పరిసయ్యుల యొక్క 50 లక్షణములు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   Religious or Spiritual
    Download Formats:

అధ్యాయము 0
పరిసయ్యుల యొక్క 50 లక్షణములు

మూడు రకములైన పులిసిన పిండిని గూర్చి యేసు ప్రజలను హెచ్చరించినట్లుగా మనము సువార్తలలో చదువుతాము:


1. హేరోదు పులిసిన పిండి (మార్కు 8:15)


2. సద్దూకయ్యుల పులిసిన పిండి (మత్తయి 16:6)


3. పరిసయ్యుల పులిసిన పిండి (మత్తయి 16:6)


మూడు రకములైన క్రైస్తవులకు ఇవి సాదృశ్యముగా ఉన్నవి.


రాజైన హేరోదు పులిసిన పిండి లోకత్వము:


హేరోదు బాప్తిస్మము ఇచ్చు యోహాను మాటలు సంతోషముతో వినుచుండెను అని మార్కు 6:20లో మనము చదువుతాము. కాని అతడు సలోమి నృత్యమును (బహుశా ఆమె అసభ్యకరముగా వస్త్రములు ధరించి కామపూరితంగా రెచ్చగొట్టే విధముగా నాట్యము చేస్తుండవచ్చును) చూచి కూడా సంతోషించినట్లు రెండు వచనముల తరువాత మనము చదువుతాము. ఈనాడు ఈవిధముగా ఉన్న క్రైస్తవులు కూడాఉన్నారు. ఆదివారం ఉదయమున శక్తివంతమైన ప్రసంగం వినుటలో సంతోషించి, అదే మధ్యాహ్నము అసభ్యకరమైన సినిమా చూచుటలో కూడా సంతోషించెదరు. బాప్తిస్మమిచ్చు యోహాను పరిసయ్యుల వలె విసుకు పుట్టించే బోధకుడుగా కాకుండా అగ్ని వలె మండుచున్న ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి హేరోదు ఆయన మాటలను వినుటకు సంతోషించెను. కాని ఒక వ్యక్తి అగ్ని వలె మండుచున్న ప్రవక్త మాటలను వినుటలో సంతోషించినంతమాత్రాన అతడు ఆత్మానుసారమైన మనస్సు కలవాడని కాదు. లోకానుసారులైన క్రైస్తవులు సాధారణంగా పరిసయ్యుల వలె వేషధారులు కాదు. వారు లోకములోని వినోదాన్ని బట్టి సంతోషించుదురు కాని దాన్ని బట్టి వారు సంతోషించారనే నిజాన్ని దాచిపెట్టరు.


సద్దూకయ్యుల పులిసిన పిండి తప్పుడు సిద్ధాంతం:


వారి విశ్వాసములో వారు స్వేచ్ఛాపరులు. వారు దేవదూతలనైనను, అద్భుతములనైనను, పునరుత్థానమునైనను, ఆత్మయైనను ఉన్నవని నమ్మరు. వేర్పాటువాదుల వలె ఉన్న క్రైస్తవులు ఈనాడు కూడా ఉన్నారు. ఈనాడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడని మరియు పరిశుద్ధాత్మ యొక్క మానవాతీతమైన వరములు క్రౖెెస్తవులకు అందుబాటులో ఉన్నవని వారు నమ్మరు.


పరిసయ్యుల పులిసిన పిండి వేషధారణ:


వారు సిద్ధాంతమును ఖచ్ఛితంగా అనుసరించువారు మరియు వారి బాహ్య సంబంధమైన జీవితంలో నీతిగా ఉండువారు. ఈ రెండు విషయాలలో యేసు ప్రభువే వారికి ధృవీకరణ పత్రాన్ని ఇచ్చాడు (మత్తయి 23:3,25). వారు దశమభాగములను ఇస్తూ, ప్రార్ధిస్తూ, క్రమము తప్పకుండా ఉపవాసముంటూ మరియు ధర్మశాస్త్రములోని బాహ్యసంబంధమైన ఆజ్ఞ్ఞలను పాటిస్తూ చివరకు మిషనరీలుగా కూడా పనిచేశారు. ఈనాడు ఇవన్నియు చేస్తూ కూడా ఇంకా ఆ పరిసయ్యుల వలె ఉన్న క్రైస్తవులు ఉన్నారు.


కొంతమంది క్రైస్తవులు ఈ మూడు రకముల పులిసిన పిండి మిశ్రమాన్ని కలిగియుండవచ్చును.


పైన చూచిన వివరణ ప్రకారము యేసు ప్రభువు యొక్క ముఖ్య పోరాటము హేరోదీయులతో లేక సద్దూకయ్యులతో అని అనుకొనవచ్చును. కాని అట్లు కాదు. కాని ఆయన యొక్క గొప్ప పోరాటమంతా పరిశుద్ధతను బోధించు మతనిష్ట కలిగిన పరిసయ్యులతోనే ఉండినది! మరియు జనులందరిలో యేసు ప్రభువును సిలువ వేయుటకు ఎక్కువ ఆసక్తి కనుపరచినది మరియు నిశ్చయించుకొనినది పరిసయ్యులే.


ఈనాడు క్రైస్తవ్యములో, సద్దూకయ్యులు మరియు హేరోదీయులు పరిసయ్యులంత ప్రమాదము కాదు. ఒక హేరోదీయుడు నరకానికి వెళ్ళ వచ్చును. కాని వేరే వాళ్ళను నాశనమునకు నడిపించలేడు ఎందుకనగా అతడు లోకానుసారమైన వ్యక్తి అని అందరికీ స్పష్టముగా తెలుస్తుంది. స్వేఛ్ఛాపరుడైన సద్దూకయ్యుని విషయమునకొచ్చినట్లయితే, అద్భుతాలనైనను చివరికి మృతుల పునరుత్థానమును నమ్మనపుడు అతడు ఒక ఆత్మీయుడనుకొని మోసపోయేవారు ఎవరూ ఉండరు.


ఈనాటి క్రైస్తవ్యములో (యేసు ప్రభువు కాలములో వలె) అతి ప్రమాదకరమైన వ్యక్తి పరిసయ్యుడే, అతని సిద్ధ్దాంతములన్నియు సరిగా ఉండి, మరియు ''పరిశుద్ధతను'' గూర్చియే బోధించును. కాని అతడియొక్క ''పరిశుద్ధత'' చట్టములు మరియు నియమములతో కూడి అక్షరానుసారమైనది (లీగలిస్టిక్‌). మరియు అతడి యొక్క నీతి పరిశుద్ధాత్మయందు సంతోష, సమాధానములు (రోమా 14:17) లేనిదై యుండును. అటువంటి వ్యక్తి ప్రమాదకరము, ఎందుకనగా క్రైస్తవులను తప్పు త్రోవ పట్టించి తప్పుడు పరిశుద్ధతలోనికి నడిపించగలడు.


కాబట్టి మనము పరిసయ్యుల లక్షణాలను అర్ధం చేసుకొనడం ముఖ్యం. హేరోదును వెంబడించు వారి లక్షణములనుగూర్చి గాని, సద్దూకయ్యుల లక్షణములను గూర్చి గాని నేను ఇంతకు ముందు ప్రస్తావించిన విషయములు తప్ప ఎక్కువగా వ్రాయబడలేదు. కాని పరిసయ్యుల దగ్గరకు వచ్చేసరికి, సువార్తలలో వారినిగూర్చి ఎంతో వ్రాయబడియున్నది. కనుక వారి లక్షణములను గూర్చి మనము తప్పక ధ్యానించవలెనని దేవుడు కోరుచుండియుండవచ్చును.


ఎవరైతే తమ సిద్ధాంతములన్నీ సరిగా ఉండి, మరియు పరిశుద్ధతను వెంబడిస్తున్నారో అటువంటి విశ్వాసులందరు వారికి తెలియకుండానే పరిసయ్యులయ్యే ప్రమాదములో ఉన్నారు. మనలో చాలా మంది ఈ విభాగానికే చెందుతాము. కనుక లోతైన దీనత్వముతో మనమందరము ఈ పఠనము యొద్దకు వచ్చెదము.


సువార్తలలో కనీసం యాభై పరిసయ్యుల లక్షణములను నేను కనుగొంటిని. అందులో ఒక్కటైనా మనకు సరిపోయినట్లయితే, మిగిలిన 49 లక్షణములు మనలో లేకపోయినను, మనము పరిసయ్యులమే. ఇది అన్నీ లక్షణాలు ఉండిన జాబితా కాదు. మీ స్వంత జీవితాల్లోనికి మీరు చూచుకొనినప్పుడు, బైబిల్లో చెప్పబడని కొన్ని ఇతరమైన లక్షణములను మీరు కనుగొందురు.


పరిసయ్యుని ఆత్మ క్రీస్తు ఆత్మకు పూర్తిగా వ్యతిరేకమైయున్నది. అందుకే ఇది ఎంతో ప్రమాదకరమైనది. మనము అణువంత నరకము కూడా మనలో ఉండకూడదని ఎలా కోరుకుంటామో, అదేవిధముగా అణువంత పరిసయ్యుని ఆత్మ కూడా మనలో ఉండకూడదని మనము కోరుకొనవలెను.


దేవుని యొక్క ఆశీర్వాదమునకు ఒక ప్రాధమికమైన గుర్తు ఏమిటంటే పరిశుద్ధాత్మ మన మీద మనకు వెలుగునిచ్చును. మన జీవితములో క్రీస్తు వలె లేని విషయములలో క్రమేపీ మనము వెలుగు పొందనట్లయితే, నిజముగా మనము దేవునిచేత ఆశీర్వదింపబడిన వారము కాము. ఆరోగ్యము మరియు సంపద దేవుని ఆశీర్వాదమునకు గుర్తులు కాదు, ఎందుకంటే ఎంతో మంది విశ్వాసులకంటే ఎక్కువగా అవిశ్వాసులే ఈ రెండింటిని కలిగియున్నారు.


మన జీవితములలో క్రీస్తు వలె లేని విషయములను దేవుడు మనకు చూపించినపుడు, వాటి నుండి మనలను పవిత్రులనుగా చేసుకొనవలెనని ఆయన కోరుచున్నాడు (2 కొరింథీ 7:1), తద్వారా ఆయన దైవ స్వభావములో మనము కూడా పాలివారము కావచ్చును. అప్పుడు మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము మరియు సంఘ జీవితము ఎంతో ప్రకాశవంతమగును. అప్పుడు మనము అక్షరానుసారమైన (లీగలిస్టిక్‌) జీవితము నుండి విడుదల పొందెదము. అప్పుడు మాత్రమే ఆకాశములో పక్షిరాజువలె ఎగురుదుము. ''మనలో ఉన్న పరిసయ్యుడను'' మనము చూడనట్లయితే భూసంబంధుల వలె మిగిలిపోతాము.


దేవుడు తన వాక్యమును మనకు ఇచ్చినది మన మీద మనము వెలుగు పొందడానికే తప్ప ఇతరులలో ఉన్న పరిసయ్యతత్వము చూచుటకు కాదు. మనలో ఉన్న పరిసయ్యతత్వమును చూచి దానిని మనము కడుగుకున్నప్పుడు మాత్రమే, ఆయన పనిలో దేవునికి మనము ఉపయోగపడగలము

అధ్యాయము 1
పరిసయ్యులు దైవజనులతో వారికున్న సంబంధాన్ని బట్టి అతిశయించుదురు

'' 'అబ్రహాము మాకు తండ్రి', అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు'' (మత్తయి 3:9).


ఒక పరిసయ్యుడికి తాను దైవభక్తి గలవాడు కాదు అని తెలుసు, కనుక దైవజనుడని మంచి పేరుపొందిన ''సహోదరుడి'' తో కలిసియుండటానికి ప్రయత్నించును. తద్వారా అతడు కూడా దైవభక్తి గలిగిన వాడనని చెప్పుకొనును. ఈనాడు ఎంతో మంది శరీరానుసారులైన క్రైస్తవులు ఒక దైవజనుడు నడిపించే సంఘములోని సభ్యులమని వారు అతిశయపడుదురు. వారికి ఏమాత్రమును పరిశుద్ధత లేకపోయినప్పటికినీ, దైవజనునికి కలిగిన పేరు ప్రతిష్టలను బట్టి జీవించుదురు. పరిసయ్యులు అత్మీయులైన వ్యక్తులతో కలిసి ఉండటమును బట్టి వారుకూడా పరిశుద్ధులే అని ఊహించుకొందురు.


ఒకవేళ నీ జీవితములో మారుమనస్సు పొందని పాపము ఏమైనా ఉండి ఉంటే, లేక ఎవరి మీదైననూ పగ ఉన్నట్లయితే, నీవు ఒక చాలా మంచి సంఘములో ఉండి కూడా నరకమునకు వెళ్ళవచ్చును. నీవు ఏదో ఒక మంచి సంఘములో ఉన్నావు కాబట్టి నీవు చెప్పే కొండెములను, నీవు మాట్లాడే చెడ్డ మాటలను దేవుడు క్షమిస్తాడని గాని లేక వదిలేస్తాడని గాని నీవు అనుకుంటే నీవు తప్పు చేసినట్లే. తీర్పు దినమున నీవు గొప్ప ఆశ్చర్యమునకు గురి అవుతావు. బహుశా ఒకానొకప్పుడు నీవు రక్షిరచబడియుండవచ్చును. అయితే ఈరోజు బహుశా దాన్ని నీవు కోల్పోయి ఉండవచ్చు. కనుక దైవజనులతో మీకున్న సంబంధాన్ని బట్టి ఎప్పుడూ అతిశయపడవద్ద్దు.

అధ్యాయము 2
పరిసయ్యులు బాహ్యసంబంధమైన నీతిని బట్టి అతిశయించుదురు

''శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరు'' అని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 5:20).


ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన దానికి అర్ధమేమిటి? పరిసయ్యులకంటే ఎక్కువగా ఉపవాసముండి, ప్రార్ధన చేసి మరియు దశమభాగములు ఇవ్వవలెనని అర్ధమా? యేసు ప్రభువు ఇక్కడ సంఖ్యాపరంగా చూడడం లేదుగాని నాణ్యతను చూస్తున్నాడు. ఒకవేళ మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే మన నీతి యొక్క నాణ్యత పరిసయ్యుల నీతి కంటే ఎంతో ఎక్కువగా ఉండవలెనని ఆయన చెప్తున్నాడు. ఈ అధ్యాయములోని ఇతర వచనములలో దీనిని వివరిస్తున్నాడు. పరిసయ్యుల నీతి కేవలము బాహ్య సంబంధమైనది. దేవుని నియమములకు వారు చూపిన బాహ్య సంబంధమైన విధేయతను బట్టి వారు అతిశయపడిరి. కాని దేవుడు చూచేది అంతరంగమునున్న నీతిని అని యేసు చెప్పెను. కేవలము హత్య చేయకుండుట కాదు, లోపల కోపమును కూడా ఉంచుకొనకుండా ఉండాలి; కేవలము బయటకు వ్యభిచారము చేయకుండుట కాదు, స్త్రీల మీద మోహపు తలంపులు కలిగియుండకూడదు.


కోపము, మోహపు చూపులు ఎంతో తీవ్రమైనవి. ఈ పాపములను బట్టి ఒక వ్యక్తి నరకమునకు వెళ్ళవచ్చునని యేసు చెప్పెను (మత్తయి 5:22,29,30). అనేకమంది క్రైస్తవులు ఈ అంతరంగిక పాపములను తీవ్రంగా తీసుకోరు-ఎందుకంటే వారు పరిసయ్యులు. మనుష్యుల యెదుట బాహ్య సంబంధమైన సాక్ష్యమును బట్టి వారు అతిశయపడుదురు. ఇతర విషయములలో కూడా నీ నీతి కేవలము బాహ్యసంబంధమైనదిగా యుండవచ్చును. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును (1 సమూయేలు 16:7). నీ ఆత్మీయతను గూర్చి ఇతర విశ్వాసుల ఆలోచనలు దేవుని యెదుట విలువలేనివి. ఆయన నీ తలంపులను, వైఖరిని చూచును. ఒకవేళ నీ హృదయము అపవిత్రముగా ఉండినట్లయితే, మనుష్యుల యెదుట నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయించవద్దు.

అధ్యాయము 3
పరిసయ్యులు పాపులైన వారితో కలువరు

''మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి'' (మత్తయి 9:11). పరిసయ్యులు వారి స్వంత ''పరిశుద్ధుల'' గుంపుతోనే కలిసియుందురు. వారు యేసు ప్రభువునే పాపులతో కలిసియున్నందుకు విమర్శించారు. నీ పరిశుద్ధత క్రీస్తులోనికి మారని నీ బంధువులతో కలవకుండా నిన్ను ఆటంక పరచుచున్నదా? మనము దేవుని బిడ్డలతోనే సహవాసము కలిగివుండవలెననేది యదార్ధమే, కాని మనము అందరితో స్నేహముగా ఉండవచ్చును. యేసు ప్రభువు పాపుల స్నేహితుడుగా పిలువబడెను. నీవు యేసువలె ఉండవలెనంటె, నీవు పాపులకు స్నేహితునిగా ఉండవలెను. ఒక పరిసయ్యుడు క్రీస్తులోనికి మార్పు చెందని తన బంధువు వివాహమునకు వెళ్ళడు, ఎందుకంటే దానికి వెళ్ళడం ద్వారా తాను కలుషితం అవుతాడని అనుకుంటాడు. యేసు ప్రభువైతే మార్పు చెందని తన బంధువుల వివాహమునకు సంతోషముగా వెళ్ళును. త్రాగుడు మరియు నాట్యము జరుగుచున్న పాపుల ఇంటికి యేసు వెళ్ళెను. ఆ పాపులకు సువార్త చెప్పుచూ ఉండెను. వారితో కలిసి ఉండటం అనేది ఆయనని అపవిత్ర పరచలేదు. ఎందుకంటే ఆయన నీతి అంతరంగమునకు సంబంధించినది. ఆయన ఎక్కువ సమయం శిష్యులతో గడిపెను అనునది వాస్తవమే కాని పాపులతో మాట్లాడుతూ కూడా ఆయన చాలా సమయం గడిపెను. వారితో స్నేహముగా లేకుండా ప్రభువు కొరకు వారిని ఏ విధముగా గెలుస్తాము? నీకు నీవు వేసుకోవలసిన ఒక మంచి ప్రశ్న: నీ ద్వారా ప్రభువు యొద్దకు వచ్చిన వారు నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? నీవు 20 సంవత్సరాల తరబడి నీ సంఘంలో ఉన్నప్పటికినీ, క్రీస్తు యొద్దకు ఒక్క వ్యక్తిని కూడా తీసుకొని రాక పోయి ఉండవచ్చును. ఇది నీ జీవితమును గూర్చి సూచిస్తున్నది అన్న విషయమును నీవు ఆలోచించలేదా? చాలా మంది సంఘ పెద్దలు కూడా ఎన్నోసంవత్సరాల నుండి ఒక్క వ్యక్తిని కూడా క్రీస్తు యొద్దకు తీసుకొనిరారు. కారణమేమంటే వారు పరిసయ్యులు. ఒకవేళ నీవు నీ పరిసయ్యతత్వాన్ని ఈ విషయంలో తెలుసుకొన్నట్లయితే వేరే వాళ్ళను తన యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా దేవుడు నిన్ను వాడుకొనును.

అధ్యాయము 4
పరిసయ్యులు వైరాగ్యమును చూపేవారు

''పరిసయ్యులు తరచుగా ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దానికి హేతువేమి?'' (మత్తయి 9:14).


పరిసయ్యులు జనులను ఉపవాసము మరియు ప్రార్ధన చేయుటకు బలవంతము చేయుదురు. వారు ఉపవాసము వంటి శరీర క్రమశిక్షణ ఆత్మీయులుగా అగుటకు ఒక సాధనముగా యెంచుదురు మరియు వాటిని బట్టి అతిశయించుదురు. యేసు ప్రభువు పరిసయ్యుల కంటె ఎక్కువగా ఉపవాసముండిరి కాని ఆయన పరిశుద్ధ్దుడుగా అగుటకు ఉపవాసముండలేదు. పరిశుద్ధుడు కనుక ఉపవాసముండెను. మరియు పరిసయ్యుల వలె యేసు ప్రభువు ఆయన ఉండిన ఉపవాసముల గూర్చి గొప్పగా చెప్పుకొనలేదు. అంతేగాక ఉపవాసముండమని జనులను ఆయన ఈభూమిపైన ఉండినప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడూ బలవంతము చేయలేదు. ఉపవాసము తమకు తాము ఇష్టపూర్వకముగా చేసినప్పుడు మాత్రమే దేవునియెదుట విలువగలదిగా ఉండును. లేనట్లయితే అది ఒక నిర్జీవ క్రియగా ఉండును.


అన్ని మతములకు సంబంధించిన ప్రజలు ఏదో ఒక రూపములో వైరాగ్యమును పాటించుదురు. ఉపవాసము అన్ని మతముల వారు ఉందురు. కొంతమంది వారు పరిశుద్ధులుగా అగుటకు వారి భార్యలతో లైంగికముగా కలవకుండా ఉందురు. కానీ ఒక క్రైస్తవుడు పరిశుద్ధుడగుటకు ఇది మార్గము కాదు. ఒక వ్యక్తి సంపూర్ణుడు అనుటకు గుర్తు ఆహారము, సెక్స్‌ విషయములలో క్రమశిక్షణ కలిగియుండుటకాదు గాని తన నాలుకను అదుపులో ఉంచుకొనుట (యాకోబు 3:2). ఆ తరువాత మన తలంపులను, కళ్ళను అదుపులో ఉంచుకోవాలి.


యేసు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక వారు ఆయనను ''తిండిబోతు'' అని పిలిచారు (లూకా 7:34). ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతము, పెండ్లి విందులో ఎక్కువ ద్రాక్షారసము చేయుట. ఇది యేసుప్రభువు చేసిన అద్భుతాలన్నింటిలో అత్యంత అవసరములేని అద్భుతముగా కనబడుచున్నది. ఆ అతిథులు అప్పటికే ఎంతో ద్రాక్షారసము త్రాగియున్నారు. బహుశా ఆ పెండ్లి విందులో 200 మంది అతిథులు ఉంటే యేసుప్రభువు 600 లీటర్ల ద్రాక్షారసము చేశారు. అంటే ఒక వ్యక్తికి 3 లీటర్ల చొప్పున ద్రాక్షారసము చేశారు!! వారికి అంతంత ద్రాక్షారసము చేయవలసిన అవసరము ఏంటి? యేసు ప్రభువు చేసిన మొదటి అద్భుతము ''చాలా ఆత్మీయమైన'' అద్భుతము మరియు చనిపోయిన వారిని లేపడం లాంటిది అయ్యుండాలి అని మనము ఆలోచించి ఉండేవారము. ప్రభువు ఈ అద్భుతము చేయడానికి గల ఒక కారణమేమంటే, ''చేత ముట్టవద్దు, రుచి చూడవద్దు'' అని మొదలైనవి. చెప్పి బోధించబడిన బాహ్యసంబంధమగు మతమును కూల్చివేయడానికి ఆయన వచ్చెను.


నేను కొంతమంది క్రైస్తవులను కలిశాను (ప్రత్యేకముగా కొన్ని శాఖలలో). వారి సంభాషణలో వారు ఎంతో కుయుక్తితో వారు చేసిన ఉపవాసములను గురించి ప్రస్తావించెదరు. వారు ఈవిధముగా చెప్పుచూ ఉంటారు-''నేను ఈ మధ్య కాలములో 21 రోజులు ఉపవాసమున్నపుడు దేవుడు నాకిచ్చిన ఈ విలువైన మాటను మీతో పంచుకోవాలనుకుంటున్నాను''. అంటే వారు ముఖ్యంగా చెప్పదల్చుకున్నదేమిటంటే వారు 21 రోజులు ఉపవాసమున్నారు అని మిమ్ములను మెప్పించడం. వారు చెప్పే ఇతర మాటలన్నీ అంత ముఖ్యము కాదు. మనము ఉపవాసమున్నప్పుడు ఎవరికీ తెలియకూడదని యేసు ప్రభువు చెప్పారు. కాని పరిసయ్యులు వారి వైరాగ్యమును బట్టి అతిశయించుదురు.


తిండి, నిద్ర మరియు లైంగిక విషయములలో క్రమశిక్షణకు క్రైస్తవ జీవితములో తప్పకుండా ఎంతో ప్రాముఖ్యమైన స్థానము ఉన్నది. అయితే వీటి గురించి ఇతరులకు చెప్పుకొని అతిశయించే విషయాలు అయితే ఖచ్ఛితంగా కావు.

అధ్యాయము 5
పరిసయ్యులు ఇతరులను చిన్న విషయాలలో కూడా విమర్శింతురు

''పరిసయ్యులది చూచి ఇదిగో, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతోచెప్పగా'' (మత్తయి 12:2).


ఎవరి పొలములోనుండైనా వెళ్ళునప్పుడు, అందులో వెన్నులు త్రుంచి తినవచ్చునని ధర్మశాస్త్రము అనుమతించుచున్నదని పరిసయ్యులకు తెలియును. కాని ఇక్కడ వారి ప్రశ్న సబ్బాతు దినమున శిష్యులు ఆ ''పని'' చేయుచున్నారు అనేది. జనుల యొక్క ప్రతి చిన్న విషయమును గూర్చి పరిసయ్యులు విమర్శ కలిగియుందురు. మత్తయి 15:2లో పెద్దలు నియమించిన ఆచారముననుసరించి ఆయన శిష్యులు ఆచార ప్రకారము చేతులెందుకు కడుగుకొనలేదని యేసు ప్రభువును అడిగిరి. పరిసయ్యులు ఎప్పుడూ ఇతర విశ్వాసులలో ఏ చిన్న తప్పయినా పట్టుకొనుటకు జాగ్రత్తగా చూస్తూ ఉందురు.


ఒకవేళ నీవు సంఘ పెద్దవైయుండి, నీవు ఈవిధముగా ఉన్నట్లయితే నీ సంఘంకూడా పరిసయ్యులతో నిండి ఉండవచ్చును-ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఏ సంఘంలోనైననూ వారి సంఘపెద్ద యొక్క అలవాట్లను నేర్చుకొందురు. దీనిని మనము ప్రకటన 2,3 అధ్యాయాలలో చూచెదము. ఒకవేళ సంఘపెద్ద పరిసయ్యతత్వము నుండి విడుదల పొందియుండినట్లయితే, ఆయన సంఘములో ఉన్న వారిలో ఎక్కువ మంది పరిసయ్యతత్వము నుండి విడుదల పొందే అవకాశాలు ఉంటాయి.


కాబట్టి ప్రతి విశ్వాసికి నేను ఈలాగు చెప్పుచున్నాను:


మీ సంఘపెద్ద ఒకవేళ ధర్మశాస్త్రానుసారుడు మరియు పరిసయ్యుడైతే అతడిని వెంబడించవద్దు. సంఘపెద్దకు లోబడి ఉండటం అనేది సంఘమునకు సంబంధించిన విషయములలోనే కాని, వ్యక్తిగత విషయములలో కాదు. దీనిని బట్టి నేను చెప్పేదేమిటంటే ఆదివారం కూడిక 10 గం||లకు ప్రారంభమవుతుందని సంఘపెద్ద చెప్పినట్లయితే, ఆయన చెప్పిన దానికి లోబడి అదే సమయానికి వెళ్ళవలెను. మీటింగులో పాట సంఖ్య 45 అని చెప్పితే, ఆయనకు లోబడి ఆ పాట పాడే వారందరితో కలిసి పాడవలెను. అందరినీ కూర్చోమని చెప్పినప్పుడు నీవు కూడా కూర్చొనవలెను. అందరినీ నిలబడమని చెప్పినప్పుడు నీవు కూడా నిలబడవలెను. సంఘపెద్దకు లోబడటం అంటే అర్ధం ఇదే. ఒకవేళ అతడిని మాదిరిగా పెట్టుకొని వెంబడించుటకు యోగ్యుడు కానట్లయితే ఆయన జీవితమును బట్టి నీవు వెంబడించవలసిన అవసరము లేదు. లేనట్లయితే నిన్ను నీవు నాశనము చేసుకుంటావు. యేసునే వెంబడించు, ఒక ధర్మశాస్త్రానుసారుడైన, పరిసయ్యుడైన సంఘపెద్దను ఎప్పటికినీ వెంబడించవద్దు. అతడెవరైనా సరే, మీ సహవాసంలో ఎంతో అనుభవం ఉన్న సంఘపెద్ద అయినా సరే. ఒకవేళ మీ సంఘపెద్ద ఒక దైవజనుడని నీకు పూర్తిగా నమ్మకం కలిగితేనే, నీ జీవితంలో వేరే విషయంలో కూడా అతనికి లోబడవలెను.


అధ్యాయము 6
పరిసయ్యులు ముఖ్యముగా నియమములను బట్టి జీవించుదురు

''......ఇదిగో ఊచచెయ్యి గల వాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని-విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి'' (మత్తయి 12:9,10).


పరిసయ్యులు నియమములను బట్టి జీవించుదురు. వారు యేసు ప్రభువు యొక్క జీవమును బట్టి జీవించరు. వారి పరిహాసకరమైన నియమములు ఒక రోగి విశ్రాంతి దినమున స్వస్థత కోరకూడదని చెప్పుచున్నవి. ఈనాడు కూడా అనేక మంది సంఘనాయకులు వారి మంద యొక్క జీవితమునకు కష్టము కలిగించే పనికిరాని నియమములు కలిగియుందురు. వారాయన మీద నేరము మోపవలెనని మాత్రమే పరిసయ్యులు యేసు ప్రభువును ఈ ప్రశ్న అడిగారు. నేటి సంఘనాయకులు ఎంతో మందికి ఇది వర్తిస్తుంది. వారు కూడా వారు నియమించిన చిన్న నియమములను ఎవరైనా పాటించనట్లయితే వారిని నిందించుటకు త్వరపడుదురు. ఈ విశ్వంలో న్యాయమును విధించువాడు (నియమములను నియమించువాడు) దేవుడొక్కడే. సర్వశక్తుడైన దేవుడు కూడా విధించని నియమములను ఒకవేళ సంఘములో ఉన్న వారికి నీవు నియమించుచున్నట్లయితే, అప్పుడు నీవే దేవుడనన్నట్లుగా పని చేస్తున్నావు-ఇది ''క్రీస్తు విరోధి ఆత్మ'' (2 థెస్స 2:4 చూడుడి). ఆ పరిసయ్యుల వలె నీవు కూడా ''సహోదరుల మీద నేరము మోపువాడైన (ప్రకటన 12:10) అపవాదితో చేతులు కలుపుతావు.


ఉదాహరణకు, స్త్రీలు తలమీద ముసుగు వేసుకోవడం గూర్చి చూద్దాము. ప్రార్ధన చేయునపుడు లేక ప్రవచించునపుడు స్త్రీ తన తలమీద ముసుగు వేసుకొనవలెనని (1 కొరింథీ 11:5) బైబిలు చెప్తుంది. కాని కొంత మంది సంఘనాయకులు స్త్రీలు ఎల్లప్పుడూ (ప్రతీ రోజు 24 గం||లు) తలమీద ముసుగు వేసుకొనవలెనని చెప్పుదురు. ఎందుకనగా వారు ఎల్లప్పుడూ ప్రార్ధన చేయవలెను. కాని పురుషులు (ఎల్లప్పుడూ ప్రార్ధన చేయవలెను అను నియమమును బట్టి) తలమీద ముసుగు వేసుకొనకూడదు (టోపీలు ధరించడం మొదలైనవి.) అనే విషయమును చెప్పరు. దీనిని బట్టి వారి అస్థిరత్వం అనేది మనకు కనబడుతుంది. సహోదరీలు కేవలం 15 శాతం మాత్రమే వారి తలను ముసుగు వేసుకోవడానికి అనుమతించుదురు (వారి తల వెనుక భాగం మాత్రమే, ఎందుకంటే తల పూర్తిగా ముసుగు వేసుకుంటే ఎండకు చాలా అసౌకర్యంగా ఉంటుందని). దీనిలో కూడా వారి అస్థిరత్వం మనకు కనబడుతుంది. పరిసయ్యులు ఎంతో అస్థిరంగా ఉన్నారు. కాని వారి అస్థిరతను గూర్చి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారి తలను పూర్తిగా ముసుగు వేసుకొనే స్త్రీలను నేను చూచినది కేవలము మదర్‌ థెరిసాలాంటి రోమన్‌ క్యాథలిక్‌ కన్యలను మాత్రమే.


దాన్ని ఒక నియమముగా యెంచి, నొక్కి చెప్పే (దీనికి విధేయత చూపించలేదని ఇతరులకు తీర్పు తీర్చేవారు) వారిలో దాదాపుగా అందరిలో ఈ విషయములో అస్థిరత ఉన్నట్లు నేను చూశాను. వారు వేషధారులు మరియు పరిసయ్యులు. స్త్రీలు తల మీద ముసుగు వేసుకోవడంలో దేవుని ఉద్దేశము కేవలము ఒక గుర్తుగానే కాని ఒక నియమముగా కాదు. కాబట్టి ప్రతి ఒక్క సహోదరీ తన తలను పూర్తిగా 100% ముసుగు వేసుకున్నదా లేక ఏవైనా కొన్ని వెంట్రుకలు బయటకు కనబడుచున్నవా అని చూచుటకు నా సమయమును వ్యక్తిగతంగా వృధా చేసుకోను.


ఇలాంటి అనేక విషయములలో పరిసయ్యులైన సంఘపెద్దలు వారి కుటుంబ సభ్యుల పట్ల ఖచ్చితంగా ఉండరు. కాని ఇతరుల పట్ల ఎంతో ఖచ్చితంగా ఉందురు. ''విశ్రాంతి దినమున మీ గాడిద గుంటలో పడితే మీరేమి చేయుదురు?'' అని యేసు ప్రభువు పరిసయ్యులనడిగెను. వారి స్వంత గాడిదలను గూర్చి అయితే జాగ్రత్త తీసుకుంటారు కాని జబ్బుపడిన ఒక మనిషిని గురించి కాదు. వారు ఇతరులకు నియమించే నియమములలో తమ స్వంత కుటుంబ సభ్యులకు వెసులుబాటు కలిగించకుండా సంఘనాయకులు ఎంతో జాగ్రత్త పడాలి.

అధ్యాయము 7
పరిసయ్యులు అసూయ ద్వేషమును బట్టి పురికొల్పబడుదురు

''అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి'' (మత్తయి 12:14).


ఒకరి మీద నీకుండిన అసూయ అతడిని చంపునంతటి స్థాయిలో ఉండకపోవచ్చును. కాని అసూయ ద్వేషములు నరహత్యకు మొదటి మెట్టని జ్ఞాపకముంచుకొనుము. అసూయ-ద్వేషము-హత్య కయీను ఈవిధముగానే పతనానికి వెళ్ళాడు.


వారు చేయలేని వాటినెన్నింటినో యేసు ప్రభువు చేసి జనుల యొద్ద వారికంటే ఆయన ప్రఖ్యాతి చెందుట చేత పరిసయ్యులు ఆయన మీద అసూయ చెందారు. చివరకు పిలాతు (యేసు ప్రభువు గురించి చాలా తక్కువ తెలిసిన వ్యక్తి) కూడా పరిసయ్యులు యేసు ప్రభువును సిలువ వేయమని కోరినది కేవలము ఆయన మీద ఉన్న అసూయ వలననే అని (మత్తయి 27:18) చూడగలిగాడు. నీకు ఎవరి మీదనైనా అసూయ ఉంటే అది నీ మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి స్పష్టముగా తెలుస్తుంది.


నీకన్నా శ్రేష్టముగా బోధించు వారిమీదనైననూ లేక నీకు లేని ఆత్మీయ వరములను కలిగియున్న వారి మీదనైననూ లేక నీకన్నా ధనవంతుల మీదనూ నీవు అసూయను కలిగియుండవచ్చును. అప్పుడు వారిలో ఏ చిన్న తప్పు అయినా దొరుకుతుందేమోనని వారిని విమర్శించడానికి చాలా తేలికగా నీవు చూస్తుంటావు. వారు ఏ విధముచేతనైననూ పడిపోవాలని ఆశతో ఎదురుచూస్తూ ఉంటావు. పరిసయ్యుల మతము కయీను మతమే.


మానవ జాతి చరిత్ర రెండు శాఖలుగా మొదలైంది ఒకటి ఆత్మీయమైనది (హేబెలు) రెండవది మతపరమైనది (కయీను). కయీను యొక్క ప్రాథమికమైన పాపము హేబేలును ద్వేషించడం. ఈ రెండు శాఖలు చివరకు యెరూషలేము (నిజమైన సంఘము) మరియు బబులోను (తప్పుడు సంఘము)గా ముగుస్తాయి. ఒకవేళ మనము మత సంబంధులుగా ఉండి, అసూయతో నిండియుండిన కయీను శాఖను వెంబడించినట్లయితే, మన సిద్ధాంతములన్నీ సరిగా ఉండినప్పటికీ చివరకు మనము బబులోనులో భాగముగా మిగిలిపోతాము.


అధ్యాయము 8
పరిసయ్యులు అనుమానము కలిగియుందురు. మరియు ఇతరులను గూర్చి తక్కువగా ఊహించుకొందురు

''పరిసయ్యులు ఆ మాట విని-వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి'' (మత్తయి 12:24).


యేసు ప్రభువు దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు అక్కడున్న ప్రజలు ''ఈయన దావీదు కుమారుడు (వాగ్దానం చేయబడిన మెస్సయ్య (మత్తయి 12:23))'' అని చెప్పుకొనిరి. కాని పరిసయ్యులు వారు చేయలేనిది యేసు ప్రభువు చేశాడనే దానిని బట్టి కలవర పడ్డారు. కాబట్టి వారు నీచముగా ఆలోచించారు.


చివరకు ఇతరులను ఆశీర్వదించుటకు ఎవరైనా ఒక మంచి పనిని చేసినా కూడా దానిని తప్పుడు ఉద్దేశముతో చేశారని పరిసయ్యులు ఆపాదించుదురు. అదే ఒకవేళ వారి స్వంత పిల్లలు అదే పనిని చేసినట్లయితే వారు మంచి ఉద్దేశముతో చేశారని చెప్పి దానిని బట్టి గర్వించి ఉండేవారు. ఎందుకంటే పరిసయ్యులు వారి కుటుంబ సభ్యులపట్ల పక్షపాతముతో ఉండి, ఇతరుల పట్ల విమర్శనాత్మకంగానుందురు. పరిసయ్యులు ఇతరులను ఎంతో అనుమానముగా చూచెదరు. మరియు ఎవరైనా ఏ పని చేసినా స్వార్ధపూరితమైన ఉద్దేశములతోనే చేస్తారు అని నమ్మెదరు, ఎందుకంటే వారే ఎంతో స్వార్ధపూరితముగా నుండెదరు. ఒకవేళ నీవు పరిసయ్యుడవైతే, వేరే వాళ్ళు చేసే మంచి పనికి నీవు తప్పుడు ఉద్దేశములను ఆపాదిస్తావు మరియు ఇతరులు ఎవరినైనా అభినందిస్తే వారిపట్ల విమర్శనాత్మక ధోరణి కలిగి ఉంటావు.


అధ్యాయము 9
పరిసయ్యులు వారి సంభాషణలో ఎంతో నిర్లక్ష్యముగానుందురు

''పరిసయ్యులు ఆ మాట విని-వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు గాని మరియొకని వలన కాదనిరి'' (మత్తయి 12:24).


పరిసయ్యులు ఇతరులను గూర్చి కఠినమైన మరియు బాధ కలిగించే మాటలను నిర్లక్ష్యముగా మాట్లాడుదురు. మరియు వారి మాటలలో ఇతరులను గూర్చి తీర్పు తీర్చుదురు. దేవుని కుమారుని ''దయ్యములకు అధిపతి'' అనుట గూర్చి ఆలోచించండి.


పరిసయ్యులు చేసిన ఆ దుష్ట విమర్శకు యేసు ప్రభువు ఎలా స్పందించాడు? ఆయన ఈవిధముగా ప్రత్యుత్తరమిచ్చాడు, ''సామాన్య మానవుడిగాయున్న నాకు విరోధముగా మీరు మాట్లాడారు కాబట్టి మీరు క్షమించబడ్డారు కాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకుండా చూచుకొనుడి'' (మత్తయి 12:32). యేసు ప్రభువు (ఒక మనిషిగా) ఆ పరిసయ్యులను క్షమించాడు. కాని పరలోకంలో ఉన్న దేవుడు వారిని క్షమించలేదు.


మనము ఎవరికైనా విరోధముగా పాపము చేసినట్లయితే, ఆ పాపములో రెండు భాగాలుంటాయి(1) అడ్డు భాగము ఆ వ్యక్తికి విరోధముగా (2) నిలువు భాగము దేవునికి విరోధముగా. నీ పాపము తుడిచి వేయబడాలి అంటే ఆ వ్యక్తి నిన్ను క్షమించాలి. మరియు దేవుడు కూడా నిన్ను క్షమించాలి. అయితే దేవుడు ఎవరినైనా క్షమించాలి అంటే ఆ వ్యక్తి మొట్ట మొదట మారుమనస్సు పొందాలి. ఒకవేళ నీ పాపములోని అడ్డు భాగమైన మానవుడు నిన్ను క్షమించినా, నీ పాపములోని నిలువు భాగము కోసం నీవు మారుమనస్సు పొంది క్షమాపణ అడిగే వరకూ దేవుని తీర్పును నీవుఎదుర్కొందువు. తరువాత ఒకవేళ ఆ పరిసయ్యులలో ఒకరు ప్రభువు దగ్గరకు వెళ్ళి ''ప్రభువా మిమ్ములను బయెల్జెబూలు అని పిలిచినందుకు చింతిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి''. అని చెప్పిన తరువాత దేవుణ్ణి కూడా క్షమాపణ అడగవలెను. అప్పుడు మాత్రమే తన పాపము తుడిచివేయబడును లేకపోతే తుడిచివేయబడదు. మనము మాట్లాడు మాటలను బట్టియే విమర్శ దినమున తీర్పు తీర్చబడతామని యేసు ప్రభువు మనలను హెచ్చరించారు (మత్తయి 12:37).


నీవు ఎంత ప్రార్ధన చేసినా, ఎన్ని మందులను వాడినా స్వస్థపరచబడని రోగమును నీవు కలిగియున్నావా? బహుశా నీవు కీర్తనలు 105:14లోని దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించియుండవచ్చును. ''నేనభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చెను (కీర్తనలు 105:14)''. ఒక దైవికమైన సహోదరుని గూర్చి నీవేమైనా నిర్లక్ష్యముగా మాట్లాడావా? బహుశా అందుకే నీ రోగము నుండి స్వస్థత కలుగుట లేదేమో. బహుశా నీ కంటే పదివేల రెట్లు పరిశుద్ధులైన వారిని, పదివేల రెట్లు దేవుని పని చేసిన వారిని నిర్లక్ష్యముగా తీర్పు తీర్చియుంటావు. మారుమనస్సు పొంది ఆ వ్యక్తిని క్షమాపణ అడుగుట ద్వారా మాత్రమే నీవు స్వస్థత పొందగలవు.


అధ్యాయము 10
పరిసయ్యులు వారి మతము పేరిట వారి కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యము చేయుదురు

''.....అందుకాయన - మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? - తల్లిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే - ఒకడు తన తల్లినైనను తండ్రినైనను చూచి - నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు...'' (మత్తయి 15:1-9).


ఒకడు అతని సొమ్మును దేవాలయపు కానుకల పెట్టెలో వేసినట్లయితే అతని యొక్క అవసరతతోనుండిన తల్లిదండ్రులను చూడనక్కర్లేదని చెప్పి తల్లిదండ్రులను సన్మానింపుము అను దేవుని ఆజ్ఞను పరిసయ్యులు నిరర్ధకము చేయుచుండెను. ''పరిశుద్ధుడైన'' కుమారుడు తన సొమ్మును సువార్త పనికొరకు ఇచ్చుట వలన, బీదవాడైన అతని తండ్రి రోగియై చనిపోవచ్చును!! ఈ ఆధునిక కాలంలో దీనికి సమానంగా ఈవిధంగా చెప్పవచ్చును: పరిసయ్యుడు తన భార్యతో ఈ విధంగా చెప్పియుండేవాడు ''ఈ సాయంత్రము నేను సంఘ కూడికకు వెళ్ళాలి. కాబట్టి ఇంట్లో చేయవలసిన ఈ పనిలో నీకు సహాయం చేయలేను''. లేకపోతే ఒక ప్రక్క తన భార్య పిల్లలను స్కూలుకు సిద్ధపరుస్తూ, వారికి అల్పాహారమును తయారు చేస్తూ, ఏడ్చే బాబును చూసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటే, పరిసయ్యుడు తన బైబిలును ముందు పెట్టుకొని ప్రత్యక్షగుడారము గురించి చదువుతూ (నిర్గమ 25), తనతో మాట్లాడమని ప్రభువుని అడుగుతూ ఉండవచ్చును. ప్రభువు పరిసయ్యునికి ఈవిధముగా చెప్పుటకు ప్రయత్నించుచుండెను. ''నీ బైబిలు మూసివేసి, ''ప్రత్యక్ష గుడారము పఠనమును'' మానివేసి ముందు వంటగదిలో ఉన్న నీ భార్యకు సహాయము చెయ్యుము!''. కాని అతడు దేవుని స్వరమును వినలేడు. ఎందుకంటే అతని పరిసయ్యతత్వము కలిగిన చెవులు దేవుని స్వరము వినలేనంత చెవిటిగా అయినవి.మనము ఆత్మీయులుగా మారే విషయములో ఎక్కువ భాగము ఏమిటంటే ఇంటిలో మనము చేయవలసిన పనిలో బాధ్యత తీసుకొనడమే. ''ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని, సంరక్షింపక పోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడైయుండును'' (1 తిమోతి 5:8).

అధ్యాయము 11
పరిసయ్యులు సుళువుగా అభ్యంతర పడుదురు

''అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా...వారి జోలికి పోకుడి...అనెను'' (మత్తయి 15:12-14).


తల్లిదండ్రులను సన్మానించనక్కర్లేదని పరిసయ్యులు చెప్పు బోధను గూర్చి వారిని సరిచేసినప్పుడు (పైన చూచినట్లు) వారు అభ్యంతర పడ్డారు. పరిసయ్యులు ఒక పెద్దయైన సహోదరుని ద్వారా ప్రభువు ఇచ్చు గద్దింపు మాట లేక సరిచేయు ఏ మాటను బట్టియైనా సళువుగా అభ్యంతర పడతారు. ''అభ్యంతర పడుట'' నుండి విజయమును పొందుట అనేది క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకొనవలసిన పాఠములలో ప్రాథమికమైయున్నది. నీవు సరిచేయబడినప్పుడు అభ్యంతర పడుట నుండి సంపూర్తిగా విడుదల పొందుటకు నీవు వెదుకనట్లయితే పరిసయ్యతత్వము నుండి ఎప్పటికైనా విడుదల పొందుదువన్న నిరీక్షణ ఉండదు.


మా సంఘములో, వారు పొందిన దిద్దుబాటును బట్టి అభ్యంతరపడి చివరకు సంఘమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు నాకు తెలుసు. ఈ రోజు వారిని చూచినట్లయితే అరణ్యములో తిరుగుతున్నారు. మరియు వారు నిత్యత్వాన్ని కోల్పోయే ప్రతి అవకాశమును కలిగియున్నారు. నీవు పొందిన దిద్దుబాటును బట్టి ఒక వేళ నీవు అభ్యంతర పడినట్లయితే, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ పరిసయ్యుల వలె నీవు కూడా నరకమునకు వెళ్ళే మార్గములో ఉన్నావు.


యేసు ప్రభువు తన శిష్యులతో ''వారి జోలికి పోకుడి'' అని చెప్పెను. అభ్యంతర పడిన పరిసయ్యులను తిరిగి సంఘమునకు తీసుకు వచ్చుటకు వారి వెంట మనము వెళ్ళకూడదు. మనము ప్రభువుకు విధేయత చూపించి వారి జోలికి పోకూడదు. ఒకవేళ వారు పశ్చాత్తాపము నొంది, మరలా ప్రభువు యొద్దకును, సంఘమునకును రావచ్చు లేకపోతే లేదు.

అధ్యాయము 12
పరిసయ్యులు ఆత్మీయముగా గ్రుడ్డివారు

''.....వారు గ్రుడ్డి వారైయుండి గ్రుడ్డి వారికి త్రోవ చూపువారు. గ్రుడ్డి వాడు గ్రుడ్డి వానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను'' (మత్తయి 15:14)


పరిసయ్యులు గొప్ప బైబిలు పండితులు. కాని వారు ఆత్మీయముగా గ్రుడ్డి వారు మరియు ఆత్మీయ విషయములను గూర్చిన ఎటువంటి ప్రత్యక్షతనైననూ కలిగిలేరు. ఈ గ్రుడ్డి నాయకులు ఇతర గ్రుడ్డి జనులను నడిపించునప్పుడు ''వారు గోతిలో (నరకములో) పడుదురు మరియు వారిని అనుసరించువారు కూడా అదే గోతిలో పడుదురని యేసు ప్రభువు చెప్పెను'' (మత్తయి 15:14).


ఒక గ్రుడ్డి వానిని ఎన్నటికినీ అనుసరించవద్దు. మీ నాయకుడు/పెద్ద ఆత్మీయ దర్శనము కలిగియుండి, దేవుని ప్రజలను ప్రేమించే వాడిగా ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలి. ప్రేమ లేకపోవడమే ఆత్మీయ గ్రుడ్డితనానికి కారణము మరియు ప్రజలను శిక్షావిధిలోనికి తీసుకొని పోవునట్లు బోధించునట్లుగా ప్రసంగీకులను నడిపించును.


యేసు ప్రభువును ప్రేమించే మనిషి తన ప్రసంగములో ప్రభువును మాత్రమే పైకెత్తి చూపించునట్లుగా స్పష్టముగా ప్రభువును చూచును మరియు ప్రభువును మీకు చూపించును. ఇటువంటి నాయకుడిని మాత్రమే మీరు వెంబడించాలి మరియు మీరు ఇష్టపడుటకు ఆశ కలిగియుండాలి.


అధ్యాయము 13
పరిసయ్యులు వేషధారులు

''పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి'' (లూకా 12:1)


''వేషధారి'' అను మాట గ్రీకు భాషలోనుండి ఇంగ్లీషు భాషలోనికి తెచ్చుకొన్నది. దీని అర్ధము నటుడు. నీవు మొదటి శతాబ్దంలో గ్రీసు దేశమునకు వెళ్ళి, వేషధారులు ఎక్కడ ఉందురని అడిగినట్లయితే, వారు ''నాట్యశాలలో'' ఉందురు అని జవాబిచ్చుదురు. ఆ వేషధారులు రంగ స్థలము మీదికి వచ్చి కొద్ది గంటలు వారు నటించిన తరువాత ఇంటికి వెళ్ళి వారి మామూలు జీవితమును జీవించుదురు.


హాలీవుడ్‌ సినిమాలో ఒక వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను పాత్రను పోషించి, కొంత సమయం పరిశుద్ధుని వలె నటించవచ్చు. ఎందుకనగా అతడు నైపుణ్యత గల నటుడు. కాని అతని నిజజీవితంలో ఒక త్రాగుబోతు మరియు వ్యభిచారి కూడా అయిఉండవచ్చును.


నేడు ఎక్కువ మంది వేషధారులను సంఘములో కనుగొంటాము, అక్కడ ఆదివారం ఉదయమున కొద్ది గంటలు వారి భాగమును నటిస్తారు. ప్రతి ఆదివారం ఆ సమయమున ప్రభువును గొప్పగా స్తుతిస్తున్నట్లు నటించుదురు. కాని వారము మధ్యలో వాళ్ళ ఇళ్ళకు నీవు వెళ్ళినట్లయితే, ఆదివారం ఉదయం కేవలం వారు నటిస్తున్నారనే విషయాన్ని ఎంతో త్వరగా కనుగొనగలం. ఇంటిలో వారు మామూలుగా జీవిస్తున్నప్పుడు, వారు దేవుణ్ణి స్తుతించుటలేదు, కాని ఫిర్యాదులు చేస్తూ, సణుగుతూ, కొండెములు చెప్పుకుంటూ మరియు ఒకరితో ఒకరు పోట్లాడుకొందురు.


నీవు ఈ విధముగా ఉన్నావా? సంఘ కూడికలలో ఇతరులు చూచునట్లు నటిస్తున్నావు, కాని నీవు పనిచేసే స్థలంలో మరియు ఇంటిలో ఎంతో వేరుగా ఉన్న వ్యక్తిగా ఉన్నవా?


అధ్యాయము 14
పరిసయ్యులు ఇతరులను వారి మాటలలోనే పట్టుకొనుటకు చూచెదరు

''పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి-ఏ హేతవు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడిగెను!'' (మత్తయి 19:3)


పరిసయ్యులు జనులు మాటలాడు దానిలో దేనినైనా పట్టుకొని ఇతరులముందు నిందించుటకు చూచెదరు. నిన్ను బోల్తా కొట్టించుటకు వారు ప్రశ్నలు కూడా వేయుదురు. ''అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచూ'' అని మత్తయి 22:15లో మనము చదువుతాము (లూకా 11:54 కూడా చూడండి).


నాకు కూడా ఇటువంటి అనుభవాలున్నాయి. కొన్ని సార్లు కొన్ని సంఘములనుండి వచ్చిన విశ్వాసులు (నేను బోధించిన దాన్ని బట్టి ఒప్పుదల కలిగినవారు మరియు మత భ్రష్టత్వమును బోధిస్తున్నానని నిందించాలనుకున్నవారు ) నన్ను కలుసుకొని నేను మాట్లాడే మాటలలో ఏదో ఒక పదాన్ని పట్టుకుందాము అని ప్రశ్నలు వేశారు. వారి జీవితాలలో పాపమునుండి విడుదల పొందుటకు ఎటువంటి ఆసక్తి లేదు కాని వేరే వారిలో ఏదైనా చిన్న తప్పును పట్టుకోవడంలో వారు ఆసక్తి కలిగి ఉన్నారు. ఖచ్ఛితంగా ఇదేవిధంగా పరిసయ్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభువు చెప్పిన మాటలను కూడా వారు అసందర్భంగా తీసుకొని మతభ్రష్టత్వమును బోధిస్తున్నాడని నిందించారు. ఆధునిక పరిసయ్యులు కూడా నా మాటలను ఇదేవిధంగా వక్రీకరించారు. మనము ఎవరినైనా ప్రేమిస్తే, ఆయన చెప్పిన దానిని ఎల్లప్పుడూ నిర్మాణాత్మకంగా చూపెడతాము. ''బహుశా నేను తప్పుగా అర్ధం చేసుకున్నానేమో''; ''బహుశా అతడు జోక్‌గా చెప్పాడేమో''......అని చెప్తాము. ఒక పరిసయ్యుడు ఎవరికైనా ఇలాంటి అనుమతినివ్వడు. ''కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదానిని బట్టి విమర్శచేయడు'' అని యేసు ప్రభువు గురించి వ్రాయబడియున్నది (యెషయా 11:3). ప్రతి దైవజనుడూ అనుసరించే మాదిరి ఇదే.

అధ్యాయము 15
పరిసయ్యులు కఠిన హృదయులు

''ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది'' (మత్తయి 15:9).


ఒక పరిసయ్యుని హృదయము కఠినముగా ఉండును, ఎందుకనగా ఇది దేవునికి ఎంతో దూరముగా ఉన్నది. ఒకవేళ వెన్నను అగ్నికి దగ్గరగా ఉంచినట్లయితే వెంటనే అది కరిగిపోవును. కాని నీవు ఫ్రీజర్‌లో ఉంచినట్లయితే ఎంతో గట్టిగా అవుతుంది. చివరకు అది రాయి అంత గట్టిగా కూడా కావచ్చును, దానిని పగులగొట్టుటకు నీకు గొడ్డలి అవసరం పడవచ్చును. పరిసయ్యుని హృదయం ఈలాగు ఉండును. దేవుడు అగ్నియై ఉన్నాడు. ఆయనకు దగ్గరగా నీవు జీవించినట్లయితే నీ హృదయము ఎప్పుడూ మెత్తగానే ఉంటుంది. రాళ్ళు సైతం దేవుని సన్నిధిలో కరిగిపోవును.


ఒకవేళ ఇతరులయెడల కఠినముగా ఉన్నట్లయితే, దేవునికి ఎంతో, ఎంతో దూరంలో నీవు జీవిస్తున్నావన్నది వాస్తవము. పరిసయ్యులు ఇతరులయెడల కఠినముగా ఉందురు. ఎందుకంటే వారు దేవునికి కొన్ని లక్షల మైళ్ళ దూరములో ఉన్నారు.


పరిసయ్యులు తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరచుదురు మరియు ''ఓ ప్రభువా నీవు యోగ్యుడవు'', మొదలైన అందమైన స్తుతి పాటలు పాడుదురు. కాని వారిని వారు తీర్పు తీర్చుకోరు. దేవుని మాట వినే వ్యక్తి ఎల్లప్పుడూ తన్ను తానే తీర్పు తీర్చుకొనును మరియు ఇతరులను తీర్పు తీర్చడు-ఒక మెత్తని హృదయము కలిగిన వ్యక్తికి ఇది ఒక గుర్తు.


నేను గమనించినదేమిటంటే పరిసయ్యులు ఇతరులయెడల ఎంత కఠినముగా ఉన్నప్పటికీ, వారి కుటుంబ సభ్యుల యెడల ప్రేమగానుందురు. ఇతరులకు వారు నియమములను విధించుదురు కాని వారి స్వంత కుటుంబ సభ్యులకు విధించరు. వారు పూర్తిగా పక్షపాతముతోనూ, వేషధారణతోనూ నిండియుందురు.


మనము తప్పకుండా ఒప్పుదలలు కలిగి ఉండాలి. నేనేమి కలిగి ఉండాలో లేదా నేనేమి చేయాలో అనే విషయాలలో ఎంతవరకు నన్ను నేను అనుమతించుకోవాలి అనే దానిలో నా స్వంత ఒప్పుదలలు నాకున్నాయి. దేవుని వాక్యము ఏ విషయాలలో అయితే మౌనముగా ఉన్నదో ఆ విషయములలో నా ఒప్పుదలలను ఇతరుల మీద రుద్దను. టెలివిజన్‌ కలిగి ఉండాలో లేదో నేను ప్రజలకు చెప్పను. ఇంటర్నెట్‌ కలిగి ఉన్న కంప్యూటర్‌ టెలివిజన్‌ కంటే ఎంతో ప్రమాదకరము అని నేననుకుంటాను. ఈ రెండు పరికరాల వలన కలిగే అపాయములను గూర్చి ప్రజలను నేను హెచ్చరిస్తుంటాను. కాని పరిసయ్యుల వలె ఇతరులకు నేను నియమములను విధించను. ఈ పరికరాలను కలిగియుండవద్దు అని ఇతరులకు చెప్పిన పరిసయ్యులు నాకు తెలుసు. కాని ఎప్పుడైతే వారి అవసరాన్ని బట్టి కంప్యూటర్లు కొన్నారో, వారి మాటలను వారే వెనుకకు తీసుకొనవలసి వచ్చినది.

అధ్యాయము 16
బహిరంగముగా బిగ్గరగా స్తుతించుటను పరిసయ్యులు ప్రశంసించరు


''కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న పిల్లలను చూచి కోపముతో మండిపడెను'' (మత్తయి 21:15)


ఎప్పుడైతే ప్రజలు దేవుణ్ణి స్తుతించుటకు గొంతెత్తుతారో అప్పుడు పరిసయ్యులు కలవరపడుదురు. దేవుణ్ణి గౌరవించడం అంటే అది తన సన్నిధిలో తన ప్రజలు మౌనముగా ఉండాలని, లేదా కనీసం మెల్లగా స్తుతించాలని దేవుడు కోరుకుంటాడని వారు విశ్వసించుదురు. చంటి పిల్లలు దేవుణ్ణి బిగ్గరగా స్తుతించడం యేసు ప్రభువు విన్నప్పుడు సంతోషించాడు. ఎందుకంటే ఇది ఆయనకు పరలోకమును జ్ఞాపకము చేసినది! పరలోకములో గొప్ప శబ్దముతో ఎల్లప్పుడూ స్తుతి-కొన్ని సార్లు బలమైన ఉరుము వంటి శబ్దముతో ఉంటుంది (ప్రకటన 19:6). మన స్తుతి కూడికలలో మనమింకా అంత శబ్దస్థాయికి చేరలేదు, కాని అది మన గమ్యము. ఎవరైనా వారు ప్రసంగములో విన్నదానికి స్పందనగా ''ఆమేన్‌'' లేక ''హల్లెలూయ'' అని చెప్తే పరిసయ్యులు కలవరపడుదురు. ఇలా ఎవరు చెప్పారు అని చుట్టూ తిరిగి చూస్తారు. సంఘకూడికలో ఇలాంటి పదాలు అనకూడదని వారు భావిస్తారు. సంఘకూడికలో కూర్చున్న ప్రతివారు ఏదో భూస్థాపిత కార్యక్రమంలో ఉన్నట్టుగా ఉండాలని వారు అనుకుంటారు. పరిసయ్యులు పాటలు పాడేటప్పుడు ఎవరైనా చూచినట్లయితే, యేసు ప్రభువు మరణమును జయించి తిరిగి లేచాడు అన్న విషయాన్ని వారు వినలేదేమో అని అనుకుంటారు

అధ్యాయము 17
పరిసయ్యులు విధేయత లేని జ్ఞానమును కలిగియున్నారు

''అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు. గనుక వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పునచేయకుడి;'' (మత్తయి 23:2,3)


పరిసయ్యుల యొక్క ఎక్కువ లక్షణాలను యేసు ప్రభువు బైబిలులోని మరి ఏ ఇతర అధ్యాయము కంటే మత్తయి 23లో బహిర్గతం చేసెను. మత్తయి 23వ అధ్యాయము 1 కొరింథీ 13వ అధ్యాయానికి చాలా వ్యతిరేఖమైనది. ధర్మశాస్త్రము చేత నడిపించబడుట పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమచేత నడిపింపబడుటకు విరోధముగా ఉండును. కనుక మనము పరిసయ్యతత్వము నుండి, అక్షరానుసారమైన నియమములనుండి దైవికమైన ప్రేమగల జీవితములోనికి నడిపించబడవలెనంటే మత్తయి 23ను జాగ్రత్తగా అధ్యయనం చేయవలెను.పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు, దీని అర్ధమేమిటంటే వారు వేదాంత కళాశాలలకు (బైబిలు కాలేజీలు) వెళ్ళి వారి డాక్టరేట్‌ డిగ్రీలను పొందుకొందురు మరియు వారు ఖచ్ఛితమైన బైబిలు జ్ఞానమును కలిగియుందురు. పరిసయ్యులు చెప్పువాటినన్నిటినీ అనుసరించి గైకొనుమని యేసు ప్రభువే తన శిష్యులకు చెప్పెను. కనుక పరిసయ్యులు చెప్పేవన్నీ సరిగానే ఉండి ఉండాలి. అయితే, వారు ఏదైతే సత్యమని ఎరుగుదురో దానికి విధేయత చూపించరు.జ్ఞానం అనేది ఎంతో ఉపయోగకరమైన విషయం, కాని ఇదే ప్రమాదకరంగా కూడా ఉండవచ్చును. విధేయతతో కూడిన జ్ఞానము మాత్రమే ఆత్మీయ జీవమును తెస్తుంది. విధేయత లేని జ్ఞానము ఆత్మీయ మరణమును తెస్తుంది. విధేయత లేకుండా జ్ఞానమును కలిగియుండుట కంటే అసలు జ్ఞానము లేకుండా ఉండుటే మంచిది. జ్ఞానమును మనము తీసుకొనే ఆహారముగాను, విధేయతను జీర్ణక్రియగాను పోల్చవచ్చును. జీర్ణమైన ఆహరం మాత్రమే శరీరంలో భాగంగా మారుతుంది. అన్నం, కూర మన శరీరంలో ఎముకలు, మాంసముగా మారడం అనేది-నీరు ద్రాక్షారసముగా మారడం కంటే తక్కువైన అద్భుతము కాదు. మరియు ప్రతిదినము మన శరీరములు ఈ అద్భుతాన్ని చేస్తూనే ఉన్నాయి. అయితే మనము తీసుకున్న ఆహారము జీర్ణము కానట్లయితే అప్పుడు ఈ ఆహారమే మనలను చంపివేయవచ్చును.ఎందుకంటే జీర్ణము కాని ఆహారము మన కడుపులోపల చెడిపోయి, మనకు రోగమును కలుగజేస్తుంది. నీవు వాంతి చేసుకున్నప్పుడు నీ కడుపులోనుండి వచ్చే ఆహారము దుర్వాసన కలిగి చెడిపోయిన రుచి కలిగియుంటుందని నీవు గమనించావా? నీవు తిన్నప్పుడు అది రుచి కలిగిన కోడి కూర అయి ఉండవచ్చును. కాని నీవు వాంతి చేసుకున్నప్పుడు అది వేరే రుచి కలిగి ఉంటుంది. మనము జ్ఞానమును సమకూర్చుకుంటూ దానికి విధేయత చూపించకుంటే అదేవిధంగా జరుగుతుంది. అందుకనే అనేక మంది క్రైస్తవులు ఆత్మీయంగా దుర్వాసన కలిగి ఉంటారు. గరిష్ఠముగా జ్ఞానము కలిగి కనిష్ఠముగా ఎవరైతే విధేయత చూపిస్తారో వారు ఎక్కువగా దుర్వాసన కలిగి ఉంటారు. పరిసయ్యులు ఈవిధముగా ఉంటారు. కాని విచారకరమైన విషయమేమిటంటే వారు దుర్వాసన కలిగియున్నారని వారికి తెలియదు. ఒక ఆత్మీయుడైన వ్యక్తి ఎంతో త్వరగా ఆ దుర్వాసనను తెలుసుకోగలడు. ఒక పరిసయ్యునితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఒక దైవజనుడు అతడిని వివేచింపగలడు. వారి కన్నులు అహంకార దృష్టిగలవి గాను లేక వ్యభిచారముతో కూడినవి గాను (సామెతలు 6:17; 2పేతురు 2:14) ఉండును. అనేక మంది స్త్రీలు వారు మార్పునొందని దినములలో సరసమైన జీవితమును జీవించెదరు. వారు మార్పునొందిన తరువాత కూడా వారి ఆత్మలను పూర్తిగా కడుగుకొనరు దీని ఫలితమేమంటే వారు మారుమనస్సు నొందిన 20 సంవత్సరాల తరువాత కూడా వారి కన్నులు సరసమైనవిగా ఉండును. యౌవనస్థులందరికీ నేను చెప్పుచున్నాను: అటువంటి సహోదరీలకు దూరముగా ఉండవలెను.

అధ్యాయము 18
పరిసయ్యులు వారు బోధించే దానిని అనుసరించరు

''పరిసయ్యులు చెప్పుదురే గాని చేయరు'' (మత్తయి 23:3)


ఈ వచనము అపోస్తలుల కార్యములు 1:1 కి వ్యతిరేఖముగానున్నది. అక్కడ యేసు ప్రభువును గురించి ఆయన ''(మొదట) చేసెను మరియు (తరువాత) బోధించెను'' అని వ్రాయబడియున్నది. పరిసయ్యులు బోధించారు కాని చేయరు. వారు బోధించిన దానిని అనుసరించరు. యేసు ప్రభువైతే మొదట ఆయన చేసి తరువాత ఆయన ఏదైతే చేసెనో దానినే బోధించెను. ఇవి రెండు వ్యతిరేఖమైన ఆత్మలు. ఎవరైతే పరిసయ్యుల ఆత్మను కలిగియుంటారో వారు వేశ్యయైన బబులోను సంఘమును నిర్మించెదరు. క్రీస్తు ఆత్మను కలిగియున్నవారు కన్యకయైన యెరూషలేము సంఘమును నిర్మించెదరు.


యేసు ప్రభువు మొట్టమొదట చేయకుండా ఎప్పుడూ బోధించలేదు. కొండమీద ప్రసంగం (మత్తయి 5,6,7 అధ్యాయములు) చేయడానికి యేసు ప్రభువు ఎంత సమయం సిద్ధపడ్డాడని మీరు అనుకుంటున్నారు-ఎవరైనా, ఎప్పుడైనా చేసిన ప్రసంగంలో కెల్లా అతి శ్రేష్టమైన ప్రసంగం. ఈ ప్రసంగం చేయడానికి ఆయనకు 30 సంవత్సరాలు పట్టినది. ఇది ఆయన జీవితము నుండి వచ్చినది కాని మనస్సు నుండి వచ్చినది కాదు.వేరే వాళ్ళ దగ్గర నుండి విన్న ప్రసంగాన్ని నీవు బోధిస్తున్నట్లయితే అది నీ తలలోనుండి మాత్రమే వచ్చును. ఇది కేవలము జ్ఞానము. అందులో జీవముగాని అభిషేకముగాని ఉండదు. యేసు ప్రభువు బోధించినట్లు నీవు బోధించాలనుకుంటే, నీవు మొట్టమొదటగా వాక్యానుసారముగా జీవించి తరువాత బోధించవలెను. ''సహో|| జాక్‌ గారు నా పరిచర్యలో మీ ప్రసంగములను నేను బోధించవచ్చునా?'' అని కొంతమంది నన్ను అడిగారు. ''ఒకవేళ, మొట్టమొదట వాటి ప్రకారం నీవు జీవించి మరియు అవి ఎక్కడనుండి పొందావో యధార్ధంగా ఒప్పుకున్నట్లయితే నీవు చేయవచ్చును''. అని నేను వారితో చెప్పాను. ''యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?......నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు (యిర్మియా 23:30,31)'',్పుఅని దేవుడు చెప్పెను.


నీవు వేరే వాళ్ళ ప్రసంగము ప్రకారము జీవించకుండా లేక నీకు ఎక్కడనుండి వచ్చినదో చెప్పకుండా బోధించినట్లయితే కేవలము నీవు నీకొరకై ఘనతను కోరుకుంటున్నావు. ఇది ఎంతో ప్రమాదకరమైన అలవాటు. నీకు ఆత్మీయ మరణాన్ని తెస్తుంది. ఎందుకంటే ''వేరే వాళ్ళ దగ్గరనుండి వారి ప్రసంగములన్నింటిని పొంది, ఇది దేవుని యొద్దనుండి వచ్చిన వర్తమానము అని చెప్పే బోధకులకు విరోధిని'' (యిర్మియా 23:30,31-మెసేజ్‌ మరియు లివింగ్‌ బైబిలు నుండి తర్జుమా చేయబడినది) అని దేవుడు చెప్పెను.గత 30 సంవత్సరాలనుండి, నా జీవితములో ఏదైతే అనుసరించానో, దానినే బోధించడానికి సాధ్యమైనంతవరకు నేను ప్రయత్నించాను. ఒక ఉదాహరణ మీకిస్తాను: ప్రజలను ఉత్తర భారతదేశమునకు మిషనరీలుగా వెళ్ళమని నేను ఎక్కడా బోధించలేదు, ఎన్నో వందలమంది మిషనరీలు ఉత్తర భారతదేశమునకు అవసరము అయినప్పటికీ, నేను వెళ్ళమని బోధించకపోవడానికి గల ఏకైక కారణమేమిటంటే ఒక మిషనరీగా నేనెప్పుడూ ఉత్తర భారతదేశములో జీవించలేదు.ఇప్పుడు నేను చెప్పేది వినండి ఒకవేళ ఇది నిజము కాకపోతే చూడండి: దాదాపుగా భారతదేశములోని ఇవాంజిలికల్‌ మిషనరీ సొసైటీల ప్రతి నాయకుడు దక్షిణ భారతదేశములోనే సౌకర్యాలలో జీవించుదురు. మరియు ఇతరులను ఉత్తర భారతదేశంలో మిషనరీలుగా వెళ్ళమని సవాలు చేయుదురు. ఈ నాయకులు వారి పిల్లలను దక్షిణ భారతదేశములోని మంచి పాఠశాలలకు, కళాశాలలకు పంపుదురు. కాని ఉత్తర భారతదేశములోని కుగ్రామములలో (పాఠశాలలు లేని ప్రదేశాలు) ఉన్న వారి యొక్క మిషనరీలకు మాత్రము దూరముగా ఉన్న బోర్డింగు స్కూలుకు వారి పిల్లలను పంపమని చెప్పుదురు. ఈ నాయకులకు తీర్పు తీర్చుటకు నేనిక్కడ లేను. దేవుడే వారి తీర్పరి. కాని వారి మాదిరిని అనుసరించనని నేను చెప్పుచున్నాను. వారు బోధించినట్లుగా నేను కూడా బోధించినట్లయితే, నేను ఒక పరిసయ్యుడనగుదును. ఎందుకంటే నేను చెయ్యనిది ఇతరులను చేయమని అడుగుదును. ఎవరైతే ఉత్తర భారతదేశములో నివసించి, అక్కడ ఉన్న పరిస్థితులలో వారి పిల్లలను పెంచుతారో కేవలము వారికే ఇతరులను కూడా అదేవిధముగా చేయమనే హక్కు ఉంటుంది. అలా కాకుండా, మిగిలిన వారంతా పరిసయ్యులే. ఈ నియమము అనేక ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది.నీవు చేయని దాని గురించి దేనినైననూ బోధించవద్దు. ఒకవేళ నీవే, యౌవనస్థులైన పిల్లలను సరిగా పెంచకుండా, వారిని ఎలా పెంచాలి అని యౌవనస్థులైన పిల్లలను కలిగియున్న తల్లిదండ్రులకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించవద్దు. ఒక పెళ్ళికాని యౌవనస్థుడు పిల్లలను ఎలా పెంచాలి అని తల్లిదండ్రులకు సలహాలిస్తే ఎంత బుద్ధిహీనంగా ఉంటుందో ఇది కూడా ఆలాగునే ఉంటుంది. అనేకసార్లు మనము ఇతరులను గురించి ప్రార్ధనచేస్తూ మరియు సలహాల విషయానికి వచ్చేసరికి నోరు మూసుకొని ఉంటే వారికి ఆశీర్వాదకరంగా ఉండవచ్చును.


ముందు నీవు రసాయన శాస్త్రాన్ని చదవకుండా రసాయనశాస్త్రాన్ని బోధించగలవా? లేదు. ఒకవేళ నీ కళాశాల డిగ్రీ ఇంగ్లీషు అయి ఉంటే నీవు ఇంగ్లీషును మాత్రమే బోధించగలవు. ఇది ప్రతి ఉపాధ్యాయునికి తెలిసిన సరళమైన సత్యము. కాని ఇంతే సులభమైన విషయమును పరిసయ్యులు అర్ధం చేసుకోరు.


అధ్యాయము 19
పరిసయ్యులు బరువైన భారములను ఇతరులకు కట్టుదురు

''మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైన వాటిని కదిలింపనొల్లరు'' (మత్తయి 23:4)


పరిసయ్యులు ఇతరులను అనుసరించుమని ఉన్నత ప్రమాణాలను బోధించుట చేత ఆత్మీయముగా కనిపించుటకు ప్రయత్నించుదురు. కాని వారు మాత్రము ఈ ప్రమాణాలను అనుసరించరు.


చాలా సంవత్సరముల క్రితం జరిగిన ఒక యౌవనస్థుల కూడిక నాకు జ్ఞాపకముంది, అక్కడ ఉన్న ఇద్దరు ప్రసంగీకులలో నేను ఒకడిని. ఆ ప్రసంగీకుడు ప్రతి ఒక్కరూ దేవునికి వారి సమయములో 10% తప్పకుండా ఇవ్వాలి (ధనములో దశమ భాగమిచ్చినట్లుగా) అని బోధించారు, అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 2గం|| 24 నిమి||లను బైబిలు చదువుటలో మరియు ప్రార్ధన చేయుటలో సమయాన్ని గడపాలని అర్ధం. ఆ వర్తమానం తరువాత జరిగిన ప్రశ్నోత్తరాల సమయములో, అక్కడున్న యౌవనస్థులలో ఒకరు ఈ బోధను నేను అంగీకరించానా లేదా అని నన్ను అడిగారు. దానికి నేను అంగీకరించనని వారికి చెప్పాను. అప్పుడు ఆ బోధకుడిని అందరి ఎదుటనే ఆ విషయమును గూర్చి ఈ విధముగా అడిగాను ''సహోదరుడా, నీవు ప్రతి రోజూ 2గం|| 24 నిమి||లు బైబిలు చదువుటలో మరియు ప్రార్ధన చేయుటలో సమయం గడుపుచున్నావా?'' అందుకతడు బేలగా ''లేదు'' అని చెప్పెను. అప్పుడు అందరూ అతడిని ఒక వేషధారియైన పరిసయ్యుడు ఏ విధముగా బరువైన భారములను ఇతరులకు కట్టివేస్తూ అతడు మాత్రము మోయకుండా ఉండునని చూశారు. ఇది కేవలము ఒక ఉదాహరణ మాత్రమే.


కొంతమంది ప్రజలు ఇతరులను వారి సంపాదనలో 10% దేవునికి ఇవ్వమని పురిగొల్పుతారు, కాని వారు మాత్రము వారి యొక్క స్థూల ఆదాయములో 10% దేవునికి ఇవ్వని వారుగా ఉందురు. వారు వేషధారులైన పరిసయ్యులు. క్రైస్తవ ప్రపంచమంతా పరిసయ్యతత్వముతో నిండిన బోధకులచేత, ఎవరైతే అసాధ్యమైన ప్రమాణాలను తమంతట తాము జీవించకుండా ఇతరులపై మోపుతారో అటువంటి వారితో నిండియున్నది. ఈ బోధకులు బబులోనును నిర్మిస్తూ దేవుని పనిని నాశనము చేయుదురు. వారు దేవుని వాక్యమును ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండుటకు బదులు భారముగా ఉండునట్లు ఉపయోగించుదురు.


మత్తయి 23:4నకు మెసేజ్‌ బైబిలు అనువాదమును నేను ఇష్టపడతాను. అందులో ఈవిధముగా ఉంటుంది. ''దేవునిలో విందు చేసే విధముగా దేవుని వాక్యమును భుజించుటకు, త్రాగుటకు ఇచ్చుటకు బదులు వారు నియమములను కట్టలుగా కట్టి, జంతువుల మీద వేసినట్లు మీ మీద భారమైన బరువులు వేయుదురు. నీవు ఆ భారములు మోయలేక నలిగిపోవుచుండగా వారు చూచి ఆనందించుదురు కాని వారి వ్రేలితోనైననూ కదిలింపనొల్లరు''.


అటువంటి బోధకులు దేవుని పిల్లలను భారమైన బరువులను మోసే గాడిదల్లాగా చూస్తారు. బైబిలులోని ఒకే సందేశమును రెండు విధాలుగా బోధించవచ్చు-భారమైనదిగా లేక ఆశీర్వాదకరమైనదిగా. ఇది అంతా బోధకునిపైన ఆధారపడి ఉంటుంది.


అనేకమంది యౌవనస్థులు సంఘకూడికలలో పాల్గొనుటలో విసిగిపోవుటకు కారణము ఈ పరిసయ్యతత్వముతో ఉన్న బోధకులే. పరిసయ్యులు బోధించిన పాతనిబంధన గ్రంథములోనిదే యేసు ప్రభువు కూడా బోధించెను. కాని పరిసయ్యులు ఏ వాక్యభాగాలతో జనులను పెద్ద గొలుసులతో కట్టివేశారో అదే వాక్యభాగాలతో యేసు ప్రభువైతే జనులను స్వతంత్రులనుగా చేసెను. పరిసయ్యులు ఈ రోజు బోధించినప్పటికినీ ఇదే విషయం జరుగుతుంది.


అధ్యాయము 20
పరిసయ్యులు మనుష్యుల యొద్ద నుండి ఘనతను కోరుకొందురు

''మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు'' (మత్తయి 23:5)


మరియు పరిసయ్యులు వీధి మూలల యొద్ద నిలువబడి ఎలుగెత్తి ప్రార్ధన చేసెడివారు (మత్తయి 6:1) అని యేసు చెప్పెను. ఇక్కడ యేసు ప్రభువు స్పష్టముగా పెద్దదిగా చేసి (అతిశయోక్తితో) చెప్పుచున్నాడు-కాని ఒక ఉద్దేశముతో. ఆయన ఎప్పుడైనా ఒక విషయమును ప్రాముఖ్యమైనదని చూపుటకు అతిశయోక్తులు చెప్పుటలో ప్రావీణ్యుడు. ప్రజలు వారి కంటిలో దూలములను కలిగియున్నారని మరియు ఒంటెలను మ్రింగారని చెప్పెను. నేను కూడా ఒక విషయమును అర్ధమయ్యేటట్లు చేయుటకు అతిశయోక్తులు చెప్పుటలో యేసు యొక్క మాదిరిని చూశాను. మనము ఒక నివేదికను ఇచ్చేటప్పుడు ఖచ్ఛితముగా పెద్దదిచేసి (అతిశయోక్తితో) చెప్పకూడదు. '' కేవలము 150 మంది మాత్రమే వస్తే కూటమికి 200 మంది వచ్చారు'' అని మనము చెప్పకూడదు. కాని యేసు ప్రభువు ఉపయోగించిన అతిశయోక్తులు ఒక విషయము యొక్క ప్రాముఖ్యతను చెప్పుటకు ఉపయోగించారు గనుక అవి విలువైనవి.


ప్రజల యొద్దనుండి గౌరవాన్ని పొందు నిమిత్తము ప్రార్ధన చేసే పరిసయ్యుల గురించి యేసు ఒకసారి చెప్పారు. ఇతరుల యొద్ద నుండి గౌరవాన్ని పొందాలనే ఉద్దేశముతో మనమందరము బహిరంగముగా ప్రార్ధన చేయలేదా? మన ప్రార్ధనకు ఎవరైనా ఒకరు హల్లేలూయ అని లేక ఆమేన్‌ అని అందురేమో అని మనము ప్రార్ధించేటప్పుడు తరచుగా వినియుంటాము. ఇది పరిసయ్యతత్వము, అప్పుడు మనము మనుష్యులకు మాత్రమే ప్రార్ధన చేశాము దేవునికి కాదు. ఈ పాపము నుండి మనలను మనము శుద్ధిచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


బోధకులు గౌరవమును పొందుటకు బోధించవచ్చా? ప్రతీ ప్రసంగము తరువాత నన్ను నేను ఈవిధముగా తీర్పు తీర్చుకుంటాను. నా బోధ ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టానా లేక మనుష్యుని సంతోషపెట్టానా? మరియు నా బోధయొక్క నాణ్యతను ఎక్కడ మెరుగు పరచుకోగలను అని. ప్రతీ వంట పని చేసే వ్యక్తి అతని వంట యొక్క నాణ్యతను మెరుగు పరచుకొనుటను కోరుకుంటాడు. కాని దురదృష్టవశాత్తు చాలా కొద్దిమంది బోధకులు వారి బోధ యొక్క నాణ్యతను మెరుగుపరచుకోవాలని కోరుకుంటారు. ఇందువల్లనే అనేక మంది బోధకులు వినుటకు విసుగు పుట్టించే విధముగా ఉన్నారు. వారు శక్తివంతమైన, అభిషేకించబడిన ప్రసంగాలను చేస్తున్నారని ఊహించుకొనుటలో చాలినంత అతిశయపడుదురు. వారు వారి బోధ గురించి కనీసం వారి భార్యలు ఏమనుకుంటున్నారో అని కూడా అడుగరు. గతించిన ఎన్నో సంవత్సరాల నుండి నా బోధను ఎడతెగక మెరుగుపరచుకొనుటకు వెదికాను, ఎందుకంటే యేసు బోధించినట్లుగా అదే పట్టు గల్గిన విధానంలోనే బోధించాలని నేను కోరుకున్నాను. మరియు ఆయన కల్గియున్న అదే అగ్నితో మరియు అదే వాంఛతో బోధించాలని కోరుకున్నాను.


ఇంకా మనము మనుష్యుల నుండి ఘనతను కోరుకొనుటకు శోధించబడే ఇతర విషయాలు కూడా ఉన్నాయి. బహుశా నీవు చేసిన పనిని గురించి నీవు నివేదికలు వ్రాస్తూ ఉండవచ్చును గాని అది దేవుని మహిమ కొరకు కాక దేవుని కోసం నీవు ఏమి చేస్తున్నావో దాన్ని బట్టి ఇతరుల మెప్పు పొందటానికి చేయవచ్చును. మా సంఘములలో, 1975లో సంఘములను మొదలు పెట్టిన సమయం నుండి, లోకంలోని ఎవ్వరికీ, ఎక్కడకూ మేము ఎన్నడూ మా పనిని గురించి నివేదికను గాని లేక ఛాయాచిత్రమును గాని పంపించలేదు. మేము ఏమి చేస్తున్నామో దేవుడు మాత్రమే తెలుసుకుంటే చాలు అని మేము భావిస్తాము. మనుష్యుల నుండి ఘనతను కోరడం అనేది అనేక సంఘములలో ఎన్నడూ చెప్పనటువంటి పాపములలో ఒకటి. ఘనతను కోరుకొనడం అనేది ఒక వ్యక్తిని పరిసయ్యునిగా చేయును. మరియు పరిసయ్యులు బబులోనును మాత్రమే కట్టుదురు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమును కట్టుటకు, మనుష్యుల యొక్క ఘనతను కోరుకొనే దానంతటి నుండి మనల్ని మనము తప్పకుండా శుద్ధిచేసుకోవాలి.


అధ్యాయము 21
పరిశుద్ధత అనేది ఒకని వస్త్రధారణలో కలదని పరిసయ్యులు అనుకొందురు

''పరిసయ్యులు తమ రక్షరేకులు (నుదిటి భాగమున ధరించుకొనే వాక్యము వ్రాయబడి ఉన్న చిన్న భాగములు) వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు'' (మత్తయి 23:5)


పరిసయ్యుల యొక్క మరొక లక్షణము వారు ధరించే వస్త్రములను బట్టి పరిశుద్ధులని అతిశయపడుదురు!!


దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ విధముగా చెప్పెను. తమ బట్టల అంచులకు కుచ్చులు ( ఒక వైపు తగిలింపబడి ఇంకొక వైపు విడువబడిన అనేకమైన వదులుగా ఉండే దారములు) చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలిసూత్రమును తగిలింపవలెను. ఆ కుచ్చులను చూసిన ప్రతిసారి పరలోకము నుండి వచ్చిన దేవుని ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకొనుటకు ఆ విధముగా చెప్పెను (సంఖ్యా 15:38).


పరిసయ్యులు తమ చెంగులను ఇతరుల చెంగుల కంటే కొంచెం పొడవుగా చేసుకొందురు. అప్పుడు వారు పరిశుద్ధులు అని నిరూపించుకొనుటకు-ఇతరుల యొక్క చెంగుల పొడవు 3 అంగుళాలు ఉండగా, వారి చెంగుల పొడవు 6 అంగుళాలు ఉండుటను బట్టి అతిశయించుదురు!!


ఈ రోజు కూడా వారు ధరించే ''పవిత్రమైన'' దుస్తులను బట్టి అతిశయించే పరిసయ్యులు అనేక మంది ఉన్నారు!! ఒకసారి ఎవరో ఒక వ్యక్తి ఎంతో ఆకర్షణీయమైన రంగులు గల హవాయీన్‌ చొక్కాను నాకు ఇచ్చారు. నేను ఆ చొక్కాను ధరించడం మీరు చూచినట్లయితే నా గురించి ఏమని అనుకొనుండేవారు? ఇది కొంతమంది క్రైస్తవులను కలవరపరచి ఉండేది. అది వారి యొక్క పరిసయ్యతత్వమును బయలుపరచి ఉండేది. క్రీస్తు యొక్క ఆలోచనలకు పూర్తిగా విరోధముగా ఉండే అనేకమైన ఆలోచనలను మనము కలిగి ఉన్నాము-ఎందుకంటే మనము దేవుని వాక్యమును చాలినంతగా ధ్యానించము. మనము ఒక రకమైన రంగు చొక్కాను ధరించినట్లయితే ప్రజలు మనలను గురించి ఏమనుకొంటారో అని భయపడతాము. కాని యేసు యొక్క పరిశుద్ధత ఆయన ధరించిన దుస్తులలో లేదు.


ఏదో ఒక దానిని కనుగొని దాన్ని బట్టి విమర్శించుట కొరకు-పరిసయ్యులు ఇతరులు ఏమేమి ధరించుకుంటున్నారో-దుస్తులు, బూట్లు, చెవి కమ్మలు(రింగులు), మొదలగు వాటి విషయములో ఎంతో జాగ్రత్తగా గమనించుదురు. అలాంటి సంగతుల కొరకు వారు డేగ కన్నులను కలిగియుందురు.


పురుషులు ''స్త్రీల వలె వస్త్రములను ధరించుకొనుట (మలాకో-గ్రీకు)'' కు వ్యతిరేకముగా యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 11:8). మరియు పరిశుద్ధాత్మ స్త్రీలను ''తగుమాత్రపు వస్త్రములచేతను, విచక్షణ కలిగి మరియు సామాన్యముగా'' వస్త్రములను ధరించవలెనని హెచ్చరించెను (1 తిమోతి 2:9; 1 పేతురు 3:3). ఇది తప్ప, మనము ధరించే దుస్తులను బట్టి పరిశుద్ధత రాదు. పరిశుద్ధత అనేది ప్రాథమికముగా అంతరంగమునకు సంబంధించినది.


అధ్యాయము 22
పరిసయ్యులు అగ్రస్థానములను మరియు గౌరవప్రదమైన బిరుదులను కోరుకొందురు (ప్రేమించెదరు)

''వారు విందులో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని (డాక్టర్‌, రెవరెండ్‌) పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు'' (మత్తయి 23:6-8)


పరిసయ్యులు సంఘములో పెద్దలగుట ద్వారా వచ్చే ఘనతను ప్రేమించెదరు. మరియు పరిసయ్యతత్వము కలిగిన భార్యలు కూడా సంఘపెద్దగా వారి భర్తకున్న గుర్తింపును గూర్చి గర్వించుదురు. ఒకవేళ సంఘపెద్దనని గాని లేక నీ భర్త సంఘపెద్ద అని అణువంత గర్వము ఉన్నా నీవు ఖచ్ఛితముగా మొదటి శ్రేణికి చెందిన పరిసయ్యుడవే. అటువంటి పెద్దలు కేవలము బబులోనును మాత్రమే కట్టగలరు. ''రబ్బీ'' అని పిలిపించుకొనుటకు ఇష్టపడే ఆనాటి పరిసయ్యులకు, ''పాస్టర్‌'', ''రెవరెండ్‌'', '' రైట్‌రెవరెండ్‌'', ''ఫాదర్‌'' అని మరియు ఎన్నో హాస్యాస్పదమైన బిరుదులను పెట్టుకొనే క్రైస్తవ నాయకులైన ఈనాటి పరిసయ్యులకు ఏమాత్రము బేధము లేదు.


నేను వ్రాసిన పుస్తకములకు మరియు నేను చేసే ఇంటర్నెట్‌ పరిచర్యను బట్టి నాకు ఒక గౌరవ డాక్టరేట్‌ ఇస్తామని అమెరికాలోని ఒక బైబిల్‌ కళాశాల నుండి నాకు ఒక ఉత్తరం వచ్చినది. కేవలము ఈ ఒక్క దరఖాస్తును నింపి పంపించమని నన్ను అడిగారు. యేసుక్రీస్తు ప్రభువు గౌరవ డాక్టరేట్‌ పొందుటకు ఇష్టపడేవారా? ఖచ్ఛితముగా కాదు.


పైన ఉన్న వాక్యభాగము ఈవిధముగా చెప్పుచున్నది: ''ప్రజలు నిన్ను పీఠము మీద కూర్చుండబెట్టనియ్యవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరు ఒక తరగతిలోని విద్యార్ధులు. నీవు ఏమి చేయవలెను అని ప్రజలు నీకు చెప్పునట్లు నీవు అనుమతించవద్దు. నీ జీవితము మీద వారిని నిపుణులుగా ఉండనివ్వద్దు. దేవునినే నీమీద అధికారిగా ఉండనిమ్ము. నీవు ఏమి చేయవలెనో ఆయనను చెప్పనివ్వు. భూమి మీద ఎవరికైననూ తండ్రి అని పేరు పెట్టవద్దు: ఒక్కడే మన తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. వారి మీద నీవు బాధ్యతలు తీసుకొనేటట్లుగా యుక్తితో ప్రజలు నిన్ను చేయకుండునట్లుగా చూసుకొనుము. నీకును, వారికిని ఒకే ఒక జీవము గల నాయకుడున్నాడు. ఆయనే క్రీస్తు. నీవు హెచ్చించబడాలనుకుంటున్నావా? అయితే తగ్గించుకొనుము. ఒక దాసుడుగా ఉండుము. నీకు నీవే ఉప్పొంగినట్లయితే, నీవు తగ్గించబడుదువు. కాని నీ మట్టుకు నీవు దీనముగానున్నట్లయితే, నీ జీవితము అనేకులకు ఉపయోగకరముగానుండును'' (మత్తయి 23:8-12 మెసేజ్‌ బైబిలు).


మా సంఘములలో ఉన్న అనేకమంది విశ్వాసులు నన్ను వారి జీవితాల పట్ల బాధ్యత వహించునట్లు చేయుటకు ప్రయత్నము చేశారు. వారు ఏమి చేయవలెనో వారికి చెప్పుమని నన్ను అడిగారు. నేను వారికి చెప్పుటకు తిరస్కరించాను. వారికి నా సలహాలను ఇచ్చి మరియు వారితో ఈ విధముగా చెప్పాను, ''ఇప్పుడు వెళ్ళి నేనుచెప్పినట్లుగా చేయవలెనో లేదో మొదట దేవుణ్ణి అడుగవలెను. ఆయన మీకు దాని విషయంలో సమాధానం ఇవ్వకపోతే, అప్పుడు నా సలహాను తీసిపారవేసి దేవుడు మిమ్ములను ఏమి చేయమని చెప్పాడో దాన్ని చేయుము. మీ ఒకే ఒక్క నాయకుడు క్రీస్తు అయి ఉండాలి''.


ఈ విషయములో అనేకమంది సంఘనాయకులు క్రీస్తుయొక్క బోధను అనుసరించుటలేదు. కాని ప్రజలకు వారి వ్యక్తిగత జీవితములు ఎలా జీవించాలనేది చెప్పుటకు వారు ఇష్టపడుదురు. అటువంటి పెద్దలు బబులోనును కట్టుచున్న పరిసయ్యులు. వారంతట వారు ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు మరియు వారి యొక్క మందను కూడా ధర్మశాస్త్రము క్రిందకు తెచ్చెదరు. ఆత్మయొక్క స్వాతంత్య్రము వారికి తెలియదు, ఎందుకనగా వారు బిరుదులను, అగ్రస్థానమును మరియు ఘనతను ప్రేమించుదురు.


అధ్యాయము 23
పరిసయ్యులు ఇతరులను చెరుపుదురు (చెడగొట్టుదురు)

''అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు'' (మత్తయి 23:13)


విశ్వాసులుగా మారిన నిజాయితీ గల యౌవనస్థులు పరిసయ్యులైన నాయకులను బట్టి చెడిపోయెను. ఈ యౌవనస్థులు మొట్టమొదట మారుమనస్సు పొందినప్పుడు పాపమును జయించాలని, దేవునికోసం జీవించాలని ఎంతో ఆసక్తి కలిగియుండి ఉండవచ్చును. కాని వారి నాయకులు సినీతారలవలె జీవించడాన్ని చూచినప్పుడు, యేసు ప్రభువును వెంబడించుటకు, ఆయన వలె జీవించుటకు ప్రారంభించిన ఈ యౌవనస్థులు ఇప్పుడేమో ఈ ప్రఖ్యాతి గాంచిన బోధకులవలె జీవించాలనుకుంటున్నారు. వారు కూడా నమ్మకముగా ఉంటే ఒక రోజు సినీతారలవలె జీవించవచ్చును అని ఊహించుకొందురు. ఈవిధముగా పరిసయ్యులైన నాయకులు వారిని చెడగొట్టి, ప్రభువును వెంబడించకుండా అడ్డుపడి చివరకు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపనీయరు.


ఈనాడు యౌవనస్థులు అనుసరించడానికి మంచి మాదిరిగా ఉన్న దైవజనులు తక్కువగా ఉన్నారు. దురదృష్టవశాత్తు, పౌలు చెప్పిన విధముగా ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి (1కొరింథీ 11:1, ఫి¸లిప్పీ 3:17)'' అని దాదాపుగా ఏ బోధకుడు చెప్పలేకపోవుచున్నాడు. కనుక యౌవనస్థులైన మీకు నేను చెప్పేదేమనగా:


యేసును చూచి ఆయన మాదిరిని అనుసరించండి. ఒకవేళ ఎవరైనా నిజముగా యేసును వెంబడిస్తున్నట్లు మీరు చూచినట్లయితే, అప్పుడు అతని వైపు కూడా చూచి అతని మాదిరిని కూడా అనుసరించుడి.


అధ్యాయము 24
పరిసయ్యులు పేదవారిని అలుసుగా తీసుకుందురు

''అయ్యో! పరిసయ్యులారా మీరు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుదురు'' (లూకా 20:47)


పరిసయ్యులు విధవరాండ్ర ఇండ్లను ఎలా దిగమ్రింగారో మనకు సరిగా తెలియదు. బహుశా వారు ఆ విధవరాండ్రను ''దేవుని పని కోసం'' మీ ఆస్తిని ఇవ్వండి అప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు అని చెప్పి పీడించి ఉండవచ్చును. ఆ తరువాత ఆ ఆస్థిని వారు తీసుకొని అనుభవించి ఉండవచ్చును. 700 సంవత్సరముల క్రితము అన్యాయస్థులైన న్యాయాధిపతులు ఇశ్రాయేలు విధవరాండ్రను దోచుకున్నట్లుగా (యెషయా 10:2) పరిసయ్యులు విధవరాండ్రను దోచుకొనిరి.


ఇదేవిధమైన పేద ప్రజలనుండి దోచుకోవడం అనేది 21వ శతాబ్దంలో కూడా జరుగుచున్నది. ''నా పరిచర్యకు డబ్బులు పంపితే, దేవుడు నీ రోగములను స్వస్థపరచి, నిన్ను ఆశీర్వదించును''. అని చెప్పి పేద విధవరాండ్ర యొద్ద నుండి మరియు ఫింఛను తీసుకునే వారి యొద్దనుండి ఎంతో ఎక్కువ మొత్తములో డబ్బులు పొందడంలో క్రైస్తవ టి.వి. ప్రసంగీకులు ఎంతో పేరు పొందినవారు. ఎంతోమంది విధవరాండ్రు మరియు ఫింఛను తీసుకునే వారు అనేక రకమైన జబ్బులతో మరియు సమస్యలతో బాధపడుతుంటారు గనుక వీరిని ఏవిధముగా దోపిడీ చేసి వారి స్వంత లాభం కొరకు వాడుకోవాలో టి.వి. ప్రసంగీకులకు తెలుసు. వారు ప్రతివిధమైన మానసికమైన కుయుక్తులను, మరియు భావోద్వేగమైన ప్రకటనలు మరియు బైబిలు వచనములను ఉపయోగించి ఈ పేద ప్రజలనుండి డబ్బులను పిండుదురు.


అమాయకులు, పేదవారైన ఈ విధవరాండ్రు ఈ ధన వ్యామోహం కలిగిన మోసగాళ్ళను నమ్మి వారు ఎంతో జాగ్రత్తగా దాచుకొన్న ధనమును వీరికి పంపించెదరు. ఆ ధనముతో బోధకులు ఎంతో విలాసవంతముగా జీవిస్తూ ప్రైవేటు జెట్‌ విమానాలు, ఆస్తులు కొనుక్కుందురు. ఈవిధముగా పేదవారిని దోచుకోవడం అనేది అమెరికాలో ఈ మధ్యనే ప్రారంభమై, ప్రపంచములోని అన్ని ప్రాంతములలో వ్యాపించినది మరియు ఇప్పుడు భారతదేశములోని అనేకమంది బోధకులలో దీనిని చూడగలము. అటువంటి పరిసయ్యులు పగటి దొంగలు మరియు మోసగాళ్ళు.


పౌలు తన జీవితము చివరిలో ఈ విధముగా చెప్ప గలిగాడు ''మేము ఎవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు'' (2 కొరింథీ 7:2). పౌలు ఎంత గొప్ప సాక్ష్యమును కలిగియున్నాడు. ప్రతి దైవసేవకుడు తన జీవితాంతమున ఇటువంటి సాక్ష్యము కలిగియుండాలి.


పేద విశ్వాసులను ఏ విధముగానైననూ అలుసుగా తీసుకొనుట దుష్టమైనది మరియు సాతానుకు సంబంధించినది.


అధ్యాయము 25
పరిసయ్యులు దీర్ఘంగా ప్రార్ధించి, బహిరంగముగా మెప్పుకోలు ప్రార్ధనలు చేయుదురు

''అయ్యో! పరిసయ్యులారా మీరు మాయవేషముగా దీర్ఘప్రార్ధనలు చేయుదురు.


మరి విశేషముగా శిక్షపొందుదురు'' (లూకా 20:47).


సంవత్సరములు తరబడి నేను పరిశీలించాను, బహిరంగముగా ఎవరైతే ఎక్కువసేపు ప్రార్ధన చేస్తారో రహస్యముగా వారు ప్రార్ధన చేయని వారుగా ఉంటారు. వారందరు పరిసయ్యులు. ఈసారి ఒక వ్యక్తి బహిరంగముగా ఎక్కువసేపు ప్రార్ధన చేసినట్లు నీవు చూచినట్లయితే, అతడు ఒక పరిసయ్యుడని తెలుసుకో.


మనము బహిరంగముగా స్తుతించే సమయములో ప్రతి ఒక్కరూ ఒకటి లేదా రెండు నిమిషములలో స్తుతించడం ముగించాలి అని నాయకుడు చెప్పినపుడు ఆవిధముగా ప్రతి ఒక్కరూ చేయాలి. కాని పరిసయ్యులు దానిని వినరు, విధేయత చూపరు. వాళ్ళ ప్రార్ధనలు ఇతరుల ప్రార్ధనలకంటే ఎక్కువసేపు ఉండాలనుకుంటారు. దీనికి గల ఏకైక కారణమేమిటంటే, వారికి గల అహంకారము, గర్వము మరియు వారి మీద వారికున్న ఎంతో ఎక్కువ అభిప్రాయమే!


''విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింపవలెను'' ( రోమా 12:6) అని బైబిలు ప్రసంగీకులకు ఆజ్ఞాపించినది. దీని అర్ధమేమిటంటే మనము ఇచ్చే వర్తమానము యొక్క సమయము మన జీవిత పరిపక్వత చొప్పున ఉండవలెను. కాని నేను కలుసుకొన్న 90% సంఘనాయకులు ఎంతో దీర్ఘమైన, విసుకుపుట్టించే వర్తమానములు బోధించి, ఈ ఆజ్ఞకు ప్రతి ఆదివారము అవిధేయత చూపించెదరు. మరలా ఈ అవిధేయతకు గల ఏకైక కారణమేమిటంటే వారి మీద వారికున్న ఎంతో ఎక్కువ అభిప్రాయము!.


అధ్యాయము 26
పరిసయ్యులు మిషనరీ సేవచేసి ప్రజలను రెండంతల నరకపాత్రులుగా చేయుదురు

''అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు వారు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీ కంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు'' (మత్తయి 23:15)


పరిసయ్యులు మిషనరీ మనసు కలిగియుండవచ్చును, అయితే వారి ద్వారా వారి మతములోనికి వచ్చిన వారు నరకమునకు వెళ్ళెదరు, ఎందుకంటే వారిని నిజమైన మారుమనస్సు, విశ్వాసములోనికి తీసుకొనిరారు.


పరిసయ్యులు ఎంతగానో ''మతసంబంధమైన పని'' లో నిమగ్నమైయుండవచ్చును. ఇంకా ఎంతో త్యాగం చేయవచ్చును. వారు ''పూర్తి కాలపు క్రైస్తవ పనివారు'' గా కూడా అవ్వచ్చును. కాని వారి ద్వారా వారి మతములోనికి వచ్చిన వారు రెండంతలుగా నరకానికి పాత్రులవుదురు. ఎందుకంటే, వారు మారుమనస్సు పొందడం గురించి బోధించరు మరియు తమ పాప మార్గములను విడచిపెట్టని వారికి సైతం తిరిగి జన్మించాము అనే నిశ్చయతను ఇచ్చెదరు. ఎందుకనగా, వారు కేవలము విశ్వాసము ఉంచారు అనే కారణము చేత ఆవిధముగా చేయుదురు. అదేవిధముగా, ప్రజలకు మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు (నిజముగా నింపబడక పోయిననూ) అని ఒప్పింప చేయుదురు. ఎందుకంటే అది వారు కేవలము ఏవో కొన్ని వికారమైన మాటలను పలికిన కారణమును బట్టి మాత్రమే. అవి నిజమైన భాషల వరమునకు ఎంతగానో వ్యత్యాసముగా ఉండును. ఆవిధముగా జనులను నరకమునకు రెండంతల వారసులుగా చేయును. నిజానికి చెప్పాలంటే అప్పటికే వారు నరకానికి పాత్రులుగా పాపములో జీవించుచున్నారు. కాని ఇప్పుడు వారు నిత్యత్వము వరకు భద్రతలో ఉన్నారని ఒక పరిసయ్యుడైన బోధకుని చేత ఒప్పింపబడ్డారు, ఎందుకంటే వారి పాపము పట్ల వారి ప్రవర్తన ఏ మాత్రము మారకుండా ఉన్నప్పటికినీ- ''యేసు ప్రభువా నా హృదయములోనికి రమ్ము'' అనే ''మంత్రము చదివినట్లు కొన్ని మాటలను పదే పదే చెప్పారు కాబట్టి. ఇప్పుడు వారు దశమ భాగములను క్రమముగా చెల్లిస్తే పరలోకములో స్థానం ఖచ్ఛితముగా ఉంటుందని వారికి చెప్పబడెను. ఆవిధముగా వారు సువార్తకు విరోధముగా అవమానించబడ్డారు. ఎందుకంటే వారు ఇప్పుడు ఒక సువార్త వర్తమానము వింటే వారు దానికి స్పందించే అవసరం లేదని అనుకుంటారు ఎందుకంటే వారు నిత్యత్వము వరకు భద్రతగా ఉన్నారు'' కాబట్టి. ఈ రోజు ఎంత భయంకరమైన మోసం జరుగుతూ ఉంది. అనేక సంవత్సరముల నుండి మా మధ్య కూర్చుంటూ ఉన్నప్పటికినీ మా స్వంత సంఘములలోని కొన్నింటిలో ఉన్న వారితో వారు తిరిగి జన్మించలేదని చెప్పాను. అనేకమంది పరిసయ్యులైన పెద్ద సహోదరులు ఒక వ్యక్తి తిరిగి జన్మించాడా లేక తిరిగి జన్మించలేదా అని నిర్ధారించేటప్పుడు శూన్యమైన వివేకమును కలిగియుందురు. వారు అన్ని రకముల ప్రజలను వారి సంఘాలలో చేరుటకు అనుమతించుదురు మరియు తరువాత వీరే వారికి ఎన్నో సమస్యలను కలిగించుటకు కారణమవుతారు.


కొంతమంది పరిసయ్యులైన పెద్దలు పేదవారి పట్ల పక్షపాతముగానుందురు. వారు కేవలము పేదవారు అవడం వలన వారిని సంఘములో ముఖ్యులుగా అనుకొను విధముగా చేయుదురు. మరియు ఈ పెద్దలు యేసు వలె ఉన్నామని అనుకొందురు! (ధనికుల యెడల పక్షపాతముగా ఉండే బోధకులకు ఇది వ్యతిరేఖము-యాకోబు 2:1-4). ''అత్యధికమైన-ఆత్మీయులమనుకొనే పెద్దలలో'' ఈ చెడు అభిప్రాయము (పద్ధతి) ఉంటుందని దేవునికి తెలుసు. గనుక ఆయన ఇశ్రాయేలు నాయకులను ఈవిధముగా హెచ్చరించాడు, ''మీరు పేదవాని యెడల పక్షపాతముగా ఉండవద్దు అని'' (నిర్గమ 23:3). అటువంటి పక్షపాతము చూపించుట ద్వారా మరియు ఈ పేదవారిని సంఘములో ముఖ్యులుగా అనుకొనునట్లు చేయుట ద్వారా, కేవలము వారి పేదరికాన్ని బట్టి, వారు ఈ పేదవారిని నరకమునకు రెండంతల వారసులనుగా చేయుదురు. యేసు పేదవారిని ధనికులతో సమానం చేయుటకు వచ్చిన ఒక కమ్యూనిస్ట్‌ కాదు. నేను కూడా కమ్యూనిస్ట్‌ని కాదు. నేను ఒక క్రైస్తవుడిని. వారు ధనికులా లేక పేదవారా అని చూడకుండా ఎవరైతే దీనులుగా మరియు దేవుని భయం కలిగిన వారుగా ఉన్నారో వారిని నేను గౌరవిస్తాను. కాని అనేకమంది సంఘ-నాయకులు కమ్యూనిజంతో క్రైస్తవ్యాన్ని కలవర పరచుదురు.


ఒక సంఘముగా మనల్ని మనమే రెండు విధాలుగా మోసం చేసుకొనవచ్చును. ఒకటి మనము ఒక అద్భుతమైన సంఘము అని ఊహించుకొందుము. ఎందుకంటే మనము ఎంతోమంది ధనికులను, చదువుకున్న వారిని మరియు ఉన్నత స్థానములలో ఉన్న నాగరికులైన వారిని మన సంఘములో కలిగియున్నాము (కాని వారిలో అనేకులు దైవభక్తి లేనివారు). ఇంకొక విధానం ఏమిటంటే మనము ధనికులను గాని, చదువుకున్న వారిని గాని కలిగి లేము, కాని ఒకే ఒక్క పేద గుంపును, నిరక్ష్యరాసులను (కాని వారిలో అనేకులు దైవభక్తి లేనివారు) కలిగియున్నాము కాబట్టి మనము ఒక అద్భుతమైన సంఘముగా ఊహించుకొనెదము. రెండు సంఘములు కూడా బబులోనుకు సంబంధించినవి-వేర్వేరు రంగులతో. ధనికులందరూ ఆత్మీయులు కారని లేక పేదవారందరూ ఆత్మీయులని ఊహించుకోవద్దు. పేదరికము దైవ భక్తికి సమానము కాదు. మనుష్యులను రెండంతల నరకపాత్రులనుగా చేయవద్దు.


అధ్యాయము 27
పరిసయ్యులు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత లేకుండానే వాక్యమును వివరించుదురు

''అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టుపెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు-బలిపీఠము తోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు దానిపై నుండు వాటన్నిటి తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు'' ( మత్తయి 23:16-22).


పరిసయ్యులు దేవుని వాక్యమును దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత లేకుండానే వారి మనస్సులతో అర్ధము చేసుకొందురు. కనుక, వారి స్వంత ఆలోచనల చొప్పున దేవుని వాక్యమును మార్పుచేసి అవే దేవుని న్యాయవిధులుగా బోధించెదరు. ఈనాడు కూడా ఇదే విధముగా చేస్తున్న పరిసయ్యులైన బోధకులు ఉన్నారు. దేవుని వాక్యము వెనుక ఉన్న ఆత్మను అర్ధము చేసుకోకుండా, అక్షరానుసారముగా బోధించెదరు. ఆ ''అక్షరము చంపును'' (2 కొరింథీ 3:6). ఈ బోధకులు అదే మాటకు వేరే విషయములో అవిధేయతను చూపించినప్పుడు వారియొక్క అస్థిరతను (నిలకడలేనితనమును) గుర్తించరు.


ఇక్కడ ఒక ఉదాహరణ ఉన్నది. కొంతమంది సంఘనాయకులు బంగారము వేసుకొనడం అనేది పాపం అని, అది ఎంతో విలాసవంతమైనదని బోధించెదరు మరియు ఏ సహోదరియైనా బంగారము కాని నగలు వేసుకొన్నప్పటికినీ (400రూ|| వెల గల) వారిని తక్కువగా చూచెదరు. కానీ ఇదే బోధకులు లక్షల రూపాయలు ఖర్చుచేసి వారి ఇంట్లో ఎంతో విలాసవంతమైన వస్తువులను కొనెదరు. కాని వారు ఇక్కడ వారి అస్థిరతను (నిలకడలేనితనమును), వేషధారణను చూడరు. వాక్యము ఖరీదైన పాలరాతిని ఇంట్లో ఉపయోగించడం గురించి చెప్పడం లేదు గాని, బంగారు నగలు వేసుకొనడం గురించి చెప్పుచున్నదని (1తిమోతి 2:9, 1పేతురు 3:3) వారి మనస్సాక్షిని నిర్మల పరుచుకొందురు !! కాని నిజానికి వాక్యము అనవసరమైన ప్రతి సౌక్యమును వదులుకొమ్మని చెప్పుచున్నది.


ఈవిధముగా అనేక ఉదాహరణలున్నాయి. అటువంటి సంఘనాయకులు వాక్యము మీద పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను కలిగియుండరు. దానికి బదులుగా వాక్యమును వారికి అనువుగా అన్వయించుకొని ఇతరులను తీర్పు తీర్చుదురు.


అధ్యాయము 28
పరిసయ్యులు ధర్మశాస్త్రములోని అక్షరమును అంటిపెట్టుకొని యుందురు


''పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియవవంతు చెల్లించి, ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయములను విడిచిపెట్టితిరి'' (మత్తయి 23:23).


పరిసయ్యులు వాక్యములోని, ఆజ్ఞ యొక్క చిన్న చిన్న విషయములను తీసుకొని దానిని నొక్కి చెప్పుదురు. వారు ''స్వల్పమైన వాటిని పెద్దగా చేసి చెప్పుదురు''. ఈనాడు ఈవిధమైన బోధ చాలా జరుగుచున్నది. ఇటువంటి బోధ చిన్న చిన్న విషయములలో విధేయత చూపించి దానిని బట్టి గర్వించే అక్షరానుసారమైన (లీగలిస్టిక్‌) ప్రజలతో సంఘమును నింపును. కాని ఇటువంటి వారు ముఖ్యమైన విషయాలలో వారి ఘోరమైన అవిధేయతను గుర్తించేవారుగా ఉండరు. యేసు పరిసయ్యులను పుదీనాలోను, సోపులోను మొదలగు వాటిలో పదియవవంతు చెల్లించవద్దని చెప్పలేదు. ఆయన చెప్పినదేమిటంటే దేవుని వాక్యములోని ప్రాముఖ్యమైన విషయములను, పదియవ భాగము ఇచ్చుట కంటే నొక్కి చెప్పవలెనని.


ఒకసారి నేను నాలుగు సువార్తలను అధ్యయనము చేసి యేసు ప్రభువు నొక్కి చెప్పిన అంశములను వ్రాసుకున్నాను: ఆయన మారుమనస్సు, ఆత్మలో దీనత్వము, సాత్వికత, పరిశుద్ధత, పాపమును గూర్చి దు:ఖించుట, పన్నులు చెల్లించుట, తిరిగి జన్మించుట, ఆత్మలో దేవుని ఆరాధించుట, ప్రేమ, దీనత్వము, వివాహములో నమ్మకముగా నుండుట, మనుష్యుల ఆచారములను విరుగగొట్టుట మొదలగు వాటి గురించి బోధించెను. కాని ఆయన ఎప్పుడూ మనుష్యులు ఎలా వస్త్రములు ధరించుకోవాలి లేక స్త్రీలు బంగారు ఆభరణాలు ధరించుకోవచ్చా లేక స్త్రీలు తల మీద ముసుగు వేసుకొనే విషయాలను గురించి మాట్లాడలేదు. సామాన్యమైన విధానములో జీవిస్తూ మరియు ధనమును ప్రేమించకూడదని మాత్రము చెప్పెను.


తరువాత పరిశుద్ధాత్ముని చేత పత్రికలలో ఏయే అంశములను ఎక్కువగా నొక్కి చెప్పారు మరియు ఏయే అంశములను అంత ఎక్కువగా ప్రస్తావించలేదు లేక అసలు అందులో ప్రస్తావించని అంశములేమిటని నేను అధ్యయనం చేశాను.


ఆవిధముగా నా బోధలో ఎక్కువగా వేటిగురించి నొక్కి చెప్పాలి మరియు వేటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కనుగొన్నాను. నీవు కూడా ఆవిధముగా వాక్యమును అధ్యయనం చేసినట్లయితే, నీ బోధలో నీవు సమతుల్యత కలిగియుందువు మరియు ఒక పరిసయ్యుని వంటి బోధకునివి కాకుండా తప్పించుకొందువు.


అధ్యాయము 29
పరిసయ్యులు న్యాయమును, కనికరమును, విశ్వాసమును కలిగియుండరు

''పరిసయ్యులారా, ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి: వీటిని చేయవలసి ఉండెను....'' (మత్తయి 23:23).


పరిసయ్యులు ప్రజలను నిర్వహించే విషయములో ఎంతో అన్యాయముగాను, అసంబద్ధముగాను ఉందురు. పడిపోయిన వారిమీద వారు కనికరమును చూపరు మరియు వారి రహస్యజీవితములలో అపనమ్మకముగా ఉందురు. కాని వారి జీవితంలో ఇన్ని కొరతలు ఉన్నప్పటికీ, వారు చేసే ప్రార్ధనలను బట్టి, ఉపవాసమును బట్టి, వారికున్న బైబిలు జ్ఞానము, మొదలగు వాటిని బట్టి వారిని వారే ఎంతో పరిశుద్ధులుగా చూచుకొనెదరు. వారు ఏవిధముగా ఉన్నారంటే, పెండ్లికుమార్తె తన వివాహమునకు వెళ్ళుచున్నప్పుడు తన వస్త్రములన్నీ మురికిగా ఉన్నను, తాను మాత్రం వినయముగా నడుస్తున్నాను అనే దానిమీదే దృష్టి పెట్టినట్లుగా ఉన్నారు.


మనము కూడా మన జీవితాలలో స్వార్ధము, గర్వము, కనికరము లేకుండుట, విశ్వాసము లేకుండుట ఇట్టి వాటిని కలిగియుండి, మనము చేసే మతసంబంధమైన కార్యములను బట్టి అతిశయపడి, మనము ఆత్మీయముగా ఉన్నాము అనుకుంటే మోసపోయినట్లే. మొట్టమొదట మనము క్రైస్తవ జీవితములో ప్రధానమైన విషయములు గుర్తించి-వాటి మీద దృష్టియుంచవలెను.


అధ్యాయము 30
పరిసయ్యులు దోమలు లేకుండునట్లు వడియగట్టి ఒంటెలను మ్రింగుదురు

''అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే'' (మత్తయి 23:24).


పరిసయ్యులు అంత ప్రాముఖ్యతలేని చిన్న విషయములలో ఎంతో జాగ్రత్తగా నుందురు (చనిపోయిన దోమలను వడగట్టుట). కాని దేవుని వాక్యములోని ఆజ్ఞ్ఞలకు విధేయత చూపుటకు నిర్లక్ష్యము చేయుదురు (చనిపోయిన ఒంటెలను మ్రింగుట). అంటే ఇక్కడ చనిపోయిన దోమలను మ్రింగడం మంచిదే అని యేసు క్రీస్తు ప్రభువు పరిసయ్యులకు చెప్పడం లేదు. ఎంతో ప్రాముఖ్యమైన విషయములను నిర్లక్ష్యం చేయుటలో వారి అస్థిరతను(నిలకడలేనితనమును) వారికి చూపించుచున్నాడు.


అటువంటి పరిసయ్యులు సంఘమునకు వెళ్ళేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించుకొనుట, లేదా వారి ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకొనే చిన్న విషయాలలో జాగ్రత్తగా ఉందురు. ఇవి మంచి అలవాట్లే కాని మనము ఇంకా ప్రాముఖ్యమైన విషయాలకొస్తే-కోపాన్ని, మోహపు చూపులను జయించే విషయంలో దేవుణ్ణి తీవ్రంగా వెదకడం, లేదా సంఘంలో జరిగే కార్యక్రమములలో సహాయము చేయుట, లేదా ప్రజలను క్రీస్తు యొద్దకు తీసుకుని రావడానికి గ్రామాలకు ప్రయాణము చేయుట ఇలాంటి విషయములలో వారు అంత ఆసక్తి కనబరచరు. ఎందుకంటే ఇవి చేయాలంటే వారి సౌకర్యములను, డబ్బును, సమయమును త్యాగం చేయాలి.


మెసేజ్‌ బైబిలు తర్జుమాలో ఈ వాక్యము ఈలాగు ఉన్నది. మీరు ఎంత హాస్యాస్పదముగా కనబడుచున్నారో మీకు అర్ధమవుతుందా? ''మొదటి నుండి చివరిదాకా జీవితచరిత్ర తప్పు వ్రాస్తూ కామాలు, సెమికోలన్‌లు జాగ్రత్తగా చూస్తున్నారు''. బెంగుళూరులో బైబిలు జ్ఞాపక పోటీలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది క్రౖౖెస్తవులు కేవలం కొన్ని వందల రూపాయలు గెల్చుకోవడానికి పాల్గొంటారు. ఆ బహుమతి పొందాలంటే, వాక్యభాగములోని పదాలన్నీ సరిగా వ్రాయడమే కాదు, అందులో ఉన్న కామాలు, సెమికోలన్‌లు కూడా సరియైన స్థానంలో వ్రాయాలి. కొంతమంది విశ్వాసులు ఈ కామాలు,సెమికోలన్‌లు సరియైన స్థానంలో వ్రాయడానికి వారాల తరబడి సిద్ధపడి జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ బహుమతి గెలవడానికి. కాని ఈ సమయమంతటిలో దేవుని వాక్యమునకు వారి గృహములలో అవిధేయత చూపిస్తూ జీవించెదరు. కాని అది వారిని ఇబ్బంది పెట్టదు. అటువంటి బైబిలు పోటీలలో నీవు మొదటి బహుమతి గెలుచుకొనవచ్చును. కాని నీవు ఇంకా పరిసయ్యులలో మొదటి తరగతి పరిసయ్యుడవుగా ఉండవచ్చును. సువార్త యొక్క గురి మరియు దాని అంతిమ లక్ష్యము ప్రేమయే(ప్రేమయైయున్నది) (1తిమోతి 1:5). పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించుట మరియు క్రీస్తు మనలను ప్రేమించునట్లుగా తోటి సహోదరులను ప్రేమించడము. ఈ ప్రేమను మనము వెంటాడినట్లయితే, క్రైస్తవ జీవితములోని అతి ప్రాముఖ్యమైన విషయములను సహజముగా మనము తెలుసుకొంటాము.


అధ్యాయము 31
పరిసయ్యులు బయటకు మంచి సాక్ష్యము కలిగియుండే దాని మీద శ్రద్ధ కలిగియుందురు

''అయ్యో, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము'' (మత్తయి 23:25,26).


పరిసయ్యులు వారి జీవితములో బాహ్యముగా కనబడే వాటినే శుద్ధి చేసుకొనెదరు. కాని వారి హృదయములు ఏ స్థితిలో ఉన్నవో పట్టించుకొనరు. అవి స్వార్ధముతోను, వ్యామోహముతోను నిండియుండును. వారు స్వార్ధపూరితమైన ఉద్దేశములతో, వారు వారి కుటుంబము ఎక్కువ డబ్బును, ఘనతను, సుఖసౌఖ్యాలను ఎలా పొందాలో ఆలోచిస్తూ జీవించుదురు. కాని బయటకు చూచుటకు వారు ఎంతో ఆసక్తి కలిగియున్నట్లుగా, మత సంబంధులుగా మరియు అన్ని పరిచర్యలలో ఇతర క్రైస్తవులు చూసే విధముగా పాల్గొందురు. ఆవిధముగా ప్రజల ముందు మంచి పేరు తెచ్చుకొందురు.


మనము దేవుని ఆమోదం పొందడానికి చూస్తున్నామా లేక మనుష్యుల ఆమోదం పొందడానికి చూస్తున్నామా అని మనలను దేవుడు పరీక్షిస్తాడు. ఒక వ్యక్తి తన హృదయములోని అపవిత్రత విషయములో నిర్లక్ష్యముగా ఉంటాడు కాని మనుష్యుల యెదుట మంచి సాక్ష్యము కలిగి ఉండాలని ఆసక్తి కలిగి ఉంటాడు. ఇది దేవుని భయము ఆ వ్యక్తిలో లేదని ఋజువు చేయుచున్నది. అతడు పరిసయ్యుడే. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టును గాని దేవుడు మన హృదయములను లక్ష్యపెట్టును (1 సమూయేలు 16:7). ఒక దైవజనుని యొక్క ప్రాధమిక గుర్తు ఏమిటంటే అతడు తన హృదయమును దేవుని ఎదుట ఎల్లప్పుడూ పరిశుభ్రముగాను, పవిత్రముగాను ఉంచుకొనుటకు చూస్తాడు.

అధ్యాయము 32
ఇతరులు చేసిన చెడు విషయములలో మేము పాలివారమై ఉండకపోదుము అని పరిసయ్యులు చెప్పుదురు

''పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండిన యెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు'' (మత్తయి 23:29,30).


పరిసయ్యులు ఇతరుల పాపములు, ఓటములు చూచి ''మేము ఈవిధముగా చేసి ఉండేవారము కాదు. మేము ఈవిధముగా వస్త్రములు ధరించేవారము కాదు. మేము ఈవిధముగా ప్రవర్తించి ఉండేవారము కాదు. మేము ఈవిధముగా మాట్లాడేవారము కాదు'' అని చెప్పుదురు.


ఎంతో శ్రేష్టమైన క్రైస్తవులు ప్రతియొక్క ఆదాము సంతానము కలిగి ఉన్న చెడిపోయిన శరీర స్వభావమును కలిగియున్నారని మనము గుర్తించవలెను. తమ స్వంత చెడిపోయిన శరీర స్వభావమును పరిసయ్యులు గుర్తించరు. ఎవరు చేసిన పాపమైననూ, ఏ పాపమైననూ తను కూడా చేయగలడు అని ఒక దైవజనుడు గుర్తెరుగును. ఎన్నో పాపములను చేయకుండా కేవలము దేవుని కృప మాత్రమే తనను కాపాడిందని ఒక దైవజనుడు గుర్తెరుగును. దేవుని పరిశుద్ధుడైన ఒక పూర్వీకుడు ఒక దొంగను ఉరితీయడానికి తీసుకువెళ్ళడం చూచి ఈవిధముగా చెప్పెను. ''ఒకవేళ దేవుని కృప లేనట్లయితే నేను కూడా అక్కడ ఉండేవాడను''. ఆ పరిశుద్ధుడు దేనిని పొందుకోడానికైతే తన హృదయమును తెరిచాడో ఆ దేవుని కృప యొక్క నియంత్రించే శక్తి లేనట్లయితే ఆ దొంగ ఏవైతే నేరాలు చేశాడో అందులోని ప్రతీది నేను కూడా చేసే వాడనని అతడు గుర్తించాడు. ప్రతీ దైవజనుడూ దానిని గుర్తిస్తాడు. కాని ఒక పరిసయ్యుడు దీనిని ఎప్పుడూ అంగీకరించడు.


అధ్యాయము 33
పరిసయ్యులు దేవుని ప్రవక్తలను హింసించుదురు

''అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు; కొందరిని మీ సమాజ మందిరములలో కొట్టి, పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును'' (మత్తయి 23:34-35).


ఒక ప్రవక్తయొద్దనుండి సత్యమును విన్నప్పుడు పరిసయ్యులు అభ్యంతర పడుదురు. కాబట్టి ఏదో ఒక విధముగా అటువంటి బోధకులను వారు హింసించుదురు. వారిని పొగిడే బోధకులను వారు ఇష్టపడుదురు కాని వారిని గద్దించి, సరిచేసే వారిని ద్వేషించుదురు. పాతనిబంధనలోని ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు వారి పాపములను గూర్చి వారి ముఖముల మీదనే చెప్పెను. ఆవిధముగా చెప్పిన ప్రవక్తలందరూ హింసింపబడ్డారు, కొందరైతే చంపబడ్డారు. ఒక దైవజనుడు నిన్ను గద్దించినపుడు లేక సరిచేసినపుడు నీవు అభ్యంతర పడినట్లయితే, నీవు కూడా ఒక పరిసయ్యుడవనుటకు ఎంతో అవకాశం ఉంది.


అధ్యాయము 34
పరిసయ్యులు ప్రజల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చుదురు

''యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా?'' అని వారినడిగెను. వారు-మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన ఆలాగైతే మీరెందుకతని నమ్మలేదని మనలనడుగును; ''మనుష్యుల వలనని చెప్పితిమా'', జనులకు భయపడుచున్నాము; అందరూ యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని ''మాకు తెలియదని'' యేసునకు ఉత్తరమిచ్చిరి (మత్తయి 21:25-27).


పరిసయ్యులు ఒక విషయములో ఖచ్ఛితముగా నిలబడినట్లయితే వారి గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఎప్పుడూ శ్రద్ధ కలిగియుందురు. దేవుని వాక్యము ఏమి చెప్పెనో దాన్ని బట్టి కాక వారి చుట్టూ ఉన్న జనులు వారి గురించి ఏమనుకుంటారో అనే దానిని బట్టి వారి ఒప్పుదలలు కలిగియుంటారు. వారు రోమీయుల యొక్క లేక గ్రీకుల యొక్క అభిప్రాయములను పట్టించుకోరు కాని వారి యొక్క సహచర యూదుల యొక్క అభిప్రాయములను పట్టించుకొందురు.


నీవు నీ మనస్సాక్షి ప్రకారముగా సరియైన విషయాన్ని (పనిని) చేసే దాని కంటే ఎక్కువగా నీ సంఘములో ఉన్న వారు నీ గురించి ఏమనుకుంటారోనని శ్రద్ధ కలిగియున్నట్లయితే, అప్పుడు నీవు ఒక పరిసయ్యుడవు. అనేకమంది బోధకులు వారి సంఘములో ఎవరి యొక్క దయను వారు కోరుకుంటారో అటువంటి గుంపును సంతోషింప జేసే విషయములను చెప్పుదురు మరియు చేయుదురు. అనేక మంది విశ్వాసులు వారి పిల్లలు దేవుని మహిమ కొరకు కాక తల్లిదండ్రులుగా వారి ఘనత కోసం సరిగా ప్రవర్తించాలని కోరుకొందురు. ఆవిధముగా వారు ఎన్నో హాస్యాస్పదమైన నియమములను వారి పిల్లలకు పెట్టుదురు, మరియు వారిని ''టిన్‌ సైనికుల వలె'' నటించునట్లు చేయుదురు.


1987లో, నా పెద్ద కుమారుడు పాఠశాల (స్కూలు) విద్యను ముగించుకొనెను మరియు రెండు కళాశాలల్లో ప్రవేశము పొందెను.భారత దేశములోని ఐ.ఐ.టిలో మరియు అమెరికాలోని ఒక మంచి కళాశాలలో (స్కాలర్‌షిప్‌తోనే). అతడు అమెరికాలోని కళాశాలకు వెళ్ళుటకు ప్రాముఖ్యతనిచ్చానని నాతో చెప్పినప్పుడు ''మంచిది నేను నిన్ను అక్కడికి పంపుదును'' అని చెప్పాను. (ఈ రోజు భారత దేశములోని మన సంఘములలో నుండి అనేక మంది యౌవనస్థులు అమెరికాకు వెళ్ళారు. కాని 1987లో, మన సంఘములలో అలాంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. అప్పుడు అనేక మంది సహోదరుల మనస్సులలో ఒక విధమైన పరిసయ్యుని ఆలోచన ఉండేది అదేమిటంటే ''భారత దేశములోని ఆత్మీయమైన మనస్సు కలిగిన వారు విదేశాలకు వెళ్ళరు లేక వారి కుమారులను విదేశాలకు అరేబీయుల యొక్క గల్ఫ్‌ దేశములకు లేక అమెరికాకు పంపరు). కాబట్టి నా కుమారుడు నేనతనిని పంపుటకు ఒప్పుకున్నప్పుడు ఆశ్చర్యపడి ఈవిధముగా అడిగెను, ''నీవు నీ కుమారుణ్ణి అమెరికాకు పంపించావని మన సంఘములలోని వారు విన్నప్పుడు వారేమనుకొందురు?''. కాని పరిసయ్యులు విధించిన నియమముల ప్రకారము నా పిల్లలు జీవించునట్లు నేను ఒప్పుకోను. క్రీస్తులోని స్వాతంత్య్రములో వారు జీవించాలని నేను కోరుకున్నాను. కాబట్టి నేను అతనితో ఈవిధముగా చెప్పాను, ''అది మాత్రమే నేను ఇతరుల యొక్క అభిప్రాయముల నుండి స్వతంత్రునిగా ఉన్నానో లేదోనని పరీక్షించగలదని''.


ఆసక్తికరముగా, కొంత మంది ఎవరైతే నా కుమారుణ్ణి అమెరికాకు పంపించే విషయములో విమర్శనాత్మక ధోరణితో ఉన్నారో, కొన్ని సంవత్సరాల తరువాత వారి స్వంత పిల్లలను అమెరికాకు పంపించారు. పరిసయ్యులు ఆవిధముగానే ఉందురు: వారు ఎంతో కఠినమైన నియమములను ఇతరులకు బోధించుదురు, కాని వారి స్వంత కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ నియమములను మార్చివేస్తారు. వారి కుటుంబ సభ్యుల యెడల పక్షపాతము చూపించు విషయములో పూర్తిగా విడుదల పొందిన వారిని చివరకు సంఘ-పెద్దలలో కూడా కనుగొనగలగడము చాలా అరుదు.


మనము ఇతరుల యొక్క అభిప్రాయముల యందు శ్రద్ధ కలిగియుండినట్లయితే, మన పిల్లలను లోకములో కోల్పోగలము. నీ సంఘములో ఉన్న పరిసయ్యులైన పెద్దలు పెట్టిన బుద్ధిహీనమైన, అక్షరానుసారమైన(లీగలిస్టిక్‌) నియమాలను వినుట ద్వారా, నీ పిల్లల భవిష్యత్తును పాడు చేయవద్దు.


''నేను లోకమునకు సిలువ వేయబడియున్నాను. ఇతరులను సంతోషపెట్టే ఊపిరాడకుండా చేయు వాతావరణము నుండి మరియు వారు నియంత్రించే చిన్న చిన్న ధోరణుల నుండి విడుదల పొందియున్నాను'' (గలతీ 6:14 మెసేజ్‌ బైబిల్‌) అని పౌలు చెప్పెను. జనులను సంతోషపరచుటకు చూచుట అనేది ఒక చెడ్డ వాసనతో నిండిన గదిలో నివసించటం వంటిది. బయటకు వచ్చి, క్రీస్తులో ఉన్న స్వాతంత్య్రము యొక్క తాజా గాలిలో నివసించుము.


అధ్యాయము 35
పరిసయ్యులు ధనాపేక్ష కలిగియుందురు

''ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు'' (లూకా 16:14)


మనము పరిసయ్యులను గూర్చి ఆలోచించినప్పుడు, సాధారణముగా పరిసయ్యులకు ధనాపేక్షను జతచేయము. కాని నిజానికి ఒక వ్యక్తి పరిసయ్యుడనుటకు ధనాపేక్ష స్పష్టమైన గుర్తు. నీకు ఇతర 49 పరిసయ్యుల లక్షణాలు లేకపోయినప్పటికినీ, కేవలము ఈ ఒక్కటి ఉన్నా నీవు పరిసయ్యుడవే. పరిసయ్యులు ధర్మశాస్త్రములోని చిన్న నియమములను పట్టి పట్టి చూస్తుంటారు కాని డబ్బు విషయానికి వచ్చేసరికి దానిని ఎంతగానో ప్రేమిస్తారు. యేసు క్రీస్తు ప్రభువు ''మీరు దేవునిని సిరిని (భౌతిక సంపదను) ప్రేమించలేరు'' అని (లూకా 16:13) లో చెప్పెను.


పరిసయ్యులు పైన చెప్పిన దానికి అపహసించిరి(వ.14), ఎందుకంటే వారు ధనాపేక్ష గలవారు మరియు వారు దేవునిని కూడా ప్రేమిస్తున్నామని అనుకొన్నారు. ఒక విశ్వాసి భౌతికమైన సంపదను (ఎంత మొత్తములోనైననూ) తన దాసునిగా వాడుకొనవచ్చును గాని ఎప్పుడైతే దానిని ప్రేమించడం మొదలు పెడతాడో, అప్పుడు ఒక పరిసయ్యునిగా అవుతాడు. దేవుడు భౌతిక సంబంధమైన వస్తువులను ఉపయోగించుకోవడానికి, ప్రజలను ప్రేమించడానికి మనకు ఇచ్చాడు. సాతాను మానవులలో దీనికి వ్యతిరేఖముగా చేయుటకు విజయం సాధించెను. దీనిని బట్టి మానవులు భౌతిక వస్తువులను ప్రేమిస్తున్నారు, ప్రజలను (తమ స్వంత లాభము కొరకు) ఉపయోగించుకుంటున్నారు. యేసు ప్రభువు తలక్రిందులుగా ఉన్న దానిని సరిచేయుటకు వచ్చారు-కాబట్టి మనము ప్రజలను ప్రేమించి వస్తువులను (ప్రజలను ఆశీర్వదించుటకు) ఉపయోగించుకొందుము. దైవజనులు ఎన్నో వస్తువులను ఉపేక్షించారు, దీనిని బట్టి ఆ వస్తువుల ద్వారా ప్రజలకు సహాయపడ్డారు. ఆవిధముగానే యేసు జీవించాడు.


చిన్న చిన్న నియమములను ఇతరులకు విధించి వాటిని అంటిపెట్టుకొని ఉండే ఎంతోమంది బోధకులు, వారే ఎంతో ధనాపేక్ష గలవారు. వారి కోసం ఇంకా డబ్బు సంపాదించడానికి సంఘములో వారికున్న బాధ్యతలను కూడా నిర్లక్ష్యం చేస్తారు-ఎందుకంటే వారు పరిసయ్యులు వారి మనస్సులు ఎల్లప్పుడూ ధనము మీదే ఉంటాయి.


అధ్యాయము 36
ఇతరుల కంటే తామే శ్రేష్టులమని పరిసయ్యులు అనుకొందురు

''తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్ధన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు... నేను ఇతర మనుష్యుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్ధించుచుండెను'' (లూకా 18:9-11).


ఈ ఉపమానములో ఇంతకీ పరిసయ్యుడు దేవునికి ప్రార్ధించలేదు. తనకు తానే ప్రార్ధించుకొనెను (వ.11) అని గమనించగలము. ఇతరులంటే తను శ్రేష్టముగానున్నానని తన హృదయములో దేవునికి కృతజ్ఞతలు చెప్పెను. అతడు గట్టిగా బయటకు చెప్పలేదు. ఎందుకంటే ఆవిధముగా చేస్తే తను దీనుడనే గౌరవమును పోగొట్టుకొనును.


ఉదాహరణకు, ఒకరోజు ఎవరైనా తన నిగ్రహమును కోల్పోయి నీ మీద కోప్పడ్డారు. కాని నీవైతే నిగ్రహించుకొని మౌనముగానున్నావు. అప్పుడు నీలో నిన్ను నీవే రహస్యముగా అభినందించుకుంటూ ఈలాగు చెప్పుచున్నావు. ''ప్రభువా, నేను ఈ మనుష్యుని వలె ఉండనందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నేను ఆశానిగ్రహము కలిగియున్నందుకు కృతజ్ఞతలు.'' నీవు ఆ క్షణములో ఆ పరిసయ్యుడు చేసిన అదే ప్రార్ధనను చేశావు. ఆ మనుష్యుడు ''కోపము'' అనే 10 అడుగుల గుంతలో పడ్డాడు. కాని నీవైతే ''ఆత్మీయ గర్వము'' అనే ఇంకా లోతైన 1000 అడుగుల గుంతలో పడ్డావు. మీలో ఎవరు హీనముగా ఉన్నారు? ఆ వ్యక్తి తన కోపమును గూర్చి ఒప్పించబడి, తరువాత మారుమనస్సు పొంది ప్రభువు యొద్దకు తిరిగి వచ్చును. కాని నీవైతే నీ స్వనీతిని ఎప్పటికీ చూడలేవు-కాబట్టి నీ ఆత్మీయ గర్వమును బట్టి మారుమనస్సు పొందవు. చివరకు దేవుని దృష్టిలో, ఆ వ్యక్తి నీ కంటే శ్రేష్టుడుగా నుండును.


ఆత్మీయ గర్వము అనేది ఒక ఉల్లిగడ్డ వంటిది. ఒక పొరను నీవు తొలగించినప్పుడు, దానితో ముగించితివి అని నీవు అనుకొందువు. కాని దాని క్రింద ఇంకొక పొర ఉంటుంది-మరియు దాని క్రింద ఇంకొకటి మరియు ఇంకా దానిక్రింద ఇంకొక పొర-ఆ విధముగా ఉంటూనే ఉండును. భూమి మీద మన జీవితాలలో నుండి ఆత్మీయ గర్వమును ఎప్పటికినీ పూర్తిగా తొలగించుకోలేము. కాని ఇతరులను తీర్పు తీర్చుట కంటే-నమ్మకముగా మనల్ని మనము తీర్పు తీర్చుకొంటే, ఉల్లిగడ్డను ఎంతో సన్నగా చేయగలము.


ఆత్మీయ గర్వము కూడా చాలా పరోక్షముగానుండును (ప్రత్యక్షముగా కాక) మరియు దీనత్వము అను వస్త్రములు ధరించుకొని ఉండును!! ఒక సండేస్కూల్‌ ఉపాధ్యాయురాలు (టీచర్‌) పరిసయ్యుడు మరియు సుంకరి కథను పిల్లలకు బోధిస్తూ ఉంది. కథ చివరిభాగములో ఆమె ఈవిధముగా చెప్పెను (పరిసయ్యుని మాటలు ఏ విధముగా ఉన్నాయో అదే విధమైన మాటలతో), ''పిల్లలూ, పరిసయ్యునిలాగా మనము లేనందుకు దేవునికి వందనములు చెప్పండి''!! దానికి మనం నవ్వి ఈవిధంగా చెప్పుదుము ''మనం సండేస్కూల్‌ టీచర్‌ లాగా లేనందుకు దేవునికి వందనములు.''!! అవును, ఆత్మీయగర్వము నిజముగా ఉల్లిగడ్డలాంటిదే.


క్రీస్తు తిరిగి వచ్చువరకు మరియు మనము ఆయనవలె మారువరకు, గర్వము మరియు స్వార్ధము అనే ఈ రెండు పాపముల నుండి ఎప్పటికినీ పూర్తిగా విడుదల పొందలేము. ఈ పాపములు లెక్కించలేని పొరలు గల ఉల్లిగడ్డలను పోలియున్నవి. మనలో ఉన్న వీటిలో ఏదైనా ఒకదానియొక్క పొరను చూచి వీలైనంత త్వరగా మనల్ని మనం శుద్ధిచేసుకొన్నట్లయితే, ఈ ఉల్లిగడ్డల పరిమాణమును క్రమముగా తగ్గించగలం. క్రీస్తురాకడకు ముందే, ఈ ఉల్లిగడ్డలను సాధ్యమైనంత సన్నగా చేయడమే మన కోరికగా ఉండాలి. నీవు దానిని చేస్తూ ఉన్నట్లయితే, సరియైన మార్గములోనే ఉన్నావు-మరియు నీవు ఎప్పటికీ పరిసయ్యుడవు కావు.


అధ్యాయము 37
పరిసయ్యులు వారి యొక్క స్వనీతియందు నమ్మికయుంచుదురు

''తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొను కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను'' (లూకా 18:9)


విశ్వాసము వలన కలుగు నీతి ఉంది, అది దేవుని యొద్దనుండి వచ్చు బహుమానము. మరియు మనంతట మనమే కలుగజేసుకొనే నీతి ఉంది. నీవు ఏ నీతిని కలిగియున్నావో తెలుసుకోవాలంటే నీ నీతిని బట్టి గర్విస్తున్నావా అని నీవు ప్రశ్నించుకొనవలెను. ఒకవేళ అలా అయితే, దానిని ఖచ్ఛితముగా నీవే కలుగజేసుకొనియుంటావు. దేవుని యొద్దనుండి బహుమానముగా పొందిన ఆయన నీతిని నీవు కలిగియుండినట్లయితే, నీవు దానిని బట్టి కృతజ్ఞుడవుగాయుండి ఉండెదవు. కాని దాన్ని బట్టి గర్వించియుండే వాడవు కాదు. పరిసయ్యులు గర్వించే నీతిని కలిగియున్నారు.


నీవు వ్రాసిన పుస్తకమును బట్టి నీవు గర్వించవచ్చు. కాని ఎవరో ఒకరు వ్రాసిన పుస్తకమును బట్టి నీవు గర్వించలేవు. కాబట్టి నీ జీవితములో నీవు కలిగియున్న ఒక మంచి గుణమును బట్టి నీవు గర్వించుచున్నట్లయితే-అది దీనత్వము, లేక దాతృత్వము, లేక ఎక్కువగా ప్రార్ధనలో గడుపుట, లేక ఏమైనా కావచ్చు. నీయంతట నీవే దానిని కలుగజేసుకొనియుంటావు. నీవు దాతృత్వము కలిగి మరియు ఆతిథ్యమిచ్చే వాడిగా ఉండి, దాన్ని బట్టి నీవు గర్వముగా ఉండినట్లయితే, ఆ లక్షణములు కేవలము మనుష్యుల లక్షణములు కావచ్చు, కానీ దైవ స్వభావము కాదు. ఎందుకనగా అవి దేవుడు నీకు ఉచితముగా ఇచ్చిన ఆయన స్వభావములోని భాగములైనట్లయితే వాటిని గూర్చి ఎలా గొప్పలు చెప్పుకొనగలవు? ఆతిథ్యమివ్వడం అనేది ఒక మంచి గుణం, కాని నీవు దాని యందు గర్విస్తే, దేవుని యెదుట నీ ఆతిథ్యము కుళ్ళు కంపు కొట్టును.


ఈ నియమము నీతితో సంబంధం లేని వేరే విషయాలకు కూడా అన్వయించబడును-ఇతరులకంటే నీవు బాగా పాడగలవేమో, లేక ఒక వాయిద్యమును బాగా వాయించగలవేమో, లేక బాగా బోధించగలవేమో లేక బహుశా నీ సంఘము వేరే వారి యొక్క సంఘముకంటే పెద్దది కావచ్చును. మరి దేనిని బట్టి అయినా నీవు గర్వించుచున్నట్లయితే అది నీ స్వంత శ్రమ యొక్క ఫలితము. ఇది దేవుని యొక్క పని అయితే, దీన్ని గూర్చి నీవు గర్వించలేవు.


ప్రభువు కోసం వారు చేసిన త్యాగములను గురించి అనేక మంది గొప్పలు చెప్పుకుంటారు. అది, వారి కొరకు యేసు చేసిన త్యాగము యొక్క తీవ్రతను వారు స్పష్టముగా చూడలేదన్నట్లుగా చేయును. సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఒక్క నక్షత్రమునైనా నీవు చూడగలవా? లేదు. ఎప్పుడైతే కలువరిలో యేసు చేసిన త్యాగము మన మనస్సులలో సూర్య తేజస్సు వంటి తేజస్సుగా మారుతుందో, అప్పుడు పగటివేళ నక్షత్రాల వలే మన యొక్క చిన్న చిన్న త్యాగములన్నీ మాయమగును మరియు ఇక ఎన్నడూ వాటిని త్యాగాలు అని కూడా మనము పిలువము. నీ త్యాగాలన్నీ నీవు గుర్తుంచుకొనగలిగితే, నీవింకా చీకటిలోనే ఉన్నావు.ఎందుకంటే రాత్రిపూట మాత్రమే మనము నక్షత్రాలను చూడగల్గుతాము.!!


విశ్వాసముతో, దీనత్వముతో రమ్ము మరియు క్రీస్తులో దేవుడు నీకనుగ్రహిస్తున్న దేవుని నీతిని పొందుకొనుము-మరియు నీ జీవితకాలమంతా దాని కొరకు సమస్త మహిమను ఆయనకు చెల్లించు. అప్పుడు నీవు ఎన్నటికినీ పరిసయ్యుడవు కావు.


అధ్యాయము 38
పరిసయ్యులు ఇతరులను తృణీకరించెదరు

''ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానమును చెప్పెను'' (లూకా 18:9)


ప్రజలు ఇతరులను తృణీకార భావముతో చూచుటకు వేర్వేరు కారణాలున్నాయి. వారు సాంఘిక స్థాయిలో తక్కువగా ఉన్నవారిని, లేక ఆస్తిపరంగా లేక చదువులో తక్కువ మొదలైన వారిని చిన్న చూపు చూచుటను వారి చిన్నతనము నుండి తమ తల్లిదండ్రుల చేత బోధింపబడియుండవచ్చును. లేక నీవు చాలా తెలివిగల్గిన వాడుగా మరియు స్కూలులో నీ తరగతిలో ప్రథముడుగా ఉండినట్లయితే, నీ తరగతిలో ఉన్న ఇతరులను తక్కువ చేసి చూడటం నీవు మొదలు పెట్టవచ్చు. దానికి తోడు నీవు ఎంతో జ్ఞానవంతుడవని నీవు ఊహించుకొనేటట్లు చేసే బుద్ధిహీనమైన తల్లిదండ్రులను కలిగియుండినట్లయితే నీవు చాలా దురదృష్టవంతుడవు, అప్పుడు సంగతులు ఇంకా నీచముగా ఉండును.


తల్లిదండ్రులందరితో నన్ను ఈ విజ్ఞప్తి చేయనివ్వండి : పిల్లలు తెలివిగలవారైనట్లయితే, వారి గురించి గొప్పలు చెప్పుట చేత దయచేసి వారిని నాశనం చేయవద్దు. నా కుమారులను తరగతిలో వారి ర్యాంక్‌ గురించి లేక వారు పొందిన బహుమతులను గురించి ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరితోను చెప్పవద్దని నా గృహములో దానిని ఒక నియమముగా పెట్టాను. వారు గర్విష్టులుగా అయితే, వెంటనే దేవుని కృపను కోల్పోదురని నాకు తెలుసు. అప్పుడు వారు పాపములో పడుదురు మరియు సామాన్యమైన సహోదరులతో సహవాసమును ఎప్పటికినీ చేయలేకపోవుదురు. ఆవిధముగా అనేకమంది తల్లిదండ్రులు వారి పిల్లలను నాశనము చేశారేమోనని భయపడుతున్నాను.


మంచి ఉచ్ఛారణతో ఇంగ్లీషు (లేక వారి మాతృభాష ఏదైనా) మాట్లాడలేని ఒకరిని చూచి అపహాస్యం చేయడం పిల్లలలో ఉండే ఒక సామాన్యమైన అలవాటు. నీ గృహములో దానిని ప్రోత్సహించకుండా జాగ్రత్త పడుము. మనలో ఎవరమైనా మన తల్లి గర్భములలో నుండి ఒక మంచి ఉచ్ఛారణతో మాట్లాడుతూ బయటకు వచ్చామా? మనము కల్గియున్న ప్రతి సామర్ధ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెల్పవలెను. కాని దాన్ని బట్టి ఎన్నడూ గర్వించకూడదు. పరలోకములో వారు ఏ ఉచ్ఛారణతో మాట్లాడుదురో నీకు తెలుసా? దీనత్వము మరియు ప్రేమ అనే ఉచ్ఛారణలు.ఆ ఉచ్ఛారణలను స్పష్టముగా మనము నేర్చుకుందాం.


బహుశా, నీ గృహమును మచ్చలేని పరిశుభ్రతతో, ప్రతీ వస్తువును దాని సరియైన స్థానములో ఉంచే ఒక స్త్రీగా నీవు ఉండవచ్చును. అప్పుడు నీవు ఇంకొకరి గృహము మురికిగా మరియు అస్తవ్యస్తముగా ఉండుట చూచి నీవు ఆమెను తృణీకరించెదవు. అప్పుడు నీవు ఒక పరిసయ్యురాలవు. అదే సమయములో ఎవరి గృహమైతే మురికిగా ఉన్నదో ఆ వ్యక్తి ఒక వేళ దైవభక్తిని కలిగి ఉండవచ్చును.


కొంతమంది సహోదరులు ఎంతో తక్కువ సంగీత పరిజ్ఞానమును కలిగియుందురు. మరియు వారు సంఘములో బహిరంగముగా స్తుతించే సమయములో ఒక పల్లవిని పాడటం మొదలుపెడితే, వారు ఎంతో వ్యత్యాసముగా ఉండే తప్పు రాగమును పాడుదురు. వారిని తృణీకరించవద్దు. ఎందుకనగా దేవుడు సంగీతమును వినడు. ఆయన మాటలను వింటాడు. మరియు సరియైన రాగముతో పాడుచున్న నీకంటే తప్పు రాగముతో పాడుచున్న ఆ సహోదరుడు ఎక్కువ నిజాయితీ గలవాడు కావచ్చును. వ్యక్తిగతముగా, అటువంటి సహోదరులను బట్టి నేను దేవునికి వందనములు తెలిపాను, ఎందుకంటే వారు సంఘములో ఉన్న సంగీత పరిజ్ఞానము గల వారందరిని దీనులుగా చేస్తారు. సంఘమును నాశనము చేసేది పరిసయ్యతత్వము గలిగిన సంగీత విద్వాంసులే కాని సంగీత పరిజ్ఞానము లేని సహోదరులు కాదు. దేవుడు సంగీత పరిజ్ఞానము లేని సహోదరులను, వేరే ఎవరినైనా ఎంత ప్రేమిస్తున్నాడో అదే విధముగా ప్రేమిస్తున్నాడు-కాని ఆయన పరిసయ్యులను తిరస్కరించును. ప్రభువు తిరిగి వచ్చునప్పుడు అటువంటి పరిసయ్యుల కోసము ఎన్నో ఆశ్చర్యములు ఎదురు చూస్తున్నవి.


మీరు మీ తరగతిలో మొదటి స్థానములో రాకూడదని, లేక మీ గృహమును పరిశుభ్రముగా పెట్టుకోవద్దని, లేక సరియైన రాగములో పాడవద్దని నేను చెప్పుట లేదు. ఎంతమాత్రమూ కాదు. ఏ విధముగానైనా మనము వీటినన్నింటినీ చేద్దాము. కాని మనము వాటి గురించి దీనులముగా ఉండెదము-మరియు మనము ఏమి చేయగలుగుచున్నామో వాటిని చేయలేకపోతున్న వారిని తృణీకరించవద్దు.


చాలా సుళువుగా మనము ఇతరులను తిరస్కరించే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. యోబు 36:5లో ఈవిధముగా చెప్పబడినది. ''దేవుడు బలవంతుడు, గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు''. దేవుని వలె మనము ఎంత ఎక్కువగా మారుదుమో, అంత ఎక్కువగా మనుష్యులకు విలువనిచ్చెదము. మరియు ఎన్నడూ-దేని నిమిత్తము, ఎవ్వరినీ తిరస్కరించము.


కనుక మనల్ని మనము శుద్ధి చేసుకుందాము మరియు దేవుడు మనుష్యులను ఏవిధముగా చూస్తున్నాడో అదే విధముగా చూచుటను నేర్చుకుందాము. ''నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?'' (1 కొరింథీ 4:7)

అధ్యాయము 39
పరిసయ్యులు ఇతరుల కంటే తమ్మును తాము హెచ్చించుకొందురు

''ఈ సుంకరి పరిసయ్యుని కంటే నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును...'' (లూకా 18:14).


పరిసయ్యులు దేవునిచేత నీతిమంతులుగా తీర్చబడలేరు ఎందుకనగా వారు తమ్మును తాము హెచ్చించుకొందురు. ఇతరుల మీద తమ్మునుతాము హెచ్చించుకొను వారిని దేవుడు తగ్గించును.


ఇతరుల కంటే మనలను మనము హెచ్చించుకొనే అనేకమైన నిగూఢమైన (నేరుగా కాని) మార్గములు కలవు. మనకంటే తక్కువ వారిగా ఇతరులు భావించుకొనునట్లు, చిన్నతనంగా అనుకొనునట్లు మనము ప్రవర్తింపవచ్చును. తలాంతులు కలిగియున్న వ్యక్తులు మరియు సంగీత విద్వాంసులు ఈ విషయములో ఎక్కువ ప్రమాదములో నుందురు. ప్రజలందరూ నిన్ను అభినందించునట్లుగా సంఘకూడికలో వాయిద్యము వాయించకూడదు. నీవు అక్కడ ఉన్నది ప్రజలు దేవుణ్ణి ఆరాధించుటలో సహాయపడుటకు గాని, ప్రజలు నిన్ను ఆరాధించుటకు కాదు!!


కొన్నిసార్లు పెళ్ళైన జంట వివాహ జీవితములోని ఆనందములను గురించి వారి కంటే పెద్దయైన మరియు వివాహము కాని సహోదరీల సమక్షములో చెబుతూ ఉంటారు. ఆ పెళ్ళి కాని సహోదరీల భావములను ఏ మాత్రము పరిగణలోనికి తీసుకోకుండా ఆవిధముగా మాట్లాడుట ద్వారా వారి వివాహ జీవితమును హెచ్చించుకొందురు. అటువంటి సాక్ష్యమును చెప్పి ఇతరులను గాయపరచకూడదు. పరిసయ్యులు ఇతరుల భావములను పట్టించుకొనరు. అందుకనే వారు దేవునిచేత నీతిమంతులుగా తీర్చబడరు, ఎందుకంటే దేవుడు కేవలము దీనులను మాత్రమే నీతిమంతులనుగా తీర్చును.


ఇతరుల కంటే మనలను మనము హెచ్చించుకొనే అనేకమైన ఇతర మార్గములు కలవు. ఈ విషయములో మనము సున్నితముగా నుండునట్లు పరిశుద్ధాత్మను అడుగవలెను.


అధ్యాయము 40
పరిసయ్యులు వారు చేసిన వాటిని బట్టి అతిశయించుదురు

''దేవా, నేను చోరులును, అన్యాయస్థులును, వ్యభిచారులునైన ఇతర మనుష్యులవలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్ధించుచుండెను'' (లూకా 18:11,12).


దేవుడు మన ద్వారా చేసిన పనికి నివేదిక ఇచ్చునపుడు మనము చాలా అపాయమును ఎదుర్కొంటాము. దేవుని మహిమ కొరకు మనము సాక్ష్యము ఇవ్వాలి కాని మనము చేసిన పనులను బట్టి పరిసయ్యుల వలె మనము అతిశయించకూడదు. ప్రత్యేకముగా బోధకులు ఈ విషయములో చాలా అపాయములో ఉంటారు. భారతదేశంలోని క్రైస్తవ పనివారు క్రైస్తవ పని గురించి పాశ్చాత్య దేశములకు పంపే అనేక నివేదికలను అతిశయపడే ఆత్మ కలిగి పంపించుదురు. ఈ పనివారు దేవుని కోసం మేము ఎంతో పని చేస్తున్నాము అని నిరూపించుకొనుటకు ప్రయత్నించుదురు. భారతదేశములోని ఏ ఇతర మిషను కంటే కూడా మేమే ఎక్కువగా దేవుని పని చేస్తున్నాము అనే అర్ధము వచ్చేటట్లుగా చేయుదురు.


ఒకవేళ మనము పరిసయ్యతత్వము నుండి విడుదల పొందాలంటే, దేవుని కొరకు మనము చేసే పని విషయములో అసలు అతిశయపడకూడదు. మనము ప్రభువు కోసము చేసిన పనిని ఆయన మాత్రమే చూచునట్లుగా దాచియుంచాలి. మన జీవితములలో ఏ మాత్రము గర్వపు వాసన ఉన్నా దేవుని యొద్దనుండి కృపను పొందుకోలేము-దేవుడు దీనులకు మాత్రమే కృపను అనుగ్రహించును.

అధ్యాయము 41
పరిసయ్యులు ఇతరులను నిందించుదురు

''శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా,ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను: అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే ఆజ్ఞాపిచెను గదా; అయిననూ నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి'' (యోహాను 8:3-6).


వ్యభిచారము చేయబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపవలెనన్న నియమము వెనుక ఉన్న దేవుని హృదయమును పరిసయ్యులు అర్ధము చేసుకొనలేదు, ఒక స్త్రీ రాళ్ళతో కొట్టబడటాన్ని చూచుటకు దేవుడు ఇష్టపడడు, కాని వ్యభిచార మార్గములో దేవుడు తీవ్రమైన అవరోధాన్ని పెట్టాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ నిజానికి పరిసయ్యులు ధర్మశాస్త్రమునకు అవిధేయత చూపించుటకు ఆసక్తి కలిగిలేరు, వారికి కావలసినదంతా ఏమిటంటే యేసు ప్రభువు మీద నేరము మోపడానికి కావలసిన కారణాలు. వారు అప్పటికే పాపము చేసిన ఆ స్త్రీని నిందించారు. ఇప్పుడు పాపము చేయని మనుష్యకుమారుని కూడా నిందించాలనుకుంటున్నారు. పరిసయ్యులు ఆవిధముగా ఉంటారు. వారికి దేవుని భయము లేదు. ఎవరి మీదైనా నేరము మోపినట్లుగానే దైవజనుల మీద కూడా నేరము మోపుదురు.


పరిసయ్యులు ఈవిధముగా అనుకున్నారు ''ఇది 22వ సారి పట్టుకొన్నప్పటి'' పరిస్థితి, యేసు ప్రభువు ఏది చెప్పినా సరే అది ఆయన మీద నేరము మోపడానికి తగిన కారణాలను ఇస్తుంది. ఒకవేళ ఆయన ''ఆమెను రాళ్ళు వేసి చంపివేయుడి'' అని చెప్పియుండుంటే, ఆయనకు కనికరము లేదని నేరము మోపియుండేవారు. మరియు ఒకవేళ ''లేదు, ఆమెను రాళ్ళు వేసి చంపవద్దు'' అని చెప్పియుండుంటే అప్పుడు ఈయన మోషే ధర్మశాస్త్రమును గైకొనుట లేదని నేరము మోపియుండేవారు. ఇది నాణెమును పైకి వేసి ''బొమ్మ పడితే మేము గెలుస్తాము, బొరుసు పడితే నీవు ఓడిపోతావు'' అని చెప్పినట్లుంది. ఏది పడినా మనమే గెలుస్తాము. కాని వారు గెలవలేదు. వారు ఓడిపోయారు! యేసు ప్రభువు వెంటనే సమాధానమివ్వలేదు కాని కూర్చొని తన తండ్రి నుండి వచ్చు మాటకొరకు ఎదురు చూశాడు. తండ్రి యొద్ద నుండి ప్రత్యుత్తరము పొందిన వెంటనే ''మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చును'' అని చెప్పెను. సమస్య పరిష్కారమునకు తండ్రి యొద్ద నుండి వచ్చిన ఒక్కవాక్యము చాలును.


నీవు పరిశుద్ధాత్మ చెప్పినది వినినట్లయితే, ఇటువంటి పరిస్థుతులలో సుదీర్ఘ ప్రసంగం చేయవలసిన అవసరం లేదు. ఒక్కవాక్యం నీ శత్రువుల నోరు మూసివేయును. ఎవరైతే పరిసయ్యులుగా ఉండరో మరియు ఇతరుల మీద నేరారోపణ చేయరో అటువంటి వారికి దేవుడు ఈనాడు కూడా ఇటువంటి జ్ఞానము గల మాటలను ఇచ్చును. అటువంటి ప్రజలకు దేవుని వాగ్ధానం ఇది: ''మీ విరోధులందరూ ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును'' (లూకా 21:15).


యేసు ప్రభువు వ్యభిచారమునకు వ్యతిరేఖమా? అవును ఖచ్ఛితముగా. కాని వ్యభిచారము కంటే అక్షరానుసారమైన (నియమ నిబంధనలతో కూడిన-లీగలిస్టిక్‌) నెరవేర్పునకు ఎంతో వ్యతిరేఖముగా ఉండెను. యేసుకు ఒకవైపు వ్యభిచారములో పట్టబడిన స్త్రీ , మరియొక వైపు మతానుసారులైన పరిసయ్యులు ఉన్నారు. చివరకు మనము చూచినట్లయితే వ్యభిచారము చేసిన స్త్రీ యేసు పాదముల వద్ద ఉన్నది. మిగిలిన వారు యేసు ప్రభువు మాట్లాడిన మాటలను బట్టి దూరముగా వెళ్ళిపోయారు. పరిసయ్యుల న్నులలోని అక్షరానుసారమైన నెరవేర్పు మరియు ద్వేషము అనే పెద్ద దూలములతో పోల్చి చూచినట్లయితే వ్యభిచారము అనేది ఆ స్త్రీ కంటిలోని నలుసుతో సమానము.


ఇప్పుడు నిన్ను నీవే ప్రశ్నించుకో, ఎన్నిసార్లు మనము మంచి సహోదరులను, వ్యభిచారంతో పోలిస్తే కనీసం ఒకటిలో పదిలక్షో వంతు కూడా కానటువంటి చిన్న విషయములను గురించి నిందించాము. మీ ఇంట్లో కాని, బయట కాని వారు లేనప్పుడు వారి వెనుక మాట్లాడిన సంగతులను ఆలోచించండి. అటువంటి నిందలలో నీవు పాలుపొందిన ప్రతిసారి నీ కంటిలోని దూలము-ఇతరుల యెడల నీకున్న కఠినమైన, తీర్పు తీర్చే, నిందలు మోపే వైఖరి-పెరుగుతూ, పెద్దదవుతూ ఆత్మీయ విషయముల యెడల ఇంకా ఎక్కువగా గ్రుడ్డితనము కలుగజేస్తుంది. మొత్తానికి నీవు ఎవరికి నష్టము చేశావు? ఇతరుల కంటే కూడా, నిన్ను నీవే నష్టపరచుకున్నావు.


తన కంటిలో దూలమున్న వ్యక్తి, ఇతరుల కంటిలోనుండి నలుసును తీసివేయగల కంటి వైద్యుడు కాగలడని మీరనుకుంటున్నారా? ''నీ సహోదరీ, సహోదరుల జోలికి పోకుము. వారు కేవలము వారి కళ్ళలో కొన్ని నలుసులు మాత్రమే కలిగియున్నారు. వారి కళ్ళలోని నలుసులన్నీ కలిపినా సరే నీ కంటిలోని దూలము ఎంతో హీనముగానున్నది.'' అని చెప్పే దేవుని మాటలు మనము వినవలసిన అవసరం ఉన్నది. ఎందుకు యేసు ప్రభువు నేరము మోపే ఈఆత్మకు వ్యతిరేఖముగా ఉన్నాడు? ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు, అపవాది (''సహోదరుల మీద నేరారోపణ చేయువాడు'') ''దివారాత్రములు'' ప్రజలను నిరంతరము నిందించుట వినియున్నాడు. యేసు ప్రభువు భూమి మీదకు వచ్చిన తరువాత ప్రజలు అదే ఆత్మను కలిగియుండుట చూచినప్పుడు, వారు అపవాదిని గుర్తుకు తెచ్చారు. యేసు నేరములు మోపే ఈ ఆత్మను ద్వేషించాడు మరియు ఈనాడు కూడా ద్వేషిస్తున్నాడు. నీవు ఇతరులను నిందిస్తున్నప్పుడు యేసు ప్రభువుకు అపవాదిని గుర్తుకు తెస్తున్నావని నీవు తెలుసుకున్నావా? అనేకమంది విశ్వాసులు దీనిని చూడరు-ఎందుంటే వారి కంటిలోని దూలము వారిని గ్రుడ్డివారిని చేసింది.


30 సంవత్సరములనుండి నేను బోధిస్తున్న ఒక సందేశము ఏదైనా ఉంది అంటే అది ఇదే: నీవు ఆత్మీయముగా ఎదగాలి అనుకుంటే, ఇతరులను తీర్పు తీర్చడం ఆపివేసి నిన్ను నీవు తీర్పు తీర్చుకో. నీ మైక్రోస్కోపు నీ మీద ఉపయోగించుకో, ఇతరుల మీద కాదు. మరియు నిన్ను నీవు తీర్పు తీర్చుకున్న తరువాత ఏమి చేయవలెనో నేను చెప్తాను. ఇంకా ఎక్కువ నిన్ను నీవు తీర్పు తీర్చుకో. ఎప్పుడు నీవు ఆపివేయాలి? నీవు సంపూర్ణముగా యేసు క్రీస్తు వలె మార్పు చెందేవరకు. తన జీవితము చివరిలో అపోస్తలుడైన యోహాను విశ్వాసులకు ఈవిధముగా చెప్పాడు, ''ఆయన ప్రత్యక్ష్యమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.'' (1 యోహాను 3:2,3).


మరి తప్పు చేసిన వారిని సంఘనాయకుడు ఎలా సరిదిద్దాలి? తన మీద ప్రభువు ఎంత కనికరము చూపించాడో అంత కనికరముతో మరియు ఎంతో కనికరముతో సరిదిద్దాలి. ఆ స్త్రీ చేసిన వ్యభిచారము అను పాపమును యేసు ప్రభువు వదిలివేయలేదు. మొట్ట మొదట ఆయన ఆమెకు ఎంతో కనికరముతో ''నేను నీకు శిక్ష విధించను'' అని చెప్పెను. ఆ తరువాత ఆమెను ''ఇక మీదట పాపము చేయకుము'' అని గట్టిగా హెచ్చరించెను. దేవుని కృప కేవలము మన పాపములను క్షమించి వదిలివేయదు. ఆ కృప మొట్టమొదట మన పాపమును క్షమించును. తరువాత పాపము చేయవద్దని హెచ్చరించును ఆ తరువాత పాపము చేయకుండా సహాయముచేయును.


ఎందుకు పరిసయ్యులందరూ దూరముగా వెళ్ళిపోయారు? ''ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి. నా రహస్య పాపములన్నింటి మీద మరియు కఠినమైన అక్షరానుసారమైన (లీగలిస్టిక్‌) నా వైఖరి మీద నేను ఇప్పుడు వెలుగుపొందాను. ఈ స్త్రీ కంటే నేను ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నానని ఇప్పుడు చూడగల్గుతున్నాను. దయచేసి నా మీద కనికరము చూపండి.'' అని వారందరూ విరిగిన హృదయముతో వచ్చి చెప్పవలసియున్నది. కాని వారిలో ఒక్కరు కూడా యేసు యొద్దకు ఆవిధముగా రాలేదు.


ఎంతో మంది ప్రజలలో ఏదో ఒక కారణాన్ని బట్టి ఎన్నో తప్పులు వెదికే లేదా వారిలో లోపాలను వెదికే నీ సంగతి ఏమిటి? దేవుడు నిన్ను విరగ్గొట్టనిస్తావా?


కొంతమంది ప్రజలు నాయొద్దకు వచ్చి నాకు విరోధముగా మాట్లాడిన దానిని బట్టి కాని లేక చేసిన దానిని బట్టి కాని క్షమాపణ చెప్పినప్పుడు, వారు విరగ్గొట్టబడలేదని నేను గమనించాను. వారి పాపములకై నిజముగా వారు పశ్చాత్తాప పడలేదని ఇది ఋజువు చేయుచున్నది. కేవలము వారి మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుకొనుటకు వారు ఒక నియమమునకు విధేయత చూపుచున్నారు. వారిని వెంటనే నేను క్షమించాను. కాని వారు వెంటనే మరలా అదే పాపములో పడిపోతారని నాకు ఖచ్ఛితముగా తెలుసు. ఎందుకంటే వారు అక్షరానుసారముగా (లీగలిస్టిక్‌గా) ఉన్నారు. ''347వ నియమము-ఒక పెద్ద సహోదరునికి విరోధముగా వారి వెనుక చెడుగా మాట్లాడకూడదు'' అను దానికి విధేయత చూపించితిమని సాంకేతముగా వారు తెలిసికొందురు. కనుక వారు ''9వ నియమము-ఎవరి ఎడల తప్పుచేశావో వారికి క్షమాపణ చెప్పవలెను'' అను దానికి విధేయత చూపించుటకు ఏదో సాంప్రదాయబద్ధమైన క్షమాపణ అడుగుదురు. కాని అంతరంగములో ఏ మాత్రము మార్పురాదు. ఇంతకు ముందు వారు ఏ విధముగా ఉన్నారో అదే విధముగా వారి జీవితములలో కొనసాగుదురు.


మన పాపముల మీద దేవుడు మనకు వెలుగిచ్చినప్పుడు, ఆ వెలుగును మనము చూడలేక, చచ్చినవారి వలె యేసు ప్రభువు యొక్క పాదముల యొద్ద పడిపోదుము (ప్రకటన 1:17). మరియు ''పాపులలో నేను ప్రధాన పాపిని'' (1 తిమోతి 1:15) అని మనకు మనమే తెలిసికొందుము. నీవు ఎప్పుడైనా ఆవిధముగా అనుకున్నావా? లేక ఏదో కొద్దిగా జారిపోయానులే అని అనుకున్నావా? అలా అయితే నీవు ఒక పరిసయ్యుడవు. మరియు వారి కళ్ళల్లో నలుసులు మాత్రమే కలిగిన పేద ప్రజల మీద రాళ్ళు వేయుట గూర్చి నీవు పశ్చాత్తాప్పడి మారుమనస్సు పొందేదాకా నీకు మంచి జరుగదు. దేవుడు నీ కఠిన హృదయమును విరగ్గొట్టనివ్వు ''ఇతరుల యెడల కనికరము చూపని వారికి దేవుడు కనికరము లేని తీర్పు తీర్చును'' అని యాకోబు 2:13లో దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. సాధారణముగా ఈ విషయములో సంఘనాయకులు మొట్టమొదటి అపరాధులు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల యెడల కనికరము చూపకుందురేమో అని జగ్రత్తపడవలెను.


వ్యభిచారములో పడ్డ ఒక సంఘనాయకుడు సంఘమును ఎప్పుడూ పాడు చేయలేడు, ఎందుకంటే వ్యభిచారము పాపమని ప్రతి విశ్వాసికి తెలుసు కాబట్టి వెంటనే ఆ నాయకుడు ఆ స్థానము నుండి తప్పించబడతాడు. కాని సంఘనాయకుడు ఒక ఆత్మ సంబంధిగా కాకుండా అక్షరానుసారుడైతే (లీగలిస్ట్‌), అతడు ఎంతో ప్రమాదకరము ఎందుకంటే అతడు ''పరిశుద్ధతను బోధిస్తున్నాడు. ఎవరైతే అక్షరానుసారమైన స్థితి (లీగలిజం) మీద వెలుగును కలిగియుండరో వారు అతనిని వెంబడించి వారు కూడా అక్షరానుసారముగా (లీగలిస్ట్‌) నెరవేర్చువారగుదురు. ఒక గ్రుడ్డి పరిసయ్యునిగా అక్షరానుసారమైన నెరవేర్పు(లీగలిజం) అను తానే పడిన లోతైన గుంటలోనికి ఇతరులను కూడా నడిపించును. ఇతరులను తీర్పు తీర్చి మరియు నిందించే వైఖరి కలిగియుండటం నీవు వ్యభిచారములో పదిసార్లు పడిపోవుట కంటే హీనమైనదని నీవు నిజముగా చూశావా? ఒకవేళ గడచిన ఒక్క నెలలో నీవు పదిసార్లు వ్యభిచారములో పడియుండుంటే ఎలా మారుమనస్సు పొందేవాడవు? ఇతరుల మీద నేరారోపణ చేసే ఆత్మను కలిగియున్నందుకు దాని కంటే ఎక్కువగా పశ్చాత్తాప్పడాలి.


అధ్యాయము 42
పరిసయ్యులు నిజానికి అపవాది తమ తండ్రి అయినప్పటికీ దేవుడు తమ తండ్రి అని అనుకొందురు

యేసు వారితో ఇట్లనెను - ''దేవుడు మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు: మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు'' (యోహాను 8:42,44).


యేసు ప్రభువు పరిసయ్యులకు మీ తండ్రి సాతాను అని వారి ముఖము మీదనే చెప్పెను. కొంత మంది బోధకులు ఏ ఒక్క మనిషి కూడా అపవాది పిల్లలై ఉండరని నమ్ముతారు. కాని యేసు ప్రభువైతే దీనికి విరుద్ధముగా చెప్పారు. మరియు మనందరి కంటే ఆయనకే దీని గురించి సత్యము తెలియును. ఆ పరిసయ్యులు తమ తండ్రి అపవాది అయితే దేవుడు తమ తండ్రి అని ఊహించుకున్నారు. ఈ రోజు ఉన్న పరిసయ్యులు కూడా ఇలానే ఉన్నారు. పిల్లలు తమ తండ్రి యొక్క స్వభావమును ప్రత్యక్షపరుస్తారు. పరిసయ్యులు వారి తండ్రియైన అపవాది వలె ''సహోదరులను నిందించువారు''. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఎంతో మంది ''క్రైస్తవులు'' వేరే విశ్వాసులను నిందిస్తూ, శిక్షావిధికి గురిచేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇవి సాతాను లక్షణాలని వారు గుర్తెరుగరు. కాబట్టి సాతాను వారి తండ్రియై ఉండాలి. అటువంటి ప్రజలు వారి తండ్రి దేవుడని ఎలా అనుకుంటారు? ఇది పూర్తిగా గ్రుడ్డితనము! యేసు ప్రభువు వారితో చెప్పిన దానిని మొదటి శతాబ్దపు పరిసయ్యులు నమ్మలేదు మరియు చివరకు ఈనాటి పరిసయ్యులు కూడా దానిని నమ్మలేదు.


కొన్నిసార్లు మా సంఘమునకు ఎన్నో సంవత్సరముల నుండి వచ్చే వారికి కూడా వారు ప్రభువును ఎరిగి ఉన్నారని నాకు అనిపించడం లేదని చెప్పాను. ''యేసు ప్రభువా, నా హృదయములోనికి రమ్ము'' అని వారు ఎప్పుడో గతంలో పదే పదే చెప్పినప్పటికీ నేను అలా చేశాను. ఎందుకంటే వారు ప్రభువుని ఎరిగియున్నారు అనడానికి గల ఎటువంటి ఫలమును వారి జీవితములలో నేను చూడలేదు. ఎంతో మంది సంఘనాయకులు ప్రజలకు సత్యము చెప్పడానికి నమ్మకమైన వారిగా (యేసు వలె) లేరు. ప్రజలను నరకము నుండి రక్షించుట కంటే వారి స్వంత ఘనత పట్ల వారు ఆసక్తి కలిగియున్నారు. కావున అటువంటి నాయకులు మార్పు చెందని ఆ ప్రజల యొక్క రక్తము విషయములో దోషులుగా ఉన్నారు.

అధ్యాయము 43
పరిసయ్యులు అబద్ధికులు మరియు నరహంతకులు

''మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడై యుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వాని యందు సత్యమే లేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు'' (యోహాను 8:44).


వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యెడల పరిసయ్యులు హత్య చేయాలనే కోరికను కలిగియున్నారు. కాని ఈనాటి పరిసయ్యులైతే ఎంతో నాగరికత కలిగియుండి కేవలము వారి మాటలతోనే హత్యచేయుదురు. నీవు ఎవరి గురించైనా చెడు కథనాలు ప్రచారం చేసి వారి పేరు ప్రతిష్టలను హత్యచేశావా?-ఒకవేళ ఆ కథనాలు నిజమైనా కూడా? సైతాను దేవుని యెదుట విశ్వాసులను నిందించేటప్పుడు, దేవునికి అబద్ధాలు చెప్పడు. అతడు నిజమే చెప్తాడు, ఎందుకంటే, సాతాను దేవునికి అబద్ధాలు చెప్పలేడని తెలుసు. నీ పాపముల గురించిన నిజమే దేవునికి చెప్తాడు కాని నిందించే ఆత్మతో చెప్తాడు. అదేవిధంగా, ఒక విశ్వాసి గురించి నిజమైన కథనాలనే నేరము మోపు ఆత్మను కలిగియుండి అతని పేరు ప్రతిష్టలను నాశనము చేసే విధముగా చెప్పే అవకాశము కలదు. మీ స్వంత పిల్లల గురించి మీలో ఎవరూ అటువంటి కథలు చెప్పియుండరు. ఒకవేళ మీ కుమార్తె వ్యభిచారంలో పడియుండుంటే, మీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో ఆ సంగతి చెప్పియుండేవాడివా? లేక సాధ్యమైనంతవరకు కప్పియుండే వాడివా? మీ కుమారులు, కుమార్తెల్లో అనేకమంది గతంలో ఎన్నో బుద్ధిహీనపు పనులు చేశారు. కాని తల్లిదండ్రులుగా మీరు ప్రేమతో వారిని కప్పి మరియు వారి పేరు ప్రతిష్టలను కాపాడారు. అదే వేరే వారి కుమారుడో, కుమార్తో అయితే ఇదేవిధముగా మీరు ఎందుకు చేయరు? సంఘములో ఉన్న ''హంతకులను'' అందరినీ మనము తీసివేయాలి.


పరిసయ్యులు అబద్ధికులు కూడా. ఈ సంవత్సరములన్నింటిలో ఒక విషయమును నేను పదే పదే గమనించాను: ఒక విశ్వాసి దిగజారిపోయినట్లయితే, వెంటనే అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. దాదాపుగా ఇది సాతానే తన హృదయమును, నాలుకను వెంటనే తీసుకున్నట్లుగా ఉంటుంది. వారి అబద్ధాలకు వారు పంచదార పూతపూసి వారేదో యదార్ధముగా ఉన్నట్లు నటించుదురు.


వారు మాట్లాడేటప్పుడు నీ ముఖము చూచి మాట్లాడరు. అపవాది అబద్ధములకు తండ్రి. కాని ఆ అబద్ధాలను పుట్టించడానికి ఒక తల్లి కావాలి. మరియు కేవలము నీవు నీ హృదయమును సాతానుకి ఇచ్చినప్పుడు మాత్రమే నీ ద్వారా అబద్ధాన్ని పుట్టించగలడు. పేతురు అననీయను ''అబద్ధము చెప్పుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను'' (అపో.5:3) అని అడిగెను. ఒక అబద్ధము చెప్పే బోధకుడు ఆ క్షణంలో తన నాలుకను సాతానుకు అప్పగించెను. తన పాపమును ఒప్పుకొని, మారుమనస్సు పొంది మరియు ఆ అలవాటును విడిచి పెట్టే దాకా దేవుణ్ణి తన నాలుకను ఉపయోగించుకొనుమని, బోధించడానికి అభిషేకించుమని అతడు ఆశించలేడు.


నరహత్యను ద్వేషించినంతగా అబద్ధమును కూడా మనము ద్వేషించాలి.


అధ్యాయము 44
పరిసయ్యులు వారి మాటలు వినని వారిని హింసించుదురు

''అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు (స్వస్థత నొందిన గ్రుడ్డివాడు), నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి'' (యోహాను 9:34).


పుట్టుకతోనే గ్రుడ్డివాడిగా జన్మించిన ఆ వ్యక్తిని పరిసయ్యులు స్వస్థపరచలేక పోయారు. కాని యేసు స్వస్థపరచినప్పుడు, వారు కలవరపడి అతనిని పాపి అని పిలచి మరియు అతనిని సమాజ మందిరము నుండి వెలివేశారు.


పరిసయ్యులైన సంఘనాయకులు వారి ఆజ్ఞలను పాటించనట్లయితే ప్రజలను సంఘము నుండి వెలివేస్త్తామని భయపెడతారు. పరిసయ్యులైన పెద్దలు ఇతరుల మీద పెత్తనం చెలాయించుటకు, వారిని అదుపులో ఉంచుకొనుటకు ఇష్టపడుదురు. ఒకవేళ, ఒక సహోదరుడు పాపము చేసినట్లయితే, మనము వెళ్ళి అతనితో మాట్లాడి అతనిని సంపాదించుకొనుటకు ప్రయత్నించవలెను (మత్తయి 18:15). వెలివేయడం అనేది చివరి విషయం. మన లక్ష్యం ఎప్పుడూ పాపము చేసిన సహోదరుణ్ణి సంపాదించుకోవడానికి ప్రయత్నించే విధముగా ఉండాలి.


బహుశా విశ్వాసులు పాపములో పడిపోయి ఉండవచ్చు మరియు తప్పులు చేసి ఉండవచ్చు. ఎప్పుడైతే ఇలాంటిది జరుగునో ఆ సంఘనాయకుడు అతనితో యేసువలె మాట్లాడియుండవచ్చు లేక ఒక పరిసయ్యునివలె చేయవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొనవచ్చును. యేసు ప్రభువైతే ఆ సహోదరుని సంపాదించుకొనుటకు చూసియుండేవాడు. కాని సాతాను అతణ్ణి నాశనం చేయాలనుకుంటాడు. పరిసయ్యులు సాతానుతో జట్టు కట్టి ఎవరైతే వారి మాట వినరో, లేక వారి అధికారమునకు లోబడరో వారిని ఇబ్బందిపెడుతూ మరియు వారిని హింసించుదురు.


అధ్యాయము 45
పరిసయ్యులు వారు చేయలేని అద్భుతములను వేరే వారు చేసినట్లయితే వారి మీద అసూయ పడుదురు

''కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహాసభను సమకూర్చి-మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే! కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి'' (యోహాను 11:47,53).


ఇక్కడ యోహాను 11లో, యేసు ప్రభువు లాజరును అప్పుడే సమాధినుండి లేపెను. దీనిని గురించి పరిసయ్యులు ఉత్తేజింపబడియుండాలి. కాని వారు ఆవిధముగా కాలేదు ఎందుకంటే ఆ అద్భుతమును చేసిన వ్యక్తి వారి గుంపునకు సంబంధించిన వాడు కాదు!! యేసు ప్రభువు వేరే శాఖకు సంబంధించిన వాడు!! పరిసయ్యులు దీనిని గూర్చి ఎంతో అసూయతో నిండియున్నారు. అసూయ అనేది ఎంతో స్పష్టముగా కనబడే విషయము. చివరకు పిలాతు వంటి లోకసంబంధమైన వ్యక్తి కూడా పరిసయ్యులలోని అసూయను గుర్తించాడు (మత్తయి 27:18). అసూయను గూర్చి జాగ్రత్తపడుడి.


అద్భుతములను చేసే వారి యెడల పరిసయ్యులు అసూయను కలిగియుందురు. ఈనాడు అనేకమంది విశ్వాసులను మోసగిస్తున్న టి.వి సువార్తీకులు చేసే నఖిళీ ''అద్భుతములను'' గురించి నేను మాట్లాడుట లేదు. మనమందరము వాటిని కోకొల్లలుగా చూశాము. ఈనాడు కూడా జరుగుచున్న నిజమైన అద్భుతములను గురించి నేను మాట్లాడుచున్నాను. కాని వాటిని మనము టి.విలలో చూడము లేక ''స్వస్థత మహాసభలు'' అని గొప్పగా పిలువబడే వాటిలోను చూడము. ఎక్కడైతే సువార్త మొట్టమొదటి సారిగా ప్రకటింపబడుతుందో అటువంటి స్థలములలో ఈనాడు నిజమైన అద్భుతములు (అపోస్తలుల కార్యములలో జరిగినట్లుగా) జరుగుచున్నవి-ఉదాహరణకు, ఉత్తర భారత దేశములోని కొన్ని ప్రదేశములలో, అపోస్తలుల కార్యములలో దేవుడు మొట్టమొదటిగా సువార్త ప్రకటింపబడుచున్న ప్రదేశములలో అద్భుతాలు జరిగించాడన్న సత్యాన్ని అనేక మంది గుర్తించరు. ఈనాడు దేవుడు అద్భుతములను ఎవరిద్వారా చేస్తున్నాడో వారు సామాన్యులు, తెలియబడని విశ్వాసులు; యేసు వలె వారు కూడా వారు చేసిన అద్భుతములను గురించి ప్రకటించుకొనరు.


దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఒకవేళ దేవుడు నీ కోసం అద్భుతం చేయగలడని నమ్మలేనట్లయితే, అప్పుడు నీవు ఒక పరిసయ్యుడవు. ఎప్పుడైతే నీవు రోగివవుతావో అప్పుడు నీవు స్వస్థత కొరకు తప్పక ప్రార్ధించవలెను, రోగమును అంగీకరించడం కాదు. వేరే వాళ్ళకు లేని కొన్ని ధన్యతలను దేవుని పిల్లలముగా మనము కలిగియున్నాము. ''రాబోవు యుగ సంబంధమైన శక్తులను అనుభవించి'' (హెబ్రీ 6:5) మరియు ఒకవేళ నిన్ను స్వస్థపరచుట దేవుని చిత్తము కానట్లయితే (ఏదైనా కారణమును బట్టి) అప్పుడు నీవు ఆయనను పౌలుకు ఇచ్చినట్లుగా (2 కొరింథీ 12:7-10) ''స్వస్థత కంటే శ్రేష్టమైనది'' అడుగవచ్చును. ఒకవేళ నీవు ఒక సంఘ పెద్దవైయుండుంటే, రోగియైన ఒక వ్యక్తి ప్రార్ధన కొరకు వస్తే, అప్పుడు నీవు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థ పరచాలని మరియు అప్పటి నుండి దేవుడు ఆ వ్యక్తిని దగ్గరగా ఆకర్షించుకోవాలని తప్పక ప్రార్ధించవలెను (నీకేదైతే విశ్వాసముందో దానితో). మరియు దేవుడు నీ ప్రార్ధనకు జవాబిస్తే, ఆయనకు మాత్రమే మహిమనివ్వుటకు జాగ్రత్తగా ఉండుము. మరియు దానిని గూర్చి అతిశయించ వద్దు. లేనట్లయితే ఇంకా పెద్ద పరిసయ్యుడవుగా నీవగుదువు.


అధ్యాయము 46
పరిసయ్యులు తాము చేయుచున్నవి దైవజనులు చేయుటలేదని వారిని తీర్పు తీర్చుదురు

పరిసయ్యులు తాము చేయుచున్నవి దైవజనులు చేయుటలేదని వారిని తీర్పు తీర్చుదురు


''కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి'' (యోహాను 9:16).


పరిసయ్యులు ప్రజలను వారి దైవభక్తిని బట్టి కాక వారు కొన్ని మతపరమైన ఆచారములను పాటిస్తున్నారా? లేదా? అనే దానిని బట్టి వారిని అంచనా వేయుదురు. యేసు ఖచ్ఛితముగా దేవుని యొద్ద నుండి రాలేదు అని వారు నిర్ధారణ చేసుకొన్నారు ఎందుకంటే వారు ఆచరించిన విధముగా యేసు విశ్రాంతి దినమును ఆచరించలేదు. మనము కూడా సంఘములో కొన్ని విషయాలు ఎలా చేయాలో అని కొన్ని ఆలోచనలు కలిగియుంటాము. ఒకవేళ వేరే ఎవరైనా అదే విధానములో చేయనట్లయితే వారు భక్తిహీనులు అని మనము వ్రాస్తాము. పక్షపాతము సహవాసమును నాశనము చేయశక్తి గల చెడ్డ కార్యము.


రక్షణ సైన్యము (ఇంగ్లాండులో 19వ శతాబ్దములో విలియం బూత్‌ గారిచే స్థాపించబడినది) అనే సంఘము వారి కూటములలో ''రొట్టె విరుచుటను'' కలిగియుండేవారు కారు. దానికి వారు చెప్పే ఒక కారణమేమిటంటే, వారి సంఘములకు వచ్చే అనేక మంది ఒకప్పుడు త్రాగుబోతులుగా ఉండేవారు. రొట్టె విరిచే సమయములో ఒకవేళ ద్రాక్షారసపు వాసన చూచినప్పుడు వారు మరలా శోధింపబడి పాత త్రాగబోతు జీవితములకు వెళ్ళుదురు. వారు నీటి బాప్తిస్మమును కూడా ఆచరించలేదు. ఎందుకంటే బాప్తిస్మము తీసుకొన్న వారిలో అనేకమంది నిజముగా మారుమనస్సు పొందలేదు అని వారు చెప్పుదురు. కాని ఆయన జీవించిన సమయములో విలియం బూత్‌ గారు గొప్ప దైవజనులలో ఒకడు. ఆయన మరియు ఆయన భార్య కలసి ప్రపంచము నలుమూలల నుండి సమాజములోని వేలమందిని క్రీస్తులోనికి తీసుకు వచ్చారు. అటువంటి మనిషిని గురించి మీరేమనుకుంటారు? పరిసయ్యులు అతనిని పూర్తిగా తృణీకరిస్తారు. కాని ఒకవేళ 150 సంవత్సరాల క్రితం నేను ఇంగ్లాండులో జీవించియుండుంటే నేను ఆయన చేస్తున్న పరిచర్యలో, ఏ ఒక్కరూ చేయని పరిచర్య-త్రాగబోతులను, వేశ్యలను మరియు దొంగలను క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చుటలో చేరియుండేవాడను. ఈ రెండు విషయాలలో వారి సిద్ధాంతముతో నేను ఏకీభవించను. కాని బాప్తిస్మము మరియు ప్రభువు బల్ల విషయములో అతడు నాతో ఏకీభవించాడా లేదా అనే దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క దైవభక్తిని నేను అంచనా వేయను.


విలియం బూత్‌ లాంటి దైవజనులకు వ్యతిరేఖముగా వ్యర్ధమైన విమర్శలు చేయకుండునట్లు మనము జాగ్రత్తగా ఉండవలెను. పేతురు రాజీపడటాన్ని బట్టి పౌలు అతనిని విమర్శించిన మాట నిజమే (గలతీ 2:11). కాని పౌలుకియ్యబడిన కృపను పేతురు గ్రహించాడు (గలతీ 2:9). కనుక పౌలు వంటి మనుష్యుడు పేతురును విమర్శించినట్లయితే దానిని అంగీకరించవచ్చును.


కాని ఈనాడు దైవజనులను విమర్శిస్తున్న వారెవరు? ఖచ్ఛితంగా, దేవుని కోసం తాము ఏమీ చేయని వారు, మరియు ఏవిధముగానైననూ దేవునిచేత సాక్ష్యము పొందనివారు. అటువంటి బుద్ధిహీనులైన విశ్వాసులు దేవుడు వారి కంటే వెయ్యిరెట్లు ఎక్కువగా వాడుకొన్న దైవజనులను విమర్శించుటకు ధైర్యము చేయుచున్నారు. ఇదే పరిసయ్యతత్వము.

అధ్యాయము 47
పరిసయ్యులు సూచక క్రియలను అడుగుటచేత దేవుణ్ణి శోధించెదరు

పరిసయ్యులు యేసుతో ''బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని చెప్పిరి'' (మత్తయి 12:38).


సత్యమును నిశ్చయపరచుకొనుటకు పరిసయ్యులు ఎప్పుడూ ఏదో ఒక సూచక క్రియను లేక అద్భుతమును కోరుదురు. వారు సాధారణమైన విశ్వాసముతో జీవించలేరు. అందుచేతనే వారు ఈ రోజు మతపరమైన జ్ఞానం ఉన్నట్టు నటించేటటువంటిి పరిసయ్యులను వారి యొక్క తప్పుడు సూచకక్రియలతోను మరియు అద్భుతాలతోను మోసపుచ్చగల్గుచున్నారు. దేవుణ్ణి ఒక సూచక క్రియనో లేక ఒక అద్భుతమునో చేయమని అడుగుట అనేది ఆత్మీయతకు ఒక గుర్తు అని ఎప్పుడూ అనుకొనవద్దు. ఇది ఒక పరిసయ్యుని గుర్తు. మత్తయి 16:1లో కూడా ఇదే వాక్యమును మరలా చెప్పబడుట మనము చూచెదము

అధ్యాయము 48
పరిసయ్యులు తప్పిపోయిన పాపుల యెడల ఆలోచన కలిగియుండరు

''అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి'' (యోహాను 7:49)


ఈనాటి పరిసయ్యులు కూడా నరకమునకు వెళ్ళువారి యెడల ఇటువంటి వైఖరినే కలిగియుండి మరియు ఈవిధముగా చెప్పుదురు. ''ఓ! క్రీస్తుని రక్షకునిగా అంగీకరించని ఈ ప్రజలు నరకమునకు వెళ్ళుచున్నారు''. అది నిజమే కాని ఇటువంటి వ్యాఖ్య తప్పిపోయిన వారి యెడల చింతలేని పరిసయ్యుని వలె ఉన్నట్లు బోధకుని బహిర్గతం చేస్తుంది. ఒకవేళ నరకమునకు వెళ్ళుచున్న వారి యెడల నీవు ఆలోచన కలిగి లేనట్లయితే, నీవు పరిసయ్యుడవని అది స్పష్టముగా ఋజువు పరచుచున్నది.


మనము ఇతరులకు సాక్ష్యమిస్తున్నప్పుడు, మన ఆలోచన వారి రక్షణ గూర్చి ఉండాలి కాని వారి రక్తాపరాధం మన చేతులకు అంటకుండా ఉండాలని కాదు. ఆలోచన లేకుండా ప్రజలకు కరపత్రములు పంచి, మరియు వాటిని ప్రజల యొక్క పోస్టుబాక్సులకు, కార్లకు అంటించిన తరువాత మా పని మేము చేశాము అని తృప్తిపడే క్రైస్తవులను నేను చూశాను. ''లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు (యోహాను 3:17)''. కాని నేడు అనేకమంది విశ్వాసులచేత పంచబడుతున్న కరపత్రముల ఫలితము ఆ అవిశ్వాసులను తీర్పులోనికి తెస్తుంది. ఈ పని విశ్వాసుల యొక్క మనస్సాక్షిని తేలిక పరచుకొనుటకు స్వార్ధపూరితమైన ఉద్దేశముతో జరిగింపబడుచున్నదే కాని తప్పిపోయిన ప్రజలను రక్షకుని పాదముల చెంతకు తీసుకొని వచ్చుటకు ప్రేమతోను మరియు భారముతోను జరుగుటలేదు. ఎంతోమంది ఈ కరపత్రములను పంచేవారు తప్పిపోయిన వారియెడల మాకు ఎంతో భారము ఉన్నది అని అనుకొందురుకాని వారికి లేదు. వారు పరిసయ్యులు.

అధ్యాయము 49
పరిసయ్యులు దేవుని వాక్యము కంటే వారి ఆచారములకు ఎక్కువ విలువనిచ్చెదరు

''యేసు పరిసయ్యులతో ఈవిధముగా చెప్పెను మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు'' (మార్కు 7:9)


అన్ని సంఘములు ఏదో ఒకరకమైన ఆచారములను కలిగియున్నవి. దేవుని వాక్యము కంటే ఆ ఆచారములు నీకు ఎక్కువ ప్రాముఖ్యమైనవైతే, అప్పుడు నీవు ఒక పరిసయ్యుడవు. యేసు పరిసయ్యులతో చెప్పినది ఏమిటంటే దేవుని వాక్యము కంటే వారి ఆచారములను హెచ్చించుట ద్వారా, వారు క్రమంగా (1) ''దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసిరి'', (2) ''ప్రక్కన పెట్టిరి'' మరియు చివరకు (3) ''దానిని నిరర్ధకం చేసిరి'' (మార్కు 7:8-13).


ఈ పాపమును బట్టి మనలో ఎవరమైనా అపరాధులుగా ఉన్నామేమోనని మనలను మనమే ప్రశ్నించుకొనవలెను. యేసు ప్రభువును పూర్ణ హృదయముతో ప్రేమించుట, మరియు యేసు నిన్ను ప్రేమించునట్లుగానే నీతోటి సహోదరులను (ప్రతి ఒక్క క్రైస్తవ శాఖలోని) ప్రేమించుటకంటే, నీ ఆచారములు నీకు ప్రాముఖ్యముగా ఉన్నాయా? మీ సంఘ ఆచారములను పాటించుటలేదని ఒక దేవుని బిడ్డను నీవు తృణీకరించుదువా? ఒకవేళ అలా అయితే నీవు పరిసయ్యుడవు.


అధ్యాయము 50
పరిసయ్యులు వారిని వారు సమర్ధించుకొందురు

''ఆయన మీరు మనుష్యుల యెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను యెరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము'' (లూకా 16:15).


ఒక పరిసయ్యుడు ప్రతి పరిస్థితిలో తనను తాను సమర్ధించుకొనును. తాను వినయముతో తన తప్పులను తెలుసుకొనలేడు. తన పాపములను బట్టి, తప్పులను బట్టి నిందను తీసుకొనలేడు.


ఆదాము తాను చేసిన పాపమునకు నిందను తీసుకొనలేకపోయాడు. ''ఆ చెట్టు ఫలమును నీవు తిన్నావా?'' అని దేవుడు అతనిని అడిగినప్పుడు అక్కడ సరియైన సమాధానం ఒక్కటే ఉన్నది. ''అవును ప్రభువా''. కాని అతడు ఆ మాట చెప్పలేదు. పండు ఇచ్చినందుకు మొదట తన భార్యను నిందించాడు తరువాత అటువంటి భార్యను ఇచ్చినందుకు దేవుణ్ణి నిందించాడు (ఆదికాండం 3:12). తనను తాను సమర్ధించుకొనడం అంటే ఇదే. దానికి ప్రతిఫలంగా ఆదాము పరదైసు నుండి వెళ్ళగొట్టబడ్డాడు.


రక్షించబడిన సిలువమీది దొంగ పూర్తిగా వ్యత్యాసంగా ఉన్నాడు. అతడు ''నా శిక్షకు నేను పాత్రుడనే'' (లూకా 23:41) అని చెప్పెను. తన తల్లిదండ్రులు తప్పుడు విధానంలో పెంచారని, తన స్నేహితులు నాశనమునకు నడిపించారని, లేదా న్యాయాధిపతి ముందే నిర్ణయించుకున్నాడని, లేక పక్షపాతము కలిగియున్నాడని, లేక ఎంతో కఠినముగా ఉన్నాడని కాని అతడు ఎవరినీ నిందించలేదు. ''ఈశిక్షకు నేను పూర్తిగా పాత్రుడను'' అని సుళువుగా చెప్పెను. దాని ఫలితంగా అదే రోజు యేసు ప్రభువుతో పరదైసుకు వెళ్ళెను. ఎవరైతే తమ పాపములకు నిందను తీసుకొని వేరే ఎవరినీ నిందించరో వారి కోసము పరదైసు ఉన్నది.


ఒకవేళ నిన్ను నీవు సమర్ధించుకొనుటకు నీ భార్యను లేక దేవుణ్ణి లేక ఏ ఇతర వ్యక్తినైననూ నిందించే వానిగా ఉన్నట్లయితే, నీవు ఒక పరిసయ్యుడవు మరియు నీవు నరకమునకు పోవు నీ మార్గములో ఉన్నావు. యేసు పరిసయ్యులతో చెప్పిన ముగింపు మాటలు ఎంతో భయంకరముగా ఉన్నాయి: సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు? (మత్తయి23:33).


అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. (హెబ్రీ 12:28 నుండి 13:1).


పరిసయ్యతత్వం అనేది మన శరీరం మీద వచ్చిన చీముపుండులోని చీము లాంటిది. ప్రతి దినము మనం చీము పిండే కొలదీ, అది పూర్తిగా కడుగబడే వరకూ, ప్రతి దినము ఇంకా ఎక్కువగా చీమును కనుగొంటాము. కాబట్టి మనలో ఉన్న పరిసయ్యతత్వం ఏమీ మిగలకుండా మొత్తాన్ని పిండి వేయాలి.


''ప్రభువా, నేను అపరాధిని. నా భర్త కాదు, భార్య కాదు, సహోదరుడు కాదు, సహోదరి కాదు లేక వేరే వాళ్ళు ఎవరూ పరిసయ్యులు కాదు. నేనే పరిసయ్యుడను. నా మీద దయ ఉంచి, నా పరిసయ్యతత్వము నుండి పూర్తిగా విడుదల దయచేయండి. ఒక దైవజనుడుగా కాగలుగుటకు మరియు నీ శిష్యుడుగా అగుటకు కావలసిన కృపను దయచేయండి. మీరు నా మీద దయ చూపినట్లుగా నేను ఎల్లప్పుడూ ఇతరుల ఎడల దయ కలిగి ఉండుటకు సహాయము చేయండి.'' అని మనము యదార్ధముగా ఒప్పుకొందుము గాక.


మన జీవిత దినములన్నింటిలో ఈ మార్గమున నడచుటకు, దేవుడు మనకు సహాయము చేయును గాక. తద్వారా ఒక రోజు ఆయన రాజ్యములోనికి సమృద్ధి ప్రవేశము మనకు కలుగును.


ఆమేన్‌... ఆమేన్‌...