నీ శత్రువు గూర్చి తెలుసుకో

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 0
ఈ పుస్తకము మరియు మీరు

యౌవనస్తులైన విద్యార్ధుల గొప్ప సమూహమునకు ఇవ్వబడిన వర్తమానములు ఈ పుస్తకములోనున్నవి. మాట్లాడిన విధానములోనే ఈ వర్తమానములు ఉంచబడినవి.

ఈ దినములలో సాతాను యొక్క దాడులకు యౌవనస్తులే గురిగానుంటున్నారు. నేటి యౌవనస్తులు అపవిత్రత, మత్సరము, అసూయ, స్వార్ధపూరితమైన లక్ష్యములు మరియు భౌతిక విషయములచేత కలుషితము చేయబడాలని సాతాను నిశ్చయించుకున్నాడు. ఒకవేళ వీటన్నింటి ద్వారా కాకపోయినా కనీసం గర్వము, స్వనీతి మరియు వేషధారణ చేతనైనా వారు కలుషితమయ్యేటట్లు చూస్తున్నాడు.

సాతాను యొక్క తంత్రములను గూర్చి మనము ఎరుగని వారముగా ఉండకూడదు.

కల్వరిలో సాతాను మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఓడించబడ్డాడు. మనము వెళ్ళిన ప్రతిచోటా అంధకారసంబంధమైన శక్తులపై విజయమును నమోదు చేయుటయే మన పిలుపైయున్నది.

ఆలాగు చేయుటకు నీవు ఆసక్తి కలిగియున్నట్లయితే, ఈ పుస్తకమును చదువుము.

- జాక్ పూనెన్

అధ్యాయము 1
నీవు సాతాను గూర్చి ఎందుకు తెలుసుకోవాలి?

యౌవనస్థులైన మీలో అనేకులు ఇంతకు ముందెప్పుడు తెలుసుకొనని కొన్ని సత్యములను దేవుని వాక్యము నుండి మీకు చూపించాలనుకొనుచున్నాను.

ఈ సత్యములు మన ఆత్మల యొక్క శతృవును గురించి.

మీరు రక్షణ గూర్చి మరియు యేసు ప్రభువు మన కొరకు చేసిముగించిన దానిని గురించి ఎంతో వినియున్నారు. అనేక మంది బోధకులు సాతాను గురించి బోధించుటకు యిష్టపడకపోవుటచేత, మీరు సాతాను గూర్చి ఎక్కువ తెలుసుకొని యుండరు.

1 పేతురు 5:8 లో ''నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు'', అని బైబిలు గ్రంథము మనకు చెప్పుచున్నది గనుక నేను సాతాను గూర్చి మాట్లాడవలెనని అనుకొనుచున్నాను.

యుద్ధతంత్రములలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక విషయం నీ శత్రువునుగూర్చి తెలిసికొనుట అయి ఉన్నది. నీవు ఒక యుద్ధము చేయుచుండినట్లయితే మరియు నీ శత్రువు గూర్చిన సమాచారము నీ యొద్ద ఎక్కువ యుండినట్లయితే, అది నీ పోరాటమును ఎంతో సులువు చేయును. నీ శత్రువు గూర్చి నీకు కొంచెమే తెలిసినట్లయితే అది నీ పోరాటమును ఇంకా కష్టతరము చేస్తుంది.

లేక, ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే: నీవు వ్రాయవలసిన పరీక్షలో వచ్చే ప్రశ్నలన్ని నీకు తెలిసినట్లయితే, అప్పుడు ఆ పరీక్ష ఎంతో సులువుగా ఉంటుంది.

క్రైస్తవ జీవితములో కూడా అంతే. నీవు నీ శత్రువు గూర్చి తెలుసుకొన్నట్లయితే నీవు అతడిని జయించవచ్చును మరియు ప్రతి శోధనలో నీవు జయించు వాడవుగానుందువు.

అనేక మంది క్రైస్తవులు యేసును వెంబడించుటకై వారి జీవితమంతా పోరాడుతూ ఉందురు, కాని ఓడిపోవుచుందురు. దానికుండిన అనేక కారణాలలో ఒక ముఖ్యమైనది, వారికి వారి శత్రువును గూర్చి ఏమి తెలియక పోవుటయే అనుకొనుచున్నాను.

వైద్యము గూర్చి చదువుకొనుట ముఖ్యమని మనందరకు తెలియును. వైద్య శాస్త్రము మన తరములో అనేక లక్షల ప్రజలను రోగములనుండి స్వస్థపరిచెను మరియు అనేకులను అర్దాంతర మరణము నుండి రక్షించెను. ఇదంతయు వైద్యమునకు సంబంధించిన శాస్త్రజ్ఞులు మానవ శరీరమున కుండిన శత్రువులను గూర్చియు మరియు అవి శరీరముపై ఏ విధముగా దాడిచేయుననే విషయము పరిశోధించుట చేత సాధ్యమయినది. అది ఆరోగ్యమునకు విరోధులైన బాక్టీరియా మరియు వైరస్ల గూర్చి ఎంతగానో అధ్యయనము చేయుటను బట్టి మానవుని ఆరోగ్యము అభివృద్ధి చెందినది. ఆరోగ్యము యొక్క శత్రువులను చంపగలిగిన మరియు మానవ శరీరము నుండి వాటిని తీసివేయగలిగినటువంటి ఔషధములను శాస్త్రజ్ఞులు కనుగొనిరి.

మన భౌతిక శరీరము గూర్చి ఏదైతే యదార్ధమో అది మన లోపలనున్న ఆత్మ గూర్చి ఇంకా ఎంతో యదార్థము. మన ఆత్మనుండి తరిమి వేయుటకును మరియు దేవుని కొరకు పవిత్రముగా నుంచుకొనుటకును, మన ఆత్మకు విరోధియైన సాతాను గూర్చి మనము చదవవలసియున్నది.

బైబిలు సాతాను గూర్చి ఎంతో చెప్తుంది. నిజానికి దేవుడు ఆదాము, హవ్వలను సృష్టించిన తరువాత వెంటనే బైబిలు సాతాను గురించి చెప్తుంది. ఆదాము హవ్వలు ఏదేను వనములో ఏమి చేసారను విషయము బైబిలు ఏమీ చెప్పలేదు. కాని ఆదాము, హవ్వలు దేవుని నుండి దూరమగునట్లు సాతాను ఆ తోటలోనికి వచ్చి పాపాన్ని మరియు గలిబిలిని ఎట్లు తెచ్చెనను విషయం వెంటనే చెప్తుంది.

ఈనాడు లోకములో నుండిన పాపము మరియు ధౌర్జన్యము మరియు చెడు అంతటికి కారణము ఏదేను వనములోనికి సాతాను యొక్క ప్రవేశమైయున్నది (ఆది.3వ అధ్యాయము).

స్త్రీ పురుషుల సృష్టి గూర్చి చెప్పిన వెంటనే బైబిలు సాతాను గూర్చి చెప్పుటకుండిన కారణమేమిటి? మనము సాతాను గూర్చి తెలుసుకొనుట ద్వారా మనము జాగ్రత్త కలిగి యుండవలెనని దేవుని ఉద్దేశ్యము. ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహమువలె ఆ సాతాను తిరుగుచుండునని మనకు తెలియును. నీవున్న పట్టణపు జంతు ప్రదర్శనశాల నుండి ఒక సింహము తప్పించుకు పోయి వీధులలో తిరుగుచున్నదని వార్తా పత్రికలు ప్రచురించాయనుకోండి. అప్పుడు ఏ ప్రదేశంలో అది తిరుగుచున్నదో తెలిసినట్లయితే అది నీకు ఒక సహాయము కాదా? ఎందుకనగా ఆ ప్రదేశమునకు నీవు దూరముగా ఉందువు. తప్పని సరిగా అదే విధముగా సాతాను ఎటువంటి విషయములలో చురుకుగా నుండునో నీకు తెలిసినట్లయితే, అది నిన్ను ఎన్నో సమస్యల నుండి రక్షించును.

అనేకమంది విశ్వాసులకు తరచు నిరుత్సాహముకలిగే సమయములు ఉండును. దీని గూర్చి ఒక విషయము మనము గమనించవలెను: నిరుత్సాహమనేది ఎప్పుడును దేవుని నుండి కలుగదు,అది ఎప్పుడు సాతాను నుండే కలుగును. అదే విధముగా జగడము, బలాత్కారము, ద్వేషము, అసూయ, నిష్టూరత, చెడుగా మాట్లాడుట, ఫిర్యాదులు, సణుగుడు, అధికారముపై తిరుగుబాటు మరియు ప్రతి విధమైన చెడుతనము సాతాను నుండి ఉద్భవించినదే. ఈ చెడులను మనజీవితములలో జయించుటకు, మన శతృవును గూర్చి తెలిసికొనుట ఎంతో మంచిది.

క్రొత్త నిబంధన ప్రారంభ పుటలలో కూడా మనము సాతాను గూర్చి చదువుదుము. యేసు నీటిలో బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందిన వెంటనే, సాతాను అరణ్యములో ఆయనను ఎదిరించి శోధించెనని మనము చదువుదుము (మత్తయి 4:1).

సాతాను యేసును శోధించిన వివరములు మనకు ఎందుకు ఇవ్వబడ్డాయి? వాటి ద్వారా మనము మన ఆత్మలకు విరోధియైన వాని యొక్క కుయుక్తులను లేక బలమును గూర్చి మనము తెలియనివారముగా నుండకుండుటకై యున్నది.

యౌవనస్థులు సాతాను గూర్చి తెలిసికొనుట ఎంతో అవసరమైయున్నది. ఎందుకనగా బైబిలు సాతాను గురించి ఏమి బోధిస్తుందో తెలుసుకొన్నట్లైతే నీవు జాగ్రత్తగా ఉందువు. బైబిలు సాతాను గూర్చి ఏమి బోధిస్తుందో తెలియక పోవుట చేత అనేకులు అతడి గూర్చి భయపడుచుందురు. సాతాను మన ప్రభువైన యేసుక్రీస్తుచేత కల్వరి సిలువపై ఓడింపబడెననునది తెలియక, ఇతరులు వారికి చెడుపు చిల్లంగిలు మరియు చేతబడి చేయుదురని వారు భయపడుచుందురు. యేసుప్రభువు మనందరి కొరకు సిలువపై ఏమిచేసారను దానితట్టు నీ కన్నులు ఒకమారు తెరువబడినట్లయితే, సాతాను గూర్చి నీవు ఎప్పుడును భయపడవు.

కొన్నిమార్లు సాతాను, యేసు సమాజమందిరములలో బోధించినప్పుడు చేసినట్లు, దెయ్యములు పట్టిన వారి ద్వారా క్రైస్తవ కూటములను కలవర పరచవచ్చును. కాని అతడు అట్లుచేయుటను ఎప్పుడును ఊరుకొనకూడదు. ఒకమారు మా మీటింగు హాలులో బైబిలు స్టడీ కూటము జరుగుతున్నప్పుడు ఒక దయ్యము పట్టిన వ్యక్తి ప్రక్క చావడిలో నుండి పామువలె ప్రాకుతు ముందుకు వచ్చి కూటమి ఆటంక పర్చాలని చూచాడు. అయితే యేసు నామములో ఆ దయ్యమును గద్దించినప్పుడు, ఆ వ్యక్తి అక్కడ నేలపైననే గాఢనిద్రలో మునిగిపోయెను. ఆ బైబిలు స్టడీ అయిపోయిన తరువాత అందరును ఆఖరుగా 'ఆమేన్' అని చెప్పిన తరువాత అతడు లేచెను. అప్పుడు అతడితో మాట్లాడితిమి. మా యొక్క బైబిలు స్టడీ కూటమిని అతని యొక్క పరిచారకులతో ఆటంక పర్చునట్లు సాతానుకు ఎప్పుడు అవకాశమివ్వము.

వేరొక బయట జరిగిన బహిరంగ కూటమిలో, నేనొక ముఖ్యమైన విషయం చెప్పబోతూ ఉండగా ఒక వ్యక్తి ప్రసంగవేదిక వద్దకు వచ్చి నాట్యం చేయ్యడం మొదలు పెట్టాడు. నాకు తర్జుమా చేయుచుండిన వ్యక్తి ద్వారా కూర్చొనమని ఆ వ్యక్తిని కోరినా అతడు పట్టించుకొనలేదు. అప్పుడు యేసు నామములో ఆ వ్యక్తిలో నుండిన దెయ్యమును గద్దించినప్పుడు అతడు వెళ్లి నెమ్మదిగా కూర్చొన్నాడు.

కల్వరిపై యేసుచేత దయ్యములన్ని ఓడింపబడినాయి కాబట్టి, యేసు నామములో ఆజ్ఞాపింపబడినప్పుడు అవి లోబడాల్సియున్నది.

కల్వరి సిలువపై సాతానును జయించిన యేసు నామములో శక్తి యున్నదని తెలుసుకొనుట ఎంతో ముఖ్యము. సాతానుకు నీవెప్పుడు భయపడనక్కర్లేదు. నీవు నీ శతృవు గూర్చి తెలుసుకొననట్లయితే అప్పుడు అతడు నిన్ను ఏమైనా చేస్తాడేమో అని నీవు భయపడ్తూ ఉందువు. నీవు యేసును నీ జీవిత మంతటికి ప్రభువుగా చేసికొన్నట్లయితే అతడు నిన్ను ఏమి చేయలేడు. ఎందుకంటె యేసు సిలువపై అతడిని ఓడించినప్పుడు, సాతాను యొక్క శక్తి అంతా అతడి నుండి తీసివేయబడింది.

అధ్యాయము 2
సాతాను యొక్క ఆవిర్భావము

దేవుడు శాశ్వత కాలమునుండి ఉన్నవాడని మనకు తెలియును. ''ఆది యందు దేవుడు...''. (ఆది 1:1) అను సందేశముతో బైబిలు మొదలయ్యెను. బైబిలులో ఇవి మొదటి మూడు మాటలైయున్నవి. ఆ మాటలు గడచిన శాశ్వత కాలము గూర్చి చెబుతున్నాయి. మన మనస్సులకు అర్థము కానటువంటి గత కాలము గూర్చి అక్కడ చెప్పబడినది. మన మనస్సులు కేవలము కాలము గూర్చి మాత్రము అర్థము చేసుకొనగలవు. అయితే దేవుడు కాల ప్రమాణము ప్రారంభమగుట ముందు నుండి యుండెను.

కాని సాతాను కాల ప్రమాణమునకు ముందు నుండి లేడు. సాతాను సృష్టింపబడినవాడు. అయితే దాని అర్ధము దేవుడు ఒక దుష్టశక్తిని సృష్టించాడనా? అలా కాదు. ఎందుకంటె అది అసాధ్యము. దేవుడు చెడ్డదైన దేనిని సృష్టించలేడు. ఆయన సృష్టించిన ప్రతిది శ్రేష్టమైనది(యాకోబు 1:17). ఆదాము, హవ్వలు కూడా వారు సృష్టించబడినప్పుడు పరిపూర్ణులుగా ఉండిరి. అదే విధముగా సాతాను కూడా అతడు సృష్టింపబడినప్పుడు సంపూర్ణుడుగా ఉండెను. అప్పుడు అతడు ''తేజో నక్షత్రము'' (లూసిఫరు) అని పిలువబడెను (యెషయా 14:12). ఆ పేరు ఇప్పుడు చెడు అర్ధమిచ్చునదిగా మారిపోయెను. కాని అతడు మొదట సృజింపబడినప్పుడు అలాగుండెడిదికాదు.

అతడు దేవదూతలకు నాయకునిగా, దేవుని ఆరాధించుటకు దేవదూతలను నడిపించువానిగా సృష్టించబడెను. అతడు సృష్టింపబడినప్పుడు అతడికి మానవాతీతమైన శక్తి సామర్థ్యములను దేవుడిచ్చాడు. కాని అతడు పాపములో పడుటవలన సాతానుగా మారెను.

అయితే అతడు పడిపోయిన తరువాత దేవుడు అతడి యొద్దనుండి ఆ శక్తులను తీసికొనకపోవుట చేత ఇప్పటికిని సాతాను ఆ శక్తులు కలిగియున్నాడు.

దేవుడు ఆ శక్తులను సాతాను యొద్దనుండి ఎందుకు తీసుకొనలేదా అని మనము ఆశ్చర్యపోవచ్చును. కారణమేమంటే సాధారణముగా దేవుడిచ్చు వరములను తిరిగి ఆయన తీసుకొనడు. మానవ మాత్రులమైన మనము కూడా ఇంకొకరికి ఇచ్చిన బహుమానమును సహజముగా తిరిగితీసుకొనము. చివరకు అతడు మనకు వ్యతిరేకముగా మారినాసరే.

సాతాను తన శక్తులను ప్రజలకు హానిచేయుటకు ఉపయోగించుచుండెను. అందుచేతనే అతడితో సంబంధమున్న వారు చెడుపు, చిల్లంగిల ద్వారా మానవాతీత కార్యములు చేయగలరు.

సాతాను గూర్చి, ''తేజో నక్షత్రమా, వేకువచుక్కా, (అది అతని పేరు) నీవెట్లు ఆకాశమునుండి పడితివి?'' అని వ్రాయబడెను.

దేవదూతల నాయకునిగా, లూసిఫరు ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండేవాడు. అయితే ఎందుకు అతడు పడిపోయాడు? దానికి కారణము తరువాత రెండు వచనములలో ఇవ్వబడినది. ''నేను ఆకాశమున కెక్కిపోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును...మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా?....నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే'' (యెషయా 14:13,14).

లూసిఫరు మిగిలిన దేవదూతలందరి కంటె గొప్ప అందగాడు, ఎన్నో వరములు కలవాడు మరియు అద్భుత సామర్థ్యములు కలవాడుగా ఉండెను. అతడి హృదయములో గర్వము ప్రవేశించనంత వరకు, అతడు ఇతర దేవదూతలను దేవుని ఆరాధనలో నడిపించేవాడు. అటువంటప్పుడు అతడు ఈలాగు ఆలోచించ మొదలుపెట్టాడు, ''ఒకే ఒకవ్యక్తి నాపైనున్నాడు. అతడే దేవుడు. నేను అతడిపై కూడా అధికారము పొందుదును'' అని.

అది నిజముగా అతడికి వచ్చిన ఒక బుద్దిలేని ఆలోచన. అతడిని సృష్టించిన వానికి పైగా అతడు ఎలా ఎక్కిపోగలడు? అయితే అతడు ఎంతో తెలివైన వాడైనా, అతడు చేసే పనులలో మరియు ఆలోచించే ఆలోచనలలో అంత బుద్ధిహీనుడిగా నుంటాడు. సాతాను పద్ధతులు అలాగే ఉంటాయి. ఆత్మీయముగా మాట్లాడుకొన్నట్లయితే లోకములో అనేక మంది తెలివైన వారు కూడా బొత్తిగా బుద్ధిలేని పనులు చేయుచుందురు. మనము సాతాను గూర్చి చదివిన కొలది అతడు చేసిన అనేక పనులలో అతడెంత బుద్ధి హీనుడుగానున్నాడో మనము చూడగలము.

దేవుడు ఉంచిన స్థానములో ఉండుట సాతానుకు సంతోషము కాకపోయెను. ప్రతి వారు అతడిని పూజించు స్థానమునకు తాను చేరవలెనని అతడు ఆశించెను! అతడు అలా అనలేదు. కాని అతడు హృదయములో అలాంటి ఆలోచనలు ఆలోచించుటకు మొదలు పెట్టెను (యెషయా 14:13).

దేవుడు మన హృదయములో ఏం జరుగుతుందో చూచును. అలానే లూసిఫరు హృదయములోనికి చూచెను. అతడు దేనిపై ఆశ కలిగియున్నాడో చూచెను.

శోధనకు మరియు పాపమునకు తేడా యున్నది.

శోధన మొదట్లో మన మనస్సులో ఒక ఆలోచనగా వస్తుంది. మనమెప్పుడైతే ఆ ఆలోచనతో ఏదోవిధముగా ఏకీభవిస్తామో అప్పుడు అది పాపముగా మారుతుంది. దానికి బదులుగా ఆ ఆలోచనను మనము వెంటనే తిరస్కరించినట్లయితే మనము పాపముచేయని వారుగా నుందుము (యాకోబు 1:14,15).

ఉదాహరణకు, నీవు ఇతరుల యెదుట మంచి వాడవుగా కనబడుటకు, వేరొకరిని ఇతరుల దృష్టిలో తక్కువ కాబడునట్లు చేయుటకు నీలో ఎప్పుడైనా చెడ్డ ఆలోచన వచ్చియున్నదా?

అటువంటి ఆలోచన వచ్చిన మొదటి వ్యక్తి ఎవరో నీకు తెలుసా? లూసిఫరు. ఎవరిని అతని కంటె క్రిందకు లాగాలనుకొన్నాడో తెలుసా? దేవదూతలను కాదు ఎందుకంటె వారు అతని కంటె ఎప్పుడో క్రింద ఉన్నారు. అతడు దేవునినే క్రిందకు లాగాలని అనుకొన్నాడు. నీవు పైకెక్కుటకు ఇతరులను క్రిందకు లాగుట సాతానుయొక్కఆత్మ అయివున్నది.

నీ శతృవు గురించి నీవు తప్పక తెలుసుకొనవలెనని ఎందుకు చెబుతున్నాను? ఎందుకనగా ఎప్పుడైతే అటువంటి ఆలోచన నీ మనసులో ప్రవేశించిందో, నీలోనికి శతృవు ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నాడని నీవు గుర్తించవలెను. గర్జించు సింహము నిన్ను మ్రింగుటకు ఎదురుచూస్తున్నాడన్న మాట.

ప్రధానదూత దెయ్యముగా మారుటకు ఎన్నో సంవత్సరములు పట్టలేదు. ఒక్క క్షణం మాత్రమే. అతడు మెట్టు తరువాత మెట్టుగా కొద్ది కొద్దిగా పడిపోలేదు. లేదు, యేసు చెప్పినట్లుగా ఒక్క క్షణంలోనే మెరుపు తీగెపడినట్లు క్రిందకు వచ్చివేసాడు (లూకా 10:18). ఒక్క క్షణం ముందు అతడు తేజో నక్షత్రము. దేవునితో సమానుడుగా కావలెననే ఆలోచనను ఎప్పుడైతే తన హృదయములో పోషించాడో, అప్పుడు వెంటనే అతడు అపవాదిగా మారిపోయాడు.

ఒక దేవదూత దయ్యముగా మారుటకు ఎంత సమయము పట్టినది? ఒక్క సెకను కూడా కాదు. ఒక్క క్షణం. ఒక మంచి వ్యక్తి దయ్యము వలె అగుటకు ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం, అంతే. అది జ్ఞాపకం ఉంచుకోండి.

యెహెజ్కేలు 28వ అధ్యాయములో సాతాను యొక్క ఆవిర్భావము గూర్చి చెప్పబడిన ఇంకొక భాగమున్నది. అక్కడ సాతాను ''తూరు రాజు'' అని పిలువబడెను (యెహెజ్కేలు 28:12). ఈ ప్రపంచ రాజుల వెనుక దురాత్మలుండును. ఆ కాలములో తూరు రాజు వెనుక సాతానే ఉండెను. ఆ మానవరాజులో నివసిస్తున్న సాతానుతో ప్రభువు చెప్పుచుండెను.

అక్కడ ప్రభువు సాతాను ఏదేను వనములో నుండినప్పటి విషయమును జ్ఞాపకము చేసెను (యెహెజ్కేలు 28:13). ఇది ఏదేను వనములో ఆదాము హవ్వలు ఉండక మునుపే సాతాను అక్కడ ఉండెనను విషయాన్ని చెప్తుంది. మరియు అక్కడ ప్రభువు సాతాను ఎలాగు, ''నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో, నీవు యధార్థవంతుడవుగా నుంటివి'' (16,17 వ) అని జ్ఞాపకము చేసెను.

లూసిఫరు హృదయము తన కుండిన సౌందర్యమును బట్టి ప్రప్రథమముగా గర్వించెను. నీవు అద్దములో చూచుకొని ఇతరులకంటె నీ వెంత అందముగా నున్నావని పోల్చుకొనుట చేత నీ హృదయము ఎప్పుడైనా గర్వించినదా? దాని గూర్చి జాగ్రత్త కలిగి యుండుము. దేవుడిచ్చిన మంచి ఈవులను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుము. అందముగా కనబడే ముఖము కలిగి యుండుటలో తప్పేమీ లేదు. కాని దానిని బట్టి గర్వించుటలోనే తప్పంతా ఉంది. అలాంటప్పుడు నీవు సాతానుకు తలుపు తీస్తున్నావు.

లూసిఫరు గర్వమునకు ఇంకొక కారణము అతడికుండిన తెలివితేటలు. సృష్టింపబడిన వాటన్నిటిలో అధికమైన తెలివి తేటలు గలవాడు సాతాను అని నీకు తెలుసా? తెలివి తేటలు కలిగి యుండుటలో తప్పేమీ లేదు. మన తెలివి తేటలను దేవునికి మహిమార్థముగా ఉపయోగించవచ్చును. అయితే వాటిని బట్టి గర్వించుటకు మనకు హక్కు లేదు. ప్రభువును సేవించుటకు మనము బుద్దిహీనులుగా నుండనక్కరలేదు. నీ తెలివిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుము, నీ సౌందర్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుము. అంతేకాని వాటిని బట్టి ఎప్పుడైనను గర్వించకు.

లూసిఫరు యొక్క అహంభావమునకు మూడవ కారణము సృష్టింపబడిన వారందరిలో అతడి కుండిన ఉన్నతమైన స్థానము. అతడు ఈ మూడు విషయములు సౌందర్యము, తెలివి మరియు అతడికుండిన ఉన్నతమైన స్థానము. దేవునియొక్క బహుమానము అని గుర్తించలేకపోయాడు. ఈ విషయాన్ని అనేకమంది మనుష్యులు మరియు క్రైస్తవులు గుర్తించరు. అదే విధముగా వాటిద్వారా సాతాను కొందరి జీవితాల్లో అడుగుమోపి చివరకు వారిని నాశనము చేయును.

గనుక ప్రపంచములో నుండిన పాపమంతా గర్వము నుండి ప్రారంభమైనది అని మనము చూడగలము. వ్యభిచారము వలన కాని, నరహత్య వలన కాని కాదుకాని గర్వము వలన. అందువలననే రక్షణ యేసు తనను తాను తగ్గించుకొనుట వలన వచ్చినది. దీనత్వము యొక్క మార్గము సాతాను కుయుక్తులను ఉచ్చులను తప్పించుకొను మార్గమై యున్నది.

జీవితములో ఒకనికి ఏర్పర్చబడిన స్థితిని గూర్చి అసంతృప్తి గలఆత్మ యొక్క ప్రారంభమును కూడా లూసిఫరులో చూచెదము. మనము ఈ లోకమును దేవుని ధృక్పథము నుండి చూచినట్లయితే, ఈ లోకమంతా సణుగులు, గొనుగులు, ఫిర్యాదులు చేసే ప్రజలతో ప్రతిచోట నిండిపోయి ఉన్నట్లు కనబడ్తుంది. అది వారందరు సాతాను నుండి పొందిన ఆత్మ.

అధికారముపై తిరుగుబాటు చేయుఆత్మ సాతాను నుండి ప్రారంభమైన మరియొక ఆత్మ, లూసిఫరు కంటె పైన ఉండిన అధికారము ఒకేఒక్కటి, అది దేవుడు మాత్రము. అయితే అతడు ఆ అధికారము పైనే తిరుగుబాటు చేసాడు. అతడు ఆ అధికారమునకు పైన ఉండి దేవునిని క్రిందకు త్రోసివేయాలనుకొన్నాడు.

మానవజాతిలో అటువంటి ఆత్మను నీవు చూస్తున్నావా? దేశాలలో వచ్చుఎన్నో తిరుగుబాట్లు, కార్ఖానాల్లో జరుగు సమ్మెలకు కారణము అధికారముపై తిరుగుబాటు చేసే ఆత్మయే. మరియు ఈ దినాల్లో విద్యార్థుల్లో సహితము ఈ ఆత్మను మనము చూస్తున్నాము. కేవలము కాలేజీ విద్యార్థుల్లోనే కాక పాఠశాల విద్యార్థుల్లోను, ఇంకా ఇంటిలో నుండు చిన్న పిల్లలలో కూడా చూస్తున్నాము.

ఇదంతా కూడా లోకము చెడిపోతుందనుటకు ఖచ్చితమైన గుర్తుగా ఉన్నది. ఉపాధ్యాయుల యెడలను, తల్లి దండ్రుల యెడలను చివరకు సంఘములో పెద్దలైన సహోదరుల యెడలను అగౌరవము ప్రతిచోటా సాధారణమైపోయినది.

శ్రేష్టులైన దేవదూతలను దయ్యములుగా మార్చినది ఆ ఆత్మయేనని ఎప్పుడైనను మరువవద్దు. మరియు ఆ ఆత్మ ఒక మంచి అబ్బాయినికాని, అమ్మాయినికాని ఈ రోజుకూడా ఒక దయ్యముగా మార్చును.

దేవుడు ఎవ్వరిని చెడ్డవారుగా చెయ్యలేదు. ఎప్పుడైతే సాతానుయొక్కఆత్మకు మనకు మనము తలుపులు తెరుస్తామో అప్పుడు మనలను మనము చెడ్డవారిగా చేసుకొనుచున్నాము.

ఇప్పుడు లూసిఫరు యొక్క ఆఖరి లక్షణాన్ని గమనించండి. అతడు పడిపోయినప్పుడు అతడు ఒంటిగా పడిపోలేదు. అతడికి తోడు ఉన్నారు. అతడితో పాటుగా మూడవవంతు దేవదూతలను ఈడ్చి పడవేసెను అని మనము ప్రకటన 12:4లో చదువుదుము. వారు కూడా అతడి ఆత్మ అయిన గర్వము, అసంతృప్తి మరియు తిరుగుబాటులతో అవివేకముగా చేరారు.

ఈనాడు అలాగే ఉంది. ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పుడు అతడి మట్టుకు అతడు చెడ్డవాడుగా నుండుటకు తృప్తిపడుటలేదు. అతడితో పాటుగా ఇతరులను కూడా అతడుండిన ధౌర్భల్య స్థితికి మరియు చెడుతనమునకు లాగాలని కోరుకొనుచున్నాడు. ఇతరులు జాగ్రత్త కలిగి లేకపోయినట్లయితే ఒకరిలో నుండిన చేదైన వేరు అనేకులను అపవిత్రపర్చును (హెబ్రీ 12:15).

అధ్యాయము 3
సాతాను యొక్క మోసము

ఆదికాండము 3వ అధ్యాయములో సాతాను ఎలాగు చొరబడతాడో మనము చూడగలము. సర్పము జంతువులన్నిటిలో యుక్తి కలిగినదని అక్కడ చెప్పబడినది. సాతాను అటువంటి సర్పములో ప్రవేశించినది (గెరాసేనీయుల ప్రాంతములో యేసు, సేన అను దయ్యములను ఒక మనుష్యుని నుండి వెళ్లగొట్టినప్పుడు అవి పందులలో ప్రవేశించినట్లు) అక్కడ సాతాను సర్పము ద్వారా హవ్వతో ''ఇది నిజమా? ఈ చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?'' అని అడిగెను. హవ్వ దేవుడు ఏమని చెప్పెనో చెప్పినప్పుడు, సాతాను దేవుని మాటకు వ్యతిరేకముగా ''మీరు చావనే చావరు'' అని చెప్పెను.

సాతాను ఏవిధముగా వస్తాడో గమనించండి. మొదటగా అతడు దేవుని మాటను ప్రశ్నిస్తాడు.

అదే విధముగా అతడు మన యొద్దకు కూడా వచ్చును. ''అది చేయకూడదని దేవుడు నిజంగా చెప్పెనా? అది చేయుటలో తప్పేమిటి? ఈ బైబిలులో నుండిన ఆజ్ఞలు పాతకాలమునకు సంబంధించినవి. అవి పౌలు నివసించిన కాలానికి, సమాజానికి సంబంధించి వ్రాయబడినవి. ఇప్పుడు మనముండిన 21వ శతాబ్ధంలో వాటిని అక్షరాలా పాటించుటకు కాదు'' మొదలైనవి అతడు చెప్పును.

యౌవనస్థులు మరియు పెద్దవారు కూడా వారు సాతానుకు ఒక మాట్లాడేసాధనముగా అవుచున్నారని తెలుసుకొనకుండా ఎప్పుడు అటువంటి ప్రశ్నలడుగుతు యుందురు. చివరకు వారి మనస్సాక్షి వారికి ఇది తప్పు అని చెబుతున్నా, వారు వారి హేతువాదాన్ని ఉపయోగించి దేవుడు ఏదైతే కూడదనెనో దాని గూర్చి ప్రశ్నించెదరు.

దేవుడు ఎప్పుడైతే ఆయన వాక్యములో ఒక దానిని వద్దనెనో, అలా అనుటకు తగిన మంచి కారణమున్నదని మనకు ఖచ్చితముగా తెలియును. కాని దేవుడు నిజముగా అలా చెప్పెనా లేదా అని మనము ప్రశ్నంచునట్లు సాతాను చేయును.

చివరకు ఏదొక విధముగా మనలను దేవుని మాటను ప్రశ్నించునట్లు చేయుటలో సాతాను యొక్క గురి ఏమిటి? హవ్వ విషయములో కూడా అతడి గురి సరిగా అదే. ఆదాము, హవ్వలను దేవుడు తప్పని సరిగా ఏవిధంగా ఆయన సన్నిధినుండి వెళ్ల గొట్టారో అదే విధముగా మనలను కూడా ఆయన సన్నిధినుండి తిరస్కరించునట్లు చేయుట సాతాను యొక్క గురిగా యున్నది.

సాతాను ఒక దొంగ అని యేసు ఒకమారు చెప్పెను. సాతాను డబ్బును దొంగతనము చెయ్యడు. ఎందుకంటె డబ్బుకు శాశ్వతమైన విలువలేదని అతడికి తెలియును. అతడు శాశ్వతమైన విలువ ఉండే వాటినే దొంగిలిస్తాడు, ముఖ్యముగా ప్రజల ఆత్మలను సాతాను దొంగిలించిన తరువాత అతడు దొంగిలించిన వాటిని చంపివేయును అని కూడా యేసు చెప్పారు (యోహాను 10:10) దానికి వేరుగా ఆయన సమృద్ధియైన జీవాన్ని ఇవ్వటానికి వచ్చెనని చెప్పెను.

600 కోట్ల ప్రజలుండిన ప్రపంచములో నూటికి 90 మంది కంటె ఎక్కువ మంది యేసుప్రభువునందు విశ్వసించకుండా దేవుని మాటకు లోబడకుండా సాతాను యొక్క అబద్దములకు ప్రాముఖ్యత ఇస్తున్నారంటె అది ఆశ్చర్యం కదా? దేవుని మాటకు లోబడక పోవడం అన్నది అంత తీవ్రమైన విషయం కాదని ప్రజలను ఒప్పింపచేసిన సాతాను యొక్క గొప్ప పనిని మనము అక్కడ చూడగలము.

ప్రజలు మొదటిసారిగా మొదటిగుక్క మధ్యాన్ని త్రాగినప్పుడు లేక మొదటి దమ్ము సిగరెట్టు పీల్చినప్పుడు లేక హెరాయిన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను మొదలు పెట్టినప్పుడు వాటి వలన వారి శరీరములు మనసులు ఈ భూమిపై పాడవుతాయని చివరకు వారి ఆత్మలు శాశ్వత కాలము నరకమునకు పోవునట్లు చేస్తాయని సాతాను వారిని హెచ్చరిస్తాడని మీరనుకుంటున్నారా? అలా చెప్పే వారికి సత్యాన్ని తెలియనివ్వడు. నిజము వినుటకు నిష్ఠూరముగా ఉంటుంది. వాటిని రుచి చూడడంలోగొప్ప హుషారు ఉంటుందని చెబుతాడు, అదే సాతాను హవ్వకు చెప్పాడు.

ఈనాడు ప్రపంచంలో కోట్లకొలది యౌవనులను అదేవిధంగా అతడు మోసగిస్తున్నాడు. జారత్వమైనా లేక ఇతరుల వస్తువులు దొంగలించుటైనా, ''దానిలో తప్పేముంది? కాలం చెల్లిపోయిన పాత 19వ శతాబ్డపు ఆలోచనలు ఇప్పుడు పనికి రావు'' మొదలైనవి సాతాను చెప్పును. నీ మనసులో సాతాను కల్పించు ఇటువంటి ఆలోచనల గూర్చి నీవు జాగ్రత్తగా ఉండుము. అతడి యొక్క చివరి లక్ష్యము నిన్ను నాశనం చేయుటయే.

ఆదికాండము 3:6 లో హవ్వ ఆ చెట్టు ఆహారమునకు మంచిదని చూచిన వెంటనే, ఆమె శరీరము దాని వైపునకు లాగబడినది. తినకూడదని చెప్పబడిన ఆ చెట్టు ఫలమునకు సంబంధించినవి ఈ 21వ శతాబ్దములో ఎన్నో ఉన్నవి. దేవుడు వద్దని చెప్పిన అనేకమైన వాటివైపు మన శరీరములు లాగబడుటను మనము తెల్సుకొనగలము.

హవ్వ కన్నులకు ఆ చెట్టు అందమైనదిగా ఉండినట్లు దేవుని వాక్యములో చెప్పబడినది. దేవుడు మనలను కనీసం చూడవద్దని నిషేధించినవి ఎన్నో మన కన్నులకు చాలా ఆహ్లాదముగా ఉండుటను మనము గమనించగలము.

ఆ పండు మనసునకు రమ్యమైనదిగా నుండినట్లు హవ్వ కనుగొనెనని కూడా చెప్పబడినది. ఆ పండు తనకు వివేకమును ఇవ్వగలదన్నట్లుగా ఆమె చూచినది. మన మనసులు కూడా దేవుడు నిషేధించిన అనేకమైన వాటివైపు ఆకర్షించబడుచుండును. నీ మనస్సాక్షి తప్పని చెప్తున్నప్పుడు నీ మనసు, శరీరము వాటివైపు లాగ బడుతున్నట్లయితే బహుజాగ్రత్త కలిగియుండుము.

ఆ సమయములో హవ్వ చేయబోయేది తప్పని ఆమె మనస్సాక్షి ఆమెకు తేటగా చెప్పియుండెనని నేను ఖచ్చితముగా నమ్ముతున్నాను. దేవుడు ఆ చెట్టు ఫలము తిన వద్దని చెప్పిన విషయము హవ్వకు బాగుగా తెలియును. కాని ఆమె చేసిందేమిటి? ఆమె శరీరము, మనసు ఆ పండును కోరుకొనుట చేత, దానిని తీసుకొని తినుటలో తప్పేమీ లేదని ఆమె సమర్థించుకొనినది. గనుక ఆమె తన మనస్సాక్షికి వ్యతిరేకముగా ఆ పండును తీసుకొని తినినది.

హవ్వ పాపము చేయునట్లు చేయుట ద్వారా సాతాను సాధించినదేమిటి? అనేక సంవత్సరాల ముందు అతడు దేవుని సన్నిధినుండి పడిపోయెను. ఒకమారు అతడు దుష్టుడుగా మారిన తరువాత అతడు ఇతరులను కూడా దుష్టులుగా మార్పుచేయాలని నిశ్చయించుకొన్నాడు. ఇప్పుడు మానవ జాతిలో అదే జరుగుతుంది. ఒక వ్యక్తి ఏదో తప్పు చేసినప్పుడు, అతడు చేసిన తప్పులో అతడొక్కడే ఉండుటలో సంతోషించడు. ఇతరులు కూడా అదే తప్పును చేయాలని అతడు కోరుకుంటాడు.

యౌవనస్థులారా! బైబిలులో సామెతలు గ్రంథము మీరంతా చదవాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాను. ఆ పుస్తకము మిమ్ములను అనేకమైన ప్రమాదకరమైన ఉచ్చులనుండి తప్పించును.

సామెతలు 1:10లో ''పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము'' అని చెప్పబడినది.

సాతాను దుష్టుడుగా మారి హవ్వను కూడా తనతో పాటు క్రిందికి లాగి వేయుటకు ఆశించెను. మరియు హవ్వ ఆ ఆత్మ వలన చెడిపోయి, ఆమెతో ఆమె భర్తను క్రిందికి లాగి వేయుటకు కోరుకున్నది. గనుక ఆమె ఇంకొక పండును తీసికొని ఆమె భర్తకు ఇచ్చినది.

ఆ విధముగా ఈ శతాబ్దాలన్నిటిలో దుష్టత్వము అభివృద్ది చెందినది. ఒకడు దుష్టుడుగా మారి అతడు ఇతరులను తనతో క్రిందికి లాగివేయుట ద్వారా ఇది జరిగినది.

అందుచేతనే మనము ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాతాను ఎప్పుడు గర్జించు సింహము వలె వచ్చినా మనమతడిని సుళువుగా గుర్తించవచ్చును. అయితే అతడు ఎల్లప్పుడు అలారాడు. అతడు కొన్నిమార్లు మంచిగా మరియు చూడచక్కని విధముగా ''వెలుగు దూత'' వలె వచ్చును (2 కొరిందీ¸ 11:14). అటువంటప్పుడు మనమింకా జాగ్రత్తగా ఉండవలెను.

యేసు తన శిష్యులతో ఆయన శ్రమపడి సిలువపై మరణించవలసియున్నదని చెప్పిన విషయము గూర్చి ఆలోచించండి. అప్పుడు పేతురు ''ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడును కలుగదని'' చెప్పెను. కాని యేసు పేతురును ''సాతానా, నా వెనుకకు పొమ్ము'' అని గద్దించెను (మత్తయి 16:22,23). సిలువపై మరణమును తప్పించుకొనునట్లు సలహాయిచ్చిన స్వరము, అది చివరకు పేతురు నోటినుండి వచ్చినను అది సాతానుదని ఆయన గుర్తించెను.

మనుష్యుని యొక్క పాపములు పరిహరింపబడుటకు సిలువపైకి వెళ్లుట ఒక్కటే మార్గమని యేసునకు తెలియును. పేతురునకు అది తెలియదు. పేతురు మంచి ఉద్దేశంతోనే చెప్పాడు కాని, ఆ సమయములో యేసును సిలువపైకి వెళ్లకుండా ప్రయత్నించినట్లు సాతాను అతడి ద్వారా మాట్లాడినట్లు తెలుసుకొనలేకపోయెను. అవును, సాతాను మన దగ్గరకు ఒక దగ్గర స్నేహితుని ద్వారా వచ్చి మానవరీత్యా జాలి మరియు మంచితనము ధ్వనించే సలహాలను ఇవ్వవచ్చును. గనుక మనము అన్ని సమయములనందు జాగరూకతతో ఉండవలెను.

మనమందరము అత్యాశతో ఆశించవలసినది మన మనస్సాక్షిలో సున్నితత్వము. అది మనమే చిన్న తప్పు చేసినా, దాని గూర్చి మనకు పెద్ద శబ్ధంతో చెప్పే మనసు. ఒక చిన్న పిల్లవాని అరికాళ్లు చూడండి. అవి ఎంత మృధువుగా, మెత్తగా ఉండును! వాటిని మీ యొక్క అరి కాళ్లతో పోల్చుకోండి. ఎంత తేడా! నీవి బహుగా గట్టివై పోయాయి. నీ మనస్సాక్షి విషయంలోనూ అంతే.

నీవు పుట్టినప్పుడు నీకును అటువంటి సున్నితమైన మనస్సాక్షి ఉండేది. అది ఆ చిన్నపిల్లల అరికాళ్ల వంటిదే. అప్పుడు నీవు చేసిన ఏ చిన్న తప్పుకైనా అది కంపించేది. అయితే నీవు ఎదుగుతున్న కొద్దీ, నీ తల్లి దండ్రులతో అబద్దములు చెప్పడం మొదలు పెట్టావు, వారిని మోసం చేసావు, ఇతరుల వస్తువులు దొంగిలించావు, ఇంకా వారిని వేరు వేరు విధాల బాధపెట్టావు, పరీక్షల్లో కాపీకొట్టావు, నీ తల్లిదండ్రులను ఎదురించావు, ఇంకా అనేక చెడ్డ కార్యాలు చేసావు. ఆ విధంగా నీ అరికాళ్లవలె కరిÄనంగా పాపానికి స్పందించకుండునంతగా నీ మనస్సాక్షిని అవమానపరచి అలక్ష్యంచేసావు.

పౌలు ఒకమారు ''సాతాను తంత్రములను మనము ఎరుగనివారముకాము'' (2 కొరిందీ¸ 2:11) అని చెప్పెను. సాతాను ఎంతో యుక్తిగా హవ్వ వద్దకు వచ్చి, చూచుటకు చక్కగా కనబడుదానిని బట్టి ఆమెను శోధించి, చివరకు ఆమెను నాశనము చేసెను. ఈనాడు కూడా సాతాను అదే విధముగా మనలను నాశనము చేయుటకు వచ్చును. ఇంత వరకు నేను చెప్పిన పద్దతులతో మాత్రమే కాకుండా ఇంకను ప్రత్యక్షముగా సాతానును పూజించుట ద్వారా కూడా అతడు ప్రజలను చెడుపు, చిల్లంగి విధ్యల ద్వారా, కొన్ని దయ్యాలకు సంబంధించిన ఆటల ద్వారా, ఔజా బల్లల ద్వారా, జ్యోతిష్యం ద్వారా, జాతక చక్రాల ద్వారా, హస్త సాముద్రకము ద్వారా చివరకు రాక్ సంగీతము మరియు మాదక ద్రవ్యాల ద్వారా కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. సాతాను అవకాశం ఉన్న ప్రతి పద్ధతి ద్వారా మనుష్యుల మనసుల్లోనికి రావటానికి ప్రయత్నిస్తున్నాడు.

విగ్రహారాధన కూడా మనుష్యులు సాతానుతో సంబంధం కలుగునట్లు చేయును. ఎందుకనగా ప్రతి విగ్రహము వెనుక ఒక దయ్యమున్నది (1 కొరిందీ¸ 10:19,20) చివరకు ఆ విగ్రహము 'బాల యేసు' అని పిలువబడినా లేక 'మేరీ' అని పిలువబడినా లేక ఇంకే పేరుతో పిలువబడినా అంతే. అందుచేతనే దేవుడు విగ్రహారాధనను అంతగా ద్వేషించి, మనలను దానినుండి పూర్తిగా తప్పు కొనమనెను (నిర్గమ 20:4,5; 1 కొరిందీ¸ 10:14; 1 యోహాను 5:21).

యౌవనస్థుల మనసులను సాతాను సినిమాల ద్వారా, టి.వి. కార్యక్రమముల ద్వారా మరియు వీడియో చిత్రముల ద్వారా కూడా పాడుచేయుచుండెను. నీవు ఆ తెరపై కామ ప్రేరిత దృష్యాలు, పోరాటాలు చూచినప్పుడు, నీకు వాటి గూర్చి కలలు రావా? నీవు భయము కలిగించే మరియు అసహ్యమైన కలలు కూడా కందువు. అపవాది ఆ విధముగా భయాన్ని మరియు అపవిత్రతను నీ మనసులోనికి చొప్పించి నెమ్మదిగా నీ జీవితాన్నంతటినీ నాశనము చేయును.

హవ్వ ఆ చెట్టువైపు ఆకర్షితురాలైనప్పుడు, ఆమె దేవునికి కేక వేసినట్లయితే, విషయం వేరొకలాగు ఉండేది.

నేను 19 సంవత్సరాలప్పుడు రక్షింపబడినప్పుడు, నేను ఇక సినిమాలకు వెళ్లకూడదని తెలుసుకొన్నాను. కాని ఒకదినాన నా స్నేహితులు వారితో ఒక సినిమాకు రావాలని కోరారు. అప్పుడు నేను నేవీలో పనిచేస్తున్నందున నేను నావికాదళకేంద్రములో ఉన్నాను. అప్పుడు నేను క్రైస్తవుడనయ్యాను కాబట్టి నేను సినిమాకు రాను అని వారితో చెప్పుటకు నాకు ధైర్యము చాలలేదు. గనుక వారితో సినిమాహాలు వరకు వెళ్లాను. కాని అక్కడకు వెళ్లే మార్గమంతా నేను ''ప్రభువా! దయచేసి నాకు సహాయం చెయ్యి. ఈ పరిస్థితి నుండి కాపాడు. నాకు వెళ్లాలని లేదు'' అని మౌనముగా ప్రార్థించాను. చివరకు మేము ఆ సినిమాహాలు చేరాము. అయితే అక్కడ, ఆరోజు ఆ సినిమా తాలూకు ఫిల్ము బాక్స్ రాకపోవుట చేత ఆ రోజు ఆ సినిమా రద్దు చేయబడెనని బోర్డుపెట్టారు. నా ప్రార్థనకు అద్భుతంగా సమాధానము ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించాను. అయితే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు: ఇప్పుడు నేను నీకు సహాయం చేసాను కాని తరువాత ఇటువంటి పరిస్థితులలో నీమట్టుకు నీవే ''రాను'' అని చెప్పాలి. తరువాత నా స్నేహితులు మరల నా దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు అద్భుతంగా నా ప్రార్థనకు ఇచ్చిన జవాబును బట్టి వారికి ''రాను'' అని చాలా సుళువుగా చెప్పగలిగాను.

దేవుడు ఏదేను వనములోనికి వచ్చి ఆదాము, హవ్వలను వారు చేసిన పాపము గూర్చి నిలదీసినప్పుడు దేవుడు, ''నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని'' సాతానును కూడా శపించెను (ఆది 3:15). అది కల్వరిపై నెరవేరినది. యేసు క్రీస్తు స్త్రీ గర్భమున జన్మించి సాతాను యొక్క తలను కల్వరిపై నలుగగొట్టెను, సాతాను ఆయన కాళ్లలో మేకులు దిగగొట్టుట ద్వారా కాళ్లపై కొట్టెను.

ఆ విధముగా ఆదికాండము 3వ అధ్యాయము సాతాను మనుష్యుని పై ఎన్నటికీ అధికారము చెలాయించలేదనే నిరీక్షణ ౖకలిగిన సందేశముతో ముగుస్తుంది. ప్రభువైనయేసు వచ్చి సాతానును జయించారు మరియు దాని ద్వారా ఇప్పుడు మానవులనందరిని సాతాను యొక్క శక్తినుండి విడుదల చేసారు.

నీ జీవితముపై సాతానుకు ఇప్పుడు అధికారమేమీ లేదు. యేసు ప్రభువు సిలువపై చనిపోయినప్పుడు నీపై యుండిన సాతాను యొక్క శక్తిని ఆయన పూర్తిగా జయించెనని నమ్మినట్లయితే, కరిÄనమైపోయిన నీ మనస్సాక్షి మరొకమారు చిన్న బిడ్డ యొక్క అరికాలువలె సున్నితమగును.

సాతానును, బైబిలు దోషారోపణ చేయువాడు (ప్రకటన 12:10) అని అంటుంది. నీవు నీ గత పాపములను మరియు ఓటములను దేవుని యెదుట కొన్ని వందలసార్లు ఒప్పుకొనినా కూడా వాటిని బట్టి అతడు నీ మీద దోషారోపణ చేస్తూనే ఉంటాడు. సాతాను యొక్క నిందను జయించుటకున్న ఒకే ఒక్క మార్గము, నీ పాపములన్నిటిని దేవుని యొద్ద ఒప్పుకొని ఆయన నీ పాపములన్నిటిని యేసు కల్వరి సిలువపై కార్చిన రక్తములో సంపూర్తిగా కడిగి వేస్తానని చెప్పిన ఆయన వాగ్దానములో నమ్మిక యుంచడములోనే యున్నది (1 యోహాను 1:7,9). దోషారోపణ చేయడమనేది దేవుని పిల్లలను బాధించుటకు సాతాను యొక్క ముఖ్యమైన పద్దతి. అతడిని జయించుటకు నీవు దేవుని వాక్యమును తెలుసుకొనవలెను.

నీవు నీ పాపములను దేవుని దగ్గర రెండుసార్లు కూడా ఒప్పుకొననక్కరలేదు. ఒక్కసారి మాత్రము నీవు నీ పాపములను ఒప్పుకొనినట్లయితే, వెంటనే నీ పాపములను క్షమించేటంతటి నమ్మకస్తుడు దేవుడు. ఆ విధముగా నీవు సాతానును ఇప్పుడు జయించగలవు. అది నీ గతమంతా క్రీస్తు రక్తము ద్వారా తుడిచి పెట్టబడినదని అతడికి చెప్పుట ద్వారా (ప్రకటన 12:11).

కేవలము నీ పాపములను క్షమించుటకు మాత్రమే కాక నిన్ను అనేకమైన చెడు అలవాట్లకు బానిసగా చేసిన సాతానుయొక్కశక్తి నుండి నిన్ను విడుదల చేయుటకు కూడా ప్రభువైన యేసు చనిపోయెను. సాతాను యొక్క తల నీ యొక్క రక్షకుని చేత సంపూర్తిగా నలుగగొట్టబడినదని జ్ఞాపకముంచుకో. హల్లెలూయా!

అధ్యాయము 4
దేవుడు సాతానును ఎందుకు నాశనము చేయలేదు?

మానవుని ఒక జంతువు స్థాయికి దిగ జార్చేదేమిటి?

అతడు ఈ భూమిపై ఉన్నప్పుడు కేవలం అతడి యొక్క శరీరావసరాలపై మాత్రమే ఆసక్తి కలిగి యుండుటయే. ఒక జంతువు దేనిపై ఆసక్తి కలిగి యుంటుంది? భోజనము, నిద్ర, లైంగిక సంతృప్తి, అంతే. ఎప్పుడైతే ఒక మనుష్యుడు కేవలము వీటిపై మాత్రమే ఆసక్తి కలిగియుంటాడో, అప్పుడు అతడు జంతువుల స్థాయికి దిగజారి పోయాడని చెప్పవచ్చును.

కాని మానవుడు జంతువువలె ఉండునట్లు దేవుడు అతడిని సృష్టింపలేదు. విద్య మానవుని జంతువుల కంటె ఉన్నతునిగా తయారుచేయదు. ఎందుకంటె విద్యాధికులు కూడా కొన్ని సార్లు జంతువులవలె ప్రవర్తించుచుందురు.

మనలో ఒక భాగము మన మనసుల కంటె ఎంతో లోతుగా నుండును. దానిని ఆత్మ అందురు. మన ఆత్మ మనలను దేవునిని తెలుసుకొనునట్లు చేయును.

దేవుడు మానవున్ని సృష్టించినప్పుడు అతడికి స్వంత చిత్తమనేది ఉండునట్లు సృష్టించాడు. ఆయన మానవునికి తనకిష్టమైన దానిని ఎంచుకొనే స్వేచ్ఛ ఇచ్చాడు. సాతాను ఒక దేవదూతగా సృష్టింపబడినప్పుడు అతడు కూడా అతడి కిష్టమైన దానిని ఎంచుకొనే స్వేచ్ఛ కలిగియున్నాడు. అందుచేతనే ''నేను దేవుని సింహాసనముపైకి ఎక్కిపోయెదను'' అని చెప్పగలిగాడు.

దేవుడు సృష్టించిన అనేక ఇతరమైన వాటికి వాటికిష్టమైన వాటిని ఎంచుకొనే స్వేచ్ఛ లేదు. నక్షత్రములు మరియు గ్రహములు దానికి ఉదాహరణ. మన సూర్య కుటుంబములో ఉన్న గ్రహములు ఎన్నో వేల సంవత్సరముల నుండి దేవుని నియమములకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయలేదు. ఎందుకలాగు? ఎందుకంటె వాటికిష్టమైన త్రోవ ఎంచుకొనే స్వాతంత్య్రము వాటికి లేదు. కాని ఆ గ్రహములు దేవుని బిడ్డలు కాజాలవు. ఒకరు దేవుని బిడ్డగా కావలెనంటె, అతడికి కావాల్సినది తనకు తానుగా ఎంచుకొనే స్వాతంత్య్రముతో సృష్టింపబడాలి.

అయితే నీకు ఇష్టమైనది ఎంచుకొనే స్వాతంత్య్రము ఉండినట్టయితే, నీవు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఆ స్వాతంత్య్రమును నిన్ను సంతోషపర్చుకొనుటకు ఉపయోగించుకొనే ప్రమాదమున్నది. కాని దేవుడు ఆ ప్రమాదము గల అవకాశమును తీసుకొనుటకు యిష్టపడ్డాడు. దానికి కారణం ఆయనకు విధేయత చూపే బిడ్డలు కావాలి. మరియు ఆ విషయంలోనే సాతాను కూడా దేవుని యొక్క ఉద్దేశ్యమును కొంత వరకు నెరవేరుస్తున్నాడు.

లోకములో ఉన్న గలిబిలి, అల్లరి, రోగములు మరియు దుష్టత్వమంతా, మానవుడు ఏదేను వనములో సాతాను మాటవిని దేవునికి అవిధేయత చూపుట వలన వచ్చిన ఫలితము. అలాగైతే మనము ఈ ప్రశ్నను అడుగుకొనవచ్చును. ''సాతాను ఈ లోకములో అన్ని సమస్యలకు మూలకారణమైతే, దేవుడు సాతానును ఎందుకు నాశనము చేయలేదు?''

మంచిదే, అయితే మనమందరము దేవునియొక్క జ్ఞానము, మనయొక్క జ్ఞానము కంటె గొప్పదను విషయమును అనుమానము లేకుండా నమ్ముతామనుకుంటున్నాను. మన జ్ఞానము ఒక చిన్న గిన్నెలో నీటి వంటిది, అయితే దేవుని జ్ఞానము ఒక సముద్రము వంటిది.

దేవుడు సాతానును ఈ లోకములో చురుకుగా తిరుగునట్లు ఉండనిస్తున్నారంటె దానికి తగిన ఏదో మంచి కారణము ఉంటుందని మనము ఖచ్చితముగా అనుకొనవచ్చును. నిజానికి సాతాను యొక్క పనుల ద్వారా దేవుడు ఎన్నో విషయాలను నెరవేరుస్తున్నారు. అందుచేతనే ఆయన అతడిని ఉండనిస్తున్నారు.

సాతాను ఈ భూమిపై ఎంతో చెడును మరియు నష్టాన్ని మరియు బాధను కలుగజేస్తుండగా దేవుడు ఊరుకొనుటకు ఒక కారణము, వాటి ద్వారా ప్రజలు దేవునివైపు తిరుగుతారని అయియున్నది.

ఈ భూమిపై ఏ రోగము, బాధ, బీదతనము లేక దు:ఖము లేకుండా జీవితము సౌఖ్యముగా గడచిపోతుంటే ఎవ్వరైనా దేవుని గూర్చి ఆలోచించేవారా?

దేవుడు చూస్తూ ఊరుకొంటున్న ప్రతిదానికి ఒక ఉద్దేశముంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము అరణ్యములో ప్రయాణిస్తున్నప్పుడు వారు దేవున్ని మరచిపోయారు. అప్పుడు అకస్మాత్తుగా విషసర్పాలు వచ్చి వారిని కరచినట్లు చదువుతాము. అప్పుడు వెంటనే వారు దేవునివైపు తిరిగారు. అప్పుడు దేవుడు వారిని స్వస్థపరచారు (సంఖ్యా 21). ఆ విషసర్పాలు అక్కడ ఉండి ఆ ప్రజలను దేవుని వైపు తిరుగునట్లు చేయుట మంచిదికాదా?

ఒక వ్యాపారము చేసే వ్యక్తి ఒకప్పుడు దేవునితో దగ్గరగా ఉండి, తన వ్యాపారము అభివృద్ధి చెందిన తరువాత దేవునికి దూరమైపోయిన వాని గూర్చి ఒకమారు నేను విన్నాను. తన సంఘములో నుండిన పెద్దలు అతడిని దేవుని వైపు త్రిప్పుటకు అనేకమార్లు మాట్లాడారు. కాని అతడు తన వ్యాపారములో ఎంతగానో మునిగిపోయాడు. ఒకరోజు తన ముగ్గురు కుమారులలో ఆఖరువానిని ఒక విషసర్పము కుట్టింది. ఆ చిన్న పిల్లవాని పరిస్థితి ప్రమాదకరముగా మారింది. వైద్యులు కూడా అతడిపై ఆశ వదులుకొన్నారు. ఆ తండ్రి ఎంతో భయపడి, బిడ్డడి కోసం ప్రార్థించుటకు సంఘములో ఒక పెద్దకు కబురు పెట్టాడు. ఆ పెద్ద జ్ఞానము కలిగినవాడు. ఆయన ఈ విధముగా ప్రార్థించాడు, ''ప్రభువా, ఈ చిన్నవానిని కరచుటకు నీవు పామును పంపించినందుకు నీకు వందనాలు. ఎందుకంటె ఈ కుటుంబము నీ గూర్చి ఆలోచించునట్లు నేనెప్పుడు చేయలేకపోయాను. కాని నేను గత ఆరేళ్ళుగా చేయలేకపోయిన పనిని ఈ పాము ఒక్క క్షణంలో చేసినది. ప్రభువా! వారిప్పుడు వారు నేర్చుకోవాల్సిన పాఠము నేర్చుకొన్నారు. అందుచేత దయచేసి బిడ్డను స్వస్థపరుచుము. మరియు వారి జీవితములో మరెప్పుడు నీ గూర్చి వారికి జ్ఞాపకము చేయుటకు ఏ పాములు అవసరము లేకుండా చేయుము''.

అకస్మాత్తుగా ఏ కేన్సర్తోనో హాస్పిటల్కు తీసుకువెళ్లబడే వరకు దేవుని గూర్చి ఆలోచించని వారున్నారు. ఒక్కమారుగా వారు దేవుని గూర్చి ఆలోచించడం మొదలు పెట్టి క్రీస్తువైపు తిరిగి, క్రొత్తగా జన్మించిన వారుగా అగుదురు. ప్రజలు వారి పాపముల నుండి దూరమై పరలోకములో నిత్యమైన గృహము సంపాదించుకొనులాగున, మానని రోగాలను, అస్వస్థతలను, బీదతనమును ఇంకా ఈలోకంలో అనేకమైన చెడులను దేవుడు ఉపయోగించుచుండెను. ఆ విధముగా సాతాను చేయుపనులను ప్రజలు వాని యొక్క పట్టులో నుండి రక్షించి వారు శాశ్వతంగా రక్షణలో ఉండునట్లు దేవుడు ఉపయోగించుచుండెను. ఆ విధముగా దేవుడు సాతానును మరల మరల బుద్దిహీనునిగా చేయుచుండెను.

దేవుని యొక్క బిడ్డలను పవిత్రపర్చుటకు కూడా దేవుడు సాతానును ఉపయోగించుచుండెను.

అగ్నిని గూర్చిన ఉదాహరణను ఆలోచించండి. ప్రపంచ చరిత్రలో లక్షలమంది అగ్నిలో కాలిపోవుటచేత మరణించారు. అయినప్పటికిని ఎవ్వరు అగ్నిని వాడుటమానలేదు. ఎందుకనగా ఆ అగ్నితోనే మనము భోజనము వండుకొంటాము మరియు మోటరు బళ్ళు మరియు విమానాలు మరియు యంత్రములు నడుస్తాయి. అగ్ని బంగారమును స్వచ్చ పరుస్తుంది, అంతేగాక బంగారము ఇంక దేనితోనూ స్వచ్ఛమవదు. గనుక అగ్నిని మంచి విషయాలకు ఉపయోగించవచ్చును.

లేక విద్యుత్తు గూర్చి ఆలోచించండి. లక్షల మంది ఎలక్ట్రిక్ షాక్ వలన మరణించారు. విద్యుత్తు ఖచ్చితంగా ప్రమాదకరమైనదే. అయినప్పటికీ దానిని మనకు ఉపయోగకరమైన విధముగా వాడుకొనవచ్చని మనకందరకు తెలియును. సాతాను విషయంలోనూ అంతే.

ఆదాము హవ్వలు సృష్టింపబడినప్పుడు అమాయకులు, వారు పరిశుద్ధముగా ఉండాలంటే వారు ఎంచుకోవాలి. వారు ఎంచుకొనుటకు గాను, వారు శోధింపబడాలి, అందును బట్టి వారు చెడును తిరస్కరించి దానికి బదులుగా దేవునిని ఎంచుకోవాలి. అందువలననే సాతాను ఏదేను వనములోనికి వచ్చి వారిని శోధించినట్లు దేవుడు అనుమతించెను.

సాతాను ఏదేను వనములోనికి రాకుండా చేయడం దేవునికి కష్టమైన పని అనుకొంటున్నారా? కానేకాదు. కాని శోధన లేకుండా ఆదాము పరిశుద్దుడుగా అయి ఉండేవాడుకాడు. అతడు ఎప్పటికిని అమాయకుడుగానే ఉండేవాడు.

అమాయకత్వానికిని పరిశుద్ధతకును ఎంతో తేడా ఉంది. ఒక చిన్న బిడ్డలో మనము చూచేది అమాయకత్వము. ఆదాము సృష్టింపబడినప్పుడు ఎలా ఉండేవాడో తెలుసుకోవాలంటే ఒక చిన్న బిడ్డను చూడండి. అమాయకంగా మంచి చెడులు తేడా తెలియకుండా ఉండేవాడు.

ఒక చిన్న బిడ్డ అమాయకంగా ఉండవచ్చును కాని ఆ బిడ్డ పరిశుద్దుడు గాని పరిపూర్ణుడుగాని కాదు. పరిపూర్ణుడగుటకు, ఆ బిడ్డ ఎదగాల్సి ఉంది, తనకు తానుగా కొన్ని ఎంచుకోవాల్సియుంది, చెడును తిరస్కరించి దేవునిని ఎంచుకోవాల్సియుంది.

మనము మన మనసుల్లో శోధనకు లోబడక దానిని ఎప్పుడు తిరస్కరిస్తామో అప్పుడు మనము గుణమును అభివృద్ది చేసుకొందుము. నీ జీవితములో ఇప్పటివరకు నీవు ఎంచుకొన్న ఎంపికలను బట్టి నీవు ఉండిన స్థితి ఉంది.

నీ చుట్టూ ఉన్నవారు నీకంటె బాగా ఉన్నారంటే, అది నీ జీవితంలో నీవు తీసుకొన్న నిర్ణయాలకంటె వారు మంచి నిర్ణయాలు ఎంచుకొనుటను బట్టియే. మన మందరము ప్రతి దినము ఏదో ఎంపికలు చేసుకుంటూ ఉంటాము. ఆ ఎంపికలే మనము ఏ విధముగా తయారవుతామనే దానిని నిర్ణయిస్తాయి.

హవ్వ ఏదేను వనములో ఒక ఎంపిక చేసుకొన్నది. ఆమె ఎంచుకొనిన దానిద్వారా ఆమె నిజానికి చెప్పినదేమంటే ''దేవుని యొక్క ఆజ్ఞలు నాపై ఉంచిన కట్టడలకు కట్టుబడి యుండుటకంటె సాతాను నాకు ఇవ్వ జూపుతున్న దానిని అంగీకరించి నా శరీరాశలను సంతోషపర్చుకోవడం మంచిది. నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని చెప్పింది.

అయితే స్వేచ్ఛ పొందిందా? లేదు. ఆమె సాతానుకు బానిసైపోయింది. కేవలము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుటయే మనలను నిజముగా స్వతంత్రులనుగా చేయును.

ఆదాము హవ్వలు ఆ దినాన ఏదేను వనములో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొన్నారు. అది వారు, వారి పిల్లలు జీవితాంతం అనుభవించాల్సిన పర్యవసానాన్ని తీసుకువచ్చింది. అన్ని నిర్ణయాలు పర్యవసానాన్ని తెస్తాయి. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు పిల్లలకు కూడా ఆ పర్యవసానాలు వర్తిస్తాయి. ఆదాము విషయంలో అతడు అతడి భార్య మిగిలిన జీవితమంతా దేవుని సన్నిధినుండి వెళ్లగొట్టబడ్డారు.

గనుక ఈ రోజు నీవు తీసుకొన్న చిన్న చిన్న నిర్ణయాలు అంత ప్రాముఖ్యమైనవి కాదని లేక ఈ రోజు నీవు విత్తే విత్తనాల యొక్క పంటను భవిష్యత్తులో కోయనక్కరలేదని అనుకొనకు. దేవుడు నీవు పరీక్షింపబడేలాగున మరియు శోధింపబడేలాగున అనుమతిస్తాడు. ఆ ఉద్దేశ్యము చేత సాతాను స్వేచ్ఛగాను మరియు చురుకుగాను ఉండునట్లు ఆయన అనుమతిస్తాడు.

పాత నిబంధనలో యోబుగ్రంథము నుండి మీకొక ఉదాహరణను చూపిస్తాను. యోబు అనుభవాలనుండి సాతాను ఎలా పనిచేస్తాడో మనము తెలుసుకోవచ్చు. యోబు 1వ అధ్యాయములో పరలోకములో దేవునికిని సాతానుకు మధ్య జరిగిన సంభాషణను గూర్చి మనము చదువుతాము.

యోబు 1:6 లో దేవుని కుమారులు (దేవ దూతలు) ఒక రోజున దేవుని సన్నిధిని నిలువబడుటకు వచ్చిరి అని చదువుతాము. సాతాను కూడా వారితో వచ్చినట్లున్నది. అతడెక్కడనుండి వచ్చెనని దేవుడు అడిగెను.

అక్కడ సాతాను యొక్క జవాబు గమనించండి. అతడు భూమిపై వేరు వేరు ప్రదేశములు సందర్శించుచుండెనని చెప్పెను. సాతాను ఇప్పుడు ఈ సమయములో ప్రపంచమంతా తిరుగుచున్నాడని మీకు తెలియునా?

సాతాను నరకంలో నివాసముంటున్నాడని అనేకులు అనుకొందురు. అదే ఒకవేళ నిజమైతే, అతడు మనలను ఈ భూమిపై యిబ్బంది పెట్టేవాడుకాడు. కాని సాతాను నరకంలో నివసించుట లేదు.

మూడు ఆకాశములు ఉన్నవని బైబిలు మనకు బోధిస్తుంది. మొదటి ఆకాశము మనము అంతరిక్షం అని పిలిచేది. మూడవ ఆకాశం దేవుని యొక్క సన్నిధి ఉండినది (2 కొరిందీ¸ 12:2). సాతాను దేవుని సన్నిధినుండి త్రోయబడినపుడు, అతడు రెండవ ఆకాశమునకు త్రోయబడ్డాడు (ఎఫెసీ 6:12). అంతేకాని నరకములోనికి కాదు. ఆ రెండవ ఆకాశమునుండి అతడు ఎప్పుడైనా భూమిపైకి రావటానికి అతడికి స్వేచ్ఛ ఉన్నది. అందువలననే అతడు ఏదేను వనములోనికి రాగలిగాడు. మరియు అలాగే అతడు మరియు అతడి దయ్యములు ఈ రోజు కూడా భూమిపైకి రాగలరు.

గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని సాతాను తిరుగులాడుచున్నాడని బైబిలు చెప్తుంది. అతడు యౌవనస్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకొనులాగున శోధించుటకై ఎల్లప్పుడు చూచుచుండును. అతడు ఆ విధముగా వారి జీవితములలో ప్రవేశించి వారి పవిత్రతను, వారి నిజాయితీని, వారి నీతిని దోచుకొని, ఆ విధముగా వారి గుణమును నాశనము చేసి చివరకు అతడితో పాటుగా వారిని నిత్యనరక కూపములోనికి తీసుకొని పోవును.

అందుకోసమే సాతాను భూమి అంతా తిరుగులాడుచున్నాడు.

సాతాను అందరినీ గమనిస్తున్నాడను విషయం నిజమని తెలుసుకో. అతడు నిన్ను నీ బాల్యమునుండి గమనిస్తున్నాడు మరియు నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకొనునట్లు చెడు చేయునట్లును నిన్ను శోధిస్తున్నాడు. ఆ విధముగానే అతడు నిన్ను చివరకు నాశనం చెయ్యాలనుకున్నాడు. నీవు పరీక్షల్లో కాపీ కొట్టమని, ఇతరులపై కక్షలుంచుకోమని, నీ తల్లిదండ్రులకు మరియు ఉపాద్యాయులకు అబద్ధములు చెప్పమని, ఇతరుల వస్తువులు దొంగిలించమని, అసహ్యకరమైన పుస్తకములు చదువుమని, మొదలైనవి నీకు చెప్పేది అతడే.

యోబు 1వ అధ్యాయములో ''నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యధార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు'' అని దేవుడు సాతానుతో చెప్పెను. అయితే సాతానుకు యోబు గూర్చి అంతా తెలుసును. నిజానికి యోబు సాతాను యొక్క ''హిట్లిస్ట్''లో మొదటనున్నవాడు.

గనుక సాతాను ''యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచెవేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి యున్నది'', అని జవాబుచెప్పెను (యోబు 1:8-10).

మనము నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠము అక్కడున్నది. దేవుడు తన బిడ్డల చుట్టూ ఒక కంచెను వేస్తాడు. అది మూడు అంచెల కంచె, వారి శరీరాలచుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మరియు వారి సంపదచుట్టూ.

ఇటువంటి మూడు అంచెల కంచె మనకు దైవికమైన రక్షణగా నుండుట దేవుని బిడ్డలుగా నుండు మనకు ఒక ఆశీర్వాదకరమైన ఆధిక్యత. యెహోవా యొక్క నామము రక్షణ దుర్గమని, నీతిమంతులు దానిలోనికి పరిగెత్తిపోయి సురక్షితముగా నుండగలరని సామెతలు 18:10 చెప్తుంది. యేసు నామములో గొప్ప భధ్రత ఉన్నది. కల్వరిపై తనను జయించిన యేసుక్రీస్తు నామమును తప్ప మరి ఏనామమునకు సాతాను భయపడడు. ఎప్పుడైతే మన జీవితము క్రీస్తుకు సమర్పించుకొంటామో, అప్పుడు మనము యేసుక్రీస్తు పేరిట సాతానును అడ్డుకోగలము. ''అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును'' అని బైబిలు చెప్తుంది.

మనమింకా యోబు గ్రంథములో సాతాను వెళ్లి యోబును, అతడి కుటుంబాన్ని మరియు అతడి సంపదను బాధించునట్లు దేవుడు అనుమతి నిచ్చునట్లు మనము చదువుతాము. ఇంకొక విధముగా చెప్పాలంటే యోబును సాతాను పరీక్షించునట్లు దేవుడే ఒక్కొక్క కంచెను కొంచెముగా తెరచెను. దేవుడెందుకు అలా చేసారు? యోబు 'బంగారమువలె పవిత్రుడగుటకు' (యోబు 23:10). పరీక్ష పూర్తయిన తరువాత, అతడిలో నుండిన స్వనీతి అతడి నుండి తీసివేయబడి యోబు ఇంకా దీనుడుగా తనను తాను తగ్గించుకొని మరియు ఇంకా ఎక్కువ దైవజనుడుగా మారెను.

అందుచేతనే దేవుడు మనము పరీక్షింపబడులాగున అనుమతిస్తారు. గనుక ఆయా విషయాలనుండి మనము ఇంకను పవిత్రముగా, దీనులుగా, ఎక్కువ దైవభక్తితో, ఎక్కువ ప్రేమ దయతో, ఎక్కువ జాలి కలిగిన వారముగా, తక్కువ స్వనీతి కలిగిన వారముగా మరియు మరి ఎక్కువగా ప్రభువు వలె మారుదుము.

గనుక దేవుని పిల్లలు పరిశుద్ధులగుటకైన విషయంలో సాతాను ఉపయోగపడుటను మనము చూడగలము.

ఇదంతా మనకు కనీసం రెండు విషయాలను బోధిస్తుంది.

మొదటిది దేవుని అనుమతి లేకుండా సాతాను ఏ దేవుని బిడ్డను - అతడి శరీరాన్ని కాని, అతడి కుటుంబాన్ని కాని లేక అతడి వస్తు వాహనాలను కాని తాకలేడను విషయం బోధిస్తున్నది.

రెండవది ఎప్పుడైనా సాతాను మనలను ఏవిధముగానైనా శోధించుటకు అనుమతి పొందినట్లయితే, అది మనమింకను మన జీవితాలలో మరియెక్కువగా క్రీస్తువలె మారుటకును, ఈ భూలోకమునకు సంబంధించిన తాత్కాలికమైన విషయాలనుండి ఇంకా ఎక్కువ స్వేచ్ఛ పొందుటకును మరియు ఇంకా ఎక్కువగా పరలోక విషయాలను గూర్చి మనసు పెట్టునట్లు చేయుటకును అయి ఉన్నది.

సాతాను మనలను ఏమి చేయుటకు ప్రయత్నించినా అవన్నియు కూడా మన పరలోకపు తండ్రి ఆధీనములో ఉన్నవను విషయం మనకు ఎంతో ఆదరణ కల్గిస్తుంది.

యౌవనస్థులారా మీకందరకు నేను చెప్పేదేమంటే, మీ జీవితాన్ని మీరు దేవునికి పూర్తిగా ఇచ్చుకొన్నట్లయితే, మీ శరీరాల చుట్టూ మీ కుటుంబాల చుట్టూ మరియు మీ ఆస్తి పాస్తుల చుట్టూ మీకు మూడంచెల కంచె ఎప్పుడు ఉంటుంది. దేవుని ఆజ్ఞ లేకుండా సాతాను ఆ కంచెలలో దేనిలోనికి కూడా ప్రవేశింపలేడు. మరియు ఎప్పుడైతే వాటి ద్వారా సాతాను రాగలుగునట్లు దేవుడు అనుమతిస్తారో అది నీ మంచికే అని నీవు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును.

గనుక సాతాను గూర్చియు మరియు అతడి పనులను గూర్చియు బైబిలు మనకు వివరమైన బోధను ఇస్తుంది. అది మనలను భయపెట్టుటకు కాదు కాని అతడు (సాతాను) ఉండుటలో దేవుని ఉద్దేశ్యమును మనము తెలుసుకొనుటకైయున్నది.

అధ్యాయము 5
సాతాను యొక్క పద్ధతులు

ఒక యౌవనుడుగా నీవు నీ జీవితంలో సాతానును ఎలా ఎదురించాలో తెలియక పోయినట్లయితే, అది భూమిపై నీ జీవితాన్ని నాశనము చేయుటయే కాక, నీ నిత్యత్వపు గమ్యాన్ని కూడా మార్చివేస్తుంది. సాతాను నీ మీద దాడిచేయటానికి నీవు పెద్దవాడివయ్యేంత వరకు ఊరుకోడు. అతడు ఇప్పుడే తన దాడిని మొదలు పెడ్తాడు. అందువలన అతడి పద్దతులు గూర్చి నీవు కొంత తెలుసుకొనాల్సియుంది.

దురదృష్టవశాత్తు, అపవాదిని (సాతాను) గూర్చిన ఊహలు అనేకులకు దేవుని వాక్యములో నున్న బోధనుండి కాక, 'ఒనీడా టెలివిజన్ వ్యాపార ప్రకటనలు' నుండి వచ్చినవి. గనుక సాతాను కొమ్ములతోను, పెద్ద పెద్ద గోళ్లుతోను మరియు సూది మొనగా ఉండిన గరుకు ఆకు పచ్చ తోకతో ఉండి ఎవర్నీ బాధించని కొంటె చేష్టలు చేసేవాడుగా అనుకుంటారు. కాని సాతాను అటువంటి భయంకరమైన రూపములో లేనట్లు బైబిలులో మనము చదువుదుము. సాతాను ఆత్మ మరియు ప్రజలు అతడిని చూచి పారిపోయేటట్లు కనబడే రూపములో వచ్చుటకు అతడు బుద్ధిహీనుడు కాడు. అలా అయినట్లయితే అతడు వారిని తప్పుత్రోవ ఎలా పట్టిస్తాడు?

సాతాను నమ్మకస్థుడుగా ముందు నీ నమ్మకాన్ని పొందుకుంటూ అటుతరువాత నిన్ను మోసం చేస్తాడు. సాతాను వెలుగు దూత వలె వస్తాడని బైబిలు చెబుతుంది - అంటే ఆకర్షణీయమైన వానివలె వస్తాడు. మరియు అతడు ''వెలుగు దూత'' వలె వచ్చుట చేత అతడు ''సర్వలోకమును మోసపుచ్చువాడు'' అని పిలువబడెను ( ప్రకటన 12:9).

ఒక ఉదాహరణ చెబుతాను అది 'కరాటె' గూర్చి. అనేకులు అది మనలను మనం రక్షించుకొనుటకు ఉపయోగపడే ఒక మల్ల విద్య అని అనుకొంటారు. కాని అది సత్యములో కొంత భాగము మాత్రమే. యోగా బయటకు శారీరక వ్యాయామము వలె కనబడుతుంది, కాని మనకు తెలియకుండగానే సూర్యున్ని ఆరాధించేలా చేస్తుంది. అదే విధముగా కరాటెకు సంబంధించిన దెయ్యములను, దెయ్యములు పట్టిన కొందరిలో నేను చూచాను. కాని అవి ఆత్మరక్షణ కొరకైన విద్యలుగా ప్రమాదము లేని విధముగా కనపర్చుకొంటాయి.

ఏదేను వనములోనికి సాతాను హవ్వ వద్దకు ఎంతో సుందరరూపంలో మరియు ఆకర్షణీయంగా వచ్చెను. ఎందుకంటె ఒకవేళ చూచుటకు వికారముగా నుండినట్లయితే హవ్వ అతడి నుండి పారిపోయేది.

పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన కూడా సాతాను ప్రజలను మోసగించే విషయంతోనే ఆరంభమగుటను గమనించండి. పాత నిబంధనలో ఆదాము హవ్వలను శోధించుట గూర్చి (ఆది. 3వ అధ్యాయము), క్రొత్త నిబంధనలో యేసు ప్రభువును శోధించుట గూర్చి (మత్తయి 4వ అధ్యాయము) చెప్పబడింది. అది మన శత్రువు యొక్క పద్దతులు మనకు తెలుపుటకు బైబిలు ఇచ్చే ప్రాముఖ్యతను చూపిస్తుంది.

సాతానును ఎదుర్కొనుటలో ఆదాము హవ్వల మాదిరిని మనము వెళ్లినట్లయితే మనము తప్పని సరిగా పడిపోతాము. కాని మనము యేసు యొక్క మాదిరిలో అనుసరించి ఆయన వలె సాతానును ఎదురించినట్లయితే మనము జయించుదుము.

యేసుప్రభువు నీటిలో బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వెంటనే, ఇంకా ఆయన తన బహిరంగ పరిచర్యను మొదలు పెట్టక ముందే, ఆయన సాతాను చేత శోధింపబడుటకు అరణ్యములోనికి పరిశుద్ధాత్మ వలన నడిపింపబడెను అని మనము మొదట చదువుదుము (లూకా 4:1).

సాతానును కలుసుకొనుటకు పరిశుద్ధాత్ముడు యేసును నడిపించుట అనేది నిజముగా ఆశ్చర్యకరము. పరిశుద్ధాత్మ జనులను కేవలము దర్శనములు మరియు పరలోక సంబంధమైన మరియు దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందునట్లు ఎత్తైన అనుభవాలలోనికి మాత్రమే నడిపించునని ఒకరు అనుకోవచ్చును. నిజమే! ఆయన అటువంటి స్థలాల్లోనికి నడిపిస్తారు. కాని ఆయన మనలను సాతాను చేత శోధింపబడే స్థలాల్లోకి కూడా నడిపించును.

మనకు హాని కలిగే ప్రదేశాలలోనికి పరిశుద్మాత్ముడు ఎప్పుడు మనలను నడిపించడని మీరు గ్రహించాలి. లూకా 4:1 వ వచనమును బట్టి శోధనలు మనకు ఉపయోగకరమైనవని మనము అర్ధము చేసికొనవచ్చును. అలా కానట్లయితే పరిశుద్ధాత్మ యేసును సాతాను చేత శోధింపబడునట్లు నడిపించక పోయియుండును. మరియు అదేవిధముగా మనలను కూడా సాతాను చేత శోధింపబడునట్లు నడిపించును. దేవుడు ఎవ్వరినీ శోధింపడు. కాని మనము సాతాను చేత శోధింపబడునట్లు ఆయన అనుమతినిస్తారు.

సాతాను శోధించే సమయాలను గమనించండి.

యేసు నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉపవాసముండి, ఆకలితో నుండిన సమయములో అతడు ఆయన దగ్గరకు వచ్చాడు. అదే విధముగా మనము ఎప్పుడైతే శారీరకంగా బలహీనముగా నుందుమో లేక మనము మానసికముగా లేక ఉద్రేకపూరితమైన పరిస్థితులను మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు, సాతాను మనపై దాడి చేయుటకు ప్రయత్నించును.

రెండవదిగా, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన పిమ్మట మరియు పరలోకము నుండి ఆయన అంగీకరించబడినట్లు స్వరమును విన్న తరువాత సాతాను వచ్చెను. అదే విధముగా మనము దేవుని యొద్దనుండి అద్భుతమైన దీవెనలు పొందిన సమయము తరువాత సాతాను మన యొద్దకు వచ్చును.

గనుక సాతాను యొక్క తంత్రముల గూర్చి మనము జాగ్రత్త కలిగియుందము. దేవుడు మనలను గొప్పగా దీవించిన తరువాత, సాతాను వచ్చి మనలను ఉప్పొంగ చేయటానికి ప్రయత్నించును లేక మనము ఒక పరీక్షలో తప్పిపోయినప్పుడు లేక రోగముతో ఉన్నప్పుడు లేక శారీరకంగా నీరసముగా ఉన్నప్పుడు, అతడు వచ్చి పాపములోనికి పడిపోవునట్లు మనలను నిరుత్సాహపరుస్తాడు.

''సాతాను యొక్క కుతంత్రమును ఉచ్చులను'' మనము ముందుగా తెలుసుకొనునట్లు దేవుని వాక్యము మనకు ముందుగా ఇవ్వబడెను. దేవుని వాక్యము మనకు సాతాను ఏ విధముగా మన యొద్దకు వచ్చుననేది, ఏ సమయాల్లో అతడు సాధారణంగా వచ్చేది, ఎటువంటి ఆశలను చూపిస్తాడనేది, ఇతరులు అతడి వలన ఎట్లు మోసపోయారనేది మరియు యేసు ఏ విధముగా జయించారనేది దానిని చూపిస్తుంది.

సాతాను మనలను శోధించే పద్ధతి ఏమిటి?

మొదటగా యేసును ఆయన శారీరక అవసరాల ద్వారా అతడు శోధించెను. ''నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని'' సాతాను సలహా ఇచ్చెను.

మన దగ్గరకు కూడా సాతాను ఆవిధముగానే వచ్చును. మన శరీరము యొక్క''న్యాయసమ్మతమైన'' అవసరములకు ''అన్యాయమగు'' మార్గములలో తృప్తి పర్చుకొమ్మని అతడు మనను శోధించును. కాని యేసు సిద్ధముగా ఉండుటచేత, ''అట్లు వ్రాయబడియున్నది'' అని సమాధానమిచ్చెను.

వేల సంవత్సరాల క్రితం సాతాను హవ్వ దగ్గరకు వచ్చి ''దేవుడు అలాగు చెప్పెనా?'' అని దేవుని మాటగూర్చి ప్రశ్నించెను.

సాతాను ఈ లోకములో నుండిన ఒకే ఒక పుస్తకాన్ని తన హృదయమంతటితో ద్వేషించునని నీకు తెలుసా? అది దేవుని వాక్యముండిన బైబిలును. ఎందుకు అతడు దానిని ద్వేషిస్తాడో తెలుసా? ఎందుకంటె అందులో అతడు సాతానుగా ఎలా మారాడో ఉంటుంది, అతడి తంత్రములను బహిరంగపరుస్తుంది మరియు అన్నిటికంటె ముఖ్యముగా అతడు కల్వరి సిలువపై ఎలా ఓడిపోయెనో మనకు తెలియజేస్తుంది మరియు క్రీస్తుతిరిగి ఈ భూమిపైకి వచ్చిన తరువాత అతడి ఆఖరి తీర్పు గూర్చి అది తెలియజేస్తుంది.

అందువలననే సాతాను బైబిలును ద్వేషించి జనులు దానిని చదువకుండునట్లు తనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించును. అతడు నిన్ను బైబిలుకు బదులుగా ఒక బొమ్మల కథల పుస్తకాన్ని కాని ఒక నవలను కాని చదువనిచ్చును. ఎందుకంటె బైబిలు తప్ప ఆ బొమ్మల కథల పుస్తకము కాని నవలకాని అతడిని జయించుటకు నీకు సహాయపడదని సాతానుకు తెలియును.

ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు, ఆయన మనవలెనె ఒక మానవునిగా వచ్చి, అన్ని విషయములలో ఆయన మనవలెనె శోధింపబడెను (హెబ్రీ 2:17; 4:15). ఎందుచేత? ఆ విధముగా ఆయన మనకు మాదిరిగా ఉండుటకు. దాని వలన ఆయన మనతో ''నన్ను వెంబడించండి, నా మాదిరిని చూచి అనుసరించండి'' అని చెప్పవచ్చును.

ఇక్కడ యేసుప్రభువు యొక్క మాదిరిని మనము అనుసరింపవలసిన దేమిటి? మనము శోధింపబడునప్పుడు దేవుని వాక్యమును మాత్రము సాతానుకు ఎత్తి చూపుటైయున్నది. హవ్వవలె యేసు సాతానుతో మాటలు పెంచుకొనలేదు. ఆయన తన శరీరమునకు ఆహారము అవసరమా లేక ఆ ఆహారము మంచిదా లేక అది ఉపయోగకరమైనదా మొదలైన కారణాలు ఆయన వెదకలేదు. దేవుడు ఆయన వాక్యములో ఏమి చెప్పెనో అది మాత్రమే ఆయన ఆలోచనలలో ఉంచుకొన్నారు.

నా స్నేహితులారా! ''దేవుడు ఆయన వాక్యములో ఏమిచెప్పారు? అది మాత్రమే నాకు చివరి అధికారము'' అనే ఒక్క సూత్రాన్ని మీరు పాటించినట్లయితే యేసువలె మీరెప్పుడు సాతానును జయించగలరని నేను చెప్పగలను. నిజానికి సాతాను తెచ్చిన మూడు శోధనలను కూడా యేసు దేవుని వాక్యములో వ్రాయబడిన దానిని ఎత్తిచూపుతూ సమాధానమిచ్చారు.

అక్కడ మనము హవ్వకును యేసునకును మధ్య ఉన్న తేడాను చూడగలము. ''నా శరీరమునకు ఆహారము కంటె నా ఆత్మకు దేవుని యొక్క మాట ఎంతో ముఖ్యము'' అని యేసు వైఖరియై యున్నది. లేక వేరొక మాటలో చెప్పాలంటే, ''దేవుని వాక్యమును చదువుట, అర్థము చేసికొనుట మరియు లోబడుటకుండిన అవసరము కంటె ఆహారమున కుండిన అవసరము ముఖ్యమైనది కాదు'. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోటనుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును'' అను పాత నిబంధనలోని వచనమును యేసు సాతానుకు ఎత్తి చూపుటలో నున్న అర్ధము అదియే.

నా యౌవన స్నేహితులారా, అది అర్ధము చేసికొన్నారా? మనము సాతానును జయించుటకు కావాల్సిన మొదటి సూత్రము, మన శరీర అవసరములు అన్ని - అది ఆహారము కొరకైన లేక సెక్సుకు సంబంధించిన ఇంకా ఏదైనా ఆకలి కావచ్చును దానికంటె దేవుని వాక్యము మనకు ఎక్కువ ప్రాముఖ్యము కలదని మనము గుర్తించుటై యున్నది. నీవు ప్రారంభములోనే అటువంటి నిర్ణయాన్ని తీసుకొనక పోయినట్లయితే, నీ జీవితంలో నీవు తప్పక మోసపోవుదువు.

నీవు ప్రతిదినము ఆహారము తినుట దేవుని వాక్యము చదువుట కంటె ఎంతో ముఖ్యమని సాతాను నీకు చెప్పునని తెలుసుకో. అనేక మంది విశ్వాసులు సాతాను చెప్పే ఆ మాటలు నమ్ముదురు.

వారు సాతాను చెప్పేదానిని నమ్ముచునాన్నరనుటకు ఋజువు, వారు ఎల్లప్పుడు భోజనము మరచిపోవడము కాని లేక సమయము లేక పోవుటచేత రోజుకు మూడు లేక అంతకు ఎక్కువ సార్లు తినుట మానుట కాని జరుగదు. కాని తరచుగా దేవుని వాక్యమును ధ్యానించు విషయములో మరచిపోవుట కాని లేక సమయం లేనంతగా పనుల్లో మునిగి పోవడం గాని జరుగును.

విశ్వాసులు ఇట్లు మోసపోవునట్లు చేసి చివరకు వారిని బలహీనులుగా చేసినదెవరు? అనుమానం లేకుండా సాతానే. నలభై దివారాత్రులు ఉపవాసముండిన తరువాత కూడా, తన శరీర అవసరాలను తీర్చుకొనుట కంటె దేవుని యొద్దనుండి మాటను వినుట ముఖ్యమని అనుకొనిన యేసులో మనకు ఎంత చక్కని మాదిరి యున్నది.

ఎవరైతే దేవుని వాక్యమునకు వారి జీవితాల్లో అన్నిటికంటె మొదటి స్థానమిస్తారో వారు మాత్రమే వారి జీవితాల్లో ఎల్లప్పుడు జయజీవితం జీవించగలరు. అపొస్తులుడైన యోహాను యౌవనస్థులతో, ''మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి యున్నారు'' అని చెప్పెను (1 యోహాను 2:14). సాతానును వేరొక పద్ధతిలో జయించుట అసాధ్యము. మీరు దేవుని వాక్యమును ప్రతిదినము చదివి ధ్యానించాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాను.

ఇప్పుడు రెండవ శోధన గూర్చి చూచెదము.

ఇక్కడ సాతాను దేవాలయపు శిఖరము పైనుండి యేసును దుమకమని, అప్పుడు కాపాడుతానని చెప్పిన దేవుని వాగ్దానమును అడుగమని శోధించెను. ఇది చూచుటకు గొప్పగా నుండినది ఏదో ఒకటి చేసి, క్రింద నుండిన వారి మధ్య గాయములేవీ తగులకుండా దిగి అక్కడనున్న జనుల నుండి మెప్పుకోలు పొందుటను గూర్చి అయిఉన్నది. అక్కడ సాతాను యేసును నిజానికి ఆత్మహత్య చేసికొనునట్లుగా పురికొల్పెను.

సాతాను నిన్ను కూడా ఇతరుల యొక్క మెప్పును పొందుటకు గాని లేక నిన్ను నీవు గొప్ప వాడిగా చూపించుకొనుటకు కాని చూచుటకు గొప్పగా నుండు ఏదొక దానిని చేయుమనును. సాతాను యేసుతో ''దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తి కొందురు'' అని లేఖనాలను కూడా ఎత్తి చూపెను.

సాతాను నిన్ను తప్పు మార్గాన నడిపించుటకు చివరకు వాక్యములోనిది తప్పుగా అర్థమొచ్చేటట్లు చూపించునని జ్ఞాపకముంచుకో మరియు వాక్యమేమి చెప్పుతుందో నీకు తెలియక పోయినట్లయితే, అతడు నిన్ను మోసగిస్తాడు.

''యేసు క్రీస్తు నామములో గొప్పగా కనుబడునది ఏదొకటి చెయ్యి'' అని సాతాను నిన్ను పురికొల్పుతాడు. అనేక మంది విశ్వాసులు వాక్యాన్ని చూపిస్తూ మరియు దేవున్ని శోధిస్తూ చేసిన బుద్ధిలేని పనుల వలన క్రైస్తత్వానికి చాలామార్లు చెడ్డ పేరు వచ్చుచుండును.

ఉదాహరణకు, కొందరు విశ్వాసులు వారు జబ్బుపడినప్పుడు మందులేమీ వాడరు. వారు విశ్వాసమని చెప్పే వారి ''విశ్వాసానికి'' ఆధారమైన వాక్యమేమీ వారికుండదు. కాని వారు దేవునిని ''నమ్ముతున్నామ''ని అనుకొంటారు. అది క్రింద దేవదూతలు దెబ్బతగులకుండా అద్భుతంగా ఎత్తి పట్టుకుంటారని, దేవాలయ శిఖరము పైనుండి దుముకుట వంటిదే. అనేకులు చివరకు వారి రోగములతో చనిపోయారు. యేసునామము దేవునెఱుగని ప్రజలలో అవమానపర్చబడును మరియు క్రైస్తత్వ మంటె బుద్దిలేని మూర్ఖ మతమని వారు అనుకొందురు.

మన శరీరములో నుండిన రోగక్రిములను చంపుటకొరకు ఉపయోగపడే ఔషధాలను దేవుడు మనకొరకు సృష్టించియుండగా, వాటిని తీసుకొనకుండా, విశ్వాసులు విషం తీసుకొని కాకుండా, ఆత్మహత్య చేసికొనునట్లు పురి కొల్పినందుకు, సాతాను వెనుక కూర్చొని నవ్వుకొనును. అనేకమంది దేవునిబిడ్డలు ఈ భూమిపై దేవుని రాజ్యము కొరకు ఆయనకు ఉపయోగపడవలసినవారు ఈ విధముగా మరణములోనికి సాతాను యొక్క వంచన ద్వారా పోవుచున్నారు.

సాతాను ఎల్లప్పుడు దేవుని బిడ్డలను ఏదొక తెలివి తక్కువ పనిని, దేవుని వాక్యమునకును, ఆత్మకును వేరుగా నున్న దానిని మరియు ఏదొక చూచుటకు గొప్పగా ఉండు దానిని చేయునట్లు శోధించును. సాతానును దీనత్వము ద్వారా అనగా మనము తగ్గించుకొని దేవునికి లోబడుట ద్వారా మరియు ఏ విధముగా కాని మనకు ఎటువంటి మహిమను కోరకొనకుండా మాత్రమే జయించగలము.

సాతాను యేసుకు ఒక వాక్యభాగమును చూపినప్పుడు యేసు వేరొక వాక్య భాగమును సాతానుకు జవాబుగా చూపెను. ''ప్రభువైన నీ దేవుని నీవు శోధించకూడదు'' అని మరియొకచోట వ్రాయబడియున్నదని ఆయన చెప్పెను.

ఇప్పుడు ఆఖరుగా మూడవ శోధన గూర్చి చూచెదము.

ఇక్కడ చివరకు, సాతాను ఎల్లప్పుడు ఆశించే విషయానికి అతడు వచ్చాడు - అది ఆరాధన. ''నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల ఈలోక మహిమను నీకిచ్చెదను'' అని అతడు యేసుతో చెప్పెను.

ఈ లోకమునకు సంబంధించిన మహిమ అనగా డబ్బు, కీర్తి, ఘనత, స్థానము, అధికారము మొదలైనవి మనకందరకు గొప్ప శోధనగా నుండును. అందువలన అపవాది ''వీటిలో నీకేది కావాలి? నీవేది అడిగితే అది నీకిస్తాను. కొంచెం నాకు వంగి నమస్కారము చెయ్యి, అప్పుడు అన్నిటినీ నీకిస్తాను'' అని చెప్పుచుండును.

''నీవు నీ పరీక్షలో ఉత్తీర్ణుడవు కావాలనుకొనుచుంటివా? నీవున్న తరగతిలో నీవు మొదటి వాడివిగా రావాలనుకొనుచున్నావా? నేను నీకు సహాయం చేస్తాను. కొంచెం నాకు వంగి నమస్కరించు...కొంచెం లంచం ఇచ్చి ప్రశ్న పత్రాన్ని ముందుగా సంపాదించుకో; లంచం యిచ్చి పేపర్లు దిద్దేవారినుండి ఎక్కువ మార్కులు వచ్చేలా చూసుకో; పరీక్షలో కాపీ చెయ్యి మొదలైనవి''...సాతాను చెప్పును.

అనేకులు ఈ రోజున ఇటువంటి విషయాల్లో సాతానుకు వంగి నమస్కారము చేయుచున్నారు.

సాతాను యొక్క కుయుక్తులను తెలుసుకోవడం మీ యౌవనస్థులకు ముఖ్యమైనది కాదా? తప్పకుండా. నీవు పరీక్షల్లో మోసము చేస్తున్నప్పుడు, నీవు నీ మనసులో సాతానుకు వంగి నమస్కారము చేయుచూ, ''సాతానా, నీ ఆజ్ఞలకు లోబడుతాను. నేను పరీక్ష హాల్లోనికి చిన్న స్లిప్పు తీసుకు వెళ్తాను'' అని చెప్పుచున్నావని తెలుసుకో.

ఈ రోజుల్లో యౌవనస్థులు ఎన్నెన్నో తెలివైన మోసములు కనిపెడుతున్నారు - ఎందుకంటె సాతాను చాలా తెలివైన వాడు మరియు మోసము చెయ్యాలనుకొన్న వారికి కుతంత్రములన్నిటిని ఇచ్చును.

సాతాను యేసుకే ఈ లోకపు మహిమను ఇవ్వజూపినప్పుడు, అతడు నీకు కూడా అలా ఇవ్వజూపడా? నీవు ఎదుగుతున్నకొద్దీ, అనేక ఇతరమైన అద్భుత విషయాలను సాతాను నీ కిచ్చెదనని చెప్పుటను నీవు కనుగొందువు. ఇంకొంచెం డబ్బు సంపాదించుటకు, ఇంకొంచెం గొప్పతనము సంపాదించుటకు లేక ఈ లోకంలో ఇంకొంచెం మంచి స్థానాన్ని సంపాదించుటకు తప్పు పత్రాలమీద సంతకాలు, ఆర్థిక విషయాల్లో అవినీతి మరియు తప్పుడు కార్యములు చేయువారున్నారు.

అపవాది జనులతో ''నీకేం కావాలో చెప్పు? అది నీకిస్తాను'' అని ఎల్లప్పుడు చెప్పుచుండెను. యేసునకైతే అటువంటి శోధనలకు ఒక్కటే సమాధానమున్నది, ''సాతానా పొమ్ము 'ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను' అని వ్రాయబడియున్నది'' అని చెప్పెను (మత్తయి 4:10).

సాతాను యొక్క కుతంత్రములన్నిటి గూర్చి దేవుని వాక్యము మనలను హెచ్చరించుట ఎంత అద్భుతమైన విషయము. యౌవనస్థులైన మీరు ఈ విషయాలను యౌవనమందే నేర్చుకొనుట ఎంత ధన్యకరము!

ఈలోకానికి సంబంధించినది ఏదో పొందుటకు నీవు శోధింపబడినప్పుడు, అది పొందుటకు నీవు మంచి గుణమును త్యాగము చెయ్యాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తావు? యేసు సాతానుతో చెప్పింది గుర్తుంచుకో మరియు యేసు యొక్క మాదిరిని అనుసరించు ఆయన చెప్పినట్లే నీవును సాతానుకు చెప్పుము.

''నీవు నీతిగా ఉండనక్కర్లేదు, నీవిక్కడ సత్యము చెప్పక్కర్లేదు. చిన్న అబద్ధము చెప్పు, అప్పుడు ఈ లోకానికి సంబంధించినది ఏదో కొంత సంపాదించుకోగలవు'' అని సాతాను నిన్ను శోధిస్తూ చెప్పినప్పుడు, ''సాతానా, పొమ్ము నేను నీ మాట వినను. నేను దేవునికి మాత్రమే సాగిలపడి ఆయననే ఆరాధించవలెనని వ్రాయబడియున్నది. నేను యేసు ప్రభువును వెంబడిస్తాను'' అని చెప్పుటకు ధైర్యము తెచ్చుకొనుము.

సాతాను సృష్టింపబడిన కాలము నుండి, ఇతరులు అతడిని పూజించాలని కోరుకొనేవాడు. అందుకే అతడు దేవుని వలె కావాలని కోరుకొన్నాడు. ఎందుకంటె దేవుడొక్కడు మాత్రమే పూజింపబడువాడు అని అతడికి తెలియును. ఇతర దూతలు అతనిని పూజించాలని కోరుకొన్నాడు. ఆదాము యొక్క సంతతి అతడిని ఆరాధించాలని అనుకొన్నాడు. ఇంకా అద్భుత విషయమేమిటంటే, యేసు ప్రభువు కూడా అతడిని పూజించాలని అనుకొన్నాడు!!

సాతాను యేసు విషయంలో గెలవలేక పోయాడు. కాని అతడు అనేక మంది జనుల విషయంలో అది సాధించాడు, నిజానికి ఎక్కువ మంది విషయంలో, అంతేకాక తమ కొరకు ఈ లోకసంబంధమైన లాభాన్ని సంపాదించుకొందామనుకొనినవారు, వారి నమ్మకాల విషయంలో రాజీపడిపోయిన అనేక మంది విశ్వాసుల విషయంలో కూడా అతడు దానిని సాధించాడు.

ఈనాడు సాతానుకు సాగిలపడి నమస్కరించు వారు కోట్లకొలదిగా ఉన్నారు. అయితే వారు పాపమునకు లొంగిపోయినప్పుడు లేక వారి మనస్సాక్షికి వ్యతిరేకముగా వెళ్లినప్పుడు వారు నిజానికి సాతానుకు సాగిలపడుతున్నారని వారికి తెలియదు. అయితే దేనికొరకు వారలా చేస్తున్నారు? ఈలోకానికి సంబంధించిన మహిమను కొంత పొందుటకు.

నీవు విజయాన్ని, పేరును లేక అధికారాన్ని కోరుకొన్నప్పుడు, బహుశా పరీక్షలో విజయము లేక నీ బడిలో పేరు లేక ప్రపంచములో ఒక స్థానము కోరుకొన్నప్పుడు, సాతాను నీ యొద్దకు వచ్చి, ''ఇది నీకిస్తాను. ఇది చెయ్యి, అది చెయ్యి. వెళ్లి ఇలా చెప్పు అలా చెయ్యి.....''అని చెప్పును.

అతడు చెయ్యమని చెబుతున్నదంతా తప్పు అని నీకు తెలియును. కాని నీవు వెళ్ళి చేయుదువు. ఆవిధంగా నీవు సాతానుకు మోకరించెదవు.

నీవు అటువంటి పనులు చేస్తూ కూడా నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకొందువా? అలా కాకూడదు. సాతానుకు మోకరించే వారెవరు క్రైస్తవులు కారు.

అటువంటప్పుడు ఏం చెయ్యాలి, గత సంవత్సరాలలో సాతానుకు మోకరించినట్లయితే ఏం చెయ్యాలి? అలా చేసిన సంఘటనలన్నిటిని గూర్చి పశ్చాత్తాపపడవలెను. తప్పుగా మోసము చేసి పొందిన వన్నిటిని తిరిగి యిచ్చివేయాలి. మరియు మనలను క్షమించమని, కడుగమని, యేసు ప్రభువును అడుగవలెను.

ఆలస్యం చేయకుండా ఇప్పుడే మనము అలా చేద్దాం లేనట్లయితే మన జీవితాలపై సాతానుకు అధికారం కొనసాగుతుంది.

అధ్యాయము 6
సాతాను యొక్క ఓటమి

సాతాను యొక్క ఓటమిని గూర్చిన సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఈ భూమిపై జరిగిన గొప్ప యుద్ధము గూర్చి ప్రపంచములో ఏ చరిత్ర పుస్తకములలో కూడా వ్రాయబడలేదు. అది కల్వరిపై, ఈ లోక అధికారియైన సాతానును యేసు ప్రభువు తన మరణము ద్వారా ఓడించినప్పుడు జరిగింది.

నీ జీవితమంతటిలో ఒక వచనాన్ని నీవు మరచిపోకూడదు, అది (హెబ్రీ 2:14,15). ఈ వచనము నీకు తెలియుట సాతానుకు ఇష్టముండదని నేను తప్పక చెప్పగలను. ఎవ్వరు కూడా తన యొక్క ఓటమి లేక తప్పిపోవుటను వినుటకు ఇష్టపడరు, మరి సాతాను కూడా అంతే. ఆ వచనము ఇలా చెప్తుంది.

''కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా (సిలువపై మరణము ద్వారా) నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయనకూడా రక్తమాంసములలో పాలివాడాయెను''.

ప్రభువైన యేసు చనిపోయినప్పుడు ఆయన అపవాదికి శక్తి లేకుండా చేసెను. ఎందుకు? మనము సాతాను నుండియు మరియు మన జీవిత కాలమంతా అతడు కల్పించు భయము యొక్క బంధకముల నుండి విడుదల పొందటకొరకు ఆయన చనిపోయెను. లోకములో ప్రజలకు, రోగముల గూర్చిన భయము, బీదతనము గూర్చిన భయము, ప్రజల గూర్చిన భయము, భవిష్యత్తును గూర్చిన భయము, మొదలగు ఎన్నో విధములైన భయములు కలవు. అయితే ఈ భయాలన్నిటికంటె గొప్పదైన భయము మరణము గూర్చిన భయమైయున్నది. మిగిలిన ప్రతి భయము మరణ భయము కంటె తక్కువైనదే.

ఈ మరణము గూర్చిన భయము మరణము తరువాత ఏమిటవుతుంది అనే భయానికి దారి తీస్తుంది. పాపములో జీవించు వారందరు చివరకు నరకములోనికి వెళ్ళుదురని బైబిలు చాలా తేటగా చెప్తుంది. అది పశ్చాత్తాపము చెందని వారందరి కొరకు దేవుడు ఏర్పరచిన ఒక స్థలము.

అపవాది కూడా నిత్యత్వమంతా అగ్ని గుండములో, అతడు ఈ భూమిపై మోసము చేసి పాపములోనికి నడిపించిన వారితో కలసి గడుపును.

యేసుక్రీస్తు మన పాపముల యొక్క శిక్షను భరించి, మనలను ఆ నిత్యనరకములో నుండి రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చెను. సాతాను మనకెప్పుడు హాని చేయకుండునట్లు మనపై సాతాను కుండిన శక్తిని కూడా నాశనము చేసెను.

మీరందరు ఈ ఒక్క సత్యాన్ని మీ జీవితమంతా జ్ఞాపకముంచుకోవాలని కోరుతున్నాను.

దేవుడు సాతానుకు వ్యతిరేకముగా ఎల్లప్పుడు మీ పక్షమున ఉన్నాడు.

ఈ గొప్ప సత్యము నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను మరియు విజయాన్ని తెచ్చినది. ప్రపంచంలో ప్రతిచోట ఉన్న ప్రతి విశ్వాసి దగ్గరకు వెళ్లి దీనిగూర్చి చెప్పాలని నా ఆశ.

బైబిలు ''దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును'' (యాకోబు 4:7) అని చెప్తుంది. యేసు నామము పేరిట అపవాది ఎప్పుడు పారిపోవును.

అనేకమంది క్రైస్తవుల మనసుల్లో దృష్యం సాతాను వారిని తరుముతున్నట్లును వారు వారి జీవితాలను కాపాడుకొనుటకు అతడి యొద్దనుండి పారిపోతున్నట్లును ఉంటుంది. కాని అది బైబిలు చెప్తున్న దానికి సరిగ్గా వ్యతిరేకమైనది.

మీరేమనుకుంటున్నారు? సాతాను యేసునకు భయపడునా లేదా? మన రక్షకుని ముందు నిలచుటకు సాతాను భయపడుతాడని మనకు తెలియును. యేసు ఈ లోకానికి వెలుగై యుండెను మరియు చీకటికి అధికారి ఆయన యెదుట నుండి మరుగైపోవలెను.

సరే, యౌవన స్నేహితులారా, మీకొక విషయం చెబుతాను. సాతానుకు వ్యతిరేకముగా, దైవికమైన అధికారముతో యేసు నామమును ఉపయోగించు వారెవరికైనా కూడా అతడు భయపడును.

ప్రభువైన యేసు ఆయన శిష్యులతో పరలోకమునుండి సాతాను ఎలా పడెనో చూచినట్లు చెప్పారు. అక్కడ, దేవుడు సాతానును త్రోసి వేసినప్పుడు సాతాను 'మెరుపు వలె' పడెనని యేసు చెప్పారు (లూకా 10:18). అరణ్యములో యేసు ప్రభువు సాతానుతో 'సాతానా పొమ్ము' అని చెప్పినప్పుడు, సాతాను మెరుపు వేగముతో అక్కడనుండి పోయెను. అదే విధముగా ఈ రోజు యేసు నామములో మనము సాతానును ఎదిరించినపుడు, అతడు మన యెదుట నుండి కూడా వెలుగు వెళ్లినంత వేగముతో వెళ్లిపోవును. వెలుగు యొద్దనుండి చీకటి అట్లే వెళ్లిపోవును.

యేసు నామమునకు సాతాను భయపడును. యేసు ప్రభువనియు మరియు అతడు ప్రభువైన యేసు చేత ఓడింపబడినాడని గుర్తు తెచ్చుకొనుటను అతడు యిష్టపడడు. దెయ్యము పట్టినవారు ''యేసు క్రీస్తు ప్రభువు'' అనియు లేక ''సాతాను సిలువపై ప్రభువైన యేసుక్రీస్తు చేత ఓడింపబడెను'' అను విషయమును ఒప్పుకొనక పోవుటను నేను గమనించాను.

ఎటువంటి దెయ్యమునైనా వెళ్లగొట్టుటకు యేసుక్రీస్తు నామములో శక్తి యున్నది. అంతేకాక ఆ నామములో ఏ దెయ్యమైనా నీ యొద్ద నుండి మెరుపు వేగముతో పారిపోవును. ఎప్పుడైనను అది మరచిపోకు.

యౌవనస్థులారా, ఎప్పుడైనా మీ జీవితములో నీవు ఏదైనా కష్టపరిస్థితిలో ఉంటే లేక ఏదో దారిలేని సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే లేక మానవ మాత్రుడు జవాబివ్వలేరని అనుకొంటున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే యేసు ప్రభువు పేరున ప్రార్థించు. ఆయనతో ఇలాగు చెప్పు, ''ప్రభువైన యేసూ, అపవాదికి వ్యతిరేకముగా నీవు నా పక్షమున ఉన్నావు. నాకిప్పుడు సహాయము చెయ్యి''. మరియు అప్పుడు సాతాను వైపు తిరిగి అతడితో ఇలా చెప్పుము, ''సాతానా, యేసు నామములో నిన్ను ఎదురిస్తున్నాను''. నేను నీకు చెప్పదలచిన దేమంటే యేసు ప్రభువు సాతానును సిలువపై జయించెను. కాబట్టి, సాతాను వెంటనే నీ యొద్దనుండి పారిపోవును. నీవు ఎప్పుడైతే దేవుని వెలుగులో నడుస్తావో, అప్పుడు నీవు యేసు నామములో సాతానును ఎదురించినప్పుడు సాతాను నీ యెదుట శక్తి హీనుడవును.

సాతానుయొక్క ఓటమి గూర్చి నీకు తెలియుట అతడికి ఇష్టం లేదు. కావున ఈ విషయం నీవు వినకుండా అతడు ఇంతకాలం నిన్ను ఆటంకపరిచాడు. ఇందుచేతనే అతడు తన ఓటమిగూర్చి బోధించకుండునట్లు అనేక బోధకులను కూడా ఆటంకపరచెను.

సిలువపై సాతాను యేసు క్రీస్తు చేత ఎప్పటికిని ఓడింపబడినాడని నీవు ఖచ్చితంగా తెలుసుకొనాలని నేను ఆశిస్తున్నాను. అప్పుడు నీవు ఎప్పుడును సాతాను గూర్చి భయపడనక్కర్లేదు. అతడు నిన్ను ఎప్పుడు యిబ్బంది పెట్టలేడు. అతడు నీకు హానిచేయలేడు. అతడు నిన్ను శోధింపవచ్చు. అతడు నీపై దాడి చేయవచ్చును. కాని నిన్ను నీవు తగ్గించుకొని, దేవునికి లోబడి, అన్నివేళలలో ఆయన వెలగులో నడచినట్లయితే క్రీస్తులో దేవుని కృప సాతానుపై ఎప్పుడును నిన్ను జయించువానిగా చేయును. వెలుగులో గొప్ప శక్తియున్నది. చీకటికి అధికారియైన సాతాను, వెలుగు ఉన్న ప్రదేశములోనికి ఎప్పుడును ప్రవేశింపలేడు.

ఈనాడు అనేక విశ్వాసులపై సాతానుకు అధికారమున్నదంటే దానికి కారణం, వారు చీకటిలో నడుస్తున్నారు, ఏదో ఒక రహస్యపాపములో జీవిస్తున్నారు, ఇతరులను క్షమించలేకపోవుట, ఎవరిపైనో అసూయ కలిగియుండుట లేక వారి జీవితాల్లో ఏదో స్వార్థపూరితమైన అభిలాషను నెరవేర్చుకొనుటకు ప్రయత్నములో నుండట మొదలైనవి ఏవో ఉన్నవి. అందుచేత సాతాను వారిని ఏలుచుండెను. అలాకానట్లయితే అతడు వారిని తాకలేడు.

ఈ లోకములో నున్న జనుల వలె నీవు మూఢనమ్మకాలతో నుండకుము. కొందరు కొన్ని దినాలలో ముఖ్యమైన పనులు చేయుటకు భయపడుతారు. ఉదాహరణకు అమావాస్య రోజున నల్ల పిల్లి ఎదురువస్తే అది అపశకునమని కొందరు అనుకొందురు. కొందరు ముహార్తములను చూచుకొని మంచి చెడు కాలాన్ని నిర్ణయించుకొని దానిని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేయుదురు.

అటువంటి మూఢనమ్మకపు భయములు ఎక్కడనుండి మొదలయ్యాయి? అవన్నియు సాతాను నుండియే అటువంటి ప్రతి భయము నుండి మనలను విడుదల చేయుటకు యేసు క్రీస్తు వచ్చియున్నారు. ఈ లోకములో ఇంక దేనికిని ఎప్పుడును మనము భయపడనక్కర్లేదు. మూఢ నమ్మకాలన్ని అపవాది నుండి వచ్చినవే.

యేసు ప్రభువు ఈ లోకానికి తిరిగి వచ్చి, సాతానును అగాధములో బంధించి, ఈ భూమిపై వెయ్యి సంవత్సరములు పరిపాలన చేయుదురని ప్రకటన గ్రంధములో మనకు చెప్పబడినది. ఆ కాలమయిన తరువాత, అంత కాలము కారాగారములో బంధింపబడిన తరువాత కూడా అతడు మారలేదని అందరికి తెలియునట్లు అతడు కొద్ది కాలము విడుదల చేయబడును.

అతడు అప్పుడు భూమిపై నున్న ప్రజలను ఆఖరు సారిగా మోసపుచ్చుటకు బయలు వెళ్లును. మరియు అప్పుడు యేసు ప్రభువు చేత పరిపాలించబడిన వెయ్యేళ్ళ సమాధానకరమైన పరిపాలనను అనుభవించి కూడా ఆదాము యొక్క సంతతి మారలేదను విషయం కనబడును.

అప్పుడు దేవుడు దిగి వచ్చి సాతానుకు తీర్పు తీర్చి శాశ్వతకాలము అగ్ని గుండములో ఉండునట్లు అతడిని అందులో పడవేయును. అప్పుడు పాపములో జీవించిన వారందరును, సాతానుకు మోకరిల్లిన వారందరును దేవుని మాటను కాదని అతడికి లోబడిన వారందరును అగ్ని గుండములో అతడితో పాటుగా చేరుదురు.

అందుచేతనే సాతాను యొక్క ఓటమి గూర్చిన ఈ సువార్తను మేము ప్రకటిస్తున్నాము. ఈ సమయములో విశ్వాసులు వినాల్సిన ముఖ్యమైన సత్యము బహుశా యిదేనేమో?

కాని ఒకటి గుర్తుంచుకోండి. నీవు పవిత్రతలో నడువక పోయినట్లయితే సాతానుపై నీకు శక్తి ఏమీ ఉండదు. మరియు సాతాను చేసే దోషారోపణలను నీవు క్రీస్తు రక్తముతో జయించుట నేర్చుకొనకపోయినట్లయితే, నీకు సాతానును జయించే శక్తి ఉండదు. నీవు ఈ లోకమును ప్రేమించినట్లయితే సాతానుపై నీకు శక్తి ఏమీ ఉండదు. ఎందుకంటె సాతాను ఈ లోకమునకు రాజును మరియు అధికారియు అయిఉన్నాడు. నీవు ఈ లోకములో దేనినైనను లేక ఎవ్వరినైనను దేవుని కంటె ఎక్కువగా ప్రేమించినట్లయితే, అప్పుడు కూడా సాతానును జయించుటకు నీకు శక్తి ఉండదు ( ప్రకటన 12:11 చూడండి).

గనుక యౌవనస్థులారా, మీ పూర్ణహృదయముతో, మీ పూర్ణమనసుతో, మీ పూర్ణ శక్తితో ప్రభువైన యేసు ప్రభువును మరియు మీ జీవితములో ఆయన చిత్తమును ప్రేమించుడి. అపవాది మీ మనసులను ఏవిధము చేతను పాడు చేయకుండునట్లు చూచుకొనండి.

మీ మనసు అపవిత్రముగా ఉండినట్లయితే సాతానుకు వ్యతిరేకముగా మీరు యేసు ప్రభువు యొక్క నామము తగినట్లుగా ఉపయోగించలేరు. యేసు ప్రభువు యొక్క నామము కీడు కలుగకుండునట్లు జపించే మంత్రము కాదు. అలా కాదు. నీవు మొదట దేవునికి లోబడవలెను. అప్పుడు మాత్రమే నీవు అపవాదిని ఎదురించినప్పుడు అతడు నీ దగ్గరనుండి పారిపోవును. కాని నీ జీవితములో ప్రతి విషయము దేవునికి నీవు లోబరచనట్లయితే అపవాది నిన్ను చూచి భయపడడు.

అందుకు నీ జీవితాన్ని సంపూర్తిగా క్రీస్తుకు ఇమ్ము. ఇప్పుడే అది చెయ్యి ఇక నుండి నీవు సంపూర్తిగా ఆయన కొరకు మాత్రమే జీవించుదునని నిర్ణయించుకో.

ఇప్పటినుండి ఇరువది సంవత్సరాలు అయిన తరువాత ఇప్పుడు నీవు వినిన దేవుని వాక్యపు ఉపదేశమును నీవు అనుసరించినందుకు నీవు కృతజ్ఞత కలిగి యుంటావని నేను ఖచ్చితముగా చెప్పగలను. మరియు క్రీస్తు తీర్పు సింహాసనము ఎదుట ఒకనాడు నీవు నిలువబడినప్పుడు ప్రభువుకు నీ జీవితము గూర్చి లెక్క అప్పచెప్పుటకు నీ వంతు వచ్చినప్పుడు, నీవు ఇంకను కృతజ్ఞత కలిగియుందువు.

నీ జీవిత ప్రయాణము చివరకు వచ్చినప్పుడు నీకు విచారించుటకు ఏమీ లేకుండునట్లు ప్రభువు నీకు సహాయము చేయును గాక. ఆమేన్.

వినుటకు చెవి గలవాడు వినును గాక.