1975వ సంవత్సరము, ఆగష్టులో క్రైస్తవ సహవాస సంఘము(సి.ఎఫ్.సి)ను బెంగుళూరులో ప్రభువు ఆరంభించియున్నారు. కొద్దిమంది విశ్వాసులతో అప్పుడు ఆరంభించాము. మొదటి కూటములో మేము కలసినప్పుడు దేవుడు మమ్ములను ఎందుకు సమకూర్చాడో స్పష్టముగా తెలియదు. నెమ్మదిగా దేవుడు తన ప్రణాళికను మాకు బయలుపరచారు.
అది ఏమనగా "క్రొత్త తిత్తిలో ఉన్న (అనగా క్రొత్త నిబంధన ప్రకారము, క్రీస్తు శరీరము స్థానిక సంఘముగా వ్యక్తపరచుటకు) క్రొత్త ద్రాక్షరసము (అనగా క్రీస్తు జీవమును మరియు దేవుని స్వభావమును కలిగి)"గా వ్యక్తపరచుటయును మరియు ప్రకటించుటయును అయి ఉన్నది. ఇప్పుడు మా దర్శనమేమిటో స్పష్టమైనది.
మన యొక్క ముఖ్యమైన పిలుపు
ఇశ్రాయేలీయులకు ప్రకటించవలసిన దానిని, దేవుడు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకు స్పష్టమైన దర్శనమిచ్చియున్నారు - వారు ఆ వర్తమానమునే ప్రకటించారు. దానిని వారు "ప్రభువు యొక్క భారమని" పిలిచారు. దేవుడు వారికి అప్పగించిన పనిని వారు ఎరుగుదురు మరియు దేవుడు వారి హృదయములలో పెట్టిన భారము మీదనే వారి గురి ఉండేది. వారు ఎప్పుడైనను దాని నుండి తొలగిపోయేవారు కాదు.
ఇండియాలో సంఘముగా కట్టబడుటకు ప్రవచనాత్మకముగా దేవుడు మనకు స్పష్టమైన దర్శనమిచ్చారు. దానినుండి తప్పిపోకుండా గత కొన్ని దశాబ్దాలుగా మనము సంపూర్ణముగా ప్రయత్నించియున్నాము.
అవిశ్వాసులను క్రీస్తు నొద్దకు తెచ్చుటకు మరియు బైబిలులోని అనేక సత్యములను ప్రకటించుటకును గత రెండు శతాబ్దములనుండి అనేకమంది సువార్తికులు మన దేశానికి వచ్చారు. వారందరిని బట్టి ప్రభువును స్తుతించుచున్నాము. కాని మరి కొన్ని క్రొత్త నిబంధన సత్యములు తగినంతగా ఇండియాలో ప్రకటించబడలేదని మేము భావించాము.
ఆ క్రొత్త నిబంధన సత్యములు ఇవి:- దేవునిని తండ్రిగా యెరిగియుండుటలో ఉన్న సంపూర్ణ భద్రత, శిష్యులుగా ఉండుటకు కావలసిన షరతులు, ఆయన అడుగుజాడలలో ప్రభువైన యేసు నడిచినట్లు నడచుట, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవజలనదులు మన(కడుపు)లో నుండి ప్రవహించుట, దేవుని స్వభావములో అంతకంతకు పాలివారమగుట, సిలువ మార్గము, తెలిసిన పాపము మీద జయము పొందుట, లోభత్వము (లోకము) నుండి విడుదల పొందుట మరియు ధనాపేక్షనుండి, నిరాశనుండి, భయము మరియు చింతించుట నుండి విడుదల పొందుట మరియు కొండ మీద ప్రసంగము (మత్తయి 5,6మరియు 7అధ్యాయములకు) సంపూర్ణముగా విధేయత చూపుట, దేవుడు ప్రభువైన యేసునకు చేసినదంతయు మనకును చేస్తాడని నమ్ముట (విశ్వసించుట) మరియు క్రీస్తు శరీరముగా స్థానిక సంఘముగా కట్టుట మొదలగునవి.
ఇండియాలోని అనేక సంఘములకు ఈ భారము వ్యాపించింది. బహిరంగ సభల ద్వారా, కూటముల ద్వారా, రేడియో, పుస్తకములు మరియు టేపులు, సి.డి.లు మరియు డి.వి.డిల ద్వారా దేవుడు అట్టి అవకాశమిచ్చియున్నారు.
కాని అనేక సంఘనాయకులు మన వర్తమానాన్ని వ్యతిరేకించారు మరియు వారు మనలను తిరస్కరించారు.
అప్పుడు దేవుడు ఒక అద్భుతము చేశారు. ఆయన మనకు ఇంటర్‍నెట్ అనే ద్వారము తెరిచారు. దేవుడు మన సంఘమునకు నడిపించిన సమర్పణ కలిగిన సహోదరుల ద్వారా వందల ప్రసంగములు ఆ నెట్‍లో పెట్టారు. అప్పుడు ఇండియా నుండి మాత్రమే కాక ప్రపంచములోని అనేక స్థలములలో ఉన్న అనేక సంఘములలోని విశ్వాసులనుండి మంచి స్పందన వచ్చింది. వారు ఆ ప్రసంగములు వినుట ద్వారా వారి వ్యక్తిగత మరియు కుటుంబ జీవితము రూపాంతరము పొంది, స్వస్థత పొందియున్నారు. మన సి.ఎఫ్.సి సంఘముతో సన్నిహిత సంబంధము కలిగియుండాలని క్రొత్త సంఘములు పుట్టినవి.
ఆ విధముగా కొందరు సంఘనాయకులు దురుద్దేశముతో మనకు తలుపులు మూసినను అనేక సంఘములలోని అనేక ఆకలిగొనిన విశ్వాసులకు ఈ సత్యములు చేరినవి. ఈనాడు ప్రపంచములో అనేక మంది విశ్వాసులు ఈ సత్యముల చేత పట్టబడి, కొందరైతే వీటిని ఇతరులకు బోధిస్తున్నారు. దీనికొరకే మేము ప్రార్ధించియున్నాము మరియు కోరియున్నాము. గనుక దేవునికి స్తోత్రము. ఈ విధముగా సి.ఎఫ్.సి యెడల దేవునికి ఉన్న కొంచెము ఉద్దేశ్యమును మేము చూచియున్నాము. దేవుని మార్గములు ఎంతో అద్భుతమైనవి. మనము మన ఘనతను కోరక దేవుని మహిమనే కోరినయెడల ఆయన అద్భుతకార్యములు చేయును.
"ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువ బెట్టవలెనని" పౌలు గురికలిగి, దాని కొరకే పౌలు ప్రయాసపడియున్నాడు (కొలస్సీ 1:28,29). మన గురికూడా అదే. మన సంఘములలో ఉన్న ప్రతి ఒక్కరు- తమ భార్యలకంటే, తమకంటే మరియు భూమి మీద తమకున్న ఆస్తులకంటే ఎక్కువగా ప్రభువైన యేసునే ప్రేమించే నిజమైన శిష్యులు కావాలని మనము ప్రయాసపడుచున్నాము (లూకా 14:26,27,31). తరువాత ప్రభువైన యేసు ఆజ్ఞలన్నిటికీ లోబడాలని బోధిస్తున్నాము (మత్తయి 28:20).
ఇది ఇరుకు మార్గమనియు కొందరే దీనిని కనుగొందురనియు మనకు తెలియును. ప్రభువైన యేసు యొక్క చిన్న సంఘమైన 12మంది శిష్యులలో కూడా ఒక వేషధారి ఉన్నాడని మనకు తెలియును. ప్రభువు వచ్చు వరకు మన సంఘములలో కూడా అటువంటి వేషధారులు ఉంటారని మనము నమ్ముచున్నాము. అటువంటి వేషధారులకు సంఘములో సౌఖ్యము లేకుండునట్లును, వారు ఒప్పించబడి మారుమనస్సు పొందునట్లును ఎల్లప్పుడు దేవుని వాక్యమును బోధించెదము.
సువార్తీకరణ మరియు శిష్యులుగా మారుట
వ్యక్తిగతముగా సువార్త ప్రకటించుమని మన సి.ఎఫ్.సి విశ్వాసులందరినీ ప్రోత్సహించియున్నాము. ఆ విధముగా అనేకులు క్రీస్తు యొద్దకు నడిపింపబడి, గత సంవత్సరములలో సంఘములో చేర్చబడియున్నారు. ఆ విధముగా ఇండియాలోని పట్టణములలోను, గ్రామములలోను మరియు ప్రపంచములోను క్రొత్త సంఘములు వచ్చినవి.
సి.ఎఫ్.సి.లో మనకు ప్రత్యేకమైన పిలుపు ఉన్నది కాబట్టి సమాజ సేవ చేయటంలాంటి వేరే పరిచర్యలు మనము కలిగిలేము ఎందుకంటే అవి మన ప్రాథమిక పిలుపు నుండి దారి మరలించును. "నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా ఉంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని"(పరమగీతము 1:6) అని అంత్యదినమందున వినుట మాకు ఇష్టము లేదు. దేవుడు తన పిల్లలను వేరు వేరు పరిచర్యలకు పిలుస్తాడు కాబట్టి వాటిని గుర్తించి వారి పరిచర్యలను వారిని చేయనిచ్చెదము. అనేక పరిచర్యలు కలిగి, వేరే విశ్వాసుల యెదుట "సమతుల్యత" కలిగియున్నట్టు కనబడాలని లేదు. దేవుని పిలుపు మరియు అంగీకారము మాత్రమే మాకు ముఖ్యమైయున్నది.
మనము అభివృద్ధి చెందే సంఘముగా ఉన్నాము. కాబట్టి మనతో కలిసిన క్రొత్త విశ్వాసులయెడలను, మన సంఘములో పుట్టిపెరిగి పెద్దవారయ్యే వారియెడలను మనకు గొప్ప బాధ్యత యున్నది. వారందరు శిష్యులుగా మారవలసి యున్నది. క్రొత్తగా రక్షణ పొందినవారు మరియు ఎదిగే పిల్లలు ఉండుట, సంఘము ఆరోగ్యకరమైనదిగా, వృద్ధిపొందుచున్నదను దానికి సూచనగా ఉన్నది.
దేవుడు మన యొద్దకు నడిపించే క్రొత్తగా రక్షణ పొందినవారు మరియు మన సంఘములో పుట్టిన బిడ్డలే మనకు క్రొత్తతోట (పని).
దేవుడు మరియు ధనము
మనము దేవునిని మరియు సిరిని సేవింపలేమని ప్రభువైన యేసు చెప్పారు. కాబట్టి సిరి విషయములో మన వైఖరి స్పష్టముగా ఉండాలి (లూకా 16:13). దేవునిని మాత్రమే సేవించాలని తీర్మానించియున్నాము. ఈ విషయములో సంపూర్ణముగా తీవ్రముగా ఉండునిమిత్తము, మా పరిచర్యలలో ధనము విషయములో కొన్ని నిర్ణయములు తీసుకున్నాము. జీతము తీసుకొనే బోధకులను మేము కలిగియుండము. కూటములలో కానుకలను పట్టము. పాత నిబంధన ప్రకారము దశమ భాగము నిచ్చుటను వ్యతిరేకించెదము. ప్రభువు పరిచర్యకు ఇచ్చే ధనము సంతోషముతోను మరియు స్వచ్ఛందముగాను ఇవ్వాలి. డబ్బులు ఇవ్వమని ఎవ్వరినీ ఒత్తిడి చేయము. మా పరిచర్యను గూర్చిన సమాచారము మేము ఎవ్వరికీ పంపము మరియు మా సంఘము యొక్క ఆర్ధిక అవసరాలను ఎవరికీ చెప్పము. కట్నము ఇచ్చుటను మరియు తీసుకొనుటను మేము వ్యతిరేకిస్తాము. అప్పు లేకుండా జీవించాలని అందరినీ ప్రోత్సహిస్తాము (రోమా 13:8).
మొదటి నుండి, దేవుని కృప వలన ఈ క్రొత్త నిబంధన ప్రమాణాలను పాటించాము. ఈ విషయములలో మా వైఖరిని అనేక సంఘముల వారు విమర్శించి మరియు వ్యతిరేకించారు. కాని మేము దేనికొరకు నిలబడ్డామో మాకు తెలియును మరియు ప్రభువు వచ్చు పర్యంతము మేము నిలిచెదము.
పౌలు వలె మా సంఘ పెద్దలందరు వారిని వారే పోషించుకుంటారు (ఆర్ధిక విషయములలో). కొంతమంది విశ్వాసులనుండి కొన్నిసార్లు బహుమతులు తీసుకున్నారు. కాని పౌలు తన వ్యక్తిగత పరిచర్య అవసరములకు అతడు కేవలము బహుమతులమీదనే ఆధారపడలేదు. తన అవసరమంతటినీ తీర్చే దేవుని యందు నమ్మికయుంచాడు. మేము కూడా అలాగే చేశాము మరియు ఇది మా దర్శనములో ఒక భాగము.
ప్రభువు పరిచర్య చేసేవారు వేరే వారినుండి ధన సహాయము పొందుట సంపూర్ణముగా సముచితమే ఎందుకనగా సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువే నియమించియున్నారు (1 కొరింథీ 9:14). కాని కొందరు బోధకులు వారి ఆత్మీయవరముల ద్వారా ధనమును వారి కొరకే సమకూర్చు కొనుచున్నందున ప్రభువు నామము అగౌరవ పర్చబడింది కాబట్టి పౌలు తనను తానే పోషించుకున్నాడు. అటువంటి పరిస్థితులలో, ప్రభువు కొరకు అతడు పవిత్రమైన సాక్షిగా ఉండాలని పౌలు కోరియున్నాడు.
ఇప్పుడు ఇండియాలో అటువంటి పరిస్థితులే ఉన్నవి. కాబట్టి సి.ఎఫ్.సిలో అటువంటి బోధకులకు (ధనము విషయములో) వేరుగా మన దేశములో ప్రభువుకు సాక్ష్యముగా ఉండాలని భావించాము. మేము తీసుకున్న ఈ నిర్ణయము వలన అనేకమంది బిలాములనుండి, గెహాజీలనుండి మరియు దేమాలనుండి, మన మధ్యలో ప్రభువుసాక్ష్యము కాపాడబడినది.
సొంత ధనమును వ్యక్తిగతముగా ఏవిధముగా వాడాలో మా సంఘములలో ఎవరికి చెప్పము. వారి ధనమును సంపూర్ణముగా వారిష్టప్రకారము ఖర్చుపెట్టవచ్చును. వారి ధనమును పరిచర్యలకు గాని లేక దిక్కులేని వారికిగాని లేక బిక్షగాళ్ళకుగాని ఇవ్వవచ్చును. సి.ఎఫ్.సి సంఘములో వేయబడే కానుకలు - మాకున్న దర్శనము ప్రకారము, సంఘములోని విశ్వాసులను శిష్యులనుగా మార్చుటకును మరియు బీద విశ్వాసులకును ఇవ్వబడుతుంది (గలతీ 6:10).
పరిచర్యలు, బిరుదులు మరియు అధికారము
పరిచర్యలు:- ఎఫెసీ 4:13లో ప్రభువైన క్రీస్తు తన సంఘమునకు అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు ఉపదేశకులు అనువారిని వరముగా ఇచ్చియున్నారు. దేవుడు తన మంచితనమును బట్టి ఈ అయిదు పరిచర్యలను సి.ఎఫ్.సికి ఇచ్చియున్నారు. కాని వీటిని వారికి బిరుదులుగా పెట్టి ఏ సహోదరుని కూడా పిలువము (తాను వ్రాసినది దేవుని వాక్యమని అంగీకరించుటకు మాత్రమే పౌలు తాను "ఒక అపొస్తలుడనని" చెప్పియున్నాడు కాని ఈనాడు ఎవరికీ ఆ అవసరము లేదు).
ఈ అయిదు పరిచర్యలను అభ్యాసము చేయుటను మేము నమ్ముచున్నాము. మన మధ్యలో ఆ పరిచర్యల ద్వారా అద్భుతమైన ఫలితాలను చూచాము. ఫలితాలు ముఖ్యము కాని ఆ పరిచర్య ఎవరు చేసారనేది ముఖ్యము కాదు. ఎందుకనగా మనమందరము ఒకే శరీరమై యున్నాము మరియు మనము ఒకరికి ఒకరము దాసులమై యున్నాము.
బిరుదులు:- ప్రభువు మనకిచ్చినది రెండేరెండు బిరుదులు. ఒకటి "సహోదరుడు", రెండు "సేవకుడు" (మత్తయి 23:8,11). మన మందరమును "సహోదరులమును" మరియు "సేవకులమును" అయి ఉన్నాము. ప్రభువైన యేసు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటిని మనము నెరవేర్చిన తరువాత, మనలను మనమీలాగు పిలుచుకుంటాము, "మేము నిష్‍ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసినదే చేసియున్నాము" (లూకా 17:10). అటువంటి బిరుదు కలిగియుండుటకు మనందరము ఇష్టపడాలి.
అధికారమునకు లోబడుట:- "మీ పైని నాయకుల మాటవిని వారికి లోబడియుండుడి" అని బైబిలు చెప్పుచున్నది (హెబ్రీ 13:17). సంఘ విషయములలో స్థానిక సంఘ పెద్దలకు లోబడియుండాలనే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలని సి.ఎఫ్.సి సంఘములో సభ్యులుగా ఉండాలని కోరేవారికి బోధిస్తాము. అలాగు చేయమని ఎవరినీ బలవంతము చేయము ఎందుకనగా స్వచ్ఛందముగా లోబడినప్పుడే దానికి విలువ ఉంటుంది.
కొన్ని ఇతర సంఘములలో పోపుకుగాని లేక ఒక యాజకునికిగాని లేక ఒక పాస్టరుకు గాని లోబడాలని బలవంతము చేస్తారు. కాని సి.ఎఫ్.సి లో ఎవరి మీదను అధికారము రుద్దము. వారు ఎవరికి లోబడాలనే విషయములో విశ్వాసులకు స్వాతంత్ర్యము ఇచ్చెదము. వారికి నమ్మకమున్న పెద్దకు వారు లోబడాలి ఎందుకనగా అట్టి విధేయత ద్వారా వారికి జీవము మరియు భద్రత కావాలని వారు కోరుదురు. ఒక పెద్ద ఏ విధముగా జీవించుచున్నాడు, తన కుటుంబమును ఏ విధముగా కట్టుచున్నాడు మరియు అతని పరిచర్యను దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తున్నాడు అనేదానిని బట్టి అతని మీద విశ్వాసులకు నమ్మకము కలుగుతుంది.
అపొస్తలుల కార్యములలో, క్రొత్తగా రక్షింపబడినవారు స్థానిక సంఘములలో చేర్చబడేవారు. అప్పుడు అపొస్తలులు ప్రతి సంఘములో పెద్దలను నియమించేవారు (తీతు 1:5). పరిచర్యలో సమతుల్యత ఉండునట్లును ప్రతి సంఘములో కనీసము ఇద్దరు పెద్దలు ఉండాలి. విశ్వాసులు ఆత్మీయముగా సంపూర్ణలగునట్లు పెద్దలు, ఆత్మీయ తండ్రుల వలె వారిని కాచెదరు. పెద్దలు కూడా అపొస్తలుల సలహాలను తీసుకుంటారు. అపొస్తలులు లేనట్లయితే పరిణితి చెందిన సహోదరుల సలహాలను తీసుకుంటారు.
విశ్వాసులు మరియు పెద్దల యొక్క క్రమశిక్షణ
మంచి కుటుంబములన్నిటిలో తండ్రులు అవసరమైనప్పుడు పిల్లలను శిక్షించెదరు. సి.ఎఫ్.సి సంఘములలో కూడా పాపములో జీవిస్తున్న వారిని (పాపమును అలవాటుగా చేయువారిని) (మత్తయి 18:15-17లో ఉన్న ప్రకారము) "ముద్దంతయు పులియకుండునట్లు" శిక్షించెదము (గద్దించెదము) (1 కొరింథీ 5:6,7).
ఇద్దరు ముగ్గురు సాక్షులు పెద్దమీద దోషారోపణ చేసినప్పుడు ఆ సంఘము మీద అపొస్తలులు లేక బాధ్యత కలిగిన పెద్దలు ఆ దోషారోపణ నిజమో కాదో అని జాగ్రత్తగా పరిశోధించాలి. ఆ దోషారోపణ నిజమని తేలితే 1తిమోతి 5:19-21లో చెప్పబడిన ప్రకారము వారు చేయుదురు. అదేమనగా "ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్దమీద దోషారోపణ అంగీకరించకుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి యెదుట గద్దించుము. విరోధ బుద్ధితోనైనను, పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తు యేసు యెదుటను, ఏర్పరచబడిన దేవదూతల యెదుటను నీకు ఆనబెట్టుచున్నాను".
అయితే ఎవరిమీదనైనను ఎటువంటి పక్షపాతము లేకుండా దానిని చేయాలి. తానుచేసిన తప్పును బట్టి ఒక పెద్ద గద్దించబడతాడు. వాక్యములో ఉన్నట్టు సంఘములో దానిని తెలియజేయాలి.
ప్రకటన 2 మరియు 3 అధ్యాయములలో వెనక్కుతగ్గిన ఐదుగురు సంఘపెద్దలను గద్దించుటకు సంఘములకు తెలియజెప్పుమని అపొస్తలుడైన యోహానుకు ప్రభువు చెప్పినట్లు చూస్తాము.
ఒక సహోదరునికి ఒక సంఘములో పెద్దను నియమించుటకు దేవుడు అధికారమిచ్చినయెడల, అవసరమైనప్పుదు ఆ పెద్దను సరిచేయుటకుగాని లేక తీసివేయుటకుగాని అధికారము ఉండును. ఒకవేళ అటువంటి పెద్ద (అధ్యక్షుడు) లేనప్పుడు సంఘములోని ఇతర పెద్దలు సరిదిద్దవచ్చును.
అయితే సమస్త క్రమశిక్షణ కూడా తండ్రివలె ప్రేమగల ఆత్మతో (ప్రేమతో) ఆ సహోదరుడుగాని లేక పెద్దగాని మరలా ప్రభువు యొద్దకును మరియు సంఘములోనికి చేర్చబడతారనే నిరీక్షణతో చేయాలి (2 కొరింథీ 2:6-11).
స్థానిక సంఘముల మధ్య సహవాసము
సి.ఎఫ్.సి సంఘములు ఒక మతానికి చెందిన గుంపు కాదు. అందరము ఒకే దర్శనము కలిగి, సంఘములు కలిసి సహవాసముతో పనిచేస్తాము. మాకు ఎటువంటి కేంద్రస్థానము లేదు. నాయకులను ఓట్ల ద్వారా ఎన్నుకొనుట మాలోలేదు. మాకు సూపరిండెంటుగాని లేక అధ్యక్షుడు (ప్రెసిడెంట్) గాని లేడు. సంఘమునకు చెందిన ఆస్తుల మీద ఎవరికీ అధిపత్యములేదు. ప్రతి సంఘము ప్రభువుతోనే సజీవ సంబంధము కలిగియుండి, ప్రభువుకు లోబడుచూ స్వతంత్రముగా ఉండును. కాబట్టి నియమించబడిన సంఘ పెద్దలందరు మొదటిగా ప్రభువుకే లెక్క చెప్పవలసి యుంటుంది (ప్రకటన 1:20లో "నా కుడిచేతిలో ఉన్న ఏడు నక్షత్రములు (సంఘములు)" ఉన్న రీతిగా ఇది క్రొత్త నిబంధన సంఘము). బిషప్పు యొక్క అధికారమునకు సంఘములు లోబడుట అనే పద్ధతి మాలో లేదు.
ఏ స్థానిక సంఘపెద్దకు మరియొక సంఘము మీద ఎటువంటి బాధ్యత ఉండదు. ఏ స్థానిక సంఘపెద్ద అయినను, ఇంకొక స్థానిక సంఘపెద్దకు లోబడవలసిన అవసరము లేదు.
పౌలు తాను కట్టిన సంఘములను ఒక మతశాఖగా మార్చలేదు. అలాగే సి.ఎఫ్.సి కి చెందిన సంఘములు కూడా మతశాఖకు చెందవు. సి.ఎఫ్.సి సంఘములన్నియు ప్రభువుచేత నాటబడి పూర్తిగా స్వతంత్రముగా ఉండును మరియు స్థానిక సంఘపెద్దలచేత నడిపించబడును. వారిని ఎవరూ నియంత్రించరు మరియు వారు ఏమి చేయాలో, చేయకూడదో ఎవరూ చెప్పరు. ప్రభువే స్వయముగా వారికి శిరస్సైయున్నాడు.
కొరింథీ సంఘములో సమస్యలున్నప్పుడు, కొందరు విశ్వాసులు వాటిని పౌలుకు చెప్పి సహాయము పొందినట్లు వారి సంఘములో ఏదైన సమస్య వచ్చినప్పుడు వారికంటే ఎక్కువగా పరిణితి చెందిన సహోదరులకు గాని లేక అపొస్తలుల పరిచర్య కలిగిన వారిని గాని సంఘపెద్దలు సంప్రదింపవచ్చును. ఆ సమయములో కొరింథు సంఘ సమస్యలు పౌలు సలహాతో పరిష్కరించబడెను.
సి.ఎఫ్.సి కి చెందిన సంఘములు మరియెక్కవ సహవాసము కలిగి, మరియెక్కువగా ఐక్యపరచబడి, ప్రభువులో ఒకే కుటుంబముగా వృద్ధిపొందునట్లు ఎల్లప్పుడు ప్రయాసపడెదము. అందువలననే మేము అన్ని సంఘములలో కూటములు జరిగించెదము.
కుటుంబ జీవితము యొక్క ప్రాముఖ్యత
సి.ఎఫ్.సి లో కుటుంబములో దేవుని యెడల భయభక్తులు కలిగియుండుట ప్రాముఖ్యమైయున్నది. కాబట్టి కుటుంబములను ప్రోత్సహించి, భార్యభర్తలు యిద్దరు దేవుని ప్రేమతో నింపబడి, ఒకరిని ఒకరు ప్రేమించుచు మరియు గౌరవించుచు, వారి బిడ్డలను దేవుని మార్గములలో పెంచునట్లు అనేక కూటములు కలిగియుంటాము.
భార్యలు భర్తలకు సహకారులుగా ఉండాలనేది దేవుని చిత్తము. సి.ఎఫ్.సి లో వారి కుటుంబములను కట్టుకొనుటలోను మరియు భర్తయొక్క పరిచర్యలోను భార్యల సహకారమునకు ఎంతో విలువ ఇస్తాము. సి.ఎఫ్.సి లో భర్తలు వారి భార్యలకు మంచికాపరులుగా ఉంటూ అన్ని విషయములలో వారికి మాదిరిగా ఉండాలని భర్తలకు ఉపదేశిస్తాము.
దేవుని కుమార్తెలు కూడా ప్రవచించవచ్చును కాబట్టి సహోదరీలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రోత్సహిస్తాము (అపొ.కా. 2:17; ఎఫెసీ 5:18; 1కొరింథీ 14:1). వారు ఇతరులను ప్రోత్సహించి, ఆదరించి మరియు ఆశీర్వదించి వారిలో క్షేమాభివృద్ధి కలుగునట్లు చేయుదురు.
1కొరింథీ 14:3, మొదటిగా వారి కుటుంబములోని వారి భర్తలకు, పిల్లలకు మరియు స్త్రీలకు అలాగు చేయాలి.
భవిష్యత్తులో సి.ఎఫ్.సి నాయకత్వము
రాబోయే దినాలలో సంఘ నాయకులగునట్లు కొందరు యౌవనస్థులు హృదయపూర్వకముగా ప్రభువును కోరికొని మరియు దేవుని కృపను పొందుకోవాలని వారిని ప్రోత్సహిస్తాము.
అసూయ అనేది మానవచరిత్ర అంతటిలో పెద్ద సమస్యగా ఉన్నది. కయీను తమ్ముడి విషయములోను, సౌలు దావీదు విషయములోను అసూయ పడిరి. క్రైస్తవ పరిచర్యలో కూడా అనేకమంది "సంఘ పెద్దలు" వరాలు కలిగిన యౌవనస్థుల విషయములో అసూయపడి వారిని పైకి రాకుండా అణచివేసారు. కాని సి.ఎఫ్.సి లో ఆసక్తి కలిగి, నాయకత్వ లక్షణములు కలిగిన యౌవనస్థులను ప్రోత్సహించి వారికి తర్ఫీదు ఇవ్వమని సంఘపెద్దలను ప్రోత్సహిస్తాము.
దేవుని పనిలో రిటైర్‍మెంట్ అనేది లేదు కాబట్టి సి.ఎఫ్.సి లోని సంఘపెద్దలు రిటైర్ అవ్వరు. రాజీనామా చేయరు కాని తండ్రులు తమ బిడ్డలను పెద్దవారిని చేసి, వారి జీవితములు వారు నడుపుకొనునట్లు తండ్రులు వారిని విడిచినట్లు వీరు కూడా చేయుదురు. అటువంటి దీనులైన, దైవజనులైన, ఆత్మీయ తండ్రులు, తరువాత కూడా గౌరవించబడుదురు, గొప్పగా ఎంచబడుదురు మరియు వారి "ఆత్మీయ కుమారులు వారి సలహా కొరకు సంప్రదించెదరు". వారు చనిపోవువరకు ఇలాగు జరుగను.
"సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఎంత మనోహరము..........ఆశీర్వాదమును శాశ్వత (నిత్య) జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు"(కీర్తన 133:1,3).
"ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు (పూర్తి చేయుటకు) దాని గూర్చి జాగ్రత్తపడుము"(కొలస్సీ 4:17).