WFTW Body: 

ప్రస్తుత కాలంలోని అనేకమంది విశ్వాసులలో ఆది క్రైస్తవులు కలిగియుండినట్టి లోతు, సమర్పణ మరియు శక్తి లేనట్లనిపిస్తుంది.

దీనికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు?

సరిగా మారుమనస్సు పొందక పోవడమే దీనికి ప్రధాన కారణమైయున్నది.

యేసు తన సందేశంలో మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని (మార్కు 1:15) ప్రకటించెను. ఇదే వర్తమానాన్ని తన అపొస్తలులను ప్రకటింపమని యేసు ఆదేశించెను (లూకా 24:47). ఖచ్చితంగా ఇదే వారు చేశారు (అపొ.కా. 20:21).

దీని విషయంలో దేవుని వాక్యము చాలా స్పష్టముగా ఉంది. నీ జీవితం నిజంగా చక్కగా మారాలంటే మారుమనస్సును, విశ్వాసమును వేరు చేయకూడదు. ఈ రెంటినీ దేవుడు కలిపియున్నాడు. దేవుడు వేటినైతే ఐక్యపరిచాడో వాటిని ఏ మానవుడు కూడా విడదీయకూడదు.

క్రైస్తవ జీవిత పునాదికి మారుమనస్సు మరియు విశ్వాసమన్నవి రెండు ప్రధాన మూలములు (హెబ్రీ 6:1). ఒకవేళ మీరు సరిగా మారుమనస్సు పొందనట్లయితే, మీ పునాది తప్పనిసరిగా లోపంతో కూడినదై ఉంటుంది. ఆపై మీ క్రైస్తవ జీవితం నిలకడలేనిదిగా ఉంటుంది.

ఉదాహరణకు తప్పుడు పశ్చాత్తాపము పొందిన కొందరిని బైబిలు గ్రంధము నుండి చూద్దాం.

సౌలు రాజు దేవునికి అవిధేయత చూపినపుడు అతడు పాపము చేసినట్లు ప్రవక్త అయిన సమూయేలు వద్ద ఒప్పుకొన్నాడు. కానీ తాను పాపము చేసినట్లు ప్రజలు ఎరుగుటకు ఇష్టపడలేదు. అతడు ఇంకా మనుష్యుల నుండి గౌరవాన్ని కోరుకొన్నాడు. అతడు పట్టబడినందుకు చింతించాడు. నిజంగా అతడు పశ్చాత్తాపము పొందలేదు (1 సమూయేలు 15:24-30). అతనికిని, పాపములో పడినపుడు తాను పాపము చేసినట్లు బాహాటముగా ఒప్పుకొన్న దావీదు రాజునకు మధ్య ఉన్న తేడా అదియే (కీర్తన 51).

రాజైన ఆహాబు సౌలులాంటి మరొకడు. ఆహాబు తాను చేసిన కార్యమును దేవుడు తీర్పుతీర్చునని ఏలియా హెచ్చరించినపుడు వ్యాకులపడ్డాడు. ఇంకను తాను గోనె పట్ట కట్టుకొని, తాను చేసిన పాపముల కొరకు ఏడ్చాడు (1రాజులు 21:27-29). కానీ నిజంగా తాను పశ్చాత్తాప పడలేదు. అతడు దేవుని తీర్పుకు మాత్రమే భయపడ్డాడు.

ఇస్కరియోతు యూదా, తప్పుడు పశ్చాత్తాపానికి మరొక స్పష్టమైన ఉదాహరణ. యేసుకు మరణశిక్ష విధింపబడటం గమనించిన వెంటనే యూదా తనలో తాను బాధపడి నేను పాపము చేసితిని అని చెప్పాడు (మత్తయి 27:3,5) . నేటికి కూడా కొందరు వారి మతపెద్దల వద్దకు వెళ్ళి తమ పాపాలను ఎలాగైతే ఒప్పుకొంటున్నారో, అలాగే యూదా ఆనాటి యాజకుల ఎదుట తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. తాను చేసిన పనికి తనలో బాధపడి ఉండవచ్చును కాని పశ్చాత్తాపము నొందలేదు. ఒకవేళ అతను నిజంగా పశ్చాత్తాప పడిఉంటే, విరిగిన హృదయంతో తాను ప్రభువు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరుకొని ఉండేవాడు. కాని అతడు ఆవిధముగా చేయలేదు.

ఈ ఉదాహరణలను బట్టి పశ్చాత్తాపమంటే ఏదికాదో అన్న విషయాన్ని బాగా నేర్చుకోవచ్చు!

విగ్రహాలనుండి దేవుని తట్టుకు తిరగడమే నిజమైన పశ్చాత్తాపము (1థెస్స 1:9).

విగ్రహాలంటే ఇక్కడ అన్యుల దేవాలయాలలో కనపడే కొయ్య మరియు రాతితో చేయబడినవే కావు. చూడడానికి అంత వికారముగా కనబడకుండా, అన్యుల విగ్రహాలంతటి అపాయాన్ని కలిగించి, ప్రజలు ఆరాధించేటటువంటి విగ్రహాలు ఉన్నాయి. అవి - సుఖము, సౌఖ్యము, ధనము, కీర్తి, స్వంత మార్గము వంటివి.

మనమంతా ఎన్నో సంవత్సరాల తరబడి వీటిని ఆరాధించాము. పశ్చాత్తాపపడటమంటే, ఈ విగ్రహాలన్నిటిని ఆరాధించడం మాని, దేవుని తట్టుకు తిరగడమే.

నిజమైన పశ్చాత్తాపములో మన పూర్తి వ్యక్తిత్వం ఇమిడి ఉంది. అనగా మన మనస్సు, భావోద్రేకములు, మన స్వచిత్తములను మార్చి వేస్తుంది.

మొదటిగా, నిజమైన పశ్చాత్తాపమంటే పాపము గూర్చి మరియు లోకము గూర్చి మన మనస్సును మార్చుకుంటాము. పాపము దేవుని నుండి మనలను దూరపరచినదని గుర్తిస్తాము, అంతేకాక ఈ లోకంలో అన్ని జీవన విధానాలు దేవునికి వ్యతిరేకమైనవిగా ఉన్నాయని గ్రహిస్తాము. అందుకే మనం దేవునికి అపకీర్తి తెచ్చే, ఈ జీవన విధానమునుండి బయటకు వైదొలగాలని కోరుకుంటాం.

రెండవదిగా, నిజమైన పశ్చాత్తాపములో మన భావోద్రేకములు కూడా ఇమిడి ఉంటాయి. మనము గతంలో జీవించిన జీవన విధానాన్ని బట్టి దు:ఖపడతాము (2కొరింథీ 7:10). మన దుష్‌ప్రవర్తనను, మనము చేసిన దుష్‌ క్రియలను మనస్సుకు తెచ్చుకొని, మనదోషములను బట్టియు, హేయ క్రియలను బట్టియు, వేరేవారు చూడని, మనలో మనమే చూచుకొను దుష్టత్వమును మనము అసహ్యించుకొంటాము (యెహెజ్కేలు 36:31).

మనము గతంలో జీవించిన జీవితాన్ని బట్టి దేవునిని ఎంతగానో బాధించామని గుర్తించి ఏడ్చి దు:ఖపడతాము. వారి పాపములను వారు గుర్తెరిగినప్పుడు బైబిలులోని గొప్ప దైవజనుల ప్రతిస్పందన కూడా ఇదే. దావీదు (కీర్తనలు 51), యోబు (యోబు 42:6) మరియు పేతురు (మత్తయి 26:75), వీరందరు తమ పాపములను బట్టి పశ్చాత్తాపము నొందినప్పుడు దు:ఖముతో ఏడ్చారు.

చివరిగా, పశ్చాత్తాపంలో మన చిత్తము కూడా ఇమిడి ఉన్నది. మూర్ఖపు(మొండి) స్వచిత్తము - మన ఇష్టానుసారంగా నడవాలను కోవటంను విడిచి పెట్టి యేసును మన జీవితాల్లో ప్రభువుగా చేసుకోవాలి. అంటే ఇప్పటినుండి దేవుడు మనలను ఏమి చేయవలెనని కోరుకుంటాడో, ఎంతటి వెల అయినా, ఎంతటి అవమాన పరిచే పనినైనా చేయడానికి సిద్ధమయి ఉండాలి.

తప్పిపోయిన కుమారుడు విరిగిన హృదయంతో, తన తండ్రి చెప్పే ఎలాంటి పనైనా చేయడానికి సిద్దపడే ఒక యవ్వనస్తునిలా తన తండ్రి ఇంటికి వచ్చాడు. ఇలాంటిది నిజమైన పశ్చాత్తాపము (లూకా 15:11-24).

మనము గతంలో చేసిన ప్రతి ఒక్క చిన్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోనవసరం లేదు. వాటన్నింటిని జ్ఞప్తికి తెచ్చుకోవడమనేది అసాధ్యమయిన విషయము. తప్పిపోయిన కుమారుడు అలాగు చేయలేదు అతను చెప్పినదంతా ఒక్కమాటే. ఆమాట "తండ్రీ, నేను పాపము చేసితిని". మనము కూడా చెప్పవలసింది ఇదియే.

కాని ఇస్కరియోతు యూదా కూడా "నేను పాపము చేసితిని" అని చెప్పాడని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ యూదా పశ్చాత్తాపానికి, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాప పడటానికి గొప్ప వ్యత్యాసముంది. దేవుడు మనము నోటితో పలికే మాటలను మాత్రమే వినడు. కాని మన మాటల వెనుక గల మనస్సును గమనించి, తగురీతిలో వ్యవహరిస్తాడు.