WFTW Body: 

యేసు ప్రభువు బాగా యౌవనములో ఉన్నవారిని తనకు అపొస్తలులుగా నుండుటకు పిలిచెను. ఒకరు అపొస్తులుడుగా నుండుటకు కనీసం 60 లేక 65 సంవత్సరములు ఉండవలెనని చాలా మంది అనుకొందురు. కాని యేసు ప్రభువు తన యొక్క మొదటి అపొస్తలులుగా సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారిని ఎంచుకొనెను. యేసు ప్రభువు కూడా ఆయన చనిపోయేనాటికి 33 1/2 సంవత్సరాల వయస్సు కలవాడై యుండెను. మరియు పదకొండు మంది శిష్యులు తనకంటే చిన్నవారు - ఎందుకంటే యూదులలో నుండిన బోధకులు ఎప్పుడూ తమ కంటే వయస్సులో చిన్నవారినే తమకు శిష్యులుగా ఎంచుకొనేవారు. యోహానుకు పెంతెకొస్తు దినము నాటికి కేవలము 30 సంవత్సరములు ఉండి యుండవచ్చును.

యేసు ఈ యౌవనస్థులను పిలిచినప్పుడు, ఆయన వారి అనుభవాన్ని చూడలేదు, కాని వారి హృదయములలో నిండియున్న ఆశను చూచెను. పెంతెకొస్తు దినాన ఈ యౌవనస్థులు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిరి మరియు ప్రభువు యొక్క అపొస్తలులగుటకు మానవాతీతముగా సిద్ధపరచబడిరి. వారికి అనుభవము మరియు పరిపక్వత తరువాత వచ్చినది. తిమోతి కూడా చాలా యౌవనస్థుడుగా నుండినప్పుడే అపొస్తలుడయ్యెను (1 తిమోతి 4:12).

ఈ రోజున కూడా దేవుడు ఆయన పరిచర్య కొరకు యౌవనస్థులను పిలుచుచున్నాడు. కాని వారు దీనులుగా ఉండవలసి యున్నది. దేవుని చేత పిలువబడిన ఏ యౌవనస్థుడైనా ఎదుర్కొనవలసిన ముఖ్యమైన ప్రమాదము ఆత్మీయ గర్వమైయున్నది.

దేవునికి సేవకులుగా నుండుటకు దేవుని చేత పిలువబడిన యౌవనస్థులు వారి పిలుపు నుండి పడిపోయిన చాలామందిని నేను భారతదేశములో చూచితిని. కొంత మంది విషయములో, దేవుడు వారిని ఏదొక విధముగా వాడుకొనుటను ప్రారంభించిన వెంటనే, వారు ఉప్పొంగిపోయి దేవునికి చెందవలసిన మహిమను వారు తీసుకొనుట చేత దేవుడు వారిని ప్రక్కన పెట్టెను. మరి కొంత మంది విషయములో వారు లోక సంబంధమైన సౌకర్యమును కోరుకొనుట చేత వారు మంచి జీతములిచ్చు పాశ్చాత్య క్రైస్తవ సంస్థలలో జీతము కొరకు పనిచేయువారుగా మారిపోయిరి. ఆ విధముగా వారు బిలాము వలె త్రోవ తప్పిపోయిరి. మరి ఇంకొంత మంది విషయములో, వారు అందమైన దెలీలాలకు ఆకర్షితులై, సంసోను వలె వారి అభిషేకమును కోల్పోయిరి. ఆ విధముగా ఈ చక్కటి యౌవనస్థులు దేవుని యొక్క పిలుపును మరియు వారి అభిషేకమును, మనుష్యుల నుండి పొందు ఘనత కొరకు మరియు ధనము లేక అందమైన స్త్రీల యెడల నుండిన కోర్కెను తృప్తి పరచుకొనుట కొరకు త్యాగము చేసిరి.

ఈనాడు భారతదేశములో దేవుని వాక్యమును ఎటువంటి భయము లేకుండా బోధించువారు, మరియు ధనమును లేక అందమైన స్త్రీలను లేక మనుష్యుల యొద్దనుండి మెప్పుకోలును ఏ మాత్రము లక్ష్యపెట్టని ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?

అటువంటివారు చాలా అరుదుగా యుందురు. దేవుని చేత పిలువబడిన అనేకులు ఎంతో మంది త్రోవ ప్రక్కన పడిపోయి యున్నారు.

దేవునికి యిష్టమైన బలులు విరిగి నలిగిన ఆత్మ. మనము విరుగగొట్టబడి దీనులుగా నుండినట్లయితే, దేవుడు ఎల్లప్పుడు మనలను తన సేవలో వాడుకొనును. కాని మనము పొందిన గొప్ప గొప్ప ప్రత్యక్షతలను బట్టి లేక దేవుడు మనకిచ్చిన గొప్ప పరిచర్యను బట్టి మనము ఏదో గొప్ప వారమను కొన్నట్లయితే ఆ రోజు నుండి మనము వెనకకు జారిపోవడం మొదలవుతుంది. అప్పుడు దేవుడు మనలను ప్రక్కన పెట్టివేయును.

మనము ఏదొక సంఘములో పెద్దగా చలామణి అవుతూ యుండవచ్చు. కాని మనము మన జీవితాలను వ్యర్థపుచ్చుకొన్నామని నిత్యత్వములో తెలుసుకొందుము.