ఒక ఆత్మీయ నాయకుడు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
    Download Formats:

అధ్యాయము 0
పరిచయం

భారతదేశములోని సంఘాలకు ఆత్మీయ నాయకత్వము ఈనాడు అత్యవసరము.


క్రైస్తవ సేవకుల బృందానికి, బైబిలు కళాశాల అధ్యాపకులకు, సంఘ కాపరులకు అందించబడిన వరుస సందేశములు ఈ పుస్తకములో ఉన్నాయి..


సులభముగా చదువుకొనుట కోసం ఇందులోని సందేశాలు వాడుక భాషలో రూపొందించ బడ్డాయి.


ఈ పుస్తకము ద్వారా దేవుడు మీ హృదయముతో మాట్లాడి ఈనాటి యువతరానికి ఆదర్శముగానూ-మాదిరి దైవ సేవకుడిగానూ, నిజమైన ఆత్మీయ నాయకుడిగానూ మీరు ఉండేలా మిమ్ములను సవాలు చేయును గాక.

అధ్యాయము 1
దేవునిచేత పిలువబడుట

ఒక ఆత్మీయ(ఆత్మానుసారుడైన) నాయకుడు ప్రాథమికముగాను అతిప్రాముఖ్యము గాను దైవ పిలుపు కలిగి ఉంటాడు. అతడు చేసే పని అతని వృత్తిగాకాక అతని పిలుపై యుంటుంది.


ఎవ్వడూ తనకు తానుగా ఒక ఆత్మీయ నాయకుడిగా నియమించుకోజాలడు. ''ఈ పనికోసమై అతడు దేవుని చేత పిలువ బడాలి'' (హెబ్రీ 5:4-లివింగ్‌ బైబిలు తర్జుమా).


ఇది మార్చజాలని నియమము. మనకు ప్రధాన యాజకుడిగా ఉండేందుకు సాక్షాత్తు యేసు కూడా తనకు తాను నియమించుకోలేదని ఆ తరువాత ఉన్న వచనము చెబుతుంది. తండ్రి ఆయన్ని నియమించాడు. మరి ఇదే సత్యమైతే ఇక మన పిలుపు విషయంలో ఈ నియమము మరెంత సత్యమై ఉండాలో కదా.


ఈనాటి విషాదకరమైన విషయమేమిటంటే భారతదేశంలోని ''క్రైస్తవ సేవకుల్లో'' అధిక సంఖ్యాకులు తమ పొట్టకూటికోసం మాత్రమే దేవుని సేవ చేస్తున్నారు. ఇది వారికి వృత్తిగా మారింది. వారు దేవుని పిలుపు పొందిన వారుకారు.


ఒక ''వృత్తి''కీ ఒక ''పిలుపు'' కూ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీనిగూర్చి నా భావమేమిటో చెప్పనివ్వండి. ఓ ఆసుపత్రిలో జబ్బుపడి చికిత్స పొందుతున్న ఒక చిన్న పాప ఉందనుకుందాం. ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న నర్సు తన విధిననుసరించి కేవలం ఎనిమిది గంటలు మాత్రం ఆ పాపను చూచుకుంటుంది. తన సమయం అయిపోగానే ఆ నర్సు తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆసుపత్రిలో ఉన్న పాపను పూర్తిగా మర్చిపోతుంది. ఆమెకు ఆ పాప విషయంలో ఉన్న బాధ్యత కేవలం ఎనిమిది గంటలే; ఆ తరువాత ఆమె చేయాల్సిన ఇతర పనులున్నాయి. సినిమాలకు వెళ్ళాలి, టెలివిజన్‌ కార్యక్రమాలు చూడాలి; మళ్ళీ మరుసటి రోజు ఆసుపత్రి ఉద్యోగానికి వెళ్ళేదాకా ఆమె ఆ పాపను గూర్చి ఆలోచించనవసరం లేదు కాని ఆ పాపను కన్న తల్లి ఆ పాపకోసం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయదు గదా! తనపాప జబ్బుపడివుండగా తాను సినిమాకు వెళ్ళలేదు. ''పిలుపు''కూ ''వృత్తి''కీ మధ్యవున్న వ్యత్యాసం ఇదే.


నీ సంఘంలోని విశ్వాసుల్ని పెంచే విషయంలో పై సాదృశ్యాన్ని నీ సేవకు పోల్చి చూచుకుంటే నీవు నర్సువో తల్లివో నీకే తెలిసిపోతుంది!


1 థెస్సలొనీకయ పత్రిక 2:7 లో పౌలు ఇలా చెప్పాడు: ''అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిధ్ధపడియుంటిమి''


ఆనాటి క్రైస్తవులకు పౌలు సువార్తను మాత్రమే బోధించలేదుగానీ తన ప్రాణమును వారికోసం ఫణంగా పెట్టినాడు. ఈ విధానములో జరగని ఏ పరిచర్యయైనా నిజమైన క్రైస్తవ సేవ కానేకాదు. దైవ సేవ కోసమైన పిలుపు పౌలుకు ఉన్నందువల్లనే అతడు ఆ విధంగా దేవుణ్ణి సేవించాడు. అతడు దైవసేవను ఒక వృత్తిగా చేపట్టలేదు.


ప్రభువును సేవించుట అమోఘమైన విషయం. ఈ లోకంలో ఉన్న వాటన్నింటి కంటే మహోన్నతమైనది. ఈ భూమిమీద మరేదీ ఈ పనితో పోల్చుటకు సరిరాదు- అయితే దీని విషయమై నీకు ''పిలుపు'' ఉండితీరాలి. ఇదొక వృత్తిగా మారకూడదు(దిగజారకూడదు).


నేను భారత నౌకా దళంలో ఓ ఆఫీసరుగా ఉన్న రోజుల్లో మే 6, 1964న దైవసేవ(పూర్తికాలపు) నిమిత్తం దేవుడు నన్ను పిలిచాడు. అప్పుడు మా నౌకాదళాధిపతులకు నా రాజీనామా సమర్పించాను. అయితే ఇశ్రాయేలీయులు విడుదలకోసం మోషే ఫరోను అడిగినట్లుగా ఉంది నా పరిస్థితి! భారత నౌకాదళం నన్ను విడుదల చేయలేదు. మళ్ళీ మళ్ళీ నేను అభ్యర్థించగా - చిట్టచివరకు రెండు సంవత్సరముల తరువాత నాకు విడుదల లభించింది. పరిపూర్ణమైన దేవుని సమయంలో అద్భుతంగా విడుదలపొందాను.


దేవుని చేత పిలువబడుట అనేది నా జీవితంలో గొప్ప మార్పును కలుగజేసినది.


మొట్టమొదటిదిగా నన్నుగూర్చిగానీ, నా పరిచర్యను గూర్చిగానీ ప్రజలు ఏమనుకున్నా ఇప్పుడు నేనేమీ పట్టించుకోను. ఎందుకంటే నాకు యజమానుడు వేరొకరు ఉన్నారు. ఆయనకు మాత్రమే నేను జవాబు చెప్పాల్సి ఉంది.


రెండవదిగా, నా పరిచర్యలో వ్యతిరిక్తతగానీ, శ్రమగానీ ఎదురైనప్పుడు నా పక్షంగా నిలవాలని, నాపై కృపచూపాలని నేను దేవుణ్ణి నమ్ముకోగలను - ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది.


మూడవదిగా, నాకు డబ్బు లభించినా, లభించకున్నా తినడానికి భోజనం దొరికినా, దొరక్కపోయినా ఫరవాలేదు. ఒకవేళ నాకు డబ్బు, భోజనం లభిస్తే మంచిదే. అలా లభించకపోయినా నాకు సంతోషమే. దేవుడు నన్ను పిలిచాడు గనుక, డబ్బు, తిండి దొరకనంత మాత్రాన ప్రభువును సేవించుట నేను మానుకోను.


నాకు లభించిన పిలుపును నేను వదులుకోలేను. నేను జీతం కోసం పని చేయటంలేదు. అందుచేత డబ్బు, తిండి లభించకపోయినా నేను సేవించుట మానను. నా పరిచర్య తల్లీ-బిడ్డ సంబంధంలాంటిది. ఒక్కనెల జీతం రాకపోతే నర్సు ఉద్యోగం మానుకుంటుంది. అయితే తల్లి అలామానుకోదు. తల్లికి ఎటువంటి జీతం రాదుగదా! తిండి, డబ్బు లభించినా లభించకపోయినా తల్లి తన బిడ్డను సంరక్షించుకుంటుంది. అపొస్త్తలులు ఈ విధానములోనే ప్రభువును సేవించారు.


దేవునిచేత పిలువబడటం ఎంత మహిమకరమైన విషయమో కదా!


ఒక వృత్తిగా మాత్రమే చేసినట్లయితే దేవుడు నిన్ను చేయమని కోరిన విధానములో నీవెన్నటికీ ప్రభువును సేవించలేవు, అది దేవుని పిలుపై యుండాలి లేక అసలు ఏమియు చేయకుండా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ పనైనా ఒక వృత్తిగానే చేపట్టి చేయవచ్చు, కానీ ఓ తల్లిగా, ఓ తండ్రిగా, ఓ దేవుని సేవకుడుగా అలాచేయటం వీలుకాదు! ఇవన్నియు పిలుపును బట్టి వచ్చేవే. బోధకులు పదివేల మంది ఉన్నా తండ్రి మాత్రం ఒక్కడు మాత్రమేనని పౌలు కొరింథీ క్రైస్తవులకు చెప్పాడు (1 కొరింథీ 4:15). పౌలు తన మందకు ఒక ఆత్మీయ తండ్రిగా, తల్లిగా ఉన్నాడు. అతడు చేస్తున్నది వృత్తికాదుగానీ పిలుపే.


''ఈ బిడ్డను తీసికొనిపోయి నా కొరకు పెంచుము నేను నీకు జీతమిచ్చెదను'' అని ప్రభువు నాతో చెప్పాడు (నిర్గ 2:9). మొట్టమొదటగా నా భౌతిక సంతానం విషయంలో ఈ మాటలు చెప్పాడు. ఆ తరువాత నా ఆత్మీయ సంతాన విషయములోకూడా ప్రభువు ఇవే మాటలు చెప్పాడు. మనము దేవుని పిల్లల్ని సంరక్షించినప్పుడు మనకు జీతమిచ్చేవాడు దేవుడే గాని మానవుడు కాదు. మనము మానవుల్ని సేవిస్తే జీతంకోసం మానవుల వైపేచూద్దాము. అయితే దేవుణ్ణి సేవిస్తున్నట్లయితే దైవ చిత్తానుకూలంగా మన అవసరతలు తీర్చుకునేందుకు దేవుని వైపు చూద్దాము. ప్రతినెలా మనమెంత స్వీకరించాలో దేవుణ్ణే నిర్ణయించనిద్దాము. నిజమైన దైవసేవకుడు హుందాగా ఉంటాడు.


అయినప్పటికీ ఒక సంఘ పెద్దగా, నీ సంఘ సభ్యుల గూర్చి నీలో ఇలాంటి బాధ్యత కలిగియుండాలన్న స్పృహ లేకుండుట సాధ్యమే. ప్రతి ఆదివారం బైబిలు బోధించుతూ నీవు సంతృప్తి చెందుతూ ఉండొచ్చు. కానీ యేసు మళ్ళీ వచ్చినప్పుడు నీ పరిచర్య విలువ లెక్కకట్టి నీవు ఈ భూమి మీద ముగించిన పరిచర్య మొత్తము కేవలము కర్ర, కొయ్యకాలు, గడ్డిగా దేవుడు కనుగొన్న పక్షంలో నీకు ఆశ్చర్యం కలగొచ్చు (1 కొరింథీ 3:12,13). అది ఎంత విషాదమో ఆలోచించు! ఈ హెచ్చరికను నీవు ఇప్పుడు తీవ్రముగా పరిగణిస్తే క్రీస్తుయొక్క న్యాయ సింహాసనం ఎదుట నీకు కలుగబోవు విచారమును తగ్గించుకొనవచ్చును.


మనము జీవించిన జీవితమును బట్టి మరియు మనము ప్రభువును సేవించిన విధానమును బట్టి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనమందరము ఎంతో కొంత విచారానికి గురికావల్సివుంటుంది. అయితే ప్రస్తుతము మనల్ని మనము విమర్శించుకుంటూ (తీర్పు తీర్చుకుంటూ) మన మార్గములను పరీక్షించుకోవటం ద్వారా కలుగబోవు విచారాన్ని తగ్గించుకోవచ్చు. రాబోవు ఆదినపు వెలుగులో ఇప్పటి మన పరిచర్య ఎలా కనబడుతుందో మనము అంచనావేసి చూచుకోవాలి.


''ఈ బిడ్డను తీసికొనిపోయి నా కోసం పెంచండి, సంరక్షించండి - నేను మీకు జీతము చెల్లిస్తాను'' అని ప్రభువు చెబుతున్నాడు. ఆ జీతము ప్రాథమికముగా డబ్బు రూపములోనే ఉండకపోవచ్చు. అనుదిన ఆహారము కోసం ప్రార్థించమని ప్రభువు మనకు నేర్పించారు, అందుచేత మనకున్న ఈ లోక అవసరతల్ని ఆయనే తీరుస్తాడని నా నమ్మకము. సువార్త ప్రకటించువాడు సువార్తవలనే జీవించాలని దేవుడే నియమించాడు. ఈ కారణంచేత మన ఈ లోక అవసరతల్ని ఆయనే తీరుస్తాడు. అయితే దీనికి అదనంగా ఎంతో గొప్ప ఆత్మీయ బహుమానము సిద్ధముగా ఉంటుంది.


పౌలు థెస్సలోనిక క్రైస్తవులకు వ్రాస్తూ ప్రభువు మళ్ళీ వచ్చినప్పుడు వారు అతనికి కిరీటముగాను, ఆనందకారకముగానూ ఉంటారని చెప్పాడు (1 థెస్స. 2:19). ఒక తండ్రి తన పిల్లలగూర్చి ఎంతగా ఆనందిస్తాడో అంతగా పౌలు వారి విషయంలో ఆనందించాడు.


ఒక నాయకుడు (ఆత్మీయ తండ్రి) ఒకానొకప్పుడు ఏమీ తెలియని ముడిసరుకు వలె తన సంఘానికి వచ్చిన ప్రజలు ఈనాడు దేవుని ప్రజలుగా మార్చబడుట చూచి విశ్వాసులగూర్చి సంతోషిస్తాడు. ఏ రూపమూలేని ఒక రాతిని ఒక మనిషి రూపానికి మల్చిన శిల్పి అనుభవించే ఆనందము వలె ఇది ఉంటుంది. ఆ రాతిలోనుండి మానవ రూపము వచ్చేదాకా అతడు ఆ బండను నెలలు, సంవత్సరాల తరబడి చెక్కుతూ పోవాలి! అలాంటి పనినే దేవుడు మనకు అప్పగించాడు. కేవలం ప్రజలకు మంచి బోధ చేయటంతోనే మనం తృప్తి చెందకూడదు. వారి జీవితాల్లో క్రీస్తు స్వరూపము ఏర్పడకపోతే మనము చేసినదంతా వృధాయే.


భూసంబంధమైన ఓ తండ్రి తన పిల్లలు 'తమ కాళ్ళపై నిలబడ గలిగినప్పుడు' కూడా చాలా సంతోషిస్తాడు. ఆ పిల్లలు ఎల్లప్పుడూ తనపై ఆధారపడి ఉండాలని అతడు కోరుకోడు. ఒక నిజమైన ఆత్మీయతండ్రి కూడా ఈ విధంగానే ఉంటాడు. తన ఆత్మీయ సంతానము ఎదుగుతూ పరిపక్వత చెందుతున్న కొలది తండ్రిగా వారికి నిరాధారుడిగాను, నిరాశ్రయుడిగాను చేసుకుంటాడు.


12 మంది పిల్లలున్న ఒక కుటుంబము గూర్చి ఆలోచించండి. ఇద్దరు పిల్లలతోనే నీ భార్య ఎంతో ఇబ్బంది పడుతూవుంటే, పన్నెండు మంది పిల్లలతో కుటుంబాన్ని నడపడం ఒక తల్లికి ఎంత కష్టమో నీకు ఆశ్చర్యం కలగొచ్చు. అయితే కాలం గడిచే కొద్ది ఇద్దరు పిల్లలున్న తల్లికన్నా పన్నెండుమంది పిల్లలు ఉన్న తల్లికి తక్కువ పని ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే పన్నెండుమంది పిల్లలున్న ఆ తల్లి వారిలో ఎక్కువ వయసొచ్చిన వారికి ఇంటి పనుల్లో తనకు సహాయకరంగా ఉండేందుకు శిక్షణ ఇస్తుంది. చివరకు పిల్లలందరూ ఇంటిపనులు చేసిపెడతారు. గనుక ఆ తల్లి ఇక పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. మన సంఘాలకు కాపరులముగా మనము కూడా ఇలానే చేయాలి - విశ్వాసులకు పని అప్పజెప్పాలి.


అయితే చాలా సంఘాల్లో ఈనాడు మనం చూస్తున్నదేమిటి? విపరీతమైన పని భారంచేత కాపరులు క్రుంగిపోతూ కుప్పకూలిపోతున్నారు. ఎందుకంటే తామే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. (పన్నెండుమంది పిల్లల్ని కన్న ఆ తల్లి కూడా వారందరి బాధ్యత నిర్వహించటంలో అన్ని పనులు తానే చేయవలసి వస్తే ఆమె కూడా ఇలాగే క్రుంగిపోవాల్సి వస్తుంది). వందలాది ఆత్మీయ శిశువులు నేలమీద పడుకొని, కాళ్ళు కొట్టుకుంటూ, పాలసీసాలు నోట్లో పెట్టుకొని ఏడుస్తూ ఉన్న అనాథ ఆశ్రమాలుగా అనేక సంఘాలు ఉన్నాయి. ఏకవ్యక్తి పరిచర్య ఫలితమే ఈ పరిస్థితి. విశ్వాసులకు ఎటువంటి బాధ్యత అప్పగించలేదు గనుక వారు ఎన్నటికీ ఎదుగలేదు. క్రీస్తు శరీరములోని ప్రతి అవయవము, నెరవేర్చవలసిన ఒక బాధ్యత ఉంది.


యేసు కేవలము పన్నెండు మందిని మాత్రమే శిష్యులుగా చేశాడు. ఒకే సమయములో ఒక్క మనిషి ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో సమర్థవంతంగా శిష్యత్వం నేర్పజాలడని నేను అనుకుంటాను. ఈ లెక్క ప్రకారం 120 మంది విశ్వాసులున్న ఓ సంఘంలో మందను కాయుటకు కనీసం పదిమంది కాపరులు అవసరం. ''కాపరులు'' అంటే సంపూర్ణకాల సమర్పణ చేసుకున్న పరిచారకులని నా భావం కాదు కానీ లోకంలో ఇతర పనులు చేసుకుంటూ సంఘంలో విశ్వాసుల్ని ప్రోత్సహించి గొర్రెల్ని కాచే కాపరి హృదయమున్న సహోదరులు.


ఈనాడు కోత విస్తారముగా ఉంది. అయితే నిజమైన కాపరులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నీవు ప్రభువును సేవిస్తుంటే ఆ పరిచర్య కోసం దేవుని పిలుపు నీకు తప్పని సరిగా ఉండాలి. అంతే గాని మానవ సంబంధమైన ఘనత కోసంగానీ, నీ పోషణ కోసము గానీ దేవుని సేవ చేయకూడదు.


అధ్యాయము 2
దేవుణ్ణి తెలుసుకొనుట

ఒక ఆత్మీయ నాయకుడు ఇతరులను దైవమార్గాల్లో నడిపించుటకు సమర్థుడు ఎందుకంటే అతడు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగినవాడు.


చివరి దినములలో ఈ భూమి మీద కనబడబోయే రెండు రకాల బోధకులను గూర్చి దానియేలు గ్రంథము 11:32,33 లో చెప్పబడింది. తీయని మాటలతో (ఇచ్ఛకపు మాటలతో) మనుష్యులను మభ్యపెట్టి భక్తిహీనత వైపు మళ్ళించేవాళ్ళు అనేకులు వస్తారు. అయితే దేవుణ్ణి తెలుసుకొని దేవునికోసం గొప్పకార్యాలు చేస్తూ ప్రజలకు జ్ఞానముతో బోధించే వారు అతి తక్కువ సంఖ్యలో ఉంటారు.


ఈనాటి క్రైస్తవ్యంలో ఈ రెండు రకాల బోధకుల్ని మనము చూస్తాము. తమ బోధ వినే వాళ్ళను సంతోష పెట్టేందుకు తీయటి మాటలు వల్లించే బోధకులు అనేకులు ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన బోధకులైతే తమ బోధ వినే ప్రజలు సంతోషించినా అభ్యంతరపడినా పొగడ్తలు కురిపించినా లేక దూషించినా సత్యాన్నే బోధిస్తారు!


మానవులు గొర్రెల వంటివారు. వారు గుంపులనే అనుసరిస్తారు గాని భిన్నంగా ఉండేందుకు భయపడతారు కాని ఒక గుంపు తప్పు దిశలో గమనం సాగిస్తున్నప్పుడు ప్రజలంతా తప్పిపోతారు. ఈనాటి పరిస్థితి ఇలావుంది. అందుచేత దేవుని కోసం నమ్మకంగా నిలబడి ప్రజల్ని దైవ మార్గములో నడిపించే సేవకులకోసం దేవుడు ఆశతో కనిపెట్టి చూస్తున్నాడు. అయితే గుంపుకు భిన్నంగా ఉండేందుకు సరిపోయిన ధైర్యము మనకు కలగాలంటే మనము దేవుణ్ణి, దేవుని మనస్సును, ఆయన ఆలోచనలు, ఆయన మార్గాలు కూడా మనకు తెలిసివుండాలి.


గత 30 సంవత్సరాలుగా భారతదేశంలో నేను కలుసుకున్న అనేక మంది 'క్రైస్తవ నాయకులు' దేవుణ్ణి గాని ఆయన ఆలోచనలు గాని వ్యక్తిగతంగా ఎరిగినవారుగా నాకు కనిపించలేదు. కొన్ని పాశ్చాత్య క్రైస్తవ పత్రికల్లో, పుస్తకాల్లో తాము చదివిన విషయాలు మాత్రమే తమ బోధల్లో వల్లించుకుంటూ పోతారు. అమెరికా క్రైస్తవ నాయకుల్లో ప్రతి దశాబ్దంలోనూ ఒక ప్రత్యేక ప్రసిద్ధ అంశము మీద గట్టి బోధ ఉండటము పరిపాటి. 1980ల కాలంలో ఒకటుంది ఈనాడు మరొకటి ఉంటుంది. తరువాత మరొకటి. పర్వత ప్రాంతాల్లో మాటలు ప్రతిధ్వనించినట్లు పై ప్రత్యేక బోధనాంశాలు భారతదేశంలోనూ, మూడవ ప్రపంచ దేశాల్లో ఉన్న అనుచరుల బోధల్లో ప్రతిధ్వనించాయి. ప్రత్యేకించి సువార్తికరణ అంశంపై వారు సభలలో సమర్పించిన పరిశోధన పత్రాలు ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటాయి! అమెరికా దేశ క్రైస్తవ నాయకులు ''సంఘాభివృద్ధి'' అంశం మీద వ్రాస్తే భారతదేశపు క్రైస్తవ నాయకులు కూడా ''సంఘాభివృద్ధి'' అంశము గూర్చే నమ్మకంగా బోధిస్తుంటారు. అమెరికన్లు ''10/40'' విండో దేశాల గూర్చి మాట్లాడితే భారత క్రైస్తవ బోధకులు కూడా నమ్మకంగా ''10/40'' విండో అంశం గురించే మాట్లాడతారు. ''మహాశ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుందనే'' అంశాన్ని పాశ్చాత్య క్రైస్తవులు బోధిస్తే భారత క్రైస్తవ బోధకులు కూడా దాన్నే బోధిస్తారు. పాశ్చాత్య క్రైస్తవులను ప్రశ్నించే ధైర్యం వీరికి లేదు!


భారతదేశములో ఏ ఒక్కరితోనైనా దేవుడు నేరుగా మాట్లాడడా? దేవుడు తెల్ల జాతి వారితోనే మాట్లాడుతాడా?


ఈ అనుకరణ అంతటికీ మూలకారణం మూడవ ప్రపంచ క్రైస్తవ సమాజంలో ప్రస్పుటంగా కనబడుతున్న ''బానిస-మనస్తత్వమే''. భారతీయులమైన మనము 200 ఏళ్ళ పైబడి బ్రిటిషు వారి ఏలుబడి క్రింద ఉన్నాము. అందుచేత మనము ఇటువంటి ''బానిస-మనస్తత్వము'' నుండి బయటపడుట కష్టము. తెల్లవాడు మనకంటే శ్రేష్టుడని, ఆత్మీయముగా ఎదిగినవాడని దాదాపు భారతీయులందరూ భావిస్తారు. ఎందుకంటే తెల్లవారు పెత్తనం చేస్తారు. ప్రణాళికలు వేయటంలో అందెవేసిన వారు, ధనవంతులు.


ఒకసారి నేను నల్లజాతి అమెరికా సహోదరుణ్ణి కలుసుకున్నాను. అమెరికాలో నివసిస్తున్న నల్లజాతి ప్రజలకు చట్టపరంగా బానిసత్వమునుండి విడుదల లభించి ఒక శతాబ్దకాలం దాటినప్పటికీ అనేకమంది నల్లవారిలో బానిసత్వపు ధోరణి ఇప్పటికీ ఇంకా ఉంది. తెల్లవారిని చూస్తే చాలు వారు తమను అల్పులుగా భావించుకొంటారు. ఇటువంటి మనస్తత్వము దాదాపు ప్రతి భారతక్రైస్తవునిలో కూడా ఉన్నట్లు నేను గమనించాను.


ఇంకా వాస్తవంగా చెప్పాలంటే, భారతదేశములో దేవుని సేవకోసం వచ్చిన చాలామంది పాశ్చాత్య బోధకులు (నేను కలిసిన) ఆత్మీయముగా శూన్యులుగానూ, లోకస్తులుగాను ఉన్నట్లు కనుగొన్నాను. వారికి దేవుడు తెలియదు. కానీ ఇష్టానుసారంగా వెచ్చించేందుకు వారి దగ్గర అపరిమితమైన డబ్బు ఉండడంచేత వారు ఎక్కడికి వెళ్ళితే అక్కడ సెలబ్రిటీలు(ప్రముఖ వ్యక్తులు)గా ఉంటారు. భారతదేశంలో నిర్వహించబడుతున్న క్రైస్తవ సభల గూర్చిన ప్రచార ప్రకటనలు ఒక్కసారి గమనించండి. ఎక్కువ భాగం ఇటువంటి సభల్లో ప్రధాన ప్రసంగీకుడు పాశ్చాత్య బోధకుడై ఉంటాడు. మన దేశపు క్రైస్తవ్యం ఎంతటి దీన స్థితికి దిగజారింది? ఒకవేళ ఈ పరిస్థితి నామకార్థ క్రైస్తవుల విషయంలో మాత్రమే నిజమైతే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే పరిస్థితి ''నూతన జన్మ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము'' పొందియున్నామని చెప్పుకొనే క్రైస్తవుల్లో కూడా ఉన్నది.


మనము ఈ బానిసత్వ స్వభావాన్ని ఛేదించుకొని బయటపడాలి. కాని ఒకవేళ ఒక తెల్లవాడు నీకు జీతము ఇస్తున్నట్లయితే ఆ మనుష్యుని యొద్దనుండి బయటపడడం నీకు కష్టతరమైన విషయమే. అప్పుడు నీవు మనుష్యుల్ని సేవించుట మాని ప్రభువును సేవించుటకు నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ నీవు ఎవరి సేవకుడవు? మనము వెలపెట్టి కొనబడ్డాము గనుక మనుష్యులకు దాసులుగా ఉండవద్దని బైబిలు మనకు చెబుతుంది (1 కొరింథీ 7:23).


వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోవటమనేది నీకు తీవ్రమైన కోరికగా ఉండనిమ్ము. అప్పుడు నీవు ఒక పాశ్చాత్య ''నాయకుని''కి ''ప్రతిధ్వని''గా ఉండవు. లేక భారత క్రైస్తవ ''నాయకుని''కి కూడా ప్రతిధ్వనిగా ఉండనేరవు. నీవు ఏ మానవుడికి దాసునిగా(బానిసగా) ఉండవు. నీవొక దైవజనుడిగా ఉంటావు.ఆత్మీయ అధికారము కేవలము దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవ జ్ఞానము ద్వారానే లభిస్తుంది.


సహోదరులారా, మీరు వ్యక్తిగతముగా దేవుణ్ణి తెలుసుకున్న వారిలా ఉండాలని నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. అది నీ వ్యక్తిగత జీవితాన్ని మహిమాన్వితముగాను, నీ పరిచర్య అధికారముతో ఉండేలా చేస్తుంది. మరిదేనికన్నా అధికంగా ఈనాడు మన దేశానికి కావలసింది ఇదే.


దేవుణ్ణి తెలుసుకోవటంకన్నా బైబిలుని తెలుసుకోవటం చాలాసులభము. బైబిలుని తెలుసుకునేందుకు నీవు ఎటువంటి వెల చెల్లించనవసరములేదు. కేవలం గ్రంథ పఠనము చాలు.


నీ వ్యక్తిగత జీవితములో అవినీతి ఉండవచ్చు. నీ ఆలోచనా జీవితములో అపవిత్రత ఉండవచ్చు. అయినప్పటికీ బైబిలును లోతుగా ఎరిగియుండవచ్చు. నీవొక ప్రఖ్యాత బోధకుడివై ఉండవచ్చు. అదే సమయంలో గొప్ప ధనాపేక్షుడవై యుండవచ్చు. అయితే నీవు దేవుణ్ణి తెలుసుకున్నాక కూడా నీలో అపవిత్రత ఉండనేరదు. దేవుణ్ణి తెలుసుకున్న నీలో ధనాశ ఉండనేరదు. అది అసాధ్యము. అందుచేత చాలామంది బోధకులు ''దేవుణ్ణి తెలుసుకునే'' మార్గముకన్నా సులభమైన ''బైబిలును తెలుసుకునే'' మార్గాన్ని అవలంబిస్తారు.


సహోదరులారా, నేను మిమ్మల్ని ఓ విషయం అడగాలనుకుంటున్నాను, కేవలం బైబిలును తెలుసుకోవటంతోనే మీరు సంతోషిస్తున్నారా? లేక ప్రభువును తెలుసుకోవాలనే తపన(తీవ్రమైన ఆకలి) మీ హృదయాల్లో ఉందా? ప్రభువును ఇంకా శ్రేష్టముగా తెలుసుకోవాలనే గొప్ప తృష్ణ తనలో ఉన్నట్లు పౌలు ఫిలిప్పీ 3:8-10 లో చెప్పాడు. ''ప్రభువును తెలుసుకొనుట'' అను విషయం ముందు మిగతావన్నీ పెంటతో సమానమని అతడు పరిగణించాడు. ఇంత గొప్ప వెలగల ముత్యంకోసం పౌలు తన ముత్యాలన్నిటినీ వదులుకున్నాడు. పౌలు పరిచర్యను గూర్చిన రహస్యము అతడు గమలియేలు శిక్షణా శిబిరంలో గడిపిన బైబిలు అధ్యయన సంవత్సరాల్లో లేదుగాని దేవుని గూర్చిన అతని జ్ఞానములోనేఉంది.


''అద్వితీయ సత్యదేవుణ్ణి మరియు యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము'' (యోహాను 17:3). పరలోకంలో బహుశా యుగయుగములు జీవించుటే నిత్యజీవమని మనము నిర్వచించి యుండవచ్చు. అయితే దీనిని యేసు ఆ విధముగా నిర్వచించలేదు. పరలోక ప్రాప్తితోగానీ, నరక విముక్తితోగానీ నిత్యజీవానికి ఎటువంటి సంబంధంలేదు. దానికున్న సంబంధమంతా ''ప్రభువును ఎరుగుట'' తోనే ఉంది. అతి సన్నిహితముగానూ, వ్యక్తిగతముగానూ దేవుణ్ణి ఎరుగుట అనేది నా జీవిత తృష్ణ మరియు నా హృదయ భారముగా నున్నది. దేవుణ్ణి వ్యక్తిగతముగా ఎరుగుట వల్లనే నా పరిచర్య దైవాధికారాన్ని పొందగలదని నాకు తెలుసు. అందుచేత మా సంఘాలన్నింటిలో ఉన్న ప్రజలు దేవుని గూర్చిన వ్యక్తిగత జ్ఞానము పొందాలని నేను చూచాను.


చరిత్రలో ఎన్నడూ లేనంత బైబిలు జ్ఞానము ఈనాడు ఉన్నది. పెంతకొస్తు దినము తర్వాత దాదాపు 1500 సంవత్సరాల కాలం వరకు అచ్చు వేయబడిన బైబిలు గ్రంథాలు ఎక్కడా లభించలేదు. గత రెండు శతాబ్దాలనుండి మాత్రమే బైబిల్లు విరివిగా దొరుకుతున్నాయి. ఈనాడు ఎన్నో రకాల బైబిలు అనువాదాలు, బైబిలు పదసూచికలు(కాన్‌కార్డెన్సు), సహాయక గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి.


అయితే ఇంతటి విస్తృత బైబిలు జ్ఞానము పరిశుద్ధమైన క్రైస్తవుల్ని తయారు చేసిందని నీవు భావిస్తున్నావా? కాదు. బైబిలు జ్ఞానమే పరిశుద్ధతకు మూలమైతే చరిత్ర మొత్తంలో కంటే ఎంతో గొప్ప భక్తిపరులు ఈనాడు మన మధ్య ఉండాల్సి ఉంది. అయితే అలాంటి వారు లేరు. బైబిలు జ్ఞానము మాత్రమే పరిశుద్ధతకు కారణమైతే సాతానుడూ పరిశుద్ధుడై ఉండేవాడు. ఎందుకంటే వానికున్నంత బైబిలు జ్ఞానము ఏ మానవుడికీ లేదు.


వేలాది విద్యార్థులకు నేర్పించేందుకు ఈనాడు మనకు ఎన్నో బైబిలు కాలేజీలు (శిక్షణా సంస్థలు)ఉన్నాయి. అయితే ప్రపంచంలోకెల్లా దైవభక్తులు ఈనాడు ఈ బైబిలు పాఠశాలలో(ఈ శిక్షణా సంస్థల్లో) ఉన్నారా? లేరు. బైబిలు కాలేజీల్లో (శిక్షణా సంస్థల్లో) డిగ్రీలు పొందిన చాలామంది, అన్యుల కన్నా భ్రష్టులుగా ఉన్నారు.


కొన్ని సంవత్సరాల క్రితం, భారతదేశములోని ఉన్నత సౌవార్తిక శిక్షణా సంస్థల్లో ఒకటైన సెమినరిలో ప్రథమస్థానం సంపాదించి డిగ్రీ పొందిన ఓ వ్యక్తిని నేను కలిశాను. బైబిలు పాఠశాలలో (శిక్షణా కేంద్రంలో) అతడు ప్రవేశించినప్పుడు అతనికున్న ఆత్మీయ పరిస్థితికన్నా మూడు సంవత్సరాల శిక్షణ తరువాత అతని ఆత్మీయ పరిస్థితి ఆధ్వాణ్ణంగా మారిందని అతడు నాతో చెప్పాడు. మరి బైబిలు కాలేజీ (శిక్షణా సంస్థ) అతనికి ఏమి నేర్పింది? బైబిలు గూర్చిన సత్యాలు, క్రైస్తవ్యం గూర్చిన సత్యాలను అది నేర్పించినటువంటి బైబిలు కాలేజీ (శిక్షణా సంస్థ) లో చదివితే సాతానుడే ప్రథమ స్థానంలో డిగ్రీ పొంది ఉండేవాడు.


ఆ యౌవనస్థుడు తన ఆత్మీయ జీవితములో కోపము, కక్ష, మోహపు తలంపులు,ధనాశల్ని జయించలేకుంటే తాను నేర్చుకున్న హర్మెన్యూటిక్స్‌ వాక్యమును వివరంగా అర్థం చేసికొనికూడా, ఉన్నత విమర్శకుల ''విమర్శలు'' గ్రీకు పదాల, ఉత్పత్తి అర్థాల భావాల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి?


క్రొత్తగా తాను సంపాదించిన డిగ్రీతో ఓ సంఘానికి కాపరిగా అతడు నియమితుడవుతాడు. అయితే వేదాంతపరమైన సమస్యలతోగాక నీతిపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంఘ సభ్యులకు అతడు ఏమి బోధిస్తాడు? ఆ విషయాల్లో అతడు వారికి ఎటువంటి సహాయమూ చేయలేడు. ఈ విధముగా భారతదేశములో దేవుని సేవ నాశనమవుతున్నది.


నీకు నీవుగా దేవుని ఎరిగినప్పుడే నీ మందను కూడా ఆయనను తెలుసుకునేందుకు నీవు నడిపించగలవు. నీ సొంత జీవితములో పాపముపై విజయము సాధిస్తే నీ మందను కూడా పాపముపై విజయసాధన వైపు నడిపించగలవు. అప్పుడు వారు కూడా శక్తికలిగి మరియు అధికారముతో బయటకు వెళ్ళి ప్రభువును సేవించుటకు సిద్ధపరచబడతారు.


ఒకరు సంపాదించిన బైబిలు జ్ఞానమును గానీ, డిగ్రీ యోగ్యతా పత్రాలను గానీ సాతానుడు మెచ్చుకుంటాడని నీవనుకుంటున్నావా? కానేకాదు. దేవుణ్ణి ఎరిగిన పరిశుద్ధులు మరియు దీనులైన స్త్రీ పురుషులకు మాత్రమే సాతాను భయపడతాడు.


మన యౌవన సహోదర, సహోదరీలను దేవుని తెలుసుకునేలా నడిపించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక.


అధ్యాయము 3
దేవునికి భయపడుట

ఒక ఆత్మీయ నాయకుడు దేవునికి ఎంతో భయపడతాడు.


ఎంతగా మనము దేవుణ్ణి తెలుసుకుంటామో అంతగా ఆయనకు భయపడతాము. దేవుడంటే భయపడుటకాదు గానీ ఆయనను గౌరవిస్తాము.


కీర్తనలు 34:11 లో దావీదు ఇలా అంటున్నాడు, ''పిల్లలారా మీరు వచ్చి నామాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను''.


ప్రజలకు దేవుని భయము నేర్పించుట సులభమైన పని కాదు. దీనికన్నా రోమా పత్రిక, ఎఫెసీ పత్రికలను విశ్లేషించుట ఎలాగో వారికి నేర్పించుట అతి సులభము!


దేవుని భయమును గూర్చి మనము ఇతరులకు నేర్పించవలసి వచ్చినప్పుడు మొట్టమొదట మనము దేవునికి భయపడాలి. దేవుని భయము జ్ఞానమునకు ఆరంభము. కేవలము బైబిలు జ్ఞానము గల వ్యక్తికన్నా దేవునిభయము కలిగిన వ్యక్తి తన సంఘమునకు ఎక్కువ బోధచేయగలడు. దేవునిభయము లేనివారు తెలివిని మాత్రమే అందించగలరు గానీ జ్ఞానమును కాదు. 1 కొరింథీ 8:1 ప్రకారం తెలివి మానవుణ్ణి గర్విష్టిగా ఉప్పొంగ చేస్తుంది. అయితే జ్ఞానము ఓ వ్యక్తిని పరిపక్వపర్చి తన దైనందిన జీవిత సమస్యల పరిష్కారం కోసం జ్ఞానమును ఎలా వినియోగించాలో నేర్పుతుంది.


దేవుని భయమనేది క్రైస్తవ జీవితంలో అ,ఆ ల వంటిది. మొట్టమొదటిగా నీ సంఘానికి దేవునిభయాన్ని నేర్పించకుండా ఇతర అంశముల గూర్చి ఎంతెంత నేర్పించినా నీ ప్రాథమిక పరిచర్యలో నీవు దారుణంగా తప్పిపోయినట్లే. అప్పుడు నీవు అసలు చదవటానికి కూడారాని విద్యార్థులకు చరిత్ర, భూగోళశాస్త్రాలు నేర్పించటానికిప్రయత్నిస్తున్న ఉపాధ్యాయుడిలా ఉంటావు! ప్రపంచంలో ఏ ఉపాధ్యాయుడుకూడా అలాంటి పొరపాటు చేయడు.


దేవునిభయం నేర్చుకోవటమంటే మనము చదువుటనేర్చుకున్నట్టు ఉంటుంది. అయితే చాలామంది సంఘపెద్దలు తమ సంఘానికి మొట్టమొదట దేవునిభయము గూర్చి నేర్పటం లేదు. వెలుగు సంబంధమైన పిల్లల కంటే ఈ లోక సంబంధమైన పిల్లలే తమ తరములో తెలివైన వారని ఇక్కడ నిరూపించబడుతున్నది.


బైబిలు శిక్షణ పొంది డిగ్రీ సంపాదించిన వాళ్ళను ఒక ప్రశ్న అడుగుతాను. బైబిలు సెమినరీలో మీరు దేవునిభయం నేర్చుకున్నారా? లేక కేవలం ఒక డిగ్రీ సర్టిఫికేట్‌ను మాత్రమే సంపాదించారా?


మరో ప్రశ్న అడుగుతాను: అసలు నీవు బైబిలు కాలేజీలో(సెమినరీ) ఎందుకు ప్రవేశించావు? ఓ ఉద్యోగము కోసమా? లేక దేవునిభయం నేర్చుకునేందుకా? ఒక బైబిలు కాలేజీకిి బదులు మరో బైబిలు కాలేజీని ఎందుకు ఎంచుకున్నావు? దానికంటే ఇది ఎక్కువ పేరు ప్రఖ్యాతలు కలిగిఉన్నందుకా? ఆ బైబిలు కాలేజి సిద్ధాంత పరంగా సువార్త కేంద్రితము కాదని లౌకిక స్వేచ్చాయుత బోధనకు నిలయమనీ నీకు తెలిసినా అందులోనే ప్రవేశం తీసుకున్నావా? యేసు తన శిష్యులను అటువంటి బైబిలు కాలేజీలకు (సెమినరీ) పంపి వారిని తన సేవ కోసం సిద్ధపర్చుట నీవు ఊహించగలవా? దేవునిభయము నేర్చుకునేందుకు బైబిలు కాలేజీని ఎంచుకున్నామని మీలో ఎంతమంది యదార్థతతో చెప్పగలరు? బహుశా ఒక్కరూ చెప్పలేరేమో?ఇది ఎంతో విచారం కాదా?


భారతదేశములో చాలామంది బైబిలు పాఠశాలలో ప్రవేశం పొంది ఆ అనుభవాన్ని అమెరికా దేశము వెళ్ళటానికి మొదటి మెట్టుగా వినియోగించుకుంటారని నాకు తెలుసు. ఇది కేవలం డబ్బు సంపాదన కోసమే. కొంతమంది అమెరికా దేశంలో స్థిర నివాసం చేయుటకు బైబిలు పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకొంటారు. అటువంటి వారు ప్రభువు సేవ ఎలా చేయగలరు?


తప్పుడు ఉద్దేశాలతో బైబిలు పాఠశాలలో చేరావని నీవు ఈ రోజు గుర్తించగలవా? యదార్థంగా ఉండాలని నీవు ఆశిస్తే ఓ గొప్ప నిరీక్షణ నీకు ఉంది- ఎందుకంటే దేవుడు యదార్థవంతులను ప్రేమిస్తాడు.నీవు చేసిన పొరపాటు ఇతరులు చేయకుండా వారిని తప్పనిసరిగా హెచ్చరించుము. మొట్టమొదట నీవు వారికి దేవునిభయం నేర్పుము. మనము చేసిన తప్పులు మన పిల్లలు చేయనవసరము లేదు.


ఒక ఇల్లు జ్ఞానము చేత కట్టబడుతున్నదని, వివేకము వల్ల దాని గదులన్నీ ప్రశస్తవస్తువులతో నిండి ఉంటుందనీ సామెతలు 24:3,4 చెబుతోంది. జ్ఞానము వివేకముల మధ్యవున్న వ్యత్యాసాన్ని మీరిక్కడ గమనించండి. బైబిలు జ్ఞానాన్ని నేనిక్కడ తక్కువచేయడం లేదు. అలా కానేకాదు.40 సంవత్సరాలకంటే పైగా నేను బైబిలు చదువుచున్నాను. వేరేవారివలే నాకు కూడా బైబిలు తెలుసని నేననుకుంటున్నాను.


అయితే అన్నింటినీ మించి నేను కోరుకునేది జ్ఞానము. దేవుని ప్రేమే లోకములో మహోన్నతమైనది. కానీ దైవప్రేమ ఎల్లప్పుడూ దైవజ్ఞానము చేతనడిపించబడుతుంది. జ్ఞానములేని ప్రేమ ప్రమాదకరము.


బస్సు యొక్క ట్యాంకులో ఉన్న పెట్రోలుతో ప్రేమను, బస్సు డ్రైవరును జ్ఞానముతోనూ పోల్చవచ్చు. నీ మందను ముందుకు నడిపించుటకు తప్పనిసరిగా నీకు ప్రేమ అవసరము. అయితే వారిని ఏ దిశగా నడిపించాలో నిర్ణయించుకునేందుకు నీకు జ్ఞానము కావాలి.


జ్ఞానము ప్రాథమికమైనది. బైబిలు జ్ఞానములో నీవు నూటికి నూరు మార్కులు సంపాదించవచ్చు. దైవ జ్ఞానములో సున్నాపొందవచ్చు! శరీర శిక్షణలో 100 మార్కులు పొంది, గణిత శాస్త్రంలో సున్నా మార్కులు వచ్చిన ఒక విద్యార్థితో ఈ పరిస్థితిని పోల్చవచ్చు. శారీరక శిక్షణలో సున్నావచ్చి గణిత శాస్త్రంలో 100 మార్కులు సంపాదించుట అతనికి మంచిది; ఎందుకంటే భవిష్యత్తు జీవితంలో శరీర శిక్షణ కన్నా గణిత శాస్త్రము చాలా ముఖ్యము. జీవిత గమనంలో వివేకము కన్నా జ్ఞానము అతి ప్రాముఖ్యము.


వివేకము గదులను నింపుతున్నట్టు మనము చూస్తాము. మనము గదుల్లో వేసుకొనే కుర్చీలు, టేబుళ్లు, పరుపుల్లాంటి సామానులతో పోల్చదగింది వివేకము. అందుచేత నీవు జ్ఞానము లేకుండా తెలివి మాత్రమే కలిగిఉంటే ఓ ఖాళీ ఇంటి స్థలములో ఖరీదైన సామాగ్రిని ఉంచిన మనిషిని పోలి ఉంటావు! అక్కడ ఖరీదైన టేబుళ్లు, సోఫాలు చాలా ఉన్నాయి. అక్కడ లేనిదల్లా ఇల్లు మాత్రమే! అటువంటి వాడు అందరి మధ్య అపహాస్యం పాలవుతాడని మీరు బాగా ఊహించవచ్చు. కానీ ఈనాటి క్రైస్తవ్యంలో సరిగ్గా పైనచెప్పబడిన నాయకులను, బోధకులను మాత్రమే మనము చూస్తున్నాము. వారికి కేవలము తెలివి ఉంది గానీ జ్ఞానములేదు - ఎందుకంటే వారు దేవునికి భయపడరు.


ఈ రోజులలో దేవుని భయమును గూర్చి ఏ బోధకుడైన బోధించుట చాలా అరుదు. అందువలన అనేక మంది విశ్వాసులు జ్ఞానము కలిగిలేరు మరియు వారు అనేక ఇతర భయములను కలిగియున్నారు.


అధ్యాయము 4
దేవుని మాటలు వినుట

ఒక ఆత్మీయ నాయకుడు ప్రతిదినము దేవుని మాటలు వినేందుకు తన జీవితంలో సమయాన్ని కేటాయించుకుంటాడు.


బైబిలు గ్రంథములో మొట్టమొదటి అధ్యాయంలోనే తరచుగా మనకు కనబడే పదజాలము: ''అప్పుడు దేవుడు చెప్పెను''.


నిరాకారముగా ఉన్న భూమిని మళ్ళీ సృష్టిస్తున్న మొదటి ఆరు దినాల్లో ఆయన ప్రతిరోజు ఏదో ఒక మాట పలికాడు. ఆయన మాట్లాడినప్పుడల్లా ఆ భూమి మరింత మంచి ఆకారాన్ని సంతరించుకుంది.


కాబట్టి బైబిలు గ్రంథములోని మొట్టమొదటి పేజీలోనే మనము ఒక అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్చుకుంటున్నాము - అదేమిటంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము విని తీరాలి. అలా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న మాటలకు విధేయులమైతే మనము శ్రేష్టమైన మరియు మంచి ప్రయోజనకరమైన క్రైస్తవులముగా మార్చబడతాము.


మామూలు బైబిలు పఠనమునకు దేవుడు చెప్పే మాటలు వినుటకు మధ్య చాలా వ్యత్యాసమున్నది. గుర్తుంచుకోండి, ప్రతిదినము బైబిలు చదివిన ప్రజలే ప్రభువును సిలువ వేశారు. వారు తమ బైబిళ్ళు చదివారు గానీ తమ హృదయాల్లో దేవుడు మాట్లాడుట వారెన్నడూ వినలేదు (అపొ.కా.13:27). అటువంటి ప్రమాదం మనముకూడా ఎదుర్కొంటాము. ఆ తరువాత మనము కూడా వారిలా గ్రుడ్డి వాళ్ళం కాగలము.


ఆదికాండము మొదటి అధ్యాయము - దేవుడు మనతో ప్రతి దినము మాట్లాడాలని ఆశిస్తున్నట్టు మనకు బోధిస్తుంది.


అయితే చాలామంది క్రైస్తవ నాయకులు ప్రతిరోజు దేవుని మాటలు వినరు. వారు మానవులు రచించిన గ్రంథాలు మాత్రమే చదువుతారు.


నరమాత్రులైన ఇతరులు మాట్లాడింది విని దానినే నీవు బోధించిన పక్షంలో అదొక విషాదకర విషయం - ఎందుకంటే మానవుల మాటలు నిత్యజీవార్థమైన దేనినీ ఎన్నటికీ ఉత్పత్తి చేయజాలవు. యెషయా 55:11 లో మనము చదివిన ప్రకారం దేవుని మాట మాత్రమే నిత్యత్వ ఫలం ఫలింపజేయగలదు.


ఆదికాండము మొదటి అధ్యాయములో దేవుడు మాట్లాడినప్పుడల్లా మానవతీత సంఘటనలు జరిగినట్లు చదువుతాము. దేవుడు మొదట మన హృదయాలతో మాట్లాడిన మాటలను మనం బోధించిన పక్షంలో మన పరిచర్యలోకూడా పై విధంగా మానవాతీత కార్యాలు జరిగి తీరుతాయి.


తనతోపాటు ఇతరులను కూడా రక్షించుకోవాలంటే తాను బోధించుటకు ముందుగా తన సొంత జీవితం గూర్చి జాగ్రత్తపడమని తిమోతితో పౌలు చెప్పాడు (1 తిమోతి 4:16). స్వకీయమోసం నుండి తప్పించుకునేందుకు గల ఏకైక మార్గం, మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలను వినుటయే.


దేవుడు చెప్పే మాటలు వినకపోతే నీవు ఈ క్రింది మూడు విధానాల్లో బోధిస్తావు:


1. ప్రపంచంలో ''ప్రసిద్ధ క్రైస్తవ బోధకులు'' అని పిలువబడే బోధకులు. ప్రత్యేకించి అమెరికా దేశానికి చెందిన బోధకులు ప్రస్తుత కాలంలో ఏమి చెబుతున్నారో నీవు తెలుసుకుంటావు - భారతదేశములో జరుగుతున్న క్రైస్తవ పరిచర్యకోసం అందుతున్న డబ్బు మొత్తంలో అధిక భాగం అమెరికా దేశం నుండే వస్తున్నది (వీరిని నేను ''పేరు మోసిన గొప్ప బోధకులని'' చెబుతున్నాను ఎందుకంటే ఈ బోధకలు దేవుని దృష్టిలో ''గొప్పవారు'' కారు). నీవు వారు రచించిన గ్రంథాలు చదివి వారి ప్రసంగాలను మళ్ళీ బోధిస్తావు. ప్రస్తుతం క్రైస్తవుల్లో ఎక్కువగా వినబడుతున్న అంశం ఏమిటో ఒక్కసారి నీవు కనుగొన్నావంటే చాలు ఇక ఆ అంశం గూర్చియే విస్తారంగా బోధించాలని నిర్ణయించుకుంటావు. వివేచన లేని నీ మంద నీ బోధకు ముగ్దులె ౖనీవు మహా మేధావివనీ, ఆత్మీయ వ్యక్తివని మెచ్చుకుంటారు.


లేదా


2. బైబిలు అంశాలను విద్యాప్రామాణికంగా అధ్యయనంచేసి వాటిని రసాయనిక శాస్త్రాన్ని బోధించినట్లు ఓ కళాశాల లెక్చరర్‌ వలె సంఘానికి బోధిస్తావు! ఒకడు రసాయనిక శాస్త్రంలో డాక్టరేట్‌ పొందటంకన్నా బైబిలు అధ్యయనంలో డాక్టరేట్‌ పొందుట అత్యంత సులభము. ''బిరుదులకోసం అర్రులుచాచే'' బోధకులకు, పాస్టర్లకు(కాపరులకు) ఈనాడు కొన్ని వందల రూపాయలకే చవక బారు బైబిలు కాలేజీలు రకరకాల గౌరవ ''డాక్టరేట్లను'' అందిస్తున్నాయి. నీవు ఎన్ని కావాలనుకుంటే అన్ని పొందవచ్చు. ఒక వేళ నీవు ప్రయాసపడి వేదాంత విద్యలో ఒక డాక్టరేట్‌ సంపాదించినా నీవు ఒక తెలివైన వ్యక్తివని మాత్రమే ఋజువుచేస్తుంది. అయినప్పటికీ నీవు దేవుణ్ణిగానీ ఆయన వాక్యముగానీ ఎరుగకుండానే ఉండవచ్చు.


లేదా


3. నీ సంఘానికి అత్యంత సమ్మతమైన అంశమేమిటో ప్రయత్నించి తెలుసుకుంటావు - ఎందుకంటే వారి మెప్పు పొందాలని నీవు ఆశిస్తావు గనుక. ప్రజలు అత్యధికముగా దేనిని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు మార్కెట్‌ పరిశోధనలు చేపట్టే వ్యాపారవేత్తల వలె నీవు కూడా ప్రవర్తిస్తావు. ఈనాడు చాలామంది పాస్టర్లు(కాపరులు) ఈ విధంగానే బోధిస్తున్నారు. పాత నిబంధన కాలంలో అబద్ధ ప్రవక్తలందరూ అలాగే బోధించారు - అలా చేసి వారు అభివృద్ధి సాధించారుకూడా! ఇశ్రాయేలు ప్రజలు ఏమి వినాలని కోరుకుంటున్నారో పసిగట్టి దానినే ఆనాటి ప్రవక్తలు బోధించేవారు. అందుచేత వారు ప్రజల మెప్పుపొంది విస్తారమైన డబ్బు సంపాదించుకున్నారు. ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో అటువంటి అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అయితే ఇశ్రాయేలు దేశంలో ప్రతి నిజమైన ప్రవక్త అప్రతిష్ట పాలయ్యాడు. ఎందుకంటే అటువంటి ప్రవక్తలు - యూదులు ఏమి వినవలసివుందో దానినే ప్రకటించారు గానీ వారు వినాలని ఆశించిన దానిని చెప్పలేదు.


మరియవలె కూర్చొని వినకుండా, తీరికలేని పనిలో మునిగిపోయిన మార్తను యేసు ఒకసారి గద్దించారు. మరియ చేసిన పనే జీవితంలో అవసరమైనదని యేసు చెప్పారు (లూకా 10:42). ''ప్రభువా, మాట్లాడుము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు'' అని సమూయేలు చెప్పినట్లు మనందరి వైఖరి ఉండాలి.


బైబిలు గ్రంథములోని మొట్టమొదటి పేజీలోనే మనమేమి చూశాము? దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే ఏదో ఒకటి జరిగింది. వెలుగు కలిగింది, జలరాశి నుండి భూమిపైకి వచ్చింది, చెట్లు, చేపలు, పశువులు మొదలైన జీవరాసులు సృష్టించబడ్డాయి.


దేవునికి అనుకూలమైన దానిని నెరవేర్చక, ఆయన పంపిన కార్యమును సఫలముచేయక దేవుని నోటినుండి వెడలిన మాట వృధాగా తిరిగిరాదని యెషయా 55:10-11 చెబుతుంది.


ప్రపంచములోని ప్రజలందరూ అత్యంత విలువను ఆపాదించే రెండు మాటల్ని ఈ వాక్యాల్లో గమనించండి - ''నెరవేర్పు'', ''కార్యసాధన''.


మనమంతా మన జీవితాల్లో ఏదో నెరవేర్చాలని, సాధించాలని కోరుకుంటాము. నెరవేర్పు, సఫలత కోసం ఆయా పద్ధతుల్ని ప్రయోగించి చూచేందుకు సరిపోయినంత సమయంలేదు. ఎందుకంటే మన జీవితము చాలా చిన్నది- ఇక ఆత్మీయ విషయాల్లో అసలు చేయలేము. దేవుని పని చేయుటకు మనము ఏదో ఒక పద్ధతిని ఏర్పరచుకొని 20 సంవత్సరముల తరువాత దేవుని పని చేసే విధానము ఇది కాదని మనము తప్పుడు మార్గములో ఉన్నామని తెలుసుకొనేటట్లుగా మనము చేయకూడదు. దేవుడు మాట్లాడునప్పుడు మనము ఆయన మాటలు విన్నట్లయితే సమయమును వృథాచేయకుండా మనము కాపాడబడతాము. ఇది మనకు ఎల్లప్పుడు సఫలతను మరియు కార్యసిద్ధిని కలుగజేస్తుంది.


దేవుని యొద్దనుండి వినే, మనిషి యొద్దనుండి నేను వినాలనుకొంటున్నాను- ఎందుకంటే వేదాంతులు (''తోక''లాంటి పొడవైన డిగ్రీలు కలిగిన) గంటల తరబడి నాకు బోధించిన దానికంటే అటువంటి వ్యక్తి ఐదు నిమిషాలలో నాకు ఎంతో బోధిస్తాడు. ప్రొఫెసర్‌.గమలియేలు లేక యూదుల సభ (సన్హెడ్రిన్‌) లోని ఏ సభ్యుడికంటే మరి ఎక్కువగా బాప్తిస్మమిచ్చే యోహాను దేవుని గురించి ఎక్కువగా ప్రజలకు బోధించగలడు!


నీవు దేవుని మాటలు వింటే, నీవు చదివిన క్రైస్తవ పుస్తకాలలోనివి, పత్రికల్లోని అంశాలు మరియు నీవు వినిన క్రైస్తవ టేపు సందేశాలుగానీ నీవు ప్రజలకు బోధించవు. దేవుని మాటలు విన్న వ్యక్తి తనకు లభించిన ప్రత్యక్షత నుండి మాట్లాడుతాడు గాని తాను నేర్చుకున్న విద్యాప్రామాణిక విజ్ఞానం, లేక అధ్యయనాల నుండి మాత్రం కాదు. అటువంటి మనిషి తాను చదివిన విషయాన్ని మొదట అనుభవం చేసుకుంటాడు - ఆ తరువాత తన జీవితము ద్వారా మాట్లాడుతాడు.


నీ తల నుండి మాట్లాడే విషయాలు ఇతరుల తలల మట్టుకే చేరుతాయి. అయితే నీ హృదయము నుండి బోధించే విషయాలుగానీ నీ జీవిత అనుభవము ద్వారా బోధించేవిగానీ ప్రజల హృదయాల్లోకి నేరుగా చొచ్చుకొని పోయి వారి జీవితాలను మార్చివేస్తాయి. సంఘంలో మాట్లాడుటకుగాను నీవు సందేశాలు తయారు చేసుకోకూడదని గానీ ప్రసంగాలు వ్రాసి తయారు చేసుకోకూడదని గానీ నేను చెప్పటంలేదు. నీ ప్రసంగాలు నోట్సు వ్రాసుకున్నా లేక నోట్సుపై ఆధారపడకపోయినా అది నీ జ్ఞాపక శక్తిపై ఆధారపడిఉంటుంది గానీ నీ ఆత్మీయ జీవితంపై ఆధారపడివుండదు. నేను చెబుతుందల్లా నీవేది మాట్లాడినా అది నీ హృదయం నుండి, నీ జీవితం నుండి రావాలని మాత్రమే.


ఈనాడు మనకు స్వేచ్ఛాపూర్వక వేదాంత కళాశాలలు మరియు సౌవార్తిక వేదాంత కళాశాలలు అందుబాటులోవున్నాయి. అయితే ఈ రెంటిమధ్య గల వ్యత్యాసమేమిటి? ఒక రకమైన కళాశాలల్లో మెదడు నుండి మెదడుకు అందించబడుతున్న పాఠ్యాంశ సమాచారం వేదాంతపరంగా తప్పుగా ఉంటుంది. మరో రకమైన కళాశాలల్లో అందించబడుతున్న సమాచారము వేదాంతపరంగా సరిగా ఉంటుంది కానీ ఆత్మీయముగా ఆలోచించి చూస్తే సౌవార్తికమైన బైబిలు కళాశాల స్వేచ్చాపూరిత బైబిలు కళాశాల కాన్నా ఏమంత మేలుకరమైనది కాదు. ఈ రెండు బోధనా స్థలాల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు డబ్బును ప్రేమిస్తూ, దురాశలకు బానిసలైపోయి ఉండవచ్చు.


యేసు తన శిష్యులకు అలా నేర్పించలేదు. వేదాంతము గూర్చి మెరుగైన బోధ అందించుటకు ఆయన ఈ లోకానికి రాలేదు. స్వభావములో మనల్ని ఆయనలా తయారు చేసేందుకు వచ్చాడు.


యేసు తన శిష్యులకు వేదాంతము కన్నా ఎక్కువగా సౌశీల్యతను(స్వభావమును) గూర్చి నేర్పించాడు. మరి నీ విషయం ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించుటను గూర్చి నీవు నీ సంఘానికి బోధిస్తున్నావా?


తమతో దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడో వినాలని ఆశతో మనవైపు చూచే ప్రజలు మన సంఘాల్లో ఎంతోమందిఉన్నారు. ప్రతి ఆదివారం వారికి బోధించుట భారబరితమైన బాధ్యత. మీ స్థానంలో నేనుంటే - సంఘానికి మనము బోధించు పాఠాల విషయం దేవుడికి మనము లెక్క అప్పగించవలసి ఉన్నదని భయపడతాను. మనము అందించిన ప్రతి సందేశముగూర్చి అంటే ఏమి మాట్లాడాము, ఎలా మాట్లాడాము, ఎందుకు మాట్లాడాము అనే విషయాల్లో ఒకానొక రోజున మనమందరం దేవుడికి లెక్క అప్పగించాలి. ఈ విషయంలో నీ బాధ్యతను నీవు తీవ్రముగా పరిగణిస్తే, నీ పరిచర్యలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది.


గత 20 సంవత్సరాలకు మించి జరిగించిన నా సేవను ప్రభుని వెలుగులో విమర్శించుకున్నాను. నేను దేవుని వాక్యమును బోధించిన అనంతరం - నా సందేశంలో ఏదైనా అనవసరమైనది నేను చెప్పానా? ప్రజల సమయాన్ని వృథా చేశానా? నా సొంత గౌరవాన్ని నేను కోరుకున్నానా? చెప్పమని ప్రభువును ఇటువంటి ప్రశ్నలు అడుగుతాను. ఇలా ఈ చెడ్డవాటి నుండి నన్ను నేను క్రమేణా ప్రక్షాళన చేసుకున్నాను, ప్రజలకు విసుగు పుట్టేలా ప్రసంగించుట, నా ప్రసంగాంశాలతో ''ప్రజల తలల్ని నింపుట'' అను కార్యాలనుండి నన్ను నేను కడుక్కున్నాను.


ప్రసంగం చేసిన తరువాత మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు వింటారా? అంతకంటే మెరుగైన సందేశం ఇవ్వగలిగివుండేవారేమో చూపించమని దేవుణ్ణి అడుగుతారా? అది మంచి ప్రసంగం అని ఇతరులు అనుకుంటే దానికి ఎటువంటి విలువ ఉండదు. మీ సందేశం గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు? అనేదే ముఖ్యమైన ప్రశ్న.


మీలో అనేకమందికి మీ సంఘములలో ఆదివారం తరువాత ఆదివారం మీ బోధ వినే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నిత్యత్వం కోసం వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నారా? వారు తమ విలువలు మార్చుకొని ఇంకెంతమాత్రం లోకస్థులుగా ఉండక పరలోక సంబంధులుగా జీవించేలా మీరు వారి జీవితాలను మార్చి వేశారా? తరచుగా నిన్ను నీవు ప్రశ్నించుకోవలసిన విషయం ఇదే.


మనము ఏదైనా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయము తీసుకునేటప్పుడు దేవుడు ఏమి చెబుతాడో వినటములో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి.


దేవుడు మనతో అనేక విధాలుగా మాట్లాడతాడు.


ప్రాథమికముగా ఆయన తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యములో ఏదైనా స్పష్టముగా వ్రాయబడినప్పుడు, ఆ విషయం అప్పటికే బయలు పర్చబడింది గనుక ఇక దాని విషయంలో దైవచిత్తం కోసం మనమిక ప్రార్థించనవసరం లేదు.


మన పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మన ప్రభువు దగ్గర ప్రతి తలుపును తెరువగల తాళంచెవి ఉంది (ప్రకటన 1:18). ఆయన తెరిచిన తలుపును ఎవ్వరూ మూయలేరు. ఆయన మూసిన తలుపును ఎవ్వరూ తెరువలేరు (ప్రకటన 3:8). మనము వెళ్తున్న మార్గములో దేవుడు వెళ్లమంటున్నాడో లేదో తెలుసుకునేందుకు చాలా సార్లు మన పరిస్థితులే సంకేతాలు. దేవుడు తెరువని తలుపులను మనం బలంతంగా బ్రద్దలు కొట్టనవసరం లేదు. అయితే ఒక ద్వారం మూసివేయబడినప్పుడు మనము ప్రార్థించాలి. పలుమార్లు ప్రార్థించిన తరువాత కూడా ఆ తలుపు అలాగే మూసుకొని ఉంటే ఆ ద్వారం గుండా వెళ్ళటం మన జీవితంలో దేవుని చిత్తం కాదని దాని భావము. ఆ తలుపు తెరుచుకునేందుకు ఇంకా పట్టుదల కలిగి బలమైన ప్రార్థన కొనసాగించాలా లేక ఇక చాలునా అనే విషయం మనం దేవుణ్ణి అడగాలి (లూకా 11:5-9).


పరిణితి చెందిన సహోదరుల సలహా ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. తమకు తాముగా పొందిన అనుభవాల ఫలితంగా మనము పడిపోగల ప్రమాదకరమైన గుంటలగూర్చి వారు మనల్ని హెచ్చరించగలరు. వారి హెచ్చరిక మాటలకు మనము గ్రుడ్డిగా విధేయులం కానవసరం లేదు, కానీ వారి దైవిక సలహా మనకు సహాయపడగలదు.


మనము ఇతర విశ్వాసులతో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడు తరచుగా మనతో మాట్లాడుతాడు. ఈ విధముగా దైవవాక్య ప్రత్యక్షత విషయంలోకూడా, క్రీస్తు శరీరంలోని ఇతర సభ్యులపైమనం ఆధారపడటంగూర్చి దేవుడు మనకు బోధిస్తాడు.


ఇతరుల అపజయాల ద్వారా కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఉదాహరణకు ఎవరైనా ఒక దైవసేవకుడు పాపములో పడిపోయాడని మనం విన్నప్పుడు ఆ వ్యక్తి పొందిన అపజయంనుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటో, మనల్ని మనం ఎలా భద్రపర్చుకోవాలో (మనమందరం బలహీనులమే గనుక) దేవుణ్ణి అడుగుట ఎంతో మంచిది.


ఎక్కడైనా ఏదైనా చెడు జరిగినప్పుడు, భయంకర ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు, వాటి గూర్చి మనం విన్నప్పుడుకూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. పిలాతు యూదుల్ని చంపుతున్న వార్త ప్రజలు విన్నప్పుడు, సిలోయములో గోపురము పడి ప్రజలు చనిపోయిన వార్త వచ్చినప్పుడు యేసు తన తరములోని ప్రజల్ని పశ్చాత్తాపపడమని హెచ్చరించాడు- ఎందుకంటే అటువంటి ప్రమాదాలు ఎవరికైనా సంభవించవచ్చు (లూకా 13:1-4).


హఠాత్తుగా బైబిలు తెరచి కనబడిన మొట్టమొదటి వాక్యాన్ని చదివి, దేవుడు ఏమి చెప్పుచున్నాడో వినాలనుకొనుటకు వ్యతిరేకముగా నన్ను హెచ్చరిక చేయనివ్వండి.


నీవు ఒక అమ్మాయిని వివాహము చేసుకోవాలని ఆశించి అది దైవ చిత్తమో కాదో తెలుసుకునేందుకు హఠాత్తుగా బైబిలు తెరచి కనబడిన వాక్యాన్ని గమనించవచ్చు. సరిపోయిన వాక్యము రాకపోతే నీకు కావలసిన వాక్యము దొరికే దాకా నీవు బైబిలు తెరుస్తూ వెదుకుతూనే ఉంటావు. ఈ విధంగా నిన్ను నీవు మోసపర్చుకుంటావు.


ఈ పద్ధతిలో దేవుని చిత్తము తెలుసుకోవాలని ప్రయత్నించిన ఒక మనిషిని గూర్చి నేను విన్నాను. అతడు తటాలున బైబిలు తెరిచి చూచాడు, ''వాడు వెళ్ళి తన్ను తాను ఉరివేసుకొనెను'' (మత్తయి 27:5) అని చదివాడు అతడు మళ్ళీ బైబిలు తెరిచాడు ''నీవును వెళ్ళి అటులనే చేయుము'' (లూకా 10:37) అని చూచాడు. అతడు మూడవసారి బైబిలు తెరిచి చదివాడు ''నీవు చేయవలసినది త్వరగా చేయుము'' (యోహాను 13:27)! ఈ పద్ధతిలో దైవచిత్తము తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా ఇప్పుడతని రోగం కుదిరింది.


ఒక్కోసారి ఇటువంటి విధానములో కూడా ఆయా వాక్యాల ద్వారా మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రోత్సహించి ఆదరిస్తాడు. అందుచేత ప్రోత్సాహం కోసం మీరు ఇలా చేయవచ్చు గానీ దైవచిత్తానుసారమైన నడిపింపుకోసం ఈ విధానం పనికి రాదు.


ప్రియమైన సహోదరులారా, మీరు దేవుని మాటలు వినే అలవాటు అభివృద్ధి చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు ఎన్నడైనా అభివృద్ది పర్చుకోగల ఏకైక అతి ప్రాముఖ్యమైన అలవాటు ఇది మాత్రమే.


అధ్యాయము 5
క్రీస్తు శరీరము ద్వారా సమతుల్యత

తన పరిచర్య సమతుల్యత లేనిదని ఒక ఆత్మీయ నాయకుడు గుర్తిస్తాడు. అందుచేత అతడు శరీరానికి చెందిన ఇతర సభ్యుల పరిచర్యలో ఆ సమతుల్యతని కనుగొంటాడు.

క్రీస్తు శరీరాన్ని ఒక ఆసుపత్రితో పోల్చవచ్చు. ఒక రోగి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతనికి సహాయపడేందుకు అందులో ఆయా విభాగాలుంటాయి. ఆ రోగికి ఒక ఇంజక్షన్‌ అవసరం కావచ్చు, లేక శరీర వ్యాయామ చికిత్స, శస్త్ర చికిత్సలాంటివి కూడాఅవసరం కావచ్చు. అతడొక కంటిడాక్టరునో, చెవిడాక్టరునో సంప్రదించాల్సి ఉండవచ్చు. ఇలా ఆసుపత్రి ఆయా విభాగాలు కలిగి ఉంటుంది. కంటిడాక్టరు తనసమయమంతా రోగుల కళ్ళు పరీక్షించటంలోనే గడుపుతాడు, మరేదీ చేయడు. అంతమాత్రాన అతడు శరీరంలోని ఇతర అవయవములను తేలికగా బావించడంలేదు. అతని ప్రత్యేకత కన్నుమాత్రమే.

క్రీస్తు శరీరములో కూడా ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క వరము, పిలుపు ఉంది. విడివిడిగానైతే ఒక్కొక్కరు ఎటువంటి సమతుల్యత లేకుండా ఉంటారు. ఈ భూమి మీద ఎన్నడైనా నడచిన సంపూర్ణ సమతుల్యత సంతరించుకున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మనమందరమూ, మనలో శ్రేష్టులైన వారు కూడా సమతుల్యత లేనివారే. మనము ఇతర సహోదర, సహోదరీలతో కలసి పరిచర్య చేసినప్పుడు మాత్రమే మన సమతుల్యతను కనుగొంటాము. - ప్రభువు ఆసుపత్రిలోని ఇతర విభాగాలతో కలసి పని చేసినప్పుడు సమతుల్యత లభిస్తుంది. అందుచేత ఆసుపత్రిలో వ్యక్తిగతమునకు ఎటువంటి స్థానము ఉండదు.

ఒక మంచి ఆసుపత్రిలో రోగుల అవసరతలన్నీ తీర్చుటకు ఆయా విభాగాలుంటాయి. అదే విధంగా క్రీస్తు శరీరము కూడా ప్రజలందరికీ సహాయపడేందుకు ఆయా రకాల పరిచర్యలు, అనేకమైన ఆత్మ వరాలు కలిగివుంది. ఏ ఒక్క సంఘముగానీ, గుంపుగానీ ఆత్మ వరాలన్నిటినీ కలిగియుండలేదు. కానీ క్రీస్తు శరీరమంతటిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి.

క్రీస్తు శరీరములో మన సొంత నిర్దిష్టమైన పిలుపు ఏమిటో మనము తెలుసుకోవాలి.

లోకమంతా ఆత్మీయముగా జబ్బుపడిన మానవులతో నిండి ఉంది. దానిలో ఎవ్వరూ నిరీక్షణారహితులు కానేకారు. ఎవరైనా ప్రభువుచేత సంపూర్ణ స్వస్థతపొందగలరు. మనము ప్రకటిస్తున్న సువార్త యొక్క శుభవార్త ఇదే. ఒక భయంకర పాపి, అతి భ్రష్టుడైన వాడుకూడా ప్రభువు ఆసుపత్రికి వచ్చి చికిత్సపొంది బాగుపడగలడు, తీవ్రమైన రోగంతో కృశించిపోతున్నవాడినైనా ఓ మంచి ఆసుపత్రి మేము చేర్చుకొనలేమని చెప్పదు. భయంకర రోగాలకు చికిత్స చేయటానికి సరైన పరికరాలు లేనందుచేత నాణ్యత లేని చిన్న ఆసుపత్రులు అటువంటి రోగుల్ని చేర్చుకొనవు. అదే విధముగా ఒక మంచి సంఘము తనను ఆశ్రయించినవాడు ప్రపంచంలోకెల్లా మహా గొప్ప పాపి అయినప్పటికీ అతడు నిరీక్షణా రహితుడని చెప్పదు. ఒక పాపి చికిత్స పొందుటకు ఇష్టపడితేచాలు - ఒక మంచి సంఘము అత్యంత భ్రష్టులైన పాపులను కూడా మహాగొప్ప పరిశుద్ధులుగా మార్చగలదు.

సంఘాన్ని ఒక మానవ శరీరముతో కూడా పోల్చవచ్చు. మానవ శరీరములోని ప్రతి అవయవము ఒక్కొక్క పని కలిగి ఉంటుంది. ఆ అవయవము తన పని నెరవేర్చటం మీదనే లక్ష్యముంచుతుంది. అయినప్పటికీ అది వేర్వేరు పనులు కలిగియున్న ఇతర శరీర భాగాలకు తగిన విలువనిస్తూ, అభినందిస్తూ సహకరిస్తుంది. క్రీస్తు శరీరములోని ఇతర పరిచర్యలతో మనము కలసి పని చేసేటప్పుడు ఈ విధముగానే చేయాలి.

క్రీస్తు శరీరములో ఆత్మ వరాలు పనిచేసే తీరును చిత్రీకరించుటకు ఉదాహరణగా 1 కొరింథీ 12 వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు కళ్ళు, చెవులు, చేతులు, పాదాలను ప్రస్తావించాడు.

నా ప్రసంగాలు మీరు వింటే బైబిల్లోని కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పటం మీరు గమనిస్తారు. ప్రభువు నాకిచ్చిన భారమే దీనికి కారణము. ప్రభువు నన్ను పిలిచి అప్పగించిన పరిచర్యను నేను హత్తుకొన్నాను. ఎందుకంటే ఈ పరిచర్యలోమాత్రమే నేను ప్రభువుకు ప్రయోజనకరంగా ఉండగలను, ఇది నాకు తెలుసు. దీనికి భిన్నమైన పని ఏదైనా నేను చేస్తే నా విషయంలో దైవ సంకల్పాన్ని నేను భంగం చేసిన వాడనవుతాను. కానీ ఇతర పరిచర్యలకు నేను విరోధముకాదు. వాటిని నేను ఉన్నతముగా పరిగణిస్తాను. చేయి చేసే పనిని కడుపు ఘన పరుస్తుంది, కానీ కడుపు ఎన్నటికీ చేయి చేసే పని చేయుటకు ప్రయత్నించదు. ఉదాహరణకు, కడుపు ప్లేటులో ఉన్న ఆహారమును తీసుకొనుటకు ఎప్పుడూ ప్రయత్నించదు. చేతిని ఆ పనిని చేయుటకు అనుమతించి, తన స్వంత పనియైన చేయి తీసిచ్చిన ఆహారమును జీర్ణము చేసుకొంటుంది. క్రీస్తు శరీరములో ఉన్న మనము పరస్పరము ఏ విధముగా ఘన పర్చుకోవాలో దానికిది సాదృశ్యము.

శరీరములో ఇమిడియున్న ఈ వివిధ పరిచర్యల సత్యాన్ని చాలా మంది విశ్వాసులు చూడలేదు. మీరు ఈ సత్యాన్ని గమనించకపోతే దేవుడు నెరవేర్చాలని సంకల్పించిన కార్యమును మీరెన్నడూ సాధించనేరరు.

దేవుడు మనల్ని దేనికొరకు పిలిచాడో అను విషయమును మన మనసుల్లో స్పష్టముగా అర్థము చేసుకొనుట మంచిది. సాధారణంగా ప్రభువు మన హృదయాల్లో పెట్టిన భారమే తన శరీరములో మనము చేయవలసిన పరిచర్యను సూచిస్తుంది.

ఇక నా విషయానికొస్తే ప్రభువు శరీరములో నా పరిచర్య ఏమిటో, నా పరిచర్యలో నేను దేనిని ఎక్కువగా చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడో అనే విషయము చాలా సంవత్సరాల క్రితమే నాకు అతి స్పష్టముగా తెలిసిపోయింది. ఈ స్పష్టత నాజీవితంలో గొప్ప విశ్రాంతిని మరియు గొప్ప స్వాతంత్య్రమును కలుగజేసింది. నేను నా పరిచర్యలో సమతుల్యముగా లేనని కొందరు నన్ను నిందించినప్పటికీ, నా పరిచర్యనుండి నన్నెవరూ ఇప్పుడు దూరముగా ఉంచలేరు!

పాత నిబంధన ప్రవక్తల్లో ఎవ్వరూ తమ పరిచర్యల్లో సమతుల్యముగా లేరు. కేవలం అటు ఇటూ కాని బోధకులే సమతుల్యముగా ఉండుటకు చూస్తారు. ప్రవక్తలందరూ సమతుల్యత లేనివారే. వారంతా ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పటం జరిగింది - ఇశ్రాయేలీయులకు, యూదులకు వారితరంలో అది అవసరము - దీనిని దేవుడు అప్పటి ప్రవక్తల హృదయాల్లో భారంగా ఉంచాడు.

ప్రభువు సేవ చేయనారంభించిన వెంటనే మన పిలుపుఏమిటో మనకున్న వరమేమిటో మనమందరము తెలుసుకోగలమని నేను చెప్పటంలేదు. నా పరిచర్య ఏమిటో నాకు స్పష్టముగా తెలియుటకు నేను క్రొత్తగా జన్మించిన తరువాత 15 సంవత్సరములు పట్టినది. నీకు ఇంత కాలం పట్టకపోవచ్చు. ఇంకా తక్కువ కాలమే పట్టవచ్చు. సమయం విషయం నీవు దేవునికే విడిచిపెట్టాలి. మరెవ్వరూ సాధించలేని వ్యత్యాసమైన, అసాధారణ పరిచర్య నీకు క్రీస్తు శరీరములో ఉందనే విషయాన్ని నీవు స్పష్టముగా అవగాహన చేసుకోవాలి. అంతేగాక ఆ పరిచర్య ఎన్నటికీ సమతుల్యత కలిగియుండదు. అది సమతుల్యతను కలిగియుండదు. శరీరములో వేరే ఇతర పరిచర్యలు కలిగియున్న సహోదరులతో సహవాసము చేస్తూ పనిచేయుట ద్వారా మాత్రమే నీ సమతుల్యతను కనుగొనగలవు. ఈ విధముగా ఇతరులపై ఆధారపడేలా చేస్తూ దేవుడు మనల్ని దీనులుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం!

ఒక విద్యార్థి ఇంగ్లీషులో తెలివిమంతుడై గణితంలో మందబుద్ధియై ఉన్న విధముగా - మన జీవితములో కొన్ని విభాగాల్లో మనము బలవంతులము, మరికొన్నిటిలో బలహీనులము. అయితే మనము ఎక్కడ బలహీనులమో తెలుసుకొని ఆ ప్రాంతాలను బలపర్చుకోవాలి. మీ సంఘము సువార్తను గూర్చి చెప్పే విషయములో బలముగా ఉండవచ్చు. కాని పరిశుద్ధతను గూర్చి చెప్పే విషయములో బలహీనముగా ఉండవచ్చు. అటువంటప్పుడు మీ సంఘము ఎటువంటి పరిచర్యను చేపట్టవలసివుందో నీకు తెలుస్తుంది.

మీకు కలిగిన ప్రఖ్యాతిని బట్టి మీ పరిచర్య విజయాన్ని ఎన్నడూ తీర్పు తీర్చవద్దు. ప్రజల్లో ''ప్రఖ్యాతి''గాంచిన వారికి శ్రమ అని యేసు ప్రకటించాడు. ఎందుకంటే అది అబద్ధ ప్రవక్తను గుర్తించే గుర్తు (లూకా 6:26). అందుచేత ఒకవేళ నీవు ఒక అత్యంత సుప్రసిద్ధ బోధకుడివైతే అబద్ధ ప్రవక్తవై యుండొచ్చు. అయితే దీనికి విరుద్ధముగా యేసు తన శిష్యులతో ఈ విధముగా చెప్పాడు - అందరూ మీకు వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు సంతోషించండి. ఎందుకనగా అది నిజమైన ప్రవక్త యొక్క ఒక గుర్తు (లూకా 6:22,23).

ఈ సందర్భంగా యేసు చెప్పిన విషయాన్ని నిజముగా నీవు నమ్ముతావా?

ఇశ్రాయేలు చరిత్రలో గానీ, సంఘచరిత్రలోగానీ జీవించిన ప్రతియొక్క నిజమైన ప్రవక్త విరుద్ధ వ్యక్తిగా, విరుద్ధ వ్యక్తులుగానూ, ఆ నాటి మత నాయకులచేత దూషణ, ద్వేషములకు, నిష్కారణ నేరారోపణలకు గురియైనారని జ్ఞాపకముంచుకోండి.

పాతనిబంధన కాలానికి చెందిన ఏలియా, యిర్మీయాలుగానీ, మొదటి శతాబ్దానికి చెందిన బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలులాంటి భక్తులుగానీ, ఆధునిక భక్తులైన జాన్‌ వెస్లీ, వాచ్‌మెన్‌ నీ లాంటి వారి జీవితాల్లోగాని పై నియమము తప్పిపోలేదు.

అందుచేత మన ప్రయాసకు ఫలితమైన శాశ్వత(నిత్యత్వపు) విజయము మనకీర్తిపై ఆధారపడిఉండదు!

మన ప్రయాస ఫలితమైన విజయాన్ని గణాంకాలలో కూడా చూడకూడదు. ఎంతమందికి సువార్త బోధించాము? మనం నిర్వహించిన సభల్లో ఎంతమంది చేతులెత్తారు? అని లెక్కలు కట్టి విజయాన్ని చూడకూడదు.

లెక్కలు కట్టి సంఖ్యాపరమైన అభివృద్ధిని పరిశీలిస్తే యేసు చేసిన పరిచర్య పూర్తిగా అపజయము పొందినదని మనము చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన పరిచర్య చివరిలో తండ్రికి చూపించేందుకు యేసు దగ్గర కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు (యోహాను 17). అయితే యేసు సాధించిన విజయము ఆ పదకొండు మంది శిష్యులు ఎటువంటి వారన్న విషయములో ఉన్నది! ఈనాటి అపనమ్మకమైన, ధన ప్రేమికులైన, రాజీతత్వ, లోకసంబంధమైన ''విశ్వాసుల్లాంటి'' పదకొండు మిలియన్ల కన్నా మించి, దేవుని దృష్టిలో ఆ పదకొండు మంది ఎంతో అమూల్యమైన వారు, దేవునికోసం అధికంగా సాధించి నెరవేర్చగలిగిన స్తోమతగలవారు.

నా జీవితమంతటిలో మొదటి అపొస్తులుల వంటి శక్తివంతమైన పదకొండుమందిని నేను తయారుచేయగలిగితే నా పరిచర్య మహిమాన్వితమైన విజయాన్ని సాధించినట్లే. కానీ అటువంటి వారిని కనీసం ఇద్దరు లేక ముగ్గుర్ని తయారు చేయటం కూడా బహుకష్టమైన పని. తమ పూర్ణ హృదయాలతో దేవుణ్ణి ప్రేమించకుండా లోకంతో రాజీపడి ''యేసునందు విశ్వాసముంచు'' గుంపును సమకూర్చడం ఎంతో సుళువు.

గత ఇరవై శతాబ్దాలుగా క్రైస్తవ్యంలో దేవుడు ఆరంభించిన ప్రతి ఉద్యమములో రెండవ తరానికి వచ్చేసరికి క్షీణత సోకి సంస్థాపకుడు ఆరంభించినపుడు ఉన్నంత శక్తివంతముగానూ, ఉజ్జీవపూరితముగానూ ఉద్యమము సాగిపోవుటలేదు. ఎందుకు?

రెండవతరము వారు తమ అభివృద్ధిని సంఖ్యాపరముగా పోల్చుకోవటము ఒక కారణము. వారు సంఖ్యలో అధికము కావటమే వారిని దేవుడు ఆశీర్వదించాడనుటకు ఋజువుగా భావిస్తారు.

కానీ ఇటీవల సంవత్సరాల్లో ఇతర మతాలకు చెందిన ఛాందస గుంపులు, విమత బృందాలు ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది ఏమి నిరూపిస్తున్నది? సంఖ్యాపరమైన అభివృద్ది దేవుని ఆశీర్వాదానికి రుజువుకాదు.

క్రీస్తు శరీరములో మనకు అనుగ్రహించబడిన పరిచర్యపై మనదృష్టిని లగ్నము చేయాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అదే సమయములో వేర్వేరు పరిచర్యలు జరిగిస్తున్న ఇతరులతో సహకరిస్తూ పనిలో సాగిపోవాలని కూడా ఆయన పిలుస్తున్నాడు. క్రీస్తు శరీరమనబడిన సంఘములో మనము ఒక భాగముగా ఉన్నాము గనుక మన పరిచర్య సాధిస్తున్న అభివృద్ధిని లెక్కకట్టుట అసాధ్యమైన పని.

కాబట్టి నెరవేర్చుటకు దేవుడు మనకు అప్పగించిన పనిలో మనము నమ్మకస్థులముగా ఉన్నామా? లేదా? అను విషయాన్ని ఖచ్చితముగా తెలుసుకోవటము మనకు అవసరము

అధ్యాయము 6
అప్పగించుకొనుట ద్వారా విరిగిన అనుభవము

ఒక ఆత్మీయ నాయకుడు విరిగినవాడుగా ఉంటాడు.


మన ప్రారంభ దినములలో దేవుడు మన మీద ఒక అధికారమును ఉంచుతాడు. ఆ అధికారమునకు మనము విధేయత చూపించవలసియుండును. ఈ విధముగా ఆయన మనలను విరుగగొడతాడు. దేవుడు ఆయనకు పరిచర్య అప్పగింపక మునుపు 30 సంవత్సరాలు యేసు కూడా మరియ, యోసేపుల అధికారమునకు విధేయత చూపవలసివచ్చెను.


విధేయతాపూర్వక అప్పగింత అనేది క్రీస్తు శరీరములో ఒక ముఖ్యమైన నియమము. ఇది మానవ శరీరములోని నియమము వంటిదే.


ఉదాహరణకు కుడిచెయ్యి కుడిమోచేతి ''బృందము''నకు అంటుకొని ఆ కుడిచేతి ''నాయకత్వానికి'' మాత్రమే అప్పగించుకొని ఉంటుంది. ఎడమ చెయ్యి ఈ బృందానికి చెందింది కాదు. అది ఎడమ మోచేతి ''బృందమునకు'' అప్పగింపబడి ఉంటుంది. క్రీస్తు శరీరములో కూడా దేవుడు కొందరు సభ్యులను ఇతరులకన్నా అధికముగా పరస్పరం జతపరుస్తాడు (ఒక స్థానిక సంఘములోని సభ్యులవలె లేదా ఒక బృందంలోని కార్యకర్తవలె).


దేవుడు మనల్ని రెండువిధాలుగా నడిపిస్తాడు - విడివిడిగా మరియు బృందముగా నడిపిస్తాడు.


కుడిచేతి భాగము ఏమాత్రం కదలకుండానే కుడి చెయ్యి తనకు తానుగా పని చేయాలని శిరస్సు ఆజ్ఞాపించగలదు. ఇది శిరస్సునుండి వచ్చు వ్యక్తిగత నడిపింపు. మన వ్యక్తిగత జీవితమునకు సంబంధించి అనగా వివాహము, ఉద్యోగము వంటి విషయాల్లో మన శిరస్సైన క్రీస్తునుండి వ్యక్తిగత నడిపింపు పొందాలి. ఇతర శరీర సభ్యుల నుండి సలహాలు పొందవచ్చు. కానీ ప్రభువునుండి మనము నేరుగా మార్గము నిర్దేశింపబడాలి.


శిరస్సు ఆజ్ఞానుసారంగా కుడిచేతి భాగముతో పాటు కుడిచెయ్యి పైకిలేస్తుంది. ఈ విషయంలో కుడిచేతికి తలనుండి వేరే ఆజ్ఞ రానవసరం లేదు. ఇది బృంద మార్గదర్శకత్వము. శిరస్సు నుండి ప్రత్యేకమైన నడిపింపు తనకు రాలేదని అందుచేత తాను కదలనని కుడిచెయ్యి చెప్పదు.


బృందవిషయాల్లో వ్యక్తిగత నడిపింపు ఎవ్వరికీ అవసరము లేదు. క్రీస్తు శరీరములో నీవు ఒక భాగమునకు అనుసంధానము చేయబడినప్పుడు సంబంధిత విషయాల్లో దేవుడు ఆ నాయకుల్ని నడిపించగా నీవు వారిని అనుసరించాలి. నీవున్న క్రీస్తు శరీర విభాగానికి సంబంధించిన బృంద విషయాలను నేనిక్కడ ప్రస్తావిస్తున్నానుగానీ వ్యక్తిగత విషయాలు మాత్రము కాదు. దేవుడు నిన్ను ఒక బృందములో వుంచినట్లు నీకు నిశ్చయంగా తెలిసినప్పుడు నీవు ఆ బృంద నాయకులతో కలిసి అనుసరించి మసలుకోవాలి.


అపొస్తలుల కార్యములు 16:19 లో దీనికి సాదృశ్యం చూస్తాము. పౌలు తన బృందంతో పాటు (దేవుడే వీరిని బృందంగా ఉంచాడు) త్రోయలో ఉన్నప్పుడు, అతనికి కలిగిన దర్శనంలో మాసిదోనియాకు వచ్చి తనకు సహాయపడమని ఒక వ్యక్తి అడిగాడు. పౌలు ఒక్కడే దర్శనం చూచినట్లు మనం 10వ వచనంలో చదివినప్పటికీ దేవుడు వారిని మాసిదోనియాలో సువార్తకోసం పిలుస్తున్నట్టు బృందంలోని సభ్యులందరూ ఒప్పింపబడ్డారు. బృందంలోని ఎవ్వరికీ వ్యక్తిగతంగా దేవుని నడిపింపు లభింపక పోయినప్పుడు వారందరు ఎలా ఒప్పింపబడ్డారు? పౌలు తమ బృందానికి నాయకుడని అతని నాయకత్వముపై వారు నమ్మకం ఉంచటమే దీనికి గల కారణము. బృంద విషయాల్లో దేవుడు సభ్యులందరికీ ఒక్కొక్కరికి విడివిడి నడిపింపు ఇవ్వనవసరంలేదు. నాయకుడికి మాత్రమే ఆయన నడిపింపు అందిస్తాడు.


మీ నాయకుని మీద మీకు నమ్మకంలేనప్పుడు అటువంటి బృందమును (సంఘమును) వెంటనే మీరు విడిచిపెట్టాలి. కానీ అదే సంఘంలో, సంస్థలోనే ఉంటూ తిరుగుబాటుకూ, గందరగోళానికీ కారకులు కాకూడదు. నాయకత్వము, యాజమాన్యము తప్పుడు విధానం అనుసరించినప్పటికీ, మీరు ఆ బృందంలో ఉంటూనే నాయకత్వానికి వ్యతిరేకముగా తిరుగుబాటుచేస్తే దేవుడు మిమ్ములను ఎన్నడూ ఆశీర్వదించడు. ఆ బృందాన్ని విడిచి మరో బృందంలో చేరు. చేయదగిన మంచి పని ఇదే.


అయినప్పటికీ మానవులచేత నియమితమైన మతాధికారమునకు దేవుని నియామకమైన ఆత్మీయ అధికారమునకు మధ్యగల తేడాను గుర్తించాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు నాయకత్వ స్థానాల్లో ఉన్నారు గానీ పౌలు వలె వీరు దేవునిచేత నియమించబడిన వారుకారు. ఆత్మీయముగా ఆత్మీయ పిల్లలకు, సంఘములకు తండ్రులు కారు. కానీ మానవాధికారాల మూలముగా ఎన్నికలు, నియామకముల వల్ల ఆ స్థానములో ఉన్నారు. బిషప్పుగారు ఒక యాజకుణ్ణి ఒక పారిష్‌ కు పంపుతాడు . ఆ ప్రాంతానికి సంబంధించిన సూపరిండెంటు గారు ఒక పాస్టరును సంఘానికి పంపుతాడు. ఇటువంటివారు ఆత్మీయ నాయకులు కారుగానీ మతపరమైన సంఘసంబంధమైన అధికారులు మాత్రమే.


ఆత్మీయ నాయకులను దేవుడే నియమిస్తాడు. వీరు మతపరమైన అధికారులవలె తమ అధికారాన్ని ఇతరులపై రుద్దరు. తమ అధికారాన్ని ఇతరులు స్వచ్ఛందంగా సమ్మతించాలని వీరు వేచి చూస్తారు. ఇటువంటి వారిపై దైవాభిషకంఉంటుందని గుర్తించే విశ్వాసులు వీరి అధికారానికి లోబడతారు. ఇతరుల విశ్వాసాన్ని చూరగొన్నవాడే ఆత్మీయ నాయకుడు.


ఒక దైవజనుడికి లోబడుటవల్ల మనము అనేక అవివేక కార్యాలు చేయకుండా భద్రపర్చబడటమేగాక అతని దగ్గర అమిత జ్ఞానము నేర్చుకునేందుకు దోహదపడుతుంది. మనకు తెలియని, తన జీవితంలో తాను ఎదుర్కొన్న ప్రమాదముల గూర్చి అతడు మనల్ని హెచ్చరించగలుగుతాడు. కాబట్టి తల్లిదండ్రుల అదుపులో ఉన్న పిల్లలకు ఎటువంటి క్షేమము కలుగుతున్నదో అటువంటి క్షేమమే ఆత్మీయ అధికారం క్రిందవుండటంవల్ల కూడా లభిస్తున్నది.


యౌవనస్థులు తమ పెద్దలకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు గర్విష్టులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని 1 పేతురు 5:5 లో మనం చదువుతాము. దేవునినుండి ఆత్మీయ అధికారం పొందుటకుగల మహారహస్యము ఇక్కడ ఉంది. ఒకేఒక కారణంచేత దేవునినుండి ఎన్నడూ ఆత్మీయ అధికారం పొందని చాలామందిమంచి సహోదరులను నేను ఎరుగుదును. తమ జీవితమంతటిలోనూ ఎవ్వరికీ లోబడి ఉండుట వారెన్నడూ నేర్చుకోలేదు. అందుచేత బలిష్టమైన తమస్వచిత్తము ఎన్నడూ విరుగగొట్టబడలేదు.


విరుగగొట్టబడని మనిషిచేతుల్లోని అధికారము అతి ప్రమాదకరము. మొట్టమొదట నీ జీవితంలో నీకు విరుగగొట్టబడిన అనుభవం లేకుండా ప్రజలపై అధికారం చెలాయించుటకు ప్రయత్నిస్తే ఆ విధానంలో వారిని నాశనం చేయటమే గాక నిన్ను నీవు కూడా నాశనం చేసుకుంటావు. మనలో ఎవరికైనా ఆత్మీయ అధికారాన్ని అప్పగించుటకు ముందు దేవుడు మొట్టమొదట మన గర్వము యొక్క బలమును విరుగగొట్టాలి.


కుటుంబములో భర్తగా లేక తండ్రిగా దైవిక విధానముననుసరించి అధికారమును అమలు చేయాలన్నా విరిగిన అనుభవమనేది తప్పని సరి. నీ భార్యాపిల్లలు నీకు లోబడి ఉండాలనుకుంటే మొట్టమొదట నిన్ను నీవు ఆత్మీయ అధికారానికి అప్పగించుకోవలసి ఉంటుంది. అప్పుడే గృహములో నీవు చేసే ప్రతికార్యాన్ని దేవుడు బలపరుస్తాడు.


నా సొంత అనుభవాన్ని మీతో క్లుప్తంగా పంచుకుంటాను. నేను 20-30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా పరిచర్యను చూచి అసూయపడిన కొన్ని సంఘాల పెద్దలు నన్ను అణచివేసి బహిరంగముగా అవమాన పరిచేలా దేవుడు నా జీవితములో అనుమతించాడు. అటువంటి సందర్భాల్లో కూడా నోరు మూసుకొని ఆ సంఘ పెద్దలను ప్రశ్నించక వారికి లోబడి ఉండమని దేవుడు నాకు చెప్పాడు. నేను అలాగే చేశాను. నేను వారి సంఘాల్లో ఉన్నప్పుడు, ఆ సంఘాలను విడిచి వెళ్లిన తరువాత కూడా వారితో మంచి సంబంధం కలిగియున్నాను.


భవిష్యత్తులో దేవుడు నాకు ఎటువంటి పరిచర్యను దాచియున్నాడో ఆ రోజుల్లో తెలియలేదు. అయితే సంవత్సరాల తరబడి నన్ను విరుగ గొడుతూ ఆత్మీయ అధికారం నేర్పుటలో దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆయన నన్ను పదేపదే విరుగగొట్టాడు, ఇతరులు నాకు చేసిన సమస్తములోనూ ఆయన అధికారము కలిగియున్నాడు. దానికి ఫలితముగా నాకు ఆత్మీయ అధికారం అనుగ్రహించాక నేను ఎన్నడూ ఆ అధికారాన్ని ఓ నియంతలా దుర్వినియోగం చేయలేదుగానీ కనికరము కలిగి వినియోగించాను.


నన్ను విరుగ గొట్టు పనిని దేవుడు ఇంకా ముగించలేదు. గత కొద్ది సంవత్సరాలుగా నేనెన్నడూ అనుభవించని క్రొత్త అసాధారణ శోధనలగుండా దేవుడు నన్ను పోనిచ్చాడు. అయితే నా జీవితములో ఆయన ఉద్దేశ్యము మారదు - తన జీవమును,అధికారమును అధికంగా నాకు అప్పగించుటకు ఆయన నన్ను ఇంకా విరుగగొడతాడు. మన బలమును, గర్వమును విరుగగొట్టుటలో దేవుడు మన నాయకుల ద్వారా మనల్ని సరిచేయుట మరో విధానము. దిద్దుబాటును స్వీకరించుట విశ్వాసులందరికీ కష్టతరమైన విషయమే. రెండు సంవత్సరముల బిడ్డకు కూడా దిద్దుబాటును స్వీకరించుట కష్టమే- ప్రత్యేకముగా బహిరంగముగానైతే ఇంకా కష్టము. నీ జీవితములో బహిరంగ దిద్దుబాటును సంతోషంగా ఒప్పుకొని ఎంతకాలమైనది? కనీసం ఒక్కసారైనా నీ జీవితములో దానిని సమ్మతించావా? లేని పక్షంలో నీవు ఆత్మీయ అధికారలోపం కలిగి ఉన్నావనుట ఆశ్చర్యము కాదు.


ప్రభువులో ఉన్న మీ నాయకుడు తన దిద్దుబాటు ప్రక్రియలో కొంచెం కఠినముగా ప్రవర్తించినా ఫరవాలేదు. మిమ్మును సరిదిద్దుటకు మీ నాయకుని అనుమతించిన దేవుని హస్తం క్రింద ఇంకా మీరు దీనులుగా ఉండాలి - మీరు ఏ తప్పు చేయకపోయినా, ఆ సమయములో దిద్దుబాటు మీకు అవసరం లేకపోయినా ఫరవాలేదు.


శత్రువులు యేసుపై ఎన్నో విషయాల్లో తప్పుడు నేరములు మోపి బహిరంగముగా అవమానించారు. అయినా ఆయన ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. మనము అనుసరించేందుకు ఆయన ఒక మాదిరి అనుగ్రహించాడు.


శత్రువు నిన్ను విమర్శించుటకు దేవుడే అనుమతించినప్పుడు కూడా ఆ విమర్శలో నిజమేదైనా ఉన్నదో లేదో, నిన్ను నీవు ప్రశ్నించుకో.నీవు చేయవలసినది ఇదే. వాస్తవానికి ఇది దేవుడు నీ జీవితంలో చేస్తున్న ఉచిత పరీక్ష! ఈ పరీక్ష ఆయన ఎందుకు చేశాడో దీని వెనుక ఆయన ఉద్దేశమేమిటో నీవు పట్టించుకోనవసరము లేదు! ఈ విషయాలు అంత ప్రాముఖ్యములు కావు. ఈ పరీక్ష ద్వారా నీ జీవితంలో దాగివున్న క్రీస్తు స్వారూప్యములో లేనిది ఏమైనా బయటపడిందా అని ప్రశ్నించుకోవటమే నీ పని.


నా పరిచర్యలో ప్రజలనుండి అనేక విమర్శలు వస్తుంటాయి. నిజమైన దైవసేవకులు నిష్కారణముగా నిందింపబడుట, విమర్శల పాలగుట నాకు తెలుసు. అందుచేత విమర్శ నన్ను కలవరపెట్టదు. ఆ విమర్శలో సత్యమేదైనా ఉందేమో నాకు చూపించమని మాత్రమే ప్రభువును నేను అడుగుతాను.


మన స్నేహితుల కన్నా శత్రువులే మనకు ఎక్కువ సత్యాలు తెలియజేస్తారు. అందుచేత మనకు ఎదురయ్యే విమర్శలన్నింటినీ అబద్ధములని కొట్టి పారవేయకూడదు.


నా ముఖం పైనున్న నల్లని మచ్చను నా శత్రువు నాకు చూపిస్తే అతనికి నేను వందనస్తుడిగా ఉండాలి, ఎందుకంటే నాకు నేనుగా చూచుకోలేని దానిని అతడు చూపించాడు. అప్పుడు నేను వెళ్ళి ఆ మచ్చను శుభ్రంగా కడుక్కోవచ్చు! అతడు నన్ను కించపర్చుటకో లేక దురుద్దేశ్యముతోనో ఆ విషయం నాకు చెప్పివుండొచ్చు, అయినా పరవాలేదు. నన్ను నేను శుద్ధిచేసుకోవటంలో అతడు నాకు సహాయపడ్డాడు!


పేతురు, ఇస్కరియోతు యూదాల మధ్యగల పెద్ద వ్యత్యాసము ఇదే. సిలువను తప్పించాలని పేతురు అవివేకముగా ప్రభువుతో చెప్పిన మాటలకు ఆయన బహు కఠినముగా గద్దించాడు, ''సాతానా నా వెనుకకు పొమ్ము''. యేసు ఎన్నడైనా ఏ మనిషినైనా ఇంత గట్టిగా గద్దించలేదు. పరిసయ్యులు కూడా ''సర్పములారా'' అని మాత్రమే పిలువబడ్డారు, కానీ పేతురు ''సాతానా'' అని పిలువ బడ్డాడు. అతి సన్నిహితులకోసమే కఠినాతి కఠినములైన యేసు గద్దింపులు దాచబడి ఉన్నాయి. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారినే ఎక్కువగా గద్దిస్తాడు (ప్రక 3:19).


దాని తరువాత వెంటనే చాలా మంది శిష్యులు ప్రభువు బోధకు అభ్యంతరపడి ఆయన్ను విడిచి వెళ్తుండగా మిగిలిన శిష్యులను ''మీరుకూడా వెళ్ళిపోతారా'' అని యేసు అడిగాడు. అప్పుడు యేసుకు జవాబిచ్చింది పేతురే. ''మేము ఎవరియొద్దకు వెళ్ళెదము, నిత్యజీవపు మాటలు గలవాడవు నీవే'' (యోహాను 6:60,66-68). పేతురు వినిన నిత్యజీవపు మాటలు ఏవి? ''సాతానా నా వెనుకకు పొమ్ము''!


దిద్దుబాటు కోసం వినియోగించిన మాటలు నిత్యజీవానికి నడిపే మాటలుగా మనము చూస్తున్నామా?


దిద్దుబాటును పేతురు ఆ విధంగా చూచాడు. అదే ఆయన్ను అంత గొప్పవాడిగా చేసింది.


ప్రభువు నుండి దిద్దుబాటు అంగీకరించిన మరో సందర్భముకూడా పేతురు జీవితంలో ఉంది. చిట్టచివరి ప్రభు రాత్రి భోజన బల్ల దగ్గర పేతురు ప్రభువుతో మిగిలిన శిష్యులందరు వెళ్ళిపోయినా తాను మాత్రము ప్రభువును విడచి వెళ్ళనని చెప్పాడు. ప్రభువు వెంటనే జవాబిచ్చాడు - మరో 12 గంటల్లో పేతురు ప్రభువును మూడుసార్లు ఎరుగనని చెబుతాడని వెల్లడించాడు. యేసు అలా మాట్లాడినందుకు పేతురు మనసులో నొచ్చుకోలేదు. ఇటువంటి మనిషిని చివరకు ప్రభువు తన ప్రధాన అపొస్తులునిగానూ, పెంతెకోస్తు దినమున ప్రభువు రాయబారిగానూ తయారు చేశాడు.


దిద్దుబాటు ప్రక్రియకు పేతురు దీనుడైనందుచేత దేవుడతణ్ణి హెచ్చించాడు. తన సొంత అనుభవం ద్వారా నేర్చుకున్న పేతురు ఇప్పుడు మనము కూడా ఎల్లప్పుడు దీనులముగా తగ్గించుకోవాలని పేతురు 5:5,6లో మనకు చెబుతున్నాడు. మనల్ని మనము తగ్గించుకోవటంవల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. ఒకానొక రోజున దేవుడే మనల్ని హెచ్చిస్తాడు.


దిద్దుబాటుకు పేతురు ప్రదర్శించిన వైఖరికి విరుద్ధమైన ఇస్కరియోతు యూదా వైఖరి చూడండి. ఖరీదైన సువాసన గల అత్తరుతో ఒక స్త్రీ యేసును ఆరాధించినప్పుడు యూదా ఇస్కరియోతు - డబ్బును అలా వృథాచేయక ఆ అత్తరును అమ్మి వచ్చిన ఆ సొమ్మును పేదలకు ఇవ్వవచ్చును గదా అని అన్నాడు (యోహాను 12:5; మత్తయి 26:10-13). యేసు యూదాను అతి మృదువుగా సరిదిద్దాడు - ఆ స్త్రీ చేసిన పని చాలా మంచిదని ఆమెను ఏమీ అనవద్దని చెప్పాడు. అయితే యూదా నొచ్చుకున్నాడు.


వెంటనే యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతో కలిసి యేసును అప్పగించుటకు ఒప్పుకున్నట్టు ఆ క్రింది వచనంలోనే మత్తయి 26:14 చదువుతాము. ఈ సమయ సందర్భము అతిప్రాముఖ్యము. యేసు బహిరంగంగా సరిదిద్దినందుకు యూదా అభ్యంతర పడ్డాడు.


యేసు యూదాతో చెప్పిందల్లా ఆ స్త్రీ చేసిన కార్యము గూర్చి అతని అంచనా సరియైనదికాదని మాత్రమే. అయితే అతణ్ణి నొప్పించుటకు అది చాలు. నీవు విరిగిన అనుభవానికి రాని పక్షంలో నిన్ను నొప్పించేందుకు ఒక చిన్న విషయంచాలు.


అయితే యూదా ప్రతిచర్యకు ఫలితంగా కలిగిన నిత్యత్వ పర్యవసానాలు గమనించండి. అదే సమయంలో పేతురు ప్రతిచర్యకు లభించిన నిత్యత్వ ఫలితాలు చూడండి. ఇద్దరూ దిద్దుబాటు ద్వారా పరీక్షించబడ్డారు - ఒకరు ఉత్తీర్ణుడయ్యారు - మరొకరు తప్పిపోయారు.


ఇదేవిధంగా ఈనాడు మనము కూడా పరీక్షించబడుతున్నాము.


బహిరంగ దిద్దుబాటు మనల్ని నొప్పింపజేస్తే మనము మనుషుల ఘనత కోరుకుంటున్నట్లు అది రుజువు. అలాంటప్పుడు అటువంటి తప్పుడు ఘనతను ఆశించే గుణమునుండి మనల్ని మనము శుద్ధి చేసుకునేందుకు ఈ సత్యాన్ని మనము ఇప్పుడే తెలుసుకొనుట మంచిది. మనుష్యుల అభిప్రాయాలకు మనమెంతగా దాసులమైపోయామో చూపించుటకు ఇటువంటి పరిస్థితిని దేవుడే అనుమతించి ఉండొచ్చు. ఇప్పుడు మనల్ని మనము శుద్ధి చేసుకొని విడుదల పొందవచ్చు.


ప్రభువు తన ఆత్మ ద్వారా నేరుగా మనల్ని సరిదిద్దినా, మరొకరి ద్వారా సరిచేసినా అన్ని సమయాల్లోనూ మనము దిద్దుబాటుకు పేతురులాంటి వైఖరి కలిగివుందాము. ఇది మనందరికీ నిత్యజీవమార్గము. మనల్ని మనము తగ్గించుకుంటే మనము దేవుని కృప పొందుతాము. సరియైన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు.


విరిగిన అనుభవంలేనివారు ఒంటరిగా ఉంటారు - ఒంటరి నాయకులు, ఒంటరి విశ్వాసులు. వీరు ఎవ్వరికీ లోబడరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలను కుంటారో అక్కడికి వెళ్తారు. ఏమి చేయాలనుకుంటారో అది చేస్తారు. ఇటువంటి విరుగగొట్టబడని విశ్వాసులు తాము చెప్పినట్లు విని తమకు విధేయులైన వారితోనే కలిసి పనిచేయగలరు. ఇటువంటి విశ్వాసులు అనేకులున్నారు. సీతాకోకచిలుకలు ఒక పుష్పము నుండి మరొక పుష్పముపై వ్రాలినట్లు వీరు ఒక సంఘమునుండి మరొక సంఘమునకు, ఒక సంస్థ నుండి మరో సంస్థకు గంతులు వేస్తుంటారు. ఏమీ సాధించకుండానే వీరు తమ జీవితాల్ని వృధాచేసుకుంటారు. వీరు కయీనువలె దేశదిమ్మరులవుతారు, ఎందుకంటే వీరు కయీనువలె దేవుని దిద్దుబాటును అంగీరించుటకు ఇష్టపడరు (ఆది 4:12).


ఇటువంటి ''ఒంటరిగాళ్ళకు'' దేవుడు ఎన్నటికీ ఆత్మీయ అధికారం అనుగ్రహించడు, ఎందుకంటే ఆయన విడివిడి విశ్వాసుల గుంపుల్ని తయారుచేయటం లేదు గానీ ఆయన ఒక శరీరాన్ని నిర్మిస్తున్నాడు!

అధ్యాయము 7
ఇతరుల కోసం బాధ్యత కలిగియుండుట

ఒక ఆత్మీయ నాయకుడు తన మందలోని ఆత్మలపై కాపరిగా ఉంటాడు. ఎందుకంటే ఒకానొక రోజున ప్రతి ఆత్మవిషయములో అతడు దేవునికి లెక్క అప్పగించాలి (హెబ్రీ 13:17).


భారతదేశములోని మా సంఘాల్లో నా జతపనివారికి, తమ ఆత్మల విషయంలో నేను బాధ్యుడనని చెప్పాను. ఎందుకంటే వారు నన్ను తమ పెద్ద అన్నగా నా వైపు చూస్తుంటారు. అందుచేత కొన్నిసార్లు వారికి బాధ కలిగించినా, వారికి అవసరమైన మంచి విషయాలు నేను చెబుతాను- ఇంటిలో నా స్వంత పిల్లలకు నేను ఏమి చేస్తానో అదే విధముగా వారికి చేస్తాను. ప్రతి పాస్టరు(కాపరి), ప్రతి సంఘపెద్ద తమ బాధ్యతక్రిందవున్న వారిగూర్చి దేవునికి జవాబుదారులై ఉన్నారు.


కుటుంబాలలో చిన్నపిల్లలకు దేవుడు భూసంబంధమైన తండ్రులను అనుగ్రహిస్తున్నట్లు దేవుడు తన పిల్లలకు ఆత్మీయ నాయకుల్ని అనుగ్రహిస్తాడు. నేను నలుగురు కుమారుల తండ్రిని. నా కుమారులు నాతో నా ఇంటిలో ఉంటున్న సంవత్సరాలలో అనేక విషయాల్లో వారికి నేను సలహాలిస్తూ నడిపించాను. వారుకూడా నాకు లోబడి విధేయతతో ప్రవర్తించారు. ఆ క్రమశిక్షణ వారిని అనేక ప్రమాదాల నుండి తప్పించింది. నేను వారి తండ్రిని గనుక నేడు వారు పెద్దవారైనప్పటికీ అప్పుడప్పుడు వారికి సలహాలిస్తూఉంటాను. అదేవిధంగా దేవుడు మన హృదయాల్లో ఎవరిగూర్చి భారము పెడతాడో వారికి మనము ఆత్మీయ తండ్రులుగా ఉండాలి.


నీవు వారికి తండ్రిగా ఉండేందుకు ఇష్టపడితేనే దేవుడు నీ మందకోసమైన ప్రవచనాత్మక వాక్యమును అనుగ్రహిస్తాడు. మందకోసం అవసరమైన వాక్యాన్ని దేవుడు నీకు ఇవ్వకముందు మందను నీ హృదయముతో మోసుకొని దైవసన్నిధిలో ఉంచాలి. పౌలు ప్రతి సంఘానికి లేఖ వ్రాశాడు. ఎందుకంటే అతడు వారిని తన హృదయములో ఉంచుకొని (ఫిలిప్పీ 1:7 లో చెప్పిన ప్రకారము) వారికోసం అనుదినం ప్రార్థించాడు. నీ మందకోసం నీకు భారము, బాధ్యత లేని పక్షములో నీవు జీతము కోసం పనిచేసే వృత్తిపరమైన పాస్టరుగా(కాపరిగా) మాత్రమే ఉంటావు.


ప్రజల ఆత్మలను గూర్చి ''లెక్క'' అప్పజెప్పటమంటే ఏమిటి? ''లెక్క'' అనే మాట ఆర్థికపరమైన పదము. నీ ఆదాయము,ఖర్చుల బ్యాలెన్స్‌ షీట్‌ తయారు చేస్తున్నప్పుడు అందులో ఎడమవైపున ఆదాయం 5000 రూపాయలు, కుడివైపున ఖర్చు 4999 రూపాయలు మాత్రమే ఉంటే ఆ లెక్క తప్పు. తేడా ఒక్క రూపాయి మాత్రమే కావచ్చు. అయినప్పటికీ ఆ లెక్క తప్పే. ఆ ఒక్క రూపాయికి కూడా నీవు లెక్క వ్రాయాలి. ఎందుకంటే లెక్కలు వ్రాయడం అనేది ఎంతో ఖచ్చితత్వముతో కూడుకున్న శాస్త్రము. అందుచేత దేవునికి లెక్క అప్పజెప్పటమంటే నీ మందలోని పరిస్థితులు ఆత్మీయముగా ఎలా ఉన్నాయో వాస్తవస్థితి నీకు తెలిసిఉండాలి. నీవు ఈ విషయాన్ని అతి తీవ్రముగా పరిగణించాలి. ఎందుకంటే ఆత్మీయ నాయకత్వమనేది ఆసుపత్రిలో అతిక్లిష్టమైన శస్త్ర చికిత్స చేయటంకంటే తీవ్రమైన విషయము. జీవితాలు నిత్యత్వం కోసం ప్రమాదకరమైన స్థితిలో ఉంటాయి.


నీ సంఘములోని విశ్వాసుల విషయంలో నీవు బాధ్యుడివి. నీవు వారిని ఆత్మీయముగా మార్చలేవు. అయితే వారు ప్రభువుతో సజీవ సహవాసము చేయుటకు అవసరమైన ప్రతీది నీవు చేయాలి. వారిలో ''ప్రతిఒక్కరినీ పరిపూర్ణముగా క్రీస్తులో సమర్పించుట''యే నీ గురియై యుండాలి (కొలస్సీ 1:28). వెనక్కుజారిపోకుండా వారిని నీవు ఆపలేవు. అయితే వారు వెనుకబడిపోకముందే నీవు వారిని హెచ్చరించాలి.


ఒకసారి మా సంఘములో యౌవనస్థుడు వెనుకకు జారిపోయినప్పుడు నేనెంతో కలతచెందాను. ఎందుకిలా జరిగింది. నా పక్షంగా ఏదైనా పొరపాటు జరిగిందా- అతని జీవితంలో జరుగుతున్న విషయాల గురించి నేను పట్టించుకోలేదేమో ఒక హెచ్చరిక మాట గానీ, ప్రోత్సాహక వాక్యముగానీ నేనతనికి చెప్పవలసి ఉండిందా? అని నేను ప్రభువును అడిగాను. నన్ను నేను తీర్పు తీర్చుకున్నాను, ఎందుకంటే ఆ యౌవన జీవితము విషయంలో నేను దేవునికి జవాబుదారిని.


మన అధికారము క్రిందవున్నవారెవరైనా పడిపోయినప్పుడు మనల్ని మనము విమర్శించుకోవాలి. దీనిగూర్చి మనము శిక్షావిధికి గురికానవసరము లేదు. అయితే దీని ద్వారా దేవుడు మనకేదైనా చెప్పవలసి ఉందేమో మనము ఆయన్ని అడగాలి. ''అపరాధ భావము'' తో మనల్ని సాతానుడు త్రిప్పుటకు వాడిని మనము అనుమతించకూడదు. భవిష్యత్తుకోసం మన తప్పులనుండి మనము పాఠాలు నేర్చుకోవాలి.


మన మానవ జ్ఞానము ఎన్నడూ చూపలేని విషయాలను దేవుడు మనకు చూపగలడు. దేవుని స్వరమునకు మనము స్పర్శ కలిగివుంటే, జారిపోతున్నవారిని ఉద్దరించుటకు దేవుడు ముందే మనల్ని పురికొల్పుతాడు. ఒక రోజున, ఏకారణము లేకుండానే ఎవరినో ఒకరిని దర్శించమని మనకు చెప్పవచ్చు. ఇటువంటి అనుభవాలు నాకు కొన్ని ఉన్నాయి. ఒక వ్యక్తిని ఎందుకు దర్శించాలో సాధారణంగా నాకు కారణభూతమైన ఆధారమేమీ ఉండదు; ఎందుకంటే దేవుడు ఇతరుల పాపములు గానీ, సమస్యలుగానీ నాకు బయలు పరచడు (ఇతరుల పాపములేమిటో తెలుసుకోవటంచేత నా మనస్సును కలుషితంచేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుచేత ఈ విషయంలో నేను దేవునికి కృతజ్ఞుడను). ఆ తరువాత దేవుడు ఆ సహోదరునితో ఏదో ఒక విషయం చెప్పమని నన్ను ప్రేరేపిస్తాడు. అతని సమస్య ఏమిటో నాకు తెలియక పోయినప్పటికీ నేను చెప్పే మాటలు అతనికి సహాయ పడవచ్చు. నేను అతనికి సహాయంచేశాననే విషయం కూడా సాధారణంగా నాకు తెలియదు.


దేవుని స్వరం వినే అలవాటు మనకుంటే, అవసరంలో ఉన్నవాళ్ళను కలుసుకొని, సహవసించి, వారి అవసరత తీరుటకు కావలసిన మాటను పంచుకొనేలా దేవుడే మనకోసం పరిస్థితుల్ని కల్పింపజేస్తాడు.


ప్రభువైన యేసు ఈ విధముగానే జీవించారు (యెషయా 50:4 లో చదువుతాము). తండ్రియైన దేవుడు యేసుతో ప్రతిదినము మాట్లాడుతూ, అలసిపోయినవారికి అందించుటకు మాటల్ని ఆయనకు అనుగ్రహించాడు. అటువంటి నాయకులముగా మన మందరము తయారు కావాలి.


నేను నౌకాదళములో పనిచేస్తున్నపుడు మా ఉద్యోగ విధుల సమయవిధానాన్ని ''వాచెస్‌'' (వీక్షణలు) అని పిలిచేవారు. ఒక్కొక్క షిఫ్ట్‌ నాలుగు గంటల వ్యవధితో ఉంటుంది. ఆ సమయములో అధికారులు తమ విధినిర్వహణలో అతి ''జాగ్రత్తగా వీక్షిస్తూ'' ఆ ఓడపై జరుగుతున్న ప్రతిదానికీ బాధ్యులవుతారు. ఒకవేళ నా ''వాచ్‌'' అయితే సముద్రములో ఓడపై అర్ధరాత్రినుండి ఉదయం 4 గంటల వరకు నేను, ఇద్దరు లేక ముగ్గురు నావికులతో ఓడ బ్రిడ్జిపై (ఓడ పైభాగము) నిలబడి ఉండేవాడను. ఓడలో ఉన్న మిగిలిన వారందరు గాఢనిద్రలో ఉంటారు. నేనైతే మా మార్గాన్ని దాటి వెళుతున్న ఇతర నౌకలను గమనిస్తూనే మా నౌక సరియైన మార్గములో ఉన్నదో లేదో కాపాడుతూవుండాలి. గాలి మరియు అలల వలన జరిగిన నౌకకు నేను దిశా నిర్ధేశములలో మార్పులు చేయాలి. ఆ 4 గంటలు నావిధిలో నౌక భద్రత, నౌక పయనిస్తున్న దిశ, ఇవే నాముఖ్య బాధ్యతలు. నా ''వీక్షణ విధి''లో ఒక్కనిమిషము కూడా నేను నిద్రించలేను.


అందుచేత ఇతరుల గూర్చి ''జాగ్రత్తగా గమనించండి'' అని బైబిలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా తీవ్రమైన విషయం. ప్రజలు దారితప్పి దూరముగా పోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా వారి జీవితాలను జాగ్రత్తగా గమనించుటకు ఒక ఆత్మీయ నాయకునికి మెళకువకావాలి.


ప్రతి మంచి ఆసుపత్రిలోనూ ''ప్రతిదిన పర్యవేక్షణావిధానము'' అమలులో ఉంటుంది. డాక్టర్లు రోగులను దర్శించి వారి పరిస్థితిని పరీక్షిస్తారు. ఆ డాక్టర్లు ఏదో పైపైన మాత్రమే వార్డులను దర్శించి రోగులంతా ఆరోగ్యవంతులుగానే కనబడుతున్నారని నిశ్చయంగా చెప్పరు. అలాకాక, ప్రతి రోగిని విడివిడిగా పరీక్షిస్తారు.


కానీ చాలామంది పాస్టర్లు(కాపరులు) చేస్తున్నదేమిటి? తమ సంఘాల్లో విశ్వాసులందరినీ ఆదివారం ఉదయాన అలా చూచి అందరూ ఆత్మీయముగా ఆరోగ్యంగానే ఉన్నారని నిర్ణయిస్తారు.


అయితే చాలామంది బాహ్యంగా చాలా ఆరోగ్యవంతులుగానే కనబడేవారు, వాస్తవానికి అంతర్గతంగా భయంకర వ్యాధితో బాధపడుతుంటారు- ఆసుపత్రుల్లో గానీ, సంఘాల్లోగానీ, పరిస్థితి ఇదే. ఆరోగ్యవంతులుగా కనిపించే చాలామంది, క్యాన్సర్‌ కలిగియుండి వారి లోపలి భాగాలను అది తినివేస్తూ ఉండొచ్చు. మీ సంఘములో ఆనందంగా కనబడుతూ హల్లెలూయ అంటూ చప్పట్లు కొడుతూ గట్టిగా అరిచేవారి కుటుంబ జీవితాల్లో తీవ్ర సమస్యలు ఉండొచ్చు.


డాక్టరు ప్రతిరోగిని ఎలా వ్యక్తిగతంగా పరీక్షిస్తాడో ఒక ఆత్మీయ నాయకుడు విడివిడిగా ప్రతి ఆత్మను పరీక్షించాలి (మెళకువగా గమనిస్తుండాలి).


''వారి మందల పరిస్థితిని బాగుగా తెలిసికొనుము'' (సామెతలు 27:23) అని బైబిలు కాపరులకు చెబుతోంది.


సంఘములో సంఖ్య పెరుగుతూ ఉండగా నాయకుడు చేయవలసిన ఏకైక కార్యము - తన అధికారము క్రింద ఉన్న ఆత్మలను పర్యవేక్షించుటయే(మెళకువగా ఉండి గమనించడమే). దీనిని చేయుటకు గాను సుశిక్షితులైన నమ్మకమైన పనివారికి బాధ్యత అప్పగించాలి.


సంఖ్యకుమించి ప్రజలను విడివిడిగా, వ్యక్తిగతంగా సంరక్షించుట ఏ ఒక్క వ్యక్తికైనా అసాధ్యమైనపని. పన్నెండు మందిని మాత్రమే పర్యవేక్షించగలమని నా సొంత ఆలోచన - ఎందుకంటే యేసు పన్నెండుమందిని మాత్రమే శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. డాక్టరు ఎంత నిష్ణాతుడైనప్పటికీ అతడొక్కడే ఆసుపత్రిలోని అనేక వార్డులను పర్యవేక్షించలేడు. మనందరికీ భౌతికమైన హద్దులున్నాయి.


అపొస్తలుల పరిచర్య, అనేక సంఘాల భాధ్యత ఉన్న నాయకులకు తమ సంఘములలోకి సంఘ పెద్దలందరి పరిస్థితి బాగా తెలిసివుండాలి. సంఘములోని పెద్దలు ఆత్మీయముగా ఉంటేచాలు. సంఘాలన్నీ ఆత్మీయముగానే ఉంటాయి.


దురదృష్టవశాత్తు చాలా మంది పాస్టర్లు(కాపరులు), సంఘ పెద్దలు అవుట్‌ పేషెంటు క్లినిక్‌ లో రోగుల్ని పరీక్షించే డాక్టర్లవలె ప్రవర్తిస్తారు. ఆ డాక్టర్లు మందులు వ్రాసి రోగులను పంపి వేస్తుంటారు. రోగుల్ని నిజంగా పట్టించుకోరు. వాస్తవానికి వారు బ్రతికున్నారా, చనిపోయారా అని కూడా వారు తెలుసుకోరు!


ఒక ఆత్మీయ నాయకుడు ఏవిధముగానైనా సరే, తన అధికారము క్రింద ఉన్న ఆత్మల విషయంలో ఎంతో తీవ్రముగా బాధ్యత వహిస్తాడు.


అధ్యాయము 8
జీవము ద్వారా పరిచర్య

ఒక ఆత్మీయ నాయకుడు తన జీవము(జీవితము)తో ఇతరులకు పరిచర్య చేస్తాడు తన మేధస్సుతో కాదు.


పాత నిబంధన కాలములో దేవుడు వారి రహస్య జీవితములు అపవిత్రముగా ఉన్న వారిని కూడా ఉపయోగించుకున్నాడు. పాపములో జీవిస్తున్నాకూడా సమ్సోను ఇశ్రాయేలీయులను శత్రువులనుండి విడిపించగలిగాడు. అతడు వ్యభిచారము చేసినప్పటికీ దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోలేదు. తన తల వెంట్రుకలు గొరిగించుకొని దైవ నిబంధన అతిక్రమించినప్పుడు మాత్రమే దైవాభిషేకము అతణ్ణి విడిచిపెట్టింది. దావీదుకు చాలామంది భార్యలున్నారు అయినప్పటికీ దైవాభిషేకము అతని మీద నిలిచింది, అతడు లేఖనాలు కూడా లిఖించాడు.


అయితే నూతన నిబంధనలో పరిచర్య పూర్తి భిన్నముగా ఉన్నది. పాత నిబంధన కాల పరిచర్యకూ నూతన నిబంధన కాల పరిచర్యకు గల వ్యత్యాసమును 2 కొరింథీ 3 వ అధ్యాయం తెలియజేస్తుంది. ప్రాథమికమైన భిన్నత్వము ఇదే: పాత నిబంధన కాలంలో యాజకులు ధర్మ శాస్త్రమును జాగ్రత్తగా పఠించి లేఖనాలలో దేవుడేమి చెప్పాడో ప్రజలకు నేర్పించారు. అయితే క్రొత్త నిబంధనలో తన అంతరంగ జీవితంనుండి దేవుని వాక్యమును మాట్లాడుతూ, తండ్రియైన దేవునితో నడచిన యేసును మనం అనుసరిస్తాము. మన జీవితము (జీవము)నుండి బోధించుటకు, మన సొంత జ్ఞానముతో బోధించుటకును మధ్య వ్యత్యాసం ఉంది.


ఈనాడు భారతదేశములోని అత్యధిక విశ్వాసుల జీవితాల్లో ఖాళీ తనము చోటుచేసుకున్నదంటే వారి నాయకుల జీవితాలు కూడా ఖాళీతనం కలిగివుండుట చేతనే. నాయకుడి జీవితం -అంటే అతని ఆలోచనా జీవితం, భార్యతో అతని సంబంధం, పిల్లలతో, తోటి పనివారితో సంబంధ బాంధవ్యాలు శరీరానుసారముగా ఉన్నందున ప్రజల జీవితాలు కూడా శరీరానుసారముగానే ఉన్నాయి. అటువంటి నాయకుల పరిచర్య కేవలం చెదురుమదురు సమాచారముగా మాత్రమే ఉంటుంది. ఇది పాత నిబంధన పరిచర్య.


ఏ బోధకుడైనా కేవలము సమాచారం మాత్రమే అందిస్తున్నట్లయితే అతడు పాత నిబంధనానుసారమైన బోధకుడు మాత్రమే. అతడు అందించే సమస్త సమాచారం ఖచ్చితమైనది గానే ఉండొచ్చు. అయితే అతడు జీవమును అందించకపోతే ఆ బోధకుడు క్రొత్త నిబంధనానుసారమైన పరిచారకుడు కాదు. పాతనిబంధన అక్షర నిబంధన, కానీ నూతన నిబంధన జీవ నిబంధన, అక్షరము చంపును. అయితే ఆత్మ జీవింపజేయును.


దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పాటించుటకు ఆజ్ఞలను అనుగ్రహించాడు. అయితే క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు అనే వ్యక్తిలో దేవుడు మనకొక మాదిరి అందించాడు. ఆయన జీవమే మనుష్యులకు వెలుగు. ఈనాడు వెలుగు అనేది ఒక సిద్ధాంతము లేక ఒక బోధకాదు కానీ మన ద్వారా ప్రభావితమయ్యే యేసు జీవమే. అది సౌవార్తీక సిద్ధాంతమైనా సరే. పైన పేర్కొన్న సత్యము కానిదేదైనా అంధకారము మాత్రమే.


పాత నిబంధనలో కీర్తనలు 119:105 ప్రకారము దేవుని లిఖిత వాక్యమే వెలుగని చూస్తున్నాము. అయితే వాక్యము శరీర ధారియై యేసే లోకానికి వెలుగయ్యాడు (యోహాను 8:12). ఆయన జీవము మనుష్యులకు వెలుగుగా ఉన్నది (యోహాను 1:4). అయితే ఈ భూలోకంలో ఉన్నంత కాలమే తాను ఈ లోకమునకు వెలుగుగా ఉంటానని యేసు తన శిష్యులతో చెప్పాడు (యోహాను 9:5). ఆయన ఇప్పుడు పరలోకమునకు వెళ్ళి ఈ లోకములో వెలుగుగా మనల్ని ఉంచాడు (మత్తయి 5:14) అందుచేత మన జీవితాలతో లోకానికి వెలుగును చూపించే గొప్ప బాధ్యత మన మీద ఉంది.


ఒక సంఘము తన నాయకుని వలె ఉంటుంది. ప్రకటన 2,3 అధ్యాయములలో ఏడుసార్లు కూడా ప్రభువు సంఘ దూతకు ఏదైతే చెప్పాడో సంఘమునకు కూడా అదే వర్తమానము చెప్పినట్లు మనము చూస్తాము. ప్రతి వర్తమానము కూడా ఆత్మ ఆ సంఘముతో చెప్పుచున్న మాటగా ముగించబడినది. అక్కడ అయిదు సంఘముల దూతలు (పెద్దలు) శరీరానుసారముగా ఉన్నారు, వారి సంఘములు కూడా శరీరానుసారముగా ఉన్నాయి మరియు అక్కడ రెండు సంఘముల దూతలు (పెద్దలు) ఆత్మీయముగా ఉన్నారు, వారి సంఘములు కూడా ఆత్మీయముగా ఉన్నాయి. లవొదికయ సంఘ దూత (పెద్ద) నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతని సంఘము కూడా నులివెచ్చగానుంది. ఫిలదెల్ఫియా సంఘదూత (పెద్ద) విశ్వాస్యత కలిగియున్నాడు గనుక అతని సంఘము కూడా అదేవిధముగా ఉంది.


ఆది కాండము 1 వ అధ్యాయములో ''వాటివాటి జాతుల ప్రకారం'' అను పదము తరచుగా వస్తుంది. ఫలవృక్షములు ఫలములను, విత్తనములు చెట్లను, చేపలు, పక్షులు, మృగములు, ప్రాకు పురుగులు వాటివాటి జాతులననుసరించి పునరుత్పత్తి చేస్తున్నట్లుగా చదువుతాము (11,12,21,25). సృష్టిలో ప్రతి ఒక్కటి తన జాతిననుసరించి ఉత్పత్తి జరిగిస్తుంది.


దేవుడు ఆదామును ''తన పోలిక చొప్పున'' సృజించాడు (ఆది 5:1) అయితే ఆదాము ''తన స్వరూపమునందు'' ఒక కుమారుని కన్నాడు (ఆది 5:3). అతడు దేవుని స్వరూపములో కుమారుని కనలేకపోయాడు. తన జాతిననుసరించి మాత్రమే కనగలిగాడు.


ఆత్మీయముగా కూడా మనమందరము మన జాతిననుసరించి, మన పోలిక చొప్పున పిల్లల్ని కంటాము. ఒకవేళ మనము మేధావులమైతే మన పరిచర్య ద్వారా మనము మేధావులైన వారినే తయారు చేస్తాము. మనం పిసినిగొట్టులమైతే పిసినిగొట్టులనే తయారుచేస్తాము. మనము అహంకారులము, గర్వాంధులమైతే మన పరిచర్య ద్వారా గర్విష్టులనే తయారుచేస్తాము. మనము సేవకుని స్వభావము కలిగియున్నట్లయితే, మన ఆత్మీయ సంతానము కూడా సేవకుని స్వభావము కలిగియుంటారు.


అయినప్పటికీ, ఒక్కోసారి అరుదుగా ఎవరైనా సహోదరుడు తన నాయకుని ప్రభావము నుండి (రూపము నుండి) బయటపడి, తనంతటతానే దేవుణ్ణి వెదకి, తన నాయకుడు శరీరానుసారుడిగా ఉన్నప్పటికీ, ఆ సహోదరుడు ఆత్మీయుడిగా మారతాడు.కాని ఇటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణముగా చెప్పాలంటే, అనేకమంది విశ్వాసులు వారి నాయకుని గ్రుడ్డిగా అనుసరించే గొఱ్ఱెలవలె ఉంటారు. బోధకుడు ఏ విధముగా నున్నాడో ప్రజలు కూడా అదే విధముగా ఉంటారు. నాయకుడు మరియు గొఱ్ఱెలు ఇరువురూ గ్రుడ్డి వారైతే, వారిరువురూ గుంటలో పడతారు.


మీ సంఘ విశ్వాసులు బయటకి వెళ్ళి వారి పోలిక చొప్పున ఇతరులను తయారుచేస్తారని జ్ఞాపకముంచుకొనండి. అటుతరువాత మీ పోలిక చొప్పున మీ పిల్లల పిల్లలు కూడా కలుగుతారు. అందుచేత మీరు ఎటువంటి పిల్లల్ని తయారుచేయబోతున్నారో ఇప్పుడే జాగ్రత్తపడుట మంచిది- ఎందుకంటే ఈ పద్ధతి యేసు తిరిగి వచ్చేదాకా కొనసాగుతూనే ఉంటుంది.


కాబట్టి ఆరంభములోనే మీ సంఘంలో మీరు కేవలం మత మార్పిడి చెందిన వారినే గాక శిష్యులను తయారు చేసేలా ఖచ్చితంగా చూచుకోవటం ముఖ్యము. ఈ పని చేయాలంటే మొట్టమొదట నీవు శిష్యుడవై యుండాలి. ఇతరులకు అందించుటకు గల జీవితం నీవు కలిగి ఉండాలి.


మతస్థులు బయటకి వెళ్ళి ఇతరులను, మతస్థులుగా మారుస్తారు. ఆ మతస్థులు వెళ్ళి ఇంకా ఎక్కువ మందిని మతస్థులుగా మారుస్తారు. అటువంటి మతస్థులు రక్షణ సందేశం అర్థం చేసుకుంటారేమో గాని ప్రభువును వెంబడించాలనే ఆశ వారిలో ఉండదు. వారిలో జ్ఞానము ఉంటుంది గానీ జీవముండదు. అయితే నీవు శిష్యులను తయారుచేస్తే ఆ శిష్యులు వెళ్ళి ఇంకా ఎక్కువ మందిని శిష్యులుగా చేస్తారు. అందుచేత ఇతరులకు జీవమును అందించుట ప్రాథమిక విషయము.


పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారము సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఆ ప్రత్యక్ష గుడారములో మీకు తెలిసిన విధంగానే మూడు భాగాలున్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతిపరిశుద్ధ స్థలము (దేవుడు నివసించు చోటు), గుడారపు ఆవరణములోని ప్రజలు అప్పుడే పాపములు క్షమించబడిన నూతన విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నారు. స్థానిక సంఘములో వారు ఎటువంటి బాధ్యత కూడా చేపట్టరు. వారు ప్రార్థనా సమావేశాలకు వస్తారు. వాక్య సందేశాలు వింటారు. కానుకలు సమర్పిస్తారు. రొట్టె విరుస్తారు. ఇంటికి వెళ్తారు. పరిశుద్ద స్థలములో ఉన్నవారు సంఘములో ఏదోవిధముగా సేవ చేయాలని ఆశించేవారు - దీప స్తంభమును వెలిగించు, బలిపీఠముమీద ధూపము వేయు లేవీయులవలె వారు ఉందురు. అయితే అతి పరిశుద్ధ స్థలములో ఉండువారు నూతన నిబంధనలో ప్రవేశించువారు. వీరు దేవునితో సహవాసము చేయాలని ఆసక్తిగల వారు. ఏక శరీరముగా ఇతర విశ్వాసులతో ఐక్యత కోరుకునే వారు. వీరు తమ జీవితాలతో(జీవముతో)దేవుని పరిచర్య చేస్తూ నిజమైన సంఘాన్ని నిర్మిస్తారు. కార్యాత్మక సంఘానికి నాంది పలుకుతారు. క్రీస్తు శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచేందుకు సాతానుతో సమరం చేస్తారు కానీ అనేక సంఘాల్లో ఇటువంటి కీలక గుంపుకు చెందినవారు లేరు.


ప్రతి సంఘములోనూ-అది శ్రేష్టమైనదైనా, చెడ్డదైనా కూడా- ఆవరణములో కూర్చొనేె వారు ఒకే విధముగా ఉంటారు- వారు అర్థ హృదయులు, లోకానుసారులు, వారి స్వంతమును వెదకేవారు, ధనాశపరులు, మరియు సుఖభోగాసక్తులుగా ఉంటారు. కాని శ్రేష్టమైన (మంచి) సంఘములో భక్తిపరులైన బలమైన అంతరంగిక నాయకులు ఉంటారు. ఈ కీలకమైన నాయకులే సంఘము ఏ దిశగా వెళ్ళాలో నిర్ణయిస్తారు.


సాధారణముగా ఈ కేంద్ర కూటమి పరస్పర ఐక్యతతో వర్ధిల్లుతున్న ఇద్దరు వ్యక్తులతో ఆరంభమవుతుంది. దేవుడు వారితో ఉంటాడు. ఆ కూటమి అంతకంతకు పరిమాణంలోనూ, ఐక్యతలోనూ ఎదుగుతుంది. మానవ శరీరముకూడా తల్లి గర్భములో రెండు సూక్ష్మ విభాగముల కలయికతో ఆరంభమవుతుంది. ఆ చిన్న పిండము పెద్దగా పెరుగుతుండగా కణములన్నీ ఐక్యతలో నిలిచిపోతాయి. అయితే ఎప్పుడైనా ఆ కణములు ఒకదానినుండి మరొకటి విడిపోతే అది ఆ పసిపాపకు అంతమే!


క్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా స్థానిక సంఘనిర్మాణము కూడా ఇదే విధానములో జరుగుతుంది. ఆ కీలక గుంపు విడిపోయినపుడు సంఘము యొక్క బాహ్యనిర్మాణము ఓ సంస్థలా అలాగే కొనసాగినప్పటికీ, నిజమైన సంఘము యొక్క అంతము అదే!


పాతనిబంధనతో క్రొత్త నిబంధన భిన్నత్వమును వ్యక్తపరిచేది క్రొత్తనిబంధన గ్రంధమంతటిలో ఒక్క హెబ్రీ పుస్తకమే. దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులకు హెబ్రీ పత్రిక అంతగా ప్రముఖమైన పుస్తకము కాదు. రోమా పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రికలు పరిచయమైనంతగా హెబ్రీ కాలేదు. దీనికి గల కారణం - హెబ్రీ పత్రికలో మాంసము ఉన్నది గానీ పాలు లేవు. చాలామంది విశ్వాసులకు మాంసము తినుటకు అవసరమైన ''పళ్ళు'' ఇంకా రాలేదు. వారింకా పసిపాపలు గానే ఉన్నారు. పూర్వము దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు కానీ ఇప్పుడు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడని, హెబ్రీ పత్రికలోని మొట్టమొదటి వాక్యము చెబుతుంది. పాతనిబంధన అంతా, ''నీవు ఇది చేయుము'', ''నీవు ఇది చేయకుము'' అను హెచ్చరికలతో మిళితమైన దేవుని ఆజ్ఞల సమాచారమును తెలియజేస్తుంది. అయితే నూతన నిబంధన తన కుమారుని ద్వారా దేవుని జీవమును వ్యక్త పరుస్తుంది.


అందుచేతనే తండ్రి, యేసును ఈ లోకానికి ఒక శిశువుగా పంపాడు. యేసును ఒక సంపూర్ణముగా ఎదిగిన మనిషిగా ఈ లోకానికి పంపుట దేవునికి కష్టమైన పనికాదు. బాల్యము నుండే మనము ఎదుర్కొనే అనుభవములు, శోధనలు ఎదుర్కొని చూడాలని ఆయనను ఒక శిశువుగా పంపాడు.


చాలామంది క్రైస్తవులు యేసు చేసిన మూడున్నర సంవత్సరాల పరిచర్య, కల్వరిలో ఆయన మరణము గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. యేసు నజరేతులో 30 సంవత్సరాలు ఎలా గడిపాడు అనే విషయం గూర్చి 99 శాతము విశ్వాసులు ఎన్నడూ ఆలోచించరని నేను చెప్పటం సబబేనని నా భావన. ఆయన జన్మము గూర్చి తలంచుతారు. ప్రతి సంవత్సరము పండుగ కూడా చేస్తారు. ఆయన మరణ, పునరుత్థానాలను గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరము వాటిని పండుగలుగా జరుపుకుంటారు. ఆయన చేసిన అద్భుతాలను గూర్చి ఆలోచిస్తారు. అంత మాత్రమే చేస్తారు. యేసు క్రీస్తు యొక్క జీవితములోని అధికభాగమును గూర్చి దాదాపుగా ఎవరూ ఆలోచించరు - ముప్పైమూడున్నర సంవత్సరాల జీవితంలో మూడున్నర సంవత్సరాల పరిచర్య కేవలం 10 శాతము మాత్రమే. ఆయన జననం, మరణం రెండు రోజుల్లో జరిగిన సంభవాలే. తన జీవిత కాలమంతటిలో ఎక్కువ భాగము 30 సంవత్సరాలు పాటున ఆయన నజరేతులో గడిపాడు.తన పరిచర్య మొత్తం 30 సంవత్సరాల మీదనే ఆధారమైవుంది. తన పరిచర్యలో ప్రసంగించిన సందేశాలన్నీ సిద్ధం చేసుకునేందుకు ఆయనకు 30 సంవత్సరాల కాలం పట్టింది. ఈనాటి బోధకులు ప్రసంగాలు తయారు చేసుకున్నట్టుగా సిద్ధపడి ఆయన కొండ మీద ప్రసంగం బోధించలేదు. గంటల తరబడి కూర్చొని, ఎంతోసేపు అధ్యయనం చేసి అనేక గ్రంథాలు తిరగవేసి ముచ్చటగా మూడు తలంపులను ఆకర్షణీయముగా కాగితంపై వ్రాసుకోలేదు!! అలాకాదు, ఆ ప్రసంగము తన జీవితము నుండి వెలువడింది. దానికి 30 సంవత్సరాలు పట్టింది. అందుకనే ఆ సందేశము శక్తివంతమైనది. అందుచేతనే ఆయన మాట్లాడిన తీరులోని అధికారమును చూచిన ప్రజలు ఆశ్చర్యపోయారు (మత్తయి 7:28,29).


దేవుడు యిర్మీయా ప్రవక్తతో, నియమితరోజుల్లో మాత్రమే మాట్లాడినట్లు మనము పాతనిబంధనలో చదువుతాము. దేవుడు మాట్లాడిన విషయాన్ని యిర్మీయా తన లేఖకుడు (శాస్త్రి)యైన బారూకునకు చెప్పగా సరిగ్గా అలాగే అతడు వ్రాసి పెట్టాడు. ఇదే విధంగా దేవుడు యెహెజ్కేలుతో ఆయా సమయాల్లో మాత్రమే మాట్లాడి అతడు యూదా ప్రజలతో ఏమి చెప్పాలో తెలియజేసాడు. సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగానే దైవసందేశాన్ని యెహెజ్కేలు ప్రజలకు అందించాడు. అది బాగుంది. ఈనాటి సందేశాలు ఆ విధంగానైనా వుంటే అది గొప్పే!


అయితే నూతన నిబంధన పరిచర్య ఇంకా శ్రేష్టమైనది! దేవుడు పాత నిబంధన ప్రవక్తలతో మాట్లాడినట్లు యేసుతో ఆయా రోజుల్లో మాత్రమే మాట్లాడలేదు. దేవుడు యేసుతో ప్రతిరోజూ మాట్లడగా, యేసు ప్రతిరోజు తన జీవము (జీవితం) నుండి ప్రజలతో మాట్లాడాడు. ఆయన పరిచర్య తన జీవము (జీవితము) నుండి ప్రవహించినది. ''కడుపులో నుండి జీవజలనదులు పారును'' (యోహాను 7:38) అను వాక్యానికి అర్థం ఇదే.


ఈ వెలుగులో నీవు నీ సంఘములో పాతనిబందన మతస్థులను తయారుచేస్తున్నావో లేక క్రొత్త నిబంధన శిష్యులను తయారు చేస్తున్నావో నిన్ను నీవు ప్రశ్నించుకొనుట మంచిది. దీనికి లభించే జవాబుపై నీవు పాతనిబంధన పరిచారకుడివో లేక క్రొత్త నిబంధన సేవకుడివో అను విషయం ఆధారపడి ఉంటుంది.


పాత నిబంధన ప్రవక్త ఒక వార్తాహరుడు(వర్తమానికుడు) మాత్రమే. ఒక సందేశం అందించేందుకు నీకు కావాల్సిందల్లా మంచి జ్ఞాపకశక్తి మాత్రమే. కానీ నూతన నిబంధనలో ఇతరులకు అందించుటకు సందేశాలను కాదుగానీ తన జీవమును అనుగ్రహిస్తున్నాడు. అందుచేత నీకు కావాల్సింది మంచి జ్ఞాపక శక్తి కాదుగానీ మంచి జీవము - దేవుని జీవము.


ఈ వ్యత్యాసాన్ని ఒక సాదృశ్యము ద్వారా వివరిస్తాను. ఒక కుళాయి నుండి ఓ గ్లాసు మంచినీళ్ళు తీసుకొని (దేవుని నుండి సందేశము పొంది) వాటిని బయట పారబోసినట్లయితే ఇది పాతనిబంధన పరిచర్యకు ప్రతీక. మళ్ళీ వెళ్ళి మరో గ్లాసు నీళ్ళు అదే కుళాయి నుండి తీసుకొని (మరో సందేశం పొంది) ఆ నీటిని కూడా పారబోయుట వంటిది.


కానీ నూతన నిబంధనలో మన కడుపులనుండి పారెడి నీటి బుగ్గగా (యేసు జీవము) అది అందించబడింది. అది మనలో నుండి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక్క సందేశం పొందటానికి మనం మాటిమాటికి దేవుని దగ్గరకు వెళ్ళనవసరంలేదు. మనలనే ఒక సందేశముగా ఆయన చేస్తాడు. మన జీవితమే ఒక సందేశము మరియు అందులో నుండి మనము మాట్లాడతాము.


చాలా మంది క్రుమ్మరింపు పరిచర్య చేస్తుంటారు. కొందరు తాము పారబోసిన తరువాత అందించుటకు వారి దగ్గర మరేమి ఉండదు. మరికొందరైతే ఇచ్చేందుకు ఎంతోకొంత కలిగివుంటారు. అయితే ఈ ఇరువురు ఇంకా పారబోస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఇరువురు ఎండిపోతారు.


నిత్యజీవపు ఊటలు నిరంతరం ప్రవహించేలా నీటిబుగ్గను ఉంచుతానని యేసు సమరయ స్త్రీతో చెప్పారు (నిత్యజీవమనగా - దేవుని జీవమే).


మనలోనుండి ప్రవహించాల్సినది జీవమే కాని సందేశం కాదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇదే క్రొత్త నిబంధన పరిచర్య.

అధ్యాయము 9
దేవుని యొక్క శక్తి చేత సేవించుట

ఒక ఆత్మీయ నాయకుడు తన పరిచర్య అంతటినీ దైవ చిత్తానుసారంగానూ దేవుని శక్తితోనూ, దేవుని మహిమార్థమే జరిగిస్తాడు. కాబట్టి అటువంటి పరిచర్య బంగారము, వెండి, వెలగరాళ్ళు పరీక్షించబడు విధముగా ఆఖరుగా అగ్ని పరీక్షకు నిలుస్తుంది (1 కొరింథీ 3:12-15).


దేవుడు మనకు సామర్థ్యము కలుగజేయనియెడల మనమెన్నడూ నూతన నిబంధన పరిచారకులము కానేరమని 2 కొరింథీ 3:5,6 లో పౌలు చెబుతున్నాడు. ఒక ఆత్మీయ నాయకుడు దేవుడు కలుగజేసిన సామర్థ్యముతో సేవిస్తాడు గనుక తాను చేస్తున్న పని విషయంలో ఎటువంటి గొప్పతనాన్ని పొందలేడు.


నిజముగా దేవుని జీవము మనలో ప్రవహిస్తూ, ఇతరులను ఆశీర్వదిస్తు న్నప్పుడు,దానిని గూర్చి మనము ఘనతపొందలేము - ఎందుకంటే మనము తయారుచేయనిదాని విషయంలో అతిశయించలేము!


ఉదాహరణకు, ఎవరో తయారు చేసిన కేకును నేనిక్కడకు తెచ్చి మీ అందరికి పంచిపెడితే మీరందరూ నన్ను మెచ్చుకుంటూ ''బ్రదర్‌ జాక్‌, నిజంగా ఇది అద్భుతమైన కేకు'' అని చెబితే - నేను గర్వించుటకు కనీసం శోధింపబడను కూడా, ఎందుకంటే ఆ కేకును తయారు చేసింది నేను కాదు! ఎవరో తయారు చేసిన కేకును నేను పంచిపెట్టాను అంతే. కానీ ఆ రొట్టెను నేనే తయారు చేస్తే ఆ విషయంలో మంచి పని చేశానని నేను గర్వించగలను. అయితే ఎవరో తయారుచేసిన దానికి నేనెలా ఘనతపొందగలను?


మనము ఇతరులకు అందిస్తున్నది మనలో దేవుడు పుట్టించినదా లేక మనంతట మనము తయారు చేసిందా అని తెలుసుకునేందుకు ఇదొక మార్గము. మన పరిచర్య(కేకును) గూర్చి మనం గర్విస్తున్నామా! అలా అయితే ఆ పరిచర్యను(కేకును) మనంతట మనమే సృష్టించుకున్నామన్నమాట! అటువంటి దానిలో దేవునికి ఎలాంటి సంబంధంలేదు. అది దేవుని చేత చేయబడినదైతే దానిగూర్చి మనము గర్వించుటకు వీలులేదు.


జనసమూహానికి రొట్టెలు, చేపలు పంచిపెట్టిన యేసు యొక్క శిష్యులు ఆ పనిగూర్చి ఎటువంటి ఘనతైనా పొందారని మీరనుకుంటున్నారా! లేదు. రొట్టెల మూట యేసుకు అందించిన ఆ చిన్న బాలుడుకూడా ఎలాంటి ఘనతను పొందలేదు. యేసు సృష్టించిన ఆహారమును శిష్యులు పంచిపెట్టారు, అంతే.


మనమంతా ఉత్పత్తి వ్యాపారములో లేము గానీ పంచిపెట్టే వ్యాపారంలో ఉన్నందుకు దేవునికి స్తోత్రములు. అందునుబట్టి అన్ని సమయాల్లోనూ మనము సంపూర్ణ విశ్రాంతిలో ఉండవచ్చు. ఉత్పత్తి చేయవలసి వచ్చినప్పుడే శ్రమ కలుగుతుంది గానీ పంచి పెట్టుటలో కాదు! పంచి పెట్టు వ్యాపారంలో మనము అలసిపోవుట నిజమే. కానీ అందులో బాధలేదు. మన సామర్థ్యము దేవుని నుండి మాత్రమే లభిస్తుంది. మనంతట మనమే విలువైన దేనినైనా ఉత్పత్తి చేయలేమని మనకు తెలుసు. అందుచేత మనము దేనికోసమైనా ప్రయత్నము కూడా చేయము.


పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నీవు సాధించే సమస్తము మానవ సంబంధమైనదే, దానికి నిత్యత్వపు విలువలేదని గుర్తుంచుకో. ప్రార్థన చేయకుండానే దైవసహాయంలేకుండానే, పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే నీవు బోధించవచ్చు, సాధించవచ్చు. నీవు గొప్ప మానవ సామర్థ్యములు కలిగియుండవచ్చు-వాటితో నీవు గొప్పవి సాధించవచ్చు. కానీ దేవుని దృష్టిలో అదంతా కొయ్యకాలు, గడ్డి, కర్ర లాంటివేనని నీవు ఒక రోజు కనుగొంటావు.


ఉద్వేగముతో ప్రజల్ని కదిలించగల గొప్ప సందేశకుడివిగా నీ గూర్చి నీవు ఆలోచించుకోవచ్చు. అయితే రాక్‌ సంగీతకారులు ప్రజల్ని ఎలా ఊపి వేస్తారో ఒక్కసారి చూడండి. బోధకులకన్నా ఎక్కువగా వారు ప్రజల్ని ఉద్వేగ భరితులుగా చేయగలరు! అయితే అదంతా శూన్య ఆవేశం మాత్రమే.


నీవు ప్రజల మనసుల్ని కదిలించి మాట చాతుర్యముతో సమూహాల్ని గంటలకొలది ముగ్ధులుగా చేయగల గొప్ప మేధావివి కావొచ్చు. అది కూడా మానవుని యొక్క ప్రకృతి సంబంధమైన శక్తి. దేవుని జీవము ప్రసరించకపోవచ్చు.


పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నీ పరిచర్యలో ఏమి సాధించినప్పటికీ, అది ఈ లోకముతోనే నశించిపోతుంది. దీనిని గూర్చి నీవు ఖచ్చితముగా నిశ్చయత కలిగియుం డవచ్చును. నా మాటలు నీవు నమ్ముతావో లేదో నాకు తెలియదు. ఒకవేళ నమ్మితే, మానవ విధానాలు అనుసరించి నీవు ఇంకెంతమాత్రము కాలము వృధాచేయవు.


నిత్యత్వములో నశించిపోయే వాటిని నిర్మించుకోవటంలో నా సమయం వృధా చేయుట నాకు ఇష్టము లేదు. దేవుడిచ్చు దైవశక్తితోనే సేవించాలని నేను కోరుకొంటున్నాను. మన సామర్థ్యము దేవుని యొద్దనుండి మాత్రమే కలుగుతుంది.


యేసు జీవించిన సమయములో పరిసయ్యులు మహాగొప్ప బైబిలు పండితులు. వీరు స్వేచ్చావాదులైన సద్దూకయ్యుల వలెగాక వారి సిద్ధాంతముల విషయములో సరిగా ఉన్నారు. ''పరిసయ్యులు బోధించిన సమస్తమును మీరు చేయండి'' (మత్తయి 23:3) అని శిష్యులతో చెప్పటము ద్వారా పరిసయ్యుల సిద్ధాంతము సరైనవేనని యేసు ఆమోదించాడు. ఆ రోజుల్లో నిర్వహింపబడిన బైబిలు శిక్షణా శిబిరాల్లో పరిసయ్యులు ప్రసిద్ధ అధ్యాపకులు. తార్సువాడైన పౌలు అభ్యసించిన యెరూషలేములోని బైబిలు-సెమినరీ (కళాశాల)కు గమలీయేలు ప్రధాన ఆచార్యుడు. చాలామంది పరిసయ్యులు గొప్ప మిషనరీ-నాయకులు కూడా మనుషులను తమ మతములో కలుపుకునేందుకు పరిసయ్యులు భూభాగము, సముద్రములు దాటి మత వ్యాప్తికోసం పాటుపడిన వారని యేసు చెప్పారు (మత్తయి 23:15). ఆ పని చేయాలంటే త్యాగము, సమర్పణ తప్పనిసరియై యుండాలి.


అయినప్పటికీ యేసు పరిచర్యలో చాలా మట్టుకు తీవ్రవాదులు, మతఛాందసులు, బైబిలు కళాశాల బోధకులు,మిషనరీ నాయకులైన ఈ పరిసయ్యులను ఎదుర్కొనుటలో గడిపాడని మనము చూస్తాము. కారణమేమిటో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే కారణమేమిటో తెలియకపోతే మనము కూడా వారిలా తయారవుతాము. అప్పుడు ప్రభువు మనతో నిరంతరము పోరాడవలసివస్తుంది!


''తాను, తన శిష్యులు ఎందుకు ఇది చేశారు? ఎందుకు అది చేయలేదంటూ'' యేసుపై ప్రశ్నల వర్షముతో విసిగించినవారు ఆ నాయకులే! వారు తమ మత సాంప్రదాయాలను ఎల్లప్పుడూ యేసుకు వల్లిస్తూ తానూ, తన శిష్యులు ఎక్కడెక్కడ వాటిని అతిక్రమించారో చూపెడుతూ వచ్చారు.


విశ్వాసుల్లో ఇటువంటి వైఖరిని నేను చాలా ఎక్కువగానే చూచాను. కొందరు నన్ను కూడా విమర్శిస్తారు. నేను ఇక్కడ అక్కడ వినియోగించిన పదజాలాన్ని, భావప్రకటన గూర్చివారు ప్రశ్నిస్తారు. పదముల (మాటల) గూర్చి వివాదమురేపుట వీరికి బహు ఇష్టము - (1 తిమోతి 6:4) - ఇటువంటిదానినుండి దూరముగా ఉండమని పౌలు తిమోతితో చెప్పాడు. అయితే తమలోని దైవిక జీవన లోపము గూర్చి వారు దిగులు పడుతున్నట్టు కనిపించరు! చనిపోయిన ఒకని చేతిని పరీక్షిస్తూ అతనికి ఉండవలసిన వ్రేళ్ళు అన్నీ ఉన్నాయా లేదా అని లెక్కించే వారుగా నా దృష్టికి వీరు కనబడుతారు! ఒక వ్రేలి గోరు కనిపించకపోయినా గందరగోళం సృష్టిస్తారు!


ఒక చచ్చినవాని చేతికి వ్రేళ్ళు, గోళ్ళు అన్నీ నిక్షేపంగా ఉండడం కన్నా బ్రతికి ఉన్నవాడి చేతికి ఐదు వ్రేళ్ళు లేకుండా పోవటం నా దృష్టికి మంచిది! చాలామంది వేదాంతులు సరిగ్గా తమ సిద్ధాంతాల్లో చచ్చినంత సరిగాఉంటారు. అయితే వారి సిద్ధాంతాలు సరైనవే! గాని వారు చచ్చినవారు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, తప్పుడు బాప్తిస్మ సిద్ధాంతమును పాటించే ఒక సహోదరునితోనైనా నేను కలిసి పరిచర్య చేస్తాను కానీ సరైన బాప్తిస్మ సిద్ధాంతమును పాటిస్తూనే తలుపులో మేకులా ఆత్మీయముగా చచ్చినవాడితో నేను కలిసి పరిచర్య చేయుటకు ఎన్నడూ ఇష్టపడను!


ఇప్పుడు నన్ను అపార్థము చేసుకోవద్దు. నా క్రైస్తవ జీవితమంతటిలో నేను సిద్ధాంతపరంగా బహు దృఢముగా ఉన్నవాడినే. నేను చాలా క్రైస్తవ గుంపుల వారిని విడిచి పెట్టాను, ఎందుకంటే వారు సంపూర్ణ దైవసంకల్పము బోధించలేదు. కనుక సిద్ధాంత విలువను నేను తగ్గించుట లేదు, కానీ సిద్ధాంతము కంటే జీవితము, ఆత్మీయత అతి ముఖ్యములని చెప్పటానికే నేను ప్రయత్నిస్తున్నాను.


యేసు పరిసయ్యులను గద్దించి సరిచేసిన తరువాత ఒకరోజు శిష్యులు యేసును సమీపించి '' పరిసయ్యులు అభ్యంతరపడిరని నీకు తెలియునా?'' అని అడిగారు. అందుకు యేసు ఆ పరిసయ్యులు గ్రుడ్డి వారిని నడిపించే గ్రుడ్డి నాయకులు గనుక వారి జోలికి పోకుడని చెప్పాడు. - ''దేవుడు నాటని ప్రతి మొక్క ఒక రోజున పెల్లగింపబడును'' (మత్తయి 15:12,13).


పైన చెప్పబడిన ఆ చివరి వాక్యమును గూర్చి ఒక్క క్షణం మీరు ఆలోచించండి. నీవు బోధించినప్పుడెల్లా ఒక విత్తనం నాటుతున్నావు, నీవు విత్తుతున్నది దేవునినుండి కలిగినది కాని పక్షంలో ఒకరోజున అది పెల్లగింపబడుతుంది.


పరిశుద్ధాత్మ ఇచ్చు సామర్థ్యముతో చేసే మన పని నిత్యత్వంకోసం నిలుస్తుంది. అయితే ప్రార్థన లేకుండా, దేవునిపై నిస్సహాయుడిగా ఆనుకోకుండా, దైవాత్మ సహాయం లేకుండా, మనం దేవునికోసము పరిచర్య చేస్తే అది ఒకానొక రోజున తప్పని సరిగా వ్రేళ్ళతోపాటు పెకిలింపవేయబడుతుంది.


అనేక విషయాల్లో క్రైస్తవ పరిచర్యకోసం పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరము లేదు, కానీ కావలసిందల్లా విస్తారమైన డబ్బు, మంచి పరిపాలకుడు మాత్రమే.


ఉదాహరణకు మీరొక క్రైస్తవ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు, దానికోసం చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఒక సభా స్థలాన్ని అద్దెకు తీసుకోవాలి. ఆహ్వాన పత్రికలు పంపాలి, వసతి ఏర్పాట్లు చేయాలి. భోజన సదుపాయం కలుగజేయాలి. ఇంకా మొదలైనవి చేయాలి. అయితే ఇవన్నీ ఒక మంచి పరిపాలన అద్యక్షుడు చేయగలడు. అతడు క్రైస్తవుడై ఉండనవసరము లేదు. వాస్తవానికి చాలా క్రైస్తవ సమావేశాలకన్నా ఈ లోక సంబంధమైన సమావేశాలు చాలా బాగా నిర్వహించబడుతున్నాయి. అయితే క్రైస్తవ సభలో నిత్యత్వము కోసం నిలిచివుండేది దైవవాక్య పరిచర్య - అందుచేత ఈ పరిచర్య ఆత్మాభిషేకము క్రిందనే జరగాలి!


మంచి మంచి ఏర్పాట్లు, వసతుల అవసరతను నేను కాదనడం లేదు. ఏ సమావేశమైనా విజయవంతం కావాలంటే ఇవన్నీ అవసరమే. పరిశుద్ధాత్మ శక్తితో జరిగిన కార్యము మాత్రమే నిత్యత్వములో నిలుచునని గుర్తుంచుకొనుడి.


దీనిని మన స్వంత పరిచర్యలో అన్వయించుకుందాం. మానవ శిక్షణ, మానవ వనరుల ఫలితంగా జరిగినది మన పరిచర్యలో ఏ భాగమును గూర్చిమనం చెప్పగలమో మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మనకు మనము యదార్థవంతులముగా ఉంటే మనము కనుగొన్న జవాబుకు ఆశ్చర్యపడతాము.


యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈనాటికి కూడా యేసు, జీవము లేకుండా జ్ఞానము కలిగి మరియు పరిశుద్ధాత్మాభిషేకము లేకుండా సమాచారమును అందించు బైబిలు కళాశాల అధ్యాపకులతోను మరియు మిషను నాయకులతో పోరాడుచున్నాడు. తాము జీవించిన కాలములో అటువంటి మనుషులతో అపొస్త్తలులు పోరాటము సాగించారు. యేసు అడుగు జాడలలో నడుస్తున్నవారమైతే ఈనాడు మనము కూడా అటువంటి వారితోనే పోరాడవలసివుంది.


నేను ప్రభువుతో నడుస్తూ, అటువంటి విమర్శకులతో పోరాడతాను కానీ వారిని సంతోషపెట్టి ప్రభువును బాధపెట్టను. వాస్తవానికి దేవుణ్ణి సంతోష పెట్టేందుకు నేను చెల్లించవలసిన వెల అదే అయితే, అవసరమైతే లోకమంతటితో పోరాడటానికి నేను సిద్ధమే. ''మనము మనుషులను సంతోష పెట్టగోరుచున్నామా, మనము క్రీస్తు పరిచారకులముగా ఉండనేరము'' (గలతీ 1:10).


మన పరిచర్యలో దేవునిపై మాత్రమే ఆధారపడుతూ ఎల్లప్పుడూ మనపై పరిశుద్ధాత్మాభిషేకం కోరుకుంటూ సాగిపోదాము.


అధ్యాయము 10
ఆత్మీయ అధికారాన్ని అమలుచేయుట

ఒక ఆత్మీయ నాయకుడు ఆత్మీయ అధికారముతో పరిచర్య చేస్తాడు.


జనసమూహములు యేసు బోధకు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సంవత్సరాల తరబడి పరిసయ్యులు వారికి చేసిన బోధకూ, యేసు బోధకూ మధ్యగల వ్యత్యాసమును వారు చూసారు. పరిసయ్యులకు ఎంతో గొప్ప జ్జానమున్నది. యేసు వారందరి కంటే అధికమైన జ్ఞానసంపన్నుడు. అయితే వింటున్నవారిని ఆట్టుకున్నది ఆయన జ్ఞానము కాదు, ఆయన అధికారమే (మత్తయి 7:29).


మన పరిచర్యలో మనము జ్ఞానము కలిగి అధికారములేకుండా ఉంటే పరిసయ్యులవంటి వారమవుతాము. యేసు చెప్పిన మాటలను దేవుడు బలపరిచాడు, ఆత్మీయ అధికారముతో మాట్లాడడమంటే అర్థము ఇదే.


వారితోపాటు పరిశుద్ధాత్ముడు సాక్ష్యము ఇస్తాడని యేసు తన శిష్యులతో చెప్పాడు (యోహాను 15:26,27). వారు బోధించినప్పుడల్లా వారు పలికిన మాటలను పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్నాడని దీని అర్థము. అన్ని సమయాల్లోనూ నా పరిచర్యకూడా ఈ విధంగా ఉండాలని నా కోరిక. నేను యేసుకు సాక్షిగా నిలిచినప్పుడు నేను చెప్పినదానికి పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యముగా నిలవాలి. ''ఈ మాటలు వినండి. ఇవి దేవుని మాటలు'' అని పరిశుద్ధాత్ముడు, వాక్యము వినేవారి హృదయాలతో మాట్లాడాలి. అప్పుడు నేను దైవాధికారముతో మాట్లాడుతాను. అయితేనేను యేసును గూర్చిన ఖచ్చితమైన సాక్ష్యము చెప్పినా, నేను చెప్పిన సాక్ష్యాన్ని పరిశుద్ధాత్ముడు బలపర్చకపోతే నన్ను మత భ్రష్టుడని ఎవ్వరూ పిలువరు ఎందుకంటే నా సిద్ధాంతాలు సౌవార్తీకములు. కానీ నేను ఇంకా మరణ పరిచర్యనే చేస్తున్నాను కాని జీవపరిచర్య కాదు.


ప్రజలపై అధికారము చేయుటకు అనేక మార్గాలున్నాయి. మానవ మార్గాలున్నాయి. మతపరమైన మార్గాలున్నాయి. ఆత్మీయ మార్గాలున్నాయి. ఈ మూడింటి మధ్య చాలా వ్యత్యాసమున్నది. యేసు అధికారము మానవసంబంధమైనది గానీ మత సంబంధమైనది గానీ కాదు. ఆయన ఎన్నడూ భూసంబంధమైన రాజువలెగానీ, ఇశ్రాయేలీయుల మతనాయకుడివలెగానీ మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. ఆయన అధికారము దైవికము, ఆత్మానుసారమైనది.


సినీ నటులు, రాక్‌ సంగీత కళాకారులు ప్రదర్శించే అధికారము మానవ సంబంధమైన అధికారమునకు మంచి ఉదాహరణ. ప్రజలు వాళ్ళను ఎంతగా ఆరాధిస్తారో, వారివెంబడి ఎంత పిచ్చిగా పడిపోతారో గమనించండి. వాళ్ళను కొంచెమైనా చూచేందుకు ప్రజలు గంటల తరబడి ఎండలో నిలబడతారు, వర్షములో పడిగాపులు కాస్తారు. ప్రజలపై వారి అధికారము ఎంతో అధికము. ప్రజల మనసులను, ఉద్రేకాలను తమ అధికారం క్రింద ఉంచుకునేందుకు ఈ కళాకారులు తమ మానవ సామర్థ్యాలను వినియోగిస్తారు. అటు తరువాత అదే ప్రజలు తమకు డబ్బు క్రుమ్మరించేలా చేసుకుంటారు! క్రైస్తవులలో అనేక బోధకుల మధ్యకూడా ఈ రకమైన అధికారం కనబడుతుంది. ఇది మానవాత్మ శక్తియేగాని పరిశుద్ధాత్మ శక్తి కానేకాదు.


మానవ సంబంధమైన అధికారాన్ని అమలుచేసేందుకుగల మరో మార్గము డబ్బు. ఈనాడు ప్రపంచము ఆయుధములు గలవారి ఆధీనములో లేదుగానీ డబ్బున్న ధనవంతుల స్వాధీనంలో ఉంది. యుద్ధములలో, ఎన్నికలలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిదేశములోని వ్యాపార రంగము, అభివృద్ధి చెందుటకు గాను రాజకీయ నాయకులను సంతోషపెట్టవలసి ఉంది. అదే విధముగా అధికారము చేజిక్కించుకునేందుకు అవసరమైన డబ్బు కోసం రాజకీయనాయకులు వ్యాపార వేత్తలవైపు తిరుగుతారు. కాబట్టి డబ్బుకు ఎంతో గొప్ప శక్తి ఉంది. క్రైస్తవ్యములో కూడా ఈ శక్తి విస్తృతముగా వినియోగించబడుతున్నది. తప్పనిసరిగా డబ్బు చాలా మంచి చేయగలదు. అయితే డబ్బు శక్తివంతమైనది కావటంచేత అది చాలా నష్టముకూడా కలుగజేస్తుంది.


ఎక్కడైనా క్రైస్తవ పరిచర్య ఆర్థిక శక్తి యొక్క అదుపులో ఉన్నట్లయితే అది ఎన్నటికీ ఒక ఆత్మీయ కార్యము కానేకాదు. డబ్బు దేవునికి వ్యతిరేకమని యేసు చెప్పారు. మానవులను ఆకర్షించుటకు లోకములో పోటీపడి పనిచేస్తున్నది ఇద్దరే ఇద్దరు యజమానులు, దేవుడు మరియు సిరి (లూకా 16:13).


ఇతరులకు డబ్బు పంచిపెట్టుటద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ఓ క్రైస్తవ నాయకుడు ఆత్మీయ అధికారం పొందినవాడు కాదు. లోకము, క్రైస్తవ్యము ఈ రెండింటిలోనూ డబ్బుకు ఆకర్షణవుంది. డబ్బున్నవాడికి ఎవరైనా వంగి నమస్కరిస్తారు. డబ్బు ఇస్తే చాలు - వారు నీవు చెప్పిందల్లా అంగీకరిస్తారు, చేయమన్న పని చేస్తారు! లౌకిక కంపెనీలలో, క్రైస్తవ సంస్థల్లోకూడా ఇది సత్యమే.


దాదాపు పాస్టర్లందరూ సంఘము యొక్క బోర్డు సభ్యుల ఆధీనములో ఉంటారు. ఎందుకంటే తన జీతము నిర్ణయించేది బోర్డు సభ్యులే. అటువంటి పాస్టర్లు(కాపరులు) బోర్డు సభ్యులను నొప్పించే విధంగా మాట్లాడుటకు ధైర్యం చేయలేరు! సాధారణముగా, సంఘములు తమలో ఉన్న ధనవంతులనే బోర్డు సభ్యులుగా కలిగియుంటుంది. అసలు అందరికన్నా ఎక్కువ గద్దింపు అవసరమైనది ఈ ధనవంతులకే. అయితే ఈ ధనవంతులు పాస్టరు(కాపరి) నోట్లో డబ్బుకట్టలు కుక్కినప్పుడు ఆ నోటితో పాస్టరు(కాపరి) వీరిని ఎలా గద్దించగలడు? అతడు గద్దించలేడు. అందుచేత పాస్టరు ఆ ధనంతుల చెవులకు గిలిగింతలు పెట్టి వారు ఎటువంటి మాటలు వినాలని ఆశిస్తున్నారో సరిగ్గా ఆ మాటలే మాట్లాడాలి. అతడు వారిని నొప్పిస్తే వారు అతని జీతం పెంచరు, పాస్టరు గారిని మార్చుటకు ఈ పని చాలు. ఇబ్బంది పడవలసి వచ్చే తన పేద కుటుంబంగూర్చి అతడు ఆలోచిస్తాడు. అన్ని వసతులు, సదుపాయాలున్న నివాసగృహాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది మరియు ఆ మంచి పాఠశాల నుండి తన పిల్లలను మానిపించి వేయవలసి వస్తుంది. ఇటువంటి ఆలోచనలు పాస్టరు (కాపరి) గారు అతి త్వరితంగా బోర్డువారి ముందర తలవంచి వారి అధికారాన్ని మౌనంగా ఒప్పుకునేలా చేస్తాయి! ఈనాడు భారతదేశంలో దాదాపుగా ప్రవక్తలు అనేవారు లేకపోవటానికి గల కారణం ఇదే. ప్రతి బోధకుడు డబ్బు ఆకర్షణకు బలిగా పడిపోయాడు. అటువంటి బోధకులు ఆత్మీయ అధికారాన్ని ఎలా అమలుచేయగలరు?


ఇతరుల మీద అధికారం కలిగియున్న సహోదరులకు నేను చెప్పేదేమిటంటే నీవు ఎవరినైనా డబ్బు ద్వారా అదుపు చేస్తున్నట్లయితే నీవు అమలు చేస్తున్నది ఆత్మీయ అధికారము కాదు.


యేసు ఎవ్వరినీ డబ్బుతో అదుపుచేయలేదు. శిష్యులలో ఒక్కరు కూడా డబ్బుకోసం ఆయన్ని వెంబడించలేదు. వారికివ్వటానికి ఆయన దగ్గర డబ్బు లేదు! ఈ లోకంలో శ్రమలు, కష్టాలు తప్ప ఆయన వారికి ఎటువంటి రిటైరుమెంటు(పదవీ విరమణ) లాభాలు చూపించలేదు. మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకమని, అప్పుడు తమకు అవసరమైన (కూడు, గుడ్డ లాంటి అవసరతలు) పరలోకపు తండ్రి తీరుస్తాడని ఆయన వారికి నేర్పించారు.


అపొస్తలులు తమ సువార్త పరిచర్యలో డబ్బు ద్వారా ఎవ్వరినీ ఆకర్షించకుండునట్లు (లేక అదుపులో ఉంచుకొనకుండునట్లు) యేసు వారిని ప్రపంచ సువార్త పరిచర్య నిమిత్తము డబ్బు లేకుండా పంపాడు. అయినప్పటికీ ఈనాడు మనము డబ్బు, సామాగ్రి, అనేక సువార్త సభలతో చేసిన పరిచర్యకన్నా మెరుగైన సేవను ఆనాటి ప్రపంచంలో వారు చేశారు!


దేవుని పనిలో మన ఆత్మీయ అధికారాన్ని దొంగిలించే, ఆర్థిక శక్తి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.


మనము జాగ్రత్తగా వ్యవహరించవలసిన మరో శక్తి సంగీత శక్తి. ఆత్మహత్య చేసుకునేలా ప్రజల్ని ఉద్వేగముతో ఊపివేయగల శక్తి రాక్‌ మ్యూజిక్‌కు ఉంది. ఈనాటి ప్రపంచంలో ఇటువంటి శక్తి రూపాలు చాలా ఉన్నాయి. ఆత్మీయ శక్తి స్థానంలో వీటిని మనము గుర్తించే పొరపాటు చేయకుండా మనము జాగ్రత్తపడాలి. ఆత్మ శక్తి మరియు ప్రాణశక్తి ఈ రెండింటి మధ్యగల వైవిధ్యమును మనము గుర్తించలేకపోతే మన పరిచర్య విజయం విషయంలో మనల్ని మనము మోసపుచ్చుకుంటాము.


మనలో కొంతమంది ఆర్థిక శక్తి, సంగీతశక్తులను వినియోగించకపోవచ్చు. అయితే మేధాశక్తిని వినియోగిస్తుండవచ్చు. ఇదికూడా ప్రాణశక్తియే - ఇది ఆత్మీయ అధికారానికి ఎంతో భిన్నమైనది. ప్రజలు ప్రసంగాలు వినుటకు వారికి ఆకర్షణగా మన అర్హతలు ప్రదర్శించుటకు ప్రయత్నిస్తాము! పేతురు తన పత్రికల్లో ఉపయోగించిన గ్రీకు పదాల మూల భావాన్ని వివరించుటకు చాలిన వేదాంత విద్యార్హత మీకున్నదేమో - వాటిభావాలు పేతురుకు కూడా తెలియదు!


అయితే ఒక ఆత్మీయ వ్యక్తి బైబిలును విభిన్న విధానంలో బోధిస్తాడు - వాటి ఫలితాలు కూడా విభిన్నంగా ఉంటాయి. మానవ మేధస్సుతో గానీ పరిశుద్దాత్మశక్తితో గానీ బైబిలు బోధచేయవచ్చు. ఈ రెండురకాల బోధలమధ్య ఎంతో వ్యత్యాసమున్నది - వాటి ఫలితాల మధ్యకూడా ఎంతో వ్యత్యాసమున్నది. సంఘనాయకుల పరిచర్యలో ఆత్మీయ అధికార శక్తి ప్రదర్శన ఈనాటి సంఘ అత్యవసరతల్లో ఒకటి. ఆత్మీయ అధికారము, మత సంబంధమైన అధికారానికి భిన్నముగా ఉంది. ఈనాటి క్రైస్తవ్యములో మనము సర్వసాధారణముగా చూస్తున్నది మతసంబంధమైన అధికారమే - బలవంతులైన నాయకులు వారి మందపైన పెత్తనం చెలాయిస్తారు.


ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నట్టు ప్రతి ఒక్కరూ ఓటువేసి తమ నాయకున్ని ఎన్నుకొను విధానము స్థానిక సంఘ విషయములో దేవుని భావన కానేకాదు. ఒక బలవంతుడైన నాయకుడు నియంతృత్వముతో పేద విశ్వాసులు తనకు నమస్కరించి విధేయులుగా ఉండేలా చేసుకొనుట ద్వారా సంఘమును నడిపించుట కూడా దేవుని ఉద్దేశ్యము కాదు.


మనము వాక్యమును బోధించునప్పుడు ప్రజలపై అధికారము కలిగియుండుట సులభమే. మన పరిచర్య ప్రజలకు సహాయకరంగా ఉన్నందువల్ల వారు మనల్ని మెచ్చుకుంటారు. ఆ తరువాత మన అభిమానులకు మనము చిన్న దేవుళ్ళుగా మారుట బహుసులభము. ఈ విషయంలో మనమెప్పుడూ భయంతో బ్రతకాలి. మన వరాన్ని దుర్వినియోగపర్చి ఇతరులపై మనకున్న అధికారాన్ని ఎన్నడూ ఆసరాగా తీసుకోకూడదు. ఇతరుల జీవితాలను నడిపించుటకు మనం ఎన్నడూ ప్రయత్నించరాదు. ఒకవేళ వారు మనల్ని హత్తుకుంటున్నట్టు కనబడితే అప్పుడు వారిని సుతిమెత్తగా ప్రభువుకు అప్పజెప్పాలి - వారి మంచికోసమే వారి ఆత్మీయ ఎదుగుదలకోసమే మనము ఇలా చేయాలి. క్రీస్తుశరీరమును నిర్మించుటకేగాని మన సొంత సామ్రాజ్యాలు నిర్మించుకునేందుకు మనము పిలువబడలేదు. ఆత్మీయ అధికారానికి మార్గమిదే.


కొరింథు సంఘములో ఒక మనిషి రక్షింపబడాలని అతని శరీరేచ్ఛలు నశించుటకై సాతానుకు అప్పగించగల ఆత్మీయ అధికారము పౌలుకు దేవుని చేత అనుగ్రహింపబడినది (1 కొరింథీ 5:5). అటు తరువాత ఆ మనిషి రక్షింపబడి పశ్చాత్తాపముతో సంఘానికి తిరిగివచ్చాడు. పౌలు ఆ సంఘానికి పునాది వేసిన తండ్రి, అటువంటి తండ్రులు ఇంకెవ్వరికీ లభించని ఆత్మీయ అధికారమును కలిగివుంటారు. ప్రజలను ఆత్మీయముగా కట్టుటకు అపొస్తలులు దేవుని చేత అనుగ్రహింపబడిన అధికారము పొందారు. మనకు కూడా అవసరమైన ప్రేమ పూరిత అధికారము ఇదే. మనకు గొప్ప సవాలుగానిలచే ఇటువంటి అనేక ఆత్మీయ అధికార ప్రత్యక్షతలను అపొస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తాము.


మూడున్నర సంవత్సరాలుగా శిష్యులు యేసును గమనించినప్పుడు, తమ సమాజమందిరములలో వారు చూచిన నాయకులకూ, బోధకులకు ఆయన సంపూర్ణముగా భిన్నముగా ఉన్నట్టు చూచారు. ఆయన వలె మాట్లాడి, ఆయన వలె జీవించిన మరొక వ్యక్తిని వారెన్నడూ కలుసుకోలేదు. ఆయన జీవితంలోనూ, ఆయన పరిచర్యలోనూ అధికారం నిండివుంది. యేసును వారు కలుసుకోకముందు, సమాజమందిరములో పరిచర్య చేస్తున్న యాజకులు, బిషప్పుల్లో చూచినదే ఆత్మీయ సేవ అని వారు తలంచారు. యేసును కలుసుకొని ఉండకపోతే, వారు ఆ యాజకులు, బిషప్పులనే ఆదర్శ ప్రాయులుగా ఉంచుకొనేవారు. అయితే ఇప్పుడు తాము అనుసరించగల నూతన ఆదర్శ ప్రాయుడను వారు పొందారు.


అనుసరించదగిన, మెరుగైన ఆదర్శప్రాయులు ఈనాటి మన యౌవనస్థులకు కావాలి. ఆత్మీయ అధికారముతో నిండిన వ్యక్తులముగా, ఆదర్శప్రాయులుగా ఉండుట మన బాధ్యత.

అధ్యాయము 11
సకల భయములనుండి విడుదల

ఒక ఆత్మీయ నాయకుడు మనుష్యుల భయమును బట్టిగానీ, పరిస్థితుల భయమును బట్టి గానీ ఆధారపడి నిర్ణయాలు తీసుకోడు.


నా ఇంటి ముందు గదిలో పెద్ద అక్షరాలతో వ్రేలాడుతూ ఉన్న ఒక వాక్యము ఉంది, ''నీవు దేవునికి భయపడితే, ఇక దేనికి భయపడనవసరము లేదు''. ఇది యెషయా 8:12,13 వాక్యభాగానికి లివింగ్‌ బైబిలు తర్జుమా. గత 25 సంవత్సరాలుగా ఆ వాక్యము నాకు గొప్ప సహాయముగా ఉంది. భయము విషయములో నేను ప్రభువు దగ్గర నేర్చుకున్న కొన్ని సత్యాలను మీతో పంచుకుంటాను.


మొట్టమొదటిదిగా, సాతాను ప్రధాన ఆయుధాల్లో ''భయం'' అనేది ఒకటి అని నేర్చుకున్నాను.


రెండవదిగా, ఆయా సమయాల్లో నాకు భయం కలిగినప్పుడల్లా నేను ఖండింప బడినట్టుగా భావించనవసరం లేదని నేర్చుకున్నాను, ఎందుకంటే నేను ఇంకా శరీరములోనే జీవిస్తున్నాను. ఈ విషయంలో మనము వాస్తవికంగానూ, యదార్థతతోనూ ఉండాలి. ఆ సమయాల్లో ''తన లోపల భయములు'' కలిగినట్లు అపొస్త్తలుడైన పౌలు ఎంతో యదార్థముగా ఒప్పుకున్నాడు (2 కొరింథీ 7:5).


మూడవదిగా, (ఇది అతి ముఖ్యమైనది) నాలో భయములన్నప్పటికీ వాటి ఆధారంగా నేనెన్నడూ నిర్ణయము తీసుకోకూడదని నేర్చుకున్నాను. నా నిర్ణయాలు ఎల్లప్పుడూ ''దేవుని యందలి విశ్వాసము''పై ఆధారపడి ఉండాలి - ఇది భయానికి సరిగ్గా వ్యతిరేకము. ఇప్పటికి, ఎన్నో సంవత్సరాల నుండి నేను ఆ విధంగా బ్రతుకుటకు కోరుకున్నాను. మరియు దేవుడు ఎంతగానో సహాయము చేసి నన్ను ప్రోత్సహించాడు.


''భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి'' అని యేసు ప్రభువు పదే పదే ఎందకు చెప్పాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ''పాపము చేయకుము, పాపము చేయకుము, పాపము చేయకుము'' అంటూ నొక్కిచెప్పిన మరో నూతన నిబంధన పదమువంటి ప్రాధాన్యత దీనికి ఉంది.


పాపమునకు, భయమునకు యేసు ఎల్లప్పుడూ వ్యతిరేకియే. దేవునికి తప్ప మరెవ్వరికీ భయపడవద్దని ఆయన మనకు చెప్పాడు (మత్తయి 10:28). ఇది మనము నేర్చుకోవలసిన అతి ముఖ్యపాఠము, ఎందుకంటే ఒక ఆత్మీయ నాయకుడు ఎన్నడూ భయమును బట్టి ఏ నిర్ణయమూ తీసుకొనకూడదు.


అనేక సంవత్సరాలుగా మా ఇంట్లో నా గదిలో వ్రేలాడుతున్న మరో వాక్యము గలతీ 1:10 ''నేను మనుషులను సంతోష పెట్టగోరుతున్నానా, అయితే నేను క్రీస్తు పరిచారకుడుగా ఉండనేరను''.


నీవు మనుష్యులను సంతోష పెట్టాలని ఆశిస్తే ఎన్నటికీ ప్రభువు సేవకునిగా ఉండలేవు. నేను చెబుతున్నాను, మనుష్యులను సంతోష పెట్టుటకు చూచుట మానుకోవడం అంత సులువు కాదు.


మన దేశములో జరుగుతున్న క్రైస్తవ పరిచర్య గూర్చి పాశ్చాత్య దేశాలకు పంపబడుతున్న అనేక నివేదికలు ప్రాధమికముగా అక్కడి ప్రజల్ని మెప్పించుటకోసం ఉద్దేశింపబడినవే; ఫలితంగా వారు ఈ దేశములో జరుగుతున్న పని కోసం ఆర్థికంగా సహాయపడతారు. మీ పనిని గూర్చి ఒక నివేదిక తయారు చేస్తున్నప్పుడు మీ ఉద్దేశాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.


అదే విధముగా మనుషులను సంతోష పెట్టుటకు వారి మెప్పుపొందుటకుగాను అనేకమైన ప్రసంగములు కూడా తయారవుతుంటాయి. అయితే అటువంటి ఉద్దేశాలతో బోధించేవారు క్రీస్తు పరిచారకులుగా ఉండనేరరు. వివేచన, పరిణితిలేని వారైన మీ సంఘములోని విశ్వాసుల గుంపును నీవు ఒక్క గొప్ప దైవజనుడవని వారిని మోసము చేయుట సులభమే. అయితే దేవుణ్ణి మోసగించలేవు మరియు సాతానును మోసగించలేవు. నీవు ఎటువంటి వ్యక్తివో దేవునికి, సాతానుకు బాగా తెలుసు.


ఎవరైనా ఒక వ్యక్తిని మెప్పించకపోతే అతడు నీకు హాని చేస్తాడేమోననే భయం నీలో ఉన్నప్పుడు నీవు అతన్ని సంతోషపెట్టుటకు ఎల్లప్పుడు ప్రయత్నిస్తావు. అలాంటప్పుడు నీవు ఎన్నడూ దేవుని సేవకుడివి కాలేవు. భయపడి ఎప్పుడైనా ఏదైనా నీవు చేస్తున్నట్లుయితే నిన్ను నడిపిస్తున్నవాడు సాతానుడే కానీ దేవుడుకాడు అని నీవు నిశ్చయించు కొనవచ్చు.


మనము మనగతజీవితాలను చూచుకుంటే భయపడి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఆ నిర్ణయాలన్నింటిలోనూ మనల్ని నడిపించింది దేవుడు కాదు. అటువంటి కొన్ని నిర్ణయాల పర్యవసానము అంత తీవ్రమైన విషయము కాకపోవచ్చు. అయితే మనము దేవుని నుండి శ్రేష్టమైన దానిని పోగొట్టుకున్నాము. భవిష్యత్తులో మనము భిన్నంగా వ్యవహరించాలి.


మనము మానవ మాత్రులము కాబట్టి భయపడుట స్వాభావికమే. ఉదాహరణకు, ఇప్పుడు నీవు కూర్చున్నచోట అకస్మాత్తుగా ఒక త్రాచుపాము కనబడితే సహజంగానే నీవు భయంతో లేచి దుముకుతావు, నీ శరీరంలో రక్తప్రసరణవేగము పుంజుకుంటుంది. ఇది సహజ సిద్ధము, కానీ నీవు వెళ్ళిన ప్రతిచోట పాము ఉంటుందనే భయంతో నీవు జీవించవు.


మనము ఎవ్వరికీ భయపడి బ్రతకకూడదు.


మనుష్యులకు గానీ, సాతానుకు గానీ భయపడి మనము నిర్ణయములు తీసుకోకూడదు. మనము తీసుకునే ప్రతి నిర్ణయము దేవునియందలి భయము, పరలోకపు తండ్రిలో మన పరిపూర్ణమైన విశ్వాసముపై ఆధారపడి ఉండాలి. అప్పుడే మనము పరిశుద్ధాత్మచేత నడిపింపబడుతున్నామనే నిశ్చయత కలిగియుంటాము.


ప్రభువును సేవిస్తున్న మనందరికీ హెబ్రీ 13:6 అతి ప్రాముఖ్యము, ''ప్రభువు మనకు సహాయకుడని మనము ధైర్యముగా చెబుతున్నాము, మనము భయపడము. మానవుడు మనకేమి చేయగలడు!''


అయితే, జాగ్రత్తగా ఉండుట మరియు భయపడుట ఈ రెండింటికీ గల వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఈ లోకములో మనము పాములవలె వివేకులముగా ఉండాలి. కానీ మనము ఏ పురుషునికి గానీ, స్త్రీకి గానీ, దెయ్యానికి గానీ, చివరకు సాతానుకుగానీ భయపడనవసరము లేదు.


యేసు జాగ్రత్తగా ఉన్నాడు. యూదయలో ప్రజలు ఆయన్ని చంపాలను కుంటున్నారని విన్నప్పుడు యేసు అక్కడికి వెళ్ళలేదు (యోహాను 7:1).అది తెలివైన పని. అది జ్ఞానము. అయితే యేసు ఎన్నడూ, ఎవ్వరికీ భయపడలేదు.


ఒకవేళ రాత్రి పూట అడవికి వెళ్ళవలసి వస్తే, నీవు టార్చిలైటు తీసుకొనివెళ్తావు. అది జాగ్రత్తయే గాని భయముకాదు. దేవుడే వెళ్ళమని చెబితే తప్ప - ఒకానొక ప్రదేశంలో ప్రజలు నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు నీవు అక్కడికి వెళ్ళకూడదు. చిట్టచివరకు పరిశుద్ధాత్ముడు నడిపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళాడు, అక్కడ ఆయన చంపివేయబడ్డాడు. అయితే అది దేవుని సమయము, దైవ చిత్తము.


ఏ నరునికి మనము భయపడము. ''సర్వ శక్తుని నీడలో'' నివసిస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న మనకు ఏ నరుడైనా ఏమి హాని చేయగలడు? (కీర్తనలు 91:1). ''ఎవరు నీకు హాని చేయగలరు?'' అని బైబిలు ప్రశ్నిస్తుంది (1 పేతురు 3:13). జనులు మనకు చేసే సమస్తమును దేవుడు మనకు మేలుగా మార్చగలడు (రోమా 8:28). ఇది సత్యమైనస్పుడు అసలు మనమెందుకు భయపడాలి?


దీనిని మనము నమ్మితే, ఇది మన జీవితములలోకి గొప్ప అధికారము తెచ్చిపెట్టగలదు. మనము మనుషులకు భయపడతాము, వారిని సంతోషపెట్టి మెప్పించుటకు ప్రయత్నిస్తాము, వారి ముందర మనలను మనము సమర్థించుకుంటాము-అందుచేత సాతానుడు మనలో నుండి ఆత్మీయ అధికారమును చాలా మట్టుకు హరించుకుపోతాడు. ఈ వైఖరులను మనము సమూలముగా నశింపజేయాలి.


అయితే ఇది అంత సులభము కాదు. ఇది నిరంతర పోరాటము. ఒక గుంపుకు చెందిన కొంత మందిని(ూ,దీ,జ లను) మెప్పించే ప్రయత్నం మానుకోవాలని ఒక్కసారి నీవు నిర్ణయించుకున్నప్పుడు మనుషులను సంతోషపెట్టే ప్రయత్నం సమాప్తమైనదని నీలో నీవు భావించవచ్చు. కానీ అతి త్వరలోనే మరో గుంపుకు చెందిన కొందరిని(ణ,జు,ఖీ లను) మెప్పించే ప్రయత్నం నీవు చేయవలసివస్తుంది! ఇది అంతము లేనిది! మానవులందరి అభిప్రాయములనుండి స్వతంత్రులుగా దూరంగా ఉండాలనుకుంటే ఈ పోరాటమును మనము అంతముదాకా నమ్మకముగా కొనసాగించవలసివుంది. ఈ పాపమునకు వ్యతిరేకముగా నిలిచి నిరంతరం పోరాడుటలో మనము అప్రమత్తంగా ఉండాలి. ఏ మానవుడి నుండి ఆమోద ముద్ర పొందాలని మనము ఎప్పుడూ ప్రయత్నించకూడదు.


తాము ఎవ్వరి సలహాను కూడా లెక్కచేయమని గర్వముగా చెప్పే కొంతమంది విశ్వాసులున్నారు. అయితే అటువంటివారు ఆత్మీయులు కారు. వారు మొండివారు. దైవజనులైన పెద్దల సలహాలు విలువైనవి. మనలో మనముగా చూడలేని వాటిని చూచి ఆయన మనకు చెప్పగలడు. అటువంటి వ్యక్తిని గౌరవించి సన్మానించుట, అతని అధికారానికి లోబడుట వల్ల నిజముగా మనకు ఎంతో సహాయము లభిస్తుంది. ఒక దైవజనుడికి బానిసగా మారకుండా అతనికి లోబడివుండుట ఎట్లో నేర్చుకొనుట అతి ముఖ్యము.


మన సంఘ సభ్యులు దేవునికి మాత్రమే భయపడుతూ, మానవులభయం, దయ్యములభయం నుండి విముక్తులవ్వాలని మనం ఆశిస్తే మొట్టమొదట మనము ఆ విధంగా ఉండాలి.


ఈ భూలోకములోని సమస్తము దేవుని ఆధీనములో ఉంది గనుక మనము ఎవ్వరికీ, దేనికీ భయపడము.


ఒక దేశానికి (సువార్త ప్రకటన నిషేధించబడిన) వేళ్ళే ప్రయత్నములో నేను ఉన్నప్పుడు ప్రభువు నాకు మత్తయి 28:18-19 లేఖన భాగాన్ని గుర్తు చేశాడు. పరలోకము భూలోకములో సర్వాధికారము తనకున్నందుచేత సర్వలోకములోని సకల దేశములకు వెళ్ళి శిష్యులుగా చేయమని ప్రభువు మనల్ని ఆజ్ఞాపించాడని నేను అందులో చూచాను. ఆ వాక్య ఆధారముపై మనము వెళ్ళకపోతే, ప్రతిచోటా మనము సమస్యలు ఎదుర్కొంటాము.


మత్తయి 28 అధ్యాయములోని ప్రధాన ఆజ్ఞలో ''కాబట్టి'' అనే మాట చాలా ముఖ్యమైనది. చాలా మంది బోధకులు ''వెళ్ళండి'' అను మాటను నొక్కి చెబుతారు. అది మంచిదే. కానీ మనము దేనిని ఆధారము చేసుకొని వెళ్ళాలి? ఈ భూలోక ప్రజలందరి మీద, దయ్యములన్నింటి మీద ప్రభువు సంపూర్ణ సార్వభౌమాధికారం కలిగివున్నాడనే సత్యముపై ఆధారపడి మాత్రమే. దీనిని నమ్మకపోతే, నీవు ఎక్కడికీ వెళ్ళకపోవటమే మంచిది.


ఆ సమయములో మత్తయి 28లోని ఈ వాక్యము నాకొక నూతన ప్రత్యక్షతలా వచ్చింది. అప్పుడు నేను నిస్సందేహంగా, ఆ దేశానికి వెళ్ళవచ్చునని గ్రహించాను. నేను ఆ దేశపు సరిహద్దుల్లో ప్రవేశిస్తున్నప్పుడు సహజంగానే నాలో అనేక భయాలు చెలరేగాయి. అయితే నేను నాకు కలిగిన ఆ భయములపై ఆధారపడి నిర్ణయము తీసుకోలేదు.


ఈ ప్రపంచంలో ఏ దేశములోనైనా యేసు ప్రభువుకు సార్యభౌమాధికారము లేదని నీవనుకుంటున్నట్లైతే నీవు ఆ దేశానికి వెళ్ళవద్దని నేను సలహా ఇస్తాను! నేను కూడా అటువంటి దేశానికి వెళ్ళను. నేను భయపడతాను. అయితే దేవునికి స్తోత్రం, ఈ భూలోకంలో అటువంటి ప్రదేశము లేనేలేదు! భూలోకములోని ప్రతిమూల మన ప్రభువు యొక్క అధికారములో ఉంది.


అదే విధముగా, ఎక్కడైనా ఎవరైనా (అతడు ఎంతటి శక్తిమంతుడైనా సరే) ప్రభువు అధికారం క్రింద లేకుండా ఉన్నాడని నీవు భావిస్తే అతని గూర్చి ఎల్లప్పుడు భయముతో బ్రతకాల్సివస్తుంది. అయితే దేవునికి వందనాలు, అటువంటి మనిషి ఎక్కడా లేడు. ప్రతి మానవునిపై మన ప్రభువు అధికారము కలిగివున్నాడు. దానియేలు 4:35లో మనము చదవినట్లుగా నెబుకద్నెజరు రాజుకూడా ఈ సత్యాన్ని అర్ధము చేసుకున్నాడు.


కల్వరి సిలువలో ప్రభువు చేతిలో ఓడింపబడక ఏదో విధముగా తప్పించుకొని తిరుగులాడుతున్న దయ్యమంటూ ఏదైనా ఉంటే ఆ దయ్యము విషయంలో మనము ఎల్లప్పుడూ భయంతోనే జీవిస్తాము. అయితే ఈవిధముగా సిలువలో ఓడింపబడని దయ్యముండలేదు. అక్కడ సాతాను కూడా శాశ్వతముగా ఓడిపోయాడు. ఈ సత్యం మనల్ని సాతాను, అతని దురాత్మల భయము నుండి తప్పించి మన పరిచర్యలో మనకు గొప్ప ధైర్యమును ఇస్తుంది.


కాబట్టి మనము దేవుడు వెళ్ళమన్న చోటికల్లా వెళ్తాము. కొన్ని ప్రదేశాల్లో ప్రమాదాలు ఉండొచ్చు. కానీ మనకు తెలిసినంత మట్టుకు అక్కడికి ప్రభవు నడిపిస్తున్నాడని భావిస్తే అక్కడికి వెళ్ళటానికి మనము భయపడనవసరము లేదు. ఒకానొక ప్రదేశములో క్రైస్తవులకు శ్రమ ఉన్నది, లేక లేదు అనేది ప్రశ్నకాదు. అసలైన ప్రశ్న ఏమిటంటే అక్కడికి వెళ్ళమని ప్రభువు మనతో చెప్పాడా, లేదా? ఒకవేళ ఆయన గను వెళ్ళమని చెబితే తన అధికారము మనల్ని సంపూర్ణముగా బలపరుస్తుంది. మనకు ఎటువంటి భయమూ అవసరములేదు. అయితే ఒక ప్రదేశానికి వెళ్ళమని దేవుడు మనల్ని పిలువకపోతే మనము వెళ్ళకూడదు. వెళ్ళమని ఎంతమంది మనల్ని ఎంతగా బలవంతపెట్టినా సరే లేక మనలోని సాహస భావము ఎంతగా మనల్ని పురికొల్పి ముందుకు త్రోసినా సరే వెళ్ళకూడదు!


మనము ఒక ప్రదేశమునకు ఎందుకు వెళ్తున్నామో మనలను మనము ప్రశ్నించుకోవాలి. మనకు మరెటువంటి కోరికలేకుండా శిష్యులుగా చేయుటకు మాత్రమే మనము వెళ్ళుచున్నట్లయితే ప్రభువు మనకు వాగ్దానము చేసినట్లుగా ''యుగసమాప్తి వరకు'' ఆయన మనకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడని చెప్పగలము కాని దానికి బదులుగా మనము వేరే ఉద్దేశ్యములు కలిగియుండవచ్చు. ప్రభువు ''మన హృదయములు ఎట్లున్నవో పరీక్షించువాడు'' మరియు మన ఉద్దేశ్యములను పరీక్షించువాడు.


తనకు తానుగా విశ్వాసి అని పిలిపించుకునే ప్రతి ఒక్కరికీ ప్రభువు తన్ను తాను వశపరచుకోడు. యోహాను సువార్త 2:24లో ఈ విషయము చదువుతాము. ''ప్రభువా, ఈ ప్రదేశానికి వెళ్ళమని నన్ను నీవే పిలిచావని నేను గ్రహించాను గనుక వెళ్తున్నాను. శిష్యులుగా చేయుటకోసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమిచ్చుటకు, నీవు ఆజ్ఞాపించిన సమస్తమును వారికి నేర్పించుటకు నేను అక్కడికి వెళ్తున్నాను. డబ్బు సంపాదనకోసం గానీ, నా పేరు ప్రఖ్యాతులకోసంగానీ, మరో వ్యక్తిగత కారణము చేతగానీ నేను అక్కడకి వెళ్ళటము లేదు''. నీవు ఈ విధముగా యదార్ధహృదయముతో ప్రభువుతో చెప్పినస్పుడు ప్రభువు యొక్క అధికారము నిన్ను ఎల్లప్పుడు నిశ్చయముగా బలపరుస్తుంది.


అప్పుడు నీవు, నీ భార్యా పిల్లలకు ఏమి జరుగుతుందోనని గానీ, నీ ఆర్థిక అవసరతలు ఎలా తీరుతాయోననిగానీ ఆలోచిస్తు భయాందోళనలో జీవించవు. అసలైన ప్రాముఖ్య ప్రశ్న ఏమిటంటే, ''దేవుడు నిన్ను పిలిచాడా లేదా?'' నిన్ను ఆ ప్రదేశానికి దేవుడు పంపుతున్నాడా? లేక ఒక మానవుడు పంపుతున్నాడా? లేక నీలోని సాహస భావము పురికొల్పుతున్నదా?


దేవుని ప్రణాళికకు బదులు మరో ప్రణాళిక నీ జీవితములో ఉంటే నిన్ను ఆదరించుటకు లేఖన భాగమునుండి ఒక్క వాగ్ధానమును కూడా నేను నీకు చూపించలేను. అయితే శిష్యులుగా చేయుట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమిచ్చుట, యేసు ఆజ్ఞానుసారం సమస్తము బోధించుట వంటి దేవుని ప్రణాళిక, నీ ప్రణాళికగా మారినప్పుడు నీవు మానవులకు గానీ, దయ్యాలకు గానీ భయపడ నవసరము లేదని నేను నీకు హామీ ఇవ్వగలను.


ప్రతి దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభువు నామములో ఉన్న అధికారాన్ని అమలు పర్చటము ద్వారా దయ్యములు పట్టిన వారిని విడుదల చేయట ఎట్లో తెలుసుకొని ఉండాలి. దయ్యములు నీకూ, నాకూ భయపడవు. వాటిని సిలువపై ఓడించిన ప్రభవుకు మాత్రమే భయపడతాయి. అందుచేత యేసుక్రీస్తు, సిలువమీద సాతానుయొక్క సర్వశక్తిని తీసివేశాడని స్పష్టముగా తెలుసుకొనుట ముఖ్యము (కొలస్సి 2:14,15). మొదట మనము అనుభవించి, ఆ తరువాత మానవులందరికీ ప్రకటించవలసిన సువార్త, శుభసందేశము ఇదే. మనము దీనిని నమ్మితే ఇతరులను సాతాను శక్తినుండి విడిపించగలుగుతాము.


దయ్యములు మనలను ఏమి చేస్తాయోనని మనము భయపడకూడదు - ఎందుకంటే దేవుని అనుమతిలేకుండా మన తల వెంట్రుకలలో ఒక దానిని కూడా ముట్టలేవు. కానీ భారతదేశములో చాలామంది విశ్వాసులు ఏదో ఒక రోజున ఎవరో ఒకరు తమపై చేతబడి (మంత్ర ప్రయోగం) చేస్తారేమోనని భయపడిపోతారు. ఇటువంటి భయాలు వారికెందుకు? ఎందుకంటె సిలవపై సాతానుడు ఓడిపోయాడని వారికి తెలియదు.


చాలాకాలంగా రోగ గ్రస్తుడైన ఓ పాస్టరు గారిని నేను దర్శించిన సంఘటన నాకు గుర్తు వస్తుంది. శత్రువులు తనపై మంత్ర ప్రయోగం చేసినందుచేత ఆ రోగం సంభవించినట్టు ఆ పాస్టరుగారు నాకు చెప్పారు. అదెలా సాధ్యము? మాయాజాలము, మంత్ర ప్రయోగాల శక్తి కంటే ప్రభువు శక్తి తక్కువా? ఆ పాస్టరుగారు అలా భావించుటకు గల కారణము తన అవిశ్వాసమే. భూమి మీద గానీ, ఆకాశ మండలములో (దయ్యములు పనిచేయు స్థలములో) గానీ మన ప్రభువు యొక్క శక్తి, అధికారములకు వ్యతిరేకముగా దయ్యపుశక్తి నిలువనేరదు (ఎఫెసీ 6:12). దీనిని నమ్మకపోతే నీవు ప్రభువును సేవించుట మానివేసి ఎక్కడికైనా వెళ్ళి మరేదైనా చేసుకొని బ్రతకమని నేను నీకు సలహా ఇస్తాను. భయమును, అపనమ్మకమును ఇతరులకు అంటించే బోధకుడిగా ఉండుట మానుకో. భయము సాతాను ఆయుధము. వాడు దానిని నీపై ప్రయోగించనీయకు.


యోబు జీవితంలో జరిగిన విధముగా- ఆయా సమయాల్లో దేవుని అనుమతితోనే దయ్యములు ఒక విశ్వాసిని వేధించవచ్చు. అపొస్తలుడైన పౌలును బాధపెట్టుటకు దేవుడు సాతాను దూతను అనుమతించాడు (2 కొరింథీ 12:7). ఆ బాధ పౌలుకు తన శరీరములో ముల్లు వలె అది వేధించింది. పౌలు వెళ్ళిన ప్రతిచోటను నిరవధికంగా బాధకు గురిచేసినది, ఒక శరీర బలహీనత కావొచ్చు లేక ఒక వ్యక్తియైనా కావొచ్చు. ఒకవేళ మన శరీరములో ముల్లు ఉండి, దానిని మనంతట మనము తీసివేసుకోలేనప్పుడు దానిని తీసివేయమని మనము దేవుణ్ణి అడగాలి. మనల్ని దీనులుగా ఉంచటములో ఆ ముల్లు గొప్ప సాధనముగా ఉన్నట్టు దేవుడు చూస్తే పౌలుతో చెప్పినట్లు మనకు కూడా ఆయన 'కాదు' అని చెప్పవచ్చును. ఒకసారి థెస్సలోనికయకు ప్రయాణము చేయకుండా పౌలును అడ్డగించుటకు దేవుడు సాతానును అనుమతించాడు. అయితే అతని స్థానములో అక్కడికి తిమోతి వెళ్ళి దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చాడు (1 థెస్స 2:18; 3:2).


ఏది ఏమైనప్పటికీ, నేను ఈ విషయమును గట్టిగా నొక్కిచెప్తాను: నూతనముగా జన్మించిన ఏ క్రైస్తవుని కూడా దయ్యము పట్టలేదు. దురదృష్టవశాత్తు అనేకమంది బోధకులు ఈ దినములలో ''విశ్వాసులకు దయ్యములు పట్టవచ్చును'' అను వాక్యానుసారము కాని సిద్ధాంతమును బోధించుచున్నారు. ఆ విధముగా వారు అనేకమంది విశ్వాసులను భయములోనికి, శిక్షావిధిలోనికి తెస్తున్నారు.


అటువంటి బోధకులు తమ బోధను సమర్థించుకునేందుకు ఒక్క లేఖన వాక్యమును కూడా చూపించలేరు. అయితే వారు తమ అనుభవములో అటువంటి సంఘటనలు చూచినట్లు చెబుతారు. ఈ విధముగా వారు దేవుని వాక్యమునకు పైగా తమ తమ అనుభమును హెచ్చిస్తున్నారు. వారు తప్పు అని ఇదే రుజువు చేస్తుంది.


ఒకే హృదయములో క్రీస్తు, దయ్యము కలిసి నివసించలేరు. ఒకే ప్రదేశంలో వెలుగు, చీకటి కలిసి ఉండవు. యేసు బోధించిన కొన్ని సమాజమందిరాల్లో కొంతమంది యూదులు దయ్యములచేత పట్టుబడుట నిజమే. కానీ రక్షింపబడిన(నూతనముగా జన్మించిన) ఒక్కరుకూడా దయ్యముచేత పీడించబడుట గూర్చి బైబిల్లో ఒక్క సందర్భము (అపొ.కా. 2 తరువాత) కూడా చదువము.


పౌలు, యోబుల జీవితాల్లో జరిగిన విధముగా ఒక క్రైస్తవుడు బయటినుండి దయ్యముల చేత వేధింపబడవచ్చు, అదీ దేవుని అనుమతితోనే. యోబు, పౌలుల వలె అటువంటి వేధింపును దేవుడు అనుమతిస్తే అది నీ ఆత్మీయ మేలు కోసమేనని ఖచ్చితంగా తెలుసుకో.


ఒక వ్యక్తి దయ్యము చేత పీడింపబడుతున్నట్టు సందేహము కలిగితే ఆ వ్యక్తితో తన హృదయపూర్వకముగా ఈ క్రింది మూడు ఒప్పుకోళ్ళు చెప్పించండి.


1. యేసు క్రీస్తు నా ప్రభువు.


2. యేసు క్రీస్తు శరీర ధారియై వచ్చి పాపమును జయించాడు.


3. సాతానుడా, సిలువపై యేసు క్రీస్తు చేతిలో నీవు ఓడించబడ్డావు. నేనింకెంతమాత్రము నీకు సంబంధించిన వాడిని కాను.


దయ్యము పట్టిన వారు తమ ఆత్మలతో ఈ మూడు ఒప్పుకోళ్ళు చెప్పలేరు.


మనము జబ్బుపడినప్పుడల్లా స్వస్థత కోసం ప్రార్థించుకోవాలి. అయితే ఆ అనారోగ్యము ద్వారా ఏదైనా ఆత్మీయ లాభమును మనకు అందించాలనీ, తద్వారా ఆయన తన నామమును మహిమపరుచుకోవాలనుకుంటే, దానిని మనము సంతోషముతో అంగీకరించాలి.


పాత నిబంధనలో తల్లిదండ్రులను సన్మానించిన వారికి దేవుడు దీర్ఘాయుష్షును (ఆరోగ్యవంతమైన జీవితమును) వాగ్ధానము చేశాడు. ఇందులో ఉన్నది ఏమిటి? అటువంటి పిల్లలు ఎదుగుతూ ఉండగా వారికి మరణకరమైన ప్రమాదము గానీ, అనారోగ్యముగానీ కలుగకుండా దేవుడు వారిని దృష్టిస్తూ ఉంటాడని దీని భావము. తమ తల్లిదండ్రులను సన్మానించిన కుమారులపై దేవుడు ప్రత్యేక దృష్టిని ఉంచాడా? అవును, అది వాస్తవమైన, అర్ధవంతమైన, దేవుడు నెరవేర్చిన వాగ్దానము. తల్లిదండ్రులను సన్మానించిన ఒక కుమారుడు ఈ లోకములో దీర్ఘాయుష్మంతుడగునట్లు దేవుడు పరిస్థితులను అదుపులో ఉంచాడు.


అదే విధముగా దేవుని చిత్తము నెరవేర్చకముందే మనము మరణించకుండా ఉండేలా మన జీవిత పరిస్థితులను కూడా ఆయన అదుపులో ఉంచగలడు, అది 33 సంవత్సరాల ప్రాయమైనా, లేక 90 సంవత్సరాల వయసైనా సరే.


నూతన నిబంధన క్రింద దీర్ఘాయుష్షు గొప్ప విషయమేమీ కాదని మనకు తెలుసు. అల్పమైనా, దీర్ఘమైనా దైవచిత్తము నెరవేర్చుటలో గడిపిన జీవితమే ముఖ్యము. యేసు ప్రభువే 33 సంవత్సరాల ప్రాయము వరకు జీవించాడు అయినా తనకు తండ్రి అప్పగించిన పనిని ముగించాడు. డేవిడ్‌ బ్రెయినార్డ్‌ 29 ఏళ్ళు బ్రతికాడు, వాచ్‌మన్‌ నీ 70 ఏళ్ళు జీవించాడు. ఏది ఏమైనా ఈ భూలోకము విడిచివెళ్ళే ముందు తమకు దేవుడు అప్పగించిన పనిని(మనకు తెలిసినంత వరకూ) వీరిరువురూ నెరవేర్చారు. వారికి ఇవ్వబడిన పని నెరవేర్చు వరకు అనారోగ్యము గానీ, ప్రమాదము గానీ వారి జీవితములను అంతం చేయకుండా దేవుడు తన సార్వభౌమాధికారముతో పరిస్థితులను స్వాధీన పర్చుకున్నాడు.


మన శరీరము మీద దండెత్తు అసంఖ్యాక క్రిములు, సూక్ష్మ జీవులు ఈ లోకములో ఉన్నాయి. వాటిలో కొన్ని మనలను చంపుటకు కూడా శక్తికలిగియున్నాయు! అయితే అవి మనల్ని చంపకుండా వాటిని అదుపు చేయుటకు దేవుడు శక్తిమంతుడు.


తప్పత్రాగి రోడ్లమీద వాహనాలు నడిపే డ్రైవర్లు, మనకు ప్రమాదాలు చేసి చంపకుండా వారిని అదుపులో ఉంచుటకు కూడా దేవుడు చాలినంత శక్తిమంతుడు.


ప్రతిక్షణము ఆయన దృష్టి మనపై ఉంటుంది. ఆయన కునుకడు, నిద్రపోడు. ఈ సత్యాన్ని మనము నమ్మితే పరిస్థితుల భయము, అనారోగ్య భయము, ప్రమాదాల భయము, ఇతరత్రా భయములనుండి మనము విముక్తులము అవుతాము.


నీవు దేవునికి భయపడితే నిజముగా ఇక నీవు దేనికీ భయపడనవసరములేదు.


అధ్యాయము 12
ఇతరులను భయమునుండి విడిపించుట

ఒక ఆత్మీయ నాయకుడు ప్రజల్ని తన అధికారము క్రింద ఉంచుకునేందుకు భయమును ఎన్నడూ ప్రయోగించడు. దీనికి భిన్నముగా అతడు ప్రజలను భయమునుండి విడిపిస్తాడు.


సాతాను యొక్క ఆయుధసామాగ్రిలో మాత్రమే భయము అనే అస్త్రము కనబడుతుంది. మానవుని భయమునుండి విడిపించుటకే యేసు వచ్చాడు. ప్రతి ఆత్మీయ నాయకుడు కూడా ఇదే పని చేయాలి.


''జీవిత కాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను'' అని హెబ్రీ 2:14లో చెప్పబడినది.


''మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని కుమారులవలె దత్త పుత్రాత్మను పొందితిరి'' అని రోమా 8:15 మనకు చెప్తున్నది.


మనల్ని భయభ్రాంతులుగా చేసే దాస్యపు ఆత్మకూ దేవుని కుమారులుగా చేసే పరిశుద్ధాత్మకు గల వ్యత్యాసమును ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. భయము ఎప్పుడైనా దాసత్వాన్ని తెచ్చిపెడుతుంది. ప్రపంచములోని మనుష్యులందరూ భయంతోనే జీవిస్తున్నారు. దురదృష్టవశాత్తు విశ్వాసులుకూడా భయంతోనే జీవిస్తున్నారు.


ఒక మానవుడు నిన్ను బాగా భయపెట్టినట్లైతే నీవు అతడికి బానిసగా మారెదవు. విమతములన్నీ(ప్రత్యేకమైన గుంపులు) ఈ నియముమును మాత్రమే ఆధారము చేసుకొని పనిచేస్తాయి. శక్తివంతమైన ప్రకృతిసంబంధమైన బలము గలవారు భయం అనే అస్త్రాన్ని ప్రజలమీద ప్రయోగిస్తారు. ఎవరైనా తమ గుంపును విడిచివెళ్ళితే వారికి, వారి కుటుంబాలకు తీవ్ర ప్రమాదం సంభవించగలదని భయపెడతారు. ఇది కేవలము బద్ధిహీనత. కానీ ప్రజలు ఇటువంటి బెదిరింపులను చాలా కాలముగా పదే పదే వినటము వల్ల వాటిని నమ్మి ఆ గుంపును విడిచిపెట్టుటకు భయపడతారు. ఆ గుంపులో జరుగుతున్నదంతా తప్పుగా కనబడుతున్నప్పటికీ భయము వల్ల అందులోనే ఉండిపోతారు. ఆ గుంపు యొక్క నాయకుడు వ్యభిచారములో కొనసాగుతూ ఉండొచ్చు. కానీ ఆ గుంపులో ఉంటున్న సభ్యులు భయంవల్ల అతనికిక వ్యతిరేకముగా మాట్లాడుటకు ధైర్యము చేయరు. అటువంటి ఆ భయమే వారిని బానిసత్వంలోకి నెడుతుంది.


ఓ క్రైస్తవ నాయకుడు ఎప్పుడైతే విశ్వాసులను తన అధికారానికి లోబర్చుకునేందుకు, దశమ భాగమును రాబట్టుకునేందుకు, మరి దేనికోసమైనా సరే భయమనే ఆయుధాన్ని సంఘస్తులమీద ప్రయోగిస్తున్నట్లయితే అప్పుడు అతడు సాతాను యొక్క అస్త్రాన్ని వినియోగిస్తున్నాడు.


మనము కోరినట్లు ప్రజలచేత చేయించుటకు భయమనే ఆయుధాన్ని మనమెన్నడూ వారిపై ప్రయోగించకూడదు. ఎవరైనా ఈ ఆయుధాన్ని వినియోగిస్తే అటువంటి వ్యక్తి కడుతున్నది ఒక విమతానికి చెందిన గుంపును మాత్రమే.


నిజమైన దేవుని సంఘములో ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి తమ తమ అభిరుచులననుసరించి ఆలోచించే స్వేచ్ఛ కలిగివుండాలి. సంఘములో ఎవరైనా పాపములో బ్రతుకుతుంటే అటువంటి వారిని సరిచేయుటకు తప్పనిసరిగా క్రమశిక్షణ అవసరము. కానీ అటువంటివారిని శాపములతో బెదిరించకూడదు.


విశ్వాసులు సంఘానికి తమ దశమ భాగములు చెల్లించకపోతే అటువంటివారు తమ డబ్బంతా డాక్టర్లు, ఆసుపత్రి బిల్లులపై వృధాచేయవలసి వస్తుందని కొందరు పాస్టర్లు(కాపరులు) తమ సంఘాల్లో చెబుతుంటారు. ఇది కేవలము బుద్ధిహీనత. ఇటువంటి భయములనుండి ప్రజలను విడిపించుటకే మనము పిలువబడ్డాము. ప్రజలు తమ ధనమును సంతోషముగా, ఉత్సాహముతో ఇవ్వాలి గానీ- శిక్ష, తీర్పు వంటి బెదిరింపులతో మాత్రము కాదు. ఆ విధానములో ఎవరిదగ్గరనైనా డబ్బు తీసుకొనుట దేవుని ఇష్టము కాదు. ప్రజల దగ్గరనుండి తప్పుడు విధానములో డబ్బు గుంజే పాస్టర్లు(కాపరులు) ఎప్పుడో ఒకప్పుడు దేవుని తీర్పును ఎదుర్కొంటారు.


పాతనిబంధన క్రింద ప్రజలు దేవుణ్ణి భయముతో సేవించారు. ద్వితీయోపదేశ కాండము 28 లో ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు విధేయులు కాని పక్షములో దారిద్య్రము, అనారోగ్యము, పిచ్చితనము లాంటి శాపములతో వారు శిక్షింప బడతారని హెచ్చరింపబడ్డారు. కాబట్టి వారు భయముతో దేవునికి లోబడ్డారు. దశమ భాగములు సమర్పించకపోతే శాపగ్రస్తులవుతారని ఇశ్రాయేలీయులకు మలాకీ చెప్పాడు (మలాకీ 3:10). అయితే అది ధర్మ శాస్త్రానుసారమైనది.


మనల్ని అటువంటి అక్షరానుసారమైన (చట్టపరమైన) విధేయత నుండి తప్పించుటకు యేసు వచ్చాడు. బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి జెకర్యా క్రొత్త నిబంధన యుగాన్ని ప్రవచిస్తూ ''మనమిప్పుడు నిర్భయముగా దేవుని సేవించవచ్చు, నిజమైన గౌరవముతో సేవింపవచ్చు'' అని చెప్పాడు.


భయము వల్ల నీ జీవితములో ఏదైనా చేస్తున్నావా? ప్రతి ఉదయము బైబిలు చదువకపోతే ఏదైనా ప్రళయము సంభవిస్తుందేమోనని ఆ భయముతో వాక్యము చదువుతున్నావా? అది కేవలము మూఢభక్తి, నమ్మకములు మాత్రమే. అటువంటి మూఢత్వంలో బైబిలు చదవమని దేవుడు నిన్ను కోరటంలేదు! నీమీద తనకున్న గాఢమైన ప్రేమను తెలుసుకొని సమస్త భయములనుండి విడుదల పొందాలని నిన్ను దేవుడు కోరుతున్నాడు. మనమెన్నడూ సాతాను చేత శిక్షా విధికి గురవకుండునట్లు కేవలం ఈ కారణం చేతనే దేవుడు మనల్ని క్రీస్తు రక్తంలో కడిగి, నీతిమంతులుగా కూడా తీర్చాడు.


దేవుని ప్రజల్ని శిక్షావిధిలోకి తీసుకువెళ్ళే ఏ పరిచర్యయైనా దేవుని నుండి కలిగినది కాదు. ప్రభువు మానవులను విడిపించుటకు వచ్చాడు గానీ - వారిని మరింత బానిసత్వములోకి లాగుటకు మాత్రము కాదు.


ఇప్పటికే చాలామంది విశ్వాసులు అనేకమైన సమస్యలతో ఎంతో శ్రమపడుతున్నారు. వారు సంఘ కూటములకు వచ్చినప్పుడు వారిని ఖండిస్తు మరిన్ని సమస్యలను వారికి మనము ఇవ్వకూడదు. విడుదలకోసము, సహాయము కోసం వారు సంఘానికొస్తారు - కానీ తిట్టించుకునేందుకు, ఖండించబడేందుకు, నిరుత్సాహముతో ఇంటికి వెళ్ళేందుకు కాదు.


ఆనంద ధ్వనులతో ఉన్న తన ప్రజలపై ప్రభువు సంతోషిస్తాడు. దీనినే మనము దేవుని ప్రజలకు ప్రకటించాలి.


మనపై ఆయన చూపిన ప్రేమను పండుగగా చేస్తూ, మనల్ని బట్టి ఆయన ఆనందిస్తూ, సంతోషిస్తున్నాడన్న విషయంలో అతిశయించుటకే మనము సంఘ కూటములలో ప్రభువుకు స్తోత్రగానములు చేస్తాము. మనము మంచివాళ్ళమైనందువల్ల దేవుడు మనల్ని క్షమించలేదు. కేవలం తన ప్రేమ చేతనే క్షమించాడు. మనలో ఏ మంచి లేనప్పుడే క్రీస్తులో మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే పశ్చాత్తాప పడిన మనల్ని ఇప్పుడు ఇంకెంత అధికంగా ప్రేమించాలి?


అయినప్పటికీ సాతానుడు తన సొంత సంతానము కన్నా ఎక్కువగా దేవుని పిల్లల మధ్య ఎక్కువగా శిక్షావిధికి లోనగునట్లు విజయం సాధించాడు. వాస్తవానికి సాతాను పిల్లలు శిక్షావిధికి లోనవ్వాలి కానీ మనము కాదు. కానీ వాళ్ళు మోసకరమైన లోకములో సంతోషంగా జీవిస్తున్నారు. లోకములో అత్యానందభరితులుగా ఉండవలసిన చాలామంది దేవుని పిల్లలు శిక్షావిధి, అయోగ్యతల వంటి భావాలతో కృంగి పోతున్నారు. ఇది దీనత్వము కాదు గానీ అవిశ్వాసమే!చాలా మంది విశ్వాసులు తాము పరిశుద్ధాత్మతో నింపబడినట్లు చెప్పుకుంటూనే భయానికి బానిసలుగా బ్రతుకుతుంటారు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడికూడా భయానికి బానిసగా ఎలా ఉండగలడు? ఎవరో అబద్ధ ప్రవక్త వచ్చి వారి మీదికి గొప్ప ఉపద్రవము రాబోతుందని చెప్పగానే-వారు వెంటనే భయంతో నిండిపోతారు. అప్పుడు ఆ తప్పుడు ప్రవక్త వారందరి దగ్గర డబ్బు వసూలు చేసుకొని ''దేవుని భద్రత వారి మీదికి రావాలని'' ప్రార్థించి మరో కుటుంబమును మోసగించుటకు వారిని దర్శిస్తాడు. అటువంటి తప్పుడు ప్రవక్తల విషయంలో మనము అప్రమత్తంగాఉండాలి. ప్రజల మనసుల్లో భయాన్ని సృష్టిస్తూ తిరుగులాడుతున్న తప్పుడు ప్రవక్తలు ఈనాడు లోకములో ఎందరో ఉన్నారు.


పదివేల మంది తప్పుడు ప్రవక్తలు మనమీద కీడును ప్రవచించినా కీడు కొంచెమైనా మనల్ని అంటదు. ఆ కీడు వారిమీదికే వెళ్తుంది. ఈ సత్యాన్ని మన సంఘాలకు బోధిస్తూ విశ్వాసుల్ని ధైర్యపర్చాలి. మనలో ఏరకమైన భయమున్నప్పటికీ దేవుని ముందర నమ్మకము గానీ సాతాను ముందర ధైర్యము కానీ మనకు కలుగదు! మనము దేవునికి భయపడితే మరి దేనికీ భయపడనవసరములేదు.


భయము సాతాను ఆయుధము, పరిచర్యలో భయాన్ని ప్రయోగించే వారెవరైనా సాతానుతోసహవాసం చేస్తున్నట్లే.


యేసు నరకము గూర్చి ప్రజలను హెచ్చరించాడు, కానీ ఆ స్థలమును గురించి రకరకాల భయంకరమైన కథలతో వర్ణించి ఎన్నడూవారిని భయపెట్టలేదు! ఆయనను విడిచిపెట్టి వెళ్లిన శిష్యులను తీవ్ర పరిణామాలు కలుగుతాయని బెదిరించలేదు. తమ సేవకులను ఎన్నడూ భయపెట్టవద్దని బైబిలు యజమానులను ఆజ్ఞాపిస్తుంది (ఎఫెసీ 6:9).


భయము సాతాను ఆయుధమైనప్పుడు దేవుని సేవకులముగా మనము దానిని ఎలా ప్రయోగించగలము? అయినప్పటికీ తమ సంఘాలను స్వాధీన పర్చుకునేందుకు గాను వారిపై భయమును ప్రయోగించే క్రైస్తవ నాయకులు కోకొల్లలుగా ఉన్నారు.


ప్రజలు మనల్ని చెడ్డ పేర్లతో పిలిచినా సరే, దేవుని తీర్పునుగానీ, దైవోగ్రతనుగానీ మనము వారిపై ప్రకటించి భయపెట్టకూడదు. పరిసయ్యులు యేసును ''దయ్యములకధిపతి'' అని పిలిచారు. అయితే బదులుగా యేసు వారిని బెదిరించలేదు గానీ క్షమించాడు (మత్తయి 12:32). ఆయన మాదిరిని మనం అనుసరిద్దాము.


మనము ప్రజలతో మాట్లాడినప్పుడు మనము మాటలతో పాటు ఒక ఆత్మను బయటకి పంపుతాము. దీనిని మనము తెలుసుకొనలేకపోవచ్చు. గానీ అది ఉంటుంది. మన నోటినుండి దుర్వాసన వస్తున్న విషయాన్ని ఇతరులు పసిగట్టగలరు గానీ మనంతట మనము దానిని తెలుసుకోలేము! ఖచ్చితముగా అదే విధంగా మన ఆత్మలనుండి వచ్చే దుర్వాసన కూడా ఉంటుంది! పరిశుద్ధాత్మగూర్చి మనము బోధించవచ్చు గానీ మనలోనుండి బయటకి వచ్చే ఆత్మ పరిశుద్ధమైనది కాకపోవచ్చు.


మనము దీనత్వము గూర్చి మాట్లాడవచ్చు, గానీ మనలో నుండి బయటకువెడలే ఆత్మ దీనత్వము కలిగినది కాకపోవచ్చు! దీనత్వము అను అంశము మీద ఇద్దరు సహోదరులు ఒకే సందేశం బోధించవచ్చు. ఒకరు దీనత్వము కలిగిన ఆత్మను కలిగియుండి దానినే తన బోధ వింటున్నవారికి చెబితే, మరొకరు గర్వము గలవాడై దానినే తన బోధను వింటున్న వారికి అందిస్తాడు- సందేశాలు రెండూ ఒక్కటే అయినా ఆ ఇద్దరి బోధకులు మధ్య వ్యత్యాసం చాలా ఉన్నది మరియు దానిని మనము తప్పక వివేచించాలి.


అదేవిధంగా మనలోపల భయం ఉంటే ఇతరులకు భయము గల ఆత్మను మనం పంపించగలము. మనము చేసే దేవుని వాక్యబోధ తీరును బట్టి విశ్వాసుల్ని శిక్షా విధికి తేగలము. మనము యదార్థవంతులము గానే ఉండొచ్చు, కానీ మనలో నుండి బయలువెడలే ఆత్మ ప్రజల్ని బానిసత్వములోనికి నడిపించేదిగా ఉండవచ్చు.


మన సందేశముల తీవ్రత మన హృదయముల నుండి బయలువెడలు ఆత్మపై ఆధారపడి ఉంటుంది గానీ మన గ్రహింపు నుండి వచ్చు జ్ఞానము మీద కాదు. మనము ఇతరులకు ఒక సందేశమును కాదుగానీ జీవమును అందిస్తున్నాము.


నీవు ఎటువంటి భయమునకైనా బానిసవైతే, అదే ఆత్మ నీ నుండి బయలువెడలి నీవు మాట్లాడుతున్న ఇతరులను కూడా పాడు చేస్తుంది, దాని ఫలితంగా వారుకూడా భయపెట్టే ఆత్మకు ఆధీనులైపోతారు. ఇది మానవ శరీర విధానములాగే ఉంటుంది! నీ రక్త ప్రసరణలో జబ్బు కణములు ఉంటే నీ ద్వారా నీ జబ్బు నీ పిల్లలకు వస్తుంది.


అందుచేత మనజీవితమునుండి ప్రతి విధమైన భయమును తొలగించుకొనుట ప్రాముఖ్యమైన విషయము- మానవ భయము, సాతాను భయము, అనారోగ్యభయము, మరణ భయము, చెడు పరిస్థితులగూర్చిన భయము, రోడ్డు ప్రమాదాల భయము, దారిద్య్ర వలన భయము (మన వంటి పేద దేశంలో ఇది వాస్తవికమైన భయమే), మన పిల్లలకు సరైన విద్య, సరైన ఉద్యోగాలు లభిస్తాయో లేదోననే భయం ఇటువంటి అనేకమైన భయాలు మనలో ఉంటాయి.


దేవుని భయము, దేవుని యందలి విశ్వాసము మాత్రమే ఈ భయాలన్నింటినీ మనలోనుండి పారద్రోలగలదు. మనము దేవునికి భయపడితే ఎవ్వరికీ, దేనికీ భయపడనవసరములేదు.


మనము దేవుని యందు విశ్వాసముంచినట్లయితే, ఆయనను శ్రద్ధగా వెదకు వారికి ఆయన ప్రతిఫలము దయచేయు వాడనీ, ఆయనను ఘనపరచు వారినే ఆయన ఘనపర్చువాడనీ మనకు తెలుసు. అప్పుడప్పుడు సందర్భానుసారమైన భయము మనలో ఉంటున్నప్పటికీ మన హృదయాల్లో విశ్వాసము నివసిస్తున్నప్పుడు అక్కడ భయము నివసించదు.


అసలు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మన ఆలోచనా విధానాన్ని అధిగమిస్తున్నది ఏమిటి? భయమా, విశ్వాసమా?


భయమనే ఆయుధాన్ని ప్రయోగిస్తూ ఎప్పుడైనా మనము ఇతరులపై పెత్తనం చేయుటకు ప్రయత్నిస్తున్నామా? అనే ప్రశ్నకూడా మనకు మనము వేసుకోవాలి.


అధ్యాయము 13
తనను తాను తగ్గించుకొనుట

ఒక ఆత్మీయ నాయకుడు తన్నుతాను తగ్గించుకొనుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉంటాడు.


దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులైయుంటే దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు(1 పేతురు 5:5,6).


హెచ్చింపబడుట అంటే ఈ లోకములో గొప్ప వారమవుతామని గానీ, క్రైస్తవ లోకములో ప్రసిద్ధులమవుతామనిగానీ మరియు మనుష్యుల యొద్ద నుండి ఘనత పొందుతామనిగాని కాదు. ఇది ఆత్మీయ హెచ్చింపును మాత్రమే సూచిస్తుంది. మన జీవితము మరియు పరిచర్యలో దైవచిత్త మంతటినీ నెరవేర్చుటకు గాను అవసరమైన ఆత్మీయ అధికారము మనకు ఇవ్వబడుతుంది. అయితే ఇటువంటి హెచ్చింపు మనలను మనము తగ్గించుకొనుటపై ఆధారపడి ఉంటుంది.


ఇతరుల దృష్టిలో ఘనులుగా, ఇంకా ఘనులుగా కనబడాలని ఉవ్విళ్ళూరే మానవులతో ఈ లోకము నిండివున్నదని మనకు తెలుసు. ప్రతి రాజకీయవేత్త, ప్రతి వ్యాపారవేత్త తాను అందరికన్నా గొప్పవాడైపోవాలని కోరుకుంటాడు. దురదృష్టవశాత్తు తాము క్రీస్తు సేవకులమని చెప్పుకునేవారు కూడా గొప్పవారిగా, ఇంకా గొప్పవారిగా కావాలని ఆశిస్తారు. ''రెవరెండ్‌ డాక్టర్‌'', వంటి బిరుదులు చైర్మన్‌ వంటి సంస్థాపరమైన అధికార స్థానాల కోసం ఆరాటపడతారు. ఈనాటి క్రైస్తవ ప్రపంచము లోకములోని ఏ వ్యాపార సంస్థకు భిన్నంగా లేదని చెప్పుట విచారకరమైన విషయము!


తమ నాయకులు సినిమా నటుల వలె ప్రకాశమానముగా సమావేశాల్లో పెద్ద పెద్ద వేదికలమీద నిలిచి ఉండడం, ఖరీదైన హోటల్లో, మేడల్లో నివసించుట, ఖరీదైన సుఖవంతమైన కార్లు నడపటం ఈనాటి యువ విశ్వాసులు చూస్తున్నారు. దేవుని మార్గాల గూర్చి ఎక్కువగా తెలియని వీరు అటువంటి నాయకుల్ని అభిమానిస్తూ తాము కూడా ఒకనాడు ఆ స్థాయికి ఎదగాలని ఎదురు చూస్తుంటారు! సంవత్సరాల తరబడి దేవునికి నమ్మకమైన సేవకులుగా ఉన్న ఫలితంగా ఆ బోధకులకు దేవుడు ఈ విధంగా బహుమానాలందించాడని వారు భావిస్తారు. నమ్మకంగా ఉంటే తాము కూడా ఒకనాటికి తమ నాయకుల వలె అటువంటి వేదికలపై ప్రకాశమానమైన వెలుగులో అందరికీ కనబడవచ్చునని వారు ఊహించుకుంటారు.


బోధకులు అమెరికా, అరబ్బు దేశాలనుండి వచ్చిన బహుమతుల ద్వారా ఎంతో డబ్బు సంపాదించుటను యౌవనస్థులు చూచినప్పుడు, ఆ బోధకులవలె తాముకూడా ధనవంతులయ్యే రోజుకోసం ఎదురు చూస్తుంటారు. ఈ యౌవనస్థులకు ఆదర్శప్రాయము యేసు క్రీస్తు కాదుగానీ, ధనవంతులు, సినీ నటుల్లాంటి ఈ బోధకులే. క్రైస్తవ్యములో ఈనాడు విషాదకరమైన విషయం ఇదే.


ప్రభువును అనుసరిస్తే మనము ధనవంతులముకాము, ప్రసిద్ధులము కాము కానీ దైవస్వభావములోనికి మారుతామని మన జీవితం, మన మాటల ద్వారా యౌవనస్థులకు చూపించాలి. అలా చేసినప్పుడు మనము అపార్థము చేసుకోబడతాము, తిరస్కరించబడతాము, శ్రమలు పొందుతాము! అయితే మనలను ద్వేషించే వారిని మనము ప్రేమించ గలుగుతాము, శపించే వారిని దీవించ గలుగుతాము. రాబోవు తరానికి మనము చూపించవలసినది ఇదే. ఇది గనుక మనము చేయకపోతే - ఈనాటి శరీర సంబంధులైన బోధకుల్లో కనబడుతున్న ''మరియొక యేసును'' వారు అనుసరిస్తారు.


దేవుని బలిష్టమైన చేతి క్రింద మనల్ని మనము తగ్గించుకొనుట అంటే - మన జీవితాల్లో దేవుడు పంపుతున్న అన్నిపరిస్థితులను ఆనందముగా అంగీకరించటమే. మనము అనుమతించిన ఆ పరిస్థితులు మనల్ని దీనులుగా చేసినప్పుడు మనము అల్పులమవుతాము. దేవుడు గొప్ప వాడవుతాడు. ప్రజల దృష్టిలో మనము చిన్నగా మారినప్పుడు, వారు ఇంకెంత మాత్రము మనపై ఆధారపడక ప్రభువును ఆశ్రయిస్తారు.


ఒక ప్రభువు సేవకునిగా నేను, నన్ను విమర్శించే వారికన్నా నన్ను ఉన్నతంగా గౌరవించు వారికి ఎక్కువగా భయపడతాను. కొంత మంది నన్ను ఎంతగా గౌరవిస్తారంటే వారి కోసము దైవ చిత్తమును నేను తెలుసుకోవాలని ఆశిస్తారు. దీనికి ఎప్పుడైనా నా జవాబు ''కాదు'' అని మాత్రమే. పాత నిబంధన కాలములో మాత్రమే ప్రజలు తమ కోసం దైవచిత్తమును తెలుసుకునేందుకు ప్రవక్తల దగ్గరికి వెళ్ళారు. క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలందరూ (పిల్లలు కూడా) నేరుగా దేవుణ్ణి సమీపించి ఆయన చిత్తమును వ్యక్తిగతముగా తెలుసుకోవచ్చు. క్రొత్త నిబంధనలో మనకు లభించిన ఆధిక్యతలలో ఇది ఒకటిగా హెబ్రీ 8:11 లో నిర్ధిష్టముగా చెప్పబడినది. ఇప్పుడు మనమందరము పరిశుద్ధాత్మను పొందవచ్చు. ఆయన మనకు మార్గదర్శి, అందుచేత నేను సలహా మాత్రము ఇవ్వగలను గానీ వారి కోసం దైవచిత్తమును నేను ఎప్పుడూ కనుగొననని నా సహోదరులకు ఖచ్చితంగా చెబుతాను. నా పరిచర్య ఆరంభమునుండే నేను ఈ విషయం గట్టిగా చెప్పాను. దీనిఫలితమేమిటంటే ఇప్పుడు మా సంఘములోని విశ్వాసులు ప్రభువును వ్యక్తిగతంగా ఎరిగి నా పై ఆధారపడరు. వారు తమ శిరస్సైన క్రీస్తుకు అనుసంధానం చేయబడి వున్నారు. ఆవిధంగా అనేక సంవత్సరాలుగా క్రీస్తు శరీరము మా మద్య నిర్మించబడింది.


''మనము సాధ్యమైనంత త్వరగా ప్రజలను శిరస్సుతో(క్రీస్తుతో) కలిపి వారిని మననుండి స్వతంత్రులుగా చేయాలి''. క్రీస్తు శరీర నిర్మాణంలో మొట్టమొదటి నియమము ఇదే.


గతములో ఈ విషయములో మనము తప్పిపోయినందుకు మనలను మనము తగ్గించుకొని లోతైన పశ్చాత్తాపము పొందవలసిన అవసరమున్నది. మనలో క్రీస్తు హెచ్చింపబడుతూ మనం తగ్గించబడాలని మనము తృష్ణ కలిగియుండాలి. ఆసక్తి కలగాలి. క్రీస్తు మనలో హెచ్చింపడునట్లుగా దేవుడు మనల్ని మన జీవితములో అనేక పరిస్థితులగుండా నడిపించి మనల్ని దీనులుగా చేస్తాడు. ఆ పరిస్థితుల్లో మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మనలో దేవుని ఉద్దేశ్యము నెరవేర్చబడుతుంది.


మనము ఎవరి యెడల తప్పు జరిగించామో వారి దగ్గర క్షమాపణ అడుగుట అనేది మనల్ని మనము తగ్గించుకొనుటలో ఇమిడి యున్నది. ప్రభువు సేవకులముగా మనము ప్రజలందరికీ సేవకులమై వారిని ఆశీర్వదించుటకు వారికి క్రిందగా ఉండుటకు ఇష్టపడాలి. మనము తప్పులు చేసినప్పుడు వెంటనే వాటిని గుర్తించి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ క్షమాపణ అడగాలి. ఎన్నడూ ఏ తప్పు చేయని వాడు దేవుడొక్కడే.


సూర్యుని క్రింద ఎవరి దగ్గరైనా క్షమాపణ కోరటానికి ఇష్టపడుతున్నానని నేను ప్రభువుతో చెప్పాను-అది పిల్లలు, పనిమనుషులు, బిచ్చగాళ్ళు ఎవరైనా ఫరవాలేదు. ఈ విషయంలో నేనెప్పుడూ నా పరువు ప్రతిష్టల కోసము నిలబడను. నేను ఆవిధంగా చేశాను. దేవుడు నన్ను దీవించాడు.


తప్పుడు పరువు ప్రతిష్ట భావముతో నీ మంద ముందు నీవెన్నడూ నిలవొద్దు. నీవు ఏదైనా తప్పుచేస్తే - తప్పు జరిగిపోయిందనీ, ఆ విషయంలో విచారం వ్యక్తము చేస్తున్నట్లు విన్నవిస్తూ క్షమాపణ కోరుకో. అప్పటి నుండి మీయెడల వారికున్న గౌరవము, మర్యాద పెరుగుతుందే గానీ ఏ మాత్రము తగ్గిపోవు. ఎన్నడూ పొరపాటు చేయనట్టు నీవు ఎందుకు నటిస్తావు?


ఓ కళాశాల విద్వార్థి తన ప్రొఫెసర్‌ను ఓ క్లిష్టమైన ప్రశ్న అడిగాడని నేను విన్నాను. నేను మూడు మాటలలో దీనికి జవాబు చెబుతానని ఆయన అన్నాడు. - ''నాకు ఇది తెలియదు''. తనకు తెలియని విషయం బోధించడం లేదని ప్రొఫెసర్‌ గారి యదార్థతను, దీనత్వాన్ని చూచిన ఆ విద్యార్థి ఆ రోజునుండి ఆయన్ను అత్యధికముగా గౌరవించ నారంభించాడు.


నేను దేవుణ్ణి కాదు, అందుచేత నా జీవితాంతం పొరపాట్లు చేస్తూనే ఉంటాను అని నేను నా సంఘస్థులకు బహిరంగంగా చెప్పాను. ఈ భూమిమీద నేను ఎంతకాలం జీవిస్తానో అంతకాలం నేను తప్పులు చేస్తూంటాను. అయితే ఈ తప్పులు గత పది, ఇరవై ఏళ్ళ క్రితం చేసినంత బుద్ధిహీనమైనవిగా మళ్ళీ ఇప్పుడు నేను చేయకపోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్ల నుండి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. నా పొరపాట్లనుండి కొంతజ్ఞానము సంపాదించుకున్నాను. అయినప్పటికీ నేనింకా పరిపూర్ణుడను కాను.


మీలో చాలామంది వివాహితులు. మీరు మీ భార్యలను నొప్పించాలనే ఉద్దేశ్యము లేకపోయినా అనుకోకుండా మీ భార్యలను నొప్పించుట ఎంత సులభమో మీకు తెలుసు. మీరు ఏదో ఒక విషయమును మంచి ఉద్దేశంతోనే చెప్పియుండవచ్చును. అయితే మీ ఉద్దేశ్యాన్ని మీ భార్య అపార్థము చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇది వేరే విధముగా జరగొచ్చు. మీరు మీ భార్యల ఉద్దేశ్యాలను అపార్థము చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరేమి చేయాలి? ఈ విషయమును నన్ను చెప్పనివ్వండి: మీ ఉద్దేశాలు గూర్చి బహుప్రయాసతో కూడిన దీర్ఘమైన వివరణ ఇవ్వటంకన్నా, అసలు తప్పు ఎవరిదో అన్న విశ్లేషణ కన్నా ఒక్క క్షమాపణ మాటతో మీ కుటుంబంలో శాంతి సమాధానము పునరుద్ధరింపబడుతుంది!


నీ సహోద్యోగులు నిన్ను అపార్థము చేసుకుంటున్న పరిస్థితిలో నీవున్నట్లయితే, విషయమును వారికి వివరముగా చెప్పుట వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే వారు వినుటకు ఇష్టపడకపోవచ్చు. అటువంటప్పుడు, ముఖ్యముగా నీవు ఆ విషయములో ఎటువంటి తప్పు చేయనట్లయితే నీవు ఏమి చేయాలి? నీ మీద నీవు జాలిపడాలా? కానే కాదు. దేవుని యెదుట మరియు మనుష్యుల యెదుట నీ మనస్సాక్షి నిర్మలముగా ఉండునట్లు చూచుకొని, ఆ విషయమును దేవునికి అప్పగించు. నీవు చేయవలసినదల్లా ఇదే. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా నేను పాటిస్తున్న విధానము ఇదే. నిజముగా దీనిద్వారా నేను ఆశీర్వదించబడ్డాను. మీరు దీనిని చేయవలెనని నేను సిఫారసు చేస్తున్నాను.


ప్రభువును సేవించే ఎవరైనా కూడా సాతాను యొక్క దాడులకు కేంద్రముగా ఉంటారు. దేవునికి మనము ఎంత ప్రయోజకులముగా ఉంటామో అంత ఎక్కువగా శత్రువు యొక్క దాడికి గురవుతాము. దానిని మనము తొలగించలేము. తన జీవిత కాలములో మాత్రమే గాక ఈనాటికి కూడా యేసును గూర్చి ప్రజలు పలికిన చెడు విషయములను (మాటలను) గూర్చి ఆలోచించండి. తిండిబోతు మరియు త్రాగుబోతు (లూకా 7:34), ఒక పిచ్చివాడు (మార్కు 3:21), దయ్యము పట్టినవాడు (యోహాను 8:48) మరియు దయ్యములకు అధిపతి (మత్తయి 12:24) అనే అనేకమైన దుర్మార్గపు పేర్లతో ఆనాటి ప్రజలు యేసును పిలిచారు. పరిశుద్ధగ్రంధము మరియు మోషే నేర్పించిన వాటికి విరుద్ధమైన దైవదూషక బోధ చేస్తున్నాడని కూడా నిందించారు (యోహాను 9:29). అలా వారు ప్రభుని మాటలు వినకుండా ప్రజల్ని దూరంగా పారద్రోలారు. కానీ అటువంటి వారికి జవాబు చెప్పుటకు ఆయనకు చింతలేదు. ఒక్క వ్యక్తిగత నిందకుకూడా ఆయన సమాధానము చెప్పలేదు. మనము కూడా అలాగే ఉండాలి. సిద్ధాంత పరమైన ప్రశ్నలకే యేసు జవాబు చెప్పాడు. ఈనాడు ప్రజలు యేసును గూర్చి అనైతిక విషయాలు కూడా కల్పించి చెబుతున్నారు. అయితే దేవుడు వారిపై తీర్పు పంపటంలేదు.


వారు పౌలును మోసగాడని, ప్రతిచోటా చెడుకు పేరుమోసిన ఒక గుంపుకు చెందిన అబద్దప్రవక్త అనీ పిలిచారు (అపొ.కా. 24:14; 28:22). ఆవిధముగా వారు పౌలు మాటలు వినకుండా ప్రజల్ని దూరంగా పెట్టారు.


సంఘ చరిత్రలో గొప్ప దైవజనులైన ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇదే విధముగా జరిగింది- మార్టిన్‌ లూథర్‌, జాన్‌ వెస్లీ, చార్లెస్‌ ఫిన్నీ, విలియం బూత్‌, వాచ్‌మెన్‌ నీ లతో పాటు ఇతర యదార్థమైన దేవుని ప్రవక్తలందరికీ ఈ పరిస్థితి ఎదురైంది.


కొన్ని వందల సంవత్సరాల క్రితము జర్మనీ దేశములో హెన్రీ సుసో అను ఒక దైవజనుడు జీవించాడు. అతడు భక్తి పరుడు, అవివాహితుడు. యేసువలే తానుకూడా విరిగి నలిగిన దీనుడిగా మార్చబడాలని అతడు తరచుగా ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనకు ఈవిధముగా జవాబిచ్చాడు. ఒకరోజున సుసో తన తలుపును ఎవరో తట్టిన శబ్దము విన్నాడు. అతడు తలుపు తీసి చూచినప్పుడు, తాను ఎన్నడూ చూడని ఒక స్త్రీ తన చేతుల్లో ఒక పసిపాపతో నిలుచొనిఉంది. ఆమెను ఇంతకు మునుపెన్నడు చూడలేదు. అప్పుడే ప్రసవించిన తన పాపను వదిలించుకోవాలని, ఆ ప్రయత్నంలో ఆ పసిపాపను హెన్రీ సుసో దగ్గర పడేసి వెళ్ళటం ఉత్తమమని తీర్మానించుకున్న దుర్ముర్గురాలామె. అప్పుడామె ఆ వీధిలో ప్రజలంతా వినేలా గట్టిగా అరచి అతనితో ఇలా చెప్పింది. ''ఇదిగో నీ పాప ఫలము'' అంటూ సుసో చేతిలో ఆ పాపను పెట్టి వెళ్ళింది. సుసో నిశ్చేష్టుడయ్యాడు. ఒక్క క్షణంలో అతనికి ఆ పట్టణములో ఉన్న మంచి పేరంతా పోయింది. అతడు ఆ పాపను లోపలికి కొనిపోయి మోకరించి ప్రభువుతో ఇలా అన్నాడు ''ప్రభువా ఈ విషయంలో నేను నిరపరాధినని నీకు తెలుసు. నేనిప్పుడు ఏమి చేయాలి?''. ప్రభువు జవాబిచ్చాడు ''నేనేమి చేసానో అదే చేయి. ఇతరుల పాపము కోసం శ్రమ అనుభవించు'' ప్రభుని మాట అంగీకరించిన సుసో ఏ మానవుని ముందు తనను తాను సమర్థించుకోలేదు. తన సొంత సంతానము వలె ఆ పసిపాపను పెంచాడు. సత్యమేమిటో దేవునికి తెలుసని, వేరే వారు తనను అపార్థము చేసుకోనుటకు ఇష్టపడ్డాడు. చాలా సంవత్సరాల తరువాత తన పాపము విషయము ఒప్పింపబడిన ఆ స్త్రీ సుసో ఇంటికి వచ్చి ఇరుగు పొరుగు వారందరినీ పిలచి, సుసో ఏతప్పు చేయలేదనీ, తానే అబద్ధమాడినట్లు ప్రకటించింది. ఈ మధ్యకాలంలో సంవత్సరాలుగా ఏమి జరిగింది? హెన్రీ సుసో ప్రార్థనలకు జవాబు లభించింది. తన యజమానుడువలె తాను విరిగి నలిగిన దీనుడై పోయాడు. అప్పటినుండి మానవుని అభిప్రాయముల నుండి విడిపించి దేవుని అభిప్రాయము మాత్రమే కావలసియున్నదని సుసోను దేవుడు పరిశుద్ధపరిచాడు.


యేసువలే మార్చబడాలంటే అటువంటి వెల చెల్లించుటకు మనము ఇష్టపడుచున్నామా? లేక మనమింకా మానవులనుండి గౌరవము లేక ఘనత కోరుకుంటున్నామా?


అపార్థము, అన్యాయము, తప్పుడు నేరారోపణ, బహిరంగ అవమానముల గుండా మనలను అనుమతించి దేవుడు మనకు విరిగి నలిగిన అనుభవమును అనుగ్రహిస్తాడు. అటువంటి పరిస్థితులు అన్నింటిలోనూ మనల్ని వేదిస్తున్న మనుష్యుల్ని చూడకూడదు. వారు మన సహోదరులు కావచ్చు లేక శత్రువులు కూడా కావచ్చు. ఎవరైనా పరవాలేదు. ప్రతి ఇస్కరియోతు యూద హస్తము వెనుక, పరలోకపు తండ్రి మనకు తాగడానికి ఒక గిన్నెను అందిస్తున్నాడు. ఆ పరిస్థితులలో మనము తండ్రి హస్తము చూస్తే ఆ గిన్నెలోనిది కటిక చేదైనా, బాధాకరమైనా ఆనందముగా త్రాగుతాము; అయితే యూదా హస్తాన్ని మాత్రమే చూస్తే పేతురు వలె ఖడ్గము తీసి ప్రజలయొక్క చెవులు(కీర్తి ప్రతిష్టలు) నరికేస్తాము.


మనము దాడిచేయబడిప్పుడు, నిష్కారణముగా నిందించబడిప్పుడు దేవుని బలమైన హస్తము క్రింద మనల్ని మనము తగ్గించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అది మానవ హస్తము కాదనీ, అది దేవుని హస్తమని మనము చూచినప్పుడు ఇలా చేయట సులభమే.


గత సంవత్సరాలలో అనేక మంది ''విశ్వాసులు'' నాగురించి నా బోధ గురించి అన్ని రకాల చెడ్డమాటలు చెప్పటం నేను విన్నాను. నాకు, నా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా తప్పుడు నేరాలు మోపారు, నాకు వ్యతిరేకముగా వ్యాసాలు, పుస్తకాలు వ్రాసారు. అటువంటి వారికి నేనెన్నడూ జవాబు వ్రాయవద్దని ప్రభువు నాకు నిరంతరము చెబుతూనే వచ్చాడు. అందుచేత నేను మౌనంగా ఉండిపోయాను. ఫలితంగా నాలో, నా కుటుంబ సభ్యులలో ప్రభువు గొప్ప ప్రక్షాళన కార్యము జరిగించాడు (పరిశుద్ధ పరిచాడు). దేవుడు కీడును మేలుగా మార్చగలడు.


ప్రభువు తన స్వంత సమయములో అడ్డుగా ఉన్న మేఘాలన్నింటిని తొలగించి సూర్యుడు వెలిగేలా చేస్తాడని నాకు తెలుసు. అయితే ఆ సమయాన్ని నిర్ణయించే వాడు ఆయనే కాని నేనుకాదు (అపొ. కా. 1:7). అంతవరకు నేను చేయవలసిందల్లా ఆయన బలిష్టమైన చేతిక్రింద నన్ను నేను తగ్గించుకోవడమే; ఎవరి ముందైనా నన్ను నేను సమర్థించుకోవడం నాపని కాదు. అలా చేయుట నేను ఆరంభిస్తే మరో పని చేసేందుకు నాకు సమయమే ఉండదు. అలెక్సండ్రు అను కంచరి వాడిని గూర్చి పౌలు చెప్పినట్లుగా ఒకానొక దినమున ప్రభువే మన శత్రువులకు వారి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును (2 తిమోతి 4:14). కాబట్టి పగ తీర్చుకొనుటకు సంబంధించిన విషయములను మనము ప్రభువు చేతికి అప్పగించవచ్చు (రోమా 12:19).


సమస్త విషయాలను దేవునికి విడిచిపెట్టుటే శ్రేష్టము. ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు. సమస్తమును ఆయన స్వాధీనములో ఉన్నది. మనలోని రాతిని చెక్కివేస్తూ క్రీస్తు రూపములోనికి మనల్ని ఆయన రూపుదిద్దుతున్నారు. ఆ శిలలోని కొన్ని భాగాలు అతి కఠినంగా ఉన్నాయి. వాటిని చెక్కుటకు ఆయన తప్పుడు నేరారోపణలు, శ్రమలు అనువాటిని వినియోగిస్తాడు. మనలను మనము దేవుని పనితనానికి అప్పగించుకుంటే


చిట్టచివరకు మనము క్రీస్తు స్వరూపము గలవారిగా, ఆత్మీయ అధికారముతో బయటపడతాము. యూదా యేసును అప్పగించినప్పుడు, యేసు యూదాను ''స్నేహితుడా'' అని పిలువగలిగాడు, ఎందుచేత నంటే ఆయన దేవుని హస్తాన్ని స్పష్టంగా చూచాడు. అన్ని పరిస్థితుల్లోనూ, మనము దేవుని సార్వభౌమత్వాన్ని చూచినట్లయితే, మనల్నిమనము తగ్గించుకొనుట సులభమవుతుంది.సరియైన సమయములో మనల్ని హెచ్చించుటకు దేవునికి కూడా అది సులభమవుతుంది. మన భుజాల మీద నుండి భారము తొలగించి తన అధికారాన్ని మనకు అప్పగించుటకు సరియైన సమయము ఎప్పుడో దేవునికి బాగా తెలుసు. అందుచేత మనము ఆయన కోసం వేచియుందాము. ఆయన కోసం ఎదురుచూచువారు ఎన్నడునూ నిరుత్సాహపడరు లేక అవమానానికి గురికారు (యెషయా 49:23).


నేను ఇంతకు ముందు ''హెచ్చించబడుట'' అని చెప్పిన మాటకు గల భావం దేవుడు మనల్ని ఈ లోకంలో హెచ్చిస్తాడని కాదు. పెద్దక్రైస్తవ సంస్థలకు ఆయన మనల్ని అధినేతలుగా చేయడు. వ్యక్తిగతంగా నేనొక క్రైస్తవ సంస్థకు అధిపతిగా ఉండుటకు ఇష్టపడను. ఇక పెద్ద సంస్థను పక్కకు పెట్టండి. నేను దేవునికి ప్రజలకూ సేవకుడిగా ఉండాలని ఆశిస్తున్నాను- ఆయన నాకు అప్పగించిన వారికోసం భాధ్యత తీసుకొని, ప్రభువు చేయమని చెప్పినకార్యం చేస్తాను. వారు పదిమంది అయినా సరే, లేక పదివేలమంది అయినా సరే. ఆ సంఖ్యను నిర్ణయించేది కూడా దేవుడే నేను కాదు. క్రైస్తవములో నాకంటూ ఒక అధికార స్థానముగానీ, బిరుదుగానీ కావాలని నాకు ఖచ్చితముగా ఇష్టములేదు. అంత మాత్రమే కాదు. డబ్బు లేక ఆస్థి లేక ప్రజలపై నా పెత్తనాన్ని అమలు పర్చాలని కూడా నేను ఆశించుట లేదు. అత్యంత అవసరత ఉన్న ఈ లోకములో దేవుని వాక్యమును ప్రకటిస్తూ, ఇతరుల సేవ చేయుటకు నన్ను నేను అంకితం చేసుకోవాలనుకుంటున్నాను.


మనమందరము యేసు అడుగు జాడల్లో నడుద్దాము. ప్రజలు మన గూర్చి ఎటువంటి చెడు ప్రచారము చేస్తారో చేయనివ్వండి. మనము దేవుణ్ణి ఘన పరిస్తే, ఒకానొక రోజున ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ప్రభువును అనుసరించటంలో మనము తీవ్రముగా ఉన్నట్లయితే, దేవుడు మనల్ని బాధాకరమైన అనుభవాలగుండా తీసుకువెళుతున్నట్లు మనము గమనిస్తాము. అయితే వీటన్నింటిలో దేవుని ఉద్దేశ్యము - మనల్ని కట్టివేసిన బంధములనుండి, మానవుల చెడు ఉద్దేశ్యములనుండి విడుదల చేయుటే - ఫలితంగా ''మనము పక్షిరాజుల్లా పైకి ఎగిరిపోగలము'' (యెషయా 40:31).


ప్రజల ఎదుట మనల్ని తగ్గించుటకు పరిస్థితులను కల్పించి చిట్టచివరకు మనము దేవుని ఉద్దేశ్యాన్ని మాత్రమే లక్ష్యపెట్టు స్థితికి వచ్చేలా ఆయన చేస్తాడు. అప్పుడు మన ఆత్మీయ అధికారము నిజంగా శక్తివంతమైనదై యుంటుంది. మనందరి విషయంలో ఆ విధముగా జరుగుగాక!

అధ్యాయము 14
మెల్కీసెదెకు యాజకత్వము

ఒక ఆత్మీయ నాయకుడు తనకన్నా ముందు తన యజమానుడు యాజకత్వము జరిగించిన విధానములో మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై యుండాలి (హెబ్రీ 6:20; 7:7).


లేవీ యాజకత్వము మెల్కీసెదెకు యాజకత్వానికి బహు భిన్నమైనది (హెబ్రీ 7వ అధ్యాయము చూడండి). లేవీ యాజకత్వములో అనేకమైన విధులు, బాహ్యకార్యములున్నాయి. అహరోను కుమారులు దేవుని సముఖమున పరిచర్య చేయునప్పుడు ఎటువంటి అంగ వస్త్రాలు ధరించాలో అను విషయముకూడా వారికి చెప్పబడింది (లేవీ 6:10;16:4)! కానీ మెల్కీసెదెకు యాజకత్వంలో వస్త్రాలు కానీ విధులుకానీ అసలులేవు!


బైబిలంతటిలోనూ మెల్కీసెదెకు మూడు వచనాల్లో మాత్రమే ప్రత్యక్ష మవుతున్నప్పటికీ మన ప్రభువు అతని క్రమములో ప్రధాన యాజకుడుగా పిలువబడ్డాడు (అపొ. కా. 14:18-20)! మెల్కీసెదెకు చేసిన అంతటి అద్భుత కార్యమేమిటి?


తన సహోదరుని కుమారుడైన లోతును, అతని కుటుంబాన్ని చెరగా పట్టుకొని పోయిన 14 మంది రాజులను జయించి, లోతు కుటుంబాన్ని విడిపించి అప్పుడే అబ్రాహాము తిరిగి వస్తున్నాడు. వాస్తవానికి అబ్రాహాము బాగా అలసిపోయాడు తన విజయం విషయములో ఖచ్చితంగా అతిశయిస్తున్నాడు - ఎందుకంటే ఒక్కరు కూడా సైనికులు కానటువంటి తన 318 మంది దాసుల సహాయంతో మాత్రమే విజయం సాధించాడు! ఆ రోజుల్లో ఆనవాయితీ ప్రకారము విజయం పొందిన వారు తమలో తాము పంచుకునేందుకు అబ్రాహాము కొల్లగొట్టిన ఆస్తికూడా సంపాదించాడు. తన 318 మంది సేవకులు అప్పుడు ధనవంతులైపోవాలని ఆశించుట నిస్సందేహం!


కాబట్టి ఆ రోజు అక్కడ అబ్రాహాము భౌతికంగా అలసిపోయి; గర్వము, దురాశ అనే రెండుప్రమాదాలను ఎదుర్కొంటూ నిలబడిపోయాడు. కానీ ఈ రెండింటి గూర్చి అతణ్ణి హెచ్చరించేవారు అక్కడ ఎవ్వరూ లేరు. అతని దగ్గరున్న వారంతా 318 మంది సేవకులు మాత్రమే. నిస్సందేహంగా అబ్రాహాము గొప్ప దైవ జనుడే కానీ ఒంటరివాడు కూడా. ఈనాడు చాలామంది క్రైస్తవ నాయకులు ఎత్తైన సంస్థాపరమైన పిరమిడుల మీద కూర్చొని, క్రింది భాగంలో అందరూ ''అవును'' అని చెప్పేవారు ఉండగా, సవాలు చేసేవారుగానీ, సరిచేసేవారుగానీ ఎవ్వరూ లేని పరిస్థితిలో ఉన్నట్టు అబ్రాహాము కూడా ఒంటరిగా ఉన్నాడు! ఇటువంటివారు సాతానుకు సులభమైన గురులుగా ఉంటారు. వాడు ఒక్కొక్కరిని ఏరి వేయగలడు.


అయితే అబ్రాహామును దేవుడు లక్ష్యపెట్టాడు. అతనికి సహాయ పడమని మరో సేవకునితో దేవుడు మాట్లాడాడు. అబ్రాహాము అవసరతలు ఏమిటో తెలియకుండానే, దేవుడు


చెప్పినట్లుగా చేయటం ద్వారా మెల్కీసెదెకు అబ్రాహాముకు గల మూడు అవసరతలు తీర్చాడు.


మొట్టమొదటిగా అతను అబ్రాహాము కోసం కొంత ఆహారము తీసుకువచ్చాడు. మెల్కీసెదెకు వివేచనాపరుడు! ఆత్మీయులంటే వారు వైరాగ్యం కలిగి యుండు వారు అనే భావన కలిగియుండే అతిఆత్మీయులవలె అతడు లేడు. ఉపవాసముండి ప్రార్థించమని అతడు అబ్రాహాముకు చెప్పలేదు కానీ అతనికి మంచి ఆహారము తెచ్చిపెట్టాడు.


చాలా సంవత్సరాల తరువాత దేవుడు ఏలియా జీవితంలో సరిగ్గా ఇదే పని చేశాడు. అప్పుడు ఏలియా అలసిపోయి నిరుత్సాహంతో నిండివున్నాడు. దేవుడతని దగ్గరకు ఒక దూతను పంపాడు - ఒక ''హెచ్చరికతో'' కాదుగానీ బలమిచ్చే మంచి భోజనంతో పంపాడు (1 రాజులు 19:5-8)!


ఇది మనము అనుసరించదగిన ఒక మంచి ఉదాహరణ - అలసి సొలసి పడివున్న ఓ సహోదరుడి కోసం లేక ఓ సహోదరి కోసం భోజనము సమకూర్చుట. ఒక విశ్వాసి నిరాశా నిస్పృహలతో పడివున్నప్పుడు అతనికి కావలసిందల్లా కొంత మంచి ఆహారము కాని హెచ్చరిక కాదు- ఎందుకంటే అతడు ప్రాణము, ఆత్మ మాత్రమే కలిగిలేడు గానీ అతనికి శరీరము కూడాఉంది. ఈ విషయం మనం మర్చిపోకూడదు!


భోజనము పెట్టిన తరువాత మెల్కీసెదెకు అబ్రాహాముకు ఆత్మీయముగా కూడా సహాయపడ్డాడు - అది అతనికి బోధచేయటంవల్లకాదు, కానీ రెండే రెండు వాక్యాల్లో అబ్రాహాము విజయం గూర్చి దేవుణ్ణి స్తుతించాడు.


ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైౖన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను (ఆది 14:19,20). బహుశా మెల్కీసెదెకు అబ్రాహాముకు, అతని సేవకులకు భోజనం పెట్టటానికి రెండు గంటలైనా పట్టిఉండవచ్చు. దేవుణ్ణి స్తుతించుటకు పదిహేను సెకెన్లు పట్టిఉండవచ్చు. కానీ మెల్కీసెదెకు యొక్క సంక్షిప్త స్తుతిలో అబ్రాహాము రెండు విషయాలు గుర్తించాడు.


మొట్టమొదటిదిగా తాను భూమ్యాకాశములకు కర్తయైన దేవునికి చెందిన వాడనని అబ్రాహాము గుర్తించాడు. అప్పుడే కొల్లగొట్టుకొచ్చిన సొదొమ రాజుకు చెందిన ధనరాశులపౖౖె ఉన్న దురాశ నుండి అతడు విడుదల పొందాడు. సొదొమ ధనవంతమైన పట్టణము, ఆ ధనరాసులు ఎంతో విలువైనవి, అయినప్పటికీ తన దేవుడి సొత్తయిన భూలోక పరలోకముల ముందు అవి పనికిరాని చెత్తగా అబ్రాహాముకు కనబడుతున్నాయి. అతడు ఎవరికి సంబంధించినవాడో అను సత్యాన్ని మెల్కిసెదెకు అబ్రాహాముకు స్పష్టముగా చూపించాడు.


ఇక్కడ మెల్కీసెదెకు జ్ఞానమును గమనించండి. ''నీవు దురాశాపరుడవవుతున్నావని దేవుడు నాకు చెప్పాడు అందుచేత నిన్ను ముందుగా హెచ్చరించుటకు దేవుడిచ్చిన మాటతో వచ్చాను'' అని అబ్రాహాముతో చెప్పలేదు. నీ కోసం ''దేవుని ప్రవచనము'' తమవద్ద ఉందని ఎల్లప్పుడు చెప్పుకుంటూ తిరిగే స్వయం నియామక ''ప్రవక్తల'' గూర్చి జాగ్రత్తగా ఉండండి. అటువంటి ''ప్రవక్తలు'' అబద్ధ ప్రవక్తలు. అబ్రాహాము దృష్టిని దోపుడు ధనముపైనుండి దేవుని వైపుకు త్రిప్పాడు మెల్కీసెదెకు. దాంతో భూసంబంధమైన వస్తువులపై అబ్రాహాము కనుదృష్టి మసక బారింది. ప్రజలకు సహాయపడుట ఈ విధముగా ఉండాలి. తీవ్రమైన ఆత్మీయ ప్రమాదమును ఎదుర్కొంటున్న అబ్రాహామును తప్పించిన మెల్కీసెదెకు మొక్క కృపాభరిత పరోక్ష సంధింపునుండి మనము ఎంతో నేర్చుకోగలము.


రెండవదిగా, ఆ శత్రురాజులను జయించింది తానూ, తన 318 మంది సేవకులు కాదు గానీ దేవుడేనను వాస్తవాన్ని అబ్రాహాము చూచాడు! అది మరో ప్రత్యక్షత - అది అబ్రాహామును గర్వమునుండి రక్షించింది. మరోసారి అబ్రాహాముదృష్టిని తన విజయమునుండి దేవుని వైపుకు త్రిప్పుటలో మెల్కీసెదెకు విజయము పొందాడు!


మన దృష్టిని మననుండి, మన సొంత విజయాలపైనుండి ప్రభువు వైపుకు త్రిప్పగలిగిన వాడే శ్రేష్టుడైన బోధకుడు.


యోబుకు నీతులు చెప్పిన ముగ్గురు స్వనీతి పరులైన బోధకులు - ఎలీఫజు, బిల్దదు, జోఫరు లకూ మెల్కీసెదెకు ఎటువంటి పోలిక లేనేలేదు! ఆ ముగ్గురూ పరిసయ్యులకు ''పితరులు''! ఈనాడు క్రైస్తవ్యంలో పరిసయ్యుల ''సంతానమైనవారు'' ఎందరోవున్నారు. ఏది ఏమైనప్పటికీ మనకు అనేక మంది మెల్కీసెదెకులు కావాలి.


ఇప్పుడు మనము ఈ చరిత్రలో అత్యుత్తమ భాగానికి వచ్చాము - అబ్రాహామును ఆశీర్వదించిన తరువాత మెల్కీసెదెకు అదృశ్యమైపోయాడు. మళ్ళీ అతన్ని గూర్చి బైబిలు గ్రంథములో మరెక్కడా చదవము. అతని నామము యేసుకు సాదృశ్యముగా మాత్రమే కనబడుతుంది.


తాను ఆరోజు ఏమి చేయాలో దేవుడు చెప్పినప్పుడు మెల్కీసెదెకు తన గుడారములో ఉదయకాల ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు. అతనికి అబ్రాహాము తెలియదు కానీ దేవుడు బాగా తెలుసు. అదిచాలు. దేవుడతనికి ఏమి చేయాలో చెప్పాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు.


మెల్కీసెదెకు క్రమము చొప్పున పిలువబడిన యాజకులమైన మనకు ఎంత గొప్ప పరిచర్య ఉందో చూడండి! మనము ప్రజలను భౌతికముగా, ఆత్మీయముగా ఆశీర్వదించాలి - ఎవ్వరూ మనకు వందనాలు చెప్పకముందే వెంటనే అదృశ్యమైపోవాలి.


నీవు ఒక గొప్ప దైవజనుడవని నిన్ను గూర్చి ప్రజలు భావించాలని నీవు కోరుకుంటున్నావా? లేక నీ ''దేవుడు గొప్పవాడు'' అని ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నావా? ఇక్కడ మతపరమైన పరిచర్యకూ, ఆత్మీయ పరిచర్యకూ మధ్య వ్యత్యాసము దాగివుంది. అహరోను యాజకత్వానికి మెల్కీసెదెకు యాజకత్వానికి మధ్యగల తారతమ్యము కనబడుతుంది. అహరోను ఎల్లప్పుడు ప్రజల మధ్య కనబడుతూ వారినుండి ఘనత పొందుతూ వచ్చాడు. మెల్కీసెదెకైతే ప్రజలకు సేవచేసి అదృశ్యమైపోయాడు!


యేసు కూడా తన భూలోక జీవితములో ఈ విధముగానే పరిచర్యచేశాడు. జీవన పోరాటాల్లో ఎదురు దెబ్బ తిన్న ప్రజల ఆత్మీయ, భౌతిక అవసరతలు తీరుస్తూ తిరిగాడు. తాను చేస్తున్న స్వస్థతల గూర్చి ప్రచారము చేయమని తాను ఎవ్వరినీ కోరలేదు. స్వస్థపరచే వాడిగా ప్రసిద్ధి పొందాలని ఆయన కోరుకొనలేదు. రాజుగా కావాలని కూడా ఆయన ఎన్నడూ కోరుకోలేదు. ఇతరులను సేవించి వారికోసం తన ప్రాణం బలిగా అర్పించుటకే ఆయన వచ్చాడు. పేరు ప్రఖ్యాతుల కోసం ఆయన ఆరాట పడలేదు. తాను దేవునికుమారుడని నిరూపించుటకు పునరుత్థానుడైన తరువాత హేరోదు, పిలాతు, అన్నకయపలకు ప్రత్యక్షము కావాలని కూడా ఆయన కోరుకోలేదు. తన పునరుత్థానము తరువాత ఒక్క పరిసయ్యుడికి గానీ, సద్దూకయ్యుడికి గానీ ఆయన ప్రత్యక్షము కాలేదు. ఎందుకంటే మానవుల ముందు తన్ను తాను సమర్థించుకోవాలని కోరలేదు. మానవ ఉద్దేశ్యాలు చెత్తకుండీలో వేయుటకు మాత్రమే పనికి వస్తాయని ఆయనకు బాగా తెలుసు!


అయ్యో! అటువంటి బోధకులను, నాయకులను ఈనాటి క్రైస్తవ్యములో మనము ఎక్కడ కనుగొనగలము?


ప్రతిరోజూ దేవుని మాటలు వింటూ, ఏమి చేయాలో ఆయన దగ్గర విచారణ చేస్తూ మెల్కీసెదెకు వలె జీవించనారంభిస్తే ఏమిజరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి జీవితము ఈ భూలోకములో ఎవరైనా జీవించదగిన అత్యంత ప్రయోజనకర జీవితము.


కీర్తనా కారుడు ఇలా చెబుతున్నాడు ''నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును'' (కీర్తనలు 23:6). జీవిత విధానమంటే అదే. మనము ఎక్కడికి వెళ్ళినా క్షమించుట గాని లేక అటువంటి దయగల మాటను గాని మరియు మంచితనమును ఉంచి వెళ్ళాలి.


యేసు యొక్క జీవితము మరియు పరిచర్యల గూర్చి పేతురు కొర్నేలికి వర్ణిస్తూ సంక్షిప్తముగా ఒక్క వచనము అపొ.కా. 10:38లో ఇలా చెప్పాడు, ''యేసు పరిశుద్ధాత్మ అభిషేకము పొంది, మేలు చేయుచూ, దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని విడిపించుటకు వెళ్ళుచుండెను. దేవుడు ఆయనతో ఉండెను''. అసలైన పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క ఫలితము ఇదే: దేవుడు మనతో ఉంటాడు, మనము వెళ్ళి ప్రజలను దీవిస్తూ, విడిపిస్తూ ఉంటాము. యేసు ఈ భూమి మీద జీవించిన దినములలో, ఆయనలోనుండి వెడలిన ప్రభావము నిన్ను భౌతికముగా, ఆత్మీయముగాను ఆశీర్వదించకుండా ఆయనను నీవు కలసి ఉండేవాడవు కాదు. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఆయన వస్త్రపుచెంగును ముట్టి ఆ ప్రభావమును పొందుకున్నది.


మనలను కలసిన వారుకూడా భౌతికముగా, ఆత్మీయముగా ఆశీర్వదింపబడుటకు అటువంటి జీవితాలు జీవించుటకోసము మనము పిలువ బడలేదా?


మనమందరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకులుగా ఉండుటకు పిలువబడ్డాము.


అధ్యాయము 15
ఒక మాదిరి

''నేను క్రీస్తును అనుసరించుచున్నట్లు మీరు నన్ను అనుసరించండి'' అని ఇతరులకు చెప్పగలుగునంతగా ఒక ఆత్మీయ నాయకుడు అటువంటి మాదిరి జీవితం జీవించాలి. క్రీస్తు మాత్రమే వారి శిరస్సుగా ఉండునట్లు అతడు వారిని నడిపించుటకు చూస్తాడు.


కానీ చాలా మంది క్రైస్తవ నాయకులు విశ్వాసుల్ని తమతో అతికించుకునేందుకు ప్రయాసపడతారు. ఆ విశ్వాసులు ఇతర నాయకులతో కంటే ఎక్కువగా తమతో అతికియున్నప్పుడు సంతోషిస్తారు. అటువంటి నాయకులు విశ్వాసులకు చిన్న ''దేవుళ్ళుగా'' మారిపోతారు. తన సొంత ప్రయోజనం కోసం పెద్దలకు లోబడి ఉండుట అనే లేఖనముల యొక్క బోధను వారు దుర్వినియోగ పరుస్తారు.


ఒకానొక రోజున అంత్యక్రీస్తు దేవాలయములో ప్రవేశించి అక్కడ ఆసీనుడై, తానేదేవుడుగా ప్రజలకు ప్రదర్శించుకుంటాడని బైబిలు చెబుతుంది (2 థెస్స 2:4). సంఘము దేవుని ఆలయము. తన జీవితకాలములో కూడా ఆనాటి సంఘాలలో అంత్యక్రీస్తు ఆత్మ కలిగిన ప్రజలు ఉన్నట్టుగా అపొస్తలుడైన యోహాను చెప్పాడు (1 యోహాను 2:18,19)! ఈనాడు అటువంటివారు మరెక్కువగా ఉన్నారు.


సృష్టింపబడిన ఒకడు తాను ఉన్నతముగా ఎదిగి, పెద్దగా పెరిగి, ఇతరుల కళ్ళలో ఎక్కువగా కనబడి దేవుని వలె కావాలనుకోవటముతో లోకములో పాపము ప్రవేశించింది. ఆ కారణము చేత లూసిఫరు సాతానుగా మారాడు. మనము ఇదెన్నడూ మర్చిపోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా మనలో ఇటువంటి ఆత్మను కనుగొన్నట్లయితే, అది ఏమిటో మనము గుర్తించాలి- అది సాతాను ఆత్మ.


కానీ దేవుని కుమారుడు తన్ను తాను తగ్గించుకొని సాధ్యమైనంత అదృశ్య అణువుగా మారినప్పుడు రక్షణ వచ్చింది. దీనినికూడా మనము మర్చిపోకూడదు.


లూసిఫరు గర్వము ద్వారా పాపము వచ్చినది, యేసు దీనత్వము ద్వారా రక్షణ వచ్చింది.


బహిరంగ వేదికల మీదనూ, మాసపత్రికల్లోనూ ఈనాటి క్రైస్తవనాయకులు తమను గూర్చి తాము ప్రచారము చేసుకుంటున్న విధానాన్ని ప్రజలు చూస్తున్నప్పుడు వారు తనను తాను రిక్తునిగా చేసుకొని, దీనాతిదీనుడుగా మారిన యేసు యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని చూడగలరని నీవనుకుంటున్నావా? కానేకాదు.


తమ్మును తాము మరుగు పర్చుకొని, ఎవ్వరికీ తెలియని విధానంలో, తమగూర్చి ఎవరూ గొప్పగా మాట్లాడుకోవాలని కోరుకొనరో తమ పనిని తాము నిశ్శబ్దముగా చేసుకుంటూ అటు తరువాత అదృశ్యమైపోయి తమను తాము తగ్గించుకునే దీనులైన మాదిరి జీవితాలు గల నాయకులను ఈనాటి యౌవన విశ్వాసులు చూడవలసివుంది. ఇటువంటి పరిచర్యనే మన మందరము ఆశించాలి.


నీవు ప్రభువు కొరకు ఏదైనా పనిచేసినప్పుడు, అది ఎవ్వరికీ నీవు చేశావని తెలియక పోయినట్లయితే, అది నిన్ను ఉత్తేజపరచాలి! దానికి తోడు, నీవు చేసిన దానిని బట్టి వేరొకరికి ఘనత కలిగినట్లయితే, అది నిన్ను ఇంకా ఉత్తేజింపచేయాలి! నీవు అలాగున్నట్లయితే, నీవు నిజముగా మెల్కీసెదెకు క్రమములో ఉన్న యాజకుడివి.


ఒక యౌవన క్రైస్తవుడిగా ఆ రోజుల్లో నేను కలిసి తిరిగిన క్రైస్తవ నాయకులు, సంఘ పెద్దల జీవితాలను గమనిస్తూ గడిపిన విషయము నాకు గుర్తుంది. వారిలో ఎవ్వరిలోనూ నేను ఇటువంటి యేసు స్వభావాన్ని చూడలేదని చెప్పటానికి విచారిస్తున్నాను. నేను వారికి తీర్పు తీర్చటంలేదు, ఎందుకంటే వారిపై నేను తీర్పరిని కాను. నేను అనుసరించదగిన దైవిక ఆదర్శప్రాయులుగా వారిని నేను గౌరవించలేనని మాత్రమే చెబుతున్నాను.


ఎవ్వరినీ మనము తీర్పు తీర్చనవసరములేదు గానీ మనము మనుష్యులను వివేచింపగలిగి ఉండాలి. ఇతరులను తీర్పు తీర్చవద్దు అని చెప్పిన యేసు వెంటనే పందులు, కుక్కలు, అబద్ధ ప్రవక్తలకూ ఇతరులకు మధ్యగల వ్యత్యాసాన్ని వివేచించుటకు జాగ్రత్త పడమని తన శిష్యుల్ని హెచ్చరించాడు (మత్తయి 7:1ని 6,15 వచనాలతో పోల్చి చూడండి). మనలో వివేచన లోపించినప్పుడు తప్పని సరిగా మనము కుక్కలు, అబద్ధ ప్రవక్తలచేత దూరముగా నడిపించబడతాము (ఫిలిప్పీ 3:2 ను చూడండి).


అందుచేత నేను నా పెద్దల్ని తీర్పుతీర్చలేదు, కానీ అనుసరించుటకు యోగ్యమైన ఆదర్శప్రాయులుగా నేను వారిని పరిగణించలేదు. ఎందుకంటే యేసువంటి సేవకుని ఆత్మ వారిలో లేదు. పరిశుద్ధుల పాదాలు కడగాలని ఆశించేవారు కాదు వీరు. అప్పుడు నేను అనుసరించదగిన ఒక్క ఆదర్శవంతమైన క్రైస్తవనాయకుణ్ణి చూచేంతవరకు యేసు వైపు మాత్రమే చూడాలని నేను తీర్మానము చేసుకున్నాను.


క్రీస్తు పోలికకు నిజమైన భావమేమిటో ప్రదర్శించి రాబోవుతరానికి నేర్పించవలసిన గొప్ప బాధ్యత మనపైఉంది. మన జీవన విధానము, బోధ పరిచర్యలను గమనిస్తున్న మనుషులు, అపొస్తలులు పాతనిబంధన కాలము నాటి ప్రవక్తలలో వలె నిజమైన ప్రభువు సేవకుడు అంటే అర్థము ఏమిటో మనలో చూడాలిగానీ 20వ శతాబ్దపు సినీనటుల్లాంటి సువార్తికుల శైలిని మాత్రంకాదు.


మనము గుర్తించినా, గుర్తించకపోయినా మనము వెళ్లిన ప్రతిచోటా ఒక ముద్ర(గుర్తు)ను వదలివెళతాము. మనము వెళ్ళిపోయాక చాలాకాలము తరువాత కూడా, మనము బోధించిన సందేశాలు మర్చిపోయాక కూడా మనము విడిచి వెళ్ళిన ముద్ర(గుర్తు) మాత్రము అలాగే నిలిచిపోతుంది.


వీడ్కోలు సందర్భంగా ఎఫెసు సంఘపెద్దల్ని పిలిచి పౌలు పలికిన మాటల్ని అపొ.కా. 20:17-35 లో గమనించండి. తాను వారితో కలిసి మూడు సంవత్సరాలు గడిపినట్లు (31 వచనము) మరియు రాత్రింబవళ్ళు వారికి బోధించినట్లు అతడు వారికి గుర్తు చేశాడు. మూడు సంవత్సరాలంటే వెయ్యి రోజులకన్నా ఎక్కువ. అందుచేత పౌలు రోజుకు కనీసము రెండుసార్లు బోధించినా ఎఫెసు సంఘస్థులకు అతడు 2000 సందేశాలకు మించి బోధించి ఉండాలి.


ఒకప్పుడు ఎఫెసులో గొప్ప ఉజ్జీవము చెలరేగినప్పుడు క్రైస్తవ విశ్వాసులుగా మారిన వారు దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే తమ ప్రాచీన మాంత్రిక విద్యనభ్యసించు పుస్తకములు అగ్నిలో పడవేసి కాల్చివేశారు. ఈ ప్రదేశములోనే చేతి రుమాళ్ళతో పౌలును ముట్టిన అనేకులు రోగముల నుండి స్వస్థత పొంది, దురాత్మలనుండి విడుదల పొందారు. ఏ ప్రదేశములోనూ జరుగని అద్భుతకార్యములు దేవుడు పౌలు ద్వారా ఎఫెసులో ఆశ్చర్యకరముగా జరిగించాడు (అపొ. కా. 19:11,12,19).


ఇవన్నీ జరిగిన తరువాత పౌలు ఎఫెసు సంఘపెద్దలకు ఏమి గుర్తు చేస్తున్నాడు? తాను చేసిన ప్రసంగాలు, లేక అద్భుత కార్యములను గురించి గుర్తు చేస్తున్నాడా? కాదు. వారు ఆయనను చూచిన మొట్టమొదటి రోజునుండి అప్పటి దాకా ఆయన వారి మధ్య ఎంతటి దీనత్వముతో జీవించాడో, ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు (19 వచనము). ఒకవేళ పౌలు యొక్క ప్రసంగములు వారు మరచిపోయినా, వారి మధ్యలో ఆయన ఏ విధముగా జీవించాడో వారు మరచిపోలేరు. ఆయన జీవితము వారి మీద చెరగని ముద్ర వేసినది. ఆయన యొక్క కనికరమును మరియు నిరాడంబరతను వారు ఎప్పటికీ మరచిపోలేరు. అతని స్వంత చేతులతో డేరాలు కుట్టుకొని తనను తాను పోషించుకుంటూ మరియు తన తోటి పనివారి అవసరములు కూడా ఏ విధముగా తీర్చాడో వారు జ్ఞాపకముంచుకుంటారు. వారికి భారముగా ఉండకుండా మరియు ఇతర క్రైస్తవ పనివారికి మాదిరిగా ఉండుటకు పౌలు ఈ విధముగా చేశాడు (34,35 వచనములు).


అంత మాత్రమే గాక, తాను దేవుని సంకల్పమంతయును ఏమీ దాచకుండా వారికి ఎలా ప్రకటించాడో పౌలు ఎఫెసు సంఘస్థులకు గుర్తు చేశాడు (అపొ.కా. 20:27). తన సొంత కీర్తి ప్రతిష్టలకోసము ఆరాటపడి, మనుషుల్ని సంతోషపెట్టే వానిగా పౌలు ఉండలేదు. కొందరికి అభ్యంతరము కలిగినా వినువారికి మేలు జరుగు నిమిత్తము అతడు పశ్చాత్తాపముతో పాటు ఇతర ఇష్టము లేని అంశాలను వారికి బోధించాడు (అపొ.కా. 20:20,21).


పౌలు వారి దృష్టికి తెచ్చిన విషయాలు ఇవే.


ఎఫెసు సంఘములో పౌలు చేసిన పరిచర్యవలె నీవుకూడా ఒక సంఘానికి మూడు సంవత్సరాల పాటు కాపరిగా పరిచర్యచేసి అటు తరువాత విడిచి వెళ్ళితే ఆ సంఘస్థులు నిన్ను ఏ విషయములో గుర్తు చేసుకుంటారు? ఒక ఆకర్షణీయమైన బోధకుడిగా గుర్తు చేసుకుంటారా? లేక యేసుని పోలిన, దీనుడైన జనుడిగా గుర్తు చేసుకుంటారా? వారిని దేవుని దగ్గరకు నడిపించినవాడిగా, క్రీస్తు పోలికలు వారిలో కనబడేలా, వారిని సవాలు చేసినవాడిగా గుర్తు చేసుకుంటారా? లేక ఏదో కొన్ని సువార్తపత్రికలు ఎలా పంచి పెట్టాలో నేర్పించిన వాడిగా గుర్తు చేసుకుంటారా?


మన వరము ఏదైనా, పిలుపు ఏదైనా అది క్రీస్తును పోలిన అంతరంగ జీవిత ఊట నుండి ప్రవహించాలి.


స్వస్థతా వరమున్న పరిచారకుడు దానిని యేసు చేసినట్టుగా చేయాలి. యేసు దీనుడు, నిరాడంబరుడు, జనసమూహములో స్వేచ్చగా కలిసి తిరిగినవాడు, రోగుల మీద కనికరము కలిగిన వాడు, ఎవ్వరిదగ్గర డబ్బు తీసుకున్న వాడుకాడు ఆయన జనులను ఉచితంగా స్వస్థపరిచాడు.


కానీ నా జీవితమంతటిలోనూ యేసు వంటి ''స్వస్థత వరముగల పరిచారకున్ని'' నేనెన్నడూ కలుసుకోలేదు. ఒకవేళ మీ జీవితములో అటువంటి స్వస్థతా పరిచారకుడు ఒక్కరైనా కనబడితే దయచేసి నాకు తెలియజేయండి. ఎందుకంటే అటువంటి వ్యక్తిని కలుసుకోవటం నాకెంతో సంతోషము. కానీ నేను మాత్రము అటువంటి మనిషిని ఇంతవరకూ చూడలేదు.


కానీ, దానికి బదులుగా స్వస్థతా వరము ఉన్నట్టు నటిస్తూ తమ మానసిక జిత్తులతో ప్రజల్ని మోసగిస్తూ డబ్బు గుంజే ధనాశపరులైన ఎంతోమంది బోధకుల్ని నేను కలిశాను!


అసలు దీనంతటిలో విచారకరమైన విషయమేమిటంటే వివేచనలేని యువకులు కొందరు ఇటువంటి మోసగాళ్ళని అనుసరిస్తూ వారు కూడా అటువంటి పరిచర్యనే ఆరంభించాలని ఆశించటమే! ఈ విధముగా రాబోవు తరముకూడా దారితప్పి పోతుంది. ఇది నన్ను చాలా విచారింపజేస్తుంది.


మనము అపొస్తలుల పరిచర్యకు పిలువబడినా, ప్రవచన పరిచర్యకు పిలువబడినా, సౌవార్తిక పరిచర్యకు పిలువబడినా, కాపరిపరిచర్యకు పిలువబడినా, బోధనా పరిచర్యకు పిలువబడినా, ఇంకా ఏ విధమైన పరిచర్యకు పిలువబడినప్పటికీ దానిని మనము యేసును పోలిన విధానములో జరిగించాలి. ప్రతి విధమైన పిలుపులోనూ మనల్ని క్రీస్తు ఆత్మ ప్రేరేపించాలి.


దేవుడు నిన్ను ఒక సంఘ కాపరిగా పిలుస్తున్నట్టు నీవు భావిస్తే అప్పుడు ఆ పనిని యేసు ఏ విధముగా చేసేవాడో ఆవిధానములో చేయాలి. అప్పుడు నీవు యేసు యొక్క మహిమను ప్రతిఫలింప చేసేవానిగా చెరిగిపోని ముద్రను నీ మందపై వేస్తావు.


చివరిగా గతములో మన అపజయాలను గూర్చి ఒక్కమాట చెప్పనివ్వండి.


గతమును మనము మార్చలేము. మన జీవితములో ఆ భాగము గతించింది. మనమందరము తప్పిపోయాము, ఇప్పుడు మనము మన అపజయాల విషయంలో పశ్చాత్తాపపడి, మన తప్పిదములన్నీ ప్రభువు చెంత ఒప్పుకొని మనపాపములన్నింటినీ తన పవిత్ర రక్తంలో కడిగి పవిత్ర పరచమని ప్రార్థించగలము.


నా జీవితములో నేను ఎన్నో పొరపాట్లు చేశాను. కానీ నా పొరపాట్లనుండి నేను చాలా పాఠాలు కూడా నేర్చుకున్నాను. అందుచేత నా అపజయాలన్నీ నాకు నిష్ప్రయోజనములు కాలేదు. అంత మాత్రమే గాక ఇతరుల పొరపాట్లను అధ్యయనం చేసి కూడా నేను చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నాను. అలా చేయటంవల్ల వారిలాంటి పొరపాట్లు నేను చేయకుండా జాగ్రత్త పడతాను.


గతంలో చేసిన చాలా కార్యముల విషయంలో మనము సిగ్గుపడవలసివుండొచ్చు. కానీ ఒక్కసారి వాటి విషయంలో పశ్చాత్తాపపడి, ఒప్పుకొని, (ఎక్కడ అవసరమో) అక్కడ సరిచేసుకున్న తరువాత గతపొరపాట్లనుండి మనము పాఠాలు నేర్చుకొని ఇక మన గతాన్ని శాశ్వతంగా మన వెనుకకు నెట్టివేయవచ్చు.


మన గత అపజయాల ఆధారంగా సాతానుడు మనల్ని ''అపరాధభావం'', ''శిక్షాభావములతో'' నింపుటకు వాడిని మనము అనుమతించకూడదు. క్రీస్తు యేసులో ఉన్న ఎవరికైనా ఏ శిక్షా విధియు ఉండదు.


దేవుడు మనల్ని క్రీస్తు రక్తము ద్వారా కడిగినప్పుడు (రోమా 5:9) మన జీవితాల్లో ఎన్నడూ పాపము చేయని వారముగానే దేవుడు మనలను చూస్తున్నాడు! దేవుడు మనల్ని చూచిన విధానములోనే మనల్ని మనము చూచుకోవాలి.


గతములో నీవు ఓడిపోయిన కారణముగా, నీవు వట్టి నిష్ప్రయోజకుడవని నిన్నుగూర్చి సాతానునిగానీ మరెవ్వరినిగానీ చెప్పనియ్యవద్దు. పశ్చాత్తాపము చెందిన కారణంగా నీవిప్పుడు దేవుని హస్తములో విలువైన పాత్రవు. ఇక నీవు శేషజీవితమంతా దేవుని మహిమ కోసము జీవించగలవు.


వారి సంపూర్ణ జీవితము వారి ముందుంటుంది గనుక యౌవనస్థులను శిష్యులుగా చేయుట పెద్దలుగా మనకు కలిగిన గొప్ప ఆధిక్యత. మన సంఘములలో ఉన్న ప్రతి యౌవనస్థునిలో ఉన్న గొప్ప శక్తిని గురించి ఆలోచించు. వారిని పొందుటకు సాతాను తిరుగుచున్నాడని మనము జ్ఞాపకముంచుకోవాలి. వారినివాడు తన వైపుకు లాగకముందే, మనము వారిని దేవుని కొరకు మరియు దేవుని రాజ్యము కొరకు సంపాదించుకోవాలి.


ఆ యౌవనస్థుల హృదయములలో ఎంతో పోరాటము జరుగుతూ ఉంటుంది.


ఒకవేళ వారు రక్షింపబడకుండా సాతాను వారిని అడ్డుకోలేనట్లయితే కనీసం వారు రాజీపడాలని సాతాను కోరుకుంటాడు. వారు రాజీపడేవారిగా కాకుండా, ప్రభువుకు తీవ్రమైన శిష్యులుగా ఉండేటట్లు చూడాలని దేవుడు వారి మీద కాపరులుగా మిమ్ములను నియమించాడు. మీ పిలుపును తీవ్రముగా తీసుకోవాలని మిమ్ములను బ్రతిమాలుచున్నాను.


రాబోవు తరమునకు చెందిన విశ్వాసులకు సరియైన మాదిరిగా యుండకుండా, గతములో ఆయన నామమునకు మనము అవమానము తెచ్చినందుకు పశ్చాత్తాపముతోను మరియు ఆయన క్షమాపణను అడుగుతూ మన తలలు దించుకొనేటట్లుగా ప్రభువు సహాయము చేయును గాక!


రాబోవు దినములలో, మనము తన ప్రజల యొక్క దీనులైన, దైవికమైన నాయకులుగా అగుటకు ఆయన సహాయము చేయును గాక. ఆమెన్‌.


వినటకు చెవులు గలవాడు వినును గాక.