వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పురుషులు Religious or Spiritual
WFTW Body: 

ఈ లోకములో అత్యంత జ్ఞానము గల వ్యక్తి కూడా తన స్వంత జ్ఞానము మీద ఆధారపడినట్లయితే, దేవుని చిత్తమును తెలుసుకొనకుండా తప్పిపోవచ్చునని చెప్పుటకు ప్రసంగి అనే పుస్తకము లేఖనములలో ఉంచబడింది. ప్రభువైనయేసు ఒకసారి ఇలాగు చెప్పారు, "తండ్రీ, ఆకాశమునకును, భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులును మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను (మత్తయి 11 : 25). జ్ఞానులు మరియు వివేకులు కలిగియుండకుండా పసిపిల్లలు కలిగియుండేదేమిటి? దీనత్వము. జ్ఞానము, తెలివితేటలు కలిగిన వ్యక్తి దీనుడుగా ఉండుట చాలా కష్టము. తెలివితేటలు కలిగియుండుట తప్పుకాదు కాని దానిని బట్టి గర్వించుట తప్పు. వారికి ఎంత తెలివితేటలున్నా గర్విష్టులు దేవుని మార్గాలను అర్ధము చేసుకొనలేరు.

ఒక వ్యక్తి తెలివితేటలు కలిగియుండి కూడా ఆత్మీయుడుగా ఉండకపోవచ్చని "ప్రసంగి" లో వివరించబడింది. మనుష్యజ్ఞానములో ఈనాడు చాలా మంచివిషయాలున్నాయి. కాని అది దేవుని జ్ఞానము కాదు. కేవలము మనుష్యజ్ఞానము కలిగియుండుట కంటే, కొంత దేవుని జ్ఞానము మరియు కొంత మనుష్యజ్ఞానము కలిపి కలిగియుండుట ఎంతో అపాయకరము. ఎవరైనా విషము కలపాలని అనుకొనినప్పుడు, ఎక్కువ పాలలో కొద్దిగా విషం కలుపుతారు. పూర్తిగా చెడిపోయిన వాటిని కనుగొనుట చాలా సులభము. మానసిక శాస్త్రము (వేదాంతము)లో చాలా మంచి విషయాలుంటాయి కాని దానిలో దేవుని జ్ఞానముండదు. లేఖనములలో నుండి మాత్రమే దేవుని జ్ఞానము వస్తుంది. దేవుని వాక్యాన్ని నమ్మని, లోబడని వీరి మాటలు తప్పు. నీవు వాటిని వెంబడిస్తే, తప్పిపోతావు.

ప్రసంగి 3 : 1-8లో సొలొమోను మానవస్వభావాన్ని మరియు లోకమును బాగుగా పరిశీలించేవాడుగా ఉన్నాడు. ఆయన ఎన్నో సం||లు గమనించిన తరువాత ప్రతి దానికి సమయము కలదని కనుగొన్నాడు. ఇక్కడ సత్యమైన, అసత్యమైన మాటలు ఉన్నాయి. వేదాంతములో ఈ రెండు కలిసుంటాయి.పుట్టుటకు, చనిపోవుటకు, నాటుటకు సమయమున్నదని సొలొమోను చెప్పుచున్నాడు. ఇదంతయు నిజమే. అయితే చంపుటకు, ద్వేషించుటకు కూడా సమయమున్నదని చెప్పుచున్నాడు. ఆత్మసంబంధికి చంపుటకు లేక ద్వేషించుటకు సమయముండదు. అతడు ఎవరినీ ద్వేషించడు. అతడు దేవునిలో నివసిస్తూ ఎల్లప్పుడు అందరిని ప్రేమిస్తాడు.

నీ తండ్రిమీద నీకు కోపమొచ్చినట్లయితే, దిండును నీతండ్రి అనుకొని దానినికొట్టినట్లయితే నీ కోపము పోతుందని వేదాంతులు చెప్పుచున్నారు. సొలొమోను కూడా అటువంటి దానిని కొంచెము నమ్మినట్లుగా ఉన్నది. అయితే అది దేవుని విధానము కాదు. "నీ శత్రువులను ప్రేమించుడి" అని ప్రభువైనయేసు చెప్పారు. సొలొమోనులో ఉన్న లోకానుసారమైన ఆలోచన ఇక్కడ మనము చూచుచున్నాము. మతాసక్తిగల బోధకులు లౌకిక జ్ఞానాన్ని వాక్యముతో కలిపి బోధిస్తారు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి. మనము దీనులమై విరిగినలిగిన హృదయముతో దేవుని ఎదుట ఉండనియెడల, అందులో కొంత బాగుగానే ఉంటుంది కాబట్టి లౌకికజ్ఞానముతో తప్పిపోయే అవకాశమున్నది.

నన్ను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి: దర్శనాలనే క్రొత్త బోధ క్రైస్తవత్వములో వచ్చింది. అది ఇలాగు బోధిస్తుంది: "ఇప్పుడు మీ సంఘములో ఐదుగురే ఉన్నప్పటికీ కళ్ళుమూసుకొని, మీ సంఘములో 5000 మంది ఉన్నట్లు దర్శనములో చూడుము. ఇప్పుడు మీరు ఇంటిలో కలుసుకుంటునప్పటికీ, పెద్దమందిరములో ఉన్నట్లుగా దర్శనములో చూడుము. నీవు కుంటివాడవైతే, నడుస్తున్నట్లుగా చూడుము. ఇప్పుడు నీకు స్కూటరు మాత్రమే ఉన్నట్లయితే, నీకు మంచిక్రొత్త కారు ఉన్నట్లు దర్శనములో చూడుము అప్పుడు వీటిని పొందుటకు కావలసిన విశ్వాసాన్ని పొందుతావు మరియు చివరకు వాటిని పొందుతావు". ఇటువంటివన్నియు కూడా ఇహలోకసంబంధమైనవైయుండును (పెద్ద మందిరము మొ||నవి). "తమ సిలువనెత్తుకొని, తమ్ముతాము ఉపేక్షించుకొని ప్రభువైనయేసును వెంబడిస్తున్నట్లు" దర్శనములో చూడమని ఎవరైనను చెప్పినట్లు నేనింతవరకు వినలేదు. ఇది "నూతన యుగము" అనే వేదాంతము నుండి వచ్చిందిగాని బైబిలులో నుండి రాలేదు. కాని చాలామంది విశ్వాసులకు వివేచనలేదు. కాబట్టి వారి విశ్వాసము ఇలాగే వృద్ధి పొందుతుందని ఊహించుకుంటారు. విశ్వాసము దర్శనాల మీద ఆధారపడదు. రోమా 10 : 17 వివరముగా చెప్పినట్లు, "వినుటవలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును". దేవుడు మాట్లాడినదానిని వినుట వలన మాత్రమే విశ్వాసము కలుగుతుంది. శారా కుమారుని కంటుందనే దర్శనము ద్వారా అబ్రాహముకు ఇస్సాకు పుట్టలేదు. అతని విశ్వాసము దేవుని వాగ్ధానమును బట్టి కలిగింది. నీకిష్టమొచ్చిన దానిని దర్శనములో పొందినట్లు ఊహించుకొనలేవు. ఆ బోధ బైబిలులో నుండి రాలేదు. అనుకూలముగా ఆలోచించుట ద్వారా విశ్వాసము కలుగదు. ప్రభువైనయేసు మరియు అపొస్తలులు దర్శనాలను బట్టిగాని లేక అనుకూలముగా ఆలోచించుటను బట్టిగాని అద్భుతాలు చెయ్యలేదు. ఈ రోజులలో మోసపోవుట చాలా సులభము. మనుష్యజ్ఞానము మీద ఆధారపడుట అనే అపాయము గురించి "ప్రసంగి" ద్వారా హెచ్చరించబడుచున్నాము.