అనేక సంవత్సరములు క్రితము నా పిల్లలు చిన్నవారై యున్నప్పుడు నేను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. నా హృదయాంతరంగములో ఒక శ్రేష్టమైన భార్యగా, ఒక శ్రేష్టమైన తల్లిగా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలనే ఆశ ఉండేది. నాకు సహాయపడిన ఒక చక్కని కథను నేను విన్నాను. ఒకడు ఒక పెద్ద నిర్మాణ ప్రదేశం ప్రక్కన నడుస్తూ అనేకమంది అక్కడ పనిచేయుట చూచెను. అక్కడ వారు ఏదో పెద్ద నిర్మాణం చేస్తున్నట్లు కనబడిరది. కొందరు నేలను త్రవ్వుచుండిరి. ఇతరులు దుంగలను ఇటుకలను మోసుకు వెళ్లుచుండిరి, మరికొందరు ఇసుకను సిమెంటును కలుపుచుండిరి. అందరూ ఏదొక పని చేయుచూ ఉన్నారు. అతడు కొంతమంది పనివాళ్లను ''మీరిక్కడ ఏం చేస్తున్నారు?" అని అడిగెను. ఒకడు, ''నేను ఇటుకలను మోస్తున్నాను" అని చెప్పాడు. మరొకడు ''నేను చెక్కపని చేస్తున్నాను" అని చెప్పాడు. ఇంకొకడు ''నేను సిమెంటును ఇసుకను కలుపుతున్నాను" అని చెప్పాడు. ఆఖరకు వారిలో ఒకడు ''నేనిక్కడ పనిచేస్తున్న ఇంజనీరును మేము ఒక పెద్ద గుడిని నిర్మిస్తున్నాము" అని చెప్పాడు.
మనము భార్యలుగా తల్లులుగా చేసే సామాన్యమైన పనుల గూర్చి ఆలోచిస్తే, మనము కూడా ''నేను పసిపిల్లల గుడ్డలు మారుస్తున్నానని" లేక ''నేను ఇల్లు శుభ్రం చేస్తున్నానని" లేక ''నేను వంట చేస్తూ అంట్లు తోముతున్నానని" చెప్పొచ్చు. కాని దేవుడు తన పరిశుద్ధాలయమును మనలో నిర్మిస్తున్నాడు. దేవుడు మనలో చేస్తున్నది ఒక అద్భుతమైన పని. ఆయన సహాయముతో మనము ఆయన కొరకు మన పిల్లలను పెంచడమే కాకుండా, అదే సమయములో ఆయన తన ఆలయమును మనతో నిర్మిస్తున్నాడు. మన గృహజీవితం మన కుటుంబ జీవితం యేసు క్రీస్తు మహిమార్థమై నిర్మించబడుచున్నవి. మన పిల్లలను ఆయనకు సమర్పించినప్పుడు వారు కూడా తమ జీవితాలలో అదే మహిమకరమైన పనిని అనుభవించగలరు. అప్పుడు మన కుటుంబము దేవుని మహిమ నిమిత్తము ఒక అందమైన ఆలయముగా ఉండును - మరియు మన పిల్లలు దానిలో ఒక భాగముగా నుందురు.
నేను ఇంటి యొద్ద చేయు చిన్న చిన్న పనులలో నమ్మకముగా ఉండాలని, నా జీవితంతో నేను తృప్తిచెందాలని, లోకం దృష్టిలో ఒక ఉద్యోగురాలిగా ఏదో గొప్ప పని చేయాలని అనుకోకూడదని ఎందుకంటే నేను వృత్తిరీత్యా వైద్యురాలిని గనుక దేవుడు నన్ను ప్రోత్సహించాడు. అప్పుడు నేను ఇంటి యొద్ద చేసిన సామాన్యమైన పనులలో ఆనందించాను. ఎందుకంటే దేవుడు నా జీవితమునకు సంబంధించిన ప్రతి విషయాన్ని యోచించెనని నేను ఆయన కొరకు చేసిన ప్రతి పనిని మెచ్చుకొనుచున్నాడని, ఆయన నన్ను యెరిగియున్నాడని నాకు తెలుసు.
కొన్నిసార్లు తల్లులుగా మనకు సరిపడా నిద్రలేనప్పుడు, లేక అలసిపోయి మానసికముగా శారీరకముగా హరించిపోయినప్పుడు మనము ఈ దృష్టిని కోల్పోవచ్చు. అప్పుడు మనము మన ఆత్మీయ కళ్లద్దాలను కేంద్రీకరించి ఈ దృష్టిని తిరిగి పొంది స్పష్టముగా చూడగలగాలి - అప్పుడు ప్రభువు మన జీవితాలలో ఒక చక్కని పనిచేయుచున్నాడని, ఆది ఒక దినమున పరిపూర్ణమవునని మనము చూడగలము.
మీరు కుట్టుపని చేస్తున్నప్పుడు మీరు క్రింది భాగాన్ని చూసినప్పుడు, అక్కడ ఏమి అందంగా ఉండదు. మీరు చేసేదల్లా కుట్లు, ముడులు. మన జీవితాలలో కూడా, మనకు అర్థము కాని అనేక విషయాలను మనము చూడవచ్చు. ఒక దినమున దేవుడు మనకు (మరియు లోకమంతటికి) పై భాగమును అంటే ఆయన మన జీవితాలలో అల్లిన అందమైన కుట్టుపనిని, మనం ఈ లోకంలో వెళ్లిన వాటన్నిటి ద్వారా మనము పొందిన రూపాంతరమును చూపించును. అది ఆయన చేసిన పనిఅయి యుండి ఆయన మహిమకు కీర్తకలుగునట్లు మాత్రమే ఉండును.
ఇప్పుడు మనము మన పిల్లలతో ప్రయాసపడుతున్నప్పటికీ, వారు చివరకు దేవుని బిడ్డలుగా మంచి వారిగానే తయారవుతారని నమ్ముదాము. వారు చేసిన చిన్న చిన్న అవిధేయతలను దేవుడు నమోదు చేయడం లేదు. మనలో ఎవరము పరిపూర్ణులము కాము. దేవుడు మనకు సహాయపడును మరియు వారికి కూడా సహాయపడును. దేవుడే స్వయముగా మనలో పని చేస్తున్నాడని మనము గ్రహించినప్పుడు మనము అద్భుతమైన తల్లులుగా ఉండియున్నామని లేక ఏదైనా పరిపూర్ణంగా చేసియున్నామని ఊహించుకోము. మనం ఇతరులకు బోధించగలమని మనమనుకోము. సమస్తమును దేవుని మహిమ కొరకే ఉండును.
ఆ చివరిదినమున ఆయన తన సర్వశక్తిని బయలుపరచి, మనకు బలహీనతలు, పొరపాటులు, లోపాలు ఉన్నప్పటికీ మనము క్రీస్తు స్వభావములో పాలివారమైతిమని చూపిస్తాడు.
నాకు మరొక దృష్టాంతము గుర్తుకువస్తుంది. మీరు ఒక రూపాయి నాణెమును తీసుకొని దానిని మీ కంటికి దగ్గరగా పెట్టుకొంటే మీరు సూర్యుని కూడా చూడలేరని ఒకరు చెప్పారు. అదే విధంగా భౌతిక వస్తువులకు సంబంధించి, డబ్బును సంపాదించడం పొదుపు చేయడానికి సంబంధించి మనము ఎదుర్కొనే ఆందోళనలు మన ఆత్మీయ దృష్టిని మందగింపచేసి, మనమిక దేవుని వెలుగు చూడకుండునట్లు చేయును.
మాకు బెంగళూరులో తరుచుగా నీటి కొరత ఉండేది. కాబట్టి మేము నీళ్లను వాడటంలో జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది. మా అవసరాలకొరకు నీటిని నిల్వచేయడంలో నేను తీరిక లేకుండా ఉండేదానను. ఇంటి యొద్ద అటువంటి అనేక చిన్న చిన్న వాటిల్లో నిమగ్నమైయుండే దానను. కాని యేసు మనకు అవసరమైనది ఒక్కటేనని, అది మరియ వలే ఆయన పాదముల చెంత నెమ్మదిగా కూర్చొనుట అని చెప్పాడని నాకు తెలుసు (లూకా 10:42). కాని నాకున్న తీరికలేని దినచర్యల మధ్యలో అలా చేయడానికి నాకు సమయమెక్కడిది? నా దినచర్యల మధ్యలో కూడా నా మనసు ప్రభువుపైన ఉండగలదని నేనప్పుడు కనుగొన్నాను. నేను మరియ హృదయమును మార్త చేతులను కలిగియుండవచ్చని నేను కనుగొన్నాను. మనం మన దినచర్యలు చేస్తూ ఉండగా, మన హృదయాలు ప్రభువును ఎల్లప్పుడు వినుటకు ఆయన తట్టుతిరిగియుండవచ్చు.
ఒక తల్లిగా నాకుండిన ఒక గొప్ప ఆశ నా పిల్లలను దేవుని మార్గాలలో పెంచాలనేది. పిల్లలందరు ఒకే విధంగా ఉండరు. ప్రతి సంస్కృతి ప్రతితల్లి కూడా ఒక విధంగా ఉండరు. పిల్లలను ఎలా పెంచాలనే విషయంపై మంచి సలహాలను మనము క్రైస్తవ పుస్తకాలనుండి పొందగలము. కాని చిట్ట చివరకు ప్రభువు మాత్రమే మన పిల్లలను ఆయన మార్గములలో పెంచడానికి సహాయపడగలడు.
ఒకప్పుడు తమ పిల్లలను వేర్వేరు పద్ధతులలో శిక్షించిన భక్తిపరులైన తల్లులను నేను కలసినప్పుడు లేక వారి గురించి చదివినప్పుడు వారిని అనుకరించడానికి శోధింపబడే దానను. కాని అవి వేర్వేరు పద్ధతులు మాత్రమే అని నేను గ్రహించాను. నా గురి నా పిల్లలను నిజమైన భక్తిలోనికి నడిపించడమే. ఆ గురి యొద్దకు చేరుకోవడానికి అనేక మార్గములున్నవని నేను చూచాను. నేను ఇతరులు వాడే పద్ధతిని గ్రుడ్డిగా అనుకరించనక్కరలేదు. నేను ఆపద్ధతిని అనుకరించలేకపోతే నేను నిరుత్సాహపడనక్కరలేదు. మన పిల్లలలో కొందరు ఒక నెమ్మదైన మాటకు స్పందించవచ్చు. అప్పుడు వారితో మనం గట్టిగా మాట్లాడనక్కరలేదు. కాని మన ఇతర పిల్లలు వేరుగా ఉండవచ్చును. ముఖ్యమైన విషయం దేవుని స్వరమును వినడం. మన పిల్లలకు మనము సహాయపడాలనుకొనుచుండగా ఆయన మనలను నడిపిస్తాడు.
నా స్వంత విషయం వచ్చేసరికి, వేరే ఇతర కారణాలు కూడా ఉండెను.ఆరు సంవత్సరాలు మా ఇంట సంఘ కూడికలు జరిగినవి. ప్రతి ఆదివారం ఉదయమున మరియు వారంలో మూడు సాయంత్రములు కూటాలు ఉండేవి. దానితో పాటు సంఘస్తులు అప్పుడప్పుడు వైద్య లేక ఇతర సహాయం కొరకో లేక ప్రార్థన కొరకో వస్తూ ఉండేవారు. కొన్నిసార్లు రాత్రిపూట దూరం నుండి వచ్చినవారి కొరకు మా గృహంలో వసతి కల్పించవలసి వచ్చేది.
మరొక కారణము ఏమిటంటే నా భర్త తరచు తన పరిచర్య నిమిత్తం ప్రయాణిస్తూ ఇంటి నుండి దూరంగా ఉండేవారు. కాబట్టి ఆ సమయాలలో నాకు ఆయన సహాయం లభించేది కాదు.
అటువంటి సమయాలలో, తమ భర్తలను ఇంటి యొద్ద ప్రతి రోజు కలిగియున్న ఇతర స్త్రీల పరిస్థితి ఎంత సునాయాసమైనదో అనుకొనేదానను. ఆ రోజులలో నేనొక పాఠమును నేర్చుకొన్నాను: నీ కంటే సునాయాసమైన పరిస్థితిలో ఉన్నవారితో నిన్ను నీవు పోల్చుకోవద్దు. కాని నీ కంటే కష్టతరమైన పరిస్థితిలో ఉన్నవారితో నిన్ను నీవు పోల్చుకో. మనము ఆ విధముగా చేస్తే మనము అన్నిటిని బట్టి అన్నివేళలయందు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు.
దేవుడు నా భర్తను సువార్త ప్రకటించుటకు పిలిచెను. కనుక ఆయన నా కొరకు ఇంట్లో అనేక పనులు చేస్తూ కట్టుబడి ఉండాలని నేను కోరుకోలేదు. అప్పుడు ఆయన తన పరిచర్యను తగ్గించుకొని, వేర్వేరు సంఘాలకు ప్రయాణించకుండా అవసరతలో ఉన్న వారికి తక్కువ అందుబాటులో ఉండవలసి వచ్చేది. దేవుడు ఇతరుల పట్ల కలిగియున్న ప్రణాళిక కంటే నా పట్ల నా కుటుంబము పట్ల కలిగియున్న ప్రణాళిక భిన్నమైనదని నేను గ్రహించాను. ఆయన యోచించిన విధంగా నా పరిస్థితిని నేను అంగీకరించడానికి దేవుడు నాకు సహాయము చేసారు. కొన్నిసార్లు, నాభర్త ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నా పిల్లలు రోగులుగా ఉండేవారు. అటువంటి సమయాలలో నా పిల్లల కొరకు ఏమి చేయాలన్న వైద్య జ్ఞానమును తగినంతగా దేవుడు నాకిచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. వారు రోగులైన ప్రతిసారి నేను వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లవలసి రాలేదు. వారి చిన్న చిన్న రోగములకు నేను చికిత్స చేయగలిగే దానిని. ప్రభువు ఎల్లప్పుడు నా ప్రక్కనుండి ఆ పరిస్థితులను అధిగమించడానికి సహాయపడెను. కొన్నిసార్లు నాకు రాత్రి పూట నిద్రలేనప్పుడు పగలు కొంత సమయం నిద్రపోవడానికి దేవుడు నాకు సహాయము చేసేవాడు.
నా పిల్లల అవసరతల వంటి ప్రాముఖ్యమైన విషయాలపైన దృష్టి కేంద్రీకరించడానికి నాకు సమయముండాలంటే నేను అత్యవసరం కాని కొన్ని వ్యవహారములను వినోద కార్యక్రమములను తగ్గించుకోవాలని గ్రహించాను. నా పిల్లలు పెరిగి పెద్దవారై వాళ్ల కాళ్లపై వారు నిలబడిన తరువాత నేను నా స్వంత ఆశయాలను సాధించుకోగలను. కాని ఇప్పుడు వారి చదువులలోను వారి జీవితాలలో ఇతర విషయాలలోను వారికి నా సహాయం అవసరము కాబట్టి నేను వారికి స్నేహితురాలిగా ఉండి వారికి అందుబాటులో ఉండాలి.
ప్రభువు పరిచర్యలో నా భాగము ఇంటిని చూచుకోవడంలో నా భర్తకు సహాయపడటమని నేను భావించాను. అప్పుడు నా భర్త కలత లేకుండా ప్రయాణించి సువార్త ప్రకటించుటకు స్వేచ్ఛ కలిగియుండును. అన్ని వేళలా ఇంటి యొద్ద ఒక సమాధానకరమైన ఐకమత్యముతో కూడిన వాతావరణమును కలుగజేయడానికి నేను ప్రయత్నించేదానను. అప్పుడు నా భర్త వెళ్లి మాట్లాడుటకు సులువుగా ఉండును. ఇంట్లో జరిగిన దేనిని బట్టిఅయినను, ప్రత్యేకముగా మా పిల్లలకు జరిగిన దాని బట్టిఅయినను ఆయన విశ్రాంతి లేకుండా ఉండకూడదు. నా గృహములో జరిగిన ఏదైనా ప్రభువు ఆయన ద్వారా చేస్తున్న పనికి ఆటంకంగా ఉండకూడదని నేను కోరుకున్నాను. నా వివాహ జీవితంలో నాకు సహాయపడిన మూడు బైబిలు సత్యాలున్నవి. ఈ గత సంవత్సరాలలో ఇవి నాకు అధికముగా ప్రాముఖ్యముగా మారినవి. నేను క్రొత్త నిబంధనతో పట్టబడిన తర్వాత మాత్రమే ఈ సత్యములను మరి స్పష్టముగా నేను గ్రహించగలిగాను. క్రొత్త నిబంధనను చూడటానికి దేవుడు నా కళ్లు తెరచేముందు, నేను నా పాపములు క్షమించబడినవని తెలుసుకొన్న ఒక తిరిగి జన్మించిన క్రైస్తవురాలిని మాత్రమే. ఇతర విశ్వాసులవలెనే నేను ఏదైనా పాపములో జారి పడిపోయిన ప్రతిసారి నేను క్షమాపణ అడిగేదానను. కొన్నిసార్లు నా ఆత్మీయ జీవితం ఎండిపోయినట్లుండేది. కాని నేను పాపము పైన జయముతో కూడిన జీవితం కొరకు వెదకడం ప్రారంభించినప్పుడు, నాకు ప్రతిదినము పరిశుద్ధాత్మ శక్తి ఎంత అవసరమో గ్రహించాను.
ప్రభువు నాకు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును ఇచ్చెను. కాని అనుదినము నేను ఆత్మతో నింపబడవలెనని నేను తెలుసుకున్నాను. అప్పుడు మాత్రమే ఆయన శక్తి, బలము, నూతనత్వము, నా జీవితంలో ఎల్లప్పుడూ ఉండును. అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది మనందరి కొరకు మన పరలోకపు తండ్రి యొక్క వాగ్దానము. మనలో ఎవరూ దానిని పొందకుండా ఉండకూడదు.
నాకు ప్రాముఖ్యమైనవిగా మారిన మూడు సత్యములు ఏమిటంటే
1. నేను దేవుణ్ణి నా తంర్రడిగా తెలుసుకోగలను(కలిగియుండగలను).
2. నా భర్తతో ఐక్యముగా ఉండడము యొక్క ప్రాముఖ్యత
3. నా భర్తకు లోబడియుండడము యొక్క మహిమ
ఈ మూడు విషయాలలో నేను యేసును నా మాదిరిగా చూడగలిగాను. క్రొత్త నిబంధన గ్రంధము నాకు జీవముగలదిగా మారింది. అది నాకు ఒక ప్రాఠ్యపుస్తకం వలేకాక, యేసు యొక్క జీవముగల మాటలుగా ఉన్నది.
దేవుణ్ణి నా తండ్రిగా తెలుసుకోవడము నాకు నిజంగా ప్రాముఖ్యముగా మారిన మొదటి సత్యము. అనేక మంది భార్యలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే వారు భద్రతాభావం కలిగియుండరు. వారు అవసరతలో ఉన్నప్పుడు తమ సమస్యలను చెప్పుకొనుటకు ఒక స్నేహితురాలికొరకు ఆశపడతారు. వివాహమైనప్పుడు ప్రత్యేకంగా స్త్రీలు అనేక మార్పులకు సర్దుబాటు చేసుకోవలసి యుండును. కాబట్టి కొన్నిసార్లు వారు తమను వినగలిగే వారిని, తమను అర్థము చేసుకునే వారిని, తమ హృదయమును కుమ్మరించడానికి ఒక స్నేహితురాలినో, సహోదరినో లేక తల్లినో తండ్రినో కోరుకుంటారు. కాని వీరందరికీ మనకు సహాయపడటంలో కొన్ని పరిమితులున్నవి. మనం మన తల్లిదండ్రులపై కాని తోబుట్టువులపై కాని ఎక్కువ భారమును పెట్టలేము. ఎందుకంటే వారికున్న సమస్యలు వారికుంటాయి. మన సమస్యలు వినడానికి మన స్నేహితులందరికీ సమయముండదు. కాని మనము నరుని వైపు తిరుగనక్కరలేదు. మనం పరలోకమందున్న మన తండ్రి తట్టు తిరుగవచ్చు.
యిర్మీయా 17:5-8 ఏం చెప్తుందంటే, ''నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవా మీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరుహావృక్షము వలే నుండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు".
ఏ నరునిపై కాక మన తండ్రిఅయిన దేవునిపైన ఆనుకొనే జీవితమే ధన్యమైన జీవితము. అప్పుడు మనమెన్నడు ఎండిపోము. మనము సంపూర్ణ భద్రత కలిగియుంటాము.
యేసు మనలో నివసించడానికి పరిశుద్ధాత్మను పంపించిన తరువాత దేవుడే స్వయంగా మన తండ్రిగా ఉంటాడు. కాబట్టి మనమిక అనాధలుగా ఉండమని యోహాను 14:17,18లో యేసు చెప్పారు.
మనం ప్రార్థించినప్పుడు దేవుణ్ణి మన తండ్రిగా సంభోధించాలని యేసు చెప్పారు. నన్ను ప్రేమించే ఒక పరలోకపు తండ్రి ఉన్నాడనే ఈ అద్భుతమైన సత్యము చేత పట్టబడినప్పుడు, నా అభధ్రతాభావములు మాయమవ్వడం ప్రారంభించాయి. పాత నిబంధనలోని ప్రజలు దేవుణ్ణి యెహోవాగా యెరిగి ఆయన యెదుట భయభక్తులతో వణకిరి. కాని ఇప్పుడు మనము నిజముగా మన పాపములనుండి వెనుతిరిగి యేసును మన జీవితాలకు ప్రభువుగా చేసుకుంటే మనము దేవుణ్ణి మన తండ్రిగా యెరుగవచ్చు.
మనము దేవుని బిడ్డలమైనప్పుడు ఆధిక్యతలున్నవి మరియు భాద్యతలున్నవి. ఆయనను మన తండ్రిగా తెలుసుకొనే ఆధిక్యత మనకున్నది. మన జీవితములపైన ఆయనకు సంపూర్ణ అధికారమునివ్వడం మన బాధ్యత. మన పరలోకపు తండ్రి నుండి మనము అనేక విషయాలను నేర్చుకోవలసి యున్నది. ''యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును" అని యెషయా 30:30లో మనము చదువుతాము. దానిని తల్లిదండ్రులుగా మన జీవితాలకు అన్వయించుకొంటే, మన పిల్లలు వారి తల్లిదండ్రులుగా మనకున్న ప్రేమగల అధికారమును గుర్తించవలెను.
మన తండ్రి మనలను నడిపించును. ''నీకు ఉపదేశము చేసెదను నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను" అని కీర్తన 32:8లో వ్రాయబడినది. యెషయా 30:21లో ''మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ. దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును" అని ఆయన చెప్తున్నాడు. దానిని మన జీవితములకు అన్వయించుకొని, మన పిల్లలను మనము కూడా సరిఅయిన మార్గములో నడిపించవలెనని మనము చూస్తాము.
మనము తప్పిపోయినప్పుడు మన తండ్రి మనలను క్షమించును. మనము కూడా మన పిల్లలు లేక ఇతరులు తప్పిపోయినప్పుడు క్షమించడానికి త్వరపడవలెను. మన తండ్రి మనమీద కనికరపడును.కీర్తన 103:13,14లో ''తండ్రి కుమారుల యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల, జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు" అని వ్రాయబడియున్నది. మనము కూడా మన పిల్లలయెడల కనికరము కలిగి వారితో కఠినముగా ఉండకూడదు.
మన తండ్రి తన వాక్యము ద్వారా మనము ఎదుర్కొనే పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడును. మనము హెబ్రీయులు 12:7-10లో చదివినట్లు ఆయన మన మంచికొరకు మనలను శిక్షించును, సరిదిద్దును. మన తండ్రి ప్రేమ కలిగియుండును. ఖచ్చితముగా కూడా యుండును. మనము కూడా మన పిల్లలకు మన ఉపదేశము ద్వారా మరియు వారు ఎదుర్కొనే పరిస్తితుల ద్వారా నేర్పించవలెను. వారితో వ్యవహరించినప్పుడు మనము ప్రేమతోను ఖచ్చితముగాను ఉండవలెను.
మన తండ్రి ఎల్లప్పుడూ స్థిరమైన వానిగా ఉండును మరియు తన వాగ్దానములను నెరవేర్చును. మన తండ్రియొద్ద నుండి మనము నేర్చుకోవలసిన మరొక విషయం మన పిల్లలకు మనమిచ్చిన మాటను నిలబెట్టుకోవడం. మనము మన పరలోకపు తండ్రితో మాట్లాడి మనలను తొందరపెట్టే విషయాలన్నిటిని, మన భయములను, మన బలహీనతలను, మన తప్పిదములను, మన ఆశలను ఆయనతో చెప్పుకోవచ్చు. ఈ లోకములో మనము దేనికి భయపడనక్కరలేదు. ''భయపడకుడి, మీ పరలోకపు తండ్రి, మీ కొరకు చింతిచుచున్నాడు" అని యేసు తన శిష్యులతో ఎన్నోసార్లు చెప్పారు. మన పిల్లలు తమ భయములను తమ సమస్యలను మనతో చెప్పుటకు ఎల్లప్పుడు స్వేచ్ఛ కలిగి యుండవలెను.
ఇటువంటి ప్రేమించే సర్వశక్తుడైన తండ్రిని కలిగియుండుట ఎంత గొప్ప ఆధిక్యత. మనము ఆయనను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఆయనకు విధేయత చూపాలి. ఆయనను మాత్రమే సంతోషపెట్టుటకు జీవించాలి.
యోహాను 17:3లో నిత్యజీవమనగా దేవుణ్ణి వ్యక్తిగతముగా ఎరుగుటయే అని మనం చదువుతాము. ప్రత్యేకంగా ఆయన మనలను క్రీస్తును ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాడని ఎరుగుట (యోహాను 17:23). ఇది ఒక అద్భుతమైన సత్యము. మన పరలోకపు తండ్రి పక్షపాతి కాడు. ఆయన యేసు కొరకు చేసిన వాటన్నిటిని మన కొరకు చేయును. ఆయన యేసు విషయములో జాగ్రత్త వహించినట్లు మన విషయములో జాగ్రత్త వహించును. మనము కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలతో వ్యవహరించే తీరులో నిష్పక్షపాతముగా ఉండవలెను.
మన తండ్రి యేసును ప్రేమించినంతగా మనలను ప్రేమిస్తున్నాడని ఈ అద్భుతమైన సత్యమును మనము నమ్మినప్పుడు, మనము మన అభద్రతా భావములనుండి విడుదల పొంది, జీవితంలో వచ్చే శోధనలను ఎదుర్కొన్నప్పుడు బలముగా ఉండెదము. సమయం గడిచే కొలది మనము మన తండ్రిని ఇంకా ఇంకా సన్నిహితముగా ఎరిగి ఆయన పైన ఇంకా ఇంకా ఆధారపడుట నేర్చుకొనెదము. కొన్ని సంగతులు ఎందుకలా జరిగినవని మనకు అర్థము కాని సమయములలో కూడా మనము ఆయన జ్ఞానమును విశ్వసించెదము. ఆయన మన జీవితములో అనుమతించేవన్నియు మనమంచి కోసమనే నిశ్చయతను మనము పూర్తిగా కలిగియుందుము. మన సమస్యలకు పరిష్కారము నివ్వడానికి ఆయనను మనము నమ్మగలము. మనలను శిక్షించాలని చూచే దేవునిగా మనము ఆయనను చూడముగాని, మనకు సహాయపడుటకు ఆసక్తి కలిగియున్న ప్రేమగల తండ్రివలే చూస్తాము. మన పిల్లలకు శ్రేష్టమైన తల్లిదండ్రులుగా ఉండుటకు మన పరలోకపు తండ్రి మనకు సహాయపడగలడు.
నా భర్తతో ఐక్యముగా ఉండటము యొక్క ప్రాముఖ్యత నా వివాహ జీవితంలో నన్ను నడిపించిన రెండవ సత్యము. యెహాను సువార్తలో తండ్రి మరియు యేసు ఏకమని చెప్పే వచనములు ఎన్నో ఉన్నవి. యోహాను 17:21లో, తండ్రి కుమారుడు ఏకమైన రీతిగా మనము ఏకముగా ఉండవలెనని ప్రభువైన యేసు చెప్పారు.
దానిని మనము కుటుంబ జీవితమునకు అన్వయించుకొంటే, మనకు మన భర్తలతో ఐక్యత అనే గట్టి బంధము ఉండవలెను. ఈ రోజులలో అపవాది అనేక కుటుంబాలలో ఐక్యతను నాశనము చేస్తున్నాడు. గృహములు చిన్నాభిన్నమగుచున్నవి. కనుక మనము మెళకువగా ఉండి జాగ్రత్తగా ఉండవలెను. అనేకమంది భార్యలు తమ భర్తలకంటే తమ తల్లిదండ్రులతోనో తమ తోబుట్టువులతోనో సన్నిహిత సంబంధమును కలిగియుందురు. వారు తమ వివాహజీవితములో అనేక సమస్యలను ఎదుర్కొనడానికి ఇదొక కారణము. మన భర్తలతో ఐక్యత బలంగా లేనట్లయితే అపవాది సుళువుగా మన గృహాలలోకి ప్రవేశించును. తల్లిదండ్రులు ఐక్యముగా లేనియెడల వారి పిల్లలు అభద్రతా భావమును కలిగియుందురు. ఇది వారు సరిగా ఆహారమును తినకపోవడంలోను, వారి చెడు ప్రవర్తనలోను, సరిగా నిద్రపోలేకపోవడంలోను కనబడును.
యోహాను 1:1లో ఆదియందు యేసు దేవునితో ఉండెననియు, ఆయనే దేవుడైయుండెననియు మనము చదువుతాము. ఇది మన పరిమితి గల మనసులకు అర్థముకానిది. త్రిత్వములో ఉన్న మూడు వ్యక్తుల మధ్య లోతైన బలమైన ఐక్యత ఉన్నది. మనము దేవుణ్ణి చూచినప్పుడే దీనిని పూర్తిగా అర్థము చేసుకోగలుగుతాము. ఇది చాలా ప్రశస్తమైన ఐక్యత. మనము కూడా అటువంటి ఐక్యతను కలిగియుండునట్లు తండ్రి ఆ ఐక్యతను మనకు కొంత మట్టుకైనా కనుపరచవలెనని యేసు యోహాను 17వ అధ్యాయములో ప్రార్థించారు.
దేవుడు ఒక పురుషుని మరియు స్త్రీని వివాహ బంధములో జతపరచినప్పుడు వారు ఏకముగా ఉండాలన్నది ఆయన చిత్తమైయున్నది. దేవుడు జతపరచిన వారిని ఎవరూ వేరు చేయకూడదు. ''సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా" అని మనము ఆమోసు 3:3లో చదువుతాము. ఇద్దరు విశ్వాసులు ఏకమై ఏకీభవించినప్పుడు వారు సాతాను కార్యములను బంధించి అతడు బంధించిన వారిని విడుదల చేయగలరని మనము మత్తయి 18:18,19లో చదువుతాము. ఇది తమ గృహములో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేసే భార్యభర్తలకు కూడా వర్తిస్తుంది. ఒక భార్య మరియు భర్త ఏకమైనప్పుడు ప్రభువు వారి మధ్య ఉండును గనుక అక్కడ శక్తి ఉండునని, సాతానుకు తెలుసు (మత్తయి 18:20). కనుక ఆ ఐక్యతను విడగొట్టుటకు అతడు శాయశక్తులా ప్రయత్నించును.
భార్యభర్తలుగా యేసుకు తండ్రికి ఉన్న ఐక్యతను కొంచెము మట్టుకైనా రుచి చూడగలుగుట ఎంతటి ఆధిక్యత. అటువంటి ఐక్యతను మన గృహములలో ఇచ్చుటకు యేసు భూమి మీదకు దిగివచ్చెను. ఇది మన జన్మహక్కు. మన మనసులకు అది అర్థంకాదు - కాని అది సాధ్యమే.
ఒక కుటుంబములో ఐక్యత లేకపోవుటకు గల కొన్ని కారణములేమిటి? వారి సంస్కృతిని బట్టి వారు పెంచబడిన విధానమును బట్టి వారి నేపథ్యమును బట్టి, వారి మనోభావాలను బట్టి భార్యభర్తల మధ్య అనేక తేడాలు ఉండవచ్చు. కాని అటువంటి తేడాలు ఐక్యతను భంగపరచనక్కరలేదు. వారు భిన్నమైనవారైనప్పటికీ దేవుని కృప ఇద్దరిని ఏకముగా చేయగలదు.
నా స్వంత వివాహ జీవితములో దీనిని నిజం చేయమని నేను దేవుణ్ణి అడిగాను. నాకు నా భర్తకు మధ్యనున్న దూరమును బట్టి వచ్చే గొడవలు, ఒంటరితనము దు:ఖముతో కూడిన జీవితమును నేను కోరుకోలేదు. మన మధ్యనున్న తేడాలు నన్ను తొందరపెట్టకుండునట్లు నన్ను నా భర్తతో ఏకము చేయమని నేను ప్రభువును అడిగాను. నా వివాహ జీవితములో ఆ ఐక్యతను కలిగియుండుటకు నేను చేయగలిగినదంతా నేను చేయాలనుకొన్నాను. అది నా గురిగా మారెను.
మనమే తప్పు చేసినప్పటికీ వేరెవరినైనా నిందించే ప్రవృత్తి మనుష్యులుగా మనలో ఉంది. ఇది వివాహ జీవితంలో కూడా జరుగవచ్చు. దేవుడు జతపరచిన వారిని మనము వేరుచేస్తున్నామని మనమప్పుడు గుర్తుంచుకోవలెను. మనము ఏకముగా ఉండాలన్నది దేవుని చిత్తము కనుక ఆ ఐక్యతను కాపాడుకొనుటకు మనము చేయగలిగినదంతా చేయవలెను.
దేవుడు మనయెడల సహనము కలిగి క్రీస్తులో మనలను క్షమించినట్లే మనము ఒకరినొకరి సహించుచు క్షమించుకొనుటకు సహాయము కొరకు మనము ప్రభువును అడుగవలెను (ఎఫెసీ 4:2,32).
ఒకరినొకరు అనుమానించుకొనుట ఐక్యతను భంగపరిచే మరొక విషయము. కనుక ఆ విషయంలో జాగ్రత్తపడుడి. ఎక్కువ అనుమానములు చివరకు ఆధారములేనివిగా కనబడునని గుర్తుంచుకొనుడి. గతంలో నీకు ఇతర పురుషులతో స్నేహముండి యున్నట్లయితే నీవు ఆ సంగతులను మరచిపోయి వాటిగురించి, ఎప్పుడూ ఆలోచించకూడదు. ఫేస్ బుక్ ద్వారా పాత పరిచయాలను పునరుద్ధరించవద్దు. ఇది మొదట్లో ప్రమాదకరంగా ఉండకపోవచ్చు. కానీ అనవసరమైన శోధనకు నిన్ను నీవు గురి చేసుకొందువు. నీ బంధువులు దూరముగా ఉన్నప్పటికీ వారు నిన్ను నియంత్రించవలెనని నిన్ను ఏలవలెనని ప్రయత్నించెదరని గుర్తుంచుకో. ఇది నీకు నీ భర్తకు మధ్య దూరమును కలుగజేయవచ్చు. దానిని ఎప్పుడూ జరుగనీయకు.
కొన్నిసార్లు డబ్బు, భౌతిక వస్తువులు, భూసంబంధమైన ఆశయాలు భార్యాభర్తల మధ్య భేదమును కలుగజేయవచ్చు. కనుక నీ ప్రాధాన్యతలను సరిగా కలిగియుండుము.
మన భర్తలతో ఐక్యత ఒక గొప్ప గురి. కాని మనము దానిని బలంగా కోరుకుంటే సాధించవచ్చు. ఎందుకంటే మనకు సహాయము చేయుటకు దేవుడు మన పక్షమున ఉన్నాడు.
నీకు మరియు నీ భర్తకు మధ్య ఒక చిన్న సమస్య వచ్చిన ప్రతిసారి, అది నీ చేతిలో ఒక చిన్న ముల్లు గుచ్చుకున్నట్లు భావించు. దానిని నీవు అలాగే ఉండనిస్తే అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు వెంటనే ప్రభువు తట్టు తిరిగి ఆయనను క్షమాపణ అడుగుటకు త్వరపడుము; తర్వాత నీ భర్తతో ఐక్యతను కాపాడుకొనుటపై దృష్టిపెట్టుము. నీ తప్పును ఒప్పుకొనుము, నీ భర్తను క్షమాపణ అడుగుము, మారుమనస్సు పొంది ఐక్యత కలిగియుండుటకు నీ హృదయమంతటితో వెదకుము. నిన్ను నీవు తీర్పుతీర్చుకొనుట మరియు నిన్ను నీవు పవిత్రపరచుకొనుట యొక్క అర్థమిదే. నీకు మరియు నీ భర్తకు మధ్య వేర్పాటును తీసుకువచ్చుటకు సాతాను ఒక చిన్న అపార్థమును వాడుకోగలడు. మన భర్తలతో ఈ ఐక్యతను కాపాడుకోవాలంటే మనము కష్టపడాలి మరియు అన్ని వేళలా మెళకువగా ఉండాలి. నీ జీవితము యొక్క చివరకు వచ్చేసరికి నువ్వు పడిన కష్టమును బట్టి పశ్చాత్తాపపడవు.
ఇంటి యొద్ద ఒక పరిస్థితి విషయంలో నీకు మరియు నీ భర్తకు వేరే అభిప్రాయములుంటే పరిణితి గల విధముగా మాట్లాడుకొనుడి. అతడు తను చెప్పినట్లే చేయాలంటే నీ మనసు మార్చుకొనుటకు సిద్ధపడుము. కాని మీరు మాట్లాడుకొన్న తరువాత అతడు తన మనసు మార్చుకొనుట కూడా సాధ్యమే లేక మీరు ఆ సమస్యను పరిష్కరించుటకు ఒక క్రొత్త పద్ధతిని కనుక్కోవచ్చు. కాని పరిణితి గలవారిగా మనము మన భేదమును పరిష్కరించుకోవలెను. అంతేకాని వాటిని బట్టి గొడవ పడకూడదు. వివిధ పరిస్థితులను గురించి మనకున్న అభిప్రాయములను విశాలపరచడానికి ప్రభువు మన మధ్య ఉన్న భేదములను వాడుకొనగలడు.
సంఘమునకు సంబంధించిన విషయము సంఘ పెద్దల అధికారమునకు చెందినవి. భార్యలుగా మనము అటువంటి విషయాలలో కలుగజేసుకోకూడదు. మనము మన భర్తకు ఒక స్త్రీ యొక్క దృష్టి కోణమును ఇవ్వవచ్చు కాని సంఘములో నీవొక సహాయక సంఘపెద్దగా ఉండకుండుటకు జాగ్రత్తపడుము. ప్రకటన 2:20లో ప్రభువు సంఘమునకు హాని చేసే ఒక పెద్ద యొక్క భార్యను అబద్ధ ప్రవక్తిఅయిన యెజెబెలు అని పిలవడం గూర్చి మనము చదువుతాము.
ఏ సంఘములోనైతే బలమైన కుటుంబాలుంటాయో ఆ సంఘము బలమైన సంఘముగా నుండును. ఆ సంఘములో నున్న కుటుంబాలు ఐక్యతతో ఉన్నవి గనుక పాతాళలోకపు ద్వారములు దాని యెదుట నిలువనేరవు. కనుక సంఘము యొక్క ఐక్యతను కాపాడుటలో మనము చేయగలిగినదంతా మనము చేయవలెను. అటువంటి ఐక్యతను కట్టుటకు సంవత్సరాలు పట్టును కాని మనము దినము వెంబడి దినము దానికొరకు పనిచేయవలెను. దానిని సాధించుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయపడును. ఆ పెద్ద గుడిని గూర్చిన కథను గుర్తుంచుకొనుడి. దానిని పూర్తి చేయుటకు సంవత్సరములు పట్టవచ్చు కాని అది పూర్తవుతుంది.
మనము మన భర్తలు చూచినట్లు అన్ని విషయములను చూడము. కాని మనము ఏకీభవించినప్పుడు మన బేధాభిప్రాయములను పిల్లలముందు లేక ఇతరుల ముందు కాక రహస్యముగా చర్చించుకోవలెను. అటువంటి విషయములను మన పిల్లలు నిద్రపోయిన తరువాత ఎవరూ లేనప్పుడు చర్చించుకోవలెను. భార్యాభర్తల మధ్య అవిశ్రాంతి ఉన్నప్పుడు పిల్లలు దానిని కనిపెట్టి అభద్రతా భావము కలిగియుందురు. వారప్పుడు మననుండి ఎక్కువ శ్రద్ధ కొరకు పట్టుబడతారు మరియు ఇతర విషయాలలో కూడా పట్టుబడతారు. నీవు కలత చెందినప్పుడు నెమ్మదిగా, మాట్లాడకుండా ఉండడం ఒక మంచి నియమము. నీవు ప్రశాంతంగా ఉండుటకు సహాయపడమని దేవుణ్ణి అడిగి నీవు మాట్లాడే ముందు నీ హృదయములో ఉన్న గలిబిలిని జయించు. నీ పిల్లలకు పెళ్లయిన తరువాత, నీవు వారికి ఎల్లప్పుడు సలహాలివ్వకుండా, వారికి తోచినట్లు వారి గృహములను నడిపించుకోనివ్వడం మంచిది. ఆవిధముగా వారు నిన్ను గౌరవించెదరు. వారి పిల్లలతో అంటే నీ మనమలతో వ్యవహరించుటకు కూడా నీకు చాలా జ్ఞానము అవసరము. నీ పిల్లలను నీ పద్ధతిలో పెంచడానికి నీకిప్పటికే అవకాశం వచ్చినదని గుర్తుంచుకో. ఇప్పుడు నీవు కలుగజేసుకోకుండా వారి పద్ధతిలో వారి పిల్లలను పెంచనివ్వు. ఆవిధంగా నీవు వారితో ప్రేమను ఐక్యతను కాపాడుకొందువు. కాని వారికి నీ సహాయము అవసరమైనప్పుడు వారికి సహాయపడుటకు అందుబాటులో ఉండుము. వారు అడిగినప్పుడు మాత్రమే వారికి సలహాలిమ్ము.
నా భర్తకు లోబడుట ప్రభువు నేను చూచునట్లు నా కళ్లు తెరచిన మూడవ ముఖ్యమైన నియమము. 'లోబడుట' అనే మాటను వినుటకు ప్రజలు ఇష్టపడరు ఎందుకంటే దానర్థము నీవు ఎల్లప్పుడు నీ భర్త చెప్పిన దానికి తలొంచి అతడు చెప్పినట్టల్ల చేయడమనుకొంటారు. కాని దాని అర్థము అది కాదు. యేసు తన జీవితమంతా తండ్రికి చేసినది, తన తండ్రి చెప్పినదంతా చేసినదని నేను నమ్ముతాను. ఆయన పరిపూర్ణులు కాని యోసేపు మరియలకు 30 ఏళ్లపాటు లోబడెను. ఆయన తండ్రి చెప్పినందుకే ఆయన అలా చేసెను. ఆయన తన తండ్రిని ఎంతో గొప్పగా ప్రేమించాడు. కాబట్టి ఆయన తన తండ్రి చిత్తమునకు లోబడెను. మనము కూడా యేసు కలిగియున్న వైఖరినే కలిగియుండాలి (ఫిలిప్పీ 2:5).
ఫిలిప్పీ 2:5-11లో, యేసు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదని మనము చదువుతాము. ఆయన దానిని ఇష్టపూర్వకంగా వదిలిపెట్టెను. ఆయన దేవుని స్థాయినుండి ఒక్క మెట్టు మాత్రమే దిగి ఒక దేవదూతగా మారలేదు. ఆయన ఇంకా క్రిందకు దిగి ఒక నరునిగా మారెను. ఆ తరువాత ఇంకా క్రిందకు దిగి ఒక దాసునిగా మారెను. ఒక దాసునికి ఏ హక్కులుండవు మరియు అతనికి ఏమి జరిగినను దానిని ప్రశ్నించలేడు. మొదటి శతాబ్దములో దాసులకు ఆహారం పెట్టకుండా చంపివేసినా వారిని కాపాడుటకు ఏ చట్టము లేదు. ఆ తరువాత యేసు ఇంకా క్రిందకు దిగి ఒక నేరస్తునిగా ఎంచబడి మనకొరకు సిలువపై చనిపోయెను. అక్కడ పడిపోయిన మనుష్యులమైన మనకొరకు యేసు యొక్క అద్భుతమైన ప్రేమను మనము చూస్తాము.
మన ప్రభువు అలా క్రిందకు దిగివచ్చుటకు నిర్ణయించుకొంటే, మనము కూడా మన ఉన్నత స్థానముల నుండి క్రిందకు దిగివచ్చుటకు ఇష్టపడవలెను. యేసు యొక్క మాదిరి నుండి మనము లోబడుటను దీనత్వమును నేర్చుకొంటాము. సాతాను తన గర్వమును బట్టి లోబడనొల్లకపోవుటను బట్టి పరలోకము నుండి త్రోసివేయబడెను. కాని యేసు తన భూలోక జీవితమంతా చివరకు సిలువపై మరణము పొందునంతగా తన తండ్రికి లోబడి మనలను రక్షించెను. ఆ విధంగా తన తండ్రితో నిత్యత్వమంతా మనము సహవాసము కలిగియుండుటకు మనకు మార్గము సిద్ధపరచెను. అది లోబడుటలో ఉన్న శక్తి.
దీనత్వము, నెమ్మదితో కూడిన హృదయమును మరియు ఆత్మను కలిగిన ఒక భార్య తన రక్షణలేని భర్తనుకూడా మార్చివేయవచ్చునని మనము 1పేతురు 3:1-4వచనాలలో చదువుతాము. ఒక లోబడే భార్య ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. దేవుడు నీకు మంచి భర్తను ఇచ్చినట్లయితే అప్పుడు అతనికి సంతోషముతో లోబడుట లోకములో అతి సుళువైన పనిగా ఉండాలి.
లోబడుట అనేది దేవుడు భార్యలైన మనకు ఇచ్చిన ఒక ఆజ్ఞగా మనము చూడవలెను (ఎఫెసీ 5:22). మనము ఆ ఆజ్ఞను దేవుని వాక్యములో చూచినప్పుడు, మనము దేవుని భయము గలవారమైతే, మనము దేవుణ్ణి ప్రశ్నించకుండా దానిని చేస్తాము. బైబిలులో ప్రతి ఆజ్ఞ దేవుని నుండి సహాయము పొందగలమనే వాగ్దానముతో వచ్చును. కనుక ఆయన మనకు ఈ విషయములో కూడా సహాయపడును. అప్పుడు లోబడటమనేది అంత కష్టమైన విషయము కాదని మనము కనుగొంటాము.
కొంతమంది మన మీద జాలిపడి, ''పాపం క్రైస్తవులైన మీరు మీ భర్తలకు లోబడాలన్నది ఎంత విచారకరము. మీరు దానిని ఎలా చేయగలరు. మీరు నిలబడి మీ హక్కుల కొరకు ఎందుకు అడగకూడదు" అంటారు. కాని వారు గ్రహించని విషయమేమిటంటే దేవునికి లోబడుట లోకములో అత్యంత సంతోషకరమైన విషయము. యేసు ఈ భూమి మీద జీవించిన విధంగా జీవించుట కంటే మనకు ఎక్కువ సంతోషమును ఏది ఇవ్వలేదు. ''ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు" (1యోహాను 2:6). భార్యలుగా మనకు ఎంతటి అద్భుతమైన అవకాశముంది. యేసు తన జీవితకాలమంతా చేసిన ఒక విషయమును మనము చేయవచ్చు. అది దేవుని చిత్తమునకు పూర్తిగా లోబడియుండే జీవితమును జీవించుట. మనము ఆయనను సంతోషపెట్టే జీవితమును జీవించుటకు చూచినప్పుడు ప్రభువు మనకు లోకము ఎన్నడూ ఇవ్వలేని సమాధానమును సంతోషమును ఇచ్చును.
నాకు వివాహమై ఇప్పటికి (2014) 46 ఏళ్లయింది. నేను వివాహిత జీవించగల అతి సంతోషమైన జీవితము, దేవుని ఆజ్ఞలకు మరియు నా భర్తకు లోబడవలెనన్న ఆజ్ఞకు సహితము లోబడి జీవించుటయేనని నేను యధార్థముగా చెప్పగలను. నాకున్న ఒకే చింత ఏమిటంటే కొన్నిసార్లు నేను లోబడవలసిన విధముగా లోబడలేదని. అటువంటి జీవితమును జీవించుటకు సహాయపడే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవునికి స్తోత్రము. మనము జారిపడిపోయినప్పుడు ఆయన మనకు ఇచ్చే క్షమాపణను బట్టి కూడా ప్రభువుకు స్తోత్రము. 1పేతురు 3:1-6లో , తన భర్త అబ్రాహామును ప్రభువు నడిపించునని నమ్మిన శారా యొక్క ఉదాహరణను పరిశుద్ధాత్మ మనకిస్తున్నాడు. కాబట్టి ఆమె అతనిని వెంబడిరచెను. అది ఆమెకు అనేకసార్లు కష్టతరముగా యుండి యుండును. ఉదాహరణకు అబ్రాహాము ఆమెను తన చెల్లెలని చెప్పి ఒక అన్యదేశపు రాజు చేతిలో ఆమె ప్రాణమును అపాయములో పెట్టినప్పుడు, దేవుడు ఆమెను కాపాడెను.
అదే దేవుడు మనలను కూడా కాపాడును తన కుమారుణ్ణి బలిపీఠము పైన అర్పించమని దేవుడు అబ్రాహాముతో చెప్పెనని ఆమె తెలుసుకున్నప్పుడు ఆమె దేవుణ్ణి నమ్మకపోయిన యెడల అది ఆమెకు ఎంత కష్టతరముగా యుండియుండేది? అబ్రాహాము దేవునికి లోబడుట చాలా కష్టముగా ఆమె చేసియుండవచ్చు. మనము మన భర్తలకు లోబడినప్పుడు మనము నిజానికి మన భర్తల యొక్క నాయకత్వము ద్వారా ప్రభువు మన కుటుంబమును నడిపించునని ఆయనను మనము నమ్ముతున్నాము.
దేవుని అధికారక్రమము 1కొరింథీ 11:3లో ఈ విధంగా వర్ణించబడియుంది. ''ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను".
తండ్రి మరియు యేసు సమానులైనప్పటికీ, యేసు తండ్రికి లోబడుటకు ఎంచుకొనెను. అదే విధముగా భార్యలమైన మనము మన భర్తలతో సమానులమైనప్పటికీ మనము వారి నాయకత్వము క్రింద ఉండుటకు ఎంచుకొందము. ఎందుకంటే ఇది దేవుని క్రమము. మనము దేవుని క్రమమును పాటించినప్పుడు మనము మన గృహములలో దేవుని దీవెనను ఆశించవచ్చు.
మనము ఖచ్చితంగా మన అభిప్రాయములను స్పష్టముగా మన భర్తలకు వ్యక్తపరచవచ్చు. కాని చివరి నిర్ణయము తీసుకొనే విషయములో ప్రభువు మన భర్తలను సరిఅయిన నిర్ణయములు తీసుకొనునట్లు చేయునని మనము నమ్మవలెను. నాకు వేరే అభిప్రాయమున్నప్పటికీ, చివరి నిర్ణయము నా భర్తనే తీసుకోనిస్తాను. నా గృహములో దేవుని క్రమమును నేను గౌరవిస్తానని నా పిల్లలు చూచుట మంచిది.
ఎఫెసీ 5:22,32లో భార్యాభర్తలకు మధ్య ఉన్న సంబంధము క్రీస్తుకు సంఘమునకు మధ్యనున్న సంబంధము వంటిదని మనము చదువుతాము. ఇది అక్కడ ఒక గొప్ప మర్మమని పిలువబడినది. ఒక భార్య తన భర్తకు లోబడినప్పుడు ఆమె నిజానికి సంఘుము క్రీస్తుకు లోబడియుండుట అనే సత్యమును లోకమునకు చూపిస్తుంది. కనుక ఒక దైవభక్తి గల గృహము నిజానికి ఒక చిన్న సంఘము. మనము తాజ్ మహల్ లేక చార్మినార్ యొక్క చిన్న ప్రతిరూపమును ఎక్కడైనా చూచినప్పుడు, ఆ నిర్మాణములు చూచుటకు ఎలా ఉండునో చూడవచ్చు. అప్పుడు ఆ నిర్మాణములను వెళ్లి చూడవలెనన్న ఆశను మనము కలిగియుండవచ్చు. అదే విధంగా మన గృహ జీవితము ప్రజలను సంఘమునకు ఆకర్షించవలెను.
1పేతురు 3:4లో భార్యలు సాధువైన మృదువైన గుణమును కలిగియుంవలెనని హెచ్చరింపబడుటను మనము చదువుతాము. ఎందుకంటే అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. మరియు యేసు సాత్వీకమును దీనత్వమును ఆయన యొద్దనుండి నేర్చుకోమని మనతో చెప్పెను (మత్తయి 11:28,29).
సామెతలు 31:26లో, ఒక దైవభక్తిగల స్త్రీ కృపగల ఉపదేశమును బోధించునని మనము చదువుతాము. భార్యలుగా మనము మన భర్తలతో గౌరవముగా మాట్లాడుట అలవాటు చేసుకోవాలి. మనము తప్పు చేసి ఎప్పుడైనా కఠినముగా మాట్లాడినప్పుడు లేక క్రీస్తును పోలి మాట్లాడనప్పుడు మనము క్షమాపణ అడుగవలెను. అనేక మంది పిల్లలు అమర్యాద పూర్వకంగా మాట్లాడడం నేర్చుకొనేది వారి తల్లుల నుండే.
మన పిల్లలకు నేర్పించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయములలో ఒకటి తల్లిదండ్రులకు లోబడుట (ఎఫెసీ 6:1). తల్లులుగా మనము వారికి మన భర్తల పట్ల మన వైఖరి ద్వారా విధేయతను నేర్పించవచ్చు. ఉదాహరణకు నాన్నగారు ఇంట్లో లేనప్పుడు మనము ఆయన ఇంటి కొరకు ఇచ్చిన నియమములను ఉల్లఘించుట వారు చూచినట్లయితే, అది మన పిల్లలను ఒక రోజు మనకు ఎదురుతిరుగునట్లు చేయగలదు.
కాని మనము మన భర్తలను గౌరవించినప్పుడు మన పిల్లలు మనలను ఇతరులను గౌరవించుదురు. అన్ని సమయములందు నిజం చెప్పాలని మనము మన పిల్లలకు నేర్పించవలసిన అవసరముంది. మనమెప్పుడైనా నిజము చెప్పకపోతే మన పిల్లలు దానిని సులువుగా తెలుసుకోగలరు. అంతటి చిన్న వయసులో కూడా వారు వంచనను వివేచించగలరు.
మన పిల్లలు శుభ్రంగా చక్కగా ఉండాలని కూడా మనము వారికి నేర్పించవలెను మనము శుభ్రంగా ఉండి మన గృహములను కూడా శుభ్రంగా ఉంచుకొంటే, అప్పుడు మన పిల్లలు కూడా శుభ్రంగా ఉండడం నేర్చుకొంటారు. వారు తమ ఆట వస్తువులతో ఆడుకోవడం పూర్తయిన తరువాత వాటిని ప్రక్కన పెట్టడం వారికి నేర్పించాలి.
మన పిల్లలకు వృథా చేయకపోవడం కూడా నేర్పించాలి. భోజనము చేసే సమయములో వారికి ముందుగా కొంచెం కొంచెం వడ్డించడం మంచిది. వారు దానిని తిన్నతరువాత మరికొంచెం వడ్డించడం మంచిది. ఆ విధంగా వారి పళ్లెంలో ఉన్న దాన్నంతటిని పూర్తిగా తినడం, ఆహారమును వృథాచేయకుండా ఉండడం, మనము వారికి నేర్పించవచ్చు. సమయము, సంభాషణ, శుభ్రము, తినే అలవాట్లలో మనము క్రమశిక్షణ కలిగియుంటే మన పిల్లలు కూడా క్రమశిక్షణ కలిగియుందురు. మన పిల్లలు స్వార్థపరులుగా ఉండకుండా వారికున్న వాటిని ఇతరులతో పంచుకోవడం నేర్పించాలి. మనము ఇతరులపట్ల బుద్ధి పూర్వకముగా ప్రవర్తిస్తే వారుకూడా బుద్ధిపూర్వకంగా ప్రవర్తించుట నేర్చుకొంటారు.
తృప్తి చెందుట అనేది నేర్పించవలసిన మరొక మంచి గుణము. అనేకమంది పిల్లలు వారు వేసుకొనే బట్టలతోను వారి ఆటవస్తువులతోను తృప్తి చెందరు. ఎందుకంటే వారు తమ్మును తాము ధనికుల పిల్లలతో పోల్చుకుంటారు. నీవు జీవించు విధానమును బట్టి తృప్తిచెందుట యొక్క విలువను వారికి నేర్పించు - అప్పుడు వారెల్లప్పుడు నీ మాదిరిని గుర్తుంచుకొందురు. మనము పిల్లలను పెంచడము గూర్చి ఎప్పుడు మాట్లాడినా ఎక్కువ మంది మనసులలోనికి వచ్చే మొదటి విషయం క్రమశిక్షణ. మన పిల్లలను మనము ఎలా సరిదిద్దాలి?
మీరు వారితో సమయం గడపడము, వారితో మాట్లాడడము. బైబిలునుండి వారికి కథలు చెప్పడము. ఇతర మంచి పుస్తకముల గూర్చి చెప్పడము, వారి వస్తువులను సర్దుకోమని నేర్పించడము. మీకు ఇంటిలో సహాయపడడం నేర్పించడము చేసిన యెడల వారికి ఒక నిర్మాణాత్మక పద్ధతిలో పెంచవచ్చు. అప్పుడు నీవు అంతగా సరిదిద్దనక్కరలేదు. కాని నీవు వారిని తరచుగా ఒంటరిగా విడిచిపెడితే, నీవు తీరిక లేకుండా నీ పనులు చేసుకుంటూ పోతే వారు సులువుగా సమస్యలలో చిక్కుకొని చివరకు చాలా చెడ్డపనులు చేస్తారు. కాబట్టి వారిని శిక్షించవలసిన అవసరముందని నీవు కనుగొంటావు. కనుక నీ పిల్లలతో సమయము గడుపు. ప్రత్యేకంగా వారు చిన్నవారైనప్పుడు, నీ మొదటి ప్రాధాన్యత నీ పిల్లలైతే, దిద్దుబాటు అంత తరచుగా అవసరముండదు. వారి యౌవన దశలో వారు వత్తిడులను ఎదుర్కొని సరైన నిర్ణయాలను తీసుకుంటారని నీవప్పుడు కనుగొంటావు ఎందుకంటే వారు పిల్లలుగా ఉన్నప్పుడే ఒకమంచి పునాదిని వేయడానికి నీవు కష్టపడ్డావు.
సరిదిద్దడానికి అతిముఖ్యమైన నియయమేమిటంటే, నీ పిల్లలను కోపంతో సరిదిద్దవద్దు. నీ పిల్లలను కొట్టేటప్పుడు నీవు కోపంగా ఉంటే, నీవు వారిని అవసరమైన దానికంటే గట్టిగా కొడతావు. నీ బిడ్డ శరీరముపైన గుర్తులుంటే నీవు చాలా గట్టిగా కొట్టినట్లు. పాపమును జయించుట అనేది చెప్పడానికి సులువే. కాని దానిని జయించడానికి మరియు మన పిల్లలను దైవికమైన విధంగా శిక్షించడానికి మనం ప్రభువును సహాయము అడుగవచ్చు.
అయితే కొట్టడమనేది, ఇతర పద్ధతులన్నీ పనిచేయనప్పుడు శిక్షించడానికి వాడవలసిన చివరి పద్ధతి. వారికున్న హక్కులను తీసివేయడం కూడా శిక్షించడానికి ఒక మంచి పద్ధతి. ఉదాహరణకు వారిని ఎక్కడైనా నెమ్మదిగా కూర్చోమనడము లేక పది పదిహేను నిమిషాలు వారి పడకలపై పడుకోమనడము. ఈ సమయము తరువాత వారు నెమ్మదిగా ఉన్నప్పుడు ఇలా వారిని ఎందుకు శిక్షించావో వివరించుము.
పిల్లలు ఆదేశాలను చాలా త్వరగా మరచిపోతారని మనము గుర్తుంచుకోవాలి. కనుక మనము వారికి వాటిని గుర్తు చేస్తూ ఉండాలి. వారికి పెద్దవారికున్న మనసు ఉన్నట్లు ఊహించుకొని వారిని అనవసరంగా తిట్టి నిందించవద్దు.
మనము స్థిరముగా ఏకరీతిగా కూడా ఉండవలెను. ఉదాహరణకు, వారిని ఏదైనా చెయ్యొద్దని నీవు చెప్పినప్పుడు, వారు నీకు లోబడకపోతే, నీవు వారి అవిధేయతను గమనించకపోతే నీవు స్థిరముగా లేనట్లు. అప్పుడు వారు అటువంటి తప్పు పనులను చేయడము కొనసాగిస్తారు. నీవు వారి అవిధేయతను గమనించావని దానిని నీవు తీవ్రంగా తీసుకున్నావని వారు తెలుసుకోవాలి. ఇంట్లో అతిథులున్నప్పుడు పిల్లలు మనలను వశపరచుకోవాలని ప్రయత్నిస్తారు. అటువంటి సమయాలలో పిల్లలను ప్రక్కకు తీసుకువెళ్లి వారితో మాట్లాడవలెను.
మన పిల్లలకు వారి పాత తప్పులను గుర్తుచేస్తూ ఉండకూడదు. ప్రభువు వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టును. మరియు మన వాత్సల్యత కూడా ఆవిధంగానే ఉండవలెను.
ఎల్లప్పుడు నియమనిబంధనలను నిష్టగా పాటించవద్దు. కొన్నిసార్లు నీవు రాజీపడి ''ఈసారికి నిన్ను విడిచిపెడుతున్నాను. నీకు మరొక అవకాశం ఇస్తాను" అని పిల్లలతో చెప్పాలి.
నా భర్త ఇంటి యొద్ద లేనప్పుడు (కొన్నిసార్లు అయిదు వారాలపాటు) నా పిల్లలలో అనేక విషయములు నేను వ్యవహరించవలసి వచ్చేది. కొన్నిసార్లు వారి అవిధేయత అంత తీవ్రమైనది కాకపోయెను కాబట్టి నేను వారితో మాట్లాడి అక్కడికక్కడే వారితో వ్యవహరించేదానను. కాని కొన్ని అవిధేయతలు చాలా తీవ్రమైనవిగా యుండేవి. కనుక ఆ అవిధేయతలను ఒక పుస్తకములో వ్రాసుకొనేదానను - వీటిని గురించి వారితో తర్వాత మాట్లాడవలసి వచ్చే అవసరమున్నదని నేను అనుకొన్నవాటిని. ఈ విషయాలను వారి నాన్న గారు వచ్చిన తరువాత ఆయనతో చెప్తానని వారితో చెప్పేదానను. కాని వారి నాన్న రాక కొరకు వారు ఒక పోలీసు వస్తున్నట్లు భయముతో ఎదురు చూడవలెనని నేననుకోలేదు. ఆయన వారికొరకు చాక్లెట్లు బహుమతులు తీసుకొని వస్తాడని తెలిసి ఆయన రాక కొరకు ఆనందముతో వారు ఎదురు చూడవలెనని నేను కోరుకొన్నాను. కనుక నేను నా భర్త వచ్చే కొద్ది రోజులమందు ఆ పుస్తకమును తీసి వారి అవిధేయతలను వారికి వివరించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడేదానను. అప్పుడు వారికి వారి ప్రతి తప్పిదము యొక్క తీవ్రతను వివరించేదానను. అప్పుడు వాటిని ఒక్కొక్కటిగా కొట్టివేసే దానను. చివరికి ఆ పుస్తకములో ఏమి మిగిలియుండేవికావు. ఇవి అంత పెద్ద అవిధేయతలు కాకపోయినా నేను ఆ జాబితాలో ఉన్న ప్రతి విషయమును వారితో చర్చించేదానను. ఎందుకంటే వారు తర్వాత విధేయతను ఎక్కువ తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుకునే దానను.
వారు వ్రాయడం నేర్చుకొన్న తరువాత, వారు అవిధేయత చూపిస్తే, వారు అటువంటి అవిధేయతను మరలా చూపించరని ఒక పేపరు పైన 20 సార్లు (లేక 100సార్లు) వ్రాయమని వారిని కొన్నిసార్లు అడిగేదానను. వారి అవిధేయతలను నేను పట్టించుకోకుండా ఉండనని వారు గుర్తిస్తారని నేను ఆశించేదానను. ఇలా చేయడం వల్ల ఫలితంగా వారి చేతివ్రాత కూడా మెరుగుపడినదని నేననుకొంటాను.
ఏదైనా అవిధేయత నా భర్త తెలుసుకోవడం ముఖ్యమని నేననుకొంటే, మేమందరము భోజనమునకు కూర్చున్నప్పుడు, ఎవరు చేసారన్నది చెప్పకుండా ఆ సంఘటన గూర్చి చెప్పేదానను. అప్పుడు నా భర్త సరిదిద్దే మాటలు చెప్పి నేను వారితో ఇంతకు ముందు చెప్పిన మాటలను పటిష్టపరిచేవాడు. అది ఎంతో సహయపడేది. నేను ఇంటి యొద్ద క్రమశిక్షణ కలిగియుండాలనుకొనేదానను. అవిధేయత తీవ్రమైన విషయమని నా పిల్లలు తెలుసుకోవాలనుకొన్నాను. కాని నేను ఒక కఠినమైన ఉపాధ్యాయురాలిగానో లేక ఒక న్యాయాధిపతిగానో ఉండాలనుకోలేదు. దేవుడు మనలను క్షమించినట్లే వారు క్షమాపణను అనుభవించాలనుకొన్నాను.
కొన్నిసార్లు నా భర్త పిల్లలను ఒక రోజంతా క్రికెట్ ఆడకుండా చేయడం ద్వారా వారిని శిక్షించేవాడు - ఎందుకంటే క్రికెట్ వారికి అతిప్రియమైన ఆట. పిల్లలు ధర్మశాస్త్రము (నియమ నిబంధనలు) క్రింద ఉన్నారు కాని వారు మన నుండి కృపను కూడా రుచిచూడవలెను. మనము వారిని నియమ నిబంధనలతో మాత్రమే అదుపులో పెడితే వారు పెద్దవారైన తరువాత మనపైన తిరుగుబాటు చేయవచ్చు. వారు ఇంటిని విడిచిపెట్టే వరకు వేచియుండి ఆ తరువాత వారు తమకు ఇష్టం వచ్చినవాటిని చేస్తారు. నా పిల్లలు మా గృహమును ప్రేమించి దానిని ఈ కృారమైన లోకములో ఒక ఆశ్రయ దుర్గముగా చూడాలనుకొన్నాను. వారి తల్లిదండ్రులైన మాతో ఉండుటకు మా ఇంటికి వచ్చుటకు వారు ఆత్రంగా ఎదురుచూడవలెనని నేను కోరుకొన్నాను.
తల్లిదండ్రులుగా మన అతిగొప్ప అవసరత జ్ఞానము. మనము మన పిల్లలతో ఎక్కడ అతి కఠినముగా ఉన్నామో ఎక్కడ అతి సౌమ్యంగా ఉన్నామో చూపించమని మనము ప్రభువును అడుగవలెను. వారి కౌమార దశలో ప్రత్యేకంగా మనము వారితో ఎల్లప్పుడు గొప్ప జ్ఞానముతో, సహనముతో మరియు ప్రేమతో వ్యవహరించవలెను.
ఒక భక్తిగల గృహమును కట్టుటకు అవసరమైన అతి ముఖ్యమైన విషయం భార్యాభర్తలు వ్యక్తిగతముగా మరియు కలసి ప్రార్థన చేయడం. ప్రతి విషయంలో దేవుని సహాయమును అడగడము. మనము కుదిరినప్పుడల్లా ప్రార్థించాలి. మనము రోజులో అన్నివేళలా మన హృదయంలో మౌనముగా దీనిని చేయవచ్చు. ప్రత్యేకంగా మన పిల్లలు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మనము ప్రార్థించవలసిన అవసరముంది. మనము మన భర్తలతో ఏకమై యున్నప్పుడు మన ప్రార్థనలకు జవాబు దొరుకును. నా భర్త నేను మా ప్రార్థనలకు అనేక అద్భుతమైన జవాబులను అనుభవించాము.
కుటుంబ ప్రార్థన అనేది మన పిల్లలు ఒక దినచర్యగా చేసే ఒక ఆచారముగా మార్చబడకూడదు. అది విసుగు పుట్టించేదిగా మారి వారు దానితో విసిగిపోవచ్చు. ప్రార్థన అనేది వారు తమ తల్లిదండ్రులైన మనతో స్వేచ్ఛగా ఆనందంగా మాట్లాడగలిగినట్టే మన పరలోకపు తండ్రితో మాట్లాడుట అని వారు చూడగలగాలి.
చివరిగా - నీ హృదయములో ఏ కారణంగానైనా అవిశ్రాంతి ఉన్నప్పుడు - అలా తరచుగా ఉండవచ్చు- దానిని త్వరగా జయించి విశ్రాంతిలోనికి వచ్చుటకు సహాయపడమని ప్రభువునడుగుము. నీవు దాని విషయంలో వెంటనే వ్యవహరించకపోతే, అనైక్యత మరియు విరోధము నీ గృహములోకి వస్తాయి. అప్పుడది సాతాను లోపలికి వచ్చి అలజడిని సృష్టించడానికి సాతానుకు తలుపు తెరుస్తుంది. అప్పుడు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది నీ పిల్లలే. కనుక నీవు నీ పిల్లలను ప్రేమిస్తే వెంటనే అనైక్యతతో వ్యవహరించు.
ఒక భక్తిగల గృహమును నిర్మించడానికి మనకు సహాయపడగలిగేది ప్రభువు మాత్రమే. అటువంటి గృహాలను నిర్మించుటకు మనకు సహాయపడుటకు ఆయన ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ గృహములు పరలోకమునకే మంచిరుచిగా ఉండును. అలా మనందరి విషయంలో జరుగునుగాక ఆమేన్.
ఆయనకు మాత్రమే స్తుతియు, మహిమ చెల్లును గాక,ఆమేన్.