దేవుని ఆమోదముద్ర పొందిన దైవజనులు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 1
పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైనవారు

దేవుని చేత అంగీకరించబడటం ఒక విషయమైతే, దేవుని చేత ఆమోదించబడటం మరొక విషయము.

నమ్మకమైన శేషము

ప్రకటన గ్రంథము దేవుని గొర్రెపిల్ల యొక్క విజయము గురించి తెలియజేస్తున్నది. గొఱ్ఱెపిల్లకు శిష్యగణముందనీ, వారి ద్వారా ఆయన యుద్దాలు చేసి జయం పొందుతాడని మనకు తెలియజేయబడెను. ఆ శిష్యులు పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైనవారు.

''గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడా ఉండినవారు పిలువబడినవారై, ఏర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను'' (ప్రకటన 17:14). ఆయన ఆ రాజులను జయించెను.

పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే, నమ్మకమైనవారు ఇంకా కొద్దిమందే. నమ్మకమైనవారే జయం పొందుదురు. వీరిని గూర్చి ప్రకటన గ్రంథంలో పదిసార్లు వ్రాయబడినది. వారు దేవుని చేత అంగీకరింపబడిన యేసుని శిష్యులు మాత్రమే కాదు గానీ, అనేక పరిస్థితుల ద్వారా దేవునిచేత పరీక్షింపబడి ఆయన చేత ధృవీకరించబడి, ఆమోదము పొందినవారు.

యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయనను నమ్మినవారు అనేకమంది. అయితే ఆయన వారందరికీ తనను తాను అప్పగించుకోలేదు.

''ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక తన్ను వారి వశము చేసికొనలేదు'' (యోహాను 2:23,24).

ఆయనయందు విశ్వాసముంచిన వారిలో అత్యధిక భాగం స్వార్థపూరిత కారణాల వల్లనే అలా చేసిరని యేసుకు తెలియును. వ్యక్తిగత ఆశీర్వాదాల కోసమే వారు యేసు దగ్గరికి వచ్చిరి. వారి పాపాలకు క్షమాపణ పొందిరి. అయితే జయించేవారిగా ఉండాలన్న ఆశ వారికి లేదు. ఒకడు జయించువానిగా ఉండవలెనంటే అతడు తన స్వప్రయోజనాలను చూచుకోవడం నుండి విడుదల పొందడానికి ఆశ కలిగియుండాలి.

ఇశ్రాయేలీయుల శత్రువులపై యుద్ధం చేయడానికి గిద్యోను సైన్యాన్ని సమకూర్చినప్పుడు అతనితో పాటు 32,000 మంది ఉండిరి. అయితే వారందరూ పూర్ణ హృదయులు కారని దేవునికి తెలియును. కాబట్టి దేవుడు వారిని వడకట్టెను. మొదటగా పిరికివారిని ఇంటికి పంపించివేసెను.

అయితే ఇంకా 10,000 మంది మిగిలిరి. దేవుడు వీరిని నది యొద్దకు తీసుకువెళ్లి పరీక్షించెను. ఆ పరీక్షలో 300 మంది మాత్రమే ఉత్తీర్ణులై, దేవుని చేత ఆమోదింపబడిరి (న్యాయా 7:1-8).

తమ దాహం తీర్చుకొనుట కొరకు ఆ పదివేలమంది నదిలోని నీటిని తాగిన తీరును బట్టి గిద్యోను సైన్యంలో ఉండుటకు ఎవరు అర్హులో దేవుడు నిర్ణయించారు. తాము పరీక్షించబడుతున్నామన్న సంగతిని వారు గ్రహించలేకపోయిరి.

తమ దప్పిక తీర్చుకొనుటకు మోకాళ్ళ మీద ముందుకు వంగినప్పుడు తొంభై ఏడు వందలమంది (9700) తమ శత్రువు గురించి పూర్తిగా మర్చిపోయిరి. కేవలం 300 మంది మాత్రమే మెళకువగా, అప్రమత్తంగా నిలబడి తన దోసిళ్ళతో నీటిని తీసుకుని త్రాగిరి.

అనుదిన జీవితములో పరీక్షింపబడుట

జీవితములోని సామాన్య విషయాల్లోనే అంటే ధనం, సుఖం, భూసంబంధమైన ఘనత సౌఖ్యం మొదలైన వాటి పట్ల మనకుండే వైఖరిని దేవుడు పరీక్షించును. గిద్యోను సైన్యంలాగా మనలను కూడా తరచుగా దేవుడు మనలను పరీక్షిస్తున్నాడని గ్రహించుము.

ఐహిక విచారాల్లో మునిగి పోవద్దని యేసు ప్రభువు మనలను హెచ్చరించారు. ఆయన ''మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి'' (లూకా 21:34) అని ఆయన చెప్పెను.

కొరింథులోని క్రైస్తవులను పౌలు ఇలా హెచ్చరించెను. ''...ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడ్వనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.... మీరు యోగ్యప్రవర్తనులై, తొందర ఏమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను'' (1కొరిందీ¸ 7:29-35).

ఈ లోకంలో దేవునిమీద పూర్ణభక్తి చూపకుండా తప్పు దారి పట్టించే దేనికీ మనము అవకాశం ఇవ్వకూడదు. సమంజసంగా అనిపించే లోకవిషయాలు పాపపూరిత విషయాల కంటే ఎక్కువ ఉరిగా పరిగణిస్తాయి. ఎందుకంటే అవి మంచివిగానూ, హానికరం కానివిగానూ కనిపిస్తాయి.

మన దాహాన్ని మనం తీర్చుకోవచ్చు కాని మన దోసిళ్ళతో తగినంత మాత్రమే తాగాలి. మన మనస్సు భూసంబంధమైన వాటిమీద కాక పైనున్న వాటిపై నుండవలెను. మనము యేసుయొక్క శిష్యులము కావాలంటే సమస్తమును విడిచిపెట్టాలి.

సాగిన ఒక రబ్బరు బాండ్‌ లాగా, అవసరమైన భూసంబంధ విషయాలపై మన మనసు ఉంచవచ్చు. పట్టు వదిలాక రబ్బరు బాండ్‌ ఎలాగైతే తిరిగి యధాస్థితికి సంకోచిస్తుందో, అలాగే మన మనసులు కూడా తిరిగి దేవుని విషయాల వైపు నిత్యత్వ విషయాలవైపు మళ్ళాలి. ''పైనున్న వాటి మీదనే గాని, భూ సంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి'' అంటే అర్థం ఇదే (కొలస్సీ 3:2).

అయితే అనేకమంది విశ్వాసుల్లో ఈ రబ్బరు బాండ్‌ వ్యతిరేకంగా పనిచేస్తుంది! వారి మనసులు అడపా దడపా మాత్రమే నిత్యత్వ విషయాలవైపు సాగుతాయి. వదిలాక, తిరిగి యధాస్థానానికి, లోకవిషయాలవైపుకు వచ్చివేస్తాయి.

దేవుని చేత ఆమోదింపబడుట

''సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్వాపారములలో చిక్కుకొనడు'' (2తిమోతి 2:4) అని పౌలు తిమోతిని హెచ్చరించెను. పౌలు తిమోతితో ఎలా రక్షణ పొందవలెనో చెప్పుట లేదు కాని దేవుని సైన్యంలోని ఒక ప్రతిభ గల సైనికుడిగా అతడు క్రీస్తును ఎలా సంతోషపెట్టాలో చెప్పుచున్నాడు.

''నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము'' అని పౌలు అతనికి చెప్పాడు (2తిమోతి 2:15). తిమోతి దేవుని చేత అప్పటికే అంగీకరింపబడెను. ఇప్పుడు దేవుని ఆమోదమును పొందుటకు అతడు కృషి చేయాల్సిన అవసరముండెను.

పౌలు కూడా దేవుని ఆమోదమును పొందెను గనుక అతడు క్రైస్తవ సేవలో క్రీస్తు చేత నియమించబడెను. ''తన పరిచర్యకు నియమించి నమ్మకమైనవానిగా ఎంచినందుకు, నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను'' (1తిమోతి 1:12) అని అతడు చెప్పెను.

పిలువబడిన, ఏర్పరచబడిన, నమ్మకమైన వారిలో పౌలు ఉండెను తిమోతి కూడా ఆ సంఖ్యలో ఉండాలని పౌలు ఆశించాడు.

అయితే పౌలు ఆమోదింపబడుటకు ముందు పరీక్షింపబడెను. మనము కూడా పరీక్షించబడుతున్నాము.

పరీక్షించకుండా దేవుడు ఎన్నడూ, ఎవరికి తనను తాను అప్పగించుకోడు.

లేఖనాల్లోని రకరకాల వ్యక్తులకు కలిగిన పరీక్షల గురించిన వివరణలు మనకెంతో అమూల్యమైనవి ఎందుకనగా అవి మన ఉపదేశము నిమిత్తమే రాయబడినాయి వారిలో కొందరు దేవుని చేత ఆమోదించబడిరి, కొందరు తిరస్కరించబడిరి.

అధ్యాయము 2
తండ్రిని ఆనందపరచువారు

క్రొత్త నిబంధనలో, తండ్రియైన దేవుడు బహుగా ఆనందించిన ఒక వ్యక్తి గురించి, ఆనందించని ఒక గుంపు గురించి చదువుతాము. ఈ వ్యత్యాసాన్ని అధ్యయనం చేయుట ఎంతో ఆసక్తికరంగా ఉండును.

దేవుడు వారియందు ఆనందించలేదు

అవిశ్వాసం వలన అరణ్యంలో నాశనమైపోయిన 6,00,000 ఇశ్రాయేలీయుల సైనికుల గురించి ఇలా వ్రాయబడెను ''వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి'' (1కొరిందీ¸ 10:5).

ఆ ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తం ద్వారా ఐగుప్తు నుండి విడుదల పొందిరి (ఇది క్రీస్తు ద్వారా మనకు కలిగిన విమోచనకు సాదృశ్యం). మేఘంలోనూ, ఎర్ర సముద్రంలోనూ, వారు బాప్తిస్మం పొందిరి (ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి, నీటి బాప్తిస్మానికి సాదృశ్యం) (1కొరిందీ¸ 10:2) అయినప్పటికీ దేవుడు వారి యందు ఆనందించలేదు.

అయినప్పటికీ ఆయన వారితో మంచిగా ఉండెను. వారి శారీరక, భౌతికావసరాలన్నిటినీ మానవాతీతమైన రీతిగా తీర్చెను. నలభై సంవత్సరాల వారి సంచారం చివర్లో మోషే వారితో ''ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు'' (ద్వితీ 8:4) అని చెప్పెను.

దేవుడు వారి రోగాలన్నింటినీ కూడా స్వస్థపరిచెను. ''(వారిలో) నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను'' (కీర్తన 105:37) అని బైబిలు చెప్పుచున్నది.

వారి కోసం దేవుడు ఎన్నో అద్భుతాలు చేసెను. నిజానికి ప్రపంచ చరిత్రలో అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులు చూసినన్ని అద్భుతాలు మరి ఏ ఇతర జాతీ చూడలేదు. అయినా వారి ''మీద నలువది ఏండ్లు దేవుడు కోపగించెను'' (హెబ్రీ 3:17).

దీన్నిబట్టి శరీరానుసారులైన విశ్వాసుల ప్రార్థనలు కూడా దేవుడు వినునని మనకు అర్థమవుచున్నది. వారి భౌతికావసరాలను తీరుస్తాడనీ, అవసరమైతే మానవాతీత రీతిలో వాటిని దయచేస్తాడనీ ఇది మనకు నేర్పిస్తున్నది.

దేవుడు మన కోసం చేసే ఒక అద్భుతం, మన ఆత్మానుసారతను ఏ మాత్రమూ నిరూపించలేదనేది సత్యం. దేవుడు మంచి దేవుడనీ, నీతిమంతుల మీదా, అనీతిమంతుల మీదా సమానంగా సూర్యుణ్ణి ప్రకాశింపజేస్తున్నాడని మాత్రమే అది తెలియజేస్తుంది!

చివరి తీర్పు దినాన, ఆయన నామములో అద్భుతాలు చేసిన అనేకమంది, పాపంలో జీవించిన కారణంగా తిరస్కరించబడుదురనీ, అనర్హులవుతారనీ యేసు మనల్ని హెచ్చరించెను.

''ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురని ఆయన చెప్పెను. ''అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి పొండని వారితో చెప్పుదును'' (మత్తయి 7:22,23).

ఆయన నామంలో నిజమైన అద్భుతాలు చేసిన క్రైస్తవ బోధకులను, స్వస్థపరిచే వారినీ ఇక్కడ ఆయన పేర్కొంటున్నాడన్నది స్పష్టం.

అద్భుతమైన, ఆశ్చర్యకరమైన పరిచర్య కలిగిన వీరిలో అనేకమంది (కొద్దిమంది కాదు; అలాగని అందరూ కాదు గానీ, అనేకమంది) తమ రహస్య జీవితాల్లో తమ తలంపుల్లో తమ వైఖరుల్లో పాపంలో నుండి విడుదల పొందలేదన్న విషయం యేసు మాటల్లో స్పష్టమవుచున్నది. ఇది క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట బట్టబయలవుతుంది.

అద్భుతాలు చేయడం అనేది ఒకవ్యక్తి దేవునిచేత ఆమోదించబడ్డాడు (మెప్పు పొందాడు) అన్నదానికి ఎంత మాత్రమూ సూచన కాదు. ఈ విషయం మనకు బాగా అర్థమైందా? లేనియెడల మనం మోసపోవుదము.

దేవుడు ఆయన యందు బహుగా ఆనందించెను

పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల మీద దేవుడు కోపగించిన దానికి భిన్నంగా క్రొత్త నిబంధనలో యేసునందు తండ్రి బహుగా ఆనందించినట్లు చదువుతాము.

యేసుకు ముప్పయి ఏండ్ల వయస్సప్పుడు ఆయనను గురించి తండ్రి పరలోకం నుండి బహిరంగంగా పలికిన మాటలివి ''ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనాందించుచున్నాను'' (మత్తయి 3:17). యేసు కనీసం ఒక్క అద్భుతంకానీ, ఒక్క ప్రసంగం కాని చేయకముందే దేవుడు ఇలా పలికెను!

అలాగయితే ఆయన దేవుని చేత ఆమోదం పొందడంలో రహస్యం ఏమిటి? దానికి కారణం ఆయన పరిచర్య కాదనేది సుస్పష్టం. ఎందుకంటే అప్పటికి ఆయన ఇంకా పరిచర్య ఆరంభించలేదు కదా. ముప్పయి సంవత్సరాలుగా ఆయన కనపరచిన జీవన శైలియే దానికి రహస్యం.

విజయవంతమైన మన సేవా పరిచర్యను బట్టి కాదు గానీ, అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనే శోధనల్లో మన నమ్మకత్వము బట్టి దేవుడు మనలను ఆమోదించును.

ముప్పయి నిశ్శబ్ద సంవత్సరాల యేసు జీవితం గురించి మనకు తెలిపిన (దేవాలయ సంఘటన కాకుండా) రెండే రెండు సంగతులు ఏవంటే, ''సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను'' (హెబ్రీ 4:15), ''క్రీస్తు ఎన్నడూ తనను తాను సంతోషపరచుకొనలేదు'' (రోమా 15:3).

ప్రతి విషయంలోనూ ఆయన శోధనను నమ్మకంగా ఎదిరించెను మరియు ఆయన ఏ విషయంలోనూ తన స్వంత కోరికలనూ ఆశలనూ, లేదా చిత్తమును కోరుకోలేదు. తండ్రిని సంతోషపరచింది ఇదే.

బాహ్యంగా మనం సాధించిన విజయాలూ, సాఫల్యాలూ లోకస్థులనూ శరీరానుసారులైన విశ్వాసులనూ మెప్పించవచ్చు. అయితే దేవుడు మన వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే మనలను మెచ్చుకొనును. దేవుని ఆమోదమును పొందగలిగేది కేవలం మన జీవితం, గుణశీలాలు మాత్రమే.

మనపట్ల దేవునికున్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటే, పరిచర్యలో మనం సాధించిన దాన్నంతటినీ మనస్సుల్లోంచి పూర్తిగా తుడిచివేయవలెను. మన ఆలోచనల్లో పాపం పట్ల మన ధోరనిని బట్టి. సంకుచిత స్వభావం పట్ల మన వైఖరిని బట్టి మనలను మనం విశ్లేషించుకోవలెను. అది కేవలం అది మాత్రమే, మన ఆత్మీయస్థితికి అసలైన, లోపంలేని కొలమానము.

కాబట్టి ప్రపంచమంతా పర్యటించే బోధకుడైనా, స్వస్థతా వరమున్నవాడైనా, తీరిక లేకుండా ఇంటి పనులతో నిమగ్నమైపోయి, ఇంటి బయటకు వెళ్లలేని తల్లియైనా దేవుని ఆమోదమును పొందుటకు సమానమైన అవకాశాలు కలిగి యుందురు.

ఇందుచేతనే క్రైస్తవ ప్రపంచంలో ఇక్కడ ముందున్నవారు క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట చివరన ఉండుటను మనం చూచెదము. ఈ భూమి మీద అల్పులుగా ఎంచబడిన అనేకమంది (ఎందుకంటే గుర్తింపు పొందిన గొప్ప పరిచర్య వారికి లేదు కాబట్టి) అక్కడ ప్రథములుగా ముందుంటారు.

ఇంటిలోనూ పనిచేయు చోటను నమ్మకముగా ఉండుట

అన్ని విషయములలో యేసు మనకు మాదిరి. యేసు తన భూసంబంధమైన జీవితంలోని మొదటి ముప్పయి సంవత్సరాలను ప్రాథమికంగా రెండు స్థలాల్లో గడపాలని తండ్రియైన దేవుడు నిర్ణయించాడు. ఆయన గృహము, ఆయన పనిచేసే స్థలము (వడ్రంగి దుకాణం). ఈ రెండు స్థలాల్లోనూ యేసు యొక్క నమ్మకత్వమే తండ్రి ఆమోదమును పొందగలిగేలా చేసింది. ఇది మనకెంతో ప్రోత్సాహకరమైన విషయము ఎందుకంటే ఈ రెండు స్థానాల్లో మనం ఎప్పుడూ ఉంటాము. మన గృహము, మనం పనిచేసే స్థలమూ మరియు దేవుడు మనల్ని తరచూ పరీక్షించేది ఈ రెండు స్థలాల్లోనే.

యేసు పుట్టి పెరిగినది చాలా పేద గృహము. దహనబలికి కనీసం గొర్రెపిల్లను కూడా అర్పించలేని నిరుపేదలు యోసేపు, మరియలు.

''ఆమె గొఱ్ఱెపిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను, రెండు పావురపు పిల్లలనైనను....తీసికొని రావలెను'' అని ధర్మశాస్త్రం ఆదేశించింది (లేవీ 12:8). యోసేపు, మరియలు ''ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను, రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు...తీసికొనిపోయిరి'' (లూకా 2:24).

యేసుతో పాటు కనీసము నలుగురు తమ్ముళ్ళూ, ఇద్దరు చెల్లెళ్ళూ అదే ఇంటిలో జీవించిరి. యేసు గురించి ఆయన స్వగ్రామ ప్రజలు ఏమి చెప్పుకున్నారో మార్కు 6:3లో ఉంది. ''ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా?''.

ఆ పేద గృహంలో పెరుగుతూ, యేసు ఎటువంటి ఒత్తిడిలనూ, సంఘర్షణలనూ ఎదుర్కొనెనో మనం ఊహించుకోవచ్చు. అన్నింటికి మించి ఆయన తమ్ముళ్ళు అవిశ్వాసులు. ''ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు'' (యోహాను 7:5) అని వ్రాయబడినది.

వారాయనను ఎన్నో రకములుగా పరిహసించి, నిందించి యుందురు. ఇంటిలోని ఇతరుల మూలంగా శోధనకూ, ఒత్తిడికీ లోనయినపుడు ప్రక్కకు వెళ్ళి ఒంటరిగా గడపడానికి ఆయనకు ఇంట్లో ప్రత్యేమైన గది లేకుండెను.

(సామాన్యంగా అన్ని ఇళ్ళలో ఉన్నట్టుగానే) ఆ ఇంట్లో కూడా పోట్లాటలూ, అనవసరమైన జగడాలూ, తిట్టుకోవడాలూ, స్వార్థాలూ యుండియుండును.

అటువంటి పరిస్థితుల మధ్య యేసు మనవలె అన్ని విషయాల్లోనూ శోధింపబడెను. క్రియలోనూ, మాటలోనూ, తలంపులోనూ, ఉద్దేశ్యంలోనూ, వైఖరిలోనూ మరే రకంగానూ ఆయన ఎన్నడూ ఒక్కసారికూడా పాపంచేయలేదు.

ఒకవేళ యేసు మనకు వేరైన రూపంతో వచ్చినట్లయితే, శోధనకు లొంగని ఏదో దివ్య శరీరంతో వచ్చినట్లయితే, అటువంటి పరిస్థితుల్లో ఆయన పవిత్రంగా జీవించడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ ఆయన ''అన్ని విషయములలో'' మనవలె చేయబడెను.

దేవుని వాక్యమిలా చెప్పుచున్నది ''...దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను'' (హెబ్రీ 2:17).

మనమెదుర్కొనే ప్రతి శోధన సంబంధమైన ఒత్తిడి గుండా ఆయన పయనించెను. మనకు శోధన కలిగిన సమయాల్లో, మనమూ దాన్ని జయించగలమనే ప్రోత్సాహానిచ్చి మనల్నెంతో పురికొల్పేది ఇదే.

క్రీస్తు మనవంటి శరీరంతో వచ్చెను. ఆయన అచ్చం మనవలె శోధించబడెను. ఈ మహిమకరమైన సత్యాన్ని మన నుండి దాచడం ద్వారా ఈ నిరీక్షణను మన నుండి దొంగిలించాలని సాతాను ప్రయత్నించును.

నజరేతులో ఒక వడ్రంగివానిగా, ఏ వృత్తి చేసేవారైనా తమ వ్యాపారంలో ఎదుర్కొనే శోధనలన్నింటినీ యేసు ఎదుర్కొని యుండును. అయితే ఆయన దేనినైనా అమ్మినప్పుడు ఎవరినీ ఎన్నడూ మోసం చేయలేదు. ఏ వస్తువుకూ అధిక ధర చెల్లించమని పట్టుబట్టలేదు. ఎంత వెల చెల్లించవలసి వచ్చినా నీతి విషయంలో ఆయన ఎన్నడూ రాజీపడలేదు.

నజరేతులోని ఇతర వడ్రంగులతో ఆయన పోటీ పడలేదు. తన జీవనోపాధి కోసం మాత్రమే ఆయన పని చేసెను. కాబట్టి (ఒక వడ్రంగిగా) అమ్మడం, కొనడం, తదితరమైన డబ్బు వ్యవహారాలు చూసుకోవడం ద్వారా డబ్బు విషయంలో మనకెదురయ్యే శోధనలన్నిటినీ యేసు ఎదుర్కొని వాటిని జయించెను.

ఆయనను పెంచిన అపరిపూర్ణులైన తల్లిదండ్రులకు లోబడి, యేసు చాలా సంవత్సరాలు జీవించెను. ఇది ఆయన్ని అనేక అంతరంగ శోధనలకు గురి చేసి యుండును. (మనో భావాలు, ఆలోచనా ధోరని విషయాలలో) అయినప్పటికీ ఆయన ఎన్నడూ పాపం చేయలేదు.

యోసేపు మరియలు అప్పటికి ఇంకా పాత నిబంధనలో నుండుట చేత ఎంతో మంది విజయంలేని దంపతుల్లాగానే బహుశా వారు కూడా అడపా దడపా తమ గొంతులు పెంచి, ఒకరితో ఒకరు ఘర్షణ పడి యుండి ఉండవచ్చు. మరో ప్రక్క యేసు సంపూర్ణ విజయంలో జీవించెను. అయినప్పటికీ ఆయన వారిని ఎన్నడూ తృణీకరించలేదు. ఆయనలా చేసినట్లయితే ఆయన పాపం చేసియుండేవాడు. ఆయన వారి కంటే అత్యంత పవిత్రంగా ఉన్నప్పటికీ వారిని ఆయన గౌరవించెను. ఆయన తగ్గింపులోని సౌందర్యాన్ని మనమక్కడ చూడగలము.

కాబట్టి నజరేతులో ఆ ముప్పయి సంవత్సరాలు యేసు హాయిగా జీవించలేదని మనము చూడగలము. యేసు అన్ని వేళలా శోధనకు వ్యతిరేకంగా పోరాడి జీవించెను. ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ ఆ పోరాటం యొక్క తీవ్రత కూడా పెరుగుతూ యుండెను. ఆయన మన రక్షకునిగా, మన ప్రధానయాజకునిగా కాక తండ్రియైన దేవుడు మన రక్షణకర్తను మానవులకు సంభవించే పూర్తి స్థాయి శోధనల గుండా తీసుకువెళ్లెను.

''ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును'' అని దేవుని వాక్యం చెప్పుచున్నది (హెబ్రీ 2:10).

ఆయన ఇహలోక జీవితంయొక్క ఆఖరి మూడున్నర సంవత్సరాల్లో యేసు మరికొన్ని శోధనలను ఎదుర్కొనెను. (దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం వలన కలిగే శోధనల వంటివి). కాని ఇంటిలోనూ, మనం పనిచేసే స్థలంలోనూ సామాన్యంగా మనకు ఎదురయ్యే శోధనలన్నిటినీ ఆయన తన మొదటి ముప్పయి సంవత్సరాల్లో ఎదుర్కొని జయించెను. ఆయన బాప్తిస్మం సమయంలో తండ్రి తన ''ప్రశంసా పత్రాన్ని లేక ఆమోద పత్రాన్ని'' యేసుకిచ్చెను.

దేని ఆధారంగా దేవుడు మనలను ఆమోదించును? మనం కళ్ళు తెరచి చూడగలిగితే అది మన జీవితాన్ని సంపూర్తిగా చైతన్యవంతం చేయును. అప్పుడు మనం ఎంత మాత్రమూ ప్రపంచ వ్యాప్తంగా పరిచర్య చేయాలని ఆశించము. అంతకంటే ముఖ్యంగా అనుదిన జీవితంలోని శోధన గడియల్లో నమ్మకంగా ఉండవలెనని ఆశించెదము.

మనము భౌతికమైన సూచకక్రియలను మెచ్చుకొనుట మాని, మార్పు చెందిన జీవితాలను మెచ్చుకొనుట ప్రారంభించెదము. అలా మన ప్రాధాన్యతలు సరియైనవిగా ఉండుటకు మన మనసులు నూతనపరచబడును.

శోధనను యేసు ఎలా ఎదుర్కొన్నాడో అదే వైఖరితో శోధనను ఎదుర్కొన్నవారికి దేవుడు తన గొప్ప బహుమానములను ఉన్నత ప్రశంసలను దాచి ఉంచెనని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరమైన విషయము. ఆ వైఖరి

''కనీసం ఒక్క విషయంలోనైనా నా తండ్రికి అవిధేయత చూపుట లేక పాపం చేయుట కంటే నేను చనిపోవడం మేలు''

అన్న యేసు వైఖరి.

''క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి...సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను'' అన్న ఫిలిప్పీ 2:5-8 లోని ప్రోత్సాహవాక్కు యొక్క అర్థం ఇదే.

మన వరమూ, పరిచర్యా, జీవన స్థితి, లింగ, వయో బేధాలతో నిమిత్తం లేకుండా మనందరికీ, జయించువారిగా ఉండడానికి, పిలువబడిన, ఏర్పరచబడిన, నమ్మకమైన వారిలో ఒకరిగా ఉండటానికి సమాన అవకాశం ఉంది.

అధ్యాయము 3
ఆదాము హవ్వలు పరీక్షింపబడుట

ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారి కొరకు ఆయన మనసులో గొప్ప ప్రణాళికలుండెను. కాని వారు పరీక్షింపకుండా ఆ ప్రణాళికలు నెరవేరియుండవు. కనుక ఆయన ఏదేనులో మంచి చెడుల జ్ఞానము నిచ్చే ఒక ఆకర్షణీయమైన మధురమైన పండ్లు కలిగిన చెట్టునుంచెను. మరియు ఆ చెట్టు పండ్లు తినకూడనివని ఆదాము హవ్వలకు వాటిని నిషేధించెను.

ఏదేను వనములో ఆదాము హవ్వల వైఫల్యము ప్రాధమికముగా విశ్వాసములో తప్పిపోవుట. దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానముపై, ప్రేమపై మరియు శక్తిపై మానవ వ్యక్తిత్వము ధైర్యముగా ఆనుకొనుటయే విశ్వాసము. హవ్వ అటువంటి విశ్వాసము కలిగియుండుటలో తప్పిపోయినందున, ఆమె దేవుని ఆజ్ఞకు అవిధేయురాలగునట్లు సాతాను చేత ప్రలోభపెట్టబడెను.

దేవుని జ్ఞానములో నమ్మకము

ఆ చెట్టు పండును తినుటకు అనుమతించకపోవుటలో దేవుని జ్ఞానమునకు లోపమున్నదని సాతాను హవ్వకు సూచించెను.

ఆ చెట్టు ఎందుకు నిషిద్ధమైనదో దేవుడు ఆదాముకు కారణము తెలుపలేదు. దేవునికి లోబడుటకు విశ్వాసమునకు కారణము అవసరము లేదు. మనలో ఉన్న వివేకము మొదట కారణము తెలుసుకోవాలని కోరుకొనును. దేవునికి విధేయత ఎప్పుడూ విశ్వాసముతో కూడిన విధేయతగా ఉండవలెను కాని వివేకముతో కూడిన విధేయతగా ఉండకూడదు.

''సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు'' (రోమా 1:6) చేయుటకై తాను పిలువబడెనని పౌలుచెప్పెను. ''అనాది నుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటింపబడుచున్నది'' (రోమా 16:25) అని కూడా చెప్పెను.

సామెతలు 3:5లో ''నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో(శిరస్సుతో కాదు) యెహోవాయందు నమ్మకముంచుము'' అని చెప్పబడినట్లు మన స్వబుద్ధి విశ్వాసముకు శతృవైయున్నది.

ఆత్మ, దేవుని యొక్క జ్ఞానమును జ్ఞానులకు, వివేకులకు మరుగుపరచి పసిపిల్లలవలె సులువుగా నమ్మువారికి దానిని బయలుపరుచును. ''తండ్రీ, ఆకాశమునకును, భూమికిని, ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను'' (మత్తయి 11:25) అని యేసు ప్రభువు చెప్పెను.

వివేకము మంచి దాసుడే కాని యజమానిగా చెడ్డవాడు; కనుక దానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థానము మానవునిలోని ఆత్మకు లోబడుటయైయున్నది మరియు ఈ ఆత్మ పరిశుద్ధాత్మకు లోబడవలసియున్నది.

దేవుని యందు ఆదాము కుండిన విశ్వాసము అభివృద్ది చెందాలనే ఉద్దేశ్యముతో ఆయన ఆదాముకు నిషిద్ధ వృక్షము యొక్క ఫలము ఎందుకు తినకూడదనే కారణము తెలుపలేదు. దేవుడు మనలను కూడా ఈ విషయములోనే మొదట పరీక్షించును. దేవుడు మనలను ఏదో చెయ్యమని పిలిచినప్పుడు అది దేనికో తెలియకపోయినా దానిని మనముచేయుదుమా? దేవుడు ఏదోచెయ్యమని పిలిచినప్పుడు మన వివేకము అది అనవసరమని చెప్పినప్పుడు ఏమి చేయుదుము?

యేసుప్రభువు పేతురును పడవలోనుండి బయటకు దిగి నీటిపై నడువమన్నప్పుడు, ఆ ఆజ్ఞ అప్పటి వరకు పేతురు యొక్క వివేకము చెప్పుచున్న ప్రతి దానికి వ్యతిరేఖముగా యున్నది కాని అతడు తన వివేకమును అనుసరించినట్లయితే అతడు అక్కడ అద్భుతమును అనుభవింపక పోయియుండును.

లేఖనాల నుండి అటువంటి ఉదాహరణలెన్నిటినో చూడవచ్చును. ఈ కారణం చేతనే అనేకమంది క్రైస్తవులు వారి జీవితాల్లో దేవుని యొక్క మానవాతీత అద్భుతాలను అనుభవించలేక పోవుచున్నారు మరియు శక్తిహీనులుగా ఉంటున్నారు. వారు వారి విశ్వాసము ద్వారా జీవించుటకు బదులు వివేకము ద్వారా జీవించుచున్నారు.

దేవుని ప్రేమలో నమ్మకము

దేవుని ప్రేమలో పూర్తి నమ్మకముంచుట కూడా విశ్వాసమైయున్నది. దేవుడు వారిని తగినంతగా ప్రేమించుట లేదని మరియు అందువలననే ఆయన ఆ చక్కని ఫలమును తినుటకు వీల్లేకుండా హద్దులు నియమించెనని హవ్వకు సాతాను సూచించెను.

హవ్వ వివేకము ద్వారా కాక విశ్వాసము ద్వారా జీవిస్తున్నట్లయితే, ఆమె

''సాతానా, దేవుడు ఎందుకు ఆ చెట్టు ఫలమును తినవద్దని చెప్పెనో నాకు అర్థము కాలేదు, కాని ఒక విషయము నాకు ఖచ్చితముగా తెలియును, అది దేవుడు మమ్మును ఎంతగానో ప్రేమిస్తున్నాడనేది; కనుక ఆయనెప్పుడూ ఏమంచి విషయము మాకు ఇవ్వకుండా ఉండడు. కనుక ఈ ఫలమును తినవద్దని చెప్పుటకు, దానికి ఏదో ఒక మంచి కారణము, మా మంచి కొరకైన కారణము యుండును'',

అని చెప్పియుండేది.

అది విశ్వాసముతో కూడిన జవాబు. కాని దానికి బదులు ఆమె అపవాది యొక్క అబద్ధములో పడిపోయెను.

''దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పగలిగేది'' (ఎఫెసీ 6:16) దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమలో మనకున్న విశ్వాసకవచమే.

విశ్వాసముతో కాక వివేకముతో జీవించుటయే నిరుత్సాహమంతటికి మరియు నిరాశంతటికి కారణం. అన్ని చింతలకు మరియు భయములకు వేళ్లు కూడా ఈ కారణమందేయున్నవి. ఆయన సన్నిధి మనతో ఉన్నదనిపించే 'అనుభూతిని' ఆయన మన యొద్దనుండి తీసివేసినప్పుడు, ఆయన ప్రేమను మనము అనుమానించేలా శోధింపబడునట్లు పరీక్షింపబడుదుము. ఆ విధముగా మనము విశ్వాసములో బలవంతులమై ఆయన తన ఉద్దేశ్యములు మన ద్వారా నెరవేర్చుటకు తగిన పరిపక్వ స్థానమునకు వచ్చెదము.

ఆదాము హవ్వలు పరీక్షింపబడుటకు మంచి చెడుల జ్ఞానమునిచ్చే చెట్టును ఆకర్షణీయముగా సృష్టించెను. వారు దేవుని యెడల అభిమానము చూపి ఎంతో ఆకర్షణీయముగా నుండిన దానిని కాదనుదురా? లేక దేవునినే తిరస్కరించి వారికి ఆనందమునిచ్చే దానిని ఎంచుకొందురా?

శోధన సమయములో మనము కూడా ఎదుర్కొనేది ఇటువంటి పరిస్థితినే. అందువలననే శోధన అంత ఆకర్షణీయముగానుండుటకు అనుమతించెను. నిజంగా ఎంతో ఆకర్షణీయముగా ఉండి, మనలను ఎంతో ఆకట్టు కొన్న దానిని మనకు ఆనందమును ఇచ్చునని మనకు తెలిసిన దానిని దేవుడు నిషేదిస్తే దానిని మనము తిరస్కరించినప్పుడే మనము దేవుని పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నామని ఋజువు చేయగలము.

మరియు ఆ విధముగానే దేవుడు నిషేధించినది మన యెడల ఆయనకున్న పరిపూర్ణ ప్రేమతో మన మేలు కొరకేనని నమ్ముట ద్వారా దేవుని పరిపూర్ణ ప్రేమయెడల మనకున్న విశ్వాసమును ఋజువు పర్చుకొందుము. అట్లు పాపము చేయుటకును మరియు దేవునికి అవిధేయత చూపుటకును వచ్చే ప్రతి శోధన మన విశ్వాసమునకు ఒక పరీక్షగా యుండును. దేవుని యొద్దనుండి వచ్చే ప్రతి ఆజ్ఞ మన మేలుకోరుకొనే పరిపూర్ణమైన ప్రేమగల హృదయము నుండి వచ్చునని నమ్ముటయే విశ్వాసముతో జీవించుట.

దేవుడు ఇశ్రాయేలీయులకు పది ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ''దేవుడు మిమ్మును పరీక్షించుటకు వచ్చియున్నాడు'' (నిర్గమ 20:20) అని మోషే చెప్పెను. ద్వితీయోపదేశకాండము 33:2,3లో, ''ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలల వంటి ధర్మశాస్త్రము మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించెను'' అని చెప్పబడినది.

ఆయన కుడి పార్శ్వమున మెరియు అగ్నిజ్వాలల వంటి ధర్మశాస్త్రము వారి యెడల దేవుని యొక్క ప్రేమకు ఋజువని వారు విశ్వసింపగలరా? అదే పరీక్ష.

హవ్వ ఏ విషయములో దేవుని నమ్ముటలో తప్పిపోయెనో, ఇశ్రాయేలీయులు కూడా అదే విషయములో తప్పిపోయి దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపిరి.

కాని యేసుప్రభువు ఇక్కడే జయించెను. ఆయన విశ్వాసముతో జీవించెను. అరణ్యములో సాతాను ఆయన యొద్దకు తీసుకువచ్చిన ప్రతిశోధనను ''.....వ్రాయబడియున్నది'' అనుచిన్న సమాధానముతో త్రిప్పికొట్టబడెను. యేసు దేవుని యొక్క ప్రతి మాటకు విధేయత చూపిస్తూ జీవించెను.

దేవుని వాక్యము మానవుని యెడల పరిపూర్ణ ప్రేమతో యివ్వబడినది. యేసు దానికి విశ్వాసముతో లోబడెను. ఆ విధముగా ఆయన మనకు ముందు పరిగెత్తిన వాడాయెను. మనము దేవుని బిడ్డలకు ప్రభావవంతముగా సేవ చెయ్యవలెనంటే మనము కూడా విశ్వాసముతో జీవించవలసియున్నది. మరియు దేవుని యొక్క ఆజ్ఞలకు పూర్తి విధేయత చూపుట ద్వారా మన విశ్వాసమును నిరూపించుకొనవసియున్నది. ఆ విధముగా మాత్రమే మనము ఇతరులకు మాదిరిగా యుండగలము.

దేవుని శక్తిలో నమ్మకము

విశ్వాసమనగా దేవుని శక్తిలో పూర్తి నమ్మకముంచుట కూడా అయియున్నది. హవ్వ శోధింపబడినప్పుడు ఆ శోధన యొక్క బలము అడ్డుకోలేనంతగా యుండినట్టనిపిస్తే, ఆమె సహాయము కొరకు ప్రభువును వేడుకొనవలసినది. అప్పుడు ఆమె సహాయమును పొందుకొనియుండేది. దేవుని యొక్క శక్తి ప్రతి శోధన యొక్క బలమును జయించుటకు సరిపోవును. యేసు శరీరధారియైయున్న దినాలలో ఈ శక్తి కొరకు మొఱపెట్టి దానిని పొందెను. అందుచేతనే ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు.

యేసు ప్రభువును గూర్చి

''శరీరధారియై యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను, యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను".

"ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను'' (హెబ్రీ 5:7,8) అని మనకు చెప్పబడెను.

ఇప్పుడు మనము సమయోచితమైన సహాయము కొరకు కృపను అడుగుటకై ధైర్యముతో కృపాసనము నొద్దకు రమ్మనమని ఆజ్ఞాపింపబడితిమి.

''గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము'' అని హెచ్చరింపబడినాము (హెబ్రీ 4:16).

దేవుడు ఈ భూమిపై ఆయన పరిపూర్ణ జ్ఞానము, ప్రేమ మరియు శక్తికి నిజమైన సాక్షుల కొరకు చూచుచున్నాడు.

క్రైస్తవులు క్రొత్త నిబంధనలోని ఆజ్ఞలను తమకు అనుకూలముగా మార్చుకొన్నప్పుడు దేవుని జ్ఞానముపైన వారికున్న అపనమ్మకమునకు వారు సాక్ష్యమిచ్చుచున్నారు. ఆ విధముగా దేవుని యొక్క సర్వజ్ఞత ఈ 20వ శతాబ్దపు ప్రత్యేకమైన ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకోలేకపోయినదన్నట్లుగా భావిస్తున్నారు.

''కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు అలాగున చేయబోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని- బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును'' అని యేసు చెప్పెను (మత్తయి 5:19).

దేవుడు మన విశ్వాసమును విధేయతను ఆయన వాక్యములో నున్న అల్పమైన ఆజ్ఞల యెడల మన వైఖరిని బట్టి పరీక్షించును. పెద్ద ఆజ్ఞలైన ''నీవు నరహత్య చేయకూడదు లేక నీవు వ్యభిచరించకూడదు'' మొదలైన వాటిని చాలా మంది క్రైస్తవులు పాటింతురు. ఆ మాటకొస్తే చాలా మంది క్రైస్తవేతరులు కూడా పాటింతురు. కాని మనము దేవుని చేత ఆమోదమును పొందుదుమో లేదో అనునది, చిన్న ఆజ్ఞల యెడల మన వైఖరిని బట్టి నిర్ధారింపబడును.

''తన భార్యను విడనాడి మరియొకతను పెండ్లి చేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును'' (మార్కు 10:11) అని యేసు చెప్పెను.

ఈ ఆజ్ఞకు చూపించే అవిధేయత మరియు నిర్లక్ష్యము, క్రైస్తవులకు విడాకులు, తిరిగి వివాహమాడుట (ఇది పాశ్చాత్య దేశములలో ఎక్కువగానున్నది) యెడల ఉన్న వైఖరి చాలా మంది క్రైస్తవులు మానవుని సంతోషమునకు సౌఖ్యానికి తగినట్లుగా యేసు ప్రభువు ఆజ్ఞలను మార్పుచేసికొంటున్నారో అనుదానిని సూచనగా యున్నది. ఇది సాతాను యొక్క విజయముకు ఒక ఉదాహరణ.

''ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుకు వేసికొనని యెడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించి కొనవలెను'' (1కొరిందీ¸ 11:5,6) అని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఇది చాలా చిన్న విషయము. కాని పాశ్చాత్య పోకడలు గల అనేక సంఘములలో స్త్రీల మధ్య ఈ ముసుగు కనబడకపోవుట ఈనాటి క్రైస్తవులకు దేవుని వాక్యము యెడల లేనటువంటి గౌరవమునకు ఒక గుర్తు.

చివరకు యేసుప్రభువు మరియు అపొస్తలులు నొక్కి చెప్పిన నీటి బాప్తిస్మము గూర్చి అన్ని ''క్రైస్తవ మత శాఖలు'' కలసియున్నచోట, ఎవరికైనా అభ్యంతరము కలుగకుండునట్లు బోధించుట మానివేసారు. ఈనాటి క్రైస్తవులు, వారిని బట్టి మనుష్యులు సంతోషింపకపోయిననూ పట్టించుకొనరు!

''.....దేవుడు నిజముగా చెప్పెనా?'' అనునది హవ్వకు సాతాను యొక్క ప్రశ్న. ఈనాడు కూడా దేవుడిచ్చిన తేటయైన ఆజ్ఞలకు అవిధేయతను పరిచయం చేయునది అదే ప్రశ్న.

దేవుడు ఆదాము హవ్వలను పరీక్షింపగా వారు తప్పిపోయిరి. ఈ రోజు నీవు నేను పరీక్షింపబడుచున్నాము.

అధ్యాయము 4
యోబు పరీక్షింపబడుట

బైబిల్లో వ్రాయబడిన దైవజనుల జీవిత చరిత్రలూ, దేవుని విషయంలో విఫలమైపోయిన వారి జీవిత చరిత్రలూ మన హితవుకోసం మనకు హెచ్చరికగా (బుద్ధి చెప్పడం కోసం) వ్రాయబడినవి. ఆత్మ యొక్క స్వరానికి చెవియొగ్గి, వాటిని ధ్యానించినట్లయితే, మనం నేర్చుకోగలిగినది ఎంతో ఉంది.

పాత నిబంధనలోని వ్యక్తుల గురించి చదువుతున్నప్పుడు ఒక సత్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. అదేమంటే, యేసు క్రీస్తు ద్వారా వెల్లడికాబోయే ''కృప''కు ముందుకాలంలో వారందరు జీవించారు.

''ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును, యేసు క్రీస్తు ద్వారా కలిగెను'' (యోహాను 1:17).

పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన ప్రమాణాల స్థాయికి చేరుకోవాలని దేవుడు కూడా ఆశించలేదు.

దీన్ని మత్తయి 19:8,9 ఉదహరిస్తున్నది. పాత నిబంధనలో మోషే విడాకులను ఎందుకు అనుమతించాడో యేసు అక్కడ పరిసయ్యులకు వివరించెను. ''మీ హృదయ కారిÄన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను'' అని ఆయన చెప్పెను. అయితే క్రొత్త నిబంధన క్రింద, దేవుడు మన కరిÄన హృదయాన్ని తీసివేసి, దానికి బదులుగా మెత్తటి హృదయాన్ని ఇస్తాడు. కాబట్టి విడాకులకు ఇప్పుడు అనుమతి లేదు.

''నీతిమంతులను పరిశోధించువాడు'' అని దేవుణ్ణి బైబిలు సంబోధిస్తున్నది (యిర్మీయా 20:12). చెడుగుచేయమని ఆయన ఎవరినీ శోధించడు. ''దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు'' (యాకోబు 1:13).

అయితే ఆయన నీతిమంతుల్ని పరీక్షిస్తాడు.

ఒక ఉత్తమమైన వ్యక్తి

దేవుడు ఏర్పరచుకున్న సేవకులలో యోబు ఒకడు. తన మార్గములన్నింటిలో భూమి మీద దేవునికి భయపడే ఏకైక వ్యక్తిగా అతనిని దేవుడు సాతానుకు చూపించెను.

''అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యధార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతనివంటి వాడెవడును లేడు'' (యోబు 1:8).

యోబుయొక్క తెలివితేటల గురించీ లేక అతని తలాంతుల గురించీ అతని ఐశ్వర్యము గురించీ దేవుడేమీ చెప్పడం లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో వీటికి విలువ లేదు. ఆయన కేవలం అతని పవిత్రతనూ, యదార్థతనూ మాత్రమే పేర్కొంటున్నాడు. యేసు విషయంలో లాగానే, దేవుని హృదయాన్ని సంతోషపెట్టింది యోబు జీవితం, గుణశీలం గానీ అతని సాఫల్యాలూ, అతని పరిచర్యా కాదు.

సాతానుకు సైతం మానవాతీత వరాలూ, తెలివితేటలూ ఉన్నాయి. అతనికి బైబిలు జ్ఞానం కూడా ఉంది. అయితే, దేవుడు చూసేది మన గుణమును, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, ఆయన మన గుణమును పరీక్షిస్తాడు. మన బైబిలు జ్ఞానాన్ని కాదు.

అతన్ని బట్టి అతిశయించేందుకు, అతని గురించి సాతానుతో సగర్వంగా చెప్పుకునేందుకు దేవుడు ఒక వ్యక్తి కోసం చూచినప్పుడు, ఆయన శీలవంతుడూ..నిందారహితుడూ, యధార్థవంతుడూ, దేవునికి భయపడే వాడూ, చెడుని అసహ్యించుకునేవాడూ అయిన వ్యక్తి కోసం చూస్తాడు.

ఆత్మ సంబంధిత విషయాల్లో ఇతర విశ్వాసుల్లో మనకుమంచి పేరు ఉండవచ్చు. అయితే తరచి, తరచి మనల్ని ఎరిగిన దేవుడు మన గురించి సాతానుతో చెప్పగలడా? మనము పొందగలిగిన భూసంబంధమైన మరి ఏ ఇతర ఘనతకన్నా గొప్పదైన యోగ్యతా పత్రాన్ని దేవుడు యోబుకిచ్చాడు. దానితో పోల్చి చూసినట్లయితే క్రైస్తవ్యం యొక్క ఘనతంతా పనికిరాని చెత్తవంటిది.

కనుక, అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న, ''నా ఆత్మీయ స్థితి గురించి ఇతరులకు ఎటువంటి అభిప్రాయముంది?'' అనేది కాదు. గాని ''దేవుడు సగర్వంగా నా గురించి సాతానుతో చెప్పగలడా?'' అనేది.

సాతాను యొక్క మొదటి ప్రయత్నం

దేవుడు యోబు గురించి సాతానుకు చెప్పినప్పుడు యోబు దేవుణ్ణి సేవించడానికి కారణము, దాని వలన అతనికి లాభమూ, ప్రయోజనమూ ఉండడం వల్లనేనని సాతాను అన్నాడు.

''నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇపుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనెను'' (యోబు 1:10,11).

దేవుడు ఆ ఆరోపణను ఖండించాడు. తన ఆరోపణ నిజం కాదని సాతాను స్వయంగా తెలుసుకోవాలని అతనిని యోబును పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు. దేవుడు అలా చేయడానికి కారణం యోబు యొక్క యదార్థత ఆయనకు తెలుసు.

మన సంగతేంటి? భౌతిక ప్రయోజనాలు కోసం మనం దేవుణ్ణి సేవిస్తున్నామా? వ్యక్తిగత లాభం కోసం దేవుణ్ణి సేవిస్తున్నామని మనలో ఎవరినైనా సాతాను వేలెత్తి చూపితే, సాతాను చెప్పింది నిజమేనని దేవుడు అంగీకరించ వలసివచ్చునా?

అయ్యో! వ్యక్తిగత లాభం కోసం క్రైస్తవ పని చేసే పాస్టర్లతో, క్రైస్తవ సేవకులతో భారతదేశం నిండిపోయింది. కొందరు జీతం కోసం, కొందరు ఘనత, గౌరవాల కోసం, పదవి కోసం, కొందరు పాశ్చాత్య దేశాలను ఉచితంగా సందర్శించడం కోసం దేవుణ్ణి సేవిస్తున్నారు.

వ్యక్తిగత లాభం కోసం క్రైస్తవ సేవ చేసే ఎవరైనా దేవుణ్ణి సేవించడం లేదు. ''ధన పిశాచాన్ని'' సేవిస్తున్నారు.

సరైన ఉద్దేశ్యంతో దేవుని కోసం మనం చేసే సేవ కొరకు మనము ఒక మూల్యాన్ని చెల్లించవలసియుండును.

దేవునికి బలి అర్పించబోయే ముందు దావీదు చెప్పిన మాటల్ని పరిశీలించండి. ''వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను'' (2సమూ 24:24).

దావీదు వైఖరిని ప్రదర్శించే వారు ఎంత కొద్దిమంది! దేవునికి చేసే యధార్థమైన సేవ వలన సహజంగా మనకు భౌతికంగా నష్టం కలుగుతుంది గానీ లాభం కాదు. అయితే దాని వలన కలిగే ప్రయోజనమూ, లాభమూ ఆత్మసంబంధమైనది (నిత్యమైనది).

మరోవైపు భౌతిక లాభాన్ని వెదికేవారు బబులోనుకు చెందినవారే గానీ పరలోకపు యెరూషలేముకు చెందినవారు కారు.

ఆత్మీయ బబులోను గురించి బైబిలు ఇలా చెప్పుచున్నది. ''ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు....'' (ప్రకటన 18:15).

స్వలాభాన్ని చూసుకొనే స్వార్థపరులైన క్రైస్తవ సేవకులందరిలో ఒక అరుదైన మినహాయింపుగా పౌలు తిమోతిని పేర్కొన్నాడు.

అతని గురించి పౌలు ఇలా అన్నాడు ''మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు''(ఫిలిప్పీ 2:20,21).

పౌలు మోసపోలేదు. తన తోటి సేవకుల ఆత్మీయ స్థితి అతనికి తెలుసు. అదే విధంగా మన విషయంలోనూ దేవుడు మోసపోడు.

దేవునికి యోబు మీద ఎంత నమ్మకముందంటే, అతన్ని పరీక్షించుటకు ఆయన సాతానును అనుమతించెను.

ఒకే రోజున యోబు తన బిడ్డలను, విస్తారమైన తన ఆస్తి నంతటినీ కోల్పోయినప్పటికీ అతడు దేవుణ్ణి ఆరాధించడం కొనసాగించెను సేవించడం కొనసాగించాడు. ''నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యోహోవా ఇచ్చెను, యెహోవానే తీసికొనిపోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక'' (యోబు 1:21) అతడు చెప్పెను.

తనకున్నదంతా పిల్లలు, ఆస్తి, తన ఆరోగ్యం సైతం దేవుడు తనికిచ్చిన ఉచిత బహుమానాలని అతనికి తెలుసు. దేవునికి ఇష్టమైనప్పుడు వీటన్నింటినీ తీసికొనిపోయే హక్కు సర్వాధికారం ఆయనకు ఉంది. ఒక వ్యక్తి సమస్తాన్నీ విడిచిపెట్టనంత వరకు అతడు నిజంగా దేవుణ్ణి ఆరాధించలేడు సమస్తాన్నీ విడిచిపెట్టడమంటే దేనినైనా సొంతం చేసుకోవాలనుకునే హక్కుని వదులుకోవడం.

సాతాను యొక్క రెండవ ప్రయత్నం

అప్పుడు సాతాను మరో అడుగు ముందుకు వేసి అరికాలు నుండి నడినెత్తి వరకు కురుపులతో యోబును బాధించుటకు దేవుడు అతనిని అనుమతించెను.

అనారోగ్యం సాతాను వలన కలుగును. అయినా దానిని కూడా, దేవుడు తన సేవకులను పవిత్రపరచడానికీ, సంపూర్ణులను చేయడానికీ వాడుకొనును.

పౌలు తన శరీరంలోని ముల్లుతో బాధపడెను. అది సాతాను కలుగజేసాడని స్పష్టంగా పేర్కొన్నాడు. ఆ ముల్లు సాతానుదూత, దేవునిదూత కాదు. అయినప్పటికీ ఆ ముల్లు అలాగే ఉండడానికి దేవుడు అనుమతించెను. పౌలు పదే పదే ప్రార్థనలు చేసినప్పటికీ దానిని తీసివేయలేదు. అది పౌలును దీనుడిగా, తనను తగ్గించుకొని ఉండేలా చేసింది.

''నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలుగ గొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు - నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను'' (2కొరిందీ¸ 12:7-9) అని పౌలు చెప్పుచున్నాడు.

సాతాను యొక్క మూడవ ప్రయత్నం

సాతాను మూడవ మెట్టు యోబును అతని భార్య ద్వారా వేధించడం.

''అతని భార్య వచ్చి నీవు ఇంకను యధార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను!''(యోబు 2:9).

నీ స్వంతభార్య నీకు విరోధంగా నిన్ను నిందించినప్పుడు, అది నీ పవిత్రతకు భయంకరమైన పరీక్ష అవుతుంది.

దేవుని వాక్యం ఇలా ఆజ్ఞాపిస్తుంది. ''భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి...మీ భార్యలను ప్రేమించుడి అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి...దాని కొరకు తన్నుతాను అప్పగించుకొనెను'' (కొలస్సీ 3:19, ఎఫెసీ 5:25).

ఒక భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్యను ద్వేషించకూడదు. అతడు ఆమెను అన్ని వేళలా ప్రేమించాలి.

నీకు ఒక గయ్యాళియైన భార్య ఉన్నట్లయితే, జీవితంలోని దురదృష్టాన్ని నిందించుకోవడానికి బదులు భక్తిగల భార్యలున్న ఇతరుల్ని చూసి అసూయపడడానికి బదులు, నిన్ను పరిశుద్ధపరిచే సాధనాలుగా నీ పరిస్థితులవైపు నీవు చూసుకోవాలి.

దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లోనే పరీక్షిస్తాడు. ఆయన ఆమోద పత్రాన్ని పొందడానికి అర్హుడివా కాదా అని చూసేది అక్కడే. నీ భార్య నీ మీద కేకలేసి, నిన్ను నిందించి దూషించినప్పుడు ఆయన నిన్ను పరీక్షిస్తాడు. తన స్వంత బంధువులచేత ఆఖరికి ''పిచ్చివాడిగా'' పిలువబడిన యేసుకు ప్రతినిధిగా ఉండేందుకు నీవు అర్హుడివో కాదో దేవుడు చూస్తాడు.

సువార్త గ్రంధాలిలా చెబుతున్నాయి ''ఆయన ఇంటివారు...ఆయన మతి చలించి యున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి'' (మార్కు 3:21).

యేసు ఆ అవమానాన్ని ఓర్పుతో, సహనంతో భరించాడు. మనము ఆయనను అనుసరించుటకు ఆయనకు ప్రతినిధులుగా ఉండుటకు పిలువబడ్డాము.

సాతాను యొక్క నాల్గవ ప్రయత్నం

బోధకులైన స్నేహితుల ద్వారా యోబును నిందించడం సాతాను యొక్క నాలుగవ ప్రయత్నం (యోబు 4-25 అధ్యాయాలు చూడండి).

ఇది యోబు భరించడానికి అతి బలమైన దెబ్బ. ఎందుకంటే ఆ బోధకులు అతని దగ్గరకు వచ్చి, దేవుని ప్రవక్తల వలే ప్రవర్తించి, అతని రోగాలన్నిటికీ కారణం అతని రహస్య పాపాలేనని చెప్పారు. అయితే తమకు తెలియకుండా తాము ''సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది''కి దూతలుగా ప్రవర్తిస్తున్నామన్న సంగతిని వారు కొంచెం కూడా గుర్తించలేకపోయారు (ప్రకటన 12:10).

అయితే యోబును పవిత్రపరచడం కొరకు దేవుడు వారిని అలా చేయుటకు అనుమతించాడు.

కృప ద్వారా జయించుట

యోబు కృపకు ముందు ఉన్న కాలంలో జీవించెను గనుక ఈ రోజున మనముండగలిగినట్లు నిరంతరము జయించలేకపోయాడు.

''మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు'' అని దేవుడు నేడు వాగ్దానం చేస్తున్నాడు (రోమా 6:14), కానీ, యోబు అయితే పాపం మీద జయం సాధ్యంకాని కాలంలో జీవించాడు.

కాబట్టి అతడు చివరికి తనపై తాను జాలిపడటానికి, తన్నుతాను సమర్థించుకోవడానికి నిస్పృహకీ, మనోవ్యాకులతకీ లొంగిపోయాడు. అప్పుడప్పుడూ అతని విశ్వాసము అంధకారంలో మినుకుమినుకు మనేది. అయితే అతనిది అటూ ఇటూ తూగుతున్న అనుభవం.

ఇప్పుడు కృప యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. కాబట్టి అదే తీరులో మనము పరీక్షించబడినట్లయితే మనము ఒక్క క్షణం కూడా కృంగిపోవలసిన మనో వ్యాకులత చెందవలసిన అవసరం లేనే లేదు. క్రొత్త నిబంధనలోని ఆజ్ఞలు ఇలా ఉన్నవి, ''దేనిని గూర్చియు చింతపడకుడి..ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించుడి...ప్రతి విషయములోనూ కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి'' (ఫిలిప్పీ 4:6,4).

ఇటువంటి ఆజ్ఞలు పాత నిబంధనలో ఇవ్వబడలేదు. ఎందుకంటే కృప అప్పటికి రాలేదు. ఇప్పుడు మనం అన్ని విషయాలలో దేవుని హస్తాన్ని చూడగలము మరియు మనం నిరంతరం విజయవంతంగా ఉండడానికి ప్రతి క్షణమూ మనకు కృప లభ్యమవుతున్నది.

''ఆయన క్రీస్తుయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము'' అనేది పౌలు విజయోత్సాహపు కేక (2కొరిందీ¸ 2:14).

మన ఆస్తుల్నీ, బిడ్డల్నీ పోగొట్టుకొన్నప్పటికీ ఆఖరికి మన భార్యలు మనల్ని నిందించినప్పటికీ లేక సాటి విశ్వాసులు మనల్ని అపార్థం చేసుకున్నప్పటికీ మనల్ని విమర్శించినప్పటికీ లేక దేవుడు అనుమతించడానికి ఇష్టపడిన మరేదైనా మన జీవితాల్లో సంభవించినప్పటికీ మనము జయించు వారిగా నుండగలము.

ఆ విధంగా భూమ్మీద తనకు ఒక శేషం మిగిలి ఉన్నదని దేవుడు సాతానుకు కనుపరచును. ఆయన వ్యవహారాలన్నిటికీ వారు లోబడడం మాత్రమే కాదు. ప్రతి పరీక్షనూ, శ్రమనూ వారు సంతోషంతో అంగీకరిస్తారు. వారికి ''నిత్యమైన మహిమ భారమును'' కలుగచేయడం కోసం ఈ కొద్ది శ్రమల్ని దేవుడే రూపొందించాడని వారు పూర్తిగా విశ్వసిస్తారు.

బైబిలు ఇలా చెప్పున్నది ''మేము దృశ్యమైనవాటిని చూడక, అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది'' (2కొరిందీ¸ 4:17,18).

సాతాను మరియు అతని దూతగణముకు ఒక సాక్ష్యం

సంఘము ద్వారా ఆకాశమండలంలోని అధికారులకు, ప్రధానులకు తన జ్ఞానాన్ని చూపాలని దేవుడు ఆశిస్తున్నాడని క్రొత్త నిబంధన మనకు చెప్తుంది.

ఎఫెసీ 3:10లో ''పరలోకములో, ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి...'' అని చెప్తుంది.

ఆకాశమండలంలోని ఆ అధికారులు దురాత్మలని ఎఫెసీ 6:12 మనకు చెప్తుంది.

మనకు సంభవించే సంగతులు యాదృచ్చికమైనవి కావు. మన కోసం ఆచి, తూచి (అవి ఎన్నడూ మన సామర్థ్యానికి మించకుండా ఉండడం కోసం) ప్రత్యేకంగా నిర్దేశించబడినవి. ''దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్‌ జ్ఞానమును అనుసరించి...'' (అపొ.కా. 2:23) ఇవి సంభవిస్తాయి.

శ్రమల్లో పరీక్షల్లో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి మార్చడం. రెండవది అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసంతో దేవుణ్ణి ప్రేమించి, ఆయనకు లోబడి, ఆయనను స్తుతించే ప్రజలు ఇంకా దేవునికి ఉన్నారని ఆకాశమండలంలో ఉన్న సాతానుకు సంబంధించిన అధికార దురాత్మలకు విశదీకరించడం.

మనము ఎదుర్కొనే ప్రతి పరీక్ష కూడా మన విశ్వాసానికి ఒక పరీక్షే. యోబు కాలంలో సైతం అతనిలా చెప్పగలిగాడు ''నాకు సంభవించబోయే ప్రతి వివరమూ దేవునికి తెలుసు''(యోబు 23:10 స్వేచ్ఛానువాదం).

నేడు మనం ఇంకొక అడుగు ముందుకేసి, ఇలా చెప్పవచ్చు (రోమా 8:28 ఆధారంగా)

''నాకు సంబంధించిన ప్రతి వివారాన్ని దేవుడు యోచించును''.

మన మార్గములో ఎదురయ్యే ప్రతిదీ కూడా దేవుడు తన సంపూర్ణజ్ఞానముతో, ప్రేమతో ఉద్దేశించాడనీ, యుక్త సమయం వచ్చినప్పుడు ఆ పరీక్ష నుండి మనల్ని విడిపించేందుకు ఆయన సర్వశక్తి గలవాడని మనం నిజంగా నమ్ముతున్నామా?

ఎట్టి పరిస్థితుల్లోనూ సణగకుండా, ఫిర్యాదులు చేయకుండా అన్నిటి కొరకు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించే మనుషులుగా నిన్నూ, నన్నూ దేవుడు ధైర్యంగా సాతానుకు చూపించగలడా?

అధ్యాయము 5
అబ్రాహాము పరీక్షింపబడుట

దేవుడు అబ్రాహామును మొదట పిలిచిన సుమారు ఏబై సంవత్సరాల తరువాత ''నీవు దేవునికి భయపడువాడవని నాకిప్పుడు తెలియును'' (ఆది 22:12) అని దేవుడు ఆమోద పత్రము ఇచ్చిన ఒకరోజు అబ్రాహాము జీవితములో వచ్చినది.

అది ఏదో చౌకగా వచ్చే బైబిలు కాలేజీ డిగ్రీ కాని, వేదాంత విద్యలోనిచ్చే డాక్టరేటుకాని కాదు! ఈనాటి అనేక మంది క్రైస్తవులు ప్రాకులాడుతున్న విలువలేని అటువంటి కాగితాల కోసం అబ్రాహాము రెండు పైసలు కూడా విలువ యిచ్చియుండేవాడు కాడు. అతడు నిజమైన విలువ గలదాన్ని కోరుకున్నాడు. అది అతడి జీవితము గూర్చి దేవుని యొక్క ఆమోద పత్రము చివరకు దానిని అతడు పొందుకొన్నాడు.

మోరియా పర్వతముపై ఆ పత్రము పొందే రోజుకు చేరుట అంత సుళువైనదేమీ కాదు! కాని దేవుని నుండి ఆ మాటలు వినుటకు అబ్రాహాము తన కున్నదంతా ఇచ్చుట సరియైనదే.

దేవుడు తన ఆమోద పత్రములను అంత సుళువుగానివ్వడు. ఏబైసంవత్సరములు పరీక్షించిన తరువాతనే ఆయన అబ్రాహామునకు అది ఇచ్చాడు.

యేసు ప్రభువు విషయంలోనైతే తండ్రి ఆయనను నజరేతులో ముప్పై సంవత్సరములు పరీక్షించిన తరువాతనే ఆయన యందు ఆనందించుచున్నానన్న విషయాన్ని బహిరంగముగా ప్రకటించెను.

మొదటి పరీక్ష

అబ్రాహాము 75 సంవత్సరముల వయసప్పుడు, కల్దీయుల దేశములో ఊరు అను తన స్వంత ఊరిని మరియు స్వంత బంధువులను విడిచిపెట్టి, దేవుని యందు విశ్వాసముంచి, తనకు తెలియని ప్రదేశముకు బయల్దేరుమని దేవుడు పిలిచెను. అతడు నెగ్గిన మొదటి పరీక్ష అది. ఆ విధముగా తల్లి తండ్రి, అన్న, తమ్ములు, అక్క, చెల్లెల్లు మొదలైన వారితో తెగతెంపులు చేసికొనుట అంత సుళువు కాదు. కాని వారితో మనము కట్టబడియున్న బిడ్డ ప్రేగు తెగిపోయేటంత వరకు మనము యేసు క్రీస్తు శిష్యులము కాలేము.

''ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను చివరకు తన స్వంత ప్రాణమును ద్వేషింపకుంటే అతడు నా శిష్యుడు కానేరడు'' (లూకా 14:26) అని యేసు చెప్పెను.

అబ్రాహాము దేవునికి వెంటనే విధేయత చూపించాడు. అబ్రాహాము ఒకవేళ దేవుని పిలుపును పట్టించుకొనకపోయినట్లయితే ఏమైయుండేదని నేను అనుకొంటూ ఉంటాను. దేవుడు అతడినేమి బలవంతం చేసియుండేవాడు కాదు. వేరొకరిని దేవుడు కనుగొని యుండేవాడు. మనమింకెప్పుడూ అబ్రాహాము గూర్చి వినియుండేవారము కాము. దేవుని పిలుపు విని వచ్చిన ఆ వేరొకరు విశ్వాసులకు తండ్రియై ఉండేవాడు మరియు మెస్సీయాకు పితరుడైయుండేవాడు! ఆ మొదటి పరీక్షలోనే అబ్రాహాము తప్పిపోయి ఉంటే అతడు ఎంత పోగొట్టుకొనియుండేవాడు! అబ్రాహాము తన బంధువుల బ్రతిమిలాటలను పట్టించుకొనకుండా, ఊరు అను తన స్వంత ఊరి నుండి బయటకు వచ్చినపుడు, దేవుడు ఎటువంటి గొప్ప భవిష్యత్తును తన కొరకు ఉద్దేశించియుంచాడో అన్నదాన్ని గురించి తనకు తెలిసింది చాలా తక్కువ.

దేవుడు అబ్రాహామును పిలిచినట్లే, ఇప్పటికీ ప్రజలను పిలుస్తున్నాడు. వారుదేవుని పిలుపును వినినప్పుడు వారికొరకు ఎటువంటి గొప్ప సంఘటనలు సిద్ధముగా నున్నవో వారికి అంతగా తెలియదు. ఈ 20 శతాబ్దాల సంఘ చరిత్ర అబ్రాహాము వలె సంతోషముతో మరియు హృదయమంతటితో దేవుని పిలుపుకు వెంటనే స్పందించి దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చిన స్త్రీ, పురుషుల అద్భుత అనుభవాలతో నిండియున్నది.

ఇంకా ఎందరు పిలువబడిరో, అందులో ఎందరు ఆ పిలుపును పట్టించుకోకుండా వారి జీవితములను వృథాచేసుకున్నారో అనేది నిత్యత్వమే బయల్పరుస్తుంది. తన ధనమును ఇంకా గట్టిగా హత్తుకొనుటకు యేసు ప్రభువు నుండి తిరిగి వెళ్లిపోయిన యవ్వనస్థుడైన ధనిక అధికారి, అలా పరీక్షింపబడినప్పుడు తప్పుడు నిర్ణయములు తీసుకొనిన వారిలో ఒకడు.

దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారికి సాధారణముగా వారి యొక్క మార్పు చెందని లోకస్థులైన బంధువులనుండే మొదటిగా మరియు బలముగా ఆటంకములు వస్తాయి. అందువలననే శిష్యత్వముకు మొదటి షరతు తల్లిని తండ్రిని ద్వేషించుటని (ప్రభువు కంటే వారిని ఎక్కువగా ప్రేమించకుండుట) యేసుప్రభువు చెప్పారు.

అబ్రాహాము ఈ పరీక్షలో ఒకేసారి కాకపోయినా, ఉత్తీర్ణుడైయ్యాడు. ఊరు నుండి బయల్దేరినప్పుడు అతడి తండ్రి కూడా అతడితో బయల్దేరాడు. కాని హారానులో (ఇది కానానుకు సగము దూరము) అబ్రాహామును ఉండిపొమ్మని నచ్చజెప్పాడు.

''తెరహు తన కుమారుడగు అబ్రాహామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్లుటకు కల్దీయుల ఊరు అను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి, హారాను మట్టుకువచ్చి అక్కడ నివసించిరి'' (ఆది 11:31). అబ్రాహాముకు ఇంకా ఆటంకము కలుగుకుండునట్లు దేవుడు తన కనికరము చొప్పున మరణము ద్వారా అబ్రాహాము తండ్రిని తీసుకొని పోయెను. అప్పుడు అబ్రాహాము కనానుకు బయలుదేరి వెళ్లెను.

మన బంధువులయెడల మనప్రేమ మన జీవితములలో దేవుని ఉద్దేశ్యము నెరవేరకుండునట్లు ఎప్పుడూ ఆటంకపర్చనియ్యకూడదు.

నాలుగువందల సంవత్సరములు దాటిన తరువాత ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించినప్పుడు లేవీ కుమారులు వారి బంధువులకు వ్యతిరేకముగా అటువంటి నిర్ణయమునే తీసుకొనవలసి వచ్చెను.

మోషే సీనాయి పర్వతము పై నుండి దిగివచ్చిన సమయములో ''యెహోవా పక్షమున నున్న వారందరు నా యొద్దకు రండి'' (నిర్గమ 32:26) అని పిలిచెను. లేవీ కుమారులు వెంటనే వచ్చిరి. అప్పుడు వారు పాళెములోనికి వెళ్లి వారి ఖడ్గముతో విగ్రహారాధన చేయువారందరిని వారి బంధువులైనా సరే విడిచిపెట్టకుండా సంహరించుమని ఆజ్ఞాపించబడిరి. లేవీ కుమారులు ఏ మాత్రము వెనుకాడకుండా అట్లు చేసిరి.

మోషే వారు చేసిన పనిని గూర్చి ''నేను వానినెరుగనని లేవి తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు, తన కుమారులను కుమారులని యెంచలేదు, వారు నీ (దేవుని) వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. (కావున) నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు'' (ద్వితీ 33:9,10) అని చెప్పెను.

దేవుడు తనకు యాజకులుగా ఉండగలవారెవరో చూచుటకు ఆ రోజున వారిని పరీక్షిస్తున్నారని ఇశ్రాయేలీయులకు తెలియదు. అందులో లేవీయులు అర్హత పొందిరి. అందువలన దేవుడు వారిని యాజకులనుగా చేసెను. అందులో పక్షపాతము లేదు. ఆ సమయములో పన్నెండు గోత్రములలో నున్న వారందరిని దేవుడు పరీక్షించెను. కేవలము లేవీ గోత్రము మాత్రమే ఆ పరీక్షలో ఉత్తీర్ణులైరి.

రెండవ పరీక్ష

అబ్రాహాము బంధువుల విషయములో విడుదలయైన తరువాత దేవుడు వస్తువులకు సంబంధించి పరీక్షించెను. ఇది కూడా శిష్యత్వమునకు సంబంధించిన మరొక అవసరత.

''తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు'' (లూకా 14:33) అని యేసు చెప్పెను.

ఆదికాండము 13 మరియు 14 అధ్యాయములలో అబ్రాహాము సిరికి సంబంధించి పరీక్షింపబడిన రెండు సంఘటనలను మనము చదువుదుము. మొదటిది, అతని మరియు లోతు యొక్క మందలు విస్తారమై వారు కలసియుండుటకు కష్టమైనప్పుడు. కనాను వెళ్లుటకు దేవుని చేత పిలవబడిన పెద్దవానిగా అబ్రాహాము అక్కడ భూమిని మొదట ఎంచుకొనుట సరియైనది మరియు సులువైనది కూడా. కాని నిజమైన నిస్వార్థముతో మరియు విశాలహృదయముతో అతడు లోతును మొదట ఎంచుకొనుమనెను. లోతు మానవుని కంటికి శ్రేష్టమైనదిగా కనబడిన దానిని ఎంచుకొనెను. అది సొదొమ ప్రదేశము.

అయితే అక్కడ అబ్రాహాము గాని లోతు గాని వారి మధ్య జరిగినదానికి దేవుడు నిశ్శబ్దముగా నుండిన సాక్షియని గ్రహించలేదు. దీని వలెనే అన్ని ఆర్థిక లావాదేవీలకు కూడా ఆయన నిశ్శబ్ద సాక్షిగా యుండును. దేవుడు అబ్రాహాము చూపిన నిస్వార్థమును బట్టి ఎంతగానో సంతోషించెను. అందువలన ఆయన వెంటనే అబ్రాహాముతో మాట్లాడి, నలుదిక్కుల అబ్రాహాము చూడగలిగిన ప్రాంతమునంతా అతని సంతానము స్వాస్థ్యముగా పొందుదురని చెప్పెను. ఇందులో లోతు ఎంచుకొనిన భాగము కూడా యున్నది.

''లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా - ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటు నుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను'' (ఆది 13:14,15).

ఈ రోజు, 4000 సంవత్సరముల తరువాత చూచినట్లయితే దేవుడు తన మాటను నెరవేర్చినట్లు చూడగలము. అబ్రాహాము వంశస్థులు (యూదులు) దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశములో ఇప్పుడు నివసించుచున్నారు. లోతు వంశస్థులు (అరబ్బులలో కొందరు) వారి పితరుడు చేజిక్కించుకున్న దానిని పోగొట్టుకొనిరి. దేవుని మార్గములు అట్లుండును. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు.

ఆదికాండము 14వ అధ్యాయములో మరల అబ్రాహాము వస్తువాహనముల విషయములో నిజమైన దేవుని సేవకునకు ఉండాల్సిన గౌరవముతో ప్రవర్తించినట్లు చూడగలము. అబ్రాహాము సొదొమరాజును అతడి ప్రజలను మరియు ఆస్తులను శతృవుల నుండి కాపాడినట్లు చూడగలము. దానికి బదులుగా సొదొమరాజు ఆస్తినంతటినీ అబ్రాహాముకు బహుమతిగా ఇవ్వజూసెను. కాని అబ్రాహాము దేనిని తీసుకొనుటకు తిరస్కరించెను.

''అబ్రాము...నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలుపోగైనను చెప్పులవారైనను నీ వాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను'' (ఆది 14:22,23).

అబ్రాహాము చెప్పిన దానిసారము

''నా దేవుడు పరలోకమునకు భూమికిని స్వంతదారుడు కాబట్టి, నీ యొద్ద నుండి నాకేమీ అక్కర్లేదు''.

తిరిగి ఇక్కడ కూడా దేవుడు నిశ్శబ్దముగా వినువాడిగానుండెను. ఆయన వెంటనే అబ్రాహాముకు ప్రత్యక్షమై ఆయనే అతనికి బహుమతి ఇచ్చుదునని చెప్పెను.

''ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను'' (ఆది 15:1).

మనము దేవుని ఘనపరచినట్లయితే ఆయన మనలను నిశ్చయముగా ఘనపర్చును.

ఆదాము యొక్క సంతానముకు ఇతరుల నుండి లాక్కొవడంలో ఆరితేరిన వారు. బలవంతంగా కాకపోయినా ఉచితముగా తీసుకోమని ఇచ్చినప్పుడు ఆ అవకాశమును వదులుకోరు. అయితే అటువంటప్పుడే దేవుడు మన ఆర్థిక లావాదేవీలలోను మరియు ఆర్థిక విషయాలలో మన సంభాషణలలో మనలను దేవుడు పరీక్షిస్తున్నాడని మనము గ్రహించము. అటువంటి విషయాల్లో మనమెలా నడచుకొంటామను దానిని బట్టే ఆయన రాజ్యములో మరియు ఈ భూమిపై ఆయన కొరకు ప్రత్యేకపర్చబడిన సైన్యములో ఏ స్థానమివ్వాలనేది దేవుడు నిర్ణయించును.

మూడవ పరీక్ష

అబ్రాహాము తన తల్లి దండ్రులు మరియు వస్తువాహనముల విషయములలో పరీక్షింపబడ్డాడు. ఇప్పుడు అతడి కుమారుని విషయములో పరీక్షింపబడవలసి యుండెను.

దేవుని యొద్ద నుండి ఆమోద పత్రము పొందుటకు ముందు ఇది ఆఖరి పరీక్ష. దేవుడు అబ్రాహాముతో ఇస్పాకును బలిగా యిమ్మనమని రాత్రిపూట అడిగినప్పుడు అబ్రాహాము 125 సంవత్సరములు వయస్సు వాడై ప్రజలలో అప్పటికే దైవజనుడని పేరుపొందియుండెను. ఆదికాండము 21:22 ''నీవు చేయువాటన్నిటిలో దేవుడు నీకు తోడుగా యున్నాడు అని అబిమెలెకు మరియు అతడి సైన్యాధిపతియైన ఫికోలు అబ్రాహాముతో చెప్పెను'' అని చెప్పబడినది.

కాని మన గూర్చి ఇతరులకున్న గొప్ప అభిప్రాయములను దేవుడు లెక్కజేయడు. దేవుడు స్వయంగా అబ్రాహామును పరీక్షించాలని అనుకొన్నాడు. కనుక దేవుడు ఆ రాత్రి నెమ్మదిగా అబ్రాహాముతో మాట్లాడాడు దేవుడతనితో మాట్లాడిన దానిని వేరెవరూ వినలేదు. దేవుడు అతడితో ఆదికాండము 22:1,2లో

ఆ సంగతులు జరిగిన తరువాత (అంటే రాజైన అబిమెలెకు అబ్రాహాము ఒక దైవజనుడని ధృవీకరణ పత్రము ఇచ్చిన తరువాత) దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా -ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన, ''నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా, అతనినర్పించుమని చెప్పెను...''.

ఆ రాత్రి దేవుడు అతడిని అడిగినది ఖరీదైనది. ఈ మరుసటి రోజు అబ్రాహాము దాని గూర్చి ఏమీ చెయ్యకుండా యుండి ఉండొచ్చు. అందువలన ఎవరికీ అబ్రాహాము దేవునికి అవిధేయత చూపించాడని తెలిసి యుండేదికాదు. అబ్రాహాము తనకు భయపడతాడా లేదా అని దేవుడు అలాగు పరీక్షించాడు. దేవుడు మనలను కూడా అట్లే పరీక్షిస్తాడు.

ఆయన మన హృదయములో రహస్యముగా మాట్లాడుతాడు. ఎంత మెల్లగానంటే, చివరకు మనతో కలసి జీవిస్తున్న వారికి కూడా దేవుడు మనతో ఏం చెప్పాడో తెలియదు. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి మన ఆలోచనా జీవితమనే పూర్తి అంతరంగ పరిధిని ఇచ్చుటకు ఒక కారణం, మనము ఆయనకు భయపడుతున్నామో లేదో అని పరీక్షించడానికి.

మన ఆలోచనలు కూడా మన మాటల వలె గట్టి శబ్దముతో బయటకు వినబడినట్లయితే మన మందరము మన ఆలోచనా జీవితమును స్వచ్ఛముగా ఉంచుకొనేవారమే. ఎందుకంటే ఇతరులెవ్వరు మనలను తక్కువగా చూడడం మనము కోరుకొనము. కాని మన ఆలోచనలు ఎంతో రహస్యముగా ఉండి, కేవలము దేవుడు మాత్రమే వాటిని చూడగలిగినట్లయితే అప్పుడు మనము ఆయనకు భయపడుతున్నామో లేదో కనుగొనుట చాలా సులువు.

మనము అపవిత్రమైన మరియు ప్రేమలేని ఆలోచనలు కలిగియుండి వాటిని గూర్చి మనతోటి విశ్వాసులకు తెలియనివ్వకూడదనుకుంటే, మనము మనష్యులకు భయపడుతున్నాము కాని దేవునికి కాదని తేట తెల్లమవుతుంది. చాలా మంది విశ్వాసుల స్థితి దురదృష్టవశాత్తు అలాగే ఉంది. దేవుడువారిని పరీక్షించాడు, వారు దానిలో తప్పిపోయారు.

యోసేపు వలె ఉన్నవారు ఎంత తక్కువమంది ఉన్నారు. అతడు రహస్యమందు లైంగిక పరంగా శోధింపబడినప్పుడు ''దేవుని దృష్టికి విరోధముగా ఇటువంటి పాపమును నేనెట్లు చేయగలను'' (ఆది 39:9) అని అన్నాడు. అటువంటి యౌవనస్థులు దేవుని ఆమోద పత్రమును పొందుదురు.

చాలా, చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే లైంగిక పరమైన విషయములలో వారి ఆలోచనా జీవితములో పవిత్రముగా యుందురు. కాని దేవుడు అటువంటి కొద్ది మందితోనే, ఈ భూమిపై తనకు కొందరు కుమారులున్నారని, వారు తమ కుడి కంటితో పాపము చేయుటకంటె దానిని పెరికి వేయుటకే ఇష్టపడుదురని, మరియు మోహపు తలంపులు కలిగియుండుట కంటె చనిపోవుటకే యిష్టపడుదురని సాతానుకు చూపించును. జీవమార్గము ఇరుకైనది. కొద్ది మంది మాత్రమే దానిని కనుగొందురు. కాని అద్భుతమైన విషయమేమిటంటే అటువంటి కొద్ది మంది ఉన్నారు!

అబ్రాహాము పరీక్షలో ఉత్తీర్ణుడైయ్యాడు. అతడు ప్రజల ముందు మంచి సాక్ష్యము కొరకు మాత్రమే ప్రాకులాడలేదు. అతడు ఎవ్వరూ చూడని రహస్య స్థలమందు కూడా దేవునికి విధేయత చూపాలనుకొన్నాడు. కనుక మరుసటి ఉదయం ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతము వైపు ప్రయాణము సాగించాడు. అక్కడ తన హృదయానికి ప్రియుడైన వానిని దేవునికి అర్పించడం ద్వారా

''ప్రభువా ఈ లోకములో ఎవ్వరికంటె, దేనికంటె కూడా నిన్నెక్కువ ప్రేమిస్తున్నాను''

అని చెప్పాడు.

అప్పుడు మాత్రమే దేవుడుతన ఆమోద పత్రమును అబ్రాహాముకు ఇచ్చి అతడిని కొలతకు హద్దులేని విధముగా దీవించాడు.

''నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీకార్యము చేసినందున, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నామాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెనని'' (ఆది 22:16-18). ఈ విధమైన త్యాగముతో కూడిన విధేయత కంటె దేవుణ్ణి ఏదీ సంతోషపరచదు.

హృదయశుద్ధి కలిగియుండుట అంటే శుభ్రమైన ఆలోచనా జీవితము కలిగియుండుట కంటె ఎక్కువైనది (మత్తయి 5:8). అది ఒకని హృదయములో దేవుడు తప్ప మరి ఇంకేదీ ఉండకపోవడం. చాలా మంది మంచి నీతి గల జీవితం జీవిస్తూ వారికి దేవుడిచ్చిన ఉద్యోగమో లేక పరిచర్యతో విగ్రహారాధన వంటి అనుబంధాన్ని కలిగియుందురు. వారు దేవుడిచ్చిన ఇస్సాకులను తిరిగి దేవునికి బలిపీఠముపై అర్పించడం నేర్చుకొనలేదు.

నీకు దేవునితో కలిసి ఒక వరము, లేక దేవునితో కలిపి ఏదో పరిచర్య, లేక దేవునితో కలిపి మనుష్యుల యొక్క మంచి అభిప్రాయములు, లేక బహుశా దేవుడు మరియు ఆరోగ్యము? దేవుడు మరియు ఏదో ఇస్సాకును కోరుకొంటున్నావా? లేక దేవుడొక్కడే నీకు చాలునా?

ఇక్కడ పరీక్షను నెగ్గితే తప్ప ఏ ఒక్కరు దేవుని చేత ఆమోద ముద్రను పొందలేరు. ''ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు, ఈలోకమందును నిన్ను తప్ప దేనినీ నేను కోరను'' (కీర్తన 73:25) అని నిష్కపటముగా చెప్పగలిగే పరిస్థితికి వచ్చిన వారు మాత్రమే, దేవుని దృష్టిలో అర్హులుగా ఎంచబడుదురు.

ఇది మనమందరము ఎక్కవలసిన మోరియా పర్వతము. అక్కడ మనకు ప్రియముగా నుండు ప్రతిదానిని బలిపీఠముపై దేవునికి అర్పించి ఇక దేవుణ్ణి మాత్రమే కలిగియుందుము.

మనకు ఏదో ఒక ఇంక్రిమెంటు ద్వారా జీతము పెరిగినదని లేక ఉద్యోగములో పదోన్నతి కలిగినందున లేక మనము పొందిన ఏ బహుమతి వలన సంతోషించినట్లయితే లేక మనము అనుకొన్న పదోన్నతి లేక బహుమతి రాకపోవుట వలన మన సంతోషము తగ్గినట్టయితే దేవుడు మరియు వేరొక భూసంబంధమైన విషయములో మన సంతోషమున్నదని అది తెలియజేస్తుంది. అటువంటప్పుడు మనము మన దేవునియందు మాత్రమే, ఆనందించుట నేర్చుకొనువరకు మన సంతోషమును పవిత్రపర్చుకొనవలసియున్నది. మన సంతోషము దేవునియందు మాత్రమే ఉండినట్లయితే, ఈ భూసంబంధమైనది ఏదైనా పొందుట వలన ఆ సంతోషము ఎక్కువ కాదు లేక భూసంబంధమైనది ఏదైనా పోవుటవలన తగ్గిపోదు.

ఫిలిప్పీ 4:4 ''ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి'' అని మనలను ఆజ్ఞాపించుచున్నది. అనేకమంది విశ్వాసులు ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించకపోవుటకు కారణం వారి యొక్క ఆనందము కేవలము ప్రభువులోనే యుండకపోవుటే. వారి ఆనందం ప్రభువు మరియు ఏదో ఒకటియైయున్నది.

మన హృదయము పవిత్రముగా ఉంటే, అనగా మన హృదయములో ప్రభువుకు మాత్రమే స్థానముంటే మన సంతోషము కూడా పవిత్రముగా ఉండును.

దేవుడు అబ్రాహామును పూర్తిగా దేవునికి అంకితమైన ఆ స్థానమునకు ఒక్కొక్క మెట్టు ఎక్కించి తీసుకు వచ్చెను. ఇప్పుడు అతడి ద్వారా భూమిపై నుండిన కుటుంబములన్నిటికి ఆశీర్వదించాలనుకొనెను. ఆవిధముగా మోరియా పర్వతము నుండి దిగివచ్చినప్పటి నుండి అబ్రాహాము జీవితము నుండి ఆశీర్వాదపు నదులు ప్రవహించుట ప్రారంభించెను. అబ్రాహాము యొక్క ఆశీర్వాదము మనము కూడా పొందవలెనని దేవుడు ఉద్దేశించెను.

గలతీ 3:14, ''ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లబించునట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై...'' అని చెప్పుచున్నది.

ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరి ద్వారా జీవజలనదులు (ఆత్మ యొక్క ఆశీర్వాదము) ప్రవహించవలెననునది దేవునియొక్క ఉద్దేశ్యము.

అయితే ఎంత మంది దానికి తగ్గ ధర చెల్లించుటకు యిష్టపడుతున్నారు? మరియు దేవుడు పరీక్షించునప్పుడు ఎందరు అర్హులగుదురు?

అధ్యాయము 6
మోషే పరీక్షింపబడుట

దేవునియొద్ద నుండి ఆమోదముద్రను పొందిన వారిలో మోషే ఒకడు. దేవుడు అతడిని గూర్చి ''నా సేవకుడైన మోషే నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు'' (సంఖ్యా 12:7) అని చెప్పెను.

మోషే మరణసమయములో అతడి గూర్చి ''యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి యింకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు'' (ద్వితి 34:12), అని వ్రాయబడెను.

మానవ జ్ఞానము గద్దెదిగుట

మోషే రాజప్రసాదములో మరియు ఐగుప్తు సైనిక విద్యాలయములలో గడిపిన మొదటి నలభై సంవత్సరముల కాలము ద్వారా అతడొక ఆత్మీయ నాయకుడు కాలేదు. అలా కాలేదు. తరువాత అరణ్యములో గొఱ్ఱెలను కాచుకొంటున్నప్పుడు, దేవుడు అతడి ''అహం'' యొక్క శక్తిని విరుగగొట్టుట ద్వారా అది జరిగినది.

ఎనభై సంవత్సరముల వయసులో, తన సామర్థ్యము మీద తనకుండిన నమ్మకము చెదిరిపోయినప్పుడు, మోషే దేవునిపై ఆనుకొని దేవుని బిడ్డలను విడిపించిన వాడయ్యెను.

అరణ్యములో ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణములో ఒక మాట పద్దెనిమిది సార్లు వచ్చుట మనము చదువుదుము. అది 39 మరియు 40 అధ్యాయములలో ఉన్న ''యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు'' అనునది. ప్రత్యక్షగుడారము యొక్క నిర్మాణము కొరకు దేవుడు ఇచ్చిన క్రమము చాలా సామాన్యముగా ఆడంబరములేనిదిగా నుండెను. అది మోషే ఐగుప్తులో కట్టబడుట చూచిన పిరమిడ్లతో పోల్చితే ఎందుకూ సరిపోనిది.

మోషేకు 40 సంవత్సరములు వయస్సున్నప్పుడు, తనకు తనపై నమ్మకము బలముగా ఉండినప్పుడు గుడార నిర్మాణము అప్పగింపబడినట్లయితే, తప్పనిసరిగా దానిని తనకిష్టమైనట్లు మార్చి అది మరి ఎక్కువ ఆకర్షణీయముగా ఉండునట్లు చేసియుండేవాడు. కాని ఎనభై సంవత్సరాలప్పుడు తనలో తన స్వంత యిష్టము చనిపోయినందున అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసెను. అదే మందిరములోనికి దేవుని మహిమను తీసుకువచ్చెను.

మనము దైవికమైన జ్ఞానమును సంపాదించుకోవాలంటే మనయొక్క మానవ జ్ఞానమును గద్దెదింపవలెను.

బైబిలు ''ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను'' (1కొరిందీ¸ 3:18).

ఐగుప్తుజ్ఞానము యొక్క పొట్టు అంతా అతనినుండి మార్చబడిన తరువాత మాత్రమే దేవుడు మోషేకు ఆమోద ముద్రవేసాడు.

అపొస్తులుడైన పౌలు యెరూషలేములో బైబిలు కళాశాలలో గొప్ప పండితుడైన గమాలియేలు పాదముల యొద్ద మూడు సంవత్సరములు చదివాడు. అందువలన అతడు క్రైస్తవుడైన తరువాత గమాలియేలు యొక్క జ్ఞానము అతడిలో నుండి పోయి దానికి బదులు దైవికమైన జ్ఞానముతో నింపబడునట్లు అరేబియా అరణ్యములలో మూడు సంవత్సరములు గడపవలసి వచ్చెను. పౌలు ఈ విషయం గూర్చి ''... వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని..అటుపైని మూడు సంవత్సరములైన తరువాత...యెరూషలేము వచ్చితిని'', అని గలతీ 1:17,18లో చెప్పెను. అప్పుడు మాత్రమే పౌలు ప్రభువుకు సేవకుడవ్వగలిగెను.

ప్రభువును సేవించదలచిన వారెవరికైనా వారిలో నున్న మానవ జ్ఞానమును వారు పడద్రోయుట ముఖ్యమైన విషయం. అయినప్పటికి ఈ పాఠమును పూర్తిగా నేర్చుకొన్నది కొద్దిమంది మాత్రమే.

మోషే మందిరమును నిర్మించినప్పుడు మోషేకు పర్వతముపై ఇవ్వబడిన మాదిరి ప్రకారము ఖచ్చితముగా నిర్మించాడో లేదో దేవుడు పరీక్షించెను. దేవుని మహిమ ఆ మందిరముపై వచ్చుట దేవుడు మోషే యొక్క పనితో సంతృప్తిపడెనను దానికి విశదమైన సూచన.

మనము దేవుని కొరకు చేయుపని విషయంలో లేక కట్టువాటి విషయంలో మనమెలా ఉన్నాము? అది సరిగా వాక్యములో వ్రాయబడినట్లుగానే ఉండునా? లేక మనము దానిని ఈ లోకమునకు సంబంధించిన జ్ఞానముననుసరించి మార్చి వేసామా? అలా అయినట్లయితే, మన జీవితముపైకి దేవుని మహిమ రాకపోవుటకు తప్పక అదొక కారణము.

ఒకరి సొంత విషయాలను చూచుకోకుండుట

అటు తరువాత దేవుడు మోషేను వేరొక విషయంలో పరీక్షించెను.అతడు ఇశ్రాయేలీయుల క్షేమమునకు బదులు తన స్వంత ఘనతను కోరుకొనునేమో చూచుటకు దేవుడు రెండుసార్లు పరీక్షించెను. రెడుసార్లు కూడా మోషే ఆ పరీక్షలను చాలా గొప్పగా నెగ్గాడు.

ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసి కొనుట ద్వారా దేవునిపై తిరుగుబాటు చేసిన మొదటి సందర్భము దేవుడు మోషేతో, ''కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదను'' అని చెప్పెను (నిర్గమ 32:10).

ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించుటకు నిరాకరించిన రెండవ సందర్భము, దేవుడు మోషేతో, ''నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతము చేసి, యీ జనము కంటె మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించెదను'' అని చెప్పెను (సంఖ్యా 14:12).

ఈ రెండు సందర్భాలలో కూడా ఇశ్రాయేలీయులను నాశనముచేసి మోషేను మరియు అతడి సంతానమును గొప్ప దేశముగా చేయుదునని దేవుడు చెప్పెను. అప్పుడు దేవుడు అబ్రాహాముకు మరియు ఇశ్రాయేలీయులు పన్నెండు గోత్రముల వారికి చేయబడిన వాగ్దానములకు వారసుడగుటకు మోషేకు అవకాశమొచ్చినది.

తక్కువ విలువలు గలవారు ఆ పరీక్షలో నెగ్గకపోవచ్చు. కాని మోషే కాదు. ఆ రెండు సందర్భాలలో ఇశ్రాయేలీయులను క్షమించమని మోషే దేవునిని బ్రతిమాలెను. ఒక సందర్భములోనయితే, ఇశ్రాయేలీయులు రక్షింపబడునట్లు అతడు చనిపోయి తన నిత్యత్వమంతా నరకములో గడుపుటకు కూడా సిద్ధపడెను.

''అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంధములో నుండి నా పేరును తుడిచి వేయుమని బతిమాలుకొనుచున్నాననెను'' (నిర్గమ 32:31,32).

మనలను రక్షించుటకు సిలువపై తండ్రిచేత విడనాడబడుటకు సిద్ధపడిన క్రీస్తు యేసుకు కలిగిన ఆత్మను మోషే నిజముగా కలిగియుండెను.

మోషే యొక్క నిస్వార్థతను బట్టి దేవుడు ఎంతో సంతోషించెను. కనుక అప్పటి నుండి ఆయన మోషేతో ఎంతో సన్నిహితముగా మాట్లాడుట మొదలుపెట్టెను. ''మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను'' (నిర్గమ 33:11).

దేవుడు ఆయన మహిమను చూచే చెప్పనశక్యమైన ఆధిక్యతను మోషేకు ఇచ్చెను.

మోషే ప్రార్థించి, ''దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన - నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను...మరియు ఆయన - నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా - ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను'' (నిర్గమ 33:18-23).

దేవుని సేవకునికి ఉండాల్సిన ముఖ్యమైన అర్హత తన స్వంత కార్యములనే చూచుకొనకపోవుట.

మనందరిలో మన స్వంత లాభమును లేక ఘనతను వెతుక్కొనే నైజము చాలా లోతుగా పాతుకొనియుండుట చేత, దానినుండి మనలను విడుదల చేయుట దేవునికి కష్టమైన పనిగాయున్నది. మనలో నుండే స్వంతం గూర్చి చూచుకొనే ఆత్మను మనము తెలుసుకొనేలా ఆయన మనచుట్టూ పరిస్థితులను కల్పిస్తాడు. అందును బట్టి మనలను మనము తీర్పు తీర్చుకొని ఆ ఆత్మనుండి మనలను మనము శుభ్రపర్చుకోవాల్సియున్నది. ఆయన మనతో ఆయన వాక్యము ద్వారా మాట్లాడును మరియు మనలో నున్న మన స్వంత కార్యములనే చూచుకొనే ఆత్మను కడుగుకొనుమని ప్రేరేపిస్తూ ఎప్పుడూ (మనకు వినగలుగుటకు చెవులుండినట్లయితే) తన ఆత్మ ద్వారా మాటలాడుచుండును.

అయినప్పటికీ, ఇవన్ని జరుగుచుండినా, చాలా కొద్ది మంది మాత్రమే ఆ తరగతికి చేరుకొని దేవుని ఆమోద ముద్రను పొందుటకు అర్హులవుదురు.

మోషే అటువంటివాడు. పౌలు తిమోతీలు అటువంటి వారు. అటువంటి వారు ఎక్కువమంది లేరు. కాని కొద్ది మంది ఉన్నారు.

పాత నిబంధనలో మోషేలో ఉన్నటువంటి ఇతరుల గూర్చి విజ్ఞాపన చేసే మనసు ఎంతో లోటుగా ఉంది. దానికి కారణం ప్రతి వారి హృదయాంతరంగములో ఏదొక విధముగా వారి స్వార్థమును చూచుకొనుటయే. మనము ఇతరుల గూర్చి రహస్యముగా ప్రార్థించునప్పుడు మనకు ఏ ఘనతా రాదు. అందువలననే చాలా కొద్దిమంది విశ్వాసులు మాత్రమే దానిని చేయుదురు.

దేవుడు ఇక్కడే మనలను పరీక్షిస్తాడు. ఎవరైతే వారి స్వంత విషయాలకు మాత్రమే ప్రాధాన్యత యిచ్చెదరో వారికి ఆయన తన్నుతాను అప్పగించుకొనడు.

విమర్శ మరియు వ్యతిరేకతకు స్పందన

మోషేలో మనము చూడని మరియొక చక్కని విషయం, విమర్శింబడినప్పుడు లేక వ్యతిరేకింపబడినప్పుడు అతని యొక్క స్పందన.

జనులు తిరుగుబాటుచేసి ''మన కొరకు వేరొక నాయకుని ఎన్నుకొందము'' అన్నప్పుడు మోషే సాగిలపడి మౌనముగా నుండెను.

''మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి'' అని మనము చదువుదుము (సంఖ్యా 14:5).

తనను తాను సమర్థించుకొనుటకు యిష్టపడలేదు.

కోరహు రెండువందల ఏభై ఇతర ఇశ్రాయేలీయుల పెద్దలతో కలసి మోషే నాయకత్వముపై తిరుగుబాటు చేసినప్పుడు, మరల అక్కడ ''మోషే ఆ మాట విని సాగిలపడెను'' (సంఖ్యా 16:4) అని చదువుదుము.

అతడు తనను తాను సమర్థించుకొనుటకు కాని లేక తన స్థానమును అధికారమును పట్టుకొని యుండుటకు కాని ప్రయత్నించలేదు.

తన స్వంత అక్క మరియు అన్న అతడి వెనుక అతడిని విమర్శింపగా, దాని విషయమై దేవుడు వారిని శిక్షించినప్పుడు, మరల మోషే సాగిలపడి కనికరము చూపుమని దేవుని ప్రార్థించెను.

''మోషే ఎలుగెత్తి దేవా, దయచేసి ఈమెను బాగుచేయుమని యెహోవాకు మొఱపెట్టెను'' (సంఖ్యా 12:13).

నిజముగా అతడి జీవితకాలములో అతడు భూలోకములో అతిదీనుడైన మనుష్యుడు. ''మోషే భూమిమీద నున్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు'' అని బైబిలులో వ్రాయబడెను (సంఖ్యా 12:3).

దేవుడు అటువంటి వారికి మాత్రమే తనను తాను అప్పగించుకొనును.

ఇతరులపై శక్తి మరియు అధికారము కలిగియుండుట ఒక విధముగా మనుష్యులను పాడుచేయును.

''అధికారము పాడుచేయును, పూర్తి అధికారము పూర్తిగా పాడుచేయును''

అని లోకములో ఒక నానుడి ఉన్నది.

కాని పూర్తి అధికారము మోషేను ఏ మాత్రము పాడుచేయలేదు. అతడితో నున్న జనాంగము ద్వారా దేవుడు అతడిని మరల మరల పరీక్షించెను. ప్రతిమారు మోషే పరిక్షలో ఉత్తీర్ణుడాయెను.

ఆత్మీయ అధికారముతో గొప్ప ప్రమాదములు యున్నవి. కాని ఎవరైతే మాటి మాటికీ ముఖము దూళిలో ఉండునట్లు సాగిలపడుట ఎరుగుదురో వారు ధన్యులు. మరియు ఎవరైతే వారి నాలుకలను అదుపులో నుంచుకొనుట, తమను తాము సమర్థించుకొనకపోవుట మరియు తమ గొప్పను తాము చెప్పుకొనకపోవుట యెరిగియుందురో వారు ధన్యులే.

దేవుని సేవకుల నిర్ధోషిత్వమును ఆయనే ఋజువు చేస్తాడనేది ఆయన వాగ్దానము. ''నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయధమును వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయుదువు. యెహోవాయొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము'', ఇదే యెహోవా వాక్కు (యెషయా 54:17).

అటువంటి విషయములను మన చేతులలోకి తీసుకొనుటంటే దేవుని చేతులలో వదలుట మంచిది. న్యాయముగా తీర్పుతీర్చువానికి మన వాజ్యము యేసువలె అప్పగించుటయే మనము చెయ్యాల్సిన పని.

''ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యామముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను'' (1పేతురు 2:23).

యెషయా 53:7లో మూడుసార్లు యేసు ప్రభువు మౌనముగా నుండెనని వ్రాయబడినది. అది శ్రమ పెట్టబడినప్పుడు, బొచ్చుకత్తిరింపబడినప్పుడు మరియు వధకు తీసుకుపోబడినప్పుడు.

''అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చుకత్తిరించు వానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరుతెరువలేదు'' (యెషయా 53:7).

అటువంటి పరిస్థితులలో మౌనముగా నుండుట తెలియని వారు ఒక ఆత్మీయ నాయకునిగా ఉండుటకు ఎదురు చూడకూడదు.

మనము వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, అటువంటి పరిస్థితులను ఆయన చూచుకొంటాడని మనము నమ్ముతున్నామా, లేదా అని మన నిజమైన విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు ఆ పరిస్థితులను వాడుకొనును.

దేవుని సేవకుని యొక్క పొరపాట్లు

బైబిలులో నుండిన దైవజనుల జీవిత చరిత్రలు మనకు ప్రోత్సాహాన్నిస్తాయి. దానికి కారణం నవీనకాలపు జీవితచరిత్రల వలెకాక ఆ కాలపు దైవజనులలో నుండిన బలహీనతలను కూడా అవి మనకు కనపరుస్తాయి. ఎప్పుడూ పొరపాటు చేయని వాని యొక్క జీవితము, అనేక పొరపాట్లు చేసిన మనలాంటి వారికి ఏవిధముగానూ ప్రోత్సాహానివ్వదు.

అయితే బైబిలులో ఉన్న దైవజనుల పొరపాట్లు కేవలము మనలను ప్రోత్సాహించుట కొరకు మాత్రమే కాక మన హెచ్చరిక కొరకు కూడా వ్రాయబడినవి.

దేవుడు ఇతర విశ్వాసుల కంటె ఆయన అభిషేకించిన సేవకుల నుండి ఎంతో ఎంతో ఉన్నతమైన ప్రమాణములను కోరుకొనును. వారిలో ఎవరికి ఎక్కువ ఇయ్యబడెనో వారి నుండి ఎక్కువ ఎదురుచూచును.

అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులను కనానులో ప్రవేశించుటకు నిరాకరించే ముందు దేవుడు వారికి పది అవకాశములను ఇచ్చాడు. ఆయన వారి గూర్చి ''నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు'' (సంఖ్యా 14:22,23) అని చెప్పెను.

కాని ఆయన మోషేకు ఒక అవకాశమును మాత్రమే యిచ్చెను. మోషే అవిశ్వాసముతో మరియు అవిధేయతతో ఒక్కమారు మాత్రమే, అది కూడా చాలా చిన్న విధంగా ప్రవర్తించినప్పుడు, దేవుడు వెంటనే అతడికి వాగ్దాన దేశములో ప్రవేశమును నిరాకరించెను. ఆ సంఘటన మన హెచ్చరిక కొరకు సంఖ్యాకాండము 20:7-12లో వ్రాయబడెను.

''అంతట యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను - నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును, నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళ నిచ్చును, నీవు వారికొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొనిపోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను. అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.''

దేవుడు మోషేతో నీరు ప్రవహించునట్లు ఈ సారి ఆ బండతో మాట్లాడమని చెప్పెను. ఆ రాయి నలభై సంవత్సరముల క్రితం ఒక మారుకొట్టబడినది. నిర్గమ 17:6లో ''ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్ళు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లుచేసెను'' అని చదువుదుము.

అది క్రీస్తు ఒక్కమారు సిలువవేయబడెను అను దానికి సాదృశ్యముగా నుండెను. ఆ బండ రెండవసారి కొట్టబడవలసిన అవసరం లేదు.

కాని మోషే నిగ్రహమును కోల్పోయి ఆ బండను కొట్టెను (సంఖ్యా 20:10). అక్కడ దేవుని సేవకుడు లోబడనప్పటికీ నీరు వచ్చినది. నీరు ప్రవహించినదనే వాస్తవము, దాహంతో నుండిన ప్రజలకు దేవుడు ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని ఋజువుచేస్తుంది. అంతేకాని దేవుని సేవకుని అవిధేయతను అంగీకరించినట్లు కాదు.

ఇది దేవుని ఆజ్ఞలకు వారి జీవితాల్లో అవిధేయత చూపు స్త్రీ పురుషుల పరిచర్యలలో కూడా దీవించబడుటకు గల కారణమును తెలియజేస్తుంది.

నీరు ప్రవహించినంత మాత్రాన మోషే అవిధేయత మాసిపోలేదు. దేవుడు అతనిని కరిÄనముగా శిక్షించాడు. మరియు ఆయన తన యొక్క అవిధేయులైన సేవకులందర్నీ ఒక రోజున శిక్షిస్తాడు.

మోషే నలభై సంవత్సరములు ఎప్పుడు కనానులో ప్రవేశించే దినము కొరకు చూస్తూ ఉన్నాడు. కాని ఇప్పుడు కనాను యొక్క సరిహద్దుల్లో అతడు అనర్హుడయ్యాడు. ఇతరులకు భోధించి కూడా ఒకడు అనర్హుడయ్యే అవకాశమున్నది. అది చివరకు ఒకరి జీవిత ఆఖరి దినములలో కూడా కావచ్చును.

పౌలు ఈ విషయమును గ్రహించి ''గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరుచుకొనుచున్నాను'' (1కొరిందీ¸ 9:27) అని చెప్పెను.

''ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను'' (కీర్తన 103:7).

ఇశ్రాయేలీయులు కేవలం దేవుని బాహ్యమైన క్రియలను చూచారు. కాని మోషేకు దేవుని మార్గములను తెలిసికొనే ఆధిక్యత కలిగినది. అందువలన ఇశ్రాయేలీయుల కంటె మోషే నుండి దేవుడు ఎక్కువ ఆశించెను.

దేవుని సేవకునికున్న ఆధిక్యతలు ఎక్కువే కాని వాటికి అనుగుణముగా వారి జవాబుదారితనం కూడా ఎక్కువే.

మెరీబా యొద్ద దేవుడు తనను పరీక్షిస్తున్నాడని మోషే గ్రహించలేకపోయెను. అది అతనికి తెలిసియుంటే ఇంకా జాగ్రత్తగా ఉండేవాడు. మన దైనందిక జీవితాల్లో మనము చేసే పనులను వాటి వెనుక నుండే ఉద్దేశ్యములను తూకము వేస్తూ దేవుడు మనలను కూడా పరీక్షిస్తున్నాడని మనము గ్రహించము. జనులు మన పరిచర్య ద్వారా దీవింపబడినా సరే, మనము మన వ్యక్తిగత జీవితాల గూర్చి క్రీస్తు తీర్పుసింహాసనమెదుట ఒక రోజున జవాబు చెప్పాల్సి ఉంటుంది.

మోషే జీవితములో అంతకు ముందొకసారి దేవుడు తన సేవకుల యెడల కలిగియున్న ఉన్నత ప్రమాణాలకు ఒక సూచన ఇచ్చాడు.

దేవుడు మోషేను ఇశ్రాయేలీయులను విడిపించువానిగా పిలిచిన వెంటనే తన కుమారునికి సున్నతి చేయు విషయములో అవిధేయత చూపినందున, అతడి ప్రాణమును తీయబోయెను. అన్యురాలైన తన భార్య సిప్పోరా ఇష్టమును నెరవేర్చుటకు, మోషే తన కుమారునికి సున్నతి చేయలేదు. కాని, ఏమైనా మోషేలో ఏ విధమైన అవిధేయతను దేవుడు సహించలేకపోయెను.

ఆ విషయం మన హెచ్చరిక కొరకు మన కోసం నిర్గమ 4:24-26లో వ్రాయబడినది. ''అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని(మోషేని) ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదముల యొద్ద అది పడవేసి - నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతట ఆయన(ప్రభువు) అతనిని(మోషేని) విడిచెను''.

ఆ సమయములో దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చుటకు మోషే భూమిమీద అతి ప్రాముఖ్యమైన వ్యక్తియైనా దేవుడు దాన్ని పట్టించుకొనలేదు. మోషేలో ఆయన అవిధేయతను చూచినట్లయితే ఆయన మోషే యొక్క ప్రాణమును కూడా తీసివేసియుండేవాడు. దేవునికి పక్షపాతము లేదు.

దేవుడు మోషేకు ఇశ్రాయేలీయులను కనాను దేశములోనికి నడిపించే ఆధిక్యతను ఇవ్వకపోయినా, తన జీవితమంతా అతడు ఒక నమ్మకమైన దైవసేవకుడిగా యున్నందున, 1500 సంవత్సరములు తరువాత వాగ్దానదేశములోనికి ప్రవేశించి రూపాంతర పర్వతముపై యేసు ప్రభువుతో నిలువ గలుగునట్లు దేవుడు అనుమతించెను.

అది మత్తయి 17:2,3లో ''ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి'' అని వ్రాయబడెను.

దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు మరియు కనికరము కలవాడు. ఎవరైనా చేసిన త్యాగపూరిత ప్రేమతో కూడిన ప్రయాసను మరచి పోవుటకు ఆయన అన్యాయస్థుడు కాడు.

''మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు'' (హెబ్రీ 6:10).

కాని దేవుడు ఖచ్చితమైన వాడు కూడా.

''కాబట్టి దేవుని అనుగ్రహమును కారిÄన్యమును చూడుము'' (రోమా 11:22).

దేవునికి అంగీకారమైన సేవను అర్పించుటకు, మనము దేవుని భయములో నడువవలెను. ''అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృపకలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదుము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు'' (హెబ్రీ 12:28,29).

తిమోతి వలె మనము కూడా ''దేవునిచేత యోగ్యునిగా'' సిగ్గుపడనక్కర్లేని పనివానిగా యుండుటకు జాగ్రత్తపడుదుము (2తిమోతి 2:15).

అధ్యాయము 7
దావీదు పరీక్షింపబడుట

దావీదు గూర్చి దేవుడు ''అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నియు నెరవేర్చును'' అని చెప్పెను (అపొ.కా.13:22).

సౌలు ఇశ్రాయేలీయులకు దేవునిచేత మొదటిగా ఎంపిక చేయబడిన రాజు. కాని సౌలు దేవుడు ఇచ్చిన రెండు పరీక్షలలో అతి అసహనము (1సమూ 13) వలన మరియు అవిధేయత (1సమూ 15) వలన తప్పిపోయాడు. దేవుడు అతని యొద్దనుండి రాజ్యమును తీసివేసి దావీదుకిచ్చాడు.

కాని రాజుగా అభిషేకము పొందిన సమయము మొదలుకొని, వాస్తవంగా ఇశ్రాయేలు సింహాసనము మీద కూర్చొను సమయము వరకు దావీదు కరిÄనమైన, దీర్ఘమైన త్రోవలో నడిచెను. ఆ సంవత్సరములన్నిటిలో అతడు దేవుని చేత అనేక విధములుగా పరీక్షింపబడి వాటిలో నెగ్గెను.

ఇంటిలోను, పనిచేయు స్థలములోను నమ్మకముగా నుండుట

దావీదులో మనము మొదట గమనించేది, దేవుడు అతనిని పిలచినప్పుడు అతడు తన భూలోక సంబంధమైన విధులను ఇంటిలోనూ మరియు పనిచేయు స్థలములోనూ నమ్మకముగా నెరవేర్చుచుండెను. అది ఒక గొఱ్ఱెలకాపరిగా.

''నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని సమూయేలు(దేవుని ఆజ్ఞ ప్రకారము యెష్షయి కుమారులలో ఒకరిని ఇశ్రాయేలు రాజుగా అభిషేకించుటకు వచ్చినప్పుడు) యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను'' (1సమూ 16:11).

దేవుడు మన జీవితాలపై ఆమోద ముద్ర వేయవలెనంటే మన యింటిలో మరియు మనము పనిచేయు చోట నమ్మకముగా నుండుట ప్రధానమైనది.

ఈ విషయంలో యేసుప్రభువు ఏ విధముగా దేవుని ఆమోద ముద్రను పొందెనో చూచాము. కాని దీనిని మరల చూచుటలో విలువ ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది.

యేసుప్రభువు ఎప్పుడూ ఒక నిరుద్యోగిని తన వాక్యపరిచర్యలోనికి పిలువలేదు. సువార్తలలో వివరింపబడిన పరిచర్యకు పిలువబడిన అపొస్తలులలో ప్రతి ఒక్కరూ వారు పనిచేయు స్థలముల నుండియే పిలువబడిరి.

ఈనాడు భారతదేశములో క్రైస్తవ పని గురించి విచారించవలసిన విషయమేమంటే పూర్తి కాలపు క్రైస్తవ సేవలో నున్న అధిక సేవకులు వారి జీవితాల్లో ఎప్పుడూ లౌకికమైన ఉద్యోగము చేయని వారే. ఈ ఒక్క విషయమే దేవుడు తన పరిచర్యకు వారిని ఎప్పుడైనా పిలిచాడా అనే ప్రశ్నను కలుగజేస్తుంది. దేవుడు మన జీవితాల్లో చేసే సాధారణ పనులలో నమ్మకత్వమునకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు. అదియే మనలను ఆయన సేవకు యోగ్యులమైనట్టుగా చేయును.

దేవుని నామమును గూర్చిన ఆలోచన

దావీదు గురించి మనము చూచే రెండవ విషయం, దేవునినామ మహిమను గూర్చిన ఆలోచన. గొల్యాతు ఇశ్రాయేలు సైన్యమును సవాలు చేస్తున్నప్పుడు, అతడిని సవాలు చేయుటకు దావీదును ప్రేరేపించింది ఏదో సాహసకృత్యములు చెయ్యాలనే చౌకయిన కోర్కె కాదు కాని దేవుని నామమును ఘనపర్చవలెననే ఆలోచన మాత్రమే.

''దావీదు - జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచిన వారినడిగెను'' (1సమూ 17:26) అని చదువుదుము.

ప్రతి నిజమైన దైవసేవకుని యొక్క అతి ముఖ్యమైన తలంపు దేవుని నామము యొక్క ఘనతను గూర్చిన తలంపు ''నీ నామము పరిశుద్ధ పరచబడును గాక'' అనేది అతడి ప్రార్థనలో మొదటి మరియు అసంకల్పితమైన మనవిగా ఉండాలి (మత్తయి 6:9).

మిగిలినవన్నీ వ్యక్తిగత సౌఖ్యము మరియు భద్రత లేక ఇంక ఏదైనా కూడా రెండవదిగా ఉండాలి. ఈ విషయంలోనే దేవుడు మనందరిని వేరు వేరు పరిస్థితుల్లో పరీక్షిస్తాడు. కొద్దిమందే ఆ పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. దావీదు వారిలో ఒకడు.

దేవుని నామముయొక్క ఘనత కొరకైన ఆలోచన దావీదులో బహు ఎక్కువగా ఉండినందున, గొల్యాతును జయించుటకు దేవుడు తప్పక సహాయము చేయుననే బలమైన విశ్వాసము అతడి హృదయములోనికి వచ్చినది. ఆ విశ్వాసము అతడిలో నుండిన భయము నంతటినీ పారద్రోలినది. ఆ విశ్వాసమును ఆయుధముగా ధరించుకొని అతడు ముందుకు వెళ్లి ఆ రాక్షసున్ని చంపి ఇశ్రాయేలీయుల శతృవులను తరిమి వేసెను.

మనము కూడా దావీదువలె దేవునినామము యొక్క ఘనత కొరకు చింత కలిగియున్నట్లయితే, దేవునియందు విశ్వాసము గొల్యాతులను చంపి మన హృదయాలలో నుండి భయాన్నంతటినీ తరిమి వేయునని కనుగొనెదము. తరచుగా మనకు దేవుని మహిమ కొరకు ఉన్న చింత బహు తక్కువ కాబట్టి, విశ్వాసములో ధైర్యముతో ముందుకు వెళ్లుటకు బదులు మనము బిడియముతో వెనుక నుండి పోవుచున్నాము.

పగతీర్చుకొనుటకు నిరాకరించుట

గొల్యాతును చంపుటతో దావీదు పరీక్ష పూర్తి కాలేదు. కేవలము మొదలయ్యాయి. దావీదుకు కీర్తి పెరుగుట సౌలు అసూయకు కారణమయ్యెను. దానితో దావీదును చంపుటకై ఇశ్రాయేలు దేశమంతటా అతడిని వెంటాడెను. దావీదు ఒక పట్టణము నుండి వేరొక పట్టణమునకును, ఒక గుహ నుండి వేరొక గుహకును పరిగెత్తెను.

రెండు సందర్భాలలో సౌలు ఒంటరిగా నుండి, దావీదు సులువుగా చంపగలిగిన పరిస్థితులలో దొరికి అతడి కనికరముపై ఆధారపడియుండెను నిజానికి దావీదు స్నేహితులు చంపమని కూడా చెప్పారు...కాని దావీదు నిరాకరించాడు. దేవుని చేత అభిషేకింపబడిన రాజును అతడు ముట్టలేదు, చివరకు ఆ రాజు దేవునిచిత్తము నుండి జారిపోయినా సరే. సౌలు నుండి సింహాసనమును లాక్కోవాలని దావీదు అనుకోలేదు. దేవుడు తన యొక్క అనుచితమైన సమయములో తనను సింహాసనముపై కూర్చొన బెట్టుటకు తగిన సమర్థుడని అతడు నమ్మాడు.

గొల్యాతును చంపుటకు సహాయపడిన దేవుని సామర్థ్యముపై దావీదుకు ఉండిన విశ్వాసము కంటె దేవుని సర్వాధికారముపై దావీదు కుండిన విశ్వాసము ఎంతో అద్భుతమైన విషయము.

సౌలు దావీదు కనికరముపై ఆధారపడినప్పుడు అతడు దేవుని చేత పరీక్షింపబడెను. అదీ ఒక్కసారి కాదు, రెండుసార్లు.

మొదటిది 1సమూయేలు 24:3-7లో వ్రాయబడెను ''మార్గముననున్న గొఱ్ఱె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి, గనుక, దావీదు జనులు - అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపుచెంగును కోసెను. సౌలు పైవస్త్రపు చెంగు తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి - ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలుమీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్లి మార్గమున పోయెను''.

రెండవది 1సమూయేలు 26:6-12లో వ్రాయబడెను ''అప్పుడు దావీదు - పాళెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబిషైని అడుగగా నీతో కూడా నేనే వత్తునని అబిషై యనెను. దావీదును అభిషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్త దళములో పండుకొని నిద్రపోవుచుండెను. అతని యీటె అతని తలగడ దగ్గర నేలను నాటి యుండెను. అబ్నేరును జనులును అతని చుట్టూ పండుకొనియుండిరి. అప్పుడు అబిషై దావీదుతో - దేవుడు ఈ దినమున నీ శత్రువును నీ కప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడచి, నేనతనిని భూమికి నాటి వేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదు నీవతని చంపకూడదు. యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్దమునకు పోయి నశించును. యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారికందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదానిని గుర్తు పట్టిన వాడొకడును లేడు'' అని వ్రాయబడెను.

ప్రతి సారి దావీదు పరీక్షలో ఉత్తీర్ణుడాయెను. అతడు పగ తీర్చుకొనలేదు. ఎందుకంటె పగతీర్చుకొను పని యెహోవాదే అని అతడికి తెలియును. అతడు చెడును మంచితో జయించుటకు నిశ్చయించుకొనెను.

''ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది. కాబట్టి, నీ శతృవు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము. అలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయించుము'' (రోమా 12:19-21) అని బైబిలు చెప్పుచున్నది.

దేవుని యొక్క సర్వాధికారములో నమ్మకము

దేవుడు దావీదుకు సింహాసనమును గూర్చి వాగ్దానము చేసెను. దేవుడు దానిని యిచ్చువరకు వేచియుండుటకు దావీదు యిష్టపడెను.

దేవుడు మనకు వాగ్దానము చేసిన దానినే మనకు ఇచ్చువరకు వేచియుండుట మన విశ్వాసమునకు మరియు ఓర్పునకు ఒక గొప్ప పరీక్ష.

దేవుని యందు నమ్మకముంచి వేచియుండుట వలన దావీదు ఎప్పుడూ ఏదీ కోల్పోలేదు. దావీదు యొక్క ముప్పయవ పుట్టిన రోజు పూర్తవగానే అతడు రాజు కావలెనని దేవుడు ఉద్దేశించెను. దానికి తగినట్లుగానే పరిస్థితులు సమకూడి జరిగెను.

''దావీదు ముప్పది ఏండ్లవాడై ఏల నారంభించి నలువది సంవత్సరములు పరిపాలన చేసెను'' (2సమూ 5:4).

దేవుడు ఉద్దేశించిన సమయములో ఆయన ఒకనిని సింహాసనముపై కూర్చొన బెట్టగలడని దావీదు తప్పని సరిగా యోసేపు యొక్క జీవిత చరిత్ర చదివి తెలుసుకొనియుండును.

అనేక సంవత్సరముల క్రితం దేవుని వాక్యము యోసేపును కూడా అతికష్టమైన పరిస్థితులలో పరీక్షించెను.

''వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను'' (కీర్తన 105:18,19).

కాని యోసేపు ముప్పదవ పుట్టిన రోజు పూర్తికాగానే, దేవుని సమయము వచ్చెను. యోసేపు ఐగుప్తుకు అధికారములో రెండవ వాడు అయ్యెను.

''....యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడైయుండెను''....(ఆది 41:46).

యోసేపు జీవితములో దేవుని ఉద్దేశము నెరవేరుటను తన అన్నల అసూయకాని లేక ఫోతీఫరు భార్య చేసిన అబద్దపు నేరారోపణలు కాని ఆటంకపర్చలేదు. నిజానికి వారు దేవుని చిత్తము యొక్క నెరవేర్పును ఒక్క రోజు కూడా జాప్యము చేయలేకపోయిరి.

దావీదు ఆ కథను చదివి ఇపుడు తన జీవితములో దేవుని నమ్మకత్వమును మరియు సర్వాధికారమును ఋజువు చేసికొనుటకు నిశ్చయించుకొనెను. మరియు దేవుడు యోసేపు విషయంలో ఏమిచేసాడో, అదే తనజీవితములో కూడా చేయునని తెలిసికొన్నాడు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దేవుడు యోసేపు మరియు దావీదు మరియు అనేకులైన ఇతరులకు చేసినట్లు, మనకూ చేయునను విశ్వాసము మనకున్నదా అనునది. ఇక్కడే మన విశ్వాసము పరీక్షింపబడుతుంది.

ఉదాహరణకు దేవుడు నీకు వివాహ భాగస్వామిగా ఉద్దేశించిన వారు, నీవు వెళ్లి లోకస్థులు వలె ప్రవర్తించి లేక బలవంతముగా లాక్కోనవసరం లేకుండానే నీ యొద్దకు వస్తారని నమ్మగలవా? అదే విధముగా దేవుడు నీకు ఉద్దేశించిన ఉద్యోగము మరియు ఇల్లు మరియు ఈలోకములో జీవించుటకు కావలసినవన్నియు దేవుడు ఉద్దేశించిన సమయములో నీ యొద్దకు వచ్చునని నమ్ముచున్నావా? అటువంటి అవసరతలతో మనమున్నప్పుడు మన విశ్వాసము పరీక్షింపబడుతుంది.

''....అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు(వారి తరుపున పనిచేయుటకు) కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు....'' (యెషయా 49:24).

''తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నీ కాలమున చూచియుండలేదు'' (యెషయా 64:4).

విశ్వాసము గలవారు ఆతురతతో లాక్కొనకుండా ఎల్లప్పుడూ శ్రేష్టమైన దానిని పొందుదురు.

యాకోబు విషయంలో చూచినట్లయితే, తన తండ్రి యొద్ద నుండి జ్యేష్టత్వపు హక్కును పొందుకొనుటకు ఒక మోసగాడిగా తయారయ్యాడు. యాకోబు తన విషయమును దేవునికి అప్పగించి నమ్మినట్లయితే, అతడు అబద్ధమాడవలసిన అవసరము లేకుండానే దాన్ని పొందుకొనేవాడు (ఆది 27). కాని యాకోబు తప్పుడు విధానముగా దాన్ని సంపాదించాడు కాబట్టి, అతడు తన యింటి నుండి పారిపోయి తరువాత ఇరవై సంవత్సరములు ఎంతో శ్రమననుభవించవలసి వచ్చెను.

అందువలన మనము కూడా అవిశ్వాసముతో మరియు అసహనము ఎప్పుడూ ప్రవర్తించకుండునట్లు ఈ విషయములన్ని మనకు బుద్ధి కలుగుటకును మరియు హెచ్చరిక కలుగుటకును వాక్యములో వ్రాయడినవి.

మనము పనిచేయు ఆఫీసులో ఒక క్లిష్ట పరిస్థితిని తప్పించుకొనుటకు అబద్ధము చెప్పుటకు శోధింపబడినప్పుడు మనము ఆ శోధనను తిరస్కరించి, దేవునిని ఘనపరచి మన గూర్చి ఆయనే జాగ్రత్త తీసుకొంటాడని నమ్మవచ్చును. నీవు నిజాన్ని చెప్పి దేవునిని ఘనపర్చుట వలన నీవు ఎప్పుడూ నష్టపోవు. చెప్పాలంటే ఏవిధమైన అబద్ధము కంటే దేవుడే శక్తిమంతుడు. ఒక అబద్ధము నిన్ను కాపాడగలిగితే, దేవుడు ఇంకెంతగా కాపాడును!!

''తూర్పు నుండియైనను పడమటి నుండియైనను(అంటే, అదృష్టవశాత్తు, లేక మనుష్యులనుండి) అరణ్యము నుండియైనను హెచ్చుకలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును'' (కీర్తన 75:6,7).

దేవుడే ఒక అనామకుడైన యోసేవును మరియు ఒక అనామకుడైన దావీదును పరీక్షించి వారు నమ్మకముగా నుండునట్లు కనుగొనిన తరువాత వారిని ఒక ప్రాముఖ్యమైన పరిచర్యకు హెచ్చించెను.

యిబ్బందుల ద్వారా సమృద్ధికి

దావీదు తరువాత తన అనుభవాలను సమీక్షించి, ''దేవా, నీవు మమ్మును పరిశీలించి యున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుములమీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. అయినను నీవు సమృద్థిగల చోటికి మమ్ము రప్పించియున్నావు'' (కీర్తన 66:10-12) అని చెప్పెను.

ఆ విధముగా దావీదు గిన్నె పొర్లి పారెను (కీర్తన 23:5). (కీర్తన 23:5లో దావీదు ''పొర్లిపారెను'' అను దానికి వాడిన హెబ్రీ భాష పదమునే కీర్తన 66:12లో ''సమృద్ధిగల చోటు'' అనుదానికి కూడా వాడెను) మనలో నుండి జీవజలనదులు ఎడతెగక ప్రవహించునట్లు మనలను మహిమ గల స్వాతంత్య్రమునకు తీసుకువచ్చుటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కాని మొదట మనలను పరీక్షింపకుండా ఆయన అక్కడకు మనలను నడిపించలేడు.

ఆయన మనలను అగ్ని ద్వారా నీటి ద్వారా తీసుకువెళ్లును. మనుష్యులు మనలను దూషించునట్లు మరియు మనలను వాడుకొనునట్లు చేయును. మనలను మన పరిచర్యను స్వేచ్ఛగా కదలలేకుండా ఇరుకులో ఉండునట్లు మనలను వలలో వేయును. ఈ పరిస్థితులన్నిటిలో మనము ఎలా స్పందిస్తున్నామో ఆయన గమనించును. ఆయన మన జీవితములో ఏర్పాటుచేసిన పరిస్థితులన్నిటికి మనము దీనత్వముతో మరియు సంతోషముతో అంగీకరించినట్లయితే, ఆయన మనలను తప్పని సరిగా చివరకు సమృద్ధితోపొంగి పొర్లే స్థలమునకు తీసుకువచ్చును.

పాపమును నిజాయితీతో ఒప్పుకొనుట

ఆఖరుగా దావీదు లక్షణములలో మనము చూడవలసినది, అతడు రాజైన తరువాత కూడా తనను తాను తీర్పుచేసికొనుటకు యిష్టపడే లక్షణము. అతడు బత్షెబాతో పాపములో పడినప్పుడు, తాను చేసినపాపము యొక్క తీవ్రతను అతడు వెంటనే గ్రహించలేదు. తరువాత, నాతాను ప్రవక్త వచ్చి, చేసిన పాపము చూపింపగా దావీదు తన తప్పును వినయముతో ఒప్పుకొనుటను చూడగలము.

''నేను పాపము చేసితిని'' అని నాతానుతో అనెను (2సమూ 12:13).

వ్యభిచారములో పడిన దావీదుతో మనలను మనము పోల్చుకోకూడదు ఎందుకంటే అతడు పాత నిబంధన క్రింద జీవించాడు. అతడు కృప క్రిందలేడు. ఈనాడు మన నుండి దేవుడు ఆశించే ప్రమాణములు చాలా ఉన్నతమైనవి.

ఈ విషయములో యేసు ప్రభువు మనకిచ్చిన ప్రమాణములు మత్తయి 5:28,29లో ఉన్నవి.

''నేను మీతో చెప్పునదేమనగా - ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా''.

కాని పాపము విషయంలో ఒప్పింపబడిన దావీదు స్పందన నుండి మనమొక ఉపయోగకరమైన పాఠము నేర్చుకోవచ్చు.

దేవుడు సౌలు నుండి రాజ్యమును తీసివేసినది ఎందుకు? మానవ దృష్టితో చూచినట్లయితే అది పరిగణలోనికి రాని అపరాధము. దావీదు యొక్క నేరము వ్యభిచారము దాని వెంబడి నరహత్యయైన గొప్ప పాపమైయుండగా, దేవుడు అతనిని రాజుగా ఎలా కొనసాగనిచ్చాడు? దీనికి జవాబు ఆ ఇరువురు పాపమును ఎదుర్కొన్నపుడు ఎలా స్పందించారు అన్న దానిపై ఆధారపడియున్నది. సౌలు తన పాపమును రహస్యముగా సమూయేలు యొద్ద ఒప్పుకొని ప్రజల ముందు ఘనతను కోరుకొన్నాడు.

''అందుకు సౌలు - నేను పాపము చేసితిని, అయినను నాజనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున...'' (1సమూ 15:30).

అతడు పాపము చేసినప్పటికీ మనుష్యుల యొక్క ఘనతను కోరుకొనెను. దానికి వేరుగా దావీదు, తన పాపమును కప్పిపుచ్చుకొనుటకు ప్రయత్నించలేదు కాని 51వ కీర్తన వ్రాయుట ద్వారా బహిరంగముగా దానిని ఒప్పుకొనెను.

మనుష్యుల నుండి ఘనతను కోరుకొనువారు వ్యభిచారము మరియు నరహత్య చేసినవారికంటె నిజమైన విరిగిన హృదయముతోను మరియు పశ్చాత్తాపముతోను దేవుని వైపునకు తిరుగుట కష్టమని ఈ ఇద్దరి ద్వారా మనము తెలుసుకొంటున్నాము. యేసు ప్రభువు తనతో సిలువ వేయబడిన దొంగను మరియు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని కూడా వారు పశ్చాత్తాప పడుటచేత క్షమించెను. కాని మనుష్యుల యొక్క గౌరవాన్ని కోరుకొన్న పరిసయ్యులకు మారుమనసు పొందుట కష్టమయింది. అందువలన వారు క్షమింపబడలేక పోయిరి.

మనుష్యుల యొక్క ఘనతను కోరుకొనుట ఒక విధమైన విగ్రహారాధన. ఈ విషయంలోనే మనలో ప్రతి ఒక్కరిని ప్రభువు ఎక్కువగా పరీక్షించును. దావీదువలె పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ధన్యులు.

మన గత వైఫల్యాలను మనము దీనత్వముతో ఒప్పుకొనుటకు మనము యిష్టపడినట్లయితే, మన యెడల దేవుని ఉద్దేశ్యములు నెరవేరుటకు అవి ఏ మాత్రము ఆటంకము కాదు. ఎందుకంటే దేవుడు దీనులకు తన కృపనిచ్చును.

అధ్యాయము 8
ఎలీషా మరియు గెహాజీ పరీక్షింపబడుట

ఇశ్రాయేలు చరిత్రలో ఒక క్లిష్టమైన కాలములో, ఆదేశమునకు తన సాక్షిగా నుండుటకు దేవుడు ఏలియా ప్రవక్తను ఏర్పరుచుకొనెను. ఏలియాకు ఎలీషా అనే సేవకుడు ఉండెను. అతడిని ఆదేశమునకు తరువాత ప్రవక్తగా దేవుడు ఎన్నుకొనెను.

ఎలీషాకు ఒక సేవకుడుండెను. అతడి పేరు గెహాజీ. ఎలీషాకు గెహాజీకి మధ్య ఉన్న తారతమ్యమును చూచి ధ్యానించుట ఆసక్తికరముగా నుండును.

ఎలీషా యొక్క నమ్మకత్వము

ఏలియాకుండిన అభిషేకములో రెండుపాళ్లు ఎలీషాకు దేవుడు ఇచ్చెను. ఇది ఎలీషా జీవితముపై దేవుని యొక్క ఆమోద ముద్ర. కాని దేవుడు అట్లు అభిషేకించుటకు ముందు అతడిని పరీక్షించెను.

నిజమైన దేవుని సేవకులందరివలె, ఎలీషా కూడ తన లౌకిక విధులను నమ్మకముగా నిర్వహించుచున్నప్పుడే పరిచర్యకు పిలువబడెను.

''ఏలియా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను'' (1రాజులు 19:19).

దాని తరువాత, ఎలీషా ఏలియా ప్రవక్తకు చిన్న చిన్న పనులు చేస్తూ చాలా సంవత్సరములు గడిపెను. అతడి గూర్చి ''ఏలియా చేతులమీద నీళ్ళుపోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా'' అని చెప్పబడెను (2రాజులు 3:11).

అతడి కొరకు అతడు గొప్ప వాటిని వెదుక్కోలేదు, కాని దేవుడు ఆ యవ్వనస్థుని కొరకు గొప్ప ప్రణాళికలు కలిగియుండెను.

ఏలియా పరలోకమునకు ఎక్కిపోక ముందు ఎలీషా పరీక్షింపబడవలసి యుండెను. కనుక ఏలియా బేతెలుకు వెళ్లునప్పుడు ఎలీషాను గిల్గాలులో నుండమనెను. ఎలీషా వెనుక నుండనని చెప్పి ఏలియాతో వెళ్లుటకు నిశ్చయించుకొనెను. తిరిగి బేతెలులో, ఏలియా ఏలీషాను విడిచిపెట్టవలెనని యెరికోకు తాను వెళ్లవలెనని చెప్పెను. కాని ఎలీషా జలగవలె వెంటపట్టుకొని యుండెను. చివరకు యెరికోలో కూడా మరియొక సారి అదే విధముగా ఎలీషా పరీక్షింపబడెను. తిరిగి ఎలీషా స్థిరత్వమనే పరీక్షను నెగ్గి ఏలియాతో యోర్దాను యొద్దకు వెళ్లెను. ఆ విధముగా రెండింతల అభిషేకమును పొందుకొనెను. అది తన జీవితములో దేవుడు ఉద్దేశించిన శ్రేష్టమైన విషయం (2రాజులు 2:1-14).

ఇక్కడ మనకున్న సందేశమేమిటంటే మన ఆత్మీయ అభివృద్ధిలో వేరువేరు దశలుండును. ఈ దశలలో మనము పొందుకొన్న వాటితో మనము సంతృప్తి చెంది పోయామా లేక మనము దేవుడు ఉద్దేశించిన ఉన్నత స్థానమునకు సాగిపోవుదుమో దేవుడు పరీక్షించి చూచును.

గిల్గాలు అనునది మన పాపములు క్షమింపబడిన స్థానమునకు నిదర్శనముగా యున్నది.

''కాబట్టి ఆ సమస్త జనము సున్నతిపొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా - నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ తొలగించి వేసి యున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు'', (యెహోషువ 5:8,9).

చాలా మంది క్రైస్తవులు అంతవరకు వెళ్లి అక్కడ ఆగిపోవుదురు. కొందరు బేతెలు ('దేవుని యిల్లు' అని అర్థము), వరకు వెళ్లుదురు. ఇది దేవుని కుటుంబములో విశ్వాసులతో సహవాసమునకు నిదర్శనమైయున్నది.

''అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను...మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును'' (ఆది 28:19,22).

కొందరు ఇక్కడ ఆగిపోవుదురు. కాని కొందరు ఇంకా ముందుకు యెరికో వరకు వెళ్లుదురు. యెరికో దేవుని యొక్క మానవాతీతమైన శక్తిని చూపు అనుభవమునకు నిదర్శనముగా యున్నది.

''యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి....ప్రాకారము కూలెను....ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి'' (యెహోషువ 6:20).

చాలా మంది క్రైస్తవులు ఇంతవరకు వెళ్లుదురు.

చాలా చాలా కొద్దిమంది మాత్రమే యోర్దాను అనగా క్రీస్తు మరణముతో సమానానుభవముగా నుండు అనుభవము, (అదే బాప్తిస్మములో సూచనార్థముగా చూపబడును) వరకు వెళ్లుదురు.

''ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను'' (మత్తయి 3:13).

చాలా కొద్ది మంది సిలువ మార్గము ''అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున;.....''(హెబ్రీ 10:20) నడచుటకు యిష్టపడుదురు.

కాని ఈ కొద్దిమంది, ఎవరైతే వారి స్వజీవమును పూర్తిగా మరణమునకు అప్పగించునట్లు పూర్ణ హృదయముతో ముందుకు సాగుదురో, వారు దేవుడు అనుగ్రహించు శ్రేష్టమైనది, అది రెండుపాళ్ల ఆత్మను పొందుదురు.

ఏ దశలో ఆగిపోదుమో తెలిసికొనుటకు మనమందరము పరీక్షింపబడుచున్నాము.

గెహాజీ యొక్క అపనమ్మకత్వము

గెహాజీ నమ్మకముగా నుండినట్లయితే, ఎలీషా ఏ విధముగా ఏలియా తరువాత ప్రవక్తగా అయ్యాడో అదే విధముగా గెహాజీ ఎలీషా తరువాత ప్రవక్తగా అయ్యుండే వాడు. కాని గెహాజీ మొదట పరీక్షింపబడవలసియుండెను.

సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైన నయమాను తన కుష్టురోగము బాగుపడిన తరువాత తిరిగి ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఈ పరీక్ష జరిగెను. అతడు స్వస్థపర్చబడినాననే కృతజ్ఞతతో లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారము వెండిని మరియు అందమైన పది సిరియా దేశపు వస్త్రములను ఇవ్వబోయెను. ఎలీషా కంటే తక్కువైన మానవునికి అది ఎంతటి శోధన! కాని ఎలీషా ఒక్క క్షణమైనా సంకోచించకుండా వాటన్నిటిని వద్దని చెప్పెను. నయమాను ఒక అవిశ్వాసి మరియు రాజీ పడేవాడు అందువలన ఎలీషా అతడి యొద్ద నుండి ఏమీ తీసుకొనలేదు.

నయమాను స్వస్థపడిన తరువాత ఎలీషాతో చెప్పిన విషయములో అతడు రాజీపడువాడని తేటగా తెలుస్తుంది. అతడి యొక్క అధికార స్థానమును బట్టి అతడు విగ్రహారాధన తప్పనిసరిగా చేయవలెనని చెప్పెను. విగ్రహారాధన తప్పని నయమానుకు తెలియును. కాని ఈనాడు అనేకులవలె అతడు కూడా సత్యము కొరకు తన ఉద్యోగమును త్యాగము చేయుటకు యిష్టపడలేదు.

నయమాను ఎలీషాతో ''నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక...'' అని చెప్పెను (2రాజులు 5:18).

ఎలీషా అటువంటి వాని నుండి ఏమీ తీసుకోడు. మొదటి కాలపు అపొస్తలులు ఈ పద్ధతినే పాటించిరి. ''....వారు అన్యజనుల వలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి....'' (3యోహాను 7).

నయమాను ఇవ్వజూపిన ధనము విషయములో ఎలీషా యొక్క వైఖరిని గెహాజీ గమనించెను. కాని నయమాను ఇవ్వబోయిన దానిని తిరస్కరించుటలో ఎలీషా తెలివి తక్కువగా ప్రవర్తించెనని గెహాజీ అనుకొనెను. అందువలన అతడు నయమాను వెనుక పరిగెత్తి (ఈనాటి అనేక భారతీయులు పాశ్చాత్య దేశపు క్రైస్తవులు వెనుకపడినట్లు), కొన్ని అబద్దములు చెప్పి నలభైవేల రూపాయల విలువ చేసే వెండిని మరియు రెండు సిరియా దేశపు వస్త్రములను తీసికొనెను.

వక్రబుద్ధి కలిగిన మనుష్యుని లోనికి సులువుగా చూడగలిగిన ఎలీషా వెంటనే గెహాజీ దురాశను బయటపెట్టెను. అతడు నయమాను యొక్క ధనాన్ని ఆశతో పొందు కొన్నాడు కాబట్టి నయమాను యొక్క కుష్టురోగమును కూడా అతడు పొందుకొనునని అతడు గెహాజీతో చెప్పాడు.

''కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలె తెల్లనైన కుష్టము గలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్లెను'' (2రాజులు 5:27).

ఎలీషా ఆత్మలో రెండు పాళ్ల ఆత్మను పొందుకొనుటకు బదులు గెహాజీ కుష్ఠును పొందుకొనెను.

ఆ రోజున అతడు దేవునిచేత పరీక్షింపబడుచుండెనని గెహాజీ గ్రహించలేదు. ఒకవేళ అతడికి రానున్నకాలములో ఎటువంటి విషయములు పొంచియుండెనో తెలిసియుంటే అతడు మరి ఎక్కువ జాగ్రత్త పడియుండేవాడు.

కాని మనము పదే పదే చూచినట్లు, దేవుడు మనలను పరీక్షించునప్పుడు మరి ముఖ్యముగా సిరికి సంబంధించిన విషయములలో పరీక్షింపబడునప్పుడు మనము దానిని గ్రహించము.

రాజైన హిజ్కియా గూర్చి ఒకసారి ''అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి, అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడిచిపెట్టెను'' అని వ్రాయబడియున్నది (2 దినవృ 32:31).

ఇది గెహాజీ విషయములోనూ నిజమయ్యింది. ఏ ఒక్కరూ చూడని పరిస్థితిలో ఉండుటకు దేవుడు అతనిని అనుమతిచ్చెను. కేవలము ఆవిధముగానే అతడు పరీక్షింపబడగలడు.

దురాశ యొక్క చివరి ఫలితము

అనేక సంవత్సరముల ముందు యెరికోలో ఆకాను విషయంలో అలాగే జరిగెను. దేవుడు నిషేధించినది ఆకాను తీసుకొనునా లేదా పరీక్షించుటకు ఒక యింట్లో ఆకాను ఒంటరిగా నుండుటకు దేవుడు అనుమతించాడు. ఆకాను అందులో తప్పిపోయెను.

ఆకాను తన పతనమును ఇలా వర్ణించెను:

''నేను చూచితిని,... దురాశపడితిని,.... తీసుకొంటిని,..... దాచితిని'' (యెహోషువ 7:21).

అదే క్రమము గెహాజీ విషయములో తిరిగి జరిగెను.

ఆకాను మరియు తన కుటుంబము ఆ విధంగా కనానులో తమ స్వాస్థ్యమును పోగొట్టుకొన్నారు. అలాగే గెహాజీ దేవుని మనసులో అతడి కొరకుండిన పిలుపును పోగొట్టుకొనెను.

ఆకాను గెహాజీ కూడా ''ఒక పూట కూటి కొరకు జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసుకొన్న ఏశావు'' (హెబ్రీ 12:16) అడుగుజాడలను అనుసరించిరి.

ఎలీషాకు మరియు గెహాజీకి మధ్య యుండిన తారతమ్యము కొట్టొచ్చినట్లుగా ఉంది. ఎలీషా రెండింతల ఆత్మ కొరకు ఏలియా వెన్నంటి వెళ్లగా, గెహాజీ కొంచెం ధనము కొరకు నయమానును వెన్నంటి వెళ్లెను. వారిరువురు ఈ రోజున ఉన్న రెండు రకాలైన క్రైస్తవ పనివారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరికీ మనము ఏ రకమునకు చెందిన వారముగా యున్నామో తెలియును.

గెహాజీకి బిలాము గూర్చిన కథ తెలియును అనే దాంట్లో అనుమానము లేదు. అయినప్పటికీ అతడి ముగింపుకూడా బిలాము ముగింపు వలె ఉండునని ఎప్పుడూ ఊహించియుండడు. బిలాము దేవుని యొక్క ఆత్మ ఒక సమయములో నిలిచిన ఒక ప్రవక్త.

''బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను'' అని ఒక చోట చదువుదుము (సంఖ్యా 24:2).

అతడు ధనము విషయములో అవినీతిపరుడుగా నుండుటను బట్టి కాక అతడు ధనమును ప్రేమించుటను బట్టి తప్పిపోయెను. ధనముపై నున్న ప్రేమ మరియు ఒక ఈ లోక సంబంధమైన రాజు నుండి వచ్చే ఘనత కొరకైన ప్రేమ అతడు దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్తున్నాననే విషయాన్ని తెలియనివ్వనంతగా బిలామును గ్రుడ్డివాడిని చేసాయి. బిలాము హృదయములో ఉన్న దానిని చూచుటకు దేవుడు అతనిని పరీక్షించెను.

రాజైన బాలాకు పంపిన వారితో వెళ్లి రాజును కలుసుకోవచ్చునా యని బిలాము మొదట దేవుని చిత్తమును వెదకినప్పుడు, ''వారితో వెళ్లవద్దని'' దేవుడు తేటయైన సమాధానమిచ్చెను (సంఖ్యా 22:12). అంతకంటె జవాబు తేటగా ఉండదు.

కాని బాలాకు ఇంకా ఎక్కువ ధనమును మరియు ఎక్కువ ఘనతను ఇవ్వజూపినప్పుడు, బిలాము తిరిగి అనుమతి కోసం అడుగునట్లు శోధింపబడెను. ఎప్పుడైతే బిలాము నిజముగా వెళ్లుటకు కోరుకొనుచున్నాడని దేవుడు చూచెనో, ఆయన అతడిని వెళ్లమనెను. కాని బిలాము దాని పర్యవసానములను అనుభవించెను.

దేవుడు కొన్నిసార్లు మనము అభ్యర్థించినది ఆయన చిత్తము కాకపోయినను, ఆ విషయమును మనము బహుగా కోరుకొనుచుండుట చేత దానిని ఆయన ఇచ్చును. కాని దాని యొక్క ఆత్మీయ ఫలితము ఇశ్రాయేలీయులను గూర్చి వ్రాయబడినట్లు ''ఆయన వారు కోరినది వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను'' (కీర్తన 106:15) అన్నట్లుగా ఉండును.

అతడు పరీక్షింపబడుతున్నాడని కాని అతడి ధనాశ చేత అతడు త్రోవ తప్పిపోయెనని కాని బిలాము గ్రహించలేదు. అతడు ప్రవచించుటను కొనసాగించెను. కాని అతడు ఈలోక సంబంధమైన లాభము అనే జారుడుబల్ల యొక్క మొదటి మెట్టుపై నుండెను. అక్కడ నుండి అడుగుకు జారిపోవుటకు ఎంతో సమయము పట్టదు. దేవునితో ఒకప్పుడు ఎంతో సన్నిహిత సంబంధముండిన వాడు ఒక సోదెగాడిగా మారి ఇశ్రాయేలీయుల చేత చంపబడెను.

''ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితోపాటు ఖడ్గముతో చంపిరి'' (యెహోషువ 13:22).

గెహాజీ తన కొరకు ఆ హెచ్చరికను తీసుకొనలేదు.

కాని బిలాము మరియు గెహీజీల యొక్క ఉదాహరణలు హెచ్చరికలుగా కలిగి యున్నప్పటికీ త్రోవ తప్పిపోతున్న క్రైస్తవ సమూహములు గూర్చి మనము ఏమందుము.

ధనాశ అన్ని కీడులకు మూలము. దేవుని యెడల మనకున్న నమ్మకత్వము మరియు అంకిత భావమును పరీక్షించుటకై వస్తు సంబంధమైన విషయములు మనలను ఆకర్షించునట్లు ఆయన అనుమతించును.

యేసు ప్రభువు యొక్క శిష్యులు ఎప్పుడూ వస్తు సంబంధమైన విషయములను పొందుకొనుటకు వాటి వెంబడి వెళ్లునట్లు ఉద్దేశించలేదు. మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుటకు పిలువబడ్డాము. మనకు అవసరమైన వస్తు సంబంధమైన విషయములు, మనకు అవసరమైనప్పుడు మన ఒడిలో పడునట్లుగా వచ్చును.

తన బిడ్డలు వస్తు సామాగ్రిని వారు అవసరమునకు మించి కూడబెట్టుకొనవలెనని దేవుడు ఉద్దేశించలేదు. అంతేకాక మనలో ఎవ్వరమూ సంపద వెంబడి పరిగెత్తాలని కూడా ఉద్దేశించలేదు. మనము దేవునిని నమ్మినట్లయితే మనకు ఏది శ్రేష్టమైనదో దానిని ఆయన మనకు ఇచ్చును. అప్పుడు మనము ధనమును బట్టి నాశనమవ్వము.

దేవుడు మనలను దీవించినప్పుడు, మనకు అవసరమైనవన్ని ఏర్పర్చబడును మరియు దానితో ఏ విచారము కలసిరాదు.

''యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆశీర్వాదము ఎక్కువకాదు'' (దానికి ఏ విచారము కలసి రాదు (ఇంగ్లీషు బైబిలు సామెతలు 10:22).

''కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' (ఫిలిప్పీ 4:19).

మనము వెంటబడి సంపాదించుకొనిన సంపద దానితో పాటు ఎన్నో విచారములను మనకు తీసుకువచ్చును.

పౌలు ఈ ప్రమాదము గూర్చి తిమోతిని హెచ్చరిస్తూ ఇలా చెప్పెను: ''ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి'' (1తిమోతి 6:10).

మనము దేవునిని మరియు సిరిని (వస్తు సంబంధమైన వాటిని) సేవించలేము. మనము ''ఒకని ద్వేషించి ఒకని ప్రేమించుదుము, ఒకని అనుసరించి ఒకని తృణీకరించుదుము'' (లూకా 16:13).

వినుటకు చెవిగలవాడు వినును గాక.

అధ్యాయము 9
పేతురు మరియు యూదా పరీక్షింపబడుట

యేసు ఏర్పరచుకొన్న పన్నెండుమంది శిష్యుల్లో బహుశా ఎంతో వ్యత్యాసమున్న వ్యక్తిత్వాలు పేతురు, ఇస్కరియోతు యూదా అయి యుండవచ్చు. పేతురు సామాన్యుడు, పామరుడు, దయార్థ హృదయుడు. యూదా ఇస్కరియోతు తెలివిగలవాడు, కుయుక్తి గలవాడు ఉన్నత స్థితి కోరే మనస్సు గలవాడు.

ధనము యెడల పేతురు వైఖరి

పేతురు కొరకు దేవుడు గొప్ప పిలుపు కలిగియుండెను. అయితే అతడు పరీక్షకు గురై, ఆమోదము పొందే వరకూ అది నెరవేరదు.

అయితే యేసు పేతురును పిలచినప్పుడు అతనికి దేవుని అద్బుత ప్రణాళిక గురించిన అవగాహన లేదు. దేవుడు తన ప్రణాళికను ఆయాసమయాల్లో ఒక్కొక్క మెట్టు చొప్పున వెల్లడి చేస్తాడు.

ఒకరోజు యేసు, పేతురు పడవ ఎక్కి పడవను లోతుకు నడిపి, వలలు వేసి చేపలు పట్టమని అతనికి చెప్పాడు. పేతురు అలాగే చేసి, తన జీవితకాలమంతటిలోనూ, ఎన్నడూ పట్టనన్ని చేపలు పట్టాడు (లూకా 5:1-11).

ఒకవేళ పేతురు నేటి క్రైస్తవ వ్యాపారుల వంటి వాడైనట్లయితే, అతను యేసుతో ఇలా చెప్పియుండేవాడు. ''ప్రభూ! ఇది అద్భుతం, నువ్వూ, నేనూ పార్టనర్స్‌గా (భాగస్వాములుగా) ఉందాం. నువ్వు బోధ చెయ్యి. నేను నీకు ఆర్థికంగా సహాయం అందిస్తాను''. ''నా చేపల వ్యాపారం ఇలా ఉండేట్టయితే, నేను త్వరలోనే ఇశ్రాయేలు అంతటిలో అతి ధనవంతుడైన వ్యాపారినవుతాను. అప్పుడు నా దశమభాగాలు నీకు మాత్రమే కాదు, ఈ దేశంలో ఇతర దేశాల్లో అనేక ప్రాంతాలలో ఉన్న క్రైస్తవ సేవకులందరికీ సహాయపడతాయి!''.

అప్పుడు పేతురు వ్యాపారస్తులకు, వారి వ్యాపారాల్ని అభివృద్ధి పరచగల ఒక క్రీస్తును గురించి బోధిస్తూ, వ్యాపారస్తుల కోసం ఏర్పాటైన వివిధ సమావేశాలలో తన సాక్ష్యమిస్తూ ప్రపంచమంతా పర్యటించి ఉండేవాడు. శరీర సంబంధమైన మనస్సు యొక్క ఆలోచన ఇలా ఉంటుంది.

అయితే పేతురు అలా చేయలేదు. తన వలలు విడిచి రమ్మని యేసు అతణ్ణి పిలిచినప్పుడు వెంటనే అతడు తన చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టి, ప్రభువైన యేసును అనుసరించాడు. అతడు పరీక్షలో గెలిచాడు.

అధిక ధనం సంపాదించుకొనేలా దేవుడు వారి విధానాలను ఆశీర్వదించి, అభివృద్ధి పరచినప్పుడు, దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడన్న సంగతిని చాలా కొద్ది మంది క్రైస్తవులు గుర్తిస్తారు. అనేకమంది క్రైస్తవులు పరీక్షలో ఓడిపోయేది ఇక్కడే. అపొస్తలులు అవ్వాల్సిన వారు ఉత్తకోటీశ్వరులుగా స్థిరపడతారు.

సంవత్సరాలు తరువాత, ఐశ్వర్యవంతుడైన వ్యాపారి కావడానికి ఇష్టపడని పేతురు కేవలం ఇలా చెప్పగలిగాడు ''వెండి బంగారములు నా దగ్గర లేవు'' (అపొ.కా. 3:6). అయితే వెండి బంగారాలకు మించి శ్రేష్టమైనది అతని దగ్గర ఉండెను. క్రీస్తు రాజ్యంలోని శాశ్వత ఐశ్వర్యం కోసం, భూసంబంధమైన ఐశ్యర్యాలనే, చెత్తను వదులుకున్నాడు.

ఒకని జీవితంలో యేసును భాగస్వామిగా కలిగియుండి ఎలా భౌతికంగా అభివృద్ధి చెందాలో, ఎలా డబ్బు సంపాదించుకోవాలో క్రైస్తవులకు బోధించే పుస్తకాలతో ఈ దినాల్లో క్రైస్తవ పుస్తక షాపులు నిండిపోయాయి! క్రీస్తుయందు విశ్వాసం ద్వారా విలువైన ఇళ్లను, కార్లను, పొలాలను స్వంతం చేసుకోవడానికి క్రైస్తవులు ఈ పుస్తకాల ద్వారా ప్రేరణ పొందుతున్నారు.

ఈ పుస్తకాల రచయితల భూసంబంధమైన మనస్తత్వాన్ని చిన్న పిల్లవాడు కూడా గ్రహించగలడు. అయినప్పటికిని ఎందరో విశ్వాసులు మోసపోతున్నారు. వాటిలోని భౌతిక వస్తువాహనాదులను పొందుతున్న వ్యక్తుల సాక్ష్యాలన్నీ నిజమే కావచ్చు కానీ, వారికి ఐశ్వర్యం ఇవ్వడం ద్వారా దేవుడు వారిని పరీక్షిస్తున్నాడని వారిలో ఎంతమది గుర్తించారు?

వారు ధనవంతులైనప్పుడు వారు తన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ''దేవుని యెడల ధనవంతులు కావడం'' నేర్చుకుంటారో లేదో చూడడానికి దేవుడు వారిని పరీక్షిస్తాడు (లూకా12:21). అయితే పేతురుకి భిన్నంగా చాలా మంది ఆ పరీక్షలో ఓడిపోయారు.

ఆదాము సంతతివాడైన ప్రతివానిలోనూ 'అహం' కేంద్రంగా ఉంది. మనం మారుమనస్సు పొందినప్పుడు 'అహం' అనేది చావదు. అది దేవుని ఎదిరించి తన స్వంత కోర్కెలు నెరవేర్చుకోవడం కోసం అడ్డదారులు వెదుకుతుంది. దేవుని నుండి వచ్చే భౌతికమైన, శారీరకమైన ఆశీర్వాదాలనే నొక్కి వక్కాణించే శరీరానుసారమైన క్రైస్తవ్యానికి మూలమే ఈ అహం. ఈ రోజుల్లో ఇది పుస్తకాలలో ''విశ్వాసం'' అనే ముసుగు ధరించి మన దగ్గరికి వస్తోంది.

అయితే ఈ పుస్తకాల వలన ఒక ప్రయోజనం కూడా ఉంది. వాటి పాఠకుల హృదయాలు నిజంగా దేనిని ఆశిస్తున్నాయో, భూసంబంధమైనవాటినా లేక పరలోక సంబంధమైన వాటినా అనేదాన్ని అవి వెల్లడి చేస్తాయి. ఆ విధంగా క్రైస్తవ్యంలోని ధాన్యం జల్లింపబడి చెత్త వేరుచేయబడుతుంది!

దిద్దుబాటు విషయంలో పేతురు వైఖరి

మరి ఏ మనుష్యుని గద్దించనంత తీక్షణమైన కరిÄనమైన గద్దింపుతో యేసు పేతురును బహిరంగంగా గద్దించినప్పుడు ఆయన మరో రకంగా అతడినెలా పరీక్షించాడో చూడగలం.

తాను తిరస్కరించబడి, సిలువ మరణం పొందబోతున్నానని యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు, పేతురు ప్రభువు మీద తీవ్రమైన మానవ ప్రేమతో ''ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను'' (మత్తయి 16:22).

యేసు పేతురువైపు తిరిగి (ఇతర అపొస్తలులు వింటుండగా) బహిరంగంగా అతడితో ఇలా అన్నాడు.

''సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు'' (మత్తయి 16:23).

బహిరంగముగా గద్దించబడడం మన అహానికి ఎంతో అవమానం. పైగా 'సాతానా' అని పిలువబడటం మరింత దారుణం. అయినప్పటికీ పేతురు అభ్యంతరపడలేదు.

యేసు బోధించిన ''అహాన్ని చంపుకోవాలి'' అనే సందేశానికి అభ్యంతరపడిన అనేకమంది శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు పన్నెండు మంది అపొస్తలులను, వారు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారేమోనని అడిగాడు. అప్పుడు జవాబిచ్చింది పేతురే! అతడిలా అన్నాడు. ''ప్రభువా, ఎవనియొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు'' (యోహాను 6:68).

యేసు నోటి నుండి వచ్చిన కరిÄనమైన గట్టి మందలింపును స్వీకరించిన తరువాత పేతురు ఉచ్చరించిన మాటలివి. పేతురు మాటలను మరింత అద్భుతమైనవిగా చేసినదిదే. యేసు నోటినుండి వచ్చిన ఏ గద్దింపు మాటలైనా, అవి నిత్యజీవపు మాటలేనని అతడు భావించాడు.

పెద్దవాడైన ఒక సహోదరుడి గద్దింపును అంగీకరించగలగడమనేది మన దీనత్వమునకు పరీక్ష. పేతురు జయశాలిగా ఈ పరీక్షలో నెగ్గాడు.

ధనం యెడల యూదా వైఖరి

యేసు ఎన్నుకున్న పన్నెండుమంది అపొస్తలులలో ఒకడిగా ఉన్న యూదా ఇస్కరియోతుకు దేవుని ఆమోదము పొంది, యోగ్యుడని అనిపించుకోవడానికి మిగతా వారికి లాగానే చక్కటి అవకాశం ఉండెను.

అలాగే ఇతరులవలెనే అతడు కూడా పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది.

సువార్త గ్రంథాలు అతణ్ణి ''ద్రోహియగు ఇస్కరియోతు యూదా'' (లూకా 6:16) అంటున్నాయి. యేసు అతణ్ణి ఎన్నుకున్నప్పుడు మిగతా పదకొండుమంది శిష్యుల్లాగానే అతడూ యధార్థవంతుడే అయితే స్వార్థపూరితమైన ఆశయాల వలన అతడు దారుణంగా పతనమయ్యాడు.

''మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును'' (యాకోబు 3:16) అని బైబిలు మనల్ని హెచ్చరిస్తున్నది.

యూదా జీవితము మనందరికీ ఒక హెచ్చరిక ఎందుకంటే మనము జాగ్రత్తగా లేకపోయినట్లయితే, మనమూ అతనిలాగే మారే అవకాశం ఉంది.

యేసుబృందానికి అతడు కోశాధికారి. ధనం విషయంలో తన నమ్మకత్వాన్ని ఋజువు చేసుకొనేందుకు కావలసినంత అవకాశం అతనికి ఉంది. అతడు నమ్మకస్తుడిగా ఉన్నట్లయితే, క్రొత్త నిబంధన పత్రికలను రాసిన రచయితల్లో అతనూ ఒకడయ్యేవాడు. నూతన యెరూషలేము ప్రాకారపు పునాదులపై అతని పేరు ఖచ్చితంగా ఉండి ఉండేది.

''ఆ పట్టణపు (నూతన యెరూషలేము) ప్రాకారము పండ్రెండు పునాదులు గలది. ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి'' (ప్రకటన 21:14) అని బైబిలు చెప్పుచున్నది.

అయితే, పరీక్షించబడినప్పుడు ఇస్కరియోతు యూదా ఓడిపోయాడు.

డబ్బు సంచి యొక్క ప్రయోజనాల్లో ఒకటి, పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కోసం డబ్బు దాచి ఉంచడం (యోహాను 13:29ప్రకారము). ''డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను, గనుక....బీదలకేమైనా ఇమ్మనియైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి''.

పేదలకు సహాయం చేసే ఈ పని పట్ల తనకు ఆసక్తి ఉన్నట్లు యూదా చెప్పుకున్నప్పటికీ పేదల కోసం దానం చేయబడిన ధనమంతటినీ అతడు దొంగిలించేవాడు.

''...బీదలమీద శ్రద్ధ కలిగికాదు గాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను...'' (యోహాను 12:4-6) అని వ్రాయబడెను.

''యేసు అప్పుడే ఎందుకని యూదాను బట్టబయలు చేయలేదు?'' అని మనం ప్రశ్నించవచ్చు.

ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వాలంటే, మనం ఇంకో ప్రశ్న వేసుకోవాలి. ''క్రైస్తవ్యం పేరిట నేడు తమకొరకు తాము డబ్బు సంపాదించుకొంటున్నవారందరినీ యేసు ఎందుకని బట్టబయలు చేయడం లేదు?'' ఈనాడు కూడా డబ్బుకోసమే దేవుని సేవిస్తున్నవారు వేలమంది ఉన్నారు. దేవుని పనికోసం ఇవ్వబడిన ధనం విషయంలో నూటికి నూరు శాతం నమ్మకంగా లేనివారూ ఉన్నారు.

కాని దేవుడు సహనం గలవాడు. ప్రతివారు పరీక్షింపబడుటకు ఆయన సమయాన్నిస్తున్నాడు. ధనాన్ని ఎంచుకోవడం వలన తానేమీ కోల్పోబోతున్నాడో యూదా తెలుసుకొని ఉన్నట్లయితే అతడెంత భిన్నంగా ప్రవర్తించి ఉండేవాడు!

అలాగే ధనాన్ని కోరుకోవడం వలన తాము ఏమి పోగొట్టుకుంటున్నామో క్రైస్తవ సేవకులు తెలుసుకున్నట్లయితే, ధనం విషయంలో వారెంత వేరుగా ప్రవర్తిస్తారు!

యూదా సమస్య ఏమిటంటే, అతడు పుచ్చుకోవడాన్ని ప్రేమించాడు కాని ఇవ్వడాన్ని ద్వేషించాడు. యేసు తన శిష్యులకు ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదాన్ని గురించి బోధించాడు. ''పుచ్చుకొనుటకంటె, ఇచ్చుట ధన్యము'' అని ప్రభువైన యేసు చెప్పెను (అపొ.కా. 20:35).

పేతురు దీనిని గ్రహించాడు. కానీ యూదా అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా ఇంకా పుచ్చుకోవడం ద్వారా సంతోషం కలుగుతుందని యూదా అనుకున్నాడు.

ప్రతి క్రైస్తవుడూ ఈ రెండు తరగతుల్లో ఏదో ఒకదానికి చెందిన వాడైయుంటాడు. పేతురులాగా సమస్తాన్నీ విడిచి, దేవునికీ, అవసరంలో ఉన్న ఇతరులకీ ఇవ్వడాన్ని ప్రేమించేవారు; యూదాలాగా పుచ్చుకోవడాన్ని ప్రేమించి తన కోసం కూర్చుకొనేవారు.

ఒకవేళ ఎప్పుడైనా ఇటువంటి ''యూదాలు'' ఇచ్చినట్లయితే, అతి కష్టంగా, పిసినారితనంగా, మనస్సాక్షి పోరు పడలేక అది కూడా ఎంతో అయిష్టంగా ఇస్తారు! అదే పుచ్చుకొనే విషయంలోనైతే వారికి ఎటువంటి కష్టమూ అయిష్టమూ ఉండదు!

మనం ఈ లోక కట్టడలను అనుసరించి జీవించడానికి ఇష్టపడుతున్నామో లేక ఆయన రాజ్య కట్టడలను అనుసరించి జీవించడానికి ఇష్టపడుతున్నామో చూడడానికి ఇచ్చే విషయంలోను, పుచ్చుకొనే విషయంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు.

దేవునిచేత ఆమోదించబడాలి అనుకుంటే, మన శరీర స్వభావంలో ఉన్న ''బహుమానాలు పుచ్చుకోవాలనే ఆశ, ప్రేమ'' లను సంపూర్ణంగా సిలువ వేయాలి. పాత అలవాట్లు మానుకొని, వాటికి బదులుగా కొత్తవాటిని మనం నేర్చుకోవాలి. గతంలో బహుమానాలు పుచ్చుకోవడంలో మనమెంత చెయ్యి తిరిగిన వారమో ఇప్పుడు ఇవ్వడంలో చెయ్యి తిరిగిన వారిగా ఉండొచ్చు.

అయితే, ఒక్క రాత్రిలోనే మనం ఏ విషయంలోనూ నిపుణులమైపోలేము. మనల్ని ఏ విషయంలోనైనా నిష్ణాతులను చేసేది నిరంతర సాధనే. మనం ఇవ్వడం ప్రారంభించాలి. మనం పుచ్చుకోకుండా, ఇచ్చేవారిగా ఉన్నామని మన గురించి దేవుడే స్వయంగా సాక్ష్యమివ్వగలిగేలా మన వ్యక్తిత్వం మార్పు చెందేంతవరకు దానిని మనం కొనసాగించాలి.

దేవుని విషయంలో ధనికుడు కావడం ఎలాగో తెలుసుకున్నవాడూ మరియు అవసరంలో ఉన్న ఇతరులకు ఇవ్వడం నేర్చుకున్నవాడే యేసుకు నిజమైన శిష్యుడు. అతని స్వంత అవసర సమయంలో, అతడిచ్చిన కొలత చొప్పుననే దేవుడు అతనికి తిరిగి ఇవ్వడం అతడు కనుగొంటాడు.

యేసు తన శిష్యులకిలా చెప్పాడు: ''ఇయ్యుడి అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లునిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును'' (లూకా 6:38).

భూసంబంధమైన విషయాలలో మనం అపనమ్మకంగా ఉంటే దేవుని దగ్గర నుండి ఆత్మీయ ఐశ్వర్యాలను ఎన్నడూ పొందలేమని యేసు బోధించాడు.

''మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?'' (లూకా 16:11) అని బోధించెను.

యూదా ఇస్కరియోతును డబ్బు సంచితో పరీక్ష కాలంలో ప్రభువు ఉంచాడు. అతడు ఓడిపోయాడు. అతడి నష్టం శాశ్వతమైనది. నేడు మన డబ్బు సంచితో నీవూ, నేనూ పరీక్షాకాలంలో ఉన్నాం.

దిద్దుబాటు విషయంలో యూదా వైఖరి

బహిరంగంగా గద్దించి సరిచేసినప్పుడు ప్రతిస్పందించే విషయంలో యేసు పేతురును పరీక్షించాడని చూసాం. ఈ విషయంలో యూదా కూడా పరీక్షించబడ్డాడు. అయితే పేతురుకు భిన్నంగా అతడు ఓడిపోయాడు.

ప్రభువు తన కొరకు చేసినదానికి కృతజ్ఞతగా, ఒక స్త్రీ అచ్చమైన జటామాంసి అత్తరును యేసు పాదాల మీద పోసినప్పుడు అది డబ్బు వృధా చేయడం అని యూదా అభిప్రాయపడ్డాడు.

అయితే యేసు ఆమెను సమర్థించి ఆమె పక్షం వహించి ఇలా అన్నాడు. ''నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; బీదలు ఎల్లప్పుడును మీతో కూడా ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండను'' (యోహాను 12:7,8).

అసలు ఇక్కడ యేసు యూదా ఇస్కరియోతును గద్దించాడని ఎవరూ చెప్పలేరు. యేసు పేతురుని గద్దించిన దానితో పోల్చినప్పుడు ఇది లెక్కలోకి రానేరాదు. అయినప్పటికీ, యూదా ఇస్కరియోతు అభ్యంతర పడ్డాడు.

మత్తయి సువార్తలోని దీనికి సంబంధించిన వాక్య భాగంలో, ఈ సంఘటన జరిగిన వెంటనే యూదా ఏమి చేసాడో చదువుతాం ''అప్పుడు....ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకులయొద్దకు వెళ్ళి నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను'' (మత్తయి 26:14,15).

'అప్పుడు' అనే మాట ఇక్కడ ప్రాముఖ్యమైనది. అతని కోపం అతణ్ణి వెంటనే యాజకుల దగ్గరకు వెళ్లి యేసును అప్పగిస్తాననేలా చేసింది. యేసు అతణ్ణి సరిచేయడానికి ప్రయత్నించడమే అతని కోపానికి కారణం.

పేతురు దిగ్విజయంగా పరీక్షలో నెగ్గాడు. కానీ యూదా ఘోరంగా ఓడిపోయాడు.

నేడు దేవుడు మన మీద అధికారులుగా నియమించినవారు మనల్ని సరిదిద్దినప్పుడల్లా నీవూ నేనూ పరీక్షించబడుతున్నాం.

తల్లిదండ్రులు పిల్లలను సరిదిద్దినప్పుడు వారు పరీక్షకు గురవుతున్నారు. భర్తలు భార్యలను సరిదిద్దినప్పుడు వారు పరీక్షకు గురవుతున్నారు. పై అధికారులు ఉద్యోగులను గద్దించినప్పుడు అది వారికి పరీక్ష. మరి సంఘంలో, మన పెద్దలు మనల్ని గద్దించినప్పుడు అది మనకు పరీక్ష.

దిద్దుబాటు విషయంలో మన యొక్క ప్రతిస్పందన, మన దీనత్వము యొక్క అతి స్పష్టమైన పరీక్షలలో ఒకటి. మనం అభ్యంతరపడినట్లయితే మనం యూదా ఇస్కరియోతు సహచరులం.

సరిదిద్దినప్పుడు మనం అభ్యంతరపడినట్లయితే మనం మన అహాన్ని చంపగలిగేలా సహాయం చేయమని దేవునికి మొరపెట్టాలి. ఆ విధంగా మన శాశ్వత బహుమానాన్ని కోల్పోకుండా ఉండగలం.

దిద్దుబాటు విషయంలో పేతురు, యూదాల ప్రతిస్పందనల మీదే వారి నిత్యత్వ వ్యవహారాలు ఆధారపడి ఉండెను. తాము పరీక్షా కాలంలో ఉన్నామని వారు పూర్తిగా గుర్తించలేకపోయిరి.

దిద్దుబాటు విషయంలో మన ప్రతిస్పందనను కూడా దేవుడు చూస్తున్నాడన్న సంగతిని మనలో చాలా కొద్ది మంది మాత్రమే గుర్తించగలరు.

దిద్దుబాటును నీవు అంగీకరించక పోయినట్లయితే లేదా నిన్ను సరిదిద్దినపుడు నీవు నొచ్చుకొని అభ్యంతరపడినట్లయితే, నీవు దేవుని చేత యోగ్యుడవనిపించుకోలేవు.

అధ్యాయము 10
దేవుని యోగ్యుల గుంపు

ప్రకటన 14:1-5లో భూమి మీద తమ జీవితాల్లో ప్రభువును సంపూర్ణ హృదయంతో అనుసరించిన ఒక చిన్న శిష్యుల గుంపు గురించి మనం చదువుతాం. అంతిమ దినాన వారు యేసుతోపాటు విజేతలుగా నిల్చుంటారు ఎందుకంటే దేవుడు వారి జీవితాల్లో తన పూర్తి సంకల్పాన్ని నెరవేర్చగలిగాడు, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే తమ పాపాలు క్షమించబడిన జనసమూహపు సంఖ్య ఏ మనుష్యుడు లెక్కించలేనంత విస్తారంగా ఉంది.

''అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, ఎవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి'' (ప్రకటన 7:9,10).

అయితే ప్రకటన 14లో ప్రస్తావించబడిన శిష్యుల గుంపు చాలా చిన్నది. దానిని లెక్కించవచ్చు అది 1,44,000. (ప్రకటన గ్రంథం చాలా వరకు సాధృశ్యరూపంగా వ్రాయబడిన కారణంగా) ఈ సంఖ్య అక్షరార్థమైనదా లేక సాదృశ్యమైనదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. గొప్ప సమూహముతో పోల్చినట్లయితే ఇది చాలా చిన్న సంఖ్య అనేదే ఇక్కడ ప్రాముఖ్యాంశం.

భూమి మీద దేవునికి ఉన్న నిజమైన, నమ్మకమైన శేషం ఇదే. వారు పరీక్షించబడి, దేవుని యోగ్యతా పత్రాన్ని పొందారు. దేవుడే స్వయంగా, వారి గురించి ఇలా చెప్పాడు ''వీరు ...అపవిత్రులు కానివారును...గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు....వీరినోట ఏ అబద్ధమును, కనబడలేదు, వీరు అనింద్యులు'' (ప్రకటన 14:4,5).

వీరు దేవుని ప్రథమ ఫలాలు. క్రీస్తు యొక్క వధువు వీరితో కూడియున్నది. గొఱ్ఱెపిల్ల వివాహ దినానా, దేవునికి అన్ని విషయాల్లోనూ పెద్దవైనా, చిన్నవైనా అన్నింటిలోనూ పూర్తి యదార్థంగా నమ్మకంగా ఉండడం ఎంత శ్రేష్టమో ప్రతి ఒక్కరికీ స్పష్టమవుతుంది.

ఆ రోజున, పరలోకం ఈ గొప్ప శబ్దంలో మారుమ్రోగుతుంది, ''గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొని యున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము'' (ప్రకటన 19:7).

భూమి మీద తన స్వలాభం, స్వగౌరవం కోసం ప్రయాసపడినవారు ఆ రోజున నిజంగా తన నష్టమెంత గొప్పదో పూర్తిగా గుర్తిస్తారు. తల్లినీ లేక తండ్రినీ, భార్యనీ లేక పిల్లల్ని, సోదరులనూ, సోదరీలనూ, తన స్వంత జీవితాన్ని లేక భౌతికమైన వాటిని ప్రభువుకంటె ఎక్కువగా ప్రేమించిన వారు ఆ రోజున తమ శాశ్వత లోటును కనుగొంటారు.

యేసు ప్రవర్తనను అనుసరించి నడవడానికి తమ హృదయమంతటితో ప్రయాసపడినవారూ, ఆయన ఆజ్ఞలకు సంపూర్ణంగా విధేయత చూపిన వారే భూమి మీద అతి శ్రేష్టులూ, మహాజ్ఞానులూ అని స్పష్టంగా ఋజువవుతుంది.

క్రైస్తవ్యంలోని ఘనతంతా అప్పుడు చెత్తలాగా కనిపిస్తుంది. మనం క్రీస్తు వధువుగా ఉండేందుకు అర్హులమో కాదో తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ధనం, వస్తువాహనాదుల ద్వారా పరీక్షించాడని అప్పుడు గ్రహిస్తాం.

ఆ రోజున మనం స్పష్టంగా చూడబోయే వాస్తవాలను కొంతమట్టుకైనా గ్రహించేందుకు ఇప్పటికైనా మన కళ్ళు తెరువబడును గాక! ఆ రోజున క్రీస్తు వధువులో స్థానం సంపాదించుకోవడమే ఏ మనిషి అయినా పొందగలిగే అతిగొప్ప ఘనత. దేవుని చేత స్వయంగా పరీక్షించబడి యోగ్యుడనిపించుకున్న వ్యక్తిగా అతనికి అంతకు మించిన ఘనత మరొకటి లేదు!

వినుటకు చెవులు గలవాడు వినునుగాక, ఆమేన్‌.