దేవుడు కేంద్రముగా నుండు ప్రార్థన

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   క్రీస్తుయెడల భక్తి
  Download Formats:

అధ్యాయము 0
దేవుడు కేంద్రముగా నుండు ప్రార్థన

    ప్రార్థించుటకు సరియైన పద్ధతి

    ---------------

    ముందు మాట

    సరియైన ప్రార్థనకు అవసరమైనవి రెండు విషయాలు.

    మొదటిదిగా మనము దేవుడిచ్చిన భారమును కలిగియుండవలెను.

    ప్రార్థన దేవునితో మొదలై దేవునితో పూర్తయ్యే వృత్తము వంటిది.

    ఆ వృత్తములో మొదటి అర్ధభాగము పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుడిచ్చిన భారము పొందుట వృత్తములో రెండవ అర్థ భాగము దేవునిచే ప్రేరేపింపబడి తిరిగి మన తండ్రికి    మనము చేయు ప్రార్థన. ఆ విధముగా ఆ వృత్తము పూర్తవును.

    ''ఆత్మలో ప్రార్థించుట'' యొక్క అర్థము అది.

    ప్రార్థనకు అవసరమైన రెండవది విశ్వాసము.

    మనము దేవుని నమ్మవలెనని ఆయన కోరుచున్నాడు. మనము దేవుణ్ణి అపనమ్మకము చేత అవమానపరచుచున్నాము. ఈ లోకపు తండ్రులు తమ బిడ్డల యెడల చూపు ప్రేమ కంటే దేవుడు మన యెడల చూపు    ప్రేమ తక్కువైనదని అపనమ్మకము చూపును.

    మన విన్నపములు మన మనస్సులలో లేక మన యొక్క నాలుకలపై నుండి ప్రారంభమైనట్లయితే మనము చేసే ప్రార్థన దేవుని చెవులలో నిజముగా ప్రార్థనగా యుండదు. ఎప్పుడైతే అది మన    హృదయపు లోతులలో నుండిన ఆశలుగా యుండునో, అప్పుడు అది నిజమైన ప్రార్థనగా యుండును.

    ప్రార్థన మన జీవితానికి సంబంధించిన విషయము. మరియు మన ప్రార్థన యొక్క బలము మానవ జీవితము యొక్క నీతిపై ఆధారపడి యుండును.

    నిజమైన నీతి మానవుని దేవున్ని కేంద్రంగా కలిగి యుండునట్లు చేయును.

    దాని అర్థము అతడు ''విషయములను దేవుని యొక్క కోణము నుండి చూచును'' (కొలస్సీ 1:9).

    అతడు ప్రజలను, విషయములను, పరిస్థితులను మానవ కోణమునుండి చూచుట మాని వేయును (2కొరిందీ¸ 5:16). అతడి చుట్టూ ఇవన్నియు మారకుండా యుండకపోవచ్చు. కాని దేవున్ని    కేంద్రంగా కలిగియుండినవాడు పరలోకములోనికి వెళ్లియుండును మరియు ప్రతివానిని మరియు ప్రతిదానిని దేవుడు చూచినట్లు చూచును.

    కేవలము అటువంటి వ్యక్తి మాత్రమే దేవుని మనసుననుసరించి ప్రార్థన చేయగలడు.

    మన శరీరములకు శ్వాస ఎటువంటిదో మన ఆత్మలకు ప్రార్థన అట్లు ఉండవలెనని దేవుడు ఉద్దేశించారు.

    శ్వాస మన ప్రయత్నము లేకుండగానే ఎప్పుడూ మనము చేయుచూ ఉండేది. ఎట్లు శ్వాసించాలో తెలియజేసే పుస్తకములు అక్కర్లేదు. నిజానికి, శ్వాసించుట మనకు కష్టమైనప్పుడు, అది    మనలో ఏదో రోగమునకు సూచన!

    దీని అర్థము ప్రార్థన ప్రయాసతో కూడిన పని కాదని కాదు.

    యేసు ప్రభువు ''మహా రోదనతోను మరియు కన్నీళ్లతోను'' ప్రార్థించెను (హెబ్రీ 5:7).

    అపొస్తలులు ''ప్రార్థనలో ప్రయాసపడిరి'' (కొలస్సీ 4:12).

    పూర్ణ హృదయులైన క్రైస్తవులు ప్రార్థనను అలాగే చూచుదురు, ఎందుకనగా, ''మనము పోరాడునది ప్రస్తుత అంధకార సంబంధులగు లోనాధులతోనై యున్నది'' (ఎఫెసీ 6:12).

    కాని ప్రార్థన ఒక భారమైన ఆచారమైనప్పుడు, అది రోగికి ఆత్మీయమైన ఆయాసపు జబ్బు ఉన్నదనడానికి ఖచ్చితమైన సూచన.

    అటువంటి విశ్వాసులు రోగగ్రస్థులు. మరియు వారు దానిని గ్రహించవలసియున్నది.

    వారికి అవసరమైన బోధ ఎలా ప్రార్థించవలెననే విషయంలో కాదు కాని వారి జీవితములలో వారియొక్క విలువలు మారవలసిన విషయంపైన.

    ఈ పుస్తకము దాని గూర్చియే.

    మనము దేవుణ్ణి కేంద్రంగా కలిగి యున్నప్పుడు మరియు మన విలువలు సరిగా యున్నప్పుడు, మనము ఈ ఆయాసపు జబ్బు నుండి స్వస్థత పొందుదుము.

    ప్రార్థన అప్పటికీ మహారోదనతోను, కన్నీళ్లతోను కలిసియుండును మరియు దానిలో పోరాటము ప్రయాస యుండును, కాని అది ఎంతమాత్రము ఒక ఆచారముగా ఉండదు. అది ఒక సంతోషముతో మరియు    ఆనందముతో కూడియుండును.

    నీకు అటువంటి జీవితము కావలెనంటే ఇది చదువుము.

అధ్యాయము 1
మనము ఏ విధముగా ప్రార్థించకూడదు

    ''మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారి కిష్టము; వారు తమ    ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

    నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.    మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారివలె ఉండకుడి.    మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియును. కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి.

   ''పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము    నేడు మాకు దయచేయుము, మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, బలము    మహిమ నీవైయున్నవి, ఆమేన్ ''

    ''మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ    అపరాధములను క్షమింపడు'' (మత్తయి 6:5-15).

    యేసు ప్రభువు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన ఇది యొక్కటియే. అందువలన దీనిని సరిగా అర్థముచేసికొనుట మనందరికీ ఎంతో లాభదాయకముగా నుండును.

    మనమెప్పుడు ప్రార్థించినను ఈ విధముగా ప్రార్థించవలెనని యేసుచెప్పెను (9వ). దాని అర్థము మనము ప్రార్థించినప్పుడెల్ల దీనిని తిరిగి చెప్పవలెనని కాదు, కాని మన    ప్రార్థనలన్ని ఈ మాదిరిగా యుండవలెనని అర్థము. ఇందులో ప్రతి వాక్యమును అర్థవంతముగా ప్రార్థించినట్లయితే, ఈ ప్రార్థనను ప్రతిసారి ప్రార్థించుటలో తప్పేమీలేదు. కాని    అది అంత సులువుకాదని మనము చూచెదము.

    యేసు ఆయన శిష్యులకు ఎట్లు ప్రార్థించాలో నేర్పుటకుముందు, ఎట్లు ప్రార్థించకూడదో నేర్పించారు (5,6 వచనములు).

    వేషధారులవలె ప్రార్థించకూడదు

    ఎట్లు ప్రార్థించ కూడదో చెప్పుటకు సంబంధించి యేసుప్రభువు చెప్పిన మొదటి విషయం మనము వేషధారువలె ప్రార్థించకూడదని (5,6వ).

    నీవు సువార్తలు చదువుకొలది యేసుప్రభువు వేషధారణ గూర్చి చాలా చెప్పుటను నీవు గమనించగలవు. పరిసయ్యులు వేషధారులుగా నుండుటచేత వారిని చాలా కరిÄనమైన మాటలతో    ఖండించారు. పరిసయ్యులలో చాలా మంచి విషయాలు ఉన్నవి. వారు రోజూ ప్రార్థించుదురు. వారు వారానికి రెండుసార్లు ఉపవాసముందురు. వారు వారి సంపాదనలోనే కాకుండా వారి    తోటలోపండే పుదీనా, కొత్తిమీరలలో కూడా పదియవ వంతు తీయుదురు. వారు దేవుని న్యాయవిధులుగా అర్థముచేసికొన్న వాటిని ప్రతి చిన్న విషయములో చాలా జాగ్రత్తగా అనుసరించుటకు    ఎంతో జాగ్రత్త తీసుకొందురు. బాహ్యముగా వారు ఎంతో నీతి కలిగి న్యాయంగా నడచుకొనేవారు. వారు సమాజమందిరములో జరిగే విశ్రాంతిదినపు కూటముకు ఎప్పుడూ తప్పిపోరు. వారికి    లేఖనములు బాగుగా బోధింపబడినవి. అయినప్పటికిని వారు చేసేవన్నీ తోటి మానవుల దగ్గర్నుండి ఘనతను పొందుట కొరకు అవుటచేత యేసువారిని ఖండించెను. ''వారు దేవుని    మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి'' (యోహాను 12:43). పరిసయ్యుల యొక్క సంతానము, అంటే ఎవరైతే దేవుని యొక్క మెప్పుకంటే వారి నాయకులు మరియు ఇతర    మనుష్యుల మెప్పును కోరి ప్రేమింతురో అటువంటివారు ఇప్పుడు లోకంలో ప్రతి సంఘములో ప్రతి సహవాసములో ఉన్నారు.

    'వేషధారి' అనే గ్రీకు మాట 'నటుడు' అను అర్థమిచ్చు గ్రీకుమాటనుండి వచ్చినది. ఒక చలనచిత్రంలో (సినిమా) బాప్తిస్మమిచ్చు యోహానుగా నటించిన ఒకని గూర్చి ఆలోచించండి.    అతడు నిజజీవితంలో ఒక త్రాగుబోతు, వ్యభిచారి, ఇద్దరు ముగ్గురు స్త్రీలను పెండ్లాడి వదిలివేసిన వాడు కావచ్చు. కాని, ఆ సినిమాలో అతడు దేవుని పరిశుద్ధమైన ప్రవక్తగా    నటిస్తాడు. వేషధారి అంటే అటువంటివాడు, ప్రజలముందు ఒకలాగున ఉండి, నిజ జీవితంలో ఇంకొకలాగున ఉండేవాడు.

    ఒక వేషధారి ఇతర విశ్వాసుల దగ్గర ఒక నిజమైన క్రైస్తవుడుగా తన పాత్రను పోషించవచ్చు. కాని, అతడు తన భార్యను ఇంటిదగ్గర చూసేతీరు లేక ఆఫీసులో అతడితోటి వారితో అతడు    ప్రవర్తించే తీరు నీవు చూచినట్లయితే నీవు వేరొక మనుష్యుని చూచెదవు. ఎందువలన? అతడు అక్కడ నటించుటలేదు. ఇంటిలో మరియు పనిస్థలములో అతడి అసలు రూపము బయటపడుతుంది.    అతడు మతానుసారుడైన వ్యక్తే కాని, ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు.

    ఒక నటునికి అతడి నటనను మెచ్చుకొనే ప్రేక్షకులు కావాలి. అదే విధంగా ప్రతి వేషధారికి కూడా కావాలి. మొదటి శతాబ్దములో పరిసయ్యులు కూడా అంతే మరియు ఇరవై ఒకటవ శతాబ్దపు    పరిసయ్యులు కూడా అంతే. వారేమి చేసినను, చివరకు పవిత్రకార్యమైనటువంటి ప్రార్థన చేసినను, వారు మనుష్యుల నుండి మెప్పుపొందవలెనని కోరుకొందురు. వారు ఎంతో చక్కగా    ప్రార్థించవచ్చు. కాని, అది ప్రజలు వారిని గమనించుట కొరకే.

    మనము నిజాయితీగా ఒప్పుకొన్నట్లయితే, మన మందరము అనేకమార్లు వేషధారులవలె, దేవుని కంటే వింటున్న ప్రజలను దృష్టిలో నుంచుకొని ప్రార్ధించామని ఒప్పుకొనాల్సియుంటుంది.    ఇంకొక విషయాన్ని కూడా మనము ఒప్పుకోవాలి, అది మనము బహిరంగముగా ప్రార్థించినట్లు మనము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థించము అనే విషయం. బహుశా మనము బహిరంగంగా    ప్రార్థించినప్పుడు సుందరమైన లేక అనర్గళమైన భాషను ప్రజలను ఆకట్టుకొనేలా ఉపయోగించుదుము. అటువంటి ప్రార్థన చేయునప్పుడు జాగ్రత్త కలిగియుండమని, అటువంటి ప్రార్థనలు    దేవుని యొద్దకు ఏ మాత్రము చేరవని యేసు చెప్పారు.

    మనము అటువంటి వేషధారణ నుండి, అది మనము బోధించే విషయములోనయినా, లేక జీవించే విషయంలోనయినా, లేక మన ప్రార్థనలోనయినా విడుదల పొందాలంటే మనము దేవుని యొక్క మెప్పుకంటే    మనుష్యుల మెప్పును ఎక్కువ పట్టించుకోకుండా ఉండే స్వభావాన్ని ఇమ్మనమని దేవునిని అడుగవలెను. మనము దేవునికి సరిగా భయపడుట నేర్చుకొనినంత వరకు, మనము మన జీవితములో    ప్రతి విషయములోనూ మన పాత్రను పోషించే నటులుగానే కొనసాగుదుము.

    యేసు ప్రభువు వేషధారణను వేరే ఏ పాపముకంటే కూడ ఎక్కువగా ఖండించారు.

    తప్పుడు అభిప్రాయమును కలిగించకూడదు

 

ఆది సంఘములో మనము చదివే మొదటి పాపము వేషధారణ గూర్చియే. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయములో, మనము అననీయ, సప్పీరాల గూర్చి    చదువుదుము. వారి పాపమేమిటి?వారు ఆస్తిని అమ్మగావచ్చిన సొమ్ము అంతా తీసుకు వచ్చి దేవునికి ఇవ్వకపోవుటా? కాదు. అది వారి పాపము కాదు. నీవు నీ ఆస్థిని లక్షరూపాయలకు    అమ్మి అందులో ఏభై వేలు దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకొంటే అది పాపముకాదు. నీవు దేవునికి ఏమీ ఇవ్వకూడదని నిర్ణయించుకొనినా అది కూడా పాపముకాదు. నీవు ఎంత ఇవ్వాలని    అనుకొంటావో అది నిజానికి నీకు సంబంధించిన విషయం. దేవుడు సంతోషముతో ఇచ్చువానిని ప్రేమించును, అందువలన నీవు సంతోషముతో ఇవ్వనట్లయితే, నీవు ఏదీ ఇవ్వకపోవుటయే మంచిది.    ఆయనకు నీ ధనము అక్కర్లేదు. ఆయనకు వెండి బంగారములు కావలసినంత ఉన్నవి.

    అయితే అననీయ, సప్పీరాలు ఎందుకు చనిపోయారు? దానికి కారణం ఇది. అననీయ అపొస్తలుల పాదాల యొద్ద పెట్టినదే అమ్మగావచ్చిన సొమ్ము అంతా అన్నట్లు నటించాడు. పరిశుద్ధమైన    భక్తిగల ముఖముతో, మిగిలిన వారి వలె అతడు కూడా సమర్పించుకొన్నట్లు అననీయ కనబరచుకొన్నాడు. అతడు ఒక నటుడును మరియు వేషధారియు అయ్యున్నాడు. కాని, పేతురు దైవజనుడు    కాబట్టి ఆయన మోసపోలేదు. అననీయ యొక్క సమర్పణలో నుండిన వేషధారణను చూచుటకు దేవుడు వివేచననిచ్చెను. అందువలన ''అననీయా పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు (అబద్దము    చెప్పుటకు) సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను''? అనెను (అపొ.కా. 5:3).

    అననీయ ఏ అబద్ధాన్ని చెప్పాడు? అతడు కనీసం తన నోరు కూడా తెరవలేదు.

    అంటే అబద్ధం చెప్పడమంటే ఏమిటి? దాని అర్థము తప్పుడు అభిప్రాయాన్ని కలుగజేయుట. నీవు నీ నోరు తెరువకుండానే తప్పుడు అభిప్రాయాన్ని యివ్వగలవన్నమాట.

    అననీయ చేసినదదే. అతడు పూర్ణహృదయంతో యేసు ప్రభువును వెంబడించే శిష్యులతోపాటు తానూ ఒకడిగా ఇతరుల నుండి ప్రశంసలు పొందాలనుకొన్నాడు. కాని, నిజానికి అతడు    అటువంటివాడుకాడు. అతడు కొంత తన కొరకు ఉంచుకొన్నాడు. అయితే నేను చెప్పినట్లు, అది పాపముకాదు. దానికి అతడు ఇలా చెప్పాల్సింది, ''సహోదరుడా, పేతురూ,నేను నా భూమిని    అమ్మాను. అయితే ఇతరులవలె అమ్మగా వచ్చినదంతా దేవునికి ఇవ్వాలని నేను అనుకొనుటలేదు. ఇదిగో అందులో కొంత తెచ్చాను''. అననీయ అలా చెప్పినట్లయితే అతడు చనిపోయి ఉండేవాడు    కాదు. అది నిజాయితీ, దానిని దేవుడు మెచ్చుకొనేవాడు.

    కాని అతడు లేనిది ఉన్నట్లుగా చూపించాడు. అది అతడి పాపమయ్యింది. అందువలననే అతడు చనిపోయాడు. కొంత సమయమైన తరువాత అతడి భార్య వచ్చి ఆమెపాత్ర ఆమె గొప్పగా పోషించింది.    ఆమెకూడా అంతా యిచ్చివేసినట్లు మాట్లాడింది. ఆమె కూడా మరణించింది.

    ఆ వేషధారణ చిన్న పులిసిన పిండివలె ఆది సంఘములోనికి ప్రవేశించింది. దానిని వెంటనే తొలగించకపోయినట్లయితే మొత్తం సంఘమంతా త్వరలోనే కల్మషమైపోవునని దేవునికి    తెలియును. అందుచేతనే దేవుడు వారిని వెంటనే చనిపోవుటకు అనుమతించారు.

    నీ జీవితములో ప్రతి విషయములో వేషధారణను జయించలేక పోయినట్లయితే, నీ ప్రార్థనా జీవితములో కూడా నీవు వేషధారణను ఎప్పటికిని జయించలేవు. ఇతరులు నిన్ను మెచ్చుకొనుటకు    నీవు ప్రార్థించితే, ''నీ ఫలమును నీవు పొందియున్నావు'' అని యేసు చెప్పారు (మత్తయి 6:2). ఎందుకంటే నీ ప్రార్థన ద్వారా దేవుడు మహిమ పొందవలెనని కాదు గాని, నీ వెంత    చక్కగా ప్రార్థించగలవో ఇతరులు తెలుసుకోవాలని నీ కోర్కెగానున్నది. అటువంటప్పుడు ఆ ఫలమును నీవు పొందుదువు. అయితే అది మాత్రమే నీవు పొందుదువు. అదే నీవు    కోరుకొన్నావు. కాబట్టి అదే నీవు పొందుదువు.

    క్రైస్తవ జీవితములో నుండిన నియమము యిదే. అది మన పెదవులతో ఏది అడుగుతున్నామనేది కాక మన హృదయ లోతుల్లో దేనికొరకు ఆశపడుతున్నామో అది మనము పొందుదుము. నీవు    వెదకినప్పుడు నీవు నిజముగా దేనిని వెదకుదువో దానిని కనుగొందువు!

    మనము క్రీస్తు తీర్పు సింహాసనము ముందు నిలువబడినప్పుడు, మనము కప్పుకొనిన ప్రతి పొరతీసివేయ బడుతుంది. అక్కడ మనము ఇంక నటులవలె కాక మన యొక్క నిజస్థితిలోనే    చూచుకొనుమని, లేనట్లయితే ఒక రోజున అక్కడ అన్ని విప్పబడి, నగ్నంగా సిగ్గుపడుతూ నిలబడవలసి వచ్చును అని బైబిలు చెప్పుచున్నది.

    1యోహాను 2:28 ''కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి'' అని    చెప్తుంది. ఆ రోజున ఎవరైతే ఈ లోకములో జీవించినంత కాలము నటులుగా జీవించారో వారు సిగ్గుపడుదురు. నేనిప్పుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాను. కొండమీద ప్రసంగం ఎవరికి    భోధింపబడింది? మీరు మత్తయి సువార్త 5:1,2 చూచినట్లయితే, యేసు ప్రభువు ఆ మాటలను ఆయన శిష్యులతో చెప్పినట్లు చూచెదము. ఆయన శిష్యులతో ''మీ నీతిక్రియలు మనుష్యుల    యెదుట చేయకుండునట్లు జాగ్రత్తపడుడి'' (మత్తయి 6:1) అని చెప్పారు. తన శిష్యులతోనే ''పరిసయ్యుల వేషధారణ అను పులిసినపిండిని గూర్చి జాగ్రత్తపడుడి'' అని చెప్పారు    (లూకా 12:1).

    వెలుగులో నడచుట

బైబిలు 1యోహాను 1:7లో మనము వెలుగులో నడువకపోయినట్లయితే మనకు దేవునితో సహవాసముండదని చెప్తుంది. మనము వెలుగులో నడచినట్లయితే, వెలుగు ప్రతి దానిని    కనబడేటట్లు చేయును. కాబట్టి, మనము దేనినీ దాచలేము. చీకటిలో నడిచే వ్యక్తికి తన జీవితములో దాచేవి కొన్ని ఉండును. మనము వెలుగులో నడచినట్లయితే మన జీవితము ఒక తెరచిన    పుస్తకమువలె నుండును. అప్పుడు మనము ప్రజలను వచ్చి ఇతరులకు కనబడని మన జీవితాలను, మన పద్దు పుస్తకాలను ఇంకా దేనినైనా చూచుకోమని వారికి చెప్పగలిగి యుందుము. మనము    దాచుటకు ఏమీ ఉండదు. దాని అర్థము మనము అన్నిట్లో సంపూర్ణులమని కాదు, దాని అర్థము కేవలము మనము నిజాయితీపరులమని మాత్రమే.

    మనందరి నుండి దేవుడు మొదటగా కోరుకొనేది నిజాయితీ - సంపూర్ణమయిన నిజాయితీ. మనము మొదట నిజాయితీగా ఉండుటకు యిష్టపడినట్లయితే, మన సమస్యలలో చాలావరకు చాలా త్వరగా    పరిష్కారమైపోతాయి. మనము దేవుని ఎదుట మరియు మనుష్యుల యెదుట నిజాయితీగా నుండుట అను ప్రాథమిక సూత్రాన్ని బట్టి జీవించినట్లయితే మన ఆత్మీయ స్థితి పరుగులిడ్తూ    ముందుకు వెళ్తుంది.

    కాని ఇది ఒక పోరాటమని నీవు కనుగొనెదవు. నీవు ''నేను ఈ హెచ్చరికను చాలా తీవ్రముగా తీసుకొనెదను. ఇప్పటినుండి నేను నిజాయితీగా ఉండెదను'' అనొచ్చు. కాని, ఈ వారం    పూర్తవకముందే, నీవు తిరిగి నటుడుగానుండుదువు శోధించబడుదువు మరియు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పు కోరుకొందువు. కనుక నీవు ఆ యుద్ధములో గెలుపొందునట్లు    పోరాడుటకై నిర్ధారించుకొనవలెను.

    ఈ రోజున అనేకమంది క్రైస్తవులు ఇరవై, ముప్పై, నలభై సంవత్సరాలుగా తిరిగి జన్మించిన అనుభవం కలిగియుండికూడా, వారు నిజాయితీగా నుండుట అను ప్రాధమిక పాఠాన్ని    నేర్చుకొనకపోవుటచేత వారు ఆత్మసంబంధంగా ఎదుగకపోవుటచూచి దేవుడు ఎంతగానో బాధపడును. మన జీవితంలో వేషధారణ ఉండినట్లయితే మనము ఆత్మసంబంధంగా ప్రగతి సాధించలేము. మన    ప్రార్థనలు దేవునికి వినబడునట్లుగా నుండవు. మనకు రాత్రంతా ప్రార్థించే ప్రార్థనా కూటములు ఉండవచ్చును. కాని, అది సమయాన్ని వృథాచేయుటయే. మొదట మనలో నుండిన    వేషధారణను మనము తీసివేయనట్లయితే మన ప్రార్థనలు దేవునికి వినబడవు.

    మన నిజమైన ఆత్మీయ విలువ మనము దేవుని యెదుట ఎలా ఉంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది తప్ప అంతకుమించి మరిదేనిపైనా అది ఆధారపడదని మనము గమనించాలి. మన ఆత్మీయస్థితి,    మనకున్న బైబిలు జ్ఞానము బట్టికాని, లేక మనమెంత ప్రార్థిస్తున్నామన్న విషయంబట్టికాని, ఎన్ని కూటములకు వెళ్లామను దానిబట్టికాని లేక సంఘములో పెద్దలు లేక ఇతరులు    మనగురించి ఏమనుకుంటున్నారు అను దానిని బట్టి గాని నిర్ధారించబడదు. దానికి బదులుగా, ''నా జీవితములో అన్ని విషయాలను చూడగలిగే దేవుడు నా గూర్చి ఏమనుకుంటున్నాడు''    అని నీకు నీవు ప్రశ్నించుకో. దానికి వచ్చే జవాబే నీవు ఎంత ఆత్మానుసారముగా నున్నావనుదానికి కొలత. ఈ విషయాన్ని మనము ప్రతి దినము జ్ఞాపకము తెచ్చుకోవాల్సియుంది.    లేనట్లయితే మనము మరల నటులుగా మారిపోవుదుము.

    ''ఇదిగో - ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునులేదు'', అని యేసు నతానియేలు గూర్చి చెప్పిన మాటలు (యోహాను 1:47) నేనెంతో యిష్టపడతాను. యేసు నీ గూర్చి,    నా గూర్చి అట్లు చెప్పినట్లయితే, అది దేనికంటే కూడా గొప్పదైన మెప్పుకోలు. నతానియేలు అన్ని విషయాల్లో సరిగానున్నవాడు కాడు. అతడు అసంపూర్ణుడే కాని అతడిలో నుండిన    లోపముల విషయములో అతడు నిజాయితీగా ఉండెను. అతడేదో లేనిది ఉన్నట్లు చూపించుకొనువాడుకాడు. అక్కడే అతడు అననీయ, సప్పీరాలకు వేరుగా నున్నాడు.

    వ్యర్థమైన మాటలు విస్తరించి మాట్లాడుటతో కాదు

    యేసు ప్రభువు మనలను హెచ్చరించిన రెండవ విషయం, అన్యజనులు ప్రార్ధించినట్లు అర్థము లేకుండా ఒకే మాటను అనేకమార్లు చెప్పుటను గూర్చి.

    మనము ఎన్ని మాటలను ఉపయోగించామని కాకుండా మన హృదయంలో నుండిన ఆశను దేవుడుచూచును. నిజమైన ప్రార్థన మన హృదయంలో నుండిన ఆశయే. ఆ ఆశ దేవుని యొద్దకు చేరి జవాబును    తెచ్చును.

    నీవు మాటలను పలుమార్లు ఉచ్చరించునప్పుడు నీవు చెప్పే మాటలు నిజముగా నీ మనసుతో అర్థవంతముగా చెప్తున్నట్లయితే తప్పేమీలేదు. గెత్సెమనె వనములో యేసు ప్రభువు ఒకే    మాటలను మూడుసార్లు పలుకుతూ ప్రార్థించారు (మత్తయి 26:44). కాని, ఆయన మాటలు ఊరకనే పలుమార్లు ఉచ్చరించినవికావు. ఆయన ప్రార్థించిన ప్రతిసారి ఆ మాటలు ఆయన హృదయములో    భారముతో వచ్చినవి. నీవు ఒకే మాటలతో రోజుకు పదిసార్లు ప్రార్థించవచ్చు, నీవు ప్రతిసారి నిష్కల్మషంగా నీ హృదయమునుండి ప్రార్థించినట్లయితే, దేవుడు నీ ప్రార్థన    వినును.

    క్రైస్తవులు మిగిలిన అన్నిరోజులు కంటే ఆదివారమున దేవునితో ఎక్కువ అబద్దములను చెప్పిన దోషములో నుందురు. ఎందుకో నీకు తెలుసా? వారు ఆదివారమున ''యేసుస్వామి నీకు నా    సమస్తము'', ''నావన్నీ యంగీకరించుమీ'' మొదలైన ఎన్నో పాటలు పాడుచుందురు. ఆ మాటలు పాటల పుస్తకములో ఉన్నవి కాబట్టి నీవు వాటిని పాడవచ్చును. కాని నీవు ఆ మాటలను    నిజముగా పలుకుటలేదు. అయితే నీవు అటువంటి పాటలు పాడుచున్నప్పుడు నీవు సూటిగా దేవునితో మాట్లాడుతున్నావని నీవు గ్రహించుటలేదు. బహుశా నీవు వాటిలోని మాటలకంటే రాగంపై    ఎక్కువ మనసు పెడుతూ ఉండవచ్చును. అప్పుడే నీవు దేవునికి అబద్దాలు చెప్తున్నావు.

    మనము మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినమున లెక్క అప్పగించవలెనని యేసు చెప్పారు (మత్తయి 12:36). దేవునికి భయపడని క్రైస్తవ తరములో మనము జీవిస్తున్నాము    కాబట్టి మన ప్రభువు ఇచ్చిన అట్టి హెచ్చరికలు తీవ్రంగా తీసుకోబడుట లేదు. ఊరకనే పలుమార్లు ఒకే విషయాన్ని ఉచ్చరించడం, దేవుని సన్నిధికి అశ్రద్ధగా వచ్చి, పైపై మాటలు    పలికే క్రైస్తవేతరుల యొక్క గుర్తు. అది మన ప్రార్థనల్లోనూ లేక మన పాటలలోనూ ఉండకూడదు.

 

    దీర్ఘప్రార్థనలయందు నమ్మిక యుంచుకొనవద్దు

    క్రైస్తవేతరులు వారు అనేక మాటలు చెప్పుటవలన వారి ప్రార్థనలు వినబడునని అనుకొందురని యేసు చెప్పారు. కొందరు విశ్వాసులు వారు రాత్రి అంతయు ప్రార్థించుటను బట్టి,    వారు ఎంతో సేపు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారికి జవాబిచ్చునని అనుకొందురు. అటువంటి ప్రార్థనలు క్రైస్తవేతరుల ప్రార్థనా తీరుకు గుర్తు.

    కర్మెలు పర్వతముపై ఏలియా ఒక ప్రక్కను, అన్యజనుల దేవుడైన బయలు యొక్క ప్రవక్తలు 450 మంది వేరొక ప్రక్కనునిలచి నిజమైన దేవునిని ఋజువు పరుచుకొనుట కొరకు ఇరువైపులవారు    ప్రార్థించిన సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. బయలు ప్రవక్తలు చాలా దీర్ఘమైన ప్రార్థనా కూడిక ఏర్పాటుచేసారు. వారు ప్రార్థించి, ప్రార్థించి మరి ఎక్కువ ప్రార్థించారు.    అటు తరువాత వారు గంతులువేస్తూ, నాట్యమాడ్తూ కేకలువేసారు. అయినను అగ్ని దిగిరాలేదు. దేవుడు వారి హృదయములలోనికి చూచి, వారి ఉద్రేక పూరితమైన అరుపులకు కేకలకు    ముగ్దుడుకాలేదు (1రాజులు 18:20-29).

    క్రైస్తవులలో కూడా అలా ప్రార్థించే వారున్నారు. వారి యొక్క ఉద్రేకమునుబట్టి మరియు వారు చేసే శబ్దాన్నిబట్టి దేవుడు వారి ప్రార్థన వింటాడని అనుకొంటారు.

    అప్పుడు ఏలియా ప్రార్థించాడు. అతడి ప్రార్థన ఒక నిమిషంకంటే తక్కువగా ఉన్నది. కాని, అది అగ్ని దిగివచ్చునట్లు చేసినది. అదే అసలైన పరీక్ష అంతేకాని నీవు ఒక నిమిషం    ప్రార్థించావా లేక రాత్రంతా ప్రార్థించావా అనేదికాదు కాని, దేవుడు జవాబిచ్చాడా లేదా అనేది! ''మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కాని, యెహోవా హృదయమును    లక్ష్యపెట్టును'' (1సమూ 16:7).

    ''నీతిమంతుని విజ్ఞాపన మన:పూర్వకమైనదై బహుబలము గలదైయుండును'' (యాకోబు 5:16). యాకోబు అక్కడ ఏలియా గూర్చిన ఉదాహరణను చెప్పుచుండెను. ఏలియా ఎన్నో గంటలు కేకలు వేయుట    చేత కాదు కాని, ఏలియా నీతిమంతుడైయుండుట చేత అతడి ప్రార్థనకు జావాబు వచ్చెను. ప్రార్థన వెనుకనుండిన జీవితం ఆ ప్రార్థనను బలము గలదిగా చేయును. మనము అదెప్పుడూ    మరచిపోకూడదు.

    ఇవన్నీ యేసు ప్రభువు తన శిష్యులకు, వారు ఎలాగు ప్రార్థించాలో నేర్పించుటకు ముందు నేర్పించిన కొన్ని ప్రాధమిక పాఠాలు. మనము ఎట్లు ప్రార్థించకూడదో ముందు    నేర్చుకొనకపోయినట్లయితే, మనము ఎట్లు ప్రార్థించవలెనో ఎప్పటికీ నేర్చుకొనలేము.

    ఇక్కడ ఆఖరుగా ఒక మాట చెప్తాను, లేనట్లయితే నన్ను తప్పుగా అర్థము చేసుకోవచ్చు.

    రాత్రి అంతా ప్రార్థించుటలో తప్పేమీలేదు. యేసు ప్రభువే ఒకసారి రాత్రి అంతా ప్రార్థించారు (లూకా 6:12). అయితే యేసు ఖండించింది ఎక్కువ ప్రార్థించడం కాదు. కాని    ఎక్కువ మాటలపై నమ్మిక ఉంచుట. ఎక్కువ ప్రార్థించుటకును, ఎన్నో మాటలు పలుకుటకును ఎంతో వ్యత్యాసమున్నది. మన ప్రార్థన కేవలం ఎన్నో వ్యర్థమైన పలుమార్లు వల్లించే    మాటలతో ఉండినట్లయితే అది సమయాన్ని వ్యర్థపుచ్చుటయే. యేసు ప్రభువు హృదయము దేవుని యెదుట సరిగా ఉన్నది మరియు ఆయనకు దేవుడిచ్చిన భారమున్నది కావున ఆయన రాత్రి అంతా    ఎంతో బలముగా ప్రార్థించగలిగాడు.

    ఏమయినప్పటికీ ప్రార్థనలో మనము గడిపిన కాలాన్ని బట్టి దేవుడు మనకు జవాబిస్తాడా లేదా అనేది నిర్ధారింపబడదు. ప్రార్థించే వ్యక్తి యొక్క జీవితము దానిని    నిర్ధారించును.

అధ్యాయము 2
మన తండ్రియైన దేవుడు

    ''పరలోకమందున్న మా తండ్రీ'' (మత్తయి 6:10)

    చిన్న పిల్లలు సాధారణముగా యేసు ప్రభువుకు ప్రార్థించుదురు. అందులో తప్పేమీలేదు. కాని యేసుప్రభువు తన శిష్యులకు నేర్పించిన ఒకే ఒక ప్రార్థనలో, వారి ప్రార్థనలు    తండ్రియైన దేవునిని సంబోధిస్తూ ప్రార్థించమని నేర్పించిన విషయం జ్ఞాపకం ఉంచుకొనుట మంచిది. మనము ఆత్మలో, కుమారుని ద్వారా తండ్రికి ప్రార్థించుదుము.

    అయితే అందరూ దేవునిని తండ్రీ అని సంబోధించలేరు. ఈ భూమిపై నీవు ఎవరి ద్వారా జన్మించావో అతడినే నీవు తండ్రీ అని పిలువగలవు. మనము దేవునికి ప్రార్థించునప్పుడు కూడా    ఇది గుర్తుంచుకొనవలెను. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపముల నుండి తిరిగి, యేసుక్రీస్తును తన జీవితమునకు ప్రభువుగా తనను తాను లోబరచుకొనునో అతడు దేవుని బిడ్డగా    తిరిగి జన్మించిన వాడవును. అప్పుడు మాత్రమే అతడు దేవునిని తండ్రిగా పిలవగలడు.

    క్రొత్త నిబంధనలో మనకున్న ఆధిక్యత

    ఇశ్రాయేలీయులు దేవునిని ఎప్పుడూ వారి తండ్రియని పిలువలేకపోయిరి. ఆ పిలుపు మొట్టమొదటిసారిగా యేసుప్రభువే పరిచయం చేసారు. యేసుప్రభువు తన పరలోకపు తండ్రితో    సంభాషించినప్పుడెప్పుడూ ఇదే పిలుపును ఉపయోగించేవారు. దేవునిని తండ్రీ అని పిలుచుట ఎంత గొప్ప భాగ్యమో మనము గ్రహించడంలేదు.

    పాత నిబంధనలో దేవాలయములో ఒక తెరనుఉంచి, దాని వెనుక అతి పరిశుద్ధ స్థలమును, ఆయన నివాస స్థలముగా ఉంచుట ద్వారా దేవుడు యూదులకు ఆయన యొక్క సమీపించరాని పరిశుద్ధత    గూర్చి తెలిపెను. ఈ స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు తప్ప ఏ మనుష్యుడు వెళ్ళరాదు. ఒకవేళ 2500 సంవత్సరాల క్రితం నీవు ఆ యూదుల యొద్దకు వెళ్ళి ఒక    రోజున దేవుని సన్నిధిలోనికి ఎవ్వరైనా స్వేచ్ఛగా ప్రవేశించునట్లు ఆయన ఒక మార్గమును తెరచునని నీవు చెప్పినట్లయితే వారు అది అసాధ్యమని కొట్టి పారవేసియుందురు.

    అయితే క్రొత్త నిబంధన క్రింద ఈనాడు మనకు ఇవ్వబడిన ఆధిక్యత ఇది. ఆ అతి పరిశుద్ధ స్థలమునకు అడ్డుగానున్న తెర ఇప్పుడు చినిగిపోయెను. కాబట్టి మనమిప్పుడు తండ్రి    సన్నిధికి వెళ్లుటకు అవకాశమొచ్చినది. అందువలన మనమిప్పుడు ఆయనను ''తండ్రి'' అని పిలవగలుగుచున్నాము. మనకు క్రొత్త నిబంధన ద్వారా వచ్చిన ఆధిక్యతలను గూర్చి తగినట్లు    సంతోషించాలంటే మనము పాత నిబంధన చదవాలి.

    తప్పిపోయిన కుమారుని ఉపమానములో దేవుని యొక్క తండ్రిహృదయమును చూచుట అద్భుతముగా నుండును. కుమారుడు తన తండ్రి సంపాదించిన ఆస్థిని వ్యర్థముచేసి తండ్రి పేరును    పాడుచేసి తిరిగివచ్చును. అయితే తండ్రి ఆ కుమారుని చూచిన వెంటనే, అతడిని కౌగిలించుకొనుటకు పరిగెత్తివచ్చును. బైబిలులో తండ్రియైన దేవుడు పరిగెత్తినట్లుండే దృష్యము    అదొక్కటే - అది ఒక పశ్చాత్తాపపడిన పాపిని కౌగిలించుకొనుట కొరకు (లూకా 15:20).

    యేసు ప్రభువు దేవునిని ప్రజలకు అట్లు చిత్రీకరించారు. అంతవరకు వారికి శాస్త్రులు పరిసయ్యులు దేవుని గూర్చి చెప్పిన అభిప్రాయములను వారి ఆలోచనలలో నుండి తుడిచి    వెయ్యాలని ఆయన ఉద్దేశించారు.

    ఆయన పునరుత్థానుడైన తరువాత, సమాధి బయట మగ్దలేనే మరియ యేసుప్రభువును కలుసుకొన్నప్పుడు, యేసు ఆమెతో ''నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని    యొద్దకు ఎక్కిపోవుచున్నాను'' (యోహాను 20:17) అని చెప్పెను. యేసుక్రీస్తు మరణము మరియు పునరుత్థానము ద్వారా, ఆయన శిష్యులు దేవునితో అంతకుముందెన్నడూ లేని    సంబంధములోనికి వచ్చారు. ఇప్పుడు వారు దేవునిని తమ స్వంత తండ్రిగా పిలువగలరు. ఒక బిడ్డ తన తండ్రి ఒడిలో కూర్చొన్నట్లుగా, ఇప్పుడు మనుష్యుడు దేవునితో అంతచనువుగా    ఉండవచ్చును.

    ఒక ప్రేమగల తండ్రి

    తండ్రియైన దేవుడు చాలా కరిÄనుడని మరియు యేసుప్రభువు మాత్రమే వారిని ప్రేమిస్తున్నాడని చాలా మందికి తప్పుడు అభిప్రాయమున్నది. ఇది సాతాను వలన చెరపబడిన సత్యము.    తండ్రి యొక్క ప్రేమే మనలను పాపములనుండి రక్షించుట కొరకు యేసుప్రభువును పంపినది. ''తండ్రితానే మిమ్మును ప్రేమించుచున్నాడు'' అని యేసుప్రభువు తన శిష్యులకు    చెప్పెను (యోహాను 16:27). పరలోకపు తండ్రి ఆకాశపక్షులకు ఆహారమునిచ్చి మరియు అడవిలో పువ్వులను అలంకరించినయెడల, ఆయన తప్పక మీ గురించి జాగ్రత్త తీసుకొనును అని కూడా    ఆయన వారితో చెప్పెను. వారి అవసరములన్నియు వారి పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి, వారు చింతపడవలసిన అవసరమేమీలేదు (మత్తయి 6:26-34).

    ఈ లోకతండ్రులు వారి బిడ్డలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా, పరలోకపు తండ్రి మరి తప్పనిసరిగా ఆయన బిడ్డలకు మంచి విషయములనిచ్చునని ఆయన వారికి చెప్పెను (మత్తయి    7:11).

    ఇవన్నీ కూడా చాలా ప్రాధమికమైనవని నీవనవచ్చును. అయినప్పటికి మనము అనేక మార్లు దేవుని యొద్దకు ప్రార్థించుటకు వచ్చినప్పుడు ఆయన మనము అడిగినవి నిజముగా ఇస్తాడని    మనము నమ్మము. దానికి కారణం మనకు ఆయన యొక్క మృధువైన, ప్రేమకలిగిన తండ్రి మనసు యందు నమ్మకముండకపోవుటయే. ఆ విధముగా మన అపనమ్మకము ద్వారా దేవునికి హద్దులు    ఏర్పర్చుచున్నాము. నీవు ప్రార్ధించునప్పుడు, నీ మాటలు వినుటలో సంతోషించి నీ గూర్చి జాగ్రత్త తీసుకొనే ఒక ప్రేమగల తండ్రితో నీవు మాట్లాడుతున్నావని నీవు నిజముగా    నమ్ముచున్నావా?.

    వారు పరిపక్వత చెందిన పరిశుద్ధులైతేనే దేవుడు వారిని వినునని కొందరు అనుకొనవచ్చును. ఈలోకపు ఒక తండ్రి విషయంలో ఎలాగుంటుంది? అతడికి కొందరు పిల్లలుండగా, అతడు తన 3    సంవత్సరాల కుమార్తె కంటే ఎక్కువగా 20 సంవత్సరాల కుమారుని మాట వినునా? ''నీవు నాతో మాట్లాడుటకు చాలా చిన్నదానవు నీ మాటలు నేను వినలేను అనునా?'' అలా ఎప్పటికీకాదు.    నిజానికి ఆ తండ్రి తన ఇతర పెద్ద పిల్లల కంటే చిన్న బిడ్డ మాటలు వినుటకే ఎక్కువ ఇష్టపడును. దేవుడు కూడా అంతే. ''వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలు పర్యంతరము అందరు    నన్ను (తండ్రిగా) తెలిసికొందురు'' (హెబ్రీ 8:11) అని వ్రాయబడెను. అక్కడ చిన్నవారి గూర్చి మొదట చెప్పబడుట గమనించాలి.

    నీవు నిన్ననే తిరిగి జన్మించిన వాడవైననూ, నీవు ధైర్యముగా దేవుని మొద్దకు వచ్చి ''ఓ దేవా, నీవు నా తండ్రివి, నేను నీ బిడ్డను, అందువలన నీతో మాట్లాడుటకు నాకు    హక్కు ఉన్నది'' అని చెప్పవచ్చును. ఈ విధముగా యేసుప్రభువు తన శిష్యులను దేవుని యొద్దకు ప్రార్ధనతో వెళ్ళమని ప్రోత్సహించెను.

    మనము ప్రార్థించిన ప్రతిసారి, మనలను ప్రేమించి, మనకొరకు జాగ్రత్త తీసుకొని మన యెడల ఆసక్తి గల తండ్రి యొద్దకు వెళ్తున్నామన్నట్లుగా దేవుని యొద్దకు వెళ్ళవలెను.    అలా మాత్రమే విశ్వాసము ప్రారంభమవుతుంది. మరియు విశ్వాసము లేకుండా ప్రార్థించుట వలన ఏ ఉపయోగము లేదు.

    దేవుడు మంచిదేవుడు. తన బిడ్డలకు మంచి ఈవులనిచ్చుటలో సంతోషిస్తాడు. ''యదార్ధముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలు చేయక మానడు'' అని బైబిలు చెప్పుచున్నది (కీర్తనలు    84:11). ''యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును'' అని కీర్తన 37:4లో చెప్పబడినది. పాత నిబంధనలో నుండిన ఈ వాగ్దానములు క్రొత్త నిబంధనలో యేసు    ప్రభువు మిగిలిన ఎన్నో వాగ్దానములతో కలపి అంగీకరిస్తూ స్థిరపరిచారు. దేవుడు మనలను ప్రేమించే తండ్రిగా తెలుసుకొని ఒప్పుకొనుట మన విశ్వాసమునకు పునాది.

    ఒక పరిశుద్ధుడైన దేవుడు

    మనము దేవునిని పరలోకమందున్న తండ్రిగా సంబోధించవలెను. ఆయన మన తండ్రి మాత్రమే కాకుండా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మనము ఆయనను ప్రార్థించుటకు సిద్ధపడినప్పుడు ఈ    రెండు వాస్తవాలను మన మనస్సులో ఉంచుకొనవలెను.

    దహించు అగ్నియైయున్న దేవుడు (హెబ్రీ 12:29) కాబట్టి ఆయన యొద్దకు పూజ్య భావముతో రావలెను. చాలామంది క్రైస్తవులు దేవునిని ఒక తాతగారిలా ఊహించుకొందురు!! కుటుంబములో    తాతలు ఎలా ఉంటారో మీకు తెలుసు. వాళ్లెప్పుడూ వారి మనుమలు చేసే ఎటువంటి తప్పిదములనైనా పట్టించుకొనకుండా సౌమ్యముగా యుందురు.

    చాలామంది క్రైస్తవులు దేవుని గూర్చి అలాగే ఊహించుకొని వారి పాపముల విషయమై తీవ్రముగా తీసుకొనరు. అటువంటి ఆలోచన పూర్తిగా తప్పు. దేవుడు ఒక తండ్రి. కాని ఆయన    దేవుడైయున్నాడు. ఆయన యెదుట పరలోకపు కెరూబులు తమ ముఖమును కప్పుకొని, ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు'' అని ఎల్లప్పుడూ స్తుతిస్తూయుందురు (యెషయా 6:3). ఆ కెరూబులు    ఎప్పుడూ పాపము చేయలేదు. అయినప్పటికి దేవుని యొద్దకు వెళ్లునప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను చూడలేక వారి ముఖములను కప్పుకొనుచుందురు. ఇది మన పరిమితి కలిగిన    మనస్సులు ఎప్పుడూ అర్థము చేసికొనలేని దేవుని అనంతమైన పవిత్రత గూర్చి తెలియజేయుచున్నది.

    బైబిలులో నున్న కొందరు గొప్ప దైవజనుల విషయంలో దేవుని దర్శనము ఏమిచేసినదో ఆలోచించండి. దేవునిని చూచినప్పుడు యెషయా తాను ఒక ఘోరమైన పాపినని అనుకొన్నాడు (యెషయా    6:5). దేవునిని చూచుటకు భయపడి మోషే తన ముఖమును కప్పుకొన్నాడు (నిర్గమ 3:6). దానియేలు తనలో నుండిన శక్తి అంతాపోయినట్లుగా అనుకొన్నాడు (దానియేలు 10:8). మరియు    అపొస్తులుడైన యోహాను ఒక చనిపోయిన వానివలె పడిపోయాడు (ప్రకటన 1:17).

    చాలామంది క్రైస్తవులకు దేవుణ్ణి ఈ విధముగా యెరిగియుండకపోవుట చేత వారి జీవితాలు లోతులేకుండా బాహ్యమైన అనుభవాలతోనే యుండును.

    ప్రజలు దేవుని యొద్దకు వెళ్ళునప్పుడు రెండు విపరీత పద్ధతులలో వెళ్లుదురు. కొందరు దేవుడు సమీపించరానివాడు అనుకొనుట చేత ఆయన యొక్క ప్రేమ గూర్చి ఏ మాత్రము తెలియక,    ఆయనంటే భీతితో ఎప్పుడూ ఆయనను వేరువేరు పద్ధతుల ద్వారా శాంతింపజేస్తూ ఉండాలని అనుకొందురు. వేరొక ప్రక్క కొందరు క్రైస్తవులు దేవునితో పరిశుద్ధము కాని చనువును    చూపిస్తూ, ఆయన దహించు అగ్నిగా ఆయనకు ఏ మాత్రము భయపడకుండాయుందురు.

    దేవుని యెడల పూజ్యభావము లేకుండా ఆయన యొద్దకు వెళ్ళువాడు దేవునిని ఏ మాత్రమూ ఎరుగనివాడు. మనము ఆయనను ఎంతగా ఎరిగియుంటే అంతగా ఆయనకు ప్రార్థించినప్పుడు భయపడి ఆయన    యెడల పూజ్యభావము చూపించుదుము. ఆయన మన తండ్రి కాబట్టి ఆయన యొద్దకు ధైర్యముతో వచ్చుదుము. కాని ఆయన దేవుడు కాబట్టి, ఆయన యొద్దకు మనము పూజ్యభావముతో కూడా రావలెను.

    పౌలు వ్రాసిన పదమూడు పత్రికలను (రోమీయుల నుండి ఫిలేమోను వరకు), ఆయన ఎప్పుడూ ''మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానము'' అను శుభవచనములతో వ్రాయుటకు    ప్రారంభించేవాడని మీరు గమనించారా. పౌలు ఆయనను తండ్రిగా మరియు దేవునిగా యెరిగెను, ఇతరులు కూడా ఆయనను అలాగే తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు.

    ఒక సర్వాధికారియైన ప్రభువు

    ''పరలోకమందున్న'' అనుమాట మనము ప్రార్థించువాడు సర్వాధికారి అనియు సర్వశక్తిమంతుడనియు, ఆయన పరలోకమునుండి ప్రభుత్వముచేయు వాడనియు కూడా మనకు జ్ఞాపకము చేయును.

    పాత నిబంధనలో, దేవుడు ఆయన యొక్క సర్వాధికారమును తన ప్రజలకు తెలియజేయుచుండెడివాడు. ఆయన వారితో, ''ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి, అన్యజనులలో నేను    మహోన్నతుడునగుదును, భూమి మీద నేను మహోన్నతుడునగుదును'' (కీర్తనలు 46:10) అని చెప్పెను. ఆయన భూమి యంతటిని సర్వోన్నతమైన సర్వాధికారిగా పరిపాలిస్తున్నందున మనము    నిశ్చింతగా ఉండవచ్చు. ఈనాడు సంఘము గుర్తించవలసిన అతిగొప్ప సత్యము బహుశా దేవుని యొక్క సర్వాధికారము గూర్చియు మరియు దేశములన్నిటిపైన మరియు శక్తులన్నిటిపైన    యేసుక్రీస్తు కున్న అధికారము గూర్చియైయున్నది.

    మనలో చాలామంది జీవితకాలములో జరిగిన విషయముల గూర్చి ఆలోచించండి. ఈనాడు ఇశ్రాయేలు దేశమునకుండిన ప్రధానమైన శతృవులలో ఒకటి సోవియట్ రష్యా అని మనకందరకు తెలియును.    ఇశ్రాయేలు దేశము ఉనికిలేకుండా తుడిచి పెట్టుకుపోయినట్లయితే రష్యా సంతోషించియుండును. అయితే 1948వ సంవత్సరము మే నెలలో గ్రేట్ బ్రిటన్ పాలస్తీనా దేశమును    ఇశ్రాయేలీయులకు ఇస్తానని చేసిన వాగ్దానమును నిలువబెట్టుకొనుటలో తప్పిపోయినది. అప్పుడు ఇశ్రాయేలు ఒక రాజ్యముగా ఏర్పడుటకు ''యునైటెడ్ నేషన్స్'' అంగీకరించునట్లు    ఇశ్రాయేలు దేశమునకు అనుకూలముగా రష్యా ఓటు వేసినది. వాస్తవానికి అప్పుడు రష్యా దేశము యొక్క ఉద్దేశము పాలస్తీనా నుండి బ్రిటీషు వారిని త్రోలివేయడం. అయితే ఏది    ఏమైనప్పటికిని దేవుడు ఆయన సర్వాధికారమును బట్టి ఒక 'క్రైస్తవ' దేశముగా పిలువబడే దేశము తన వాగ్దానము నెరవేర్చకుండా వెనుక తీసినప్పుడు ఆయన మాట నెరవేరునట్లు    యూదులను తిరిగి వారి దేశమునకు తీసుకొని వచ్చునట్లు ఒక నాస్తిక దేశమును వాడుకొనెను.

    దేవుడు ఆయన సింహాసనము మీద యుండి ప్రపంచపు వ్యవహారములన్ని నియంత్రిస్తున్నాడు. మన విశ్వాసము ఈ సత్యములో వేరుపారి యున్నప్పుడే రాబోవు రోజులలో మన చుట్టూ ఏమి    జరిగినా మన హృదయములు విశ్రాంతిలో నుండగలవు.

    ప్రభుత్వము గూర్చి ప్రార్థించుమని బైబిలు చెప్తుంది (1తిమోతి 2:1,2) మన ప్రార్థనలు ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చునను నమ్మకము లేకపోయినట్లయితే అట్లు చేయుటలో    ఉపయోగము లేదు. దేవుడు ప్రభుత్వ నిర్ణయములపై చివరకు ఎన్నికల సమయములో ఓట్లపై కూడా మన ప్రార్థనలకు జవాబుగా ప్రభావము చూపునని నేను నమ్మనట్లయితే, నా మట్టుకు నేను    ప్రభుత్వపు అధికారము గూర్చి ప్రార్థించి సమయమును వ్యర్థ పుచ్చను. గతములో మేము మన దేశము గూర్చి ప్రార్థించాము, ఈ దేశములో దేవుని ఉద్దేశము నెరవేరునట్లు మా    ప్రార్థనలు అద్భుతమైన ఫలితములను తెచ్చుటను మేము చూచాము.

    ''యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలె నున్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును'' (సామెతలు 21:1). మనము ప్రార్థించినట్లయితే ప్రపంచములో నున్న    అతిగొప్ప పరిపాలకుడు కూడా తన నిర్ణయములను మార్చుకొనునట్లు దేవుడు చేయగలడు.

    భారతదేశపు ప్రధాని నీ తండ్రి అయినట్లయితే, నీవు జీవితములో ఎదుర్కొనే సమస్యలు మరియు యిబ్బందులు యెడల నీ వైఖరిలో ఎటువంటి వ్యత్యాసముండును. నీ అద్దెయింటి యజమాని    నిన్ను బెదిరించినట్లయితే లేక నీ అధికారి నీకు జీవితమును దుర్భరము చేసినట్లయితే, లేక వేరెవరో నీకు అన్యాయము చేస్తూ యుండినట్లయెతే, లేక నీకు ఏదో వెంటనే జరుగవలసి    యున్నట్లయితే, నీకు వాటి గూర్చి ఏమైనా చింతలుండునా? ఉండవు. కేవలం నీవు ఫోను ఎత్తి నీ సమస్య పరిష్కరింపుమని నీ నాన్నకు చెబితే సరిపోతుంది.

    మన ప్రభువు భారతదేశ ప్రధాని కంటె గొప్పవాడు కాడా? మనకు మన జీవితములో ఏదో ఒక సమస్య వచ్చినట్లయితే ఏమి చేస్తాము? ''సరే, దీని గూర్చి నా పరలోకపు తండ్రికి చెప్తాను    ఆయన ఈ విశ్వాన్ని పాలిస్తున్నాడు, ఈ సమస్యను తప్పక పరిష్కరించును'' అని అంటున్నామా? లేక ఇప్పుడు సహాయము చేయుటకు నాకు ఒక కేబినెట్ మంత్రి గాని లేక ఒక పోలీసు    అధికారి గాని తెలిసి ఉంటే బాగుండును అని అనుకొంటున్నామా? ఏది నీలో మొదటి స్పందన.

    అనేక మంది క్రైస్తవులు దైనందిక జీవితములో పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నాస్తికులుగా ఉందురు. వారు కూటములలోను చివరకు వారి ఇళ్లల్లోను విశ్వాసము గూర్చి    మాట్లాడుదురు. కాని ఈ లోక సంబంధమైన విషయములు వచ్చేసరికి, వారు నాస్తికుని వలె పూర్తి భయముతోను ఆతురతతోను ఉందురు.

    ఈనాడు ఎప్పుడూ లేనంత భయముంటున్నది. కడవరి దినములలో తరువాత ఏమి జరుగుతుందో అనే భయముతో జనులు హృదయములో ధైర్యము చెడి కూలుదురు అని యేసు ప్రభువు చెప్పారు (లూకా    21:26). కాని అటువంటి సమయములోనే, భయపడకుండా మన తలలు ఎత్తి క్రీస్తురాకడ కొరకు ఎదురు చూడమని హెచ్చరింపబడినాము (లూకా 21:28).

    పరిపూర్ణమైన భద్రత

    మనకు సర్వోన్నతుడైన తండ్రి యుండుట చేత మనము అనాధలము కాదు. అందువలన మనము అనాధల వలె ప్రవర్తించవద్దు. నీవు ఎప్పుడైతే భయపడుదువో లేక చింత కలిగి యుందువో, అప్పుడు    నీవు నీ పరలోకపు తండ్రిని అవమాన పరుస్తున్నావన్న మాట. అలా ఉండుట ద్వారా నీకు ఆయనపై నమ్మకము లేదని, నీ కష్ట సమయములో ఆయనకు శక్తి చాలక లేక నిన్ను పట్టించుకు పోవుట    వలన ఏమి చేయలేడని నీవు చెప్తున్నావు! అది ఒక విశ్వాసము లేని హృదయము యొక్క సాక్ష్యము.

    దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు ఆయన నీ గూర్చి అన్ని జాగ్రత్తలు తీసుకొనునని మరియు ఆయన సర్వశక్తిమంతుడని నీవు నమ్మినట్లయితే, నీవు ఎప్పుడైనా చింత కలిగి    యుండవలసిన అవసరమేమిటి? రెండు పక్షులకు సంబంధించిన ఒక పద్యము ఎప్పుడూ నన్ను సవాలు చేస్తూ ఉంటుంది.

    ఒక పిచ్చుక ఇంకొక పిచ్చుకతో,

''ఈ మనుష్యులు ఆతురత పడ్తూ దేని కొరకు పరుగిడుతూ చింత కలిగియుంటారో నాకు నిజముగా తెలుసుకోవాలని యుంది''.

    ఇంకొక పిచ్చుక చెప్పిందిలా,

''మిత్రమా, నీ గూర్చి, నా గూర్చి జాగ్రత్త తీసుకొనే పరలోకపు తండ్రి వారికి లేనందు వలనయ్యుంటుంది''.

    ''భయపడకుడి, మీరు అనేక పిచ్చుకలకంటె ఎంతో విలువైన వారు'' అని యేసు చెప్పారు (మత్తయి 10:31). యేసుక్రీస్తు మన జీవితానికి ప్రభువైనట్లయితే మరియు మనకు ఈ భూమిపై    దేవుని చిత్తమును చేయుట తప్ప మరి ఏ అభిలాష లేకుండినట్లయితే, మన చుట్టూ మనకు సంబంధించి ఏమి జరిగినా అవన్నీ మనకు ''మేలు కలుగుటకు సమకూడి జరుగును'' (రోమా 8:28).

    మనము మన తండ్రియైన దేవుని ప్రేమలో మరియు ఆయన మన కొరకు తీసుకొనే జాగ్రత్తలో పరిపూర్ణ భద్రతతో జీవించాలని ఆయన కోరుచున్నాడు. మనము జన్మించక ముందే ఆయన మనయెడల    తీసుకోనే జాగ్రత్త మొదలైనదని మనము ఒప్పింపబడవలెను. ఆయనే మన తల్లిదండ్రులు ఎవరు అనేది, మన వ్యక్తిత్వము ఎలా ఉంటుందనేది, మనము ఎంత విద్య అభ్యసిస్తామనేది, మన    మెక్కడ నివసిస్తామనేది మొదలైన వాటిని నిర్ణయించెను. మనము ఈ విషయమై ఒకమారు ఒప్పింపబడినట్లయితే, మనము ఎదుర్కొనే పరిస్థితులపై కాని, లేక మన తల్లిదండ్రులపై కాని లేక    వేరెవరిపైనా ఏ ఫిర్యాదులూ లేకుండా మనము పరిపూర్ణమైన విశ్రాంతిలో జీవించవచ్చును (కీర్తనలు 139:16).

    దేవుడు మనుష్యుల యొక్క కోపమును కూడా ఆయనను స్తుతించునట్లు చేయగలడు (కీర్తనలు 76:10). దీనికి తేటయైన ఉదాహరణను యోసేపు జీవితములో చూడవచ్చును. నీవు ఆదికాండము 37    నుండి 50 అధ్యాయములు చదివినట్లయితే, యోసేపు యెడల వేరువేరు వ్యక్తులు చేసిన చెడునంతటినీ, అతడికి మేలు కలుగునట్లు దేవుని యొక్క సర్వాధికార శక్తి ఎలా చేసిందో,    చూడవచ్చును. అదంతా యోసేపు దేవునికి నమ్మకముగా ఉండుటవలన జరిగినది.

    తల్లి దండ్రులను సన్మానించు వారు దీర్ఘాయుష్మంతులవుదురని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దాన మిచ్చెను (ఎఫెసీ 6:2,3). అట్లు విధేయత చూపు వ్యక్తిని దేవుడు శతృవుచే    హత్య చేయబడకుండా లేక కేన్సరు రోగముతో మరణించకుండా లేక ఒక రోడ్డు ప్రమాదము మొదలైన వాటిలో మరణించకుండా కాపాడలేక పోయినట్లయితే దేవుడు అటువంటి వాగ్దానము    ఎట్లుచేయగలడు. దేవుడు ఈనాడు కూడా అట్లు కాపాడగలడు. కేవలము మన యొక్క అపనమ్మకమే దేవుని యొక్క సర్వాధికారము ద్వారా వచ్చే మేలులను మనము పొందకుండా చేస్తుంది.

    ఒక కుటుంబము యొక్క తండ్రి

    చివరగా, మనము దేవునిని ''నా తండ్రి'' అని కాక ''మా తండ్రి'' అని పిలువమని యేసు ప్రభువు చెప్పిన మాట గుర్తుంచుకొనవలెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయమున్నది. ఇది    ఒక కుటుంబ ప్రార్థన. నేను ఆయన యొద్దకు వచ్చిన ప్రతిసారి, నా పరలోకపు తండ్రికి అనేక మంది బిడ్డలున్నారని నేను గుర్తించవలసి యున్నది. ఆయనకున్న అనేక మంది బిడ్డలలో    నేను ఒక్కడినే. ఈ కుటుంబములో ఏ ఒక్కరూ ఇంకొకరి కంటె ఎక్కువ ఆధిక్యత కలవారు కాదు. అందరు సమానమే. ఆయన మన తండ్రి.

    ఈ కుటుంబములో నున్న నా తోటి ఇతర విశ్వాసులతో నా యొక్క సంబంధము సరిగా లేనట్లయితే దేవునితో నాకు సరైన సంబంధం ఉండదు. సిలువకు రెండు కమ్ములుండును. ఒకటి నిలువు    మరియొకటి అడ్డము. సహవాసమునకు కూడా నిలువు మరియు అడ్డముగా నుండు కమ్ములుండును. వేరే మాటలలో చెప్పవలెనంటె, దేవుని కుటుంబములో నుండిన నా యొక్క సహోదర సహోదరీలతో నా    సంబంధము సరిగా లేక పోయినట్లయితే, వారితో నేను సరిగా మాట్లాడలేక పోయినట్లయితే, వారిలో ఎవరి పైనైనా నాకు కక్ష యుండినట్లయితే లేక ఎవరిపైనైనా కోపముండినట్లయితే లేక    ఎవరినైనా క్షమింప నట్లయితే, అటువంటప్పుడు దేవుని యొద్దకు ''మా తండ్రీ'' అంటూ రాలేను. నేను క్షమించనటువంటి ఆ వేరొక వ్యక్తికి కూడా ఆయన తండ్రే కదా?

    క్రీస్తు శరీరములో ఎవరినైనా మనము తృణీకరించినట్లయితే మనము దేవుని యొద్దకు రాలేము. పరిసయ్యుడు ఎలా ప్రార్థించాడో నీవు జ్ఞాపకం తెచ్చుకో, ''ప్రభువా, నేను ఇతరుల    వలె లేక ఈ సుంకరి వలె లేనందుకు నీకు వందనములు'' (లూకా 18:11). అటువంటి వైఖరితో మనము దేవునికి ప్రార్థించలేము. దేవునికి సంబంధించినంత వరకు నీ సాంఘిక స్థితి కాని,    నీ విద్య కాని చివరకు నీ ఆత్మానుసారత కాని ఇంక ఏది కాని నిన్ను నీతోటి విశ్వాసుల కంటె ఏ విధంగానూ ఎక్కువ చేయుట లేదని గ్రహించి నీ తోటి విశ్వాసులందరి స్థానమునకు    దిగివచ్చుటకు నీవు యిష్టపడనట్లయితే నీవు ఈ ప్రార్థన చేయలేవు. మన మందరము ఒక కుటుంబములో సభ్యులము.

    ప్రతి స్థానిక సంఘములో నున్న సహవాసము ఒక కుటుంబము వంటి వాతావరణము కలిగి యుండాలని, అక్కడ సహోదర సహోదరీలు కుటుంబ సభ్యుల వలె యుండాలని మరియు క్రొత్తవారు    వచ్చినప్పుడు వారికి ఒక కుటుంబములోనికి వచ్చిన భావము కలగాలని దేవుడు ఉద్దేశించాడు. ఎక్కడైతే అలా లేదో, అక్కడున్న దేవుని బిడ్డలు యేసు ప్రభువు ఈ ప్రార్థనలో    నేర్పించిన వాటిని గ్రహించడంలో తప్పిపోయినట్లే.

    కనుక మనము ప్రార్థించిన ప్రతిసారి, మనము ఈ విధముగా దేవుని యొద్దకు సమీపించుదుము:

   

 • ఆయనను తండ్రిగా మరియు ఆయన ప్రేమగల సంరక్షణ గుర్తించుట వలన ఆయన యొద్దకు ధైర్యముతో వచ్చుదుము.
 •     
 • ఆయనను పరిశుద్ధుడైన తండ్రిగా గుర్తించుట వలన, ఆయన యొద్దకు పూజ్యభావముతో వచ్చుదుము.
 •   
 •   ఆయనను పరలోకమందున్న సర్వాధికారిగా గుర్తించుట వలన, ఆయన యొద్దకు విశ్వాసముతో వచ్చుదుము మరియు
 •      
 • ఆయనను ఒక పెద్ద కుటుంబమునకు తండ్రిగా గుర్తించుట వలన, ఆయన యొద్దకు కుటుంబములో ఒక భాగస్థుని వలె వచ్చుదుము''
.

అధ్యాయము 3
దేవుని నామము యొక్క గొప్పతనము

    ''నీ నామము పరిశుద్ధ పరచబడును గాక''

    ప్రార్థన మన జీవితానికి అవసరమైనది కావునే యేసుప్రభువు మనలను ఎల్లప్పుడు ప్రార్థించమని చెప్పారు (లూకా 18:1). దాని అర్థం మనము ఎప్పుడూ మోకాళ్ళపై ఉండాలని కాదు.    మనము అలా మోకాళ్ళపై ఉండే సమయాలు కూడా ఉంటాయి. కాని మనము అన్ని వేళలా ప్రార్థనాత్మ కలిగి యుండవలెను. అది మన జీవితమంతటిపై ప్రభావము చూపాలి.

    ప్రార్థనలో సరియైన ప్రాధాన్యతలు

    యేసు ప్రభువు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో మనము జీవితములో దేనికి ప్రాధాన్యత యివ్వాలో మరియు మనకు ఉండాల్సిన గొప్ప ఆశలు ఏమిటో బయల్పర్చారు. అవి ఆరు    విజ్ఞాపనములుగా ఉన్నవి.

    మొదటి మూడు దేవునికి సంబంధించిని. ''నీ నామము పరిశుద్ధ పర్చబడను గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు ఎలాగునో అలాగే భూమి యందును నెరవేరును గాక''.    తరువాత మూడు మనకు సంబంధించినవి. ''మా అనుదిన ఆహారము మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించినట్లు మా ఋణములను క్షమింపుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి    తప్పింపుము''.

    ఇక్కడ మనము ప్రాముఖ్యముగా గమనించవలసినది ఒకటి యున్నది. మన ప్రార్థనలలో మనము ప్రధానముగా అడిగేవి మన స్వంత సమస్యలకు సంబంధించినవి కాకూడదు. మనకు ఎన్నో    సమస్యలుండవచ్చును, అవి ఆత్మీయమైనవి కూడా కావచ్చును, కాని అవి మన ప్రార్థనలలో ముందు రాకూడదు. దేవుని యొక్క గొప్పతనము ముందుండవలెను.

    మనము దేవుని యెదుట మన హృదయములో కోర్కెలను ప్రార్థనలో వెలిబుచ్చుతున్నప్పుడు ఎక్కువగా ఏవి ముందుంచుతున్నామో మనము పరీక్షించు కొన్నట్లయితే మనము ఎప్పుడూ ఈ వరుస    క్రమమును పాటించలేదని తెలియును. ఇది మనము యేసు ప్రభువు యొక్క ఉపదేశమును తీవ్రముగా తీసుకొనలేదను విషయమును తెలియజేయును. మనము జాగ్రత్తగాను మరియు ఖచ్చితముగాను    దేవుని వాక్యమును చదివినట్లయితే, యేసు ప్రభువు మనలను ఒకే పద్ధతిలో ప్రార్థించమని - అది దేవునికిని మరియు ఆయన నామమునకును మొదటి స్థానము ఇచ్చునట్లు నేర్పించెనని    గ్రహించగలము.

    దేవుణ్ణి కేంద్రంగా కలిగియుండుట

    దేవుడు మానవుని ఈ విధముగా సృష్టించెను. దేవుడే తలగా మరియు మానవుడు శిరస్సుకు లోబడే శరీరముగా నుండవలెను. మన శరీరములో శిరస్సు పైనుండుటయే గాక అది శరీరమును    పరిపాలించును కూడా. మన శరీరము యొక్క పనులన్నీ శిరస్సు ఆధీనములో నుండనంతవరకు మనము అంతా బాగానే ఉన్నట్లే. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క తల (మెదడు) సరిగా పనిచేయదో,    అప్పుడు అది శరీరమును అదుపు చేయలేదు. అటువంటి వ్యక్తిని మనము మానసిక వ్యాధిగ్రస్తునిగా లేక పిచ్చివానిగా పరిగణిస్తాము. నరుడు అలా ఉండాలని దేవుడు ఎప్పుడూ    ఉద్దేశించలేదు.

    మనము ఆత్మీయముగా నిటారుగా నడువవలెనని (లేవీ 26:13) దేవుడు ఉద్దేశించాడు. చాలామంది విశ్వాసుల యొక్క సమస్య వారి శిరస్సు ఉండాల్సిన చోట ఉండక పోవుటయే. వారి    జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వరు. మనము మన జీవితాల్లో మన ఆశలు, మన కోర్కెలు మరియు అభిలాషల విషయములో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చినట్లయితే    దేవుడు, ఆయన యొక్క మహిమ మన జీవితాలలో ముఖ్యమైన తృష్ణగా నుండినట్లయితే, మనము దేవుని యొద్దకు ప్రార్ధనలో వెళ్లిన ప్రతిసారి అదియే మన ఆశను దేవునికి తేటగా    తెలియజేస్తుంది.

    మన జీవితాల్లో అనేక విషయాలు వాటి వాటి స్థానాల్లో ఉండక పోవుటకును, గలిబిలి మరియు అయోమయము ఉండుటకు కారణం దేవుడు మన జీవితాల్లో మొదటివాడుగా నుండకపోవుటయే. మనము    ప్రార్థించినప్పుడు కూడా మనకు ఇచ్చువానికంటె ఇచ్చువాటినే ఎక్కువగా ఆశపడుతున్నాము. ఒక ఆత్మీయ జీవితం కలవానికి యుండు ఒక గుర్తు, ఇచ్చువాటికంటె ఇచ్చిన వానిని    ఎక్కువగా కోరుకొనుటైయున్నది. మరియు అతడు ఇచ్చువాని యొద్ద నుండి ఏ బహుమతులు పొందకపోయిననూ ఆయనను ప్రేమించును.

    దేవుడు మన ప్రార్థనలకు మనము ఆశించినట్లు జవాబియ్యక పోయినను మనము సంతృప్తి కలిగి యున్నామా అనునది మనము ఆత్మానుసారమైన మనసు కలిగియున్నామా లేదా అనునది    తెలుసుకొనుటకు ఒక పరీక్షయైయున్నది.

    అనేక మంది విశ్వాసులు వారి ప్రార్థనలకు దేవుడు జవాబివ్వనప్పుడు సణుక్కోవడం మరియు ఫిర్యాదులు ఎందుకు చేస్తూఉంటారు? దానికి కారణం వారు కేవలం బహుమతులనే    కోరుకొంటున్నందువలన, వారు, ఇచ్చువాని గూర్చి అంత ఆసక్తి కలిగియుండుట లేదు. వారు తప్పిపోయిన కుమారుని వలె ఉంటున్నారు. అతడు కోరుకున్నది తండ్రి యొద్దనుండి పొందిన    వెంటనే తనకు తాను సంతోషపడుటకు వెళ్లిపోయాడు. అతడు తన తండ్రి నుండి బహుమతులు మాత్రమే ఆశపడినాడు. అతడు పొందిన బహుమతులను ఖర్చు చేసిన తరువాత, మరి ఇంకా కొన్ని    పొందుటకు మాత్రమే తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు (లూకా 15:11-24).

    ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఏభై శాతం దేవుని మహిమకు సంబంధించినదని గమనించండి. మనము ఏదో అలవాటుగా ''ప్రభువా, మొదట నీ నామము మహిమ పర్చుబడాలని నేను    కోరుకొంటున్నాను'' అని చెప్పి మిగిలిన గంట సమయం మనకు కావల్సిన వస్తువుల చిట్టా ఆయనకు ఇవ్వడం కాదు. మనము ప్రార్థనలను ఒక పద్ధతిగా చేయుటగూర్చి కాక, దేవుడు మరియు    ఆయన మహిమ ఇప్పుడు మన ఆలోచనలలో ముఖ్యమైనవిగా ఉండునట్లు మన వైఖరి మారుట మరియు మన మనస్సు రూపాంతరం చెందుట గూర్చి చర్చించుకొంటున్నాం.

    మనకు మనమే కేంద్రముగా నుండుట - పాపమంతటి యొక్క మూలము

    దేవుడు ఈ సృష్టిలో ప్రతిది ఆయనను కేంద్రంగా చేసికొనునట్లు సృష్టించెను.

    సూర్య, చంద్ర నక్షత్రాలను మరియు ఇతర గ్రహముల గూర్చి ఆలోచించండి. వాటికి స్వంత చిత్తము లేదు అవి వాటి సృష్టికర్తకు ఎదురుచెప్పకుండా లోబడుచుండును. భూమి సూర్యుని    చుట్టూ ఏ ప్రశ్నావేయకుండా తిరుగుచుండును. మరియు నక్షత్రములు వాటికి ఏర్పాటు చేయబడిన కక్ష్యలో వేల సంవత్సరాలనుండి తిరుగుచుండెను. అయితే దేవుడు జీవంలేని అటువంటి    వాటియందు సంతోషించుట లేదు. ఆయన కుమారులను కోరుకొనుచున్నాడు.

    ఆయన మొదట స్వంత చిత్తము కలిగిన దేవదూతలను సృష్టించెను. అప్పుడు దేవదూతలకు నాయకత్వం వహించు లూసిఫరు దేవుణ్ణి కేంద్రంగా కలిగియుండుటకు ఇష్టపడక దేవునికి    వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను. ఒక సృష్టింపబడినది తనకు తానే కేంద్రముగా కావాలనుకొన్నప్పుడు పాపము ప్రారంభమైనది (యెషయా 14:12-15).

    మనము దీన్ని అర్థము చేసుకొనుట ఎంతో ముఖ్యమైయున్నది. మనము పాపమంటే ఏమిటో అర్థము చేసుకోవాలంటే అది ఎలా ప్రారంభమైనదో చూడాలి. అప్పుడు పాపమంటె కేవలము వ్యభిచారము,    నరహత్య, కోపము లేక అసూయ మొదలైనవి కావని అర్థము చేసికొంటాము. పాపము యొక్క వేరు తనకు తాను కేంద్రముగా నుండుటలో యున్నది.

    ఒక దేవదూతను ఒక్క క్షణంలో అపవాదిగా మార్చినది తనకు తానే కేంద్రముగా చేసికొనిన లక్షణము, మరియు అటువంటి లక్షణము మనష్యులను కూడా దయ్యములుగా మార్చును.

    ఆదామును పాపము చేసి పడిపోయిన మానవునిగా చేసినది ఆ లక్షణమే. ఏదేను వనములో నున్న రెండు చెట్లు, జీవవృక్షము మరియు మంచి చెడుల తెలివి నిచ్చు వృక్షము, ఆదాము    జీవించుటకు తీసుకోవలసిన రెండు నియమములకు సూచనార్థముగా నుండెను. ఒకటి దేవుడు కేంద్రముగా నుండు జీవితము మరియొకటి తనకుతానే కేంద్రమైన జీవితం. సాతాను హవ్వతో ''మీ    కండ్లు తెరవబడును మరియు మీరు దేవుని వలె యుందురు'' (అప్పుడు మీరు దేవుని అవసరం లేకుండా స్వతంత్రంగా ఉండవచ్చు) అని నిషిద్ధ వృక్షపు పండు తినుట గూర్చి శోధిస్తూ    చెప్పాడు. ఆదాము హవ్వలు వారికి వారే కేంద్రముగా ఉండి, దేవుని నుండి స్వతంత్రముగా నుండు జీవితాన్ని ఎన్నుకొన్నాడు.

    దేవునికి ఏదో కావలసివచ్చి మనలను ఆయనలో ఉండమని అడుగడు. లేదు. మన మేలు కొరకే ఆయనను మన జీవితాల్లో ముందు పెట్టుకొనమని చెప్పును. మనము దేవునిని ఆరాధించక    పోయినట్లయితే, మనము తప్పక వేరొక దానిని ఆరాధించుట ప్రారంభించుదుము - అది మనలను మనమవ్వచ్చు లేక సాతానవ్వచ్చు లేక లోకము కావచ్చు. మనము తప్పుగా దేనినో ఆరాధించుచు    మనలను మనము నాశన పర్చుకొనకుండుటకు, మన స్వంత రక్షణ కొరకు మరియు మన మంచి కొరకు దేవుడు ''నన్ను ఆరాధించుట నేర్చుకొనండి. నాలో మీరుండుట నేర్చుకొనండి'' అని    చెప్పును.

    భూమి సూర్యుని చుట్టూ తిరుగుట కొరకై సృష్టింపబడినది. ఒకవేళ భూమి ఒక రోజున ఇంతవరకు నేను సూర్యుని చుట్టూ తిరిగింది చాలు, ఇక నుండి సూర్యుని నా చుట్టూ తిరగమను అని    అనుకొన్నట్లయితే ఏమవును? దేవుడు నియమించిన నియమమును ఆ విధముగా భూమి మీరును అప్పుడు ఋతువులలో మార్పు ఉండదు, మరియు భూమిపై నుండిన జీవమంతా త్వరలోనే నాశనమవును.    దేవుని న్యాయ విధులకు అవిధేయత చూపుట ఎప్పుడూ మరణమునకు దారితీయును.

    లోకములోనికి ఆత్మీయ మరణము కూడా అట్లే వచ్చును. మానవుడు దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉండాలని మానవుల్ని దేవుడు సృష్టించాడు. అయితే దేవుడు కేంద్రముగా నుండుటను    మానవుడు అంగీకరించక తిరస్కరించాడు, ఆ రోజునే అతడు మరణించాడు. ఎప్పుడైతే మనము ఇది అర్థము చేసుకొంటామో, అప్పుడు రక్షణ అనగా మనకు మనము ముఖ్యముగా ఉండుట నుండి    రక్షింపబడుట అని అర్థము చేసికొందుము.

    ఒకడు రక్షణ పొందుటకు, మొదట అతడు మారుమనస్సు పొందవలసి యున్నదని నూతన నిబంధన చెప్పుచున్నది. మారుమనస్సునకు అర్థము నీ పాతజీవిత విధానము నుండి తిరుగుట. దాని అర్ధము    త్రాగుడు మరియు జూదము మొదలైన అనేక చెడ్డ అలవాట్లను మానుటకంటె ఎంతో ఎక్కువైనది. మన గతజీవితము మనకు మనము కేంద్రముగా యున్నటువంటిది, మరియు మారుమనస్సు అర్థము    ''ప్రభువా, ఈ విధముగా నాకు నేను కేంద్రముగా ఉండిన జీవితముతో అలసిపోతిని మరియు ఇప్పుడు నీ వైపు తిరగాలని నీలో నేను కేంద్రీకృతమై యుండవలెనని కోరుకొనుచున్నాము''    అని చెప్పుటయై యున్నది.

    మనకు మనమే కేంద్రంగా యుండుట నుండి రక్షణ

    మనలను పాపమునుండి రక్షించుటకు యేసు ప్రభువు వచ్చాడు. వేరే మాటలలో మనకు మనము కేంద్రంగా యుండుట నుండి రక్షించుటకు ఆయన వచ్చాడు.

    క్రొత్త నిబంధనలో ''పాపము'' అను మాట వచ్చిన చోట మనకు మనము కేంద్రంగా యుండుటయను మాటను మార్చినట్లయితే అనేక వాక్య భాగములకు ఎలాంటి అర్థము వచ్చునో చూడండి. ''పాపము    మీ మీద ప్రభుత్వము చేయదు'' అనునది ''నీకు నీవు కేంద్రముగా యుండుట నీ మీద ప్రభుత్వము చేయదు'' (రోమా 6:14). అది దేవుని ప్రజల కొరకు ఆయన ఉద్దేశము.

    అయినప్పటికిని మన జీవితాల్లో, ఎంత పవిత్రమైన ఆశలలో కూడ మనకు మనము కేంద్రంగా యుండుటను గమనించగలము. పరిశుద్ధాత్మతో నింపుమని దేవునిని అడుగుట మనము ఒక గొప్ప    బోధకునిగా, లేక ఒక గొప్ప స్వస్థపరచువానిగా లేక అటువంటి వేరొక విషయములో గొప్పతనము చూపుట కొరకై యుండవచ్చు. అది ఈ లోకములో గొప్పతనము చూపుట కొరకైన కోర్కెలతో    సమానమైనదే. ఇటువంటి ఎంతో పరిశుద్ధమైన విషయంలోనికి కూడా పాపము ఎలా ప్రవేశిస్తుందో చూచారా?.

    అందుచేతనే యేసు ప్రభువు ప్రార్థించుట నేర్పించినప్పుడు, అన్నిటికంటే ముందు మనము పరిశుద్ధాత్మతో నింపబడాలని కాక, దేవుని నామము మహిమ పర్చబడాలని ప్రార్థించుట    నేర్పించారు.

    నిజమైన ఆత్మీయజీవితము గల్గిన వ్యక్తి మాత్రమే ఈ ప్రార్థన నిష్కల్మషముగా చేయగలడు. అయితే ఎవరైనా ఈ ప్రార్థనను తిరిగి చెప్పవచ్చును. ఒక చిలుక కూడా అలా చెప్పగలదు.    కాని దానిని నిజముగా అర్థవంతముగా హృదయ అంతరంగాలలో నుండి చెప్పాలంటే, దేవునిపై సంపూర్ణమైన అంకితభావం ఉండాలి. దానికి ఆయన మన జీవితాల్లో అన్నిటికి మొదటివాడుగా    నుండి, మనము ఆయనను కేంద్రంగా కలిగియుండాలి మరియు మనము ఆయనను వెదికినంతగా ఆయన యిచ్చే దీవెనలను వెదకని వారుగా నుండాలి. ఒకవేళ ఆయన ఏమైనా బహుమతులను యిచ్చినట్లయితే    మంచిది; ఒకవేళ ఆయన ఏవీ ఇవ్వకపోయినా అదీ మంచిదే, ఎందుకంటే మనము దేవుని కొరకే ఆశపడుతున్నాము కాని ఆయనిచ్చే బహుమతుల కొరకు కాదు.

    దేవుడు ఎందుచేత ఇశ్రాయేలీయులను వారి హృదయమంతటితో ఆయనను ప్రేమించమని మరియు తమ వలెనే పొరుగు వారిని ప్రేమించవలెనని చెప్పారు. కేవలము వారినివారు కేంద్రంగా    కలిగియుండుట నుండి విడుదల చేయుటకే.

    ''జీశీవ'' అనే ఇంగ్లీషు పదము యొక్క అక్షరాల పొందికను ఈ విధముగా చెప్పుదురు. జీ-జీవరబర (ఖీఱతీర్) ూ-శ్ీష్ట్రవతీర (చీవఞ్) ్్శీబతీరవశ్రీట (ూaర్). మొదట    యేసు, తరువాత ఇతరులు, చివరిగా నువ్వు. ఆ విధముగా నీకు సంతోషం వచ్చును.

    దేవుడు శాశ్వతమైన సంతోషముతో నిండియున్నవాడు. పరలోకంలో ప్రతీది దేవుణ్ణి కేంద్రంగా కలిగియుండును కాబట్టి అక్కడ విచారముగాని చింతగాని యుండదు. దేవదూతలు దేవుణ్ణి    కేంద్రంగా కలిగి ఉంటారు కాబట్టి వారు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటారు.

    మనము సంతోషం శాంతి మరియు అనేకమైన ఇతర ఆత్మీయ సుగుణముల లోటు కలిగియుండుటకు కారణం మనకు సరియైన కేంద్ర స్థానం తెలుసుకొనక పోవుటైయున్నది. దేవునిని మన అవసరములు కొరకు    మాత్రమే ఉపయోగించు మనస్తత్వము మనము కలిగియుందుము. మన ప్రార్థనలు సుమారుగా ఇలా యుండును ''ప్రభువా, దయతో నా వ్యాపారము అభివృద్ధియగునట్లు చూడుము...నా ఉద్యోగములో    ప్రమోషన్ వచ్చునట్లు చూడుము....మంచి ఇల్లు దొరుకునట్లు చేయుము...'' మొదలైనవి. మన భూలోక జీవితము మనకు సౌకర్యముగా నుండినట్లు చేసే అల్లాఉద్దీన్ అద్భుత దీపం కథలో    ఉండే సేవకునిగా దేవుడు ఉండాలని మనము కోరుకొందుము.

    అనేకమంది విశ్వాసులు ఈ లోకంలో వారి అభివృద్దికి మరియు లాభానికి కారణముగా కనిపించే ఇటువంటి ప్రార్థన దేవునికి చేస్తారు. కాని క్రొత్త నిబంధనలో కనబడే దేవుడు    ఒలింపిక్ ఆటలలో 100 మీటర్లు పరుగు పందెం నీవు గెలిచేలా లేక నీ వ్యాపార లావాదేవీలలో నీ పోటీ దారుని నీవు ఓడించేలా చేసే దేవుడు కాదు.

    మన ప్రార్థనలు మనమెంత మనకు మనము కేంద్రంగా కలిగియున్నామో తెలియజేయును.

    ''యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును'' (కీర్తన 37:4) అని బైబిలు చెప్తుంది. దేవునిలో ఆనందించుట యనగా దేవుని మన జీవితాలకు కేంద్రముగా    చేసికొనుటైయున్నది. కనుక కేవలము దేవునిని తనకు కేంద్రముగా(ఆధారముగాను, సర్వముగాను) చేసికొనిన వ్యక్తియే తన హృదయ వాంఛలన్నిటిని పొందును.

    ''యదార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు'' (కీర్తన 84:11) (అది ఎవరైతే వారి శిరస్సులను అన్నింటికి పైనుంచుకొని - ఎవరి జీవితాలైతే దేవుని అదుపులో    ఉన్నవో వారికి).

    ''నీతిమంతుని విజ్ఞాపన మన:పూర్వకమైనదై బహు బలము గలదైయుండును'' నీతిమంతుడనగా దేవుణ్ణి కేంద్రంగా కలిగియున్నవాడు (యాకోబు 5:16). దానికి వ్యతిరేకముగా, తనకు తాను    కేంద్రంగా చూచుకొను వ్యక్తి యొక్క విజ్ఞాపన, చివరకు అతడు రాత్రంతా ప్రార్థించినా పొందినదేమీ ఉండదు. మనము ఎటువంటి జీవితం జీవిస్తున్నామో ఆ జీవితము మనము చేయు    ప్రార్థనకు విలువనిచ్చును.

    అందుచేత మన జీవితములో నుండాల్సిన మొదటి మూడు కోర్కెలు, ''తండ్రీ, నీ నామము పరిశుద్ధ పర్చబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము జరుగునుగాక'', అని    యుండవలెను.

    మనకు ఇంకా అనేకమైన మనవులు, ''నా నడుము నొప్పి స్వస్థపర్చుము, నివసించుటకు మంచి ఇంటిని దయచేయుము, నా కుమారునికి మంచి ఉద్యోగము ప్రసాదించుము'' మొదలైనవి ఎన్నో    ఉండవచ్చును. అవన్నీ మంచి మనవులే. కాని నీవు, ''తండ్రీ, నీవు ఈ మనవులన్నింటిని అనుగ్రహించక పోయినను, నా ముఖ్యమైన ఆశ నీ నామము మహిమ పర్చబడవలెననియే'' అని    అయినట్లయితే నీవు ఒక ఆత్మానుసారుడివైన మనుష్యునిగా నుందువు.

    దేవుని నామము ఘనపర్చబడవలెను

    ''నీ నామము పరిశుద్ధపర్చుబడును గాక'' అను మొదటి మనవి అర్థమేమిటి?

    ''పరిశుద్ధపర్చుట'' అనుమాట క్రొత్త నిబంధనలో నుండిన ''ప్రతిష్టించుట'', ''పరిశుద్ధత'', ''పరిశుద్ధుడు'' మొదలైన మాటల యొక్క మూలపదము నుండి వచ్చినది. దాని అర్థము    ''ప్రత్యేక పర్చుట'' అనునది, అనగా దుష్టత్వము మరియు అపవిత్రత అంతటి నుండి ప్రత్యేకపర్చుము అని.

    తండ్రీ, నీ నామమునకు భయపడవలసియున్నది, పూజింపబడవలసియున్నది, ఘనపర్చ బడవలసియున్నది మరియు మహిమపర్చబడవలసి యున్నది అనునది. వేరే మాటలలో ఇది మొదటి విన్నపము కాబట్టి,    ఈ లోకములో దేవునికి అందరు భయపడవలెననేది మన హృదయములో నుండవలసిన కోర్కెయై ఉండవలెను. అది నిజంగా మన కోర్కెలలో గొప్పదై యున్నదా?

    మానవుని యొక్క అపరాధమును ఒక వాక్యములో చెప్పవచ్చును. ''వారి కన్నుల యొదుట దేవుని భయము లేదు'' (రోమా 3:18). దేవుని యెడల భయము జ్ఞానమునకు మూలము (సామెతలు 1:7).    వేరొక మాటలో చెప్పవలెనంటే అది క్రైస్తవ జీవితము యొక్క ''అక్షరమాల''. నీవు ''అ, ఆ''లను నేర్చుకొనకపోయినట్లయితే గణితశాస్త్రముగాని, రసాయనిక శాస్త్రముగాని, భౌతిక    శాస్త్రమునుగాని ఇక దేనినీ చదువలేవు. అదే విధముగా క్రైస్తవ జీవితము యొక్క ''అ, ఆ''లైన దేవుని భయమును నీవు నేర్చుకొనక పోయినట్లయితే నీవు ఆత్మీయముగా ఎదగలేవు.

    మనము మన స్వంతపేరు కంటే దేవుని పేరును గూర్చి ఎక్కువ పట్టించు కొంటున్నామా లేదా అనునది మన ఆత్మానుసారతకు ఒక మంచి పరీక్ష. ఒకరు నీ పేరును పాడుచేస్తున్నారని నీవు    వినినప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? బహుశా చాలా తీవ్రంగా తీసుకొంటావేమో? మరి యేసు క్రీస్తు యొక్క నామము అగౌరవపర్చబడుతుందని తెలిసినప్పుడు నీవు ఎలా    స్పందిస్తావు? ఈనాడు అన్యజనుల యెదుట దేవుని ప్రజల యొక్క ప్రవర్తన వలన దేవుని నామము దూషింపబడుచుండెను (రోమా 2:24). అది మనలను బాధిస్తుందా?

    ఈ దేశములో యేసుక్రీస్తు యొక్క పేరు అగౌరవపర్చబడుచుండుట నీవు చూచుచుండగా అది నీకు బాధ కల్గిస్తుందా? మన దేశములో దేవుని యొక్క నామము ఘనపర్చబడాలనే హృదయ భారముతో అది    నిన్ను ఎప్పుడైనా దేవుని ముందు మోకాళ్లపైకి తీసుకువచ్చిందా? అది మన ఆత్మానుసారతకు ఒక పరీక్ష.

    అపొస్తలుల కార్యములు 17:16లో పౌలు ఏథెన్సు వారు విగ్రహములను పూజించుట చూచి అతడు ఆత్మలో పరితాపము పట్టలేకపోయెనని చదువుదుము. అతడు సాతానుపై బహుకోపము    తెచ్చుకొన్నాడు. మనము ఆత్మచేత నింపబడినట్లయితే మన దేశములో విగ్రహారాధనను చూచినప్పుడు సాతానుపై మనకును కోపము రేగును.

    యెరూషలేము దేవాలయములో జనులు దేవునినామము పేరిట ధనమును సంపాదించుట చూచినప్పుడు యేసుప్రభువు యొక్క ఆత్మలో కోపము రేగెను. మనము దేవుని యొక్క మనసుతో ఏకమై    యుండినట్లయితే, క్రీస్తునామము పేరిట ఈనాడు మన దేశములో జనులు ధన సంపాదన చేయుటద్వారా ప్రభువు నామమునకు అవమానము తెచ్చుట చూచినప్పుడు మనము కూడా కోపము తెచ్చుకొందుము.

    ప్రతి ఒక్కటి దేవుని మహిమ కొరకే

    2రాజులు 17:33 గూర్చి ఆలోచించండి, ''వారు యెహోవా యందు భయభక్తులు గలవారై యుండి...తమ దేవతలను పూజించుచుండిరి''. దీనిని మనకు అన్వయించుకొన్నట్లయితే, మనము దేవునిని    ఆదివారాలు పూజిస్తున్నాము కాని నిజానికి మిగిలిన అన్ని వేళలా మన స్వంత విగ్రహాలను పూజిస్తున్నామన్న మాట.

    మనము కొన్ని క్రైస్తవ కార్యక్రమములు, అనగా బైబిలు చదువుట, ప్రార్థించుట, పత్రికలు పంచుట, బోధించుట మొదలైనవి పవిత్రమైనవనే నమ్మకముతో పెరిగాము. ఇతర కార్యక్రమములైన    తినుట, త్రాగుట, నిద్రించుట, మాట్లాడుట మరియు బజారులో సామాన్లు కొనుట మొదలైన వాటిని లోకసంబంధమైన కార్యక్రమములుగా అనుకొందుము.

    ఈ విధముగా ఆలోచించుట వలన నీవు చేసే మతసంబంధమైన కార్యక్రమములు దేవుని మహిమకొరకు చెయ్యాలని అనుకొందువు. కాని అవన్ని చేసి నీవు నీ యింటిలోను మరియు లోకములోను వేరొక    జీవితము అనగా కొండెములాడుట, గాలి కబుర్లు చెప్పుకొనుట మరియు ఇతరులతో పోట్లాడుట మొదలైనవి చేస్తూ జీవించెదవు. అటుతరువాత మరల ఒకరోజు కూటమునకు వెళ్లి మరల    పవిత్రుడవైపోయినట్లు భావించుదువు. అది వేషధారణ. పౌలు 1కొరిందీ¸ 10:31లో ''మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు    చేయుడి'' అని చెప్పెను. మన జీవితములో ప్రతి ఒక్క కార్యము దేవుని మహిమ కొరకు చేయవలెను.

    నికొలాస్ హెర్మన్ (సహోదరుడైన లారెన్స్గా ఎక్కువ మందికి తెలియును). చాలా సంవత్సరాల క్రితం ఒక క్రైస్తవ మఠంలో వంటవాడిగా పనిచేసేవాడు. అతడు ''నేను నా చుట్టూ    ఎంగిలితో ఉన్న పళ్లాలను కడుగుతున్నా లేక వంటగదిలో పని చేస్తున్నా, నేను మోకాళ్లపై నుండి రొట్టె మరియు గిన్నెలో పాలుపంచుకొన్నప్పుడు ఎంత నిర్మలముగా ఉందునో అంతే    నిర్మలత్వంతో నా ఆత్మను ఉంచుకొనగలను'' అని చెప్తుండేవాడు. మనము చేయునదంతా పరిశుద్ధమైనదని గుర్తెరిగినట్లయితే అది అన్నివేళలా దేవుని సన్నిధిలో జీవించుటై ఉంటుంది.

    సరియైన ఉద్దేశ్యములతో ప్రార్థించుట

    ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఈ మనవిని అర్థము చేసుకొనుట మనము ప్రార్థించునప్పుడు ఉద్దేశ్యములను సరిచేయును. చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబులు రాకపోవుటకు కారణం    అవి తప్పుడు ఉద్దేశ్యములతో ప్రార్థించుటై యుండును. కాని ఒకడు నిజముగా ''నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక'' అనేది అతడి మొదటి విన్నపముగా ప్రార్థించినట్లయితే, అతడి    ప్రార్థనలో దురుద్దేశమేమి ఉండదు. అతడి ప్రార్థన ''ప్రభువా, నా పరిస్థితులేమైనను, నీవు నా విన్నపమును అనుగ్రహించినా అనుగ్రహింపక పోయినా, నీ నామము మహిమ    పర్చబడవలెను'' అని యుండును.

    దావీదు ఒకసారి దేవుని కొరకు ఆలయము కట్టవలెనని గొప్ప ఆశ కలిగియుండెను. అదొక మంచి ఆశ. కాని మనము 2సమూయేలు 7:12,13లో, నా ఆలయమును కట్టుటకు నిన్ను ఉపయోగించుకొనను.    నీ కుమారుడైన సొలొమోనును ఉపయోగించుకొందును అని దేవుడు చెప్పుటను మనము చదువుదుము. అది వినినప్పుడు దావీదు నొచ్చుకోలేదు. దాని గురించి బాధగా ఏమీ అనలేదు. ''నీ    నామమునకు శాశ్వత మహిమ కలుగును...'' (2సమూ 7:26) అని మాత్రము దేవునితో చెప్పాడు.

    దేవునినామము మహిమ పర్చబడినట్లయితే దావీదు ప్రక్కకు తప్పుకొనుటకు సిద్ధపడియుండెను. మనము అనుసరించుటకు అది ఒక మంచి మాదిరి.

    ''తండ్రీ, పరిశుద్ధతతో కూడిన ఒక ఉజ్జీవమును మా దేశమునకు పంపుము. నీవు ఆ ఉజ్జీవమును వేరొక సంఘము ద్వారా పంపదల్చుకొంటే, అదిమంచిదే. కాని ఎలా అయినా పంపించు. దానిలో    నన్ను వాడుకొనకుండా ఇంకొకరెవరినైనా వాడుకుంటే, అదీ మంచిదే. కాని నీ నామము మహిమపర్చబడవలెను'' అనే ప్రార్థన మనము చేయగలమా?

    మనమెప్పుడైతే నిజముగా, ''తండ్రీ, ఎలాగైనా నీ నామము ఘనపర్చబడునుగాక'' అని ప్రార్థించినట్లైతే, అది మనలో నుండిన అనేక స్వార్థపూరితమైన ఉద్దేశములను తీసివేయును.

 

    తండ్రి నామమును మహిమ పర్చుట

    ''మనుష్య కుమారుడు గోధుమ గింజవలే భూమిలో పడి చావవలసిన ఘడియ వచ్చియున్నది, నే నేమందును, తండ్రీ, యీ గడియ తటస్థింపకుండునట్లు నన్ను తప్పింపుము, వద్దు తండ్రీ ఏమైనా    చివరకు అది నా మరణము ద్వారా అయినా నీ నామము మహిమ పరచుము'' అని చెప్పిన యేసు ప్రభువు మాటలు జ్ఞాపకము తెచ్చుకొనండి (యోహాను 12:24,27,28 కూర్చబడినది).

    యేసు అనుసరించిన దానినే బోధించెను. అది చివరకు ఆయనకు మరణమును తెచ్చినా, ఆయన తండ్రి నామమును మహిమ పరచబడుటయే ఆయన కోరుకొన్నాడు. అందుచేతనే ఆయన ఈ భూలోకజీవితము చివర    ''భూమి మీద నిన్ను మహిమ పరచితిని'' (యోహాను 17:4) అని చెప్పగలిగెను.

    అనేకమంది విశ్వాసులు వారి జీవితమంతటిలో ఇటువంటి ఎత్తుకు ఎదుగరు. వారికి దేవుడు కేంద్రముగా ఉండే ఇటువంటి అద్భుతమైన జీవితము గూర్చి తెలియదు. అందువలన నిజమైన    ఆత్మానుసారత అంటే ఏమిటో వారికి అర్థము తెలియదు. వారి ఆత్మకు పరలోకపు ఆత్మ పూర్తిగా విచిత్రముగా ఉండును.

    పరలోకములో ప్రతివారు ''ప్రభువా, నీ నామము మహిమ పర్చబడునుగాక'' అని ప్రార్థింతురు. ఆ ఆత్మలో మనమిప్పుడు పాలుపంచుకొనక పోయినట్లయితే, మనము నిత్యత్వమంతా పరలోకములో    ఎలా గడపగలము? పరలోకపు ఆత్మలో మనమిప్పుడు ఈ భూమి పైనే పాలు పంచుకోవాలనేది దేవుని ఉద్దేశ్యము. అందుకొరకే దేవుడు మనకు పరిశుద్ధాత్మను యిచ్చెను. ''పరలోకమునుండి దిగి    వచ్చి, మహిమ నా మనసును నింపెను'' అని మనము పాడుచున్నప్పుడు దాని అర్థము పరలోకములో నుండిన వారి ఆశయే ఇప్పుడు నా ఆశగా అయినదని అర్థము.

    చివరగా మలాకీ 3:16 చూచెదము: ''అప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడు కొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు    కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖము నందు వ్రాయబడెను''.

    దేవునియొద్ద ఆయనకు ఎవరు భయపడుదురో, ఎవరు ఆయన నామము గూర్చిన ఆలోచన కలిగియుందురో వారి పేర్లు పట్టికయున్నది. వారిని నావారని, నా స్వకీయ సంపాద్యమని దేవుడు    చెప్పుచున్నాడు. దేవుని యింటిలో ఎన్నో మట్టి పాత్రలు ఉన్నవి. కాని ఆయన యొద్ద బంగారు వెండి పాత్రలు కూడా ఉన్నవి(2తిమోతి 2:20,21).

    ''ఆయనకు భయపడి, ఆయన పేరు గూర్చి ఆలోచన కలిగి, ఎటువంటి ధర చెల్లింపవలసి వచ్చినా దేవుని నామము మహిమ పర్చబడవలెననే ఆశ కలిగిన వారి జ్ఞాపకార్థముగా పేర్లు వ్రాయబడి    దేవుని యెదుట ఉంచబడిన పుస్తకములో నా పేరు వ్రాయబడవలెనని నేను కోరుకొనుచున్నాను'' అని మాత్రము నేను చెప్పగలను.

    ''పరలోకమందు ఎలాగునో అలాగునే భూమియందును'' అను మాట మూడవ విన్నపమునకు చివరన వచ్చును. అది మొదటి మూడు విన్నపములకు వర్తించును.

    కనుక మన ప్రార్థన ''తండ్రీ, పరలోకమందు ఎలాగునో అలాగునే భూమి మీద నీ నామము పరిశుద్ధ పర్చబడును గాక. దేవదూతలు ఎట్లు నీకు భయపడి వారి ముఖములు కప్పుకొని నిన్ను    పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధింతురో అలాగే నా హృదయమంతటితో నేనును నాతోటి విశ్వాసులును ఎల్లప్పుడు నీకు భయపడి పూజించాలని కోరుకొనుచున్నాను''.    ఆమేన్.

అధ్యాయము 4
దేవుని యొక్క రాజ్యము

    ''నీ రాజ్యము వచ్చును గాక''

    నిజమైన రక్షణ మనలో మనకు మనము కేంద్రముగా నున్న నైజము నుండి విడుదల పొందుటకును దేవుడు మన జీవితములకు మరియు మన ప్రార్థనలకు కేంద్రముగా నుండుటకును గొప్ప వాంఛను    ఇవ్వవలెను. ఒకప్పుడు తలక్రిందులుగా నుండిన మనము, దేవుని చేత సరిచేయబడుట వలన ఇప్పుడు మన జీవితములలో ప్రతి విషయములో దేవుని ముందుగా ఉంచుటకు ఆశకలిగియుందుము.

    నిజమైన ఆత్మానుసారతను ఒక తేటయైన ఋజువు ఒక వ్యక్తి తన సహజమైన తనకు తాను కేంద్రముగా నుండు స్థితిని అసహ్యించుకొని పూర్తిగా దేవున్ని కేంద్రంగా నుండుటకు ఆశపడును.

    ఆయనను కేంద్రంగా కలిగియుండవలెనని కోరు వ్యక్తి దేవుని యొద్దకు వచ్చి ''పరలోక మందున్న మా తండ్రీ నీ నామము ఈ భూమిపై మహిమ పర్చబడవలెనని మరియు పూజింపబడవలెనని నా    హృదయము కోరుకొంటుంది'' అని చెప్పును. అప్పుడు దేవుని యొక్క నామము భూమిపై మహిమ పర్చబడుట లేదని మరియు పూజింపబడుట లేదని గ్రహించుట చేత ''తండ్రీ! నీవు ఇక్కడకు    రావాలని, వచ్చి ఈ భూమిపై నీ రాజ్యమును స్థాపించవలెనని దాని ద్వారా భూమి అంతా నీ నామమునకు భయపడి మరియు పూజింపవలెనని నేను కోరుకొనుచున్నాను'' అని రెండవ విన్నపముగా    చెప్పును.

    ఈ ప్రార్థన గత 1900 సంవత్సరములుగా దేవుని యెరిగిన స్త్రీ పురుషులు ప్రార్థించుచున్నారు. దానికి జవాబు పొందుటకు సమయము దగ్గరపడినది.

    నీ యుక్తమైన రాజ్యము

    ఈ లోకములోని దుష్టత్వముతో విసుగు చెందిన వారు మాత్రమే ఈ ప్రార్థన ప్రార్థించగలరు. ''మన మాయన వాగ్ధానమును బట్టి క్రొత్త ఆకాశములు కొరకును క్రొత్త భూమి కొరకును    కనిపెట్టుచున్నాము; వాటి యందు నీతి నివసించును'' అని పేతురు చెప్పుచున్నాడు (2పేతురు 3:13).

    ఈనాడు లోకములో ఉన్న హింస మరియు అవినీతిని చూడండి. మనము వార్తా పత్రికలు చదువుచుండగా మన హృదయములలో నుండి పైకి వెళ్ళవలసిన ప్రార్థనలలో ఒకటి ''తండ్రీ, నీ రాజ్యము    రావాలని కోరుకొను చున్నాను. ఇది నా వ్యక్తిగతమైన సౌకర్యము గూర్చి అడుగుట లేదు. నీ యొక్క నీతి యుక్తమైన పరిపాలన త్వరలో రావలెనని నేనెంతగానో ఆశపడుచున్నాను. దానిని    బట్టి నీ మహిమ కొరకు సృష్టించబడిన ఈ భూమిపై నీ నామము మహిమపర్చబడును'' అనేది.

    కడవరి దినములు నోవహు దినముల వలె నుండునని యేసు ప్రభువు చెప్పెను. నోవహు అవినీతితో మరియు దుష్టత్వముతో నిండిన లోకములో నుండిన నీతిమంతుడు. అతడు నీతిని బోధించువాడై    యుండెను మరియు అతడు తన చుట్టూ చూచిన వాటిని బట్టి ఏవగింపు కలిగి యుండెను (2పేతురు 2:5). ఆయన తన హృదయము లోపల నుండి నీతి కొరకు ఆశించెను, మరియు దానిని అతడు రాజీ    లేకుండా ప్రకటించెను. మరియు ఆయన ప్రార్థన కూడా ''నీ రాజ్యము వచ్చును గాక'' అను దానిని సమానముగా యుండి యుండును.

    క్రీస్తు భూమిపై తన రాజ్యమును స్థాపించుటకు త్వరలో తిరిగి వచ్చునని విశ్వాసులందరు ఒప్పుకొందురు. అయితే దీనిని మనము నిజముగా నమ్ముచున్నామను దానికి ఋజువు ఏమిటి?    1యోహాను 3:3 లో ''ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును'' అని చెప్పబడినది.

    మనము నిజముగా క్రీస్తు యొక్క రాకడను నమ్ముచున్నామనుటకు ఋజువు, ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడునట్లు మనలను మనము సిద్ధపరచు కొనుటైయున్నది.    దీని అర్థము పరిశుభ్రమైన జీవితము, దీని అర్థము మన బాకీలన్ని తీర్చుట, దీని అర్థము మన గొడవలన్ని తీరిపోవుట - ఇప్పుడే, ఎందుకనగా మనము ఆయన పవిత్రుడై యున్నట్లు    మనలను మనము పవిత్రులనుగా చేసికొనుచున్నాము. కేవలము అటువంటి వ్యక్తి మాత్రము ''నీ రాజ్యము వచ్చును గాక'' యని ఈ ప్రార్థన ప్రార్థించగలడు.

    మనలను మనము క్రీస్తు రాకడ కొరకు పవిత్రులనుగా చేసికొనకుండా ఈ ప్రార్థనను తిరిగి చెప్పుట, ఈ ప్రార్థనను ఒక ఆచారముగా మార్చివేయుట మాత్రమే అగును.

    ఆయన రాక కొరకు ఎల్లప్పుడు సిద్ధపడియుండుట

    క్రైస్తవ ప్రపంచములో నున్న కొన్ని సంఘ శాఖలలో ''ప్రభువా, అకస్మాత్తుగా వచ్చు మరణమునుండి నన్ను రక్షించుము'' అని చెప్పు ప్రార్థన యుండును. ఆ ప్రార్థన    క్రీస్తులోనికి ప్రవేశించని ఒక వ్యక్తి తన వలె మార్పు లేని వ్యక్తుల కొరకు వ్రాసినదన్న విషయం స్పష్టమైనది. తమకు తాము కేంద్రముగా నుండు వ్యక్తులకు వారి    సృష్టికర్తను ఎదుర్కొనుటకు ముందు వారి గొడవలు తీర్చుకొనుటకు మరియు వారి బాకీలు తీర్చుకొనుట మొదలైన వాటి కొరకు వారికి చనిపోక ముందు కొంత సమయము కావలసియున్నది.    వారు ఆరోగ్యముగా ఉన్నంతకాలము వీటిని తీర్చుకొనుటకు వారికి ఎటువంటి ఉద్దేశ్యము లేదు. అటువంటి మనుష్యులకు దేవుని భయము లేదు మరియు వారు తమకు తాము కేంద్రముగా నున్న    నైజము నుండి మారుమనస్సు పొందితేనేతప్ప వారు మారరు.

    ఒక నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా నుండును కాబట్టి అతడు అటువంటి ప్రార్థన చేయనవసరము లేదు. అతడి ఇచ్చి పుచ్చుకొను విషయములన్ని ఎప్పటికప్పుడు సరిపడి    యుండును. అందుచేత అతడు ఎల్లప్పుడు ''నీ రాజ్యము వచ్చు గాక'' అని ప్రార్థించును.

    మనము నిజముగా దేవుని రాజ్యము వచ్చుట కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూచుచున్నామని మనకెట్లు తెలియును? ఒక్క విషయము గూర్చి ఆలోచించుదము - అది మన కుటుంబ జీవితము.

    ఒక రోజు ఉదయమున, నీ కిటికీలో నుండి బయటకు చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ యింటి వైపునకు నడిచి వచ్చుచున్నట్లు చూచావనుకో. అప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది?    నీవు దేవుని రాజ్యము వచ్చుట కొరకు సిద్ధముగా ఉన్నావో లేదో తెలుసు కొనుటకు అది ఒక మంచి పరీక్ష.

    యేసు ప్రభువు చూడకూడదని నీవు పరిగెత్తి నీ బీరువాలో కొన్ని పుస్తకములు దాచవలసియుండునా, బహుశా నీ టి.వి. ని కూడా దాచవలసియుండునేమో.

    యేసు నీతో ఉన్నంతకాలము, నీ సంభాషణలో సాధారణముగా భోజనము బల్ల యొద్ద సహవాసముగా మాటలాడు కొనే గాలి కబుర్లు ఇక ఉండవు.

    నీవు ఆ రోజుల్లో నీ కుటుంబ సభ్యులతోను మరియు నీ సేవకులతోను ప్రత్యేకమైన మర్యాద చూపిస్తూ, సాధారణముగా నీ మాటలలో వచ్చే కరిÄనమైన మాటలు రాకుండా చూచుకొనవలసియుండునా?

    ప్రభువు నీ స్నేహితులందరిని కలుసుకొనుట నీ కిష్టమా, లేక అందులో కొందరు యేసు నీతో ఉన్నప్పుడు రాకుండా ఉంటే మంచిదనుకొందువా?

    యేసు ప్రభువు అలాగే నీతో ఎల్లకాలమూ ఉండినట్లయితే నీవు సంతోషించుదువా? లేక ఆయన చివరకు ఒక రోజు నీ యిల్లు విడిచి వెళ్ళిపోతే ''హమ్మయ్య'' అను కొందువా?

    నిజాయితీగా ఒప్పుకో.

    మన యింటికి ఎవరైనా మనం మెప్పించాలనుకొనే అతిధులు వచ్చినప్పుడు వారి కొరకు మన ప్రవర్తనలో మార్పు వచ్చునేమో చూచుకొనుట ద్వారా పై ప్రశ్నలకు మనము జవాబు    తెలుసుకొనవచ్చును. అలా అయినట్లయితే యేసు ప్రభువే మనతో కొన్ని రోజులు ఉండుటకు వచ్చినట్లయితే మన నడవడి ఇంకెంత వ్యత్యాసముగా ఉండవలెను.

    యేసు ప్రభువు మన యింటికి వచ్చి మన గృహాలకు ప్రభువుగా ప్రతిరోజు ఉండుటకు మనము యిష్టపడక పోయినట్లయితే ''నీ రాజ్యము వచ్చును గాక'' అని ప్రార్థించుటలో అర్థము లేదు.    యేసు ప్రభువు కొద్ది రోజులు కాక ఎల్లవేళలా ఉండు స్థలమే దేవుని రాజ్యము, ఆయన కొన్ని రోజులు మన యింటిలో ఉండుటే మనకు భారముగా ఉంటే, నిత్యత్వమును మనము ఆయనతో ఎలా    గడుపుదుము.

    పరలోకమందలి నిధులు

    ''నీ రాజ్యము వచ్చును గాక'' అను ప్రార్థించు వాడు తన మనస్సును తన అభిమానమును మరియు కోర్కెలను పై నున్న వాటిపై పెట్టుకొనిన వాడు. అతడు క్రైస్తవత్వమును మరియు    పరిశుద్ధతను ఒక వస్త్రము వలె ధరించినవాడు కాదు. అతడి ఆత్మానుసారత పైపై నుండునది కాదు. అది తనలో అణువణువులోనికి చొచ్చుకుపోయినది. అతడు ఈ భూమిపై ధనమును    కూర్చుకొనుట కంటే పరలోకమందు ధనమును కూర్చుకొనుట యందు ఎక్కువ ఆసక్తి కలిగియుండును.

    ధనము యెడల ఒక క్రైస్తవుని వైఖరి అతడి ఆత్మీయ ప్రమాణము తెలియజేసే తేటయైన పరీక్ష, మరియు అతడు నిజముగా దేవుని రాజ్యము వచ్చుట కొరకు ఆశ కలిగి యున్నాడో లేదో    తెలియజేయును.

    ఒక రైతు తన భార్యకు చెప్పిన కథ నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. ఆ రైతు ఒక రోజు తన భార్యతో ''మన ఆవుకు ఇప్పుడే రెండు దూడలు పుట్టినవి. ఒకటి తెల్లనిది, వేరొకటి గోధుమ    రంగుది. అవి పెద్దవైన తరువాత అందులో ఒకదానిని దేవునికి ఇవ్వాలని అనుకొంటున్నాను'' అని చెప్పాడు. ''అందులో దేనిని దేవునికి ఇవ్వాలని అనుకొంటున్నావు తెల్లదానినా,    గోధుమ రంగు దానినా'' అని అతడి భార్య అడిగినది. ''ఆ విషయం అవి పెద్దదైనా తరువాత ఆలోచించుదము'' అని అన్నాడు.

    ఆ దూడలు పెద్దవై బాగుగా బలిసినవి. ఒక రోజున ఆ రైతు విచార వదనముతో ఇంటికి వచ్చి భార్యతో ''నీకు ఒక విచారకరమైన వార్త. దేవుని యొక్క దూడ ఇప్పుడే చనిపోయినది'' అని    చెప్పాడు. అందుకు భార్య ''దేవునికి ఇవ్వబడుచున్న దూడ ఏదో నీకు ఎలా తెలియును, నీవు దానిని ఇంకా నిర్ణయించుకొనలేదు కదా'' అని అడిగింది. అందుకు ఆ రైతు ''గోధుమ రంగు    దూడను దేవునికి ఇవ్వవలెనని ఇన్ని రోజులు నేను అనుకొన్నాను. అది ఈ రోజు ఉదయం చనిపోయింది'' అనెను.

    అనేక మంది విశ్వాసుల విషయంలో అలాగే ఉంటుంది. దేవుని యొక్క దూడే ఎప్పుడూ చనిపోతూ ఉంటుంది. వారి స్వంత అవసరములన్ని తీరిన తరువాత మిగిలినది దేవునికి ఇచ్చెదరు.    మరియు వారు ''దేవుని యెడల ధనికులు కాకుండుట చేత'' వారి జీవితకాలమంతా ఆత్మీయముగా బీదలై యుందురు (లూకా 12:21).

    పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు వారి ''ప్రధమ ఫలములను'' దేవునికి ఇవ్వవలెనని దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చెను (నిర్గమ 23:19). ఈ విధముగా మాత్రమే వారు ''దేవుని    ఘనపర్చుదురు'' (సామెతలు 3:9). ఈ రోజు అంతే. మనము మనకు శ్రేష్టమైన దానిని దేవునికి ఇవ్వక పోయినట్లయితే మనము దేవునిని ఘనపరచలేము.

    మనజీవితములో ఎలా ఉన్నది? దేవునికి మన శ్రేష్టమైనది ఇవ్వకుండుటకు ఏదొక వంక ఉన్నదా? అప్పుడు మన హృదయము నిజముగా ఎక్కడ ఉన్నదో అది తెలియజేయుచున్నది. ఎక్కడ ఒకని ధన    నిధియున్నదో అక్కడనే అతడి హృదయముండును.

    కాని ''నీ రాజ్యము వచ్చు గాక'' అని ప్రార్థించినవాడు, ధనాశ మరియు వస్తు వాహనముల యొక్క ఆశ నుండి విడుదల పొందినవాడు. అతడు ఇప్పుడు దేవుని కొరకు మరియు శాశ్వతమైన    దాని కొరకు జీవించుచున్నాడు.

    దేవుని యొక్క సంపూర్ణమైన అధికారము

    దేవుని రాజ్యమనగా అర్థము దేవుని యొక్క ప్రభుత్వము, దేవుని యొక్క సంపూర్ణమైన అధికారము. దాని అర్థము యేసుక్రీస్తును మన జీవితములో ప్రతి విషయములో సంపూర్ణమైన    ప్రభువుగా చేయుటయైయున్నది.

    దేవుని రాజ్యము రావలెనని మనమనుకొనినట్లయితే, మొదట అది మన హృదయములలోనికి, మన కుటుంబములలోనికి, మరియు మన సంఘములలోనికి రావలెను. ఈ ప్రదేశములలో మనము సాతానుకు లేక మన    శరీరమునకు ఏ మాత్రమును స్థలమివ్వకూడదు. దేవుని రాజ్యము మన హృదయములలో, మన కుటుంబములలో మరియు సంఘములలో మరి దేనికి స్థలము లేనట్లుగా నింపబడవలెను అనునది మన వాంఛగా    నుండవలెను.

    ''దేవుని రాజ్యము శక్తితో'' భూమిపైకి తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు వచ్చి యున్నాడు (మార్కు 9:1). మన స్థానిక సంఘములు ఒకనాడు భూమి యంతా వ్యాపించే దేవుని    రాజ్యము ఎలా ఉండునో లోకమునకు చూపించేవిగా ఉండవలెను. ఇక్కడనే మనము దేవుని ఉద్దేశ్యమును నిరర్ధకము చేసియున్నాము.

    యేసు మొదట దేవుని రాజ్యమును వెదకమని మరియు దేని గూర్చి చింతపడవద్దని చెప్పినప్పుడు, ఆయన అర్థమేమనగా, మనము దేని గూర్చియైనా చింతపడినట్లయితే అది దేవుని రాజ్యము    పరలోకములో ఎలాగునో అలాగునే భూమిపై రావలెనని చింతపడవలెనని చెప్పెను (మత్తయి 6:33). మనలో ఎంతమందికి సంఘము యొక్క పవిత్రతను గూర్చి మరియు దేవుని రాజ్యము వచ్చుట    గూర్చి అటువంటి భారము మరియు చింత యున్నది?

    దేవుడు, మొదట దేవుని రాజ్యమును వెదకు వారిని అనేకులను మనలో కనుగొనును గాక.

అధ్యాయము 5
దేవుని యొక్క చిత్తము

    ''పరలోకమందు ఎలాగునో అలాగున భూమిపై నీ చిత్తము నెరవేరును గాక''

    మన మెప్పుడైతే మన అనుదిన జీవితములో దేవుని చిత్తమును చేయుటకు యిష్టపడుదమో అప్పుడు మాత్రమే మనము యేసుక్రీస్తును ప్రభువు అని పిలువగలము. నిజమైన మార్పు, ఒక వ్యక్తి    తన వివేకము మరియు ఉద్రేకములలో కదిలింపబడినప్పుడు కాదు గాని, అతడు లోబడి ''ప్రభువా, నీ యిష్టము నా జీవితములో జరుగును గాక'' అని చెప్పినప్పుడే జరుగును. మనము ఈ    వైఖరిని దేవుని యొద్ద నిలకడగా కొనసాగించినట్లయితే అప్పుడు మనము మరి ఎక్కువగా పరిశుద్ధపరచబడుదుము.

    పరిశుద్ధత యొక్క రహస్యము

    యేసు ప్రభువు ఈ లోకములో జీవించిన కాలమంతా ''నా చిత్తము కాదు నీ చిత్తము జరుగును గాక'' అని తన తండ్రికి ప్రార్థిస్తూ ఉండే వాడు (యోహాను 6:68). యేసుక్రీస్తే తన    తండ్రిని సంతోషపరచుట కొరకు అలా జీవించవలసి వచ్చినట్లయితే, మనము దేవుని సంతోషపరచుటకు మనకు వేరే మార్గము లేదని ఖచ్చితముగా నమ్మవచ్చును. మన జీవితములలో ఈ వైఖరి    ఎల్లప్పుడు ఉండనట్లయితే, దేవునితో మన నడకలో ప్రగతి యుండదు.

    మనము గంటల కొద్దీ ప్రార్థించవచ్చు మరియు వాక్యము ధ్యానించవచ్చు మరియు వందల కొద్దీ కూటములకు వెళ్ళవచ్చు. కాని అవన్ని ''పరలోకమందు నీ చిత్తము నెరవేర్చునట్లు ఈ    భూమిపై కూడా (మొదట మన జీవితములో) నెరవేరనిమ్ము'' అను చెప్పగలిగే స్థానమునకు తీసుకు రాకపోయినట్లయితే, మనము సమయమును వ్యర్థపరచుచున్నాము. మనము కృపను పొందే ప్రతి    మార్గము మనము మన హృదయము నుండి, ''తండ్రీ, నా చిత్తము కాదు, గాని నీ చిత్తము జరుగును గాక'' అని చెప్పగలిగేటట్లు మనలను నడిపింపవలెను.

    నిజమైన పరిశుద్ధత యొక్క రహస్యము ఇక్కడ యున్నది.

    పౌలు గలతీయులు శరీరమునకు మరియు ఆత్మకు మధ్య జరుగు పోరాటమును గూర్చి వ్రాయునప్పుడు, ఆయన మానవుని యొక్క యిష్టము మరియు దేవుని యొక్క యిష్టము మధ్య జరుగు పోరాటము    గూర్చి చెప్పుచుండెను.

    శరీరమును దానిలోనున్న దురాశలన్నిటిని కలిపి ఒక్క మాటలో చెప్పవలెనంటే స్వంతయిష్టము (స్వచిత్తము) అని చెప్పవచ్చును. నీవు క్రొత్త నిబంధనలో ''శరీరాశలు'' అని    చదువునప్పుడు ఎప్పుడూ ఆ మాటను ''స్వచిత్తము మరియు తనకు తాను కేంద్రముగా నుండే కోర్కెలు'' అను మాటతో మార్చుకొనవచ్చును. అప్పుడు ఆ వచనములను నీవు అర్థము    చేసికొనగలవు.

    ఉదాహరణకు, పరిశుద్ధాత్ముడు, మన శరీరమునకు విరోధముగా ఉండునని మనకు చెప్పబడినది (గలతీ 5:17), దాని అర్థమేమనగా ఆత్మ ఎప్పుడూ మన స్వచిత్తమునకు మరియు మనకు మనము    కేంద్రముగా నుండే కోర్కెలను వ్యతిరేకముగా పోరాడును అని. మనలో నున్న స్వచిత్తమును మరియు మనకు మనము కేంద్రముగా నుండు కోర్కెలను మొదట చంపకుండా, మనలను పరలోకమునకు    అర్హులుగా చేయలేడని లేక క్రీస్తు పోలికలోనికి మరియు పరిశుద్ధతలోనికి నడిపించలేడని ఆత్మకు తెలియును.

    పరిశుద్ధతకు మరియు ప్రత్యేకపరచబడుటకు మార్గము మన స్వంత యిష్టమునకు ''కాదు'' మరియు దేవునికి 'అవును' అను చెప్పు మరణ మార్గము. దాని అర్థము ''తండ్రీ, నీ చిత్తము    యొక్క పరిధిని దాటి నా జీవితములో ఎటువంటి కోర్కెలు లేక ప్రణాళికలు లేక అభిలాషలు లేవు. నీ సంపూర్ణ చిత్తముకు ఆవల నాకు ఏమి వద్దు'' అని చెప్పుటయై యున్నది''.

    దైనందిక జీవితములో సిలువ

   ''ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను'', అని యేసు చెప్పారు (లూకా 9:23).    ఎక్కడైతే మన స్వంత యిష్టము దేవుని చిత్తముకు వేరుగా ఉండి రెండూ ఒకదాని నొకటి ప్రతిరోజు ఖండించుకొనునో అక్కడ మన సిలువను మనము కనుగొందుము. సిలువను ఎత్తికొనుట    అనగా, ''తండ్రీ, నా చిత్తము కాదు, నీ చిత్తము జరుగనిమ్ము'' అని చెప్పుటయైయున్నది.

    తన స్వంత యిష్టము, తన స్వంత ప్రణాళికలు, తన స్వంత కోర్కెలు మరియు తన స్వంత అభిలాషలు మొదలైన వాటికి 'కాదు' అని ఎవరైతే చెప్పగలరో మరియు ''ప్రభువా, నేను నా సిలువను    ఎత్తికొనగోరుచున్నాను, నా స్వంత కోర్కెలకు చనిపోదలచుకొనుచున్నాను మరియు నిన్ను వెంబడించి నీ చిత్తము మాత్రమే చేయదలుచుకొనుచున్నాను'' అని ఎవరైతే చెప్పగలరో వారే    నిజముగా ''నీ చిత్తము పరలోకమందు ఎలాగునో అలాగునే ఈ భూమిపై నెరవేరును'' అని ప్రార్థించగలరు.

    యేసు ''ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని చెప్పెను (మత్తయి 11:28). అయితే ఆయన అక్కడితో    ఆగిపోలేదు. ఆయన ఎలాగు ఆ విశ్రాంతిని మనకు సంపూర్ణముగా యిచ్చునో చెప్పెను.

   ''నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును'' అని ఆయన చెప్పెను    (మత్తయి 11:29). వేరే మాటలలో నీవు సిలువను ఎత్తికొని నీ స్వంత యిష్టముకు ''కాదు'' అని చెప్పువరకు నీలో ఆ విశ్రాంతి పరిపూర్ణము కాదు. మన స్వంత యిష్టమును    చేయుటనుండే అవిశ్రాంతియంతా వచ్చును. నీవు సిలువను ఎత్తికొనకూడదనుకుంటే నీవు ప్రభువు యొద్దకు రానక్కరలేదు.

    నిజమైన శిష్యుడు మాత్రమే, ''పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు ఈ భూమిమీదను నెరవేరును గాక'' అని ప్రార్థించగలడు. యేసు ప్రభువు ఆయన జీవితమంతా ఈ ప్రార్థనను    ప్రార్థించాడు. ఆయన చేసినదే బోధించాడు. ఆయన ఒక మానవునిగా జీవించాడు మరియు తన తండ్రి చిత్తము చేయవలెననునదియే ఆయన గొప్ప వాంఛగానుండెను.

    యేసు ప్రభువు ఈ లోకముకు ఎందుకు వచ్చాడు? దానికి జవాబు: తండ్రి చిత్తము చేయుటకు. అదే ఆయన యోహాను 6:38లో ''నా యిష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన    వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని'' అని చెప్పారు. ఆయన ముఖ్యముగా లోక పాపముల కొరకు చనిపోవుటకు రాలేదు. దాని కొరకు కాదు. ఆయన తన తండ్రి    చిత్తము చేయుటకు వచ్చాడు. ఆయన కల్వరికి వెళ్లి మరణించింది అది ఆయన జీవితములో తండ్రి యొక్క చిత్తములో భాగముగా యుండుటవలనే.

    యేసు యోహాను 4:34లో''నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది'', అని చెప్పారు. ఒక ఆకలిగొనిన వ్యక్తి ఆహారము కొరకు    మొఱపెట్టినట్లు, యేసులో అణువణువు తండ్రి చిత్తమును చేయుటకు మొఱపెట్టెను. యేసును వెంబడించుట యనగా మన జీవితములో ప్రతి విషయములో తండ్రి చిత్తమును చేయుటకు అటువంటి    ఆశ కలిగియుండుటయై ఉన్నది.

    పరలోకములో ఎంతో సంతోషముండి ఏ విధమైన విచారము లేక పోవుటకు కారణము, అక్కడ దేవుని చిత్తము సంపూర్తిగా నెరవేరుచుండును. దేవుని చిత్తము జనులకు ఉన్నతమైన సంతోషమును    మరియు సంపూర్ణమైన ఆనందమును కలుగజేయునదై యున్నది.

    పేతురు, ''క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట    మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని యిష్టానుసారము గానే నడుచు కొనునట్లు పాపముతో జోలి యిక నేమియు లేక యుండును'' (1పేతురు 4:1-2) అని వ్రాసెను.

    ''లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరమును నిలుచును'' (1యోహాను 2:17) అని అపొస్తలుడైన యోహాను వ్రాసెను.

    విశ్వాసుల కొరకు అపొస్తలుల యొక్క ప్రార్థనల భారము ''ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని'' (కొలస్సీ 4:12)    యుండెడిది. కేవలము పాపముల యొక్క క్షమాపణ కలిగి యుండి మిగిలిన జీవితమును దేవుని చిత్తమును చేయుటకు సమర్పించుకొనుటకు నడిపించని రక్షణ, అసత్యమైన రక్షణ యని అప్పటి    అపొస్తలులకు తెలియును. పాప క్షమాపణ దేవుని చిత్తము అంతటిని చేయు ఇరుకు మార్గమును నడుచుటకు అవసరమైన ఒక ద్వారము మాత్రమే.

    పరలోకములో దేవుని చిత్తము ఎలా జరుగును

    ''పరలోకమందు ఎలాగునో అలాగునే భూమి యందును నీ చిత్తము నెరవేరును గాక'' అని మనము ప్రార్థించవలెను. పరలోకములో దేవుని చిత్తము ఎట్లు జరుగును? నాలుగు విషయములు    చూచెదము.

    అన్నిటికంటె ముందు, అక్కడ దేవ దూతలు దేవుని ఆజ్ఞల కొరకు ఎల్లప్పుడు నిశ్చలముగా ఎదురు చూచుచుందురు. వారు పరలోకమంతటా, వారి స్వంత ఆలోచనల చొప్పున దేవుని కొరకు    ఏదొకటి చేయుటకు పరిగెడుతూ ఉండరు. అలా ఉండరు. మొదట దేవుడు మాటలాడుటకు ఎదురు చూచుదురు మరియు అప్పుడే వారు కార్యము చేయుదురు.

    ఎవరైతే మెళకువగా యుండి నా చేయి కదలికను గమనించుదురో, ఎవరైతే నేనిచ్చు పనిని నేను చేయునట్లు చేయుదురో మరియు నేనివ్వని పనిని విడిచి వెళ్ళుదురో అటువంటి వారి కొరకు నా కన్ను చూచుచున్నది. నా చిత్తము నంతటిని చేయుటకు నా మనసును తెలుసుకొనుటకు మనసు పెట్టుఅటువంటి వానిని ఒకని కనుగొనునప్పుడు  ఓ! అది నాకు ఎంత సంతోషమును తెచ్చును అని దేవుడు చెప్పుచున్నాడు.

    కనుక, ''పరలోకమందు ఎలాగునో అలాగునే భూమియందును నీ చిత్తము జరుగును గాక'' అని మనము ప్రార్థించు నప్పుడు అన్నిటికంటె ముందు దేవుడు మనతో ఏమి చెప్పుచున్నాడో మనము    వినవలసియున్నదని అర్థము.

    రెండవదిగా, దేవుడు మాటలాడినప్పుడు, దేవదూతలు వెంటనే విధేయత చూపుదురు. వారు ''ప్రభువా, నేను కొద్ది దినములు ఆగి దాని గూర్చి ఆలోచించుదును. నా తోటి దేవదూతలు దీని    గూర్చి ఏమి అనుకొనుచున్నారో తెలుసు కొనవలెనని కోరుచున్నాను'' అని చెప్పరు. పరలోకములో అటువంటివి ఉండవు. దేవుడు మాట చెప్పితే అదే ఆఖరు. విధేయత వెంటనే ఉండును.

    అప్పుడు మన ప్రార్థన ''తండ్రీ, నీ స్వరము వినిన తరువాత నేను ఆలస్యము చేయకుండునట్లు సహాయము చేయుము. నీ కాలము కంటే నేను ముందు పరిగెత్త కూడదని కోరుచున్నాను, కాని    ఒకమారు నీవు చెప్పిన తరువాత వెంటనే నీకు విధేయత చూపవలెనని కోరుచున్నాను'' అని యుండవలెను.

    మూడవదిగా, పరలోకములో దేవుడు దేనినైనా ఆజ్ఞాపించినప్పుడు, అది సంపూర్తిగా చేయబడును. అక్కడ దేవదూతలు వెళ్ళి సగము విధేయత చూపరు. కనుక మన ప్రార్థనలు ''తండ్రీ, నా    జీవితములో నీ చిత్తమంతటిని, నీ ప్రతి ఆజ్ఞను సంపూర్తిగా, ఏ విధముగానైనా ఎంత వెల చెల్లించవలసి వచ్చినను నెరవేర్చుటకు సహాయము చేయుము'' అని యుండవలెను.

    చివరగా, దేవదూతల యొక్క విధేయత సంతోషముతో కూడినది. వారు వారి యొక్క విధేయతలో ఫిర్యాదులు చేయరు మరియు కష్టపెట్టుకొనరు. ఏ దేవదూత కూడా వేరొక దేవదూతతో తన పనిని    సరిపోల్చుకొని, ''ప్రభువా, ఆ దేవదూతకు ఇచ్చిన పనికంటె నాకు కష్టమైన పనిని ఎందుకు యిచ్చావు'' అని అడగడు.

    విశ్వాసులలో, ''త్యాగములన్నీ నేనే ఎందుకు చెయ్యాలి? అతడు లేక ఆమె ఎందుకు చెయ్యకూడదు'' మొదలైన ఫిర్యాదులు మనము విందుము. కాని పరలోకములో దేవ దూతల నుండి అటువంటివి    మనము వినము. వీరు దేవుని కొరకు ఏమైనా చేయుట ఒక ఆధిక్యతగా చూచుదురు మరియు ఆయనకు లోబడు ప్రతి అవకాశము విషయములో వారు ఆనందించుదురు.

    కనుక మనము ఈ ప్రార్థన చేయునప్పుడు, మన జీవితములలో దేవుని చిత్తము సంతోషముతో మరియు ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా మరియు ఇతరులతో ఏ విధమైన పోల్చుకొనుట లేకుండా    జరుగవలెనని దేవుని అడుగుతున్నాము.

    నిత్యత్వములో ఎటువంటి విచారములు ఉండవు

    నీవు ఈ భూమిపై దేవుని చిత్తమును అట్లు చేసినట్లయితే, నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు ఎటువంటి విచారించవలసిన పరిస్థితులు ఉండవు.

    మనము, మన ప్రభువు యొక్క ముఖమును, ఇంకా ఇంకా చూచినప్పుడు, మన జీవితములను ఇంకా ఎక్కువగా ఇచ్చుకొని యుండవలసినదని మరియు ఇంకా ఎక్కువగా సంపూర్తిగా విధేయత చూపి    యుండవలసినదని అనుకొందుము. నీవు ఈ భూమిపై దేవుని ఆజ్ఞలకు వెంటనే, సంపూర్తిగా మరియు సంతోషముగా విధేయత చూపకుండా పరలోకమునకు చేరినట్లయితే పరలోకములో నీవు పొందవలసిన    సంతోషమును కొంత పోగొట్టుకొందువు.

    సాధు సుందర్సింగ్, ''నీవు ఈ లోకమును విడిచి పెట్టినట్లయితే క్రీస్తు యొక్క సిలువను మోయుటకు నీకు మరియొక అవకాశము దొరకదు'' అని చెప్పుచుండేవారు. ప్రభువు యెడల    నీకుండిన ప్రేమను ఋజువు చేసికొనవలెనంటే, దానికి ఇదే సమయము - నీవు పరలోకమునకు వెళ్ళిన తరువాత కాదు.

    మనము చూచిన మూడు విన్నపములను గూర్చి ఆలోచించండి. ''తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగునో భూమియందు    అలాగునే నెరవేరును గాక''. ఎంతో అవసరమైన పాపముల యొక్క క్షమాపణ గూర్చి అడుగుట కంటె ముందుగా ప్రభువు తండ్రి యొక్క నామము పరిశుద్ధ పరచుట గూర్చి, ఆయన రాజ్యము వచ్చుట    గూర్చి మరియు మన జీవితములో ఆయన చిత్తము నెరవేరుట గూర్చి అడుగుటకు నేర్పించెను.

    ప్రభువు మనకు నేర్పించుటకు ప్రయత్నించుచున్నది మనము నేర్చుకొందుము గాక.

అధ్యాయము 6
దేవుడు మన భౌతిక అవసరములను లక్ష్యపెట్టును

    ''మా అనుదిన ఆహారము మాకు దయచేయుము''

    మన శారీరక అవసరతలను తీర్చుటకు దేవుడు ఆసక్తి కలిగియున్నాడు. అయితే వాటిని బట్టి మనకు హాని కలుగకుండా ఆ అవసరతలు తీర్చబడవలెను. జనులు వారి జీవితములలో దేవునికి    మొదటి స్థానము ఎలా ఇవ్వవలెనో తెలుసుకొనక పోయినట్లయితే వస్తు సంబంధమైన అభివృద్ధి మరియు భౌతికమైన ఆశీర్వాదములు వారు ఆత్మీయముగా నాశనమగుటకు ఒక మార్గముగా యుండును.

    పదివేల రూపాయలను ఒక పరిణితి చెందిన ఆత్మానుసారుడైన వ్యక్తి ఎంతో లాభకరముగా ఉపయోగించును; కాని ఒక బాధ్యతెరుగని జులాయి కుర్రవాడిని అవి పాడుచేయును. అందువలన దేవుడు    మనలను భౌతికముగా మరియు వస్తు రూపేణా దీవించుటకు ముందు మనము ఆయనను కేంద్రముగా చేసికొనునట్లు చేయుటకు చూచుచున్నాడు.

    మొదట మన శారీరక అవసరములు

    ప్రభువు నేర్పిన ప్రార్థనలో మన వ్యక్తిగత అవసరతలకు సంబంధించి మూడు విన్నపములున్నవి. ఆశ్చర్యకరముగా, మొదటిది మన ఆత్మీయ సంక్షేమమునకు సంబంధించినది కాదు. అది    నిజముగా ఆసక్తికరమైన విషయం కాదా? మనకు సంబంధించిన వాటి గూర్చిన మొదటి విన్నపము, ''ఆత్మీయ కీడు నుండి తప్పింపుము'', లేక ''పాపము నుండి మాకు జయము నిమ్ము'', లేక    చివరకు ''పరిశుద్ధాత్మతో నింపుము'' అనేవి కావు. అవేవీ కావు. మొదటి విన్నపము ''ప్రభువా, నా యొక్క శారీరక అవసరములను తీర్చుము'' అనేదిగా యున్నది.

    మానవుడు మూడు భాగముల కలియక అని బైబిలు చెప్పుచున్నది. అతడికి ఒక ఆత్మయుండును, దాని ద్వారా అతడు దేవునితో సంబంధము ఏర్పర్చుకొనగలిగి యుండును. రెండవది ప్రాణము అనగా    అతడి వ్యక్తిత్వము (అతడి తెలివి తేటలు, ఉద్రేకములు మరియు చిత్తము) మరియు అతడి శరీరము (1థెస్స 5:23).

    ఇక్కడున్న మూడు విన్నపములు ఒకనితో నుండిన మూడు భాగములకు సంబంధించినవై యున్నవి. మొదటిది శరీరమునకు అవసరమైన వాటి గూర్చి; రెండవది మన మనస్సులను (ప్రాణము) పట్టుకు    పీడించే పాపము యొక్క దోషమునకు సంబంధించినది; మరియు మూడవది మన యొక్క ఆత్మ ఆత్మీయమైన కీడునుండి తప్పింపబడుటను గూర్చినది. వీటిలో మన ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది.    అయినప్పటికి ఇక్కడ ప్రభువు మొదట మన శరీర అవసరముల గూర్చి ప్రార్థించమని నేర్పించారు.

    క్రైస్తవత్వములో శరీరము గురించి రెండు విపరీత ధోరణులు కనబడును. శరీరమును లొంగదీసుకొని దానికి ప్రతి సౌకర్యమును నిరాకరిస్తే తప్ప మనము పరిశుద్ధులము కాలేమని    బోధించే వైరాగ్యపు ధోరణి కొందరు కలిగియుందురు. అయితే పాపమునకు శరీరము కారణము కాదు, ఎందుకంటే శరీరము లేని సాతాను పాపముతో నిండియున్నాడు. యేసు ప్రభువు శరీరము    కలిగియుండి కూడా ఎప్పుడూ పాపము చేయలేదు.

    ఈ వైరాగ్యపు బోధ వైవాహిక సంబంధము కూడా పాపపూరితమైనదిగా భావించును. కాని మానవునిలో లైంగిక వాంఛను కలుగజేసినది దేవుడు మరియు ఆయన దానిని 'ఎంతో మంచి'గా ఉన్నట్లు    చూచెను (ఆది 1:31). ఆహారము కొరకు, విశ్రాంతి కొరకు మరియు లైంగిక తృప్తి కొరకు కోరిక కలిగియుండుట మంచిది మరియు అవి దేవునిచేత సృష్టింపబడిన సామాన్యమైన శరీర    కోరికలు. వాటిలో దేని గూర్చి మనము సిగ్గుపడనవసరము లేదు. వాటిని దేవుడు నిషేధించిన మార్గములో సంతృప్తి చెందకుండా ఉండునట్లు మనము జాగ్రత్త వహించవలెను.

    మనము అన్ని విషయములలో వర్ధిల్లవలెనను అభిప్రాయము కొందరు క్రైస్తవులలో చూచుదుము. ఇది మరొక విపరీత ధోరణి దాని ఫలితముగా శరీరమును అశ్రద్ధ చేయుదుము. కాని యేసు    ప్రభువు యొక్క బోధ విపరీతమైన వైరాగ్యధోరణి కాదు, అదే విధముగా విపరీతముగా వస్తు సంబంధవిషయముల గూర్చి అమితమైన ఆసక్తి కలిగియుండుట కూడా కాదు. అది శరీరమునకు    న్యాయముగా కావలసిన అవసరతల గూర్చి జాగ్రత్త తీసుకొనుట ద్వారా అది దేవుని సేవకు ఉపయోగపడేటట్లు ఉండుటయై యున్నది.

    దేవుడు మన శరీరముల గూర్చి లక్ష్యపెట్టుచున్నాడు

    దేవుడు మన శరీరముల యెడల ఆసక్తి చూపడు అని అనేకమంది విశ్వాసులు అనుకొనుట వలన వారు రోగగ్రస్తులైనప్పుడు స్వస్థత కొరకు దేవుని వెదకరు. రాజైన ఆసా (2దిన 16:12) వలె    వారి విశ్వాసము దేవుని యెడల కాక వైద్యులపై యుండును. దేవుడు వైద్యులను, ఔషధములను, చివరకు శస్త్ర చికిత్సను కూడా మనలను స్వస్థపర్చుటకు ఉపయోగించవచ్చును. మన    ప్రార్థనలకు ఏ విధముగా జవాబివ్వవలెనను దానిని మనము ఆయనకు చెప్పలేము. కాని ఆయన బిడ్డలు మానవులపై నమ్మకముంచుటను ఆయన యిష్టపడుటలేదు. మనము ఆరోగ్యముగాను మరియు    దేనికైనా సరిపడు వారుగా నుండుట ద్వారా దేవుని మహిమ కొరకు ఉపయోగపడవలెనను ఉద్దేశ్యముతో ఆయన మన శరీరముల యెడల ఎంతో ఆసక్తి కలిగియున్నాడు.

    మన శరీరముల గూర్చి బైబిలు బోధించు మూడు మహిమకరమైన సత్యములు ఇక్కడ ఉన్నవి.

 1.   ''శరీరము ప్రభువు నిమిత్తమైనట్లయితే, ప్రభువు శరీరము నిమిత్తమై యుండును''.
 2.    
 3.   మన ''శరీరములు క్రీస్తులో అవయవములు''గా యున్నవి.
 4.     
 5.   మన ''శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నది'' (1కొరి 6:13-19)

అటువంటప్పుడు మనము తప్పక మన శరీరముల కొరకు దేవుని యొక్క శక్తిని అడుగవచ్చును.

    భౌతికమైనది ఆత్మీయమైన దానికంటె ఎప్పుడూ ప్రాముఖ్యమైనదికాదు. మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానము మరియు మిగిలిన దేనికైనా రెండవ స్థానము ఇవ్వవలెనని మనము    చూచితిమి. మనము ''నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరుగాక'' అని ప్రార్థించినట్లయితే దాని తరువాత ''మా అనుదినాహారము మాకు    దయచేయుము'' అని ప్రార్థించుట సరియైనదే. ఎందుకనగా మనము పరలోకములో వలెనె భూమిపై దేవుని చిత్తమును చేయుట ద్వారా ఆయనను మహిమ పర్చుటకు ఆహారమును అడుగుచున్నాము.

    మన ఆత్మీయమైన స్థితి కొంతవరకు మన శారీరక పరిస్థితిపై కూడా ఆధారపడియుండును. ఏలియా పరలోకము నుండి అగ్నిని మరియు వర్షమును దిగివచ్చునట్లు చేసిన తరువాత, అతడు    నిరుత్సాహము చెంది తన జీవితమును తీసుకొనుమని దేవుని అడిగెను. 850 మంది అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకముగా నిలిచిన ఈ ధైర్యవంతుడు యెజెబెలు అను ఒక స్త్రీ బెదిరింపులకు    భయపడి పారిపోయెను (1రాజులు 18:19).

    అది ఎలా జరిగినది? సుమారు మూడు సంవత్సరములకు పైగా అతడు ఒంటరిగా జీవించెను. అయితే యిప్పుడు కర్మెలు పర్వతముపై దినమంతా ప్రయాసపడి శారీరకముగా అలసిపోయాడు. అతడు ఒక    బదరీ వృక్షము క్రింద నిరుత్సాహముతో కూర్చొనినప్పుడు, దేవుడు అతడికి ఒక ప్రసంగము చెయ్యలేదు! అలా కాకుండా, దేవుడు ఒక దేవదూతతో అతడికి ఆహారమును మరియు నీటిని    పంపెను. ఏలియా తినెను, నీటిని త్రాగెను మరియు నిద్రించెను. అతడు నిద్రలేచినప్పుడు, దేవుడు అతడికి ఇంకొంచెము ఆహారము మరియు నీళ్ళు యిచ్చెను (1రాజులు 19:1-8).    ఏలియా అలసిపోయెనని మరియు ఓపిక లేకుండా ఉండెననియు మరియు అతడికి కావలసినది బలమిచ్చే ఆహారము కాని హెచ్చరిక కాదని దేవునికి తెలియును. మనకు కూడా కొన్నిసార్లు    కావలసినది అదే - పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు కాని కొంత ఆహారము మరియు విశ్రాంతి.

    కొంతమంది క్రైస్తవులకు వారి శరీరములు గూర్చి విపరీతమైన ఆత్మీయ వైఖరి కలిగియుండి ''నేను దేవుని కొరకు దహింపబడవలెనని కోరుచున్నాను'' అని అందురు. అలాగున వారు 'వారి    దేవుని కొరకు సేవ' ను ఉదయం, మధ్యాహ్నము మరియు రాత్రి, వారంలో ఏడురోజులు అలా ప్రతివారము చేయుదురు. అటు తరువాత వారు నీరసించిపోయి నిరాశకు లోనవుదురు! వారి యొక్క    కార్యచరణ ప్రకృతి సంబంధమైనది. వారి వ్యాకులతకు శారీరకమైన కారణమున్నది తప్ప ఆత్మీయమైన కారణము లేదు. అటువంటి వారితో ప్రభువు ''మీరు ఏకాంత ప్రదేశమునకు వచ్చి    కొంతసేపు అలసట తీర్చుకొనుడని'' చెప్పవలసి యుండును (మార్కు 6:31).

    ఒకమారు యేసు ప్రభువు ఒక పడవలో ప్రయాణిస్తూ యుండగా ఆయన నిద్రించుచున్నట్లు మనము చదువుదుము. ఆయన అలసియున్నట్లుగా తెలియుచున్నది మరియు ఆయన నిద్రించుటకు    సిగ్గుపడలేదు. ఆయన ఆకలి, దాహము కలిగియున్న సమయములున్నవి మరియు ఆయన వాటిగూర్చి ఒప్పుకొనెను. ఆయన యొక్క శారీరక అవసరాలను బట్టి ఆయన సిగ్గు పడలేదు. మన శరీరము    పరిశద్ధాత్మకు ఆలయమైయున్నది మరియు మనము దాని కొరకు జాగ్రత్త తీసుకొనవలసి యున్నది.

    మన శరీరములకు అవసరమైన వాటన్నిటిని మనకు యిచ్చుటకు మన ప్రభువు ఆసక్తి కలిగియున్నాడు. మనకు ఆహారము, వస్త్రములు మరియు ఈ లోకములో ఉండుటకు వసతి కావలయునని ఆయనకు    తెలియును. ఒక స్వంత గృహమును కలిగియుండుటకు నీవు తగని వాడివిగా ఆయన చూచినట్లయితే నీవు ఒక ఇంటిని అద్దెకు తీసుకొనగలుగునట్లు ఆయన సహాయము చేయును. అరణ్య ప్రయాణములో    ఇశ్రాయేలీయులకు ''విశ్రాంతి స్థలమును'' వెదకినవాడు తప్పక నీ కొరకు కూడా చోటు చూచును (సంఖ్యా 10:33). ఇటువంటివి దేవునిని అడుగతగిన ఆత్మీయమైన విషయములు    కాదనుకొనవద్దు.

    ప్రజలలో నుండిన దేవుని గూర్చిన తప్పుడు ఉద్దేశములను సరిచేయుట కొరకు ప్రభువు ప్రార్థనలో చివర నున్న మూడు విన్నపములలో శారీరక అవసరతలను ముందు పెట్టెను.

    మన ఇహలోక అవసరతల గూర్చి దేవుని జాగ్రత్త

    మన శారీరక అవసరతలన్నియు ''మా అనుదిన ఆహారము మాకు దయచేయము'' అను విన్నపములోనే సంక్షప్తమై యున్నవి.

    ఈ విన్నపములోనే ''నాకు ఉద్యోగమిమ్ము. నివసించుటకు ఒక ఇంటిని యిమ్ము. నేను మరియు నా కుటుంబీకులు ధరించుకొనుటకు వస్త్రములనిమ్ము. నా బిడ్డలు కూడా ఒకనాడు వారి    అనుదినాహారమును సంపాదించుకొనవలెను. కాబట్టి వారికి విద్య నిమ్ము'' అనేవి కలిసియున్నవి. దేవుడు ఈ విషయములన్నిటిలో ఆసక్తి కలిగియున్నాడు మరియు మనము మొదట ఆయన    రాజ్యమును వెదకుట నేర్చుకొన్నట్లయితే, ఈ విషయములన్ని మనకు సమకూర్చబడును.

    మనము ఈ భూలోక సంబంధమైన ఆహారము, వస్త్రములు, ఉద్యోగము, ఇల్లు, బిడ్డలు చదువు మొదలగు వాటి గూర్చి ఎందుకు చింతిస్తామో మీకు తెలియునా? అది ఇటువంటి విషయాలలో మనకు    సహాయం చేయుటకు దేవునికి ఆసక్తి లేదనే భావన మన హృదయపు లోతులలో నుండుట చేతనైయున్నది. దేవుడు కేవలం మన ఆత్మీయ సంక్షేమము కొరకు మాత్రమే ఆసక్తి కలిగియున్నాడని మనము    భావిస్తాము.

    దేవుడు మనలో నున్న ఆత్మ ప్రాణము మరియు శరీరము అనే మూడు భాగముల గూర్చి ఆసక్తి కలిగియున్నాడని, మన ఈలోక అవసరముల గూర్చి మనము ఆయనను అడుగవలెనని ఆయన కోరుచున్నాడనియు    మరియు మనము ఎప్పుడూ దేనిగూర్చి చింతపడకూడదని ఆయన కోరుచున్నాడని పరిశుద్ధాత్మ చేత మనము ఒక్కమారుగా ఒప్పింపబడవలసియున్నది. అందుచేతనే బైబిలు, ''దేనిని గూర్చి    చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి'' (ఫిలిప్పి 4:6) అని చెప్పెను.

    ఒక భూ లోకపు తండ్రి తనచుట్టూ ఉండిన ప్రతిఒక్కరి అవసరత తీర్చుటకు బద్ధుడైయుండడు. కాని అతడు తన స్వంత కుటుంబీకుల అవసరత తీర్చుటకు కట్టుబడి యుండును. దేవుడు    పక్షులకు కూడా ఆహారమును ఏర్పాటు చేయునంత మంచివాడు. అటువంటప్పుడు ఆయన తన స్వంత బిడ్డలకు అవసరతలను మరెంతగా తీర్చును.

    ఒకమారు ఒక కనాను స్త్రీ తన కుమార్తెను స్వస్థపరచమని యేసు ప్రభువును అడిగినప్పుడు, యేసు ''మొదట బిడ్డలు సంతృప్తి పడవలెను'' (మార్కు 7:27) అని చెప్పెను. బల్లపై    నుండి పడిన రొట్టెముక్కలతో సంతృప్తి పడుదునని ఆమె జవాబిచ్చెను. మరియు ఆమె కుమార్తె సంపూర్తిగా విడుదల కాబడెను. దానిగూర్చి ఆలోచించండి. బల్లపై నుండి పడిన    రొట్టెముక్కలు దెయ్యము ఆవహించిన వారిని విడుదల చేయుటకు సరిపోయినవి. అటువంటప్పుడు దేవుని బిడ్డలమైన మనకు ఒక పూర్తి రొట్టె ఏమి చేయునో ఊహించుకొనండి. ''మొదట    బిడ్డలు సంతృప్తి పొందవలెను'' అని చెప్పిన యేసు ప్రభువు మాటలు జ్ఞాపకము తెచ్చుకొనుడి. అందుచేత మనము ధైర్యముతో ''మా తండ్రీ, మా అనుదినాహారము మాకు దయచేయుము'' అని    ప్రార్థించగలము.

    దేవుడు సమకూర్చిన దానితో సంతృప్తి

    ఇక్కడ, యేసు విలాసముల కొరకు అడుగమని నేర్పించకపోవుటను గమనించండి. ''తండ్రీ, మా అనుదిన ఐస్క్రీం ఇమ్మనమని కాదు, కాని ''మా అనుదినాహారము మాకు దయచేయమని''    ప్రార్థించుచున్నాము. మనకున్న వాగ్దానము, ''నా దేవుడు నా అవసరములన్నిటిని తీర్చును'' (ఫిలిప్పీ 4:19, మనము కోరుకొన్నవి అన్నీ కాదు, కాని మనకు అవసరమైనవన్నీ అని    యున్నది. మనము కోరుకొన్న వాటికి మరియు మనకు అవసరమైన వాటికి చాలా వ్యత్యాసమున్నది. నీకు ఒక మోటారు కారు కావాలని నీవు కోరుకొనవచ్చును, కాని అది నీకు అవసరము లేదని    దేవుడు చూచుట చేత ఆయన నీకది యివ్వకపోవచ్చును. ఇంకొకరికి అది అవసరముండవచ్చును. అందువలన వారికి ఆ మొటారుకారును ఆయన యివ్వవచ్చును. అందునుబట్టి నీవు వారిపై అసూయ    పడకూడదు. మరియు దేవునిపై సణగకూడదు. నీకున్నదానితో నీవు సంతృప్తి పడవలెను. విలాసాల కొరకు అడుగవద్దు. దేవుడు కొన్ని విలాసముల నిచ్చినట్లయితే వాటిని తీసుకొని ఆయన    మహిమ కొరకు వాడుకొనెదము. కాని ఆయన మనకు ఏమీ ఇవ్వకపోయినప్పటికిని దేవుని స్తుతించుదుము.

    మనము ఇతరులతో పోల్చుకొనవద్దు. మనకు ఏది మంచిదో దేవునికి తెలియును. మనము ఆయనను రొట్టె అడిగినట్లయితే, ఆయన మనకు రాయిని ఇవ్వడు. అంతేకాక మనము రాయిని అడిగినా ఆయన    రాయినివ్వడు. దానికి బదులుగా ఆయన మనకు రొట్టెను యిచ్చును.

    ఆయనిచ్చిన దానితో సంతృప్తి పడుదుము, పౌలు జీవితము యొక్క రహస్యములలో ఒకటి అతడు సంపూర్ణమైన సంతృప్తితో నుండుటయై యున్నది. ఫిలిప్పీ 4:11లో ''నేనే స్థితిలో ఉన్నను ఆ    స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను'' అని అతడు చెప్పెను.

    అనుదిన ఏర్పాటు

    ఇక్కడ ప్రార్థన, ''మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము'' అని యున్నది. దేవుడు చాలా రోజుల కొరకు ఒక్కమారే ఆహారము నివ్వచ్చును కాని, ఇక్కడున్న విన్నపము ఒక్కరోజు    భౌతిక అవసరముల కొరకై యున్నది. రేపు ఏమవుతుంది. అనే విషయం గూర్చి కూడా చింతింపవద్దని యేసు చెప్పాడు. భవిష్యత్తు గూర్చి మనము చింతించుటను దేవుడు కోరుకొనుట లేదు,    మనము ఆయనపై దినదినము ఆధారపడాలి.

    దేవుడు ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులకు అరణ్య మార్గములో అద్భుతముగా నేర్పించెను. వారు వెళ్ళి ప్రతి ఉదయాన మన్నాను సమకూర్చుకొనవలసియుండెను. వారు దానిని కొన్ని రోజుల    కొరకు ఒక్కసారే సమకూర్చుకొనలేదు. వారు దేవునిపై దినదినము ఆధారపడవలసి వచ్చెను. వారు ఆ విధముగా నలభై సంవత్సరములు జీవించవలసివచ్చెను. అది యిబ్బందికరమైన పరిస్థితి    అనుకొనుచున్నారా? కాదు. అది తప్పక యిబ్బందికరము కాదని నేను అనుకొనుచున్నాను. అది తప్పక ఉత్తేజ పరిచేదిగా యుండియుండును.

    దేవుడు మనకు ఒక్కమారే ఎక్కువగా యిచ్చినట్లయితే, మన హృదయములు ఆయన నుండి ప్రక్కకు తప్పిపోవును. మనలను ఆత్మీయ విషయముల కంటె భౌతిక విషయములు ఎక్కువగా బాధపెట్టును.    కనుక దేవుడు మన జీవితాల్లో మనము భౌతిక విషయములలో తరచు కొన్ని అవసరతలు ఎదుర్కొనునట్లు పరిస్థితులను కల్పించును.

    మనము దేవుని తట్టు మరల మరల తిరుగునట్లుగా మనకు అవసరతలు కలుగునట్లు ఆయన అనుమతించును. ఆ విధముగా మనము ఆయనపై నిరంతరము ఆధారపడుట అనే పాఠము నేర్చుకొందుము.

    దేవుడు ఆకాశమునుండి మన్నాను కురిపించినా, సూటిగా ఇశ్రాయేలీయుల నోళ్ళలోనికి దానిని కురిపించలేదు! ఇశ్రాయేలీయులు దానిని సమకూర్చుకొనుటకు ప్రతి ఉదయమున బయటకు    వెళ్ళవలసియుండెడిది. అందువలన బద్ధకస్తునికి ఏమీ దొరకకపోయుండును. అదే విధముగా, ''మా అనుదిన ఆహారము మాకు దయచేయుము'' అని మనము ప్రార్థించినప్పుడు మనము ఏ పని    చేయకుండా ఏదో ఒక అద్భుతము ద్వారా మాఅవసరతలన్ని తీర్చమని మనము దేవుణ్ణి అడుగుట లేదు. ''ఒకడు కష్టించి పనిచేయకపోయినట్లయితే అతడు ఆహారము తినుటకు అర్హుడు కాడు'' అని    బైబిలు చెప్తుంది (2థెస్స 3:10). దేవుడు ఆకాశపక్షులను పోషించును అని యేసు చెప్పాడు. కాని ఆయన ఆ ఆహారమును వాటినోళ్ళలో పడవేయడు. అవి బయటకు వెళ్లి ఆహారము గూర్చి    వెదకవలయును. అదే విధముగా మనము కూడా కష్టించి పని చేయుచుండవలెనని మరియు ఆయన యందు నమ్మికయుంచవలెనని ఆయన చూచుచున్నాడు. విశ్వాసము కష్టపడి పని చేయుటకు ప్రత్యామ్నాయం    కాదు.

    దేవుని చిత్తప్రకారము చేయుట కొరకు కావలసిన ఆరోగ్యము

    ఈ ప్రార్థన దీనికి ముందున్న విన్నపముతో కలసియున్నది: ''పరలోకమందు ఎలాగునో అలాగే భూమిపై నీ చిత్తము నెరవేరును గాక''. మనము ఆయన చిత్తము చేయుట కొరకు శారీరక    ఆరోగ్యము మరియు బలమును కోరుకొనుచున్నాము.

    అనారోగ్యముతోనున్నవారు స్వస్థత గూర్చి నన్ను ప్రార్థించమని అడిగినప్పుడు ''అతడు దేవుని సేవించుట కొరకు తగినంత బలమును మరియు శక్తిని కోరుచుండెనా? లేక తన కొరకు    తాను జీవించుట కొరకు అది కోరుచుండెనా? నేనిప్పుడు అతడు లోకము కొరకు జీవించుట కొరకు అతడిని స్వస్థపర్చమని అడుగవలెనా?'' అను ఆలోచన నాకు తరచు వచ్చును. మనము మన    యిష్టము కాక దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు మన శారీరక అవసరతలు తీర్చుమని ప్రార్థించుట నేర్పించాడు.

    ఒక కుటుంబ ప్రార్థన

    ఈ ప్రార్థన ''నాకు ఇమ్ము'' అని కాక ''మాకు ఇమ్ము'' అని యుండుట గమనించండి.

    తన జీవితములో దేవునిని ముందుగా పెట్టుకొనినవాడు తననుతాను రెండవ స్థానములో ఉంచుకొనలేడని చూస్తాడు. మనము తండ్రి బల్ల చుట్టూ కూర్చొని యున్న కుటుంబ సభ్యులము.    తండ్రి తన బల్ల యొద్ద ఉంచిన వాటన్నిటిని ఇతరులు తినుటకు ఉన్నవో లేదో పట్టించు కొనకుండా స్వార్థపూరితముగా అన్నీ వారి కొరకే వడ్డించుకొనే బిడ్డలను ఆయన కోరుకొనడు.    అటువంటి ప్రవర్తన అవిశ్వాసులలో కూడా అమర్యాదగా పరిగణింప బడును. అది క్రైస్తవులలో ఇంకెంత చేయకూడనిదిగా యుండును.

    తీర్పుదినమును గూర్చి యేసుప్రభువు చెప్పినది జ్ఞాపకముంచు కొనండి. ఆయన ప్రజలను తీర్పు చేయుటకు ఆయన సింహాసనముపై కూర్చొన్నప్పుడు, ''అనేకులతో ఆయన, నేను ఆకలిగొనుట    మీరు చూచిరి. కాని ఆహారమివ్వలేదు, నేను దిగంబరినై ఉండుట చూచిరి కాని కప్పుకొనుటకు వస్త్రమివ్వలేదు. నేను రోగినై యుండుట మీకు తెలిసినను నన్ను దర్శించుటకు మీరు    రాలేదు'' అని చెప్పెను. దానికి వారు, ''ప్రభువా, ఎప్పుడు అలా జరిగినది? నీవు దిగంబరిగా గాని ఆకలిగొని యుండుట గాని మేమెప్పుడూ చూడలేదు'' అని జవాబిచ్చెదరు. ''నేను    తిరిగి జన్మించిన వారిలో నుందును. నా సహోదరుడు అవసరములో నుండుట నీవు చూచినప్పుడు, నేనే అవసరములో ఉన్నానని నీవు గ్రహించలేదు. అప్పుడు నేనే ఆకలిగొని, దాహముగొని    యుంటిని'' (మత్తయి 25:31-46 అర్ధవంతముగా కూర్చబడినది).

    పరలోకమునకు నరకమునకు మధ్యనున్న మౌళికమైన తేడాలో ఇది ఒకటి. నరకము పాపముతో నిండిపోయి ఉంటుంది, స్వార్థము రాజ్యమేలుతూ ఉంటుంది. ప్రతి ఒక్కడు తన కొరకు మాత్రమే    జీవిస్తూ, దేవునికి గాని ఇతరులకు గాని ఏ మాత్రము చోటు లేకుండా యుందురు. పరలోకములో దానికి వేరుగా యుండును. అక్కడ దేవునికి మొదటి స్థానము మరియు మిగిలిన వారు    తరువాత యుందురు.

    పరలోకము మరియు నరకముల గూర్చి వివరించు ఒక కథను గూర్చిన ఉపమానము ఒకమారు విన్నాను. ఒకడు కల కనెను. అందులో అతడు మొదట నరకముకు వెళ్లును. అక్కడ ప్రతి ఒక్కరు    రుచికరమైన వంటకములు వడ్డింపబడిన బల్లచుట్టూ కూర్చొని యుండిరి. కాని, వారందరూ బక్కగా, నీరసముగా మరియు దుర్భలులుగా నుండిరి. వారు వారి ముందు ఉంచబడిన ఆహారము    తినలేకపోవుటకు కారణము చూడగా, వారి చేతులకు నాలుగు అడుగుల పొడవు ఉండే గరిటలు కట్టబడి యుండెను. నీ చేతులకు నాలుగు అడుగులు పొడవుంటే గరిటలు కట్టబడియుంటే నీ ముందు    ఏది ఉన్నా దాన్ని తినుట అసాధ్యము.

    అప్పుడు అతడు తన కలలో పరలోకమునకు వెళ్లెను. అక్కడ కూడా బల్లపై అవే రుచిగల పదార్థములుండెను. మరియు అక్కడ బల్ల చుట్టూ కూర్చొనిన వారి చేతులకు కూడా ఈ నాలుగడుగుల    గరిటలు కట్టబడి యుండెను. కాని యిక్కడ వారందరూ ఆరోగ్యకరముగా మరియు బలముగా యుండిరి. అది చూచి అక్కడున్నవారిలో ఒకనిని, ''మీరందరూ ఆరోగ్యముగా మరియు బలముగా ఎలా    ఉన్నారు?'' అని అడుగగా అతడు ''చూడండి, నా చేతితో నేను తినలేనని గ్రహించాను. కనుక నా చెయ్యి చాపి బల్లకు ఆవలివైపునున్న ఒకరికినేను తినిపించుచున్నాను, మరియు నాకు    ఎదురుగా నున్నవారు వారి గరిటతో నాకు తినిపించుచున్నారు. ఈ విధముగా మాలో ప్రతివారు తినుటకు కావలసినంత పొందుచున్నాము'' అని చెప్పెను.

    అప్పుడు కలలో అతడు తిరిగి నరకమునకు వెళ్లి అక్కడున్న వారితో ''మీరందరు తినుటకు మార్గమున్నది. మీ పళ్లెములోనికి వేరొకరు తిననివ్వవలెను మరియు మీరు బల్లపై అవతల    ఉన్న వారికి తినిపించవలెను'' అని వారితో చెప్పెను. దానికి వారందరూ ఒకే జవాబిచ్చిరి. ''నేను నా పళ్లెము నుండి ఎవర్నీ తిననివ్వను, ఎవరో తన పళ్లెములోనిది నన్ను    తిననిచ్చుదురో లేదో నాకేమి తెలియును'', అని వారిలో ప్రతి ఒక్కరు అనిరి.

    నరకము మరియు చివరకు నరకముకు వెళ్లు వారందరిలో అటువంటి స్వార్థము లక్షణముగా యుండును. వారందరూ వారి స్వంత అనుదినాహారము గూర్చి ఆసక్తి కలగియుందురు.

    నీవు క్రీస్తులో ఉన్న నీ సహోదర సహోదరీల గూర్చి ఆలోచన కలిగిలేనట్లయితే, నీ అనుదినాహారము గూర్చి ఈ ప్రార్థన చేయలేవు.

    అబ్రాహాము జీవితములో ఒక సమయములో శారా ద్వారా కుమారుని పొందుటకు ఆయన ఇరవై ఐదు సంవత్సరములు వేచియుండెను. అతడు బహుగా ప్రార్థిస్తూయుండెను. జవాబు ఏమీ పొందలేదు. అటు    తరువాత అతడు గెరారులో నున్నప్పుడు, దేవుడు అక్కడి స్త్రీలను గొడ్రాళ్ళగా నుండునట్లు మొత్తుట ద్వారా అక్కడ ప్రజలను శిక్షించుటను గమనించెను. వెంటనే అబ్రాహాము ఆ    స్త్రీలకు సంతాన మిమ్మని దేవుని ప్రార్థించెను (ఆది 20:17). అబ్రాహాము తన స్వంత భార్య కొరకు ప్రార్థించే ప్రార్థనలకు జవాబు అప్పటికి పొందలేదని    జ్ఞాపకముంచుకొనండి. అబ్రాహాము యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు సంతానములేని ఆ స్త్రీలకు సంతానమిచ్చెను. అయితే దేవుడు అక్కడితో ఆగిపోయాడా? లేదు. అదే సమయములో శారాకు    కూడా వాగ్దాన పుత్రుని దయచేసెను (ఆది 21:1). అబ్రాహాము యితరుల కొరకు ప్రార్థించగా, దేవుడు అతని స్వంత అవసరతలను కూడా తీర్చెను.

    ముందుగా దేవుని గూర్చి తరువాత ఇతరుల గూర్చి ఆలోచించు వారు దేవుని యొద్దనుండి శ్రేష్టమైన వాటిని పొందుదురు. ''యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు    యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసెను'' (యోబు 42:10). అది దేవుని పద్దతి.

    మన భౌతిక అవసరాల గూర్చిన విన్నపము మరియు రెండు విన్నపములను కలుపుచూ మధ్యలోనున్నది. ఒక ప్రక్క ''పరలోకమందు ఎలాగునో భూమియందును అలాగు జరుగునుగాక!'', అని మరో    ప్రక్క ''మా యెడల ఇతరుల అపరాధములను మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమింపుము'' అనునది. నీవు దేవుని చిత్తమును చేయుటకు ఆశ కలిగియున్నావా? మరియు నీకు హాని    చేసిన వారిని క్షమించగలిగి యున్నావా? లేక నీవు క్రీవ్ు బిస్కెట్టులో మధ్యనుండిన క్రీవ్ును మాత్రమే తిను చిన్న బిడ్డవలె యున్నావా? ''మా అనుదిన ఆహారము మాకు    దయచేయుము'' అని నీ ఒక్కడి భౌతిక అవసరతలు మాత్రమే తీరునట్లు ఆసక్తి కలిగి, దానిముందు మరియు వెనుక నుండిన విన్నపములను అశ్రద్ధ చేయుచున్నావా?

    మనము రెండు విపరీత ధోరణులున్న క్రైస్తవులను చూచితిమి. కొందరు వస్తు సంబంధమైన వాటిగూర్చి ప్రార్థించుట తప్పనుకొనే అతిగొప్ప భక్తిపరులు. మరికొందరు కేవలము వారి    స్వంత భౌతిక మరియు వస్తు సంబంధమైన అవసరములను గూర్చి మాత్రమే ప్రార్థించువారు.

    యేసు ప్రభువు చెప్పిన సమతుల్యతను సరియైన విధముగా అర్థము చేసికొనినవారు ధన్యులు.

అధ్యాయము 7
పాపముల యొక్క క్షమాపణ

    ''మా ఋణస్తులను మేము క్షమించినట్లు మా ఋణములను క్షమించుము''

    పాపము అనేది దేవునికి బాకీ - అది దేవుని ప్రమాణమునకు మనము తక్కువగా యుండుట కావచ్చు లేక దేవుడు అనుమతించిన దానిని మీరుట మరియు దాటిపోవుట కావచ్చును.

    మనస్సాక్షి యొక్క విలువ

    ఈ భూమిపై సృష్టించబడిన వాటన్నిటిలో, కేవలము మానవుడు మాత్రమే, ఏదైనా తప్పు చేసినప్పుడు అపరాధ భావన కలిగియుండును. అతడిని జంతువులు నుండి వేరు పరిచే ఒక లక్షణము    యిదియే.

    ఒక కుక్క తన యజమానుడు శిక్షణ యిస్తే తప్ప, ఏదైనా తప్పు చేసినప్పుడు దోషిగా భావించుకొనదు. కాని మానవుని విషయంలో, నీవు అడవులలోనికి వెళ్ళినా, అక్కడ మతము గూర్చి    ఎప్పుడూ వినని వారు, ఎవ్వరి చేత ఏమీ చెప్పబడని వారు, ఎప్పుడూ బైబిలును చూడనివారు, అపరాధ భావము కలిగి యుండుట కనుకొనగలవు, వారి మనస్సాక్షి వారు తమ సృష్టికర్తను    బాధపెట్టారని వారికి చెప్పెను కనుక వారు ఆయనను ఏదొక విధముగా ప్రసన్నము చేసికొనుటకు ప్రయత్నించెదరు. అయితే నీవు మతాసక్తి గలిగిన ఒక కోతినిగాని, ఒక కుక్కను గాని    కనుగొనలేవు.

    మన మనస్సాక్షి దేవుడు మనకిచ్చిన గొప్ప వరములలో ఒకటి. మన శరీరములో ఏదైనా బాగోలేనప్పుడు నొప్పి ఎలాగు వచ్చునో అలాగే దేవునితో మన సంబంధము సరిగా లేనప్పుడు అది మనకు    హెచ్చరిక చేయును. అందువలననే మనము అన్ని వేళలలో సునిశితమైన మనస్సాక్షిని కొనసాగించవలెను.

    నిజాయితీగా పాపమును ఒప్పుకొనుట

    ''తండ్రీ, మా పాపములను క్షమింపుము'' అని అనేకులు అందురు, కాని మొదట మన పాపములను దేవుని యొద్ద ఒప్పుకొనకుండా మనలను క్షమించమని దేవుని అదుగలేమని వారు గ్రహించరు.    మన పాపములను సంపూర్ణమైన నిజాయితీతో మనము ఒప్పుకోవలసి యున్నది.

    ''తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు'' (సామెతలు 28:13) అని దేవుని వాక్యము చెప్పుచున్నది. తన పాపములను దాచి పెట్టుకొనిన వాడు ''నన్ను క్షమింపుము, నన్ను    క్షమింపుము'' అని ప్రార్ధించవచ్చును. కాని అతడు క్షమింపబడడు. ఆ వచనము ఇంకా ''....వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరము పొందును'' అని చెప్పుచున్నది.    బైబిలు ఇంకా ''మన పాపములను ఒప్పుకొనిన యెడల (అది మనము చేయవలసినది) ఆయన (దేవుడు) నమ్మదగినవాడు మరియు నీతిమంతుడు కనుక మనలను సమస్త దుర్నీతి నుండి కాపాడును'' (అది    దేవుడు చేయునది) (1యోహాను 1:9) అని చెప్పుచ్నుది. మనము చేయవలసినది మనము చేసినట్లయితే, ఆయన చెయ్యవలసినది ఆయన చెయ్యుటకు ఆయన నమ్మదగినవాడు.

    ఆదాము పాపములో పడిపోయినప్పటి నుండి, మానవుడు తాను చేసిన పాపమును ఒప్పుకొనుటకు బదులు దానిని కప్పిపుచ్చుకొను నైజము కలిగియుండెను. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు    వారి యొక్క మొదటి స్పందన ఏమిటి? వారు దేవుని యొద్దకు పరిగెత్తి కొని వెళ్లి ''ఓ దేవా, మేము పాపము చేసితిమి, నీవు చెయ్యవద్దన్న దానిని మేము చేసాము'' అని    చెప్పారా? లేదు. వారు అలా చెయ్యలేదు. వారు దేవుని నుండి పారిపోయి ఆయన నుండి దాగుకొనుటకు ప్రయత్నించితిరి. ఎటువంటి బుద్ది హీనత! ఆదాము హవ్వలు ఒక చెట్టు వెనుక    మహోన్నతుడైన దేవుని నుండి దాగు కొనగలరా? పాపము మనుష్యుని ఎంత బుద్ధిహీనునిగా చేయును.

    మానవుని యొక్క రెండవ లక్షణము అతడు చేసిన పాపముల యొక్క నిందను ఇతరులపై మోపుట. ''నీవు ఆ చెట్టు ఫలమును తింటివా?'' అని అడిగెను. దేవుడు ఆదాము పాపమును ఎరిగినప్పుడు    దానికి ఆదాము యొక్క జవాబేమిటి? ఆదాము తన భార్యను నిందించెను. అతడి భార్య సర్పమును నిందించెను.

    ఆదాము హవ్వ నుండి ఆ స్వభావము మనందరికి వచ్చినది. మనము చేసిన తప్పులకు బాధ్యులము మనము కాదు అని, మనము ఎప్పుడూ సమర్థించుకొందుము. మనము పాపములో పట్టుబడినప్పుడు,    మనము క్షణికోద్రేకముతోను మరియు ఒత్తిడి వలనను అట్లు చేసామని చెప్పుదుము. మన పాపమును ఒప్పుకొనుటకు బదులు వాటిని కప్పి పుచ్చుకొనుటకు చూచెదము. అందువలననే మనము    దేవుని యొక్క క్షమాపణను పొందలేక పోవుచున్నాము.

    వెలుగులో నడుచుట

    వెలుగులోనికి వచ్చుట గూర్చి యేసు ప్రభువు మాటలాడినప్పుడు, ''వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు దుష్ క్రియలుగా కనబడునట్లు వెలుగు నొద్దకు రారు.    సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును'' (యోహాను 3:19-21).

    ఇక్కడ ఉండిన వ్యత్యాసము గమనించండి! ఒక వైపున, చెడు చేయు ప్రతి ఒక్కరు వెలుగును ద్వేషించుందురని యేసు ప్రభువు చెప్పారు. 'చెడు'కు వ్యతిరేకము 'మంచి' కాబట్టి, మంచి    చేయువారందరు వెలుగు యొద్దకు వచ్చెదరు అని చెప్పెనని అనుకొనవచ్చును. కాని ఆయన అట్లు చెప్పలేదు. సత్యముననుసరించి నడుచుకొను ప్రతివాడు వెలుగునొద్దకు వచ్చునని ఆయన    చెప్పెను.

    ఇక్కడ వ్యత్యాసము గమనించితివా? యేసు ప్రభువు మనలో మొదట అడుగునది మంచితనము కాదు గాని సత్యము అనగా యదార్థత మరియు నిజాయితీ. వేరే మాటలలో ''దుష్కార్యము చేయువాడు    నిజాయితీ లేనివాడు, కాని వెలుగుయొద్దకు వచ్చువాడు, అతడు సంపూర్ణుడు కాకపోయినను, అతడు నిజాయితీగా యుండును'' అని యేసు చెప్పెను. మనము సంపూర్ణముగా మంచివారమైనప్పుడే    మనము వెలుగు నొద్దకు రావలెనంటే, మనలో ఎవ్వరము దానిలోనికి రాలేక పోవుదుము. కాని నిజాయితీగా ఉన్నవారిని ఆయన యొద్దకు రమ్మనమని దేవుడు ఆహ్వానించుచున్నాడు. ఈ    నిజాయితీగా యుండిన ప్రజలు క్రమముగా మంచివారగుదురు.

    మనము నిజాయితీగా యుండుటకు యిష్టపడినప్పుడే ''మా పాపములను క్షమించుము'' అని ప్రార్థించగలము. నీవు సంపూర్ణుడవు కాకపోయినా నీవు నిజాయితీతో యుండినట్లయితే, నీలో    నుండిన అసంపూర్ణమైన లక్షణములను గూర్చి యధార్థముగా యుండినట్లయితే నీవు దేవుని యొక్క వెలుగులోనికి రావచ్చును. సత్యములో నడుచుకొనుచు, నిజాయితీతో నున్న ప్రతి ఒక్కరు    వెలుగులోనికి వచ్చి వారి పాపములను ఒప్పుకొనినట్లయితే వారి పాపములు చెరిపివేయబడును.

    ''అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి    మనలను పవిత్రులనుగా చేయును'' (1యోహాను 1:7). ఆ వచనములో చివరి భాగమైన ''యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేయును'' అను మాటను చాలా మంది    చెప్పుచుందురు. కాని అలా దానిని చెప్పుట సరియైనది కాదు. యేసు రక్తము, వచనము యొక్క మొదటి భాగములో చెప్పబడిన వెలుగులో నడుచుట అను షరతు నెరవేర్చిన వారినే పవిత్ర    పర్చును.

    ఒక ఉదాహరణ. నా చుట్టూ అంతా చీకటిగా యున్నదనుకొందుము. ఇప్పుడు నేను వెలుగులోనికి వచ్చుట అనగా నన్ను నేను కనపరచుకొనుటయై యున్నది. నా చొక్కాయి మురికిగా    నుండినట్లయితే, అది కనబడును. వెలుగు నా చొక్కాయిని శుభ్రపరచదు. ఆ వెలుగు నా చొక్కాయి మురికిగా నున్నదను వాస్తవమును మాత్రమే చూపును. అది నాలో నున్నదానిని    దాచుకొనకుండా నాలో నేను చూచిన దానిని నిజాయితీగా ఒప్పుకొనుటైయున్నది. అది వెలుగులోనికి వచ్చుట అను దానికి ప్రధానమైన అర్థమైయున్నది.

    మనకు దేవునితో ఉన్న సంబంధములో మాత్రమే గాక తోటి మానవులతో నున్న సంబంధములో కూడా ఈ విషయము పనిచేయును కనుక దీనిని మనము సరిగా అర్థము చేసికొనవలెను.

    క్రైస్తవత్వములో దేవునితో నిలువుగా యున్న సంబంధము మరియు తోటి విశ్వాసులతో సమాంతరముగా నున్న సంబంధము యున్నది. ఒకటి లేకుండా ఇంకొకటి నీవు కలిగియుండలేవు. నీ తోటి    విశ్వాసులతో నీకు సహవాసము లేకపోయినట్లయితే నీవు దేవునితో సహవాసము కలిగియుండలేవు.

    ''ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును'' (1యోహాను 4:20). నీవు నిజముగా దేవుని ప్రేమించిన యెడల నీవు    నీ సహోదరుని కూడా ప్రేమించుదువు.

    తోటి విశ్వాసులతో సరియైన సంబంధము

    మనము దేవుని ఎడల చేసిన తప్పులను ఏ విధముగా దేవుని యొద్ద ఒప్పుకొనెదమో అట్లే మన తోటి మానవుని యెడల చేసిన తప్పులను వారి యొద్ద కూడా ఒప్పుకొనవలసి యున్నది. అటువంటి    ఒప్పుకోలు లేకుండా క్షమాపణ యుండదు.

    మనము ఎవరినైనా డబ్బు విషయములో మోసగించినట్లయితే, దానిని మనము తిరిగి ఇవ్వవలసియున్నది. అలా కానట్లయితే దేవుడు మనలను క్షమింపలేడు. మనము నిజముగా మారుమనస్సు    పొందామని చూపుటకు గల ఒకే ఒక మార్గము మనము ఎవరి యెడల తప్పుచేసితిమో వారి యొద్దకు వెళ్ళి వారి యొద్ద తప్పుగా తీసుకొనిన దానిని తిరిగి ఇచ్చివేయుటయై యున్నది.

    నీవు రైలు బళ్ళలో టిక్కెట్టు తీసుకొనకుండా ప్రయాణము చేసియుండినట్లయితే, దేవుని యొద్దకు వెళ్ళి ''రైల్వే శాఖను మోసగించాను, దానిగూర్చి విచారించుచున్నాను'' అని    చెప్పుట చాలా సుళువైనది. కాని కష్టమైనది మరియు ఖరీదైనది మరియు నీవు నిజముగా పశ్చాత్తాప పడితివని ఋజువు చేసికొనుటకు చేయవలసినది, నీవు రైల్వే టిక్కెట్టు ఇచ్చు    చోటికి వెళ్ళి, నీవు గతములో టిక్కెట్టు లేకుండా ప్రయాణించిన దూరమునకు ఒక టిక్కెట్టు కొని దానిని చింపి వేయుటయై యున్నది, అలా కాక పోయినట్లయితే నీ పశ్చాత్తాపము    కేవలము శూన్యమైన మాటలైయున్నవి.

    అనేకులు దేవునితో లోతైన సహవాసములోనికి రాక పోవుటకు కారణం ఇక్కడనే ఉన్నది. వారు వారి పెదవులతో పశ్చాత్తాపము చెందుదురు కాని హృదయముతో కాదు. వారు వారి పాపములను    దేవునికి ఒప్పుకొందురు. కాని వారు తోటి మానవుల యెడల చేసిన తప్పిదములను వారి యొద్ద ఒప్పుకొనరు.

    ''అది నా పొరపాటు నేను చింతిస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి'' అని చెప్పుట చాలా కష్టమైనది. ఎందుచేత? అది మన అహాన్ని హతము చేయును. మనము ప్రాధమికముగా    గర్విష్టులైన ప్రజలము మరియు మనలను మనము తగ్గించుకొనుటకు మరియు మన తప్పును ఒప్పుకొనుటకు ఇష్టపడము.

    మనము పరిశుద్ధుడైన దేవునికి మన పాపములను ఎంతో స్వేచ్ఛగా ఒప్పుకొనుటకు యిష్టపడుదుము కాని మన పాపమును ఒక పరిశుద్ధుడు కాని సహోదరునికి ఒప్పుకొనుటకు ఎందుకు ఎంతో    కష్టముగా భావించుదుము? దానికి కారణము, మనము గదిలోనికి వెళ్ళి దేవునికి ఒప్పుకొనుచున్నామను కొనినది, నిజానికి మనతో మనమే ఒప్పుకొనుచు ఉండవచ్చును. మనము దేవునితో ఏ    మాత్రము ఒప్పుకొనుట లేదు. మనలను మనము మోసగించు కొనుచున్నాము. నిజముగా పరీక్ష, నీవు బాధ కలిగించిన ఏ మానవ మాత్రునినైనా క్షమాపణ అడుగుటకు నీవు యిష్టపడుచున్నావో    లేదో అను దానిలోనుండును.

    భారతదేశ సంస్కృతిలో, భార్యలు మాత్రమే ఎప్పుడూ భర్తలను క్షమించుమని అడుగవలెను తప్ప ఇంకొక విధముగా కాదు అను ఆలోచనయున్నది. అది పురుషుడు ఏదో ప్రత్యేకమైన జాతిగా    చూపు చున్నది.

    క్షమాపణ అడుగుటకు ఎక్కువ వారని మరియు తక్కువ వారని ఏమీ లేదు. నీవు ఒక పెద్ద సంస్థకు అధిపతివైనా, ఆ సంస్థలో అతి చిన్న ఉద్యోగి యెడల నీవు తప్పుచేసినట్లయితే,    నిన్ను నీవు తగ్గించుకొని అతడి యొద్దకు వెళ్లి ''అది నా పొరపాటు, నేను బాధపడుచున్నాను, నన్ను క్షమించు'' అని చెప్పవలసియున్నది. అలా చేయుట కంటె తక్కువైనది నిజమైన    క్రైస్తవత్వము కాదు.

    అనేక సంఘములలో సంబంధములు తెగిపోయి వాటిని సరిచేసికొనుటకు ఒకరి యొద్దకు ఒకరు వెళ్ళకుండా ఉండువారు ఎందరో ఉన్నారు. వారికి ఒకరిపై ఒకరికి కక్షలుండును మరియు    ఒకరినొకరు దర్శించుకొనరు. అయినా వారందరూ క్రైస్తవులమని చెప్పుకొందురు. వారు ఏ మాత్రము క్రైస్తవులు కారు. అటువంటి వారు దేవుని రాజ్యములో ఉన్నట్లు    అనుకొనినట్లయితే, వారిని వారు మోసగించుకొనుచున్నారు.

    నీవు ఒక సహోదరుని దర్శించుటకు గాని లేక మాటలాడుటకు కాని యిష్టపడకుండా రొట్టె విరుచుటలో పాలు పంపులు పొందినట్లయితే, అది దేవ దూషణయై యున్నది. ఆ విధముగా ఉంటూ మనము    దేవునితో సహవాసము కలిగియుండలేము. నీ తోటి విశ్వాసులతో సమాంతర సంబంధము సరిగా లేనట్లయితే దేవునితో నిలువుగా సంబంధమును కలిగియుండలేవు.

    కాని మనము నిజముగా దేవునికి మరియు మానవునికి మన తప్పిదములను ఒప్పుకొనినట్లయితే, అప్పుడు దేవుడు మన గత పాపముల యొక్క జ్ఞాపకము ఆయన ఎదుట ఉండకుండునట్లు సంపూర్తిగా    మనలను పవిత్రపర్చును. ఆయన మన గత పాపములను ఇక ఎప్పుడూ జ్ఞాపకము చేసికొనక పోయినట్లయితే, మనమెందుకు వాటి గూర్చి జ్ఞాపకముంచు కొనవలెను? (హెబ్రీ 8:12).

    సంపూర్ణమైన క్షమాపణ

    మనము యేసుక్రీస్తు రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడితిమి అని బైబిలు చెప్పుచున్నది (రోమా 5:9). దేవుడు మనలను పవిత్రపరచినప్పుడే ఆయన మనలను నీతిమంతులుగా తీర్పు    తీర్చెను. ''నీతిమంతులుగా తీర్చబడుట'' అను మాటకు ''నేనెప్పుడూ నా జీవితములో పాపము చేయలేదు మరియు ఇప్పుడు నేను సంపూర్తిగా నీతిమంతుడను'' అని అర్థము. ఎంత    అద్భుతమైన విషయము.

    మన పాపములను ఒక వ్రాత బల్ల అంతటా వ్రాయబడిన అనేక పదాలవలే ఊహించుకొనవచ్చును. ఇప్పుడు ఆ బల్ల ఒక తడి గుడ్డతో శుభ్రముగా తుడవబడినది. నీవు ఇప్పుడు ఆ బల్లను    చూచినప్పుడు ఏమి చూచుచున్నావు? ఏమీ లేదు. అది దానిపై ఎప్పుడూ ఏదీ వ్రాయబడనట్లుగా యున్నది. యేసు రక్తము మనలను అదే విధముగా ఏమీలేకుండా సంపూర్తిగా అలాగే కడుగును.

    మనము నిజముగా మన పాపములను దేవునికి ఒప్పుకొనినట్లయితే, ఆ విధముగా ఒక్కసారి ఒప్పుకొనుట చాలును. దేవుడు వాటిని వెంటనే తుడిచి వేయును. మరియు ఆయన వాగ్దానము ''వారి    పాపములు నేనెన్నడును జ్ఞాపకముంచుకొనను'' (హెబ్రీ 8:12) అని యున్నది. మనము నిజముగా క్షమింపబడినామని మరియు మన పాపములను మరల దేవుని యొద్ద ఒప్పుకొననక్కర్లేదని మనము    గ్రహించినప్పుడు ఎటువంటి విశ్రాంతి మన హృదయములలోనికి వచ్చును.

    మనము ''మా పాపములను క్షమించుము'' అని ప్రార్థించినప్పుడు వాటి గూర్చి నిర్ధిష్టముగా నుండుట మంచిది. అనేకులు సాధారణముగా ''ప్రభువా, నేను ఎన్నో పాపములు    చేసియుందును'' అని మొత్తముగా కలిపి ప్రార్థింతురు. దాని అర్థము వారికి అది ఖచ్చితముగా తెలియదు. ఆ విధముగా ఒప్పుకొనుటలో ప్రయోజనము లేదు. ఆ విధముగా చెప్పుట ద్వారా    బహుశా నీవు అసలు పాపమే చేసి యుండక పోవచ్చును అని కూడా చెప్పుచున్నావు.

    ''ప్రభువా, ఇదిగో ఈ పాపము. ఫలానా వ్యక్తిపై నాకు కక్ష ఉన్నది. ఆ వ్యక్తిని నేను క్షమింపలేక పోవుచున్నాను. ఆ వ్యక్తిపై నాకు అసూయయున్నది. ఆ పని చేయుటలో నా    ఉద్దేశము సంపూర్తిగా స్వార్థపూరితమైనది. ఆ పని కేవలము నాకు పేరు వచ్చునని చేసాను'' మొదలగు విషయములను నిర్దుష్టముగా చెప్పుట మంచిది. నీవు నిజాయితీగా యుండవలసి    యున్నది.

    ఆ విధముగా మనము మనకు తెలిసిన పాపములన్నిటిని ఒప్పుకొనిన తరువాత దావీదు వలె, ''నా రహస్య పాపములను క్షమించుము'' (కీర్తనలు 19:12) అని ప్రార్థించవలసి యున్నది.    మనమందరము మనకు తెలియని విషయములలో కూడా తెలియకుండా పాపము చేసి యుందుము.

    ఇతరులను క్షమించుట

    యేసు ప్రభువు తన ప్రార్థనలో చివరన మరల తిరిగి చెప్పిన ఒకే ఒక విన్నపము క్షమించుట గూర్చిన విన్నపము. కాబట్టి అది విన్నపములన్నింటిలో ఒక ప్రాముఖ్యమైన విన్నపము.

    దానిని నీవు గమనించావా?

    ఈ ప్రార్థనలో నున్న ఆరు విన్నపములలో ఒక దానిని యేసు ప్రత్యేకముగా వివరించిరి. ''మీరు ఇతరులు చేసిన అపరాధములను క్షమించినట్లయితే, మీ పరలోకపు తండ్రి కూడా    మిమ్ములను క్షమించును. కాని మీరు వారి యొక్క అపరాధములను క్షమింపకపోయినట్లయితే మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మును క్షమింపడు'' అని ఆయన చెప్పెను (మత్తయి 6:14,15).

    అనేక మంది క్రైస్తవులు ఈ విన్నపమును తీవ్రముగా తీసుకొనక పోవుటచేత దేవునితో సంపూర్ణమైన మరియు స్వేచ్ఛతో కూడిన సహవాసమును అనుభవింపరు.

    యేసు ఒక ఉపమానములో, ''ఒక రాజు తన లెక్కలు చూచుకొనునప్పుడు అతడికి 40 లక్షల రూపాయుల బాకీ ఉన్న ఒక సేవకుడి గూర్చి తెలుసుకొనెను. అయితే అతడు నా యొద్ద అంత సొమ్ము లేదు    నన్ను క్షమింపుము ''అని చెప్పినప్పుడు రాజు అతడిని సంపూర్తిగా క్షమించెను. ఆ సేవకుడు బయటకు వెళ్ళి తనకు నలభై రూపాయలు బాకీ ఉన్న ఒకరిని మెడ పట్టుకొని ఖైదులో    వేయించెను. రాజు ఈ విషయము విని ఆ దుర్మార్గుడైన సేవకుని పిలిచి ''నేను నిన్ను నలభై లక్షల రూపాయలకు ఊరికనే క్షమించాను. నీవు అతడి నలభై రూపాయలను క్షమింపలేవా?''    అని అడిగి అతడిని బాధ పెట్టువారికి అప్పగించెను. అప్పుడు యేసు ''మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ    యెడల చేయుననెను'' (మత్తయి18:35). బాధపెట్టువారు అనగా దుర్మార్గులు, మనము ఇతరుల యెడల కనికరము చూపుట నేర్చుకొను వరకు వాటికి మనలను బాధపెట్టుటకు అనుమతి యివ్వబడును.

    దేవుడు మనలను క్షమించిన బాకీ ఎంత గొప్పదో తెలియజేయుటకు, మరియు మనము మనలను బాధించిన వారికి క్షమింపక పోయినట్లయితే, అది ఎంత కనికరము లేని మరియు దుష్టమైన విషయమో    చెప్పుటకు యేసు ప్రభువు ఈ ఉపమానము చెప్పెను.

    ఎవరైనా నీకు ఏదైనా హాని చేసారా? ఒకడు నీ గూర్చి అసత్య విషయములను ప్రచారము చేసియుండవచ్చును. నీ పొరుగు వారు, లేక నీ భార్య, లేక నీ తండ్రి లేక నీ అత్తగారు నీకు    ఏదొక హాని చేసి యుండవచ్చును. నీవు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ఒక తప్పుచేయుట వలన అది నీకు చెప్పుకోలేని బాధ కల్పిస్తుయుండవచ్చును. కాని ఆ పాపములన్ని కలిపి    చూసినా దేవుడు నిన్ను క్షమించినదానికి మరియు నీవు దేవునికి బాకీ ఉన్నదానితో పోల్చిచూచినట్లయితే అది చాలా చిన్నదని ప్రభువు చెప్పుచున్నాడు. కనుక నీకు హాని చేసిన    వారినందరినీ హృదయపూర్వకముగా క్షమింపక పోవుటకు ఏ విధమైన కారణము లేదు.

    మత్తయి 18:35లో ప్రాముఖ్యమైన భాగము ''హృదయ పూర్వకముగా'' అనునది. నీతోటి మానవుని నీవు హృదయ పూర్వకముగా క్షమింపలేకపోయినట్లయితే, దేవుని యొద్దకు వచ్చి ''మా    అపరాధములను క్షమింపుము'' అని చెప్పుచు సమయమును వ్యర్థపుచ్చుకొనవద్దు. ఎందుకనగా దేవుడు నీ ప్రార్థన వినడు. ఈ లోకమంతటిలో ఏ ఒక్కనినైనా నీవు క్షమింపలేక    యుండినట్లయితే, నీవు క్షమాపణ పొందలేవు, మరియు నీవు శాశ్వతముగా నశించిపోవుదువు. ఎందుకనగా క్షమింపబడని వాడెవడు కూడా దేవుని సన్నిధికి చేరడు. ఇది మనము అనుకొనుచున్న    దాని కంటె ఎంతో తీవ్రమైనది.

    ''మేము ఇతరులను క్షమించిన ప్రకారము మమ్ములను క్షమింపుము'' అనేది ప్రార్థన. మనము ఇతరులను ఎలా క్షమిస్తున్నామనేది దేవుడు జాగ్రత్తగా చూచును. మనము ఇతరులను ఏ    విధముగా కొలుచుచున్నామో దేవుడు మనకును అట్లే కొలుచునని యేసు బోధించెను. ''క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును. అణచి,    కుదించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడును'' అని ఆయన చెప్పెను (లూకా 6:38).

    దాని అర్థము నీవు ఇతరులకు యిచ్చుటకు చిన్న గరిటను ఉపయోగించినట్లయితే నీ ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు దేవుడు కూడా అదే గరిటను ఉపయోగించును. కనుక నీవు ఏదైనా గొప్ప    మహాత్యము గల దాని గూర్చి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు చిన్న గరిటను తీసుకొని మనకు దానితో కొంత మట్టుకే యిచ్చును. దానికి కారణం సాధారణముగా మనము ఇతరులకు    యిచ్చినప్పుడు అదే గరిటను ఉపయోగించియుందుము. ఇతరులకు మనము యిచ్చినప్పుడు ఎంత పెద్ద గరిటను ఉపయోగించెదమో, అంతటి పెద్ద గరిటనే దేవుడు మనకు యిచ్చుటకు ఉపయోగించును.    ఇది మనతో దేవుడు వ్యవహరించే తీరులో మారని నియమము.

    ''కనికరము గల వారు ధన్యులు; వారు కనికరము పొందుదురు'' (మత్తయి 5:7). నీవు ఇతరుల యెడల ఎంత ఎక్కువ కనికరము కలిగి యుందువో, దేవుడు నీ యెడల తీర్పు దినమందు అంత    ఎక్కువ కనికరము చూపును. కాని ''కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును'' (యాకోబు 2:13).

    కనుక, నీవు ఇతరులను తక్కువగా, పిసినారితనముతో క్షమించినట్లయితే, దేవుడు నిన్ను అదే విధముగా క్షమించును. కాని నీవు నీకు హాని చేసిన వారికి క్షమాపణతో కూడిన ప్రేమ    గలిగిన చూపును చూపినట్లయితే, దేవుడు కూడా ప్రేమతో కూడిన క్షమాపణ నీకు చూపును. నీవు ఇతరులను చూచినట్లుగానే దేవుడు నిన్ను చూచును.

    సంబంధములను సరి చేసికొనుట

    నీవు బలిపీఠము యొద్దకు అర్పణము తీసుకువచ్చినప్పుడు, దేవుని ప్రార్థించుటకు వచ్చునప్పుడు, లేక కానుక పెట్టెలో సొమ్ము వేయుటకు వచ్చినప్పుడు, నీవు నీ సహోదరునికి    హాని కలిగించినట్లు నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే, నీవు ''మొదట నీ సహోదరునితో సమాధానపడి, అటు తరువాత వచ్చి నీ అర్పణను నీవు అర్పించవలెను'' (మత్తయి 5:22-24) అని    యేసు చెప్పెను. అలాకాక పోయినట్లయితే దేవుడు నీ ధనమును కాని లేక నీ ప్రార్థనను కాని అంగీకరించడు.

    పాత నిబంధనలో నుండిన ప్రమాణము కేవలము ''నీ సహోదరుని మీద పగపట్టకూడదు'' (లేవీయ 19:17). అది పాటించుట సుళువే.

    కాని క్రొత్త నిబంధన ప్రమాణము ఉన్నతమైనది. ''నీ సహోదరునికి నీపై విరోధమేమైన యుండిన యెడల, వెళ్ళి దాని సరిచేసుకొనుము'' అని యేసు చెప్పెను. అయితే మన తప్పు ఏమీ    లేకుండానే మనపై ఏదో విరోధముంచుకొనిన సహోదరులు ఎప్పుడూ ఉందురు. యేసు ప్రభువు మరియు అపొస్తలులును సత్యముకొరకు నిలువబడినందున ఎప్పుడూ వారికి శత్రువులు అనేక మంది    యుండేవారు. కాని యిక్కడ సందర్భము మనము ఎవరితోనైనా కరిÄనముగా మాటలాడినందున (మత్తయి 5:22) మనపై విరోధముంచు కొనిన సహోదరుని గూర్చి యేసు ప్రభువు మాటలాడెను. ఆ    విరోధమునకు కారణము మనము చేసిన ఏదొక పాపము. అటువంటి విషయములలో, మనము మొదట అతడి యొద్దకు వెళ్ళి, మన పాపమును ఒప్పుకొని అతడిని క్షమాపణ అడుగవలెను. అప్పుడు మాత్రమే    మనము దేవుని యొద్దకు అర్పణను తీసుకు రావచ్చును.

    మనము దేవుని యొద్దకు వెళ్ళి, ''ప్రభువా, నా జీవితములో క్రొత్త నిబంధనపు శక్తి కావలెను'' అని అడిగినట్లయితే ''నేను నీకు క్రొత్త నిబంధనపు శక్తిని ఇచ్చినట్లయితే,    దానితో పాటు అది క్రొత్త నిబంధనపు భాద్యతలను తీసుకువచ్చును'' అని ప్రభువు చెప్పును.

    అనేక మంది క్రైస్తవులు పాత నిబంధనపు ప్రమాణములలో జీవించుచుండుట చేత, క్రొత్త నిబంధనపు శక్తిని పొందుకొనరు. వారు ఎవరి యొద్దకైనా వెళ్ళి క్షమాపణ అడుగుటకు    యిష్టపడరు కాబట్టి వారు శక్తిహీనులుగా యుందురు.

    కనికరము కలిగి యుండుట

    మనందరకు మాంసపు శరీరమున్నది మరియు మనము మాంసపు శరీరముండిన వారి మధ్యన జీవించుచున్నాము. కనుక మనము ఎడతెగక తెలిసి తెలియక ఒకరిని ఒకరు బాధపరుచుకొందుము. మనము ఎవరి    చేత హాని చేయబడని స్థలము ఒక్క పరలోకము మాత్రమే. కనుక మనము భూమిపై జీవించియున్నంత కాలము మనము ఒకరి నొకరము క్షమించుకొనవలసి యున్నది. పొరపాటు చేయుట మానవ నైజము,    క్షమించుట దైవత్వము.

    నరకము యొక్క లక్షణములలో ఒకటి అక్కడ కనికరము ఉండకపోవుట. ఇతరుల ఎడల నీ హృదయములో ఎంతవరకు కనికరము లేకుండా యుంటుందో అంత నరకము నీ హృదయములో ఉండును. నీవు ఎవరినైనా    క్షమించుటకు యిష్టపడనట్లయితే, నీ లోపల నరకము యొక్క చిన్న ముక్క ఉండును. నీకున్న మతపరమైన కార్యక్రమములను బట్టి ఇతరులు నిన్ను భక్తి గలవాడిగా ఎంచవచ్చును. కాని    నీలో నరకము యొక్క ఈ చిన్న ముక్క అన్ని సమయములలో ఉండును. అయితే నీవు పరలోకములోనికి నరకమును తీసుకు వెళ్లలేవు. కాబట్టి, అటువంటి స్థితిలో నీవు పరలోకమునకు    వెళ్లలేవు. నీవు ఈ భూమిని విడువక ముందే దానిని నీవు విడిచిపెట్టవలసియున్నది.

    అందువలననే ''మేము ఇతరులను క్షమించినట్లుగా మమ్ములను క్షమింపుము'' అని ప్రార్థించుట ప్రభువు మనకు నేర్పించెను.

    మనము ఇతరులను క్షమించనప్పుడు అది మన శరీరమును కూడా భాధించును. దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపుట శారీరక బాధలను కూడా తీసుకు వచ్చును.

    నీవు ఎవరిపైనైనా విరోధము ఉంచుకొని లేక ఎవరిపైనైనా అసూయ కలిగియుండి, ఆ విధముగా దేవునియొక్క ప్రేమ విధులను మీరినట్లయితే, అది చివరకు నీ శరీరమును ప్రభావితం చేయుట    ప్రారంభించును. ఈ రోజుల్లో క్రైస్తవుల కున్న కీళ్ళనొప్పులు, పార్వ్వనొప్పి, ఎముకల నొప్పులు మరియు ఆయాసము మొదలైనవి వారికి ఎవరిపైనో విరోధ బావముండుట వలన అవి    స్వస్థపడవు. వారు ఎన్ని మాత్రలైనా వాడవచ్చును కాని వారు క్షమించుట నేర్చుకొనేవరకు వారు స్వస్థత పొందరు. అటువంటి రోగములకు కారణము శారీరకమైనది కాదు. అది వారి    శరీరములో లేదు. అది వారి మనసులో ఉన్నది.

    నీవు నీ సహోదరుని కాని సహోదరిని కాని క్షమించక పోయినట్లయితే, దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, కీర్తన 66:18 ''నా హృదయము నందు పాపమును లక్ష్యముంచిన యెడల ఆయన నా మనవి    వినకపోవును'' అని బైబిలు చెప్పుచున్నది. ఆయన ప్రార్థనకు జవాబివ్వక పోవుటే కాదు, ఆయన అసలు వినడు.

    మనలను మనము మోసగించుకొనవద్దు. నిజమైన క్షమాపణ వెనుక విరుగ గొట్టబడుట మరియు ఒప్పుకోలు ఉండును. మరియు దానితో పాటు మన శరీరము యొక్క కుళ్ళును గుర్తించుట, ఇతరుల    యొద్ద తీసుకొన్న దానిని తిరిగి యిచ్చి వేయుట మరియు అవసరమైనట్లుయితే ఎవరినైనా క్షమాపణ అడుగుట ఉండును ఇవన్ని దేవునితో మన సంబంధము సరిగా యుండినప్పుడే యుండును.

    చివరగా, ఈ విన్నపము ''మమ్మును క్షమింపుము'' అని జ్ఞాపకముంచుకొనండి. మన సహోదరులు కూడా క్షమించబడాలని మనము కోరుకొనుచున్నాము. మన సహోదరుడు మన యెడల చేసిన దానికి    ప్రతిగా దేవుని చేత తీర్పు తీర్చబడవలెననే రహస్యపు కోర్కె మనలో ఉండవచ్చును. అటువంటి వైఖరి సాతానుకు సంబంధించినది, కేవలము సాతాను మాత్రమే జనులు దేవుని చేత    శిక్షింపబడవలెనని కోరుకొనును.

    ''.....నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగ వలసినదే'' (యోహాను 13:4) అని యేసు ప్రభువు చెప్పెను. దాని అర్థము ఆత్మానుసారముగా    చూచినట్లయితే నీ సహోదరుని పాదములపై మురికిని చూచినప్పుడు, అతడు కడుగబడవలెననే ఆశ నీలో యుండవలెను.

    ''మమ్మును క్షమింపుము'' అనగా, ''తండ్రీ నీవు నా పాపములు క్షమించినను నేను సంతృప్తిపడను. నా చుట్టూ ఇతర సహోదరులు, సహోదరీలు ఉన్నారు. వారి పాపములను కూడా నీవు    క్షమించాలని కోరుచున్నావు. ఆమేన్''.

అధ్యాయము 8
  కీడు నుండి విడుదల

    ''శోధన లోనికి తేక కీడు నుండి తప్పించుము''

    ఈ విన్నపమునకు రెండు ప్రక్కలున్నవి ఒకటి మనలను కాపాడమని మరియు మనలను విడిపించమని ఇంకొకటి. దీని ముందు మనవిలో పాపము యొక్క అపరాధ భావము నుండి విడుదల పొందుటకు    ప్రార్థించిన తరువాత మనమిప్పుడు పాపముయొక్క శక్తి నుండి విడుదల కొరకు ప్రార్థించుదుము. మనము పాప క్షమాపణ మాత్రమే కోరుకుని దానినుండి విడుదలను కోరుకొనకపోతే, మన    మారుమనస్సు సరియైనది కాదని అది సూచిస్తుంది. పాపక్షమాపణ అనేది పరిశుద్ధ జీవితానికి ఒక ద్వారబంధంగా ఉండాలి తప్ప దేవుని కృపను అలుసుగా తీసుకొనేదిగా ఉండకూడదు.

    సంతోషము మరియు శక్తి

    క్రైస్తవులందరూ సంతోషముగా నుండుటకు చూచెదరు. అయితే యేసు ప్రభువు ''హృదయ శుద్ధి గలవారు ధన్యులు'' (మత్తయి 5:8) అని చెప్పెను. 'ధన్యులు' అనుమాట సంతోషించువారు అని    కూడా అర్థమిచ్చును. కనుక యేసు ప్రభువు చెప్పేది, నిజమైన సంతోషము నిజమైన పరిశుద్ధత నుండి ప్రవహించును అని. పరలోకము అనంతమైన సంతోషము కల స్థలమంటే అది కేవలము    సంపూర్ణంగా పరిశుద్ధమైన స్థలమైనందువలననే.

    పరిశుద్ధత లేని సంతోషము నకిలీ సంతోషమై ఉన్నది. మనము పరిశుద్ధులముగా లేనప్పుడు మనలను సంతోషము లేకుండా చేయుమని దేవుని ప్రార్థించవలసియున్నది. అలాకాకపోయినట్లయితే    మన ఆత్మీయ స్థితి గురించి మనము మోసపోవుదుము.

    చాలా మంది క్రైస్తవులు వారి జీవితములో శక్తి కొరకు దేవుని ప్రార్థించెదరు. కాని పరిశుద్ధత కొరకు ఉండవలసిన ఆశ దీనితో సమానముగా ఉండవలెను. అలా కాకపోయినట్లయితే అది    ప్రమాదకరము. ఎందుకంటే ఒక పరిశుద్ధత లేని మనుష్యుని చేతులకు శక్తి నిచ్చుట, ఒక శస్త్ర చికిత్స చేసే వైద్యుడు మాలిన్యములతో నుండిన పరికరములతో శస్త్ర చికిత్స    చేసినదాని కంటే ప్రమాదకరమైనదిగా ఉండును. అది జీవమునకు బదులు మరణమును తెచ్చును.

    అందువలననే దేవుడు ఆయన యొక్క శక్తిని ఎక్కువగా చాలామంది క్రైస్తవులకు ఇవ్వలేడు. అది వారిని పాడు చేయును మరియు నాశనము చేయును. మనము అడిగిన మానవాతీతమైన    వరములనన్నిటిని మనకు ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన అవసరమున్నది! విశ్వాసులు వారు పొందిన వరములను సరిగా ఉపయోగించుటకు కావలసినంత దీనులుగాను    పరిశుద్ధముగాను లేకపోవుటను బట్టి వాటి ద్వారా నాశనమైన సంఘటనలు ఎన్నో ఉన్నవి. మనము పరిశుద్ధత కొరకు మరియు శక్తి కొరకు ఒకే విధముగా ఆశపడవలెను. అప్పుడు మాత్రమే    మనము సురక్షితముగా ఉండగలము.

    దేవుడు సాతానును ఉపయోగించు విధానము

    నిజమైన పరిశుద్ధత పోరాటము యొక్క ఫలితము. అది వాలు కుర్చీలో వెనుకకు జారబడి కూర్చొని 'ఆకాశములోనికి పూలమార్గము వంటి సుఖముతో తీసుకు వెళ్లాలనబడే వారికి' రాదు.    మనము మన శరీరాశలతో మరియు సాతానుతో యుద్ధములో పోరాడినప్పుడు మనము పరిశుద్ధులమగుదుము. ''మన పరిశుద్ధతకు అపవాది అటువంటి ఆటంకమైనప్పుడు దేవుడు వాని నెందుకు నాశనము    చేయలేదు?'' అని మనము ప్రశ్నించవచ్చును.

    దానికి జవాబు, బంగారమును శుద్ధి చేయుటకు కొలిమి ఎలా అవసరమో అలాగే సాతాను కూడా ఒక విధముగా మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమై యున్నాడు. ఎప్పుడైతే మన కండరములు    వ్యతిరేకతను ఎదుర్కొనునో అప్పుడే అవి బలముగా తయారగును. అలా కానట్లయితే, మనము క్రొవ్వెక్కి ఊబగా ఉందుము. ఆత్మీయ విషయములో కూడా సరిగా అంతే. మనము ఆత్మానుసారముగా    బలంగా ఉండవలెనంటే మనకు వ్యతిరేకత అవసరమైయున్నది. అందుచేతనే సాతాను మనలను శోధించునట్లు దేవుడు అనుమతించును.

    జీవితమంతా సుళువుగా గడచిపోయే మనుష్యుడు ఆత్మానుసారముగా బలహీనముగా నుండి ఊబగా మరియు బలహీనముగా నుండును. దేవుడు అతడిని చేయమనిన దంతా చేయలేకుండును. అయితే ఇబ్బందులు    మరియు పరీక్షల గుండా విజయముతో వెళ్లిన వారు, బలముగా నుండి దేవుని చిత్తము చేయుటకు సామర్థ్యము కలిగియుందురు.

    దేవుడు సాతానును నాశనము చేయకపోవుటకు అది కనీసము ఒక కారణము.

    దేవుడు, నిషేధించిన ఒక చెట్టును ఏదేను వనములో ఎందుకు ఉంచెను? దేవుడు ఆ చెట్టును అక్కడ ఉంచకపోయినట్లయితే, ఆదాము అసలు పాపము చేసియుండేవాడు కాడని కొందరు    అనుకొనవచ్చును. కాని ఆదాము పరిశుద్ధుడగుటకు ఆ చెట్టు అవసరమైయున్నది. శోధన లేకుండా మనుష్యుడు పరిశుద్ధుడు కాలేడు. అందుచేతనే ఏదేను వనములోనికి సాతాను    ప్రవేశించునట్లు దేవుడు అనుమతించెను.

    ఆదాము అమాయకుడు - కాని అమాయకత్వము పరిశుద్ధత కాదు, ఆదాము తన జీవిత కాలమంతా అమాయకుడు గానే యుండి యుండవచ్చును మరియు అతడు పరీక్షింపబడకపోయినట్లయితే అతడెప్పటికీ    పరిశుద్ధుడు కాకపోయేవాడు. అమాయకత్వము ఒక విధమైన మధ్యస్థ స్థితి వంటిది మరియు ఆ మధ్యస్థితి నుండి ఖచ్చితమైన పరిశుద్ధ స్థితిలోనికి వచ్చుటకు, ఆదాము తనకు ఉండిన    ఇష్టాయిష్టాలను ఎంపిక చేసుకొనే అవకాశమును ఉపయోగించవలసి యుండెను. అతడు శోధనకు ''కాదు'' అని మరియు దేవునికి ''అవును'' అని చెప్పవలసియుండెను. అప్పుడు మాత్రమే అతడు    పరిశుద్ధుడుగా మారియుండేవాడు. అందువలన అతడు శోధింపబడవలసి యుండెను. అయితే దురదృష్టవశాత్తూ అతడు దేవునికి ''కాదు'' అని చెప్పుట వలన అతడు పాపిగా మారెను.

    శోధన మరియు పాపము

    యేసు ప్రభువు కూడా మనవలెనె అన్ని విషయములలో శోధింపబడెను (హెబ్రీ 4:15) కాని ఆయనకు మరియు ఆదాముకు ఉండిన వ్యత్యాసమేమంటే ఆయన ఎప్పుడూ దేవునికి ''ఆవును'' అని    చెప్పుచుండెడివాడు. మానవునిగా సంపూర్ణుడగుటకు, మనుష్యులందరూ అవ్వాలని దేవుడు కోరుకున్న మనిషిగా అగుటకు, యేసు విధేయతను ఆయన పొందిన శ్రమల ద్వారా    నేర్చుకొనవలసియుండెను. ఆయన శోధనను ఎదుర్కొని దానిని జయించి, దాని ద్వారా పరిపూర్ణుడు ఆయెను (హెబ్రీ 5:8,9). అందుచేత యేసుప్రభువు తన శిష్యులు గూర్చి    ప్రార్థించినపుడు ''తండ్రీ, వారిని ఈ లోకము నుండి తీసుకుపొమ్మని నేను ప్రార్థించుట లేదు. కాని దుష్టుని నుండి తప్పించుమని వేడుకొనుచున్నాను'' (యోహాను 17:15) అని    ప్రార్థించెను. తన శిష్యులు ఈ లోకమునందలి ఒత్తిడులు, శోధనలు మరియు పరీక్షలనుండి తీసుకు పోబడినట్లయితే వారు ఎప్పటికీ పరిశుద్ధులు కాలేరని యేసు ప్రభువుకు    తెలియును.

    మనము పాపమునకు మరియు శోధనకు మధ్య నున్న తేడాను తెలుసుకొనవలెను. మనము అనుకోకుండా చూచిన దాని ద్వారా మనము అకస్మాత్తుగా శోధింపబడితే అది పాపము కాదు. కాని మనలను    శోధించే దానిని చూచుట మనము కొనసాగించినా లేక దాని గురించి ఆలోచించినా అది పాపము. మనము శోధనను తప్పించుకోలేము. కాని మనలను శోధించేదానినుండి మన కళ్లను మన మనసును    త్రిప్పివేయుటకు మనము ఖచ్చితంగా ఎంచుకోవచ్చును.

    మనమందరము శోధింపబడుదుము. దానిని బట్టి మనము దోషులు లేక చెడు చేసినట్లుగా దేవుడు ఎంచడు. కాని మనము శోధనను నిలువరించవలెనని ఆయన కోరుచుండెను. ఒకరు ఈ విధముగా    చెప్పెను. ''పక్షులు నా తలపైన ఎగురుటను నేను ఆపలేను కాని, నా తలపై గూడు కట్టకుండా అడ్డుకోగలను''. నీవు శోధన రాకుండా అడ్డుకొనలేవు కాని అది నీ మనస్సులో    స్థిరపడకుండా దానిని అడ్డుకొనగలవు.

    మనము బలవంతులుగా ఋజువు చేసుకొనుటకు మనము సాద్యమైనన్ని శోధనలను ఎదుర్కొనవలెనని దేవుని వాక్యము చెప్పుటలేదు. మనము శోధన నుండి తప్పించుకొని పారిపోవలెను. తనను    శోధించే పరిస్థితుల నుండి తప్పించుకొని పారిపొమ్మని పౌలు తిమోతిని హెచ్చరించెను (2 తిమోతి 2:22). మనము ధనాశ నుండి, వగలుగా మాటలాడే స్త్రీలనుండి మరియు దేవుని    నుండి మనలను దూరముగా తీసుకొని పోయే ఏ విషయము నుండియైనా మనము పారిపోవలెను.

    శోధన యెడల మన వైఖరి ''దాని నుండి నేను సాధ్యమైనంత దూరముగా యుందును'' అన్నట్లుగా యుండవలెను. మనము కొండ శిఖరము యొక్క అంచు నుండి పడిపోకుండా ఎంత చివరగా వెళ్లగలను,    లేక రైల్వే ప్లాట్ ఫారము యొక్క అంచున రైలుకు తగులకుండా ఎంత చివరన నిల్చొనగలను అని ప్రయత్నించే చిన్న పిల్లల వలే నుండకూడదు. అట్లు ఏ బుద్ధియున్న తల్లిదండ్రులు    కూడా తమ బిడ్డలకు సలహా ఇవ్వరు. మనము మన బిడ్డలకు అటువంటి ప్రమాదముల నుండి దూరముగా నుండుమని చెప్పుదుము. దేవుడు మనకు అదే సలహా ఇచ్చును.

    ఈ విన్నపములో నుండిన నిజమైన అర్థము ''నేను ఎదుర్కోలేని బలమైన శోధన నాకు రానివ్వవద్దు'' అనునది. అది తన శరీరము బలహీనమైనదని తెలిసి తాను సుళువుగా పడిపోవుదునని    తెలిసిన వాని మొఱ్ఱ.

    శోధనను ఎదుర్కొనుటకు సిద్ధపాటు

    గెత్సెమనె వనములో యేసు, పేతురు, యాకోబు మరియు యోహానులతో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి (మత్తయి 26:41) అని చెప్పెను. వారు    శోధనను ఎదుర్కొన వలసియుండునని ఆయన యెరిగి అందుకు వారిని సిద్ధము చేయుటకు చూచెను. అయితే వారు ప్రార్థించుటకు బదులు నిద్రించిరి. దాని ఫలితముగా శోధన వచ్చినప్పుడు    పేతురు సైనికుని చెవిని తెగనరికెను. అతడు మెళకువగా నుండి ప్రార్థించక పోవుట వలన పాపములో పడెను. అయితే యేసు ప్రార్థించుట వలన ఆయన పవిత్రముగా మరియు ప్రేమతో    ప్రవర్తింపగలిగెను.

    మనలను ముందుగా హెచ్చరించుటలో దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగినవానిగా నుండును. మనమందరము ఏదొక సమయములో ''ఇప్పుడు కొద్ది క్షణములు ప్రార్థనలో గడుపు'' అని ఆత్మ మన    హృదయములో చెప్పుట వినియుందుము. ఆ సమయములో నీముందుండిన ఏదో శోధనను ఎదుర్కొనుటకు దేవుడు నిన్ను సిద్ధ పరచుచుండెనని నీవు గమనించావా?

    అటువంటి సమయములో నీవు సాధారణముగా ఏమి చేయుదువు? శిష్యుల వలె నీవు ఆ స్వరమును పట్టించుకొనకుండా యుండి యుండవచ్చును. ఆ విధముగా శోధన వచ్చునప్పుడు నీవు పడిపోవుదువు.    దేవుడు ఆ శోధనకు నిన్ను సిద్ధపరచుటకు చూచెను. కాని నీవు వినిపించుకొనలేదు.

    ప్రతి శోధనను జయించవచ్చును

    దేవుడు ఆయన వాక్యములో ఒక అద్భుతమైన వాగ్దానము చేసెను. అది మనకు వచ్చిన పరీక్ష కాని లేక శోధన కాని మనము భరించుటకు లేక జయించుటకు ఎక్కువగా ఉండుటకు ఆయన ఎప్పుడూ    అనుమతించడు (1కొరిందీ¸ 10:13). వేరే మాటలలో, ప్రతి పరీక్ష మరియు శోధన మనము జయించగలిగియున్నామో లేదో ఆయన చూచి, అప్పుడు మాత్రమే అది మన యొద్దకు వచ్చునట్టు    అనుమతించును. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ ఒక 2వ తరగతి విద్యార్థికి 9వ తరగతి పరీక్ష పత్రము ఇవ్వడు. అతడు విద్యార్థి యొక్క ప్రమాణమునకు తగినట్లు ప్రశ్నల    నిచ్చును. దేవుడు కూడా అంతే.

    ఈ వాక్యపు వెలుగులో, నీవు ఎదుర్కొను ఏ పరీక్ష గాని లేక శోధన గాని నీవు జయించలేనిదిగా యుండునా? లేదు. దేవుడు అలా అనుకొనడు. అలా అనుకొన్నట్లయితే ఆయన అది నీకు    వచ్చుటకు అనుమతించడు. ఒక శోధన నీకు వచ్చుటకు దేవుడు అనుమతించినట్లయితే దాని అర్థము అది నీవు జయించగలవు అని.

    కనుక మనము శోధనను ఈ విధముగా చూడవలసియున్నది. ''ఈ శోధన నాకు వచ్చుటకు దేవుడు అనుమతించెను. కనుక అది ఆయనకు నాపైయున్న నమ్మకమునకు గుర్తు. ఇది నేను జయించగలను అని    ఆయనకు తెలియును మరియు దీనిని జయించుటకు ఆయన ఆత్మ శక్తిని తప్పక నాకు ఇచ్చును''. మనము మనకు వచ్చు శోధనను మరియు పరీక్షను అట్లు చూచినట్లయితే మనకు ఎదురయ్యే ప్రతి    దానిని మనము గెలువగలము.

    దేవుడు ఆయన ఆజ్ఞలను మన హృదయములపై మరియు మన మనస్సులపై వ్రాయుదునని కూడా వాగ్దానము చేసెను (హెబ్రీ 8:10). ఆయన ఆత్మ ద్వారా మనము ఆయన సంపూర్ణ చిత్తమును    ఇచ్చయించుటకును మరియు చేయుటకును మనలో ఆయన కార్యము చేయును (ఫిలిప్పీ 2:13). కనుక మనము ఎప్పటికిని ఓడిపోనవసరం లేదు.

    పాపపు శక్తి నుండి విడుదల

    ''శోధన లోనికి తేకుము'' (మా శక్తికి మించిన) అను విన్నపము తరువాత ''కీడు నుండి విడిపించుము'' అనే విన్నపము.

    ''విడిపించుము'' అనుమాటను ''మమ్మును నీ యొద్దకు తీసుకొనుము'' అని చెప్పవచ్చును. కనుక ఈ ప్రార్థన ''కీడు నుండి మమ్మును నీ యొద్దకు తీసుకొనుము'' అని యున్నది.    దేవుడు మరియు దుష్టత్వము మనను రెండు వ్యతిరేక దిశలకు లాగును. మనము దేవునితో ''తండ్రీ, నా శరీరము దుష్టత్వము వైపునకు లాగుచున్నది'' కాని నేను అట్లు    వెళ్ళకుండునట్లు చేయుము. ''నేను ఆ కోర్కెకు లోబడుటకు ఇష్టపడుట లేదు. దయచేసి నన్ను నీ మార్గమువైపునకు లాగుకో'' అని చెప్పుచున్నాము. దేవుని వైపునకు లాగబడవలెననే    కోర్కె మరియు ఆకలి పాపముపై విజయము పొందుటకు కావలసిన ముఖ్యమైన అవసరమైయున్నది.

    రోమా పత్రిక 6:14లో నున్న ''పాపము మీ మీద ప్రభుత్వము చేయదు'' అను వాగ్దానము అనేక మంది క్రైస్తవులలో నెరవేరక పోవుటకు ఒక కారణము, వారి హృదయపు అంతరంగములో పాపము    నుండి విడుదల పొందవలెననే ఆకలి తగినంతగా ఉండకపోవుటయై యున్నది. ''ఓ దేవా! పాపము నుండి ఎలాగైనా నన్ను విడుదల చేయుము'' అని వారు మొఱ్ఱ పెట్టరు. వారు దాని గూర్చి    దాహము కలిగియుండరు. వారు జబ్బుగా యుండినట్లయితే వారు ఎంతగానో మొఱ్ఱ పెట్టుదురు. వారు పాపము రోగము కంటే చెడ్డదని అనుకొనరు. అటువంటప్పుడు వారు ఓడిపోవుటలో    ఆశ్చర్యమేమీలేదు.

    నిర్గమ కాండము 2:23-25లో ''....ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపనులను బట్టి వారు పెట్టిన మొఱ దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును    విని....దేవుడు వారియందు లక్ష్యముంచెను'' దేవుడు మనయందు కూడా లక్ష్యముంచుట మనము విడుదల కొరకు నిరాశతో మొరపెట్టినప్పుడు జరుగును. ''మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ    మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు'' (యిర్మీయా 29:13).

    దేవుని నుండి మనము విలువైన దానిని దేనినైనా పొందవలె నంటె దాని కొరకు మనము ఆకలి మరియు దాహము కలిగియుండాలన్నది నియమము. కేవలము అప్పుడు మాత్రమే దానిని తగినంతగా    మెచ్చుకొందుము. కనుక మనకు ఆకలి మరియు దాహము కలుగు వరకు దేవుడు ఊరుకొనును, అప్పుడు మనము దేనికొరకు నిజముగా ఆశపడుదుమో అది దేవుడిచ్చును.

    క్రైస్తవ జీవితము సాతానుతో పోరాటము. ఈ పోరాటములో సాతానుయొక్క ప్రతినిధి ఒకరు మనలోపలే ఉండును -అవి మన శరీరేచ్ఛలు. మన శత్రువు వైపున యుండుట వలన సాతానుతో మన    పోరాటములో మనము బలముగా పోరాడకుండునట్లు అవి ఎన్ని విధాల అవకాశములుండునో అన్ని విధముల ఆటంకములు కల్పించును. అది ఎప్పుడూ మరచిపోవద్దు. అందుచేతనే మనము సాతానును    జయించవలెనంటే, మనము మన శరీరేచ్ఛల నుండి పూర్తిగా విడుదలగుటకు ఆశపడవలెను.

    దుష్టత్వమంతటినుండి విడుదల

    చాలామంది విశ్వాసులు ''ఓ దేవా, సాతాను మరియు ఇతరులు నాకు చేయుటకు ఉద్దేశించిన కీడునుండి నన్ను కాపాడుము'' అని ప్రార్థించుదురు. కాని అదే సమయములో వారి శరీరేచ్ఛలు    (శతృవు యొక్క ప్రతినిధి) కోరుకొనినదంతా యిచ్చి పోషించుచుందురు. అటువంటప్పుడు దేవుడు వారిని కీడునుండి విడుదల చేయలేడు.

    మన శరీరములో నున్న శరీరాశల నుండి విడుదలగుటకు మనము మొదట చూచుదుము. అప్పుడు సాతానును జయించుట చాలా సుళువైన విషయం. అప్పుడు మనుష్యులనుండి కాని లేక అపవిత్రాత్మల    నుండి కాని ఏ విధమైన కీడు మనలను తాకదు.

    రోమా 7:14-25లో, పౌలు తన శరీరములో నున్న దురాశల నుండి విడుదల కొరకు అతని ఆశ గూర్చి చదువుదుము. తరువాత రోమా 8:28లో ''దేవుడు అన్ని విషయములను మన మేలు కొరకు    సమకూర్చి జరిగించును'' అని చదువుదుము. ఇవి ఒక దాని వెంబడి ఒకటి వచ్చును. మనము శత్రువు యొక్క ప్రతినిధి అయిన మన శరీరేచ్ఛలు నుండి విడుదల కొరకు ఆశ పడినప్పుడే రోమా    8:28 మన జీవితములలో యాదార్థమగును. రోమా 8:28 ఎంతటి అద్భుతమైన వాగ్ధానము-అది ఏ కీడు ఎప్పుడైనను మన జీవితాలలోకి రాదనేది. సమస్తమును, కొన్ని విషయాలే కాదు, లేక అనేక    విషయాలే కాదు, లేక ఎక్కువ విషయాలే కాదు, లేక 99 శాతం విషయాలే కాదు, సమస్తమును నీ మేలు కొరకు సమకూడి జరుగునని నీవు నమ్ముచున్నావా?

    ఈ విషయములను ఒక్కొక్కటిగా చూచినట్లయితే అవి భయంకరముగా కన్పించవచ్చును. కాని నీవు దేవుని ప్రేమించినట్లయితే మరియు ఆయన సంకల్పము చొప్పున పిలవబడినట్లయితే అవన్ని    కలిసి మేలుకొరకు సమకూడి జరుగును. నీవు పాపము నుండి పూర్తిగా విడుదల పొంది క్రీస్తు స్వరూపమునకు మార్చబడుట ఆయన సంకల్పమైయున్నది (8:29). కనుక పాపమునుండి విడుదల    పొందవలెననేది నీ ఆశయైనట్లయితే, నీకు సంభవించే ప్రతి ఒక్క విషయము నీకు మేలు కలుగునట్లు సమకూడి జరుగును అని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. హల్లెలూయా!

    యోసేపు గూర్చి ఆలోచించండి. అతడు భక్తి కలిగిన జీవితము జీవించవలెనని అనుకొనెను మరియు తనకుండిన వెలుగుకు తగినట్లు కీడునుండి తప్పించుకొనుటకు చూచెను. అతడు దేవుని    సంతోషపరచుటకు చూచెను. మరియు దేవుడు అతడిని దీవించెను. కాని అతడు ఇతరుల చేత ఎట్లు చూడబడెను? అతడి పదిమంది అన్నలు అసూయపడి ఐగుప్తుకు వెళ్ళునట్లు అమ్మివేశారు. అది    చూచుటకు కీడుగా కనబడును. కాని దానిని చూచినట్లయితే చివరకు అది యోసేపు ఐగుప్తులో రెండవ పాలకునిగా చేయు దేవుని ప్రణాళికలో ఒక భాగముగా కనబడును. తన అన్నలు తన యెడల    చేసిన కీడు తనకు మేలుగా మారెను. అతడు ఐగుప్తుకు చేరుకున్నప్పుడు, అతడు ఒక దాసునిగా పోతిఫరు ఇంటిలోకి అమ్మబడెను. అక్కడ పోతీఫరు భార్య అతనిని శోధించెను కాని    అతడామెకు లొంగిపోలేదు. అతడు ఆ శోధన ప్రదేశమునుండి పారిపోయెను. అతడు ఆమె చేత తప్పుగా నిందించబడి చెరసాలలో వేయబడెను. అది కూడా ఒక చెడ్డ విషయముగా కనబడెను. కాని    సింహాసనముకు యోసేపు మార్గాన్ని చెరసాల ద్వారా యోచించినది దేవుడే. ఎందుకంటే ఆ చెరసాలలోనే యోసేపు ఫరో యొక్క పానదాయకుడను కలిసి ఆ తరువాత అతని ద్వారా ఫరోతో పరిచయము    పొందెను (ఆది 39 నుండి 41 అధ్యాయములు).

    యోసేపుకు ఇతరుల ద్వేషముతో మరియు కోపముతో చేయుటకు ప్రయత్నించిన కీడు, దేవుడు ఆయన సర్వాధికారముతో, యోసేపు యొక్క జీవితములో ఆయన ప్రణాళిక నెరవేరునట్లు సమకూడి    జరిగించెను. మన విషయములో కూడా అంతే మన జీవితములలో మనము క్రీస్తు స్వరూపము లోనికి మారుట అను దేవుని ఉద్దేశము నెరవేరునట్లు సమస్తము సమకూడి జరుగును. అయితే మనము    దానిని నమ్మవలెను. ఎందుకంటే మనకున్న విశ్వాసమునకు తగినట్లు దేవుని యొక్క వాగ్దానము పొందుదుము.

    ఎస్తేరు గ్రంధములో, మొర్దకైను ఉరివేయుటకు హామాను ఉరికొయ్యను సిద్ధము చేసిన విషయమును చదువుదుము. కాని చివరకు, హామాను ఆ ఉరికొయ్యపై వ్రేలాడతీయబడెను (ఎస్తేరు    7:10). దేవుడు ఆయన ప్రజల యొక్క శత్రువుల కుట్రలను తిరిగి వారిపైకి వచ్చునట్లు చేసెను. దేవుడు సాతాను విషయములో అదే చేయును. మనము వ్రేలాడుటకు సాతాను సిద్ధపరచిన    ఉరికొయ్యపై అతడే వ్రేలాడునట్లు దేవుడు పరిస్థితులను మార్చును. హల్లెలూయా! ఆమేన్.

    మనము ఒకరి కొకరము అవసరమైయున్నాము

    ఈ ప్రార్థనలో నున్న విన్నపములో కూడా, ''నన్ను విడిపించుము'' అనికాక ''మమ్ము విడిపింపుము'' అని యుండుట గమనించండి. ''నన్ను మరియు నా సహోదరుని కీడునుండి    తప్పించుము. తండ్రీ మమ్మును తప్పించుము''.

    మనము ఒకరికొకరము అవసరమై ఉన్నాము. మనము కీడునుండి తప్పించబడుటకు మనము సహవాసములో ఉండవలసిన అవసరమున్నది. ''ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడియుండుట మేలు, వారు    పడిపోయినను ఒకడు తనతోటి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును'' (ప్రసంగి 4:9,10).

    అందుచేతనే సాతాను విశ్వాసులను వేరుచేసి వారిమధ్య విభేదము తీసుకువచ్చుటకు ప్రయత్నించును. అదే కారణముచేత భార్యాభర్తల మధ్య కూడా విభేధము కలుగచేయుటకు ప్రయత్నించును.    చిన్న చిన్న అపార్థములను కల్పించునది సాతానే. ఒకరు ఒకదానిని వేరొకరు మరియొక దానిని నమ్మునట్లు చేయును. మరియు ఏదైనా తీవ్రమైనది జరుగకుండానే వారిని సాతాను    వేరుచేయును.

    విశ్వాసులను ఒకరినుండి ఒకరిని ఒకసారి వేరుచేసినట్లయితే, వారిని ఒక్కొక్కరిని పడగొట్టుట సుళువని సాతానుకు తెలియును. వారు ఐకమత్యముతో ఉన్నంతవరకు సాతాను వారిని    పడగొట్టలేడు. కనుక వారిని విడదీయును. ఒకసారి అతడు ఒక్కొక్క విశ్వాసిని ఇతరుల కొరకు పట్టించుకొనకుండా తమకొరకు తాము జీవించునట్లు చేసినట్లయితే, వారు అందరూ దేవుని    కొరకు నిరుపయోగమగుటకు ఎక్కువ సమయము పట్టదు.

    మనకు ఒకే ఒక శత్రువు ఉన్నాడని, అతడు సాతాను అని మనము గుర్తించవలెను. కనుక మనము ఒకరితో ఒకరు పోట్లాడుకొనకుందుము. మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుదుము.

    పడిపోయిన సహోదరుని గూర్చిన ఆలోచన

    ''మమ్మును విడిపించు'' అను దానిలో, నా సహోదరుడు పాపములో పడిపోయినప్పుడు, దానిగూర్చి నేను సంతోషించను అని కూడా అర్థము. దానికి బదులుగా దానిగూర్చి నేను    బాధపడుదును, మరియు అతడిగూర్చి ప్రార్థించుదును మరియు అతడు తిరిగి లేచునట్లు చూచుదును.

    మంచి సమరయుని ఉపమానములో యాజకుని వైఖరికి మరియు సమరయుని వైఖరికి మధ్య ఖచ్చితమైన తేడా కనబడును. యాజకుడు దెబ్బలతో పడిపోయిన వానిని చూచి బహుశా తనలో తాను ''అతడివలె    నేను పడిపోనందుకు దేవునికి వందనములు'' అనుకొని వెళ్ళిపోయి యుండవచ్చును (లూకా 10:30-37). కొంతమంది విశ్వాసులు వేరొక విశ్వాసి పాపములో పడిపోయినప్పుడు అలా    అనుకొందురు. వారు ఇతరులతో, ''చూడు అతడు ఎట్లు పడిపోయెనో'' అని,  ''చూడు నేను పడిపోలేదు'' అను అర్థము వచ్చేటట్లు చెప్పుదురు.

    అయితే మంచి సమరయుడు ఏమి చేశాడు?. అతడు తన యొక్క విజయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపలేదు. అతడు దిగివెళ్ళి పడిపోయిన వ్యక్తిని లేవనెత్తి అతడు    స్వస్థపడుచోటికి మోసుకువెళ్ళెను. ''వెళ్ళి అట్లే చేయుము'' (లూకా 10:37) అని యేసు చెప్పారు.

    బలహీనత కలిగిన ఒక సహోదరుని చూచినప్పుడు లేక బహుశా ఏదొక విషయములో పడిపోయిన సహోదరుని చూచినప్పుడు నీ వైఖరి అట్లే ఉన్నదా? అతడిని ప్రార్థనలో నీవు లేవనెత్తి స్వస్థత    కొరకు యేసునొద్దకు తీసుకు వెళ్ళుదువా? నీవు దేవునిలో కేంద్రీకృతమై ఉన్నావో లేదో తెలుసుకొనుటకు ఇది ఒక మంచి పరీక్ష. ఇతరులకంటే ఆత్మానుసారులమైన వారిగా కనబడాలనే    స్వార్థపూరితమైన ఆశవలన, వేరెవరైనా పాపములో పడిపోతే మనము పట్టించుకొనము. ఇతరులకంటే ఉన్నతమైన వారిగా మనలను మనము కనుపరచకొనుటకు పురికొల్పేది, ఒక దుష్టమైన సాతానుకు    సంబంధించిన ఆత్మ. ''తండ్రీ, కీడునుండి మమ్మును తప్పించుము'' అని మనం ప్రార్థించినప్పుడు, ఇతరులకంటే మనలను మనము ఎక్కువ ఆత్మానుసారులుగా కనుపరచుకొనే ఆశ ఉండదు.

    మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉన్నాము. నా ఎడమచేతికి దెబ్బతగిలినట్లయితే నా కుడి చెయ్యి, తగిలిన దెబ్బ బాగుపడుటకు వెంటనే సహాయము చేయును. ఒక్క కుడి చెయ్యి మాత్రమే    కాదు కాని శరీరములో నుండిన ప్రతి అణువు, ఆ గాయము మానుటకు అవసరమైనది చేయును. క్రీస్తు శరీరమైన సంఘములో అట్లే ఉండవలెను.

    రెండు గొప్ప ఆజ్ఞలు

    సీనాయి కొండపై నుండి మోషే రెండు రాతి పలకలు చేతిలో పట్టుకొని క్రిందికి వచ్చాడు. ఒకదానిపై మనుష్యునికి దేవునితో నుండవలసిన సంబంధము గూర్చిన నాలుగు ఆజ్ఞలు    వ్రాయబడియుండెను. రెండవ దానిపై మానవునికి తన తోటి మానవునితో ఉండవలసిన సంబంధమును గూర్చిన ఆరు ఆజ్ఞలు వ్రాయబడెను.

    ఈ రెండు పలకలు రెండు ఆజ్ఞలుగా చెప్పవచ్చని యేసు ప్రభువు చెప్పెను. మొదటిది ''నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును    ప్రేమింపవలయుననునది'', మరియు రెండవది ''నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింప వలెననునది'' (మత్తయి 22:37-39).

    యేసు ప్రభువు ఈ రెండింటిని ఆయన నేర్పించిన ప్రార్థనలో నొక్కిచెప్పెను. మొదటిమూడు విన్నపములు మొదటి ఆజ్ఞకు సంబంధించినవి. తరువాత మూడు విన్నపములు, యేసు ప్రభువు తన    శిష్యులకు ''నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరును ప్రేమించుడి'' (యోహాను 13:34) అని క్రొత్త నిబంధన క్రింద ఇచ్చిన రెండవ ఆజ్ఞకు సంబంధించినవి.

    యేసు యొక్క నిజమైన శిష్యుడు తన మనసుకు తెలిసిన మరియు తెలియని విషయములలో తన యొక్క ప్రతి కోర్కె దేవుని ఇష్టమునకు అనుగుణ్యముగా యుండి మరియు తన జీవితములో ఏ కోర్కె,    అభిలాష లేక అనుభూతి దేవుని చిత్తమునకు బయట ఉండకుండా సంపూర్తిగా దేవున్ని కేంద్రంగా కలిగియుండును. అదే సమయములో అతడు తన సహోదరులను కూడా యేసుప్రభువు తనను    ప్రేమించినట్లుగా పరిపూర్ణముగా ప్రేమించుటకు చూచును.

    అయితే తన వైఖరి ఈ దిశలలో ఉండవలసిన విధముగా లేదని అతడు ఎల్లప్పుడూ ఎరిగియుండును. కాని అతడు గమ్యము వైపునకు పనిచేయును. అక్కడికి చేరుట కొరకు ఎటువంటి ధరను    చెల్లించుటకైనా ఎల్లప్పుడూ సిద్ధపడియుండును.

    మన సహోదరులను ప్రేమించుట అనగా వారి గూర్చి ఆలోచన కలిగియుండుటయైయున్నది. లోకములో ఉన్న వారందరి గూర్చి మనము ఆలోచింపలేము. దేవునికి మాత్రమే అది సాధ్యమగును. కాని    మనకున్న సామర్థ్యము చొప్పున, మనతోటి విశ్వాసుల గూర్చి మనము చింత కలిగి యుండవలెను. మరియు అది ఎక్కువగుచుండవలెను.

    మనము ఈ విధముగా మొదలు పెట్టము. మొదటి మెట్టుగా మన ఇంటిలో నున్న కుటుంబ సభ్యులను, ప్రభువైన యేసు మనను ప్రేమించినట్లుగా మనము ప్రేమించవలెను. అయితే అక్కడితో    ఆగిపోకూడదు. మనము ముందుకు వెళ్ళి దేవుడు మనకు ఇచ్చిన ఆయన కుటుంబములో సహోదర సహోదరీలను మనలను యేసు ప్రేమించినట్లుగా ప్రేమించుట నేర్చుకొనువలెను.

    ''సంపూర్ణత'', మనము ముందుకు సాగుటకు మన యెదుట ఉంచబడిన గమ్యస్థానము. అయితే అక్కడకు చేరుటకు మనము స్థిరమైన నిశ్చయత కలిగియుండవలెను. పౌలు ఆ దిశగా ప్రయాణిస్తూ,   ''...నేనిదివరకే చేరుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నతమైన    పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను'' అని చెప్పెను (ఫిలిప్పీ 3:13,14). దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు దేవుణ్ణి సంపూర్తిగా    కేంద్రంగా కలిగియుండుట, దేవుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించుట మరియు మనతోటి విశ్వాసులను యేసు మనలను ప్రేమించినట్లు ప్రేమించుట మరియు మన పొరుగు వారిని మనవలె    ప్రేమించుటయై యున్నది.

అధ్యాయము 9
  దేవునికి మహిమ చెల్లును గాక

   ''ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై యున్నవి. ఆమేన్''

    ఈ ప్రార్థన, ''నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక'' అని దేవునితో మొదలై ''రాజ్యము, శక్తి మరియు మహిమ నీదే'' అని    దేవునితో ముగియుచున్నది.

    ''నేను అల్ఫాయు మరియు ఒమేగాయు'' అని ఆయన వాక్యములో దేవుడు చెప్పెను (ప్రకటన 1:8). యేసు యొక్క ప్రతి శిష్యుని జీవితములో మొదటి ఆలోచన మరియు ఆఖరి ఆలోచన దేవుడై    యుండవలెను. దేవుడు మన జీవితములకు సర్వము మరియు పరిధి కూడా అయ్యుండవలెను. ఆయన మన కొరకు గీచిన వృత్తములో మనము ఆయన యందు జీవించుచున్నాము మరియు చలించుచున్నాము.    మరియు ఆ వృత్తములోనే మనము ఎప్పుడూ ఆయనను కనుగొందుము (అపొ.కా. 17:26,27).

    ఈ ప్రార్థన యొక్క ముగింపులో నున్న మూడు వ్యాఖ్యలు, అరణ్యములో మన ప్రభువునకు ఎదురైన మూడు శోధనలతో పోల్చవచ్చును.

 

    రాజ్యము దేవునిదై యున్నది

    మొదటగా ''నీ రాజ్యము'' అని చెప్పబడినది.

    దీనిని సాతాను యేసు ప్రభువుకు లోకములో నుండిన రాజ్యములన్నిటిని చూపి ''నాకు మ్రొక్కి ఇవన్ని తీసుకొనుము'' అన్న మూడవ శోధనతో పోల్చండి. కాని యేసు ప్రభువు ''వద్దు,    రాజ్యము తండ్రిదై యున్నది. ఆయనే రాజు'' అని చెప్పెను. ఆ విధముగా యేసు ప్రభువు సాతాను చేతి నుండి రాజ్యమును తీసుకొనుటకు తిరస్కరించెను.

    అందుచేతనే యేసు ప్రభువు శరీరధారియైయున్న రోజులలో రాజుగా ఉండుటకు ఎప్పుడూ కోరుకొనలేదు. జనులు ఆయనను రాజుగా చేయుటకు చూచినప్పుడు ఆయన పారిపోయెను (యోహాను 6:15). ఆయన    మనుష్యులందరికి సేవకుడుగా జీవించారు.

    మనముకూడా ఇతరులపై రాజులుగా నుండటకు చూడకూడదని ఇది బోధించుచున్నది. ఒక నాయకుడుగా, లేక క్రైస్తవ నాయకుడుగా, తన తోటి విశ్వాసుల కంటె ఏదొక విధముగా    హెచ్చించుకొనవలెనని చూచేవాడు ''తండ్రీ, నీవు మాత్రమే రాజుగా ఉండుటకు అర్హుడవు''  అని ప్రార్థించుటకు అర్హుడు కాదు. దేవుని సంఘములో దేవుడు ఒక్కడే రాజు. మనము    సేవకులుగా ఉండాలి, రాజులుగా కాదు.

    శక్తి దేవునిదై యున్నది

    తరువాత, ''బలము నీదై యున్నది'' అని చెప్పబడినది. బలము దేవునిది'' (కీర్తనలు 62:11). ఆయన బలమును మనకు ఆయన మహిమ కొరకు పాటుపడుటకు ఇచ్చును; కాని అది ఆయనది. మన స్వంత    స్వార్థ పూరిత విషయముల కొరకు ఆయన బలమును దేవుడు మనకు ఇవ్వడు.

    దీనిని మొదటి శోధనతో పోల్చి చూడండి. ప్రభువుతో అపవాది ''రాళ్ళను రొట్టెలుగా చేసి నీ ఆకలిని తీర్చుకొను శక్తి నీకున్నది. దీనిని ఇప్పుడు ఉపయోగించు'' అనెను.    అందుకు యేసు ''లేదు, శక్తి అంతా దేవునికి చెందినది. ఆయన చెప్పువరకు నేను దానిని ఉపయోగించను'' అనెను.

    అనేకమంది విశ్వాసులు ఇక్కడ అపనమ్మకస్థులుగా యుందురు. దేవుడు వారికి కృపా వరము ఇచ్చిన తరువాత వారు దానిని వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుట మొదలు    పెట్టుదురు.

    నీకు ఎటువంటి వరముండినా అది ఆత్మీయమైనది కావచ్చు లేక సహజమైనదికావచ్చు, అది ప్రవచించు వరము లేక స్వస్థపరచు వరము, లేక సంగీత పరిజ్ఞానము ఏదైనా కావచ్చును, కాని అది    దేవునిదని గుర్తుంచుకో. ఆయనెప్పుడు శక్తితో కూడిన వరమును మనలను మనము హెచ్చించుకొనుటకు యివ్వడు.

    మనము దేవుని యొక్క వరములను స్వార్థపూరితముగా మన స్వప్రయోజనాల కొరకు వాడినట్లయితే,యెరూషలేము దేవాలయములో యేసుప్రభువు తరిమివేసిన రూకలు మార్చువారి వలె మన పరిస్థితి    యగును. వారు అక్కడ ఏమి చేయుచుండిరి? వారు మతము పేరుతో వారి కొరకు ధనము సంపాదించు కొనుచుండిరి. ''మేము దేవుని సేవించుచున్నాము''' అని చెప్పిరి. కాని నిజానికి    వారిని వారు సేవించుకొనుచుండిరి.

    యేసు క్రీస్తు నామము పేరిట ఆయన పేరును వారి స్వప్రయోజనాల కొరకు ఉపయోగించుచు, వారి కొరకు వారు పేరును, వారి కొరకును మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని    సంపాదించుకొనువారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు.

    మన కొరకు యేసుక్రీస్తు నామము పేరిట ఏదైనా లాభమును సంపాదించుకొనుట అది ధనము కావచ్చు. పేరు, ఘనత, సంఘములో స్థానము, సౌకర్యము లేక ఇంకేదైనా సంపాదించుకొనుట గొప్ప    దుష్టత్వమై యున్నది. దైవభక్తి మనకు లాభసాధకముగా నుండకూడదు (1తిమోతి 6:5). ఈ రోజు కూడా దేవుని ప్రవక్తలు దేవుని ఆలయము నుండి రూకల మార్పు వారిని (మతముతో వ్యాపారము    చేయువానిని) తరిమి వేయవలసి యున్నది.

    మహిమ దేవునిదై యున్నది

    మూడవదిగా, ''మహిమ దేవునిది'' .

    మనము ఈ ప్రార్థనను నిష్కపటముగా చేసిన తరువాత, ఇప్పటి వరకు చెప్పుకొనిన ఆత్మీయ స్థితికి చేరిన తరువాత మరియు ప్రభువు కొరకు అద్భుతమైన పరిచర్యను చేసిన తరువాత,    వాటన్నిటి చివర, మనము ''మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నాము'' అని మాత్రమే చెప్పగలవారమై యున్నాము (లూకా 17:10).

    మరియు మనము చెప్పు మాటలు యదార్థమైనవిగా యుండవలెను. మనము అసత్యపు దీనత్వముతో ఈ మాటలు చెప్పకూడదు. కొందరు, ''దేవుడు సహాయము చేసాడు' అని చెప్పుచు, హృదయములో లోపల    వారు ఆ పని మేము చేసాము అని దాని గూర్చి పేరును వారు తీసుకొందురు.

    దీనిని యేసు ప్రభువు అరణ్యములో ఎదుర్కొనిన రెండవ శోధనతో పోల్చి చూడండి. ఎత్తైన ఆలయ శిఖరమునుండి యేసు దుమికినట్లయితే, దేవుని యొక్క కాపుదలను అడిగి క్రిందకు    గాయములేవి తగలకుండా చేరుట ద్వారా, జనుల నుండి ఘనతను అలాగే వారియొక్క మెస్సియగా గుర్తింపును పొందవచ్చని సాతాను శోధించెను. కాని యేసు, ''లేదు, మహిమ అంతా తండ్రికి    ఒక్కడికే చెందవలసియున్నది'' అని చెప్పారు.

    దేవుడు రోషము గల దేవుడు మరియు ఆయన మహిమను మనతో పంచుకొనడు (యెషయా 42:8). పరలోకమందు గాని, నిత్యత్వములో గాని మానవుడు ఎప్పుడైననూ మహిమనుపొందడు. మహిమ అంతయూ దేవునికే    చెందును.

    మరియు ఎవడి హృదయములో పరలోకపు ఆత్మ యుండునో, వానికి అటువంటి వైఖరి యిప్పుడే యుండును. అతడు ఎవ్వరికీ కనబడకుండా మరియు ఎవ్వరికీ తెలియబడకుండా వెనుక నుండుటకు చూచును.    అందువలన జనుల యొక్క దృష్టి దేవుని వైపునకు తప్ప అతడి తట్టుకు గాని అతడు చేసిన పనివైపునకు కాని తిరగకుండా యుండును.

    అటువంటి వానికి అతడు దేవునికొరకు ఏమి చేసితినను ఆలోచన గాని లేక ఆత్మానుసారముగా ఎలా ఉన్నాడని గాని ఆలోచన రాదు. అతడు పొందనిదంటూ ఏమీ లేదు అని అనుకొనుట చేత అతడు    దేని గూర్చికూడా అతిశయపడడు (1కొరిందీ¸ 4:7). అటువంటివాడు పౌలుతో కలసి ''అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగును    గాక''  (గలతీ 6:14) అని చెప్పును.

    ''వెనుక నున్నవి మరచి'' అని పౌలు ఫలిప్పీ 3:13లో చెప్పుచుండెను. పౌలు వెనుక విడిచి పెట్టినవి ఏమిటి? జయజీవితము మరియు ప్రభువుకొరకు గొప్ప పరిచర్య. అతడు, అతడి    జీవితము మరియు అతడి పరిచర్యను బట్టి దేవునికి మహిమ చెల్లించెను కాబట్టి వాటన్నింటిని అతడి మనస్సు నుండి అతడు బయట పడవేసెను.

    తీర్పు దినమున రెండు గుంపుల జనులు ఆయన యెదుట నిలబడుదురని యేసు ప్రభువు చెప్పెను. అందులో ఒక గుంపువారు ''ప్రభువా, నీ నామమున మేము ప్రవచించితిమి, దెయ్యములను    వెళ్లగొట్టితిమి మరియు గొప్ప అద్భుత కార్యములను చేసితిమి'' అని చెప్పుదురు. వారందరు వారు ప్రభువు కొరకు చేసిన వాటిని మనసులో ఉంచుకొనిన వారు. ప్రభువు వారితో    ''అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి'' అని చెప్పును (మత్తయి 7:22,23).

    రెండవ గుంపుతో ప్రభువు, ''నేను ఆకలి గొనినప్పుడు నాకు ఆహారమిచ్చితిరి, నేను దిగంబరినై యుండగా నాకు వస్త్రమిచ్చిరి. నేను రోగినై యున్నప్పుడు, నేను చెఱసాలలో    నున్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి'' అని చెప్పును. కాని వారికి ఈ పనులు చేసినట్లు జ్ఞాపకము ఉండదు. ''ప్రభువా, మేమెప్పుడు అవన్ని చేసితిమి? అవన్ని చేసినట్లు    మాకు జ్ఞాపకము లేదు'' అని వారు జవాబు చెప్పుదురు. అది అద్భుతమైన విషయము కాదా, మరియు ప్రభువు, ''మీరు ధన్యులు. మీరు నా రాజ్యము పొందుటకు అర్హులు''  అని చెప్పును    (మత్తయి 25:31-40).

    నీతిమంతులు మంచిపనులు చేసి వాటిని చేసిన విషయము మరచిపోవుదురు. అయితే అనీతిమంతులు వారు చేసిన మంచి పనుల జాబితాను మనసులో ఉంచుకొందురు.

    మనము ప్రభువుకొరకు చేసిన మంచి అంతటిని మరియు ఇతరుల కొరకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొని యున్నామా, అలా అయినట్లయితే మనము ఉండకూడని గుంపులో ఉన్నాము.

    నిత్యత్వమంతయు

    ఇంకా ఈ ప్రార్థనలో ''నిరంతరము'' -కొద్ది సంవత్సరములు కాదు, గాని నిత్యత్వమంతా అని యున్నది.

    మనము నిత్యత్వమంతా ఇదే చేయబోవుచున్నాము. అది దేవుని స్తుతించుట మరియు ఆయన నామమునకు ఇవ్వవలసిన మహిమను ఇచ్చుట మరియు ఇది మన ప్రార్థనలన్ని ముగించుటకు ఒక అద్భుతమైన    పద్ధతి. మనకు ఏ విధమైన విలువ ఇచ్చుకొనకుండా స్తుతులు ఘనత మహిమ దేవునికే ఇచ్చుదుము.

    మనమెప్పుడూ జనుల యొక్క దృష్టిని మనపై నుండి దేవుని వైపునకు త్రిప్పుటకు చూడవలెను. అన్ని వేళలా మనము, వెనుక దాగబడుటకు చూడవలెను. అప్పుడు దేవుడు మన ద్వారా మన    కొరకు, మనలో ఆయన ఉద్దేశ్యమును ఇంకా ఎక్కువగా నెరవేర్చగలడు.

    ఆ విధముగా జరుగును గాక

    ఆఖరిమాట ''ఆమేన్''

    ఈ అద్భుతమైన ప్రార్థనలో ఏ ఒక్కమాటను మనము విడిచి పెట్టవద్దు, మరి తప్పనిసరిగా ఆఖరిమాటయైన ''ఆమేన్''అను దానిని విడిచిపెట్టవద్దు.

    ''ఆమేన్'' అనగా అర్థమేమిటి? దురదృష్టవశాత్తు క్రైస్తవులు వారి మతపరమైన పదజాలములలో నున్న వ్యర్థమైన మాటలలో ఇది కూడా ఒకటిగా కలిసిపోయినది.

    కాని నీవు ''ఆమేన్'' అనిన ప్రతిసారి దాని అర్థమేమిటో ఎప్పుడైనా ఆలోచించావా?

    ''ఆమేన్''  అనగా, ''ఆ విధముగా జరుగును గాక''  అని అర్థము. అది ఆదికాండము 15:6లో ''అబ్రాహాము దేవుని నమ్మెను'' అను వాక్యములో వాడిన '' నమ్మెను'' అను హెబ్రీ భాష    యొక్క మాట. అబ్రాహాముకు బిడ్డలు లేనప్పుడు, ఆకాశమండల మందలి నక్షత్రముల వలె ఆయన సంతానముండును అని దేవుడు అబ్రాహాముతో చెప్పెను. ఆ అసాధ్యమైన విషయమునకు, -    అబ్రాహాము ''ఆమేన్''అని చెప్పెను. ''ప్రభువా, నీవు చెప్పావు కాబట్టి, అట్లు జరుగును గాక'' అని అబ్రాహాము అనెను.

    ''ఆమేన్''అనగా అది అర్థము. అది విశ్వాసము యొక్క ఒప్పుకోలు.

వేరే మాటలలో మనము మన ప్రార్థనను ఇలా ముగించెదము:

 

    ''తండ్రీ, నేను అడుగనవన్ని అనుగ్రహించెదవని నమ్ముచున్నాను.

    నీ నామము పరలోకమందు ఎలాగునో అలాగునే భూమియందును పరిశుద్ధపరచబడును.

    పరలోకమందు వలె భూమిపైనను నీ రాజ్యము వచ్చును.

    నీకు యిష్టమైనది పరలోకమందు ఎలాగు జరుగునో

    అలాగే భూమి పైనను జరుగును.

    మాకు ప్రతి దినము ఆహారము ఇచ్చెదవు.

    మా పాపములను క్షమించెదవు.

    నీవు మమ్ములను క్షమించినట్లుగా మేము ఇతరులు క్షమించుటకు మాకు సహాయము చేయుదువు.

    మేము జయించుటకు కష్టమైన శోధన లోనికి మేము వెళ్లకుండునట్లు చేసెదవు.

    మమ్ములను కీడులో నుండి తప్పించెదవు.

    రాజ్యము, బలము మరియు మహిమ ఎప్పటికిని నీవి మాత్రమే అయియున్నవి.

    అట్లు జరుగును అని తండ్రీ నేను నా హృదయమంతటితో నమ్ముచున్నాను.''

    ఆమేన్, ఆమేన్ !!