దేవుని మార్గములను తెలుసుకొనుట

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 1
దేవుని మార్గములను తెలుసుకొనుట

''దేవుడు తన మార్గములను మోషేకు తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను'' (కీర్తనలు 103:7). ''అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము'' (యోహాను 17:3).

దేవుని క్రియలను (ఆయన అద్భుతములను సహితము) గమనించుటకు మరియు ఆయన మార్గములను అర్థము చేసికొనుటకు మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ఎక్కువ మంది క్రైస్తవులు కేవలము దేవుని క్రియలను గమనించుదురు. వారు బాహ్య అద్భుతముల చేత ఆకట్టుకోబడుదురు. వారు స్వస్థతను భౌతికమైన ఆశీర్వాదాలను ఆత్రముగా కోరుకొనెదరు. వారి ప్రార్థనలలో ఎక్కువ భాగము కూడా భూసంబంధమైన విషయాల గురించే యుండును; వాటిలో దేవుడు వారి పక్షమున కార్యముచేసి భౌతిక రంగములో వారిని దీవించవలెనని ఆశించుదురు. వారు ఆత్మీయముగా శిశువులుగా ఉండుటయే దీనికి కారణము. ''దేవునిని యేసుక్రీస్తుని ఎరుగుటయే'' నిత్యజీవమని బైబిలు చెప్పుచున్నది (యోహాను 17:3). నిత్యజీవము అన్నది నిత్యమైన అస్థిత్వమును (ఉనికిని) సూచించదు. నిత్యజీవమన్నది దేవుని జీవమునకు, స్వభావమునకు మరొకమాట.

నిత్యత్వమును మనుష్యులందరు అనుభవించెదరు-నరకమునకు వెళ్లువారు కూడా అనుభవించెదరు. కాని, బహుకొద్దిమందే నిత్యజీవమును ఆనందింతురు. మనము దేవునిని ప్రభువైన యేసును యెరిగిన కొలది, మనము నిత్యజీవమును అంత ఎక్కువగా కలిగియుందుము.

మోషే దినాలలో, మోషే మాత్రమే దేవుని మార్గములను అర్థము చేసుకోగలిగెను. ఈ రోజున క్రొత్త నిబంధన క్రింద, ఈ ఆధిక్యత మనకందరికీ ఇవ్వబడినది.

అయినప్పటికీ ఎక్కువమంది విశ్వాసులు దేవుని బాహ్యక్రియల చేత ఆకర్షింపబడుదురు గనుక బహు కొద్దిమంది మాత్రమే దేవునిని ఆయన మార్గములను యెరుగుదురు. వారు ఒక ఉద్యోగము పొందుట, ఎక్కువ డబ్బులు సంపాదించుట, క్రొత్త ఇంటినికొనుట లేక భార్యను గాని భర్తను గాని పొందుట లేక స్వస్థతను అనుభవించుట వంటి బాహ్యమైన అద్భుతాలను అనుభవించినప్పుడు, జీవితములో వారికి ఇవే అతి గొప్ప విషయాలు గనుక వారు ఉత్సాహపడి వీటిని గురించి సాక్ష్యమిచ్చుటకు త్వరపడుదురు.

మనలను ఉత్సాహపరచేవి ఇంకను ఇవే అయితే మనము క్రొత్త నిబంధన యొక్క మహిమను చూడలేదు. ఆత్మీయముగా పరిణితి చెందిన వారి ఒక గుర్తు ఏమిటంటే వారు దేవునిని యెరుగుటకు మరియు ఆయన మార్గములను అర్థము చేసుకొనుటకు ఇచ్చే ప్రాముఖ్యతను దేవుని బాహ్య క్రియలకు ఇవ్వరు. ఉదాహరణకు, మనము దేవునిని ఆయన మార్గములను అర్థము చేసుకొన్నప్పుడు మాత్రమే, ''లోకానుసారత'' అంటే ఏమిటో అర్థము చేసుకోగలము. అనేకమంది విశ్వాసులు లోకానుసారత అంటే లిప్‌స్టిక్‌ వేసికొనుట, ఆభరణాలు మరియు ఖరీదైన దుస్తులను ధరించుట లేక ఇంటిలో ఖరీదైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను కలిగియుండుట వంటి బాహ్యసంబంధమైనదని తలంచుదురు. కాని లోక మర్యాదను అనుసరించుట అనేది ఒక వ్యక్తి మనస్సులో ఉన్నదని రోమా 12:2 స్పష్టము చేయుచున్నది. ఒక వ్యక్తి తన మనస్సులో ఈ లోక మర్యాదను అనుసరించుటను వ్యతిరేకించి దేవుని చిత్తమును అర్థము చేసికొనుటకు నూతన పరచబడవలెను. ఒక వ్యక్తి ఈ లోకానుసారత యొక్క బాహ్య గుర్తులన్నిటిని తొలగించుకొని మనుష్యుల యెదుట ఒక మంచి సాక్ష్యమును కలిగియుండవచ్చును. అయినప్పటికీ తన ఆలోచనా విధానములో పూర్తిగా లోకానుసారముగా ఉండవచ్చును. ఎక్కువ మంది విశ్వాసుల ''లోకానుసారత'' యొక్క నిర్వచనము వారి స్వంత జీవన ప్రమాణము మీద ఆధారపడియుండును. వారు ఈ లోకపు సామాగ్రిని కలిగియున్నను అది వారిని లోకానుసారులైన వారిగా చేయదని వారు భావించుదురు. కాని వారి కంటే ఎక్కువగా ఎవరైనా కలిగియుంటే అతడు లోకానుసారమైన వ్యక్తి! వారి జీవన ప్రమాణము పెరిగినప్పుడు, వారు వారి లోకానుసారత యొక్క కొలతను తగినవిధంగా పైకి సర్దుబాటు చేయుదురు! కాని ఏ విశ్వాసి పరిపూర్ణమైన ప్రమాణము కాదు. ప్రభువైన యేసు ఒక్కడే మన ప్రమాణము. లోకానుసారతను గుర్తెరుగుటకు మనము యేసు క్రీస్తును యెరుగవలెను. ఆయన జీవితము యొక్క వెలుగులో మాత్రమే ఏది లోకానుసారమైనదో ఏది కాదో మనము చూడగలము.

పరిసయ్యులు దేవుని ఎరిగియుండలేదు గనుక వారు నీతిని వెంటాడినప్పుడు స్వనీతిపరులుగా మారిరి. వారు దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగియుండకుండా నీతిని వెంటాడిరి. మనము కేవలము పరిసయ్యుల క్రియలు చేయకుండుట ద్వారా పరిసయ్యుల మనస్తత్వమును తొలగించుకోలేము. ఉదాహరణకు, మనము ఒక పరిసయ్యునికి కలిగిన లక్షణములను గూర్చి విని, బహుశా ఆ లక్షణములను మన జీవితాలలోనుండి తొలగించుకోవచ్చు కాని అది ఒక చెడ్డ చెట్టు నుండి చెడ్డ ఫలములను కత్తిరించినట్లు మాత్రమే ఉండును. ఆ చెడ్డ ఫలాలు మరల వేరొక కొమ్మ మీద కనబడును.

ఒక విశ్వాసి తన జీవితమంతా కేవలము పరిసయ్యుల యొక్క వివిధ ఫలములను తన జీవితములో నుండి కత్తిరించుచు గడిపి, తన క్రైస్తవ జీవితము యొక్క ప్రారంభము కంటే దాని చివరిలో ఇంకా గొప్ప పరిసయ్యునిగా మారవచ్చును.

ఈ రోజుల్లో అన్నిచోట్ల నిర్వహించబడే ''స్వస్థత సభల'' విషయమును పరిశీలించండి. ఇటువంటి సభల నిమిత్తము అమాయక విశ్వాసులనుండి కోట్లాది రూపాయలు సేకరింపబడును. ఇటువంటి వ్యాపారాత్మకమైన ''క్రైస్తత్వము''లో క్రీస్తుకు సంబంధించిన ఆత్మలేదని వివేచింపగలిగిన విశ్వాసిని కనుగొనుట అరుదు. అయితే మీరు యేసుక్రీస్తును యెరిగియున్నప్పుడు దేవుని సేవకులమని చెప్పుకొనే ప్రతివానిని యేసుతోనే పోల్చిచూచెదరు.

యేసుని జీవితము యొక్క వెలుగులో ప్రభువైన యేసుకు మరియు ''స్వస్థపరచువారు'' అనబడే వీరికి మధ్య ఏ పోలికా లేదని స్పష్టమగును. కాని మీరు యేసుక్రీస్తును యెరిగియుండని యెడల, ఇటువంటి సభలలో చేయబడే అనేక సంగతులు మీకు ఎంతో ఆకర్షణీయముగా కనబడి, మీరు మోసపోవచ్చును.

చివరి దినాలలో మోసపరచు ఆత్మలు ఒక ప్రవాహమువలే లోకమును ఆక్రమించి, అనేకులను మోసగించునని పరిశుద్ధాత్మ నొక్కి వక్కాణించెను (1తిమోతి 4:1). తన శిష్యులు మోసగింపబడకుండునట్లు జాగ్రత్తగా ఉండమని యేసు వారికి అనేకసార్లు చెప్పెను. యుగాంతమునకు మొదటి గుర్తు మోసమేనని ఆయన చెప్పెను (మత్తయి 24:3,4). మోసమును తప్పించుకొనుటకు ఏకైక మార్గము ప్రభువును తెలిసికొనుటయే. అప్పుడు దేవుని మహిమ పరచేది ఏమిటో, కానిది ఏమిటో మనము వివేచింపగలము.

ఈ రోజులలో క్రైస్తవ తల్లిదండ్రులు వారి పిల్లలను ఏమి చేయుటకు అనుమతించవచ్చునో వారు ఏమి చేయకూడదో, వారి పిల్లలు పాల్గొనుటకు పాఠశాలలో ఏ కార్యక్రమములు సరియైనవో ఏవి కావో, వారి కుమార్తెలు ఏ రకమైన దుస్తులు ధరించుటకు అనుమతించవచ్చునో మొదలగు వాటిని గూర్చి చాలాసార్లు అయోమయంలో ఉందురు.

మనము కేవలము ఇతర భక్తిగల సహోదరులకున్న ప్రమాణములనే అనుకరింపవలెనా? ఇతరుల క్రియలను అనుకరించుట మనము మునిగిపోవుటకు నడిపించునని బైబిలు చెప్పుచున్నట్లున్నది (హెబ్రీ 11:29 చూడండి). మనము ఇతరుల విశ్వాసము అనుకరించాలి గాని వారి క్రియలను కాదు (హెబ్రీ 13:7). ఒక సహోదరుడు ఏ నియమములను బట్టి ఒక నిర్ణయము తీసుకొనెనో మనము అర్థము చేసుకోవలెను అంతేకాని కేవలము అతని చర్యలను అనుకరించకూడదు. దీనిని నేను ఒక ఉదాహరణతో వివరించగలను. ఒక సహోదరుడు పొదుపుచేయుట భక్తిలో ఒక ముఖ్యమైన భాగమని యెరిగి తన టూత్‌బ్రష్‌పైన సగము మట్టుకే టూత్‌పేష్ట్‌ను వేసుకొనేవాడు. ఈవిధంగా అతని టూత్‌పేష్ట్‌ రెట్టింపు కాలము మిగులును. కాని మీరు ఆ చర్యను ప్రతి దినము అనుకరించినప్పటికీ ఎప్పటికీ భక్తిగలవారు కాలేరు. మనము అనుకరించవలసినది ఆ సహోదరుడు జీవించిన మితవ్యయము యొక్క నియమమును గాని అతడు తన టూత్‌బ్రష్‌పైన వాడిన టూత్‌పేష్ట్‌ యొక్క కొలతను కాదు. మీ పళ్లు మంచివి కానప్పుడు, మీరు భక్తిపరులైనప్పటికీ, మీ బ్రష్‌పైన టూత్‌పేష్ట్‌ను పూర్తిగా వేసుకోవలసిన అవసరమున్నది.

దేవుణ్ణి ఇంకా బాగా తెలుసుకొనుట మన వాంఛగా ఉండవలెను, ఎందుకంటే ఇదే నిత్యజీవమైయున్నది. మనము నిత్యత్వమంతా దేవునిని ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకొనుచు గడిపెదము. అందుచేత దేవున్ని తెలిసికొనుట తమ వాంఛగా కలిగియున్న వారికి నిత్యత్వము విసుగు పుట్టించదు. మన భూలోక జీవితము కూడా ఇక విసుగుపుట్టించేదిగా ఉండదు.

ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు ఆదాముతో వ్యవహరించిన విధానములో ఆయన జీవమును గూర్చి మరియు ఆయన మార్గములను గూర్చి మనము కొంత నేర్చుకొందాము. అక్కడ భార్యకొరకు ఆదాము అవసరతను చూచి అతని కొరకు ఒక భార్యను చేసి ఆ అవసరతను తీర్చినది దేవుడేనని మనము చూచెదము. అక్కడ దేవుని స్వభావము ఎటువంటిదో మనము చూచెదము. దేవుడు ప్రజల అవసరతలకు ఎల్లప్పుడు అప్రమత్తముగా (మెళకువగా) ఉండి ఆ అవసరతలను తీర్చుటకు ఆయన చేయగలిగినదంతయు చేయును.

మనము దేవ స్వభావములో పాలుపొందినప్పుడు, మనము కూడా అలాగే మారుదుము. మన చుట్టూ ఉన్న వారి యొక్క అవసరతలకు సమస్యలకు, మెళకువగా నుండి ఆ అవసరతలను తీర్చుటకు మనము చేయగలిగినదంతయు చేయుదుము.

దీనికి చాలాసార్లు మననుండి గొప్ప త్యాగము అవసరము. కాబట్టి దేవ స్వభావములో పాలుపొందుటకు ఈ వెల చెల్లించుటకు మనము సిద్ధముగా ఉన్నామా లేమా అని మనలను మనము ప్రశ్నించుకోవలసిన అవసరమున్నది. మన ఆదాము స్వభావము ఈ దేవ స్వభావమునకు ఖచ్చితముగా విరుద్ధముగా ఉన్నది. ఆదాము జీవము పూర్తిగా స్వార్థపూరితమైనది మరియు అది మన స్వంత అవసరతలకు మన కుటుంబ సభ్యుల అవసరతలకు మాత్రమే మనలను మెళకువగా చేయును. నిజానికి అది ఎంత స్వార్థముతోను అసూయతోను నిండియున్నదంటే, ఇతరుల అవసరతలను వేరొకరు తీర్చుట కూడా అది ఇష్టపడదు. దానికి బదులు ప్రజలు బాధపడుట చూచి అది ఆనందించును. మానవుడు పాపము చేసినప్పుడు దేవుడు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటుఅటు తిరుగు ఖడ్గమును కలిగిన కెరూబులను నిలువబెట్టెను. జీవవృక్షము నిత్యజీవమును, అనగా దేవుని యెరుగుటను సూచించుచున్నది. జీవవృక్షము యెదుట ఉంచబడిన ఈ ఖడ్గము ద్వారా, ఎవరైనను ఇప్పుడు జీవవృక్షములో పాల్గొనగోరితే, అతడు మొదట తన స్వార్థపరమైన జీవముపైన ఈ ఖడ్గము పడుటను అనుభవింపవలెనని దేవుడు సాదృశ్య రూపముగా ఆదాముకు చూపించుచుండెను. ఆదికాండము 3:21లో, ఆదాము హవ్వ పాపము చేసిన వెంటనే, దేవుడు ఏదేనులో ఒక జంతువును చంపి, వారికి ఆ జంతు చర్మము యొక్క చొక్కాయిలను తొడిగించెను. అక్కడ కూడా దేవుడు వారికి అదే పాఠమును నేర్పించుచుండెను-వారు కప్పబడుటకు ఏకైక మార్గము త్యాగము మరియు మరణము అనే మార్గము అని నేర్పించుచుండెను. ఆదాము మరియు హవ్వ మొదట తమ్మును తాము ''మరణము'' లేకుండా అంజూరపు ఆకులతో కప్పుకొనుటకు ప్రయత్నించిరి. కాని దేవుడు ఆ ఆకులను పడవేసి, వారు కప్పబడుటకు సరైన మార్గమును వారికి చూపించెను. గనుక మానవుడు ఆయనతో సహవాసము చేయుటకును ఆయన స్వభావమును ధరించుటకును మార్గము త్యాగమేనని దేవుడు నొక్కిచెప్పుట మనము మొదటినుండే చూచెదము.

కయీను యొక్క ప్రధానమైన సమస్య అతడు తన సహోదరుని యెడల సరియైన ఉద్దేశ్యము కలిగిలేకపోవుటయేనని దేవుడు అతనితో చెప్పెను (ఆదికాండము 4:7). ''కయీను నడచిన మార్గము''న నడచువారిని గూర్చి యూదా చెప్పెను (యూదా 11). వారు ఎవరు? వారి సహోదరుల యెడల మంచి ఉద్దేశ్యములను కలిగియుండని వారు. ఈ విషయములో మనమందరయు ఆత్మీయ తనిఖీ చేసుకొనుట మంచిది.

మీ స్థానిక సంఘములో నున్న సహోదర సహోదరీలకును వారి కుటుంబాలకును అతిశ్రేష్టమైనవాటినే మీరు కోరుకొనుచున్నారని మీరు యధార్థముగా చెప్పగలరా? ఇతర సంఘ శాఖలలో మీకు తెలిసిన ఇతర విశ్వాసులకు అతి శ్రేష్టమైనవాటిని మీరు కోరుకొనుచున్నారని మీరు చెప్పగలరా? తరువాత ఈ వృత్తమును ఇంకా పెద్దది చేసి మీరు తెలిసిన వారందరికీ, మీ బంధువులకు, మీ శత్రువులకు, మీకు ఏ విధముగానైనా హాని చేసిన వారికి మీరు అతిశ్రేష్టమైన వాటినే కోరుకొనుచున్నారేమో అని మిమ్ములను మీరు ప్రశ్నించుకొనుడి. వేరొక వ్యక్తికిగాని అతని పిల్లలకు గాని ఏదైనా మంచి జరిగినప్పుడు మీరు మీ హృదయముతో (ఆనందమునకు బదులు) అలజడిని కనుగొన్న యెడల లేక అతనికి గాని అతని పిల్లలకు గాని ఏదైనా చెడు జరిగినప్పుడు మీ హృదయములో (దు:ఖమునకు బదులు) సంతోషమును కనుగొన్న యెడల, ఇటువంటి వైఖరులు దేనిని సూచించుచున్నవి? ఆదాము జీవము మీలో సజీవముగాను చురుకుగాను ఉన్నదని సూచిస్తున్నది.

మీతో మీరు యదార్థముగా ఉన్నయెడల, మీరు కయీను నడచిన మార్గమున నడచుచున్నారో లేదో అని మీరు వెంటనే కనుగొనవచ్చును. మీలో ఈ దుష్ట ఆదాము జీవమును మీరు చూచినప్పుడు, మీరు దేవుని అగ్నిని ఆయన అభిషేకమును నిరంతరము మీ మీద నిలిచియుండగోరిన యెడల, దానిని మీరు వెంటనే చంపవలెను. గోధుమగింజ భూమిలో పడి పూర్తిగా చచ్చిపోయినప్పుడు మాత్రమే అది విస్తారముగా ఫలించును. తన అహము విషయములో పూర్తిగా చనిపోయిన వ్యక్తి ఇతరులు ఏమి చేసినా చేయకపోయినా ఎప్పుడు అభ్యంతరపడడు. అతడు అందరియెడల మంచి ఉద్దేశ్యము కలిగియుండును. తనకు సంబంధించిన ఏ విషయములోనైనను అతడు ఎప్పుడు కోపపడడు మరియు అతడు ఎవరితోను గొడవపడడు తన కొరకు తాను జాలిపడుచు ఒక్క కన్నీటి చుక్కను కూడా కార్చడు- ఎందుకంటే మృతులు తమ సమాధులలో నిశ్చయముగా ఏడ్వరు.

కయీను తన సహోదరుడి పట్ల మంచి ఉద్దేశ్యమును కలిగియుండనందున అతని ముఖము వ్యాకులపడినట్టుగా ఉండెను (ఆదికాండము 4:6). మనము గ్రహించకపోవచ్చు గాని, మన హృదయాలలో నున్న వైఖరి మన ముఖముల మీద ప్రతిబింభించును. మీరు అందరి యెడల మంచి ఉద్దేశ్యములను కలిగియుంటే, మీ ముఖము దేవునియొక్క ఆనందముతో ఎల్లప్పుడు ప్రకాశించును.

అనేకమంది విశ్వాసులు కయీను నడచిన మార్గమున నడుచుచున్నారు. వారి నీరసముగా ఉండే చిరునవ్వులు మరియు వారి పెదవులనుండి వచ్చు ''దేవుని స్తోత్రము'' అను మాటల వెనుక, వారి సహ-విశ్వాసుల పట్ల తప్పు వైఖరులు కనబడును. ప్రజలు మిమ్ములను వ్యతిరేకించి మీకు చెడుచేసినప్పుడు, మీ హృదయము యొక్క నిజస్థితిని మీకు చూపించుటకు దేవుడు వారిని వాడుకొనును. మీరు వారిని ప్రేమింపలేని యెడల, మీ హృదయమును పరీక్షించుకున్నప్పుడు మీరు దేవుని స్వభావములో పాలుపొందలేదని చూపిస్తుంది, ఎందుకనగా తమ దేవుని స్వభావము శత్రువులను సహితము ప్రేమించు స్వభావము. యేసు ఇస్కరియోతు యూదా పట్ల కూడా మంచి ఉద్దేశ్యమును కలిగియుండెను. దేవుడు ప్రజలందరి కొరకు అతిశ్రేష్టమైన దానినే కోరుకొనును. ఈ స్వభావములో మనము కూడా పాలివారము కాగలము అనునదియే సువార్త యొక్క సందేశము. దీనిని అర్థము చేసుకొనని వారు సువార్తను ఏ మాత్రము అర్థము చేసుకోలేదు.

ఆదాము హవ్వ పాపము చేసినప్పుడు, దేవుడు వారిని శపింపలేదు. ఆయన సర్పమును శపించెను. కాని ఆదాము మరియు హవ్వకు, సర్పము యొక్క తలను చితుకద్రొక్కుటకు క్రీస్తు ''స్త్రీ సంతానము''గా వచ్చునన్న ఆ అద్భుతమైన వాగ్దానము ఇచ్చెను (ఆదికాండము 3:15). ఈ ప్రక్రియలో క్రీస్తు యొక్క మడిమ గాయపరచబడును. అది ఆదాము సంతతిని వారి పాపములనుండి రక్షించుటకు ఆయన చెల్లించవలసిన వెలయైయుండును.

ఇది దైవికమైన ప్రేమ- తాను ప్రేమించిన వారిని రక్షించుటకు తన ప్రాణమును పెట్టు ప్రేమ. మనము దేవుని ప్రేమ యొక్క లోతును చూచినప్పుడు, దానికి ఎంత తక్కువగా మన ప్రేమ ఉన్నదోనని మనము చూచెదము. మనము దానికొరకు కోటి సంవత్సరములు ప్రయాసపడినప్పటికీ మనకు మనము ఈ దేవుని జీవమును ఎప్పటికీ ఉత్పత్తి చేయలేము. దానిని దేవుడే మనకు ఇవ్వవలెను. ఈ ప్రేమను మన హృదయాలలో ప్రవహింపజేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను (రోమా 5:5). ఈ త్యాగపూరితమైన ప్రేమ యొక్క నియమము చొప్పున జీవించుటకు ఇష్టపడిన వానిని మాత్రమే భూమి మీద తన సంఘమును కట్టుటకు దేవుడు వాడుకొనగలడు.

2దినవృత్తాంతములు 3:1లో ''సొలొమోను మోరీయా పర్వతమందు యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను'' అని మనము చదివెదము. మోరీయా పర్వతము అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి అర్పించిన స్థలము (ఆదికాండము 22వ అధ్యాయము). అక్కడ, ఆ పర్వతము మీద దేవుని మార్గము త్యాగముతో కూడిన మార్గమని అబ్రాహాము అర్థము చేసికొని దానికి లోబడెను. దేవుడు ఆ స్థానమును పవిత్రపరచి ఆయన మందిరము అదే స్థానములో, వెయ్యేళ్ల తరువాత కట్టబడునని నిర్ణయించెను. మరియు ఈ రోజున కూడా దేవుడు తన మందిరమును (సంఘమును) అదే చోట కట్టును-అబ్రాహాము యొక్క ఆత్మను మరియు విశ్వాసమును కలిగియున్నవారిని, ఆయన కనుగొన్న చోటనే సంఘమును కట్టును.

మోరీయా పర్వతము మీద అబ్రాహాము దేవునితో చెప్పినది ఏదేను వనములో ఆదాము హవ్వ దేవునికి చెప్పినదానికి సాదృశ్యరూపముగా ఖచ్చితముగా విరుద్ధముగా నున్నది.

ఏదేనులో, ఆదాము హవ్వ నిషేధింపబడిన ఫలమును తినుట ద్వారా వారికి ఆనందము నిచ్చు సృష్టింపబడిన వస్తువులు, సృష్టికర్త కంటే వారికి అమూల్యమైనవని దేవునితో చెప్పిరి. ఈ రోజు కూడా వందల కోట్ల మానవులు దేవునితో ఖచ్చితముగా అదే చెప్పుచున్నారు. ''వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి'' (రోమా 1:25). కాని మోరీయా పర్వతము మీద అబ్రాహాము దానికి విరుద్ధమైన దానిని చెప్పెను: తన దేవుడు మరియు తన సృష్టికర్త భూమి మీద తనకు కలిగిన అతి ప్రియమైన దానికంటే (ఇస్సాకు కంటే) అమూల్యమైన వాడని చెప్పెను. దానిని నిరూపించుటకు అతడు ఇస్సాకును బలిచ్చుటకు సిద్ధముగా నుండెను. ఈ త్యాగమనే నియమము చొప్పున జీవించువారందరిని దేవుడు ఘనపరచును. ఈ మార్గము చేత పట్టబడిన వారి చేతనే దేవుని యొక్క నిజమైన మందిరము ఈ రోజున కూడా కట్టబడను.

కల్వరి కొండమీద, యేసు లోకపాపముల నిమిత్తము చనిపోవుట మాత్రమే సత్యము కాదు. అక్కడ, దేవుడు తన కార్యమునంతటిని చేయు త్యాగమనే నియమమును యేసు ప్రదర్శించెను. ఎవరు ప్రభువును ఇంకా ఏ ఇతర మార్గములో సేవించలేరు.

ఈ లోకములో ఒక సౌకర్యవంతమైన జీవితమును కోరుకొని, అదే సమయములో సంఘమును కూడా కట్టాలనుకొనేవారు, కేవలము తమ్మును తాము మోసపరచుకొనెదరు. రెండు లోకాలలోను (ఇహలోకములో, పరలోకములో) శ్రేష్టమైన వాటిని కోరుకొనువారు సాతానుచేత పూర్తిగా మోసగింపబడిరి. అనేకులు త్యాగము చేయకుండా దేవుని సేవించుటకు ప్రయత్నించిరి. కాని వారి ప్రయాసలకు ఫలితము వైఫల్యము వెంట వైఫల్యమే. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్నుతాను అప్పగించుకొనెను (ఎఫెసీ 5:25,26).

సంఘమును కట్టుటకు మనము కూడా సంఘమును అదే విధముగా ప్రేమించవలెను. మన డబ్బునో లేక సమయాన్నో ఇచ్చుట సరిపోదు. మనలను మనము (మన స్వజీవమును) అప్పగించుకోవలెను. దేవుడు తన ప్రేమను మానవునికి వర్ణించగోరినప్పుడు, ఆయన తన ప్రేమను ఒకే ఒక్క భూసంబంధమైన ఉదాహరణతో పోల్చగలిగెను-అది ఒక తల్లి తనకు పుట్టిన చంటిబిడ్డ కొరకు కలిగియున్న ప్రేమ (యెషయా 49:15).

మీరు ఒక తల్లిని గమనించిన యెడల, తన శిశువు కొరకు ఆమెకున్న ప్రేమ త్యాగపూరితమైన ఆత్మను కలిగియుండునని మీరు చూచెదరు. తెల్లవారుజాము నుండి రాత్రివరకు మరియు రాత్రంతయు కూడా ఒక తల్లి తన శిశువుకొరకు త్యాగము చేస్తూ ఉండును. దానికి ఫలితముగా ఆమెకు ఏమియు లభించదు. ఆమె తన బిడ్డకొరకు సంవత్సరం వెంబడి సంవత్సరం బాధను, అసౌకర్యమును, ఎదురు ఏమి ఆశించకుండా, ఆనందముగా సహించును. దేవుడు మనలను కూడా అదేవిధముగా ప్రేమించుచున్నాడు. ఆ స్వభావమునే ఆయన మనకు ఇవ్వజూచు చున్నాడు. కాని ఆ విధముగా అందరు ఒకరినొకరు ప్రేమించే సహవాసము లోకమంతటిలో ఎక్కడైనను ఉన్నదని యధార్థముగా చెప్పగలుగుట అసాధ్యము. ఎక్కువ మంది విశ్వాసులకు వారితో ఏకీభవించిన వారిని మరియు తమ గుంపులో జేరినవారిని మాత్రమే ఏ విధముగా ప్రేమించవలెనో తెలియును .వారి ప్రేమ మానవ సంబంధమైనది మరియు అది తల్లుల యొక్క త్యాగముతో కూడిన ప్రేమకు చాలా దూరముగానున్నది. కాని మనము ప్రయాసపడవలసిన గురి దైవికమైన ప్రేమ. కాబట్టి మన ప్రేమ ఇంకను అలా లేదని యధార్థముగా అంగీకరించటమే కాకుండా, మన ప్రేమ అలా ఒక రోజున మారునన్న నిరీక్షణను ఆశను మనము ఒప్పుకోవలెను.

తన చుట్టు ఉన్నవారు తన బిడ్డకొరకు త్యాగము చేసినా చేయకపోయినా ఆ తల్లి లెక్కచేయదు. ఆమె మాత్రము ఆనందముగా సమస్తమును త్యాగము చేయును. అదేవిధముగా, సంఘమును తన స్వంత శిశువుగా చూచినవాడు, తన చుట్టూ ఉన్నవారు సంఘము కొరకు ఏదైనా త్యాగము చేయుచున్నారా లేదాయని చింతించడు. అతను మాత్రము ఆనందముగా త్యాగము చేయును మరియు అతడు ఇంకెవరికి వ్యతిరేకముగా ఎటువంటి ఫిర్యాదునుగాని అభ్యర్థననుగాని కలిగియుండడు.

సంఘము కొరకు ఇతరులు త్యాగము చేయుట లేదని ఫిర్యాదు చేయువారు తల్లులు కాదు గాని జీతము తీసుకొనే నర్సులు. అటువంటి నర్సులు నియమింపబడిన సమయములోనే పనిచేసి, తరువాత 8 గంటలు పనిచేయు నర్సు సమయానికి రానియెడల ఫిర్యాదు చేయుదురు. కాని ఒక తల్లి ప్రతిదినము 8 గంటలే పనిచేయదు. ఆమె అనుదినము 24 గంటలు, సంవత్సరము వెంబడి సంవత్సరము పనిచేయును. ఆమె దాని నిమిత్తము జీతము కూడా పొందదు. తన బిడ్డకు 20 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ, ఆ తల్లి పని పూర్తి కాదు. తల్లులు మాత్రమే, తమ శిశువులకు ప్రతిదినము పాలు కలిగియుండగలరు. నర్సులు వారు చూచుకొనే శిశువుల కొరకు పాలను ఉత్పత్తిచేయలేరు. అదే విధముగా, సంఘములో తల్లుల వలే ఉండువారు తమ ఆత్మీయ పిల్లల కొరకు ఎల్లప్పుడు ఒక సందేశమును కలిగియుందురు-ప్రతి కూటములోను కలిగియుందురు. అనేక మంది పెద్దలు తల్లులుగా కాక నర్సులుగా ఉన్నందున సంఘము కొరకు సందేశమును కలిగియుండరు.

ఒక తల్లి తన పిల్లల యొద్దనుండి ఎటువంటి ప్రతిఫలము కొరకు ఎదురుచూడదు. ఏ బిడ్డ తన తల్లి పరిచర్య కొరకు డబ్బు చెల్లించదు. నిజానికి, ఒక తల్లికి చెల్లించవలసిన జీతమును మీరు లెక్కించిన యెడల, నర్సుల కిచ్చునట్లు గంటకు 20 రూపాయలు ఇచ్చిన యెడల, ప్రతి బిడ్డ 20 వ సంవత్సరములు వచ్చేసరికి తన తల్లికి 30 లక్షల రూపాయలకంటే ఎక్కువ ఋణపడియుండును. ఏ బిడ్డ అయినా అంత మొత్తమును తన తల్లికి ఎలా చెల్లించగలుగును? మనకు వచ్చే ప్రశ్న ఇదే: ఈ విధముగా, ఎటువంటి జీతము లేకుండా, తన్నుతాను ఇచ్చుకొనుచూ, రోజు వెంబడి రోజు, సంవత్సరము వెంబడి సంవత్సరము, యేసు తిరిగి వచ్చువరకు, ప్రభువు కొరకు ఆయన సంఘముకొరకు పనిచేయుటకు ఇష్టపడువాడెవడు?

అటువంటి ఆత్మ కలిగిన ఒక్కడినైనా దేవుడు ఎక్కడైనను కనుగొన్న యెడల, త్యాగముతో కూడిన ఆత్మ లేకుండా ఆయనను సేవించుటకు ప్రయత్నించే పూర్ణ హృదయులు కాని 10,000 మంది విశ్వాసులను వాడుకొనిన దానికంటే, ఎక్కువగా అతనిని వాడుకొనును. యేసు భూమికి తిరిగి వచ్చినప్పుడు, నీవు ఆయనముందు నిలబడినప్పుడు, నీవు జీవించిన విధానము గురించి నీవు చింతించుదువా లేక దేవుని రాజ్యము కొరకు ఉపయోగకరముగా గడిపిన జీవితమును నీవు వెనుకకు తిరిగి చూడగలవా?

అనేకులు కొట్టుకొనిపోవుచు భూమి మీద తమ జీవితములను వృథా చేయుచున్నారు. ఆలస్యము కాకముందే మేల్కొని, ఆయన మార్గము త్యాగముతో కూడిన మార్గమని దేవుణ్ణి చూపించమని అడుగుము.

వినుటకు చెవులు గలవాడు వినును గాక.

అధ్యాయము 2
నేను నేర్చుకొన్న కొన్ని ముఖ్యమైన సత్యములు

ఒక క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా నేనుండిన 40 సంవత్సరాలలో, నన్ను ప్రోత్సహించి నా జీవితమునకు ఉద్దేశ్యమును దిశను ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సత్యములను నేను నేర్చుకొంటిని. అవి మీకు కూడా ప్రోత్సాహకరముగా నుండునట్లు నేను వాటిని ఇక్కడ మీతో పంచుకొనుచున్నాను.

1. దేవుడు యేసును ప్రేమించినట్టే మనలను ప్రేమించుచున్నాడు

''నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడా ప్రేమించితివి'' (యోహాను 17:23).

ఇది నేను బైబిలులో కనుగొన్న అతి గొప్ప సత్యము. ఇది నన్ను ఒక భద్రతలేని, నిస్పృహ కలిగిన విశ్వాసినుండి దేవునిలో పూర్తి భద్రతను కలిగి, ఎల్లప్పుడు ప్రభువు యొక్క ఆనందముతో నిండిన విశ్వాసిగా మార్చివేసెను. దేవుడు మనలను ప్రేమించుచున్నాడని చెప్పే వచనములు బైబిలులో అనేకమైనవి కలవుగాని ఇది ఒక్కటే ఆ ప్రేమ యొక్క విశాలతను గూర్చి చెప్పుచున్నది-దేవుడు యేసును ప్రేమించినంతగా మనలను కూడా ప్రేమించెను. మన పరలోకపు తండ్రి తన కుమారులలో ఎవరినైనను ప్రేమించు విధానములో పక్షపాతము లేదు గనుక, ఆయన కుమారులమైన మనకు, ఆయన తన జ్యేష్ఠ కుమారునికి చేసినవాటినన్నిటిని చేయుటకు ఆయన నిశ్చయముగా సిద్ధముగా నున్నాడు. ఆయన యేసుకు సహాయపడినట్టే మనకు సహాయపడును. ఆయన యేసును చూచుకొన్నట్టే మనలను చూచుకొనును. ఆయన యేసు యొక్క జీవితమును యోచించుటలో కలిగియున్న ఆసక్తిని, మన అనుదిన జీవితము యొక్క వివరములను యోచించుటలో ఆసక్తి కలిగియుండును. మనకు జరుగునది ఏదియుకూడా దేవునిని ఆశ్చర్యపరచదు. ఆయన ప్రతి పరిస్థితి కొరకు ఎప్పుడో ప్రణాళిక వేసెను. కాబట్టి మనము భద్రతలేనివారిగా ఉండవలసిన అవసరము లేదు. యేసు పంపించబడినట్టే మనము కూడా, భూమికి ఒక ఖచ్చితమైన ఉద్దేశ్యముతో పంపబడితిమి.

ఇదంతయు మీ విషయములో కూడా నిజమే-కాని మీరు దానిని నమ్మినప్పుడు మాత్రమే. దేవుని వాక్యమును విశ్వసింపని వానిలో వాక్యము పనిచేయదు.

2. దేవుడు నిజాయితీ గలవారియందు ఆనందించును

''ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము'' (1యోహాను 1:7).

వెలుగులో నడచుట అనగా మొట్టమొదటిగా మనము దేవుని యెదుట ఏదియు దాచిపెట్టకుండా ఉండుట. మనము ఆయనకు సమస్తమును ఉన్నదిఉన్నట్టు చెప్పుదుము. దేవుని యొద్దకు వెళ్ళుటకు మొదటి మెట్టు నిజాయితీ అని నేను ఒప్పించబడియున్నాను. యదార్థముగా లేనివారిని దేవుడు అసహ్యించుకొనును. యేసు వేషధారులకు వ్యతిరేకముగా మాట్లాడిన దానికంటే వ్యతిరేకముగా ఎవరి గురించి మాట్లాడలేదు. దేవుడు మనలను మొదటిగా పరిశుద్ధులుగా లేక పరిపూర్ణులుగా ఉండమని అడుగడు కాని యధార్థముగా ఉండమని అడుగును. నిజమైన పరిశుద్ధతకు ఇదే ఆరంభము. ఈ ఊటనుండియే తక్కినవన్నియు ప్రవహించును. మనలో ఎవరైనను చేయుటకు సులువైనదేదైనా ఉన్నదంటే అది యదార్థముగా ఉండుటయే. కాబట్టి, పాపమును వెంటనే దేవునితో ఒప్పుకొనుడి. పాపపు తలంపులను ''యుక్తమైన'' పేర్లతో పిలువకుడి. మీరు నిజానికి మీ కళ్లతో వ్యభిచరించు విధముగా మోహించి, ''నేను కేవలము దేవుని సృష్టి యొక్క అందమును మెచ్చుకొనుచున్నాను'' అని చెప్పవద్దు. కోపమును ''న్యాయమైన ఆగ్రహము'' అని పిలువవద్దు. మీరు యధార్థముగా లేనియెడల మీరు పాపముపైన ఎప్పటికీ విజయము పొందలేరు. ''పాపము''ను ఎన్నడు ''పొరపాటు'' అని పిలువకుడి, ఎందుకనగా యేసు రక్తము మిమ్ములను సమస్త పాపములనుండి పవిత్రపరచును కాని, మీ పొరపాట్లనుండి పవిత్రపరచదు. ఆయన యదార్థవంతులు కానివారిని (నిజాయితీ లేనివారిని) పవిత్రపరచడు. యదార్థవంతులైన వారికి మాత్రమే నిరీక్షణ కలదు. ''అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు'' (సామెతలు 28:13). దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మత నాయకులకంటే వేశ్యలకు దొంగలకు ఎక్కువ నిరీక్షణ ఉన్నదని యేసు ఎందుకు చెప్పెను? (మత్తయి 21:31). ఎందుకనగా వేశ్యలు దొంగలు పరిశుద్ధులైనట్లు నటించరు. అనేకమంది యౌవనస్తులు సంఘాలనుండి వెళ్లిపోవుదురు ఎందుకనగా తమకు ఎటువంటి ఇబ్బందులు లేవన్న భావనను సంఘస్తులు వారికి కలుగజేయుదురు. కాబట్టి ''ఈ పరిశుద్ధులైన గుంపు మన సమస్యలను ఎప్పుడు అర్థము చేసుకోరు'' అని ఆ యౌవనస్తులు అనుకొందురు. ఇది మన విషయములో నిజమైతే, తన యొద్దకు పాపులను ఆకట్టుకొన్న క్రీస్తును పోలిన వారిగా మనములేము.

3. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని యందు ఆనందించును

''దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును'' (2కొరిందీ¸ 9:7). ఈ కారణము చేతనే దేవుడు మానవునికి, రక్షణకు ముందు దాని తరువాత కూడా, పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత కూడా పూర్తి స్వేచ్ఛను ఇచ్చును. మనము దేవునివలే యున్నయెడల, మనము కూడా ఇతరులను నియంత్రించుటకు లేక వత్తిడి చేయుటకు ఆశించము. వారు మనకు వేరుగా ఉండుటకు భిన్నమైన అభిప్రాయములు కలిగియుండుటకు, వారికి తగిన విధముగా ఆత్మీయముగా ఎదుగుటకు వారికి స్వేచ్ఛ నిచ్చెదము. ఎటువంటి బలవంతమైనా అపవాది యొద్దనుండి వచ్చును. పరిశుద్ధాత్మ ప్రజలను నింపును, అయితే దయ్యములు ప్రజలను పట్టుకొనును. తేడా ఇదే: పరిశుద్ధాత్మ ఎవరినైనా నింపినప్పుడు, ఆ వ్యక్తి చేయాలనుకున్నది చేయుటకు అతనికి ఇంకా స్వేచ్ఛనిచ్చును. కాని దయ్యములు ప్రజలను పట్టినప్పుడు, అవి వారి స్వేచ్ఛను దొంగిలించి వారిని నియంత్రించును. ఆత్మతో నిండియుండుట యొక్క ఫలము ఆశానిగ్రహము (గలతీ 5:22,23). అయితే దయ్యము పట్టుటకు ఫలితము నిగ్రహమును కోల్పోవుట. మనము దేవుని కొరకు చేయు ఏ కార్యమైనను ఉత్సాహముగా, ఆనందముగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందముగా చేయని యెడల అది నిర్జీవ క్రియయని మనము గుర్తుంచుకోవలెను. ప్రతిఫలము పొందుటకు లేక జీతము పొందుటకు దేవుని కొరకు చేసిన ఏ కార్యమైనను నిర్జీవ క్రియయే. దేవుని దృష్టిలో ఇతరులనుండి వత్తిడివలన దేవునికిచ్చిన ఎంత డబ్బయినను విలువలేనిది. బలవంతమువలనో లేక మనస్సాక్షిని తృప్తి పరచుటకో చేసిన గొప్పకార్యములకంటే, ఆయన కొరకు ఉత్సాహముగా చేసిన చిన్న కార్యములకు దేవుడు విలువనిచ్చును.

4. పరిశుద్ధత యేసువైపు చూచుట ద్వారా వచ్చును

''యేసువైపు చూచుచు.....మనము పందెము పరుగెత్తుదము'' (హెబ్రీ 12:2).

దైవభక్తిని గూర్చిన మర్మము మన వంటి శరీరములో వచ్చిన క్రీస్తు అను వ్యక్తిలో ఉన్నది (1తిమోతి 3:16 దీనిని స్పష్టము చేసెను)-అంతేకాని క్రీస్తు మన వంటి శరీరములో వచ్చాడన్న సిద్ధాంతములో లేదు. ఆయన శరీరమును సిద్ధాంతపరముగా విశ్లేషించుట ద్వారా కాక ఆయన (అనగా క్రీస్తుయేసు) ద్వారా మనము పరిశుద్ధులమగుదుము. స్వయంకృషి ఎంతైనను ఒక పాపపు హృదయాన్ని పరిశుద్ధముగా చేయలేదు అది జరగాలంటే దేవుడే మనలో కార్యము చేయవలెను.

పరిశుద్ధత (నిత్యజీవము) దేవుని వరము -దానిని క్రియల ద్వారా ఎప్పుడు సాధించలేము (రోమా 6:22). దేవుడు మాత్రమే మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచగలడని బైబిలు చెప్పుచున్నది. (ఎవరు పొరబడకుండునట్లు 1థెస్సలొ 5:23 దీనిని చాలా తేటగా చెప్తుంది). అయినప్పటికీ అనేకమంది విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండుటకు తమను తాము ఉపేక్షించుకొనుటకు ప్రయాసపడుచున్నారు. కాబట్టి వారు పరిశుద్ధులగుటకు బదులు వారు పరిసయ్యులగుదురు. ''భ్రమకాని పరిశుద్ధత'' (ఎఫెసీ 4:24-ఫిలిప్స్‌ తర్జుమా)ను యేసుయందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే పొందవచ్చును-వేరేమాటలలో చెప్పాలంటే ''యేసువైపు చూచుట'' ద్వారా పొందవచ్చును. మనము ఒక సిద్ధాంతమును మాత్రమే చూచినయెడల మనము పరిసయ్యులుగా మారుదుము. మన సిద్ధాంతము ఎంత పవిత్రమైనదైతే అంత గొప్ప పరిసయ్యులుగా మనము మారెదము. నేను భూమి మీద కలుసుకొన్న అతి గొప్ప పరిసయ్యులు స్వయంకృషి ద్వారా పరిశుద్ధతయొక్క అత్యున్నతమైన ప్రమాణాలను బోధించు వారి మధ్య ఉన్నారు. వారిలో ఒకరివలే మనము కాకుండునట్లు మనము జాగ్రత్తగా ఉండవలెను! యేసువైపు చూచుట అంటే ఏమిటో హెబ్రీయులు 12:2లో చాలా స్పష్టముగా వివరించబడెను. మొట్టమొదటిగా అనుదినము ''తన సిలువను సహించుచు'' భూమి మీద జీవించిన వానిగా ఉన్న ఆయన వైపు- ''సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, పాపము లేనివాడుగా'' (హెబ్రీ 4:15) ఉన్న ఆయన వైపు మనము చూడవలెను. ఆయన మన అగ్రగామి (హెబ్రీ 6:20); ఆయన అడుగుజాడలలో మనము పరుగెత్తవలెను. రెండవదిగా ఇప్పుడు ''తండ్రి కుడిపార్శమున'' ఉన్నవానిగాను, మనకొరకు విజ్ఞాపన చేయుచు ప్రతి కష్టములోను శోధనలోను సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నవానిగాను మనము ఆయనను చూడవలెను.

5. మనము ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడవలెను

''ఆత్మతో నింపబడుతూ ఉండుట'' (ఎఫెసీ 5:18- అక్షరానుసారమైన తర్జుమా).

మనము పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడు నింపబడియుండని యెడల దేవుడు ఆశించినట్టుగా క్రైస్తవ జీవితమును జీవించుట మనకు అసాధ్యము. ఆత్మ అభిషేకము లేకుండా మానవాతీతమైన కృపావరములను ఆయన యొద్దనుండి పొందకుండా దేవునిని మనము సేవించవలసినరీతిగా సేవించుట అసాధ్యము. యేసు తానే అభిషేకింపబడవలసి వచ్చెను. మన వ్యక్తిగత జీవితాలలోను మన పరిచర్యలో కూడా మనలను యేసువలే చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను (2కొరిందీ¸ 3:18). మన స్వభావములో మనలను యేసును పోలినవారిగా చేయుటకును, యేసు సేవించినట్లు మనము సేవించుటకు మనలను సిద్ధపరచుటకును దేవుడు మనలను ఆత్మతో నింపును. యేసు కలిగియుండిన పరిచర్యను మనము కలిగిలేము. కాబట్టి యేసు తన పరిచర్యలో చేసినది మనము చేయలేము. కాని దేవుని సేవించుటకు యేసు సన్నద్ధుడైయున్నట్లే మనము పూర్తిగా సన్నద్ధులైయుండగలము-అలా మన స్వంత పరిచర్యను నెరవేర్చగలము.

జీవజలనదులు మనలోనుండి ప్రవహించుటకు మననుండి కావలసినదల్లా తగినంత దప్పిక మరియు విశ్వాసము (యోహాను 7:37-39).

మనము కృపావరములను కలిగియుండుటకు మనము వాటిని ఆసక్తితో అపేక్షించవలెను (1కొరిందీ¸ 14:1). లేనియెడల వాటిని ఎప్పటికీ కలిగియుండలేము. పరిశుద్ధాత్మ వరములను కలిగియుండని సంఘము, జీవించుచున్నప్పటికీ చెవిటివాడైన, మూగవాడైన, గ్రుడ్డివాడైన అవిటివాడైన వ్యక్తిగా ఉండును -కాబట్టి అది పనికిరానిది (నిష్ఫలమైనది).

6. సిలువ మార్గమే జీవ మార్గము

''మనమాయనతోకూడా చనిపోయినవారమైతే ఆయనతో కూడా బ్రదుకుదుము'' (2తిమోతి 2:11).

దేవుడు మన కొరకు యోచించి ఏర్పరచిన పరిస్థితులన్నిటిలోను మన స్వజీవమునకు మరణమును అంగీకరించుట ద్వారా తప్ప యేసుయొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు మరి ఏ మార్గము లేదు (2కొరిందీ¸ 4:10,11). మనము పాపము మీద జయము పొందాలంటే, అన్ని పరిస్థితులలోను, మనలను మనము ''పాపము విషయములో మృతులుగా యెంచుకొనవలెను'' (రోమా 6:11). మనము జీవించాలంటే ''ఆత్మచేత శరీర క్రియలను చంపవలెను'' (రోమా 8:13). మన అనుదిన జీవితములో పరిశుద్ధాత్మ మనలను ఎల్లప్పుడు సిలువ యొద్దకు నడిపించును. దేవుడు మనలను ''దినమెల్ల వధింపబడు'' పరిస్థితులలోనికి (రోమా 8:36) మరియు ''యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడు'' పరిస్థితులలోనికి పంపించును (2కొరిందీ¸ 4:11). అటువంటి పరిస్థితులలో యేసుయొక్క జీవము మనలో ప్రత్యక్షపరచబడునట్లు మనము ''యేసుయొక్క మరణానుభవము''ను అంగీకరింపవలెను (2కొరిందీ¸ 4:10).

7. నరుని అభిప్రాయములు చెత్తకుండీకే తగును

''తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును'' (యెషయా 2:22).

నరుని ప్రాణము తన నాసికారంధ్రములను విడిచి పెట్టినప్పుడు, మనము నడిచే దుమ్ము కంటే అతడు శ్రేష్టమైనవాడు కాదు. కాబట్టి మనము ఎందుకు నరుని అభిప్రాయమునకు విలువ ఇవ్వవలెను? మనుష్యులందరి అభిప్రాయములన్నియు కలిపి చెత్తకుండీకే తగును అన్న వాస్తవములో మనము వేరుపారి స్థిరపడనియెడల, మనము ఎప్పుడు ప్రభువును సమర్థవంతముగా సేవించలేము. మనము ఒక్క నరునినైనను సంతోషపెట్టగోరిన యెడల, మనము క్రీస్తు దాసులము కాలేము (గలతీ 1:10).

దేవుని అభిప్రాయముతో పోల్చినప్పుడు ప్రతి నరుని అభిప్రాయము విలువలేనిది. దీనిని ఒప్పుకొన్నవాడు తన జీవితము మీద మరియు తన పరిచర్య మీద దేవుని ఆమోదమునే కోరుకొనును. అతడు ప్రజల మెప్పు పొందుటకు లేక వారి ముందు తన్నుతాను సమర్థించు కొనుటకు ఎప్పుడు ప్రయత్నించడు.

8. లోకము ఘనముగా ఎంచునదంతయు దేవుడు అసహ్యించుకొనును

''మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము'' (లూకా 16:15). లోకములో ఘనముగా ఎంచబడేవి దేవుని దృష్టికి విలువలేనివేకాక, నిజానికి ఆయనకు అసహ్యము. ఈ లోక ఘనత అంతయు దేవునికి అసహ్యము గనుక అది మన దృష్టికి కూడా అసహ్యముగా ఉండవలెను. డబ్బును భూమి మీద ఉన్నవారందరు విలువైనదిగా ఎంచుదురు. కాని డబ్బును ప్రేమించువారు, ధనవంతులగుటకు అపేక్షించువారు ఈ క్రింది ఎనిమిది పరిణామాలను ఎప్పుడోకప్పుడు అనుభవింతురు (1తిమోతి 6:9,10).

1) వారు శోధనలో పడుదురు

2) వారు ఉరిలో పడుదురు

3) వారు అవివేక యుక్తములైన దురాశలో పడుదురు

4) వారు హానికరమైన దురాశలలో పడుదురు

5) వారు నష్టములో మునిగిపోవుదురు

6) వారు నాశనములో మునిగిపోవుదురు

7) వారు విశ్వాసమునుండి తొలగిపోవుదురు

8) వారు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొందురు. ప్రతి చోట విశ్వాసులకు ఇది మరల మరల జరుగుట నేను చూచితిని.

ఈ రోజులలో మన దేశములో ప్రభువు యొద్దనుండి ఒక ప్రవచనాత్మకమైన సందేశము అరుదుగా వినబడుటకు కారణము ఎక్కువమంది బోధకులు డబ్బును ప్రేమించువారిగా ఉండుటయే. సత్యమైన ధనము (ప్రవచనవాక్యము అందులో ఒకటి) డబ్బు విషయములో అపనమ్మకముగా ఉన్న వారికి దేవుడు ఇవ్వడని యేసు చెప్పెను (లూకా 16:11). ఈ కారణముగానే సంఘకూడికలలో సమావేశములలో మనము ఎన్నో విసుగు పుట్టించే ప్రసంగాలను సాక్ష్యములను వినెదము.

9. మనకు మనమే తప్ప వేరెవ్వరు మనకు హానిచేయలేరు

''మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?'' (1పేతురు 3:13).

దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయనను ప్రేమించువారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లు చేయును-అనగా తమ జీవితాలలో ఆయన చిత్తము కాక భూమి మీద ఇంకా ఏ ఆశయము లేని వారికి (రోమా 8:28). స్వార్థపరమైన ఆశయాలు గలవాడు ఈ వాగ్దానమును తనదిగా భావించలేడు. కాని మనము దేవుని చిత్తమును పూర్తిగా అంగీకరించిన యెడల, భూమి మీద మన జీవితము యొక్క ప్రతి నిమిషములోను ఈ వాగ్ధానము మనదిగా భావించవచ్చును. మనలను ఏదియు హానిచేయలేదు. మనకు ఇతరులు చేయునవన్నియు,మంచైనా, చెడైనా, అనుకోకుండా చేసినా, ఉద్దేశ్యపూర్వకముగా చేసినా, అవి రోమా 8:28 చేత వడియ కట్టబడి మన మేలు కొరకే పనిచేయును-అవి ప్రతిసారి మనలను మరికొంచెము క్రీస్తు సారూప్యములోనికి మార్చును (రోమా 8:29), ఇది దేవుడు మనకొరకు యోచించిన మేలు. ఈ వచనములోని షరతులను నెరవేర్చు వారికి ఈ వచనము ప్రతిసారి పరిపూర్ణముగా వడియగట్టును.

ఇంకా చూస్తే, మనము ''మంచి విషయములో ఆసక్తిగలవారమైతే'' మనకు ఎవరు హాని చేయలేరని 1పేతురు 3:13 చెప్పుచున్నది. దురదృష్టవశాత్తు ఇది రోమా 8:28 వలె ఎక్కువగా ప్రాచుర్యము పొందిన వచనము కాదు. కాని దీనిని మనము ఇప్పుడు ప్రాచుర్యము పొందునట్లు చేయవలెను. అయితే ఈ వాగ్దానము కూడా ప్రజలందరి యెడల తమ హృదయాలను మంచిగా ఉంచుకొనుటకు ఆసక్తి గలవారికి మాత్రమే వర్తించును. అటువంటి విశ్వాసికి ఏ దయ్యమైనాగాని నరుడైనాగాని హాని చేయుట అసాధ్యము. కాబట్టి ఏ క్రైస్తవుడైనా ఇతరులు తనకు హాని చేస్తారని ఫిర్యాదు చేసినప్పుడు, అతడు దేవున్ని ప్రేమించుటలేదనియు, దేవుని సంకల్పము చొప్పున పిలువబడలేదనియు, మంచి విషయములో ఆసక్తి కలిగిలేదనియు పరోక్షముగా ఒప్పుకొనుచున్నాడు. లేనియెడల, ఇతరులు చేసినదేదైనను తన మేలు కొరకే జరిగియుండేది, అప్పుడు అతడు ఎటువంటి ఫిర్యాదులు కలిగియుండే వాడు కాదు. నిజానికి, మిమ్ములను హానిచేయగలిగినది మీకు మీరు మాత్రమే-అది మీ అపనమ్మకమును బట్టి లేక ఇతరుల పట్ల మీ చెడు వైఖరుల వలన జరుగును.

నా వయస్సు ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు మరియు నా జీవితమంతటిలో నన్ను ఎవరు హానిచేయలేకపోయారని నేను యధార్థముగా చెప్పగలను. అనేకులు చేయుటకు ప్రయత్నించిరిగాని, వారు చేసిన సమస్తమును కేవలము నా మేలుకొరకు నా పరిచర్య యొక్క మేలు కొరకు జరిగినవి. కాబట్టి వారి కొరకు కూడా నేను దేవునిని స్తుతించగలను. నన్ను వ్యతిరేకించిన వారు ఎక్కువగా దేవుని మార్గములను అర్థము చేసుకొనని ''విశ్వాసులు''గా పిలువబడువారే. ఇది ఎల్లప్పుడు మీ సాక్ష్యము కూడా కాగలదని మీరు నమ్మునట్లు ప్రోత్సహించుటకే నేను నా సాక్ష్యమునిచ్చుచున్నాను.

10. మనలో ప్రతి ఒక్కరి జీవితము కొరకు దేవుడు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను కలిగియున్నాడు

''వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై యున్నాము'' (ఎఫెసీ 2:10)

చాలా కాలం క్రిందట, దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకొన్నప్పుడు, మన భూలోక జీవితాలతో మనము ఏమి చేయవలెనో కూడా ఆయన యోచించెను. ఆ ప్రణాళికను మనము ప్రతిరోజు కనుగొని, దానిని అనుసరించుట మన కర్తవ్యము. దేవుని ప్రణాళిక కంటే మెరుగైన ప్రణాళికను మనము యోచించలేము. ఇతరులు చేయుదానిని మనము అనుకరించకూడదు, ఎందుకనగా ఆయన పిల్లలలో ప్రతి ఒక్కరికి దేవుని ప్రణాళిక భిన్నముగా నుండును. ఉదాహరణకు, యోసేపు విషయములో దేవుని ప్రణాళిక, అతడు ఐగుప్తు యొక్క రాజభవనములో ఉండి తన జీవితము యొక్క చివరి 80 సంవత్సరములు, ఎంతో సుఖంగా జీవించుట. మరోప్రక్క మోషే విషయములో దేవుని ప్రణాళిక, అతడు ఐగుప్తులో ఉన్న రాజభవనమును విడచిపెట్టి తన జీవితము యొక్క చివరి 80 సంవత్సరములు, అరణ్యములో, ఎంతో అసౌకర్యముగా జీవించుట. సుఖమును, సౌఖ్యమును ప్రేమించుట వలన మోషే, యోసేపు మాదిరిని అనుసరించిన యెడల, తన స్వంత జీవితములో అతడు దేవుని చిత్తమును తప్పిపోయేవాడు. ఖచ్చితముగా అదే విధముగా, దేవుడు ఒక సహోదరుని తన జీవితమంతా సుఖంగా అమెరికాలో జీవించాలని కోరుకోవచ్చును మరియొక సహోదరుని తన జీవితమంతా ఉత్తర భారతదేశము యొక్క వేడిలోను దుమ్ములోను కష్టపడాలని కోరుకోవచ్చును. వేరొక సహోదరుని పరిస్థితితో తన పరిస్థితిని పోల్చుకొని అతనియందు అసూయపడి, అతనిని విమర్శించుటకు బదులు, ప్రతివాడు తన స్వంత జీవితము విషయములో దేవుని ప్రణాళికను గూర్చి ఒప్పింపబడవలెను.

దేవుడు నన్ను భారతదేశములో ఆయనను సేవించుటకు పిలచెనని నాకు తెలుసు. కాని వేరెవ్వరికీ నాకున్న పిలుపే ఉండవలెనని నేను కోరుకోలేదు. అయితే మనము మన స్వంత ఘనతను ఆశించినయెడల లేక డబ్బును గాని సుఖమునుగాని మనుష్యుల యొక్క ఆమోదమును గాని ప్రేమించినయెడల మనము దేవుని చిత్తమును ఎన్నటికీ కనుగొనలేము.

11. దేవునిని సన్నిహితముగా యెరుగుటయే బలముగా ఉండుటకు రహస్యము

''తమ దేవుని నెరుగువారు బలముకలిగి యుందురు'' (దానియేలు 11:32).

ఈ రోజు, ఇతరుల ద్వారా పరోక్షముగా మనమాయనను నెరుగవలెనని దేవుడు కోరుకొనుట లేదు. ఆయన అతి పిన్న విశ్వాసిని కూడా ఆయనను వ్యక్తిగతముగా ఎరుగుటకు ఆహ్వానించుచున్నాడు (హెబ్రీ 8:11). దేవుణ్ణి మరియు యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరుగుటయే నిత్యజీవమని యేసు నిర్వచించెను (యోహాను 17:3). ఇది పౌలు జీవితము యొక్క అతి గొప్ప వాంఛగా నుండెను. మరియు ఇది మన గొప్ప వాంఛగా కూడా ఉండవలెను (ఫిలిప్పీ 3:10). దేవున్ని సన్నిహితముగా తెలుసుకొనగోరినవాడు ఆయనను ఎల్లప్పుడు ఆలకించుచుండవలెను. దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటను వినుట ద్వారానే మనుష్యుడు తన్నుతాను ఆత్మీయముగా సజీవముగా ఉంచుకోగలడని యేసు చెప్పెను (మత్తయి 4:4). ఆయన పాదముల చెంత కూర్చొని ఆయనను ఆలకించుట క్రైస్తవ జీవితములో అతిముఖ్యమైన విషయమని కూడా ఆయన చెప్పెను (లూకా 10:42). యేసు తండ్రిని ప్రతిరోజు తెల్లవారు జామునుండి రోజంతయు ఆలకించే అలవాటును (యెషయా 50:4) మనము కూడా అవలంభించుకోవలెను; ఆ ఆలకించే వైఖరితో రాత్రి గడియలలో మనము నిద్రించునప్పుడు కూడా ఉండవలెను. అలా ఉన్నచో మన నిద్రనుండి రాత్రివేళ ఎప్పుడైన మేల్కొన్నప్పుడు, ''ప్రభువా, మాట్లాడుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు'' అని మనము చెప్పవచ్చును (1సమూయేలు 3:10). దేవుని ఎరిగియుండుట అన్ని పరిస్థితులలోను మనలను జయించువారిగా చేయును-ఎందుకనగా మనము ఎదుర్కొనే ప్రతి సమస్యకు దేవుని యొద్ద పరిష్కారమున్నది-మరియు మనమాయనను ఆలకించినప్పుడు, ఆ పరిష్కారమేమిటో ఆయన మనకు తెలియజేయును.

12. క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే ఎంతో ఉన్నతమైనది

''యేసు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు'' (హెబ్రీ 8:6).

పాత నిబంధన క్రొత్త నిబంధనల మధ్య ఒక ప్రాథమికమైన వ్యత్యాసమున్నదని అనేక మంది క్రైస్తవులకు తెలియదు (హెబ్రీ 8:8-12). యేసు మోషే కంటే ఎంత శ్రేష్టుడో, క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే అంత శ్రేష్టమైనది (2కొరిందీ¸ 3 మరియు హెబ్రీయులు 3). తీర్పు యొక్క భయము వలనను ప్రతిఫలము యొక్క వాగ్దానము వలనను పాత నిబంధన ఒక వ్యక్తి యొక్క బాహ్యజీవితమును మాత్రమే పవిత్రపరచగలిగెను; అయితే క్రొత్త నిబంధన బెదిరింపులతో వాగ్దానములతో కాక, పరిశుద్ధాత్మ మనకు క్రీస్తు యొక్క స్వభావమును-పవిత్రమైన ప్రేమించే స్వభావమును- ఇచ్చుట ద్వారా మన అంతరంగమును మార్చును. ఒక పంది సంకెళ్లతో బంధింపబడుట ద్వారా (ధర్మశాస్త్రము క్రింద శిక్ష యొక్క భయము వలన) శుభ్రముగా ఉంచబడుటకును ఒక పిల్లి తన అంతరంగ స్వభావము వలన తనను తాను శుభ్రముగా ఉంచుకొనుటకును ఎంతో వ్యత్యాసమున్నది. ఈ ఉదాహరణ ఈ రెండు నిబంధనల మధ్య వ్యత్యాసమును వివరించును.

13. మనము మనుష్యుల చేత తృణీకరింపబడుటకు హింసింపబడుటకు పిలువబడితిమి

''క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించినవారందరు హింసపొందుదురు'' (2తిమోతి 3:12).

లోకములో వారికి శ్రమ కలుగునని యేసు తన శిష్యులతో చెప్పెను (యోహాను 16:33). మరియు తన శిష్యులను లోకమునుండి తీసికొని పోవద్దని ఆయన తండ్రికి ప్రార్థన చేసెను (యోహాను 17:15). అనేక శ్రమలను అనుభవించుట ద్వారానే విశ్వాసులు దేవుని రాజ్యములోనికి వ్రపేశింపగలరని అపొస్తలులు వారికి బోధించిరి (అపొ. కా. 14:22). ప్రజలు ఇంటి యజమానిని బయెల్జెబూలని పిలచిన యెడల ఆయన ఇంటి వారు ఇంకా ఘోరమైన పేర్లతో పిలువబడుదురని యేసు చెప్పెను (మత్తయి 10:25). ఈ విధముగా మనమాయన ఇంటి యొక్క నమ్మకస్తులైన సభ్యులమని మనము యెరుగుదుము. ఇతర ''విశ్వాసులు'' నన్ను పిలచిన కొన్ని పేర్లు: ''అపవాది'', ''అపవాది యొక్క కుమారుడు'', ''దురాత్మ'', ''క్రీస్తువిరోధి'', ''మోసగాడు'', ''తీవ్రవాది'', ''నరహంతకుడు'', మరియు ''దియొత్రేఫె''. ఈ విధంగా యేసు ఇంటివానిగా గుర్తింపబడుట ఒక గొప్ప భాగ్యముగానున్నది. ప్రభువును నమ్మకముగా సేవించువారందరు దీనిని అనుభవింతురు. ఒక నిజమైన ప్రవక్త తన ''స్వంత బంధువుల'' చేత సన్మానింపబడడని కూడా యేసు చెప్పెను (మార్కు 6:4). యేసు తానే తన కుటుంబ సభ్యుల చేత అంగీకరింపబడలేదు. ఈ రోజున కూడా దేవుని ప్రతి నిజమైన ప్రవక్త తన బంధువుల చేత అవమానింపబడి తృణీకరింపబడును.

అదే విధముగా, ఒక నిజమైన అపొస్తులుడు ''దూషింపబడి, లోకమునకు మురికిగాను, అందరికి పెంటగాను ఎంచబడును'' (1కొరిందీ¸ 4:13). శ్రమలు తిరస్కారము దేవుని అతి గొప్ప దాసులకు ఎప్పుడు నియమింపబడి యుండెను. ''మహాశ్రమల'' ముందు సంఘము కొనిపోబడును అనే బోధ ఎక్కువమంది విశ్వాసులకు ఇష్టమైనది ఎందుకనగా దానిని వినుట వారి శరీరమును ఆదరించును. కాని మత్తయి 24:29-31లో మహాశ్రమల తరువాత మాత్రమే తన సంఘమును కొనిపోవుటకు ఆయన తిరిగివచ్చునని యేసు చాలా స్పష్టము చేసెను. సంఘము కొనిపోబడుట ద్వారా మహా శ్రమలను తప్పించుకొనునని బోధించే ఒక్క వచనము కూడా క్రొత్త నిబంధనలో లేదు. ఈ సిద్ధాంతము ఇంగ్లాండు దేశములో 19వ శతాబ్దము మధ్యలో మనుష్యులు కనిపెట్టినది. మన దేశములోనున్న సంఘమును మనమిప్పుడు హింసల కొరకు సిద్ధపరచవలెను.

14. దేవుడు అంగీకరించిన వారినందరిని మనము అంగీకరించవలెను

''దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను-శరీరములో వివాదము లేకుండునట్లు అలా చేసెను'' (1కొరిందీ¸ 12:18,25).

దేవుడు వేర్వేరు దేశాలలో వేర్వేరు కాలాలలో తన కొరకు ఒక పవిత్రమైన సాక్ష్యమును పునరుద్ధరించుటకు మనుష్యులను లేవనెత్తెను. కాని ఆ దైవజనులు చనిపోయిన తరువాత, వారి అనుచరులు వారి గుంపులను వ్యతిరిక్తమైనవాటిగాను, తెగలగాను చేసిరి. కాని క్రీస్తు శరీరము గుంపులన్నిటి కంటెను పెద్దది. మనము దానిని ఎప్పుడు మరువకూడదు. ఈ రోజున క్రీస్తు వధువు చాలా చాలా గుంపులలో ఉన్నది. కాబట్టి, దేవుని వాక్యమును వివరించుటలో (అర్థము చేసుకొనుటలో) వ్యత్యాసములు ఉండుట వలన మనము వారిలో అనేకమందితో కలిసి పనిచేయలేకపోయినను, ప్రభువు అంగీకరించిన వారందరితో మనము సహవాసము చేయుటకు కోరుకొనవలెను.

15. మనము ప్రతి మనుష్యుని గౌరవముతో చూడవలెను

''మన నాలుకతో దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము, నా సహోదరులారా, యీలాగుండకూడదు'' (యాకోబు 3:9,10).

ఒక మనుష్యుని కించపరచే (దిగజార్చే) ఏ మాటయైనా కార్యమైనా ఎప్పుడు దేవునినుండి రాదు. అది ప్రజలను ఎల్లప్పుడు కించపరచుటకును దిగజార్చుటకును చూచే సాతాను నుండే ఎల్లప్పుడు వచ్చును. మనము ప్రజలందరితో ''సాత్వీకముతోను గౌరవముతోను'' మాట్లాడవలెనని ఆజ్ఞాపింపబడినాము (1పేతురు 3:15)-వారు మన భార్యలైనా, పిల్లలైనా, యౌవనస్తులైనా, బిచ్చగాళ్లయినా లేక శత్రువులైనా అలా మాట్లాడవలెను. మనుష్యులందరు గౌరవింపబడవలెను. ఉదాహరణకు, ఒక బీదవాడైన సహోదరునికి ఒక కానుకనిచ్చినప్పుడు, మనుష్యునిగా అతనికున్న గౌరవమును కాపాడుచు దానిని చేయవలెను. మనము అతని ఉపకారిగా కాక సహోదరునిగా ఉండవలెను.

16. మన ఆర్థిక అవసరతలను మనము దేవునికే తెలియజేయవలెను

''దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' (ఫిలిప్పీ 4:19).

పూర్తికాల క్రైస్తవ పరిచారకులు తమ ఆర్థిక అవసరతలన్నిటి కొరకు దేవుని విశ్వసించి వాటిని ఆయనకు మాత్రమే తెలియజేయవలెను. అప్పుడు దేవుడు వారి అవసరతలను తీర్చుటకు తన బిడ్డలను ప్రేరేపించును. ఈ రోజున అనేకులు జీవించినట్లు వారు ''దేవుని యందు విశ్వాసముతోను ఇతర విశ్వాసులయొక్క సూచనలతోను'' జీవింపకూడదు. కనుక దేవుణ్ణి పూర్తికాలము (వేరే జీవనోపాది లేకుండా) సేవించువారు ఇతర విశ్వాసులనుండి కానుకలను పొందుటకు అనుమతింపబడిరి. కాని వారు జీతమును ఎల్లప్పుడు తీసుకొనకూడదు. కానుకలకు జీతమునకు ఎంతో వ్యత్యాసమున్నది. కానుకలను హక్కుగా అడుగలేము కాని జీతమును హక్కుగా అడగవచ్చును. ఈ రోజున ఎక్కువ క్రైస్తవ సంఘాల యొక్క మరియు సంస్థల యొక్క దిగజారిన స్థితికి కారణము ఇదే.

అయితే, మన వ్యక్తిగత లేక కుటుంబ అవసరతలకు మనకంటే పేదవారైన వారి యొద్దనుండి ఎటువంటి కానుకలను తీసుకోకూడదు. అటువంటి వారు మనకు కానుకలు ఇచ్చినప్పుడు, మనము వారికంటే పేద వారైన వారికి ఆ డబ్బును ఇవ్వవలెను లేదా ఆ డబ్బును ప్రభువు పరిచర్య నిమిత్తము కానుక పెట్టెలో వేయవలెను. పూర్తికాల సేవకులందరు జాగ్రత్త వహించుటకు ఇక్కడ డబ్బును గూర్చి ''పది ఆజ్ఞలు'' ఉన్నవి:

1. ఎల్లప్పుడు మీ ఆర్థిక అవసరతలను దేవునికి తప్ప వేరెవ్వరికి తెలియజేయకుడి (ఫిలిప్పీ 4:19).

2. ఎల్లప్పుడు అవిశ్వాసుల యొద్దనుండి డబ్బును తీసుకొనకుడి (3యోహాను 7).

3. ఎల్లప్పుడు ఎవరి యొద్దనుండి కానుకలను ఆశింపకుడి (కీర్తనలు 62:5).

4. ఎల్లప్పుడు ఎవరినీ మీకు డబ్బు ఇచ్చుట ద్వారా మిమ్ములను నియంత్రించుటకు గాని మీ పరిచర్యను ప్రభావితము చేయుటకు గాని అనుమతించకుడి.

5. ఎల్లప్పుడు మీ పరిచర్యను పొందని వారి యొద్దనుండి డబ్బును తీసుకొనకుడి.

6. ఎల్లప్పుడు మీకంటే పేదవారి నుండి మీ వ్యక్తిగత లేక కుటుంబ అవసరాల కొరకు డబ్బును తీసుకొనకుడి.

7. ఎల్లప్పుడు మీ ఆర్థిక అవసరతల కొరకు ఏ మనుష్యుని మీద ఆధారపడకుడి.

8. ఎల్లప్పుడు దేవుని డబ్బును ఇతరులు అనుమానించే విధముగా నిర్వహించకుడి (2కొరిందీ¸ 8:20,21).

9. ఎల్లప్పుడు డబ్బును పొందినప్పుడు ఉత్సాహపడకుడి.

10. ఎల్లప్పుడు డబ్బును పోగొట్టుకున్నప్పుడు నిరాశపడకుడి.

ముగింపు: ఈ సత్యములు మిమ్ములను ప్రోత్సహించటమే కాకుండా మిమ్ములను విడుదల చేయునని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రభువుతో మీరు నడచుట గురించి మీ పరిచర్య గురించి మీరు తీవ్రముగా ఉన్నయెడల, మీ అనుదిన జీవితములో ఈ సత్యములను మీరు తీవ్రముగా తీసుకోవలెను.


అధ్యాయము 3
దేవుని సేవలో నియమములు

దేవుని సేవలో నియమములు

(ఇది సంఘము యొక్క లక్ష్యము మరియు నాయకత్వము యొక్క తర్ఫీదును గూర్చిన ఆల్‌ ఇండియా కాన్ఫెరెన్స్‌లో క్రైస్తవ నాయకులుకు ఇవ్వబడిన సందేశము డిసెంబరు 17,1997).

ప్రకటన 4వ అధ్యాయములో దేవుని వాక్యము చూచెదము. మొదటి అధ్యాయములో దేవుడు తన ప్రత్యక్షతను యోహానుకు ఇచ్చిన తరువాత, ఆయన యోహానుకు 2,3 అధ్యాయాలలో, ఆకాలమందలి, ఆ ప్రదేశములో గల సంఘముల గూర్చిన స్థితిని కూడా తెలియపర్చెను. ఆ సంఘములు ఆత్మీయముగా ఎక్కువ వెనక్కు జారిపోయిన స్థితిలో నుండినవి. అప్పుడు ప్రభువు యోహానుతో ప్రకటన 4:1లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని చెప్పెను. అది ఎంత చక్కని మాట!

మనము మనచుట్టూ ఉన్న పరిస్థితులు చూచినప్పుడు మరియు పరిష్కారము లేని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ''పైకి ఎక్కిరమ్ము! క్రింద నున్న భూలోక స్థానము నుండి నీవు ఈ పరిస్థితులను చూచుటకుకాక పైకి వచ్చి నేనుండిన స్థానమునుండి వీటిని చూడుము'' అని ప్రభువు చెప్పు మాటలు వినుట ఎంత బాగుండును. ''పైకి ఎక్కిరమ్ము'' అను మాట మనము ఎల్లప్పుడును వినవలసిన అవసరమున్నదని నేను నమ్ముచున్నాను.

పౌలు, ''అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను'' (ఫిలిప్పీ 3:13,14) అని చెప్పుచున్నాడు. అతడే పైకి ఎక్కిరమ్ము అని పిలువబడిన పిలుపును వినియుండెను మరియు ఆతడు ఎంత ఎత్తుకు ఎదిగినను అతడు దానితో ఎప్పుడు సంతృప్తి పడలేదు.

క్రైస్తవ నాయకత్వంలో ఉన్న ప్రమాదమేమిటంటే మనము ప్రజల ముందర చాలా ఎక్కువగా నిలబడుచుందుము. మనము అభినందించ బడుదుము. ఇప్పుడు వార్తాసాధనములు కూడా అందుబాటులో ఉన్నవి. మన పేర్లముందు బిరుదులు, మన పేర్ల తరువాత డిగ్రీలున్నవి. ఇంతకంటే మనకు ఇంకా ఏమి కావాలి? ఏం కావాలో నేను చెబుతాను - మనము దేవుని యొక్క హృదయానికి దగ్గర్లోనికి వెళ్ళాల్సిన అవసరము కలిగియున్నాము! మనము పైకి ఎక్కవలసిన అవసరములో నున్నాము.

దేవునికి ఒక సేవకుడు అవసరమై ఆదామును సృష్టించలేదు. ఆయనకు ఒక పండితుడు కావలసి ఆయన ఆదామును సృష్టించలేదు. ఆయనకు సేవకులు లేక పండితులు కావలసి ఆయన నిన్ను నన్ను సృష్టించలేదు. ఆయనకు కావలసినంత మంది సేవకులు కోట్లకొలదిగా నుండిన దేవదూతలలో అప్పటికే నుండిరి. ఆదాము ఆయనతో సహవాసముండుటకు ఆయన మొదట ఆదామును సృష్టించెను. అందుచేతనే ఆదామునకు నియమము నీవు ఆరుదినములు పని చేసి ఏడవదినము విశ్రమించుము అను నియమము లేదు. అది తరువాత మోషే యొక్క ధర్మశాస్త్రము ద్వారా వచ్చినది.

ఆదాము ఆరవదినమున సృష్టించబడెను. కనుక అతడి యొక్క మొదటి దినము అనగా దేవుని యొక్క ఏడవ దినము ఆదాముకు మొదటి దినము. అది విశ్రాంతి దినమును మరియు అతడి యొక్క సృష్టికర్తతో సహవాసము చేయుదినమై యుండెను. దేవునితో సహవాసము చేసిన ఆ దినము నుండి తదుపరి ఆరుదినములు తోటలోనికి వెళ్ళి ఆదాము దేవుని సేవ చేయ్యవలసియుండెను.

ఎప్పుడైతే మనము ఆ వరుసక్రమమును మరచిపోవుదమో, అనగా మనము ఆయన ద్రాక్షతోటలో ఆయనకు సేవచేయుటకు వెళ్ళుట కంటె ముందు, దేవునితో సహవాసము చేయుట ఎప్పుడును చేయవలసినదని మరచిపోయినట్లయితే అప్పుడు మన యొక్క సృష్టిని గూర్చియు మరియు మన పాప విడుదల గూర్చిన ఉద్దేశ్యమును మరచిన వారమగుదుము.

మనము మన చుట్టూ ఉన్న అవసరము గూర్చి ఎక్కువ ఆలోచించువారమై (మరి ముఖ్యముగా భారతదేశము వంటి దేశములో ఉండి) దేవునితో సహవాసము చేయుటకు సమయము లేనివారముగా అగుదుము. మన చుట్టూ ఎంతో అవసరతలుంటుండగా ఆయనతో సహవాసమునకు సమయము వెచ్చించుట సమయాన్ని వ్యర్థపుచ్చునట్లుగా ఆలోచించుకొనవచ్చును. అయితే అవసరమును ఆధారముగా తీసుకొని చేయు పని యొక్క ఫలితమేమైయుండును? బహుశా ఎంతో పని జరుగవచ్చును కాని దానిలో నాణ్యత చాలా తక్కువగా నుండును. గణాంక వివరాలు మోసపూరితమైనవి. మూడురకాలైన అబద్ధములున్నవనే మాటను నీవు విని యుండవచ్చును. అవి నల్లటి అబద్దములు, తెల్లటి అబద్దములు మరియు గణాంక వివరములు! గణాంక వివరములు మోసపూరితమైని. కాని యేసు ఎప్పుడును అటువంటి గణాంక వివరములు గూర్చి లక్ష్యపెట్టలేదు.

నా జీవితములో కొన్ని సంక్షోభాల పరిస్థితులు గుండా వెళ్లిన సమయములున్నవి. ఒకటి నా జీవితములో దేవుని సేవ చెయ్యాలని వెదకుచుండిన ప్రారంభదినాల్లో, నాకు దేవుని వాక్యము తెలిసియుండినా శక్తి లేకుండా యుండెడిది. అప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము కోసం, పై నుండి వచ్చు శక్తితో నింపుదల కోసం దేవునిని వెదికితిని, దీని గూర్చి వేరు వేరు అభిప్రాయాలు ఉన్నవని నాకు తెలియును మరియు నేను ఎవరిని నా అభిప్రాయాలలోకి మార్పు చేయుటకు ప్రయత్నించను. నేను చెప్పేదేమంటే నేను తిరగి జన్మించి నీటిలో బాప్తిస్మము పొందియుంటిని. కాని ''జీవజలనదులు'' నా నుండి ప్రవహించలేదు. అయినప్పటికిని ఎవరైతే యేసునందు విశ్వాసముంచెదరో వారి జీవితాల్లోనుండి జీవజలనదులు ప్రవహిస్తాయనియు వారెప్పుడూ ఎండిపోరని యేసు చేసిన వాగ్దానము నాకు తెలిసియుండెను కాని అనేకసార్లు నా మట్టుకు నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లు గమనించితిని. నాకు దేవుని వాక్యము తెలిసియుండినా, నేను భోధించుచుండినా నేను ఎండిన స్థితిలోనే ఉంటిని. అనేక మార్లు దేవునికి నేను చేయుచున్న సేవ నీరుతోడుకునే బోరింగుతో నీరు తోడినట్లుండేది. దాని అర్థమేమిటో మీకు తెలియును కొట్టగా కొట్టగా కొంచెము నీరు వస్తుంది. అది ఒక నది కానేకాదు. అయినప్పటికి ''నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజలనదులు పారును'' (యోహాను 7:38) అని యేసుక్రీస్తు చెప్పిన దానిని నేను తేటగా చూచియుంటిని.

నేను చెప్పగలిగినదేమనగా నేను దేవునిని వెదకితిని మరియు ఆయన నా అవసరము తీర్చెను. ఆ అనుభవము నా జీవిత దిశను మార్చినది. నేను పెంతుకోస్తు సంఘములో చేరలేదు. నేను పెంతెకొస్తు వానిగా కాని కరిస్మాటిక్‌ వానిగా అనుకోలేదు కాని దేవుడు ఆయన ఆత్మతో నన్ను నింపుట ద్వారా నా అవసరము తీర్చెను.

తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత నా జీవితములో మరొక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాను. ఈ మారు నేనెదుర్కొన్నది నాయొక్క యధార్థతను గూర్చి. అది నేను బోధించునది నా అంతరంగ జీవితములో నిజముగా యదార్థమేనా మరియు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు చూపుతున్న భారమును అదేవిధముగా నా హృదయమందు నిజముగా కలిగియుంటినా అనునది.

ఇది సుమారు 28 సంవత్సరములు క్రితము డియోలాలీలో మొట్టమొదటి ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ ఆన్‌ ఇవాంజిలిసవ్‌ు కాన్ఫెరెన్స్‌ జరిగినప్పుడు జరిగినది. అప్పుడు నేనొక పత్రమును సమర్పించినాను. అప్పుడు నేను 30 సంవత్సరముల యౌవనుడను. మనము యౌవనులుగా నుండినప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలియును. ప్రతివారిని మెప్పించాలని కోరుకొంటిని అందువలన నా పత్రము ఎంతో ఆకట్టుకొనే విధంగా ఉండినది. ఎందుకంటే దానికొరకు నేనెంతో కష్టపడ్డాను. నా పరిచర్యలో లోతైన జీవితము గూర్చి (ణవవజూవతీ ూఱటవ జశీఅటవతీవఅషవ) మాట్లాడుటకు ఆస్ట్రేలియా మరియు సింగపూరు మొదలైన చోట్లకు ప్రయాణించు చుంటిని. ప్రతి చోటను నా గురి ప్రజలను మెప్పించుట లేదా ఆకట్టుకొనుటయే.

అప్పుడు ఒకమారు ''నీవు మనుష్యులను మెప్పించాలను కొంటున్నావా? లేక వారికి సహాయము చేయాలనుకుంటున్నావా?'' అని దేవుడు నాతో మాట్లాడెను. ''ప్రభువా నేను వారికి సహాయము చెయ్యాలను కొనుచున్నాను'', అని చెప్పితిని. అప్పుడు ప్రభువు ''అయితే వారిని మెప్పించుటకు ప్రయత్నించుట మానుము'' అని చెప్పెను. అప్పుడు ''ప్రభువా నా అంతరంగ జీవితము నేను బోధించు దానికి సమన్వయం లేకుండా ఉంది'' అని చెప్పుకొను స్థితికి వచ్చితిని. బాహ్యముగా మంచి సాక్ష్యము కలిగియుంటిని. కాని నా ఆలోచనా జీవితము మరియు నా వైఖరి (ధనము యెడల నా వైఖరి) క్రీస్తు కుండిన వైఖరి వలె లేదు. నేను నా నోటితో క్రీస్తును ప్రకటించుచుంటిని కాని నా ఆలోచనలను క్రీస్తు యొక్క ఆత్మ పాలించుట లేదు. ఈ విషయము గూర్చి నేను దేవునితో యదార్థముగా యుంటిని.

దేవుని వైపు మన మొదటి అడుగు యదార్థత అని నేను నమ్ముచున్నాను.

ఆ సమయానికి నేను బాగుగా పేరుపొంది యుంటిని. నేను పుస్తకములు వ్రాయుచుంటిని మరియు అవి బాగుగానే ప్రాచుర్యమగుచుండెను. నేను ప్రతివారము రేడియోలో కూడా మాట్లాడుచుండెడి వాడను. నేను వేరు వేరు చోట్లకు ఆహ్వానింపబడు చుండెడివాడను. ఒక నాడు ప్రభువు నా హృదయముతో ''నిన్ను గౌరవించే సమూహము ముందు నీవు నిలబడి, నీవు యదార్థతతో లేవనియు, నీవు లోపల, బయట ఒకే విధముగా లేవని చెప్పగలవా'' అని అడిగెను. ''అలాగే ప్రభువా! ప్రజలు నా గూర్చి ఏమనుకొనినా నేను లెక్కచేయను. నీవు నా కొరకు ఏదోకటి చెయ్యాలని కోరుకొనుచున్నాను. నేను నా అంతరంగ జీవితము నేను బోధంచు దానితో సమన్వయం కలిగియుండవలెనని నేను కోరుకొనుచున్నాను'' అని చెప్పితిని.

23 సంవత్సరముల క్రితము నేను ప్రభువును అట్లు అడిగితిని. దేవుడు మరల నా అవసరము తీర్చెను. ఆయనను ఆశతో అడగు వారి కోరికను ఆయన తీర్చును మరియు ఆయన పైకి ఎక్కిరమ్ము అని నాతో చెప్పెను.

గత 22 సంవత్సరాలుగా దేవునితో సహవాసము నాకు ఎంతో విలువైనదిగా మారినది. అది నా జీవితాన్ని ఎంతగానో మార్చినది మరియు నా జీవితములో ఉండిన నిరుత్సాహము మరియు వ్యాకులము సంపూర్తిగా తీసివేసినది.

దేవునితో నడుచు రహస్యమును నేను కనుగొంటిని. మరియు అది నా సేవను సంతోషబరితము చేసినది! ఇప్పుడు ఇంకెన్నడును ఎండిన స్థితి లేదు.

మీ యొక్క సేవ అంతయు దేవునితో మీకు గల వ్యక్తిగత నడకపై ఆధారపడియున్నది. యేసు, మరియ మార్తల ఇంటిలో ఉండినప్పటి విషయము మీకు జ్ఞాపకముండి యుంటుంది. ''నీవు అనేక విషయముల గూర్చి చింతించుచున్నావు'' అని ఆయన మార్తతో చెప్పెను, మార్త దేనిగూర్చి చింతించెను? అక్కడ అవసరముండెను మరియు ఆమె ప్రభువును నిస్వార్థముగా మరియు త్యాగపూరితముగా సేవిస్తూ వంటగదిలో చెమట పడుతూ ఉండినది - ఆమె తన కొరకు ఆహారము వండుకొనలేదు కాని ప్రభువునకు ఆయన శిష్యులకును వండినది. అంతకంటె గొప్ప సేవ ఆమె ఏమి చెయ్యగలదు? అది పూర్తిగా నిస్వార్థమైనది మరియు ఆమె దానిని ధనము కోసముకాని లేక ఈనాటి అనేక క్రైస్తవ పరిచారకులవలె జీతము కొరకుకాని చెయ్యలేదు. లేదు, అది పూర్తిగా నిస్వార్థమైనది! అయినప్పటికి ''నీవు అనేక విషయముల గూర్చి చింతించుచున్నావని'' ప్రభువు ఆమెతో అనెను. మరియ స్వార్థపరురాలని, ప్రభువు పాదాల యొద్ద కూర్చొని ఏ పనీ చేయకుండ వింటూ కూర్చొన్నదని ఆమె అనుకొన్నది. ''అదియే ప్రాముఖ్య విషయమనియు, అది ఒక్కటియే అవసరమైనదనియు'' ఆయన చెప్పెను (లూకా 10:41).

1 కొరిందీ¸ 4:2 లివింగు బైబిలు తర్జుమాలో ''ఒక సేవకుని యొక్క ముఖ్యమైన పని అతడి యజమాని చెప్పిన పని ఏదో అది మాత్రమే చేయుటైయున్నది'' అని ఉన్నది. అది నా హృదయమునకు ఎంతో విశ్రాంతి కలిగించింది. అవసరముతో నుండిన ప్రపంచమును చూచినప్పుడు నేనేమి చెయ్యవలెను? అవసరమునకు తగినట్లు నేను పనిలో మునిగిపోవలెనా? అనేకులైన సామర్థ్యము కలిగినవారు క్రైస్తవ ప్రపంచములో నాతో పని చేయించుటకు సిద్ధముగా నుండిరి. కాని ''నీ నుండి వినాలని కోరుకుంటున్నాను'' అని నేను ప్రభువుకు చెప్పాను. అనేక మంది మార్తలు నన్ను విమర్శిస్తూ, ''అవసరతలో నుండిన లోకము పాపముతో నాశనమవుతుండగా, వింటూ అతడి సమయమును వ్యర్థపుచ్చవద్దని చెప్పమని'' చెబుతూ ఉండేవారు.

మనము తప్పనిసరిగా లోకము యొక్క అవసరతను చూడాలి. కన్నులెత్తి పంటను చూడుమని (యోహాను 4:35) యేసు చెప్పెను. మనము అవసరమును చూడాలి, ఆ అవసరతను ఇతరులకు చూపాలి కూడా. అవును గాని ఆ పిలుపు దేవుని నుండి రావలెను, మనుష్యుని నుండి కాదు. ఆ విషయమును నేను కనుగొంటిని.

లోకము, రక్షకుడులేక నశించుచుఉండగా యేసు 4000 సంవత్సరములు పరలోకములో కూర్చొని యుండెను. తండ్రి నిర్ణయించిన సమయమునకు ముందు పరలోకమును విడిచి వెళ్ళునట్లు ఆయనను ఎవ్వరు ఒత్తిడి చేయలేదు. కాని కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చెను. మరియు ఆయన భూమిపైకి వచ్చినప్పుడు లోకము నశిస్తూ ఉండగా ఆయన 30 సంవత్సరములు కుర్చీలు బల్లలు తయారుచేస్తూ కూర్చొని యుండెను. ఆయన కేవలం అవసరమును బట్టి కదలలేదు. కాని సమయమొచ్చినప్పుడు, తండ్రి ''వెళ్ళు'' అని చెప్పెను. మరియు ఆయన 3 1/2 సంవత్సరములలో ఇతరులు 3000 సంవత్సరములలో చేసిన దానికంటే ఎక్కువ చేసెను. సేవకుడు ప్రాముఖ్యముగా చేయవలసినది అటూ ఇటూ పరిగెడుతు దేవుని కొరకు ఇది, అది లేక ఇంకొకటి చేయుట కాదు, కాని ఆయన చెప్పునది వినుటయై ఉన్నది. అట్లు వినుట కష్టమైన పని.

నా యౌవన దినాల్లో క్రమము తప్పకుండా లేఖనములు ధ్యానిస్తూ, ఉపవాసములు చేసెడి ఒక సంఘములో నుంటిని. ప్రతి ఉదయం దేవునితో కొంత ప్రత్యేక సమయము గడపవలెనని అక్కడ చెప్పిరి - అది ఒక మంచి అలవాటు, అట్లు చేయమని ప్రతి ఒక్కరికి నేను సిఫారసు చేయుదును. అయితే ఎంతో ఖచ్చితముగా ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో గడిపినా, ప్రజలు ఇంకను చిరుబురులాడు నిష్టురతతో, కలిసి మెలగుటకు ఇబ్బంది కరముగా, ప్రతి దానిని తీర్పు తీరుస్తూ, విమర్శలు మరియు అనుమానములు కలిగిన వారిగా ఉండిరి. ఎక్కడో ఏదో సరిగా లేకుండెను. నేనొక దైవజనునితో 10 లేక 15 నిమిషములు మాత్రమే గడిపినట్లయితే నేనెంతగానో దైవికంగా పురికొల్పబడుట లేక ప్రేరేపింపబడిన సమయములు నాకు తెలియును. మరియు 10 లేక 15 నిమిషములు దేవునితోనే గడిపే సమయము ఎటువంటి కార్యము చేయగలదో మీరు ఊహించగలరా? మనమందరము ఆత్మీయముగా సవాలు చేయబడకపోవుటకు కారణమేమి? నేను నా ప్రత్యేక సమయములో దేవునితో గడుపుట లేదని ఆయన నాకు చూపెను. నాతో నేనే సమయాన్ని గడుపుచుండేవాడిని. కేవలం నేనొక పుస్తకాన్ని చదువుచుండేవాడిని. నా ముందున్న పుస్తకము బైబిలు కావచ్చు లేక రసాయన శాస్త్రమవ్వచ్చును, దాని వలన ఏ తేడా లేదు. నేను దేవునితో సమయాన్ని గడుపుట లేదు - ఆయననుండి వినుట లేదు. నేను కేవలం ఒక పుస్తకమును చదువుచుండెడి వాడను.

యేసు, మరియను గూర్చి ''అవసరమైనది ఒక్కటియే - అది వినుట'' అని చెప్పెను. అక్కడ నుండి ప్రతిది ప్రవహిస్తుంది. మరియు అది దేవుని సేవచేయుటకు ఎంతో కార్యసాధకమైన పద్ధతి, ఎందుకనగా నీవేమి చేయవలెనో ఆయన చెప్పును.

యేసు, ఏమి చేయవలెనో తండ్రి చెప్పియుండెను. ఒకమారు ఆత్మ యేసును ఇశ్రాయేలు సరిహద్దునకు ఆవల గలిలయకు 50 మైళ్లుండిన సురోఫెనియా ప్రాంతమునకు నడువమని చెప్పెను. ఆయన అక్కడకు చేరుటకు ఎంత సమయమైనదో నాకు తెలియదు. బహుశా ఒక రోజంతా పట్టియుండవచ్చు. అక్కడ అపవిత్రాత్మపట్టిన ఒక చిన్న కుమార్తెగల ఒక అన్యురాలైన స్త్రీని కలుసుకొనెను. ఆయన ఆ దెయ్యమును వెళ్ళగొట్టెను. మరియు ఆమె కేవలం చిన్నపిల్లల బల్లపై నుండి పడే రొట్టెముక్కల గూర్చి అడిగినప్పుడు ఆమె కుండిన గొప్ప విశ్వాసమును ఆయన శిష్యులకు ఎత్తి చూపించెను. తరువాత ఆయన తిరిగి గలిలయకు నడిచి వెళ్ళిపోయెను (మార్కు 7:24-31) యేసు అట్లు జీవించెను. ఆయన కేవలము ఒక్క ఆత్మ కొరకు అంత దూరము నడచివెళ్లెను. గణాంక వివరములు ప్రకారం చూచినట్లయితే అది అంత ఆకర్షణీయంగా ఉండదు! కాని అది దేవుని చిత్తములో ఉండెను.

యేసు ఆవిధముగా 3 1/2 సంవత్సరములు జీవించెను. ఆ సమయమైపోయిన తరువాత తండ్రీ, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని (యోహాను 17:4) అని చెప్పెను. ఆయన ఇండియాలోను, ఆఫ్రికాలోను మరియు ప్రపంచమంతటా నుండిన అవసరతను తీర్చెనా? లేదు, ఆయన తీర్చలేదు. కాని ఆయన తండ్రి ఆయన కప్పగించిన పనిని పూర్తి చేసెను. మరియు ఈ భూమిపై ఒక్కదినము కూడా ఎక్కువగా జీవించుట కోరుకొనలేదు. అపొస్తులుడైన పౌలు కూడ తన జీవితపు ఆఖర్లో ''నా పోరాటము తుద ముట్టించితిని'' అని చెప్పగలిగెను (2 తిమోతి 4:7).

క్రీస్తు శరీరములో మీకొక వేరైన పిలుపు మరియు నాకొక వేరైన పిలుపు యున్నది. కాని మనమందరము దేవుడు మనలను ఏమి చెయ్యమని కోరుతున్నారో అది అర్థము చేసికొనాల్సియున్నది. దేవుని స్వరమునకు మనము చెవిటి వారమగుటకు గల ముఖ్య కారణాలలో ఒకటి మన జీవితాలలో గల అవాస్తవికత - నిజాయితీ లేకపోవుట మరియు నటన అయ్యున్నది.

పరిసయ్యులు తమలో లేనిదానిని ఉన్నట్టు చూపించే జీవితాన్ని జీవించేవారు కాబట్టి వారు యేసు చెప్పిన దానిని వినలేకపోయిరి. వారు ఇతరులకు భక్తి గలవారమన్నటువంటి అభిప్రాయము కలుగజేసిరి. వారు ప్రజల ముందు వారి కాలమందలి నాయకులవలెను మరియు వాద పండితులవలెను నిలువబడిరి. మీరొకవేళ పేతురు యోహానులను వారు యేసుక్రీస్తును కలుసుకొనకముందు నాలుగు, ఐదు సంవత్సరముల ముందు కలుసుకొని మీకు తెలిసిన దైవికముగా జీవించే భక్తుని పేరు చెప్పుమని అడిగినట్టయితే, వారు అక్కడున్న సమాజమందిరమునకు పెద్దయిన ఒక పరిసయ్యుని పేరు చెప్పి ఉండెడివారు. ఎందుకనగా వారికి తెలిసినంత మట్టుకు ఎవరైతే లేఖనములను అధ్యయనము చేయుదురో, ఉపవాసము చేయుచు, ప్రార్థించుచు నొసళ్ళపై చిన్ని పెట్టెలలో లేఖనపు వచనములను కట్టుకొని భక్తిగా, పరిశుద్ధముగా కనిపించేవారే దైవికమైన వారని అనుకొనెడివారు. అటువంటప్పుడు యేసు సమాజమందిరములో ఆ పెద్దలను నరకమునకు పాత్రులయిన వేషధారులని దులిపివేయడాన్ని విని వారు ఎటువంటి విభ్రాంతికి గురైయుందురో ఊహించుకొనండి.

యేసు తన శిష్యులను ఏర్పరచుకొన్నప్పుడు, ఆయన ఒక్కరిని కూడా బైబిలు పాఠశాలనుండి ఏర్పరచుకొనలేదు. ఆ దినాలలో యెరూషలేములో గమలీయేలుచే నడిపింపబడిన ఒక బైబిలు పాఠశాల ఉండేది, కాని యేసు తన శిష్యులను ఏర్పరచుకొనుటకు అక్కడకు వెళ్ళలేదు. ఆయన గలిలయలో సముద్రపు ఒడ్డున ఉండిన పామరులను ఎంచుకొని ఆయన శిష్యులనుగా చేసికొనెను. వారు, ఇప్పుడు వేదాంత విద్యలో డాక్టరేటు పొందుటకుగాను ప్రజలు చదువుకొనే బైబిలు సెమినరీలకు కావలసిన పుస్తకములు వ్రాసియున్నారు. అది అద్భుత విషయముకాదా? పేతురు మనకుండిన ఏదైనా సెమినరీలనుండి డిగ్రీ పొందుటకు సమర్థత కలిగియుండిన వాడని నేను అనుకోను. బహుశా శిష్యులందరిలో ఒకేఒక శిష్యుడు అటువంటి సమర్థత కలిగియుండెను - అతడు అందరిలో తెలివైనవాడు మరియు చురుకయినవాడు - అతడు ఇస్కరియోతు యూదా.

యేసు ఎందుకు అటువంటి వారిని ఎంచుకొనెను? వారు సామాన్యమైన మనసు కలిగి ఆయన చెప్పు దానిని వినుటకు సిద్ధపడిన వారు. ఇటువంటి సామాన్యమైన మనుష్యులు ఏదైనా సమాజమందిరమునకు వెళ్ళి బోధించునప్పుడు ఎటువంటి కలకలం చెలరేగేది. వారు అక్కడ ప్రజలు అలవాటుగా ఎల్లప్పుడు వినే ప్రసంగములను బోధించేవారుకాదు. వారు ప్రవక్తలు. ప్రజలు ఎల్లప్పుడు ప్రవక్తలను ఇష్టపడేవారుకాదు. ఇశ్రాయేలు యొక్క 1500 సంవత్సరముల చరిత్రలో ''ఏ ప్రవక్తను వారు హింసించకుండా ఉండిరి?'' అని స్తెఫను అనెను (అపొ.కా. 7:52).

ఆ అపొస్తలులు లౌక్యముగా మాట్లాడువారుకాదు. వారు ప్రవక్తలు. ఈ కాలములో దేవుడు మనతో ఏమి చెప్పుచుండెనో మనము వినగలుగునట్లు మన దేశమునకు కొద్ది మంది ప్రవక్తల అవసరమున్నదని నేను అనుకొనుచున్నాను. దేవుడు మనుష్యుల దృష్టిలో ఘనమైన దానిని, గొప్పగా నుండిన దానిని లెక్కజేయడు (లూకా 16:15).

నేను ఇటువంటి కూటములకు వ్యతిరేకిని కాను. కాని ఇటువంటి కూటములకు 20 సంవత్సరముల క్రితం నుండి వెళ్ళుట మానివేసాను. అటువంటి ఆహ్వానములను ఇప్పుడు నేను అంగీకరించుట లేదు. ఇటువంటి సమావేశములు నాకు ప్రఖ్యాతిని తెస్తాయని నాకు తెలియును. మీకు వార్తాసాధనముల గుర్తింపు కూడా ఉంటుంది. అయితే నేను ఎక్కువగా వెళ్తున్న మన దేశమందలి గ్రామాలలో (ప్రస్తుతము నా పరిచర్య ఎక్కువగా అక్కడనే ఉన్నది) నిజముగా పనిచేయువారు ఇటువంటి సమావేశములో ఉండరు. వారు ఇంగ్లీషు మాట్లాడలేనివారు మరియు ఒక పత్రమును సమర్పించుట అనగా ఏమిటో తెలియని వారునై యున్నారు. కాని వారు ఆత్మతో నింపబడినవారు, వారు ప్రభువును ప్రేమించినవారు. మరియు వారు వెళ్ళి క్రీస్తు నొద్దకు తప్పిపోయిన ఆత్మలను తీసుకువచ్చువారునై యున్నారు. అటువంటి వారి కొరకు దేవునిని స్తుతించుదము. ఇతరులు వారి సంస్థలను నడుపుతు సంస్థనాయకులుగా ఘనతనొందెదరు. కాబట్టి ఇప్పుడు మొదట నుండిన వారు యేసు తిరిగి వచ్చినప్పుడు కడపటి వారగుదురు. కనుక మనలను మనము తగ్గించుకొనుట మంచిది. మన గూర్చి మనకు తక్కువ ఆలోచనలుండుట మంచిది. మనకుండిన డిగ్రీలు బిరుదులను బట్టి ఇతర క్రైస్తవులు అనుకొన్నంత గొప్పగా మనము దేవుని దృష్టిలో లేమేమో. ఇవన్నియు మనుష్యులను ఆకట్టుకొనును గాని దేవుణ్ణి ఆకట్టు కొనవు. నిజానికి అవి సాతానుకు కూడా గొప్ప అభిప్రాయమును కలుగజేయవు. ఏ మనుష్యుడైతే ఖచ్చితముగా నుండునో, ఏ మనుష్యుడైతే బయటకు ఉన్నట్లే లోపలనుండునో మరియు ఏ మనుష్యుడైతే అతడు అభ్యాసము చేయని దానిని బోధించడో అటువంటి పరిశుద్ధుడైన మనుష్యుని చూచి సాతాను భయపడును.

ప్రజలు నన్ను ఇలా అడుగుతారు, సహో. జాక్‌, ఉత్తర భారతదేశమునకు వెళ్లమని నీవు ప్రజలనెందుకు ప్రేరేపించవు? దానికి నా సమాధానము యేసు మొదట ఆయన చేసిన దానినే బోధించెను (అపొ.కా. 1:1). నేను ఉత్తర భారతదేశములో ఇంతవరకు నివసించలేదు. గనుక నేను ఇతరులకు చేయమని చెప్పలేను. అది చేయకూడనిదని నేను చెప్పుటలేదు. నేను చెప్పునదేమంటే నేను చేయని దానిని నేను బోధించలేనని మాత్రమే చెప్పుచున్నాను.

కాని నేనే క్రీస్తు శరీరమంతా కాదు. నేను అందులో ఒక భాగమును మాత్రమే. నేను క్రీస్తు శరీరములో సమతుల్యములేని ఒక అవయవమును. నేనెప్పుడును సమతుల్యము లేనివాడనుగా ఉందును. ఈ భూమిపై నడిచిన వారిలో సమతుల్యము కలిగినది యేసు ఒక్కడే. నీవెలాగు సమతుల్యము లేనివాడవో, నేనును అట్లే సమతుల్యము లేనివాడను. అందుచేత మనలో ఎవ్వరము ఒక భాగముకంటే ఎక్కువైన వారమని అనుకోవద్దు. ప్రతి భాగము అవసరమైనదే- సువార్తికుడు, బోధకుడు, కాపరి, ప్రవక్త మరియు అపొస్తులుడు అందరును ప్రజలను క్రీస్తు శరీరములో అవయవములుగా చేయుటకును మరియు ఆ శరీరము కట్టబడుటకును అవసరమై ఉన్నారు (ఎఫెసీ 4:11,12,13).

మన యొక్క పిలుపు ఏమై యున్నది? క్రీస్తు శరీరములో అవయవముగా లేని ఒకనిని ఆ శరీరములో ఒక అవయవముగా చేయుటయే. ప్రాథమికముగా మన పిలుపు అది కాదా? మన మందరమును దానిని అంగీకరిస్తామని అనుకొనుచున్నాను.

పరిశుద్ధాత్ముడు ''శరీరము'' అనుమాటను ఉపయోగించెను. కావున, భౌతిక శరీరము నుండి ఒక ఉదాహరణను ఉపయోగిస్తాను. ఇక్కడ ఒక ప్లేటులో ఒక బంగాళదుంప (అవిశ్వాసిని సూచించుచున్నది) ఉన్నదనుకొందము. అది నా శరీరములో ఒక భాóగముగా అవ్వవలసియున్నది. ఏ విధముగా అది జరుగును? సువార్త ద్వారా - చెయ్యి చాపబడి బంగాళదుంపను తీసుకొనుట ద్వారా అది మొదటగా జరుగును.

ఈ పనిలో సువార్త ఎల్లప్పుడును మొదట పరిచర్య అయ్యున్నది. అందుచేతనే నేనెప్పుడైనను సువార్తను తక్కువగా చూడను. నేను దానికి ఎంతో విలువ ఇస్తాను. మరియు ప్రత్యేకముగా ఈ పరిచర్య నిమిత్తము ఉత్తరభారతదేశములో వేడి మరియు ధూళితో కూడిన స్థితిలో సువార్త ప్రకటిస్తున్న వారికి ఎంతో ఎక్కువగా విలువను ఇస్తాను. వారి యొక్క పత్రికలను చదువుటకు ఆసక్తి చూపుతాను, ఇటువంటి ఎంతో ప్రియమైన సహోదరుల పరిచర్య, అక్కడ వారి ప్రయాస గూర్చి చదువుటకు కొన్ని పత్రికలను నా ఇంటికి తెప్పించుకుంటాను. అప్పుడప్పుడు వారిలో కొందరిని కలుసుకొనుటకు అక్కడకు వెళ్ళుట కూడా జరిగినది.

ఇక్కడ నా చెయ్యి ప్లేటునుండి బంగాణదుంపను తీసుకొనెను. ఆ బంగాళదుంప, సువార్తికుడు (చేయి) బయటకు వెళ్లి సువార్తను (బంగాళదుంపను నా నోటిలో పెట్టుట) ప్రకటించక పోయినట్లయితే అది ఎప్పటికిని నా శరీరములో ఒక భాగముగా అయి ఉండేది కాదు.

కాని అంతేనా జరిగేది? బంగాళదుంపను నా నోటిలో పెట్టుకొన్నంత మాత్రమున అది నా శరీరములో ఒక భాగముగా అగునా? కాదు. అలా జరుగదు. కొంత సమయమైన తరువాత అది నా నోటిలో క్రుళ్లిపోయి నా నోటినుండి ఉమ్మివేయవలసియుండును. అదే విధముగా కొంతమంది క్రైస్తవ్యంలోనికి మారిన వారు మన యొక్క కొన్ని సంఘములలో క్రుళ్ళిపోవుచున్నారు. వీరు లోపలకు తీసుకొనబడి నోటిలోనే ఉంచబడుచున్నారు.

కాని అంతకంటే ఎక్కువ ఆ బంగాళదుంపకు జరగాల్సియున్నది. అది నా పండ్లచేత నమలబడి నలగ గొట్టబడవలసియున్నది. ఆ బంగాళదుంప అప్పటితో ఇక అంతా అయిపోయిందని ఊహించుకొనును కాని అంతా ఇంకా పూర్తి కాలేదు. ఆ బంగాళదుంప నా కడుపులోనికి వెళ్ళును. అక్కడ కనికరమేమిలేకుండా తనపై ఆమ్లములు పోయబడుటను కనుగొనును. అది సంఘములోనున్న ప్రవచన పరిచర్యయైయున్నది. ఆమ్లము మనపై పోయబడినప్పుడు అది సుఖముగా నుండదను విషయము మీకు తెలియును. ప్లేటునుండి అందుకోబడిన సున్నితమైన పరిచర్య చాలా చక్కగా నుండును. కాని ఆసిడ్‌ మనపై పోయబడినప్పుడు అది సంతోషముగా కనపడదు. ఇప్పుడు ఆ బంగాళదుంప పూర్తిగా విరుగగొట్టబడి అది ఒక బంగాళదుంప వలె కనపడదు. కాని కొన్ని వారముల తరువాత మనము చూచినట్లయితే, అది రక్తమాంసములు మరియు ఎముకలుగా మారును - అది నా శరీరములో ఒక భాగము అగును.

ఇప్పుడు ఈ కార్యమంతటిలో ఎవరి పని ప్రాముఖ్యమైనది? మనము పొందవలసిన పరిచర్య ఏమైయున్నది? మనము దీనులమైనట్లయితే, మనము సరియైన సమతుల్యము లేనివారమని ఒప్పుకొందుము. చెయ్యి కడుపు కంటె ఎక్కువ ప్రాముఖ్యమైనది కాదు. అవి ఒకదానిని బట్టి వేరొకటి పూర్తయినవి. దురదృష్టవశాత్తు క్రైస్తవ్యంలో అవయవముల మధ్య నిరంతరమైన పోటీ ఉన్నది. చెయ్యి తనయొక్క స్వంత రాజ్యమును నిర్మించుకొనుచున్నది. కడుపు తన స్వంత రాజ్యమును నిర్మించుకొనుచున్నది. అటువంటప్పుడు మనకు ఉండినదేమిటి? ఒక శరీరము కాదు, కాని ఒక నోరు అక్కడ, ఒక కడుపు ఇంకొక దగ్గర, ఒక చెయ్యి ఇక్కడ ఒక కాలు వేరొక చోట ఉండిన ఒక శరీర అవయవములను కోసి పరీక్షించు ప్రయోగశాలవలె నుండును. అది ఒక శరీరము కాదు.

వీటన్నిటిలో మనకు ఏది ఎక్కువ అవసరమైయున్నది? మనకు ఉపదేశము కావలెను. కాని మనకు అన్నిటికంటే దీనత్వము ఎక్కువగా అవసరమైయున్నది. క్రీస్తు శరీరములో నున్న ప్రతి అవయవము - మనందరము సమానమైన ప్రాముఖ్యత కలవారమని మనము గ్రహించవలెను. మరియు సంస్థయొక్క గొప్ప నాయకుడు, ఇంగ్లీషు మాట్లాడలేకపోయినా, క్రీస్తునొద్దకు ఆత్మలను తెచ్చే బీదవాడైన సహోదరునికంటె ఈ పరిచర్యలో ఎక్కువ విలువైన వాడుకాదు. వారందరు ఒకే శరీరములో భాగములైయున్నారు.

''పైకి ఎక్కి వచ్చి నేనుండిన స్థానము నుండి విషయములను చూడు'' అని ప్రభువు చెప్పుచున్నాడు. భూమిపై నుండి చూచిన దానికంటె దేవుని స్థానమునుండి చూచినట్లయితే వేరుగా కనబడును.

చాలామంది క్రైస్తవ పరిచారకులకు తమను గూర్చి ఎక్కువైన అభిప్రాయము ఎందుకుంటుంది? నిజముగా చెప్పండి, మీరు ఒంటరిగా నున్నప్పుడు మీ గూర్చి మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నవి? అవి, నీవు ఏ విలువాలేని వాడవని నిన్ను గుర్తింపచేసే దీనత్వపు ఆలోచనలా?

ఆరుబయట కూర్చొని నక్షత్రాల వైపు చూచే సమయాలు నాకున్నవి. అక్కడ కోట్లాది నక్షత్రములున్నవనియు మరియు ఈ భూమి, విశ్వంలో ఒక చిన్ని నలుసు వంటిదనియు నేనెరుగుదును. ''ఓ దేవా! నీవెంత గొప్పవాడివి!ఈ విశ్వమెంత గొప్పది! ఈ నలుసు వంటి భూమిపై నేనొక ధూళి రేణువు వంటి వాడను. నేనిక్కడ నీకు ప్రాతినిద్యం వహిస్తున్నానని చెప్పుకుంటు గొప్ప గొప్ప విషయములు బోధిస్తున్నాను. నా గూర్చి నాకు సరైన అంచనా ఉండునట్లు దయచేసి సహాయము చేయుము''. మీరందరు దేవునితో అట్లు చెప్పవలెనని సిఫారసు చేస్తున్నాను.

దేవుడు దీనులకు కృపనిచ్చును. ఎవరికైనా తెలివితేటలుండవచ్చును. కాని దీనులు మాత్రమే కృపను పొందుకోగలరు. మనకు తెలివితేటలకంటె కృప ఎంతో ఎక్కువగా అవసరమైయున్నది.

యౌవనస్థులై, వారి కుటుంబాలచేత వారి విశ్వాసము గూర్చి హింసింపబడిన, హిందూ మరియు ముస్లిము కుటుంబాలనుండి ప్రభువునొద్దకు వచ్చిన వారి గూర్చి ఆలోచిస్తాను. అటువంటి వారు మన సంఘములలో ఒక సంఘమునకు వచ్చినట్లయితే వారు ఏమి చూచెదరు? వారు అక్కడ యేసు ఆత్మను చూచెదరా? మన చుట్టూ ఉండిన ప్రజలకు మనలను గూర్చి ఎంతో తప్పు అభిప్రాయమున్నది.

సమర్థవంతమగు పరిచర్యకు అది సువార్త ప్రకటనైనా లేక ఇంకేదైనా మొట్టమొదట కావలసినది హెబ్రీ 2:17లో వ్రాయబడినట్లు యేసు ''అన్ని విషయములలో తన సహోదరుని వంటివాడాయెను'' అనునది నేనెప్పటి నుండియో నమ్ముచుంటిని. ప్రతి విషయములోను ఆయన తన సహోదరులవలె కావలసివచ్చెను -అనుదానిని నేను ధ్యానించాలని కోరుకొనుచున్నాను.

నేను ఏ విధముగా ఇతరులకు సేవచేయగలను? అన్ని విషయములలోనూ నేను వారివలె కావలసియున్నది. నేను వారుండిన స్థానమునకు దిగవలసి యున్నది.

నేలపై ప్రాకు ఒక చీమతో నేనెందుకు సంభాషించలేను? ఎందుకంటే నేను పెద్దపరిమాణములో నున్నాను. నేను మానవరూపములో వెళ్ళినట్లయితే అది ఎంతో భీతి చెందును. ఆ చీమతో నేను సంభాషించుటకున్న ఒకే ఒక మార్గము మొదట దానివలె మారుటైయున్నది. దేవుడు మనతో సంభాషించుటకు ఒకే ఒక మార్గము, ఆయన మనవలె మారుట ద్వారా, మనమందరము ఆ విషయమును అర్థము చేసికొనగలము. కాని మనము ఇతరులకు చేయు పరిచర్యలో కూడా - అది మన స్థానిక సంఘములో కావచ్చును లేక ఎవ్వరు వెళ్ళని ప్రదేశములో కావచ్చును, మొదట అన్ని విషయములలో వారివలెనగుట, యెహెజ్కేలు చెప్పినట్లు ''వారు కూర్చుండుచోట కూర్చుండుట'' (యెహెజ్కేలు 3:15) అనునది మనము జ్ఞాపకముంచుకొనవలెను.

దాని అర్థము, ఉదాహరణకు, ఏవిధముగా కూడా మనము ఇతరులకంటె ఎక్కువగా హెచ్చించి కొనుటకు కోరుకొనకూడదు. అందుచేత యేసు ప్రభువు తన శిష్యులకు ఎల్లప్పుడు ''బోధకుడు'', ''తండ్రి'' లేక ఇంకా ఏ బిరుదులు తీసుకొనవద్దని చెప్పెను. ఎందుకనగా బిరుదు నీవు ఎవరికైతే సేవ చేస్తున్నావో వారి కంటె నిన్ను హెచ్చిస్తుంది. వారిలో ఒకరిగా నుండుటకు బదులు నీవు నీ గొప్పతనము చేత వారికి గొప్ప భయమును కలుగ చేయుదువు.

అటువంటి హెచ్చరికలుండినా ఈనాడు క్రైస్తవ ప్రపంచములో ఎందరో బిరుదులు కలిగియున్నారు. లోకములో నున్న పద్ధతులు తెచ్చుకొనుట ద్వారా మనము దేవునికి గొప్పగా సేవ చేయవచ్చునని అనుకొందుము. కాని అది ఏమాత్రము సత్యము కాదు.

పాత నిబంధనలో, ఫిలిష్తీయులు ఒకమారు దేవుని మందసమును పట్టుకొనినట్లు మనము చదువుదుము. అయితే దానిని బట్టి వారికి సమస్యవచ్చుట చేత దానిని వారు ఒక ఎడ్ల బండిపై వెనక్కు పంపివేసిరి. కొన్ని సంవత్సరముల తర్వాత రాజైన దావీదు మందసమును తీసుకువచ్చుటకు ముందు, ఫిలిష్తీయులు మందసమును తీసుకు వచ్చిన పద్ధతి బాగుందని అనుకొనిరి. ''ఇది మంచి ఆలోచన, ధర్మశాస్త్రములో చెప్పినట్లు లేవీయుల భుజములపై మందసమును మోయుట తక్కువ దూరమునకు సరిగా నుండును. కాని దూరపు ప్రయాణములకు ఫిలిష్తీయుల పద్దతి తప్పనిసరిగా బాగుండెను'' అని అతడు అనుకొనెను. ఆవిధముగా అతడు కూడా మందసమును ఎడ్ల బండిపై నుంచెను. అయితే ఏమి జరిగెనో మీకు తెలియును. ఎద్దుల కాలుజారుట వలన తడబడగా ఉజ్జా చేయిజాపి మందసము జారిపోకుండునట్లు దానిని పట్టుకొనెను. అప్పుడు యెహోవా కోపము రగులుకొనుట చేత ఉజ్జాను మొత్తగా ఆ స్థలమందే అతడు మరణించెను. ఎందుకనగా ఉజ్జా లేవీయుడు కాదు. దేవుడు ఆయన పద్ధతులను మార్చడు. అప్పుడు దావీదు ఎంతగానో కలత చెందెను. అయితే ఇదంతయు ఎక్కడ ప్రారంభమయ్యింది? అది దావీదు ఫిలిష్తీయులు చేసినట్లు చేయుటతో ఇది ప్రారంభమాయెను. మరియు దాని ద్వారా మరణము వచ్చినది.

క్రైస్తవ పనిలో ధనము ప్రథమ కారణమైనప్పుడు, క్రైస్తవ సంఘములు వ్యాపార సంస్థలు నడుచు రీతిని నడుచునప్పుడు, మనము లోకపు పద్ధతులను అనుసరించినప్పుడు ఎల్లప్పుడు మరణము వచ్చును.

మనలను మనము అడుగు కొనవలసిన ఒక మంచి ప్రశ్న ఏమనగా మనకు వచ్చు ధనము ఆగిపోయినట్లయితే మనము నడుపు సంఘము లేక సంస్థ కొనసాగునా లేక సమస్తము కూలిపడిపోవునా అనునది? నిజమైన దేవుని కార్యము ధనమును ఉపయోగించవచ్చును కాని ఎప్పుడును ధనముపై ఆధారపడి యుండదు. అది పరిశుద్ధాత్మునిపై మాత్రమే ఆధారపడియుండును.

''ఆత్మ మత్సరపడెను'' (యాకోబు 4:5) అని బైబిలు చెబుతుంది. తనకు సంఘములో చెందవలసిన స్థానమును వేరొకటి కాని, లేక వేరొకరు కాని తీసుకొనినప్పుడు ఆత్మ మత్సరపడెను. అది సంగీతము కావచ్చును. నేను సంగీతమునకు వ్యతిరేకిని కాను ప్రపంచమును అనుకరించకుండా మనకు అందుబాటులోనుండిన శ్రేష్టమైన సంగీతము మన సంఘములో నుండవలెనని నేను నమ్ముదును కాని మనము సంగీతముపై ఆధారపడకూడదు.

ఉదాహరణకు, ఒక కూటమి చివర్లో, ఒక సంగీత వాయిద్యమును మెల్లగా వాయించుటద్వారా, ప్రజలను వారు నిర్ణయములు తీసుకొనులాగు చేయుదమనుకొంటే ఏమిటి? అది మానసికమైన ఉద్రేకమును ప్రేరేపించుటయే తప్ప పరిశుద్ధాత్మ యొక్క శక్తికాదు. దేవుని యొక్క మాట ఆత్మయొక్క శక్తితో యేసు బోధించునట్లుగా మరియు పేతురు బోధించునట్లు బోధించినట్లయితే, చివరన ఏదొక సంగీత వాయిద్యము మెల్లగా వాయించవలసిన అవసరముండదు. నీకు కావలయునంటె నీవు అటువంటివి ఉంచుకొనవచ్చును, కాని అది నీకేమి ఉపయోగపడదు. కాని నీవు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందనట్లయితే, అప్పుడు ప్రజలు నిర్ణయము తీసుకొనునట్లు వారిని మానసికముగా ప్రేరేపించవలసియుండును. అయితే కాలము గడిచిన తరువాత, అటువంటి నిర్ణయములు ఉద్రేకభరితమైనవనియు పైపైనుండినవనియు నీవు తెలిసికొందువు.

పరిశుద్ధాత్ముడు ఆయనకు సంఘములో నుండవలసిన స్థానము గూర్చి అత్యాశక్తితో అపేక్షించుచున్నాడు. నీవు ఆయన స్థానమును వేదాంతముతో పూరించలేవు. నీవు ధనముతో భర్తిచేయలేవు, నీవు ఆయన స్థానమును సంగీతముతో భర్తీచేయలేవు. వీటన్నిటినీ బట్టి దేవునికి కృతజ్ఞతలు. వాటన్నిటిని ఉపయోగించుకొందుము. యేసు ధనమును ఉపయోగించెను. గనుక ఏ విధముగా మనము దానిని వ్యతిరేకించగలము? యేసు కీర్తన పాడెను అని వ్రాయబడియున్నది. హెబ్రీ 2:12 లో తండ్రిని స్తుతించుటలో యేసు సంఘమును నడిపించును, అని మనము చదువుదుము. గనుక మనము దేవునిని స్తుతించునప్పుడు మనము మన నాయకునినే అనుసరిస్తున్నాము. ఏవిధముగా మనము సంగీతమునకు వ్యతిరేకముగా నుండగలము? మనము వీటిలో దేనికి వ్యతిరేకులముకాము. కాని ఇక్కడ ప్రశ్న ఏమిటనగా మనము దేనిమీద ఆధారపడుతున్నామనేది.

మనము గొప్ప వ్యక్తులపైనను లేక గొప్ప వక్తలపైనను ఆధారపడుచున్నామా? లేదు పరిశుద్ధాత్ముడు మత్సరపడుచున్నాడు.

యేసు ఒక సేవకునిగా మారెను.ప్రతి క్రైస్తవ నాయకుడు సేవకుని జీవిత విధానముగూర్చి మరియు సేవకునిగా యుండుట గూర్చి మాట్లాడును మరియు దాని గూర్చి అనేక పుస్తకములు కూడా వ్రాయబడెను. కాని అభ్యాసాత్మకముగా దాని అర్థమేమిటి? నీ తోటి పనివానిని ఎలాచూచుచున్నావు? నీ గుంపులో నిన్ననే చేరిన నీ తోటిపని వానిని ఎలా చూచుచున్నావు? అతడు నిజముగా నీకొక సహోదరునిగా ఉన్నాడా? లేక నీయందు భయముతో జీవిస్తున్నాడా? ఒకవేళ అలా అయినట్లయితే నీవు తీర్పుదినము వరకు సేవకత్వము గూర్చి బోధించినా దాని గూర్చి నీవేమి అర్థము చేసికొనలేదని నేను చెప్పగలను. నీవు యేసును చూడలేదు.

ప్రభువైన యేసు చాలా సామాన్యముగా నుండెడివారు. ఆయనెప్పుడు ప్రజలను అతిగా భయపడేటట్టు చేయలేదు. నేను మనుష్య కుమారుడనని ఆయన చెప్పెను. దాని అర్థము నేనొక సామాన్య మానవుడిని అని. ఆయన శాశ్వత కాలమునుండి తండ్రితో జీవించిన పవిత్రమైన మరియు పరిశుద్ధుడైన దేవుని కుమారుడై యుండెను. కాని ఆయన ఈ భూమిపైకి వచ్చి ఒక సామాన్యమైన మనుష్యుడుగా జీవించెను. ఆయన అన్నిటిలో ఆయన సహోదరులవలెనాయెను.

మనము అన్ని విషయములలో మన సహోదరులవలెనగుటకు మనలో ఉన్నది కొంత మరణించాల్సియున్నది. ఆయన మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను (ఫిలిప్పీ 2:8) అని యేసును గూర్చి చెప్పబడెను. మన యొక్క దీనత్వమునకు మరణము సరియైన ఋజువుగానుండును.

భూమిలో పడి మరణించిన గోధుమగింజ తప్పనిసరిగా ఫలించునన్న నమ్మకమున్నది. 22 సంవత్సరముల క్రితము నా జీవితములో యధార్థత గూర్చిన సంకటస్థితి వచ్చినప్పుడు నేను భారతదేశములో ప్రభువు కొరకు చేయగలిగిన గొప్పపని, నేను భూమిలో పడి మరణించుట - అది నా స్వంత యిష్టమునకు ప్రజలు నా గూర్చి ఏమనుకొనుచున్నారను దానికి నా యొక్క అభిలాషలకు, నా యొక్క ఆశయాలకు, నా యొక్క ధనాశకు, ప్రతి విషయమునకు - మరియు ముఖ్యముగా నా స్వజీవమునకు, ఆ విధముగా అప్పటినుండి నాకు యేసు మాత్రమే అన్నియు అయ్యెను. గనుక ప్రతిదినము నిజాయితీతో ఆయనవైపు చూస్తూ ''ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు'' (కీర్తనలు 73:25) అని చెప్పగలిగియుంటిని.

నా పడకపై పరుండి ప్రభువుతో, ''ప్రభువా, నా పరిచర్య నా దేవుడు కాదు, నీవు మాత్రమే నా దేవుడవు. ఎవ్వరుకూడ నీ యొక్క స్థానమును తీసుకొనలేరు. నీవు నాకు సమస్తమైయున్నావు. నీవు నా స్వరమును తీసుకొనవచ్చును. పక్షవాతము వచ్చిన వానిగా చేయవచ్చును లేక నీ కిష్టమైనట్టు నన్ను చేయవచ్చును. అప్పుడుకూడా నేను నా హృదయమంతటితో నిన్ను ప్రేమింతును'' అని చెప్పిన సమయములు నాకున్నవి. దేవుని సన్నిధిలో పరిపూర్ణ సంతోషము ఉన్నది కావున ఎవ్వరు కూడా నానుండి నా యొక్క సంతోషమును తీసివేయలేరు. ఆ ఊటనుండియే మన ద్వారా జీవజలనదులు ప్రవహించును.

ఆఖరుగా మరొక విషయం అనేక సంవత్సరాల క్రితము, నేను యౌవన క్రైస్తవునిగా నుండినప్పుడు ప్రభువు 2సమూయేలు 24:24 నుండి నాతో మాట్లాడెను. అక్కడ దావీదు వెల ఇయ్యక తీసుకొనిన దానిని నేను యెహోవాకు బలిగా ఇయ్యను అని అనెను. ఆరోజు ప్రభువు నా హృదయముతో మాట్లాడిన మాట, ఆయన ఈ లోకమునకు వచ్చినపుడు, ఆయన తన సమస్తమును వెలగా అర్పించివచ్చెను. మరియు నేను ఆయనను సేవించవలయుననినయెడల నేను కూడా అట్టి ఆత్మతోనే సేవించవలెను. నా యొక్క సేవ ఏదైనప్పటికిని అది కొంత వెల యివ్వవలసినదైయున్నది.

ప్రభువునకు నీసేవ ఎలా ఉన్నది? అది నీవు ఏదొక వెల చెల్లించేదిగానున్నదా? ఈనాడు భారతదేశములో అనేకులు వారొక లౌకిక ఉద్యోగములో ఉండి సంపాదించిన దానికంటె ఐదు లేక పదిరెట్లు ఎక్కువ క్రైస్తవ పరిచర్యలో సంపాదించు చున్నారు. అదొక త్యాగమా?

31 సంవత్సరములు క్రితము నేను భారత నౌకాదళములో ఉద్యోగము విడచినప్పుడు ఒక నిర్ణయమును తీసుకొన్నాను. అది నాయొక్క లౌకిక ఉద్యోగములో ఉండి సంపాదించగలిగే నెల జీతము కంటె ఎక్కువైన సొమ్మును నేనెప్పుడు తీసుకొనకూడదని అనుకొంటిని. ఆ నిర్ణయము 31 సంవత్సరములుగా నన్ను కాపాడినది.

మనము ఇతరులను తీర్పు తీర్చకూడదు. మరియు నేను ఇక్కడ మిమ్మును తీర్పు తీర్చుటకు లేను. మీలో చాలామందిని నేను ఎరుగను గనుక, ''నేనొకవేళ ఈనాడు లౌకికమైన ఉద్యోగములో ఉండినట్లయితే ఏ మాత్రము రాబడి కలిగియుందును'' అని మీకు మీరు అడుగుకొనుడి అని చెప్పుట నాకు సులువు.

జాన్‌వెస్లీ, తన తోటి పనివారితో నీవు సువార్త ప్రకటించుట ద్వారా ధనికుడు వైతివని ఎప్పుడును చెప్పబడకూడదని చెప్పుచుండెడివారు. క్రైస్తవ పని ఎక్కువగా ఎక్కడ వెనుకబడివుందో నీకు తెలియునా? ఇక్కడనే, ఈ విషయములోనే. నీవు సిరిని దేవునిగా సేవించలేవు. మనము అన్నిటికంటే ముందుగా నిర్ణయించుకోవలసిన అంశము అదియే. ఇక్కడ మనము సూర్యుని క్రిందనుండిన ప్రతి విషయము గూర్చి చర్చించుకొనుచు సమయమును వెచ్చించ వచ్చును. కాని, ధనాశ అనేటటువంటి సమస్య గూర్చి మనము నిర్ణయము తీసుకోనట్లయితే మన పరిచర్య అంతయు వ్యర్థమే.

ప్రజలు వారి నివాసమును ఒక స్థలము నుండి వేరొక స్థలమునకు మార్చుచుందురు. దానిలో తప్పేమి లేదు. యేసు కూడా ఆయన నివాసమును పరలోకము నుండి భూమికి మార్చెను. కాని, ఆయన మార్చినప్పుడు ఒక మెట్టు దిగువకుండెను - ఆయనకు ప్రజలగూర్చి నిజమైన భారము కలిగియుండుటచేత అట్లు చేసెను, నీవెందు చేత మార్చితివి?

మరల నేను నిన్ను తీర్పు తీర్చుట లేదు. కేవలము అడుగుచున్నాను. నీకు గొప్ప భారము కలదని చెప్పి, ఈ దేశమును గూర్చి నీవు క్రొత్తగా మార్చిన ప్రదేశము నుండి ప్రభువునకు ఇంకా ఫలభరితముగా ఈ భారతదేశములో సేవ చేయవచ్చునని నీవు నీ నివాసమును మార్చితివా, నీకు నిజమైన భారమున్నదా?

మనము దక్షిణ భారతదేశపు సౌఖ్యములలో జీవిస్తూ, ఉత్తర భారతదేశపు పల్లెల గూర్చి భారము కలిగియుందుమా? నీవు అలా కలిగి యుండవచ్చును. కాని అలాగు ఎలా ఉండవచ్చో నాకు తెలియుట లేదు. నీవు అమెరికా దేశములో ఉంటూ భారతదేశము గూర్చి భారము కలిగియుందువా? ఉండవచ్చు- కాని, అది కాగితముపై మాత్రమే. కాగితముపై నీవు దేని గూర్చియైనను భారము కలిగి యుండవచ్చును.

సాతాను గొప్ప మోసగాడు. అతడు మనలను పూర్తిగా మోసముచేయును. మనలో కేవలము ఊహలు తప్ప ఏమీ లేనప్పుడు మనకు గొప్ప భారముండినట్లు మనము అనుకొనేలా చేయును. మీలో మీరు నిజాయితీగా ఉండవలెనని నేను కోరుకొనుచున్నాను. నేనిక్కడ ఒక పత్రమును సమర్పించుట లేదు. నా యొక్క హృదయమును పంచుకొనుచున్నాను మరియు అది దేవుని హృదయములో నున్నదే అని నమ్ముచున్నాను.

నేను మిమ్ములను తీర్పు తీర్చుటలేదు. నీవు ఇతరులను తీర్పు తీర్చినట్లయితే నిన్ను నీవు నాశనపర్చుకొందువు అని దేవుడు ఎన్నో సంవత్సరముల క్రితము నాకు చెప్పెను. ఈ రోజు దేవుని యెదుట నిలువబడి నేను ఎవరినీ తీర్పు తీర్చుట లేదని చెప్పగలను. నన్ను నేను తీర్పు తీర్చుకొందును. మరియు నేను పశ్చాత్తాపపడి, ''ప్రభువా, నేను ఆ వ్యక్తితో దయతో మాట్లాడలేదు. ఏ విధముగా మాటలాడవలెనో నేను నేర్చుకొనవలెనని కోరుచున్నాను'' అని చెప్పుదును.

తన నాలుకను అదుపు చేసికొనలేని మనుష్యుని యొక్క క్రైస్తత్వము ఏ విలువలేనిదని యాకోబు చెప్పెను (యాకోబు 1:26). మరియు ఆ వచనమును ఎల్లప్పుడు నా ముందుంచుకొనుటకు కోరుకొందును.

పౌలు తనతోటి పనివారిని గూర్చి ఒకమారు ఒక విషయము చెప్పెను. అతడు ఫిలిప్పీకి పంపుట కొరకు ఒకరి కొరకు చూచుచుండగా, తిమోతిని మాత్రమే అతడు కనుగొనగలిగెనని చెప్పెను. ఎందుకనగా తనతో నుండిన మిగిలిన వారు, వారి స్వంత కార్యములను చూచుకొనువారైరి (ఫిలిప్పీ 2:19-21). ఇక్కడ గమనించండి. పౌలు అన్యులగూర్చి ఈ మాట చెప్పలేదు. కాని, తనతోటి పనివారి గూర్చి అట్లు చెప్పెను. పౌలు యొక్క గుంపులో చేరగలుగుటయే ఒక ఘనత, ఎందుకనగా మార్కు తగినంత ఆసక్తితో లేడను ఉద్దేశ్యముతో తన గుంపులో కొనసాగుటకు ఇష్టపడనటువంటి వ్యక్తి పౌలు. అయినప్పటికినీ తన తోటి పనివారిలో ఎక్కువ మంది వారి స్వంత కార్యములను చూచుకొనువారని ఆయన అభిప్రాయపడెను.

ఈనాడు అనేకులు సువార్తను ప్రకటించుచున్నారు. మరియు ఆత్మల గూర్చి ఆసక్తి ఉన్నట్లు కనబడుచున్నారు. కాని, వారు నిజముగా వారి స్వంత లాభమును మరియు సౌఖ్యమును చూచుకొనుచున్నారు. వారు వారి మంచి స్థితిని పెంచుకొనుచున్నారు. తాము ఆ పని నుండి విరమణ చేసిన తరువాత వారి బిడ్డలు మరియు వారి కుటుంబ సభ్యులు ఆ పనిని తీసుకొనులాగున వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుచున్నారు.

సౌలు కూడా యోనాతానును ఉన్నత స్థితికి తీసుకువెళ్ళవలెనని అనుకొనెను. కాని దేవుడు యోనాతాను కాదు కాని దావీదు తరువాత రాజుగా నుండును అని చెప్పెను. అది సౌలు రాజుకు ఎంతో కోపము తెప్పించినది. తన కుమారుని రాజును చేయుటకు గాను అతడు దావీదును తొలగించుటకు ప్రయత్నించెను. అటువంటి పరిస్థితి ఇప్పటి క్రైస్తత్వములో జరుగుటలేదని అనుకొనగలరా? అటువంటివి జరుగుచున్నవి.

మనము దేవునిని సేవించినప్పుడు మరియు సత్యము చెప్పినప్పుడు మనము ఖ్యాతి పొందము. కాని మనుష్యులను సంతోష పర్చవలెననుకొంటే, మనము క్రీస్తు సేవకులుగా నుండలేము. నేను ప్రతి సహోదర సహోదరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ముఖ్యముగా ఎవరైతే క్లిష్టతరమైన పరిస్థితులలో పనిచేయుచున్నారో, ఎవరైతే యేసు తిరిగి వచ్చినప్పుడు తప్ప మనకు తెలియని త్యాగములు చేయుచున్నారో, ఎవరైతే క్రైస్తవ సంఘములు, సంస్థలలో తెలియని వారుగా నుందురో, ఎవరి పేర్లయితే ప్రకటింపబడవో, ఎవరికైతే వార్తాసాధనాల గుర్తింపు ఉండదో, కాని, ఎవరైతే దేవునికి భయపడుదురో, తమ్మును తాము తగ్గించుకొనియుందురో, త్యాగ పూరితముగా యేసుక్రీస్తు సువార్తను ఈ దేశములో ప్రకటించెదరో అట్టివారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. వారికి గౌరవ వందనము చేయుదును. నా హృదయమంతటితో అటువంటి వారిని గూర్చి దేవునికి స్తుతులు చెల్లింతును. అటువంటి వారిలో ఎవరితోనైనా పోల్చినపుడు నేనెక్కడా నిలువను. వారిలో అనేకులు మన సంఘములలో మరియు మన సంస్థలలో పనిచేయు చున్నారు. వారి అడుగుజాడలలో మన మందరము నడచుదముగాక.

వినుటకు చెవిగలవాడు వినును గాక. ఆమేన్‌.

అధ్యాయము 4
ఒక ఆత్మీయ ఉద్యమము ఎలా క్షీణించును

''ప్రభువా! రక్షించుము. భక్తిగలవారు కనుమరుగవుచున్నారు? లోకమంతటిలో నమ్మకమైనవారు ఎక్కడ కనబడుదురు? అందరు మోసపుచ్చుచు, ముఖస్తుతి చేయుచు, అబద్ధములు చెప్పుచున్నారు. యధార్థత ఇకలేదు'' (కీర్తనలు 12:1 లివింగు బైబిలు).

పై వచనములో వర్ణింపబడిన వ్యవహారాల పరిస్థితి ఈనాడు క్రైస్తవ ప్రపంచము యొక్క సరైన వివరణగా నున్నది. ఒకప్పుడు, భక్తికొరకు ప్రయాసపడిన విశ్వాసులు సహితము తమ స్వంత లాభము కొరకు మోసము చేయుట, ముఖస్తుతి చేయుట, అబద్ధములాడుట వంటి వాటిలో పాల్గొనుటను మనము ఈ రోజుల్లో కనుగొనెదము.

దేవుడు మననుండి మొట్టమొదటిగా కోరుకొనేది యదార్థతను. మనలో 1001 లోపాలు ఉండవచ్చును మరియు మనము అదే సంఖ్యలో పొరపాట్లు చేయవచ్చును. కాని మనము యదార్థముగా ఉన్న యెడల, దేవుడు మన జీవితాలతో అద్భుతాలు చేయగలడు.

మత్తయి 16:3, యేసు ఒక ప్రశ్నతో పరిసయ్యులను గద్దించెను: ''మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరా?''. మనము జీవించుచున్న కాలముల యొక్క సూచనలను మనము చూడని యెడల, యేసు పరిసయ్యులను గద్దించినట్లే మనలను కూడా గద్దింపవలసియుండును. ప్రజలకు బైబిలు తెలిసినప్పటికీ దేవునిని ఎరుగనట్టయితే, వారు చాలా సులువుగా మోసపచరచబడగలరు-ఎందుకంటే లోకములో ఉన్న ప్రతి మతారాధన వ్యవస్థ (కల్ట్‌) బైబిలును తమ పాఠ్యపుస్తకముగా వాడుకొందురు మరియు వారి విచిత్రమైన సిద్ధాంతాలను ప్రచారము చేయుటకు దానిలోని వచనాలను రుజువుచేయు వచనాలుగా వాడుకొందురు. ఈ కారణము చేత ఈ శతాబ్దములో లోకమంతట అనేక మతారాధన వ్యవస్థలు ఆవిర్భవించి అనేకమంది ప్రజలకు ఇంపైనవిగా, అంగీకారముగా నున్నవి. విశ్వాసులు సహితము మోసగింపబడి వారి రక్షణను పోగొట్టుకొనుచున్నారు.

నూతన నిబంధనలో, దేవుడు తన ప్రతియొక్క బిడ్డ తనను వ్యక్తిగతముగా తెలుసుకోవాలని కోరుకొనుచున్నాడు (హెబ్రీ 8:11). పాత నిబంధన కాలములో (అరుదుగా కనబడే) ప్రవక్త మాత్రమే దేవునిని వ్యక్తిగతముగా తెలుసుకొనే అవకాశము కలిగియుండెడివాడు. నిజానికి, క్రొత్త నిబంధనలో ఒక దేవుని బిడ్డ పాత నిబంధనలోనున్న అతి గొప్ప ప్రవక్త కంటే దేవునిని మెరుగైన విధముగా మరియు ఎక్కువ వ్యక్తిగతముగా తెలిసికొనగలడు. యేసు దీనిని ప్రత్యేకముగా చెప్పెను (మత్తయి 11:11). దేవునిని తెలిసికొనుటకు వాంఛను కలిగిన విశ్వాసులు బహుకొద్దిమందే ఉన్నారు. విశ్వాసులలో ఎక్కువమంది బైబిలు జ్ఞానమును పెంపొందించుకొనుటకును బ్రహ్మాండమైన ఉద్వేగపూరితమైన అనుభవాలను పొందుటకును ఆసక్తి కలిగియుందురు. ''క్రైస్తవునిగా ఉండుటకు కష్టముగా ఉండును'' (2తిమోతి 3:1 లివింగు బైబిలు) అని పౌలు చెప్పిన విధముగా చివరి దినాల యొక్క చివరి ఘడియ యొక్క చిట్ట చివరి నిమిషములకు మనము వచ్చియున్నామని ఇదంతయు సూచించుచున్నది. చివరి దినాలలో క్రైస్తవునిగా ఉండుట కష్టముగా ఉండును. ఇది హింసవలనో, వ్యతిరేకతవలనో కాదుగాని అనేకులు ''పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారైయుందురు'' అనుదానివలెనే (2తిమోతి 3:5). వేరే మాటలలో చెప్పాలంటే, వారు క్రొత్త నిబంధన క్రమమునకు దాని సిద్ధాంతములకు ప్రాముఖ్యత నిత్తురు గాని క్రీస్తు యెడల వ్యక్తిగత అంకిత భావములో గాని ఆచరణాత్మక భక్తిలో గాని ఆసక్తి చూపరు.

గతములో మృతమైన మతశాఖలను విడిచిపెట్టిన మనలో అనేకులము, మనము ఒక ఆత్మీయ వాస్తవికతను వెదుకుచున్నందున వాటిని విడిచిపెట్టితిమి. మన అన్వేషణను మనము ధృడసంకల్పముతో మొదలుపెట్టియుండవచ్చును. కాని యేసు కాలములో పరిసయ్యుల యొక్క తెగవలే, ఏదో ఒక తెగలోనికి విశ్వాసులను ప్రక్కదారి పట్టించుటకు సాతాను చాలా తెలివైన వాడు.

ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పించుటకు పాత నిబంధనలో అంత వివరముగా మనకు ఇవ్వబడెను. ఆ చరిత్రనుండి ఒక జ్ఞానము గలవాడు, ప్రజలు దేవునికి ఎలా ఇష్టులుగా ఉండిరో మరియు ఎలా అనేకులు ఆయనకు ఇష్టులుకాకుండిరో నేర్చుకొనును. యిర్మీయా 3:14,15లో ''ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను. నా కిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మునేలుదురు'' అని ప్రభువు వాగ్దానము చేసెను.

''సీయోను'' సజీవుడగు దేవుని నిజమైన సంఘమునకు సూచనగా ఉన్నది. దేవుడు తన ''సీయోను'' లోనికి ఒకానొక పట్టణమునుండి ఒకనిని, ఒకానొక కుటుంబమునుండి ఇద్దరిని రప్పించును. మనము ఈ సీయోనులోనికి అనగా ప్రభువు కట్టుచున్న సంఘములోనికి -వచ్చినప్పుడు ఆయనను గూర్చిన జ్ఞానముతో (కేవలము బైబిలు జ్ఞానము కాదు) ఆయన మార్గముల యొక్క వివేచనముతో (కేవలము సిద్ధాంతములను అర్థము చేసుకొనుటతో కాదు) మనలను పోషించు ''తన కిష్టులైన కాపరులను'' అక్కడ మనకిచ్చెదనని ఆయన వాగ్దానము చేసెను.

నిజమైన దేవుని సంఘమును గుర్తించుటకు ఒక ప్రధానమైన గుర్తు ఇదే: అది దేవునికిష్టులైన కాపరులను కలిగియుండును. దేవుడు ప్రేమామయుడు-ప్రేమ యొక్క ప్రధానమైన గుణము ఏమిటంటే అది స్వప్రయోజనమును విచారించుకొనదు. కాబట్టి దేవునికి ఇష్టమైన కాపరులు తమ స్వప్రయోజనమును విచారించుకొనని వారు. అటువంటి కాపరులు ఎవరి డబ్బును లేక ఘనతను కోరుకొనరు. వారు మనుష్యులను సంతోషపెట్టుటకు గాని వారిని ఆకట్టుకొనుటకు గాని ప్రయత్నించరు. దానికి బదులు వారు విశ్వాసలను ''క్రీస్తు నందు సంపూర్ణులుగా చేసి ఆయన యెదుట నిలువబెట్టుటకు'' వారిని కట్టుటకు కోరుకొందురు (కొలొస్స 1:28). అటువంటి ఆశ కలిగిన వ్యక్తిని దేవుడు ఎక్కడ కనుగొన్నను -ఈ లోకములో ఏ పట్టణములోనైనను పల్లెలోనైనను కనుగొన్నను ఆయన తన సంఘమును కట్టును.

మరొక ప్రక్క, ప్రధాన మతశాఖలను విడిచిపెట్టి, ''క్రొత్త నిబంధన క్రమము'' ను అనుసరించుటకు కోరుకొని తమ సిద్ధాంతములన్నియు సరియైనవిగా కలిగియుండియు డబ్బును ప్రేమించి, తమ స్వప్రయోజనమును విచారించుకొనుచు, తాము క్రీస్తు శరీరమును కట్టుచున్నామని ఊహించుకొనే అనేక విశ్వాసులను మేము చూచితిమి. వారి ప్రయాసల ఫలితము ఎప్పుడు గందరగోళము అయోమయమే మరియు వారి ప్రయాసల ద్వారా చివరకు కట్టబడునది ఎప్పుడు బబులోనే. తన స్వప్రయోజనమును విచారించుకొనని మనుష్యుని కనుగొన్న చోట మాత్రమే దేవుని తన నిజమైన సంఘమును కట్టగలడు. ప్రజల కొరకు దేవుని హృదయభారమును పంచుకొనే అటువంటి ఒక వ్యక్తి, తమ స్వప్రయోజనమును విచారించుకొనే వెయ్యిమంది విశ్వాసుల కంటే దేవునికి విలువైనవాడు.

దేవునికి ఇష్టునిగా ఉండే కాపరిగా ఉండుట త్యాగము, అసౌకర్యము, శ్రమతో కూడినది. దాని అర్థము అపార్థమును, వ్యతిరేకతను, ఎగతాళిని, దూషణను సంతోషముతో భరించుటకు సిద్ధపడియుండుట. అటువంటి కాపరి తన స్వప్రయోజనమును చూచుకొనని భార్యను కలిగియున్న ధన్యుడైన యెడల, ప్రభువు ఏమి చేయాలనుకొన్నా వారి గృహము ఆయన కొరకు తెరచియుండబడినట్లయితే, దేవుడు వారి జీవితాల ద్వారా చేయగలిగిన దానికి ఎటువంటి పరిమితి లేదు. నేనిప్పుడు అనేకమందిని పోగుచేయుటను గూర్చి మాట్లాడుట లేదు. జనుల సంఖ్య దేవుని ఆశీర్వాదమునకు గుర్తు కాదు. ప్రసిద్ధిగాంచిన మతారాధన వ్యవస్థలలో అనేకమైనవి మిగిలినవారి కంటే ఎక్కువ జనులను పోగుచేయును. అది దేనిని నిరూపించదు. నేనిప్పుడు నాణ్యతను గూర్చి మాట్లాడుచున్నాను-ప్రతి వ్యక్తి దేవునిని వ్యక్తిగతముగా తెలుసుకోగలిగే క్రీస్తు శరీరమును కట్టుటను గూర్చి మాట్లాడుచున్నాను.

అటువంటి అభివృద్ధి లేకుండా, ఏ గుంపైనా ఒక గుడ్డివాడు అనేకులైన గ్రుడ్డివాళ్ళను గుంటలోకి నడిపించు స్థలముగా నుండును. వారి ప్రార్థనా కూడికలన్నియు గుంటలో ఉండును. వారి బైబిలు ధ్యానములు గుంటలో ఉండును, వారి సమావేశములు కూడా గుంటలోనే ఉండును. యేసు కాలములో, ఆయన చూచినప్పుడు ప్రజలు కాపరి లేని గొఱ్ఱెలుగా ఉండిరి. ఈనాడు కూడా అదే పరిస్థితి ఉన్నది. దేవునికి ఇష్టులైన కాపరులే ప్రతి స్థలములో ఉండవలసిన గొప్ప అవసరత ఉన్నది. నేనిక్కడ ఒక సంఘములో ఒక పెద్దగా మాత్రమే ఉండుటను గూర్చి మాట్లాడుట లేదు. ఒక పెద్ద సంఘమునకు అనేకమంది కాపరులు కావలెను-దేవుని ప్రజల కొరకు భారముగల హృదయము గలవారు కావలెను. అటువంటి వారు పెద్దలుగా ఉండకపోవచ్చును. కాని వారు గొఱ్ఱెలకు అహారమిచ్చి ప్రోత్సహించెదరు-ఆనందముతో వారికి సేవచేయుదురు.

నేను ముందు చెప్పినట్లు, ఇశ్రాయేలు చరిత్రలో మనము అనుసరించగల మంచి మాదిరిలను, దానిలో మనము తప్పించుకోవలసిన మనుష్యులు చేసిన తప్పులను మనకు చూపించుటకు ఇశ్రాయేలు చరిత్ర బైబిలులో మనకు అంతయు వివరముగా ఇవ్వబడెను. దానిలో ఒక దేశముగా ఇశ్రాయేలు చరిత్రలో రెండు ముఖ్యమైన ఆరంభ దశలుండెను. మొదటిగా, యెహోషువ నాయకత్వము క్రింద వారు కానానులో ఒక దేశముగా మొదలు పెట్టినప్పుడు రెండవదిగా, కొన్ని శతాబ్దాల దిగజారిన స్థితి తరువాత రాజైన దావీదుతో ఒక క్రొత్త ఆరంభమును చేసినప్పుడు. మనము ఈ రెండు సందర్భాలను పరిశీలించెదము. యెహోషువ ఇశ్రాయేలు దేశమునకు శ్రేష్టమైన నాయకత్వమును అందించిన భక్తిపరుడు. అతడు ఇశ్రాయేలంతయు ప్రభువును విడిచిపెట్టుటకు నిర్ణయించుకొన్నను, తన కుటుంబమంతటితో ప్రభువును వెంబడించుటకు ధృఢనిశ్చయము చేసుకొనెను (యెహోషువ 24:15). అవసరమైతే ఒంటరిగా నిలబడుటకు సిద్ధపడిన అటువంటి వ్యక్తి మాత్రమే ఈనాడు ఒక సంఘమునకు ఒక భక్తిపరమైన నాయకత్వమును అందించగలడు.

యెహోషువ జీవితకాలములో ఇశ్రాయేలు ఒక విజయము నుండి మరో విజయముకు ముందుకు వెళ్ళెను. కాని అప్పుడు యెహోషువ మరణించెను. దేవుడు ఒక సమయములో ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యము నిమిత్తము ఒక దేశములో లేవనెత్తిన ఒక మనుష్యుడు తన భూసంబంధమైన ప్రయాణము ముగించి వెళ్లినప్పుడు ఏమి జరుగునో దాని తరువాత సంభవించిన దానిలో మనము చూడగలము.

యెహోషువ తోటి పెద్దలు ఇశ్రాయేలు యొక్క నాయకత్వమును చేపట్టిరి (యెహోషువ 24:31). ఈ పెద్దలు యెహోషువ తరువాతి తరమునకు చెందినవారు. యెహోషువ 110 సంవత్సరముల వయస్సులో మరణించెను మరియు ఈ క్రొత్త నాయకులు తమ అరవైలలో, డెబ్బైలలో ఉండిరి. ఎందుకనగా (కాలేబు తప్ప) యెహోషువ స్వంత తరమువారు అరణ్యములో నలభై సంవత్సరములు సంచరించుచు నశించిరి. ఈ సమయములో అనగా రెండవ తరము నాయకత్వములో ఉన్నప్పుడు, యెహోషువ సమయములో ఉన్నంత మంచిగా పరిస్థితులు లేకుండెను. న్యాయాధిపతులు 1వ అధ్యాయములో, ఈ కాల వ్యవధిలో కొద్ది విజయములు (1-21 వచనాలు) అనేక పరాజయములు (22-36 వచనాలు) ఉండెనని మనము చదివెదము. పరిస్థితి క్రమక్రమముగా క్షీణించడము మొదలుపెట్టెను. రెండవ తరమునకు తమలో వేగము లేకుండెను కాని మునుపటి తరములో యెహోషువ నాయకత్వమునుండి వారు పొందిన ఉరవడి వలన కొంతకాలము మనుగడ సాగించిరి.

ఒక ఇంజను చేత నెట్టబడిన రైలు బండివలే, రెండవ తరము మొదట చాలావేగముగా కదిలెను గాని క్రమేణ వేగము తగ్గిపోయి చివరకు నిలిచిపోయెను! మనము న్యాయాధిపతులు 2:11 కి వచ్చేసరికి, పరిస్థితి ఘోరమైనదిగా నుండెను. ఇశ్రాయేలు ఇప్పుడు ప్రభువు దృష్టిలో బాహాటముగానే పాపము చేసెను. కాబట్టి ఒక తరములో మంచిగా ప్రారంభమైనది, మూడవ తరమునకు వచ్చేసరికి నెమ్మదిగా చెడుగా మారుటను మనము చూడగలము.

ఇశ్రాయేలు చరిత్రలో రెండవ ముఖ్యమైన దశ, దావీదు ఇశ్రాయేలు రాజైనప్పుడు ప్రారంభమాయెను. సౌలు ఇశ్రాయేలునకు మొదటి రాజుగానుండెను. అతడు గొప్ప దీనత్వముతో తన రాజ్యమును ప్రారంభించెను గాని ఎంత గొప్పగా దిగజారిపోయెనంటే దేవుడు తన అభిషేకమును అతనినుండి తీసివేసెను. మొదటి తరములోనే క్షీణించిపోవు ఉద్యమాలకు సౌలు జీవితము ప్రతీకగానున్నది. క్రైస్తవత్వ లోకములో కూడా అటువంటివి అనేకమైనవి ఉన్నవి. దేవుడు ఈ రాజ్యమును ''తన చిత్తానుసారమైన మనస్సు గలవానికి'' ఇచ్చెదనని సమూయేలు ద్వారా సౌలుకు చెప్పెను (1సమూయేలు 13:14). అతడు దావీదు. ఇది దావీదు పట్ల సౌలుకు ఎంతో అసూయ కలుగజేసెను. సౌలు దావీదును ఎంతగా ద్వేషించెనంటే అతడు దావీదును చంపనుద్దేశించెను. అయితే ఇశ్రాయేలు దేశములో దేవుని అభిషేకము ఎక్కడ ఉండెనోనని గుర్తించిన వారు, దావీదుతో కలిసిరి. ఈ విధముగా ఒక చిన్న గుంపు దావీదు చుట్టూ పోగయ్యిరి. కాని వారు సౌలు చేత దేశమంతయు తరుమబడి, హింసింపబడి వేటాడబడి తమ జీవితాలు కాపాడుకొనుటకు పారిపోవలసి వచ్చెను .కాని దేవుడు ఆ చిన్న గుంపుతో నుండెను. అయితే సౌలు మాత్రము ఇశ్రాయేలు సింహాసనము మీద అనేక సంవత్సరాల పాటు కూర్చుండుట కొనసాగించెను-ఇది తమ జీవితాలనుండి ఎప్పుడో దేవుని అభిషేకమును పోగొట్టుకొనిన అనేకమంది క్రైస్తవ నాయకులు తమ మందలను ఈ రోజున ఏలునట్లు ఉన్నది.

కాని తనను మెచ్చుకొని ముఖస్తుతిని చేసే అనుచరులను సౌలు ఇంకను కలిగియుండెను. ఇది అనేక మంది క్రైస్తవ 'నాయకులు' తమ గుంపులలో అట్టివారిని కలిగియున్నట్లున్నది. అనేకమైన మృత మతశాఖలు అన్య మత నాయకులు కూడా పెద్ద అనుచరుల సంఖ్యను కలిగియుందురు. కాని దేవుడు వారిలో ఎవరితోను లేడు.

మనలను మనము ఎప్పుడూ ప్రశ్నించుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న ఇదే: దేవుని కృపా మరియు అభిషేకము ఇప్పుడు నాపై యున్నవా? దేవుడు తన అతి గొప్ప కార్యమును తన ప్రజలలో ఆయన కొరకు పూర్ణ హృదయముతో నిలబడు ఒక చిన్న గుంపుతో చేసెనని సంఘ చరిత్ర మరల మరల నిరూపించుచున్నది. గిద్యోను కాలములో వలెనే, సాతానుతో యుద్ధములో విజయము కొద్ది మంది పూర్ణ హృదయులైన శిష్యులతోనే ఎప్పుడు గెలువబడును (న్యాయాధిపతులు 7). అటువంటి గుంపు (దావీదు గుంపువలె) దేవుడు వారి కాలములో ఏమి చేయుచున్నాడో అర్థము చేసుకోలేని క్రైస్తవ లోకములోని స్థాపితమైన వ్వవస్థలచేత ద్వేషింపబడి, అపార్థము చేసుకొనబడి, హింసింపబడును. కాని దేవుడు దావీదుకు అతని చిన్న గుంపుకు జాగ్రత్త వహించెను. మరియు ''దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవచేసి నిద్రించెను'' అని బైబిలులో నమోదు చేయబడినది. దావీదుకు లోపాలున్నప్పటికీ, అతడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి తన జీవితకాలములో ఇశ్రాయేలునకు భక్తిపరమైన నాయకత్వమును అందించెను. అతడు పరిపూర్ణుడుగా లేడు. కాని ఒక సాధారణమైన ప్రవక్త అతని యొద్దకు వచ్చి తన పాపము నిమిత్తము తనను గద్దింపగా అతడు వెంటనే తనను తాను తగ్గించుకొని మారుమనస్సు పొందెను (2సమూయేలు 12).

కాని దావీదుకు ప్రభువు యెడల అంకితభావము, దీనత్వము, తన జీవితముపైన దేవుని అభిషేకమును కలిగియున్నప్పటికీ, అతడు దేవుని సంకల్పమును తన తరములో మాత్రమే నెరవేర్చగలిగెను. తన మరణము తరువాత, పరిస్థితులు చాలా త్వరగా క్షీణించుట మొదలుపెట్టెను. అతని కుమారుడైన సొలొమోను బాగా ఆరంభించెను (1రాజులు 3:3,5,10-14). సొలొమోను మొదటిలో ఎంత జ్ఞానము కలిగియుండెనో, సామెతలు గ్రంథము మనకు చూపించుచున్నది. పాత నిబంధన అంతటిలో సామెతలు గ్రంథము బాహుశా అత్యుత్తమమైనది. అది పాత నిబంధన సరిగ్గా మధ్యలో ఒక క్రొత్త నిబంధన గ్రంధము వలెనున్నది. దానిని సొలొమోను వ్రాసెను. కాని సొలొమోను చాలా త్వరగాను చాలా ఘోరముగాను దిగజారిపోయి, దారుణముగా తన జీవితమును ముగించెను. మొదట్లో అతడు తన భక్తిపరుడైన తండ్రి నుండి పొందిన ఉరువడి వలన ముందుకు కొనసాగెను. కాని అదే దిశలో ఎక్కువ కాలము కొనసాగుటకు అతడు దేవుని యెడల తగిన ఆశను కలిగియుండలేదు. అతడు ధనము చేతను స్త్రీల చేతను దారి మళ్లింపబడెను (1రాజులు 10:23, 11:1-9)-మన కాలములో అనేకమంది బోధకుల వలెనే.

సొలొమోను చనిపోయిన తరువాత, అతడి కుమారుడైన రెహబాము (మూడవ తరము) బాధ్యతలు చేపట్టెను. అప్పుడు పరిస్థితులు ఘోరమాయెను. యువతరము రెహబాముతో చేతులు కలిపి ఇశ్రాయేలు నాయకత్వమును చేపట్టిరి మరియు రెహబాము జ్ఞానులైన పెద్ద వారి యొక్క సలహాను తిరస్కరించెను (1రాజులు 12:6-15). ఇది ఇశ్రాయేలు లోనికి గందరగోళమును తీసుకొని వచ్చెను మరియు రాజ్యము త్వరలోనే రెండుగా చీలిపోయెను. దావీదు తన తాతగారని మాత్రమే రెహబాము ఇప్పుడు అతిశయపడగలిగెను గాని దావీదుకున్న ఆత్మను అతడు ఎంత మాత్రము కలిగియుండలేదు. గత 20 శతాబ్దాలుగా క్రైస్తవ ప్రపంచములో భక్తిగలవారు ప్రారంభించిన అనేకమైన ఉద్యమాలలో ఈ క్షీణించిపోయే ప్రక్రియ ఖచ్చితముగా పునరావృతమవుటను మనము కనుగొనెదము. క్రైస్తవ ప్రపంచ చరిత్రలో, క్రైస్తవత్వమును తిరిగి తన యొద్దకు తెచ్చుటకు దేవుడు పంపిన ప్రతి భక్తిపరుడైన సంస్కర్త దేవుని సంకల్పమును తన తరములో మాత్రమే నెరవేర్చగలిగెను. దాదాపు ప్రతి సందర్భములో, ఆ సంస్కర్త చనిపోయిన తరువాత, తరువాతి తరములో అతని శిష్యులు వారి నాయకుడు కలిగియుండిన జీవము కంటే అతడు బోధించిన సిద్ధాంతములకు ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చిరి. పైకి భక్తిగా కనబడుటయే ప్రాముఖ్యత వహించి, దాని శక్తి నిర్లక్ష్యము చేయబడెను. ఆ విధముగా క్షయము, కుళ్లు లోనికి వచ్చెను. అటువంటి ఉద్యమాలు వాటి మూడవ తరము చేరుకొన్న సమయానికి, ఆ గుంపులోని భ్రష్టత్వము కుళ్లు సంపూర్ణమాయెను. ఆ తరువాత ఆ గుంపు వారి నాయకునిలో కనబడిన భక్తికిని ఆత్మీయతకును ఎటువంటి పోలికను కనుపరచలేదు. వారు అతడు ప్రకటించిన సిద్ధాంతములనే ప్రకటించి అతని నామమునందు అతిశయించిరి గాని బబులోనును కట్టిరి.

ఒక గుంపు ఒక ఆత్మానుసారమైన ఉద్యమముగా ప్రారంభము కావచ్చును గాని అది శరీరానుసారమైనదిగాను, ప్రకృతి సంబంధమైనదిగాను, దయ్యముల సంబంధమైనదిగాను మారవచ్చును.

ఒక దైవజనుడి చేత ప్రారంభించబడిన ఒక ఉద్యమము చివరకు ఒక మతారాధన వ్యవస్థ (కల్ట్‌)గా మారవచ్చును. దావీదు, సొలొమోను మరియు రెహబాము చరిత్రలో మనము చూచిన క్షీణగతి వంటిదే క్రైస్తవ ప్రపంచములో మరల మరల పునరావృతమాయెను. దేవుడు ఆరంభించిన ఏ ఉద్యమమునైనా దాని రెండవ లేక మూడవ తరములో మీరు జాగ్రత్తగా గమనించండి-నేను మీకిప్పుడు చెప్పిన దాని యొక్క సత్యమును మీ కళ్ల యెదుట మీరు చూచెదరు. ఇలా ఎందుకు జరుగుతుంది? సమాధానము సరళమైనదే! ఎందుకనగా విశ్వాసులు యేసుక్రీస్తుయొక్క వ్యక్తిత్వము కంటే వాక్యము యొక్క అక్షరముకు ఎక్కువ ప్రాముఖ్యత నిత్తురు. క్రీస్తు యెడల వ్యక్తిగత అంకితభావము కంటే ఏ సిద్ధాంతమైననూ ఎక్కువ ప్రాముఖ్యమైనప్పుడు, కుళ్లు, స్వనీతి, పరిసయ్యుల సిద్ధాంతము దానికి ఎల్లప్పుడు ఫలితమగును. ''సిలువను ఎత్తికొనుట'' అను సిద్ధాంతము సహితము, దానిని బోధించు వారిలో యేసు యొక్క జీవము వారిలో ప్రత్యక్షపరచబడుటకు బదులు, కేవలము మాటలుగా ఎలా మారెనో అనేక ఉదాహరణలను మేము చూచితిమి. ఇదంతయు మనకు ఒక తీవ్రమైన హెచ్చరికగా ఉండవలెను.

ఎఫెసులో నున్న సంఘ చరిత్రను పరిశీలించండి. పౌలు రాత్రి పగలు బోధించుచు అక్కడ మూడేళ్లు నివసించెను (అపొ.కా. 20:31). దీని అర్థము ఎఫెసీ క్రైస్తవులు పౌలు పెదవులనుండి వందలాది ప్రసంగములను వినియుండిరి. ప్రభువు వారి మధ్య అసాధారణమైన అద్భుతములను చేయుట వారు చూచిరి (అపొ.కా.19:11). వారి మధ్యనుండి, దేవుని వాక్యము ఆసియా మైనర్‌ యొక్క పరిసర ప్రాంతాలంతటికిని రెండేళ్ల తక్కువ వ్యవధిలోనే వ్యాపించెను. వారు ఉజ్జీవమును అనుభవించిరి (అపొ.కా. 19:10,19). అపొస్తలుల కాలములో ఉన్న సంఘములన్నిటిలో వారు అత్యాధిక్యత గలిగిన వారుగా ఉండిరి.నిస్సందేహముగా వారు ఆ సమయములో ఆసియా మైనర్‌లో ఎక్కువ ఆత్మానుసారమైన సంఘముగా నుండిరి. (పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో, ఇతర సంఘములకు అతడు వ్రాసిన విధముగా, వారి మధ్య ఎటువంటి తప్పును సరిదిద్దుటకు లేకపోయెను).

కాని పౌలు ఎఫెసును విడిచి వెళ్లేటప్పుడు, సంఘము యొక్క క్రొత్త నాయకత్వము క్రింద, తరువాత తరములో పరిస్థితులు అధ్వానముగా మారునవి అక్కడి పెద్దలను హెచ్చరించెను. వారి మధ్యకు క్రూరమైన తోడేళ్లు వచ్చుననియు, శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు వారిలోనే బయలుదేరుదురనియు వారితో చెప్పెను (అపొ.కా. 20:29,30). పౌలు అక్కడున్నంత కాలము, ఏ తోడేలు ఎఫెసులో ఉన్న మందలోనికి వచ్చుటకు సాహసించలేదు. పౌలు ఒక నమ్మకస్తుడైన ద్వారపాలకునిగా యుండెను (మార్కు 13:34 చూడండి). అతడు అభిషేకింపబడి యున్నందున, దైవ భయము కలిగియున్నందున, తన స్వంత కార్యములను కాక ప్రభువు కార్యములను చూచినందున, అతడు ప్రభువు నుండి ఆత్మీయ అధికారమును పొందెను. కాని ఎఫెసులో సంఘపెద్దల యొక్క ఆత్మీయ స్థితి సరిగా లేదని తెలుసుకొనుటకు కావలసిన ఆత్మీయ వివేచనను కూడా అతడు కలిగియుండెను-కాబట్టి ఒకసారి వారు సంఘనాయకత్వమును చేపట్టిన వెంటనే పరిస్థితి క్షీణించిపోవునని అతడు యెరిగియుండెను.

ఎఫెసులో ఖచ్చితముగా జరుగబోయే దాని ప్రవచనమును పౌలు ఆ పెద్దలకు ఇవ్వలేదు. అది ఒక హెచ్చరిక మాత్రమే. ఆ పెద్దలు తమ్మును తాము విమర్శించుకొని మారుమనస్సు పొందిన యెడల అతడు అంచనా వేసినట్లు జరుగకపోయుండవచ్చును.

ఒకసారి యోనా నీనెవె యొక్క నాశనమును ప్రవచించెను. కాని నీనెవె యొక్క ప్రజలు మారుమనస్సు పొందినందున అతడు ప్రవచించినట్టు జరుగలేదు. ఎఫెసులో ఉన్న సంఘము కూడా పౌలు చెప్పిన గతిని తప్పించుకొని యుండవచ్చును. కాని ఎఫెసులో ఉన్న క్రొత్త తరము యొక్క నాయకులు పౌలు యొక్క హెచ్చరికను ఎన్నడు తీవ్రముగా తీసుకొనక పోవుట చేత ప్రభువునుండి కొట్టుకొని పోయిరి.మొదటి శతాబ్దము యొక్క అంతములో, మూడవ తరము అధికారములోనికి వచ్చెను. అప్పుడు పరిస్థితులు ఘోరముగా మారెను. వారి సిద్ధాంతములన్నియు సరిగా నుండెను మరియు వారు క్రైస్తవ కార్యక్రమాలలో ఆసక్తిగా నుండిరి. వారు బహుశా వారి రాత్రంతా ప్రార్థనా కూడికలను మరియు ఇతర ప్రత్యేకమైన కూడికలను ఇంకా కలిగియుండిరి. కాని వారి ఆత్మీయ పరిస్థితి ఎంత దారుణముగా నుండెనంటే ఒక సంఘముగా వారికున్న గుర్తింపును ప్రభువు తీసివేయుటకు సిద్ధముగా నుండెను. వారి నేరమేమిటి? ప్రభువు యెడల వారికున్న అంకిత భావమును(ప్రేమను) వారు పోగొట్టుకొనిరి (ప్రకటన 2:4,5).

ఎఫెసులో ఉన్న సంఘచరిత్ర మనకు ఏమి నేర్పించుచున్నది? ప్రభువుకు అంకితభావము కలిగియుండుట కంటే ప్రాముఖ్యమైన సిద్ధాంతము ఏదియు లేదన్న విషయమునే. నిజమైన ఆత్మానుసారతకు ఒకటే, కేవలము ఒకటే గుర్తు ఉన్నది-అది యేసు జీవము మన ప్రవర్తనలో మరి ఎక్కువగా ప్రత్యక్షపరచబడుట. అయితే ఇది కేవలము ప్రభువు పట్ల పెరుగుతు పోయే అంకితభావము ద్వారానే కలుగును. పౌలు ఒక భక్తిపరుడు-అతడు తన జీవితము యొక్క అంతము వరకు ప్రభువైన యేసు పట్ల అంకితభావము కలిగియుండిన ఒక తీవ్రతకలిగిన నమ్మకస్తుడైన అపొస్తులుడు మరియు సాతాను విశ్వాసులను క్రీస్తుయెడల వారికున్న సరళమైన అంకితభావమునుండి తొలగిపోవునట్లు ఎట్లయినను ప్రయత్నించునని అతడు ప్రతి చోట విశ్వాసులను హెచ్చరించెను (2కొరిందీ¸ 11:3). ''నీటి బాప్తీస్మము'' మరియు ''పరిశుద్ధాత్మలో బాప్తీస్మము'' వంటి సిద్ధాంతపరమైన విషయాలలో పొరపాట్లు, క్రీస్తు యెడల ఒకరికున్న వ్యక్తిగత అంకితభావమును పోగొట్టుకొనుట అంతటి ప్రమాదకరమైనవి కావు. అయినప్పటికీ అనేకమంది విశ్వాసులు ఎప్పుడు దీనిని గ్రహించకుందురు. పౌలు కూడా దేవుని సంకల్పమును తన తరములో మాత్రమే నెరవేర్చకలిగెనని మనము చూచెదము. అతనితో నివసించిన తిమోతివంటి వారు అతని ఆత్మను అవలంభించుకొని, క్రీస్తు యెడల స్వార్థరహితమైన అంకిత భావముతో జీవించిరి (ఫిలిప్పీ 2:19-21). కాని, అదికాక పౌలు తన ఆత్మానుసారతను తాను స్థాపించిన సంఘాలలో రెండవ తరము విశ్వాసులకు కూడా అందించలేకపోయెను. మొదటి శతాబ్దము నుండి ప్రతి తరములో దేవుడు లేవనెత్తిన ప్రతి ఉద్యమములో ఇటువంటి క్రమమే పునరావృతమవుటను మనము చూచెదము.

ప్రతి తరములోను, లోకములోని ప్రతి ప్రాంతములోను, దేవుడు తన నామము కొరకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యమును కలిగియుండాలన్న వాంఛను కలిగియున్నాడు. ఈ సంకల్పము నిమిత్తము, ఒక తరములో, ఒక దేశములోని సంఘమునకు అపొస్తలులు బోధించిన సత్యమును తిరిగి ఇచ్చుట ద్వారా ప్రజలను భక్తిపరమైన జీవితమునకు నడిపించుటకు దేవుడు ఒక భక్తిపరుడైన మనుష్యుని లేవనెత్తును. ఆ వ్యక్తి ద్వారా ఒక ఉద్యమము నెమ్మదిగా ఆరంభమగును మరియు తమ తరము యొక్క క్రైస్తవలోకముయొక్క వేషధారణతోను, అవాస్తవికతతోను విసుగుచెందిన కొద్దిమంది పూర్ణహృదయులైన విశ్వాసులు అతని చుట్టూ పోగవుదురు. త్వరలోనే ప్రభువు కొరకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యము స్థాపించబడును. అటువంటి గుంపు(సంఘము) ఆరంభములో ఎప్పుడు చిన్నదిగానుండును. మరియు అప్పటికే ఉన్న సంఘాల చేత ఆ సంఘము తీవ్రముగా ద్వేషించబడి హింసించబడును. అందరికంటే ఎక్కువగా దాని వ్యవస్థాపకుడు ద్వేషింపబడును. మరియు ఆ ద్వేషము సాధారణముగా మునుపటి తరములో దేవుడు లేవనెత్తిన గుంపు నుండే ఎక్కువ తీవ్రముగా నుండును. ఎందుకనగా ఆ గుంపు యొక్క ప్రస్తుత నాయకులు, ప్రభువు వారిని విడిచిపెట్టెనని గ్రహించక ఈ క్రొత్త గుంపును బట్టి అసూయపడుదురు. ఈ క్రొత్త గుంపుకు వ్యతిరేకమైన దాడిలో సాతాను కూడా చేరును-మరియు అతడు తన నిందారోపణను ఎక్కువగా ఇతర ''విశ్వాసుల'' ద్వారా చేయును-ప్రత్యేకించి ఆ పాత గుంపు వారి ద్వారా చేయును.

అయితే ఆ హింసంతయు, మనుష్యుల మరియు దయ్యముల తంత్రములన్నియు ఈ క్రొత్త తరములో ఆయన లేవనెత్తిన వ్యక్తి ద్వారా ఆయన నామము నిమిత్తము ఒక స్వచ్ఛమైన సాక్ష్యమును నెలకొల్పకుండా దేవున్ని ఆపలేవు. కాని ఈ వ్యక్తి చనిపోయిన తరువాత ఏమి జరుగును? అప్పుడు ఆ ఉద్యమము క్షీణించుట మొదలగును. క్రీస్తు యెడల వ్యక్తిగత అంకితభావము మాయమయ్యి ఆ వ్యవస్థాపకుడు బోధించిన సిద్ధాంతముల చేత అది భర్తీచేయబడును. రెండవ తరముకు ప్రభువు కంటే ఆ సిద్ధాంతములు ఎక్కువ ప్రాముఖ్యమగును. మరియు రూపాంతరపు కొండమీద ప్రభువుకు మరియు శిష్యులకు మధ్య వచ్చినట్లు వారికి మరియు దేవునికి మధ్య ఒక మేఘము అడ్డువచ్చును (మత్తయి 17:5).

ఏ సిద్ధాంతము, అది ఎంత మంచిదైనను ముఖ్యమైనదైనను యేసు యెడల మనకున్న అంకితభావము యొక్క స్థానమును ఎన్నడు తీసుకొనకూడదు. ఆ వ్యవస్థాపకుడు ప్రభువును యెరిగియుండెను. రెండవ తరము వారు కేవలము సిద్ధాంతమును యెరిగియుందురు. ఈ ఉద్యమము మూడవ తరమునకు చేరే సరికి గందరగోళము నెలకొనును మరియు బయటకే వేర్పాటు, కలహములు కనబడును.

ప్రతి ఉద్యమానికి జరిగే ఒక అతి సాధారణమైన విషయమేమిటంటే, అది రెండవ మూడవ తరము చేరేసరికి అది ధనము సంపాదించును, దాని సభ్యులు ఎంతో డబ్బును, ఇళ్లను, భూములను, ఆస్తులను కలిగియుందురు. ఆ ధనముతో పాటు తప్పకుండా గర్వము, (స్వయం సమృద్ధి), నిశ్చలత కూడా వచ్చును-ఎందుకనగా ధనము ఎలా ఉపయోగించాలో చాలా కొద్ది మంది విశ్వాసులకే తెలియును.

ఒక ఉద్యమము యొక్క మొదటి తరము సాధారణముగా పేదరికముతో ఇబ్బంది పడి దేవునికి సమీపముగా నుండును. రెండు మూడు తరములు వారికున్న ధనమంతటితో సాధారణముగా లోకమునకు సమీపముగా నుండును-అలా వారు ఆత్మీయముగా పోగొట్టుకొనెదరు. అప్పుడు దేవుడు, అప్పటికి బబులోనులో ఒక భాగమైపోయిన ఆ గుంపును విడిచిపెట్టును-ఆయన మరియొక వ్యక్తిని లేవనెత్తి అతని ద్వారా పూర్తిగా క్రొత్తదైన ఒక పనిని ఆరంభించును. అయ్యో, అదే కథ మరలా పునరావృతమగును-ఎందుకనగా వారి ముందు వెళ్లిన వారి పొరపాట్లనుండి ఎవరు నేర్చుకొనరు అన్నట్లుగా అనిపిస్తున్నది. కాబట్టి జ్ఞానము గలవారు ప్రస్తుతము అనగా వారి తరములో దేవుని అభిషేకము ఎవరి మీద నిలిచియున్నదోనని తెలుసు కొనుటకు తమ చుట్టూ చూచి, అటువంటి సంఘముతో పూర్తి అనుబంధన కలిగియుందురు. మునుపటి తరాలలో అభిషేకము ఎక్కడ నిలిచియుండెనో అన్నదానిని వారు లెక్కచేయరు. దేవుడు ఇప్పుడు ఎక్కడ కార్యము చేయుచున్నాడో అని వారు చూచెదరు కాని ఒకటి రెండు తరాల ముందు ఎక్కడ కార్యము చేసెనో అని చూడరు.

కేవలము పైకి భక్తిగలవారికి మనము దూరముగా నుండి (2తిమోతి 3:5), ''పవిత్రహృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో'' మనము సహవాసమును కోరుకోవలెనని లేఖనములు మనకు చాలా స్పష్టముగా చెప్పుచున్నవి (2తిమోతి 2:22). పవిత్ర హృదయులు అనగా ప్రభువును తమ హృదయాలంతటితో ప్రేమించువారు. అటువంటి విశ్వాసులకు తమ హృదయములో డబ్బు కొరకు, ఆస్తి కొరకు, ఈ లోకములో ఇక దేనికొరకు, స్థానము కలిగియుండరు. వారు ప్రభువును అమితముగా ప్రేమించుట వలన వారి కుటుంబ సభ్యులను వారు స్వంతగా ప్రేమించగలిగిన దాని కంటే ఎక్కువగా ప్రేమించగలరు. వారు ఎటువంటి సిద్ధాంతమునకు కాక ప్రభువు యెడల అంకితభావము కలిగియుందురు. అటువంటి విశ్వాసులతో అన్ని సమయములలోను మనము సహవాసమును కోరుకోవలెనని చెప్పబడితిమి. ఈ విధముగా దేవుని పని ఒక తరమునుండి మరియొక తరము వరకు తప్పిపోకుండా ముందుకు సాగును-ఎందుకనగా సాతాను మరియు మనుష్యుల తంత్రములన్నియు దేవుని ఉద్దేశ్యములలో దేనిని ఆటంకపరచలేవు. హల్లెలూయా!

అధ్యాయము 5
ఒక ఆత్మసంబంధమైన మనిషి యొక్క మూడు గుర్తులు

''ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని'' (1కొరిందీ¸ 3:1). కొరింథులోనున్న క్రైస్తవులు మూడు విషయాలలో రాణించిరని మనము 1కొరిందీ¸ 1:5-7లో చదివెదము. అవి లేఖనముల యొక్క జ్ఞానము, ఉపదేశము మరియు కృపావరములు. ఇవన్నియు వారికున్నప్పటికీ వారు ఆత్మసంబంధులు కాలేదు. వరములు కలిగి అనర్గళముగా మాట్లాడగలిగిన ఒక బోధకుడు విశాలమైన బైబిలు జ్ఞానమును కలిగియుండియు దానితోపాటు అద్భుతమైన కృపావరములను కూడా కలిగియుండియు ఒక ఆత్మసంబంధుడైన వాడు కాకపోవచ్చని గుర్తించే వివేచన కలిగిన విశ్వాసులను కనుగొనుట నిజముగా అరుదైన విషయము. అతడు పూర్తిగా శరీరసంబంధుడైయుండ వచ్చును. దురదృష్టవశాత్తు ఒక మనిషి కూడికలను చురుకైన విధముగా నిర్వహించగలిగితే, తన అనేకమైన హాస్యోక్తులతో ప్రజలను నవ్వించగలిగితే, అనర్గళముగా బోధించగలిగితే అతడు ఆత్మీయుడని అనేకమంది విశ్వాసులు తలంచే రోజులలో మనము జీవించుచున్నాము. అబద్ధ ప్రవక్తలు తమ ప్రవర్తనలో ఆత్మీయ ఫలములు లేకపోవుటను బట్టి గుర్తింపబడుదురని యేసు స్పష్టముగా బోధించినప్పటికీ, ఈ రోజులలో బోధకులు దురదృష్టవశాత్తు వారి జీవితాలలో క్రీస్తు పోలిక వలనవచ్చు ఫలమును బట్టి కాక వారికున్న వరములను బట్టి గౌరవింపబడుచున్నారు (మత్తయి 7:15-20).

తీర్పు దినమున అనేకమంది ఆయన యెదుటకు వచ్చి ఆయన నామమున ప్రవచించితిమనియు, అద్భుతములు చేసితిమనియు చెప్పుదురని కూడా యేసు చెప్పెను. కాని ఆయన వారిని ఎన్నడు ఎరుగనని ఆయన వారికి సమాధానమిచ్చును (మత్తయి 7:22,23). వారు యేసును ''ప్రభువా'' అని పిలిచిరి మరియు మానవాతీత శక్తులు కలిగియుండిరి. కాని వారి జీవితాలలో పాపముండెను. ఎంతో ''క్రైస్తవ'' కార్యచరణ మరియు మానవాతీతమైన వరములు సహితము ఒక మనిషిని ఆత్మ సంబంధునిగా చేయలేవని ఇది మనకు స్పష్టముగా చూపించుచున్నది. నిజానికి, అవి ఆ వ్యక్తి తిరిగి జన్మించాడనుటకు కూడా అవి గుర్తుకాదు ఎందుకనగా ప్రభువు ఆ ప్రజలతో వారిని తాను ఎన్నడును ఎరుగలేదని చెప్పెను.

ఒక వ్యక్తిని ఆత్మ సంబంధునిగా చేయునది ఏమిటని మనము అర్థము చేసుకొనుటకు, సాతాను కలిగియున్న సామర్థ్యముల పట్టికను మనము మొదట చేయవచ్చును. నిజమైన ఆత్మానుసారతకు గుర్తులు కానటువంటి వాటిని అది మనకు స్పష్టముగా కనుపరచును. ఉదాహరణకు కార్యచరణను పరిగణించండి: సాతాను పగలు రాత్రి చురుకుగానుండే ఒక పూర్తికాల సేవకుడు (ప్రకటన 12:9,10). అతడు ఎప్పుడు సెలవు పెట్టడు. అతడు నేరారోపణ చేయుటకు ప్రజల కొరకు ఎప్పుడు వెదకుచున్నాడు. అతనికి అనేకమంది సహాయకులు కూడా ఉన్నారు. అతడు యేసుకు సహితము లేఖనములను వల్లించెను. గనుక అతడు అపారమైన బైబిలు జ్ఞానమును కలిగియున్నాడు. అతడు మానవాతీతమైన వరములను, ఆసక్తిని, అనేకమంది సహపనివారిని, గొప్ప అనుచర బృందమును అనేకమంది ప్రజలమీద అధికారమును కలిగియున్నాడు. కాని అతడు ఆత్మసంబంధుడు కాదు.

ఒక వ్యక్తిని నిజముగా ఆత్మసంబంధునిగా చేయునది ఈ మూడు వ్యాఖ్యలలో చెప్పవచ్చును: ఒక ఉన్నతమైన దృష్టి, ఒక అంతరంగ దృష్టి, ఒక బాహ్య దృష్టి. ఒక ఆత్మసంబంధుడు ఈ మూడు దిశలలో ఎల్లప్పుడు చూచును.

1. ఉన్నతమైన దృష్టి-దేవుని యెడల క్రీస్తు యెడల ఆరాధనతోను అంకితభావముతోను చూచును.

2. అంతరంగ దృష్టి-తాను క్రీస్తు పోలికతో లేకపోవుటను అంగీకరించి మారుమనస్సు పొందుటకు చూచును.

3. బాహ్య దృష్టి-ఇతర ప్రజలకు సహాయపడుటకు, వారికి దీవెనకరముగా ఉండుటకు చూచును.

ఒక ఆత్మసంబంధుడు పైకి చూచును

దేవుడు మనలను మొట్టమొదటిగా ఆయనను ఆరాధించు వారిగా ఉండుటకు, ఆయన కొరకు ఆకలి దప్పులు గలవారిగా ఉండుటకు పిలిచెను. ఒక ఆత్మ సంబంధి దేవుని ఆరాధించును. అతని ఏకైక కోరిక దేవుడే. దేవుని కంటే అతనికి డబ్బు విలువైనది కాదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, ఒక ఆత్మసంబంధుడు దేవుని కొరకు ఆశపడును. ఒక దప్పిక గలవాడు నీళ్లకొరకు ఆశపడుదాని కంటే ఎక్కువగా అతడు దేవుని కొరకు ఆశపడును. ఒక ఆత్మసంబంధుడు సుఖ సౌకర్యముల కొరకు ఆశపడుదాని కంటే దేవునితో సహవాసము కొరకు ఆశపడును. ప్రతిదినము దేవుని మాటలు వినుటకు అతడు ఆశపడును.

డబ్బును మరియు తమ సుఖసౌకర్యములను ఆరాధించువారు ఫిర్యాదు చేయుటకు ఏదొక దానిని కనుగొనెదరు. కాని ఒక ఆత్మసంబంధుడు తన జీవిత పరిస్థితులను బట్టి ఎప్పుడు నిరుత్సాహపడడు ఎందుకనగా ఆ పరిస్థితులన్నిటిలోను అతడు దేవుని యొక్క బలీయమైన హస్తమును చూచును మరియు ఆ హస్తము క్రింద సంతోషముతో అన్ని సమయములలోను తన్నుతాను తగ్గించుకొనును. ఒక ఆత్మసంబంధుడు దేవునితో సంబంధము కలిగియున్నందున, తన జీవితమును నియంత్రించుటకు అతనికి ఏ విధమైన నియమ నిబంధనలు అక్కరలేదు. అతడు జీవ వృక్షమును (స్వయముగా దేవునినే) కనుగొనెను గనుక అతనికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములో ఆసక్తి లేదు. అతడు క్రీస్తు యెడల సరళమైన పవిత్రమైన అంకితభావమును కలిగియున్నందున అతడు ప్రధానముకాని విషయాలచేత ప్రక్కదారి పట్టడు. యేసువైపు చూచుచూ ఈ ఆత్మసంబంధుడు సంవత్సరము వెంబడి సంవత్సరము తన ప్రభువువలే ఎక్కువగా మారుచుండును. ఒక ఆత్మసంబంధుడు ఎల్లప్పుడు తన్నుతాను తగ్గించుకొనును కాబట్టి దేవుడు అతనిని ఎల్లప్పుడు హెచ్చించును. అతడు దేవునితో మరింత దగ్గర సంబంధము కలిగియుండుటకు ఇంకా ఇంకా హెచ్చింపబడును. ఒక పరలోకపు జీవితము యొక్క వాస్తవికతను చూచిన ఇటువంటి వ్యక్తి తన మంచి క్రియలను మనుష్యుని దృష్టికి మరుగైయుండునట్లు చేయును.

ఒక ఆత్మసంబంధుడు అంతరంగములోనికి చూచును

ఉన్నతమైన దృష్టి అంతరంగ దృష్టిలోనికి నడిపించును. యెషయా ప్రభువు మహిమను చూచిన వెంటనే, తన స్వంత పాప స్వభావమును గ్రహించెను (యెషయా 6:1-5). యోబు, పేతురు, యోహాను విషయములో కూడా ఈ విధముగానే జరిగెను (యోబు 42:5,6; లూకా 5:8; ప్రకటన 1:17). మనము దేవుని సన్నిధిలో నివసించినప్పుడు మన జీవితాలలో అనేక క్రీస్తుని పోలని విషయములను గుర్తించెదము. కాబట్టి ఒక ఆత్మసంబంధుడు ఎల్లప్పుడు తన జీవితములో మరుగైయున్న పాపముల పైన వెలుగును పొందును.

''పరిశుద్ధాలంకారము''తో (వస్త్రముతో)మనము ప్రభువును ఆరాధించవలెనని మనము ఆజ్ఞాపించబడితిమి. పరిశుద్ద వస్త్రములు లేకుండా మనము ప్రభువు యెదుట దిగంబరులుగా ఉండుదుము. కాబట్టి ఒక ఆత్మసంబంధుడు దేవుని యెదుటను మనుష్యుల యెదుటను తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకొనుటకు ''తన శాయశక్తులా ప్రయత్నించును'' (అపొ.కా.24:16). ఏ విధముగానైతే ఒక వ్యాపారవేత్త ఎక్కువ డబ్బు సంపాదించుటకు తన శాయశక్తులా ప్రయత్నించునో, ఏ విధముగానైతే ఒక పరిశోధన చేయు శాస్త్రజ్ఞుడు క్రొత్త పరిశోధనలు చేయుటకు తన శాయశక్తులా ప్రయత్నించునో, ఒక ఆత్మసంబంధుడు కూడా తన మనస్సాక్షిని అన్ని వేళలా నిర్దోషమైనదిగా ఉంచుకొనుటకు తన శాయశక్తులా ప్రయత్నించును.

ఒక ఆత్మసంబంధుడు తన్నుతాను ఎల్లప్పుడు విమర్శించుకొనును. ఎందుకనగా ఇతర విశ్వాసులు తమ జీవితాలలో కలత చెందని అనేక విషయాలను అతడు తన జీవితములో పరిశుద్ధపరచు కోవలసినవిగా కనుగొనును. దేవుని కొరకు ప్రభావవంతముగా నుండకుండా అతనిని అడ్డుకొనే అనేకమైన వాటికి అతడు తన అంతరంగములో అనుదినము చనిపోవలెనని ఒక ఆత్మసంబంధుడు గ్రహించును. కాబట్టి అతని జీవన విధానము సిలువనెత్తికొని ''తన శరీరములో యేసు యొక్క మరణానుభవమును వహించుకొనిపోవు వానిగా'' మారును (2కొరిందీ¸ 4:10).

ఒక ఆత్మసంబంధుడు ఎవరి యెదుటైనను తన్నుతాను తగ్గించుకొనుటకుగాని లేక ఎవరినైనను క్షమాపణ కోరుటకుగాని ఇబ్బంది పడడు. ఆ యెదుటి వ్యక్తి తనకంటే పెద్దవాడైయుండవచ్చును లేక చిన్నవాడైయుండవచ్చును. అతడు మరియొకనికి ఏ విధముగానైనను హాని చేసిన యెడల, అది భార్య కావచ్చును, సహోదరుడు కావచ్చును లేక పొరుగువాడు కావచ్చును, అతని ప్రార్థనలుకాని లేక పరిచర్యకాని దేవుని చేత అంగీకరింపబడదని అతడు గ్రహించును. కాబట్టి, అతడు ఎవరినైనను హాని చేసెనని గ్రహించిన వెంటనే, ''బలిపీఠము యెదుట తన అర్పణము విడిచిపెట్టి, ఆ వ్యక్తితో మొదట సమాధానపడి, అటుతరువాత వచ్చి అతని అర్పణను అర్పించును'' (మత్తయి 5:23,24).

ఒక ఆత్మసంబంధుడు బయటకు చూచును

ఉన్నతమైన దృష్టి మరియు అంతరంగ దృష్టి ఆ వ్యక్తిని బాహ్య దృష్టికి నడిపించును. ఇతరులకు దీవెనకరముగా నుండుటకే దేవుడు అతనిని దీవించెనని ఒక ఆత్మసంబంధుడు గ్రహించును. దేవుడతనిని ఎంతగానో క్షమించినందున అతడు తనకు హాని చేసిన వారినందరినీ ఆనందముగా వెంటనే క్షమించును. దేవుడు అతని యెడల ఎంతో మంచిగా ఉన్నందున అతడు కూడా ఇతరులకు మంచి చేయును. అతడు దేవుని నుండి ఉచితముగా పొందినందున అతడు కూడా ఇతరులకు ఉచితముగా ఇచ్చును. ఒక ఆత్మసంబంధుడు ఇతరుల శ్రేయస్సు కొరకు యధార్థముగా శ్రద్ధ వహించును. తప్పిపోయిన శ్రమలు పడే మానవాళి కొరకు అతడు కనికరముతో నింపబడియుండును. మరియు మంచి సమరయుని ఉపమానములో లేవీయుడు మరియు యాజకుడు చేసినట్టు ఎటువంటి అవసరతలోనున్న సహోదరునైనను నిర్లక్ష్యము చేయలేడు (లూకా 10:30-37). దేవుడు పతనమైపొయిన మానవుని కొరకు చింతించుచున్నాడు దేవుడు అతనికి సహాయము చేయాలని, అతనిని దీవించాలని, అతనిని లేవనెత్తాలని, సాతాను బంధకములోనుండి విడిపించుటకు చూచుచున్నాడు. ఒక ఆత్మసంబంధుడు అటువంటి చింతనే కలిగియుండును.

తన యజమాని వలే, ఒక ఆత్మసంబంధుడు సేవ చేయించుకొనుటకు కాక సేవచేయుటకు ఇష్టపడును. యేసు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించుచు సంచరించుచుండెను (అపొ.కా. 10:38). ఒక ఆత్మసంబంధుడు అదే చేయును. ఒక ఆత్మసంబంధుడు ఇతరుల కొరకు అతడు చేయు పరిచర్య ద్వారా డబ్బును గాని ఘనతను గాని పొందుటకు ఆశించడు. దేవుని వలెనే అతడు కేవలము ఇతరులను తన జీవితము ద్వారా మరియు ప్రయాసల ద్వారా దీవించుటకు చూచును. అతడు ఎవరి నుండియు కానుకలు ఎదురుచూడడు-ఎందుకనగా తన ప్రతి అవసరత కొరకు అతడు దేవునిని మాత్రమే విశ్వసించును.

రెండవ శతాబ్దములో ''పండ్రెండుమంది అపొస్తలులు యొక్క బోధ'' అను శీర్షికతో మన యొద్దకు వచ్చిన ఒక పుస్తకము, ఆది అపొస్తలుల వారి కాలములో నున్న విశ్వాసులందరికీ తమను డబ్బు అడిగే ప్రతి బోధకుని విషయములో జాగ్రత్తగా ఉండమని, ఎందుకనగా అటువంటి వ్యక్తి ఎప్పుడు ఒక అబద్ధ ప్రవక్తయేనని బోధించిరని మనకు చెప్పుచున్నది. మనము దీనిని అర్థము చేసుకోగలిగితే, ఈనాడు మనము అనేకమంది అబద్ధ ప్రవక్తలనుండి రక్షింపబడగలము.

ఒక ఆత్మసంబంధుడు పైకి(పైనున్నవాటిని), అంతరంగములోకి, బయటకి(బాహ్యమైనవాటిని) చూచును. అతడు పైకి మాత్రమే చూచిన యెడల అతడు వాస్తవికతను ఎంచనివాడుగా ఉండును-''ఎంత పరలోకసంబంధమైన మనస్సుగలవాడంటే అతడు భూసంబంధమైన విషయాలలో పనికిరాడు''. అతడు అంతరంగములోనికి మాత్రమే చూచిన యెడల, అతడు అధిక సమయము నిరాశపడి నిరుత్సాహముతో ఉండును. అతడు బయటకు మాత్రమే చూచిన యెడల, అతడి పరిచర్య లోతులేనిదిగా ఉండును. కాని ఒక ఆత్మసంబంధుడు మూడు దిశలలో నిరంతరము చూచును. మనము సమతుల్యత గలవారిగాను ఆత్మసంబంధులుగాను ఉండుటకు దేవుడు మనకు సహాయపడును గాక!

అధ్యాయము 6
యేసు అత్యధికముగా ద్వేషించిన అయిదు పాపములు

మనము ఆత్మానుసారముగా ఎదుగునప్పుడు, దేవుని నీతి ప్రధానముగా బాహ్యమైనది కాదని, పాపము కూడా ప్రధానముగా బాహ్యమైనది కాదని మనము కనుగొనెదము. మనము నీతిగురించి మాట్లాడినప్పుడు, ఎక్కువమంది పది ఆజ్ఞలలో పేర్కొనబడిన ప్రమాణమును గూర్చి తలంచుదురు. కాని క్రొత్త నిబంధనలో నీతి, వ్రాయబడియున్న నియమమును బట్టి కాక యేసుయొక్క జీవితమును బట్టి కొలవబడును. యేసు ఎక్కువగా ఏ పాపములకు వ్యతిరేకముగా మాట్లాడెనోనని మనము పరిశీలించినప్పుడు, ఆయన అత్యధికముగా ద్వేషించిన పాపములను మనము కనుగొనెదము. మనము అటువంటి అయిదు పాపములను పరిశీలించినప్పుడు, వాటిలో ఏవియు పది ఆజ్ఞలలో పేర్కొనబడలేదని మనము చూచెదము.

1. వేషదారణ

వేషదారిగా యుండుట అంటే మనము ఉన్నదానికంటే ఎక్కువ పరిశుద్ధుల మన్న అభిప్రాయమును ఇతరులకు కలుగజేయుట. అది అబద్ధముగా నుండుటకు లేక అబద్ధము చెప్పుటతో సమానము. మత్తయి 23:13-29లో యేసు వేషదారులను ఏడు మారులు శపించెను. మన నోళ్లు తెరువకుండా కూడా అబద్ధమాడుట సాధ్యమే. అననీయ యేసు యొక్క పూర్ణహృదయుడైన శిష్యునిగా నటించినప్పుడు ఒక్క మాట కూడా చెప్పకుండా పరిశుద్ధాత్మతో అబద్ధమాడెను (అపొ.కా. 5:1-5). వారి అంతరంగ జీవితము ''అజితేంద్రియత్వముతో నిండియున్నది'' అని యేసు పరిసయ్యులతో చెప్పెను (మత్తయి 23:25)-దాని అర్థము తమనుతాము సంతోషపెట్టుకొనుటకే వారు జీవించిరి. కాని వారు లేఖనములను బాగా ఎరిగియున్నందున, వారు ఉపవాసముంచి ప్రార్థించి వారి రాబడిలో దశమభాగమును ఇచ్చినందున, వారు పరిశుద్ధలన్న అభిప్రాయమును ఇతరలకు కలుగజేసిరి. వారు బయటకు ఎంతో భక్తిగలవారిగా కనిపించిరి. ఈనాడు అనేకమంది వలే వారు బహిరంగముగా సుదీర్ఘమైన ప్రార్థనలు చేసిరి, కాని రహస్యముగా ప్రార్థనలు చేయలేదు.

అన్ని సమయాలలో మన హృదయాలలో స్తుతితోకూడిన ఆత్మను కలిగియుండకుండా ఆదివారము ఉదయమున మాత్రము మనము దేవున్ని స్తుతించిన యెడల అది వేషదారణగా నుండును. దేవుడు మన హృదయాలను లక్ష్యపెట్టును. బుద్ధిగల కన్యకలు వారి పాత్రలలో మరుగైన నూనె నిల్వలను కలిగియుండిరి. అయితే బుద్ధిలేని కన్యకలు బయటకు తమ దీపములను వెలిగించుటకును మనుష్యుల యెదుట మంచి సాక్ష్యము కలిగియుండుటకు సరిపడా నూనెను మాత్రమే కలిగియుండిరి (మత్తయి 25:1-4). ఒక క్రైస్తవ నాయకుడు అకస్మాత్తుగా వ్యభిచారములోకి పడపోయాడని మనము వినినప్పుడు, అది ఒక ఆకస్మిక పతనము కాదు గాని తన అంతరంగ జీవితములో ఎంతో కాలముగా అపనమ్మకముగా ఉండుట యొక్క ఫలితమని మనము గ్రహించవలెను. అతడు ఎంతో కాలముగా వేషదారిగా యుండెను.

2. ఆత్మీయ గర్వము

పరిశుద్ధత కొరకు ప్రయాసపడువారిలో కనబడు అత్యంత సామాన్యమైన పాపము ఆత్మీయ గర్వము. తన ప్రార్థనలో సహితము ఇతరులను తక్కువగా చూచిన స్వనీతిపరుడైన పరిసయ్యుని ఉపమానము మనందరికి తెలుసు (లూకా 18:9-14). విశ్వాసులు బహిరంగముగా చేయు ప్రార్థనలలో 90 శాతము వినువారిని ఆకట్టుకొనుటకే గాని దేవునికి ప్రార్థనలు కాకపోవుటకు అవకాశమున్నది. ఈ ఉపమానములో పరిసయ్యుడు తన బాహ్య జీవితములో ఇతర పాపులవలే చెడ్డవాడు కాకపోవచ్చును. కాని తన ఆత్మీయ కార్యచరణను తలంచుకొని ఇతరులను తృణీకరించునట్లు చేసిన అతని గర్వాన్ని యేసు ద్వేషించును. ఇతర విశ్వాసులను నిరంతరము తీర్పు తీర్చునట్లు చేయునది ఆత్మీయ గర్వమే.

అయితే ఆ సుంకరి తన్నుతాను ఇతరులకంటే ఘోరమైన పాపిగా చూచుకొని దేవునిచేత అంగీకరింపబడెను. దేవునితో ముఖాముఖిగా ఉన్నవారందరు తమ్మునుతాము ఏదో ఒక సమయములో పాపులలో ప్రధానునిగా చూచుకొనియుందురు.

పరలోకములో అతిగొప్ప వ్యక్తి అత్యంత దీనుడైనవాడని యేసు బోధించెను (మత్తయి 18:4). పరలోకములో కనబడు అతిగొప్ప సద్గుణము దీనత్వము. పరలోకములో కిరీటములు పొందువారందరు వెంటనే వాటిని ప్రభువు యెదుట పడవేసి ఆయన ప్రతి కిరీటమునకు అర్హుడని అంగీకరించుటను మనము ప్రకటన గ్రంధములో చదివెదము (ప్రకటన 4:10,11). మనకు ఆజ్ఞాపింపబడియున్నవన్నియు చేసినప్పటికీ మనము చేయవలసిన దానికంటే ఎక్కువ చేయని నిష్‌ప్రయోజకులమైన దాసులమని యేసు చెప్పెను (లూకా 19:10). అయితే తరచు పడిపోయే మన పరిస్థితిని గూర్చి మనము ఏమి చెప్పగలము.

3. అపవిత్రత

అపవిత్రత మన హృదయాలలోకి ప్రధానముగా మన కళ్లద్వారా మన చెవుల ద్వారా ప్రవేశించును. ఆ తరువాత ఈ అపవిత్రత మన హృదయాలనుండి బయటకు వచ్చి మన శరీరము యొక్క వివిధ అవయవముల ద్వారా వ్యక్తపరచబడును-అవి ప్రధానముగా మన నాలుకలు మరియు మన కళ్లు. కాబట్టి పవిత్రముగా నుండగోరు వాడు తను చూచువాటిని గురించి వినువాటిని గురించి ప్రత్యేక జాగ్రత్త వహించవలెను. యేసు అపవిత్రతను ఎంతగా ద్వేషించెనంటే, వాటితో పాపము చేయుటకంటే తమ కుడికన్నును పెరికివేయుటకును, కుడిచేతిని నరికివేయుటకును సిద్ధముగా నుండవలెనని యేసు తన శిష్యులతో చెప్పెను (మత్తయి 5:27-29). కుడి చేతి విచ్ఛేదనమును లేక కంటిని శస్త్రచికిత్స ద్వారా తీసివేయుటను వైద్యులు ఎప్పుడు సిఫార్సు చేయుదురు? పరిస్థితి ఎంత తీవ్రముగా ఉన్నదంటే ఈ అవయవములను తీసివేయకుంటే శరీరమంతయు చనిపోవును అని వారికి అనిపించినప్పుడు సిఫార్సు చేయుదురు. అలాగే పాపము విషయములో కూడా మనము అర్థము చేసుకోవలసినది ఇదే. పాపము ఎంత తీవ్రమైనదంటే అది మన జీవితానికే ముప్పు తెచ్చును. ఎక్కువమంది విశ్వాసులు దీనిని గ్రహించకపోవుట చేత వారి నాలుకలను, కళ్లను వారు వాడు విధానములో వారు జాగ్రత్త వహించరు. మన కళ్లతోను, నాలుకలతోను పాపముచేయుటకు మనము శోధింపబడినప్పుడు మనము గ్రుడ్డివారుగా మూగవారిగా ఉండవలెను. ఇదే యేసు మాటల యొక్క అంతర్భావము.

4. మానవ అవసరత పట్ల ఉదాసీనత (అశ్రద్ధ)

అది సబ్బాతు దినము గనుక సమాజమందిరము యొక్క నాయకులు ఆయనను ఒక వ్యక్తిని స్వస్థపరచనీయక పోవుట వలన యేసు కోపపడెను. ''మానవ అవసరత పట్ల వారి ఉదాసీనతను బట్టి ఆయన ఎంతో కలత చెందెను'' (మార్కు 3:5 లివింగు బైబిలు). మనుష్యులందరికిని, ప్రత్యేకముగా దేవుని పిల్లలకు మనము మంచి చేయవలెనని ఆజ్ఞాపింపబడితిమి (గలతీ 6:10). జీవించుటకు అవసరమైన ప్రాథమిక విషయాలలో తమ సహోదరులకు సహాయపడుటకు ఏమియు చేయనివారు అంత్యదినమున తన సముఖమునుండి వెళ్లగొట్టబడుదురని యేసు బోధించెను (మత్తయి 25:41-46). వ్యాధి గ్రస్తులైన విశ్వాసులను స్వస్థపరచుటకు మనము స్వస్థతవరమును కలిగియుండకపోవచ్చు. కాని మనము నిశ్చయముగా వ్యాధిగ్రస్తులను దర్శించి వారిని ప్రోత్సహించవచ్చును. ప్రభువు మనలను అడిగేది అదే. ధనికుడు తన తోటి యూదుడును, అబ్రాహాము కుమారుడును తన సహోదరుడైన లాజరును పట్టించుకోనందున నరకమునకు వెళ్లెను. మంచి సమరయుని ఉపమానములో యాజకుడు లేవీయుడు రోడ్డు మీద గాయపడి పడియున్న తమ తోటి సహోదరుడగు యూదునిపైన కనికరపడనందున యేసుచేత వేషదారులుగా బయటపెట్టబడిరి. అవసరతలో ఉన్న తమ సహోదరులను చూచి వారికి సహాయము చేయుటకు కదిలింపబడని వారికి నిజముగా రక్షింపబడే విశ్వాసము లేదని బైబిలు చెప్పుచున్నది (యాకోబు 2:15-17). తాము తిరిగి జన్మించినామని వారు చెప్పుకొన్నప్పుడు తమ్మునుతామే మోసపరచుకొను చున్నారు. వారు తిరిగి జన్మించలేదు. అవసరతలో నున్న తమ సహోదరులకు సహాయపడనివారు దేవుని ప్రేమను తమ హృదయాలలో కలిగియుండే అవకాశములేదు (1యోహాను 3:17). యేసు ఇటువంటి విషయాలను గూర్చి గట్టిగా మాట్లాడెను ఎందుకనగా అవసరతలోనున్న సహోదరులకు సహాయపడుటలో కాక మతానుసారమైన కార్యక్రమాలలో మాత్రమే ఆసక్తి కలిగిన అనేకమైన మతానుసారమైన ప్రజల వైఖరిని ఆయన ద్వేషించెను.

5. అవిశ్వాసము

మనము ఇప్పటికే పేర్కొన్న నాలుగు పాపాలను విశ్వాసులందరు పాపాలుగా గుర్తించుదురు. కాని అవిశ్వాసము విషయముకొచ్చేసరికి, దాదాపు విశ్వాసులందరు దానిని పాపముగా కాక ఒక బలహీనతగా తలంచుదురు. కాబట్టి వారు ఇతర పాపములను ద్వేషించినట్లు అవిశ్వాసమును ద్వేషించరు.

కాని బైబిలు విశ్వాసము లేని హృదయమును దుష్ఠహృదయమని పిలచుచున్నది (హెబ్రీ 3:12). యేసు తన శిష్యుల అవిశ్వాసమును బట్టి వారిని ఏడు మారులు గద్దించెను (మత్తయి 6:30; 8:26; 14:31; 16:8; 17:17-20; మార్కు 16:14; లూకా 24:25 చూడండి). ఆయన తన శిష్యులను దాదాపు మరి దేనివిషయములో ఇన్నిసార్లు గద్దింపలేదని అనిపించుచున్నది. అవిశ్వాసము దేవునికి అవమానకరము, ఎందుకనగా భూమి మీదనున్నను చెడ్డ తండ్రులు వారి పిల్లలను పట్టించుకొని ఇచ్చినంతగా కూడా, దేవుడు తన పిల్లలను పట్టించుకొని వారికి కావలసినవి ఇవ్వడని అది సూచిస్తున్నది. దేవుని యొద్దనుండి కావలసినవి పొందుటకొరకు ఈనాడు ఒక నకిలీ విశ్వాసము ప్రకటింపబడుచున్నది. కాని యేసు ప్రకటించిన విశ్వాసము అది కాదు. మన అనుదిన జీవితములో మనము విశ్వాసము మూలముగా జీవించవలెని ఆయన ఆశించెను. పరలోకమందు ప్రేమగల తండ్రి యందును ఆయన తన వాక్యములో మనకిచ్చిన వాగ్దానములయందును విశ్వాసముంచుట ద్వారానే నిరాశ, నిరుత్సాహము, చెడు మనోభావాల మీద విజయము వచ్చును.

యేసు ఆశ్చర్యపడుటను గూర్చి మనము రెండు మారులు చదివెదము: ఒకసారి ఆయన విశ్వాసమును చూచినప్పుడు, మరియొకసారి ఆయన అవిశ్వాసమును చూచినప్పుడు (మత్తయి 8:10; మార్కు 6:6). ప్రజలలో ఆయన విశ్వాసమును చూచినప్పుడెల్లా యేసు ఉత్సాహపడెను. పరలోకములో నున్న ప్రేమగల తండ్రిని విశ్వసించుటకు ప్రజలు ఇష్టపడనప్పుడు ఆయన నిరుత్సాహపడెను.

ఇప్పుడు మనకు తెలుసుగనుక

యేసు వేటిని ఎక్కువగా ద్వేషించెనో మనము గ్రహించాము గనుక ఈ అయిదు పాపములను ద్వేషించుట మనగురి కూడా కావలెను. ఈ పాపములను మన జీవితాలలో కనుగొన్నప్పుడు, మనము వాటిని కనికరము లేకుండా సిలువ వేయవలెను.

అనేకమంది బోధకులు కేవలము తమ ప్రసంగాలకొరకు అంశాలను పొందుటకు మా పుస్తకములను క్రమం తప్పకుండా చదువుతారు. అటువంటి వారినందరినీ హెచ్చరించుచున్నాను. ఒక ప్రసంగము కొరకు అయిదు అంశాలను పొందుటకు ఈ వ్యాసమును వాడమని సాతాను మిమ్మును శోధించును! గాని మీరు మొట్టమొదటిగా చేయవలసినది ఈ పాపములను మీ జీవితములలో పూర్తిగా ద్వేషించుట. అప్పుడు మీరు దేవుని వాక్యమును అధికారముతో ప్రకటింపగలరు. లేనియెడల లోకములో అనేక ఇతర బోధకులవలే మీరు కూడా పరిసయ్యులుగా మారుదురు.

అధ్యాయము 7
ప్రతి సంఘమునకు ఒక ద్వారపాలకుడు ఉండవలెను

''ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలముండును)'' (మత్తయి 24:14). ప్రభువు తన దాసులకు భూమిమీద తన ఇంటిలో (సంఘములో) అధికారమిచ్చి ప్రతివానికి ఒక పనిని నియమించెను. ప్రభువు ఆ ఇంటికి ఒక ద్వారపాలకుని కూడా నియమించి అతనిని మెళకువగా నుండుమని ప్రత్యేకముగా ఆజ్ఞాపించెను. ఈ ద్వారపాలకుడు నిశ్చయముగా స్థానిక సంఘపెద్దలలో ఒకడు. ప్రభువు తన మందను నడిపించుటకు ద్వారము తెరచుట, గొఱ్ఱెలను నాశనము చేయుటకు లేక ప్రక్కదారి పట్టించుటకు వచ్చే తోడేళ్లను జీతగాళ్లను సంఘములోనికి ప్రవేశించకుండా ఖచ్చితముగా నిర్ధారించుట అతని విధి (యోహాను 10:3). ఆత్మీయముగా దిగజారిపోయే వారిని హెచ్చరించుటకు అతడు సంఘములో ఉన్నవారందరి ఆత్మీయ స్థితిపైన దృష్టియుంచవలెను.

''నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము'' (సామెతలు 27:23) అని బైబిలు కాపరులందరిని ఆజ్ఞాపించుచున్నది. ద్వారపాలకుడు అన్ని సమయములయందు మెళకువగా నుండవలెను ఎందుకనగా సంఘమును పాడు చేయుటకును దాని సాక్ష్యమును నాశనము చేయుటకును సాతాను చేత పంపబడిన లోకానుసారులైన వారు తన సంఘములో చేరుటకు ప్రయత్నించవచ్చును. మొదటి శతాబ్దపు సంఘములోనికి కూడా ''రహస్యముగా జొరబడిన వారి''ని గూర్చి యూదా చెప్పెను (యూదా 4వ వచనము). కాబట్టి కొన్నిసార్లు ఆ ద్వారపాలకుని పని అటువంటి వారిని సంఘమునుండి వెలివేయవలసిన కష్టమైన పనిగా నున్నది. అటువంటి పని ఖచ్చితముగా ఎక్కువమంది పెద్దలు చేయుటకు ఇష్టపడే పని కాదు-ప్రత్యేకముగా వారు ప్రభువు నామము యొక్క ఘనతను గూర్చి ఆ సంఘసాక్ష్యము కంటే ఎక్కువగా తాను, సాత్వీకునిగా తనకున్న పేరును ప్రేమించినప్పుడు ఇలా ఉండును. కాబట్టి ఒక ద్వారపాలకునిగా యుండుటకు ప్రాథమిక అర్హత దేవుని నామ మహిమార్థమై కరిÄనముగా ఉండుటకు సిద్ధముగానుండుట మరియు ఒకరి స్వంత ఘనతను పేరును వెదకుటనుండి విడుదల పొందియుండుట. పౌలు తాను ఎఫెసును విడిచివెళ్లిన తరువాత ''మందని కనికరింపని ఒక ద్వారపాకునిగా ఉండే కష్టమైన పనిని చేయుటకు సిద్ధముగా నున్నవాడు, ఆ పెద్దలలో ఒకడు కూడా లేడని అతడు ఎరిగియుండెను''. వారందరును ''సాత్వికులైన సహోదరులు'' అన్న పేరును కోరుకొని ''వారిని అభినందించే శిష్యుల బృందమును'' పొందవలెననుకొనిరి.

ఆ కారణము చేత ఎఫెసులోనున్న సంఘము తరువాత తోడేళ్లచేత ఆక్రమింపబడెను. మరియు సాతాను దానిని ఎంతగా చెడగొట్టగలిగెనంటే ప్రభువు తన సన్నిధిని తన అభిషేకమును (దీపస్తంభమును) వారి మధ్యనుండి తీసివేయుటకు సిద్ధముగా నుండెను (ప్రకటన 2:5). ఈనాడు అనేక సంఘములు తోడేళ్ల చేత ఆక్రమింపబడుటకు కారణము కూడా ఇదియే. ''భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటే నా దేవుని మందిర ద్వారపాలకునిగా ఉండుటయే తన కిష్టము'' అని దావీదు చెప్పెను (కీర్తనలు 84:10). దేవుని మందిరములో ఉన్న స్థానములన్నిటిలో ద్వారపాలకుని స్థానము తక్కువ కోరదగినదని ఇది సూచిస్తున్నది. ఈనాడు బాధ్యతగల సహోదరులు ఈ పని కొరకు తమ్మునుతాము అప్పగించుకోవలెనని ప్రభువు కోరుచున్నాడు.

ఏలీ దేవుని ప్రత్యక్ష గుడారము యొక్క పవిత్రతను కాపాడుటకు బాధ్యత కలిగియుండిన ఇశ్రాయేలు యొక్క ప్రధాన యాజకుడు. కాని అతడు తన స్వంత కుమారులను తమ జారత్వము ద్వారా దేవుని మందిరమును అపవిత్రపరచుటకు వారిని అనుమతించెను మరియు అతడు వారిని బయటకు వెళ్లగొట్టలేదు. అతడు వారిని స్వల్పముగా మాత్రమే గద్దించెను, వారు పాపములో జీవించుట కొనసాగించిరి (1సమూయేలు 2:22-25). ఏలీ కాలములో, ''యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు'' గానుండెను (1సమూయేలు 3:1). ఈనాడు కూడా నూతన నిబంధనను ప్రకటించు అనేక సంఘాలలో పరిస్థితి ఆ విధముగానే నున్నది. దీనికి కారణము అనేక మంది పెద్దలు, ఏలీ వలె తమ పిల్లలను ఎంతగా ప్రేమింతురంటే వారిని సరిదిద్దరు. ఒక సంఘ పెద్ద పిల్లలు విశ్వాసులు కాని యెడల, పెద్దగా కొనసాగుటకు అతనికి అర్హతలేదు (తీతు 1:6).

తన స్వంత ఇంటికి ద్వారపాలకునిగా ఉండి తన పిల్లలను సరిగా పెంచలేనివాడు ఒక సంఘములో ద్వారపాలకునిగా ఉండే అవకాశములేదు (1తిమోతి 3:4,5 చూడండి). అటువంటి పెద్దలు దేవుని స్వరము వినుట యెరుగరు గాని తమ కుటుంబీకులను సమర్థించుకొనుటను మాత్రమే యెరుగుదురు. వారు ఏలీ వలే తమ సింహాసనములపై కొనసాగినప్పటికీ, వారు దేవుని అభిషేకమును పోగొట్టుకొనిరి. అటువంటి పెద్దలు వారి జీవితాల మీద ఆయన అభిషేకమును పోగొట్టుకొనిరని సంఘములో నున్న ప్రతి విశ్వాసికి దేవుడు స్పష్టము చేయవలెనని మనము ప్రార్థన చేయవలెను.

ఒక పెద్ద యొక్క పరిచర్య మందకోడిగా, విసుగుపుట్టించేదిగా, బరువుగా నిర్జీవముగా, ఇదివరకు తరచు చెప్పినవాటినే చెప్పే విధముగా నున్నప్పుడు, ఆ పెద్ద ఏలీ వలే మారెనని మీరు నిర్ధారించుకోవచ్చును. గతములో దేవుడు ఒకవేళ అతనితో ఉన్నప్పటికీ, ఇప్పుడు దేవుడు అతనితో లేడు. అతడు ఇప్పుడు ప్రభువు కంటెను ఆయన సంఘము కంటెను బహుశా ధనమును ఎక్కువ ప్రేమించుచున్నాడేమో. విశ్వాసులు వివేచన లేనివారుగా ఉండి, అటువంటి పెద్దలు దైవజనులని ఊహించుకోకూడదు. వారు దైవజనులు కాదు. ఈనాడు నూతన నిబంధన సంఘాలలో నున్న అనేకమంది పెద్దలు వారు ఆ సంఘము యొక్క ఆరంభము నుండి దానిలో ఉన్న కారణము చేతనే పెద్దలుగా నున్నారు. దేవుని యొద్దనుండి తమ జీవితాలమీద నిరంతరముగా నున్న అభిషేకమును బట్టికాక తమ పెద్దరికమును బట్టి వారు వారి సింహాసనముల మీద కూర్చుని యున్నారు. ఏలీ కుమారులు ''దేవుని ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి'' (1సమూయేలు 2:12). అయినప్పటికీ వారికి యెహోవా మందిరములో బాధ్యతతో కూడిన స్థానములు ఇవ్వబడెను. ''దేవుని ఎరుగని'' మనుష్యులు అనేక సంఘములలో బాధ్యతగల పదవులలో నున్నారు. ఈ విధముగా, ద్వారపాలకులు లేనందున, సాతాను అటువంటి సంఘాలలో తన ఉద్దేశ్యాలను నెరవేర్చును. అలా పాతాళలోక ద్వారములు అటువంటి సంఘమునకు వ్యతిరేకముగా నిలువగలవు.

కొరింథులో ఉన్న సంఘములో ఒక వ్యక్తి లైంగికపరమైన పాపము చేసెనని పౌలు వినినప్పుడు ఎంత కరిÄనముగా వ్యవహరించెను? అతడు కొరింథులో వ్యక్తిగతముగా లేనప్పటికీ, ఆ విషయమును క్లోయె అను సహోదరుని ద్వారా మాత్రమే వినినప్పుడు (1కొరిందీ¸ 1:11), ''నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతో కూడా ఉండినట్టుగానే యిట్టికార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదవరకే తీర్పు తీర్చియున్నాను, ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను'' (1కొరిందీ¸ 5:3-5) అని చెప్పెను. కొరింథులో నున్న సంఘమును కలుషితము కాకుండా కాపాడినది, అక్కడ ప్రభువు నామము అవమానపరచబడకుండా నిరోధించినది పౌలు యొక్క బలమైన వైఖరియే. అతని కరిÄనమైన చర్య చివరకు ఆ వ్యక్తి రక్షింపబడుటకు కారణమాయెను (2కొరిందీ¸ 2:5-8).

పౌలు లాంటి ద్వారపాలకులే ఒక సంఘము యొక్క పవిత్రతను కాపాడి దిగజారిపోయిన వారిని, వారి నిజ స్థితిని తెలుసుకొనునట్లు చేసి వారిని తిరిగి ప్రభువు నొద్దకు తీసుకురాగలరు. మరోప్రక్క తమ స్వంత పేరును ఘనతను కోరుకొనువారు ప్రభువు కొరకు దేనిని సాధించలేరు. దీనిని చదివిన కొందరు పెద్దలు ఇప్పుడు మానవసంబంధమైన ఆసక్తితో కదిలింపబడి భవిష్యత్తులో వారి సంఘములనుండి ప్రతిపాపిని వెలివేయాలని తీర్మానించుకొనే అవకాశమున్నది. దీని ఫలితముగా వారి సంఘములు ఖాళీయగును-''ఎందుకనగా నరుని ఆసక్తి దేవుని నీతిని నెరవేర్చలేదు'' (యాకోబు 1:20). ఈ విషయములోకూడా ఒకడు ఆత్మచేత నడిపింపబడవలెను. యేసు రూకలు మార్చువారిని పావురములను అమ్మువారిని ఆలయములో అనేక సందర్భాలలో చూచెను. కాని వారిని చూచిన ప్రతిసారి వారిని తరిమివేయలేదు. తన తండ్రి తనను అలా చేయమని చెప్పినప్పుడు మాత్రమే ఆయన అలా చేసెను-తన పరిచర్య ప్రారంభములో ఒకసారి (యోహాను 2:15), దానియంతములో ఒకసారి (మార్కు 11:15) ఆయన అలా చేసెను. యేసు తన తండ్రి ఇంటిలో ఒక నమ్మకస్తుడైన ద్వారపాలకునిగా యుండెను.

అయితే మనము మానవసంబంధమైన ఆసక్తితో పనిచేసినయెడల, తన చేయి చాపి మందసమును పట్టుకొని, ''తాను చేసిన తప్పును బట్టి'' దేవుని చేత మొత్తబడిన ఉజ్జావలే మనముందుము (2సమూయేలు 6:7). ప్రభువు ఇంటిలో ద్వారపాలకులుగా మనము సంఘము యొక్క సాక్ష్యమును చెడగొట్టు లోకానుసారులైన విశ్వాసుల విషయములో మాత్రమే కాక, మానవ సంబంధమైన ఆసక్తితో పనిచేయుచు ఇతర యౌవనస్తులను అపరిచితమైన మార్గములలో నడిపించే ఆసక్తి కలిగిన యువకుల విషయములో కూడా మెళకువగా ఉండవలెను. మనము ఉద్వేగ పూరితమైన వాటి విషయములో, పరిణితి చెందని శిష్యులు ఎప్పుడు కోరుకొనే క్రొత్త ''వ్యామోహాలు'', ''చిట్కాల'' విషయములో కూడా మెళకువగా ఉండవలెను.

''శిష్యులను చేసి ప్రభువు ఆజ్ఞాపించిన వాటినన్నిటిని గైకొనవలెనని బోధించుట'' (మత్తయి 28:19,20) కాక సంఘము సంగీతమునకు లేక సమాజ సేవకు లేక ఇంకా దేనికైనను ప్రాముఖ్యత నివ్వకుండా ఉండుటకు మనము మెళకువగా నుండవలెను. ఆదాము హవ్వ ఏదేను వనమునుండి వెళ్లగొట్టబడినప్పుడు ఎవరును జీవవృక్షము నొద్దకు రాకుండా దేవుడు జీవవృక్షము యెదుట కెరూబులను, ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఈనాడు ప్రతి సంఘములోను ద్వారపాలకులు కలిగియుండవలసిన పరిచర్యకు ఇది సాదృశ్యముగా నున్నది. కాని అటువంటి ద్వారపాలకుడు మొదట ఆ ఖడ్గమును తన స్వంత శరీరము మీద పడి, తన స్వంత జీవితములో తెలిసిన పాపమంతటిని, తన మానవసంబంధమైన ఆసక్తిని, తన కుటుంబీకుల యెడల తన స్నేహితుల యెడల తనకున్న పక్షపాతమంతటినీ చంపివేయుటకు అనుమతించినవాడై యుండవలెను.

ఈనాడు భారతదేశములో నున్న సంఘముల యొక్క ద్వారముల యొద్ద ఖడ్గముతో నిలబడియుండుటకు సిద్ధముగా నున్న వాడెవడు? దేవుడు మన దేశములో అనేక మంది ద్వారపాలకులను లేవనెత్తును గాక!

అధ్యాయము 8
వేరు యొద్ద గొడ్డలినుంచుట

ఎక్కువ మంది విశ్వాసులు దేవుని వాక్యము ద్వారా కూడా సాతాను వారిని మోసగింపగలడని నమ్మరు. కాని సాతాను ఒక ''వెలుగు దూత'' వలే వచ్చును (2కొరిందీ¸ 11:14). కాబట్టి అతడు ఒక అన్యమత గ్రంధమును వల్లించక, బైబిలును వల్లించుచు మీ యొద్దకు వచ్చును. సాతాను లేఖనములను వల్లించుచు యేసును సహితము శోధింపవలెనని ప్రయత్నించియున్నాడు గనుక, అలా మనతో కూడా చేయుటకు ప్రయత్నించునని మనము నిశ్చయముగా నమ్మవచ్చును.

సత్యము ఒక పక్షివంటిదని దానికి రెండు రెక్కలున్నవని ఒకరు చెప్పిరి- ఆ రెండు రెక్కలు ఏవనగా: ''వ్రాయబడియున్నది'', మరియు ''మరియొక చోట వ్రాయబడియున్నది''. మీరు ఒక రెక్కనే కలిగియుండిన యెడల మీరు నిరంతరము వలయాకారములో తిరుగుచు బహుశా తప్పిపోవుదురు. కాని మీరు రెండు రెక్కలను కలిగియుండిన యెడల మీరు ముందుకు కదులుదురు. ఈ ప్రశ్నకు సమాధానమును పరిగణించండి: యేసు సిలువపైన ఎందుకు మరణించెను? ఆ ప్రశ్నకు సాధారణమైన సమాధానము: ''క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను'' అని వ్రాయబడియున్నది (1కొరిందీ¸ 15:3). కాని అది సత్యములో సగము మాత్రమే. సత్యమును పూర్తిగా పొందుటకు మనము మరో లేఖనమును చూడవలెను. ''జీవించు వారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు క్రీస్తు మృతిపొందెను'' (2కొరిందీ¸ 5:15). ఈ రెండు లేఖనములను మనము కలిపినప్పుడు మాత్రమే, మనకు సత్యము యొక్క రెండు రెక్కలు దొరుకును. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెనని మనము చదివినప్పుడు, పాపమంటే ఏమిటో మనము అర్థము చేసుకోవలెను. మనము ఈ రెండవ లేఖనమును చూచినప్పుడు మాత్రమే దీనిని సరిగా అర్థము చేసుకోగలము. మన కొరకు మనము జీవించుటయే పాపమని మనమక్కడ చూచెదము. కాని ఎక్కువమంది విశ్వాసులకు పాపమంటే సామాన్యముగా ఉండే జ్ఞానము అది కాదు. మీరు ఇక పాపము చేయాలని కోరుకొనుట లేదని మీరు చెప్పినప్పుడు, మీ ఉద్దేశ్యము నిజముగా మీ కొరకు మీరు ఇక జీవించుట కోరుకొనుట లేదు అనేనా?

మన మనస్సాక్షి ప్రకారము పాపమనేది వేర్వేరు విశ్వాసులకు వేర్వేరు రకాలుగా ఉండును. ఉదాహరణకు, ఒక తలలు నరికేవాడి మనస్సాక్షి వాడు ఒకరి తలనరికిన తరువాత కూడా వాడిని గద్దింపదు. ఇతరులకు అబద్ధములాడుట పాపము కాదు, మనము భూమిమీద బ్రతకాలంటే అది కొన్నిసారులు అవసరము కూడా. కాబట్టి పాపము విషయములో మనస్సాక్షి అంత మంచి మార్గదర్శికాదని వారు అంటారు.

మనము దేవుణ్ణి గూర్చి లేఖనములను గూర్చి మెరుగైన జ్ఞానమును పొందినప్పుడు, పాపమంటే నరహత్య, వ్యభిచారము, దొంగతనము మొదలగునవి మాత్రమే కావని మనము గ్రహించెదము. ఒకడు తన కొరకు తానే జీవించుటయే పాపము. మన కొరకే మనము జీవించిన యెడల, మనము ఎన్ని చెడు అలవాట్లను మానివేసినను మనము ఇంకను పాపములో జీవించుచున్నాము. ''ఎవడైనను క్రీస్తునందున్న యెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను'' (2కొరిందీ¸ 5:17). ఆ పాత వైఖరులు, ఆ పాత జీవనశైలి వెళ్లిపోయెనని దీని అర్థము. అతడు ఇక తన కొరకు జీవించుట లేదు. అతడు క్రీస్తు స్వారూప్యము పొందుట అను గురి యొద్దకు ఇంకా చేరుకోలేదు. కాని అతడు వెనుకకు తిరిగి దేవుని మహిమకొరకు జీవించాలని కోరుకొనుచున్నాడు. ఇది, కేవలము ఇది మాత్రమే నిజమైన మారుమనస్సు.

నీవు నీ జూదమాడుటను, పొగత్రాగుటను, మద్యము సేవించుటను విడిచిపెట్టి యుండవచ్చు గాని, నీ కొరకు నీవు జీవించుట అనే పాపము యొక్క మూలకారణ విషయములో మారుమనస్సు పొందియుండక పోవచ్చును. కాని నీ చెవులు నిమిరి నీవు ఇంకను రక్షింపబడియున్నావని చెప్పే బోధకులు ఈనాడు అనేకమంది ఉన్నారు. అట్టి బోధకులు నీవు వారి కూటములకు వెళ్లినంతకాలము వారి చందా సంచిలో నీ కానుకను వేసినంత కాలము సంతోషించెదరు.

సాతాను విశ్వాసులను మోసము చేసిన అతిగొప్ప మోసాలలో ఇది ఒకటి-అది ఒక వ్యక్తి తన కొరకు తాను జీవించుట కొనసాగించినప్పటికీ రక్షింపబడి తన జీవితము చివరిలో పరలోకము వెళ్లవచ్చని వారిని నమ్మించుట. తన జీవితమును నాశనము చేసే కొన్ని చెడు అలవాట్లనుండి ఒక వ్యక్తి తిరిగియుండవచ్చును. కాని అది అతడు భూమి మీద తన ప్రాణమును కాపాడుకొనుటకు ప్రయత్నించుచున్నాడని మాత్రమే అది సూచించవచ్చును. ''ధూమపానము ఆరోగ్యానికి హానికరము'' అనే చట్టపరమైన హెచ్చరిక సిగరెట్టు ప్యాకెట్లన్నిటి మీద ఉండును. గనుక ప్రజలు పొగత్రాగరు. అదే కారణము చేత, ప్రజలు మద్యపానము సేవించకపోవచ్చు లేక జూదమాడకపోవచ్చు. ఎయిడ్స్‌ వ్యాధి సోకుతుందేమోనన్న భయము చేత వారు వ్యభిచరింపకపోవచ్చు. కాని బైబిలు పరంగా అట్టివారు మారుమనస్సు పొందలేదు (పాపమునుండి తిరుగలేదు).

ఆయన మహిమకొరకు జీవించుటకు మనము దేవుని చేత సృష్టింపబడితిమి. మనము అలా జీవించక మన స్వంత సుఖసౌకర్యములకొరకు, ఘనత కొరకు జీవించినయెడల మనము రక్షణపొందలేదు. మనము మారుమనస్సు పొందలేదు. ఆ పాపాత్మమైన జీవనశైలినుండి మనలను విడిపించుటకు యేసు మరణించెను. సంఘములో ఒక గొప్పవాడిగా ఉండాలని మరియు ఇతరులు తనను గౌరవించాలని కోరుకొనేవాడు తన కొరకు తాను జీవించుచున్నాడనునది స్పష్టముగా నున్నది. అతడు తనకు కొంత మతపరమైన సున్నమును పూసికొనియుండవచ్చును. కాని మౌళికముగా అతడు మారలేదు. అతడు ఇప్పుడు కొంత క్రైస్తవ బాషను ఉపయోగించవచ్చును (''తిరిగి జన్మించుట'' వంటి మాటలను) కాని అతడి అంతరంగ పురుషుడు ఇంకను ఆ విధముగానే ఉన్నాడు.

ఇటువంటి వర్తమానమును అనేక మంది బోధకులు ప్రకటించుటకు ఇష్టపడని కారణము స్పష్టముగానున్నది, ఎందుకనగా అది వారి సమాజముల పరిమాణమును (సంఖ్యను) తగ్గించును. వారు ప్రజాదరణ పొందరు. మరియు వారు ప్రతి సంవత్సరము మాట్లాడు ప్రతిష్టాత్మకమైన క్రైస్తవ సమావేశాలకు తిరిగి ఆహ్వానింపబడరు. వారి ప్రసంగాలకొరకు, వారు వ్రాసే పుస్తకాల మరియు వ్యాసాలకొరకు మాత్రమే మా పుస్తకాలు చదువు బోధకులను గూర్చి మాకు తెలుసు. కాని వారు తమ ప్రజాదరణను పోగొట్టుకొనకుండా మా వర్తమానములోని కరిÄనముగా ఉండే భాగములను విడిచిపెట్టుటకు జాగ్రత్త పడుదురు.

ఏ బోధకుడైనను దేవుని సంకల్పమంతటిని ఆరునెలల పాటు తన సంఘ సభ్యులకు ప్రకటించి, వారికొరకు వారు జీవించుట పాపములో జీవించుట అని, డబ్బును ప్రేమించువారు దేవునిని ప్రేమించలేరని చెప్పుచుండిన యెడల అతడు తన ఉద్యోగమునైనా లేక సంఘ సభ్యులలో 75 శాతము మందినైనా పోగొట్టుకొనునని నేను హామి ఇవ్వగలను. దేవుడు మన హృదయాలను లక్ష్యపెట్టును. మన జీవితాలయొక్క మౌళిక ఉద్దేశ్యము మారనియెడల మనము రక్షింపబడలేదు. అనేకమంది విశ్వాసులలో, వారు మారిన తరువాత మనము కనుగొనే ఏకైక వ్యత్యాసము ఇదే: ముందు, వారు ఎటువంటి ''మతపరమైన సున్నము'' లేకుండా తమ కొరకు తాము జీవించిరి. ఇప్పుడు వారు తమ కొరకు తాము ఎంతో ''మతపరమైన సున్నముతో'' జీవించుచున్నారు. నిజానికి వారి మొదటి స్థితియే మెరుగుగా నున్నది-ఎందుకనగా అప్పుడు కనీసము తాము పాపులమని వారు ఎరిగియుండిరి. ఇప్పుడు తాము పరిశుద్ధలమని ఊహించుకొనుచు మోసపోవుచున్నారు.

వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీ యేసు ముందుకు తేబడినప్పుడు ఆయన ఆమెను గద్దింపలేదని గమనించండి. యేసు ఒక అసాధారణమైన ప్రవక్తగా నుండెను. వ్యభిచారములో పట్టుబడిన ఒక స్త్రీని ఒక్కమాట గద్దింపులేకుండా మరియు శిక్షలేకుండా వెళ్లుటకు ఆయన అనుమతించెను ఎందుకని? ఎందుకనగా ఆమె మారుమనస్సు పొందెనని ఆయన చూడగలిగెను. కాబట్టి ఆయన ఆమెను క్షమించెను. ఆ తరువాత ఒక హంతకుడుండెను. అతడు ఎంత దౌర్భాగ్యుడైన నేరస్థుడంటే రోమీయులు అతడిని సిలువ వేయుటకు నిర్ణయించిరి. కాని అతడు తన పాపమును అంగీకరించినప్పుడు యేసు అతడిని క్షమించుటయే కాక అతడిని పరదైసుకు కూడా తీసుకువెళ్లెను. ఆ వ్యక్తి తన జీవితమంతటిలో బహుశా ఒక్క మంచిపని కూడా చేసియుండడు. అతడు ఇతరుల యొద్దనుండి దొంగిలించి వారిని హత్యచేసి కేవలము చెడునే చేసెను. అయినప్పటికీ అతడు మరణించినప్పుడు అతడు స్వయముగా యేసుచేత పరదైసులోకి ఆహ్వానింపబడెను. ఇది చాలా ఆశ్చర్యకరముగా ఉందికదా?

కాని తమ బైబిళ్లను పట్టుకొని ప్రతి శనివారము సమాజమందిరమునకు వెళ్లే మతానుసారులైన ప్రజల విషయము వచ్చేసరికి, యేసు వారిని ''నరకశిక్షను తప్పించుకొనని సర్పసంతానము'' అని పిలిచెను. యేసు యొక్క బోధనలు ఎంతో అసాధారణముగా నుండెను. ఆయన కాలములో ఎక్కువ మంది బోధకులు, నరహంతకులకు మరియు వ్యభిచారిణులకు వారు నరకమునకు నియమింపబడిరని చెప్పగా, యేసు అదే మాటను ఆయన తరము యొక్క ఎంతో మతభక్తిగలిగిన మరియు బయటకు నీతిమంతులైన ప్రజలతో చెప్పెను ఎందుకని? నరహత్య లేక జారత్వము కంటే వేషదారణ మరియు ఆత్మీయ అహంభావము (ఇతర మనుష్యులను తక్కువగా చూచునట్లు చేయునది) దేవుని దృష్టిలో కోటిరెట్లు ఘోరమైనదని ఆయన యెరిగియుండెను. యేసు ప్రజల హృదయాలను లక్ష్యపెట్టెను ఆయన బయటకు కనిపించే మతపరమైన సున్నమును లెక్కచేయలేదు. ప్రభువు మన మతసంబంధమైన భాషను బట్టి, మనము ''పాపము మీద జయము'' మరియు ''పరిపూర్ణులగుటకు సాగిపోవుట'' గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆకట్టుకొనబడడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించానని చెప్పుకొనుచు తన స్వంత చిత్తమును చూచుకొంటే, ప్రభువు అతనిని ఈ రోజున కూడా, ''సున్నము కొట్టిన సమాధి మరియు సర్పము'' అని పిలచును. తమ ఆత్మానుసారతను గూర్చి గొప్పలు చెప్పుకొనే వారికొరకు ఆయన చూచుటలేదు కాని, అనేక సంవత్సరములు పవిత్రముగా జీవించి, ప్రభువు కొరకు ఎంతో సాధించిన పౌలు తన భూలోకజీవితము చివరిలో ఉన్నట్లు, తమ పాపములను బట్టి దు:ఖముతో విరుగగొట్టబడిన వారి కొరకు, భూమి మీదనున్న పాపులందరిలో తమ్మును తాము ప్రధానులుగా ఎంచుకొనే వారి కొరకు ఆయన చూచుచున్నాడు.

తన స్వార్థపరమైన జీవన విధానమునుండి యధార్థముగా తిరుగుటకు కోరుకొని తన వైఫల్యాలను బట్టి యథార్థముగా నుండి, తన పాపములను బట్టి ఇంకెవరినీ కాక తన్నుతానే నిందించుకొనే వారి యెడలనైనను ప్రభువు ఎల్లప్పుడు కరుణాసంపన్నుడైయుండి క్షమించును. వ్యభిచారములో పట్టబడిన ఆ స్త్రీ గురించి మరల ఆలోచించండి. ఆమెకు ఏ అర్హతలుండెను? ఆమె ఆ పట్టణములో మంచి సాక్ష్యమును కలిగియుండెనా? లేదు. కాని ఆమె యధార్థముగా నుండెను. ఇతరులు తనను తప్పుగా నిందించుచున్నారని తాను అమాయకురాలని ఆమె నటించలేదు. ఆమె తన నోరు తెరువలేదు కాబట్టి తన అపరాధమును అంగీకరించెను. కాబట్టి ఆమెకు నిరీక్షణయుండెను.

తమ దృష్టిలో తాము నీతిమంతులుగా కనబడేవారు రక్షణను కనుగొనుట ఎంతో కష్టము. ఆ పరిసయ్యులు వ్యభిచారములో పట్టబడిన ఆ స్త్రీని రాళ్లు రువ్వి చంపుటకు సిద్ధముగా నుండిరి కాని అదే సమయములో వారి స్వంత హృదయాలలో నున్న పాపమును చూడలేకపోయిరి. వారు కానుక పెట్టెలో పెద్దమొత్తముల డబ్బును వేసి అందరు దానిని చూడవలెనని కోరుకున్నప్పుడు వారు దేవుని దృష్టిలో వ్యభిచారము కంటే గొప్ప పాపమును చేయుచుండిరి, ఎందుకనగా వారు ప్రజలను దేవునిని ఆరాధించుటకు బదులు వారిని ఆరాధించు (మెచ్చుకొనునట్లు)నట్లు చేయుచుండిరి. మారుమనస్సు అనగా ''పూర్తిగా వెనుదిరుగుట'', గనుక మనము మన కొరకు జీవించుట నుండి వెనుదిరిగి దేవుని కొరకే జీవించుటకు నిర్ణయించుకొందము. దీని అర్థము పూర్తికాల క్రైస్తవ పరిచారకులగుట కాదు. దేవుడు వెయ్యిమంది విశ్వాసులలో ఒక్కరినే పూర్తికాల సేవకులుగా ఉండుటకు పిలచును. తన ఇతర బిడ్డలందరు లౌకికపరమైన ఉద్యోగాలు చేయుచు, తమ జీవనోపాధిని సంపాదించుకొనుచు, తమ కొరకు కాక, దేవుని మహిమకొరకు జీవించవలెనని ఆయన కోరుకొనుచున్నాడు.

1థెస్సలోని 1:9లో మారుమనస్సు ''విగ్రహములను విడిచిపెట్టి, దేవుని తట్టు తిరుగుట''గా వర్ణింపబడినది. విశ్వాసులుగా పిలువబడే అనేకమంది వారి విగ్రహాలనుండి దేవుని తట్టు తిరుగలేదు. భారతదేశములో, అన్యులలో అనేకమంది క్రీస్తును తమ దేవునిగా అంగీకరించుటకు సంతోషపడుదురు-కాని వారు అప్పటికే ఆరాధించు అనేకమైన విగ్రహాలకు అదనంగా మరొక దేవునిగా ఆయనను అంగీకరింతురు. ఇది అసాధ్యమని మనకు తెలుసు. క్రీస్తును అంగీకరించినవాడు ఇతర దేవతలను విగ్రహాలను విడిచి పెట్టవలెను.

''చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి'' (1యోహాను 5:21) అని పరిశుద్ధాత్మ విశ్వాసులతో చెప్పెనని గుర్తుంచుకొనుడి. తనకున్న దేవతలకు అదనంగా క్రీస్తును అంగీకరించుటకు అన్యుడికి మరియు విశ్వాసి అనబడి క్రీస్తును అంగీకరించి, (తన ప్రస్తుత దేవుడైన) డబ్బు కొరకు ప్రయాసపడే వానికి ఎటువంటి తేడాలేదు. అది ఇప్పటికే పెండ్లి చేసుకొన్న ఒక స్త్రీ రెండవ భర్తను పెండ్లి చేసుకోవాలన్నట్టుండును. యేసు క్రీస్తు వారితో అటువంటి వివాహమునకు ఒప్పుకొనునని తలంచుచు తమను తాము విశ్వాసలుగా ఎలా మోసగించుకోగలరో ఆశ్చర్యముగా నున్నది. మరొక పురుషునితో అప్పటికే వివాహమైన స్త్రీని వివాహము చేసుకొనుటకు మనలో ఎంతమంది ఇష్టపడుదురు? అయినప్పటికీ లోకము కొరకు దాని ఘనత, సుఖభోగములు, సంపద కొరకు మీకున్న ప్రేమను విడిచిపెట్టకుండా క్రీస్తు మిమ్ములను వివాహము చేసుకోవాలని మీరు ఆశించుదురు.

చెక్కతోను రాతితోను చేయబడిన విగ్రహాలు డబ్బు మరియు పేరు ప్రతిష్టల వంటి కనబడని విగ్రహాలంత మోసకరమైనవి కావు, ఎందుకనగా ఒకరు భౌతికమైన విగ్రహాలకు మ్రొక్కునప్పుడు ఇతరులు ఆ విగ్రహారాధనను స్పష్టముగా చూడగలరు. ఒక వ్యక్తి ఒక గదిలోనున్న ఒక అన్య విగ్రహము యొక్క ప్రతిమకు మ్రొక్కి ఆ తరువాత ప్రక్క గదిలోనికి వెళ్లి యేసు క్రీస్తుకు ప్రార్థనచేయుటను మీరు చూచిన యెడల, అతడిని క్రైస్తవునిగా మీరు పరిగణించరు. కాని అతనికిని మరియు వారమంతయు డబ్బు, మనుష్యుల ఘనత, లోకానుసారమైన లక్ష్యాలు అను విగ్రహాలను ఆరాధించి, ఆ తరువాత ఆదివారమున కూటమునకు వచ్చి క్రీస్తును ఆరాధించుటకు ప్రయత్నించేవానికిని తేడా ఏమిటి? అటువంటి ''విశ్వాసి'' కంటే బుధ్దుని పూజించేవానికి ఎక్కువ నిరీక్షణ ఉందని నేననుకొనుచున్నాను.

అటువంటి ఒక ''విశ్వాసి'' ఆదివారమున కూటమునకు వచ్చి, ''నా వెండిని బంగారమును తీసుకొనుము-ఒక్క పైసాను కూడా నేను ఉంచుకొనను'' అని పాడినప్పుడు అతడు దేవునితో అబద్ధమాడుచున్నాడు. క్రైస్తవులు వారములో వేరే రోజుల కంటే ఆదివారమున దేవునికి ఎక్కువ అబద్ధములు చెప్పుదురు ఎందుకనగా వారు అన్నిటిని ఆయనకు సమర్పించామని, ఆయనను వెంబడించుచున్నామని చెప్పుచు గొప్ప సమర్పణ గురించిన పాటలు ప్రభువుకు పాడుదురు. దేవుడు వీటన్నిటికి వినునుగాని ఆయన మోసపోడు. ''వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది'' అని ఆయన చెప్పుచున్నాడు (యెహెజ్కేలు 33:31). అనేకమంది విశ్వాసులు పాడు పాటల యొక్క మాటలు వింటే, భూమిమీద వారు అత్యుత్తమ పరిశుద్ధులని ఒకరు భావించగలరు. కాని నిజానికి వారిలో ఎక్కువమంది అతి గొప్ప వేషదారులు అయితే దేవుడు మోసపోడు.

తన కొరకే తాను జీవించువాడు జంతువువలే జీవించుచున్నాడు -ఎందుకనగా జంతువులు కూడా వాటికొరకు వాటి పిల్లల కొరకు మాత్రమే జీవించును. అవి వాటి స్వలాభమునే కోరుకొనును, వాటికి లాభదాయకమైన వాటిని గూర్చియే ఆలోచించును. ఒక అడవిలో ఉన్న సింహము ఇలా ఆలోచించును, ''నా ఆహారము కొరకు ఆ జింకను చంపగలిగితే నేను దానిని చంపెదను''. కాబట్టి జంతువులలో బలమైనవే జీవించగలవు. కాని మనము జంతువులము కాము. తిని, నిద్రపోయి, పిల్లలను పుట్టించి చచ్చిపోయే కుక్కలవలే మరియు పందులవలే జీవించుటకు దేవుడు మనలను సృష్టించలేదు. మానవుడు తన జీవితమంతయు దేవుని మహిమకొరకు జీవించుటకు సృష్టింపబడ్డాడు.

పదవీవిరమణ చేసిన వారినుండి నాకు కొన్నిసార్లు ఉత్తరాలు వచ్చును. వారు తమ పదవీ విరమణ తరువాత సంవత్సరములు ''దేవుని సేవ''లో గడుపుటకు మేము వారికి ఏదైనా పని ఇవ్వగలమా అని వారడుగుదురు. ఒక గౌరవనీయమైన అతిది¸ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అతని యెదుట ఒక కప్పు టీ త్రాగి ఆ తరువాత మీ కప్పులో అడుగున మిగిలియున్న దానిని అతనికి ఇచ్చుటను ఊహించుకొనుడి. ప్రజలు దేవునికి అదే చేయుదురు. వారి జీవితమంతయు లోకములో డబ్బు సంపాదించుచు జీవించిన తరువాత, ఇప్పుడు వారు తమ జీవితాల యొక్క మడ్డిని దేవునికివ్వాలనుకొనుచున్నారు. ఇది ఎంత అవమానకరము!

మనము యౌవన దశలోనే మన జీవితాలను దేవునికి ఇవ్వవలెను. ఆయనకు తగినట్లు నిర్దేశించుటకు మన జీవితాలన్నియు ఆయనకు చెందవలెను. నీ స్వలాభమును కోరుకొనే జీవితమునుండి, మీరు అలా వెనుదిరిగితిరా? యేసు తిరిగి వచ్చినప్పుడు అనేకమంది విశ్వాసులు ఎంతో పశ్చాత్తాపపడుదురు. ఎందుకనగా వారు భూమి మీద సంపాదించిన డబ్బంతయు మొనోపోలి అనే ఆటలో పిల్లలు ఆడే ఆట డబ్బు వంటి విలువలేనిదని వారు కనుగొనెదరు. వారు భూమి మీద సంపాదించిన ఆస్తియంతయు కూడా ఆ మొనోపోలీ బోర్డు మీద ఉండే హోటళ్లవలే మరియు ఇళ్లవలే విలువలేనివి. అప్పుడు జీవితమనే ఆట ముగియును మరియు నిత్యమైన విలువలేని నిరర్థకమైనవి పోగుచేసుకొనుటకంటే వారు ఏమియు సాధించలేకపోయిరి. వారు నిష్‌ప్రయోజనమైన జీవితమును జీవించిరి. వారు వెదికినదంతయు ఘనతయైనను వారు చాలా పశ్చాత్తాపపడుదురు. ఎందుకనగా వారు తమ ఘనత నిత్యత్వపు వెలుగులో ఆవిరైపోయెనని వారు కనుగొనెదరు కాని దేవుని చిత్తము చేయుటకును మరియు ఆయన మహిమార్థమై జీవించిన వారు ఆ దినమున వారు అత్యంత ఆనందముగా నుందురని కనుగొనెదరు. భౌతికపరమైన వస్తువులు కేవలము మనము భూమి మీద ఉపయోగించుట కొరకే. అంతే . వాటిని మనము వాడుకొన్నంతకాలము మంచిదే. కాని అవి మనకు యజమానులు కాకూడదు. డబ్బును ఉపయోగించుట ఒకటి. దానిచేత లోపరచకొనబడుట వేరొకటి. డబ్బు ఒక శ్రేష్టమైన దాసుడు గాని ఒక ఘోరమైన యజమాని. ఒక శ్రేష్టమైన పురుషుని పెండ్లి చేసుకొని తన భర్త కంటే కారు డ్రైవరును ఎక్కువ ప్రేమించి తన సమయమును ఎక్కువగా అతనితో గడిపే ఒక స్త్రీని పరిగణించండి. అటువంటి స్త్రీ గురించి మీరు ఏమనుకొందురు? ప్రభువు కొరకు ఎలా ఎక్కువ ప్రభావవంతముగా ఉండవలెనో అనుదాని కంటే తనకు కావలసిన అవసరతలను మించి ఇంకా ఇంకా ఎక్కువ డబ్బును ఎలా సంపాదించాలా అని ఆలోచించే విశ్వాసికి అది సరియైన వర్ణన.

దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, భూమియంతటిని లోపరచుకొనుమని ఆయన అతనితో చెప్పెను. కాని ఆదాము ఒక బానిసగా మారెను. మనలను మరల రాజులుగా చేయుటకు క్రీస్తు వచ్చెను. మనము ఈ లోకములో ఆనందించుటకు దేవుడు అనేకమైన వాటిని ఇచ్చెను. కాని వాటిలో ఏదైనను మనలను లోపరచుకొన్నప్పుడు, మనము బానిసలుగా మారెదము. అప్పుడు దేవుడు ఉద్దేశించిన రాజులుగా మనము ఇకలేము. దేవుడు ఏదేనులో మన్ను దానికి ఆహారమైయుండునని సర్పముతో చెప్పెను. బంగారమంటే ఏమిటో మీకు తెలుసా? దేవుడు ఈ భూమిమీద సృష్టించిన మంటిలో అది కూడా భాగమే-బహుశా సామాన్యమైన మంటి కన్నా కొంచెము గట్టిగాను కొంచెము అరుదుగాను ఉండవచ్చును గాని అది కూడా మన్నే. మానవుడు, అపవాది యొక్క ఆహారము కొరకు ప్రయాసపడుచున్న విషాదకరమైన దృశ్యమును మనమిక్కడ చూచెదము. మానవుడు ప్రతిచోట బంగారపు మంటికి బానిసగానున్నాడు.

ఒక చెడు అలవాటు ద్వారా ఒక వ్యక్తిని బానిసగా చేయలేనని అపవాది చూచినప్పుడు, అతడు ఒక తటస్థమైనదాని ద్వారా వానిని బానిసగా చేయుటకు చూచును - మనిషికి దేవుని కొరకు, బైబిలు చదువుట కొరకు లేక సహవాసము కొరకు సమయము లేకుండా చేయును. ఒక వ్యక్తిని బానిసగా చేయునది ఒక మంచి శుభ్రమైన టీ.వి. కార్యక్రమము కావచ్చును. అపవాది తమ స్వలాభమును, తమ వినోదాలను, తమ స్వంత చిత్తమును కోరుకొనేవారికొరకు చూచుచున్నాడు. ఒక వ్యక్తిని దేవుని నుండి దూరముగా ఉంచుటకు అపవాదికి 101 మార్గములున్నవి. ఆకారణముగానే మనము పాపమంటే కేవలము త్రాగుట, జూదమాడుట, వ్యభిచరించుట, నరహత్యచేయుట కాదని చూడవలసిన అవసరమున్నది. ''మనకొరకే మనము జీవించుట''ను మనము పాపముగా చూడవలెను. పాపము చేయుట అంటే మనకిష్టమైనది చేయుట, మన స్వంత చిత్తమును చేయుట. ఆ వేరునుండి పాపము యొక్క అనేక ఫలాలు వచ్చును. వాటన్నిటిని నుండి మనలను రక్షించుటకు యేసు మరణించెను.

యేసు వచ్చునప్పుడు, ఆయన గొడ్డలిని వేరు యొద్ద నుంచునని బాప్తీస్మమిచ్చు యోహాను చెప్పెను. యేసు గొడ్డలిని ఉంచుటకు వచ్చిన వేరు ఇదే:-మనకొరకు మనము జీవించుట మరియు మన స్వంత చిత్తమును చేయుటకు ఆశించుట. చెట్టునుండి అప్పుడప్పుడు మనము చిన్న చెడ్డ ఫలములను మనము కత్తిరించవచ్చును. కాని అది సమస్యకు పరిష్కారము కాదు. ఇతరులు చూడగలిగే చెడ్డ ఫలములన్నియు కత్తిరింపబడినప్పుడు మన జీవితము ఎంతోబాగా కనబడవచ్చును. కాని ఆ చెట్టు మారలేదు. ఒక చెడ్డ చెట్టును మీరు మార్చనంతవరకు అది మంచి ఫలములను ఫలించదని యేసు చెప్పెను. చెట్టును మార్చుటకు మీరు గొడ్డలిని పాత చెట్టు యొక్క వేరుల యొద్ద నుంచవలెను.

ఈనాడు ఎక్కువ గృహాలు యుద్ధరంగాల వలే ఎందుకున్నవి? ఎందుకనగా భార్యలు భర్తలు కూడా తమ కొరకు తాము జీవించాలనుకొనుచున్నారు. కాబట్టి ఈనాడు ఈ ఆశ్చర్యకరమైన సంగతి లోకములో జరుగుట చూచెదము: ''నూతనముగా జన్మించిన క్రైస్తవులు'' అని పిలువబడే వారు తమ భాగస్వాములకు విడాకులిచ్చి మరల వివాహము చేసుకొనుచున్నారు!! ఇది 20వ శతాబ్దమునకు ప్రత్యేకమైనది. పాష్టరులు, బోధకులు సహితము తమ భార్యలకు విడాకులిచ్చి ఇతర స్త్రీలను పెండ్లిచేసుకొనుచున్నారు. కొంతమంది బోధకులు తమ భార్యలకు విడాకులివ్వరు గాని రహస్య వ్యభిచారములో జీవించుచున్నారు. అన్ని శతాబ్దములలోను లోకులైన దంపతులు ఒకరికి ఒకరు విడాకులు ఇచ్చుకొనిరి. కాని క్రైస్తవులు అలా చేయుట మొదలు పెట్టినప్పుడు, గొప్ప భ్రష్టత్వము (విశ్వాస భ్రష్టత్వము) మనమీదకు వచ్చినదని మనము కడవరి దినాలలో ఉన్నామని మనము నిర్ధారించుకోవచ్చును. దీనంతటికి కారణము తన కొరకే తాను జీవించుట పాపమని విశ్వాసులు చూడకపోవుటయే. వారు దాని గూర్చి బోధింపబడలేదు. కాబట్టి వారు దానిని చూడలేదు. తప్పు వారి నాయకులదే మరియు దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారి నాయకులు, వారి రక్తము విషయమై దోషులుగా ఉన్నారు.

''జీవమునకు పోవు మార్గమును బహు కొద్ది మందే కనుగొనెదరు'' అని యేసు చెప్పెను. ఎందుకని? ఎందుకనగా ద్వారాము చాలా ఇరుకైనది. లోకానుసారముగా చూచినట్లయితే, యేసు యొద్దకు వచ్చిన ధనికుడైన యౌవన అధికారికి సంఘ సభ్యత్వమునకు కావలసిన నాలుగు శ్రేష్టమైన అర్హతలుండెను- అతడు యువకుడు, ధనికుడు, పలుకుబడి ఉన్నవాడు (ఒక అధికారి) మరియు నీతిపరుడు. అటువంటి వ్యక్తిని సభ్యునిగా కలిగియుండుటకు సంఘములన్నియు ఇష్టపడును. ఈనాడు ఉన్న ఎక్కువ ఇవాంజిలికల్‌ సంఘాలలో అతడు ఒక బోర్డు-సభ్యుడు (ఒక భాధ్యతగల పదవి)గా ఉండుటకు కూడా అర్హత కలిగియుండెను. కాని ఒక నాయకుడు కాదు గదా తన శిష్యునిగా ఉండుటకు కూడా యేసు అతడిని అర్హునిగా ఎంచలేదు. ఇది ఆశ్చర్యకరముగా లేదా?

యేసు అతని ధనముచేతను మరియు లోకములో అతనికున్న పలుకుబడి చేతను ఆకట్టుకొనబడలేదు. ఆ వ్యక్తి ఇంకను డబ్బును ప్రేమించిన యెడల యేసుని శిష్యునిగా ఉండుటకు అతడు అర్హుడు కాదు. అతడు ఇరుకు ద్వారములో ప్రవేశించే ముందు డబ్బుకొరకు అతనికున్న ప్రేమను అతడు విడిచిపెట్టవలసియుండెను. ఆ వ్యక్తి దు:ఖపడుచు వెళ్లిపోయెను, యేసు అతడిని వెళ్లనిచ్చెను. యేసు అతని వెంటవెళ్లి తన డబ్బును దశలుగా -10శాతము ఇప్పుడు, మరొక 10 శాతము ఒక నెల తరువాత ఇవ్వమని సలహాఇవ్వలేదు. లేదు. శిష్యత్వము విషయములో బేరాలాడుటకు అవకాశము లేదు. ఇవ్వాలనుకుంటే సమస్తము ఇవ్వాలి లేకపోతే లేదు. అతడు డబ్బును మరియు దేవునిని ఒకే సమయములో ప్రేమించలేడు. అతడు ఎంచుకోవలసియుండెను. అతడు తన విగ్రహము (డబ్బు) నుండి వెనుదిరిగి క్రీస్తుతో మాత్రమే జతపరచబడవలెను.

మీరు మీ కొరకు జీవించవలెనని కోరుకొన్న యెడల మీరు అలా చేయవచ్చును. ఈ ధనికుడు విషయములో జరిగినట్లే, ప్రభువు మిమ్ములను ఒంటరిగా విడిచిపెట్టును. మీరు ఇంకను పరలోకమునకు వెళ్లేదారిలో నున్నారని మీకు చెప్పు ఒక సౌకర్యవంతమైన సంఘమును మీరు కనుగొన్నయెడల, దేవుడు కూడా మిమ్ములను అక్కడ ఇబ్బంది పెట్టడు. మీ జీవితమంతయు మిమ్ములను మీరు మోసపరచుకొనుటకు ఆయన అంగీకరించును. మీరు చివరకు మేల్కొని మిమ్ములను మీరు నరకములో కనుగొనెదరు. ప్రజలు మోసగింపబడుటకు దేవుడు ఎందుకు అనుమతించునంటే వారు తమను గూర్చిన సత్యమును తెలిసికొనుటకు ఇష్టపడరు. ఒక ప్రవక్త వారిని గూర్చిన సత్యమును వారికి చెప్పినప్పుడు వారు ఆ ప్రవక్త మీద కోపపడుదురు.

యిర్మీయా రాజైన యెహోయాకీము పాలనలో ప్రవచించెను. యూదా ప్రజలు యిర్మీయా ఒక చర్మపు చుట్ట మీద వ్రాసిన మాటలను చదివినప్పుడు, వారు భయపడిరి ఎందుకనగా యిర్మీయా పాత నిబంధనలో ఉన్న అతి కరిÄనమైన ప్రవక్తలలో ఒకడు మరియు అతడెప్పుడు ఒక వినసొంపుగా నుండే వర్తమానమును ప్రకటింపలేదు. ఆ వర్తమానము, తీర్పు తీర్పు ఇంకా ఎక్కువ తీర్పుగా నుండెను (యిర్మీయా 20:8 లివింగు బైబిలు). అయితే రాజు యిర్మీయా పుస్తకపు చుట్టను చదివినప్పుడు అతనికెంత కోపమొచ్చెనంటే అతడు దానిని, ముక్కలుగా కోసి అగ్నిలో వేసెను (యిర్మీయా 36). కాని దేవుడు యిర్మీయాను ఆ పుస్తకపు చుట్టను తిరిగి వ్రాయమనెను. ఆ విధముగా మనకు యిర్మీయా గ్రంథము వచ్చెను. కాని అది వ్రాయబడిన మొదటిసారి, తనను గూర్చిన సత్యమును వినుటకు ఇష్టపడని రాజు చేత అది చింపివేయబడెను. అటువంటి ప్రజలు ఎల్లప్పుడు ఉంటారు.

కాని సత్యమును ప్రేమించిన కొందరు ప్రతి యుగములోను ఉండిరి. దేవుడు తన మహాకృపను బట్టి సత్యమును వినే చెవులను మనకు అనుగ్రహించియున్నారు. మన జీవితాలను మనము వృథా చేసుకొని నిత్యత్వములో మేల్కొని మనలను మనము దరిద్రులుగా కనుగొనుట ఆయనకు ఇష్టములేదు. సృష్టింపబడినదంతయు (డబ్బు, ఇండ్లు, పొలాలు సహితము) ఒక రోజున చలింపచేయబడి, తీసివేయబడును. సృష్టింపబడనిది మాత్రమే నిలిచియుండును. కాబట్టి మనము జ్ఞానము కలిగి నిత్యము నిలిచియుండే దాని కొరకు మన సమయమును సామర్థ్యములను ఉపయోగించవలెను. దీని అర్థము మీరందరు పూర్తికాల సేవకులు కావాలన్నది కాదని నన్ను మరియొకసారి చెప్పనియ్యండి. కాని దాని అర్థము మీరు ఏ పనిచేసినా, ఇక మీ కొరకు మీరు జీవింపక, దేవుని మహిమ కొరకు మాత్రమే జీవించుదురు. మీరు నిశ్చయముగా పనిచేయుచు సాధ్యమైనంత మంచి జీతమును సంపాదించుకొనవచ్చును. దానితో మీరు దేవుని పనికి సహాయపడవచ్చును. కాని జీవితములో మీ గురి దేవుని మహిమైయుండవలెను. ఆయనకు ఇష్టులుగా ఉండుటయే మీ జీవితాశయముగా ఉండవలెను.

మనము ఒక విహార యాత్రకు వెళ్లకూడదని లేక వినోదకరమైన దేదియు కలిగియుండకూడదని నేను చెప్పుటలేదు. మనము అలాంటివి చేయవచ్చు. ఆటలు ఆడుకొనుట లేక సంగీతము వినుటవంటివి మనుష్యులుగా మనకు కావలెను. అది శుభ్రమైన పవిత్రమైన వినోదమైతే అది మంచిదే. కాని వీటిలో ఏవైనను మనలను లోపరచుకొని మన జీవితాలలో ఒక ప్రాముఖ్యమైన విషయముగా మారినప్పుడు (మన మీద ప్రభుత్వము చేయునప్పుడు) మనము ప్రమాదకరమైన స్థలములోకి వెళ్లుటకు గీత దాటుదము. ఒక ఉద్యోగముగాని, ఒక ఆటగాని లేక ప్రమాదకరముకాని వినోదము గాని ఒక వ్యక్తి జీవితములో ఒక ప్రధాన భాగమగుట ఎంత సులభమైనదంటే, అది ఆ వ్యక్తి జీవితములో అతి ముఖ్యమైనదిగా మారును. అప్పుడు అతని భార్య పిల్లలు కూడా నిర్లక్ష్యము చేయబడుదురు. అయితే మొట్టమొదటిగా దేవుడు నిర్లక్ష్యము చేయబడును. అలా జరిగినప్పుడు, ఆ విషయము (అది ఏమైనప్పటికీ) ఆ వ్యక్తికి యజమానిగా మారెను అని మీరు తెలుసుకోవచ్చును. దేవుడు నిత్యయుగములనుండి కట్టుటకు యోచించిన సంఘమును మన ద్వారా ఆయన కట్టాలంటే మనము మన కొరకు జీవించుటనుండి వెనుతిరుగవలెను. తమ స్వంత చిత్తమును కోరుకొనని వారి ద్వారా, ఆయన కొరకు సమస్తమును బలిపీఠముమీద పెట్టుటకు సిద్ధపడిన వారి ద్వారా మాత్రమే ఆయన దానిని కట్టగలడు.

పాత నిబంధన దేవాలయము, అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి అర్పించిన ప్రదేశములో, మోరీయా పర్వతము మీద కట్టబడెను(2దినవృత్తా 3:1). ఆ సమయములో అబ్రాహాముకు ఒక్క కుమారుడు మాత్రమే మిగిలియుండెను. అతడు తన ప్రియకుమారుడైన ఇస్సాకు. దేవుడు ఆ దినమున అబ్రాహాము జీవితములో ఇస్సాకు ఒక విగ్రహముగా మారెనా అని చూచుటకు అబ్రాహాము యొక్క భక్తిని పరీక్షించెను. ప్రభువుని సేవించుటకు అతడు తన విగ్రహారాధన అంతటినుండి వెనుదిరగవలెనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి అతడు తన కుమారుని బలిపీఠము మీదపెట్టి అర్పించవలసి వచ్చెను. దేవుడు ఇస్సాకును తీసుకొనిపోలేదు ఎందుకనగా అబ్రాహాము తనతో నడచుటకు ఆటంకముగా ఉండబోయే ఇస్సాకు పట్ల అతనికున్న అసహజమైన అనుబంధము నుండి అతనిని వేరుచేసెను. దేవుడు మనలోకూడా అదే చేయవలెను. మనకు ఎంతో అమూల్యమైన దానిని మనము విడిచిపెట్టవలెను. ధనికుడైన యౌవన అధికారి విషయములో అది అతని డబ్బు. దేవుడు అబ్రాహామును ఇస్సాకును త్యజించమని అడిగినట్లే, ఆయన ధనికుడైన యౌవన అధికారిని తన డబ్బును త్యజించమని అడిగెను. మనకు తెలిసినంతవరకు ఆ ధనికుడు ''అవును ప్రభువా, అంతయు తీసుకొనుము'' అని చెప్పియుండిన యెడల, దేవుడు అబ్రాహాముతో ఇస్సాకును ఉంచుకోమని చెప్పినట్లు, అతనితో తన డబ్బును ఉంచుకోమని చెప్పియుండవచ్చును కాని అతడు దానిని మొదట ఇచ్చివేయవలసియుండెను.

''ప్రభువా, నా జీవితములో ఎటువంటి ఇస్సాకులున్నప్పటికీ, వాటినన్నిటినీ బలిపీఠముమీద పెట్టి వాటినన్నిటినీ నీకు సమర్పింతును. నీకు నాకు మధ్య వచ్చే ఎటువంటి విగ్రహాలు నా జీవితములో నాకు వద్దు. నా కొరకు నేను జీవించాలని కోరుకొనుట లేదు. నేను నిజముగా నీకొరకు మాత్రమే జీవించాలనుకొనుచున్నాను. నేను దేవుని మహిమ కొరకు జీవించాలనుకొనుచున్నాను. నా జీవితమును నేను వృథాచేయదలచుకోలేదు'' అని చెప్పుటకు మనందరికీ కృప ఉండును గాక.

అధ్యాయము 9
క్రొత్త నిబంధన సేవకులు మరియు క్రొత్త నిబంధన సంఘములు

క్రొత్త నిబంధన సేవకులు

క్రొత్త నిబంధనలో ఒక నిజమైన దేవుని సేవకుడెవరో మనకు తెలియజేసే మూడు లేఖన భాగములు ఉన్నవి. మనము ఆ మూడు వాక్య భాగాలను ముందుగా ఏర్పరచుకొన్న ఎటువంటి అభిప్రాయాలు లేకుండా మనము చదివినప్పుడు, ఈనాడు, ఈ యుగములో, మనము కావాలనుకొంటే మనమందరము దేవుని సేవకులుగా ఉండవచ్చని మనము కనుగొనెదము. పాత నిబంధనలో, లేవీయులు మాత్రమే దేవుని సేవకులుగా ఉండగలిగిరి. వారు ఎటువంటి భూసంబంధమైన పనిని చేయకుండా నిషేధించబడిరి మరియు ఇశ్రాయేలీయుల యొక్క ఇతర గోత్రముల దశమ భాగములచేత వారు పోషించబడిరి. బబులోను సంబంధమైన క్రైస్తత్వము ఈనాడు క్రొత్త నిబంధనలో కూడా తమ లౌకికపరమైన ఉద్యోగాలను విడిచిపెట్టిన వారు మాత్రమే దేవుని సేవకులుగా ఉండగలరనియు మరియు వారు ఇతర క్రైస్తవుల యొక్క దశమభాగముల చేత పోషింపబడవలెననియు బోధించును. కాని ఇది మనుష్యుని పారంపర్యాచారము యొక్క బోధయేగాని లేఖనముల యొక్క బోధకాదు!

1. పాపము నుండి విమోచన

''ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున'' (రోమా 6:22). ఇది మొదటి అవసరత-పాపమునుండి విమోచింపబడుట. పాపమునుండి విమోచింపబడుట కంటే ఒకరి భూసంబంధమైన ఉద్యోగమును విడిచిపెట్టుట తేలిక. యేసు ఒక లౌకికపరమైన ఉద్యోగములో పనిచేసెను. కాని అప్పుడు కూడా ఆయన దేవుని సేవకునిగా యుండెను. కోపపడి తన నిగ్రహమును కోల్పోయే వ్యక్తి దేవుని సేవకుడు కాలేడు. అతడు ఒక బోధకుడై లేక ఒక ముఖ్యకాపరియై యుండవచ్చును గాని అతడు దేవుని సేవకునిగా ఉండలేడు. అనేకమంది కాపరులు ''అన్యభాషలలో'' ఆదివారపు ఉదయమున దేవునికి బిగ్గరగా స్తుతులు చెల్లింతురు. ఆ తరువాత అదే మధ్యాహ్నమున తమ మాతృభాషలో తమ భార్యల మీద కోపముతో అరిచెదరు. మనము అన్య భాషలలో మాట్లాడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మనలను నియంత్రించగలడా, కాని మన మాతృభాషలో మనము మాట్లాడినప్పుడు నియంత్రించలేదా? అది మోసము. నేను భాషలలో 22 ఏళ్లపాటు మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెప్పుదును. అది నాకు క్షేమాభివృద్ది కలుగజేసి, ఈ సంవత్సరములన్నియు నన్ను నిరాశ నుండి, నిరుత్సాహమునుండి దు:ఖము నుండి పూర్తిగా విడుదల చేసెను. కాని నేను నా మాతృభాషలో నా భార్యతో, నా సహోదరులతో, అపరిచితులతో, బిక్షగాళ్లతో మాట్లాడునప్పుడు కూడా పరిశుద్ధాత్మ నా భాషను నియంత్రంచుటను బట్టి నేను దేవునికి వందనాలు చెప్పుచున్నాను.

తన కళ్లతో స్త్రీలను మోహించువాడు సువార్తను ప్రకటించువానిగా లేక దేవుని సేవకునిగా కాలేడు. పాపమును చేయకుండుటకు తన కంటిని సహితము పెరికివేయుటకు సిద్ధముగా నున్నంత తీవ్రముగా నుండేవాడే దేవుని సేవకుడు కాగలడు. మీరు చివరిసారిగా మీ కళ్ల విషయములో పాపముచేసినందున రాత్రిపూట మీ దిండు మీద కన్నీళ్లు విడచినది ఎప్పుడు? మీరు ఈ విషయమును తేలికగా తీసుకొన్న యెడల, మీ అంతరంగములో మీరు కొద్ది కొద్దిగా దిగజారి ఒక రోజు బహిరంగముగా పడిపోవుదురు. తన కొరకు కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించుకొనుటకో లేక కొద్ది ఘనతను సంపాదించుకొనుటకో అబద్ధము చెప్పు ఒక వ్యక్తి నిజానికి అపవాది యొక్క సేవకుడు -ఎందుకనగా అపవాది అబద్ధమునకు జనకుడైయున్నాడు. అతడు దేవుని సేవకుడు కాలేడు. తన శత్రువులందరినీ ప్రేమించలేనివాడు లేక తనకు హాని చేసినవారికి మంచిచేయలేనివాడు సువార్తను ప్రకటించుటకు పూర్తిగా అనర్హుడు. మీకు ఎవరికి వ్యతిరేకముగానైనా కొంచెమైనా కోపముగాని క్షమింపలేనితనముగాని మీ హృదయములో నున్నయెడల, మీరు చేయగలిగిన ఉత్తమమైన పని మీ నోరు మూసుకొని, ఇంటికి వెళ్లి, మారుమనస్సు పొంది, ఆ పాపములనుండి మీ హృదయములను శుభ్రపరచుకొనుటయే. మీరు దేవుని సేవకులుగా ఉండలేరు.

2. సిరినుండి విడుదల

''ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను'' (లూకా 16:13). ఇది రెండవ అవసరత-సిరి నుండి (డబ్బునుండి సమస్త భౌతికమైన వాటినుండి) విమోచింపబడుట. మరలా చెప్పాలంటే, సిరినుండి విడుదల పొందుటకంటే ఒకరి లౌకికపరమైన ఉద్యోగమునుండి విడుదల పొందుట తేలిక. మీరు ఎవరిని సేవించబోవుచున్నారో అనుదానిని మీరు ఎన్నుకోవలెను-దేవుడు లేక సిరి. అనేకమంది ''పూర్తికాల సేవకులు'' దేవునిని మరియు సిరిని సేవించాలని చూచుచున్నారు. వారు ఒక లౌకికమైన ఉపాధిలో ఉండి దాని ద్వారా సంపాదించగలిగిన దానికంటే ఈ రోజున వారు ''దేవుని సేవకులు''గా పిలువబడుచు ఎక్కువ సంపాదించుచున్నారు. దేవుని సేవించుటకు భూసంబంధమైన సుఖాలను, డబ్బును, భౌతికపరమైన వస్తువులను త్యాగము చేయనివాడు నిజముగా దేవునిని సేవించుటలేదు.

ఏ విశ్వాసియైనా దేవుని సేవకుడు కాగలడు-కాని అతడు సిరిని ప్రేమించుట నుండి విడుదల పొందవలెను. నిజానికి, మీరు పై వచనమును జాగ్రత్తగా చదివినట్లయితే, దేవుని సేవకులుగా ఉండుటకు మనము సిరిని ద్వేషించి, తృణీకరించవలెనని యేసే చెప్పెనని మీరు కనుగొందురు. సిరి యెడల మీ వైఖరి అలా ఉన్నదని లేక అటువంటి వైఖరిని మీరు కలిగియుండగోరుచున్నారని మీరు దేవుని యెదుట చెప్పగలిగిన యెడల, అప్పుడు దేవుని సేవకులుగా ఉండుటకు మీకు అర్హత ఉన్నది-లేనియెడల లేదు. యేసు ఇక్కడ చెప్పిన ప్రమాణము ప్రకారము ఎంతమంది పూర్తికాల సేవకులకు అర్హత ఉన్నది? బహు కొద్దిమందికే!

మనము ఎవరి ఆజ్ఞలను గైకొనుచున్నామో అనుదాని ద్వారా మనము ఎవరిని సేవించుచున్నామో కనుగొనవచ్చును. మన జీవితాలలో ఎవరి హక్కులకు ప్రాముఖ్యత ఉన్నది-దేవుని హక్కులకా లేక సిరి హక్కులకా? ఎవరూ ఇద్దరు యజమానులను సేవించలేరు. డబ్బు మిమ్ములను పిలచినప్పుడు మీరు వెంటనే స్పందిచినయెడల, మీరు సిరికి దాసులు. ఎందుకని ఎక్కువమంది బోధకులు ధనిక విశ్వాసులున్న సౌకర్యవంతమైన ప్రదేశాలలో బోధించుటకు మాత్రమే ప్రయాణించుదురు. భారతదేశములో ఉన్న పేద విశ్వాసులను క్రమక్రమముగా దర్శించి వారిని విశ్వాసములో స్థిరపరచుటకు ఎంత మంది ఆసక్తి కలిగియున్నారు. వారే భారతదేశములో దేవుని నిజమైన సేవకులు.

అనేకమంది భారతీయ పూర్తికాల సేవకులు ఇప్పుడు అమెరికాలో జీవించుచు, భారతదేశము కొరకు భారమున్నదని చెప్పుకొందురు. అది వట్టి వేషధారణ. అయినప్పటికీ అనేకమంది విశ్వాసులు వారిచేత మోసగింపబడుచున్నారు. వారికి భారతదేశము కొరకు నిజముగా భారమున్న యెడల, వారు భారతదేశములోనే నివసించియుండేవారు. ఒక విశ్వాసి మరియొక దేశమునకు తన నివాసస్థలమును మార్చుటలో ఏ తప్పులేదు. కాని అలా చేయుటకు తనకున్న ఉద్దేశ్యము ముఖ్యమైనది. యేసు కూడా తన నివాసస్థలమును పరలోకమునుండి భూమికి మార్చెను. కాని ఆయన ఉద్దేశ్యమేమిటి? అది సుఖసౌకర్యములు మరియు డబ్బా? లేక అది దేవుని మహిమ కొరకు అవసరతలో ఉన్నవారికి సహాయపడుటకా? ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశమునకు మారుటకు నీవు ఎందుకు నిర్ణయించుకొంటివో చూచుకొనవలెను. నీవు దేవుని దాసుడవో లేక సిరికి దాసుడవో అది సూచించును. సిరిని సేవించువాడు దేవునికి పనికిరాడని అపవాదికి తెలియును. కాబట్టి అతడు అటువంటి బోధకులను విడిచిపెట్టును. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి లోకస్తులనుండి భ్రష్టుపట్టిన క్రైస్తవలోకపు నాయకులనుండి ఘనత పొందుటకు నిన్ను అనుమతించుటయే అపవాది నీకు చేయగలిగిన అతిగొప్ప అవమానము.

ఒక దేవుని సేవకుడు నిరంతరము ఆత్మలను ఎలా గెలవాలని(రక్షణలోనికి నడిపించాలని) మరియు సంఘమును ఎలా కట్టాలని ఆలోచించును. రాత్రిపూట కూడా దాని గురించే కలలు కనును. అయితే సిరి యొక్క దాసుడు రాత్రింబగళ్ళు ఎలా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచించి కలలుకనును. మన ''మనస్సాక్షిని''(రబప-షశీఅరషఱశీబర)ను మనము మోసగించలేము. ఎందుకంటే దానికి అందరికంటే ఎక్కువగా మనము ఖచ్చితముగా దేనిని కోరుకొనుచున్నామో తెలియును. మనము సిరిని ప్రేమించుచుంటే మనము యధార్థముగా ఉండి దేవునితో చెప్పి దాని నుండి మనలను విడిపించమని ఆయనను అడుగవలెను. యధార్థవంతులైన విశ్వాసులకు గొప్ప నిరీక్షణ కలదు. కాని యధార్థతలేని వేషధారులకు ఎటువంటి నిరీక్షణలేదు.

ఈ రోజుల్లో మనము అనేక ''అద్భుత సమావేశాల''ను (కూటములను) గూర్చి విందుము. కాని ''ప్రజలను డబ్బులు అడుగని'' అద్భుతము జరుగు కూటములను చూచుటకు నేనింకా ఎదురుచూచుచున్నాను. యేసు మరియు ఆయన అపొస్తలులు వారి కూటములలో ప్రజల యొద్దనుండి కానుకలను ఎప్పుడు తీసుకోలేదు. కాని గ్రుడ్డివారును అవివేకులైన విశ్వాసులు ఈ రోజున సిగ్గులేకుండా డబ్బు అడుగు బోధకులను ప్రశంసించి వీరు దేవుని గొప్ప సేవకులని కూడా ఊహించుకొందురు. క్రీస్తు న్యాయ-పీఠము యొక్క స్పష్టమైన వెలుగు, అటువంటి బోధకులు దేవునిని గాక తమ్మును తామే సేవించుకొన్నారని బయలుపరచును. విశ్వాసులు సాంప్రదాయకమైన సిద్ధాంతముగలవారిని అలా కానివారినుండి వేరుపరచుటకు ఒక గీతను గీయుదురు. కాని అటువంటి సందర్భములో అపవాది మరియు అతని దయ్యములందరు సాంప్రదాయకమైన సిద్ధాంతములు గలవారి ప్రక్కనే ఉందురు ఎందుకనగా వారి సిద్ధాంతములు సరియైనవియే (యాకోబు 2:19). కాని దేవుడు సిరిని ప్రేమించువారిని దేవుని ప్రేమించువారినుండి వేరుపరచుటకు ఒక గీత గీయును. అప్పుడు అపవాది అతని దయ్యములు సిరిని ప్రేమించువారిలో ఉందురని మనము కనుగొనెదము.

మనము దేవుని రాజ్యమును మొదట వెదకిన యెడల, భూమి మీద మనకు జీవించుట కొరకు అవసరమైన వాటినన్నిటిని, మనము వాటికొరకు ప్రయాసపడకుండా, దేవుడు మనకిచ్చును. నా 40 ఏళ్ల క్రైస్తవ అనుభవమంతటిలో ఇది నిజమని నేను కనుగొంటిని. ఆకాశమును భూమియు గతించును గాని దేవుని వాక్యము ఎప్పుడు గతించదు. తన రాజ్యమును మొదట వెదకినవారందరి యొక్క అవసరతలన్నిటిని దేవుడు తీర్చునన్న సత్యమునకు మనము సజీవమైన ప్రదర్శనలుగా(సాక్షులుగా) ఉండాలి. మన క్రైస్తవ జీవితమంతటిలో అన్ని సమయాలలోను దేవుని రాజ్యమును స్థిరముగా మొదట వెదకితిమని మనలో ఎవరు చెప్పలేనప్పటికీ, మనము నిశ్చయముగా డబ్బు వెంట పరుగెత్తలేదని సాక్ష్యము చెప్పగలిగియుండాలి. మనము బోధకులమైతే, మనము ఎక్కడికైనా బోధించుటకు వెళ్లినప్పుడు కేవలము అక్కడ డబ్బు పొందగలమని తెలియుటను బట్టి వెళ్లలేదనియు, ధనికులను సంతోషపెట్టుటకు మనము చూడమనియు, పేదవారిని నిర్లక్ష్యము చేయమనియు, కానుకలు పట్టుటకు మనకు ఆసక్తి లేదనియు, మన ఆర్థిక అవసరతలను ప్రజలకు తెలుపమనియు, ప్రజలు మనకు డబ్బులిచ్చెదరని ఎదురుచూడమనియు మనము సాక్ష్యము కలిగియుండవలెను. అటువంటి జీవితమును జీవించినట్లు పౌలు సాక్ష్యమివ్వగలిగెను. పౌలు దేవునిని సేవించినట్లు తాము కూడా దేవునిని సేవించుచున్నామని చెప్పుకొనే ఆ కాలములో డబ్బును ప్రేమించే బోధకులందరినీ బయటపెట్టుటకు తాను అలా జీవించియున్నానని పౌలు చెప్పెను (2కొరింథీ 11:10-13 లివింగు బైబిలు).

మన కాలములో కూడా, భారతదేశములోని క్రైస్తవత్వములో సమృద్ధిగా కనిపించే డబ్బును ప్రేమించు బోధకులను బయటపెట్టే పౌలు వంటి సజీవసాక్షుల అవసరత భారతదేశములోనున్నది. అపవాది మమ్ములను మా పరిచర్యను ఎందుకు ద్వేషించునో మాకు బాగుగా తెలియును. అతడు మా కూటములకు ఎప్పుడు రానివారిని మరియు మేము మాట్లాడుట వినని వారిని మమ్మును మత భ్రష్టులనియు, క్రీస్తువిరోధులనియు, ఉగ్రవాదులనియు, అబద్ధప్రవక్తలనియు పిలచునట్లు చేయును. డబ్బును ప్రేమించి క్రీస్తు సువార్తను ప్రకటించు పూర్తికాల సేవకులు నిజానికి సాతాను సేవకులన్న సత్యమును బయటపెట్టుట ద్వారా మేము సాతాను రాజ్యమునకు సమస్యలు కలిగించుచున్నందున సాతాను అలా చేయును (2కొరింథీ 11:15ను 10-13 వచనాల సందర్భములో చూడండి).

సిరిని ఉపయోగించే విషయములో మనము నమ్మకముగా లేనియెడల దేవుడు తన రాజ్యము యొక్క సత్యమైన ధనమును మన వశము చేయడని యేసు చెప్పెను (లూకా 16:11). భారతీయ క్రైస్తవులు పాశ్చాత్య క్రైస్తవులను గ్రుడ్డిగా అనుకరించుటను, దేవుని వాక్యము మీద ప్రత్యక్షత యొక్క ఘోరమైన కొరతను, ఈ కాలము బోధకుల యొక్క విసుగుపుట్టించే బోధను మనము చూచినప్పుడు, ఈ బోధకులు డబ్బు విషయములో నమ్మకముగా లేకపోవుటయే దీనంతటికీ కారణమని మనము స్పష్టముగా అర్థము చేసుకొనవచ్చును.

3. మనుష్యులను సంతోషపెట్టగోరుట నుండి విమోచింపబడుట

''నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును'' (గలతీ 1:10).

ఇది మూడవ అవసరత, మనుష్యులను సంతోషపెట్టగోరుటనుండి విడిపింపబడుట. మరోసారి చెప్పాలంటే, మనుష్యులను సంతోషపెట్టగోరుట కంటే ఒక లౌకిక పరమైన ఉద్యోగమునుండి విడుదలపొందుట తేలిక. మనము మనుష్యులను సంతోషపెట్టుటకు దేవుని వాక్యమును బోధించినయెడల మనము మనుష్యులకే గాని దేవుని సేవకులము కాము. ఒక బోధకుడు వచ్చే సంవత్సరము ఎక్కువ డబ్బును ఘనతను పొందగలిగే ఒక ప్రతిష్టాత్మకమైన సమావేశమునకు మరల తిరిగి ఆహ్వానింపబడగోరిన యెడల, అతడు చెప్పుదానిని బట్టి ఎవరు అభ్యంతరపడకుండా ఉండునట్లు తన వర్తమానము సవరించుటకు శోధింపబడవచ్చును. ఆ విధముగా అతడు మనుష్యులకు దాసుడగును. మీరు మనుష్యులను మెప్పించుటకు బహిరంగముగా ఒక విధముగా ప్రార్థించినప్పుడు మీరు సజీవుడైన దేవునిని కాక మనుష్యుల అభిప్రాయములను ఆరాధించుచున్నారు. దేవుడు అటువంటి ప్రార్థనలను వినడు, ఎందుకనగా అవి ఆయనకు కాక మనుష్యులకు అర్పింపబడినవి.

అదేవిధముగా, మనము ఎటువంటి వస్త్రములను ధరించుదుమో, ఎలా ప్రజలతో మాట్లాడుదుమో, మనము నడిచే తీరును గురించి కూడా మనలను మనము పరీక్షించుకొనవచ్చును. వీటిలో దేనినైనను మనుష్యులను మన ''పరిశుద్ధత''తో లేక బహుశా మన ''దీనత్వము''తో మెప్పించుటకు మనము చేసిన యెడల మనము మనుష్యులకే గాని దేవునికి దాసులము కాము. మీరు మీ భర్తనుగాని భార్యనుగాని సంతోషపెట్టగోరినా కూడా, మీరు దేవునిని సంతోషపెట్టలేరు. మీరు దేవునిని ఎంత ఎక్కువగా సంతోషపెట్టుదురో ఎంత ఎక్కువగా మీరు దేవుని ఎరుగని మనుష్యుల చేత, క్రైస్తవలోకము యొక్క మతపరమైన నాయకుల చేత కూడా చెడు పేర్లతో పిలువబడుదురు. యేసు ''దయ్యములకు అధిపతి'' అని పిలువబడెను. ఆయన శిష్యులు పోపును గాని బిషప్పును గాని, ముఖ్యకాపరిని గాని భూమిమీద ఇంకే మనుష్యుని గాని సంతోషపెట్టగోరరు కాబట్టి వారింకెంతగా అటువంటి పేర్లతో పిలువడుదురో.

క్రొత్త నిబంధన సంఘములు

ఈ రోజుల్లో, అనేకమంది విశ్వాసులు తమ స్వంత మత శాఖలతో విసిగిపోయి, ఒక క్రొత్త నిబంధన సంఘమును వెదకుట కొరకు వాటిని విడిచిపెట్టుచున్నారు. ''క్రొత్త నిబంధన సంఘములు'' అని చెప్పుకొనే అనేకమైన గుంపులు కూడా ఉన్నవి. కాని ఒక క్రొత్త నిబంధన సంఘమును మనము ఎలా గుర్తుపట్టగలము? అది నిశ్చయముగా దాని కూడికల యొక్క క్రమమును బట్టికాదు. ఒక శక్తివంతమైన సంఘములో మనముచూచే క్రమములో అనేకమైన వాటిని అనుకరించినప్పటికీ, మనము ఒక శక్తివంతమైన సంఘము కాకపోవుట సాధ్యమే.

మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారము వంటి దానినే సరిగ్గా ఫిలిష్తీయులు కట్టుట సాధ్యమే ఎందుకనగా, దాని వివరములన్నియు నిర్గమకాండములో స్పష్టముగా ఇవ్వబడినవి. కాని ఆ ప్రత్యక్షపు గుడారమునకు సంబంధించిన ఒక్క విషయమును ఎవరు అనుకరింపలేకపోయి యుండేవారు-అది ఆ ప్రత్యక్షపు గుడారము మీద నిలిచిన దేవుని మహిమయను అగ్ని. అరణ్యములో ఆ ఒక్క విశేషమైన గుర్తు చేత దేవుని నివాసస్థలము గుర్తింపబడెను. అది లేకుండా ఆ ప్రత్యక్ష గుడారము ఒక ఖాళీ గుల్లగా నుండును. తరువాత సొలొమోను సమయములో ప్రత్యక్ష గుడారము యొక్క స్థానములో దేవాలయము వచ్చినప్పుడు దేవుని మహిమ దానిని నింపెను. కాని తరువాత, ఇశ్రాయేలు దిగజారినప్పుడు, ఆ మహిమ నెమ్మదిగా బయటకు వెళ్లిపోయెను (యెహెజ్కేలు 10:4,18,19). అప్పుడు ఆ ఆలయము ఒక ఖాళీ గుల్లగా మారెను. ఈ రోజున అనేక సంఘముల విషయములో కూడా అదే జరుగుచున్నది.

క్రొత్త నిబంధన సంఘమునకు ఉన్న ఒక్క గుర్తు దాని మధ్యలో ఉన్న దేవుని సన్నిధి. ఒక సంఘకూడికలో ప్రవచనాత్మ శక్తివంతముగా ఉన్నప్పుడు, ఆ కూడికకు వచ్చువారు సాగిలపడి, ''దేవుడు అక్కడ ఉన్నాడని అంగీకరించుదురు'' (1కొరింథీ 14:24,25). యేసు సంఘములో ప్రవచనాత్మకముగా మాట్లాడినప్పుడు, ఎమ్మాయి గ్రామమునకు వెళ్లే ఇద్దరి శిష్యుల హృదయాలు యేసు వారితో మాట్లాడినప్పుడు మండినట్లు, మన హృదయాలు కూడా మండును (లూకా 24:32). దేవుడు దహించు అగ్నియై యున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుటకు ఒక పొదలోకి దిగివచ్చినప్పుడు, ఆ పొద మండెను మరియు ఏ పురుగు దానిలో జీవించగలిగి యుండలేకపోయెను. సరిగ్గా అదే విధముగా, ఈ రోజున శక్తివంతమైన మండే దేవుని సన్నిధి ఉన్న చోట ఏ పాపము దాగి బయటపడకుండా ఉండలేదు. అటువంటి సంఘము మాత్రమే ఒక క్రొత్త నిబంధన సంఘము. యేసుని నేత్రములు అగ్నిజ్వాలవలే ఉన్నవి (ప్రకటన 1:14). మరియు ఆయన కట్టుచున్న సంఘములన్నిటిలో ఆయన నిరంతరము పాపమును, మానవ ఆచారాలను పరిసయ్యుల బోధను వెదకుచు బయటపెట్టుచున్నాడు.

పరలోక రాజ్యమునకు ప్రధానమైన తాళపుచెవి ఆత్మవిషయమైన దీనత్వము (మత్తయి 5:3).

ఇది లేకుండా మనము క్రొత్త నిబంధన సంఘమును కట్టలేము. ఆత్మవిషయమై దీనులుగా ఉండుట అంటే, మన అవసరతను గుర్తించుచు దేవుని యెదుట విరగగొట్టబడియుండుట, ఎందుకనగా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మనము కూడా పరిపూర్ణులుగా ఉండుటకు మనము ఒక గొప్ప తీవ్రమైన వాంఛను కలిగియున్నాము. ''విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు'' (కీర్తనలు 34:18). ఆయన సమీపముగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధి పరలోకపు అగ్నిని మన హృదయాలలోకి తీసుకొనివచ్చి మనమెక్కడికి వెళ్లినను మన ద్వారా ఇతరులకు దానిని తెచ్చును.

అననీయ సప్పీరా (అపొ.కా. 5వ అధ్యాయము) దేవుని సన్నిధి అగ్నివలే మండుచున్న యెరూషలేములోని శక్తివంతమైన క్రొత్త నిబంధన సంఘములో చేరినప్పుడు ఘోరమైన తప్పిదము చేసిరి. వారుగనుక తరువాతి సంవత్సరాలలో కొరింథులోనున్న సంఘములో నున్నయెడల వారు దీర్ఘాయుషు గల జీవితాలను జీవించియుండెడివారు. అననీయ అక్కడ ఒక సంఘపెద్ద కూడా అయ్యిండెడివాడు-ఎందుకనగా కొరింథులో ఉన్న సంఘము ఒక శరీరానుసారమైన మృతమైన సంఘము గనుక. కాని యెరూషలేములోనున్న మండుచుండే క్రొత్త నిబంధన సంఘములో, ఈ దంపతులు మనుగడ సాగించలేకపోయిరి. ఏ క్రొత్త నిబంధన సంఘములోనైనా వేషదారణలో జీవించే వారిని దేవుడు బయటపెట్టి తీసివేయును.

ఇంటి యొద్ద లేక మనము పనిచేయు స్థలములో మన జీవితాలో దేవునిని అవమానపరచేది ఏదైనా ఉన్న యెడల, మనము ఒక నిజమైన క్రొత్త నిబంధన సంఘము యొక్క సభ్యులుగా ఉన్న యెడల మనము ఒక గొప్ప ప్రమాదములో ఉన్నాము. మీ జీవితములో మీ ప్రధాన గురి దేవుని మహిమను వెదకుట కాక, మీ కొరకో మీ కుటుంబము కొరకో ఏదోఒకటి కోరుకొనుట అయితే, దేవుని సన్నిధి శక్తివంతముగా ఉండి ఆయన వాక్యము శక్తివంతముగా ప్రకటింపబడు క్రొత్త నిబంధన సంఘమును మీరు విడిచిపెట్టుట ఎంతో మెరుగైనది. మీరు ఒక మృతమైన సంఘములో చేరుట మీకు మంచిది. అప్పుడు కనీసము, అననీయ సప్పీరాల వలే కాక మీరు దీర్ఘకాలము జీవించెదరు!

తమ్మును తాము ''క్రొత్త నిబంధన సంఘాలు'' అని పిలచుకొనే అనేకమైన సంఘాలు ఈనాడు కలవు. కాని అవి (అంతరించి పోయిన) ఒక మృతమైన డోడో పక్షి వలే నున్నవి. పేరులో ఏమిలేదు. ప్రశ్న ఏమిటంటే అక్కడ పరిసయ్యులు వేషదారులు సుఖంగా జీవించగలరా లేక వారు బయటపెట్టబడి అభ్యంతరపడి వెళ్లిపొవుదురా అన్నది. ఒక క్రొత్త నిబంధన సంఘములో అనేకులు వాక్య ప్రకటన వలన అభ్యంతరపడి సంఘమును విడిచిపెట్టుదురు. ''ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు'' అని యెరూషలేములోని సంఘము గురించి వ్రాయబడినది (అపొ.కా.5:13).

పెద్దలుగా మన కోరిక యేసు కొరకు శిష్యులను చేయుటకాక మన సంఖ్యలను పెంచుకొనుట అయినయెడల, మన సంఘాలలో మనము పరిసయ్యులను మరియు వేషదారులను పోగుచేసుకొనెదము. ఒక సంఘములో యేసు యొక్క సన్నిధి బలముగా ఉన్నయెడల, దానిలో ఉన్న శిష్యులు ఆయన మహిమను చూచుటకు ప్రాముఖ్యతనిచ్చెదరు. మనము నిజముగా తిరిగిలేచిన ప్రభువు యొక్క మహిమను చూచామనుటకు ఋజువేమిటంటే, భూసంబంధమైన విషయాలు (సుఖము, ఘనత, ధనము వంటివి) మన కళ్లకు మసకగా కనిపించి ఒకప్పుడు వాటి కొరకు మనకున్న ఆకర్షణను కోల్పోవును. ఒక క్రొత్త నిబంధన సంఘములో శక్తివంతమైన వాక్య ప్రకటనయే కాక, వాక్యము యొక్క సజీవమైన మాదిరులు కూడా ఉండును. దేవుని కొరకు ఇతరులపై ప్రభావము చూపునది క్రొత్త సిద్ధాంతము కాదు గాని పరిశుద్ధమైన జీవితములు. క్రొత్త నిబంధన సేవకులు కేవలము ఇతరులకు బోధించుట మాత్రమే కాక, వారిని తమ మాదిరిని అనుసరించమని ఆహ్వానించెదరు (1కొరింథీ 11:1).

మన మాదిరి యోగ్యమైనది కానప్పుడు మనము దు:ఖపడవలెను. మనము ప్రజలను తాజాగాలేని, అభిషేకములేని వర్తమానములతో విసిగించినప్పుడు, సిగ్గుతో మన తలను దించుకోవలెను. మనము యేసును వెంబడించిన యెడల చల్లగాగాని లేక పరిసయ్యులవలేగాని మారుట అసాధ్యము. మనము మాట్లాడుటకు కేవలము కలలు దర్శనాలను మాత్రమే కలిగియుండి, ప్రజలకు ఆహారమిచ్చుటకు ప్రభువు యొద్దనుండి ఏ మాటలేనియెడల మనము యేసుకు చాలా దూరముగా ఉన్నాము. మనము దేవునికొరకు మండుచున్నయెడల, ప్రజలను విసిగించుట అసాధ్యము.

ఆయనకు అన్నిటిలోను ప్రాముఖ్యము కలుగునిమిత్తము యేసు మృతులలోనుండి లేపబడెను (కొలొస్స 1:18). దీనిని వారి ఆశయముగా కలిగిన వారందరికీ దేవుడు పూర్తిగా మద్దతిచ్చును. దీని అర్థమేమిటంటే మనము మన స్వంత ప్రణాళికలను హక్కులను విడిచిపెట్టి మనము ఏమిచేయవలెనో, మన డబ్బును సమయమును ఎలా ఉపయోగించవలెనో యేసు మనకు చెప్పుటకు అనుమతించెదము. జీవితములో ఇది మీ ఏకైక ఆశయమైతే, మీరుండు స్థలములో క్రొత్త నిబంధన సంఘము కట్టుటకు దేవుడు మిమ్మును వాడుకొనునని మీరు నిశ్చయముగా నమ్మవచ్చును.

తాము ఆయన నామమును ఉచ్ఛరించినందున యేసు తమ మధ్య ఉన్నాడని అనేకులు చెప్పుకొందురు. కాని వారు తమ్మునుతాము మోసగించుకొనుచున్నారు. ఆయన నిజముగా వారి మధ్య ఉంటే ఆ కూటములు ఎందుకు విసుగుపుట్టించేవిగా ఉండును? ఎందుకు జీవితాలలో పరివర్తన లేదు? ఒక నిజమైన భక్తిపరుని యొక్క సహవాసములో గడిపిన కొద్దిసమయము కూడా మనపైన ఎంత లోతైన ప్రభావమును చూపునంటే అది మన జీవితాల యొక్క దిశను కూడా మార్చివేయును. మనము స్వయంగా యేసుతోనే కొద్ది సమయము గడిపితే మన జీవితాలపైన ఇంకెంత ప్రభావము ఉండవలెను. కాబట్టి సంఘ కూడికల ద్వారా జీవితాలు పరివర్తన చెందకపోయినయెడల, మన కూడికలలో ప్రభువు యొక్క సన్నిధిలేదని మనము ఒప్పుకొనవలెను. అప్పుడు మనము ఒక క్రొత్త నిబంధన సంఘముగా లేము.

ఈ భూమి మీద ఒక పరిపూర్ణ సంఘమును మనమెప్పుడు కట్టలేము. యేసు పండ్రెండు మంది అపొస్తలులతో కట్టిన మొదటి సంఘములో కూడా ఒక ద్రోహియుండెను. కాబట్టి మనము ఇంకా మెరుగైనదాని కొరకు ఆశపడలేము. కాని ఈ రోజున యేసు తన సంఘమును ఎక్కడ కట్టునో, ఆ సంఘము యొక్క కేంద్రములో, ఆయన మహిమను చూచి దానితో పట్టబడిన ఒక ప్రజల కేంద్రముండును. వారి హృదయములు అపవాది ఆర్పలేని ఒక మంటతో మండుచుండును. వారి ద్వారా ప్రభువు దేవుని మహిమార్థమై ఒక క్రొత్త నిబంధన సంఘమును కట్టును.

అధ్యాయము 10
కయీను మరియు హేబెలునుండి పాఠములు

వాక్య పఠనము: ఆది కాండము 4:1-12.

ఆదాము మరియు హవ్వ ఏదేను వనమునుండి వెళ్లగొట్టబడిన తరువాత ఇది బైబిలులో నమోదుచేయబడిన మొదటి సంఘటన. ఇక్కడ ఒకే గృహములో, ఖచ్చితముగా ఒకే పరిస్థితులలో, ఒకే నేపథ్యముతో నిజమైన దేవునిగూర్చి ఒకే బోధ మొదలగువాటితో పెంచబడిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాని వారి జీవితములు చివరకు ఎంతో వ్యత్యాసముగా మారెను. యేసు తన వధువు కొరకు వచ్చునప్పుడు ఇద్దరు ఒక మంచము మీద ఉందురు.కాని ఒకరు కొనిపోబడి వేరొకరు విడిచిపెట్టబడవచ్చును. ఇద్దరు ఒకే సంఘములో సహవాసము చేయుచుండవచ్చునుగాని ఒకరు కొనిపోబడి వేరొకరు విడిచిపెట్టబడుదురు.

కయీను హేబెలు విషయములో కూడా అలానే ఉండెను; ఒకరు అంగీకరింపబడిరి, వేరొకరు తృణీకరింపబడిరి. ఇద్దరు మత భక్తి కలిగినవారే. ఇద్దరూ దేవునికి అర్పణలు తెచ్చిరి కాని వారి హృదయవైఖరులు వేరుగా ఉండెను మరియు అదే తేడానంతటిని తెచ్చెను. మనుష్యుడు పైరూపమును లక్ష్యపెట్టును గాని దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. మనము సామాన్యముగా వినిన హేబెలు మరియు కయీనుకు మధ్య తేడా, ఒకరు గొఱ్ఱెపిల్లను తెచ్చుటయు (దాని రక్తము చిందించెను) మరియు వేరొకరు పొలము పంటలోని కోతను తెచ్చుటయు కాదు. వారు తమ పాపముల కొరకు బలిని అర్పించలేదు కాని ప్రభువుకు ఒక అర్పణను తెచ్చిరి. మోషే ధర్మశాస్త్రము క్రింద కూడా అర్పణగా ప్రభువుకు తెచ్చుట అనుమతింపబడెను (ద్వితియోప 26:2,10). రాబడి అంతటిలో ప్రథమ ఫలములనిచ్చి ప్రభువును ఘనపరచమని సామెతలు 3:9లో హెచ్చరిక ఉన్నది. హేబెలు విషయములో, అతడు గొఱ్ఱెల కాపరి గనుక, ఇది తన మందలో తొలిచూలుగా నుండెను. కయీను విషయములో, అతడు భూమిని సేధ్యపరచువాడు గనుక, ఇది భూమి యొక్క ఫలముగా ఉండెను (ఆదికాండము 4:2). వారిరువురు తమ సంబంధిత వృత్తుల యొక్క ప్రథమ ఫలములను తెచ్చిరి. ఈ విషయములో, కయీనులో తప్పుపట్టుటకు ఏమి లేదు.

అంగీకారయోగ్యమైన బలులు

తన నిస్సహాయతను శూన్యత్వమును ఎరిగిన విరిగి నలిగిన హృదయమే దేవునికిష్టమైన బలి (కీర్తనలు 51:17). ఇటువంటి హృదయమును హేబెలు కలిగియున్నాడు కాని కయీను కలిగిలేడు. అందుకనే, ''యెహోవా హేబెలును, అతని అర్పణను లక్ష్యపెట్టెను, కాని కయీనును (కాబట్టి) అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు'' (ఆదికాండము 4:4,6) అని వ్రాయబడియున్నది. విశ్వాసము అనగా ఆత్మవిషయములో నిస్సహాయముగా దేవుని మీద ఆధారపడుట. విశ్వాసమును బట్టి హేబెలు కయీనుకంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను (హెబ్రీ 11:4). కాబట్టి హేబెలు యొక్క అర్పణలు దేవునికి అంగీకారయోగ్యముగా నుండెను. కయీను హేబెలు మధ్యనున్న వ్యత్యాసము, హేబెలు రక్తము నర్పించెను మరియు కయీను అర్పించలేదు అన్న బోధలో గొప్ప మోసము ఉన్నది. అటువంటి బోధ యొక్క అనువర్తన ఏమిటంటే ఒక మనుష్యుడిని దేవునియెదుట అంగీకారయోగ్యముగా చేయునది అతడు దేవుని ఎదుట యేసు రక్తమును తెచ్చుట అనునది.

ఆ మనుష్యుడు ఎలా జీవించుచున్నాడో మరియు అతని హృదయము యొక్క స్థితికి (అది విరిగి నలిగినదో కాదో లేక విశ్వాసమున్నదో లేదో) ఎటువంటి ప్రాముఖ్యత లేనట్టుగా నున్నది. అతడు ఒక మంత్రకట్టువలే యేసు రక్తమును జపిస్తే అతడు దేవుని యెదుట అంగీకారమును పొందును. ఇది ఒక అబద్ధము. మరియు అనేకులు దానిచేత మోసగింపబడుచున్నారు. యేసుయొక్క రక్తమును ఎవరు పడితే వారు తమకు చెందినదానిగా చెప్పుకోలేరు. యేసుయొక్క రక్తము ఎవరుపడితే వాళ్లను తమ పాపములనుండి పరిశుద్ధపరచునని లేఖనములలో చెప్పబడలేదు. లేదు. అది లేఖనములను నిగూఢముగా వక్రీకరించుట. లేఖనము ఏమి చెప్పుచున్నదంటే ''దేవుడు వెలుగులోనున్న ప్రకారము వెలుగులో నడచు'' వారి నందరిని యేసు యొక్క రక్తము పరిశుద్ధ పరచును అని చెప్పుచున్నది. (1యోహాను 1:7). దేవుని వెలుగులో నడవాలంటే హేబెలుకు ఉండినట్లు ఒకడు విరిగి నలిగిన హృదయమును కలిగియుండవలెను. అప్పుడుమాత్రమే ఒకరి అర్పణ దేవునికి అంగీకారయోగ్యముగా ఉండును.

ఒక వ్యక్తి యేసుని రక్తమును నమ్ముచున్నానని చెప్పుచు ఒక గర్వించే అహంకారము కలిగిన ఆత్మను కలిగియున్నయెడల కయీనును ఎదిరించినట్లే దేవుడు అతనిని ఎదిరించి వ్యతిరేకించును (1పేతురు 5:6). దీనులు మాత్రమే దేవునియొద్దనుండి కృపను పొందెదరు (యాకోబు 4:6). మన ఆరాధన, ప్రార్థన, పరిచర్య అను అర్పణలు ఒక విరిగినలిగిన విశ్వాసముతో కూడిన (దేవుని మీద దీనత్వముతో ఆధారపడు) హృదయము నుండి వచ్చునప్పుడు మాత్రమే అవి దేవునికి అంగీకారయోగ్యమగును. దేవుడు చూచేది మన మాటలయొక్క అనర్గళతను మరియు మన పరిచర్యయొక్క సమర్థతను కాదు గాని, మన హృదయముల యొక్క వైఖరిని. ఆదికాండము 4వ అధ్యాయము నుండి మనము నేర్చుకోగలిగిన మొదటి పాఠము ఇదే.

కయీను మరియు హేబెలు దినములనుండి అంత్యకాలము వరకు ఒక విరిగి నలిగిన ఆత్మయే దేవునికిష్టమైన బలిగానున్నది. ఆయన మారనివాడు. ఆయన నియమము అదే విధముగా నుండును. ఒకవేళ కయీను ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి దాని రక్తమును చిందించినా కూడా, అతని హృదయము గర్వముతో హెచ్చింపబడియుండెను గనుక దేవుడు అతనిని అంగీకరించేవాడు కాదు. దీనత్వముతోకూడిన హృదయమే రక్షణకు మొదటిమెట్టు. అప్పుడు మనము వెలుగులోకి వచ్చి మన పాపములన్నిటినుండి మనలను పవిత్రులుగా చేయుటకు యేసుయొక్క రక్తము కొరకు అడుగవచ్చును. హృదయములో దీనులుగా ఉన్నవారు మాత్రమే పౌలు యొక్క విజయ ఆర్భాటమును ఆర్భాటించగలరు, ''దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు?'' (రోమా 8:31). ఎందుకనగా దేవుడు దీనుల పక్షమున మాత్రమే ఉండును. గర్విష్టులు ఆ మాట చెప్పలేరు. ఎందుకనగా దేవుడు వారికి విరోధియైయున్నాడు. కయీనుకుండినట్లు తన గురించి తాను గొప్ప తలంపులను కలిగియుండువాడు యేసు రక్తము తనదిగా చెప్పుకొనినను చివరకు కయీను వలే తయారగును. ''మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు; మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయును'' (గలతీ 6:7). మరియు ఆ నియమము పక్షపాతము లేకుండా సార్వత్రికంగా అందరికీ వర్తించును.

అసూయ మరియు కోపము

ఈ సంఘటన నుండి మనము నేర్చుకోగలిగిన మరొక పాఠము ఉన్నది. కయీను, హేబెలు మీద అసూయపడి, కోపపడెను; ఎందుకనగా దేవుడు అతనిని అంగీకరించినందున అతనికి మంచి జరిగినది. మీరు దగ్గర అనుబంధము కలిగియున్న ఎవరికైనను చాలా మంచి జరిగిన యెడల మీకెలా అనిపిస్తుంది? పాపము మీద జయమును ప్రకటించుచున్న ఒక తోటి సహోదరుని మీరు కనుగొన్నప్పుడు, అతని బోధతో అతని జీవితము అనుగుణంగా ఉన్నదని మీరు చూచినప్పుడు, అతనిలో ఆత్రుత, కోపము లేక అసహనము యొక్క ఆధారము లేకుండుటయే కాక ఎల్లప్పుడు విజయము, ఆనందము, సమాధానముతో కూడిన ఆత్మను అతడు కలిగియుంటే, దానికి వ్యత్యాసముగా (మీరు జయజీవితము సాధ్యముకాదని నమ్మరు గనుక) మీ స్వంత జీవితము దౌర్భాగ్యముగా, దు:ఖముతో ఓడిపోయినట్లు ఉంటే, అప్పుడు మీరు అతని ఓటమిని బట్టి అతిశయించి ఇతరుల దృష్టిలో అతనిని క్రిందకు లాగుటకు ఒక మత్సరముతో కూడిన వేరు జొరబడుట మరియు అతడు దేనిలోనైనను పడిపోవుట చూచుటకు ఒక కోరిక మీలో కనుగొనగలరా? అటువంటి ఆత్మయే కయీనును నడిపించెను.

ఆ సహోదరునికి ఇబ్బంది కలిగినప్పుడు మీరు సంతోషించుదురా? అటువంటి మీ వైఖరి కయీను యొక్క ఆత్మయేగాని క్రీస్తు యొక్క ఆత్మకాదు; అది ఎంత మలినమైనదో, జిగట గలదిగా ఉండేదో మీరు ఎంత వెంటనే గుర్తించగలిగితే అంత మంచిది. దేవుడు కయీనును హెచ్చరించుటకు చూచినప్పుడు పాపము అతని హృదయము యొక్క వాకిట పొంచియుండెను. పాపము ఒక వందమైళ్ల దూరములో కాదు గాని లోపలికి ప్రవేశించుటకు అతని హృదయపు వాకిట పొంచియుండెను. కయీను ఏదో మంచి చేయుటకు ఆలోచించలేదు. అతడు చెడు చేయుటకు కూడా ఇంకా ఆలోచించలేదు, అలా అయితే పాపము అప్పటికే ప్రవేశించియుండేది. అతడు తన హృదయమును ఊడ్చి, మంచి వాటితో నింపకుండా ఖాళీగా ఉంచెను. యేసు చెప్పినట్లు అది ఎనిమిది దురాత్మలను దానిలో కాపురముండుటకు ద్వారము తెరచెను (మత్తయి 12:43-45). కయీను జీవితములో ఆనందము లేకుండెను, ఎందుకనగా అటువంటి వ్యక్తి నిజముగా ఆనందించలేడు. అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనెను; దానితోపాటు దు:ఖము, నిస్పృహ, కోపము అతనిలో కనిపించుచుండెను. వేరొకనికి మంచి జరుగుటను చూచుట అతడు భరించలేక పోయెను. కయీను దేవుని మీద మరియు హేబెలు మీద కోపపడెను. తనకంటే చిన్నవాడైన వానికి మంచి జరుగుట అతనికోపమునకు మరొక కారణము. అతని కంటే పెద్దవానికి మంచి జరుగుట బహుశా సహింపశక్యముగా ఉండేదేమో కాని, అది చిన్నవానికి జరుగుట భరించలేనిదిగా నుండెను.

కయీను మీద మీరు ఒక రాయి వేయకముందు, ఈ విషయము ఆలోచించుడి; మీ కంటే చిన్నవారైన సహోదరులు, మీ కంటే ఆత్మానుసారముగా ఎదుగుట చూచి మీరు నిజముగా ఆనందించగలరా? వారు మిమ్ములను దాటిపోవుట చూచుటకు ఆశకలిగియుండి వారికి మంచి చేయుటకు ఆసక్తి కలిగియున్నారా? అలా అయిన యెడల, తన శిష్యులు తాను చేసిన క్రియల కంటే గొప్ప క్రియలను చేయుదురని ఆనందించిన క్రీస్తుకు ఉండిన మనస్సు మీరు కలిగియున్నారు (యోహాను 4:12). కాని ''మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును'' (యాకోబు 3:16). అవును, ఎక్కడైతే కయీను యొక్క ఆత్మ ఉండునో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఊహకందిన చెడు కూడా ఉండును.

దేవుని హెచ్చరిక

అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే దేవుడు అటువంటి వ్యక్తిని కూడా ఒక హెచ్చరిక ఇవ్వకుండా విడువడు. తన పెద్ద కుమారుని లోపలికి ఆహ్వానించుటకు బయటకు వెళ్లుటకు ఇష్టపడిన తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రిని చూడండి. అలాగే దేవుడు కయీను యొద్దకు వచ్చెను. తరువాత యేసు ఇస్కరియోతు యూదాను కూడా అంతము వరకు ప్రేమించినట్లు, దేవుడు కూడా కయీనును ప్రేమించి అతని నాశనమును కోరుకోలేదు. ''నీకు కోపమేల? నీవు సత్క్రియ చేసిన యెడల నీవుకూడా నిశ్చయముగా అంగీకరింపబడుదువు'' అని దేవుడు చెప్పెను (ఆదికాండము 4:7). కయీను ఒక విరిగి నలిగిన హృదయముతో వచ్చిన యెడల అతడుకూడా అంగీకరింపబడేవాడు. దేవునికి పక్షపాతము లేదు.

దేవునికి ప్రత్యేకముగా ప్రియమైనవారెవరూ లేరు. ఆయన నియమములు మారనివి మరియు తమ్మునుతాము తగ్గించుకొనువారు హెచ్చింపబడుదురు, తమ్మును తాము హెచ్చించుకొనువారు తగ్గించబడుదురు. ఆయన స్వంత కుమారుడైన యేసును సహితము తండ్రి ఒక ప్రత్యేకమైన విధంగా చూడలేదు. యేసు తన్నుతాను తగ్గించుకొనెను గనుక దేవుని కుడిపార్శమునకు హెచ్చింపబడెనని స్పష్టముగా వ్రాయబడియున్నది. ఆయన దేవుని కుమారుడైనందుకు కాదుగాని, మనుష్యునిగా తన్నుతాను తగ్గించుకొన్నందుకు ఆయన హెచ్చించబడెను. ఆయన ఒక మనుష్యునిగా మనము జీవించినట్లే దేవుని నియమముల ప్రకారము జీవించెను. దేవుడు ఇతర మనుష్యులను చూచినట్లే తన కుమారుని చూచెను. కాబట్టి దేవుడు యేసు కొరకు చేసినవాటిని మన కొరకు కూడా చేయునని ధైర్యముగా నమ్మగలము. మనలను మనము తగ్గించుకొనిన యెడల, మనము కూడా హెచ్చింపబడుదుము, లేనియెడల హెచ్చింపబడము. మనము మంచి చేసిన యెడల, మన తలలు ఎత్తబడును మరియు మన ముఖములు ఆనందముతో వెలిగిపోవును.

''నీవు మంచి చేయని యెడల, పాపము వాకిట పొంచియున్నది'' అని దేవుడు కయీనును హెచ్చరించెను. అతనిని మ్రింగివేయుటకు వేచియున్న సింహమువలే, పాపము కయీను హృదయమునకు సమీపముగా నుండెను. అతడు బహుశా దానిని గ్రహించలేదేమో కాని దేవుడు అతడిని హెచ్చరించెను. కయీను అప్పటికే అసూయపడి కోపపడెను, కాని వాకిట ఇంకా ఘోరమైనది పొంచియుండెను. కయీనును ఆవహించుటకు నరహత్య చేయు ఆత్మ పొంచియుండెను. కాని అతడు పాపమును ఏలవలెనని దేవుడు కయీనుతో చెప్పెను. ఇది మనుష్యుని కొరకు దేవుని కోరికగా ఎల్లప్పుడూ ఉండెను. మరియు ఇది మానవ చరిత్ర ఆరంభములోనే పేర్కొనబడెను-మానవుడు పాపమును ఏలవలెను. కాని దేవుని హెచ్చరిక లక్ష్యపెట్టబడలేదు-ఇది ఈనాడు అనేకులు లేఖనములలోని హెచ్చరికలను లక్ష్యపెట్టునట్లున్నది. కయీను దేవుని పిలుపుకు స్పందించలేదు. దేవుని బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కుడై యుండుటకు బదులు, అతడు తన్నుతాను హెచ్చించుకొని తన శరీరాశలకు లొంగిపోయెను. ఆ విధముగా దేవుడతనికి విరోధియాయెను.

మన శరీరములో ఉన్న భ్రష్టత్వమును మనము చూచునట్లు దేవుడు మన పరిస్థితులను నిర్దేశించును. కయీను తన తల్లిదండ్రుల యొక్క ఏకైక కుమారుడైయుండిన యెడల, తన శరీరములోనున్న అసూయను అతడు ఎప్పటికీ చూడగలిగే వాడుకాదు. కాని హేబెలు ఉనికి మరియు దేవుడు అతడిని అంగీకరించుట, కయీను శరీరములోనున్న దురాత్మను తాను స్పష్టముగా చూడగలుగునట్లు బయటకు తెచ్చెను. తన సహోదరునిపైన కోపపడుటకు బదులు కయీను తన్ను తాను తీర్పు తీర్చుకోవలసియుండెను. అప్పుడు అతడు రక్షింపబడియుండేవాడు. మన శరీరములో నివసించువాటిని మనము స్పష్టముగా చూచుటకు దేవుడు మనలను ఇతరులతో కూడిన పరిస్థితులలోనికి తెచ్చునప్పుడు మనము కృతజ్ఞత కలిగియుండవలెను. దేవుని నుండి వచ్చు ఆ హెచ్చరికలను మనము లక్ష్యపెట్టి, మనలను మనము తగ్గించుకొని, తీర్పుతీర్చుకొని మనలను గూర్చి దేవుడు వెలుగులోకి తెచ్చిన సత్యమును అంగీకరించిన యెడల అప్పుడు మనకు మంచి జరుగును. లేనియెడల మనలను మ్రింగుటకు పాపము మన వాకిటకూడా పొంచియుండును.

మనము చూచునట్లు శరీరసంబంధమైన వాటిని మరియు ప్రకృతి సంబంధమైన వాటినన్నిటిని బయటకు తెచ్చుటకు దేవుని వెలుగు బాగా ప్రకాశించగలిగే సంఘమునకు మనము చెందియున్నందుకు మనము కృతజ్ఞత కలిగియుండవలెను. మన శరీరములో మరుగైయుండి నివసించు దుర్మార్గతను మనము ఏళ్ల తరబడి కనుగొనలేని సంఘమునకు చెందియుండుట ఘోరమైన విషయము. సహవాసము కొరకు ఆశించనివారు వారి స్వజీవము పైన ఎటువంటి వెలుగును కలిగియుండరు. ఆ విధంగా వారి స్థితిని గూర్చి వారు అజ్ఞానములో నుండి ఎటువంటి పురోగతిని సాధించరు. మన గురించి దేవుడు మనకేదైనా చూపించినప్పుడు, మనము ఆ వెలుగును బట్టి కృతజ్ఞత కలిగియుండవలెను. దేవుడు మనకు సంఘములోని సహోదర సహోదరీల ద్వారా ఒక హెచ్చరిక నిచ్చినప్పుడు, మనము దానిని తీవ్రముగా తీసుకోవలెను,

లేనియెడల దేవుని హెచ్చరికను నిర్లక్ష్యము చేసిన కయీను వలే మనము చివరకు మారుదుము.

అనుమానము నుండి విడుదల

హేబెలులో మనము, కయీను యొక్క దుర్మార్గ వైఖరికి విరుద్ధమైన వైఖరిని చూచెదము. కయీను హేబెలును పొలములో నడుచుటకు ఆహ్వానించినప్పుడు (ఆదికాండము 4:8), అతడు అనుమానపడకుండా కయీనుతో వెళ్లెను. కయీనుకు అతనంటే అసూయయని హేబెలు అనుమానించలేదు-లేనియెడల అతడు కయీనుతో బయటకు వెళ్లియుండేవాడు కాదు. హేబెలు ఎంత మంచి హృదయము కలిగియున్నాడు. అతడు ఒక విరిగినలిగిన హృదయమును కలిగియుండి తన సహోదరుడైన కయీనును తీర్పుతీర్చులేదు. మనము అనుసరించుటకు ఎంత మంచి మాదిరి!

ఇతర విషయాలలో అన్ని బాగా ఉన్నవారు కూడా ఇతరులు తమ మీద అసూయపడుచున్నారని లేక తమ గురించి చెడుతలంపులు తలంచుచున్నారని లేక క్రిందకు నెట్టుచున్నారని అనుమానించుదురు. మనము ఇతరుల యెడల ఎటువంటి చెడుతలంపులను కలిగియుండనప్పటికీ, ఇతరులు మన యెడల కలిగియున్నారని అనుమానించవచ్చును. ఆ విధముగా మనము కూడా అపవిత్రపరచబడెదము.

హేబెలు తనను నరహత్య చేయబోయే వానిని కూడా అనుమానించలేదు. అతడు ఎంత మంచి హృదయమును కలిగియుండెను! మనకు అటువంటి హృదయమే అవసరము. ఇరుకు మార్గము యొక్క ఇరుప్రక్కల రెండు కొండ చరియలున్నవి. ఒకటి అసూయ అనే కొండచరియ మరియొకటి అనుమానమనే కొండచరియ-మనము వీటిలో దేనినుండైనా పడి క్రిందకు చేరుకోవచ్చును. హేబెలు కయీను మీద అసూయపడలేదు మరియు అనుమానపడలేదు. మన తోటి విశ్వాసుల విషయములో మనము ఈ త్రోవలో నడువవలెను. అనుమానముతో కలుషితమైన హృదయముతో జీవించుట కంటే అనుమానపడని హృదయముతో హేబెలు వలే మరణించుట మంచిది.

ఇతరులు అసూయపడుచున్నారు లేక కోపపడుచున్నారని అనుమానించి వారికి తీర్పుతీర్చువాడు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకొనేవాడు. ఆ విధముగా ఒక అసూయపడే లేక కోపపడే వ్యక్తి కంటే ఎక్కువగా, అతడు విరిగినలిగిన హృదయమును కలిగిలేడని నిరూపించుచున్నాడు. హేబెలు వలే మన గురించి మనము చిన్న తలంపులు కలిగియున్నయెడల, ఇతరులకు మనమంటే అసూయయని తలంచలేము కూడా. అప్పుడు మన అంచనాలో మనము ఎంత ప్రాముఖ్యతలేని వారుగా ఉందుమంటే ఇతరులు మన మీద అసూయ పడుదురని కూడా ఊహించలేము.

దేవుడతనిని అంగీకరించుటను బట్టి హేబెలు ఆనందించెను. కాని అది కయీనుకు విరోధముగా తన హృదయమును పైకెత్తలేదు. అతడు తన్నుతాను కయీనుతో పోల్చుకొనలేదు. మరియు కయీను జీవితములో అతడు జోక్యము చేసుకోలేదు.

కయీను యొక్క అంతము

కయీను తన గర్వము వలన దేవుని హెచ్చరికను తీసుకోలేకపోయెను, కాబట్టి తన వాకిట పొంచియున్న పాపము తన హృదయములోకి ప్రవేశించి, అతనిని లోపరచుకొని, అతనిని నాశనము చేసెను. చివరిగా నాశనమైనది కయీను, హేబెలు కాదు, ఎందుకనగా హేబెలు నేరుగా దేవుని సమక్షములోకి వెళ్లెను, అయితే కయీను నిత్యత్వమంతటికీ దేవుని సన్నిధినుండి బయటకు వెళ్లెను (ఆదికాండము 4:16). దేవుడు మనలను ఒక కూటములోని హెచ్చరిక ద్వారా లేక ఒక వ్యాసము నుండి వచ్చే మాట ద్వారా మనలను హెచ్చరించినప్పుడు, ''ఆ హెచ్చరిక నాకవసరము లేదు'' అని మనము తలంచిన యెడల మనము ''కయీను నడచిన మార్గము''న నడుచుట మొదలుపెట్టితిమి (యాదా 11). ''మన హృదయపు గర్వము మనలను మోసగించెను'' (ఓబద్యా 3).

ఈ హెచ్చరిక ప్రభువులో మనకంటే ఎంతో చిన్నవాడైన సహోదరుని యొద్దనుండి వచ్చినప్పుడు, దానిని తేలికగా తీసుకొనుటకు వచ్చే శోధన ఇంకా గొప్పది. మనము వినుటకు చెవులుగలవారిమైతే, సత్యము కంటే ఎక్కువగా మనలను మనము ప్రేమించుకొనుచున్నామని దేవుడు మనకు చూపించును. మనము అదే త్రోవలో కొనసాగితే, సత్యము విషయములో మనము మోసపోవునట్లు దేవుడు ఒక దినమున మన జీవితాలలో భ్రమను కలుగజేయును (2థెస్స 2:10,11). హెచ్చరికను నిర్లక్ష్యము చేయుట ప్రమాదకరము. పాపము వలన కలుగు భ్రమచేత కఠినపరచబడుటకును కయీను వలే సజీవుడైన దేవునిని విడిచి పెట్టుటకును అది ఖచ్చితమైన మార్గము (హెబ్రీ 3:12,13).

కయీను చేసినట్లు మనమెవరిని రాళ్లతో కొట్టి చంపకపోవచ్చు కాని మన నాలుకలతో అలా చేయవచ్చు. నాలుకకు ప్రజలను చంపే శక్తియున్నదని బైబిలు మనలను హెచ్చరించుచున్నది (సామెతలు 18:21). మనము ఒక వ్యక్తిని ముట్టుకోకుండా అతని పేరును, అతని వ్యక్తిత్వమును (శీలమును) ఇంకా అనేకమైన వాటిని హత్య చేయవచ్చును. అయ్యో, తమ్మును తాము విశ్వాసులని పిలచుకొనేవారు వారం వెంబడివారం అదే చేయుదురు. వారము చివరిలో వారు ఎంతో అమాయకముగా ఆదివాపు కూటమునకు వెళ్లి, గత వారమంతయు ఏ తప్పు చేయనట్లు దేవుని ఆరాధింతురు. కాని దేవుడు వారితో ఇలా చెప్పును, ''నీవు చంపిన నీ సహోదరుని వ్యక్తిత్వము యొక్క స్వరము నాకు మొరపెట్టుచున్నది''. కాని వారి మనస్సాక్షి కఠినపరచబడినందున వారు ఆస్వరమును వినరు. కయీను వలే వారు ఆత్మీయపరముగా దేశదిమ్మరులై తిరుగచూ, క్రీస్తు స్వారూప్యములోనికి మారుటకు ఎటువంటి పురోగతిని సాధించక, క్రీస్తు శరీరములోనికి ఎప్పుడూ కట్టబడరు (ఆదికాండము 4:10,12). నిజముగా, పాపము మన హృదయాల వాకిట చాలా సమీపముగా పొంచియున్నది. తప్పించుకొనుటకు ఏకైక మార్గము మన తోటి విశ్వాసుల యొక్క లోపాలు బలహీనతలతో కాక వారిని గూర్చిన మంచి విషయాలు, వారిలో మెచ్చుకోతగ్గ విషయాలతో మన మనస్సులను నింపుకొనుట ద్వారానే (ఫిలిప్పీ 4:8). హేబెలు మరియు కయీను బైబిలు చివరి పేజీలలో వర్ణింపబడిన రెండు వ్యవస్థలయొక్క అగ్రగాములు. ఇవి యెరూషలేము మరియు బబులోను, వధువు మరియు వేశ్య. ఒక వ్యవస్థ ఆత్మీయమైనది మరియొకటి (కయీను వలే) మతపరమైనది. ఒకటి యేసును వెంబడించును. వేరొకటి పరిసయ్యులను వెంబడించును. క్రీస్తు రాకడను గూర్చి మరియు ఆయన వచ్చినప్పుడు కొనిపోబడుటను గూర్చి నిరీక్షణ కలిగినవాడు, నిశ్చయముగా దినదినము తన్నుతాను పవిత్రపరచుకొనుచు, తన్నుతాను ఇంకా ఇంకా తగ్గించుకొనుటకు ఆశపడును (1యోహాను 3:3). తక్కినవారు ''ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు'' ఉందురు (2తిమోతి 3:13).

ఆత్మ చెప్పుచున్నది చెవులు గలవాడు వినునుగాక.

అధ్యాయము 11
ఎవనికిని ఏమియు అచ్చియుండవద్దు

దేవుడు ఏ వ్యక్తికి ఋణపడియుండడు. క్రొత్త నిబంధనలో మనము దేవుని స్వభావములో పాలివారమగుటకు పిలువబడియున్నాము. మనము కూడా ''ఎవనికిని ఏమియు అచ్చియుండవద్దు'' అని ఆజ్ఞాపించబడ్డాము (రోమా 13:8). ఇతరులనుండి అప్పుతీసుకోవలసి వచ్చుట ధర్మశాస్త్రము యొక్క శాపములో భాగమైయుండెను-ఈ శాపము ఇశ్రాయేలు ధర్మశాస్త్రమును గైకొన్నప్పుడు వారి మీదకు వచ్చునని దేవుడు చెప్పెను (ద్వితియోప 28:43-48 చదవండి). ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను గైకొననప్పుడు వారు ''అన్ని లోపముల''చేత బాధింపబడుదురు (48వ వచనము). వారు దేవుని ఆజ్ఞలను గైకొనినప్పుడు దేవుడు వారికి వాగ్దానము చేసిన అనేకమైన దీవెనలలో ఒకటి ''వారు అనేక జనములకు అప్పు ఇచ్చుదురు గాని అప్పుచేయరు'' అన్న దీవెన (ద్వితీ 28:12; 15:6). దేవుడు తన ప్రజలను దీవించు ఒక విధానమేదనగా వారు ఇతరులకు దీవెనకరముగా ఉండునంతగా కలిగియుందురు.

కాబట్టి మీరు ఎల్లప్పుడు ఆర్థిక అవసరతలో ఉన్నయెడల, లోపము ఎక్కడ ఉన్నదో చూచుటకు మీకు ఒక ఆత్మీయపరమైన తనిఖీ అవసరమైయున్నది. మన విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అప్పుడప్పుడు ఆర్థిక అవసరతను అనుమతించవచ్చును. కాని అప్పుచేయునంతగా ఎల్లప్పుడు ఉండే ఆర్థిక అవసరత తన బిడ్డలెవరి యెడలను దేవుని చిత్తము కాదు. ''అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు'' అని బైబిలు చెప్పుచున్నది (సామెతలు 22:7). ''అప్పుచేయుట'' అనే పదము హెబ్రీభాషలో మీకు అప్పిచ్చినవానికి కట్టివేయబడుట అను అర్థమునిచ్చును. మీకు అప్పిచ్చిన వానికి మీరు సంకెళ్లతో కట్టివేయబడియుందురు మరియు అతనికి మీపై అధికారముండును. ఇతరులు తన బిడ్డలపై అటువంటి అధికారమును కలిగియుండుట దేవుని చిత్తము కాదు. మనము క్రీస్తు రక్తము చేత కొనబడినవారము గనుక, మనము మనుష్యులకు దాసులు కాకూడదని ఆజ్ఞాపింపబడితిమి (1కొరింథీ 7:23). యేసు మన నిమిత్తము శాపమగుట ద్వారా మనలను ధర్మశాస్త్రము యొక్క ప్రతి శాపమునుండి విడిపించుటకు వచ్చెను (గలతీ 3:13). చెరలోఉన్న ప్రతి వానిని విడుదల చేయుటకు కూడా ఆయన వచ్చెను (లూకా 4:18). కాబట్టి మీరు ఋణము అను శాపము చేత బంధింపబడియున్న యెడల మిమ్మును మీరు పరీక్షించుకొని ఆత్మీయపరముగా తనిఖీ చేసుకొనుటకు ఇక్కడ కొన్ని విషయాలున్నవి.

1. సరికాని ప్రాధాన్యతలు

దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకు వారికి జీవితములో అవసరమైనవన్నియు అనుగ్రహింపబడునని యేసు చెప్పెను (మత్తయి 6:33). ఇది అన్ని విషయములలోను అన్ని సమయాలలోను నెరవేరే వాగ్దానము. ఈ వాగ్దానముతో తాను చేయవలసినది చేయకుండా, దేవుడు ఎప్పుడు ఉండడు కాబట్టి ఎవనికైనను ఆర్థిక అవసరత ఉన్నట్లైతే తప్పు ఆ మనుష్యునిదే. నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట (అప్పుచేయుట భిక్షమెత్తుట వంటిదే) గాని తాను చూడలేదని దావీదు చెప్పెను. మరోప్రక్క నీతిమంతులు దయాళురై ఇతరులకు అప్పు ఇచ్చుచు అందరికి దీవెనకరముగా ఉందురు (కీర్తనలు 37:25,26). మనము దేవుని రాజ్యమును ఆయన నీతిని మన జీవితాల యొక్క ప్రతి విషయములో వెదికితిమా? దేవుని పనియు, ఆయన కార్యములు మన పనియు మరియు మన కార్యములునై యున్నవా? లేనియెడల మన ప్రాధాన్యతలు సరిగాలేవు మరియు మన ఆర్థిక అవసరతలకు ఇది ఒక కారణము కావచ్చును. డబ్బు విషయాలలో నీతి అనగా ఇతరులనుండి తప్పుగా తీసుకొనిన వాటిని తిరిగిఇచ్చుట. అనేకమంది విశ్వాసులు అటువంటి విషయాలను సరిచేసుకోనందున తమ జీవితాలలో దేవుని దీవెనను పోగొట్టుకొందురు.

యేసు తన ఇంటిలోనికి వచ్చిన వెంటనే, తన పాత ఆర్థికపరమైన అవకతవకలను సరిచేసుకోవాలని జక్కయ్య నిర్ణయించుకొనెను (లూకా 19:1-10). కాబట్టి అతడు ధనవంతుడైనప్పటికీ, సూది బెజ్జెము ద్వారా వెళ్లెను. అతడు తప్పుగా తీసుకొన్నవాటిని (వడ్డితో సహా) తిరిగి ఇచ్చెను. ఆ వడ్డీ తక్కువ కాకుండునట్లు, అతడు తీసుకొన్నవాటికి నాలుగు రెట్లు తిరిగిఇచ్చెను. అతడు మోసగించిన అనేకులలో కొంతమంది చనిపోయిరి లేక ఎటో వెళ్లిపోయిరి గనుక జక్కయ్యకు వారి ఆచూకీ లేకుండెను. ఆ డబ్బుతో జక్కయ్య ఏమి చేశాడు? అతడు దాని గురించి సులభముగా మరచిపోయెనా? లేదు. అటువంటి డబ్బును తనయొద్ద పెట్టుకొనే అర్హత అతనికి లేకుండెను. కాబట్టి అతడు ఆ డబ్బును పేదవారికి ఇచ్చివేయుటకు నిర్ణయించుకొనెను. అదే తాను పొదుపు చేసుకొన్నవాటిలో సగము దాకా ఉండెను. ఈ విషయములో అతడు తీవ్రముగా ఉండెను గనుక (డబ్బును ప్రేమించుట నుండి) రక్షణ ఆ దినమున ఆ ఇంటికి వచ్చెనని యేసు చెప్పెను (లూకా 19:9). యేసు మన గురించి అటువంటి వ్యాఖ్యను చేయగలడా?

మన డబ్బును సంపూర్ణమైన యధార్థమైన మార్గములలో మనము సంపాదించుచున్నామా అని కూడా మనలను మనము ప్రశ్నించుకోవలెను. అనైతికముగా సంపాదించిన సంపదను దేవుడు ఎప్పుడూ దీవించలేడు. అయితే ''అన్యాయపు సంపాదన ఇంటివారినందరిని బాధపెట్టును'' (సామెతలు 15:27). అవి నిజాయితీగా సంపాదించబడిన రొట్టెలు, చేపలు అయిన యెడల ప్రభువు అయిదువేల మంది కంటే ఎక్కువ ప్రజలను అయిదు రొట్టెలు రెండు చేపలతో తృప్తిపరచగలడు (సామెతలు 13:11). మనకు చెందనిది కాని మనము నిజాయితీగా సంపాదించనిది కాని ఒక్కపైసా కూడా మన బ్యాంకు ఖాతాలో ఉండకూడదు. పన్నులు కట్టకుండా ప్రభుత్వమును మోసము చేసి సంపాదించిన డబ్బు లేక మోసముద్వారా సంపాదించిన డబ్బు అన్యాయమైన, చెడిపోయిన డబ్బు మరియు ఇది మన మీద మన పిల్లల మీద కేవలము శాపమును మాత్రమే తెచ్చును.

2. ఇవ్వకుండా తీసుకొనుట

మనము దేవుని నుండి పొందినవాటిని స్వార్థముతో హత్తుకొనినయెడల మనము ఆత్మీయముగా చనిపోవుదుము. గట్టిగా పట్టుకొనియున్న పిడికిలి ఆదాము సంతతికి సరియైన సాదృశ్యము. అది దొరికిన దానినెల్ల పట్టుకొని, కలిగిన వాటిని హత్తుకొనును. కలువరి సిలువపైన యేసు తెరువబడిన అరచేతులను కలిగియుండెను; మనము కూడా ఆ విధముగానే ఉండవలెను. ''దశమ భాగము యొక్క ఉద్దేశ్యము మీ జీవితాలలో దేవునికి మీరు మొదటి స్థానమును ఇవ్వవలెనని నేర్పించుట''యే అని ఇశ్రాయేలీయులకు చెప్పబడెను (ద్వితీ 14:23).

క్రొత్త నిబంధనలో దశమ భాగమును ఇవ్వమని ఆజ్ఞలేదు, ఎందుకనగా తన శిష్యునిగా ఉండుటకు ఒకడు 100 శాతమును (10 శాతమునే కాదు) విడిచిపెట్టవలెనని యేసు చెప్పెను. మన డబ్బులో ఏ భాగము మనది కాదు. అదంతయు దేవునిదే. దీని అర్థము మన డబ్బునంతటిని దేవుని పనికి ఇవ్వాలని కాదు. కాని సమస్తము దేవునికి చెందినదని మనము గుర్తించవలెను. మన కొరకు మనము ఖర్చు పెట్టుకొన్నప్పుడు, అది దేవుని మహిమ కొరకు చేయవలెను (1కొరింథీ 10:31). కాని మనము దేవునికి ఆయన పని నిమిత్తము ఇవ్వవలెను. మనము ఎంత ఇవ్వవలెను? మనము సంతోషముతో ఇవ్వగలిగినంత ఇవ్వవలెను (2కొరింథీ 9:7). పాత నిబంధనలో పరిమాణము వలే కాక క్రొత్త నిబంధనలో మనము ఇచ్చుదాని నాణ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడెను.

కాని అదే వాక్య భాగములో మనము విత్తుదాని ప్రకారమే మనము కోయుదమని కూడా చెప్పబడెను (2కొరింథీ 9:6). మనము ప్రభువుకు ఇచ్చునది ఒక విత్తబడిన విత్తనము వంటిది. మనము కొద్దిగా విత్తితే, కొద్దిగా కోయుదుము. అనేకమంది విశ్వాసులు నిరంతరము ఆర్థిక సమస్యలలో ఉండుటకు ఇది ఒక కారణము కావచ్చును. వారు దేవుని యెడల ధనవంతులు కాకపోయిరి (లూకా 12:21). ఒక వ్యక్తి దేవుని యెడల ధనవంతునిగా ఉన్నప్పుడు, అతని అవసరతలో దేవుడు అతనికి ఋణపడియుండుట అసాధ్యము. ''పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యమైనది'' అని యేసు చెప్పెను (అపొ.కా. 20:35). మనము ఇతరులనుండి బహుమానములను పొందుటకు ఇష్టపడుచున్నామా? అప్పుడు మనము ఆదాము సంతతివారి వలే ఉన్నాము. నిజమైన భక్తిపరుల యొక్క ఒక లక్షణమేదనగా వారు పుచ్చుకొనుట కంటే ఇచ్చుటకు ఇష్టపడుదురు. ''భక్తిపరులు ఇచ్చుటకు ఇష్టపడుదురు'' (సామెతలు 21:26-లివింగు బైబిలు). ''బహుమతులను అసహ్యించుకొనువాడు బ్రదుకును'' అని బైబిలు చెప్పుచున్నది (సామెతలు 15:27). బహుమతులను పుచ్చుకొనుటను అసహ్యించుకొని వాటిని ఇచ్చుటకు ఇష్టపడునట్లుగా మన మనస్సు నూతన పరచబడవలెను.

మన ఆర్థిక ఇబ్బందులకు మరొక కారణము అవసరతలో ఉన్న మన తోటి విశ్వాసులకు ఇచ్చుటకు మనము ఇష్టపడక పోవుట కావచ్చును. ''దరిద్రుల మొఱ్ఱవినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు'' (సామెతలు 21:13). అయితే, ''బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును'' (సామెతలు 19:17).అయితే, మీరు దీనిని జ్ఞానముతో చేయవలెను. ఇది చేయుటకు మీకు జ్ఞానము లేని యెడల, మీకు నమ్మకమున్న పెద్దలకు డబ్బును ఇచ్చి వారిని జ్ఞానముతో పంచమని చెప్పుట శ్రేష్టమైనది.ఆది సంఘములో అనుసరింపబడిన విధానము ఇదే (అపొ.కా. 4:34,35).

''ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును, ....మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలువబడును'' (లూకా 6:38) అనునది మనకు సమృద్ధి ఉండునో లేక కొరత ఉండునో అని నిర్ణయించే దేవుని నియమమైయున్నది. మనము ఇతరుల యెడల ఔదార్యము గలవారమైతే దేవుడు మన యెడల ఔదార్యము కలిగియుండును. మనము ఇతరుల పట్ల పిసినారితనముగా ఉన్నట్లయితే దేవుడు మన పట్ల పిసినారితనముగా నుండును. అనేకమంది క్రైస్తవులు అవసరతలో ఉండునట్లు చేయుటకు ఒక కారణము ధనాపేక్ష. ప్రజలందరు ధనాపేక్షను కలిగియుందురు. మనము తిరిగి జన్మించినప్పుడు, ధనాపేక్ష మాయమవదు. కాని మనలను మనము విమర్శించుకొనుటకు దానినుండి పవిత్రపరచుకొనుటకు నమ్మకముగా ఉన్నయెడల, అది మన జీవితాలనుండి క్రమేణ మాయమగును.

3. వృథా చేయుట

డబ్బు విషయములలో న్యాయముగా నుండుట, గురి వైపుకు మనము తీసుకొనే మొదటి మెట్టు మాత్రమే. తరువాత మనము నమ్మకముగా నుండుట నేర్చుకొనవలెను. తమ డబ్బును వ్యర్థమైన విధముగా వృథా చేయుట వలన అనేకులు ఋణస్తులైయుందురు. వారి నెలవారి ఆదాయములో వారి ఖర్చులకు సరిపోయే విధముగా వారు క్రమశిక్షణ చేసుకోరు. అత్యవసర పరిస్థితులలో వారు బిక్షమెత్తకుండా లేక అప్పుచేయకుండునట్లు వారు ప్రతినెల కొంత పొదుపునుచేయుట చీమల యొద్దనుండి నేర్చుకొనరు (సామెతలు 6:6-11; 21:20). ఒక వ్యక్తి ప్రతినెల ఎంత పొదుపు చేయవలెను? అది దేవుడతనికి ఇచ్చిన విశ్వాస పరిమాణము పైన ఆధారపడియుండును (రోమా 12:3).

జార్జి ముల్లర్‌ వంటి కొంతమందికి దేవునిపై ఎంత విశ్వాసముండునంటే వారు ప్రభువు పని కొరకును ఆయన ప్రజల కొరకును అంతయు ఇచ్చివేసి తమ కొరకు ఏమియు పొదుపుచేసుకొనరు. వారి అవసరత గడియలో దేవుడు వారిని విడిచిపెట్టక వారికి అద్భుతకరమైన రీతులలో సహాయముచేయును. కాని మనకు అటువంటి విశ్వాసపరిమాణము లేనప్పుడు (మనలో ఎక్కువమందికి అది లేదు) మనము ఆ విషయమును దీనత్వముతో అంగీకరించవలెను. అప్పుడు అవసరత సమయములో ఇతర సహోదరులు మరియు సహోదరీలు మనకు సహాయపడుదురని ఆశించుచు జీవించకుండునట్లు కొంత పొదుపును చేసుకొనుట శ్రేష్టమైనది.

యేసు ఎంతో సమృద్ధిగా రొట్టెలను చేపలను వృద్ధి చేసినప్పటికి ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలను పోగుచేయుడని ఆయన తన శిష్యులతో చెప్పెను (యోహాను 6:12). ప్రభువు వృథా చేయుటను ద్వేషించును. అనేకులు తమ గృహములలో ఆడంబరముగా నుందురు. ఈ విషయములో సమస్యలున్న వారు ప్రతినెల ఎక్కడ వృథా జరుగుచున్నదో కనుగొనుటకు ప్రతినెల వారి ఆదాయము మరియు ఖర్చు యొక్క ఖాతాలను ఉంచుకోవలెను. మనము ఈ విషయమును తీవ్రముగా తీసుకొననియెడల మనము ఎల్లప్పుడు ఋణస్థులమై యుందుము.

విశ్వాసులు చేయు ఎంతో అనవసరమైన ఖర్చు తరచుగా మనుష్యుల ఘనతను పొందుటకు చేయబడును. ప్రత్యేకముగా వివాహ సమయముల యందు ఇది జరుగును. ఒక ఘనమైన వివాహ వేడుక నిమిత్తము అనేకులు అప్పుచేయుదురు. ఇది బుద్ధిహీనత. అదే విధముగా, అనేకులు తమ గృహముల కొరకు ఘనమైన వస్తువులను కొనుదురు మరియు ఘనమైన భోజనాల కొరకు ఇతరులను ఆహ్వానించుదురు. ఇది కూడా ఘనత పొందుట కొరకే. ఇదంతయు బుద్ధిహీనత. మనము దేవుని యెదుట మాత్రమే స్వతంత్రులుగా జీవించాలంటే మనము మనుష్యుల ఘనత కోరుకొనుట విషయములో మరణించవలెను. అప్పుడు మనము అప్పునుండి కూడా స్వతంత్రులుగా నుందుము.

మనము డబ్బు విషయములో నమ్మకముగా లేనియెడల ఆయన రాజ్యము యొక్క సత్యమైన ధనమును దేవుడు మనకు అప్పగించడని యేసు చెప్పెను (లూకా 16:11). ఈ రోజులలో ఎక్కువమంది బోధకులు చేయు ఎండిపోయినట్టుగా ఉన్న ప్రసంగములను ఒకడు వినినప్పుడు, దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షత అను సత్యమైన ధనమును వారు కలిగిలేరని అది స్పష్టము చేయును. దీనికి కారణము వారు డబ్బు విషయములో నమ్మకముగా ఉండకపోవుటయే. దేవుడు తన వాక్యము నుండి మనకు ప్రత్యక్షతను ఇవ్వనియెడల మనము డబ్బు విషయములో నమ్మకముగా ఉన్నామా అనే విషయమును పరీక్షించుకోవలెను. మనము డబ్బు విషయములో అన్యాయముగా ఉండనప్పటికీ, మనము దానిని వృథా చేసియుండవచ్చును.

4. ఇతరులకు తీర్పుతీర్చుట

మనము విత్తుదానినే మనము కోయుదము. మనము ఇతరులను విమర్శించి మరియు వారిని తీర్పుతీర్చిన యెడల, మనము ఆర్థిక ఇబ్బందులలో ఉండుట మనలను ఆశ్చర్యపరచకూడదు. దేవుని అభిషేకము కలిగిన ఆయన దాసులలో ఎవరినైనా మనము విమర్శించామా లేక తీర్పుతీర్చామా? ఇది ఎవరైనా చేయగలిగిన అతి ప్రమాదకరమైన విషయము. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన తన వాక్యములో ఆజ్ఞ ఇచ్చెను (కీర్తనలు 105:15). తన దాసులను విమర్శించి వారికి తీర్పు తీర్చు వారితో దేవుడు తీవ్రముగా వ్యవహరించును. మనము గతంలో వారికి వ్యతిరేకముగా మాట్లాడియుండిన యెడల (బహుశా అది చాలాకాలం క్రితం అయ్యుండవచ్చును) లేక వారి చర్యలను బట్టి వారికి తీర్పుతీర్చిన యెడల (వారి చర్యలను అంచనా వేయువారిగా మనలను మనము నియమించుకొని) మన ప్రస్తుత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆ పాపములను ఒప్పుకొనకపోవుట వలన మరియు వాటినుండి మారుమనస్సు పొందకపోవుట వలన కావచ్చును. ఈ విషయములో ప్రతి వ్యక్తి తన్నుతాను పరీక్షించుకొనవలెను.

దేవుని బిడ్డలలో అనేకమైన వ్యాధులు ఈ కారణముచేతనే యున్నవి. మన జాగ్రత్తలేని మాటలను గూర్చి మనతో మాట్లాడుటకు దేవుడు వ్యాధులను, ఆర్థిక ఇబ్బందులను వాడుకొనును. మనము ఇంటి యొద్ద దేవుడు అభిషేకించిన వారికి వ్యతిరేకముగా మాట్లాడిన జాగ్రత్తలేని మాటలు మనలను గాయపరచుటకు ఇప్పుడు తిరిగి వచ్చియున్నవి. మనలను మనము తీవ్రముగా తీర్పుతీర్చకొనకుండా నిజముగా తగ్గించుకొనకుండా మనము గాయపరచిన వారికి క్షమాపణ చెప్పకుండా ఈ సమస్యకు పరిష్కారమును పొందలేము.

వృథాగా ఖర్చుపెట్టే విశ్వాసులను మనము బహుశా విమర్శించి యుండవచ్చు. ఈ విధముగా మనము ఇతరుల విషయాలలో జోక్యం చేసుకొనేవారిగా మారితిమి. ఇతరుల వ్యవహారాలలో మనము పర్యవేక్షకులము కాకుండునట్లు దేవుడు మనలను ఆర్థిక ఇబ్బందిలో శిక్షించియుండవచ్చును. మనము ఎంత శరీరానుసారముగా ఉండవచ్చంటే కూటములలో ఇతరులకు తగులునట్టుగా మనము వారికి తీర్పు తీర్చిన విషయాలలో కొన్ని మాటలు మాట్లాడవచ్చును. దేవుడు అటువంటి మాటలను గుర్తుపెట్టుకొనును. మరియు ఈ విధముగా శరీరేచ్ఛలను బట్టి విత్తుట వలన మనము క్షయమను పంటను కోయుచున్నామని అనేక సంవత్సరాల తరువాత కనుగొనెదము.

5. అవిశ్వాసము

ఋణపడియుండుటకు చివరి కారణము అవిశ్వాసము కావచ్చును. ఒక నాస్తికునికి ఆర్థిక ఇబ్బంది కలిగినప్పుడు అతడు దేవుడున్నాడని నమ్మడు గనుక సహాయము కొరకు ఇతరుల యొద్దకు పరుగెత్తును. మనసంగతి ఏమిటి? మనము అవసరతలో ఉన్నప్పుడు ఏమి చేయుదుము? దేవుడు ఆర్థిక అవసరత ద్వారా మనలను పరీక్షించవచ్చును. అపొస్తలులు తరచుగా ఆర్థిక అవసరతలో ఉండిరి (1కొరింథీ 4:11). కాని వీరు ఎప్పుడూ యాచించవలసి(బిక్షమడుగవలసి) రాలేదు లేక అప్పుచేయవలసి రాలేదు. వారి అవసరత తీర్చుటకు వారు దేవుని నమ్మిరి మరియు దేవుడు వారి అవసరతలను తీర్చెను.

దేవుడు తన నమ్మకస్థులైన బిడ్డలను ఎన్నడు ఎడబాయడు. అవసరమైతే ఏలియాకు చేసినట్లు వారికి కాకుల ద్వారా ఆహారమునిచ్చును. మనము విశ్వాసముతో కూడిన ప్రార్థన ద్వారా మన ఆర్థిక అవసరతలను దేవునికి తెలియజేసితిమా? లేక నాస్థికుల వలే మనము ప్రవర్తించితిమా? (ఈ సందర్భానికి సంబంధించి యెషయా 30:7-21 మరియు కీర్తనలు 121 చదువుడి). దేవుడు సంతోషముగా మనకు ఇచ్చినదానితో మనము తృప్తిపడవలెను. అంతేకాని మనకంటే ఎక్కువ కలిగిన విశ్వాసులతో మనలను మనము పోల్చుకొనకూడదు. మనలను ఎన్నడు విడువను ఎడబాయనని దేవుడు మనకు వాగ్దానము చేసెను (హెబ్రీ 13:5). ప్రస్తుతము అప్పులో ఉన్న ప్రతివాడు ఈ విషయాలన్నింటిలో తన్నుతాను విమర్శించుకొని వ్యవహారాలను సరిదిద్దుకొనుట ముఖ్యమైన విషయము. నీవొక క్రైస్తవ నాయకునిగా లేక పెద్దగా అప్పులో ఉన్నయెడల అప్పుడు నిన్ను నీవు పది రెట్లు తీర్పు తీర్చుకొనవలెను. అప్పులో ఉన్న వారెవరును దేవుని ప్రజలకు పెద్దగా ఉండుటకు అర్హత కలిగిలేరు.

మనము తీవ్రముగా ఉండవలెను. అప్పులో ఉండుట రోమా 13:8లో ఉన్న దేవుని వాక్యమునకు అవిధేయత చూపుట అని మనము స్పష్టముగా చూడవలెను. అప్పులతో జీవించుట పాపములో జీవించుట వంటిది. తీవ్రముగా ఉండుట అనగా పాపము చేయకుండునట్లు అవసరమైతే కుడి చేతిని నరికివేయుట మరియు కుడి కంటిని పెరికివేయుట. దీని అర్థము మన అప్పులను తీర్చుటకు మనము వెంటనే చర్యలను తీసుకొనవలెను.

మొట్టమొదటిగా మన నెలవారి అవసరతలకు సరిపోయే డబ్బును మాత్రమే ఉంచి మన బ్యాంకు ఖాతాను మనము ఖాళీచేసి అప్పు చెల్లించుట ప్రారంభించవలెను. ఆ తరువాత మన గృహములో ఉన్న వెండి బంగారములను అమ్మి మన అప్పు తీర్చవలెను. మన అప్పులను త్వరగా తీర్చగలుగుటకు మన నెలవారి ఖర్చులను తగ్గించుకొనవలెను. మనము అప్పును తీర్చేముందు మనకు కావలసిన మొత్తము ఉన్నంతవరకు వేచియుండకూడదు. మనము తీర్చగలిగినంత వరకు మన అప్పులను ప్రతి నెల తీర్చవలెను. మనము ఈ విషయములో తీవ్రముగా ఉన్నామని దేవుడు చూచిన యెడల ఆయన మనకు సహాయము చేయును. తమ అప్పులను తీర్చే విషయమును అనేకులు తేలికగా తీసుకొనుట వలన దేవుడు వారికి సహాయపడడు. తనకు లోబడుటకు పూర్ణహృదయులైన వారికి మాత్రమే దేవుడు సహాయము చేయును (యిర్మీయా 29:11-13).

మన అప్పులను తీర్చుటకు ఈ చర్యను తీసుకొనుటకు మనము ఇష్టపడని యెడల మనము తీవ్రమైన క్రైస్తవులము కాదని మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులము కామని స్పష్టమగుచున్నది. అప్పుడు మన జీవితకాలమంతయు శరీరానుసారమైన క్రైస్తవులుగా జీవించుటకును మరియు ఆ పర్యవసానములను భరించుటకును దేవుడు మనలను విడిచిపెట్టును. దేవుని ఘనపరచు వారందరిని ఆయన ఘనపరచును. గతములో పొరపాట్లు చేసినవారిని ఖండించుటకు ఇది వ్రాయబడలేదు. మన భవిష్యత్తునకు సంబంధించిన విషయములో తప్ప దేవుడు మన గతము గురించి మాట్లాడడు. మనము గతములో చేసిన వాటికి దేవునియొద్ద క్షమాపణ ఉన్నది కాని కీర్తన 134లో తేటగా చెప్పబడినట్లు మనము భవిష్యత్తులో ఆయన యందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడు మనలను క్షమించును.

అధ్యాయము 12
మీరు నేరము మోపుచున్నారా లేక విజ్ఞాపన చేయుచున్నారా?

మీరు సాతానుకు జతపనివారుగా ఉన్నారా లేక యేసుతో జతపనివారుగా ఉన్నారా?

సాతాను 'సహోదరులపై నేరము మోపు వాడని' అతడు రాత్రింబగళ్లు దేవుని యెదుట వారిపై నేరము మోపునని మనము ప్రకటన 12:10లో చదివెదము.ఇది సాతాను చేయుచున్న ఒక పూర్తికాల పరిచర్యగా నున్నది. మరియు ఈ పరిచర్యలో, అతడు దురాత్మలలోను మనుష్యులలోను అనేకమంది జత పనివారిని కలిగియున్నాడు. విషాదకరమైన విషయమేమిటంటే ఈ నేరారోపణ పరిచర్యలో అనేకమంది విశ్వాసులు కూడా సాతానుతో జతపనివారుగా ఉన్నారు. ఏదేను వనములో ఆదాము పాపము చేసిన వెంటనే సాతాను ఆదామునకు తన స్వభావమును ఆదాముకు ప్రసారంచేసెను. దేవుడు ఆదాము యొద్దకు వచ్చి అతడు నిషేదింపబడిన ఫలమును తినెనా అని అడిగినప్పుడు, అతడు చేసిన మొట్టమొదటి పని హవ్వవైపు వేలెత్తి, ''నాకు తినుటకు ఫలము ఇచ్చినది ఈమెయే'' (ఆదికాండము 3:12) అని చెప్పుటలో మనము దీని యొక్క ఋజువును చూడగలము. తన చూపుడు వేలును ఒక తోటి మనుష్యుని వైపు చూపుచూ ఉన్న ఆదాము యొక్క ఆ భంగిమ సుపరిచితమైనది, మరియు అది అతని సంతానమంతటిలో కూడా కనబడును. బాల్యమునుండి మనము ఇతరులను నిందించి వారి మీద నేరారోపణ చేసే అలవాటును అలవరచుకున్నాము. మనము పెద్దవారము అగుచుండగా, ఈ నిందించే నేరారోపణ చేసే ఆత్మ ఇంకా తెలివైనదిగాను, నిగూఢమైనదిగాను, దుష్టమైనదిగాను వ్యక్తపరచుకొనును. విషాదకరమైన విషయమేమిటంటే, వారు తిరిగి జన్మించిన అనేక సంవత్సరాల తరువాత కూడా ఇది అనేకమంది విశ్వాసులనుండి తొలగించబడలేదు!

''ఎవడైనను క్రీస్తునందు నున్నయెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను'' (2కొరింథీ 5:17) అని బైబిలు చెప్పుచున్నది. ఇతరుల పట్ల మన వైఖరి ఇప్పుడు క్రొత్తదిగా అనగా యేసు వారి యెడల కలిగియున్న వైఖరిగా మారవలెను. కాని మనము దేవునితో సహకరించకుండా మన వైఖరిలో అటువంటి మార్పు ఎప్పుడు రాదు. సందేహములేకుండా, మన హృదయాలలో ఈ క్రొత్త వైఖరులను కలుగజేయునది దేవుడే. కాని ఆయన మనలను యంత్రములుగాను, మరమనుష్యులుగాను చూడడు. మన తప్పుడు వైఖరులనుండి ''మన స్వంత రక్షణను మనము కొనసాగించుకొనుటకు'' మనమాయనతో సహకరించవలసిన అవసరమున్నది (ఫిలిప్పీ 2:12,13). అప్పుడు మాత్రమే మనము మారగలము.

''తమ స్వంత రక్షణను కొనసాగించుకోవలెను'' అన్న ఆజ్ఞను విశ్వాసులు తీవ్రముగా తీసుకోనందున, వారి జీవితముల యొక్క అంతము వరకు, వారు ఆదాము సంతానము వలే జీవితమును కొనసాగించెదరు. ఆయన బిడ్డల యొక్క ప్రవర్తన వలన ప్రభువుకు చెడ్డపేరు వచ్చును. తాము పరిశుద్ధపరచబడుటకు తాము కేవలము సువార్త యొక్క వాస్తవాలను తమ మేథస్సుతో నమ్మటము తప్ప తాము ఏమి చేయనక్కరలేదని ఒక తప్పుడు బోధ విశ్వాసులను నమ్ముటకు నడిపించినది. అదే నిజమైతే అపవాది తానే పరిశుద్ధ పరచబడియుండును ఎందుకనగా అతడు కూడా సువార్త యొక్క వాస్తవాలన్నిటిని నమ్మును! కాని అతడు ఇంకను సహోదరుల మీద నేరారోపణ చేయువాడుగా ఉన్నాడు-అలాగే అనేకమంది ''విశ్వాసులు''గా పిలువబడే వారు కూడా ఉన్నారు.

యేసు కాలములో ఉన్న పరిసయ్యులను పరిశీలించండి. వారు తమ సిద్ధాంతము విషయములో సాంప్రదాయకముగాను, ఎంతో మతభక్తి కలిగినవారుగాను ఉండిరి. వారు వారి తరములోఉన్న సాంద్రాయకముకాని సద్దూకయులకు విరోధముగా దేవుని వాక్యము యొక్క సత్యముల కొరకు పోరాడిరి. ఇది ఈనాడు అనేకమంది ఇవాంజిలికల్‌ క్రైస్తవులు చేసినట్లున్నది. కాని యేసు వారిని సద్దూకయుల కంటే ఎక్కువగా ఖండించెను.

వ్యభిచారములో పట్టబడిన స్త్రీ మీద వారు నేరారోపణ చేసిన సంఘటనలో మనము పరిసయ్యుల యొక్క వైఖరిని స్పష్టముగా చూడగలము. ఆమె పాపజీవితము నుండి ఆమెను రక్షించుటకు వారు ఎటువంటి ఆసక్తిని కలిగియుండలేదు. వారు తమ స్వంత నీతిని కనుపరచుటకే ఆశించారు. వారు ఆ దురదృష్టవంతురాలి వైపు (తమ పూర్వీకుడైన ఆదామువలె) తమ చూపుడు వేళ్లను ఎత్తిచూపుచూ అక్కడ నిలబడిరి. ఆ చర్య ద్వారా, వారు ఎవరి సంతానమయి ఉన్నారో వారు బయలుపరచిరి. అయితే యేసు అటువంటి స్త్రీలను తమ పాపములనుండి రక్షించుటకు వచ్చెను కాబట్టి ఆయన ఆ పరిసయ్యులతో వారి తండ్రి కేవలము ఆదామే కాక, నేరారోపణ చేయువాడైన సాతానని వారితో చెప్పెను (యోహాను 8:1-11 మరియు 44 వచనాలను చూడండి).

యేసు యొక్క బహిరంగ పరిచర్య అంతా కూడా పరిసయ్యులతో ఘర్షణతో కూడినదైయుండెను ఎందుకనగా ఆయన నేరారోపణ చేయువానితోను, అతని ప్రతినిధులతోను, (వారు మతపరమైన వస్త్రములు ధరించినప్పటికీ) పోరాడుటకు భూమి మీదకు వచ్చెను. మనము ప్రభువును వెంబడించినప్పుడు, మనపోరాటము కూడా పరిశుద్ధతకంటే సిద్ధాంతములకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చుచు, ఇతరులను రక్షించుటకు ఒక వ్రేలును కూడా ఎత్తక వారి మీద నేరారోపణ చేయువారునైన ''క్రైస్తవ ఛాందసవాదులతో'' ఉండును! నశించిపోవుచున్న అన్యులను రక్షించుటకు భారము కలిగినట్లున్నవారు అదే సమయములో తమ తోటి విశ్వాసులను రక్షించుటకు ఆసక్తిలేనివారై, వారి మీద నేరారోపణ చేయుదురు! దేవుడు లోకమును రక్షించుటకే గాని దానికి తీర్పుతీర్చుటకు ఆయన కుమారుని పంపలేదు (యోహాను 3:17). ప్రభువు మనలను సంపూర్ణముగా రక్షింపగలుగుటకు కారణము ఆయన మనకొరకు విజ్ఞాపన చేయుటకొరకు నిరంతరము జీవించుటయే (హెబ్రీయులు 7:25). నేరారోపణతోను మరియు శిక్షావిధితోను కూడిన పరిచర్య సాతాను పరిచర్య మరియు మనకు దానిలో ఏ భాగము ఉండకూడదు. మరోప్రక్క మన ప్రభువు మనము సంపూర్ణ రక్షణ పొందునట్లు మనకొరకు విజ్ఞాపణ చేసే పూర్తికాల పరిచర్యను కలిగియున్నాడు. మనము కూడా కలిగియుండవలసిన పరిచర్య ఇదియే.

దేవుడు మనలను ప్రభువైన యేసుకు వధువుగాను, ఈ పరిచర్య కొరకు సాటియైన సహాయముగాను ఆయనకు ఇచ్చెను. కాబట్టి ఈ విజ్ఞాపన చేయు పరిచర్యలో మనము మన ప్రభువుతో జతపనివారమై యుండవలెను. లోకమును ఖంచించుటకు (తీర్పు తీర్చుటకు మరియు నేరారోపణ చేయుటకు) కాక దానిని రక్షించుటకు తండ్రి యేసును లోకములోకి ఎలా పంపెనో అలాగే, ఆయన మనలను కూడా ఇతరులను ఖండించుటకు, తీర్పు తీర్చుటకు మరియు నేరారోపణ చేయుటకు కాక వారిని రక్షించుటకు లోకములోనికి పంపెను (యోహాను 20:21). కాబట్టి, మనము మన జీవితాలనుండి ''నేరారోపణ చేయు ఆత్మను'' (సాతాను యొక్క ఆత్మను) పూర్తిగా తొలగించుకొని దానిని ''విజ్ఞాపన చేయు ఆత్మ''తో (క్రీస్తు యొక్క ఆత్మతో) నింపినప్పుడు మాత్రమే మనము ఈ లోకములో ఈనాడు దేవుని పనిలో ఆయన చేతులలో సమర్థవంతమైన సాధనాలుగా ఉండగలము.

జెకర్యా 3:1-5లో, ఈ రెండు పరిచర్యల యొక్క చక్కటి ఉదాహరణను మనకు ఉన్నది. అక్కడ మనము (ఒక విశ్వాసికి సాదృశ్యముగానున్న ) యెహోషువను, ప్రభువు యొక్క సింహాసనము యెదుట నిలువబడుట చూచెదము. అతడు మలినమైన వస్త్రములు ధరించుకొని యుండెను. మన భూలోక జీవితముల అంతము వరకు మనలో శ్రేష్టమైన వారిలో కూడా ఎల్లప్పుడు పాపము (తెలిసినది, తెలియనిది లేక రెండూ) ఉండునని ఇది సూచిస్తున్నది. ఎందుకనగా యెహోషువ ప్రధాన యాజకుడు, యూదుల నాయకుడని గుర్తుంచుకొనుడి (1యోహాను 1:8). సాతాను ఫిర్యాదు చేయుటకై అతని ప్రక్క నిలబడియుండుటను మనము చూచెదము. మరోప్రక్క ప్రభువు యెహోషువ పక్షమున ఉండి ఆ ఫిర్యాదు చేయువాడిని గద్దించుటను మనము చూచెదము. ప్రభువు యెహోషువ యొక్క మలినమైన వస్త్రములను తీసివేసి వాటి బదులు ప్రశస్తమైన వస్త్రముల నిచ్చెను. ఇదంతా గమనించుచున్న జెకర్యా, ప్రభువు యెహోషువను నీతిమంతునిగా తీర్చుటచూచి ఎంత పులకరించిపోయెనంటే, అతడు కూడా ''తన సహోదరుని మహిమకరమైనవానిగా చేయుటలో'' ప్రభువుతో కలిసి, ''అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడి'' అని చెప్పెను. ప్రభువు జెకర్యా మనవిని ఆలకించి, యెహోషువకు ఒక తెల్లని పాగాను కూడా ఇచ్చెను. దేవునితో జతపనివానిగా ఉండుట అంటే ఇదే.

''తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసినవానికి జీవము దయచేయును'' అని బైబిలు చెప్పుచున్నది (1యోహాను 5:16). ఇది దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వాగ్దానము. మనము ఒక సహోదరుడు పాపము చేయుట లేక పడిపోవుట చూచినప్పుడు మనము దీనిని వాడుటను గూర్చి ఆలోచించామా? లేక మనము సాతాను యొక్క గణములతో కలిసి ఆ దీనస్థితిలో ఉన్న సహోదరుని మీద నేరారోపణ చేసామా?

దేవుని సింహాసనము యెదుట నేరారోపణ చేయుట మరియు విజ్ఞాపన చేయుట అనే ఈ రెండు పరిచర్యలు ఎల్లప్పుడు కొనసాగుచుండును. ఈ రెండు పరిచర్యలలో దేనిలో పాల్గొనాలనేది నిర్ణయించుకొనుట మన వంతు. మనము మన తోటి విశ్వాసుల మీద నేరారోపణ చేయుటకు నిరంతరము మనలను పురిగొల్పేది సాతాను మరియు అతని దురాత్మలనియు, అలా చేయుటకు సాతాను మనకు ''ఒక న్యాయమైన మంచి'' కారణమును ఎల్లప్పుడు ఇచ్చుననియు మనము మొట్టమొదటిగా స్పష్టముగా చూడవలసిన అవసరమున్నది!! కాని మనము నేరారోపణ చేసిన కొలది, మనము మన జీవితాలలో దురాత్మల యొక్క ప్రభావమునకు ఎక్కువగా చోటిచ్చుదుము. ఈనాడు అనేక మంది విశ్వాసులు తమ శరీరములోను తమ మనస్సులలోను నయంకాని వ్యాధులతో బాధపడుటకు గల ముఖ్య కారణము ఇతరుల మీద నేరారోపణ చేయుట అను ఈ ఒక్క దురలవాటు మాత్రమే. ఈ నేరారోపణ చేయు ఆత్మను మన జీవితాలనుండి పూర్తిగా తొలగించుకొనుటకు మనము తీవ్రముగా ఉండవలెను-ఇది నయంకాని క్యాన్సర్‌ వ్యాధి కలిగియున్న ఒక వ్యక్తి మీద ఒక శస్త్రవైద్యుడు ''తీవ్రమైన శస్త్రచికిత్స'' చేసినట్లుండును. అయితే ప్రశ్న ఏమిటంటే మనము ''ఈ నేరారోపణ చేయు ఆత్మ''ను క్యాన్సర్‌ కంటే ఘోరమైనదానిగా చూచామా లేదా అన్నది.

ఇతరులను నిందించే ఈ దురలవాటును మనమందరము పుట్టుకతోనే కలిగియున్నాము. ఇతరుల వైపు మన వేళ్లను ఎత్తిచూపుచు వారి మీద ఏదోఒక నేరము మోపుచు లేదా వారికి వ్యతిరేకముగా కొండెములాడుచు మన జీవితములను గడిపితిమి. పరిసయ్యులవలే మన స్వంత పాపములను మరచి, మన స్వంత పాపములు ఇతరుల మీద రాళ్లు రువ్వుటకు మనలను అర్హతలేని వారిగా చేయునని మనము గ్రహించలేకపోతిమి. గత సంవత్సరాలలో మన జీవితములో ఈ నేరారోపణ చేయు దురాత్మకు ఎంతో చోటు లభించెనని మనము దు:ఖపడవలసిన అవసరమున్నది. మనకు తెలియకుండానే, మన ప్రభువు చేయుచున్న విమోచనతోకూడిన విజ్ఞాపన చేయు పరిచర్యలో ఆయనతో జతపనివారుగా ఉండుటకు బదులు సాతాను చేయు నేరారోపణ పరిచర్యలో అతనితో జతపనివారుగా ఉంటిమి. కనీసము ఇప్పుడైనా మనము దీని విషయములో మారుమనస్సు పొందవలసిన అవసరమున్నది.

మన జీవితాలనుండి నేరారోపణచేయు దురాత్మను వెళ్లగొట్టుట సంపూర్ణ రక్షణ పొందుటకు కేవలము మొదటి మెట్టు మాత్రమే. మన హృదయాలలో నున్న ఆ ఖాళీ స్థలమును విజ్ఞాపన చేయు ఆత్మతో నింపుకొనని యెడల, యేసు హెచ్చరించినట్లు ఆ నేరారోపణ చేయు ఆత్మ ఇంకా ఘోరమైన ఏడు దురాత్మలతో మన హృదయములోనికి వచ్చి మనలను మరల హింసించి చెరుపును (లూకా 11:24-26). కాబట్టి మనము ''విజ్ఞాపన చేయు ఆత్మ'' అని పిలువబడిన పరిశుద్ధాత్మతో నింపబడుట ఎంతో అవసరము (జెకర్యా 12:10 మరియు రోమా 8:26,27 చూడండి). విజ్ఞాపన చేయు ఆత్మతో నింపబడుటయే మన జీవితాలనుండి నేరారోపణచేయు ఆత్మను శాశ్వతముగా వెళ్లగొట్టుటకు ఏకైక మార్గము.

మీరు క్రమము తప్పకుండా ప్రార్థన చేయుచున్న వ్యక్తి గురించి చెడు మాట్లాడుట లేక అతనిమీద నేరారోపణ చేయుట అసాధ్యము. ఇది నిజమో కాదో పరీక్షించి చూచుకొనుడి: మీరు నేరారోపణ చేయువారికొరకు మీరు ఎప్పుడైనను ప్రార్థించరు కదా? కాబట్టి ఇతర ఏ క్యాన్సరు వ్యాధి వలెనే ఈ ''క్యాన్సరుతో కూడిన నేరారోపణ చేయు ఆత్మ'' మిమ్ములను ఎల్లప్పుడు వదలకపోవుటయే కాక, ప్రతి సంవత్సరము ఇంకా ఇంకా ఘోరమైనదిగా మారును.

సాతాను యొక్క నేరారోపణ చేయు ఆత్మలకు అనేకమంది విశ్వాసుల జీవితాలలోనికి హృదయాలలోనికి సులువైన ప్రవేశం ఉండుట వలన, ఈ రోజు సాతానుకు క్రైస్తవ లోకములో విమర్శించుటకు ఎంతో మంచి అవకాశమున్నది. కాని ప్రభువు నేరారోపణ చేయు ఆత్మలతో సహా అన్ని దురాత్మలమీద మనకు అధికారమునిచ్చెను (లూకా 10:19). మనము నేరారోపణ చేయుటకు శోధింపబడిన వారి కొరకు విజ్ఞాపనచేయుట ద్వారా మనము ఈ ఆత్మల మీద ఈ శక్తిని ప్రయోగించవలెను. మనము అలా చేయని యెడల, మన జీవితముల యొక్క అంతము వరకు, మనము ఎల్లప్పుడు ఉండినట్టే, నాశిరకమైన పనికిరాని క్రైస్తవులుగా ఉండెదము. మన ప్రభువుతో మనము జతపనివారుగా ఉండలేము.

విజ్ఞాపన చేయు పరిచర్యను మనలో ప్రతి ఒక్కరు తీవ్రముగా తీసుకోవలెను. సంఘములో సాతానుని జయించుటకు వేరే మార్గము లేదు. మనలను హింసించువారిని క్షమించుటయే కాక వారి కొరకు ప్రార్థన కూడా చేయవలెనని మన ప్రభువు మనకు చెప్పెను (మత్తయి 5:44). మనము వారిని కేవలము క్షమించి వారి కొరకు ప్రార్థన చేయని యెడల, నేరారోపణ చేయు ఆత్మ తిరిగి మన జీవితాలలోనికి ప్రవేశింపవచ్చును. ఒకరిని బట్టి ఒకరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుట మనము ప్రారంభించవలెను, ఎందుకనగా నిజమైన విజ్ఞాపనంతయు ఇక్కడే మొదలగును. ''ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరియు (ఒకరికొకరు) కృతజ్ఞులై యుండుడి'' (కొలొస్స 3:15).

పౌలు యొక్క పత్రికలలో అతనికి ఈ అలవాటు ఎలా ఉండెనో మనము చూచెదము: అతడు ఎల్లప్పుడు క్రైస్తవుల కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు తన పత్రికలను ప్రారంభించెను-రోములో, కొరింథులో, ఎఫెసులో, ఫిలిప్పీలో, కొలస్సీలో, థెస్సలోనికయలో ఉన్నవారి కొరకు మరియు తిమోతి, ఫిలోమోను కొరకు కూడా కృతజ్ఞతలు తెల్పెను (రోమా 1:8; 1కొరింథీ 1:4; ఎఫెసీ 1:15; ఫిలిప్పీ 1:3; కొలొస్స 1:3; 1థెస్సలోని 1:3; 2తిమోతి 1:3; ఫిలోమోను 4). పౌలు వంటి ఒక భక్తిపరుడు చాలా సుళువుగా చూడగలిగిన పొరపాట్లు ఆ క్రైస్తవులందరిలో ఉండెననుటకు సందేహము లేదు. కాని వారిపై నేరారోపణ చేయుటకు అతడు నేరారోపణ చేయువానితో (సాతానుతో) చేతులు కలుపుటకు నిరాకరించెను. దేవుడు అతడిని వారి మీద నేరారోపణ చేసి వారిని ఖండించుటకు కాక వారికి సహాయపడుటకు, వారిని రక్షించుటకు పంపెను. వారి మధ్య తీవ్రమైన సమస్యలున్న కొరింథీయులకు వ్రాసినప్పుడు కూడా, వారిలో సహితము అతడు చూడగలిగిన మంచి కొరకు దేవునికి కృతజ్ఞత తెలుపుచు పౌలు ప్రారంభించెను. అలా చెప్పిన తరువాతనే, అతడు వారిని సరిదిద్దెను. కొరింథులోనున్న క్రైస్తవులు పౌలు యొక్క దిద్దుబాటును వెంటనే అంగీకరించుటకు బహుశా ఇదే కారణము కావచ్చును (2కొరింథీ 7:8,9). ఇతరులు మన దిద్దుబాట్లను మరియు మన హెచ్చరికలను అంగీకరించకపోవుటకు కూడా బహుశా ఇదే కారణము కావచ్చును-అదేదనగా మనము వారిలో చూచిన మంచిని ఎప్పుడైనను మెచ్చుకొనకపోవుటయే!

తల్లిదండ్రులైన మీరు దీనిని పరిగణించండి: మీరు మీ పిల్లలలో చూచిన మంచిని మెచ్చుకొనుట కంటే లోపాలను పొరపాట్లను ఎత్తిచూపుటకు త్వరపడలేదా? మీ పిల్లలతో మీరు ప్రోత్సాహము మరియు ప్రశంసతో కూడిన మాటలను మాట్లాడితిరా? మీరెప్పుడైనను మోకరించి వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపితిరా? మీరు మెచ్చుకోకుండా విమర్శించినయెడల, మీ పిల్లలు మెరుగైనవారిగా మారకపోవుటలో ఆశ్చర్యము లేదు!! మీరు మరొక ఎక్కువ దైవికమైన పద్ధతిని ఎందుకు ప్రయత్నించకూడదు? మీ వైఖరిని మీరు మార్చుకున్నప్పుడు, మీ పిల్లలు కూడా మారుట మీరు కనుగొనెదరు. మీరు దీనిని ప్రయత్నించి పనిచేస్తుందో లేదో అని చూడండి.

విశ్వాసులమైన మనము మనలను ఈ విధముగా ప్రశ్నించుకోవచ్చు: మనము అనేక సంవత్సరములుగా నేరారోపణ చేయుచున్న ఇతర విశ్వాసులలో అసలు మంచి ఏమీ లేదని సాతాను మనకు చెప్పినది నిజముగా సత్యమా? గతంలో మన హృదయాలలోను మన తలంపులలోను ఇతరులకు వ్యతిరేకముగా నేరారోపణ, ఫిర్యాదులు, కొండెములు చెప్పు ఆత్మకు చోటు లభించినట్లే మనము అంతే మోతాదులో, మరి ఎక్కువగా కూడా, ఒకరికి ఒకరు కృతజ్ఞతలు చెప్పు, విజ్ఞాపన చేయు ఆత్మతో నింపబడునట్లు దేవుడు అనుగ్రహించును గాక. ఆ విధముగా అపవాదికి మన జీవితాలలో ఇకచోటు ఉండదు. నేరారోపణ చేయువాడైన సాతాను అతని ఆత్మలు జయంపబడి, విజ్ఞాపనచేయు ఆత్మద్వారా వెళ్లగొట్టబడును. మీరు ఇప్పుడు తీవ్రముగా ఉండి ఇక ఎప్పటికీ ఇతరుల మీద నేరారోపణ చేయు ఈ అలవాటును విడిచిపెట్టి, దానిని విజ్ఞాపణచేయు ఆత్మతో భర్తీ చేయుదురా? అలా చేయుటకు ప్రభువు మనందరికీ సహాయపడును గాక.

''పరిశుద్ధునిగా ఉండగోరినవాడు తన్నుతాను పరిశుద్దునిగా ఉంచుకోవలెను; కాని అపవిత్రునిగా ఉండగోరిన వానిని అపవిత్రముగానే ఉండనిమ్ము'' (ప్రకటన 22:11).

అధ్యాయము 13
సంఘములో ఒక దహించు అగ్ని

''మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు....'' (హెబ్రీయులు 12:29).

''దేవుడు ప్రేమాస్వరూపి'' అను మాటలు అనేక గృహములలో గోడమీద తగిలించియుండుట మనము అనేకసార్లు చూచితిమి. కాని ''దేవుడు దహించు అగ్నియైయున్నాడు'' అనుమాటలు ఎక్కడైనను తగిలించియుండుటమీరు చూచితిరా? ఈ వచనాలు రెండూ క్రొత్త నిబంధనలో నున్నవి. కాని దేవునిని దహించు అగ్నిగా భావించుట మనకిష్టము లేదు. కాబట్టి దేవునిని గూర్చిన మన భావన సమతుల్యముగా లేదు. దేవునిని గూర్చి మన భావన సమతుల్యముగా లేనప్పుడు, మన క్రైస్తవ జీవితము శరీరానుసారమైనదిగాను, సమతుల్యత లేనిదిగాను ఉండును! యెషయా ప్రవచనములో మనము ఈ మాటలను చదివెదము: ''సియోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు, వణకు భక్తిహీనులను (వేషదారులను -మరో తర్జుమా) పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యధార్థముగా మాటలాడుచు నిర్భంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును'' (యెషయా 33:14,15).

పాపులును, వేషదారులుకూడా సియోనులో (సంఘములో) ఉన్నారని మనమిక్కడ చదివెదము!! దహించు అగ్నితో ఎవడు నివసింపగలడు అని ఇక్కడ ప్రశ్నించబడెను. ప్రభువు నిజముగా ఒక సంఘములో ఉంటే, అక్కడ ఒక దహించు అగ్నియు, నిత్యము మండుచూ ఉండే మంట అక్కడ ఉండును. ''విశ్వాసుల బాప్తీస్మము'', ''భాషలలో మాటలాడుట'', ''స్తుతి ఆరాధన'', ''ప్రతివారము రొట్టెవిరచుట'' వంటి కొన్ని ప్రత్యేకతలను కలిగియున్నందువలన ఈనాడు అనేక సంఘములు తాము ''క్రొత్త నిబంధన సంఘములు'' అని చెప్పుకొనును. కాని ఒక నిజమైన క్రొత్త నిబంధన సంఘముయొక్క గుర్తు వీటిలో ఏదియు కాదు. ఒక నిజమైన క్రొత్తనిబంధన సంఘముయొక్క గుర్తు ఏమిటంటే దేవుడు దాని మధ్య దహించు అగ్నిగా ఉండుట-ఇది పాపులను భయక్రాంతులను చేసి వేషదారులను వణకించే అగ్ని.

శరీరానుసారులైనవారు మా సంఘమును విడిచిపెట్టినప్పుడు, లేక విశ్వాసభ్రష్టులైనప్పుడు నేను ఆశ్చర్యపడను-ఎందుకనగా మా మధ్య దహించు అగ్ని మండుచున్నది అనుటకు ఇది ఒక ఋజువు. వేషదారులు, శరీరానుసారులు ఒక సంఘమును విడిచిపెట్టినప్పుడు అది ఒక మంచి సూచన. అటువంటి సంఘములో దేవుడు శక్తిమంతముగా పనిచేయుచున్నాడనుటకు అది ఒక సూచన. ఒక సంఘమును ఆత్మానుసారమైనవారు, దైవభయము కలిగిన వారు విడిచిపెట్టినప్పుడు, ఆ సంఘము మేలుకొని తన స్థితిని పరిశీలించుకోవలెను. అది శ్రేష్టమైన విద్యార్థులు ఒక పాఠశాలను విడిచిపెట్టి అదే ప్రాంతములో ఉన్న మరియొక పాఠశాలలో చేరినట్లుండును. అప్పుడు ఆ మొదటి పాఠశాల ''వారు ఎందుకు విడిచిపెట్టిరి'' అని తన్నుతాను ప్రశ్నించుకోవలెను. మన మధ్యన అగ్ని మండుచు ఉండకపోతే, అనేకమంది మనతో ఉండుట కొనసాగించెదరు. మన సంఘాలలో గర్విష్టులైన, యదార్థవంతులు కాని వేషదారులు ఉండుట ఈ రోజుకు కూడా సాధ్యమే. నేను దేవుణ్ణి కాదు గనుక నాకు తెలియదు! కాని నేను ఒక విషయమును నిశ్చయముగా చెప్పగలను: దేవుడు మా మధ్యన దహించు అగ్నిగా ఉన్నంతవరకు అటువంటి వేషదారులు మారుమనస్సు పొంది విషయాలు సరిచేసుకొననియెడల, వారు బయట పెట్టబడుదురు. దేవునికి పక్షపాతము లేదు- మనము ప్రకటన 2,3 అధ్యాయాలలో చూచినట్లు, ఆయన వేషదారులైన పెద్దలను కూడా బయలుపరచును.

దేవుడు దీర్ఘశాంతము కలవాడు, కాని ఆయన సహనము ఒక దినము అంతమగును. దేవుని సంఘమును అపవిత్రపరచు వాడు దేవుని చేత నాశనము చేయబడును-అది నిశ్చయము (1కొరింథీ 3:17). దేవుడు పరిపూర్ణులు కాని వారిని, పాపము చేత జయింపబడిన వారిని తీసివేయడు. కాని ఆయన యదార్థముగా ఉండని వారిని తీసివేయును. ఈ దహించు అగ్నితో నివసించుటకు ఇక్కడ పేర్కొనబడిన మొదటి అర్హత: ''నీతిని అనుసరించి నడచుచు, యధార్థముగా మాటలాడువాడు'' (యెషయా 33:15). అది తమకున్న వెలుగు ప్రకారము నడచుకొనే వారిని, తమ రహస్య జీవితములో యధార్థముగా నడచుకొనేవారిని సూచిస్తున్నది. వారు పరిపూర్ణులు కాకపోవచ్చు కాని వారు యధార్థవంతులు. వారు వేషదారులు కారు.

మనము సంఘములో అన్నిటికంటే ఎక్కువగా భయపడవలసిన విషయము ఒకటున్నదంటే అది మన ఆత్మీయతను గూర్చి ఇతరులకు సత్యముకాని అభిప్రాయమును కలుగజేయుట. మీరు అసలు ప్రార్థనచేయకుండా, మీరు ఎంతో ప్రార్థన చేయుదురన్న అభిప్రాయాన్ని ఇతరులకు కలుగజేయుచున్నారా? మీరు అంతగా ఉపవాసము చేయకుండా, ఎంతో ఉపవాసము చేయువారిగా వారికి అభిప్రాయము కలుగజేయుచున్నారా? మీరు పూర్ణహృదయులు కాకుండా ఇతరులు మిమ్మును అలా ఎంచాలని కోరుకొనుచున్నారా? అప్పుడు మీరు విశ్వాస భ్రష్టులయ్యే ప్రమాదములో ఉన్నారు. అది మీరు పరిపూర్ణులు కాకపోవుట వలనకాదుగాని, మీరు యధార్థముగా ఉండకపోవుట వలన జరుగును. దేవుడు మన అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. వారు బయటపెట్టబడుదురేమో నని భయపడి, సీయోనులోని వేషదారులు వణకుచున్నారు.

దహించు అగ్నితో నివసించుటకు రెండవ అర్హత ''నిర్భంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుట'' (యెషయా 33:15)-వేరేమాటలలో చెప్పాలంటే డబ్బు విషయంలో న్యాయముగాను, నమ్మకముగాను ఉండుట. దేవునికి ప్రత్యామ్నాయ యజమాని సాతానని మనము అనుకొనియుండవచ్చును. కాని లూకా 16:13లో దేవునికి ప్రత్యామ్నాయ యజమాని సిరియని (డబ్బు మరియు భౌతిక సంపద) యేసు స్వయముగా చెప్పారు! దేవుణ్ణి మరియు సాతానును ఒకే సమయములో ప్రేమింపగలనని ఏ విశ్వాసి ఊహించడు, కాని దేవుణ్ణి మరియు డబ్బును ఒకేసారి ప్రేమించవచ్చని ఊహించుకొనే విశ్వాసులు కోకొల్లలమంది ఉన్నారు. ఏ విశ్వాసి కూడా సాగిలపడి సాతానుని మ్రొక్కడు. కాని ఈనాడు కోట్లమంది విశ్వాసులు సిరిని పూజించుచు దేవునిని కూడా ఆరాధించవచ్చని ఊహించుకొనుచున్నారు. కాని వారు డబ్బు విషయములో నమ్మకముగా లేనియెడల, దేవునిని ఆరాధించలేరు. సత్యవంతుడైన, సజీవుడైన దేవునినుండి సిరి ఒక వ్యక్తిని ఆకర్షించి ఆయనకు దూరము చేయునని వారు గ్రహించరు.

దహించు అగ్నితో నివసించుటకు మూడవ అర్హత ''హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొనుట'' (యెషయా 33:15). ఇది వదరుబోతులుగా ఉండకపోవుటకంటే ఎక్కువ. ఇది వేరొకరు అలా చేసినప్పుడు వినుటకు ఇష్టపడకపోవుటను సూచిస్తున్నది. ఒక దైవభయము కలిగిన వ్యక్తి సహోదరులమీద నేరారోపణ చేయువారిలో ముఖ్యుడినే కాక (ప్రకటన 12:10), అతని ప్రతినిధులకు కూడా తన చెవులు మూసుకొనును.

పరలోకము యొక్క కోణమునుండి మనము భూమిని చూడగలిగినయెడల, ప్రతి దినము లోకమంతట కోట్ల మంది ప్రజలు తెల్లవారు జామునుండి అర్థరాత్రి వరకు, తమ నాలుకలతో ఇతరులను ముక్కలుగా చీల్చివేయుటను మనము చూచెదము. కాని దహించు అగ్నియైన దేవునితో మీరు నివసించాలనుకొన్న యెడల, మీరు అటువంటి నేరారోపణలను వినకుండా మిమ్మును మీరు క్రమశిక్షణలో పెట్టుకొనవలెను. మీరు లేచి నిలబడి గదినుండి బయటకు వెళ్లుటకు అసాధ్యమైన పరిస్థితులలో మీరు వాటిని విన్నప్పటికీ, మీరు వాటిని వినకుండా మీ మనస్సును ఆపుకోవచ్చును (అదుపులో పెట్టుకోవచ్చును). మీ చుట్టూ ఉన్నవారందరూ చెడిపోయినప్పటికీ, మీరు మీ జీవితము నుండి దేవుని కృపను ఎందుకు పోగొట్టుకోవాలి? మీరు దహించు అగ్నితో నివసించుటను గూర్చి తీవ్రముగా ఉన్నయెడల, నేరారోపణలన్నిటిని వినుట మానివేయుడి. లోపల నుండి మన మనస్సులను అదుపులో పెట్టుకొనే సామర్థ్యతను దేవుడు మనకిచ్చెను. అలా చేయుడి. హత్య అను మాట వినకుండా మీ చెవులు మూసుకొనుడి.

దహించు అగ్నితో నివసించుటకు ఇక్కడ పేర్కొనబడిన నాల్గవ అర్హత, చెడుతనమును చూడకుండా మన కన్నులు మూసికొనుట. ఈ రెండు శారీరక ఇంద్రియాలు-వినుట మరియు చూచుట-మన మనస్సులలోనికి మంచి మరియు చెడు ప్రవేశించుటకు ముఖ్యమైన ద్వారములు. దేనిని లోపలికి ప్రవేశించుటకు అనుమతించెదమో మనము నిర్ణయించుకోవలెను. దహించు అగ్నితో నివసించువాడు తన ఆత్మను కలుషితము చేయు వాటిని చూడడు. మీలో లోకానుసారమైన వాటినన్నిటిని, దహించివేయబడగలిగిన వాటినన్నింటిని దేవుడు దహించివేయుటకు మీరాయనను అనుమతించినప్పుడు మాత్రమే, దహించు అగ్నియైన ఆయనతో మీరు నివసింపగలరు. అప్పుడు మీలో ఏదైతే మిగిలియుండునో అది దహించబడలేనిదిగా నుండును. వారిలో దహించబడగలిగిన వాటిని లేనివారితో దేవుడు పరలోకమును నింపును.

దేవుడు మనలను పరలోకము కొరకు సిద్ధపరచుచున్నాడు. ''పరలోకము దిగివచ్చెను, నా యాత్మ మహిమతో నింపబడెను'' అని మనము పాడినప్పుడు, మనము దేని గురించి మాట్లాడుచున్నాము? మనము ఆ దహించు అగ్ని మన ఆత్మలోనికి వచ్చి దహించబడగలిగిన వాటినన్నిటిని దహించివేయుటను గూర్చి మాట్లాడుచున్నాము. ''ప్రభువా, నీవు మరియు నేను కలిసి చిరకాలము సహవాసములో నివసింపగలుగునట్లు, దహించబడలేనివి మాత్రమే నా జీవితములో నాకు కావలెను'' అని మనము ఇష్టపూర్వకముగా ప్రభువుతో చెప్పగలమా! చివరి దినమున ప్రభువు ప్రతిదానిని తన అగ్నిచేత పరీక్షించునని 1కొరింథీ 3:11-15 చెప్పుచున్నది. దహించబడగలిగిన ప్రతిఒక్కటీ, కఱ్ఱ,గడ్డి,కొయ్యకాలు దహించివేయబడును. దహించబడలేనివి మాత్రమే-బంగారము, వెండి,వెలగాలరాళ్లు-నిలచియుండును.

ఇది ఇలా ఉండును గనుక, పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని ఇప్పుడే పొందగలుగుట ఎంత గొప్ప ఆధిక్యత, ఈ విధముగా ఆ రోజు రాకమునుపే మనలో దహించబడగలిగేవన్నియు దహించివేయబడును. యేసు మనకు పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో బాప్తీస్మమిచ్చుటకు వచ్చెను (యోహాను 1:29). ఆ విధముగా పరిశుద్ధాత్మ మన జీవితముల యొక్క ప్రతి భాగములోనికి ప్రవేశించి మనలో లోకానుసారమైన వాటన్నిటిని -కఱ్ఱ,గడ్డి,కొయ్యకాలులను దహించివేయును. దేవుని వాక్యము మన జీవితాలనుండి అనేకమైన వాటిని దహించి తొలగించివేయగలిగిన ఒక అగ్నియైయున్నది (యిర్మీయా 23:29). కాని దేవుని వాక్యము మాట్లాడని, మన జీవితములో దహించవేయబడవలసినవి అనేకమైనవి ఉన్నవి. వాటిని పరిశుద్ధాత్మ మనకు చూపించి వాటిని దహించివేయుటకు మన అనుమతిని అడుగును. మనము ఈ ఆధునిక ప్రపంచములో ఎదుర్కొనే అనేకమైన విషయాలను గూర్చి దేవుని వాక్యము మనకు ఏమియు చెప్పదు ఎందుకనగా అవి మొదటి శతాబ్దములో లేకుండెను. కాని మనము వాటిని క్రీస్తుతోని సహవాసముతో చేయవచ్చో లేదో అని ఆత్మ మనతో చెప్పును.

కాబట్టి ప్రతిదినము మనకు పరిశుద్ధాత్మ చెప్పే వాటన్నిటికి సున్నితముగా ఉండుటకు మనము జాగ్రత్తపడవలెను. పరిశుద్ధాత్మను ఎల్లప్పుడు ఆలకించువాడు, దేవుని భయముతో వ్యవహరించువాడు మాత్రమే దహించు అగ్నియైన దేవునితో నివసింపగలడు. అటువంటి వ్యక్తి ఇతర విశ్వాసులు జారిపోయి పడిపోవుటను చూచినప్పుడు తను గురించి తాను భయపడును. అతడు ఇతరులకు తీర్పు తీర్చడు కాని ఇలా చెప్పును, ''ప్రభువా, నాకు వారికున్న శరీరము వంటిదే ఉన్నది. వాళ్లకు జరిగినదే నాకు జరుగవచ్చును. నేను భయముతో జీవించాలనుకొనుచున్నాను. నేను యదార్థముగా నుండుటకు సహాయపడుము. నాకున్న వెలుగు ప్రకారము నేను డబ్బువిషయములో నమ్మకముగా ఉండాలనుకొనుచున్నాను. నేను ఇతరుల మీద నేరారోపణలను వినాలనుకోవటంలేదు. నేను నిన్ను అంగీకరించినంత మాత్రాన, నేను ఎలా జీవించినా క్షేమముగానే నుందునని నేను ఊహించుకోదలచుకోలేదు. నేను భయముతో జీవించాలనుకొనుచున్నాను''. దహించు అగ్నితో నివసించాలని కోరుకొనే ఒక దైవభయము గల వ్యక్తి ఆ విధముగా ప్రార్థించును.

తాము రక్షింపబడునట్లు తమను గూర్చిన సత్యమును ప్రేమించని వారి మీద దేవుడు ఒక మోసగించు ప్రభావమును పంపించునని 2థెస్సలోని 2:11 చెప్పుచున్నది. సత్యమును ప్రేమించని వారందరిని దురాత్మలు మోసగించుటకు దేవుడు అనుమతించి, వారు ఆ అబద్ధమును నమ్ముటకు దేవుడు అనుమతించునని ఆ వచనము చెప్పుచున్నది. 'ఆ అబద్ధము' అంటే ఏమిటి? అనేక రకములైన అబద్ధములున్నవి, కాని ఒక అబద్ధము లేఖనములలో 'ఆ అబద్ధము' అని పిలువబడెను. 'ఆ అబద్ధము' మనిషి విన్న మొదటి అబద్ధము. అది ''మీరు చావనే చావరు'' అని సాతాను హవ్వతో చెప్పిన మాట (ఆదికాండము 3:4). తాను దేవుని స్వారూప్యములో చేయబడినది గనుక, దేవునికి లోబడుటకు బదులు పాపము చేసినా కూడా తాను ఆత్మీయముగా మరణించదన్న ఆ అబద్ధమును హవ్వ నమ్మెను. వారు ప్రభువును అంగీకరించిరి గనుక లేక వారు నీటిలో బాప్తిస్మము పొందిరి గనుక లేక వారు భాషలలో మాట్లాడుదురు గనుక లేక వారు క్రమం తప్పకుండా కూటములకు హాజరవుదురు గనుక వారు చావరని అపవాది ఇంకా ఈ రోజున ప్రజలకు చెప్పుచున్నాడు.

తమను గూర్చిన సత్యమును ప్రేమించని వారందరికి ఈ అబద్ధము నమ్ముటకు దేవుడు అనుమతించును. కాబట్టి ''విశ్వాసులు''గా పిలువబడే కోట్లాది మంది ఈ రోజున ఈ అబద్ధమును నమ్ముచున్నారు. వారు పాపములో జీవించినప్పటికీ, వారు ఆత్మీయముగా చావరని వారు నమ్ముచున్నారు. కాబట్టి వారు పాపము విషయములో అజాగ్రత్తగానుందురు. వారు దేవునికి భయపడరు. వారు పాపమును ద్వేషించరు. వారి జీవితాలలో దహించవేయబడవలసిన వాటన్నిటిని దహించు అగ్నిలో పడవేయరు. వారు యధార్థత లేనివారు, నీతిలేని వారు మరియు వేషదారులు. వారు పాపముతో ఆడుకొందురు. వారు ఇతరులపై నేరారోపణ చేసి నేరారోపణలను ఆలకించుదురు. వారి కన్నులతో వారు చెడ్డవాటిని చూతురు. అయినప్పటికీ, చిరకాలము ''దహించు అగ్ని''తో వారు పరలోకములో నివసించుదురని వారు ఊహించుకొందురు. అటువంటి అబద్ధమును వారు ఎలా నమ్మగలరు? తమ సిద్ధాంతములు సరియైనవైతే వారు ఎలా జీవించినా పరవాలేదు అని వారిని నమ్మించిన సాతాను యొక్క బృహత్పధకము ద్వారా వారు దానిని నమ్మిరి.

''మారుమనస్సు పొందుటకు నేను వారికి సమయమిచ్చితిని'' అని దేవుడు తన వాక్యములో చెప్పుచున్నాడు. దేవుడు ఎంత మంచివాడు! ఆయన వెంటనే తీర్పుతీర్చడు. ఆయన మనము మారుమనస్సు పొందుటకు సమయమునిచ్చును. కాని మనము పాపమునుండి రక్షింపబడునట్లు మనలను గూర్చిన సత్యమును ప్రేమించని యెడల, అప్పుడు దేవుడు కూడా మనకు సహాయపడలేడు. కాబట్టి సహోదర సహోదరీలారా, మీ గురించిన సత్యమును మీరు ప్రేమించవలెనని మీ జీవితములో క్రీస్తు పోలికలో లేనివాటన్నిటి నుండి రక్షింపబడుటకు కోరుకొనవలెనని నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఈనాడు తామే సత్యమును కలిగియున్నామని, ప్రకటించే అనేకమైన గుంపులు, శాఖలు, వ్యవస్థలు కలవు. ఏది సత్యమో మనము ఏలాగు తెలిసికోగలము? మోసపోకుండా మనలను మనము ఎలా నివారించుకోగలము? సమాధానమిదే: అన్ని సమయములందు మీ గురించిన సత్యమును ప్రేమించినయెడల, మీ జీవితము యొక్క అంతము వరకు మీరు మోసపోవుటకు ప్రభువు అనుమతించడు. లేనియెడల, మీరు ఇతరులకు బోధించి, మీరు నరకమునకు వెళ్లుటయేకాక ఇతరులను కూడా అక్కడికి నడిపించుదురు.

మనము రక్షింపబడునట్లు మనము సత్యమును ప్రేమించినయెడల, మనము ఏ బోధకుని చేత గాని, లేక భక్తిపరుడుగా పిలువబడే వానిచేత గాని, లేక మతభ్రష్టుడైన వానిచేత గాని, పరిసయ్యునిచేత లేక అక్షరానుసారుడైనవాని చేత మోసగింపబడము. ఎవరైనను మనలను మోసగించలేరు లేక తప్పు దారి పట్టించలేరు. దేవుడు మనతో నేరుగా తన వాక్యము ద్వారా లేక పరిశుద్ధాత్మ ద్వారా, లేక వేరొక సహోదరుని ద్వారా, బహువా ఒక శత్రువు ద్వారా మాట్లాడినప్పుడు, మన గురించిన సత్యమును మనము వినినప్పుడు మనమేమి చేయుదుము? మనలను మనము నీతిమంతులుగా కనుపరచకుందుమా లేక మనలను మనము తీర్పుతీర్చుకొందుమా?

నేను నా జీవితములో అనేకమైన నేరారోపణ చేయు ఉత్తరాలను అందుకొంటిని. (అది ప్రభువును సేవించువారందరికి నియమింపబడినది). నేను సాధారణముగా వాటిని చెత్తబుట్టలో పారవేయుదును. కాని అలా చేసేముందు, నేను వాటిని చదివి ''ప్రభువా, నా శత్రువు చెప్పుచున్నదానిలో ఏదైనా సత్యమున్నదా? బహుశా ఉన్నదేమో దయచేసి నాకు చూపించుము'' అని ప్రభువును అడుగుదును. మన స్నేహితులకంటే మన శత్రువులే మనలను గూర్చి ఎక్కువ సత్యములు చెప్పుదురు.

కాని నేను ఏ ఉత్తరము నన్ను శిక్షావిధికి గురిచేయుటకు అనుమతించను, ఎందుకనగా క్రీస్తులోనున్న నాకు ఏ శిక్షావిధియు లేదు. కాని అటువంటి సమయములలో ప్రభువు నాతో మాట్లాడుటకు నేను అనుమతించెదను. అది మన శరీరములకు ఉచితమైన ''స్కాన్‌'' (పరీక్షను) పొందినట్లుండును. ఈ రోజుల్లో మన శరీరము యొక్క ఎమ్‌.ఆర్‌.ఇ. స్కాన్‌ వైద్య విశ్లేషణ ప్రయోగశాలలో కొన్నివేల రూపాయలు ఖర్చగును. అటువంటప్పుడు మన హృదయాలను ఎవరైన మనకొరకు ఉచితముగా స్కాన్‌ చేయుట అద్భుతమైన విషయము కాదా!! అటువంటి స్కాన్‌ను మనకు ఇచ్చేది మన శత్రువైన యెడల, మనము దేవునిని స్తుతించి అటువంటి స్కాన్‌కు (పరీక్షకు) మనలను మనము అప్పగించుకొందాము. మన హృదయాలలో ఎటువంటి వ్యాధిలేని యెడల, ఒక శత్రువు వ్రాసిన ఉత్తరము చేతనైనను మనలను మనము పరీక్షచేసుకొనుట ద్వారా మనము పోగొట్టుకొనేది ఏమియు లేదు.

ఒక భక్తిహీనుడైన అన్యుడు (అబీమెలెకు) ఒకసారి అబ్రాహామును అబద్ధమాడినందుకు గద్దించెనని గుర్తుంచుకొనుడి (ఆదికాండము 20:9). అబ్రాహాము దేవునిచేత ఏర్పరచుకోబడిన ఒక ప్రవక్త. కాని అతడు తన పాపము నిమిత్తము ఒక భక్తిహీనుని చేత గద్దింపబడవలసి వచ్చెను! ఈ రోజున అబ్రాహాము పరలోకములో ఉన్నాడు, అబీమెలెకు బహుశా నరకములో యుండవచ్చును. కాని ఆ దినమున తన పాపమును చూచుటకు అబ్రాహాముకు సహాయపడినది అబీమెలెకే. ఇందుకు మిమ్ములను మీరు తగ్గించుకొనుడి. మీ జీవితములో ఉన్న ఒక దురలవాటును విడిచిపెట్టుటకు సహాయపడుటకు ఒక అన్యుడు మీరు దానిని చూచునట్లు సహాపడునేమో. చివరి విశ్లేషణలో, దేవుని యెదుట కేవలము రెండు వర్గాల ప్రజలే ఉన్నారని మనము కనుగొనెదము. వీరు తప్పుచేయని వారు, తప్పుచేయువారు కాదు గాని దీనులుగా ఉన్నవారు, గర్విష్టులుగా ఉన్నవారు. వేరే మాటలలో చెప్పాలంటే యేసును తన దీనత్వములో వెంబడించిన వారు, సాతానును తన గర్వములో వెంబడించిన వారు.

దేవుడు మొట్టమొదటిగా మన హృదయాలలో దహించు అగ్నితో ఎల్లప్పుడు దహించి వేయుటకు చూచునది మన గర్వమునే. ఆయన సియోనునుండి గర్విష్టులైన అహంకారులను తీసివేయుటకు చూచుచున్నాడు. ''నీ గర్వమునుబట్టి సంతోషించువారిని నేను వెళ్లగొట్టుదును గనుక, నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూడవు'' అని ప్రభువు చెప్పుచున్నాడు (జెఫన్యా 3:11). అప్పుడు సంఘములో ''దు:ఖితులగు దీనులు'' మిగిలియుందురు (జెఫన్యా 3:12). సాతాను మీద గెలుచునది ఈ సంఘమే. అంతిమ దినమున, వారు గర్విష్టులైనందున సరియైనది చేసినప్పటికీ దేవుని చేత తిరస్కరింపబడిన అనేకమందిని మనము చూచెదము. ఆశ్చర్యకరముగా, తమ జీవితాలలో తీవ్రమైన తప్పులను చేసినవారు, దీనులై యధార్థముగా ఉన్నందున దేవుని చేత అంగీకరింపబడుదురని మనము చూచెదము.

మనము ''చిన్నపాపము'' అని పిలిచే దానిని చేసిన కొందరిని దేవుడు ఏ విధముగా తిరస్కరించెనో, మనము ''పెద్దపాపము'' అని పిలిచే దానిని చేసిన కొందరిని దేవుడు ఏ విధముగా అంగీకరించి ఆశీర్వదించెనో పరిగణించుడి. మొదటిగా మనము రాజైన సౌలు విషయము చూచెదము. అతడు మనము ''చిన్నపాపము'' అను దానిని చేసెను. దేవుడు చెప్పినట్లు అమాలేకు యొక్క గొఱ్టెలన్నిటిని చంపుటకు బదులు, అతడు చెడ్డ గొఱ్ఱెలను మాత్రమే చంపి దేవునికి బలిగా అర్పించుటకు మంచి గొఱ్ఱెలను విడిచిపెట్టెను. అటువంటి పొరపాటు నిమిత్తము మీరు సౌలును ఖండించేవారా? బహుశా లేదేమో. కాని దేవుడు సౌలును శిక్షించెను. అది కూడా తీవ్రముగా! ఆయన సౌలునుండి రాజ్యమును తీసివేసుకొనెను.

మరోప్రక్క దావీదు ఏమి చేసెనో పరిశీలించుడి. ఒక వ్యక్తి ఊరు బయట ఉండి దావీదు యొక్క స్వంత సైన్యములో పోరాడుచున్నప్పుడు దావీదు అతని భార్యతో వ్యభిచారము చేసెను. ఆ తరువాత తన పాపమును కప్పిపుచ్చుకొనుటకు, దావీదు ఆ వ్యక్తిని యుద్ధరంగములో చంపించి ఆ తరువాత ఆ స్త్రీని వివాహము చేసుకొనెను. దావీదు వంటి వ్యక్తితో మీరేమి చేయుదురు. మీరు బహుశా దావీదును నరకమునకు వెంటనే పంపివేయుదురు. కాని దేవుడు అలా చేయలేదు. ఆయన మార్గములు మన మార్గములు కావు. దేవుని మార్గములను మన మానవ జ్ఞానమునకు అర్థముకావు. మనము ప్రజలను వారు మంచి చేసారా చెడు చేసారా అను దాని ప్రకారము విభజించుదుము. కాని దేవుడు వారు గర్విష్టులా (మరియు యధార్థత లేనివారా) లేక దీనులా (మరియు యధార్థత కలిగినవారా) అన్నదాని ప్రకారము వారిని విభజించును. కాబట్టి దేవుడు దావీదును తన పాపమును బట్టి శిక్షించిన తరువాత, అతడిని అంగీకరించెను.

దావీదు తనకు ఇష్టానుసారుడైన మనుష్యుడనియు, తన సంకల్పము చొప్పున తన తరము వారిని సేవించెననియు దేవుడు చెప్పెను (అపొ.కా.13:22,36). దావీదు దీనుడు గనుక అతని అంతము సౌలు యొక్క అంతము వలే లేకుండెను. పడిపోయిన క్రైస్తవులను, క్రైస్తవ నాయకులను నేను గమనించినప్పుడు నేను ఒక వ్యత్యాసమును కనుగొంటిని. దేవుడు కొంతమంది బయటపడుటకు అనుమతించును గాని ఇతరులను అనుమతించడు. మనుష్యుల దృష్టిలో చాలా చిన్న నేరములు చేసిన కొంతమంది అందరిముందు బయటపెట్టబడి అవమానపరచబడుదురు. నాకు గోప్యంగా తెలిసిన ఇతరులు ఇంకా ఎంతో గొప్ప నేరములు చేసినప్పటికీ అస్సలు బయటపెట్టబడరు. దేవుడు వారి పొరపాట్లను కప్పిపుచ్చటమే కాకుండా, వారిని దీవించి గొప్పగా వాడుకొనును!

ఇదంతా మనకు అన్యాయముగా అనిపించవచ్చును. కాని అలా కాదు. దేవుడు అటువంటి వాటిని ఎందుకు చేయును. ఎందుకనగా ఎక్కువమంది మతభక్తి కలిగినవారివలే ఆయన పరిసయ్యుడు కాదు! ఆయన ప్రజలను ''దీనులు'' మరియు ''గర్విష్టులు'' అను వర్గాలలోకి విభజించును. అంతేకాని ''మంచిచేసినవారు'' మరియు ''చెడుచేసిన వారు'' అను వర్గాలలోకి విభజింపడు. ఇదే మనందరికీ గొప్ప నిరీక్షణను ప్రోత్సాహమును ఇచ్చును. మనుష్యులు విభజించినట్లు దేవుడు ప్రజలను విభజించిన యెడల, మనము యాదృచ్ఛికంగా తప్పుగుంపులో పడిపోవుదమేమో నన్న భయముతో మనము ఎల్లప్పుడు జీవించవలెను-ఎందుకనగా మనమందరము కావాలని చేయకపోయినా అనుకోకుండా పొరపాట్లుచేసి తప్పుడు పనులను చేయుదుము. మనము ఒక్క తప్పు పనిచేసినా మనుష్యులు సాధారణంగా మనతో కఠినముగా వ్యవహరించుదురు. కాని మనము కనికరము లేని మనుష్యులతో వ్యవహరించవలసి రానందుకు దేవునికి వందనాలు. మన కనికరముగల సృష్టికర్తకే మనము లెక్క అప్పచెప్పవలసియున్నది (హెబ్రీయులు 4:13).

మనము ఎల్లప్పుడు దేవునియెదుట దీనత్వముతో విరిగిన హృదయముతోను నివసించి, ఇంకెవరికంటే మనలను మనము గొప్పగా ఎంచుకొనకుండా, మనము పాపులలో ప్రధానులమని ఎల్లప్పుడు గుర్తించుచు, ఇతరుల మీద పెత్తనము చేయుటకు ఎల్లప్పుడు కోరుకొనక, భూమి మీద దేనికైనను (అది ఒక పరిచర్యయైనను) లాక్కొనుటకు ప్రయత్నించకుండా, ''రెండవ మైలును'' నడచుటకు మనము సిద్ధపడి, మనకు అతి గొప్ప హానిని చేసిన వారిని క్షమించుటకు మనము సిద్ధముగా ఉన్నయెడల, మనుష్యులు మనలను గూర్చి ఏమి తలంచినా మనకు ఏమి చేసినా దేవుడు మన వైఫల్యాలను కప్పిపెట్టి మనలను దీవించుట కొనసాగించును. పనివారు ముష్కరులైన యజమానులకు కూడా లోబడియుండవలెనని 1పేతురు 2:18,19 వచనాలు వారికి చెప్పుచున్నవి. మనము ఈ లోకములో జీవించినంత కాలము అసమంజసమైన ప్రజలను ఎదుర్కొనెదము. మనము సమంజసమైన ప్రజలతో మాత్రమే నివసింప గలిగినయెడల, యేసు యొక్క శిష్యులుగా ఉండుటకు మనకు అర్హతలేదు. అసమంజసమైన ప్రజల ద్వారా దేవుడు మన గర్వాన్ని దహించివేయును. మనము అసమంజసమైన ప్రజలతో వ్యవహరించి వారి చేత శ్రమపెట్టబడినప్పుడు, మనలను మనము తగ్గించుకొని మన శ్రమను సహనముతో యేసు వలే సహించినయెడల దేవుడు మనయందు ఆనందించును.

మీరు తప్పుచేయుట వలన శ్రమపడినప్పుడు మీరు సహనముగా ఉంటే మీకేఘనతా లేదు. మీకు దానికి సున్నా లభించును! దానిని బట్టి మీకు దేవునినుండి ఎందుకు మార్కులు రావలెను? కాని మీరు మేలుచేసి దానికొరకు శ్రమపొందినప్పుడు-అది కార్యాలయములో గాని లేక సంఘములో గాని లేక ఎక్కడైననూ- మీరు దానిని సహనముతో భరించినయెడల, దేవుడు మీయందు ఆనందించును (1పేతురు 2:20). ''ఆనందించుచున్నాను'' అనేది ఎంత అద్భుతమైన మాట. యేసును గూర్చి మాట్లాడినప్పుడు దేవుడు ఉపయోగించిన మాట ఇదే. ''ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను''. దీనత్వము దేవుని యెదుట బ్రహ్మాండమైన విలువకలది. సాధువైనట్టియు మృధువైనట్టియునైన అంతరంగ స్వభావము (అది స్త్రీలో కనబడిన లేక పురుషునిలో కనబడినా) దేవుని దృష్టికి మిగుల విలువకలదని 1పేతురు 3:4లో చెప్పబడినది. యేసు తానే సాత్వీమైన, దీనమైన మనస్సును కలిగియుండెను మరియు ఆయననుండి ఈ సద్గుణాలను నేర్చుకోవలెనని(పొందుకోవలెనని) ఆయన మనకు చెప్పెను (మత్తయి 11:28).

ఒక సాధువైన, మృధువైన స్వభావము ఆందోళన చెందదు లేక అలజడిలో ఉండదు. కొన్ని దుస్తులను ఉతికే యంత్రములు ''యాజిటేటర్‌'' అను పరికరమును కలిగియుండును. అది ఇటుఅటు నిరంతరము తిరుగుచుండును. అది ఎప్పుడైనను విశ్రమించదు. అది ఎల్లప్పుడు కదులుచు తిరుగుచుండును. ఆదాము సంతానము యొక్క హృదయాలలో కూడా ఒక ''యాజిటేటర్‌'' ఉన్నది. వారిని ఎవరైనా సరిగా చూడనియెడల, ఈ ''యాజిటేటర్‌'' కదులుచు తిరుగుట మొదలుపెట్టును. కాని సాధువైన మృధువైన అంతరంగ స్వభావము కలవారు ఈ ''యాజిటేటర్‌''ను తొలగించుకొనియున్నారు. వారికి ఎవరైన ఏదైన చెడు చేసినా మాట్లాడినా లేక వారు ఆశించినది ఎవరైనా చేయకపోయినా వారు అభ్యంతరపడరు, బాధపడరు. వారు తమ ''యాజిటేటర్‌''ను సిలువకు అప్పగించిరి.

ఒక సాధువైన మృధువైన అంతరంగ స్వభావము ''అక్షయాలంకారము'' గలది అని పేతురు చెప్పెను. ఇది నిత్యమైన సౌందర్యమునకు రహస్యము. ఈ రోజుల్లో తక్కువ వయస్సు కలవారిగా కనబడుటకు ఇష్టపడే స్త్రీలతో లోకము నిండియున్నది. కాని నిజముగా అక్షయమైన సౌందర్యము ఏమిటి. అది ఒక సాధువైన మృధువైన అంతరంగ స్వభావము. ఇది పురుషులకు కూడా అవసరమే. మిమ్ములను దేవునికి నిజముగా విలువగలవారిగా చేయునది ఇదే -మీరు కదిలింపబడని, అభ్యంతరపడని, చెడ్డ మనోభావాలు లేని, క్రోధము లేక కోపము లేని సాధువైన మృధువైన అంతరంగ స్వభావమును కలిగియుండుట. ఆత్మ ఫలము ఆశానిగ్రహము గనుక మీరు మీ నిగ్రహమును ఎన్నడు కోల్పోనవసరము లేదు. లోకమంతా ''యాజిటేటర్‌''లను కలిగియున్న ప్రజలతో నిండియున్నను, అది ఇక మనకు కాదు. మనము మన యాజిటేటర్‌లను శాశ్వతముగా తొలగించుకోవచ్చు. దేవునికి స్తోత్రము.

శాస్త్రుల మరియు పరిసయ్యుల నీతికంటే వారి నీతి అధికముగా ఉండవలెనని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు, ఆయన అర్థమేమిటి? నేను ఇప్పుడు మాట్లాడినదే ఆయన అర్థము. పరిసయ్యుల యొక్కనీతి ''సరియైనది'' ''తప్పయినది'' అనువాటికి సంబంధించినది. కాని యేసు తన శిష్యుల యొక్క నీతి దానికంటే ఎక్కువగా ఉండవలెనని కోరుకొనెను. అది దీనత్వమును, విరిగినలిగిన హృదయమును, సాత్వీకమును, మృధువైన స్వభావముతో కూడియుండవలెను. లేనియెడల వారు ఎన్నడు పరలోక రాజ్యములో ప్రవేశింపరని ఆయన వారితో చెప్పెను. యేసు చెప్పినది నిజముగా నమ్మువారు మనలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. యేసు మనకు ఇచ్చే ఈ ''విశ్రాంతి''లోనికి మనము ప్రవేశింపకుందుమేమో అని భయము కలిగియుండవలెనని మనకు హెబ్రీయులు 4:1లో చెప్పబడినది. మరియు 11వ వచనములో మనము విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడవలెనని మనకు చెప్పబడినది. మీరు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించారా?

మిమ్ములను మోసము చేసినవారందరినీ, నష్టము చేకూర్చిన వారందరినీ మీరు క్షమించితిరా? కోపము, ద్వేషము, ఆత్రుత, అత్యాశ వంటి వాటన్నిటినుండి మీ హృదయమును మీరు పవిత్రపరచుకొనిరా? ఇదే మనకు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు సహాయపడును. మీరు యేసుని శిష్యులైన యెడల లోకములో ఏ వ్యక్తియు లేక ఏ పరిస్థితియు రోమా 8:28 (దేవుని ప్రేమించువారికి సమస్తమును సమకూడి జరుగును.....)ను మరియు 1కొరింథీ 10:13 (మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు మిమ్ములను శోధింపబడనీయ్యడు....)మీ జీవితములో నెరవేరకుండా ఆపలేవు. మనము సహింపగలిగిన దానికంటే మనమెప్పుడు శోధింపబడలేము. అది అసాధ్యము-ఎందుకనగా దేవుడు తన వాగ్దానముల విషయములో నమ్మదగినవాడు. మరియు సమస్తమును-అవును, సమస్తమును మన మేలు కొరకు సమకూడి జరుగును.

ఒక దీనుడైన వ్యక్తి ఎప్పుడు పడిపోలేడు. ఎందుకనగా అతడు అప్పటికే నేల మట్టమున ఉన్నాడు. అతడు ఎలా పడిపోగలడు. ''తొట్రిల్లకుండా ఆయన మిమ్మును కాపాడును'' అని దేవుని వాక్యము చెప్పినప్పుడు (యూదా 24) ఈవిధంగా ప్రభువు మనలను కాపాడును- అది ఆయన యెదుట మన ముఖాలను దుమ్ములో పెట్టుటద్వారా, అప్పుడు పడిపోవుట అసాధ్యమగును. 1కొరింథీ 10:13లో వాగ్దానము చేయబడిన తప్పించుకొను మార్గము మనలను మనము తగ్గించుకొనే మార్గము. దేవుడు మనకు కృపనిచ్చి లేవనెత్తునని మనము నమ్మెదము గనుక మనలను మనము తగ్గించుకొనెదము. నీటి బాప్తీస్మములో వలెనే, మనలను నీళ్లలోనికి ముంచువాడు మనలను తిరిగి పైకెత్తునని మనము నమ్మెదము కాబట్టి మనము అతనికి లోబడుదుము. అదే విధముగా ఒక పరిస్థితి మనలను అణగద్రొక్కుటకు అనుమతించిన దేవుడు మనలను లేవనెత్తి మన జీవితాలలోకూడా ఒక పునరుత్థానమును తెచ్చునని కూడా మనము నమ్మెదము. మనము ఆయనను అనుమతించిన యెడల మన హృదయము యొక్క ప్రతిమూల నుండి ''ప్రతి గర్వపు అణువును'' దహించివేయుటకు నిశ్చయించుకొనిన దేవుడు ఒక దహించు అగ్నియైయున్నాడు. గర్వము యొక్క ప్రతి అణువు పూర్తిగా దహించివేయబడునట్లు ఆయన ప్రజలను పరిస్థితులను నిర్దేశించును. కాబట్టి మనమాయనతో సహకరించి మనలో ఒక పరిపూర్ణ కార్యము చేయుటకు ఆత్మను అనుమతించెదము గాక.

వినుటకు చెవులు గలవాడు వినునుగాక.

అధ్యాయము 14
సంఘమునకు విలువనిచ్చుట

''క్రీస్తు సంఘమును ప్రేమించి దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను'' (ఎఫెసీ 5:25-27).

మనము ఎవరుపడితే వాళ్లకొరకు మన ప్రాణములను అర్పించము. కాని కొంతమంది కొరకు మనము మన ప్రాణములను కూడా అర్పించుదుము. ఉదాహరణకు మీ బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉండి తనకు మీ మూత్రపిండము అవసరమైతే, అది మీ స్వంత ప్రాణమునకు హానికరమైనప్పటికీ మీరు నిశ్చయముగా మీ మూత్రపిండమును దానము చేయుదురు. మీ బిడ్డ ప్రాణమును కాపాడుటకు మీరు సంతోషముతో మీ ప్రాణమును అర్పించుదురు. అయితే మీరు ఒక అపరిచితుని కొరకు అలాచేయరు. మీ ఇంటి ప్రక్కనున్న పొరుగు వానికి కూడా అలాచేయరు. మనము ఎవరికైనా చేయునది మనము అతనికి ఎంత విలువనిచ్చుచున్నామనే దాని మీద ఆధారపడియున్నది. పై వచనములో క్రీస్తు సంఘమును, నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు తన్నుతాను అప్పగించుకొనెనని మనము చదివెదము. మనము ఎంత విలువైన వారమని ఆయన భావించెనంటే ఆయన తన మూత్రపిండాలనే కాక, తన జీవితమంతటిని అర్పించుటకు ఇష్టపడెను.

మేము యేసును వెంబడించాలనుకొనుచున్నాము అని మనమందరము చెప్పుదుము. కాని మనమాయనను ఏవిధముగా వెంబడించెదము? మనము ఆయనతో యుగయుగములు నివసించుటకు, పరలోకము వెళ్లుటను గూర్చియే ఆలోచించుదుమా? లేక మొట్టమొదటిగా ఈ విషయమును గూర్చి భూమిమీద ఆయనను వెంబడించుటతో మొదలు పెట్టుదుమా? ఆయన సంఘములోనున్న వారందరి కొరకు, మన ప్రాణములనే అర్పించునంతగా వారిని ప్రేమించుదుమా? దూరముగా, దక్షిణ అమెరికాలో, రష్యాలో ఉన్న సహోదరులను సహోదరీలను ప్రేమించుట సులభమే. ఎందుకనగా వారిలో ఎవరు మన సహనాన్ని ఎప్పుడు పరీక్షించరు. కాని మనము వారిని చూడము గను వారి కొరకు మన ప్రాణాలను అర్పించలేము. యేసు పరలోకములో కూర్చుని ఆయన మనలను ఎంతగానో ప్రేమించెనని మనకు ఒక సందేశమును పంపించలేదు. ఆయన భూమిమీదకు దిగివచ్చి మన కొరకు తన ప్రాణము పెట్టుట ద్వారా తన ప్రేమను మనకు చూపించెను. మనము కూడా సంఘము యెడల మన ప్రేమను మాటలతోకాక ఆయన మనతో ఉంచిన వారి కొరకు ప్రాణము పెట్టుట ద్వారా చూపించవచ్చును.

మన స్థానిక సంఘములో దేవుడు మనతో ఉంచిన సహోదరుల మరియు సహోదరీల కొరకు మన ఘనతను, ప్రతిష్టను, హక్కులను, అంచనాలను సమస్తమును అప్పగించుటకు (విడిచిపెట్టుటకు) సిద్ధముగా ఉన్నామా? మనము అలా ఉంటేనే ప్రభువైన యేసు మనతో సహవాసమును మరియు ఆత్మలోని ఐక్యతను కనుగొనగలడు. ఒక రక్షింపబడిన, యువకుని గూర్చి నేను చదివితిని. కాని తరువాత అతడు ప్రభువు యెడల పూర్ణహృదయుడు కాలేదు. ఒకనాడు తాను చనిపోయి పరలోకములో ప్రవేశించినట్లు అతడు కలకనెను. అక్కడ అతడు ''క్షమింపబడెను'' అను మాటను తన జీవితమంతయూ వ్రాయబడి యుండుటను చూచెను. అతడు క్షమించబడి పరలోకములో ఉన్నందుకు అతడు ఆనందించెను. కాని పరలోకములో ఒక ప్రత్యేక మహిమతో కొందరు విశ్వాసులు ప్రకాశించుట అతడు చూచెను. వారు భూమి మీద ప్రభువు కొరకు తమ ప్రాణమును పెట్టిన హతసాక్షులు. ప్రభువు కొరకును మరియు ఆయన సంఘముకొరకును వారు సమస్తమును విడిచిపెట్టిరి. వారు డబ్బును, పదవిని, ఘనతను, లోకము విలువనిచ్చే సమస్తమును త్యాగము చేసిరి.

ఈ వ్యక్తి పరలోకములో వారి గొప్ప మహిమను చూచి ఈర్ష్య పడెను. అప్పుడు ప్రభువైనయేసు కలలో ఈ వ్యక్తి యొద్దకు వచ్చి అతడు తనకొరకు మాత్రమే భూమిమీద జీవించెను గనుక అతడు చూచిన ఈ మహిమకరమైన ప్రజలతో అతడు పూర్తిగా ఏకీభవించలేదని చెప్పెను. అది వినినప్పుడు అతడు విరిగిన హృదయము కలవాడై నిత్యత్వమంతా తన స్వార్థపరమైన జీవన విధానము యొక్క జ్ఞాపకముతో జీవించవలెనని గ్రహించెను. రెండవ అవకాశము కొరకు అతడు ప్రభువును బ్రతిమాలుకొనెను. కాని మరణము తరువాత రెండవ అవకాశము ఉండదని ప్రభువు అతనితో చెప్పెను. అప్పుడతడు మేల్కొనెను-అతడు చూచినదంతా ఒక కల మాత్రమే అయినందుకు అతడు ఇంకా సజీవముగా ఉన్నందుకు అతడు కృతజ్ఞత కలిగియుండెను. ఆ తరువాత తన మిగిలిన జీవితమంతా ప్రభువుకొరకు పూర్తిగా జీవించుటకు నిశ్చయించుకొని, ఒక గొప్ప దైవజనుడాయెను.

మనము మరణించిన వెంటనే యేసు యొక్క పూర్ణహృదయులైన శిష్యులుగా మనము రూపాంతరము పొందలేము, ఎందుకనగా దేవుడు ఎవరినైనను, వారి చిత్తమునకు వ్యతిరేకముగా మార్చడు. ఆయన ఆత్మ మన హృదయాలతో ఇప్పుడు చేసే కార్యముతో మనము సహకరించుటకు ఇష్టపడితేనే ఆయన మనలను మార్చును. మనము దేవస్వభావములో పాలివారమగునట్లు చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను. భూమి మీద గొప్పగా ఎంచబడిన దానికి పరలోకములో విలువలేదని మనము గుర్తుంచుకొనవలెను. భూమి మీద విలువనిచ్చువాటినేమైనా మీరు పోగొట్టుకొనిన యెడల, నిత్యత్వములో మీకు పోయేది ఏమి లేదు. అదే విధముగా, భూమి మీద ఎంతో విలువనిచ్చే దానిని ఏదైనా మీరు పొందినా దాని వలన కూడా మీకు పరలోకములో ఏ ప్రయోజనము ఉండదు.

యవనస్థులైన వారందరికీ నేను ప్రత్యేకముగా చెప్పునదేమనగా మీ స్నేహితుల మధ్య మీకున్న మంచి పేరుకు పరలోకములో ఏ విలువా ఉండదు. మీ పరీక్షల కొరకు మీరు నిశ్చయముగా బాగా చదువలెను. కాని నిత్యత్వములో మీ మహిమకు మంచి మార్కులు ఏమియు కలుపవని గుర్తుంచుకొనుడి. మీరు పూర్ణహృదయులై దేవుని కొరకు జీవించగోరినయెడల, మీ మార్కులు ఏమైనప్పటికీ, మీకు ఏ ఇతర అనర్హతలున్నప్పటికీ ఆయన మీ ఉపాధికొరకు సరైన ద్వారమును తెరచును.

మీకు లెక్కలు సరిగా రాకపోవుట చేత దేవుని చిత్తమును తప్పిపోవుట అసాధ్యము. కాని మీరు ఇతరులను క్షమింపగలిగి, మీకు చెడు చేసిన వారికి మేలుచేసి మిమ్మును శపించిన వారిని దీవించిన యెడల మీరు యేసును వెంబడించి ఆయన సంఘమును కట్టగలరు. మీ భూలోక జీవితమునకు అవసరమైన భౌతికమైనవన్నియు మీకు అనుగ్రహింపబడుటను మీరు కనుగొనెదరు. సంవత్సరాలుగా మీరు సంఘములో పొందిన ఆత్మీయ ఆహారమునకు మీరు విలువనిచ్చిన యెడల, మీరు సంఘమును ఎంతో గొప్పగా ప్రశంసించుదురు. మిమ్మును భోజనము చేయుటకు ఒకసారి పిలిచిన వారికి మీరు ఎంత కృతజ్ఞత కలగియుందురో ఆలోచించండి. సంఘములో ఎల్లప్పుడు సంవత్సరము వెంబడి సంవత్సరము మీరు పొందే ఆత్మీయ ఆహారమును బట్టి మీరును ఇంకెంతో కృతజ్ఞత కలిగియుండవలెను.

ఈ విషయమును మరొక విధముగా పరిగణించుడి. మీ పిల్లలను చూచుకొని, వారిని అపాయమునుండి కాపాడి, వారు వ్యాధిగ్రస్తులైనప్పుడు వారిని పట్టించుకొని, వారు నిరుత్సాహపడినప్పుడు వారిని ప్రోత్సహించి, వారికి మంచి మార్కులు వచ్చునట్లు వారి చదువులలో సహాయపడిన ఒకవ్యక్తి ఉన్నాడనుకుందాము. ఈ వ్యక్తి ఇదంతయు ఒకటి రెండు రోజులు మాత్రమే కాక కొన్ని సంవత్సరాలుగా ఇలా చేసెననుకొండి. మీరు అతనికి కృతజ్ఞులై యుండరా? మీ పిల్లలను కాపాడినందుకు మీరు సంఘమునకు కనీసము అంతే కృతజ్ఞులైయుండరా? సంఘములో వారు పొందిన దానికి వారు కృతజ్ఞత కలిగిలేకపోవుటయే అనేక మంది విశ్వాసులు ఆత్మీయముగా ఎదుగకపోవుటకు ఒక కారణము. సంఘమునుండి తొలగిపోయినవారు అనేక సంవత్సరాలుగా వారు ఉచితముగా సంఘమునుండి పొందిన వాటన్నిటిని బట్టి పూర్తిగా కృతజ్ఞత లేనివారే.

లూకా 17:15లో స్వస్థత పొందిన పది మంది కుష్టురోగులను గూర్చి మనము చదివెదము. కాని వారిలో ఒక్కడు మాత్రమే ప్రభువుకు కృతజ్ఞత తెలుపుటకు దేవున్ని మహిమ పరచుటకు తిరిగివచ్చెను. వారు అవసరతలో నున్నప్పుడు, వారు కరుణించమని కేకలు వేసిరి. కాని వారు స్వస్థపరచబడిన తరువాత, వారు పొందిన ఉపకారము విషయములో తొమ్మిది మంది ఏ మాత్రము కృతజ్ఞత లేకుండిరి. ఒక్కడు మాత్రమే తన స్వరమెత్తి కృతజ్ఞతా స్తుతులు చెల్లించెను. పాలస్తీనా ప్రాంతములో స్వస్థపరచబడి ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుటను లెక్కచేయని వారు వేలమంది యుండియుండవచ్చును. కాని ఈ సమరయుడు తిరిగి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతలు తెల్పెను. అతడు ప్రభువుతో ఇలా చెప్పియుండవచ్చును, ''ప్రభువా, నీవు నన్ను ఇప్పుడు ముట్టితివి గనుక భవిష్యత్తులో నా జీవితము ఎంతో వ్యత్యాసముగా నుండబోవుచున్నది. నేను ఏ పట్టణములోకైనా వెళ్లగలను. నేను నా కుటుంబమునకు తిరిగి వెళ్లగలను. నీవు నా జీవితములోనికి సంతోషమును తెచ్చితివి. ఈ దీవెనలలో దేనిని నేను తేలికగా తీసుకోవాలని కోరుకొనుటలేదు. నేను నాకు కలిగినవన్నిటినిబట్టి నీకు ఋణపడియున్నాను. మరియు నా జీవితములో నీవిచ్చిన దీవెనలన్నిటికీ నేను ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను''.

అతడు కనుపరచిన ఈ కృతజ్ఞతతోకూడిన ఆత్మను బట్టి యేసు అతడిని ప్రశంసించెను. తరువాత యేసు అతనికి మరియొక దానినిచ్చెను. తన విశ్వాసమె తనను రక్షించెనని ఆయన అతనితో చెప్పెను. ఆ శుద్ధిపొందిన కుష్టురోగి ప్రభువునుండి స్వస్థతకంటే మేలైన దానిని పొందెను. అతడు అప్పటికే స్వస్థత నొందెను. కాని అతడు కృతజ్ఞతను కలిగియున్నందున అతడు రక్షణను కూడా పొందెను. ఈ సమరయుడుని నేను పరలోకములో కలుసుకొనెదనని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. కాని మిగిలిన తొమ్మిది మందిలో ఎవరినైనా కలుసుకొంటానన్న నిశ్చయత నాకు లేదు. ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుటకు మీరు తిరిగివచ్చినప్పుడు మీరు ఇతరులు పొందిన దాని కంటే ఎక్కువ పొందెదరు. భూమి మీద తన శరీరముగా నున్న సంఘము మధ్యన ప్రభువు ఉన్నాడు. ఆయన శరీరమునకు విలువనిచ్చుట ద్వారా మనము ప్రభువును ప్రశంసించుదుము. మీరు సంఘమునకు విలువనిచ్చి దానిని ప్రశంసించని యెడల, పోగొట్టుకొనేది మీరేగాని సంఘము కాదు. సంఘమునకు విలువనిచ్చిన వారిని మరియు సంఘమునుండి తాము పొందిన దానిని బట్టి కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు బహుగా దీవించెను.

మన పిల్లలను లోకమునుండి భద్రపరచినందుకు మనము సంఘమునకు ఎంత కృతజ్ఞులైయుండవలెనో ఆలోచించుడి. నేను స్వయముగా దీని గురించి సాక్ష్యమివ్వగలను. నా పెద్ద కుమారుడు ఆరేళ్ల వయస్సునుండి, నా నలుగురు కుమారులు సంఘములోనున్న యౌవన సహోదరుల మధ్య పెరిగిరి. ఆ ఆధిక్యతను బట్టి దేవునికి నా కృతజ్ఞతలను తెలుపుటకు నాకు మాటలు లేవు. ఆ యౌవన సహోదరులు పరిపూర్ణులు కారు. వారికి ఎన్నో బలహీనతలుండెను. అయినప్పటికీ, ఆ సహోదరులు యధార్థత కలిగినవారైనందున నా కుమారులందరు వారినుండి సహాయము పొందిరి. తల్లిదండ్రులు మాత్రమే అన్నిచేయలేరు. మన పిల్లలను పెంచుటలో మనకు సహాయపడుటకు మనకు సంఘములోనున్న సహోదరులు సహోదరీలు అవసరము.

దురదృష్టవశాత్తు అనేక మంది తమ స్వంత సంఘమును (వారు పుట్టి పెరిగిన సంఘమును) విడిచిపెట్టిన తరువాత మాత్రమే దానికి విలువనిత్తురు. దావీదు ఒకసారి తన స్వస్థలమైన బెత్లెహేములో ఉన్న బావియొక్క నీటిని త్రాగుటకు ఆశపడెను. వేరే స్థలాలలో ఉండే నీటివలే కాక దానికి ఒకప్రత్యేకమైన రుచి ఉండెను (2సమూయేలు 23:15). అదే విధముగా అనేకమంది బదిలీ చేయబడినప్పుడు లేక దూరదేశము వెళ్లినప్పుడు మాత్రమే సంఘము యొక్క కూటముల కొరకు ఆశపడుదురు. కాని మీ సహోదరులను సహోదరీలను మీరు ప్రశంసించి వారికి విలువనిచ్చుట నేర్చుకొనుటకు మీరు ఇంటియొద్దనుండి వెళ్లిపోయేవరకు ఆగనక్కరలేదు. మీరు దానిని ఇప్పుడే చేయవచ్చును.

మీ స్థానిక సంఘములోని సహోదరులకు సహోదరీలకు విలువనిచ్చుట మీకు ఎందుకు అంత కష్టముగా అనిపించును? మీరు వారిలో అనేక పొరపాట్లను చూడగలరని మీరు చెప్పుదురేమో. ప్రజలకు వారి కళ్లతో సమస్య ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు వారి కళ్లముందు ఎల్లప్పుడు చుక్కలను (మచ్చలను) చూచెదరు. ఆత్మీయముగా కూడా అలాగే ఉండవచ్చును. కొందరి కళ్లల్లో (దృష్టిలో) ప్రతి సహోదరుని మరియు సహోదరియొక్క ముఖము మచ్చలతో నిండియున్నది. మీ విషయములో అది నిజమైతే సమస్య ఆ ఇతర సహోదరుల సహోదరీలతో కాకపోవచ్చును. సమస్య మీ కళ్లతోనే కావచ్చును. మీ స్వంత కళ్లలో మచ్చలున్నవి గనుక మీరు ఇతరులలో మచ్చలను చూచెదరు. ప్రభువైనయేసు మీ కళ్లను స్వస్థపరచువరకు మీ దృష్టి ఎల్లప్పుడు స్పష్టముగా ఉండదు.

ప్రభువైనయేసు తన శిష్యులయొక్క నమ్మకత్వమునకు ఎంతో విలువనిచ్చెను. వారందరు ఆయనను విడచిపెట్టినప్పటికీ తండ్రి ఆయనతో ఉన్నాడు గనుక ఆయన ఒంటరిగా ఉండనని ఒకసారి తన శిష్యులతో చెప్పెను (యోహాను 16:32). ఆయనకు ఆ శిష్యులయొక్క అవసరత లేదు. అయినప్పటికీ లూకా 22:28లో వారాయనతో నిలచియుండిరి గనుక ఆయన కృతజ్ఞత కలిగియుండెను. ఆయన మహిమాస్వరూపియగు ప్రభువైయుండెను. ఆయనతో నిలచియుండుటకు ఆయనకు ఎవరి అవసరత లేదు. కాని ఆయనకు వారి సహాయము అవసరము లేనప్పటికీ ఆయన వారి నమ్మకత్వమును ప్రశంసించెను. ఆయన వారితో ఇలాగు చెప్పుచుండెను: ''మీరు ఈ ప్రాచీన యూదా మత వ్యవస్థనుండి బయటకు వచ్చి పాత ద్రాక్షారస తిత్తిని విడచిపెట్టితిరి. మీరు వధువుయొక్క స్వభావమునకు మరియు వేశ్యయొక్క స్వభావమునకు మధ్య ఉన్న వ్యత్యాసమును చూచి వెలచెల్లించుటకు సిద్ధపడి నాతో నిలచియుండుడి''.

చివరి దినమున ప్రభువు మనతో కూడా మనమాయనను బట్టి సిగ్గుపడకుండా ఆయనతో నిలచియున్నామనియు ఆయన మనలను ఉంచిన సంఘమును మనము ప్రేమించామనియు, దానికొరకు మనలను మనము అప్పగించుకొన్నామనియు అనేకులైన ఇతరుల వలే మనము సంఘమును విమర్శించలేదనియు చెప్పగలుగునని నేను ఆశిస్తున్నాను. సహోదర, సహోదరీలారా, సంఘములో మనము మన పిల్లలు పొందిన బ్రహ్మాండమైన కాపుదలనుబట్టి మనము అభినందించవలెను. యౌవనస్థులైన మీరు సంఘము మిమ్మును అపాయమునుండి, ప్రమాదమునుండి, పాపమునుండి ఎంతగా కాపాడెనో మీరు ఎప్పటికీ గ్రహించలేరు. మీరు ప్రభువు యెదుట నిలువబడినప్పుడు మాత్రమే సంఘములో ఉన్న కఠినమైన ప్రమాణాలు మీరు లోకములోనికి తప్పిపోయి మిమ్మును మీరు నాశనము చేసుకొనకుండా కాపాడెనని మీరు గ్రహించుదురు.

ఆ దినమున మీరు సంఘములో అనేక సంవత్సరముల ముందు విన్నవి మిమ్మును చాలా కాలము తరువాత ఎలా అపాయము నుండి కాపాడెనో మీరు చూచెదరు. వారు సంఘములో వినిన దానిని బట్టి మీ పిల్లలు ఎన్ని అపాయాలనుండి రక్షింపబడి భద్రపరచబడిరో కూడా ప్రభువు మీకు చూపించును. ఇవి మరియు ఇంకెన్నో ఇతర దీవెనలను మనము పొందినప్పటికీ మనమందరము సంఘమునకు ఎంత తక్కువ విలువనిచ్చి అభినందించాము. మీరు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండే స్థాయికి ఎదుగాలనుకొనుచున్నారా? అయితే మొట్టమొదటిగా ప్రభువు మీ కొరకు చేసినదానిని బట్టియు మరియు మీకు ఇచ్చిన సంఘమును బట్టియు ఆయనకు కృతజ్ఞులై యుండుట నేర్చుకొనుడి. సంఘమును మీరు తేలికగా తీసుకొనవద్దు. మనలో అనేకమంది తమ తల్లిదండ్రులు చనిపోయిన తరువాత మాత్రమే వారి నిజమైన విలువను గ్రహించే పిల్లలవలె ఉన్నాము. ఆలస్యము కాకముందే సంఘములో ఒకరికొరకు ఒకరు కృతజ్ఞత కలిగియుండుట ప్రభువు మనకు ఇప్పుడే నేర్పును గాక!

అధ్యాయము 15
క్రీస్తు యొక్క మహిమను చూచుట మరియు దానిలో పాలుపొందుట

''మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలే ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధికమహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము'' (2కొరింథీ 3:18; 4:1).

ఎక్కువ మంది విశ్వాసులు ఒక పరిచర్య గురించి ఆలోచించినప్పుడు వారు ప్రభువు కొరకు ఒక బహిరంగమైన సేవను గురించే ఆలోచించుదురు. కాని ఇక్కడ పౌలు మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు పోలికలోకి మార్చబడు పరిచర్య గురించి మాట్లాడుచున్నాడు. అతడు అటువంటి పరిచర్యను కలిగియుండినందున అతడు ఎప్పుడైనను నిరాశపడలేదు. ప్రభువును సేవించువాడు తన జీవితములో ''పరిశుద్ధతయను ఫలము''ను కలిగియుండును (రోమా 6:22). అతడు ఎంతగా ప్రభువును సేవించునో, అంతగా అతడు క్రీస్తు సారూప్యములోనికి మారగలడు. వేరేమాటలలో చెప్పాలంటే, అతడు ఎంత ఎక్కువగా ప్రభువును సేవించునో, అంత ఎక్కువగా మరుగైయుండుటకు కోరుకొనును, అంత ఎక్కువగా ఇతరుల యెడల తన వైఖరిలో దీనుడుగా ఉండును, అంత ఎక్కువగా డబ్బును ద్వేషించును, అంత ఎక్కువగా తన తలంపులలో పవిత్రముగా ఉండును, అంత ఎక్కువగా తన శత్రువులను ప్రేమించును. తన అంతరంగ జీవితములోను వైఖరులలోను అట్టి పరిశుద్ధత యొక్క ఫలములను కలిగియుండనివాడు, అనేకమైన మతపరమైన క్రైస్తవ కార్యకలాపాలలో పాల్గొన్నప్పటికీ, అతడు లోకములో ఒక ప్రసిద్ధిగాంచిన బోధకుడు లేక స్వస్థపరచువాడైనప్పటికీ అతడు నిజముగా ప్రభువును సేవించుట లేదు.

క్రైస్తవులలో ఆత్మానుసారముగా లేకుండా కేవలము మతభక్తి కలిగిన నీతిగలవారు అనేకమంది ఉన్నారు. నీతిగా ఉండుటకు మరియు క్రీస్తువలె ఉండుటకు ఎంతో వ్యత్యాసమున్నదని మీకు తెలుసా? మేము నీతిని ప్రకటించుచున్నాము కాబట్టి అనేకమంది మతానుసారులైన నీతిగల క్రైస్తవులు మా యొద్దకు ఆకర్షింపబడుదురు. కాని వారు క్రీస్తు వలె ఉండుటకు ఆసక్తి కలిగియుండకపోవచ్చు. లేఖనముల యొక్క అక్షరమునకు ప్రాముఖ్యత నిచ్చువారు నీతిగా ఉండుటకు ఆసక్తి కలిగియుందురు. కాని క్రొత్త నిబంధన యొక్క ఆత్మకు ప్రాముఖ్యత నిచ్చువారు క్రీస్తును పోలియుండుటకు ఆశించుదరు. వారు మాత్రమే నిజముగా ఆత్మానుసారమైన వారగుదురు. సర్పము హవ్వను మోసగించినట్లే మనము క్రీస్తుయెడల మనకున్న అంకితభావమునుండి కేవలము మతానుసారమైన క్రియలు చేయుటకు తప్పించబడే ప్రమాదమును ఎల్లప్పుడు ఎదుర్కొనుచున్నామని మనము 2 కొరింథీ 11:3లో చదివెదము. హవ్వ పాపము చేయునట్లు సర్పము ఆమెను భయపెట్టలేదు. అతడు ఆమెను తన కుయుక్తితో మోసగించెను. కాబట్టి ఈనాడు సాతాను పరిచారకులు ''నీతి''ని ప్రకటించువారిగా వచ్చుటలో ఆశ్చర్యములేదు (2కొరింథీ 11:15).

సాతాను పరిచారకుడు ''నీతి''ని ప్రకటింపవచ్చేమో కాని వారు క్రీస్తువలే ఉండుటను ప్రకటింపరు. స్త్రీలకు పొడవాటి వెంట్రుకలు, పురుషులకు చిన్న వెంట్రుకలు, స్త్రీలు తలపై ముసుగు వేసికొనుట, ఆభరణాలను తీసివేయుట, కాపరి లేక పెద్దకు విధేయత చూపుట, దశమభాగములు చెల్లించుట, ప్రతివారము రొట్టె విరచుట, సంఘ కూడికలో క్రొత్త నిబంధన క్రమమును పాటించుటవంటి విషయాలకు వారు ప్రాముఖ్యతనిచ్చుదురు. బాహ్య సంబంధమైన విషయాలను గూర్చి అలా ప్రకటించుట ద్వారా, వారు దేవుని సేవకులని నమ్మునట్లు వారు అనేక మంది విశ్వాసులను మోసము చేయుదురు. కాని ఈ సాతాను యొక్క పరిచారకులు దేనిని ఉద్ఘాటించరో అనుదానిని బట్టి సులువుగా గుర్తింపబడగలరు. వారు దీనత్వము, హృదయ పవిత్రత, ఒకరి యెడల ఒకరు కలిగియుండవలసిన మిక్కుటమైన ప్రేమ, అనుదినము సిలువనెత్తికొనుట, ఆత్మతో నింపబడుట, అనుదిన జీవితములో యేసును వెంబడించుట మొదలగు క్రైస్తవ జీవితము యొక్క ముఖ్యమైన విషయాలను వారు విడిచిపెట్టుదురు.

వ్యభిచారము చేసిన లేక సంఘ నిధులను దొంగిలించిన ఒక పెద్ద ఇతర విశ్వాసులను ఎప్పుడైనను మోసగించలేడు, ఎందుకనగా అవిశ్వాసులు కూడా అటువంటి వ్యక్తి భక్తిపరుడు కాదని చూడగలరు. కాని ఒక మతానుసారుడైన సహోదరుడు చాలా సులువుగా అనేకమంది విశ్వాసులను మోసగించగలడు. ఎందుకనగా ఎక్కువ మంది విశ్వాసులు (ఆత్మానుసారతకు, మతభక్తికి ఉన్న తేడా తెలియక) అతని జీవితము యొక్క బాహ్యసబంధమైన నీతిని బట్టియు అతని మతాశక్తిని బట్టియు అతని మతానుసారమైన కార్యకలాపాలను బట్టియు ఆకర్షింపబడుదురు. మార్త వలె ''ప్రభువుని సేవించుట'' మరియ వలె ''ఆయన స్వరమును వినుట'' కంటే ముఖ్యమైనదని మీరు భావించిన యెడల, మీరు మతానుసారులైనవారే కాని ఆత్మానుసారులైనవారు కారని మీరు నిర్ధారించుకోవచ్చును (లూకా 10:38-42).

ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాలనుండి భారతదేశమును దర్శించు అనేకమైన బోధకులున్నారు. అటువంటి బోధకులు ఇంటి యొద్ద తమ భార్యలతో ఎలా నివసింతురో, వారి పిల్లలను ఎలా పెంచిరో, లేక వారి స్వస్థలాలలో ఎటువంటి సహవాసమును (సోదర సంఘమును) కట్టిరో ఎవరికీ తెలియదు. ప్రజలు వారి వాగ్దాటికి మరియు వారికున్న డబ్బుకు ఆకర్షింపబడుదురు!! కాని ఒక వ్యక్తి యొక్క పరిచర్యను సరిగా అంచనా వేయుటకు, అతడు తన ఇంటి యొద్ద ఎలా జీవించునో తెలుసుకొనుట మీకు అవసరము! ఒక వ్యక్తి తన పిల్లలనెలా పెంచెనో మీరు చూచేవరకు మీరు అతనిని ఒక ఆత్మానుసారమైన వ్యక్తిగా ఎంచవద్దు. అతని పిల్లలు లోకానుసారులైతే, అది సాధారణముగా ఆ వ్యక్తి ఒక వేషదారియని సూచించును-ఎందుకనగా ఒకడు తన ఆత్మానుసారతను గూర్చి తన పిల్లలను మోసగించలేడు. అతని స్థానిక సంఘము కేవలము అతని అభిమానుల యొక్క సమాజముగా నుండి, సమానులైన సహోదర సహోదరీల యొక్క సహవాసము కానియెడల, అతనికి క్రీస్తుయొక్క శరీరమును కట్టుట గురించి ఏమి తెలియదని స్పష్టమవుతున్నది.

ఒకరితో ఒకరు చాలాసార్లు కలిసి ఉండలేని నీతిమంతులైన ప్రజలతో క్రైస్తవ లోకము నిండియున్నది. వారు ఎంత నీతిగలవారైతే, వారితో ప్రజలకు ఎటువంటి సహవాసమునైనా కలిగియుండుట అంత కష్టము. అయితే క్రీస్తును పోలియుండుటకు ప్రయాసపడువారితో ఉండుట సుళువే మరియు వారు ఒకరితో ఒకరు మహిమకరమైన సహవాసమును కలిగియుందురు. సాతాను హవ్వయొద్దకు వచ్చి ఆమె దేవునివలే ఉండగలదని చెప్పెను. యేసుకూడా భూమి మీద మనము దేవునివలే ఉండగలమన్న సందేశముతో వచ్చెను. రెండు సందేశములు ఒకే విధమైనవిగా కనిపించుచున్నవి. కాని ఈ రెండు వ్యాఖ్యల మధ్య ఎంతో గొప్ప వ్యత్యాసమున్నది-ఈ వ్యత్యాసము పరలోకమునకు మరియు నరకమునకు మధ్య ఉన్న వ్యత్యాసమంత గొప్పది.

జ్ఞానములోను, శక్తిలోను, అధికారములోను దేవునివలే ఉండుటకు సాతాను హవ్వను శోధించెను. అయితే ప్రభువైనయేసు మన స్వభావములో(దేవుని స్వభావమును మనలో కలుగజేయుటకు) అనగా దీనత్వములో, పవిత్రతలో, ప్రేమలో, మంచితనములో మనలను దేవునివలే చేయుటకు వచ్చెను. వివేచన లేని కారణముగా, ఈనాడు ఎక్కువ సంఘములు తమ సంఖ్యలను బట్టియు తమ ''నీతి''ని బట్టియు, తమ ''క్రొత్త నిబంధన క్రమమును''బట్టియు, తమ కార్యకలాపాలను బట్టియు గర్వించే పరిసయ్యులతో నిండియున్నది. వారు ఎంతో నీతి గలవారన్న సాక్ష్యముతో తమ సంఘములలో కూర్చొనెదరు. కాని వారి రహస్య జీవితములలో వారు అన్యుల కంటే హీనముగా ప్రవర్తించుదురు. వారు తమ క్రైస్తవ జీవితాలను ప్రారంభించినప్పుడు బహుశా అలాయుండి యుండరు. కాని క్రమేణా వారు పరిసయ్యులుగా మారిరి. వారు యధార్థమైన నీతితో ప్రారంభించియుండవచ్చును. ఈ రోజున వారు మొదటి తరగతి వేషదారులుగా ఉన్నారు. వారు మౌళికముగా కపటమైనవారని ఆయన చూచెను గనుక దేవుడు వారి జీవితాలలో అటువంటి మార్పును అనుమతించెను. కాని దేవుడు అనేక స్థలములలో తన శేషమును కలిగియున్నాడు- వీరు అంతరంగ పవిత్రతను వెదకుచు, విరిగినలిగిన మనస్సు కలిగి, తమ కొరకు ఏమి ఆశించని, దేవుని నామము యొక్క మహిమ కొరకు చింతకలిగి సిద్ధాంతమునకో లేక బోధకో లేక ప్రధానముగా బాహ్యసంబంధమైన వాటికి ప్రాధాన్యత నివ్వక ప్రభువైనయేసుకు ప్రాధాన్యతనిచ్చే సహోదరులు మరియు సహోదరీలు.

మనము మోసపోకుండా మనలను మనము ఎలా నివారించుకోగలము? మనకు జవాబు 2కొరింథీ 11:3లో ఇవ్వబడెను- క్రీస్తుయెడల సరళమైన, పవిత్రమైన భక్తిని కలిగియుండుట ద్వారా. మనకు యేసుయెడల ఉన్న భక్తినుండి దూరము చేసేది యేదైననూ- అది ఒక సిద్ధాంతము లేక ఒక ఉద్ఘాటన లేక ఒక పరిచర్య లేక ఇంకేదైననూ- మనలను మోసగించి నాశనము చేయుటకు సాతాను యొక్క తంత్రములో భాగము. ఏ.బి.సింప్సన్‌ 19వ శతాబ్ధములో జీవించిన ఒక గొప్ప దైవజనుడు. ఆయన కాలములో ఆయన అతిపెద్ద మిషనరీ ఉద్యమమును స్థాపించెను. మొదట్లో అతడు ఒక వ్యాధిగ్రస్థుడైన బోధకునిగా ఉండెను. కాని తరువాత అతడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెను. ఒక రోజున ఒకరు ఈ మాటలను పాడుచుండగా అతడు వినెను: ''నా యేసు- ఆయన వలే ఏ మనిషి పనిచేయలేదు''. ఆ మాటలు అతని హృదయమును పట్టుకొనెను మరియు సమస్య తన స్వంత శక్తితో పనిచేయుట వలన అలసిపోవుటయని అతడు గ్రహించెను. అప్పుడతడు యేసును, ఒక స్వస్థపరచువానిగా మాత్రమే కాక తన శరీర ఆరోగ్యమునకు ప్రాణమునకు మూలముగా ఆయనను చూచెను. అప్పుడతడు తన అనుభవమును వర్ణించిన ఒక గీతమును వ్రాసెను:

''ఒకప్పుడు అది ఆశీర్వాదము, ఇప్పుడది ప్రభువే,

ఒకప్పుడు అది భావము, ఇప్పుడది ఆయన వాక్యము,

ఒకప్పుడు ఆయన వరములను కోరుకొంటిని, ఇప్పుడు వరములిచ్చువానిని కోరుకొనుచున్నాను,

ఒకప్పుడు స్వస్థతను వెదకితిని, ఇప్పుడు ఆయనను మాత్రమే వెదకుచున్నాను.

ఒకప్పుడు నేను పనిచేసితిని, ఇకనుండి ఆయన పనిచేయును,

ఒకప్పుడు నేనాయనను వాడుకొంటిని, ఇప్పుడాయన నన్ను వాడుకొనుచున్నాడు.

ఒకప్పుడు నాకొరకు నేను ప్రయాసపడితిని, ఇప్పుడు ఆయన కొరకు మాత్రమే ప్రయాసపడుచున్నాను''

ఇదే సంఘ చరిత్రలో ప్రతి గొప్ప దైవజనుడి యొక్క రహస్యము అయ్యుండెను. వారు ఆయన దీవెనలకు లేక ఆయన వరములకు ప్రాధాన్యత నివ్వక, క్రీస్తుకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిరి. ఆ విధముగా వారు ఘర్షణ మరియు గందరగోళముతో నిండియున్న లోకము మధ్య విశ్రాంతితో కూడిన జీవితములోనికి ప్రవేశించిరి.

''దేవుని హృదయమునకు సమీపముగా నెమ్మదిగల విశ్రాంతితోకూడిన స్థలమున్నది. దేవుని హృదయమునకు సమీపముగా పాపము వేధించలేని స్థలమున్నది''.

మనలను అనుదినము పరిశుద్ధాత్మ ఈ స్థలములోనికి నడిపించుటకు కోరుకొనును. ఆ విధముగా మనము ఒంటరిగా బ్రతుకుతు సాధువులుగా మారిపోము. లేదు. మనము ఇతరులకు సేవచేయుటలోను సహాయము చేయుటలోను చురుకుగా నుందుము. కాని మన వ్యక్తిగత జీవితము, వైవాహిక జీవితము మరియు మన పరిచర్య రూపాంతరము చెందును. తరువాతి వచనములో (2కొరింథీ 4:2) ''కుయుక్తి''గా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము'' అని పౌలు చెప్పుచున్నట్లుగా మనము చదివెదము. మన జీవితాలలో యధార్థముకానిది, కుయుక్తితో కూడినది ఏదైనా ఉన్నయెడల, మనము దేవునియొక్క ఈ విశ్రాంతిలోనికి ఎన్నడైనను రాలేము.

గతములో, ఎంతో తెలివైన మరియు వరములు కలిగిన ఒకరిద్దరు సహోదరులు మాతో కలిసిరి (వారు ఇప్పుడు పడిపోయిరి). కాని వారు చాలా కుయుక్తి కలవారు కూడా. తెలివైనవారు మరియు వరములు కలిగినవారు సూటిగా, యదార్థముగా దీనులుగా ఉన్న యెడల దేవుడు వారిని వాడుకోగలడు. కాని దేవుడు కుయుక్తి గలవారిని వారి కుయుక్తిలోనే పట్టుకొనును (1కొరింథీ 3:19). ఆయన ఆ సహోదరులతో అదే చేసెను. హామాను వలే వారు ఇతరుల కొరకు సిద్ధపరచిన ఉరికొయ్య మీద వారే ఉరితియ్యబడిరి.

కుయుక్తి గల సహోదరులు సహోదరీలు సంఘములో ఎంతో కాలము మనుగడ సాగించగలరు. ఎందుకనగా దేవుడు దీర్ఘశాంతము, కనికరము గలవాడైనందున వారు మారుటకు వారికెంతో సమయమునిచ్చును. కాని వారు తమ్మును తాము పవిత్రపరచుకొనని యెడల వారు ఒక ఆత్మానుసారమైన సంఘములో నిలిచియుండలేరు. ''నీతిమంతుల సభలో పాపము చిరకాలము నిలువలేదు'' (కీర్తనలు 1:5). మీరు క్రీస్తు శరీరములో ఒక ఉపయోగకరమైన సభ్యునిగా ఉండగోరినయెడల ఇక్కడ మొదలు పెట్టవలెను: ''కుయుక్తిని, కపటమంతటిని విడిచిపెట్టుడి, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించుడి మరియు మీ సౌకర్యము కొరకు దేవుని వాక్యమును వంచనగా బోధించుట మానుకొనుడి''.

దేవుని వాక్యమును ప్రజలు రెండు విధాలుగా వంచనతో బోధించగలరు. తమ స్వంత జీవితము విషయములో లేక దగ్గర స్నేహితునితో లేక ఒక నమ్మకస్తుడైన సహాయకునితో వ్యవహరించినప్పుడు దేవుని వాక్యము యొక్క ప్రమాణాల విషయములో రాజీపడుట ఒక విధానము. పేతురు దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన ఒక కార్యమును సూచించినప్పుడు ప్రభువైనయేసు పేతురు వంటి సమీపస్తుడైన వానిని కూడా ''సాతానా, నా వెనుకకు పొమ్ము'' అని గద్దించెను. మన భార్యల యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుటకు లేక ఒక ధనికుడినో లేక దగ్గర స్నేహితుడినో సంతోషపెట్టుటకు మనము దేవుని వాక్యమును వంచనతో బోధించకూడదు. దేవుని వాక్యము కంటే దగ్గరైన స్నేహితులను మనము ఎప్పుడైనను కలిగియుండకూడదు- ఎందుకనగా అటువంటి స్నేహము ఒక ఆత్మానుసారమైన సహవాసము కానేరదు.

మనకు ముందునుండి యున్న వేదాంతమునకును అభిప్రాయములకును, అనుగుణముగా ఒక వచనము యొక్క తాత్పర్యమును వక్రీకరించుట రెండవ విధానము. ఒక్క ఉదాహరణను మాత్రము పరిశీలించండి: పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనే సిద్ధాంతము. క్రొత్త నిబంధన యొక్క మొదటి అయిదు గ్రంథముల యొక్క ప్రారంభములో ఈ సత్యము ఎంతో స్పష్టముగాను తేటగాను ఉద్ఘాటించబడినది (మత్తయి 3:11, మార్కు 1:8, లూకా 3:16, యోహాను 1:33 మరియు అపొ.కా.1:5 వచనాలను చూడండి). అయినప్పటికీ బ్రదరన్‌ మరియు బాప్టిస్టు గుంపులలో ఉన్న విశ్వాసులను యేసు ఈ రోజు వారికి పరిశుద్ధాత్మలో బాప్తీస్మమివ్వగలడని నమ్మించుట దాదాపు అసాధ్యము- ఎందుకనగా వారి బాల్యమునుండి వారు ''మారిన వెంటనే (రక్షింపబడిన వెంటనే) వారు సమస్తమును పొందితిరి'' అని వారికి జ్ఞానవత్తిడి(మరలా మరలా చెప్పబడినది) చేయబడినది. వారు యదార్థముగా ఉన్న యెడల, పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలలోనుండి జీవజలనదులు పారునని ప్రభువైనయేసు చెప్పినట్లు వారి జీవితములలోనుండి పారుటలేదని వారు ఒప్పుకోవలెను. కాని వారు వాస్తవికతను ఎదుర్కొనరు. పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుటను గూర్చి సంబంధించిన లేఖనములను వారు చదువునప్పుడు వారు వాటిని తమ శాఖ యొక్క వేదాంతముతో సరిపడునట్లు చేసెదరు. ఇది మనో సంబంధమైన కపటము మరియు దేవుని వాక్యమును వంచనతో బోధించుట.

అయితే ఒక యదార్థత కలిగిన విశ్వాసి తాను ఎల్లప్పుడు నమ్మిన సిద్ధాంతముతో సరిపడని ఒక కష్టమైన వచనమును చదివినప్పుడు, బహుశా దీని మీద దేవుని యొద్దనుండి ఎక్కువ వెలుగును నేను పొందవలెనేమో అని చెప్పును. అటువంటి యదార్థమైన విశ్వాసులకు ఎంతో నిరీక్షణ యున్నది.

యధార్థత మరియు దీనత్వము కవలల వంటివి. ఒక వ్యక్తిలో అవి రెండు కలిసియుండును. అవి ఒక నాణెమునకు రెండు ప్రక్కల వంటివి. ఒక ప్రక్క లేకుండా మీరు మరో ప్రక్కను కలిగియుండలేరు. మీరు నిజముగా దీనులైన యెడల మీరు యధార్థవంతులుగా కూడా ఉందురు. మీ కుయుక్తిని ఒప్పుకొనుటయు మిమ్మును మీరు తగ్గించుకొనుట. మీరు కపటమును విసర్జించినప్పుడు మీరు నిజానికి మీ గర్వములో ఒక భాగమును విసర్జించుచున్నారు. తాను ప్రకటించిన సువార్త అనేకుల నేత్రములకు మరుగైయుండెనని పౌలు ఈ వాక్య భాగములో చెప్పెను. అతడు ఏ సువార్తను గూర్చి ఇక్కడ మాట్లాడుచుండెను? అది కేవలము మన పాప క్షమాపణకు సంబంధించిన సువార్త కాదు గాని, ''దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త'' (2కొరింథీ 4:4). క్రీస్తు మహిమ ఖచ్చితముగా పాపక్షమాపణలో కనుపరచబడదు-ఎందుకనగా క్రీస్తు క్షమించబడుటకు ఆయనకు పాపములు లేకుండెను. ''క్రీస్తు మహిమను కనుపరచు సువార్త'' అంటే ఏమిటి? జవాబు అదే వచనములో నున్నది. అది క్రీస్తు దేవుని స్వరూపియైయుండుటను సూచించుచున్నది. సువార్త సందేశమేమిటంటే మన పాపములు క్షమించబడిన తరువాత, మనము దేవుని స్వారూప్యములోకి మార్చబడగలము.

సృష్టి ప్రారంభములో దేవుడు వెలుగు కమ్మని పలికెను (2కొరింథీ 4:6). దేవుడు పలికిన మొదటి మాట అదే. మన హృదయాలలోకి కూడా దేవుడు పలికే మొదటి మాట అదే. మనలో చీకటి యున్నది ఎందుకనగా మనలో ఆదాము స్వభావమున్నది-అది ఆదాము యొక్క కామము, కోపమే గాక, ఆదాము యొక్క కపటము మరియు కుయుక్తి కూడా. ఆ చీకటి యంతయు బయటకు పారద్రోలబడవలెను. అమాలేకుల యొక్క చెడ్డగొఱ్ఱెలనే కాక మంచి గొఱ్ఱెలు కూడా చంపబడవలెనని దేవుడు ఆజ్ఞాపించెను (1సమూయేలు 15). ఈ వెలుగు ఏమిటి? క్రీస్తు యొక్క జీవమే వెలుగని యోహాను 1:4 చాలా స్పష్టముగా చెప్పుచున్నది. ఆ వెలుగుతో దేవుడు మన చీకటి హృదయాలను వెలిగించాలని చూచుచున్నాడు. ''కృపాసత్య సంపూర్ణత''తో కూడిన దేవుని మహిమ క్రీస్తు యొక్క భూలోక జీవితములో కనబడెను. ఈ వెలుగునకు ప్రాముఖ్యతనిచ్చువారే కేవలము నీతిపరులుగా ఉండుటకేకాక క్రీస్తు పోలికలో ఉండుటకు ఎక్కువ ఆసక్తి కలిగియుందురు. బాహ్యసంబంధమైన నీతి మనకు మనుష్యుల ఘనతను తెచ్చును. కాని దేవుడు మన అంతరంగములో మనలను క్రీస్తును పోలినవారిగా చేయాలని కోరుకొనుచున్నాడు.

దాదాపు 350 ఏళ్ల క్రితము ఫ్రాన్స్‌ దేశములో మేడమ్‌ జీయోన్‌ అనే స్త్రీ నివసించెను. క్రైస్తవ పుస్తకములు అందుబాటులోలేని రోజులలో కూడా ఆమె దేవుని మార్గాలపై ఎంతో వెలుగును కలిగియుండెను. దానికి కారణము ఆమె తన శ్రమల మధ్య దేవునిని వెదకెను. అనేకమంది విశ్వాసులు శ్రమలను అనుభవించుదరు గాని వారి శ్రమల ద్వారా దేవునిని తెలుసుకొనరు. ఎందుకనగా వారు దేవునిని ఆయన ఏమైయున్నాడో అనుదానికొరకు ఆయనను వెదకరు. వారు తమ శ్రమలనుండి ఉపశమనము కొరకు మాత్రమే వెదకెదరు. అయితే మేడమ్‌ జీయోన్‌ దేవునినే వెదకెను, దాని ఫలితముగా బహు కొద్ది మంది మాత్రమే దేవునిని ఎరిగినట్లు ఆమె దేవునిని ఎరిగెను. దేవుడు మన మార్గములో(జీవితములో) పంపించు శ్రమలను మనము ఆనందముగా అంగీకరించినప్పుడు మనము దేవుణ్ణి తెలిసికొనవచ్చును-దానికి మనము లోబడినప్పుడు మాత్రమే కాక, మనము దానిని సంతోషముతో కూడా అంగీకరించినప్పుడు అలా జరుగును. తన రచనలలో ఒక దానిలో మేడమ్‌ జియోన్‌ను, స్వచ్ఛమైన వెలుగును కలిగియుండని వారినుండి మనకు ప్రశంసలను తెచ్చే వెలుగులు, వరాలు, కృపలతో కూడిన మార్గమున్నది-ఇది ఒక పరిశుద్ధత కలిగిన జీవితము. కాని మనము ఆ జీవితమును దాటి, అన్ని విషయములలోను ప్రభువునకు పూర్తి విధేయత కలిగిన జీవితమునకు వెళ్ళినప్పుడు, మనలను అంతకు ముందు ప్రశంసించినవారే మనలను తృణీకరించి మరియు తిరస్కరించుటను మనము కనుగొనెదము. అప్పుడు మనము ప్రభువైనయేసు శ్రమలలో పాలివారమగుట ద్వారా ఆయనతో సహవాసమును కలిగియుందుము-ఎందుకనగా ప్రభువైనయేసు కూడా ఖచ్చితముగా దానినే అనుభవించెను.

మీరు దైవభక్తిగలవారని ఇతరులు మీ గురించి కలిగియున్న అభిప్రాయమును బట్టి మీరు ఆనందించవచ్చును. అనేకులు కేవలము దానితోనే సంతృప్తి పడుదురు. కాని మీరు యేసును నిజముగా వెంబడించిన యెడల మీరు ఇంకా ముందుకు వెళ్లుదురు. నజరేతులో యేసు జీవితమును చూచిన ప్రజలు, అందరి కంటే ఆయన జీవితమును దగ్గరగా చూచిన ఆయన స్వంత బంధువులు కూడా, ఆయనను అభినందించే బదులు ఎందుకు తిరస్కరించిరి? మీ కార్యాలయములో లేక మీరుండే ప్రాంతములోని ప్రజలు ఒక నీతిపరుడని సాధారణముగా ప్రశంసించారా? కాని ప్రజలు యేసును ప్రశంసించలేదు. ఎందుకని? ఎందుకనగా ఈ లోకపుఆత్మ, దేవునిఆత్మకు ఎంత విరోధముగా ఉన్నదంటే నిజమైన దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉన్న ఎవరైనను తిరస్కరింపబడుదురు. నిజమైన దేవునికి ప్రభువైనయేసు అటువంటి ఒక నమ్మకమైన సాక్షిగా ఉండెను.

అయితే ప్రజలు మిమ్మును ఎందుకు అంతగా ప్రశంసించుదురు? బహుశా, మృతమైన మత శాఖలలో నున్న ప్రజలు కూడా మిమ్మును ప్రశంసించుదురేమో. ఈ రోజుల్లో ''క్రైస్తవులు'' కూడా నోబెల్‌ శాంతి బహుమతిని పొందుటను గూర్చి మనము చదివెదము. కాని సమాధానధిపతియైన యేసుకు ఈ లోకము ఆ బహుమతిని ఇచ్చియుండేది కాదు. లోకము ఆయనకు ఒక బహుమతినో లేక ఒక పతకమునో కాక ఒక సిలువనిచ్చెను. ఈ లోకపు ఆత్మ మారలేదని గుర్తుంచుకొనుడి. నిజానికి అది ఇంకా ఘోరముగా మారెను. జనులచేత ప్రశంసించబడినవారు అబద్ధ ప్రవక్తలని యేసు చెప్పెను.

''మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ'' అని యేసు చెప్పెను (లూకా 6:26). మీరు నిజముగా క్రీస్తు మహిమను చూచినప్పుడు, మనుష్యులిచ్చే ఘనత మీకు ఏమి కానట్లుండును. మనము క్రీస్తు మహిమను కనుపరచు సువార్త యొక్క స్వచ్ఛమైన వెలుగులో నడిచినప్పుడు, మనము అపార్థము చేసుకోబడి తిరస్కరింపబడి ఇతరుల చేత ప్రత్యేకముగా మతానుసారులైన క్రైస్తవులచేత పలురకములైన చెడ్డపేర్లతో పిలువబడుదుము. ప్రభువైనయేసు ''వెఱ్ఱివాడు'', ''పాపుల స్నేహితుడు'', ''దయ్యములకు అధిపతి'' మొదలగు పేర్లతో పిలువబడెను. మీరు యేసును పూర్తిగా వెంబడించినయెడల మీరుకూడా అటువంటి పేర్లతో పిలువబడుదురు. అయితే మీరు మనుష్యులను సంతోషపెట్టుటకు మీ సంభాషణలో దౌత్యపరమైన విధముగా (లౌకముగా) ఉండుటకు కోరుకున్నయెడల మీరు క్రీస్తు విషయమైన నిందను తప్పించుకొందురు. కాని క్రీస్తు మహిమను చూడకుండునట్లు సాతాను మీ నేత్రములకు గ్రుడ్డి తనమును కలుగజేసెను అని కూడా అది సూచించును.

2కొరింథీ 3:15లో, మీరు అక్షరానుసారముగా దేవుని వాక్యమును చదివిన యెడల మీ నేత్రములపై ఒక ముసుగును మీరు కనుగొందురని చెప్పబడెను-ఈ ముసుగు లేఖనముల యొక్క నిజమైన భావమును మరియు క్రీస్తు యొక్క మహిమను మీరు చూడకుండా ఆటంకపరచును. అప్పుడు మీరు, ''మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మీకు హానిచేయువారికి మంచి చేయుడి'' మొదలగు క్రొత్త నిబంధన ఆజ్ఞలను గైకొనుటకు ఆశించినా, మీరు వాటిని అక్షరానుసారముగానే గైకొనెదరు. ఈ ఆజ్ఞలన్నిటిని మీరు ఒక స్వనీతితో కూడిన, పరిసయ్యుల వంటి ఆత్మతో గైకొనుట సాధ్యమే. దీనికి కారణము మీ నేత్రములమీద నున్న ముసుగు. కాని మీరు ప్రభువు వైపునకు తిరిగినప్పుడు, ఆ ముసుగు తీసివేయబడును మరియు మీరు క్రీస్తు మహిమను చూచెదరు (16వ వచనము).

మీరు ప్రభువును కలుసుకొనుటకు కాక కేవలము ఒక వర్తమానమును వినుటకు ఒక కూడికకు వెళ్లుట సాధ్యమే. కాని ఏ వర్తమానము మీ సమస్యలను పరిష్కరించలేదు. ప్రభువైనయేసు మాత్రమే అది చేయగలడు. ఉదాహరణకు, ఒక నిజమైన క్రైస్తవ వివాహమును గూర్చి ఎంతో విన్న అనేకమంది విశ్వాసులు తమ వివాహ భాగస్వాముల పట్ల క్రీస్తును పోలిన వైఖరులను కలిగియుండక పోవుటకు కారణమేమిటి? ఎందుకనగా వారు లేఖనముల యొక్క అక్షరమునకు ప్రాముఖ్యతనిచ్చుదురు. మీకు ఇప్పుడు అవసరమైనది ఎక్కువ వర్తమానములు వినుట కాదు గాని, క్రీస్తు యొక్క మహిమను చూచుట. మీరు మతానుసారమైన కార్యచరణకు లేక స్వస్థతకు లేక ఉద్వేగభరితమైన అనుభవాలకు (క్రింద పడిపోవుట మరియు నవ్వుట మరియు నాట్యమాడుట మొదలగునవి) కాక యేసుకు ప్రాముఖ్యత నిచ్చినయెడల, మీరు ఆత్మానుసారులుగా ఉండుట మొదలుపెట్టుదురు.

మనకు అవసరమైనది నీతి కూడా కాదు గాని ప్రభువైనయేసు మాత్రమే. 1కొరింథీ 1:31లో, ''క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు ఆయెను'' అని మనకు చెప్పబడినది. ఆయన మనకు జ్ఞానమును ఇచ్చుట కాదు. అయనే మనకు జ్ఞానము అయ్యున్నాడు. ఆయనే మన పరిశుద్ధతయు, మన విమోచనయు, మన స్వస్థతయు, మన పరిచర్యయు, మన సమస్తమును అయ్యున్నాడు. మనము క్రీస్తును విడిచిపెట్టి ఒక సిద్ధాంతమునకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు మనము దారి తప్పిపోతిమి.

దైవభక్తిని గూర్చిన మర్మమేమిటి (1తిమోతి 3:16). యేసు మన వంటి శరీరముతో వచ్చిన సిద్ధాంతమా? కాదు. మనవంటి శరీరములో వచ్చిన యేసే దైవభక్తిని గూర్చి మర్మము. ఈ సిద్ధాంతమునకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చువారు క్రైస్తవ ప్రపంచములో అతిగొప్ప పరిసయ్యులని నేను కనుగొంటిని. కాని యేసుకు ప్రాముఖ్యతనిచ్చువారు ఎన్నడూ పరిసయ్యులు కారు. ఈనాడు క్రైస్తవ లోకములో ఒక పెద్ద విభజన రేఖ ఉన్నది: అది లేఖనముల యొక్క అక్షరమునకు ప్రాముఖ్యత నిచ్చువారికి మరియు దాని ఆత్మకు ప్రాముఖ్యతనిచ్చు వారికి మధ్య గీయబడినది. వేరే మాటలలో చెప్పాలంటే పరిశుద్ధత యొక్క సిద్ధాంతములకు ప్రాముఖ్యత నిచ్చువారికి మరియు ప్రభువైనయేసుకు ప్రాముఖ్యత నిచ్చువారికి మధ్య గీయబడినది.

విశ్వాసులు అక్షరమును ఎంత చూచుదురో, వారు ప్రభువును చూడకుండునట్లు, అంత ఎక్కువగా వారి నేత్రములపైన ముసుగు ఉండును. మన ప్రభువైనయేసుక్రీస్తునందు మనము ఆయన మహిమ యొక్క వెలుగును చూడవలెనని దేవుడు కోరుకొనుచున్నాడు. ఆయన దీనత్వము యొక్క మహిమను పరిశీలించండి. ఫిలిప్పీ 2:8-11లో, దేవుడు యేసు నామమున అన్ని ప్రదేశాలలో అందరూ వంగునట్లు దేవుడు ఆయన నామమును ప్రతినామమునకు పై నామముగా హెచ్చించెనని మనము చదివెదము. ఈనాడు ప్రతి దయ్యము ఆ నామమునకు ముందు వంగాలి. ఎందుకని? ఆయన దేవుని కుమారుడైనందుకు కాదు లేక ఆయన పరిశుద్ధ జీవితమును జీవించినందుకు కాదు. ఆయన తన్నుతాను తగ్గించుకున్నందుకు. మిమ్మును మీరు తగ్గించుకొనుటకు ఇష్టపడకుండా, యేసు నామమును ఉపయోగించుటకు చూచిన యెడల, మీరు దానిని ఒక మంత్ర కట్టువలే వాడుటకు ప్రయత్నించుచుందురు. అది పని చేయదు. కాని తన్నుతాను తగ్గించుకొని తన స్వంత చిత్తమునకు చనిపోయి యేసు నామమును వాడిన వ్యక్తి, దాని వాడుకలో శక్తిని కనుగొనును.

మీరు యేసు నామములో దేవుని వాక్యమును బోధించినప్పుడు, దేవుడు యేసు యొక్క నామమును ప్రతి నామమునకు పైగా ఎందుకు హెచ్చించెనో మీరు అర్థము చేసుకొనని యెడల, మీ బోధను బలపరచుటకు ఆత్మ యొక్క శక్తిని మీరు కలిగియుండరు. మీరు ఒక పుస్తకములో చదవిన లేక మరొక వ్యక్తి ప్రకటించిన వర్తమానమునే ప్రకటింపవచ్చును. కాని మీ ప్రకటన పైన అదే అభిషేకము ఉండదు. ఒక వ్యక్తి ఘనత పొందుటకు బోధించవచ్చును. కాని పరిశుద్ధాత్మ ఆ వర్తమానమును బలపరచడు మరియు అతని పరిచర్యలో కనిపించే ఏ ఫలమైనను నిత్యత్వములో నిలువదు.

మీరు యేసు యొక్క దీనత్వపు మహిమను చూచితిరా? మనము ఏమి చేసినను యేసు నామమున చేయవలెనని మనము ఆజ్ఞాపింపబడితిమి. అప్పుడు, తన్నుతాను తగ్గించుకొని, ఒక దాసునిగా మారి చనిపోయిన యేసుకున్న మనస్సు వంటి మనస్సును కలిగి మనము సమస్తమును చేయవలెను. ఆయన తన భూలోక జీవితమంతటిలోను, ఒక దాసునిగా తప్ప మరిదేనిగా ఉండుటకు నిరాకరించెను. అదే మన పిలుపు కూడా అయ్యున్నది. మనము కేవలము సహోదరుల వలేకాక ఒకరికొకరు దాసులుగా కూడా ఉండవలెను. ఆయన దీనత్వము యొక్క మహిమచేత మనము పట్టబడుదుము గాక. అప్పుడు మన ముఖముల పైన ఒక ముసుగు కాదుగాని ఒక శక్తివంతమైన అభిషేకము ఎల్లప్పుడు ఉండును.

తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసికొనెనని మనము చదివెదము. మీరు పోగొట్టుకొనిన మహిమను మరుగుచేయుటకు మీరుకూడా మీ జీవితము పైన ఒక ముసుగును వేయవచ్చును. ఈ దినమున అలా ఉండనప్పటికీ, మీ అంతరంగ జీవితములోను మీ వైవాహిక జీవితములోను ఉన్న మహిమ కొన్ని సంవత్సరముల క్రితమున్నట్లే ఇతరులు భావించవలెనని మీరు కోరుకొనవచ్చును.

కాని పౌలు ''మేము అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము. ముసుగు లేని ముఖముతో మనమిప్పుడు ప్రభువు యొక్క మహిమను చూచుచున్నాము'' అని చెప్పెను. ''యెహోవా తన సన్నిధికాంతిని నీపై ప్రకాశింపజేయునుగాక'' అని ఇశ్రాయేలీయులను దీవించవలెనని అహరోనుకు దేవుడు చెప్పెనని మనము సంఖ్యాకాండము 6:23-25లో చదివెదము. ఆయన తన మహిమను వారిపై ప్రకాశింపజేయుటయే వారు ప్రభువు యొద్దనుండి పొందగలిగిన అతిగొప్ప దీవెన. క్రొత్త నిబంధనలోకూడా, మనము ఈ రోజున పొందగలిగే అతిగొప్ప దీవెన కూడా ఇదే.

సూర్యుడు చంద్రునిపై ప్రకాశించినప్పుడు, అది సూర్యుని వెలుగును ప్రతిఫలింపజేయును. కాని భూమి సూర్యునికి మరియు చంద్రునికి మధ్య వచ్చునప్పుడు చంద్రుడు క్రమేణ అదృశ్యమగును. అనేకమంది విశ్వాసుల పరిస్థితి కూడా ఆవిధముగానే ఉన్నది. వారికి ప్రభువుకు మధ్య భూసంబంధమైన విషయాలు వచ్చును. పౌర్ణమిగా మొదలైనది త్వరలోనే అర్ధ చంద్రునిగా, చివరకు అమావాస్యగా మారును!!

ఈ తగ్గిపోవు మహిమను మనము నివారించుటకు ఏకైక మార్గము పూర్తిగా యధార్థముగా ఉండుట మరియు ప్రతి ముసుగును తొలగించుట. యధార్థముగా ఉండుట అంటే మనము మన పాపాలను బహిరంగముగా ఒప్పుకొనుటకాదు. లేదు. కాని దాని అర్థము మనము కపటమును, నటనను విసర్జించాలని. ఒక దీనత్వముతో కూడిన పరిశుద్ధమైన జీవితము లేకుండా ఒకడు అద్భుతమైన సత్యములను ప్రకటించుట ప్రజలు వినినప్పుడు వారు ఈ మహిమకరమైన సువార్తనుండి దూరముగా వెళ్లిపోవుదురు. మీరు ''యేసు రక్షించును'' అనే బాడ్జిని ధరించి మీ నిగ్రహమును కోల్పోతే, మీరు ఆ బ్యాడ్జిని మార్చి ''యేసు మనలను నరకమునుండి రక్షించును గాని కోపమునుండి రక్షించడు'' అనే బ్యాడ్జిని పెట్టుకోవలెను. లేదా మీ బ్యాడ్జిని తీసివేయవలెను. అప్పుడు కనీసం ప్రభువు యొక్క నామము అవమానపరచబడదు.

యేసుని దీనత్వము యొక్క మహిమ చేత మనము పట్టబడవలెను. అందరికీ దాసునిగా ఉండకుండునట్లు ఆయనను ఎవరు ఆపలేకపోయిరి. ప్రజలు ఆయనను రాజుగా కావాలనుకొనిరి, గాని ఆయన వారి కోరికను కాదనెను. ఆయన ఒక గొప్పవానిగా లేక జ్ఞానముగల వానిగా లేక ఇంకా ఏ విధముగాను ఘనతను లేక పేరును సంపాదించవలెనని కోరుకొనలేదు. తన జీవితము ద్వారా దేవుడు ఎటువంటివాడో మనకు చూపించుటకు ఆయన వచ్చెను. మన పిలుపు కూడా ఇదే-దాసులుగా ఉండుట, మన స్వంత చిత్తమునకు చనిపోవుట మరియు దేవుడు ఎటువంటి వాడో ఇతరులకు చూపించుట.

మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ క్రీస్తుయొక్క మహిమను మనకు చూపించుటకు మనము అనుమతించవలెను. ఆ తరువాత పరిశుద్ధాత్మ ఆ మహిమలో మనము మరింతగా పాలివారమగునట్లుగా చేయును.

అధ్యాయము 16
ఒక శుద్ధ హృదయము మరియు ఒక పవిత్రమైన జీవితము

దేవుని జీవమును ప్రత్యక్షపరచుట

నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు నేను వెలుగునని మన ప్రభువు చెప్పెను (యోహాను 9:5). మన ప్రభువు లోకమును విడిచి వెళ్లిన తరువాత ఆయన మనలను లోకమునకు వెలుగుగా ఉండుటకు నిర్దేశించెను (మత్తయి 5:16). యేసు తెచ్చిన వెలుగు ఏదోఒక సిద్ధాంతమో లేక బోధయో కాదు. అది క్రొత్త నిబంధన గూర్చిన సత్యము కూడా కాదు. ఆ వెలుగు ఆయన జీవమే-దేవుని స్వభావమును ప్రత్యక్షపరచిన దేవుని జీవము.

''మాకు దానిమీద వెలుగు కలిగెను'' అనే మాటలను మనము తరచు వాడుదుము. మనకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము, పాపము మీద జయము మొదలగు వాటిపైన వెలుగు ఉన్నదన్న సత్యమును బట్టి మనము అతిశయపడవచ్చును. కాని మనము ప్రత్యక్షపరచవలసిన అవసరమున్న వెలుగు యేసు యొక్క జీవమే. ''ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు'' అని క్రొత్త నిబంధనలో రెండుమారులు వ్రాయబడెను. మొదట యేసు వచ్చి మనకు దేవుని గూర్చి వివరించెను (యోహాను 1:18). యేసు తన చేతులను ఒక కుష్ఠురోగి చుట్టూ ఉంచినప్పుడు, దేవుడు ఏ విధముగా నుండెనో ఆయన ప్రత్యక్షపరచుచుండెను. ఆయన రూకలు మార్చువారిని ఆలయములోనుండి తరిమి వేసినప్పుడు, దేవుడు ఏ విధముగా నుండెనో ఆయన ప్రత్యక్షపరచుచుండెను. ఆయనను చూచినవారు తండ్రిని చూచిరని ఆయన తన శిష్యులకు చెప్పెను. కాని ఇప్పుడు యేసు పరలోకమునకు వెళ్లిపోయెను. ఇప్పుడు మనము ఒకరినొకరు ప్రేమించిన యెడల, దేవుడు మనయందు నివసించును మరియు ప్రజలు దేవునిని యేసులో చూచినట్లే ఆయనను సంఘములో చూడగలరు (1యోహాను 4:12). సంఘములో మనలను గమనించిన వారు క్రీస్తు ఎటువంటి వాడో తెలుసుకోగలిగియుండవలెను. మనము ఈ వెలుగును, అనగా యేసు యొక్క జీవమును మన జీవితాల ద్వారా ప్రతిఫలింపజేయుటలో విఫలమైనయెడల మన ప్రాథమిక పిలుపులో మనము విఫలులైయ్యామని మనము అంగీకరించవలెను.

మనలో ఎవరు వ్యక్తిగతముగా దేవుని వెలుగును (దేవుని జీవమును) దాని అన్ని కోణాలలోను పరిపూర్ణముగా ప్రతిఫలింపచేయలేము. కాని ఒక సంఘముగా మనము ఇతరులకు దేవునియొక్క నానావిధమైన జ్ఞానమును కనుపరచవచ్చును. మన శరీరముల యందు యేసు యొక్క మరణానుభవమును వహించుట ద్వారానే మనము యేసు యొక్క జీవమును ప్రత్యక్షపరచవచ్చును. ఒక గృహములో భార్యాభర్తలిద్దరు తమ ఆదాము స్వభావమునకు చనిపోవుటకు ఇష్టపడిన యెడల ఆ గృహములో సమాధానము ఏలును! మనము ఎంత ఎక్కువగా దు:ఖపడినను, బాధింపబడినను, హింసింపబడినను, లేక శోధింపబడినను, ''మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి''(2కొరింథీ 4:12) అని మనము చెప్పగలిగియుండవలెను. అదే మన పిలుపు.

యధార్థమైన హృదయము

ఆదికాండము 20వ అధ్యాయములో, అబీమెలెకు తన అంత:పురములో ఉంచుకొనుటకు అబ్రాహాము భార్యయైన సారాను తన ఇంట చేర్చుకొనెనని మనము చదివెదము. అయితే అసాధారణముగా ఆ అన్యుడైన రాజు ఆమెను ముట్టకుండానే ఆ రాత్రి నిద్రించెను. అప్పుడు దేవుడు స్వప్నమందు అతనితో మాట్లాడి అతడు వేరొకని భార్యను తన ఇంట చేర్చుకొనినందున అతడు చచ్చినవాడని అతనితో చెప్పెను. అబ్రాహాము స్వయముగా ఆమె తన చెల్లెలని చెప్పెను గనుక అతడు యధార్థహృదయముతో ఈ పనిచేసెనని దేవునితో ధైర్యముగా చెప్పెను. అబీమెలెకు, ''యధార్థహృదయము గలవాడని'' కలవాడని దేవుడు అంగీకరించి ఆ కారణముగానే ఆ రాత్రి ఆయన అతనిని పాపము చేయకుండా అడ్డగించెనని ఆయన అతనితో చెప్పెను. ఒక అన్యుడైన రాజు హృదయములో యధార్థతను దేవుడు చూచి అతడు పాపము చేయకుండునట్లు దేవుడు అతనిని నిద్రించునట్లు చేయగలిగినప్పుడు, క్రొత్త నిబంధనలో ఆయన మనలను ఇంకెంతగా కాపాడును. కాని ఆయన యధార్థమైన హృదయము కొరకు చూచుచున్నాడు. ఒక అన్యుడైన రాజు దేవుడు అంగీకరించగలిగే యధార్థమైన హృదయమును కలిగియుండ గలిగినప్పుడు, మనము కూడా దానినికలిగియుండుట కష్టము కాకూడదు.

అయితే మనము యధార్థ హృదయము కొరకు ప్రయాసపడెదము. దేవుడు దీనిని అనేక మంది విశ్వాసులలో చూడనందు వలన ఆయన వారిని పడిపోకుండా కాపాడడు.

పునరావృతమగు పరీక్షలు

దేవుడు అబ్రాహామును మరల మరల పరీక్షించెను మరియు అతడు ప్రతిసారి నమ్మకస్తునిగా కనబడెను. అబ్రాహాము అనేక శోధనలలో నమ్మకముగా ఉన్న తరువాత, దేవుడు అతనిని ఊరులో 50 ఏళ్ల క్రితము మొదట పిలిచిన తరువాత దేవుడు అతనిని మరల పరీక్షించి తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మని అడిగెను. అతడు 50 ఏళ్ల క్రితము చేసినట్లుగానే అతడు మరల దేవునికి పూర్ణ హృదయముతో లోబడెను. మనము అనేక సంవత్సరములు నమ్మకముగా ఉన్నంత మాత్రాన దేవుడు మనలను పరీక్షించుట మానివేయడు. ప్రేమతో అంతమువరకు సహించువాడే రక్షింపబడును. మనము మన తోటి విశ్వాసుల చేత తిరస్కరింపబడుట ద్వారా మనలను దేవుడు పరీక్షింపవచ్చును. ''ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు'' అని యేసుని గూర్చి వ్రాయబడెను (యోహాను 1:11). మనము యేసు పొందిన విద్యనే పొందగోరినయెడల, మనము ఆయన అనుభవించినదే అనుభవింపవలెను మరియు ఆయన వలే ప్రేమతో స్పందించవలెను.

వాక్యమును బోధించే వరమును కలిగిన ఒక యువకుడు తన స్థానిక సంఘములో తనకంటే 20 ఏళ్లు ఎక్కువ వయస్సు కలిగిన ఒక సంఘపెద్ద తన పరిచర్యను బట్టి అసూయపడి తనను బోధించుటకు అనుమతించకుండా, కూటములలో మౌనముగా కూర్చుండబెట్టెనని అతడు గమనించెను. ఇది తిరస్కారమునకు సంబంధించిన పరీక్ష. ఆ యువకుడు తిరుగుబాటు చేయకుండా ఆ పెద్ద అధికారమునకు లోబడి అతనితో మంచి సంబంధమును కలిగియుండెను. ముప్పై ఏళ్ల తరువాత అతడు ఎంతో పెద్దవాడైనప్పుడు, దేవుడు అతనిని ఆ విషయములోనే మరల పరీక్షించెను. ఒక సంఘములో అతడు మాట్లాడుటకు అనుమతించబడని మరియొక పరిస్థితిని దేవుడు అనుమతించెను. ఈసారి అక్కడి పెద్దలు అతనికంటె 20 ఏళ్లు చిన్నవారైనప్పటికీ అతడు మరల కూటములో మౌనముగా కూర్చుని తిరుగుబాటు చేయకుండా వారికి లోబడి వారితో మంచి సంబంధమును కొనసాగించెను.

దేవుడు మనందరినీ అనేక విధములుగా మన జీవితాల అంతము వరకు పరీక్షించును.

ఆత్మ యొక్క స్వరమును వినుట

మన జీవితాలలో అనేకసార్లు మనము నిర్ణయాలు తీసుకోవలసిన సమయములో మనము ఏమి చేయవలెనో మనకు ఖచ్చితముగా తెలియదు. లేఖనములు మౌనముగా ఉన్న అనేక విషయములున్నవి. అదే సమయములో, మనము సలహానడుగుటకు వెళ్లగలిగే భక్తిపరుడైన సహోదరుని మనము ఎల్లప్పుడు కనుగొనలేకపోవచ్చును.

ఎవరో ఒక భక్తిపరుడైన సహోదరుడు అటువంటి పనులను చేసెననో లేక మనము అది చేయుట మంచిదేనని అతడు చెప్పెననో మనము మన క్రియలను సమర్థించుకొనినప్పుడు, మనము చేయు దానిని ఒక చెడ్డ మనసాక్షితో మనము చేయుచున్నామని అది నిరూపించును. మనలను వ్యక్తిగతముగా నడిపించుటకు దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించెను.

ఉదాహరణకు, ఒక సహోదరి ఒక కూటములో లోకమును ప్రేమించవద్దు అనే హెచ్చరికను వినవచ్చును. అలా చాలా సాధారణమైన హెచ్చరిక, అది ఏ ఒక ప్రత్యేకమైన విషయమునకు సంబంధించినది కాదు. క్రొత్త నిబంధన మనకు అటువంటి సాధారణమైన హెచ్చరికలనే ఇచ్చును. అప్పుడు ఒక వివాహ వేడుకకు ఒక ఆడంబరమైన ఖరీదైన చీరను ధరించవలెనో లేదో అను నిర్ణయమును తీసుకోవాలన్నప్పుడు ఆమె ఏమి చేయవలెను. ఆమె ఆ చీరను ఎందుకు ధరించవలెనో అని ఆమె మనస్సు ఎన్నో కారణములను ఇవ్వవచ్చును. కాని పరిశుద్ధాత్మ ఆమె ఉద్దేశ్యమును పరీక్షించి ఆమె తన లోకస్తులైన స్నేహితులనుండియు, బంధువులనుండియు ఘనత పొందుటకే ఆమె దానిని ధరించుచున్నదని పరిశుద్ధాత్మ ఆమెతో చెప్పవచ్చును. ఆమెతో సత్యమును చెప్పుటకు ఆత్మ నమ్మకముగా నుండెను. కాని ఆమె లోబడవలెనని ఆయన బలవంతపెట్టడు. చివరి నిర్ణయము ఆమెదే.

సంఘములో ఏ సహోదరుడు లేక సహోదరి మనకు నేర్పించలేని అనేక విషయములను గూర్చి ఆత్మ యొక్క అభిషేకము మనకు నేర్పించును. కాని మనము ఆత్మను వినుటకు జాగ్రత్త పడవలెను. మనము ఆ స్వరమును తిరస్కరించుచుండిన యెడల, కొంత సమయము తరువాత ఆయన మనతో మాట్లాడుట మానివేయవచ్చును. అప్పుడు మనము దిగజారిపోయి, లోకానుసారులుగాను శరీరానుసారులుగాను మారెదము.

ఆత్మీయ అధికారమునకు లోబడుట

సంఘము తెలివి చేత (సిద్ధాంతము చేత) కట్టబడదు గాని జ్ఞానము చేత కట్టబడును (సామెతలు 24:3). జ్ఞానము ఇంటియొద్ద లేక సంఘములో లేక సమాజములో దేవుడు అతని పైన ఉంచిన అధికారులందరికీ ఒక సహోదరుడు లోబడునట్లు జ్ఞానము చేయును. తాను నజరేతులో ఉన్న సంవత్సరములన్నిటిలోను యేసు పరిపూర్ణులు కాని తల్లితండ్రులకు (యోసేపు, మరియలకు) లోబడెను. ఎందుకనగా తన పరలోకపు తండ్రి ఆయనను అలా చేయాలని కోరుకొనెను. యోసేపు, మరియలు పరిపూర్ణులా కాదా? అన్నది ప్రశ్నకాదు గాని తండ్రి, యేసు కొరకు ఏమి నియమించెనో అన్నదే ప్రశ్న. యోసేపు, మరియలు నిస్సందేహముగా దైవభయము గలవారే. కాని వారు పాత నిబంధనలో ఉండిరి. కాబట్టి వారు కృప క్రింద లేరు. గనుక వారికి పాపము మీద జయము ఉండే అవకాశము లేకుండెను. వారి గృహములో వారు గొడవపడి యుండెడివారు మరియు వారి మధ్య ఉద్రిక్తతలు యుండియుండవచ్చును. ఇది క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించని దంపతులందరి విషయములో ఉన్నట్లే ఉన్నది. అయినప్పటికీ పరిపూర్ణుడైన దేవుని కుమారుడు పరిపూర్ణులు కాని వీరిద్దరికి లోబడెను. లోబడుటలో ఆయన మొదటిమెట్టు పరిపూర్ణులు కాని అధికారులకు లోబడుట అయ్యుండెను. ఇప్పుడు మనమును అదే మార్గములో నడువ వలెనంటే దేవుడు మనపై నియమించిన అధికారులకు (వారు ఎంత పరిపూర్ణులు కానప్పటికీ) మనము లోబడవలెను. అందుచేత పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడవలెనని మనము వారికి నేర్పించుదుము. అది పిల్లలకు మొదటి ఆజ్ఞయైయున్నది; దానిని గైకొనిన వారందరికీ ''మేలు కలుగునని'' దేవుడు వాగ్దానము చేసెను. అధికారమునకు విధేయతకు దేవుడు ఎంతో ప్రాముఖ్యతనిచ్చును. గనుక మన పిల్లలకు జీవితములో మేలు జరగాలని మనము కోరుకొంటే మనము వారికి విధేయతను నేర్పించవలెను.

అదే విధముగా మనకు మేలు జరగాలని మనము ఆశించిన యెడల, దేవుడు సంఘములో మనమీద నియమించిన పరిపూర్ణులు కాని ఆత్మీయ అధికారులకు మనము లోబడవలెను. ప్రభువు నందు మన మీద పెద్దలుగా ఉన్నవారు నిశ్చయముగా పరిపూర్ణులు కారు. కాని మనము సరియైన స్థానిక సంఘములో ఉన్నామని మనకు నిశ్చయత ఉన్నయెడల, అక్కడ దేవుడు నియమించిన పెద్దలకు మనము లోబడవలెను. అయితే మీరు ప్రస్తుతమున్న స్థానికసంఘము సరియైనదని మీకు నిశ్చయత లేనప్పుడు, మీరు దానిని విడిచి పెట్టుటను గూర్చి దేవుని ప్రార్థించవలెను.

కాని అధికారమునకు వ్యతిరేకముగా తిరుగుబాటును దేవుడు ఎప్పుడైనను ఆమోదించడు. మన సంఘములలోనున్న పెద్దలు ప్రభువు కొరకు ఒక పవిత్రమైన సాక్ష్యమును కలిగియుండుటకు పోరాడుచున్నారని మనము మరువకూడదు. ఇది ఖచ్చితముగా తేలికైన పని కాదు. అయితే సంఘములోనున్న సహోదరులు, సహోదరీలు, తమ పెద్దలలోనున్న లోపాలను చూచి వారిని విమర్శించి వారికి విరోధముగా తిరుగుబాటు చేయుట తేలికైన పని. పిల్లలులేని వారికి ఇతరులు తమ పిల్లలను పెంచే విధానములో తప్పులు కనుగొనుట తేలికైన పని. కాని జ్ఞానము గలవారు, పిల్లలను భక్తిమార్గములో పెంచుట ఎంత కష్టమైన విషయమో ఎరిగియుందురు గనుక, మౌనముగా నుందురు.

మొట్టమొదటిగా మీరు ఈ విషయమును పరిశీలించుట కూడా మంచిది: మీరు ఎక్కడైనా ఒక సంఘమును నడిపించుటకు దేవుడు మిమ్మును ఎంచుకొనెనా? దేవుడు మిమ్మును ఎక్కడైనను ఆత్మీయ అధికారము కలిగియుండుటకు తగిన వారిగా ఎన్నడూ ఎంచనియెడల, దేవుడు అటువంటి ఆత్మీయ బాధ్యతను అప్పగించిన వారిని మీరెందుకు తీర్పుతీర్చుదురు? మీరు దేవుని నియామకమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుచున్నారు. ఆ పెద్దలు అనేక విధాలుగా అసంపూర్ణులై యుండవచ్చును. అయినప్పటికీ దేవుడు వారిని మీకంటే మెరుగైనవారిగా కనుగొనెను, అందుచేత ఆయన వారిని పెద్దలుగా చేసెను. మీరు అక్కడికి రావడానికి ఎంతో కాలము ముందే దేవుడు వారిని ఆ ప్రదేశములో మొదట ఎంచుకొనెను. మీరు కేవలము పరిణితిలేని తిరుగుబాటు దారులును, ఆచరణలో పెట్టని, తెలివైన ఆలోచనలు కలిగిన వారుగా ఉండవచ్చు. ఆయన కొరకు ఒక స్థానిక సంఘమునైనా కట్టుటకు మీకు దేవుడు కృపనివ్వని యెడల, మీరు మీ పెద్దల క్రింద మిమ్మును మీరు తగ్గించుకొని మౌనముగా ఉండుటయే మీరు చేయవలసిన జ్ఞానము కలిగిన పనియైయున్నది.

అయితే ఒక సంఘములో పెద్దలతో తీవ్రమైన సమస్యలుండవచ్చును. అటువంటి సందర్భములో మీరు దాని విషయము ఈ పరిస్థితిలో సహాయపడగలిగే మరెక్కడైన ఉన్న పరిణితి గల పెద్ద సహోదరునితో మాట్లాడవలెను. మరియు సంఘములో ఇతరులతో ఈ విషయమును గూర్చి కొండెము లాడకూడదు. ఒక సంఘములో గందరగోళమును సృష్టించేవారిని లేక జగడములను పుట్టించువారిని దేవుడు ఎన్నడూ దీవించలేడు. దేవుని చేత నియమింపబడిన అధికారులకు లోబడియుండుట మనము నేర్చుకోవలెను.

ఆత్మీయ అధికారమును అభ్యాసము చేయుట (అమలు పరచుట)

ఒక భక్తిగల విధానములో ఆత్మీయ అధికారమునకు లోబడుట ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయ అధికారమును భక్తిగల విధానములో అభ్యాసము చేయుట కూడా అంతే ప్రాముఖ్యము. దురదృష్టవశాత్తు అనేకమంది పెద్దలు తమ మందపైన ఆత్మీయ అధికారమును కాక మతానుసారమైన అధికారమును అమలుచేయుదురు. ఇద్దరు కుమారుల యొక్క ఉపమానములో (లూకా 15:11-32లో) తప్పిపోయిన కుమారుని యెడల తండ్రికి మరియు పెద్ద కుమారునికి ఉన్న వైఖరులలో ఈ వ్యత్యాసమును మనము స్పష్టముగా చూడవచ్చును. చిన్న కుమారుడు తన అవిధేయతతో కూడిన జీవితమును బట్టి మారుమనస్సుపొంది ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతనిని ఆహ్వానించుటకు తండ్రి బయటకు పరుగెత్తెను. ఇది మారుమనస్సు పొందు పాపులయెడల దేవుని హృదయమునకు మరియు భక్తిపరులైన పెద్దల హృదయమును ప్రతీకగా నున్నది.

తన తండ్రి, తన తమ్ముడిని ఆహ్వానించిన విధానమును పెద్ద కుమారుడు చూచినప్పుడు అతడు ఎంత కోపపడెనంటే (ఈ కోపము అసూయ నుండి పుట్టినది) అతడు తన ఇంటిలోనికి ప్రవేశింపలేదు. అతడి స్వనీతి అతని క్రియలలోను మరియు అతని మాటలలోను స్పష్టమాయెను. అతడు తన తమ్ముడిని తన స్వంత సహోదరునిగా కూడా పేర్కొనలేదు. ''ఈ నీ కుమారుడు'' అని తన తండ్రితో అనెను. అతడు తన సహోదరుని తృణీకరించి అతడు అలా చేసెనో లేదో ధృవీకరించకుండా అతడు వేశ్యలతో సాంగత్యము చేసెనని అతని గూర్చి ఘోరమైన వాటిని ఊహించుకొనెను. ఆ పెద్ద సహోదరుడు తన తండ్రి ఆజ్ఞలన్నిటిని గైకొని తన తండ్రి ఇంటిలో (సంఘములో) నమ్మకముగా యుండియుండవచ్చును. కాని అతని హృదయము ఎంతో కఠినమైనదిగాను భక్తిహీనమైనదిగాను ఉండెను. అతడు ఆత్మానుసారుడు కాక మతానుసారుడైయుండెను. అతడు ఎంతో స్వనీతి కలిగి పరిసయ్యుల మనస్తత్వమును కలిగియుండెను. అతడు తనతండ్రి యొక్క ఆనందములో పాలుపొందలేకపోవుట దీనికి ఒక రుజువు.

పరిసయ్యులు పరిశుద్ధాత్మ యొక్క ఆనందము లేకుండా ఒక దిగులుతో కూడిన కఠినమైన నీతిని కలిగియుందురు. కాని దేవుని రాజ్యము యొక్క నీతి ''సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందముతో కూడిన నీతి''యై యున్నదని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది (రోమా 14:17). కాని తండ్రి పరిసయ్యుల మనస్తత్వము గల తన పెద్ద కుమారుని బ్రతిమాలుటకు కూడా బయటకు వెళ్ళెనని మనము చూచెదము. ఈ కథలోని తండ్రివలె భక్తిపరులైన పెద్దలు మారుమనస్సు పొందిన పాపుల యెడల మరియు పరిసయ్యుల యెడల కూడా మంచిగా ఉందురు. పెద్దలందరు అటువంటి పెద్ద హృదయమును కలిగియుండవలెను. అప్పుడు మాత్రమేవారు ఆత్మీయ అధికారమును అమలు చేయగలరు. ఒక ఆకాశసౌధనమును కట్టుటకు ఎంతో సమయము పట్టినట్లే ఒక స్థానిక సంఘమును క్రీస్తు శరీరముగా కట్టుటకు ఎంతో సమయము, ప్రయాస, చెమట, కన్నీళ్లు అవసరము. ఆ ఆకాశసౌధము ఒక బాంబు చేత కొద్ది క్షణాలలో నాశనము చేయబడగలిగినట్లే, ఇతరులు చేసిన పనిని విమర్శించుట చాలా సులభము, ప్రత్యేకముగా మనము ఆ పనిలో మన శ్రమను, కన్నీళ్లను పెట్టని యెడల అది చాలా సులభము.

మరుగైయున్న వైఖరులు బహిర్గతమగును

మన అంతరంగములో ఉన్న పాపమంతటి నుండి మనలను మనము పవిత్రపరచుకొనుటలో పరిపూర్ణమైన కార్యమును చేయనియెడల-ప్రత్యేకముగా మనకు విరోధులైనవారి యెడల మన చెడు వైఖరుల విషయము-అటువంటి వైఖరులు ఒక రోజు లోపలున్న క్యాన్సరు రోగము వలె మనలను నాశనము చేయును. పాత నిబంధనలో మనము రాజైన సౌలుకు బంధువుడైన షిమీని గూర్చి చదివెదము. సౌలు మరణించి దావీదు ఇశ్రాయేలుకు రాజైనప్పుడు ఈ వ్యక్తి తన హృదయము యొక్క లోతులలో దావీదుకు వ్యతిరేకముగా పగను కలిగియుండెను. దేవుడే దావీదును రాజుగా అభిషేకించినప్పటికీ దావీదు దేవుని ప్రజలను ఏలుచున్నందుకు అతడు సంతోషించలేదు. అబ్షాలోము తన తండ్రికి విరోధముగా తిరుగుబాటు చేసి, దావీదు యెరూషలేమునుండి పారిపోవలసిన దినము వరకు షిమీ యొక్క అసూయ మరియు అసంతృప్తి తన హృదయములో ఎంతో కాలము మరుగైయుండెను (2సమూయేలు 16:5-14). అప్పుడు షిమీ హృదయములో దాగియున్నది బయటకు వచ్చెను. దావీదు తన ప్రాణము కొరకు పారిపోవుచున్నప్పుడు, షిమీ దావీదు యొద్దకు వచ్చి అతనిపై నేరారోపణ చేయటమే కాక అతడిని శపించి, అతడు దేవునిచేత శిక్షింపబడుచున్న ఒక నరహంతకుడని అతనిని పిలిచి అతనిపై రాళ్లు రువ్వెను. ఇతరులు బాధలో ఉన్నప్పుడే మన హృదయాలలో దాగియున్నది బయటకు వచ్చును.

కాని దావీదు దయగలవాడై షిమీ యొక్క శాపవచనమును పట్టించుకొనలేదు. తరువాత అబ్షాలోము చంపబడి దావీదు రాజుగా తిరిగి వచ్చినప్పుడు షిమీ భయపడి క్షమాపణ కొరకు దావీదు యొద్దకు పరుగెత్తెను. మరల దావీదు దయగలవాడై అతడిని క్షమించి అతనిని చంపనని ప్రమాణము చేసెను. కాని షిమీకు విరోధముగా తన అంతరంగములో నున్న ద్వేషము నుండి దావీదు తన్నుతాను పవిత్రపరచుకోలేదని స్పష్టమగుచున్నది. ఎందుకనగా అతడు చనిపోక ముందు తన కుమారుడైన సొలొమోనుతో ఇట్లనెను: ''నేను షిమీని క్షమించి అతనిని చంపనని ప్రమాణము చేసితిని. కాని ఆ ప్రమాణము నిన్ను కట్టివేయదు. నీవు జ్ఞానము గలవాడవు గనుక నీవు షిమీ చంపబడునట్లు ఒక తెలివైన మార్గమును నీవు ఖచ్చితముగా కనుగొనగలవు''. మనకు తెలిసినంతవరకు దావీదు తన తుది శ్వాసను తీసుకొనకముందు అవే అతడి ఆఖరు మాటలు (1రాజులు 2:8-10 వచనాలను చూడండి).

ఆ విధముగా అతడు షిమీ పైన ప్రతీకారము తీసుకొని మరణించెను. అనేక సంవత్సరములు ఒక దైవజనుడిగా ఉన్నతరువాత ఇది ఎంత విషాదకరమైన మరణము. మనము దావీదును మన ప్రమాణాలను బట్టి తీర్పుతీర్చలేము. ఎందుకనగా అతడు పాత నిబంధనలో జీవించెను. క్రొత్త నిబంధనలో మన పిలుపు ఉన్నతమైనది. పగతీర్చుట దేవునిపని గనుక ఇప్పుడు మనము కీడుకు ప్రతిగా కీడు చేయవద్దని హెచ్చరింపబడినాము (రోమా 12:17-21). కాబట్టి మన హృదయాలలో ఎవరికైనా వ్యతిరేకముగా ప్రతీకారము కొరకు అతి స్వల్పమైన కోరిక ఉన్నదేమోనని దేవుని యెదుట మన హృదయాలను పరీక్షించుకొనుట ముఖ్యమైన విషయము.

అధ్యాయము 17
జ్ఞానము యొక్క ఏడు స్తంభములు

బైబిలు యొక్క ముగింపు పేజీలలో మనము చూచె గొప్ప వ్యత్యాసము వేశ్యయైన బబులోనుకు (ప్రకటన 17,18) మరియు క్రీస్తు యొక్క వధువైన యెరూషలేముకు (ప్రకటన 21,22) మధ్యనున్నది. ''లోకముతో స్నేహము చేయువారు వ్యభిచారిణులు'' అని బైబిలు చెప్పుచున్నది (యాకోబు 4:4). దీనికి వ్యత్యాసముగా, వధువు తమ్మును తాము లోకమునుండి వేరుపరచుకొని, తమ పరలోకపు వరుని కొరకు తమ్మునుతాము పవిత్రముగా ఉంచుకొనిన వారితో కూడియున్నది (2కొరింథీ 11:1-3 చదవండి). సామెతలు 8:1,21లో వరుడు ''జ్ఞానము'' అని పిలువబడెను. తరువాత తదుపరి అధ్యాయములో వధువు కూడా ''జ్ఞానము'' అని పిలువబడెను (సామెతలు 9:1). ఎందుకనగా ఆమె ప్రతి విషయములోను తన వరునితో ఒకటిగా నుండి ఆయన పేరును ('జ్ఞానము')తన నొసటి మీద కలిగియుండెను-ఆమె తన వరుని వలే జయించెను (ప్రకటన 3:12,21 మరియు 14:1 చూడండి).

సామెతలు 9వ అధ్యాయములో, వధువుకు వేశ్యకు మధ్య ఉన్న వ్యత్యాసము స్పష్టముగా చూపబడెను. ఈ అధ్యాయము యొక్క మొదటి 12 వచనాలలో, వధువు జ్ఞానము లేని వారందరిని తమ జ్ఞానములేని మార్గములను విడిచిపెట్టి, పాపుల సాంగత్యమును విడిచిపెట్టి (6వ వచనము), జ్ఞానమునకు మూలమైన దేవుని యందు భయభక్తులను నేర్చుకొనుమని అహ్వానించుచున్నది (10వ వచనము). ఆ అధ్యాయము యొక్క చివరి 6 వచనాలలో మనము వేశ్య యొక్క పిలుపును గూర్చి చదివెదము. అనేకులు వేశ్య పిలుపునకు స్పందించి ఆత్మీయ మరణమును పొందుదురు (18వ వచనము).

వధువు (జ్ఞానము) తన నివాసమును ఏడు స్తంభముల మీద కట్టుకొనినదని మనము అక్కడ చదివెదము. ఈ ఏడు స్తంభముల యొక్క జాబితా మనకు యాకోబు 3:17లో ఇవ్వబడినది మరియు నిజమైన సంఘము ఈ స్తంభములపైన కట్టబడును. ఈ గుణ లక్షణముల ద్వారా మనము క్రీస్తు యొక్క వధువును ఎక్కడైనను గుర్తు పట్టవచ్చును:

1. పవిత్రత

నిజమైన సంఘములో మొదటి మరియు అతి ముఖ్యమైన స్తంభము పవిత్రత. అది కేవలము బాహ్యసంబంధమైన పవిత్రతతో కూడిన ఒక బోలు స్తంభము కాదు. అది పూర్తిగా గట్టిదైనది. అది హృదయ పవిత్రత మరియు అది హృదయపు లోతులలో ఉన్న దేవుని భయము అనే విత్తనము నుండి పెరుగును. క్రీస్తు యొక్క నిజమైన సంఘము తెలివిగల మెదడులతో కాక పవిత్రమైన హృదయాలతో కట్టబడును. దేవుని గురించి ఆయన మార్గముల గురించి మనకు ఆత్మీయ ప్రత్యక్షత లేనియెడల మనము సంఘమును కట్టలేము. హృదయ శుద్ధి (హృదయమంతటితో దేవుని వెదికేవారు) గలవారు మాత్రమే తమ హృదయాలలో దేవుని చూచుటకు అనుమతించబడుదురు (మత్తయి 5:8).

2. సమాధానము

నీతి, సమాధానము ఎల్లప్పుడు కలిసియుండును. అవి కవలలు. దేవుని రాజ్యము, నీతి సమాధానములతో కూడియున్నది (రోమా 14:17). నిజమైన జ్ఞానము ఎల్లప్పుడు గొడవపడదు, వాదించదు. అది పోట్లాడదు. సాధ్యమైనంత వరకు అది అందరితో శాంతియుతమైన సంబంధములను కలిగియుండును. దైవ జ్ఞానముతో నిండియున్న ఒక వ్యక్తితో తగాదా పడుట అసాధ్యము. ఎందుకనగా అటువంటి వ్యక్తి సమాధానపరుడు. అతడు స్థిరముగా ఉండును మరియు రాజీపడువారిచే ద్వేషించబడవచ్చును. కాని అతడు ఎల్లప్పుడు సమాధానపరుడై యుండును. వారు సువార్తను ప్రకటించుటకు ప్రయాణము చేసినప్పుడు వారు సమాధానపాత్రులైన వారి ఇంటనే యుండవలెనని యేసు తన శిష్యులతో చెప్పెను (లూకా 10:5-7). మనము దేవుని మందిరమును కట్టవలెనంటే మనము సమాధానపాత్రులై యుండవలెను.

3. సాత్వీకము

క్రీస్తు యొక్క వధువు ఎల్లప్పుడు ఇతరులతో న్యాయముగాను, సాత్వీకముగాను, ఓరిమితోను, సహనముతోను, మర్యాదగాను ప్రవర్తించును. ఆమె ఎల్లప్పుడు కఠినముగాను లేక బిరుసుగాను ఉండక ఇతరుల భావాలను ఎల్లప్పుడు పరిగణనలోకి తీసుకొనును. సంఘము ఈ స్తంభము మీద ఆధారపడినప్పుడు, కొందరు తక్కువ జ్ఞానము గలవారైనను, లేక వారి పద్ధతులలో మోటైన వారైనను ఒకరికొకరు భరించుట సులువుగానుండును. సమస్య మన సహోదరుని లేక సహోదరి యొక్క మోటుతనము కాదు గాని మనలో నివసించు అసహనమని మనము గ్రహించుట మొదలుపెట్టెదము. కాబట్టి మన సహోదరులు లేక సహోదరీలతో కాక మన నిజమైన శత్రువైన స్వజీవముతో పోరాడుదుము.

4. సులభముగా లోబడుట

మందలింపును గాని హెచ్చరికను గాని స్వీకరించలేని వాడు లేక ఆ స్థాయిని దాటి పోయానని అనుకొనేవాడు, ఒక పెద్దయైనను లేక ఒక ముసలివాడైనను నిజముగా జ్ఞానములేనివాడు (ప్రసంగి 4:13 చూడండి). ప్రత్యేకముగా భారత దేశములో, అనేకమంది ''పెద్దవారు జ్ఞానము గలవారు'' అనే అన్యతలంపును కలిగియుందురు. అది భూసంబంధమైన విషయాలలో నిజమైయుండవచ్చు గాని ఆత్మ సంబంధమైన విషయాలలో ఖచ్చితముగా కాదు. యేసు సమాజమందిరములలో ఉన్న వయస్సులో పెద్దవారిని తన శిష్యులుగా ఎంచుకోలేదు. ఆయన యౌవనస్థులను ఎంచుకొనెను. సంఘములో పెద్ద వయస్సు కలవారు ఒక తక్కువ వయస్సు గల సహోదరుడు, సంఘపెద్దయైనను లేక ఎక్కువ భక్తిపరుడైనను అతని నుండి హెచ్చరికను పొందుట చాలా కష్టతరముగా నుండును. కాని దానికి కారణము వారి గర్వమే. దిద్దుబాటును స్వీకరించుటకు ఇష్టపడువారు జ్ఞానులుగా మారుదురు (సామెతలు 13:10). కాబట్టి ఎక్కడైతే ఒక సంఘములో హెచ్చరికను మరియు దిద్దుబాటును స్వీకరించుటకు ఆసక్తి కలిగిన సహోదరులు మరియు సహోదరీలుందురో అక్కడ ఒక నిజమైన మహిమకరముగల సంఘము కట్టబడును. జ్ఞానముగలవాడు తనను నమ్మకముగా హెచ్చరించువారిని ప్రేమించి వారి సాంగత్యమును ఆసక్తితో కోరుకొనును. ''ఒకనికొకడు లోబడియుండుడి''అను మాటలు ఈ స్తంభము మీద వ్రాయబడి యున్నవి (ఎఫెసీ 5:21).

5. కనికరము మరియు దాని మంచి ఫలముల యొక్క సంపూర్ణత

క్రీస్తు యొక్క వధువు అప్పుడప్పుడు కనికరము కలది మాత్రమే గాక కనికరముతో నిండియుండును. ఆమెకు ఎవరినైనను ధారాళముగా ఆనందముతో హృదయపూర్వకముగా క్షమించుటకు ఏ సమస్యా లేదు. ఆమె ఇతరులకు తీర్పుతీర్చదు, ఖండించదు, కాని తన వరుని వలే వారి యెడల కనికరము చూపును. ఈ కనికరము అనేదికేవలము మనస్సు యొక్క వైఖరి కాదు గాని తన క్రియలనుండి వచ్చు మంచి ఫలముల ద్వారా వ్యక్తపరచబడును. ఆమె మంచి చేయగలిగిన వారందరికీ అన్ని విధాలుగాను అన్ని సమయములలోను మంచి చేయును.

6. స్థిరత్వము (నిలకడగా నిలిచియుండుట)

దైవ జ్ఞానము కలిగిన ఒక సహోదరుడు వంచన అంతటినుండి విడిపించబడియుండును. అతడు పూర్ణహృదయుడై, ముక్కుసూటిగా ఉండి సందేహములు గాని సంకోచము గాని లేనివాడైయుండును. అతడు ద్విమనస్కుడు కాక, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగియుండును. అతడు తన బలహీనతలవైపు చూడక దేవుని వాగ్దానముల వైపు చూచును. తెలిసిన ప్రతి పాపముపైన విజయము ఇప్పుడిక్కడ సాధ్యమేనని ఆ సహోదరునికి తెలియును. అతడు ఒక నమ్మకస్తుడైన వ్యక్తి-అన్ని సమయములలోను అతడు తన మాటను నిలబెట్టుకొనునని అతనిని నమ్మవచ్చును. అతడు స్థిరముగాను కదల్చబడనివాడుగాను ఉండును. అతడు తన ఒప్పుదలను మార్చుకొనునట్లు లేక ఏ విషయములోను రాజీపడునట్లు మీరు చేయలేరు. అతడు ఒక కఱ్ఱవలే నేరుగాను నిటారుగాను ఉండును.

7. వేషదారణ నుండి విడుదల

ఇతరులు ఆమెలో బయట చూచేదానికంటే వధువు తన అంతరంగములో ఎక్కువ ఆత్మానుసారతను కలిగియుండును. ఇతరులు ఆమె బయట జీవితమును గూర్చికలిగియున్న అభిప్రాయము కంటే ఆమె అంతరంగ జీవితము మెరుగైనదిగా ఉండును. మనుష్యుల ఘనతను పొందుటకు మాత్రమే ఆత్మానుసారతగా పిలువబడే దానిని కలిగియున్న 'వేశ్య'కు లేక 'ఆత్మీయ వ్యభిచారిణి'కి ఇది పూర్తిగా వ్యత్యాసముగానున్నది. ఆమెకున్నది నిజానికి 'మతానుసారత'యే గాని నిజమైన ఆత్మానుసారత కాదు. వధువు తన బయట మాటలు మరియు క్రియల కంటే మరియెక్కువగా తన అంతరంగ తలంపులను, ఉద్దేశాలను, వైఖరులను గమనించుకొనును. ఆమె తన బయట జీవితమును గూర్చి మనుష్యుని ఆమోదమును అసలు పట్టించుకొనక, తన అంతరంగ జీవితమును దేవుడు ఆమోదించవలెనని కోరుకొనును. ఈ పరీక్ష ద్వారా, మనలో ప్రతివారు మనము వధువుకు చెందినవారమో లేక వేశ్యకు చెందినవారమో తెలిసికొనవచ్చును.

జ్ఞానము కొరకు దేవుని వేడుకొనుడి

క్రీస్తుయొక్క వధువుహృదయములో జ్ఞానము యొక్క విత్తనము నాటబడి యుండును గనుక ఆమెలో ప్రతి సంవత్సరము ఈ ఏడు గుణలక్షణములు ఎదుగుచు నుండును. ఆమె పరిపూర్ణతకు చాలా దూరముగా ఉన్నప్పటికీ ఆమె పరిపూర్ణమగుటకు ఎదుగుచూ సాగిపోవుచున్నది. కాని ఎక్కడైతే ఈ గుణ లక్షణములు కనిపించవో ఒక వ్యక్తియైననూ 'సంఘము'గా పిలువబడెదేదైనను క్రీస్తు యొక్క వధువులో భాగమని ఎంచుకొనుట దురభిమానత. ఎక్కడైతే వివాదములు అసూయలు అపవిత్రత అవిశ్వాసము గర్వము ఉండునో అక్కడ ఉన్నది వధువు కాదు గాని నిశ్చయముగా వేశ్యయే.

దాచబడిన ధనము కొరకు మనము వెదకినట్లు దాని కొరకు మనము వెదకితేనే మనము దేవుని జ్ఞానమును పొందగలమని బైబిలు చెప్పుచున్నది (సామెతలు 2:4). పరలోక రాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నదని, దాని కనుగొనిన ఒక మనుష్యుడు దానిని పొందుటకు తనకు కలిగినదంతయు అమ్మెనని యేసు చెప్పెను (మత్తయి 13:44). సమస్తమును విడిచిపెట్టి, దేవునికంతయు అప్పగించి, పౌలు చేసినట్లు భూమి మీదనున్న సమస్తమును చెత్తగా ఎంచినవారు మాత్రమే (ఫిలిప్పీ 3:8) జ్ఞానమును పొంది ఈ ఏడు స్తంభాలను కట్టగలుగుదురు. మరియు అటువంటి వారి ద్వారా మాత్రమే యేసుక్రీస్తు యొక్క నిజమైన సంఘము కట్టబడును.

పరిజ్ఞానమును కూడబెట్టుకొనుట లేక ఒక అనర్గళముగా మాట్లాడే వక్తగా నుండుట సులభమే. కాని ఇది మిమ్మును కేవలము శాస్త్రులుగా చేయును. ప్రతి శాస్త్రి శిష్యుడిగా మారవలెనని యేసు చెప్పెను (మత్తయి 13:52). దీని కొరకు ఆ శాస్త్రి తన స్వంత ఆదాము స్వభావము మరియు తన మార్గము ఎంచుకొనే హక్కుతో పాటు సమస్తమును విడిచిపెట్టవలెను (లూకా 14:26,33). ఆవిధముగా మాత్రమే అతడు దేవుడిచ్చు ధనమును (దేవుని స్వభావమును మరియు జ్ఞానమును) పొందగలడు. అప్పుడు అతడు తన ధనము నుండి ఇతరులకు ఇవ్వగలుగును. తన తలనుండి కాక తన హృదయమునుండి ఇచ్చును. అతడు క్రొత్త వాటిని (వాక్యమునుండి క్రొత్త ప్రత్యక్షతలను, జ్ఞానమును) మరియు పాతవాటిని (నలభై సంవత్సరములు మందసములో ఉంచబడినను ఎప్పుడు కంపుకొట్టని మన్నాను పోలినట్లుండు తాజాగానుండు పాత సత్యములు) కూడా ఇతరులతో పంచుకోగలుగును (మత్తయి 13:52).

మననుండి దేవుడు ఎదురుచూచే ఈ ఉన్నతమైన పిలుపును ప్రమాణమును మనము చూచినప్పుడు అధిగమించబడినట్లు భావించవచ్చును. గనుక పరిశుద్ధాత్మ మనలను ప్రోత్సాహపరచే మాటను యాకోబు 1:5లో ఇచ్చెను. మనకు ఈ జ్ఞానము కొదువగా ఉన్న యెడల (ఇంకా ఎక్కువ జ్ఞానము అవసరంలేదని మనలో ఎవరు చెప్పగలరు), మనము దేవుని అడుగవలెనని ఆజ్ఞాపించబడితిమి. మనకు జ్ఞానము నిచ్చునది ప్రభువే (సామెతలు 2:6). కాని మనము విశ్వాసముతో అడుగవలెను. మనము విశ్వాసముతో అడిగిన యెడల, మనము ఖచ్చితముగా మన జీవితములో ఈ ఏడు స్తంభములను పొందెదము మరియు దేవునిగృహము (మందిరము) మనలోను మన ద్వారాను కట్టబడును.

వినుటకు చెవులు గలవాడు వినును గాక.

అధ్యాయము 18
దేవుని సత్యమైన కృప

''ఇదియే దేవుని సత్యమైన కృప. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి'' (1పేతురు 5:12).

ఇక్కడ పేతురు యొక్క మొదటి పత్రిక చివరిలో, అతడు ఈ పత్రికలో వ్రాసినదంతయు దేవుని సత్యమైనకృపను గూర్చియే అని అతడు చెప్పుచున్నాడు. అబద్ధ కృప ఎంతగానో ప్రకటింపబడే ఈ రోజులలో, దేవుని సత్యమైనకృప నిజముగా ఏమిటోనని చూచుటకు మరియు దానిలో నిలుకడగా ఉండుటకు పేతురుయొక్క మొదటి పత్రికకు తిరిగి వెళ్లుట మంచిది.

''దేవుని సత్యమైన కృప'' అను మాటను పేతురు మొదటి శతాబ్దములోనే వాడుట, ఆ దినాలలో కూడా ఒక నకిలీ కృప సాతాను యొక్క ప్రతినిధులచేత ప్రకటింపబడుచున్నది అనుదానిని సూచిస్తున్నది. వీరు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచిరి (పాపము చేయుటకు హక్కుగా వాడుకొనిరి) (యూదా 4). విశ్వాసులందరూ ''తండ్రియైన దేవుని భవిష్యత్‌ జ్ఞానమునుబట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసు క్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు'' అని పేతురు ఆరంభములోనే చెప్పారు మరియు అటువంటి విశ్వాసులకు ''కృపయు సమాధానమును విస్తరిల్లును గాక'' అని అతడు ప్రార్థించాడు (1పేతురు 1:2).

దేవుడు మనలను పరిశుద్ధపరచుటకును మరియు మనము ప్రభువైన యేసు క్రీస్తుకు విధేయులగుటకు నడిపించుటకును ఏర్పరచుకొనెను. దేవుని సత్యమైన కృప మనలను పరిశుద్ధతలోనికి మరియు విధేయతలోనికి నడిపించుటకు ఉద్దేశింపబడినది; కాబట్టి దీనిని వారి జీవితాలలో ఆశించినవారు దేవుని కృపను సంపూర్ణముగా అనుభవించగలుగుదురని పేతురు ప్రార్థించెను.

''మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, దానిని విచారించి పరిశోధించిరి'' అని పేతురు చెప్పెను (1పేతురు 1:10). మనము క్రొత్త నిబంధనలో అనుభవించే కృపను పాత నిబంధనలో ఎవరు అనుభవించలేకపోయిరి. ప్రవక్తలు కూడా ఈ కృప, భవిష్యత్తులో వచ్చునని మాత్రమే ప్రవచింపగలిగిరి. వారు దానిని అనుభవించలేకపోయిరి. తరువాత పేతురు విశ్వాసులందరిని ''యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండమని'' వారిని బ్రతిమాలుకొనెను (1పేతురు 1:13). క్రీస్తు మహిమలో తిరిగివచ్చినప్పుడు, మనలను ఆయన స్వారూప్యములోనికి పూర్తిగా మార్చివేయు ప్రత్యేకమైన కృపను మనము అనుభవించెదము. మన క్రైస్తవజీవితము యొక్క ఆరంభమునుండి చిట్టచివరి వరకు, మనలో దేవుని కార్యము పూర్తిగా కృపకు సంబంధించినదే.

ఒక సంతోషకరమైన వైవాహిక జీవితము కొరకు కృపను పొందుటను గూర్చికూడా పేతురు మాట్లాడుచున్నాడు. ''అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించుడి'' (1పేతురు 3:7). క్రైస్తవ దంపతులు కలిసి సమాధానముతోను సమన్వయముగాను ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ఘర్షణలతో విభజింపబడిన లోకములో వారి గృహము శాంతి యొక్క ద్వీపముగా నుండవలెను. దీనికి కృప సమృద్ధిగా కావలెను. పేతురు కృపా వరాలను గూర్చి మాట్లాడెను: ''దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహనిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి'' (1పేతురు 4:10). ప్రతి కృపావరము, ఇతరులకు దేవుని సత్యమైన కృపను పంచి ఇచ్చుటకు సాధానోపాయముగా, ఇతరులను సేవించుటకే వాడబడవలెను. దేవుని కృప నానావిధమైనది. అందుచేత దేవుడు వేర్వేరు నేపధ్యాలనుండి, వేర్వేరు వ్యక్తిత్వాలు మరియు స్వభావాలు గల వారిని ఏర్పరచుకొని వారినందరినీ క్రీస్తు శరీరములో ఉంచెను. ఈ విధముగా వారిలో ప్రతి ఒక్కరు తమ జీవితము ద్వారా లేక పరిచర్య ద్వారా దేవుని కృపయొక్క ప్రత్యేకమైన కోణమును ప్రదర్శించగలరు.

దీనులు కృపను ప్రత్యక్షతను పొందుదురు

''చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును'' (1పేతురు5:5).

మన యౌవనకాలమందే ఆత్మీయ అధికారమునకు లోబడుటను నేర్చుకొనుట యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఇక్కడ పేతురు మాట్లాడుచున్నాడు. ఒక యువకుడు 20ఏళ్ల వయస్సులో రక్షింపబడితే, అతడు 35 ఏళ్ల వయస్సుకు వచ్చేసరికి అతనికి ఒక ప్రభావవంతమైన పరిచర్య ఉండాలన్నిది సాధారణముగా దేవుని ఉద్దేశ్యమైయున్నది. కాని ఇది నెరవేరుటకు, ఆ వ్యక్తికి 35 ఏళ్లు వచ్చేసరికి దీనత్వము మరియు విరిగి నలిగిన మనస్తత్వమునకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన పాఠాలను నేర్చుకొనవలెను. అతడు ఆత్మీయ అధికారమునకు లోబడుట ద్వారానే ఆ పాఠాలను నేర్చుకోగలడు. ఆ విధముగా మాత్రమే అతడు తరువాత తన గృహములోను మరియు సంఘములోను ఆత్మీయ అధికారము అమలుపరచగలడు. ఆత్మీయ అధికారమునకు లోబడనివారు, దేవుడు వారి కొరకు కలిగియున్న పరిచర్యను చివరకు కోల్పోవుదురు.

దీని అర్థము మనము వయస్సులో పెద్దవారము అయిన తరువాత మనలను మనము తగ్గించుకోనక్కరలేదని కాదు. మనము యౌవనులుగా ఉన్నప్పుడు పెద్దలకు విధేయతను చూపుటను మనము నేర్చుకోవలెను. కాని దీనత్వమనే మార్గములో యేసును వెంబడించుట అనేది మనము చనిపోయే దినము వరకు చేయవలసినదే. మన జీవితాల అంతము వరకు కృపను పొందుటకు అది ఒక్కటే మార్గము. బైబిలు జ్ఞానము మనకు కృపను ఇవ్వలేదు. మన ప్రభువు, నిజమైన దేవుని ఎరుగని అన్యులైన రోమీయుల చేత లేక గ్రీసు దేశస్తుల చేత కాక బైబిలును నమ్మే యూదామత మూఢభక్తులచేత సిలువవేయబడెననునది ఆశ్చర్యకరమైన వాస్తవమైయున్నది.

యేసుయొక్క దినాలలో భూమిమీద ఒకే ఒక్క నిజమైన మతము (యూదా మతము) యొక్క నాయకులు మరియు నిజమైన లేఖనముల (ఆదికాండము నుండి మలాకీ వరకు) యొక్క పండితులు యేసును మోసగాడని, మత భ్రష్టుడని, దురాత్మలకు అధిపతియని పిలిచిరి. ఆ శాస్త్రులు మరియు పరిసయ్యులు తెలివైన, బైబిలును నమ్మిన, బాగా చదువుకున్న, లేఖనముల యొక్క సత్యము కొరకు తీవ్రత కలిగిన వారు. కాని ఆత్మానుసారముగా వారు పూర్తిగా గ్రుడ్డివారై యుండిరి. వారు కృపను పొందలేదు. ఎందుచేత? ఆ ప్రశ్నకు సమాధానము ముఖ్యమైనది, ఎందుకనగా క్రైస్తవ లోకములో చరిత్ర మరల మరల పునరావృతమాయెను. ఈనాడు కూడా ఆసక్తి కలిగిన బైబిలు పండితులు లేఖనముల యొక్క నిజమైన యేసునకు మరియు దేవుని సత్యమైన కృపకు పూర్తిగా గ్రుడ్డివారుగా ఉన్నారు. అప్పటి పరిసయ్యుల వలే, వీరు కూడా దేవుని యొక్క మరుగైయున్న జ్ఞానమును పొందలేకపోవుచున్నారు (1కొరింథీ 2:7-10). రెండు సందర్భాలలోను కారణము ఒకటే: వారు గర్విష్టులు మరియు మనుష్యుల ఘనతను కోరుకొందురు.

''అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు?'' అని యేసు పరిసయ్యులకు చెప్పెను (యోహాను 5:44). మనుష్యుల యెదుట జీవించుచు, తమ స్వంత ఘనతను వెదకు వారు లేఖనముల యొక్క నిజమైన తాత్పర్యము మీద ఎప్పటికీ ప్రత్యక్షతను పొందలేరు, ఎందుకనగా దేవుడు వారిని సత్యమునకు గ్రుడ్డివారిగా చేయును (మత్తయి 11:25). వారు తమ్మును తాము తగ్గించుకొననియెడల, జ్ఞానులు మరియు వివేకులు వాటిని అర్థము చేసికోలేని విధముగా దేవుడు లేఖనములను వ్రాసెను. ఇది ఏ భూసంధమైన గ్రంధము విషయములో నిజము కాదు. బైబిలు అర్థము చేసుకొనుటకు తప్ప దీనత్వమును ఒక ముఖ్యమైన అర్హతగా అవసరమైన గ్రంధము మరేదియు లోకములోలేదు. సహజమైన మనస్సు (అది ఎంత తెలివికలిగినను) ఒక దీనుడైన సహోదరుని నుండి వచ్చు ఆత్మ యొక్క ప్రత్యక్షతను వెఱ్ఱితనముగా ఎంచును (1కొరింథీ 2:14). దేవుని వాక్యమును అర్థము చేసుకొనుటకు ఒకరికి కృప అవసరము. గర్విష్టులైన వేదాంతులు ఈ రోజున లేఖనముల యొక్క అనేకమైన వ్యత్యాసము గల తాత్పర్యములను ప్రకటింతురు గాని వారి గ్రుడ్డితనమును గూర్చి వారికి ఏమాత్రము అవగాహన లేకుండును.

దేవుని యెదుట మనలను మనము తగ్గించుకొని మరియు మనుష్యుల నుండి ఘనతను, ఆమోదమును కోరుకొనుట మానివేయవలెను. అప్పుడు ఇతరుల నుండి ఆయన దాచిన దానిని దేవుడు మనకు బయలుపరచును.

దేవుడు గర్విష్టులను ఎదిరించి, దీనులకు తన కృపనిచ్చును. మనము గర్విష్టులమైతే, మన సిద్ధాంతములన్నియు సరిగా ఉన్నను మనము చివరకు పరిసయ్యులవలే ఆత్మీయ వాస్తవాలకు గ్రుడ్డివారమై మోసపరచబడుదుము. అప్పుడు తమ కాలములో నిజమైన ప్రవక్తయైన యేసును పరిసయ్యులు గుర్తుపట్టలేనట్లే మనముకూడా మన కాలములో ఉన్న దేవుని యొక్క నిజమైన ప్రవక్తలను గుర్తించలేము.

పాపమంతటికి మూలము గర్వము మరియు స్వార్థము. అదేవిధముగా క్రీస్తు యొక్క సద్గుణాలన్నిటికి మూలము దీనత్వము మరియు నిస్వార్థము. మనలను మనము ఎంత తగ్గించుకొనెదమో, దేవుని నుండి అంత కృపను పొందెదము. అప్పుడు మనము జయజీవితము జీవించి మన జీవితాలలో క్రీస్తుయొక్క స్వభావమును ఇంకా ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష పరచుదుము. ఎవరికైనా పాపము మీద జయము లేనియెడల, అతడు తన్నుతాను తగ్గించుకోలేదని అది స్పష్టముగా సూచించుచున్నది-ఎందుకనగా తమ్మును తాము తగ్గించుకొన్న వారందరు నిశ్చయముగా కృపనొందెదరు (1పేతురు 5:6). మరియు దేవుని కృపలో ఉన్నవారందరు నిశ్చయముగా జయము పొందెదరు (రోమా 6:14).

క్రైస్తవ లోకములో దీనత్వమును గూర్చి ఎన్నో తప్పుడు ఆలోచనలున్నవి. కాని పొరబడకుండా మనలను మనము విశ్లేషించుకొనుటకు ఉన్న పరీక్ష ఇదియే: మనకు పాపము మీద జయమున్నదా మరియు క్రీస్తు యొక్క స్వభావము మనలో అత్యధికముగా ప్రత్యక్షమగుచున్నదా?

శ్రమల ద్వారా సంపూర్ణత

''తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును'' (1పేతురు 5:10). ఇక్కడ దేవుడు సర్వకృపానిధియగు దేవుడని పిలువబడెను. ఆయన తన ప్రజలకు కృపను ఇచ్చుటకును, ''వారిని పూర్ణులుగా చేసి స్థిరపరచుటకును'' వారిని శ్రమల ద్వారా నడిపించును. పౌలు తన శరీరములో ఒక ముల్లును పొందుట ద్వారా దేవుని యొక్క కృపను తగినంతగా అనుభవించెను (2కొరింథీ 12:7-10).

శ్రమల ద్వారా తన కృపను మనకు ఎలా పంచి ఇచ్చునో అను విషయమును గూర్చి పేతురు యొక్క మొదటి పత్రిక మనకు ఎంతో చెప్పును. ''క్రీస్తుకూడా మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను....క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు పాపముతో జోలి యిక నేమియు లేకయుండును'' (1పేతురు 2:21,22; 4:1). మనము కూడా ఏ సమయమందైన పాపము చేయకుండునట్లు బాధనొందిన క్రీస్తుయొక్క మాదిరిని మనము అనుసరించవలెనని మనకు స్పష్టముగా చెప్పబడినది.

మనలను పరిశుద్ధులుగా చేయుటయే కృప యొక్క ఉద్దేశ్యము, 'ఎందుకనగా మనలను పిలిచినవాడు పరిశుద్ధుడు'' (1పేతురు 1:16). ''మనము శరీర విషయములో శ్రమపడిన యెడల శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు మనము పాపముతో జోలి యిక లేకుందుము'' అని పేతురు మనకు గుర్తు చేయుచున్నాడు (1పేతురు 4:1,2).

''శరీర విషయములో శ్రమపడుట'' అంటే శరీరములో వ్యాధిగ్రస్తుడగుట కాదు, ఎందుకనగా తద్వారా ఎవరూ పాపము చేయుట మానివేయలేదు. దాని అర్థము క్రీస్తు నిమిత్తము కొట్టబడుట లేక గాయపడుట కాదు, ఎందుకనగా ఆ విధముగా కూడా ఎవరు పాపము చేయుట మానివేయలేదు. ఇది దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన శరీరాశలను ఉపేక్షించుటను సూచిస్తున్నది. పాపము కొంత ఆనందమును తెచ్చును. శ్రమపడుట అంటే ఆ ఆనందము అనుభవించుటకు వ్యతిరేకమైనది. మనము ప్రతి పరిస్థితిలోను శ్రమపడుటకు ఇష్టపడినయెడల, మనము పాపము చేయుట మానివేయుదము. మనము ఇష్టపడితే దేవుడు మనకు సహాయము చేయును. నిజానికి, మనము ఇష్టపడుటకు కూడా ఆయన కార్యము చేయును (ఫిలిప్పీ 2:12,13). కాని చాలా తరచుగా మనము ఆయన కార్యమును వ్యతిరేకించుదుము. అందుచేత మనము ఓడిపోయిన వారిగా ఉందుము.

క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మనమును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనవలెను. తన జీవితమంతా యేసు తన్నుతాను ఉపేక్షించుకొనే మార్గములో నడిచెను. ఆయన సశరీరుడై భూమి మీదకు వచ్చి, ఎంత శ్రమ పడవలసి వచ్చినప్పటికీ తన స్వంత చిత్తమును కాక ఎల్లప్పుడు తన తండ్రి చిత్తమును చేసెను (యోహాను 6:38). అందుచేత ఆయన ఎప్పుడు పాపము చేయలేదు. ''పాపము చేయని వాని అడుగుజాడలను'' వెంబడించుటకు ఇప్పుడు మనకు కూడా అవకాశమున్నది (1పేతురు 2:21,22). ఇదే దేవుని కృపను గూర్చిన సువార్త (శుభవార్త).

తన రెండవ పత్రికలో దేవుడు తన దైవ శక్తి ద్వారా ''భక్తికి కావలసినవాటినన్నిటిని'' మనకు ఈ భూమిపైన దయచేసి యున్నాడని పేతురు మనకు గుర్తుచేసాడు (2పేతురు 1:3). పేతురు పొందినటువంటి అమూల్యమైన విశ్వాసమునే మనము పొందియున్నయెడల (2పేతురు 1:1), మనము అతడు పొందిన కృపనే పొంది అతని వలే దేవస్వభావములో పాలివారమగుదుము. అప్పుడు క్రీస్తుయొక్క స్వభావము-''సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ మనకు కలిగి విస్తరించును'' (2పేతురు 1:5-11). ఇవి మనలను ఫలించువారిగా చేసి గ్రుడ్డితనము నుండి, దూరదృష్టిలేనితనము నుండి మనలను విడుదల చేయును (8,9 వచనాలు). యేసులో నిలిచియుండు ప్రతివాడు బహుగా ఫలించును (యోహాను 15:5). కాబట్టి క్రీస్తుయొక్క ఈ సద్గుణములు మనలో విస్తరించని యెడల, అది మనము యేసులో నిలిచియుండలేదని మరియు దేవుని సత్యమైన కృపక్రింద మనము జీవించుటలేదని సూచించుచున్నది.

కృప మనలను ఐక్యపరచును

తమ్మును తాము తగ్గించుకొనువారు జయము కొరకు కృపను పొందుటయే గాక ఒకరితో ఒకరు ఏకమగుటకు కూడా కృపనొందెదరు. భార్య భర్తలిద్దరు ''జీవమను కృపావరములో పాలివారగుటకు'' కృపను పొందగలరని మనము ఇంతకు ముందు చూచినట్లే, విశ్వాసులు కూడా క్రీస్తు శరీరములో ఉన్న ఇతర విశ్వాసులతో కలిసి పాలివారగుటకు కృపను పొందగలరు.

తన భూలోక జీవితము యొక్క చివరి రాత్రియందు యేసు మరియు ఆయన తండ్రి ఏకమైయున్న లాగున మనము కూడా ఏకమై యుండవలెనని యేసు ప్రార్థించెను (యోహాను 17:22). ఆ ఐక్యతను మనము ఈ లోకములో అనుభవించవలెనని ఆయన ప్రార్థించెను (యోహాను 17:21,23). ఇది జ్ఞానములో ఐక్యత కాదు గాని ఆత్మలో ఐక్యత. మన పాప స్వభావము వలన మరియు పాపము చేత చెరుపబడిన మన మనస్సుల యొక్క పరిమితుల వలన, మనము భూమి మీద అన్ని విషయాలలోను ఒకరితో ఒకరు అంగీకరించలేకపోవచ్చు కాని ఆత్మీయ ఐక్యతతో దీనికి సంబంధము లేదు. మన హృదయాలలో మనము ఏకముగా ఉండవచ్చును. ఐక్యత లేకపోవుటకు కారణము మనము శిరస్సు యొక్క చిత్తమును కాక మన స్వంత చిత్తమును మనము చేయగోరుటయే. ఇది మనము సిద్ధాంతములను అర్థము చేసుకొనుటకు సంబంధించిన విషయము కాదు. ఇది మన స్వంత చిత్తమును ఉపేక్షించుకొని మరియు తండ్రి చిత్తమును మాత్రమే చేయుటకు సిద్ధపడియున్నామా అను దానికి సంబంధించిన విషయము.

తన తండ్రి యొద్ద నుండి వినిన వాటినన్నిటిని యేసు ఎల్లప్పుడు గైకొనెను. తండ్రి చిత్తమునకు విధేయతయే ఆయన ఆహారమై యుండెను (యోహాను 4:34). యేసు తండ్రితో ఏకమై యుండెను. దేవుని యొక్క సత్యమైన కృప ద్వారా మనము కూడా ఈ ఐక్యతలోనికే పిలువబడితిమి. ప్రభువైనయేసు కీడును ఎల్లప్పుడు మేలుతో జయించెను. ఆయన మేలు చేయుటలో వేరుపారియుండినందున ఆయనపై కీడుకు ఎటువంటి శక్తిలేకుండెను. మనము కూడా ''మేలు చేత కీడును జయించుము'' అను మాటను గైకొనిన యెడల మన విషయములో కూడా ఆవిధముగానే ఉండును. ఇతరులు మనలను ద్వేషించి దూషించినప్పుడు వారికి మేలు చేయుట ద్వారా మనము వారి కీడును జయించగలము. మనము దేవుని సత్యమైన కృపను పొందినప్పుడు ఇది సాధ్యమగును. అప్పుడు మనము యేసు ప్రార్థించిన విధముగా లోకములో ఉన్న కీడునుండి కాపాడబడుదుము (యోహాను 17:16). మరియు అదే మార్గములో నడుచు వారందరితోను మనము ఏకమగుదుము.

యేసు కట్టుచున్న సంఘము కృపను పొందిన సంఘము. అది శిరస్సైన క్రీస్తు క్రింద ఐక్యతతో కట్టబడుటకు దేవుని సత్యమైన కృపను పొందియున్నది. అటువంటి సంఘము మాత్రమే పాతాళలోకపు ద్వారములపైన విజయము సాధించును (మత్తయి 16:18).

అధ్యాయము 19
భాషలలో మాట్లాడుటను గూర్చిన సత్యము

''సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్దనుండి వచ్చును, ఆయనయందు ఏ చంచలత్వమైనను (మార్పయినను) లేదు'' (యాకోబు 1:17). దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎన్నడు మారనివాడు మరియు ఆయన సంపూర్ణమైన వరములనే ఇచ్చును. కాబట్టి పెంతెకొస్తు దినమున సంఘమునకు ఆయన ''అన్యభాషలలో మాట్లాడు వరమును'' ఇచ్చినప్పుడు, ఆయన ఏమి చేయుచుండెనో ఆయన ఖచ్చితముగా ఎరిగియుండెను. ''భాషల'' వరము సంపూర్ణమైన వరము. దేవుడు మారనివాడు గనుక ఆయన ఈ వరమును గూర్చి తన మనస్సును మార్చుకోలేదు. 20వ శతాబ్దములో ఈ వరము గూర్చి వివాదము ఉండునని దేవుడు ఎరిగియుండెను. అయినా కూడా తన పరిచర్యను నెరవేర్చుటకు సంఘమునకు ఈ వరము అవసరమని ఆయన భావించెను.

త్రిత్వము, క్రీస్తు యొక్క దేవత్వము, క్రీస్తు యొక్క మానవత్వము మరియు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వము వంటి ప్రధానమైన సత్యాలు కూడా క్రైస్తవ చరిత్రలో వ్యతిరేకించబడి వివాదాస్పదమైనవిగా యుండినవి. కాబట్టి భాషల వరము కూడా వివాదాస్పదముగా నుండుట మనలను ఆశ్చర్యపరచకూడదు. సిద్ధాంతపరమైన విషయాలన్నిటిలోను లేఖనములు చెప్పినదానికే కట్టుబడియుండుట ఎల్లప్పుడు శ్రేష్టమైనది. అయితే మనము పక్షపాతము లేని మనస్సుతో ''భాషలలో మాట్లాడుట''ను గూర్చి బైబిలులోనున్న ప్రతి వచనమును పరిశీలించెదము.

1వ సత్యము

మార్కు 16:17: ''నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలలో మాటలాడుదురు,...రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు'' అని యేసు చెప్పెను.

''నమ్మినవారివలన'' కనబడు కొన్ని సూచక క్రియలు భాషలలో మాట్లాడుట, దయ్యములను వెళ్లగొట్టుట మరియు రోగులను స్వస్థపరచుట అని ప్రభువైనయేసు చెప్పెను. ఈ సూచక క్రియలన్నియు ప్రతి విశ్వాసి వలన కలుగునని ఆయన చెప్పలేదు. కాని ''నమ్మిన వారి'' గుంపులో ఈ సూచక క్రియలు కనబడునని ఆయన చెప్పెను. కాబట్టి ప్రతివిశ్వాసి ఈ వరములన్నిటిని కలిగియుండనక్కరలేదు. అలాగే ప్రతి సంఘము ఈ వరములన్నిటిని కలిగియుండనక్కరలేదు. కాని ఇవి ప్రపంచ వ్యాప్తముగా ఉన్న సంఘములో కనబడును. ఎవరికి ఈ వరములను ఇవ్వాలన్న విషయాన్ని పరిశుద్ధాత్మ సార్వభౌముడుగా నిర్ణయించును.

2వ సత్యము

అపొ.కా. 2:4,7,11: ''అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మవారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి....అంతట ప్రతి జనము నుండి వచ్చిన యూదులందరు విభ్రాంతి నొంది....వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి''

విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడిన మొదటిసారి, వారందరు భాషలలో మాట్లాడిరి. ఈ ''భాషలు'' ఇతరులు వెంటనే అర్థము చేసుకొన్న భాషలు. కాబట్టి భాషలకు అర్థము చెప్పువరము యొక్క అవసరత లేకుండెను.

ఆ వ్యక్తులు వారికి వారే భాషలలో మాట్లాడుట మొదలుపెట్టిరని, పరిశుద్ధాత్మ కాదని, 4వ వచనములో గమనించండి. ఆత్మ వారి నాలుకలను కదుపలేదు. ఆత్మ వారికి కేవలము వాక్‌ శక్తినిచ్చెను, వారికి వారే మాట్లాడిరి.

ఏ వరములో కూడా పరిశుద్ధాత్మ మననుండి ఎంచుకొనే స్వేచ్ఛను తీసివేయడు. నిజానికి ఆత్మ యొక్క ఫలము ''ఆశా నిగ్రహము'' (గలతీ 5:22). దయ్యము పట్టిన వారే తమ నిగ్రహమును కోల్పోవుదురు. ఆత్మచేత నింపబడిన వానికి ఇతరుల కంటే తనపై తనకు ఎక్కువ నిగ్రహముండును. ''ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి'' (1కొరింథీ 14:32).

3వ సత్యము

అపొ.కా. 10:46 ''వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి''.

ఇక్కడ కొర్నేలి ఇంటిలో, అతని ఇంటిలోనున్న వారందరును క్రీస్తును నమ్మిన క్షణములోనే పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందిరి. వారు భాషలలో మాట్లాడుచు దేవుని ఘనపరచిరి (స్తుతించిరి)- పెంతెకొస్తు దినమువలే వారు ప్రజలతో మాట్లాడలేదు.

4వ సత్యము

అపొ.కా. 19:6 ''పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్దాత్మ వారిమీదికి వచ్చెను-అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి''.

పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ ఎఫెసులో నున్న విశ్వాసుల మీదకు వచ్చెను. ఇక్కడ ''భాషలు'' ప్రవచనముగా ఉన్నట్లు అనిపించుచున్నది. ''అపొస్తలుల కార్యముల''లో నున్న పై సంధర్భాల నుండి ఈ క్రింది సత్యాలను గమనించండి:

1. అపొ.కా. 2లో వారు నీటి బాప్తీస్మము తీసుకొన్న తరువాత ఆత్మను పొందిరి.

2. అపొ.కా. 2 మరియు 10 అధ్యాయాలలో, వారి మీద ఎవరూ చేతులుంచకుండానే వారు ఆత్మను పొందిరి. అపొ.కా. 19వ అధ్యాయములో వారి మీద పౌలు చేతులుంచిన తరువాత వారు ఆత్మను పొందిరి. (ఆత్మను పొందుటకు ఎటువంటి ప్రామాణిక క్రమము లేదని ఇది నిరూపించుచున్నది. అది నీటి బాప్తీస్మము ముందైనా కావచ్చును లేక తరువాతైనా కావచ్చును లేక చేతులుంచుట ద్వారా కావచ్చును అలా కాకుండా కావచ్చును).

3. అపొ.కా. 8:14-18, సమరయలో నున్న శిష్యులు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, వారు భాషలలో మాట్లాడినట్లు పేర్కొనబడలేదు. కాని పేతురుకున్న సామర్థ్యమును కోరుకొనునట్లు

చేసే ఒక ఆధారమును (అదేమిటో మనకు చెప్పబడలేదు) సీమోనును మాంత్రికుడు చూచెను.

5వ సత్యము

1కొరింథీ 12:7,8,10: ''అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఒకనికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును....మరియొకనికి నానావిధములైన భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి''.

భాషల వరము ''అందరి ప్రయోజనము'' కొరకు ఇవ్వబడినది, అనగా సంఘము యొక్క మంచి కొరకు. ఇది పెంతెకొస్తు దినము దాటిన 25 సంవత్సరాల తరువాత వ్రాయబడినది. ''అందరి ప్రయోజనము'' కొరకు ఆత్మ అప్పటికి కూడా భాషల వరమును ఇచ్చుచుండెను.

6వ సత్యము

1కొరింథీ 12:11: ''అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు''.

పరిశుద్ధాత్మ (భాషల వరముతో సహా) ఎవరికి ఏ వరమును యివ్వవలెనో సార్వభౌమునిగా నిర్ణయించునని బోధించే స్పష్టమైన వచనము బహుశా ఇదేనేమో. ఆయన ఎవరికి ఏ వరము ఇవ్వవలెనో మనమాయనకు చెప్పలేము.

7వ సత్యము

1కొరింథీ 12:27 ''దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను ....కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను''.

సంఘములో భాషల యొక్క వరమును ఒక ఉద్దేశ్యముతో నియమించినది దేవుడే. కాబట్టి మనము ఈ వరమును ఎప్పుడు వ్యతిరేకించకూడదు లేనియెడల మనము దేవుని వ్యతిరేకించువారిగా నుందుము. మనకంటే ఆయనకు ఎక్కువ జ్ఞానమున్నదని గుర్తించుకొనుడి.

8వ సత్యము

1కొరింథీ 12:30 ''అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?''.

విశ్వాసులందరికీ స్వస్థపరచు కృపావరములు లేనట్లే, విశ్వాసులందరు భాషలలో మాట్లాడరు. కాబట్టి పరిశుద్ధముగా నుండుటకు లేక ఆయన పరిచర్యలో ప్రభావమంతముగా నుండుటకు ''భాషలు'' విశ్వాసులందరికీ అవసరమైన వరమని దేవుడు భావించడని స్పష్టమగుచున్నది. అలాయైన యెడల, ఆయన ఈ వరమును అందరికి ఇచ్చియుండేవాడు.

9వ సత్యము

1కొరింథీ 13:1 ''మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును''.

ప్రేమ లేకుండా భాషలతో మాట్లాడుట నిష్‌ప్రయోజనమైనది. భాషలతో మాట్లాడుటను బట్టి అతిశయపడుటకు, భాషలతో మాట్లాడని వారిని చిన్న చూపు చూచుటకు గల కారణము ప్రేమ లేకుండుటయే. మనకు మ్రోగెడు కంచు ఎంత వికర్షణమైనదో ప్రేమలేకుండా భాషలతో మాట్లాడు విశ్వాసులు దేవునికి అంత వికర్షణమైన వారు.

10వ సత్యము

1కొరింథీ 13:8-10 ''ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును''.

క్రీస్తు యొక్క రాకడ యందు పరిపూర్ణత వచ్చునప్పుడు, భాషలలో మాట్లాడే అవసరత ఇక లేకుండును. పరలోకములో ''భాషల'' అవసరత ఉండదు. అలాగే బైబిలు జ్ఞానమునకు ప్రవచనమునకు ఇక అవసరత ఉండదు. కాబట్టి ''భాషలు'' ఈ భూమి మీద ప్రబలిన పరిపూర్ణముకాని పరిస్థితులలో అవసరమైన తాత్కాలికమైన వరము మాత్రమే. యేసుకు భాషల వరము ఎందుకు అవసరతలేదో ఇది వివరించుచున్నది. ఆయన మనస్సు పరిపూర్ణముగా పవిత్రముగా నుండుట మరియు ఆయన అన్ని సమయాలలోను తన తండ్రితో పరిపూర్ణమైన సహవాసము కలిగియుండుటయే దానికి కారణము.

11వ సత్యము

1కొరింథీ 14:2 ''భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు''.

ఇక్కడ పేర్కొనబడిన భాషల వరము పెంతెకొస్తు దినమున ప్రత్యక్షపరచబడిన దానికి నిశ్చయముగా వేరైనది ఎందుకనగా ఈ వరము ''మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుటకు ఇవ్వబడెను'' మరియు మాట్లాడువాడు చెప్పుచున్నది మనుష్యుడెవడును గ్రహింపలేడు.

12వ సత్యము

1కొరింథీ 14:4 ''భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును''.

భాషల వరము ఒక విశ్వాసి తన్నుతాను ఆత్మీయముగా కట్టుకొనుటకు సహాయపడును.

13వ సత్యము

1కొరింథీ 14:5 ''మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటే ప్రవచించు వాడే శ్రేష్టుడు. సహోదరులారా, అలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెననియైనను, జ్ఞానోపదేశము చేయవలెననియైనను, ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడలేకపోయినయెడల, నా వలన మీకు ప్రయోజనమేమి?''.

అందరు భాషలతో మాట్లాడవలెనని పౌలు కోరుకొనెను. ఇది విశ్వాసులందరు భాషలతో మాట్లాడరని స్పష్టముగా సూచించే మరియొక వచనము. తనవలె అందరు ఒంటరిగా (పెళ్లికాకుండా) ఉండవలెనని పౌలు యొక్క కోరిక వలెనే (దీనిని ఇదే పత్రికలో అతడు పేర్కొనెను-1కొరింథీ 7:7) ఇది కూడా ఉన్నది. ఒంటరిగా ఉండుటలో పౌలు కొన్ని ప్రయోజనాలను చూచెను. ఒంటరిగా ఉండగలిగే వరమును కొంతమంది విశ్వాసులకు మాత్రమే ఇచ్చుటకు దేవుడు సార్వభౌముడైనట్లే ''భాషల వరము'' ను కూడా కొంతమంది విశ్వాసులకు ఇచ్చుటకు దేవుడు అంతే సార్వభౌముడని పౌలు గుర్తించెను.

కాబట్టి విశ్వాసులందరు ఒంటరిగా ఉండాలని ఆశించుట అవివేకమైనట్లే, విశ్వాసులందరు భాషలతో మాట్లాడాలని ఆశించుట అంతే అవివేకమైనది. ఒక సంఘకూడికలో ప్రవచించుట (క్షేమాభివృద్దియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు దేవుని వాక్యమును ప్రకటించుట-1కొరింథీ 14:3) ఎంతో మెరుగైనది. అయితే ఒక భాషకు అర్థము చెప్పబడిన యెడల అది ప్రవచనముతో సమానమైయున్నది.

14వ సత్యము

1కొరింథీ 14:9,13 ''మీరు స్పష్టమైన (అర్థమయ్యే) మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తి కలుగుటకై ప్రార్థనచేయవలెను''.

ఒక సంఘ కూడికలో వాడబడినప్పుడు ''భాషలకు'' అర్థము చెప్పబడవలెను.

15వ సత్యము

1కొరింథీ 14:14 ''నేను భాషతో ప్రార్థన చేసినయెడల నాఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థనచేతును, మనస్సుతోను ప్రార్ధన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును''.

భాషతో ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి ఏమి ప్రార్థనచేయుచున్నాడో ఆ వ్యక్తి గ్రహించలేడు. కాని పౌలు తన మనస్సుతో చేసినంతగానే (తెలిసిన భాషతో) ''తన ఆత్మతో'' (భాషలతో) ప్రార్థించవలెననియు, పాడవలెననియు భావించెను.

16వ సత్యము

1కొరింథీ 14:18 ''నేను మీయందరికంటే ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను''.

ఈ వరమును బట్టి పౌలు దేవునికి కృతజ్ఞుడై యుండెను గనుక ఇది అతనికి సహాపడియుండును.

17వ సత్యము

1కొరింథీ 14:19 ''సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటే, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు''.

సంఘములో తెలిసిన భాషలో మాట్లాడుట ఎల్లప్పుడు శ్రేష్టమైన విషయము.

18వ సత్యము

1కొరింథీ 14:22 ''కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి''.

పెంతెకొస్తు దినము నాడు ఉన్నట్లే, భాషలు అవిశ్వాసులకు సూచకమైయున్నవి.

19వ సత్యము

1కొరింథీ 14:23 ''సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను, అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాటలాడుచున్నారని అనుకొందురు కదా?''.

ఒక సంఘకూడికలో అందరు భాషలలో మాటలాడుట వెఱ్ఱితనము, ఎందుకనగా ఎవరు ఏమి మాటలాడుచున్నారో ఎవరూ గ్రహించలేరు (ఇది అందరు కలిసి ప్రార్థన చేయుటను కాక జనులు వ్యక్తిగతముగా భాషలతో మాటలాడుటను సూచిస్తున్నది, ఎందుకనగా అందరు కలిసి ప్రార్థన చేసినప్పుడు, తెలిసిన భాషలో ప్రార్థన చేయువారి ప్రార్థనలను కూడా మనము వినము).

20వ సత్యము

1కొరింథీ 14:26,27 ''సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలుపరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు; సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి. భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులు చొప్పున మాటలాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను''.

ఒక సంఘ కూడికలో ఇద్దరు ముగ్గురిని మించి భాషలలో మాటలాడకూడదు, కాని ప్రతి ''భాష''కు అర్థము చెప్పబడవలెను. ''అర్థము చెప్పుట'' అంటే అనువదించుట కాదు. అనువదించుట అంటే ''మాటకు మాట''. అర్థము చెప్పుట అంటే ''భావమును ఒకరి స్వంత మాటలతో చెప్పుట''.

21వ సత్యము

1కొరింథీ 14:39 ''కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి''.

అయితే ఇదే ముగింపు. భాషల వరము ఉపయోగించుటను ఆటంకపరచకుడి. కాని మీరు ఒక వరమును కోరుకొనుచుంటే భాషల వరము కంటే ఎక్కువగా ప్రవచన వరమును కోరుకొనుడి.

నిజమైనది మరియు నకిలీయైనది

భాషలవరమును పొందినవారందరు, వారు యధార్థులైతే, ఈ వరము గూర్చి కొంత మర్మమున్నదని ఒప్పుకొనెదరు. మనకు దాని గురించి అంతా తెలియదు. కొంతమట్టుకే ఎరిగియున్నాము (1కొరింథీ 13:12). గత 24 సంవత్సరాలుగా భాషలతో మాటలాడిన వానిగా, నా స్వంత అనుభవమునుండి, ఈ వరమును గూర్చి నేను ప్రస్తుతము గ్రహించిన దానికి సంబంధించి కొన్ని మాటలను చెప్పెదను. ఒక వ్యక్తి భాషలతో మాటలాడినప్పుడు, అతని ఆత్మ (హృదయము) మాటలను మాటలాడును (తన మనస్సును దాటవేసి, హృదయము నుండి నేరుగా నోటికి మాటలు వచ్చును), ఆ విధముగా అతడు తన హృదయములో నున్నదానిని దేవుని ముందు కుమ్మరించును-అది ఉప్పొంగిన ఆనందము కావచ్చును లేక దు:ఖము వలనో లేక నిరుత్సాహము వలనో కలిగిన భారము కావచ్చును. ఆ విధముగా తన హృదయము మీద నున్న ఒత్తిడి తగ్గించబడును. ఆ విధముగా అతడు క్షేమాభివృద్ధి పొందును.

మనము ఇంతకుముందు అపొ.కా.2:4లో చూచినట్లు, ఎవడైనను భాషలతో మాటలాడినప్పుడు, మాట్లాడునది పరిశుద్ధాత్మ కాదు, ఆ వ్యక్తియే. తనకు తెలిసిన భాషను మాటలాడుచున్నప్పుడు చేసినట్లే ఆ విశ్వాసి ఆ పదాలను ఉచ్ఛరించును. ఒకే ఒక్కతేడా ఏమిటంటే ఇప్పుడు అతడు ప్రార్థించుటకు తెలిసిన భాషను వాడడు కాని, ప్రభువు పైన తన దృష్టిని కేంద్రీకరించుచు, తన హృదయమునుండి వచ్చు పదాలను, తన మనస్సుతో కాక తన నోటితో మాటలాడును-తాను చెప్పుచున్నది తాను గ్రహించలేకున్నను, తన హృదయములోనున్న వాంఛలు, ఒత్తిడిలు దేవుడు ఎరుగునని అతనికి తెలియును. ఒత్తిడిని ఎదుర్కొనుచున్న సమయాలలో తన భారమును ఆవిధముగా తగ్గించుకొనుట ఒక విశ్వాసికి సహాయపడును, ప్రత్యేకముగా అతని మనస్సు ఒక తెలిసిన భాషలో ప్రార్థనచేయుటకు బాగా అలసిపోయినప్పుడు. ఇది ఎలా పనిచేయునో మనము వివరించలేము. కాని ఇది పని చేయును.

ఇప్పుడు భాషల అర్థము చెప్పు వరమును పరిశీలించెదము. మనము ఇప్పటికే చూచిన విధముగా, భాషలకు అర్థము చెప్పుట ప్రవచించుటతో సమానమైయున్నది. కాబట్టి ప్రవచన వరమును కలిగిన వ్యక్తికి ఆత్మ సాధారణముగా ఈ వరమును కూడా ఇచ్చును. ఒక సంఘకూడికలో, ఒకడు భాషతో మాటలాడినయెడల, ప్రవచన వరము కలిగిన వారిలో ఒకడు (సాధారణముగా పెద్దలో ఒకడు) దేవుని వెలుగులో నడుచుచుంటే, (ఆ భాష దేవుని యొద్దనుండి నిజముగా వచ్చినదైతే) తన మనస్సులో ఒక భావము పుట్టినట్లు కనుగొనును. అతడు ఆ భావనను తన స్వంత మాటలలో మాట్లాడును-ఎందుకనగా అది అనువాదము కాదు గాని అర్థము చెప్పుట. అర్థము చెప్పు వరము కలిగిన మరియొక పెద్ద ఆ ''భాష''కు అర్థము చెప్పనియెడల, తన స్వంత మాటలలో చెప్పినప్పటికీ, దాని అర్థము ఒకే విధముగా నుండును. పెద్దలిద్దరు ప్రభువుతో సంపూర్ణమైన సంబంధము కలిగియున్న యెడల అలా జరుగును.

దేవుని నుండి వచ్చిన ఏ ప్రత్యక్షత బైబిలులో వ్రాయబడియున్న దానికి వ్యతిరేకముగా ఉండదు గనుక, ఆ భాషయొక్క అర్థము లేఖనముల ప్రకారమే యుండును-ఇది నిజమైన ప్రవచనము లేఖనములకు అనుగుణముగా ఉన్నట్లే ఉండును.

కృపావరాలను గూర్చి సందేహాన్ని వ్యక్తము చేయువారు ఈ ప్రశ్నను అడిగిరి: ఒక కూడికలో అర్థము చెప్పబడిన ''భాష'' ఒక టేపు పైన నమోదు చేయబడి వేరే స్థలములోనున్న అర్థము చెప్పు వరము కలిగిన వేరొకరు దానికి అర్థము చెప్పినప్పుడు, దాని అర్థము మొదట చెప్పబడిన అర్థముతో సమానముగా నుండునా? దానికి సమాధానము: అర్థము చెప్పువారిద్దరికి ప్రభువు మనస్సు యొక్క పరిపూర్ణమైన గ్రహింపు ఉన్న యెడల ఆ రెండు అర్థములు ఒకటిగా నుండవలెను. అర్థము యొక్క సారాంశములో (కేవలము మాటలలో కాదు) వ్యత్యాసమున్న యెడల ఆ అర్థము చెప్పువారిలో ఒకరు లేక ఇద్దరు కూడా ప్రభువుతో పరిపూర్ణమైన సంబంధము కలిగిలేరని అందుచేత ఆయన మనస్సును పరిపూర్ణముగా గ్రహించలేదని ఇది సూచిస్తున్నది. అది అసాధారణమైన విషయము కాదు ఎందుకనగా ప్రభువు మనస్సును పరిపూర్ణముగా తెలుసుకొనుటకు లోకములోని ఏ విశ్వాసి కూడా ఆయనతో పరిపూర్ణమైన సంబంధమును కలిగిలేడు.

ఈ క్రిందటి ఉదాహరణ సందేహములేని విధముగా ఈ వాస్తవమును నిరూపించును. మీరు ఒక కూడికలో మాటలాడాలనుకొండి. ఆ కూడిక కొరకు ప్రభువు యొక్క భారమైయున్న ఒక సందేశము మీ హృదయములో ఉన్నది అనుకొండి. అప్పుడు, మీరు ఆ కూడికకు వెళ్లలేకపోయి వేరొకరు మీ స్థానములో మాటలాడినయెడల, ఖచ్చితంగా చెప్పాలంటే, అతడు మీ హృదయములో మీరు కలిగియున్న సందేశమునే తన స్వంత మాటలలో చెప్పవలెను. ఆ సహోదరుడు మీ హృదయములో నున్న సందేశమును ఇవ్వని యెడల, మీ ఇద్దరిలో ఒకరు ఆ కూడిక కొరకు ప్రభువు యొక్క మనస్సును పరిపూర్ణముగా గ్రహించలేదు. కనుక తెలసిన భాషలో ఒక సందేశమును ఇచ్చినా కూడా విశ్వాసులు అటువంటి పరీక్షను తప్పుదురు.

ఆ కారణము చేత మనము ఒక ప్రవక్త యొక్క సందేశమును కూడా వివేచింపవలెనని బైబిలు మనకు చెప్పుచున్నది (1 కొరింథీ 14:29). అదే విధముగా, ''భాషలలో'' ఇవ్వబడిన అన్ని సందేశాలను వాటి ''తాత్పర్యములను'' మనము వివేచింపవలెను. అటువంటి సందర్భాలలో మనము దేనిని వివేచింపవలెను? కేవలము ఈ విషయమునే: మన ఆత్మ ఆ వ్వాఖ్యలు (ప్రవచనము, భాషలు లేక తాత్పర్యము) లేఖనానుసారమైనవా (మరియు ప్రభువు యొద్దనుండి వచ్చినవా) కాదా అని సాక్ష్యమివ్వవలెను.

ప్రతి ఆత్మను నమ్మక, ''ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించుడి'' అని మనము హెచ్చరింపబడియున్నాము (1యోహాను 4:1). కాబట్టి మనము ''భాషలను'' లేక వాటి తాత్పర్యములను బహిరంగముగా వినినప్పుడు వాటిని మన ఆత్మలలో పరీక్షింపవలెను. మనము వినే అనేకమైన ''మానవాతీతమైన ఉచ్ఛరింపులు'' దేవుని నుండి కాకపోవచ్చును. మనము ఒక ప్రవచనమును (లేక దానిలో ఒక భాగమును), ఒక భాషను లేక ఒక తాత్పర్యమును బట్టి ఏ కారణముగానైనను మన ఆత్మలలో కలత చెందినప్పుడు వాటిని మనము ఎల్లప్పుడు తృణీకరించవలెను. అసహజమైన మరియు మానవాతీతమైన వాటినన్నిటిని ప్రశ్నించకుండా అంగీకరించుట ఈ శతాబ్దములో క్రైస్తవ లోకములోనికి ఎంతో గందరగోళమును కలుగజేసినవి-మరియు ప్రభువు నామమునకు గొప్ప అవమానమును కూడా తెచ్చెను. ''అపొస్తలుల కార్యములలో'' భాషలు మాట్లాడిన అన్ని సందర్భాలలో ఈ వాస్తవాలను గమనించండి:

1. ప్రతి సందర్భములోను, భాషలలో మాటలాడుట యాదృచ్ఛికముగా నుండెను.

2. ప్రతి సందర్భములోను, అందరు భాషలతో మాటలాడిరి- ఎటువంటి మినహాయింపులు లేకుండెను.

3. ప్రతి సందర్భములోను, భాషలతో మాటలాడుటకు శిక్షణ గాని, ఉపదేశముగాని, ప్రోద్భలముగాని చేయబడలేదు.

అయితే ఈనాడు అనేక ప్రదేశాలలో, పైనున్న లక్షణములలో ఏవియు కనబడవు. ఎటువంటి శిక్షణా లేకుండా భాషల వరమును ప్రజలు పొందినప్పుడు మాత్రమే, అది అసలైనదని మనము నిర్ధారించవచ్చును. నేను వినిన ''భాషలతో మాటల''లో, వాటిలో ఒక చిన్న శాతము మట్టుకే అసలైనదని నా యాత్మ సాక్ష్మమిచ్చెను. తక్కినవి ఆ వరమును అనుకరించుటకు ప్రయత్నాలని నేను భావించాను-ఇది ఒక గుంపులో ఉన్న ఇతరులతో అంగీకరింపబడుటకు లేక వారిని ఆకట్టుకొనుటకు చేయబడినవి. ఒక చిన్న శాతము యొక్క మూలము దయ్యముల నుండి కూడా కావచ్చును. నా పరిశీలనలు అనేక దేశాలలో అనేక ప్రజల జీవితాలలో నేను చూచిన ఫలములు మరియు ఫలితాల మీద ఆధారపడియున్నవి. అనేక సంఘాలలో భాషలలో మాటలాడుట మరియు పాడుట తరచు ''ప్రదర్శన చేయుట'' వలే యున్నది-మరియు ప్రదర్శించుట అనేది చిన్న పిల్లల యొక్క గుణలక్షణము.

ప్రస్తుత కాలములో, ఆర్థిక లబ్ది కొరకు విశ్వాసుల యొద్దనుండి దోపిడి, ''భాషలతో మాటలాడుదుము'' అని చెప్పుకొనే బోధకులు మరియు కాపరుల చేత చేయబడుచున్నదన్న విషయము బాగా తెలిసిన సత్యమే. 20వ శతాబ్దములో ఉన్న మతారాధన వ్యవస్థలలో (కల్ట్‌) ఎక్కువ శాతము భాషలు మాటలాడే గుంపులనుండి వచ్చినవి. కాబట్టి విశ్వాసులందరికి నా సలహా ఏమిటంటే: భాషల వరమునకు మరియు స్వస్థత వరమునకు ప్రాముఖ్యతనిచ్చే సంఘాలన్నిటికి దూరముగా నుండుడి-ఎందుకంటే వాటిలో అనేక సంఘాలు ప్రమాదకరమైన విపరీత ధోరణులను అవలంభించును మరియు సాధారణముగా ఆత్మానుసారమైన మనస్సు కలిగియున్న నాయకులను కలిగియుండవు. దానికి బదులు పరిశుద్ధతకును, శిష్యులను చేయుటకును ప్రాముఖ్యతనిచ్చు సంఘముతో సహవాసమును కలిగియుండుటకు ఆశించుడి మరియు నిజమైన భాషల వరమును అంగీకరించి మీ డబ్బును ఆశించని లేక మీ జీవితమును నియంత్రించని సంఘము కొరకు వెదకుడి. దేవుని చిత్తమును మరియు ఆయన వాక్యమును సరిగా గ్రహించుటకు (రోమా 12:12) మనము పరిశుద్ధాత్మ చేత నూతన పరచబడిన మన మనస్సును ఉపయోగించవలెనని నేను ఉద్ఘాటించాలనుకొనుచున్నాను. మన మనస్సు ఒక భార్య వలె నుండవలెను. ఆమె గృహమునకు యజమానిగా ఉండకూడదు. అదే సమయములో ఆమె చంపబడకూడదు. యేసు మనకు భర్తయు, మనకు యజమానియైయున్నాడు. మన మనస్సు మరియు మన హృదయము ద్వారా ఆయనకు లోబడవలెను.

ఒక్కమాటలో చెప్పాలంటే, ''భాషల''పైన ఇదే విచక్షణమైన సలహా: మీకు దేవుడు భాషల వరమునిచ్చిన యెడల, దానిని స్వీకరించి, దానిని అభ్యాసము చేయుడి. మీరు ఆయనతో ఏకాంతముగా ఉన్నప్పుడు ఆ మాటలను మీ హృదయమునుండి దేవునితో మాటలాడుడి- అది ఎక్కడైన కావచ్చును-ప్రత్యేకముగా నిరుత్సాహము వలన మీ హృదయము ఒత్తిడికి లోనైనప్పుడు లేక ఆనందముతో ఉప్పొంగినప్పుడు. మీకు ఆ వరము లేని యెడల దాని గూర్చి చింతింపకుడి. కాని అన్నివేళల దానిని పొందుటకు ప్రభువు పట్ల తెరచిన హృదయముతోనుండుడి. దానికి వ్యతిరేకముగా నుండకుడి మరియు దానిని పొందుటకు ఆసక్తికలిగియుండుడి. దేవుడు మీకు దానిని ఇవ్వదలచితే మీరు ఆసక్తిచూపకుండానే దానిని మీకిచ్చును. అదే సమయములో మీరు క్రైస్తవ లోకములో చూచిన మరియు వినిన ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వచ్చినదని నమ్మకుడి. అన్నిటిని పరీక్షించుడి. దేవుడు మీకిచ్చిన వివేచనా శక్తిని ఉపయోగించుడి. మీకు భాషల వరము లేనియెడల, దానిని కలిగియున్న వారికంటే మిమ్మును మీరు తక్కువగా ఎంచుకొనకుడి. మీకు ఆ వరమున్న యెడల, అది లేనివారికంటే అది మిమ్మును ఎక్కువగా లేక ఆత్మానుసారులుగా చేయునని ఊహించుకొనకుడి (పౌలు మరియు కొరింథీయులు భాషలతో మాటలాడిరి. కాని పౌలు ఆత్మీయ దిగ్గజము, అయితే కోరింథీయులు శరీరానుసారులైయుండిరి).

ఖచ్చితముగా అవసరమైనదేమిటి? మనందరికి ఖచ్చితముగా అవసరమైన దేమిటంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుట. పరిశుద్ధాత్మలో బాప్తీస్మము యొక్క రుజువు శక్తి అంతేకాని భాషలలో మాటలాడుట కాదు (అపొ.కా. 1:8). మనము పాపక్షమాపణ పొందిన విధముగానే పరిశుద్ధాత్మను కూడా విశ్వాసముతో పొందవలెను (యోహాను 7:37-39). ఇది మన యోగ్యత వలన కాక క్రీస్తుయొక్క యోగ్యత వలన మాత్రమే సాధ్యము. మనము ఆత్మ అను వరమును ఉపవాసము ద్వారా లేక ప్రార్థన ద్వారా లేక ఏ ఇతర పని ద్వారా పొందలేము. ఆయన ఒక వరము (అపొ.కా. 2:38). మనము విశ్వాసము ద్వారా అడిగిన వెంటనే పొందెదము మరియు ఒక ఆకలిగొన్న కుమారునికి ఏ భూలోకపు తండ్రి ఆహారమును ఇచ్చిన దానికంటే త్వరగా దేవుడు తనను అడుగువారికి తన పరిశుద్ధాత్మను ఇచ్చుననే వాగ్దానమును నమ్ముచు వెళ్ళుదుము (లూకా 11:13). మనము ఆత్మను పొందామో లేదో అన్న అనిశ్చితను కలిగియుంటే, మనకు నిశ్చయతనిమ్మని దేవుని అడుగవచ్చు. కాని మనము ఆత్మతో నిరంతరము నింపబడుతు ఉండవలెను (ఎందుకనగా మనము చిల్లులుగల పాత్రలము-ఎఫెసీ 5:16). ఇది మనము నిరంతరము క్షమాపణ పొందవలసిన అవసరము వలేయున్నది (ఎందుకంటే మనకు తెలియకుండానే మనము తరచు పాపము చేయుదుము-మత్తయి 6:12).

భాషలతో మాటలాడుట కంటే క్రీస్తు యెడల మన హృదయము యొక్క అంకిత భావము (భక్తి) ఎంతో ప్రాముఖ్యమైనది. పేతురును తన పరిచర్యకు నియమించే ముందు మన ప్రభువు పేతురును అడిగిన ప్రశ్న ''వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?'' కాబట్టి ''భాషలతో మాటలాడుట''ను గూర్చి వాదనలు విశ్వాసులను క్రీస్తుయొక్క సంపూర్ణమైన భక్తినుండి ప్రక్కదారి పట్టించుటకు సాతాను ఏర్పాటు చేసిన ఒక మలుపు.

వారు భాషలతో మాట్లాడినా లేకపోయినా ప్రపంచములో అతిగొప్ప క్రైస్తవులు ప్రభువైన యేసును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించినవారే. పేతురు, యాకోబు, యోహాను, పౌలు వంటి కొందరు భాషలతో మాటలాడిరి. జాన్‌ వెస్లీ, చార్లెస్‌ ఫిన్నీ, డి.ఎల్‌. మూడీ, ఎ.బి.సింప్సన్‌, విలియమ్‌ బూత్‌, సి.టి.స్టడ్‌ మరియు వాచ్‌మెన్‌ నీ వంటి మరికొందరు (మనకు తెలిసినంతవరకు) ఎప్పుడు భాషలతో మాటలాడలేదు. కాని వారందరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందిరి. తమ పూర్ణహృదయాలతో వారందరు ప్రభువును ప్రేమించిరి. మరియు వారందరు సిలువ మార్గములో నడచిరి, వారి జీవితాలలో ఈ సత్యములు ప్రధానమైనవిగా ఉండెను. ఇతర విషయాలు తక్కువ ప్రాముఖ్యతకలిగియుండెను. మనము వారి మాదిరిని అనుసరిస్తే మనము తప్పిపోము.

వినుటకు చెవులు గలవాడు వినునుగాక.

అధ్యాయము 20
విశ్వాసుల మధ్య షిబ్బోలెతులు

ఇశ్రాయేలులో న్యాయాధిపతుల కాలములో, వారి పాళెమునకు చెందిన వారెవరో, కాని వారెవరో పరీక్షించుటకు గిలాదువారు ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనిపెట్టిరి. వారు అందరిని ''షిబ్బోలెతు'' అను మాటను పలుకమనిరి. వారి శత్రువులైన ఎఫ్రామీయులు దానిని ''సిబ్బోలెతు'' అని పలికిరి; అది వారి చావును ఖరారు చేసెను. వారు ఒక శబ్దమును సరిగా పలుకలేకపోయిరి గనుక 42,000 మంది ఇశ్రాయేలీయులు తమ సహోదరుల చేత చంపబడిరి (న్యాయాధిపతులు 12:6).

గత 20 శతాబ్దాలుగా, వేర్వేరు క్రైస్తవ గుంపులు వారి గుంపుకు చెందినవారెవరో, కానివారెవరో కనిపెట్టుటకు తను స్వంత ''షిబ్బోలెతు''లను కనిపెట్టిరి. ఆ షిబ్బోలెతులను (ఆ గుంపు అంగీకరించిన వేదాంతపరమైన పరిభాష) పలుకలేని వారు పూర్వకాలములో ఖడ్గముతో, నాగరికత ఎక్కువగా ఉన్న ఈ రోజులలో నాలుకతో చంపబడుదురు. మంచి విశ్వాసులు ఒక గుంపుకు అంగీకారయోగ్యమైన షిబ్బోలెతును పలుకలేకపోవుట వలన ఈ కాలములో మానసికముగాను, బెదిరింపుల ద్వారాను నాశనము చేయబడిరి. ఆ గుంపులకు చెందిన నాయకుల యొక్క ప్రకృతి సంబంధమైన శక్తిని ఎదిరించుటకు బలహీనులైనందున నాశనమైపోయిరి.

ఫలానా పదజాలమును వాడుటవలన లేక వాడకపోవుట వలన ప్రజలకు సరియైన సిద్ధాంతము ఉన్నదో లేదో అని మనము గుర్తించలేము. ''యేసుయొక్క మరణానుభవము'' అనే మాటను పరిశీలించండి (2కొరింథీ 4:10). ఆ మాట సూచించే సత్యమును వ్యక్తపరచుటకు అది ఏకైక మార్గము కాదు. యేసు దానిని ''అనుదినము సిలువను ఎత్తికొనుట'' అను మాటలతో చెప్పెను (లూకా 9:23). క్రీస్తుయొక్క దాసులుగా ఉండుటకు బదులు మనమందరము ఒక ప్రత్యేకమైన పదజాలమునకు బానిసలుగా మారే ప్రమాదములో ఉన్నాము. తన రచనలన్నిటిలో ఒక్కదానిలోనైనను ''అనుదినము సిలువ నెత్తికొనుట''ను గూర్చి మాట్లాడని అపొస్తులుని గురించి మీరేమనుకొందురు? అతడు సిలువ యొక్క కేంద్రత్వాన్ని నిర్లక్ష్యము చేసెనని మీరతనిని నిందించుదురా? అలా అయితే మీరు పేతురు, యోహాను, యాకోబు, యూదా అటువంటి అతిక్రమమును చేసిరని వారిని నిందించవలెను, ఎందుకనగా వారు తమ రచనలలో ఈ మాటను ఒక్కసారి కూడా వాడలేదు. పౌలు కూడా తాను వ్రాసిన పత్రికలన్నిటిలో, ''యేసు యొక్క మరణానుభవమును'' గూర్చి ఒక్కసారే మాట్లాడెను. దానికి కారణము అతడు తన పరిచర్యలో సిలువ యొక్క కేంద్రకత్వానికి ప్రాముఖ్యత నివ్వకపోవుటయా? అలా అనుకొనుట దైవదూషణ-ఎందుకనగా లేఖనములలో పౌలు పత్రికలన్నిటిని ప్రేరేపించినది పరిశుద్ధాత్మయే!

యోహాను నిశ్చయముగా తన సిలువను అనుదినము ఎత్తికొనెను. కాని అతడు తన మొదటి పత్రికలో క్రైస్తవ జీవితమును గూర్చి మాట్లాడినప్పుడు దాని గూర్చి అతడు సానుకూలమైన విధంగా మాట్లాడెను-నిత్యజీవితములో, యేసు జీవములో పాలుపొందుటను గూర్చియు మరియు దానిని ప్రత్యక్షపరచుటను గూర్చియు మాట్లాడెను. ''తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మీకు ప్రకటించుచున్నాము'' అని అతడు చెప్పెను (1యోహాను 1:2).

నిత్యజీవము-అనగా యేసు యొక్క జీవము-పత్రికలన్నిటి యొక్క ముఖ్య నేపథ్యము, నిజానికి క్రొత్త నిబంధన అంతటి యొక్క నేపథ్యము. సంఘము యొక్క ప్రతి కూటములోను మనము ప్రకటించవలసినది దీనినే.

మనము లేఖనముల యొద్దకు వచ్చినప్పుడు మానవ తర్కాన్ని వాడకూడదు. గణితశాస్త్రములో (లెక్కల్లో) తర్కము మంచిదేకాని, దేవుని వాక్యములో మంచిదికాదు. మనము దేవుని వాక్యము యొద్దకు వచ్చినప్పుడు మానవ తెలివికి సంబంధించిన తెలివిగల వాదనలను ప్రక్కకుపెట్టి లేఖనములు వ్రాయబడిన విధముగానే వాటిని అంగీకరించుట శ్రేష్టమైన విషయము. దేవుడు తన వాక్యములో తన సంపూర్ణమైన ప్రత్యక్షతను మనకిచ్చెను. క్రొత్త నిబంధన లేఖనములు ''నిత్యజీవము''ను గూర్చి మాట్లాడిన యెడల మనము కూడా దాని గూర్చి మాట్లాడవలెను. ''యేసు తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై, సిలువను సహించెను'' అని గుర్తుంచుకొనుడి. ఆయన సిలువను ఆనందించలేదు. ఆయన దానిని సహించెను. ఆయన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై దానిని సహించెను-అది తండ్రితో సహవాసములోనున్న ఆనందము, ఆయన సన్నిధిలో జీవమును, సంపూర్ణ సంతోషము కలవు (కీర్తనలు 16:11).

పాత నిబంధన మందిరము యొక్క అతి పరిశుద్ధ స్థలములో తండ్రి నివసించెను, ఆ స్థలములోకి వెళ్లుటకు ఏకైక మార్గము సిలువ వేయబడిన శరీరమును సూచించిన చిరిగిన తెర ద్వారా నుండెను. యేసు అనుదినము తన స్వంత చిత్తమునకు చనిపోవుట వలన తండ్రితో సహవాసమును కలిగియుండెను, కాని యేసు తన చిత్తమును సిలువ వేసుకొనుటపై తన దృష్టిని కేంద్రీకరించలేదు. ఆయన గురి తన తండ్రితో సమవాసమైయుండెను. ఆయన గురి జీవము, మరణము కాదు. మన గురి కూడా జీవమైయుండవలెను-అది యేసు కలిగియున్న గురి వంటిదే. మనము సిలువ మార్గమును వెంబడించము. అది ఒక బోధను వెంబడించనట్లుండును. మనము సిలువ మార్గములో నడచిన యేసును వెంబడించెదము. మనము ఒక సిద్ధాంతము వైపు లేక ఒక మార్గము వైపు చూడక ఒక వ్యక్తి వైపు, యేసు వైపే చూచెదము (హెబ్రీయులు 12:2). ''స్వయమునకు మరణము'' అను దాని గూర్చి ఎప్పుడు ఆలోచించువారు, మాట్లాడువారు అనేక విధాలుగా ప్రతికూలముగా మారే అవకాశముంది, వారు చివరికి ఇతరులను గూర్చికూడా ప్రతికూలముగా నుందురు.

దీనికి మేము అనేక ఉదాహరణలను చూచితిమి. దీని అర్థము మనము సిలువనెత్తికొనుటను గూర్చి ప్రకటించుట మానివేయాలనా? లేదు. కాని సిలువనెత్తికొనుట అనే సత్యమును ఆ మాటలనే ఉపయోగించి ప్రకటించవలసిన అవసరము లేదు. అక్షరము చంపును కాని ఆత్మ జీవమునిచ్చును.

ఒక సహోదరుడు తన వర్తమానములో ఆ అక్షరమును ఒక్కసారి కూడా వాడనప్పటికి, దానిలో సిలువకు సంబంధించిన ఆత్మ (క్రొత్త నిబంధన అంతటిలో ఉన్నట్లే) ఉండవచ్చును. మనము ఆత్మానుసారమైన మనస్సు గలవారమైన యెడల మనము అతని మాటలనే కాక అతని ఆత్మను విందుము. మీకు సంబంధించిన ''షిబ్బోలెతు''ను ఒక సహోదరుడు వాడని కారణముగా, అతడు సిలువ యొక్క కేంద్రకత్వమును గ్రహించలేదు అనుకొనుట పూర్తిగా తప్పయిన విషయము. లేఖనములను వ్రాసే సమయములో ఏ పదాలను వాడాలో వాడకూడదో అని నిర్ణయించుటకు అపొస్తలులు ఒక నియమాల పుస్తకమును (''మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము'') అనుసరించలేదు. వారు తమ హృదయాల యొక్క మరియు జీవితాల యొక్క సమృద్ధినుండి మాట్లాడిరి మరియు వారికి సహజముగా వచ్చిన మాటలతో ఆత్మీయ సత్యాలను వ్యక్తపరచిరి, పరిశుద్ధాత్మ వారినందరిని ఒకే మూసలో పోసి వారినందరిని ఒకే విధమైన పదబంధములను, పదజాలములను వాడునట్లు చేయలేదు.

''గాలి తన కిష్టమైన చోట విసురును...ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును (దేవుని ప్రతి బిడ్డ) అలాగే ఉన్నాడు'' (యోహాను 3:8). మానవ నియమ నిబంధనలను అనుసరించుట ద్వారా బానిసత్వము వచ్చును. దైవికమైన సత్యమును కూడా అపొస్తలులు తమ స్వంత బాషతో వ్యక్తపరచుటకు స్వేచ్ఛను కలిగియుండిరి. కేవలము మతారాధన వ్యవస్థలకు సంబంధించిన వారు మాత్రమే తమ నాయకులు వాడే మాటలను తమ అనుచరులు వాడునట్లు బలవంతపెట్టుదురు. దీని ఫలితమేమిటంటే అటువంటి వ్యవస్థలకు చెందినవారు దేవునితో ఎటువంటి వ్యక్తిగత సంబంధము లేని మరియు తమకు సహజముగా వచ్చే భాషను వాడుటకు ధైర్యము లేని మరమనుషులవలే మారుదురు. వారు తమ నాయకులను గ్రుడ్డిగా, అవివేకముగా అనుకరించుదురు.

క్రైస్తవ లోకములో ప్రాచుర్యములో ఉన్న అనేక లేఖనానుసారముకాని మాటలను మనము నిశ్చయముగా వాడకూడదు. బైబిలులో ఉన్న మాటలను అజాగ్రత్తగా వాడకుండుటకు మనము జాగ్రత్త పడవలెను. ఈ రోజున కొంతమంది విశ్వాసులు ''తెరను చింపుట''ను గూర్చి మాట్లాడరు. క్రీస్తు ఎప్పటికీ తెరను చించివేసెనని గ్రహింపక అలా మాట్లాడుదురు. దానిని మరల చింపవలసిన అవసరమే లేదు. దేవుడు ఒక్కసారే పాపమునకు శరీరములో శిక్షవిధించెనని గ్రహింపక మరికొందరు ''తమ శరీరమందు పాపమునకు శిక్షవిధించుట''ను గూర్చి మాట్లాడుదురు (రోమా 8:3). ఒకగుంపులోని నాయకులు వాడే ''షిబ్బోలెతు''ను వాడుటకు కలిగిన ఆశ వలనే లేఖనములు నిర్లక్ష్యముగా వాడబడును.

వారు వాడే పదాలను మాత్రమే ఇతరులు వాడాలని పెద్దలు ఎప్పుడు ఒత్తిడి చేయకూడదు. ప్రతి ఒక్కరు తనలో ఉన్న క్రీస్తు యొక్క జీవమును వ్యక్తపరచుటకు తాను స్వేచ్ఛగా వాడగలిగిన లేఖనములలోని పదాలనే వాడవలెను. మనము కేవలము ఇతరులకు అంగీకారయోగ్యముగా నుండుటకు మన గుంపులో కనబడు ఇష్టమైన మాటలను(పదాలను) బానిసల వలే అనుకరించకూడదు. మనము భక్తి యొక్క పై రూపమును గాక దాని శక్తిని వెంటాడవలెను. ఒక సహోదరుడు మన గుంపులో చేరి మన ''షిబ్బోలెతు''లను వాడితేనే అతడు క్రీస్తు వధువులో భాగమని అనుకొనే విపరీతమైన మూఢభక్తి వైపుకు వెళ్లకుండుటకు జాగ్రత్త పడవలెను. మానవుని అభిప్రాయములు చెత్త కుండీకి మాత్రమే తగును! ఆయన విషయాలలో మనము జోక్యము చేసుకొనకుండా ఆయన కొరకు ఒక వధువును ఎంపిక చేయకుండా, క్రీస్తు తన స్వంత వధువును ఎంచుకొనుటకు మనము అనుమతించెదము.

అధ్యాయము 21
సత్యమును స్పష్టముగా (ఖండితముగా) అర్థము చేసుకొనుట

మన విషయములోను, మన బోధవిషయములోను జాగ్రత్త కలిగియుండవలెనని మనము లేఖనములలో ఆజ్ఞాపించబడితిమి ఎందుకనగా ఆ విధముగా మాత్రమే మనలను, మన బోధవినువారిని రక్షించుకోగలము (1తిమోతి 4:16). మన జీవితము మరియు మన సిద్ధాంతము మన క్రైస్తవ జీవితమునకు స్థిరత్వమును ఇవ్వగల రెండు కాళ్లవంటివి. మానవుని కాళ్లవలే అవి రెండు సమానముగా నుండవలెను. సాధారణముగా క్రైస్తవలోకములో ఎక్కువ మంది విశ్వాసులు ఈ రెండు కాళ్లలో ఒక దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చుటను మనము కనుగొనెదము.

సిద్ధాంతము విషయములో, మనము ''సత్యవాక్యమును సరిగా ఉపదేశించవలెనని'' (2తిమోతి 2:15) ఆజ్ఞాపించబడియున్నాము. చాలామంది లేఖనములను ధ్యానించుటలో అశ్రద్ధగా ఉండుట వలన సిద్ధాంతము అర్థము చేసుకొనుటలో వారికి సమతుల్యత లేదు. దేవుని సత్యము మానవ శరీరము వంటిది. దానిలో ప్రతి అవయవము సరైన పరిమాణములో నున్నప్పుడే అది పరిపూర్ణముగా ఉండును. లేఖనములలో ఉన్న సత్యములన్నియు సమానముగా ముఖ్యమైనవి (ఒకే ప్రాముఖ్యత కలిగినవి) కావు. ఒక్క ఉదాహరణను తీసుకొనుడి: భాషలతో మాటలాడుట ఇతర విశ్వాసులను ప్రేమించుట అంత ముఖ్యమైనది కాదు. ఏ ఒక సిద్ధాంతముకైనా వేరేవాటి కంటే విశేషించి ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, మనము ప్రకటించు సత్యము ఒక భారీ పరిమాణము కలిగిన కంటినో లేక చెవినో కలిగిన శరీరము వలె అసహ్యముగా నుండును. అంతేకాకుండా ఆ విధముగా చేయుట మనలను విశ్వాసభ్రష్టత్వములోనికి నడుపును.

దేవుని వాక్యములో (బైబిలు యొక్క 66 పుస్తకాలలో) కనబడిన సత్యమును మేము నమ్ముతాము అని చెప్పుట సామాన్యమైన విషయము. అలా చెప్పుట సత్యమే. కాని దేవుని వాక్యము యొక్క సత్యము, సాతాను మరియు మనుష్యుల కపటము వలన వక్రీకరింపబడి చెరుపబడెను. గనుక, బైబిలు ఖచ్చితముగా బోధించువాటిని విశదపరచి వివరించవలసిన అవసరమున్నది.

దేవుని వాక్యమును, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత లేకుండా గణిత శాస్త్రము మరియు విజ్ఞాన శాస్త్రమును చదివి అర్థము చేసికొన్నట్లు చేసుకొనలేము.

ఈ ప్రత్యక్షత గర్విష్టులైన జ్ఞానులకు కాక శిశువులకు(దీనులకు) ఇవ్వబడునని యేసుచెప్పెను (మత్తయి 11:25). ఇందువలనే యేసు యొక్క కాలమందలి బైబిలు పండితులు ఆయన బోధను అర్థము చేసుకోలేకపోయిరి. ఈ కాలములో కూడా ఎక్కువ మంది బైబిలు పండితులు అదే పడవలో, అదే కారణము చేత ఆ విధముగా ఉన్నారు! అదే సమయములో మనము మన మనస్సులను కూడా ఉపయోగించవలెను, ఎందుకనగా, ''బుద్ధి విషయమై పెద్ద వారలైయుండుడి'' అని మనము ఆజ్ఞాపింపబడియున్నాము (1కొరింథీ 14:20). కాబట్టి పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడిన మనస్సు మాత్రమే దేవుని వాక్యమును సరిగా అర్థము చేసుకోగలదు.

తన బిడ్డలు అన్ని విధాలుగా స్వతంత్రులైయుండవలెనని దేవుడు కోరుకొనుచున్నాడు. కాని అనేకమంది విశ్వాసులు అనేకమైన పాపపు అలవాట్లకు మరియు మానవ సాంప్రదాయాలకు బానిసలుగా ఉన్నారు. వారు దేవుని వాక్యమును అశ్రద్ధగా చదువుటయే దీనికి ఒక కారణము. మనము దేవుని వాక్యమును అర్థము చేసుకొనుటకు ఎంత శ్రద్ధవహించెదమో అంతగా సత్యము మన జీవితముల యొక్క ప్రతి విషయములో మనలను స్వతంత్రులుగా చేయును (యోహాను 8:32 చూడండి).

వారి డబ్బును పెట్టుబడి పెట్టే విషయములో ఎక్కువ మంది విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉందురు. కాని లేఖనములను ధ్యానించే విషయములో వారు చాలా అశ్రద్ధగా ఉందురు. వారు దేవుని కంటే డబ్బుకే ఎక్కువ విలువనిచ్చుచున్నట్లు ఇది చూపించుచున్నది. అటువంటి విశ్వాసులు దేవుని వాక్యమును అర్థము చేసుకొనుటలో ఖచ్చితముగా తప్పిపోవుదురు. మనలను పరిపూర్ణులుగా చేయుటకే లేఖనములు ఇవ్వబడెనని మనకు తేటగా చెప్పబడెను (2తిమోతి 3:16,17). గనుక క్రైస్తవులుగా పరిపూర్ణులగుటకు ఆసక్తి లేనివారు దేవుని వాక్యమును సరిగా అర్థము చేసుకోలేరని మనము చెప్పవచ్చును (యోహాను 7:17ను కూడా చూడండి). యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలము. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసేయున్నది (కీర్తన 25:14).

దేవుని గూర్చిన సత్యము

దేవుడు ఒక్కడేననియు మరియు ఆయనలో ముగ్గురు వ్యక్తులున్నారనియు కూడా బైబిలు బోధిస్తున్నది. అంకెలు భౌతిక సంబంధమైనవి గాని దేవుడు ఆత్మ గనుక, ఒక చిన్న గిన్నె ఒక మహాసముద్రములోని నీటిని కలిగియుండలేనట్లే, మన పరిమితమైన మనస్సులు ఈ సత్యమును పూర్తిగా గ్రహించలేవు.

ఒక కుక్క గుణకారమును అర్థము చేసుకోలేదు-మూడు ఒకటులను గుణించినప్పుడు జవాబు ఒకటి ఎలా అవునో దానికి తెలియదు(1ఞ1ఞ1=1). అలాగే దేవుడు ఒక త్రిత్వమైయుండి కూడా ఎలా ఒక్కడైయుండునో మనకు అర్థము కాదు. ఒక కుక్క మరొక కుక్కను మాత్రమే అర్థము చేసుకోగలదు. ఒక మనిషిని పూర్తిగా అర్థము చేసుకోలేదు. అదే విధంగా మానవ తెలివిచేత వివరింపబడగలిగిన ఒక దేవుడు మనవంటి మానవుడై మాత్రమే ఉండగలుగును. బైబిలులో ఉన్న దేవుడు మానవ జ్ఞానమునకు అందని వాడై యున్నాడన్న వాస్తవమే ఇది ఖచ్చితముగా సత్యమనుటకు స్పష్టమైన ఆధారముగా నున్నది.

త్రిత్వమును గూర్చిన సత్యము బైబిలుయొక్క మొదటి వచనమునుండే స్పష్టమగుచున్నది. అక్కడ ''దేవుడు'' అను పదము హెబ్రీభాషలో బహువచనమైన 'ఏలోహిమ్‌' అను పదము. ఆదికాండము 1:26లో వాడబడిన 'మనము' మరియు 'మనయొక్క' అను మాటలయొక్క ఉపయోగములోకూడా మనము దానిని చూడగలము. యేసు యొక్క బాప్తీస్మము జరిగిన సమయములో ఈ సత్యము మరి విశేషముగా వెలుగులోనికి తేబడినది. అక్కడ తండ్రి (పరలోకము నుండి స్వరము) కుమారుడు (యేసుక్రీస్తు) మరియు పరిశుద్ధాత్మ (పావురము రూపములో ) ఉండిరి (మత్తయి 3:16,17).

యేసు ప్రభువే తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మయై యున్నాడని చెప్పువారు ఆయన తన స్వంత చిత్తమును ఉపేక్షించుకొని తన తండ్రి చిత్తమును ఎలా చేసెనో వివరించలేరు (యోహాను 6:38). దేవుడు ఒక్కవ్యక్తియే అను నమ్ము యూనిటేరియన్‌ అను తెగకు చెందిన వారు ''యేసు నామములో మాత్రమే'' బాప్తీస్మము ఇచ్చువారు నిజానికి యేసు ఒక మానవునిగా వచ్చెనను సత్యమును నిరాకరించుచున్నారు. సరియైన బోధను కలిగియున్నవాడు తండ్రిని మరియు కుమారున్ని అంగీకరించునని మరియు తండ్రిని గాని కుమారుని గాని తృణీకరించువాడు క్రీస్తువిరోధియొక్క ఆత్మను కలిగియున్నాడనియు బైబిలు చెప్పుచున్నది. క్రైస్తవ బాప్తీస్మములో తండ్రి,కుమార, పరిశుద్ధాత్మ అను ముగ్గురి నామములో మనము బాప్తీస్మము ఇవ్వవలెనని ఆజ్ఞాపించబడియున్నాము (మత్తయి 28:19). కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తుగా గుర్తించబడియున్నాడు (అపొ.కా. 2:38).

క్రీస్తును గూర్చిన సత్యము

యేసుక్రీస్తు దేవుడనియు, ఆయన ఆదినుండి (నిత్యత్వమంతటినుండి) దేవునిగా దేవునితో సమానుడిగా ఉండెననియు లేఖనములు చెప్పుచున్నవి (యోహాను 1:1). ఆయన భూమి మీదకు ఒక మనుష్యునిగా వచ్చినప్పుడు దేవుడిగా తనకుండిన శక్తులను స్వచ్ఛదంగా వాడలేదనియు లేఖనములు బోధించుచున్నవి. ''ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను'' అను పరిభాష (మాట) యొక్క అర్థము ఇదే (ఫిలిప్పీ 2:6,7).

దీనిని ఋజువు చేయు కొన్ని ఉదాహరణలు పరిశీలించెదము: దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు (యాకోబు 1:13). కాని యేసు శోధింపబడుటకు అనుమతించెను (మత్తయి 4:1-11). దేవుడు సమస్తమును ఎరుగును కాని యేసు భూమి మీద నున్నప్పుడు తన స్వంత రెండవ రాకడ దినమును గూర్చి యెరుగనని చెప్పెను (మత్తయి 24:36). దానికి ఏ ఫలమైనా నున్నదేమోనని చూచుటకు ఆయన ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్లవలసి వచ్చెను (మత్తయి 21:19). దేవునిగా ఆయనకున్న శక్తిని ఆయన వాడిన యెడల దూరమునుండే ఆ చెట్టుకు ఫలములు లేవని ఆయన యెరిగియుండెడివాడు! దేవుని జ్ఞానము మార్పులేనిది మరియు నిత్యమైనది అయినప్పటికీ ''యేసు జ్ఞానముతో నిండుకొనుచు వర్ధిల్లుచుండెను'' అని మన ప్రభువైన యేసును గూర్చి రెండుసార్లు వ్రాయబడినది (లూకా 2:40,52). ఈ వచనములన్నియు యేసు భూమి మీదకు వచ్చినప్పుడు దేవుడు కలిగిన అనేక శక్తులనుండి ''తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను'' అని సూచించుచున్నవి.

యేసు భూమి మీదకు వచ్చినప్పుడు ఈ శక్తులనుండి తన్నుతాను రిక్తునిగా చేసుకొనినప్పటికీ వ్యక్తిత్వములో ఆయన ఇంకా దేవునిగా ఉండెను. దేవుడు ఎప్పటికైనా దేవుడు కాకుండుట నిశ్చయముగా అసాధ్యము. ఒక రాజు తన హక్కులన్నింటిని వదలుకొని వెళ్లి ఒక మురికివాడలో ఉండగలడు కాని అతడు ఇంకా రాజుగానే నుండును. ఆ విధముగానే యేసు కూడా భూమి మీద నున్నప్పుడు ఆయన దైవత్వమునకు స్పష్టమైన ఋజువు ఆయన ఇతరులనుండి ఏడు మారులు ఆరాధనను అంగీకరించుటలో ఉన్నది (మత్తయి 8:2; 9:18;14:33; 15:25; 20:20; మార్కు 5:6; యోహాను 9:38). దేవదూతలు, దేవుని యందు భయభక్తులు కలిగిన మనుష్యులు మ్క్రొబడుటకు అంగీకరించరు (అపొ.కా. 10:25,26, ప్రకటన 22:8,9). కాని యేసు దేవుని కుమారుడైనందున దానిని అంగీకరించెను. యేసు భూమి మీద నుండినప్పుడు కూడా దేవుని కుమారుడైయుండెనని తండ్రి పేతురుకు బయలుపరచెను (మత్తయి 16:16,17).

యేసు యొక్క మానవత్వమును గురించి, ఆయన ''అన్ని విషయములలో తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను'' అని హెబ్రీయులు 2:17 చాలా ఖచ్చితముగా చెప్పుచున్నది. ఆయన ఆదాము సంతతిగా చేయబడలేదు, ఎందుకనగా అప్పుడాయన మనుష్యులందరి వలే ''ప్రాచీన పురుషుని'' కలిగియుండెడివాడు. ('ప్రాచీన పురుషుడు' అనునది లేఖనానుసారమైన పదము, దురదృష్టవశాత్తు అనేకులు దానికి బదులు లేఖనానుసారముకాని 'పాప స్వభావము' అను మాటను వాడుదురు). యేసు ఒక మానవ తండ్రిని కలిగియుండలేదు గనుక ఆయన పాప స్వభావమును కలిగియుండలేదు. యేసు పరిశుద్ధాత్మ వలన జన్మించెను మరియు ఆయన గర్భములో ఉన్నప్పటి నుండి పరిశుద్ధునిగా ఉండెను (లూకా 1:35).

యేసు యొక్క ఆత్మీయ సహోదరులు దేవుని చిత్తము చేయువారు (మత్తయి 12:49,50), ఆత్మ మూలముగా జన్మించిన వారు (యోహాను 3:5) మరియు ప్రాచీన పురుషుని వదులుకొని నవీన పురుషుని ధరించుకొనిన వారైయున్నారు (ఎఫెసీ 4:22,24). కాని యేసు యొక్క సహోదరులమైన మనము ఒక స్వంత చిత్తాన్ని కలిగియున్నాము మరియు ఆయన ''అన్ని విషయములలో'' మనవంటి వానిగా చేయబడెను. ఆయన కూడా ఒక స్వంత చిత్తాన్ని కలిగియుండెను, ఆయన దానిని ఉపేక్షించెను (యోహాను 6:38).

మనము ఆదాము సంతతిగా జన్మించినప్పుడు, మనమందరము ప్రాచీన పురుషుని కలిగియుంటిమి. ఈ ప్రాచీన పురుషుని మన శరీరెచ్ఛలకు (వీటిని ఒక దొంగల ముఠాగా పోల్చవచ్చును) మన హృదయపు ద్వారాన్ని తెరచే ఒక అపనమ్మకమైన దాసునితో పోల్చవచ్చును. మనము తిరిగి జన్మించినప్పుడు ఈ ప్రాచీన పురుషుడు దేవుని చేత చంపబడును (రోమా 6:6) కాని మనము శోధింపబడుటకు శరీరమును ఇంకను కలిగియున్నాము (యాకోబు 1:14,15). ఈ శరీరేచ్ఛలను ఎదిరించి ఈ దొంగల ముఠాకు వ్యతిరేకముగా హృదయపు తలుపును మూసివేయుటకు ప్రయత్నించే నవీన పురుషుడు ఆ ప్రాచీన పురుషుని స్థానములో ఉన్నాడు.

యేసు అన్ని విషయములలో మనవలే శోధింపబడి జయించెను (హెబ్రీ 4:15). అయితే ఆయన 'పాపము'తో రాలేదు కాని 'పాప శరీరాకారము'తో వచ్చెను (రోమా 8:3). మనము అనేక సంవత్సరాలు పాపములో జీవించితిమి. అనేక సంవత్సరములు పాపము చేయుట వలన మనము నేర్చుకొనిన పాపపు అలవాట్లు మనము తిరిగి జన్మించిన తరువాత కూడా మనకు తెలియకుండానే పాపముచేయునట్లు చేయును. ఉదాహరణకు గతములో బూతులు మాట్లాడిన అనేకులు ఒత్తిడికి గురైనప్పుడు అటువంటి మాటలు వారినోటనుండి వారికి తెలియకుండానే వచ్చుట కనుగొందురు. అయితే తాము రక్షణపొందని దినములలో బూతులు మాట్లాడని వారు తమకు తెలియకుండా అటువంటి మాటలను మాట్లాడుట కనుగొనరు. అదేవిధముగా బూతు పుస్తకములను ఎక్కువగా చదివిన వారు, అలా చేయని వారికంటే ఎక్కువగా అపవిత్రపు తలంపులను, కలలను కలిగియుండుటను కనుగొందురు.

యేసు ఎప్పుడు పాపము చేయలేదు మరియు ఆయన జీవితములో తెలియని పాపమును కలిగియుండలేదు. ఆయన తెలియకుండా ఒక్కసారి పాపము చేసినా ఆ పాపముకొరకు ఆయన ఒక బలి అర్పించవలసి యుండును (లేవీ 4:27,28). అప్పుడు ఆయన మన పాపముల కొరకు పరిపూర్ణమైన బలి అయ్యుండేవాడు కాదు. సంఘ చరిత్రయంతటిలో యేసు యొక్క వ్యక్తిత్వమును గూర్చిన సిద్ధాంతము వివాదాస్పదముగా నుండెను మరియు దాని గురించి అనేక భిన్నాభిప్రాయములు ప్రకటింపబడెను. కొందరు ఆయన దైవత్వమును ఎంత ఎక్కువగా చేసిరంటే ఆయన మన వలెనే శోధింపబడిన ఒక మనుష్యుడని చూడలేకపోయిరి. ఇతరులు ఆయన మానవత్వమును ఎంత ఎక్కువగా చేసిరంటే వారు ఆయన దైవత్వమును కొట్టివేసిరి.

ఇటువంటి మత భ్రష్టత కలిగించు వాటినుండి తప్పించుకొనుటకు మన ఏకైక రక్షణ, లేఖనములలో ఉన్న దేవుని సంపూర్ణ ప్రత్యక్షతతో నిలబడుటయే. లేనియెడల మనము ''క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడచి ముందుకు సాగెదము'' (2యోహాను 7,9). యేసు ఒక మానవునిగా భూమి మీదకు వచ్చుట ఒక మర్మము. బైబిలులో దీనిని గూర్చి చెప్పబడిన దానిని దాటి ఈ సత్యమును మనము విశ్లేషించుటకు ప్రయత్నించుట అవివేకమైన విషయము. అలా చేయుట క్రీస్తుకు సాదృశ్యముగా నున్న మందసములోనికి చూచిన ఇశ్రాయేలీయుల బుద్ధిహీనమైన అగౌరవమైన చర్యగా నుండును-ఆ చర్యను బట్టి దేవుడు వారిని హతము చేసెను (1 సమూయేలు 6:19).

తన ఇష్టమును నెరవేర్చుటకు కాక తండ్రి చిత్తమునే జరిగించుటకు భూమి మీదకు తాను వచ్చెనని యేసు చెప్పెను (యోహాను 6:38). తన తండ్రి చిత్తమునకు వేరైన మానవ చిత్తమును యేసు కలిగియుండెనని ఇది చూపిస్తున్నది. లేనియెడల ఆయన దానిని ఉపేక్షించుకోవలసిన అవసరము ఉండెడిది కాదు. యేసు కూడా అన్ని విషయములలో మనవలెనే శోధింపబడెను (హెబ్రీ 4:15). కాని ఆయన ఆ శోధనలకు తన మనస్సులో ఎన్నడు సమ్మతించలేదు గనుక ఆయన ఎన్నడు పాపము చేయలేదు (యాకోబు 1:15). మనము ఎదుర్కొనే ప్రతి శోధనను యేసు తన భూలోకజీవితములో ఎదుర్కొని జయించెను.

పాపము చేయకుండా ఒక్కరోజైనా ఉండగలుగుట ఎంత కష్టమో మనందరికి తెలియును! కాబట్టి ఆయన మనవలే ప్రతి విషయములో అనుదినము శోధింపబడినప్పటికీ, 33 సంవత్సరముల పాటు యేసు పాపము చేయకుండా జీవించుటయే ఆయన చేసిన అతిగొప్ప అద్భుతమని మనము చెప్పవచ్చును. ఆయన మరణము పొందునంతగా పాపమును ఎదిరించెను మరియు ఆయన మహారోధనతోను కన్నీటితోను మొఱపెట్టెను గనుక తండ్రి నుండి కృపను పొందెను (హెబ్రీ 5:7; 12:3,4).

మన అగ్రగామిగా (మార్గదర్శకునిగా), మన సిలువనెత్తికొని మన స్వంత చిత్తమును చంపుటలో ఆయన మాదిరిని అనుసరించుటకు ఆయన మనలను పిలచుచున్నాడు (లూకా 9:23). మనము పాపమును తగినంత తీవ్రముగా ఎదిరించక పోవుట మరియు జయించుటకు తండ్రి కృపను అడుగకపోవుట మనము పాపములో పడిపోవుటకు కారణము. ఈనాడు మనము యేసు జీవితము యొక్క బాహ్యసంబంధమైన విషయాలలో- ఒక వడ్రంగిగా ఉండుటలో లేక ఒక బ్రహ్మచారిగా ఉండుటలో- లేక ఆయన పరిచర్యలో- నీటిపై నడుచుటలో లేక మృతులను తిరిగిలేపుటలో- ఆయనను అనుసరించుటకు పిలువబడలేదు, కాని ''పాపమును జయించే విషయములో ఆయన వలె నమ్మకముగా ఉండుటకు పిలువబడియున్నాము''.

యేసుక్రీస్తును గూర్చి పరిశుద్ధాత్మ మనలను రెండు విషయములు ఒప్పుకొనుటకు ప్రేరేపించును-ఒకటి ఆయన ప్రభువని, మరియొకటి ఆయన శరీరధారియై వచ్చెనని (1కొరింథీ 12:3, 1యోహాను 4:2,3). ఈ రెండు విషయములు సమానమైన ప్రాముఖ్యత గలవి, రెండవది మరి ప్రాముఖ్యమైనది ఎందుకనగా యేసు శరీరధారియై వచ్చెనని ఒప్పుకొనకపోవుటయే క్రీస్తువిరోధి యొక్క ఆత్మను గుర్తుపట్టుటకు ఆనవాలు అని మనకు చెప్పబడినది (2యోహాను 7). ఈనాడు క్రీస్తుయేసు అను నరుడు (1తిమోతి 2:5) ''అనేకులైన సహోదరులలో జ్యేష్టుడైయున్నాడు'' మరియు ఆయన తండ్రి మనకు కూడా తండ్రియై యున్నాడు (రోమా 8:29, యోహాను 20:17, ఎఫెసీ 1:3; హెబ్రీ 2:11). యేసు భూమి మీదకు వచ్చినప్పుడు దేవునిగా ఆయనకున్న ఉనికిని ఆయన కోల్పోలేదు (యోహాను 10:33). ఆయన తిరిగి పరలోకమునకు వెళ్లిన తరువాత నరునిగా ఆయనకున్న ఉనికిని కోల్పోలేదు (2తిమోతి 2:5).

రక్షణ గూర్చిన సత్యము

దేవుని వాక్యములో ''రక్షణ'' మూడు కాలములలో ఉన్నట్లుగా చెప్పుచున్నది-భూతకాలము (ఎఫెసీ 2:8), వర్తమాన కాలము(ఫిలిప్పీ 2:12), భవిష్యత్కాలము (రోమా 13:11). వేరే మాటలలో చెప్పాలంటే నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట.

రక్షణ అనునది పునాది మరియు కట్టడమునైయున్నది. పునాది పాపక్షమాపణపొంది మరియు నీతిమంతులుగా తీర్చబడుటయైయున్నది. నీతిమంతులుగా తీర్చబడుట అనునది మన పాపములు క్షమింపబడుట కంటే ఎక్కువైనది. దీని అర్థము క్రీస్తు మరణమును, పునరుత్థానమును, ఆరోహణమును ఆధారము చేసుకొని మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడియున్నాము. ఇది మన క్రియల మూలముగా కలిగినది కాదు (ఎఫెసీ 2:8,9) ఎందుకనగా మన నీతిక్రియలు కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నవి (యెషయా 64:6). మనము క్రీస్తుయొక్క నీతిని ధరించుకొని యున్నాము (గలతీ 3:27). మనము క్షమింపబడుటకును నీతిమంతులుగా తీర్చబడుటకును మారుమనస్సు మరియు విశ్వాసము షరతుగా ఉన్నవి (అపొ.కా. 20:21).

నిజమైన మారుమనస్సు మనలో నష్టపరిహారము చేయుట అను ఫలమును ఫలింపజేయును. ఇది డబ్బును, వస్తువులను, పన్నులను తిరిగి చెల్లించుట, మనము కష్టపెట్టిన వారికి సాధ్యమైనంత వరకు క్షమాపణ చెప్పుట వంటి వాటితో కూడినది (లూకా 19:8,9). దేవుడు మనలను క్షమించినప్పుడు మనము ఇతరులను అదే విధముగా క్షమించవలెనని ఆయన కోరును. మనము అలాచేయని యెడల ఆయన తన క్షమాపణను రద్దు చేయును (ఉపసంహరించుకొనును) (మత్తయి 18:23-25). మారుమనస్సు పొంది విశ్వసించిన తరువాత మనము నీటిలో ముంచబడే బాప్తీస్మమును తీసుకోవలెను. దీని ద్వారా మన ప్రాచీన పురుషుడు (స్వభావము) పాతిపెట్టబడెనని మనము దేవునికి, మనుష్యులకు, దయ్యములకు బహిరంగముగా సాక్ష్యమిచ్చెదము (రోమా 6:4,6). అప్పుడు మనము సాక్షులుగా నుండుటకు శక్తిని పొందెదము (అపొ.కా. 1:8). పరిశుద్ధాత్మలో బాప్తీస్మము దేవుని పిల్లలందరును విశ్వాసము ద్వారా పొందవలసిన వాగ్దానమైయున్నది (మత్తయి 3:11; లూకా 11:13). తాను నిజముగా దేవుని బిడ్డనని ఆత్మయొక్క సాక్ష్యమును కలిగియుండుట (రోమా 8:16) తాను నిజముగా పరిశుద్ధాత్మను పొందియున్నానని నిశ్చయముగా తెలిసికొనుట ప్రతి శిష్యుని యొక్క ధన్యతయైయున్నది (అపొ.కా. 19:2).

పరిశుద్ధపరచబడుట అనునది పునాదిమీద కట్టడము. పరిశుద్ధపరచబడుట (పాపము నుండియు, లోకము నుండియు వేరుచేయబడుట) అనునది నూతన జన్మతో మొదలగు ఒక ప్రక్రియ (1కొరింథీ 1:2) మరియు అది మన జీవితకాలమంతయు కొనసాగును (1థెస్స 5:23,24). దీనిని దేవుడు మనలో తన పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సులలో వ్రాయుట ద్వారా ప్రారంభించును (హెబ్రీ 8:10). అయితే మనము భయముతోను వణకుతోను మన రక్షణను కొనసాగించుట మన భాధ్యతయైయున్నది (ఫిలిప్పీ 2:12,13). ఆత్మ మనకిచ్చు శక్తి ద్వారా మన శరీర క్రియలను మరణింపజేయవలసినది మనమే (రోమా 8:13). దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి పవిత్రులుగా చేసుకోవలసినది మనమే (2కొరింథీ 7:1).

ఈ పనిలో పరిశుద్ధాత్మతో సహకరించుటకు ఎక్కడైతే ఒక శిష్యుడు తీవ్రతతో పూర్ణహృదయము గలవాడైయుండునో తన జీవితములో పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియ వేగముగా కొనసాగును. ఆత్మ నడిపింపునకు నిదానముగా స్పందించు వాని జీవితములో ఈ పని నిశ్చయముగా నెమ్మదిగా జరుగును లేక పూర్తిగా ఆగిపోవును.శోధన సమయాలలోనే పరిశుద్ధత కొరకు మనకున్న ఆశ నిజముగా పరీక్షింపబడును.

పరిశుద్ధపరచబడుట అంటే ధర్మశాస్త్రమునందలి నీతి మన హృదయాలలో నెరవేర్చబడుట-అంతే కాని పాత నిబంధనలో వలే బయటకు మాత్రము కనబడుట కాదు (రోమా 8:4). దీనికే యేసు మత్తయి 5:17-48లో ప్రాముఖ్యత నిచ్చెను. ధర్మశాస్త్రమంతయు ''నీ దేవుని పూర్ణహృదయముతో ప్రేమించుట మరియు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుట'' అను వాటిలో ఇమిడియున్నదని యేసు చెప్పెను (మత్తయి 22:36-40). ఆయన స్వభావమైయున్న ప్రేమయను నియమమునే దేవుడు మన హృదయాలలో వ్రాయాలని కోరుచున్నాడు (హెబ్రీ 8:10; 2పేతురు 1:4). ఎరిగిన పాపమంతటి మీద జయము పొందుట ద్వారా మరియు యేసుయొక్క ఆజ్ఞలన్నిటికి విధేయత ద్వారా ఇది బయటకు ప్రత్యక్షపరచబడును (యోహాను 14:15). శిష్యత్వమునకు యేసు విధించిన షరతులను మొదట నెరవేర్చకుండా ఇటువంటి జీవితములోనికి ప్రవేశించుట అసాధ్యము (లూకా 14:26-33). ఇది ప్రభువుకు మన బంధువులందరి కంటే మరియు మన స్వంత జీవితము కంటే మొదటి స్థానము నిచ్చుట మరియు మనకున్న సిరిసంపదల నుండి విడుదల పొందుటయైయున్నది. మనము మొదట వెళ్లవలసిన ఇరుకు మార్గము ఇదే. ఆ తరువాత పరిశుద్ధపరచబడుట అనే ఇరుకు మార్గము వచ్చును. పరిశుద్ధత కొరకు ప్రయాసపడని వారు ప్రభువును ఎన్నడు చూడలేరు (హెబ్రీ 12:14).

నిర్మలమైన మనస్సాక్షిని ఇప్పుడిక్కడ కలిగియుండుట సాధ్యమైనప్పటికి, యేసు తిరిగి వచ్చునప్పుడు మనము మహిమకరమైన శరీరమును పొందువరకు పాపరహితమైన జీవితము అసాధ్యము (1యోహాను 3:2). అప్పుడు మాత్రమే మనమాయనవలే ఉండగలము, కాని ఇప్పుడు కూడా ఆయన నడచినట్లే మనము కూడా నడచుటకు ప్రయత్నించవలెను (1యోహాను 2:6). మనము ఈ క్షయమైన శరీరమును కలిగియున్నంతవరకు, మనము ఎంత పరిశుద్ధ పరచబడినప్పటికీ, మనకు తెలియని పాపము దానిలో దాగియుండును (1యోహాను 1:8). కాని మనము పూర్ణహృదయులమైనయెడల (2కొరింథీ 4:4) మన మనస్సాక్షి విషయములో మనము నిర్దోషముగా నుండి (అపొ.కా. 24:16) తెలిసిన పాపమునుండి విడుదల పొందవచ్చును (1యోహాను 2:1). ఈ విధముగా మనము క్రీస్తుయొక్క రెండవ రాకడ కొరకును, మనము మహిమపరచబడుట కొరకును ఎదురు చూచుచున్నాము-ఇది మన రక్షణ యొక్క చివరి భాగము, అప్పుడు మనము పాపరహితమైన పరిపూర్ణులముగా మారుదము (రోమా 8:23, ఫిలిప్పీ 3:21).

సంఘమును గూర్చిన సత్యము

సంఘము క్రీస్తుయొక్క శరీరమైయున్నది. దానికి ఒకే ఒక్క శిరస్సు-అది క్రీస్తు; దానికి ఒకే ఒక ప్రధాన కార్యాలయము-అది మూడవ ఆకాశము. క్రీస్తు శరీరములో ప్రతి అవయవమునకు ఒక విధి యున్నది (ఎఫెసీ 4:16). కొందరికి ఇతరుల కంటే ప్రాముఖ్యమైన లేక బయటకు కనబడే పరిచర్య ఉన్నప్పటికీ ప్రతి అవయవము (వ్యక్తి) ఒక విలువగల పరిచర్యను కలిగియుండును.

క్రీస్తు తన సంఘముకు అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తీకులను, కాపరులను మరియు బోధకులను తన శరీరమును కట్టుటకు ఇచ్చెను (ఎఫెసీ 4:11). ఇవి పరిచర్యలే కాని బిరుదులు కావు. అపొస్తలులు స్థానిక సంఘాలను నాటుటకు దేవునిచేత పిలువబడి పంపబడిన వారు. వారికి సంఘములో మొదటి స్థానము కలదు (1కొరింథీ 12:28). కాబట్టి వారి మేరలో నున్న సంఘముల యొక్క పెద్దలకు వారు పెద్దలుగా ఉందురు. దేవుని ప్రజల యొక్క మరుగైయున్న అవసరతలను బయటపెట్టి వాటిని తీర్చువారు ప్రవక్తలు. సువార్తికులనగా అన్యులను క్రీస్తుయొద్దకు తెచ్చుటకు వరములను కలిగిన వారు. వారప్పుడు రక్షింపబడిన వారిని క్రీస్తు శరీరమైన స్థానిక సంఘమునకు తీసుకొనిరావలెను (ఇక్కడే ఆధునిక సువార్తీకరణలో ఎక్కువ భాగము విఫలమగుచున్నది). కాపరులనువారు గొఱ్ఱెపిల్లలను గొఱెల్రను కాచి నడిపించువారు. బోధకులనువారు లేఖనములను వాటి సిద్ధాంతములను వివరించగలిగిన వారు. ఈ అయిదు వరములు సార్వత్రిక సంఘముకొరకు ఇవ్వబడినవి; వీటిలో కాపరులు ప్రతి స్థానిక సంఘముకు ముఖ్యమైనవారు. ఇతర వరములు ఇతర స్థలములకు (తిరుగుచుండేవి) కావచ్చును.

స్థానిక సంఘము యొక్క నాయకత్వము పెద్దల చేతులలో ఉండవలెను. క్రొత్త నిబంధన దీనిని స్పష్టముగా బోధించుచున్నది (తీతు 1:5; అపొ.కా. 14:23). 'పెద్దలు' అనునది బహువచనము అయినందున ప్రతి సంఘములో కనీసము ఇద్దరు పెద్దలు ఉండవలెనని ఇది సూచించుచున్నది. స్థానిక సంఘము యొక్క నాయకత్వములో సమతుల్యత కొరకు (మనము మత్తయి 18:18-20 లో చదువునట్లుగా) సాతాను యొక్క చర్యలను ప్రభువు సన్నిధి యొక్క శక్తి ద్వారా బంధించుటకును పెద్దల యొక్క బహుళత్వము (ఒకరి కంటే ఎక్కువ మంది) అవసరము. ఒక సంఘమును ఒక వ్యక్తి మాత్రమే నడిపించుట క్రొత్త నిబంధన బోధకు విరుద్ధముగా నున్నది. అయితే పెద్దలలో ఒకరు వాక్యమును బోధించు వరము గలవాడైనయెడల, అతడు 'సంఘము యొక్క దూత'గా ఉండవచ్చును (ప్రకటన 2:1).

తన శిష్యులు బిరుదులను కలిగియుండుటను యేసు నిషేధించెను. కాబట్టి రబ్బోని, తండ్రి, స్వామి, పాష్టరు, రెవరెండు (పూజనీయుడు), గురువు అను బిరుదులను కలిగియుండుట దేవుని వాక్యమునకు విరుద్ధమైనది. 'పూజనీయుడు' అను బిరుదు బైబిలులో దేవునికి మాత్రమే ఇవ్వబడినది (కీర్తనలు 111:9). మరియు దానిని కలిగియుండువాడు, దేవునివలే ఉండుటకు లూసిఫరు కలిగిన ఆశనే కలిగియుండే ప్రమాదమున్నది (యెషయా 14:14). సంఘములో ప్రతి ఒక్కరు, చిన్నవారేమి పెద్దవారేమి, కేవలము ఒక సహోదరుడు మరియు ఒక దాసుడు మాత్రమే.

శిష్యులందరు ప్రవచించుటకు స్థానిక సంఘ కూడికలలో అవకాశము ఇవ్వబడవలెను (1కొరింథీ 14:26-40). అయితే అది బోధించుటకు (అపొ.కా. 20:9,11) లేక ప్రార్థించుటకు (అపొ.కా. 12:5,12) లేక సువార్తీకరణకు (అపొ.కా. 21:14-40) సంబంధించిన కూటమైన యెడల ఇది వర్తించదు. కూడికలలో మాట్లాడుటకు ఆశించిన వారందరు ప్రవచించు వరమును కోరుకొనవలెను (1కొరింథీ 14:1,39). భాషల వరము ప్రాథమికముగా వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకైనప్పటికీ, సంఘకూడికలలో వాడబడవచ్చును, కాని దాని తరువాత తప్పనిసరిగా దాని అర్థము చెప్పబడవలెను (1కొరింథీ 14:27). దాని అర్థము ఒక ప్రత్యక్షతగాని, జ్ఞానవాక్యముగాని, ప్రవచనము గాని, బోధగాని, దేవునికి ఒక ప్రార్థనగాని అయియుండవచ్చును (1కొరింథీ 14:2-6). 1కొరింథీ 12:8-10,28 మరియు రోమా 12:6-8లో పేర్కొనబడిన వరములన్నియు క్రీస్తు శరీరమును కట్టుటకు అవసరమైయున్నవి. పరిశుద్ధాత్మ యొక్క కృపావరములను తృణీకరించు లేక నిర్లక్ష్యము చేయు సంఘము వాటిని ఎప్పుడు కలిగియుండదు.

స్త్రీలు వారి తలలపై ముసుగు వేసికొని కూటములలో ప్రార్థించుటకును ప్రవచించుటకును అనుమతించబడియున్నారు, కాని వారు పురుషులపైన అధికారము చేయుటకు లేక వారికి బోధించుటకు అనుమతించబడలేదు (1కొరింథీ 11:5; 1తిమోతి 2:12). అన్ని దేశములలో క్రీస్తు యొక్క శిష్యులను తయారుచేయుట అను గురిని కలిగియుండి, వీలైనంత మందికి, వీలైన అన్నిరీతులలోను సువార్తను ప్రకటించే బాధ్యత కూడా సంఘము కలిగియున్నది (మార్కు 16:15; మత్తయి 28:19). అయితే శిష్యులను చేయకుండా సువార్తీకరణ చేయుట భూమి మీద క్రీస్తు యొక్క సాక్ష్యమునకు ఆటంకముగా నుండును.

ప్రతి స్థానిక సంఘము 'రొట్టె విరచుట' ద్వారా ప్రభువు యొక్క మరణమును ప్రకటింపవలెను (1కొరింథీ 11:22-34). దీనిని ఎంత తరచుగా చేయవలెనను విషయములో దేవుని వాక్యము ప్రతి సంఘమునకు స్వేచ్ఛనిచ్చును. కాని అది ఎప్పుడు ఒక వ్యర్థమైన ఆచారముగా దిగజారిపోకూడదు.

కానుకల విషయములో, దేవుని పని నిమిత్తము అవిశ్వాసుల యొద్దనుండి డబ్బును తీసుకొనుట తప్పని దేవుని వాక్యము స్పష్టము చేయుచున్నది (3యోహాను 7). కాబట్టి అవిశ్వాసులు హాజరైన కూటములలో కానుకలు పట్టకూడదు. విశ్వాసులు ఇచ్చే కానుకలన్నియు స్వచ్ఛందముగాను, రహస్యముగాను ఇవ్వబడవలెను (2కొరింథీ 9:7). ఇతరుల యొద్దనుండి డబ్బును పొందే ఉద్దేశ్యముతో పరిచర్యను గూర్చిన నివేదికలను 'ప్రార్థనా పత్రికలు' అను పేరుతో పంపుట తప్పు.

విశ్వాసముతోకూడిన విధేయతకు శిష్యులను నడిపించునప్పుడే సంఘము స్థిరముగా కదలకుండా ఉండును-ఈ విధేయత యేసుయొక్క ఆజ్ఞలన్నిటికి ప్రత్యేముగా మత్తయి 5-7 లో ఉన్న ఆజ్ఞలకు లోబడి ఉండవలెను. క్రొత్త నిబంధనలో ఉన్న అతి చిన్న ఆజ్ఞలకు కూడా మనము లోబడి వాటిని ఆసక్తితో ప్రకటించవలెను. ఇదే ఒక వ్యక్తిని దేవుని దృష్టిలో గొప్పవానిగా చేయును (మత్తయి 5:19). అనేక విషయములను గూర్చి క్రొత్త నిబంధన మౌనముగా నున్నది. అటువంటి విషయాలలో మనము పిడివాదముగా నుండకుండా ఇతర శిష్యులు తమ స్వంత ఒప్పుదలను కలిగియుండుటకు స్వేచ్ఛనిచ్చుచు, మన స్వంత ఒప్పుదలను మనము స్థిరముగా కలిగియుండవలెను (రోమా 14:15).

అన్ని విషయాలలో మనతో అంగీకరించువారిని ప్రేమించుట సులువైన విషయము. అయితే మనతో అంగీకరించని వారి పట్ల మన వైఖరి ద్వారా మన ప్రేమ పరీక్షింపబడును. ప్రతి చిన్న విషయములోను తన పిల్లలందరు ఒకే అభిప్రాయమును కలిగియుండవలెనని దేవుడు ఉద్దేశించలేదు. అదే విధముగా ప్రతి స్థానిక సంఘము లేఖనములకు సంబంధించని విషయాలలో ఒకే విధమైన బాహ్యరూపమును కలిగియుండవలెనని ఆయన ఉద్దేశించలేదు. భిన్నత్వము మధ్య ఏకత్వములో దేవుని మహిమ కనుపరచబడవలెను. ఒకే రూపము కలిగియుండట మానవ కల్పితమైనది మరియు అది ఆత్మీయ మరణమును తెచ్చును. దేవుడు ఒకే రూపమును కోరుకొనుటలేదు గాని ఐక్యతను కోరుకొనుచున్నాడు.

చివరిగా, యేసుయొక్క శిష్యులు కలిగిన అతి స్పష్టమైన గుర్తు వారు ఒకరియెడల ఒకరు కలిగియున్న ప్రేమయేనని మనము గుర్తుంచుకొనవలెను (యోహాను 13:35). ఈ విధముగా తండ్రి కుమారుడు ఏకమై యున్నట్లే సంఘము కూడా ఏకముగా ఉండుటకు అపేక్షింపవలెను (యోహాను 17:21).

ఒక్కమాటలో చెప్పాలంటే ఇదంతయు మనము స్థిరముగా నిలిచియుండవలసిన సత్యమైయున్నది. దీనిని పూర్ణహృదయముతో అంగీకరించిన వారినందరిని ఇది స్వతంత్రులుగా చేసినందున ఇది సత్యమైయున్నదని మాకు తెలియును (యోహాను 8:32).