దైవజనులు కావలెను

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
  Download Formats:

అధ్యాయము 0
పరిచయము

జనవరి 1971లో వెల్లూరు యొద్ద జరిగిన భారతీయ ఇవాంజిలికల్‌ సహవాసము యొక్క 20వ వార్షికోత్సవములో ఇవ్వబడిన వర్తమానముల యొక్క సారాంశము ఈ పుస్తకములో ఉన్నది.

నేనిక్కడ గురిని చేరుకొన్నవానిగా మాట్లాడుటలేదు గాని, నేనింకను చాలా దూరము వెళ్లవలసిఉందన్న వాస్తవమును ఎరిగినవాడనై, ఆ గురి యొద్దకు చేరుకొనుటకు ప్రభువు యొద్దనుండి కృపను కోరుచున్నవానిగా మాట్లాడుచున్నాను.

ప్రభువు యొక్క వాక్కు నమ్మకముగా ప్రకటింపబడవలెను అనేది నా ఒప్పుదల. ఆ ప్రక్రియలో ఆ దూతయే (మాట్లాడువాడే) దాని చేత సవాలు చేయబడినా సరే. కాబట్టి ఈ వర్తమానములు నా హృదయమునకు దేవుని వాక్కుగా నేను మొదట పరిగణించుదును. అవి నన్ను ఒక్కసారి కంటే ఎక్కువగా ఒప్పింపజేయుచున్నవి.

లోకమంతట అనేకులు ప్రార్థించుచుండిరి కాబట్టి ఈ సదస్సు ఈ వర్తమానములను దీవించుట ప్రభువునకు ఇష్టమాయెను. ఇది ఇంకా అనేకులకు దీవెనకరముగా ఉండునట్లు ఇప్పుడు ప్రార్థనతో పంపబడుచున్నది.

ఈ వర్తమానములు ఇక్కడ మాట్లాడిన రీతిగానే పునరుత్పత్తి చేయబడినవి (వ్రాయబడినవి).

జనవరి 1971 జాక్‌ పూనెన్‌

--------------------

''సంఘమునకు ఈ రోజున అవసరమైనది ఎక్కువ లేక మెరుగైన యంత్రాంగము కాదు, క్రొత్త సంస్థలు కాదు, లేక ఎక్కువైన లేక సరికొత్త విధానాలు కాదు గాని పరిశుద్ధాత్మ వాడుకోగలిగిన మనుష్యులు...పరిశుద్ధాత్మ విధానాల ద్వారా ప్రవహించడు గాని మనుష్యుల ద్వారా ప్రవహించును. ఆయన ప్రణాళికలను అభిషేకించడు గాని మనుష్యులను అభిషేకించును....సహజముగా ఉండే సామర్థ్యము మరియు విద్యార్హతలు ఈ విషయములో లెక్కకు రావు, కాని విశ్వాసముతో నిండిన హృదయము ప్రార్థించే సామర్థ్యము, సంపూర్ణముగా ప్రతిష్టించుకొనుట నుండి వచ్చుశక్తి, తగ్గించుకోగలుగుట, దేవుని మహిమలో స్వంత చిత్తమును మరచిపోవుట, దేవుని సంపూర్ణత కొరకు తీరని ఆకలి కలిగి దాని కొరకు వెదకుట వంటవి ఈ విషయములో వర్తించును. దేవుని కొరకు సంఘాన్ని మండించే మనుష్యులు ఇట్టి లక్షణాలను కలిగియుందురు. వీరు గొడవ చేయుచూ, ప్రదర్శించే విధానములో దీనిని చేయరు కాని తీవ్రమైన నెమ్మదిగల వేడితో దేవుని కొరకు అన్నిటిని కరిగించి కదిలించెదరు.

దేవునికి తగిన మనుష్యులు దొరికిన యెడల ఆయన అద్భుతములు చేయగలడు

- ఇ.యం. బౌండ్స్‌

అధ్యాయము 1
ఆత్మీయ సామర్థ్యము కలిగిన మనుష్యులు

శతాబ్దాలుగా దేవుడు తన మహిమ కొరకు ఒక సాక్ష్యమును స్థిరపరచుటకు, తన నామము కొరకు అన్యజనుల మధ్య ఒక దీర్ఘకాల ప్రభావమును చేయుటకు, చీకటి శక్తులను పూర్తిగా ఓడించుటకు దేవుడు వాడుకోగలిగిన స్త్రీ పురుషులు ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండిరి. దేవుని దీవెనలను అనేకమంది పొందెదరు కాని, దేవునితో కలిసి ప్రయాసపడు పనిచేయు శేషము ఎప్పుడూ ఒక చిన్న గుంపుగానే ఉండెను. గిద్యోను సైన్యమైన 32,000 మందిలో, దేవుడు 300 మందిని మాత్రమే వాడుకోగలిగెను. సంఘ చరిత్ర అంతటిలో కూడా దాదాపు అదే ప్రమాణము (శాతము) ఉండెను. ఈ శేషములో ఉండుటకు వెల చెల్లించుటకు కొద్దిమందే సిద్ధముగా ఉన్నారు.

తన గొప్ప నామము ప్రస్తుతము నిందించబడుచున్న చోట, దానిని మహిమ పరచుట కొరకు వాడుకొనుటకు ఆత్మీయ సామర్థ్యము కలిగిన మనుష్యుల కొరకు ప్రభువు యొక్క కనుదృష్టి మన దేశమందంతట సంచారము చేయుచున్నదని నేను నమ్ముచున్నాను.

ఇశ్రాయేలు దేశములో, 2500 ఏళ్ల క్రితము, ఇటువంటి దినాలలోనే యెహోవా నామము అవమానపరచబడినప్పుడు, దేవుడు తన ప్రజలకు ''అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు'' అని చెప్పెను (యెహెజ్కేలు 36:23). ఆ సందేశములో ఒక వాగ్దానము సూచించబడెను, కాని ఆ వాగ్దానము ఒక షరతు మీద ఆధారపడి యుండెను. అన్యజనులు యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకొందురు, కాని అది ఆయన తన ప్రజల జీవితాలలో పరిశుద్ధ పరచుకొనినప్పుడే జరుగును.

తమ చుట్టూ ఉన్న ప్రజలు దానిని గుర్తించి ఆయన నామము కొరకు వారి మీద ప్రభావము కలుగుటకు తమలో దేవుడు తనను తాను పరిశుద్ధ పరచుకొనుటకు అనుమతించు స్త్రీ పురుషుల కొరకు దేవుడు ఈ రోజున చూచుచున్నాడు. క్రీస్తు పూర్వము 9వ శతాబ్దములో జీవించిన ఒక దైవజనుణ్ణి పరిశీలించినప్పుడు 20వ శతాబ్దపు దేవుని సేవకునిని నిర్దేశించవలసిన విషయాలను కనీసము మూడింటిని మనము కనుగొనెదము.

ఎలీషా మనవంటి స్వభావము గల మనుష్యుడే, అయినప్పటికీ దేవుని కొరకు అతడు తన తరము వారిని ప్రభావితము చేసెను. లేఖనములలో ఆయన జీవితము గురించి మనకు ఇవ్వబడిన భాగములో, ఆయన ఇతరులపై ప్రభావము చూపిన మూడు సందర్భాలను గూర్చి మనము చదివెదము. వీటిని ఒక దాని తరువాత ఒకటి పరిశీలించెదము.

అధ్యాయము 2
ఒక పరిశుద్ధుడైన (భక్తిగల) దైవజనుడు

''ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి-మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును'' (2 రాజులు 4:8,9).

ఈ అభిప్రాయమును తెలియజేసిన స్త్రీ ''ఒక పలుకుబడి కలిగిన ధనికురాలైన స్త్రీ'' యై యుండెను (ఆంప్లిఫైడ్‌ తర్జుమా). ఆమె పైరూపాల చేత మోసపోయే అమాయకురాలైన వ్యక్తి కాదు. ఎలీషా ఆమె గృహమును తరచుగా దర్శించెను మరియు అన్యులు మనలను గమనించినట్లే ఆమె అతనిని గమనించెను. చివరకు ఎలీషా ఒక భక్తిగల దైవజనుడు అన్న ఖచ్చితమైన నిర్ధారణకు ఆమె వచ్చెను.

సహోదర సహోదరీలారా, ఇతరులు మనలను గమనించినప్పుడు వారు ఇదే నిర్ధారణకు రాకపోయిన యెడల, మనము ఇంకేమి చెప్పినా చేసినా ప్రయోజనము లేదు. నేను మాట్లాడేది మన గురించి తక్కువ తెలిసిన వారికి మనము కలుగజేసే అభిప్రాయమును గూర్చికాదు గాని, మనము తరచూ కలుసుకొనే వారికి, మనతో నివసించువారికి, మనలను గూర్చి బాగా తెలిసిన వారికి మనము కలుగజేసే అభిప్రాయమును గూర్చి మాట్లాడుచున్నాను.

మనము ఇతరులకు కలుగజేయు అభిప్రాయము ఎటువంటిది? వారు మనలను కేవలము తెలివైనవారిగా, చమత్కారముగా, అనర్గళముగా మాట్లాడువారిగా లేక బహుశా చైతన్యవంతమైన వ్యక్తిత్వము గలవారిగా పరిగణించుదురా? ఈ గుణములు అమ్మకందారులకు అవసరమైనవి మరియు శ్రేష్టమైనవి, కాని మనము అమ్మకందారులుగా ఉండుటకు పిలువబడలేదు. మనము ప్రాథమికముగా భక్తిగల దైవజనులుగా దైవజనురాళ్లుగా ఉండుటకు పిలువబడినాము.

మన సంఘములలో మరియు క్రైస్తవ సంస్థలలో, మనము అనేకమంది బోధకులను, గాయకులను, వేదాంతులను మరియు నిర్వాహకులను కలిగియున్నాము. వారిలో ప్రతి ఒక్కరి కొరకు దేవునికి వందనాలు. కాని మనము పరిశుద్ధులైన దైవజనులను కలిగియున్నామా? ఇదే ముఖ్యమైన ప్రశ్న. మనము పరిశుద్ధులైన దైవజనులను దైవజనురాళ్లను పొందినప్పుడే మనము నిజమైన ఉజ్జీవమును పొందగలము.

మన హృదయములలో మనము నిజముగా ఏ విధముగా ఉండగోరెదమో చివరకు ఆ విధముగా మారెదమని చెప్పుట సత్యమేనని నేననుకొనుచున్నాను. మనము యదార్థముగా పరిశుద్ధులమైన దైవజనులుగా దైవజనురాండ్రగా ఉండుటకు ఆశించిన యెడల మనము నిశ్చయముగా అటువంటి వారిగా మారుదము. దేవుడు మన హృదయములలోని లోతైన వాంఛలను చూచి దానికి సమాధానమును ఇచ్చునని గుర్తుంచుకొనుడి.

కాబట్టి ఈ రోజున మనము పరిశుద్ధముగా లేని యెడల, మన అసలైన లక్ష్యములు వేరైయుండుట బహుశా కారణమైయుండవచ్చు. బహుశా మనము కేవలము తెలివిగా ఉండుటను బట్టియు, చైతన్యవంతముగా నుండుటను బట్టియు, నిర్వాహాత్మకమైన చతురత కలిగియుండుటను బట్టియు తృప్తిపడియున్నామేమో. అన్నిటికంటే మనము పరిశుద్ధతను కోరుకొనుచున్నామని చెప్పుట సులభమే, ఎందుకనగా చెప్పుటకు అదే సరియైనది. కాని యెషయా మరియు యెహెజ్కేలు దినములలో దేవుని ప్రజలవలే, మన పెదవుల యొక్క మాటలకు మన హృదయాల యొక్క లోతైన వాంఛలకు ఎంతో వ్యత్యాసముండవచ్చును (యెషయా 29:13, యెహెజ్కేలు 33:31).

మనము ఒక ఆశీర్వాదమును లేక రెండింటిని బోధించవచ్చు (రక్షణను లేక రక్షణ మరియు పరిశుద్ధాత్మ బాప్తీస్మము). కాని పరిశుద్ధతకు సంబంధించిన ఏ సిద్ధాంతమును మరియు పాత అనుభవాలకు సంబంధించిన ఏ సాక్ష్యమును ఒక యదార్థమైన పరిశుద్ధ జీవితమునకు ప్రత్యామ్నాయము కాదు.

ఈ జీవితము ''భ్రమ కాని పరిశుద్ధతను'' కలిగియున్నది (ఎఫెసీ 4:24-జె.బి.ఫిలిప్స్‌ తర్జుమా). భారతదేశములో మన క్రైస్తవేతర స్నేహితులలో కొందరికి ఎంతో ఉన్నతమైన నైతిక ప్రమాణాలున్నవని మనకు తెలియును. వారి మతము వారికి బోధించిన దాని కంటే వారు మనలో పరిశుద్ధత యొక్క తక్కువ ప్రమాణమును చూచినయెడల వారు క్రీస్తు వైపుకు ఎలా ఆకర్షింపబడుదురు? అనేక మంది క్రైస్తవుల కంటే కొందరు నిష్టకలిగిన క్రైస్తవేతరులు తరచుగా ఎక్కువ చిత్తశుద్ధిని నీతిని కనబరచుట విషాదకరమైన విషయము కాని అది నిజము. దీనిని బట్టి మనమందరమూ సిగ్గుపడి దేవుని యెదుట సాగిలపడి ఆయన కనికరము కొరకు ప్రాధేయపడవలసియున్నది.

మన సంఘములలో, ప్రత్యేకముగా మన నాయకుల మధ్య మనకు నిజముగా పరిశుద్ధులైన దైవజనులు దైవజనురాండ్రు అవసరము. అట్టివారు లేకుండా క్రీస్తు కొరకు మన దేశమును చేరుకొనుటకు (ప్రభావితము చేయుటకు) మనము చేసే ప్రయత్నాలన్నియు వ్యర్థమే.

దేవుని ఆత్మ మనలో నివసించునని క్రైస్తవులమైన మనము చెప్పుకొందుము. కాని మనలో నివసించే పరిశుద్ధాత్మ యొక్క ప్రాథమిక విధి మనకు వరములిచ్చుట కాదుగాని మనలను పవిత్రలుగా చేయుటయని మనము మరచి పోకూడదు.

యెషయా దేవుని యొక్క దర్శనమును చూచినప్పుడు, సెరాపులు, ''సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు'' లేక ''కరుణామయుడు, కరుణామయుడు, కరుణామయుడు'' అని కేకలు వేయుట వినలేదుకాని, ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు'' అని కేకలు వేయుట వినెను. అటువంటి దృశ్యమును చూచినవారెవరైననూ అటువంటి దేవునికి సేవకునిగా ఉండుట సామాన్యమైన విషయము కాదని గ్రహించుదురు. పరిశుద్ధుడు అన్న నామమును కలిగిన మహాఘనుడికి మహోన్నతునికి ప్రాతినిధ్యము వహించుటకు పిలువబడినవాని జీవితములో పరిశుద్ధత అనేది అత్యవసరమైన ఆవశ్యకతయైయున్నది.

మన దేవుడు అపరిమితమైన పరిశుద్ధత కలిగిన దేవుడు అన్న వాస్తవము మన జీవితాలలో పరిశుద్ధముగా నుండుటకు అతిగొప్ప ప్రేరణగా నుండవలెను. ''నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులైయుండవలెను'' అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు మనలను వాడుకోవాలనే ఆశతో మాత్రమే మనము పరిశుద్ధత కొరకు ప్రయాసపడితే, మన ఉద్దేశ్యము స్వార్థపరమైనది. ఆయన మనలను వాడుకొన్నా వాడుకొనక పోయినా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులుగా ఉండటకు కోరుకొనవలెను.

ఎలీషా ప్రయాణించినప్పుడు, అతడు కలుసుకొన్నవారందరికీ అతడు కలుగజేసిన అభిప్రాయము ఇదే అతడు ఒక పరిశుద్ధుడైన దైవజనుడని ప్రజలు అతని వర్తమానములకు ఆయన ప్రసంగాలలోని మూడు అంశాలను మరచిపోయియుండవచ్చు గాని అతని జీవితము యొక్క ప్రభావమును వారు మరవలేకపోయిరి. ఇది మనకు ఎంతటి సవాలుగా ఉండవలెను! మన ప్రసంగాలలో అనర్గళముగా మాట్లాడుటకంటే, లేఖనములను అద్భుతముగా వివరించుటకంటే వ్యవహారాలను సామర్థ్యముగా నిర్వహించుటకంటే ఎక్కువగా పరిశుద్ధులైన దైవజనులుగా ఉండుటకు ఎంత ఆశించవలెను.

మన దేశములో నేను ప్రయాణించినప్పుడు, అద్భుతమైన వరములు సామర్థ్యములు గల అనేక క్రైస్తవ నాయకులను మిషనరీలను (క్రొత్త ప్రాంతాలలో సువార్తను ప్రకటించువారు) కలుసుకొంటిని. నేను డాంబికులను, బహిర్ముఖులను కలుసుకొంటిని. కాని పరిశుద్ధులైన దైవజనులుగా నేను గౌరవించగలిగిన బహుకొద్ది మందినే నేను కలుసుకొంటిని. నా అంచనాలో నేను తప్పని ఆశించుచున్నాను గాని నేను సరియైయుండవచ్చని నాకు భయముగానున్నది.

దేవుడు తన సేవలో ఒక వ్యక్తిని వాడుకొనుచున్నాడన్న విషయము ఆ వ్యక్తి పరిశుద్ధుడని కాని అతని జీవితము దేవునికి ఇష్టమైనదని కాని సూచించదు. దేవుడు తన సందేశమును అందించుటకు ఒకసారి ఒక గాడిదెను వాడుకొనెను. ఆ గాడిద యొక్క యజమానియైన బిలాము అవినీతి పరుడైనప్పటికీ అతనిని ప్రవచించుటకు వాడుకొనెను. దేవుడు ఒక వ్యక్తిని తన వాక్యమును పంచుకొనుటకు వాడుకొన్న యెడల, అది తరచుగా ఆయన కనికరమువలన ఆ వ్యక్తి పరిచర్య చేయు ప్రజలను ఆయన ప్రేమించుట వలన, అంతేకాని ఆ వ్యక్తి జీవితములో ఆయన సంతోషముగా ఉన్నందుకు కాదు.

దేవుని వాక్యమును ఆకట్టుకొనే విధముగా పంచుకొనుటకు మనము పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరము లేదు. కాని తెర వెనుక దేవుని పోరాటములను చేసి నిత్యత్వమంతటికి కాలిపోని, నిశ్చలమైనదానిని కట్టుటకు ఆయనతో సహకరించే శేషములో నుండుటకు మనము పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరమున్నది.

మన సంఘాలలో ఎందుకు బహుకొద్ది పరిశుద్ధులైన స్త్రీ పురుషులున్నారని, నన్ను నేను ప్రశ్నించుకొనగా, దీనికి మూడు కారణములు నాకు కనిపించెను. ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చును.

కపటము

కపటము విస్తృతముగా ప్రబలియుండట మొదటి కారణమని నేను నిశ్చయముగా చెప్పగలను. సమస్త కపటము నుండియు మరియు వేషధారణనుండియు విడుదలయే ఎల్లప్పుడు ఆచరణాత్మకమైన పరిశుద్ధతకు మొదటి మెట్టుగా నున్నది.

తన జీవితమునుండి కపటమును పూర్తిగా తొలగించుకొనుటకు తన పూర్ణహృదయముతో ప్రయాసపడని వాడెవడును పరిశుద్ధుడైన దైవజనుడిగా ఉండలేడు. ప్రకటన 14:1-5లో చిత్రీకరించబడిన శేషము ఎటువంటి కపటము లేనిదానిగా వర్ణింపబడెను. చాలా తరచుగా మనమనుకొన్నదానికంటే మనలో కపటముండును. మనము నిజాయితీ గలవారమైతే మనము ఉన్నదానికంటే మెరుగైన అభిప్రాయమును ఇతరులకు కలుగజేయుటకు తరచుగా ప్రయత్నించుదుమని ఒప్పుకొననివారు మనలో ఒకరు కూడా ఉండరు. మనము ఈ అలవాటును మానుకోవలసిన అవసరమున్నది. మనము నిజముగా పరిశుద్ధులుగా ఉండుటకు దీనికి వ్యతిరేకముగా నిరంతరమూ పోరాడి దానిని సంహరించవలసిన అవసరమున్నది. మనము స్వచ్ఛముగా ఉండుటకు మనమున్నట్లే (నిజస్థితి) ఇతరులకు తెలియబడుటకు ప్రయాసపడవలెను. ఇది సులవైనది కాదని నాకు తెలియును. కాని ఇది మొదటి మెట్టు మరియు ఇది లేకుండా ఎక్కడా ఉజ్జీవముండదు. మన జీవితాలనుండి కపటమును తొలగించుకొనుటకు ఒక పట్టుదలతో కూడిన కృషిని మనము చేయనియెడల ఉజ్జీవము కొరకు మనము చేయు ప్రార్థనలకు దేవుడు సమాధానమునిచ్చునని అనుకొంటే మనము కేవలము మనలను మోసపరచుకొనుచున్నాము.

నిజమైన క్రైస్తవ సహవాసమును కూడా ఆటంకపరచేది కపటము. చాలా తరచుగా మరుగైయున్న సంవత్సరములు మరియు క్షమింపలేని ఆత్మ క్రైస్తవ నాయకుల మరియు మిషనరీల హృదయములలో ఆశ్రయము కలిగియుండును. బయటకు కనబడు ఆహ్లాదకరమైన ఆత్మీయత అను ముఖభాగము (మైమరువు) క్రింద అగాధమునుండి వచ్చిన ఈ జిగటయైన దుష్టత్వములుండును. మనము పరిశుద్ధులైన దైవజనులుగా ఉండవలెనంటే ఇవి బయటపెట్టబడి విడిచిపెట్టబడవలెను.

యేసు కపటమును వేషధారణను ఇతర పాపములకంటే ఎక్కువగా ఖండించెను. ''పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి'' అని ఆయన తన శిష్యులకు చెప్పెను. ఈ పాపము ఆది సంఘములో కనబడినప్పుడు, దేవుడు దానితో సమూలముగా వ్యవహరించెను. ఈ కొద్ది పులిసిన పిండి వల్ల ముద్దంతయూ పులియకుండా ఆయన దీనికి సంబంధించిన జంటను వెంటనే హతమార్చెను (అపొ.కా. 5వ అధ్యాయము).

''ఇదిగో ఇతనియందు ఏ కపటమును లేదు'' అని యేసు నతనయేలును గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నేను అనేక మారులు చదివి ధ్యానించితిని. దానికంటే గొప్పదైన మెప్పును మనము ఆశించగలమా అని నేను ఆలోచించితిని. దేవుడు మన గూర్చి అటువంటి మాటలను చెప్పగలడా అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను. అయ్యో, తరచుగా ఆయన చెప్పలేడు-ఎందుకంటే మన తోటి మనుష్యుల దృష్టినుండి మనము జాగ్రత్తగా దాచిపెట్టిన పాపములను ఆయన మనలో చూడగలడు.

కపటము లేనివాడు నిజముగా ధన్యుడు.

క్రమశిక్షణ లేకపోవుట

మన దినములలో పరిశుద్ధత లేకపోవుటకు రెండవ కారణము మనలను మనము కరిÄనముగా క్రమశిక్షణలో పెట్టుకొనకపోవుటయే. మన శరీర అవయవాలను క్రమశిక్షణలో పెట్టుకొనుటకు క్రొత్త నిబంధన ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది-ప్రత్యేకముగా చెవి, కన్ను, నాలుక. రోమా 8:13లో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మన శరీరక్రియలను చంపని యెడల మనము ఆత్మీయ జీవమును ఆనందించలేమని పౌలు చెప్పెను. తన స్వంత శరీరమును ఎంత కఠినముగా అతడు క్రమశిక్షణలో పెట్టుకొనెనో అతడు 1కొరింథి 9:27లో చెప్పెను. పరిశుద్ధపరచబడుటలో మనము ఎటువంటి అనుభవము కలిగియున్నప్పటికీ, మనము పరిశుద్ధులుగా ఉండాలంటే, పౌలువలే మన జీవితాంతము వరకు మన శరీర అవయవాలను క్రమశిక్షణలో పెట్టుకొనవలెను.

మన చెవులు ఏ రకమైన సంభాషణను వినునో అను విషయములో మనము క్రమశిక్షణ కలిగియుండవలెను. కొండెములను మరియు అపవాదులను వినుచూ మన సమయమును వృథా చేసిన తరువాత దేవుని స్వరమును వినుటకు మన చెవులు అనుసందానము చేయబడి యుండవలెనని మనము ఆశింపలేము.

ప్రత్యేకముగా ఈ రోజులలో మన కళ్ళతో చూచే విషయములో మరియు చదివే విషయములో క్రమశిక్షణలో ఉండవలెను. వారి నేత్రములను అలవాటు ప్రకారము నియంత్రణలో పెట్టుకొనక పోవుట చేత అనేకమంది మిషనరీలు దేవుని సేవకులు జారత్వములో పడిపోయారు. ఈ విషయములో క్రమశిక్షణ లేకపోవుట చేత ఇంకా ఎంతమంది తమ ఆలోచనా జీవితాలలో నిరంతరము పడిపోవుచున్నారు.

''వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము'' అని మనమెల్లప్పుడు ప్రార్థన చేయాలి (కీర్తనలు 119:37).

మన నాలుకలు కూడా పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో ఉండాలి. క్రైస్తవ సంఘములో మానవ నాలుక కంటే మరణమును తెచ్చునది బహుశా ఇంకేదియు ఉండదు. యెషయా దేవుని పరిశుద్ధతను చూచినప్పుడు అతడు తన నాలుకను వాడిన విధమును బట్టి ప్రధానముగా ఒప్పింపబడెను. తనను తాను దేవుని వెలుగులో చూడనంత వరకు అతడు దీనిని స్పష్టముగా గ్రహింపకుండెను.

తన నాలుకను వాడువిధములో జాగ్రత్తగా ఉంటేనే తన సంభాషణలో పనికిరాని వాటిని విలువైనవాటినుండి వేరుపరచినప్పుడు మాత్రమే అతడు దేవుని నోటిగా ఉండగలడని ప్రభువు యిర్మీయాతో చెప్పెను (యిర్మీయా 15:19).

వారి నాలుకలను వాడు విధములో ఈ ప్రవక్తలు అజాగ్రత్తగా ఉండజాలరు, లేకుంటే వారు దేవుని ప్రతినిధిగా ఉండే ఆధిక్యతను పోగొట్టుకొని యుండేవారు. వారు పనికిరాని సంభాషణలో, అతిగా మాట్లాడుటలో, కొండెము లాడుటలో, అపవాదులలో విమర్శలలో పాల్గొని తప్పించుకోలేరు. ఆవిధముగా చేసినయెడల వారు వారి పిలుపును పోగొట్టుకొని యుండెడివారు. మన రోజులలో దాదాపుగా ఇటువంటి ప్రవక్తలు లేకపోవుటకు ఇది ఒక కారణము అయ్యుండవచ్చును.

''సాధారణ క్రైస్తవ పరిచారకుడు'' అను పుస్తకములో వాచ్‌మన్‌ నీ అనే దైవజనుడు ఇలా చెప్పెను:

''ఒక క్రైస్తవుడు అన్ని రకాలైన విషయములను గూర్చి అనుచితముగా మాట్లాడిన యెడల, దేవుని వాక్యమును పంచుకొనుటలో ప్రభువు చేత వాడుకోబడుటకు అతడు ఎలా ఆశించగలడు? దేవుడు తన వాక్కును మన పెదవులయందు ఎప్పుడైననూ ఉంచిన యెడల, ఈ పెదవులను ఆయన పరిచర్యకొరకు మాత్రమే కాచుకొనే గంభీరమైన బాధ్యత మనపైనున్నది. మన శరీరములోని ఒక అవయవమును ఒకరోజు ఆయనకు ఇచ్చి మరుసటి రోజు దానిని మన అభీష్టానుసారముగా వాడుకొనుటకు వెనక్కి తీసుకోలేము. ఆయనకు ఒకసారి అప్పగించిన దేదైననూ నిత్యత్వమంతయు ఆయనకే చెందును''.

మానవ శరీరములో, ఒక వైద్యుడు మన నాలుకలను చూచి మన ఆరోగ్యపరిస్థితి అంచనా వేయగలిగినట్లే, ఆత్మీయ పరిధిలో కూడా ఒక వ్యక్తి తన నాలుకను వాడు విధానము అతని ఆత్మీయతకు పరీక్షగా ఉన్నదని యాకోబు చెప్పెను (యాకోబు 1:26). ఒక వ్యక్తి తన నాలుకను నియంత్రించుకోగలిగిన యెడల అతడు పరిపూర్ణుడని అతడు ధైర్యముగా చెప్పెను (యాకోబు 3:2).

దేవుని కొరకు సమయము లేకపోవుట

మన దినాలలో పరిశుద్ధత లేకపోవుటకు మూడవ కారణము మనము దేవునితో ఏకాంతముగా తగిన సమయము గడపక పోవుట అనే సత్యము. దేవునితో అతి పరిశుద్ధ స్థలములో సమయము గడుపుట తన జీవితములో అతి ముఖ్యమైన విషయమని నిర్ణయించుకోని ఏ వ్యక్తియైనను పరిశుద్ధుడుగా ఉండలేడు. ఇదే మన అతి ముఖ్యమైన ప్రాధాన్యతగానున్నది.

మోషే ముఖము ప్రకాశించెను కాని, అది అతడు దేవునితో ఏకాంతముగా నలభై దినములు కొండపైన గడిపిన తరువాత మాత్రమే జరిగెను. అతడు తన దేవునిని ముఖాముఖిగా ఎరిగెను. గనుక అతడు ఒక పరిశుద్ధుడైన దైవజనుడిగా ఉండెను. ఎలీషా విషయములో కూడా అంతే. అతడు దేవుని గూర్చి ''ఎవని యెదుట నేను నిలువబడియున్నానో ఆ యెహోవా'' అని చెప్పగలిగెను (2రాజులు 3:14; 5:16). దేవునిని ముఖాముఖిగా కలుసుకొనుట అంటే ఏమిటో అతడు ఎరిగియుండెను మరియు అదే అతనిని పరిశుద్ధునిగా చేసెను.

మన దినాలలో, మన చుట్టూ ఉన్న సంగతులు ఎంత విపరీతమైన వేగముతో కదులుచున్నవంటే, మనము తీరికలేని కార్యచరణలో పడిపోయి చివరకు దేవునితో గడుపుటకు సమయము లేకుండా ఉండవచ్చును. ఈ విధముగా అపవాది మన ఆత్మీయ సజీవత్తమును (శక్తిని) బలహీనపరచును. అతడు మనలను కార్యచరణకు, కమిటీ సమావేశాలకు ప్రాధాన్యతనిచ్చునట్లు చేయుట ద్వారా మనము పరిశుద్ధాత్మను నిర్లక్ష్యము చేయునట్లు చేయును.

యేసు మనుష్యులకు దూరముగా తన తండ్రితో ఏకాంతముగా గడిపిన సంఘటనలను గూర్చి చదువుట నాకు ఎప్పుడూ ఒక సవాలుగా నుండును. ఒకసారి, ఒక దినమంతయు తీరికలేకుండా బోధించి వేలమంది భౌతిక అవసరాల నిమిత్తము పరిచర్య చేసిన తరువాత, ఆయన ఒక్కడే తన తండ్రితో ఏకాంతముగా గడుపుటకు ఒక కొండ యెక్కిపోయెను (మత్తయి 14:23). మరియొక సందర్భములో, రోగులను స్వస్థపరచుచూ ముందు రాత్రి చాలా సమయము పనిచేసిన తరువాత ఆయన పెందలకడనే లేచి ప్రార్థన చేసుకొనుటకు ఒక అరణ్యప్రదేశమునకు వెళ్లెను(మార్కు 1:35). మనలో అందరికంటే ఎక్కువగా తీరిక లేని దేవుని కుమారుడు మనకు ఇటువంటి మాదిరినిచ్చెను. ఇటువంటి వెలుగు మనకున్నప్పుడు దేవుని కొరకు ఎదురుచూచుచూ గడపకుండా ఉండగలనని మనలో ఎవరు ధైర్యముగా చెప్పగలరు?

తన దేవుని యెదుట తరచూ నిలబడుట అంటే ఏమిటో ఎలీషా యెరిగెను గనుక అతడు భయము లేకుండా పాపమును ఏవిధముగా గద్దించవలెనో యెరిగియుండెను. దేవుడు ఇశ్రాయేలు రాజును గురించి ఏమనుకొనెనో అతడు ఆ రోజున ఖచ్చితముగా చెప్పెను. తన స్వంత సహపరిచారకుడైన గెహాజీ దురాశ అను పాపములో పడిపోయినప్పుడు కూడా అతడు గెహాజీని ఎదుర్కొనెను. మరియు అతడు దీనిని వ్యవహారదక్షకముగా లేక వ్యూహాత్మకముగా లేక సందిగ్దంగా ఉండుటకు ప్రయత్నించకుండా చేసెను.

కొన్ని సందర్భాలలో వ్యవహార దక్షకముగా మరియు వ్యూహాత్మకముగా ఉండుటకు అవసరమున్నదనుటలో సందేహము లేదు కాని పాపమును భయములేకుండా నమ్మకముగా గద్దించవలసిన అవసరమున్న సమయాలు కూడా ఉన్నవి. మన దినాలలో క్రైస్తవ గుంపులలో విస్తృతముగా నున్న పాపము లోకానుసారత సయోధ్యకు వ్యతిరేకముగా మాట్లాడువారు మనలో బహుకొద్ది మందే ఉండుటకు కారణమేమిటి? దీనికి కారణము మనము మనుష్యుల మెప్పును ఆశించి ఎవరినీ అభ్యంతరపరచుటకు ఇష్టపడకపోవుటయేనని నా భయము. మనము దేవుని సన్నిధిలో ఆయన భయమును నేర్చుకొనుచు బహుకొద్ది సమయము గడుపుచున్నామనే వాస్తవము నుండి ఇటువంటి శరీరాశ స్థిరముగా వస్తున్నది.

మనము దేవుని ప్రవక్తలాగా ఉండాలంటే, దేవుడు తన వాక్యములో ఉంచిన ప్రమాణాలను తక్కువ చేసే సయోధ్య అంతటికి వ్యతిరేకముగా మాట్లాడి, దేవుడు విరోధముగా ఉన్నవాటన్నిటికీ విరోధముగా నిలబడుట అత్యవసరము. మనము ఈ వైఖరిని వ్యక్తులుగానే కాకుండా ఒక విశ్వాసుల శరీరముగా (సంఘముగా)అవలంబించవలెను. ఈ రోజున క్రొత్త నిబంధన సువార్త ప్రకారము నడచుకొనే మనము భారతదేశములో ఉన్న సంఘమునకు ఒక ప్రవచనాత్మకమైన స్వరముతో మాట్లాడని యెడల, దేవుని యెదుట మనకున్న బాధ్యతలో తప్పిన వారిగా ఉండెదము.

దేవుడు తన సంఘము కొరకు కలిగియున్న ఉన్నతమైన ఉద్దేశమునకు తక్కువగా నుండే వాటన్నిటికి వ్యతిరేకముగా ఒక ప్రవచనాత్మక స్వరముతో మాట్లాడుట మన సంఖ్యను తగ్గించవచ్చునేమో గాని, దేవుడు ఎప్పుడూ పరిమాణములో కంటే నాణ్యతలో ఆసక్తి కలిగియుండెను. దేవుడు చేసిన దానికంటే విశాలముగా మనము ఇరుకు మార్గమును విశాలము చేయకూడదు.

పాతకాలపు ప్రవక్తలు వారి రోజులలో ఉన్న ప్రజలచేత అపార్థము చేసుకోబడి తృణీకరింపబడిరి. మరియు ఈ రోజున కూడా ప్రవక్తలుగా ఉండగోరిన వారికి అలాగే జరుగును. కాని ''క్రిస్టియన్‌ అండ్‌ మిషనరీ అలయన్స్‌'' అను సంస్థను స్థాపించిన ఎ.బి.సింప్సన్‌ అను దైవజనుడి యొక్క జ్ఞానము గల మాటలనుండి మనము ధైర్యము తెచ్చుకోవచ్చు.

''ఒక వ్యక్తికున్న విలువకు సరైన కొలత అతనికున్న స్నేహితుల సంఖ్యలో కాదుగాని అతనికున్న శత్రువుల సంఖ్యలో ఉన్నది. తన తరమునకు ముందుగా జీవించు ప్రతి వ్యక్తి నిశ్చయముగా అపార్థము చేసుకోబడును. తరచుగా హింసింపబడును. కాబట్టి మనము ప్రజాదరణ లేనివారిగా, తరచుగా ఒంటరిగా నిలబడుటకు, దూషించబడుటకు, బహుశా ద్వేషముతో తప్పుగా ఆక్షేపించబడుటకు, మతపరమైన లోకము అనే శిబిరములోనుండి బయటకు వెళ్లగొట్టబడుటకు తరచుగా ఎదురు చూడవచ్చు'' అని ఆయన చెప్పెను.

దేవుడు ఈ రోజున కేవలము బోధకుల కొరకు చూచుటలేదుకాని, తన వాక్యమును నమ్మకముగా ప్రకటించిన పాత కాలపు ప్రవక్తల వంటి ప్రవక్తల కొరకు చూచుచున్నాడు. ''యెహోవా ఆజ్ఞ యితని ద్వారా దొరుకును'' (2రాజులు 3:12) అని ఎలీషా గురించి చెప్పబడినట్లు అట్టివారి గురించి చెప్పబడును.

కాని అటువంటి పరిచర్య పొందుటకు అడ్డదారి లేదు. ఇన్‌స్టెంట్‌ కాఫీ చేయబడిన విధముగా ప్రవక్తలు కొద్దిక్షణాలలో చేయబడరు. వారి శిక్షణా సంస్థ తర్ఫీదు ద్వారా కూడా తయారు చేయబడరు. దేవుని మహిమను చూస్తూ ఆయన స్వరమును వినుచు, ఆయన స్వారూప్యములోనికి మార్చబడుచూ ఆయన సన్నిధిలో సుదీర్ఘమైన సమయము గడుపుట అంటే ఏమిటో మనము ఎరిగియుండవలెను.

అవును, మనము ప్రవక్తలము అయ్యేముందు పరిశుద్ధులమవవలెను.

ఉజ్జీవము కొరకు ప్రార్థించుట

సహోదర సహోదరీలారా, మనము ఉజ్జీవము కొరకు ప్రార్థించుట కొనసాగించే ముందు, మనము పరిశుద్ధులమైన దైవజనులుగా ఉండుటకు చెల్లించవలసిన విలువను చెల్లించుటకు సిద్ధముగా ఉన్నామా అని మనలను మనము ప్రశ్నించుకో వలసిన అవసరమున్నది.

యెహోషువా 7:10-13).

కాబట్టి మనము కృపాసనము నొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆలకించుచున్నాడా లేదా అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను. బహుశా ఆయన వినుటలేదేమో. మనము సహవాసము పోగొట్టుకొనిన ఆ సహోదరునితో మనము ఇంకా విషయాలు సరిచేసుకోలేదు. మన సహవాసాలలో ఉన్న ధనికులకు పలుకుబడి ఉన్నవారికి మనము పక్షపాతము చూపించుచూ వారి పాపములను బట్టి వారిని ఎదుర్కొనుటకు నిరాకరించెదము. మనలను మనము ఇప్పటికీ తగ్గించుకొనక మన జీవితాలలో ఉన్న నటనను కపటమును ఒప్పుకొనలేదు. మన నాలుకలు ఇప్పటికీ అదుపులో లేవు. అతి పరిశుద్ధ స్థలములో మనము అరుదుగా కనబడెదము. ఎంత వెల చెల్లించవలసి వచ్చినా పరిశుద్ధులమైన దైవజనులుగా ఉండుటకు మన హృదయాలు కాంక్షించుటలేదు. అటువంటప్పుడు మన ప్రార్థనలకు ఏ విలువ ఉండును? మెట్టుకు, పరిశుద్ధుని విజ్ఞాపనయే దేవుని యెదుట బహు బలముగలదై యుండును (యాకోబు 5:16).

దేవుడు మన హృదయాలను పరిశోధించును గాక!

అధ్యాయము 3
ఒక సేవకుడు

''యెహోషాపాతు అతనిద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలురాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతులమీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పెను''
(2రాజులు 3:11).

ఎలీషా ఇక్కడ ఏలీయా చేతులు కడుగుకొనుటకు అతని చేతుల మీద నీళ్లు పోయువానిగా ప్రస్తావించబడెను. వేరే మాటలో చెప్పాలంటే ఒక సేవకుని బాధ్యతలను నిర్వహించే వ్యక్తి.

20వ శతాబ్దపు ప్రమాణాల ప్రకారము ఇది నిశ్చయముగా ఒక ప్రవక్తను ప్రశంశాపూర్వకముగా పరిచయము చేసే విధానము కాదు. ఈ రోజున ప్రేక్షకులకు ఈ విధముగా పరిచయము చేయబడితే అనేక మంది బోధకులు అభ్యంతర పడుదురు.

ప్రజలు తమ చేతులు కడుగుకొనుటకు నీళ్లు పోయటమే కాకుండా ఎలీషా ఇంకా ఎన్నో ఇతర కార్యములను చేసెను. అతడు యోర్దాను జలములను రెండుగా విడగొట్టెను మరియు యెరికోలో నీళ్లవలన వచ్చిన తెగులును బాగుచేసెను. ఇవి నిజముగా చెప్పుకోదగ్గ అద్భుతములు. అయినప్పటికీ అతడు ఇక్కడ ఒక సేవకునిగా పరిచయము చేయబడెను. అటువంటి బిరుదును పొందుట అతడు పట్టించుకోలేదని నేననుకొనుచున్నాను. ఏలీయాకు ఒక సేవకునిగా అతని పరిచర్య ఎంత ప్రస్పుటమైనదిగా ఉండెనంటే, ఇతరులు తమ మనస్సులలో అతని గురించి నిలబెట్టుకొనిన అభిప్రాయము ఇదే. గనుక ఇక్కడ ఈ రాజు సేవకుడు ఎలీషాను నీళ్లు పోయువానిగా పేర్కొనెను.

సహోదర సహోదరీలారా, మనము పిలువబడినది కూడా ఇందుకే ఇతరులకు సేవకులుగా ఉండుటకు. యేసు తానే నీళ్లు పోసి తన శిష్యుల పాదములు కడిగినవానిగా ఉండెను.

''నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కాని పరిచారము చేయుటకు వచ్చితిని''

అని ఆయన చెప్పెను (మత్తయి 20:28). భూమి మీద పరలోకమును నాయకత్వపు పదవులను ఆశించిన వారికి భూలోక రాజ్యములకు తన రాజ్యము భిన్నముగా ఉండుననియు, తన రాజ్యములో ముఖ్యులుగా ఉండగోరినవారు ఇతరులకు సేవకులుగా ఉండవలెనని ఆయన చెప్పెను.

ప్రభువు యొక్క ప్రతి సేవకుడు మనుష్యుల సేవకుడిగా ఉండవలెను, లేనియెడల దేవుని సేవకునిగా ఉండే ఆధిక్యతను అతడు పోగొట్టుకొనును.

ఒక సేవకుని స్వభావమునకు విరుద్ధముగా ఉండే రెండు విషయాలు ఉన్నవని నేను అనుకొనుచున్నాను. ఒకటి పేరు ప్రఖ్యాతులను ఆశించుట. వేరొకటి ఇతరుల పట్ల ఒక యజమాని వైఖరి కలిగియుండుట. ఈ రెండింటికి వ్యతిరేకమైనదానిని మన ప్రభువైన యేసులో మనము చూచెదము.

''ఆయన దాసుని స్వరూపము ధరించి తన్నుతానే రిక్తునిగా చేసికొనెను'' (ఫిలిప్పీ 2:7).

ఈ రెండు విషయములను మనము పరిశీలించెదము.

గుర్తింపును ఆశించుట

లోకములో గొప్పవారిగా, ప్రసిద్ధిచెందినవారిగా ఉండుటకు కలిగియున్న ఆశను మనము తొలగించుకొని యుండవచ్చు గాని ఇవాంజిలికల్‌ గుంపులలో (క్రొత్త నిబంధన సువార్త ప్రకారము నడచుకొనేవారిలో) ప్రసిద్ధి చెందుటకు వారిచేత అంగీకరింపబడుటకు రహస్యముగా కోరుకొనవచ్చు. బహుశా అది ఒక ఉజ్జీవ కర్తగా లేక ఒక అసాధారణమైన బైబిలు బోధకునిగా ఎంచబడుటకు ఆశ కావచ్చును. లేక మనము బోధించుట ద్వారా ప్రజలు ఎప్పుడూ దీవించబడుచున్నారని ఇతరులు తెలుసుకోవాలని మనము కోరుకోవచ్చు. బహుశా ఒక సంస్థకో ఒక శాఖకో పర్యవేక్షకుడుగానో లేక నిర్ధేశకుడిగానో తెలియబడాలనే ఆశ కావచ్చును. అది ఏమైనప్పటికీ అటువంటి వాంఛలు యేసు యొక్క ఆత్మకు విరోధముగా ఉన్నవి మరియు అటువంటి శరీరేచ్ఛలు మన హృదయాలలో ఉన్నందువలననే, దేవుడు తన పరిపూర్ణతను మనలోనికి ప్రవేశింపజేయకుండునట్లు మన ద్వారా ఇతరులకు ప్రవహింపజేయకుండునట్లు ఆటంకపరచబడుచున్నాడు.

ఈ రోజున అనేక క్రైస్తవ గుంపులలో ప్రజాదరణ కొరకు ఒక ప్రమాద కరమైన వ్యామోహము ఉన్నది అనునది ఒక విషాదకరమైన వాస్తవము మరియు ఇది మనకున్న అతి కొద్ది ఆత్మీయతను చావు దెబ్బ కొట్టింది. ఈ వ్యాధి ఎంత విస్తృతమైనదంటే మనము నిరంతరము మెలకువగా నుండి దానిని పోరాడని యెడల మనకు తెలియకుండానే అంటువ్యాధి వలె అది మనకు సోకవచ్చును.

మన రోజుల్లో క్రైస్తవ నాయకులు బోధకులు లోకమునకు మురికిగాను చెత్తగాను ఉండిన పౌలువలె లేరు (1కొరిందీ¸ 4:13). వారు ఎక్కువగా సినీతారలవలె వి.ఐ.పి.లు (ప్రముఖులు) వలె ఉన్నారు. వారిని గూర్చి వ్రాయబడును, వారి ఫోటోలు తీయబడును, వారు ఆకాశమునకు ఎత్తబడుదురు, మహిమపరచబడుదురు. దారుణమైన విషయమేమిటంటే, కృపను బట్టి అన్నీ పొందినవారిలో అనేకులు ఇటువంటి వాటిని ఇష్టపడుదురు. ఇతరులు మన గురించి మన పరిచర్య గురించి ప్రచారము చేయుటను మనము నిరోధించలేమన్నది నిజమే కాని అటువంటి ప్రాచుర్యము పొందుటకు ఎటువంటి రహస్య కోరిక నుండియైనను దేవుడు మనలను విడుదల చేయునుగాక! ఇతరుల కొరకు నీళ్ళుపోయు సేవకుడుగా తప్ప ఇంకా ఏవిధముగానైనను పిలువబడుటకు ఉన్న ఆశనుండి మనము విడుదల పొందుదుము గాక!

యేసు తానే ప్రజాదరణను త్యజించెను. ఆయన రోజులలో ప్రజలు ఆయనను రాజుగా చేయాలనుకొన్నప్పుడు ఆయన వారిని తప్పించుకొని తన తండ్రితో ఏకాంతముగా గడిపెను. ఆయన శిష్యుల అభినందనలను కోరుకోలేదు. ఈ భూమి మీద ఆయన వి.ఐ.పి గా (ప్రముఖుడుగా) ఉండాలనుకోలేదు (యోహాను 6:15). ఇక్కడ తండ్రి మహిమయొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ అయిన ఆయన మరుగైయుండి భూసంబంధమైన ప్రసిద్ధిని ఘనతను తృణీకరించెను. మానవ మాత్రులైన మనము దీనిని ఇంకెంత ఎక్కువగా చేయవలెను. ప్రభువు యొక్క నిజమైన సేవకుడు తన నాధుని యొక్క అడుగుజాడలలో ఇక్కడ నడచును.

ప్రజాదరణ కొరకు వ్యామోహము కాకుండా ఈ రోజున క్రైస్తవ ప్రపంచములో గణాంకాల కొరకు దురాశను కూడా నేను కనుగొనగలను. పాతకాలములో తన శతృవుల పుర్రెలను లెక్కపెట్టుకొనే కొందరు కొండజాతి ప్రజల వలే ప్రస్తుత దినములలో అనేక మంది సువార్తికులు తలలు, చేతులు నిర్ణయపత్రాలు లెక్కపెట్టే శరీరాశకు బానిసలుగా మారిరి. ఆ తరువాత వీరి ఈ సంఖ్యల గురించి (కుయుక్తితో) గొప్పలు చెప్పుకొందురు (అతిశయపడుదురు). అపవాది మనలో ఈ ఆశను చూచి దానిని వాడుకొనే మనలను తప్పుదారి పట్టించును.

నేను చెప్పేదానిని ఒక్క ఉదాహరణ వివరించును. భారతదేశములో ఒక చోట సువార్త కూటములు నిర్వహించబడినవి మరియు సువార్త ప్రకటించుటకు ఒక ప్రసిద్ధి గాంచిన సువార్తికుడు ఆహ్వానించబడెను. అనేకులు తమ చేతులెత్తి నిర్ణయ పత్రాలపై సంతకాలు చేసి ఈ గణాంకములకు దేశములో పలు భాగాలలో విస్తృత ప్రచారము ఇవ్వబడెను. మరియు వచ్చిన ''ఉజ్జీవము''ను బట్టి ప్రజలు దేవుని స్తుతించిరి. ఒక ఏడాది తరువాత ఈ ''రక్షింపబడినవారి'' యొక్క తదుపరి స్థితిని గూర్చి బాధ్యత గల వ్యక్తిని నేను కలుసుకొనుట జరిగినప్పుడు విషయాలు ఎలా ఉన్నవని నేను అడిగితిని. సంఘాలయొక్క స్థితిలో దాదాపు ఏ మార్పు లేదని తను దర్శించిన ప్రజలు చివరకున్న స్థితిలోనే ఉన్నట్టు కనిపించారని అతడు చెప్పెను. ఈ కూటములు జరుగుచుండగా ఒక ఉద్వేగపూరితమైన కదలిక ఉండెను అనుదానిలో సందేహము లేదు గాని, శాశ్వతమైన మార్పులేకుండెను. కొందరు ప్రజలైతే తమకు సువార్తను ప్రకటించుటకు అంత దూరమునుండి వచ్చిన ఆ బోధకునిని నిరుత్సాహపరచకుండుటకు తమ చేతులనెత్తినట్లుండిరి! ఇతరులు, ఆ ప్రసిద్ధిగాంచిన బోధకుని కూటాలలో రక్షింపబడినామని అతనితో చెప్పుట ద్వారా అతనితో సన్నిహిత సంబంధము ఏర్పరచుకోవచ్చను ఆశతో తమ చేతులనెత్తిరి! ఇతరులు కేవలము ఈ సువార్తికుని దగ్గరగా చూచుటకు ముందుకు వచ్చిరి. ఈ అద్భుతమైన ఉజ్జీవము యొక్క అసలైన కథ ఇదే మరియు ఇది వాస్తవము కల్పన కాదు.

సహోదర సహోదరీలారా, నేను పైకి కనిపించే సఫలత అను పిలిచే దానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణ. అనేకమందిని మోసగించుటకు అపవాది దీనిని వాడుకొనెను. దాదాపు ఎవరూ రక్షింపబడలేదు, దాదాపు ఎవరూ పరిశుద్ధులుగా మారలేదు, అయినప్పటికీ, ఆ సువార్తీకుడు మరియు ఆ నిర్వాహక సంఘమంతా కూడా ఆ ప్రదేశము ''దేవునికొరకు ఒక అద్భుతమైన విజయము'' ను బట్టి ఆనందించిరి! ఒకవేళ ఆ కూటములలో ఎవరూ చేతులెత్తకుండా నిర్ణయ పత్రాలమీద సంతకము చేయకుండినట్లయితే, ఆ బోధకుడు మరియు ఆ నిర్వాహక సంఘము బహుశా తమనుతాము తగ్గించుకొని ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిని వెదికి యుండెడివారు. అప్పుడు ఆత్మీయముగా విలువైనదేదైనా వారు సాధించియుండే వారు. కాని అపవాది పైకి కనిపించే సఫలతతో అందరినీ సంతోషపెట్టుట ద్వారా అది జరుగకుండా సమర్థవంతముగా నివారించెను. వారు విమోచింపబడక పోయిననూ వందలాది మంది అతని పట్టునుండి విమోచింపబడిరని అందరూ భావించునట్లు అతడు చేసెను.

విశ్వాసుల మధ్యకూడా పైకి కనిపించే ఉజ్జీవాలతో అపవాది అనేకులను మోసగించుచున్నాడు.ప్రజలు దైవపీఠము యొద్దకు వచ్చి దు:ఖించి, ఏడ్చుదురు గాని తమ చిత్తములను తమ జీవితాలను దేవునికి సమర్పించరు. మరి కొందరు బోధకుని యొద్దకు వచ్చి అతని వర్తమానములు వారికి ఎంత దీవెనకరముగా నుండెనో అని అతనితో చెప్పుదురు. వెస్లీ మరియు ఫిన్నీలవలె అతను కూడా ఒక ఉజ్జీవకర్తయని రహస్యముగా ఆనందించుచు ఆ బోధకుడు వెళ్లిపోవును! అతడు ఈ ''ఉజ్జీవము''ను గురించిన వార్తను ఇతరులు దేవుని స్తుతించుదురన్న నెపముతో వారితో పంచుకొనును, కాని దేవుడే అతనిని ఎలా వాడుకొనెనో ఇతరులకు తెలియజేయుటలోనే అతడు ఆసక్తి కలిగియున్నాడు. అతడు దేవునితో ఏకాంతముగా గడుపుటకు రహస్య స్థలమునకు వెళ్లి అతడు బోధించిన ఆత్మల విడుదల కొరకు అతడు ప్రార్థించునా? లేదు, వారు అప్పటికే విడుదల పొందిరని అతడు భావించును. గనుక, కూటములు అయిపోయిన తరువాత ప్రార్థించుట అతడు నిర్లక్ష్యము చేయును. అతడు ఆ ''ఉజ్జీవము''ను గూర్చి ప్రకటించుటలో తీరిక లేకున్నాడు.

ఈ విధముగా ఈ రోజున అనేకమంది క్రైస్తవ పరిచారకులు శత్రువు చేత మోసగింపబడుచున్నారు. అది వారు తమ సిద్ధాంతములో ఉదారవాదులైనందుకు కాదుగాని వారు చాటింపులను గణాంకములను ప్రేమించుట వలన జరుగుచున్నది. ఇటువంటి పరిస్థితులలో బోధకుల మరియు నిర్వాహక సంఘ సభ్యుల హృదయాలలో ప్రసిద్ధి కొరకు, ప్రాచుర్యము కొరకు ఉన్న ఆశను అపవాది చూచును గనుక అతడు విజయము సాధించును.

సువార్తికులు అనేక ఆత్మలను గెలుచువారిగా ఇతరులముందు తమకున్న పేరును నిలుపుకొనుటకు, నిర్వాహక సంఘ సభ్యులు తమ ప్రయాసలు బాగా ఫలించెనని ఇతరులు గ్రహించుటకు ఆశపడుదురని అపవాదికి తెలుసు. ఈ విధముగా అతడు తన పైశాచిక లక్ష్యాలను సాధించును. ఇక్కడ చెప్పబడినది గణాంకములలో అతిశయించే మిషను సంస్థలకును మన శాఖలకును సమానముగా వర్తించును.

దావీదు ఒకసారి తనకున్న సంఖ్యలను లెక్కపెట్టి వాటియందు అతిశయించినప్పుడు ఒప్పింపబడినట్టు, అటువంటి విషయాలలో మనము కూడా మన శరీరానుసారతను గూర్చి ఒప్పింపబడినట్లయితే బాగుండును (2సమూయేలు 24). కేవలము పైకి మాత్రమే కనబడువాటినన్నిటిలోనికి చూచుటకు ప్రభువు మనకు దృష్టిని ఇచ్చునుగాక. చాటింపు చేసే ప్రపంచపు ఆత్మనుండి ఆయన మనలను విడిపించును గాక, ఎందుకనగా అది దేవుని కార్యమును ఎప్పుడూ అంతముచేయును. మనము అటువంటి శరీరేచ్ఛల నుండియు దురాశలనుండియు విడుదల పొందకపోతే అపవాది మనలను ఏదోఒక విధముగా మోసము చేయుటలో సఫలమగునని మనము కనుగొనెదము.

బహిరంగముగా సాక్ష్యమిచ్చుట నా జీవితములో కష్టతరమైనవాటిలో ఒకటని నేను కనుగొన్నాను. ఒక ప్రసంగము చేయుట కంటే బహిరంగముగా ఒక సాక్ష్యము ఇచ్చుట ఎక్కువ కష్టమని నేను కనుగొన్నాను. ఒకరి జీవితమును గూర్చి లేక ఒకరి ప్రయాసలను గూర్చి సాక్ష్యమిచ్చునప్పుడు కొంత మహిమను అతడు తీసుకొనకుండా ఉండుట ఎంతో కష్టము.

మనలో ఎవరూ కూడా మహిమను ఘనతనంతటినీ లేక వాటిలో ఎక్కువ భాగమును తీసుకొనే ధైర్యము చేయరని నేను నిశ్చయముగా నమ్ముతాను. బహుశా మనము కేవలము 5 లేక 10 శాతము తీసుకొనెదమేమో. మనము పడిన ప్రయాస అంతటికి అది ఎక్కువ కమీషను (ప్రతిఫలము) కాదని మనము భావించుదుము!

దేవుని మహిమ మనలను విడిచివెళ్లి, ''ఈకాబోదు'' అని మన సంఘములలో అనేకమైన వాటిపైన వ్రాయబడినప్పుడు, మనము ఆశ్చర్యపడవలెనా?

దేవుని మహిమను ముట్టుకొంటే ఏమి జరుగుతుందోనని మనము భయపడవలెను. మన దేవుడు రోషముగల దేవుడు మరియు ఆయన తన మహిమను-దానిలో చిన్న శాతమైనను-ఎవరితోను పంచుకొనడు (యెషయా 42:8).

పౌలు ఒకసారి మూడవ ఆకాశమునకు కొనిపోబడెను కాని దానిని గూర్చి 14 ఏళ్లపాటు మౌనముగా నుండి, తన అపోస్తలత్వమును సమర్థించుకొనుటకే దానిని ప్రస్తావించెను-అప్పుడు కూడా ఏ వివరములను ఇవ్వలేదు (2కొరిందీ¸ 12:2).

దేవుని మహిమను చూచినవాడు మోషే మండుచున్న పొద యొద్ద చేసినట్టు సెరాపులు దేవుని సింహాసనము చుట్టూ చేసినట్టు తన ముఖమును ఎప్పుడు దాచుకొనును (నిర్గమకాండము 3:2; యెషయా 6:2). అతడు మనుష్యులకు కనబడాలని లేక తెలియబడాలని కోరుకొనడు. దేవునిని ఆయన మహిమంతటిలో చూచిన తరువాత ఆ మహిమను ముట్టుకొనుటకు అతడు భయపడును. అతడు తన ముఖమును నిరంతరము దాచుకొనును. ఖచ్చితముగా అవసరమైతే తప్ప అతడు తనను గూర్చిగాని తన పరిచర్యను గూర్చికాని మాట్లాడడు. దేవుని పట్ల తనకున్న అంకిత భావమును గూర్చి, తనకు కలిగిన అద్భుతమైన అనుభవాలను గూర్చి తాను చేసిన విలువైన త్యాగాలను గూర్చి (ఇది సాక్ష్యమను ముసుగులో ఉండును) ఒక బహిరంగ సభలోగాని లేక క్రైస్తవ పత్రికలోగాని మాట్లాడుటకు కలిగే శరీరాశను అతడు విడిచిపెట్టును (త్యజించును).

నేను క్రైస్తవ లోకములో కనుగొన్న మరొక వ్యాధి నాయకత్వపు పదవుల కొరకు ఉండే దురాశ. నేను నౌకాదళములో ఉన్నప్పుడు, పదోన్నతిని పొందుటకు ఇతరుల భుజాలమీద ఎక్కి, ప్రజలను అణగద్రొక్కుటకు జంకని కొందరిని నా చుట్టూ కనుగొంటిని. నేను సాయుధ దళాలను విడిచిపెట్టినప్పుడు వాటిని చివరిగా చూచాననుకొంటిని. కాని నేను మన దేశములోని క్రైస్తవ గుంపుల మధ్య తిరిగినప్పుడు, సరిగ్గా అటువంటి ప్రవర్తనను (పదవి కొరకు దురాశ మరియు దానికొరకు గొడవపడుట) ఇవాంజిలికల్‌ క్రైస్తవుల మధ్యకూడా చూచినప్పుడు నేను ఆశ్చర్యపడితిని మరియు దు:ఖపడితిని. కొంత మంది క్రైస్తవులు పర్యవేక్షకులుగా, పెద్దలుగా, కోశాధికారులుగా, క్రైస్తవ సంస్థల యొక్క కార్యనిర్వాహక సంఘాలలో సభ్యులుగా ఉండుటకు కుట్రలు పన్నుట ప్రచారాలు చేయుటను నేను కనుగొంటిని.

ఇదంతయు యేసు యొక్క ఆత్మకు విరుద్ధముగానున్నది. దేవుని మహిమను చూచిన వ్యక్తి, లోకములో లేక ఇవాంజిలికల్‌ గుంపుల మధ్య ప్రసిద్ధి పొందుటకు పోటీపడడు. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని అతడు గురి యొద్దకు పరిగెత్తుటలో తీరికలేకున్నాడు. అతడు కేవలము ఇతరులకు నీళ్లు పోయుటకు, నేలను ఊడ్చుటకు, భూమి మీద తన దేవుని మహిమపరచుటకు ఆశ కలిగి యున్నాడు.

మనుష్యుల దృష్టిలో గొప్పతనమంటే ఎల్లప్పుడూ దేవుని దృష్టిలో గొప్పతనముకాదని మనము గుర్తుంచుకోవలెను. ముప్పై ఏళ్లగా ఈ మతపరమైన లోకమును చూచిన తరువాత పరిశుద్ధత మరియు సంఘ నాయకత్వము ఎక్కువసారులు ఒకటే కాదని నిర్ధారించుకోవలసి వచ్చిందని ఎ.డబ్లూ.టోజర్‌ అనే దైవజనుడు ఒకసారి చెప్పెను. భారతదేశములో కూడా ఇది నిజమే. మన దేశములో పెద్ద వేదికలపై నిలబడు వారు మరియు క్రైస్తవ గుంపులలో ఉన్నత పదవులను కలిగియున్న వారు ఎక్కువసార్లు దేవుని గొప్ప పరిశుద్ధులు కాదు. దేవుని యొక్క అరుదైన ఆణిముత్యములు సాధారణముగా మన సంఘాలలో ఉన్న పేదవారి మధ్య ఎవరికీ తెలియని వారి మధ్య కనబడుదురు.

బాప్తిస్మమిచ్చు యోహాను ఉండినట్లే (లూకా 1:14) మన హృదయ వాంఛ ఆయన దృష్టిలో గొప్పగా ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. యోహాను దేవుని దృష్టిలో గొప్పగా ఉండుటకు ఒక కారణమున్నది. యోహాను స్వయంగా వ్యక్తము చేసిన విధంగా, జీవితములో అతని వాంఛ క్రీస్తు హెచ్చింపబడుట, అతను తగ్గింపబడుట (యోహాను 3:30). యేసుకు ప్రాముఖ్యత కలుగునట్లు అతడు నిరంతరము తెరమరుగై యుండాలని కోరుకొనెను.

అన్నిటిలోను క్రీస్తుకు ప్రాముఖ్యము కలుగవలెనని దేవుడు దృఢనిశ్చయము చేసుకొనెను (కొలస్సీ 1:18). క్రీస్తు మాత్రమే హెచ్చింపబడవలెను, మనము తెరమరుగై యుండవలెనని మనము దృఢనిశ్చయము చేసుకొన్న యెడల, అప్పుడు నిశ్చయముగా మన వెనుక దేవుని శక్తిని అధికారమును నిరంతరమూ కలిగియుండెదము.

ఇతరులకు తెలియక పోయినప్పటికీ, దేవునికి తెలిసిన ఇతర స్వార్థపూరితమైన లక్ష్యాలను ఉద్దేశ్యాలను మనము కలిగియున్నప్పుడు, దేవుడు తన పరిశుద్ధ నామమునకు కలిగియున్న నమ్మకత్వమును బట్టి తన శక్తిని మనకు అప్పగించలేడు (ఇవ్వలేడు).

సహోదర, సహోదరీలారా, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ఆత్మను కలిగియున్న స్త్రీ పురుషులతోనే దేవుడు తన నిజమైన సంఘమును కట్టగలడు. ప్రకటన గ్రంధము చాలా స్పష్టము చేసినట్లు, ఒక నిజమైన సంఘము కలదు మరియు ఒక అబద్ధపు సంఘము కలదు. ఒక యెరూషలేమున్నది, ఒక బబులోను ఉన్నది. యెరూషలేము తమ్మును తాము కనుమరుగు చేసుకున్న వారి చేత, దాసుని స్వభావము కలిగియున్న వారి చేత మాత్రమే కట్టబడగలదు, కాని బబులోనును ఎవరైనా కట్టవచ్చును. యెరూషలేము నిత్యత్వమంతా నిలుచును కాని బబులోను త్వరలోనే దేవుని చేత నాశనము చేయబడును (ప్రకటన 18:21).

బాబేలు గోపురము (బబులోను యొక్క ఆరంభము) ఎలా ఉనికిలోనికి వచ్చెనో మీకు గుర్తున్నది కదా. మనుష్యులు కలసి, ''పేరు సంపాదించుకొందము'' అని చెప్పుకొనిరి (ఆదికాండము 11:4). అనేక సంవత్సరాల తరువాత బబులోను యొక్క రాజు కూడా అదే విధముగా మాట్లాడెను, ''బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నేను కట్టించినది కాదా?'' (దానియేలు 4:30).

తన కొరకు పేరు తెచ్చుకొనుటకు మరియు మనుష్యుల దృష్టిలో తన్నుతాను హెచ్చించుకొనుటకు ఇటువంటి కోరికను కలిగిన ఏ విశ్వాసియైనను బబులోను ఆత్మను కలిగియున్నాడు మరియు తన ప్రయాసల ద్వారా అతను కట్టునది నిత్యత్వము వరకు నిలువదు. అయితే సహోదరులారా, ఇటువంటి ఆత్మ ఇవాంజిలికల్‌ గుంపులలో అత్యధిక స్థాయిలో కనబడుచున్నది.

లూసిఫరు ఇటువంటి ఆత్మనే కలిగియుండెను. దేవుడు తనకిచ్చిన స్థానముతో అతడు సంతృప్తి పడలేదు. అతడు ఇంకా పైకి వెళ్లాలనుకొని ఆ విధముగా తన అభిషేకమును పోగొట్టుకొనెను. ఒకప్పుడు అతడు అభిషేకమునొందిన కెరూబు, కాని చివరకు అతడు అపవాదిగా మారెను. ఈ విధముగా అభిషేకము పోగొట్టుకొనినది అతడొక్కడే కాదు.

దీనంతటికీి క్రీస్తు యొక్క ఆత్మ విరుద్ధముగా నున్నది. ఆయన దేవుడై యుండి కూడా, తన్ను తాను తగ్గించుకొని మన నిమిత్తము ఏమికాని వాడుగా తన్నుతాను చేసుకొనెను. ''ఇటువంటి మనస్సును మీరును కలిగియుండుడి'' అని బైబిలు చెప్పుచున్నది (ఫిలిప్పీ 2:5-8).

మనుష్యుల చేత యెరుగబడుటకు అంగీకరించబడుటకు ఉన్న ఆశయంతటిని దేవుడు మన హృదయాలనుండి పెరికివేయును గాక. మన పలుకుబడిని పెంచుకొనుటకును ఇవాంజిలికల్‌ గుంపులలో ప్రసిద్ధి చెందుటకును ప్రయత్నించుచు మనము తిరుగకుండా ఉండవలెను. ''అన్యదేశమైన భారతదేశమునుండి ఆత్మీయ విషయములో శ్రేష్టమైన వ్యక్తులుగా'' ఇతర దేశాలకు ఆహ్వానింపబడుటకు మనము ప్రయాసపడకుండా ఉండవలెను.

మనము యేసు వలె ఉండవలెనంటే, మనము సాధారణమైన జనముతో, సామాన్యమైన స్త్రీ పురుషులతో, యేసు గడిపినట్లు మన సమయమును గడుపుదుము. సమయమంతా ఇవాంజిలికల్‌ నాయకుల స్నేహమును మాత్రమే కోరుకొనుచు మనము తిరుగము.

పెద్దవాడిగా నటించకు. ముఖ్యులైన వారితో మంచి సంబంధాలు పెట్టుకొనుటకు ప్రయత్నించ వద్దు, సామాన్య జనము యొక్క సహచర్యమును (సహవాసమును) ఆనందించుము) (రోమా 12:16 లివింగు బైబిలు).

దేవుడు మనలను దీనులుగా చేయును గాక, సిలువ చెంత యుండుట అతి సురక్షితమైన ప్రదేశము.

ఆధిపత్యము ప్రదర్శించే వైఖరి

మన ప్రభువు సేవకునిగా ఉండెను కాని ఈ రోజున క్రైస్తవ నాయకులు మిషనరీలు తరచుగా యజమానులుగా, అయ్యగారులుగా ఉన్నారు. బహుశా ఇతరులు మనలను ''అయ్యగారు'' అని పిలువకుండా ఆపలేమేమో కాని, మన హృదయాలలో మనము ''అయ్యగార్ల''గా ఉండాలని కోరుచున్నామా అన్నది ప్రశ్న.

యేసు తన శిష్యులకు చాలా సహనముతో నేర్పించుటకు చూచిన పాఠమును మనము మరల నేర్చుకోవలసిన అవసరమున్నది. వారి పాదములు కడిగిన తరువాత, ''ఈ లోకములో రాజులు, గొప్పవారు తమ దాసులను ఆదేశించుదురు...కాని మీ మధ్య మిమ్మును శ్రైష్టమైన రీతిగా సేవించువాడే మీ నాయకుడు బయట లోకములో యజమానుడు బల్ల యొద్ద కూర్చుండి తన సేవకుల చేత సేవించబడును. కాని ఇక్కడ కాదు! ఎందుకనగా నేను మీ సేవకుడను'' అని వారితో చెప్పెను (లూకా 22:25-27 లివింగు బైబిలు). అయ్యో, ఈ మాటలు మనక్రింద ఉన్నవారి యెడల మనము ప్రదర్శించే ఆధిపత్య వైఖరిని గూర్చి మనలను ఎంతగా ఒప్పింపజేయవలెను. మన ప్రభువు యొక్క ఉదాహరణను బట్టి మనము ఎంత దీనులుగా చేయబడవలసియున్నది. బహుశా మనము ఇప్పటికీ ఆత్మ గౌరవమును గూర్చి, పరువును గూర్చి, జాతి ఆధిపత్యమును గూర్చి కలిగియున్న అబద్ధపు లోకానుసారమైన ఆలోచనలను మననుండి తీసివేయునుగాక. దేవుని రాజ్యములో గొప్పతనమునకు నిజమైన గుర్తు ఒక సేవకునిగా ఉండుటయేననియు, యేసు ఉన్నట్టు ఒక నీళ్లు పోయువానిగా యుండుటయేననియు ఆయన మనకు క్రొత్తగా నేర్పించును గాక.

ఇప్పుడు మాత్రమే కాక మన జీవితాంతము వరకు మనము తక్కువ స్థానమును తీసుకొనుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక! మనము భావించినప్పటికీ, మన తోటి సహోదరుల నుండి ఘనతను, సన్మానమును, విధేయతను ఏ సమయమందైనను మనము ఆశింపక ఉండవలెను. మనము వయస్సులో, అనుభవములో పెద్దవారిమైనప్పటికీ, మన సంఘము యొక్క నిర్వాహకవ్యవస్థలో మన అధికారక స్థానము వారి స్థానము కంటే ఎక్కువైనప్పటికీ, వారి పట్ల మన వైఖరిలో వారు యజమానులనియు మనము సేవకులమనియు మనము ఎల్లప్పుడు గుర్తించుదుము గాక. మనము పైకి వెళ్లిన కొలదీ, ఇతరులను సేవించుటకు మన బాధ్యతకూడా పెరుగును.

దీనికి సంబంధించి 2 కొరిందీ¸ 4:6 చాలా సవాలు చేసే వచనము. అక్కడ పౌలు మాటలను వివరించాలంటే అవి ఇలా ఉండును.

''మేము రెండు సంగతులను బోధించుచున్నాము: మా పెదవులతో క్రీస్తు యేసును ప్రభువుగా ప్రకటిస్తున్నాము. మా జీవితాలతో యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము''.

సహోదర సహోదరీలారా, ఇదే మన రెండింతల వర్తమానము మరియు దేవుడు జతపరిచిన వాటిని మనుష్యుడు వేరుపరచకుండవలెను. ఇదే సంపూర్ణ సువార్త. మనము దీనిలో సగమునే ప్రకటించే తప్పు చేయకుందుము గాక, ఎందుకనగా ఈ వర్తమానము పూర్తిగా ప్రకటించినప్పుడు మాత్రమే, అన్యులు మనలో క్రీస్తు ప్రతిష్టింపబడుటను చూచెదరు. ఈ రోజున మన దేశములో దీని కొరతే ప్రభువు పనిని చాలా మట్టుకు ఆటంకపరచుచున్నది.

మనము సేవకులుగా ఉండవలెనంటే, మనము యధార్థముగా దీనులమై యుండవలెను. మనము వినమ్రతను దీనత్వమని తప్పుగా అనుకోకూడదు. స్వార్థపరులైన రాజకీయ నాయకులు కూడా దానిని కలిగియుందురు. మనము గొప్పవారిమన్న గర్వముతో కూడిన అభిప్రాయమును మన హృదయాలలో కలిగియుండి, ఆ తరువాత తక్కువ వారితో సహవాసము చేయుటకు నమ్రత కలిగి, అదే దీనత్వమని పొరబడవచ్చును. లేదు, అది ఎంత మాత్రం దీనత్వము కాదు.

నిజమైన దీనత్వము అనేది దేవుని దృష్టిలో నాకు మరియు ఇతరులకు మధ్య ఎటువంటి బేధము లేదన్నది గుర్తించుట. నాకు ఇతరులకు మధ్యనున్న సహజమైన వైవిధ్యాలన్నియు పరిస్థితుల వలన మరియు పరిసరాల కారణాలు మొదలగు వాటివలన కలుగజేయబడినవి. ఇవన్నియు సిలువయొద్ద నిర్మూలించబడినవి. యేసుని సిలువ మనందరిని శూన్యము చేయును. ఇది నా జీవితములో జరుగని యెడల, ఫిలిప్పీ 2:3 మనలను ఆజ్ఞాపించినట్టు, నేను ఇతరులను నాకంటే యోగ్యులని యెంచుట మొదలుపెట్టలేదని ఇది సూచించుచున్నది. ఒకసారి మనము ఏమీ కానివారిగా చేయబడిన యెడల, మనము ఆనందముగా ఇష్టముగా తక్కువ స్థానము తీసుకొనుట సులభమగును. అప్పుడు దేవుడు తన పూర్ణ ఉద్దేశ్యమును మన ద్వారా నెరవేర్చుట కూడా సులువగును.

మోషే (40 ఏళ్ల వయసులో) దేవుని ప్రజల యొక్క నాయకుడిగా ఉండబోవుదునని భావించినంత కాలము దేవుడు అతనిని వాడుకోలేకపోయెను (అపొ.కా. 7:25). దేవుడు అతనిని అరణ్య ప్రదేశములోనికి మరొక 40 ఏళ్లపాటు తీసుకొనివెళ్లి విరుగగొట్టవలసి వచ్చెను. చివరకు మోషే, ''ప్రభువా, ఈ పనికి నేను తగినవాడను కాను. నేను అర్హతలేని వాడిని. నేను మాట్లాడలేను కూడా (అతడు నిజముగా తన మనసులోని మాట చెప్పెను; అటువంటి మాటలను చెప్పు కొందరివలె అది నకిలీ దీనత్వము కాదు)'' అని చెప్పవలసిన పరిస్థితి వచ్చెను. మోషే తన సహజ శక్తినంతటిని పోగొట్టుకొనిన తరువాత మాత్రమే దేవుడతనిని వాడుకోగలిగెను. 40 ఏళ్ల వయస్సులో, తన స్వంత శక్తితో మోషే చేయగలిగినదంతా ఒక ఐగుప్తీయుని ఇసుక క్రింద పాతిపెట్టుట మాత్రమే. దేవుడు అతడిని విరుగగొట్టిన తరువాత ఐగుప్తు సైన్యమంతటిని అతడు ఎఱ్ఱ సముద్రములో పాతిపెట్టెను. విరుగగొట్టబడుట యొక్క ఫలితము ఇలా ఉండును.

ప్రభువు అయిదు రొట్టెలను తీసుకొని వాటిని దీవిస్తే సరిపోదు. జనసమూహము ముందు అవి విరువబడవలెను. ఈ ప్రక్రియ మన జీవితాలలో నిరంతరము జరుగుచుండవలెను. దేవుడు మనలను పట్టుకొని దీవించి, విరుగగొట్టి వాడుకొనును. మనము అనేకమంది ఆకలి తీర్చుటకు వాడుకోబడినాము గనుక మనము హెచ్చింపబడుటకు అవకాశమున్నది. కాబట్టి ఆయన మనలను మరల పట్టుకొని విరుగగొట్టవలెను. ఈ ప్రక్రియ జీవితకాలమంతయు కొనసాగును.

ఈ విరుగగొట్టబడిన స్థితిని మనము ఎంతగా ఆశించవలెను. ఒక చిన్న అణువు విరుగగొట్టబడినప్పుడు, ఎంత శక్తి విడుదలగును! మన సంఘాలలో ఉన్న నాయకులు మరియు వారి సంఘస్తులు దేవుని చేత విరుగగొట్టబడిన యెడల మన దేశములో ఎంత శక్తి విడుదలగును.

ఒక విలక్షణమైన(ప్రత్యేకపరచు) గుర్తు

నిజమైన వాటిగా చాలా మట్టుకు కనబడే అబద్ధపు సంగతులున్న ఈ నకిలీ చేయబడే దినాలలో, ఒక నిజమైన దేవుని సేవకుని యొక్క పొరబడరాని విలక్షణమైన గుర్తు ఏమిటని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకొంటిని.

అది అద్భుతము చేయు శక్తియా? కాదు. దయ్యమలు అద్భుతములు చేయగలవు. అది అన్యభాషలలో మాట్లాడే సామర్థ్యమా? లేదు. దయ్యములు దానికి కూడా నకలు (డూప్లికేటు) చేయగలవు. ప్రధానముగా వీటిలో ఏవియూ కాదు.

యేసు యొక్క ఒక నిజమైన శిష్యుని గుర్తు సిలువకు సంబంధించిన ఆత్మయేనన్న నిర్ధారణకు నేను వచ్చితిని. తన జీవితములో సిలువను అంగీకరించిన వాడే ప్రభువు యొక్క నిజమైన సేవకుడు. ఈ సిలువ అతని ఆత్మ గౌరవమును, ఆత్మ విశ్వాసమును, స్వీయ-కేంద్రీకృత స్వభావమును (తనకు తానే కేంద్రముగా ఉండుట) అతనికి సంబంధించిన వాటినన్నిటిని వధించి, అతనిని ఏమి కాని వానిగా చేసియున్నది. తన్నుతానే సేవించుకొనుచున్న వానిని ప్రభువుని నిజముగా సేవించుచున్న వానినుండి ఈ ఒక్క స్పష్టమైన గుర్తు ద్వారా మాత్రమే మనము వేరుపరచగలము. ఇతర ఆధారాలన్నియు మోసకరమైనవిగా ఉండవచ్చును. మన వంటి వారినే మనము పునరుత్పత్తి చేయుదుము.

మనవంటి వారినే మనము తయారుచేయుదము

ఈ రోజున మనము మన సంఘాలలో ఇబ్బంది పెట్టే ప్రజలచేత, గర్వించు పెద్దలచేత, పెత్తనము చేసే పరిచారకుల చేత ఇబ్బంది పెట్టబడుచున్నామా? సంవత్సరాల తరబడి మనము విత్తిన దాని ఫలమునే మనము కోయుచున్నాము మరియు ఖచ్చితముగా మనవంటి వారినే మనము పునరుత్పత్తి చేయుచున్నాము. మన హృదయాలలో మనము కలిగియుండిన (ఇప్పటికీ కలిగియున్న) గర్వము మరియు పెద్దరికము ప్రదర్శించు తత్వము మన ఆత్మీయ సంతానముయొక్క జీవితాలలో ఇప్పుడు స్పష్టముగా కనబడుచున్నవి. ఇది మనలను ఆశ్చర్యపరచకూడదు గదా?

కాబట్టి మనము, ''ప్రభువా, మాకు ఉజ్జీవము పంపించు'' అని మొరపెట్టినప్పుడు, మనకు వచ్చు ప్రభువు యొక్క వాక్కు ఏదనగా,

''నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి..ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని....వారి దేశమును స్వస్థపరచుదును'' (2 దినవృత్తాంతములు 7:14).

మన దేశమునకు స్వస్థత ఎంత అవసరము. దేవుడు ఉజ్జీవమును ఆలస్యము చేయుచున్నాడని మనము అనకూడదు. సహోదరులారా, ఆటంకము మనలోనే ఉన్నది.

దేవుడు మన మధ్య సేవకులుగా ఉండుటకును, నీళ్లు పోయువారిగా ఉండుటకు సిద్ధముగా ఉన్నవారిని కనుగొనును గాక.

అధ్యాయము 4
ఒక అభిషేకింపబడిన మనుష్యుడు

''మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, ఒంటి మీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి- ఏలీయా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను. యెరికో దగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి- ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి'' (2రాజులు 2:13-15).

ప్రవక్తల శిష్యులు అమాయక ప్రజలు కాదు. వారు లేఖనములను ధ్యానించిరి మరియు మంచి బైబిలు జ్ఞానమును కలిగియుండిరి. కనుక ఒక అభిషేకింపబడిన వ్యక్తిగా ఉండుట అంటే ఏమిటో వారు ఎరిగియుండిరి. ఎలీషా నిజముగా అటువంటి వ్యక్తి అని వారు గుర్తించిరి. దేవుని ఆత్మ అతనిపై నిలిచియుండెనని వారు గుర్తించిరి.

ఎలీషా బోధించిన ఒక కదలించే ప్రసంగమును వినుట ద్వారా లేక తన అనుభవమును గూర్చి అతడిచ్చిన బ్రహ్మాండమైన సాక్ష్యమును వినుట ద్వారా వారు ఈ వాస్తవమును గుర్తించలేదు. అతని జీవితములో ఉన్నశక్తిని చూచినప్పుడు, ఏలీయా విడగొట్టినట్లు అతడు యొర్దానును విడగొట్టుటను చూచినప్పుడు, అతడు నిజముగా అభిషేకించబడెనని వారు నిర్థారించుకొనిరి.

మనము దేవునికి చేయు పరిచర్యలో మనము దేవుని చిత్తమంతటిని నెరవేర్చగోరిన యెడల పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఖచ్చితముగా అవసరము. దేవుని ఆత్మ మనలో నివసించుట సరిపోదు. ఆయన మన మీద శక్తితో నిలిచియుండుటను మనము ఎరిగియుండవలెను. యేసు సహితము తన భూసంబంధమైన పరిచర్యను నెరవేర్చుటకు వెళ్లేముందు అభిషేకింపబడవలసిన అవసరముండెను (మత్తయి 3:16, అపొ.కా. 10:38).

ప్రభువు కొరకు మన పరిచర్య కేవలము మనకు అమెరికాలో సరైన పరిచయాలు ఉండుటవలన, సువార్తను ప్రకటించుటకు మన జీతగాళ్లయిన సువార్తికులకు ఇచ్చుటకు చాలినంత డబ్బుఉన్నందు వలన కొనసాగితే, మన సమయాన్ని మనము వృథా చేసికొనుచున్నాము. వాస్తవానికి, మన పరిచర్యకు ఏదైనా భూసంబంధమైన వివరణ ఉన్నయెడల, మన క్రైస్తవ పరిచర్యను మానుకొని ఏదైన లౌకిక వృత్తిని చేపట్టుట మంచిది, ఎందుకనగా మన ప్రయాసలు దేవుని రాజ్యము కొరకు దేనిని సాధించలేవు. మన పరిచర్యకు ఎటువంటి స్వభావము ఉండవలెనంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కాక అది కొనసాగుటకు వేరే ఏ వివరణ ఉండకూడదు. ఈ రకమైన పరిచర్య మాత్రమే దేవునికి అంగీకారమైనది.

ఈ రోజున విశ్వాసుల మధ్య పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క నిజమైన ఆధారమును గురించి చాలా గందరగోళము ఉన్నది. కాని ఎలీషా జీవితములో ఈ సంఘటన నుండి అభిషేకము యొక్క పొరబడరాని ఆధారము శక్తియని స్పష్టముగా నున్నది. ఇతర ఆధారాలు తప్పుదోవ పట్టించవచ్చును గాని ఇది అలా చేయదు.

మనము వాగ్దాటిని, ఉద్వేగభరితమైన అతిశయమును, ఉత్సాహమును లేక సందడిని అభిషేకమునకు ఆధారాలుగా పొరబడకూడదు. లేదు, వీటిలో ఏదియూ కాదు, శక్తి మాత్రమే. యేసు స్వయంగా అభిషేకించబడినప్పుడు పొందినది శక్తినే (అపొ.కా. 10:38). ఆయన శిష్యులు అభిషేకింపబడినప్పుడు వారు పొందునది శక్తియని యేసు వారితో చెప్పెను:

''పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందుదురు'' (అపొ.కా. 1:8).

దీనికంటే స్పష్టముగా ఉండుట సాధ్యమా? భాషలు కాదు, ఉద్రేకము కాదు. కాని శక్తియే.

భాషలు మాట్లాడుటను పరిశుద్ధాత్మ శక్తియని పొరబడుచున్న కొరింథులోనున్న క్రైస్తవులకు పౌలు వ్రాసినప్పుడు,

''నేను మీ మధ్యకు వచ్చినప్పుడు, నేను కేవలము మీ సాక్ష్యాలను మీ సందేశాలను (అవి తెలిసియున్న బాషలలోనైనా తెలియకున్న బాషలోనైనా) వినను, కాని మీ జీవితాలలో నిజమైన శక్తి యున్నదా లేదా యని చూచెదను. ఎందుకనగా దేవుని అధికారము (పరిశుద్ధాత్మ) కేవలము మాటలలో కాక శక్తిలో ప్రత్యక్షమగును'' అని చెప్పెను (1కొరిందీ¸ 4:19,20-వివరణ).

కాబట్టి సహోదర సహోదరీలారా, మనము బాగా మాట్లాడగలము లేక చెప్పుటకు మనము ఒక అద్భుతమైన సాక్ష్యమును కలిగియున్నాము అనే దానితో మనము సంతృప్తిపడకూడదు. మనలను మనము ప్రశ్నించుకోవలసినది ఏమిటంటే: మనము ఆత్మీయ శక్తిని కలిగియున్నామా లేదా? బాగా సిద్ధపడిన ప్రసంగములు అభిషేకమునకు ప్రత్యామ్నాయము కాదు. ఒక చైతన్యవంతమైన వ్యక్తిత్వము గాని ఒక బ్రహ్మాండమైన సాక్ష్యముగాని ఆత్మీయ శక్తికి ఎటువంటి ప్రత్యామ్నాయము కాదు.

వైజ్ఞానిక పురోగతి ఉన్న రోజుల్లో పరిశుద్ధాత్మ మీదకాక ఎలక్ట్రానిక్‌ పరికరాల మీద యంత్రాల మీద వివిధ రకాలైన దృశ్యశ్రవణ ఉపకరణాల మీద ఆధారపడుట చాలా సులభము. సువార్త వ్యాప్తి కొరకు వైజ్ఞానిక ఆవిష్కరణలను వాడగలిగిన చోట, మనము తప్పకుండా వాటిని వాడుకోవచ్చు. కాని మనము తెలియకుండానే పరిశుద్దాత్మ మీద కాక ఈ భౌతికమైన వాటిమీద ఆధారపడెదమేమో అని మనము జాగ్రత్తపడవలెను.

మనము దేనిమీద ఆధారపడుచున్నామో తెలుసుకొనుట చాలా సులభము. మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడుచుంటే, అప్పుడు మనము ప్రార్థనలో, దేవుని యొద్దకు మరల మరల వెళ్లి (ఆయనలేకుండా) మన పూర్తి నిస్సహాయతను ఒప్పుకొనెదము. మనము అలా చేయుచున్నామా? మన మనస్సాక్షులను నెమ్మది పరచుకొనుటకు ''ప్రార్థన'' అనే ప్రక్రియ ద్వారా మనము వెళ్లుచున్నామా లేదాయని నేను అడుగుటలేదు. నేను అనేది ఏమిటంటే: మనము దేవునిపై ఆనుకొని ఆయన మనలను పిలిచిన పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ మనమీద నిలిచియున్నదని ఖచ్చితముగా తెలుసుకొనే వరకు ఆయన సన్నిధిని (అవసరమైతే ఉపవాసముతో) ఆసక్తితో అపేక్షించుచున్నామా? (వెదకుచున్నామా?) మరియు ఇది ఎప్పటికీ సరిపోయే ఒక్కసారి జరుగు అనుభవము కాదు!!

పరికరాల మీద ఆధారపడకపోతే మన ఆధారము డబ్బుమీద ఉండవచ్చును. మన దేశములో ఉన్న ఒక ఇవాంజిలిక్‌ గుంపులో, ఆ గుంపు కొరకు ఎవరు ఎక్కువ మొత్తములో నిధులు సమకూర్చగలరని వారి పనివారి మధ్య ఒక పోటీ ఉన్నదని నేను వింటిని. ఒక క్రైస్తవ సంస్థ ఆ స్థాయికి దిగజారిపోయినప్పుడు,వారి పరిచర్యలో తప్పనిసరివైన వాటిగా వేటిని ఎంచుదురో స్పష్టమగుచున్నది. వారు నిజముగా దేనిమీద ఆధారపడుచున్నారో ఇది వెల్లడి చేస్తున్నది. డబ్బు వారికి నిజముగా ప్రాముఖ్యమైనది, కాబట్టి బహిరంగ సభలలో ప్రజలకు బోధించే ముందు వారు డబ్బుకొరకు ప్రజలను అడుక్కొని బతిమాలుకొందురు. ఎంత సిగ్గుచేటు! యేసు అలా చేయుట ఎవరైనా ఊహించగలరా? అయినప్పటికీ ఆయన ప్రతినిధులమని వారు చెప్పుకొందురు.

అటువంటి వారు డబ్బు అడుక్కొనుచూ గడిపే సమయములో సగమైనా పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు దేవునికి మొరపెట్టుటకు గడిపిన యెడల, వారి ప్రయాసల ద్వారా అపరిమితమైనవి నెరవేర్చబడును.

మన ఆధారము డబ్బు మీదనా లేక పరిశుద్ధాత్మ అభిషేకము మీదనా అని పరీక్షించుటకు ఒక ప్రశ్నను నేను సూచిస్తాను.

మన మద్దతుదారులు తమ ఆర్థిక మద్దతును ఆపివేసినప్పుడు మనము వ్యాకులపడునంతగా దేవుడు మన జీవితాలనుండి అభిషేకమును తీసివేస్తే వ్యాకులపడుదుమా?

అయ్యో, దేవుని అభిషేకము మనపై ఉన్నదా లేదా అని చూచుకొనుటకంటే మన నెలసరి జీతమును పూర్తిగా పొందితిమా లేదా అని చూచుకొనుటకు మనము తరచూ ఎక్కువ ఆతురపడుదుము. ఇది ఎందువలన? ఎందుకనగా క్రైస్తవ పరిచర్య అభిషేకము లేకపోయినా కొనసాగును గాని డబ్బులేకుండా కొనసాగదు అని మనము భావించుదుము. మనము అలా చెప్పినా చెప్పకపోయినా, మన క్రియలు మన అంతరంగ తలంపులను వెల్లడిపరచును.

ఆది సంఘముతో మనలను మనము పోల్చుకొన్నప్పుడు, మనము ఏమి చూచెదము? సువార్తను ప్రకటించుటకు వారు ఎలక్ట్రానిక్‌ పరికరాలను కలిగియుండలేదు, వారి ఆర్థికపరమైన మద్ధతు నిచ్చుటకు ధనికులైన వ్యాపారవేత్తలను వారు కలిగియుండలేదు మరియు సమాజములో వారు అంగీకరింపబడలేదు. అయినప్పటికీ, అత్యవసరమైన ఆ ఒక్కదానిని వారు కలిగియుండిరి, (అది లేకుండా మిగతాదంతయూ విలువలేనిది) గనుక వారు దేవుని కొరకు గొప్ప వాటిని సాధించిరి. వారు పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగియుండిరి. కాబట్టి మనము తరచూ విఫలమయ్యే చోట వారు విజయము సాధించిరి.

పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఈ రోజున క్రైస్తవ సంఘమునకు క్రైస్తవ నాయకులకు ఉన్న అతి మిక్కిలి అవసరము. అనేకులు అతిశయపడే తృప్తిపడే చవకైన నకిలీ అభిషేకమును గూర్చి నేను మాట్లాడుటలేదు కాని, శక్తిని తెచ్చే నిజమైన అభిషేకమును గూర్చి నేను మాట్లాడుచున్నాను.

దేవుని కార్యము-ఆయన నిజమైన కార్యము- పాత కాలములో జరిగినట్లే, ఎలక్ట్రానిక్‌ శక్తి వలన లేక ఆర్థిక బలము వలన చేయబడదు కాని ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన చేయబడును (జెకర్యా 4:6).

వివేచన

ఈ రోజులలో సాతాను క్రైస్తవ పరిచారకులను మోసగించుటకు ప్రయత్నించే కొన్ని కుటిలమైన మార్గములను నేను ఇప్పటికే పేర్కొంటిని. మన ప్రభువు యొక్క రాకడ దగ్గర పడుచుండగా అతని మోసములు ఎక్కువగుచుండునట్లుగా కనబడుచున్నవి. ఇటువంటి రోజులలో మనము ప్రత్యేకముగా క్రైస్తవ సంఘములో నాయకత్వపు పదవులలో ఉన్నవారు, నిజముగా దేవుని యొద్దనుండి వచ్చినదానిని అలా కానిదాని నుండి, నిజమైన దానిని నకిలీ దానినుండి, మన రోజులలో దేవుడు తన సంఘము పట్ల కలిగియున్న ఉన్నతమైన ఉద్దేశ్యము ఏదో తెలిసికొనుటకు వివేచన వరమును కలిగియుండుట ఎంత అవసరము.

కాని వివేచన మరియు ఆత్మీయదృష్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారానే రాగలవు. అవి మానవ తెలివితేటల ద్వారా లేక జ్ఞానము ద్వారా లేక శిక్షణ సంస్థల యొక్క తర్ఫీదు ద్వారా రావు. ఈ సంగతులను జ్ఞానులకును వివేకులకును మరుగుచేసి, పసిబాలురకు, అనగా నిస్సహాయతలో ఆయన మీద ఆధారపడి, ''ప్రభువా, మేము అనేక విషయాలలో తెలివిగలవారమైనప్పటికీ, ఆత్మీయ విషయాలలో మేము మూర్ఖులము'' అని అంగీకరించే వారికి బయలు పరచుట తండ్రి అబీష్టమాయెను.

యిర్మీయా, తన రోజులలో, యెషీయా యూదాకు రాజైయుండగా జరిగిన పైపై ఉజ్జీవమును కనిపెట్టే వివేచనను కలిగియుండి, దేవుడు తన ప్రజలను బబులోనుకు పంపించునని ప్రవచించెను. దేవుడు తన ప్రజలను బబులోను చెరలోనికి పంపుటకు నిజమైన కారణములను యెహెజ్కేలు చూచెను. వారి రోజులలో ఉన్న ఇతర వృత్తిపరమైన బోధకులు చూడలేని వాటిని వారు చూడగలుగుటకు కారణము ఇదే: యిర్మీయా మరియు యెహెజ్కేలు దేవుని అభిషేకమును వారిపై కలిగియుండిరి.

బహుకొద్ది మినహాయింపులతో, ఈ రోజున ఎక్కువ సంఘాలలో పరిస్థితులు బబులోను చెరలో ఉన్న దేవుని ప్రజల మధ్య ప్రబలిన పరిస్థితులకు ఖచ్చితముగా సమానముగా ఉన్నవి. ఇటువంటి రోజులలో మనకు ఆత్మీయదృష్టి కలిగిన మనుష్యులు కావలెను మరియు దేవుని ప్రజల మధ్యనున్న నాయకులు ఈ కీలకమైన గడియలో ఆత్మీయదృష్టిని కలిగియుండకపోతే, ప్రజలు అతి నిశ్చయముగా విచ్చిన్నమగుదురు (సామెతలు 29:18).

పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మనకు ఎంత తప్పనిసరిగా కావలెను. ఈరోజున ప్రభువు యొక్క ద్రాక్షాతోటలో మన పరిచర్య కొరకు ఇది అత్యున్నతమైన ఆవశ్యకత.

యేసుని నామము

ఏలీయా దుప్పటితో ఎలీషా యొర్దాను జలములను కొట్టెనని మనము చదివెదము. ఇక్కడ మనము ఏలీయాను పరలోకమునకు కొనిపోబడిన క్రీస్తుకు సాదృశ్యముగా మరియు ఎలీషాను క్రీస్తు పరిచర్యను కొనసాగించుటకు భూమి మీద ఉంచబడిన సంఘమునకు సాదృశ్యముగా పరిగణించిన యెడల అప్పుడు ఏలీయా యొక్క దుప్పటి ప్రభువగు యేసు క్రీస్తు తన సంఘమునకు అప్పగించిన తన నామమునకు సాదృశ్యముగా నున్నది. యొర్దాను నది గుండా ఒక మార్గమును ఏర్పరచుటకు ఎలీషా ఆ దుప్పటిని వాడినట్లే, మనము మార్గమునుండి అవరోధాలను తీసివేయుటకు తన నామమును వాడుటకు యేసు మనకు అధికారము ఇచ్చెను.

అయితే దానిని ఒక మంత్రకట్టు వలే జపించిన యెడల సరిపోదు. అనేకులు ఆయన నామమును ఈ విధముగా వాడుదురు గాని ఏమి జరుగదు. శక్తి ప్రత్యక్షపరచబడదు. దారికి అడ్డముగానుండు పర్వతము తొలగిపోదు.

గెహాజీ ఒకసారి ఎలీషా దండమును తీసుకొని ఎలీషా ఆదేశాల మేరకు, ఒక మృతుడైన బాలుని పైన దానిని ఉంచెను. అతడు ఆ సమయములో ప్రమాణికమైన విధముగా బిగ్గర స్వరముతో ''అబ్రాహాము ఇస్సాకు యాకోబు యొక్క దేవుని నామమున, మృతులలోనుండి లెమ్ము'' అని చెప్పియుండవచ్చును. కాని ఏమి జరుగలేదు.

ఒక మనిషి చెప్పే మాటలను మాత్రమే దేవుడాలకించడు. ఆయన అతని హృదయాన్ని చూచును. మాటలయొక్క శక్తి ఏ రకమైన వ్యక్తి వాటిని వాడునో అనుదాని మీద ఆధారపడియుండును. గెహాజీ హృదయము దేవుని మహిమ మీదకాక లోకము మీద, వ్యక్తిగత లాభముమీద ఉండెనని దేవుడు ఎరిగియుండెను.

ఎలీషా హృదయము భిన్నముగా నుండెను. అతడు దేవుని మహిమను మాత్రమే కోరుకొనెను గనుక దేవుడు తన అధికారమును అతనికి ఇవ్వగలిగెను. కాబట్టి ఎలీషా ప్రార్థించినప్పుడు, ఆ మృతుడైన బాలుడు వెంటనే లేచెను. అతడు దుప్పటితో యొర్దాను జలములను కొట్టినప్పుడు అవి రెండుగా విడిపోయెను.

యేసు నామమును వాడి దానిని జపించే వారిని (కొన్నిసార్లు వారి స్వరమంతటితో) నేను కలుసుకొంటిని గాని ఏమి జరుగదు. వారు కర్మేలు పర్వతముపైన అరచి కేకలు పెట్టిన బయలు ప్రవక్తలను తలపింపచేయుదురు. దేవుని రాజ్యము కేవలము మాటల ద్వారా (అవి ఎంత బిగ్గరగా లేక ప్రామాణికముగా పలుకబడినను) కాక, శక్తి ద్వారా బయలుపరచబడును. ఒకవేళ ఎలీషా అభిషేకింపబడిన వ్యక్తి కానియెడల, అతడు ఆ దుప్పటితో ఆ జలములను ఎంత గట్టిగా కొట్టినను, ఏమియు జరిగియుండేది కాదు. అది కేవలము సమయమును శక్తిని వృథా చేసినట్లుగా ఉండును! మనము యేసు నామమును నిజమైన శక్తితో ఉపయోగించాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నిజముగా అవసరమైయున్నది.

అపొస్త్తలుల కార్యములు 3వ అధ్యాయములో, పేతురు యేసు నామమును వాడుట కనుగొనెదము; మరియు దేవుని శక్తి ప్రత్యక్షపరచబడెను. ఆ కుంటివాడు నడచుట మొదలుపెట్టెను. అది ఎంత స్పష్టమైన అద్భుతమంటే ఎవరూ ఆ వ్యక్తి యొక్క వైద్య నివేదికలను (మెడికల్‌ రిపోర్టులను) ప్రజలకు చూపించవలసిన అవసరము రాలేదు. ఆ అద్భుతములో అస్పష్టమైనది గాని మరుగైనదిగాని ఏమియు లేదు. ఈ రోజులలో కొంతమంది స్వస్థపరచువారు చేయు ''అద్భుతముల'' విషయములో తరచూ ఉన్నట్లు ఒక అద్భుతము నిజముగా జరిగెనా లేదాయని ఎవరి మనస్సులోను సందేహము లేకుండెను!

అపొస్తలుల కార్యములంతటిలో కూడా వారు దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చు మార్గములో అడ్డువచ్చిన ప్రతి అవరోధమును తీసివేయుటకు శిష్యులు యేసు నామమును మరల మరల ఉపయోగించుటను మనము కనుగొనెదము. వారు అభిషేకమును నిజముగా ఎరిగియుండిరి మరియు ఈ కారణము చేతనే, అపోస్తలుల కార్యములు ''ఏ ఆటంకమును లేక'' అను మాటలతో ముగియును. ఇటువంటి శక్తివంతమైన సంఘమునకు వ్యతిరేకముగా పాతాళలోక ద్వారములు నిలువలేకపోయెను.

పునరుత్థాన శక్తి

ఎలీషా యొర్దానును విడగొట్టుట ఆత్మీయ మరణముపై జయము సాధించే జీవమునకు కారణమగు పరిచర్యకు సాదృశ్యముగా నున్నది. బైబిలులో యొర్దాను జలములు మరణమునకు సాదృశ్యముగా నున్నవి. కాబట్టి ఆ జలములను విడగొట్టుట మరణముపైన విజయమునకు సాదృశ్యముగా నున్నది.

ఎలీషా యొక్క పరిచర్యలో, ఈ సమయమునుండి, అతడు మరల మరల మరణములోనుండి జీవమును తెచ్చుటలో నిమగ్నమైనట్టు మనము కనుగొనెదము. యెరికోలో, అక్కడున్న బీడు భూమికి అతడు జీవము తెచ్చెను. షూనేములో, ఒక స్త్రీ యొక్క కనని గర్భమునకు అతడు జీవము తెచ్చెను. ఆ తరువాత అతడు ఒక మృతుడైన బాలునిలోనికి జీవమును తెచ్చెను. ఒక కుష్టురోగియైన సైన్యాధికారి యొక్క చనిపోనున్న దేహమునకు కూడా అతడు జీవమును తెచ్చెను.

ఎలీషా యొక్క శక్తి ఎన్నడు తగ్గిపోలేదు. అతడు మరణించి, పాతిపెట్టబడి అతని దేహము విచ్చిన్నమైపోయిన తరువాత కూడా, ఒక మృతుడైన వ్యక్తి అతని సమాధిలోకి పడవేయబడినప్పుడు, ఆ మృతుడైన వ్యక్తి తిరిగి లేచెను! ఇదే ఎలీషా పరిచర్య-అతడు ఎక్కడికి వెళ్లినను మరణమునుండి జీవమును తెచ్చుట. ఇది అతడు అభిషేకింపబడుట యొక్క ప్రత్యక్ష ఫలితము.

పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఇటువంటి రకమైన శక్తిని తెచ్చును-మరణము నుండి జీవమును తెచ్చు శక్తి, అనగా పునరుత్థ్థాన శక్తి ఇది మాత్రమే అభిషేకము యొక్క పొరబడరాని ఆధారము. ఈ శక్తిని గురించి మనము క్రొత్త నిబంధనలో తరచు చదివెదము. పౌలు ఎఫెసులో ఉన్న క్రైస్తవులకు వ్రాయుచు, వారు ఈశక్తిని ఎరుగుదురని వారికొరకు అతడు ప్రార్థన చేయుచున్నాడని చెప్పెను. దేవుని శక్తి యొక్క అతిగొప్ప ప్రత్యక్షత సృష్టిలో లేక బైబిలులో నమోదు చేయబడిన అద్భుతములలో కాక క్రీస్తును మృతులలోనుండి లేపుటలో ఉన్నదని వారికి ఇంకా తెలియజేసెను (ఎఫెసీ 1:19-23). ఫిలిప్పీ క్రైస్తవులకు వ్రాయుచు, ఈ పునరుత్థాన శక్తిని మరింత తెలిసికొనుట తన స్వంత ఆశగా నున్నదని వారితో పౌలు చెప్పెను (ఫిలిప్పీ 3:10).

పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చునప్పుడు వారు పొందే శక్తి ఇదేనని యేసు తన శిష్యులకు చెప్పెనని నేను ఒప్పించబడ్డాను (అపొ.కా. 1:8). ఇది పునరుత్థాన శక్తి. ఆత్మీయ మరణము నుండి జీవమును తెచ్చు శక్తి. దీనిని మనకు కూడా ఇవ్వాలని దేవుడు కోరుకొనుచున్నాడు.

సహోదర, సహోదరీలారా, ఇదే అభిషేకమునకు గుర్తు. ఏదో ఒక అనుభవమో, ఏదో ఒక ఉచ్చరణయో కాదు గాని, మనము ఎక్కడికి వెళ్లినను మరణమునుండి ఆత్మీయ జీవమును తెచ్చుట. మన పరిచర్య దీనిని సాధిస్తున్నదా? మనకు అభిషేకము ఉన్నదో లేదో తెలిసికొనుటకు ఇది ఆత్మ పరీక్ష (అతి తీవ్రమైన పరీక్ష)యై యున్నది.

అయ్యో, క్రైస్తవులు అనేకసార్లు తమ పరిచర్య ద్వారా జీవమునకు బదులు మరణమును తెచ్చుచున్నారు. తాము తిరిగి జన్మించిన క్రైస్తవులమని చెప్పుకొనేవారిలో కలహాలు, కొట్లాటలు, చిత్తశుద్ధి లేకపోవుట మరియు క్రీస్తుకు వ్యతిరేకమైన ఇతర అలవాట్లను చూచుటవలన మన దేశములోని అన్యులు ప్రభువు యొద్దకు ఆకర్షింపబడుటకు బదులు ఆయన యొద్దనుండి తరిమివేయ బడుచున్నారు. మన ప్రవర్తన ద్వారా ఆయన నామమునకు నిందను తీసుకొని వచ్చినందుకు మనలను మనము ఎంతగా తగ్గించుకొని, ఆయన క్షమాపణ అడుగవలసియున్నది.

మనము కేవలము ''ఇవాంజిలికల్‌'' గుంపునకు చెందిన వారిమన్న వాస్తవములో మనము అతిశయింపకూడదు. మనము జాగ్రత్తగా లేకుంటే, జీవించుచున్నామని పేరును కలిగియుండి వాస్తవానికి మృతులముగా, సార్దీసులో ఉన్న సంఘమువలె చివరకు తయారగుదుము (ప్రకటన 3:1).

మనము చెప్పు సందేశము మనము సంతకము చేయు ధర్మ ప్రకటన (మనము నమ్మువాటితో కూడియున్న పత్రము) లేఖనానుసారముగా ఉంటే సరిపోదు. మనము ముఖ్యమైన సిద్ధాంతపరమైన ధర్మ ప్రకటన పైన సంతకము చేయవచ్చును. అపవాది కూడా అది చేయగలడు! అతనికి బైబిలు బాగా తెలుసు మరియు అతడు నవ్యతావాది కాదు. సిద్ధాంతపరముగా అతడు చాంధసవాదియే! కాబట్టి కేవలము మన మతవాదానికి మనము ఘనత పొందుటలో ఏ ఉపయోగము లేదు.

సిద్ధాంతములు ముఖ్యమైనవి. నేను వాటి విలువను తగ్గించుట నాకు దూరమగును గాక. కాని సిద్ధాంతము కంటే దేవునికి ముఖ్యమైనదేమిటంటే మనము మన పరిచర్య ద్వారా ఆత్మీయ(దేవుని) జీవమును తెచ్చుచున్నామా లేదాయని.

దేవుని సహాయముతో, తన పరిచర్య ద్వారా ఆత్మీయ(దేవుని) జీవమును తెచ్చు క్రొత్తనిబంధన పరిచారకునిగా తాను ఉండగలిగెనని అపొస్త్తలుడైన పౌలు చెప్పగలిగెను (2 కొరిందీ¸ 3:5,6). అతడు ఒక మతవాదియైనందుకు అతడు అతిశయపడలేదు. అతడు కేవలము తన అనుభవాల గురించి మాట్లాడలేదు. అది దమస్కుకు వెళ్లు దారిపైన అనుభవము కావచ్చును లేక తిన్ననిదను వీధిలో అనుభవము కావచ్చును. తన ప్రాథమిక నమ్మకాల యొక్క మరియు తన ఆత్మీయ అనుభవాల యొక్క వాస్తవికతను ఆత్మీయ మరణముండిన పరిస్థితులలోకి, జీవమును నిరంతరము తెచ్చుట ద్వారా ప్రదర్శించెను.

ఎలీషా జీవితములో వలే, పౌలు జీవితములో కూడా, శక్తి తగ్గిపోవుట అనేది లేకుండెను. మన రోజుల్లో అనేకమంది దేవుని సేవకులకైనట్లు, తరువాతి సంవత్సరాలలో అభిషేకము పోగొట్టుకొనుట అనేది లేకుండెను. దేవుడు గత దినాలలో చేసిన దానిని బట్టి మాత్రమే వారు అతిశయించే దశకు పౌలు మరియు ఎలీషా ఎన్నడూ రాలేదు. వారు అన్ని సమయాలలో అభిషేకమును దేవుని శక్తిని వర్తమానములో ఆనందించుచూ జీవించిరి. వారి ఆత్మీయ బలము తగ్గుటకు బదులు, ఇంకా ఇంకా ఎక్కువగా పెరిగెను. వారి దినములున్నట్లే వారి బలము కూడా ఉండెను. పట్టపగలు వరకు వారి వెలుగు ఇంకా ఇంకా తేజరిల్లెను. ఇలా జీవించుట ఎంత ధన్యము! అయితే దేవుడు తన పిల్లలందరు నడవాలని కోరుకొనే మార్గము ఇదే (సామెతలు 4:18).

ఎలీషా దేవునితో నిరంతరము సంబంధము కలిగియుండెను గనుక అతడు ఎక్కడికి వెళ్లినను మరణమునుండి జీవమును తీసుకురాగలిగెను. కాబట్టి ప్రజలు తమ సమస్యలతో తమ అవసరాలతో ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన ఒక పరిచర్య కొరకు వెతుక్కుంటు వెళ్లవలసి రాలేదు. తనను పోషించమని మరియు ఆహ్వానించమని ప్రజలను అడుగుచు అతడు తిరుగలేదు. లేదు. అతడు శరీరానుసారమైన ప్రయత్నములు చేయకుండానే అతనికి పరిచర్య కొరకు అవకాశములు సమృద్ధిగా వచ్చెను.

బాప్తీస్మమిచ్చు యోహాను విషయములో కూడా అలాగే యుండెను. యెరూషలేము నుండియు, యూదయ రాష్ట్రమంతటినుండియు, యొర్దాను చుట్టు ప్రక్కలున్న ప్రాంతాలన్నిటి నుండియు ప్రజలు అతడు చెప్పేది వినుటకు సుదూర ప్రయాణములను చేసిరి-అతడు తననుతాను ప్రకటించుకోనప్పటికీ ఒక అద్భుతము కూడా చేయనప్పటికీ ఇలా జరిగెను.

ఈ వ్యక్తులు అభిషేకింపబడిరి మరియు ఆ అభిషేకము క్రింద నిరంతరము ఉండిరి. అదే రహస్యము. ఇంకేదియు కాదు.

కాని ఆత్మ యొక్క అభిషేకము ఎంత ప్రాముఖ్యమైనదైతే, దేవుడు దానిని తన బిడ్డలందరికి ఎందుకు ఇవ్వడు? దానికి కారణము కేవలము ఇదే, వారిలో బహు కొద్ది మంది మాత్రమే దానిని పొందుటకు వెల చెల్లించుటకు సిద్ధముగా నున్నారు.

ఎలీషా అభిషేకింపబడుటకు కారణములుండెను, నేను కనీసము మూడింటిని పరిగణలోనికి తీసుకోగలను.

దాహము

ఎలీషా అభిషేకము కొరకు దప్పిక కలిగియుండెనన్న నిజమును ఎవరు సందేహింపలేరు. లోకములో ఇంకా దేనికంటే కూడా ఎక్కువగా అతడు దానిని కోరుకొనెను.

2రాజులు 2:1-10లో, ఈ విషయములో ఏలియా అతనిని ఎలా పరీక్షించెనో మనము చదివెదము. అతడు ఇంకా ముందుకు వెళ్లుచూ ఎలీషాను మొదటిగా గిల్గాలులో ఉండిపొమ్మని చెప్పెను. కాని ఎలీషా ఏలీయాను విడిచిపెట్టుటకు నిరాకరించెను. తరువాత ఏలియా అతనిని 15 మైళ్లు పడమర నున్న బేతేలునకు, ఆ తరువాత 12 మైళ్లు వెనకనున్న యెరికోకు, ఆ తరువాత 5 మైళ్లు తూర్పునున్న యొర్ధానునకు నడిపించి, ప్రతి దశలో ఎలీషాయొక్క పట్టుదలను ఆసక్తిని పరీక్షించెను. చివరిగా, అతడు వెళ్లిపోయేముందు అతడు మంజూరు (దయ) చేయగలిగిన అభ్యర్థనేదైన ఉన్నదాయని ఎలీషాను అడిగెను.

''నాకు ఒక్కటే కావలెను. అందుచేతనే నేను ఈ సమయమంతా నిన్ను వెంబడించితిని. అందుచేతనే నీవు నన్ను వదిలించుకోవాలనుకున్నా నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్లు నాకు కావలెను'' అని ఎలీషా చెప్పెను.

ఎలీషా తన హృదయమంతటితో అభిషేకమును కాంక్షించెను. దానికంటే తక్కువైన దానితో అతడు సంతృప్తి చెందేవాడు కాదు. అతడు అడిగిన దానిని అతడు పొందెను.

మనము, ఆయన పరిశుద్ధాత్మ యొక్క పూర్ణ అభిషేకము కంటే తక్కువైన దేనితోనైనా సంతృప్తి పడుదమా అని పరీక్షించుటకు ఏలియా ఎలీషాను నడిపించినట్లు దేవుడు మనలను అనేకసార్లు నడిపించును. మనము దానికంటే తక్కువైన దానితో తృప్తి పడినయెడల, మనము అంతమట్టుకే కలిగియుందుము. అది లేకపోయినా బాగానే ఉండగలను అనుకొనే ఆత్మ సంతృప్తి చెందే అల్ప సంతోషియైన విశ్వాసికి దేవుడు ఈ అభిషేకమును ఇవ్వడు.

కాని అన్నింటికంటే ఎక్కువగా మనకు అవసరమైనది ఇదేనని మనము గ్రహించిన యెడల, దానిని మనము పొందేవరకు ఎలీషా వలె వెంబడించుటకు మనము సిద్ధపడిన యెడల, పెనూయేలు యొద్ద యాకోబు చెప్పినట్లు

''ప్రభువా ఈ ఆశీర్వాదముతో నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడచిపెట్టను''

అని మనము చెప్పిన యెడల, మనము నిజముగా పరిశుద్ధాత్మ యొక్క ఈ శక్తిని పునరుత్థాన శక్తిని ఆశించి బలముగా కోరుకొన్న యెడల, అప్పుడు మనము దానిని నిజముగా పొందెదము. అప్పుడు మనము దేవునితోను మనుష్యుల తోను ప్రభావము గలిగిన నిజమైన ''ఇశ్రాయేలు''గా ఉండెదము.

మనకు ఈ అభిషేకము ఎంత అవసరమో చూపించుటకు దేవుడు మన జీవితాలలోకి అపజయమును, వైరాగ్యమును (ఆశాభంగమును) అనుమతించును. మన సిద్ధాంతములో మనము ఇవాంజిలికల్‌ గుంపుకు చెందిన వారమైనప్పటికీ, పరిశుద్ధాత్మ మనలో వసించినప్పటికీ పరిశుద్ధాత్మ మన మీద శక్తితో నిలిచియుండుటను మనము ఎరిగియుండవలెనని మనము గ్రహించునట్లు ఆయన ఆశించును.

అభిషేకమును కలిగియుండుట సులువైన విషయము కాదు. ఏలియా ఎలీషా విజ్ఞప్తిని విన్నప్పుడు, ''ఓ, నీవడిగినది సులువైనదే. నీవు ఇక్కడ మోకరించుము, నేను నీ తలమీద నా చేతులుంచినప్పుడు నీవు దానిని పొందెదవు'' అని చెప్పలేదు. లేదు. ''నీవు అడిగినది కష్టతరముగా నున్నది'' అని ఏలియా ఎలీషాతో చెప్పెను. అవును, అది కష్టతరమైనదే. దాని కొరకు మనము ఒక వెల చెల్లించవలెను. దాని కొరకు మనము లోకములో ఉన్నవన్నియు విడిచిపెట్టుటకు సిద్ధముగా నుండవలెను.

మనము ఈ అభిషేకమును భూమిమీద నున్న అన్నింటికంటే ఎక్కువగా ఆశించవలెను-డబ్బు, సుఖము, భోగము కంటే ఎక్కువగా ప్రసిద్ధి, ప్రజాదరణ కంటే ఎక్కువగా క్రైస్తవ పరిచర్యలో సఫలత కంటే కూడా ఎక్కువగా ఆశించవలెను. అవును. అది నిజముగా కష్టతరమైనదే కాని దప్పిగొనుట అంటే ఇదే. మనము ఆ స్థాయికి చేరుకొన్నప్పుడు, మనము యేసు యొద్దకు వెళ్లి త్రాగవచ్చును, మరియు లేఖనము చెప్పినట్లు, మన ద్వారా జీవజల నదులు అనేక దిక్కులలో ప్రవహించి, అవి ప్రవహించిన ప్రదేశములన్నిటిలో మరణము నుండి జీవమును తెచ్చును (యోహాను 7:37-39, యెహెజ్కేలు 47:8,9).

మనము అభిషేకమును పొందినయెడల, ఏమైనా సరే దానిని పోగొట్టుకొనకుండా ఉండుటకు జాగ్రత్త పడవలెను. మనము జాగ్రత్తగా లేకుంటే, మనము దానిని కలిగియుండి కూడా పోగొట్టుకొనవచ్చును. మనము దయలేని విమర్శలు చేసి, హద్దులు లేని సంభాషణలో పాల్గొని, అపవిత్రపు తలంపులను తలచి, మన హృదయాలలో గర్వమునకు లేక పగకు ఆశ్రయమును ఇచ్చినయెడల, అభిషేకము తొలగిపోవును.

ఇతరులకు ప్రకటించిన తరువాత తానే భ్రష్టుడనైపోదునేమో అని తన శరీర అవయవములను కరిÄనముగా క్రమశిక్షణలో పెట్టుకొన్నానని అపొస్త్తలుడైన పౌలు 1కొరిందీ¸ 9:27లో చెప్పెను. ఈ గొప్ప అపొస్త్తలుడైన పౌలు అనేక సంఘములను స్థాపించిన తరువాత, అనేక అద్భుతములును చేసిన తరువాత, దేవుని చేత ఎంతో బలముగా వాడుకోబడిన తరువాత కూడా, తన శరీర అవయవాలతో జాగ్రత్తగా లేనియెడల దేవుని చేత అనర్హుడిగా ప్రకటించబడే ప్రమాదములో ఉండెనను విషయమును బట్టి నేను ఆశ్చర్యపడుట ఎన్నడు మానలేదు. అలా అయితే మన పరిస్థితి ఏమిటి?

మనము నిరంతరము, ''ప్రభువా, జీవితములో నేను ఏమి పోగొట్టు కొనిననూ, నీ అభిషేకమును ఎన్నడూ పోగొట్టుకొనకుండా ఉండనిమ్ము'' అని ప్రార్థించవలెను.

పవిత్రమైన ఉద్దేశ్యము

ఎలీషా అభిషేకింపబడుటకు రెండవ కారణము అతని ఉద్దేశ్యములు పవిత్రముగా నుండుట. అతడు దేవుని మహిమ గురించి మాత్రమే చింతించెను. ఇది మాటలలో ఎక్కడా చెప్పబడలేదు గాని, ఒకరు అతని జీవితమును గూర్చి భాగములను చదివినప్పుడు, ఇది చాలా స్పష్టముగా కనిపించును. దేవుని ప్రజల మధ్య అవసరము గొప్పగా ఉండెను మరియు దేవుని నామముపైన వచ్చిన నింద అతనికి ముందున్న ఏలీయాను బాధించినట్లే అతనిని బాధించెను. ఆ ఘనమైన నామముపైన ఉన్న నిందను తొలగించే పరిచర్యను ఆ దేశములో దేవుని కొరకు నెరవేర్చుటకు అతడు అభిషేకింపబడుటకు కాంక్షించెను.

దేవుని బిడ్డలు అభిషేకింపబడకుండుటకు అపవిత్రమైన స్వార్థపూరితమైన ఉద్దేశ్యములే తరచుగా కారణమగును. ఎక్కువ మంది క్రైస్తవులు వారు బయటకు సరిగా ఉంటే సంతోషపడుదురు, కాని దేవుడు అంతరంగములలో సత్యము కోరుచున్నాడు. మనము ఆయన మహిమను గూర్చి చింతించుచున్నామా, మన మహిమను గూర్చి చింతించుచున్నామా అని ఆయన చూచును. ఆయన నామము పైనున్న నింద మనలను బాధించుచున్నదా లేదాయని ఆయన చూచుచున్నాడు. ఈ రోజున మన దేశములో దేవుని నామము నిందించబడుటకు మనము చూచినప్పుడు మన హృదయాలు భారముతో నింపబడి బాధపడనట్లైతే, దేవుడు మనలను ఎప్పటికైననూ అభిషేకించునా అని నేను భావించెదను.

యెహెజ్కేలు 9:1-6లో, దేవుడు కొంత మంది ప్రజలను తనకు చెందిన ప్రత్యేకమైన ప్రజలుగా ముద్రవేయుటను గూర్చి మనము చదివెదము. ఆయన ముద్రించినవారు దేవుని ప్రజల మధ్య వారు చూచిన పాపములను బట్టి దు:ఖించి నిట్టూర్చిన వారు. వీరు దేవుని శేషమైయున్నారు మరియు ఆయన అభిషేకించునది ఇట్టివారినే. ఆయన నామము గురించి వారి హృదయాలు చింతించును మరియు వారు ఆయనను మాత్రమే ఘనపరచగోరుదురు.

ఈ లోకమును ప్రేమింపకుండుట

ఎలీషా అభిషేకింపబడుటకు మూడవ కారణము అతడు ఈ లోకము కొరకు ఎటువంటి ప్రేమను కలిగియుండలేదు. నయమానుతో అతడు వ్యవహరించిన రీతిలో ఇది స్పష్టమగుచున్నది. నయమాను అతనికి డబ్బు యిచ్చినప్పుడు అతను చేసిన అద్భుతము కొరకు ఎటువంటి చెల్లింపును తీసుకొనుటకు అతడు నిరాకరించెను. ఈ లోకము కొరకు గాని డబ్బుకొరకు గాని ఎలీషా ఎటువంటి ప్రేమను కలిగియుండలేదు. ప్రభువు యొక్క పరిచర్యలో అతడు వ్యక్తిగత లాభము చూసుకోలేదు.

మరోప్రక్క గెహాజీ మన దృష్టిలో ఒక ఆశ్చర్యకరమైన వ్యత్యాసముగా ఉన్నాడు. ఎలీషా ఏలియా సహాయకునిగా ఉన్నట్లే అతడు ఎలీషాకు సహాయకునిగా ఉండెను. ఏలియా ఆత్మలో రెండు పాళ్లను ఎలీషా పొంది, ఏలియా పరిచర్యను ఎలీషా కొనసాగించగలిగితే గెహాజీ కూడా నిశ్చయముగా ఎలీషా ఆత్మను పొంది ఎలీషా పరిచర్యను కొనసాగించగలిగి యుండవచ్చును. కాని అతడు అభిషేకమును పొందలేదు. దానిబదులు అతడు కుష్ఠువ్యాధిని పొందెను. ఎందుకని? ఎందుకంటే దేవుడు అతని హృదయాన్ని చూచెను. బయటకు ఆత్మీయుడుగా కనిపించినప్పటికి గెహాజీ హృదయము యొక్క లోతులలో వ్యక్తిగత లాభము కొరకు ఒక కోరిక ఉండెను. అతడు మొదట్లో యదార్థముగా ప్రభువు పరిచర్యలోకి వచ్చియుండవచ్చును. కాని త్వరలోనే అతడు భౌతికపరమైన ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించడము మొదలుపెట్టెను. అతడు భౌతికపరమైన సంపదను కూర్చుకొనుటతో పాటు అభిషేకమును కూడా పొందవచ్చని తలంచెను కాని అతడు పొరబడెను. అనేక క్రైస్తవ పరిచారకులు అదే పొరపాటును చేసిరి.

ఏ సంఘములోనైనా లేక క్రైస్తవ సంస్థలోనైనా మన పదవిని గాని లేక మన పరిచర్యను గాని వ్యక్తిగత లాభముకొరకు వాడుకొనుటకు ప్రయత్నించుట నుండి ప్రభువు మనలను విడుదల చేయును గాక.

ఈ రోజుల్లో క్రైస్తవ పరిచర్యల్లో నుండుట ఎంతో లాభకరమైనదిగా ఉండుటను గమనించినట్లు ఒక అవిశ్వాసి నాకొకసారి చెప్పెను. లౌకికపరమైన వృత్తిలో నున్నప్పుడు ధనికునిగా లేనటువంటి ఒక క్రైస్తవ పరిచారకుని ఉదాహరణను అతడు చెప్పెను. కాని ఇప్పుడు అతనికి సమృద్ధిగా ఉండెను. అమెరికా నుండి అతడు ఎంతో డబ్బును పొందుచుండెను. తన కొరకు అతడు ఒక పెద్ద ఇంటిని కట్టుకొని ఇప్పుడు విలాసముగా జీవించుచుండెను. ఇదంతయు కాక తనను తాను ఇవాంజిలికల్‌ గుంపుకు చెందిన వానిగా పరిగణించుకొనెను. నిశ్చయముగా అటువంటి వారు దేవునిని ఎంత మాత్రము సేవించుటలేదు.

సహోదరులారా, క్రైస్తవ పరిచర్య మనకు భౌతికమైన లాభాన్ని తీసుకువచ్చినప్పుడు మన జీవితాలను పరీక్షించుకొనిన మనము నిజముగా యేసుని వెంబడించుచున్నామా లేదా యని చూచుకొనవలెను. మనము వెంబడించుటలేదని సాధారణముగా కనుగొనెదము.

మనము దేవునికొరకు వెళ్లినప్పుడు వెల చెల్లించవలసి రానియెడల త్యాగము చేయవలసి రానియెడల, మన పిలుపు నిజముగా దేవుని యొద్దనుండి వచ్చెనా లేదా అని మనము తీవ్రముగా ప్రశ్నించుకొనవలెనని వాచ్‌మన్‌ నీ అనే దైవజనుడు చెప్పెను.

లోకము కొరకు దాని భోగములు, సుఖములు,సంపద కొరకు మన హృదయాలలో ప్రేమ యున్నదా యని మనలను మనము ప్రశ్నించుకొనెదము. అలా ఉంటే దేవుడు మనలను అభిషేకించలేడు.

ఒక విజయవంతమైన శేషము

ఈ రోజున మన దేశములో దేవుడు తన ఆత్మతో అభిషేకింపగలిగిన స్త్రీ పురుషుల కొరకు చూచుచున్నాడు. అట్టివారు ఆ శక్తితో నింపబడుటకును మరియు నిత్యము నింపబడుతు ఉండుటకును చెల్లించవలసిన వెలను చెల్లించుటకు సిద్ధముగా నున్న శేషము.

ఈ రోజున యొర్ధాను జలములు చీకటి శక్తులయొక్క క్రియల ద్వారా మన దేశమును క్రమ్ముచున్నటువంటి ఆత్మీయ మరణమునకు సాదృశ్యముగా నున్నవి. వీటి గుండా వెళ్లి మరణమునుండి జీవమును తెచ్చే విజయవంతమైన శేషము కొరకు చూచుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు నామమును ఉపయోగించి శత్రువు యొక్క బలగాలను తరిమికొట్టి ప్రతి అవరోధము గుండా ఆటంకము లేకుండా వెళ్లే ప్రజల కొరకు చూచుచున్నాడు. ప్రతి యొర్ధాను గుండా మార్గమును కలుగజేసి ఈ దేశములో మన దేవుని కొరకు రాజమార్గమును సరాళము చేయు ప్రజల కొరకు చూచుచున్నాడు. అప్పుడు మనము ఎదురుచూచుచున్న ఉజ్జీవమును మన సంఘాలలో చూచెదము మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడని అన్యులు తెలుసుకొందురు.

ఈ అభిషేకము మాత్రమే మన దేశములో శత్రువు కాడిని విరుగగొట్టగలదు (యెషయా 10:27). యేసు నామము ఇవ్వబడెను కాని మనము అభిషేకమును కలిగియున్నామా?
మనము దేవుని మహిమ పరచునట్లు ఆయన చిత్తమును నెరవేర్చునట్లు ఆయన రాజ్యమును తీసుకువచ్చునట్లు మన జీవితములోను మన పరిచర్యలోను పరిశుద్ధాత్మ యొక్క శక్తికొరకు మనము దాహము కలిగియుందుము గాక.

పరిశుద్ధులైన దీనులైన అభిషేకింపబడిన దైవజనులుగా ఉండుటకు చెల్లించవలసిన వెలను చెల్లించుటకు సిద్ధముగా నున్న అనేకులను ఆయన మన మధ్య కనుగొనును గాక! ఆమేన్‌.

అధ్యాయము 5
ఒక ప్రార్థన

ఈ ధ్యానములను నేను ఎ.డబ్లు.టోజరు అనే దైవజనుడు వ్రాసిన ప్రార్థనతో తగిన విధముగా ముగించెదను. నేను ఇతనిని 20వ శతాబ్దములో ఉన్న కొద్ది మంది ప్రవక్తలలో ఒకనిగా పరిగణిస్తాను. ఇది ''ఒక చిన్న ప్రవక్త యొక్క ప్రార్థన'' అను శీర్షికతో ఉన్నది:

 1. ''ఓ ప్రభువా, నేను నీ స్వరము విని భయపడితిని. ఒక తీవ్రమైన ప్రమాదకర ఘడియలో నీవు నన్ను ఒక భక్తి పూర్వకమైన విధికి నన్ను పిలచితివి. నిశ్చలమైనవి నిలిచియుండునట్లు నీవు భూమిని ఆకాశమును రాజ్యములన్నింటిని చలించజేయ బోవుచున్నావు. ఓ దేవా, మా దేవా, నీ సేవకునిగా ఉండుటకు నీవు నన్ను ఘనపరచితివి. ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై యీ ఘనత పొందును. తమ హృదయాలలో మొండివారైయుండి వినుటకు మందులైన వారికి నన్ను నీ దూతగా నియమించితివి. వారు యజమానినైన నిన్ను తృణీకరించిరి, సేవకుడినైన నన్ను వారు స్వీకరించుదురని ఆశించలేము''.
 2. నా దేవా, నా బలహీనతను ఈ పనికి నా అసమర్థతను గ్రహించుచు సమయమును వృథా చేయను. ఈ బాధ్యత నాది కాదు, నీదే.
 3. ''నిన్ను యెరిగితిని - నిన్ను నియమించితిని - నిన్ను ప్రతిష్టించితిని'' అని నీవు చెప్పితివి, ''నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతు లన్నియు చెప్పవలెను'' అని కూడా చెప్పితివి. నీతో వాదించుటకు లేక నీ సార్వభౌమ ఎంపికను ప్రశ్నించుటకు నేనెవరిని? ఈ నిర్ణయము నాది కాదు నీదే. అలాగే, ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక!
 4. ప్రవక్తలకును, అపోస్తలులకును దేవుడువైన వాడా, నేను నిన్ను ఘనపరచినంత వరకు నీవు నన్ను ఘనపరచెదవని నాకు బాగా తెలియును. కాబట్టి నా భావి జీవితములోను ప్రయాసలలోను, నష్టమైనను, లాభమైనను, జీవము ద్వారాయైనను, మరణము ద్వారాయైనను, నిన్ను ఘనపరచుదునన్న గంభీరమైన ప్రతిజ్ఞను తీసుకొనుటకును, నేను జీవించినంతకాలము ఆ ప్రతిష్టను మీరకుండా ఉండుటకు నాకు సహాయము చేయుము.
 5. దేవా, శత్రువు నీ మేత స్థలములలోనికి ప్రవేశించెను మరియు నీ గొఱ్ఱెలు కొనిపోబడి చెదరగొట్టబడియున్నవి గనుక నీవు పని చేయవలసిన సమయము వచ్చియున్నది. ప్రమాదము లేదని చెప్పి నీ మంద చుట్టూ ఉన్న అపాయములను చూచి నవ్వే అబద్ధ కాపరులు సమృద్ధిగా ఉన్నారు. తోడేలు చంపుటకును నాశనము చేయుటకును దగ్గరగా వచ్చుచుండగా ఈ గొఱ్ఱెలు ఈ జీతగాళ్ల చేత మోసగింపబడి వారిని నమ్మకముగా వెంబడించును. శత్రువు యొక్క ఉనికిని గుర్తించుటకు తీక్షణమైన కన్నులనిమ్మని నిన్ను ప్రాధేయపడుచున్నాను. నిజమైన స్నేహితుని అబద్ధమైన వానినుండి వేరుచేయుటకు నాకు జ్ఞానమునిమ్ము. చూచుటకు దృష్టిని, చూచిన దానిని నమ్మకముగా తెలియజేయుటకు ధైర్యమును నాకిమ్ము. రోగులైన గొఱ్ఱెలు కూడా దానిని గుర్తు పట్టి నిన్ను వెంబడించునట్లు నా స్వరమును నీ స్వరము వంటి దానిగా చేయుము.
 6. ప్రభువైన యేసు, ఆత్మీయ సిద్ధపాటు కొరకు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నీ హస్తమును నా మీద నుంచుము. క్రొత్త నిబంధన ప్రవక్త యొక్క నూనెతో నన్ను అభిషేకించుము. నేను ఒక మతానుసారియైన శాస్త్రిగా మారి నా ప్రవచనాత్మకమైన పిలుపును పోగొట్టుకొనకుండా ఉందును గాక. ఈ ఆధునిక మతాధికారులపై చీకటితో యున్న శాపము నుండి, రాజీపడు శాపమునుండి, అనుకరించు శాపమునుండి, పిలుపును ఒక వృత్తిగా ఎంచుట అను శాపమునుండి నన్ను కాపాడుము. ఒక సంఘమును దాని పరిమాణమును బట్టి, దాని ప్రజాదరణను బట్టి, దాని సంవత్సర చందాను బట్టి తీర్పుతీర్చే పొరపాటునుండి నన్ను కాపాడుము.
 7. నేను ఒక ప్రచారకర్తను కాదని, ఒక మతానుసారమైన నిర్వాహకుడిని కాదని ఒక ప్రవక్తనని గుర్తుంచుకొనుటకు సహాయపడుము. నేను జన సమూహములకు బానిసగా మారకుండా ఉండనిమ్ము. నా ఆత్మకు శరీరానుసారమైన లక్ష్యాలనుండి స్వస్థపరచి ప్రాచుర్యము కొరకున్న దురదనుండి నన్ను విడిపించుము. వస్తువులకు బానిసగా కాకుండా నన్ను కాపాడుము. ఇంటి యొద్ద నా దినాలను వృథా చేయకుండా ఉండనిమ్ము. ఓ దేవా, నీ భయమును నా మీద ఉంచి, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను పోరాడుటకు నన్ను ప్రార్థనా స్థలమునకు కొనిపొమ్ము. ఎక్కువగా తినుట నుండి, ఎక్కువగా నిద్రపోవుటనుండి నన్ను విడిపించుము. యేసు క్రీస్తు యొక్క మంచి సైనికునిగా ఉండునట్లు నాకు క్రమశిక్షణ నేర్పుము.
 8. ఈ జీవితములో నేను కష్టమైన పనిని చిన్న ప్రతిఫలాలను అంగీకరించెదను. నేను ఒక సుళువైన స్థలము కొరకు అడుగను. నా జీవితమును సుఖముగా చేయు వాటికి నేను గ్రుడ్డిగా ఉండుటకు ప్రయత్నించెదను. ఇతరులు సుళువైన మార్గమును ఎంచుకొంటే, వారిని కరిÄనముగా విమర్శించకుండా నేను కష్టమైన మార్గమును తీసుకొనుటకు ప్రయత్నించెదను. నేను వ్యతిరేకత కొరకు ఎదురుచూచి, అది వచ్చునప్పుడు దానిని నెమ్మదిగా తీసుకొనుటకు ప్రయత్నించెదను, లేక నీ సేవకులకు జరిగినట్లుగా, నీ దయార్థులైన ప్రజలు కృతజ్ఞతతో కానుకలు ఇచ్చినప్పుడు నీవు నాతో నిలబడి, దాని వెంబడి తరచుగా వచ్చు చీడనుండి నన్ను కాపాడుము. ఆ విధముగానే నేను పొందువాటిని నా ఆత్మను గాయపరచకుండా, నా ఆత్మీయ శక్తిని తగ్గించుకొనకుండా వాడుకొనుటకు నాకు నేర్పించుము. నీవు అనుమతించినప్పుడు నీ సంఘము నుండి ఘనత నాకు వచ్చిన యెడల, ఆ గడియలో నీ కనీస వాత్సల్యములకు నేను అర్హుడను కానని నన్ను గుర్తుపెట్టుకొననిమ్ము మరియు నా గురించి నాకు తెలిసినంతగా ఇతరులకు తెలిసిన యెడల, వారు వారి సన్మానములను నా కివ్వకుందురు లేక వాటిని పొందుటకు ఎక్కువ యోగ్యత కలిగిన వారికి వాటిని ఇచ్చెదరు.
 9. ఆకాశమునకు భూమికి ప్రభువైన దేవా, ఇప్పుడు నాకు మిగిలిన దినములను నీకు ప్రతిష్టించుకొనుచున్నాను; నీ చిత్తప్రకారము అవి ఎక్కువైనను తక్కువైనను ఉండనిమ్ము. నేను గొప్పవారి యెదుట నిలువనిమ్ము లేక పేదవారికి పరిచర్య చేయనిమ్ము; ఆ ఎంపిక నాది కాదు, దానిని నేను ప్రభావము చేయగలిగినను నేను చేయను. నీ చిత్తము చేయుటకు నేను నీ దాసుడను మరియు ఆ చిత్తము నాకు పదవి, సంపద, ప్రసిద్ధి కంటే మధురమైనది మరియు భూమి మీద మరియు పరలోకములో ఉన్న వాటన్నికంటే ఎక్కువగా నేను దానిని ఎంచుకొనెదను. నేను నీ చేత ఏర్పరచుకోబడి, ఒక గొప్ప పరిశుద్ధమైన పిలుపుతో ఘనపరచబడినప్పటికీ, నేను కేవలము దుమ్ము బూడిదతో కూడిన మనిషినని, సహజమైన పొరపాట్లన్నిటితో కూడిన మనిషినని, మానవజాతిని బాధించే ఇచ్ఛలు కలిగిన మనిషినని నేను ఎన్నడు మరువకుండా ఉండనిమ్ము. కాబట్టి, నా ప్రభువా, నా విమోచకుడా, నా నుండియు ఇతరులకు దీవెనకరముగా ఉండుటకు ప్రయత్నించుచుండగా నాకు నేను చేసుకోగలిగిన గాయముల నుండియు నన్ను కాపాడుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ శక్తితో నన్ను నింపుము, అప్పుడు నేను నీ బలముతో వెళ్లి నీ నీతిని గూర్చి కేవలము దాని గూర్చియే చాటింతును. నాకు సహజశక్తులున్నంత వరకు నీ విమోచించు ప్రేమను గూర్చిన సందేశమును వ్యాపింపజేయుదును. ఆ తరువాత, ప్రియమైన ప్రభువా, నేను కొనసాగుటకు ముసలివాడనై, అలసిపోయినప్పుడు, నా కొరకు పైన ఒక స్థలమును సిద్ధపరచుము మరియు నిత్యత్వము ఉండే మహిమలో నీ పరిశుద్ధులతో కూడా నన్ను లెక్కింపుము. ఆమేన్‌, ఆమేన్‌''.

(''ఎ.డబ్లూ.టోజర్‌'' అను పుస్తకములో డెవిడ్‌.జె.ఫాంట్‌ చేత ఉల్లేఖించబడినది).

ఇది నీ హృదయ ప్రార్థన నా హృదయ ప్రార్థన అవును గాక.