నీ ఓటమిలో దేవుని యొక్క ఉద్దేశ్యము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 1
మానవుని ఓటమిలో దేవుని ఉద్దేశ్యము

లూకా 22వ అధ్యాయము 31వ వచనము చూచెదము.

ఇక్కడ యేసు ప్రభువు, పేతురుకు ముందు పొంచిఉన్న ప్రమాదము గూర్చి పేతురును హెచ్చరిక చేయుట చదివెదము. ఆయన ''సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరుచుమని చెప్పెను''.

ఆయన చెప్పిన రోజు రాత్రి పేతురు ప్రభువును ఎరుగనని ముమ్మారు చెప్పినట్లు మనకందరకు తెలియును. 34వ వచనములో యేసు ప్రభువు పేతురుతో ''పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పువరకు, నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను'' అనెను.

ఇప్పుడు నేను మీతో పంచుకోవాలని అనుకొనిన విషయం మానవుని ఓటమిలో దేవుని ఉద్దేశ్యము అనుదాని గూర్చినది. ఇది మనము నిరీక్షణ విషయంలో తప్పిపోయినందున కలిగిన నిస్పృహ, భంగపాటుల నుండి మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చును.

మొదటగా వచ్చే ప్రశ్న, దేవుడు తప్పిపోవునట్లు చేయునా? ఆయన దానిని అనుమతించునా? తప్పిపోవుటలో ఏమైనా ఉద్దేశ్యమున్నదా? అనునది. లేక దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములో తప్పిపోవుటకు ఏ కారణము లేదా మరియు దానిని ఆయన ఉద్దేశ్యము నెరవేర్చుటకు ఉపయోగించలేనిదా!

మనము వాక్యములో చదివినప్పుడు పేతురు యేసు ప్రభువు ఎవరో తెలియదని చెప్పకుండునట్లు చేయకపోవుటను మనము గ్రహించగలము. "సీమోనూ, నీవు నన్నెరుగనని ఒక్కమారు కూడా చెప్పకుండునట్లు నీ కొరకు ప్రార్థించాను", అని యేసు ప్రభువు ఎందుకు చెప్పలేదు. పేతురు పడిపోయినా అతడి విశ్వాసము తప్పిపోకూడదని మాత్రమే ప్రభువు ఎందుకు ప్రార్థించారు? పేతురు పడిపోకుండునుట్ల ప్రభువు ప్రార్థించక పోవుట ఒక ఆసక్తికరమైన విషయం కాదా!

మనము ఎప్పుడూ పడిపోకుండునట్లు మన కొరకు ప్రభువు ప్రార్థించుట మనలో కొందరు ఇష్టపడుదురు. ప్రభువు మనతో ''నా కుమారుడా, నా కుమార్తే నీవు ఎప్పుడు పడిపోకూడదని మరియు తప్పిపోకూడదని నీ కొరకు నేను ప్రార్థించాను'' అని చెప్పుట మనము ఇష్టపడుదుము. కాని ఆసక్తికరముగా, మన ప్రభువు మన కొరకు అటువంటి ప్రార్థనచేయలేదు.

యేసు ప్రభువు సీమోను కొరకు ఏమని ప్రార్థించారు? సాతాను అతనిని శోధించినప్పుడు, అతడి విశ్వాసము తప్పిపోకుండునట్లు ప్రార్థించారు. పేతురు శోధనలో పడకూడదని ప్రార్థించలేదు, కాని ఆయన పడిపోయినప్పుడు, దేవుని యొక్క పరిపూర్ణ ప్రేమయందు ఆయన విశ్వాసము తప్పిపోకూడదని ప్రార్థించారు - తద్వారా పేతురు తప్పుట అనే గోతి అడుగునకు చేరినా, అతడు అప్పటికిని, ''దేవుడు నన్ను ఇంకను ప్రేమిస్తున్నారు'' అని ఒప్పుకొనగలడు.

విశ్వాసమనగా అదియే. మనమెంత లోతుగా పడిపోయినా లేక మునిగిపోయినా, అప్పటికిని దేవుడు మనలను ప్రేమించుచుండును, మనమేస్థితిలో ఉంటే ఆ స్థితియందే దేవుడు మనలను ఇంకను ప్రేమిస్తున్నాడనే ఒప్పుకోలు మన పెదవులపై మరియు హృదయాలలో ఎల్లప్పుడు ఉండాలి.

తప్పిపోయిన కుమారుని యొక్క ఒప్పుకోలు అదియే. అతడు అంతకంటె లోతునకు వెళ్ళలేనంత అడుగునకు పడిపోయినా, తన తండ్రి అప్పటికిని తనను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని అతడు నమ్మెను. పందులు తినే పొట్టు తినేస్థితికి దిగజారిన తప్పిపోయిన కుమారుని కంటె ఎవరైనా క్రిందికి దిగజారి పోతారని నేను ఊహించలేను. అతడు అట్టడుగునకు దిగజారిపోయాడు. కాని అతడు ఎప్పుడైతే అట్టడుగునకు దిగజారిపోయాడో అప్పుడు ఒక విషయాన్ని అతడు జ్ఞాపకం తెచ్చుకొన్నాడు. అది అతడి తండ్రి ఇంకను అతడిని ప్రేమిస్తున్నాడనే విషయం. అలా కాకపోయినట్లయితే అతడు ఎప్పటికిని తిరిగి ఇంటికి రాడు. ఒకవేళ తన తండ్రి మరణించెననియు, ప్రస్తుతం తన అన్న ఇంటి బాధ్యత వహిస్తున్నాడని అతడు వినినట్లయితే అతడు యింటికి తిరిగి వచ్చునని మీరనుకొంటున్నారా? రాడు. ఎందుకంటె అతడి అన్నగారు ఎటువంటివాడో అతడికి తెలియును. అందువలన అది తెలిసినట్లయితే అతడు ఎప్పటికి యింటికి తిరిగి వచ్చియుండేవాడు కాదు. తన తండ్రి తనను ప్రేమిస్తున్నాడని అతడికి తెలియును కాబట్టి అతడు తిరిగి వచ్చాడు.

కొందరు పాపులు కొన్ని సంఘాలలో పాస్టర్లను లేక పెద్దలను ఆ ఉపమానములో అన్నగారి వలె ఉండుట చూచుట వలన వారెప్పుడూ ఆ సంఘాలకు రారు. ఆ పాపులు రానందుకు వారిని మనమేమీ అనలేం. అయితే సంఘములో నుండిన పెద్దలు ఆ తండ్రి వలెనుంటె, అప్పుడు యేసు ప్రభువు యొద్దకు రక్షణ కొరకు పాపులు ఎలా వచ్చేవారో అలాగే ఘోరమైన పాపులు కూడా సంఘమునకు వచ్చెదరు. ఘోరమైన పాపులు కూడా మన దగ్గరకు రావాలన్పించేటట్లు మన సంఘములకు గుర్తింపు ఉండాలి. యేసు ప్రభువు నిజముగా మన మధ్యనుంటే, ఎంతో ఘోరమైన పాపులు కూడా తప్పక వచ్చి మన మధ్య రక్షణ పొందుదురు.

ఘోరంగా పడిపోయిన వారికి, వారి జీవితాలను చిందరవందర చేసికొన్న వారికి మరియు ఎవరైతే అట్టడుగు స్థితికి జారిపోయారో అటువంటి వారికి నిరీక్షణ ఉన్నది. అక్కడ నుండి, ఆ స్థితి నుండి ప్రభువు నిన్ను అందుకొని లేవనెత్తి ఎత్తైన మహిమగల స్థితిలోనికి తీసుకువెళ్లగలడు. ఏ సమయములోనైనా దేవుని ప్రేమ యందు మన విశ్వాసము తప్పిపోకూడదనేదే మన గూర్చి ఆయన ప్రార్థన.

ఈ రోజున నీకు ఈ సందేశము అక్కర్లేకపోతే, నీవు అట్టడుగుకు జారిపోయిన ఒక రోజున, భవిష్యత్తులో ఇది నీకు తప్పని సరిగా అవసరమవుతుంది. ఆ రోజున ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, నీవు ఎక్కడ ఉండినా లేక నీవు ఎలా పడిపోయినా దానితో సంబంధంలేదు. దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ గడియలో దేవుని ప్రేమ యందలి నీ విశ్వాసము తప్పి పోకుండును గాక!

విశ్వాసము అంటే ముఖ్యముగా దేవుడు ఇంకను మనలను ప్రేమిస్తున్నాడని నమ్ముటయే. ఆయన మన పాపాన్ని ప్రేమించుట లేదు, మనము పాపములో కొనసాగుటను ఆయన ఇష్టపడటము లేదు. తన బిడ్డ యొక్క రోగమును చూచి ఆ రోగమును ద్వేషించుచు, ఆ బిడ్డను ప్రేమించే ఒక తండ్రి వంటివాడు ఆయన. టి.బి. తోనో, కుష్ఠుతోనో బాధపడుతున్న బిడ్డను చూస్తున్న తల్లి గూర్చి ఆలోచించండి. ఆ తల్లి ఆమె బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుంది. కాని, ఆ రోగమును హృదయమంతటితో ద్వేషిస్తుంది. దేవుడు పాపులను ప్రేమించును కాని వారి యొక్క పాపమును ద్వేషించును.

కల్వరి సిలువపై పాపుల యెడల దేవుని ప్రేమను మరియు పాపము యెడల ఆయన ద్వేషాన్ని మనము చూడగలము. యేసు ప్రభువును సిలువపై మన కొరకు చనిపోనిచ్చుటలో పాపుల యెడల ఆయన కుండిన ప్రేమను మనము చూడగలము. యేసు ప్రభువు లోకమంతటి యొక్క పాపమును తనపై భరించినప్పుడు తండ్రి తన ముఖమును త్రిప్పుకొనుటలో ఆయనకు పాపము యెడల ఉండిన ద్వేషాన్ని చూడగలము.

ప్రేమా స్వరూపియైన దేవుడు మానవులను ఎలాగు నరకమునకు పంపునని కొందరు కొన్నిమార్లు అడుగుదురు. నరకము ఎలా ఉంటుంది? నరకమంటె దేవుడు పూర్తిగా విడిచిపెట్టిన స్థలము. దేవుడు కనబడని స్థలము. ఈ భూలోకము దేవుని చేత విడిచి పెట్టబడలేదు. అందువలననే భూమిపై ఇంకా మంచితనము మరియు సౌందర్యము కనబడుతుంది.

ఉదాహరణకు సృష్టిలో ఉండిన సౌందర్యాన్ని చూడండి. అనేకులలో నుండిన మంచితనము మరియు మర్యాదను చూడండి. మానవులనందరిని ఆవహించాలని దెయ్యములు కోరుకుంటాయి. కాని అలా చేయలేవు, అందుకు కారణం జనుల చుట్టూ దేవుడు ఒక అడ్డుగా నుండు గోడను ఉంచుటచేత అవి అట్లు చేయలేవు. దేవుని కనికరము వలననే మానవుడు ఆరోగ్యము, ఆస్థి మరియు అనేక ఇతర సౌఖ్యములు పొందగలుగుతున్నాడు. ఈ ఆశీర్వాదములన్ని కూడా దేవుడు మంచి వారి మీద చెడ్డవారి మీద కుమ్మరించును. ఇదంతా కూడా దేవుడు ఈ భూలోకమును విడిచి పెట్టలేదని ఋజువు పరుస్తున్నాయి. కాని నరకము అలా ఉండదు. నరకములో కనికరమనేదే ఉండదు. ఎందుకనగా నరకము నిజముగా దేవుడు విడిచిపెట్టిన స్థలము.

దేవుని యొక్క ప్రభావము ఏదొక విధముగా ఇంకను జనులపై నుండుటచేత ఈ లోకములో అనేక మంది యేసు క్రీస్తులోనికి మారని వారిలో కూడా మంచితనమున్నది. కాని వారు ఒక్కసారి నరకములోనికి వెళ్లగానే ఆ ప్రజలే సాతానంత దుష్టులైపోతారు. ఎందుకంటె దేవుని యొక్క కనికరము వారి జీవితాలపై ఇక ఉండదు.

దేవుని చేత పూర్తిగా విడిచి పెట్టబడుట అనగా ఏమిటో మొదటిసారిగా జనులు నరకములో తెలుసుకొందురు. యేసు ప్రభువు దానిని సిలువపై అనుభవించెను. యేసు ప్రభువును దేవుడు సిలువపై విడిచి పెట్టినప్పుడు, సిలువపై మూడు గంటల చీకటిలో ఆయన నరకాన్ని అనుభవించారు. అక్కడ దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తారనేది చూచెదము.

కనుక జవాబేమిటి? ప్రేమాస్వరూపియైన దేవుడు జనులను నరకమునకు పంపునా? దానికి జవాబు వేరొక ప్రశ్న యొక్క జవాబులో ఉంది. లోకము యొక్క పాపమంతా తన కుమారునిపై పడినప్పుడు, ప్రేమ స్వరూపియైన దేవుడు తన స్వంత కుమారుడు సిలువపై నరకాన్ని రుచి చూచుటకు ఒప్పుకొనెనా? ఆయన అట్లు చేయగలిగితే, తప్పకుండా ఆయన జనులను నరకానికి పంపగలడు. పాపములోనే కొనసాగుతూ ''నేను నీ మాట వినను, నా కిష్టమైన మార్గాన్ని నేను ఎంచుకొంటిని మరియు అందులోనే ఎప్పటికిని నేను నడిచెదను'' అని చెప్పు వారి నుండి ప్రేమా స్వరూపియైన దేవుడు తన ముఖమును త్రిప్పి వేసుకొనును.

సామెతలు 29:1లో బైబిలు

"ఒకడు అనేకమార్లు గద్దింపబడి మరియు ఆ గద్దింపును అంగీకరించక తిరస్కరించినట్లయితే ఒక రోజున అకస్మాత్తుగా నాశనమగును" మరియు అతడికి వేరొక అవకాశముండదు అని చెప్తుంది.

ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమపూర్వక అహ్వానములను అలా తిరస్కరిస్తూ ఉండినట్లయితే, అతడు నిజంగా ప్రమాదములో ఉండినట్లే.

ఇది విని మీరు ఊరకనే బాధపడిపోవద్దని, శిక్షా విధిలోనికి వెళ్ళవద్దని కోరుచున్నాను.. ఎందుకనగా ఈ వచనము పాపములో పడినవారి గూర్చి వ్రాయబడలేదు, కాని ఎవరైతే పాపము చేయుటను ఇష్టపడుదురో ఎవరైతే పాపములో కొనసాగుటను కోరుకొందురో వారి కొరకు వ్రాయబడినది. ఎవరైతే పరిశుద్ధముగా జీవించుటకు ప్రయత్నిస్తూ పడిపోయారో వారికి వ్రాయబడలేదు. ఇది తిరుగుబాటు చేయువారికిని, దేవుని ఎదురించి పాపమును చేయుచూ నుండువారికి వ్రాయబడినది.

నీవు ఒక తిరుగుబాటు చేయువాడవో, కావో నీకేలాగు తెలియును? అది తెలుసుకొనుట చాలా సులువు. మారుమనస్సు పొంది దేవుని వైపు తిరుగుటకు నీకు కోర్కె కలదో లేదో నీకు నీవు ప్రశ్నించుకో, నీలో దేవుని వైపు తిరుగుటకును మరియు ఆయనను ప్రేమించుటకును ఏ మాత్రము చిన్న కోర్కె ఉండినా, పరిశుద్ధాత్ముడు నీ జీవితములో ఇంకా పనిచేస్తున్నాడనియు దేవుడు నిన్ను ఆయన దగ్గరకు ఆకర్షించుకొనుటకు ప్రయత్నించుచుండెనని అది రుజువు చేస్తుంది. నీవు ఒక తప్పిన వాడవుకావచ్చు కాని, ఒక తిరుగుబాటు చేసినవాడవు కావు. తప్పిపోతూనుండు వానికిని తిరుగుబాటు చేయువానికిని ఎంతో తేడా యున్నది.

పేతురు తప్పిపోవుటను అనుమతించుటలో దేవునికి ఒక ఉద్దేశ్యమున్నది. పేతురును జల్లించుటయే ఆ ఉద్దేశ్యము. పేతురును పూర్తిగా నాశనము చేయవలెనని సాతాను అనుకొనెను, కాని అట్లు చేయుటకు దేవుడు అనుమతించలేదు. మన కుండిన సామర్థ్యము కంటె ఎక్కువగా శోధించుటకు గాని పరీక్షించుటకు గాని దేవుడు అనుమతినివ్వరు (1 కొరిందీ¸ 10:13). ఆ విధముగా పేతురును జల్లించుటకు సాతానుకు అనుమతి ఇవ్వబడినది. పేతురు తప్పిపోవుట ద్వారా ఆయన జీవితములో నుండిన చాలా పొట్టు నుండి పేతురు శుభ్రపరచబడెను.

మనము తప్పిపోవుటలో దేవునికుండిన నిజమైన ఉద్దేశ్యము అదియే.

మన జీవితములలో నుండి పొట్టు తీసివేయబడడము మంచిది కాదా? తప్పనిసరిగా మంచిదే, ఒక రైతు ధాన్యమును పండించిన తరువాత వాటిని ఉపయోగించుకొనుటకు ముందు వాటిని జల్లించవలసియున్నది. అప్పుడే వాటినుండి పొట్టు తీసివేయబడును.

మన జీవితాలలో నుండి పొట్టును తీసివేయుటకు దేవుడు సాతానును ఉపయోగించుకొనును. మనము పలుమార్లు తప్పుటకు అనుమతినిచ్చుట ద్వారా దేవుడు ఆశ్చర్యకరంగా ఈ పనిని నెరవేర్చును. ఆ ఉద్దేశ్యము నెరవేరుటకు పేతురు విషయంలో దేవుడు సాతానును ఉపయోగించుకొనెను. మన జీవితంలో కూడా ఆ ఉద్దేశ్యము నెరవేరుటకు తనను ఉపయోగించుకొనును. మనందరిలో చాలా పొట్టు ఉంది - గర్వము అనే పొట్టు, మనమీద మనకుండిన నమ్మకము మరియు స్వనీతి అనే పొట్టు. మనలోనున్న పొట్టును పూర్తిగా తీసివేయుటకు దేవుడు సాతానుని ఉపయోగించుకొని మనలను మరలా, మరలా పడిపోవునట్లుగా చేయును.

నీ జీవితములో ఈ ఉద్దేశ్యము దేవుడు నెరవేరుస్తున్నారా? లేదా? అనేది నీ ఒక్కడికే తెలియును. అయితే ఆ పొట్టు తీసివేయబడుచున్నట్లయితే, నీవు ఇంకను దీనుడుగా మరియు తక్కువ స్వనీతి పరుడుగా అగుదువు. అంతేకాక తప్పిపోయిన ఇతరులను నీవు చులకనగా చూడవు. ఎవ్వరికంటె నీవు గొప్ప వాడివిగా అనుకొనవు.

నేను చెప్పినట్లుగా, మనలను పలుమార్లు తప్పిపోవునట్లు చేయుట ద్వారా, దేవుడు మనలో పొట్టును తీసివేయుటకు సాతానుకు అనుమతి నిచ్చును. కనుక తప్పినప్పుడు దానిని బట్టి నీవు నిరుత్సాహపడవద్దు. నీవు ఇంకను దేవుని చేతిలోనే ఉన్నావు. నీవు పలుమార్లు తప్పిపోవుట ద్వారా ఒక గొప్ప మహిమకరమైన ఉద్దేశ్యము నెరవేరును. అయితే దేవుని ప్రేమయందు నీకుండిన విశ్వాసము అటువంటి సమయాల్లో తప్పిపోకూడదు. యేసు ప్రభువు పేతురు విషయంలో అదే ప్రార్థించారు, ఈ రోజు మన కోసం కూడా ఆయన అదే ప్రార్థిస్తున్నారు. మనము తప్పిపోకూడదని ప్రార్థించుట లేదు కాని, మనము అట్టడుగుకుచేరి పోయినా, దేవుని ప్రేమయందు మనకుండిన నమ్మకము కదలనిదై యుండాలని ఆయన ప్రార్థించుచున్నారు.

అనేకమార్లు తప్పిపోయిన అనుభవాల ద్వారానే మనము చివరకు ''ఏమీ లేని స్థితికి'' వచ్చెదము, అది నిజముగా మన విరిగిన స్థితియై ఉండును. ఎప్పుడైతే పేతురు అటువంటి స్థితికి వచ్చెనో, అప్పుడు ఆయన రెండవసారి మార్పు చెందిన స్థితికి వచ్చెను (లూకా 22:32). ఆయన ఒక్కమారుగా వెనుకకు తిరిగెను. యేసు ప్రభువు పేతురు కొరకు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చినదనుటకు ఋజువు పేతురు అట్టడుగునకు పడిపోయినా అతడు వెనుకకు తిరుగుటలో కనబడుతుంది. అతడు అక్కడనే పడినచోటునే ఉండిపోయి నిరుత్సాహపడలేదు. అతడి యొక్క విశ్వాసమును విడచిపెట్టలేదు. అతడు తిరిగి లేచెను. తరువాత దేవుడు అతడు ఎంతో దూరము వెళ్లునట్లు చేసెను. కాని పేతురు త్రాడు చివరకు వచ్చినప్పుడు, దేవుడు ఆయనను పైకి లాగెను.

దేవుని బిడ్డగా ఉండుట అద్భుతమైన విషయము. దేవుడు మనలను పట్టుకొనినప్పుడు, మనలను కాపాడుటకు మన చుట్టూ ఒక త్రాడును ఉంచును. ఆ త్రాడు ఎంతో వదులుగా ఉండుటచేత, నీవు అనేక వేలసార్లు జారిపోవచ్చును, పడిపోవచ్చును. చివరకు దేవుని నుండి దూరముగా జరిగిపోవచ్చును. కాని ఒక రోజు నీవు ఆ త్రాడు చివరకు చేరుకొందువు. అప్పుడు దేవుడు తిరిగి నిన్ను ఆయన దగ్గరకు లాగుకొనును.

అయితే ఆ సమయములో ఆ త్రాడును తెగగొట్టుకొని పారిపోయే నిర్ణయము నీవు తీసుకొనవచ్చును. లేక దేవుని యొక్క కనికరమును బట్టి దు:ఖపడి విరువబడి తిరిగి ఆయన యొద్దకు వచ్చుటకు నీవు ఎంచుకోవచ్చును. పేతురు అదే చేశాడు. ఆయన ఏడ్చి తిరిగి ప్రభువు యొద్దకు వచ్చాడు. కాని ఇస్కరియోతు యూదా అది చేయలేదు. తన జీవితముపై దేవుని అధికారమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి, ఆ త్రాడును త్రెంపుకొని శాశ్వతముగా దూరమైపోయాడు. కాని నీవు పేతురు చేసినట్లుగా చేయుదువని నేను నమ్ముతున్నాను.

యేసు పేతురుతో ''నీ మనస్సు తిరిగినప్పుడు నీ సహోదరులను బలపర్చుము'' అని చెప్పెను.

మనమెప్పుడైతే విరుగగొట్టబడుదుమో అప్పుడే మనము ఇతరులను బలపర్చగలము.

పేతురు ఎప్పుడైతే బలహీనుడుగా అయి విరుగగొట్టబడెనో అప్పుడే అతడు నిజముగా బలవంతుడయ్యెను. తన సహోదరులను, సహోదరీలను బలపర్చగలిగేటంతటి బలవంతుడయ్యెను. పేతురు యొక్క తప్పిపోయిన అనుభవము ద్వారానే ఆత్మచేత నింపబడిన పరిచర్యకు ఆయన సిద్ధపడెను. ఆయన ఈ తప్పిపోయిన అనుభవము లేకుండానే పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే, పెంతెకొస్తు దినాన ఆయన నిలువబడినప్పుడు ఎప్పుడూ తప్పిపోనటువంటి గర్విష్టియైన ఒకనిగా నిలువబడి ఆయన ముందు నిలువబడిన పాపులను తృణీకార భావముతో ఎంతో క్రింద నున్నవారుగా చూచి యుండేవాడు. అలా అయినట్లయితే దేవుడు ఆయనకు విరోధిగా అయ్యుండేవాడు. ఎందుకనగా దేవుడు అహంకారులను ఎదురించి, దీనులకు కృపనిచ్చును (1పేతురు 5:5).

ఎప్పుడో ఒకమారు పరిశుద్ధాత్మతో నింపబడిన ఈనాటి అనేక క్రైస్తవుల విషయంలో అటువంటి విచారకరమైన పరిణామమే జరుగుచున్నది. వారెప్పుడూ విరువబడలేదు. బహుశా వారు నిజంగానే పరిశుద్ధాత్ముని చేత నింపబడియుండవచ్చును, కాని, వారెప్పుడును విరువబడలేదు. అందువలన వారి గర్వమును బట్టి వారి యొక్క అభిషేకము త్వరలోనే పోగొట్టుకొన్నారు.

నా యొక్క జీవితములో సిలువను గూర్చియు మరియు విరువబడుటను గూర్చిన సత్యములను, ఆయన నన్ను పరిశుద్ధాత్మతో నింపుటకు ఎంతో ముందే నేర్పించారు. దానివలన నాకెంతో మేలు జరిగినది. ఎందుకంటే నేను త్రోవ తప్పిపోకుండా అవి నన్ను కాపాడెను. నా మీద నాకుండిన నమ్మకాన్ని మరియు నా స్వనీతిని దేవుడు అనేక సంవత్సరాల ఓటమి ద్వారా చెదరగొట్టెను, అవును అది నిజంగా తప్పిపోవుటయే, రోజు తరువాత రోజులెన్నో సంవత్సరములు తప్పిపోవడము. నేను నా 60 సంవత్సరాల జీవితాన్ని గ్రాఫుగా గీసినట్లైతే ఇలా ఉండొచ్చు. నేను పుట్టినప్పుడు - అమాయకంగా, అందరు చిన్న బిడ్డల వలె ముద్దుగా, ఎప్పుడూ పాపము చేయనివానిగా ఉన్నాను. తరువాత నేను తిరిగి జన్మించినప్పుడు (నాకు 19 సంవత్సరాలుండినప్పుడు) పరిస్థితులన్ని కొంత కాలము బాగానే సాగాయి, నిజానికి కొన్ని సంవత్సరాల వరకు నా గ్రాఫు నెమ్మదిగా పైకి వెళ్లడం మొదలయ్యింది. కాని దేవుడు నా పరిచర్యను దీవిస్తూ ఉండగా మరియు క్రైస్తవుల మధ్య నేను గుర్తింపు పొందుతూ ఉండగా, గర్వము నాలో ప్రవేశించుట చేత, నాకు తెలియకుండానే నా గ్రాఫు క్రిందికి వచ్చుట మొదలయ్యింది. బాహ్యంగా నేను అప్పటికి అందరకు తెలిసిన ప్రసంగీకుడను. కాని నా అంతరంగ జీవితము మరియు దేవునితో నా సాన్నిహిత్యము చెడిపోవుట మొదలైనది. అంతరంగములో నేను వెనుకకు జారిపోయిన వానిగా అయ్యాను. ఆఖరుగా నా జీవితపు గ్రాఫు అట్టడుగుకు దిగజారిపోయిన స్థితికి వచ్చినది. అది 26 సంవత్సరముల క్రితం ఆ సమయములో నేను చేసే పరిచర్యను పూర్తిగా విడిచి పెట్టవలెనని తీవ్రంగా ఆలోచించాను. నేను పాటించని దానిని బోధిస్తూ ప్రజలను మోసగించుట నాకిష్టము లేదు. ఆ సమయములో నా వేషధారణ జీవితానికి, నేను వెనుకకు జారిపోయిన స్థితికిని నేను దేవుని యొద్ద నుండి తీర్పు పొందుటకు మాత్రమే అర్హుడను. కాని నన్ను తీర్పు తీర్చి నరకమునకు పంపుటకు బదులు, దేవుడు నాకు చేసినదేమిటో మీకు తెలియునా? ఆయన పరిశుద్ధాత్మతో నన్ను నింపెను.

ఆయన ఎందుకు అలా చేశారు? ఎందుకనగా దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు (యెషయా 55:8). ఈ అద్భుతము మీకు అర్థమగుట గూర్చి ఒక ఉదాహరణను ఉపయోగించుదును.

నీవొక అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుగల ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉండి, వారి నియమనిబంధనలకు లోబడకుండా, కంపెనీ విషయంలో అపనమ్మకత్వముతో నుండి, వారి మంచితనాన్ని నీవు ఉపయోగించుకుంటూ వారి పేరును పాడు చేస్తున్నావనుకో. ఒక రోజున నీవు ఏదో ఒక ఘోరమైన తప్పు చేసావనుకో ఇక అదే నీకు ఆఖరు. అప్పుడు ఆ కంపెనీ అధిపతి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఉద్యోగములో నుండి తీసి వేయుటకుబదులు మేము నీవు చేసిన తప్పులు అన్నిటిని క్షమించాం మరియు ఈరోజు నుండి నీ జీతాన్ని మూడు రెట్లు పెంచాలని నిర్ణయించాం అని చెప్పారనుకోండి. అటువంటిది జరుగుతుందని అనుకొనగలరా? అనుకొనలేము. అయితే అది దేవుని త్రోవలు మనుష్యుని త్రోవల వంటివి కావని తెలియజేస్తుంది.ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం దేవుడు నా జీవితంలో చేసినది అదే.

దేవుడు నన్ను ఆదరించినందుకు వచ్చిన ఫలితమేమిటి? దేవుని యొక్క కనికరాన్ని అవకాశముగా తీసుకొని ఆ రోజు నుండి ఇంకా ఎక్కువపాపము చేయుటా? అలా కాదు. దానికి బదులుగా రోమా 2:4లో చెప్పబడినట్లు, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నన్ను ప్రేరేపించినది. అది నన్ను దు:ఖపడుటకును మరియు విరువబడుటకును నడిపించినది. దేవుని యొక్క అనుగ్రహము నన్ను విరుగగొట్టి అప్పటి నుండి ఆయన కొరకు పవిత్రమైన మరియు పరిశుద్ధమైన జీవితము జీవించాలనే ఆశను కలుగజేసినది.

కాని ఇక్కడ నేను మీ యెదుట నిజాయితీతో ఉండాలనుకొంటున్నాను. ఆ రోజు నుండి నా జీవితపు రేఖ స్థిరంగా పైకి వెళ్లలేదు. ఆ విధంగా లేదు. పోరాడుతున్న ఇతర క్రైస్తవుల వలె నాకూ ఎగుడు దిగుడులున్నవి. పౌలు వలెనె నాకును ''వెలపల పోరాటములు, లోపట భయములు'' ఉండెను. ''నేను నిరాశలో ఉన్నప్పుడు నేను ఆదరించబడుటకు'' (2కొరిందీ¸ 7:5,6) నాకు ఇంకను ఇతర సహోదరుల సహాయము అవసరమైయుండెను. అయితే నేను అట్లు పరిపూర్ణతలోనికి సాగిపోవుటకు ప్రయత్నించుచున్నాను.

దేవుని ఉద్దేశ్యము నాలో నెరవేరుటకుముందు, నేను మరల మరల తప్పిపోవుట అనే గోతిలోనికి పడిపోవునట్లు దేవుడు అనుమతించెను. నేను తిరిగి జన్మించిన తరువాత నన్ను ఏమీలేని స్థితికి తీసుకురావటానికి ఆయనకు 16 సంవత్సరములు పట్టింది. అప్పటికి నాకు 35 సంవత్సరాల వయస్సు వచ్చింది. నా జీవితములో సగము జీవితమైపోయింది. నీ విషయంలో అంతకాలము పట్టకపోవచ్చును, ఎందుకంటె నీవు నా అంతమొండిగా ఉండకపోవచ్చును. కాని నీవు ఎప్పుడూ నిరీక్షణను కోల్పోకుండునట్లు, నిన్ను ప్రోత్సహించుటకు నా సాక్ష్యమునిస్తున్నాను. దేవుడు నా విషయంలో అటువంటి కార్యాన్ని చేసినప్పుడు ఆయన ఎవరి విషయంలోనైనా అట్లు చేయగలడు.

ఇకనాకు నిరీక్షణ లేదు అని ఎవ్వరూ అనుకోనక్కరలేదు. ఇది మీరు విన్నారా? ఎవ్వరు కూడా ఇక నాకు నిరీక్షణ లేదు అని అనుకోనక్కరలేదు. మీరు జీవించి ఉన్నంత కాలం మీలో ప్రతి ఒక్కరికి ఆ నిరీక్షణ ఉన్నది. నీవు చనిపోయినప్పుడే నీకు ఏ నిరీక్షణా లేకుండా పోతుంది.

పేతురు విషయంలో దేవుడు ఏమి ఉద్దేశించెనో అది నెరవేరుటకు ముందు పేతురు కూడా అటువంటి ఏమీ లేని స్థితికి రావాల్సియున్నది.

ఒకమారు మనము అటువంటి అడుగునకు వెళ్ళినట్లయితే ఇంకా అటువంటి స్థితిలో ఉన్న వారిని మనము చులకనగా చూడము. అప్పటి నుండి మనము పాపులను లేక విశ్వాసములో నుండి పడిపోయిన విశ్వాసులను లేక పడిపోయిన క్రైస్తవ నాయకులను చులకనగా చూడము. ఒక సమయములో మనము ఎలా తప్పిపోతిమో తెలియుట చేత, పాపముపై మనము పొందిన విజయాన్ని బట్టి మనము గర్వించము.

అందుచేతనే పేతురు ఇతర క్రైస్తవులను ఈ విధముగా హెచ్చరించుచున్నాడు. మీ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని ఎప్పటికీ మరచిపోవద్దు (2పేతురు 1:9). ఒకవేళ అలా మరచిపోయినట్లయితే, అట్టివారు గ్రుడ్డి వాడుగా దూర దృష్టిలేని వాడును అగును అని పేతురు హెచ్చరించెను. నాకు అన్ని సమయములలో పరలోకపు విలువలను మరియు నిత్యమైన విలువలను చూడగలిగే ఎంతో దూరంగా చూడగలిగేటటువంటి దృష్టి కావాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడూ గ్రుడ్డి వానిగా కాని హ్రస్వదృష్టి కలవానిగా కాని ఉండాలని అనుకోవడం లేదు.

దూరదృష్టిలేని వారంటె ఎవరు? వారు పాపముతో వచ్చే సంతోషాలను, వస్తురూపమైన సంపదను మరియు మనుష్యుని యొద్ద నుండి గౌరవము, అంగీకారము మొదలైన ఈ లోకసంబంధమైన విషయాలకు విలువ ఇచ్చేవారు. అటువంటి వారందరు దూరదృష్టి లేనివారు అటువంటి విశ్వాసులను చూచి మనము విచారించాలి. నీవు 10 అడుగుల కంటె ఎక్కువ దూరము చూడలేని దృష్టి లోపమున్న ఒకనిని చూచి అతడిపై కోపగించుకొనవు. అతడి గురించి విచారించెదవు. ఒక వ్యక్తి ఒక పుస్తకము చదువుటకు కళ్లకు రెండంగుళాల దూరములో పుస్తకాన్ని ఉంచుకొన్నట్లయితే అతడిపై నీవు కోపగించుకొనవు. అతడి గూర్చి విచారించవా? ఒక కంటివైద్యుడు లావుగాఉన్న భూతద్దాలను ధరించుకొనిన వ్యక్తితో కంటి చూపు పరీక్షించే బోర్డుపై అక్షరాలను చదువమన్నప్పుడు అతడు కేవలం పైనున్న అక్షరాన్ని మాత్రమే చూడగలిగి అది 'అ' యో లేక 'ఇ' యో చెప్పలేక పోవుచున్నాను, అంటే ఆ వైద్యుడు ఏమంటాడు? అతడు కోపగించుకొనునా? అలా చెయ్యడు, కాని అతడి గూర్చి విచారిస్తాడు.

అలానే మనము కొందరు విశ్వాసులు దూరదృష్టిలేనివారై, కేవలము ధనము కొరకు, పాపము వలన వచ్చు ఆనందము కొరకు మరియు మనుష్యుల నుండి అంగీకరింపబడుటకు జీవిస్తుంటే, వారిని గద్దించి ప్రయోజనము లేదు. వారు అంత దూరదృష్టిలేని వారుగా నున్నందుకు వారి గూర్చి మనము విచారించాలి. వారు ఒక రోజున ప్రభువు ముందు నిల్చున్నప్పుడు ఎంతో దు:ఖాన్ని పొందుదురు.

అటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు. వారు ఆ విధముగా ఎందుకు గ్రుడ్డి వారయ్యారో నీకు తెలుసా? వారి మొదటి పాపముల నుండి శుద్ధి కలిగిన సంగతి వారు మరచిపోవుట చేత (2 పేతురు 1:9). దేవుడు వారిని ఎటువంటి గోతి నుండి బయటకు లాగెనో వారు మరచారు. దానితో పాటుగా దేవుడు వారిని ఆశీర్వదించుటను బట్టి వారు గర్వించారు.

దేవుడు నన్ను ఏ గోతినుండి పైకిలాగెనో దానిని నేనెప్పుడూ మరచిపోదల్చుకోలేదు. దేవుడు నా పాపములన్నిటిని తుడిచివేసెననియు మరియు నేను చేసిన పాపములలో ఏ ఒక్క దానిని కూడా ఆయన జ్ఞాపకమునకు తెచ్చుకోడనియు నాకుతెలియును. నా 60 సంవత్సరాల జీవితకాలములో ఏ ఒక్కమారు కూడా ఏ పాపము చేయని వానిగా, ఈ రోజున నేను ఆయన ముందు నిల్చుందును. ఎందుకనగా నేను యేసు క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతునిగా తీర్చబడితిని (రోమా 5:9). దేవుడు నన్ను అలా చూచుచుండెను. కాని నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడనో నేనెప్పుడూ మరచిపోను నీ పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకముచేసికొననని (హెబ్రీ 8:12) దేవుడు నాతో చెప్పెను. కాని ఒకప్పుడు నేను ఎలాంటి వాడినో ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొందును.

అయితే ఇప్పుడు సాతాను నా గత పాపముల గూర్చిన ఆలోచనల చేత నన్ను క్రుంగదీయునట్లును లేక తప్పు మోపునట్లును గతాన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకొనను. అలా ఎప్పటికి చేయను.కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు (రోమా 8:1). సాతాను నా మీద దోషారోపణ చేయునప్పుడు యేసు రక్తము నా పాపములన్నిటిని కడిగి వేసెను అని అతడి ముఖముపైనే చెప్పుదును. గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా (ప్రకటన 12:11) నేను సాతానును జయించెదను. కాని దేవుడు నన్ను కలుసుకొని, ఆయన పరిశుద్ధాత్మతోనింపిన సమయములో నేను పడియున్న గోతిని నేను ఎప్పుడూ మరచిపోను.

దేవుడు ఒకమారు యూదాతో చెప్పినట్లుగా

''నీవు పుట్టిన నాడే బయట నేలనుపారవేయబడి, చూడనసహ్యముగా నుండి, నీయందు జాలిపడిన వాడొకడును లేక పోయెను''. అట్లు నేను ఒకప్పుడు ఉంటిని. అయితే ప్రభువు ఆ త్రోవను వచ్చినప్పుడు రక్తములో పొర్లుచున్న నన్ను చూచి, లేవనెత్తి, స్నానము చేసి బట్టలు తొడిగి ఆయన యొక్క పరిపూర్ణ శోభను నాకిచ్చెను (యెహెజ్కేలు 16:5,6,9,10,14).

నా సహోదరుడా, సహోదరీ నీ విషయంలో ఎట్లున్నది? మీలో చాలామంది పరిశుద్దాత్మ చేత నింపబడ్డారు. కాని మిమ్ములను విరుగగొట్టుటలో మరియు మీ మీద మీకుండిన నమ్మకమును మరియు గర్వమును చెదరగొట్టుటలో దేవుడు విజయం సాధించారా అనేది అనుమానమే. అది తెలుసుకొనుట చాలా సులువు. ఈ రెండు ప్రశ్నలకు జవాబివ్వు.

మొదటగా: ఇతరులను బహుశా ఇతర క్రైస్తవ సంఘాలలో ఉన్న వారిని నీవు చులకనగా చూస్తున్నావా?

మనము అనేక మంది క్రైస్తవులతో సిద్ధాంతపరమైన విషయాల గురించి ఏకీభవించలేక పోవచ్చును. కాని వారిలో ఎవ్వరినీ చులకనగా చూడకూడదు. అనేక ఇతర క్రైస్తవ సంఘాలలో నున్న అనేక మంది క్రైస్తవులు నాకంటె ఉన్నతముగా నున్నారని యదార్థముగా చెప్తున్నాను. అయితే మాయొక్క సిద్ధాంతపరమైన తేడాల వలన వారిలో చాలా మందితో నేను కలసి పనిచేయలేను. కాని వారిలో ఎవ్వరినీ నేను తృణీకరించను.

నీవు పరిసయ్యుని వలె ఎప్పుడైనా, ''దేవా, నేను ఇతరుల వలె ఉండనందుకు వందనాలు'' (లూకా 18:11) అని చెప్పావా? అలా అయినట్లయితే పరిశుద్ధాత్మ గూర్చి నీకు ఎటువంటి అనుభవముండినా, నీవు విరిగిన మనిషివి కావు.

ఇక రెండవ ప్రశ్న: నీ ఆత్మీయ ఎదుగుదల గూర్చి లేక నీవు సాధించిన వాటి గూర్చి నీవు గర్విస్తున్నావా?

ఒక విరిగిన మనుష్యుడు తనలో మంచి ఏదియు నివసింపదని తెలుసుకొనినవాడై జీవితములో కాని తన పరిచర్యలో కాని ఏ ఫలాన్నైనా చూచినట్లయితే అతడు వెంటనే దేవునికి మహిమ చెల్లించును.

కనుక ఈ రెండూ విరిగిన మనుష్యుని యొక్క రెండు గుర్తులు.

  1. అతడు ఎవ్వరిని తక్కువగా చూడడు - అది విశ్వాసి కావచ్చును, అవిశ్వాసి కావచ్చును.
  2. అతడు అతడి ఆత్మీయ ఎదుగుదలను గూర్చికాని లేక అతడి పరిచర్యను బట్టి కాని ఎప్పుడైననూ ఉప్పొంగిపోడు.

మానవుని దేవుడు విరుగగొట్టు విషయంలో యాకోబు జీవితం ఒక చక్కని ఉదాహరణ. అతడు దేవునిని రెండు చోట్ల బేతెలు (ఆదికాండము 28వ అధ్యాయము) మరియు పెనూయేలు (ఆదికాండము. 32వ అధ్యాయము)లో కలుసుకొనెను.

బేతెలు అనగా దేవుని మందిరము (ఒక విధమైన సంఘము) మరియు పెనూయేలు అనగా ''దేవుని ముఖము'' అని అర్థము. మనమందరము దేవుని సంఘములోనికి ప్రవేశించి దేవుని ముఖమును చూడవలసిన అవసరమున్నది.

బేతెలు దగ్గర ''ప్రొద్దుగ్రుంకినది'' అని చెప్పబడినది (ఆది.కా. 28:1). అది కేవలము సహజముగా జరిగిన ఒక భౌగోళిక సంఘటన, కాని, తరువాత యాకోబు జీవితములో జరిగిన 20 సంవత్సరముల జీవితానుభవము అతడికి ఒక చీకటి అనుభవము వంటిది. పెనూయేలు వద్ద ''సూర్యోదయమాయెను'' అని చెప్పబడినది (ఆది.కా. 32:31). మరలా ఇదొక భౌగోళిక సత్యము. యాకోబు చివరకు దేవుని వెలుగులోనికి వచ్చియుండెను.

పేతురు రెండు మార్లు మార్పు చెందినట్లు, తరతరాలుగా దేవునితో నడిచిన విశ్వాసులకు, దేవునిని రెండు మార్లు కలుసుకొనిన అనుభవాలున్నవి. మొదటిది వారు తిరిగి జన్మించుట ద్వారా దేవుని మందిరము (సంఘము)లో ప్రవేశించినప్పుడు, రెండవది, వారు దేవునిని ముఖాముఖిగా కలుసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి మరియు వారి జీవితములు మార్పు చెందినప్పుడైయున్నది.

బేతెలు వద్ద, ఒక నిచ్చెన పరలోకమునకు వేయబడి యుండుటను యాకోబు కలగనెను. యోహాను 1:51లో, భూమి నుండి పరలోకమునకు మార్గమైన ఆయనే ఆ నిచ్చెన అని యేసు ప్రభువు తెలియపర్చెను. కనుక నిజానికి యాకోబు, యేసు ప్రభువు పరలోకానికి మార్గమును తెరచుట గూర్చిన ప్రవచన దర్శనాన్ని చూచెను. ప్రభువు ఆ కలలో యాకోబునకు అనేక విషయాలు వాగ్దానము చేసెను. కాని యాకోబు కేవలము భూసంబంధమైన విషయాలపైనే దృష్టియుంచుట చేత అతడు కేవలము ఈ లోక సంబంధమైన భద్రత, శారీరక ఆరోగ్యము మరియు ఆర్థిక అభివృద్దిని గూర్చియే అలోచించెను. అందువలన అతడు దేవునితో ప్రభువా! నీవు నా ఈ ప్రయాణములో నా గూర్చి జాగ్రత్త తీసుకొని నాకు ఆహారము దుస్తులు ఇచ్చి తిరిగి నా యింటికి క్షేమంగా తీసుకువచ్చినట్లయితే, నా సంపాదన అంతటిలో నూటికి పదివంతులు నీకిచ్చెదను అని చెప్పెను. యాకోబు దేవునిని తనను కాపాడే ఒక కాపలాదారునిగా చూచాడు. దేవుడు అతడిని కాపాడినట్లయితే యాకోబు దేవునికి జీతముగా తన రాబడిలో నూటికి 10 వంతులు ఇచ్చును!!

ఈనాడు కూడా అనేక మంది విశ్వాసులు దేవునిని అలాగే చూస్తున్నారు. వారు ఆయన నుండి వస్తు సంబంధమైన సౌకర్యములనే కోరుకొంటున్నారు. మరియు దేవుడు వాటిని వారికిచ్చినట్లయితే, వారు సంఘ కూటములకు తప్పకుండా వెళ్ళుదురు మరియు వారి సొమ్ములో కొంత దేవుని పనికి ఇచ్చెదరు. అటువంటి విశ్వాసులు ఒక లోకసంబంధియైన వ్యాపారస్తుడు తన స్వంత సౌఖ్యాన్ని, లాభాన్ని వెదుక్కొన్నట్లు నిజానికి దేవునితో వ్యాపారము చేయుచున్నారు.

యాకోబు తన జీవితములో 20 సంవత్సరములు ఈలోక విషయాలను గూర్చి ప్రాకులాడుతూ ఉండెను. అతడు లాబాను కుటుంబము నుండి ఒక భార్యను చేజిక్కించుకోవాలనుకొని ఇద్దరిని పొందెను. అతడు ఇద్దరిని కావాలనుకోలేదు కాని ఇద్దరిని పొందెను. తరువాత లాబానును మోసగించి అతడి గొఱ్ఱెల ద్వారా ధనవంతుడయ్యెను. అతడు లాబాను యింటికి పైసా లేకుండా వెళ్లి, అక్కడ నుండి గొప్ప ధనవంతునిగా తిరిగివచ్చెను. ఈనాటి అనేక మంది విశ్వాసుల వలెనే అతడి అభివృద్దికి కారణము దేవుని ఆశీర్వాదమనే అతడు చెప్పెను.

కాని, ''దేవుని ఆశీర్వాదము''నకు నిజమైన గుర్తు ఏది? అభివృద్దియా? కాదు. యేసు క్రీస్తు యొక్క స్వభావము వంటి స్వభావములోనికి మారుటైయున్నది.

నీ జీవితము ఇప్పటికిని దేవునికిని మానవునికిని ఉపయోగపడకుంటే, నీకున్న మంచి ఉద్యోగము, ఇల్లు మరియు అనేక సౌకర్యముల వలన ప్రయోజనమేమిటి?

అయితే దేవుడు యాకోబుతో అంతటితోనే ఆయన కార్యాన్ని నిలిపివేయలేదు. ఆయన తిరిగి రెండవ మారు అతడిని పెనూయేలు దగ్గర కలుసుకొనెను.

నా సహోదర సహోదరీల్లారా! మీలో చాలామందికి దేవుని రెండవ మారు కలుసుకొనవలసిన అవసరమున్నది. మీరెప్పుడైతే మీ జీవితములో అట్టడుగు స్థితికి జారిపోయారో అప్పుడు అది మీకు అవసరమైయున్నది. అప్పుడు దేవుడు మిమ్ములను తీర్పు తీర్చి నరకమునకు పంపుటకు బదులు మిమ్ములను ఆయన పరిశుద్ధాత్మతో నింపును.

ఆది కాండము 32వ అధ్యాయములో, ఏశావు (ఎవరి దగ్గరైతే 20 సంవత్సరముల క్రితం యాకోబు మోసం చేసి జ్యేష్ఠత్వమును తీసుకొనెనో ఆ వ్యక్తి) యాకోబును కలుసుకొనుటకు వచ్చుచుండెనని విని యాకోబు భయపడినట్లు చదువుదుము. ఏశావు అతడిని చంపివేయునేమో అనుకొనెను. అదే విధముగా మనకు భయము కలిగించే పరిస్థితులు మనము ఎదుర్కొనునట్లు దేవుడు చేయుటలో మనకు మేలున్నది. ఎందుకంటే ఎప్పుడైతే మనుష్యులు మనలనుఏమైనా చేస్తారేమో అని భయపడినప్పుడు, మనము దేవుని దగ్గరకు చేరుదుము.

పెనూయేలు దగ్గర యాకోబు ఒంటరిగా ఉండెను (ఆది.కా. 32:24). దేవుడు మనలను కలుసుకొనుటకు ముందు ఆయన మనలను ఒంటరిగా పట్టుకొనవలసియున్నది. అందుచేతనే ఈ రోజుల్లో సాతాను ప్రపంచాన్ని ఎంతో తీరికలేని విధంగా పరుగుల పెడుతున్నట్లుగా (ముఖ్యముగా పట్టణములలో) చేసాడు. చాలా మంది విశ్వాసులకు దేవునితో ఒంటరిగా గడుపుటకు కూడా సమయముండుట లేదు. వారి జీవితాలు ఎంతో తీరిక లేనట్లుగా అయిపోయినవి. వారు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయాలు (ఉదాహరణకు దేవుడు) వారి దైనందిన కార్యక్రమ పట్టికలో ఖాళీ లేక సంపూర్తిగా బయటకు త్రోసివేయబడెను. ఈ దినాల్లో క్రైస్తవత్వంలో నుండిన విచారకరమైన విషయమిదియే.

దేవుడు యాకోబుతో ఆ రాత్రి చాలా సమయము పెనుగులాడినట్లు చూడగలము. కాని, యాకోబు లొంగిపోలేదు. ఆ పెనుగులాట యాకోబు జీవితములో గత 20 సంవత్సరాల జీవితాన్ని సూచనార్థంగా చూపిస్తుంది. అక్కడ యాకోబు లొంగకుండా ఉండుటను బట్టి చివరకు దేవుడు అతడి తొడగూడు వదులవునట్లు కొట్టెను. యాకోబు ఆ సమయములో 40 సంవత్సరాల వయస్సు కలవాడు మరియు అతడు ఎంతో బలమైన వాడు. అతడి తాతగారైన అబ్రహాము 175 సంవత్సరాలు జీవించెను. దాని ప్రకారము యాకోబు అప్పటికి మంచి వయసులో నుండెనని చెప్పవచ్చును. అతడి యొక్క 75% జీవితము ఇంకను ఆయన ముందున్నది. ఆ సమయములో యాకోబు మంచి బలవంతుడుగా ఉన్నాడు. ఆ సమయములో తనకు కుంటితనము అసలు అతడు ఎప్పుడూ కోరుకొననటువంటిది. ఎందుకంటే అది తన భవిష్యత్తు కొరకు వేసుకొనిన ప్రణాళికలన్నిటినీ చెదరగొడుతుంది. ఆ పరిస్థితిని ఇప్పటి పరిస్థితులతో అర్థము చేసికొనినట్లయితే, ఒక 20 సంవత్సరాల యువకుడు తన తొడగూడు వసలిపోయి, మామూలుగా నడువ లేక తన మిగిలిన జీవితకాలమంత కర్రతో నడవాల్సియుండును. అది ఊహించని అనుభవము. యాకోబు చేతి కర్ర లేకుండా ఇంకెప్పుడూ తన మిగిలిన జీవితంలో నడువలేక పోయెను.

దేవుడు యాకోబును విరుగగొట్టుటకు అనేక విధాల ప్రయత్నించి సాధించలేకపోయెను. అందువలన చివరగా అతడికి శాశ్వతంగా ఉండే కుంటి తనమునిచ్చెను. అది చివరకు యాకోబు విరువబడునట్లు చేసినది.

అవసరమైతే దేవుడు మన జీవితాలలో కూడా అదే చేయును. ఆయన ప్రేమించువారిని, వారు గొప్ప విపత్తులో పడకుండునట్లు ఆయన క్రమశిక్షణ చేయును.

అలాగే ఒకవేళ ఆయన నిన్ను సరిదిద్దుట మానివేసినట్లయితే, అప్పుడు నీవు ఒక వెనుకకు జారిపోయిన వానిగా ఉంటూకూడా, మంచి ఆరోగ్యముతో మరియు మంచి సంపాదన సంపాదిస్తూ నీ జీవితాన్ని దేవునికి ఉపయోగము కాని విధముగా ఉండినా ఆయన ఊరుకొనును. కాని, ఆ స్థితిని ఎవరు కోరుకొందురు? ఆయన చిత్తమును ఈ భూమిపై నెరవేర్చుటకును, ఆయనతో కలసి నడుచుటకును, దేవుడు నా విషయంలో కరిÄనంగా నిర్ణయము తీసుకొని అవసరమైతే నాకు శాశ్వతముగా ఏదైనా కుంటితనము నిచ్చినా నేను దానినే కోరుకొందును.

గొప్ప అపొస్తులుడైన పౌలునకు కూడా ఆయన విరుగగొట్టబడిన స్థితిలో ఉండుటకు ఆయన శరీరములో ఒక ముల్లు కావలసియుండెను (2 కొరిందీ¸ 12:7). అతడు ఈ ''సాతాను యొక్క దూతను'' తీసివేయమని దేవునికి మరల మరల ప్రార్థించెను. కాని ''అది సాతాను యొక్క దూత అయినా నేను దానిని తీసివేయను నీవు దీనుడుగా ఉండుటకు అది నీకు అవసరము - దానిని బట్టి నీవు నాకును నీతోటి మానవులకును ఉపయోగముగా నుందువని దేవుడు చెప్పెను''.

దేవుడు యాకోబు యొక్క తొడగూడు వసిలినట్లు కొట్టిన తరువాత ఆయన ''నా పని పూర్తయినది అనెను''. ''నన్ను పోనివ్వు, నీవెప్పుడు నన్ను కోరుకొనలేదు, నీవు స్త్రీలను, డబ్బును మాత్రమే ఎప్పుడు కోరుకొంటివి'' అనెను. అయితే ఇప్పుడు యాకోబు దేవునిని పోనివ్వలేదు. చివరకు అతడిలో మార్పువచ్చినది.

అప్పటి వరకు తన జీవితములో భార్యలను, ఆస్తిని కోరుకొనిన యాకోబు దేవునిని పట్టుకొని, ''నన్ను దీవించితేనే కాని పోనియ్యననెను''.

తన తొడగూడు వసులుట ద్వారా యాకోబు హృదయములో ఎంతో గొప్ప కార్యము జరిగినది. దాని ద్వారా యాకోబు ఇప్పుడు దేవుణ్ణి మాత్రమే కోరుకొనుచుండెను.

ఒక పాతకాలపు మాట చెప్పినట్లు "నీకు దేవుడు తప్ప ఇంకేమీ మిగలనప్పుడు, నీకు దేవుడే అన్నిటికి చాలినంతటి వాడు అని నీవు తెలుసుకొందువు". అది నిజమే.

అప్పుడు దేవుడు యాకోబును ''నీ పేరేమిటి?'' అని అడిగినప్పుడు ''మోసగాడు'' అని అర్థమిచ్చే యాకోబు అని చెప్పెను. చివరకు అతడు ఒక మోసగాడినని యాకోబు ఒప్పుకొనెను.

బహుశా నీవు కూడా ఒక మోసగాడివేనేమో? నీవొక ఆత్మీయమైన వాడివని ఇతరులను మోసము చేస్తూ తిరుగుచున్నావా? అలా అయినట్లయితే, ఈ రోజైనా దేవునితో నిజాయితీగా నీవొక వేషధారివని చెప్పలేవా?

కొన్ని సంవత్సరాల క్రితం కనుదృష్టిలేని తన తండ్రి ఇస్సాకు అతని పేరు అడిగినప్పుడు ఏశావు అని మోసగించినవాడు, ఇప్పుడు నిజాయితీతో యాకోబు అని చెప్పెను. అప్పుడు వెంటనే దేవుడు ఇక మీదట నీవు యాకోబు (మోసగాడు) కాదు, అనెను.

అది ప్రోత్సాహకరమైన మాట కాదా?

''నీవికమీదట మోసగాడివి కాదు''

అది నీవు విన్నావా?

హల్లెలూయా!

నీవు పాపములో ఇంకెప్పుడు పడవని కాదు. కాని నీ జీవితంలో ఇంక ఏ మోసము ఉండదు. ఇక నీ జీవితములో ఏ కపటము ఉండదు.

మరియు దేవుడు యాకోబుతో ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలు (దేవునితో రాకుమారుడు), ఎందుకనగా నీవు దేవునితోను మనుష్యునితోను పోరాడి గెలిచితివనెను. ఎటువంటి మార్పు- మోసగాడి నుండి దేవుని రాకుమారుడిగా మారెను. యాకోబు విరుగగొట్టబడిన తరువాతనే ఇదంతా జరిగినది.

మన యొక్క పిలుపు కూడా అదే. సాతానుపై ఆత్మీయమైన అధికారమును చూపుతూ, సాతాను బంధకాలలో నుండి ప్రజలను విడిపిస్తూ క్రీస్తుతో పాటుగా ఒక రాకుమారుని వలె సింహాసనముపై కూర్చొనుట మన పిలుపై యున్నది. క్రీస్తు శరీరములో అవయవములుగా మనకు దేవుని యొద్ద మరియు మనుష్యుల యొద్ద జయించు అధికారము కలిగియుండవలెను. మనము మనుష్యులందరకు ఆశీర్వాదకరముగా నుండుటకు పిలువబడ్డాము, కాని అది మనము విరువబడినప్పుడే జరుగును. మనమెప్పుడైతే మన వేషధారి జీవితము గూర్చియు మరియు మనలో నుండిన మోసము గూర్చియు దేవునితో నిజాయితీతో ఉందుమో అప్పుడే మనము విరువబడుదుము.

అనేక శతాబ్దాల తరువాత యాకోబు వంశస్థుడు, నతానియేలు, యేసు ప్రభువును కలుసుకొన్నప్పుడు యేసు అతని గూర్చి ''ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు ఇతని యందు యాకోబు (కపటము) లేడు'' (యోహాను 1:47) అని చెప్పెను. తరువాత యాకోబు బేతెలులో చూచిన నిచ్చెనను గూర్చి నతానియేలుకు జ్ఞాపకం చేసి అతడు కూడా నిజమైన ఇశ్రాయేలీయుడని చెప్పెను. అ

అధ్యాయము 1
మానవుని ఓటమిలో దేవుని ఉద్దేశ్యము

''నేను దేవుని ముఖాముఖిగా చూచితిని అయినను నేను బ్రతికితిని'' అని యాకోబు ఆశ్చర్యంతో చెప్పెను (ఆది.కా. 32:30).

నేను ఉద్యోగము నుండి తొలగింపబడాలి కాని నా జీతము మూడురెట్లు పెరిగినది.

నేను నరకమునకు వెళ్లవలసినది, కాని దానికి బదులుగా ఆయన నన్ను పరిశుద్ధాత్మతో నింపెను! హల్లెలూయా!

అనేకులు పరిశద్ధాత్మతో ఎందుకు నింపబడలేకపోవుచున్నారో దానికి కారణము నాకు తెలుసు అనుకుంటున్నాను. దానిని అర్హతతో సంపాదించుకోవాలని అనుకొనుచున్నారు. దాని కొరకు వారు యోగ్యులుగా కావలెనని అనుకొనుచున్నారు. అనేక మతములకు సంబంధించిన ఎంతో మంది యదార్థమైన ప్రజలు కూడా ఇదే విధముగా పాపక్షమాపణ కొరకు వెదికెదరు. ఎందుకు వారు పాపక్షమాపణ పొందరు? ఎందుకంటే దానిని వారు సంపాదించుకొనుటకు ప్రయత్నించెదరు.

నీవు నీ పాపములకు క్షమాపణ ఎలా పొందావు? నీవు దానిని సంపాదించుకొన్నావా? లేక నీవు దానికి తగినవాడవా? నీ జీవితంలో దేవుని యొక్క క్షమాపణ పొందుటకు నీవు ఏ మాత్రము అర్హుడవు కావనుకొనిన రోజు ఒకటి నీ జీవితంలో వచ్చినది. అప్పుడు నీవు యేసు ప్రభువు యొద్దకు ఒక క్రైస్తవుడుగా కాక ఒక పాపిగా వచ్చావు. మరియు వెంటనే నీ పాపములు క్షమించబడ్డాయి. అదే విధముగా ఆత్మ యొక్క నింపుదలను పొందుటకు మనము రావలెను.

ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మ నింపుదలను పొందుటకు ఉపవాసముండి, ప్రార్థించి ఎదురుచూస్తున్నారు. అలా చేయుటలో తప్పేమీ లేదు కాని వాటి ద్వారా నీవు పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను పొందుటకు నిన్ను నీవు అర్హునిగా చేసికోదల్చుకొంటే నీవు తప్పుత్రోవలో ఉన్నావు.

ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ నింపుదలను పొందలేదో అప్పుడు నీవు ''ప్రభువా! నేను ఉపవాసముండి ప్రార్థించి ఎదురుచూచాను. అయినను ఎందువలన నీవు నన్ను నీ ఆత్మతో నింపలేదు'' అని అడుగుదువు. అయితే నీ పాపములకు క్షమాపణ నీవు ఎలాగైతే సంపాదించుకొనలేదో లేక ఎలాగైతే దానిని అర్హతగా పొందలేదో అలాగే పరిశుద్ధాత్మను కూడా నీవు సంపాదించుకొనలేవు లేక దానికి తగిన అర్హుడవు కాలేవు. ఇవి రెండును కూడా దేవుని ఉచిత బహుమానములు. వీటిలో దేని కొరకైనా నీవు వెల చెల్లించలేవు. వాటిని నీవు ఉచితముగా తీసుకొనవలెను లేనట్లయితే ఎప్పటికిని నీవు పొందలేవు.

దేవుని బహుమానములన్నీ ఉచితము. కాని మానవుడు చేసే తప్పేమిటంటే దేవుని దగ్గర వెల చెల్లించి వాటిని పొందాలనుకుంటాడు కాబట్టి వాటిలో దేనిని అతడు పొందలేడు. దేవుని బహుమానములను పొందుటకు నిన్ను నీవే యోగ్యునిగా చేసుకొనుటకు ప్రయత్నించినట్లయితే, వాటిని నీవు పొందలేవు. ఇప్పటికే నీవు పరిశుద్ధాత్మతో నింపబడకుండా యుండుటకు బహుశా ఇదే కారణమై యుండవచ్చును.

యేసు ప్రభువు ఈ లోకములో ఉండినప్పుడు, ఇతరులందరికంటే పరిసయ్యులే పాపక్షమాపణ పొందుటకు అర్హులని వారు తలంచిరి. కాని వారు దానిని పొందలేదు మరియు వారు నరకానికి వెళ్ళారు. దానికి విరుద్దముగా మగ్దలేనే మరియ వంటి పేరుపొందిన పాపులు వెంటనే పాపక్షమాపణ పొందిరి. తన జీవితమంతా నేరజీవితం గడిపిన ఒక దొంగ ఒక్క క్షణంలోనే క్షమింపబడి, అతడు సిలువ వేయబడిన రాత్రియే పరదైసునకు వెళ్లాడు.

ఎవరైతే మేము పాత్రులము కాము అని తెలుసుకొందురో వారికే దేవుడు ఆయన యొక్క మంచి బహుమానములనిచ్చును. ద్రాక్షతోటలోనికి రోజులో ఆఖరి గంటలో పనిచేయుటకు వచ్చిన వారికి వారు దేనికిని అర్హులు కారని తెలియును. అందుకే వారు మొదట జీతము పొందిరి. కాని, మొదట వచ్చిన వారు జీతము పొందుటకు అర్హులని అనుకొనినవారు, చివరకు మిగిలిపోయిరి.

తప్పిపోయిన కుమారుని కథలో తండ్రిచేతికి ఒక ఉంగరము ఉండినట్లు చదువుదుము. దానిని ఒక రోజున ఆయనతీసి, తన సొమ్మంతటినీ వ్యర్థపుచ్చిన చిన్న కుమారుని చేతికి పెట్టెను. ఆయన తన పెద్ద కుమారునికి ఎందుకు ఇవ్వలేదు? అతడు స్వనీతిపరుడు, మనుష్యుల దృష్టిలో పెద్దకుమారుడు ఆ ఉంగరమునకు అర్హుడు. కాని, తండ్రి దానిని తన చిన్న కుమారునికిచ్చెను.

అది దేవుని యొక్క పద్ధతి. మానవునిలో ఉన్న గర్వమును అణగద్రొక్కుటకు ఆయన అట్లు చేయును. అందునుబట్టి ఆయన సన్నిధిలో ఎవ్వరును అతిశయపడలేరు. ఆయన మార్గములు మన మార్గములు వంటివి కావు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు (యెషయా 55:8).

నేను మీకు వివరించి చెప్పాలనుకుంటున్న సత్యాన్ని మీరు అర్థము చేసికొన్నట్లయితే, దేవుడు మానవుని విషయంలో ఎలా పనిచేస్తారనే ఒక ముఖ్యమైన పద్దతి గూర్చి తెలుసుకొందురు.

దేవుని యొక్క అనుగ్రహమే నన్ను మారుమనస్సునకు నడిపించినది (రోమా 2:4) దాని తరువాత దేవుడు నాపైచూపిన ప్రతి అనుగ్రహము నన్ను ఇంకను ఎక్కువైన మారుమనస్సులోనికి నడిపించినది.

దేవుడు అనుగ్రహము మిమ్మును కూడా మారుమనస్సులోనికి నడిపింపనియ్యుడి. దేవుని యొక్క మంచితనమును అవకాశముగా తీసుకొనవద్దు. దేవుడు మన యెడల అనేక విధాలుగా ఆయన దయను చూపించుచుండెను. కాని ఆయన మన యెడల దయగా నున్నంత మాత్రాన ఆయన మన గూర్చి సంతోషంగా ఉన్నారని ఊహించుకోవద్దు. ఆయన మానవులందరి యెడల దయకలిగియుందురు. ఆయన యొక్క దయ మనము మారుమనస్సు పొందుటకే, మనమెప్పుడైతే నిజాయితీతో ఆయన వైపు తిరుగుదుమో, అప్పుడు ఆయనచేతి ఉంగరమును మనకు తొడుగును. ఆయన ఆ ఉంగరాన్ని ప్రత్యేకంగా మన వంటి పాపుల కొరకే దాచి ఉంచారు.

యేసు క్రీస్తు ఒకసారి పరిసయ్యులతో మీరందరు ఆరోగ్యముగా నున్నారు. మీకు వైద్యుడక్కర్లేదు. రోగులకే వైద్యుని అవసరమున్నది కాబట్టి నేను వారి కొరకు వచ్చాను (మత్తయి 9:12) అని వ్యంగ్యంగా అన్నారు. ఆయన వ్యంగాన్ని ప్రేమతో కలిపి వాడారు. అది వారు తెలుసుకొనునట్లు చేయుటకు, కాని వారు తెలుసుకొనలేదు.

ఎవరైతే వారు నీతిమంతులమని అనుకొందురో వారి గూర్చి ప్రభువైన యేసు రాలేదు, కాని వారు పాపులమని ఒప్పుకొన్న వారి గూర్చి వచ్చి ఆయన యుండెను. ఇక్కడ కూర్చొని యున్న వారిలో చాలా మంది ఆ పరిసయ్యుల వలె యుండవచ్చును. అయితే దానిని మీరు తెలుసుకొనకుండా వేషధారణ, గర్వము, స్వనీతి మొదలగు రోగములతోఉండవచ్చును. ఈ రోగములు ఎయిడ్స్‌ మరియు కేన్సరు కంటె బహు ప్రమాదకరమైనవి. మిమ్మును నాశనము చేయును! ఈ పాపములతో పోల్చిచూచినట్లయితే ఇతర పాపములైన నరహత్య, వ్యభిచారము వంటివి కేవలము జలుబు, జ్వరము వంటివి మాత్రమే. హంతకుడు, వ్యభిచారి మాత్రమే రోగముతో నున్నాడని నీవనుకొనవచ్చును. కాని నీవు వారిరువురి కంటె రోగగ్రస్తముగా నున్నావు!!

దేవుడు ఆయన జీవమును, ఆయన శక్తిని మరియు ఆయన అధికారాన్ని మనకు ఇవ్వవలెనని ఆశించుచున్నాడు. అందుచేతనే మనము చివరకు విరుగగొట్టబడేవరకూ మరల మరల పడిపోనిచ్చుచున్నారు.

యోబు విషయంలో, ఆయన ఆస్తి, బిడ్డలు చివరకు ఆయన ఆరోగ్యము పోగొట్టుకొనుట ద్వారా ఏవిధముగా ఆయన చిట్టచివరకు వచ్చునట్లు దేవుడు చేసెనో మనము చూచుదుము. ఒక విధముగా అతడు తన భార్యను (ఎప్పుడూ నిష్టూరముగా మాట్లాడినది) తన ముగ్గురు స్నేహితులను (తనను తప్పుగా అర్థము చేసికొని విమర్శించిన వారిని) కూడా పోగొట్టుకొనెను. తన స్నేహితులు స్వనీతి పరులైన బోధకులుగా మారి అతడు ''పడిపోయినప్పుడు తన్నుట'' యందు సంతోషించువారుగా అయ్యిరి. దేవుడు ఆయన కనికరము చొప్పున ముగింపు పలికేంత వరకు వారు అతడిని ''తన్నుతూనే'' ఉండిరి. ఆ పరిస్థితులన్నిటిలో కూడా యోబు తనలో తప్పేమీ లేదని తనను తాను సమర్థించుకొనెను. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడెనో, యోబు తనలో ఉన్న భ్రష్టత్వమును - స్వనీతిని చూచి పశ్చాత్తాపపడెను. అతడు ఒక నీతి పరుడు. అది మంచిదే. కాని అతడి నీతిని బట్టి అతడు గర్వించెను. అది మంచిది కాదు. దేవుడు యోబు విషయంలో ఆ అనుభవాలలో నుండి తీసుకువెళ్లిన తరువాత, అతడు ఒక విరిగిన వానిగా అయ్యెను. అప్పటినుండి అతడు కేవలము దేవునియందే అతిశయించెను. ఆ విధముగా యోబు యెడల దేవుని ఉద్దేశ్యము నెరవేరెను.

యోబు విరిగిన వానిగా అయిన తరువాత ఇప్పటి వరకు (బోధకుల ద్వారా) నీ గూర్చి వింటిని కాని, ఇప్పుడు కన్నులారా నిన్ను చూచుచున్నాను (యోబు 42:5) అని దేవునితో చెప్పెను. అది యోబు యొక్క పెనూయేలు! అతడు కూడా దేవుని కన్నులారా చూచియు జీవించెను. దాని ఫలితమేమిటి? అతడు దూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపపడెను (6వ). నలుగురు బోధకులు రోజుల తరబడి బోధించినా యోబు విషయంలో సాధించలేనిది, దేవుడు ఒక్క క్షణంలో ఆయన అనుగ్రహము ప్రత్యక్షపర్చుట ద్వారా పూర్తి చేసెను. అక్కడ దేవుని అనుగ్రహము యోబును విరుగగొట్టి పశ్చాత్తాపములోనికి నడిపించినది.

మనము దేవుని గూర్చి కూటములలో వినుచుందుము. మనకు కావాల్సింది ఆయన అనుగ్రహమును చూడగల్గునట్లు ఆయనను ముఖాముఖిగా కలుసుకొని దాని ద్వారా మనము విరుగగొట్టబడవలెను. పేతురు విషయంలో అదే జరిగినది. పేతురు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకి మరియు కోడి రెండుమార్లు కూసిన తరువాత జరిగిన దేమిటో మీకు జ్ఞాపకం ఉందా? అతడు ప్రభువు ముఖము చూచెను. పేతురుకు కూడా అక్కడ పెనూయేలు అనుభవమైనది. ''ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను'' అని మనము చదువుదుము (లూకా 22:61) దాని ఫలితమేమిటి? పేతురు బయటకు వెళ్లి సంతాపపడి ఏడ్చెను (లూకా 22:62).

ఆ దయగల, క్షమించే చూపు మొరటుగా ఉన్న చేపలు పట్టేవాని హృదయాన్ని విరుగగొట్టినది.

పాత నిబంధనలో దేవుడు ఆరోగ్యమును, ఆస్తిని మరియు అనేక వస్తు రూపమైన ఆశీర్వాదములను ఇశ్రాయేలీయులకిచ్చెను. అయితే వాటన్నిటిలో ఒక ఆశీర్వాదము వాటన్నిటికంటె గొప్పది. అది సంఖ్యాకాండము 6:22 నుండి 26 వచనము వరకు నున్నది. అక్కడ అహరోను ఇశ్రాయేలీయులను ''యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక'' అని దీవింపమని ఆజ్ఞాపింపబడినట్లు మనము చదువుదుము.

మన జీవితాలను పూర్తిగా మార్చివేసి గొప్ప దీవెన పొందునట్లు దేవునిని కన్నులారా చూచే అనుభవానికి బదులు అనేక మంది విశ్వాసులు ఈనాడు ఆరోగ్యము, సంపద (వీటిని అవిశ్వాసులు కూడా ప్రార్థించకుండా పొందుతున్నారు) మరియు ఉద్రేకము కలుగజేసే అనుభవాలు (అందులోఎక్కువగా కృత్రిమమైనవి) వంటి తక్కువైన దీవెనల కొరకు వెదకుట విచారకరముకాదా?

మనమొక వేళ ఎప్పటికిని ధనికులము కాకపోయినా, ఎప్పటికిని స్వస్థత పొందకపోయినా, మనము ప్రభువు యొక్క ముఖాన్ని చూచినట్లయితే, అది మన అవసరాలన్నిటిని తీర్చును.

యోబు దేవునిని కలుసుకొన్నప్పుడు అతడి ఒళ్ళంతా పుండ్లతో నిండియున్నది. కాని అతడు దేవునిని స్వస్థత కొరకు అడుగలేదు. ''నేను దేవునిని కన్నులారా చూచితిని, నాకదే చాలును'' అనెను. యోబు స్నేహితులుగా వచ్చిన ముగ్గురు బోధకులు, వారికి వివేచన కలిగి యున్నట్లుగాను మరియు దేవుని నుండి వారికి వాక్యము వచ్చినట్లుగాను కనబరచుకొని అతడి జీవితములో ఉండిన ఏదో రహస్య పాపమును బట్టియే ఈ శిక్ష వచ్చినదని చెప్పిరి. ఈనాడు కూడా తనకు తానుగా ప్రవక్తలమని చెప్పుకొని ''యెహోవా వాక్కు ఈలాగు సెలవిచ్చెను'' అని దేవుని ప్రజలపై దోషము మోపే ప్రసంగములు చేసే వారున్నారు. కాని ఆ ముగ్గురు బోధకులు బోధించునట్లు దేవుడు యోబును తీర్పులతో భయపెట్టలేదు.

దేవుడు యోబు యొక్క ఓటములు గూర్చి కాని లేక అతడు ఒత్తిడికి లోనయినప్పుడు దేవునికి విరోధముగా అతడు నిష్టూరముగా మాట్లాడిన మాటలనుగాని జ్ఞాపకము చేయలేదు. కేవలము దేవుడు ఆయన అనుగ్రహమును ప్రత్యక్షపరచెను. మానవుని సంతోషము కొరకు ఆయన సృష్టించిన సృష్టిలో సౌందర్యమును, మానవునికి లోబడుటకు దేవుడు సృష్టించిన జంతువులలో కనబడే దేవుని అనుగ్రహమును ఆయన ప్రత్యక్షపరచెను. దేవుని అనుగ్రహము యొక్క ప్రత్యక్షత యోబు మారుమనస్సు పొందునట్లు చేసినది. చాలా మంది దేవుని అనుగ్రహమును అవకాశముగా తీసుకొని దానిని దుర్వినియోగపర్చుదురు. కాని యోబు విషయంలో అది మారుమనస్సు పొందునట్లు చేసినది. అప్పుడు దేవుడు యోబునకు అంతకు ముందు ఉన్న దానికి రెండింతలుగా దీవించెను.

మనము యాకోబు 5:11లో చదివినట్లు దేవుడు మనలను విరుగగొట్టుటలో ముఖ్య ఉద్దేశ్యము మనలను సమృద్ధిగా దీవించుటైయున్నది. యోబు విషయములో దేవుని మనసులో నుండిన ఉద్దేశ్యము అతడి యొక్క స్వనీతిని, గర్వాన్ని చెదరగొట్టి, అతడు ఒక విరిగినవానిగా అగుటచేత దేవుడు అతడికి ముఖాముఖిగా కనపరచుకొని అతడిని సమృద్ధిగా దీవించుటైయున్నది. దేవుడు మనకు ఇచ్చిన వస్తురూపమైన మరియు భౌతికమైన దీవెనల వెనుక దేవుని ముఖమును మనము చూడనట్లయితే అవి కూడా మనలను ఆయన నుండి దూరముగా తీసుకొని పోయి మనలను నాశనము చేయును. వస్తురూపమైన అభివృద్ధిని బట్టి ఎంతమంది విశ్వాసులు ఈరోజు దేవుని నుండి దూరముగా జరిగిపోయిరి.

దేవుని ముఖము యొక్క ఒక్క దర్శనము ఈలోకము మనకు ఇవ్వజూపే అన్నిటి కొరకు ఆశపడుట నుండి మనలను విడుదల చేయును.

"ఒక్క దాటిపోయే తళుకులో దైవికమైన ప్రేమతో నిండిన నీ ముఖాన్ని చూపు

ఇంక నీ ప్రేమ తప్ప దేనినీ ఎప్పుడూ కలలో కూడా ఊహించను.
తక్కువ వెలుగులన్ని చీకటిలా కొద్దియైన మహిమ ఇంకా తగ్గిపోగా

భూమి యొక్క అందం ఇంకెప్పుడూ అందంగా అన్పించదు."

పేతురు ప్రభువు యొక్క ముఖము చూచి బిగ్గరగా ఏడ్చాడు. పేతురు చివరకు విరుగగొట్టబడెనని మనము అనుకొనవచ్చును. అలా జరుగలేదు. అతడు పెనూయేలు అనుభవమునకు సిద్ధపడుటకు దేవుడు ఇంకొక తప్పిపోయిన అనుభవము ద్వారా తీసుకువెళ్లవలసి వచ్చినది.

యోహాను 21:3 లో పేతురు తనతోటి అపొస్తలులతో ''నేను చేపలు పట్టుటకు వెళ్లుదును'' అని చెప్పినట్లు చదువుదుము. ఏదో ఆ ఒక్క సాయంత్రము మాత్రమే చేపలు పట్టుట తన అర్థము కాదు. అతడు అపొస్తులుడుగా నుండుటకు తప్పిపోయెను కాబట్టి ఇంక అపొస్తులుడుగా నుండక ఎప్పుడూ చేపలు పట్టుకొనవలెనని అతడి ఉద్దేశ్యము.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు పిలచినప్పుడు పేతురు చేపల వ్యాపారము మానివేసెను. అతడు సమస్తమును నిజముగా విడిచిపెట్టి తనకు తెలిసినంతవరకు(చేయగలిగినంతవరకు) ప్రభువును వెంబడించెను. కాని తప్పిపోయాడు. ఇక ఈ అపొస్తులుడుగా నుండుట నా లాంటి వారికి కాదనుకొనెను. మూడున్నర సంవత్సరములు ఇంతవరకు భూమిపై జీవించిన బోధకులలో గొప్ప బోధకుని, ఇంతవరకు ఎవ్వరూ బోధించనటువంటి గొప్ప బోధలు వినిన తరువాత అతడు ప్రభువును ఎరుగనని నిర్మోహమాటముగా చెప్పెను, అదీ ఒక్కసారి కాదు ముమ్మారు. అతడు అపొస్తులుడుగా నుండుటకు చేయాల్సిన ప్రయత్నము చేసెను.

అయితే ఇప్పటికిని అతడు ఇంకొకపని చేయగలడు - అది చేపలు పట్టుట. ఆ పనిని అతడు చిన్న పిల్లవానిగా ఉన్నప్పటినుండి చేయుచున్నాడు. అందులో అతడు ఆరితేరినవాడు కూడా కనుక మరియొక మారు అతడు దానిని ప్రయత్నించాలని అనుకొనెను.కొందరు ఇతర అపొస్తలులు కూడా పేతురు వలె ఉండిరి. వారు కూడా ప్రభువు అవసరంలో ఉండినప్పుడు విడిచి పారిపోయారు. ఆ విధంగా వారు ''అపొస్తలులుగా'' ఉండుటలో తప్పిపోవుట చేత వారు కూడా చేపలు పట్టుటకు వెళ్ళిరి.

వారు నిష్కపటమైనవారు. వారు యేసు ప్రభువు మాటలు విని ఎంతో యిష్టపడిరి. మరియు వారి హృదయాలు ఆయన మాటలు వినినప్పుడు వారిలో మండినవి. వారు ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండాలనికొంటిరి కాని తప్పిపోయిరి.

నీ అనుభవం కూడా అలాగుండవచ్చు. గొప్ప ప్రసంగాలు విని నీవు కదిలింపబడవచ్చును. దేవుని వాక్యము వినుచుండగా నీలో నీ హృదయము మండి యుండవచ్చును. నీవు అన్నిటిని విడిచిపెట్టి నిజాయితీగా ప్రభువును వెంబడించాలని అనుకొనియుండవచ్చును. బహుశా నీవు అనేకమార్లు, శక్తివంతమైన ప్రసంగములు విని ''నిర్ణయాలు'' తీసుకొని యుండవచ్చును. బహుశా మరల మరల తప్పిపోయిన తరువాత ''ఈసారి నేను నిజముగా సాధిస్తాను'' అనుకొని యుండవచ్చును. కాని నీవు బయటకు వెళ్ళి మరల తప్పిపోయి యుండవచ్చును. నీవు ఈ దినాన ఒకమారు వెనుకకు తిరిగి చూచుకొనినట్లయితే ఒక దానిపై ఒకటిగా పేర్చిన తప్పిపోయిన అనుభవాల కుప్ప, ఒక వేయిమార్లు అనుభవం ఉండవచ్చును. ''మీలో కొందరు ఇంక లాభంలేదు, ఇక ఈ విషయాన్ని విడిచిపెట్టుట మంచిది. ఈ సువార్త ఇతరులకు పనిచేయవచ్చును. కాని నా విషయంలో పనిచేయుట లేదు. నేను చాలాదూరము వెళ్లిపోయాను. నేనిక తిరిగి రాలేను అని నిరుత్సాహముతో అనుకొనుచున్నారా?''

ఈ రోజున మీరు అలా భావిస్తున్నారా? ఇక ప్రయత్నించి లాభము లేదు కాబట్టి ఇంకెప్పుడూ ప్రత్నించనని నిర్ణయించుకొంటిరా? తిరిగి లోకములోనికి వెళ్లి అదృష్టమునో లేక శూన్యమైన ఆనందమునో వెదకుకొందామని నిర్ణయించుకొంటిరా? ఈ రోజు మీరు ఆ విధంగా అనుకొంటున్నారా? యేసు ప్రభువు శిష్యుడుగా చూపించుకొనుట కంటే పూర్తిగా లోకస్థునిగా ఉండుటయే మంచిదనుకొనుచున్నారా?

మంచిదే, సరిగా అలాగే చేపలు పట్టుటకు వెళ్ళిన అపొస్తలులు అనుకొన్నారు. మరియు ప్రభువు వారిని ''మీరు వెళ్ళి అక్కడ ఏమైనా సాధించగలరేమో చూడండి'' అని చెప్పినట్లు వెళ్ళనిచ్చెను. కనుక పేతురు, అతని స్నేహితులు రాత్రంతా ప్రయత్నించారు. కాని ఘోరంగా ఓడిపోయారు. వారి జీవితాల్లో అంతటి ఘోరమైన రాత్రి ఎప్పుడూ లేదు.

అక్కడ కూడా వారు తప్పిపోయారు. ఒకమారు దేవుడు నిన్ను పిలచినట్లయితే ఆయన నిన్ను పోనివ్వడు. నీవు చేపలు పట్టుటకు వెళ్లినా ఇంకా ఏ పని చేయుటకు వెళ్ళినా నీవు తప్పిపోవునట్లు ఆయన చేయును. నీవు ఎంత ప్రయత్నించినా చివరకు తప్పిపోదువు. దేవుని ప్రేమ నీ జీవితమును వ్యర్థము చేసుకొనుటకు ఒప్పుకొనదు. నీవు ఆయన యొద్దనుండి పారిపోయినా, నీవు ఎక్కడికి వెళ్ళి ఏమి చేసినా తిరిగి ఆయన యొద్దకు వచ్చేంతవరకు నీవు తప్పిపోవుచుందువు.

అయితే ఇది దేవుని చేత పిలువబడని వారికి వర్తించదు. అనేక మంది మోసకరమైన వ్యాపారస్తులు, రాజకీయ వేత్తలు ఎంతో 'నల్లడబ్బు' సంపాదిస్తూ దేవుడు లేకుండానే మంచి ఆరోగ్యముతో జీవిస్తున్నారు. దేవుడు ఎందుకు అట్లు జరుగనిస్తున్నాడు? ఎందుకంటే వారు ఆయన బిడ్డలు కారు. నేను వారిగూర్చి మాట్లాడుటలేదు. ఆయన స్వంతముగా నుండుటకు జగత్పునాది వేయబడక మునుపే, పిలువబడిన నీతో మాట్లాడుచున్నాను.

నిజానికి గలిలయ సముద్రములో ఎన్నో చేపలున్నాయి. ఆ రాత్రి ఇతర చేపలు పట్టేవారు ఎన్నో చేపలను పట్టుకొని యుందురని నేను అనుకొనుచున్నాను. ఆ చేపలు వారి పడవల దగ్గరకు వెళ్ళాయి. కాని దేవుడు వాటిని పేతురుకు దూరముగా ఉంచాడు. అందువలన ఒక్క చేప కూడా అతడి దగ్గరకు రాలేదు. ఇతర పడవల వారు పేతురు పడవ దగ్గరకు వచ్చి వారికి ఎంత మంచి వేట దొరికిందో చెప్పియుండవచ్చును కూడా. అది పేతురును అతడి స్నేహితులను వారు ఏమీ పట్టలేకపోవుట ఇంకా ఆశ్చర్యము కలుగజేసియుండును.

నీ చుట్టూ ఉన్న ఇతరుల వలె నీవు ఎందుకు ధనవంతుడవు కాలేకపోతున్నావని ఎప్పుడైనా ఆలోచించావా? నీవెందుకు ఇతరుల వలె వ్యాపారములో లక్షలు సంపాదించుటలేదో ఆలోచించావా? నీ చుట్టూ ఉన్నవారు ఇంకా అభివృద్ది చెందుతున్నారు, నీవు మాత్రం ఏమీ ఎదుగుటలేదు. దానికి కారణం నీ యెడల దేవుని పిలుపు ఉన్నది. ఆ ఇతరులకు కలిగిన దానికంటే విలువైన దానిని నీకు ఇవ్వాలని ఆయన కోరుచున్నాడు.

పేతురు తన యెడల నుండిన దేవుని పిలుపునుండి తిరిగి వెళ్ళిపోవుచుండెను. దేవుడు అతణ్ణి మరల తప్పిపోవునట్లుచేసి అతన్ని విరుగగొట్టెను. పేతురు ఆ రాత్రంతా కష్టపడినా చేపలేమీ పట్టలేడని ప్రభువునకు తెలియును. అయినను వారు సమయాన్ని వ్యర్థపరచకుండా వారు పడవపై వెళ్ళినవెంటనే ఆయనెందుకు రాలేదు? అపొస్తలులు సాయంత్రం ఆరు గంటలకు చేపలు పట్టుటకు మొదలు పెట్టిరి. కాని యేసు ప్రభువు వారి దగ్గరకు మరుసటి ఉదయం ఐదు గంటల వరకు రాలేదు. కనీసం రాత్రి తొమ్మిది గంటలకు వారి దగ్గరకు ఆయన ఎందుకు రాలేదు? ఉదయం ఐదు గంటల వరకు ఆయనెందుకు ఎదురుచూచెను? వారు సుమారు 11 గంటల సేపు ప్రయత్నించి ఓడిపోయి అలసిపోయినంత వరకు ఆయన ఎందుకు ఎదురుచూచెను?

దానికి సమాధానము మనము పడిపోవుటలో దేవునికుండిన ఉద్ధేశ్యములో ఇమిడియున్నది. అందులోనే మనం గతంలో పెనుగులాడుతున్నప్పుడు, సహాయం కోసం మరల మరల కేకలు వేసినప్పుడు, మరియు మన బలమైన ప్రార్థనలకు ఇప్పటికి జవాబు రాకపోవుటను మనం అర్థం చేసుకోగలము.

పేతురు మరియు అతని స్నేహితులు చేపలు పట్టుటకు సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళినప్పుడు వారు తప్పిపోయినవారు కాదు. అప్పుడు వారు పూర్తి ఆశతో ఉన్నవారు. రాత్రి 9గంటల వరకు చేపలేమి పట్టలేదు. బహుశా అప్పుడు వారు కొంచెం నిరాశచెంది యుందురు. అప్పటికి వారు బయటకు వెళ్ళిన పనిలో తప్పిపోయినట్లు అనిపించుకోదు. మధ్య రాత్రికి వారు బాగా క్రుంగియుంటారు. తెల్లవారి 4 గంటలకు వారు ఆశ వదులుకోవడం మొదలు పెట్టి యుందురు. కాని, వారు పూర్తిగా తప్పిన వారుగా అవ్వాల్సియున్నది. అది జరగడానికి, వారు ఇంకా ఓడిపోవాల్సియున్నది. వారి మీద వారికున్న నమ్మకము అనే గ్రాఫు నెమ్మదిగా తగ్గుచున్నది. అయితే అది ఇంకా పూర్తిగా అడుగునకు తాకే విధముగా శూన్యమునకు (సున్నా) చేరవలసియున్నది. అది ఉదయం 5గంటలకు మాత్రమే అయినది. అప్పుడు వారి నిరీక్షణను వదిలిపెట్టుటకు సిధ్దమయ్యారు. బహుశా అప్పుడు వారు ''ఇక ప్రయత్నించి లాభంలేదు, ఇంటికి పోదాం పదండి'' అనుకొనియుందురు.

అప్పుడు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. అది దేవుని పద్ధతి. అప్పుడు ప్రభువు వారి వలలునిండిపోయేటట్లు చేసారు. వారి జీవితాల్లో ఏరోజూ అన్ని చేపలు వారు పట్టలేదు. ఆ ఉదయం వారు 153 గొప్ప చేపలు పట్టారు. వారు గతంలో బాగా చేపలు పడినప్పుడు 20 లేక 30 చేపలు పట్టి యుందురు. కాని ఇది నిజముగా ఒక అద్భుతము. ఎవ్వరూ ఆ ప్రదేశములో ఒక్కరోజులో అన్ని చేపలను పట్టలేదు. ఆ రోజు ఆ ప్రదేశములో పట్టిన చేపల గూర్చి గలిలయ రికార్డు పుస్తకాల్లోనికి ఎక్కును. వారు ఆశ అంతా వదలుకున్న సమయములో ప్రభువు వారికి చేసిన అద్భుతమును వారెప్పుడూ గుర్తుంచుకొందురు.

నీవు కూడా నీ శక్తి అంతా హరించుకుపోయిన స్థితికి ఈ రోజుకు వచ్చావా? ఎటువెళ్ళాలో లేక తరువాత ఏంచెయ్యాలో తెలియక, ఎటు వెళ్ళినా, ఏంచేసినా ఓటమి, నిరాశనూ చూస్తున్నావా? అలా అయినట్లయితే ప్రభువు నీకు ప్రత్యక్షయమ్యే స్థలానికి బహుశా నీవు చాలా దగ్గరగా ఉన్నావేమో, నీవు విడిచిపెట్టవద్దు. నీ మీద నీకున్న నమ్మకము సున్నా దగ్గరకు వచ్చుటకు ఆయన కనిపెడుతున్నారు. ఆయనింకను నీ దగ్గరకు రాకపోయి ఉంటే దానికి కారణము నీ ఆత్మీయ జీవితపు గ్రాఫులో నీ వింకా సున్నా విలువ దగ్గరకు రాలేదన్నమాట.ఆయన నీలో ఇంకా నీ స్వంత బలము ఉన్నట్లు చూస్తున్నారు. అది కూడా పోవలసియున్నది. ప్రభువు వచ్చేముందు లాజరు చనిపోయి పాతి పెట్టబడవలసియున్నది.

చివరకు యేసు ప్రభువు ఆ ఉదయం ఒడ్డునకు వచ్చి ఏమి అడిగారు? వారి దగ్గర చేపలేమీ లేవని ఆయనకు తెలియును. అయినప్పటికి పిల్లలారా మీ యొద్ద చేపలేమైనా ఉన్నవా? అని అడిగెను. బహుశా ఎవ్వరు కూడా మొదట సమాధానమిచ్చియుండరు. ఆయన రెండవసారి అడిగియుండవచ్చును. అప్పుడు వారు 'లేదు' అని సమాధానమిచ్చియుండవచ్చును. వారి ఓటమిని వారు ఒప్పుకొనిరి. వారికి ముందున్న యాకోబు, యోబుల వలె వారు కూడా నిజాయితీ చూపిరి. వారు తప్పిపోయారనేది ఒప్పుకొనమనియే దేవుడు వారి నుండి కోరుచుండెను. దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా నిజాయితీని కోరుచుండెను.

మన జీవితాల్లో ఎప్పుడైనా దేవుడు ఆశించేది నిజాయితీ అనే సత్యమును తెలుసుకొన్నప్పుడు అది నా జీవితములో గొప్ప సంతోషము కలిగించిన విషయాల్లో ఒకటి అయ్యెను. అప్పుడు ఆయన మన కొరకు అద్భుతాలు చెయ్యగలడు.

''నీవేమైనా చేపలు పట్టావా?'' - ''లేదు''. ''నీ వలలు వేరొక వైపున వెయ్యుము'' ఇదిగో ఒక అద్భుతము జరిగినది.

''నీ పేరు ఏమిటి?'' - ''మోసగాడు''. ''నీ పేరు ఇక ఏ మాత్రము మోసగాడు కాదు కాని దేవుని రాజకుమారుడు'' ఇదిగో ఒక అద్భుతము జరిగినది.

సహోదర, సహోదరీలారా, ఇది దేవుని పద్ధతి.

మన నుండి దేవుడు కోరుకొనేది నిజాయితీ.

ఈ రోజున నీవు ఆయనతో నిజాయితీగా నుండలేవా?

మా సంఘము ఒక ఆసుపత్రి లాంటిది. మేమందరము ఇక్కడ రోగులము. మేము నిపుణులము, ప్రత్యేక వైద్యులము కాము. మాలో కొందరు ఇతరుల కంటె ఈ ఆసుపత్రిలో ఎక్కువ కాలము నుండి ఉంటున్నారు. కాని మేమందరము రోగులమే. ఒకే ఒక వైద్యుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. మా మధ్యను ఇతర సలహాలిచ్చేవారు లేరు. నిపుణులు, సలహాలిచ్చేవారు తమ ఔపాసన గుంపులలో స్వనీతి పరుల మధ్య యుందురు కాని దేవుని జీవముగల సంఘములో నుండరు. మా ఆసుపత్రికి అందరూ ఆహ్వానితులే. నీకు రోగము ఎక్కువగా ఉన్నట్లయితే, స్వస్థత కొరకు నీవు మా మధ్య ఎక్కువ ఉండవలెను. మా సందేశము ''క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను, అందులో మేము ప్రధానులము'' - అనునదియే.

దేనికీ అర్హత లేని వారిని దేవుడు కలుసుకొనును. సుంకరి ''దేవా! నేను పాపిని నన్ను కరుణించు'' అని ప్రార్థించెను (లూకా 18:13). తనను తాను నేను పాపిని అని పిలచుకొనెను. తన భావమేమిటంటే అతడితో పోల్చుకొంటే అతడి చుట్టూ ఉన్న వారందరూ పరిశుద్ధులు అని! ఈ భూమిపై అతడు మాత్రమే పాపి! అతడు నీతిమంతుడుగా తీర్చబడి (క్షమింపబడి) ఇంటికి వెళ్లెను అని యేసు క్రీస్తు చెప్పెను. అటువంటి వారిని మాత్రమే దేవుడు నీతిమంతులుగా తీర్పు తీర్చును.

ఈ 'తీర్పుతీర్చబడుట' అనేమాట గూర్చి కొంత చెప్పాలనుకుంటున్నాను. లూకా 18:14లో నుండిన తీర్పు తీర్చబడుట అనేమాట ఎంతో చక్కనిది మరియు విడుదలచేసే మాట, దాని అర్థం చెబుతాను.

ఈ పుస్తకంలో ఉన్న పేజీలు చూడండి, ప్రతి పేజీలో ఎడమప్రక్క వాక్యపు ప్రారంభము, కుడి ప్రక్క వాక్యపు ముగింపు ఒకే వరుసలో నుంటాయి. కంప్యూటర్‌ పరిభాషలో దానిని ''తీర్పు తీర్చబడడము'' అంటాము. ఆ పేజీలో వేరు వేరు వరుసలలో వాక్యాలు హెచ్చుతగ్గులున్నా, అక్షరాల సంఖ్య ఎక్కువ తక్కువలున్నా కంప్యూటర్లో ఒక మీట నొక్కగానే అవి ఒకే వరుసలోనికి వచ్చును. ఇప్పుడు నీవు నీ కంప్యూటర్లో 'జస్టిఫై' అనేది చేయకుండా ఏదొకటి వ్రాసినట్లయితే నీవు వ్రాసిన వ్రాత కుడి ప్రక్క వంకరటింకరగా నుండును. మనము గతంలో టైపు మిషన్లు ఉపయోగించినప్పుడు మన పేజీలు అలా ఉండేవి. కనీసం ఒక్క పేజీలోనైనా ప్రతి వరుస సమానంగా ఉండేటట్లు వ్రాయుట అసాద్యమయ్యేది. కాని ఇప్పటి అద్భుతం చూడండి. ఇప్పుడు జస్టిఫికేషన్‌ అనేది వచ్చినది. ఇది వరుస చివర గీతపెట్టి పదాన్ని పూర్తి చేయాల్సిన అవసరము లేదు. నీవు ఈ పుస్తకములో పేజీలు చూచినట్లయితే పుస్తకం అంతట్లో కూడా వరుస చివరన గీతలేమీ కనబడవు. అది చూచుటకు చక్కగా ఉండదు కాబట్టి అట్లు చేయలేదు. కంప్యూటర్‌ వరుసలో నుండిన పదముల మధ్య ఖాళీని సరిగా పూరించుట వలన ప్రతి వరుస చక్కగా 'జస్టిఫై' అయినది.

నీవొకవేళ ఒక పేజీలో 30 వరుసలు చివరన వంకరగా వచ్చినట్లు వ్రాసినా, నీవు అంత వరకు వ్రాసినది 'జస్టిఫై' అగునట్లు ఒక్క ఆజ్ఞ ఇచ్చినట్లయితే అనగా ఒక మీటను నొక్కి పట్టుకొంటే వ్రాయబడిన వరుసలన్నీ ఒకే తీరులోనికి వచ్చును.

దేవుడు నీ జీవితంలో అదే చేస్తాడు. నీ గత జీవితంలో ప్రతిరోజూ నీవు నీ జీవితాన్ని గలిబిలి చేసుకొని యుండవచ్చును. కాని నీవు క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే దేవుడు ఒక్క క్షణంలో నిన్ను ''జస్టిఫై'' (సరిగా) చేయును. నీ గత జీవితంలో ప్రతి వరుస సరికాబడును. అది నీ జీవితమంతటిలో ఒక్క మారు కూడా పాపము చేయనట్లు, ఏవిధమైన వంకర టింకర వరుసలు లేకండా ఖచ్చితమైన తిన్నని వరుసలోనికి వచ్చును.

అది అద్భుతం కాదా? కంప్యూటర్‌ మన పేజీలకు ఎట్లు చేయునో దేవుడు మన జీవితాలకు అట్లే చేయును. అందులో ''నీతిమంతులుగా తీర్చబడుట'' అను దానికి 20వ శతాబ్దమునకు చెందిన ఉదాహరణను మనము ఇక్కడ చూడగలము.

ఇక్కడ ఇంకొంచెం చెప్పుదును.మనము కంప్యూటర్‌ను 'జస్టిఫై' అని ఆజ్ఞయిస్తే అటు తరువాత వ్రాయబడిన వరుసలన్నీ కూడా వాటికవే యితర వరుసలతో సమానముగా తిన్నగా వచ్చును. నీతిమంతులుగా తీర్చబడుట మన గత జీవితమునకు ఎట్లు అన్వయింపబడునో అట్లే రాబోవు జీవితానికీ అన్వయింపబడును. ఇది నిజముగా అద్భుతమైన సువార్త.

దేవుడు మనలను క్రీస్తునందు చూచును. చెప్పుకొనుటకు మనకంటూ మన నీతి ఏమీలేదు. క్రీస్తే మన నీతియైయుండెను.

దేవుడు మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చినప్పుడు, అది మనమెప్పుడు మన జీవితమంతటిలో ఏ ఒక్క పాపము కాని లేక పొరపాటు కాని చేయని దానితో సమానము.

మనము ఆయన వెలుగులో నడుచుచున్నందున, మనము తెలిసిచేసిన మరియు తెలియక చేసిన ప్రతిపాపము నుండి క్రీస్తు రక్తము మనలను కడిగి ఎల్లప్పుడూ నీతి మంతులుగా తీర్చుచుండును.

మనము వాక్యమును చదువునప్పుడు మనముచేసే పొరపాట్లలో ఒక ముఖ్యమైనది. మనము లెక్కలు చేసేటప్పుడు ఉపయోగించే తర్కజ్ఞానమును ఉపయోగించి వాక్యమును అర్థము చేసికొనుటకు ప్రయత్నించుట.

దేవుని మనసును మనము అట్లు అర్థము చేసికొనలేము. ఎందుకంటే దేవుడు గణితశాస్త్రపు సిద్ధాంతముతో పనిచేయడు. కనుక మనము గతములో ఎన్నో పొరపాట్లు చేసి కూడా మన జీవితాల్లో దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చగలమా అను దానిని తెలుసుకొనుట మన తర్కాన్ని ఉపయోగించి ప్రయత్నించలేము. గణిత శాస్త్రపు సిద్ధాంతాల ప్రకారం అది అసాధ్యము. గణిత శాస్త్ర పద్దతుల ప్రకారము లెక్క చేసేటప్పుడు ఎక్కడైనా ఒక్క మెట్టు తప్పయినా, చివరకు వచ్చేసరికి జవాబు ఎప్పుడు తప్పవుతుంది.

నీవొకవేళ ఆ తర్కమును (logic) ఉపయోగించదలిస్తే, నీవు గతంలో ఎక్కడో దేవుని చిత్తమును తప్పిపోతే (అది నీవు 2 సంవత్సరముల వయసప్పుడు కావచ్చును లేక 52 సంవత్సరముల వయసప్పుడు కావచ్చును, అది అంత ప్రాముఖ్యముకాదు) ఇప్పుడు నీ వెంతగా ప్రయత్నించినా, ఎంతగా పశ్చాత్తాపపడినా తిరిగి దేవుని చిత్తమును నెరవేర్చలేవు. గణిత శాస్త్ర సిద్ధాంత ప్రకారము నీవు ఏ సమయములో తప్పుచేసావనేది ముఖ్యము కాదు (అది 2వ మెట్టు కావచ్చు లేక 52వ మెట్టు కావచ్చును) కాని, చివరకు జవాబు తప్పుగా వచ్చును.

కాని దేవుడు ''నా మార్గములు మీ మార్గముల వంటివి కావు'' అని చెప్పుచున్నాడు.

మన జీవితాల్లో ఆయన ఉద్దేశ్యాలు తర్కజ్ఞానాన్ని బట్టి పనిచెయ్యుటలేదు. అందుకు దేవునికి వందనాలు. ఒకవేళ అలా అయినట్లయితే ఒక్క మానవ మాత్రుడు కూడా (చివరకు అపొస్తులుడైన పౌలు కూడా) దేవుని పరిపూర్ణ ఉద్దేశ్యాన్ని నెరవేర్చలేడు. మనలో ప్రతి ఒక్కరము ఎక్కడో ఒక్క దగ్గర తప్పిపోయాము. మనము విశ్వాసజీవితంలోనికి వచ్చిన తర్వాత కూడా అనేకమార్లు పడిపోవుచుంటిమి. మనము తెలిసికూడా అనేకమార్లు పాపము చేసాము. నిజాయితీగా నున్నవారు అది వెంటనే ఒప్పుకొందురు. అయితే అద్భుత విషయం ఏమంటే మనలో ప్రతి ఒక్కరికి ఇంకను నిరీక్షణ ఉన్నది.

గణిత శాస్త్ర సమస్యలు ఏ చిన్న తప్పు చేసిన వారినైనా ఖండించును. ఏ చిన్న తప్పుకు కూడా అవకాశముండదు. 2+2=3.9999999 కు సరికాదు. అది సరిగా 4 గా ఉండవలెను. అంతే తప్ప ఎక్కువ గాని తక్కువ గాని కాకూడదు.

అయితే దేవుని ప్రణాళిక లెక్కల వలె పనిచేయదు. ''ఆయన ప్రణాళికలోతప్పిపోవుట అవసరమైయున్నది''. తప్పిపోవుట ద్వారా తప్ప, మనలో ఎవ్వరము ఇంకొక విధముగా విరుగగొట్టబడము. అందుచేత మన ఆత్మీయ విద్యాభ్యాసములో తప్పిపోవుట అనునది ఒక ముఖ్యమైన పాఠ్యాంశము అని మనము చెప్పగలము.

యేసు ప్రభువు ఒక్కరే ఎప్పుడూ దేనిలోనూ తప్పిపోకుండా జీవించెను. కాని మనలో (ఎంతో గొప్ప వారిని) కూడా తప్పిపోవుట ద్వారా దేవుడు విరుగగొట్టెను. చివరకు పేతురు, పౌలులు కూడా మరల మరల తప్పిపోవుట ద్వారా విరుగగొట్టబడిరి.

గనుక సువార్త సందేశమును బట్టి సంతోషించుము, దేవుని యొక్క అనుగ్రహము నిన్ను మారుమనస్సులోనికి నడిపించునుగాక. అదినిన్ను సంతోషకరమైన జీవితమునకును మరియు దేవునిలో సంపూర్ణ విశ్రాంతి లోనికిని నడిపించును. ఆ విశ్రాంతి దేవుడు ''నిన్ను ఆయన కుమారునిలో అంగీకరించెను (శాశ్వతముగా)'' అని తెలుసుకొనుట ద్వారా కలుగును (ఎఫెసీ 1:6).

ప్రతి దినము మనము ఎన్నో పొరపాట్లు చేయుచుందుము. మనకు తెలియకుండా ఊహించని విధముగా మనము పాపములోనికి జారిపడిపోదుము. కొన్ని సమయాల్లో మనపై నున్న ఒత్తిడి చాలా ఎక్కువగా నుండుటచేత, మనము కృంగిపోయి నిరుత్సాహపడుదుము. ఇంకా మనము ఎక్కువ పాపము చేయునట్లు శోధింపబడుదుము. దేవుడు మనపై నుండిన ఒత్తిడిని అర్థము చేసికొనగలడు మరియు ఆయన కనికరము గలవాడు. ఆయన మనలను సహింపజాలనంతటి కంటె ఎక్కువగా శోధింపబడనియ్యడు, అంతేకాక శోధనతో పాటు మనము తప్పించుకొను మార్గమును కూడా ఏర్పాటు చేయును. ఆయన మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి దానిని సరిగా చేయును.

క్రైస్తవ జీవితము మానవ తర్క జ్ఞానముతో పనిచేయదు. అది పరలోకమందున్న తండ్రి యొక్క అద్భుతములు చేయు శక్తితోనూ, సంపూర్ణ జ్ఞానముతోనూ, మరియు ప్రేమతోను పనిచేయును.

ఏ ఒక్కరు వారి జీవితాన్ని సరియైన వరుసలో నుండినట్లు టైపు చేసి వరుసలన్నీ పరిపూర్ణముగా ఉండునట్లు చెయ్యలేరు. మనలో ప్రతి వారిని - చివరకు మనలో శ్రేష్టులైన వారిని కూడా దేవుడే నీతిమంతులుగా తీర్పు తీర్చవలెను. ఏ మనుష్యుడు కూడా దేవుని యెదుట అతిశయపడుటకు లేదు.

అందును బట్టి, జీవిత పోరాటాల్లో ఓడిపోయి పెనుగు లాడుతున్న వారి యెడల మనము కూడా ఓడిపోయి, దేవుని నుండి ఎంతో కనికరము పొందితిమి కావున వారి యెడల కనికరము చూపవలయును.

ఆఖరుగా యేసు నామములో ఒక మాట చెప్పెదను:

నీవు ఇప్పుడు ఎక్కడ ఉంటివో, అక్కడ నుండియే తిరిగి మొదలుపెట్టి, ఇప్పటికిని నీ జీవితంలో దేవుని యొక్క పరిపూర్ణ ఉద్దేశ్యాన్ని నీవు నెరవేర్చవచ్చును.

నీవు మరల రేపు తప్పిపోయినట్లయితే, వెంటనే పశ్చాత్తాపముతో దేవుని దగ్గరకు వెళ్లుము. ఆయన మరల నిన్ను నీతిమంతునిగా తీర్పుతీర్చును.

ఈ సువార్త నాకు పని చెయ్యలేదని ఎప్పుడు చెప్పకు. నీవు అలా చెప్పుటకు శోధింపబడినట్లయితే, నీవు ఎంతో కాలముగా అబద్ధ బోధకులు, ప్రతిది ధర్మశాస్త్రమును బట్టి పరీక్షించి చెప్పే వారు మరియు సాతాను యొక్క మాటలు వినుట దానికి కారణము. వారి మాటలు వినుట మానుము, వారి పుస్తకములు చదువుట మాని, దేవునిని, ఆయన వాక్యమును వినుట మొదలుపెట్టుము. దేవుని వాక్యము ఏమి చెప్తుందో దానిని ఒప్పుకొనుము.

నీ విశ్వాసము పరీక్ష సమయములో తప్పిపోకుండును గాక.

మన ప్రభువు మన కొరకు ప్రార్థించినట్లు, మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకొందము.

ఆమేన్‌. ఆమేన్‌.

అధ్యాయము 2
తప్పినవారి యెడల దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక

చాలామంది సహోదర, సహోదరీలు వారి గత జీవితములో పాపమువలన వారి యెడల దేవుని ఉద్దేశ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు తప్పుట చేత, ఇప్పుడు వారి జీవితాల్లో దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చలేమని అనుకొందురు.

మన యొక్క స్వంత జ్ఞానము మీద లేక మన తర్క జ్ఞానము మీద ఆధారపడకుండా, ఈ విషయములో లేఖనములు ఏమి చెప్పుచుండెనో చూచెదము.

బైబిలు ఎలా మొదలయినదో గమనించండి.

''ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను'' (ఆది.కా. 1:1) దేవుడు వాటిని సృష్టించినప్పుడు భూమ్యాకాశములు తప్పనిసరిగా పరిపూర్ణముగా ఉండియుండెడివి, ఎందుకనగా ఆయన చేతినుండి ఎప్పుడును అసంపూర్ణమైనదియు లేక కొఱతగానున్నదియు రాదు.

అయితే ఆయన సృష్టించిన దేవదూతలలో కొందరు పడిపోయిరి. ఆ విషయం యెషయా 14:11-15 మరియు యెహెజ్కేలు 28:13-18లో చెప్పబడినది. అలాగు జరిగినప్పుడు ఆది కాండము 1:2లో వ్రాయబడినట్లు '' భూమి నిరాకారముగాను, శూన్యముగాను మరియు చీకటిగాను ఉండెను''.

ఆదికాండము 1వ అధ్యాయము మిగిలిన భాగములో అటువంటి నిరాకారమైన, శూన్యమైన, చీకటి పదార్థము నుండి ఆయనే 'మంచిది' అని చెప్పిన (ఆది 1:31) సుందరమైనది తయారగునట్లు ఆయనేచేసెను. ఆదికాండము 1:2,3 లో భూమిపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను మరియు దేవుడు ఆయన మాటను పలికెను. అది మార్పును తీసుకువచ్చినది.

ఈనాడు ఆ విషయంలో మనకుండిన సందేశమేమిటి?

అది ఏమిటనగా మనమెంత తప్పినా లేక మనమెంతగా పరిస్థితులను గజిబిజి చేసినా, అప్పటికిని దేవుడు మన జీవితాల నుండి ఆయన ఆత్మ ద్వారా మరియు వాక్యము ద్వారా ఒక మహిమగల కార్యాన్ని చేయగలడనేది.

పరలోకాన్ని, భూమిని సృష్టించినప్పుడు వాటి గూర్చి దేవునికొక నిర్ధుష్టమైన ప్రణాళిక యుండెను. కాని లూసిఫరు తప్పిపోవుటను బట్టి ఆ ప్రణాళికను పక్కను పెట్టవలసివచ్చియున్నది. అయితే దేవుడు పరలోకమును భూమిని తిరిగి తయారుచేసి చెడిపోయిన వాటి నుండి ఎంతో మంచిగా నుండిన దానిని బయటకు తీసెను.

తరువాత ఏమైనదో ఇప్పుడు చూచెదము.

దేవుడు ఆదాము, హవ్వలనుచేసి తిరిగి అంతా మొదలు పెట్టెను. వారి విషయంలో కూడా దేవునికి ఒక సంపూర్ణమైన ప్రణాళిక ఉండెను. అందులో వారు మంచి, చెడ్డల వివేచన నిచ్చు చెట్టు ఫలమును తినుట వలన చేర్చబడ లేదనేది స్పష్టము. కాని వారు నిషేధింపబడిన చెట్టు యొక్క ఫలమును తినుట ద్వారా దేవుని యొక్క అసలు ఉద్దేశ్యాన్ని పాడుచేసారు. ఆ ప్రణాళిక ఏదైనా కావచ్చును.

వారు దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళికను నెరవేర్చలేక పోయారని మన తర్కజ్ఞానము చెప్పవచ్చును. అయితే ఏదేను తోటలో దేవుడు వారిని కలియుటకు వచ్చినప్పుడు, వారి జీవితమంతా దేవుని యొక్క ద్వితీయ శ్రేణి ప్రణాళిక ప్రకారం జీవించాలని వారితో అనలేదు. ఆయన వారితో ఆదికాండము 3:15లో స్త్రీ సంతానము సర్పము యొక్క తలను నలగగొట్టును అని ఆయన వాగ్దానము చేసెను. అది లోక పాపము కొరకు క్రీస్తు చనిపోవుట మరియు కల్వరి సిలువపై సాతానును జయించుట అనే వాగ్దానమై యున్నది.

ఇప్పుడు ఈ వాస్తవాన్ని నీవు ఆలోచనతో గ్రహించి తర్కించుటకు ప్రయత్నించు.

క్రీస్తు యొక్క మరణము ఆదినుండి దేవుని సంపూర్ణ ప్రణాళికలో భాగమని మనకు తెలియును. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల (ప్రకటన 13:8). అయితే ఆదాము, హవ్వలు పాపము చేయుట వలన దేవుని ఉద్దేశ్యము నుండి తప్పిపోయినందున మాత్రమే క్రీస్తు చనిపోయెనని మనకు తెలియును.

గనుక తర్కబద్దంగా, లోకపాపములకై చనిపోవుటకు క్రీస్తును ఈ లోకమునకు పంపించుట అనే దేవుని పరిపూర్ణ ప్రణాళిక యొక్క నెరవేర్పు ఆదాము తప్పిపోయినందు వలన కాదు కాని ఆదాము తప్పిపోవుట ద్వారా అని మనము చెప్పవచ్చును. ఆదాము యొక్క పాపమును బట్టి తప్ప కల్వరి సిలువపై చూపబడిన దేవుని ప్రేమను మనము తెలిసికొని ఉండేవారము కాము. ఇది మన తర్కాన్ని భంగపరుస్తుంది. అందుచేతనే మీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక (సామెతలు 3:5) అని లేఖనములలో చెప్పబడి యున్నది.

దేవుడు గణిత శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం పనిచేసి యుండినట్లయితే, క్రీస్తు ఈ భూమిపైకి వచ్చుట దేవుని యొక్క ద్వితీయ శ్రేణి ప్రణాళికగా చెప్పుకొనవచ్చును. కాని అలాగు చెప్పుట దైవదూషణ అయియున్నది. అది దేవుని పరిపూర్ణ ప్రణాళికలో ఒక భాగమైయున్నది. దేవుడు పొరపాట్లు చేయడు. దేవుడు సర్వశక్తిమంతుడు మరియు నిత్యము ఉండేవాడు కనుక ఆయనకు చివరన జరిగేది ముందుగానే తెలియును కనుక ఆయన మన కొరకు నిశ్శబ్దంగా ప్రేమతో ప్రణాళికలు వేయును కనుక, ఆయన మన యెడల చేయు కార్యములను వివరించుటలో మానవ జ్ఞానము ఓడిపోతూ ఉంటుంది.

దేవుని మార్గములు మనమార్గములు వంటివి కావు. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు.

వాటి మధ్యనున్న తేడా ఆకాశమునకును భూమికిని ఉన్నంతటిది (యెషయా 55:8,9). కనుక దేవుని మార్గాలను అర్థం చేసికొనుటలో మన తెలివైన ఆలోచనలను మరియు తర్కాన్ని ప్రక్కన పెట్టుట మంచిది.

బైబిలు తెరిస్తే వచ్చే మొదటి పేజీ నుండి దేవుడు మనకు ఇచ్చుటకు ప్రయత్నించే సందేశమేమిటి? ఒక తప్పిపోయిన మానవుని తీసుకొని అతడి నుండి మహిమకరమైనది ఏదో చేసి మరియు అతడి జీవితంలో దేవుని సంపూర్ణ ప్రణాళికను నెరవేర్చునట్లు చేయగలడు అనునదియే.

అది మానవునికి బైబిలులో దేవుని యొక్క మొదటి సందేశము, దానిని మనమెన్నడూ మరచిపోకూడదు.

మరలా, మరలా తిరిగి పడిపోతున్న మానవుని తీసుకొని అతని యెడల దేవుని యొక్క ద్వితీయ శ్రేణి ప్రణాళిక కాక, ప్రథమ శ్రేణి ప్రణాళికను నెరవేరునట్లు దేవుడు చేయగలడు.

తప్పుట లేక ఓటమి కూడా కొన్ని మరచిపోలేని పాఠములు నేర్పుటకొరకు దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికలో భాగముగా ఉండి యుండవచ్చును. దేవుని గూర్చి మనకు చాలా కొద్దిగా తెలియుట చేత, మానవ తర్క జ్ఞానముతో దీనిని అర్థము చేసికొనుట అసాధ్యము.

విరిగినలిగిన స్త్రీ, పురుషులను మాత్రమే దేవుడు ఉపయోగించుకొనగలడు. మరియు ఒక విధముగా మన యొక్క అనేక పర్యాయముల ఓటమి ద్వారా ఆయన మనలను విరుగగొట్టును.

అపొస్తులుడైన పేతురు యొక్క నాయకత్వపు శిక్షణలో ఒక భాగము ఓటమి లేక తప్పుట అయి యున్నది. పేతురు యొక్క ఓటమిని ప్రభువు అతడిని విరుగగొట్టుటకు ఉపయోగించుకొనెను.

మన గూర్చి దేవునికుండిన పెద్ద సమస్యలలో ఒకటి ఆయన మనను దీవించునప్పుడు ఆ దీవెన మనలను గర్వముతో ఉప్పొంగచేయకుండునట్లు దీవించుట. కోపముపై జయము పొంది దాని గూర్చి గర్వించుట, మనము ఉండిన గోతికంటె ఎక్కువ లోతైన గోతిలోనికి పడిపోవుట వంటిది. దేవుడు మనలను విజయములో కూడా దీనులనుగా ఉంచవలసి యున్నది.

పాపముపై సరైన విజయము ఎప్పుడును లోతైన దీనత్వముతో కలసియుండును. ఇక్కడనే అనేక పర్యాయములు తప్పిపోవుట మనపై మన కుండిన నమ్మకాన్ని నాశనము చేయుటలో ముఖ్యమైన పాత్రను పోషించును. ఆ విధముగా మనము పాపముపై పొందిన విజయము దేవుని యొక్క కృపతో తప్ప సాధ్యము కాదని మనము ఒప్పింపబడుదుము. అప్పుడు మనము విజయము పొందినప్పుడు దానిగూర్చి ఎప్పుడును అతిశయించము.

ఇంకను, మనకు మనము మరల మరల తప్పుటను(పడిపోవుటను) బట్టి తప్పిన మరొకరిని తృణీకరించము. మనము లెక్క లేనన్ని మార్లు తప్పుట చేత మన రక్తమాంసములు గల శరీరములో నుండిన బలహీనతలు తెలిసికొనుట ద్వారా తప్పుతున్న వారియెడల సానుభూతి చూపగలము. బలహీనతల చేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియని వారి యెడలను త్రోవ తప్పిన వారి యెడలను తాలిమి చూపగల వాడైయుండెను (హెబ్రీ 5:2).

ఇటువంటి సందేశము విని, తర్క జ్ఞానపు మనసు కలిగిన మనుష్యులు ''మంచి జరుగును కనుక మనమింక ఎక్కువ పాపము చేయుదము'' అని చెప్పవచ్చును.

రోమా 3:7,8 లో అటువంటి మనుష్యునికి సమాధానముగా ఈ మాటలున్నవి. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రభలిన యెడల నేనికను పాపినైనట్లు తీర్పు పొందనేల? మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్ము దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే.

లేదు, మంచి కలుగునట్లుగా మనము పాపము చేయవలెనని మేము బోధించుట లేదు. లేక దేవుని యొక్క కృపను అవకాశముగా తీసుకొనవచ్చుననియు మరియు దేవునికి అవిధేయత చూపవచ్చుననియు, మరియు అలాగు చేసినను మనము విత్తిన దానిని కోయకుండా తప్పించుకొన వచ్చునని మేము చెప్పుట లేదు. అలా ఎప్పుడును కాదు.

కాని మేము చెప్పునది పడిపోయిన మానవుని యెడల దేవుని కృపగూర్చి మానవ తర్క జ్ఞానము అర్థము చేసికొన లేదనియే. దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు, చివరకు మనము దౌర్భాగ్యకరంగా మరల, మరల తప్పిపోయిన తరువాత కూడా ఆయన పరిపూర్ణ చిత్తములోనికి మనలను తెచ్చుట కూడా ఆయనకు సాధ్యమైయున్నది. కేవలము మన అపనమ్మకమే ఆయనను ఆటంకపరుచును.

''కాని నేను అనేక పర్యాయములు పరిస్థితులను గజిబిజి చేసుకొంటిని, ఇప్పుడు ఆయన పరిపూర్ణ చిత్తములోనికి నన్ను తెచ్చుట అసాధ్యము'', అని నీవనవచ్చును. అప్పుడు అది దేవునికి అసాధ్యమే. ఎందుకనగా ఆయన నీకు చేయగల దాని గూర్చి నీవు నమ్మలేక పోవుచున్నావు. కాని, దేవుడు నీకు చేయుదాని గూర్చి నీవు కేవలము నమ్మిక మాత్రముంచినట్లయితే దేవునికి ఏదియును అసాధ్యము కాదు అని యేసు చెప్పెను.

''మీ నమ్మిక చొప్పున మీకు జరుగును'' (మత్తయి 9:29) అనునది అన్ని విషయములలో దేవుని నియమమైయున్నది. మనకుండిన విశ్వాసమునకు తగినట్లుగ మనము పొందుదము. ఒకటి మన యెడల జరిగించుట దేవునికి అసాధ్యమని మనము నమ్మినట్లయితే, అది మన జీవితాల్లో ఎప్పటికి నెరవేరదు.

అయితే నీకంటే జీవితాన్ని ఇంకా ఎక్కువ గజిబిజి చేసికొన్న వేరొక విశ్వాసి జీవితములో దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక నెరవేరుటను క్రీస్తు న్యాయసింహాసనము ఎందట నీవు చూడగలవు - అది కేవలము విరిగిముక్కలైన తన జీవితాన్ని దేవుడు పైకి తీసి వాటి నుండి ఎంతో మంచిదానిని చేయగలడని నమ్ముటను బట్టి.

ఆ దినమున నీ జీవితములో దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా చేసినది నీ ఓటములు కాక (అవి ఎన్నైనా కావచ్చును) నీ అపనమ్మకమే అని ఆ దినమున నీవు తెలుసుకొనినప్పుడు ఎంత విచారించెదవు.

ద్రాక్షతోట యజమాని వెళ్లి పనివారిని పనికి కుదుర్చుకొనిన ఉపమానము కూడ ఇదే విషయాన్ని బోధిస్తుంది (మత్తయి 20:1-16). ఆఖరి గంటలో పనికి పెట్టుకొనబడిన వారు మొదట ప్రతిఫలము పొందిరి. వేరొక మాటలలో చెప్పవలెనంటే ఎవరైతే వారి జీవితాలలో 90 శాతం (12 గంటలలో 11 గంటలు) నిత్యత్వపు విలువలకు సంబంధించి ఏమియు చేయక వ్యర్థ పరచుకొన్నారో వారు కూడా మిగిలిన 10 శాతం వారి జీవితాలలో దేవుని కొరకు కొంత మహిమ గల పనిని చేయగలరు. ఇది తప్పిన (పడిపోయిన) మనకందరకు ఒక గొప్ప ప్రోత్సాహకరమైన విషయం.

అపవాది క్రియలను లయపర్చుటకే మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యెను (1 యోహాను 3:8).

దాని అర్థము ''మన జీవితాలలో సాతాను వేసిన చిక్కు ముడులను విప్పుటకే యేసు వచ్చెను''. మనమందరము మన బాల్య జీవితాన్ని ఒక చక్కని దారపు ఉండతో మొదలు పెట్టితిమి. కాని ఇప్పుడు ఆ దారము పదివేల ముడులు పడిపోయినది మరియు ఆ ముడులను విప్పగలమన్న నిరీక్షణ మనకు లేకుండా పోయినది. మన జీవితాల వైపు చూచుకొన్న కొలది మనకు నిరుత్సాహము మరియు నీరసము కలుగును. అయితే యేసు ఆ ముడులను ప్రతి ఒక్క దానిని విప్పుననునదియే సువార్తలో ఉండిన సందేశము.

''అది అసాధ్యము'' అని నీవనవచ్చును. అప్పుడు నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును. నీ విషయములో అది అసాధ్యము.నీ కంటె చెడుగా నుండిన జీవితము కలిగిన వేరొకరు ''అవును, దేవుడు నాలో అది చేయునని నేను నమ్ముదును'' అని చెప్పుచుండుట నేను వింటిని. అతనికి కూడ అతడి విశ్వాసము చొప్పున జరుగును. అతడి జీవితములో దేవుని పరిపూర్ణ ప్రణాళిక నెరవేరును.

యిర్మీయా గ్రంధము 18:1-6లో దేవుడు యిర్మీయాతో ఒక ప్రయోగాత్మకమైన ఉదాహరణతో ఆయన మాట్లాడెను. అక్కడ యిర్మీయాను ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని చెప్పెను. అక్కడ ఆయన ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేయుటను చూచెను. కాని ''ఆ పాత్ర అతడి చేతిలో పాడైపోయినది''. అప్పుడు ఆ కుమ్మరి ఏమి చెయ్యవలెను? ''ఆ కుమ్మరి వానికి ఇష్టమైన విధముగా అతడు వేరొక పాత్రగా దానిని చేసెను''.

అప్పుడు దానికి సంబంధించిన అన్వయింపు: ఓ ........! ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా? అనేది ప్రభువు యొక్క ప్రశ్న (వచనము 6) (ఆ చుక్కలున్న ఖాళీలో నీ పేరు నింపుకో మరియు అది నీకు దేవుని యొక్క ప్రశ్న).

నీవు తప్పిన (ఓడిపోయిన) అన్ని పరిస్థితుల గురించి నీ జీవితములో దైవికమైన విచారము నీకుండినట్లయితే, అప్పుడు నీ పాపములు కెంపువలె ఎఱ్ఱనివైనను పాత నిబంధనలో వాగ్ధానము చేసినట్లు (యెషయా 1:18) గొఱ్ఱె బొచ్చు వలె తెల్లగా అగుట మాత్రము కాక, మరిఎక్కువగా దేవుడు క్రొత్త నిబంధనలో మన పాపముల నెన్నటికి జ్ఞాపకము చేసికొనను (హెబ్రీ 8:12) అని వాగ్దానము చేసెను.

నీ యొక్క పొరపాట్లు లేక ఓటములు ఏమైనా, నీవు దేవునితో ఒక క్రొత్త ప్రారంభాన్ని మొదలు పెట్టగలవు. మరియు నీవొకవేళ వెయ్యి క్రొత్త ప్రారంభములను గతంలో మొదలు పెట్టి తిరిగి ఓడిపోయిన స్థితికి వచ్చినా, నీవు తిరిగి వెయ్యిన్నొక్క క్రొత్త ప్రారంభాన్ని ఈ దినము మొదలు పెట్టవచ్చును. దేవుడు నీ జీవితము నుండి ఇంకా మహిమ గలదానిని చేయును. ప్రాణమున్నంత వరకు నిరీక్షణ ఉన్నది.

కనుక దేవుని నమ్ముటలో ఎప్పుడును తప్పిపోవద్దు. ఆయన ఎన్నో గొప్ప కార్యములను ఆయన పిల్లలైన ఎందరికో చేయలేకపోవుట, గతములో వారు తప్పినందున కాదు, కాని ఇప్పుడు వారు ఆయనను నమ్మకపోవుటచేత.

ఇప్పటి వరకు ఏవిషయములైతే అసాధ్యమని అనుకొంటిమో వాటి గూర్చి రాబోవు దినములలో సాధ్యమని నమ్మి మనము, ''విశ్వాసము వలన బలము పొంది దేవునికి మహిమను చెల్లించుదుము'' (రోమా 4:20).

అందరును వారు యౌవనులైనా మరియు పెద్దవారైనా, వారు ఎంతగా గతములో తప్పినా, కేవలము వారి ఓటములను వారు ఒప్పుకొనినట్లయితే, వారిని వారు తగ్గించుకొనినట్లయితే మరియు దేవుని నమ్మినట్లయితే వారికి నిరీక్షణ కలదు.

ఆవిధముగా మన మందరము మన ఓటములనుండి నేర్చుకొని మన జీవితకాలంలో దేవుని సంపూర్ణ ప్రణాళికను నెరవేర్చుటకు సాగిపోదుము. మరియు రాబోవు కాలములో, పూర్తిగా ఓడిపోయిన వారి జీవితములనుండి కూడా ఆయన ఏమి చేయగలడో ఇతరులకు మాదిరిలుగా మనలనుచూపును.

''క్రీస్తుయేసునందు ఆయన మనకు కృపా మహదైశ్వర్యమును'' బట్టి (ఎఫెసీ 2:6), మనలో ఆయన ఏమి చేసెనో ఆ దినమున ఆయన చూపును.

హల్లెలూయా!

ఆమేన్‌, ఆమేన్‌.