WFTW Body: 

మనమెదుర్కొనే అతిపెద్ద సమస్య ఏమిటి? దైవభక్తి కొరకు వెదికే వ్యక్తియొక్క అతిపెద్ద సమస్య పాపము చేయాలనే శోధనను జయించాలనునదియే.

యేసు సమస్త విషయములలో మనవలె శోధింపబడెనని మనము హెబ్రీ 4:15లో చదువుతాము. అందుకనే ఆయన మనపట్ల సానుభూతి చూపగలడు. మనము శోధన యొక్క శక్తికి గురైనట్లే ఆయన కూడా గురయ్యెను. లేనియెడల ఆయన సమస్త విషయములలో మనవలనే శోధింపబడెనని ఇక్కడ వ్రాయబడియుండకపోవును. సాతాను ఆయనను శోధించినప్పుడు ఆయన దాని శక్తికి గురయ్యెను గాని దానిని తిరస్కరించెను. దాని శక్తికి ఆయన గురవ్వకపోతే అది శోధనగా ఉండేది కాదు. శోధన "టగ్ ఆఫ్ వార్" అను ఆట వంటిది. రెండు జట్లు ఒక త్రాడును చెరొకప్రక్క పట్టుకొని లాగుతూ ఉంటాయి. నీవు పరిశుద్ధ జీవితమును పట్టుకొనియుండుటకు ప్రయత్నిస్తున్నప్పుడు, అవతల దిక్కుకు నిన్ను లాగుతున్నట్లు అనిపిస్తుంది. అదే శోధన. అవతల దిక్కులో ఎవరు తాడును లాగకపోతే "టగ్ ఆఫ్ వార్" అనేది ఉండదు. యేసుకు అలా లాగినట్లు అనిపించకపోయుంటే ఆయన మనవలె శోధింపబడలేదని మనము చెప్పాలి. మత్తయి 4:1-10 వచనాలలో అపవాది ఆయనను శోధించెననియు మరియు హెబ్రీ 4:15లో ఆయన మనవలెనే సమస్త విషయాలలో శోధింపబడెననియు బైబిలు చెప్పినప్పుడు అది అబద్దం అని మనము చెప్పవలసి ఉంటుంది.

బైబిలులో 'శోధన' అనే పదము ఎల్లప్పుడు పాపము చేయుటకు శోధింపబడుటను సూచిస్తుంది. మనము అలసిపోయినప్పుడు నిద్రపోవాలనే కోరికవంటి సాధారణమైన కోరికలు శోధనలు కాదు. యేసు మనవలే శోధింపబడెను అను దాని అర్ధము అదికాదు. ఆయన పాపము చేయుటకు మనవలెనే శోధింపబడెను కాని ఆయన పాపము చేయలేదు. ఈ విషయంలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన అన్ని విషయములలో మనవంటివాడాయెనని మనము హెబ్రీ 2:17లో చూచాము. ఆయన ఒక దూతవలె రెక్కలతో వచ్చి మనకు ఈత నేర్పించడానికి ప్రయత్నించలేదు. ఆయన మనకు ఈత నేర్పించడానికి భూమిమీదకు తన "రెక్కలు" లేకుండా వచ్చెను. యేసు నీటిపై నడిచినప్పుడు ఆయన గురుత్వాకర్షణ శక్తిని అధిగమించెను. ఒక దూత నీటిని దాటుకొని పోయుంటే అది అద్భుతమైయుండేది కాదు. కాని యేసు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించెను గనుక ఇది అద్భుతము. పేతురు కూడా నీటిమీద నడువగలడని ఆయన పేతురుతో చెప్పినప్పుడు ఆయనయందు విశ్వాసముంచితే ఆయన చేసిన దానినే అతడు కూడా చేయగలడని అతనితో చెప్పుచుండెను. మన పరలోకపు తండ్రి తన జ్యేష్టకుమారుడైన యేసు పట్ల పక్షపాతము చూపించడు. మనమాయనయందు విశ్వాసముంచితే ఆయన యేసు కొరకు చేసినదానిని మనకొరకు కూడా చేయును.

యేసు మనవలే అన్ని విషయములలో శోధింపబడెను కాని ఆయన పాపము చేయలేదు. ఈ విషయములో ఆయన మనకు మాదిరికరముగా ఉన్నాడు. మనమెప్పుడైనా శోధించబడినప్పుడు మనము ప్రభువుతో "ప్రభువా, నజరేతులో నీవు జీవించినప్పుడు నీవు కూడా నేనిప్పుడు శోధింపబడినట్లే శోధింపబడినావు. అప్పుడు నీవు స్పందించినట్లే నేను స్పందించుటకు నాకు సహాయము చేయుము" అని చెప్పాలి. నీవు నిరాశ పడుటకు లేక కోపముతో స్పందించుటకు శోధించబడుతున్నావా? యేసు కూడా ఆ విషయములలో శోధింపబడెను కాని ఆయన పాపము చేయలేదు. గనుక నీవాయన మాదిరిని చూచుచు "ప్రభువా నేను నిన్ను వెంబడించాలనుకొనుచున్నాను" అని చెప్పవచ్చు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిద్వారా అలా జీవించెను గనుక మనమాయన వలే జీవించగోరితే మనము కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు వెదకాలి. అందుకనే "గనుక మనము (కూడా) కృపాసనము యొద్దకు చేరుదము" అని హెబ్రీ 4:16 చెప్పబడినది. "గనుక అను మాట యేసు మనవలె శోధింపబడి పాపము చేయకపోవుటను గూర్చి చెప్పుచున్న దీని ముందు వచనాన్ని సూచిస్తుంది. గనుక ఆయన భూమిమీద జీవించిన దినాలలో వెళ్ళిన కృపాసనము నొద్దకు మనము కూడా వెళ్ళి పాపమును జయించుటకు మనకు సహాయపడే అదే కృపను మనము పొందగలము.

హెబ్రీ 4:16లో కనికరము మరియు కృప గురించి చెప్పబడియున్నది. కనికరమునకు కృపకు మధ్య తేడా ఉంది. కనికరము మన గతముతో వ్యవహరిస్తుంది. అయితే కృప మన భవిష్యత్తునకు సంబంధించినది. మనము చేసిన పాపములకు మనము కనికరమును పొందవలెను. తరువాత భవిష్యత్తులో పాపమును జయించుటకు మనకు కృప అవసరము. పాతనిబంధనలో వారు కనికరమును మాత్రమే కలిగియుండిరి. క్రొత్తనిబంధనలో యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చెను (యోహాను 1:17). యేసు ఎన్నడు పాపము చేయలేదు గనుక ఆయనకు కనికరము అవసరము లేదు. కాని మనకు కనికరము మరియు కృప రెండూ అవసరము.

హెబ్రీ 4:16లో చెప్పబడిన సమయోచితమైన సహాయము ఎప్పుడు అవసరము? నీవు శోధింపబడినప్పుడు; ఉదాహరణకు నీవు ఒక పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు నీవు జారి నీ వ్రేళ్లతో ఒక గట్టును పట్టుకొని వ్రేలాడుతున్నావు. అలా పట్టుకోలేక నీవు పడి నీ యెముకలను విరుగగొట్టుకుంటావు. అప్పుడు నీవు సహాయము కొరకు మొఱపెడతావు. అప్పుడు అంబులెన్సు వచ్చి నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళి నీ యెముకలను సరిచేస్తారు. అది కనికరము కాని నీవు పడిపోకముందే సహాయము కొరకు మొఱపెడితే ఎవరైనా నిన్ను పైకి లాగి గట్టున నిలబెడతారు. ఇది కృప. నీ నిజమైన అవసరము నీవు పడిపోకముందే ఉన్నది. పడిన తర్వాత సహాయమును కోరడం అంత శ్రేష్టమైన విషయం కాదు. నీవు పడిపోకముందే సహాయం కోరడం శ్రేష్టమైనది. పరిశుద్ధాత్ముడు కృపనిచ్చు ఆత్మయని మరియు సహాయకుడని పిలువబడినాడు. నీవు జారిపోతున్నప్పుడు (శోధింపబడినప్పుడు) నీవు పడిపోకముందు ఆయన నీకు సహాయపడగలడు. అనేకమంది క్రైస్తవులు పడిపోతూ ఉంటారు. కనికరమును కోరుతూ ఉంటారు. వారు పడిపోయి దేవుని క్షమాపణ అడుగుతారు. వారు మరలా ఎక్కడం ప్రారంభించి మరలా పడిపోయి కనికరము అనే అంబులెన్సు కొరుకు అడుగుతారు. ప్రతిసారి కనికరము అనే అంబులెన్సు వస్తుంది కాని నీవు అలా జీవించాలని దేవుడు కోరుకొనడం లేదు.

ఈ సారి నీవు శోధింపబడినప్పుడు కోపగించుటకు లేక లైంగిక ఆలోచనలను తలంచుటకు శోధింపబడి నీవు జారిపోతున్నట్లు నీకనిపించినప్పుడు "ప్రభువా, నాకిప్పుడు కృపనిమ్ము" అని మొఱపెట్టుము. నీవు పడిపోలేదని చూచి నీవు ఆశ్చర్యపడతావు. దేవుని కృప నిన్ను పైకెత్తుతుంది. దేవుని కృపకు లోనైతే పాపము నీమీద ప్రభుత్వము చేయదని రోమా 6:14 చెప్తుంది.