40వ అధ్యాయంతో ప్రారంభమయ్యే యెషయా గ్రంథం రెండవ భాగంలో క్రైస్తవులకు కొన్ని అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో రెండు భాగాలు ఉన్నాయి, మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనలోని మొదటి 39 పుస్తకాలను పోలి ఉంటాయి, తరువాతి 27 అధ్యాయాలు కొత్త నిబంధనలోని 27 పుస్తకాలను పోలి ఉంటాయి. యెషయాలోని చివరి 27 అధ్యాయాలు ప్రాముఖ్యంగా కొత్త నిబంధన ప్రవచనాలు - వాటిలో చాలా వరకు క్రీస్తును, అదేవిధంగా మనం యేసు అడుగుజాడలను అనుసరించాలని సూచిస్తాయి. కాబట్టి యెషయా 40 నుండి 66 అధ్యాయాలలో కొన్ని అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి, ఇవి ప్రాధమికంగా కొత్త నిబంధనలోని మనకు సంబంధించినవి.
పాతాళలోకపు ద్వారాలు ఎప్పటికీ విజయం సాధించని యేసుక్రీస్తు యొక్క నిజమైన సంఘాన్ని నిర్మించుటకు యెషయా 66:1-2 ఒక సాదృశ్యంగా ఉంది. "ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది?". "మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా పిలుచుకునే ప్రజలారా, మానవ మాత్రులారా, నా కొరకు నిర్మిస్తున్న సంఘం ఏపాటిది?".
"వానినే నేను దృష్టిస్తున్నాను" అని ప్రభువు చెప్పినప్పుడు, ఆయన, పాతాళలోకపు ద్వారాలు దాని ఎదుట నిలువలేని తన సంఘాన్ని నిర్మించడానికి అనుకూలమైన వ్యక్తిని వర్ణిస్తున్నాడు. ఆదాము వంశంలో కనిపించే కోపం, కామం, వ్యభిచారం, అబద్ధం, దొంగతనం మరియు ఇతర దుష్ట విషయాలతో సాతాను చొరబడలేని సంఘం.
"ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై... యుండునో వానినే నేను దృష్టించుచున్నాను" (యెషయా 66:2). ఆయన వెతుకుతున్న ప్రధానమైన లక్షణం దీనత్వం మరియు నలిగిన స్థితి లేదా విరువబడిన ఆత్మ. దేవుడు తమ గురించి తాము తక్కువ అభిప్రాయం కలిగి ఉన్న వ్యక్తులను వెదకుతున్నాడు, తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉన్న వ్యక్తులను కాదు. యేసు తక్కువ ఆత్మగౌరవం కలిగి లేడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన తన శిష్యులతో, "బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే" (యోహాను 13:14) అని చెప్పాడు. ఆయన ఎవరో ఆయనకు ఎటువంటి సందేహం లేదు. ఆయన దేవుని కుమారుడని ఆయనకు తెలుసు. ఆయన తక్కువ ఆత్మగౌరవాన్ని కలిగిలేడు. కానీ ఆయన ఎంతో దీనుడై ఉండి, ఇతరులకు సేవ చేయవలసిన వానిగా తనను తాను పరిగణించుకుని ఆయన వారి పాదాలను కడిగాడు. ఆయన ఇస్కరియోతు యూదా పాదాలను కూడా కడిగాడని మీకు తెలుసా? అదే వినయం, కొన్ని గంటల్లో మిమ్మల్ని అప్పగించబోయే వ్యక్తి పాదాలను కడగడం. ఆయన తక్కువ ఆత్మగౌరవాన్ని కలిగిలేడు కానీ తక్కువ స్థానాన్ని తీసుకున్నాడు. ఆయనకు తన గురించి తక్కువ ఆలోచనలు ఉన్నాయి. ఇతరులతో మనకున్న సంబంధాల గురించి, ఫిలిప్పీ 2:3 ఇలా చెబుతోంది, "ఇతరులను మీకంటే ముఖ్యమైనవారిగా పరిగణించండి". విరిగి నలిగిన ఆత్మయే ప్రధాన లక్షణం. మనం క్రీస్తులా లేనందున దుఃఖంతో విరువబడటం. దేవుడు అటువంటి వ్యక్తి కొరకు చూస్తున్నాడు.
యెషయా 66:2 ప్రకారం దేవుడు ఒక వ్యక్తిలో వెతుకుతున్న రెండవ లక్షణం, "...నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను". యేసు ఆజ్ఞలకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైనది. మీరు కొండమీది ప్రసంగాన్ని చదువుతున్నప్పుడు వణకుతున్నారా. మీరు కోపపడి, ఆ కోపంతో ఒక వ్యక్తితో మాట్లాడితే, మీరు నరకానికి వెళ్ళేంత అపరాధిగా ఉన్నారని చెప్పే వాక్యం వద్ద మీరు దేవుని వాక్యానికి వణకుతున్నారా? మీ కళ్ళతో లైంగిక పాపం చేయుటకు కారణమైన మీ కళ్ళను పెరికివేయమని, మీ కళ్ళతో లేదా మీ చేతులతో లైంగిక పాపం చేసే శరీర అవయవాలను నరికివేసే విషయంలో తీవ్రమైన వైఖరిని తీసుకోకపోతే మీరు నరకానికి వెళతారు అని చెప్పే వాక్యాన్ని చూసి మీరు వణకుతున్నారా?
ఆ వాక్యాన్ని చూసి వణకే క్రైస్తవులు, అనేక సంవత్సరాలు నేను దీని గురించి బోధించడం విన్న వారిలో కూడా, చాలా తక్కువ మందిని నేను కనుగొన్నాను. నేను బాధ్యత వహించే కొన్ని సంఘాలలో, 25 సంవత్సరాలుగా నేను ఈ పాపాలకు వ్యతిరేకంగా బోధించడం విన్న కొన్ని సంఘాలలో కూడా, వారు ఇప్పటికీ ఈ వాక్యాన్ని చూసి వణకుట లేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. చాలా మంది క్రైస్తవుల పరిస్థితి అదే: వారికి జ్ఞానం ఉంది, కానీ వారు దానిని తేలికగా తీసుకుంటారు. పాపం నుండి మనలను విడిపించడానికి క్రీస్తు సిలువపై చెల్లించిన వెలను చూసినప్పుడు మీరు పాపాన్ని ఎలా తేలికగా తీసుకోగలరు? నేను తరచుగా నాలో నేను పాడుకునే ఒక కీర్తన ఉంది, అది ఇలా చెబుతుంది:
శోధించబడినప్పుడెల్లా నేను చూచేలా సహాయపడు ప్రభువా,
నా దేవుడు మాత్రమే చేతులు చాచి నలుగగొట్టబడ్డాడని
ఆయన చేసిన పృథ్వీపై రక్తం కార్చాడని
ఇతర పాపమేమి లేనట్లుగా
అది నా పాపమేనని నేను తలచునట్లుగా
లోక భారాన్ని మోసిన ఆయనకు
తట్టుకోలేని భారభరితమయినదని
ఈ విశ్వం యొక్క భారాన్ని తన భుజంపై మోయగలిగిన నా ప్రభువు నా పాప భారాన్ని ఎలా భరించలేకపోయాడో గుర్తుచేసుకోవడానికి నేను చాలాసార్లు నాకు నేను పాడుకుంటాను. అది ఆయనను కల్వరిపై నలుగగొట్టింది -- అదే నాకు పాపం పట్ల విపరీతమైన ద్వేషం కలిగి ఉండటానికి సహాయపడింది మరియు దేవుని వాక్యానికి వణకునట్లు చేసింది. మీ కళ్ళతో మోహించడం వంటి పాపాలు ఎయిడ్స్ లేదా క్యాన్సర్ కంటే దారుణమైనవని క్రైస్తవులు తెలుసుకొనునట్లు నేర్పించు భారాన్ని ఇదే నాకు కలుగజేసింది.
మీరు దానిని అర్థం చేసుకున్న రోజు, మీరు ఈ పాపాలతో తీవ్రంగా పోరాడుతారు. ఎయిడ్స్ సోకిన సిరంజిలతో మీరు ఆటలాడరు. మీరు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, ఎయిడ్స్ కంటే చాలా ఘోరమైన దాని గురించి ఎందుకు ఇంకా జాగ్రత్తగా లేరు? ఎందుకో నేను మీకు చెప్తాను: పాపం ఎయిడ్స్ మరియు క్యాన్సర్ కంటే ఘోరమైనదని మీరు నమ్మరు కాబట్టి, మీరు దేవుని వాక్యానికి వణకరు. నేను దీనిని నమ్మడం నేర్చుకున్నాను, అందుకే కోపం, స్త్రీలను మోహించడం మరియు విడాకులు వంటి పాపాల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే, మన నీతి శాస్త్రుల నీతిని మరియు పరిసయ్యుల నీతిని అధిగమించాలి.
దీన్ని తీవ్రంగా పరిగణించే చాలా తక్కువ మందిని క్రైస్తవులను, దానిని తీవ్రంగా ప్రకటించే చాలా తక్కువ మంది ప్రసంగికులను నేను కనుగొన్నాను. కొండమీది ప్రసంగం మనం వెంబడించవలసిన ప్రాథమిక విధి. "మీ నీతి శాస్త్రుల నీతిని మరియు పరిసయ్యుల నీతిని అధిగమించకపోతే, మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు" (మత్తయి 5:20) అని యేసు చెప్పారు.
నేను దీనిని నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. పది ఆజ్ఞలకు మించిన నీతిని క్రైస్తవులు చూపించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. విగ్రహారాధన అంటే చెక్క మరియు రాతి విగ్రహాల ముందు నమస్కరించడం కాదు; ఇది నా హృదయంలో దేవుడు కాకుండా వేరే దానికి స్థానం ఇవ్వడం. విశ్రాంతిదినం అంటే ఆరోజు పని చేయకపోవడం మాత్రమే కాదు; ఇది అంతర్గతంగా విశ్రాంతి కలిగి ఉండే జీవితం. వ్యభిచారం అంటే కేవలం శారీరక వ్యభిచారం కాదు; అది కళ్ళతో మోహించడం. హత్య అంటే ఒకరిని చంపడం కాదు; అది కోపం. అదేవిధంగా ఇతర అన్ని ఆజ్ఞలు కూడా, మనం వాటిని తరువాత పరిశీలిద్దాము.
దేవుడు తన సంఘాన్ని నిర్మించుటకు మనల్ని ఉపయోగించుకొనులాగున దేవుని వాక్యానికి వణకడం నేర్చుకుందాము. దేవుడు తన ఇంటిని నిర్మించడానికి ఎలాంటి వ్యక్తిని వెతుకుతాడో మరియు ఉపయోగించుకుంటాడో మనం యెషయా 66:1-2లో చూశాము. దేవుడు మనకు సహాయం చేయును గాక.