ఒక అమ్మాయి ఆలోచనలనుండి

వ్రాసిన వారు :   డా. అనీ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు
    Download Formats:

అధ్యాయము 0
పరిచయము

This is the story of a young girl's experiences from her teenage years to the early days of her marriage. It is the story of one who faces the problems that many young girls face in Indian society today, and of how she overcome them and came out triumphant. She met life's challenges head-on, strengthened by God's grace, and proved in her life that Christ could transform a weak, helpless girl into a jewel in His kingdom and enable her to overcome every limitation and disappointment in life. Here is "must" reading for every growing girl....

అధ్యాయము 1
బాల్య దినములు

నా తల్లిదండ్రులు నాకిచ్చిన పేరును నేను నిజంగా ఇష్టపడుతున్నాను. అది - కృప. అది నిజముగా ఒక ప్రవచనమే. ఎందుకంటే నా జీవితపు కథ నిజముగా దేవుని యొక్క అద్భుత కృపను గూర్చినదే.

నా తండ్రి ఒక ప్రైవేటు కంపెనీ ఆఫీసులో పనిచేసేవారు. ఆయనకు సరిపడిన జీతము వచ్చేది. కాని ఆయన రాబడిలో ఎక్కువ భాగం త్రాగుడుకు వృథా చేసేవారు. ఆయన సాధారణంగా చాలా పొద్దుపోయాక ఇంటికి వస్తుండేవారు. అమ్మయితే ఆయన ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని వారి యొద్దకు వెళ్ళి వస్తున్నారని గొడవపెట్టుకుంటూ ఉండేది.

అమ్మ ఒక గవర్నమెంటు ఆఫీసులో క్లర్క్‌గా పనిచేసేది. ఆమెకు మంచి జీతము వచ్చేది. కాని ఆమె ఎప్పుడూ క్రొత్త క్రొత్త చీరెలు కొంటూ ఉండేది. అందువలన మాకు పొదుపు అంటూ లేక పోయింది. అమ్మ అప్పుడప్పుడూ ఆఫీసు నుండి బాల్‌ పాయింట్‌ పెన్నులు, కవర్లు తెల్ల కాగితాలు తెస్తూ ఉండేది.

మేము డబుల్‌ బెడ్‌రూము ఇంటిలో ఉండేవారము. నాన్నగారి తల్లిదండ్రులు కూడా మాతోనే ఉండేవారు.

మాది అనేకవిధాల సంతోషం లేని కుటుంబము. ఎప్పుడూ అరచుకోవడం కొట్టుకోవడం ఉంటూండేది. అమ్మ దాని తీవ్రతను ఎక్కువగా భరించేది, అయితే పిల్లలమైన మేముకూడా అప్పుడప్పుడూ అందులో వాటా పొందుతుండే వాళ్ళము. తరచుగా ఇంటిలో గొడవల్లో నాన్నమ్మ కూడా కలిగించుకుంటూ ఉండేది. వాటిలో అమ్మ ఎప్పుడూ ఓడిపోతూ ఉండేది. అయితే ఇంట్లో ఏమవుతుందో ఇరుగు పొరుగు వారికి తెలిసేటట్టు అమ్మ ఎందుకు అలా కేకలేస్తుందో నాకర్థమయ్యేది కాదు. అది నాకు సిగ్గుగా ఉండేది.

నాన్నకు బుద్ధి చెప్పుటకు ఆయనకు గాని ఆయన తల్లిదండ్రులకు గాని అమ్మ సరైన భోజనం ఉంచేదికాదు. ఆమె మరియు పిల్లలమైన మేము ఏమైనా ప్రత్యేకమైన పిండివంటలు ఉంటే బెడ్‌రూంలో రహస్యముగా తినేస్తూ ఉండేవాళ్లము.

కాని అమ్మ నాన్నను చూసే తీరు నాకిష్టమయ్యేది కాదు. ఒక్కోమారు వారిద్దరి మధ్య వచ్చే వేడి వేడి వాదనల వలన మధ్య రాత్రిలో మేము సరిగా నిద్రపోయే వాళ్లం కాదు.

ఒకమారు నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ నన్ను నా చిన్న

తమ్ముడుని ఆమె ఒక క్రైస్తవ కూటమిలో కల్సుకొన్న ఒకావిడను చూట్టానికి తీసుకు వెళ్లింది.


మేము ఆవిడను కల్సుకొన్నప్పుడు, ఆవిడ పూర్తిగా అపరిచితురాలైన ఆవిడతో అమ్మ ఉద్రేకంగా ఆమె ఇంటిలో ఎన్ని బాధలు పడ్తుందో చెబుతుంటే నాకు నిజంగా సిగ్గేసింది. అయితే అమ్మ చెప్పిన విషయాలకన్నిటికిని ఆవిడ స్పందించిన తీరులో దయ ఓదార్పు ఉండటాన్ని నేను గమనించాను.

నాకు తరువాత తెలిసిన దేమంటే అమ్మ ఆమెను వచ్చి చూచుటకు కారణం, ఇంట్లో త్రాగుబోతు తండ్రి వలన వచ్చే సమస్యల నుండి మమ్ములను తప్పించుటకు మా ఇద్దరిని ఒక అనాధ శరణాలయంలో చేర్పించాలని వచ్చింది.

ఆవిడ చాలా ఓర్పు దయ కలిగినది. ఆమెకు ఏ అనాధ శరణాలయంతో స్వయంగా పరిచయం లేదని చెప్పినది. కాని ఆవిడ అమ్మకు కొన్ని మంచి సలహాలను ఇచ్చింది. ఆవిడ అమ్మకు చెప్పింది ఏమిటంటే, అన్నిటికంటె ముందు నాన్న అమ్మకు చేసినవన్ని క్షమించి ఆయన ఒక రోజున మారుతారని నిరీక్షణ కలిగి యుండమంది. పిల్లలు యిబ్బంది కలిగించే తండ్రి దగ్గర పెరుగుతున్నా అనాధ శరణాలయంలో జీవితం ఇంకా దుర్భరంగా ఉంటుందని ఎందుకంటే అక్కడ తల్లి ప్రేమ కూడా లేకుండా పోతారని ఆవిడ అమ్మను హెచ్చరించింది!

ఆవిడ నాతో కూడా మాట్లాడిరి. నా తల్లిదండ్రులకు లోబడాలని, నాన్నలో ఎన్ని లోటుపాట్లున్నా ఆయనను గౌరవించి మర్యాద చూపాలని చెప్పిరి. యేసుప్రభువు, దేవుని కుమారుడైయుండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన తల్లిదండ్రులు ఆయనవలె పాపము లేని వారు కాకపోయినా వారికి లోబడి యుండెనని చెప్పిరి. ఆమె మాతో కలసి ప్రార్థించిరి. అప్పుడు మేము కొంత మెరుగైన భావనలను కలిగి వెళ్లిపోయాము.

నేను ఎదుగుతూ ఉండగా నాకు ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉండేవి. అమ్మకయితే తన ఆఫీసు పని మరియు ఇంటిలో పనితోనే తీరిక లేకుండేది కాబట్టి ఆవిడకు నాతో సమయము గడిపి మాట్లాడటానికి సమయం ఉండేది కాదు. నేను కూడా నా సమస్యలు ఆమెతో చెప్పుకోవడానికి స్వేచ్ఛ అనిపించేది కాదు. అందువలన నాలో అనేకమైన ప్రశ్నలుండి పోయి నేను ఒంటరి దానను అనే అనుభూతితో పెరిగాను. అప్పుడే నేను ఎప్పుడైనా పెండ్లి చేసుకుంటే మరియు పిల్లలు కలిగితే, వారితో ప్రతి ఒక్కరితో చాలా సమయం గడపాలని నిర్ణయించుకొన్నాను.

చివరకు అమ్మ, మాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల ప్రాంతంలో చల్లని ప్రదేశములో నున్న క్రైస్తవ బాలికల హాస్టల్‌ను తెలుసుకొని నన్ను అందులో చేర్చింది.

అధ్యాయము 2
క్రొత్త ప్రారంభములు

హాస్టల్‌లో జీవితానికి నేను క్రొత్తగా సర్దుకు పోవాల్సివచ్చింది.

నేను తరచుగా ఇంటి గురించి తలంచుకొని విచారముతో చింతిస్తూ ఉండేదానను. అయితే బడికి వెళ్లగలుగుతున్నందుకు మరియు ఇతర పిల్లలతో కలసిఉండినందున నాకు సంతోషం కూడా అనిపించేది. వారిలో కొందరు నావంటి సంతోషం లేని కుటుంబాల నుండి వచ్చిన వారు. భోజనం కాయగూరలతో మామూలుగా ఉండేది, కాని బాగానే ఉండేది. ఆదివారము మాంసము కూర కూడా ఉండేది.

కొన్ని సార్లు అమ్మ కొంత డబ్బు పంపుతూ ఉండేది, దానితో నేనేమైనా ప్రత్యేకమైన వాటిని కొనుక్కోగలిగేదానిని. ఒకసారి నేను ఎత్తు మడిమలున్న చెప్పులను (హై హీల్స్‌) కొనుక్కున్నాను. వాటిని ప్రతి రోజూ జాగ్రత్తగా శుభ్రం చేసేదానను. నాతోటి అమ్మాయిలు ఇది చూచి నాకు కోపం వచ్చేటట్టు నా జోళ్లను అటూ ఇటూ తన్నుతూ ఉండేవారు. దానితో నేను గొడవ చేసేదానిని.

ఒకరాత్రి మాకు హాస్టల్లో ఒక ప్రత్యేక కార్యక్రమము జరిగింది. మాకు యేసుప్రభువు జీవితము గురించి ఒక సినిమా చూపించారు. మా ఇంట్లో ఒక బైబిలు ఉండేది కాని దానినెప్పుడూ ఎవ్వరూ చదివినట్లు నాకు గుర్తులేదు. ఒక పుస్తకాల అరలో అది దుమ్ము పేరుకు పోయి ఉండేది. కాని ఇప్పుడు హాస్టల్లో ప్రార్థనా సమయాల్లో మరియు బైబిలు పఠనా సమయాల్లో యేసు ప్రభువును గూర్చిన కథలను విన్నాను. అయితే యేసు ప్రభువు నా కొరకు ప్రత్యేకంగా ఏమి చేసారనేది నాకేమి అర్థం కాలేదు. కాని నేను ఆ సినిమా చూచినప్పుడు, మొట్టమొదటిసారిగా, యేసు ప్రభువు నన్నెంతగా ప్రేమించారనేది అందుకోసం ఆయన ఈ దౌర్భాగ్యమైన భూమిపైకి వచ్చి నా పాపముల కొరకు చనిపోయారనేది చాలా బలంగా నాకు తట్టింది.

అప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించాను. నా మొండితనంతో ఎన్ని మార్లు నా తల్లిదండ్రులను బాధించానో జ్ఞాపకం తెచ్చుకున్నాను. నా స్నేహితులతో నా వస్తువులను పంచుకొనుటకు ఇష్టపడని నా స్వార్థపరత్వం గురించి జ్ఞాపకం తెచ్చుకొన్నాను. ఇంకా నా యొక్క అబద్ధములు, దొంగిలించుట, నా యొక్క కోపము ఇంకా చెప్పటానికి సిగ్గు అనిపించే నేను చేసిన, తలపెట్టిన పాపాలన్నిటి కొరకు శిక్ష అనుభవించుటకు యేసుప్రభువు మరణించారని తెలుసుకొన్నాను.

ఆ రాత్రి లైట్లు అన్ని ఆర్పివేసిన తరువాత నేను ఏడ్చాను. నన్ను క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేసికొమ్మని యేసుప్రభువును అడిగాను. ఒక్కమారుగా సంతోషము మరియు శాంతి నా హృదయములోనికి వచ్చాయి. అప్పటి వరకు నన్ను ఎవరూ ప్రేమించడం లేదని భావించే నాకు, నా రక్షకుని యొక్క ప్రేమ ఒక్కమారుగా తెలియవచ్చింది.

ఇప్పుడు నేను ఆయన యొక్క ప్రత్యేకమైన బిడ్డననియు మరియు ఆయన నన్నెప్పుడూ త్రోసివేయడనియు నాకు తెలిసింది. ఎప్పుడూ నా తల్లి దండ్రుల యొక్క ప్రేమగురించి నమ్మకము లేని నా హృదయానికి ఒక బలమైన భద్రతా భావము కలిగింది. ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన దాననని మరియు ఆయన ఎప్పటికిని నా వాడని గ్రహించాను.

ఇటువంటి భద్రతా భావం నాలోనికి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఎందుకంటే ఈ విషయాల గూర్చి నాకు ఎవ్వరూ చెప్పలేదు. కాని ఇప్పుడు వెనక్కు తిరిగి చూచుకొంటే, పరిశుద్ధాత్ముడు ఏవిధంగా ఎప్పుడూ బైబిలు చదవని సామాన్యమైన వారికి కూడా యేసు క్రీస్తును గూర్చిన విషయాలు నిజంగా ఎలా బయలు పరుస్తాడో చూడగలుగుతున్నాను.

అది నా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయ్యింది. ఈ విషయాన్ని ఇంటికి వ్రాస్తూ నా తల్లి మరియు ఇంట్లో ఉన్న అందరూ కూడా అటువంటి సంతోషములో పాలుపొందాలని నేను కోరుకొంటున్నానని వ్రాసాను.

త్వరలోనే నేను పదమూడవ సంవత్సరములో ప్రవేశించాను. వేసవి సెలవులకు నేను ఇంటికి వెళ్లాను. కాని త్వరలోనే ఇంటిలో జీవితముకంటె హాస్టల్లోనే బాగున్నట్లు గ్రహించాను. అక్కడ హాస్టల్లో నాకు ప్రార్థించుకోవటానికి, ఒక పద్ధతిగా జీవించటానికి, క్రమ శిక్షణతో ఉండటానికి, స్నేహితులతో మాట్లాడు కోవటానికి, అక్కడ గుడిలో కూటాలకు వెళ్లటానికి వీలయ్యేది. అక్కడ మమ్మల్ని అప్పుడప్పుడూ హాస్టల్‌ నుండి ఏదైనా పార్కుకో లేక కొండ ప్రాంతాలలోని మంచి ప్రదేశానికో తీసుకు వెళ్తుండేవారు. అటువంటి విహార యాత్రలు మాకందరకూ మరల మరలా ఎదురుచూచే చక్కని అనుభవాలుగా ఉండేవి. వాటన్నిటితో పోలిస్తే ఇంటి దగ్గర జీవితము విసుగు పుట్టించేదిగా ఏ మార్పులేనట్లుగా ఉంది. కాని నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆడుకోవటానికి వీలవ్వని నా తమ్ముడుతో ఆడుకొనుటను నేను ఆనందించాను.

ఆ దినాల్లో నేనొక ఉలికి పడే విషయాన్ని తెలుసుకొన్నాను. మా బంధువు కుర్రాడొకడు, 17 సంవత్సరాల అబ్బాయి అంతకు ముందు లాగానే మా యింటికి వచ్చాడు. అతడిని ఎప్పుడూ ఒక అన్నయ్యవలె చూచేదాన్ని. కాని ఈసారి మేమిద్దరం ఒంటరిగా ఉన్న సమయాల్లో అతడు నన్ను తాకుటకును, శారీరకంగా నాకు దగ్గరగా ఉండుటకు ప్రయత్నించుట గమనించాను. అతడు ఇంతకు ముందు ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. నా కెవ్వరూ ఎప్పుడూ అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండే సంబంధాల గురించి కాని లైంగిక విషయాలు కాని చెప్పలేదు. కాని అతడి ప్రవర్తనలో ఏదో తప్పు ఉందని మాత్రం నాకు అర్థమైంది. కనుక అప్పటునుండి అతడికి దూరంగా తప్పుకు తిరిగాను. అందుకు అతడు చాలా కోపగించుకున్నాడు.

నా ప్రభువే నన్ను ఆ విధముగా కాపాడాడు. నా తోటి హాస్టల్‌ అమ్మాయిల ద్వారా వారు అమాయకంగా ఏమీ తెలియని వయసులో ఉన్నప్పుడు, వారి దగ్గర బంధువుల ద్వారా ఎలా వంచింపబడి లైంగిక పాపములో పడిపోయారో తరువాత విన్నాను. నేను ఇంటి నుండి తిరిగి హాస్టల్‌కు వెళ్లుటకు నా బంధువు ప్రవర్తన కూడా ఒక కారణమయ్యింది. ఒక దగ్గర బంధువుకు కూడా అపవిత్రమైన వైఖరి కలిగియుండవచ్చునని తెలుసుకొన్నాను.

అధ్యాయము 3
ఒక సహాయకరమైన మార్గదర్శి

నా యౌవనదశలో నేనొక స్త్రీగా మారుతున్నానని నెమ్మదిగా గ్రహించాను. రకరకాలైన భావనలు నా మనసులోనికి వస్తుండేవి. ఎప్పుడు ప్రేమింపబడాలని కోరుకొనే నేను ఒక పురుషుని యొక్క ప్రేమ గూర్చి ఆశ పడడం గమనించాను!! ఎవరో చక్కని పురుషుడు నన్ను ప్రేమిస్తున్నట్లు పగటి కలలు కంటూ ఉండేదానను. అటువంటి ఆలోచనలు ఒక్కొక్క మారు విపరీతముగా ఉండేవి.

యేసుప్రభువుతో నాకుండిన సంబంధానికి ఆటంకపరిచే ఒక పెద్ద రాక్షసుడి లాగున నా ఈ ఊహాలోకం ఉండడం గమనించాను. నాకుండిన నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తుతో మాట్లాడుట కంటె నేను ఊహాలోకంలో విహరించుటయే ఎక్కువగా ఇష్టడుటను నేను గమనించాను. నేను ఈ అలవాటు నుండి విడుదలవ్వ లేకపోయాను.

హాస్టల్లో కొందరు అమ్మాయిలు ఒకరితో ఒకరికి ఏదో అసాధారణమైన బంధం ఉన్నట్లుగా వారొకరికొకరు స్వాధీనతా భావము ఉన్నట్లు గమనించాను. వారు ఒకరిపై ఒకరు ఆప్యాయతను చూపించుకొనే తీరు చూచి నాకు సిగ్గువేసేది. వారు వారి గదుల్లోనికి వెళ్లి తలుపులు బిగించుకొనేవారు. వారక్కడ ఏంచేసే వారో నాకు తెలియదు. కాని వారు స్వలింగ సంబంధం కలిగియున్నారని తరువాత తెలుసుకొన్నాను. అది దేవుడు అసహ్యించు కొనునదియు మరియు ఆయన వాక్యములో నిషేధించినదియునై యున్నది (రోమా 1:26,27) . నేను అటువంటి అమ్మాయిలతో కలసి ఉండుట మానివేసాను.

హాస్టల్లో చాలా మంది అమ్మాయిలు వారి జీవితాలను యేసుప్రభువుకు సమర్పించలేదు. వారు ఒకరితో ఒకరు దెబ్డలాడుకుంటూ మరియు ఒకరితో ఒకరు వారాల తరబడి మాట్లాడుకోకుండా ఉండేవారు.

హాస్టల్లో ఒక ఉపాధ్యాయురాలు ముఖములో ప్రకాశం కొట్టొచ్చినట్లు కనబడేది. ఆమె ఒక నిజమైన క్రైస్తవురాలనియు, యేసు ప్రభువును ప్రేమించే ఆవిడని తెలుసుకొన్నాను. ఆమె అర్థం చేసికొనే ఆవిడలా కనబడుట చేత నా సమస్యలు కొన్నిటిని ఆమెతో పంచుకొన్నాను. ఆమె ఎప్పుడూ చక్కని సలహాలు ఇచ్చేది. ఆమె జ్ఞానానికిని ఆమెలో నుండిన బలానికిని మూలము యేసుప్రభువే అని నేను తెలుసుకొన్నాను.

ఆ ఉపాధ్యాయురాలు దాని తరువాత చాలా కాలం, నేను హాస్టల్‌ విడిచి పెట్టిన తరువాత కూడా మాదిరిగా ఉండిరి. నా జీవితముపై ఆమె ఎంత ప్రభావం చూపినదో ఆమెలోనున్న ఆత్మను నేనెంతగా పొందుకొన్నానో చాలా కాలము తర్వాతగాని నేను గ్రహించ లేకపోయాను. ఆమె మాదిరి నా జీవితములో ఎంతో మంచికి పునాది వేసినది.

ఆమె మాతో సామాన్యమైన విషయాలు చెప్పేది. ఆమె మాకు సైన్సు తరగతిలో పువ్వుల గూర్చి చెప్పినప్పుడు, ఉదాహరణకు, ఆమె లిల్లీ పుష్పం గురించి చెబితే అది స్వచ్ఛతకు గుర్తు అని చెప్పేది. ఈ లోకంలో మన జీవితము ఒక గడ్డి పుష్పంవలె అందంగా ఉండి మరుసటి రోజుకు ఎండిపోయే లాంటిదని చెప్పేది. ఆమె గులాబీ గూర్చి-అది ఎక్కువ రాత్రులందే దాని సువాసన వెదజల్లునని-అదే విధముగా మనము కూడా చీకటి యిబ్బందులలో నుండి వెళ్లినా దయకలిగి ఇతరులకు ప్రకాశముగా ఉండాలనిచెప్పేది. నీలలోహితం అనేడి పువ్వు చీకటిగా ఉండే ప్రదేశాలలో పుష్పించేది-ఇది దీనత్వమునకు సాత్వీకమునకు సాదృశ్యముగా నుండెను. అనేక పువ్వులు ఎవ్వరూ చూడని చోట పూయునని చెప్పేది. అందువలన మనము కూడా దేవునిని మాత్రమే సంతోష పెట్టే వారుగా మరియు మనుష్యులలో గుర్తింపు పొందే వారుగా ఉండకూడదని ఆమె బోధించేది. అనేక పువ్వులు కాళ్లతో త్రొక్కబడుతాయి కాని వాటిలో ఏవి కూడా ఎదురించవు. కనుక మనము కూడా కక్షలు ఉంచుకోకుండా అవమానములు భరించుటకును మరియు ఇతరులను వెంటనే క్షమించుటను వాటినుండి నేర్చుకొనవలెను. అటువంటి పాఠములు నా యౌవన మనసులో లోతైన ముద్ర వేసాయి-అవి నాలో స్వభావమును రూపొందిచాయి.

ఈ ఉపాధ్యాయురాలు మాకు హాస్టల్‌ వార్డెన్‌గా కూడా ఉండేవారు. మేము రజస్వల వయసులోనికి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేవారు. ఎప్పుడూ ఆరోగ్యపరంగా ఆలోచించాలని, క్రమం తప్పకుండా స్నానం చెయ్యాలని, ముఖ్యంగా ఏ శరీర భాగాలు ఎక్కువ మురికి అవునో మరియు ఎక్కడ ఎక్కువ చెమట పడుతుందో అక్కడ జాగ్రత్తగా కడుక్కొనాలని ఆమె నేర్పించారు. మా యొక్క నెలసరి దినాలు ఏదో రోగము వచ్చినట్లు చూడకూడదని, అది సృష్టికర్త మా శరీరాలు సృష్టించిన అద్భుతమైన విధానములో అది ఒక భాగమని చెప్పారు. మా శరీరాలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండునట్లు నడచుట ద్వారా లేక ఆటలాడుట ద్వారా వ్యాయామము చెయ్యాలని చెప్పారు. మేము సన్నగా చురుకుగా ఉండాలి కాని, లావుగా బద్ధకంగా ఉండకూడదని చెప్పేవారు. ఆమె మాతో ఆటలు కూడా ఆడేవారు.

ఆమె మా తలను ఏ విధముగా శుభ్రముగా నుంచుకోవలెనో, పేలు పట్టకుండా ఏం చెయ్యాలో కూడా చెప్పేవారు. హాస్టల్లో ఉండే అమ్మాయిలకు పేలు బహు సామాన్యముగా నుండేవి. మా వస్తువులు చక్కగా సర్దుకొని మా చుట్టు ప్రక్కల శుభ్రముగా ఉంచుకోవాల్సి యుండేది. మా బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కొని అవసరమైనపుడు చిరిగిన వాటిని కుట్టుకొనేవారము.

ఆమె తరచు బైబిలులో సామెతలు పుస్తకము నుండి కొన్ని మంచి సూక్తులు చెబుతూ, మమ్ములను బైబిలులో వాక్యాలను కంఠస్తము చేయుమని ప్రోత్సాహపరిచేవారు.

మేము పాటలు పాడే సమయాన్ని ఇష్టపడే వాళ్లము. మేము ఎన్నో ఆరాధన పాటలు నేర్చుకొన్నాము, నేను ఒంటరిగా నున్నప్పుడు ప్రభువుకు పాటలు పాడుకుంటూ ఉండేదానను. ఈ చిన్న చిన్న పల్లవులు నేను నిరుత్సాహముతో కృంగి ఉన్నప్పుడు, నా ఆత్మను లేవనెత్తుటకు ఎంతో సహాయపడేవి. ఆ దినాల్లో అన్ని సమయాల్లో దేవునిని స్తుతించుటలో గొప్ప శక్తి యున్నదని నేను నేర్చుకొన్నాను.

మేము పరీక్షలముందు పాఠాలన్నిటినీ చదువుకొనుటకు ఉంచుకొనకుండా ఎప్పటికప్పుడు చదువుకోవాలని మా వార్డెన్‌ మమ్ములను ప్రోత్సాహ పరిచేవారు. మేము పరీక్షలంటే భయపడకూడదని, కాని శ్రద్ధతో చదవాలని, ఎప్పుడూ పరీక్షల్లో కాపీ కొట్టకూడదని, మిగిలినది దేవునికి విడిచిపెట్టాలని ఆమె చెప్పేవారు. మన ఆలోచనలు దేవునిపైన ఉంచినట్లయితే ఆయన మనకు పరిపూర్ణ సమాధానము నిచ్చును అనే బైబిలు వాక్యాన్ని ఆమె మాకు బోధించిరి (యెషయా 26:3). చాలా మంది పరీక్షల సమయములో అనవసరమైన ఆందోళనకు గురి అయ్యేవారు. కాని మా వార్డెన్‌ మేము ఆందోళనేమీ లేకుండా ఉండుటకు సహాయము చేసేవారు.

చరిత్ర చెప్పే తరగతిలో మా వార్డెన్‌ భారతదేశాన్ని పరిపాలించిన రాజుల గూర్చి మాత్రమే కాక, ఈ దేశాన్ని మెరుగైన ప్రదేశముగా మార్చుటకు వారి జీవితాలను త్యాగము చేసికొని వచ్చిన మిషనరీల గూర్చి కూడా చెప్పేవారు.

ఆమె విలియం కేరీ గూర్చి చెప్పారు. ఆయన ఇంగ్లాండు దేశములో కేవలము ఒక చెప్పులు కుట్టుకొనే వాడు. కాని ఆయన భారతదేశము వచ్చి మన దేశస్థులకు సువార్త చెప్పుటకు ఎంతో త్యాగము చేసారు. ఆయన మన దేశములో ఎన్నో కష్టాలను అనుభవించారు. అయితే చివరిగా బైబిలును ఎన్నో భారతదేశ భాషలలోనికి అనువదించే అద్భుతమైన పనిని చేసారు. ఈ ఒక్కని వలననే ఎంతో మంది భారతీయులు వారి మాతృ భాషలలో దేవుని వాక్యమును పొందగలిగిరి.

అలాగే ఎమీ కార్‌మైకేల్‌ అనే ఐర్లాండు దేశపు స్త్రీ గూర్చి కూడా ఆమె చెప్పారు. ఆమె ఆ దేశమునుండి వచ్చి తమిళనాడులో దోనవార్‌ అనే స్థలములో అనాధలకు ఒక ఆశ్రమము స్థాపించారు. ఆమె, తల్లిదండ్రులు పారవేసిన ఆడపిల్లలను రక్షించి వారిని పెంచి వారు దేవునియందు భయభక్తులు గల స్త్రీలుగా చేయుటకు ఆమె జీవితాన్నంతటినీ వెచ్చించిరి.

పంజాబు ప్రాంతానికి మత ప్రబోధకుడుగా వచ్చి, అనేకులను క్రీస్తు నొద్దకు

తీసుకు వచ్చిన జాన్‌ హైడ్‌ (ప్రార్థనా పరుడైన హైడ్‌ అని కూడా ఆయనను పిలిచెదరు) అనే ఆయన గూర్చి కూడా మాకు చెప్పారు.

ఈ కథలు అశోకుడు, షాజహానుల గూర్చిన చరిత్ర పాఠాల కంటె కూడా నన్ను ఎక్కువ సవాలు చేసేవి.

మా వార్డెన్‌ మాలో ప్రతి ఒక్కరి గూర్చి అటువంటి శ్రమ తీసుకొన్నందుకు నేనెంతో కృతజ్ఞురాలను. మేము ఆమెతో చాలా విషయాల గూర్చి నిర్మొహమాటంగా మాట్లాడేవారము. నా తల్లి ఆమెలా ఉంటే ఎంత బాగుండేదని నేను తరచూ అనుకుంటూ ఉండేదానను.

ఒక రోజున మా వార్డెన్‌ తను కూడా ఒక అనాధనేననియు తను కూడా ఎమీకార్‌ మైకేల్‌ దగ్గర దోనావర్‌లో పెరిగినదని ఆమె నాతో చెప్పినది. అటు తరువాత ఆమె టీచరు ట్రైనింగ్‌ చదివి ఈ హాస్టల్‌లో ఈ ఉద్యోగములో చేరినది.

ఆమె నిజముగా పక్షపాతము లేని స్త్రీ మరియు మమ్ముల నందరిని ఎంతో ప్రేమించేది.

నా జీవితములో క్రమశిక్షణ గల అలవాట్లను పెంపొందించుకోవాలని ఆమె నన్ను వ్యక్తిగతముగా తరచు ప్రోత్సాహపరచేది. ఆమె ప్రతి రోజూ తప్పకుండా దేవునితో కొంత సమయమును గడుపుట, బైబిలు చదువుట, ప్రార్థన చేయుటలో గొప్ప విలువను పొందినట్లు ఆమె చెప్పినది. నేను ఎదుర్కొనే పోరాటాలు, అవి నా ఆలోచనా జీవితములో ఉండిన ఊహాలోకం మరియు నాతో హాస్టల్లో ఉన్న వారిలో కొందరిపై నా కుండిన కక్షలు పోవునట్లు నేను జయించులాగున దేవునిని సహాయమడుగుమని ఆమె నన్ను ప్రోత్సాహించేది.

నేను నా తండ్రిని చాలా కాలం క్రితమే క్షమించాను. కాని ఇప్పుడు మరి కొందరిపై నెమ్మదిగా నాకు అయిష్టత పెరుగుతుండేది. మన జీవితమంతా అయిష్టత అను దానిపై పోరాడాల్సి ఉంటుందని నేను గ్రహించాను. ఎందుకంటే ఇతరులు మనకు ఏ సమయములోనైనా హాని కలిగించవచ్చును. అయితే వారిని క్షమించుటకు మరియు ప్రేమించుటకు దేవుడు మనకు కృప నిచ్చును.

యేసుక్రీస్తు యొక్క సువార్తలో నుండిన గొప్ప శక్తి అది.

అధ్యాయము 4
చెడు అలవాట్లను జయించుట

నా జీవితము మారవలెనంటే మొదట నాకున్న చదివే అలవాటు మారాలని అర్థము చేసుకొన్నాను. నాకు ఊహలలో తేలిపోజేసే శృంగారపరమైన నవలలు చదివే అలవాటు ఉండేది, ఎందుకంటే అవి నా ఊహలను ఉద్రేకపరిచేవి. కాని అవి నా హృదయంలో మంటలులా లేచే కోర్కెలకు ఆజ్యం పోసి ఇంకా ఊహాలోకంలో ఉండేలా చేసేవి. నేను మంచి పుస్తకాల రుచి చూడగలుగునట్లు నా స్నేహితురాలైన వార్డెన్‌ తన స్వంత పుస్తకాలలో కొన్ని నాకు యిచ్చినది. ఆ పుస్తకాలు నన్ను ప్రభువు యొద్దకు తీసుకువచ్చాయి.

అప్పుడు నేను ప్రభువును మంచివి కాని పుస్తకాలను చదవాలన్న కోర్కె నుండి తప్పించమని అడిగాను. నెమ్మదిగా నా దృక్కోణం మారుటను గమనించాను. హాస్టలు గ్రంధాలయములో ఇండియా దేశానికి వచ్చిన క్రైస్తవ మిషనరీల గూర్చి మరియు వేరు వేరు కాలాల్లో నుండిన క్రైస్తవ విశ్వాస వీరుల గూర్చిన పుస్తకాలు కొన్ని తీసుకొని చదివాను. నెమ్మదిగా, కాని ఖచ్చితంగా నాలో అటూ ఇటూ పోయే ఊహలను ప్రభువు నందు బంధించాను. అప్పుడు నా ఊహలలోకము మేఘము వలె కదిలి వెళ్లి పోయింది. చివరకు నన్ను ఎంతో కాలము తన బంధిఖానాలో ఉంచిన అసహ్యమైన రాక్షసుని నుండి నేను విడుదల పొందాను.

మా హాస్టల్లో ఒక టి.వి. ఉండేది. అక్కడున్న ఆడ పిల్లలు అందులోవచ్చే సినిమాలు తరచు చూస్తూ ఉండేవారు. నేను కూడా కొన్ని సినిమాలు చూచాను. కాని అవి నా ఊహలలోకాన్ని నా యొద్దకు తిరిగి తీసుకు వస్తున్నాయని గ్రహించాను. కనుక ఈ అలవాటు నుండి నన్ను పూర్తిగా విడుదల చేయుమని దేవునిని అడిగాను.

ఈ శోధన జయించునట్లు నా ఆలోచనను ప్రక్కకు తప్పించుటకు, ఒక మూలను చూచుకొని నా స్నేహితురాలైన వార్డెన్‌కు ఒక అల్లిక పని చేయడం మొదలుపెట్టాను. మా హాస్టల్లో అప్పుడప్పుడు కొన్ని అమ్మకాలు సాగుతూ ఉండేవి, అప్పుడు కొన్ని ప్లాస్టిక్‌ బ్యాగులను ఇంకా అటువంటి కొన్ని అమ్మకాలు సాగుతూ ఉండేవి, అప్పుడు కొన్ని ప్లాస్టిక్‌ బ్యాగులను ఇంకా అటువంటి కొన్ని వస్తువులను తయారు చేసేదాన్ని. కుట్టడంలోను, అల్లికలలోనూ నేను ఆసక్తిని పెంచుకొన్నాను. నా జీవితానికి ఒక విలువ ఉందని గ్రహించుట చేత గౌరవప్రదముగా దుస్తులు ధరించుట నేర్చుకొన్నాను.

నాలో పరధ్యాన తలంపులు నెమ్మదిగా క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టేదానను, కాని అది ఎల్లప్పుడూ ఉండే పోరాటము. కొన్నిమార్లు నాతోటి అమ్మాయిలు టి.వి.లో ఆసక్తి కరమైన కార్యక్రమము గూర్చి చెప్పేవారు. అప్పుడు అది చూచేదానను. టి.వి.ని చూచి కళ్లు మూసికొనే పరిశుద్ధ వ్యక్తి వలె కనబడుట నాకిష్టముండేదికాదు. కాని మొత్తానికి టి.వి.లో వచ్చే చాలా కార్యక్రమములు కేవలము నా మనసును చెరిపేసేవే అని గమనించాను.

నేను దేవునిని వెదకుట మొదలు పెట్టిన దగ్గర్నుండీ ఇతరుల అవసరాలను -ముఖ్యముగా ఇతరుల ఆత్మీయ అవసరాలను గూర్చి పట్టించుకొనే దాననుగా అగుటను గమనించాను. ఒకరోజున ఎప్పుడూ చాలా మౌనముగా నుండే అమ్మాయి నా దగ్గరగా వచ్చి ఆమె సమస్యలు నాతో చెప్పుకోవడం మొదలు పెట్టింది. ఆమె తల్లి చనిపోయింది. ఆమె తండ్రి మరల పెండ్లి చేసికొనుట కొరకు ఈమెను హాస్టలుకు పంపించి వేసారు. తనతో తన కూతురు మరొక బరువుగా నుండినట్లయితే తనకు ఒక భార్య దొరకదని ఆమె తండ్రి అనుకొనెను!! ఆమె తన తండ్రి పెట్టిన వాతలు, కొట్టినప్పుడు అయిన మచ్చలు నాకు చూపించినది. ఆమె ఇంకెప్పుడూ తిరిగి తన ఇంటికి వెళ్లదలచలేదు. అప్పుడప్పుడూ ఆమె అమ్మమ్మ ఆమెను చూడటానికి వచ్చినప్పుడు కొన్ని తినుబండారములు పట్టుకు వచ్చేది. కాని ఆమెలో నుండిన ద్వేషము, అయిష్టత వలన ఆమె తన అమ్మమ్మతో ఎప్పుడూ మాట్లాడేదికాదు. ఆమె శరీరము కంటే ఎక్కువ ఆమె ఆత్మ దెబ్బతిని ఉన్నట్లుగా నేను గమనించాను. ఆమె నేను ఎన్నో విషయాలు మాట్లాడుకొన్నాం. తరువాత మేమిద్దరం కలసి ప్రార్థించడం మొదలు పెట్టాం. కొద్ది రోజుల్లోనే ఆమె కూడా ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించినది. ఒక ఆత్మను రక్షకుని చెంతకు తీసుకు వచ్చాననే విషయం నన్ను ఎంతగానో పులకరింపజేసింది. అప్పట్నుంచే మేమిరువురము కలసి మా కుటుంబాల కోసం లోపల భాధలున్న మా వంటి ఇతర అమ్మాయిల కోసం ప్రార్థించడం మొదలు పెట్టాము.

మాతో పాటు కొందరు వికలాంగులైన అమ్మాయిలు కూడా హాస్టల్లో ఉండేవారు. వారి తల్లులు వారు కడుపులో ఉన్నప్పుడు గర్భస్రావం చేసుకొనటానికి ఏవో మందులు వాడారట. అవి సరిగా పని చెయ్యకపోవడం వలన కొందరు అలా ఉన్నారు. ఒక అమ్మాయికి పళ్ళు లేవు. ఇంకొక అమ్మాయి ఎంతో మొద్దుగా నుండి చదువుపై అసలు మనసు పెట్ట లేకపోయేది. అందువలన ఆమెను ఎప్పుడూ వంట పనిలోనే ఉంచేవారు. అలా మొద్దుల్లాగా ఉన్న అమ్మాయిలను ఇతరులు ఎగతాళిచేసి ఏడిపించేవారు. వారి తల్లులు చేసిన పాపానికి పిల్లలు ఎలాగు వారి జీవితాంతము బాధ పడ్తున్నారనే విషయం గూర్చి విచారించేదానను. ఈ మర్మానికి సంబంధించిన జవాబు నాకు దొరికేది కాదు. కాని నేను వారితో స్నేహంగా నుండి వారి చీకటి జీవితాల్లో కొంచెమైనా సంతోషం కలిగించవచ్చని అనుకొనేదానను. ఆ కారణంతోనే దేవుడు నన్ను ఆ హాస్టల్లో ఉంచాడని అనుకోనేదానను.

మా హాస్టల్లో తల్లి చనిపోయి వారి సవితి తల్లి చేత బాధలు అనుభవించిన అమ్మాయిలు కూడా ఉండేవారు. దాని ఫలితముగా ఆ అమ్మాయిలు స్త్రీలందర్ని ద్వేషించేవారు. కొంతమంది అమ్మాయిలు వారి తండ్రుల చేత లైంగికంగా బాధలు అనుభవించి ఇప్పుడు మగవారంటేనే ద్వేషించే స్థితికి వచ్చిన వారున్నారు. మరికొందరు వారి గతంలో జరిగిన మానసిక పరిస్థితుల వలన ఎప్పుడూ ప్రతివారితో కటువుగా మాట్లాడేవారు.

అయితే మా అందరి అమ్మాయిలకూ అప్పుడప్పుడూ చెడు మనోభావములు ఉండేవి.

అయితే మా వార్డెన్‌ గారు మాతో ఓర్పుతో ఉండేవారు. ఆమె మాతో సమయాన్ని గడిపి మాతో మాట్లాడి మమ్ములను ప్రోత్సాహపరిచేవారు. మాలో అనేకులు ప్రభువు వైపు తిరుగునట్లు ఆమె సహాయపడిరి. మేము కూడా కోపం వచ్చినప్పుడు కేకలు వేయడం, ముఖాలు ముడుచుకోవడం జయించునట్లు కృపను పొందాము.

అధ్యాయము 5
ప్రాకారములు మరియు కవాటములు

నేను ఒక రోజు పరమగీతములో ఒక అమ్మాయి ఒక గోడవలె నుండవలెను తప్ప తలుపు వలె నుండకూడదని చదివాను (పరమ గీతము 8:9). ఆమె పురుషుల విషయములో అణకువయు స్వస్థబుద్ధి కలిగి, ఒక గోడ వలె నుండవలెను తప్ప వారు లోపలకు రాగల్గునట్లు తీయబడిన ద్వారము వలె నుండకూడదు.

మేముండినది ఆడ పిల్లల హాస్టలు కావున, మాకు మగవారితో ఎటువంటి సంబంధము ఉండేది కాదు. అందువలన కొందరు అమ్మాయిలకు మగవారంటే మొత్తముగా ఏవో అసాధారణమైన ఆలోచనలుండేవి. అందువలన వారు మగవారిని చర్చిలోనో రోడ్డుమీదో చూచినప్పుడు బిగుసుకు పోవడమో, మెలికలు తిరిగిపోవడమో లేక అతిగా ప్రవర్తించటమో చేసేవారు.

మగవారితో ఎలా మసలు కోవాలనే విషయంలో మా వార్డెన్‌ మాకు చాలా సహాయము చేసారు. వారితో మామూలుగా మాట్లాడాలని చెప్పేవారు. కేవలం ఒక్క మగవాడి మీద మేము ఆసక్తి చూపించడం మొదలుపెడితే ప్రమాదమని చెప్పేవారు. అటువంటి ఆలోచన పెండ్లి సమయం వచ్చే వరకు రానివ్వకూడదని చెప్పేవారు. మగవారితో మాట్లాడినప్పుడు సాధారణ విషయాలు తప్ప ఎప్పుడు వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడకుండుట ఎంతో జ్ఞానముతో కూడుకొన్నది అని చెప్పేవారు. ఒక ప్రాకారముగా నుండుట అనగా మగవారితో అస్సలు కలవకుండా ఉడడం కాదు. దాని అర్థమేమిటంటే వారి దగ్గర జాగ్రత్తగా మరియు అణకువ కలిగి నుండవలెననియే. ఆమె సలహాలు, మేము మగవారిని చూచినప్పుడు వారి నుండి పారిపోకుండా వారితో సహజంగా ప్రవర్తించునట్లు మాకు సహాయపడెను!

కాని కొందరు అమ్మాయిలు వారు గూడులో బంధింపబడిన పక్షులవలె ఉన్నామని అనుకొనేవారు. వారు కుదురుగా ఉండని పక్షులవలె, మా అందరి మంచికోసం మాపై ఉంచిన కట్టుబాటులను ఇష్టపడేవారు కాదు. వారు స్వేచ్ఛ కోసం పరితపించేవారు. కాని నేను నిజమైన స్వేచ్ఛ యేసు ప్రభువుచేత అన్ని బంధకాలు నుండి విడిపింపబడిన దేవుని బిడ్డగా నుండుటలోనే ఉందని తెలుసుకొన్నాను. హాస్టల్లో నుండిన అన్ని నియమములు మా మంచికే, మాకు తెలియని అనేక ప్రమాదాల్లో నుండి కాపాడుటకు ఉండినవి.

ఒకసారి మా వార్డెన్‌ బైబిలులో ఉండిన దీనా అనే అమ్మాయిని గూర్చిన కథ చెప్పారు. ఆమె తన యింటినుండి బయటకు వెళ్లుట వలన తన జీవితాన్ని పాడు చేసుకొనుటే కాకుండా తన కుటుంబ సభ్యులకు కూడా యిబ్బందులు తీసుకువచ్చినది. ఆ కథను నేను యింతకు ముందు గమనించలేదు. కాని ఆమె ఆ కథ మాకు చెప్పినప్పుడు ఆ కథనంతా ఆదికాండము 34వ అధ్యాయములో చదివాను. అది దేవుడే యౌవనములో ఉన్న అమ్మాయిల కందరకూ బాధ్యత లేకుండా యిష్టమొచ్చినట్లు తిరుగకూడదని ఒక గట్టి హెచ్చరికగా యిచ్చినట్లు నాకు అనిపించింది. దీనా చేసిన పని వలన ఒక యుద్ధము జరిగి అనేకులు మరణించారు. ఆమె తన తల్లి దండ్రుల మాట వినకుండా స్వేచ్ఛ కోసమని బయటకు వెళ్లి తిరిగే అమ్మాయిల కందరకు నిజంగా ఒక హెచ్చరికగా నున్నది.

హాస్టల్లో చాలా మంది సామాన్యమైన బట్టలు వేసుకొనేవారు కాని దానిని బట్టి మేము హృదయములో కూడా అలా సామాన్యముగా ఉన్నామని కాదు. చాలా మంది అమ్మాయిలు బిగుతుగా ఉండే బట్టలు ధరించుకొని, వారు టి.వి.లో చూచిన నటీమణుల షోకులను వారి మేకప్‌ల తోను లిప్‌ స్టిక్‌లతోనూ అనుకరించేవారు.

నేను వారి మధ్య ప్రత్యేకంగా కనబడాలని అనుకోలేదు. కాని అదే సమయంలో వారి వలె తయారవ్వాలని అనుకోలేదు. యేసుప్రభువు యొక్క శిష్యుడు ఈ లోకములో, చివరకు క్రైస్తవులని పిలిపించుకొనే వారి మధ్య కూడా సరిపడడు అని అప్పుడు నాకన్పించినది. చాలా మంది అమ్మాయిలు మగవారికి ఆకర్షణీయముగా కనబడుటకు మాత్రమే తయారయ్యేవారు. నేను దుస్తులు ధరించుకోవాలనేది నాకు అంత సులువుగా తేలేది కాదు. కాని మగవారు నన్ను ప్రత్యేకంగా తేరిచూడనటువంటి దుస్తులు ధరించాలని నేను నిర్ణయించుకొంటిని. మేము గుంపుగా బయటకు వెళ్లినప్పుడు చాలా మంది అబ్బాయిలు మా వైపు ఎలా మోహపు చూపుతో చూస్తారో నేను గమనించాను. నేను వేరుగా కనబడకుండా, నా వస్త్ర ధారణలో దేవునికి ఒక మంచి సాక్ష్యముగా ఉండాలనుకొన్నాను.

హాస్టల్లో అధికారానికి లోబడుటనేది మాలో ఎవ్వరికీ సంతోషకరమైనది కాదు. కొందరు అమ్మాయిలైతే తిరుగుబాటు చేసి చివరకు కొన్ని చెయ్యకూడని పనులు కూడా చేసేవారు. కొందరు పట్టుబడి యిబ్బందులలోనికి వెళ్ళేవారు.

ఒక అమ్మాయి ఆమెకున్న మగ స్నేహితుల గూర్చి చెప్పేది. ఆమె ఎప్పుడూ క్రొత్తగా వచ్చిన ఫేషన్లకు తగినట్లు అలంకరించుకొనేది. ఒక రోజున ఆ అమ్మాయి నీరసముగా కనబడడం గమనించి వార్డెన్‌ డాక్టరు దగ్గరకు పరీక్షకు పంపారు. అప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది!! ఆమెను వెంటనే హాస్టలు విడిచిపెట్టి వెళ్లిపొమ్మన్నారు. ఆమె సిగ్గుతో ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ప్రత్యేకముగా ఆమె మగ వారితో చాలా ఎక్కువగా కలుపుకోలుగా ఉండుట చూచినప్పుడు, ఆమె విషయంలో ఇటువంటిదేదో జరుగుతుందని నేను అనుకొనేదాన్ని.

మగవారితో, వారు దగ్గర బంధువులైనా సరే ఒంటరిగా ఉండకుండా చూచుకొనుట ఎంతో మంచిదని నేను గ్రహించాను. దుర్నీతిలోనికి జారవేసే దారి ఒకడు పడిపోయే ముందు ఆగుదామని ఆలోచించుటకు సమయము లేని విధముగా ఏర్పడి అకస్మాత్తుగా నుండును.

సన్నగా ఉండి, వారి అందాన్ని బట్టి గర్వించి, వారు టి.వి.లలో చూచే నటీమణుల వలె ప్రవర్తించేవారే, ఎక్కువగా సమస్యలలో చిక్కుకొందురు. మేము బస్సులో ఊర్లోకి వెళ్లినప్పుడు, మగవారు ఈ అమ్మాయిలను అక్కడక్కడా గిల్లుతుండేవారు. వారి వస్త్రధారణను బట్టి మరియు వారి పద్ధతిని బట్టి వారు అటువంటి సమస్యను కొని తెచ్చుకొన్నారని అనుకొనేదానను!

అటువంటి మగవారి నుండి నన్ను కాపాడుకొనుటకు ఒక పద్ధతి కనుక్కొన్నాను. అది నేను బస్సులో నుండినా లేక రోడ్డుపై నుండినా జనంలో ఉన్నప్పుడు నా ముందు భాగాన్ని హేండ్‌ బ్యాగుతో కప్పుకొనేదానను. అటువంటి తుంటరి మగవాళ్లకు దూరముగా ఉండుటకు నాకు వీలైనంతమట్టుకు ప్రయత్నించేదానను.

ఒక్కొక్కసారి మా అమ్మాయిలలో ఒక అమ్మాయిని టౌన్‌ నుండి వచ్చేటప్పుడు ఒక అబ్బాయి వెంటపడేవాడు, తనను ప్రేమిస్తున్నానని కూడా ధైర్యంచేసి చెప్పేవాడు. అటువంటప్పుడు ఏం చెయ్యాలని మేము మా వార్డెన్‌ను అడిగేవారము. అటువంటి రోమియోలను వారి ముఖాలపైనే కరిÄనముగా తిరస్కరిస్తే కొందరు మాకు హాని చేసే అవకాశము ఉన్నది కాబట్టి అటువంటి వారిని కరిÄనమైన మాటలతో కోపం తెప్పించేలా మాట్లాడకూడదని హెచ్చరించారు. తమను రెచ్చగొట్టిన అమ్మాయిల ముఖాలపై అబ్బాయిలు ఆసిడ్‌ పోసిన కొన్ని సంఘటనలు ఉన్నవని ఆమె చెప్పారు. కాని అదే సమయములో ఏ పురుషుని కూడా ఏ విధముగా ప్రోత్సహించకూడదని చెప్పారు. అటువంటి కుర్రాళ్ల విషయంలో చాలా తెలివిగా మసలుకోవాలని చెప్పేవారు. అటువంటి వారిని పట్టించుకోకపోవడం వారివైపు చూడకపోవడం, వారి మాటలకు ఏ సమాధానం ఇవ్వకపోవడం ఉత్తమము.

మాలో అనేకమంది అమాయకమైన పక్షుల వంటి వారమనియు, మమ్ములను పట్టుకొనుటకు సాతాను బయటకు కనబడని ఉచ్చులను పెట్టి ఉంచాడని ఆమె చెప్పేవారు. మేము మా 14-20 ఏళ్ల మధ్యలో సుళువుగా దెబ్బకు దొరికి పోవుదుమని చెప్పేవారు. ఒక అబ్బాయి వచ్చి ప్రేమ అభిమానము అని మాటలు మొదలు పెడితే, అటువంటి మాటలు తీవ్రముగా తీసుకోకూడదని లేక ఒక్కసారే నక్షత్రాలలోనికి వెళ్లిపోయి అతడి గూర్చి కలలు కంటూ గాలిలో మేడలు కట్టకూడదని చెప్పేవారు.

తనను పెండ్లి చేసికోనట్లయితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే యౌవనస్థుల గూర్చి ఆవిడ హెచ్చరించేవారు. ఆమె చెప్పిందేమంటే, అది కేవలం తొందరగా పెండ్లి చేసికొనుటకు ఒత్తిడి చేసే ఒక కుయుక్తి మాత్రమే అనేవారు. తెలివైన అమ్మాయి అయితే అటువంటి బెదిరింపులకు లొంగదు. అటువంటి బెదిరింపులకు లొంగిపోయే వారు అటువంటి అబ్బాయిలకు ఇంటిలో దాసీలుగా (భార్యలుగా కాదు) ఉందురు. అటువంటి పెళ్ళిళ్లు సాధారణంగా, ఆ అబ్బాయికి వేరొక అమ్మాయి దొరికిన తరువాత విడాకులతో ముగిసిపోతాయి!! అటువంటి బెదిరింపులు సాధారణముగా అంత చదువు లేని, ఉద్యోగము లేని కుటుంబాన్ని పోషించుకోలేని అబ్బాయిలనుండే వస్తుంటాయి.

దీనికంతటికీ ఉత్తమమైన మార్గము, అటువంటి ఉచ్చులలో పడకుండా కాపాడుమని దేవుని అడుగుట. వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును అని కీర్తనలు 91:3లో వాగ్దానమున్నది. ఆ వాగ్దానాన్ని అడిగి, దేవునిని సంతోషపర్చుట మరియు జీవితంలో బాగుగా స్థిరపడునట్లు కష్టపడి చదువుకొనుట మా యొక్క అభిలాషగా ఉండాలని చెప్పేవారు. దేవుడు ఎల్లప్పుడూ మమ్ములను గమనిస్తున్నాడనియు, మేము ఆయనను ఘనపరచినట్లయితే తగిన సమయమందు మాకు మంచి జీవిత భాగస్వామిని ఇచ్చుననియు చెప్పేవారు.

మేము అబ్బాయిల యెడల గౌరవపూర్వకమైన మరియు నిగ్రహముతో కూడిన వైఖరిని అవలంబిస్తే చాలా మంది అబ్బాయిలు మమ్ములను గౌరవించుదురని చెప్పేవారు. కాని అటువంటి సమయాల్లో కూడా అబ్బాయిలను దూరంగా ఉంచాలని, వారు సన్నిహితంగా మెలగే అవకాశము ఇవ్వకూడదనియు లేనట్లయితే ఏదైనా బలహీనపడిన సమయంలో పాపంలో పడే అవకాశము కాని లేక పెండ్లి గూర్చిన నిర్ణయానికి వచ్చుటకాని జరుగునని హెచ్చరించే వారు.

మాకు కనీసం 20 సంవత్సరాలు వచ్చేవరకు ఏ అబ్బాయినీ కాబోయే వివాహ భాగస్వామిగా ఆలోచించుకోవద్దనియు, అప్పటికి మేము ఈ విషయం గూర్చి తగిన విధంగా జ్ఞానయుక్తంగా ఆలోచించుటకు ఆత్మీయంగా మరియు మానసికముగా మరి కొంచెం పరిపక్వత చెందుదుమని చెప్పేవారు.

ఇటువంటి మంచి సలహాలకు నేను ఎంతో కృతజ్ఞురాలను, అవి నేను నా యౌవనంలో బుద్ధి తక్కువగా ఏపనీ చేయకుండా కాపాడినవి

అధ్యాయము 6
హాస్టల్‌ జీవితములో సమస్యలు

మా కందరకూ హాస్టల్లో వేరు వేరు బాధ్యతలుండేవి. దాని ప్రకారము మేము ఒకరి తరువాత ఒకరముగా తోటపని, వంట పనిలో మరియు చాపెల్‌ (హాస్టల్‌లో ఉన్నవారి కొరకు ఉద్దేశింపబడిన చర్చి)లో సహాయము, బట్టలు ఉతుకుట, పరిసరాలను శుభ్రముగా నుంచుట చేసేవారము.

మాకు యిచ్చే భోజనము గూర్చి నాకు ఫిర్యాదు ఉండేది. కాని ఒకరోజున క్రైస్తవునికి ఎప్పుడూ దేని గూర్చియైనా ఫిర్యాదు ఉండడం తప్పని పరలోకము నుండి వచ్చిన ఒక ప్రత్యక్షత వలె నాకు తెలిసినది. నిజానికి నేను నరకమునకు తప్ప దేనికిని అర్హురాలను కానని గ్రహించాను. నేను ఆ నరకము కంటె శ్రేష్టమైన వాటిని పొందుట దేవుని కనికరము యొక్క ఫలితమే. అందువలన నా ముందు పెట్టబడిన దేమైనా నేను తినుటకు సిద్ధముగా ఉండవలెనని గ్రహించాను. ఆహార విషయంలో కూడా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని నేను చూచాను. యేసు ప్రభువు ఏవిధముగా 40 రోజులు ఉపవాసం చేసారో అప్పుడు ఎట్లు సాతానును ఓడించారో సువార్తలలో చదివాను.

దొంగిలించడం అనేది మా హాస్టల్లో చాలా సామాన్యమైన విషయం. మా అమ్మ తను పనిచేసే ఆఫీసు నుండి ఎలా చిన్న చిన్న వస్తువులు తీసుకువచ్చేదో ఆలోచించాను. అప్పట్లోనే అది అంత తప్పు పట్టాల్సిన విషయం కాదని ఎందుకంటె ఆమె ఎవ్వరి సొత్తూ తీసుకొనుటలేదని కేవలం గవర్నమెంటు ఆఫీసు నుండే వస్తువులు తీసుకొంటుందని అనుకొనేదానను. అయితే ఇప్పుడు దొంగిలించడం ఏదైనా తప్పు అని తెల్సుకొన్నాను. దొంగిలించడం అనేది దేవుని దృష్టిలో అంగీకారము కాదని అమ్మకు ఉత్తరం వ్రాయాలని ఒక బలమైన కోరిక నాకు ఉండేది. కాని నేను చూచినంత వరకు ఒక మారు ఇటువంటి అలవాట్లు అలవాటయిన తరువాత వయస్సులో పెద్దవారు వాటిని విడిచిపెట్టడం కష్టం. అందువలన అమ్మ అలవాట్లను విడిచిపెట్టగలదో లేదో నాకు తెలియకుండెను.

ఇది నాలో ఒక ఆరోగ్యకరమైన భయాన్ని కలిగించింది. అందువలన అటువంటి చెడ్డ అలవాట్లను నా యౌవనమందే విడిచి పెట్టాలని నిర్ణయించుకొన్నాను. లేకపోయినట్లయితే నేనూ చివరకు వారి వలె అయిపోతాననే భయము కలిగింది.

కొంతమంది అమ్మాయిలయితే అందరూ పంచుకోవాల్సిన వస్తువులు, ఆహార పదార్థముల విషయములో చాలా స్వార్థంగా అత్యాశతో ఉండేవారు. అది అందరికి సమస్య కలుగజేసేది.

కొందరమ్మాయిలైతే ఎప్పుడూ ముభావంగా ఉండి ఎప్పుడూ వారి గూర్చి మాత్రమే వారు ఆలోచించుకుంటూ ఉండేవారు, వారి గూర్చి వారు బాధపడిపోతూ, ఎప్పుడూ వారి బాధల అనుభవాలను ఆపకుండా చెప్పుతూ ఉండేవారు. వారిలో చాలా మంది నిజముగా వారి ఇళ్లల్లో బాధలు అనుభవించారు. అయితే అంతమాత్రాన వాళ్లెప్పుడూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించవలసిన అవసరము లేదని నేను చెప్పేదాన్ని కావాలంటే వారు గతాన్ని దేవుని సహాయంతో విదులించి వదిలి వేయవచ్చు మరియు యేసు ప్రభువు వారి గతాన్ని మరచిపోవటానికి, వారికి చెడు చేసిన వారిని క్షమించి వారు ఆత్మీయముగా ఎంతో గొప్ప ఎత్తులకు ఎదుగుటకు సహాయం చేయును. ఇతరులకు ఏ సహాయము కావాలో తెలుసుకొని సహాయము చేయుట ద్వారా వారి సమస్యలు కుదుట పడునని వారిని ప్రోత్సహించేదానను. ఇది ఎప్పుడూ వారి గూర్చి వారే ఆలోచనలో ఉండిపోయే స్థితినుండి వారిని విడుదల చేయును.

<

ఇంటి దగ్గర్నుండి ఉత్తరం వస్తుందని ఎదురు చూచినప్పుడు రాకపోతే నాకు నిరుత్సాహం వచ్చేది. అయితే ఇంటి దగ్గర్నుండి వచ్చే ఉత్తరాలు సాధారణంగా బాధకలిగించే విషయాలతోనే ఉండేవి కాబట్టి, ఒక్కొక్కసారి ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు ఇంకా నిరుత్సాహ పరిచేవి.

ఏదైనా చిన్న వస్తువు పోగొట్టుకొంటే అది నన్ను నిరుత్సాహపరిచే ఇంకొక విషయమయ్యేది. దానిని ఎలా జయించాలో తెలిసేది కాదు. వస్తువులతో నా కుండిన బంధాన్ని జయించునట్లు సహాయము చేయమని దేవునిని అడిగాను.

కొందరు అమ్మాయిలు వారు బాగా ఉన్న వారవడం వలన వారి వస్తువుల గూర్చి పట్టించుకొనేవారు కాదు అలాగే ఇతరులు ఏమనుకొంటారని కూడా పట్టించుకొనేవారు కాదు.

హాస్టల్లో ఆడించే అన్ని ఆటలలో నేను పాల్గ్గొనేదానను. ఇది నాకు మేలుగా నుండేది. ఎందుకంటే కొందరమ్మాయిలు ఏవిధమైన శారీరక పరిశ్రమ గాని చివరకు కొంచెం ఎక్కువ నడచుటకు ఇష్టపడని వారు క్రొవ్వు పట్టి తరచుగా రోగ గ్రస్తులయ్యేవారు. మన శరీరము పరిశుద్ధాత్మకు దేవాలయము కావున దానినెప్పుడూ ఆయనకు ఉపయోగపడే విధముగా అన్ని వేళలా సిద్ధపాటుతో ఉంచవలెనని నేను గ్రహించాను. నా స్నేహితులలో నుండిన చాలా తినే అలవాట్లు నిజానికి వారి శరీరములకు హాని చేయుట చూచాను. ఎక్కువగా తినడం, కొందరు పిల్లలను ఊబగా మందకోడిగా చూడటానికి అసహ్యంగా చేస్తుంది.

నేనెప్పుడూ పలుకుబడి ఉన్న అమ్మాయిలతో కలసి ఉండటానికి, వారిని నాకు మంచి స్నేహితులుగా చేసికోవటానికి మొగ్గు చూపించడాన్ని గమనించాను. కాని అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు ఏంచేసేవారని ఆలోచించినప్పుడు, విచారంగా, ఒంటరిగా ఉండువారితోను, చురుకుగా లేని అన్ని చేయగలిగే సామర్థ్యంలేని వారితోను నేను స్నేహంగా ఉండాలనుకొన్నాను. ప్రయాసపడి భారము మోసుకొను వారిని తన యొద్ద విశ్రాంతి తీసుకొనుటకు రమ్మని పిలిచే ప్రభువు గూర్చి వారికి చెప్పాలని ఎంతో ఆశపడేదానను.

నేనంత చూడ చక్కగాను తెల్లగాను ఉండకపోయినా దేవుడు నన్నెలా తయారు చేసాడో అలాగే నన్ను నేను అంగీకరించుటను చాలా త్వరగా నేర్చుకొన్నాను. నన్ను నా తల్లి గర్భంలో ఆయన తయారు చేసినప్పుడు ఆయనేమీ పొరపాటు చేయలేదని నాకు తెలియును. అలాగే నేను ఏకుటుంబంలో జన్మించానో ఆ కుటుంబంలో జన్మించునట్లు చేయుటలో కూడా ఆయన ఏ పొరపాటు చేయలేదని నాకు ఖచ్చితంగా తెలియును. యేసు ప్రభువు నాకొరకు చనిపోవుటకు తగినంత యోగ్యురాలనుగా ఎంచినారనే ఆలోచన నన్ను నిలువనియ్యలేదు! ఆ మహిమకరమైన సత్యమును నేనెప్పుడూ మరచిపోలేకుండా ఉన్నాను.

హాస్టల్లో ఉన్న నా కంటె అభాగ్యుల గూర్చి ఆలోచించే దానను. ఒక ఏక్సిడెంటులో ఒక కన్ను పోగొట్టుకొనిన ఒక అమ్మాయి మాతో ఉండేది. ఇంకొక అమ్మాయికి ఆమె ముఖము మీద పెద్ద నల్లని మచ్చ వెంట్రుకలతో నిండి ఉండేది. మరి కొందరు వారి చిన్నతనములో సరియైన ఆహారము తీసుకొనకపోవుట వలన అనేక విధములుగా అనారోగ్యంతో ఉండేవారు. కొందరికి ముఖముపై ఏవో మచ్చలుండేవి.

కొందరు వారి చిన్న వయస్సప్పుడు శారీరకంగా లైంగికముగా పడిన బాధలను బట్టి వారి మనస్సుల్లో మానని గాయములు ఉండేవి. వారి గూర్చి నిజముగా నేను విచారించే దాన్ని. అటువంటి అమ్మాయి తన జీవితములో నుండిన అసహ్యకరమైన రహస్యములను తనను పెళ్లి చేసికొనుటకు వచ్చిన వానికి ఎట్లు చెప్పగలదు? ఇవన్నీ వినిన తరువాత అతడు ఆమెను వద్దనునా? లేక పెళ్లి అయినట్లయితే విడిచిపెట్టునా? అని ప్రశ్నించుకొనేదానను. దానికి నాకు జవాబు దొరకలేదు. అటువంటి అమ్మాయిల యొక్క ప్రతి బాధ యేసు ప్రభువునకు తెలియుననియు ఇతరులు వారికి చేసిన చెడును బట్టి కలిగిన పర్యవసానములను జయించగలుగునట్లు ఆయన చేయునని మాత్రమే నేను వారికి చెప్పగలిగి యుంటిని. సాతాను మన జీవితాల్లో కల్పించిన ప్రతి చిక్కు ముడిని విప్పుటకే యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చెనని నాకు తెలియును (1యోహాను 3:8).

హాస్టల్లో కొందరు అనాధ పిల్లలుండేవారు. వారెప్పుడూ ఎవ్వరి నుండి ప్రేమను పొందలేదు. అలాగే వారు ఎవ్వరికీ దగ్గరగా వెళ్ళేవారు కాదు. వారికి మనలను ఎప్పుడూ నిరాశపరచని నేను తెలుసుకొనిన స్నేహితుని గూర్చి చెప్పేదానను. మన గత జీవితము యొక్క భారములను కూడా ప్రభువు పైవేసి ఆయన చేతులలో విడిచి పెట్టుట నేర్చుకోవలెనని వారికి చెప్పేదానను. ఆయన మాత్రమే ప్రతి బాష్పబిందువును తుడిచి, పెద్దదిగా నుండిన ప్రతి గాయమును మాన్పి గతకాలపు ప్రతి జ్ఞాపకమును పూర్తిగా తుడిచి వేయగలవాడు.

సాతాను శక్తులతో సంబంధమేర్పర్చుకొనుటకు చూచుట కొందరి అమ్మాయిలలో నేను చూచిన మరొక ప్రమాదకరమైన అలవాటు. వారిలో కొందరు హస్త సాముద్రికమును, జాతకములను, సోదే చెప్పేవారి దగ్గరకు వెళ్లుట వార పత్రికలలో వారఫలములు చదువుట చేసేవారు. ఒకరిద్దరి దగ్గర వీజా బల్లలు కూడా ఉండేవి. ఇవన్నీ చేయకూడనివని నాకు తెలియును. అటువంటివి చేయుట వలన తెలియకుండా సాతానుతో సంబంధము కలిగియుండి వారిని వారు నాశనము చేసికొందురని హెచ్చరించేదానను. చేతబడి వలన మంత్ర విద్యల వలన వారు సమస్యలను పరిష్కరించుకొనెదమని అనుకొంటే అంతకంటె భయంకరమైన సమస్యలను వారి మీదకు తెచ్చుకొనెదరని వారిని హెచ్చరించితిని.

మా వార్డెన్‌ మాకు తల్లి వలె ఉండేవారు. ఒకసారి ఆమె ఒక వివాహిత స్త్రీ మాతో లైంగిక విషయాల గూర్చి మాట్లాడుటకు ఏర్పాటుచేసెను. ఆమె బొమ్మల చార్టులను ఉపయోగించి ఏవిధముగా మగ పిల్లలు ఆడ పిల్లలు వేరుగా ఉందురో వారి శరీరములు ఎట్లు పనిచేయునో వివరించిరి. ఈ సమాచారము మాకు ఉపయోగకరముగా ఉండినది. మేము లైంగిక విషయముల గూర్చి తెలుసుకోవాలని ఉత్సుకత ఉండినా ఎవరినైనా అడుగుటకు భయమేసేది. ఎట్లు ఒక పురుషకణము ఒక స్త్రీ కణము కలియుట ద్వారా అద్భుతముగా ఒక క్రొత్త బిడ్డ తయారగునో అనునది ఒక పరిపక్వత కలిగిన వ్యక్తి నుండి తెలిసికొనుట మంచిది.

నేను చాలా చిన్నదాననైనా, హాస్టల్‌ జీవితము ఆత్మీయముగా నన్ను చాలా త్వరగా పరిపక్వతలోనికి తీసుకు వచ్చినదని నేను కనుగొన్నాను. దానికి కారణము హాస్టల్లో నుండిన చాలా మంది వేరు వేరు అమ్మాయిలకు సహాయము చేయుటకు అవకాశము వచ్చుట.

అదయిన కొన్ని సంవత్సరాల తరువాత మాత్రమే, ''ఇతరులకు నీరు పోసిన వారికి దేవుడు నీరు పోయును'' అనే వచనము చూచితిని (సామె 11:25).

ఆ రోజుల్లో దేవుడు నిశ్చయముగా అద్భుతమైన రీతుల్లో నాకు నీరు పోసెను.

అధ్యాయము 7
పాఠశాల జీవితము పూర్తగుట

నా తల్లిదండ్రులు కూడా దేవునిని తెలుసుకోవాలని నేను ఆశించేదానను. నా తండ్రి కుటుంబ బాధ్యతలను ఇంకా బాధ్యతాయుతంగా మోయాలని ఆశించేదానను. నా తల్లిదండ్రలు సంతోషంగా కలిసి ఉండాలని కోరుకొనేదానను. నా తమ్ముడు కూడా ప్రభువును తెలుసుకోవాలని కోరుకొనేదానను. వీటన్నిటి కొరకు నేనేమి చెయ్యాలో నాకు తెలిసేది కాదు. కాని ఈ విషయాలన్ని ప్రతి దినము దేవునికి అప్పగించి నాకున్న చింతలన్నీ ఆయనపై వేసేదాన్ని.

  ''కొద్ది కొద్దిగా దిన దినము,
  కొద్ది కొద్దిగా ప్రతి విషయంలోనూ
  నా యేసు నన్ను మార్చుచుండెను.....''

అనే పల్లవిని హాస్టల్లో మేం పాడుకుంటూ ఉండేవాళ్లం. అది నా జీవితములో నిజముగా నెరవేరుటను నేను చూడగలిగాను. కొద్ది కొద్దిగా దేవుడు నాలో నున్న కోపాన్ని ముఖం ముడుచుకొని ఉండే నా నైజాన్ని అదుపు చేసి నేను మారుటకు సహాయం చేసారు.

యేసు ప్రభువుకు శిష్యురాలుగా ఉండుట గూర్చియు, ఆయన పోలికలోనికి మారుట గూర్చిన పుస్తకాలు చదివాను. క్రమక్రమముగా యేసు ప్రభువు వలె మారుట అనేది నా యొక్క ఆశగా మరియు గొప్ప కోర్కెగా మారిపోయినది.

నాలో క్రీస్తు స్వభావము వంటి స్వభావములో లేని నా లక్షణాలన్నిటినీ కాగితంపై వరుసగా వ్రాసుకొని వాటి గూర్చి ప్రార్థించేదానను. నన్ను మార్చుమనియు నాలోనున్న పాత, భ్రష్టమైనటువంటి స్వభావమును తీసివేసి అక్కడ ఆయన స్వభావమును ఉంచమని దేవునిని అడిగేదానను. కాలం గడిచే కొద్దీ నా బలహీనతలు మరియు పాపముల చిట్టా ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉండేది. అయితే నేను సంతోషముగా ఉండేదాన్ని. నాలో మార్పు కలుగజేయుట దేవుని పని అని నమ్మి, ఆయనకు నాలో సమస్తమును అప్పగించుకొనుట ద్వారా నేను చెయ్యవలసిన పనిని నేను చేసాను. ఇతరుల గూర్చి కూడా ప్రార్థించుట మొదలు పెట్టాను.

ఒక యౌవనురాలు దేవుని వాక్యమునకు శ్రద్ధవహించుట చేత తన నడతను శుద్ధి చేసికొని తన హృదయమును పవిత్రముగా ఉంచుకొనవచ్చునని ఒకరోజున కీర్తనలలో చదివాను (కీర్తన119:9,11). బైబిలులో నేను కనుగొన్న ఈ వాగ్దానాలను బట్టి ఎంతగా ప్రోత్సహించబడినానంటే, ప్రతి సంవత్సరం బైబిలు అంతా ఈ చివరి నుండి ఆ చివరి వరకు చదవటానికి ప్రయత్నించాలని నిర్ణయించుకొన్నాను. మా వార్డెన్‌ గారు బైబిలు చదివే కార్యక్రమ పట్టికను ఒక దానినిచ్చారు, దాని ప్రకారమైతే సంవత్సరానికి ఒకమారు బైబిలు అంతటిని పూర్తి చేయవచ్చును. నేను దీని ప్రకారము చదువుట మొదలుపెట్టి బైబిలంతటిని చదవాలని గురి కలిగియుంటిని. కాని నేను అలాగు కూడా ఒక సంవత్సరములో పూర్తి చెయ్యలేకపోయాను. నాకు ఇంకా ఎక్కువ సమయం పట్టింది. కాని చివరకు నేను పూర్తి చెయ్యగలిగాను!

నేను ఎవ్వరికీ భారముగా నుండకుండునట్లు నా పోషణను నేను సంపాదించుకోవాలని ఆశించినందున స్కూల్లో పాఠాలపై కూడా నేను శ్రద్ధ పెట్టగలిగాను.

హాస్టల్లో ఒక పద్ధతిగా జీవించిన జీవితము నాకు అనేక విషయాల్లో నా సమయాన్ని ఇంకా ఇతరత్రా ఒక నియమ ప్రకారం ఏర్పాట్లు చేసికొనుటకు నాకు ఉపయోగపడినది.

ఇతరులకు సహాయపడుటకు అనేక అవకాశములు ఉండేవి.

నా ఇంటర్మీడియెట్‌ పరీక్ష అయిపోయి, దేవుని దయవలన దానిలో ఉత్తీర్ణత పొందిన తరువాత నేను హాస్టల్‌ జీవితాన్ని వదలవలసి వచ్చినది.

సుమారు నాలుగు సంవత్సరాలుగా మా వార్డెన్‌ నాకు అనేక విధాలుగా మార్గదర్శిగా ఉండుట చేత నేను హాస్టల్‌ను ఎంతో ప్రేమించు స్థితికి వచ్చాను. అందువలన ఆరోజు నాకు నిజంగా విచారించే రోజు.

నా ఇంటర్‌ మార్కులు కేవలం సరాసరి మార్కులు. నా భవిష్యత్తు గూర్చి మా వార్డెన్‌తో మాట్లాడాను. ఆమె నేను నర్సు ట్రైనింగ్‌ చదివితే మంచిదని చెప్పారు. ఆమె సలహా ప్రకారం నేను వేరు వేరు చోట్ల నర్సు ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసాను. కాని ఒక దాని తరువాత ఒకటిగా దక్షిణ భారతదేశములో నుండిన అన్నిమంచి నర్సు ట్రైనింగ్‌ స్కూళ్లనుండి నా దరఖాస్తు త్రిప్పి పంపబడినది. నేనెంతో నిరుత్సాహపడ్డాను. కాని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనియు, ఒక పేరు పొందిన చోటను కాకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఆయన నాకు తలుపును తెరచుననియు నాకు తెలియును.

ఒక రోజున ఉత్తర భారతదేశములో ఉన్న ఒక నర్సు ట్రైనింగ్‌ స్కూలు నుండి బి.యస్‌.సి. నర్సింగ్‌లో వచ్చి చేరమని నాకు ఉత్తరం వచ్చినది. ఆది మా ఊరికి చాలా దూరపు ప్రదేశం. అందువలన ఈ అవకాశమును అంగీకరించాలా వద్దా అని చాలా ఆలోచించాల్సి వచ్చినది. ఆ ట్రైనింగ్‌ స్కూలు కూడా ఏదో మారుమూల ప్రదేశంలో ఉన్నది. అక్కడ నాకు తెలిసిన వారెవరూ లేరు. అక్కడ భాషకూడా వేరైనది, నాకు హిందీ కూడా అంతగా రాదు.

భవిష్యత్తు గూర్చిన ఆలోచనలు నా మనసులోనికి ఎన్నో భయాలను ఆందోళనలను తీసుకువచ్చాయి. అప్పుడు నాకిష్టమైన ఒక పాటను జ్ఞాపకము చేసికొన్నాను:

  ''మార్గమంతటిలో నా రక్షకుడు నన్ను నడిపిస్తూ ఉండగా 
 ఇంకా నేను అడగాల్సింది ఏమిటి? 
 నా జీవిత మంతా ఆయనే నాకు మార్గదర్శిగా ఉండగా

ఆయన కరుణా కటాక్షమును నేను అనుమానించగలనా?''

నేను మరొకసారి మా వార్డెన్‌ గారిని సలహా అడిగాను. ఆమె, దేవుడు అన్నితలుపులు మూసివేసి ఇది ఒక్కటే తెరచెనని చెప్పెను. కనుక బహుశా ఉత్తర భారతదేశములో ఆయన నాకు ఏదో ఒక మంచిని దాచి ఉంచారేమో అని ఆమె చెప్పెను. ఆ సమయములో ఆ మాటలు ఎటువంటి ప్రవచన వాక్కులో నాకు తెలియదు. నేను ఆ నర్సింగు స్కూళ్లో చేరుతున్నట్లు వారికి తెలియజేసాను.

చివరకు జీవితములో స్థిరపడుట గూర్చిన నా కలలు కార్యరూపం దాల్చుట ప్రారంభించెను

అధ్యాయము 8
క్రొత్త వృత్తిపరమైన శిక్షణ

నర్సింగు స్కూళ్లో నా జీవితము నా పాఠశాల జీవితానికి వేరుగా ఉండేది.

ఇప్పుడు నా ముందు నా వృత్తిపరమైన జీవితముండెను. నేను వేరు వేరు మనుష్యులను కలుసుకొన్నాను. మా నర్సుల్లో కొందరు విశ్వాసులు కూడా ఉండిరి. వారు క్రైస్తవ నర్సుల యూనియన్‌లో సభ్యులుగా ఉండేవారు. నేను ఆ సమావేశాలకు వెళ్లుచూ ఉండేదానను. అక్కడ పాటలు పాడుకుంటూ, ప్రార్థిస్తూ మరియు సందేశములు వింటూ చక్కగా సమయాన్ని గడిపేవారము.

కొందరు విద్యార్థి నర్సులు ధనిక కుటుంబాల నుండి వచ్చుట చేత వారు చాలా లోకరీతిగా ఉండేవారు. వారు ఖర్చుపెట్టే చాలా వాటికి నేను ఖర్చు చేయలేకపోయేదాన్ని, ఆ విధముగా నేను చాలా వరకు లోకపు తీరు నుండి తప్పింపబడ్డాను. ఈ లోక అవసరాలకు తగినంత కలిగిన, మధ్యతరగతి కుటుంబముల నుండి వచ్చుట ఎంత ఆశీర్వాదకరము.

ట్రైనింగులో నా చదువును బట్టి నేను ఆనందించాను. నేను హిందీ నేర్చుకొనవలసి వచ్చినది. అది నాకు ఒక సవాలుగా ఉండినది. నేను డిగ్రీ చదువు చదివి ట్యూబరు ఉద్యోగము చెయ్యాలని అనుకొంటిని.

శరీర భాగములను కోసి చూచే అనాటమీ తరగతిలో మన శరీరములను దేవుడు ఎంత అద్భుతముగా సృష్టించాడో కొంచెం అర్థము చేసుకోగలిగాను. అలాగే మనము మన శరీరములను ఎన్ని విధములుగా తప్పుగా ఉపయోగించి దుర్వినియోగపర్చుదుమో కూడా చూచితిని. వైద్యవృత్తి ద్వారా బీదల బాధలను ఉపశమింప చేయుటకు బదులు చాలా మంది ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు డబ్బు సంపాదన కొరకు దానిని ఉపయోగించుకొనుట చూచితిని. నేను వైద్య వృత్తిని ఎప్పుడూ ఒక గొప్ప వృత్తిగా తలంచుట చేత నా భ్రమ తొలగిపోయినది.

నేను మత్తు మందులను మోతాదు మించి వ్యసనముగా తీసుకొని తరువాత ఆ అలవాటు పోగొట్టుకొనుటకు వైద్యము గూర్చి చేరిన రోగులను చూచితిని. అటువంటి మారు మూల ప్రాంతములో కూడా సాతాను మద్యము మరియు ఇతర మత్తు పదార్థముల ద్వారా ప్రజల జీవితాలను ధ్వంసము చేయుచుండెను.

గర్భస్రావము ద్వారా గర్భములో నున్న బిడ్డను చంపుట తప్పని నాకు తెలియును. కొందరు డాక్టర్లు యూతనాసియా అనే పద్ధతిని కూడా పాటించుచుండిరి. ఆ మాట నాకు క్రొత్తగా నుండినది. అది జబ్బుగా ఉన్నకొందరకు తగిన చికిత్స చేయకుండా వైద్యరీత్యా చంపుటయని తరువాత నాకు తెలిసినది. జబ్బుతో నుండిన వృద్ధులు కుటుంబమునకు భారముగా నుండినప్పుడు సాధారణముగా ఈ పద్ధతి పాటించుదురు. అటువంటివి ఆసుపత్రులలో జరుగునని తెలియుట నన్ను ఎంతో భయానికి గురిచేసింది. వైద్య ప్రపంచములో నుండిన దుష్టత్వము చూడగలుగునట్లు నా కన్నులు వైద్యశాలలో తెఱచుకొనెను. ఎక్కువమంది డాక్టర్లు నర్సుల కంటె వారు గొప్ప కులపు వారుగా భావించే వారు! కాని డాక్టర్లుచేసే తప్పు విషయాలు చూచినప్పుడు, నేను ఆజ్ఞను పాటించే నర్సునే కాని ఆజ్ఞ ఇచ్చే డాక్టరును కానందుకు నేను సంతోషించేదానను!

కొందరు నర్సులు కూడా వారు పేద రోగులపై అరచేవిధానము, వారి తరువాత చేరిన వారిని ఆజ్ఞాపిస్తూ అరచే విధానము నాకు యిష్టముండేది కాదు. కొందరు నర్సులు గర్వముతో వైద్య వృత్తికి సంబంధించని వారినందరిని ఏమీ తెలియని వారుగా బుద్ధి లేని వారుగా చూచేవారు!! అయితే, చెప్పుటకు సిగ్గుపడవలసిన విషయమేమంటే, కొద్ది కాలము తరువాత నేను కూడా అలాగే ప్రవర్తించడం మొదలు పెట్టాను. దాని గూర్చి నేను పశ్చాత్తాపపడి, రోగులతో మంచిగా ఉండేటట్లు నా ప్రవర్తన మారునట్లు చేయమని దేవునిని అడిగాను. భాష తెలియకపోవుట నాకు దుర్భరముగా నుండేది. అది నా కరిÄన ప్రవర్తనకు ఒక సాకు అనుకొనేదానను. తప్పును ఒప్పు కొనకుండా దేనినో నిందించుట- ఎంత యుక్తితో కూడుకొన్న మానవనైజం మనకున్నది.

కాని ఒక క్రైస్తవ అమ్మాయిగా, నేను రోగులతోను, బలహీనులతోను మరియు పెద్దవారితోను గౌరవముగా మాట్లాడాలని గ్రహించాను. గోలచేసే చిన్న బిడ్డలను సముదాయించుటకు మరియు బిడ్డను పోగొట్టుకొన్న తల్లిని ఆదరించుటకు దేవుని దగ్గర కృపను నేను అడుగవలెను. ఆసుపత్రిలో ప్రతిరోజూ ఏదో ఒక చావును చూచుచుండుట చేత, ఒకరు ఇతరుల బాధలను పట్టించుకొనని కరిÄనులను, చలించని వారుగా సులువుగా మారిపోవచ్చును. నాకు జాలిగల హృదయము నిమ్మని దేవునిని ప్రార్థించాను. ఇతరులకు మంచి చేయుటకు నాకు ఎన్నో అవకాశములు ఉండెను మరియు అప్పుడప్పుడు ఎవరితోనైనను దేవుని గూర్చి చెప్పుచుండెడిదానను.

నా ఆత్మీయ జీవితములో ఓటములు కూడా ఉండేవి. ఇక్కడ నా జీవితాన్ని కనిపెట్టి చూచుటకు నమ్మకమైన వార్డెన్‌ ఎవరూ లేరు. నా ప్రార్థన జీవితములో సులువుగా క్రమశిక్షణ తప్పిపోయాను. బైబిలు పఠన విషయంలో కూడా జారిపోయాను. ఇంతకు ముందు ఉండిన క్రైస్తవ హాస్టల్‌ కంటె ఇక్కడ నిజమైన క్రైస్తవురాలుగా నుండుట చాలా పోరాటముతో కూడుకొనియుండెను. కాని ఆ పోరాటముల ద్వారా నేను దేవునిని ఇంకా వ్యక్తి గతముగా తెలుసుకొనుట ప్రారంభించాను.

ఒకసారి ఒక ధనవంతుడైన యువకుడు ఆసుపత్రిలో ఒకగదిలో రోగిగా చేరాడు. నేను అతనిని యిష్టపడుట ప్రారంభించాను. అతడు ఏదో ఒక రోజున నన్ను పెండ్లి చేసికోమని అడుగుతాడేమోనని అనుకుంటూ ఉండేదానను. నేను చాలా గర్వాంధురాలిగా ఉంటిని. అతడు త్వరలోనే హాస్పిటలు నుండి బాగై వెళ్లిపోయాడు. అతడిని నేను మరల ఎప్పుడూ చూడలేదు. కొన్ని సమయాల్లో, అందముగా నున్న డాక్టరు ఎవరైనా నాతో చక్కగా మాట్లాడితే లేక శస్త్ర చికిత్స చేసే సమయంలో ఆ గదిలో అతడికి సహాయపడ్తున్నప్పుడు అతడిని నాకు కాబోయే భర్తగా ఊహించుకొనేదానను. అటువంటి పగటికలలు కంటూ ఉండేదానను!

నేను బుద్ధి లేని దానను. నా భవిష్యత్తు యేసు ప్రభువులో క్షేమంగా ఉండెను. కాని నేను తరచు దానిని మరచిపోతూ ఉండేదాన్ని. నేను ప్రేమించే ప్రభువును ప్రేమించని ఆ ధనిక రోగిని కాని లేక అందముగా నుండిన డాక్టరును కాని పెండ్లి చేసికొని ఉంటే నా జీవితమెంత కష్టముగా నుండేది.

యేసు ప్రభువు నా సృష్టికర్త మరియు ఆయన చిత్తమయితే నాకు ఈ లోకసంబంధమైన ఒక భర్త నిచ్చేవరకూ, ఆయన నా భర్త. ఆయన లేకుండా జీవితానికి విలువేది? ఆయన ఆజ్ఞలను నేను పట్టించుకొనకపోయినట్లయితే, నేను కలుసుకొనిన కొందరు స్త్రీల వలె ఎవరికో రెండవ భార్యగా నా జీవితము ముగిసిపోయేది.

నా భవిష్యత్తు ప్రభువుకు అప్పగించుకొనుటకు నేను నిర్ణయించుకొంటిని. ఇంత వరకు ఆయన నన్ను నడిపించారు, భవిష్యత్తులో కూడా ఆయన నడిపిస్తారని నేను నమ్మాను. నా హృదయ వాంఛలు ఆయనకు తెలియును. నా హృదయంలో వాంఛలను కలుగజేసినది ఆయనే, అందువలన ఆయనే ఆయన సమయములో, ఆయన పద్ధతిలో వాటిని తృప్తి పర్చును. నేను కనిపెట్టవలెను. నా జీవితములో ఈ విషయం గూర్చి నేను అంతరంగ మందు విశ్రాంతిలోనికి రావలెను.

హాస్టల్లో ఎంతమంది నర్సులు కొందరు డాక్టర్లు లేక ఇతర వైద్య వృత్తిలో నుండిన వారి అబద్ధపు వాగ్దానముల వలన మోసపోయి త్రోవ తప్పిపోయారో చూచాను. వారిలో చాలామంది ట్రైనింగునకు వచ్చినప్పుడు అమాయకమైన అమ్మాయిలుగా వచ్చి ఇప్పుడు వారి కన్యత్వమును కోల్పోయిరి. నేను ఇక్కడకు రాక ముందే దేవుని గూర్చి తెలుసుకొన్నందుకు కృతజ్ఞురాలను, అది నన్ను కాపాడినది.

దేవుని విషయములో నమ్మకముగా ఉందునని నేను తీసుకొన్న నిర్ణయాలను ప్రభువు నాకు తరచుగా జ్ఞాపకం చేసేవారు. నేను ఇంతకుముందు ఉండిన హాస్టల్‌ కంటె ఇక్కడ నాకు ఎక్కువ స్వేచ్ఛ ఉండినా, నా మనస్సాక్షి ప్రభువు యొక్క మార్గములలోనే ఉండునట్లు నన్ను కట్టివేయుటను గమనించాను.

నేను ఎక్కువ దుస్తులపైననూ, షోకుల పైననూ ఖర్చు చేయకుండా పొదుపుగా డబ్బు వాడుకొనుటను నేర్చుకొంటిని. నాకు వచ్చే ఉపకార వేతనములో కొంత ప్రతి నెల ప్రభువు పనికిచ్చునట్లు నేను పొదుపు చేయగలిగేదాన్ని. అప్పుడప్పుడూ ఒకరిద్దరు బీద రోగులకు మందులు కొనుటకు కూడా అందులో కొంత సొమ్మును ఉంచేదానను.

కొన్నిసార్లు ఒక్కొక్క నర్సు వచ్చి నా దగ్గర డబ్బు అప్పు తీసుకొని తిరిగి ఎప్పుడూ ఇచ్చేది కాదు. నేనేమో నెల తరువాత నెల ఆమె తిరిగి ఇస్తాదేమో అని చూచేదాన్ని. కాని ఆమె ఇచ్చేది కాదు. ఆమెను క్షమించమని, నాకు వచ్చే సొమ్ము నాది కాదు కాని ఆయనది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి విషయాల్లో జ్ఞానము కలిగియుండవలెనని ప్రభువు నాకు తెలియజేసెను. భాధ్యతా రాహిత్యముగా ప్రవర్తించే వారికి, లేదు అని చెప్పుటను నేను నేర్చుకొనవలసి వచ్చెను.

కొందరు నా దగ్గర చీరెలు ఎరువుగా తీసుకొనేవారు. వారు తిరిగి వాటిని ఇచ్చినప్పుడు ఆ చీరెలు చిరిగి ఉండేవి. అది నన్ను కలవర పర్చేది. అప్పుడు నేను ఈ లోక వస్తువులను ఎంతగా ప్రేమిస్తున్నానో గ్రహించితిని. అటువంటి విషయాల్లో నన్ను నేను తీర్పుచేసికొనుమని ప్రభువు నేర్పించారు.

నేను ఒంటరితనముతో ఎలా జీవించవలెనో మరియు నాలోనికి చూచుకొని విచారములోనికి క్రుంగిపోకుండుటను ప్రభువు నేర్పెను. కొందరు పెద్దవయసు గల స్త్రీలు ఎప్పుడూ ఏదొక దానికొరకు ఫిర్యాదులు చేస్తూ ఇతరులకు అవసరము లేకపోయినా వారికి ఏదొక సలహాలు యిస్తూ ఉండే వారిని నేను కలుసుకొన్నాను. వారిని అసహ్యించుకొనేటంతగా వారు చిరాకు తెప్పించేవారు. వారి వలె కాకూడదని నేను అనుకొనేదానను.

నేను ఎప్పుడు నా ఆత్మీయ జీవితములో తాజాగా ఉండునట్లును, దేవుని యందే సంతోషించునట్లు దేవునిని అడుగుటకు నిశ్చయించుకొన్నాను. నేను ఎప్పుడూ దేవుడు ఆమెకు ఇచ్చిన పనిని నెరవేర్చుటలో సంతృప్తి పడే నా పాతస్నేహితురాలు, నాకు మార్గదర్శి అయిన పాత వార్డెన్‌ గారిని నాకు మాదిరిగా నా కళ్ల ముందు ఉంచుకొనేదానను. నాకు నా యౌవన దినాలలో అటువంటి మాదిరి ఉండుట నా

అధ్యాయము 9
జ్ఞానములో ఎదుగుట

మా ఆసపత్రికి దగ్గర్లో ఒక మంచి హిందీ మాట్లాడే చర్చి దొరికింది. అది అక్కడ ప్రాంతీయులు మరియు కొందరు ఆసుపత్రి ఉద్యోగులైన మంచి క్రైస్తవులతో కూడిన చిన్న సంఘము. అక్కడ కూటములకు క్రమము తప్పకుండా వెళ్లుటకు అలవాటు చేసుకొన్నాను. అప్పటికి నేను అక్కడ సందేశములు విని అర్థముచేసికొనుటకు, కొన్ని పాటలు పాడుటకు కావల్సిన హిందీని బాగానే నేర్చుకొంటిని.

నేను అప్పటికిని హిందీలో బాగా సంభాషించ లేకపోయినా, నా భాషను భరించగలిగి ఎప్పుడైనా వారిళ్లకు నన్ను ఆహ్వానించే ఒకటి రెండు కుటుంబములు నాకు దొరికెను. నేను ఆ సంఘముకు క్రమముగా వెళ్ళే సభ్యురాలనయితిని. నేను ఆ సంఘములో బాగా అలవాటు పడిపోయాను. త్వరలోనే నేను నీటి బాప్తిస్మము ద్వారా ప్రభువుకు లోబడవలెనని అనుకొంటిని.

నా విశ్వాసము గూర్చి ఇంటికి వ్రాసాను. దానికి మా అమ్మ కూడా ఎగతాళి చేసింది. ఆమె తృణీకరించినటువంటి హల్లెలూయా రకాల్లో ఒకరుగా అగుట ఆమె కిష్టము లేదని వ్రాసింది. మా ఊరిలో అందరి ఇళ్ళకూ వెళ్లి, పెద్ద ప్రార్థనలు చేస్తూ, బలవంతముగా మతాన్ని వారి మీద రుద్దుటకు ప్రయత్నించి మరియు దేవుని పనికొరకు డబ్బు యిమ్మని అడిగే సేవకులు, బైబిలులో స్త్రీల గూర్చి కొన్ని యిబ్బందికర అనుభవాలున్నవి. నేను వారి వలె లేనని అమ్మ వచ్చి చూస్తే బాగుండునని అనుకొన్నాను. చివరకు నా ఉత్తరాలు కాకుండా నా జీవితమే ఆమెతో మాట్లాడాలని అనుకొన్నాను.

నా బాప్తిస్మము నాకు ఒక గొప్ప సంఘటన. అది దేవుడు కొన్ని సంవత్సరాల క్రితము ఆయనను నేను తెలుసుకొనుట ద్వారా ఆయన మందలోనికి నన్ను చేర్చుకొనిన రోజు వంటి ఆనందకరమైన రోజు. కాని ఇది నా జీవితములో ఎన్నో వ్యతిరేకతల హింసల ప్రారంభాన్ని కూడా సూచించినది. ప్రభువును వెంబడించువారు దేవుని యెడల నిజమైన భక్తితో జీవించాలనుకొనిన వారందరు హింసలు పొందవలెనని తెలుసుకొంటిని.

నేను దేవుని బిడ్డగా ఏ విధముగా గౌరవప్రదముగా మరియు అణకువగా ఉండాలో నేర్చుకోవాలనుకొన్నాను. నేను ఎవరితోనైతే పని చేయుచుంటినో వారు నేను ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుకు చెందిన దానినని తెలుసుకోవాలని ఆశించాను. నేను బాప్తిస్మము తీసుకొనిన తరువాత ఈ లోకము మరియు ఈ లోక ఆకర్షణలో నాకు ఆసక్తి లేకుండా పోయినది.

నేను సంఘములో ఎందరినో మంచి వారిని కలుసుకొంటిని. నాకు మగవారితో వివాహితులతో కూడా, ఆసుపత్రిలో మరియు చర్చిలోనూ మాట్లాడాలనే కోర్కె నాలో ఉండినట్లు గమనించాను. కొన్ని సమయాల్లో అయితే ఆడవారి కంటె మగవారితోనే ఎక్కువ మాట్లాడుటకు యిష్టపడుటను గమనించాను. కాని ఇది తప్పని గమనించాను. ఈ విషయంలో జాగ్రత్తగా నుండుమని దేవుడు నన్ను హెచ్చరించెను. దేవుడు ఇరువురిని భార్యా భర్తలుగా కలిపినప్పుడు నేను వారి మధ్యకు రావడమనేది తప్పని చూచితిని. అప్పటినుండి ఏ వివాహితుని భార్యతో స్వేచ్ఛగా మాట్లాడనట్లయితే, అతడితోనూ అంత స్వేచ్ఛగా మాట్లాడకూడదని నిశ్చయించుకొంటిని. నా ఈ నిర్ణయము నన్ను అనేక విషయాలలో పడిపోకుండా కాపాడింది. ఇది చాలా మంది గృహాల్లో అనవసరమైన అపార్థములు కలుగకుండా కాపాడినది అనుకొంటున్నాను. అటువంటి సమయములలో యిబ్బందికరమైన పరిస్థితులు కలుగకుండా నేను తప్పుకొనునట్లు పరిశుద్ధాత్ముడు నన్ను నమ్మకముగా హెచ్చరించినందుకు నేను కృతజ్ఞురాలను.

ఆడపిల్లలందరూ నాకులాగానే ఉన్నారా అని అప్పుడప్పుడు అనుకొనేదాన్ని. అటువంటి తప్పుడు అభిమానములు నాలో తాత్కాలికమైన ఆనందాన్ని తెచ్చేవి, కాని అటు తరువాత నాలో చేదు జ్ఞాపకాలను మిగిల్చేవి. ఈ అలవాటు నాలో ఇంకొక రాక్షసుని లాగున ఉండి చివరకు నన్ను నాశనము చేస్తాదేమో అని భయపడేదాన్ని. నాలో దేవునికి సంతోషం కలిగించని ప్రతి అలవాటును తీసివేయుమని ఒక రోజున దేవునికి ప్రార్థించాను.

నేను దేవుని సేవ చేయ గలిగిన విధానాలను నేను తెలుసుకొంటిని. పిల్లలకు సండే స్కూలు తీసుకొనుటకు నేను ముందుకు వచ్చాను. అలాగే ఒకటి రెండు కుటుంబాలు ఎక్కడికైనా వెళ్ళే పని పడినప్పుడు వారు తిరిగి వచ్చేటంత వరకూ వారి పిల్లలను చూచే బేబీ సిట్టర్‌ పని కూడా చేసేదానను. కొందరు రోగులతో దేవుని గూర్చి మాట్లాడుతూ ఉండేదానను. జనులకు సంతోషం కలిగేటట్లు చేయుటకు ఎంతో కష్టపడిపోవలసిన అవసరము లేదని తెలుసుకొన్నాను. ఒక రోగి ముఖము వెలుగునట్లు చేయుటకు ఒక చిరునవ్వు చాలును మరియు ఒక దయగల మాట స్వస్థపరిచే తైలము వలె పని చేయును.

ఇతరులు నన్ను ఆసరా తీసుకొనకుండునట్లు నేను జ్ఞానముగా ఉండవలసి వచ్చెను. కొందరు రోగులు దయగా ఉండే నర్సుల మంచితనాన్ని ఆసరగా తీసుకొని వారి చుట్టూ వారికి సేవకుల వలె పరుగులు పెట్టించేవారు.

చాలామంది నర్సులకు అడిగిన వారికి అడగని వారికి సలహాలిచ్చే గుణముండుట నేను కనుగొంటిని. వారు ఎంతో అనుభవశాలురువలె మాట్లాడుతూ, ఇతరులకు వారే పెద్ద దిక్కు అనేటట్లు ప్రవర్తించేవారు. వారిని బట్టి ఇతరులు విసిగిపోయి వారిని చూచి తప్పుకొనేవారు. అది చూచి నేను అనుభవములోను, వయసులోనూ చిన్న దానను కాబట్టి అలాగు సలహాలు ఇచ్చుట మానివేసాను. నేను కనిపెట్టిన దేమంటే చాలా మందికి వారు చెప్పేది వినేవారు కావలెను కాని వారికి సలహాలిచ్చేవారు అక్కరలేదు. గనుక నేను ఇతరుల సమస్యలను వినుటను అలవాటు చేసికొంటిని. అట్లు ఆసుపత్రిలో ప్రతి వార్డులో నాకు చాలా మంది స్నేహితులయ్యారు.

నేనెదుర్కొన్న ఇంకొక సమస్య హాస్టల్లో నాతోటి నర్సులతో ఎదురయ్యేది. వారిలో చాలా మందికి కేవలము ఊసుపోని కబుర్లు లేకపోతే ఆసుపత్రి (హాస్పిటలు) అధికారుల గూర్చి చెడుగా మాటలాడుటయందే ఆసక్తి ఉండేది. అటువంటి వ్యర్థమైన మాటలతో గంటలు గంటలు గడిపేవారు. వారి దగ్గర్నుండి తప్పించుకొని వెళ్లుట నాకు చాలా కష్టమయ్యేది. అయినా ఏదో సాకు చెప్పి తప్పించుకొనేదాన్ని. నేను మాట్లాడిన ప్రతి మాటకును నేను వినిన ఊసుపోని కబుర్లకును ఒక రోజున నేను లెక్క అప్ప చెప్పాలని నాకు తెలియును.

కొందరు నర్సులు ఏమీ లేకుండానే ఏదో జబ్బు ఉన్నట్లు దిగులుగా ఉండేవారు. వారెప్పుడూ వారికేదో జబ్బు ఉన్నట్లు ఊహించుకొని ఎప్పుడూ ఇతరుల సానుభూతి కోరుతూ ఉండేవారు. వారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే వారి గూర్చిన చింతలతో వారు నిండి ఉండగా వారు వివాహము ఎలా చేసికొంటారు. భర్తను పిల్లలను చూచుకొనే బాధ్యతను ఎలా పంచుకొంటారు అనిపించేది. అటువంటి అమ్మాయిలు ఇతరులకు వారి వలన ఎటువంటి యిబ్బంది కలుగుతుంది అనే ఆలోచన లేకుండా ఇతరులను పట్టించుకోకుండా వారి భారము మోపేవారు వారు ఆసుపత్రిలో ఎన్నో జబ్బులను చూచుట చేత వారికి కూడా అటువంటి కొన్ని జబ్బులున్నాయని ఊహించుకొనుచున్నారని నాకు అప్పుడప్పుడూ అనిపించేది.

అయితే ఒక నర్సుకు ఒక రోగినుండి క్షయవ్యాధి వచ్చినది. ఆమెకు ఆ వ్యాధి ఎలా వచ్చినదో తెలుసుకొని చాలా బాధపడినది. ఆమె ఒక అవిశ్వాసురాలు, ఆమె ఆ రోగిని రాత్రింబవళ్లు శాపనార్ధాలు పెడుతూ ఉండేది.

దేవుని బిడ్డలైన మన విషయంలో పరిస్థితులు ఎంత వేరుగా ఉంటాయి. మనకు ఏది కూడా దేవునికి తెలియకుండా జరుగదు. మనము జబ్బు పడినా, దేవునికి స్తోత్రము, ఆయన మనలను బాగుచేయును. యేసు ప్రభువు మనలను బాగుచేయువాడును, మన భారము మోయువాడుగా నున్నాడు. ఆయన మనలను అద్భుతరీతిగా బాగుచేయును లేక మన రోగమునకు ఎక్కడ మంచి వైద్యం దొరుకునో అక్కడకు నడిపించును.

నాతో పనిచేసే కొందరు సినిమా పిచ్చి ఉన్నవారు. వారెప్పుడూ వారి అభిమాన సినీ నటీనటుల గూర్చి మాట్లాడుకొంటూ హాస్టల్లో సినిమా పాటలు పాడేవారు. నాకు వాటి గూర్చి ఏమీ తెలియదు. అందుకు దేవునికి వందనములు. నాకు ఒక పాట గుర్తుకు వచ్చింది.

 ''నా స్వరాన్ని తీసుకో మరియు ఎప్పుడూ
 నా రాజు గూర్చి మాత్రమే నేను పాడనీ....''

వారిలో కొందరకు అరబ్బు దేశములు వెళ్లాలని ఆశ ఉండేది. అక్కడకు వెళ్లిన ఇతర నర్సులు చాలా డబ్బు సంపాదించుకొని చాలా బంగారు నగలు కొన్నారని వినిరి. దేవుడు నన్ను ఏం చెయ్యమనుచుండెను? నేను కుటుంబానికి ఆర్థిక సహాయము చెయ్యాలనుకున్నాను. అదే సమయములో, నేను దేవుని చిత్తమును చెయ్యాలనుకున్నాను. దేవుడు నాకు వచ్చే కొంచెమును ఆశీర్వదించినట్లయితే అది 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించినప్పుడు 5000 మందికి ఆహారము పెట్టుటకు సరిపోయినట్లుగా నాకు సరిపోవునని నేను అనుకొనేదానను.

చాలా మంది విశ్వాసులు కేవలము డబ్బు సంపాదించుకొనుటకు మాత్రమే విదేశాలకు వెళ్లుదురని విన్నాను. డబ్బు ఒక ఉచ్చువంటిదని నేను చూచితిని. ఏ సంపదైనా తప్పు పద్ధతిలో వచ్చినట్లయితే అది నాకు నా కుటుంబమునకు ఒక శాపముగా మారును.

నా యింటిలో నా తండ్రి అలాగే తన సొమ్మును త్రాగుడుకు ఖర్చు చేసిన విషయము ఆలోచించాను. ఆయనకు ఆ అలవాటు లేకపోయినట్లయితే మాది బాగా ఉన్న కుటుంబముగా ఉండును. డబ్బు మనకు దేవుడిచ్చిన ఒక పవిత్రమైన ఆస్తియని, దానిని మనము జ్ఞానయుక్తముగా మరియు పొదుపుగా వాడు కొనాలని చూచితిని. నేనెప్పుడూ ఖాళీ లేకుండా ఉండేదాన్ని. నాకు చాలా కొద్ది సమయమే ఖాళీ ఉండేది. పనిలేని మనసు సాతానుకు ఉపయోగపడేస్థలము. నేను ఖాళీ లేకుండా ఏదో పనిలో ఉండుటకు కుట్టుపని నేర్చుకొన్నాను. నాకు దొరికిన పనిలేని సమయాల్లో నా బట్టలు నేను కుట్టుకొనేదాన్ని.

నా చదువును నేను యిష్టపడేదాన్ని. ప్రస్తుత జీవితము చెప్పాలంటే సంతోషంగానే గడిచిపోయింది. నా జీవితము గూర్చిన అవగాహన మరియు ఉద్దేశ్యము నాకుండెను. నా చిన్నతనములో నున్న ఎదురు దెబ్బలను అధిగమించి వాటిని శాశ్వతంగా వెనుకకే విడిచి పెట్టాలని కొంటిని.

చర్చి గ్రంధాలయములో కొన్ని మంచి పుస్తకములు నాకు దొరికాయి. మేడవ్‌ు గుయాన్‌ యొక్క జీవిత చరిత్ర పాత ప్రతి ఒకటి నాకు దొరికినది. ఆమె గూర్చి నేనెప్పుడూ వినలేదు. అది చాలా పెద్ద పుస్తకం. చదువుటకు నాకు చాలా తక్కువ సమయముండేది కాబట్టి అది పూర్తి చేయుటకు చాలా రోజులు పట్టింది. కాని అది నేను చదివిన పుస్తకాలలో ఒక శ్రేష్టమైన పుస్తకము. దేవునిని నా హృదయమంతటితో ప్రేమించునట్లు ఆ పుస్తకము నన్ను మరలా క్రొత్తగా సవాలు చేసింది. అది నా ఆత్మీయ జీవితములో ఇంకా చాలా విధాల సహాయము చేసినది. ముఖ్యముగా సిలువ మార్గములో శ్రమల యొక్క ఉద్దేశ్యములను గూర్చి అర్థము చేసికొనుటకు సహాయపడినది.

ఎటువైపు మనసు త్రిప్పకుండా ప్రభువును సేవించుట ఇప్పుడు నా మూల వాక్యముగా చేసికొంటిని,                                                                                                                                                                                                                      

ఈ మూల వాక్యము యొక్క ప్రేరేపణ ప్రభువును వెంబడించునట్లు నన్ను నడిపించినది.

అధ్యాయము 10
ముందుకు దృష్టియుంచుట

నా నర్సు చదువు అయిపోయిన తరువాత, అక్కడ క్రైస్తవ నర్సుల అవసరముండుట చేత అక్కడనే ఉండిపోయి ఉత్తర భారతదేశములో అదే ప్రదేశములో పనిచేయు చుంటిని.

నాకు అక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రములో ఉద్యోగము వచ్చినది. మేము తరచు అక్కడ గ్రామములకు వెళ్తూ ఉండేవారము. అలా వెళ్ళుట అలసట తెప్పించినా సంతోషకరముగా ఉండేది. అక్కడ ప్రతి ఒక్క రోజూ నేను పనితోనే తీరికలేక ఉండేదానను. అక్కడ ప్రజలను నేను సేవించే దానను మరియు వారికి దేవుని గూర్చి చెప్పుటకు ఇష్టపడేదానను.

ప్రతినెల నా తల్లిదండ్రులకు కృతజ్ఞతాసూచకంగా కొంత డబ్బు పంపుతూ ఉండేదానను. ఉత్తర భారతదేశములో ప్రభువు పనికి కొంత సొమ్ము ఇస్తూ ఉండేదానను. అలాగే కొంత సొమ్మును ఎప్పటికైనా అవసరానికి లేక నా వివాహమునకు పొదుపు చేయగలుగుచుండేదానను.

నా వంటను నేను చేసికొనేదానను, నా బట్టలు నేను ఉతుక్కొనేదానను అలాగున నా వ్యక్తిగత ఖర్చులను చాలా తగ్గించుకొంటిని. నేను ఎక్కువగా ఎప్పుడూ వేసికొని ఉండే నర్సులు వేసుకొనే బట్టలు, నేను క్రొత్తగా వచ్చే ఫ్యాషన్‌ల గూర్చి ఆలోచించకుండా చేసేవి.

నా తండ్రి ఇప్పుడు తిరిగి నా జీవితములోనికి ప్రవేశించుటకు ప్రయత్నించుచుండెను. ఇన్ని సంవత్సరాలు ఆయన నన్ను పట్టించుకోలేదు. కాని ఇప్పుడు నేను డిగ్రీ చదివి, సంపాదిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను విదేశాలకు పంపించాలని మరియు నా పెండ్లి కోసం వేరు వేరు కుటుంబాలను అడుగుట మొదలు పెట్టారు. ఆయన త్రాగుడు మానివేసారని నాకు ఉత్తరము వ్రాసారు. అమ్మకూడా అది నిజమే అని తెలియజేసింది. అది నిజముగా నా ప్రార్థనలకు వచ్చిన జవాబు.

నిజానికి నాకు నాన్న అంటే ఎంతో యిష్టం. అందువలన ఆయననెప్పుడూ బాధపెట్టడానికి ఇష్టపడే దాన్ని కాదు. కాని నాగలిపై చెయ్యి ఉంచి ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే, నేను నా దేవునికి యోగ్యురాలుగా నుండనని గ్రహించాను(లూకా 9:62). నాకు యేసు క్రీస్తు కంటె ఎవ్వరు కూడా ఎప్పుడూ నాకు ముఖ్యము కాదని నిర్ణయించుకొంటిని.

నా భవిష్యత్తు గూర్చి ప్రార్థించడం మొదలు పెట్టాను. నా వివాహము విషయములో దేవుని నడిపింపు కోరుకొంటిని.

ఈ విషయంలో ఇరువురు ఏకీభవించనట్లయితే ఎట్లు వారు కలసి నడచుదురు? చీకటితో వెలుగునకు సహవాసమెట్లు.....అవిశ్వాసులతో విజ్జోడిగా నుండకుడి...

మొదలైన బైబిలులో చదివిన వచనములు నాకు జ్ఞాపకానికి వచ్చేవి. బైబిలులో నుండిన ఆ వచనములు అర్థము చాలా తేటగా ఉంది, అది ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని ఎప్పుడూ వివాహము చేసికొనకూడదు.

నా వివాహ జీవితము నా తల్లి జీవితము వలె గొడవలతో ఉండకూడదని నేను నిశ్చయించుకొంటిని. దేవుడు నాకు సహాయము చేయును. నా భర్తకు నేను లోబడవలెనని బైబిలు చెప్పుచుండెనని నాకు తెలియును. కాని నేను బాధలు పడినట్లు నా పిల్లలు బాధపడకూడదని నిశ్చయించుకొన్నాను.

కాని ఈ ముఖ్యమైన సత్యములు నా తల్లి దండ్రులు అర్థము చేసుకొనునట్లు ఎలా చెయ్యవలెను?

ఏది ఏమైనా ఒక్కొక్క అడుగు వేయుచు ఎంత వెల చెల్లించవలసివచ్చినా ప్రభువును వెంబడించాలని నిశ్చయించుకొంటిని.

ఒక అవిశ్వాసిని పెండ్లి చేసికొనుట కంటె నా జీవితమంతయు అవివాహితగా ఉండిపోవుట మేలని నేను నిర్ణయించుకొంటిని. దేవుడు నాకు ఏర్పాటు చేయని వ్యక్తిని పెండ్లి చేసికొని జీవితాంతము కలసి ఉండుట నేను కోరుకొన లేదు. ఈ విషయంలో అవసరమైతే నా తల్లిదండ్రుల నిద్దరినీ ఎదురించాలని అయితే అది మంచిగా, కాని స్థిరముగా చెయ్యాలని నిర్ణయించుకొంటిని.

నాకు మాదిరిగా ఉన్న స్త్రీలు లోకానుసారమైనవారు కాక వాక్యములో చదివిన శారా, రూతు, ప్రిస్కిల్ల వంటి వారు మరియు నేను చదివిన జీవిత చరిత్రలలో కొద్ది కాలము ముందున్న సూసన్నా వెస్లీ, బెట్టీ సావ్‌ు, ఎలిసబెత్‌ ఇలియట్‌ వంటి వారు.

నేను ఒకమారు మా నర్సుల ప్రార్థనా సహవాసమునకు బైబిలులోని స్త్రీలను గూర్చి బైబిలు తరగతులు తీసుకొన్నాను. అప్పుడు ఈ స్త్రీల జీవితములు గూర్చి వారితో పంచుకొంటిని. కనుక ఆ స్త్రీల ఉదాహరణలు ఇంకా నా మనసులో చెరిగిపోకుండా ఉండెను.

ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి విడుదల చేయుటకు దేవుడు మోషేను వాడుకొనినట్లు దెబోరాను వాడుకొనెను. ఆమె అటువంటి ధైర్యవంతురాలు. ఎస్తేరు దేవుని కొరకు నిలువబడుట ద్వారా దేవుని ప్రజలకు ఆమె తరములో ఆశీర్వాదరకమైనది.

యేసు ప్రభువు తల్లియైన మరియ దేవునికి లోబడిన వారిలో ఎన్నతగిన ఉదాహరణ. ఆమె హేళన, అపార్థము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చునని తెలిసినా దేవునికి లోబడెను. మార్తా మరియలు వారి ఇంటిని వారి హృదయాలను ప్రభువుకు తెరచి వారి ఇంటిలో గొప్ప అద్భుతములను చూచిరి.

లిడియ, దోర్కా, తిమోతి తల్లియైన యూనికే, అతడి అవ్వయైన లోయి, వీరిని నా కన్నుల ముందు ఉంచుకొనేదానను.

బైబిలులో చెప్పబడిన చెడు ఉదాహరణలైన హవ్వ, లోతు భార్య, యోబు భార్య, మోషే భార్య మరియు యెజెబెలుల వంటి వారి నుండి కూడా హెచ్చరికలు పొందితిని.

కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి కాని నాకు సరిపడిన వివాహ సంబంధము రాలేదు. ఇక జీవితమంతా ఒంటరిగా ఉండిపోవాల్సిన స్థితిని అంగీకరించితిని.

భద్రత గూర్చిన ఆశ వయసులో నుండిన అందరు స్త్రీలకు ఉండినట్లే నాకూ ఎక్కువగా ఉండేది. కాని మొట్టమొదటిగా నేను ప్రభువులో సంతోషముగా నుండవలెనని మరియు అన్నిటికంటె ముఖ్యముగా ఆయనను సంతోషపర్చవలెనని కోరుకొనేదానను. ప్రాముఖ్యమైన వివాహ విషయములో ఆయనకు అవిధేయురాలను కాకుండా, ఆయన రాకడకు సిద్ధపడవలెనని ఆశించేదానను. నేనెప్పుడూ నర్సుగా పనిచేస్తూ వేరు వేరు ప్రదేశములలో దేవుని పనికి సహాయము చేస్తుండగలను. ఇప్పుడు నా జీవితానికి ఒక గౌరవము, విలువా కలిగినది.

ఇప్పుడు నాకు ఇంక పగటి కలలు లేవు. ఏది ఏమైనా దేవునిని మాత్రమే సంతోషపర్చదలుచుకొంటిని. ఆ ఆసుపత్రి అంతటికి మెడికల్‌ సూపరిండెంటు మాకు అధికారిగా ఉండేవాడు. ఆయన యెడల నాకు గౌరవముండేది.

నేను ఇంతకు ముందు చెప్పినట్లు, ఎందరో నర్సులు డాక్టర్లతో స్వేచ్ఛగా కలిసి తిరిగేవారు- చివరకు పెండ్లి అయిన వారితో కూడా. వారి యొక్క బుద్ధిలేని చంచల ప్రవర్తన వలన ఎన్ని కుటుంబములు నాశనమైపోగలవోనని వారు లెక్కచేసేవారు కాదు. అటువంటి పాపము నేనెప్పుడూ చెయ్యకూడదని అనుకొనేదానను.

మా నర్సుల హాస్టల్లో ఒక టి.వి. ఉండేది. కాని అందులో వచ్చే అర్థంలేని కార్యక్రమాలు చూచుట ఎంత సమయాన్ని వ్యర్థము చేయుటయో గ్రహించాను. కొన్ని కార్యక్రమాలు ఏదో విషయాన్ని తెలియజేసేవిగా ఉండేవి. అటువంటి వాటిని ఎప్పుడైనా నేను చూచేదానను. కాని టెలివిజన్‌కు అలవాటు పడిపోయి ఆత్మీయముగా కోల్పోవుదునేమో అనే భయముతో ఎప్పుడూ జీవించేదానను. అయితే ఆ భయాన్ని నా పాత వార్డెన్‌ స్నేహితురాలు నాలోనికి ఎక్కించినదని గ్రహించాను. అయితే అది నేను టి.వి.కి అలవాటు పడిపోకుండా కాపాడినది.

సంఘములో వారిని తెలుసుకొనుట నాకు ఎంతో సంతోషాన్నిచ్చినది. వారిలో కొందరు వైద్యానికి వచ్చినప్పుడు వారికి సహాయముచేయుట సంతోషాన్నిచ్చేది. ఆ సామాన్యమైన వారిని నేను ప్రేమించేదానను. వారు కూడా నన్ను ప్రేమిస్తున్నారని అనుకొనేదానను.

ఆ విధముగా రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోతూ ఉండేవి.

అధ్యాయము 11
జీవజల నదులు

మేము ఒకసారి జాన్‌ బన్యన్‌ వ్రాసిన ''యాత్రికుని ప్రయాణము''ను చర్చిలో బైబిలు తరగతిలో ధ్యానించాము. అది మాలో చాలా మందికి ఉజ్జీవాన్ని తెచ్చినది. దాని తరువాత మాలో చాలా మంది క్రైస్తవ జీవితములను ఎంతో ఆసక్తిగా తీసుకొన్నారు. ఆ కథలో క్రైస్తవుని వలె నా జీవితాంతము వరకు యేసు క్రీస్తును వెంబడించుటలో నేను నమ్మకముగా ఉండాలని కోరుకొన్నాను.

అప్పుడప్పుడు మా చర్చిలో మాకు ప్రత్యేక కూటములు ఉండేవి. నేను ఆ కూటములకు అన్నిటికి వెళ్ళేదాన్ని. ఎందుకంటె నా జీవితములో ప్రతిదినము ఉజ్జీవము కావాలని కోరుకొంటిని.

అలా ఆలోచించుకొనునప్పుడు ఒకసారి నా జీవితము ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లు ప్రత్యేకముగా గుర్తించాను. దానికి తోడు ఉత్తర భారతదేశములో నుండిన రోజంతా వేడిగా ఉండే ఎండకాలం నన్ను మరీ క్రుంగదీసేది. ఈ సమయంలో దేవుని ప్రత్యేకంగా ప్రార్థించే అవసరము కనబడినది.

ప్రభువు అనుకొనని రీతిలో నన్ను కలుసుకొని దీవించిరి. ఒకరోజున నేను ఒంటరిగా నా గదిలో ప్రార్థిస్తూ ఉండగా, నా మీదికి కెరటాల వలె సంతోషము ప్రవహించినట్లు అన్పించినది. అప్పుడు ఏదో తెలియని భాషలు నా నాలుక పలికినది. యేసు ప్రభువు నన్ను ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపారని గ్రహించితిని మరియు నేను ఏదో భాషలో ప్రార్థిస్తూ చెప్పినది నాకు అర్థము కానిది. అది భాషల వరము, ఈ అనుభవము గూర్చి చాలామంది మాట్లాడుట విన్నాను. కాని నాకు ఎప్పుడూ దీని గూర్చి అంతగా తెలియదు.

నేను ఎంతగానో సంతోషించి ఆనందించాను.

నా వంటి ఒక దౌర్భాగ్యురాలుకు దేవుడు అటువంటి దీవెననిచ్చునని నాకెప్పుడు తెలియదు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము నా ఆత్మలో గొప్ప విడుదలను మరియు దేవుని యెడల తీవ్రమైన ప్రేమను కలుగజేసినది. నా జీవితము పరలోకములోనికి వెళ్లినట్లు అనిపించినది. అటు తరువాత నేను ఆ మహిమ యొక్క వెలుగులో కొన్ని దినములు జీవించితిని.

ఆ దినాలన్నిటిలో, నేను పైకి చెప్పలేనటువంటి నా హృదయంలో భావాలను ప్రభువు నాకు ఇచ్చిన క్రొత్త భాషతో వ్యక్తంచేసే దానను. నేనేమి చెప్పుచుంటినో నాకు తెలియదు, కాని అది నాకు నా ప్రభువుకు మధ్య నుండిన రహస్యమైన ప్రేమ- భాషగా ఉండేది. అది సూటిగా నా హృదయములో నుండి వస్తున్నందున, అది ప్రభువుకు అర్థమవునని నాకు నమ్మకముండెను. అది నాలో ఆత్మీయమైన స్వస్థతను కూడా తెచ్చినది. అది నా అంతరంగములో ఉపశమనమిచ్చే ఒక తైలము వలె ఉండేది.

పరిశుద్ధాత్మ నా జీవితములో ఒక క్రొత్తదనాన్ని కూడా తీసుకువచ్చెను. అది నా అంతరంగము నుండి ఎప్పుడూ ఒక నీటి ఊట పైకి ఉబుకుతున్నట్లు ఉండేది. ఈ నీటి ఊట, ఈ లోకము ఇచ్చే సంతోషమనే ఇతర ఊటలు ఎండిపోయినట్లు ఎండిపోకుండా, నా అంతరంగములో నుండి నా జీవితాంతము వరకు ఇంకా ఇంకా ఎక్కువగుతూ ప్రవహిస్తుందని అన్పించేది. అలా జరుగునని నేను దేవుని నమ్మితిని.

నేను అనుభవించినది మొదటి శిష్యులు పెంతుకోస్తు దినమున పొందినదని, అది వారిని భయపడే పిరికి వారి నుండి దేవుని కొరకు ధైర్యము గల సాక్షులుగా చేసినదని గ్రహించితిని. నాకు కలిగిన ఈ అనుభవము గొప్పగా చెప్పుకొనుటకు కాదు కానీ, కేవలము ప్రభువు మహిమ కొరకు అణకువతో వాడుకొనుటకని గ్రహించితిని.

నేను బైబిలును లోతుగా చదువలేదు గనుక నా ఈ అనుభవము యొక్క బైబిలు ఆధారమును, నా మట్టుకు నేను కూడా వివరించలేను. నాకు తెలిసినదంతా నేను దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగియుంటిని. ఆయన నన్ను కలుసుకొనెను అప్పుడు యేసుక్రీస్తు వాగ్ధానము చేసినట్లు నా కడుపులో నుండి జీవజలనదులు ప్రవహించుట ప్రారంభమయ్యెను (యోహాను 7:37-39).

ఆత్మలో బాప్తిస్మము నా క్రైస్తవ జీవితములోనికి పూర్తిగా ఒక క్రొత్త కోణమును మరియు దేవుని కొరకును ఆయన వాక్యము కొరకును ఎక్కువ ఆకలిని తీసుకు వచ్చినది.

ఈ అనుభవము కలిగిన తరువాత, నా విశ్వాసము గూర్చి నా చుట్టూ ఉండిన ఇతరులతో పంచుకొనుట నాకు కష్టమయ్యేది కాదు. నాలో ఉండిన బిడియము పోయినది.

నేను పొందిన క్రొత్త భాష నా ప్రార్థన జీవితానికి క్రొత్తదనాన్ని తెస్తూ ఈనాటికీి నాలో ఉన్నది. నేను ఎంతో ఒత్తిడికిలోనయినప్పుడు మరియు నిరుత్సాహపడునట్లు శోధింపబడునపుడు అది నాకు ఎంతో సహాయముగా ఉండుట కనుగొన్నాను.

నాకు వివాహము కాక మునుపు దేవుడు ఈ విధమైన అనుభవాన్నిచ్చుటను బట్టి నేను ఆయనకు కృతజ్ఞురాలను.

అధ్యాయము 12
ఒక యౌవనస్థుడు

మా పాస్టరుగారు ఒక రోజున తన భార్యను తీసుకొని నన్ను చూడటానికి వచ్చారు. నాకు వివాహము చేసికొనే ఆలోచన ఉందా? ఉన్నట్లయితే చర్చిలో ఉన్న ఒక యౌవనస్థుని వివాహము చేసికొనే అవకాశమున్నదా అని అడిగిరి. అతడి పేరు ప్రకాశ్‌. అతడు ఒక ఎలక్ట్రానిక్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేయుచుండెను. అతడు మంచి విద్యను అభ్యసించుటకు చాలా ఆటంకములను అధిగమించి చదువు పూర్తి చేసిన ఒక మంచి క్రైస్తవుడు.

ఈ సంబంధములో చాలా మంచి చెడులను ఆలోచించవలసివచ్చెను. అతడు నేను వేరు వేరు కులములకు సంబంధించిన వారము. మా మాతృభాషకూడా ఒకటి కాదు. నేను స్వేచ్ఛగా మాట్లాడగలిగేటట్లు స్వేచ్ఛగా నాకు తెలిసిన భాష వచ్చిన వారిని వివాహము చేసికొనాలని కోరుకొనుచుంటిని. నా ఉద్దేశ్యములో వివాహములో ఒకరితో ఒకరు సంభాషించుకొనుట చాలా ప్రాముఖ్యమైనది గనుక అతడు ఇంగ్లీషు బాగా మాట్లాడగలడని తెలిసి సంతోషించితిని.

ప్రకాశ్‌కు సంఘములో మంచి సాక్షముండెను. కూటములలో అతడు పాటలను పాడే సమయాన్ని నడిపిస్తున్నప్పుడు చూచినంత మట్టుకు, ఆత్మీయముగా అతడిని నాకంటె ఎక్కువగా చూడగలను అని భావించాను. ఇది నాకు ఎంతో ముఖ్యమైనది. నేను చూచిన చాలా క్రైస్తవ వివాహాములలో భార్యలు వారి భర్తలను ఆత్మీయముగా వారి కంటె ఎక్కువగా చూడలేకపోవుట వలన యిబ్బందులు వచ్చెను. ఇంకొక విషయాన్ని కూడా నేను గమనించాను. అది ప్రకాశ్‌కు నాకు ఒక విషయములో ఒకే ఆసక్తి ఉన్నది. అది దేవుని యెడల మాకున్న ప్రేమ.

కాని నేను తొందరపడి నిర్ణయము తీసుకొనదల్చుకొనలేదు. గనుక దీని గూర్చి ప్రార్థించుదునని మా పాస్టరు గారితో చెప్పితిని. ఈ విషయంలో నేను ఉద్రేకానికి గురవ్వుట నా కిష్టము లేకుండెను. ఒక రోజు దీని గూర్చి ప్రత్యేకముగా ఉపవాసముండి ప్రార్థించి ఈ విషయములో ఆయన చిత్తమేమిటో తేటగా కనుపరచుమని దేవునిని అడిగితిని. తరువాత కూడా ప్రతి దినము ఈ విషయం గూర్చి ప్రార్థిస్తూ ఉండేదానను.

ప్రకాశ్‌ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. అతడు తన తల్లిదండ్రులతో కలసి ఉండేవాడు. నేను తనను వివాహము చేసికొన్నట్లయితే వారితో కలసి జీవించవలసి ఉండును. నేను దెనికైనా సిద్ధమే. అయితే నేను తెలుసుకోవలసినది అది నా పరలోకపు తండ్రి యిష్టమా కాదా అనేది. నేను సుఖముగా విలాసవంతముగా జీవించాలనే ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టివేసితిని. నేనొకవేళ అతడిని వివాహము చేసికొనినట్లయితే అతడి తల్లిదండ్రులను నా తల్లిదండ్రుల వలె గౌరవించవలెనని నిర్ణయించుకొంటిని.

నాకు ఒక కుటుంబము, గృహము కావలెనని ఎంతో ఆశ ఉండేది. ఆ ఆలోచన నన్ను ఉల్లాస పరిచినది. కాని సౌఖ్యము లేని జీవితము నాముందుండెను. ఒక క్రొత్త సంస్కృతి, వేరే సాంఘిక పరిస్థితులకు సంబంధించిన వ్యక్తి మరియు అత్తమామలతో కలసి జీవించే జీవితము నా ముందు ఉండెను. కాని ప్రకాశ్‌ మరియు నేను ప్రభువును ప్రేమించుచుండుట వలన అది సంతోషకరమైన జీవితముగా నుండును. ఆ ఆలోచన నన్ను ఎక్కువగా ఆదరించినది.

నేను రూతు గూర్చి ఆలోచించితిని. ఆమె బైబిలులో ఒక స్త్రీ. ఆమె తన సంస్కృతి జాతి కాని వానిని పెండ్లి చేసికొని తన ప్రజలను వదిలి వేసినది. ఆమె తన భర్తకు, భర్త తరపు వారికిని నమ్మకముగా ఉండెను. ఆమె ఒక బీదరాలుగా జీవితము ప్రారంభించినది. ఆమె వావివరుసలు తప్పిన సంబంధము ద్వారా వచ్చిన మోయాబీయ జాతి అయినా దేవుడు ఆమెను దీవించెను (ఆది 19:30-37). ఆ జాతి యెహోవా సమాజములోనికి ప్రవేశించుటకు అనుమతి లేనిది (ద్వితీయో 23:3). అయినప్పటికి ఆమె దావీదు రాజు యొక్క ముని నాన్నమ్మ అయినది.

ఆ సమయములో నేను చదివిన రెండు పుస్తకములు దేవుని చిత్తమును తెలుసుకొనుటకు నాకు సహాయము చేసినవి. అవి క్రైస్తవ దృక్పథంలో సెక్సు, ప్రేమ, పెళ్లి మరియు దైవ చిత్తాన్వేషణ (రచయిత జాక్‌ పూనెన్‌) ఈ పుస్తకములు వివాహమును దేవుని దృక్కోణము నుండి చూచుటను నేర్పించెను. మొదటి పుస్తకము, నేను వివాహము చేసికొనే వ్యక్తి ఎలా ఉండాలనేది చూచుటకు కూడా సహాయపడినది.

అప్పుడు మా పాస్టరుగారిని ప్రకాశ్‌ గురించి అతడి కుటుంబము గురించి ఇంకా ఎక్కువ వివరములు గూర్చి అడిగితిని.

ఈ సంబంధము గూర్చి నా తల్లిదండ్రులకు ఉత్తరము వ్రాసితిని. కాని వారు ఈ విషయములో సంతోషించరని నాకు తెలియును. నేను ఎవరైనా బాగా ఉన్న వానిని లేక విదేశములలో ఉండి బాగా డబ్బు సంపాదించే వానిని కాని పెళ్లి చేసికొనాలని వారు కోరుకొనుచుండిరి. ఒకవేళ నేను వారు కోరుకొనిన దానికి యిష్టపడక పోయినట్లయితే నా జీవితాంతము ఒంటరిగా నుండి వారికి సహాయపడవలెనని వారి ఉద్దేశ్యము. నేను సంతోషముగా ఉండుట వారికిష్టమా లేక బోలెడు డబ్బు సంపాదించుటలో వారు ఆసక్తి కలిగి యున్నారా అని మర్యాదగా వారికి ఉత్తరము వ్రాసితిని. దేవుడు వారి మనసు మార్చాలని ఎంతో ప్రార్థనతో ఉత్తరాన్ని పంపింతిని.

ఎవరికో నేను భార్యను కాబోతున్నాననే విషయం అప్పుడప్పుడు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది. నేను కొంత భయపడేదానను కూడా. నా జీవితమును పూర్తిగా మార్చి వేసే ఒక ముఖ్యమైన మెట్టు గూర్చి నేను ఆలోచించుచుంటిని. నాకున్నదంతా ఇంకొక వ్యక్తితో పంచుకోబోవుచుంటిని. అది హాస్టల్లో నా గదిలో ఉండుటకు ఎవరో క్రొత్త వ్యక్తి రావడము వంటిది కాదు. అక్కడైతే వచ్చినామె సరిగా లేకపోతే ఆమెను పట్టించు కొనకుండా ఉండవచ్చును. లేక గది మారి పోవచ్చును. కాని భర్త విషయంలో అలా ఎప్పటికీ చెయ్యలేను!

దేవుని చిత్తమును తప్పిపోకుండునట్లు పట్టుదలతో ప్రార్థించితిని. ఒక వేళ ఈ విషయములో నేను పొరపాటు చేస్తుండినట్లయితే, ఇప్పటికైనా ఈ విషయాన్ని ఏదొక విధముగా ఆపునని కూడా దేవునిని ప్రార్థించేదానను. నేను దేవుని చిత్తమునకు మధ్యలో ఉండునట్లు కోరుకొంటిని. నా తల్లి వలె సంతోషము లేని వివాహ జీవితము నేను కోరుకో లేదు.

ఈ సంబంధము గూర్చి రోజూ, పట్టుదలతో రెండు నెలలు ప్రార్థించిన తరువాత దీని గూర్చి నా హృదయములో ఒక విధమైన శాంతిని పొందితిని. ఇది నా విషయములో దేవుని చిత్తమని దేవుడు నాకు సూచించే పద్ధతని నాకు తెలియును. ఈ విషయము మా పాస్టరు గారికి చెప్పితిని.

ఆ మరుసటి రోజే నా తల్లిదండ్రుల దగ్గరనుండి పెళ్లికి ఈ సంబంధమును ఒప్పుకుంటున్నట్లు ఉత్తరము వచ్చినది. దేవుని సమయము ఎంత ఖచ్చితముగా నుండును! వారు నాకు తెలియకుండా నేను పనిచేసే ఊరికి దగ్గర్లో పనిచేస్తున్న వారి స్నేహితుల ద్వారా ప్రకాశ్‌ గురించి వాకబు చేసి అతడు మంచి వాడని తెలుసుకొన్నారట.

మా పాస్టరు గారు మా సంఘ ఆరాధనలో ఒక రోజున మేము ఒకరి నొకరము వివాహము చేసికొనుటకు ఉద్దేశిస్తున్నామని ప్రకటించిరి. అదయిన తరువాత ప్రకాశ్‌ మరియు నేను మా హాస్టల్‌ విజిటర్స్‌ గదిలో కలుసుకొని ఒకరినొకరము తెలుసుకొనుటకు ప్రయత్నించేవారము. మన దేశపు సంస్కృతి కట్టుబాటుల వలన మేము స్వేచ్ఛగా ఒకరి నొకరము బయటకు వెలిబుచ్చ లేకపోయినా నాలో ప్రకాశ్‌ యెడల ప్రేమ ఎక్కువ అవుచున్నట్లును అటు నుండి కూడా అదే విధముగా నున్నట్లును కనిపెట్టితిని.

దేవుడు ఎంత అద్భుతముగా ఆయన నా కొరకు ఏర్పాటు చేసిన వాని యొద్దకు నన్ను నడిపించారు. నా చిన్న వయసులో బుద్ది లేకుండా ఇతర పురుషులను ప్రేమిస్తున్నట్లు ఊహాలోకములో విహరించినా, ఆయన కృపను బట్టి నా ప్రేమాభిమానములు ఎవ్వరి పైననూ వ్యర్థమవ్వకుండా నన్ను దూరముగా ఉంచారు. అయితే నేకొక వేళ పొరపాటుచేసి తప్పేదైనా చేసినా కూడా, నా ప్రేమ గల రక్షకుడు నన్ను క్షమించుననియు, నా పాపములను తుడిచి వేసి తిరిగి క్రొత్తగా జీవితమును మొదలు పెట్టుటకు సహాయము చేయుననియు నాకు తెలియును. మనము తప్పిపోయిన తరువాత కూడా దేవుడు మనకు ఎన్నో అవకాశములు ఇచ్చును మరియు మన గతాన్ని పూర్తిగా మరచిపోవుటకు సహాయము చేయును.

నా వివాహము నిశ్చయమగుట గూర్చి, ఇంతకాలం నాకు సలహాలిచ్చి నా గూర్చి ప్రార్థించిన వార్డెన్‌ స్నేహితురాలికి ఉత్తరం వ్రాసాను. ఆమె తనదైన ప్రత్యేక రీతిలో, యేసుక్రీస్తు మాదిరిలో, ఆమె ఇప్పటికిని ఒంటరిగా ఉండినా నా సంతోషముతో పాలు పంచుకొన్నది.

ఈ విషయమంతటి గూర్చి నేను ఆలోచించుకొన్నప్పుడు, నాకు వివాహము జరుగునను ఆశ కోల్పోయి, నా తల్లిదండ్రులు కూడా నాకు ఏ సహాయము చేయలేనప్పుడు దేవుడు నాకు చేసినది తలచుకొంటే, ''ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను'',  (లూకా 1:47-49) ( అనిన మరియ మాటలు నాకు గుర్తుకు వచ్చెను.

ప్రకాశ్‌ నేను వారంలో రెండు రోజులు కలుసుకొంటూ ఉండేవారము. అతడు వచ్చే రోజు కొరకు ఎదురు చూస్తూ ఉండేదానను. అతడు ప్రభువును చాలా లోతుగా ప్రేమిస్తున్నాడని చూడగలిగితిని. ఆ విషయము అన్ని విషయాలకంటె నాకు భధ్రత కలుగచేసినది. నేను తనకు పెండ్లి కుమార్తెగా అయ్యే రోజు కొరకు ఆతురతతో ఎదురు చూచితిని. ఇద్దరము కలసి మా జీవితములను గూర్చి ప్రణాళికలు వేసుకొనేవారము. ఆ విధముగా మేము కలుసుకొనిన మా కూడికను ప్రార్థనతో, మా జీవితాలకు యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొంటూ ముగించు కొనేవారము.

ఇప్పుడు నా రోజులు సూర్యుని ప్రకాశముతో నిండిపోయి ఉండేవి!

అధ్యాయము 13
ఒక అందమైన ఉద్యానవనము

మా పెండ్లికి ఒక తేదీని నిర్ణయించుకొంటిమి. నా తల్లిదండ్రులు దానికి కొద్ది రోజులు ముందు వచ్చిరి. వారు ప్రకాశ్‌ యొక్క గుణాలన్ని చూచి ఎంతగానో ముచ్చట పడ్డారు. వారి వైఖరిలో నిజముగా దేవుడు తీసుకువచ్చిన మార్పును నేను చూడగలిగితిని. మనము దేవుని ఘనపరచినప్పుడు, ఆయన కూడా మనలను ఘనపర్చును.

మా ఇరువురిలో ఎవరి దగ్గర కూడా గొప్పగా విందు జరిపించుకొనుటకు తగినంత సొమ్ము లేనందున మా వివాహము చాలా సామాన్యముగా జరిగినది. కొందరు దంపతులు వారి వివాహమునకు గొప్ప విందు ఇచ్చుటకొరకు వారి వివాహజీవితమును అప్పుతో ప్రారంభించిన వారిని నేనెరుగుదును.

మేము మా జీవితములో ఎప్పుడూ అప్పులో పడకూడదని నేను, ప్రకాశ్‌ నిర్ణయించుకొంటిమి. గనుక మేము కొందరు ప్రకాశ్‌ బంధువులను, మా సంఘస్థులందరిని, మరియు హాస్పిటల్‌లో నా స్నేహితులు కొందరిని విందుకు పిలిచితిని. నా వార్డెన్‌ స్నేహితురాలు కూడా వచ్చినది.

మాకు దేవుడు అంటే ఏమిటనేది ప్రకాశ్‌, నేనూ క్లుప్తముగా మా వివాహ సమయములో సాక్ష్యమిచ్చితిమి. ఇది మామూలు పద్ధతికి విరుద్ధమైనది. పెండ్లికుమారుడు పెండ్లి కుమార్తె వారి పెళ్లిలో సాక్ష్యమిచ్చుటనేది సాధారణముగా జరిగేది కాదు. కాని వివాహానికి వచ్చి, బహుశా మరల సువార్త వినుటకు అవకాశము లేని యేసుక్రీస్తును విశ్వసింపని మా బంధువుల, స్నేహితులతో మా విశ్వాసాన్ని పంచుకొనుటకు ఇది ఒక మంచి అవకాశమని అనుకొంటిమి.

పాస్టరు గారు ఆయన సందేశములో మాకు మంచి సలహానిచ్చిరి. నేను ఆ ప్రసంగమంతా జాగ్రత్తగా విన్నాను. ఆయన మాట్లాడిన దాదాపు ప్రతిమాట ఇప్పటికి జ్ఞాపకమున్నది.

వివాహము ఒక ఉద్యానవనము వంటిదని ఆయన చెప్పెను. భర్త, భార్య అందులో తోటమాలి వంటివారు. మాకు చక్కని ఉద్యానవనము కావలెనంటె ప్రధాన తోటమాలి అయిన యేసు ప్రభువు యొక్క సూచనలను మేము జాగ్రత్తగా పాటించవలసియున్నది. అటువంటి ఉద్యానవనములోనికి ప్రభువే వచ్చి ఏదేను వనములో వలె ఆయన మాతో కలసి నడచి సంభాషించును. మేము మా మాటల్లో దురుసు తనమును పూర్తిగా తీసివేసికొనవలెననియు మరియు ఒకరి నొకరు నష్టపర్చుకొనేటటువంటి విమర్శలు మానుకొనవలెననియు మరియు ఒకరినొకరు నష్టపర్చుకొనేటటువంటి విమర్శలు మానుకొనవలెనని ఆయన చెప్పెను. మేము ఒకరి నొకరము సంతోషము కలిగే విధముగా మాట్లాడుకొనుటను అలవర్చుకొనవలెను కాని ఎప్పుడూ ఒకరినొకరికి చిరాకు తెప్పించినట్లు మాట్లాడుకొనకూడదని చెప్పెను. మాలో ఎప్పుడైతే చిరాకు పైకి వస్తుందో, అప్పుడు అసహ్యమైన ఆ కలుపు మొక్కను, వెంటనే పెరికి వేసి, బయటకు పారవేసి ప్రేమ అనే విత్తనమును ఆ ప్రదేశములో వెంటనే నాటవలెను.

మేము ఇంకా చూడవలసిన కలుపు మొక్కలు, ఒకరినొకరు నిందించుకొనుట, క్షమించలేని మనసు, ముఖం ముడుచుకొని ఉండడము, మన భాగస్వామిని ఇంకొకరితో పోల్చుట, గతములో తప్పిన విషయములను లేక గతములో స్త్రీ పురుషులతో నుండిన స్నేహములను, కక్షలను మనసులో ఉంచుకొనుట మరియు అలుగుట మొదలైనవి.

ఇంతవరకు మనము చేసిన పద్ధతులలోనే మన భాగస్వామి కూడా పనులు చెయ్యాలని ఎదురు చూడకూడదని చెప్పారు. మేము ఒకరి నొకరము ఎలా ఉంటే అలాగే స్వీకరించుటకు సిద్ధపడవలెనని చెప్పిరి. అనుమానమనేది కూడా బహు ప్రమాదకరమైన కలుపు మొక్క అని ఆయన జ్ఞాపకము చేసిరి. అది అసూయతో సంబంధము కలిగియున్నటువంటిది. అవి రెండూ అశ్రద్ధ చేయబడిన ఏ ఉద్యానవనములోనైనా సుళువుగా వేరు తన్నే కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలు కనబడుట మొదలవగానే వాటిని వేరుతో పీకి వేయవలెను.

అనుమానము వంటి విషతుల్యమైన కలుపు మొక్కలను సాతాను వచ్చి నాటును మరియు మనము మెలకువగా ఉండి చూచుకొననప్పుడు అవి చాలా త్వరగా పెరిగి ఇరువురిని మరియు వివాహమును కూడా నాశనము చేయును. భయము, నిరుత్సాహము అనేవి పెద్ద వృక్షములుగా పెరిగి ఉద్యానవనములో నుండిన చిన్ని మొక్కలను నలిపివేయును. వీటిని కూడా వేరు తన్నేటప్పుడే వేరుతో సహా పెకిలించవలెనని ఆయన చెప్పెను.

పాస్టరుగారు భయము గూర్చి మాట్లాడుతూ ఉండగా, ''హిండ్స్‌ ఫీట్‌ ఇన్‌ హై ప్లేసెస్‌'' (హన్నా హుర్నార్డ్‌ రచించినది) అనే పుస్తకములో నేను చదివిన ''ఎంతో భయము'' అనే కుంటి అమ్మాయి గూర్చి చదివినది జ్ఞాపకము చేసికొన్నాను. ఆ అమ్మాయిని ప్రభువు ఎంతో ధైర్య సాహసములు గల దానిగా మార్చును. యాత్రికుని ప్రయాణములో కూడా నిరాశ రాక్షసుడు క్రైస్తవుని బంధించి చంపబోవుటను చదివితిని.

పాస్టరుగారు ఇంకా చెప్పినదేమంటే, అసంతృప్తి అనే మరొక విషతుల్యమైన మొక్క అది సణుగుడు, ఎప్పుడూ అది బాగోలేదు, ఇది బాగోలేదు అని ఫిర్యాదులు చేయుట, గొణుగుడు వంటి ఫలాలనిచ్చును (ఆయన గొణుగుడు గూర్చి హాస్యంగా అది కడుపు పాడయి ఆగకుండా విరేచనములు అవుట వంటిదని చెప్పెను). వీటిని జాగ్రత్తగా కనిపెట్టి ఆ చెడు విషయములను వేరులతో తీసివేయక పోయినట్లయితే అవి మా జీవితములను కలచి వేసి నాశనము చేయుటే కాక ఇతరుల జీవితములపై కూడా ఆ ప్రభావమును చూపునని చెప్పెను.

అసంతృప్తితో నుండే వారు వారి స్తోమతకు మించి ఎక్కువ వస్తువులు కొనుటకు అప్పుల్లో పడుదురు. చివరకు వారి అప్పులు ఎంతో పెరిగిపోయినప్పుడు, వారు ఆత్మహత్య చేసికొని వారి పిల్లలను తండ్రిలేని వారుగా చేయుదురు. ఎవరైతే ఈ లోకమును ప్రేమించుదురో వారి ఉద్యానవనములో ఎక్కడపడితే అక్కడ ఈ అసంతృప్తి అనే మొక్కను చూచెదరు అని కూడా పాస్టరుగారు మమ్ములను హెచ్చరించారు.

ఇతరుల గూర్చి చెడుగా మాట్లాడుకొనుట గాలికబుర్లు చెప్పుకొనుట అను మొక్కలు కూడా మన పిల్లలకు అంటురోగమువలె చెడు చేయును కాబట్టి వాటిని ఉద్యానవనములో లేకుండా చూచుకొనవలెను.

వాదనలు వచ్చినప్పుడు అందులో గెలువవలెనని లేక చివరగా నా మాటే నెగ్గవలెననే ఆలోచనలు కూడా హాని చేసే మొక్కలన్నియు అవి మొత్తము తోటనంతటిని పాడుచేసి చెడు వాసన వచ్చేటట్లు చేయునని చెప్పెను.

మంచి మొక్కలు నాటే వారితో సహవాసము చేయుమనియు కలుపు మొక్కలను, చెత్తను (గాలి కబుర్ల మరియు ఇతరులు గూర్చి చెడుగా మాట్లాడుట) తోటలోనికి తీసుకు వచ్చే వారందరిని తప్పించుకొనుమని ఆయన నొక్కిచెప్పెను.

మా తోటలో కలుపు మొక్కలను తీసివేసి వాటి స్థానములో వెయ్యాల్సిన మంచి మొక్కలు ఒకరి నొకరు క్షమించుటకు సిద్ధపాటు కలిగియుండుట, ఒకరి భావములు ఒకరు లక్ష్యపెట్టుట, ఈ లోకమునకు సంబంధించిన వస్తువులన్నిటిని ఒకరితో ఒకరు పంచుకొనుట, వాదించుకొనకుండా అభిప్రాయములను ఒకరి నొకరు పంచుకొనుట, ప్రతి దినము బైబిలు చదివి ప్రార్థించుకొనుట, ఇతర క్రైస్తవులతో క్రమము తప్పకుండా సహవాసముచేయుట చివరకు పరిశుభ్రముగా నుండుట.

అటువంటి మొక్కలు మంచి బలముగా ఆరోగ్యముగా నుండే చెట్లవలె పెరగవలెనంటె వాటిని పోషించవలెను. మేము ఒకరినొకరు మాట్లాడుకొనే మాటలు ఈ మొక్కలు పెరుగుటకు అవసరమైన నీరు వంటివి. మా మాటలు కోపముతో నుండినట్లయితే అవి ఆ మొక్కలపై మరుగుతున్న వేడి నీరు పోయుట వంటిది. అది వాటిని నాశనము చేయును.

ఆయన, దేవుని యొక్క మాటలు కొలిమిలో ఏడుమార్లు పుటమి వేయబడిన వెండితో పోల్చబడిన విషయాన్ని ( కీర్తన 12:6 ) నుండి చదివిరి. మా మాటలు కూడా అలాగే పుటము వేయబడి దయతో నుండవలెనని చెప్పిరి.

మంచి చెట్లు పెరుగుటకు, చాలా సంవత్సరములు పట్టునని ఆయన చెప్పెను. కాని ఒకమారు అవి పండ్లుకాయుట ప్రారంభించినట్లయితే తినుటకు పనికివచ్చే వాటి పండ్ల్ల వలన ఎందరో దీవింపబడుదురు. అంతేకాక వాటి ఆకులు ఎందరికో స్వస్థతకు పనికి వచ్చును. దయగల మాట ఒకరి కోపమును చల్లార్చును (సామె 15:1)  అనే వచనాన్ని కూడా ఆయన తీసి చూపించిరి.

తమను తాము తీర్పు తీర్చుకొనుట అను మొక్క తప్పని సరిగా తోటలో ఉండవలసినదని పాస్టరు గారు చెప్పిరి. ఈ మొక్క బహిరంగ ప్రదేశములో కాక మనుష్యుల కంటికి కనబడని విధముగా నీడలోనే పెరుగును. అది చాలా సున్నితమైన మొక్క దానిని ప్రతి దినము జాగ్రత్తగా సంరక్షింపక పోయినట్లయితే అది ఎండి పోవును. ఈ మొక్క చూచుటకు ఆకర్షణీయముగా నుండదు. కాని దానికి ఎంతటి ఆహ్లాదకరమైన ఘాటైన సువాసన ఉండునంటే అది దాని సువాసనను తోట అంతా విరజిమ్మ గలదు.

మమ్ములను మేము తీర్పు తీర్చుకొననట్లయితే మా వ్యక్తి గత జీవితమనే ఉద్యానవనము మరియు వివాహ జీవితము బయటకు మనుష్యులకు అందముగా కనబడే, జీవము లేనటువంటి మానవులు తయారు చేసే ప్లాస్టిక్‌ పువ్వువలె ముగిసిపోవును. అనేకుల వైవాహిక జీవితమనే ఉద్యానవనములు నిజానికి ప్లాస్టిక్‌ పుష్పములతో నిండియుండి మనుష్యులను మోసము చేయును గాని దేవుని మోసము చేయలేకుండా ఉండును.

చాలా మంది ఇతరులను తీర్పు తీర్చుదురు కాని, కొందరే వారిని వారు తీర్పు తీర్చుకొందురు. అలాగున ఎవరైతే వారికి వారు తీర్పు తీర్చుకొనరో వారు మనుష్యులందరిని తీర్పు తీర్చుటకు ప్రభువు తిరిగి భూమిపైకి వచ్చినప్పుడు భయంకరమైన తీర్పును ఎదుర్కొందురు.

పాస్టరుగారు ఒకరి నొకరు క్షమించుకొనుటకు సిద్ధపడియుండుట మరియు క్షమాపణ అడుగుటకు సిద్ధపడి యుండుట ఒక మంచి ఉద్యానవనమునకు ముఖ్యమైన అవసరమైయున్నదని నొక్కి చెప్పిరి.

భార్య విషయములో లోబడుట అనేది చాలా సున్నితమైన మొక్క అయి ఉన్నది. మరియు అది ఎంతో విలువైనది. మనకందరకు బలమైన చిత్తము అనేది ఉండును. అయితే నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక అనిన యేసు ప్రభువు వలె మన స్వంత చిత్తమును వదులుకొనుటకు యిష్టము కలిగియుండవలెను. సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్యలు వారి భర్తలకు లోబడవలెననునది దేవుని చిత్తమైయున్నది.

విరిగిన హృదయము మరియ జటమాంసి అత్తరు బుడ్డిని విరుగగొట్టి యేసుప్రభువు పాదములపై పోసినప్పుడు ఆమె ఇంటి అంతటికీ వ్యాపించిన చక్కటి సువాసన వంటిది. దేవుడు విరిగిన హృదయము కలవారికి సమీపముగా నుండును (కీర్తన 34:18).

నా వివాహ సమయములో ప్రేమలో పడి గ్రుడ్డిగా తొందర పాటు నిర్ణయములు తీసుకొన్న వారు మరియు మరికొందరు ప్రాపంచిక లాభములు గొప్పదనము గూర్చి నిర్ణయములు తీసుకొని పెళ్లిల్లు చేసుకొన్న చాలా మంది నా స్నేహితుల గూర్చి ఆలోచించితిని.

అలాగే చాలా మంది విశ్వాసులైన నర్సులు వారి తల్లిదండ్రులను సంతోషపెట్టుటకో, లేకవారు అమెరికా లేక గల్ఫ్‌ దేశములకు వెళ్లి డబ్బు సంపాదించుటకో అవిశ్వాసులను పెండ్లి చేసికొనిన వారి గూర్చి ఆలోచించితిని.

దేవుడు అటువంటి స్థితిలో పడకుండా నన్ను కాపాడి నందుకు దేవునికి కృతజ్ఞత కలిగి యుంటిని. అట్లు నేను కాపాడబడుట నా నమ్మకత్వము వలన కాదు, కాని ప్రభువుయొక్క కనికరము వలనై యుండెను.

నేను ఆయన యిష్టమొచ్చినట్లు జీవించగలిగిన, నా ఒంటరి జీవితపు రోజులను నేను యిష్టపడినా, వివాహము చేసికొనుట గూర్చినేను సంతోషించితిని. ఇప్పుడు ప్రకాష్‌కు లోబడిన భార్యగా ప్రభువు కొరకు జీవితమును గడుపుట గూర్చి ఎదురు చూచుచుంటిని. నా వివాహ జీవితమును ఒక జయజీవితముగా జీవించి, నా వంటి ఇతర పాపుల జీవితములను దేవుడు ఏమి చేయగలుగునో చూపించవలెనని అనుకొనుచుంటిని.

నేను ప్రకాష్‌కు ఒక ఆటంకముగా కాక ఒక సహాయకురాలుగా ఉండాలని కోరుకొనుచుంటిని: మా జీవితము ప్రతి విషయములో ఒకే రాగము పలికే వేరు వేరు సంగీత వాయిద్యముల కలయిక వలె ఉండాలని కోరుకొనుచుంటిని.

నేను ముందుకు వెళ్లుచుండగా, నన్ను నేను తగ్గించుకొన్నట్లయితే, ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు సహాయము చేయునని నాకు తెలియును. ప్రకాష్‌ తల్లిదండ్రులను ప్రేమించి వారి యెడల మంచిగా నుండవలెనని అలాగే అతనికి యిష్టమైన వారందరి విషయంలో కూడా అలాగే ఉండవలెని అనుకొంటిని.

నా విత్తనములను సమాధానముతో విత్తినట్లయితే, తగిన సమయమందు సమృద్ధిగా సమాధానము, నీతి అనే పంటను కోయుదునని నాకు తెలియును (యకోబు 3:18).

నా జీవితములో దేవుడు నాకు యిచ్చిన విస్తారమైన బహుమతుల గూర్చి నేను ఆయనను స్తుతిస్తున్నాను. చాలా సంవత్సరముల క్రితం ఆయన, ఆయనే నా అవసరములన్ని తీర్చును కావున నా జీవితము నీరు పెట్టిన తోటవలెను మరియు ఎప్పుడూ ఆగిపోని నీటి ఊటవలెను ఉండునని ( యెషయా 58:11 ). ద్వారా నాకు వాగ్దానము చేసెను.

ఇప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుట ప్రారంభించుటను చూస్తున్నాను.

అధ్యాయము 14
కలసి వారసులుగా ఉండుట

నాకు స్వంత గృహముండవలెనని నేను ఎంతగానో ఆశ కలిగి యుండినను, అది నాకిచ్చుటకు నేను ఇంకా తగినదానిగా దేవుడు ఇప్పటి వరకు చూడలేదు. అవసరతను బట్టి మేము ప్రకాష్‌ తల్లిదండ్రులతో కలసి జీవించవలసి వచ్చినది. కాని నేను, ప్రకాష్‌ అప్పటికి జీవమనే కృపావరమును కలసి పంచుకొనే వారసులుగా నుంటిమి గనుక మేము రాజరికపు దంపతులము!! అన్నిటి కంటె ఎక్కువగా మేము దేవునిలో ఆనందించుచుంటిమి.

ప్రకాష్‌ తల్లిదండ్రులను గౌరవించి వారిని నా స్వంత తల్లిదండ్రుల వలె స్వీకరించుటను నేను నేర్చుకొంటిని. వారు కూడా నన్ను బాగానే చూచుకొనేవారు. నా మట్టుకు నేను వారికిష్టమైన పద్ధతులలో పనులు చేయుటను నేర్చుకొంటిని. నేను వినయముగా, నేర్చుకొనే విధముగా నుండినట్లయితే వారి యొద్ద నుండి ఇంకా చాలా నేర్చుకొనవచ్చునని నేననుకొంటిని. వారిని ఎప్పుడూ నా తల్లి దండ్రులతో పోల్చకుండా వారు ఎలా ఉంటే అలాగే అంగీకరించమని దేవుడు నాకు తెలియజేసెను. అప్పుడు వారు కూడా నన్ను వారి స్వంత బిడ్డ వలె స్వీకరించుదురు.

నేను నా క్రొత్త యింటిలోనికి వెళ్లగానే కొన్ని నిర్ణయములు తీసుకొంటిని.

      ప్రకాశ్‌ వారి కొడుకు కాబట్టి అతని తల్లిదండ్రులు అతనితో ఏ సమయములోనైనా సమయాన్ని గడపాలనుకొంటే దాని గూర్చి నేను ఏమనుకోను. అతనికి అతని తల్లిదండ్రులకు మధ్య దూరము కలుగజేసే ఏమాట కాని ఏ పని కాని నేను ఎప్పుడూ చేయను.

      ప్రకాశ్‌కును ఆయన తల్లిదండ్రులకు మధ్య ఒకరినొకరు కలుగజేసికోనటువంటి వేర్పాటు గీత ఎప్పుడు గీయవలెనో (బైబిలు ఆదికాండము 2:24 లో చెప్పబడినట్లు) అనేది ప్రకాశ్‌కే విడిచి పెట్టుదును.

      అతని యొక్క వ్యవహారములో నేను అన్నీ నాకే కావాలన్నట్లు కలుగజేసికొనను.

    ఒక రోజు మాకు దగ్గర్లో నుండిన మురికి వాడలో ఒక చిన్న అమ్మాయిని ఆమె తల్లిదండ్రుల పేదరికము వలన అమ్మివేస్తున్నారని తెలిసినది. ఉత్తర భారతదేశములో మేమున్న ప్రదేశములో చాలా మంది తల్లిదండ్రులు చాలా పేదవారగుట చేత అలా చెయ్యడము మామూలేనని తెలిసినది. మేము వెంటనే వారి దగ్గరకు వెళ్లి వాళ్లమ్మాయిని మా దగ్గర మాతో ఉంచమని, అలా చేస్తే ఆమెను అమ్మనక్కర్లేదని చెప్పాము. మేము దగ్గరలోనే ఉంటిమి కాబట్టి ప్రతివారము ఆమె వెళ్లి తన తల్లిదండ్రులను చూడవచ్చు కూడా. వారు దానికి సంతోషముతో ఒప్పుకొనిరి. ఇప్పుడు నాకు మాట్లాడుటకు మరియు దేవుని మార్గముల గూర్చి చెప్పుటకు ఒకరుండిరి. ఆమెను దగ్గరగా ఉన్న ఒక బడికి పంపుటకు కూడా ఏర్పాటుచేసాము. ఈ భూమిపై దౌర్భాగ్య స్థితి అనుభవించవలసిన ఒకరికి దయ చూపించ గలిగే అవకాశము నాకు దొరికినది. ఆ విధముగా నా చిన్నతనములో నా యెడల ఇతరులు చూపిన దయను బదులు తీర్చుకొన గలుగుచుంటిని.

    యేసు ప్రభువు ఈ లోకములోనికి మానవులందరకు సేవకుడిగా అగుటకు వచ్చియుండెను. నేను కూడా, నా జీవిత మార్గములో తటస్థ పడిన వారికి అందరికీ, ముఖ్యముగా బీదలకు అక్కరలో నున్న వారికి నా ప్రభువు వలె సేవకురాలిగా కావలెనని కోరుకొంటిని.

    నేను ప్రకాశ్‌కు ఒక మంచి స్నేహితురాలిగా నుండుటకు ప్రయత్నించితిని. అందుకు నా పని సమయాలను తనకు తగినట్లు మార్చుకొంటిని. కొన్ని విషయాలలో మా అభిప్రాయములు వేరైనా, రోజులు గడుస్తున్న కొలది, ఇంద్ర ధనస్సులో రంగులవలె అవి ఒకటిగా ఇంకా ఇంకా ఎక్కువగా కలసిపోవుచుండెను. ఇది మా జీవితాన్ని అర్థవంతముగా మరియు సమృద్ధిగా చేసెను.

    నాకు ఇంటి పనులైన వంట, బట్టలుతుకుట, ఇంటిని శుభ్రము చేయుట వంటివి తరచు విసుగు పుట్టించేవి. కాని నేను సహోదరుడు లారెన్సుగారి ఒక పుస్తకములో చెప్పినట్లు, అతడు దేవుని సన్నిధిని మోకాళ్ళూని ప్రభువు బల్ల దగ్గర ఉండి, రొట్టె, ద్రాక్షారసము తీసుకొన్నప్పుడు అనుభవిస్తున్నట్లే వంట గదిలో గిన్నెలు కడుగుతున్నప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నానని చెప్పిన మాటనుగుర్తు తెచ్చుకొంటిని. నా విషయములో అలాగు ఉండవలెనని కోరుకొంటిని. దేవునికి స్తుతులు పాడుట ప్రతి భారమును తేలిక చేయును.

    నాలో నుండిన ముభావమును, పంతానికి పోవుట, ప్రకాశ్‌ను దేని గూర్చియైనా అదే పనిగా అడుగుట ఇంకా అటువంటి క్రీస్తు స్వభావము కాని అనేక చెడు అలవాట్లను జయించుటకు కావాల్సిన దేవుని కృప కొరకు వెదకవలసిన అవసరముండినట్లు నేను తెలుసుకొంటిని. నేను, తన భర్తకు కిరీటము వలె నుండి అన్ని సమయములలో అతడు ఆమెపై నమ్మకముంచే భార్యగా (సామెతలు 12:4; 31:11) నుండవలెనని కోరుకొంటిని.

    ''అది నా పొరపాటు, దానికి బాధపడుతున్నాను''. ''దయచేసి క్షమించండి'' అనే మాటలు మా మధ్య ఉద్రిక్తత మరియు విస్పోటన కలుగజేయు అనేక పరిస్థితులలో మరల మరల స్వస్థతను తీసుకొనివచ్చాయి.

    ఆనందకరమైన వివాహమునకు ఒక పెద్ద రహస్యాన్ని నేను తెలుసుకొంటిని. అది ఒకరినొకరు మెచ్చుకొనుట మరియు ఒకరికొకరు కృతజ్ఞత కలిగి యుండుటై యున్నది. అప్పుడు దేనికైనా విచారించవలసిన పరిస్థితి కాని అపార్థములు వచ్చే పరిస్థితి కాని యుండదు.

    ప్రభువును తనకు చాలా దగ్గర స్నేహితునిగా మార్గదర్శిగా ఎరిగిన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. అటువంటి అమ్మాయి వివాహము చేసికొనినా లేక ఒంటరిగా నుండినా తన జీవితములో దేనికీ కొదువ ఉండదు.

    సంతృప్తితో కూడిన భక్తి లాభసాధకమైనది. దాని అర్థము మన జీవితములో దేవుడు ఏర్పాటు చేసిన ఎటువంటి పరిస్థితికైనా సంతృప్తి పడుటైయున్నది.

    నా విషయములో నేను ఎంతగానో ఆశించిన నా స్వంత యిల్లు ఎప్పటికిని నాకు లేక నా జీవితమంతా నా భర్త తల్లిదండ్రులతో జీవించవలసి యుండవచ్చును. దానితో నేను సంతృప్తి కలిగియుందును.

    నా కుటుంబముకు సహాయము చేయుటకు నేను నర్సుగా పనిచేయుట కొనసాగించవలసి యుండవచ్చును. దానితో నేను సంతృప్తి కలిగియుందును.

    లేక దేవుడు నాకు ఒక బిడ్డను ఇచ్చినప్పుడు నేను పూర్తి కాల తల్లినై (ఫుల్‌ టైం మదర్‌) బహుశా ఒక రోజున నేనుపని చెయ్యుట మానివేయ వచ్చును. దానితో నేను సంతృప్తి కలిగియుందును.

    ఇప్పుడు దేవుడే నా కొరకు అన్ని విషయములు ఏర్పాటు చేయుచుండెను. కాబట్టి ఆయన నా మార్గములోనికి పంపుటకు ఎంపిక చేసిన దేనికైనా నేను సిద్ధపడియున్నాను.

    నేను సామెతలు 31వ అధ్యాయములో చెప్పబడిన గుణవతియైన స్త్రీవలె ఉండవలెనని కోరుకొంటిని. ఆమె నాలుకపై దయగల ఉపదేశముండును. ఆమె భవిష్యత్తును దేవునిపై నమ్మకముంచి ఎదుర్కొనును. అది నేను బైబిలులో ఎక్కువగా ధ్యానించే ఒక అధ్యాయము.

    నాకు పెండ్లి అయిన తరువాత దేవుడు నాకు ఎక్కువగా జ్ఞాపకము చేసే వచనము( కీర్తన 45:10). అందులో ''నాకు వివాహమైనది కాబట్టి నా తండ్రి యింటిని మరువవలెనని'' చెప్పబడినది. రిబక్కా ఇస్సాకును వివాహము చేసికొనిన తరువాత ఆమె స్వంత జనులతో అతుక్కొని యుండలేదు. నేను యేసు ప్రభువును నా జీవితానికి ప్రభువుగా ఎన్నుకొని నాగలిపై చెయ్యివేసిన తరువాత ఎలాగైతే వెనక్కు తిరిగి చూడలేదో అట్లే, ఈ లోకములో నా భర్తను నాకు శిరస్సుగా ఎంచుకొన్న తరువాత దాని నుండి తిరిగి వెనుకకు చూడదల్చుకొనలేదు. లోతు భార్య వెనుకకు తిరిగి చూచి తనను తాను నాశనపర్చుకొనెను. నేను అటువంటి పొరపాటు చెయ్యదల్చుకొనలేదు. నేను నా తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను దర్శించవచ్చును. కాని ఇప్పటి నుండి నేను నా భర్తను మాత్రమే హత్తుకొని యుందును.

    లైంగిక సంపర్కము గూర్చి నాకు చాలా తప్పుడు ఆలోచనలుండేవి. నేను ఒంటరిగా ఉండినప్పుడు ఎటువంటి లైంగిక విషయాలైన తప్పే అనుకొనేదానిని. అయితే ఇప్పుడు అవన్ని వివాహమునకు బయట మాత్రమే తప్పని ఒక వివాహితగా తెలుసుకొంటిని. లైంగిక సంబంధము కేవలము బిడ్డలు కలుగుటకు ఉద్దేశించినది మాత్రమే కాక, భార్యా భర్తలిరువురు కలసి వారికి వారు దూరముగా ఉండుటకు నిర్ణయించుకొనినప్పుడు తప్ప అది ఒకరి యెడల ఒకరు నెరవేర్చవలసిన బాధ్యతగా నేను వాక్యములో చూచితిని (1కొరి 7:3-5). మానవుడు పాపము చేయుటకు ముందే, భార్య ఒకరి యెడల ఒకరికుండే ప్రేమను తెలియజేసుకొనేటట్లు దేవుడు లైంగిక కార్యమును సృష్టించెనని చూచితిని (ఆది 1:28).

    ఇప్పుడు నాకు పెండ్లి అయినది కాబట్టి దేవునితో దగ్గరగా నడచునట్లు నేను ప్రభువుతో సన్నిహితమైన సంబంధమును కలిగియుండుటకు బైబిలు చదువుకొనుటకును, ప్రార్థించుటకును సమయాన్ని ఏర్పాటు చేసుకొనవలెను అలా చేసుకొనుటకు, ఖాళీ లేని నా దైనందిక కార్యక్రమములో సమయముండునట్లు నేను క్రమ శిక్షణ చేసికొనవలసిన అవసరమున్నది.

    రాత్రి సమయములో, నా పని అంతా అయిపోయిన తరువాత, నిద్ర పోకముందు, శాంతికరమైన జలముల యొద్దకు చేరి నా ఆత్మ యొక్క కాపరితో మాట్లాడుకొనుటకు అది మంచి సమయమని తెలుసుకొంటిని. ఆయన సన్నిధిలో, నా మనసులో భారమునంతా ఆయన యొద్ద చెప్పుకొనినప్పుడు నేను నిజమైన సంతోషమును పొందెదను. అక్కడ నేను పరలోకమునకు సంబంధించిన స్వచ్ఛమైన సంతోషముతో తిరిగి నింపబడుచుంటిని. అక్కడ ఏ పాపము కూడా నాపై అధికారము చేయలేకుండెను. అక్కడ నిత్య సుఖములను నేను పొందితిని.

    ఇప్పుడు అనేక సంవత్సరాలుగా నాలో నేను పాడుకొనే పాటయొక్క నిజాన్ని అనుభవించుచుంటిని, అది:

    ''దేవుని హృదయానికి దగ్గర్లో

    ఎంతో విశ్రాంతి నిచ్చే ఒక స్థలమున్నది

    దేవుని హృదయానికి దగ్గర్లో

    పాపము తొందర చేయలేని ఒక స్థలమున్నది''

    ఒక విధముగా చెప్పవలెనంటె నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటున్నాను. నా హృదయము తరచుగా ఉప్పొంగి, నా కొరకు అద్భుత కార్యములు చేసిన ఆ ప్రభువును స్తుతిస్తూ ఉంటుంది

అధ్యాయము 15
క్రీస్తు యొక్క శరీరము

మేము వెళ్ళే స్థానిక సంఘము మా ''గుండె చప్పుడు'' లాంటిది. దేవుని యొక్క ఆ కుటుంబమును మేము మా యొక్క నిజమైన కుటుంబముగా చూచితిమి.

ఈ ముఖ్యమైన విషయములో ప్రకాశ్‌కు కూడా నాకున్న అభిప్రాయము కలిగి యుండుటను బట్టి నేను దేవునికి వందనములు చెల్లించితిని. యేసు ప్రభువు నన్ను నా భూసంబంధమైన కుటుంబము నుండి వేరు పరచి ఆయన యొక్క కుటుంబములోనికి తీసుకు వచ్చినట్లు నేను చూడగలిగితిని.

మేము ఒక 60 మంది విశ్వాసులున్న చిన్న సంఘము. కాని మేము ఒకరి నొకరము ప్రేమించేవారము, ఒకరి కొకరము సహాయపడ్తుండే వారము మరియు ఒకరిని ఒకరు పట్టించుకుంటూ ఉండేవారము. దేవుడు తన సంఘము ఇలాగే ఉండాలని ఆశించెనని నేను చూడగలిగితిని.

అటువంటి వాతావరణము ఆ సంఘములో నుండుటకు ఎక్కువగా ఆ సంఘకాపరి యొక్క ప్రయాసయే కారణము. ఆయన స్వార్థమేమీ లేనివాడు, దేవుని సేవించుటకు దేవుని యొద్ద నుండి, తేటగా పిలుపు పొందిన వ్యక్తి. నా జీవితములో ఎన్నో మృతమైన సంఘములను చూచితిని. ఇప్పుడు దానికి కారణమును చూడగలిగితిని అది: ఒక సంఘము చివరకు దాని యొక్క నాయకుని వలె నుండును.

ప్రకాశ్‌, నేను క్రమము తప్పకుండా ఆదివారకూటము మరియు వారము మధ్యలో బైబిలు స్టడీ(ధ్యానము) కూటములకు వెళ్లు చుండేవారము. ఈ రెండు కూటములలో ఏదీ తప్పకుండా వెళ్ల గలుగునట్లు నాకు సాధ్యమైనంతవరకు నా తోటి నర్సులతో డ్యూటీ సమయములను మార్చుకొనేదానిని.

ఆదివారము ఉదయాలలో స్తుతించుట పాటలు పాడుట మా సంఘములో నిజముగా ఎంతో జీవముగా ఉండి ప్రతిసారి నా ఆత్మను లేవనెత్తచేసేది. బైబిలు స్టడీ కూటములలో నేను విన్నది పుస్తకములో వ్రాసుకొనేదానను. నా ఖాళీ సమయములో తిరిగి ఆ వాక్యములను ధ్యానించేదానిని మరియు నాకు ఉపయోగకరముగా నున్న వాటిని నర్సులతో పంచుకొనేదానిని. దేవుని వాక్యము చదువుటకు నాలో ఒక ఆకలి కలిగియుంటిని.

సంఘములో స్త్రీ పాత్ర గూర్చి వాక్యము ఏమి చెప్తుందో నేను ధ్యానించాను (1తిమోతి 2:9-15; 1కొరి 14:34-38). పురుషులు సంఘములో నాయకులుగా నుండవలెనని బైబిలు చెప్తున్నట్లు నేను తేటగా చూచితిని. దేవుని వాక్యములో నుండిన ప్రతి చిన్న విషయానికి కూడా లోబడవలెనని అనుకొంటిని. నా భర్తకు, సంఘములో పెద్దలుగా నుండిన సహోదరులకు లోబడుటకును వారి పరిచర్యల గూర్చి వారి గూర్చి ప్రార్థించుటయందు సంతోషించుచుంటిని.

ఒక స్త్రీగా సంఘములో నా పిలుపు గుర్తింపు పొందుటకాక తెరవెనుక నుండి ఒక సహాయకురాలుగా నుండుట అని చూచితిని. చిన్న పిల్లలకు ఆదివారపు బడి చెప్పుచుండెడిదానను. స్త్రీల కూటములలో మరియు నర్సుల కూటములలో దేవుని వాక్యమును పంచుకొనుచుండెడిదానను.

కూటములలో నా తలను కప్పుకొనుటకు ఉపయోగించే పెద్ద రుమాలు నాకు ఒక ఆచారము కంటె ఎక్కువైనది. అది నేను నా భర్తకు మరియు సంఘములో దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వమునకు దేవుడు నన్నుంచిన స్థానములో లోబడియుంటినని సూచనార్థముగా చెప్పుటైయున్నది (1కొరీంది¸ 11:3-16).

ఒక సహోదరిగా సంతోషముతో లోబడే స్థానమును తీసుకొన్నప్పుడు, నేను చేయు పరిచర్యలో దేవునికి నా యొక్క సేవ, సమృద్ధిగా ఫలించినది. చిన్న పిల్లలకు బోధించినప్పుడు మరియు సహోదరిలతో వాక్యమును పంచుకొనినప్పుడు దేవుడు అభిషేకము సమృద్ధిగా నుండినట్లు నాకు తెలిసేది.

లోబడుట, అనేది నా ఆత్మలో వైఖరి తప్ప కేవలము బయటకు కనిపించేది కాదని నేను తెలుసుకొంటిని. అది ఈ భూమిపై తన జీవితమంత తన పరలోకపు తండ్రికి లోబడిన యేసు ప్రభువు యొక్క ఆత్మ అని నేను చూచితిని. ఎప్పుడైతే ఆ ఆత్మ మన సమస్తములోనికి చొచ్చుకొని పోవునో అప్పుడు మనము ఇతరులకు దీవెనకరముగా నుండునట్లు దేవుడు మనలను దీవించును.

అదే విధముగా తిరుగుబాటు, సాతాను యొక్క ఆత్మగా చూచితిని. సంఘము ప్రతి విషయములోను క్రీస్తుకు లోబడినట్లుగా, నేను నా భర్తకు లోబడుట ద్వారా నా యింటిని కట్టుకొని, నేనొక జ్ఞానము గల భార్యగా ఉండగలను (ఎఫె 5:24; సామె 14:1).

నేనూ ప్రకాశ్‌ కూడా క్రమముగా దేవుని పని కొరకు కొంత సొమ్ము ఇవ్వవలెనని అనుకొంటిమి. ఈ విషయములో మేము ఏ ధర్మ శాస్త్రమునకు కట్టుబడి లేము మరియు ఆ విధముగా చెయ్యవలెనని బలవంత పెట్టబడలేదు. మేము సంతోషముగా ఇచ్చితిమి. కొంత సొమ్మును మా సంఘములో కానుకలుగా ఇచ్చితిమి. ప్రతి నెల కొంత సొమ్మును ఉత్తర భారతదేశమునకు సేవకొరకు స్త్రీ పురుషులను పంపే రెండు క్రైస్తవ మత ప్రాచుర్యము చేసే సంస్థలకు పంపుచుండేవారము. మేము క్రమముగా మాకు తెలిసిన సేవకులందరి కొరకు ప్రార్థిస్తూ ఉండేవారము.

మేము దేవునికి ఇచ్చినందున, మా ఇంటిలో ఎప్పుడూ దేనికీ లోటు ఉండేది కాదు. మాకు మిగిలినది మా ఇంటిలో ప్రతి అవసరము తీరుటకు సరిపడేటట్లుగా ఆయన చేసిరి. ఆ విధముగా ఆయన నమ్మకత్వమును మరల మరల ఋజువు చేసితిమి.

మా స్థానిక సంఘము మా జీవితములలో అంతర్భాగమయినది. సంఘము మేమొక ముఖ్యమైన భాగమైయున్న క్రీస్తు శరీరమై యున్నది. పరిశుద్ధులతో సహవాసము మా జీవితములను అనేక విధములుగా వృద్ది చేసెను.

మాకు సమస్యలేమయినా వచ్చినప్పుడు మేము దేవుని ప్రజలతో కలసి ప్రార్థించేవారము. జీవితాలలో సమస్యలు, యిబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయము కూడా చేసెడి వారము. క్రీస్తు శరీరములో సభ్యులు ఒకరి కొకరు ఎక్కువ దగ్గరగా ఐక్యమగునట్లు దేవుడు ఆయన బిడ్డలకు వారి జీవితములలో అనేక యిబ్బందులు వచ్చునట్లు అనుమతించునని నేను చూచితిని. సహవాసము చేయుటకు మంచి స్థానిక సంఘము లేని వారి గూర్చియు, స్థానిక సంఘములో నుండిన సహవాసమునకు విలువ ఇవ్వని వారి గూర్చియు నేను విచారించేదానను.

మా సంఘములో సహోదరుల మరియు సహోదరీల సహవాసములో మేము పరలోకము యొక్క అనుభవాన్ని కొంచెము రుచి చూచితిమని నేను ప్రకాశ్‌ నిజాయితీగా చెప్పగలము.

అధ్యాయము 16
వెనుకకు చూచుకొనుట

నా గత జీవితమును వెనుకకు తిరిగి చూచుకొనినట్లయితే, నా ప్రభువు నా రక్షకుడు నాకు చేసిన దానినంతటి కొరకు నేను కృతజ్ఞతతో నిండిపోవుచున్నాను.

ఒకప్పుడు భద్రత లేని అమ్మాయిగా నుండిన నన్ను, ఇప్పుడు దేవుని కుమార్తెగా చేసి ఈ లోకమునకు సంబంధించిన భద్రత మరియు పరలోకములో శాశ్వత భద్రతను పొందుకో గలిగినట్లు చేసెను.

ప్రకాశ్‌తోను ఆయన తల్లిదండ్రులతోనూ గత కొన్ని నెలలుగా జీవించుట నాకు చాలా నేర్పించినది. నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లు నా చిన్న నాటి రోజుల్లో ఎప్పుడూ సంతోషకరమైన గృహవాతావరణాన్ని అనుభవించలేదు. అయితే ఇప్పుడు ఆనందకరమైన గృహములో జీవించుట హాస్టల్లో జీవించుట కంటె ఎంత బాగుంటుందో ఇప్పుడు చూడగలను.

ఒక ఇంటిలో ఉన్నప్పుడు, ఇచ్చి పుచ్చుకొనుట నేర్చుకొనవలెను కలసి జీవిస్తున్నప్పుడు, ఇరువురికి ఎక్కువగా రాపిడి జరుగుతుంది మరియు ఆ విధముగా ఒకరిపై ఒకరు చిరాకు పడుట చాలా సుళువుగా జరిగిపోతుంది. క్షమించుట అలాగే క్షమాపణ అడుగుట మరల మరల చేయుట నేను నేర్చుకొనవలసియుండెను. నాకంటె పెద్దవారిని హిందీలో ఎలా గౌరవముగా పిలవాలో నేను నేర్చుకొనవలసి ఉండెను.

నాకు కలిగిన వాటినన్నిటిని ఇంటిలో నున్న వారందరితో ఎలాగు పంచుకొనవలెనో నేను నేర్చుకొనవలసియుండెను. అకస్మాత్తుగా ప్రకాశ్‌ ఊహించని అతిధిని ఇంటికి తీసుకువచ్చినప్పుడు, అతడికి పెట్టుటకుగాను నా భోజనమును ఎలా మానుకోవలెనో నేను నేర్చుకొనవలసియుండెను.

నేను వండిన వంటకాన్ని -ముఖ్యముగా ప్రత్యేక వంటకములు ఇంటిలోనున్న వారందరూ సమానముగా పొందునట్లు చేయవలెనని నేను నిర్ణయించుకొంటిని. నా మట్టుకు నేను ఎప్పుడూ ఎక్కువ వేసుకొనేదానను కాదు. కాని అది ప్రకాశ్‌కు యిష్టమైనదైతే ముందుగా రుచి చూపించటానికి ఆయనకు యిచ్చేదానిని. ఎందుకంటె ఆయనెప్పుడూ నా వంటను మెచ్చుకొనేవారు!!

రాత్రి మెలకువగా ఉండి కొన్నిసార్లు జబ్బుగా ఉన్న ప్రకాశ్‌ తల్లిదండ్రులతో ఒకరిని చూచుకొనుట నేర్చుకొనవలసివచ్చినది. నాకు వేరుగా నున్న వారితో ఎట్లు సరిపెట్టుకోవలెనో నేర్చుకొనవలసివచ్చినది.

ఇవన్నీ ఇలా ఉండినా, ఇంక ఎక్కడైనా జీవించుట కంటె ప్రకాశ్‌తో జీవించుటే నేను యిష్టడుతున్నాను (అది పూర్తిగా నా స్వంత ఇల్లు కాకపోయినా).

నేను ముఖ్యముగా నేర్చుకొన్నది ప్రతీదీ ప్రేమతో చేయుట అనునది. అప్పుడు నేను ఒకవేళ పొరపాట్లు చేసినా అవి దేవుని కన్నుల యెదుట అంత తీవ్రమైనవి కావు.

నేను ప్రకాశ్‌ను చూచి మురిసిపోయే స్థితికి వచ్చితిని. ఆయన కష్టపడి పనిచేసేవాడు. ఆయన ప్రభువును ప్రేమిస్తున్నాడు మరియు నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక మేము ఎంతో ఆనందముగా ఉన్నాము. మేము ప్రతిరోజు సాయంత్రము నడచుటకు వెళ్లి ఆరోజు అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకొనేవారము. ప్రతి రోజూ దాని కొరకు ఎదురు చూస్తూ ఉండుదును.

కొన్నిసార్లు అందరు దంపతుల వలె మాకూ వాదనలు వస్తుండేవి. కాని మేము వాటిని మా అదుపు తప్పిపోకుండా ఉండేలా ప్రయత్నించే వారము. దేవుడు నన్ను ప్రకాశ్‌కు ఒక సహాయకురాలుగా ఉండుటకు పిలిచెను కాని ప్రతి దానికి-అవును అనే స్త్రీగా ఉండుటకు పిలువలేదని నాకు తెలియును. అందువలన నా అభిప్రాయములను చాలా నిర్మొహమాటముగా ఆయనకు చెప్పుచుండెడిదానను. కాని నా అభిప్రాయము చెప్పి దానికి కారణము చెప్పిన తరువాత, దానిని అంగీకరించుటకు లేక విడిచి పెట్టుటకు నిర్ణయించుకొనుటకు ఆయనకే విడిచిపెట్టేదానను.

నేను ఆయన కంటె ఎంత వేరుగా నుంటినో చూడగలిగితిని. నన్ను ఎంతగానో యిబ్బంది పెట్టే చిన్న చిన్న విషయములు ఆయనను అసలేమీ యిబ్బంది పెట్టేవి కావు. బహుశా ఇది నేను స్త్రీని ఆయన పురుషుడైనందున కావచ్చును!!

మేము తరచూ ఒకరి నొకరము ఏడ్పించుకొని నవ్వుకొనేవారము. ఎప్పుడైతే మేము ఒకరి నొకరము బాధపర్చుకొనకుండా లేక అవమానించకుండా అట్లు చేయుదమో అప్పుడు మా సంబంధము ఆరోగ్యకరముగా నున్నదని మాకు తెలియును!! కలసియున్న మా జీవితము నిజానికి ఎంతో సరదాగా ఉండేది.

ఒక రోజున నేను కూర్చొని నా యొక్క స్వంత సమస్యలను వరుసగా వ్రాసుకొని, వాటితో ఎలా జీవించవలెనో సహాయము చేయుమని దేవునిని అడిగితిని.

నేను మాటిమాటికి ఒంటరిగాా ఇంటిపై బెంగతో ఉండేదానిని. ఇటువంటి ఒంటరి తనము, ఇంటిపై బెంగ సాధారణముగా నా రోజు వారి పనులలో ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఎక్కువగా ఉండేది. కాని నేను దేవునిని నా తండ్రిగా, తల్లిగా స్నేహితునిగా మరి ఎక్కువగా తెలుసుకొనిన తరువాత, నాలో కలిగే ఆలోచనలనన్నిటిని ఆయనకు చెప్పుకొని సహాయమడుగుట నేర్చుకొనిన తరువాత నేను ఒంటరితనపు భావన వచ్చినప్పుడు ఎలా జీవించవలెనో తెలుసుకొంటిని.

నేను ఎక్కువగా భయపడేదానను. నాకు చీకటి అంటే భయము. ప్రజలంటే భయము, భవిష్యత్తు ఎదుర్కొనాలంటే భయము ఇంకా చాలా భయాలుండేవి. నేను నర్సుగా పని చేస్తున్నప్పుడు, మరణకరమైన రోగములున్న రోగుల దగ్గర పనిచేస్తున్నప్పుడు, నేను చనిపోవుదునేమో అని భయపడేదాన్ని అప్పుడు ఒక రోజున పాత నిబంధన గ్రంధములో దేవుడు ప్రేమించిన వారితో ఎన్నిసార్లు భయపడవద్దు అని చెప్పెనో అదే విధముగా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు ఆయన ప్రేమించిన శిష్యులతో ఎన్నిమార్లు ఆ మాటను చెప్పితిరో చూచితిని. ఈ మాటలను ఒక ప్రేమ గల తండ్రి మరియు స్నేహితుని నుండి ఒక ఆజ్ఞగా మరియు ఆదరణ కలిగించే మాటగా చూచితిని. వాటిని మరల మరల జ్ఞాపకము తెచ్చుకొనుచు ఉండేదానను. నా భయాలను అవి వచ్చిన వెంటనే కాని, లేక కొంత సమయము వాటితో పెనుగులాడిన తరువాత గాని ప్రభువు నా నుండి తరిమి వేసేవారు.

నాకు ఏ కారణము లేకుండానే లేక చిన్న విషయానికి ఏడ్చే చెడ్డ అలవాటు ఉండేది. అయితే అది నా మీద నాకుండిన జాలిని బట్టి అలా ఏడ్చుచుండేదాననని ఇప్పుడు తెలుసుకొంటిని. నా ప్రతి భాష్ప బిందువును తుడిచి వేయుదునని నా దేవుడు నాకు వాగ్దానము చేసెను. నేను స్కూళ్లో చదువుకొనేటప్పుడు హాస్టల్లో నేర్చుకొనిన ఒకపాట గూర్చి ఎక్కువ ఆలోచించేదానను.

>

అది ఆయనకు (యేసుకు) ఆయన బాధల గూర్చిన కన్నీళ్లు లేవు కాని నాకొరకైన రక్తపు స్వేధ బిందువులు కలవు.

సంవత్సరాలు గడిచిన తరువాత ఏడ్చుట అనే అలవాటును మానుకొనుటకును మరియు ఇతరుల విచారము గూర్చి పట్టించుకొనుటకును ఆయన సహాయము చేసెను.

భద్రతా లేమి నా జీవితములో మరొక పెద్ద రాక్షసుడుగా నుండి అది అనేక విధములుగా బయటకు కనబడుచుండెను. అది నేను నా స్నేహితులను, నాకు ఉన్నవాటిని ఎవరైనా ఎత్తుకు పోతారేమో అనే భావనతో అంటిపెట్టుకొని ఉండేటట్లు చేసేది! ఇతరులచే ఎంతగానో ప్రేమింపబడవలెననే కోర్కె ఉండేది, నా అనుకొనేవారు ఎవరినైనా ప్రేమిస్తే నేను తట్టుకోలేక అలిగేదాన్ని. వారి స్నేహం నా ఒక్కరికే ఉండాలని కోరుకొనేదానిని. నేను హాస్టల్లో ఉండినప్పుడు కూడా నాలో ఇటువంటి వైఖరి ఉండేది. అది తప్పని నాకు తెలుసు, కాని దాని గూర్చి ఏమీ చెయ్యలేక పోయేదాన్ని.

నాకు పెండ్లి అయిన తరువాత ప్రకాశ్‌ యెడల అటువంటి వైఖరియే ఉండుట గమనించితిని. ఆయన బంధువులు ఆయనతో కలపుగోలుగా ఉండినా భరించలేకపో యేదానిని. దానికి ప్రకాశ్‌ ఇప్పుడు పూర్తిగా నావాడు కాబట్టి అలాగు అనుకొనుటలో తప్పేమీ లేదని సమర్థించుకొనేదానను. కాని నా వైఖరి సరియైనది కాదని నెమ్మదిగా తెలుసుకొంటిని. నా భర్త నన్ను పెండ్లి చేసుకొనినంత మాత్రాన ఆయన తల్లి తన కొడుకును ప్రేమించుట మానవలెనని నేనెలా అనుకొనగలను! ఇతరులు నాపై ప్రేమను చూపుటను బట్టి నేను సంతోషించుచుంటిని. ప్రకాశ్‌ తన యొక్క బంధువుల ప్రేమను బట్టి ఆనందించుటను ఇష్టపడక పోవుటలో నేనెంత స్వార్థముగా నుంటున్నాను. బహుశా ఇది స్త్రీలలో ఉండిన ఇంకొక లక్షణము కావచ్చును. దీనిని ఒక దేవుని బిడ్డగా నేను జయించవలసి యుండెను.

అదీ ఇదీ కొనాలనే గొప్ప పిచ్చి నాలో ఉన్నట్లు నేను చూచాను. ప్రకాశ్‌ నేను ఎక్కువ డబ్బు ఖర్చు చేయుట ఇష్టపడడని లేక నేను అవసరమనుకొనిన దానిని ఆయన అవసరముగా చూడడనినేను అనుకొనేదానను. అందువలన అప్పుడప్పుడు ఆయనను అడుగకుండానే కొన్ని వస్తువులను కొంటూ ఉండేదానను. కాని నాకు తెలివిలేనందువలన, అమాయకంగా ఉండుటవలన ఆ ఊరి వారి వలన చాలాసార్లు మోసపోతిని. ఏదైనా ఖరీదైన వస్తువుకొనవలెనని అనుకొన్నప్పుడు నేను ప్రకాశ్‌తో కలిసి వెళ్లినప్పుడు కొంటేనే మంచిదని అప్పుడు నేను గ్రహించితిని.

ఆయన నాకు క్రొత్తగా వచ్చిన ఫ్యాషన్లను బట్టి బట్టలు కొంటే బాగుండునని అప్పుడప్పుడు అనుకొనేదానిని. కాని, అటువంటి ఆశలు మనుష్యులను ఆకట్టుకోవాలనుకొనే కోరిక నుండి పుట్టినవని చూచితిని మరియు దాని గూర్చి పశ్చాత్తాపపడితిని. నేను నాలో ఉన్న లోకానుసారమైన స్వభావమునకు స్వస్థిచెప్పి లోకపు ఫ్యాషన్ల వెనుక పరిగెత్తుట మానవలసి యుండెను. నా కంటె బీద స్థితిలో ఉన్నవారితో నాకున్న వాటిని పంచుకొనుట నేను నేర్చుకొనవలసియుండెను. అప్పుడు దేవుడు నేను కోరుకొన్న వాటినన్నిటిని నాకు ఇవ్వకపోయినా నాకు అవసరమైన వాటినన్నిటిని నాకు ఇచ్చును.

కొన్నిసార్లు నా అత్తగారిపై కోపమును ఉంచుకొని ఆమెతో చాలా కాలము మాట్లాడకుండా ఉండిపోతూ ఉండేదానను. ఆమె నాకు సలహాలు ఇచ్చుట నాకు యిష్టము ఉండేది కాదు. అలాగే ఆమె ఎత్తిపొడుపు మాటలు కోపము తెప్పించేవి. నేను మాట్లాడకుండా ఉండుట ద్వారా నా పగను తీర్చుకొనేదానను. అయితే అలా మౌనముగా నుండుట కొన్నిసార్లు కోపముతో కేకలు వేసినదాని కంటె భయంకరమైనదని ఇప్పుడు గ్రహించితిని. ఈ పాపపు అలవాటును జయించుటకు సహాయము చేయుమని నేను దేవునిని అడిగితిని. నేను ప్రభువుతో నా దైనందిక నడకలో అజాగ్రత్తగా నుండినప్పుడు నేను పడిపోతుండినట్లు నేను చూచితిని. నేను నా పాపమును గూర్చి గ్రహించినపుడు, నేను ప్రభువును క్షమించమని అడిగి నా అత్తగారిని కూడా క్షమించమని అడిగేదానను.

నాలో ఉండిన భద్రతా లేమి మరియు స్వాధీనతా భావము నుండి ప్రకాశ్‌తో మాట్లాడిన ఇతర స్త్రీలపై అసూయ మొలకెత్తేది. ఆయనకు నేను తప్ప ఇంకెవ్వరిపై కూడా ఆసక్తి లేదనినాకు బాగా తెలియును. ఆయన కంటె ఎవ్వరూ నమ్మకముగా ఉండరు. అయినప్పటికిని నా స్వాధీనతా భావన నన్ను అసూయ పడునట్లు చేసినది. ప్రకాశ్‌ను ఆ విధముగా దోషారోపణ చేయుట లేక ఆయనపై అనుమానము కలిగియుండుట, ఆ విధముగా ఆయనను బాధ పెట్టుట తప్పని దేవుడు నాకు తెలియజేసెను.

బహుశా నా తండ్రి నా తల్లికి అపనమ్మకముగా ఉండిన విషయం నాకు తెలియుట వలన నేను అట్లు ప్రవర్తించానేమో లేక బహుశా, స్త్రీలందరు ఇలాగే ఉంటారేమో!

కాని నా పనిలో ఆసుపత్రిలో నేనెన్నిమార్లు అనేకమంది పురుషులతో మాట్లాడుదును అనే విషయం అప్పుడు నేను ఆలోచించితిని. దాంట్లో తప్పేమి ఉంది? అప్పుడు నా వైఖరి మారవలెనని గ్రహించితిని. ప్రకాశ్‌ నాతో ఎంత ఓర్పు కలిగియుంటిరి!

నా చిన్నప్పుడు మేము సలహా కొరకు దర్శించిన ఒకావిడ మా అమ్మకు ఇచ్చిన సలహాను నేను జ్ఞాపకము చేసికొంటిని. ఒకవేళ ఆమె భర్త ఆమె యెడల అపనమ్మకముగా నుండినా సరే, ఆమె అతడిని క్షమించి, అతని యెడల ఎతో ప్రేమ చూపవలెనని, అది ఇనుప రజను అయిస్కాంతము వైపు ఆకర్షింపబడునట్లు ఆమె వైపు ఆకర్షింప బడునంతటి ప్రేమ చూపవలెనని ఆమె చెప్పినది. ఆ విధముగా ఒక జ్ఞానము గల భార్య తన భర్త అనేక ఊహించని ఆపదల నుండి కాపాడుకొనును.

ఒక రోజున కేన్సరు రోగముతో మరణించే ఒక వ్యక్తి మా హాస్పిటల్‌లో చేరాడు. నేను విన్నదేమంటే, అతడు తన కుటుంబమునకు దూరముగా వేరొక పట్టణములో పనిచేస్తూ ఉండగా, అతడు ఒకామెతో పాపములో పడి ఆమె ద్వారా ఒక బిడ్డను కనెను. అతడి భార్య, ఒక నిజమైన విశ్వాసురాలు. అతడిని మా హాస్పిటల్‌కు తీసుకువచ్చి అతడు చనిపోయే వరకు చూచుకొనెను. ఆమె తన భర్తతో పాపము చేసినామెతో స్నేహము చేసికొనెనని కూడా తెలుసుకొంటిని. ఆమె ఆ స్త్రీకి పుట్టిన బిడ్డను దత్తత తీసుకొని స్వంత బిడ్డ వలె పెంచినట్లు వింటిని ఆ బిడ్డ తన భర్తకు పుట్టిన వాడు కాబట్టి ఆ బిడ్డను ఆమె ప్రేమిస్తున్నట్లు ఆమె ఇతరులతో చెప్పేది! ఒక మానవ మాత్రుడు అట్లు ప్రేమించి క్షమించగలిగేటట్టు చేసే అద్భుతము కేవలము క్రీస్తు మాత్రమే చేయగలడు. అటువంటి ఉదాహరణలు నేను కూడా నా భర్తకు ఒక ప్రేమించే భార్యగా ఉండునట్లు సవాలు చేసేవి.

వివాహములో చివరి వరకు ప్రేమలో సహిస్తూ నిలచి యుండుట గొప్ప అవసరముగా తెలుసుకొంటిని. ప్రేమ ఒక భర్త యొక్క లోటులను అతడి ఓటములను కప్పిపెట్టి అతడి పొరపాటులను పట్టించుకొనకుండా ఉండి అతడి గత పాపములను మనసులోనికి తెచ్చుకొనదు. ప్రేమ గూర్చిన అధ్యాయము (1కొరింది¸ 13) నేను చదివినప్పుడెల్ల, నేను దేవుని ప్రమాణములకు ఎంతో ఘోరముగా తక్కువైయుంటిననియు మరియు ఈ మార్గములో నేను ఎంతో దూరముగా వెళ్లవలసి యున్నదని గ్రహించితిని.

ఈ లోకపు చీకటిలో ఎప్పుడూ ప్రకాశించే వెలుగు దేవుని యొక్క మారని ప్రేమ ఒక్కటియే. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించెను. ఆ విధముగా, నా మార్గములో తారసపడే వారికి ఆయన ప్రేమను పంచుకొనుటకు, నా చుట్టూ ఉన్న వారికి నేను బాకీ పడి యుండినట్లు చేసిరి.

ప్రేమ, క్రైస్తవ జీవితములో అతి గొప్ప విషయముగా నేను చూచితిని. కాని మానవపరమైన నా ప్రేమ నమ్మదగనిది. నా హృదయము దేవుని ప్రేమతో నింపబడియుండునట్లు, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మాతో నింపబడి యుండే అవసరతను నేను చూచితిని.

తన ఏకైక కుమారుని వెనుక తీయక నా కొరకు ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు అన్నిటిని నాకు ఉచితముగా- నా జీవితాంతము ఇచ్చునని నాకు తెలియును.

ఎటువంటి అద్భుతమైన రక్షణను నేను పొందితిని.

నేను నా ప్రారంభ దినాలనుండి వెలివేయబడిన దానను, కాని ఇప్పుడు లోకమంతటిలో నాకంటె సంతోషముగా నున్న వారెవరైనా ఉన్నారా అనుకొనేటంతటి కృపను ప్రభువు యొద్ద నుండి నేను పొందితిని.

మీలో కొందరు, నేను నా స్వంత యిల్లు అని చెప్పేది లేకుండా, భర్త తల్లిదండ్రులతో నివసిస్తూ, నేను ఏ విధముగా అటువంటి సంతోషము కలిగియుంటినా అని అనుకొనవచ్చును. దానికి కారణము నేను నా సంతోషమును నా యొక్క పరిస్థితులలో కాక ప్రభువు నందు పొందితిని.

 సంతుష్టితో కూడిన దైవ భక్తి లాభసాధకమైయున్నది.

ఎప్పుడూ సంతోషముగా నుండనట్లుండే చాలా మంది క్రైస్తవులను నేను కలుసుకొంటిని మరియు దానికి కారణము నాకు ఇప్పుడు తెలియును. వారికి సంతృప్తి పొందునటువంటి లోక సంబంధమైన కోర్కెలు కలిగియున్నారు. వారు ఫలానాది కాని లేక ఇంకొకటి కాని లేకపోయినట్లయితే బ్రతకలేము అన్నట్లుందురు. ఆ విధముగా వారు విశ్రాంతి లేకుండా యుందురు.

నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన రోజున నేను ప్రభువుతో చెప్పినది నాకు బాగా జ్ఞాపకమున్నది. అది: యేసు ప్రభువా ఇప్పటి నుండి, ఈ భూమిపై నీవు తప్ప నాకు ఇంకేమీ వద్దు  (కీర్త 73:25)  అని చెప్పితిని. నా మాటను నేను నిలువబెట్టు కొంటినో లేదో పరీక్షించుకొనుటకు నేను తరచూ నా హృదయములోనికి చూచుకొందును. ఎప్పుడైతే నేను వెనుకకు జారిపోయినట్లు తెలుసుకొందునో, అప్పుడు నేను పశ్చాత్తాపపడి నా వాగ్దానాన్ని తిరిగి స్థిరపర్చుదును. అది నా హృదయ మంతటితో నా ప్రభువును ప్రేమించుట. ఇప్పటి వరకు ప్రభువు నన్ను సంరక్షించెను. నా జీవితాంతము ఆయన యెడల ఇటువంటి అంకిత భావముతో ఆయన నన్ను సంరక్షించునని నేను నమ్ముచున్నాను. నా అనుభవము నా పేరుకు తగినట్టిదే. నేను కృప వెంబడి కృపను పొందితిని.

ప్రభువైన యేసు క్రీస్తుకు సమస్తమైన ఘనత మహిమ చెల్లించవలెనని కోరుకొనుచున్నాను.

                                                            

    యేసూ నా ప్రభువా, నేను సంపూర్ణ అర్పణతో నిన్ను మ్రొక్కుదును
   ఎందుకంటే నీవు నన్ను కల్వరిపై కొంటివి
   ఇప్పుడు నేను నీ దానను, ఎప్పటికీ నీ దాననే
  మరియు నీవు ఎప్పటికినీ నా స్వాస్థ్య భాగానివే.