బూడిదకు ప్రతిగా పూదండ

    Download Formats:

అధ్యాయము 0
పరిచయం

దేవుడు నరుని సృజించినప్పుడు అతని కొరకు ఒక గొప్ప మహిమకరమైన ఉద్దేశ్యము కలిగియుండెను. సృజించబడిన జీవులన్నిటిలో నరుడొక్కడే దేవుని జీవములోను మరియు దేవస్వభావములోను పాలివాడగుటకుగల సామర్థ్యముతో సృజింపబడెను. కాని ఈ ఆధిక్యతను అనుభవించుటకు అతడు స్వచ్ఛందంగా దేవునిలో కేంద్రీకృతమైన జీవితమును ఎంచుకోవలసి యుండెను.

ఏదేను తోటలో ఉన్న రెండు వృక్షములు రెండు విధములైన జీవనాలకు ప్రతిరూపముగా ఉన్నవి. ఆదాము జీవవృక్షము - (దేవుణ్ణే సూచించిన) నుండి పాలుపొంది దేవుని జీవముతో జీవించవచ్చును లేదా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమునుండి పాలుపొంది, తన స్వంత జీవమును వృద్ధిచేసుకొని దేవునిపై ఆధారపడకుండా స్వతంత్రముగా జీవించవచ్చును. మనకందరికీ తెలిసిన విధముగానే అతడు రెండవ దానిని ఎంచుకున్నాడు. ఆదాము సంతతియైన మనము ఇప్పుడు బాగా అబివృద్ధిచెందిన స్వజీవమును కలిగియున్నాము.

కాని ఆదాము పడిపోయినప్పుడు దేవునికి నరునియెడల కలిగిన ఉద్దేశ్యము మారలేదు. ఈ లోకములోనికి క్రీస్తు వచ్చింది మనము వారసత్వముగా పొందుకొన్న ఈ స్వార్థపరమైన జీవమునుండి విడుదలపొంది, మరియొకసారి జీవవృక్షములో పాలుపొందే అవకాశం ఇచ్చుటకే. క్రీస్తు మనకు ఇయ్యవచ్చిన సమృద్ధియైన జీవము ఇదే.

క్రీస్తు వచ్చినప్పుడు జనులను దాస్యమునుండి విడిపించునని యెషయా ప్రవచించెను (యెషయా 61:1-3). నరుడు అపవాది చేతనే కాకుండా తన స్వజీవముచేత (స్వజీవమనగా స్వనీతి, స్వార్థము, ఆత్మ విశ్వాసము, స్వంత చిత్తమును కోరుకొనుట మొదలగు లక్షణాలతో కూడిన జీవము) బంధించబడియున్నాడు. క్రీస్తు మనలను ఈ రెండింటి నుండి విడిపించుటకు వచ్చెను. క్రీస్తు విడిపించిన వారికి, వారి బూడిదకు ప్రతిగా పూదండను ఆయన ఇచ్చునని యెషయా చెప్పెను. బూడిద స్వజీవమునకు తగిన గుర్తు - అది దాని వికారమును పనికిరానితనమును వర్ణించును.

మన స్వజీవమను బూడిదకు ప్రతిగా ప్రభువైన యేసు తన జీవము యొక్క అందాన్ని ఇస్తున్నాడు. ఇది ఎంత ఆధిక్యత! కాని అనేక మంది క్రైస్తవులు దీనిని సంపూర్ణముగా ఆనందించుటలేదు .ఎందుకని?

దీనిని మనము ఎలా ఆనందించగలము?

ఈ పుస్తకము యొక్క అంశము అదే.

ఈ సందేశములు మే 1971లో దక్షిణ భారత దేశములో కూనూర్‌ ప్రాంతములో జరిగిన నీలగిరీ కెస్విక్‌ (లోతైన జీవము) సమావేశములో ఇవ్వబడినవి.

తరువాత పేజీలలో మనము బైబిలులోని నలుగురు వ్యక్తుల స్వభావాలను చూద్దాము; వీరిలో ప్రతిఒక్కరు మనకు ఏదోఒకటి నేర్పించగలరు.

జాక్‌ పూనెన్‌ - బెంగళూరు, భారతదేశము

అధ్యాయము 1
స్వజీవము యొక్క భ్రష్టత్వము

మన స్వజీవము యొక్క పూర్తి భ్రష్టత్వమును చూడకముందు మనము దానినుండి విడుదలను ఎన్నడూ అనుభవించలేము. లూకా 15వ అధ్యాయములో ఉన్న ఉపమానములో ఉన్న పెద్ద కుమారుని మనము చూద్దాము, ఎందుకనగా బహుశా అతడు బైబిలులో ఉన్నవారందరి కన్నా ఎక్కువగా స్వజీవము యొక్క తీవ్రముగా కుళ్ళిపోయిన స్థితికి సాదృశ్యముగా ఉన్నాడు.

ఈ ఉపమానములో ఉన్న చిన్న కుమారుడు సాధారణంగా ఈ ఇద్దరు కుమారులలో ఎక్కువ చెడ్డవాడుగా పరిగణించబడతాడు. కాని మనము మరికొంచెము జాగ్రత్తగా పెద్ద సహోదరుని చూచినప్పుడు, దేవుని దృష్టిలో అతడు కూడా అంతే చెడ్డవాడుగా (ఇద్దరిలోకి ఎక్కువ చెడ్డవాడు కాకపోయినా) ఉన్నాడని కనుగొనెదము. అతడు తన తమ్ముడు చేసిన పాపములు చేయలేదన్న సంగతి నిజమే. కాని అతని హృదయము వక్రమైనదిగానూ, స్వీయ-కేంద్రీకృతముగానూ(స్వీయ-కేంద్రీకృతమనగా దేవుణ్ణి కేంద్రముగా కలిగియుండకుండా తనను తాను కేంద్రముగా కలిగియుండుట) ఉండెను.

నరుని యొక్క పూర్ణ భ్రష్టత్వము

మానవ హృదయము ప్రతి వ్యక్తిలోనూ మౌళికముగా ఒకే విధముగా ఉన్నది. బైబిలు మానవ హృదయాన్ని అన్నిటికంటే మోసకరమైనదిగాను, ఘోరమైన వ్యాధి కలదిగాను వర్ణించినప్పుడు (యిర్మీయా 17:9) అది ఆదాము యొక్క ప్రతి బిడ్డను సూచిస్తుంది. నాగరికత యొక్క సంస్కారము, పాపము చేయుటకు కలుగని అవకాశము మరియు సురక్షితమైన పాలన పోషణ బహుశా మనలను ఇతరులు పడిపోయిన విస్తారమైన పాపములలో పడిపోకుండా కాపాడియుండవచ్చును. కాని ఈ కారణముగా మనలను మనము వారికంటే శ్రేష్టమైన వారముగా పరిగణించుకోలేము. ఎందుకనగా మనము కూడా వారు ఎదుర్కొన్న ఒత్తిడులను ఎదుర్కొనవలసి వచ్చినయెడల మనము నిస్సందేహముగా అవే పాపములను చేసియుండెడివారము. దీనిని అంగీకరించడము మనకు ఒక అవమానకరమైన సంగతి కావచ్చును, కాని ఇది నిజము. ఎంత త్వరగా ఈ విషయాన్ని మనము గుర్తిస్తామో, అంత త్వరగా మనము విడుదలను అనుభవించగలము. తన శరీరమందు మంచి ఏదియూ నివసింపదని పౌలు గుర్తించెను (రోమా 7:18). విడుదలకు అది అతని మొదటి మెట్టు (రోమా 8:2).

మనుష్యులు బాహ్యరూపమును లక్ష్యపెట్టి కొందరిని మంచివారుగా ఇతరులను చెడ్డవారిగా ఎంచుదురు. కాని హృదయాన్ని చూచే దేవుడు మనుష్యులందరు ఒకే స్థితిలో ఉండుట చూచును. బైబిలు నరుని యొక్క పూర్ణ భ్రష్టత్వమును బోధించుచున్నది. ఉదాహరణకు రోమా 3:10-12 పరిశీలిస్తే: ''నీతిమంతుడు లేడు (ఇది అతిశయోక్తి అని మనము ఎంచకుండునట్లు అది ఈ విధముగా కొనసాగుతుంది), ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.'' రోమా 3:10-20 మానవాళియంతటి యొక్క అపరాధమును సంక్షిప్తము చేసి చెప్తుంది- దీనిలో మతానుసారులు మరియు ఏ మతము లేనివారున్నారు. రోమా 1:18-32లో మనకు ''చిన్న కుమారుని'' యొక్క వర్ణన ఇవ్వబడియున్నది- ఇతడు బాహ్యముగా వ్యభిచారి మరియు భ్రష్టుడు. రోమా 2లో, మనకు ''పెద్దకుమారుని'' యొక్క వర్ణన ఇవ్వబడింది - ఇతడు మతానుసారుడు కాని అంతే చెడ్డవాడు. ఈ రెండు రకములైన జనులను వర్ణించిన తరువాత, పరిశుద్ధాత్మ ఈ రెండు గుంపులు ఒక్కలాగే అపరాధులని తీర్పునిస్తున్నాడు. ఈ రెండు గుంపుల మధ్య వ్యత్యాసము లేదు.

నరుడు నిజముగానే పూర్తిగా భ్రష్టుడు. దేవుడు క్రిందకు వచ్చి అతని కొరకు ఏదైనా చేయనియెడల, అతనికి నిశ్చయముగా ఎటువంటి నిరీక్షణాలేదు.

స్వీయ-కేంద్రీకృతము

పెద్ద కుమారుడుని (లూకా 15:25-32) ఒక క్రైస్తవ పరిచారకునికి ప్రతిరూపముగా తీసుకొనవచ్చు. ఈ కథలోని తండ్రి దేవునికి ప్రతిరూపముగా ఉన్నయెడల, పెద్ద కుమారుడిని ఒక చురుకైన క్రైస్తవునికి ప్రతిరూపముగా ఎంచుట సక్రమమైనదే- ఎందుకనగా ఈ ఉపమానములో అతడు రోజంతా తన తండ్రి పొలములో పనిచేసి ఇంటికివచ్చుట మనము చూస్తాము. అతడు ఇంటివద్ద కూర్చుని, తన తండ్రి సంపదను అనుభవించే సోమరియైన యౌవనస్తుడు కాదు. అతడు తన తండ్రి కొరకు కష్టపడి పనిచేసి, బయటకు తన తమ్ముడికన్నా ఎక్కువగా తన తండ్రిని ప్రేమించినట్లు కనబడిన వ్యక్తి - ఎందుకనగా తన తమ్ముడివలే అతడు ఇంటిని విడచి తన తండ్రి సంపదను వృధా చేయలేదు. అతడు ఎక్కువ నమ్మకస్తునిగా కనిపించెను, కాని నిజానికి, అతడు తన తమ్ముడు వలనే స్వార్థపరుడని మనము చూచెదము. ఇది ప్రభువు పనిలో చురుకుగా ఉండి, ప్రభువుకు అంకితమైనవానిగా కనిపించి, తనలోనే కేంద్రీకృతమైన విశ్వాసికి ప్రతిరూపముగా ఉన్నది.

దేవుడు ఈ లోకములో కొన్ని నియమాలు కలిగియుండేటట్లు సృజించెను. ఆ నియమాలను ఉల్లఘించినయెడల, ఏదోఒక నష్టమో, హానియో కలుగును. ఉదాహరణకు ఒక నియమాన్ని పరిశీలించండి: భూమి సూర్యుని చుట్టూ తిరగాలని దేవుడు నిర్దేశించెను. ఒకవేళ భూమి స్వంత చిత్తము కలిగియుండి, ఒక రోజు అది సూర్యుని కేంద్రముగా కలిగియుండకుండా, తన చుట్టూ మాత్రమే తిరగాలని నిశ్చయించుకొనినయెడల, రుతువులలో మార్పుఉండదు మరియు భూమిపైన ఉన్న జీవమంతయు నశించును. మరణము ప్రవేశించును.

అదే విధముగా, ఆదాము దేవుణ్ణి కేంద్రముగా కలిగియుండుటకు సృజించబడెను. దేవుణ్ణి కేంద్రముగా కలిగియుండకుండా తనకు తానే కేంద్రముగా కలిగియుండుటకు అతడు ఎంచుకొన్న రోజున (ఇది దేవుడు నిషేధించిన చెట్టునుండి అతడు తినుటకు ఎంచుకొనుట ద్వారా సూచించబడినది), దేవుడు చెప్పిన విధముగానే అతడు మరణించెను.

దీనిలో మనకొక పాఠమున్నది: ఏ మోతాదులో మన క్రైస్తవ జీవితము మరియు పరిచర్య మనలో కేంద్రీకృతమైయున్నవో, అదే మోతాదులో మనము ఆత్మీయ మరణమును అనుభవించెదము - మనము క్రొత్తగా జన్మించినప్పటికీ మరియు మనము మతవాదులమైనప్పటికీ ఇది జరుగును. మరియు మనకు తెలియకుండానే మనము ఇతరులకు ఆత్మీయ మరణమును పంచెదము. మనము తండ్రి కొరకు ఆసక్తి కలిగిన తీవ్రమైన పరిచారకులుగా పేరుపొందియుండవచ్చు (బహుశా ఆ పెద్ద కుమారునికి యుండినట్లే), కాని చివరకు ప్రభువు యొక్క గద్దింపుకు మనము అర్హులముకావచ్చు: ''జీవించుచున్న క్రైస్తవునిగా పేరుమాత్రము యున్నది గాని నీవు మృతుడవే'' (ప్రకటన 3:1) ఇది క్రైస్తవ పరిచర్యలో ఒక విషాదకరమైన, ప్రమాదకరమైన అవకాశము. చాలామంది క్రైస్తవ పరిచారకులు తమకొరకు తాము కట్టుకొన్న (తెచ్చుకొన్న) పేరుతో జీవించుదురు. ఇతరుల చేత గొప్పగా ఎంచబడుచు దేవుడు అతనిని పూర్తిగా వేరే దృష్టితో చూచుచున్నాడని అతనికి తరచుగా తెలియకయుండును. అతడే స్వీయ-కేంద్రీకృతము (తన కొరకే తాను బ్రతుకుట) నుండి విడుదల పొందలేకపోవుటచేత, అతడు ఎంత అద్భుతముగా ప్రసంగించినను, అతడు ఇతరులను స్వీయ-కేంద్రీకృతము నుండి విడుదల చేయలేడు.

కాబట్టి, పెద్ద కుమారుని కథలో మనకందరికీ ఒక హెచ్చరిక ఇవ్వబడినది.

లోపల ఉన్న చెడును గుర్తించుట

దేవుడు మనలోనున్న మన భ్రష్టమైన స్వజీవమును బయటకు తెచ్చుటకు ఒత్తిడులను ఎదుర్కొనవలసిన సమయములను మన జీవితాలలో తరచుగా అనుమతించును. మన పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు మనలను మనము ఆత్మీయులుగా ఎంచుకొనుట చాలా సులభము. మనకు అధిగమించేందుకు సమస్యలేమి లేనప్పుడు, మనలను ఎవరు విసిగించనప్పుడు, అంతా సజావుగా సాగుచున్నప్పుడు, మనతో పనిచేసేవారు మనకు అనుకూలముగా ఉన్నప్పుడు, మన హృదయాల నిజస్థితిని గురించి మనలను మనము మోసగించుకోవచ్చు. మనలను విసిగించే ఒక జతపనివాడు మనకు ఎదురైనప్పుడు లేక మనలను ఎల్లప్పుడు పీడించే ఒక పొరుగువాడు దొరికినప్పుడు మన ఆత్మీయత యొక్క ముసుగు మాయమగును. అప్పుడు మన స్వజీవము దాని వికారస్వభావమంతటితో వ్యక్తపరచుకొనును.

పెద్ద కుమారునికి జరిగింది కూడా ఇదే. తన తమ్ముడు ఘనపరచబడినప్పుడు అతడు వ్యాకులపడెను. ఈ పెద్ద కుమారుడు ఇంత పెడసరముగా ప్రవర్తించునని ఎవరూ అనుకొనియుండరు. అప్పటివరకు అతడు ఎంతో మంచి వ్యక్తిగా కనబడెను. కాని ఇంతకుముందు అతడు ఇటువంటి ఒత్తిడిని ఎదుర్కొనలేదు. ఇప్పుడు అతడి నిజమైన స్వభావము బయలుపరచబడెను. ఆ సమయములో అతనికి కలిగిన కోపము పుట్టించే పని అతడిని చెడ్డవాడిగా చేయలేదు. అలాకాదు. ఆ ప్రకోపనం కేవలము అతనిలోపల ఎప్పుడు ఉన్నదాన్నే పైకి తీసుకువచ్చింది.

ఏమీకార్‌మైకెల్‌ అనే దైవజనురాలు ఈ విధంగా చెప్పింది:''తీయటి నీటితో నిండియున్న ఒక గిన్నెను ఎంత అకస్మాత్తుగా ఎన్నిసార్లు కుదిపిననూ ఒక్క చేదు నీటి బొట్టుకూడా క్రిందపడదు.'' మన జీవితములనుండి మరియు మన పెదవులనుండి చేదైన నీరు బయటకు వస్తే దానికి కారణము అది అప్పటికే మనలో ఉండియున్నది. మనలను ఆత్మీయులు కానివారిగాను, ద్వేషభరితులుగాను చేసినది ఆ ప్రకోపనమో, ఉద్విగ్నతో కాదు. మనలోపల అప్పటికే ఉన్న వాటినే అవి బయటకు తెచ్చును. మన స్వభావముల యొక్క భ్రష్టత్వమును మనము చూడగలుగుటకు దేవుడు మన జీవితాలలో అటువంటి సమయాలను అనుమతించినందుకు మనము ఎంతో కృతజ్ఞత కలిగియుండవలెను. అటువంటి సందర్భాలు లేనియెడల, మనలో భ్రష్టత్వము యొక్క ఊట ఉన్నదని మనము ఎన్నడూ గ్రహించకపోవచ్చు మరియు మన శరీరములో మంచిదేదైనను లేదని తెలుసుకొనకపోవచ్చు.

అణచివేత విజయం కాదని ఇది మనకు నేర్పించుచున్నది. ఒక వ్యక్తి కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కోపముతో రగిలిపోవచ్చు, మరోవ్యక్తి (కొంచెము ఎక్కువ నిగ్రహంతో) అదే పరిస్థితిలో, లోపల మాత్రమే ఉడికిపోయి తన పెదవులనుండి ఎటువంటి ఆవిరి (అనగా మాటలు) రాకుండా చూచుకొనవచ్చు! మనుష్యుల దృష్టిలో, రెండవ వ్యక్తి సాత్వీకునిగా పేరుపొందవచ్చు. కాని హృదయాలను చూచే దేవునికి ఇద్దరు వ్యక్తులు లోపల ఉడికిపోయిరని తెలుసు గనుక వారిద్దరు అంతే చెడ్డవారని ఎంచును. వారి బాహ్య ప్రవర్తనలలో వ్యత్యాసము కేవలము వారి విభిన్న స్వభావాల ఫలితము, వీటిని దేవుడు లెక్కచేయడు.

అణచివేత విజయమైతే, నేను కలిసిన వాళ్ళలో అమ్మకందారులు అందరికంటే ఎక్కువగా క్రీస్తును పోలినవారని అనుకొంటాను! వినియోగదారులు వారి సహనాన్ని ఎంత పరీక్షించినను, వారు లోపల ఉడికిపోతున్నప్పటికీ, వారి వ్యాపారం నిమిత్తము, వారు ఉదార వైఖరి కలిగియుందురు.

లేదు. అణచివేత విజయము కాదు. మనము కేవలము ఆత్మీయులుగా మరియు విడుదల పొందిన వారుగా కనిపించుట దేవుడు కోరుకొనుటలేదు - మనము నిజముగా విడుదల పొందాలని ఆయన కోరుకొంటున్నాడు. ''ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు'' (గలతీ 2:20) అని పౌలు చెప్పెను. ఈ స్థాయికి మనలను తీసుకురావాలని దేవుడు కోరుచున్నాడు.

స్వజీవము యొక్క లక్షణాలను మనము రెండు కోణాలలో పరిశీలించెదము. మొదటిగా దేవుని పట్ల దాని వైఖరి, రెండవదిగా, తోటి మానవులపట్ల దాని వైఖరి. పెద్ద కుమారుని కథలో ఈ రెండు వైఖరులు ఉదహరించబడినట్లు మనము చూడవచ్చు.

దేవుని పట్ల స్వీయ - కేంద్రీకృతుడైన వ్యక్తి యొక్క వైఖరి

అక్షరానుసారత

స్వీయ-కేంద్రీకృత జీవము యొక్క వైఖరి, దేవుని పట్ల ఆయన పరిచర్య పట్ల, అక్షరానుసారముగా నుండును. స్వజీవము కూడా దేవుణ్ణి సేవించుటకు ప్రయత్నించును. అది ఆ సేవలో ఎంతో చురుకుగా కూడానుండును-కాని అది ఎల్లప్పుడు అక్షరానుసారమైన సేవే. దేవునికి చేసిన సేవకు అది బహుమానమును ఆశించును. ''నేను యిన్ని యేండ్ల నుండి నీకు సేవ చేసాను కాని నీవెన్నడూ నాకు ఒక మేకపిల్లను ఇవ్వలేదు'' అని పెద్దకుమారుడు తండ్రితో అనెను. అతడు తన తండ్రిని ఇప్పటి వరకు బహుమానము కొరకు సేవించెను, కాని ఆ విషయము ఇప్పటి వరకు స్పష్టము కాలేదు. ఈ ఒత్తిడితోకూడిన ఘడియ నిజమును బయటకు తీసుకువచ్చెను.

ఆ విధముగా స్వజీవము దేవుణ్ణి సేవించును- ఉచితముగా, ఆనందముగా, స్వేచ్ఛగా కాకుండా, ప్రతిఫలము కొరకు ఆశించుచూ సేవించును. ఆశించిన ప్రతిఫలము దేవుని యొద్దనుండి ఆత్మీయ ఆశీర్వాదము కూడా కావచ్చు. కాని అటువంటి ఉద్దేశ్యముతో చేసిన సేవకూడా అక్షరానుసారమైనది మరియు దేవునికి అంగీకారయోగ్యము కానిది.

ఆ సంవత్సరములన్నియు తాను చేసిన సేవకు బహుమానము ఇవ్వనందుకు పెద్ద కుమారుడు తన తండ్రిని కరిÄనుడిగాను కృారుడిగాను ఎంచెను. అతడు ఒక్క తలాంతు ఇవ్వబడిన వ్యక్తిగానుండెను. అతడు లెక్కచెప్పవలసిన సమయము వచ్చినప్పుడు ''నేను నీ తలాంతును భధ్రముగా ఉంచితిని (దానితో లాభం కొరకు వ్యాపారం చేయకుండా) ఎందుకనగా (నీవు నా లాభాలను అడుగుతావని) నేను భయపడితిని, నీవు కరిÄనముగా వ్యవహరిం చువాడవు ''(లూకా 19:21). స్వజీవము దేవుని సంతోషపెట్టుట ఎంతో కష్టమని ఎంచును. కాబట్టి అది దేవుని సేవచేయుటకు ఎంతో కష్టపడినప్పటికీ ఇంత ఎక్కువగా ఆశించే దేవుడి అవసరతలను సంతృప్తి పరచనందుకు తనను తాను ఖండించుకొనును!

దేవుడు మనలో ఎవరి వద్దనుండి ఇటువంటి పరిచర్యను ఆశించుటలేదు. ''దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును'' అని బైబిలు చెప్తుంది (2 కొరింది¸ 9:7). పరిచర్య విషయములో కూడా దేవుడు సణుగుకొనక బలవంతముగా కాక ఉత్సాహముగా పరిచర్యచేయు వానియందు దేవుడు ఆనందించును. అయిష్టముగా చేయు పరిచర్యకన్నా పరిచర్య చేయకపోవుటయే దేవుడు కోరుకొనును. ఒకడు బహుమానము కొరకు సేవించినయెడల కొంతసమయములో అతడు తగినంతగా ఆశీర్వదింపబడుటలేదని దేవునికి ఫిర్యాదు చేయును. ఇంకెవరన్నా అతనికన్నా ఎక్కువగా ఆశీర్వదింపబడితే పరిస్థితి ఇంకా అద్వాన్నంగా మారును.

మనము ఎప్పుడైనా మన పనిని, మనము పొందు ఆశీర్వాదమును ఇతరుల పనితో వారు పొందు ఆశీర్వాదముతో పోల్చిచూచామా? ఇది అక్షరానుసారముగా చేసిన పరిచర్య యొక్క ఫలితము. దినములో వేర్వేరు ఘడియలలో ఒక వ్యక్తి చేత పనిలోకి పిలువబడిన పనివారి గురించి యేసు ఒక ఉపమానము చెప్పెను. సాయంకాలమైనప్పుడు ఆ యజమాని ఒక్కొక్కరికి ఒక దేనారము ఇచ్చెను. అందరికంటే ఎక్కువ సమయము పనిచేసిన వారు యజమానియొద్దకు వచ్చి ఈ విధముగా ఫిర్యాదు చేసిరి,''తక్కినవారికిచ్చినంత జీతమే నీవు మాకేవిధముగా ఇవ్వగలవు? మేము ఎక్కువ జీతమునకు అర్హులము''. ఈ జనులు జీతము కొరకు సేవించిరి-వారు ఒప్పుకున్నది వారికొచ్చినప్పుడు, ఇతరులకు వారికివ్వబడినంత ఇవ్వబడకూడదని వారు ఫిర్యాదు చేసిరి (మత్తయి 20:1-16).

పెద్దకుమారునిలో మనము చూచేది ఖచ్చితముగా ఇదే. అతడు తన తండ్రితో ఇట్లనెను, ''ఇదంతా నా తమ్ముడికి ఎలా ఇవ్వగలవు? నిన్ను నమ్మకముగా సేవించినది నేనే, అతడు కాదు.''

ఇశ్రాయేలియులు దేవుని మీద సణుగుకొనుచు సేవించినప్పుడు ఆయన చెప్పిన విధముగానే వారిని చెరలోకి పంపించెను: ''నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు.....కాబట్టి నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు'' (ద్వితీ 28:47). దేవునికి అక్షరానుసారమైన పరిచర్య ఇష్టములేదు.

స్వీయ కేంద్రీకృతులైన (తమ కొరకే బ్రతికే) క్రైస్తవులు ఇతరుల దృష్టిలో ఆత్మీయులుగా కనబడుటకు దేవుని సేవించెదరు. వారిని క్రైస్తవపరిచర్యలో చురుకుగా ఉంచేది క్రీస్తు కొరకు ఉన్న స్వచ్ఛమైన తీవ్రమైన ప్రేమ కాదుగాని తాము ఏమియు చేయకపోతే ఇతరులు తమను ఆత్మీయులు కానివారుగా ఎంచుదురేమోనన్న భయము. మరియు అటువంటి వారు తమ కొరకు సుళువైన మార్గమును, వారికి ఆర్థిక లబ్దిని తెచ్చే మార్గమును ఎంచుకొన్నప్పుడు, దేవుడే వారిని ఆ మార్గములో నడిపించెనని ఇతరులను నమ్మించుటకు ఎంతో ప్రయత్నించుదురు! ఇతరులు తమ ఆత్మీయత గురించి తక్కువగా అనుకొందురేమోఅన్న రహస్యభయము లేనియెడల ఆవిధముగా తమ్మును తాము సమర్థించుకొనే అవసరత వారికి లేదు. ఆవిధముగా దేవుని సేవించుటలో ఎంత శ్రమా బంధకము ఉన్నది.

క్రీస్తు కొరకు ప్రేమనుండి వెలువడే పరిచర్యలో ఎంత ఆనందము, స్వేచ్చ కలదు! ప్రేమ మన జీవితాలయొక్క యంత్రాంగము కీచుమనకుండా, మూలగకుండా మెత్తబరచే నూనె! రాహేలును పొందుటకు యాకోబు ఏడు సంవత్సరములు ప్రయాసపడెను. ''అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను'' అని బైబిలు చెప్తుంది (ఆది 29:20). దేవుని కొరకు మనపరిచర్య ప్రేమనుండి వెలువడినప్పుడు, మన విషయములో కూడా అదే నిజమగును. అప్పుడు వెట్టిచాకిరిగాని, శ్రమగాని ఉండదు.

క్రీస్తుకు సంఘముతో ఉన్న సంబంధము భర్తకు భార్యతో ఉన్న సంబంధము వంటిదని బైబిలు భోదిస్తుంది. భర్త భార్య నుండి ప్రాథమికంగా ఆశించేదేమిటి? ఆమె సేవకాదు. తనకు వంటచేయుటకు, లేక తన బట్టలు ఉతుకుటకు ఆమెను ప్రధానంగా వివాహము చేసుకొనడు. అతడు ఆమెనుండి ప్రధానముగా కోరుకొనేది ఆమె యొక్క ప్రేమను. అది లేనట్లయితే మిగిలినదంతా వ్యర్థమే. దేవుడు మననుండి కోరుకొనేది కూడా అదే.

శిక్షణ పొందలేకపోవుట

స్వీయ-కేంద్రీకృతమైన జీవము యొక్క మరో లక్షణము శిక్షణ పొందలేకపోవుట. పెద్ద కుమారుడు కోపపడి ఇంటి బయట నిలబడినప్పుడు, తన తండ్రి బయటకు వచ్చి అతనిని బ్రతిమాలెను. కాని అతడు మొండి వాడుగానుండి ఆలకించుటకు నిరాకరించెను.

నిజముగా, ''మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలిరాజుకంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్టుడు'' (ప్రసంగి 4:13). తనకంతా తెలుసనుకొని ఇతరుల యొద్దనుండి నేర్చుకొనుటకు ఇష్టపడని వాడు నిశ్చయముగా దయనీయ స్థితిలో ఉన్నాడు.

స్వీయ-కేంద్రీకృతుడైన వ్యక్తి తానే సరియని ఎంత ఖచ్చితముగా నమ్మునంటే అతడు సరిచేయబడుటకు ఇష్టపడడు. మరియు అతడు విమర్శించబడుటకు కూడా ఇష్టపడడు. మనము వ్యతిరేకించబడి, విబేధించబడినప్పటి కంటే ఎక్కువగా మన ఆత్మీయత బహుశా ఎప్పుడూ పరీక్షింపబడదు.

మనము విమర్శించబడినప్పుడు, మనము పట్టించుకోవలసిన విషయము ఆ విమర్శ సరియైనదా కాదా అని, అంతేకాని విమర్శించిన వ్యక్తి స్నేహితుడా లేక శత్రువా అని కాదని ఎ.డబ్యూ.టోజర్‌ అనే దైవజనుడు చెప్పెను. మన గురించి మన స్నేహితులు కంటే ఎక్కువగా మన శత్రువులే మనకు ఎక్కువ నిజాలు చెప్పుదురు.

ఒక లొంగని, తల బిరుసు (అణగనటువంటి) స్వభావము (తత్వము) ఒక స్వీయ-కేంద్రీకృతుడైన వ్యక్తికి ఖచ్చితమైన గుర్తు. మన తోటి మనుష్యుల పట్ల ఒక కరిÄనమైన మరియు సమర్థించుకొనే వైఖరి దేవుని పట్ల మన హృదయాల వైఖరిని సూచిస్తుందని మనము గుర్తుంచుకొనవలెను. మన సహోదరుల చేత (వారిలో అతి చిన్న సహోదరుని చేత) మనము సరిచేయబడుటకు మరియు శిక్షణ పొందుటకు మనము ఇష్టపడకపోతే, మనకు ఆత్మీయ అనుభవాలు, బైబిలు జ్ఞానము ఉన్నప్పటికీ మనలను మనము ఎంత ఘనపరచుకొనుచున్నామో ఇది చూపించును.

తండ్రి పెద్దకుమారుడిని బతిమాలుకొనినను అతడు బాధపడి తన కొరకు తాను జాలితో నింపబడెను. స్వీయ-కేంద్రీకృతుడైన క్రైస్తవుడు చిన్న పిల్లవానివలే దేవుని చేత కూడా బుజ్జగింపబడుటకు, లాలించబడుటకు కోరుకొనును. దేవుడు అటువంటి వ్యక్తులను బతిమాలుతుండవలెను, కాని వారు తేలికగా వినరు. చివరకు పెద్ద కుమారుని వలె, తండ్రి ఇంట బయట తమ్మును తాము కనుగొందురు.

నరుని హృదయము ఎంత భయంకరమైనదో మీరు చూచితిరా!

తోటిమనుష్యుల పట్ల స్వీయ-కేంద్రీకృతుడైన వ్యక్తి యొక్క వైఖరి

అసూయ మరియు ఘనతను ప్రేమించుట

దేవునితో మనకున్న సహవాసము తగ్గిపోయినప్పుడు లేక విరిగిపోయినప్పుడు, అది మన తోటి మనుష్యులతో మనకున్న సంబంధాలను కూడా నిశ్చయముగా ప్రభావితము చేయును. ఆదాము దేవుని జీవమును పోగొట్టుకొన్నప్పుడు, అతడు వెంటనే హవ్వ కొరకు కలిగియున్న ప్రేమను కూడా పోగొట్టుకొనెను. అతడు పాపము చేసెనా అని దేవుడు అడిగినప్పుడు అతడు తన భార్యను నిందించి, ''ప్రభువా, తప్పు నాది కాదు అది ఈ స్త్రీదే'' అని చెప్పెను.

స్వీయ-కేంద్రీకృత జీవము యొక్క లక్షణాలలో ఒకటి ఇతరుల పట్ల అసూయతో కూడిన వైఖరి. ఉపమానములో పెద్ద కుమారుడు తన తమ్ముడిని బట్టి అసూయ పడెను, దీని కారణముచేత అతడు కోపపడెను. ఈ సంవత్సరములన్నియు పెద్ద కుమారుడే ఆ ఇంటిలో తిరుగులేని వారసుడిగా నుండెను. దాసులు అతనికి వంగి నమస్కారము చేసిరి, కాని ఇప్పుడు (ఇంటిలో) అతని స్థానమునకు ముప్పు కలిగెను. ఇంటిలో మరొకరు ఆకర్షణ కేంద్రమాయెను. అతడు ఇది చూచి భరించలేకపోయెను. అసూయ అనెడి పెను భూతము అతని హృదయములో తన వికారమైన తలను పైకెత్తెను.

స్వీయ-కేంద్రీకృతమైన జీవము ఇతరుల చేత గమనించబడుటకు ఇష్టపడును. అది మనుష్యుల మెప్పును ప్రేమించును మరియు దానిని మాత్రమే ప్రశంసించినప్పుడు అది నిజముగా ఆనందించును. అది ఉన్నతమైన స్థానమును ప్రేమించును మరియు నిరంతరము ఏదోఒక విధముగా అందరి దృష్టిని తనవైపు ఆకర్షించుటకు చూచును. స్వీయ-కేంద్రీకృతుడైన క్రైస్తవుడు ప్రభువు కొరకు తాను ఏమి చేసెనో ఇతరులకు చెప్పుటకు అవకాశముల కొరకు చూచును (బహుశా భక్తిపూర్వకముగా కాని రహస్యముగా వారి ప్రసంశలను కోరుకొంటూ) మరియు ఇంకెవరైనా విజయము సాధించినా లేక తాను చేసిన దానికంటే ఏదైనా శ్రేష్టముగా చేసినా అతడు ఎంతో సంతోషము లేనివానిగాను నెమ్మది లేనివానిగాను ఉండును.

స్వీయ-కేంద్రీకృతుడైన వ్యక్తి త్వరగా చిరాకుపడును మరియు కలత చెందును.అతడు ఇతరుల చేత గుర్తించబడుటకు మరియు తన అభిప్రాయములకొరకు సంప్రదించబడుటకు ఎంతగానో కోరుకొనును. ఉదాహరణకు ఒక సభాసమావేశములో అతనిని సంప్రదించకపోయిన యెడల అతడు చాలా అభ్యంతరపడును. అతని గురించి అతనికి ఎంతగొప్ప అభిప్రాయముండునంటే మిగిలినవారందరికీ అతని అమూల్యమైన సలహా అవసరమని తలంచుచు అతడు పదేపదే మాట్లాడుటకు ఇష్టపడును. కొందరు క్రైస్తవులకు ఒక మారు తమ నోరు తెరచిన తరువాత దానిని మూయుట ఎంతో కష్టమైనదిగా అనిపించును; మరియు చుట్టు ఉన్నవారందరికీ ఏహ్యభావము కలుగుచున్నదని గ్రహించక వారు మాట్లాడుతూ ఉందురు. నియంత్రణ లేని నాలుక సిలువ వేయబడని స్వజీవము యొక్క లక్షణములలో ఒకటి.

స్వీయ- కేంద్రీయుడైన క్రైస్తవుడికి రెండవ స్థానమును సంతోషముగా ఉదారముగా తీసుకొనుట తెలియదు. ఇంకెవరికైనా నాయకత్వమునిచ్చి అతనిని రెండవ స్థానములో ఉంచినప్పుడు అతడు వ్యాకులపడును. నాయకుడు పదవీ విరమణ తరువాత అతడి స్థానములో తాను అడుగుపెట్టవచ్చునని తెలిసినప్పుడు మాత్రమే అతడు రెండవ స్థానమును తీసుకొనుటకు ఇష్టపడును!

జర్మనీ దేశపు కైసరు అన్ని ప్రదేశాలలో ఆకర్షణ కేంద్రముగా ఉండాలని కోరుకొనెనని ఆయన గూర్చి చెప్పబడినది. అతడు ఒక నామకరణము చేయుచోటికి వెళ్ళినప్పుడు శిశువుగా ఉండగోరెను, ఒక వివాహమునకు వెళ్ళినప్పుడు వధువుగా ఉండగోరెను, అంత్య క్రియలకు వెళ్ళినప్పుడు శవముగా ఉండగోరెను! అతడి హృదయము మన హృదయము కన్నా దారుణమైనది కాదని మనము మరచిపోకూడదు.

ఒకవ్యక్తిలో ఉన్న స్వీయ- కేంద్రీకృతము దేవునికి ప్రార్థించుట లేక ఒక వర్తమానమును భోధించుట వంటి అతి పవిత్రమైన కార్యములలో కూడా ఇతరుల దృష్టిని తనవైపు ఆకర్షించేటట్లు చేయును! స్వీయ కేంద్రీకృతుడైన క్రైస్తవ నాయకుడు తాను పరిచర్య చేయువారి ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుపడును-ఎందుకనగా అతడు జనులను క్రీస్తు యొద్దకు కాకుండా తన యొద్దకు ఆకర్షించును. నిజమైన దైవజనుడు ఎల్లప్పుడు జనులను తన యొద్దకు కాకుండా క్రీస్తు యొద్దకు ఆకర్షించును. ఇది చేయుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పిలచెను. కాని నిజానికి ఎంతకొద్ది మంది దీనిని చేయుదురు.

యవ్వనస్థులైన పనివారిని ఆటంకపరచుట

ఒక స్వీయ- కేంద్రీకృతుడైన క్రైస్తవ నాయకుడు తన స్థానమునకు ముప్పు కలుగకుండు నిమిత్తము అతని క్రింద ఉన్న వారిని నాయకులు కాకుండునట్లు అడ్డుపడును. కాబట్టి అతడు తాను పరిచర్య చేయువారికి తప్పనిసరిగా తన అవసరము ఉండునట్లు వారికి పరిచర్య చేయును. ఇది దేవుని చిత్తమునకు పూర్తిగా విరుద్ధముగా నున్నది. ఎవరైననూ తనను తాను మరొక ఆత్మకు (వ్యక్తికి) ఆవశ్యకముగా చేసికొనినయెడల అతడు దేవుని క్రమమును తప్పెనని ఆస్వాల్డ్‌ చాంబర్స్‌ అనే దైవజనుడు చెప్పెను. దేవుడొక్కడే ఏ నరుని ఆత్మకైన సంపూర్ణమైన ఆవశ్యకత. మనలో ఎవ్వరును ఆయన స్థానమును తీసుకొనుటకు ప్రయత్నించకుందుము గాక.

క్రీస్తు సంఘములో ఎవరును ఆత్యవసరముకారు. దేవుని పని మనము లేకున్నను తప్పకుండా కొనసాగును. నిజానికి తమను తాము అత్యవసరమని ఎంచుకొనే గర్విష్టుల సహాయము లేకుండా అది ఇంకా బాగా కొనసాగును! ఈ సత్యాన్ని మనము ఎల్లప్పుడు గుర్తించవలెను. తాను ''అత్యవసరము''అని ఎంచుకొన్న వానిని తగ్గించుటకు (దీనుడిగా చేయుటకు) ఒక చిట్కాను నేను ఒకసారి చదివాను. అతను ఒక బక్కెటును నీటితో నింపి తన చేతిని మణికట్టు వరకు దానిలో ముంచిన తరువాత దానిని బయటకు తీయవలెను. ఆ నీటిలో ఏర్పడిన రంధ్రమే అతడు పోయిన తరువాత ఏర్పడే కొరత!! మనకున్న వరములు సంఘమునకు ఉపయోగకరమే కాని ఎవ్వరు అత్యవసరము కాదు.

మనలను దేవుడు ఎప్పుడు పిలచినా వెనుకుండుటకు ఇష్టపడవలెను. కాని స్వీయ-కేంద్రీకృతుడైన క్రైస్తవ పరిచారకుడు దానిని ఎన్నటికీ అంగీకరించడు. తనకున్న పదవిని సాధ్యమైనంత ఎక్కువ కాలము పట్టుకొనవలెనని అతడు యోచించును. అటువంటి అనేక మంది ''క్రైస్తవ నాయకులు'' వారి ''సింహాసనముల''మీద మురిగిపోవుచు, దేవుని పనిని ఆటంకపరచుచున్నారు. వారి స్థానమును వేరే వారు తీసుకొనునట్లు వారికి ఉదారముగా వెనుకుండుట తెలియదు.

విజయమును కొనసాగించు వారసుడు లేనియెడల ఆ విజయము ఓటమేనన్న సామెతను మీరు వినియుందురు. యేసు దీనిని గుర్తించి తన పనిని కొనసాగించుటకు జనులకు తర్ఫీదునిచ్చెను. మనము అనుసరించుటకు ఇది ఎంత గొప్ప మాదిరిగా ఉన్నది!

తన పరిచర్యను కొనసాగించుట కొరకు ఇతరులకు తర్ఫీదు ఇవ్వవలసిన ఆవశ్యకతను పౌలు గుర్తించెను. 2 తిమోతి 2:2 లో అతడు తిమోతితో ఇట్లనెను: ''నేను నీకు అప్పగించినది, తిరిగి ఇతరులకు (నాల్గవ తరమునకు) తర్ఫీదునిచ్చే వారికి అప్పగించవలెను'' (వివరణ). ఇక్కడ పౌలు చెప్పుచున్నదేమనగా ''ఈ సంపదను నీవు ఇతరులకు అప్పగించేటట్లు చూచుకొనుము. నీ కన్నా చిన్నవారి యొక్క ఎదుగుదలను నీవు ఎన్నడును ఆటంకపరచవద్దు.'' ''విజయమును కొనసాగించు వారసుడు లేనియెడల ఆ విజయము ఓటమే'' అన్న సూత్రమును వ్యాపారస్తులు కూడా గుర్తించుదురు. కాని అనేక మంది క్రైస్తవ నాయకులు దానిని గుర్తించలేదు. నిజముగా ''వెలుగు సంబంధులకంటే లోకసంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై యున్నారు''.

ఒక వ్యక్తిని తనకంటే చిన్న వాడైన మరొక వ్యక్తి తనకంటే మెరుగుగా పనులు చేయుటను బట్టి అసూయపడేటట్లు చేసేది అతనిలో ఉన్న స్వీయ-కేంద్రీకృతము తప్ప మరేదియు కాదు. దేవుడు హేబెలును అంగీకరించి తనను తిరస్కరించుటను బట్టి కయీను అసూయపడెను. హేబెలు తనకన్నా పెద్దవాడైనయెడల అది సహింపదగినదిగా ఉండవచ్చును. కాని తన తమ్ముడు తనకన్నా యోగ్యుడన్న సత్యము అతన్ని హేబెలును చంపేటంత ఆగ్రహము కలవానిగా చేసెను.

యోసేపు మరియు అతని సహోదరుల విషయములో కూడా మనము ఇదే చూడవచ్చు. యోసేపు దేవుని ప్రత్యక్షతలను పొందెను. కాబట్టి అది తన పదిమంది అన్నలు తనపై అసూయపడేటట్లు చేసెను - ఎంత అసూయ అనగా వారు అతనిని చంపనుద్దేశించిరి.

''సౌలు వేలమందిని చంపెను కాని దావీదు పదివేల మందిని చంపెను'' అని స్త్రీలు పాడిరి గనుక రాజైన సౌలు యౌవనుడైన దావీదుపై అసూయపడెను. ఆ రోజునుండి అతడు దావీదును చంపుటకు నిశ్చయించుకొనెను. మానవ చరిత్ర,- అయ్యో క్రైస్తవ సంఘ చరిత్ర కూడా- ఇటువంటి కథలతో (మరలా మరలా) నిండియున్నది.

ఆ విధముగానే, వయస్సులో పెద్దవారౖౖెన పరిసయ్యులు యవ్వనుడైన నజరేయుడైన యేసు యొక్క ప్రజాదరణను బట్టి అసూయపడి, ఎంత వెల చెల్లించవలసి వచ్చిననూ, ఆయనను సిలువ వేయుటకు తీర్మానించుకొనిరి.

మరొకప్రక్క, నూతన నిబంధనలో బర్నబా వంటి వ్యక్తిని చూచుట ఎంత ఆహ్లాదకరముగా భిన్నముగా ఉన్నది. క్రొత్తగా రక్షణ పొందిన పౌలును మరెవ్వరు అంగీకరించనప్పుడు అనుభవజ్ఞుడైన బర్నబా అతనిని అంగీకరించి తనవెంట తీసుకువెళ్ళెను. బర్నబా అంతియొకయలోని సంఘమునకు పౌలును తీసుకొని వచ్చి అతనిని ప్రోత్సహించెను. అపోస్త్తలుల కార్యములు 13 వ అధ్యాయములో, బర్నబా మరియు పౌలు కలసి సువార్త పరిచర్య నిమిత్తము ప్రయాణము చేసిరని మనము చదివెదము. దేవుడు ఈ చిన్న పరిచారకుడైన (తక్కువ అనుభవం కలిగిన) పౌలును, తన పరిచర్య కన్నా పెద్ద పరిచర్యకు దేవుడు పిలిచెనని బర్నబా చూచినప్పుడు, అతడు స్వచ్ఛందంగా వెనుకకు తగ్గి ఉదారముగా కనుమరుగాయెను. మరియు అపోస్తలుల కార్యములో ''బర్నబా మరియు పౌలు'' అనే పదబంధం దాదాపు కనబడకుండానే ''పౌలు మరియు బర్నబా''గా మారెను. ఈ విధముగా వెనుకకు తగ్గి మరొకరు ఘనపరచబడుటకు అంగీకరించే బర్నబా వంటివారు చాలా తక్కువమంది ఉన్న కారణముచేత క్రైస్తవ సంఘము నష్టపోవుచున్నది. ప్రాముఖ్యతలేని విషయాలలో వెనుకకు తగ్గుటకు మనము ఇష్టపడెదము. ఉదాహరణకు, ఒక ద్వారముగుండా వెళ్ళుచున్నప్పుడు, మనము ప్రక్కకు వెళ్ళి వేరేవారిని పోనిచ్చుటకు మనము సిద్దమే. కాని క్రైస్తవ సంఘములో పదవి మరియు నాయకత్వము వంటి ముఖ్యమైన విషయాలలో మనము వెనుకకు తగ్గుటకు సిద్ధముగా లేము. మన స్వజీవము ఎంతో మోసకరమైనది. ప్రాముఖ్యతలేని విషయాలలో మనము నకిలీ దీనత్వమును కలిగియుండవచ్చు. కాని ముఖ్యమైన విషయాలలోనే మనమేమైయున్నామని మనము చూడగలము.

గర్వము

స్వీయ- కేంద్రీకృతుడైన వ్యక్తి తనగురించి తాను ఒక గొప్ప అభిప్రాయము కలిగియుండును. పెద్ద కుమారుడు ఇట్లనెను, ''ఇన్ని సంవత్సరములు నీకొరకు కష్టపడి పనిచేసితిని మరియు నీవు నన్ను చేయమని అడిగిన ఒక్కపనిని కూడా నేను చేయుటకు నిరాకరించలేదు''. తన తండ్రి కొరకు అతడు చేసిన విధేయతతో కూడిన సేవను బట్టి అతడు గర్వపడెను. మన సద్గుణాలు మరియు జయములు బట్టియేకాక, మన చుట్టూ ఉన్నవారు మనము చేసినంత బాగా చేయలేదన్న తలంపు వలన కూడా గర్వము మన హృదయాలలో ఉప్పొంగును. ఒక వ్యక్తి తనను ఇతరులతో పోల్చుకొనుట వలన ఎల్లప్పుడు వచ్చే ఫలితము గర్వమే. మన చుట్టూ ఉన్నవారు మనకన్నా శ్రేష్టులని స్పష్టమైనయెడల, మనము ఎప్పుడూ గర్వించము. ఈ కథలో తండ్రిని పెద్ద కుమారుని కన్నా ఎక్కువ నమ్మకముగా సేవించిన మరొక సహోదరుడు ఉన్నయెడల, పెద్ద కుమారుడు ఆ సహోదరుని యెదుట అసలు గర్వించి యుండెడివాడుకాదు. కాని ఇక్కడ తన తమ్మునితో పోల్చిచూచుకొన్నప్పుడు అతడు మెరుగుగా కనబడెను. అతడు తన తండ్రితో ఇట్లనెను, ''నేను నిన్ను నమ్మకముగా సేవించితిని, కాని నీ ఈ చిన్న కుమారుని చూడుము. అతడు ఏమి చేసెను? తన సొమ్మును వేశ్యలపై వృథా చేసెను''.

గర్వము వలన లూసిఫరు పతనమయ్యెను. తనను ఇతర దూతలతో పోల్చిచూచుకొని తను ఎక్కువ జ్ఞానము గలవానిగాను, ఎక్కువ సౌందర్యవంతునిగాను, ఎక్కువ ఘనత పొందిన వానిగాను ఎంచుకొనెను. అతడు అభిషేకమునొందిన కెరూబైయుండెను, కాని అతడు అపవాదిగా మారెను. అప్పటినుండి అనేకులు అదే విధముగా దేవుని అభిషేకమును కోల్పోయిరి. నీవు ఒక దేవదూతవైయుండవచ్చు కాని గర్వము ఒక్క క్షణములో నిన్ను అపవాదిగా మార్చగలదు.

పరిసయ్యులకు పట్టిన రోగము ఇదే. పరిసయ్యుడు ఈవిధముగా ప్రార్థించిన ఉపమానములో యేసు వారిని ఖచ్చితంగా చిత్రీకరించెను, ''దేవా, నేను (చోరులను అన్యాయస్థులను వ్యభిచారులైన) ఇతర మనుష్యులవలే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను ఉపవాస ప్రార్థన చేయుచు, నా దశమ భాగమునిచ్చుచు మొదలగు వాటిని విసుగుపుట్టే వరకు ప్రార్థించెను. స్వజీవము అటువంటిది. అయితే కొన్నిసారులు అది నిగూఢమైనదిగా ఉండును. ఒక సండేస్కూలు టీచరు తన తరగతికి ఈ ఉపమానమును బోధించిన తరువాత ఈ విధముగా ప్రార్థించెను, ''దేవా, మేము ఆ పరిసయ్యుని వలే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము''. దీనిని విని మనము నవ్వుతాము ఎందుకనగా మనము ఆ సండేస్కూలు టీచరువలే లేమని మనము ఊహించుకొందుము!! ఉల్లిపాయ పొరల వలే, ఆత్మీయ గర్వము మనలో లోతుగానూ, నిగూఢముగాను పాదుకొని పోయియున్నది. అది కొన్ని మారులు గర్వము యొక్క ఘోరమగు రూపమైన నకిలీ దీనత్వమను ముసుగును దాల్చును!

స్వీయ-కేంద్రీకృతుడైన క్రైస్తవ పరిచారకుడు తప్పనిసరిగా అహంకార పూరితమైన వైఖరితో తిరుగుతూ ఉండే వ్యక్తి కాకపోవచ్చు. బయటకు అతడు ఎంతో నకిలీ దీనత్వము, తగ్గింపుతో కూడిన రూపము మరియు దీనముగా మాట్లాడు వైఖరి కలిగియుండును. కాని అంతరంగములో, అతడు తనను ఇతరులతో పోల్చుకొని తన మంచితనమందును, గొప్పతనమందును, దీనత్వమందును గర్వించును.

ఇతరులను ఖండించుట

ఈవిధముగా ఒక వ్యక్తి తనను ఇతరులతో పోల్చుకొనుట అనునది చివరకు ఇతరులను ఖండించుటకు నడిపించును- కొన్నిసారులు ఇది కరిÄనమైన వ్యంగ్యపూరిత మాటలతో జరుగును. పెద్ద కుమారుడు తన తండ్రితో ఏమనెనో వినుడి: ''ఈ నీ చిన్న కుమారుడు నీ సొమ్మును వేశ్యలపైన వృధాచేసెను''. అతడికి ఈ సమాచారమును ఎవరిచ్చారు? ఎవ్వరూ ఇవ్వలేదు. అతడు కేవలము ఘోరమైన దానిని ఊహించుకొనెను. నీవు ఎవరినైనా ద్వేషించినప్పుడు, అతని గురించి ఘోరమైన విషయాలను నమ్ముట సులభము. తన తమ్ముని పొరపాట్లను కప్పుటకు బదులుగా వాటిని బహిర్గతం చేయుటకు పెద్దకుమారుడు ఎంత ఆనందించెను.

మనము ఇతరులలో పొరపాట్లను మాత్రమే చూచెదమా? మరొకరు పడిపోవుటను బట్టి మనము రహస్యముగా ఆనందించామా? ప్రత్యేకముగా ఆ పడిపోయిన వ్యక్తి మనకిష్టుడు కాని వాడైతే? మన హృదయములు ఎంత చెడ్డవి అంటే ఇతరులు పడిపోయినప్పుడు మనము పూర్తిగా బాధపడము. దానికి బదులు మనము కొంచెము ఆనందించెదము ఎందుకనగా, అది మనలను మెరుగైన వారిగా చూపును. ఇటువంటి వైఖరి ఒక స్వీయ-కేంద్రీకృతుడైన వ్యక్తి యొక్క లక్షణము.

మనము ఇతరుల ఉద్ధేశాలను తీర్పు తీర్చెదమా? స్వీయ- కేంద్రీకృతుడైన వ్యక్తి ఎవరైనా ఏదైనాచేయుట చూచి తనలోతాను ఇట్లనుకొనును ''అతడు అది ఎందుకు చేయుచున్నాడో నాకు తెలుసు'', మరియు ఆ కార్యమునకు ఏదోఒక శరీరసంబంధమైన ఉద్దేశ్యమును ఆరోపించును. స్వజీవము తనపై చాలా బాధ్యతను తీసుకొనును- అది దేవుని సింహాసనముపై కూడా కూర్చుండును (ఎందుకంటే దేవుడొక్కడే ఇతరుల ఉద్దేశ్యంలను తీర్పుతీర్చగలడు). పౌలు ఈ విధంగా మనలను హెచ్చరించాడు, ''ఒకడు మంచి సేవకుడా కాదా అన్న విషయమును ప్రభువు రాకడ ముందే తొందరపడి నిర్ధారించకు. ప్రభువు వచ్చినప్పుడు మన హృదయాల యొక్క లోతులలో మనమేమైయున్నామో అందరూ చూడగలుగునట్లు ఆయన వెలుగును ప్రకాశింపజేయును. అప్పుడు అందరికి మనము ఎందుకు (ఏ ఉద్దేశ్యముతో) దేవుని పనిని చేయుచుంటిమో తెలియును'' (1 కొరింది¸ 4:5 లివింగు బైబిలు). ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే (దానికి ముందు కాదు) మనకు ప్రతి వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశ్యములు తెలియును.

ప్రేమహీనత

స్వీయ- కేంద్రీకృతుడైన వ్యక్తి తన తోటి మనుష్యుల యెడల ఎటువంటి నిజమైన ప్రేమ కలిగియుండడు మరియు వారియెడల తనకున్న కరిÄనవైఖరికి గల మూలకారణము ఇదే. అతడు చాలా ప్రేమ కలిగియున్నట్లు నటించును, కాని యధార్థమైన క్రీస్తు కలిగియున్న ప్రేమను అతడు కలిగియుండడు. ఆ సంవత్సరాలన్నిటిలో పెద్ద కుమారుడు ఒక్కమారు కూడా తన తండ్రియొద్దకు వెళ్లి, తన తప్పిపోయిన తమ్ముడికొరకు వెళ్లి వెతుకుతానని (స్వచ్ఛందంగా) అనలేదు. తన తమ్ముడు చనిపోయెనా లేక బ్రతికేయున్నాడా అని అతడు పట్టించుకోలేదు. తన స్నేహితులతో విందు చేసుకొనుటకు (సంతోషపడుటకు) మాత్రమే అతడు ఆసక్తి చూపించెను (29 వ వచనము). తాను సంతోషముగా ఉన్నంత కాలము, ఇతరులకేమైనను అతడు లెక్కచేయలేదు.

మనము కూడా ఆ విధముగానే స్వార్థపరులుగా ఉన్నామా? భక్తి విడచిన వారిపట్ల మనకున్న వైఖరి ఏమిటి? ఒక భక్తి విడచిన వానిని ప్రేమించుట కంటే ఒక అవిశ్వాసిని ప్రేమించుట సులభము. కాని మనము నిజముగా క్రీస్తుకున్న కనికరమును కలిగియున్నయెడల మనము ఆ యిద్దరిని ప్రేమించెదము. ఈ కథలోని చిన్న కుమారుడు ఒక భక్తి విడచిన వానిని పోలియున్నాడు. అతనిని ఖండించుట సులభమే. అతనిని ప్రేమించుట మరియు అతనికి సహాయము చేయుట చాలా కష్టము. ''ఒక క్రైస్తవుడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీరు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకొనిరావలెను'' అని బైబిలు చెప్తుంది (గలతీ 6:1). మరల, ''ఒక క్రైస్తవుడు పాపము చేయుట నీవు చూచినప్పుడు....దేవుడు అతడిని క్షమింపవలెనని నీవు వేడుకొనవలెను. అప్పుడు దేవుడతనికి జీవము దయచేయును'' (1 యోహాను 5:16). పడిపోయినవారి నిమిత్తము మనమెప్పుడైనా ఈ విధముగా ప్రార్థించితిమా? లేదు. ఎందుకు? ఎందుకనగా మనము స్వీయ- కేంద్రీకృతమైన వారిగా ఉన్నాము.

మనము దేవునితో సన్నిహిత సంబంధమును మరియు లోతైన దేవుని జీవమును వెదకినప్పుడు, ఈ దేవుని జీవము మనలను స్నేహపూర్వకముగా చేయునని మనము మరువకూడదు. మనము కేవలము ''మన స్నేహితులతో విందుచేసుకొనుటకు'' దేవుడు మనకు ఆయనతో సన్నిహిత సంబంధమును దయచేయడు. మనము నమ్మినవాటినే నమ్మేవారితో కలసి చిన్న పరిశుద్ధ గుంపులను ఏర్పరచుకొని మన ఆనందము గురించే ఆలోచించుట చాలా సులభము- ఆ సమయమంతా మన వలె ''లోతైన జీవపు అనుభవము'' లేని వారిని చిన్న చూపు చూడవచ్చును. అది లోతైన జీవము కానేకాదు. అది ఆత్మీయత అన్న ముసుగులోఉన్న స్వీయ-కేంద్రీకృతము; అది దేవునికి ఏహ్యమైనది.

మనము మోసపోకూడదు. మన ''ఆత్మీయ గుంపు''లో ఉన్న ఇతర సభ్యులతో కలసి ఉల్లసించుటకు మాత్రమే మనము ఆసక్తి కలిగియున్నయెడల (అది ఆత్మీయముగా ఉల్లసించుటైనప్పటికీ), మరియు మనతో ఏకీభవించని విశ్వాసులతో మనము సహవాసము చేయలేని యెడల, మనము నిజముగా ఆత్మీయ నిశ్చలత్వములో ఉన్నాము. ''తన సహోదరుని ప్రేమింపనివాడు మరణమందు నిలచియున్నాడు'' అని బైబిలు చెప్తుంది (1 యోహాను 3:14). ఈ వచనములో ''ప్రేమ'' అని తర్జుమా చేయబడిన పదము గ్రీకు భాషలో ''అగాపే'' అను పదము. దీని అర్థము ''నమ్మకముగా ఉండుట, ఆనందించుట, విలువనిచ్చుట, భారము కలిగియుండుట''. కాబట్టి ఈ వచనము యొక్క నిజమైన అర్థమేమిటంటే మన సహోదరులకు సహోదరీలకు (ఇతర శాఖలలో ఉన్న వారినిసైతము) విలువనివ్వని యెడల, వారి కొరకు భారము లేనియెడల, వారి విషయములో నమ్మకముగా లేనియెడల మరియు వారియందు ఆనందించనియెడల, మనకు ఎంత బైబిలు జ్ఞానమున్నప్పటికీ ఎన్ని ఆత్మీయ అనుభవములున్నప్పటికీ, మనము ఆత్మీయ మరణస్థితిలో ఉన్నాము.

పరిశుద్ధాత్మ యొక్క ప్రధాన పరిచర్య

నేను మీకు చెప్పునదేమనగా, మనము యవ్వనులమైనను ముసలివారమైనను, పరిశుద్ధత గురించి ఎటువంటి సిద్ధాంతమును నమ్మినను, ఎన్ని అనుభవములు మరియు ఆశీర్వాదములు పొందినను, స్వజీవము మరణించుట కష్టము. మనము స్వజీవముపై జయముతో జీవించాలంటే మనము ప్రతిరోజూ సిలువనెత్తుకొని యేసును వెంబడించుట అంటే ఏమిటో తెలుసుకొనవలెను. వేరొక మార్గము లేదు. రాబోవు అధ్యాయములలో దాని గురించి ఇంకా క్షుణ్ణంగా చూచెదము.

కాని దానిముందు పరిశుద్దాత్ముడు మన స్వీయ-కేంద్రీకృతమైన జీవమును మరణింపజేయుటకు మనకు సహాయపడుటకు వచ్చెనని మనము గుర్తుంచుకొనెదము. ''మనము సహజముగా చెడు కార్యములు చేయుటకు ఇష్టపడెదము; ఇది పరిశుద్ధాత్మ మనలను చేయుమని చెప్పే కార్యములకు వ్యతిరేకముగా నున్నవి; మరియు పరిశుద్ధ్దాత్మ మనలో కార్యము చేయునప్పుడు మనము చేయగోరు మంచి పనులు మన శరీరేచ్ఛలకు వ్యతిరేకముగా ఉన్నవి. ఈ రెండు శక్తులు (మన స్వజీవము మరియు పరిశుద్ధాత్మ) మనలను నియంత్రించుటకు ఎల్లప్పుడు పోరాడుచున్నవి'' (గలతీ 5:17 లివింగ్‌ బైబిలు).

పరిశుద్దాత్ముని పరిచర్య ఏమిటో అనేకమంది క్రైస్తవులకు అర్థంకాని ఈ దినాలలో, శరీర కార్యములను (స్వజీవమును) మరణింపజేయుటకు ఆయన ఒక సహాయకుడిగా వచ్చెనని మనము గుర్తుంచుకొనవలెను. ఆయన ఇంకా అనేక కార్యములను మనలోను మనద్వారాను చేయును. వాటిలో దేనినీ మనము తృణీకరించరాదు. కాని మన స్వజీవమును మరణింపజేయుటకు మనము ఆయనను అనుమతించనియెడల, మనకున్న ఇతర అనుభవములన్నియు విలువలేనివే.

''విూరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను (ఈ అధ్యాయములో కొన్ని శరీర క్రియలను మనము ఇప్పుడే చూచాము) చంపినయెడల జీవించెదరు (ఈ విధముగా) దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు'' అని బైబిలు చెబుతుంది (రోమా 8:13,14). 14 వ వచనము తరచుగా సందర్భరహితముగా ఉదహరించబడును. అది మనము ఎక్కడికి వెళ్లవలెనో ఏమి చేయవలెనో అనువిషయములలో ఆత్మ నడిపింపుకు సంబంధించినదిగా ఉదహరింపబడును. కాని అది నిజముగా దానిముందు వచనమునకు సంబంధించినది కాబట్టి అది పరిశుద్దాత్ముడు మన స్వీయ-కేంద్రీకృతమైన ఆశలన

అధ్యాయము 2
క్రీస్తు జీవమునకు మార్గము (1) : విరుగగొట్టబడుట

విరుగగొట్టబడుట

మన స్వజీవమునుండి క్రీస్తు జీవము యొక్క సంపూర్ణ సౌందర్యములోనికి నడిపించే మార్గమును స్పష్టముగా వర్ణించే వచనాలలో ఒకటి గలతీ 2:20: ::before''నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేనుకాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.''::after మనకు ఇది కేవలము కంఠతపెట్టుకొనుటకో లేక ప్రసంగించుటకు మూడు విషయాలు దొరికే మంచి వచనముగా ఉండవచ్చు! కాని ఇది వ్రాసిన అపోస్తుడైన పౌలు విషయములో ఇది ఆయన అనుభవాన్ని వర్ణించాడు. పౌలు తన స్వజీవము అను బూడిదను క్రీస్తు యొక్క దైవజీవమను పూదండకొరకు మార్చుకొనెను. అతడు తన స్వయము (స్వజీవము) యొక్క మరణమును అంగీకరించెను గనుక ఇది సాధ్యమాయెను.

'నేను' (నా స్వజీవము) క్రీస్తుతో సిలువవేయబడినప్పుడు మాత్రమే క్రీస్తు మనలో ఆయన మహిమను ప్రత్యక్షపరచగలడు. 2 కొరిందీ¸ 3:18లో, పరిశుద్దాత్మ మనలను క్రీస్తు పోలికలోనికి మహిమనుండి అధిక మహిమకు మార్చునని చదివెదము. ఇదే పరిశుద్దాత్ముని యొక్క ప్రధాన పరిచర్య. రోజు వెంబడి రోజు, సంవత్సరము వెంబడి సంవత్సరము, దేవుని ఆత్మ మనలను క్రీస్తు పోలికలోనికి అధికముగా మార్చుటకు కోరుకొనును. కాని ఒక మెట్టు మహిమనుండి తదుపరి మెట్టు మహిమకున్న మార్గము సిలువ ద్వారా నడిపించును. మనము ఆత్మ ద్వారా మన స్వజీవమును చంపినయెడల, మనము క్రీస్తు జీవము యొక్క సమృద్దిని ఎరుగవచ్చు, లేనిచో దానిని ఎరుగలేము.

ఈ రోజున మనము, ఆదాము పడిపోకమునుపు వెళ్ళగలిగినట్లు, జీవవృక్షము వద్దకు స్వేచ్చగా వెళ్ళలేము. ఆదికాండము 3:24లో, దేవుడు జీవవృక్షము యెదుట ఖడ్గజ్వాలలను నిలువబెట్టెనని మనము చదివెదము. కాబట్టి, ఈ జీవ వృక్షములో మనము పాలుపొందే ముందు ఆ ఖడ్గ జ్వాల మన స్వజీవము పైన పడి దానిని చంపవలసియున్నది. దేవుని జీవమును పొందుటకు ఇంకా వేరే మార్గము లేదు. సమృద్ది జీవమునకు ఉన్న ఏకైక మార్గము సిలువ మార్గమే. ఈ సత్యము ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకు, లేఖనములన్నింటిలో స్పష్టమైన మాటలోను, ఉపమాన రీతిగాను బోధింపబడెను. సిలువ మనలను విరుగగొట్టును మరియు రిక్తులుగా చేయును. సిలువ యొక్క ఈ రెండు కోణాలను ఈ అధ్యాయములోనూ తదుపరి అధ్యాయములోనూ పరిశీలించెదము.

దేవునితో యాకోబుయొక్క రెండు కలయికలు

యాకోబు విరుగగొట్టబడుట అంటే ఏమిటో ప్రయోగాత్మకంగా నేర్చుకొన్న వ్యక్తి అతడి జీవితము (జీవము) నుండి మనము అనేక సత్యములను నేర్చుకొనవచ్చు. బైబిలులో ఒక అత్యుత్తమమైన విషయమేమిటంటే అది దానిలో ఉన్న శ్రేష్టమైన వ్యక్తుల యొక్క పొరపాట్లను, వైఫల్యాలను పూర్ణమైన యదార్థతతో నమోదు చేయును. లేఖనములు పాలరాయి పరిశుద్దులను (ఏ తప్పు చేయనివారిని) చిత్రీకరించవు. మనము దేవుని వాక్యములో పురుషులను స్త్రీలను వారి పొరపాట్లతో సహా యదావిధిగా చూచెదము. దీనిచేతనే బైబిలులోని వ్యక్తులయొక్క జీవిత చరిత్రలు మన రోజుల్లో వ్రాయబడే అనేక జీవిత చరిత్రలకన్నా మనకు ఎక్కువ ప్రోత్సాహకరముగా నుండును. ఈ రోజుల్లో వ్రాయబడే జీవిత చరిత్రలు ఆ వ్యక్తుల యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చి, వారిని ఉత్తమమైన పరిశుద్దులుగా ప్రదర్శించును.

యాకోబు మనవంటి స్వభావము గల మనుష్యుడే. అతడు దేవుని చేత పిలువబడినవాడు. దానిలో సందేహము లేదు మరియు దేవుని ఉద్దేశ్యముల నెరవేర్పు నిమిత్తము అతని గమ్యము నిత్యత్వమునుండి నిర్ణయించబడెను. కాని మనవలెనే అతడు ఒక చెడ్డదైన మోసకరమైన హృదయమును కలిగియుండెను. దేవుడు అసాధారణమైన వారిని కాకుండా సాధారణమైన జనులను ఆయన సేవకొరకు పిలచును. చాలా తరచుగా ఆయన ఈ లోకంలోని నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, బలహీనులను తన ఉద్దేశ్యములను నెరవేర్చుటకు పిలచును. ఆయన మానవ జ్ఞానమునకు సామర్థ్యమునకు విలువనివ్వడు.

యాకోబు దేవుణ్ణి తన జీవితములో ఎన్నో మారులు కలిసికొని యుండవచ్చును. కాని ఆదికాండములో దేవునితో అతడి రెండు ముఖ్యమైన కలయికలు మనకు నమోదుచేయబడెను. మొదటిది బేతేలులో జరిగెను. అక్కడ అతడు ఆకాశమునుండి అంటియున్న ఒక నిచ్చెన గురించి కల గనెను. మరియు అక్కడ అతడు ''ఇది దేవుని మందిరము'' అని చెప్పెను (ఆది 28:10-22). రెండవది పెనూయేలులో జరిగెను. అక్కడ అతడు దేవునితో పెనుగులాడెను మరియు అక్కడ అతడు ''నేను ముఖాముఖిగా దేవుని చూచితిని'' అని చెప్పెను (ఆది 32:24-32). ఈ రెండు సంఘటనల మధ్య 20 సంవత్సరములు గడిచెను.

అతడు బేతేలులో ఆగినప్పుడు, సూర్యుడు అస్తమించెనని మనము చదివెదము (ఆది 28:11). అది కేవలము యాకోబు బేతేలుకు వచ్చిన సమయమును సూచించే వాక్యము. కాని తదుపరి నాలుగు అధ్యాయములలో మనము యాకోబు జీవితచరిత్రను చదివినప్పుడు, సూర్యుడు నిజముగా అతని జీవితముపై అస్తమించెనని కనుగొనెదము. ఈ సంఘటన జరిగిన తదుపరి 20 సంవత్సరములలో ఆ చీకటి మరి ఎక్కువాయెను. కాని అది కథకు ముగింపు కాదు.

పెనూయేలు వద్ద, అతడు దేవుణ్ణి మరల కలుసుకొన్నాడు మరియు అక్కడ, అతడు దేవుణ్ణి కలుసుకొన్న వెంటనే, సూర్యుడు ఉదయించెనని వ్రాయబడినది. మరియు అతడు ముందుకు సాగిపోయెను (ఆది 32:31). ఇది కూడా భౌగోళిక సత్యమే. కాని యాకోబు జీవితములో కూడా ఇది నిజమే. ఆ దినమునుండి అతడు ఒక భిన్నమైన వ్యక్తిగా నుండెను. చీకటి గతించిపోయెను మరియు దేవునియొక్క వెలుగు అతని జీవితముపై ప్రకాశించెను.

యాకోబు ఒక సాధారణమైన మనుష్యుడే అని మనకు చూపించుటకు దేవుడు అతనిలో ఉన్న చీకటి గురించి మనకు తెలియజేసెను. మనము అనుభవించే చీకటినే అతడు కూడా అనుభవించెను. కాని అతడు సూర్యోదయమును కూడా అనుభవించెను. కాబట్టి మన స్వజీవము యొక్క చీకటి ఎంత గొప్పదైనప్పటికీ పెనూయేలు యొద్ద యాకోబు అడుగుజాడలలో మనము నడచినయెడల మనము కూడా సూర్యోదయమును చూడవచ్చునని ఇది మనలను ప్రోత్సహించుచున్నది. కాబట్టి మనమిప్పుడు యాకోబు యొక్క జీవితమును పరిశీలించెదము- మొదట అతనిపై సూర్యుడు అస్తమించినప్పుడు; రెండవదిగా అతనిపై సూర్యుడుదయించినప్పుడు.

సూర్యుడు అస్తమించెను

యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని తన తల్లి గర్భమునుండి బయటకు వచ్చెను. ''కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను'' (యాకోబు అనగా లాక్కొనువాడు) (ఆది 25:26) మరియు అతడు ఖచ్చితముగా ఆ విధంగానే ఉండెను. అతడు ఎప్పుడు ఎవరివద్దనుండైనా ఏదో ఒకటి తన కొరకు లాక్కొనేవాడు. అతడు తన అన్న దగ్గరనుండి జ్యేష్ఠత్వపు హక్కును లాక్కొన్నాడు. అటుతరువాత తన తండ్రియొద్దనుండి ఆశీర్వాదమును లాక్కొన్నాడు. అతడు రాహేలును ఆమె తండ్రియైన లాబానుయొద్దనుండి లాక్కొన్నాడు. అటుతరువాత లాబాను యొక్క ఆస్థినికూడా లాక్కొన్నాడు.

యాకోబు ఒక బేరగాడు కూడా. అతడు ఏశావుతో జ్యేష్ఠత్వపు హక్కు కొరకు బేరమాడెను. తరువాత రాహేలు కొరకు లాబానుతో బేరమాడెను. బేతేలులో అతడు దేవునితో కూడా బేరమాడినట్లు కనుగొనెదము.

యాకోబు ఒక మోసగాడు కూడా. అతడు తన తండ్రి దీవెనను కోరుకున్నప్పుడు, దానిని పొందుటకు తన తండ్రిని మోసగించుటకు సిద్ధపడెను. అతడు అబద్ధము చెప్పినప్పుడు దేవుని నామమును ఉచ్ఛరించుటకు కూడా సిద్ధపడెను. ఇస్సాకు అతనిని ఇంత త్వరగా మాంసము ఎట్లు దొరికెనని అడుగగా అతడు ''యెహోవా దానిని నాయొద్దకు రప్పించెను'' అని సమాధానమిచ్చెను (ఆది 27:20). అతడు దేవుని నామమును ఎంత చులకనగా తీసుకొని అబద్ధము చెప్పెను! అతనికి ఖచ్చితముగా దేవునిభయము లేకుండెను.

లాక్కొనుట, బేరమాడుట, మోసగించుట వంటివి యాకోబు స్వభావములోనుండెను. అతడు ఎల్లప్పుడు తన స్వంత భూలోకసంబంధమైన ప్రయోజనాలనే చూచుకొనెను. అతడు నిశ్చయముగా ఆదాము సంతతికి చెందినవాడే.

దేవుని పిలుపును తప్పిపోవుట

చివరకు బేతేలులో, అతని జీవితముపైన సూర్యుడస్తమించెను. అక్కడ ఒక కలలో, అతని జీవితము కొరకు కలిగియున్న గొప్ప మహిమకరమైన ఉద్దేశ్యము యొక్క ప్రత్యక్షతను దేవుడు యాకోబుకు ఇచ్చెను. ఆయన అబ్రహాముకిచ్చిన వాగ్ధానములే యాకోబుకిచ్చెను. కాని యాకోబు ఏవిధముగా స్పందించెను? ''ప్రభువా, నాకు ఆ ఆత్మీయ ఆశీర్వాదాలన్నిటిలో అంత ఆసక్తి లేదు. నీవు నన్ను హానినుండియు, ప్రమాదము నుండియు కాపాడి, నాకు తినుటకు ఆహారము నిచ్చి, వేసుకొనుటకు బట్టలను ఇచ్చినయెడల, నేను చాలా సంతోషముగానుందును. నా రాబడిలో నీకు పదియవ వంతునిచ్చి నిన్ను నా దేవునిగా ఒప్పుకొనెదను'' అని అతడు చెప్పెను (ఆదికాండము 28:20-22).

అనేక మంది క్రైస్తవులు ఆ విధముగానే ఉన్నారు. దేవుడు వారిని ఒక గొప్ప మహిమకరమైన దానికొరకు పిలచును కాని వారు ఎంతో తక్కువైన దానితో తృప్తిచెందుదురు. దేవుడు వారి శక్తి సామర్థ్యాలను ఆయన పనిలో ఖర్చుచేయుటకు వారిని పిలచును, కాని వారు వారి జీవితాలను డబ్బును సంపాదిస్తూ ఈ లోక ఘనతను వెదకుతూ వృధా చేయుదురు. వారి ఉన్నత పిలుపును గుర్తించేవారు దేవుని ప్రజలలో ఎంత కొద్దిమంది ఉన్నారు! అటువంటి ఒక దైవజనుడు తన కుమారునితో ఇట్లనెను, ''నిన్ను దేవుడు ఒక మిషనరీ (సువార్త అందని ప్రదేశములకు సువార్తను తీసుకువెళ్ళేవాడు)గా ఉండుటకు పిలచినయెడల నీవు ఒక రాజువో లేక కోటీశ్వరుడివో అవుట నాకిష్టము లేదు. క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటలో ఉన్న ఘనతతో పోల్చినప్పుడు రాజుల లేక ప్రధానుల ఘనత ఎంత''.

యాకోబు కోరుకున్నట్లే మన కొరకు దేవుని ఉద్దేశ్యము కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా చాలా ఎక్కువగా నుండును. ఆయన ఉద్దేశ్యము ప్రాధమికముగా ద్విగుణమైనది-మొదటిగా మనము క్రీస్తు యొక్క జీవమును ఇతరులకు ప్రత్యక్షపరచవలెను; రెండవదిగా మనము ఆ జీవమును ఇతరులకు పంచి ఇవ్వవలెను. ఇది క్రైస్తవుని యొక్క పిలుపు- మరియు ఈ భూమిపైన దీని కన్నా గొప్ప పిలుపు లేదు. అయితే యాకోబు వలే అనేకమంది క్రైస్తవులు, క్రైస్తవ పరిచర్యలో ఉన్న కొందరు కూడా, దీనిని గుర్తించరు. దేవుడు వారికి ఒక కృపావరమునో లేక సామర్థ్యమునో ఇచ్చినప్పుడు వారు దాని మోజులోపడి, తప్పు దారిపట్టి, వారి జీవితాల కొరకు దేవునికున్న ప్రధాన ఉద్దేశ్యమునుండి వైదొలగుదురు. ఒక బాలుడు ఒక ఆట వస్తువు మోజులో పడినట్లు, వారు వారికున్న వరము మోజులో పడుదురు. అది వారి దృష్టినంతటిని నింపును కనుక వారింకేమియూ చూడలేరు. వారు దానిని గ్రహించకుండానే సాతాను వారిని ఎంత తెలివిగా తప్పుదారి పట్టించెను!

దేవుడు తన జీవితము కొరకు కలిగియున్న ఉద్దేశ్యము యొక్క విస్తారతను యాకోబు గ్రహించలేక పోయెను. దేవుడతనిని పరలోక సంబంధమైన ఐశ్వర్యమును కలిగియుండాలని కోరుకొనెను గాని అతడు ఆట వస్తువులతో తృప్తిపడెను. అటువంటి సంకుచితమైన దృష్టి యొక్క ఫలితమేమిటంటే యాకోబు యొక్క జీవితము కొరకు దేవుడు కలిగియున్న ఉద్దేశ్యములు ఆలస్యమాయెను. యాకోబు తన మనస్సును లోక సంబంధమైన వాటినుండి తీసివేసి పైనున్న వాటిపైన పెట్టుటకు దేవుడు ఇరవై సంవత్సరములు వేచియుండవలసి వచ్చెను. ఎంత మంది క్రైస్తవులు తమ సంకుచితమైన దృష్టివలననూ, దేవుని యొక్క ఉన్నతమైన విషయములకు బదులుగా తక్కువ వాటియందు మోజుపడుటవలననూ వారి జీవితముల కొరకు దేవుడు కలిగియున్న ఉద్దేశ్యములను ఆటంకపరచుచున్నారు మరియు ఆలస్యము చేయుచున్నారు.

పౌలు భిన్నమైన వ్యక్తిగానుండెను. అతడు తన జీవితము చివరిలో తనకు ఆకాశమునుండి కలిగిన దర్శనముకు అవిధేయుడు కాలేదని చెప్పగలిగియుండెను. దమస్కుకు వెళ్ళే మార్గములో దేవుడు అతని కొరకు కలిగియున్న గొప్ప పరిచర్య యొక్క దర్శనమునిచ్చెను - ఈ పరిచర్య గ్రుడ్డివారైన ప్రజల కన్నులు తెరచుట మరియు సువార్త యొక్క సందేశము ద్వారా వారిని సాతాను యొక్క శక్తినుండి విడిపించుట (అపొ.కా. 26:16-19). అయితే పౌలు సమాజసేవతోగాని దేవుడు తనను పిలచిన దానికంటే తక్కువైన దేనితోనూ ఆటంకపరచబడలేదు.

కాని దేవుడతనితో మాట్లాడినప్పుడు యాకోబు ఆ విధముగా స్పందించలేదు. కాబట్టి సూర్యుడు అతని జీవితముపై అస్తమించెను మరియు పరిస్థితులు ఇంకా ఇంకా చీకటి మయమాయెను. కాని అద్భుతమైన విషయమేమిటంటే దేవుడు యాకోబును విడచిపెట్టలేదు. ''నేను నీకిచ్చిన వాగ్ధానములను నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను'' అని దేవుడు యాకోబునకు ప్రమాణము చేసెను మరియు దేవుడు ఆయన మాటను నిలబెట్టుకొనెను. ఆయన మొండి వారైన పిల్లలతో దేవుని దీర్ఘశాంతమే మనలను ప్రోత్సహించును.

దైవశిక్షణ (దేవుని యొక్క క్రమశిక్షణ)

యాకోబుకిచ్చిన వాగ్దానములు నెరవేర్చుటకు దేవుడు అతనిని తీవ్రముగా శిక్షించవలసి వచ్చెను. కాబట్టి కథలో ఈ సమయమునుండి పెనూయేలులో రెండవసారి కలుసుకొనేవరకు, యాకోబు తన జీవితము కొరకు దేవుడు కలిగియున్న ఉత్తమమైన దానిని అంగీకరించెవరకు, అతని జీవితములో ఇరవై సంవత్సరముల దైవశిక్షణను మనము చూచెదము.

మొట్టమొదటిగా, దేవుడు యాకోబును మరియొక యుక్తిగల వ్యక్తి ప్రక్కన ఉంచెను. లాబాను యాకోబు వంటి తెలివిగలవాడే మరియు వారు కలసి జీవించుచూ, దగ్గర సంబంధము కలిగియున్నప్పుడు, వారిమధ్య ఎంతో రాపిడి(సంఘర్షణ) ఏర్పడెను. దీని వలన యాకోబుకున్న కొన్ని మోటైన గుణములు తొలగిపోయెను. మనలో ఉన్న కుటిలతను తీసివేయుటకు మనలను ఎవరితో ఉంచాలో దేవునికి తెలియును. దేవుడు మన వ్యక్తిగత అవసరతను బట్టి తన శిక్షణను కొలచిఇచ్చును; మరియు దేవుని ఏర్పాటుకు వ్యతిరేకముగా మనము తిరుగుబాటు చేయని యెడల ఆయన మనలను లాబాను వంటి వ్యక్తి ప్రక్కన ఉంచిననూ మన మేలు కొరకు సమస్తము సమకూడి జరుగునట్లు ఆయన చేయగలడు. అనేకులు దేవుడు వారిని వారివంటి వారినే వివాహము చేసుకొనుటకు నడిపించుట ద్వారా పరిశుద్ధముగా నుండుట నేర్చుకొనిరి. ''ఇనుము ఇనుమును కొట్టినప్పుడు నిప్పురవ్వలొచ్చును'' (సామెతలు 27:17 లివింగు బైబిలు)-కాని అది ఆ రెండు ఇనుము ముక్కలను పదును చేయును.

చివరకు యాకోబు తాను విత్తినదే కోయుట మొదలు పెట్టెను. తన జీవితమంతయు అతడు ఇతరులను మోసగించెను. ఇప్పుడు తానే మోసగించబడెను. తాను రాహేలును వివాహము చేసుకొనుచున్నాడనుకొనుచూ వివాహ వేడుకలో పాల్గొనెను, కాని మరుసటి ఉదయము తను నిజానికి లేయాను వివాహము చేసుకొన్నట్లు కనుగొనెను! అతడు లాబానును తనకు సమ ఉజ్జీగా కనుగొనెను! అతడు ఇతరులకిచ్చే చేదైన మందును ఇప్పుడు రుచి చూడవలసి వచ్చెను. దేవుడు ఏ ఉద్దేశ్యములేకుండా లేక ఇష్టమొచ్చినట్లుగా శిక్షింపడు. ప్రతి వ్యక్తికి ఏ మోతాదులో మందు అవసరమో ఆయనకు తెలుసు గనుక దానికి అనుగుణముగానే వారికిచ్చును. దయగలవారియెడల ఆయన దయ చూపించును; మరియు మొండివారి యెడల ఆయన మొండితనము చూపించును (కీర్తనలు 18:25). ప్రతియొక్క యాకోబుతో ఎలా వ్యవహరించవలెనో ఆయనకు తెలుసు.

యాకోబు యొక్క సమస్యలు ఇంకా ముగిసిపోలేదు. పదునాలుగు సంవత్సరములు కష్టించి పనిచేసిన తరువాత అతడు రాహేలును పొందెను; కాని ఆమె గొడ్రాలని కనుగొనెను. దేవుడు కనికరపడి చివరకు యాకోబుకు ఆమె ద్వారా ఒక బిడ్డను అనుగ్రహించెను. కాని ఇది కూడా యాకోబులో మార్పు తేలేదు. అతడు అప్పటికి కూడా దేవుణ్ణి నమ్మలేకపోయెను. కాని ఎత్తులు వేయుట కొనసాగించెను.

అతడు తరువాత లాబాను యొక్క ఆస్థిని దోచుకొనుటకు పథకం వేసెను. యాకోబు తెలివైనవాడు. అతడు వ్యాపారములోని యుక్తులన్నియు ఎరిగియుండెను మరియు లాబాను యొక్క శ్రేష్టమైన పశువులను ఏ విధముగా పొందవలెనో ఎరిగియుండెను. యాకోబు తన స్వంత మానవ చాతుర్యమును విడచిపెట్టి దేవుని నమ్ముట నేర్చుకొనుటకు దేవుడు ఎంతో కాలము వేచియుండవలసివచ్చెను. ఈ రోజున కూడా దేవునికి ఆయన పిల్లలతో ఉన్న సమస్య ఇదే. ఆయన మన తెలివిని బట్టి ముగ్దుడు కాడు.ఆయన చిత్తమును నెరవేర్చుటకు మనలను ఉపయోగించుకొనే ముందు మనము దాని అవివేకమునంతా చూచువరకు ఆయన వేచియుండును.

లాబాను నుండి పారిపోవుటకు యాకోబు చివరగా ఎత్తులువేయుట మనము కనుగొనెదము. తన మామగారితో కలసి జీవించుటకు విసుగుచెంది అతడు వెళ్ళిపోవుటకు ఇష్టపడెను. కాని అతడు పారిపోయినప్పుడు అతడు పెనముమీద నుండి పొయ్యిలోనికి పడినట్లు కనుగొనెను. ఏశావు ఒక పెద్ద సైన్యముతో తనను సమీపిస్తున్నాడని, లాబాను తనను వెనుకనుండి తరుముతున్నాడని యాకోబు వినెను. దేవుని క్రమశిక్షణను తప్పించుకోవాలని చూచేవానికి అది అంత తేలికైన విషయముకాదని కనుగొనును. యాకోబు ఈ విషయమును దేవుని చేతులలో విడచిపెట్టినయెడల దేవుడు అతనిని ఆయన చిత్తప్రకారము లాబాను నుండి విడిపించియుండును. కాని యాకోబు దేవునిని నమ్ముట ఇంకను నేర్చుకొనలేదు.

తన ప్రాణము ముప్పులో ఉన్నదని తనచుట్టూ కంచెవేయబడినట్లు కనుగొని యాకోబు ప్రార్థించుట మొదలుపెట్టెను. బేతేలులో దేవుడు చేసిన వాగ్దానాలను అతడు దేవునికి వెంటనే గుర్తు చేసెను (ఆది 32:9-12). కాని ప్రార్థన ఒక్కటే యాకోబుకు సరిపోదు. అతడు ఎత్తులు కూడా వేయవలెను. ఒకవేళ దేవుడు అతనికి సహాయపడనియెడల తనకున్న గుంపులో కనీసము ఒక భాగమును కాపాడుటకు అతడు ఒక తెలివైన పథకమును ఆలోచించెను. దేవుని నమ్ముట గురించి ''విశ్వాసమూలముగా జీవించుట'' గురించి మాట్లాడుచు, ఒకవేళ దేవుని యందు విశ్వాసము మాత్రమే పనిచేయని తరుణములో ఏదోఒక భూసంబంధమైన భద్రతను కలిగియున్నవారివలె అతడు ఉన్నాడు! యాకోబు నిజముగా ఎంతో మనలను పోలియున్నాడు.

యాకోబు ఏశావును కలసినప్పుడు గ్రహించినట్లు, మన భయాలు ఎంత అనవసరమైనవో మనము ఎంత తరచుగా చూచితిమి. మరియు మనము ఎత్తులువేసి, ఆందోళనచెంది, దేవుణ్ణి సందేహించవలసిన అవసరము లేదని కూడా చూచితిమి. ఏశావు హృదయము దేవుని చేతులలో ఉండెను మరియు ఆయన దానిని (సామెతలు 21:1 లో వ్రాయబడినట్లుగా) తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పగలడు. ''ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు, ఆయన అతని శత్రువులను కూడా అతనితో సమాధానముగా ఉండునట్లు చేయును'' (సామెతలు 16:7 లివింగు బైబిలు). అతని గూర్చి బాధ్యత వహిస్తానని దేవుడు యాకోబుకు స్పష్టముగా చెప్పెను. కాని యాకోబు దేవుని యొక్క వాగ్దానమును నమ్మలేకపోయెను.

దేవుని చేతిక్రింద యాకోబు 20 సుదీర్ఘమైన మరియు బాధాకరమైన సంవత్సరములు శిక్షణ పొందెను. యాకోబు అనుభవించిన వాటన్నిటిగురించి మనకు వివరాలు ఇవ్వబడలేదు- కాని అతడు చాలా కరిÄనమైన సమయమును అనుభవించియుండును. శారీరకముగా కూడా అది చాలా క్షీణింపజేసేదిగాయుండి ఉండును- ఎండలో, మంచులో, వానలో పనిచేయుచు మరియు నిద్రపోవుచు యాకోబు ఆ సమయమును గడిపెను. కాని యాకోబు యొక్క ఆత్మవిశ్వాసము, స్వయంసమృద్ధిని విరుగగొట్టుటకు ఈ శిక్షణ అంతా అవసరమాయెను. తరువాత సంవత్సరములలో అతడు వెనుతిరిగి చూచినప్పుడు మాత్రమే (ఇప్పుడు కాదు) దేవుడు తనను తీసుకువెళ్లిన మార్గమును అతడు మెచ్చుకోగలడు. ''దేవుని శిక్షణ ఎప్పుడూ సరియైనదే మరియు ఆయన పరిశుద్ధతలో పాలుపొందగలుగుటకు మనకు శ్రేష్టమైనదిగా ఉన్నది. కాని శిక్షించబడినప్పుడు మనము సంతోషించలేము, అది బాధకలిగించును! కాని తరువాత దాని ప్రతిఫలమును మనము చూడవచ్చు. ఆ ఫలితము కృపలోనూ స్వభావములోనూ నెమ్మదిగా అభివృద్ధి చెందుట (హెబ్రీయులు 12:10,11 లివింగు బైబిలు). అందరికి తెలిసిన ఒక గీతము ఈ విధముగా చెప్తుంది:

 
 ''కనికరముతోనూ తీర్పుతోనూ, నా సమయమనెడి వస్త్రమును ఆయననేసెను 
నా దు:ఖము యొక్క మంచు ఆయన ప్రేమచేత ప్రకాశించబడెను 
మహిమ నివసించు ఇమ్మానుయేలు దేశమున నేను సింహాసనాసీనుడనైనప్పుడు 
నన్ను నడిపించిన చేతిని నేను స్తుతించెదను, నా కొరకు ప్రణాళికలను వేసిన హృదయమును సన్నుతించెదను.'' 

సూర్యుడు ఉదయించెను

యాకోబు జీవితములో సూర్యుడు ఏ విధముగా అస్తమించెనో మరియు తదుపరి ఇరవై సంవత్సరములలో చీకటి ఏవిధముగా ఎక్కువైనదో మనము చూచితిమి. అతడు నిజముగా మనవంటి సామాన్యమైన మనుష్యుడే. అటువంటి మనుష్యునిపైన సూర్యుడు ఒక రోజు ఉదయించెను. దేవుడు అతనిని రెండవమారు కలుసుకొని అతనిని ''ఇశ్రాయేలు'' (అనగా దేవుని రాకుమారుడు)గా మార్చివేసెను.

కేవలము దేవుడు మాత్రమే యాకోబు వంటి పనికిరాని వ్యక్తిలో ఏదైనా మంచిని చూచి, నిరాశచెందకుండా, అతనిని సహనముతో వెంబడించెను. ఇక్కడ మనము దేవుని కృపను, గొప్పతనమును చూడగలము. మరియు ఇదే మనలను ప్రోత్సాహపరచును. మనము ఎంత స్వీయ-కేంద్రీకృతులమైనప్పటికీ దేవుడు మనలను చెత్తకుప్పపైన పడవేయడు. ఆయన మనయెడల సహనము కలిగియున్నాడు.

పరిశుద్ధుల ఓర్పు (ఒకసారి రక్షింపబడినవారు ఎన్నటికీ నశించరు) అను సిద్ధాంతమును మనము నమ్మకపోయినను దేవుని ఓర్పును మనము నమ్మకుండా ఉండలేము. ''నేను నీకు వాగ్దానము చేసినది నెరవేర్చు వరకు నిన్ను విడచిపెట్టను'' అని దేవుడు యాకోబుతో బేతేలులో ప్రమాణము చేసెను - మరియు అదే ప్రమాణము మనతో కూడా చేసెను. దేవుడు మనతో వ్యవహరించునప్పుడు ఎంత సహనముగా ఉండునో తెలుసుకొనుట అద్భుతమైనది మరియు అవమానకరమైనది కూడా. ఆయన ఆవిధముగా లేనియెడల మనలో ఎవరికి ఎటువంటి నిరీక్షణ యుండేది కాదు.

పెనూయేలు వద్ద దేవుడు యాకోబును చివరి దెబ్బ కొట్టెను. ఆయన యాకోబును గత ఇరవై సంవత్సరాలలో శిక్షించుచూ కొద్ది కొద్దిగా విరుగగొట్టుచుండెను. ఆ పనిని ఒక చివరి దెబ్బతో ముగించుటకు ఇప్పుడు సమయము వచ్చియుండెను. దేవుడు దానిని ఇక్కడ చేయకుండిన యెడల, యాకోబుపైన సూర్యుడుదయించుటకు ఇంకా ఇరవై ఏళ్ళు పట్టియుండవచ్చును. మన ఆత్మ విశ్వాసమును ఎప్పటికినీ విరుగగొట్టుటకు సరియైన సమయమేమిటో దేవునికి తెలియును.

దేవుని చేత ఆశీర్వదించబడుట

దేవుడు యాకోబును చివరిగా విరుగగొట్టినప్పుడు అతడు నిజముగా ఆశీర్వరించబడెను. ''దేవుడు యాకోబును అక్కడ ఆశీర్వదించెను'' అని వ్రాయబడియున్నది (ఆది 32:29). క్రైస్తవుల ప్రార్థనలలో తరచుగా వాడబడే పదము బహుశా ''ఆశీర్వాదము'' అను పదము. కాని చాలా కొద్దిమందికే దాని సరియైన అర్థము తెలియును.

ఆశీర్వాదము అనగా ఏమిటి? యాకోబు పొందిన ఆశీర్వాదము ఏమిటి? అది 32:28వ వచనములో ''దేవుని విషయములోనూ, మనుష్యుల విషయములోనూ శక్తి కలిగియుండుట''గా వర్ణించబడినది. మన మందరము కోరుకోవలసిన మన అందరికీ అవసరమైన ఆశీర్వాదము ఇదే. మరియు ఇది మాత్రమే మన జీవితాలపైన సూర్యుడు ఉదయించేటట్లు చేయును. దీనికంటే తక్కువైనదేదియు దేవుడు ఆయన ప్రజలకిచ్చుటకు ఇష్టపడడు. యేసు తన శిష్యులను తండ్రి యొక్క వాగ్థానము కొరకు యెరూషలేములో కనిపెట్టమని చెప్పినప్పుడు ఈ ఆశీర్వాదమునే సూచించెను. ''పరిశుద్ధాత్మ విూ విూదికి వచ్చినప్పుడు విూరు శక్తినొందెదరు'' (అపొ.కా. 1:8)- అనగా దేవునితోనూ మనుష్యులతోనూ శక్తిని కలిగియుండుట. యాకోబులు ఆత్మ యొక్క శక్తి ద్వారా ఇశ్రాయేలులుగా మార్చబడుదురు. ఆ రోజున యెరూషలేములోని మేడగదిలో ఇదే పేతురు మరియు ఇతర అపోస్తలుల జీవితాలపై సూర్యుడుదయించేటట్లు చేసినది.

మరియు ఇది మాత్రమే మన స్వజీవము యొక్క కుటిలతకు జవాబివ్వగలదు. ఇది సంస్కరణల వలనో మంచి తీర్మానముల వలనో లేక మన నిర్ధారణ వలనో జరిగేది కాదు. ఇది పరిశుద్ధాత్మ మనలను సంపూర్ణముగా ఆవహించి మన జీవితాలను ప్రభావితం చేసి పరిపాలించుటవలన మాత్రమే జరుగును.

కాని ఆత్మ మనలను ఎక్కడకు నడిపించును? ఎల్లప్పుడు సిలువయొద్దకే. మనము సిలువవేయబడినప్పుడు మాత్రమే క్రీస్తు మనలో పరిపూర్ణముగా జీవించగలడు. యేసు బాప్తిస్మము తీసుకున్నప్పుడు నీటిలో పాతిపెట్టబడినప్పుడు అనగా ఉపమానరీతిగా మరణమును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చెను (మత్తయి 3:16). యాకోబు విరుగగొట్టబడిన తరువాత మాత్రమే ఆశీర్వదించబడెను. 40 సంవత్సరములు గొఱ్ఱెలను కాచుటద్వారా మోషేయొక్క ఆత్మ విశ్వాసము చెదరగొట్టబడిన తరువాత మాత్రమే అతడు ఇశ్రాయేలును విమోచించుటకు సిద్ధముగా ఉండెను. జీవ జలములు పారుటకు ముందు ఆ బండ కొట్టబడవలసియుండెను. ఇశ్రాయేలీయులు (జీవమును పరిశుద్ధాత్మ నింపుదలను సూచించే) కానానులో ప్రవేశించుటకు ముందు (మరణమును పాతిపెట్టబడుటను సూచించు) యోర్ధాను నదిలోనుండి వెళ్ళవలసియుండెను. కుండలలోని దివిటీలయొక్క కాంతి బయటకు కనబడుటకు గిద్యోను సైన్యము కుండలను పగులగొట్టవలసి వచ్చెను. అత్తరు యొక్క సువాసన ఆ ఇంటిని నింపుటకు ఆ అత్తరు బుడ్డి పగులగొట్టబడవలసి వచ్చెను. పేతురు పెంతెకోస్తు కొరకు సిద్ధముగా నుండుటకు అతని అతిశయపడే ఆత్మ విశ్వాసము చెదరగొట్టబడవలసియుండెను. ఈ సత్యమును మనము లేఖనములంతటిలో కనుగొనగలము.

విరుగగొట్టబడని వ్యక్తికి దేవుడు శక్తినిచ్చుట చాలా ప్రమాదకరము. అది ఒక ఆరు నెలల శిశువుకు పదునైన కత్తినిచ్చునట్లుండును, లేక 20,000 వాట్ల విద్యుత్తును సరియైన విద్యుత్భందనం లేకుండా వాడినట్లుండును. దేవుడు జాగ్రత్త వహించును. ఎవరిలోనైతే స్వయం విరుగగొట్టబడలేదో అట్టి వారికి ఆయన ఆత్మయొక్క శక్తినివ్వడు. మరియు ఆయన విరిగిన వానిగా ఉండని వ్యక్తినుండి ఆయన శక్తిని తీసివేయును.

యాకోబు ఇప్పుడు దేవుని చేతనే ఆశీర్వదించబడెను. దీనికి ముందు యాకోబు ఇస్సాకు కొరకు మాంసమును తెచ్చినప్పుడు అతడు యాకోబుపైన చేతులుంచి ఆశీర్వదించెను (ఆది 27:23). కాని అది యాకోబు జీవితములో ఎటువంటి మార్పును తీసుకురాలేదు. నిజమైన ఆశీర్వాదము పెనూయేలులో వచ్చెను. మనము నేర్చుకొనవలసిన పాఠము కూడా ఇదే. ఒక వ్యక్తి - ఇస్సాకు వంటి పరిశుద్ధుడైన వ్యక్తికూడా- తన ఖాళీచేతులను మన ఖాళీ తలలపై ఉంచి ప్రార్థన చేయవచ్చును. అయినప్పటికీ మనకు ఏమియూ లబించకపోవచ్చును. దేవుడు మాత్రమే మనలను శక్తివంతులుగా చేయగలడు. ఇస్సాకు తన చేతులను యాకోబు తలపై ఉంచినప్పుడు, సూర్యుడు కేవలము యాకోబు జీవితముపై అస్తమించెను. కాని దేవుడతనిని ఆశీర్వదించినప్పుడు సూర్యుడు ఉదయించెను! శక్తి దేవునికి చెందినది కాబట్టి ఆయనొక్కడే దానిని మనకు ఎప్పటికైనా ఇవ్వగలడు.

''దేవుడు యాకోబును అక్కడ ఆశీర్వదించెను'' అని వ్రాయబడియున్నది (ఆది 32:29)- ఎక్కడైతే యాకోబు కొన్ని షరతులను నెరవేర్చెనో తన జీవితములో ఒక స్థాయికి వచ్చెనో అక్కడన్నమాట. దేవుడు యాకోబును అక్కడ అనగా (పెనుయేలు వద్ద) ఆశీర్వదించుటకు కొన్ని కారణములు ఉండెను.

దేవునితో ఏకాంతముగా నుండుట

మొట్టమొదటిగా యాకోబు దేవునితో ఏకాంతముగా ఉన్న స్థలములో ఆశీర్వదించబడెను. అతడు మిగిలిన వారందరినీ పంపివేసి ఒంటరిగా ఉండెను (ఆది 32:24). 20వ శతాబ్దపు విశ్వాసులు దేవునితో ఎక్కువ సమయము ఏకాంతముగా గడుపుట కష్టతరమైనదిగా ఎంచుదురు. ఈ జెట్‌-యుగము యొక్క ఆత్మ (అంతా త్వరగా అయిపోవలన్న ఆత్మ) మనలోని ఎక్కువమందిలోనికి ప్రవేశించెను. మరియు మనము ఎల్లప్పుడు తీరికలేకుండా ఉన్నాము. మన మనస్థత్వము లేక మన సంస్కృతియో సమస్యకాదు. మన ప్రాధాన్యతలు సరిగ్గాలేవు - అంతే.

విశ్వాసికి అవసరమైనది ఒక్కటే, అది యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పినది ఆలకించుటయేనని ఒకసారి యేసు చెప్పెను (లూకా 10:42). కాని మనము దానిని ఇక నమ్మము గనుక యేసుని మాటలను లెక్కచేయకపోవుట ద్వారా వచ్చే ప్రమాదకరమైన పరిణామాల వలన బాధపడెదము. మనము అనేకమైన కార్యక్రమాల వలన ఎల్లప్పుడు తీరికలేకుండిన యెడల, దేవునితో ఏకాంతముగా ఉపవాస ప్రార్థనలో ఎలా గడపవలెనో తెలియని యెడల మనము నిశ్చయముగా దేవుని యొక్క శక్తిని లేక ఆశీర్వాదమును పొందలేము. నేను చెప్పేది ఆయన నిజమైన శక్తిని గురించి (అనేకమంది అతిశయపడే చవకైన నకిలీల గురించికాదు).

దేవుని చేత విరుగగొట్టబడుట

రెండవదిగా, యాకోబు సంపూర్ణముగా విరుగగొట్టబడిన ప్రదేశములో ఆశీర్వదించబడెను. పెనూయేలు యొద్ద ఒక నరుడు యాకోబుతో పెనుగులాడెను. దేవుడు యాకోబుతో ఇరవై సంతవ్సరములు పెనుగులాడెను కాని యాకోబు తన ఓటమిని అంగీకరించలేదు. యాకోబు ఎంత తెలివిగల వాడైనా, ఎన్ని పథకాలు వేసినా, అతను చేయదలచినదంతయు నిష్ఫలమాయెనని చూపించుటకు దేవుడు ప్రయత్నించెను. కాని యాకోబు అప్పటికి కూడా మొండివాడుగా ఉండెను. చివరకు దేవుడు తొడగూడు వసిలేటట్లు అతని తొడగూటి మీద కొట్టెను (25వ వచనము). శరీరములో తొడ అన్నింటికన్నా బలమైన భాగము అయితే ఆ భాగమునే దేవుడు కొట్టెను.

మన జీవితములోని బలమైన విషయాలనే దేవుడు విరుగగొట్టుటకు చూచును. ఆత్మీయముగా తనకున్న బలమైన విషయము తన ధైర్యమేనని సీమోను పేతురు ఒకప్పుడు అనుకొనెను. అందరు ప్రభువును ఎరుగమని చెప్పినా తను ఎప్పుడూ ఆ విధముగా చెప్పడు. కాబట్టి ఆ విషయములో దేవుడు అతనిని విరుగగొట్టవలసి వచ్చెను. ఇతరులలో ఎవరైనను ప్రభువును ఎరుగనని చెప్పకముందే పేతురు ఎరుగనని చెప్పాడు మరియు ఒక్కమారు కాదు, మూడు మారులు, అది కూడా ఒక బలహీనమైన చిన్న పనిపిల్ల ప్రశ్నించినప్పుడు! పేతురును విరుగగొట్టుటకు అది సరిపోయెను. భౌతిక రంగములో, పేతురుయొక్క బలమైన విషయము చేపలు పట్టడము. ఏ విషయములోనైనా పేతురు నిపుణుడైతే అది చేపలు పట్టడమే. కాబట్టి దేవుడు ఆ విషయములో కూడా అతనిని విరుగగొట్టెను. పేతురు రాత్రంతయు చేపలు పట్టుటకు ప్రయత్నించెను గాని ఏమియు పట్టలేకపోయెను. మరియు ఇది ఒకమారు కాదు రెండు మారులు జరిగెను (లూకా 5:5, యోహాను 21:3). దేవుని సేవించుటకు అతని సంపూర్ణ అసమర్ధత గురించి నేర్పుటకు దేవుడు పేతురును అతని బలమైన విషయాలలో విరుగగొట్టెను.

క్రీస్తు లేకుండా వారేమియు చేయలేరని నేర్చుకొనుటకు శిష్యులకు మూడున్నర సంవత్సరములు పట్టెను. మనలో కొందరికి మరిఎక్కువ కాలము పట్టును. కాని ఆ మాటలలోని సత్యమును మనము ఏ మోతాదులో నేర్చుకొందుమో అదే మోతాదులో మనము దేవుని శక్తిని తెలుసుకోగలము. పేతురు తన బలమైన విషయాలలో విరుగగొట్టబడినప్పుడే- తన 'తొడ' పైన దేవుని చేత కొట్టబడినప్పుడే - అతడు పెంతెకోస్తు కొరకు సిద్దముగా ఉండెను.

మోషేయొక్క బలమైన విషయము అతనికున్న నాయకత్వపు సామర్థ్యము, అతని వాగ్దాటి మరియు ఐగుప్తు శ్రేష్టమైన విద్యాకేంద్రాలలో అతడు పొందిన శిక్షణ. ఇశ్రాయేలీయుల నాయకుడిగా ఉండుటకు తనకు మంచి అర్హత ఉందని అతడు భావించెను (అపొ.కా.7:25). కాని 40 సంవత్సరముల తరువాత మోషే తన బలమైన విషయాలయందు విరుగొట్టబడేవరకు దేవుడు అతని వెంట నిలబడలేదు. అప్పుడతడు ''ప్రభువా అటువంటి పనికి నేను సరియైన వ్యక్తిని కాను .....నేను బాగా మాట్లాడలేను....దయచేసి ఇంకెవరినైనా పంపుము'' (నిర్గ 3:11; 4:10,13-లివింగు బైబిలు) అని చెప్పెను. అప్పుడు దేవుడతనిని పట్టుకొని అతనిని బలముగా వాడుకొనెను. మన ఆత్మ విశ్వాసము మన ఆత్మ నిబ్బరత విరుగగొట్టబడే వరకు మన గురించిగాని మన సామర్థ్యం గురించి గాని మనము అతిశయింపకుండా యుండేవరకు దేవుడు వేచియుండవలెను. అప్పుడు దేవుడు సంకుచితము లేకుండా తనను తాను మనకు అప్పగించుకొనగలడు.

దేవుని కొరకు ఆకలి కలిగియుండుట

మూడవదిగా, యాకోబు దేవునికొరకు ఆసక్తి మరియు ఆకలి కలిగియున్న ప్రదేశములో దీవించబడెను.''నీవు నన్ను దీవించువరకు నిన్ను విడిచిపెట్టను'' అని అతడు మొఱపెట్టెను (26వ వచనము). ఈ మాటలను యాకోబు నుండి వినుటకు దేవుడు 20 సంవత్సరాలపాటు ఎంతగా వేచియుండెనో. తన జీవితమంతా, జ్యేష్టత్వపు హక్కును, స్త్రీలను, డబ్బును, ఆస్థిని లాక్కొంటూ గడపిన యాకోబు ఇప్పుడు వాటన్నింటిని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకొనెను. ఈ స్థితి తీసుకువచ్చుటకే దేవుడు యాకోబు జీవితంలో ఇప్పటివరకు పనిచేసెను. తాత్కాలికమైన భూసంబంధమైన వాటిని విడచి దేవునికొరకు ఆయన ఆశీర్వాదము కొరకు యాకోబు దప్పిక కలిగియుండుట, కోరుకొనుట దేవుని హృదయమును సంతోషపరచియుండును. హోషయా 12:4లో ఆ రాత్రి పెనూయేలు వద్ద యాకోబు విలపించి ఆశీర్వాదము కొరకు వేడుకొనెనని మనకు చెప్పబడినది. తన ముందరి సంవత్సరాలలో కేవలము ఈ లోక సంబంధమైన వాటిని కోరుకొన్నదానితో పోల్చిచూచినపుడు ఆ రాత్రి అతడు ఎంత భిన్నమైన వ్యక్తిగా నుండెను. అతనితో దేవుని వ్యవహారాలు చివరకు ఫలించెను!

దేవుడు యాకోబును సంపూర్ణముగా ఆశీర్వదించేముందు అతని ఆసక్తిని పరీక్షించెను. యాకోబు తనకు దొరికిన దానితో తృప్తిపడేనా లేక ఇంకా ఎక్కువ కొరకు కాంక్షించెనా అని పరీక్షించుటకు ఆయన యాకోబుతో ''నన్ను వెళ్ళనివ్వు'' అనెను. ఇది తదుపరి సంవత్సరాలలో ఏలియా ఎలీషాను పరీక్షించినట్లే యుండెను. ఏలియా, ''నన్ను వెళ్ళనివ్వు'' అని పదే పదే చెప్పెను, కాని ఎలీషా విడిచిపెట్టుటకు నిరాకరించెను-కాబట్టి అతడు ఏలియా ఆత్మను రెండింతలుగా పొందెను (2 రాజులు 2). అటువలెనే యేసు కూడా ఎమ్మాయి అను గ్రామమునకు నడచి వెళ్లుచున్న ఇద్దరు శిష్యులను పరీక్షించెను (లూకా 24:15-31). వారు తమ ఇంటికి చేరుకోగానే ఆయన ఇంకా ముందుకు వెళ్లునట్లుగా నడిచెను. కాని ఆ ఇద్దరు శిష్యులు ఆయనను వెళ్లనివ్వలేదు - దాని ఫలితముగా వారు ఆశీర్వాదమును పొందిరి.

దేవుడు మనలను కూడా పరీక్షించును. ఒక వ్యక్తి దేవుని యొక్క శ్రేష్టమైన దానికొరకు అత్యంత ఆసక్తి కలిగియుండనంత వరకు ఆయన అతనిని పూర్తిగా ఆశీర్వదించలేడు.

''ప్రభువా, నేను ఇప్పటి వరకు అనుభవించిన దానికంటే క్రైస్తవ జీవితములో ఇంకా ఎక్కువ ఉన్నది. నాకు తృప్తిలేదు. ఎంత వెల చెల్లించవలసి వచ్చినా నాకు నీ సంపూర్ణత కావాలి''

అని మనము యాకోబు వలె తృష్ణకలిగి యుండవలెను. మనము ఆ స్థితికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదమునకు ఒక చిన్న మెట్టు తీసుకొనవలసియున్నది.

పెనూయేలు వద్ద సంఘటనను గమనించినట్లయితే, యాకోబు బలహీనమైన స్థితిలో ఉండగా (తన తొడగూడు వసిలిన తరువాత), ''దేవా, నేను నిన్ను విడచిపెట్టను'' అనెను. దేవుడతనిని సుళువుగా విడచిపెట్టి వెళ్ళిపోయి యుండవచ్చును, కాని ఆయన అలా చేయలేదు. ఎందుకనగా, ఒక వ్యక్తి తనలోతాను అతి బలహీనముగా ఉన్నప్పుడే, అతడు దేవునితో అత్యధిక శక్తి కలిగియుండెను. అపోస్తులుడైన పౌలు చెప్పినట్లుగా,

::before ''నేను ఎంత బలహీనుడనో చెప్పుటకు అతిశయపడుచున్నాను; నా శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుటకు బదులుగా, క్రీస్తుని శక్తి యొక్క సజీవమైన ప్రదర్శనగా నుండుటకు నేనానందించుచున్నాను......ఎందుకనగా నేను బలహీనముగా ఉన్నప్పుడే బలముగా ఉన్నాను'' (2 కొరిందీ¸ 12:9 లివింగు బైబిలు). ::after

దేవుని శక్తి మానవ బలహీనతలోనే అత్యంత ప్రభావితముగా ప్రదర్శింపబడును.

అయితే యాకోబు ఓడిపోయినప్పుడు, విరుగగొట్టబడినప్పుడు, అత్యంత బలహీనముగా ఉన్నప్పుడు, దేవుడు ''నీవు ఇప్పుడు గెలిచితివి'' అని చెప్పెను. ''నీవు చివరకు ఓడిపోతివి'' అని దేవుడు చెప్పవలసి యుండెనని మనమనుకొందుము. కాని అలాకాదు. ఆయన చెప్పిన మాట, ''నీవు గెలచితివి. ఇకనుండి నీవు దేవునితోనూ మనుష్యులతోనూ శక్తికలిగియుందువు'' (28వ వచనము). దేవుడు మన స్వంతబలమును మరియు మన స్వయంసమృద్ధిని విరుగగొట్టినప్పుడు మనము గెలిచెదము. ఆ గీతములోని మాటలు చెప్పునట్లుగా,

''నన్ను ఒక బందీగా చేయుము, ప్రభువా, అప్పుడు నేను స్వాతంత్రునిగా ఉందును''.

క్రైస్తవ జీవితములోని మహిమకరమైన విరోధాభాసము (పారడాక్స్‌) ఇదే.

ఎప్పుడైన బలహీనతకు ఒక చిహ్నం ఉంటే దానిని సిలువపై నిస్సహాయముగా వేలాడుచున్న మనుష్యునిలో చూడగలము. కొరడాతో కొట్టబడి, పిడికిళ్ళతో గుద్దబడి, చివరకు సిలువకు మేకులతో కొట్టబడి, క్రీస్తు ఒక బలహీనమైన అలసిపోయిన మనిషిగా చనిపోయెను. కాని అక్కడ అపవాది యొక్క ఓటమిలోనూ, మానవుల యొక్క విమోచనలోనూ దేవుని శక్తి ప్రదర్శించబడెను (హెబ్రీ 2:14;కొలస్సీ 2:14,15). ''సిలువవేయబడిన క్రీస్తు దేవుని శక్తియై యున్నాడు'',''బలహీనతనుబట్టి ఆయన సిలువ వేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, దేవుని శక్తినిబట్టి ఆయనతో కూడా జీవముగలవారము'' అని పౌలు కొరిందీ¸యులకు వ్రాసెను (1 కొరిందీ¸1:23,24; 2 కొరిందీ¸ 13:4). కొరిందీ¸యులైన క్రైస్తవులు అన్యభాషలలో మాట్లాడు వరమును దేవుని శక్తిని పొందుటకు రుజువుగా పొరబడినారు, కాబట్టి పౌలు వారి పొరపాటును సరిచేయవలసి వచ్చెను. పౌలు చెప్పినదాని సారాంశమేమనగా,

''సహోదరులారా, దేవుని శక్తి అన్య బాషలలో మాట్లాడు వరములో లేదు. మీకు ఆ వరమున్న యెడల దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. కాని పొరబడవద్దు. దేవుని శక్తి సిలువలోనూ సిలువ ద్వారా మాత్రమే ప్రత్యక్షపరచబడును. మానవ బలహీనతలోనే దేవుని శక్తి కనపరచబడును''.

ఒక దైవజనుడు తనకు ఆత్మీయశక్తి యొక్క రహస్యమును దేవుడు ఏవిధముగా చూపించెనో నేను వినుట గుర్తున్నది. అతడు దేవుని యొద్దనుండి ఏదోఒక అద్భుతమైన ప్రత్యక్షత కొరకు కొంతకాలమునుండి వెదకుచుండెను. చివరకు ప్రభువు,

''నీవు నీ పాపములకు క్షమాపణ ఏవిధంగా పొందావు?''

అని అడిగెను.

''ప్రభువా, భూమిపై నున్న పాపులలో నేనే ప్రధానుడను అని నేను గుర్తించినప్పుడు నీవు నన్ను ఉచితముగా క్షమించితివి''

అని సమాధానమిచ్చెను. అప్పుడు ప్రభువు అతనితో ఇట్లనెను,

''ఇప్పుడు నీవు భూమిపైన ఉన్న వారిలో అత్యంత బలహీనుడవని గుర్తించుము. అప్పుడు నీవు నా శక్తిని పొందెదవు''.

ఆ విధముగా అతడు తన జీవితములో దేవుని శక్తి అనుభవించుట ప్రారంభించెను.

సిలువ మార్గము శక్తితో కూడిన మార్గము. మనము ఏ ప్రమాణముతో ఆ మార్గములో నడిచెదమో, మనము అదే ప్రమాణములో దేవుని శక్తిని మన జీవితములో కలిగియుందుము. మరియు జనులు మన జీవితము ద్వారా మన పరిచర్య ద్వారా ఆశీర్వదించబడెదరు. అయిదు రొట్టెలు విరువబడినప్పుడు మాత్రమే గాని దానికి ముందుకాదు, జన సమూహములు భుజించగలరు.

దేవునితో యదార్ధముగా నుండుట

చివరిగా, యాకోబు దేవునితో యదార్ధముగా ఉన్న ప్రదేశములో ఆశీర్వదింపబడెను. ''నీ పేరేమిటి?'' అని దేవుడతనిని అడిగెను. ఇరవై సంవత్సరముల ముందు, అతని తండ్రి అతనిని అదే ప్రశ్న అడిగినప్పుడు, అతడు అబద్ధమాడి, ''నేను ఏశావును'' అని చెప్పెను (ఆది 27:19). కాని ఇప్పుడు అతడు యదార్థముగా నుండెను. ''దేవా, నేను యాకోబును'' అని చెప్పెను. వేరేమాటలో ''దేవా, నేను లాక్కొనేవాడిని, మోసగాడిని మరియు బేరగాడిని''. యాకోబులో ఇప్పుడు ఏ కపటమును లేదు. కాబట్టి దేవుడతనిని ఆశీర్వదించగలిగెను.

చాలా సంవత్సరాల తరువాత, యేసు నతనయేలును చూచిప్పుడు ఏమనెనో మీకు గుర్తున్నదా; ''ఇదిగో, యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు - నిజమైన ఇశ్రాయేలు, నిజమైన దేవుని రాకుమారుడు, ఇతనిలో ఏ యాకోబు (అనగా ఏ కపటమును) లేడు'' యోహాను 1:47). దేవుడు మనలోకూడా దీనినే చూడాలని వేచిచూచుచున్నాడు. అప్పుడు మాత్రమే ఆయన మనకు అధికారమివ్వగలడు.

దేవుడు యాకోబును అక్కడ ఆశీర్వాదించెను - అతడు యదార్థముగా ఉన్నప్పుడు, నటించుటకు ఇంకా ఏ మాత్రము ఇష్టపడనప్పుడు, ''దేవా, నేను వేషదారిని, నా జీవితములో అవమానము మరియు నటన ఉన్నవి'' అని ఒప్పుకొన్నప్పుడు. నేను మీకు చెప్పునదేమనగా, ఒకవ్యక్తి తన హృదయంతరంగములోనుండి దీనిని అంగీకరించుటకు నిజమైన విరిగి నలిగిన స్వభావము అవసరము. అనేక మంది క్రైస్తవ నాయకులు అటువంటి మాటలను నకిలీ దీనత్వముతో, దీనులమని పేరుపొందుటకు చెప్పుదురు. నేను అటువంటి హేయమైనదాని గురించి చెప్పుట లేదు. నేను చెప్పేది ఒక విరిగి నలిగిన హృదయము నుండి వచ్చే యదార్థత. అది ఖరీదైనది. మనందరిలో చాలా కపటమున్నది. మనము పరిశుద్ధులము కాకపోయినా ఎంతో పరిశుద్ధులమని నటించినందుకు దేవుడు మనయెడల కనికరపడును గాక. మనము నిజాయితీని, యదార్థతను, తృష్ణను మన హృదయాలంతటితో ఆశించెదము. అప్పుడు మన జీవితాలపై దేవుని ఆశీర్వాదమునకు ఎటువంటి పరిమితి ఉండదు.

ఆరోహణమయ్యే సూర్యుడు

యాకోబు విరుగగొట్టబడుట వలన ఇశ్రాయేలుగా మారెను. చిట్టచివరకు అతని జీవితముపైన సూర్యుడు ఉదయించెను. అయితే దీని అర్థము యాకోబు పరిపూర్ణుడయ్యాడని కాదు. ఏ ఒక్క అనుభవము పరిపూర్ణతను దయచేయదు. దేవుడతనిని ఇంకా శిక్షించవలసిన అవసరముండెను ఎందుకనగా అతడు నేర్చుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నది. ఆదికాండము 33 మరియు 34వ అధ్యాయాలలో, మనము యాకోబు అవిధేయతల్లో, పొరపాట్లలో కొన్నిటి గురించి మనము చదివెద

అధ్యాయము 3
క్రీస్తు జీవమునకు మార్గము (2): రిక్తునిగా చేయబడుట

రిక్తునిగా చేయబడుట

సిలువ మార్గములో విరుగగొట్టబడటమే కాకుండా ఖాళీ చేయబడుట కూడా ఉన్నది.

''ఇక నేను కాను'', అని పౌలు చెప్పెను. క్రీస్తు తనలో జీవించి, పరిపాలించులాగున అతడు తనలో 'నేను' (అనగా స్వయము) లేకుండా ఖాళీ చేసుకొనెను. యేసు కూడా తండ్రి సింహాసనమునుండి సిలువలోని లోతులకు దిగినప్పుడు తననుతాను రిక్తునిగా చేసుకొనెను (ఫిలిప్పీ 2:5-8). యేసుకు మరియు పౌలుకు ఉన్నట్లే మన జీవితాలలో కూడా సిలువకు అదే అర్థముండును.

ఖాళీచేయబడుట అనగా ఏమిటో తెలుసుకొనుటకు మనము ఈ అధ్యాయములో అబ్రాహాము జీవితమును పరిశీలించెదము. యాకోబు వ్రాసిన పత్రిక 2:23లో, అబ్రాహాము ''దేవుని స్నేహితుడు'' అని పిలువబడెను. నూతన నిబంధన కాలములో దేవుని స్నేహితులు అనబడేవారికి అతను చిహ్నముగా ఉండెను. యేసు సిలువపై మరణించుటకు వెళ్ళేముందు తన శిష్యులతో ఇట్లనెను, ''అబ్రాహాము లోబడినట్లు మీరు నాకు లోబడితే మీరు నాకు స్నేహితులు. నేను మిమ్మును ఇక దాసులని పిలువను, ఎందుకనగా ఒక యజమాని తన దాసులకు రహస్యాలు చెప్పడు; తండ్రి నాతో చెప్పిన వాటన్నిటిని విూతో చెప్పితిని గనుక ఇప్పుడు మీరు నా స్నేహితులు;'' (యోహాను 15:14,15- లివింగు బైబిలు).

ఈ నూతన నిబంధన కాలములో దేవుడు మనలను ఆయన దాసులుగా ఉండుటకు మాత్రమే కాకుండా ఆయన స్నేహితులుగా ఉండుటకు పిలచుచున్నాడు - ఆయన రహస్య ఆలోచన సభలలోకి ప్రవేశించుటకు, ఆయన వాక్యములోని దాచబడిన మర్మములను అర్థంచేసుకొనుటకు పిలచుచున్నాడు. అబ్రాహాము అటువంటి స్నేహితుడు. దేవుడు ఆయన రహస్యములను అతనికి బయలుపరచెను (ఆది 18:17-19).

దేవుడు అబ్రాహామును గొప్పగా ఆశీర్వదించెను. మరియు ''క్రీస్తునందు విశ్వాసముంచువారు అబ్రహాము పొందిన ఆశీర్వాదములో పాలివారము కావచ్చును'' అని మనకు చెప్పబడెను (గలతీ 3:9 లివింగు బైబిలు). దేవుడు ఏ ఆశీర్వాదముతో అబ్రాహామును ఆశీర్వాదించెను? దేవుడు అబ్రాహాముకిచ్చిన వాగ్ధానము ''నేను నిన్ను ఆశీర్వదించెదను'' (ఆది 12:2). మనము గలతీ అధ్యాయములో దేవుని చేత ఆశీర్వదించబడుట అంటే ఏమిటో చూచాము. కాని అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్ధానము ''నేను నిన్ను ఆశీర్వదించెదను'' అను మాటతో ముగిసిపోలేదు. ''...మరియు నీవు ఇతరులకు ఆశీర్వాదముగా నుందువు'' అని కూడా చెప్పెను. ఇది అబ్రహాము కొరకు దేవుడు కలిగియుండిన సంపూర్ణ ఉద్దేశ్యము మరియు ఈ రోజున ఆయన మనకొరకు కలిగియున్న ఉద్దేశ్యము. మనము ఆశీర్వదించబడటమేకాకుండా ఆ ఆశీర్వాదము ఇతరులకు ప్రసారమగుటకు మనము కాలువలుగా ఉండవలెను.

ఈ రోజున మనకొరకున్న అబ్రాహాము యొక్క ఆశీర్వాదము పరిశుద్ధాత్ముని వరముకు సంబంధించినదని గలతీయులకు వ్రాసిన పత్రిక 3:13,14 స్పష్టంచేస్తుంది. క్రీస్తు యొక్క సమృద్ధి జీవమును మనలోనికి ప్రసరింపజేసేది మరియు అదే జీవమును మనద్వారా ఇతరులకు ప్రసరింపజేసేది పరిశుద్ధాత్ముడే.

యాకోబు వ్రాసిన పత్రిక 2:21-23లో, అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడినచోట, అబ్రాహాము జీవితములోని రెండు సంఘటనలు చెప్పబడినవి:

  1. దేవుడు అతనికి ఒక కుమారుడు కలుగునని చెప్పినప్పుడు అతడు దేవుని నమ్ముట (23వ వచనము ఆదికాండము 15:6 సూచిస్తుంది).
  2. దేవుడు అడిగినప్పుడు అతడు ఇస్సాకును అర్పించుట (21వ వచనము ఆదికాండము 22 సూచిస్తుంది).

యాకోబు అబ్రాహాము దేవుని స్నేహితుడని చెప్పినప్పుడు, ఆదికాండము 15 మరియు 22వ అధ్యాయాలలో వివరించబడిన ఈ రెండు సంఘటనలను కలిపెను. ఆదికాండములోని ఈ రెండు అధ్యాయాలు అబ్రాహాము జీవితములోని రెండు ముఖ్యకాలములను వర్ణించును. దానికి తోడు, ఈ రెండు ముఖ్యమైన అధ్యాయాలలో బైబిలులోని రెండు ముఖ్యమైన పదాలు మొదటిసారిగా సంభవించుట మనము కనుగొనగలము. అవి ''నమ్ముట'' (ఆదికాండము 15:6) మరియు ''మ్రొక్కుట'' (ఆదికాండము 22:5).

ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది కాబట్టి, మొదటిసారిగా ఒక ముఖ్యమైన పదము లేఖనములలో సంభవించుటకు ఏదో ప్రాముఖ్యత ఉండవలెను. కాబట్టి లేఖనములలోని ఈ రెండు భాగములు 'నమ్ముట' (విశ్వాసము) మరియు 'మ్రొక్కుట' (ఆరాధన) యొక్క నిజమైన అర్థముల గూర్చి మనకు ఎంతో నేర్పించగలవు.

మరియు అబ్రాహాము నేర్చుకొనవలసిన రెండు పాఠములు కూడా ఇవే - దేవుని నమ్ముట అంటే ఏమిటి మరియు ఆయనను ఆరాధించుట అంటే ఏమిటి. మనలను మనము ఖాళీచేసుకొనుటకు సిలువను సాధనముగా అంగీకరించినప్పుడే ఈ రెండు సాధ్యమగును.

దేవుని యందు విశ్వాసముంచుట

దేవుని యందు విశ్వాసముంచుట అంటే కేవలము మేధో సంబంధమైన నమ్మిక మాత్రమేకాక, స్వయంసమృద్ధి నుండియు మరియు స్వీయ - ఆధీనత (తనపై తాను ఆధారపడుట) నుండియు ఖాళీచేయబడుట అని అబ్రాహాము నేర్చుకొనవలసియున్నది.

ఆదికాండము 15లో ('నమ్ముట' అనే పదము ఉన్న 6వ వచనములో), ఆ పద్దు ''ఇవి జరిగిన తరువాత.....'' (1వ వచనము) అనే మాటలతో మొదలవుతుంది. ఆ మాటలు సూచించే ముందటి అధ్యాయములో అబ్రాహాము తన జీవితములో గొప్ప విజయము సాధించిన సమయము గురించి వ్రాయబడియున్నది. 318 మంది తర్ఫీదు పొందని దాసులతో అతడు వెళ్ళి నలుగురు రాజుల సైన్యములను ఓడించెను. మరియు అదంతా అయిపోయిన తరువాత తాను చేసిన దానికి ఎటువంటి ప్రతిఫలము తీసుకొనక సొదోమ రాజు ముందు ఎంతో మర్యాదగా ప్రవర్తించెను. దేవుడు ఈ రెండు పర్యాయాలలో అతనికి అద్భుతముగా సహాయము చేసెను. ఇప్పుడు అతడు విజయం పొందిన గడియలో అబ్రాహాము ఆత్మ- నిబ్బరత కలిగియుండుట చాలా సులభము.

అటువంటి సమయములో దేవుడు అబ్రాహాముతో మాట్లాడి, అతడికి ఒక కుమారుడు కలుగునని (పుట్టునని) చెప్పెను. అంతేకాకుండా, ఆ కుమారుని ద్వారా వచ్చు సంతానము సంఖ్యలో ఆకాశములోని నక్షత్రములను పోలియుండునని కూడా దేవుడు చెప్పెను. అది దాదాపు అసాధ్యముగా కనబడెను కాని అబ్రాహాము దేవుని నమ్మెను (ఆది 15:6). ''నమ్ముట'' అని తర్జుమా చేయబడిన హెబ్రీబాష పదము ''అమాను''. దీనినే మనము మన ప్రార్థనల చివరలో ''ఆమేన్‌'' అని వాడుదుము. దాని అర్థము, ''అది తప్పకుండా జరుగును''. అబ్రాహాము కు ఒక కుమారుడు కలుగునని దేవుడు చెప్పినప్పుడు, అతడు ''ఆమేన్‌'' అని సమాధానమిచ్చెను. దాని సారాంశమేమిటంటే, ''దేవా, ఇది ఎలా జరుగునో నాకు తెలియదు. కాని నీవు చెప్పావు కాబట్టి అది తప్పకుండా జరుగునని నేను నమ్ముచున్నాను''.

శారా గొడ్రాలు గనుక దేవుని వాగ్దానము నెరవేరుట కష్టతరముగా కనబడెను. వాస్తవానికి, అబ్రాహాము అప్పటికి కూడా సంతాన భాగ్యమున్నవాడే. కాబట్టి కొంచెం నిరీక్షణ యుండెను. వెరే మాటలో చెప్పాలంటే, ఆ వాగ్ధానము నెరవేరుట అసాధ్యమైనది కాకున్నా ఖచ్చితముగా కష్టతరమైనదే.

దేవునికి ఒక కష్టమైన పరిస్థితిలో సహాయపడుట

అబ్రాహాము దేవుని వాగ్ధానమును వినిన తరువాత, అతడు తనలో తాను ఈ విధముగా ఆలోచించుకొనియుండును, ''శారా గొడ్రాలు కాబట్టి, నేను దేవునికి ఈ పరిస్థితిలో సహాయపడాలని అనుకొనుచున్నాను''. కాబట్టి తన దాసియైన హాగరుతో కూడవలెనని శారా యిచ్చిన సలహాను అతడు వెంటనే అంగీకరించెను. అతడు యదార్థముగా దేవునికి సహాయపడవలెనని ఆశించెను. మానవ రీతిగా చూచినట్లయితే నెరవేర్చలేని ఒక వాగ్ధానముచేసి దేవుడు ఒక కష్టమైన స్థితిలో ఉండెనని అబ్రహాము తలంచెను. ఇది దేవుని ప్రతిష్టకు సంబంధించిన విషయము. కాబట్టి దేవుణ్ణి ఇటువంటి పరిస్థితినుండి రక్షించుటకు, అబ్రాహాము హాగరుతో కూడా ఇష్మాయేలును కనెను! కాని దేవునికి ఇశ్మాయేలు అంగీకారము కాదు గనుక అతనిని తృణీకరించెను ఎందుకనగా అతడు మనుష్యుని స్వంత ప్రయత్నము ద్వారా పుట్టినవాడు.

మన రోజుల్లో క్రైస్తవ పరిచర్యకున్న ప్రేరణ చాలా మట్టుకు అబ్రాహాము కలిగియుండినటువంటి శరీరానుసారమైన ఆలోచన వలన వచ్చును. దేవుడు విశ్వాసుల ప్రయత్నాలపై ఆధారపడియున్నాడని, వారుగనుక ఆయనను నిరాశపరచితే ఆయన ఉద్దేశ్యములు నెరవేరవని వారికి చెప్పబడును! దేవుడు యోచించునట్లు పనులు జరిగినట్లు కనబడుటలేదు కాబట్టి ఆయన ఇప్పుడు కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు! క్రైస్తవ పరిచర్య చేయుటకు ఇవ్వబడుచున్న కొన్ని హెచ్చరికలు, సర్వ శక్తిమంతుడైన దేవుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడని, ఆయనకు మన సహాయము ఎంతో అవసరమన్న అభిప్రాయమును కలుగజేయును!

నిజమే, దేవుడు తన ఉద్దేశ్యములను నెరవేర్చుటకు మానవ కారకత్వమును ఉపయోగించుకొనును. ఆయన పనిలో ఆయనతో సహకరించే ఆధిక్యతను మనకు కలుగజేయుటకు ఆయన ఈ పరిమితిని స్వచ్ఛందంగా అంగీకరించెను. అయితే మనము దేవునికి లోబడనియెడల, ఆయన పని జరగదు అని మాత్రం దీని అర్థం ఖచ్చితంగాకాదు. ఆవిధంగా కాదు. ఆయన సార్వభౌముడు. మనము యేసు కొరకు చేయగలిగిన పని ఖచ్చితముగా ఉన్నది; కాని మనము దానిని చేయకపోయిన యెడల, ఆయన మనలను దాటిపోయి ఆ పని చేయుటకు మరియొకరిని కనుగొనును-మరియు దేవుని సహపనివారమయ్యే ఆధిక్యతను మనము కోల్పోవుదము. దేవుడు తన కార్యమును నెరవేర్చుటనుండి బలహీనులైన మనుష్యులు ఆపలేరు.

దేవుడు మన సహాయము లేకుండా తన పనిని చాలా బాగా కొనసాగించగలడు. మనము ఈ సత్యాన్ని గుర్తించవలసియున్నది.

దేవుని కొరకు మనము చేయు పరిచర్య ఆయనున్న ఒక కష్టమైన పరిస్థితిలో సహాయపడదామనే ఆలోచనతో ఉత్పన్నమైతే మనము ఇష్మాయేలులను మాత్రమే తయారుచేయగలము.

మానవ శక్తిలోనూ, లౌకిక జ్ఞానములోనూ, మానవ సామర్థ్యములోనూ మరియు సహజమైన ప్రతిభలోనూ (అవి ఎంత శ్రేష్టమైనవైనను) వేరులున్న పరిచర్య దేవునికి పూర్తిగా అంగీకారము కాదు.

ఇశ్మాయేలు ఎంతో తెలివైన వాడును, మనోహరమైనవాడు కావచ్చును. ''ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకననుగ్రహించుము'' అను అబ్రాహాము మొఱ్ఱపెట్టవచ్చును (ఆది 17:18). కాని దేవుని సమాధానమిదే:

''లేదు. అబ్రాహాము, అతడు నీ శక్తి వలన పుట్టినవాడు కాబట్టి అతడు ఎంత మంచి వాడైనప్పటికీ, నేను అతనిని అంగీకరించలేను''.

మరియు మన ద్వారా ఉద్భవించే పరిచర్యతో కూడా ఇదే జరుగును. దేవుడు అప్పుడు దానిని స్వీకరించలేడు, దానిని ఈ రోజుకూడా స్వీకరించడు! మన క్రైస్తవ పరిచర్యకు ఎటువంటి మానవ సంబంధమైన వివరణయున్న యెడల, అది కేవలము మన తెలివైన మనస్సులు సమకూర్చుకొన్న శ్రేష్టమైన వేదాంత శిక్షణయొక్క ఫలితమైనయెడల, లేక క్రైస్తవ పరిచర్యలో స్వయం పోషణ చేసుకొనుటకు తగినంత ధనము మనకు అందుబాటులో ఉండుటవలన సాధ్యమైన యెడల, మానవ దృష్టిలో మన పరిచర్య ఎంత మనోహరమైనప్పటికీ తీర్పు (పరీక్షింపబడే) దినమున కర్ర, గడ్డి, కొయ్యకాలుగా అది కాల్చివేయబడును. ఆ రోజు తమ ఆత్మ - నిబ్బరతనుండి ఎన్నడూ ఖాళీచేయబడని మంచి ఉద్దేశ్యాలుగల క్రైస్తవులు తయారుచేసిన అనేక మంది ''ఇష్మాయేలు'' బయలుపరచబడుదురు. దేవుని పరిశుద్ధాత్మ మీద దీనత్వముతో ఆధారపడుచూ చేసిన కార్యములు మాత్రమే నిత్యత్వములో నిలచియుండును. క్రీస్తు న్యాయ పీఠమువద్ద ఎటువంటి చింతలు లేకుండునట్లు, మనము ఆ పాఠమును ఇప్పుడే నేర్చుకొనుటకు దేవుడు సహాయపడును గాక!

విశ్వాసముతో కూడిన క్రియలు

మన స్వజీవము ఎంత కుటిలమైనదియు, మోసకరమైనదంటే, అది దేవుని పరిశుద్ధ్ద స్థలములోనికి ప్రవేశించి, అక్కడ ఆయనను సేవించుటకు ప్రయత్నము చేయును. మనము దానిని గమనించి, స్వజీవము దేవుని సేవించుటకు ఆశించినను దానిని చంపవలసియున్నది.

దేవుని పని విశ్వాసముతో కూడిన పనియై యుండవలెను - అంటే దేవునిపై మానవుడు నిస్సాయముగా ఆధారపడుటలో ఉద్భవించేదిగా ఉండవలెను. కాబట్టి మనపని మనుష్యుల దృష్టిలో లేక మన దృష్టిలో ఎంత ప్రభావితముగా ఉన్నది అనునది ప్రశ్న కాదు. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మన పని పరిశుద్ధాత్ముడు కార్యము చేయుట వలన వచ్చిన ఫలితమా లేక మనము కార్యము చేయుట వలన వచ్చినఫలితమా అనునదియే. ఎంతపని జరిగెనా అను దానిలో కాక ఎవరి శక్తి వలన పనిజరిగెనా అను దానిలో దేవుడు ఆసక్తిని చూపుచున్నాడు. ఆపని ధనము యొక్క శక్తివలన జరిగెనా లేక మేధాశక్తి వలన జరిగెనా లేక పరిశుద్ధాత్ముని శక్తి వలన జరిగెనా? ఇదే ఆత్మీయ క్రియకు, విశ్వాసముతో కూడిన క్రియకు నిజమైన పరీక్ష. వేరేమాటలలో చెప్పాలంటే దేవునికి పరిమాణములో కన్నా నాణ్యతలో ఎక్కువ ఆసక్తి ఉన్నది. ఇదివరకటి రోజులవలెనే ఈ రోజున కూడా దేవుని నిజమైన పని, మానవ శక్తి చేతనో, బలముచేతనో కాక పరిశుద్ధాత్మ శక్తి వలన కొనసాగుతుంది (జెకర్యా 4:6). ఈ సత్యాన్ని మరచితే మనకే ప్రమాదము.

మనుష్యుని అంత్యము - దేవుని అవకాశము

ఇష్మాయేలు వలే ఇస్సాకు అబ్రాహాము శక్తి వలన జన్మించినవాడు కాదు. అబ్రాహాము అప్పటికి సంతానప్రాప్తి లేనివాడుగా అయ్యెను. (రోమీయులు 4:19 లో శారా గర్భమేకాక అబ్రాహాము శరీరము కూడా ''మృతతుల్యమైనట్టు'' స్పష్టముగా చెప్పబడెను). నిర్వీర్యమైన (సంతానప్రాప్తి లేని) అబ్రాహామును దేవుడు బలపరచుట ద్వారా ఇస్సాకు పుట్టెను. ఇటువంటి పరిచర్య నిత్యత్వము వరకు నిలచును. ఒక్క ''ఇస్సాకు'' వెయ్యిమంది ''ఇష్మాయేలుల'' విలువ కలిగినవాడు. అబ్రాహాము ఇష్మాయేలును కొద్దికాలము మాత్రమే తనవద్ద ఉంచుకోగలిగెను, కాని చివరకు దేవుడతనిని వెళ్ళగొట్టమని అడిగెను (ఆది 21:10-14). ఇష్మాయేలులందరును ఒక దినమున వెళ్ళగొట్టబడుదురు. ఇస్సాకు మాత్రమే అబ్రాహాముతో నుండగలిగెను. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠమున్నది. దేవుడు మనద్వారా పనిచేయుట వలన వచ్చు పరిచర్య మాత్రమే నిత్యత్వములో నిలచియుండును. మిగిలినదంతయు కాల్చివేయబడును. మీరు ఈ సామెతను వినియుండవచ్చు, ''ఒకేఒక్క జీవితము, అది త్వరగా గతించిపోవును, కేవలము క్రీస్తు కొరకు చేసినదే నిలచియుండును''. ఇంకా ఖచ్చితముగా చెప్పవలెనంటే ''కేవలము క్రీస్తు నా ద్వారా చేసినది మాత్రమే నిలచియుండును''.

కేవలము ''ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును'' కలిగియున్నదే నిత్యత్వములో నిలచియుండును (రోమా 11:36). (దీనిగురించి పూర్తి వ్యాఖ్యానము కొరకు నా పుస్తకము ''యేసువలె జీవించుట'' ను చూడండి).

దేవుడు పౌలు ద్వారా జీవించుట మరియు కార్యముచేయుటను బట్టి పౌలు జీవించి ప్రయాసపడెను (గలతీ 2:20; కొలస్సీ 1:29). గనుక అతని జీవితము మరియు అతని ప్రయాసలు ఎంతో ప్రభావితముగా నుండెను. అతడు విశ్వాసమూలముగా జీవించెను మరియు పరిచర్య చేసెను.

ఆదికాండము 16:16లో హాగరు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 సంవత్సరముల వయస్సు గలవాడని మనము చదివెదము. కాని తరువాత వచనములోనే (17:1లో ), దేవుడు మరల తనకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహాము 99 సంవత్సరాల వయస్సు గలవాడని చదివెదము. ఇక్కడ మనము 13 సంవత్సరముల అంతరమును చూచెదము. ఆ సంవత్సరములలో అబ్రాహాము రిక్తుడగువరకు దేవుడు వేచియుండెను. అబ్రాహాము నిర్వీర్యుడగువరకు దేవుడు తన వాగ్ధానమును నెరవేర్చలేకుండెను. ఆయన సేవకులందరితో దేవుని మార్గము (పద్ధతి) అదే. వారు తమ నిర్వీర్యమును గుర్తించనంతవరకు ఆయన వారి ద్వారా పనిచేయలేడు. కొన్ని సందర్భాలలో ఆయన అనేక సంవత్సరములు వేచియుండవలెను.

దేవుని నమ్ముట అంటే ఏమిటో అబ్రాహాము నిజముగా నేర్చుకొనవలసిన అవసరముండెను. అతడు నిర్వీర్యుడైన తరువాతనే తాను నిజముగా విశ్వాసమును అభ్యాసము చేయగలడని అతడు నేర్చుకొనవలసి యుండెను. రోమీయులకు వ్రాసిన పత్రిక 4:19-21లో, కుమారుని కనుటకు తన శరీరము నిర్వీర్యమైనదని అబ్రాహాము ఎరిగినప్పటికీ, అది అతనిని చింతింపచేయలేదని మనము చదివెదము. అతడు దేవుడు వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, దేవుని మహిమపరచి విశ్వాసమువలన బలమునొందెను. అతడు అవిశ్వాసము వలన సందేహించలేదు, ఎందుకనగా, అతని పాదములు దేవుని వాక్యమనెడి బండపైన స్థిరముగా నిలచుండెను. కాని అబ్రాహాము అటువంటి విశ్వాసమును ఎప్పుడూ అభ్యాసము చేయగలిగెను? అతడు తన స్వంత సామర్థ్యములో ఉన్న నమ్మకమును పూర్తిగా పోగొట్టుకొన్నప్పుడు మాత్రమే. మనము కూడా అటువంటి అత్యంత నిస్సహాయ స్థితికి చేరుకొన్నాక మాత్రమే నిజమైన విశ్వాసమును అభ్యాసము చేయగలము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, దేవుడు ఈ పద్ధతిని అవలంబించును.

అయితే దీని అర్థము మనము ఏమి చేయము అని కాదు. అలా కాదు. దేవుడు మనలను ఒక జడత్వపు స్థితిలో ఉండాలని కోరుకోవడం లేదు. అది మరియొక విపరీత ధోరణి. ఇస్సాకును పుట్టించుటకు దేవుడు అబ్రాహామును వాడుకొనెను. దేవుడు తనంతటతానే అంతా చేయలేదు, ఎందుకనగా అబ్రాహాము తనవంతు పని చేయకుండా ఇస్సాకు పుట్టలేదు. లేదు. కాని ఇశ్మాయేలు పుట్టుకకు ఇస్సాకు పుట్టుటకు ఒక వ్యత్యాసమున్నది. రెండు సందర్భాలలో, అబ్రాహాము తండ్రియైయుండెను. కాని మొదటి సందర్భములో, అది తన స్వంత శక్తిపై ఆధారపడుట వలన జరిగినది; రెండవ దానిలో అది దేవుని శక్తిపై ఆధారపడుట వలన జరిగినది. అదే వ్యత్యాసము - ఇది ఎంత ముఖ్యమైన వ్యత్యాసము!

శరీరమును ఆస్పదము చేసికొనకపోవుట

పదమూడు సంవత్సరములు వేచియున్న తరువాత, దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అతనికి సున్నతి విషయమైన నిబంధనను అనుగ్రహించెను (ఆది 17:11). సున్నతి అనగా మానవ శరీరమును కోసివేయుట మరియు విసర్జించుట. అది ఆత్మ విశ్వాసమునంతా విసర్జించుటకు సూచనగా ఉన్నది. పౌలు ఫిలిప్పీ 3:3 లో వివరించినట్లు: ''శరీరమును ఆస్పదము చేసికొనని మనమే సున్నతి ఆచరించువారము''.

గమనించండి, అబ్రాహాము దేవునికి లోబడి సున్నతి చేసికొన్న సంవత్సరములోనే, శారా ఇస్సాకుతో గర్భవతియాయెను (ఆది 17:1; 21:5 పోల్చిచూడండి). ఇక్కడ మనము నేర్చుకోవలసిన ఒక పాఠమున్నది. మనము మనలను మన సామర్థ్యములను ఆస్పదము చేసికొనక పోవుట నేర్చుకొనే వరకు దేవుడు వేచియుండును. మరియు మనంతట మనమే దేవుని సేవించుటకు, ఆయనకు ఇష్టులుగా ఉండుటకు అసాధ్యమని గ్రహించు స్థలమునకు చివరిగా వచ్చినప్పుడు (రోమా 8:8), మరియు దేవుడు మన ద్వారా పనిచేయునని నమ్మినప్పుడు, ఆయన మనలను చేపట్టి మన ద్వారా ఒక శాశ్వతమైన పనిని చేయును. 85 ఏళ్ళ వయస్సప్పుడు, అబ్రాహాముకు ఒక బిడ్డ పుట్టుట కష్టముగా కనిపించెను. అతనికిక 99 ఏళ్ళ వయస్సొచ్చి, నిర్వీర్యమైన సమయానికి, కష్టతరముగా ఉండినది కాని ఇప్పుడు అసాధ్యమాయెను. అప్పుడు దేవుడు కార్యముచేసెను.

దేవుని యొక్క నిజమైన పనిలో మూడు దశలున్నవని ఒకరు చెప్పిరి. అవి - కష్టము, అసాధ్యము మరియు ఆ పని పూర్తికావడము! ఇటువంటి తర్కమును అర్ధము చేసుకొనుట మానవ జ్ఞానమునకు కష్టముగానుండును, ఎందుకనగా ఆత్మీయ సత్యము ప్రకృతి సంబంధమైన మనస్సుకు వెర్రితనము. కాని దేవుని మార్గము ఇదియే.

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపలేడు, ఇప్పుడుగాని నిత్యత్వములోగాని (1 కొరిందీ¸ 1:29 చూడండి). చివరకు అన్నిటిలో క్రీస్తుకు ఔన్నత్యము కలుగునట్లు దేవుడు పనిచేయుచున్నాడు (కొలస్సీ 1:18). మానవ చాతుర్యముతోనూ, తెలివి తేటలతోనూ చేయబడి శాశ్వతముగా పరలోకములో నిలచియుండే కార్యమేదైన పరలోకములో ఉన్నయెడల, అప్పుడు నిత్యత్వమంతా ఏదోఒక మనిషి దానికొరకు గుర్తింపు పొందును. కాని ఆవిధముగా జరుగకుండునట్లు దేవుడు ఖచ్చితముగా చూచుకొనును. మానవ ఘనత కొరకున్నదంతయు క్రీస్తు న్యాయ పీఠముముందు కాల్చివేయబడును. ఇక్కడ భూమిపైన, మనుష్యులు వారు చేసిన దానికి గుర్తింపు పొందవచ్చేమోగాని, మనము నిత్యత్వపు ఒడ్డునకు చేరుకొనకముందు అదంతయు బూడిద పాలగును. ఒక రోజున, దేవుడు క్రీస్తులో సమస్తమును పోగుచేయును. అప్పుడు నిత్యత్వమంతయూ క్రీస్తుకు మాత్రమే ఔన్నత్యము కలుగును.

జెస్సీపెన్‌ లూయిస్‌ అను స్త్రీ యొక్క రచనలు అనేకమందికి సిలువ మార్గమును అర్థంచేసుకొనుటకు సహాయపడినవి. ఆమె తిరిగిజన్మించిన పది సంవత్సరముల తరువాత, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వెదకుచున్నప్పుడు, ఏ విధముగా ఒక భయంకరమైన ప్రత్యక్షతను పొందెనో ఆమె చెప్పెను.ఆమె ఒక మురికి గుడ్డల మూటనుపైకి పట్టుకొనియున్న ఒక చేతినిచూచెను మరియు ఒక సౌమ్యమైన స్వరము ఈ విధముగా చెప్పుట వినెను, ''నీవు ఇప్పటివరకు దేవునికొరకు చేసిన సేవ యొక్క ఫలితమిదే''. ఆమె ప్రభువు కొరకు కొన్ని సంవత్సరాలుగా తనను తాను ప్రతిష్టించుకొన్నానని ఆక్షేపించెను. కాని ఆమె చేసిన సేవ కేవలము ప్రతిష్టింపబడిన స్వజీవము యొక్క ఫలితమని ప్రభువు చెప్పెను-ఆమె స్వంత శక్తియు మరియు ఆమె స్వంత ప్రణాళికల యొక్క ఫలితము. మరియు ఆమె ''సిలువవేయబడెను'' అను ఒక్క మాట విన్నది. ఆమె సిలువవేయబడుటకు కాక నింపబడుటకొరకు అడిగెనని ఆమె అనుకొనెను. కాని ఆమె ఆ ఒక్క మాటపైన విశ్రమించి యేసును పునరుత్థానుడైన ప్రభువుగా తెలుసుకొనెను!!

దేవుని మెప్పించే ఎటువంటి పరిచర్యనైనా చేయకముందు స్వీయము( ''నేను''అనునది) సిలువవేయబడవలెను. మన హృదయాలంతటితో దేవుని సేవించి, ''ప్రభువా, నేను చేసిన ఈ ఇష్మాయేలులను దయచేసి అంగీకరించుము'' అని మనమనవచ్చు. కాని దేవుడు ''వద్దు'' అనును. ఆయన ఇప్పుడు 'వద్దు' అనును మరియు నిత్యత్వములో కూడా 'వద్దు' అనును.

పరిశుద్ధాత్మపైన ఆధారపడుట

మనలను మనము ఒక్క విషయములో ప్రార్థన విషయములో పరీక్షించుకొనెదము. ''విశ్వాసముతో కూడిన ప్రార్థన'' అని బైబిలు చెప్పినట్లుగా మనకు ప్రార్థించుట నిజముగా తెలుసా? మనము ఏమి చేయలేని పూర్తి నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడే అటువంటి ప్రార్థన చేయగలము. ఓహలెస్‌బి అను దైవజనుడు చెప్పినట్లుగా నిజమైన ప్రార్థన అంటే మన నిస్సహాయ స్థితిని దేవుని ముందు ఒప్పుకొనుటయే. అందమైన, అనర్గలమైన, మనోహరమైన ప్రార్థనలు ఉచ్చరించుటలో ఎటువంటి ఘనత లేదు. ఇటువంటి సామాన్యమైన ప్రార్థనను ఎవరైనా, అన్యుడు కూడా చేయగలడు. కాని విశ్వాసముతో కూడిన ప్రార్థన తన నిర్వీర్యతను గుర్తించి, దేవుడు లేని పక్షములో తన పూర్తి నిస్సహాయతను గుర్తించిన వానినుండి మాత్రమే వచ్చును. ''ఆత్మ వలన ప్రార్థించుట'' అను దానికి అర్థము ఇదే (ఎఫెసీ 6:18); మరియు అటువంటి ప్రార్థనకే సమాధానము లభించును. ఒకరు చెప్పినట్లు, ఈ రోజున మనకు అవసరమైనది ఎక్కువ ప్రార్థన కాదుగాని ఎక్కువ సమాధానము పొందే ప్రార్థన. మనము ఎక్కువగా ప్రార్థన చేయుట దేవునికిష్టమని, అన్యులవలె మనలను మనము మోసపరచుకొనవద్దు.మనస్వంత నిర్వీర్యతను గుర్తించుట వలన వచ్చిన ప్రార్థనకు తప్ప మరేప్రార్థనకు దేవుని ముందు విలువ లేదు.

ఈ రోజున ఉన్న ఇవాంజలికల్‌ క్రైస్తవ పరిచర్యలో చాలా కొద్ది మట్టుకు మాత్రమే విశ్వాసమూలముగా జరుగుతున్నది. మనము ప్రభువు కొరకు చేయు సేవలో సహాయపడుటకు మనకు ఎన్నో ఎలక్ట్రానిక్‌ పరికరాలు మరియు ఇతర సదుపాయాలు ఉన్నవి. మరియు మనలో అనేకమంది తమకు తెలియకుండానే, ప్రభువుపై కాకుండా వీటిపై ఆధారపడుదురు. ఈ రోజుల్లో ప్రభువును సేవించుటకు పరిశుద్ధాత్మ నింపుదల పొందే అవసరము లేనట్లుగా కనబడుచున్నది. ఒకరికి కావలసినది ఒక టేపు-రికార్డు, కొన్ని క్రైస్తవ చలన చిత్రాలు దృశ్య-శ్రవణ పరికరాలు మరియు ఆర్థిక సహాయము కొరకు కొందరు ధనికులైన వ్యాపారవేత్తలు. వీటితోకలిపి ఒకరికి చైతన్యవంతమైన వ్యక్తిత్వము, వాగ్ధాటి, బాగా పాడగలిగిన స్వరము ఉన్న యెడల, అతడు వెళ్ళి, ''క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించవచ్చు!''.

అపోస్త్తలుల యొక్క విశ్వాసమునుండి ఇవాంజలికల్‌ క్రైస్తత్వము ఎంత దూరము దిగజారిపోయెను! వ్యాపార ప్రపంచంలో ఉన్న పద్దతులు దేవుని పరిశుద్ధ స్థలములోనికి తేబడుట ఎంత విషాదకరమైన విషయము. ఈ పద్దతుల వలన బయటకు కనబడే విజయాలను బట్టి మనము మోసపోకూడదు. మన ''మత మార్పిడుల'' యొక్క గణంకాలను మనము సమకూర్చుకోవచ్చు కాని అవి అప్రమాణికమైనవని మనము నిత్యత్వములో గ్రహించెదము. పరలోకము మన ప్రయాసలను బట్టి ఆనందించదు ఎందుకనగా, మనము ఆత్మలను వారి స్వీయ-కేంద్రీకృతము నుండి విడుదలచేయక, కేవలము వారికి వినోదాన్నిచ్చి సంతోషపెట్టితిమి.

దేవుని మార్గము మారలేదు. ఈ రోజున కూడా, మనము దేవునికిష్టమయ్యే ''ఇస్సాకులను'' తయారు చేయ్యాలంటే, మన స్వయంసమృద్ధిని ఖాళీచేసుకొని, దేవుని ఆత్మ నింపుదల పొందవలసిన అవసరమున్నది.

::before ''నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొని, తన ఆత్మనిర్భరతపైన ఆనుకొనువాడు శాపగ్రస్తుడు - అతడు ఎడారిలోని ఆరుహవృక్షము వలేనుండును'' (యిర్మియా 17:5 వివరణ). ::after

అటువంటి వ్యక్తి తను ఫలభరితముగానున్నట్లు ఇతరులకు ఎంత ప్రదర్శించినా, అతడు నిత్యత్వములో ఒక ఆరుహవృక్షము వలేనిలచును, ఎందుకనగా అతని పరిచర్య యొక్క మూలము అతనిలోనే యుండెను మరియు అది మానవ శక్తిపైనా మానవ వనరులపైన ఆధారపడెను. మరోప్రక్క, ''దేవుని నమ్ముకొనువాడు, మరియు ప్రభువును తనకు ఆశ్రయముగా చేసుకొన్నవాడు ధన్యుడు. అతడు నదిఒడ్డున నాటబడిన చెట్టువలేనుండును; అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును ....దాని ఆకు పచ్చగా నుండును మరియు అది కాపుమానక తన తియ్యని ఫలములనిచ్చును'' (యిర్మియా 17:7, 8 లివింగు బైబిలు).

ఈ ఉపమానమును మార్చి 1 కొరిందీ¸ 3:10-15లో ఉన్న ఉపమానము చూచినట్లయితే, మనము దేనితో కట్టుచున్నాము - కర్ర, గడ్డి, కొయ్యకాలుతోనా లేక బంగారము, వెండి, వెలగల రాళ్ళతోనా? అగ్ని తనపనిని చేసిన తరువాత ఒక్క గ్రాము బంగారము ఒక టన్ను గడ్డికన్నా విలువైనది. పరీక్ష దినమున కేవలము నిజమైన విశ్వాసము మూలముగా చేసిన కార్యములే నిలచును.

మన సంపూర్ణ నిస్సహాయ స్థితి

ఎడిల్‌ షాఫర్‌ వ్రాసిన ఎల్‌ అబ్రీ అను పుస్తకములో, తన భర్తయైన ఫ్రాన్సిస్‌ షాఫర్‌ను తన సహపనివారిని దేవుడు మరల మరల ఏ విధముగా సంపూర్ణ నిస్సహాయస్థితికి తీసుకువచ్చెనో వ్రాసెను. వారున్న క్లిష్ట పరిస్థితిలోనుండి బయటకు వచ్చుటకు దారిలేని సందర్భములు ఎన్నో ఉండెను. సువార్త యొక్క శత్రువులు పలుమారులు దాదాపుగా విజయము సాధించిరి. వారి నిర్వీర్యతలో వారి తరపున పనిచేయుటకు వారు దేవునితట్టు చూచిరి. మరియు ఆయన ఆలాగు-ఒకటికాదు, రెండు కాదు, పలుమారులు చేసెను. ఆ విధమైన కార్యమే - అనగా విశ్వాసముతో కూడిన కార్యమే-నిత్యత్వము వరకు నిలచును.

ఒక పనియొక్క పరిమాణము దేవుణ్ణి ముగ్ధుణ్ణి చేయదు(మెప్పించదు). లోకము పరిమాణము కొరకు సంఖ్య కొరకు చూచును. కాని దేవుడు విశ్వాసముతో కూడిన క్రియలకొరకు చూచుచున్నాడు-అవి ఆవగింజంత పరిమాణము కలిగియున్నప్పటికీ.

మన ఆశలను నిరాశలుచేసి, మనలను సంపూర్ణ నిస్సహాయ స్థితికి తీసుకొని వచ్చినప్పుడు మనము నిరుత్సాహపడకూడదు! మనలను మొదట నిర్వీర్యులుగా ఉన్నస్థితికి తీసుకొని వచ్చుట ద్వారా ఆయన మనలను ఇంకా గొప్పగా వాడబడుటకు సిద్ధపరచుచున్నాడు. మనము ''ఇస్సాకులను'' తయారుచేయుటకు ఆయన మనలను సిద్ధపరచుచున్నాడు.

ఈ విధముగా యేసు తన అపోస్తలులను తన సేవ కొరకు సిద్ధపరచెను. ఆయన వారికి మూడున్నర సంవత్సరములు తర్ఫీదు ఇచ్చుటలో ఉన్న ఉద్దేశ్యముఏమైయున్నదని మీరనుకొనుచున్నారు? వారు వేదాంతములో డాక్టరేట్లను సంపాదించుకొనేటట్లు చేసే పాండిత్యముగల వ్యాసాలను వ్రాయుటకు వారికి శిక్షణ ఇవ్వబడలేదు! ఈ రోజున కొందరు ఆ విధముగా ప్రభువును సేవించుటకు తమ్మును తాము సిద్ధపరచుకోవచ్చని భావించుదురు. కాని యేసు తన శిష్యులను దానికొరకు తర్ఫీదు చేయలేదు. బహుశా ఇస్కరియోతు యుదా తప్ప పండ్రెండుమంది అపోస్తులులలో వేరెవ్వరూ కూడా (వారు ప్రయత్నించినాసరే) మన ప్రమాణాల ఒక ప్రాథమిక వేదాంత డిగ్రీ పొందుటకు అర్హత కలిగియుండక పోదురు. వారు ప్రధానంగా ఒక్క పాఠమును నేర్చుకొనుటకు యేసు వారికి తర్ఫీదు నిచ్చెను-అది, ఆయనకు వేరుగా ఉండి వారు ఏమియూ చేయలేరు (యోహాను 15:5). అయితే నేను మీకు చెప్పునదేమనగా, ఆ పాఠము నేర్చుకొన్న ఒక్క వ్యక్తి, ఆ పాఠము నేర్చుకొనని వందమంది వేదాంత ఆచార్యులకన్నా విలువైనవాడు.

దేవునిపై సంపూర్ణముగా ఆధారపడుట ఒక నిజమైన దేవుని సేవకుని యొక్క గుర్తు. భూమిపై యెహోవా సేవకునిగా ఉన్నప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు విషయములో కూడా ఇది సత్యమే. యెషయా 42:1లో ఆయన గురించి ప్రవచనాత్మకముగా దేవుడు ఇలా చెప్పెను, ''ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు'' ఆయన తన స్వంత బలముపై నిలబడలేదు; ఆయన దేవునిచేత ఆదుకోబడెను. క్రీస్తు ఈ విధముగా తననుతాను రిక్తునిగా చేసుకొనెను గనుక, దేవుడు తన ఆత్మను ఆయనపై నుంచెను అని ఆ వచనము చెప్పుచున్నది. సంపూర్ణ నిస్సహాయ స్థితికి వచ్చినవారికి, తమను తాము తమ ఆత్మవిశ్వాసమునుండి, తమ స్వయంసమృద్ధి నుండి ఖాళీ చేసుకొన్న వారిపై మాత్రమే దేవుడు తన ఆత్మను క్రుమ్మరించును.

యేసు చేసిన కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలను చూచినప్పుడు, ఆయన తనను తాను ఎంత రిక్తునిగా చేసికొనెనో చూడగలము:

::before ''కుమారుడు తనంతట తాను ఏదియూ చేయనేరడు...నా అంతట నేను ఏమియూ చేయలేను...నా అంతట నేనే మాట్లాడలేదు;నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు...నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు'' (యోహాను 5:19,30;8:28;12:49;14:10). ::after

ఎంత ఆశ్చర్యము! పరిపూర్ణుడైన పాపములేని దేవుని కుమారుడు విశ్వాసము మూలముగా జీవించెను. తనపై తాను ఏ విధముగా ఆధారపడకుండా, ఆయన సంపూర్ణముగా తన తండ్రిపై ఆధారపడెను. ఈ విధముగా జీవించుటకే దేవుడు మనలను పిలచుచున్నాడు.

మనము స్వయంసమృద్ధి కలిగియున్నప్పుడు, దేవుని సేవించుటలో మనకు సహాయపడుటకు మనము దేవుణ్ణి వాడుకొనుటకు ప్రయత్నించుదుము. కాని మనము మనలను రిక్తులుగా చేసుకొన్నప్పుడు, దేవుడు మనలను వాడుకోగలడు.

క్రిష్టియన్‌ ఆండ్‌ మిషనరీ అలయన్స్‌ అను సంస్థకు వ్యవస్థాపకుడైన ఎ.బి.సింప్సన్‌ అను గొప్ప దైవజనుడు తన స్వంత జీవితములో ఈ పాఠమును ఏ విధముగా నేర్చుకొనెనో చెప్పెను. ఒక యవ్వనస్తుడైన సంఘ కాపరిగా, తన ఆరోగ్యము కోల్పోయే వరకు తన స్వంత శక్తి సామర్థ్యాలతో దేవుని సేవించుటకు శ్రమపడెను. చివరకు క్రైస్తవ పరిచర్యపై తనకున్న దృక్పధాన్నంతటిని మార్చివేయు విధముగా అతడు దేవుణ్ణి కలుసుకొనెను. తను దేవుణ్ణి వాడుకొనుచున్నాడని అతను గ్రహించెను. అప్పటినుండి అతడు దేవుడు తనను వాడుకొనుటకు అనుమతించెను. అతడు వ్రాసిన ప్రసిద్ధిగాంచిన గీతములో తన అనుభవాన్ని పంచుకొనెను.

 
''ఒకప్పుడు అది నా పని, ఇప్పటినుండి అది ఆయనపని; 
ఒకప్పుడు నేను ఆయనను వాడుకొన్నాను, ఇప్పుడు ఆయన నన్ను వాడుకొనుచున్నాడు. 
ఒకప్పుడు నేను శక్తిని కోరుకున్నాను, ఇప్పుడు శక్తిమంతుని కోరుకొనుచున్నాను; 
ఒకప్పుడు నా కొరకు శ్రమించితిని, ఇప్పుడు ఆయన కొరకే శ్రమించుచున్నాను''. 

దేవుని నమ్ముట అనుదానికి అర్థమిదే. మరియు అబ్రాహాము నేర్చుకోవలసియున్న మొదటి పాఠము ఇదే.

దేవుని ఆరాధించుట

అబ్రాహాము నేర్చుకోవలసియున్న రెండవ పాఠము ఆరాధన యొక్క నిజమైన అర్థము. దేవుని నమ్ముట (విశ్వసించుట) అనగా ఆత్మ విశ్వాసము మరియు స్వయంసమృద్ధి నుండి ఖాళీ చేసుకొనుటైతే, దేవుని ఆరాధించుట అనగా సమస్తమునుండి (ఒకరు కలిగియున్న వన్నిటినుండి) ఖాళీ చేయబడుట.

ఆదికాండము 15లో ఉన్నట్లే, ఆదికాండము 22లో కూడా, ఆ పద్దు, ''ఇవి జరిగిన తరువాత'' అను మాటలతో మొదలవుతుంది. ఇక్కడ కూడా, ఈ పరీక్షా ఘడియకు ముందు జరిగిన పరిస్థితులను మనము చూచినప్పుడు, అబ్రాహాము ఒక జయము పొందిన స్థితిలో ఉండుట మనము చూడగలము.అన్యులు అతని యొద్దకు వచ్చి, ''అబ్రాహాము, మేము నీ జీవితమును గమనించుచున్నాము, నీవు చేయుపనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు అని మేమెరుగుదము'' అని చెప్పిరి (ఆది 21:22). నిస్సందేహముగా వారు శారా ఏవిధముగా అద్భుతరీతిగా గర్భవతి అయినదో విని, దేవుడు ఈ కుటుంబముతో ఉన్నాడని ఒప్పించబడిరి. ఇశ్మాయేలు వెళ్ళగొట్టబడెను (పంపించివేయబడెను). ఇస్సాకు ఇప్పుడు అబ్రాహాము అతిప్రియమైన వాడుగా ఉండెను. ఈ సమయములో అబ్రాహాము దేవుని కొరకు కలిగియున్న తన మొదటి ప్రేమను భక్తిని కోల్పోయే తీవ్రమైన ప్రమాదములో ఉండెను. కాబట్టి దేవుడతనిని మరలా పరీక్షించి, ఇస్సాకును బలిగా అర్పించమని కోరెను.

త్యాగము మరియు ఆరాధన

దేవుడు మనలను అటువంటి కరిÄనమైన మరియు కష్టమైన పనులనుచేయుటకు పిలచుట మనమెప్పుడైనా విన్నామా? లేక ఆయన కేవలము తన వాగ్ధానములతో మనలను ఆదరించుట మాత్రమే వినుచున్నామా? దేవుడు మనతో ఎన్నడు ఒక కరిÄనమైన మాటచెప్పుట మనము విననియెడల మనము నిజముగా ఎప్పుడైనా దేవుడు మాట్లాడుట విన్నామా అన్నది సందేహించవలసిన విషయమేనని ఆస్వాల్డ్‌ చేంబర్స్‌ అనే దైవజనుడు చెప్పాడు.

దేవుడు ఎల్లప్పుడు ఆదరించే వాగ్ధానాలతో మనతో మాట్లాడుతున్నాడని మన శరీరానుసారమైన మనస్సులు ఊహించుకొనుట సులభమే. మనకు కరిÄనమైన మార్గము ఇష్టములేదు గనుక, దేవుడు మనలను ఒక కష్టమైన పనిచేయుటకు పిలచినప్పుడు, మనము దేవుని స్వరమునకు చెవిటివారముగా ఉండవచ్చు.

కాని అబ్రాహాము వినుటకు చెవులు కలవాడు మరియు దేవుడు ఆజ్ఞాపించిన దేనికైనా విదేయత చూపే హృదయము కలవాడు . మరుసటి రోజు తెల్లవారినప్పుడు అతడు లేచి దేవునికి లోబడుటకు ముందుకు వెళ్ళెను (3వ వచనము). దానిముందు రాత్రి దేవుడు మాట్లాడిన తరువాత ఆ మూల పురుషుడు ఏమి అనుభవించెనో వ్రాయబడలేదు. ఆ రాత్రి అతడు నిద్రించలేదని నేను ఖచ్చితముగా నమ్ముతాను. అతడు మెలకువగానుండి, వెళ్ళి తన ప్రియమైన కుమారుని మరలా మరలా చూచియుండును; తన కుమారునితో ఏమి చెయ్యవలెనో ఆలోచించినప్పుడు అతడు కన్నీరు కార్చియుండును. తన ముసలి వయస్సులో పుట్టిన కుమారున్ని అర్పించుట అబ్రాహాముకు ఎంత కష్టతరమైనదిగా యుండెనో. కాని ఎంత వెల చెల్లించవలసి వచ్చినా అతడు దేవునికి లోబడుటకు సిద్ధముగా ఉండెను. 50 ఏళ్ళ ముందు దేవుడు ఊరులో తనను పిలచినప్పుడు, అతడు నాగటిపై చేయి పెట్టెను; ఇప్పుడతడు వెనుకతట్టు చూడడు. ఒకరు చెప్పిన మాటలలో చెప్పాలంటే అబ్రాహాము ఈ విధముగా చెప్పెను:

 
 
''వెనుకతట్టు చూడకుండా నన్ను కాయుము- 
నా నాగటియొక్క చేతి పిడులు కన్నీళ్ళతో తడచియున్నవి, 
కత్తెరలు తుప్పుతో పాడైపోయినవి కాని 
నా దేవా, నా దేవా! వెనుకతట్టు తిరుగకుండా నన్ను కాయుము'' 
 

ఎటువంటి ఫిర్యాదులుగాని ప్రశ్నలుగాని లేకుండెను. ''ప్రభువా, నేనిప్పటికే ఎంతో నమ్మకస్థునిగా ఉన్నాను. ఇంత కష్టమైనది కూడా నన్నెందుకు అడుగుచున్నావు'' అని అబ్రాహాము అనలేదు. లేక, ''ప్రభువా, నేనిప్పటికే ఎంతో త్యాగము చేసాను, నా చుట్టూ ఉన్నవారికంటే మరెక్కువగా చేసాను. నన్నెందుకు ఇంకా త్యాగము చేయమని అడుగుచున్నావు?'' అని కూడా అతడు అనలేదు. అనేకమంది విశ్వాసులు వారుచేసిన త్యాగాలను ఇతరులు చేసిన త్యాగాలతో తరచుగా పోల్చిచూచుకొందురు. వారి చుట్టూ ఉన్నవారికన్నా ముందుకు వెళ్లమని దేవుడు వారిని కోరినప్పుడు వారు సంకోచించెదరు. కాని అబ్రాహాము అలా చేయలేదు. అతని విధేయతకు మరియు తన దేవుని కొరకు ఎటువంటి త్యాగము చేయుటకైనా ఉన్న సిద్ధపాటుకు ఎటువంటి హద్దులేకుండెను. అతడు దేవుని స్నేహితుడయ్యెను అను దానిలో ఆశ్చర్యము లేదు.

ఇస్సాకును బలిగా అర్పించుటకు అబ్రాహాము వెళ్లినప్పుడు, దేవుడు ఇస్సాకును ఏదో ఒకవిధముగా మరణమునుండి తిరిగి లేపునను విశ్వాసము అబ్రాహాము హృదయములో నుండెను. హెబ్రీ 11:19 మనకు ఆ విషయమును చెప్పుచున్నది. ఇస్సాకు జన్మించుట ద్వారా దేవుడు అబ్రాహాముకు శారాకు అప్పటికే పునరుత్థాన శక్తియొక్క రుచినిచ్చెను. కాబట్టి బలిపీఠముపైన చంపబడిన ఇస్సాకును తిరిగి జీవింపజేయుట దేవునికి ఒక సమస్య కాదు. కాబట్టి అబ్రాహాము తన దాసులను మోరీయా పర్వతము యొక్క దిగువున విడచిపెట్టినప్పుడు ఈ విధముగా చెప్పెను, ''నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరల (మేమిద్దరము) మీ యొద్దకు (తిరిగి) వచ్చెదము'' (5వ వచనము). అది విశ్వాసముతో చెప్పిన మాట. ఇస్సాకు అతనితో కూడా తిరిగి వచ్చునని అతడు నమ్మెను.

''మేము దేవుని మ్రొక్కుటకు వెళ్ళుచున్నాము'' అని కూడా అతడు చెప్పెనని గమనించండి. దేవుడు తననుండి చాలా ఎక్కువ అడుగుచున్నాడని ఫిర్యాదు చేయలేదు లేక దేవుని కొరకు తాను చేయబోయే విశిష్టమైన త్యాగము గూర్చి అతిశయపడలేదు. దేవునికొరకు తాముచేసే త్యాగాల గురించి కుటిలముగా ఇతరులకు తెలియజేసే కోవకు అబ్రాహాము చెందలేదు. తన దేవుని మ్రొక్కుటకు వెళ్ళుచున్నానని అబ్రాహాము చెప్పెను. అయితే అక్కడ మనము మ్రొక్కుట (ఆరాధన) యొక్క నిజమైన అర్థమును తెలుసుకొనవచ్చును.

''అబ్రాహాము నా దినము చూతునని మిగులానందించెను; అది చూచి సంతోషించెను'' అని ఏవిధముగా యేసు చెప్పెనో జ్ఞాపకము చేసుకొనుడి (యోహాను 8:56). ఖచ్చితముగా మోరీయా పర్వతముపైనే అబ్రాహాము క్రీస్తు దినమును చూచియుండును. ప్రవచనాత్మక దృష్టితో ఆ మూలపురుషుడు తాను చేసిన కార్యములో తండ్రియైన దేవుడు తన అద్వితీయ కుమారుడిని కల్వరిలో మానవాళి పాపము నిమిత్తమై బలిగా అర్పించుటను ఉపమానరీతిగా చూచెను. ఆ రోజున మోరీయా పర్వతముపైన ఒక దారితప్పిన లోకమును రక్షించుటకు దేవుని హృదయము చెల్లించవలసియున్న వెలను అబ్రాహాము కొంతమట్టుకు ఎరిగెను. ఆ ఉదయ కాలమున అతడు దేవుని హృదయముతో ఒక సన్నిహితమైన సహవాసములోనికి వచ్చెను. అవును, అతడు నిజముగా దేవుని ఆరాధించెను, కేవలము రమణీయమైన (అందమైన) మాటలతో, పాటలతో కాకుండా విలువైన విధేయత మరియు త్యాగముతో ఆరాధించెను.

దేవుని గూర్చి లోతైన మరియు సన్నిహితమైన జ్ఞానము అటువంటి విధేయత ద్వారానే వచ్చును. మన మనస్సుల్లో మనము విస్తారమైన మరియు ఖచ్చితమైన వేదాంత జ్ఞానమును కూడబెట్టుకోవచ్చునుగాని నిజమైన ఆత్మీయ జ్ఞానము, మనము అంతయు దేవునికర్పించినప్పుడే కలుగును. ఇతర మార్గమేమియూ లేదు.

ఇచ్చువాడా లేక ఆయన ఇచ్చిన వరమా?

అబ్రాహాము ఇచ్చినవానిని ఎక్కువ ప్రేమించునా లేక ఇచ్చిన వాటిని ఎక్కువ ప్రేమించునా అని ఇక్కడ పరీక్షింపబడెను. నిస్సందేహముగా ఇస్సాకు దేవుడిచ్చిన వరమే కాని తన కుమారుని కొరకు ఒక అమితమైన (విపరీతమైన) ఆప్యాయతను కలిగియుండె ప్రమాదములో అబ్రాహాము ఉండెను. అబ్రాహాము యొక్క ఆత్మీయ దృష్టిని మందగింపజేసే విగ్రహముగా ఇస్సాకు మారుచుండెను. కాబట్టి అటువంటి విషాదరకమైన పరిస్థితినుండి అబ్రాహామును కాపాడుటకు దేవుడు కల్పించుకొనెను.

ఎ.డబ్ల్యూ. టోజర్‌ అను దైవజనుడు, ''దేవుని యొక్క అనుసరణ'' అను పుస్తకములో ''ఏమియూ సొత్తుగా కలిగియుండకపోవుటలోని ధన్యత'' గురించి మాట్లాడెను. మోరీయా పర్వతముపైన దేవుడు అబ్రాహాముకు సమస్తమునుండి ఖాళీచేయబడుట మరియు ఏమియు కలిగియుండకపోవుట లోని ధన్యతను నేర్పించెను. ఆ రోజుకుముందు, అబ్రాహాము ఇస్సాకును గట్టిగా తన సొత్తుగా పట్టుకొనియుండెను. కాని తన కుమారుడిని బలిపీఠము పైనుంచి దేవునికర్పించిన తరువాత అతడు ఇస్సాకును ఇంకెప్పుడు గట్టిగా పట్టుకొనలేదు. అవును, దేవుడు ఇస్సాకును అబ్రాహాముకు తిరిగి ఇచ్చివేయుట మరియు అబ్రాహాము తనను ఇంటిలోనే కలిగియుండుట నిజమే. కాని అటుతరువాత అతడు ఇస్సాకును తనవానిగా (సొత్తుగా) ఎప్పుడూ కలిగియుండలేదు.అప్పటినుండి ఇస్సాకు దేవునికి చెందినవాడు. ఒక గృహనిర్వాహకుడు తన యజమాని యొక్క ఆస్తిని కలిగియున్నట్లు అబ్రాహాము ఇస్సాకును కలిగియుండెను. వేరే మాటల్లో చెప్పాలంటే, అతడు ఇస్సాకును కలిగియుండెను కాని, తన సొత్తుగా ఎప్పుడూ కలిగియుండలేదు.

ఈ లోకసంబంధమైన వాటియెడల మన వైఖరి ఈ విధముగా ఉండవలెను. మనము వాటిని కలిగియుండవచ్చు, వాటిని వాడుకోవచ్చు. కాని మనము వాటిలో దేనినైనను హత్తుకొనకూడదు. మనము కలిగిన వాటినన్నిటిని బటిపీఠముపైన పెట్టి దేవునికి సంపూర్తిగా సమర్పించవలసియున్నది. మనము దేనిని సొత్తుగా కలిగియుండకూడదు. అప్పుడు మనము దేవుడు మనకు బలిపీఠము నుండి తిరిగి ఇచ్చిన వాటిని మాత్రమే కలిగియుండవచ్

అధ్యాయము 4
క్రీస్తు జీవము యొక్క సౌందర్యము

క్రీస్తు మనకు బూడిదకు ప్రతిగా పూదండ నిచ్చుటకు వచ్చెను - అనగా ఆయన దేవస్వభావమనెడి పూదండను మన స్వజీవమనెడి బూడిదకు ప్రతిగా నిచ్చుటకు వచ్చెను. స్వజీవము యొక్క కొన్ని గుణలక్షణములను మనము చూచితిమి. సిలువ మార్గము అనగా విరుగగొట్టబడుట మరియు ఖాళీ చేయబడుటతో కూడియున్న మార్గమే మనలను మన స్వజీవము యొక్క చీకటి నుండి క్రీస్తు జీవము యొక్క సంపూర్ణ మహిమలోనికి నడిపించునని కూడా మనము చూచితిమి. ఒకనాడు, క్రీస్తుతిరిగి వచ్చినప్పుడు, నీడలన్నియూ మాయమైనప్పుడు, ఈ మార్గములో నడచిన వారందరిపైన ఈ మహిమ తగ్గిపోకుండా ప్రకాశించును. కాని ఇప్పుడు కూడా, భూమిపైన, ఆ మహిమను మన జీవితములు కొంతమట్టుకు ప్రతిఫలింపచేయగలవు. దీని కొరకే దేవుడు మనకు పరిశుద్ధాత్మ నిచ్చెను; ఆ పరిశుద్ధాత్మ మన జీవితములను నింపాలనుకొనుచున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా క్రీస్తు జీవము యొక్క సౌందర్యము మనలోనికి తేబడును.

ఒక ఆత్మ నింపుదల గల వ్యక్తి యొక్క గుణలక్షణాలను మనము ముందు, పరిశుద్ధాత్మ మరియు ఆయన పరిచర్యకు సంబంధించిన కొన్ని అపార్థాలను సరిచేయవలసిన అవసరమున్నది.

పరిశుద్ధాత్ముని యొక్క సార్వభౌమవత్వము

మొట్టమొదటిగా, పరిశుద్ధాత్మ సార్వభౌముడనియు, ఆయన అనేక రకములుగా పనిచేయుననియు మనము గుర్తుంచుకొనవలెను. ''ఏ విధముగా నీవు గాలి శబ్దమును విందువుగాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడికి వెళ్లునో చెప్పలేవు, అదే విధముగా ఆత్మ కూడా ఉండును'' అని యేసు చెప్పెను (యోహాను 3:8 లివింగు బైబిలు). మనము గాలిని, దాని వేగమును గాని దాని దిశను గాని నియంత్రించలేము. ఆ విధముగానే పరిశుద్ధాత్మను కూడ నియంత్రించలేము. అయినప్పటికీ అనేక మంది విశ్వాసులు ఆయనను నియంత్రించగలమని, ఆయనను తమ నియమనిబంధనాలకు అనుగుణముగా పని చేయించుకోగలమని తలంచుదురు.

త్రిత్వములో రెండవ వ్యక్తి భూమిపై నున్నప్పుడు, పరిసయ్యులు ఆయనను తమ నియమాలతోను, సంప్రదాయాలతోను కట్టడిచేేయాలని ప్రయత్నించిరి. కాని ఆయన వారి నీళ్ళు చోరవని కక్షలలో బంధింపబడుటకు (నియమనిబంధనాల చేత కట్టివేయబడుటకు) నిరాకరించెను. ఈ రోజున ఇవాంజలికల్‌ క్రైస్తత్వములో ఉన్న పరిసయ్యుల యొక్క వారసులు త్రిత్వములో మూడవ వ్యక్తిని (పరిశుద్ధాత్మను) వారి సంప్రదాయాల మరియు వారి మానవ జ్ఞానముయొక్క పరిమితులలోనే పనిచేయుటకు కట్టడిచేేయాలని ప్రయత్నించుచున్నారు. కాని ఆయన మానవ నిర్మిత క్రమాలకు అనుగుణముగా పనిచేయుటకు నిరాకరించును. ఆయన కిష్టమైన చోట ఆయన విసరును(పని చేయును). ఆయన పని చేయు శబ్దమును మనము వినవచ్చుగాని, ఆయన మనచేత నియంత్రించబడడు లేక నిర్దేశించబడడు. ఆయన మన జీవితాలలో పనిచేసిన రీతిగానే ఇతరుల జీవితాలలో కూడా పనిచేయాలని చెప్పలేము; లేక గతంలో ఆయన పనిచేసిన విధముగా ఈ రోజున కూడా పనిచేయాలని చెప్పలేము. లేదు. ఆయన సార్వభౌముడు. మనము చేయగలిగిన శ్రేష్టమైన పనిఏమిటంటే ఆ గాలి వీచు దిశవైపు తిరిగి ఆ గాలి మనలను మోసికొనిపోవుటకు అనుమతించుటయే. పరిశుద్ధాత్ముడు ఏ ఒక్క మత శాఖ యొక్క సిద్ధాంతపరమైన కక్షలో కట్టివేయబడలేడు. ఆయన పనిచేయు విధానము ద్వారా ఆయన మనలను ఆశ్చర్యపరచునని మనము కనుగొనెదము. పెంతెకోస్తువారును, పెంతెకోస్తుకాని వారును దీనిని గుర్తించవలసిన అవసరమున్నది!

పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు ఒక సుడిగాలి వలే తననుతాను వ్యక్తపరచుకోవచ్చు. భావోద్వేగాలు లోతుగా కదిలింపబడవచ్చు, శారీరకమైన ప్రతిస్పందనలు కూడా ఉండవచ్చు. దీనిని అంగీకరించుటకు మనము అనుకూలముగా నుండవలెను. దేవుడు యోబుతో ఒక సుడిగాలినుండి మాట్లాడెను (యోబు 38:1).

ఆత్మ అప్పుడప్పుడు ఆత్మ ఒక నిమ్మళమైన పిల్లగాలివలే వీచునని కూడా మనము గుర్తుంచుకొనవలసిన అవసరమున్నది. ఏలియా సుడిగాలి వీచుట వినినప్పుడు, దేవుడు ఆ సుడిగాలిలో ప్రత్యక్షముకాలేదని చెప్పబడెను (1 రాజులు 19:12). భాకోద్వేగములు కదిలింపబడిన ప్రతిసారి, దేవుడు కదలించినట్లు కాదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలెను. ఏలియాతో దేవుడు ఒక నిమ్మళమైన గాలి ద్వారా మాట్లాడెను (1 రాజులు 19:12).

పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు పెనుగాలి వలె వీచడు. కొన్నిమారులు ఆయన అలా చేయును, కాని ఎల్లప్పుడూ కాదు. ఆయన ఒకసారి ఒకరి జీవితములో సుడిగాలివలే వీచెను కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి జీవితములో ఎల్లప్పుడు అలా వీచవలెనని మనము ఆశించకూడదు. అదే విధముగా ఆయన ఎల్లప్పుడు ఒక నిమ్మళమైన పిల్లగాలివలే వీచాలని ఆశించకూడదు. కాని ఆయన సుడిగాలి వలే మనకున్న అనేకమైన సంఘములపై వీచి, వాటిలో క్రీస్తును ఘనపరచని వాటిని పెల్లగించవలసిన అవసరం మనకున్నది.

బహుమతి చుట్టూ ఉన్న కట్టును(కవరును) బహుమతని మనము పొరబడకూడదు. పరిశుద్ధాత్మే తిరిగిలేచిన ప్రభువు తన సంఘమునకిచ్చిన వరము. ఆయన ప్రజలపైనకు దిగివచ్చినప్పుడు, అది హల్లెలూయ అరుపులతో, కన్నీళ్ళతో, భాషలు మాట్లాడు వరముతోకావచ్చు, లేక ఎక్కువ భావోద్వేగాలు లేకుండా, నిమ్మళముగా నిశ్శబ్దముగా కావచ్చు. వ్యక్తిత్వాలు వేరుగానుండును కాబట్టి దేవుని ఆత్మ (అనేకమంది క్రైస్తవులవలే కాకుండా) ప్రతి వ్యక్తిత్వమునకు అనుగుణముగా పొసగించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మనము పొందినట్లే ఇతరులుకూడా పొందవలెనని ఆశించుట అవివేకము - అది అసాధారణముగా కావచ్చు లేక సాధారణముగా కావచ్చు. శిశువులు మాత్రమే బహుమతి ఉన్న కవరును ఇష్టపడుదురు. పరిణితిచెందిన వారు బహుమతే కవరు కంటే ముఖ్యమైనదని గుర్తించుదురు. అపోస్తులుడైన పౌలు యేసుని దర్శనము ద్వారా మార్చబడెను. కాని రక్షింపబడుటకు అందరూ అటువంటి దర్శనమును పొందవలెనని అతడు బోధించలేదు. లేదు. ఎటువంటి కవరులో ఆ బహుమతి వచ్చినప్పటికీ, అంతరంగములో వాస్తవికతే ముఖ్యమైనదని అతడు గుర్తెరిగెను. ఆత్మ నింపుదల విషయములో కూడా ఇది నిజమే.

పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యము

రెండవదిగా, పరిశుద్ధాత్మ ఎప్పుడూ దేవుని వాక్యమునకు అనుగుణముగా పనిచేయునని మనము గుర్తించవలెను-ఎందుకనగా ఆయనే ఆ వాక్యమును వ్రాసెను మరియు ఆయన మారనివాడు. ఈ సత్యమును లేఖనములోని మొట్టమొదటి పేరాగ్రాఫ్‌ లోనే మనము చూడగలము. చీకటి భూమిని కమ్మియుండగా, దేవుని ఆత్మ దానిపై అల్లాడు చుండెను. అప్పుడు దేవుని వాక్కు బయలువెళ్ళెను - ''వెలుగుకలుగును గాక''. కాబట్టి పరిశుద్ధాత్మ మరియు దేవుని సృజనాత్మకమైన వాక్కు కలసి పనిచేయుట ద్వారా చీకటిలోనికి వెలుగు వచ్చెను మరియు అంతకుముందు నిరాకారము శూన్యము ఉన్నచోట సంపూర్ణత ఆకృతివచ్చెను (ఆది 1:1-3).

నూతన జన్మ మనలో దేవుని వాక్యము నాటబడుటకును (1 పేతురు 2:3) పరిశుద్ధాత్మ కార్యముచేయుటకును (తీతు 3:5) ఆపాదించబడినది. అలాగే పరిశుద్ధత కూడా దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ మన జీవితములలో పనిచేయుట వలన వచ్చు ప్రతిఫలము (యోహాను 17:7ను 2 థెస్స 2:13తో పోల్చిచూడండి). అదే విధముగా, ఆత్మనింపుదల మరియు దేవుని వాక్యముతో నిండియుండుట కూడా కలిసియుండును. ఎఫెసీ 5:18 నుండి 6:9 ని కొలస్సీ 3:15-21తో పోల్చిచూచినప్పుడు ఇది స్పష్టమగును. ఎఫెసీ వాక్యభాగములో, కృతజ్ఞత చెల్లించుట, దేవుని స్తుతించుట, కుటుంబ సంబంధాలలో ఒకరికొకరు లోబడుట ఆత్మనింపుదల యొక్క ఫలితమని మనకు చెప్పబడినది. అయితే కొలస్సీ వాక్యభాగములో ఈసంగతులన్నియు దేవుని వాక్యముచేత నింపబడుటవలన వచ్చిన ఫలితముగా మనకు చెప్పబడినది.

మనము సమతుల్యమైన క్రైస్తవులుగా ఉండవలెనంటే ఈ సత్యమును మనము గుర్తించవలసియున్నది. ఒక ఆవిరితో నడిచే రైలు ముందుకు వెళ్ళుటకు కేవలము ఆవిరి మాత్రమే కాకుండా రైలు పట్టాలుకూడా అవసరము. ఆత్మీయ పురోగతి సాధించుటకు మనకు దేవుని ఆత్మ అనెడి ఆవిరి అవసరము, అయితే మనము దారితప్పిపోకుండా దేవుని వాక్యమనెడి పట్టాలు కూడా కావలెను. ఒకదాని కంటే మరోకటి ముఖ్యమైనది కాదు. రెండు సమానముగా ముఖ్యమైనవే. ధూమముతో నిండియున్నామని చెప్పుకొనేకొందరు, పట్టాలను నిర్లక్ష్యముచేసి బురదలో కూరుకుపోయిరి (ఇరుక్కపోయిరి). వారు తమ అనుభవానికి ప్రాముఖ్యతనిచ్చి ప్రతి ఒక్కదానిని దేవుని వాక్యముతో పరీక్షించుటకు జాగ్రత్త పడలేదు గనుక దానికి ఫలితముగా పట్టాలు తప్పిపోయిరి. ఒక పట్టాలు తప్పినబండి గట్టిగా ఈలవేయునట్లు వారిలో అనేకమంది వారికూడికలలో ఎంతో సందడి చేయుదురు, కాని వారి జీవితాలలో ఎటువంటి ఆత్మీయ ఎదుగుదల, క్రీస్తు స్వారూప్యములో ఎదుగుదల ఉండదు.

ఇతరులు దీనికి వ్యతిరేకమైన విపరీత ధోరణి అవలంబించిరి. వారు పట్టాపై ఉన్నప్పటికి, వారు ఇంజను ధూమముతో నిండియుండవలసిన ఆవశ్యకతను తృణీకరించి (లేక వారికి ఆత్మ నింపుదల లేకపోయినను ఉన్నట్లు ఊహించుకొని) ఇరుక్కుపోయిరి. వారు దేవుని వాక్యముయొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటించుదురు మరియు ప్రతి పొల్లు, ప్రతిసున్న విషయములో జాగ్రత్తపడుదురు. వారు పట్టాలకు మెరుగుబెట్టుచూ వాటిని మెచ్చుకొనుచుందురు. కాని వారికి పరిశుద్ధాత్మ నింపుదల అవసరమని వారు గుర్తించరు. వారి సిద్ధాంతములు సరియైనవే - పట్టాలు ఖచ్చితముగా నేరుగా ఉన్నవి- కాని ఇంజను కదుపుటకు ధూమము లేదు. వారి సిద్ధాంతములలో వారు చచ్చినంత సరిగ్గా ఉన్నారు, కాని వారు సరిగ్గా చచ్చినవారిగా ఉన్నారు!

మన పరిమితి కలిగిన జ్ఞానము

మూడవదిగా, మనలో శ్రేష్టులైన వారికి కూడా పరిశుద్ధాత్మ గురించి, ఆయన కార్యముల గురించి అంతా తెలియదని మనము గుర్తించవలసియున్నది. కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్మకు సంబంధించిన ప్రతియొక్క విషయమునకు వారియొద్ద జవాబులున్నవని అభిప్రాయమును కలిగించుదురు. ఆ అంశముపైన వారు బైబిలు సంబంధమైన బోధను విశ్లేశించి ప్రతియొక్క వచనమును చక్కగా వర్గీకరించిరి. అటువంటి వారిని బట్టి నేను చాలా జాగ్రత్త వహిస్తాను. ఎందుకంటే వారు ఈ విషయములో తప్పని నాకు తెలుసు. మనకు అంతా తెలియదు. మనము కొంత మట్టుకు ఎరుగుదుము- ప్రత్యేకముగా ఆత్మయొక్క పరిచర్యకు సంబంధించిన విషయములో (1 కొరిందీ¸ 13:9,12). మన పరిమితి గల మరియు పాపముతో కలుషితమైన మనస్సులు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనమును విశాలతను పూర్తిగా అర్థము చేసుకోలేవని అంగీకరించవలసిన అవసరమున్నది.

ఎ.డబ్ల్యు.టోజర్‌ అనే దైవజనుడు బైబిలులోని అతి ప్రగాఢమైన వాక్యము ''ప్రభువా, దేవా, అది నీకే తెలియును!'' (యెహెజ్కేలు 37:3) అని చెప్పెను. దేవుని విషయములు అర్థంచేసుకొనుటలో మనము ఒక స్థాయికి వచ్చినప్పుడు ఈ విధముగా చెప్పవలసియున్నది,

''ప్రభువా, దేవా, నాకు ఇంత మట్టుకు తెలుసు, కాని దీనికి మించి నాకు తెలియనిది ఇంకా ఎంతో ఉంది. నేను సత్యముయొక్క అంచుకు మాత్రమే వచ్చియున్నాను''.

యోబు చెప్పినట్లు,

::before ''ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్డము వంటిదే గదా! గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?'' (యోబు 26:14). ::after

ఇటువంటి వైఖరి బైబిలులో స్పష్టమైన ఉపదేశములేని పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయములలో ఎన్నో శరీరానుసారమైన సిద్ధాంతములనుండి మనలను కాపాడును. పరిశుద్ధాత్మయొక్క పరిచర్య విషయములో మనకున్న అభిప్రాయములు లేని విశ్వాసుల యెడల మనకు ఆ వైఖరి ఎక్కువ ఓర్పు నిచ్చును. వారు తప్పు కావచ్చు-కాని మనము కూడా తప్పు కావచ్చు! లేఖనములో స్పష్టముగా బయలుపరచబడినది మన ఉపదేశము కోసమే. దానిని మించి మనము ఊహాగానములు చేయకూడదు (ద్వితీ 29:29).

అడ్డుదారులు లేవు

నాల్గవదిగా ఆత్మ నింపుదల గల జీవితమునకు ఏ అడ్డుదారి లేదు, జయమును ఖచ్చితముగా నిచ్చే ఏ సుళువైన సూత్రము లేదు. మన రోజుల్లో మీట నొక్కితే పనిచేసే యంత్రములు కాయకష్టమును భర్తి చేసినవి, మానవుడు సుఖ సౌఖ్యాలతో కూడిన జీవము అనే తత్వమును అంగీకరించాడు. క్రైస్తవులు తమకు తెలియకుండానే ఈ వైఖరిని ఆత్మీయ విషయాలలోకి కూడా తేగలరు. దీని ఫలితమేమంటే పరిశుద్ధాత్మతో నింపబడుటకు ఏదో ఒక సుళువైన సూత్రము కలదని మనమనుకొనెదము. ''ఈ మూడు మెట్టులు తీసుకొంటే మీరు తక్షణమే నింపబడుదురు!'' కాని అటువంటి సూత్రమును మనము బైబిలులో కనుగొనలేము. ఒక వ్యక్తి జీవితములో పరిశుద్దాత్మచేయు కార్యమును ఒక సూత్రాల పట్టికగా మార్చకుండుటకు మనము జాగ్రత్త పడవలెను. ఆత్మ నింపుదల అనేది యాంత్రికమైన విషయము కాదు గాని జీవముకు సంబంధించిన విషయము. ఆత్మీయ జీవమును సూత్రాల ద్వారా వ్యక్తపరచలేము.

విూరు ఆత్మతో నిండియున్నారని అతిశయపడకుడి

అయిదవదిగా, నూతన నిబంధన గ్రంథమంతటిలో గమనించవలసిన నిజమేమిటంటే, కొంతమంది జనులు 'ఆత్మతో నిండియున్నారని' చెప్పబడినప్పటికీ (అపొ.కా.6:5; 11:24) ఎవరూ కూడా తమకు ఆత్మనింపుదల ఉన్నదని సాక్ష్యమివ్వలేదు.

నేనిప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము (లేక కొన్ని వాక్య భాగాలలో ఉన్నట్లు, ఆత్మను పొందుట) గురించి చెప్పుటలేదు. అది ఆత్మ నింపుదలకు కావలసిన మొదటి అనుభవము. దీనిగురించి ప్రతియొక్క విశ్వాసి ఆత్మను పొందెనా లేదా అను విషయము గూర్చి స్పష్టమైన సాక్ష్యమును కలిగియుండవలెనని అపోస్త్తలులు భావించిరి (అపొ.కా. 19:2; గలతీ 3:2 చూడండి).

కాని ఎఫెసీ 5:18లో, పౌలు అప్పటికే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన ఎఫెసీ క్రైస్తవులకు ''ఆత్మతో నింపబడుచూ ఉండుడి'' (బాషాంతరము) అని హెచ్చరించెను. వేరే మాటలో చెప్పాలంటే ఎల్లప్పుడు ఆత్మతో నిండియుండవలెను. ఇటువంటి నింపుదల గలిగి ఆత్మలో నడిచేవారిని మాత్రమే ''ఆత్మతో నిండియున్న'' స్త్రీ పురుషులుగా సంభోధించవచ్చు కాని ఇది ఇతరులు గమనించవలసిన విషయము. మనము సాక్ష్యమిచ్చుకొనే విషయముకాదు. మోషే యొక్క ముఖము దేవుని మహిమతో ప్రకాశించినప్పుడు, ఇతరులు దానిని చూచిరి గాని అతనికి అది తెలియకుండెను (నిర్గమ 34:29,30).

ఆత్మతో నిండియుండుట అనగా క్రీస్తుయొక్క ఆత్మతో నిండియుండుట అన్నమాట; మరియు మన వ్యక్తిత్వములో క్రీస్తు స్వారూప్యము యొక్క ఫలమును బట్టి ఇతరులు మనము ఆత్మతో నిండియున్నామని తెలుసుకొందురు. దీనిగురించి మనము సాక్ష్యమివ్వనవసరము లేదు, ఎందుకనగా మన జీవితము మన మాటల కంటే బిగ్గరగా పలుకును.

పౌలుయొక్క మాదిరి

గలతీ 2:20 లో పౌలు చేసిన ప్రకటన కంటే ఆత్మ నింపుదల గల జీవితముగురించి స్పష్టమైన వివరణ బహుశా ఇంకెక్కడ లేదు, ''నేను క్రీస్తుతో కూడ సిలువవేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు''. మనలో క్రీస్తు జీవమును పునరుత్పత్తి చేయుటకు కాకపోతే ఆత్మ నింపుదలయొక్క ఉద్దేశ్యము ఇంకా ఏమైయుండును? కాబట్టి మన స్వజీవము ఏ మేరకు సిలువవేయబడునో, ఏ మేరకు క్రీస్తు జీవము మనలో వ్యక్తపరచబడునో, ఆ మేరకే మనము పరిశుద్ధాత్మతో నిండియున్నాము.

పౌలు గలతీ క్రైస్తవులతో ఈ విధముగా చెప్పెను, ''సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటి వారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను''. పౌలు ఇతరులను తన మాదిరిని అనుసరించమని చెప్పగలిగిన వ్యక్తి. ''నా తట్టు చూడకుడి గాని క్రీస్తుతట్టు చూడుడి'' అని అతడు చెప్పవలసి రాలేదు. అతడు పదేపదే ఇతరులను తన స్వంత జీవితము యొక్క మాదిరిని చూడమని, తాను క్రీస్తును పోలి నడుచుకొన్న ప్రకారము తనను పోలి నడచుకొనమని కోరెను (1 కొరిందీ¸ 4:16; 11:1; ఫిలిప్పీ 3:17 చూడండి).

అతడు ఎంత సంతృప్తికరమైన క్రైస్తవ అనుభవము కలిగియుండెనంటే, సంకెళ్ళలో ఉన్నప్పటికీ అతడు అగ్రిప్ప రాజుతో ఈ విధముగా చెప్పగలిగెను, ''రాజా, లోకములో నీకెంత ఉన్నప్పటికీ (ఆత్మీయముగా) నేనున్నట్లు నీవు ఉండవలెనని కోరుకొనుచున్నాను'' (అ.కా.26:19). అతడు అతిశయించుట లేదు, ఎందుకనగా వేరొకచోట అతడు ఈ విధముగా చెప్పెను,''నేనేమైయున్నానో దేవుని కృపవలననే అయియున్నాను'' (1 కొరిందీ¸ 15:10).

కాబట్టి క్రీస్తు జీవయుయొక్క గుణలక్షణాలను కొన్నింటిని చూచుటకు అపోస్తులుడైన పౌలు యొక్క. జీవితమును, పరిచర్యను పరిశీలించెదము. పౌలు తన జీవితమును, పరిచర్యను,''నేను'' అన్నమాటతో వర్ణించిన 8 వాక్య భాగములను మనము లేఖనములనుండి పరిశీలించెదము.

మనము ముందుగా ఆత్మ నింపుదల గల పరిచర్యయొక్క లక్షణాలను చూచి తరువాత ఆత్మ నింపుదల గల జీవితము యొక్క లక్షణాలను చూచెదము.

ఆత్మ నింపుదల గల పరిచర్య

అపోస్తులుడైన పౌలు యొక్క మాటలనుండి ఆత్మ నింపుదల గల పరిచర్య గురించి నాలుగు సంగతులు చెప్పాలనుకొనుచున్నాను.

ఒక ప్రేమ - బానిస

మొట్టమొదటిగా, ఆత్మ నింపుదల గల పరిచర్య ఒక ప్రేమ-బానిస (ప్రేమను బట్టి బానిసగా సమర్పించుకొనుట) యొక్క పరిచర్య. అపోస్తులుల కార్యములు 27:23 పౌలు ఈ విధముగా చెప్పెను, ''...నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో''. తన దేవునికి అతడు ప్రేమనుబట్టి బానిసగా ఉండెను. తన జీవితముపై అతడు ఏ హక్కు కలిగియుండలేదు. తన యజమానికి అతడు అంతయూ సమర్పించెను.

మన సమర్పణకు సరియైన పునాది మనము సంపూర్ణముగా దేవునికి మొదటిగా చెందినవారమన్న సత్యమును గుర్తించుటయే. దేవుడు మన కొరకు చేసిన దానిని బట్టి కృతజ్ఞతతో ఆయనకు సమర్పించుకొనుట మంచిదైనప్పటికీ, క్రైస్తవ సమర్పణకు అది సరియైన పునాది కాదు.

క్రీస్తు కొరకు మనకున్న ప్రేమ ఆయన కొరకు మనము చేయు సేవయొక్క ముఖ్య ఉద్దేశ్యము కావచ్చు. కాని ఆయన సిలువపై మనలను కొనెనన్న సత్యము యొక్క పునాదిపైన మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకొనవలెను. కాబట్టి ఇప్పుడు మనము దేవుని సొత్తుగనుక, మనపై మనకు ఏ హక్కులేదు.

పాతకాలములో బానిసలు వారి యజమానులను సేవించినప్పుడు, అది ప్రధానముగా వారు వారి యజమానులను ప్రేమించుట వలన కాదు గాని వారు వారి యజమానుల సొత్తు అయినందున సేవించిరి! కాబట్టి ఒక వ్యక్తి తన జీవితమునంతటిని దేవునికిచ్చినప్పుడు అతడు దేవునికి ఒక గొప్ప ఉపకారము చేయుటలేదు. లేదు! అతడు దేవునియొద్దనుండి దొంగిలించన దానినే ఆయనకు తిరిగి యిచ్చుచున్నాడు.

నేను ఒక వ్యక్తి యొక్క డబ్బును దొంగిలించి, తరువాత, నా పాపమును బట్టి ఒప్పించబడి ఆ డబ్బును అతడికి తిరిగి ఇచ్చిన యెడల నేను ఖచ్చితముగా ఆ వ్యక్తికి ఉపకారము చేయుట లేదు. నేను ఒక మారుమనస్సు పొందిన దొంగగా అతని యొద్దకు వెళ్ళుదును. అయితే మన జీవితములను దేవునికి ఇచ్చుటకు ఆయనను సమీపించినప్పుడు మనము అవలంబించవలసిన సరియైన వైఖరి అదే. దేవుడు మనలను కొనుగోలు చేసెను. మనము దానిని గుర్తించినప్పుడు, సమర్పణకు సరియైన పునాదియొద్దకు మనము వచ్చెదము.

పౌలు ప్రభువు యొక్క ప్రేమ-బానిసగా నుండెను. తన యజమానిని ప్రేమించుటవలన, తన సేవ యొక్క ఏడవ సంవత్సరములో స్వతంత్రుడుగా వెళ్ళగలిగినప్పటికీ, ఆ సేవలో కొనసాగించుటకు ఎంచుకొన్న హెబ్రీయుడైన బానిసవలె (నిర్గమ 21:1-6) పౌలు తన ప్రభువును సేవించెను. అతడు జీతము కొరకు పనిచేసే దాసుడు కాదుగాని తనకు ఎటువంటి హక్కులు లేకుండా సేవించిన ప్రేమ-బానిస. క్రిందటి పద్యములో ఒక ప్రేమ-బానిస యొక్క పరిచర్యను ఒకరు ఈ విధముగా వ్యక్తం చేసిరి:

 
''నేను కేవలము ఒక బానిసను! 
నాకు ఎటువంటి స్వతంత్య్రము లేదు; 
నేను అతి చిన్న దానిని ఎంచుకొనలేదు- 
నేను వెళ్ళుదారి సహితము 
నేను ఒక బానిసను! 
నా యజమానుడు చెప్పినది చేయుటకు ఉంచబడినాను- 
ఆయన నన్ను పగలైనా, రాత్రైనా పిలువగలడు 
నేనొక దాసుడినై యుండినయెడల, నేను జీతము అడుగగలను- 
కొన్ని విషయాలలో స్వాతంత్రము అడుగగలను 
కాని నేను కొనబడిన వాడను, 
నా యజమానుడు నాకొరకు చెల్లించిన వెల రక్తము, 
కాబట్టి నేనిప్పుడు ఆయన బానిసను- 
ఇంకెప్పటికీ అలాగే నుందును 
ఆయన నన్ను ఇక్కడకు తీసుకువెళ్ళును, ఆయన నన్ను అక్కడకు తీసుకువెళ్ళును, 
ఏమి చేయవలెనో ఆయన నాతో చెప్పును; 
నేను కేవలము లోబడుదును, అంతే- 
నేనాయనను నమ్మెదను కూడా!'' 

ప్రేమ-బానిసగానుండుటకు అర్థము ఇదే.

దేవుడు తనకు ఎంతగా సమర్పించుకొన్నవారి కొరకు చూచుచున్నాడంటే, వారు ఆయన తమకు ఏమి చేయవలెనో తెలిసికొనుటకు ఆయన తట్టే ఎప్పుడూ చూచుదురు-అంతేకాని దేవుని కొరకు వారికేమిచేయవలెననిపించెనో దానిని చేసేవారు కాదు. ఒక బానిస తనకు చేయాలని పించినదంతయు చేయుచూ తిరుగుచుండడు. లేదు. ఆ బానిస తన యజమానిని ఈ విధముగా అడుగును, ''ప్రభువా, నీవు నన్ను ఏమి చేయవలెనని కోరుచున్నావు?'' మరియు ఆయన అతనికి చెప్పినది అతడు చేయును. ''ఒక దాసుని గురించి అతి ముఖ్యమైన విషయమేమిటంటే అతడు కేవలము తన యజమాని చెప్పినది చేయును'' (1 కొరిందీ¸ 4:2 లివింగు బైబిలు) అని బైబిలు చెప్పుచున్నది. ఒకరు చక్కగా వర్ణించినట్లు, ఇటువంటి వ్యక్తి కొరకు ప్రభువు చూచుచున్నాడు.

 
''నేను నా చేతితో నా కంటితో చేయు సైగలకొరకు వేచి ఎదురుచూచే వాని కొరకు నేను 
వెదకుచున్నాను; 
నేనిచ్చిన పనిని నా పద్ధతి ప్రకారము చేయువాని కొరకు వెదకుచున్నాను; 
నేనివ్వని పనిని విడచిపెట్టు వానికొరకు వెదకుచున్నాను; 
ఆహా, ఇటువంటి వానిని నేను కనుగొనినప్పుడు నాకు ఎంత ఆనందము కలుగును, 
నా చిత్తమంతటిని చేయువ్యక్తి, 
తన యజమాని యొక్క మనస్సును అధ్యయనం చేయుటకు పూనుకొన్న వ్యక్తి కొరకు 
చూచుచున్నాను. 

''నేను ఒకని కొరకు వెదకితిని కాని ఒక్కడైననూ కనబడలేదు'' అని ప్రభువు ఒకసారి చెప్పెను (యెహెజ్కేలు 22:30). ఈ రోజున ఆయన తనకు, ప్రేమను బట్టి బానిసలుగా ఉండువారికొరకు వెదకుచున్నారు. కాని ఆయన చాలా కొద్ది మందినే కనుగొనును.

సువార్తీకరణ కొరకు ఆసక్తి- ఉద్వేగభరిత ఉత్సాహముకాదు.

రెండవదిగా, ఆత్మనింపుదల గల సేవ, ఇతరులయెడల తనకున్న ఋణమును గుర్తించే సేవ. ''నేను గ్రీసుదేశస్తులకు (నాగరికులకు) గ్రీసు దేశస్తులు కానివారికి (అనాగరికులకు) ఋణస్తుడను'' అని పౌలు చెప్పాడు (రోమా 1:14). దేవుడు మనకు ప్రపంచములో పంచుకొనుటకు ఒక నిధినిచ్చెను. మనము అనేకమందికి మనీ-ఆర్డరులను ఇచ్చుటకు ఒక పెద్ద మొత్తమును అప్పగింపబడిన తపాలా-కార్యాలయములో పనిచేసే ఉద్యోగులుగా ఉన్నాము. అటువంటి ఉద్యోగి ఎవరికి రావలసిన మొత్తము వారికి చెల్లించేవరకు వారికి ఋణస్తుడిగా ఉండును. అతడు వేలకొలది డాలర్లను(లక్షల కొలది రూపాయలు) కలిగియుండవచ్చును గాని, దానిలో ఒక్క సెంటుకూడా(రూపాయి కూడా) అతనిది కాదు. అతడు అనేకులకు ఋణస్తుడు.

దేవుడతనికి సువార్త వర్తమానమును అప్పగించినప్పుడు అపోస్తులుడైన పౌలు కూడా అటువంటి ఋణమును గుర్తించెను. అది ఇతరులకు ఇచ్చుటకేనని అతడు గ్రహించెను. ఇతరులకు రక్షణ గురించిన వర్తమానమును ఇచ్చేవరకు తాను వారికి ఋణస్తునిగా ఉండునని అతడెరిగెను. పాతిక సంవత్సరములు సువార్తను ప్రకటించుచూ గడిపిన తరువాత కూడా పౌలు ''నేను ఋణస్తుడను'' అని, రోమీయులకు తన ఋణమును తీర్చుటకు రోముకు వచ్చుటకు సిద్ధముగానున్నానని రోమీయులైన క్రైస్తవులతో పౌలు చెప్పెను. రోమీయులకు వ్రాసిన పత్రిక 1:14-16లో పౌలు ''నేను'' అను పదమును ఏవిధముగా వాడెనో గమనించండి: ''నేను ఋణస్తుడను; నేను సిద్ధముగా నున్నాను; సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను''.

ఆత్మనింపుదలగల పరిచర్య స్నేహపూర్వకముగా నుండును. ఇతరులకు తన ఋణమును గురించి, అది ఆ ఋణమును తీర్చుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా నుండును. ఆత్మ నింపుదల మరియు క్రీస్తు జీవము యొక్క సౌందర్యము యొక్క ఆధారము ఉద్వేగభరితమైన అనుభవాలలో చూడలేము గాని, ఈ విధముగా చెప్పే హృదయములోని ఆసక్తిలో చూడవచ్చు. శ్రీమతి ఎఫ్‌.సి. డుర్హావ్‌ుగారు చక్కగా వ్రాసినట్లు:

 
 
''నేను నీ దాసుడను, నీ బానిసను; ఇంకెప్పుడు 
నాలోనున్న ఈ తీవ్రమైన ఆసక్తినుండి విడుదల పొందను, 
ఒక జాతినుండి మరొకజాతికి, ఒక ఒడ్డునుండి మరొక ఒడ్డుకి, 
మానవ పాపముయొక్క క్షమాపణగూర్చిన సంతోషకరమైన వార్తను వ్యాపింపజేసే ఆసక్తి 
 
 
 
నాకు మనుష్యుల ఆత్మలను ఇమ్ము, లేనియెడల నేను చనిపోవుదును. 
నాకు వెల చెల్లించుటకు ఇష్టపడే ప్రేమనిమ్ము, 
నాకు అన్ని అవరోధాలను లెక్కచేయని విశ్వాసము నిమ్ము, 
నాకు తప్పిపోయిన వారిని ఇంటికి తీసుకొనివచ్చే ఆనందము నిమ్ము'' 
 

ఆత్మ నింపుదల గల సేవ సువార్తీకరణ కొరకు ఆసక్తి కలిగియుండును మరియు అది ఎల్లప్పుడు స్నేహపూరితముగా నుండును. అది తన స్వంత సంతృప్తి కొరకు కాక, ఇతరుల అవసరాల కొరకు చింత కలిగియుండును. క్రీస్తు కూడా తన సంతృప్తిని వెదకలేదు (రోమా 15:3).

ఆత్మ నింపుదల మరియు ఆయనిచ్చు వరములు మన భావోద్వేగాలను తృప్తిపరచుటకు కాదని మనరోజుల్లో ఉద్ఘాటించవలసిన అవసరమున్నది. అవి ప్రదర్శింపబడుటకు ఖచ్చితముగా ఇవ్వబడలేదు. ''ప్రదర్శన'' అనేది చిన్న పిల్లలు ఎక్కువగా చేసేది అని ఎ.డబ్ల్యు.టోజరుగారు చెప్పిరి! దేవుడు మనలను ఆత్మీయముగా పరిణితి చెందినవారిగా ఉండాలని కోరుచున్నాడు, అలా మనమైనప్పుడు, మన ఆసక్తి ఉద్వేగపూరితమైనదిగా కాకుండా, ప్రదర్శించేటిది కాకుండా సువార్తీకరణ పట్లనుండును.

ఇ.ఎల్‌.కాటల్‌ రచించిన ''పరిశుద్ధమైన ఆత్మ'' అను పుస్తకములో అతడు బావోద్వేగాలయొక్క ప్రమాదాలలో కొన్నిటిని గూర్చి వ్రాసెను- దేవునికి బదులు ఉద్వేగభరితమైన ఉత్సవమును వెదకుట, చెడ్డ సాక్ష్యము, వృథాఅయిపోయిన శక్తి, నకిలీ పరిశుద్దత.

భావోద్వేగాలకు ప్రాముఖ్యత నిచ్చే వారు ఒక కూడికలోని పాటలుపాడుట మరియు ప్రార్థనయొక్క బావోద్వేగాలు ఒక స్థాయికి చేరుకొన్నప్పుడు మరియు అక్కడ సందడి ఒక స్థాయికి చేరుకొన్నప్పుడు మాత్రమే అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నదని భావించుదురు! అది విశ్వాసమూలముగా జీవించుట కాక భావోద్వేగాలవలన జీవించుట. అది దేవుని ఆరాధించుటకు బదులు, బావోద్వేగాలను ఆరాధించుట. దేవుడు మన ఆత్మలో నివసించును, మన భావోద్వేగాలలో కాదు.

మన భావోద్వేగాలు మనచుట్టూ ఉన్న లోకమునకు మన సాక్ష్యమును ఆటంకపరచగలవు. అవిశ్వాసులు ఒక ఉద్వేగభరితమైన సంఘకూడికకు వచ్చినప్పుడు (అందరూ ''బాషలలో మాట్లాడే'' చోటకు), వారు అందరిని వెఱ్ఱివారుగా భావించెదరని పౌలు మనలను హెచ్చరించెను (1 కొరిందీ¸ 14:23). దేవుడు సమాధానమునకే గాని అల్లరికి కర్తకాదు (1కొరిందీ¸ 14:33). ఉద్వేగభరితులైన క్రైస్తవులు వారి వెఱ్ఱిప్రవర్తనను, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతగా అంగీకరించనందుకు ఇతరులను ఆత్మీయులు కానివారిగా ఎంచుదురు. ''కృప హింసను భరించును కాని అది ఎప్పుడూ ఇతరులను హింసించదు'' అని కేటెల్‌ చెప్పారు!!

భావుకత పరిచర్యకు చాలా తరచుగా ఒక ప్రత్యామ్నాయముగా మారును. ఇతరులకు సహాయపడుటకు బదులు మనము కేవలము కూటములలో మన ''ఉద్వేగపూరితమైన అనుభవాలను'' ఆనందించెదము! యేసు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చేసినట్లు మనము ''మేలు చేయుచూ తిరుగుచు అపవాది చేత పీడింపబడినవారిని విడిపించుటకు'' మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించవలెను- అంతేకాని మన భావోద్వేగాలను తృప్తిపరచుకొనుటకు కాదు.

నకిలీ ఉద్వేగభరితమైన ''పులకరింతలు'' మన ఆత్మీయ స్థితిని గురించి మనలను మోసగించగలవు. నీవు నీ భార్యనుగాని ఇంకెవరినన్నగాని బాధపెట్టిన యెడల, దేవునితో నీవు సహవాసము పునరిధ్దరించడానికి(తిరిగి పొందుటకు) ముందు దేవుడు నిన్ను ఆమెను లేక అతనిని క్షమాపణ అడుగమని కోరును. కాని ఒక తీవ్రమైన ఉద్వేగపూరిత కూటములలో లేక ఒక బాషలలో మాట్లాడే సందర్భములో సాతాను నీకు ఎంత మంచి అనుభూతి నిచ్చునంటే అది నీవు దేవునితో సహవాసములో ఉన్నావని మోసము చేయును. కాని నీవు సహవాసములో ఉండలేవు ఎందుకనగా ముఖ్యమైన సంగతి ఇంకా తేలలేదు. బాషలలో మాట్లాడుట ఇంకా ఉత్సాహముగా ఉండవచ్చు. కాని గాయపరచబడిన వ్యక్తి యొద్ద నుండి క్షమాపణ అడిగే అవమానకరమైన మెట్టును నీవు తీసుకొనవలెనని దేవుడు ఆశించును. లేనియెడల సాతాను ఒక భ్రమకలిగించే పరిశుద్ధతతో నిన్ను మోసగించును.

మన భావోద్వేగములను గాని లేక నిజమైన బాషలలో మాట్లాడు వరమును గాని నేను తక్కువ చేయుటలేదు. దేవుడు మన భావాలను సృజించెను కాబట్టి ఆయన మనలను మృతమైన రాళ్ళవలె ఉండాలని కోరుకొనుటలేదు. సంఘమునకు బాషలు మాట్లాడు వరమును ఇచ్చినది కూడా ఆయనే కాబట్టి దానికి కూడా ఒక స్థానమున్నది. కాని ఆత్మ నింపుదలగల సేవ స్నేహపూరితమైనదని, ఇతరుల యెడల తనకున్న ఋణమును గూర్చి ఆలోచించునని అది కేవలము ఉద్వేగభరితమైన అనుభవాలతో సంతృప్తిపడదని మనము ఎప్పుడూ మరచిపోకూడదు.

రెండు ముఖ్యమైన వాస్తవాలను కూడా మనము గుర్తించుకొనవలెను:

  1. ఒక ఉద్వేగభరితమైన కూటములో మనము పొందిన ఏ అనుభవమైనను దేవునినుండి కాక, సొంతగా ప్రేరేపించబడినది కావచ్చు.
  2. ఒక వ్యక్తి యొక్క ఆశానిగ్రహమును కోల్పోయేటట్లుచేసే ఎటువంటి అనుభవమైనా పరిశుద్ధాత్మ వద్దనుండి వచ్చినదికాదు, ఎందుకనగా ఆత్మయొక్క ఫలము ఆశానిగ్రహము (గలతీ 5:22,23).

దేవుడు మనలను మన భావాలపై ఆధారపడి జీవించవలెనని కోరుటలేదు. ఆయన మనలను విశ్వాసమూలముగా జీవించవలెనని కోరుచున్నాడు. ఇందువలన దేవుడు మనలను అప్పుడప్పుడు ఆత్మీయముగా వాడిపోయినట్లు భావించుటకు అనుమతించును. అలా వాడిపోయినట్లు భావించుట ఎల్లప్పుడు మన జీవితములో పాపము ఉన్నదనుటకు గుర్తుకాదు. అవి మన భావాలపై మనము ఆధారపడకుండునట్లు దేవుడు చేసే ప్రయత్నాలు.

అపవాది అనేకులను నకిలీ వరముల ద్వారా, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చుట ద్వారా తప్పుదారిలో నడిపించుచున్నాడు గనుక మనము ఈ దినములలో జాగ్రత్తగా నడవవలసిన అవసరమున్నది. అపవాది యొక్క ఉచ్చులలోనుండి మనము తప్పించుకోవాలంటే, ఇతరులను దీవించుటకు కోరుకొనే జీవితములోనే క్రీస్తు జీవముయొక్క సౌందర్యమున్నదని మనము గుర్తుంచుకొనవలెను. యేసు పరలోకమునుండి భూలోకమునకు తన కొరకు ఏది ఆశించి రాలేదు కాని ఇతరులను ఆశీర్వదించుటకే వచ్చెను.

మానవ అసమర్ధత (కొరత)

మూడవదిగా ఆత్మ నింపుదలగల పరిచర్య మానవ అసమర్ధత గూర్చి ఎరిగియున్న పరిచర్య. 2 కొరిందీ¸ 10:1 లో పౌలు మాటలను గమనించండి, ''నేను మీ మద్య అణకువగలవాడిని''- లేక, వేరేమాటలలో చెప్పాలంటే, ''నాకు ఆకట్టుకొనే రూపములేదు''.

చరిత్ర ప్రకారము అపోస్తులుడైన పౌలు యొక్క ఎత్తుకేవలము నాలుగు అడుగుల పది అంగులాలు మరియు అతడు బట్టతల గలవాడు. అతడి ముక్కు వంకరగానుండెను, అతడు బహుశ కంటి వ్యాధి కలిగియుండెను. అతనికి ఖచ్చితముగా సినిమా-తారలకుండే వ్యక్తిత్వముగాని రూపముగాని లేవు. అతడి ప్రయాసాలయొక్క విజయాలు ఎటువంటి మానవ సంబంధమైన అంశంపైన అధారపడలేదు ఎందుకనగా అతని రూపముగాని అతని మాటలుగాని ఆకట్టుకొనేవి కావు. పౌలు బోధించు శైలి గురించి కొరిందీ¸యులకు ఈ విధముగా వ్రాసెను, ''నేను భయముతోను వణుకుతోను మీ మద్యనుంటిని'' (1 కొరిందీ¸ 2:3). అతడు బోధించినప్పుడు తన ద్వారా ప్రవహించే దేవుని శక్తిని కాక, తన బలహీనతను ఎరిగియుండెను. ఇదే ఆత్మ నింపుదలగల పరిచర్య-ఎందుకనగా, పౌలు యొక్క బోధకు ఫలితముగా దేవుని యెరుగని కొరింథులో ఒక సంఘము స్థాపించబడెనని మనము జ్ఞాపకముంచుకొనవలెను.

దేవుని ఆత్మ ఒక వ్యక్తి ద్వారా మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తికి తను దేవుని నోటివలే ఉన్నానని సాధారణముగా తెలియదు.

ప్రసంగవేదికపై నిలబడి తమ ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడని ఖచ్చితముగా తెలిసియున్నవారంటే నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. (అట్టివారు తమ ప్రకటనలను ''ప్రభువు సెలవిచ్చినదేమనగా'' అని మొదలు పెట్టుదురు) అట్టివారితో నా అనుభవము ఏమిటంటే దేవుడు వారిద్వారా అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. వారు ప్రవచనాత్మక స్వరములని తమ గురించి గొప్ప ఆలోచనలు కలిగియుందురు. దేవుడు ఎవరిద్వారా మాట్లాడునో ఆ వ్యక్తి ఆ విషయమును ఎరిగియుండడు. అపోస్తులుడైన పౌలు వ్రాసిన ఒక పత్రికలో ఈ విధముగా చెప్పెను ''నేనిది చెప్పినను దేవుని ఆత్మనుండి వచ్చు ఆలోచనను (సలహాను) మీకు ఇస్తున్నానని నేననుకొనుచున్నాను'' (1 కొరిందీ¸ 7:40- లివింగు బైబిలు). దేవుడు తన ద్వారా మాట్లాడుచుండెనా లేదా అన్న విషయము అతడు ఖచ్చితముగా చెప్పలేక పోయెను. అయినప్పటికీ దేవుడు పౌలు ద్వారా మాట్లాడెనని మనకు తెలుసు, ఎందుకనగా దేవుడు దానిని తన లేఖనములలో పొందుపరచెను.కాని పౌలుకు ఆ విషయము తెలియదు.

అవును, ఆత్మనింపుదల గల పరిచర్య మానవ కొరత గురించి ఎరిగియుండును. పౌలు చెప్పిన విధంగా, ''నేను బలహీనుడనైనప్పుడే, నేను బలవంతుడను'' (2 కొరిందీ¸ 12:10). ఉపమానములో ఉన్న మనుష్యునివలె, ఆత్మ నింపుదలగల దేవుని సేవకుడు దేవునియొద్దకు పదే-పదే వెళ్ళి ఈ విధముగా చెప్పెను, ''ఇతరులకు ఇచ్చుటకు నాయొద్ద ఏమియూ లేదు, దయచేసి నాకు జీవాహారమిమ్ము'' (లూకా 11:5-8). ప్రభువు యొక్క సేవకుడు తన స్వంత కొరతను ఎల్లప్పుడు ఎరిగియుండును.

ఆత్మనింపుదల గల పరిచర్య గురించి మనము ఎటువంటి తప్పుడు అభిప్రాయములు కలిగియండకూడదు. దానికి దేవుని శక్తి గురించి ఎటువంటి గొప్ప అవగాహన ఉండదు. దీనికి విరుద్ధంగా దానికి భయము మరియు అనిశ్చితి యుండును. ప్రయాసలన్నియు ముగించిన చాలాకాలము తరువాత మాత్రమే, వెనుతిరిగి చూచినప్పుడు, దేవుడు ఖచ్చితముగా మన ద్వారా పనిచేసాడన్న నిశ్చయత ఉండును.

మన పిలుపును(పరిచర్యను) నెరవేర్చుట

నాల్గవదిగా, ఆత్మనింపుదలగల పరిచర్య దేవుని యొక్క ప్రత్యేకమైన పిలుపును నెరవేర్చే పరిచర్య. కొలస్సీ 1:23,25 పౌలు ఈ విధముగా చెప్పెను, ''నేను పరిచారకుడనైతిని'', మరియు 1 తిమోతి 2:7లో, ''నేను అపొస్తులుడనుగా నియమింపబడితిని'' . పౌలు మనిషిచేతకాక మేకులు కొట్టబడిన తన రక్షకుని చేతుల ద్వారా నియమింపబడెను. పౌలుకు అపోస్తులునిగా ఉండుటకు పిలచినది దేవుడే. ఈ పిలుపు (పరిచర్య) అతనికివ్వబడెనని కొలస్సీ 1:25లో చెప్పెను. అది దేవుని యొక్క వరము - అతడు సాధించినదో, సంపాదించినదో కాదు. ఇతరులకు పరిచర్యచేయుటకు ఈ పిలుపు ఇవ్వబడినదని అదే వచనములో పౌలు చెప్పెను. అది సంఘము కట్టుటకు దేవుడు తనకప్పగించిన గృహనిర్వాహకత్వము.

మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపును కలిగియున్నాడు. మనలను పిలవని దానిగా నుండుటకు దేవుణ్ణి అడుగుట నిష్‌ ప్రయోజనము- ఎందుకనగా మనలో ప్రతి ఒక్కరికి ఏ వరముండవలెనో పరిశుద్ధాత్మయే నిర్ణయించును. పౌలు అపొస్తులుడనుగా ఉండుటకు పిలువబడెను. కాని ప్రతి ఒక్కరికి అటువంటి పిలుపు లేదు. కాబట్టి దేవుడు మనలను దేనిని చేయుటకు పిలచెనో దానిని చేయుటకు శక్తి కొరకు మనము దేవుని వెదకవలసిన అవసరమున్నది. ''ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్తపడుము'' అని పౌలు అర్ఖిప్పుకు సెలవిచ్చెను (కొలస్సీ 4:17).

దేవుడు గుండ్రపు రంధ్రాలలో చతురస్రపు కొయ్యకర్రలను పెట్టడు. ఆయన సంఘమునకు ఫలానా సమయములో ఫలానా స్థలములో ఏది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మనమాయనకు లోబడినట్లయితే, మనలో ప్రతిఒక్కరినీ ఒక ప్రత్యేకమైన పనిచేయుటకు సిధ్దపరచును- ఆ పని మనకు మనమే చేయాలనుకున్న పనికంటే ఎంతో భిన్నముగా ఉండవచ్చును.

''అందరూ అపొస్తులులా? కానే కాదు. అందరూ ప్రవక్తలా? కాదు. అందరూ బోధకులా? అందరికీ అద్భుతములు చేయుటకు శక్తిఉన్నదా? అందరూ రోగులను స్వస్థపరచగలరా? కానే కాదు. మనము నేర్చుకొనని బాషలు మాట్లాడు వరమును దేవుడు మనకందరికీ ఇచ్చునా? లేదు'' (1 కొరిందీ¸ 12:29,30- లివింగు బైబిలు). కాని క్రీస్తు శరీరములో దేవుడు ఈ కృపావరములన్నిటిని ఉంచెను.

ముఖ్యమైన విషయమేమిటంటే మనకున్న వరమును పిలుపును మనము గ్రహించుట మరియు ఆ వరమును సార్థకము చేసి (వాడి) ఆ పిలుపును నెరవేర్చుట. ఆత్మ నింపుదలగల పరిచర్య దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన పిలుపును నెరవేర్చు పరిచర్య.

కొత్తనిబంధన మనలను అపేక్షించమని ప్రత్యేకముగా ప్రోత్సాహించే వరమేదైనా ఉన్నదంటే అది ప్రవచన వరమే (1 కొరిందీ¸ 14:39). ఇది బహుశా ఈ రోజున సంఘములో అత్యవసరమైన వరము.

ప్రవచించే పరిచర్య క్షేమాభివృద్ది కలుగజేయును (బలపరచును, కట్టును), హెచ్చరించును (గద్దించును, సవాలు చేయును) మరియు ఆదరించును (ఓదార్చును, ప్రోత్సహించును) (1 కొరిందీ¸ 14:3).

దేవుడు మన సంఘములలో మనకు ప్రవక్తలను ఇచ్చునట్లు మనము ప్రార్ధన చేయవలసిన అవసరమున్నది. అటువంటి వారు భయపడకుండా పక్షపాతము లేకుండా దేవుని సత్యమును ప్రకటించుదురు-వారు జీతములో, హోదాలో, ప్రజాధరణలో ఎక్కువ ఆసక్తి చూపించే వృత్తిపరమైన మతానుసారులైన బోధకులవలె కాకుండా వారు వేరే ప్రమాణము కలిగియుందురు. మన పిలుపేమైయున్నదో తెలుసుకొనుటకు ప్రభువును ఆసక్తితో వెదకుటకు ఆయన మనలో ప్రతిఒక్కరికీ సహాయపడునుగాక!

ఆత్మ నింపుదల గల జీవితము(జీవము)

మరియొకసారి అపొస్తులుడైన పౌలు జీవితములోనుండి ఆత్మ నింపుదల గల జీవితము యొక్క నాలుగు లక్షణాలను పరిశీలించెదము.

పరిపూర్ణమైన సంతుష్టి

ఆత్మ నింపుదల గల జీవితము మొట్టమొదటిగా పరిపూర్ణమైన సంతుష్టి గల జీవితము. ఫిలిప్పీ 4:11లో ''నేను ఏ స్థితిలో ఉన్నను నేను సంతృప్తి కలిగియున్నాను'' అని పౌలు చెప్పెను. మరియు అటువంటి సంతుష్టి మనలోనికి సంపూర్ణ ఆనందమును సమాధానమును తెచ్చును. కాబట్టి అదే అధ్యాయము4 మరియు 7 వచనాలలో పౌలు ఆనందము మరియు సమాధానమును గూర్చి మాట్లాడెను.

దేవుడు మనతో వ్యవహరించే తీరును బట్టి ఎల్లవేళల మనము పరిపూర్ణమైన సంతుష్టితో ఉన్నప్పుడే మనమాయనను స్తుతించగలము. దేవుడు సార్వభౌముడు కాబట్టి మనకు జరిగేదంతా మనమేలుకొరకు జరిగించుచున్నాడని మనము నమ్మినయెడల (రోమా 8:28) మనము అన్ని పరిస్థితులలోనూ నిజముగా సంతుష్టిగా ఉండగలము. అప్పుడు మన వనములో చెట్లు ఫలించకపోయినను మన గొఱ్ఱెలమంద చనిపోయినను, ఆర్థికపరమైన గొప్ప నష్టమును భరించినను, లేదా ఇంకే పరిస్థితిలోనైనా, హబక్కూకు వలే మనము దేవుని స్తుతించగలము (హబక్కూకు 3:17,18).

పరిశుద్ధాత్మ నింపుదలయొక్క ఫలితముగా దేవుని స్తుతించుట మనలోనుండి ప్రవహించునని ఎఫెసీ 5:18-20 వచనములు సూచిస్తున్నవి. అపోస్తులుడైన పౌలు తన కాళ్ళకు బండ వేయబడి, చెరసాలలో బంధించబడినప్పటికీ ఆనందించగలిగెను (అపొ.కా.16:25). అక్కడ కూడా అతడు సంతుష్టి కలిగి ఫిర్యాదు చేయుటకు ఏమియూ కనుగొనలేదు.

ఆత్మ నింపుదల గల జీవితముయొక్క మొదటి గుర్తులలో ఇది ఒకటి. ఒక క్రైస్తవునిలో సణుగుడు కనిపించినప్పుడు అతడు దేవునికి వ్యతిరేకముగా సణిగిన ఇశ్రాయేలీయుల వలె, జయ జీవితము అనే వాగ్ధాన దేశములోకి ప్రవేశించలేదని సూచన.

పరిశుద్ధతలో ఎదుగుట

రెండవదిగా, ఆత్మ నింపుదల గల జీవితము పరిశుద్ధతలో ఎదిగే జీవితము. ఒక వ్యక్తి స్వంత జీవితము పరిశుద్ధతలో ఎదిగినప్పుడు అతనికున్న దేవుని యొక్క పరిపూర్ణ పరిశుద్దత యొక్క జ్ఞానము కూడా ఎదుగును. ఈ రెండూ కలిసియుండును. నిజానికి, ఒక వ్యక్తికి నిజముగా మొదటిది ఉన్నదనటానికి ఒక పరీక్ష అతడు రెండవది కలిగియుండుట.

తాను రక్షింపబడిన పాతికేళ్ళ తరువాత, ''నేను అపొస్తులందరిలో తక్కువవాడను'' అని పౌలు చెప్పెను (1 కొరిందీ¸ 15:9). అయిదు సంవత్సరాల పిమ్మట, ''నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను'' అని చెప్పెను (ఎఫెసీ 3:8-11). ఇంకా ఒక సంవత్సరము తరువాత, ''నేను పాపులలో ప్రధానుడను'' (గమనించండి, ''ప్రధానుడిగా ఉండేవాడును'' అని కాదు ''ప్రధానుడను'') అని చెప్పెన