WFTW Body: 

ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటన్నింటికంటె ఎక్కువగా కావాలని ఎలీషా కోరియున్నాడు. 2 రాజులు 2:1-10లో ఈ విషయంలో ఏలియా అతనిని పరీక్షించినట్లు చదువుతాము. మొదటిగా అతడు ఏలీషాను గిల్గాలులో ఉండమని కోరియున్నాడు. అయినప్పటికి అతను తనతోనే వచ్చియున్నాడు. ఎలీషా ఏలియాను విడిచిపెట్టుటకు నిరాకరించాడు. అప్పుడు ఏలియా తూర్పుగా 15మైళ్ళు వెళ్ళి బేతేలుకు చేరి మరియు 12మైళ్ళు వెళ్ళి యెరికో చేరియున్నాడు. మరియు ఇంకనూ తూర్పుగా 5 మైళ్ళు వెళ్ళి యెర్ధాను చేరియున్నాడు. ఎలీషాలో ఉన్నటువంటి ఆసక్తి ప్రతి స్థలములో పరీక్షించబడింది. చివరకు ఏలియా అతనిని విడిచివెళ్ళేముందు ఏలీషాకు ఏమైనా కోరికున్నదేమో అని అడిగాడు మరియు ఏలీషా ఇట్లన్నాడు, "నాకు ఒక్క విషయం మాత్రమే కావాలి" దాని కోరకే నేను ఇప్పటి వరకు వెంబడించాను. నీవు నన్ను విడిచిపెట్టమన్నప్పటికిని అందుకే నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీ ఆత్మలో నాకు రెండు పాళ్ళు కావాలి. తన హృదయమంతటితో ఎలీషా అభిషేకాన్ని కోరియున్నాడు. దానికంటే తక్కువ దానితో అతడు తృప్తిపడలేదు. అతడు అడిగిన దానిని పొందుకొనియున్నాడు.

ఏలియా ఎలీషాను పరీక్షించినట్లే మనము కూడా పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ అభిషేకము కంటే తక్కువ దానితో తృప్తిపడతామేమోనని దేవుడు మనలను పరీక్షిస్తాడు. దానికంటే తక్కువ దానితో మనము తృప్తిపొందిన యెడల మనం అంతవరకే పొందుకుంటాము. అభిషేకం లేకుండానే నేను బాగుగానే జీవించగలనని అనుకొనే విశ్వాసికి దేవుడు దానిని అనుగ్రహించడు.

కాని అన్నింటికంటె ఇది అత్యవసరమని గుర్తించినయెడల, దానిని పొందేవరకు ఎలీషావలె వెంబడిస్తూ ఉన్నయెడల, పెనూయేలు యొద్ద యాకోబువలె యదార్ధముగా ఇట్లు ప్రార్ధించినయెడల, "ప్రభువా, నీవు నాకు ఆ ఆశీర్వాదము ఇచ్చే వరకు నిన్ను విడువను". ఈ విధముగా నిజముగా పరిశుద్ధాత్మశక్తి కొరకు అనగా పునరుత్థాన శక్తికొరకు మనము నిజముగా దప్పిక కలిగి ఆశపడినట్లయితే దానిని పొందుకోగలము. అప్పుడు మనము నిజమైన ఇశ్రాయేలైయుండి దేవునితోను మరియు ప్రజలతోను ఆ శక్తిని కలిగియుంటాము.

ఈ అభిషేకం మనకు ఎంత అవసరమైయున్నదో తెలుసుకొనుటకు ఓటమిని మరియు ఆశాభంగమును దేవుడు మన జీవితములో అనుమతిస్తాడు. మనము మంచి సిద్ధాంతం కలిగియున్నప్పటికిని, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పటికిని, పరిశుద్ధాత్మశక్తి మనకు ఎంత అవసరమో తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు.

అభిషేకము కలిగియుండుట అంత సులభమైన విషయం కాదు. ఎలీషా యొక్క మనవిని ఏలియా వినినప్పుడు, అతడు ఇట్లనలేదు, "ఓ! నీవడిగిన విషయం చాలా సులభమైనది, నీవు కేవలం మోకరించుము మరియు నా చేతిని నీ తల మీద ఉంచిన యెడల నీవు దానిని పొందెదవు". ఏలియా ఎలీషాతో ఇట్లన్నాడు, "నీవు కష్టమైన విషయం అడిగియున్నావు". అవును ఇది కష్టమైన విషయం. దీని కొరకు మనము వెల చెల్లింపవలసియుంది. దాని కొరకు మనం ఈ లోకంలో దేనినైననూ విడిచిపెట్టుటకు ఇష్టపడాలి.

ఈ భూమి మీద మనం డబ్బుకంటే సుఖసౌఖ్యములకంటే, పేరుప్రతిష్ఠలకంటే మరియు క్రైస్తవ పరిచర్యలో జయము కంటే ఎక్కువగా అభిషేకమును కోరుకోవాలి. ఇది కష్టమైన విషయం. కాని దీనినే దప్పిగొనుట అంటారు. మనము ఈ స్థాయికి వచ్చినప్పుడు మనము ప్రభువైనయేసు యొద్దకు వెళ్ళి త్రాగవచ్చును. అప్పుడు లేఖనము చెప్పినట్లు మనలో నుండి జీవజలనదులు ప్రవహించి, మరణములో ఉన్న వారికి జీవాన్ని ఇచ్చును(యోహాను 7:37-39; యెహెజ్కేలు 47:8).

మనం ఈ అభిషేకాన్ని పొందినయెడల దానిని పొగొట్టుకొనకుండా జాగ్రత్తపడాలి. మనం జాగ్రత్తగా లేనట్లయితే మనకున్న అభిషేకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. మనము కనికరము లేకుండా తీర్పు తీర్చుచు లేక మనం చులకనగా మాట్లాడుచు లేక మనం మురికి తలంపులు కలిగియుంటే లేక గర్వాన్ని గాని లేక ద్వేషాన్ని గాని మన హృదయములో ఉంచుకొనినట్లయితే అభిషేకం పోతుంది.

ఇతరులకు బోధించిన తరువాత తానే భ్రష్టుడనై పోదునేమో అని తన శరీరమును నలుగగొట్టుకొనుచున్నానని అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 9:27లో చెప్పియున్నాడు. అయితే ఇది రక్షణపోగొట్టుకొనుట కాదు, అభిషేకాన్ని పోగోట్టుకొనుట అని నేను నమ్ముచున్నాను. అనేక సంఘములను నిర్మించి అనేక అద్భుతములను చేసి మరియు దేవునిచేత గొప్పగా వాడబడిన గొప్ప అపొస్తలుడైన పౌలే, అజాగ్రత్తగా ఉండినయెడల అభిషేకాన్ని పొగోట్టుకొనే అవకాశం ఉండినట్లయితే, మన సంగతేమిటి? దీనిని బట్టి నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపడుతుంటాను. మనం ఎల్లప్పుడు ఈ విధముగా ప్రార్ధిస్తుండాలి, "ప్రభువా నా జీవితములో దేనిని పోగోట్టుకున్నప్పటికిని, అభిషేకాన్ని పోగొట్టుకొననీయవద్దు.