యదార్థ సత్యము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు అన్వేషకుడు
    Download Formats:

అధ్యాయము 0
పరిచయం

నీకు తెలుసా

  • మంచి దేవుడు సృష్టించిన ప్రపంచంలో చెడు ఎలా మొదలైంది?
  • మీ మనస్సాక్షి మీ కన్ను లాంటిదేనా?
  • మీరు చేతబడి & మంత్రవిద్య యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయగలరా?
  • ప్రేమగల తండ్రిలా మీరు దేవునితో మాట్లాడగలరా?
  • దేవుని సహాయంతో మీరు ప్రతి సమస్యను అధిగమించగలరు.

ఈ పుస్తకంలో సమాధానాలున్నాయి.

అధ్యాయము 1
చెడును గూర్చిన యదార్థ సత్యము

ప్రపంచములోని ప్రజలు ప్రయాసపడి తెలిసికోవటానికి ప్రయత్నించిన గొప్ప మర్మములలో చెడును గూర్చిన మర్మమొకటి. సర్వజ్ఞుడైన మంచి దేవునిచే సృష్టింపబడిన లోకములో చెడు ఏ విధంగా మొదలైనది?


లోకములో ప్రతిచోటా చెడుదే పైచేయి ఎలా అయింది? ఎందువలన ప్రతిచోటా రోగము, పేదరికము, దు:ఖము మరియు బాధ ఉన్నాయి? దేవుడు మనకు సహాయము చేయుటకు ఆసక్తిగా లేడా? ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. వీటికి బైబిలు సమాధానమిస్తుంది.


వీటిని గూర్చి తెలుసుకొనుటకు ముందు మనము దేవుని గూర్చి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను తెలిసికొందము.


దేవుడు శాశ్వత కాలము నుండి ఉన్నవాడు. ఆయనకు ఆరంభం అనేది లేదు. ఆయన మన మెరిగిన కాల పరిమితులకు మించి ఉన్నవాడు, కనుక ఆయనకు ఆరంభం లేదు, ఆ విషయం మనము అర్థం చేసుకోవడం కష్టం.


బైబిలులో మొదటి వాక్యం ఇలా ప్రారంభమవుతుంది.


ఆదియందు దేవుడు....(ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము).


దేవుడు నిత్యత్వంలో గతకాలమంతటి నుండి ఉన్నాడనే నిజాన్ని వివరించడానికి బైబిలు ప్రయత్నించదు. అది వాస్తవ విషయముగా మాత్రమే చెబుతుంది.


మానవమాత్రులమైన మనతో దేవుడు వ్యక్తిగత సంబంధం కోరుచున్నట్ల్లు బైబిలు తెలియజేస్తుంది. మనము మనుష్యులను అర్థము చేసికొనే రీతిని దేవునిని అర్థము చేసుకోవటానికి, ఆయన ఒక మనిషి కాదు. ఆయన అచంచల గుణశీలములు మరియు నిత్యమైన మార్గములు గల ఆత్మస్వరూపి మరియు ఆయన ఎప్పుడును మార్పులేనివాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అనంతమైన జ్ఞానము, ప్రేమా పవిత్రతలు గలవాడు.


దేవుని యొక్క అనంతమైన ప్రేమ నిస్వార్థమైనది. కనుక ఆదినుండి ఆయన తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవటానికి ఆశపడేవాడు. అందుచేతనే ఆయన జీవరాశిని సృష్టించెను. ఆయన మొదటిగా తన సంతోషాన్ని, మహిమను పంచుకొనుటకు కోట్లాది దేవదూతలను సృష్టించెను. మానవుని సృష్టించుటకు పూర్వమే అది జరిగెను.


దేవదూతలలో ఒకరిని వారికి నాయకునిగా దేవుడు సృష్టించెను. అతడి పేరు లూసిఫరు. ఆ పేరు ఇప్పుడు చెడుగా ఎంచబడుతున్నా, ఒకప్పుడు ఆ పేరు దేవదూతలందరిలో జ్ఞానవంతుడు మరియు ఎంతో సౌందర్యవంతుడైన వానిది. అతడు దేవదూతలందరిలో ప్రధానుడు.


దేవుడు లూసిఫరును గూర్చి ఇట్లు చెప్పారు, ''పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గలవాడవు. అభిషేకము నొందిన కెరూబువు. నీవు నియమింపబడిన దినము మొదలుకొని, పాపము నీయందు కనబడువరకు ప్రవర్తన విషయములో నీవు యదార్థముగా నుంటివి'' (యెహెజ్కేలు 28వ అధ్యాయము 12 నుండి 15 వచనములు).


దేవుడు సృష్టించిన నక్షత్రములు మరియు వృక్షములవలె కాక లూసిఫరు మరియు యితర దేవదూతలు దేవునికి లోబడటానికి లేక లోబడకపోవటానికి ఎన్నుకొనే స్వీయ చిత్తము కలిగియుండిరి.


ఈ స్వీయ చిత్తమనునది ఒక వ్యక్తి నైతికజీవి అగుటకు మొదట అవసరమైనది. నక్షత్రాలు చెట్లు మంచిగాని, చెడుగాని చేయలేవు ఎందుచేతనంటే తమకు తామే ఏమియు ఎంచుకొనలేవు. అవి దేవుని ఆజ్ఞలకు సంపూర్ణముగా లోబడతాయి. ఎందుచేతనంటే అవి స్వతంత్రముగా నుండుటకు సృష్టింపబడలేదు. అందుచేతనే అవి దేవుని కుమారులుగా కూడా ఉండలేవు. ఒక శాస్త్రవేత్త నిర్మించిన మరమనిషి, అది చేయవలసిన ప్రకారము ప్రతి విషయములో ఎదురుమాట చెప్పక లోబడవచ్చు. కొన్నిమార్లు తన స్వంత కుమారుడే సణుగుకొనవచ్చును. కాని ఆ మరమనిషి ఎన్నటికిని అతని కుమారుడు కాలేడు.


రెండవదిగా మనస్సాక్షి అనునది ఒక వ్యక్తి నైతికజీవి అగుటకు ముఖ్య అవసరమైయున్నది. పక్షులు జంతువులు తమ పనులు స్వతంత్రముగా చేసికొనగలవు. వానికి మనస్సాక్షి లేదు గనుక అవి నైతిక జీవులు కానేరవు-కనుక అవి పరిశుద్ధముగా గాని, పాపసహితముగా గాని ఉండలేవు.


దేవుడు నైతికజీవి కనుక అవి దేవుని బిడ్డలు కాజాలవు. నిజానికి పక్షులు మరియు జంతువులు నీ బిడ్డలుగా కకూడా కాలేవు.


నీవు ఒక కుక్కకు నీ యొక్క ప్రతి ఆజ్ఞకు లోబడేటట్లు శిక్షణ ఇవ్వవచ్చు. అయినప్పటికీ ఆ కుక్క నీ యొక్క కుమారుడుగా ఎన్నటికిని కాలేదు. ఎట్లనగా నీ కుమారుడు నీ స్వభావం కలిగియుండాలి, నీ కుక్కకు అది ఉండదు.


కాని దేవుడు మానవుని తన స్వరూపములో తయారుచేసెను. అదియే మనలను తన బిడ్డలుగా కావటానికి సాధ్యపరచును.


మనము నైతిక జీవులమని గుర్తుచేస్తూ, మనము దేవుని నియమమును మీరినప్పుడు మనలను ఒప్పింప చేసే స్వరమే మనస్సాక్షి.


దేవదూతలు స్వీయచిత్తము, మనస్సాక్షి కలిగి సృష్టింపబడిరి. వారు నైతిక జీవులు. గనుక దేవుని సృష్టి యందు వారు సాటిలేని వారుగా యుండిరి. వారికి నాయకుడైన లూసిఫరు త్వరలోనే మంచివి కానట్టి ఆలోచనలు, ఆశలు గల వాడయ్యెను. లోకములో చెడు అనేది మొట్టమొదటిగా ఇచ్చటనే ప్రారంభమయినది.


లూసిఫరు యొక్క ఆలోచనలు మంచివి కాకపోవుటయే కాదు అవి గర్వముతోను, తిరుగుబాటుతోను, అసంతృప్తితోను కూడినవి.


అప్పటి వరకు లోకము పరిపూర్ణమైన స్వచ్ఛతతో నుండెడిది. కాని యిప్పుడు స్వీయ చిత్తముతో సృష్టింపబడిన ఒక జీవి యొక్క హృదయములో చెడు తన అసహ్య రూపమును పైకెత్తెను. జ్ఞాపకముంచుకో! చెడు మొట్టమొదట హృదయములోనే ప్రారంభమయినది. మొదట బాహ్యమైన క్రియలేదు. ఈనాడు కూడా దుష్టత్వము (చెడు) హృదయములోనే ప్రారంభమవుతుంది.


ఈ లోకములోనికి చెడును తీసుకొని వచ్చిన మొదటి పాపము 'గర్వము' అనే విషయాన్ని కూడా గుర్తుంచుకో.


దేవుడు లూసిఫరును తన సన్నిధి ఎదుట నుండి వెంటనే త్రోసివేసెను. ఆ క్షణము నుండి లూసిఫరు సాతానుగా పిలువబడెను.


సాతాను పతనమును గూర్చి బైబిలు ఇలా చెపుతుంది, ''తేజో నక్షత్రమా, వేకువ చుక్కా, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? నేను ఆకాశమున కెక్కిపోయెదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీది కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే'' (యెషయా 14వ అధ్యాయము 12 నుండి 15 వచనములు).


అయితే లూసిఫరు త్రోసివేయబడినపుడు కొంతమంది ఇతర దేవదూతలను కూడా, తాను చేసిన తిరుగుబాటులో చేరునట్లు చేసాడు. కోట్లాది దేవదూతలు అతడితో చేరిరి. నిజానికి పరలోకములో గల దేవదూతలలో మూడోవంతు అతడితో చేరారు (ప్రకటన 12వ అధ్యాయము 4వ వచనము). కనుక దేవుడు వారిని, లూసిఫరును కూడా బయటికి త్రోసివేశాడు. ఈ విధంగా పడిపోయిన దేవదూతలే దురాత్మలుగా (దయ్యాలు) ఈనాడు ప్రజలను ఇబ్బంది పెడుతూ, కష్టాలకు గురిచేస్తూ ఉన్నారు.


బహుశా నీవు దురాత్మల వలన ఇబ్బంది పడి ఉండవచ్చు లేక ఇతరులు నీపై చిల్లంగి తనము చేసి ఉండవచ్చు. అట్లయితే బైబిలులో నీకొక శుభవార్త ఉంది. నీవు సంపూర్తిగా వాటి యొక్క బాధలనుండి శాశ్వతమైన స్వేచ్ఛను పొందగలవు.


ఈ పుస్తకాన్ని చివరి వరకు జాగ్రత్తగా చదువు. ముగింపునకు వచ్చేసరికి, దేవుడు నీ కొరకు ఎన్ని అద్భుతాలు చేయగలడో నీవు చూడగలవు.


ఇప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న ఏమిటంటే ''లోకములోనున్న దుష్టత్వానికి (చెడుకు) సాతాను కారణం అయినట్లయితే, దేవుడు ఎందువలన సాతానును, ఇతర దురాత్మలను నాశనం చేయలేదు?'' అని.


దేవుడు కావాలనుకుంటే తప్పనిసరిగా ఒక్క క్షణంలో ఆ పని చేయగలడు. కాని ఆయన అలా చేయడు. ఇది దేవుడు తన అనంత జ్ఞానంతో సాతానును మరియు ఈ దయ్యాలను ఉండనిచ్చుటలో ప్రత్యేకమైన ఉద్దేశ్యం దేవునికి కలదని ఋజువు చేస్తుంది. దానిలో భాగంగానే దేవుడు ఈ భూమిపై మానవ జీవితాన్ని దుర్భరంగాను, భద్రతలేకుండగను, ప్రమాదభరితంగాను చేయుటకు సాతానుని ఉపయోగించుకొని, తద్వారా భూమిపై, మానవుడు కేవలము తమ స్వంత సౌఖ్యమునే వెదుకుకొనక, నిత్యత్వము గూర్చి యోచించి దేవునివైపు తిరుగునట్లుగా చేయుచున్నాడు.


ఈ భూమిపై జీవితము రోగము, బాధలు, పేదరికము లేకుండా మిక్కిలి సౌఖ్యవంతముగా ఉండినట్లయితే ఎవరును దేవునిగూర్చి ఆలోచించేవారు కాదు. కనుక దేవుడు ఈ లోక జీవితములోని దురవస్థలను, ప్రమాదాలను ఆయన గురించి ఆలోచింపజేసి మన అవసరతలో ఆయన వైపు తిరుగునట్లు ఉపయోగించుకొనును.


సాతాను నీ జీవితములో కల్పించే సమస్యలు, రోగములు మరియు పరీక్షలు నీవు దేవునివైపు తిరగటానికి ప్రేమ గలిగిన దేవుడు అనుమతించినవే. అవన్నీ ఒక విధంగా చెప్పాలంటే నీ యెడల దేవునికి గల ప్రేమను చూపించుటయే.


ఇదే బైబిలు యిచ్చే సందేశము. దేవునితో ఒకప్పుడు సన్నిహితముగా నుండిన ఒక వ్యాపారవేత్త గురించిన ఒక కథ నేను వినియున్నాను. అతని వ్యాపారము అభివృద్ధి చెందగా, అతడు దేవుని నుండి తొలిగిపోయాడు, ఆయన యొక్క సంఘమందలి పెద్దలు ఆయనను దేవునివైపు త్రిప్పుటకు పదే పదే మాట్లాడారు. కాని అతడు తన వ్యాపారములో బహుగా మునిగిపోయాడు. ఒకరోజు అతని ముగ్గురు కుమారులలో చిన్నవానిని ఒక విషసర్పము కాటు వేయగా, ఆ బిడ్డ మిక్కిలి వ్యాధి గ్రస్తుడయ్యాడు. వైద్యులు కూడా నమ్మకం వదలివేసారు. అప్పుడు వాని తండ్రి మిక్కిలి దు:ఖపడి, ఆ బిడ్డ గురించి ప్రార్థించుటకు సంఘ పెద్దలలో ఒకరిని రమ్మని కబురంపాడు. ఆ పెద్ద జ్ఞానము గలవాడు. అతడు వచ్చి 'ప్రభువా, ఈ బిడ్డను కరచులాగున ఆ సర్పమును పంపినందుకు వందనములు, ఎందుచేతనంటే ఈ కుటుంబం నీ గూర్చి ఆలోచించులాగున నేను ఎప్పుడును చేయలేకపోయాను, నేను ఈ ఆరు సంవత్సరాలలో చేయలేని దానిని ఈ సర్పము ఒక్క క్షణంలో చేసినది. ఇప్పుడు వారు వారి పాఠాన్ని నేర్చుకున్నారు. ప్రభువా! ఈ బిడ్డను బాగు చేయండి మరియు నిన్ను జ్ఞాపకము చేసికొనుటకు మరల ఎప్పుడును వేరే సర్పములు వీరికి అవసరం లేకుండా చేయండి' అని ప్రార్థించాడు.


కొందరు అకస్మాత్తుగా ఒక దినాన కేన్సరుతో గాని వేరొక నయముకాని రోగముతోగాని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళబడే వరకు దేవుని గూర్చి అసలు ఆలోచించరు. అప్పుడు వారు దేవుని గూర్చి ఆలోచించడం మొదలుపెట్టి రక్షణకొరకు ఆయనవైపు తిరుగుతారు. ప్రజలు వారి పాపముల నుండి మరల్చుటకు నయముకాని జబ్బులు, రోగములు, పేదరికము మరియు లోకమందలి కీడులను దేవుడు వాడుకొనుచున్నాడు. ఆ రీతిగా దేవుడు వారిని పరలోకమందున్న నిత్యత్వపు గృహములు పొందుటకు నడిపించుచున్నాడు. ఆ రీతిగా దేవుడు సాతాను చేసే చెడుపనులను, సాతాను యొక్క కబంద హస్తాల నుండి ప్రజలను నిత్య రక్షణలోనికి నడిపించుటకు వాడుకొనుచున్నాడు.


ఆ రీతిగా దేవుడు సాతానును మరల మరల బుద్ధిహీనునిగా చేయుచున్నాడు.


ఇతరుల కొరకు సాతాను త్రవ్విన గోతిలో (తానే) త్రోయబడతాడు.


దేవుడు తన పిల్లలను పుటము వేయుటకుగాను సాతాను నుండనిచ్చుచున్నాడు. అగ్ని యొక్క ఉదాహరణ ఆలోచించండి:


ప్రపంచ చరిత్రలో కోట్లాది ప్రజలు అగ్నిలో కాలిపోవుటచే మరణించారు. అయితే దానిని బట్టి ఎవ్వరును అగ్నిని వాడుట మానివేయలేదు, ఎందువలన? అగ్ని వలననే ఆహారము వండబడుతుంది, మోటారు వాహనాలు, విమానాలు మరియు యంత్రాలు నడుస్తున్నాయి. బంగారము కూడా అగ్ని ద్వారానే స్వచ్ఛమవుతుంది. కనుక అగ్ని ప్రమాదకరమైనదైనా, హానికరమైనదైనా, మంచి పనులకు ఉపయోగించవచ్చు.


అదే రీతిని సాతాను చెడ్డవాడయినప్పటికి, ప్రజలను తప్పు త్రోవను పట్టించే వాడయినప్పటికి దేవుడు వానిని వాడుకొనుచున్నాడు. దేవుని బిడ్డలను వేర్వేరు అగ్నివంటి శ్రమలు మరియు శోధనలు ద్వారా పరీక్షించుటకు సాతానుకు అనుమతి యివ్వబడినది; ఆ విధముగా వారు బంగారము అగ్నిగుండా వెళ్ళినట్లు పవిత్రముగా మరియు స్వచ్ఛముగా తయారు కాగలరు.


కనుక దేవుడు లోకములోనున్న చెడునంతటిని ఒక్క క్షణములో తీసివేయగలిగినా, ఆయన అట్లు చేయడు. ఎందుచేతనంటే ఆయన యొక్క మహిమకరమైన సంకల్పము వాటి ద్వారా నెరవేర్చుకొనుటకు మనము చూడగలము.

అధ్యాయము 2
పాపమును గూర్చిన యదార్థ సత్యము

కొందరు ఎందుకు తరచుగా జంతువులవలె ప్రవర్తిస్తారు?


దానికి సమాధానము వారు శారీరక అవసరాలు మరియు భూమి మీద ఉనికిని గూర్చియే ఆసక్తి గలిగి యుండుట వలననే.


ఒక జంతువు దేనిమీద ఆసక్తి గలిగియుంటుంది? - ఆహారము, నిద్ర మరియు లైంగిక సంతృప్తి. అంతేగదా! ఒక మనిషి ఎప్పుడైతే ఈ విషయముల గూర్చి మాత్రమే ఆసక్తి గలిగియున్నాడో, అతడు జంతువులతో సమానమైన స్థితికి దిగజారియున్నాడని మనము చెప్పవచ్చు.


కాని దేవుడు మానవులను జంతువులవలె చేయలేదు. ఆయన మనలను తన పోలికలో చేసి నీతి, యదార్థతలు, గుణశీలములు, ఆశా నిగ్రహము కలిగి పశువాంఛలకు బానిసకాకుండా చేసెను.


మనము జంతువుల కంటె తెలివి గలవారము మరియు విద్య గలవారము అనే సత్యము మనలను వాటికంటె శ్రేష్టులుగా చేయదు? ఎందుకంటె ఎంతో తెలివితేటలు, విద్య గలవారు సహితము లోభము, స్వార్థము, కామేచ్ఛలు, కోపము మొదలగు వానికి బానిసలై యున్నారు.


మన మనస్సు కంటె లోతైన భాగమొకటి మనలో నున్నది! అది మనకు దేవుని నెఱుగునట్లు చేయు మన యొక్క ఆత్మ. ఏ జంతువులకు అట్టి ఆత్మ లేదు.


మనము ఇది వరకు చూచినట్లు, దేవుడు మనలను కావాలనుకొన్నది స్వేచ్ఛగా ఎంచుకొనే అధికారము కలిగిన నైతిక స్వేచ్ఛా జీవులుగా చేసెను. కాని ఎంచుకొనే స్వేచ్ఛ కలిగియుండుటలో ప్రమాదమేమిటంటే ఆ స్వేచ్ఛ మనలను మనము సంతోషపెట్టుకొని, దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపునట్లుగా చేస్తుంది. కాని దేవుడు అటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడానికి యిష్టపడుతున్నాడు. ఎందువలనంటే ఎవరైతే ఇష్టపూర్వకముగా ఆయనను ఎంచుకుంటారో, అటువంటి బిడ్డలను ఆయన కోరుకొనుచున్నాడు.


ప్రపంచమందలి గందరగోళమునకు, కలవరపాటుకు రోగములకు మరియు కీడులకు గల సూటియైన కారణము మానవుడు దేవునికి అవిధేయుడై, సాతాను యొక్క మాట వినుటయే.


దేవుడు సృష్టించిన మొదటి పురుషుడు, స్త్రీ ఆదాము మరియు హవ్వగా పిలువబడిరి. వారు సృష్టింపబడినప్పుడు పాపరహితులుగా నుండిరి. కాని వారు పరిశుద్ధులగుటకు ఒక ఎంపిక చేసికొనవలసి వచ్చినది. ఆ విధముగా ఎంపిక చేసికొనుట కొఱకు వారు శోధింపబడాలి. ఈ విధంగా వారు చెడును తిరస్కరించి, దానికి బదులుగా దేవునిని ఎంచుకొనగలిగియుండిరి. అందువలన సాతాను వారి యొద్దకు వచ్చి శోధించులాగున, దేవుడు అనుమతించాడు.


మనము దీనిని బైబిలునందలి మొదటి పుస్తకమైన, ఆదికాండము 2,3 అధ్యాయములలో చదువగలము.


అమాయకత్వానికి, పరిశుద్ధతకు చాలా తేడా ఉన్నది. అమాయకత్వం అనేది పసిబిడ్డలో చూస్తాము. ఆదాము సృష్టింపబడినపుడు ఎలా ఉండేవాడో తెలిసికోవాలంటే, అమాయకత్వం, మంచి చెడుల నెరుగని ఒక పసిబిడ్డను చూడుము. కాని ఆ చిన్న బిడ్డలో పరిశుద్ధతగాని, పరిపూర్ణతగాని లేవు. అయితే పరిపూర్ణత నొందుటకుగాను, ఆ పసిబిడ్డ ఎదగాలి, చెడును తిరస్కరించి, దేవుని ఎంచుకొనేలా కొన్ని ఎంపికలు చేసుకోవాలి.


మన మనసులలో ఎప్పుడైతే శోధనకు లోబడుటకు తిరస్కరిస్తామో మన నడవడి వృద్ధి పొందుతుంది. ఇప్పుడు నీవు ఏమయియుంటివో ఆ స్థితి, యింత వరకు నీ జీవితంలో నీవు ఎన్నుకొనిన ఎంపికలను బట్టి నీకు కలిగినది.


నీ చుట్టునున్న ఇతరులు నీ కంటె బాగుగా ఉన్నట్లయితే, వారు వారి జీవితములో నీకంటె మంచి విషయములు ఎన్నుకొని యుంటారు. మనము ప్రతిరోజు కొన్నిటిని ఎంచుకొంటాము- ఆ ఎంపికలే మనం చివరికి ఏమవుతామో నిర్ణయిస్తాయి.


దేవుడు మొదట స్త్రీ, పురుషులను చేసినప్పుడు సాతాను వలన శోధింపబడుట ద్వారా, వారు పరిశుద్ధులయ్యే అవకాశాన్ని దేవుడు వారికిచ్చాడు.


వారిని ఒక తోటలో ఉంచి, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టుని తప్ప ఆ తోటలో నుండిన ప్రతి చెట్టు పండ్లను తినవచ్చునని చెప్పాడు. అది ఒక పరీక్ష.


నిజానికి అది చాలా సుళువైన పరీక్ష- ఎందుచేతనంటే వారు వేలకొద్ది ఆకర్షణీయమైన చెట్లకుండిన తియ్యని ఫలములుండిన తోటలోనికి పంపబడ్డారు మరియు ఒక చెట్టు పండు తప్ప వాటిలో దేనినైనా తినవచ్చని చెప్పడం జరిగింది. కాని వారు విధేయత గూర్చిన చిన్న పరీక్షలో ఓడిపోయారు.


ఎందుకంటె సాతాను తోటలో నున్న వారి దగ్గరకు వచ్చి మీరు తినకూడని వృక్షఫలములు తినినట్లయితే, మీరు దేవునివలె ఉందురని చెప్పుట ద్వారా ఆదాము, హవ్వలను శోధించెను. ఆ సమయంలో ఆదాము హవ్వలు ఎదుర్కొనిన శోధన, కేవలం చెట్టుపండు తినటం అనే సామాన్య విషయం కాదు గాని, వారు కోరుకుంటే దేవునివలె అవ్వటం అనునదే. అదే సాతాను ఒకప్పుడు తన విషయంలో కూడా కోరుకొనెను మరియు అదే ఆదాము హవ్వలకు కూడా చెప్పెను. కాని సాతాను ఈ దినాన్న ఎలాంటి అబద్దములతో ప్రజలను మోసగిస్తున్నాడో అలాగే అది కూడా ఒక అబద్దమయి ఉన్నది. ఈనాడు సాతాను యొక్క అబద్దముకు ఏ విధముగా ప్రజలు పడిపోతారో అలాగే ఆదాము హవ్వలు అప్పుడు పడిపోయారు. వారు దేవునికి అవిధేయత చూపి, అంతకు ముందు సాతాను పొందిన గతినే అనుభవించారు. వారు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డారు.


దీనికి సంబంధించిన వివరాలన్నియు బైబిలు గ్రంధమందలి మొదటి పుస్తకంలో చదువవచ్చు (ఆదికాండము 3వ అధ్యాయము).


ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞ మీరుట ద్వారా వారు దేవునివలె సర్వశక్తిమంతులుగాను, స్వతంత్రులుగా నుందుమని అనుకొనిరి. కాని వారు స్వతంత్రులయ్యారా? లేదు. వారు కేవలం సాతానుకు బానిసలయ్యారు. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించుట ద్వారా మాత్రమే మనము నిజముగా స్వతంత్రులము కాగలము.


ఈ విషయములోనే సాతాను అనేకులను మోసగిస్తాడు. వారు నిజంగా జీవితాన్ని ఆనందించాలంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞలను అలక్ష్యము చేయాలని సాతాను వారికి చెప్తాడు.


ఇప్పుడు మనం మానవజాతిలో పాపము ఎలాగు మొట్టమొదట ప్రారంభమైనదో చూచితిమి.


ఆదాము హవ్వలు ఏదేను తోటలో ఆ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసికొన్నారు. అది వారికి వారి పిల్లలకు జీవితకాల పర్యంతముండే పర్యవసానాలను ఉత్పత్తి చేసింది.


మన జీవితములో మనము తీసుకొనే నిర్ణయాలన్నీ వాటి పర్యవసానాలను తెస్తాయి. మనమందరము ఏదైతే విత్తామో దాన్ని కోయవలసియున్నది. అనేకసార్లు, మన పిల్లలు సహితము మనము విత్తిన దాని చేదైన ఫలములను కోయవలసి యుంటుంది.


ఆదాము విషయములో, అతడు, అతని భార్య వారి మిగిలిన జీవిత కాలమంతయు దేవుని సన్నిధి నుండి పంపివేయబడిరి.


కాబట్టి ఈనాడు మనము చేసికొనిన చిన్న ఎంపికలు అంత ప్రాముఖ్యమైనవి కావని, లేక ఈనాడు మనము విత్తిన దానికి భవిష్యత్తులో ఎప్పుడును కోయనక్కరలేదని తలంచరాదు.


మనము భూమి మీద అన్నింటికంటే ఎక్కువగా దేవునిని నిజముగా కోరుకొనుచున్నామని మనము ఆయనకు ఋజువు చేయులాగున మనము వివిధ వ్యక్తుల ద్వారాను, వివిధ పరిస్థితులు ద్వారాను పరీక్షింపబడుటకు మరియు శోధింపబడుటకు దేవుడు అనుమతిస్తాడు.


మనము వెళ్లుచున్న ప్రతి శోధన యొక్క ఉద్దేశ్యము మనము సృష్టింపబడిన వాటన్నిటి కంటె సృష్టికర్తకు ఎక్కువ విలువ ఇస్తున్నామా లేదా అనునది పరీక్షించుటే.


అన్ని పాపముల యొక్క సారము సృష్టింపబడిన వాటిని మరియు మనలను మనము దేవునికంటె ఎక్కువగా ఎంచుకోవటమే. అది దేవుని మార్గాన్ని ఎంచుకోవడానికి బదులు మన స్వంత మార్గాన్ని ఎంచుకోవడము. దేవుని సంతోషపెట్టుటకు బదులు మనలను మనమే సంతోష పెట్టుకొనడము.


పాపము అంటే కేవలం వ్యభిచరించటం లేక హత్య చేయటం లేక దొంగిలించటం కాదు. అది మన స్వంత మార్గాన్ని కోరుకోవటం. చంటి బిడ్డ యొక్క మొండితనములోనే మనము పాపము యొక్క ప్రారంభాన్ని చూడగలము, పుట్టినప్పటి నుండి ప్రతి బిడ్డ నైజములో పాపముంటుంది మరియు అతడు ఎదుగుచున్న కొలది, తాను కావాలనుకొన్నది చేయటానికి నిశ్చయించుకొని, తాను కోరినది పొందుటకు ఇతర పిల్లల దగ్గర లాగుకొనుట, తగువులాడుట చేస్తూ ఉంటాడు.


మనము పెద్దవారముగా ఎదిగినప్పటికి, మనము చిన్నప్పుడు ఉండినదానికంటే అంత ఎక్కువగా మార్పుచెందము. మనము కేవలము తెలివిగలవారమై మన పద్దతులు మార్చుకొందుము! చివరకు సంస్కారం కలవారు కూడా అదే విధంగా ఉండిపోదురు. వారు వారియొక్క స్వార్థాన్ని, దురాశలను, శరీరాశలను, బాహ్య సంబంధమైన మర్యాదతోనో లేక మతమనే ముసుగుతోనో కప్పుకొందురు!!


పాపము మన యొక్క ప్రతి అణువులోనికి చొచ్చుకొని పోయినది. పాపమును మతసంబంధ అభ్యాసములైన ఉపవాసము, ప్రార్థన లేక తీర్థయాత్రలు లేక ఆశానిగ్రహము ద్వారా వదిలించుకొనలేము. దేవుడు మాత్రమే పాపము నుండి మనలను రక్షించగలడు.


కాని పాపము ఎంత చెడుగును కలిగిస్తుందో మనము తెలిసికొను వరకు దేవుడు కనిపెట్టుచుండును. తాను పాపులనే పిలువ వచ్చితిని గాని, నీతిమంతులను పిలువరాలేదని ఒకసారి యేసుప్రభువు చెప్పారు. దీని అర్థము భూమిపై కొందరు నీతిమంతులనియు, మరికొందరు పాపులనియు కాదు. తమకుతామే పరిశుద్ధులమనుకొనే స్వనీతిపరులైన మత నిష్ఠగల ప్రజలనుద్దేశించి, ఆయన వ్యంగంగా ఆ మాటలు చెప్పాడు. ఎవరైతే తమను తాము నీతిమంతులుగా చూచుకొంటారో వారిని రక్షించలేననునది యేసు యొక్క భావము.


ఎవరైతే తాము అనారోగ్యముగా నున్నట్లు గుర్తింతురో వారు వైద్యుని దగ్గరకు వెళ్ళుదురు. అటులనే మన మొదటి అవసరత మనము పాపులమని గుర్తించెదము.


మన మతము ఏదైనప్పటికి, మనమందరము పాపులము. మనమందరము ఆలోచనలలోను, మాటలలోను, పనులలోను, వైఖరిలోను, ఉద్దేశములలోను దేవుని పరిశుద్ధ శాసనములకు వ్యతిరేఖముగా పాపము చేసినవారము. మనము దేవుని యొక్క పరిశుద్ధ ప్రమాణాలకు తక్కువగా నున్నాము.


రోగము మన శరీరాలను నష్టపరచిన దానికంటె, పాపము మన ఆత్మకు ఎక్కువ నష్టం కలుగజేయును. అయితే ఈ విషయాన్ని మనం గుర్తించుచున్నామా?


ఈ రోజుల్లో ప్రపంచమంతట వ్యాపించుచున్న లైంగిక సంపర్కము వలన వ్యాపించే ఆ భయంకర వ్యాధియైన ఎయిడ్స్‌పై మీ ప్రతిస్పందన ఏమిటి?


ఎయిడ్స్‌ ఎంతటి అంటు వ్యాధి అంటే ఆ వ్యాధి గలవాని దగ్గరకు వెళ్ళటానికి కూడా ప్రజలు భయపడుదురు. పాపము నిజానికి అంతకంటె భయంకరమైనది, ఒకే ఒక తేడా ఏమనగా పాపము మన ఆత్మకు నష్టం కలిగిస్తుంది. కనుక అది బయటకు కనబడదు. ఎయిడ్స్‌ వ్యాధి ఫలితాలు కంటె, పాపము యొక్క ఫలితాలు బహు ఘోరమైనవి. మనము దాని నుండి రక్షింపబడకపోయినట్లయితే అది మన జీవితాలను పాడుచేస్తుంది, మనలను ఈ లోకంలో సంతోషం లేని వారుగా చేస్తుంది, చివరకు నిత్యత్వంలో కూడా మనలను నాశనం చేస్తుంది.


అధ్యాయము 3
మన మనస్సాక్షిని గూర్చిన యదార్థ సత్యము

మనము నైతిక జీవులమని నిరంతరము మనకు జ్ఞాపకం చేసే మనస్సాక్షితో మనము సృష్టింపబడ్డాము. మనం చేసే ప్రతిపనికి మనమే బాధ్యులమని, మన అంతరంగములో నుండి మనకు వినిపించు దేవుని స్వరమే మనస్సాక్షి. ఒకరోజున, మనం జీవించిన జీవితాన్ని గూర్చి మనం దేవునికి లెక్క అప్పజెప్పవలసియుంది.


మనము మనస్సాక్షి లేనటువంటి జంతువులవలె లేము. జంతువులు నైతిక జీవులు కాదు గనుక అవి దేని విషయములోను దేవునికి జవాబుదారులు కాదు. ఒక జంతువు ఎప్పుడైతే చనిపోతుందో, అదే దాని ముగింపు గాని మన విషయములో అలాగున కాదు. మానవుడు దేవుని స్వరూపములో సృష్టింపబడినవాడు మరియు నిత్యుడు.


మనకు తీర్పు దిన మొకటి గలదు. అప్పుడు మన జీవితకాలమంతటిలో మనము చేసిన క్రియలు, మన మాటలు, తలంపులు మన జ్ఞాపకములోనికి తేబడి దేవునిచే పరిశీలింపబడును. ఆయన బైబిలులో యివ్వబడిన పరిశుద్ధ శాసనముల ప్రకారముగా ఆయన మనకు తీర్పు తీర్చును. అప్పుడు మనము చేసిన ప్రతి ఒక్క పనికి, మాటకు, తలంపుకు ఆ సమయములో దేవునికి జవాబు చెప్పుకొనవలసి యుంటుంది.


'మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును' (హెబ్రీయులు 9వ అధ్యాయము 27వ వచనము) అని బైబిలు చెబుతుంది.


అనేకులు వారు చేసిన నేరాలకు తగిన శిక్షను పొందకుండా ఈ భూమిపై తప్పించుకొందురు. కాని వారు చివరిగా దేవుని న్యాయపీఠము యెదుట నిలిచినప్పుడు, వారికి తగినట్టి న్యాయమైన శిక్షను పొందుతారు. అట్లే అనేకులు యితరుల యెడల చేసిన మంచికి ఈ భూమి మీద అభినందింపబడలేరు లేక ప్రతిఫలము పొందలేదు, కాని వారు క్రీస్తు తిరిగి భూమి మీదికి వచ్చినప్పుడు ప్రతిఫలము పొందుతారు.


మనము చేసిన దానికంతటికి ఒక దినమున దేవునికి జవాబు చెప్పుకోవలసియున్నది, గనుక మన మనస్సాక్షి యొక్క స్వరాన్ని మనమెల్లప్పుడు వినుటకు ప్రాముఖ్యత నివ్వవలసియున్నది.


దేవుడు మానవునికిచ్చిన గొప్ప వరములలో మనస్సాక్షి ఒకటి. అది మన శరీరానికి ఇవ్వబడిన నొప్పి అనే వరము వంటిది. మనలో అనేకులు ఈ నొప్పిని ఒక చిరాకు గలిగించుదానిగా భావిస్తారు. కాని నొప్పి అనేది మన జీవితాలకు ఎంతో గొప్ప దీవెన అనేది మనము గ్రహించము. నొప్పి ద్వారానే శరీరములో ఎక్కడనో, ఏదో సరిగా లేదని శరీరము మనకు హెచ్చరిక చేస్తుంది. అది రోగమును గూర్చి హెచ్చరించే, శరీరము యొక్క మొదటి సంకేతము. అది నొప్పిద్వారా కాకపోయినట్లయితే, ఎప్పుడు మనము వ్యాధిగ్రస్తులమో మనకు తెలియదు మరియు మనము మరణించవచ్చు కూడా. ఆ నొప్పియే మనలను అకాల మరణము నుండి రక్షిస్తుంది.


కుష్ఠురోగులు నొప్పిని కలిగియుండరు, ఎందుచేతనంటే కుష్ఠురోగము నరములను చంపివేస్తుంది మరియు స్పర్శజ్ఞానమును నశింపజేస్తుంది. ఒక కుష్ఠురోగి పాదము గుండా ఒకమేకు దిగిపోయినను, బాధ తెలియకుండా ఉంటాడు. ఆ పాదమునకు రోగము కలిగినప్పటికి, దాని నెరుగడు. చివరకు అతని యొక్క పాదము తీసివేయవలసినంతగా చెడిపోతుంది. దీనికి కారణం అతనికి 'నొప్పి అనే దీవెన' లేకపోవుటయే.


మనస్సాక్షి నొప్పివంటిది. మనము దేవుని శాసనాలను మీరుచున్నప్పుడు మనము పాపము చేయుట గురించి ఆలోచించుచున్నప్పుడు లేక మనమప్పటికే పాపము చేసినప్పుడు, అది మనలను హెచ్చరిస్తుంది. మనము దాని హెచ్చరికలను లక్ష్యపెట్టక, దానికి వ్యతిరేఖముగా వెళ్ళినట్లయితే, క్రమక్రమముగా మనలో పాపము గూర్చిన భావనను మనము చంపివేస్తాము. అప్పుడు పాపమును గూర్చి ఏ మాత్రమైనను స్పర్శలేని దినమొకటి మనకు వస్తుంది. అప్పుడు మనము మృతమైన మనస్సాక్షి గల ఆత్మీయ కుష్ఠురోగులమవుతాము. అప్పుడు మనము మనస్సాక్షి లేనటువంటి జంతువులవలె నుందుము. అందువల్లనే కొందరు జంతువులకంటె అధ్వాన్నముగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి జీవితానికి చిట్టచివరి ఫలితము దేవునిచే శాశ్వతముగా శిక్షింపబడటమే.


మనము పాపులమని మనకందరకు తెలుసు, ఎందుచేతనంటే మన మనస్సాక్షి ఆ విషయం చెబుతుంది. మనము ఆ అపరాధ భావనను ఎప్పుడు వదలుకోకూడదు. ఎందుచేతనంటే ఆ అపరాధ భావన 'నొప్పి అనే దీవెన' వంటిది. మనము ఆత్మ సంబంధమైన రోగగ్రస్థులముగా నున్నామని, మనకు స్వస్థత అవసరమని అది చెబుతుంది. దేవుడు మానవునికిచ్చిన అత్యుత్తమ వరము మనస్సాక్షి.


యేసు మనస్సాక్షిని కన్నుతో పోల్చెను. (లూకా సువార్త 11 అధ్యాయము 34 నుండి 36 వచనాలు).


మన కళ్లు మన శరీరమంతటిలో పరిశుభ్రమైన భాగములు, ఎందుకంటే అవి మన కన్నీళ్ళచే ప్రతి రోజు అనేకమార్లు కడుగబడతాయి.


మన కనురెప్ప వేసి తీసిన ప్రతిసారి (మనకు తెలియకుండా వేలకొలదిసార్లు ఒక దినములో అది జరిగిపోతూ ఉంటుంది) వాటిలో పడిన ధూళి నుండి కళ్లు కడుగబడతాయి. మన కళ్లను శుభ్రముగా కడుగుకొనే వరకు వాటిని చికాకు పెట్టటకు, మనము పనిచేయకుండా ఆపుటకు చిన్న ధూళిరేణువు సరిపోతుంది.


అదే విధంగానే మన మనస్సాక్షిని కూడా ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకోవాలి.


మన పాపములు దేవుని వలన మాత్రమే క్షమింపబడగలవు మరియు కడుగబడగలవు. మన మనస్సాక్షి అపరాధ భావన నుండి విడిపించబడటానికి అదొక్కటే మార్గము.


కాని పాపములకు క్షమాపణ చౌకైనది కాదు.


అధ్యాయము 4
పాప క్షమాపణను గూర్చిన యదార్థ సత్యము

దేవుడు మన పాపములను ఎలా క్షమించగలడు?


దేవుడు న్యాయవంతుడైన మరియు నీతిమంతుడైన దేవుడు కనుక ఒక వ్యక్తి యొక్క పాపములను ఉపేక్షించి అతనిని క్షమించలేడు. అది అన్యాయమవుతుంది.


దేవుడు పరిశుద్ధుడు మరియు న్యాయమంతుడునైన దేవుడు, అందుచేత ఆయన పాపానికి శిక్ష విధించాలి.


అయితే ఆయన ప్రేమగలిగిన దేవుడు కూడా అగుటచేత మన పాపములు క్షమించబడుటకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసాడు.


అన్ని మతములు మంచిగా ఉండవలెనని, దయగలిగి యుండవలెనని మరియు సత్యముగా నుండవలెనని మనకు బోధిస్తాయి. అయితే ఇవన్నియు మనము మన పాపములకు క్షమాపణ పొందిన తరువాత ఎలా జీవించాలనే విషయాన్ని తెలుపుతున్నాయి.


మంచితనము, దయార్థ్ర హృదయము మరియు యదార్థత గలిగియుండుట అనునవి ఒక భవనము యొక్క పై కట్టడము వంటివి. పాపక్షమాపణ యనునది ఆ భవనము యొక్క పునాది వంటిది.


ఒక భవనము యొక్క అతి ముఖ్యమైన భాగము దాని పునాదియే. మన పాపములను క్షమించుటకు దేవుడు, లోకమును సృష్టించినప్పటి కంటె కష్టమైన బాధ కలిగించునదొకటి చేయవలసి యుండెను.


లోకమును సృష్టించుటకు దేవుడు ఒక మాట మాత్రమే పలికినప్పుడు వెంటనే లోకము ఉనికిలోనికి వచ్చింది. కాని కేవలము మాట మాత్రము పలుకుట ద్వారా ఆయన మన పాపమును క్షమించలేడు. మానవుని యొక్క పాపములు క్షమించబడుటకు ఒకే ఒక మార్గము కలదు.


దేవుడు మనవంటి యొక మానవుడు కావలసియుండెను. మానవ మాత్రులముగా మనము ఎదుర్కొనుచున్న శోధనలు మరియు పోరాటముల ద్వారా ఆయన జీవించవలసి యుండెను మరియు మన పాపములకు శిక్ష ఆయనపై వేసికొని మనకు బదులుగా ఆయన బలి యాగముగా చనిపోవలసి యుండెను.


పాపమునకు శిక్ష బాధ లేక అనారోగ్యము లేక పేదరికము లేక సమాజములో అట్టడుగు స్థితిలో మరల జన్మించుట లేక అటువంటిది ఏదైనా కాదు. అది ఎల్లకాలము దేవుని నుండి వేరు చేయబడుటకు సమాన్యమైన నిత్య (శాశ్వత) మరణము.


భౌతిక మరణము అనగా మన భూ సంబంధమైన శరీరము నుండి వేరు పర్చబడుట. అటులనే సమస్త జీవమునకు మూలాధారమైన దేవుని నుండి వేరుచేయబడుటయే ఆత్మీయ మరణమైయున్నది.


నీవు భవిష్యత్తులో చేయబోవు మంచి పనులు గతములో నీవు చేసిన దుష్టత్వానికి ఎన్నటికిని ప్రాయశ్చిత్తము కానేరవు. పాపము అనేది దేవుని శాసనములకు మనము తీర్చవలసిన బాకీ (అప్పు). మనము దేశము యొక్క చట్టములకు అవిధేయత చూపితే, ఉదాహరణకు, మనము కట్టవలసిన పన్నులు కట్టకుండా మోసము చేసి, భవిష్యత్తులో వాటిని కడతామని ప్రమాణము చేసినంత మాత్రముచేత మనము క్షమించబడము. అంతేకాదు, భవిష్యత్తులో మనము పన్నులు కట్టినా, గతములో బాకీ ఉండిన పన్ను అంతయు కట్టవలసియుంది. పాపము విషయములోను అంతే.


భవిష్యత్తులో మనమెన్ని మంచి కార్యాలు చేయువారమైనప్పటికి, గతములో మనము చేసిన పాపములకు మూల్యము చెల్లించవలసి ఉంది.


'మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి' అని బైబిలు చెబుతుంది (యెషయా 64వ అధ్యాయము 6వ వచనము).


దేవుడు మంచి పనులను మెచ్చుకొంటాడు. కాని మనము చేసిన శ్రేష్టమైన పనులు కూడా దేవుని యొక్క పరిశుద్ధ ప్రమాణాలకు సాటిరావు. ఎందుకంటే ఆయన అనంతమైన పరిశుద్ధుడు. కనుక మనము ఏమాత్రమును నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాము. మన మంచి కార్యములు ఎంత మాత్రమును సరిపడవు గనుక దేవుని సన్నిధిలో నెప్పటికైనను ప్రవేశించుటకు మనకు ఏ మార్గము లేదు. మనము నిరీక్షణలేని విధముగా తప్పిపోయిన వారము.


కాని దేవుడు ఆయన యొక్క గొప్ప ప్రేమచేత మన పాపములు క్షమించబడుటకు ఒక మార్గమును ఏర్పాటు చేసాడు.


దేవుడు చాలా క్లిష్టమైనవాడు గనుక మన మానవ మేధస్సులు ఆయన సమ్మిళిత స్వభావాన్ని గ్రహించలేవు. బైబిలు దేవునిని ఒకనిగా బయలు పరుస్తున్నా, ఆ ఏకత్వములో ముగ్గురు వ్యక్తులు - తండ్రి, కుమారుడు (దీని యర్థము తండ్రికి కలిగిన స్వభావమే ఆయన కలిగియున్నాడని తప్ప తండ్రి ద్వారా పుట్టినవాడని కాదు) మరియు పరిశుద్ధాత్మ - వీరందరు ఒకరితో నొకరు సమానమైన వారు.


మన మానవ మేధస్సుకు ఆ ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఏ విధంగా ఒకే దేవుడుగా ఉన్నారనే విషయం గ్రహింపశక్యము కాదు. వేర్వేరు శరీరాలు గలిగిన వ్యక్తుల గురించి మాత్రమే మనము ఆలోచించగలము. కాని దేవుడు ఆత్మయై యున్నాడు, మన మేధస్సులు పరిమితమైనవి. అవి దేవుని యొక్క అసాధారణ నైజమును గ్రహింపలేవు.


మానవులు అర్థము చేసుకోగలిగిన విషయములను ఒక 'కుక్క' ఏలాగు అర్థము చేసికొన లేదో ఆ విధముగానే నరమాత్రులమైన మనము దేవుని గూర్చిన కొన్ని విషయములను అర్థము చేసికొనలేము.


దేవుడు వేటినైతే బైబిలు నందు మనకు బయలుపరచుటకు ఏర్పాటు చేసాడో వాటిని మాత్రమే మనము తెలిసికొనగలము. అంతకు మించి తెలియవు.


ఉదాహరణకు, నీవు ఒక తెలివైన కుక్కకు 1+1+1=3 అనే కూడికను మూడు ఎముకలను దాని ముందు ఉంచి, వాటిని ఒకదాని తరువాత మరొకటి లెక్కించి దానికి విశదపరచుటకు ప్రయత్నించగలవు. కాని 1ఞ1ఞ1=1 అనే గుణకారమును అదే కుక్కకు నేర్పించుటకు ప్రయత్నించు. అతి తెలివైన కుక్క కూడా దానిని అర్థము చేసికొనలేదని గ్రహిస్తావు!


మానవ మాత్రులమైన మనకు 'ఒకట్లు' మూడు అయినప్పటికి ఒకదానితో నొకటి గుణించినప్పుడు ఒకటి యగునని బాగుగా తెలియును.


మనమేలాగు కుక్కల కంటె ఉన్నతమైనవారమో, అలాగే దేవుడు మనకంటె ఎంతో అత్యున్నతమైనవాడు.


గుణకారమును అర్థము చేసికొనుటకు కుక్క మానవుడుగా నుండవలెను. మనము దేవుని అర్థము చేసికొనడానికి మనము దేవునివలె నుండవలెను.


కనుక దేవుడు ముగ్గురు వ్యక్తులయినప్పటికి ఒకే దేవుడు అను విషయమును మనము అర్థము చేసుకోలేకపోవుట ఆశ్చర్యము కాదు.


మనము అర్థము చేసికొనలేక పోయినప్పటికి అది సత్యమని మనకు తెలియును, ఎందుకనగా దేవుడు తన వాక్యములో ఆ రీతిగా చెప్పెను.


అదే విధముగా అనేకులు మానవ తర్కాన్ని ఉపయోగించి - దేవుడు సర్వాంతర్యామి అయినట్లయితే ప్రతి మానవునిలోను, ప్రతి జంతువులోను, ప్రతి మొక్కలోను మరియు ప్రతి మతపరమైన ఆరాధనా స్థలములోను ఉండి తీరాలని చెబుతారు. ఇది దైవికమైన సత్యములను అర్థము చేసుకోలేనటువంటి సంకుచితమైన మానవ మేథస్సుకు ఇది సరిగానే అనిపిస్తుంది.


కాని ఇది పూర్తిగా తప్పు. దేవుడు సర్వాంతర్యామి అనగా - ఆయనకు ప్రతిచోట జరిగే ప్రతి విషయం తెలియునని అర్థం. కాని ఆయనకు నరకములో ఏమిజరుగుతుందో తెలిసినప్పటికీ ఆయన అక్కడ ఖచ్చితంగా లేడు.


నరకము అనే దానికి అసలైన అర్థము (నరకము అనగా పాపులకు శాశ్వతమైన శిక్ష) 'దేవుడు లేని చోటు'. అదియే పాపుల యొక్క వేదనను నరకములో భరించలేనట్లు చేస్తుంది.


కనుక ఖచ్చితముగా దేవుడు ప్రతిఒక్కరిలో నివసించడు.


మానవజాతిని వారి పాపములకు రావలసిన నిత్యశిక్ష నుండి రక్షించుటకు, 2000 సంవత్సరముల క్రిందట తండ్రియైన దేవుడు పరిశుద్ధాత్ముని మానవాతీత క్రియ ద్వారా కుమారుడు ఒక కన్యకు బిడ్డగా పుట్టునట్లు పంపించెను. ఆయనకు యేసు క్రీస్తు అను పేరు పెట్టబడెను.


ఆయన బాల్యమునుండి మానవులు ఎదుర్కొనే ప్రతి శోధనను ఎదుర్కొనుచూ పెద్దవాడయ్యెను. ఆ శోధనలన్నిటి యందును ఆయన జయమును పొందెను. ఆయన ఎన్నడునూ పాపము చేయలేదు.


తండ్రియైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును తన 33వ ఏట దుష్టులైన ప్రజలు పట్టుకొని, సిలువ వేయబడుటకు అనుమతించెను. ఆయన సిలువపై మన కొరకు శాపమాయెను మరియు మానవజాతి పాపములకు శిక్షను అనుభవించెను - అచ్చట మనము దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను చూడగలము.


యేసుక్రీస్తు సిలువపై మరణించి ఆయన రక్తము చిందించినప్పుడు, మన పాపముల కొరకు చెల్లించవలసిన నీతియుక్తమైన పరిహారము పూర్తిగా చెల్లించబడెను, న్యాయపు తీర్పు పూర్తిగా తీర్చబడెను.


యేసుక్రీస్తు సిలువపై అర్పించిన బలియాగము అంగీకరింపబడెనని ఈ లోకమునకు ఋజువు చేయుటకు ఆయన పాతిపెట్టబడిన తరువాత మూడు దినములకు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను.


దేవుడు ఒక్కడేయనియు, ఈ భూమిపైకి మానవ రూపములో వచ్చిన ఒకే ఒక దైవ అవతారము యేసుక్రీస్తే అనియు రెండు వాస్తవాల ద్వారా ఋజువగుచున్నది.


1. ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే లోకపాపముల కొఱకు చనిపోయినవాడు.


2. ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే మృతిపొందిన తరువాత సజీవుడై మరలా ఎన్నడూ మరణించలేదు. ఆ విధంగా మానవుని యొక్క బద్దశత్రువైన మరణమును జయించానని ఋజువు చేసెను.


నులుబది దినములు భూమిపై సంచరించిన తరువాత యిప్పుడు తానున్న ఆ పరలోకమునకు యేసు తిరిగి వెళ్ళెను.


ఆయన వెళ్లుటకు ముందు, ఈ ప్రపంచమునకు తీర్పు తీర్చుటకు మరియు నీతి సమాధానములతో పాలించుటకు ఒక దినమున తిరిగి వచ్చెదనని వాగ్దానము చేసారు. ఆయన భూమిపైకి తిరిగి వచ్చుటకు ముందు జరిగే నిర్ధిష్టమైన సూచనలను ప్రభువు మనకు యిచ్చారు.


మనము ఆ సూచనల నెరవేర్పు యిప్పుడు చూచినప్పుడు, క్రీస్తు యొక్క రెండవ రాకడ బహు సమీపములో నున్నదని తెలుసుకొనుచున్నాము.


ఆయన భూమి మీదికి తిరిగి రాకముందే, క్రీస్తులో దేవుడు నీ ముందు ఉంచిన పాప క్షమాపణను నీవు పొందుకొనుట ముఖ్యము.


అధ్యాయము 5
మారుమనస్సును గూర్చిన యదార్థ సత్యము

పాపమునకు శిక్ష ఆత్మీయ మరణము. ఆ విషయము మనము ఇదివరలో చూచితిమి, దాని అర్థము దేవుని సన్నిధి నుండి ఎన్నటికిని దూరమవ్వడం. దానిని (పాపమునకు శిక్ష) యేసు సిలువపై అనుభవించెను. ఆయన తన తండ్రిచేత విడనాడబడెను.


యేసు దేవుడై యుండి ఆయన అంతరంగ వ్యక్తిత్వమందు నిత్యుడై యుండినందున తన తండ్రి నుండి నిత్యత్వపు ఎడబాటు యొక్క వేదనను, స్వల్పకాలములో అనగా సిలువపై మూడు గంటలు పూర్తి చీకటిలో, మనము నిత్యత్వమంతా నరకములో పడవలసిన బాధను ఆయన అనుభవించెను.


మన పాపములకు మనము పొందవలసిన శిక్షను ఆయనే పొందెను. అయితే దేవుని నుండి ఆ క్షమాపణను మనము తీసికోనట్లయితే మనము ఇంకను క్షమింపబడనివారమే మరియు ఆ శిక్ష నుండి విడుదల పొందని వారమే. ఈ కారణము చేతనే క్రీస్తు వారి కొఱకు చనిపోయినను ఈ లోకములో అనేకులు దేవుని చేత క్షమింపబడిన వారు కాదు.


క్రీస్తు లోకమందలి పాపములన్నిటి కొఱకు ప్రతి మతములో ఉండిన ప్రజల కొఱకు చనిపోయెను (తన రక్తాన్ని కార్చారు). అంతేకాని కేవలము క్రైస్తవుల యొక్క పాపముల కొఱకు మాత్రమే కాదు.


క్రీస్తు యొక్క మరణము ద్వారా, నీ కొఱకు దేవుడు వెలయిచ్చి కొనిన దానిని నీవు పొందుటకు మొదటిగా నీవు నీ పాపముల గూర్చి పశ్చాత్తాప పడవలెను. దీని అర్థమేమిటంటే నీ యొక్క పాపమార్గములన్నిటి గూర్చి నీవు నిజంగా చింతించవలెను మరియు నీకు తెలిసిన ప్రతి పాపమును మన:ఫూర్వకముగా విడిచిపెట్టుటకు ఆశ కలిగి యుండవలెను.


ప్రారంభములో దేవుని సంతోషపెట్టునదేదియో మరియు సంతోషపెట్టని దేదియో నీ మనస్సాక్షికి అంతగా తెలియదు కనుక, నీ జీవితములో దేవునికి ఇష్టము కాని ప్రతి పని చేయకుండుట సాధ్యము కాదు. దేవుడు వాస్తవమైనవాడు గనుక ఆయన ఆ విషయములో బలవంతము చేయడు. ఆయన ఇష్టపడని ప్రతి దానిని నీవు విడిచి పెట్టుటకు ఇష్టపడమని మాత్రమే ఆయన ఆడుగును.


ఏ విషయాల గూర్చి నీ మనస్సాక్షి నిన్ను ఒప్పింపజే స్తుందో వాటిని విడిచిపెట్టుటతో నీవు ప్రారంభించవచ్చు.


నీ యొక్క చెడు అలవాట్లను విడిచిపెట్టడానికి నీకు తగినంత శక్తి లేకపోవచ్చు. ఇక్కడ కూడా దేవుడు నీ బలహీనతను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. నీవు శక్తిగలిగి యుంటావని ఆయన అనుకోడు. నీవు ఆ చెడు అలవాట్లను విడిపెట్టుటకు ఇష్టపడుచున్నావా అని మాత్రమే ఆయన అడుగుతాడు. నీవు మనస్పూర్తిగా మరియు యదార్థముగా పాపముతో కూడిన ప్రతి విషయాన్ని విడిచిపెట్టుటకు ఆసక్తిగలవాడవని ఆయన చూచినప్పుడు, నీవు అప్పటికి అనేకమైన చెడు అలవాట్లతో ఓడిపంపబడుచున్నను, నీవు ఏ రీతిగనున్నావో అలాగుననే ఆయన నిన్ను అంగీకరిస్తాడు.


ఇది ఎంత అద్భుతకరమైన శుభవార్త!


నీవు గతంలో చేసిన పొరపాటులను సరిచేసికొనుటకు చూపుతున్న ఆసక్తియే, నీ పాప మార్గములను విడిచిపెట్టుటకు ఇష్టపడు చున్నావనుదానికి నిదర్శనము. ఇక్కడ కూడా ఆయన నీకుండిన పరిమితులను అర్థం చేసుకుంటాడు. నీవు ఎంత తీవ్రముగా ప్రయత్నించినను, ఎన్నటికిని సరిచేసికోలేని నీ గత పాపములు వేలాదిగా కలవు. అయితే కొన్నిటిని నీవు సరిచేసి కొనవచ్చును. నీ సామర్థ్యము కొలది వాటిని సరిచేసుకోవాలని మాత్రమే దేవుడు ఎదురుచూచుచున్నాడు.


ఉదాహరణకు, నీవు ఎవరి దగ్గరనైనా డబ్బును దొంగిలించినట్లయితే, ఆ సొమ్మును నీవు సమకూర్చిన వెంటనే అది తిరిగి యిచ్చి వేయుటకు నీవు సిద్ధపడాలి. నీ మాటల ద్వారా ఎవరినైనా బాధపరచినట్లయితే, అది నీకు జ్ఞాపకముండినట్లయితే, నీవు వెళ్ళి (లేక ఉత్తరం వ్రాసి) నీవు పలికిన మాటలకు క్షమాపణ అడుగుటకు నీవు యిష్టపడవలెను. అటువంటి క్రియలే దేవుడు నీయొక్క నిష్కపటతను (నిజాయితీని) మరియు దీనత్వమును పరీక్షించుటకు వీలు కల్పిస్తాయి. ఆయన దీనులకు మాత్రమే తన సహాయమును ఇచ్చును మరియు దేవుని సహాయము లేకుండా మనము రక్షణ పొందలేము.


బైబిలు నిజమైన మారుమనస్సును, 'విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుట' అని పిలుస్తుంది (1థెస్సలోనీకయులకు 1వ అధ్యాయము 9వ వచనము).


విగ్రహారాధన అంటే ఏమిటి? సృష్టికర్త కంటె ఎక్కువగా సృష్టింపబడిన దానిని ఉంచుటయే. ఆ సృష్టింపబడినది ధనము కావచ్చు, చక్కని స్త్రీ కావచ్చు లేక మన యొక్క కీర్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.


సృష్టింపబడిన వస్తువులలో దేనినైనను ఎంచుకొనుట విగ్రహారాధన - అది సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించుట మరియు అది సమస్త పాపమునకు మూలము. దేవుడు అటువంటి విగ్రహారాధనను ద్వేషిస్తాడు. ఎందుకంటే మానవుని హృదయములో దేవునికుండవలసిన స్థానమును అది ఆక్రమించును. ఆ విధముగా అది మానవుని నాశనము చేయును.


విగ్రహములు మనుష్యులచేత తయారు చేయబడి, వారు పూజించే దేవుని సూచిస్తాయి. కాని లోకమునకు సృష్టికర్త యొక్క చిత్రాన్ని కనీస పోలికలతో నైనను ఏ మానవుడు తన హస్తములతో చేయుట అసాధ్యము. సర్వశక్తుడైన దేవుని రూపమును సృష్టింపబడిన వాటి రూపమున తయారుచేయుట ఆయనను అవమానపరచుటయే. దేవుడు మామూలు కంటికి గోచరించనివాడు, మన సృష్టికర్తను రాత్రింబవళ్ళు మనకు జ్ఞాపకమునకు తెచ్చే మనస్సాక్షి ఆయన మనందరికి ఇచ్చాడు.


ప్రజలు దేవుని చట్టాలను మీరుతున్నప్పుడు మరియు భవిష్యత్తులో కూడా మీరే ఉద్దేశ్యము కలిగియున్నప్పుడు, వారు వేరువేరు మతపరమైన కర్మలు మరియు కార్యక్రమములు చేయుట ద్వారా మనస్సాక్షి యొక్క గొంతునొక్కటానికి చూచెదరు. వారు యిచ్చుచున్న అర్పణల వలన మరియు తీర్థయాత్రల వలన దేవుడు వారియొక్క అనేక పాపములను క్షమించునని వారు ఊహించుకుంటారు. కాని ఇది ఒక వంచన. దేవుడు మన మతపరమైన కర్మకాండలను మరియు కార్యక్రమములను చూడడు. మన మనస్సాక్షి యొక్క స్వరమును వినుచున్నామో లేదోయని గమనించుటకు ఆయన మన హృదయములలోనికి చూస్తాడు.


ప్రతి విధమైన విగ్రహారాధన నుండి తిరుగుటతో మారుమనస్సు ముడిపడి ఉంది. నిజమైన మారుమనస్సులో మనము ప్రతివిధమైన సృష్టింపబడిన వస్తువుల నుండి (సృష్టము నుండి) సృష్టికర్త వైపు తిరిగి, 'సర్వశక్తి గల దేవా, నీ వొక్కడవే పూజింపబడుటకు, సేవింపబడుటకు యోగ్యుడవు. ఇప్పటి వరకు సృష్టింపబడిన వాటిని పూజించినందుకు విచారిస్తూ యున్నాను. ఇప్పటి నుండి నా జీవితములో నీవే సర్వోన్నతుడవు' అని చెప్పవలెను.


మారుమనస్సు అనగా మనము మన ఉద్యోగములను, మన కుటుంబాలను విడిచి, సన్యాసులవలె ఏదో అడవులలోనికి వెళ్లుట కాదు. కానే కాదు.


మనం కుటుంబాలను కలిగియుండాలని, జీవనోపాధి కొరకు పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధనము సంపాదించుట యనునది పాపము కాదు గాని దేవుని కంటే ధనమును ప్రేమించుటయే పాపము. ఆధునిక నాగరికత కలుగజేయు సౌఖ్యములను ఉపయోగించుట పాపము కాదు గాని దేవునికంటె ఆ సౌఖ్యములను ప్రేమించుటయే పాపము.


దేవుడు మన శరీరాలను ఆహారము నిద్ర మరియు లైంగిక సంతృప్తి అనుభవించుట ద్వారా ఆనందించులాగున సృష్టించెను. వీటిలో ఏది కూడా తగనిది కాదు.


మనము తరచుగా కలిగే ఆకలి మరియు అలసట గూర్చి ఏలాగు సిగ్గుపడమో, అట్లే లైంగిక కోర్కె గురించి సిగ్గుపడన్కరలేదు! అయితే మనము ఆకలిగొనినప్పుడు ఆహారము దొంగిలించరాదు మరియు మనము పని స్థలములో పనిలో నున్నప్పుడు నిద్రించరాదు!! అటులనే మన లైంగిక కోర్కెలు తీర్చుకొనుట కొఱకు మరియొకరిని పాడుచేయరాదు. దేవుడు వివాహమును ఏర్పరచినాడు - ఆయన ఒక పురుషునికి ఒక భార్య ఉండాలని కోరుచున్నాడు - ఆ రీతిగ లైంగిక వాంఛలు తీర్చబడతాయి. వివాహబంధముకాని ఏ లైంగిక సంబంధమైనా పాపమే. మనము ప్రతివిధమైన లైంగిక పాపమును గూర్చి పశ్చాత్తాపపడి, దానిని విడిచి, నిజాయితీతో దేవుని వైపు తిరుగవలెను.


నీవు తప్పక పశ్చాత్తాప పడవలసినది మరియు విడిచి పెట్టవలసిన పాపము మరియొకటి ఏమనగా నీవు ఇతరులను క్షమించలేనటువంటి స్వభావము. దేవుడు నీ పాపములను క్షమించవలెనంటే, ఏ విధముగానైననూ నిన్ను బాధపరచిన వారినందరిని నీవు క్షమించుటకు ఇష్టపడాలి. దేవుడు నీ యెడల చేసినట్లుగా నీవు యితరుల యెడల చేయవలెను. నీవు దీని చేయుటకు ఇష్టపడని యెడల, దేవుడు నిన్ను క్షమింపడు.


ప్రభువైన యేసు క్రీస్తు ఈ విధముగా చెప్పెను ''మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల, పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు'' (మత్తయి 6వ అధ్యాయము 15వ వచనము).


నీకు మితిలేని హాని కలిగించిన వానిని క్షమించుట నీకు అతి కష్టముగా యుండవచ్చును. అప్పుడు నీవు ఆ వ్యక్తిని క్షమించుటకు సహాయము చేయుమని దేవుని ప్రార్థించవచ్చును.


ఈ పని చేయుటకు దేవుని సర్వశక్తి నీకు సహాయముగా నుంటుంది. దేవుడు తన యొక్క సర్వశక్తితో నీకు సహాయము చేసినట్లయితే, నీకు అసాధ్యమైనది ఏదియు ఉండదు.


మన పాపములు ఎంత చెడ్డవైనను దేవుడు వాటినన్నిటిని క్షమించగలడు. అయితే వాటిని గూర్చి మనము పశ్చాత్తాప పడినపుడు మాత్రమే అనగా మనము నిజముగా మన పాపముల గూర్చి దు:ఖించుచూ మన గత పాపపు మార్గములను మనస్పూర్తిగా విడిచిపెట్టుటకు కోరుకోవాలి.

అధ్యాయము 6
విశ్వాసమును గూర్చిన యదార్థ సత్యము

ఒకసారి మనము మారుమనస్సు పొందిన తరువాత దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుటకు కావలసినది విశ్వాసము.


'మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు' అని బైబిలు చెబుతుంది (ఎఫెసీయులకు 2వ అధ్యాయము 8వ వచనము).


కృప అనగా ఆయన సహాయము మరియు ఆశీర్వాదము మనకు అందించుటకు చాపబడిన దేవుని హస్తము. విశ్వాసము అనగా ఆ సహాయము మరియు ఆశీర్వాదము మనము దేవుని నుండి అందుకొనుటకు చాచిన మన హస్తము.


మనము ముందు చూచినట్లు, ఏ పని చేయమని ఆజ్ఞాపించి మీట నొక్కితే ఆ పనిని అక్షరాల నెరవేర్చే మెదడు లేని మరబొమ్మలు దేవునికి అక్కర్లేదు. మనమొక ఎంపిక చేసుకోవాలని ఆయన కోరుకొనుచున్నాడు.


దేవుడు మంచి దేవుడనియు, ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడనియు నీవు నమ్ముచున్నావా? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును నీ పాపముల కొఱకు సిలువపై చనిపోవుటకు పంపెననియు, దేవుడు ఆయనను మృతులలో నుండి మూడవ దినమున లేపెననియు ఆయన ఇప్పుడు పరలోకములో సజీవుడుగా ఉన్నాడనియు నీవు నమ్ముచున్నావా? అట్లయితే దేవుడు నీకు యివ్వగోరిన క్షమాపణ ఇప్పుడే నీవు పొందగలవు. నీవు దాని కొరకు ఎదురుచూడనక్కరలేదు.


ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామమున తప్ప మరి ఏ నామమున పాపము నుండి రక్షణ దొరకదు. నీవు ఆయనను ప్రభువుగా మరియు రక్షకునిగా చేర్చుకోవాలంటే, వివాహములోవలె 'అన్నిటిని విడిచి ఆయనను మాత్రమే హత్తుకొనుట' అనునది ముఖ్యమైనది. వివాహములో ఒక స్త్రీ తనకుండిన మొదటి ప్రియులను విడిచిపెట్టి, తన మిగిలిన జీవితమంతయు ఒకే పురుషుణ్ణి తన భర్తగా హత్తుకొని యుండవలెను.


ప్రభువైన యేసుక్రీస్తుతో మన సంబంధాన్ని బైబిలు ఆత్మీయ వివాహముతో పోలుస్తుంది. అందులో ఆయన ఒక్కడే మనయొక్క దైవిక భర్త. కనుక నీవు క్రీస్తును అంగీకరించుటకు యిష్టపడుచున్నానని చెప్పు. ఇతర దేవుళ్ళను పూజిస్తానని లేక ప్రార్థిస్తానని కూడా చెప్పడానికి వీలులేదు. నీవు ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి.


అటువంటి ఎంపిక చేసుకోవాలంటే, ఇదే సమయము.


ఇప్పుడే మోకాళ్ళూని, నీ కళ్లు మూసికొని, హృదయపూ ర్వకముగా ఈ మాటలు దేవునికి చెప్పు. నీవు ఎక్కడ ఉన్నప్పటికి ఆయన నీ మాటలు వినగలడు. ఆయన నీవు చెప్పేది వినటానికి ఆసక్తి కలిగియున్నాడు. ఈ మాటలు అర్థవంతముగా మరియు నెమ్మదిగా చెప్పు. 'ప్రభువైన యేసు క్రీస్తూ! నేనొక పాపిని మరియు నేను నిజముగా నా పాపములన్నిటి నుండి మరలుటకు యిష్టపడుచున్నాను. నీవు నా పాపములన్నిటి కొఱకు చనిపోయినావనియు, మృతులలో నుండి తిరిగి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నావనియు నేను నమ్ముచున్నాను. దయచేసి నా పాపములన్నిటిని క్షమించు, నా హృదయములోనికి మరియు నా జీవితములోనికి వచ్చి ఇప్పటినుండి నా జీవితమునకు ప్రభువుగా నుండుము. నేను మిగిలిన దేవుళ్ళను విడిచి, ఇప్పటి నుండి నిన్ను మాత్రమే పూజించాలనుకొనుచున్నాను'.


అది చాలా సుళువుగా చెప్పగలిగే అతి సామాన్యమైన ప్రార్థన, దానికి ఒక నిమిషముకన్న తక్కువ సమయము సరిపోతుంది. కాని దానిని నీవు మనస్పూర్తిగా దేవునికి ప్రార్థించినట్లయితే, నిత్యత్వమంతటికి నీ ఆత్మ రక్షింపబడుతుంది. నీవు వెంటనే దేవుని బిడ్డవు కాగలవు. దీనిని ఎవరైతే చిలుకవలె వల్లిస్తారో అట్టివారికి దీవెనయిచ్చే మంత్రము కాదు. ఇదియంతయు హృదయము యొక్క నిష్కాపట్యముపై ఆధారపడి యుంటుంది. నీవు చెప్పేదాని అర్థము నీవు ఎరిగియుంటే, నీవు నిజాయితీ లేనివాడవైతే, మార్పులేనివాడవుగా ఉండిపోతావు. క్రీస్తును తన జీవితములోనికి అంగీకరించమని (స్వీకరించమని) దేవుడు ఎవరిని బలవంతం చేయడు. అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తును అంగీకరించమని ఎవరినీ బలవంతం చేయడు. బలవంతపు మతమార్పిడులు అసలు మార్పిడులే కావు.


మనము దేవునిచే నిజముగా క్షమించబడి అంగీకరించబడి, ఆయన యొక్క బిడ్డలముగా చేయబడితిమను నిశ్చయత లేకుండా మనము ఉండాలని దేవుడు కోరుకొనుటలేదు. ఆయన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చుట ద్వారా మరియు మనము దేవుని బిడ్డలమని ఆయన చెప్పుట ద్వారా దేవుడు ఈ నిశ్చయతను కలుగజేయును. ఆయన యొక్క వ్రాతపూర్వకమైన వాక్కు (బైబిలు) నందలి వాగ్దానముల ద్వారా కూడా దేవుడు ఇదే నిశ్చయతను కలుగజేయును.


ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా చెప్పెను 'నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను' (యోహాను 6వ అధ్యాయము 37వ వచనము).


మనము నిత్యత్వమనే శాశ్వత కాలమంతా క్రీస్తు యొక్క వాగ్దానముపై ఆధారపడవచ్చును.


ఇప్పుడు నీవు చేసిన ప్రార్థన మనస్పూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తుకు చేసావా? అట్లయితే నీవు తప్పనిసరిగా ఆయన యొద్దకు వచ్చావు. అప్పుడు ఆయన నిన్ను త్రోసివేయలేదని నీవు తప్పక నమ్మవచ్చు. ఆయన నిన్ను అంగీకరించాడు. ఆయన యొద్దకు నీవు వచ్చుట ద్వారా నీవంతు నెరవేర్చిన యెడల, దేవుడు నిన్ను అంగీకరించుట ద్వారా ఆయన వంతు నెరవేర్చియున్నాడని నీవు రూఢిగా నమ్మవచ్చు.


దేవుడు నిన్ను అంగీకరించాడా లేదా అనేది నీ అనుభూతులపై ఆధారపడి లేదు. ఈ అనుభూతులు మన భౌతిక శరీరములకు సంబంధించినవి మరియు ఆత్మీయ విషయములలో అవి బహుగా మోసకరమైనవి.


మన నమ్మకాన్ని అనుభూతులపై ఉంచుట అనేది ఇసుకపై ఇంటి పునాది వేయటం వంటిది. మన నమ్మకాన్ని ఆయన వాక్యములో నుండిన వాగ్దానాలపై నిలపాలి - అది రాతిపైన కట్టబడిన కట్టడము వంటిది.


ఒకమారు నీవు దేవుని బిడ్డగా మారినావనే నిశ్చయత నీకు కలిగినప్పుడు, ఆ వాస్తవాన్ని నీవు బహిరంగముగా ఒప్పుకొనవలెను. నీవు హృదయములో నమ్మిన దానిని, నీ నోటితో ఒప్పుకొనవలెనని బైబిలు చెబుతుంది. కనుక నీవు యేసు క్రీస్తును ఇప్పుడు నీ రక్షకుడని మరియు నీ ప్రభువని నీ పెదవులతో ఒప్పుకొనవలెను. నీవు నీ స్నేహితులకు మరియు బంధువులకు క్రీస్తు నీ పాపములు క్షమించెనని మరియు ఆయననే నీ జీవితానికి ఏకైక ప్రభువని చెప్పవలెను.


అప్పుడు క్రీస్తుతో నీకున్న సంబంధాన్ని బాప్తిస్మము ద్వారా ఒప్పుకొనవలెను. నీ హృదయాన్ని మరియు నీ జీవితాన్ని క్రీస్తుకు యివ్వవలెనని నిర్ణయించుకొనిన తరువాత సాధ్యమైనంత త్వరగా నీవు బాప్తిస్మము పొందవలెను. బాప్తిస్మము అనేది మతపరమైన ఆచారము కాదు. అది ఇప్పుడు నీవు క్రీస్తుకు మాత్రమే చెందినవాడవని దేవునికి, ప్రజలకు, దేవదూతలకు మరియు సాతానుకు నీవు యిచ్చే బహిరంగ సాక్ష్యము.


తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో వేరొక క్రైస్తవుడు నీటిలో (చెఱువులోగాని, నదిలోగాని) నిన్ను పూర్తిగా ముంచి తిరిగి నీటిలో నుండి పైకి లేవనెత్తుట అనునది బాప్తిస్మము. ఈ చిన్న కార్యము ద్వారా నీలో ఉన్న పాత వ్యక్తి చనిపోయాడనే వాస్తవాన్ని నీవు సాక్ష్యమివ్వగలవు. నీవు పూర్తిగా నీటమునుగుట ద్వారా అతనిని సూచనార్థముగా పాతిపెట్టితివి.


నీటనుండి పైకి వచ్చుట ద్వారా నీవు ఇప్పుడు నూతన వ్యక్తివైతివని (ఆత్మీయముగా చెప్పవలెనంటే మృతి నుండి లేపబడటం), దేవునిని మాత్రమే సంతోషపరచటానికి కోరుకుంటున్నావని నీవు ఒప్పుకొంటున్నావు.


నీవింకను పరిపూర్ణుడవు కాలేదు. నీవు పరిపూర్ణుడవగుటకు నీ జీవిత కాలమంతయు పడుతుంది. కాని నీ యొక్క జీవిత గమనపు దిశను నీవు మార్చుకొన్నావు. నీవు ఇక ఎంతమాత్రమునూ పాపము చేయుటకు లేక దేవునికి దు:ఖము కలిగించుటకు ఇష్టపడవు.


నీవు ఇప్పుడు పరలోక పౌరుడవు మరియు దేవుని బిడ్డవు.


అధ్యాయము 7
రక్షణను గూర్చిన యదార్థ సత్యము

'యేసు' అను పేరునకు 'రక్షకుడు' అని అర్థము.


ఆయన ఈ భూమిపైకి ప్రజలను వారి పాపములనుండి రక్షించుటకే వచ్చియున్నాడు గనుక, ఆ నామము ధరించుకొని ఈ భూమిపైకి వచ్చెను. రక్షణ అంటే పాపక్షమాపణ మాత్రమే కాదు.


ఈ తేడాను తేటగా తెలుపుటకు ఒక దృష్టాంతమును ఉపయోగిస్తాను.


నా యింటి ముందు ఉన్న రోడ్డు మరమ్మత్తులకై ఒకలోతైన గోతిని త్రవ్విరనుకొందము. నేను నా చిన్న కుమారునితో 'ఆ గోతి దగ్గరకు వెళ్ళవద్దు, నీవు అందులో పడిపోవచ్చు' అని హెచ్చరించాను. కాని వాడు నా ఆజ్ఞను మీరి ఆ గోతి దగ్గరకు తొంగి చూడటానికి వెళ్ళాడు. వాడు జారి, అందులో పడిపోయాడు. ఆ పది అడుగుల లోతైన గోతిలో నుండి, వాడు అరచుచు నన్ను పిలచుచున్నాడు.


నేను అక్కడకు వచ్చినప్పుడు, వాడు నా ఆజ్ఞను మీరినందుకు నిజముగా చింతిస్తూయున్నానని, తనను క్షమించమని నన్ను అడిగాడు. అప్పుడు నేను 'సరే కుమారుడా! నేను నిన్ను క్షమించాను, వెళ్ళివస్తాను' అని చెప్పినట్లయితే, అప్పుడు నేను ఏమి చేసినట్లు? నేను వాడిని క్షమించి ఉండవచ్చును గాని, నేను వాడిని రక్షించలేదు.


క్షమాపణకంటె రక్షణ అధికమైన వాటితో ముడిపడియుంది. వాడుపడిన గోతిలో నుండి వాడిని నేను పైకిలాగుట కూడా అందులో ముడిపడియుంది.


మన కొఱకు ప్రభువైన యేసు దీనినే చేయటానికి వచ్చియున్నాడు. ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే కాక, ఆయన మన పాపముల నుండి మనలను రక్షించుటకు కూడా వచ్చియున్నాడు.


మనమందరము మన మనస్సాక్షికి మరల మరల లోబడకపోవుట వలన పాపపు గోతిలో మిక్కిలి లోతునకు పడిపోయియుంటిమి. ఇప్పుడు దేవుడు మనలను క్షమిస్తే అదే అద్భుతమైన వార్త. అయతే క్రీస్తును గూర్చిన శుభవార్త ఏమిటంటే ఆయన మనలను క్షమించుటయే కాక పాపపు శక్తి నుండి కూడా మనలను రక్షించుట.


రక్షణను మనము మూడు కాలములలో భూత, వర్తమాన, భవిష్యత్కాలములలో అనుభవించాలి. మొదటిగా, మనము పాపము యొక్క శిక్ష నుండి రక్షింపబడాలి. తరువాత పాపము యొక్క శక్తినుండి రక్షింపబడాలి. చివరిగా పాపము యొక్క ఉనికి నుండి పరలోకమునకు వెళ్లినపుడు రక్షింపబడెదము.


రక్షణలో మొదటి భాగము మన పాప క్షమాపణను అనగా గత జీవితము యొక్క అపరాధమును తీసివేయుటకు సంబంధించినది.


కాని అదిసరిపోదు. మనము భవిష్యత్తులో కూడా యదార్థముగా జీవించుటకు దేవుని యొద్ద నుండి సహాయము కావలెను. దీని కొరకు దేవుడు మనకు తన శక్తిని ఇచ్చును.


మానసిక రోగులు చికిత్స కొరకు చేర్చబడే ఒక మానసిక రోగ చికిత్సాలయము (పిచ్చి ఆసుపత్రి) గూర్చిన ఒక కథను నేను వినియున్నాను. అందులో చేరినవారు సరియైన రీతిలో ఆలోచించగలుగునట్లు బాగుపడితిరో లేదో తెలుసుకొనుటకు ఒక పరీక్ష పెట్టెదరు. తెరువబడిన కుళాయి గుండా నీరు వచ్చుచున్న ఒక గదిలో వారిలో ఒకనిని ఉంచెదరు. అతనికి ఒక బకెట్టు, గచ్చుతుడిచే గుడ్డ యిచ్చి గచ్చును పొడిగా తుడవమని చెప్పెదరు. అతడు మొదటిగా కుళాయిని కట్టకుండా ఆ పని చేయుటకు ప్రయత్నించినట్లయితే, అతడికింకను బుద్ధి రాలేదన్నమాట!


మన సమస్య కూడా అదే. మనలోపల కూడా ఒక కుళాయి ఉన్నది. అది ఎల్లప్పుడూ పాపాన్ని బయటకు చిమ్ముతూవుంటుంది. యేసు మనము చేసిన పాపములను తుడిచివేయుటయే కాదు. ఆ కుళాయిని కట్టివేయుటకు కూడా మనకు శక్తినిస్తాడు. లేనట్లయితే సువార్త అసలు మంచి వార్త కానేరదు.


బైబిలులో సువార్త (శుభవార్త) 'రక్షించుటకు దేవుని శక్తియైయున్నది' అని వివరించబడింది (రోమీయులకు 1వ అధ్యాయము 16వ వచనము).


శక్తికి మొదటి మూలాధారము దేవుని వాక్యము. దేవుని వాక్యము (అంటే బైబిలు గ్రంథము) శోధనను జయించుటకు మనకు సహాయపడే శక్తిగల ఆయుధమైయున్నది. యేసు తానే సాతాను యొక్క శోధనలను దేవుని వాక్యము యొక్క శక్తితో జయించెనని బైబిలులో చదువగలము (మత్తయి 4వ అధ్యాయము 1 నుండి 11 వచనములు).


అందుచేతనే దేవుని వాక్యమును ప్రతిరోజు చదివే అలవాటును వృద్ధిచేసుకోవాలి. ఆ విధముగా దేవుడు మనతో మాట్లాడి దైనందిన జీవితములో పోరాటములను ఎదుర్కొనేలాగున మనలను బలపరుస్తాడు.


యౌవనస్థులకు బైబిలు 'మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించియున్నారు' అని చెప్పుచున్నది (1వ యోహాను 2వ అధ్యాయము 14వ వచనము).


శక్తికి రెండవ మూలాధారము - మనలో నివసించుటకు వచ్చిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆయన మనలో శాశ్వతముగా జీవించి, ప్రతి దినము మనతో మాట్లాడుచు, జీవితపు పోరాటములను ఎదుర్కొనుటకు బలపరచి, యేసు శిష్యులుగా ఆయన అడుగుజాడలలో నడచుటకు సహాయము చేయవలెనని ఆయన కోరుచున్నాడు. మనలను ఎడతెగక పరిశుద్ధాత్ముని చేత నింపమని దేవుని అడుగవలెను.


ప్రభువైన యేసు ''మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' (లూకా 11వ అధ్యాయము 13వ వచనము).


శక్తి నొందుటకు మూడవ మూలాధారము - మనవంటి మనసుకలిగిన క్రైస్తవులతో సహవాసము చేయుట.


ఎప్పుడైతే అనేక బొగ్గులు అగ్నితో కలిసి ఉంటాయో, అవన్నియు ప్రకాశవంతముగా మండుచూ ఉంటాయి. కాని ఒక బొగ్గు (అది ఎంతో గొప్పగా మండుతున్నదైనా) ను బయటకు తీసివేసినట్లయితే త్వరలోనే అది ఆరిపోతుంది. ఇతర క్రైస్తవుల సహవాసం లేకుండా మనకు మనమే దేవుని కొరకు జీవించాలనుకుంటే మనము కూడా అలాగే చల్లారిపోతాము.


అయితే ఇక్కడే మనము జాగ్రత్త కలిగి యుండాలి. 'క్రైస్తవులమని' చెప్పుకొనే ప్రతివారు క్రైస్తవులు కారు.


వాస్తవానికి క్రైస్తవులమని చెప్పుకొనే వారిలో 90% మంది నిజమైన దేవుని బిడ్డలు కాదని చెప్పడం శ్రేయస్కరం (వారు ఎటువంటి క్రైస్తవ గుంపుకు లేక శాఖకు చెందినవారైనా సరే), వారు వారి పాపములను విడిచిపెట్టుటకు, క్రీస్తును వారి జీవితములపై ప్రభువుగా స్వీకరించుటకు వారు వ్యక్తిగత నిర్ణయము తీసుకున్నవారు కాదు. తాము క్రైస్తవ కుటుంబములో 'జన్మించుట అనే సంఘటన' ద్వారానే తాము క్రైస్తవులమని ఊహించుకొంటారు.


కేవలం పేరుకు మాత్రము క్రైస్తవులైన వారిని మనము తప్పించుకొని ఎవరైతే అనుభవము ద్వారా క్రైస్తవులుగా నుందురో, ఎవరైతే వారి దైనందిన జీవితాలలో యేసు క్రీస్తును వెంబడించుటకు ఆశతో వెదకుచున్నారో అట్టివారి సహవాసం వెదకాలి.


ఎప్పుడైతే మనము క్రీస్తును మన యొక్క ప్రభువుగాను, రక్షకునిగాను చేర్చుకొందుమో అప్పుడు మనము పైనుండి పుట్టినవారమని బైబిలు చెబుతుంది. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమైతిమి. దేవుడు యిప్పుడు మన తండ్రియై యున్నాడు. ఈ లోకపు తండ్రివలెనే, దేవుడు కూడా ఈ భూమిపైన మన జీవితమునకు అవసరమైన వన్నియూ - ఆత్మీయముగా మరియు భౌతికముగా సమకూర్చుటకు ఆసక్తి కలిగియున్నాడు.


మన జీవితములో దేవుని కిష్టమైన వాటిని మొదట వెదకిన యెడల, ఈ లోకములో మనకు అవసరమైన ఇతర వస్తువులన్నియు సమకూర్చబడునని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను.


'ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. మీ జీవితములో ఆయనకు మీరు మొదటి స్థానమిచ్చిన యెడల ఆయన కిష్టమైన విధముగా మీరు జీవించిన యెడల వాటన్నిటిని ఆయన మీ కిచ్చును అని ఆయన చెప్పెను' (మత్తయి 6వ అధ్యాయము 33వ వచనము).


దేవుని బిడ్డకు గల గొప్ప ఆధిక్యతలలో ఒకటి ప్రార్థించే ఆధిక్యత - అది సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడుట మరియు దేవుడు తనతో తన ఆత్మతో మాట్లాడునది వినుట. దేవుడు సాధారణముగా మన చెవులతో వినగలిగే స్వరముతో కాక మనలో నున్న మన ఆత్మలో ఒక తలంపు కలుగజేయుట ద్వారా మాట్లాడును. అది వినదగినట్టి స్వరమంత యదార్థమైనది. మన హృదయాలలో భారము కలిగించే ప్రతి విషయాన్ని దేవునికి చెప్పమని, యేసు మనలను ప్రోత్సహించెను. అనేకమంది ప్రజలు వారి బాధలు చెప్పుకోవటానికి ఎవరును లేక మౌనముగా బాధపడుతుంటారు. కాని దేవుని బిడ్డకు తన ప్రతి భారము పంచుకొనుటకు ఒక తండ్రి పరలోకములో ఉన్నాడు. అతడు భూమిపై తనకు అవసరమైన ప్రతిఒక్కటి తన పరలోకపు తండ్రి సమకూర్చగలడని కూడా ఆయనపై నమ్మికయుంచగలడు.


దేవుని అడుగుట ద్వారా కొన్ని పరిస్థితులను మార్చుట ఎట్లో ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించెను. ఇది ప్రార్థన యొక్క అద్భుతము.


మనకు, మన కుటుంబాలకు ఏ విధముగానైనను, నష్టము కలిగించే పరిస్థితులు కలిగినప్పుడు అది దైవకృతమని (జరిగిన ప్రతిది దేవుని చిత్తమని చెప్పుచూ) అంగీకరించనక్కర్లేదు. విధివశము అనునది దేవుని చిత్తమునకు లోబడుట అనుదానికి వేరైనది. మనకు అవసరమైన దాని గూర్చి దేవుని అడుగుటకు మనము ప్రోత్సహింపబడుచున్నాము.


'దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును' అని బైబిలులో వాగ్దానము గలదు (ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 19వ వచనము).


కాని జ్ఞానముగల ప్రతి తండ్రి వలెనే, దేవుడు కూడా మనము కోరినది మరియు అడిగిన ప్రతి ఒక్కటి మనకు యివ్వడు. మనకు అవసరమైనది మరియు ఏది మనకు మేలుకరమైనదిగా ఆయన చూస్తాడో దానిని మాత్రమే ఆయన యిస్తాడు.


దేవుడు మంచిదేవుడు మరియు ఆయన తన పిల్లలలో ఎవరికైనను, ఎప్పుడైనను ఏదైనా కీడు జరుగుటకు ఆయన ఇష్టపడడు.


గనుక ఆయన యొద్దకు మనము ధైర్యముగా వెళ్లి, ప్రతి కీడు నుండి మనలను విడిపించమని ఆయనను ఆడుగవచ్చును.


ఈ లోకములో అనేకులు ఇతరులు వారికి చెడుపు, చిల్లంగి, చేతబడి చేయుట ద్వారా బాధపడుచున్నారు. నీవు నీ హృదయమును నీ జీవితమును క్రీస్తుకు ఇచ్చినట్లయితే అటువంటి సాతాను క్రియలు నిన్ను ఇకపై ఏ మాత్రము హానిచేయలేవు. సాతానును తరిమి వేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు నామము (ఎవరైతే సాతానును ఓడించారో) ను నీవు ఉపయోగించగలవు.


నీవు యేసుక్రీస్తు నామములో ఎదిరించినట్లయితే ఏ చెడుపు, చిల్లంగి నిన్నుగాని నీ బిడ్డలనుగాని ముట్టుకొనలేవు, హానిచేయలేవు. నిన్ను రక్షించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మొఱలిడినచో - నీ పై ప్రయోగింపబడిన ఏ చిల్లంగి శక్తియైనను ఇప్పుడే - ఈ క్షణమందే వెడల గొట్టబడును.


యేసు సిలువపై మరణించినప్పుడు, ఆయన సాతానును ఓడించి, వాని యొక్క శక్తిని కొట్టివేసెనని బైబిలు చెబుతుంది. అది ఇప్పటికే జరిగిపోయినది. అయితే నీ పాపముల యొక్క క్షమాపణవలెనే, ఈ విషయములో కూడా, నీ మట్టుకు నీవు అంగీకరించు వరకు సాతాను యొక్క ఓటమి నీ జీవితములో నిజము కాలేదు.


అపవాదిని (సాతానును) మరణము ద్వారా నశింప జేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, ఆయన (యేసు) కూడా రక్త మాంసములలో పాలివాడాయెను (హెబ్రీయులకు 2వ అధ్యాయము 14,15 వచనములు).


'దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును' (యాకోబు 4వ అధ్యాయము 7వ వచనము).


మనము దేవుని బిడ్డలమయిన తరువాత కూడా సాతాను మనలను శోధించుటకు దేవుడు అనుమతిస్తాడు, ఎందుకనగా ఆ రీతిగా మనము బలవంతులము కాగలము.


మనలో యిప్పుడు నివసించుచున్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, సాతాను యొక్క దాడులను ఎదిరించుటకు మరియు జయించుటకు మనకు శక్తినిచ్చును.


తన బిడ్డలు తమ భూ సంబంధమైన జీవితములలో బాధలు, సమస్యలు లేకుండా యుందురని దేవుడు వాగ్దానము చేయలేదు.


పుట్టుక నుండి గారాబము చేయబడి చెడిపోయిన ధనవంతుల పిల్లలవలె కాక, మనము కష్టనష్టములకు ఓర్చుకొని బలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలను బలవంతులుగా తయారుచేయుటకు, మనము ఇతర మానవ మాత్రులవలెనే జీవితములో పరీక్షలు మరియు సమస్యలు ఎదుర్కొనేటట్లు ఆయన అనుమతిస్తాడు. అయితే ఆ శోధనల యందు ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క అద్భుత సహాయమును మనము అనుభవించుట ద్వారా దేవునిని అధికముగా తెలిసికొందుము.


అధ్యాయము 8
నిత్యత్వమును గూర్చిన యదార్థ సత్యము

దేవుని బిడ్డగా మారిన వానికి, ప్రస్తుత కాలమందలి సంగతుల కంటె, నిత్యత్వమును గూర్చిన సంగతులు ఎక్కువ విలువైనవిగా నుండును. అతనికి భూ సంబంధమైన వాటి విలువలకంటె పరలోక సంబంధమైన వాటి విలువలు ఎంతో ముఖ్యమైనవిగా నుండును.


2000 సంవత్సరముల క్రిందట, ప్రభువైన యేసుక్రీస్తు మరణము నుండి లేచిన తరువాత, పరలోకమునకు అరోహణమైనప్పుడు, తిరిగి భూమిపైకి వచ్చెదనని వాగ్దానము చేసెను.


దీనిని ''క్రీస్తు రెండవ రాకడ'' యందుము. ఇది ప్రపంచ చరిత్రలో తరువాత వచ్చు గొప్ప సంఘటన.


క్రీస్తు ఈ భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు, దేవునికి తన జీవితమంతటిని గూర్చి లెక్క అప్పగించవలెనని దేవుని బిడ్డకు తెలియును.


ఈ లోకము నిత్యత్వము వైపు మన ప్రయాణములో ఒక జరిగిపోయే దశ మాత్రమే. ఇప్పుడు మనము పరీక్షింపబడు చున్న కాలమందున్నాము. జీవిత పరిస్థితుల ద్వారా మనము పరలోకము యొక్క శాశ్వతమైన విషయాలను ఎంచుకొంటామో లేక అశాశ్వతమైన ఈ లోకపు విషయాలను ఎంచుకొంటామో తెలుసుకొనుటకు యిప్పుడు దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. మనము జ్ఞానము గలవారమైతే, నిత్యత్వములో విలువ ఉండే విషయాలను మనము ఎంచుకొంటాము.


ఒక చిన్న శిశువు ఒక 500 రూపాయల నోటుకు బదులుగా ఒక మెరుస్తున్న రంగు కాగితమును ఇష్టపడతాడు. ఎందుకంటే ఈ బిడ్డకు విలువల ప్రాధాన్యత తెలియదు. మనము పరలోకము మరియు నిత్యత్వ విషయాలకు బదులు ఈ లోకపు విషయాలను ఎంచుకొనినట్లయితే మనము అటువంటి చిన్న శిశువువలె ప్రవర్తిస్తూ యున్నాము.


ఈ లోకము మరియు అందులో నుండినవన్నిము గతించిపోవును అని దేవుడు బైబిలులో చాలా తేటగా చెప్పారు.


ఈ లోకము యొక్క అశాశ్వతమైన విషయాల కొరకు జీవించుట చాలా తొందరలో దివాలా తీయబోవుచున్న బ్యాంకులో డబ్బు జమచేయుట వంటిది.


ఒక జ్ఞానము గలిగిన వ్యక్తి తన ధనాన్ని స్థిరముగా నుండే బ్యాంకులో నిలువజేస్తాడు. అదే విధముగా నిజముగా జ్ఞానముగలవారు నిత్యమైన విలువగల విషయాల కొరకు జీవిస్తారు - అవి మన గుణమునకు సంబంధించినవి - పవిత్రత, ప్రేమ, మంచితనము, క్షమాగుణము, దీనత్వము మొదలైనవి, వాటిని మాత్రమే మనము ఈ భూమిని వదిలినప్పుడు మనతో తీసికొనివెళ్ళగలము.


ఎవరైతే వారి పాపముల నిమిత్తము మారుమానస్సు పొందకుండా చనిపోవుదురో వారి అంతము భయంకరముగా ఉంటుందని బైబిలు చెబుతుంది.


'మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును' (హెబ్రీయులకు 9వ అధ్యాయము 27వ వచనము).


మనుష్యుడొకమారు చనిపోయినట్లయితే అతనికి ఇక మార్పు చెందుటకు అవకాశముండదు. దేవుడు కూడా అటువంటి వ్యక్తిని మార్చలేడు. ఎందుకనగా ఒక వ్యక్తి యొక్క యిష్టమునకు వ్యతిరేఖముగా దేవుడు అతనిని మార్చడు. ఈ భూమిపైన మనము మారుటకు ఇష్టపడితేనే దేవుడు మనలను మార్చగలడు.


భవిష్యత్తులో రానైయున్న ఒక రోజున ఈ భూమిపై జీవించిన ప్రతి వ్యక్తి తన జీవితము యొక్క లెక్కను దేవునికి అప్పగించుటకు మృతులలో నుండి లేపబడును.


రెండు పునరుత్థానములు కలవని బైబిలు చెప్పుచున్నది. అది దేవుని యొక్క అతీతమైన శక్తిచేత ధూళిగా మారిపోయిన మృత శరీరములు తిరిగి అక్షయమైన శరీరములుగా లేపబడుట.


ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించిరో, ఎవరి పాపములు క్షమించబడినవో మరియు ఎవరైతే భూమి మీద నుండగానే దేవుని బిడ్డలుగా మారితిరో అట్టి నీతిమంతులకు మొదటి పునరుత్థానముండును.


ఎవరైతే వారి పాపములు క్షమించబడకుండా చనిపోతిరో ఎవరైతే క్రీస్తును తమ రక్షకునిగా మరియు ప్రభునిగా అంగీకరించలేదో వారికి రెండవ పునరుత్థానముండును.


ఒక వ్యక్తి తన పాపముల గురించి పశ్చాత్తాపపడకుండా, తన పాపముల క్షమాపణ కొరకు క్రీస్తునందు నమ్మిక యుంచకుండా చనిపోయినట్లయితే ఒకనాడు అతడు దేవుని తీర్పు సింహాసనము ముందు తీర్పు తీర్చబడతాడు. అక్కడ అతని జీవితమంతా పునర్విచారణ చేయబడుతుంది. అప్పుడు అతని పాపముల కొరకు నిత్య తీర్పు వానికి తగినదేయని విశ్వమంతటికి ఋజువు చేయబడుతుంది.


మానవులనందరిని పాపములోనికి నడిపించి, ఈ ప్రపంచములో చెడును మొదలుపెట్టిన సాతాను అందరికంటె ముందుగా అగ్నిగుండములోనికి త్రోయబడతాడు.


మరియొక వైపు, ఎవరైతే తమనుతాము తగ్గించుకొని, తమ పాపములను తెలిసికొని, ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి, సిలువపై క్రీస్తు మరణించుట ద్వారా దేవుడు అందిస్తున్న క్షమాపణను స్వీకరించారో వారు నిత్యత్వమంతా దేవునితోను, యేసు క్రీస్తుతోను నివసించుటకు దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తారు.


పరలోకము స్వచ్ఛత, సమాధానము మరియు సంతోషముగల ప్రదేశము, అచ్చట దేవదూతలు, పాపములనుండి రక్షింపబడిన మానవజాతి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ యుందురు మరియు ఆయనకు నిత్యత్వమంతా అనేకరీతులుగా పరిచర్యచేయుదురు.


వారి రక్షణ విషయమై క్రీస్తును నమ్మి దేవుని బిడ్డలుగా చనిపోయి మనకంటె ముందుగా భూలోకమును విడిచిన మన ప్రియులను సంతోషముతో తిరిగి కలిసికొనే ప్రదేశమది.


నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు దేవునితో చిరకాలము కలిగియుందునా అని ఆ మహిమకరమైన దినము గూర్చి ఎదురుచూచుచుండును.


ఇప్పుడు నీవు యదార్థ సత్యాన్ని తెలిసికొన్నావు. నీ స్పందన ఎలా ఉండబోతుంది?


నిన్నును, నీ పాపములను క్షమించి దేవుని బిడ్డగా నిన్ను చేసికొనమని ప్రభువైన యేసు క్రీస్తును అడుగుతూ ప్రార్థించావా?


దేవుడు నీ హృదయముతో మాట్లాడుచుండగా ఆ ప్రార్థన చేయుటకు సమయమిదే.


మనలో ఎవరము మనమెప్పుడు చనిపోయి, ఈ లోకమును విడిచిపెట్టుదుమో చెప్పలేము.


ఈ దినాలలో ఒకరోజు ఈ భూమిపై మన ఆఖరి రోజు కావచ్చు.


ఆ దినము రాకముందే నీ పాపములు క్షమింపబడినవని, దేవుని కలిసికొనుటకు సిద్ధపడి యున్నావని నిశ్చయముచేసుకో.