ఒక మంచి పునాది

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
  Download Formats:

అధ్యాయము 0
పరిచయము

ఆదియందు దేవుడు ఉద్దేశించిన ప్రకారము, మానవుడు ఈనాడు జీవించగలడను శుభవార్తే ఈ సువార్త. క్రీస్తు కట్టడలకు పూర్తిగా లోబడే వారే నిరంతరము జయజీవితము జీవించగలరు. అయినప్పటికీ, క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించిన అనేకులు, సువార్త అందించే ఈ మహిమకరమైన జయజీవితము లోనికి ప్రవేశింపలేక పోవుచున్నారు. ఎందుకని?

క్రైస్తవ జీవిత ఆరంభములో మంచి పునాది వేసుకొనకపోవడమే దీనికి తరచుగా కారణమవుతుంది.

మారుమనస్సు పొందిన తరువాత మనజీవితాన్ని కట్టబడుచున్న ఒక ఇంటితో పోల్చవచ్చు. ఇంటికి అతి ప్రాముఖ్యమైన భాగము దాని పునాదియని మనకందరికి తెలుసు. మూడవ అంతస్తు నందు పగుళ్ళున్నట్లయితే, సాధారణముగా అది పునాది లోపమేనని కనుక్కోవచ్చు.

మన జీవిత పరిస్థితి కూడా ఇలాంటిదే. క్రీస్తునందు విశ్వాసముంచిన చాలా సంవత్సరాల తరువాత, ప్రారంభములో లోపముతో కూడిన పునాది వేసుకొనుట వలన, దాని పర్యవసానములను అనుభవించవలసి వస్తుంది.

క్రొత్త నిబంధన మనకిచ్చే వాగ్దానము ''పాపముపై జయ జీవితము''.

రోమా 6:14 లో దేవుని వాగ్దానాన్ని చూడండి .

''విూరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము విూ విూద ప్రభుత్వము చేయదు''.

ఇంతే గాక, చింత (ఆందోళన) నుండి సంపూర్తిగా విడుదల పొందినట్టి, నిరంతరము ఆనందముతో కూడినట్టి జీవితం జీవించమని కూడా ఆజ్ఞాపిస్తుంది. ఫిలిప్పీ 4:4,6 చూడండి -

''ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి...దేనినిగూర్చియు చింతపడకుడి...''

దేవుడు వేటినైతే మనము చేయడానికి శక్తినిస్తాడో, వాటినే చేయాలని ఆయన మనలను ఆజ్ఞాపిస్తాడని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒకవిధంగా, మనము చేయుటకు ఆయన ఇచ్చే కృపా వాగ్దానములే ఆయన ఆజ్ఞలు! కాబట్టి పై ఆజ్ఞలు దేవుడు మనలను నిత్యము ఆనందమయ జీవితాన్ని జీవింపజేయ గలిగే మరియు చింత (ఆందోళన) నుండి సంపూర్తిగా విడుదల చేయించగలిగినటువంటి వాగ్దానములే.

క్రొత్త నిబంధన యందు ఇలాంటి మహిమకరమైన వాగ్దానాలెన్నో ఉన్నవి. కాని, ఇక్కడ మనము ప్రస్తావించిన వాగ్దానములు సువార్త నిజముగా ఒక శుభవార్తేనని చూపడానికి సరిపోతుంది.

అయినప్పటికి విచారించవలసిన సత్యమేమిటంటే సువార్తను అంగీకరించామని ఎంతో మంది క్రైస్తవులు, పైన చెప్పబడిన వాక్యాలలో వివరించినట్టి మాదిరి జీవితాన్ని జీవించటము లేదు.

నీ జీవితములో ఒక మంచి పునాది వేసుకోవటానికి తోడ్పడి, అలాగున నీ జీవితముపట్ల దేవుని సంపూర్ణ ఉద్దేశ్యము, నీ యందు నెరవేరడానికి దోహదకారి కావడమే ఈ పుస్తకము యొక్క ముఖ్యోద్దేశ్యము.

మరి చదువుతూ, పరిశుద్ధాత్ముని మీ హృదయముతో మాట్లాడనివ్వండి.

మొత్తానికి, ఇది మీ జీవితములో ఒక నూతన అధ్యాయానికి ప్రారంభం కావచ్చు.

అధ్యాయము 1
మారుమనస్సు

గొఱ్ఱెలదొడ్డిలోనికి ద్వారము గుండా ప్రవేశించుటయే సరైన మార్గము. కాని కొందరు గోడదూకిలోనికి ప్రవేశించుటకు ప్రయత్నిస్తారని యేసు చెప్పియున్నాడు (యోహాను 10:1).

మానవాళి రక్షింపబడటానికి మారుమనస్సు మరియు ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుటయే సరైన మార్గమని దేవుడు ఉద్దేశించెను. అది ఒక్కటే మార్గమై యున్నది. కాని వేరే ఏ మార్గము ద్వారానైనా ఎక్కి ప్రవేశింప ప్రయత్నించే వారిని దేవుడు ఎన్నటికి అంగీకరించడు.

ప్రభువు త్రోవను సరాళము చేయవచ్చిన యోహాను మారుమనస్సు గూర్చి బోధించెను. ఇశ్రాయేలు జనాంగము క్రీస్తును రక్షకునిగా స్వీకరించుటకు ఇదొక్కటే మార్గమయినది. మనకు కూడా ఈ మార్గమే తప్ప వేరొకటంటూ లేదు.

మారుమనస్సు మరియు విశ్వాసము

ప్రస్తుత కాలంలోని అనేకమంది విశ్వాసులలో ఆది క్రైస్తవులు కలిగియుండినట్టి లోతు, సమర్పణ మరియు శక్తి లేనట్లనిపిస్తుంది. దీనికి కారణం ఏమైయుండునని మీరు అనుకొనుచున్నారు?

సరిగా మారుమనస్సు పొందక పోవడమే దీనికి ప్రధాన కారణమైయున్నది. వీరు క్రీస్తునందైతే విశ్వాసముంచారు. మంచిదేకాని, మొట్టమొదట వారు పశ్చాత్తాప పడకుండా విశ్వసించారు. కావున వారి మార్పు పైపైన యున్నది. మనకు బాగా తెలిసిన ఒక పాటలోని వచనాలను చూద్దాం:

''నిజంగా నమ్మిన నికృష్ట అపరాధికి, దొరుకును తక్షణమే క్షమాపణ యేసునుండి''

నికృష్టమైన అపరాధి కేవలం ''నిజంగా నమ్మికయుంచినంత''

మాత్రమునే క్షమాపణ పొందుతాడనే మాటవాస్తవమేనా?

మొదటిగా అతడు పశ్చాత్తాప మొందనవసరం లేదా?

నిజమైన విశ్వాసం పశ్చాత్తాపముతో కూడినదని మీరనవచ్చు. కాని నికృష్ట అపరాధికి ఈ విషయం సరిగ్గా తెలియనంతవరకు అతడు కేవలము నమ్మిక ఉంచినంతనే క్రీస్తునందు నూతనముగా జన్మించవచ్చునని భావించవచ్చు. అతడు ఈలాగు మోసగించబడవచ్చు.

యేసు తన సందేశంలో ''మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని'' (మార్కు 1:15) ప్రకటించెను. ఇదే వర్తమానాన్ని తన అపొస్తలులను ప్రకటింపమని యేసు ఆదేశించెను (లూకా 24:47).ఖచ్చితంగా ఇదే వారు చేసిరి (అపొ.కా. 20:21).

దీని విషయంలో దేవుని వాక్యము చాలా స్పష్టముగా ఉంది. నీ జీవితం నిజంగా చక్కగా మారాలంటే మారుమనస్సును, విశ్వాసమును వేరు చేయకూడదు. ఈ రెంటినీ దేవుడు కలిపియున్నాడు.మరియు దేవుడు వేటినైతే ఐక్యపరిచాడో వాటిని ఏ మానవుడును కూడా విడదీయకూడదు.

క్రైస్తవ జీవిత పునాదికి మారుమనస్సు మరియు విశ్వాసమన్నవి రెండు ప్రధాన మూలకములు (హెబ్రీ 6:1). ఒకవేళ మీరు సరిగా మారుమనస్సు పొందనట్లయితే, మీ పునాది తప్పనిసరిగా లోపంతో కూడినదై యుంటుంది. ఆపై మీ క్రైస్తవ జీవితం నిలకడలేనిదిగా ఉంటుంది.

''యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానమునకు మూలము''(లేక అ,ఆ లు వంటివి) (సామెతలు 9:10) అని దేవుని వాక్యము చెబుతుంది. మనము నిజంగా దేవునికి భయపడినట్లయితే, ''పాపము నుండి దూరంగా వైదొలగుతాము'' (సామెతలు 3:7) కావున పశ్చాత్తాపము నొందక, పాపమునుండి వైదొలగని వారు, క్రైస్తవ జీవితం యొక్క మూలాక్షరాలను, (అ, ఆలను) కూడా నేర్చుకోని వారితో సమానులు.

అసత్యమైన మరియు సత్యమైన పశ్చాత్తాపము

మీరు మారుమనస్సు పొందినట్లయితే, అది వాస్తవమైనట్టిదిగా నిశ్చయత కలిగి ఉండాలి. ఎందుకంటే సాతాను తన కల్పితమైన(నఖిళీ) మారుమనస్సు ద్వారా ప్రజలను మోసపరుస్తాడు.

''ఎవ్వరిచేతను పట్టుబడకూడదు'' అన్న ఒక్క ఆజ్ఞపై అనేకమంది ప్రజలు జీవిస్తున్నారని సాతానుడికి తెలుసు. అందుకే సాతాను ఎవ్వరికి చిక్క కుండా పాపము చేయగలిగే తీరుతెన్నులను బోధిస్తూంటాడు.

చివరికి ఒక దొంగ కూడా పట్టుబడినట్లైతే విచారం వ్యక్తం చేస్తాడు. కాని అది పశ్చాత్తాపం కాదు

ఉదాహరణకు తప్పుడు పశ్చాత్తాపము పొందిన కొందరిని బైబిలు గ్రంధము నుండి చూద్దాం.

సౌలు రాజు దేవునికి అవిధేయత చూపినపుడు అతడు పాపము చేసినట్లు ప్రవక్త అయిన సమూయేలు వద్ద ఒప్పుకొన్నాడు. కానీ తాను పాపము చేసినట్లు ప్రజలు ఎరుగుటకు ఇష్టపడలేదు. అతడు ఇంకా మనుష్యుల నుండి గౌరవాన్ని కోరుకొన్నాడు. నిజంగా అతడు పశ్చాత్తాపము పొందలేదు (1 సమూయేలు 15:24-30). అతనికిని, పాపములో పడినపుడు తాను పాపము చేసినట్లు, బాహాటముగా ఒప్పుకొన్న దావీదు రాజునకు మధ్య ఉన్న తేడా అదియే (కీర్తన 51).

రాజైన ఆహాబు సౌలులాంటి మరొకడు. ఆహాబు తాను చేసిన కార్యమును దేవుడు తీర్పుతీర్చునని ఏలియా హెచ్చరించినపుడు వ్యాకులపడ్డాడు. ఇంకను తాను గోనె పట్ట కట్టుకొని, తాను చేసిన పాపముల కొఱకు ఏడ్చాడు (1రాజులు 21:27-29). కానీ నిజంగా తాను పశ్చాత్తాప పడలేదు. అతడు దేవుని తీర్పుకు మాత్రమే భయపడ్డాడు.

ఇస్కరియోతు యూదా విషయం, తప్పుడు పశ్చాత్తాపానికి మరొక స్పష్టమైన ఉదాహరణ. యేసుకు మరణశిక్ష విధింపబడటం గమనించిన వెంటనే యూదాతనలో తాను బాధపడి ''నేను పాపము చేసితిని'' (మత్తయి 27:3,5) అని చెప్పాడు. నేటికి కూడా కొందరు వారి మతపెద్దల వద్దకు వెళ్ళి తమ పాపాలను ఎలాగైతే ఒప్పుకొంటున్నారో, అలాగే యూదా ఆనాటి యాజకుల ఎదుట తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. తాను చేసిన పనికి తనలో బాధపడి ఉండవచ్చును కాని పశ్చాత్తాపము నొందలేదు. ఒకవేళ అతను నిజంగా పశ్చాత్తాప పడిఉంటే, విరిగిన హృదయంతో తాను ప్రభువు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరుకొని ఉండేవాడు. కాని అతడు ఆవిధముగా చేయలేదు.

ఈ ఉదాహరణలను బట్టి పశ్చాత్తాపమంటే ఏదికాదో అన్న విషయాన్ని బాగా నేర్చుకోవచ్చు!

''విగ్రహాలనుండి దేవుని తట్టుకు తిరగడమే'' (1థెస్సలో 1:9) నిజమైన పశ్చాత్తాపము.

విగ్రహాలంటే ఇక్కడ అన్యుల దేవాలయాలలో కనపడే కొయ్య మరియు రాతితో చేయబడినవే కావు. చూడడానికి అంత వికారముగా కనబడకుండా, అన్యుల విగ్రహాలంతటి అపాయాన్ని కలిగించి, ప్రజలు ఆరాధించేటటువంటి విగ్రహాలు ఉన్నాయి. అవి-కోరికలు, సుఖము, ధనము, కీర్తి,స్వయిష్టము వంటివి.

మనమంతా ఎన్నో సంవత్సరాల తరబడి వీటిని ఆరాధించాము. పశ్చాత్తాపపడటమంటే, ఈ విగ్రహాలన్నిటిని ఆరాధించడం మాని, దేవుని తట్టుకు తిరగడమే.

నిజమైన పశ్చాత్తాపము మన పూర్తి వ్యక్తిత్వంపై పనిచేస్తుంది. అనగా మన మనస్సు, భావోద్రేకములు, మన స్వచిత్తములను మార్చి వేస్తుంది.

నిజమైన పశ్చాత్తాపమంటే, మొదటిగా పాపమునుండి మరియు లోకము నుండి మన మనస్సును మార్చుకుంటాము. పాపము దేవుని నుండి మనలను దూరపరచినదని గుర్తిస్తాము, అంతేకాక ఈ లోకంలో సర్వజీవన విధానాలు దేవునికి వ్యతిరేకమైనవిగా ఉన్నాయని గ్రహిస్తాము. అందుకే మనం దేవునికి అపకీర్తి తెచ్చే, ఈ జీవన విధానమునుండి బయటకు వైదొలగాలని కోరుకుంటాం.

నిజమైన పశ్చాత్తాపమంటే, రెండవదిగా, మన భావోద్రేకముల మీద పని చేస్తుంది. మనము గతంలో జీవించిన జీవన విధానాన్ని బట్టి దు:ఖపడతాము (2కొరిందీ¸ 7:10) మన దుష్‌ప్రవర్తనను, మనము చేసిన దుష్‌ క్రియలను మనస్సుకు తెచ్చుకొని, మనదోషములను బట్టియు, హేయ క్రియలను బట్టియు,వేరేవారు చూడని, మనలో మనమే చూచుకొను దుష్టత్వమును మనము అసహ్యించుకొంటాము (యెహెజ్కేలు 36:31).

మనము గతంలో జీవించిన జీవితాన్ని బట్టి దేవునిని ఎంతగానో బాధించామని గుర్తించి ఏడ్చి దు:ఖపడతాము. వారి పాపములను వారు గెర్తెరిగినపుడు బైబిలులోని గొప్ప దైవజనులు ప్రతిస్పందన కూడా ఇదే. దావీదు (కీర్తనలు 51), యోబు (యోబు 42:6) మరియు పేతురు (మత్తయి 26:75). వీరందరు తమ పాపములను బట్టి పశ్చాత్తాపము నొందినప్పుడు దు:ఖముతో ఏడ్చారు.

మన పాపముల నిమిత్తమై ఏడ్చి, దు:ఖ పడాలని యేసు మరియు అపొస్తలులు మనలను ప్రోత్సహించారు (మత్తయి 5:4; యాకోబు 4:9). ఇదే దేవుని తట్టు తిరగడానికి సరైన మార్గము.

చివరిగా, పశ్చాత్తాపము మన చిత్తము మీద కూడా ఆధారపడియున్నది. మూర్ఖపు(మొండి) స్వచిత్తము - ''మన ఇష్టాను సారంగా నడవాలను కోవటం'' ను విడిచి పెట్టి యేసును మన జీవితాల్లో ప్రభువుగా చేసుకోవాలి. అంటే ఇప్పటినుండి దేవుడు మనలను ఏమి చేయవలెనని కోరుకొంటాడో, ఎంతటి ఖర్చయినా, ఎంతటి అవమాన పరిచే పనినైనా చేయడానికి సిద్ధమయి ఉండాలి.

తప్పిపోయిన కుమారుడు విరిగిన హృదయంతో, తన తండ్రి చెప్పే ఎలాంటి పనైనా చేయడానికి సిద్దపడే ఒక యవ్వనస్తునిలా, తన తండ్రి ఇంటికి వచ్చాడు. ఇలాటిది నిజమైన పశ్చాత్తాపము (లూకా 15:11-24).

మనము గతంలో చేసిన ప్రతి ఒక్క చిన్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోనవసరం లేదు. ఎట్టి పరిస్థితిలోను వాటన్నింటిని జ్ఞప్తికి తెచ్చుకోవడమనేది అసాధ్యమయిన విషయము. తప్పిపోయిన కుమారుడు అలాగు చేయలేదు అతను చెప్పినదంతా ఒక్కమాటే. ఆమాట ''తండ్రీ, నేను పాపము చేసితిని''. మనము కూడా చెప్పవలసింది ఇదియే.

కాని ఇస్కరియోతు యూదా కూడా ''నేను పాపము చేసితిని'' అన్నట్లు గమనించగలము. అయితే ఇక్కడ యూదా పశ్చాత్తాపానికి, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాప పడటానికి గొప్పవ్యత్యాసముంది. దేవుడు మనము నోటితో పలికే మాటలను మాత్రమే వినడు. కాని మన మాటల వెనుక గల మనస్సును గమనించి, తగు రీతిలో వ్యవహరిస్తాడు.

పశ్చాత్తాప ఫలము

''మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి'' అని బాప్తిస్మమిచ్చు యోహాను పరిసయ్యులతో చెప్పెను (మత్తయి 3:8). మనము నిజంగా మారుమనస్సు పొందినట్లైతే, మన యావత్తు జీవనవిధానమే మార్పు చెందుతుంది.

మారుమనస్సు పొందిన తరువాత మనము చేయవలసిన మొదటి కార్యము గత జీవితంలో చేసిన తప్పిదములను ఒప్పుకొని దానికి తగిన నష్టపరిహారం చెల్లించడం.

యేసు, జక్కయ్య గృహములోనికి ప్రవేశించిన క్షణమే జక్కయ్య తను పాపము చేసిన వాడనని ఒప్పింపబడినట్లు మనము సువార్తలలో చూడగలము (లూకా 19:1-10). జక్కయ్య ధనాన్ని ప్రేమించిన వ్యక్తి. కాని మారుమనస్సంటే ఏమై యుందో అతడు అర్థం చేసుకొన్నాడు. తాను యేసుకు శిష్యుడయి ఉండాలంటే తాను గత జీవితంలో చేసిన తప్పిదాలన్నింటినీ సరిదిద్దు కోవాలని తెలుసుకొన్నాడు.

జక్కయ్య ఎంతో మందిని మోసపుచ్చిన వాడు గనుక, నష్ట పరిహారమంటే అతని విషయంలో ఎంతో ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి. కాని అతడు పూర్ణహృదయంతో మారుమనస్సు పొందాలని నిశ్చయించుకొన్నాడు. అందుకే అతడు తన ఆస్తిలో సగాన్ని పేదలకిస్తూ, తాను మోసపుచ్చిన వారికి నాలుగంతలుగా తిరిగి చెల్లిస్తానని ప్రభువు దగ్గర ఒప్పుకొన్నాడు.

జక్కయ్య తాను చేసిన కార్యాలకు పరిహారం చేస్తానని చెప్పిన వెంటనే, యేసు జక్కయ్య గృహానికి రక్షణ వచ్చిందని అన్నాడు. దిద్దుబాటును చేయడానికి గల యిష్టత నిజమైన రక్షణకు ఒకానొక నిదర్శనం (లూకా 19:1-10).

యేసు చెప్పిన ఉపమానంలో బుద్ధిమంతుడు తన ఇల్లు కట్టడానికి బాగా లోతుగా త్రవ్వి బండమీద పునాది వేసుకొన్నాడు (లూకా 6:48). బుద్ధి హీనుడు కూడా తన ఇంటిని అదే ప్రదేశంలో కట్టుకొన్నాడు. కాని అతడు సరిపోయేటంతటి లోతు త్రవ్వలేదు. తాను బాహ్యంగా ఇసుకపై పునాది వేసుకొన్నాడు.

ఈ ఉపమానాన్ని నిజమైన మరియు అబద్ధమైనమారుమనస్సులతో పోల్చుకోవచ్చు. మనం ఎప్పుడైతే జీవితంలో దిద్దుబాటు(పరిహారం) చేయడానికి తగిన శ్రమ తీసుకొంటామో, అప్పుడే మనము బాగా లోతుగా త్రవ్వి పునాది వేసుకొన్న వారమవుతాము.

మనము క్రీస్తు వద్దకు వచ్చునప్పుడు, మార్పుచెందనట్టి గత జీవితానికి సంబంధించి సరిజేసుకోవలసిన ఎన్నో విషయాలు పరిష్కరించుకోవడానికి ప్రారంభంలోనే సమయాన్ని తీసుకోవడం మంచిది. కాని ఈ దశలోనే కొన్ని విషయాల్లో మనము తేలికగా ఉంటే, మనము కట్టబోయే గృహపునాది బలహీనమై, ఏదో ఒక దినాన కూలిపోతుంది.

తిరిగి చెల్లించుటలో ఇమిడియున్న సంగతి

తిరిగిచెల్లించుటలో ఇమిడియున్న భావమేమిటి?

అంటే ఒకవేళ ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా మోసము చేయడము మొదలగునవి చేసి ఉంటే ఆ పన్నును యిప్పుడు తిరిగి చెల్లించివేయడము. కొన్ని సందర్భాలలో పన్ను ముట్టవలసిన విభాగానికే తిరిగి చెల్లించడం వీలు కాకపోవచ్చు. మనసుంటే, మార్గము తప్పనిసరిగా ఉంటుందన్నట్టు - మనము దేవునికి విధేయత చూపాలంటే, ఏ తపాళా బిళ్లలో, రైలు టిక్కట్లనో కొని వాటిని చింపి వేయగలిగితే, మనము ప్రభుత్వానికి అచ్చి యున్నంత ధనము తిరిగి ప్రభుత్వానికే చెల్లించిన వారమవుతాము.

ఒకవేళ మీరు ఇతరులను మోసం చేసినట్లయితే తిరిగి చెల్లించడంతో బాటు, క్షమాపణ కూడా అడుగవలెను. మీ జీవితంలో ఇంతటి మార్పు ఎలా రాగలిగిందో కూడా వారితో పంచుకోవాలి! మీ అంతట మీరే ఇలా చేయడానికి ధైర్యం చాలక పోయినట్లయితే, మరొక సహోదరుని వెంట తీసుకెళ్లి ఈ కార్యాన్ని పూర్తి చేయవచ్చు.

ఒకవేళ మీరు చేసిన అప్పులన్ని ఒక్కసారిగా తీర్చలేక పోయినట్లయితే, పరవాలేదు. అయితే వాయిదాలలో చెల్లించవచ్చు. కాని మొదట కనీసము అయిదు రూపాయలు చెల్లించడంతోనైనా ఆరంభించాలి! తిరిగి చెల్లిస్తానని జక్కయ్య ఒప్పుకొన్ననాడే దేవుడతనిని అంగీకరించాడు కాని, తాను పూర్తిగా చెల్లించిన దినాన (తరువాత) కాదు!

ఒకవేళ మీరు మోసం చేసిన వ్యక్తి ఇపుడు నివసిస్తున్న స్థలము తెలియనిచో, ఆ ధనాన్ని సర్వధనానికి నిజమైన యజమాని అయిన దేవునికి తిరిగి చెల్లించివేయాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు విధించిన నియమము ఇదే (సంఖ్యా 5:6-8).

ఎటువంటి పరిస్థితులలో కూడా చట్టవిరుద్ధంగా ఆర్జించిన ధనం మన దగ్గర ఉండకూడదు. అటువంటి ధనాన్ని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించలేడు.

ఒకవేళ మనము ఏ విషయంలోనైనా ఇతరులను గాయపరచడమో, నొప్పించడమో జరిగి, అది ధనసంబంధిత విషయము కానట్లయితే మనము అతని వద్దకు వెళ్లి తప్పు ఒప్పుకొంటూ క్షమాపణ అడగాలి.కొందరు సహోదరులు ప్రభుత్వానికి చెల్లింపవలసిన పన్ను, సుంకమును చెల్లించకుండా నెలల తరబడి మోసం చేసి ఆర్జించిన ధనాన్ని, ఒక్కసారిగా దిద్దుబాటు కార్యాన్ని పూర్తిగావించడానికై వారి బ్యాంకు నిల్వలను ఖాళీ చేసిన వారితో నాకు పరిచయముంది. అట్టివారిని దేవుడు బ్యాంకు నిల్వల కన్నా అత్యుత్తమమయిన వాటితో ఆశీర్వదించాడు!

మరికొందరు బస్సులలోను, రైళ్లలోను టిక్కెట్టు లేకుండా ప్రయాణించేసి, ఆ ప్రయాణాలకు చెల్లించవలసిన టిక్కెట్టు ధరను ఖచ్చితంగా లెక్కబెట్టి తిరిగి చెల్లించిన వారు కూడా నాకు తెలుసు. ఎవరు అతిస్వల్పవిషయాలలో నమ్మకంగా ఉంటారో, వారే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారు.

ఇంకా కొంతమంది విశ్వవిద్యాలయ అధికారుల వద్దకు తమ డిగ్రీ సర్టిఫికేట్లతో వెళ్లి తాము అంతిమ పరీక్షలలో మోసం చేసినట్లు ఒప్పుకొన్న వారు కూడా నాకు తెలియును.నిర్మలమయిన మనస్సాక్షి కలిగి యుండుటకు వారు తమ డిగ్రీ సర్టిఫికేట్లు సైతం పోగొట్టుకొనడానికి సిద్ధపడ్డారు. సాధారణంగా అటువంటి విశ్వాసుల పట్ల విశ్వ విద్యాలయ అధికారులు అనుగ్రహమును చూపి,వారిని క్షమించడానికై దేవుడు సహాయపడ్డాడు, కానీ అన్ని సందర్భాలలో ఇలాగు జరగకపోవచ్చు. నీ యొక్క విషయంలో విశ్వవిద్యాలయ అధికారులు నీ సర్టిఫికేట్లను వెనక్కు తీసుకోవడానికై దేవుడు అనుమతించవచ్చు! అయినప్పటికీ అది నీ విషయంలో దేవుని పరిపూర్ణ చిత్తమై ఉంటుంది.

ఒక సహోదరుడు చాలా సంవత్సరాల క్రితము మరొకని వద్దనుండి ఒక చిన్న తపాలా బిళ్ళను దొంగిలించిన విషయాన్ని గూర్చి వెంటనే అతనినుండి క్షమాపణ కోరుకుంటూ ఒక ఉత్తరం వ్రాసాడు. దొంగిలించబడ్డ వస్తువు విలువ ఎంత తక్కువైనప్పటికీ, దొంగతనమంటే అది దొంగతనమే. మన యొక్క నమ్మకత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాలలోనే పరీక్షింపబడుతుంది.

గత జీవితంలో చేసిన చిన్న చిన్న తప్పులను జ్ఞప్తికి తెచ్చు కొనడానికై మిమ్ములను మీరు హింసించుకోవాలని నేను చెప్పుట లేదు. అలాగు మీరు చేయనవసరం లేదు. మీరు సరిచేసుకోవలసిన విషయాలను దేవుడే మీకు గుర్తుచేస్తాడు. వాటిని మాత్రము సరి చేసుకుంటే చాలు.

పరిష్కరించటానికి ఎటూ వీలు లేని అతిక్లిష్టమైన తప్పులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులలో నీ విచారాన్ని దేవుని వద్ద ఒప్పుకొని ఆయన కనికరము కొరకు వేడు కొనటం తప్ప మరి చేయగలిగిందేమియు లేదు.

ఏదో ఒక విషయాన్ని సరిచేసుకోక పోవడం వల్ల సాతాను మనలను నేరస్తులుగా నిరంతరం నిందించడానికై ఎటువంటి పరిస్థితులలోనూ అవకాశము కల్పించరాదు. దేవునికి మన పరిస్థితి పూర్తిగా తెలియును, ఆయన మనలను చిత్ర హింసకు గురిచేయడు. నీవు చేయగలిగిన దానిని చేయటానికి నీవు సిద్ధముగా వుంటే - ఒకవేళ నీవు చేయటానికి యేమీ లేకపోయినా - దేవుడు అంగీకరిస్తాడు (2 కొరిందీ¸ 8:12).అంతటి గొప్ప కనికరము గల దేవుణ్ణి మనం స్తుతించాలి.

తనను ఘనపరచు వారిని దేవుడు ఘనపరచును (1 సమూయేలు 2:30) చిన్న చిన్న విషయాలలో మనకున్న నమ్మకత్వంను బట్టి ఒకవిధంగా దేవునిని మనము ఘనపరచగలము.

మనము దిద్దుబాటు కార్యం చేయని ఎడల, మన జీవిత కాలమంతా ఒక పెద్ద గొలుసును వెంట లాగుకుంటున్న వారమవుదుము. నిర్మలమయిన మనస్సాక్షిని మించి మనము ధనము, గౌరవం, అంతస్తు ఇంకా మన ఉద్యోగానికి విలువిస్తామేమోనని దేవుడు మనలను పరీక్షిస్తాడు. అనేక మంది దేవుడు పెట్టే ఈ పరీక్షలో నెగ్గలేరు. కాని ప్రతీ తరంలోనూ,లోకంలో విలువైన దేనికన్నా దేవుని ఎక్కువగా ప్రేమించే, శేష జనాంగాన్ని బట్టి దేవునికి స్తోత్రము.

ఇతరులను క్షమించడం

ఇతరులు మనకు ఏవిధంగా హాని చేసినా వారిని క్షమించడం కూడా పశ్చాత్తాపములో ఒక భాగమవుతుంది. ''విూరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల విూ తండ్రియు విూ అపరాధములను క్షమింపడు'' (మత్తయి 6:15) అని యేసు చెప్పెను. ఇంకనూ మనము ఇతరులను బాహ్యంగా కాకుండా హృదయాంతరంగమునుండి క్షమించాలన్నారు. (మత్తయి 18:35). ఇతరులను మనము హృదయపూర్వకంగానూ, సంపూర్తిగాను క్షమించని యెడల, దేవుడు కూడా మనలను అలాగు క్షమించుట అసాధ్యమవుతుంది.

ఇతరులు మనకు గతంలో చేసినది మనము మరవలేక పోవచ్చును. కాని వారు చేసిన హానిని గుర్తు తెచ్చుకోవడమనే శోధన కలిగినప్పుడల్లా మనము ఖచ్చితముగా తిరస్కరించవచ్చు.

ఒకవేళ ఎవరైనా మనము క్షమించడానికి కష్టమయ్యే విధంగా మనకు హాని చేసిన యెడల అట్టివారిని హృదయపూర్వకంగా మనము క్షమించలేకపోయినట్లయితే, మనము దేవుని నుండి సహాయంఅడగాలి. అప్పుడు దేవుడు ఎటువంటి వారినైనా సరే క్షమించడానికి ఆశనే గాక కావలసినంత శక్తిని కూడా మనకు ఇవ్వడానికి సిద్దముగా ఉన్నాడని చూడగలుగుతాము.

మనము చేసిన కోట్లాది పాపములను దేవుడు ఉదారంగా క్షమించిన రీతిని ఒక్కసారి ఆలోచిస్తే ఇతరులను క్షమించడం కష్టతరము కాదు. మనము ఇతరులను క్షమించనప్పుడే సాతానుడు మనపై శక్తిని పుంజుకుంటాడు.

''సాతాను మనలను మోసపరచకుండునట్లు'' మనము ఇతరులను ''క్షమించాలి'' అని పౌలు చెప్పాడు (2 కొరిందీ¸ 2:10,11).

సాతాను పట్ల ఉండాల్సిన మారిన వైఖరి

విషయాలను సరిచేసికోవల్సిన మరియొక విషయముంది. అది సాతాను మరియు దురాత్మలతో సంబంధం కలిగియుండుట. జ్యోతిష్యము, విగ్రహారాధన, హస్త సాముద్రికము, చిల్లంగి (చేతబడి) మొదలగు వాటిలో నీవు ఉన్నయెడల లేక రాక్‌ సంగీతం మరియు హానికరమైన మాదక ద్రవ్యాల పట్ల మక్కువ కలిగి యున్నయెడల, ఒకవేళ ఈ సాతాను సంబంధాలన్నింటితో నీవు అనుకోని రీతిలో భాగస్థుడవై ఉంటే, తప్పక పరిత్యజించుకోవాలి.

మొట్ట మొదటిగా చేయవలసినదేమంటే నీవు కలిగి యున్న విగ్రహాలను, మాంత్రిక పుస్తకాలను, తాయెత్తులను నాశనం (అమ్ముట కాక, నాశనం చేయడం) చేయాలి (అపొ.కా. 19:19). ఆ తరువాత

''యేసు ప్రభువా, తెలిసీ తెలియక సాతానుతో నేను చేసిన సంబంధాలన్నిటిని పరిత్యజించుచున్నాను'' అని ప్రార్థించాలి.

ఆపై ''సాతానా, నా ప్రభువును, నా రక్షకుడయిన యేసు క్రీస్తు నామములో నేను నిన్ను ఎదిరిస్తున్నాను, ఇకపై నేను ప్రభువైన యేసు క్రీస్తు సొత్తును. కావున నీవు నన్ను తాకలేవు'' అని సాతానుతో ధైర్యంగా చెప్పాలి.

(యాకోబు 4:7)లో ''దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును'' అని వ్రాయబడి యున్నది.

ఇలాగున మీపై సాతానికి ఎలాంటి అధికారము లేకుండా పోతుంది. మనము దేవునితో నడవడం కొనసాగించినట్లయితే, ఆయన మన జీవితంలోని అనేక విషయాలలో మనకు వెలుగునిస్తాడు. అది మనము ధరించేదుస్తులలోని లోకవిధానాలు, మనము మాట్లాడే భాషపైన, మనం పలికే కరిÄనమైన మాటలపైన, చదివే అలవాట్లతో మనలను మనము అపవిత్ర పరచుకొనే విధానాలపైన గావచ్చు. అలాగునే క్రమేపి మనము ఏఏ క్రొత్త విషయాలు శుద్ధి చేసుకొని, మారుమనస్సు పొందాలో కనుక్కోగలము.

మన జీవిత దినములన్నింటిలో నిరంతరము మారుమనస్సు కలిగి జీవించే ఈ మార్గంలో నడుచుకొనవలెను.

అధ్యాయము 2
విశ్వాసము

మారుమనస్సు క్రైస్తవ జీవత పునాదికి మొదటి భాగము. రెండవది విశ్వాసము.

దేవునిలో విశ్వాసము కలిగి యుండడమంటే, ఆయన యందు నమ్మిక ఉంచుట మరియు మన యొక్క అనుభూతులు లేక ఇతరుల చెప్పే మాటలను బట్టికాక దేవుని వాక్యములో చెప్పిన మాటలపై నమ్మిక ఉంచడము. ఇది ఎంతో సామాన్యమైన విషయము.

ఇక్కడ దేవుని గూర్చి మూడు సత్యాలున్నాయి. అవి

 1. ఆయన మనలను అనంతంగా (శాశ్వతముగా) ప్రేమిస్తున్నాడు.
 2. ఆయన సంపూర్ణ జ్ఞానము గలవాడు, మరియు
 3. ఆయన సర్వశక్తిమంతుడు.

ఈ సత్యాలను నమ్ముట కష్టమా? కానేకాదు. అలా అయితే దేవునిని మన పూర్ణ హృదయముతో విశ్వసించుట కష్టము కాకూడదు..

దేవుని మాటల పట్ల విశ్వాసము లేకపోవటము వలననే ఏదేను తోటలో హవ్వ సాతాను మాటలకు చెవి యొగ్గింది. దేవుని ఆజ్ఞలు ఆమె మంచి కొరకే అన్న విషయాన్ని తాను నమ్మలేదు. తనపై దేవునికి గల సంపూర్ణమైన ప్రేమను నమ్మలేని కారణంగా ఆమె దేవుని తిరస్కరించినది.

దేవుని బహుమానములను పొందడానికి ఉండాల్సిన విశ్వాసము

దేవుని వద్ద మనకివ్వడానికి ఆశ్చర్యకరమయినవి ఎన్నో ఉన్నాయి. ఆయన మనకిచ్చే బహుమానాలన్నీ కృపతో కూడిన బహుమానాలు. కాని వాటి నందుకోవడానికి మనకు విశ్వాసము ఉండాలి.

''విూరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు'' అని దేవుని వాక్యము (ఎఫెసీ 2:8) లో చెప్పబడియున్నది. పరలోకపు ఆశీర్వాదాలతో నింపబడి మన యొద్దకు చాపబడిన,దేవుని హస్తమే కృపయై యున్నది. దేవుని వైపుకు మన చేయి చాపి ఆయన చేతినుండి ఆశీర్వాదాలనందుకోవడమే విశ్వాసము.

దేవుడు మొదటిగా పాపక్షమాపణను మనకిస్తాడు. మనము మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపము పొందిన ఎడల, ఇక మనము చేయవలసిన దంతా మన హస్తాన్ని చాచి దేవుడు ధారాళంగామనకివ్వజూచిన వాటిని అందుకోవడమే. దానికి మనము ఎటువంటి పనిని చేయనవసరం లేదు, వెల చెల్లించనవసరం లేదు. ఇదివరకే కలువరిలో అందుకు తగిన వెల చెల్లించబడియున్నది. ఇప్పుడు మనము చేయవలసినదంతా ''తండ్రీ! మీకు కృతజ్ఞతలు'' అని చెప్పి తీసుకోవడమే. అదే విశ్వాసము.

దేవుడు మనకివ్వదలచిన వాటిని తీసుకోనియెడల మనము నిజంగా ఆయన్ని కించపరచుచున్నాము. ఆయన బహుమానాల్ని తృణీకరించుచున్నాము. కొందరు బహుమానాలు గల తమ చేతుల్ని పిల్లలవైపు చాచి, పిల్లలు వాటిని అందుకొనే సమయానికి ఎలాగైతే తమ చేతుల్ని వెనుకకు లాగేసుకొంటుంటారో, అలాగు దేవుడు మనల్ని విసిగించే వాడని బహుశా మనము అనుకొంటున్నామేమో, దేవుడు అట్టి వారిలా సంకుచిత మరియు దుష్టబుద్ధి గలవాడుకాడు. ఆయన మనల్ని మిక్కిలి ప్రేమించే తండ్రి. మనకు మంచి బహుమతులను ఇవ్వడానికి అపేక్షిస్తున్నాడు.

అందుకే దేవుని వాక్యములో (హెబ్రీ 11:6) నీవు ఎన్ని ఇతర కార్యాలు చేసినా, ''విశ్వాసములేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము'' అని వ్రాయబడియున్నది.

మనము దేవుని విశ్వసించిన ఎడల, ఆయన మన పాపములను క్షమించుటయే గాక, పాపపుశక్తి నుండి కూడా విముక్తి చేయును.

విశ్వాసాన్ని మనము ఎలా పొందగలము? ఒకే ఒక మార్గము ద్వారానే. అది బైబిలు గ్రంధములో వ్రాసిన విధంగా ''వినుట వలన విశ్వాసము కలుగునుబీ వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును'' (రోమా 10:17). మరొక విధముగా చెప్పాలంటే, మనము దేవుణ్ణి, ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడనిస్తే విశ్వాసము పొందగలము. ఇదే విధముగా మన విశ్వాసము కూడా క్రమేపి పెరుగుతుంది.

మన పాపములు నిమిత్తము క్రీస్తు చనిపోయి, తిరిగి లేచినట్లు మరియు మనము మన పాపములకై పశ్చాత్తాపపడి ఆయనను విశ్వసించిన ఎడల సంపూర్ణమైన పాపక్షమాపణ ఉచితముగా వెంటనేదొరుకుతుందని దేవుని వాక్యము ద్వారా మనకు తెలుసు. మరియు ఈ విషయము సత్యమని పరిశుద్ధాత్మ మన హృదయానికి సాక్ష్యమిచ్చును. ఇట్టి దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు అను ఇద్దరు సాక్ష్యుల ద్వారా మనము పూర్తిగా క్షమించబడి, దేవుని బిడ్డల మయినట్లు సంపూర్ణ నిశ్చయత మనకు కలుగుతుంది.

విశ్వాసపు దృఢ నిశ్చయత

దేవుడు, మనము ఆయన పిల్లల మన్న విషయాన్ని గూర్చి గట్టి నిశ్చయం మన హృదయాల్లో కలిగి ఉండాలని, యీ సత్యము విషయంలో ఎన్నటికీ సందిగ్ధ పడకూడదని ఆశించుచున్నాడు.

ఈ విషయంలో మనల్ని అనుమానంలో పడేయటానికి సాతాను శాయశక్తులా కృషి చేస్తాడు. దేవుడు యీ విషయమై తన వాక్యములో ఎన్నో వాగ్దానాలతో రూఢి పరచి యున్నాడు. కాబట్టి మన మెన్నటికీ సందేహపడనవసరము లేదు.

ఒకసారి ఈ క్రింది వాగ్దానాలను గమనిద్దాం.

''నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. ..విశ్వసించువాడే నిత్యజీవము గలవాడని విూతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' (యోహాను 6:37,47) అని యేసు చెప్పెను.

''తన్ను (ప్రభువైన యేసు క్రీస్తును) ఎందరంగీకరింతురో, వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను''' (యోహాను 1:12).

''నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొనను'' (హెబ్రీ 8:12) అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

దేవుని వాగ్దానము లందు విశ్వాసముంచడమనేది ఒక నది ఆవలికి దాటేటప్పుడు గట్టి వంతెన పైన మనకాలిని మోపటాన్ని పోలియున్నది. వంతెన గట్టిది అయితే మన పాదాలు బలహీనమైనా పర్వాలేదు. అయితే బలమైన విశ్వాసమనగా నేమి? దేవుని యందు మరియు ఆయన వాగ్దానముల యందు నమ్మిక యుంచుటయే బలమైన విశ్వాసం.

మన అనుభూతులు సాధారణంగా బహు మోసకరమైనవి. మనము వాటిని ఎన్నటికినీ నమ్మకూడదు. ఒక ఉపమానంతో ముగ్గురు వ్యక్తులను గూర్చి ఇలా చెప్పబడియుంది. వారు సత్యము, విశ్వాసముమరియు అనుభూతి. వీరు కలసి ఒకరివెనుక మరొకరు ఒక సన్నటి గోడపై నడుస్తున్నారు. సత్యము అన్నవాడు ముందు, వానివెనుక విశ్వాసము, మరియు అనుభూతి అనువాడు చివరిగా నడుస్తున్నారు. విశ్వాసమన్న వాడు తన ముందున్న సత్యము వైపు దృష్టి ఉంచినంతసేపూ అంతా సవ్యంగా సాగింది. అనుభూతి అన్నవాడు సరిగ్గా విశ్వాసము వెనుకనే వెంబడించాడు. కానీ ఎప్పుడైతే విశ్వాసమన్న వాడు ఒక్కసారి వెనుకకు తిరిగి అనుభూతి అన్నవాడు ఎలా వెంటవస్తున్నాడో చూద్దామని చూసాడో, వెంటనే అతను దొర్లిపడి ప్రాణం పోగొట్టుకొన్నాడు. వెంటనేఅనుభూతి అన్నవాడు కూడా క్రిందపడి చనిపోయాడు. కాని ఒక్క సత్యము మాత్రము చెక్కు చెదరక గోడపై నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ ఉపమానంలోని సారాంశము స్పష్టముగా తెలుస్తుంది. దేవుని వాక్యము మారని సత్యాలతో కూడినది. మన విశ్వాసము దేవుని వాక్యాన్ని మాత్రమే ధృఢంగా చూసినట్లయితే మనమెన్నటికీ పడిపోవలసిన అవసరముండదు. క్రమేపివాటి సమయంలో అనుభూతులు కూడా చక్కబడుతాయి. కాని మొదట మనము అనుభూతుల వైపు చూచుట ప్రారంభించినట్లయితే, సుళువుగానిరుత్సాహము మరియు శిక్షావిధిలోనికి జారిపడవలసి వస్తుంది.

విశ్వాసపు ఒప్పుకొలు

మనము నమ్మిన దానిని ఒప్పుకొనాలని బైబిలు చెప్తుంది. ''యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును'' (రోమా 10:9,10).

మన నోటితో ఒప్పుకొనడమనేది చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని ఒప్పుకొనడమంటే, దేవుడు చెప్పిన మాటలను చెప్పడం. దేవుని యొక్క వాగ్దానాలన్నింటికిని ''ఆమేన్‌'' (ఆవిధంగా జరుగునుగాక) అని చెప్పడం మనకు కష్టతరం కాకూడదు. ''నమ్మిక యుండుట'' అను మాట లేఖనములలో మొట్టమొదటి సారిగా ఆదికాండము 15వ అధ్యాయములో వాడబడినది. సంతానము లేని దశలో దేవుడు అబ్రాహాముతో ఆకాశంలో నున్న సంఖ్యకు మించిన నక్షత్రాల వలె సంతానమును నీకు కలుగజేసెదనని చెప్పాడు. అందుకు అబ్రాము ''యెహోవాను నమ్మెను'' (6వ వచనం) అని చెప్పబడియున్నది. ఇక్కడ ''నమ్ముట'' అన్న పదానికి హెబ్రీ భాషలో ''ఆమన్‌'' అంటారు. ఈ మాట నుండే మనకు ''ఆమేన్‌'' అను పదము (అవును గాక) వచ్చినది. కాబట్టి అబ్రాము చేసినదంతా దేవుని వాగ్దానానికి ''ఆమేన్‌'' అని పలకడమే.

దేవుని మాటలకు ''ఆమేన్‌'' అని పలకడమే నిజమైన విశ్వాసము.

తరువాత కాలంలో అబ్రాము దేవుడు తనకిచ్చిన క్రొత్త పేరు, అబ్రాహాము (బహుజనాంగములకు తండ్రియని అర్థము)తో తన్ను తాను పిలచుకొన్నట్లు చదువగలము. ఆయన భార్యయైన శారయి అప్పటి కింకను సంతానము లేక ఉన్నది. కాని ఈ విషయము అబ్రాహాముకు ఎటువంటి తేడాను చూపలేదు. అబ్రాహాము యెహోవాను నమ్ముటను బట్టి తన్ను తాను బహుజనాంగములకు తండ్రి అని పిలుచుకొన్నాడు (ఆది.కా. 17:5).

విశ్వాసాన్ని ఒప్పుకొనడమంటే - దేవుని వాగ్దానాల నెరవేర్పును చూడక ముందే ఆయన పలికినది ఒప్పుకొనడమే.

దేవుని వాక్యములో చెప్పబడినదాన్నే మనము చెప్పాలి - దేవుడు మనలను చేయమని చెప్పినదంతా యిదే. దేవుని వాగ్దానాలను మనము నోటితో పలికినపుడు, మనకు దేవునిపై గల విశ్వాసాన్ని వ్యక్త పరుస్తాము. ఆ తరువాతే దేవుడు మన పక్షముగా పనిచేయగలడు. మనమిచ్చే ''సాక్ష్యాన్ని'' బట్టి మనము సాతానును జయించగలము (ప్రకటన 12:11). మనపై నేరాలను మోపే సాతాను మన రక్షణ యొక్క నిశ్చయతను, దేవుని ముందు మనకు గల ధైర్యాన్ని ఎప్పుడూ దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనము, సాతానును జయించాలంటే దేవుని వాగ్దానాలను వానికి నేరుగా తిరిగి చెప్పాలి.

యేసు కూడా తాను పలుమార్లు ''ఇట్లు వ్రాయబడియున్నది ...ఇట్లు వ్రాయబడియున్నది. ఇట్లు వ్రాయబడియున్నది.....''అని లేఖనభాగములను చెప్పి సాతానును జయించాడు (మత్తయి 4:1-11).

దేవుని వాక్యాన్ని మనము సందేహిస్తే మనము ఆయన్ని అబద్దికునిగా చేసినట్లే, కానీ మనము దేవుని వాక్యాన్ని సాతానుతో చెప్పినప్పుడు, సాతానుకును మరియు వాని అబద్దాలకును విరుద్దంగా నిలబడి దేవునికినీ మరియు దేవుని వాక్యము పక్షంగా నిలబడే వారమవుతాము. ఈ విధంగా ఒకప్రక్క మనపరిస్థితులు మరియు మన మనోభావాలు ఏమిచెప్పినా సరే, దేవుడు చెప్పిందే ముమ్మాటికి సత్యమని కూడా మనము సాతాను ఎదుట చెప్పగలము.

విశ్వాసాన్ని ఒప్పుకొనడమంటే యిదే.

అధ్యాయము 3
ఏర్పాటు మరియు నీతిమంతులుగా ఎంచబడుట

దేవుడు తన పిల్లలను ఏర్పాటు చేసుకొనుట మరియు వారిని నీతి మంతులుగా తీర్చుట అనేవి నూతన నిబంధన బోధించే రెండు గొప్ప మహిమకరమైన సత్యములు.

ఏర్పాటు

దేవుడు తన భవిష్యత్‌ జ్ఞానమును బట్టి మనలను ఆయన పిల్లలుగా ఎన్నుకొన్నట్లు బైబిలు గ్రంధములో చెప్పబడియున్నది (1 పేతురు 1:1,2), అనగా నిత్యత్వమునకు పూర్వము నుండి ఎవరు ఆయన పిల్లలగుదురో ఆయనకు బాగుగా తెలుసు.

''జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను'' అని బైబిలు గ్రంధము (ఎఫెసీ 1:4) చెబుతుంది. ఇంకను ఆదాము సృష్టింపబడక పూర్వమే ఆయన బిడ్డలుగా మనలను పేరుపేరున ఎరిగియున్నాడు. మరియు మనపేర్లు ''జీవగ్రంధము'' లో వ్రాయబడి యున్నవి (ప్రకటన 13:8).

ఇవన్ని మనకు అత్యంత భద్రత నిచ్చే సత్యాలు.

మనము నిలువబడిన దేవుని పునాదికి రెండు విధాల ముద్ర ఉన్నదని బైబిలు చెబుతుంది. దేవుని వైపు నుండి చూస్తే ''ప్రభువు తనవారిని ఎరుగును'' అని మానవుని వైపు నుండి చూస్తే ''ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను'' అని వ్రాయబడియున్నది (2 తిమోతి 2:19).

జగత్తు పునాది వేయబడక ముందే దేవునికి తన పిల్లలెవరో తెలియును. కాని మనకు, నిజముగా మన పాపములకై పశ్చాత్తాపము పొంది, ఆయన తట్టు తిరిగినప్పటినుండి ఆయన పిల్లలమని తెలియును. మన పరిమితమైన మనస్సుకు దేవుడు తన పిల్లలను ఎలా ఎన్నిక చేసుకుంటాడో, అయినప్పటికీ దేవుడు మనిషికి తనను ఎన్నుకోవాలా? లేదా అనే స్వేచ్ఛను కూడా ఇస్తాడు. ఇవి మన ఆలోచనకు అందని, కలుసుకొననివిగా కనబడేటటువంటి రెండు సమాంతర రేఖలను పోలియున్నవి. అయితే గణిత శాస్త్ర నిర్వచనము అనుసరించి అవి అనంతంలో కలుస్తాయి - అంటే అనంతమైన దేవుని మనస్సులో కలుసుకొంటాయి.

ఒకరు దీన్ని ఇలా వ్యక్త పరిచారు. మీరు జీవితబాటలో నడక సాగిస్తున్నపుడు, ''ఎవరైతే పశ్చాత్తాపము పొంది క్రీస్తును నమ్ముదురో వారు లోనికి ప్రవేశించి, నిత్యజీవము పొందవచ్చును'' అని వ్రాయబడిన మాటలు గల తెరచిన ద్వారము ఒకరోజు మీకు కనిపించింది. మీరు లోనికి ప్రవేశించారు. ఆపై వెనుదిరిగి చూచినపుడు ''లోకపు పునాది వేయబడక ముందే దేవుడు మిమ్మును క్రీస్తులో ఎన్నుకొనెను,'' అన్న మాటలు అప్పుడే ప్రవేశించిన తలుపుపై వ్రాసియుండుట చూచారు.

నీతిమంతులముగా ఎంచబడుట

పాపక్షమాపణ గతమును గురించిన అపరాధ భావమును తీసివేయును. కానీ ఇది మనలను పూర్తిగా పరిశుద్ధ పరచదు. అందును బట్టి మనము సంపూర్ణ పరిశుద్దుడయిన దేవుని యెదుట ఇంకను నిలబడలేము. అందుకు దేవుడు మనకింకా కొంత చేయవలసి వచ్చినది. అది ఆయన మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చాల్సి వచ్చింది. నీతిమంతులుగా తీర్చబడటమంటే దేవుడు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన నీతిని మన లెక్కలో వేయడం. దీని ఫలితం దేవుని యందు ఎట్టి కల్మషములేని క్రీస్తు వలె యుండగలుగుట! ఇది మనకు ఆశ్చర్యము కలిగించే సంగతే! అది సత్యము. ఇది ఒక బిక్షగాని పేరున బ్యాంక్‌ ఖాతాలో కోట్లకొలది డబ్బును వేసినట్టి విషయము. అది అతడు సంపాదించినది కాదు మరియు అంతటి ధనానికి పాత్రుడును కాదు కాని ఆ బిక్షగానికి ఆ డబ్బు ఒక ఉచిత బహుమతిగా ఇవ్వబడింది.నీతిమంతులుగా తీర్పు తీర్చబడటమంటే మన గడచిన జీవితములో ఎన్నడూ పాపము చేయనట్టు మరియు ప్రస్తుత జీవితంలో పూర్తిగా నీతిమంతులుగా దేవుని చేత అంగీకరింపబడటము.

''విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడితిమి కాబట్టి, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలచియుందుము'' అని (రోమా 5:1,2) దేవుని వాక్యములో చెప్పబడియున్నది. ఇప్పుడు మనము దేవుని సన్నిధికి ఏ సమయంలోనైనా ఎటువంటి భయము, సందేహము లేకుండా ధైర్యంగా వెళ్ళగలము. దేవుడే దానికి తగిన ద్వారమును తెరచి ఉంచాడు.

ఏదేను తోటలో, ఆదాము హవ్వలు పాపము చేసిన వెంటనే తప్పుచేసామని తెలుసుకుని సిగ్గుతో అంజూరపు ఆకులతో తమ్ము తాము కప్పుకొనిరి. దేవుడు వారు కప్పుకున్న అంజూరపు ఆకులకు బదులు, ఒక జంతువును చంపి, దాని చర్మాన్ని వస్త్రములుగా వారికి ధరింపజేసాడు. ఆ అంజూరపు ఆకులు మనము చేసే మంచి కార్యములను పోలినవి. అంజూరపు ఆకుల వలె, మన మంచి కార్యాలు మన దిగంబరత్వాన్ని దేవుని ఎదుట కప్పజాలవు. ఎందుకనగా ''మనము చేసే నీతిక్రియలన్నియు కూడా దేవుని దృష్టిలో మురికిగుడ్డవలె నాయెను'' అని (యెషయా 64:6) బైబిలు గ్రంథములో వ్రాయబడియున్నది. వధింపబడిన ఆ జంతువు మన పాపములకై చనిపోయిన క్రీస్తును పోలియున్నది. జంతు చర్మము మనము కప్పుకొనుటకై దయచేయబడిన క్రీస్తు యొక్క పరిపూర్ణమైన నీతిని పోలియున్నది (ఆది.కా. 3:7,21).

నీతిమంతులుగా తీర్చబడుట దేవుని ఉచితమయిన బహుమతి. వారి స్వకార్యములను బట్టి ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్పు తీర్చబడలేదు. కావున ''దేవుని చేత నీతిమంతులముగా తీర్పు తీర్చబడడానికి నీతి కార్యములు చేయప్రయత్నిద్దాం'' అని చెప్పుట ఒక విపరీతమైన పొరపాటు.ఇక్కడ దీనికి వ్యతిరేకంగా మరొక విపరీతమైన తప్పుకూడా ఉంది. అది ''మనము దేవుని చేత ఎంపిక చేయబడి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడితిమి కావున ఇప్పుడు మనము పాపము చేసినా పరవాలేదు'' అనడం. ''దేవుడు మమ్ములను ఏర్పాటు చేసుకుని, నీతిమంతులుగా తీర్పుతీర్చాడు'' అన్న ఆలోచనతో పాపమును తేలికగా తీసుకునే వారు, దేవుడు ఎన్నుకొనిన జనాంగములో ఏ మాత్రము ఉండరన్న సంగతి సులువుగా ఋజువవుతుంది (యాకోబు 2:24 తో రోమా 4:5 ను పోల్చండి).

ఒకసారి మనము దేవుని చేత ఎంపిక చేయబడి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడితిమన్న నిశ్చయత, సాతాను యొక్క నేరారోపణ మనపై ఎటువంటి ప్రభావము లేకుండా చేస్తుంది. ''దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధి యెవడు?'' (రోమా 8:31). దేవునిచేత మనము తృణీకరించబడ్డాం లేక శిక్షావిధిలోకి తేబడ్డాం అని మన జీవితంలో మరెప్పుడూ మనము అనుకోవాల్సిన అవసరం లేదు.

''దేవునిచేత ఏర్పరచబడిన వారివిూద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే'' (రోమా 8:33) హల్లెలూయ!

ఇది సువార్త యొక్క శుభవార్త! ఎంతో మంది విశ్వాసులు తాము దేవునిచేత ఎంపిక చేయబడి నీతిమంతులుగా తీర్పు తీర్చ బడ్డారన్న సత్యాన్ని సాతాను తెలుసుకోకుండా చేశాడు అనడములో ఎటువంటి ఆశ్చర్యము లేదు.

అధ్యాయము 4
శిష్యత్వము

క్రీస్తు తన శిష్యులతో ''విూరు వెళ్ళి, సమస్తజనులను శిష్యులనుగా చేయుడి'' అని చెప్పినపుడు వారికి ఆయన మాటలలో అర్థము పట్ల ఎలాంటి సందేహము కలుగలేదు (మత్తయి 28:19). ఎందుకనగా తన శిష్యులుగా ఉండుటయన్న దానిని గూర్చి ఆయన వారికి ముందుగానే తెలియజెప్పియున్నాడు.

శిష్యత్వమునకు కావలసిన మూడు షరతులను (లూకా 14:25-35) వాక్య భాగము స్పష్టంగా తెలియపరచుచున్నది. ఒకడు గోపురం కట్టడానికి పునాది వేసి, దాని నిర్మాణానికి కావలసిన ధనం చెల్లించలేక, కట్టడం పూర్తి చేయని విషయాన్ని యేసు 28-30 వచనాల్లో తెలియజేసియున్నాడు. అంటే శిష్యునిగా ఉండుట కొంత విలువతో కూడినదని రుజువవుతుంది.

నిర్మాణము మొదలు పెట్టకముందే దానికయ్యే ఖర్చును ముందుగా కూర్చొని లెక్క వేయవలసినదిగా యేసు చెప్పాడు. శిష్యరికమంటే ఏమిటో నిజంగా తెలుసుకోవడానికి, మన పాపములు క్షమింపబడిన తరువాత చాలా సంవత్సరములు వేచియుండుట దేవునికి ఇష్టం లేదు. క్రీస్తు తన దగ్గరకు వచ్చిన వారికి వెంటనే, శిష్యులు కావటానికి చెల్లించవలసిన వెల ఏమిటో తెలియజేసాడు.

విశ్వాసిగా ఉండి, శిష్యునిగా ఉండుటకు ఇష్టపడని వారు రుచిని పోగొట్టుకొన్న ఉప్పువలె దేవునికి ఎందుకూ పనికిరాని వారని క్రీస్తు చెప్పియున్నాడు (లూకా 14:35).

బంధువులను ''ద్వేషించుట''

శిష్యత్వమునకు కావలసిన మొదటి షరతు, మన బంధువులపై మనకు ఉండే మితిమీరిన సహజమైన ప్రేమనుండి తెగతెంపులు చేసికోవడం. ''ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు'' (లూకా 14:26) అని క్రీస్తు చెప్పియున్నాడు.

అవి చాలా కరినమైన మాటలు. అసలు 'ద్వేషించుట' అంటే అర్థమేమిటి? ద్వేషించడమంటే చంపుటతో సమానము (1 యోహాను 3:15). మన బంధువులపై మనకు ఉండే సహజ ప్రేమను చంపివేయాలని మనకు ఇక్కడ చెప్పబడియున్నది. వారిని ప్రేమించకూడదనా దీనర్థం? కాదు. ఖచ్చితంగా దానర్థం ప్రేమించకూడదని మాత్రం కాదు. మనము మన బంధువులపై మానవ సంబంధమైన అప్యాయతను విడనాడినప్పుడు దేవుడు అదేస్థానంలో దైవ సంబంధమైన ప్రేమతో (దేవుని ప్రేమతో) భర్తీ చేయగలడు. మన బంధువులపై మనకు గల ప్రేమ అప్పుడు పవిత్రం కాగలుగుతుంది-మన అభిమానం మన బంధువులపై కాక మొట్టమొదటిగా దేవునిపైనే ఉంటుంది.చాలా మంది వారి తల్లిదండ్రులు లేక వారి భార్యలు మొదలగువారిని అభ్యంతరపరచుటకు భయపడుట వలన దేవునికి లోబడుట లేదు. దేవునికి మన జీవితాల్లో మొదటి స్థానమివ్వాలని దేవుడు కోరుచున్నాడు. మనము ఆ మొదటి స్థానం ఆయనకివ్వనట్లైతే, మనము ఆయన శిష్యులుగా ఉండలేము.

క్రీస్తు మాదిరినే చూద్దాం. క్రీస్తు తన జీవితాంతము వరకు, విధవరాలయిన తన తల్లి బాగోగులను చూసినప్పటికిని, పరలోకమందున్న తన తండ్రి పరిపూర్ణ చిత్త ప్రకారం నడుచుటలో చిన్న విషయాల్లో కూడా తన తల్లి ప్రభావమునకు ఏమాత్రం లోను కాలేదు. కానా పెండ్లి విషయంలో యేసు తన తల్లి చెప్పిన మాటల ప్రకారం చేయటానికి అంగీకరించని సన్నివేశమును దీనికి ఉదాహరణంగా చూడవచ్చు (యోహాను 2:4). దేవునిలో మన సహోదరులను ఎలా ''ద్వేషించా''లో కూడా యేసు నేర్పియున్నాడు. యేసు సిలువ మరణ విషయంలో పేతురువైపు తిరిగి ఎప్పుడూ పలుకని కరిÄనమైన మాటలతో గద్దించాడు. యేసు, పేతురుతో, ''సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావని'' అన్నాడు (మత్తయి 16:23). మిక్కుటమైన శరీర సంబంధమైన ప్రేమతో పేతురు ఈ సలహాను యేసుకు ఇచ్చాడు. కానీ పేతురు ఇచ్చిన ఈ సలహా తన తండ్రి చిత్తానికి విరుద్దంగా ఉన్నందున పేతురును గద్దించెను.

క్రీస్తు యొక్క అనురాగాల్లో అత్యున్నతమైనవాడు తన పరలోకపు తండ్రి. మనము కూడా ఇదేవిధమైన వైఖరిని కలిగియుండాలని ఆయన ఆశిస్తున్నాడు. క్రీస్తు తాను పునరుత్థానము అయిన తరువాత పేతురుతో, ''లోకములోని అన్నింటికన్న నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?'' (యోహాను 21:15-17) అని అడిగాడు. ఎవరైతే దేవుని అత్యున్నతంగా ప్రేమిస్తారో అట్టివారికే దేవుని సంఘంలో తగిన బాధ్యతలు ఇవ్వబడతాయి.

ఎఫెసీ సంఘ కాపరి తన మొదటి (ప్రేమ) భక్తిని పోగొట్టుకొనుటను బట్టి తాను దేవుని చేత తృణీకరించబడేె అపాయంలో ఉండెను (ప్రకటన 2:1-5).

కీర్తనల గ్రంధకర్త అన్నట్టు ''ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు'' (కీర్తన 73:25) అని మనము కూడా అనగలిగితే శిష్యత్వానికి కావలసిన మొదటి నియమాన్ని ఆచరించినట్టవుతుంది. క్రీస్తు మననుండి కోరే ప్రేమ - మన ప్రేరణ కలుగజేసే భక్తి పాటలలో కనపరచే ఉద్రేకము, భావోద్వేగము లేక మానవ ప్రేమలతో కూడినది ఏ మాత్రము కాదు. మనము ఆయనను ప్రేమించినట్లయితే ఆయనకు లోబడుతాము (యోహాను 14:21) .

మన స్వంత ప్రాణమును ద్వేషించుట

శిష్యత్వానికి కావలసిన రెండవ షరతు, మన స్వంత ప్రాణమును సహా ద్వేషించడం. ''ఎవడైనను తన స్వంత ప్రాణమును సహా ద్వేషించకుండా నా యొద్దకు వచ్చిన యెడల, నా శిష్యుడు కానేరడు'' (లూకా 14:26) అని క్రీస్తు చెప్పియున్నాడు. ఈ మాటలనే వివరిస్తూ (లూకా 14:27)లో ''ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు'' అని చెప్పియున్నాడు. ఇది క్రీస్తు చేసిన బోధలన్నింటిలోను అతి తక్కువగా అర్థం చేసుకున్న విషయం.శిష్యుడన్నవాడు ''తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను'' (లూకా 9:23) అని క్రీస్తు చెప్పియున్నాడు. మనము దేవుని వాక్యాన్ని చదవడానికన్నా, అనుదినం ప్రార్ధన చేయడం కన్నా మనలను మనము ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువను మోస్తుండాలి. మన స్వంతమును ఉపేక్షించడమంటే, ఆదాము నుండి మనకు సంక్రమించిన మన స్వంత జీవమును ద్వేషించడం. సిలువను మోయడమంటే ఆ స్వంత జీవమును చంపివేయడం. ఆ జీవమును చంపకముందు మొదటగా ద్వేషించగలగాలి.

మన స్వజీవము క్రీస్తు జీవమునకు ముఖ్య విరోధి. దేవుని వాక్యము ఇటువంటి జీవమును 'శరీరము'గా సూచిస్తుంది(పిలుస్తుంది).

మన శరీరమన్నది మనలో ఉండే అన్ని విధాలయిన దురాశలకు నిధి. ఈ దురాశే మన స్వలాభం, మన ఆత్మ గౌరవం. మన స్వంత సుఖం మన స్వంత మార్గాన్ని చూచుకోవడానికి శోధిస్తుంది.మనము యదార్థముగా ఒప్పుకొన్నట్లయితే మనము చేసే ఎంతో మంచి కార్యాలు కూడా మన భ్రష్టమయిన దురాశలనుండి ఏర్పడిన దుష్ట ఉద్దేశాలను బట్టి కల్మషం అయ్యాయని ఒప్పుకోక తప్పదు. మనము ఈ శారీరక స్వభావాన్ని ద్వేషించక పోయినట్లయితే ప్రభువును వెంబడించలేము.

ఇందుకే యేసు మన ప్రాణాన్ని ద్వేషించడం (పోగొట్టుకొనడం) గూర్చి మరింతగా చెప్పాడు. నిజానికి ఇదే వాక్య భాగము సువార్తలలో ఆరుసార్లు (మత్తయి 10:39; 16:25, మార్కు 8:35, లూకా 9:24; 14:26, యోహాను 12:25) మళ్ళీ మళ్ళీ చెప్పబడింది. మన ప్రభువు మాటలలోఈ మాట సువార్తలలో పలుసార్లు చెప్పబడింది. అయినప్పటికిని ఇది అతి తక్కువగా బోధింపబడే మరియు అతి తక్కువగా అర్థం చేసుకొన్నట్టి విషయం!

మీ స్వంత ప్రాణాన్ని ద్వేషించడమంటే - మీకున్న హక్కులను, ఆధిక్యతలను వదులుకోవడం, కీర్తి పొందటానికి తాపత్రయపడకుండా ఉండడం, మీ కోరికలను ఇష్టాలను విడిచిపెట్టడం, మీ స్వంత మార్గాలలో వెళ్లుటను ఆపివేయడం, మొదలగునవి. ఇలాంటి మార్గంలో పోవడానికి అంగీకరిస్తేనే, నీవు యేసుకు శిష్యుడవు కాగలవు.

మన ఆస్తులన్నింటిని వదులుకొనుట

శిష్యత్వానికి కావలసిన మూడవ షరతు - మనకు కలిగిన స్వంత ఆస్తులనన్నిటిని వదులుకొనడం. ''విూలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు'' (లూకా 14:33) అని యేసు చెప్పాడు. మనకు కలిగినవన్నీ అంటే మనకు సొత్తుగా ఉన్నవన్నీ, వాటిని విడచిపెట్టడమంటే మన మెప్పటికినీ అవి మనకు చెందినవని అనుకోకూడదు.

మనము అబ్రాహాము జీవితంలో దీనికి సంబంధించిన ఒక సాదృశ్యంను చూడవచ్చు. ఇస్సాకు అతని సొంత కుమారుడు, అనగా అతని సొత్తు. ఒకరోజు దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని అతనిని కోరాడు. అందుకు అబ్రాహాము ఇస్సాకును బలిపీఠము మీద పెట్టి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాని దేవుడు అడ్డుపడి, తన మాటకు లోబడుటలో గల సిద్ధపాటే చాలునని, బలి అక్కరలేదని అతనితో చెప్పాడు (ఆది.కా. 22) ఆ తరువాత అబ్రాహాము, ఇస్సాకును తన ఇంటిలో కలిగియున్నప్పటికినీ తన సొత్తుగా ఎంత మాత్రము ఎంచలేదు. ఇస్సాకు

మన ఆస్తులన్నింటినీ వదులుకోవడమంటే ఇదే. మనకు కలిగినదంతా బలిపీఠము మీద ఉంచి దేవునికి అర్పించాలి.

దేవుని అర్పణగా చెల్లించిన వాటిలో కొన్నింటిని మనము వాడుకొనడానికి అనుమతించవచ్చును. కాని ఎన్నటికినీ అవి మన స్వంతమైనవని తలంచకూడదు. ఒకవేళ మనము మన స్వంత గృహములోనివాసమున్నప్పటికినీ అది దేవునికి చెందిన గృహంగా, అందులో అద్దె చెల్లించనవసరం లేక నివాసం చేయడానికి దేవుని నుండి అనుమతి పొందినట్లుగా ఎంచుకోవాలి. ఇదే నిజమైన శిష్యత్వమంటే.

మన ఆస్తులనన్నింటితో పైన చెప్పిన విధంగా చేశామా?మనము నిజమైన శిష్యులుగా ఉండాలనుకుంటే, మనకు చెందిన వాటిలో, మన బ్యాంకు నిలువ, ఆస్తి, ఉద్యోగం, అర్హతలు, బహుమానాలు మరియు మన సామర్థ్యము, భార్య మరియు పిల్లలు ఇంకా మనము భూమిపై విలువ ఇచ్చే వాటినన్నింటిని బలిపీఠము పైన అర్పించాలి.మనము ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే (మత్తయి 5:8)లో చెప్పబడిన ''హృదయశుద్ధి'' యొక్క అర్థము. ఒక్క మనస్సాక్షి నిర్మలముగా ఉండడమే సరిపోదు. మనస్సాక్షి నిర్మలంగా ఉండటమంటే పాపాన్ని విడచిపెట్టడం మాత్రమే. కాని అన్నింటిని విడచిపెట్టేదే శుద్ధ హృదయం!

కాబట్టి నిజమైన శిష్యత్వమంటే

 1. మన బంధువులు మరియు మనము మిక్కిలిగా ప్రేమించేవారు.
 2. మన స్వజీవము మరియు.
 3. మన ఆస్తులపై మన వైఖరిలో తీవ్రమైన మార్పు రావాలి.

ఇలాంటి అంశాలన్నింటిని మన క్రైస్తవ జీవితారంభంలోనే సక్రమంగా చక్కబెట్టుకొనకపోయినచో గట్టిపునాది వేయడం అసాధ్యమవుతుంది.

అధ్యాయము 5
నీటి బాప్తిస్మమునీటి

యేసు పరలోకమునకు ఆరోహనమయ్యే ముందు తన శిష్యులకు ఆజ్ఞాపించిన చివరి మాటలు:

 1. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.
 2. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇయ్యుడి.
 3. నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.

ఇక్కడ వరుస క్రమము చాలాముఖ్యము. ఎవరైతే శిష్యులు అవడానికి యిష్టపడుదురో వారికే బాస్తిస్మము ఇవ్వాలి. మరెవ్వరికి కాదు.

చిన్న బిడ్డలను యేసు వద్దకు తీసుకొని వచ్చినపుడు, ఆయన వారి తలలపై తన చేతులుంచి ఆశీర్వదించెను (మార్కు 10:13-16) చూడండి. కాని మారుమనస్సు పొందిన స్త్రీ, పురుషులు(పెద్దవారు) ఆయన యొద్దకు వచ్చినపుడు తన శిష్యులు ద్వారా వారికి బాప్తిస్మము ఇచ్చెను (యోహాను 4:1,2) చూడండి.

అయితే ఈనాడు మనము అనేక ''సంఘము'' లలో చూచేదేమిటి? సరిగ్గా వ్యతిరేకమయినది. అది పసిబిడ్డలు బాప్తిస్మము పొందడము మరియు పెద్దల తలలపై చేతులుంచడము (ధృవీకరించడము)! ఇది సరిగ్గా యేసు చేసిన దానికి వ్యతిరేకమయినది.

పెంతెకొస్తు దినాన, చాలామంది వారివారి పాపములను బట్టి ఒప్పింపబడినప్పుడు, పేతురు వారితో 'మారుమనస్సు పొంది, బాప్తిస్మము పొందుడి' అని చెప్పెను. ''ఆయన వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి'' అని లేఖనములలో చెప్పబడియున్నది (అపొ.కా. 2:38,41). కాబట్టి వివేకముతో దేవుని వాక్యాన్ని గ్రహించగలిగి, పశ్చాత్తాపాన్ని పొందిన వారే బాప్తిస్మము పొందిరి అని స్పష్టంగా తెలుస్తుంది.

ఆ ప్రకారమే ప్రతి ఒక్క సంఘటన కూడా 'అపొస్తలుల కార్యముల'లో లిఖింపబడియున్నది.

బాప్తిస్మము అనగా అర్థమేమిటి?

బాప్తిస్మము యొక్క అర్థాన్ని (రోమా 6:1-7) చాలా స్పష్టంగా విశదీకరిస్తుంది. అక్కడ ''మన ప్రాచీన పురుషుడు (స్వభావము) క్రీస్తుతో కూడ సిలువ వేయబడెనని, మరియు బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి'' అని చెప్పబడియున్నది. ప్రాచీన స్వభావమంటే, మనము అన్యులుగా ఉన్న దినాల్లో పాపము చేయడానికి ఇష్టపడే మనస్సు. అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నది (రోమా 6:6).

ఈ సత్యములో జీవించకముందు దానిని మొదట మనము అర్థము చేసుకొనవలసిన అవసరము లేదు. దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని అలాగే నమ్మవచ్చు. దేవుని వాక్యము ''క్రీస్తు కలువరి కొండపైన సిలువవేయబడ్డాడు'' అని చెప్పినపుడు మనము ఎలా నిస్సందేహంగా నమ్ముతామో అలానే దేవుని వాక్యము ''మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినది'' అని చెప్పినపుడు నమ్మాలి. ఈ రెండు సత్యాలు విశ్వాసముతో అంగీకరించవలసినవి. ప్రాచీన పురుషుడు మరియు శరీరము ఒక్కటి కావు. శరీరమన్నది దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచే మనలోని దురాశలన్నింటిని భద్రపరిచే కొట్టులాంటిది. మనమంతా చనిపోయే దినము వరకు మోస్తూ ఉండాలి.

శరీరాన్ని మన గృహంలో ప్రవేశింపదలచిన ఒక దొంగల ముఠాతో పోల్చవచ్చు. ప్రాచీన స్వభావము ఎల్లప్పుడు దొంగలు ప్రవేశించడానికి తలుపు తెరచి సిద్ధంగా ఉన్న మన గృహములోని అపనమ్మకమైన సేవకుని లాంటిది. ఇపుడు చంపబడుతున్నది ఈ అపనమ్మకమయిన సేవకుడే. దొంగలు ఎటూ క్షేమంగాను, ఆరోగ్యంగాను ఉంటారు. మరి ప్రస్తుత నూతన స్వభావమనేది దొంగలు చొరపడకుండా తలుపులు మూసి ఉంచే నూతన సేవకుని లాంటిది.

బాప్తిస్మము నందు, మన ప్రాచీన స్వభావము (పాపము చేయు కోరిక) యొక్క మరణము మరియు పాతిపెట్టబడుట గూర్చి మరియు ''నూతనజీవము పొందిన వారమై నడచుకొనునట్లు'' మనము క్రీస్తుతో పాటు మృతులలోనుండి లేపబడితిమని (రోమా 6:4) సాక్ష్యమిస్తున్నాము.

నోవహు దినములలోని వరద కూడా ఒకలాంటి బాప్తిస్మమే (1పేతురు 3:20,21). దేవుడు ఆ జల ప్రవాహము ద్వారా సర్వ ప్రపంచాన్ని నాశనం చేశాడు. నోవహు ఓడలోనికి ప్రవేశించి దాని ద్వారా ఒక సరిక్రొత్త ప్రపంచము లోనికి రాగలిగాడు. మునుపటి ప్రపంచము అందులోని సమస్త జీవరాశి కూడా జలప్రవాహము క్రింద పాతిపెట్టబడినది. ఇదే విధంగా మనము లోకములోని పాత సంబంధములు (ఈ లోక వైఖరి మరియు ఈలోక స్నేహితులు మొదలగునవి) తెగతెంపులు చేసుకొంటూ, నీటిలో నుండి వెలుపలికి ఒక నూతన ప్రపంచము లోనికి రాగలగాలి. ఇదే మనము బాప్తిస్మము నందు ఇచ్చే సాక్ష్యము.

బాప్తిస్మపు తీరు

మనమిపుడు ''బాప్తిస్మము ఎలాపొందాలి'' అన్న ప్రశ్నకు వచ్చాము. ''బాప్తిస్మము'' అన్న మాట సహజంగా ఆంగ్లపదము కాదు. నూతన నిబంధన మొదట గ్రీకు భాషలో వ్రాయబడింది. ''బాప్తిస్మము'' అన్న పదము గ్రీకు పదమయిన 'బాప్టో' నుండి వచ్చింది. బాప్టో అనగా నీటి (ద్రవము)తో పూర్తిగా కప్పబడటం లేక ముంచడం అని అర్థము. ఇదే అవగాహన (నీటిలో ముంచడం) అది అపొస్తలులకు కూడా ఉండేది. మరి ఎవరి తలపైనైనా నీటి చిలకరింపు నిస్సందేహంగా బాప్తిస్మము కాదు.

ఫిలిప్పు ఐతియోపీయుడైన నపుంసకునికి బాప్తిస్మము ఇచ్చినపుడు ''ఇద్దరును నీళ్లలోనికి దిగిరి...మరియు వారు నీళ్ళలోనుండి వెలుపలికి వచ్చిరి'' (అపొ.కా. 8:38,39) అని వ్రాయబడియున్నది. యేసు క్రీస్తు బాప్తిస్మము తీసుకొన్న సందర్భంలో కూడా, బాప్తిస్మము తీసుకొన్న తర్వాత 'ఆయన నీళ్ళలోనుండి వెలుపలికి వచ్చెను' అనే మాటలనే చదువుతాము (మార్కు 1:10).

క్రొత్త నిబంధనలో బాప్తిస్మము ఎప్పుడు ముంచడం వల్లనే జరిగినది. బాప్తిస్మమన్నది పాతిపెట్టబడుట లాంటిది. కనుక ముంచుటే ఈ కార్యానికి ఖచ్చితమైన మాదిరి అవుతుంది. మనము ఇసుకను తలలపైన చిలకరించుట వలన ఏ మాత్రము పాతిపెట్టలేము. కాని వారిని పూర్తిగా భూస్థాపన చేయడం వలనే ఇది జరుగుతుంది.

ఎవరిలో అయితే ప్రాచీన పురుషుడు మృతి చెందుతాడో ఎవరైతే ఇకపై పాపము చేయనని కృతనిశ్చయం చేసుకుంటారో అట్టివారే బాప్తిస్మానికి అర్హులు అని దీనిద్వారా స్పష్టమవుతుంది. చనిపోయిన వారిని మాత్రమే పాతిపెట్టగలము కదా! కాని మృతి చెందని వారిని భూస్థాపన చేయడం ఒక నేరం!

మూడు పేర్లతో మిళితమైయున్న బాప్తిస్మము

''తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మమివ్వవలెనని'' (మత్తయి 28:19) యేసు మనకు ఆజ్ఞాపించెను. దేవుడు ఒక్కడే గనుక ఇక్కడ నామము ఏకవచనమైయున్నది. కానీ దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన ముగ్గురు వివిధ వ్యక్తులలో, ఒకరికి భిన్నంగా ఒకరు ఉన్నారని యేసు బయల్పరచియున్నాడు.

మన పాపముల కొరకు చనిపోయినది తండ్రి లేక పరిశుద్ధాత్మ కాదు గాని, కుమారుడు మాత్రమే. యేసు పరలోకమునకు ఆరోహణమయినపుడు తాను తండ్రి యొక్క కుడి పార్శ్యమున ఆసీనుడైనాడు కాని, పరిశుద్ధాత్మాయొక్క కుడి పార్శ్యమున మాత్రం కాదు. ఇలాగే, తాను శిష్యులకు సహాయ కర్తగా ఉండటానికి పంపినది పరిశుద్ధాత్మనే గాని, తండ్రిని కాదు. ఇవన్నీ ప్రాథమిక విషయాల్లా అనిపించినప్పటికి దేవునిలో గల ఈ త్రిత్వాన్ని, మన విమోచనలో వారికి గల ఏకైక ఔన్నత్య పరిచర్యలను బట్టి మనము కలవరము చెందకుండా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది.

అపొస్తలుల కార్యములలో వారు ప్రజలకు క్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చుచుండిరని (అపొ.కా. 2:38 మొదలగునవి) మనము అనేక పర్యాయములు చదువగలము. (మత్తయి 28:20) లోని క్రీస్తు యొక్క ఆజ్ఞతో ఇది ఎలా ఏకీభవిస్తుంది?

దేవుని వాక్యమందు స్పష్టంగా రెండు విరుద్ధమైన వివరణలుండుట కనబడినపుడు మనము వాటిని జాగ్రత్తగా ధ్యానించినపుడు రెండు వివరణలు సత్యమైనవిగా చూడగలుగుతాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు అన్యసంబంధమైన త్రిత్వము కాదని తేట తెల్లపరచడానికి, అపొస్తలులు కుమారిని యేసు క్రీస్తుగా గుర్తించిరి. అందునుబట్టి వారు ప్రజలను''తండ్రి యొక్కయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్కము నామములోనికి'' బాప్తిస్మమిచ్చిరి. ఇది క్రీస్తు నామము పేరిట బాప్తిస్మమని పిలువబడినది.

విశ్వాసమునకు విధేయత చూపడం

శిష్యుని జీవితంలో బాప్తిస్మమన్నది విధేయతకు మొదటి మెట్టయి ఉండాలి. అదే జీవితాంతం విధేయతలో కొనసాగడానికి దారితీస్తుంది. ఈ విధేయత విశ్వాసమునకు విధేయతేగాని, హేతువునకు మాత్రం కాకూడదు.

యేసు తన సొంత హేతువు(స్వబుద్ధి) పైన ఆధారపడి ఉండినట్లయితే, తాను బాప్తిస్మము కొఱకు బాప్తిస్మమిచ్చు యోహాను వద్దకు వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే తన హేతువు తనకు ఎన్నో కారణాలను చూపి ఉండేది. అందులో యేసు ఎన్నడైనను పాపము చేయలేదు గనుక యోహాను కూడా, యేసుకు బాప్తిస్మము ఎందుకు అవసరమో, సరిగా అర్థం కాలేదు. కాని యేసు హేతువాదాన్ని ప్రక్కనుంచి, పరిశుద్ధాత్మ స్వరానికే లోబడినాడు (మత్తయి 3:15).

''నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక, నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము'' (సామెతలు 3:5) అని దేవుని వాక్యము చెప్పుచున్నది. మనుష్యుని హేతువు ఆత్మీయ సత్యాలను అర్థం చేసుకోలేదు గనుక హేతువన్నది విశ్వాసానికి మొట్టమొదటి శత్రువయి ఉన్నది.మనము బాప్తిస్మము తీసుకునేటప్పుడు మన శరీరంలో తలపై భాగము చివరిగా నీళ్ళలోనికి వెళ్తుంది. ఇది ఒక సాదృశ్యమైయున్నది! మనలో భాగమై యున్నహేతువు యొక్క అధికారమును చంపుట చాలా కష్టతరము! ఆదాము సంతతి, వారి హేతువు ఏమి చెబుతుందో దాన్ని అనుసరించి జీవిస్తారు. బాప్తిస్మమందు మనము ''అటువంటి జీవన విధానమునకు (మన స్వబుద్ధిపైన ఆధారపడే జీవనము) చనిపోతిమని మరి ఇప్పుడు మనము దేవుని నోటనుండి వచ్చుప్రతి మాటపైన విశ్వాసముంచి జీవిస్తామని సాక్ష్యమిస్తాము'' (మత్తయి 4:4, రోమా 1:17) .

కొంతమంది క్రైస్తవులు బాప్తిస్మము అంత ప్రాముఖ్యము కాని విషయముగా ఎంచుదురు. నయమాను తన కుష్టురోగము మానుటకు మొదటగా ఎలీషా ఆజ్ఞ ప్రకారం యోర్దాను నదిలో ఏడుమార్లు మునుగుటకు తిరస్కరించాడు. కాని అతడు ఆ చిన్న ఆజ్ఞను శిరసావహించినప్పుడే పూర్తిగా స్వస్థత పొందినాడు (2 రాజులు 5:10-14) దేవుడు ఇలా స్వల్ప విషయాల్లో మన విధేయతను పరీక్షిస్తాడు.

దేవునికి విధేయత చూపడంలో ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. మీ ప్రాచీన స్వభావము నిజముగా చనిపోయినట్లయితే, దాన్ని నేరుగా పాతిపెట్టాలి. చనిపోయిన మనిషిని పాతిపెట్టకుండుట ఒక నేరము!

''గనుక నీవు తడవుచేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొందుము'' (అపొ.కా. 22:16).

అధ్యాయము 6
పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మము

విశ్వాసులుగా మనము ప్రాథమికముగా రెండు అవసరతలు కలిగియున్నాము. మొదటిది గతానికి సంబంధించినది - మన పాపమునకు క్షమాపణ పొందడము. రెండవది భవిష్యత్తుకు సంబంధించినది - దేవునికి ఇష్టమయిన రీతిగా జీవితము (క్రీస్తు సారుప్యము లోనికి) కొనసాగించడానికి సాధ్యపడటం. మన మొదటి అవసరత క్రీస్తు మరణం వలన తీర్చబడినది. రెండవ అవసరతను తీర్చడానికి దేవుడు మనకు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని యిచ్చియున్నాడు.

జీవమునకు మరియు సేవకు కావలసిన శక్తి

మనంతట మనము ఆ మొదటి అవసరతను ఎన్నటికీ తీర్చుకొని యుండలేము. దేవుడే దానిని తీర్చవలసియున్నది. రెండవదికూడా అలాంటిదే. మన స్వశక్తి చేత, దేవునికి ఇష్టమయిన రీతిగా జీవించడం లేక తన పూర్తి చిత్తానుసారంగా జీవించడం చేయలేము. కొందరు బుద్దిగా వారి క్రైస్తవ జీవిత ఆరంభదశలోనే దీనిని తెలుసుకుని, నేరుగా దేవుని నుండి శక్తిని కోరుకుంటారు.

మరి కొందరు కష్టతరమైన మార్గం ద్వారా కనుగొంటారు. అది చాలా సంవత్సరాలు పలుమార్లుగా ప్రయత్నించి, ఓడిపోవుచు ఆ తరువాత దేవుని శక్తి కొరకు ఆయన తట్టు తిరగడము. దురదృష్టవశాత్తు ఇంకా మరికొందరు పలుసార్లు పడిపోయి ఓడిపోయిన తరువాత, జయజీవితం సాగించడం అసాధ్యమని నమ్మి చివరకు సెలవు తీసుకుని ఓటమి జీవితములోనికి పోవుచున్నారు.

ఇది మనము దేవుని సేవించడానికి మరియు ఆయనకు సాక్షులుగా ఉండడానికి కూడా వర్తిస్తుంది. అనేకమంది విశ్వాసులు తాము మార్పు చెందిన వెంటనే ప్రభువుకు సాక్షులుగా ఉండాలని గ్రహిస్తారు. కానీ వారి నోరు కట్టివేసినట్లు, శక్తిలేని వారిలా ఉన్నట్లు వారికి వారే తరచుగా చూడగలుగుతారు. కొందరు దీన్ని దురదృష్టవశాత్తు వారి వ్యక్తిత్వ లక్షణంగా ఎంచి, క్రీస్తుకు బలమైన సాక్షిగా ఉండాలనే ఆశను వదిలేసుకుంటారు.

మరికొందరు వారికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడానికి వాగ్దానము చేసియున్నాడని గ్రహిస్తారు. అందువలన వారు దేవుని ఆశ్రయించి, ఆ శక్తిని పొందగలుగుతారు. మరియు వారు ధైర్యముచే నింపబడి, అగ్నిలా మండుచుండడానికి, సిగ్గును త్యజించడానికి దోహదపడే మానవాతీతమైన వరాలను పొంది క్రీస్తుకు బలమైన సాక్షులుగా ఉంటారు.

ఆత్మ మూలంగా జన్మించుట అనేది ఒక విషయం. అలాగున మనము దేవుని పిల్లలము కాగలము, కాని పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మము పొందుట (మునుగుట) అనేది పూర్తిగా మరొక విషయము. అలాగున మనము దేవుడు కోరుకొనే రీతిలో ఉండుటకును, దేవునికి ఇష్టానుసారముగా నడుచుటకును శక్తి కలిగిన వారమవుతాము.

మన క్రొత్త నిబంధన జన్మ హక్కు

పాత నిబంధన ప్రకారం, పరిశుద్ధాత్మ కొంతమంది ప్రజలపైనే ఉండి, దేవుని కొరకు కొన్ని నిర్ణీతమైన కార్యాలను నెరవేర్చుటకు తోడ్పడేవాడు. కాని, నూతన నిబంధనలో,పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు పొందవచ్చును. ఆయన యేసు మహిమను మనకు కనపరుచుటకును మరియు యేసు సారూప్యములోనికి మనలను మార్చుటకును వచ్చియున్నాడు.

బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు నెరవేర్చగలిగే రెండు పరిచర్యలను సూటిగా చూపించాడు. అందులో ఒకటి పాపమును కొనిపోవునని, రెండవది ప్రజలకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చునని (యోహాను 1:29,33). మనము ఈ రెండింటియందును అనుభవము పొందాలి.

నూతన నిబంధనయందు మొట్టమొదటి వాగ్దానము: ''తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును'' (మత్తయి 1:21).

నూతన నిబంధన యందు రెండవ వాగ్ధానము: ''ఆయన విూకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చును'' (మత్తయి 3:11).

నూతన నిబంధన ఈ రెండు వాగ్దానాలతో ప్రారంభింపబడుట నిజముగా ప్రాముఖ్యమైన విషయము. మనుష్యునితో దేవుని నిర్వహణ దీనితో ఒక క్రొత్త శకంలా ప్రారంభమయినది - అదే నూతన నిబంధన.

దేవుని పిల్లలముగా మరి ఇది మన రెండంతల జన్మహక్కు. మన పాపములనుండి రక్షింపబడడము మరియు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందటము. మరి దేవుడు తప్పకుండ ఈ జన్మహక్కును సగంగా కాకుండ, పూర్తిగా ఇవ్వాలని కోరుచున్నాడు. నూతన నిబంధనలోని మొదటి ఐదు పుస్తకాలలో ప్రతి పుస్తకము కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అన్న వాగ్దానముతో ప్రారంభింపబడినది (మత్తయి 3:11, మార్కు 1:8, లూకా 3:16, యోహాను 1:33, అపొ.కా. 1:5). అయినప్పటికిని, ఎంతో మంది క్రైస్తవులు దీన్ని పొందుకొనుటలో నిర్లక్షత చూపుచున్నారు.

జీవజల నదులు

నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు దేవుని సింహాసనము నుండి ప్రవహిస్తూ భూమి పైకి పడే ఒక నదిలా చిత్రించబడియున్నాడు (ప్రకటన 22:1, అపొ.కా. 2:33). పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందడమంటే ఈ జల ప్రవాహం క్రింద మునగడమే. యేసు ''దప్పిగొన్న వారందరిని ఆయన వద్దకు వచ్చి, వారి కడుపులో నుండి జీవజల నదులు పారేలా పరిశుద్ధ్దాత్మను పొందమని'' చెప్పియున్నాడు (యోహాను 7:37,38).

సాధారణ విశ్వాసి యొక్క అనుభవము చేతి పంపు వలె ఎండిపోయిన హృదయమునుండి అతి కష్టంగా కొన్ని చుక్కల వంటి ఆశీర్వాదము తోడుటను పోలియున్నది. అయినప్పటికీ ఈ విధముగా ఉండనవసరం లేదు. మన ఎండిన స్థితి దేవుని దగ్గరకు నడిపించేదిలా ఉన్నట్లయితే మన జీవితములో పరిస్థితులు వేరుగా ఉండగలవు. మనము కలుసుకొనే ప్రతి ఒక్కరికి మనలో నుండి ఆశీర్వాదాలు నదులుగా ప్రవహించుటే మన జీవితములో దేవుని చిత్తమయి ఉన్నది.

మన అవసరతను మనము ఎరుగుటయే దీనికి మొదటిమెట్టు. ఎంతో మంది విశ్వాసులు పదాలను గురించి, అవివేకమైన చర్చలలో పట్టుబడియున్నారు. కాని మనకు కావలసినది దేవుని శక్తే గాని, ఖచ్చితమయిన పదజాలం మాత్రం కాదు. మన భాష (పదసముదాయము) ఖచ్చితంగా ఉండి, మనము ఎండిన ఎముకలా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? నిజాయితీగా దేవుని వద్దకు వచ్చి, ఆశీర్వాదములనెడి నదులు మనలో నుండి ప్రవహించడము లేదని ఒప్పుకొనడం చాలా ఉత్తమమయిన విషయం. ఈ విధముగా మొదటి మెట్టు ఎక్కిన తరువాత, మనము దేవుని యొద్దనుండి కోరుకొనేదానిని, పొందుతామన్న నమ్మకం కలిగి ఉండవచ్చును.

మనము పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందడానికి మనకు కావలసినదంతా తృష్ణ (దేవుని మన జీవితంలో మహిమ పరచాలనే గొప్ప ఆకాంక్షనుండి జనించే తీవ్రమైన కోరిక) మరియు విశ్వాసము (వాగ్దానము చేసిన దానిని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడన్న పూర్తి నమ్మకము). మరి ఇలాంటి తృష్ణ (దప్పిక) మరియు విశ్వాసముతో ఈ శక్తి కొరకు అడుగుదాము.దేవుడు మన మనవిని ఎన్నడు త్రోసిపుచ్చడు.

శక్తిని పొందుకొనడము

ఆది అపొస్తలులు సర్వమును త్యజించి యేసును వెంబడించిరి. అయినప్పటికీ వారు లోకములోకి వెళ్ళి దేవుడు అభిషేకించిన సేవను నిర్వర్తించుటకు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందునంత వరకు ఆగవలసి వచ్చినది. యేసు బహిరంగముగా సువార్త సేవను ఆరంభింపక మునుపు ఆయనకే తాను పరిశుద్దాత్మతోను, శక్తితోను అభిషేకము పొందుట అవసరమైయుండెను (అపొ.కా.10:38). ఈ అభిషేకము ఆయనకే అంత అవసరమైనప్పుడు, మరి మనకెంత అవసరమో కదా.

యేసు తన శిష్యులకు పై నుండి శక్తిని పొందువరకు యెరూషలేములో నిలచియుండుడని వారితో చెప్పెను (లూకా 24:29). యేసు పరలోకమునకు ఆరోహణమయ్యే ముందు కూడా తన శిష్యులతో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు ''శక్తినొందెదరు'' అని మరలా చెప్పియున్నాడు (అపొ.కా. 1:8).

పెంతెకొస్తు దినాన, పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరింపబడగా, పిరికివారైన ఆ మనుష్యులు వెంటనే ధైర్యముతో, మండు జ్వాలల్లా ప్రభువుకు సాక్షులుగా మారిరి (అపొ.కా. 2:1-4). యేసు వారితో పొందుతారన్న ఆ ''శక్తి'' నే వారు ఖచ్చితంగా పొందారు.

క్రైస్తవ జీవితము జీవించాలంటే ఒక మత సిద్ధాంతం మాత్రమే కాదు కాని మన జీవితంలో దేవుని యొక్క శక్తి అవసరమై ఉంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము మనకు దైవభక్తికి కావలసిన శక్తి మరియు ఆయనను సేవించడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తుంది.

ఆత్మ పనిచేయు తీరులు

లేఖనములలో పరిశుద్ధాత్మ గాలితో పోల్చబడ్డాడు. మరియు గాలి వేర్వేరు సమయాల్లో వేర్వేరు విధాలుగా వీస్తుంది. ''ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే యుండు'' నని యేసు చెప్పెను (యోహాను 3:8). అందుకే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందినట్లు బయటకు అగుపడే సూచనలు ఒక్కొక్క విశ్వాసి అనుభవములో వేర్వేరుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికి, కావలసినదంతా ఆంతర్యంలో శక్తిని పొందుకొనటమే.

సంఘము క్రీస్తు శరీరముగా కట్టబడేందుకు మనము ఆయన్ని ధృఢమైన రీతిలో సేవించుటకు ఆయన మనకు ఆత్మద్వారా 'శక్తితో కూడిన వరాలను' అనుగ్రహిస్తాడు. మనలో ఎవరు ఏ వరాన్ని పొందాలో నిర్ణయించేది మాత్రం ఆయనే.

ప్రవచించుట (విశ్వాసులను సవాలు చేయుటకు, ప్రోత్సహించుటకు, ఆదరించుటకు శక్తివంతముగా వాక్యమును బోధించు సామర్థ్యము) అనేది అన్ని వరములలో బహు ప్రయోజనమైనది (1 కొరిందీ¸ 14:1-5). ఇంకను పరిచర్య, బోధించుట, స్వస్థపరచుట, హెచ్చరించుట, ధనాన్ని ఇచ్చుట, నాయకత్వము వహించుట మొదలగు ఆత్మ వరాలు కూడా ఉన్నవి (రోమా 12:6-8; 1 కొరిందీ¸ 12:8-10). మన మనస్సు లేదా మాతృ భాష హద్దులు లేకుండా దేవుని ప్రార్థించడానికి స్తుతించడానికి వీలుపడే అన్య భాషల్లో మాట్లాడుటకు (భాషలు మాట్లాడే వరము) శక్తి అనేది దేవుడు అనుగ్రహించే మరొక వరమై యున్నది. నీవు ఆత్మలో బాప్తిస్మము పొందనట్లయితే, దేవుని అడిగి నీ జన్మ హక్కును స్వతంత్రించుకోవాలి. దానితో బాటు ఆ బాప్తిస్మపు నిశ్చయతను కూడా ఇమ్మని అడగాలి.

''కాబట్టి విూరు చెడ్డవారైయుండియు, విూ పిల్లలకు మంచి యీవులనియ్యనెరిగి యుండగా, పరలోకమందున్న విూ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను''. ''విూరు దేవుని అడుగనందున విూకేేమియు దొరుకదు'' (లూకా 11:12,13, యాకోబు 4:2).

మరి హృదయ పూర్వకంగా దేవుని మొఱపెట్టుకొని, ఆనాడు పెనూయేలు వద్ద యాకోబు దేవునితో అన్నట్టు, ''నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యను'' (ఆది.కా. 32:26) అని అందాము. దేవునికి పక్షపాతము లేదు. ఇతరులకు చేసిన విధముగా నీకూ చేయగలడు. ఈనాటికి కూడా తన్ను నిజముగా వెదకు వారికి ఫలము దయచేయువాడు (హెబ్రీ 11:6). ఆయన్ని మహిమ పరచేందుకు ఆశ ఉన్న వారందరికి పరిశుద్ధాత్మను తన పూర్తి స్థాయిలో దయచేయడానికి ఆయన మిక్కిలి ఆసక్తి కలిగియున్నాడు.

అధ్యాయము 7
పరిశుద్ధపరచబడుట

సువార్త యొక్క రెండంతల సందేశమంతా క్రీస్తు, పాపములో పట్టుబడ్డ స్త్రీతో పలికిన మాటలలో సంగ్రహంగా చెప్పబడినది. అవి

 1. నేను నీకు శిక్ష విధింపను.
 2. నీవు వెళ్ళి ఇకపాపము చేయకుము (యోహాను 8:11).

క్రైస్తవ పరుగు పందెములో నీతిమంతులుగా తీర్చబడుట అనేది పందెము ప్రారంభించవలసిన గీత అయితే, పరిశుద్ధ పరచబడుట అనేది పందెము పరుగెత్తవలసిన మార్గమయి ఉన్నది. పరిశుద్ధపరచబడుట అన్న పదానికి అర్థం ప్రత్యేకపరచబడుట. కాబట్టి పరిశుద్ధ పరచబడటమంటే పాపమునుండి, లోకమునుండి మరియు మన స్వంత జీవితాన్నుండి మరి ఎక్కువగా ప్రత్యేకపరచబడే ప్రక్రియలో అభివృద్ధి చెందడము.

ఒక క్రీడాకారుడు ప్రారంభగీత దగ్గరకు వచ్చి పందెములో పరుగెత్తాలని ఏ విధముగానైతే వస్తాడో అదే విధముగా మనము పరిశుద్ధ పరచబడాలనే ఉద్దేశ్యముతోనే క్రీస్తు యొద్దకు వస్తాము. క్రీడాకారుడు పరుగు పందెంలో పాల్గొనాలనే ఉద్దేశమే లేకుండా పరుగు పందెము యొక్క ప్రారంభపు గీత యొద్దకు వచ్చి ఇతరులతో చేరుటనేది అర్థంలేని పని.

దేవునికి మనపట్ల కలిగియున్నట్టి ఉద్దేశ్యము

మనలో అనేకమంది మొట్టమొదట క్రీస్తు వద్దకు ఏదో ఒక స్వప్రయోజనము పొందాలనే స్వార్థఉద్దేశ్యంతో వచ్చాము. ఆ ప్రయోజనము స్వస్థత లేక నరకాగ్ని నుండి విముక్తి పొందాలనైనా కావచ్చు. మనము ఆ స్వార్థ ఉద్దేశ్యము కలిగి ఉన్నప్పటికీ, దేవుడు మనలను చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి కడుపు నింపుకోవడానికే తిరుగుముఖం పట్టినా, తండ్రి అతనిని మిక్కిలిగా ప్రేమించుటను బట్టి ఆహ్వానించగలిగాడు. దేవుడు అలాంటి మంచివాడు! పరలోకమునకు వెళతామన్న ఆ ఒక్క ఉద్దేశ్యం కలిగియుండి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినట్లయితే, నిజంగా అది విచారింపదగిన విషయము. దేవుని ఉద్దేశ్యము మన జీవితంలో ఏమై ఉన్నదో దాన్ని ఎక్కువగా తెలుసుకున్న కొలది ఆ విధముగా పూర్తిగా నెరవేర్చాలన్న ఆశ కలిగి జీవించాలి. అపొస్తులుడైన పౌలు ఎఫెసీలోని క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తూ, వారి మనో నేత్రములు తెరువబడి, వారు ''పిలువబడ్డ పిలుపువలనైన నిరీక్షణ'' ఎట్టిదో తెలుసుకోవాలని కోరాడు (ఎపెసీ˜ 1:18).

(రోమా 8:29,30) లో ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో మనకు చెప్పబడియున్నది. ''తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను''.

ఇక్కడ మనము యేసు సారూప్యము లోనికి మార్పు చెందాలన్నదే దేవుని ఉద్దేశ్యము. పరిశుద్ధతను పొందడమంటే ఇదే- యేసు సారూప్యములోనికి మరెక్కువగా మార్పు చెందుతుఉండటము. మనకు ముందుగా పరుగెత్తిన యేసుమీద మన కన్నులను నిలిపి, ఇటువంటి క్రైస్తవ పందెమందు పరుగెత్తాలని మనము హెచ్చరింపబడియున్నాము (హెబ్రీ 12:1,2).

పాపమును పరిష్కృతం చేయడము

తెలిసి పాపము చేయుటకు మానివేయడమే ఈ పందెములోని మొదటి మెట్టు. పాపము చేయుట మానుటను గూర్చిన హెచ్చరిక ధర్మశాస్త్రములో లేదు. కాని నూతన నిబంధనలో అపొస్తులులందరూ యేసు చెప్పిన రెండుభాగాల సువార్త సందేశముతో ఏకీభవించారు. అది శిక్షావిధి నుండి స్వతంత్రత మరియు పాపమునుండి విముక్తి.

''పాపము చేయకుడి'' (1 కొరిందీ¸ 15:34) అని పౌలు చెప్పాడు. యోహాను తన మొదటి పత్రికలో ''విూరు పాపము చేయకుండుటకై యీ సంగతులను విూకు వ్రాయుచున్నాను'' (1యోహాను 2:1) అని చెప్పాడు. మరియు ''పాపముతో జోలి యిక నేమియులేక యుండును'' (1 పేతురు 4:1) అని పేతురు కూడా మనలను హెచ్చరించి యున్నాడు.

పౌలు రోమా 5వ అధ్యాయమందు విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడుటను గూర్చి విశదీకరించిన తరువాత, ''అలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?'' (రోమా 6:1) అని ప్రశ్నించి యున్నాడు. మరలా (ఈసారి నొక్కి పలుకుతూ) ''మరేమిటి? కనీసం ఒక్కసారైనా పాపము చేయుదుమా?'' (రోమా 6:15 వాడుక భాషలో) . ఈ రెండు సందర్భాలలోను సమాధానము, ''కాదు'' అని ప్రతిధ్వనించుచున్నది.

మనము కనీసము ఒక్కసారి కూడా పాపము చేయకుండుటకు చూడాలి. ఈ మాటలు అతి కష్టమైన, భారమైన సందేశంలా వినబడుతున్నాయా? ఎవరైతే పాపము చేస్తూ ఉండటానికి నిశ్చయం చేసుకుంటారో, అట్టివారికి ఈ మాటలు అతి భారమనిపిస్తాయి! కానీ పాపపు బంధకాల వలన వెగటు పుట్టి, అలసిపోయినట్టి వారికి ఇదొక సంతోషకరమైన విమోచన సందేశం. ఏ ఖైదీయైనా సరే విడుదల పొందుతామని చెప్పే సందేశాన్ని విని గొప్పగా ఆనందిస్తాడు. కానీ అది అతి భారమైన సందేశంగా వినపడదు, వినబడుతుందా?

''(పాపపు) చెరలోనున్న వారికి విడుదలను, (సాతాను చేత) నలిగిన వారికి విడుదలను ప్రకటించుటకై'' యేసు అభిషేకించబడ్డాడు (లూకా 4:18).

ఒక మహత్తరమయిన నూతన నిబంధన వాగ్దానము: ''విూరు కృపకే (యేసు ఏర్పరచిన నూతన నిబంధన) గాని ధర్మశాస్త్రము (పాత నిబంధన) నకు లోనైనవారు కారు గనుక పాపము విూ విూద ప్రభుత్వము చేయదు'' (రోమా 6:14). అలాంటి జీవితము నీకు సాధ్యమవుతుందని నమ్మిక ఉంచడమే విజయానికి మొదటి మెట్టు.

శోధన మరియు పాపము

శోధింపబడటము మరియు పాపము చేయడముల మధ్య వ్యత్యాసం ఉంది.ఈ వ్యత్యాసం ఏమిటో (యాకోబు 1:14,15) నందు బయలు పరచబడినది. ''ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. ఆ తరువాత దురాశ గర్భము ధరించి పాపమును కనును''. మన శరీరములోని దురాశను గర్భము ధరించుటకు అవకాశమివ్వనంత వరకు మన హృదయంలో పాపమనేది పుట్టదు. దురాశ మన మనస్సులో ఓ సలహాను క్షణిక కాలం కలుగజేసినపుడు, మనము శోధింపబడతాము. మన మనస్సు ఆ శోధనతో ఏకీభవించినపుడు, తరువాత గర్భము ధరింపబడి పాపము పుడుతుంది.

శోధింపబడుట మనలను దుష్టులనుగా చేయదు. యేసు కూడా శోధింపబడ్డాడు. కానీ ఏవిధంగానైనా తాను ఒక్కసారి కూడా పాపము చేయలేదు. అందునుబట్టి ఆయన పరిశుద్ధుడు.

దేవుని వాక్యమునందు యేసు ''అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను'' మరియు ''సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడెను'' (హెబ్రీ 2:17; 4:15) అని చెప్పబడియున్నది. ఆయన మనవలె ఖచ్చితంగా శోధింపబడ్డాడు కాని ఎన్నడును పాపము చేయలేదు. మనలో కొందరికి ఇదొక మహత్తరమైన విషయములా వినపడదు. ఎందుకంటే యేసు, దేవుడైయుండి పాపాన్ని సులభంగా, సాధారణంగా జయించగలిగాడేమో అని అనుకొంటూ ఉండవచ్చు. కానీ, యేసు భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన దేవునితో సమానమైన ఆధిక్యతను ''విడిచిపెట్టుకున్నాడు'' (ఫిలిప్పీ 2:6,7) అని గుర్తుంచుకోవాలి. ఆయన దేవుడైయుండినప్పటికినీ, మానవునిలా ఈ భూమిపై ఆయన ఇప్పుడు మనకు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తినే ఆశ్రయించి జీవించాడు.

అందుకే మనము ''యేసువైపు దృష్టిని సారించి'' పరుగుపందెములో పరుగెత్తమని మనకు చెప్పబడింది. మనము ''పాపముతో పోరాడే'' ఈ రోజుల్లో ఆయనను మాదిరిగా చూస్తూ ధైర్యంతో ముందుకు కొనసాగవచ్చు (హెబ్రీ 12:2-4). ఎందుకంటే ఆయన ఒక మనుష్యుడుగానే మనకు ఎదురయ్యే ప్రతి శోధనను జయించగలిగాడు కాబట్టి. అలాగున ఆయన మనకు ముందుపరుగెత్తిన వానిగా మరియు ఆయన మార్గమును అవలంబించటానికి మాదిరిఅయ్యాడు (హెబ్రీ 6:20).

ఇదే ''దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నదిబీ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను..ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను'' (1 తిమోతి 3:16). మనలా శరీరధారి అయియుండి కూడా, ఆయన జీవితాంతము తన ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకొన్నాడు. ఆయన జయించినట్టుగా మనమూ జయించగలుగుతామన్న నిరీక్షణను పైన చెప్పబడిన మర్మము మనకు కలుగజేయుచున్నది. ఎందుకంటే ఆయన ''శరీరమను తెరద్వారా ప్రతిష్టించిన నూతనమైనదియు, జీవము గలదియునైనట్టి మార్గము'' నందు మనము ఆయనను వెంబడించటానికి సాద్యపడుతుంది (హెబ్రీ 10:20). ఇదే పరిశుద్ధతను పొందడానికి మార్గము.

ప్రాచీన పురుషుడు (స్వభావము) మరియు నూతన పురుషుడు (స్వభావము)

ప్రాచీన స్వభావమను అపనమ్మక సేవకుడు ఏలాగు ఇంటిలోనికి దొంగలు ప్రవేశించడానికి అనుమతినిచ్చాడో మనమిదివరకే చూసాము. ఎలాగైతేనేం, ఆ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడి మరణము నొంది పాతిపెట్టబడ్డాడు. ఇప్పుడు మనలో నవీన పురుషుడు ఉంటూ ''దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చియున్నానని'' అంటున్నాడు (హెబ్రీ 10:7).

ఇక్కడ విచారించవలసిన విషయమేమిటంటే క్రీస్తు యొక్క శిష్యుడుగా ఉండికూడా పాపము చేయుట సాధ్యమని మనకందరికి తెలుసు. ఎలాగైతే పిల్లి మురికి నీళ్ళలో పడడానికి, పంది అదే మురికినీళ్ళలో ఎగిరిదూకుటకు ఇష్టపడడానికి ఎంత వ్యత్యాసముందో, అలాగే విశ్వాసి పాపము చేయడానికి, అవిశ్వాసి పాపము చేయడానికి గల వ్యత్యాసము అంతే! పిల్లి మురికి నీళ్ళంటే అసహ్యించుకుంటుంది. కానీ అకస్మాత్తుగా పడిపోవచ్చు. కానీ పంది అన్నది అలా పడుటను కావాలనే కోరుకుంటుంది. ఇదంతా స్వభావమును బట్టి ఆధారపడుతుంది. యేసు శిష్యుడు పరిశుద్ధతను ప్రేమించి, పాపాన్ని అసహ్యించుకొనె నూతన స్వభావమును కలిగియుంటాడు. ప్రాచీన పురుషుడు (స్వభావము) పాపము చేయాలని కోరుకుంటాడు. నూతన పురుషుడు (స్వభావము) ఎన్నడూ పాపము చేయకూడదని కోరుకుంటాడు. కానీ నూతన పురుషుడు శక్తివంతుడు కాకపోయినట్లయితే ఇక శరీర వాంఛలకు తన హృదయమనెడు ద్వారాన్ని మూసి ఉంచలేక పోతాడు. అతడు ఆ వాంఛలు కావాలని కోరుకొనుటలేదు. కానీ అతడు వాటిని ఎదుర్కొనడానికి శక్తివంతుడు కాడు - ఇది తాను దేవుని వాక్యాన్ని తగినంతగా తీసుకోలేకనో లేకపోతే ప్రార్థనా మూలంగా తన్ను తాను శక్తిమంతునిగా చేసుకోలేక పోవటమో కారణమై ఉండవచ్చు.

అంటే, పాపము చేయుటకును, పాపములో పడుటకును వ్యత్యాసముంది. మన హృదయములో అనేకమైన అనవసరమైన నిందాభావాలను తొలగించుకొనడానికై ఈ వ్యత్యాసాన్ని తెలుసుకొనుట చాలా ముఖ్యము.

యోహాను తన మొదటి పత్రికలో ఈ వ్యత్యాసాన్ని స్పష్టం చేసాడు. ఆయన ''పాపము చేయువాడు (ఉద్దేశ పూర్వకంగా పాపము చేస్తూ ఉండువాడు) అపవాది సంబంధి''(1 యోహాను 3:8) అని ఆయన చెప్పియున్నాడు. మరో ప్రక్కగా విశ్వాసులకు వ్రాస్తూ ''ఎవడైనను పాపము చేసినయెడల (అకస్మాత్తుగా పాపంలో పడినయెడల) నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు'' (1 యోహాను 2:1,2) అని చెప్పెను.

మనస్సాక్షికి తెలిసిన పాపము మరియు తెలియని పాపము

పాపములో పడిపోవడానికిని మరియు పాపమును కలిగియుండటానికి కూడా వ్యత్యాసముంది. పాపమును కలిగియుండడమంటే మన వ్యక్తిత్వంలో మన మనస్సాక్షికి తెలియని రీతిలో పాపమును కలిగియుండడం. మనకన్నా అనుభవజ్ఞులు మనలోని ఆ పాపమును గమనిస్తున్నప్పటికినీ మనకు మనమే తెలుసుకోలేనట్టిది. కానీ, మన మనస్సాక్షికి తెలియని అలాంటి పాపము మనలనెన్నటికీ దోషులుగా చేయజాలదు. దేవుని వాక్యములో ''ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు'' (రోమా 5:13) అని చెప్పబడియున్నది. (అంటే, మన మనస్సాక్షికి తెలియని పాపమును దేవుడు మనపై ఆరోపించడు).

మనము వెలుగులో నడుస్తున్నప్పటికీ, మనము మరణించే దినము వరకు కూడా మన మనస్సాక్షికి తెలియని పాపము మనలో క్రమేపీ తగ్గుచున్నప్పటికీి, కొద్ది స్థాయిలోనైనా ఇంకా ఉంటుంది. ''మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు'' (1యోహాను 1:8) అని బైబిలు చెప్పుచున్నది. ఎవరైతే వారిలో పాపములేదని చెబుతుంటారో, అట్టివారు ఒక విధంగా క్రీస్తు లాగా సంపూర్ణంగా పరిశుద్ధత పొందాము అని అంటున్నట్టే. కానీ దేవుని వాక్యంలో ఆయన తిరిగి మనలను కొనిపోవటానికి ప్రత్యక్షమైనప్పుడే మనము ''ఆయనను పోలియందుము'' కాని దానికి ముందెన్నడును కాదని (1యోహాను 3:2) వ్రాయబడియున్నది. ఎవరైతే ఇప్పటికే పూర్తిగా పరిశుద్ధులము, సంపూర్ణులము అని ఎంచుకుంటారో, అట్టివారు వారిని వారే మోసగించుకుంటున్నారు.

ఎలాగైనా మన మనస్సాక్షికి తెలియని పాపము కూడా కడగబడాలి. మరియు ''మనము దేవుని వెలుగులో నడిచినంతకాలము యేసురక్తము ప్రతి పాపము (మనస్సాక్షికి తెలియని) నుండి కూడా మనలను పవిత్రులనుగా చేయును'' (1యోహాను 1:7).

కాబట్టి మనము ఇప్పుడు ఏ భయమూ లేకుండా అనంత పరిశుద్ధుడగు దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలువగలము. క్రీస్తు రక్తము మనలను నీతిమంతులముగా తీర్చగలిగినంతటి శక్తి గలది.హల్లెలూయా!

కనికరము మరియు కృప

''కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు'' చేరుటకు మనము పిలువబడ్డాము (హెబ్రీ 4:16). కనికరము మరియు కృప రెండునూ ఒక్కటి కావు. కనికరమన్నది మన పాపక్షమాపణను సూచించేది. అది మన గతానికి సంబంధించినది. కానీ, భావి జీవితంలోని మన అవసరముల సమయములో మనకు కృప అవసరమై యుంటున్నది.

మనకు అవసరమయ్యే సమయమంటే ఎలాగైతే పేతురు గలిలయ సముద్రంలో మునిగిపోబోయాడో (మత్తయి 14:30) అలాగున మనము శోధింపబడి, పాపంలో పడిపోబోయే సమయం. మరి ఇలాంటి సమయాల్లో కృప కొరకు మొరపెట్టుకోవాలి. ఎలాగైతే యేసు తన చేతిని చాచి పేతురును వెంటనే పట్టుకున్నాడో, అలాగున పడిపోకుండా నిలబడులాగున మనము కూడా కృపను పొందుకొనుటను చూడగలము.

దేవుడు మనము పడిపోకుండునట్లు సహాయం చేస్తాడన్న నిశ్చయత నిచ్చే ఎన్నో మహత్తరమైన వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గమనించండి:

మొదటగా, దేవుడు మనము జయించుటకు వీలుకానట్టి శక్తివంతమైన శోధనతో శోధింపబడనియ్యడని వాగ్దానము చేసియున్నాడు: ''దేవుడు నమ్మదగినవాడుబీ విూరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును'' (1కొరిందీ¸10:13).

''తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును ఆయన శక్తిగలవాడు'' (యూదా 24) అని కూడా చెప్పుచున్నది .

దేవుని వాక్యములో ఇవ్వబడిన ఇలాంటి మరియు ఇంకా ఎన్నో అద్భుతమైన వాగ్దానాలను బట్టి మనము ఇక ఎన్నడూ పాపము చేయనవసరం లేదు. (1పేతురు 4:2)లో చెప్పబడిన విధంగా, మనము ఇకమీదట మనలో దేవుని చిత్తము మాత్రమే నెరవేరునట్లు జీవించగలము.

వృద్ధినొందెడి పరిశుద్ధత

యేసు తన శిష్యులతో ''నేను విూకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి'' (మత్తయి 28:20) అని చెప్పియున్నాడు. ప్రభువును ప్రేమించువారు మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలేవో హృదయ పూర్వకముగా తెలుసుకుంటారు. ఆ తరువాత ఆ ఆజ్ఞలను గైకొని వాటికి విధేయులవుతారు (యోహాను 14:21).

ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు మానవునికి ఆజ్ఞలిచ్చాడే గాని వాటికి లోబడటానికి శక్తిని ఇవ్వలేదు. అయితే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకిచ్చాడు? మనుష్యుడు తాను దేవుని యొక్క పరిశుద్ధ ప్రమాణాలను చేరుకోలేడని కనుగొనడానికి మరియు ఆపై తనకు రక్షకుడు, సహాయకుడు కావాలనే అవసరతను గ్రహించటానికే. ''క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను'' (గలతీ 3:24).

కాని, ఇపుడు దేవుడు మనుష్యునితో క్రొత్త నిబంధన ఏర్పరచుకొని యున్నాడు. ఆయన మనకు ఆజ్ఞలను మాత్రమేకాక మన ప్రభువైన యేసుక్రీస్తు అను వ్యక్తిలో ఒక మాదిరిని కూడా ఇచ్చాడు. దేవుని ఆజ్ఞలన్నిటికీ మనము విధేయులమవ్వగలమన్నది సాధ్యమని యేసు ఈ భూమి మీద జీవించి నిరూపించియున్నాడు. క్రొత్త నిబంధన ప్రకారము దేవుడు తన ధర్మ విధులను మనస్సులలో ఉంచి వాటిని హృదయాల మీద వ్రాసెదను (హెబ్రీ 8:10) అని వాగ్దానము చేసి యున్నాడు. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దీనిని చేయును. మనకు సహాయకుడైన పరిశుద్ధాత్మ మనకు దేవుని చిత్తమును చూపటమే కాకుండా, ఆ చిత్తాన్ని మనము జరిగించటానికి కోరికను మరియు ఆ చిత్తానికి పూర్తిగా విధేయులమవ్వటానికి కృపను దయచేయు సహాయకర్తగా ఉంటాడు.

దేవుడే మనలను సంపూర్ణంగా పరిశుద్ధ పరచగలుగుతాడు (1థెస్స 5:23). దీన్ని మనమే స్వంతంగా చేయలేము. ఆయనే మనయందు ఈ కార్యము జరిగించి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కోరికను మరియు సామర్థ్యతను ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనము ఆయనపై ఆధారపడి ఉండాలి. మనము ''భయముతోనూ వణకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించాలి'' (ఫిలిప్పీ 2:12). ఆయన మనలను యంత్రములుగా మార్చలేదు. కాబట్టి దేవుడు మనలో జరిగిస్తున్న పనికి మనము బాహ్యంగా కార్యరూపమునివ్వాలి!

దేవుడు మనలను పాపపు నిందారోపణ నుండి పవిత్ర పరుస్తారు. కాని మనము ''దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి'' (2కొరిందీ¸ 7:1) అని ఆజ్ఞాపింపబడియున్నాము. మనలోని ఎటువంటి కల్మషము పైనైనా వెలుగు కలిగినప్పుడల్లా మనము దీన్ని చేయాలి.

మనము ఈవిధంగా ''ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల'' (రోమా 8:13) ఆత్మ ఫలమయిన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహములనెడి గుణములు మరెక్కువగా మనలో ప్రత్యక్షమవుతాయి. ఇదే క్రీస్తు సారూప్యములోనికి మార్పు చెందడమంటే. అలాగున మన మార్గము అంతకంతకు తేజరిల్లును (సామెతలు 4:18). మనము పరిశుద్ధతను పొందడానికి దేవుడు చేసిన మహిమకరమైన మార్గము ఇదే.

అధ్యాయము 8
దేవుని వాక్యము మరియు ప్రార్థన

క్రొత్తగా జన్మించిన శిశువుకు పుట్టుకతోనే రెండు అవసరాలు ఉంటాయి. అవి ఆహారము మరియు గాలి. ఆత్మీయ జననమొందే వారి విషయంలోకూడా ఖచ్చితంగా ఇంతే. క్రొత్తగా జన్మించిన దేవుని బిడ్డ కూడా తిని, శ్వాస పీల్చుకోవలసిన అవసరముంది. దేవుని వాక్యం అతనికి ఆహారంగాను, ప్రార్థన అవశ్యకమైన ఊపిరిగాను అయి ఉండాలి.

దేవుని వాక్యము - మన ఆత్మీయ ఆహారము

చిన్న బిడ్డకు ప్రారంభంలో పాలు, ఆ తరువాత పుష్టికరమైన(బలమైన) ఆహారము అవసరమై ఉంటాయి. బైబిలు గ్రంథము పాలును మరియు బలమైన ఆహారమును కలిగియున్నది.''క్రీస్తునుగూర్చిన మూలోపదేశము'' లను పాలు అనియు (హెబ్రీ 6:1) ''నీతి వాక్యవిషయము''లను పుష్ఠికరమైన(బలమైన) ఆహారమనియు (హెబ్రీ 5:13) చెప్పబడియున్నది. మనమెంత త్వరితగతిన దేవుడు కనపరచే వెలుగుకు విధేయత చూపుదుమో, అంత త్వరగా పుష్ఠికరమైన(బలమైన) ఆహారము తీసుకోవడానికి వెళ్ళగలుగుతాము.

మన ఆత్మీయ అభివృద్ధి, విశ్వాసము మరియు విధేయతలపై ఆధారపడి యుంటుంది. దేవుడు తన యందు మనము నమ్మిక యుంచటానికి తన వాక్యములో ఎన్నో వాగ్దానములనిచ్చి యున్నాడు. మనము పాటించటానికి ఆయన ఆజ్ఞలను కూడా ఇచ్చియున్నాడు. మనము దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించి, నమ్మి ఆయనకు లోబడినట్లయితే మనము దేవునిలో నిత్యము పచ్చగా ఉండి ఎన్నటికీ వాడిపోనట్టి చెట్టులాగ, బాగా లోతుగా వేరుపారిస్థిరపడి ఉన్నట్లు కనుగొనగలము. అప్పుడు దేవుడు మనలను మనముచేయు ప్రతీపనిలో సఫలమగునట్లు ఆశీర్వదించగలడు (కీర్తన 1:2,3).

మనము దేవుని వాక్యాన్ని మన మేథస్సుతో మాత్రమే పరిశీలిస్తే గ్రహించలేము. పరిశుద్ధాత్ముని ప్రత్యక్షత మనకు అవసరమైయున్నది. ''ఆత్మీయ సత్యాలు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి పసిబాలురకు బయలుపరచబడి యున్నాయని'' (మత్తయి 11:25) యేసు చెప్పియున్నాడు. పసిబాలురకు ఉన్నది జ్ఞానులకు, వివేకులకు లేనిది ఏమిటి? శుద్ధ హృదయం! దేవుడు మన హృదయాన్ని చూస్తాడే గానీ, మన తలను కాదు. ఎవరైతే దీన మనస్సు కలిగి, దేవుని మాట విని వణకుచుండునో అట్టివారికే దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు (యెషయా 66:2). ''ఎవరైతే దేవుని చిత్తమును చేయ నిశ్చయించుకున్నారో, అట్టివారు మాత్రమే దేవుని వాక్యమును అర్థం చేసుకోగలరు''(యోహాను 7:17) అని యేసు చెప్పాడు..

దేవుని వాక్యము - ఆత్మ ఖడ్గము

సాతానుపైన మన పోరాటంలో దేవుని వాక్యాన్ని కూడా ఒక ఆయుధంలా ఉపయోగించుతాము. దేవుని వాక్యము (ఎఫెసీ 6:17) లో ఆత్మ ఖడ్గము అని చెప్పబడియున్నది. యేసు సాతాను చేత అరణ్యంలో శోధింపబడినపుడు, చివరి మూడు శోధనలను, ఈ ఆయుధమునే ఎక్కువ బలంగా ఉపయోగించి ఎదుర్కొన్నాడు. ప్రతీసారి, యేసు ''అని వ్రాయబడియున్నది'' అని చెప్పి సాతాను శోధనను ఎదుర్కొన్నాడు (మత్తయి 4:4,7,10). ఆయన అలాగు సాతానును జయించాడు. అలాగే మనమును సాతానును జయించగలము.

సాతాను నేరము మోపువాడై యున్నాడు. మనము సాతాను నిందారోపణలు మరియు పరిశుద్ధాత్ముని ఒప్పుదలలకు మధ్యగల బేధమును గుర్తించగలవారమై యుండాలి. సాతాను మనలనెల్లప్పుడూ బాధించాలని చూస్తాడు, మరియు తన నిందారోపణల చేత ఖండింపబడినట్లు మనము భావించులాగున చేస్తాడు. కానీ, పరిశుద్ధాత్ముని ఒప్పుదల ఎల్లప్పుడు సాత్వికముగాను మరియు పూర్తి నిరీక్షణను యిచ్చేదిగాను ఉంటుంది.

మనము నేరము మోపేవాడిని ''గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, మనమిచ్చే సాక్షమును బట్టియు'' జయించగలము (ప్రకటన 12:11). మన గత పాపముల నిమిత్తం, క్రీస్తు మనలను తన రక్తముచేత పూర్తిగా కడిగారనియు, మనలను నీతిమంతులనుగా తీర్చారనియు, మనము సాతానుకు సాక్ష్యమిచ్చినపుడు మాత్రమే, వాని నిందారోపణలను మనము జయించగలము. యేసు ఉపయోగించిన ''......అని వ్రాయబడియున్నది'' అనే ఆయుధమునే మనము కూడా ఉపయోగించాలి.

దేవుని వాక్యాన్ని సాతాను ముందు ఒప్పుకొనుట, వాని నిందారోపణలను మాత్రమే గాక, నిరుత్సాహమును, చింతను మరియు మన మనస్సును తీవ్రంగా వేధించే పలు ఇతర శోధనలను కూడా జయించే మార్గము. పరిశుద్ధాత్ముడు మన అవసరమును బట్టి సరియైన వాక్యాన్ని మన జ్ఞప్తికి తేగలుగునట్లు, మనము దేవుని వాక్యమును బాగుగా తెలిసికొనియుండుట చాలాముఖ్యమైన విషయం.

అందుకే, ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఆయనను మనతో మాట్లాడమని అడిగి కొంత సమయాన్ని వెచ్చించుట చాలా ఉత్తమము. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొంటే, ఆయనకు విరుద్ధంగా పాపము చేయకుండునట్లు మనలను ఆ వాక్యము భద్రపరుస్తుంది (కీర్తన 119:11 ).

మన జీవితాల పట్ల దేవుని ప్రణాళిక

దేవుడు మన పట్ల సంపూర్ణమైన ప్రణాళిక కలిగియున్నారు. అది మనలో నెరవేరునట్లు దేవుడు మనలను నడిపించాలని కోరుకుంటున్నారు. దేవుని యొక్క ప్రణాళిక మనలో సంపూర్ణంగా నెరవేరునట్లు మనము జీవిస్తే, ఈ భూమి మీద దానికన్నా ధన్యకరమైన జీవితం మరొకటి లేదు. మన ఉద్యోగము లేక వివాహ విషయములో మనము తీసుకోవలసిన మార్గాన్ని దేవుడు ముందుగానే యేర్పాటు చేసియుంచాడని తెలుసుకోవడం ఎంత అద్భుతకరమైన విషయం!

మనము ఆయన మార్గాన్ని ఎన్నుకొన్నట్లయితే, సాతాను మనలను వంచించుటకు వరుసగా త్రవ్వి కప్పియుంచిన గోతులలో పడకుండా తప్పించుకోగలము. ముఖ్యంగా, దేవుడు మనలను తన వాక్యము ద్వారా ఆ ప్రణాళికలోనికి నడిపిస్తాడు.దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమనేది మిక్కిలి విస్తారమైన అంశం. దీనిని నేను వ్రాసిన ''దైవ చిత్తాన్వేషణ'' అను పుస్తకమందు వివరించాను.

ఆత్మీయ పద్దతిలో వివాహము గూర్చి అను వేరొక పుస్తకమందు వ్రాసాను.

ప్రార్థన - దేవునితో మాట్లాడటము

దేవునితో సంభాషించుట అనునది రెండు విధాలైన విషయం. మొదట దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతారు. తరువాత మనము ఆయనతో మాట్లాడుతాము. కానీ, ప్రార్థన అంటే దేవునికి మనవులు చేయుట మాత్రమే కాదు. వధువు తన వరునితో కలిగియుండు సహవాసము వలె, మనము దేవుని సహవాసము కలిగియుండటము ప్రార్థనలో ప్రధానమైన భాగము.

వధువు తన వరునితో ఎలా మాట్లాడాలో అనే విషయంపై నియమాలు ఏమీ లేవు. కానీ, క్రమశిక్షణకు గాను మన ప్రార్థనలు ఈ క్రింది విషయములను కలిగియుండుట మంచిది.

 1. మన తండ్రియైన దేవుడు యేమై ఉన్నాడో, అందునుబట్టి ఆయనను స్తుతించుట.
 2. పాపము మరియు అపజయముల ఒప్పుకోలు
 3. దేవుని రాజ్యమునకు సంబంధించిన విజ్ఞాపనలు చేయటము
 4. మన వ్యక్తిగత అవసరాలను గూర్చి విజ్ఞాపనలు చేయటము
 5. ఇతరుల అవసరములను గూర్చి విజ్ఞాపన చేయటము
 6. దేవుడు మనకు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మరియు
 7. దేవుడు మనకు చేయబోయే దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట.

''నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని'' (లూకా 18:1) యేసు మనకు చెప్పియున్నాడు. అనుదిన జీవితంలోని చిన్న విషయములను గూర్చి దేవునితో మాట్లాడుటను నేర్చుకోవడం మనము పెంపొందించుకోవాల్సిన ఒక మంచి అలవాటు. ఆవిధంగా మనము దినమంతా ప్రార్థన ఆత్మతో నుండవచ్చు. అలాగున, దేవునితో మాట్లాడుట మనకు ఒక ఆచారంగా కాకుండా సంతోషంగా ఉంటుంది. దేవుడు మన హృదయాల్లో ఆశ్చర్యకరమైన రీతులలో మనతో మాట్లాడుటను గమనిస్తాము. కానీ, ఇవన్నీ ప్రార్థన అనే పాఠశాలలో బొమ్మలతో బోధించే చిన్న పిల్లల పాఠాలవంటివి. మనము నమ్మకముగా ఉన్నట్లయితే ఇంకా ముందుకు సాగిపోవచ్చు.ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రార్థనను ఎండిపోయిన (మనస్సుకు సంతోషము కలిగించని) శూన్యమయిన ఆచారంగా దిగజారిన స్థితికి రానీయకూడదు. ప్రార్థన శ్వాస వంటిది. శ్వాస పీల్చుకోవడం మనకు కష్టమవుతున్నపుడు, ఏదో ఒక లోపమున్నట్టు గ్రహించవచ్చు! దేవుడు ప్రార్థనను జీవములేనిది (ఎండిపోయినది)గాను, విసుకు పుట్టించేదిగాను ఉండాలని నిశ్చయించలేదు.

కానీ, మనము ముందుకు సాగే కొద్దీ, ప్రార్థించటం కష్టమైన పనిగా కనబడుతుంది. దేవుడు మన హృదయాల్లో పెట్టిన భారము చొప్పున చిన్న విషయాలను గూర్చి ప్రార్థించటానికి మనము నమ్మకముగా ఉన్నట్లయితే, ఆయన ఇంకను తన భారములను మనకు ఇచ్చుటను కనుగొంటాము. ఆవిధముగా ఇతరులను దీవించే పనిలో మనము దేవుని జతపని వారమవ్వగలము.

యేసు ''మహా రోదనముతోను కన్నీళ్లతోను'' ప్రార్థించాడు (హెబ్రీ 5:7). ఒకసారి గెత్సెమనెలో ప్రార్థించినపుడు, ఆయన చెమట గొప్ప రక్తబిందువులవలె ఆయెను (లూకా 22:44).ఆయన ప్రార్థన ఎంతో తీవ్రతతో కూడినది. ఒకసారి ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపారు (లూకా 6:12). ఆయన పలుసార్లు ప్రార్థన చేయడానికి అరణ్యములోనికి తప్పించుకొనిపోవుట అలవాటుగా ఉండేది (లూకా 5:16) . ఒకరు ఈ విధంగా చెప్పినట్లు ''పర్యాటకులు ఏ విధంగా అయితే క్రొత్త ప్రదేశానికి వెళ్ళి, ఇంపైన ప్రదేశాలను చూడ్డానికి ఇష్టపడతారో, అలాగున యేసు ఏ క్రొత్త ప్రదేశానికి వెళ్లినా ప్రార్థించటానికి ప్రశాంత వాతావరణముగల ప్రదేశము కొరకు వెదికేవారు''.

యేసు యొక్క మాదిరి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో తెలియజేస్తుంది. ఆయనకే ప్రార్థన

అధ్యాయము 9
సహవాసము మరియు సంఘము

దేవుడు మనలను క్రీస్తు సారూప్యములోనికి మార్పు చేయాలని ఇష్టపడుతున్నట్లు మనమిదివరకే చూసాము. కానీ, మనము యేసు యొక్క ఇతర శిష్యులతో కలువకుండా ఒంటరిగా ఉంటే, ఈ మార్పు మనలో జరగదు. మనము వారితో బాటే ఈ మార్పును పొందగలము.దేవుడు మనలను ఆయనపై ఆధారపడి మాత్రమే గాక, ఒకరితో ఒకరు సహవాసము చేస్తూ జీవించాలని ఆశిస్తున్నాడు. పాత నిబంధన కాలమందు దేవుడు ఒక మోషేను లేక ఒక ఏలీయాను లేక ఒక బాప్తిస్మమిచ్చు యోహాను మొదలగు వ్యక్తుల ద్వారా తన కార్యాలను జరిగించారు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు ఆశించేది క్రీస్తు ఆధిపత్యం క్రింద ఒకే శరీరం లాంటి శిష్యబృందం. 'సంఘము' అంటే క్రీస్తు శరీరమే (ఎఫెసీ 1:22,23; 2:14-16).

సంఘము - క్రీస్తు శరీరము

సంఘమన్నది ఒక కట్టడము లేక ఒక శాఖలాంటిది కాదు. వెలుపలకు పిలువబడ్డ ప్రజల సమూహము అని అర్థము నిచ్చే గ్రీకు పదమయిన ''ఏక్లేషియా'' నుండి ఆంగ్లము లోనికి తర్జుమా చేయబడిన పదమే క్రొత్త నిబంధనలోని ''సంఘము'' - ప్రస్తుత సందర్భములో దేవునికి స్వంత సొత్తుగా నుండుటకు లోకములో నుండి వెలుపలకు పిలువబడినటువంటిది.

ప్రపంచమంతటను, ఎవరెవరైతే పాపము నుండి, లోకము నుండి ప్రత్యేకముగా ఉండాలన్న దేవుని పిలుపుకు స్పందిస్తారో, అట్టి వారందరు కలిసి క్రీస్తు శరీరము అనే సంఘముగా ఏర్పడతారు. ప్రతీ ప్రదేశంలోను, క్రీస్తు శరీరము యొక్క సభ్యులంతా కలిసి ఆ ప్రదేశంలో ఆ ఆశరీరమును స్థానికముగా వ్యక్తపరచాలి.

మొట్టమొదటి క్రీస్తు శరీరమన్నది క్రీస్తు ఈ లోకములోనికి వచ్చినట్టి భౌతిక శరీరం. ఆ శరీరంలో దేవుడు తన్నుతాను లోకానికి ప్రత్యక్ష పరుచుకొన్నాడు. యేసు సంపూర్ణముగా తండ్రికి అర్పించుకోగలిగాడు కాబట్టి, తన జీవితాంతమున ''నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు'' అని అనగలిగాడు (యోహాను 14:9).

మనమందరము కలిసి మన చుట్టూ ఉన్న లోకమునకు యేసు యొక్క ప్రతినిధిగా వ్యవహరించడమే ఇప్పటి మన పిలుపు. ఏ ఒక్కరూ తనకు తానే యేసుకు తగిన ప్రతినిధిగా వ్యవహరించలేడు. మనకు ఒకరికొకరి సహకారం కావాలి. మనలో ఉత్తములైన వారు కూడా అసమతుల్యముగానే ఉన్నారు. మనలో బలమైన విషయములతో బాటు, బలహీనమయిన విషయాలు కూడా ఉన్నాయి. మనము ఒక విషయములో క్రీస్తు మాదిరిని బాగా చూపిస్తూ, వేరొక విషయము చాలా కొద్ది మోతాదులోనే క్రీస్తు మాదిరిని చూపగలుగుచున్నాము. మనందరము కలసి ఉన్నప్పుడు ఒకరి బలమైన విషయములు, వేరొకరి బలహీనమైన విషయములు సమతుల్యతను చేయుటను మనము చూడవచ్చు. అందువల్ల మనము ఒకరికొకరము ప్రేమతోను అణుకువతోను లోబడి జీవించినట్లయితే, అవిశ్వాసలోకానికి మనద్వారా క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత ప్రతిబింబిస్తుంది. ఇదే సంఘము పట్ల దేవుని ఉద్దేశ్యమయి ఉన్నది.

స్థానిక సంఘాల్లో భాగస్తులమగుట

నీవు క్రైస్తవుడిగా మార్పు చెందిన వెంటనే, ఏ శిష్యులైతే దేవుని వాక్యానికి లోబడి, యేసు అడుగుజాడల్లో నడవడానికి అతురత కలిగి ఉంటారో వెదకి అట్టి సహవాసంలో చేరాలి. క్రైస్తవుడుగా మారిన నూతన వ్యక్తి ఇట్టి దశలోనే క్రైస్తవత్వంలో గల అనేక సమాజాలను, శాఖలను చూచి కలవరపడతాడు. దురదృష్టవశాత్తు, ఒక చివరినుండి మరొక చివరికి గల పలు క్రైస్తవ సిద్ధాంతాల పుంజములో అనేక గుంపుల వారు ఈ ప్రపంచంలో మేము ఒక్కరమే క్రీస్తుకు సరియైన రాయబారులమని చెప్పుకుంటున్నారు!!

ఇటువంటి చాలా గుంపుల వారు, నీవు వారితో కలవనట్లయితే, క్రీస్తు యొక్క సంఘములో నీవు భాగస్తుడవు కానేరవని వారి బైబిళ్ళను గుద్ది మరీ నిరూపిస్తుంటారు!

వారి 'గుంపుకు' చెందని మరియు వారి వింత బోధనలను ఆచరింపని అనేకమందిని, దేవుడు తన పిల్లలుగా కలిగియున్నాడన్న విషయాన్ని ఇటువంటి వారికి చెప్పి ఒప్పిపంచటము చాలా మట్టుకు అసాధ్యమయిన పనే అవుతుంది. దురభిమానానికి ఉన్న శక్తి అటువంటిది! ఈ దినాల్లో క్రైస్తవత్వాన్ని పీడిస్తున్న పరిసయ్యతత్వము మరియు మత మౌఢ్యములనే సాలె గూడుల్లో చిక్కుకొనకుండా మీరు జాగ్త్రత పడాలి.

ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, ఆయనను నిజాయితీతో వెంబడించాలని చూస్తారో అట్టి వారి పట్ల మీ హృదయాలను తెరచి ఉంచాలి. నీవనుకొనేలాగే వారూ కొన్ని సిద్ధాంతాల పట్ల 'ఔను' అనే సుముఖతను, మరికొన్ని సిద్ధాంతాల పట్ల 'కాదు' అనే వ్యతిరేకతను ఖచ్చితంగా ఏకీభవించలేక పోవచ్చును. కానీ అది అంత ఆందోళన చెందాల్సిన విషయమేమి కాదు, దేవుడు వారికి ఇచ్చిన వెలుగులో వారు నడుస్తున్నట్లయితే, అంతేచాలు. దేవుడు మనకిచ్చిన వెలుగులో వారు ఖచ్చితంగా నడవాలని మనము వారిని బలవంతము చేయలేము.

దేవుని పిల్లలనందరినీ చేర్చుకొనుట

దేవునికి అనేక మంది పిల్లలున్నట్లే, మనమును అనేక మంది సహోదరులను, సహోదరీలను కలిగియుండాలి. దేవుడు చేర్చుకున్నట్టి ప్రతీవారినీ మనము కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించి చేర్చుకొనాలి (రోమా 14:1, 15:7). యేసు ఒకరిని తన సహోదరుడని పిలచుటకు సిగ్గుపడకపోయినట్లయితే, మనము కూడా అతనిని నా సహోదరుడని పిలవడానికి సిగ్గుపడకూడదు (హెబ్రీ 2:11).

సహవాసము అనే విషయంలో విశ్వాసులు రెండు అంచులకు(చివరలకు) వెళ్ళే అవకాశముంది. ఒకటి, సహవాసంలో కొనసాగటానికిగాను సత్యము విషయంలో రాజీపడటం, మరొకటి, సహవాసము చేయటానికి ఒప్పుకొనుటకు ముందే అన్ని విషయాల్లోనూ ఒకే విధంగా ఉండాలని కోరుకోవడం. మీరు జ్ఞానవంతులైతే, ఈ రెండు అంచులలో దేనివైపునకు చేరకుండా దూరంగా ఉంటారు.

దేవుని కార్యము ఎలా చేయాలన్న విషయముపై ఏకీభవించని వారితో మనము కలిసి పనిచేయటం జరగని పని అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ మనము ఒకనితో సహవాసము చేసే మునుపు, అతను ప్రతీ చిన్న విషయము కూడా మనము నమ్మేలాగే నమ్మాలని కోరుకోకూడదు. మనము ఒకనితో కలిసి పనిచేయటానికీ మరియు వానితో సహవాసము చేయటానికి మధ్య వ్యత్యాసమున్నది.

ఎలాగైనప్పటికీ, మీరున్న ప్రదేశములో మిమ్మును మీరు అప్పగించుకొనుటకు, మీకు ఆత్మీయ గృహముగా ఉండగలిగిన ఒక సంఘమును మీరు తప్పక చూసుకోవాలి.

క్రొత్త నిబంధన సంఘము

మీ ప్రదేశంలోని అనేక సంఘాలలో మీరు ఇప్పటి వరకు గ్రహించినదాని ప్రకారం క్రొత్త నిబంధనను చాలా బాగా అనుసరిస్తున్నట్లుగా ఉన్న ఒక సంఘము కొరకు మీరు వెతకాలి. కాలము గడిచే కొలదీ, మీరు క్రొత్త నిబంధనను మరెక్కువగా గ్రహించిన కొలది, ప్రస్తుతమున్న సంఘమును విడచి దేవుని వాక్యముతో ఏకీభవించే వేరొక సంఘములో చేరాలని మీరు భావించవచ్చు.

ఆత్మీయంగా అభివృద్ది చెందుతున్న వారికి మరియు తన జీవితంలో దేవుడు ఉద్దేశించినట్టి ఉత్తమమైన మరియు హెచ్చు స్థాయిలో ఉన్న ఆశీర్వాదాలను పొందటానికి నిశ్చయించుకొన్న వారికి ఇదొక స్వభావసిద్ధమైన విషయమే ఎప్పుడు కూడా. ప్రతీ విషయంలోను దేవుని యొక్క ఉత్తమమైన మరియు శ్రేష్టమైన వాటికన్నా తక్కువ స్థాయి ఆశీర్వాదముతో తృప్తి నొందకూడదు.అప్పుడే నిత్యత్వంలో దేనికినీ విచారించనక్కరలేదు.

క్రొత్త నిబంధన సంఘమును ఎటువంటి శాఖాపరమైన గుర్తింపు (లేబుల్‌) ఉండదు.క్రొత్త నిబంధన సంఘమన్నది యేసు క్రీస్తు నామములోనికి పరిశద్ధాత్మ చేత చేర్చబడిన ప్రజల సమూహము. అలాంటి సహవాసములోనే ప్రభువు ఉంటాడని వాగ్దానము చేసి యున్నాడు (మత్తయి 18:20) మీరు భాగస్తులయ్యేటి సంఘం, బైబిలు గ్రంధాన్ని దేవుని వాక్యముగా మరియు అది ఒక్కటే విశ్వాసము మరియు జీవమునకు పునాదియని అంగీకరించేదిగా ఉండాలి. అనేక మత మౌఢ్యపు గుంపులు బైబిలు గ్రంథములో వ్రాసి ఉన్నవే వారి పూర్తి అధికారిక మైనట్టివని చెప్పుచున్నప్పటికీ, మరొక ప్రక్క వారి నాయకులు వ్రాసినవి కూడా అంతే అధికారికమైనట్టివిగా చెప్పటం తరచుగా కనబడుతుంది. మీరు వారిని ఇంకా జాగ్రత్తగా గమనించిన కొలదీ, వారు దేవుని వాక్యముచేత కాకుండా వారి నాయకుల బోధల చేతే మరెక్కువగా కట్టబడి ఉన్నట్లు మీరు గ్రహించగలరు. వారిలో అనేకమంచి గుణాలుండవచ్చు. కానీ, మీరు వారితో సహవాసము చేస్తే, వారి తెగల వైఖరులు మిమ్ములను బానిసలుగా చేయటం చాలా శీఘ్రముగా గ్రహించగలరు.

.

దేవుని సంఘములో విశ్వాసులందరు సమానముగా దేవుని యాజకులు- ఎందుకంటే దేవుడు మనందరినీ యాజకులుగా చేశాడు (1పేతురు 2:9). ఒక 'సంఘము' ప్రత్యేకమైన యాజకులనుగాని, కాపరుల (పాస్టర్స్‌)ను గాని కలిగియుండి వారు మాత్రమే దేవుని వాక్యమును బోధించుటకు అర్హులని బావించిన యెడల అది దేవుని చిత్తమునకు విరుద్ధము.

.

సంఘ నాయకత్వము పెద్దల(ఎప్పుడూ ఒకరికంటే ఎక్కువ) చేతుల్లో ఉండేలా దేవుడు నిర్ధేశించాడు. కాని ఈ పెద్దలు (పూర్తి కాలపు సేవకులు'గా ఉండనక్కరలేదు (అపొ.కా. 14:23,తీతు 1:5). క్రొత్త నిబంధన సంఘపు కూటములలో దేవుని వాక్యమును బోధించుటకే ప్రాముఖ్యత ఉంటుంది. అట్టి సంఘాల్లో విశ్వాసులందరు వారి యొక్క పరిపక్వత, ఆత్మీయ వరాలను బట్టి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి స్వేచ్ఛ ఉంటుంది. చెప్పబడిన వాక్యము నిజముగా పరిశుద్దాత్మ ప్రేరేపణను బట్టే అయితే, అది ప్రజలను ఆదరించి, సవాలు చేసి, బలపరచి, 'హృదయ రహస్యముల'ను బయలు పరచి, ఖచ్చితంగా దేవుడే మాట్లాడుతున్నాడు అని ఒప్పుకునేటట్లు చేయడం చూడగలుగుతాము (1కొరిందీ¸ 14:3, 24-31).

నిజమైన క్రొత్త నిబంధన సంఘము యొక్క ముఖ్యభారము, శిష్యులను చేయడం పైన మరియు యేసుని ఆజ్ఞలను పూర్తిగా గైకొనునట్లు వారికి బోధించడంపైన ఉంటుంది (మత్తయి 28:19,20). అట్టి సంఘాలకుండిన ప్రత్యేక లక్షణం. యేసు (యోహాను 13:35) లో ''విూరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి విూరు నా శిష్యులని అందరును తెలిసికొందురు'' అని చెప్పినట్లు సంఘ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ కలిగియుండడము.

దేవుని వాక్యము ఎక్కడైతే బలంగా ప్రకటింపబడుతుందో, ఎక్కడైతే దేవుని ప్రేమ పరిపాలిస్తుందో, ఎక్కడైతే దేవుని సన్నిధి యొక్క ఉనికిని తెలుసుకోగలుగుతారో, మీ ప్రదేశంలో ఉన్న అలాంటి సంఘములో తప్పకుండా మీరు భాగస్థులు కావాలి.

సహవాసము యొక్క ప్రాముఖ్యత

మనము ఇతరులతో కలిసి ప్రేమతో కూడిన సహవాసంలో మనము జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనలను మనము ఎంతగా ఉపేక్షించుకొని, సిలువనెత్తుకొని ప్రతిరోజు నడవాలో తెలుసుకోగలము. దేవుని పిల్లలు ఒకరితో ఒకరు సహవాసము చేయకుండా వేరు చేయటానికి సాతాను ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనము క్రీస్తులో ఎదిగిన వారమైతే అటువంటి సాతాను ప్రయత్నాలు మనలోను, ఇతరులలోను రానీయకుండా తగు జాగ్రత్తతో జీవించగలము. క్రీస్తు శరీరమందు సహవాసము విరిగినట్లయితే అది దేవునికే గాక మనకునూ గొప్ప నష్టము వాటిల్లుతుంది.

సంఘము యొక్క ఐక్యత యందు ఎనలేని శక్తి ఉంటుంది. ఐక్యత కలిగినట్టి సంఘమొక్కటే సాతానును జయించగలదు. ''కనీసం ఇద్దరు విశ్వాసులు వారి ఆత్మలలో పూర్తిగా ఏకమై,సంపూర్తిగా ఏకీభవిస్తే వారు తండ్రిని కోరే ఎలాంటి కోరికైనా సరే అది వారికి అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఐక్యత కలిగిన మనస్సులు పరిశుద్ధాత్మ చేత చేర్చబడుతాయో అట్టి వారి మధ్య నేను బలంగా ఉంటాను'' అని యేసు చెప్పాడు. అలాంటి విశ్వాసుల సంఘము సాతాను శక్తులను భూమి మీదను, పరలోక మందును బంధించగలదు. వారు సాతాను చేత పీడింపబడుచున్న ప్రజలను ప్రార్థనల ద్వారా విడిపించగలరు (మత్తయి 18:18-20) వివరించబడినది.

అందుకే సాతాను విశ్వాసుల మధ్య విభేధాలను తెచ్చి, వేరు వేరు ముఠాలను, వర్గాలను తయారు చేస్తాడు. అతడు ఐక్యత కలిగిన సంఘము యొక్క ఎదురు దాడినుండి తన రాజ్యమును కాపాడుకోవాలని కోరుకొంటాడు. మనము సాతాను కుతంత్రాలను ఎరిగిన వారమై, మెలకువ కలిగి ఉండాలి.

క్రీస్తు భౌతిక శరీర మందు అన్ని అవయవములు కలిసి పనిచేయనట్లయితే ఆయన యొక్క శరీరం పనిచేయుటకు ఎంత హద్దు ఏర్పడి ఉండేదో ఒక్కసారి ఊహించండి. ఆయన దేవుని మహిమను ఈ లోకానికి కనపరచలేకపోయేవాడు. ఆ స్థితినే ఈ రోజుల్లో క్రీస్తు ఆత్మీయ శరీరమైన తన సంఘానికి శిరస్సుగా, విశ్వాసులు విభజింపబడినప్పుడు కలిగియుంటాడు.

మనమూ నష్టపోతాము. దేవుని పిల్లల్లో ఏ ఒక్కరినుంచైనా మనకు మనము దూరపర్చుకొంటే, ఆ ఒక్క బిడ్డ ద్వారా మనము పొందుకొనవలసిన దేవుని ఆశీర్వాదములనన్నింటిని మనకు మనమే పోగొట్టుకొంటాం. క్రీస్తు ప్రేమను మనము 'పరిశుద్ధులతో కలసి మాత్రమే తెలుసుకోగలుగుతాం (ఎఫెసీ 3:17-19).

(క్రైస్తవ సహవాసము యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఇంకా లోతుగా గ్రహించాలంటే, నేను వ్రాసిన పుస్తకమయిన 'క్రీస్తులో ఒకే శరీరము'ను చదువగలరు).

అధ్యాయము 10
ఈ యుగ సమాప్తి

పాత నిబంధన కాలములో మరణము తరువాత జీవితమును గూర్చియు మరియు దేవుని భవిష్యత్‌ ప్రణాళికను గూర్చియు సరియైన అవగాహన లేదు. కాని యేసు ఈ రెండు అంశములను గూర్చి చక్కగా బోధించారు. వీటిని గూర్చిన సత్యమును తెలుసుకొనుట మనకు చాలా మంచిది.

మరణం తరువాత ఏమిటి?

యేసు మరణాన్ని జయించాడు కాబట్టి, నిజమైన క్రీస్తు శిష్యులకు మరణమంటే భయము ఉండదు. మరణమనేది ఒక ఓడిపోయిన శత్రువు లాంటిది. యేసు తన మరణమును బట్టి అపవాదిని శక్తి హీనునిగా చేశాడు కాబట్టి మన మెన్నటికినీ మరణమంటే భయపడకూడదని (హెబ్రీ 2:14,15) బైబిలు గ్రంధం చెప్తుంది. మరణము యొక్క తాళపు చెవులు ఇప్పుడు యేసు చేతిలో ఉన్నవి (ప్రకటన 1:18) మరియు ఇప్పుడు తన శిష్యులకు తానొక్కడే మరణద్వారమును తెరువగలడు. సాతాను వారిని ముట్టుకోలేడు.

మనుష్యుడు మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? యేసు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ధనవంతుడు, లాజరులను గూర్చి చెప్పినప్పుడు విశదంగా చెప్పియున్నాడు. మీరిక ముందుకు చదువబోయేముందు (లూకా 16:19-31) లో వ్రాసిన సంగతులను ఇప్పుడే చదవడం మంచిది...

ఇదొక ఉపమానము కాదు ఎందుకంటే యేసు చెప్పిన ఏ ఉపమానాల్లోనూ, ఇక్కడ చెప్పిన విధంగా వ్యక్తి పేరును ఉపయోగించలేదు. ధనవంతుడు మరియు లాజరు ఇద్దరూ కూడా నిజమైన వ్యక్తులు.ఒక వ్యక్తి చనిపోయిన తరువాత వెళ్ళడానికి రెండు స్థలములే ఉన్నాయని యేసు ఈ వాక్య భాగములో విశదంగా చెప్పియున్నాడు. ఒకటి పరలోకము (అబ్రాహాము రొమ్ము లేక 'పరదైసు' అని కూడా పిలుస్తారు) - అది ఆదరణ గల స్థలము, మరొకటి నరకము - కరిన హింస, దు:ఖమును గల స్థలము. మనిషి చనిపోయిన వెంటనే తన శరీరము భూమిలో పాతిపెట్టబడక మునుపే, అతడి జీవాత్మ వెంటనే పై రెంటిలో ఏదో ఒక స్థలానికి వెళుతుంది. అతనికి శరీరం లేకపోయినప్పటికీ అతను పరిసరాల ఉనికిని గూర్చి తెలుసుకోగలుగుతాడు. సుఖము లేకబాధను అనుభవించగలుగుతాడు.

మనుష్యుడు శరీరము, ప్రాణము (జీవము), ఆత్మ అను మూడంతల సమ్మేళనము (1థెస్స 5:23). మరణమందు ప్రాణము (జీవము) మరియు ఆత్మలు శరీరమును విడిచి పరదైసుకు గానీ లేక నరకానికి గాని వెళ్తాయి.సిలువయందు వ్రేలాడే సమయంలో యేసు పశ్చాత్తాపపడిన దొంగతో ''నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని చెప్పియున్నాడు.యేసు మరియు ఆ దొంగ, వారి ప్రాణములు, శరీరములను వదిలిన వెంటనే పరదైసుకు చేరుకొన్నారు. యేసు తన మరణానంతరము, భూగర్భమునందు, మూడు పగళ్ళు మూడు రాత్రులు ఉంటానని చెప్పారు. (మత్తయి 12:40). దీన్ని బట్టి పరదైసన్నది, ఆ సమయములో భూగర్భములో ఉండి ఉంటుందని అర్థమవుతుంది. క్రీస్తు ఆరోహణమైనప్పుడు ''తాను భూమియొక్క క్రింది భాగముల నుండి...ఆకాశమండలములన్నింటికంటె పైకి వెళ్ళాడనియు మరియు చెరను చెరగా పట్టుకొని పోయాడనియు'' (ఎఫెసీ 4:8,9) చెప్పబడియున్నది. మూడవ ఆకాశమునకు పరదైసును మరియు అందున్నట్టి అన్ని ఆత్మలను కొనిపోయాడు. 2కొరిందీ¸ 12వ అధ్యాయమందు 2వ మరియు 4వ వచనములను పోల్చినట్లయితే,ఇప్పుడు పరదైసు మూడవ ఆకాశమందు ఉంచబడినట్లు తెలుసుకోవచ్చు. యేసు శిష్యుడు తాను చనిపోయిన వెంటనే ఆ స్థలానికి వెళ్తాడు (ఫిలిప్పీ 1:23).

క్రీస్తు రాకడ యొక్క సూచనలు

క్రీస్తు భూమి పైకి వచ్చుటకు కొద్ది ముందు జరుగబోయే వివిధ సంఘటనలను గూర్చి బైబిలు గ్రంధంలో చెప్పబడియున్నది. వాటిలో కొన్ని ఈ క్రిందివి.

 1. యుద్ధములు, కరువులు మరియు భూకంపములు (మత్తయి 24:7). అన్ని కాలములలోనూ ఇవన్నియు భూమి మీద ఉంటున్నవే. కానీ రెండవ ప్రపంచ యుద్ధము (1939-1945) తరువాత వీటి సంఖ్య బహుగా పెరిగింది.
 2. మానవుని జ్ఞానము ఒక్కసారిగా పెరిగిపోవుట మరియు ప్రపంచపు నలుదిక్కులకు అధికంగా ప్రయాణం చేయడం (దానియేలు 12:4), ఈ రెండూ కూడా మునుపటి కన్నా ఒక ఏబది సంవత్సరములనుండి అత్యధికంగా పెరిగిపోవడం చూడగలము.
 3. మనుష్యులు సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించుట (2తిమోతి 3:4). జారత్వము ఈ కాలమునాటి ఒక ప్రత్యేకమైన దుష్టస్వభావమై యుంటున్నవి. జారత్వమును పెంపొందించడానికై బూతు సినిమాలు మరియు వీడియో టేపులు సాతాను ఉద్దేశ్యము నెరవేర్చుటకు బహుగా ఉపయోగపడుతున్నవి.
 4. మనుష్యులు అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు కావటము (2తిమోతి 3:2-4). ఈ కాలంలో ఇళ్ళల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో మరియు కర్మాగారాల్లో తిరుగుబాటు తనము(ఆత్మ)ను అధికంగా ఉండటం చూస్తున్నాము.
 5. విశ్వాసులు తమ విశ్వాసము నుండి తొట్రిల్లడం (1తిమోతి 4:1). మనము ఈ కాలంలో అనేక మతపద్ధతులకు ప్రాముఖ్యతనిచ్చే మత మౌఢ్యపు తెగలు అనేకమైనవి ఏర్పడటం మూలాన, విశ్వాసులు వాటిలో పడిపోవటం చూస్తున్నాము.
 6. ఇశ్రాయేలు దేశం తిరిగి జన్మించటం (అంజూరపుచెట్టు- ఇశ్రాయేలు దేశమునకు గురుతు - అది చిగురించటం - లూకా 21:29-32). క్రీ.శ. 70 నుండి కూడా యూదులు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోవటం జరిగింది. అప్పటినుండి ఆ అంజూరపు చెట్టు దాదాపు 19 శతాబ్దములు మోడుబారిపోయి ఉండినది. కాని మే నెల 1948 నందు ఇశ్రాయేలు దేశము మళ్ళీ జన్మించింది.

యెరూషలేము, యూదులు కానట్టి జాతుల వారిచేత, వారికాలము సంపూర్ణమగునంత వరకు ఆక్రమింపబడి యుంటుందని (లూకా 21:24) యేసు చెప్పియున్నాడు. 20 శతాబ్దాల కాలములో మొదటిసారిగా జూన్‌ 1967లో ఇశ్రాయేలు వారు యెరూషలేమును ఆక్రమించారు. ప్రపంచంలో ఈ కాలంలో జరుగుచున్నవి చూసినట్లయితే చాలా ఉత్తేజము కలిగించేవిగా ఉన్నవి. ఈ సూచనలన్నీ క్రీస్తు అతి త్వరలో రావటాన్ని సూచిస్తున్నాయి.

మొదటి పునరుత్థానము మరియు క్రీస్తు న్యాయ పీఠము

క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, ఆయనవారమైన మనమందరము ఒక రెప్పపాటున మార్పుపొందుదుము. అక్షయమైన క్రొత్త శరీరమును పొందుదుము (1కొరిందీ¸ 15:51-53). మన క్రొత్త శరీరములు, యేసు పునరుత్థానుడైన తరువాత తానుపొందిన శరీరమునకు సమరూపముగా ఉంటాయి (ఫిలిప్పీ 3:20,21). మొదట క్రీస్తు నందు మృతులైన వారు క్రొత్త శరీరములతో సమాధులలోనుండి లేతురు. ఆ మీదట సజీవులై నిలచియుండు ఆ కాలమందలి యేసు శిష్యులు కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదురు (1థెస్స 4:13-17).

ఆ తరువాత క్రీస్తు తన న్యాయ పీఠమును ఏర్పరచి, భూమిపై జీవించినట్టి జీవితములో మన విశ్వాస్యతను తీర్పు తీర్చి, (అంచనా వేసి)దానికి తగినట్టుగా ఒక్కొక్కరికి బహుమానము ఇస్తాడు.నమ్మకంగా జీవించినట్టి వారు పొందే కిరీటములను గూర్చి బైబిలు గ్రంధము చెప్పుచున్నది. (2కొరిందీ¸ 5:10), (1కొరింది¸ 3:11-15 మరియు 4:5),( 2తిమోతి 4:8)మరియు (1పేతురు 5:4) లలో ఆనాడు ప్రభువు తన శిష్యులకిచ్చే బహుమానాల గూర్చి విశదంగా వ్రాయబడియున్నది.

ఆనాడు ''మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు''ను చూడగలము (మత్తయి 19:30). మనకు భూమియందు ఎక్కువ ఆత్మీయంగా జీవించినట్టు కనపడేవారు,దేవుని దృష్టియందు అంత ఎక్కువగా విశ్వాసంగా జీవించనట్టు ఆనాడు తెలుసుకోవచ్చు. మనము హెచ్చుగా తలంచనట్టి కొందరిని, చివరికి దేవుని దృష్టిలో విశ్వాసంగా జీవించినట్టుగా అప్పుడు తెలుసుకోగలము. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన అపనమ్మక ప్రసంగీకునికన్నా, ఎవరికీ తెలియనట్టి నమ్మకమైన విధవరాలు ముందు స్థానాన్ని ఆక్రమించుకోగలుగుతుంది.ఆనాడు, భూమి మీద మనిషి విలువ ఇచ్చిన ధనము, ప్రఖ్యాతి మొదలగునవి దేవుని ముందు విలువలేనివని ఆరోజున కనుగొనగలుగుతాము. మరియు మనిషి విలువ ఇవ్వనట్టి సుగుణాలయిన దీనత్వము, నిస్వార్థము, దయ, మంచితనము మొదగునవి అత్యధికంగా దేవుని చేత విలువ ఇవ్వబడేటివని కనుగొంటాము.

ఆ తరువాత బైబిలు గ్రంధము చెప్పిన

''దేవుని గొఱ్ఱెపిల్ల వివాహము''

జరుగుతుంది. ఇది యేసుక్రీస్తుకు తన పెండ్లి కుమార్తెతో (భూమిపై ప్రతిదినము తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని శిష్యులుగా వెంబడించుటలో విశ్వాసంగా జీవించిన వారు) జరిగేటి ఆత్మీయ వివాహము (ప్రకటన 19:8-10).

దేవుని కొరకును మరియు ఆయన సువార్త కొరకును, మనము అపార్థమును, పరిహాసమును, అవమానమును, హింసలను, చివరికి చంపబడుటను కూడా భరించుట గొప్ప భాగ్యమని ఆనాడు గ్రహించగలము. వెయ్యేండ్ల పరిపాలన ఆ తరువాత వెయ్యేండ్ల పాటు సమాధానము రాజ్యము ఏలడం ప్రారంభమవుతుంది. భూమి మీద ఆనాడు ఏదేను వనములో ఉన్న పరిస్థితులు ఉంటాయి. చిఱుత పులి, మేకపిల్ల వద్ద పరుండుట, పాలు కుడుచు పిల్ల హానిచేయని నాగుపాముతో ఆటలాడుకొనుట మొదలగునవి ఉంటాయి (యెషయా 11:6-9).యేసు యెరూషలేము నుండి సర్వ లోకమునకు రాజుగా ఏలును (జెకర్యా 14:9-21). ఇప్పుడు సాతాను భూమి మీద సంచరించునట్లు అప్పుడు అవకాశము లేకుండా ఆ కాలమంతా బంధింపబడతాడు. ఆ వెయ్యి సంవత్సరములు ముగిసిన తర్వాత భూవాసులను మరొకసారి పరీక్షించటానికి సాతాను కొద్దికాలం పాటు చెరనుండి విడిపింపబడతాడు. అప్పుడు కూడా బహు జన సమూహములు సాతానును వెంబడిస్తారు. వెయ్యి సంవత్సరముల పాటు శాంతమేలునట్టి రాజ్యాన్ని రుచి చూచి కూడా, తమపై క్రీస్తు అధికారాన్ని తిరస్కరించేటి వారున్నారని దేవదూతలకు, మనుష్యులకు దేవుడు కనపరుస్తాడు.

మానవుని అంధత్వము, మొండితనము (మూర్ఖపు పట్టుదల) మరియు దుష్టత్వము అలాంటిది. కాని అట్టి తిరుగబడెడి ప్రజలపైకి దేవుడు తీర్పుతో దిగివస్తాడు మరియు సాతాను అగ్నిగంధకములుగల గుండములోనికి పడవేయబడతాడు ఇది నరకము యొక్క వివరణ - (ప్రకటన 20:7-10).

రెండవ పునరుత్థానము మరియు అంతిమ తీర్పు

అటు తరువాత దేవుడు అవిశ్వాసులకు తీర్పు తీర్చడానికి న్యాయపీఠాన్ని ఏర్పరుస్తాడు. ఇది రెండవ పునరుత్థానము. చనిపోయిన వారు వారి సమాధులలో నుండి లేపబడుదురు.నరకములోనుండి అవిశ్వాసుల ఆత్మలు, భూమిపై పూర్వము తమకుండిన శరీరములతో దేవుని ఎదుట తీర్పు తీర్చబడుటకై నిలుస్తారు. ''గ్రంధములో వ్రాయబడిన వాటిని బట్టి, తన క్రియల చొప్పున'' వారు తీర్పు నొందుదురు (ప్రకటన 20:12).

'జ్ఞాపకము' అనేది మన జీవితకాలమంతా మనము ఆలోచించినవి, మాట్లాడినవి, చేసినవి అంతేగాక మన వైఖరి, ఉద్దేశములను వీడియోటేప్‌ లాగా నమ్మకముగా నమోదు చేస్తుంది.అవిశ్వాసుల రహస్య జీవితాలను దేవుడు ఆ దినాన ఈ టేపుద్వారా మొత్తం ప్రపంచానికి బయలు పరుస్తాడు. దేవుడు వారిని నిత్యనరకానికి పంపడంలో పరిపూర్ణమైన నీతిమంతుడుగా ఈ క్రియ ద్వారా అందరికి కనపరుస్తాడు. జీవ గ్రంధంలో పేర్లు లిఖింపబడని వారందరు, మునుపు భూమిపై తాము సేవించినట్టి సాతానుతో కలసి ఉండడానికి, అగ్ని గుండములోనికి త్రోసివేయబడుదురు (ప్రకటన 20:15).

యుగసమాప్తి

అటు తర్వాత ఈ యుగము సమాప్తమై నిత్యత్వము ప్రారంభమవుతుంది. విమోచించబడిన స్త్రీ పురుషులు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోనికి ప్రవేశించుదురు మరియు క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె తన మహిమలో ప్రకాశించును (ప్రకటన 21లో వివరించబడినట్లు).

సాతాను మరియు అవిశ్వాసులందరును దేవుడు మరలా తయారుచేయబోవు పరిశుద్ధమైన భూమ్యాకాశములనుండి తొలగింపబడుతారు. ఆ మహిమకరమైనట్టి విశ్వంలో పాపము యొక్క వికార రూపము ఎన్నటికి తలెత్తదు మరియు మన శరీరమందు ఎలాంటి దురాశలు కూడా ఉండవు. నిత్యత్వము వరకు దేవుని చిత్తాన్ని ఆనందముగా ఎంచుకొన్నట్టి ప్రజలతో పరలోకము నిండియుంటుంది.

జయించుట కొరకు పిలుపు

''ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి (ప్రస్తుతమున్న ఆకాశము మరియు భూమి) గనుక, విూరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను'' (2పేతురు 3:11,12) అని పేతురు చెప్పి యున్నాడు.

ఈ చివరి దినాల్లో ఆత్మ యొక్క వర్తమానాన్ని 'జయించుట' అన్న ఒక్క మాటలో చెప్పవచ్చు (ప్రకటన 2:7,11,17,26; 3:5,12,21; 21:7)ను చూడండి.

ఈ దినాల్లో అవిశ్వాసులకు చేసే ప్రసంగాలలో చాలా వరకు తప్పించబడుతున్న 'పశ్చాత్తాపము నొందుట' అన్న విషయమును నొక్కి చెప్పుటతో ఈ పుస్తకమును ప్రారంభించాము.అలాగే ఈ దినాల్లో విశ్వాసులకు చేసే ప్రసంగాలలో చాలా వరకు తప్పించబడుతున్న 'జయించుట' అన్న విషయమును నొక్కి చెప్పుటతో ఈ పుస్తకాన్ని ముగిస్తాము.

మానవుడు పాపములో పడిన నాటినుండి అతనికి దేవుడిచ్చే పిలుపు జయించువానిగా ఉండమని. దేవుడు కయీనుతో ''పాపము నీ ద్వారము యొద్ద (హృదయ ద్వారము యొద్ద) పొంచియున్నది...కానీ నీవు దానిని ఏలుదువు'' అని చెప్పియున్నాడు (ఆది.కా. 4:7). బైబిలు గ్రంధములోని చివరి పుస్తకములో ఈ పిలుపే మరల ఇవ్వబడియున్నది.

''జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై యుందును. అతడు నాకు కుమారుడై యుండును''(ప్రకటన 21:7).

దేవునితో సహవాసము చేయడము మరియు ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చడము వంటి మహిమకరమైన జీవితముతో పోల్చదగినది ఈ భూమి మీద ఏమీ లేదు. యేసు ఈ భూమిపై జీవించినటువంటి అత్యద్భుతమైన, అత్యంత మహిమకరమైన మరియు మహా సంతోషకరమైన జీవితమును ఏ మానవుడూ జీవించలేదు. ఆయన ప్రపంచ ప్రసిద్ధికెక్కిన వాడుగానీ, ధనవంతుడుగానీ కాదు. కానీ ఆయన దేవుని మహిమను తన జీవితం ద్వారా ప్రసరింపజేశాడు.

విూరు కూడా అట్టి మహిమను ప్రసరింపజేయగలరన్నదే సువార్త యొక్క శుభవార్త. జీవితాంతము మీరు ఈ భూమి మీద జయించు వారిగా ఉండగలరు.విూరు విశ్వాసంతో, ఎల్లప్పుడూ నిత్యత్వపు విలువలను దృష్టిలో నుంచుకొని జీవించుదురు గాక. ఆమేన్‌.