WFTW Body: 

"నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును...తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు" (యెహెజ్కేలు 22:30). ప్రపంచ చరిత్రలో, ఇశ్రాయేలు మరియు సంఘచరిత్రలో తన సంకల్పమును నేరవేర్చుటకు దేవుడు ఏవిధముగా ఒక పరిస్థితిలో కేవలము ఒక వ్యక్తి మీద ఆధారపడెనో అనుదానికి ఎన్నో ఉదాహరణలు మనము చూచెదము. దేవునితో ఉన్న ఒక్క వ్యక్తి ఎప్పటికి అధికుడే.

నోవహు:

నోవహు కాలములో లోకమంతయు దుర్మార్గతతోను, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటుతోను నిండియున్నప్పడు భూమి మీద దైవభక్తి కలిగిన ఎనిమిది మంది వ్యక్తులున్నప్పటికీ, దేవుని ఉద్దేశ్యము యొక్క నెరవేర్పు కేవలము ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వము పైన పూర్తిగా ఆధారపడియుండెను. ఆ వ్యక్తి నోవహు. ఆ కాలములో దేవుని దృష్టిలో కృపపొందిన ఏకైక వ్యకి నోవహు (ఆదికాండము 6:8). ఒకవ్యక్తి దేవునికి నమ్మకముగా లేనియెడల మానవజాతి అంతయు తుడిచిపెట్టబడియుండెడిది మరియు మనలో ఏ ఒక్కరు ఈ రోజున సజీవముగా ఉండేవారము కాము. నోవహు నమ్మకముగా ఉన్నందుకు మనము నిశ్చయముగా దేవునికి వందనాలు చెప్పవలెను. చివరి దినములు నోవహు దినముల వలె ఉండునని యేసు చెప్పెను. నోవహు దినములలో ఉండిన లైంగికపరిమైన విపరీతత్వము మరియు బలాత్కారము చివరి దినములలో కూడా ఉండును. ఈ రోజున కూడా కావలసినది నోవహు వంటి రాజీపడని వ్యక్తులు.

ఏలియా:

ఇశ్రాయేలు చరిత్రలో మరియొక కాలమును గూర్చి ఆలోచించండి. అప్పుడు ఆహాబు ప్రజలందరు బయలును పూజించునట్లు చేసెను. ఆ కాలములో ఇశ్రాయేలులో, బయలు దేవతను పూజించుటకు నిరాకరించిన 7000 మంది ఉండిరి (1రాజులు 19:18). అలా ఉండుట, నిస్సందేహముగా ఒక ధైర్యముగల మెచ్చుకోదగ్గ విషయము. కాని అటువంటి సాక్షము వ్యతిరేకమైనది. వారు విగ్రహారాధన చేయలేదు. ఇది ఈరోజున అనేక మంది విశ్వాసులు కలిగియున్న వ్యతిరేకమైన సాక్షమువలే యున్నది. వారు పొగత్రాగరు, జూదమాడరు మొదలగునవి. కాని దేవుడు ఆ కాలములో ఇశ్రాయేలులో తన ఉద్దేశ్యములను నెరవేర్చుటకు ఆ 7000 మందిలో ఒక్కరిని కూడా వాడుకోలేకపోయెను. దానికొరకు దేవునికి ఒక ఏలియా అవసరమాయెను. ఆ 7000 మందికి (విశ్వాసులుకు) ఆహాబు భయపడలేదు. కాని అతడు ఏలియాకు భయపడెను. ఆ 7000 మంది దేవునికి ప్రార్ధన చేసిరిగాని వారి ప్రార్ధనలు ఆకాశమునుండి అగ్నిని క్రిందకు తేలేకపోయెను. ఏలియా ప్రార్ధన దానిని చేసెను. దేవుని సన్నిదిలో విశ్వాసులందరి ప్రార్ధనలు ఒకే రకమైన ప్రభావమును కలిగియుండవు. "నీతిమంతుని ప్రార్ధన బహుబలము గలదైయుండును" అని బైబిలు ఏలియా విషయములో చెప్పెను(యాకోబు 5:16,17). ఒక్క వ్యక్తి ఒంటరిగా దుష్టశక్తులను ఓడించి, బయలు ప్రవక్తలందరిని హతమార్చి, ఒక దేశమంతటిని తిరిగి దేవుని వైపుకు త్రిప్పెను. ఈరోజున కూడా, ఒక జనసమూహము ద్వారా కాక ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చబడును.

ఎలీషా:

ఏలియా కాలములో, ఒక రోజు ఇశ్రాయేలులో ప్రవక్తలవుదామని ఆశించిన 50 మంది "ప్రవక్తలశిష్యులు"(బైబిలు కళాశాల విద్యార్ధులు) ఉండిరి. కాని దేవుని ఆత్మ వారినందరిని దాటవేసి "ప్రవక్తశిష్యుడు"కాని ఎలీషా మీదికి వచ్చెను (2రాజులు 2:7,15). ఎలీషా ఇశ్రాయేలులో కేవలము ఒక దాసునిగా "ఏలియా చేతులమీద నీళ్ళు పోయువాడుగా" పేరు నొందెను (2రాజులు 3:11). ఆరాము రాజు యొక్క సైన్యము ఇశ్రాయేలు పైన దాడిచేసినప్పడు ఈ 50 బైబిలు పండితులలో ఎవరు ఇశ్రాయేలును కాపాడలేకపోయిరి, ఎందుకనగా వారు వారి బైబిలు కళాశాలలో మోషే ధర్మశాస్ర్తమును చదివినప్పటికి, వారు దేవుణ్ణి ఎరుగలేదు. ఇశ్రాయేలు దేశములో దేవునితో సంబంధము కలిగిన ఒక్క వ్యక్తి ఎలీషా మాత్రమే శత్రువు ఎక్కడ దాడిచేయునో అనే విషయాన్ని ముందుగా హెచ్చరించగలిగెను. ఈనాడు కూడా ఒక ప్రవక్తయొక్క పని అటువంటిదే: సాతాను వారిపై ఎక్కడ దాడిచేయునో అని దేవుని ప్రజలను ముందుగా హెచ్చరించుట. ఈనాడు ఒక సంఘములో, ఎలీషా వంటి ఒక ప్రవక్త 50 మంది బోధకుల కంటే (ప్రవక్తల శిష్యులకంటే) ఎక్కువగా దేవుని ప్రజలను ఆత్మీయ విపత్తునుండి రక్షించగలడు. ఒక వ్యక్తి ఆత్మ స్వరమును వినలేనప్పడు, బైబిలు జ్ఞానము వల్ల ఉపయోగము లేదు. దేవుని స్వరము వినగలిగిన వ్యక్తి మాత్రమే ఒక సంఘమును సాతాను తంత్రములనుండియు, దాడులనుండియు కాపాడగలడు. పాత కాలము ప్రవక్తలు దీర్ఘదర్శులని పిలువబడిరి (వారు దేవుడు ఇచ్చిన దృష్టితో భవిష్యత్తులోకి చూడగలిగేవారు- 1సమూయేలు 9:9). శత్రువు ఎక్కడ దాడిచేయునో వారు ఎరిగియుండిరి. మరియు ఒక పనిచేయుట వలన వచ్చే ప్రమాదములను ముందుగా చూడగలిగిరి. ఈనాడు సంఘమునకు అటువంటి దీర్ఘదర్శులు ఎంతగానో అవసరము.

దానియేలు:

దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి కానానుకు తీసుకురావాలనుకొన్నపుడు, ఆయనకు ఒక మనుష్యుడు అవసరమాయెను. ఆయన మోషేను కనుగొనెను. ఆయన యూదులను బబులోనునుండి యెరూషలేమునకు తీసుకురావానుకొన్నపుడు ఆయనకు మరొక మనుష్యుడు అవసరమాయెను. ఆయన దానియేలును కనుగొనెను. దానియేలు తన యౌవ్వనకాలమునుండి నమ్మకముగా ఉండి ప్రతి పరీక్షలో ఉత్తీర్ణుడాయెను. బబులోనులో 20 ఏళ్ళ వయస్సు గల యువకునిగా అతడు ప్రభువు కొరకు ఒక గట్టి తీర్మానమును తీసుకొనెను. "తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని తన హృదయములో తీర్మానించుకొనెను"(దానియేలు 1:8). ఇది యౌవ్వనస్ధులందరు గుర్తుంచుకొనుటకు ఒక మంచి వచనము. రాజుకు భయపడి మిగిలిన యౌవ్వన యూదులందరు రాజు భోజన బల్లపై వడ్డింపబడిన ఆహారమును(అది దేవుని లేవీయకాండములో నిషేధించిన ఆహారము) వెంటనే తినగా, దానియేలు మాత్రము దానిని తినుటకు నిరాకరించెను. ఆ బల్లయొద్ద ఆ దినమున ఇంకా ముగ్గురు యౌవ్వనస్ధులుండిరి, వారు దానియేలు తీర్మానము చేసుకొనుట చూచి అతనితో కలసిరి. దానియేలు మరియు ఆ ముగ్గురు వ్యక్తులు దేవుని కొరకు బబులోనులో ఒక శక్తివంతమైన ప్రభావముగా మారిరి. 70 ఏళ్ళ తరువాత దానియేలు దాదాపు 90 ఏళ్ళ వాడైనపుడు అతని ప్రార్ధనలు యూదులు బబులోనునుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లుటకు ప్రేరేపించెను. ఈనాడు కూడా దేవుని ప్రజలు ఆత్మయపరమైన బబులోను(నకిలీ సంఘము) నుండి ఆత్మీయ పరమైన యెరూషలేము(క్రీస్తు శరీరము)నకు వెళ్ళే ఉద్యమమున్నది. అటువంటి ఉద్యమానికి కూడా దేవునికి మనుష్యులు అవసరము. ఈనాడు హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారు అనేకమంది ఉన్నారు (దానియేలు 1:11). వారు ప్రభువు కొరకు నిలబడుటకు ఆతృత కలిగియున్నారు కాని స్వంతగా అలా చేయుటకు వారికి ధైర్యము లేదు. వారిని నడిపించుటకు వారు ఒక దానియేలు కొరకు ఎదురుచూచుచున్నారు. కాబట్టి దేవుడు మరలా దానియేలుల కొరకు చూచుచున్నాడు.

కాని దేవునికి తన నామము కొరకు ఒక స్వచ్ఛమైన సాక్షము ప్రతి తరములోను కావలెను. ఆయన మన తరములో కూడా తన కొరకు ఒక సాక్షము లేకుండా ఉండడు. ఈ తరములో దేవునికి పూర్తిగా అందుబాటులో ఉండుటకు నీవు వెల చెల్లించెదవా?