WFTW Body: 

"మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది" హెబ్రీ 4:13వ వచనములో వ్రాయబడియున్నది.

"మనమెవరికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో" అనేది ఒక చక్కటి మాట. అంటే నరులుగా మనము ఈ విశ్వమంతటిలో ఒక్క వ్యక్తికి మాత్రమే లెక్క యొప్పచెప్పవలసియున్నది. ఒక్క వ్యక్తికి మాత్రమే సమాధానము చెప్పవలసియున్నది - అది దేవునికే. దాన్ని గుర్తించి నీ జీవితాన్ని జీవిస్తే నీవు ఇంకా ఇంకా భక్తిపరునిగా మారిపోతావు. అయితే ఇతరులు నీ గురించి ఏమనుకొంటున్నారో అని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ జీవిస్తే నీవు వారికి బానిసవైపోతావు.

నీవు దేవుని దాసునిగా ఉండాలనుకుంటే నీవు దేవునికి మాత్రమే లెక్క యొప్పచెప్పవలసియున్నదని ఎల్లప్పుడు గుర్తించుము. పదివేల మంది నిన్ను భక్తిపరుడని పిలిస్తే నీవు భక్తిపరుడవైపోవు. అదే విధంగా పదివేల మంది నిన్ను భక్తిహీనుడని పిలిస్తే నీవు భక్తిహీనుడవైపోవు. మనుష్యులిచ్చే పట్టాలు పనికిరానివి. గనుక వాటిన్నిటిని చెత్తబుట్టలో వేయండి. ఇతరులకు నీ రహస్యజీవితము గురించి ఒక్క శాతమే తెలుసు. ఆ ఒక్క శాతము పైన వారి అభిప్రాయము ఆధారపడియుండును. గనుక వారి అభిప్రాయములు మంచివైనా చెడ్డవైనా పనికిరానివే. వారియొక్క మంచి అభిప్రాయములు మరియు చెడు అభిప్రాయములు చెత్తబుట్టకే తగును. వాటిని దానిలో వేయండి. అనేక సంవత్సరాలుగా నేను దానినే చేసాను. తద్వారా దేవుణ్ణి సేవించుటకు నేను విడిపించబడ్డాను.

దేవుణ్ణి సేవించుటకు నీవు విడిపించబడాలనుకుంటే, "ప్రభువా, నేను లెక్క అప్పచెప్పవలసినది నీకే. ప్రతి దినము నేను నీ యెదుట నిలబడాలనుకొంటున్నాను. నీ దృష్టికి మరుగైనది ఏదియు లేదు. నా జీవితములో సమస్తము నీ యెదుట తేటగానున్నది. నేను ఆత్మానుసారుడనని ప్రజలను మోసగించవచ్చును గాని నిన్ను మోసగించలేను" అని చెప్పుము. నీవలా జీవిస్తే నీ జీవితములో ఒక మంచి మార్పు రావడం నీవు చూస్తావు. ఆవిధంగా నీవు క్రొత్త నిబంధన జీవితములోనికి ప్రవేశిస్తావు.