క్రొత్త ద్రాక్షారస తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 1
క్రొత్త ద్రాక్షారసపు తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము

క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త ద్రాక్షారసపు తిత్తులలో పోయుట గూర్చి యేసు ప్రభువు చెప్పారు (లూకా 5:37). క్రొత్త ద్రాక్షారసము యేసుప్రభువు యొక్క జీవము మరియు క్రొత్త ద్రాక్షారసపు తిత్తులు యేసు కట్టుచున్న సంఘమైయున్నది.


క్రొత్త ద్రాక్షారసము


కానాలో, యేసు ఉన్న వివాహములో పాత ద్రాక్షారసము అయిపోయెను. పాత ద్రాక్షారసము మానవ ప్రయత్నముతో ఎన్నో సంవత్సరములుగా తయారు చేయబడినది. కాని అది అవసరమును తీర్చలేకపోయినది. ఇది పాత నిబంధనలో నున్న ధర్మశాస్త్రానుసారమైన జీవితము గూర్చిన ఉపమానము. పాత ద్రాక్షారసము అయిపోయినది; మరియు ప్రభువు మనకు క్రొత్త ద్రాక్షారసమును ఇచ్చుటకు పాతది అయిపోవు వరకు ఎదురు చూడవలసి యుండును. ''ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకుండుట వలన రక్షింపబడెదరు....అయినను మీరు సమ్మతింపక గుఱ్ఱముల నెక్కి పారిపోవుదుమంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చెను......కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరు ధన్యులు'' (యెషయా 30:15-18 - లివింగు బైబిలు).


మనము విజయములో జీవించుటకు ప్రయత్నించి, ప్రయత్నించి తిరిగి మరల పడిపోయినప్పుడు దేవుడు మనకు నేర్పించదలచుకొన్న పాఠము ''నీ స్వంత బలముతో నీవు విజయమును పొందలేవు'' అనునదియే. నీవు ధర్మశాస్త్రము క్రింద యున్నంత కాలము నీవు పాపముచే పరిపాలింపబడుదువు. దేవుడు తన బిడ్డలలో చేయదల్చుకొనిన ముఖ్యమైన పని, వారిలో నున్న 'నేను చేయగలను' అనుకొనే బలమైన స్వంత శక్తిని విరుగ గొట్టుటయై యున్నది.....యేసు ప్రభువు కానాలో అద్భుతము చేయుటకు ముందు పాత ద్రాక్షారసము పూర్తగు వరకు ఎదురు చూచెను. అలాగే ఇప్పుడు మన బలము పూర్తగువరకు ఎదురు చూస్తున్నారు. మన బలహీనతలోనే ఆయన శక్తి పరిపూర్ణముగా బయల్పర్చబడునట్లు (2 కొరింథీ 12:9) మన ఓటములు మరియు అపజయములు మనలను చివరకు తెచ్చునట్లు దేవుడు ఉద్దేశించెను. మనము శోధింపబడు మరియు రెచ్చగొట్టబడిన సమయములలో, మనము నిష్ఠూరమైన మాటలతో బదులిచ్చినప్పుడు, కోప పూరితమైన భావము చూపినప్పుడు, మనలను మనము తప్పులేదని ఋజువు చేసికొనుటకు ప్రయత్నించినప్పుడు, ఇతరులను విమర్శించి లేక తీర్పు తీర్చినప్పుడు, క్షమించలేని వైఖరి చూపినప్పుడు, వస్తువుల విషయంలో ఎలా అయినా పొందాలనే కోర్కె చూపినప్పుడు, మన హక్కుల కొరకు మరియు మన పేరు కొరకు పోరాడినప్పుడు, పగ తీర్చుకొనుటకు చూచినపుడు మనలో నున్న ''నేను'' అను దానికున్న బలమును చూడగలము. ఇవి మరియు ఇటువంటి ఇతర వైఖరులలో మనలో నుండిన ''నేను'' అనుదాని యొక్క బలమెంతో తెలియును. పాత ద్రాక్షారసము ఇంకను అయిపోలేదు. అందువలన యేసు ప్రభువు మన విషయంలో ఏమీ చేయకుండా ఊరుకొనుచున్నారు.


దేవుడు మనలను విరుగగొట్టుటకు మనము అనుమతించినట్లైతే, మనలను మనము తగ్గించుకొని మన హక్కులు మరియు పేరు విషయంలో చనిపోవుటకు మనము ఒప్పుకొన్నట్లయితే, ఆయన మనలను ఎంతో త్వరగా క్రొత్త నిబంధన క్రింద నున్న జీవితానికి మనలను నడిపించును! మనలను యిబ్బంది పెట్టే అన్ని పరిస్థితులు, భంగపాటులు, నిరాశలు మొదలైనవన్ని మనలో నుండిన ''నేను'' అనుదాని యొక్క బలమును ఏమీలేని 'సున్నా' స్థితికి తీసుకువచ్చుట కొరకు దేవుడు ఉద్దేశించినవియైయున్నవి.


దేవుడు యోబు విషయములో అట్లే చేసెను. చివరకు యోబు ఆ సున్నా స్థితికి చేరి తన ముఖమును ధూళిలో పెట్టుకొని ''ప్రభువా, నేను నీచుడను....నేను నా నోటి మీద చేతినుంచుకొని మౌనముగా నుంటిని. నేను వినికిడి చేత నీ గూర్చి వింటిని కాని ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను'' (యోబు 40:4; 42:5, 6) అనెను.


చివరగా దేవుడు మనలను విరుగగొట్టి ఆయన గూర్చిన ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అట్లు జరుగును. ఒకప్పుడు ఇశ్రాయేలీయులను రక్షించుటకు సామర్థ్యము కలదని అనుకొనిన మోషేయే (40 సంవత్సరముల వయనప్పుడు) దేవుని ప్రత్యక్షత తరువాత (40 సంవత్సరముల తరువాత) ''ప్రభువా, నేను మాట్లాడుటకు నేర్పరిని కాను, వేరొకరిని పంపుము'' (నిర్గమకాండము 4:11, 13) అనెను.


దేవుని మహిమను చూచిన తరువాత గొప్ప ప్రవక్తయైన యెషయా కూడా అట్లే జరిగెను. ''నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను; నేను నశించితిని'' (యెషయా 6:5) అని యెషయా అనెను. దేవుడిచ్చిన దర్శనమును చూడగానే శక్తి అంతా పోయెనని దానియేలు అనెను. ఆ విధముగా అతడు ఏమీ లేని ''సున్నా'' స్థితికి వచ్చెను (దానియేలు 10:8).


దేవునితో 65 సంవత్సరములు నడచి ఆత్మతో నింపబడిన అపొస్తులుడైన యోహాను, పత్మాసు ద్వీపముపై యేసును చూచి ఆయన పాదముల యొద్ద చనిపోయిన వానివలె పడిపోయెను (పక్రటన 1:17).


దేవుని మహిమను చూచిన వారందరి యొక్క అనుభవము ఎప్పుడూ అటువంటిదే! వారి ముఖమును ధూళిలో ఉంచి వారి నోటిని మూసుకొనిరి.


దేవుడు అటువంటి స్థితికి మనలను తీసుకువచ్చిన తరువాత క్రొత్త ద్రాక్షారసమనే యేసు యొక్క దైవస్వభావమును, యేసు రక్తము చేత ముద్రింపబడిన క్రొత్త నిబంధన యొక్క అతి గొప్పదైన దీవెనను యిచ్చుట దేవునికి ఎంతో సుళువైన విషయము.


మన జీవిత దినములన్నీ మన ముఖమును దేవుని యెదుట ధూళిలో నుంచుకొను స్థితికి మనమందరము త్వరగా వచ్చి అటువంటి స్థితిలో జీవించినట్లయితే ఎంత బాగుండును! అటువంటి జీవితములో వెలుగు నుండి అధిక వెలుగునకు (సామెతలు 4:18), మహిమ నుండి అధిక మహిమకు (1కొరింథీ 3:18) అభివృద్ధి యుండును.


యోహాను ''వెలుగులో నడుచుట'' గూర్చి మాట్లాడెను (1 యోహాను 1:7). వెలుగులో నిలుచుట అనేది లేదు. కాని చీకటి అనేది ఏ మాత్రమూ లేని ఆయన దగ్గరకు ఇంకా దగ్గరగా నడిచివెళ్లుటగా యున్నది. ఆ విధముగా ఆ వెలుగు మనపై ప్రకాశవంతముగా మరియెక్కువ ప్రకాశవంతముగా ప్రకాశించుటచేత మన శరీరములో అంతకు ముందు మనకు తెలియని, దాగియున్న పాపముల గూర్చి అంతకంతకు ఇంకా ఎక్కువగా తెలియునట్లు చేయును, మరియు యేసు రక్తము మన పాపములన్నిటిని క్షమించును.


ఆ విధముగా, మనము ప్రభువు యొద్దకు దగ్గరగా వచ్చుకొలది మన శరీరములో నున్న పాపము గూర్చి ఎక్కువగా మనము తెలిసికొనెదము. మన చుట్టూ ఉన్న ఇతరుల పాపమును గూర్చి ఇంకా తక్కువగా తెలిసికొనెదము. మనము వ్యభిచారములో పట్టుబడిన స్త్రీపై రాళ్ళు వేయుటకు ఏ మాత్రము కోర్కె కలిగియుండము. ఎందుకంటే యేసు ప్రభువు సన్నిధిలో మనలో నున్న పాపమును మనము తెలిసికొనుట చేత మనము ''ఆ స్త్రీ ఎంత దౌర్భాగ్యురాలు'' అని కాకుండా ''అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను'' అని కేక వేయుదము (రోమా 7:24). ఆదాము దేవుని యెదుట నిలువబడి కూడా, తన భార్యవైపు వ్రేలు ఎత్తి చూపాడు (ఆదికాండము 3:12). కాని దేవుడు అతనిని తన పాపమును తెలిసికొనునట్లు చేసెను (ఆదికాండము 3:17). మనలో కూడా అట్లు చేయవలెనని దేవుడు చూచుచున్నాడు. ఇది మనము కలిగియున్నది ఏదో ఒక మతము మరియు ఏదో సిద్ధాంతమా లేక మనము దేవుని ముఖము యెదుట నివసించుచున్నామా అను దానికి నిజముగా ఒక పరీక్షయైయున్నది.


మన వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో లేక మన సంఘ జీవితములో ద్రాక్షారసము అయిపోయినదా? అలా అయినట్లయితే మనము ప్రభువు ముఖమును వెదకుటకు మరియు మన అవసరత త్వరగా ఒప్పుకొనుటకు ఇదే సమయము. ఆయన మాత్రమే మనకు క్రొత్త ద్రాక్షారసమును ఇవ్వగలడు! కానాలో క్రొత్త ద్రాక్షారసము మానవ ప్రయత్నముతో తయారవ్వలేదు. అది దేవుని యొక్క అద్భుతకార్యము. మన జీవితములో కూడా అట్లే జరగవచ్చును. ఆయన, ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయములపై మరియు మన మనసులపై వ్రాసి ఆయన సంపూర్ణ చిత్తమును చేయుటకు ఆశ కలిగియుండునట్లు చేయును (హెబీ 8:10; ఫిలిప్పీ 2:13). మనము ఆయనను ప్రేమించునట్లును మరియు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచునట్లు ఆయన మన హృదయములను సున్నతి చేయును (ద్వితీయో 30:6; యెహెజ్కేలు 36:27). ఈ పని కానాలో క్రొత్త ద్రాక్షారసమును తయారు చేసినంతటిది. కృప యొక్క అర్థమిదే. మన జీవితకాలమంతా మనము ప్రయత్నించినా మనము యేసుయొక్క జీవమును ఉత్పత్తి చేయలేము. కాని మనము మన శరీరములో ''యేసు యొక్క మరణానుభవమును'' (మనము ప్రతిదినము సిలువను ఎత్తుకొనుట, మన అహం విషయములో, మన స్వంత యిష్టము విషయములో మరియు మన యొక్క హక్కులు మరియు పేరు విషయములో చనిపోవుట) కలిగియుండినట్లయితే, మనలో యేసు యొక్క జీవము అనే క్రొత్త ద్రాక్షారసమును తయారు చేయుదునని దేవుడు వాగ్దానము చేసెను (2 కొరింథీ 4:10).


మనము యేసువైపు చూచుచు ఆయనొక్కడితో మాత్రమే అన్నివేళలా మనలను మనము పోల్చుకొనుచు ఈ పందెము పరిగెత్తవలెను. అప్పుడు మాత్రమే మన హృదయములలో నుండి ''అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను'' అనే కేక ఎడతెగక వచ్చును, ఎందుకనగా మనము మన మనసుకు తెలిసిన పాపము విషయములో జయ జీవితము కలిగియుండినా, మనమింకా యేసు వలె లేమనే విషయం ఎప్పటికప్పుడు మనకు తెలియును. ''ఇతరులతో తమను పోల్చుకొను వారు ఆత్మీయముగా బుద్ది తక్కువైన వారు'' (2 కొరింథీ 10:12). అది ఆత్మీయ గర్వమునకు మరియు అనేక ఇతర కీడులకు తప్పనిసరిగా తీసుకువెళ్లు మార్గము. మన కన్నులు యేసుపై యుంచుకొని మనము ఎప్పుడూ ఆయనతో పోల్చుకొనుచుండినట్లయితే మనము ఆత్మీయ గర్వములో పడే ప్రమాదములో ఎప్పుడూ ఉండము. పరిశుద్ధాత్ముడు యేసు యొక్క మహిమను ఎప్పుడూ దేవుని వాక్యము యొక్క అద్దములో మనకు చూపుచుండును మరియు అప్పుడు మాత్రమే మనము ఆయన వలె నుండునట్లు చేయును (2 కొరింథీ 3:18). పౌలు, తనకు ఒక గమ్యముందని, అది నశించుచున్న వారిని క్రీస్తులోనికి నడిపించుట కాదు కాని- ''దేవుని యొక్క పైనుండి వచ్చిన పిలుపు (క్రీస్తు వలె మారుట)'' వైపు పరిగెత్తుటయని చెప్పెను (ఫిలిప్పీ 3:13, 14). మరియు ''మనలో సంపూర్ణులమైన వారందరము (మన మనస్సాక్షి విషయములో, మరియు మన మనసుకు తెలిసిన పాపముపై విజయము కలిగియుండుట) అదే తాత్పర్యము కలిగియుందుము (సంపూర్ణమైన పరిపూర్ణతలోనికి సాగిపోవుట పూర్తిగా క్రీస్తు పోలికలోనికి మారుట)'' (ఫిలిప్పీ 3:15) అని చెప్పెను. ఇది ఆత్మీయముగా పరిపక్వత కలిగిన వాని యొక్క గుర్తు. దేవునిలో పరిపక్వత కలిగిన మానవుని జీవితములో దేవుని పరిచర్య మరియు సువార్త ప్రకటించుట మొదలైనవి ఈ గురితో చూచుకొన్నప్పుడు రెండవ స్థానము ఆక్రమించుకొనును.


అటువంటి దేవుని వెలుగులో నడుచుట ద్వారా మనము ఒకరితో నొకరము సహవాసము కలిగియుందుమనికూడా యోహాను చెప్పెను (1 యోహాను 1:7). అప్పుడు దేవునితో సహవాసములో మాత్రమే కాకుండా ఇతర విశ్వాసులతో సహవాసంలో కూడా సంపూర్ణమైన ఏకత్వము కలిగియుందుము. దీనికి కారణం చాలా సామాన్యమైనది. దేవుని వెలుగులో నడిచేవాడు, దేవుని ముఖము యెదుట జీవించుచు, ఎల్లప్పుడూ తనలో నుండిన లోటులను ఎరిగియుండి ఎప్పుడూ తనను తాను తీర్పు చేసికొనుచు జీవించుట చేత, ఇతర సహోదరులపై నేరము మోపుటకు ఏమి ఉండదు, ఆ విధముగా ఈ మార్గములో నడిచి వెళ్లు ఏ ఇరువురి సహోదరులకు ఎప్పుడు ఎటువంటి గొడవరాదు. ఇది కొద్దిమంది మాత్రమే కనుగొందురని యేసు చెప్పిన ఇరుకైన మార్గము (మత్తయి 7:14). దేవుని ఇంటిలో దేవుడు సమీపింపరాని తేజస్సుతో నివసించుట చేత (2 తిమోతి 6:6) మొదటగా నీతిమంతులకు కూడా తీర్పు దేవుని యింటి నుండి బయలుదేరెను (1 పేతురు 4:17, 18). ''దహించు అగ్నితో ఎవరు నివసింపగలరు....ఎవరైతే నీతిగా నడచుదురో వారే (తన గూర్చి నిజాన్ని ఎదుర్కొనువారు)'' (యెషయా 33:14, 15).


లవొదికయ సంఘములో నుండిన పెద్ద తనను తాను ఎల్లప్పుడూ తీర్పు తీర్చుకొనుచు జీవించక పోవుటయే అతడి పాపమయినది (మరియు నీవు పెద్ద అయినపుడు నీవూ అదే తప్పిదములోనికి జారిపోవుట చాలా సుళువు) మరియు అందువలననే అతడు 'దౌర్భాగ్యస్థితిలో' నుండినట్లు అతనికి తెలియలేదు (పక్రటన 3:17).


మనము నిరంతరము విరుగగొట్టబడిన స్థితిలోను మరియు నిరంతరము మనలను మనము తీర్పు తీర్చుకొను స్థితిలోను ఉండుట ద్వారా ''అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను'' అని మొఱ్ఱపెట్టునట్లు మన దినములన్ని దేవుని ముఖము ఎదుట జీవించుదముగాక. ఆ విధముగా ఒకవేళ మనము ఒక రక్షింపబడిన పాపి ఈ భూమిపై పరిశుద్ధత విషయములో చేరగలిగినంత ఎత్తుకు ఎదిగినా, అప్పటికిని మనము ''నేను విశ్వాసులలో కడమవాడను.....పాపులలో ప్రధానుడను'' (ఎఫెసీ 3:8, 1 తిమోతి 1:15) అని చెప్పుకొందుము. అట్లు మనము అదే మార్గమున నడచుచున్న మన తోటి విశ్వాసులతో సహవాసము కలిగి క్రమేణ మన మధ్య తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సహవాసమునకు సుమారుగా సమానమైనటువంటి సహవాసము కలిగియుందుము (యోహాను 17:21). ఇది యేసు మనకు ఇవ్వదలచుకొనిన క్రొత్త ద్రాక్షారసము.


క్రొత్త ద్రాక్షారసపు తిత్తులు


ఈ సందేశమును ఇప్పటివరకు ఆనందించిన వారిలో చాలా మంది క్రొత్త ద్రాక్షారసపు తిత్తిని పొందుకొనుటకు కావలసిన ధర చెల్లించుటకు యిష్టపడకపోవచ్చు. ''క్రొత్త ద్రాక్షారసము క్రొత్త ద్రాక్షారసపు తిత్తిలోనే పోయవలెను'' (లూకా 5:38). ఇక్కడనే మన విధేయత పరీక్షింపబడును.


క్రొత్త ద్రాక్షారసమును సంపాదించుకొనుటకు మన పోరాటమంతా పాపమునకు వ్యతిరేకముగా నున్నది. కాని క్రొత్త ద్రాక్షారసపు తిత్తిని సంపాదించుకొనుటకు మన పోరాటము దేవుని వాక్యమును కొట్టివేయు మత పరమైన ఆచారములకు వ్యతిరేకముగా నున్నది. పాపమును విడిచివచ్చిన దానికంటె ఈ మానవుల యొక్క ఆచారములను విడిచివచ్చుట ఎంతో ఎక్కువ కష్టముగా నుండును! కాని బలాత్కారులు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశింతురు (మత్తయి 11:12). మతపరమైన ఆచారములు బలవంతముగా వదిలించుకొంటే తప్ప పోవు.


యేసు ప్రభువు పాపమునకు వ్యతిరేకముగా బోధించుట చేత కాదు కాని, యూదులలో దేవుని వాక్యానికి బదులుగా స్థానమేర్పర్చుకొనిన మతపరమైన ఆచారములకు వ్యతిరేకముగా బోధించుటచేతనే సిలువ వేయబడెను (మార్కు 7:1-13). ఆయన లోకరీతిగా నుండిన మన నాయకులలో నుండిన వేషధారణను, వారి ఆచారములలో నుండిన పనికిరాని విలువలను బయటపెట్టి మతము పేరిట ధన సంపాదన చేయువారిని దేవాలయములో నుండి బయటికి తరిమివేసెను. దేవుని ఇంటిని పవిత్ర పర్చవలననే ఆయన ఆసక్తి ఆయనను సిలువ వేయమని తమనాయకులు అడిగేటంతగా వారికి ఆగ్రహం తెప్పించెను.


మన విషయములో కూడా 'విరుగగొట్టబడుట' మరియు క్రొత్త ద్రాక్షారసము గూర్చి బోధించుట వలన జనులు మనలను సిలువ వేయమని అడుగరు. కాని నీవు దేవుని సంపూర్ణ సంకల్పమైన ఈ క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త ద్రాక్షారసపు తిత్తిలో పోయవలెనను విషయాన్ని ప్రకటించుటకు నిశ్చయించుకొంటే, నీవు క్రైస్తవ్యములో ఉన్న ప్రతి మతశాఖ యొక్క నాయకుల ఉగ్రతను ఎదురు చూడవలసి యుండును.


క్రొత్త ద్రాక్షారసము పాత ద్రాక్షారసపు తిత్తిలో పోయకూడదని యేసు ఎందుకు చెప్పారు? పాత తిత్తి ఇంక ఎక్కువ సాగదు కనుక అది పిగిలిపోవును. పాత తిత్తి ఒకప్పుడు పాత ద్రాక్షారసము పోయుటకు ఉపయోగకరమైనది, కాని క్రొత్త ద్రాక్షారసము పోయుటకు ఉపయోగపడదు.


యూదమత వ్యవస్థ - పాత ద్రాక్షారస తిత్తి, ఒకప్పుడు పాత ద్రాక్షారసమును కలిగియుండుటకు మోషే ద్వారా దేవుని చేత నిర్దేశించబడెను. అయితే యేసు ప్రభువు ఒకసారి వచ్చి క్రొత్త నిబంధన స్థిరపరచిన తరువాత ఒక క్రొత్త ద్రాక్షారసపు తిత్తి అవసరమైనది. పాతది పోవలసియుండెను. పాతది క్రొత్త మాసిక వేయుట ద్వారా బాగు చేయుటకు కూడా వీలవ్వదని యేసు చెప్పారు. అది గుడ్డను చింపివేయును (లూకా 5:36).


మనము క్రైస్తవులుగా, పాత యూద మత ద్రాక్షారస తిత్తులను తీసివేసి క్రైస్తవ సంఘమను క్రొత్త ద్రాక్షారస తిత్తులను కలిగియున్నామని అనుకొనవచ్చును. కాని నీవు క్రైస్తవ సంఘముగా పిలిచేదానిని జాగ్రత్తగా చూచినట్లయితే, దానిలో నున్న పాత నిబంధనపు లక్షణములను చూచి నీవు ఆశ్చర్యపోవుదువు.


అటువంటివి ఎన్నో ఉండినా, కేవలం మూడు ఉదాహరణలను ఆలోచించండి.


అన్నిటికంటె మొదటిగా, యూదులలో యాజకత్వం చేసే ఒక ప్రత్యేక గోత్రము (లేవీయులు) మతపరమైన పనులన్ని చేయుటకు ఉండేవారు. యూదులందరు యాజకులు కాలేరు. అయితే క్రొత్త నిబంధన క్రింద విశ్వాసులందరు యాజకులే (1 పేతురు 2:5; పక్రటన 1:6). ఈ సత్యమును చాలామంది విశ్వాసులు వాక్యానుసారంగా అంగీకరించినా, దానిని పాటించేది మాత్రము కొద్దిమంది మాత్రమే. క్రైస్తవ గుంపులలో దాదాపు ప్రతి ఒక్కదానికి ''ప్రీస్టు'' లేక ''పాస్టర్‌'' లేక ''దేవుని సేవకుడు'' లేక ''పూర్తి కాల సేవకుడు'' ఉందురు.వీరు సరిగ్గా పాత నిబంధన కాలపు లేవీయులవలె దేవుని జనుల ఆరాధనను నడిపించుదురు. కేవలం ఈ లేవీయులు మాత్రమే క్రొత్తగా క్రీస్తును నమ్మిన వారికి బాప్తిస్మమిచ్చుట మరియు రొట్టెవిరచు కార్యక్రమము చేయుదురు. మరియు ఈ 'లేవీయులు' దేవుని ప్రజల దశమ భాగములచే పోషింపబడుదురు. కూటములలో ఈ 'లేవీయులే' అంతా అయి యుండి శరీరము యొక్క పరిచర్యకు ఏ అవకాశము లేకుండా చేయుదురు. ఒకే బోధకుడు ఉండే పద్ధతి పాత ద్రాక్షారస తిత్తి పద్ధతులలో ఒకటిగా యున్నది. క్రొత్త నిబంధన క్రింద, ప్రతి విశ్వాసి క్రొత్త ద్రాక్షారసమును త్రాగవచ్చును అనగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆత్మ యొక్క ఫలములను కలిగియుండవచ్చును. ఇద్దరు లేక ముగ్గురు ప్రవక్తలు కూటమును ప్రారంభించవలెను, ఒకరిద్దరు భాషతో మాట్లాడవచ్చును. (ప్రతిదానికి అర్థము చెప్పవలెను) మరియు ప్రతి విశ్వాసి కూటములో ప్రవచించుటకు స్వేచ్ఛ కలిగి సంఘమును కట్టవలెను. ఇది క్రొత్త ద్రాక్షారసపు తిత్తి (1 కొరింథీ 14:26-31). క్రొత్త ద్రాక్షారసము 1 కొరింథీ 13లో ప్రేమగా చెప్పబడినది. క్రొత్త ద్రాక్షారసపు తిత్తి 1 కొరింథీ 12 మరియు 14లో వివరింపబడినది. కాని ఎంతమంది విశ్వాసులు దేవుని పద్ధతిలో చేయుటకు కోరిక కలిగియున్నారు? అయ్యో! చాలా కొద్ది మంది మాత్రమే. చాలా మంది వారి పాత ద్రాక్షారసపు తిత్తితోను మరియు వారి సొమ్ములు స్వీకరించే ''లేవీయుల''తోను సంతృప్తి పడుతున్నారు.


రెండవదిగా యూదులకు వేరు వేరు విషయములు గూర్చి దేవుని చిత్తమును తెలిసికొను ప్రవక్తలుండేవారు. వారు మాత్రమే దేవుని ఆత్మను కలిగియుండుట చేత అట్లు జరిగేది. కాని క్రొత్త నిబంధన క్రింద, ప్రవక్తలకు వేరైన పని యున్నది. అది క్రీస్తు శరీరమును కట్టుపని (ఎఫెసీ 4:11,12), ఇప్పుడు విశ్వాసులందరు పరిశుద్ధాత్మను పొందగలరు కాబట్టి, ఇప్పుడు వారు వారి కొరకు దేవుని చిత్తమును తెలిసికొనుటకు ఎవరో ఒక ప్రవక్త యొద్దకు వెళ్ళనక్కరలేదు (హెబీ 8:11; 1 యోహాను 2:27). అయినప్పటికి చాలామంది విశ్వాసులకు ఇప్పటికిని ఒక దైవజనుని యొద్దకు వారు ఏమి చెయ్యవలెనో తెలుసుకొనుటకు లేక ఎవరిని వివాహము చేసికొనవలెనో మొదలైనవి తెలిసికొనుటకు వెళ్ళుట ద్వారా పాత ద్రాక్షారసపు తిత్తి జీవితమునే జీవించుచున్నారు.


మూడవదిగా, యూదులు ఒక పెద్ద జాతి ప్రజలై యుండి చాలా దూరముగా విస్తరించి యుండినా వారికి యెరూషలేము ఒక కేంద్ర స్థానముగా యుండి వారికి ఈ లోక సంబంధమైన ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు. క్రొత్త నిబంధన క్రింద యేసు క్రీస్తు మాత్రమే మనకు ప్రధాన యాజకుడు మరియు మనకున్న ఒకే ఒక కేంద్ర స్థానము దేవుని సింహాసనము మాత్రమే. యూదులకు ఒక స్థంబము నుండి ఏడు కొమ్ములు కలిగిన ఒక దీప స్తంభము ఉండెను (నిర్గమకాండము 25:31, 32). ఇది పాత ద్రాక్షారసపు తిత్తి.


క్రొత్త నిబంధనలో, ప్రతి స్థానిక సంఘము కొమ్మలేమీ లేకుండా ఒక దీప స్తంభముగా యున్నది. దీనిని పక్రటన 1:12, 20లో తేటగా చూడవచ్చును. అక్కడ ఆసియా మైనర్‌ అను ప్రాంతములో నుండిన ఏడు సంఘములు, యూదుల దీప స్తంభము వలె కాకుండా ఏడు వేరు వేరు దీప స్తంభములుగా చూపబడెను. యేసు ప్రభువు, సంఘములకు శిరస్సుగా ఆ దీపస్తంభము మధ్య నడుచుచుండెను. ఈ లోక సంబంధమైన పోపు గాని లేక సంఘముల అధ్యక్షుడు గాని ఆ దినాల్లో లేకుండెను. అలాగే ఏ విషయములోనైనా తనదే చివరి మాటగా ఉండే పెద్దగాని లేకుండెను. ప్రతి స్థానిక సంఘము స్థానిక పెద్దలచే నడిపింపబడుచుండెను. ఈ పెద్దలు, ప్రభువే వారికి శిరస్సు గనుక ఆయనకే వారు లెక్క అప్పచెప్పవలసి యుండెను. కాని మనము మనచుట్టూ జన సమూహములు ఈ రోజున ప్రత్యేకమైన పేరు పెట్టుకొని గాని, పేరు లేకుండా గాని సంస్థల పద్దతిలో ఉండుటను చూడగలము. కొందరైతే పేరు ఏమీ లేకపోయినా ఒక మతశాఖ కున్న లక్షణాలన్ని కలిగియుంటున్నారు. ఇదంతా పాత ద్రాక్షారసపు తిత్తి పద్ధతి.


దేవుడు స్థానిక సంఘమనే క్రొత్త ద్రాక్షారసపు తిత్తిని దుష్టత్వము వ్వాపించకుండునట్లు ఏర్పాటు చేసెను. ఆసియా మైనర్‌ అను ప్రాంతములో నుండిన సంఘములన్నీ ఒకే సంస్థ యొక్క శాఖలైనట్లయితే, బిలాము మరియు నీకొలాయుతుల తప్పుడు బోధలు మరియు యెజెబెలు యొక్క తప్పుడు ప్రవచనములు (పక్రటన 2:14, 15, 20) ఆ ఏడు సంఘములకు వ్యాపించి ఉండేవి. కాని వారు వేరు వేరు స్థంబములైనందున, స్ముర్న మరియు ఫిలదెల్పియలో నున్న రెండు సంఘములు వారిని వారు పవిత్రముగా ఉంచుకొన గలిగారు. నీ సంఘమును నీవు పవిత్రముగా ఉంచుకొనవలెననుకుంటే ఈ సంస్థలనే పాత ద్రాక్షారసపు తిత్తిని వదిలించుకో.


మనదేశంలో అనేక మందిని బంధకాలలో నుంచిన మానవ ఆచారములను వదిలించు కొనునట్లు బలాత్కారము చేయు వారిని మరియు ప్రతి స్థలములో క్రీస్తు శరీరమైన సంఘమును కట్టువారిని అనేకమందిని దేవుడు లేపును గాక.


అధ్యాయము 2
దేవునికి కావలసిన వారు

ఈనాడు దేవునికి కావలసిన వారు


- ఎవరైతే ప్రతి దినము ఆయన ముఖము ఎదుట నిలువబడి ఆయన స్వరము విందురో,


- ఎవరికైతే వారి హృదయములో దేవునిపై కాక దేనిపైన కాని, ఎవరిపైన కాని కోర్కె ఉండదో,


- ఎవరైతే ఏ రూపముననున్న పాపమునైనా ద్వేషించి వారి మార్గాలన్నిటిలో సత్యమును, నీతిని ప్రేమించునట్లు దేవుని యెడల గొప్ప భయము కలిగియుందురో,


- ఎవరైతే కోపాన్ని మరియు కామపూరిత పాపపు ఆలోచనలను జయించి, వారి ఆలోచనల్లో లేక వైఖరిలో పాపము చేయుట కంటే చనిపోవుట మేలు అని తలంతురో,


- ఎవరి జీవన శైలి ప్రతిదినము వారి సిలువ నెత్తికొని పరిపూర్ణులగుటకు సాగిపోవునట్లుండునో, మరియు ఎవరైతే వారి స్వంత రక్షణను ఎల్లప్పుడూ భయముతో వణకుతో కొనసాగించుకొందురో,


- పరిశుద్ధాత్మతో పూర్తిగా నింపబడి, ఇంకొకరు వారి నెంతగా కవ్వించినా వారి యెడల చూపు ప్రేమ నుండి కదలకుండునట్లు ఎవరైతే ప్రేమలో వేరుపారి యుందురో,


- ఎవరైతే మనుష్యుల యొక్క పొగడ్తలు లేక ఆత్మీయ ఎదుగుదల లేక దైవికముగా ఇవ్వబడిన పరిచర్య కాని లేక మరి ఏ ఆధిక్యతనైనా వారు పరిశుద్ధులలో కడమ వాని కంటే కూడా తక్కువ వానిననే ఆలోచన నుండి తప్పించనంతటి దీనత్వములో వేరుపారి యుందురో,


- ఎవరైతే దేవుని కార్యము ద్వారా ఆయన యొక్క స్వభావమును మరియు ఉద్దేశ్యములను అర్థము చేసికొనుచు మరియు దేవుని వాక్యములో అతి చిన్న ఆజ్ఞకు కూడా అవిధేయత చూపకుండా లేక ఇతరులకు దానిని బోధించుటలో అలక్ష్యము చేయకుండా ఉండునట్లు ఆ వాక్యమును బట్టి వణుకుచుందురో,


- ఎవరైతే మానవుల యెడల దేవుని సంపూర్ణ ఉద్దేశ్యమును ప్రకటించుచూ ఆత్మీయ జారత్వమును మరియు వాక్యానుసారము కాని మానవ ఆచారములను బహిరంగపరచుదురో,


- ఎవరికైతే దైవభక్తి గూర్చిన మర్మము గూర్చియు, క్రీస్తు మానవ శరీరముతో వచ్చి ఆయన శరీరము ద్వారా ఒక నూతనమైనదియు మరియు జీవముగలదియునైన మార్గము తెరచెనను విషయము గూర్చి పరిశుద్ధాత్మ యొక్క బయల్పాటు కలిగియుందురో,


- ఎవరైతే ఆసక్తితో కష్టపడి పనిచేయువారై యుండి హాస్యానికి తావిచ్చువారును మరియు తీరికచేసికొని పిల్లలతో ఆడుట ఎలాగో తెలిసిన వారును మరియు దేవుడు ప్రకృతిలో ఇచ్చిన మంచి విషయములను బట్టి సంతోషింపగలిగిన వారైయుందురో,


- ఎవరైతే సన్యాసులుగా నుండక, అదే సమయములో క్రమశిక్షణ జీవితాన్ని జీవిస్తూ కష్టమైన పరిస్థితులను గూర్చి భయపడరో,


- ఎవరికైతే ఖరీదైన దుస్తులపై లేక క్రొత్త ప్రదేశాలను చూచుటయందు ఆసక్తి యుండదో మరియు ఎవరైతే వారి సమయాన్ని ఆత్మీయముగా లాభకరముకాని కార్యక్రమములపై వ్యర్థ పుచ్చరో మరియు వారి యొక్క ధనాన్ని అనవసరమైన వాటిని కొనుటకు ఖర్చుచేయరో,


- ఎవరైతే రకరకాల రుచుల భోజనపదార్థాల విషయములో జయము పొందుదురో మరియు ఎవరైతే సంగీతానికి లేక ఆటలకు లేక చట్టబద్దమైన ఏ కార్యక్రమమునకైనా బానిసకారో,


- ఎవరైతే ఇబ్బందులు దూషణలు, శ్రమలు, అపనిందలు, శారీరక అస్వస్థతలు, ఆర్థిక ఇబ్బందులు మరియు బంధువుల నుండి మత పెద్దల నుండి వ్యతిరేకతల కొలిమిలో దేవుని చేత క్రమశిక్షణ పొందియుండిరో,


- ఎవరైతే, వారిని వారు పాపులలో అధములుగా చూచుకొనుట వలన పాపులలో ఘోరమైన పాపుల యెడలను, విశ్వాసులలో చెడ్డవారి యెడలను సానుభూతి కలిగియుండి, వారిని గూర్చి నిరీక్షణ కలిగియుండి, కనికరముతో నిండియుండుదురో,


- ఎవరైతే తమ పరలోకపు తండ్రి ప్రేమ యందు లోతుగా వేరుకలిగి యుండుట చేత, దేని గూర్చియు ఎప్పుడు ఆతురత పడకయుండి సాతాను గూర్చి కాని, దుష్టులైన మనుష్యుల గూర్చి కాని లేక క్లిష్ట పరిస్థితులు లేక దేని గూర్చి భయపడకుందురో,


- ఎవరైతే అన్ని విషయములు వారి మేలు కొరకై సర్వాధికారియైన దేవుడు సమకూర్చి జరిగించునని నమ్ముట చేత ఎల్లప్పుడు, మనుష్యులందరి కొరకు, అన్ని సంగతుల గూర్చి మరియు అన్ని సమయములందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింతురో,


- ఎవరైతే వారి ఆనందాన్ని దేవుని యందు మాత్రమే కనుగొనుట చేత దేవుని యొక్క సంతోషాన్ని పొందినవారై, చెడు మనోభావాలను జయించుదురో,


- ఎవరైతే వారి కున్న సహజసిద్ధమైన సామర్థ్యమునందు నమ్మికయుంచక, అన్ని పరిస్థితులలో దేవుడే వారిని సిగ్గుపడనివ్వని సహాయకుడని నమ్మి జీవము గల విశ్వాసము కలిగియుందురో,


- ఎవరైతే వారి స్వంత గ్రహణ శక్తి చెప్పు మాటలను బట్టి కాక పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి జీవించుదురో,


- ఎవరైతే నిజముగా క్రీస్తు చేత పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము పొందుదురో (అంతేకాని ఏదో ఉద్వేగపూరితమైన నఖిళీ అనుభవము, లేక వేదాంత పరమైన వాదనతో ఒప్పింపబడుట కాదు),


ఎవరైతే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఉండి, వారికి ఆయన ఇచ్చే మానవాతీత వరములతో యుందురో,


- ఎవరికైతే సంఘము క్రీస్తు యొక్క శరీరమని (ఒక సమాజము లేక మత సంస్థ కాదు) బయల్పడునో, మరియు ఎవరైతే వారి శక్తి యుక్తులు, వారి వస్తు వాహనాలు మరియు ఆత్మీయవరాలు ఆ సంఘమును కట్టుటకు వెచ్చింతురో,


- ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా వారి నాలుకలకు కళ్లెము వేయుట నేర్చుకుందురో మరియు ఎవరి నాలుకయితే ఎప్పుడూ దైవికమైన వాక్యముతో మండుచుండునో


- ఎవరైతే అన్నిటిని విడిచిపెట్టి, ధనానికి కాని వస్తు వాహనాలకు కాని అతుక్కుని ఉండరో, మరియు ఎవరైతే ఇతరుల నుండి ఏ బహుమతులను ఆశించరో,


- ఎవరైతే వారి ఇహలోక అవసరాలన్నిటిని గూర్చి దేవుని యందే నమ్మిక యుంచెదరో మరియు ఎవరైతే వారి భౌతిక అవసరాల గూర్చి ఎప్పుడూ ఎవరికీ తెలియునట్లు ప్రవర్తించరో లేక వారు పడిన శ్రమల గూర్చి వారి మాటలలో కాని లేక ఉత్తరాల నివేదికల ద్వారా తెలియపర్చరో,


- ఎవరైతే మొండిగా నుండక మర్యాదగాను, విమర్శకు తావిచ్చువారి గాను మరియు తమకంటే పెద్దవారి నుండి మరియు జ్ఞానము గల సహోదరుల నుండి దిద్దుబాటు తీసుకొనుటకు ఆశ కలిగియుందురో,


- ఎవరైతే ఇతరులను అదిగమించాలని లేక ఇతరులకు సలహా ఇవ్వాలని (అయితే అడిగినప్పుడు సలహా ఇచ్చుటకు సిద్ధముగా ఉండవలెను), మరియు నాయకులుగా పెద్దలుగా అనిపించుకొనుటకు ఆసక్తి లేని వారును, ఎవరైతే కేవలము సామాన్యమైన సహోదరులుగా మరియు అందరికి సేవకులుగా ఉండుటకు ఆశ కలిగియుందురో,


- ఎవరితోనైతే సులువుగా కలిసిపోగలమో, మరియు ఎవరైతే యిబ్బంది పర్చబడుటకు ఇష్టపడుదురో మరియు ఇతరులు వారిని ఉపయోగించుకొనుటకు యిష్టపడుదురో,


- ఎవరైతే లక్షాధికారికిని భిక్షమెత్తుకొనువానికిని, తెలుపు రంగు చర్మమునకును నలుపు రంగు చర్మమునకును, తెలివితేటలు కలవారికిని తెలివిలేని వానికిని మరియు నాగరికునికి మరియు అనాగరికుల మధ్య తేడా చూపక అందరిని ఒకేలా చూచునో,


- ఎవరైతే తన భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు లేక ఇతర విశ్వాసుల చేత క్రీస్తు యెడల తనకున్న అంకిత భావమునుండి లేక దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట నుండి ఏ మాత్రము తగ్గకుండా చూచుకుందురో,


- ఎవరైతే దేవుని నియమముల విషయములో రాజీపడుటకు సాతాను ఎటువంటి ఆశను చూపినా అటువంటి లంచమునకు (అది ఘనత లేక ధనము లేక ఇంకేదైనా కావచ్చు) లొంగరో, ఎవరైతే మన నాయకులకు కాని, ప్రభుత్వ అధినేతలకు కాని భయపడక క్రీస్తు కొరకు భయము నెఱుగని సాక్షులుగా నుందురో,


- ఎవరైతే దేవునిని కాదని ఈ భూమిపై నుండిన ఏ మానవుని సంతోషపర్చుటకు ఆశ చూపరో, మరియు దేవునిని సంతోష పర్చుటకు అవసరమైతే మనుష్యులందరినీ అభ్యంతపర్చుటకు (కోపము తెప్పించుటకు) ఇష్టపడుదురో,


- ఎవరికైతే దేవుని మహిమ, దేవుని చిత్తము మరియు దేవుని రాజ్యము మానవ అవసరము కంటే మరియు వారి స్వంత సౌఖ్యము కంటే ముందుగా నుండునో,


- ఎవరైతే దేవుని కొరకు ''నిర్జీవ క్రియలు'' చేయుటకు ఇతరుల చేత కాని, లేక వారి స్వంత ఆలోచన చేతకాని బలవంత పెట్టబడకుండా యుండి, వారి జీవితాల్లో దేవుని చేత బయల్పర్చబడినవి మాత్రమే చేయుటకు ఆసక్తి మరియు సంతృప్తి కలిగియుందురో,


- ఎవరైతే క్రైస్తవ పనిలో ఆత్మీయమైన దానిని మరియు మనసుకు సంబంధించిన దానిని వేరు చేసి చూడగలిగియుందురో,


- ఎవరైతే విషయాలను భూసంబంధ దృష్టితో కాక పరలోక సంబంధ దృష్టితో చూచుదురో,


- ఎవరైతే దేవుని కొరకు వారు పడిన శ్రమకు వారికివ్వ జూపే ఇహలోక సంబంధమైన బిరుదులన్నిటిని మరియు ఘనతలన్నిటిని తిరస్కరింతురో,


- ఎవరైతే మానక ప్రార్థింతురో మరియు అవసరమైనప్పుడు ఉపవాసముండి ప్రార్థింతురో,


- ఎవరైతే ధారాళముగా, సంతోషముగా, రహస్యముగా మరియు జ్ఞానముతో ఇచ్చుటను నేర్చుకుందురో,


- ఎవరైతే మనుష్యులందరి కొరకు వారిలో కొందరినైనా రక్షించుటకు అన్ని విషయములలో వారివలె అగుటకు యిష్టపడుదురో,


- ఎవరైతే ఇతరులు రక్షింపబడవలెనను కోర్కె మాత్రము కాక, వారిని క్రీస్తు యొక్క శిష్యులుగా చేయవలెననియు, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికి విధేయత చూపునట్లు వారిని సత్యము యొక్క గ్రహింపులోనికి తేవలెనని ఆశ కలిగియుందురో,


- ఎవరైతే ప్రతి స్థలములో దేవుని కొరకు స్వచ్ఛమైన సాక్ష్యము స్థిరపర్చబడుట చూచుటకు ఆశ కలిగియుందురో,


- ఎవరికైతే సంఘములో క్రీస్తు మహిమ పర్చబడవలెననే ఆశ మండుచుండునో,


- ఎవరైతే ఏ విషయములోనూ తమ స్వప్రయోజనమును వెదకుకొనరో,


- ఎవరైతే ఆత్మీయమైన అధికారము మరియు ఆత్మీయమైన గౌరవము కలిగియుందురో,


- ఎవరైతే అవసరమయితే దేవుని కొరకు లోకములో ఒంటరిగా నిలువబడుదురో, - ఎవరైతే పాతకాలపు ప్రవక్తలు మరియు అపొస్తలుల వలె ఏ మాత్రము రాజీపడని వారుగా యుందురో, అటువంటి వారు కావలసియున్నది.


అటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉండుట చేత ఈనాడు లోకములో దేవుని పని ఇబ్బంది పడుచున్నది. పాపముతోను మరియు అవినీతితోను నిండిపోయిన జనాంగము మద్యన మరియు రాజీపడుచున్న క్రైస్తవ్యము మధ్య అటువంటి దైవజనునిగా యుండుటకు నీ హృదయమంతటితో నిశ్చయించుకొనుము. దేవునికి పక్షపాతము ఉండదు కావున, నీవు కూడా అటువంటి వానిగా నుండుట సాధ్యమే, అయితే, నీ మట్టుకు నీవు అటువంటి వానిగా నుండుటకు ఆసక్తి కలిగియుండవలెను. దేవుడు ఒకని జీవితములో అతడికి తెలిసినంత వరకే చేయుట కొరకు కాని, విధేయతను కాని అడుగుచున్నాడు. కనుక నీ జీవితములో దైవిక జీవితము గూర్చిన అవగాహన నీకు కొద్దిగా యుండినా, (నీవు దేవుడిచ్చు వెలుగలో నడుస్తూ సంపూర్ణతలోనికి సాగిపోవుచున్నప్పుడు నీలో ఆ అవగాహన పెరుగుచుండును) నీవు అటువంటి వానిగా కావచ్చును. అటువంటప్పుడు నీవు అటువంటి వానిగా నుండకుండుటకు కారణమేమి లేదు. శరీరములో మంచిది ఏదీ నివసించదు కాబట్టి, పైన చెప్పబడిన లక్షణముల కొరకు మనము దేవుని కృపను కోరుకొనవలసియున్నది. కాలము సమాప్తమగుచున్న ఈ రోజులలో అటువంటి వానిగా, నుండుటకు ప్రతిదినము దేవునికి మొఱ్ఱపెట్టుము, అప్పుడు ఆయన నీకు కృప నిచ్చును. ఆమేన్‌.


అధ్యాయము 3
దేవునికి కావలసిన స్త్రీలు

దేవుడు ప్రారంభములో హవ్వను సృష్టించినప్పుడు ఒక స్త్రీ ద్వారా ఆయన ఎటువంటి మహిమను ప్రత్యక్షపరచాలని ఉద్దేశించెనో, దానిని నమ్మకముగా ప్రత్యక్షపరచే స్త్రీలు ఈనాడు దేవునికి అవసరమైయున్నారు.


భర్తకు సహాయకురాలుగా ఆమె యొక్క మహిమ


దేవుడు హవ్వను సృష్టించినప్పుడు ఆమె ఆదాముకు సాటియైన ''సహాయకురాలు''గా ఉండునట్లు ఆమెను సృష్టించెను (ఆదికాండము 2:18). ఈ పరిచర్య మహిమను, యేసు ప్రభువు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా చెప్పుటను మనము (యెహాను 14:16) గమనించినప్పుడు చూడగలము.


పరిశుద్ధాత్ముడు కనబడకుండా, మౌనముగా నుండినా శక్తివంతముగా విశ్వాసికి ఎలా సహాయము చేయునో, స్త్రీ కూడా మగవాడికి అలా సహాయము చేయుటకు సృష్టింపబడినది. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ''తెరవెనుక'' నుండును. స్త్రీలు కూడా అలాంటి పరిచర్యలో ఉండవలెను.


యేసు ప్రభువు యొక్క జీవితము కూడా స్త్రీలకు మాదిరికరమైనదే. తండ్రియైన దేవుడు క్రీస్తుకు ఎలా శిరస్సైయున్నాడో ఖచ్చితంగా ఆ విధముగానే పురుషుడు స్త్రీకి శిరస్సైయున్నాడు (1 కొరింథీ 11:3). యేసు ప్రభువు ఎల్లప్పుడు తన తండ్రికి లోబడి జీవించెను. దేవునికి భయపడే స్త్రీ కూడా తన భర్త విషయములో అలాగే ఉండును. హవ్వ నిర్ణయం తీసుకొనే ముందు తన భర్తతో సంప్రదించకపోవుటయే ఆమె ఏదేను వనములో చేసిన గొప్ప పొరపాటు. ఆ విధముగా సాతాను ఆమెను మోసగించాడు (1 తిమోతి 2:14) హవ్వ ఎక్కడైతే తప్పిపోయినదో ఆ విషయంలో, యేసు ప్రభువు తన తండ్రికి లోబడినట్లుగా మరియు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా (ఎఫెసీ 5:24) స్త్రీలు తమ భర్తలకు లోబడుటలో నున్న మహిమను ప్రత్యక్షపరచుటకై దేవుడు ఈనాడు క్రైస్తవ భార్యలను పిలిచెను.


లూసిఫరు యొక్క తిరుగుబాటు ద్వారా పాపము విశ్వములోనికి ప్రవేశించినది, క్రీస్తు యొక్క విధేయత ద్వారా రక్షణ వచ్చినది. దేవుని అధికారానికి అణకువతో లోబడే ఆత్మే లోకములో అతిగొప్ప శక్తి - ఎందుకంటే అది క్రీస్తు యొక్క ఆత్మయై యున్నది. ఆ ఆత్మ, తిరుగుబాటు చేసే ఆత్మలన్నిటిని సిలువపై జయించెను. ఒక భార్య తన భర్తకు లోబడినప్పుడు, నిజానికి ఆ విధముగా చేయమని చెప్పిన దేవుని వాక్యపు అధికారానికి లోబడుచున్నది. మరియు ఆ విధముగా ఆమె చేయుటకు లోకములో నున్న అతి గొప్పశక్తి ఆమెపై ప్రభావము చూపుట చేత క్రీస్తు నెరుగని భర్తలు కూడా ఆ శక్తిచేత జయించపబడుదురు (1 పేతురు 3:1, 2). ఆమె యొక్క ఇహలోక జీవితములో ఆమె అటువంటి లోబడే ఆత్మతో నుండినట్లయితే, ఆమె ఒక జయించు స్త్రీగా నుండి, యేసు ప్రభువుతో కలసి యుగయుగములు పాలించును (పక్రటన 3:21).


ఇక్కడే సాతాను తిరిగి స్త్రీలను మోసగిస్తున్నాడు. దేవదూతలను ఎలా తిరుగుబాటు ఆలోచనతో తప్పుత్రోవను పట్టించాడో అలాగే స్త్రీలను తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. ఒక తిరుగుబాటుచేసే భార్య తన ఇంటిని పనికిరాని ఏ ఎడారి కంటే కూడా భయంకరముగా తయారు చేయును (సామెతలు 21:19 లో చెప్పబడిన దానికి ఉద్దేశమదే). దానికి బదులుగా ఒక గుణవతియైన లోబడే భార్య తన భర్తను రాజును చేయుట ద్వారా తన ఇంటిని ఒక రాజ భవనముగా మార్చును (సామెతలు 12:4). ఆత్మీయముగా చెప్పుకొన్నట్లయితే నీ గృహము ఒక రాజ భవనమైనా కావచ్చును లేక ఒక ఎడారి అయినా కావచ్చును. అది నీవు ఎటువంటి భార్యవు అను దానిపై ఆధారపడియుండును. అందుచేతనే దేవుడు వినయము, అణకువ గల ఆత్మను ఎక్కువ విలువైనదిగా చూచును (1 పేతురు 3:4).


సామెతలు 31:10-31లో గుణవతియైన భార్య యొక్క గుణములు గూర్చి చెప్పబడినది. అందులో ఆమె హృదయము, చేతులు మరియు నాలుక శ్రేష్టమైనవిగా వివరింపబడెను.


ఆమె సొగసు గూరిచ ఏమీ చెప్పబడలేదు, కాని అవి వ్యర్థమైనవియు మరియు మోసకరమైనవని చెప్పబడెను (30వ). ఈ సత్యాన్ని స్త్రీలందరూ ప్రత్యేకంగా పెళ్లి వయస్సు వచ్చిన యువతులు గ్రహించుట ఎంతో శ్రేష్టమైనది.


అందులో చెప్పబడిన గుణవతికి దేవునికి భయపడే హృదయమున్నది (30వ). ఇదే ఆమె జీవిత మంతటికి పునాదిగా నున్నది. ఆమె తన చేతులను బట్టలుతుకుతూ, వంట చేస్తూ, మొక్కలు నాటుతూ మరియు బీదలకు సహాయపడుతూ ఉపయోగించును (13-22వ). ఆమె అన్ని వేళలా తన నాలుకను జ్ఞానముతోను కృపతోను ఉపయోగించును (26వ). ఆమె అందముగా లేకపోయినా దేవుని భయము కలిగి, కష్టపడి పని చేయుచు దయకలిగియుండును. దేవుని యొక్క మహిమ ఆమె యొక్క స్వచ్ఛమైన హృదయము ద్వారాను, గరుకుగానుండిన చేతుల ద్వారాను మరియు సున్నితముగా మాట్లాడే నాలుక ద్వారాను కనపరచబడుచుండెను. (లోకస్థులైన స్త్రీలు, దీనికి వ్యతిరేకముగా అపవిత్రమైన హృదయము కలిగియుండి, మెత్తని చేతులు కలవారై, రుకుగా మాట్లాడే నాలుకను కలిగియుందురు!). ఈ విషయాలలోనే దేవుడు తన మహిమను చూపుటకు ఈనాడు స్త్రీల కొరకు చూచుచున్నాడు).


ఒక భార్యగా ఈ గుణవతియైన భార్య తన భర్తకు నిజమైన సహాయకురాలుగా నుండును. తన భర్తకు ఆమె జీవితాంతము వరకు ఒకే విధముగా - అప్పుడప్పుడు కాకుండా ఎల్లప్పుడు మేలు చేయును. ఇంకొక మాటలలో చెప్పవలెనంటే అతడిపై ఆమెకుండిన మొదటి ప్రేమను ఎప్పటికీ ఆమె పోగొట్టుకొనదు. ఆమె అతడి ఉద్యోగమునకు, సేవలో పిలుపునకు తగినట్లుగా సర్దుకొని, అతడి రాబడికి తగినట్లు ఇంటి ఖర్చులలో జాగ్రత్తచేసి, డబ్బు ఏమీ వ్యర్థమవకుండునట్లు పొదుపుగా నుండి జాగ్రత్తగా ఖర్చుచేయును. ఆమె భర్త ప్రభువు పరిచర్యకు ఉపయోగపడునట్లు అతడికి ఇంటి వ్యాపకాల నుండి స్వేచ్చ నిచ్చును (23-27వ). అటువంటి స్త్రీని ఆమెభర్త లోకములో నున్న అందరు స్త్రీల కంటే (ప్రధానమంత్రులైన స్త్రీలు, బోధకులైన స్త్రీలతో సహా) నీవు శ్రేష్టమైన దానవు (29వ) అని పొగుడుటలో ఆశ్చర్యమేమీలేదు. ఆ విధముగా అందరిలో పొగడబడుటకు కూడా ఆమె అర్హురాలే (31వ). ఎందుకంటే స్త్రీగా ఆమె యొక్క పిలుపులో మహిమను ఆమె గ్రహించినది (31వ).


మన ఇళ్లల్లో ''పరిశుద్ధులకు పరిచారము చేయుటకు'' క్రొత్త నిబంధనలో ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడినది. ''ఆకలి గొన్నవారికి ఆహారమిచ్చుచు, రాత్రియందు ఉండుటకు చోటు, అక్కరగొన్న వానికి స్థలము నిచ్చుచు సంతోషముతో శ్రద్దగా ఆతిథ్యమియ్యుడి'' (1 పేతురు 4:9; రోమా 12:13). ఆతిథ్యము విషయములో ఇంటిలో భార్యదే ముఖ్యమైన బాధ్యత. ఆమె ఒక ప్రవక్తకాకుండానే, ఒక ప్రవక్తను కేవలము తన ఇంటిలోనికి ఆహ్వానించుట ద్వారా ఆమె ఒక ప్రవక్త ఫలమును పొందును (మత్తయి 10:41). అలాగే యేసు క్రీస్తు శిష్యులలో అతిచిన్న వానికి ఆతిథ్యమిచ్చుటచేత ఆమె తగిన ప్రతిఫలము పొందును (మత్తయి 10:41). ఒక అపొస్తులునికి ఇంటిలో ఆతిథ్యమిచ్చుట యేసుప్రభువును చేర్చుకొనుటతో సమానమైనది (మత్తయి 18:5). ఈ ఆతిథ్యము విషయములో సహోదరీలకు ఎటువంటి అద్భుతమైన అవకాశములు తెరువబడి ఉన్నవి. పేతురు, పౌలు ఉత్తరాలు వ్రాసిన క్రైస్తవులు చాలా బీదవారు. వారు కేవలము పరిశుద్ధులకు సామాన్యమైన భోజనము, నిద్రించుటకు నేలపై పడక మాత్రము ఇమ్మనమని వారిని అడిగిరి. గొప్ప భోజనము పెడితేనే ఆతిథ్యమనుకోకుండునట్లు, 1 తిమోతి 5:10లో బీద విధవరాండ్రు కూడా తమ గృహాలలో పరిశుద్ధులకు ఉపచారము చేసిన విషయం వ్రాయబడినది!


తను ఒక ఇంటిని కట్టుటకు పిలువబడిన దానినని చూచిన స్త్రీలో దేవుని మహిమను చూడగలము.


తల్లిగా ఆమె యొక్క మహిమ


ఆమె తల్లి కాబట్టి ఆదాము తన భార్యను ''హవ్వ'' అని పిలిచెను. దేవుని సన్నిధి యొక్క స్వచ్ఛమైన వెలుగులో ఆదామునకు అతడి భార్య యొక్క పరిచర్య ఏమిటో తేటగా తెలిసెను. హవ్వకు కూడా అది తెలిసెను. అయితే పాపము మరియు మానవ పద్ధతులు (సాతాను చేత ప్రభావింపబడి) ఇప్పుడు స్త్రీ యొక్క గ్రహింపు మబ్బుకమ్మినట్లు చేసినవి. అందువలన స్త్రీ ఇప్పుడు తల్లిగా ఆమె మహిమను చూచుకో లేకపోవుచున్నది. పిల్లలు ఇప్పుడు దేవుని మాటలలో 'వరములుగా' కాక (కీర్తన 127:3) సాతాను మాటలలో ''అనుకోకుండా'' కలిగిన వారు అని పిలువబడుతున్నారు. ఎక్కడైతే దేవుడు వారిని ఒక 'ఆశీర్వాదముగా' గుర్తిస్తున్నాడో, వారు 'విసుగుగా' కూడా పరిగణిస్తున్నారు (కీర్తన 127:5, 128:4). ఇది క్రైస్తవులని పిలువబడుచున్న వారు కూడా దేవుని నుండి తప్పిపోయి ఎంతగా సాతాను కలిగించు ఆలోచనలలోనికి వెళ్ళిపోయారో తెలియజేస్తుంది.


అయితే తిమోతి యొక్క తల్లి పూర్తిగా వేరైనది. ఆమె యొక్క పిలుపును ఆమె తేటగా చూడగలిగినది. ఆమె భర్త ఒక అవిశ్వాసి అయినా (అపొ.కా.16:1) అది ఆమె విశ్వాసాన్ని ఆరిపోచేయలేదు. ఆమె 'నిష్కపటమైన విశ్వాసురాలు' మరియు దేవుని వాక్యము తెలిసినది (2 తిమోతి 1:5). ఆమె తిమోతికి దేవుని వాక్యమును నేర్పించినది (2 తిమోతి 3:14, 15). అంతకంటే ముఖ్యముగా ఆమె అతనికి విశ్వాసాన్ని నూరిపోసినది. లోకమంతా విషతుల్యమైన అవిశ్వాసపు గాలులు పీల్చుకొనుచుండగా, తిమోతి ఇంటిలో అతడి తల్లి అతడు స్వచ్ఛమైన 'విశ్వాసపు' గాలి పీల్చుకొనేలా చేసినది. బహుశా అతడు తన తల్లి తరుచుగా ప్రార్థనలో గడుపుట, తరుచుగా దేవుని స్తుతించుట, కష్ట సమయాల్లో దేవుని యందు నమ్మకము కలిగియుండుట చూచిఉండవచ్చు. ఎందుకంటే ఇవన్ని ''నిష్కపటమైన విశ్వాసము'' యొక్క కొన్ని లక్షణములు. ఆశ్చర్యమేమీ లేదు. అతడి తల్లి యొక్క ప్రయాస చివరకు ఫలించెను.


ఇది 21వ శతాబ్దపు తల్లులందరికి సవాలుగా ఉండవలెను. నూరేళ్ల పాటు లోకమంతా ఒక బోధకురాలిగా తిరిగినా చేయలేని పనిని తన గృహములో 16-20 ఏళ్లపాటు ఒక శ్రేష్టమైన తల్లిగా ఉంటూ ప్రభువు కొరకు ఆయన సంఘము కొరకు తిమోతి తల్లియైన యునీకే చేసెను! ఇటీవల కాలములో సూసన్నావెస్లీ గూర్చి మనము వినియుంటిమి. ఆమె 15మంది బిడ్డలకు తల్లియై యుండి పేదరికముతో, కొందరు పిల్లలు మరణించిన పరిస్థితులలో నుండినది. కాని, ఆమె మిగిలిన ప్రతివారికి దేవుని భయమును బోధిస్తూ పెంచినది. వారిలో ఒకడైన జాన్‌వెస్లీ పెరిగి పెద్దవాడై దేవుని చేతిలో గొప్ప పనిముట్టుగా ఆయెను. ప్రపంచమతా అనేకులు గత రెండు శతాబ్దాలుగా ఆయన సేవ ద్వారా ఆయన వ్రాతల ద్వారా దీవింపబడిరి. సూసన్నా వెస్లీ తన కుటుంబమును నిర్లక్ష్యము చేసి డబ్బు సంపాదనకు బయటకు వెళ్లినట్లయితే లేక ప్రంచమంతా బైబిలు బోధకురాలుగా కాని లేక సువార్తికురాలుగా కాని పర్యటించినా తన కుమారుడు దేవుని కొరకు నెరవేర్చిన దానిలో లేశమాత్రమైనా నెరవేర్చకపోయి యుండును.


పౌలు స్త్రీల పరిచర్య గూర్చి తిమోతికి తెలుపుతూ స్త్రీలకు బోధించే పరిచర్య కాని, పెద్దలుగా ఉండే పరిచర్య కాని లేకపోయినా వారు మాతృత్వపు పరిచర్య కలిగియుండవచ్చునని చెప్పెను (1 తిమోతి 2:12, 15). ఆ పత్రిక సందర్భమును చూస్తే మాతృత్వము కూడా సంఘములో ఒక పరిచర్యగా పౌలు పరిగణించెను. దేవునికి భయపడే తల్లులుగా ఉండేందుకు దేవుడు స్త్రీలను పిలిచిన రెండవ పరిచర్య ఇదే. తిమోతి తన చిన్నతనమందే తన గృహములో ఈ మహిమను చూచియున్నాడు. ఇప్పుడు ఆయన ఎఫెసులో ఇతరులకు బోధించెను.


జీవితములో అన్ని వృత్తులలో పురుషులు స్త్రీలను అధిగమించుదురు. ఒక విషయములో మాత్రము స్త్రీలు విశిష్టమైన వారిగా ఉన్నారు - అది 'తల్లులుగా'. దేవుడు స్త్రీని ఎందుకు సృష్టించెనో ఈ విషయమే సూచిస్తున్నది. ఎక్కువ డబ్బు సంపాదించి తద్వారా సుఖసౌఖ్యాలలో జీవించుటకు పనికి వెళ్లుట లేక బోధకులుగా ఉండుట వలన తమ పిల్లలను నిర్లక్ష్యం చేసినవారు తమ జీవితాల యొక్క చివరి దశలలో తమ పిల్లలు ఏదో ఒక విధముగా ఇబ్బందిపడుట చూడవలసి వచ్చిన విషాదకరమైన అనుభవమును కలిగియుందురు. వారు ఇప్పుడు పశ్చాత్తాపపడుట తప్ప ఇంకేమి చేయలేరు. ఇది యౌవన తరము తల్లులకు ఒక హెచ్చరికగా ఉండవలెను. తన కుటుంబము యొక్క ఆర్థిక మనుగడ నిమిత్తము ఒక తల్లి పనికివెళితే, దేవుడు ఖచ్చితముగా ఆ కుటుంబానికి అదనపు కృపను ఇచ్చును. కాని, ఆమె ఉద్దేశ్యము విలాసవంతమైన జీవితము మరియు ఉన్నత జీవన ప్రమాణమైన యెడల ఆమె కేవలము క్షయమను పంటను కోయును. ఎందుకనగా దేవుడు వెక్కిరింపబడడు (గలతీ 6:7, 8).


తమ పిలుపు యొక్క మహిమను చూచు నిమిత్తము తల్లులందరి నేత్రములు తెరవబడును గాక.


క్రీస్తుకు సాక్షిగా ఆమె యొక్క మహిమ


మనము చూచిన విధముగా తన భర్తకు సహాయకురాలిగా ఉండుట మరియు తన పిల్లలకు తల్లిగా ఉండుటయే క్రీస్తు కొరకు ఒక స్త్రీ యొక్క ప్రధానమైన సాక్ష్యము. కాని దేవుడు ఆమెను ఆమె నోటి ద్వారా క్రీస్తుకు సాక్షిగా ఉండాలని పిలిచెను. క్రొత్త నిబంధన యుగములో దేవుడు స్త్రీని అపొస్తలునిగా, ప్రవక్త్రిగా, సువార్తీకురాలుగా, కాపరిగా లేక ఉపదేశకురాలుగా పిలువలేదు. పాత నిబంధన క్రింద ప్రవక్త్రిలు ఉండిరి - వారిలో చివరి ప్రవక్తి అన్నా. కాని పెంతెకొస్తు దినము తరువాత, క్రొత్త నిబంధన క్రింద ఉన్న ఏకైక ప్రవక్త్రి, అబద్ధ ప్రవక్త్రియైన యెజెబెలు (పక్రటన 2:20). కాబట్టి ఈరోజు ప్రవక్త్రినని లేక బోధకురాలినని చెప్పుకొనే ప్రతి స్త్రీ యెజెబేలు యొక్క అనుచరురాలు. ఈ విషయాన్ని అందరూ గ్రహించవలెను. దేవుని 'ఏలీయా'లందరు అటువంటి 'యెజెబెలు'లందరిని ఎదిరించి బయటపెట్టవలెను (1 రాజులు 21:20-23). క్రొత్త నిబంధనలో, ఫిలిప్పు కుమార్తెల వలే స్త్రీలు అప్పుడప్పుడు ప్రవచింపవచ్చును (కాని ఈ సహోదరీలు ప్రవక్త్రిలు కాదన్న విషయము స్పష్టమైనది; ఎందుకనగా అపొస్తలుడైన పౌలు ఫిలిప్పు ఇంటిలో నున్నప్పుడు దేవుడతనికి ఒక సందేశము ఇవ్వదలచినప్పుడు, ఆయన ఫిలిప్పు యొక్క కుమార్తెలను వాడుకోలేదు. కాని, 50మైళ్ల దూరము నుండి అగబు అను ప్రవక్తను తీసుకువచ్చెను (అపొ.కా.21:8-11). యేసు తన అపొస్తలునిగా ఉండటకు ఏ స్త్రీని పిలువలేదు ఎందుకనగా ఒక స్త్రీ పురుషునిపై అధికారము కలిగియుండుట ఆయన ఉద్దేశ్యము కాదు (1 తిమోతి 2:12). ఈ పరిచర్యలో ఏదియు స్త్రీలకు తెరువబడి లేకున్నప్పటికీ, వారు క్రీస్తుకు ఇంకా అనేకవిధాలుగా సాక్షులుగా ఉండవచ్చు.


మగ్దలేనే మరియ పునరుత్థానుడైన క్రీస్తుకు మొదటి సాక్షి. ఆమె సువార్తీకురాలు కాదు గాని ఆమె చూచిన దానిని, అనుభవించిన దానిని ఆమె నమ్మకముగా సాక్ష్యము చెప్పినది. క్రీస్తు కొరకు అటువంటి సాక్షిగా నుండుటకు (పెంతెకొస్తు దినమున మరియ తదితర స్త్రీల వలే) ప్రతి స్త్రీ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందవలసియున్నది (అపొ.కా. 1:8, 14). భారతదేశములో నుండిన సాంఘీక కట్టుబాట్ల వలన స్త్రీలు మగవారి నోటి నుండి సువార్త వినుటకు అనేక ఆటంకములున్నవి. కేవలము ఆత్మచేత నింపబడిన స్త్రీలు మాత్రమే అటువంటి వారిని చేరగలరు. దేవునికి భయపడే ప్రతి సహోదరి, తను కలుసుకొనే ప్రతి బంధువుకు, స్నేహితులకు, పొరుగువారికి, ఇంట్లో పనిచేసే పనికత్తెకు మొదలగు వారికి సువార్త చెప్పే బాధ్యతను చేపట్టాలి.


క్రొత్త నిబంధన స్త్రీలు సంఘములో ప్రార్థించుట మరియు ప్రవచించుట చేయవచ్చునని బోధించుచున్నది. అయితే అట్లు చేయునప్పుడు వారి తలపై ముసుగు వేసుకొనవలెను (1 కొరింథీ 11:5). సంఘము కట్టబడుటకు ప్రార్థన ఒక ముఖ్యమైన పరిచర్య. సహోదరీలందరు అందులో పాలుపొందవచ్చును. ఆయన ఉద్దేశాలు నెరవేరుటకై రహస్యముగా ప్రార్థన చేయు స్త్రీల కొరకు దేవుడు ఈ రోజు నిశ్చయముగా చూచుచున్నాడు. స్త్రీలు ప్రవచింపవచ్చు కూడా. అపొ.కా. 2:17, 18లో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు స్త్రీ పురుషులు ప్రవచింతురు అని తేటగా చెప్పబడినది. క్రొత్త నిబంధన క్రింద ఇది స్త్రీలకున్న ఆధిక్యతలో ఒక భాగము. ఆమె సంఘ కూడికలో దేవుని వాక్యమును విధేయతతో కూడిన ఆత్మలో పంచుకోవచ్చును అయితే ఆమె బోధించుటకు ప్రయత్నించకూడదు (1 తిమోతి 2:12). వయస్సులో పెద్దవారైన స్త్రీలు ఇంటిలో వారి ప్రవర్తన విషయములో, ఆచరణాత్మకమైన విషయాలను యౌవన సహోదరీలతో పంచుకొనవలెనని హెచ్చరింపబడుచున్నారు (తీతు 2:4, 5). సంఘములో దేవుడిచ్చు ఆత్మ వరములలో 'ఉపకారములు' (1 కొరింథీ 12:28). స్త్రీలందరు అవసరానుగుణంగా సంఘములో ఉపకారము చేయుటకు ఈ ఆత్మ వరము అడుగవచ్చును. ఆది సంఘములో అటువంటి భక్తిగల సహోదరీలు అనేకమంది ఉండిరి. (''ఫీబె అనేకులకు సహాయకురాలైయుండెను'' రోమా 16:1, 2, 3, 6, 12 వచనాలు కూడా చూడండి). ఈ రోజున కూడా సంఘములో అనేకులు ఉండవలెనని దేవుడు ఆశించుచున్నాడు.


స్త్రీ తలపైన ముసుగు వీటికి సాదృశ్యముగా ఉన్నది (1 కొరింథీ 11:1-16 వచనములు).


1. పురుషుని మహిమపై సంఘములో ముసుగు ఉండవలెను (7వ వచనము).


2. స్త్రీ మహిమపై కూడా సంఘములో ముసుగు ఉండవలెను - స్త్రీ తలవెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము (15వ వచనము). స్త్రీలకు ఈ విషయము తెలుసు. కావున తమ తలపై ముసుగు వేసుకొనువారిలో కూడా అనేకులు పాక్షికముగా మాత్రమే ముసుగు వేసుకొందురు.


3. స్త్రీ పురుషుని అధికారమునకు లోబడి యుండవలెను (10వ వచనము) - అది భర్త లేక తండ్రి లేక సంఘ పెద్ద కావచ్చు.


స్త్రీలు వారి వస్త్రధారణ విషయములో కూడా క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా ఉండవలెను. స్త్రీలు తగుమాత్రపు వస్త్రములతో తమ్మును అలంకరించుకొనవలెనని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. క్రైస్తవ స్త్రీలు తమయొక్క దయ మరియు మంచిగుణమును బట్టి గుర్తించబడవలెను కాని తలవెంట్రలను రకరకాలుగా అలంకరించుకొనుట, ఖరీదైన దుస్తులు మరియు నగల వలన కాదు (1 తిమోతి 2:9, 1 పేతురు 3:3). దుస్తులు స్త్రీల శరీరములను కప్పుటకే తప్ప బహిరంగ పర్చుటకు కాదు. ఒక దైవభక్తి గల సహోదరి ఈ లోకానుసారమైన స్త్రీవలె తన బట్టలను కత్తిరించి కుట్టబడునట్లు దర్జీవాడిని అనుమతించదు. మెడ క్రిందకి కుట్టబడిన జాకెట్లు, క్రిందకి కట్టబడిన చీరలు, రంగు పూసుకున్న పెదవులు, గోళ్ళు యెజెబెలును అనుసరించు వారి గుర్తులు తప్ప యేసు క్రీస్తు శిష్యులకు గుర్తులు కావు. (యెషయా 3:16-24 జాగ్రత్తగా చదవండి. ఈ వాక్య భాగములో దేవుడు లోకానుసారులైన సీయోను కుమార్తెల యొక్క లోకానుసారమైన వస్త్రధారణను ఆభరణాలను ఎలా ఆక్షేపించెనో చూడండి).


దేవుడు స్త్రీ పురుషులలో ఏర్పాటు చేసిన వ్యత్యాసాలను సాతాను నాశనము చేయాలని చూస్తున్నాడు. ఈ 21వ శతాబ్దములో అనేక విషయములలో మగవారివలె నటించే మరియు ప్రవర్తించే స్త్రీలను సాతాను కలిగియున్నాడు. ఆధిపత్యం చెలాయించే భార్యలు మరియు బోధించే స్త్రీలు దిగజారిపోయే క్రైస్తవ్యం యొక్క స్త్రీలు ఇంకా ఇంకా దేవునికి మరియు ఆయన వాక్యానికి దూరంగా వెళ్తున్నారు.


అటువంటి పరిస్థితులలో దేవుడు ఆయన వాక్యములో ఏర్పాటు చేసిన హద్దులలో ఉండి స్త్రీ యొక్క మహిమను వారి జీవితాల ద్వారా చూపే స్త్రీలు దేవునికి అవసరమై యున్నారు. ఈ ఆఖరి దినాల్లో పాపము, వ్యభిచారము మరియు రాజీతత్వముతో నిండిపోయిన క్రైస్తవత్వములో దేవుని హృదయానుసారిగా నుండిన స్త్రీ వలె నుండుటకు నీ హృదయమంతటితో నిర్ణయించుకో.


నీవు నిజముగా దీని కొరకు ఆశపడితే, దానికి కావలసిన కృపను దేవుడిచ్చును.


అధ్యాయము 4
మతాసక్తియా లేక ఆత్మానుసారతా?

పరిశుద్ధ జీవితాన్ని వెంటాడే క్రైస్తవుడు ఎదుర్కొనే గొప్ప ప్రమాదాలలో ఒకటి ఆత్మానుసారముగా జీవించుటకు బదులు మతాసక్తిలో మునిగిపోవడం. వివేచనాజ్ఞానం లేని విశ్వాసి తరచుగా మతాసక్తిని ఆత్మానుసారతగా పొరబడుతుంటాడు. కాని రెంటికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మొదటిది మానవ పరమైనది కాగా రెండవది దైవికమైనది. ధర్మ శాస్త్రము మనుష్యులను మతాశక్తిగలవారిగా చేయగలదు కాని ఆత్మానుసారులుగా చేయలేదు. మతాసక్తి బాహ్యమైన, కనబడే విషయాలను పరిగణలోనికి తీసుకొంటుంది. అయితే ఆత్మానుసారత ప్రాథమికంగా హృదయానికి సంబంధించిన విషయం.


ఆఖరి దినాలలో అనేకులు శక్తి లేని ఒక విధమైన భక్తి గల రూపము కలిగి యుందురని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది. వేరే మాటలలో చెప్పాలంటే వారు మతాసక్తి కలిగినవారే కాని ఆత్మీయాసక్తి లేనివారు (2 తిమోతి 3:5). వారు క్రమం తప్పకుండా కూటాలకు వెళ్తూ ఉంటారు. ప్రార్థన చేస్తుంటారు మరియు రోజూ బైబిలు చదువుతూ ఉంటారు. ఇంకా రాత్రంతా ఉండే ఉపవాస ప్రార్థన కూటాలకు కూడా హాజరవుతుంటారు. వారి సంపాదనలో దశమ భాగము ఇవ్వడం మొదలైనవి చేస్తుంటారు. కాని వారు మనుష్యుల యొక్క మెప్పుకోసం వెదకుతుంటారు. వారి కోసమే జీవిస్తుంటారు. ధనాపేక్ష కలిగియుండి, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండడం మొదలైనవి చేస్తూ ఉంటారు. అటువంటి వారు మతాసక్తి కలిగినవారే కాని ఆత్మానుసారత కలిగినవారు కారు. వారు శక్తి లేని ఒక విధమైన భక్తి రూపము కలిగియుందురు.ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం.


నీవు శరీరాశలకు సిలువ వేయడం కంటె (గలతీ 5:24) కూటాలకు వెళ్లడంలోనే ఎక్కువ ఆసక్తిగల వాడవైతే నీవు మతాసక్తి కలిగినవాడవే కాని ఆత్మీయాసక్తి లేనివాడవు. నీవు రోజంతటిలో నీ నాలుకను స్వాధీనంలో ఉంచుకోవడం కంటె ప్రతి ఉదయం బైబిలుతో గడిపే నిశ్చల సమయమందే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటే నీవు మతాసక్తి కలిగిన వాడవే తప్ప ఆత్మానుసారత లేనివాడవు. నీవు ధనాపేక్ష నుండి విడుదల పొందుట కంటే ఉపవాసము మరియు ప్రార్థనలో ఎక్కువ ఆసక్తి కలిగియుంటే నీవు మతాసక్తి కలవాడవే కాని ఆత్మానుసారుడివి కావు. నీవు నీ స్వంత పవిత్రత కంటె సువార్త విషయంలో అత్యాసక్తి కలిగి ఉంటే నీవు మతాసక్తి కలిగినవాడవే కాని ఆత్మానుసారత కలిగిన వాడవుకావు.


పైన చెప్పిన ఉదాహరణలలో మతాసక్తి కలిగిన వారి పనులన్ని మంచివే. కాని ప్రాధాన్యత మొదట దేనికి అనేది ప్రశ్న. ఒక వ్యక్తిని ఆత్మానుసారముగా తయారు చేసేవి ఆత్మానుసారముగా సరియైన ప్రాధాన్యతలే.


మతాసక్తి కలవారు లిఖిత మాటలందు (అక్షరానుసారమైన) మాత్రమే ఆసక్తి కలిగియుండి ధర్మశాస్త్రము యొక్క నీతితో సంతృప్తి చెందుతారు. ఆత్మసంబంధులు శరీరధారియైన వాక్యమందు శరీరేచ్ఛలు, కోర్కెలతో కూడిన మనలాంటి మాంసపు శరీరాన్ని దాల్చినట్టి క్రీస్తు ఆసక్తి కలిగి చివరగా దైవికమైన దేవుని నీతిని పొందుకొందురు.


మతాసక్తి గలవారు వారు చేసే పనులను సమర్థించుకోవడానికి ఎవరో ఒక దైవ సేవకుని మాటలనాధారంగా తీసుకొంటారు. కాని ఆత్మ సంబంధులు మనుష్యుల యెదుట తమ్మును తాము సమర్థించుకోవడానికి ఎన్నటికీ ఇష్టపడరు.


మతాసక్తి కలిగినవారు దేవుని అభిప్రాయము కంటె మనుష్యుల అభిప్రాయము పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మీయాసక్తి కలవారు దేవుని అభిప్రాయాన్ని మాత్రమే లక్ష్యపెడతారు. మతాసక్తి కలవారు వారిని ప్రశంసిస్తూ ఎవరైనా పెద్దగా ఉన్న సహోదరుడు చెప్పిన మాటలను సంవత్సరాల తరబడి ధ్యానిస్తూ ఉండగలరు. అయితే ఆత్మీయాసక్తి కలవారు యేసువలె, మనుష్యుల యొద్ద నుండి సాక్ష్యం పొందుటకు ఇష్టపడరు (యోహాను 5:34). తమలో తాము చూడగలుగుతున్న భ్రష్టత్వము ఇతరులకు తెలియదని వారికి తెలియును. కనుక మనుష్యుల యొక్క పొగడ్తలు కేవలము వ్యర్థమని గ్రహింతురు.


మతాసక్తి కలవారు పూర్తి అక్షరానుసారంగా ఆలోచిస్తారు. మరియు వారు ధర్మశాస్త్రానికి బద్దులైనవారు. వారు దేవుని సంతోషపర్చుటకు అవసరమైనట్టుగా ఎంత తక్కువలో చెయ్యవచ్చా అని ఆలోచింతురు. అందుకే వారి సంపాదనలో 10 శాతం లెక్కకట్టి అయిష్టంగా దేవునికి అర్పిస్తూ ఉంటారు. పాత నిబంధనలో ఈ వైఖరియే ఇశ్రాయేలీయులను చివరకు గ్రుడ్డి గొఱ్ఱెలను, జబ్బుతో ఉన్న దున్నపోతులను దేవునికి బలిగా అర్పించేంత వరకు తెచ్చింది (మలాకీ 1:8). క్రొత్త నిబంధనలో గల ఆజ్ఞలను అదే విధమైన వైఖరితో పాటించడం సాధ్యమే. ఒక సహోదరి అక్షరానుసారమైన వాక్యప్రకారము తన భర్తకు లోబడు విషయంలో లేక కూటములలో తలపై వేసుకొనే ముసుగు విషయంలో, తల వెంట్రుకల అందం పూర్తిగా దాచబడకుండా అతి తక్కువ అవసరతమట్టుకు ముసుగు వేయుటను గూర్చి ఆలోచించవచ్చు! పురుషులు, స్త్రీలు, ''ఆత్మానుసారము''గా ఉండటానికి సర్వాన్ని విడిచిపెట్టకుండా అతి తక్కువలో ఏలాగు చేయవచ్చు అనేది ఆలోచించవచ్చు. ''ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలను విడిచిపెట్టడం వచ్చేసరికి నేను అతి తక్కువగా చేయగలిగిందేమిటి?'' అనే ప్రశ్న అటువంటి వారి మనసులో ఎప్పుడు ఉంటుంది. అటువంటి వారు ఎన్నటికీ ఆత్మానుసారముగా ఉండలేరు. కేవలం మతాసక్తి కలిగిన వారుగా మాత్రమే ఉండగలరు.


యేసు యొక్క వైఖరి దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆయనెప్పుడు తండ్రిని సంతోషపర్చటానికి కనీసంగా చేయవలసినది ఏమిటని అన్వేషణ చేయలేదు. అయితే దానికి భిన్నంగా ఆయన తండ్రికి పూర్తిగా సమర్పించుకోవటానికి అత్యున్నతమైనదేదో తెలుసుకోవటానికి వెదికారు. అందువలన ఆయన బాల్యమందు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు ప్రతి ఆజ్ఞ వెనుక ఉండిన ఆత్మ ఉద్దేశమును తెలుసుకోవటానికి వెదికారు. ఆ విధంగా ఉదాహరణకు కేవలం శరీరంతో వ్యభిచరించడాన్ని విడిచిపెట్టడం మాత్రమే సరిపోదని ఆయన అర్థం చేసికొన్నారు. (అది ధర్మశాస్త్రం అనుసరించటానికి కావలసిన కనీసపు అవసరత అయినప్పటికి) ఆయన తండ్రి సన్నిధిని వెదుకుతూ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండడం వలన ఆయన వెలుగు పొందారు. ఒకడు తన హృదయమందు కూడా మోహమునకు తావివ్వకూడదని ఆయన అర్థము చేసుకొన్నారు. ఆ విధంగా ఆయన కోపము, నరహత్య సమానమని చూడగలిగెను. ఆవిధంగా ఆయన ప్రతి ఆజ్ఞ వెనుక ఉన్న ఆత్మను (సారమును) గ్రహించగలిగెను.


ఈ లోకములోని ఒక పెండ్లి కుమార్తె తన పెండ్లి కుమారునిపై ఉన్న గాఢ ప్రేమను బట్టి తన భాగస్వామిని కనీస అవసరము మట్టుకే ఎలా సంతోషపెట్టడం అని ఎన్నడూ ఆలోచించదు. అందుకు భిన్నంగా ఆమె అతనిని అత్యధికంగా సంతోషపెట్టటానికి ఏమి చేయగలనో అని ఆలోచిస్తుంది. క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె వైఖరి కూడా ఇదే. ఇక్కడ మనం పెండ్లి కుమార్తెకు, సేవకునికి మధ్య వ్యత్యాసం చూడగలం. ధర్మశాస్త్రము క్రింద ఉన్నట్టి వారు సేవకులుగా మాత్రమే ఉండగలరు. ఉద్యోగస్థుడు జీతము కొరకు పనిచేస్తాడు కనుక తను అందించే సేవ కూడా ఎంతో లెక్కగట్టినట్లు చేస్తుంటాడు. అతడు తన పనిని గడియారం చూపే సమయంతో కొలుస్తూ ఉంటాడు. ఒకవేళ అతడు ఎక్కువ సమయం పని చేసినట్లయితే ఎక్కువ జీతం కొరకు ఆశిస్తూ ఉంటాడు. అయితే ఒక కుమారుడు (లేక భార్య) ఇందుకు భిన్నంగా ఎంత దీర్ఘకాలమైనా ప్రతిఫలం గూర్చి కాకుండా ప్రేమ పూర్వకంగా పనిచేస్తారు. మతాసక్తికిని ఆత్మానుసారతకు మధ్య గల బేధము ఇక్కడే తెలుస్తుంది.


ప్రభువు నుండి నేను ఏమి పొందగలను? అన్న అభిప్రాయముతో ఆలోచించే మనసు మతాసక్తికి దారితీస్తుంది. మరోవైపు, ఈ భూమిపై నాకున్న ఒక్క జీవితంలో ప్రభువు నా నుండి ఏమి పొందగలడు? అనే అభిప్రాయంతో ఆలోచించేది నిజమైన ఆత్మానుసారతలోనికి నడిపిస్తుంది. అలాగున మనం వెళ్ళాల్సింది ఒకే ఒక మైలు అయినప్పటికీ, రెండవ మైలు కూడా వెళ్ళడం మనకు సహజంగా మారుతుంది.


ఆదాము అంజూరపు ఆకులతో తనకు కచ్చడము తయారు చేసికొన్నాడు. ఒకడు మనుష్యుల యెదుట, దేవుని యెదుట కూడా తన్ను తాను చూడదగ్గ విధముగా కనపరచుకోవటానికి చేసిన ఈ ఆకులతో నిండి ఉన్న చెట్టును శపించెను (మార్కు 11:13, 14, 21). దేవుడు దానిని ద్వేషిస్తాడు. దేవుడు ఆదాముకు వేరొక చొక్కాయిని ఇచ్చాడు. అది చర్మపుది మరియు అది యథార్థమైన ఆత్మానుసారతకు సూచనగా ఉంది. మనుష్యుడు తనకు తాను తయారు చేసుకోగలిగేది కాక దేవుడు తన సహజ స్వభావమును మనకు ఇవ్వడమనేది యథార్థమైన ఆత్మానుసారతకు గుర్తు. యేసు అంజూరపు చెట్టు నొద్దకు వచ్చినప్పటి సమయం పండ్లు కాచేది కాదు. పాత నిబంధన ఆత్మ ఫలము కాచే కాలము కాదని మనము చెప్పొచ్చు. మనుష్యుని బంధకాలలోనికి నడిపింపజేసిన ఆచార బద్దమైన పద్ధతి ఇపుడు పూర్తిగా తీసివేయబడినది. మానవుడు తన అవసరతను చూడగలుగుటకు దేవుడు దానిని కొంతకాలము అమలు చేసెను. ధర్మశాస్త్రము మనలను పరిశుద్ధపరచుట కొరకు ఎప్పుడు ఇవ్వబడలేదు. అది ఒక లోపంతో కూడిన వ్యవస్థ అని హెబీ 8:7లో చెప్పబడినది. ఎందుకంటే అది మనుష్యుని ఆత్మానుసారునిగా తయారు చేయలేదు. కాని మతాసక్తి కలవానిగా మాత్రమే చేసింది. ఒకడు ఆత్మ సంబంధిగా మార్పుచెందవలెనంటే క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించాలి.


మానవుడు మనుష్యుల యొద్ద గౌరవం తెచ్చే నీతి క్రియలతో సంతృప్తి పడతాడో లేక ఇంకా ఎక్కువ కొరకు వెదుకుతాడో చూడటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చెను. అనేకమంది విశ్వాసులు బాహ్యమైన నీతితో తృప్తిపడి మానవ మతాసక్తియనే ఆకుల తొడుగులతో మరియు ధర్మశాస్త్రముతో సంతృప్తి చెందుతున్నారు. సువార్త రక్షణ కలుగజేయుటకై దేవుని శక్తి, అది ఆకులను శపించి మరియు వాడిపోచేసి దేవుడు మనుష్యుని కొరకు ఉద్దేశించిన యథార్థమైన పరిశుద్ధతను ఇస్తుంది.


అయితే ఈ విధమైన సువార్తను పొందటానికి మనం మొట్టమొదటిగా తీవ్రముగా (రాడికల్‌) పశ్చాత్తాపం పొందాలి. ''రాడికల్‌'' అనే పదానికి అర్థం ''వేరు మొదలుకొని పైకి'' అని - అదే రాడికల్‌గా పశ్చాత్తాపం పొందడం అంటే. యేసుకు ముందు మార్గము సరాళము చేయువానిగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను పశ్చాత్తాపం గూర్చిన తన సందేశంలో యేసు గొడ్డలిని చెట్ల వేరుపై పడేలా చేయునని చెప్పాడు. ప్రతి పాపము ఒక వేరు నుండి ఆవిర్భవిస్తుంది. మనము కేవలము పాపము (ఫలము) గూర్చి పశ్చాత్తాప పడినట్లయితే, మనం సమూలంగా (రాడికల్‌) పశ్చాత్తాప పడనట్లే. ఉదాహరణకు కొండెములాడుట అనేది ఒక సహోదరుని యెడల ఉన్నటువంటి తప్పుడు వైఖరి వలన వస్తుంది. సమూలంగా (రాడికల్‌) పశ్చాత్తాపం పడడం అంటే ఆ తప్పుడు వైఖరిని మొదట ఖండించుకోవడం, అంతేకాని కేవలం కొండెములాడుట అనే క్రియను కాదు. బాహ్యంగా కనబడే క్రియను సరిచేసికోవడం లేక మానివేయడం అనేది ఒక కత్తెరతో ఫలమును కత్తిరించి వేయడం వంటిది. యేసు కత్తెరతో రాలేదు కాని గొడ్డలితో వచ్చెను (వేరును తీసివేయటానికి). ఆయన సరైన పండ్ల కొరకు చూస్తున్నారు. అంతేకాని ఆకుల కొరకు మాత్రమే కాదు. ఆయన ఎక్కడయితే ఆకులను మాత్రమే చూచునో అక్కడ ఈనాడు కూడా ఆకులను శపించి వాడిపోజేయును(ఎక్కడ జనులు ఆయనను చేయడానికి అనుమతిస్తారో). ఆ విధంగా ఆయన వారిని ఫలించునట్లు చేయును. అనేకమైన ఇతర పాపములు కూడా మొదటిగా మనలో ఉన్న తప్పుడు వైఖరి యొక్క ఫలితమే. అవి మన స్వప్రయోజనమును చూచుకోవడం, ధనాన్ని ప్రేమించడం మొదలైనవి. ఆత్మానుసారుడైన మనిషి మనుష్యుల యొద్ద గుర్తింపు పొందటానికి బాహ్యంగా పండ్లను కత్తిరించేయడంతో సంతృప్తిపడడు. కాని దేవుని యొక్క వెలుగులో పాపము యొక్క వేరును తనలోతాను తీర్పు తీర్చుకొనును.


మతాసక్తి కలవారు సుళువుగా మోసగింపబడతారు. ఒక భర్త తన భార్య యెడల 6 నెలల పాటు తప్పుడు వైఖరి కలిగియుండి కూడా ఆమె బాధపడే విధంగా ఎప్పుడూ ఏమి మాట్లాడకుండా నిగ్రహం కలిగి ఉండడం సాధ్యమే. కాని ఆ తరువాత ఏదో ఒక దినాన కోపముతో మండిపడవచ్చు. అప్పుడు అతడు 6 నెలలు నుండి జయ జీవితం గడిపానని, కాని ఒక్క క్షణం మాత్రమే పాపంలో పడితినని (అతడు నిగ్రహం కోల్పోయినప్పుడు) ఊహించుకొన్నట్లయితే తనను తాను మోసపుచ్చుకున్నట్లే. అతడు 6 నెలలుగా ప్రేలుడు పదార్ధాన్ని కూడబెడుతున్నాడు. తగిన సమయమైనప్పుడు ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగినంతలోనే మొత్తం పదార్థమంతా పేలిపోయింది. అతడు ఆ కాలమంతా పాపములోనే జీవించాడు. కాని అది చాలాకాలం వరకు బయటకు కనపడలేదు. పేలటానికి కారణమయింది అగ్గిపుల్ల కాదు కాని 6 నెలలు కాలం నుండి కూడవేసిన పేలుడు పదార్థమే.


మనము ఇతరుల యెడల 'దేవుని యొక్క ప్రేమలో' ఉండులాగున (యూదా 21) పోరాటము సలపనట్లయితే బాహ్యంగా మతాసక్తి కలిగిన వారుగా సాక్ష్యం కొనసాగిస్తూ కూడా పాపము చేయవచ్చు. చాలా మంది విశ్వాసులకు వివేచన లేకపోవడం వలన వారు మనలను ఆత్మానుసారమైన వారమని తలంచవచ్చు. వారి యొక్క అభిప్రాయంతో సంతృప్తి పడడం ఎంతటి మూర్ఖత్వమంటే సంగీతం గురించి ఏ మాత్రం పరిజ్ఞానం లేని ఒకనిని మనకుండిన సంగీత సామర్థ్యం గూర్చి చెప్పమనడం లాంటిది!


మనం మతాసక్తి నుండి విడుదల పొందటానికి, మూలము నుండి (రాడికల్‌) పశ్చాత్తాపపడటానికి ''పాపమును'' పాపమనే పిలవాలి. కోపమును దాని అసలు పేరుతోనే పిలవాలి-అది ''నరహత్య'' అని (మత్తయి 5:21, 22). నీవు ప్రతి పాపము విషయంలో అలా చేయనట్లయితే నీవు నీ జీవిత కాలమంతా 'మతాసక్తి' కలిగిన వాడవుగానే మిగిలిపోతావు. నీవు ఎప్పటికిని యథార్థమైన ఆత్మ సంబంధివిగా కాజాలవు. మతాసక్తి కలిగినవాడు బాహ్యమైన నీతిక్రియల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండును. పరిసయ్యులు పుదీనా, తోటకూర మరియు జీలకర్రలలో కూడా దశమ భాగం అర్పించేవారు. వారు బాహ్యమైన నీతి నుండి ఒక్క మిల్లీమీటరు కూడా ప్రక్కకు తప్పేవారు కాదు. అయినప్పటికి ప్రేమ, జాలి మరియు మంచితనము మొదలగు విషయాల్లో మైళ్ళ దూరం వెళ్ళిపోయేవారు. ఈనాడు నీతిని వెదికే వారి విషయంలో కూడా అలాగే ఉండి, బాహ్యమైన నీతి విషయంలో నూటికి నూరు పాళ్ళు (100 శాతం) ఖచ్చితంగా ఉండి ప్రేమ మార్గాన్ని తప్పిపోవడం సాధ్యమే. క్రొత్త నిబంధన ప్రకారం నీతి మార్గమంటే ప్రేమ మార్గమే. మనము ఈ మార్గము నుండి ఒక మిల్లీమీటరు కూడా తప్పిపోకుండా అనుసరించుటకు జాగ్రత్త వహించాలి. ఇదే ఆత్మానుసారతకు మార్గము.


అనేకులు లోకత్వపు విధానాల్లో జీవించుట కంటె తప్పుడు బోధనల వలననే (పరిసయ్యుల వలె) నరకానికి వెళ్తారు. అందుచేతనే మనము మతాసక్తి మరియు ఆత్మానుసారత మధ్య తేడాను గ్రహించుటలో జాగ్రత్త కలిగియుండాలి. మనము చేసే బాహ్య క్రియలు, అవి మంచివైనను, దేవుని యెడల గల అమితమైన ప్రేమచేత ప్రేరేపింపబడనివయితే అవన్ని ఒక రూపము గలవి మాత్రమే. వాటి వెనుక ప్రేమ యొక్క శక్తి లేనట్లయితే అవి జీవము లేని క్రియలే. మనము చేసే జీవము లేని క్రియల నుండి పశ్చాత్తాపపడమని ఆజ్ఞాపించబడ్డాము. అవి క్రీస్తు నందు భక్తి కల హృదయము నుండి బయలు వెడలనటువంటి మృత క్రియలు (హెబీ 6:1, 2 కొరింథీ 11:3).


దేవుడు సంతోషముతో ఇచ్చువారిని ప్రేమిస్తాడు. అంటే ధనాన్ని మాత్రమే కాదు కాని విధేయతను కూడా. ఎప్పుడయితే దేవుని యెడల మన విధేయత మనకు భారమౌతుందో, అప్పుడు మనము ఆత్మానుసారతనుండి త్రోవ తప్పిపోయి, మతాసక్తి మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తేటపర్చబడుతుంది. క్రొత్త నిబంధన ప్రకారము మనము దేవునికి ఇచ్చే ప్రతీది ప్రేమ పూర్వకముగాను, ఉత్సాహముగాను, స్వచ్ఛందముగాను ఇవ్వాలి. అలా కానట్లయితే ధర్మ శాస్త్ర ప్రకారము చేయువారమయి తిరిగి పాత నిబంధన క్రింద అంటే కుమారుని వలె కాక సేవకుని కుండే మనస్సు, వైఖరి కలిగినవారమగుదుము.


యూదా తన పత్రికలో ఆత్మానుసారులు కాక మతాసక్తి కలిగిన ముగ్గురిని గురించి చెప్పెను. వారు కయీను, బిలాము, కోరహు (యూదా 11). ఒక్కొక్కరిని గురించి మనము చూద్దాము.


కయీను దుష్టుడు కాదు. అతడు దేవునికి బలులు అర్పించుట గూర్చి నమ్మిక యుండినంత మతాసక్తి కలిగినవాడు (ఆదికాండము 4:3). హేబెలు కూడా దేవునికి బలులు అర్పించాడు. ఈ రెండు బలుల మధ్య తేడా మరియు కయీను హేబెలుల మధ్య తేడా నరకానికి, పరలోకానికి మరియు మతాసక్తికి ఆత్మానుసారతకు మధ్య ఉండేటంతది. కయీను హేబెలులు ప్రజలు వెళ్తున్న రెండు మార్గాలకు సూచనగా ఉన్నారు. అవి మతాసక్తి మార్గము మరియు ఆత్మానుసారమైన మార్గము, కయీను డబ్బు, సేవ, సమయం మొదలైన బాహ్యమైన వాటిని అర్పించే రకము, మరియొక వైపు హేబెలు ఒక గొఱ్ఱె పిల్లను చంపి బలిపీఠముపై ఉంచుటనేది తనకు తానుగా బలిపీఠముపై ఉంచబడుటకు సూచన అయి ఉంది.


మతానుసారమైన మనుష్యులు బహుమతులు ఇవ్వగలరు, ప్రార్థించగలరు, మరియు ఎన్నో మంచి పనులు చేస్తారు. కాని తమను తాము అర్పించుకోవడమనేది వారికి అర్థం కాదు. వారు ఖచ్చితంగా దశమభాగాన్ని ఇస్తూ ఉండవచ్చు. కాని శోధన సమయంలో వారి స్వార్థాన్ని చంపుకోరు. అదే పాత నిబంధనకు, క్రొత్త నిబంధనకు ఉన్న తేడా. స్వార్థానికి చనిపోకుండా పాత నిబంధనలో ప్రవేశించవచ్చు. కాని స్వార్థానికి చనిపోకుండా క్రొత్త నిబంధనలో ప్రవేశించడం అసాధ్యము. యేసు దశము భాగాలు అర్పించటానికి రాలేదు గాని, దేవునికి అంగీకారమైనట్టి మరియు సంతోషము కలిగించే అర్పణగా తన్ను తాను సమర్పించుకోవటానికి వచ్చారు. కయీను, హేబెలు దేవుని యొద్దకు వెళ్లుటకు ఉన్న మతాసక్తి నిజమైన ఆత్మానుసారత అనే విశాల మార్గము, ఇరుకైన మార్గములనకు సూచనగా ఉన్నారు. నీవు స్వార్థానికి చనిపోకుండా సేవకుడుగా ఉండవచ్చు. కాని కుమారుడుగా ఉండలేవు.


దేవుడు ఆకాశము నుండి హేబెలు బలికి అగ్నితో సమాధానమిచ్చాడు. కాని కయీను అర్పణపై ఏమి పడలేదు. ఎప్పుడయితే ఒక మనుష్యుడు క్రమం తప్పక రోజు తరువాత రోజూ తన స్వార్థానికి చనిపోతూ ఉంటాడో అప్పుడు అతడి జీవితంపై మరియు అతడు చేసే పరిచర్యపై పరలోకము నుండి వచ్చే అగ్ని నిలుస్తుంది. ఎవరి వేరును ఆయన గొడ్డలితో మొదట నరికాడో వారికి ఆత్మతోను, అగ్నితోను యేసు బాప్తిస్మము ఇస్తాడని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన సరియైన బాప్తిస్మము ఇదే. మరొకవైపు ఒక సహోదరుడు బాహ్యంగా మంచి పనులు చేసి మంచి జీవితము కలిగియుండవచ్చు కాని పరలోకము నుండి అగ్ని మరియు అభిషేకము అతడి జీవితములో లేకపోవచ్చు. భావోద్రేకాలను గిలిగింతలు పెట్టే సాతాను యొక్క కల్పితమైన 'బాప్తిస్మమును' (అనేకులు ఈనాడు దానినే అనుభవిస్తున్నారు) సిలువ మార్గమును ఎంచుకొన్న యేసు శిష్యులపైకి ఆయన పంపిన సరైన పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో మరియు అగ్నితో పోల్చి చూచినట్లయితే అది విలువ లేనటువంటి చెత్తతో సమానం.


బిలాము మరొక మతాసక్తి గల మనిషి, అతడు దేవుని సేవ చేయాలని ఆశ కలిగిన ఒక బోధకుడు. కాని ధనార్జన, లోకంలో గొప్పవారిని కలుసుకోవాలనే ఆసక్తి కూడా కలిగియుండెను (సంఖ్యాకాండము 22). అతడు ధన లాభము, గౌరవము దేవుని పేరుతో తన కొరకు పొందాలని వెదికాడు. ఈనాడు బిలాము వంటి అనేక అబద్ద ప్రవక్తలున్నారు. వారి సిద్ధాంతములు అక్షరానుసారమైన వాక్యమును బట్టి చూచినట్లయితే ప్రాథమికంగా సరైనవే. అయితే వివేచన లేని విశ్వాసులు వారు బిలాము యొక్క ఆత్మతో (ధనాశ, ఘనతను ప్రేమించుట) ప్రేరేపించబడినవారని గుర్తింపలేరు. వీరి గూర్చియే పౌలు ఫిలిప్పీ 2:21లో వారందరు వారి స్వంత లాభాలను చూచుకొనుచున్నారని వ్రాసెను. పెర్గము సంఘములో ధనాన్ని కోరుకోవడము గౌరవాన్ని కోరుకోవడము మధ్య వ్యత్యాసము ఏమీ లేదు. ఆ రెండు బిలాము యొక్క ఆత్మలో ఉన్న వేర్వేరు రకములు.


కోరహు మరొక మతానుసారుడైన మనిషి. అతడు లేవీయుడును, యాజక గోత్రమునకు చెందినవాడు (సంఖ్యాకాండము 16). కాని అతడు ప్రభువు తనకు అప్పగించిన పరిచర్యతో అసంతృప్తి చెందాడు. అతడు మోషే వలె ప్రముఖునిగా కావలెనని ఆశపడ్డాడు. ఈ దురాశ (భక్తి వేషములో కప్పబడి) చివరకు అతడి నాశనాన్ని ఋజువు పరచింది. అతడు అతడితో కూడిన తిరుగుబాటు దారులయిన దాతాను, అభిరాము, వారి కుటుంబాలు మాత్రమే సజీవముగా నరకానికి వెళ్లినట్లు లేఖనాలలో వ్రాసియుంచబడింది (సంఖ్యాకాండము 16:32, 33). అలాగు ప్రభువు తన ప్రజలపై ఆయన ఏర్పాటు చేసిన అధికారానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు అనే పాపాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు.


ఈనాటి అనేక పెద్దలు, బోధకులు మరియు కాపరులు తమ్మును తామే నియమించుకొన్నవారు. వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం తీవ్రమైనది కాకపోవచ్చు. కొన్ని సమయాలలో అలా చేయడం అవసరం కూడా అవ్వొచ్చు! కాని దేవునిచేత ఏర్పాటు చేయబడ్డ వారిపై తిరుగుబాటు చేయడం దేవునియొక్క ఉగ్రతతో పాటు తీర్పును తెచ్చుకోవడమవుతుంది. ఒక ఆత్మానుసారుడైన మనిషి కలలో కూడా అటువంటి పని చేయడు. కాని మతానుసారులైన మనుష్యులు చేస్తారు. మతానుసారతలో ఉన్న ఆత్మీయ తెలివితక్కువ తనము అటువంటిది.


సంఘములో ఇతరులతో పోటీపడే వారికి కోరహు నిదర్శనమై ఉన్నాడు. ఎప్పుడయితే దేవుని భయంతో ఎదిగే ఒక సహోదరుని మెచ్చుకోవటానికి మరియు ప్రశంసించటానికి నీకు కష్టంగా అనిపిస్తుందో అది కోరహు ఆత్మ నీలో కొంత ఉన్నదనటానికి ఒక నిదర్శనం. ఎప్పుడయితే నీవు అతడిని విమర్శిస్తావో అప్పుడు కోరహు ఆత్మ నీలో పూర్తిగా నిండి ఉంటుంది. ఇతరులు అతడిని విమర్శించినప్పుడు నీవు చెవి యొగ్గితే అప్పుడు నీవు దేవునిచే తీర్పు తీర్చబడిన కోరహుతో కూడిన 250 మంది తిరుగుబాటుదార్లవంటి వాడవన్నమాట.


మనం ఆత్మానుసారతకు మతానుసారతకు మధ్య తేడాను వివేచించనట్లయితే మనమెప్పటికిని ఆత్మ సంబంధులం కాలేము. అది ఈ సమయంలోనే అవసరమై ఉంది. ఎందుచేతంటే అనేకులలో పైకి కనబడే భక్తి గల రూపముండి శక్తి (సిలువ యొక్క వాక్యం) లేనివారై యుందురని ప్రత్యేకంగా ఆఖరి దినాల గూర్చి వ్రాయబడింది. అనేకులు దైవభక్తిని గూర్చిన మర్మము నుండి తిరిగిపోతారని ఆత్మ ప్రత్యేకంగా హెచ్చరించాడు. పెండ్లి మానివేయడం, కొన్ని రకాల ఆహార పదార్థములను మానివేయడం మొదలైన కొన్ని ఇతర మత పద్ధతుల ద్వారా భక్తిని వెదుకుతారు.


మానవుడు కూడా అనేక కల్పితమైన పద్ధతులను కనిపెట్టాడు. అవి బహిరంగంగా పాపాలను ఒప్పుకోవడం (''అణుకువ''గా మారటానికి) మరియు రోగంతో ఉన్నప్పుడు మందులు వాడకపోవడం (''విశ్వాసము'' అభివృద్ది చేసికోవడానికి) మొదలైనవి. ఇవన్ని క్రైస్తవులను నిజమైన భక్తిని గూర్చిన మర్మము (2 తిమోతి 3:16-4:5) నుండి దారి తప్పించే దయ్యముల సిద్ధాంతములై ఉన్నాయి.


నిజమైన ఆత్మానుసారతకు ఒకే ఒక మార్గము, ప్రతి దినము తమను తాము క్రీస్తు వలె మృతికి అప్పగించుకోవడము (రోమా 8:36; 2 కొరింథీ 4:10-12). ప్రతి ఇతర మార్గము కల్పితమైనదే.


అధ్యాయము 5
క్రొత్త నిబంధన ఆత్మ

పాత నిబంధనలో, దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చిన తరువాత (నిర్గమ 20వ అధ్యాయము) ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక చక్కని కట్టడి పాతనిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉండిన వ్యత్యాసమును చక్కగా వివరిస్తుంది. అక్కడ నిర్గమ కాండము 21:1-6లో ఒక హెబ్రీ దాసుడు, అతడు దాసుడు కాబట్టి ఆరు సంవత్సరములు దాసత్వము చేయవలసియుండెడిది. తరువాత అతడు తన యజమానుని సేవించుటకు యిష్టపడుటవలన అతడు సేవలో కొనసాగును (నిర్గమ కాండము 21:5). ఇది రాబోయే క్రొత్త నిబంధన ఆత్మ యొక్క ప్రవచనాత్మకమైన దృశ్యముగా దేవుడు ముందు చూపించెను.


తప్పనిసరిగా సేవించవలసిన ఆరు సంవత్సరములు దేవునిని అక్షరానుసారంగా తప్పక సేవించవలసిన బానిసత్వమును చూపించుచున్నది. ఏడవ సంవత్సరము నుండి అది తన ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసిన ''సబ్బాతు విశ్రాంతి'' (హెబీ 4:9) ని సూచిస్తుంది. ధర్మశాస్త్రము ప్రకారము జనులు ఆరురోజులు పనిచేసిన తరువాత ఏడవ దినమున మాత్రమే విశ్రాంతి తీసుకొనవలసి యుండెను. కాని దేవుడు ఆదామును సృష్టించిన తరువాత, ఆయన మొదట అతడికి విశ్రాంతిని యిచ్చి అటు తరువాత ఆరు దినములు పని యిచ్చెను (దేవునికి ఏడవ దినము ఆదాము ఉనికి యొక్క మొదటి దినము). ఇది దేవుని కొరకు మానవుడు చేసే పరిశ్రమ అంతా మానవునికి ఆయనతో నుండిన ప్రేమ మరియు సహవాసము నుండి రావలెనని తెలియజేయుచున్నది. అలాకాక పోయినట్లయితే అది అక్షరానుసారమైనది మరియు విలువ లేనిదిగా యుండును.


మనము క్రొత్త నిబంధన కాలములో జీవించుచున్నామను వాస్తవము మనము క్రొత్త నిబంధన ఆత్మలో జీవంచుచున్నామనికాదు. పాపముపై విజయము గూర్చిన సందేశములో నియమములు అర్థము చేసికొనినప్పటికీ అక్షరానుసారమైన నియమములతో జీవించుచుండుట సాధ్యమే. రోమా 7:1-6లో, ఒకడు రోమా 6వ అధ్యాయము (విజయము గూర్చిన సువార్త చెప్పు అధ్యాయము) గుండా వచ్చి కూడా అక్షరానుసారమైన జీవితములో నుండగలడని చూచెదము. మన జీవితాలలో కూడా ఇది చూచెదము. అనేకులు న్యాయముగా మరియు మంచి మంచి నీతి సూత్రములతో జీవించు వారు ధర్మశాస్త్రపు నియమముల చేత జీవించు వారుగా నున్నారు.


లోపల తప్పుడు ఉద్దేశములు కలిగియుండి బాహ్యముగా నీతి కలిగిన జీవితము జీవించుట సాధ్యమే. పాత నిబంధన క్రింద ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును నెరవేర్చవలసి యుండెను, కాని వారు దానిని ఏ ఉద్దేశ్యముతో నెరవేర్చుచున్నారు అనుదానిని ధర్మశాస్త్రము తీర్పు చేయలేకపోయెను. అనేకులు ధర్మశాస్త్రమును శిక్షకు భయపడి నెరవేర్చు చుండిరి. ఇతరులు ప్రతిఫలమును ఆశించి నెరవేర్చుచుండిరి. ఈ రెండు ఉద్దేశ్యములు క్రొత్త నిబంధన ఆత్మకు సరిపడనివిగా యున్నవి. క్రొత్త నిబంధనలో ఏ ఆత్మతో లోబడుచున్నాము అనునది అక్షరానుసారమైన విధేయత కంటె ముఖ్యమైనది (రోమా 7:6). మనము ఆజ్ఞలన్నిటిని పాటించిన తరువాత కూడా ప్రభువు ''నీకు వ్యతిరేకముగా ఒకటి యున్నది. నీవు నా ఆజ్ఞలను మొదటి ప్రేమతో నెరవేర్చుట లేదు. అందునుబట్టి మారుమనస్సు పొందుము'' అని గద్దిస్తూ చెప్పవలసి యుండును (పక్రటన 2:4). మనము చేయునది ప్రేమతో కాకపోయినట్లయితే పాత నిబంధన క్రింద అది నేరము కాదు. కాని క్రొత్త నిబంధన క్రింద అది చాలా తీవ్రమైనది. ఎఫెసు సంఘపెద్ద ఈ విషయములో మారుమనస్సు పొందకపోయినట్లయితే అతడు తన అభిషేకమును పోగొట్టుకొను ప్రమాదములో యుండెను. లోపల ఉద్దేశములు సరిగా లేకుండా ఆజ్ఞలను పాటించుట సరిపోదు అని మనము గ్రహించామా?


మనము మన శరీరము యొక్క మాలిన్యమును తొలగించుకొనినప్పుడు, మనము మనుష్యుల ఎదుట మంచి సాక్ష్యము పొందుదుము. అయితే, మనమెప్పుడైతే మన ఆత్మయొక్క మాలిన్యమును కూడా కడుగుకొందుమో అప్పుడే దేవుడు మనగూర్చి సాక్ష్యమిచ్చును. ఇది 2 కొరింథీ 7:1లో తేటగా చెప్పబడినట్లు పరిశుద్ధతలో పరిపూర్ణులగు మార్గము. మనయొక్క ''పరిశుద్ధ విషయములలో దోషముండును'' (నిర్గమ కాండము 28:38). మనము నీతిని వెదకుటలో మన తప్పుడు ఉద్దేశములే ఈ దోషములు.


ఈ దోషము వెనుక అంతకంటే చాలా తీవ్రమైన చెడు ఇంకొకటి ఉన్నది. అది మనుష్యుల నుండి గౌరవమును వెదకుకొనుట. మనము ఎప్పుడైతే ఇతరుల నుండి గౌరవమును వెదకుకొనెదమో (ముఖ్యముగా సంఘములో) అప్పుడు మనము మన బాహ్య జీవితమును సరిగా ఉంచుకొనుటకు జాగ్రత్త పడెదము. ఈ చెడును మనము మన ఆజ్ఞానుసారమైన జీవితము వెనుక కనిపెట్టుటలో మనము త్వరపడవలెను, లేకపోయినట్లయితే అది మనలను చివరకు నాశనము చేయును.


పదిమంది కన్యకలను గూర్చిన ఉపమానములో (మత్తయి 25:1-13) వారిలో ఎవరు కూడా 'వేశ్యలు' కారు. వారందరూ కన్యకలే. వారందరూ శరీరమాలిన్యము నుండి తమను తాము కడుగుకొనిరి. అందువలన వారికి మనుష్యుల యెదుట మంచి సాక్ష్యముండెను. వారి దీపములు వెలుగు చుండినవి మరియు మనుష్యులు వారి మంచి క్రియలు చూచి వారిని కీర్తించిరి (మత్తయి 5:16). వారిలో కొందరు కన్యకలకు అంతరంగ జీవితము లేదని మనుష్యులకు తెలియదు. వివేచన లేని విశ్వాసుల దృష్టిలో ఆ పదిమంది భక్తిగలవారుగా కనబడిరి. అయినప్పటికిని వారిలో ఐదుగురి యొద్దనే వారి అంతరంగ జీవితములలో సత్యము (కీర్తనలు 51:6) ఉన్నదని దేవుడు చూచెను. మిగిలిన ఐదుగురు ఆజ్ఞానుసారముగా నడచుచూ, అక్షరానుసారమైన ఆజ్ఞను నెరవేర్చుచు, మనుష్యుల యెదుట సాక్ష్యముతో సంతృప్తి చెందియుండిరి. ఎత్తబడునప్పుడు వారు విడిచి పెట్టబడుదురని వారు గ్రహించలేకపోయిరి. పెండ్లి కుమారుడు వారితో ''మీరెవరో నాకు తెలియదు'' అని చెప్పెను. ఆయన వేరొక గుంపువారితో చెప్పినట్లు ''అక్రమము చేయువారలారా'' అని చెప్పలేదు (మత్తయి 7:23). ఎందుకనగా ఈ ఐదుగురు అక్రమము చేయువారు కాదు. అయినా, వారు వారి అంతరంగ జీవితములలో క్రీస్తు ఆత్మలో పాలివారుగా లేరు. ప్రభువు వారితో ''మీ ఆత్మతో నాకు ఎటువంటి సహవాసము లేదు. మీ బాహ్యజీవితము న్యాయబద్దముగా నుండినా, మీ ఆత్మ కేవలము అక్షరానుసారమైనది. మీరు క్రొత్త నిబంధన యొక్క పరిసయ్యులై యున్నారు'' అని చెప్పెను. ''మీరెవరో నాకు తెలియదు'' అను మాటల వెనుక ఉండిన భావము అది.


క్రొత్త నిబంధన ఆజ్ఞలకు అక్షరానుసారముగా తు.చ. తప్పక పాటిస్తున్నప్పటికీ, క్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలించకపోవుట సాధ్యమే. ఉదాహరణకు, మనకు హాని చేసిన మరొకరి యొద్దకు, కీడుకు మేలు చేయవలెను అను ఆజ్ఞను పాటించుట కొరకు బహుశా ఖరీదైన బహుమతితో వెళ్లి ఆజ్ఞానుసారముగా మన ప్రేమను అతడికి చూపి, మేలు చేయవచ్చును. అయినప్పటికిని అతడి యొద్దకు వెళ్ళునప్పుడు మన ఆత్మలో బయటకు వినబడని ఈ మాటలు : ''ఇదిగో నేనొక గొప్ప పరిశుద్ధుడిని, ఒక చెడ్డవాడైన పాపికి మేలు చేయుటకు వచ్చుచున్నాను'' అని యుండవచ్చును. అటువంటి పరిస్థితులలో, మనము ఆ బహుమతి కొనుటకు చాలా డబ్బును పెట్టియుండవచ్చును, మరియు ఆ ''మంచి'' చేయుటకు ఎంతో కష్టపడి యుండవచ్చును. అయినప్పటికిని ఆ అర్పణ దేవునికి పరిమళ వాసన కాదు, ఎందుకనగా అక్కడ మన అహం బలికాబడలేదు (ఎఫెసీ 5:2).


వేరొక పరిస్థితిని ఆలోచించండి. కోపముపై అప్పటికి విజయము పొందని ఒకని భార్య, ఒకరోజున అతడి విషయంలో కోపము తెచ్చుకొన్నదనుకోండి. అతడు తన కుర్చీలో మౌనముగా ఆమె తనకు వ్యతిరేకముగా వెళ్ళగక్కే ధూషణలన్నిటినీ వింటూ కూర్చొనెను. అది వివేచన లేని బయటవారు చూచుటకు అతడొక ''పరిశుద్ధుని''గాను మరియు ఆమె ఒక ''పాపి''గాను కనబడును. కాని మానవుల ఆత్మలను తూకము వేసిచూచే దేవునికి వారిరువురి గూర్చి సంపూర్తిగా వేరు అభిప్రాయము ఉండవచ్చును. నోరువిప్పని ఆ భర్తయొక్క ఆత్మ బయటకు చెప్పకపోయినా ''ప్రభువా! నా భార్యవలె నేను ఒక ఓడిపోయిన విశ్వాసిగా ఉండనందుకు నీకు వందనములు. నేను కోపమును జయించినందుకు వందనములు'' అని చెప్పుచుండవచ్చును. అందువలన ఆ సమయములో కోపము అదుపు చేసికోలేకపోయిన భార్య, మౌనముగా కుర్చీలో కూర్చొనిన స్వనీతి పరుడగు పరిసయ్యుడైన అతడి కంటె దేవునికి అంగీకారమైనదని అతడు గ్రహించడు. నిజముగా వేశ్యలు మరియు దొంగలు పరిసయ్యులకంటె ముందు దేవుని రాజ్యములో ప్రవేశింతురు. ఉద్రేకమును కోల్పోవుట నిశ్చయముగా క్రైస్తవునికి తగదు. అయితే పరిసయ్యతత్వమును అంతే. అటువంటి పరిస్థితులలో మనము చెయ్యవలసినదేమంటే, పరిసయ్యతత్వముతో కల్మషము కాకుండునట్లు మన ఆత్మలను శుభ్రపరచు కొనుట. అదియే రక్షణకు మార్గము.


తప్పిపోయిన కుమారుని ఉపమానములో, క్రీస్తు మరియు పరిసయ్యుని యొక్క వైఖరులు తండ్రి మరియు పెద్దకుమారునిలో తేటగా చూపబడినవి. తండ్రి తన చిన్న కుమారుడు పాపములపై విజయము పొందక పోయినప్పటికిని, అతడు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినందుకు సంతోషించెను. పరిసయ్యతత్వముతో నుండిన పెద్దకుమారుడు అదేవిధముగా తన తమ్మునికి స్వాగతమివ్వలేక పోయెను. అతడి యిష్టము జరగనిచ్చి యుండినట్లయితే, అతడు తన తమ్ముని పశ్చాత్తాపము నిజమైనదో కాదో తెలుసుకొనుట కొరకు కనీసము సంవత్సరము పాటు ఇంటిలోనికి రానివ్వకుండా సేవకులు నివసించే గదులలో ఉంచేవాడు.


మన శరీరములో నున్న ఈ పరిసయ్య ఆత్మ మనకు ఏదొక విధముగా హాని చేసిన వారి యెడల మనము చూపించే వైఖరిలో చాలా బాగా కనబడును. వారు వారు చేసిన తప్పు గూర్చి క్షమాపణ అడిగినా, మనము వారి పశ్చాత్తాపమును పరీక్షించుట కొరకు ''వారిని సేవకుల గదులలో ఉంచుదుము''. అయితే ఒకడు మనకు వ్యతిరేకముగా ఒక దినములో (12 గంటలు సమయములో) ప్రతి రెండు గంటలకు పాపము చేసి, తిరిగివచ్చి నేను పశ్చాత్తాప పడితిని, నన్ను క్షమించమని అడిగినట్లయితే, అతడి పశ్చాత్తాపములో యథార్థత గూర్చి ప్రశ్నించకుండా మనము క్షమింపవలెనని యేసు ప్రభువు మనకు చెప్పెను (లూకా 17:4). మనము అతడు చెప్పిన మాటను బట్టి అతడిని అంగీకరించవలెను. అతడు బహుశా నమ్మదగిన వాడు కాకపోవచ్చు. కాని అది తీర్పు చెయ్యవలసినది దేవుడే గాని మనము కాదు. మనము కేవలము బాహ్య స్వరూపమును మాత్రమే చూడగలము. కాని దేవుడు హృదయమును చూచును.


'ఏమి' చేశామను దానికంటే 'ఎందుకు' చేశామనునది చాలా ప్రాముఖ్యమైనదని మనము తీర్పు దినమున తెలిసికొందుము (1 కొరింథీ 4:5). లూకా 15:29లో, ''అన్న తండ్రి యొక్క ఒక్క ఆజ్ఞకు కూడా అవిధేయత చూపలేదని మనము చదివెదము''. అయినప్పటికీ ఆ కథ చివర్లో అతడు తండ్రి యింటి (సంఘము) బయట నుండుట చూచుదము. దానికి కారణము అతడు అక్షరానుసారమైన ఆజ్ఞ నెరవేర్చు ఆత్మ కలిగియుండెను. అతడు కన్యకయే, కాని అతడి సిద్దెలో నూనె లేదు. అతడి ఉద్దేశము చివరకు బయటపడెను. అతడు ప్రతిఫలమును ఆశించి సేవించెను. అతడు తన తండ్రితో ''నేను నీ యొక్క ఆజ్ఞలన్నిటికి లోబడినా, నీవు నాకెప్పుడు బహుమతి ఇవ్వలేదు'' అనెను!


పేతురు యేసుప్రభువును (యౌవనస్థుడైన ధనవంతుడు యేసు వద్దకు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన తరువాత) ''అన్నిటిని విడిచిపెట్టిన (యౌవనస్థుడైన ధనవంతుని వలె కాక) మేము ఏమి పొందుదుము?'' అని అడిగినప్పుడు (మత్తయి 19:27) ఇటువంటి వైఖరి గూర్చి యేసు ప్రభువు శిష్యులను హెచ్చరించెను. యేసు ప్రభువు పనివారిని కుదుర్చుకొనిన యజమానుని ఉపమానముతో జవాబిచ్చెను. ఐదు గుంపులను ఈ యజమానుడు పనికి కుదుర్చుకొనెను. అందులో నాలుగు గుంపులు 'ఇంత' ఇవ్వబడునని కుదుర్చుకొనబడెను. ఆఖరి గుంపు మాత్రము ఎంత ఇచ్చేదీ తెలియకుండానే పనిలోనికి వచ్చెను (మత్తయి 20:1-16). ఈ ఉపమానములో ముఖ్యమైన అంశము ఇది. మొదటి గుంపు రోజు కూలీయైన ఒక దేనారమునకు (2వ) పనిచేసిరి. రెండు, మూడు మరియు నాలుగవ గుంపులు కూడా ఎంతని తెలియకపోయినా ప్రతిఫలమును ఆశించి పనిచేసిరి (3,4 మరియు 5వ). ఈ నాలుగు గుంపులలో పనివారు ఆజ్ఞలను పాటించువారు లేక దేవునికి సేవ చేయువారు లేక ఆయన కొరకు బాహ్యమైన త్యాగములు చేయువారు కాని రహస్యముగా ప్రతిఫలము గూర్చి ఆశించువారు. బహుశా అది వెయ్యేళ్ళ పాలనలో సింహాసనముపై కూర్చొనెదమన్న మానవ నైజపు సంతోషము కావచ్చును లేక వారి తలలపై 'కిరీటము' ధరింపవచ్చన్న విషయం కావచ్చును లేక 'ఆత్మీయ' ఉద్దేశ్యము వలె కనబడే పెండ్లికుమార్తెలో భాగముగా నుండవలెననే ఆశ కావచ్చును. అటువంటి క్రైస్తవ పనివారందరూ ప్రతిఫలము గూర్చి పనిచేయుచున్నారు. అది పాత నిబంధన ఆత్మ.


నిజమైన ఆత్మానుసారుడు ప్రతిఫలముగా దేవుని యొక్క పరిశుద్ధమైన మరియు ప్రేమ గలిగిన స్వభావములో పాలివాడగుటకు మరియు ఆయనతో దగ్గర సంబంధము కలిగి యుండుటను ఆశించును. అతడు ఎదురుచూసే 'కిరీటము' ఇదియే, మరియు యేసు ప్రభువు అటువంటి ప్రతిఫలమునే పట్టుకొని వచ్చుచున్నాడు (పక్రటన 22:12). మరియు ఈ బహుమానము ఒకడు తన రక్షణను ఎటువంటి నమ్మకత్వముతో కొనసాగించుకొనెను అనుదానికి సరిసమానముగా నుండును. అది శరీర మాలిన్యము కడిగివేసుకొనుట మాత్రము కాక ఆత్మకు అంటిన మాలిన్యమును ముఖ్యముగా ఆత్మలో నుండి పరిసయ్యుతత్వము అనే మాలిన్యమును కడుగుకొనవలెను. ఇందును బట్టియే మనము తిరిగి పునరుత్థానులమైనప్పుడు నక్షత్రముల యొక్క ప్రకాశము ఒక దానికి ఒకటి వేరు వేరుగా నుండినట్లు మన యొక్క మహిమ కూడా ఒకరికొకరికి వేరువేరుగా నుండును (1 కొరింథీ 15:41, 42). ఎందుకనగా నీతిమంతుడైన దేవుడు ఒక్కొక్క 'కన్యక'కు మనుష్యులు చూచినట్లు కాక ఆయన చూచిన దానిని బట్టి న్యాయముగా ప్రతిఫలమిచ్చును (2 కొరింథీ 5:10).


పై ఉపమానములో ఆఖరున వచ్చిన గుంపులో నున్న పనివారు మాత్రమే ఏ విధమైన ఒప్పందము లేకుండా ప్రతిఫలము గూర్చిన ఆశ గాని వాగ్దానము గాని లేకుండా పనికి వచ్చిరి (మత్తయి 20:7). వారు క్రొత్త నిబంధన ఆత్మతోనున్నవారు. అందుచేత వారు మొదటగా ప్రతిఫలము పొందిరి మరియు ఇతరులకంటె ఎంతో ఎక్కువ (పోల్చుకొనినప్పుడు) పొందిరి (మత్తయి 20:16). మరొక ప్రక్క మొదటి గుంపులో పనివారు తప్పిపోయిన కుమారుని కథలో పరిసయ్యుతత్వము కలిగియుండు అక్షరానుసారముగా ఆజ్ఞ నెరవేర్చుచు ఘనత పొందుదుమని ఎదురుచూచిన అన్నవలె నుండిరి.


క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు మనకు మాదిరి మరియు ముందు పరిగెత్తిన వారుగా నున్నాడు. ఆయన తన తండ్రి యొక్క ఆజ్ఞలను ఇప్పుడైనా లేక నిత్యత్వములోనైనా ఏదో ప్రతిఫలము పొందుటకు గాని లేక ఘనమైన స్థానము పొందుటకు గాని నెరవేర్చలేదు. తన తండ్రి శిక్షిస్తాడనే భయము చేత ఆయన తండ్రి ఆజ్ఞలను పాటించుట అసలే కాదు. కేవలము ఆయన యెదుట నుంచబడిన సంతోషమును - అది 'తెర'కు అటువైపు నివసించుచున్న తండ్రితో నుండే మహా సంతోషకరమైన సహవాసము కొరకు ఆయన సిలువను సహించెను. తండ్రి సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషము కలదు (కీర్తన 16:11). యేసు ప్రభువు భూమిపై జీవించిన రోజులన్నిటిలో తండ్రితో సహవాసమును కోరుకొనుచుండెను. అందువలన ఆయన మహా రోదనముతోను మరియు కన్నీళ్ళతోను 'మరణము' నుండి తప్పింపబడునట్లు - అది తన తండ్రితో సహవాసము తెగిపోకుండునట్లు ప్రార్థించెను (హెబీ 5:7). 33 సంవత్సరములు ఆయన ఈ లోకములో తనను తాను ఆ విధముగా 'మరణము' నుండి కాపాడుకొనెను. చివరగా గెత్సేమనే వనములో సిలువపై 3 గంటలపాటు తన తండ్రితో తన సహవాసము తెగిపోవుటను చూచినప్పుడు (మన పాపముల నిమిత్తము దేవునిచేత విడువబడి బాధ అనుభవించవలసి వచ్చినప్పుడు) ఆయన వేరొక మార్గము ఏదైనా యుండునేమోనని మెఱ్ఱపెట్టెను. కాని వేరొక మార్గము లేక పోయెను. అయితే మన యెడల నుండిన ప్రేమను బట్టి, చెల్లించవలసిన ధరను లెక్కకట్టి, సిలువ మీదకు వెళ్ళి ఆయన ఎప్పుడూ చెల్లించనంతటి గొప్పధరను చెల్లించెను.


మనము ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆ ఆత్మలో పాలివారమగుదుమో అప్పుడు అక్షరానుసారమైన ఆజ్ఞను పాటించుట నుండి విడుదల పొందుదుము. అక్షరానుసారమైన ఆజ్ఞను పాటించుట - నలకలను వడగట్టి ఒంటెలను మ్రింగు నైజము నుండి విడుదల - మనము ఏదైనా యుక్తి చేత గాని లేక పద్ధతి ద్వారాగాని సాధించలేము. దానికి ఒకే ఒక మార్గమున్నది. అది 2 కొరింథీయులు 3:18లో వ్రాయబడినది. అక్కడ అధ్యాయమంతా పౌలు పాత నిబంధనకు వేరుగా క్రొత్త నిబంధనను చూపించిన తరువాత (6-17), చివరగా పరిశుద్ధాత్మ ఏవిధముగా దేవుని వాక్యపు అద్దములో యేసుప్రభువు యొక్క మహిమను చూపించి, మనలను అదే సారూప్యములోనికి ఎట్లుమార్చునో చెప్పెను.


పరిశుద్ధాత్ముడు అన్నిటికంటె మొదటిగా, యేసుప్రభువు మనవంటి శరీరము కలిగి వచ్చెనని చూపుటకు ఆశపడుచున్నాడు. ఆయన ధర్మశాస్త్రము క్రింద జన్మించెను (గలతీ 4:4). అయినప్పటికిని, యేసుప్రభువు యౌవనుడుగా ధర్మశాస్త్రములో ఆజ్ఞలను ధ్యానించినప్పుడు, ఆ ఆజ్ఞలలో ఆయన తనకంటె ముందున్నవాడు ఎవరూ చూడనిదాని కంటె ఎక్కువచూచెను. ఉదాహరణకు, వ్యభిచరించవద్దు అను ఆజ్ఞకు ఒకడు తన హృదయమందు కూడా మోహము కలిగి యుండకూడదు అని కూడా అర్థమని ఆయన చూచెను. నరహత్య చేయకూడదు అను ఆజ్ఞలో, ఒకరి హృదయములో కూడా కోపగించకూడదు అనికూడా అర్థమని ఆయన చూచెను. యేసుప్రభువు శరీరధారియై జీవించినప్పుడు తన తండ్రికి అక్షరానుసారముగా కాక పరిపూర్ణముగా విధేయత చూపవలెనని గొప్ప వాంఛ కలిగియుండెను. ఆ విధముగా ఆయన ధర్మశాస్త్రము క్రింద మనవంటి శరీరముతో జన్మించినా, (గలతీ 4:4) ఆయన ఒక క్రొత్త నిబంధనను ప్రతిష్టించెను. పరిశుద్ధాత్ముడు మనకు లేఖనముల యొక్క పేజీలలో ఈయననే చూపించెను.


యేసు ప్రభువును ఈ మార్గములో వెంబడించుట యనగా లేఖనములను ఆయన ధ్యానించునట్లు మనమును ధ్యానించుట. అప్పుడు దేవుని ఆజ్ఞలలో ఇతరులకు కనబడిన వాటికంటె మనకు ఎక్కువ కనబడును.


యేసు ప్రభువు మాట్లాడిన మాటలు ఆత్మయు మరియు జీవమునై యుండెను (యోహాను 6:63). ఆ కారణము వలననే ఆయన భూమిపై నుండినప్పుడు అనేకులు ఆయనను అర్థము చేసికొనలేదు మరియు ఈనాడు కూడా అందుకే అర్థము చేసికొనుట లేదు. సత్యమును ప్రేమించిన వారికే దేవుడు వెలుగునిచ్చును. మిగిలిన వారందరు మోసపోవునట్లు ఆయన అనుమతించును. 2 థెస్సలోనీకయులకు వాస్రిన పత్రిక 2:1-12 వచనాల యొక్క అర్థమదియే. మనము ఆయన వాక్యమును, సత్యమును గూర్చి హృదయమంతా నిండిన ప్రేమతో ధ్యానించినట్లయితే, ధర్మశాస్త్రమును అక్షరానుసారముగా పాటించినందుకు మనలను మనము మెచ్చుకొనుట కాక, అది సరియైన ఆత్మతో పాటించలేదని మనలను మనము తీర్పు తీర్చుకొందుము.


పది ఆజ్ఞలలో, తొమ్మిదింటిని పాటించుట సాధ్యమే కాని పదవ దానిని పాటించుట అసాధ్యము. ఎందుకనగా అది దురాశ గూర్చినది, అది అంతరంగమునకు సంబంధించినది. ఒకడు హృదయములో దురాశ కలిగి యుండెనో లేదో ధర్మశాస్త్రము ఎప్పుడూ కనుగొనలేదు, కనుక అతడు అట్లుండినా శిక్షించలేదు. అందువలననే పౌలు, ధర్మశాస్త్రపు నీతిననుసరించి అనింద్యుడైనప్పటికి, పదవ ఆజ్ఞను నెరవేర్చలేకపోయానని ఒప్పుకొనెను (ఫిలిప్పీ 3:6, రోమా 7:7-10తో పోల్చి చూడండి). ఆయన ఈ విషయమును ఒప్పుకొనిన కొందరిలో ఒకడు. ఆ విధముగా దేవుడు ఆయనను క్రొత్త నిబంధనలోనికి నడిపించెను.


మనుష్యుని యొక్క నిజాయితీని పరీక్షించుటకు పదియవ ఆజ్ఞను దేవుడు ఉంచెను. ఎవరైతే ఈ విషయంలో ఓడిపోయామని ఒప్పుకొందురో వారు ముందుకు నడిపింపబడుదురు. అటువంటి వారికి మాత్రమే ధర్మశాస్త్రము 'బాలశిక్షకుడుగా' నుండి వారిని క్రీస్తులోనికి మరియు క్రొత్త నిబంధనలోనికి నడిపించును (గలతీ 3:24). తమ అంతరంగ పాపములను దాచుకొనిన వారందరు పాత నిబంధనలోనే యుండిపోవుదురు. ఈ కారణము చేతనే అనేకమంది క్రైస్తవులు ఈనాడు ఓడిపోవుచున్నారు. వారి అంతరంగ ఓటములను ఒప్పుకొనుటలో వారు నిజాయితీగా యుండుట లేదు. వారు మనుష్యుల యొద్దనుండి వచ్చు ఘనతతో సంతృప్తి పడిపోవుచున్నారు. వారు వారిని గూర్చిన సత్యమును ప్రేమించుట లేదు. ఆ విధముగా దేవుడు వారు మోసపోవునట్లు అనుమతించుచుండెను.


మానవుడు ధర్మశాస్త్రపు నియమ నిబంధనలతో జీవించవలెననేది ఎప్పుడూ దేవుని ఉద్దేశముకాదు. ధర్మశాస్త్రము మానవుని జీవములోనికి నడిపించుటకు ఇవ్వబడలేదు. కాని మానవుని యొక్క శక్తిహీనతను తెలుపుటకును మరియు అతడి నిజాయితీ పరీక్షించుటకు ఇవ్వబడెను. అందువలన యేసు ప్రభువు వచ్చిన తరువాత, ధర్మశాస్త్రము ప్రక్కన పెట్టివేయబడెను మరియు క్రొత్త నిబంధన వచ్చెను (హెబీ 8:7, 8, 13).


దేవుడు ఆదామును ఏదేను వనములో నుంచినప్పుడు మంచి చెడుల జ్ఞానము నిచ్చే చెట్టు ఫలములను తినవద్దనెను. వేరే విధముగా చెప్పవలెనంటే, మానవుడు 'మంచి చెడు' నియమముల పుస్తకమును బట్టి చెడు అంతటిని చేయక, మంచి అంతటిని చేయుచు జీవించ వలెననికాదు. ఇక్కడే నిజమైన క్రైస్తత్వము అబద్దపు క్రైస్తత్వముతోను మరియు ఇతర మతములతోను విభేదించుచున్నది.


మానవుడు జీవవృక్షము మీద ఆధారపడి అనగా దేవునికి యిష్టమైనది ఏదో యిష్టం కానిదేదో పరిశుద్ధాత్ముడు తెలియజేయుటను బట్టి జీవించుటను దేవుడు ఉద్దేశించెను (1 కొరింథీ 6:12 మరియు 10:13). మంచి చెడుల జ్ఞానమును బట్టి జీవించుట ధర్మశాస్త్రానుసారముగా జీవించుట; మరియు అది ఎప్పుడూ బంధకములు తీసుకువచ్చును. ఆ విధముగా మనము ధర్మశాస్త్రము వెనుకనుండిన ఆత్మను గ్రహించలేము.


మనము ఆజ్ఞలను పాటించుట ద్వారా బాహ్యముగా నీతిగల జీవితము జీవించి కన్యకలము అగుదుము మరియు ఇతరుల నుండి, సంఘములోను కూడా ఘనతను పొందుదుము. కాని మన సిద్దెలోనికి నూనెవచ్చు ఒకే ఒక మార్గము, ఏ మానవుడు చూడని ఆత్మ యొక్క మాలిన్యము నుండి మనలను మనము కడుగుకొనుట ద్వారా అయియున్నది.


పౌలు ఎఫెసులో నుండిన క్రైస్తవులకు క్రొత్తనిబంధన సత్యములను వ్రాయుచూ, ఆయన మాటలు వారికి ప్రత్యక్షతను యివ్వలేవు అని ఎరిగియుండెను. కనుక వారి కన్నులు పరిశుద్ధాత్మ చేత తెరవబడవలెనని ప్రార్థించెను (ఎఫెసీ 1:17, 18).


మన కొరకు కూడా మనము అట్లు ప్రార్థించవలసి యున్నది.


అధ్యాయము 6
క్రొత్త నిబంధన - యేసుతో భాగస్వామ్యము

ఎవరును ఎప్పుడును దేవునిని చూడలేదు. కాని ఆయనను తండ్రిగా బయల్పరచుటకై యేసు వచ్చెను (యోహాను 1:18). యేసు దేవుని నామమును 'తండ్రిగా' బయలుపరచెను (యోహాను 17:6). ఆ నామములోనే (మరియు ఆ నామమునకు వెనుకనున్న శక్తిలో) యేసు యొక్క శిష్యులు వారియొక్క భధ్రతను కనుగొనవలసి యుండెను (యోహాను 17:11, 12).


పాత నిబంధన కాలములో దేవుడు గుడారమునందు ఒక దళసరి తెర వెనుక ఉండెడివాడు. ఆయన ఎటువంటి వాడో ఎవరికీ సరిగా తెలియదు. పరిసయ్యులైతే దేవునిని ఒక కనికరము లేని మరియు తనకు కావలసిన వాటిని ఖచ్చితంగా అడిగి తీసుకొనే ఒక నియంతగా ప్రజలకు చిత్రీకరించిరి. అప్పుడు యేసు ప్రభువు వచ్చి తెరను చింపి లోపల ఉన్నది ఒక ప్రేమగలిగిన తండ్రి అని చూపెను. అయితే సాతాను చురుకుగా నుండి తిరిగి దేవునిని విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కూడా తప్పుగా చిత్రీకరించుచున్నాడు. ఇప్పుడు సంఘము యొక్క పిలుపు యేసు ప్రభువు ఏమి చేసెనో అది చేయుటయై యున్నది- అది దేవునిని ఒక ప్రేమగల తండ్రిగా తెలియపర్చుటయై యున్నది. మనకు దేవుడు తండ్రిగా తెలిసినప్పుడే మనము క్రొత్త నిబంధన యొక్క మేలంతటిలోనికి ప్రవేశింపగలము. ఆయన సర్వకృపానిధియగు దేవుడు అని పిలువబడెను (1 పేతురు 5:10). 'కృప' అనగా 'సమయోచిత సహాయము' (హెబీ 4:16). కావున దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయుడై యుండును. ఆయన ఎల్లప్పుడూ అపవాదికి వ్యతిరేకముగా మన పక్షమున ఉండును. అందుచేతనే యేసు ప్రభువు పరిశుద్ధాత్మను ''ఆదరణకర్త'' (సహాయకుడు) (యోహాను 14:16) అని పిలిచెను.


ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చియుండెను మరియు అది పాపమును (రోమా 7:13) మరియు పాపమునకు వ్యతిరేకముగా మనము ఎంత నిస్సహాయులమో చూపుచుండెను (గలతీ 3:24). అంతేకాని జయించుటకు ధర్మశాస్త్రము మానవునికి ఎటువంటి సహాయకుని ఇవ్వలేదు. అందువలన ధర్మశాస్త్రము మానవుని అంతరంగములో పవిత్రత యివ్వలేకుండెను. దేవుడు ఎల్లప్పుడూ అంతరంగములో పవిత్రతను కోరుచుండెను (కీర్తనలు 51:6). అయితే ధర్మశాస్త్రము క్రింద ఏ మానవుడు ఈ ప్రకారం ఉండలేకపోయెను. అయితే యేసుప్రభువు ఇప్పుడు మనకొరకు శ్రేష్టమైన నిబంధనను ఏర్పరచెను. అది ఈ కారణముల వలన శ్రేష్టమైనది: ధర్మశాస్త్రము కేవలము ఆజ్ఞలనే ఇచ్చెను. కాని కృపలో ఆజ్ఞలను పాటించగలుగుటకు దేవుడు ఆజ్ఞలను మాత్రమే కాక ఒక మాదిరిని కూడా యిచ్చెను (యేసు ప్రభువు యొక్క ఈలోక జీవితము) మరియు ఒక సహాయకుని (పరిశుద్ధాత్ముని) కూడా యిచ్చెను. ఇది పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న ఒక ముఖ్యమైన వ్యత్యాసము. యేసుప్రభువు మనవంటి శరీరముతో ఈ లోకములోనికి వచ్చెనను వాస్తవమును మననుండి దాచుట ద్వారా యేసు ప్రభువు మనకు మాదిరిగా ఉండెనను విషయమును బట్టి పొందు ప్రోత్సాహమును క్రైస్తవత్వములో అనేకమంది నుండి సాతాను దొంగిలించెను. రెండవదిగా, ఆదరణ కర్తయైన పరిశుద్ధాత్ముని ద్వారా పొందవలసిన శక్తిని నకలు చేయుట ద్వారా లేక పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును తృణీకరించుట ద్వారా సాతాను దొంగిలించుచుండెను. అనేకులు ఈనాడు వారి శరీరములోని దురాశలతో పోరాడుటకు మరియు సాతానును ఎదిరించుటకు శక్తిలేని నకిళీ ''ఆత్మలో బాప్తిస్మము''ను పొందుచున్నారు. సాతాను ఎటువంటి అద్భుతమైన మోసమును చేసెను!


ధర్మశాస్త్రము క్రింద మానవుడు దేవునిని సంతోషపర్చుటకు ప్రయత్నించి విఫలమాయెను. కృప క్రిందనైతే దేవుడు మనలో పనిచేసి ఆయనను సంతోష పరచునట్లు చేయును (ఫిలిప్పీ 2:12, 13). దేవునిని సంతోషపర్చుటకు ఆసక్తితో ప్రయత్నించుచు వారి ప్రయత్నములో తప్పిపోవుచున్నవారు, బహుశా యథార్థతగలవారైనా ధర్మశాస్త్రము క్రిందనున్నారు. వారిలో అనేకులు ఆజ్ఞలను పాటించవలెననే ప్రయాసలతోను భారముతో అలసిపోయి యుందురు. అటువంటి ప్రయాసపడి భారము మోయువారి యొక్క కాడిని తనయొద్దకు వచ్చి తన యొద్దనున్న తేలికైన కాడితో మార్చుకొనమని యేసు ప్రభువు చెప్పారు (మత్తయి 11:28-30). వివాహము, వ్యాపారములలో దేనికైనా కాడి సూచనగా యుండును. యేసు ప్రభువు ఆయన పెట్టుబడి పెట్టే వ్యాపారములోనికి లాభములను తీసుకొనుట కొరకు మనలను ఆహ్వానించుచుండెను!


యోహాను యేసు చేసిన అద్భుత కార్యములను 'సూచక క్రియలు' అని పిలిచెను (యోహాను 2:11). వేరొక విధముగా చెప్పవలెనంటే, ప్రతి అద్భుతము ఒక సందేశము కలిగిన ఉపమానముగా యుండెను. ముఖ్యముగా యోహాను సువార్తలో వ్రాయబడిన అద్భుతములన్నిటిలో నుండిన సందేశము, యేసు ప్రభువు మనతో భాగస్వామ్యములో చేరుటకు కోరుచున్నాడు అనునది.


కానాలో వివాహములో యేసు ప్రభువు సుళువుగా నీటి బానలను ద్రాక్షారసముతో నింపియుండేవారు. అయితే అందులో భాగస్వామ్యము అనేది ఉండేది కాదు. అది ఒకే వ్యక్తి చేసిన కార్యముగా నుండేది. అక్కడ ఉండిన సేవకులు వారు పనిచేయుట ద్వారా ఆ అద్భుతములో పాలు పంచుకొనుటకు పిలువబడిరి - అది సుళువైన పనియైన నీటిని నింపుట. అప్పుడు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చుట అను కష్టమైన పనిని ఆయన చేసెను(యోహాను 2:1-11).


అదే విధముగా ఐదువేల మందికి ఆహారము పెట్టు విషయములో, యేసు ప్రభువు ఏమీ అవసరము లేకుండానే ఆహారము సృష్టించగలరు. కానీ ఆయన అలా చేయలేదు. ఒక చిన్న బాలుడు అతడు తెచ్చుకొనిన ఆహారమును యిచ్చుటకు ఆహ్వానింపబడెను. ఆ విధముగా ఆ చిన్నబాలుని భాగస్వామ్యముతో ఆయన ఐదువేల మందికి ఆహారము పెట్టెను (యోహాను 16:1-13). ఆ చిన్న బాలుడు చెయ్యగలిగినది అతడు చేసెను. యేసు ప్రభువు చెయ్యగలిగినది ఆయన చేసెను!


పుట్టుకతో గ్రుడ్డివానికి కూడా అతడు చెయ్యగలిగినది అతడు చేయవలెనని యేసు చెప్పెను(యోహాను 9:1-7). అతడు వెళ్ళి సిలోయము అను కోనేటిలో కడుగుకొనవలెను. అప్పుడు యేసు ప్రభువు కన్నులు తెరచుటను కష్టమైన పనిని చేసెను.


లాజరును లేపుటలో కూడా ఇదే నియమమును చూచెదము. అతడి స్నేహితులు సుళువైన పనియైన సమాధిని కప్పియుంచిన రాయిని తొలగించిరి. అప్పుడు యేసు చావు నుండి లాజరును లేపుట అనే కష్టమైన పనిని చేసెను. అక్కడ కూడా అతడి స్నేహితులు మరియొకసారి వారు చేయగల పని చేయుటకు అవకాశము పొందిరి - వారు కట్లు విప్పి లాజరును విడుదల చేయుటను చేసిరి (యోహాను 11:38-44).


పునరుత్థానుడైన తరువాత శిష్యులు ఒకరోజు చేపలు పట్టుటకు వెళ్ళుటను చూచుదుము. ''వారు ఆ రాత్రి ఏమియు పట్టలేదు'' (యోహాను 21:3). ఇది మానవుడు ధర్మశాస్త్రమునకు లోబడి దానిని నెరవేర్చుటకు చేయు ప్రయత్నమునకు చక్కని దృశ్యము! అప్పుడు యేసు ప్రభువు వచ్చారు. ఆయన వారి వలలు సముద్రములో వేయకుండానే వారి పడవలు చేపలతో నిండునట్లు చేయగలడు. ఆ ప్రాంతములో చేపలను పేతురు యొక్క పడవ దగ్గరకు రమ్మనమని ఆజ్ఞ యిచ్చిన దేవుడు, వాటిని ఆ పడవలోనికి గెంతుమని కూడా సుళువుగా ఆజ్ఞ యివ్వగలడు. అయితే అట్లు చేసినట్లయితే భాగస్వామ్యము యుండేది కాదు. కనుక మానవుడు అతడు చెయ్యవలసిన పని అతడు చెయ్యవలెను. వారు వారి వలలను సముద్రములో వెయ్యవలసి యుండెను. ఆ విధముగా యేసు ప్రభువు భాగస్వామ్యముతో ఆ అద్భుతము జరిగెను. కనుక మానవుడు చెయ్యవలసిన పని అతడు చెయ్యవలసియుండెను. మానవుడు సుళువైన పని చెయ్యవలసియుండెను మరియు క్లిష్టమైన పనిని యేసుప్రభువు చేయును. అయితే వారు వారి వలలు వేయవలసి యుండెను. అది పౌలు రోమా 1:5లో చెప్పిన విశ్వాసము యొక్క విధేయతయై యుండెను.


ఇది క్రొత్త నిబంధన యొక్క సువార్త. ఇది అపొస్తలులు ప్రకటించిన సువార్త. ఎక్కడైతే ఈ సువార్త అర్థము చేసికొనబడదో అక్కడ, మానవుడు అయితే అక్షరానుసారముగా జీవించు చట్టబద్ధత లోనికి (అది రాత్రంతా శ్రమపడి ఖాళీ పడవలతో విజయము లేకుండా యుండుట) లేక అసత్యపు కృపలోనికి (అందులో అసలు ప్రయత్నమూ యుండదు, విజయము ఉండదు) వెళ్ళిపోవును!


అనేక నిష్కపటమైన ఆత్మలు వారికి వారు ఏర్పర్చుకొనిన ఆజ్ఞలయొక్క భారము క్రింద కృంగిపోవుచుండుట చేత ప్రయాసపడి భారము మోయుచు యుందురు. ఫరో యొక్క పనివారు ఇశ్రాయేలీయులను ఎక్కువ ఇటుకలు చేయమని కొరడాలతో కొట్టినట్లు, సాతాను 'నీతి బోధకుడు'గా ముసుగు వేసుకొని (2 కొరింథీ 11:14, 15) ఎంతో మంది యథార్థమైన విశ్వాసులను ''నీవు తగినంతగా బైబిలు చదువుట లేదు, నీవు తగినంతగా ఉపవాసము మరియు ప్రార్థన చేయుట లేదు, నీవు తగినంతగా సాక్ష్యము చెప్పుటలేదు'' మొదలైన వాటిని చెప్పుచూ కొరడాలతో కొట్టును. చాలామంది బోధకులు కూడా వారికి తెలియకుండా సాతాను పక్షమున చేరి అటువంటి బోధలతో దేవుని ప్రజలను శిక్షావిధికి గురిచేయుదురు. అటువంటి శిక్షావిధి క్రొత్త నిబంధనను అర్థము చేసికొనకపోవుట వలనైయున్నది.


యేసు ప్రభువు తన మందకు ముందు నడచు కాపరియై యున్నాడు. ఆయన ఒక జీతగానివలె మంద వెనుక కొరడా పట్టుకొని తోలువాడుగా యుండడు. తమ గుంపులను కొరడాలతో కొట్టు బోధకులు జీతగాళ్ళై యున్నారు. నిజమైన కాపరులు మాదిరిలుగా నుండి నడిపించువారు. అనేకులు జీతగాళ్ళ బోధలు వినుటవలన బంధకములలో ఉన్నారు.


దేవుడు ఆయన కుమారుని లోకములోనికి లోకమును శిక్షించుటకు కాక రక్షించుట కొరకు పంపెను (యోహాను 3:17). అందువలన ఇతరులను శిక్షావిధికి గురియగునట్లు చేయువారు దేవునిచే పంపబడినవారు కాదు. దేవుని సేవకులు ప్రజలను ఎల్లప్పుడూ రక్షణలోనికి నడిపించుదురు.


మన జీవితమంతటిలో యేసు ప్రభువు మనతో భాగస్వామిగా నుండుటకు కోరుకొనుచున్నాడు. పేతురు దేవాలయపు పన్ను గూర్చి యేసు నొద్దకు వచ్చినప్పుడు, సముద్రములోనికి గాలమువేసి దొరికిన మొదటి చేప నోటిలో ఒక షెకెలు ఉండుననియు, అది తన యొక్క మరియు పేతురు యొక్క పన్ను చెల్లించుటకు సరిపోవునని యేసు చెప్పెను. పేతురుతో యేసు ప్రభువు ''నీ కొరకు మరియు నా కొరకు'' అను మాటలు చెప్పెను (మత్తయి 17:27). ''నీ కొరకు మరియు నా కొరకు'' అను మాటలు గూర్చి ఆలోచించండి. ఇది భాగస్వామ్యము. మనయొక్క పన్నులు కట్టుటకు సహాయము చేయుటకు కూడా యేసు ప్రభువు ఆసక్తి కలిగియున్నారు. మన దైనందిక జీవితములకు సంబంధించిన చిన్నిచిన్ని విషయములనుండి, ఎప్పటికీ శాశ్వతముగా మనము అనుభవించే విషయముల వరకు ''నీవు మరియు నేను'' అను నియమమును అనుసరించి జీవించవలెనని యేసు ప్రభువు పిలుచుచున్నాడు.


ఆయనతో భాగస్వామ్యముగా ఈ కాడిని మనము తీసుకొనినప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగును (మత్తయి 11:28-30). మన స్వంత క్రియలు మాని ఈ విశ్రాంతిలోనికి ప్రవేశింపమని మనము హెచ్చరించబడితిమి (హెబీ 4:10, 11).


మన స్వకీయ జీవితము ఎంతో బలమైనది. కాబట్టి, మన స్వంత క్రియలను మానుట అంత సుళువు కాదు. అందుచేత మనము విరుగ గొట్టబడునట్లు దేవుడు మనయొక్క పరిస్థితులను ఏర్పాటు చేయును. మన ప్రణాళికలు నిష్ఫలమగునట్లు మరియు మన నిరీక్షణ చెదిరిపోవునట్లు ఆయన అనుమతించును. మన ఆలోచనలు మరియు ఉద్దేశ్యములు నాశనమగును మరియు మనము మరల మరల పాపములో పడుదుము. ఆ విధముగా ఆయన మన స్వకీయ కార్యములను మానునట్లు నేర్పించును. కనుక మనము ఆయన కార్యములు చేయుదుము.


పాత నిబంధనలో చెప్పబడిన విశ్రాంతిదినము క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలయొక్క ఈ విశ్రాంతి యొక్క దృశ్యమైయున్నది (హెబీ 4:9, 10). నిత్యమైన విలువకు సంబంధించి ఏదైనా చేయుటకు ముందు దేవునిలో ఈ విశ్రాంతి పొందవలసియున్నది.


దేవుడు ఆదామునకు ఆరవ దినమున చేసినప్పుడు, ఆ మరుసటి దినమును ఆయన విశ్రాంతి దినముగా పవిత్రపరిచెను. అది లెక్క ప్రకారము ఏడవ దినము అయినా, ఆదాముకు అది మొదటి దినము. తరువాత 2500 సంవత్సరములకు వచ్చిన ధర్మశాస్త్రము, ''ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున నీవు విశ్రాంతి తీసుకొనవలెను'' అని చెప్పెను. కాని ఆదాముకు దేవుడు మొదట ఒకరోజు విశ్రాంతి మరియు సహవాసము ఆ తరువాత ఆరు రోజులు పని నియమించెను. అది కృప. కృప క్రింద విశ్రాంతి దినము మొదటగా వస్తుంది. మనము దేవునిని సేవించే ముందు మనము విశ్రాంతిలో ప్రవేశింపవలెను. అప్పుడు మన ఈలోక జీవితములో ప్రతిదినము ఒక సబ్బాతుగా నుండును. మరియు అదే మన యెడల దేవుని ఉద్దేశ్యమై యున్నది.


పరిసయ్యులు యేసు ప్రభువును మోషే ధర్మశాస్త్రములో విడాకులకు ఎందుకు అనుమతించెను అని అడిగినప్పుడు, మానవుని హృదయ కాఠిన్యమును బట్టి కొద్దికాలమునకు మానవులకు అటువంటి ఏర్పాటు చేయబడెను అని ఆయన జవాబిచ్చెను (మత్తయి 19:8). అయితే, అది మొదట నుండి దేవుని పరిపూర్ణమైన చిత్తము కాదని యేసు ప్రభువు చెప్పెను. ధర్మశాస్త్రములో అనేక విషయములు దేవుని అనుమతితో కూడిన చిత్తమునకు సంబంధించినవి కాని పరిపూర్ణ చిత్తమునకు సంబంధించినవి కాదు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఆవిష్కరింపబడెను. కనుక దేవుడు ''ప్రారంభము నుండి'' (మత్తయి 19:8) మానవుని ఎట్లు ఆయన పరిపూర్ణ చిత్తములో జీవించుటకు ఉద్దేశించెనో అట్లు జీవించవలెనని కోరుచున్నాడు. కనుక ఆదామునకు వలె మనకును విశ్రాంతి ముందు రావలెను. జీవితము దేవునిలో చక్కని సబ్బాతు విశ్రాంతిగా నుండవలెను.


మనము విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు మాత్రమే దేవుని ఆజ్ఞలు భారమైనవి కావని సంతోషముగా సాక్ష్యమివ్వగలము (1 యోహాను 5:3). దేవుని ఆజ్ఞలు భారముగా అనిపించినప్పుడు, తనను తాను ఉపేక్షించుకొనుట మరియు ఆజ్ఞలన్నిటికి విధేయత చూపుట బంధకాలలో ఉన్నట్లు అనిపించినప్పుడు అటువంటి వ్యక్తి యేసు యొక్క కాడి క్రిందకు రాలేదను విషయము స్పష్టమగుచున్నది. అతడు తన స్వంత కాడి క్రింద అనగా ధర్మశాస్త్రము క్రింద ప్రయాసపడుచున్నాడు.


ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణములో మరియు పరిశుద్ధ స్థలములో కూడా, ఎన్నో కార్యక్రమములు జరుగుచుండును. కాని అతి పరిశుద్ధ స్థలములో, తెరవెనుక, ఏ కార్యక్రమము ఉండదు - కేవలము సహవాసము మాత్రమే ఉండును. చివరకు దేవునికి చేయు పరిచర్య కూడా ఆ సహవాసము నుండి వచ్చును. అది పాతనిబంధన పరిచర్యకు క్రొత్త నిబంధన పరిచర్యకు మధ్యనున్న వ్యత్యాసము. ఇది లూకా 10:38-42లో చెప్పబడిన మరియ మరియు మార్తల సంఘటనలో తేటగా చూపబడెను. మరియు (సూచనార్థముగా చెప్పినట్లయితే) అతిపరిశుద్ధస్థలములో ఉండెను - అది విశ్రాంతిలో నుండి ప్రభువుతో సహవాసము చేయుచుండెను. మార్త విశ్రాంతి లేని పరిచర్యలో (''ప్రభువు కొరకు'') మందిర ఆవరణములోనుండెను. మరియ ప్రతి ఒక్కరికి అవసరమైన ఒకదానిని ఎంచుకొనెను అని యేసు చెప్పెను.


ఇప్పుడు తెర యేసు ప్రభువు చేత చింపబడెను. అందుచేత మనము అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించి నివసించగలము. అది మన రోజులన్ని తండ్రితోను కుమారుడైన యేసు ప్రభువుతోను సహవాసములో గడుపుటయై యున్నది. దేవుడు మానవుని నుండి మొదటి నుండి కోరుచున్నది అన్నిటికంటె ముందుగా పరిచర్యకాదు, బైబిలు పఠన కాదు, ఉపవాసము మరియు ప్రార్థన మొదలైనవి కాదు, కాని సహవాసము.


ఆదాము దేవునిచేత ఆయన పోలికలో సృష్టింపబడినది, దేవునికి ఏదేనులో ఒక తోటమాలి కావలసి కాదు, కాని ఆయనతో సహవాసము చేయుటకు ఒకరు కావలసియుండి సృష్టింపబడెను. మనము ఆయనకు సేవ చేయుదమను ఉద్దేశముతో కాక, ఆయనతో సహవాసము చేయుట కొరకు దేవుడు మనలను పాపపు గోతి నుండి రక్షించెను. ఈ విషయము అర్థము చేసికొనక పోవుటచేతనే, ఎందరో విశ్వాసులు మార్త వలె ఈరోజున భారముతో అలసిపోయి యున్నారు.


అపొస్తలుడైన యోహాను 95 సంవత్సరాలప్పుడు, దేవునితో 65 సంవత్సరాలు నడచిన తరువాత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఒక ఉత్తరము వ్రాయుటకు నిశ్చయించుకొనెను. ఆ ఉత్తరము యొక్క ముఖ్యాంశము ''సహవాసము'' (1 యోహాను 1:3). మొదటి ప్రేమను విడిచిన (పక్రటన 2:4) మరియు ఇప్పుడు జీవించుచున్నారను పేరుండి (వారి వేరువేరు క్రైస్తవ కార్యక్రమములతో) నిజానికి దేవుని దృష్టిలో చనిపోయిన (పక్రటన 3:1) సంఘములను మరియు నాయకులను చూచి, యోహాను క్రైస్తవులను తండ్రితోను మరియు కుమారుడైన యేసుక్రీస్తుతోను, చినిగిన తెరవెనుక సంతోషకరమైన సహవాసములోనికి నడిపించవలసిన ముఖ్యమైన అవసరతను చూచెను.


వేరువేరు కార్యక్రములలో సంతోషముండవచ్చును. కొంతమంది ఆటలలో, కొంతమంది సంగీతములో, కొంతమంది వారి వృత్తిలో, మరికొంతమంది క్రైస్తవ పనిలో సంతోషము పొందుదురు. కాని విశ్వంలో అతి పవిత్రమైన సంతోషమును కేవలము తండ్రితో సహవాసములోనే పొందగలము (1 యోహాను 1:4). ''నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు'' (కీర్తన 16:11) అని కీర్తనాకారుడు చెప్పుచుండెను. ప్రతిదినము సిలువను భరించునట్లు యేసు ప్రభువు ''యెదుట ఉంచబడిన ఆనందము'' ఇదియే (హెబీ 12:2). తండ్రితో సహవాసము యేసుప్రభువు కలిగిన వాటిలో అతి విలువైనది. దానితో పోల్చుకొనినప్పుడు ఆయన ఈ విశ్వములో మరి దేనికీ విలువ ఇవ్వలేదు. ఆయన సిలువపై మూడు గంటలపాటు తప్పిపోయిన మానవాళి శాశ్వతముగా అనుభవించవలసిన నరకబాధను అనుభవించవలసినప్పుడు, తండ్రితో నుండిన ఈ సహవాసము కల్వరిపై తెగిపోవునని యేసు ప్రభువుకు తెలియును (మత్తయి 27:45). అప్పుడు తండ్రి ఆయనను విడిచిపెట్టవలసివచ్చును మరియు ఆయన నిత్యత్వమంతా తన తండ్రితో ఆనందించిన సహవాసము ఆ మూడు గంటలు తెగిపోవలసియుండెను. ఆయన ఆ సహవాసము తెగిపోవుట గూర్చియే ఎంతగానో వేదన చెందుటచేత గెత్సేమనే తోటలో రక్తము చెమటవలె కారెను. ఆయన తొలగించుమని ప్రార్థించిన గిన్నె తన తండ్రితో సహవాసము తెగిపోవుట అనునది.


మనము దీనిని చూచి దానిచేత పట్టబడినట్లయితే, యేసు ప్రభువును వెంబడించుట గూర్చి అంత తేలికగా మాట్లాడము మరియు పాడము. యేసును వెంబడించుట అనగా ఆయనవలె తండ్రితో సహవాసమునకు విలువ నిచ్చుట. అప్పుడు పాపము మనకు ఇంకా అధికమైన పాపముగా కనిపించును. ఎందుకనగా అది తండ్రితో మన సహవాసమును తెంచివేయును. వేరొకరియెడల ప్రేమలేని వైఖరిని మనము సహించము, ఎందుకనగా అది తండ్రితో సహవాసమును తెంపివేయును.


క్రైస్తవత్వమనగా ప్రేమ గలిగిన పరలోకపు తండ్రితో తెగిపోని సహవాస సంబంధము కంటె మరేదీ కాదని మనము తేటగా చూచునట్లు దేవుడు మనకు ప్రత్యక్షత యిచ్చునుగాక.

అధ్యాయము 7
యేసు మన వలె శోధింపబడెను

యేసు ఈ భూమి మీద శరీరధారిగా నివసిస్తున్నప్పటికి కూడా ఆయన తన వ్యక్తిత్వ విషయములో దేవునిగానే ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన దైవత్వాన్ని ఎప్పుడూ కోల్పోడు. యేసు శరీరధారిగా ఉన్నప్పుడు తన దైవత్వానికి స్పష్టమైన ఋజువు ఏమిటంటే ఇతరులు ఆయనను ఆరాధన చేసినప్పుడు తాను స్వీకరించాడు (మత్తయి 8:2, 9:18, 14:33, 15:25, 20:20, మార్కు 5:6, యోహాను 9:38). దేవదూతలు మరియు దైవభక్తి కలిగిన మనుష్యులు ఆరాధననను స్వీకరించరు (అపొ.కా. 10:25, 26, పక్రటన 22:8, 9). కాని యేసు దేవుడు కాబట్టి ఆయన ఆరాధనను స్వీకరించారు.


యేసు తన స్వంత అధికారమును బట్టి ప్రజల యొక్క పాపములను కూడా క్షమించారు (మార్కు 2:10). ఆయన శరీరధారిగా ఈ భూమిమీద నివసిస్తున్న దినములలో కూడా ఆయన దేవుడైయున్నాడని చెప్పుటకు ఇది మరొక ఋజువైయున్నది.


కాని అదే సమయములో ఆయన భూమిమీదకు వచ్చినప్పుడు యేసు ''తన్ను తాను రిక్తునిగా చేసికొనెను'' అని మనకు చెప్పబడినది (ఫిలిప్పీ 2:5). ఏ విషయంలో తన్నుతాను రిక్తునిగా చేసుకున్నారు? తన దైవత్వం విషయంలో కాదు (పైన మనం చూసినట్లుగా) కాని దేవునిగా తనకున్న ఆధిక్యతల విషయంలో తన్నుతాను రిక్తునిగా చేసుకున్నాడు. శోధించబడనేరకపోవుట అనే తన ఆధిక్యతనుండి తన్నుతాను రిక్తునిగా చేసుకున్నాడు.


దేవుడు శోధింపబడనేరడు (యాకోబు 1:13) కాని యేసు శోధింపబడుటకు అనుమతించెను (మత్తయి 4:1-11).


శోధింపబడినప్పుడు ఏవిధంగా జయించాలో మనకు మాదిరిగా ఉండు నిమిత్తం శోధింపబడుటకు తన్నుతాను అనుమతించుకొనెను. యేసు సమస్త విషయములలో మనవలె శోధింపబడి కనీసం ఒక్కసారి కూడా తలంపులలోను, మాటలోను, క్రియలోను, వైఖరిలోను, ఉద్దేశ్యములోను మరి ఏవిధంగానైనను పాపము చేయలేదు. ఈ విషయమును చూడటంలోనే దైవభక్తి కలిగిన జీవితమును జీవించడానికి అవసరమైన మర్మమున్నది (1 తిమోతి 3:16 మరియు హెబీ 4:15 ను చూడండి).


ఇటువంటి దైవభక్తి కలిగిన జీవితమును జీవించేవారు మాత్రమే ఎటువంటి కలహములు లేకుండా క్రీస్తులో ఏకశరీరముగా కలిసిజీవిస్తారు. కాబట్టి మనము మరొక అడుగు ముందుకేసి ఎక్కడైతే విశ్వాసులు యేసును ఈ విధంగా చూస్తారో ఆ స్థానిక సంఘము మాత్రమే క్రీస్తుయొక్క శరీరమును వ్యక్తపరుస్తుంది అని చెప్పగలము.


సంఘము ఈ సత్యమునే స్తంభమును, ఆధారమునైయున్నది (1 తిమోతి 3:15, 16).


శోధన అనేది పాపము కాదు. యాకోబు 1:14, 15లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. శోధనలు మన మనస్సు అంగీకరిస్తేనే పాపముగా మారుతుంది. యేసు కూడా శోధింపబడెనని మత్తయి 4లో స్పష్టముగా తెలుస్తుంది. కాని ఆయన మనస్సు ఏ ఒక్క శోధనను కూడా ఒక్కసారైనా అంగీకరించలేదు. ఆ విధంగా ఆయన ఎన్నడూ పాపము చేయనివానిగా ఉన్నాడు. తన హృదయమును పవిత్రంగా ఉంచుకున్నాడు.


యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. మనందరికీ పుట్టుకతోనే ప్రాచీన పురుషుడు ఉన్నట్లుగా ఆయనలో ప్రాచీన పురుషుడు లేడు. మనందరము పాప శరీరమును కలిగియున్నాము, కాని యేసు పాపశరీరమును కలిగిలేడు. ఆయన కేవలం ''పాప శరీరాకారము''తో వచ్చాడు (రోమా 8:3). అయితే మన ప్రభువు ''సమస్త విషయములలో మనవలె శోధింపబడెను'' (హెబీ 4:15) అని బైబిలు బోధిస్తుంది. దేవుడు మానవునిగా ఎలా అయ్యాడు అనే అంశమును మనము ఏవిధంగా విశ్లేషించామో ఈ విషయమును కూడా మనము విశ్లేషించవలసిన అవసరం లేదు. మనం కేవలం నమ్మితే చాలు. ఆదాము వలె కాకుండా ప్రతి విషయంలోను, ప్రతి శోధనలోను యేసు తన తండ్రికి విధేయత చూపించాడు.


యేసు శరీరధారిగా నుండినప్పుడు విధేయతను శోధనల ద్వారా ఆయన నేర్చుకొనెనని బైబిలు బోధిస్తుంది (హెబీ 5:7-9).


ప్రతి శోధనలో శరీరములో శ్రమపడుట ద్వారా విధేయతను నేర్చుకొని ఆయన పరిపూర్ణుడయ్యెను. ''నేర్చుకొనెను'' అనే పదము విద్యాభ్యాసమునకు సంబంధించినది. కాబట్టి ఒక మనుష్యునిగా యేసు విధేయతతో విద్యాభ్యాసమును పొందెనని ఈ వాక్యము చెప్పుచున్నది. ప్రతి పరిస్థితిలో ఆయన తన తండ్రికి లోబడి ఒక మనిషిగా తన విద్యాభ్యాసమును పూర్తిచేసెను. ఆ విధముగా ఆయనను మనము వెంబడించులాగున ఆయన మనకు ముందు పరిగెత్తిన వాడాయెను (హెబీ 6:20).


అన్ని విషయములలో ఆయన సహోదరులమైన మనవలె సమానానుభవముకలవాడై యుండుటచేత, శోధనతో మన పోరాటమును బట్టి ఆయన మనకు ఇప్పుడు సానుభూతి చూపించగలడు (హెబీ 2:18; 4:15; 12:2-4).


మానవునిగా యేసు యొక్క పవిత్రత ఆయనకు ఒక పళ్ళెములో పెట్టి ఇవ్వబడినది కాదు, కాని, పోరాటముతో ఆయన సంపాదించు కొనినది. అయితే ఆ పోరాటములు ముగింపులేనివికావు. ప్రతి శోధన ఒకదాని వెంబడి ఒకటి జయింపబడినది. ఆ విధముగా ఆయన జీవించిన కాలములో మనము ఎదుర్కొనే ప్రతి శోధనను ఆయన ఎదుర్కొనెను మరియు జయించెను.


మనమందరము అనేక సంవత్సరాలుగా పాపములో జీవించితిమి. మరియు మన పాపపు రక్త మాంసములు విష సర్పములతో నిండిన ఒక పెట్టెవంటిది. అవి మన చేత బాగా పోషింపబడినవి! వాటి పేర్లు అపవిత్రత, కోపము, పగ, జగడం, నిష్ఠూరత, ధనాశ, స్వార్థము, గర్వము మొదలైనవి. మనము శోధింపబడినప్పుడెల్ల ఈ సర్పములు తలలు పైకి పెట్టునట్లు ఆ పెట్టెకు ఒక తెరవబడిన మూత ఉండినది. మన విషయంలో మనము క్రైస్తవునిగా మారక ముందు మనము ఈ సర్పములకు సమృద్ధిగా తిండి పెట్టే వారము. దాని ఫలితముగా అవి బాగుగా తిని ఆరోగ్యముగా పోషింపబడుట చేత, ఆ దురాశలు ఇతరమైన వాటికంటె మనపై మరి ఎక్కువ పట్టు సాధించి యుండెను.


ఇప్పుడు క్రీస్తునందు పాపమునకు మనము మృతి చెందితిమి. ఈ సర్పములు ఆరోగ్యముగా ఉన్నప్పటికి వాటి యెడల మన వైఖరి మారినది. మనమిప్పుడు దేవ స్వభావములో పాలుపొందితిమి మరియు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను, దురాశలతోను సిలువ వేసియున్నారు (గలతీ 5:24). ఇప్పుడు ఎప్పుడైతే ఒక సర్పము తెరవబడిన మూత గుండా తన తలను ఒక శోధనలో పైకెత్తుతుందో, అప్పుడు మనము దాని తలపై ఒక కర్రతో కొట్టెదము. అది తిరిగి ఆ పెట్టెలోనికి పోతుంది. కాని అది చనిపోదు. తిరిగి అటువంటి శోధన కలిగినప్పుడు, ఆ సర్పము తన తలను తిరిగి పైకెత్తుతుంది. తిరిగి ఒక దెబ్బ తింటుంది. క్రమంగా అది బలహీనమవుతుంది. మనము ప్రతి శోధనలో నమ్మకముగా నుండి ఆహారము పెట్టుటకు బదులు సర్పమును కొట్టుచున్నట్లయితే శోధన యొక్క శక్తి బలహీనమగుచున్నట్లు మనము కనుగొనగలము. ఈ శరీరేచ్ఛలను ఒక్క క్షణంలో తుపాకీతో కాల్చుట కాని వురికొయ్యకు వ్రేలాడదీయుటకాని చెయ్యుటకు వీలవ్వదు. అవి కేవలము సిలువ వేయబడాలి, సిలువ వేయబడుట నిదానమైన మరణము. కాని అది ఖచ్చితమైన మరణము. అందుచేతనే శోధనలో పడినప్పుడు ఆనందమని ఎంచుకొనుడి అని చెప్పబడింది (యాకోబు 1:2). ఎందుకనగా అది ఒక్కొక్క సర్పమును కొట్టుటకు బలహీనపరచుటకు అవకాశాన్నిస్తుంది. వేరొక విధముగా ఇది సాధ్యమవదు.


అపవిత్రపు తలంపుల గూర్చి ఆలోచించండి. మనము ఈ విషయములో నమ్మకముగా నుండినట్లయితే, కొద్ది కాలమైన తదుపరి మరణం ఈ విషయంలో ప్రవేశించుటను మనము గమనించగలము. మన రక్షింపబడని దినములలో ఈ విష సర్పమును ఎన్నో సంవత్సరములు పోషించిన వారమైనట్లయితే ఇది మరణించుటకు కొన్ని సంవత్సరములు తీసుకొంటుంది. కాని మనము నమ్మకముగా నుండినట్లయితే మరణము తప్పక వస్తుంది. దానికి ఫలితముగా మన కలలు కూడా పవిత్రముగా నుండును. అపవిత్రపు కలలు అరుదుగా వచ్చును. అపవిత్రపు కలలు ఎక్కువైనట్లయితే మన ఆలోచనా జీవితములో మనము మరల అపనమ్మకముగా ఉంటున్నామని అది సూచిస్తుంది. మన ఆలోచనా జీవితము మన నమ్మకత్వమును తెలుసుకొనుటకు ఇది మంచి పరీక్ష. అపవిత్రపు కలలు మనకు తెలిసిన పాపము కాదు కాని తెలియని పాపము. వాటి గూర్చి మనము అపరాధభావన కలిగి యుండనక్కర్లేదు (రోమా 7:25 మరియు 8:1). వెలుగులో నడచుచున్న వారి యొక్క తెలియని పాపము దానికదే యేసు రక్తములో కడుగబడును అనే విషయం 1 యోహాను 1:7 చెప్తుంది.


పూర్తి నమ్మకత్వం సంపూర్ణ విజయాన్నిస్తుంది. ఉదాహరణకు లైంగిక పరమైన విషయాల్లో పూర్తి నమ్మకత్వం అనగా ఒక వ్యక్తియొక్క చక్కని ముఖాన్ని కూడా మెచ్చుకొననటువంటిది. అది, ఏ విధమైన లైంగిక తలంపులు ఆ మెప్పుకోలులో లేకపోయినా కూడా. ఇది సామెతలు 6:25లో చెప్పబడిన నమ్మకత్వమునకు (దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడుట) అర్థము. ఈ విషయములో చాలా కొద్ది మంది నమ్మకంగా ఉందురు. కాబట్టి వారి కలలలో చాలా కొద్ది మంది మాత్రమే పవిత్రంగా యుందురు.


మనము మేల్కోని యుండిన క్షణాల్లో ఏది ఆలోచిస్తామో అది మన మనస్సు అచైతన్య (స్వాధీనములేని) స్థితిలోనున్నప్పుడు ప్రభావం చూపిస్తుంది. అది మన ఆలోచనలలోనికి వచ్చిన శోధనల వలన కాదు కాని ఆ శోధనలకు మన మనసు ప్రతిస్పందించే తీరును బట్టి. మన లోపలనున్న అచైతన్య మనస్సు మనము పాపాన్ని మన ఆలోచనల్లో, వైఖరిలో కూడా ద్వేషిస్తున్నామని మనము దేవుని ముఖము యెదుట జీవిస్తున్నామని సందేశాన్ని పొందినట్లయితే, పవిత్రత కొరకై మనకున్న ఆశకు తగినట్లు మన అంతరంగము కూడా స్పందిస్తుంది (కీర్తన 51:6). దీనిని బట్టి ముఖ్యమైన ప్రశ్న ''నాతోటి విశ్వాసులు నా పవిత్రత గూర్చి ఏమనుకొనుచున్నారు?'' అనేది కాదు కాని ''నా అంతరంగము ఎటువంటి సందేశాన్ని అందుకొంటుంది?'' అనేది. దానికి జవాబు నీకు వచ్చే కలలు ఇచ్చును.


ఎవరైతే పూర్తి పవిత్రత గూర్చి వెదకరో వారు ఇక్కడ చెప్పబడిన దానిని ఎప్పటికీ అర్థం చేసుకొనలేరు. ఎవరైతే వారికి వచ్చే చెడు కలలు గూర్చి అది మనకు తెలియని పాపము అని తప్పించు కొనచూచెదరో వారు, వారియొక్క చైతన్య స్థితినందలి జీవితములో నమ్మకత్వం లేకపోవుటయే ఆ స్థితికి కారణమని గ్రహించకుండా ఇటువంటి బోధ వాస్తవం కాదనియు విపరీత బోధనియు అనెదరు. ఎందుకనగా ఆత్మీయ విషయాలు మామూలు మనసుకు బుద్ధిహీనముగా నుండును.


ఏమైనప్పటికి నీ ఆలోచనా జీవితం ఎంత అసహ్యంగా నుండినా యేసు నడచిన మార్గమందు నడుచుటలో నీవు నమ్మకముగా నుండినట్లయితే, అది సంపూర్తిగా పవిత్రమవుతుంది. దానికి తగినట్లుగా నీ కలలు కూడా పవిత్రముగా ఉండును. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. నీవు మారని దినాలలో ఆ సర్పమును ఎంతగా పోషించావు అనే దానిని బట్టి ఎంత సమయం కావాలన్నది ఆధారపడి యుంటుంది. అయితే అత్యంత బలమైన సర్పము కూడా తీవ్రమైన నమ్మకత్వం ద్వారా చంపబడుతుంది.


యేసు ప్రయాసపడి భారము మోయువారిని మాత్రమే ఆయన యొద్దకు రమ్మని పిలిచెను. ఎప్పుడైతే నీవు నీ యొక్క ఓడిపోతున్న జీవితాన్ని గూర్చి అలసి సొలసి పోవుదువో అప్పుడే విజయము కొరకు ఆయన యొద్దకు వచ్చుటకు నీవు అర్హత పొందెదవు. ప్రపంచమంతా ఇతరుల గూర్చి మరియు ఇతరులు వారి యెడల ప్రవర్తించిన దానిని బట్టి అలసి, సొలసిన వారితో నిండియుంది. కొంత మంది క్రైస్తవులు కూడా వేరు వేరు క్రైస్తవ శాఖలలో నున్న సయోధ్య మరియు లోకానుసారతను బట్టి అలసి, సొలసిపోయి ఉన్నారు. కాని వారు విజయం పొందుటకు అర్హులుకారు. ఎవరైతే వారికి వారు అలసిసొలసితిరో వారు మాత్రమే ప్రభువుచే రమ్మనమని ఆహ్వానింపబడుచున్నారు.


ఎవరైతే గెలుపు కోసం దాహం కలిగియుందురో వారు మాత్రమే ఆయన యొద్దకు రావచ్చును (మత్తయి 11:28; యోహాను 7:37). ఎవరైతే వారి ఆలోచనా జీవితంలో పడిపోయిన ప్రతిమారు దు:ఖిస్తారో, ఎవరైతే వారి రహస్యపాపములు గూర్చి చింతిస్తారో వారు దేవుని సత్యములను చాలా త్వరగా నేర్చుకొనెదరు. మిగిలిన వారు ఈ సిద్ధాంతాన్ని తప్పు సిద్ధాంతముగా కొట్టిపారవేయుదురు. ఆత్మీయ సత్యములు ప్రకృతి సంబంధమైన జ్ఞానమునకు అర్థము కావు. కాని తమ రహస్య పాపములను బట్టి దు:ఖించు వారికి ప్రత్యక్షత ద్వారా దేవుడు తెలియజేయును. దేవుడు తన రహస్యములను (భక్తిగల జీవితము యొక్క రహస్యమును కూడా) ఆయనకు భయపడువారికి మాత్రమే తెలియజేయును (కీర్తన 25:14). యేసు వాగ్దానం చేసిన విశ్రాంతి పాపముపై పూర్తి జయమనే విశ్రాంతి.


హెబ్రీ 4వ అధ్యాయములో ఈ విశ్రాంతి కనాను దేశమును స్వాస్ధ్యపరచుకొనుటతో సమానముగా చూపబడినది. అక్కడ దృఢశాలులు, చాలా కాలం తరువాత ఒక్కొక్కరుగా చంపబడ్డారు (ద్వితీయో 7:22 చూడండి). ఆ విధంగా విశ్రాంతి, సమాధానము దేవుని కొరకు సంపాదించిన ప్రతి స్థలము మీదకు వచ్చెను. కనానులో నుండిన ధృఢశాలులు మన శరీరములో నుండిన శరీరేచ్ఛలై యున్నవి. కనబడే ధృఢశాలులు మనకు తెలిసిన పాపమునకు గుర్తుగా నున్నారు. గుహలలో దాగుకొనిన ధృఢశాలులు ఒక రకమైన మనకు తెలియని పాపములకు గుర్తుగా నున్నారు.


హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం దేవుడు తన ప్రజలకు సిద్ధం చేసిన సబ్బాతు విశ్రాంతిని గూర్చి చెప్పుచున్నది. ఆరు దినాల శ్రమ తరువాత వారు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశింపవచ్చు. అదే విధంగా మనలను కూడా మన స్వశక్తి చేత ఆరు దినములు పోరాడులాగున ఆయన అనుమతించును- అది మరల మరల ఓడిపోవులాగున. ఎప్పుడైతే మన స్వంత సామర్థ్యముపై నమ్మకం కోల్పోవుదమో (తమ కార్యములనుండి విశ్రమించి హెబీ 4:10) అప్పుడు దేవుని విశ్రాంతిలో ప్రవేశించెదము- అది పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో జీవితము. ఎంత స్వంత ప్రయత్నమైనను (''శరీరమును మరణింపజేయుట'') మన పాపపు హృదయములను పవిత్రపరచలేదు. పరిశుద్ధాత్మ మాత్రమే మనలను దేవస్వభావములో పాలివారగునట్లు చేయుట ద్వారా దానిని చేయగలడు. మనము నమ్మకముగా నుండినట్లయితే మన దినములన్నియు ఈ సబ్బాతు విశ్రాంతిలో జీవించగలము. మనము అపనమ్మకముగా నుండినట్లయితే తిరిగి శ్రమపడుటకు వెళ్లవలసియుండును.


మన జీవితమంతా ఒకే పాపముతో పోరాడుట దేవుని చిత్తముకాదు. కానానులో ప్రతి బలశాలి ''జయింపబడవలెనని దేవుడు ఆశించుచున్నాడు. మన ఎదుగుదల యొక్క ప్రతి స్థాయిలో - శారీరకముగాను మరియు ఆత్మానుసారముగాను'' మనము క్రొత్త క్రొత్త పద్ధతులలో శోధింపబడెదము. ఒక నాలుగు సంవత్సరముల పిల్లవాడు కోపము విషయమై శోధింపబడును కాని లైంగిక విషయాల గూర్చి శోధింపబడడు. తరువాత తన యుక్తవయసులో ఆ శోధన వచ్చును. ఒకరు లైంగిక విషయంలో ఎప్పుడూ ఓడిపోతూ, ఒకనాడు తను జయము పొందెదనని సంవత్సరం తరువాత సంవత్సరం ఒకని విశ్వాసాన్ని ఒప్పుకొనుచూ ఉండుట దేవుని చిత్తముకాదు. అతడు పూర్ణ మనసుతో ఉండినట్లయితే అతడు త్వరలో విజయంలోనికి వస్తాడు. ఈ విషయంలో కూడా మరణం ప్రవేశిస్తుంది. దానికి బదులు దైవ స్వభావం వస్తుంది.


రోమా 6వ అధ్యాయం జయ జీవితానికి సంబంధించిన వరుస క్రమం గురించి చెప్పుచున్నది. క్రీస్తుతో కూడా మరణించితిమని తెలిసికొని (6వ వచనము - ఈ నిజాన్ని మనకు అర్థం కాకపోయినా విశ్వాసముతో అంగీకరించవలెను). పాపమునకు మనము మరణించితిమని యెఱిగి (11వ వచనము) మన అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుకొనవలెను. దీని యొక్క ఫలితము పరిశుద్ధతలో ఎదుగుదల (13-18, 22). ఆఖరుగా మనము పొందేది నిత్యజీవము (ఇది దైవ స్వభావమునకు వేరొక భావము). కనుక ఆఖరు లక్ష్యమేమిటనగా మనము దైవ స్వభావములో పాలివారమగుటయే. కాని ఇది సిలువపై క్రీస్తుతో కూడా చనిపోయిన వారముగా మన స్థితిని అంగీకరించి మరియు అప్పటినుండి మనము పాపమునకు ఎప్పటికిని చనిపోయిన వారమని ఎంచుకొనుట ద్వారా మాత్రమే ప్రారంభమగును.


ఇది యేసు జీవితంలో ఎలా ఉండెను? ఆయన మన వలె అన్ని విషయములలో శోధింపబడెను. అయితే ఒకే మాదిరి శోధనలతో ఎప్పటికిని పోరాడుతూ యుండలేదు. యేసు కూడా ఆయన యౌవనదశలో మనవలెనే లైంగిక పరమైన విషయములలో కూడా శోధింపబడెను. అయితే ఆయన పూర్తి నమ్మకంతో ఉండుటచేత త్వరలో ఆ విషయంలో ఆయన జయము పొందెను. దాని ఫలితముగా ఆయన బహిరంగ పరిచర్యలో ప్రవేశించునప్పటికి ఆయన దాని విషయం కనీసం శోధింపబడలేదు కూడా. స్త్రీలు ఆయన పాదములను తుడిచినప్పుడు ఆయన అస్సలు శోధింపబడలేదు. ఎవరైతే ఈ విషయంలో శోధనకు వ్యతిరేకంగా నమ్మకంగా పోరాడలేదో వారు ఈ విషయాన్ని అర్థం చేసికొనలేరు.


సాతాను యేసును అరణ్యములో 40 దినములు తీవ్రముగా శోధించినప్పుడు యేసును లైంగికపరమైన విషయాలలో మరియు ధన విషయములలో శోధించుట నిరర్ధకమని తెలుసుకున్నాడు ఎందుకంటే యేసు ఈ విషయములను అనేక సంవత్సరములకు పూర్వమే జయించెను. అరణ్యములోని ఆఖరు మూడు శోధనలు ఎంత గొప్పవో యేసు నడచిన మార్గములో మనము కూడ నడచినట్లయితే వాటి యొక్క సూక్ష్మ అంతర్భావాలను మనము అర్థం చేసుకోగలము.


శోధన పాఠశాల ఇతర పాఠశాలల వంటిదే. మనమందరము మొదట చిన్న తరగతిలోనే మొదలు పెట్టాలి. మన ప్రభువు కూడా మొదట చాలా సామాన్యమైన శోధనలతో శోధింపబడియుండును. కాని ఆయన ప్రతీ తరగతిలో అవసరమైన కాలం కంటె ఎక్కువ ఉండలేదు. ఆయనకు 33 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికి, సిలువపై మరణించే సమయానికి 'సమాప్తమైనది' అని చెప్పగలిగెను. ప్రతి ఒక్క శోధన జయింపబడెను. పాఠశాలలో ప్రతీ పరీక్షలో విజయవంతముగా ఉత్తీర్ణుడయ్యెను, ఆయన పరిపూర్ణుడుగా తయారయ్యెను. మానవునిగా ఆయన విద్య పూర్తి అయ్యెను (హెబీ 5:8, 9).


చిన్న తరగతిలో శోధన విషయంలో అపనమ్మకత్వంతో నుండిన వ్యక్తికి (ఉదాహరణకు లైంగికేచ్ఛ, కోపము, అబద్దము మొదలైనవి) యేసు పిహెచ్‌.డి. తరగతిలో ఎదుర్కొన్న శోధనలు హాస్యాస్పదంగాను ఊహకందనివిగాను యుండును. నీ మట్టుకు నీవు నమ్మకంతో ఉండినట్లయితే నీవు అర్థం చేసికొనెదవు (యోహాను 7:17లో యేసు ఈ విషయం చెప్పెను). శోధన సమయంలో నీవు అపనమ్మకత్వంతో ఉండినట్లయితే, నీవు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని టేపులు వినినా ఆ విషయం నీవర్థం చేసికొనలేవు. దేవుని యొక్క రహస్యాలు టేపుల ద్వారా కాని పుస్తకముల ద్వారా కాని తెలిసికొనలేము కాని ఆయన నోటి నుండి, ఆయన వాక్యము ద్వారా సూటిగా తెలుసుకొనగలము.


యేసు పాపము చేయనప్పటికీ ఆయన మన పాపశరీరముతో వచ్చి ''తన శరీరములో పాపమును కలిగియుండెను''. ఇది మతభ్రష్టత్వము. ఎవరూ దేవుని యెదుట ఎటువంటి పాపముతోను నిలబడలేరు- అది అతని శరీరములో ఉన్న పాపమైనా సరే - దేవుడు ఎంత పవిత్రుడంటే ఆయన పాపము వైపు చూడనుకూడా చూడలేడు. యేసు తన శరీరములో పాపమును కలిగియుండిన యెడల ఆయన భూమి మీద జీవించినప్పుడు ఒక్క దినము కూడా తన తండ్రితో సహవాసము కలిగియుండెడివాడు కాదు. యేసు పాప శరీరము కలిగిలేడనుటకు ఇది స్పష్టమైన రుజువు. శరీరములో పాపము కలిగియున్న మనతో దేవుడు సహవాసము కలిగియుండుటకు ఏకైక కారణము ఆయనలో ఏ పాపము లేని క్రీస్తు యొక్క నీతితో మనము కప్పబడియుండుటయే.


యేసు తెలియక పాపము చేసియుండవచ్చని బోధించే వారు మరికొందరున్నారు. ఇది కూడా మతభ్రష్టత్వమే. పాత నిబంధన క్రింద ఒక వ్యక్తి పొరబాటున చేసిన పాపమునకు కూడా అది తెలిసిన వెంటనే దానికి బలి అర్పించవలసియుండెను (లేవీకాండము 4:2, 13, 27, 28). కాబట్టి పొరబాటున చేసిన పాపమునకు కూడా ప్రాయశ్చిత్తము కాలసియున్నది. క్రొత్త నిబంధన క్రింద యేసు రక్తము పొరబాటున చేసిన పాపమును వెంటనే తుడిచివేయును (1 యోహాను1:7). కాని తెలిసి చేసిన పాపము విషయములో మనము వెలుగులో నడచినప్పుడే ఇది జరుగును. ఆ విధంగా తండ్రితో మన సహవాసము కొనసాగును. అయితే యేసు విషయములో పొరబాటున చేసిన పాపమునకు ఎటువంటి రక్తము అందుబాటులో లేకుండెను. యేసు పొరబాటున కూడా ఒక్కసారి కూడా పాపము చేయలేదనుటకు ఇదే స్పష్టమైన రుజువు.


మన జీవితంలో తెలియని పాపము మనము అనేక సంవత్సరాలుగా స్వార్థము మరియు గర్వము కలిగి జీవించిన దాని ఫలితము.


యేసు ఒక్క క్షణమైనా అట్లు జీవించనందున ఆయనలో తెలియని పాపమేమియు లేదు. ఆయన మనసులో ఎప్పుడు పవిత్రమైన ఆలోచనలుండుట చేత ఆయనకు ఎప్పుడును అపవిత్రపు కలలు రాలేదు. ఆయనలో ఎటువంటి పాపము - తెలిసినదిగాని తెలియనిది గాని లేకుండెను.


మన విషయంలో, మనగత జీవితపు వైఖరి మరియు అలవాట్లు మరియు పద్దతులు స్వార్థంతోను మన మనసు యొక్క ఇష్టం వైపు వంగియుండుటచేత మనలో గుర్తులేని పాపముండును. ఇప్పుడు మన తిన్నగా లేని మనసును తిన్నగా చేయుటకు ఆత్మ వచ్చెను.


ఇక్కడ ఎవరికైతే పాపముపై విజయము కలదో వారు జాగ్రత్త కలిగి నిజాయితీ కలిగి యుండవలెను. దురదృష్టవశాత్తు అనేకులు కొంతవరకు పాపంపై విజయం పొంది వారి ప్రవర్తనలో మరియు మాటలలో క్రీస్తును పోలి నడుచుకొనక పోవుటకును కేవలము శరీరబలహీనత అని చెప్పుచూ తప్పించుకొనజూచెదరు. వారు వాటిని 'పొరపాట్లు' అని లేక 'శరీర క్రియలు' అని పిలచుదురు. వారి యొక్క శరీర బలహీనతలను వారు విశ్లేషించి చూచుకొన్నట్లయితే వాటి వెనుక అహంకారము మరియు స్వార్థము ఉండుట గమనించగలరు. అట్లుండుటచేత సాతాను వారిని మోసగించును, దేవుడు సాతాను అట్లు చేయుటకు అనుమతి నిచ్చును. దానికి కారణం అటువంటి విశ్వాసులు వారిని గూర్చిన సత్యమును ప్రేమించుట లేదని దేవుడు చూచుట (2 థెస్సలో. 2:10, 11). అటువంటి వారు బాహ్య విషయాలలో నీతిగా యుండవచ్చును మరియు సంఘములో మంచి సాక్ష్యం కలిగియుండవచ్చును. వారి క్రియలను వారెప్పుడు శరీర బలహీనతలని సమర్థించుకొనుట వలన వారి జీవితములలో వెలుగు ఇంకా ఎక్కువ అవ్వదు (సామెతలు 4:12). మనము నిజాయితీతోను మరియు విరిగి, నలిగిన స్వభావముతో నడువనట్లయితే మన జీవితాలు అలాగే ముగిసిపోవును.


ఇప్పుడే మనము యేసును పోలియుండవలెనని దేవుడు అడుగుట లేదు. మన వ్యక్తిత్వంలో అట్లుండుట అసాధ్యమని ఆయనకు తెలియును. ఆయన వచ్చినప్పుడు మాత్రమే మనమాయనవలె నుందుము. ఈనాడు దేవుడు మనలను యేసు నడుచునట్లు నడువమని అడుగుచున్నాడు (1 యోహాను 2:6తో 3:2 పోల్చి చూడండి). నడుచుట అనునది మనకు తెలిసిన క్రియ అది మనకు తెలిసిన జీవితాన్ని సూచిస్తుంది. ఈ విషయంలోనే మనము యేసును వెంబడించగలము.


సువార్తలో నుండిన శుభవార్త ఏమనగా యేసు మన వంటి శరీరముతో వచ్చి అన్ని విషయములలో జయించుటచేత మనము కూడా ఆయన వలెనే జయించగలమనేది (పక్రటన 3:21). ఇక మనము తెలిసిన జీవితములో పాపము చేస్తూ యుండవలసిన అవసరము లేదు.


ఇటువంటి మహిమకరమైన సువార్తకై హల్లెలూయ!

అధ్యాయము 8
నిజమైన ఆత్మానుసారత-దేవునికి ఆసక్తి కలిగిన వాటిని వెదకుట

''సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు యెడల నున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమోయని భయపడుచున్నాను.....సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు'' (2 కొరింథీ 11:3, 14, 15).


''ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు'' (రోమా 9:31).


ఇశ్రాయేలు దేశమునందలి పరిసయ్యులు నీతిని వెంటాడిరి, కాని వారు సాతాను చేత త్రోవ తప్పింపబడిరి. ఈనాడు నీతిని వెంటాడు వారందరికి ఇదొక హెచ్చరికయైయున్నది. మనము మోసపోవుటకు అవకాశములేదని అనుకొనుట మన యొక్క గొప్ప అహంభావము. మోసము నుండి మనము కాపాడబడుటకు మనము దేవుని వాక్యములో మరియు యేసు ప్రభువు ఈ లోకములో జీవించిన జీవితములో మనము పొందు సత్యమును ప్రేమించుట మరియు వెలుగులో నడుచుట మాత్రమే చేయవలెను (2 థెస్సలో. 2:10, 11).


దేవుని వాక్యాన్ని మనము మార్గదర్శిగా పెట్టుకొనకపోయినట్లయితే, నిష్కపటము ఒకటే మనను మోసము నుండి రక్షింపలేదు. పేతురు ఎంతో నిష్కపటము కలవాడు, అయినప్పటికిని యేసు ప్రభువుకు తప్పుడు సలహాను యిచ్చుటలో సాతానుకు నోటిగా మారాడు (మత్తయి 16:21-23). యేసు ప్రభువు సిలువను గూర్చి తన శిష్యులకు మొదట చెప్పినప్పుడు, వారు దానిని దేవుని యొక్క మార్గముగా అర్థము చేసికొనలేదు. వారు పాత నిబంధన వాగ్దానములైన సంపన్నత, ఆరోగ్యము, అనేకమంది పిల్లలు మరియు ఇతరమైన ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములకే అలవాటుపడిరి. శ్రమపడుట మరియు మరణించుట ఈ పాతనిబంధన సువార్తకు సంపూర్తిగా విరుద్ధముగా నుండెను.


పాత నిబంధన వ్యక్తిగతమైన దీవెనలు మరియు ఈలోక విషయముల మీద కేంద్రీకరింపబడి ఉండెను. క్రొత్త నిబంధన సువార్త దేవుని యొక్క ఉద్దేశ్యములు మరియు పరలోక విషయముల మీద కేంద్రీకరింపబడియుండెను. బాప్తిస్మమిచ్చు యోహాను నూతన నిబంధన సువార్తకు మార్గము సిద్ధము చేయుటకు వచ్చినప్పుడు, ఆయన యొక్క సందేశము ''మారు మనస్సు పొందుడి (పూర్తిగా తిరుగుట)....పరలోక రాజ్యము (ఇహలోక రాజ్యమునకు మరియు ఇహలోక ఆశీర్వాదములకు వ్యతిరేకమైనది) మరియు దేవుని రాజ్యము (వ్యక్తిగత ఆశీర్వాదములకు వ్యతిరేకమైన రాజ్యము) ఇప్పుడు సమీపించియున్నది అని యుండెను (మత్తయి 3:2, మార్కు 1:14, 15). బాప్తిస్మమిచ్చు యోహాను కాలము తరువాత, పరలోక రాజ్యము మరియు దేవుని రాజ్యము ప్రకటింపబడుచుండెను అని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 11:12, లూకా 16:16). అయితే దానితో పాటుగా ఈ రాజ్యములో ప్రవేశించుటకు మనము బలత్కారము చేయవలసి యుంటుందని కూడా ఆయన చెప్పెను. ఈలోక సంబంధమైన సౌకర్యము, ఘనత, సౌఖ్యము, ఆస్థి మొదలైన వాటిని ప్రేమించుట మన మాంసశరీరములో లోతుగా పాతుకొని పోయియుండెనంటే అటువంటి వాటిపైనుండి ప్రేమలకు ఎవరైతే బలాత్కారము చేయుటకు సిద్ధపడుదురో వారే దేవుని యొక్క రాజ్యమును ఎప్పటికైనా పొందుకొనెదరు.


పేతురు సుళువైన మరియు సుఖవంతమైన మార్గమును గూర్చి యేసు ప్రభువుకు సలహా చెప్పినప్పుడు ఆయన ''సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు'' అని పేతురును గద్దించెను (మత్తయి 16:23). మనము మన మనస్సులను మన స్వంత ఇష్టములపై పెట్టినప్పుడు, మనము యేసు ప్రభువునకు మరియు దేవుని రాజ్యమునకు అడ్డుబండలుగా నుందుము. అటువంటప్పుడు, మనలను తప్పుత్రోవ పట్టించుటలో సాతాను జయమొందును.


రక్షణ యొక్క సారమంతా ''మన స్వప్రయోజనములను వెదకుకొనుట'' నుండి రక్షింపబడుటలో నున్నది. లూసిఫరు తన స్వప్రయోజనములను వెదకుకొన్నాడు, మరియు ఆ విధముగా పాపము లోకములోనికి వచ్చినది. యేసు ప్రభువు ఎప్పుడు తన స్వప్రయోజనములను వెదుకుకొనలేదు, మరియు ఆ విధముగా రక్షణను తెచ్చెను. మనుష్యుని తన స్వప్రయోజనములను వెదకు కొనేటట్లు చేసే నీతి ఒక నఖిళీ నీతియైయున్నది. అయినప్పటికీ అదే నీతిని పరిశుద్ధతను బోధించే అనేక గుంపులలో మనము చూడగలము. మనుష్యుడు ప్రాథమికముగా ''వ్యాపార మనస్సు'' కలిగినవాడు- కనుక అతడికి అతితక్కువ అసౌకర్యముతో పరలోక సంబంధమైన శ్రేష్టమైన వాటిని పొందుకొనవలెనని చూచును. ఆ విధముగా అతడు తన స్వంత సౌఖ్యానికి లేక అతడి ఆసక్తులకు భంగము కలుగని మన సిద్ధాంతాన్ని కనుగొనుటకు ఎప్పుడూ చూచుచుండును.


ఒకడు కోపమును, మోహమును మరియు క్రోదమును జయించవచ్చును మరియు అన్ని విషయములలో బాకీ పడిన వాటిని తిరిగి చెల్లించియుండవచ్చును కూడా (ఒకని గత జీవితమునకు సంబంధించి) అయినప్పటికిని అతని స్వప్రయోజనములను వెదకుకుంటూ ఉండవచ్చును. అనగా ఒకని స్వంత సౌకర్యములను మరియు సుఖములను లేక ఒకని యొక్క భార్య సౌకర్యములను మరియు సౌఖ్యములను వెదకుట (1 కొరింథీ 7:33లో, అట్లు భార్యను సంతోషపెట్టువాడు ''లోక సంబంధ విషయములు'' గూర్చి చింతించువాడుగా చెప్పబడెను!) లేక ఒకని స్వంత ఘనత (బహుశా లోకములో కాకపోవచ్చును, కాని సంఘములోను మరియు ప్రత్యేకముగా పెద్దలైన సహోదరుల యొద్ద మంచి అభిప్రాయము గూర్చి కావచ్చును), లేక ఒకని స్వంత లాభము (వృత్తి రీత్యా ఉన్నత స్థానములకు వెళ్ళవలననే అభిలాష మొదలైనవి) మొదలైన వాటిని వెదుకుచూయుండవచ్చును.


దైవభక్తిని గూర్చిన మర్మమును నమ్మి, అర్థము చేసికొని చివరకు వివరింపగలిగి యుండవచ్చును, అయినప్పటికిని - ధర్మవిరోధ సంబంధమైన మర్మమును గూర్చిన గ్రహింపు లేక యుండవచ్చును.


సమస్త దుర్నీతి యొక్క రహస్య మూలము తన స్వప్రయోజనములను తాను వెదకుకొనుటలోనే యున్నది. ఇది మన శరీరములో నున్న మోసపూరిత దురాశలన్నిటిలో ఒకటి. ఒకడు తన నిర్ణయములలో మరియు క్రియలలో ''తన స్వప్రయోజనములను వెదకుకొనుట'' అతిగా నుండినను, అతడు పైపై పాపములను కొన్నింటిని జయించినందున తాను ఆత్మానుసారుడనని అనుకొనవచ్చును. సాతాను ''నీతిపరిచారకుని''గా వచ్చినప్పుడు అతడి మోసం అట్లుండును! దుర్నీతి యొక్క మర్మము అటువంటిది.


మన రోజుల్లో మనకు బైబిలు గూర్చిన జ్ఞానమునకు లోటులేదు. నిజానికి మనలో తెలివైనవారు క్రొత్త నిబంధన సిద్ధాంతములను పౌలు బోధించిన దానికంటే (దాని గూర్చి మొదట ప్రత్యక్షత కలిగినవాడు) గొప్పగా వివరించగలిగి యుండవచ్చునేమో! అయినప్పటికిని, మన స్వప్రయోజనములను గూర్చి మనము వెదకుకొనుటలో, పౌలు యొక్క జీవితమునకు వేలమైళ్ల దూరములో మన జీవితములు ఉండుటకు ఎక్కువ అవకాశమున్నది.


ఒకనిని నిజమైన దైవజనునిగా చేయునది, ఒకడు ఒక ప్రత్యేకమైన సిద్ధాంతమును కలిగింయుడట కాదు - కాని అతడు తన స్వప్రయోజనములను వెదకు కొనకుండుటయై యున్నది. పౌలు ఫిలిప్పీ 2:19-21లో, తనతోటి పనివారందరు తమ స్వంత విషయములనే చూచుకొను వారైయున్నారనియు, అందువలన వారిని తాను ఫిలిప్పీకి పంపలేక పోవుచుండెనని చెప్పెను. అయితే వారిలో తిమోతి ఒక మహిమకరమైన మినహాయింపు. పౌలు యొక్క సహపనివారికి సిద్ధాంతములన్ని పరిపూర్ణముగా సరియైనవిగాయుండెను. అందులో అనుమానమేమీలేదు. అయిప్పటికి వారు వారి స్వప్రయోజనమును వెదకుకొను వారుగా నుండిరి. వారు తమ్మునుతాము నీతిమంతులుగా మరియు ఆత్మానుసారులుగా తమ చుట్టూ నున్న ఇతరుల కంటే ఉన్నతమైన వారమని అనుకొనియుండవచ్చును. అయినను పౌలు వారియొక్క 'నీతి'లో లోతులేని విషయాన్ని చూడగలిగెను. ఈనాడు అదే పరిస్థితియున్నది.


శతాబ్దాల క్రైస్తవ చరిత్రలో, గొప్పదైవజనుల విషయములో సాధారణముగా కనబడు ఒక విషయము ఇది. వారు వారి స్వప్రయోజనములను గూర్చి చూచుకొనలేదు. సిద్ధాంతములలో నిశితమైన విషయములు వారిని దైవజనులుగా తయారు చేయలేదు కాని వారందరికి సంబంధించిన విషయము - వారి స్వప్రయోజనములను వారు చూచుకొనకపోవుట వారిని అట్లు చేసినది. కొందరికి మనవలె సత్యమును గూర్చిన గ్రహింపు లేకపోయి యుండవచ్చును. కాని వారి ఆత్మీయ స్థితి, వారి కాలములో మరియు వారి తరములో వారికి యుండిన వెలుగుకు తగినట్లు వారు నిస్వార్థముగా దేవుని రాజ్యమును వెదకుటలో యుండినది.


ఈనాడు మనకు లేఖనములలో కొన్ని సత్యములను గూర్చి అనేకమంది దైవజనుల కంటే ఎక్కువ వెలుగు ఉండినట్లయితే ఎవరికి ఎక్కువ ఇవ్వబడినదో వారి నుండి ఎక్కువ కోరబడునను విషయము మనము జ్ఞాపకముంచుకొనవలెను. కేవలము కోపము, మోహము మొదలైన వాటిని జయించుటలోనే నీతి యున్నదని అనుకొనినట్లయితే మనము గొప్ప ప్రమాదములో యున్నాము. భక్తి కలిగిన ఇతర మతస్తులలో ఇటువంటి పాపములను (బాహ్యముగా) జయించిన వారుందురు. ఒక ప్రసిద్ధి పొందిన మతనాయకుడు ఒకరితో తనకు యిప్పుడు ఇతరులు కోపము తెప్పించుట అసాధ్యమని చెప్పినట్లు చెప్పుదురు. కాని అది క్రీస్తు యొక్క నీతికాదు. అది కేవలము అణచివేయుట. అనేకమంది సన్యాసులు కూడా ఈలోక వస్తు వాహనములపై ఆసక్తి లేని వారమనిచెప్పుకొందురు. వారు తప్పనిసరిగా అనేక ''విశ్వాసులను'' సిగ్గు పరచుదురు!


మనము శరీరములోనున్న ఈ పాపములన్నిటిని ఇశ్రాయేలీయులకు ఎదురుగా తమ నాయకుడు గొల్యాతుతో నిలిచిన ఫిలిష్తీయులుగా చూడవచ్చును. అయితే గొల్యాతు, ''తన స్వప్రయోజనములను చూచుకొను'' బలశాలిగా ఉన్నాడు. దావీదు కేవలము ఫిలిష్తీ సైనికులను ఒక్కొక్కరిని చంపినట్లయితే అక్కడ విజయము వచ్చేదికాదు. లేక అనేక సంవత్సరముల వరకు కొనసాగిన యుద్దముండేదేమో, కాని దావీదు గొల్యాతును చంపగానే ఫిలిష్తీయులందరు పారిపోయినట్లు మనము చదువుదుము (1 సమూయేలు 17:51). ఇదే రహస్యము. మనము నిజమైన విజయము పొందవలెనంటే మనదాడి అంతటిని బలశాలియైన, ''మన స్వప్రయోజనములను మనము చూచుకొనుట''పై కేంద్రీకరించవలెను. అప్పుడు ఇతర పాపములు వాటికవే జయింపబడును.


చెట్టు యొక్క వేరుపై గొడ్డలి వేయుటకు యేసు ప్రభువు వచ్చెను, చెట్టు యొక్క ఫలములు ఎన్నో - అబద్దమాడుట, దొంగతనము, కోపము, క్రోధము మొదలైనవి. వాటన్నిటి యొక్క వేరు ఒకని స్వప్రయోజనములను వెదకుకొనుట. ఇక్కడనే గొడ్డలి వేయవలెను. అలాకానట్లయితే మనము మోసపోవుదుము.


మనము ఎప్పుడూ ఉద్రేకమును కోల్పోకుండా యుండుటచేత మరియు మనము ఒక ప్రత్యేకమైన మతపరమైన భాషను మాట్లాడుచుండుట చేత మనము పరిశుద్ధతలో నడచుచున్నట్లు ఊహించుకొనవచ్చును. అయినప్పటికి మన మనసు శక్తి మరియు సమయమును తరచుగా మన ఇళ్ళకు, భార్యలను సంతోషపెట్టుటకు, మన బిడ్డలకు ఆనందము కలిగించునట్లు చేయుటకు మరియు ఒక మధ్యతరగతికి చెందిన సాధారణ సౌకర్యవంతమైన జీవితము జీవించుటకు మరి ఎక్కువ వస్తు వాహనములను కూర్చుకొనుట గూర్చి ఖర్చు పెట్టవచ్చును. అట్లు జీవించుచూ, మనము పరిశుద్ధముగా ఉన్నామనుకొనుట మనలను మనము ఎంతగానో మోసగించుకొనుటయైయున్నది.


కొరింథీ క్రైస్తవులు క్రీస్తు యెడల నుండిన సరళమైన భక్తి నుండి త్రోవ తప్పింపబడిరేమో అని పౌలు భయపడెను. మన భక్తి లేక అంకితభావము క్రీస్తు యెడల నుండు దాని కంటే మన భార్యల యెడల ఎక్కువగు ప్రమాదము మనకున్నది. మొదటి ఆజ్ఞ నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించుమనునది కాదు, కాని నీ దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెననునది. మనమెప్పుడైతే దానిని మొదట చేయగలమో అప్పుడు, మన పొరుగువారిని (మన భార్యను కూడా) సరియైన విధముగా ప్రేమించగలము.


నీతిని వెంటాడు క్రైస్తవులు గోడగడియారములో లోలకమువలె ఒక చివరకు వెళ్ళి, అప్పుడు, అక్కడ వారి పొరపాటును గ్రహించి వేరొక చివరకు వెళ్ళిపోవుదురు. ఇరుకుమార్గాన ప్రమాదకరమైన శిఖరములు రెండు వైపులా ఉండును - మరియు నీవు ఏవైపు శిఖరముపైనుండి క్రిందపడుదువనేది సాతాను పట్టించుకొనడు!


కాని, పరిశుద్ధాత్మ పరిచర్యను బట్టి దేవునికి స్తుతులు చెల్లించుదుము, ''నీవు దేవుని మార్గములను విడిచి తప్పుత్రోవ పట్టినట్లయితే (కుడికి గాని ఎడమకు గాని), నీ వెనుక నుండి ఒక స్వరము, ''ఇదే మార్గము దీనిలో నడువుడి'' అని చెప్పుట విందువు (యెషయా 30:21 లివింగు బైబిలు). సంఘములో ప్రవచన పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఇది. అది ఇరుకు మార్గమున మధ్యలో ఉండునట్లు ఆ స్వరము మనతో మాట్లాడును. సంఘములో ప్రవచన పరిచర్య, మరియు వ్రాయబడిన దేవుని వాక్యము జీవమునకు తీసుకువెళ్ళు ఇరుకు మార్గమునకు మధ్యలో మనముండునట్లు దేవుడు ఉపయోగించు సాధనములు.


బాహ్యమైన కార్యకలాపములను కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయుట గూర్చి ఎక్కువగా చెప్పే యథార్థతలేని క్రైస్తవత్వాన్ని చూచి, ఇప్పుడు మనము కేవలము మన భార్యను పిల్లలను మరియు మనము మాట్లడే ఆత్మీయ భాష మాట్లాడే మన గుంపులోని క్రైస్తవులను ప్రేమించుటయే క్రైస్తవత్వమనే విపరీత ఆలోచన వైపుకు వెళ్లిపోవచ్చును. మనము తప్పనిసరిగా మన కుటుంబమును మరియు మన సంఘములో సభ్యులను ప్రేమించవలెను మరియు మన వ్యక్తిగత జీవితములో పాపమును కూడా జయించవలెను. కాని క్రీస్తు యెడల మన కున్న భక్తిని, చివరకు మన వ్యక్తిగతమైన నష్టము మరియు త్యాగముతో ఆయన రాజ్యమును వ్యాప్తి చేయుటలో కూడా చూపించవలెను. అంతరంగ పవిత్రత మరియు బాహ్యమైన త్యాగములలో ఏదో ఒకటి ఉంటే చాలును అనుకునేవి కావు. యేసు ప్రభువు యొక్క జీవితములో రెండూ ఉండెను.


అపొస్తలుడైన పౌలు తార్సులో సుఖవంతమైన క్రైస్తవ వ్యాపారిగా క్రైస్తవ జీవితము జీవిస్తూ స్థిరపడియుండవచ్చును. మరియు తన వ్యక్తిగత జీవితములోనూతనమైనదియు మరియు జీవము గలదియునైన జీవితము జీవించుచుండవచ్చును. కాని, ఆయన అట్లు చేయలేదు. క్రీస్తు యెడల ఆయన కున్న భక్తి తన జీవితములో సమస్తమును ఖర్చుపెట్టి దేవునికి అర్పించునట్లు బలవంతము చేసినది.


రెండు వందల సంవత్సరముల క్రితం, ఇద్దరు మొరేవియను సహోదరులు వెస్టిండీస్‌ ద్వీపములో నున్న ఒక బానిసల గుంపుగూర్చి విని, అక్కడుండిన బానిసలకు సువార్త ప్రకటింపవలెనను ఉద్దేశ్యముతో అక్కడకు వెళ్లుటకు వేరేమార్గములేక వారిని వారు బానిసలుగా అమ్ముకొనిరి. అలాగే మరొక ఇద్దరు ఆఫ్రికా ఖండములో నున్న కుష్టురోగులుండే ప్రదేశము గురించి వినిరి. ఆ రోగము ఇతరులకు అంటుకొని వ్యాప్తి చెందునను ఉద్దేశ్యంతో అక్కడకు ఎవ్వరిని వెళ్లనిచ్చేవారు కాదు, వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేవారు కాదు. వారు ఆ ప్రదేశములో నుండిన కుష్ఠురోగులకు క్రీస్తును తెలుపవలెనను ఆశతో తిరిగి రాకుండా ఆ ప్రదేశముకు స్వచ్ఛందముగా వెళ్లిరి.


ఆ సహోదరులు నమ్మిన మత సిద్ధాంతముల యొక్క పూర్తి వివరములు నాకు తెలియదు. కాని, వారు ఖచ్చితముగా వారి స్వప్రయోజనములను గూర్చి ఆలోచించుకొనలేదు మరియు ప్రభువుకు వారి యొక్క సమస్తమును వెలగా చెల్లించి సమర్పించుకొనిరి.


ప్రభువుకు సమర్పించుకొనిన అటువంటి వారి ముందు మనము ఈ రోజు చేసే చిన్న చిన్న త్యాగములు చిన్నవిగా యుండును. నిత్యత్వములో మనము అటువంటి వారిని కలుసుకొని, క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె క్రీస్తువంటి స్వభావము కలిగిన - అనగా, ''తమ స్వప్రయోజనములను చూచుకొనని'' స్త్రీ పురుషులతో కూడియుండునని కనుగొందుము. మనలో కొందరము క్రీస్తు పెండ్లికుమార్తెతో నుండుటకు మనలను అర్హులుగా చేసేది సిద్ధాంతపరమైన గ్రహింపు అనుకొనే ప్రమాదమున్నది. అది కాదు. అది మన స్వంత యిష్టములను కాక దేవునికి ఆసక్తికరమైన వాటిని వెదకుటతో కూడిన జీవితమైయున్నది.


అటువంటి వారితో పోల్చుకొనినప్పుడు మన జీవితములు మరియు మన ప్రయాసలు, ఎంత లోతులేనివిగా నున్నవి. మనకు ఎక్కువ సత్యము తెలిసియున్నదన్నంత మాత్రమున మనము వారికంటే యేసు ప్రభువును శ్రేష్టమైన విధముగా వెంబడించుచున్నామనుకొనుట ఎటువంటి డంభం. దేవుని సేవించుటకు మన సొమ్మును సౌకర్యమును, సౌఖ్యమును మరియు ఆరోగ్యమును నష్టపోవుటలో ఎంత వెల చెల్లించాము? బహుశా చాలా తక్కువ, లేక అసలు ఏమీ యుండకపోవచ్చును. అది మనలను తగ్గింపచేసి ఆలోచించునట్లు చేయును. బహుశా మనము త్యాగపూరిత జీవితమును సౌకర్యముగా తప్పించుకొనుచున్నామేమో.


ఆంగ్లము చదవ గలిగిన ప్రతి క్రైస్తవుడు హడ్సన్‌ టేలర్‌, సి.టి.స్టడ్‌, డేవిడ్‌ బ్రయినార్డ్‌, విలియం కేరీ, విలియం బూత్‌, జిమ్‌ ఎలియట్‌ మొదలగు దైవజనుల జీవిత చరిత్రలు తప్పక చదివి సవాలు చేయబడవలెను. పరిశుద్ధాత్ముడు హెబ్రీ 11వ అధ్యాయములో అనేకమందిని మరియు 2 కొరింథీలో పౌలు గూర్చి మనలను ప్రోత్సహించుట కొరకు ఉదహరించెను. నవీన కాలపు విశ్వాసవీరుల జీవితములు కూడా మన యొక్క స్వంతమును కేంద్రముగా, కుటుంబమును కేంద్రముగా కలిగి సౌకర్యములను ప్రేమించుచు వస్తు వాహనములను ప్రేమించు క్రైస్తవత్వము నుండి బయటకు వచ్చి, క్రీస్తు యెడల భక్తి కలిగిన జీవితములోనికి వచ్చునట్లు సవాలు చేయును.


యేసు ప్రభువు యొక్క రోజుల్లో మతము పేరిట దేవాలయములో గొఱ్ఱెలను మరియు గువ్వలను అమ్మి రూకలు మార్చు వారు ఉండిరి. యేసు ప్రభువు వారిని తరిమివేసెను. దైవభక్తి వారికి ఒక లాభసాధకముగా నుండెను. ఎప్పుడు మనకు దైవభక్తి ఒక లాభసాధకమవునో - అనగా ధన సంపాదన, సౌకర్యములు పొందుట, సుళువైన జీవనము మొదలైనవి పొందుకొనుటకు ఉపయోగపడునో, అప్పుడు మనము నీతిని వెంటాడుచున్నామని అనుకొనినా, మనము తప్పుడు త్రోవలో ఉన్నామనునది నిజము. యేసు ప్రభువుకు దైవభక్తి అనగా ఈ లోకము ప్రియముగా చూచిన ప్రతి దానిని విడిచిపెట్టుటయై యుండెను. మనము నిజముగా పూర్ణహృదయముతో నుండినట్లయితే మనమును అదే వెల చెల్లించవలెను. (ఉదాహరణకు మత్తయి 19:29 చదివి, అక్కడ యేసు ప్రభువు చెప్పిన వాటిని విడిచి పెట్టవలసి వచ్చునేమో చూచుకొనండి).


మనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టినప్పుడే గొప్ప వెల కలిగిన ముత్యమును పొందుకొనగలము అని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 13:46; లూకా 14:33). పౌలు 'క్రీస్తును పొందుకొనుటకు' (ఫిలిప్పీ 3:8) సమస్తమును విడిచిపెట్టవలసి వచ్చెను. ఈనాడు మనము మన సమస్తమును విడిచిపెట్టకుండా క్రీస్తును పొందుకొనుటలో సఫలమైనట్లయితే మనము 'వేరొక క్రీస్తు'ను పొందినాము. కొరింథీ క్రైస్తవుల గూర్చి పౌలు కుండిన భయము ఇదియే - అది సమస్తమును విడిచి పెట్టుమని అడగని ''మరియొక క్రీస్తు'' (2 కొరింథీ 11:4)ను వెంబడించుచూ మురిసిపోయిరేమో అనునది. మనము కూడా నిజానికి దేనిని విడిచిపెట్టకుండా ''అన్నిటిని విడిచిపెట్టు'' విషయమును గూర్చి మత సంబంధమైన వివరణతో మనకు అనుకూలముగా నిర్వచించుచు మనలను మనము మోసగించుకొనవచ్చును. ఈ విషయములో సత్యమును ఉన్నదున్నట్లు ఎదుర్కొనక పోయినట్లయితే మనము భ్రమపరచు ఆత్మచేత తప్పుడు త్రోవలోనికి నడిపింపబడుదము. మనము మోసపోవునట్లు దేవుడే చేయును.


పరిశుద్ధులైన దైవజనులను అభిమానించుట మనలను ఆత్మానుసారులను చేయదు. యేసు ప్రభువు ఈ భూమిపై నుండినప్పుడు అనేకులు ఆయనను అభిమానించారు. కాని, వారు ఆత్మానుసారమైన వారుగా కాలేదు. ఆయన యందు నమ్మికయుంచిన వారు కూడా అనేకులుండిరి, కాని ఆయన వారికి కూడా తనను అప్పగించుకొనలేదు (యోహాను 2:24, 25) - ఎందుకనగా ఎవరు హృదయ పూర్వకముగా ఆయనను వెంబడించువారో ఎవరు కాదో ఆయనకు తెలియును. ఈనాడు కూడా ఆయనకు తెలియును.


అటువంటప్పుడు గొల్యాతు ఇంకను నిటారుగా మరియు పొడవుగా నిలువబడి యుండగా మనము చిన్నచిన్న ఫిలిష్తీయులను అక్కడక్కడా చంపినందుకు సంతృప్తిపడుట మానుదుము. మన వడిసెలలో నుండిన రాయిని మన స్వప్రయోజనములను చూచుకొనుట అను రాక్షసుని పైకి గురి పెట్టవలెను. నిజమైన విజయము మనది కావలెనంటే ఈ తలను మనము తెగగొట్టవలెను. యేసు ప్రభువు ద్వేషింపుమని చెప్పిన మన జీవితము మన స్వప్రయోజనములను మనము చూచుకొనే జీవిత నైజము (యోహాను 12:25).


మనము వెలుగులో నడచి మరియు మన పనులను మరియు నిర్ణయములను ఎక్కువగా మలినపరచు స్వార్థము కేంద్రముగా నుండు స్థితిని కనుగొనుటకు వెదకినట్లయితే మరియు ఆ విషయముల గూర్చి మనలను మనము తీవ్రముగా తీర్పు తీర్చుకొనినట్లయితే, అప్పుడు ఆ రాక్షసుడు కొంచెము కొంచెముగా జయింపబడుటను మరియు సంహరింపబడుటను చూడగలము.


యేసు ప్రభువు ఒకసారి పేతురుతో, సంఘమును కట్టుట గూర్చి అతనితో చెప్పిన వెంటనే (మత్తయి 16:18-23), అతడు (పేతురు) సాతాను యొక్క తలంపులను వ్యక్తపరచుచున్నాడని చెప్పెను. పాతాళలోక ద్వారములు నిలువనేరని సంఘము తమ స్వప్రయోజనములను చూచుకొనువారి మీదకాక ఎవరైతే దేవునికి ఆసక్తికరమైన వాటి గూర్చి వెదకుదురో వారిపై కట్టబడును. అది సరియైన సిద్ధాంతములను అంగీకరించిన వారిచేత లేక కొంతమంది చిన్న ఫిలిష్తీయులను చంపిన వారిచేత కట్టబడదు.

అధ్యాయము 9
పరిశుద్ధత మరియు సహవాసము

''సహవాసము'' అనే మాట క్రొత్త నిబంధనమాట. క్రొత్తనిబంధనలో చెప్పబడిన సహవాసము యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రికి ఆయనకు యుండిన సహవాసము యొక్క మాదిరి పోలినది. తన శిష్యుల మధ్య సహవాసము అదే విధముగా యుండవలెనని యేసు యొక్క ప్రార్థనయై యుండెను.


పాత నిబంధనలో, జనులు పరిశుద్ధత విషయములో గొప్ప ఎత్తులకు ఎదుగగలిగినా వారు ఒకరితో ఒకరు ఇటువంటి సహవాసములోనికి రాలేకపోయిరి. పాత నిబంధనలో ఉండిన దైవజనులలో మోషే ఏలీయా, దానియేలు మరియు బాప్తిస్మమిచ్చు యోహానులు ఇప్పటి విశ్వాసులలో అనేకమంది పరిశుద్ధత కంటే ఎంతో ఎక్కువైన పరిశుద్ధత కలిగియుండిరి. దానికి కారణం ఈనాటి విశ్వాసులు క్రొత్త నిబంధనలో ప్రవేశింపకపోవుట వలనైయున్నది.


క్రొత్త నిబంధన యేసు యొక్క శిష్యులను అంతరంగ పరిశుద్ధతలోనికి నడిపించును. పరిశుద్ధత ఒకరితో ఒకరు సహవాసము కలిగియుండునట్లు నడిపించును. హెబ్రీ 11వ అధ్యాయములో విశ్వాస వీరుల గూర్చి చదివినప్పుడు వారందరూ ఒంటరి వ్యక్తులుగా నుండుట మనము చూచుదుము. పాతనిబంధన కాలములో అలా ఉండెడిది. అయితే మనము క్రొత్త నిబంధనలోనికి రాగానే యేసు ప్రభువు ఇద్దరిద్దరిని పంపుట మనము కనుగొనుదుము. ఇది క్రొత్త పద్ధతి. మనలను అంతరంగ పరిశుద్ధతలోనికి తీసుకువచ్చుటకు మాత్రముకాక సహవాసములోనికి తీసుకువచ్చుట కొరకు యేసు వచ్చెను.


ఒక విశ్వాసి పాపముపై అంతరంగములో జయజీవితములోనికి వచ్చినప్పటికి ఇతరులతో సహవాసములోనికి రాలేకపోయినట్లయితే, అతడి పరిశుద్ధతలో ఏదో విపరీతమైన లోటు ఉన్నది. సహవాసములేని పరిశుద్ధత మోసపూరితమైనది. ఈ రోజు అనేకులు లోకమంతా పరిశుద్ధత గూర్చి బోధిస్తూ తిరుగుచున్నారు; కాని వారు పాతనిబంధన పరిశుద్ధులవలె ఒంటరివారైయున్నారు. అటువంటి బోధకులు, పాత నిబంధన క్రింద ఉన్నవారు. వారు, వారు నివసించుచున్న స్థలములో ఎటువంటి సహవాసము కట్టకుండుట చూచుదుము. కాని, మొదట శతాబ్దములో అపొస్తలుల విషయంలో అలా ఉండేదికాదు.


పెంతెకొస్తు దినము తరువాత, అపొస్తలుల క్రొత్త నిబంధనలో ప్రవేశించిన వెంటనే, పేతురు, యోహానులు కలసి బయటకు వెళ్ళినట్లు మనము చదువుదుము. దేవాలయములో కుంటివానితో పేతురు, తనవైపు మరియు యోహానువైపు ఇద్దరివైపు చూడమని చెప్పెను (అపొ.కా.3:4). పేతురు యోహానులు ఒక జట్టుగా పనిచేసారు. పెంతెకొస్తు దినాన పేతురొక్కడే బోధించినా, అతడు మిగిలిన పదకొండు మందితో లేచి నిలువబడెనని మనము చదువుదుము (అపొ.కా.2:14). అపొస్తలుల కార్యములు 2 నుండి 4 అధ్యాయములు చదివినప్పుడు ప్రత్యేకముగా కనబడేది సహవాసము.


పేతురు యోహానులు ఒకే రకమైన స్వభావము కలవారుకాదు. వారు మానవులుగా ఎంతో భిన్నమైనవారు. పేతురు తొందరపాటు కలిగి చురుకుగా పనిచేసేవాడు ఎప్పుడు ప్రభువును ఎఱుగనని, బొంకనని గొప్పగా చెప్పుటకు తొందర పడువాడు, ఒడ్డున ప్రభువును చూడగానే గలిలయ సముద్రములో దుముకినవాడు (యోహాను 21 అధ్యాయము). వేరొక ప్రక్క యోహాను ఒంటరిగా ఉండుటకు యిష్టపడువాడు, మౌనముగా ధ్యానము చేసుకొన్నట్లుండే రకము మరియు పరలోక విషయముల గూర్చి దర్శనములు చూచువాడు (పత్మాసువలె). దేవుడు ఎప్పుడూ భిన్నంగా ఉండు వ్యక్తులను సంఘములో దగ్గరకు తీసుకువచ్చును. ఆ విధంగా ఆయన ఒకే రీతిగా నున్న ఇరువురు ఒకటిగా అగుటకంటే భిన్నత్వములో ఏకత్వమును ఎంతో మహిమకరముగా ప్రదర్శించును.


అపొస్తలుల కార్యములు 13:2లో, అంతియొకయ సంఘములో నుండిన పెద్దలు ఉపవాసముండి దేవుని ఆరాధించుచు ఆయన నడిపింపు కొరకు కనిపెట్టుకొని యుండినట్లు చదువుదుము. పౌలు బర్నబాలను ఆయన పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరుచుమని పరిశుద్ధాత్ముడు వారికి చెప్పెను. ఇక్కడ మరల గమనించినట్లయితే, పాత నిబంధన కాలములోవలె కాక ఆత్మ ఇక్కడ ఒక్కరిని కాక ఇరువురును పిలిచెను. ఇది క్రొత్త నిబంధన కాలము. ఈ కాలములో ఒక్కొక్కరుగా చేయు పరిచర్యకు స్థానములేదు. అక్కడ క్రీస్తు యొక్క శరీరముగా ఉండవలసియున్నది. మరియు దాని కొరకు కనీసము ఇద్దరు ఉండవలసియున్నది.


ఇక్కడ మరియొకసారి స్వభావము విషయములో ఒకే రీతిగాయుండని ఇరువురిని కలిసి పని చేయుటకు ఆత్మ పిలుచుట చూడగలము. పౌలు తీవ్రముగా నుండి ఎవరైనా ఏ విధమైన సగము హృదయముతో యుండినట్లయితే దానిని సహించుటకు రాజీపడని వాడుగా యుండెను. అపొ.కా. 15:36-39లో తమ రెండవ ప్రయాణములో మార్కును తమ వెంట తీసుకు వెళ్లుటను గూర్చి పౌలు బర్నబా మాట్లాడుకొనిరి. వారి మొదటి ప్రయాణములో మార్కు వారిని మధ్యలో వదిలి వెళ్ళిపోయినందున, పౌలు దానికి అంగీకరించలేదు. బర్నబా (అందరిని ప్రోత్సాహపరచు చక్కని పరిచర్య కలిగియుండుటచేత, అతడికి ఆ పేరు ఇవ్వబడినది - అపొ.కా.4:36) వేరొక ప్రక్క మార్కుకు మరియొక అవకాశమివ్వవలెనని అనుకొనెను. ఈ విషయములో పౌలు బర్నబాలు వారివారి ఆలోచనలకు గట్టిగా కట్టుబడియుండుట వలన వారు ఒకరి నుండి ఒకరు వేరైపోయిరి. వారిరువురు బలమైన పట్టుదల కలిగి అప్పటికి (వారి ఆత్మీయ అభివృద్ధి విషయంలో) పై నుండి వచ్చు జ్ఞానమైన ''సులువుగా లోబడుటను'' (యాకోబు 3:17) పొందుకొనలేదు.


అపొస్తలులు పరిశుద్ధులుగా పుట్టినవారు కాదు. వారు కూడా మనవలెనె వారి శరీర ఇచ్ఛలపై కొద్దికొద్దిగా వెలుగు పొందుకొనుచు అభివృద్ధి చెందవలసి యుండెను. తరువాత పౌలు, బర్నబా మరియు మార్కు ఒకరితో ఒకరు ఎంతో మహిమకరమైన సహవాసములో యుండిరి (2 తిమోతి 4:11లో యుండినట్లు).


పౌలు మరియు బర్నబాలు ఒకే విధమైన స్వభావములు కలవారుకాదు. పరిశుద్ధాత్ముడు వారిని ఇరువురినీ కలిసి పిలిచాడు. అయినప్పటికి వారు ఒకరితో ఒకరు కలసి ఎలా ఉండాలో వారికి తెలియలేదు. దురదృష్టవశాత్తు ఈనాడు కూడా అనేక విశ్వాసులలో ఉన్న పరిస్థితి ఇదే. అటువంటి పరిస్థితి పరిపక్వత లేని వారిలో సహించవచ్చును. కాని పది సంవత్సరాలుపైగా విశ్వాసులుగా నున్నవారిలో అటువంటి పరిస్థితిని చూస్తే ఏమనాలి. అది చెప్పటానికి చాలా విచారించవలసిన విషయం.


పౌలు 'సత్యము' కొరకు నిలువబడెను. బర్నబా 'కృప' కొరకు నిలువబడెను. వారిరువురు వేరేవానిలో నున్న దాని అవసరతను చూచి మెచ్చుకొనినట్లయితే వారిలో దేవుని మహిమ అయిన ''కృపా సత్య సంపూర్ణత''తో (యోహాను 1:14) కనబడియుండెడిది. వారిరువురు కలసి వారు ఒక్కొక్కరుగా చేయలేని దానిని సాధించేవారు. అందుకోసమే పరిశుద్ధాత్మ (ఎప్పుడూ పొరపాటు చేయనివాడు) వారిని కలిసి పిలిచాడు. ఒక స్థానిక సంఘములో యౌవనుడైన పౌలు వంటి పరిచర్యయుంటే, బహుశా ప్రతివాడు అక్కడ్నుండి తరిమివేయబడి, పౌలు ఒక్కడే మిగిలియుండును. అదే విధముగా యౌవనములో నుండిన బర్నబావంటి పరిచర్య యుండినట్లయితే అది వెన్నెముకలేని జెల్లీ చేపవంటి సంస్థగా ఎవరికీ స్థిరమైన విలువలు లేని పూర్ణహృదయులు కాని రాజీపడువారితో నిండిపోయియుండును. కాని పౌలు, బర్నబాలు కలిసి సత్యమైన సంఘమును కట్టవచ్చును. దీనినే వారు చూడకుండునట్లు సాతాను చేసెను (అపొ.కా. 15వ అధ్యాయము). దేవునికి వందనములు వారు ఆ విషయమును తరువాత చూసిరి.


బర్నబా పౌలును విడిచి వెళ్లిన తరువాత పరిశుద్ధాత్మ పౌలు కొరకు వేరొక తోటి పని వానిని సిద్ధపర్చెను. మనము ఈ వ్యక్తిని గూర్చి అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయములో సంఘటన జరిగిన వెంటనే 16:1లో చూచుదుము. అతడు తిమోతి. పౌలు ఒంటరిగా పరిచర్య చేయునట్లు ఆత్మ విడిచి పెట్టలేదు. పరిశుద్ధాత్మ పౌలు కొరకు ఒక సహపనివానిని తయారు చేసెను. అతడు మరల పౌలుకు స్వాభావికముగా భిన్నమైనవాడు. తిమోతి సిగ్గు బిడియము కలిగి ముభావముగా ఉండి కలుపుగోలుతనము గల పౌలుకు వ్యతిరేకముగా తనమట్టుకు తను ఉండువాడు. వారిరువురు దేవుని యెడల వారికుండిన అంకితభావం విషయంలో వారి హృదయపూర్వక ఆసక్తి విషయంలో మరియు తమ స్వప్రయోజనములను చూచుకొనుట (ఫిలిప్పీ 2:19-21) నుండి విడుదలైన విషయంలో వారు ఒకేలా ఉండిరి. కాని వారి స్వభావము విషయంలో వారు రెండు ధృవములుగా యుండిరి. అయినప్పటికిని పౌలు తిమోతిని మిగిలిన తన సహపనివారి కంటే ఎక్కువగా మెచ్చుకొనెను. వారి స్వంత విషయములో వారు వ్యత్యాసముగా నుండినా వారి మధ్యన మహిమకరమైన సహవాసము ఉండెను. చివరకు పరిశుద్ధాత్ముడు పౌలులో నెరవేర్చవలెనని అనుకొన్నది నెరవేర్చాడు.


ఇంకొకరి పరిచర్యను అనుకరించుట తెలివి తక్కువ పని. అలా చేసినట్లయితే శరీరములో ఒకరి స్వంత పరిచర్య ఆటంకపర్చబడును. సంఘమలో అనేక యౌవనస్థుల తెలివి తక్కువతనము ఇదేయైయున్నది. వారికి అటువంటి పిలుపు లేకపోయినా వారు ఒక దైవజనుడి పరిచర్య చూచి దానిని అనుకరించుదురు. దాని ఫలితముగా, వారు నామకార్థ క్రైస్తవత్వములోను మరియు మానవ అనుభూతుల సముద్రములో మునిగిపోవుదురు హెబీ 11:29లో ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పుటచేత ఎఱ్ఱసముద్రమును ఏ కష్టము లేకుండా దాటిరి. అయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను అనుకరించుటకు ప్రయత్నించుట చేత వారు అందులో మునిగిపోయిరి. ఇతరుల పరిచర్యను అనుకరించుటకు ప్రయత్నించిన వారికి ఇది ఒక హెచ్చరికగా ఉన్నది.


రెండు ఉదాహరణలు చూచినట్లయితే: చాలా కొద్ది మంది యిర్మీయా యొక్క పరిచర్యయైన పెల్లగించుట, విరుగగొట్టుట, నశింపచేయుట, పడద్రోయుట, కట్టుట, నాటుట అనువాటికి (యిర్మీయా 1:10) పిలువబడుదురు. ఒకరు, అటువంటి పిలుపులేకుండా, దానిని అనుకరించుటకు ప్రయత్నించినట్లయితే, అతడికి దేవుడు శరీరములో ఇచ్చిన ప్రత్యేకమైన పరిచర్యను నాశనము చేసికొనుట మాత్రమే కాకుండా, తన ఆత్మను కూడా నాశనము చేసుకొనును. అదేవిధముగా, మనము బోధకులుగా తయారవ్వవద్దని హెచ్చరింపబడినాము (యాకోబు 3:1). దేవుని చేత సంఘములో బోధకులుగా నుండుటకు ప్రత్యేకముగా పిలువబడినవారు (1 కొరింథీ 12:29; ఎఫెసీ 4:11) వారి పరిచర్య జయకరముగా నెరవేర్చుటకు కృపపొందుదురు. వారిని అనుకరించిన ఇతరులు వారు మునిగిపోవుట మాత్రమే కాకుండా ఇతరులను కూడా గలిబిలి మరియు తప్పుడు బోధ అనే సముద్రములో ముంచి వేయుదురు.


క్రొత్త నిబంధన జనులను క్రీస్తు శరీరములోనికి నడిపించుట కొరకు ఉద్దేశింపబడినది. పాత నిబంధనలో 'శరీరము' అనునది ఏమీలేదు. దానికి కారణము అప్పటికి పరిశుద్ధాత్ముడు మనుష్యులలో నివసింపలేదు. అందువలన ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒరు సహవాసములోనికి వచ్చుట అసాధ్యము. పాత నిబంధన క్రింద వారి నడవడిలో వారు ''మానవ స్వభావము'' లో నుండుట వలన వారు సహవాసములో నుండుట అసాధ్యము. క్రొత్త నిబంధన క్రింద మనము ఇప్పుడు దైవ స్వభావములో నుండుట సాధ్యము. క్రొత్త నిబంధన క్రింద మనము ఇప్పుడు దైవ స్వభావములో పాలివార మవ్వవలసియున్నది (2 పేతురు 1:4). కాబట్టి మన నడవడిలో మనము ''దైవికము''గా నుండవలెను. ఆ విధముగా సహవాసము మహిమకరముగా సాధ్యమగును, మరియు శరీరము కట్టబడును.


జనులు ఈ కాలములో నివసించుచుండినా, వారు ఒకరితో ఒకరు సహవాసములోనికి రాలేకపోవుటకు కారణము వారింకను శరీరానుసారులుగా, పసిపిల్లలవలె మరియు ''మానవ స్వభావము''తో నుండుటయే. పౌలు ఈ విషయం గురించి కొరింథీ క్రైస్తవులను ''మీరు శరీర సంబంధులై మనుష్యురీతిగా నడచుకొనువారు కాదా;'' (1 కొరింథీ 3:3) అని గద్దించెను. జనులు ''మానవ స్వభావము''తో నుండినప్పుడు తమ వంటి స్వభావము కలవారితో కలసియుండుటకు చూచుదురు. మళయాలీలు ఒక గుంపుగా కూడి తమ కొరకు ఒక సంఘమును ఏర్పరచుకొందురు. ఆంగ్లో -ఇండియన్లు కూడి తమ కొరకు ఒక సంఘమును ఏర్పరచుకొందురు, మరియు తెలుగువారు కూడి తమ కొరకు ఒక సంఘమును ఏర్పరచుకొందురు. ఇవన్ని క్లబ్బులు, అంతే తప్ప యేసు క్రీస్తు యొక్క సంఘము కాదు!


అయితే దేవుడు ఉద్దేశించిన శరీరములో, ఆయన వేరు వేరు పరిస్థితుల నుండి, కులముల నుండి, జాతుల నుండి, స్వభావాల నుండి విద్యాస్థాయి నుండి, సాంఘీక మరియు ఆర్థికమైన స్థాయిల నుండి వచ్చిన వారిని ఉంచి, వారి మధ్య ఒకరితో ఒకరికి యున్న సహవాసము ద్వారా వారిలో ఒక్కొక్కరి కొరకు కోణములు అరిగిపోయేలా చేయును. ఆ విధముగా పరిశుద్ధత మరియు సహవాసము రెండూ సమానముగా అభివృద్ధి చెందును.


హెబీ 12:14లో మనము అందరితోను సమాధానమును (సహవాసము) మరియు పరిశుద్ధతను కలిగి యుండుటకు ప్రయత్నించవలెనని మనకు చెప్పబడినది. క్రొత్త నిబంధనలో ఈ రెండు విడదీయబడలేవు. అవి రెండు మనకున్న రెండు కాళ్ళవంటివి. మనము నడుస్తున్నప్పుడు మొదట అడుగు ఎడమ కాలితో వేసినట్లయితే రెండవ అడుగు వేయుటకు కుడి కాలిని ముందుకు వెయ్యాల్సి ఉంటుంది. పరిశుద్ధత మరియు సహవాసము విషయంలో కూడాఅంతే. చాలా తరచుగా, పరిశుద్ధత గూర్చి బాగుగా పట్టబడిన విశ్వాసులు సహవాసము యొక్క అవసరత గూర్చి అదేవిధముగా పట్టబడరు. వారు ఒక కుంటికాలు కలిగి, పరిశుద్ధత అనే ఒకే కాలుతో గెంతువారుగా యుందురు. వారు, వారి ఆలోచనలలో, మాటలలో మరియు పనులలో మరియు బహుశా వారి వైఖరిలో, ఉద్దేశములలో మాలిన్యమును కడుగుకొనుటకు ఆసక్తి కలిగియుందురు. కాని వారు శరీరములో ఇతరులతో సహవాసమును పెంపొందించుట గాని లేక దాని విలువను గుర్తించుటగాని చేయరు. అటువంటప్పుడు పరిశుద్ధత గూర్చి వారి వెదకులాట స్వార్థపూరితమైనదిగా నుండి అది చివరకు తప్పుడు గమ్యస్థానమునకు చేర్చును. ఎందుకంటే సహవాసములేని పరిశుద్ధత నకిలీదైయున్నది. మనము అదెప్పుడూ మరువకూడదు.


దీనికి వ్యతిరేకమైన పరిస్థితులు కూడా యుండవచ్చును. ప్రజలు వారి యొక్క అంతరంగ జీవితాల్లో పరిశుద్ధతను కోరకుండా సహవాసము గూర్చియే ఆసక్తి కలిగియుందురు. అటువంటి పరిశుద్ధతలేని సహవాసము కూడా నకిలీదే.


మనము ముందుగా సరిగా నడువలెనంటే మన రెండుకాళ్ళు బలముగా నుండవలెను. దీని ముందు వచనచాలో (హెబీ 12:12, 13) మనము బలహీనమైన అవయవాలను బలపరచవలెనని మనకు చెప్పబడెను. మనలను మనము పరీక్షించుకొని, మనలను మనము సరిగా విమర్శించు కొనులాగున ఇక్కడ మనము దేవుని వెలుగు కొరకు వేడుకొనుట లాభదాయకరముగా ఉండును.


మనలో నుండవలసిన ఏకత్వము యేసు ప్రభువు ఈలోకములో నుండినప్పుడు తన తండ్రితో కలిగియున్న ఏకత్వమువలె యుండవలెను. అది ఆత్మలో ఏకత్వము. మన విమోచన విషయంలో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ వారి వారి పరిచర్యలు చేసిరి. తండ్రి కుమారుని పంపెను. కుమారుడు మనకొరకు ఒక శరీరమును ధరించి మన పాపముల కొరకు మరణించెను. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనము కుమారుని సారూప్యముగల వారగునట్లు మనలో పనిచేయుచున్నాడు. ఈ పరిచర్యలలో ఏ విధమైన గలిబిలిలేదు. అయినప్పటికిని ఈ ముగ్గురు ఒక్కటిగా యున్నారు. సంఘములో కూడా అలాగే యుండవలసియున్నది.


దేవుడు, ఆయన సర్వాధికారముతో క్రీస్తు శరీరములో ప్రతి సభ్యునికి ఒక ప్రత్యేకమైన పరిచర్య యిచ్చును (1 కొరింథీ 12:7, 8). దేవుడు ప్రతివ్యక్తి చుట్టూ ఒక వృత్తమును గీచెనని చెప్పవచ్చును. కొందరి విషయములో అది చాలా పెద్దది మరియు కొందరి విషయములో అది చాలా చిన్నది (మత్తయి 25:15). నీ పరిధిలోనే నీవు దేవునిని కనుగొనగలవు (అపొ.కా. 17:26, 27). నీ పరిధికి బయట ఇతరుల విషయాలలో జోక్యం చేసుకొని శ్రమ పొందుటకు బదులు, మనలను మనము తీర్పు తీర్చుకొని మన శరీరములో శ్రమ పొందుట మేలని పేతురు చెప్పెను (1 పేతురు 4:15, 17, 1).


ఉదాహరణకు: వేరొక సహోదరుడు ఏ విధముగా తన బిడ్డలను పెంచుతున్నాడు లేక ఎట్లు డబ్బు ఖర్చు పెడుతున్నాడు మొదలైనవి నీకు సంబంధించినవి కావు. అది నీ పరిధి బయట ఉన్నవి. ఇతరుల పరిధిలోనికి వెళ్లుటకు దేవుడు మనకు అధికారము ఇవ్వలేదు. అందువలన మనము కేవలము మన గూర్చి మాత్రమే చూచుకొనవలెను (1 తిమోతి 4:16).


మనము లోకరీతిగా ఉన్నప్పుడు, మనము అనేకులను గూర్చి మరియు అనేక విషయములతో అభిప్రాయములతో కూడిన ఒక పెద్ద వృత్తమును తయారు చేసికొని యుంటిమని చెప్పవచ్చును. కాని ఇప్పుడు మనము మన చుట్టూ దేవుడు ఏర్పాటు చేసిన పరిధిలో నుండుటకు జాగ్రత్తపడవలెను. అనేకుల విషయములో ఆ వృత్తము ఒక్కడినే కలిగియుండును! నీవు కుటుంబీకుడవైనట్లయితే ఆ వృత్తములో నీ కుటుంబము కూడా ఉండును. నీవు ఒక సంఘ పెద్ద అయినట్లయితే ఆ వృత్తములోనికి నీ సంఘము కూడా వచ్చును. కాని చాలా వరకు, ప్రతి వ్యక్తి తనకు తాను మాత్రమే తీర్పు తీర్చుకొనవలసి యుండును.


మనము ఎప్పుడయితే మన వృత్తము యొక్క పరిధి దాటి హద్దులు మీరుదుమో అప్పుడు ఇతరులతో మనకుండిన సహవాసము పాడవును, మరియు ఆ ప్రక్రియలో మన పరిశుద్ధత కూడా ఆటంకపర్చబడును.


మనము ''దేవుని యందు భయముతో ఒకరికొకరము లోబడి యుండవలెనని'' ఆజ్ఞ పొందియున్నాము (ఎఫెసీ 5:21) దాని అర్థము క్రీస్తు యెడల భయము మనలను ఇతరుల పరిధిలోనికి వెళ్ళుటకు భయమును పుట్టించవలెను. ఇతరులతో మనకుండిన సహవాసములో, మనకు సంబంధము లేని ఇతరుల విషయములలో మనము అనవసర ఆసిక్తి చూపకుండా మనలను మనము నియంత్రించుకొనవలెను.


ఇతరుల విషయములు తెలసుకొనవలెననే ఉత్సుకత అనేక విశ్వాసుల జీవితములలో కనబడని తీవ్రమైన పాపము. ఇది ఇతరుల విషయములలో తలదూర్చేదానికి ప్రారంభములో బయటకు కనబడే లక్షణము. చిన్నపిల్లలు ఇతరుల సంభాషణను పొంచి వినుటకు ఉబలాటపడుదురు. ''నేను పెద్దవాడినైనప్పుడు పిల్ల చేష్టలను మానివేసితిని'' అని పౌలు చెప్పెను (1 కొరింథీ 13:11) కాని చాలా మంది విశ్వాసులు వారు పెద్దవారైనప్పుడు కూడా ఈ చెడు అలవాటును మానుకొనరు. అటువంటి ఉబలాటం అంతకంటే చెడ్డదైన గాలికబుర్లు చెప్పుకొనే అలవాటుకు తీసుకువెళ్తుంది. ఈ అలవాటును కొనసాగించువారు, ముసలమ్మ లక్షణములు కలవారై దైవిక జీవితమును జీవించుటకు వారు క్రమశిక్షణ కలిగియుండలేరు (1 తిమోతి 4:7). బూతుబొమ్మలు చూచే అలవాటు కూడా ఇతరుల దిగంబర శరీరములను చూచుటకు మన శరీరములో ఉన్న ఉత్సుకతను సంతృప్తిపరచుటకు సాతాను యొక్క మార్గమైయున్నది.


యేసు ప్రభువుకు కూడా మనవలెనె ఈ విషయంలో శోధింపబడెను. కాని ఆయన తన తండ్రి ఆయన చుట్టూ గీసిన వృత్తములో నుండి బయటకు వచ్చుటకు ధృడముగా నిరాకరించెను. ఆ విధముగా ఆయన తన ముప్పై మూడున్నర సంవత్సరముల జీవితములో ఒక్కమారు కూడా ఈ విషమంలో పాపము చేయలేదు. మనము ఈ ఉత్సుకత విషయములో ఎంత బలహీనులమో చూచినట్లయితే, ఈ ఒక్క విషయములోనే యేసు ప్రభువు యొక్క విజయములో ఎంత గొప్పతనము ఉన్నదో మనము అర్థము చేసికొనగలము. ఎవరు ఎవరిని పెండ్లి చేసుకోబోవుచున్నారు. తరువాత ఎవరు గర్భం దాల్చుచున్నారు మొదలైనవి తెలుసుకొనవలెననే ఉత్సుకత దేవునినెరుగని జనుల కాలక్షేపం. హృదయపూర్వకముగా దేవునిలో జీవించే సహోదరుడుగాని సహోదరిగాని అట్లు కాలక్షేపం చేయరు.


ఒకరి పరిధి దాటి హద్దులు మీరుట కొందరు పెద్దలు, భర్తలు మరియు తల్లిదండ్రులు వారికి లోబడువారిపై అధికారము చలాయించుటలో కూడా కనబడును. మనము ఎప్పుడూ, ఏ విధముగాను మన బిడ్డలను భయపెట్టుట కాని లేక మన భార్యలను లేక సంఘములో ఇతర సహోదరులను ఒత్తిడి చేయుట కాని చేయకూడదు. ''నా వలన భయము నిన్ను బెదరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు'' అని ఎలీహు చెప్పిన మాటలు ఇక్కడ సరిగా సరిపోవును (యోబు 33:7).


మనలో ప్రతి ఒక్కరము ఏ విధముగానైనా మన అధికారము క్రిందనున్నవారు (బిడ్డలు, భార్య, సేవకులు, విశ్వాసులు మొదలైనవారు) ఎప్పుడూ భయపడుట లేక ఒత్తిడి చేయబడుట లేక బెదరింపబడకుండునట్లు జాగ్రత్తపడవలెను. మనకు ఇతరులపై అధికారమున్నప్పుడు మన హద్దులను దాటి వెళ్లుట చాల సుళువు. అప్పుడు సహవాసము నాశనమగును.


ఒక భర్త తన భార్య యొక్క వ్యక్తిత్వమును నలగగొట్టునంతగా ఆమెపై అధికారమును చూపవచ్చును. అది బుద్ధిహీనత. దేవుడు భార్యాభర్తలు ఒకరికి ఒకరు వేరుగా నుండునట్లు తయారుచేసెను. అందునుబట్టి వారు ఒకరికి ఒకరు సహాయకరముగా యుందురు. ఏదైనా ఒక విషయమును చూచునప్పుడు, భర్తగా నీవొక కోణమునుండి చూచుదువు మరియు నీ భార్య ఇంకొక కోణము నుండి చూచును. అవి నీవు ఒక భవనమును ఉత్తరమువైపు నుండి ఫోటో తీసినట్లును మరియు నీ భార్య అదే భవనమును దక్షణవైపు నుండి ఫోటో తీసినట్లుండును. ఆ రెండు చిత్తరువులను ప్రక్కప్రక్క పెట్టినప్పుడు, అవి పూర్తిగా వ్యత్యాసముగా కనబడును. కాని, ఆ విధముగా మాత్రమే నీకు ఆ భవనము యొక్క సంపూర్ణమైన స్వరూపం కనబడును. నీ భార్య కూడా నీవు చూచే కోణము నుండే ఫోటో తీయునట్లు ఆమె వ్యక్తిత్వమును నీవు పడగొట్టివేసినట్లయితే నీవు బుద్ధిహీనుడవైన భర్తగా యుందువు. అప్పుడు నష్టము నీకే కలుగును. నీవు ఆమె మట్టుకు ఆమెను ఉండనిచ్చినట్లయితే, నీవు ఆ విషయం గూర్చి వేరొక వైపు దృశ్యమును సంపాదించియుండే వాడవు మరియు అది నిన్ను జ్ఞానవంతునిగా చేసియుండును. ఈ విషయంలోనే అనేక మంది భర్తలు వారి బుద్ధిహీనతను కడుగుకొనవలసియున్నది.


పరిశుద్ధత మరియు సహవాసము విడదీయలేని విధంగా కలిసియుండేవి.


ప్రతి సంబంధములో అది భర్త మరియు భార్య, సహోదరుడు మరియు సహోదరుడు, లేక సహోదరి మరియు సహోదరి విషయంలోనైనా పరిశుద్ధత అనే ఎడమ కాలు ముందుండినట్లయితే సహవాసమనే కుడికాలు దానిని అనుకరించవలెను.


దేవుని వెలుగులో నడుచువారు (1 యోహాను 1:7) నడచుటకు రెండుకాళ్లను ఉపయోగించుదురు. ఆ విధముగా వారు వారిలో యుండే చెడు విషయములో వెలుగును పొందుకొనుచూ యుందురు. అది వారిని వారు తీర్పు తీర్చుకొనుటకు తోడ్పడును. ఆ విధముగా వారు అదే మార్గములో నడచువారితో వారి యొక్క సహవాసము మరి ఎక్కువ మహిమకరముగా నుండునట్లు చేయును. అట్లు సంఘము క్రీస్తు యొక్క మహిమను చుట్టూ ఉన్న లోకమునకు ప్రకాశింపచేయును.


అధ్యాయము 10
క్రీస్తువిరోధి ఆత్మపై విజయము

క్రీస్తువిరోధియైన అంత్యక్రీస్తు ప్రపంచపు రంగములోనికి బహిరంగముగా వచ్చే ముందురోజులలో మనము జీవిస్తున్నాము. అయితే అతడు ఈ లోకములో సాతాను యొక్క ముఖ్య ప్రతినిధిగా ప్రత్యక్షమగుటకు ముందు, ప్రపంచ పరిస్థితులు క్రమేణ అతడి రాకకు ఏర్పాట్లు సిద్ధము చేయునట్లుండును - అది ఒక ఏటవాలు భూభాగము ఒక పర్వత శిఖరమునకు తీసుకు వెళ్ళినట్లుండును. ఈ ఏటవాలు యొక్క నిర్మాణము మొదటి శతాబ్దములోనే ప్రారంభమైనదని యోహాను చెప్పెను. 1 యోహాను 2:18లో ''చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలు దేరియున్నారు'' అని చెప్పెను. ఇది వ్రాయబడినప్పటికే రాత్రి 11 గంటలై పోయిందని సుమారు క్రీ.శ. 100వ సంవత్సరములోనే పరిశుద్ధాత్ముడు చెప్పెను.


ఇప్పుడు మనము యుగాంతము యొక్క చివరి క్షణాల్లో ఉన్నాము. పరిస్థితులన్ని పర్వత శిఖరపు చివరకు చేరుటకు దగ్గరగా యున్నవి. మనము జీవించు కాలములను అర్థము చేసికొనువారముగా మనముండవలెను (మత్తయి 16:3).


క్రీస్తు విరోధి యొక్క రాజ్యము రాజకీయ ఆర్థిక మరియు మత సంబంధమైనదిగా యుండును. మనము ఇప్పుడు దానిలో కేవలము మత సంబంధమైన విషయములు గూర్చి ఆలోచించుదము. సాతాను తన ఉద్దేశ్యములను నాస్తిక ప్రభుత్వముల ద్వారా కంటె ఎంతో ఎక్కువగా తప్పుడు మతముల ద్వారా మరియు తప్పుడు మతముల కంటె ఎంతో ఎక్కువగా నకిలీ క్రైస్తవత్వము ద్వారా నెరవేర్చుకొనుచుండెను. అందుచేతనే క్రైస్తవ సంఘములో క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దములోనే కూర్చుని యుండిరని యోహాను చెప్పుచుండెను. అయితే అటువంటి వారు అపొస్తలుల బలమైన బోధచే బయటకు తరిమి వేయబడిరి. ''వారు మనలో నుండి వెళ్ళిపోయిరి'' (1 యోహాను 2:19) అని ఆయన చెప్పెను.


ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఈనాటి క్రైస్తవ ప్రపంచములో బహుగా నిండి యున్నది. అట్టి ఆత్మ ఎలాటిదో గుర్తించవలసియున్నది అప్పుడు మాత్రమే దానిని మన నుండి మరియు మన సంఘములలో నుండి బయటకు త్రోలి వేయగలము.


2 థెస్సలోనీకయులకు వాస్రిన రెండవ పత్రిక 2:3-12 వచనములలో మన కొరకు క్రీస్తు విరోధి లక్షణముల గూర్చి క్లుప్తముగా చెప్పబడినది.


1. అతడు పాప పురుషుడుగా పిలువబడును (3వ).


2. దేవుని వలె కాగోరి తన్ను తాను హెచ్చించుకొనును (4వ).


3. అతడు అబద్దమాడుచు మోసపరచుచుండును (9, 10వ).


ఈ లక్షణములు, యోహాను రోజులలో వలె క్రైస్తవ సంఘములలో కూర్చొని ఉన్న క్రీస్తు విరోధులను గుర్తించుటకు మనము వేటిని చూడవలెనో మనకు సూచించును.


పాపము


క్రీస్తు విరోధి పాప పురుషుడని పిలువబడెను. క్రైస్తవ లోకములో పాపమును తేలికగా తీసుకొనే వైఖరిలో అతడి ఆత్మ కనబడును. క్రీస్తు రాకడకు ముందు ఈ చివరి తరములో పాపముకు వ్యతిరేంగా మాట్లాడుట అపఖ్యాతిని తెచ్చును. సాంఘీక, సమానత్వము, బీదలను, విద్య లేని పామరులను గూర్చి పట్టించుకొనుట, వరద బాధితులకు సహాయము మొదలైన వాటి గూర్చిన బోధ ఎంతో ఉండును. అవన్నియు మంచివే. కాని ధనాశ మరియు వస్తు సామాగ్రిని ప్రేమించుట గూర్చి, లైంగికపరమైన చెడ్డ ఆలోచనలు, క్షమించలేకపోవుట, కోపముతో ఉద్రేకమును కోల్పోవుట, మనుష్యులలో ఘనతను వెదుక్కొనుట, చెవులు కొరుక్కొనుట, ముచ్చట్లు మొదలైన వాటికి వ్యతిరేకత గూర్చిన ప్రాధాన్యత ఏ మాత్రము ఉండదు. (ఈ విషయములను యేసు ప్రభువు మత్తయి 5-7 అధ్యాయములలో చెప్పారు). 'ధర్మ విరోధ సంబంధమైన మర్మము' (2 థెస్సలో. 2:7), ''క్రైస్తవులను వారు పాపములో జీవితాన్ని కొనసాగిస్తున్నా, వారు ఎప్పుడో ఒకసారి క్రీస్తును అంగీకరించినందున వారు శాశ్వతమైన భద్రతలో నుండినట్లే'' అనే అసత్యమైన కృపలో కనబడును. అటువంటి బోధ చెవులకు యింపుగా నుండును. కావున అనేకమంది విశ్వాసులు అటువంటి దానిని వినుటకు సిద్ధముగా యుందురు (2 తిమోతి 4:3, 4).


క్రీస్తు విరోధి పరిపాలన గూర్చి వివరింపబడిన ప్రకటన 13వ అధ్యాయములో అతడు తనను వెంబడించు వారు బహిరంగముగా గాని లేక రహస్యముగా గాని వెంబడించు అవకాశము ఇచ్చెనని చెప్పబడినది. వారు అతడి గుర్తును వారి నొసళ్ళపై కాని (బహిరంగముగా అనుసరించాలని అనుకొనువారికి) లేక వారి కుడి అరచేతిపై కాని (వారు కొన్ని క్రైస్తవ సంఘములలో విశ్వాసులుగా కొనసాగుతూ, మృగము యొక్క గుర్తు వేయించుకొనుట ద్వారా వచ్చు ఉపయోగములను పోగొట్టుకొనని వారు) వేయిచుకొనుటకు ఇష్టపడిన వారు (పక్రటన 13:16, 17). అయితే ఆ తరువాత వచనములో చెప్పబడిన యేసును వెంబడించువారికి, ఆ విధంగా ఎంచుకొను అవకాశము లేదని చెప్పబడినది. వారి ముద్ర తప్పకుండా వారి నుదుటిమీద ఉండవలెను (పక్రటన 14:1).


క్రీస్తు విరోధి పరిపాలనలో అవసరమైన ఆహార వస్తువులు కూడా 'మృగము యొక్క ముద్ర' లేకుండా కొనుటకు సాధ్యమవ్వదు. మనము ఇంకను ఆ శిఖరముకు చేరలేదు. కాని మనము దానికి చాలా దగ్గరగా యున్నాము. ఈనాడు ఎన్నో ఉద్యోగములు మరియు విద్యా సంస్థలలో ప్రవేశము పొందుట మన కుడిచేయి లంచముతో అపవిత్ర మవ్వకుండా (మృగము యొక్క ఒక గుర్తు) కష్టమైపోతుంది. కర్మాగారాలలో పనిచేసే కార్మికులు ''ఆయుధ పూజ'' పండుగకు ప్రతి సంవత్సరం చందా ఇవ్వకపోతే, వారికి కష్టమైన పనులు అప్పగించుట ద్వారా వారు శిక్షింపబడుదురు. ఎంతోమంది విశ్వాసులమని పిలిపించుకొనువారు అటువంటి పరిస్థితులలో రాజీపడిపోయి తరువాత ఆదివారము కూటములకు వచ్చి ప్రభువును ఎంతో 'ఆత్మానుసారమైన' విశ్వాసుల వలె ఆరాధించుదురు. ఇది ఎలా సాధ్యము? వారు వారములో చేసిన అవినీతి మరియు పాపము సంఘములో ఎవరికీ తెలియదు కాబట్టి అట్లు చేయుచున్నారు. మృగము యొక్క గుర్తు వారి అరచేతిపై కనబడకుండా యున్నది. ఇప్పటి పరిస్థితులో యిబ్బందులు లేకుండా కొనసాగాలంటే మనము అటువంటి విషయాలలో పట్టు పట్టకూడదని వారు చేసిన పనిని సమర్థించుకొందురు. ఇటువంటి వారే ఒకరి సాక్ష్యము పోకుండా, రహస్యముగా సాతానుకు మోకరించుట సమర్థనీయమే అని అనుకొందురు! ఈనాడు చివరకు క్రొత్త నిబంధన క్రమము గల సంఘముల యొక్క పెద్దలు కూడా వారి అరచేతులపై మృగము యొక్క గుర్తును రహస్యముగా కలిగియున్నారు. ఆ విధముగా సంఘములలో క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పరిపాలన చేయుచున్నది. క్రొత్త నిబంధన సంఘములలో ఎన్నో తగువులు, పోట్లాటలు మరియు మరణము ఉండుటకు ఇదే కారణము.


కేవలం ఎవరైతే ప్రతివిధమైన పాపానికి వ్యతిరేకముగా తీవ్రమైన వైఖరి కలిగి యుందురో, ఎవరైతే పాపమును యేసు ద్వేషించినట్లు ద్వేషించుదురో (హెబీ 1:9) అటువంటి వారికి విశ్వాసుల సంఘములో నుండి పాపమును తరిమివేయు శక్తియుండును.


తన్ను తాను హెచ్చించుకొనుట


లూసిఫరు తన తోటి దేవదూతల నుండి ఆరాధనను పొందగోరి దేవుని వలె అగుటకు తన్నుతాను హెచ్చించుకొనుట ద్వారా సాతానుగా మారెను. మానవజాతి అంతటా అటువంటి ఆరాధింపబడు కోర్కె ఉండుటను కనుగొనగలము. ఇది రాజకీయ రంగములో, వ్యాపార రంగములో మరియు మతపరమైన రంగములో కూడా కనుగొనగలము. అసత్యమైన మతములలో, కొందరు దైవ పురుషులనిపించుకొనువారు నిజంగా ఇతరులచే ఆరాధింపబడుచున్నారు.


క్రైస్తవ ప్రపంచములో కూడా మనుష్యులు ఇతరుల కంటె హెచ్చుగా నుండగోరి యేసు ప్రభువు ఖండించిన యూదుల 'రబ్బీ'ల వలె, తమ్మును తాము 'రెవరెండు ఫాదరు', 'రెవరెండు డాక్టరు', పాస్టర్‌ మొదలైన బిరుదులతో హెచ్చించుకొందురు. అటువంటి బిరుదుల యొక్క వేరు చూచినట్లయితే అందులో ఇతరులచే ఆరాధింపబడవలననే పైశాచిక కోరిక కనబడును. ఇది 'తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనపరచుకొను' (2 థెస్సలో. 2:4) క్రీస్తు విరోధి యొక్క లక్షణమైయున్నది.


ఈ విధముగా ఇతరులచే ఆరాధింపబడాలనే కోరిక, ఒకరి పనిని గూర్చి లెక్కలు మరియు ఫోటోలు (సాధారణంగా సేవకుని వేరు వేరు భంగిమలైన ప్రసంగించుట మరియు ప్రార్థించుట మొదలైన వాటితో నుండును) పంపునటువంటి నిగూఢమైన పద్ధతులలో కూడా వ్యక్తపరచబడును.


ఒక తోటి విశ్వాసి కంటె పైగా హెచ్చించుకొనే కోరిక సంఘములో పెద్దగా ఉండాలని కుట్రలు పన్నుటలోను, పేరు పొందిన బోధకుడుగా ప్రపంచమంతా చుట్టి రావాలనుకొనుటలో వేరు వేరు విషయాల గూర్చి ఇతరులకు సలహాల నివ్వాలనుకొనుటలో (వారు నీ సలహాను కోరుకొనకపోయినను) ఇతరుల పనిని గూర్చి విమర్శించి మరియు తీర్పు చేయాలనుకొనుటలో, మనుష్యుల నుండి ఘనత పొందునట్లు ప్రసంగములను జాగ్రత్తగా ఏర్పాటు చేసికొనుటలో, ఇతరుల కంటె స్వస్థపరచుటలో బోధించుటలో గొప్పగా యుండినట్లు ఋజువు చేసికొనుటలో ఇతర దేవుని సేవకుల యొక్క పరిచర్యలను, వరములను అనుకరించుటలో, పడిపోయినప్పుడు దానిని సమర్థించుకొనుటకు చూచుటలో ఇంకా ఇటువంటివెన్నో ఇతర పద్ధతుల ద్వారా ఒకడు తనకు పేరు తెచ్చుకొనుటకు చూచుటలో (లూకా 16:15) కనబడును.


మనము ఇటువంటి వాటినుండి విడుదల పొందవలె నంటే ఈ కోర్కెలన్ని మరియు ఇంతకంటె అసహ్యమైనవి మన శరీరములో ఉన్నవని మనము తేటగా చూచి, వాటిని మనము తీవ్రముగా తీర్పు తీర్చుచుండవలెను. అప్పుడు మాత్రమే మన సంఘముల నుండి క్రీస్తు విరోధి ఆత్మను బయటకు తరిమి వేయు అధికారము మనకుండును.


అబద్ధము


క్రీస్తు విరోధి లోకమును అబద్ధ విషయమైన సమస్త బలముతోను, ''నానా విధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను సాతాను కనపరచు బలమును అనుసరించియుండును'' (2 థెస్సలో. 2:9, 10).


సాతాను అబద్ధములకు జనకుడు (యోహాను 8:44). తన నాలుకతో అబద్ధము చెప్పు దేవుని బిడ్డ, నిజానికి తన నాలుకను అబద్ధమును కనునట్లు సాతానుకు గర్భముగా యిచ్చుచున్నాడు. మనమందరము ప్రావీణ్యము సంపాదించిన ఒక పాపము అబద్ధము చెప్పుట. ''మనము తల్లి గర్భము నుండి అబద్ధికులము'' (కీర్తన 58:3). అబద్ధములలో వేరు వేరు రకములున్నవి. సగము నిజము చెప్పుట, సత్యమును ఒకవైపు మాత్రమే చెప్పుట (మనలను మనము నీతిమంతులుగా తీర్చుకొనుటకు), మన పనిని గురించి ఇచ్చే రిపోర్టును గొప్పచేయుట, సంఘటనలను గొప్పగా చేసి చూపించుట (ఈనాడు అనేక క్రైస్తవ జీవితచరిత్రలలో నుగొనగలము. వీటిని సామాన్య విశ్వాసులు ఎటువంటి వివేచన లేకుండా స్వీకరించుదురు), ఇతరుల సానుభూతి పొందునట్లు బాధను, రోగమును అనుభవించుచున్నట్లు చూపుట, దాతృత్వ స్వభావమున్నట్లు చూపుట, లేకపోయినా అంతరంగములో పవిత్రత ఉన్నట్లు చూపుట, సంఘటనలను ప్రార్థనతో ముడిపెట్టుట, ఉపవాస ప్రార్థన లేక దయ్యములను పారద్రోలుట వంటి వాటిలో ప్రావీణ్యుడనని భ్రమకలుగజేయుట మొదలగునవి. ఇంకా అబద్ధములు చెప్పడానికి వందలకొద్దీ అవకాశములు ఉన్నవి.


నీవు పాపముచేత జయింపబడినట్లయితే, దాని గూర్చి నిజాయితీగా ఒప్పుకొని నీ ఓటమి గురించి దు:ఖించు, అప్పుడు నీకు గొప్ప నిరీక్షణ ఉండును. అలాకాక పాపమును నీవు జయిస్తున్నావని లేక నీ అంతరంగములో లేక రహస్యముగా పాపముచే ఓడింపబడుచుండినా జయము పొందుచున్నట్లు నీ బోధల ద్వారా ఇతరులకు అభిప్రాయము కలుగజేసినట్లయితే, అప్పుడు నీవొకవేళ ఆత్మ చేత బాప్తిస్మము పొందిన వాడినని చెప్పుకొనినా ''వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా.....నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు?'' (మత్తయి 23:31-33) అను యేసు యొక్క మాటలు నీకు వర్తించునని తెలుసుకో.


మన జీవితాల్లో అబద్ధమును మనము కనుగొనిన ప్రతిసారి దీని గూర్చి తీవ్రమైన వైఖరిని చూపకపోయినట్లయితే, మన జీవితాల్లో నుండి అది అంత సులువగా పోదు. చాలామంది పరిశుద్ధతకు సంబంధించిన భాషను మాట్లాడుదురు. కాని వారు అబద్ధమునకు వ్యతిరేకముగా తీవ్రమైన వైఖరి చూపరు. వారు మనుష్యుల యెదుట తమ్మును తాము సమర్థించుకొందురు కాని ఒకరోజు ప్రతి రహస్యమును తీర్పులోనికి తీసుకువచ్చు దేవునికి భయపడనందున వారిపై క్రీస్తు విరోధి ఆత్మకు అప్పటికిని అధికారముండును. మన సంఘములు ప్రతి విధమైన అబద్ధికులను దేవుని వాక్యపు బోధ ద్వారా నిష్కర్షగా బహిరంగ పరిచేవిగా ఉండవలెను. ఆ విధముగా యోహాను కాలములో క్రీస్తు విరోధులు తరిమి వేయబడిరి మరియు కేవలం అట్లే మన రోజుల్లో కూడా క్రీస్తు విరోధులు తరిమివేయబడుదురు.


మోసము


క్రీస్తు విరోధి అబద్ధ విషయమై సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోను జనులను మోసపుచ్చునని చూచాము. మానవాతీతమైన అద్భుతములు జనులను మోసము చేయుటకు గొప్ప శక్తి కలిగియుండును. మన దేశములో క్రైస్తవేతర మతనాయకులు సాతాను శక్తితో చేసిన అద్భుతములను బట్టి అనుచరగణమును తయారుచేసుకొన్న సంఘటనలు ఎన్నో ఉన్నవి.


మానవాతీతమైన సూచకక్రియలను మరియు స్వస్థతలను దేవుడు ఈ లోకములో సంఘము కొరకు ఉద్దేశించిన పనిని నెరవేర్చుట కొరకు సంఘమునకిచ్చెను. యేసు ప్రభువు, పేతురు మరియు పౌలు ఈనాడు కనీసం విననటువంటి బహు గొప్ప అద్భుతములు చేసారు. అవి వారికుండిన విశ్వాసము వలన జరిగినవి. మరియు 'అపొస్తలులు కార్యములు' లో సంఘటనలన్నీ ఈనాటి మన అల్ప విశ్వాసమునకు గద్దింపై యున్నవి. ఆత్మీయవరములు లేనటువంటి సంఘము 1 కొరింథీ 12వ అధ్యాయము ప్రకారము ఒక మనుష్యుడు జీవించుచూ ఉండినప్పటికిని, గ్రుడ్డి, చెవుడు, మూగ మరియు పక్షపాతముతో నుండిన వానితో సమానము. అద్భుతములు, సూచక క్రియల కాలము ముగిసిపోయినదని చెప్పే అవిశ్వాసుల వలె మనముండకూడదు. వారి అవిశ్వాసమును బట్టి వారికి తప్పక ఆ కాలము గతించిపోయెను కాని విశ్వసించుచున్న మనకు కాదు.


అయితే దీని అర్థము యేసుక్రీస్తు నామములో అద్భుతములు చేయువారి నందరిని గ్రుడ్డిగా వెంబడించమని కాదు. ఎందరో అటువంటి అద్భుతములు చేసినవారు చివరకు ప్రభువు చేత తిరస్కరింపబడుదురు (మత్తయి 7:22, 23). అటువంటప్పుడు దేవుడు అటువంటి వారిని యేసు నామములో అద్భుతములు చేయునట్లు ఎందుకు అనుమతించెను? దానికి సమాధానము ద్వితీయోపదేశకాండము 13:1-5లో తేటగా ఇవ్వబడినది. మనము అటువంటి అద్భుతములను సూచకక్రియలను బట్టి ప్రక్కత్రోవ పట్టి పోవుదుమో లేక వాక్యమందలి ఆజ్ఞలకు లోబడుదుమో పరీక్షించుటకు దేవుడు అట్లు అనుమతించును. అందువలన నీ ఆత్మీయ నాయకుడు ఆ చివరి దినాన దేవునిచే త్రోసివేయబడువాడుగా నుండకుండునట్లు చూచుకొనుట ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయం గూర్చి పక్రటన 13:13, 14 జాగ్రత్తగా చదివినట్లయితే గొఱ్ఱెపిల్ల వలె కనబడు అబద్ద ప్రవక్త (పక్రటన 13:11) అద్భుతములు, సూచకక్రియలను బట్టి జనులను మోసపుచ్చుట చూడగలము!


అటువంటప్పుడు మనము మోసపోకుండా ఎట్లు మనలను మనము కాపాడుగొనగలము? దీనికి జవాబు ఒకఅద్భుతములు చేయు క్రైస్తవ సేవకుని విషయంలో పైన చెప్పబడిన మూడు క్రీస్తువిరోధి లక్షణములను పరీక్షించుటలో ఉన్నది. నీ మట్టుకు నీవు ఈ క్రింది ప్రశ్నలను ప్రశ్నించుకొన్నట్లయితే సమాధానము నీకు తెలియును.


1. అతడి జీవితము మరియు పరిచర్య జనులను పాపపు శక్తి నుండి విడుదల చేయుచున్నదా, లేక కేవలము పాప క్షమాపణ వరకే నడిపించుచున్నదా? అతడు పవిత్రమైన హృదయము గూర్చి మరియు జీవితము గూర్చి ప్రాధాన్యత యిచ్చి మాట్లాడుచున్నాడా?


2. అతడు యేసు వలె మరియు అపొస్తలుల వలె దీనుడై తనను తాను తగ్గించుకొనువాడుగా ఉన్నాడా? లేక అతడు గుర్తింపు పొందుటకు ఆసక్తి కలిగియుండి, నీవు అతడి సలహాలపై మరియు అతడి ప్రవచనాలపై ఆధారపడునట్లును, దానివలన నీవు శిరస్సయిన క్రీస్తుతో సంబంధం లేకుండా పోవునట్లు చేయుచున్నాడా? అతడికి సేవకుని ఆత్మయున్నదా, లేక తన చుట్టూ ఉన్నవారికి ఆజ్ఞలిచ్చునట్లు పనులు చెప్పు అధికారిగా ఆత్మయున్నదా?


3. నీవు అతడి జీవితములో నిజాయితీని మరియు నిష్కపటత్వమును, మరియు ముఖ్యముగా ధనమునకు సంబంధించిన విషయములో న్యాయబద్దతను మరియు సూటిగా మాట్లాడుటకు కనుగొంటివా? (ఎప్పుడు నీ యొక్క దశమ భాగములు మరియు కానుకల యెడల ఆసక్తి ఉన్నవారి గూర్చి జాగ్రత్తగా నుండుము)


యేసు, పేతురు మరియు పౌలు ఈ పరీక్షలో ఉత్తీర్ణులవుదురు, కాని ఈనాటి అనేకమైన ''స్వస్థపరచే'' బోధకులు మాత్రము కాదు.


క్రీస్తువిరోధి ఆత్మ ద్వారా సాతాను క్రైస్తత్వమును కల్మషపరిచెను. దేవుడు మన దేశములో మన సంఘముల నుండి ఈ ఆత్మను అపొస్తలుల యొక్క శక్తితో తరిమివేసే అనేకులను లేపును గాక.


అధ్యాయము 11
స్తుతుల ద్వారా విజయము

యేసుక్రీస్తు శిష్యులుగా మన యొక్క పిలుపు విశ్వాసమూలముగా జీవించుటయై యున్నది. విశ్వాసము యొక్క ప్రధానమైన గుర్తు స్తుతులు మరియు కృతజ్ఞతలు తెలియజేయుటయై యున్నది. ''అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి'' (కీర్తన 106:12). అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోవుట చూచిన తరువాత మాత్రమే దేవుని స్తుతించిరి. అప్పుడు దేవుని మాటలను నమ్మి ఆయనను స్తుతించిరి. వారు చూచిన దానిని బట్టి నడచిరి.


అయితే మనము విశ్వాసము వలన నడచువారము. శత్రువులు సముద్రములో మునిగిపోవుట చూచుటకు ముందే మరియు మన శత్రువులు ఇంకను మన ముందు ఉన్నప్పుడే దేవుని యొక్కమాటను నమ్మి మనము దేవుని స్తుతించెదము. దేవుడు తగిన సమయములో, ఆయనకు తోచిన రీతిని వారి విషయము చూచుకొనును అని మనము నమ్ముదుము. ఆ కారణము వలన క్రొత్త నిబంధన క్రింద నున్న మనము అన్ని పరిస్థితులలో మరియు అన్ని సమయములలో దేవుని స్తుతించగలము.


మనము దేవుని యందు విశ్వాసముంచుట చేత యేసు ప్రభువే సంఘము మధ్యన ఉండి మనలను మన తండ్రియైన దేవునికి స్తుతులు చెల్లించుటలో నడిపించును అని హెబీ 2:12, 13లో మనము చదువుదుము. నమ్మకము మరియు స్తుతి ఒక నాణెము యొక్క రెండు ప్రక్కల వంటివి. స్తుతి మరియు కృతజ్ఞత లేని విశ్వాసము నఖిళీ విశ్వాసమును మరియు మృత విశ్వాసమునైయున్నది. యేసుప్రభువు యొక్క 'తమ్ముళ్లుగా' (హెబీ 2:11, 12లో ఆయన మనలను అట్లు పిలచెను), మనము తండ్రిని అంతరంగములో మరియు 'సంఘము మధ్య' బహిరంగముగా స్తుతించు మన అన్నగారి మాదిరిని అనుసరించుటకు పిలువబడితిమి.


దేవుడు గొప్ప రాజు, కాని ఆయన కూర్చొను సింహాసనము బంగారముతో లేక వెండితో చేయబడినదికాదు. అటువంటి సింహాసనము ఆయనకు విలువలేనిదిగా యుండును. ''నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములు మీద ఆసీనుడవైయున్నావు'' (కీర్తన 22:3) అని కీర్తనకారుడు అనుచుండెను. స్తోత్రములు సింహాసనముగా ఏర్పడగా దానిపై దేవుడు ఒక రాజుగా కూర్చొనును. అందువలననే పరలోకము ఎల్లప్పుడు స్తోత్రములతో నిండియుండును. దేవదూతలు ఎడతెగక దేవుని కీర్తించుచుందురు. పరలోకములో దేవుడు కూర్చొను సింహాసనము అదియే. పరిశుద్ధాత్ముడు మన హృదయములలోనికి వచ్చినప్పుడు, ఆయన పరలోకమును మన హృదయములలోనికి తీసుకువచ్చును, మరియు అప్పుడు మనము కూడా మన హృదయాలలో, మన గృహములలో మరియు సంఘములో దేవుడు కూర్చొనుటకు ఒక సింహాసనమును స్తోత్రములతో సిద్ధము చేయుదుము.


అందువలననే మనము అన్ని విధములైన సణుగులు మరియు ఫిర్యాదులును మాని, దేవుడు (పరిశుద్ధాత్ముడు) మన హృదయములలో తండ్రి కొరకు ఒక సింహాసనమును సిద్ధము చేయుచుండగా మన రక్షణను భయముతో వణకుతూ కొనసాగించుకొనవలెను (ఫిలిప్పీ 2:12-14). అన్ని విషయములు మనకు మేలుకలుగునట్లు సమకూడి పనిచేయునట్లు మనకు బయట కూడా దేవుడు పనిచేయును. కనుక మనకు రోమా 8:28లో విశ్వాసముండినట్లయితే మనము సణుగుకొనుటకు గాని ఫిర్యాదు చేయుటకుగాని నిజానికి ఏమీ ఉండదు.


మనము ఇతర సమయములలో మన ఇళ్లల్లో లేక పనిచేయు స్థలములలో సణుగుకొనుచు మరియు ఫిర్యాదు చేయుచు ఉండినట్లయితే, సంఘములో మనము దేవున్ని తగినట్లుగా స్తుతించుట సాధ్యముకాదు. నిజమైన స్తుతి కేవలము సిలువవేయబడిన జీవితము నుండి మాత్రమే వచ్చును. దేవుడు ఆయన ప్రజల యొక్క స్తుతులపై ఆసీనుడగును అని మనకు చెప్పు ఒకే ఒక్క వచనము సిలువను గూర్చి చెప్పబడిన కీర్తన మధ్యలో నుండుట ఒక విశేషమైన విషయము (కీర్తన 22:3). ఆ కీర్తన యేసు ప్రభువు సిలువపై వేసిన కేకతో ప్రారంభమగును మరియు అవి ఆయన చేతులు, కాళ్లు పొడవబడుట గూర్చి చెప్పును (16వ). మరియు అదే కీర్తన మధ్యలో యేసు ప్రభువు మనలను ఆయన యొక్క తమ్ముళ్లగా తండ్రికి స్తోత్రముతో సింహాసనమును సిద్ధము చేయుటకు ఆహ్వానించుచుండెను (22, 23వ). మనము కూడా ఆయనతో అదే సిలువపై సిలువవేయబడితిమి - మరియు అక్కడ ఆయనతో పాటుగా ఈ లోకమునకు మరియు మనలో నున్న శరీరాశలకు సిలువ వేయబడగా, మనము తండ్రి గూర్చి స్తోత్రగానము చేయుదుము. అనేక సంఘములలో సిలువను గూర్చిన వార్త కేంద్రముగా లేని చోట లోతులేని స్తుతి ఆరాధన ఉండును. అటువంటి వాటిని చూచి కొందరు పూర్తిగా స్తుతి ఆరాధనకు వ్యతిరేకులై క్రొత్త నిబంధన ఆరాధనలో స్తుతి ఆరాధనకు స్థానము లేదను నిర్ణయమునకు వచ్చుదురు. కాని ఇది శిఖరము పైనుండి ఒక ప్రక్క పడిపోకుండా జాగ్రత్తపడి ఇంకొక ప్రక్క పడిపోవునట్లుండును!


క్రీస్తుతో కూడా, సిలువ వేయబడి, మనము మన తండ్రికి స్తుతులతో ఒక సింహాసనమును సిద్ధపరచుచున్నాము. సిలువను గూర్చి మరియు క్రీస్తును గూర్చి చెప్పు మరియొక కీర్తన 118 (11-14 మరియు 22 వచనములు). మనలను మనము బలిపీఠముపై నుంచుకొని సిలువకు త్రాళ్లతో కట్టుకొని మనము ''దేవునికి కృతజ్ఞత చెల్లించుచూ'' (28, 29వ) ''ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము'' అని చెప్పుదుము (24వ).


మన యొక్క భారమైన ఆత్మకు మరియు వ్యాకులతకు బదులుగా ''ఆనందతైలము మరియు స్తుతి వస్త్రమును'' ఇచ్చుట కొరకు యేసు ప్రభువు మన యొక్క శిరస్సుగా అభిషేకింపబడెను (యెషయా 61:1-3). నీవు వ్యాకులమైన మనసుతో జీవించుచున్నట్లయితే, అది సాతాను యొక్క పనియని రూఢిపరచుకొనవచ్చును. నీ జీవితము నుండి ఆ ఆత్మను శాశ్వతముగా త్రోలివేయుట కొరకు, మరియు నిన్ను స్తుతివస్త్రముతో కప్పుటకు యేసువచ్చెను. మనము ఎప్పుడైనా వ్యాకులపడి యుండుట లేక నిరరుత్సాహముతో లేక చికాకైన మనసుతో నుండుట దేవుని చిత్తము కాదు. ఎందుకనగా యేసు ప్రభువు ఎప్పుడు వ్యాకులతతో కాని, నిరుత్సాహముతో కాని లేక చికాకైన మనసుతో కాని లేరు, అట్లే మనము కూడా ఆయన నడిచినట్లు నడచుటకు పిలువబడినాము (1 యోహాను 2:6). అయితే ఇది మనము యేసుప్రభువు వలె ప్రతిదినము సిలువను ఎత్తుకొనినప్పుడే సాధ్యము.


కీర్తన 8:2లో దేవుడు, విరోధులను ఓడించుటకు బాలుర యొక్కయు, చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమున దుర్గములను స్థాపించియున్నాడని చదువుదుము. పిల్లలు దేవుని స్తుతించుచూ అరచుచున్నప్పుడు ప్రధాన యాజకులు వారిని గద్దించగా యేసు ఈ వచనమును ఎత్తిచూపెను (మత్తయి 21:15, 16). ఈ రోజుల్లో అనేకుల వలె అప్పటి ప్రధాన యాజకులు దేవుని మందిరములో స్తుతి ఆరాధనలో స్వరము పెంచకూడదని అనుకొనిరి. జనులు దేవుని సన్నిధిలో ముఖములు వ్రేలాడవేసుకొని, మౌనముగా నుండవలెనని వారనుకొనిరి. కాని యేసు ప్రభువు స్తుతుల యొక్క శబ్దము వినినప్పుడు పులకరించిపోయిరి. దానికి కారణం ఉరుముల వంటి స్వరముతో దేవదూతలు దేవునిని స్తుతించు ఆయన యొక్క పరలోకపు నివాసమును అవి ఆయనకు గుర్తుకు తెచ్చినవి. సాతాను మరియు అతడి యొక్క దూతలు పరలోకములో నివసించలేకపోవుటకు అది ఒక కారణము. వారు నిష్కపటముగా దేవునిని స్తుతించుటను భరించలేరు. అదే విధముగా భూమిపై అటువంటి స్తుతులుండిన ఏ సంఘములోను నిలువలేరు. అందువలన సాతాను రెండు పద్ధతులలో ఏదొకదానిని ప్రయత్నించును. అవి స్తుతులలో నిష్కపటత్వమును దొంగిలించుట లేక స్తుతించుటను పూర్తిగా మానివేయునట్లు చేయుట. మనము మన చుట్టూ ఉండిన క్రైస్తవ సంఘములను చూచినట్లయితే, సాతాను దాదాపు ప్రతిచోట ఈ రెండు పద్ధతులలో ఏదొక దానిని సాధించినట్లు చూడగలము.


దేవునికి చెల్లించే నిష్కపటమైన స్తుతిని సాతాను ఎందుకు ద్వేషిస్తాడు? యేసు ప్రభువు ఎత్తిచూపిన కీర్తన 8:2లో 'స్తుతులు' ఒక దుర్గము వంటి బలము కలవి (మత్తయి 21:6). శత్రువును తరిమికొట్టే 'బలమైన దుర్గము' స్తుతి (కీర్తన 8:2).


పరిశుద్ధ జీవితము నుండి రాని వ్యర్థమైన స్తోత్రములకు ఎటువంటి శక్తియుండదు. నిర్గమకాండము 32లో ఇశ్రాయేలీయులు ఒక బంగారు ఆవుదూడను చేసికొని, చివరకు దానిని 'యెహోవా' (5వ) అని పిలచుచు, వారి యొక్క 'యెహోవా' చుట్టు నాట్యమాడుచు ఎంతో దూరమున నుండిన మోషే మరియు యెహోషువాలకు వినబడునంతగా కేకలు వేసిరి (17-19వ). అయితే వారి యొక్క ఉద్రేక పూరితమైన స్తుతుల మధ్య సాతాను కొలువుదీరి ఉండెను. ఈనాడు ''యేసు'' నామములో కేకలు వేయుచు నాట్యమాడు అనేకుల మధ్య నుండినట్లుగా అప్పుడు వారి మధ్య జారత్వము లేకుండెను.


మనము ఇంతకు ముందు చెప్పుకొనినట్లు, మన యొక్క స్తుతి సిలువవేయబడిన, పరిశుద్ధమైన జీవితము నుండి వచ్చినప్పుడు మాత్రమే శక్తిగలదిగా నుండును.


లూకా సువార్త 19:37, 38లో యేసు ప్రభువు యొక్క శిష్యులందరు సంతోషముతో బిగ్గరగా దేవుని స్తుతించుటకు ప్రారంభించినప్పుడు, పరిసయ్యులు కలవరపడి ఆయన శిష్యులను మౌనముగా నుండమని చెప్పమని యేసు ప్రభువును అడిగిరి. అయితే దానికి యేసు, వారు మౌనముగా నుండినట్లయితే రాళ్లు దేవుని స్తుతించునని చెప్పెను (40వ). అక్కడ బిగ్గరగా స్తుతించుట గూర్చి యేసు ప్రభువు యొక్క అభిప్రాయమును, పరిసయ్యుల అభిప్రాయమును చూడగలము. మీ సంఘములో ఎట్లున్నది? మీరు పరిసయ్యులను వెంబడించుచున్నారా లేక యేసు ప్రభువునా? మనము మనుష్యుల నుండి గౌరవమును ఎక్కువగా కోరుకొందుము. కాబట్టి (ముఖ్యముగా క్రైస్తవ నాయకుల నుండి) మనము కూటములలో బిగ్గరగా స్తుతించుటకు వెనకాడుదుము. ఒక సంఘములో బిగ్గరగా స్తుతించుటను అంగీకరించకపోవుటను బట్టి, ఆ సంఘములో వారందరు అదే పద్ధతిని గ్రుడ్డిగా అనుసరించుదురు. కాని మనము యేసు ప్రభువు శిష్యులుగా నుండి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనంటే అటువంటి పద్ధతులకు వ్యతిరేకముగా బలాత్కారము చెయ్యవలసియున్నది (మత్తయి 11:12).


యేసు ప్రభువు ఎడతెగని స్తుతి మరియు ఆరాధన ఉండే తన తండ్రి సన్నిధి యొక్క వాతావరణములో వేల సంవత్సరములు ఉండెను. ఆయన ఈ భూమిపై దిగులుగా ముఖము వ్రేలాడవేసుకొని, చిన్నబుచ్చుకొన్న ముఖములు కలిగిన మన సాంప్రదాయవాదులతో కలసి జీవించుట ఆయనకు పూర్తిగా వేరు వాతావరణములో నుండినట్లుండెను. అందువలన ఆయన ఎప్పుడైనా ఏ కొద్దిమందియైనా స్తుతించుట చూచినప్పుడు వారిలో పరలోకపు వాతావరణమును కనుగొనెను. అది ఆయనను పులకరింపజేసెను.


ప్రకటన గ్రంథములో, మనము చాలా 'ఏడు'లు కనుగొందుము. దానిలో పరలోకములో స్తుతులతో కూడిన ఏడు దృశ్యములను చూడగలము. నీకు ఆ భాగములు చూచు ఓపిక ఉండినట్లయితే, పరలోకము గూర్చి నీ ఆలోచన విప్లవాత్మకముగా మారును. ఆ భాగములు పక్రటన 4:8-11; 5:8-14; 7:9-12; 11:15-18; 14:1-4; 15:1-4 మరియు 19:1-6. అక్కడ మన భవిష్యత్తు గృహము గూర్చి కనబడు ప్రతి దృశ్యము సంతోషముతో కూడిన స్తుతులు విస్తారమైన జలములు మరియు ఉరుములను పోలిన శబ్ధముతో ఉండుట చూచెదము (19:6). అక్కడ వారు దేవుని ఆయన సర్వాధికారము గూర్చి, ఆయన పరిశుద్ధతగూర్చి, ఆయన తీర్పులు మొదలైన వాటి గూర్చి స్తుతించుచుండిరి. ఫిర్యాదులతో కూడిన ఒక్కమాట కూడా అక్కడ వినబడదు మరియు అక్కడ ముఖము వ్రేలాడవేసుకొని, నిస్పృహతో నుండిన ఒక్క దేవదూత కూడా అక్కడ ఉండరు. మనము ఆ వాతావరణమునకు ఇక్కడే అలవాటు పడనట్లయితే, మనము ప్రభువు సన్నిధికి వెళ్లి, అక్కడ జనులందరు ''హల్లెలూయా'' మరియు ''ఆమేన్‌'' మానక చెప్పుచుండుట వినునప్పుడు మనము యిబ్బంది (కల్చర్‌షాక్‌) పొందుదము. పరలోకములో ''హల్లెలూయా'' మరియు ''ఆమేన్‌'' అనుమాటలు అర్థములేనివిగా నుండకుండుట గమనించండి. వారు ''...కాబట్టి హల్లెలూయా'' (19:1,2, 6) అందురు చూడండి. అది అర్థవంతమైన ఆరాధన మరియు పరిశుద్ధత యొక్క సౌందర్యములో స్తుతించుటగానున్నది. పరిశుద్ధాత్ముడు మనలోను మరియు మన సంఘములోను దీనిని జన్మింప చేయుటకువచ్చెను.


1,44,000 మంది భూమిపై నుండినప్పుడు ఈ క్రొత్త గీతము నేర్చుకొనిరి అని మనకు చెప్పబడెను (పక్రటన 14:1-4). ఈ భూమిపై ప్రతివారు పాడు పాతపాట ఇతరులకు మరియు పరిస్థితులకు వ్యతిరేకముగా సణుగు కొనుట మరియు ఫిర్యాదు చేయుటయైయున్నది. అయితే కొద్దిమంది గొఱ్ఱెపిల్ల ఎక్కడకు వెళ్లినా వెంబడించువారు (4వ) - అనగా సిలువను ప్రతిదినము ఎత్తుకొనినవారు- వారిని వారు ద్వేషించుకొనుటను నేర్చుకొనిరి (లూకా 14:26) మరియు ఆ విధముగా వారు వారి జీవితములలో నుండి పూర్తిగా సణుగులను మరియు ఫిర్యాదులను తీసివేసికొని, దేవుని సర్వాధికారమునందు విశ్వాసముంచిరి (రోమా 8:28). వారు ప్రతి విషయము నందు (1 థెస్సలో. 5:18) ప్రతి విషయము కొరకు (ఎఫెసీ 5:20) మరియు మనుష్యులందరి కొరకు (1 తిమోతి 2:1) కృతజ్ఞత తెలుపుట నేర్చుకొనిరి. వారు భూమిపై ఎదుర్కొనిన ప్రతి యిబ్బందిలోను, వారి శరీరములందు యేసు యొక్క మరణానుభవమును భరించి, అన్ని పరిస్థితులలోను మరియు అందరి కొరకు స్తుతి చెల్లించుట మరియు ఆరాధించుట అను క్రొత్త పాటను నేర్చుకొనిరి. ఆ విధముగా వారు ఆఖరి దినమున సీయోను కొండపై గొఱ్ఱెపిల్లతో పాటు నిలబడిరి.


మనము మన హృదయములలో దేవుని స్తుతించుట సరిపోదు. మనము దేవుని సన్నిధిలో మన పెదవులతో స్తుతియాగము (అది మన సిలువవేయబడిన జీవితము నుండి వచ్చినది)ను చెల్లించవలసియున్నది. క్రొత్త నిబంధనలో మనము మానక చెయ్యవలెనని చెప్పబడిన కొన్ని విషయములలో ఇది ఒకటి (హెబీ 13:15). హృదయమందు నిండియుండు దానిని బట్టియే నోరుమాటలాడును అని యేసు చెప్పెను (మత్తయి 12:34). కనుక మన పెదవుల నుండి స్తుతి పొర్లి రాకపోయినట్లయితే, అది మన హృదయము స్తుతులతో నిండియుండదను దానికి సూచనయైయున్నది. ''మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును'' (రోమా 10:10).


కీర్తనలు 50:23లో ''స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచన్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును'' అని చదువుదుము.


మనము దేవుని స్తుతించుట ప్రారంభించినప్పుడు మాత్రమే దేవుడు మనలను అనేక పరిస్థితుల నుండి విడుదల చేయగలడు - ఎందుకనగా విశ్వాసమునకు గుర్తు స్తుతి మాత్రమేయై యున్నది. ప్రార్థన ఒక్కటే మనలను అనేక పరిస్థితుల నుండి కాపాడలేదు. మన హృదయమందు మన ప్రార్థన దేవుని యొద్దకు చేరెనను నిశ్చయతను మనకు ఆత్మ ఇచ్చువరకు మనము ప్రార్థించవలెను. అప్పుడు విశ్వాసము జన్మించును మరియు మనము అడిగిన వాటిని పొందుటను చూడకపోయినను ''మనము అడిగిన వాటిని పొందితిమి'' అని విశ్వసించుదుము. అప్పుడు, అప్పుడు మాత్రమే మనము ప్రార్థించిన వాటిని పొందుదుము అని యేసు ప్రభువు చెప్పెను (మార్కు 11:24). అయితే మన హృదయములో విశ్వాసము జన్మించెనను దానికి ఋజువు ఏమిటి? మనము ప్రార్థించుట మాని దేవుని స్తుతించుట మొదలు పెట్టుదుము. అది, అది ఒక్కటి మాత్రమే, విశ్వాసము యొక్క తేటయైన ఋజువు. ఆ విధముగా మనము దేవుడు తన విడుదలను, మనకు చూపుటకు ఆయనకు మనము మార్గము ఏర్పాటు చేయుచున్నాము.


మనము 2 దినవృత్తాంతములు 20లో, దీనికి సంబంధించిన ఉదాహరణను చూచుదుము. అక్కడ యెహోషాపాతు శత్రు సమూహముల మధ్య చిక్కుకొనెను (2వ). ఆ సమయములో యెహోషాపాతు, అటువంటి పరిస్థితులలో చిక్కుకొనినప్పుడు ఎవరైనా చేయు తెలివైన పనిని అతడు చేసెను. అతడు ఉపవాసముండి ప్రార్థించి దేవుని సన్నిధిని వెదికెను. అతడి ప్రార్థన 6 నుండి 12 వచనములలో చెప్పబడెను. అందులో ఏడు విషయములను మనము చూచెదము.


1. దేవుని యొక్క పూర్తి సర్వాధికారమునుబట్టి అతడు దేవుని స్తుతించెను (6వ).


2. అతడి విషయములో దేవుడు గతకాలములో చేసిన వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకొనెను (7వ).


3. దేవుని వాక్యములోనుండిన ఆయన యొక్క వాగ్దానములను దేవునికి గుర్తు చేసెను (9వ).


4. వారు దేవుని యొక్క స్వంత స్వాస్థ్యమని దేవునికి గుర్తు చేసెను (11వ).


5. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనుటకు వారికి శక్తిలేదని అతడు దేవునికి చెప్పెను


6. వారికి జ్ఞానము కూడా లేదని అతడు దేవునికి చెప్పెను (12వ).


7. వారు ఆయనపై ఆధారపడి యుండిరని చెప్పెను (12వ).


అది ప్రార్థించుటకు మనకు కూడా ఒక మంచి నమూన. దేవుడు ఆ పరిస్థితిని చూచుకొనెదనని వెంటనే జవాబిచ్చెను. యెహోషాపాతు దేవుని మాటను నమ్మెను మరియు తన సైన్యమునకు ముందు పాటలతోను బిగ్గర స్వరముతోను దేవుని స్తుతించుటకు ఒక గాయక బృందాన్ని నియమించెను. శత్రువుల యెదుట దేవునికి స్తుతియాగము అర్పించుట ద్వారా, యెహోషాపాతు దేవుడు ఇచ్చు విడుదలకు మార్గము ఏర్పాటు చేసెను. అప్పుడు దేవుడు కార్యము చేసెను. ఆయన శత్రువులను ఘోరముగా మొత్తెను (22వ).


యోనా గ్రంథములో దీనికి సంబంధించిన మరియొక ఉదాహరణను చూచెదము. యోనా చేపకడుపులో మూడు పగళ్లు మూడు రాత్రుళ్లు ఉండెను మరియు ఆ సమయములో కనీసం దేవునికి ప్రార్థించలేదు (1:17). ''అప్పుడు'' అని 2:1లో చెప్పబడెను (మూడు పగళ్లు రాత్రుళ్లు గడచిన తరువాత) యోనా ప్రార్థించుట మొదలుపెట్టెను. బహుశా మనము మన సమస్యల నుండి బయటపడుటకు మనకు తెలిసిన ప్రతి పద్ధతి ప్రయత్నించినట్లు మూడు దినములు యోనా చేప నోటి యొద్దకు ప్రాకుతూవచ్చుటకు ప్రయత్నించియుండవచ్చును. మానవ ప్రయత్నము విఫలమైన తరువాతనే చాలామంది దేవునివైపు తిరుగుదురు. అట్లే యోనా తన స్వంత ప్రయ్నతము ఫలించని తరువాత దేవునిని వెదకెను.


మనము మన చివరి ప్రయత్నము ప్రయత్నించే వరకు దేవుడు ఊరకుండును. అప్పుడు యోనా ప్రార్థించెను. ఇంకా ప్రార్థించెను. అయితే అతడు ''యెహోవా యొద్దనే రక్షణ దొరకును'' (2:9) అని చెప్పుచు స్తుతియాగము చెల్లించువరకు ఏమీజరుగలేదు. యోనా ఇంకను తన పరిష్కరింపబడని సమస్యల నడుమ యుండినప్పుడు, అతడికి దేవుడు విడుదల మార్గము చూపునట్లు దేవునికి ఒక మార్గము ఏర్పాటు చేసెను. అప్పుడు వెంటనే (2:10), దేవుడు యోనాను కక్కివేయుమని చేపను ఆదేశించెను.


మనము స్తుతియాగము చెల్లించుటకు ముందు ఎంతకాలము చేపకడుపులో (మన సమస్యలో) ఉందుము? మనము అన్ని విషయములను బట్టి ఆయనను స్తుతించుట ద్వారా ఆయనను ఘనపరచకపోవుట వలన - మరియు అట్లు ఆయన మనలను విడిపించుటకు మనము ఆయనకు ఒక మార్గము సిద్ధపరచకపోవుట వలన ఆయన మనలను విడిపించలేడు (కీర్తనలు 50:23).


అపొస్తలుల కార్యములు 16 నుండి ఒక ఆఖరి ఉదాహరణ. అక్కడ పౌలు సీలలు సువార్త ప్రకటించినందున ఖైదులో వేయబడుటను చదువుదుము. మధ్య రాత్రిలో వారు నిద్రించుటకు బదులు (లేక సణుగుకొనుచు, వారి పరిస్తితిని బట్టి ఫిర్యాదు కలిగియుండుటక బదులు), వారు పాటలతో దేవునికి స్తుతించుటకును మరియు ప్రార్థించుటకును ప్రారంభించిరి. వారికి ఫిర్యాదులు లేవు. వారు దేవుని సర్వాధికారము యందు పరిపూర్ణమైన నమ్మకముతో నుండిరి. వెంటనే దేవుడు వారి కొరకు జైలు తలుపులు తెరిచెను. పౌలు, సీలలు వారి పెదవుల ద్వారా స్తుతియాగమును చెల్లించుట ద్వారా వారి కొరకు దేవుడు పని చేయునట్లు ఆయనకు ఒక మార్గమును ఏర్పాటు చేసిరి.


ప్రతి చేప నోటి యొక్క మరియు ప్రతి జైలు తలుపుల యొక్క తాళము అద్భుతమైన దేవుని చేతిలో ఉన్నది (పక్రటన 3:7). మరియు ఆయన తలుపును తెరచినట్లయితే ఎవరును దానిని వేయలేరు. మరియు ఆయన దానిని తెరచువరకు, మానవ సహాయము అంతయు విఫలమగును. ప్రతి పరిస్థితి మన కోర్కెలకు మరియు ప్రణాళికలకు తగినట్లుగా జరిగినప్పుడు దేవుని స్తుతించుట సుళువు. కాని పరిస్థితులు మనము అనుకొన్న దానికి వ్యతిరేకముగా జరిగినప్పుడు, అది మనము స్తుతియాగము చెల్లించవలసిన సమయము - ఎందుకనగా అటువంటి సమయములలో దేవుని స్తుతించుట కొంత విలువతో కూడికొనినది, ఆవిధముగా మనము రక్షణ కలుగేయునట్లు దేవునికి ఒక మార్గమును ఏర్పాటు చేయుదము.


కీర్తన 149:5 మనము మన పడకలపై పరుండి (మనము సాధారణముగా అనేక విషయముల గూర్చి ఆలోచించి చింతపడేచోటు) మన నోళ్లతో దేవుని ఉత్సాహగానము చేయుటకు ఆహ్వానించుచున్నది, మరియు అటువంటి స్తుతులతో మనము చీకటి శక్తులను బంధించి దేవుని వాక్యములో వారి గూర్చి వ్రాయబడిన తీర్పు (రోమా 16:20) తీర్చగలము. ఇది దేవుని యొక్క బిడ్డలందరికి ప్రత్యేకించబడిన ఆధిక్యత (కీర్తన 149:9).


కనుక మనము భూమిపై మనకు మిగిలియున్న కాలములో దేవుని ఘనపరచునట్లును దేవుని యొక్క రక్షణ (విడుదల)ను మన జీవిత దినములన్నిటను అనుభవించునట్లు, అన్ని పరిస్థితుల యందు అన్ని పరిస్థితుల కొరకు మరియు అందరి కొరకు స్తుతించుటను మరియు కృతజ్ఞతను తెలుపుటను చేయు క్రొత్త పాటను నేర్చుకొందుము.


అధ్యాయము 12
క్రైస్తవులు పాపములో ఎందుకు పడుదురు?

దీనికి కారణము గూర్చి ఆలోచించుటకు ముందు మనము శోధింపబడుటకును, పాపము చేయుటకును తేడాను తెలుసుకోవాల్సియున్నది. ప్రతివాడును తన వ్యక్తిగత దురాశచేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అని యాకోబు 1:14,15 తేటగా చెప్తుంది. ఎప్పుడైతే ఒకని మనస్సు శోధనకు అంగీకారము తెలుపునో, అప్పుడు దురాశ గర్భముదాల్చి పాపము అతడి హృదయములో జన్మించును.


అయితే మన ప్రాచీన పురుషుడు (మన శరీరాశలతో ఏకీభవించే మనసు) క్రీస్తుతో కూడా సిలువ వేయబడెను (రోమా 6:6) అనే సత్యమును చూచినప్పుడు మనము విశ్వాసముతో ప్రాచీన పురుషుని బయటకు త్రోసి వేయవచ్చును. అప్పుడు మనము ఉద్దేశ్యపూర్వకముగా పాపము చేయుట ఆపవచ్చును. మనము తిరిగి జన్మించిన వారమగుదుము (1 యోహాను 3:9). అయితే మనము ఇప్పటికిని శోధింపబడుదుము. కాని మన మనసు (నూతన పురుషుడు) మన రక్తమాంసములు గల శరీరముతో ఏకీభవించడు.


కాని మనము పాపము చేయుట మానివేసినా, మనము పాపములో పడుతూ ఉందుము (లేక 'తప్పిదములో చిక్కుకొనుట' గలతీ 6:1). పాపము 'చేయుచూ' ఉండుటకును మరియు పాపములో పడుటకును వ్యత్యాసమున్నది.


మన ప్రాచీన పురుషుడు సిలువవేయబడినప్పటికీ (రోమా 6:6), మనకు రక్తమాంసములు గల శరీరము ఇంకను ఉండుట చేత అది మనలను కవ్విస్తూ ఉంటుంది. అయితే మనము మన పెండ్లి కుమారుడైన క్రీస్తుకు నమ్మకముగా ఉండుటకు పిలువబడినాము. అంతేకాక ఇప్పుడు మన శరీర కోర్కెలకు లొంగిపోవుటకు మనకు అసలు యిష్టము లేదు. మనము మన శరీముతో వ్యభిచరించము, అలా కానట్లయితే మనము వ్యభిచారిణులమవుదుము (యాకోబు 4:4). మరియు ఆ విధముగా పెండ్లి కుమార్తెలో భాగముగా కాక వేశ్యలో భాగముగా అగుదుము (పక్రటన 17:5). అయితే ఒక స్త్రీ తనను తాను ఒక పురుషునికి ఇచ్చుకొనకుండానే బలాత్కారము ద్వారా కూడా గర్భము దాల్చవచ్చును. అటువంటి పరిస్థితులలో ఆ స్త్రీ తనకు తాను ఇచ్చుకొనిన స్త్రీ కంటె మంచిదిగా పరిగణింపబడుతుంది. ఇది పాపములో పడుటకును (మన శరీరములో నుండిన కోర్కెలచే జయించబడుట) మరియు పాపము చేయుటకును (ఇక్కడ మనకు చేయకూడనిదని తెలిసినా దానిని కావాలని చేయుట ద్వారా, శరీరమునకు మనలను మనము అప్పగించుకొనుట) ఉన్న వ్యత్యాసాన్ని సూచనార్థముగా తెలుపుతుంది.


అయితే పాపములో పడుట, కావాలని పాపము చేసినంత చెడు కాకపోయినా అది కూడా అదే ఫలితాన్నిస్తుంది - అది గర్భము దాల్చి పాపమును కనుట. క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానము యేసు ప్రభువు మనలను చివరి వరకు తొట్రిల్లకుండా కాపాడుననునది (యూదా 24). మనము పాపములో పడకుండా కూడా కాపాడేదే విజయాన్నిచ్చే జీవితము.


నీవు పాపము చేయుచుండుట మానివేయవచ్చును. కాని ఇంకను పాపములో పడిపోతూ ఉండవచ్చును. అలా అయినప్పుడు నీవు పడిపోవుటకు కారణములు ఇవి కావచ్చును.


1. దేవుని భయము లేకపోవుట


దేవుని యెడల భయము జ్ఞానమునకు మూలము (అక్షరమాల) సామెతలు 9:10. జ్ఞానము యొక్క బడిలో ఇది మొదటి పాఠము. మనము ఈ మొదటి పాఠమైన అక్షరమాల నేర్చుకొనక పోయినట్లయితే మనము ముందుకు వెళ్ళలేము. దేవుడు దుష్టత్వమును ద్వేషించును (సామెతలు 8:13). కాబట్టి ''దేవుని యెడల భయమనగా దుష్టత్వమును ద్వేషించుట''. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండవలెనన్న పిలుపు మనము వినినట్లయితే, మరియు ఆ పిలుపుచేత మనము పట్టుబడినట్లయితే, మనము పాపమును ద్వేషించుదము.


చాలా మంది విశ్వాసులు కొన్ని పాపములను (ఉదాహరణకు కోపము, మోహం మొదలైనవి) ఇతరుల యెదుట చాలా సులువుగా జయించుదురు. దానికి కారణము వారి పేరు పోతుందేమోనన్న భయము. కాని వారు ఒంటరిగా ఉన్నప్పుడు సులువుగా ఆ పాపములో పడిపోవుదురు దీనిని బట్టి వారు ఆ పాపములను జయించలేక వాటిలో పడిపోవుట లేదు కాని, వారు దేవుని కంటె వారి స్వంత పేరు ప్రతిష్టలనే ఎక్కువ ప్రేమించుట చేత వారు పడిపోవుచున్నారు. వారు దేవుని అభిప్రాయము కంటె మానవుని అభిప్రాయముకే ఎక్కువ విలువ ఇచ్చువారై యున్నారు. అటువంటి క్రైస్తవులు ''సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన దానిని (మానవుని) ఆరాధిస్తున్నందుకు'' (రోమా 1:25), దు:ఖపడాల్సియున్నది. మరియు వారి హృదయమంతటితోను దేవుని యెడల భయమును నేర్పునట్లు ఆయనకు మొఱ్ఱ పెట్టాల్సిన అవసరమున్నది. నీవు దాచబడిన ధనమునకై వెదకినట్లు దేవని భయముకొరకు వెదకినట్లయితే మరియు నీవు ఎలుగెత్తి మొఱపెట్టినట్లయితే, అప్పుడు దేవుడు భయమును నేర్పించుననేది వాగ్దానము (సామెతలు 2:3-5) మరియు (మత్తయి 5:6). ఎవరైతే తమ హృదయమంతటితో ఆయనను వెదకుదురో వారికే ఆయన దొరుకును (యిర్మీయా 29:13). ఎవరైతే వారి వైఫల్యాల గూర్చి దు:ఖపడుదురో వారు మాత్రమే ఆదరణ కర్తచేత ఆదరింపబడుదురు (బలపర్చబడి సహాయము పొందుదురు - మత్తయి 5:4).


దేవుని ముఖము యెదుట జీవించే అలవాటు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరత మనకున్నది.


మనము దేవునికి భయపడుతున్నామో లేదో పరీక్షించి చూడటానికే ఆయన మనకు మన స్వంత రహస్య పరిధిని ఇచ్చెను. అది మన ఆలోచనా జీవితం. మనము కేవలము ఇతరులు మన గూర్చి ఏమనుకుంటున్నారు అని మాత్రమే ఆలోచించినట్లయితే, మన ఆలోచనా జీవితములో నుండిన పాపము గూర్చి చాలా అజాగ్రత్తగా ఉందుము. దీనిని బట్టియే, పాపముపై పూర్తిగా విజయము గూర్చి ఆశపడే వారిని, బాహ్యమైన విజయము మాత్రమే కోరుకునే వారిని దేవుడు వేరుచేయును. మనము మన బాహ్య పాపము గూర్చి దు:ఖపడినట్లు ఆలోచనా జీవితంలో కల పాపము గూర్చి కూడా దు:ఖపడినట్లయితే మనము విజయములోనికి చాలా త్వరగా ప్రవేశించుదుము


2. విశ్వాసములో లోటు


క్రైస్తవ జీవితములో ప్రగతి విశ్వాసము ద్వారానే లుగును. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును (రోమా 1:17) మరియు వారి మార్గము వేకువ వెలుగు తేజరిల్లునట్లు ....అంతకంతకు తేజరిల్లును (సామెతలు 4:18).


మనకు మన పాపముల యొక్క క్షమాపణ గూర్చి మరియు మనలో నుండిన ప్రాచీన పురుషుని బయటకు త్రోసి వేయుటను గూర్చి కూడా విశ్వాసము కలిగి యుండు టచేత పాపము చేయుట మానివేయవచ్చును. అయినప్పటికి మనము తొట్రిల్ల కుండునట్లు యేసు ప్రభువు కాపాడుననే విషయములో విశ్వాసము లేక పోవచ్చును. ఆజాను బాహువులను చూచి (మన మాంస శరీరములో నుండిన శరీరేచ్ఛలు) మేము వాగ్ధాన దేశమైన విజయములోనికి ప్రవేశింపలేమని చెప్పిన కాదేషు బార్నియాలోనున్న ఇశ్రాయేలీయుల వలె మనము కూడా అపనమ్మకముతో నిండి యుండవచ్చును.


దేవుని రాజ్యమునకు సంబంధించిన ప్రాముఖ్యమైన నియమములలో ఒకటి, మన విశ్వాసమునకు తగినట్లే మనము పొందుదుము అనేది - అంతకు ఎక్కువ కాదు తక్కువ కాదు (మత్తయి 9:29). దేవుడు పక్షపాతి కాడు, కాని విశ్వాసము కలిగి ఆసక్తితో ఆయనను వెదకు వానికి తగిన ఫలమిచ్చును (హెబీ 11:6). ఆ విధముగా కొందరు జయజీవితములోనికి ప్రవేశించుదరు (యెహోషువ, కాలేబులు కనానులో ప్రవేశించినట్లు) అదే సమయములో అనేకులు ఓడిపంబడి నిలిచిపోవుదురు. కొద్దిమంది మాత్రమే దేవునికి భయపడినవారు మరియు విశ్వాసము కలిగినవారు ఉండుటచేత ఇరుకైన నిత్యజీవమార్గమును కొందరే కనుగొందురు. యేసు ప్రభువు తన స్వంత ఊరిలో వారికుండిన అవిశ్వాసమును బట్టి అనేక అద్భుత కార్యములు చేయలేకపోయెను. వారిని స్వస్థపర్చుటకు ఆయన ఉద్దేశ్యము కలిగియుండెను. కాని వారు అపనమ్మకము ఆయనను ఆపివేసెను (మత్తయి 13:58). ఈనాడు కూడా అదే విధముగా ఉన్నది. ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేయవలెనని కోరుచున్నారు. కాని మనలో నున్న విశ్వాసపు లోటును బట్టి ఆయన ఏమీ చేయలేకపోవుచున్నాడు.


విశ్వాసమనేది మనకుండిన వివేకముతో అర్థము చేసికొనిన నమ్మకము కంటె ఎక్కువైనది. యేసు ప్రభువునకు ప్రజలను తొట్రిల్లకుండా కాపాడుటకు శక్తి ఉందని నమ్ముటవేరు, మరియు నిన్ను ఆయన తొట్రిల్లకుండా కాపాడునని విశ్వసించుట వేరు. మొదటిది మనసులో కల ఆలోచనలలో ఉండిన ఒక లక్షణము. అటువంటిది సాతానుకు కూడా ఉన్నది. రెండవది విజయాన్ని తెచ్చే హృదయానికి సంబంధించిన ఆత్మీయ లక్షణము.


''పాపము మీ మీద ప్రభుత్వము చేయదు'' (రోమా 6:14) అనేది దేవుని వాగ్దానము. దానిని నమ్ము. మరియు నీవు పడిపోయినప్పుడు దేవుని వాక్యములో నుండిన వాగ్దానము మారనిదని జ్ఞాపకముంచుకో. ఆ వాగ్దానము ఎప్పటికి నిలిచియుంటుంది. నీవు లేచి దేవుని వాక్యములో నీకున్న నిరీక్షణను ఒప్పుకొని నీలో ఉండిన నిరీక్షణ విశ్వాసముగా మారి ఒకనాడు విజయము నీదయ్యేవరకు సాగిపో.


3. శరీరములో నున్న బలహీనతను ఎరుగక పోవుట


మనకున్న శరీరమునకు దేవుని చిత్తము చేయుటకు ఏ మాత్రము సామర్థ్యము లేదు. యేసు ప్రభువు ఈ విషయాన్ని మత్తయి 26:41లో చాలా తేటగా చెప్పారు. పౌలు ఈ విషయాన్ని తెలుసుకొనుట చేతనే ''నా శరీరములో మంచిది ఏదియు లేదు'' అని చెప్పాడు (రోమా 7:18). ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించినవాడు కనీసము రెండు పనులు చేయును. ఒకటి అతడు శోధన నుండి పారిపోవును. రెండవది దేవుని నుండి సహాయము పొందుటకు ఆసక్తితో ప్రార్థించును. ఒకడు ఈ రెండు విషయాలనూ చేయుటలేదంటే, అతడు తన శరీరములో నున్న బలహీనతను గూర్చి అప్పటికి ఇంకా ఒప్పింపబడలేదు అని ఖచ్చితముగా చెప్పవచ్చును.


''మమ్మును శోధనలోనికి రానీయవద్దు'' అని ప్రార్థించుమని యేసు ప్రభువు నేర్పించారు (మత్తయి 6:13). మన శరీరము బలహీనమైనదని ఒప్పింపబడినట్లయితే మనము ఆ ప్రార్థనను మనస్పూర్తిగా చేయుదుము. తిమోతి వంటి గొప్ప దైవజనుడు కూడా, యౌవనేచ్ఛల నుండి పారిపొమ్మని, ధనాశ నుండి తొలగి పొమ్మని హెచ్చరింపబడ్డాడు (2 తిమోతి 2:22; 1 తిమోతి 6:10, 11). తిమోతి క్రైస్తవ జీవితములో ఎంతగానో అభివృద్ది చెందుటచేత అతడు ఈ విషయాలలో శోధింపబడడని ఎవరైనా అనుకొనవచ్చును. కాని అతడు శోధింపబడవచ్చునని పౌలుకు తెలియును. అందుచేతనే శోధన నుండి పారిపొమ్మని తిమోతిని హెచ్చరించాడు. ఎవడైతే తన శరీరములో ఉన్న బలహీనతను తెలుసుకొనునో అతడు ఈ హెచ్చరికకు వెంటనే లోబడును.


అంతేకాక, తనలో బలహీనత నెరిగినవాడు ఆ బలహీనతను జయించుటకు సహాయముగా కృపను ఇమ్మనమని దేవునికి మొఱపెట్టును కూడా. మనమందరము బలహీనులమే, కాని మనమందరము మన బలహీనత గూర్చి సమానముగా ఎరిగినవారము కాము. బలహీనమైన మనుష్యుడు ప్రమాదము వచ్చుట చూచి దాని నుండి పారిపోవును, కాని బలవంతుడు, అతడి గూర్చి అతడికి గొప్ప ఆలోచనలుండుట చేత అలా చేయడు. అతడు సహాయము కొరకు అర్థించడు. అందుచేతనే అతడు పడిపోవును.


నిజమైన దీనత్వము మన శరీరములో ఉన్న బలహీనతను ఎరుగుటచేత శోధన నుండి తప్పించుకొనుటకు సహాయు కొరకు మొఱ్ఱపెట్టుటలోనే ఉన్నది. అటువంటి వారే దేవుని నుండి కృపను పొందుకొందురు, ఎందుచేతనంటే దేవుడు ఆయన కృపను దీనులకు మాత్రమే ఇచ్చును (1 పేతురు 5:5).


4. శ్రమ పొందుటకు మనస్సు లేకపోవుట


పాపములో సంతోషమున్నది - కాని అది మోసకరమైనది మరియు అల్పకాలముండునది (హెబీ 3:13; 11:25). సంతోషమునకు వ్యతిరేకమైనది శ్రమననుభవించుట. శ్రమ పొందుట అనగా పాపమునుండి వచ్చు సంతోషమును నిరాకరించుటైయున్నది. యేసు ప్రభువు శరీరమందు శ్రమపొందిరి; మరియు మనమును అటువంటి మనస్సును ఆయుధముగా ధరించుకొన్నట్లయితే, మనమును పాపము చేయక మన జీవితమంతటిలో దేవుని చిత్తమును చేయుదుము (1 పేతురు 4:1, 2). శరీరములో శ్రమపడుట అనగా భౌతికముగా, శారీరకముగా కాదు. ఎందుచేతనంటే ఆ విధముగా ఎవరు కూడా పాపముచేయుట మానలేదు. అయితే ఇక్కడ శరీరమునకు సంతోషము కలిగించే కోర్కెలను చేయకుండుట చేత శరీరముకు కలిగే బాధగూర్చి చెప్పబడినది. యేసు ప్రభువు తనను తాను సంతోషపర్చుకొననట్లుగా, మనలను మనము సంతోష పర్చుకొనుటకు ఇష్టపడకుండవలెను (రోమా 15:13). ఆ విధముగా ఆయన శ్రమలలో మనము పాలివారమవ్వచ్చును.


మన శరీరములో శ్రమ పొందుటకు నిర్ధారించుకొనిన వైఖరి మనము పోరాడు దినమున మనకు కావలసిన కవచమని పేతురు చెప్పెను. అయితే పోరాటము ప్రారంభమవక ముందే మనకు ఆ కవచము కావలసియున్నది. శోధన యొక్క దాడి ప్రారంభమైన తరువాత ఈ కవచము కొరకు చూచినట్లయితే ఫలితముండదు. ఎందుకంటే సాధారణముగా అప్పుడు ఆ కవచము కనబడదు. అందువలన పోరాటము ప్రారంభమవకముందే ఒకడు కవచము ధరించాల్సియున్నది. ఎప్పుడైతే ఒకనికి ఈ కవచము (ఒక చిన్న పాపపు ఆలోచన నుండియైనా సంతోషము పొందుటకంటె తనను తాను ఉపేక్షించుకొనుటలో శ్రమ పొందుటకు కల స్థిరమైన మనస్సు కలిగియుండుట) ఉండదో, అప్పుడు అతడు శోధన సమయములో వెనుకకు మళ్ళిపోయి దానికి లోబడిపోవును (హెబీ 10:38).


కాని పాపము చేయుట కంటె చనిపోవుటే మేలని నిర్ణయించుకొన్నట్లయితే, అది యేసువలె 'మరణము పొందునంతగా లోబడుట' అయి ఉన్నది (ఫిలిప్పీ 2:8). అప్పుడు ఈ కవచము మన యుద్ధ దినమందు మనకు బలమును మరియు కాపుదలయు అయి ఉండును.


ఉదాహరణకు: మనము వస్తు వాహనాలను ప్రేమించినట్లయితే, మనము వాటిలో ఏమైనా పోగొట్టుకొనినా లేక ఎవరైనా మనకు కలిగిన విలువైన వాటికి ఏమైనా నష్టము కలిగించినా లేక పోగొట్టినా మనము సులువుగా శాంతిని కోల్పోయి పాపములో పడుదుము. దానికి బదులు మనము ''శరీములో శ్రమపడుట'' అను మార్గమును ఎంచుకొని దేవుడు ప్రతీది మనకు మేలు కలుగుటకై సమకూర్చి జరిగించునని నమ్మినట్లయితే (రోమా 8:28) అప్పుడు మనము వస్తువులను పోగొట్టుకొనుటను కూడా సంతోషముగా స్వీకరించగలము (హెబీ 10:34).


5. ముందుకు కొనసాగక పోవుట


మనము క్రైస్తవ జీవితములో కొనసాగుతున్నట్లయితే (''ఒక దానికొకటి కలుపుకుంటూ....కలుపుకుంటూ'') మన మెప్పుడూ పడిపోమని పేతురు చెప్పెను (2 పేతురు 1:5-10). అనేక మంది క్రైస్తవులు వారి యొక్క ఆత్మీయ జీవితములో పరిపూర్ణతలోనికి సాగిపోవుటకు బదులు వారికి ఉండిన ఆత్మీయ ప్రగతితో సంతృప్తి పడుట చేత వారు పాపములో పడిపోవుచుందురు. పౌలు తన జీవితమంతా క్రీస్తు వలె కావలెనను గమ్యము వైపు కొనసాగుట అను ఒకే ఒక్క పనిని తన జీవితమంతా చేసెను (ఫిలిప్పీ 3:13, 14). అది స్తబ్దతనుండి మరియు పాపము నుండి కూడా దూరముగా ఉంచెను. ఆయన తిమోతిని శోధన నుండి పారిపొమ్మని మాత్రమే కాక, దైవభక్తిని ప్రేమను ఓర్పును మొదలైన వాటిని వెదుకుమని హెచ్చరించెను (2 తిమోతి 2:22; 1 తిమోతి 6:11).


అనేకులు వారు పాపము చేయుట మానినా వారు అప్పుడప్పుడూ పడిపోవుచూ అటువంటి స్థితితో సంతృప్తి పడుదురు. ఆ విధముగా వారు పడిపోవుట మానరు.


మనము మన శరీరములో గుప్తముగా ఉండిన దుష్టత్వమును కనుగొనుటలో అభివృద్ధి సాధించాలంటే, ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు ఇచ్చిన వెలుగులో మనలను మనము ఎప్పుడూ తీర్పు తీర్చుకొను చుండవలెను. మనము వెలుగులో నడచినట్లయితే, మనము దైవ స్వభావములో పాలు పొందుటయందు అభివృద్ది పొందుదుము.


ఆవిధముగా మన విశ్వాసమునకు సద్గుణమును, సహోదర ప్రేమను, ప్రేమను మొదలైన వాటిని కలుపుకుంటూ పోవచ్చును. ఆ విధముగా మన మనస్సులలో అన్ని వేళలా మంచి ఆలోచనలను నింపుకుండినట్లయితే (ఫిలిప్పీ 4:8) పాపము మన మనస్సులలోనికి అంత సుళువుగా ప్రవేశించదు. ఖాళీగా ఉండిన మనస్సు శోధనకు సులువుగా లోబడేదిగా ఉంటుంది.


6. మానవ మనస్సుకు సంబంధించిన జీవితమును గద్దె దించకపోవుట


ఆదాము సంతానమంతటికి మానవపరమైన జీవితమే ప్రభువు. వారు వారి యొక్క తర్కమునుబట్టి మరియు ఉద్రేకములనుబట్టి జీవించుదురు. మనము మారుమనస్సు పొందిన తరువాత పాపభూయిష్టమైన శరీర కార్యములను మానివేసినా, మన మానవ మనస్సుకు సంబంధించిన జీవితాన్ని (మన మానవ ఆలోచనా శైలిని, భావోద్రేకములు) కూడా గద్దెదించాల్సిన అవసరమున్నది. అయినా అనేక మంది క్రైస్తవులు మానవ మనస్సుకు సంబంధించిన జీవితమును సింహాసనముపై ఉంచుటవలననే పాపములో పడిపోవుచున్నారు.


ఉదాహరణకు: క్రైస్తవ కూటములలో భావోద్రేకములను రేకెత్తించుట, అనేక అసహజమైన విపరీత కార్యములు చేయుటకును మరియు పాపము చేయునట్లు కూడా చేయును. భావోద్రేకములతో జీవించుట, ఆత్మలో జీవించుట ఒకటి కాదు. ఈ రెండు కూడా భూమికి ఆకాశమెంత వ్యత్యాసమో అంత వేరుగా ఉండును. భావోద్రేకములను కదలింపజేసే కూటములు అన్నీ ఆత్మీయమైనవి అనుకొనక్కర్లేదు. ఎందుచేతనంటే అనేకమంది అటువంటి వాతావరణము నుండి పులకరింతతో వెళ్ళి అటు తరువాత వెంటనే పాపము చేయుదురు. మన ఉద్రేకములు మోసపూరితమైనవి.


అదే విధముగా మనకున్న తెలివి తేటలు కూడా మోస పూరితమైనవి. అనేక మంది క్రైస్తవులు వారి తెలివి తేటలను సింహాన మెక్కించి వారి యొక్క మానవపరమైన తర్కము మరియు పూర్విపరములను బేరీజు వేయుట ద్వారా దేవుని సంగతులను అర్థము చేసుకొనుటకు చూచెదరు. దాని ఫలితముగా వారు మృతమైనటువంటి బైబిలు జ్ఞానమునుబట్టి త్వరగా ఉప్పొంగిపోయి పడిపోవుదురు (1 కొరింథీ 8:1). వారు పడిపోయిన విషయం అంత స్పష్టముగా కనిపించకపపోవచ్చును, ఎందుకంటే గర్వము వ్యభిచారమంత అసహ్యముగా కనబడదు, కాని నిజానికి అది ఇంకా గొప్ప పతనము అంతేకాక అది ఇంకా ఇతర విధములుగా పడిపోవుటకు దారి తీయును.


నిన్ను నీవు తగ్గించుకొని నీ తెలివితేటలను మరియు భావోద్రేకములను సింహాసనముపై నుండి దింపి చిన్న బిడ్డవలె సామాన్యముగా జీవిస్తూ ప్రశ్నలడుగని విధేయతతో దేవుని వాక్యమునకు లోబడుతూ జీవించుము. నీ మానవ మనస్సుకు సంబంధించిన జీవితమును మరియు దాని నుండి వచ్చే ప్రతి దానిని ద్వేషిస్తూ దేవుని యొక్క జ్ఞానము మరియు బలము గూర్చి ఆయనపై సంపూర్తిగా ఆధారపడుతూ ఆత్మలో జీవించుము. ఆ విధముగా నీవు నీ ఆత్మను కాపాడుకొనెదవు మరియు తొట్రిల్లకుండా ఉండెదవు.


7. సహవాసమునకు విలువ ఇవ్వక పోవుట


క్రొత్త నిబంధనలో ఒంటరిగా ఉండే క్రైస్తత్వముండదు. పాత నిబంధన ప్రవక్తలు (ఏలీయా మరియు బాప్తిస్మమిచ్చు యోహాను వంటివారు) ఒంటరిగా జీవించేవారు. అయితే శరీరము కాక కేవలము ఛాయగా (కొలొస్స. 2:17) ఉండిన రోజులలో అలా ఉండేవారు. కాని ఇప్పుడు మనకు క్రీస్తు శరీరమున్నది, మరియు మనము ఆ శరీరములో ఉన్నప్పుడు ఆ శరీరమునకు శిరస్సైన క్రీస్తు మనము పడిపోకుండా కాపాడును. పొరపాట్ల నుండి రక్షణ మరియు ఆత్మీయ ఎదుగుదల మరియు భద్రత కేవలము మనము శిరస్సును హత్తుకొని శరీరము యొక్క ఇతర అవయవములకు ఆధారముగా సంబంధము కలిగియుండులోనే ఉందని పౌలు తేటగా చెప్పెను (కొలొస్స. 2:19).


పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువనేరవని యేసు ప్రభువు చెప్పారు (మత్తయి 16:18). ఒంటరిగా తన మట్టుకు తాను జీవించే క్రైస్తవుని సాతాను తప్పక జయించును. కేవలము వారమునకు రెండుసార్లు కూటములకు వెళ్లుట చాలదు. మనము ఇతర సభ్యులతో సహవాసమునకు విలువనిచ్చి శరీరముతో ఐక్యమవ్వవలసి యున్నది. శరీరములో నేనొక పనిచేయు అవయవముగా నాకు స్థానము కలిగియున్నప్పుడు మాత్రమే, తలయొక్క విజయములో నేనూ పాలుపొందుటను చూడవచ్చును. అప్పుడు నా ఒక్కడిపై వచ్చిన ఒత్తిడి నాకు చాలా ఎక్కువైనప్పుడు శరీరములో నున్న ఇతర సభ్యులు నాకు బలముగా ఉందురు (పస్రంగి 4:9-12). శరీరములో ఒకరికొకరు హెచ్చరించు కొనుటనేది, మనము మోసపోయి పాపములో పడకుండా మనలను కాపాడుటకు దేవుడు చేసిన ఏర్పాటు (హెబీ 3:13), అటువంటి సహవాసమునకు విలువనిచ్చుట ద్వారా నీవు అనేక మనోవ్యధల నుండి మరియు వైఫల్యాల నుండి తప్పింపబడుదువు.


ఒక్కమారుగా పొందిన ఏ అనుభవమైనా మనము మరల పడిపోకుండా ఖచ్చితమైన రక్షణ యిచ్చునని చెప్పలేము. కాని ఆత్మయొక్క ఈ నియమములకు మనము విధేయత చూపినట్లయితే, అవి మనలను పాపము యొక్క శక్తినుండి విడుదల చేయును మరియు పడిపోకుండా కాపాడును (రోమా 8:2). అప్పుడు మనము అపొస్తలుల యొక్క కేకను మనమూ ప్రతిధ్వవనించినట్లు వేయగలము. ''క్రీస్తులో మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము'' (2 కొరింథీ 2:14).


అధ్యాయము 13
నిర్జీవ క్రియలు

క్రొత్త నిబంధన శరీర క్రియల గూర్చి చెప్పినట్లే (గలతీ 5:19) నిర్జీవ క్రియల గూర్చి కూడా చెప్తుంది (హెబీ 6:1).


శరీర క్రియలైన జారత్వము, జగడము, అసూయ, కోపమును ప్రదర్శించుట మొదలైన వాటిలో జీవిస్తున వారు దేవుని రాజ్యాన్ని నిశ్చయముగా స్వతంత్రించుకొనరు. ఈ పనులన్ని ప్రత్యక్షంగా పాపపూరితముగా కనబడుటచేత ఒక విశ్వాసి వీటి గూర్చి తన మనస్సాక్షితో దోషిగా ఒప్పించబడకుండా వీటిని కొనసాగిస్తూ ఉండడం అసాధ్యము.


అయితే నిర్జీవ క్రియలు బహు మోసపూరితమైనవి. అవి బయటకు మంచి క్రియలుగా ఉండును. కాని అవి దురుద్దేశ్యముతో కూడుకొనిన స్థానము నుండి (ఎందుకనగా శరీరమందు మంచిదేదియు నివసింపదు) వచ్చుట చేత అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలెనున్నవి (రోమా 7:18; యెషయా 64:6).


అందుచేత మనము పాపము నుండి మాత్రమే కాక నిర్జీవ క్రియల నుండి కూడా మారుమనస్సు పొందవలెనని ఆజ్ఞాపింపబడినాము. అటువంటి పునాది మనము వేసికొనిన తరువాత మాత్రమే మనము పరిపూర్ణులమగుటకు సాగిపోగలము (హెబీ 6:1).


యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను కడుగుననునది విశ్వాసులందరకు బాగుగా తెలిసిన విషయము. అయితే అంత బాగుగా తెలియని యథార్థమేమంటే మనము జీవము గల దేవుని సరిగా సేవించుటకు గాను యేసు రక్తము నిర్జీవ క్రియల నుండి మన మనస్సాక్షిని తప్పక కడుగవలెననునది (హెబీ 9:14).


దీనినిబట్టి నిర్జీవ క్రియలనగా ఏమిటో మనకు సరిగా తెలియవలసిన అవసరమున్నది.


1. సంతోషము లేకుండా చేసిన క్రియలు


సంతోషముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును (2 కొరింథీ 9:7). ఆయన చిత్త ప్రకారము సంతోషముగా చేయువారిని కూడా ఆయన ప్రేమించును. సంతోషముగా నీతిని అనుసరించువారిని ఆయన దర్శించును (యెషయా 64:5). ఇశ్రాయేలీయులు యెహోవాను సంతోషముతో సేవింపక పోవుట చేత వారు వారి శత్రువులను సేవించునట్లు యెహోవా శిక్షించెను (ద్వితీయో. 28:47, 48). దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో కూడిన నీతియైయున్నది (రోమా 14:17). ఆయన చిత్తమును చేయుటలో ఆనందించువారు మాత్రమే దేవుని హృదయమునకు సంతోషమును చేకూర్చగలరు.


ఉదాహరణగా దశమభాగార్పణ గూర్చి చూచెదము. ఇది పాత నిబంధనకు సంబంధించిన ఆజ్ఞ, కాని యేసు లేక అపొస్తలుల చేత ఎప్పుడును క్రొత్త నిబంధన క్రింద నున్న వారికి ఈ ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికి అనేకమంది దురాశ కలిగిన కాపరులు వారి యొక్క సమాజములను దైవికమైన ప్రతిఫలముల వాగ్దానములచేతకాని, దైవికమైన తీర్పు అనే భయముచేతకాని దశమ భాగము గూర్చి చాలా బలవంతపెడుతూ ఉందురు. అది ప్రజలు సంతోషము లేకుండా, స్వచ్ఛందంగా ఇచ్చినది కాక ఆయాసముతో, అయిష్టతతో ఇచ్చినదిగా ఉంటుంది. కానుక పెట్టెలు నిండినప్పుడు కాపరులు సంతోషముగా నుండవచ్చును కాని దేవుడు ఉండడు. కాపరులు ఎక్కువగా ఇచ్చువానిని ప్రేమించుదురు కాని దేవుడు సంతోషముగా ఇచ్చువానిని మాత్రమే ప్రేమించును!


క్రొత్త నిబంధన నియమము ''నీవు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు'' అనునది కాదుగాని ''నీవు సంతోషముతో ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు'' అనునది. అంతకు మించి దేవునికి అక్కర్లేదు. అయితే నీవు ఇచ్చిన దానికి తగినట్లుగానే నీవు తిరిగి పొందుదువు (2 కొరింథీ 9:6; లూకా 6:38). కాని అది వేరొక విషయము. ఏమైనప్పటికిని దేవుడు అయిష్టతతో యిచ్చిన ఏ శ్రమను కాని లేక బహుమతులను కాని కోరుకొనడు. సంతోషము లేకుండా మనము చేసినది నిర్జీవ క్రియ.


2. ప్రేమ లేకుండా చేసిన క్రియలు


దేవునిని ప్రేమించుట మరియు మానవుని ప్రేమించుట అనునవి, మిగిలిన అన్ని ఆజ్ఞలు వ్రేలాడదీయుటకు ఉంచిన రెండు కొయ్యలైయున్నవి (మత్తయి 22:40). ఆ రెండు కొయ్యలను తీసివేసినట్లయితే మిగిలినవన్నీ నేలపై పడిపోవును. దీనిన బట్టియే ఎఫెసు సంఘము యొక్క పెద్ద గద్దింపబడెను. అతని క్రియలు దేవునియెడలకాని, మనుష్యుల యెడలకాని ప్రేమతో ప్రేరేపింపబడలేదు (పక్రటన 2:2, 4). మనము దేవుని యొక్క ఆజ్ఞలకు వాటి యొక్క ఆత్మను గ్రహించకుండా విధేయత చూపినట్లయితే, మన క్రియలు నిర్జీవ క్రియలగును. మనము ఆయన యొక్క మందను కాయుటకు కాపరిగా ప్రభువుచే నియమింపబడినట్లయితే, మనము ఆయనను అన్నిటి కంటె ఎక్కుగా ప్రేమిస్తున్నామో లేదోనని ఆయన పేతురును పరీక్షించినట్లు, మనలనూ పరీక్షించును (యోహాను 21:15-17). అలాకానట్లయితే మన పరిచర్య విలువ లేనిదైయుండును. అదే విధముగా, మనలను శపించు వారిని కేవలం దీవించుట సరిపోదు. మన హృదయములో నుండి వారిని ప్రేమించాలి. అలా కానట్లయితే అక్షరానుసారమైన వాక్యమును నెరవేరుస్తాము కాని అందులోని ఆత్మను నెరవేర్చము. సంఘములో సహోదర సహోదరీలకు పరిచర్య చేయవలెనని చెప్పబడుట చేత వారికి పరిచర్య చేసి వారిని విమర్శిస్తున్నట్లయితే (బహుశా వారు మనకు కృతజ్ఞత కలిగి యుండకపోవుటచేత), ఆ పరిచర్య ఒక పెద్ద నిర్జీవ క్రియల పోగుగా ఉండును. ప్రభువు యొక్క సేవ కొరకు మనము చేసే త్యాగములన్ని, ఆయన యెడల ప్రేమ నుండి ఉప్పొంగక పోయినట్లయితే అవి విలువలేని నిర్జీవ క్రియలుగానుండును.


3. ఆసక్తి లేకుండా చేసిన క్రియలు


నీ క్రియలు నాకు తెలియును....నీవు నులివెచ్చగా నుంటివి, వేడిగానైనను, చల్లగానైనను లేవు....అందువలన ఆసక్తి కలిగియుండుము (పక్రటన 3:15-19). సగము హృదయముతో చేసిన క్రియలు నిర్జీవ క్రియలు. మనము మన పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను మన ప్రభువును ప్రేమింపవలెను (మార్కు 12:30). మన ఆరాధన మరియు స్తుతి నిర్జీవమైనవిగా, మృతమైనవిగా కాక పూర్ణహృదయుతో నుండవలెను. దేవుని కొరకు చేసిన ఏ పనియైనను పూర్ణహృదయముతో చేయవలెను. మనము ప్రార్థించుట భారముతోను మరియు మనము ప్రవచించుట ఆసక్తితోను ఉండవలెను. మనము అన్ని సమయములయందును ''ఆత్మయందు తీవ్రత'' కలవారమైయుండవలెను (రోమా 12:11). బలిపీఠముపై అగ్ని నిత్యము మండుచుండవలెను (లేవీయకాండము 6:13). దేవుడు మనకు పైనుండి ఇచ్చిన వరములను మనము ఎప్పుడూ ప్రజ్వలింపజేయవలెను అంతేతప్ప అనేకులు దుర్వినియోగము చేయుచుండుట చేత మనము వాటిని నిర్లక్ష్యము లేక తిరస్కారము చేయకూడదు (2 తిమోతి 1:7). క్రైస్తవ సమాజములు ఆత్మ యొక్క అగ్ని మండకుండా, జీవము లేని స్థితిలో ఉన్నవి. వాటిలో ఆసక్తి కొరవడుట చేత అవి దేవునిచేత తిరస్కరింపబడుటకు సిద్ధముగా నున్నవి (పక్రటన 3:16). మన జీవితములో నున్న అటువంటి నిర్జీవ క్రియల గూర్చి మనము పశ్చాత్తాపపడాల్సి యున్నది.


4. విశ్వాసము లేకుండా చేసిన క్రియలు


క్రియలు లేని విశ్వాసము ఏ విధముగా మృతమో (యాకోబు 2:26), అదే విధముగా విశ్వాసములేని క్రియలు మృతక్రియలై యున్నవి. విశ్వాసము లేనందున అనేక ప్రార్థన కూటములు మృతమైనవిగా నున్నవి. ఓపికను చూపించే ఒకరాత్రంతా ఉన్న ప్రార్థన కూటము కంటే విశ్వాసముతో నిండియున్న ఐదు నిమిషముల ప్రార్థన ఎక్కువ జీవము గలదై మరియు శక్తికలదై దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చును. యేసు రాత్రంతా ప్రార్థించారు కాబట్టి అవసరమైతే మనమును అట్లు ప్రార్థించాల్సి యున్నది. కాని ఒక నిర్జీవ క్రియ వలె మట్టుకు కాదు. విశ్వాసమనగా వ్యక్తిగత నిశ్చయత కూడా అయియున్నది (రోమా 14:22). వ్యక్తిగతమైన నిశ్చయత లేకుండా మనము చేసినదేమైనా నిర్జీవ క్రియయే. ఒక గొప్ప భక్తుడు ఏదో ఒక పద్ధతిని పాటించుటచేత లేక ఒక సిద్ధాంతమును నమ్ముటచేత మనమును దానిని అనుకరించవలెనని లేదు. అయినప్పటికిని క్రైస్తవత్వం, వ్యక్తిగత ఒప్పుదల లేకుండానే ఇతరులను గ్రుడ్డిగా అనుకరించే విశ్వాసులతో నిండిపోయియున్నది. అనుకరణ ఎప్పుడూ మరణమును తెస్తుంది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును విశ్వాసముతో దాటిరి. ఐగుప్తీయులు వారిని అనుకరించి మునిగిపోయిరి (హెబీ 11:29). అది మనకు హెచ్చరికగా వ్రాయబడినది. ఇతరుల యొక్క పనులను కాని పరిచర్యను కాని అనుకరించవద్దు. వేరొకరి పరిచర్యలో ప్రత్యేకతను కూడా అనుకరించకూడదు. అది కూడా ఒక నిర్జీవ క్రియ అవుతుంది. మనము మనకివ్వబడిన విశ్వాస పరిమాణము ప్రకారము మనము ప్రవచింపవలసియున్నది (రోమా 12:6). దేవుడు నిన్ను నీవుగానే ఉండాలని కోరుచున్నాడు. ఎందుకనగా నీకున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం ద్వారా క్రీస్తు శరీరమునకు నీద్వారా ఒక అద్వితీయమైన పనిని నెరవేర్చవలెనని ఆయన ఉద్దేశించుచున్నాడు.


5. వ్యక్తిగతమైన లాభము మరియు ఘనత కొరకు చేసిన క్రియలు


''నీ క్రియలను నేనెరుగుదును, నీవు జీవించుచున్నావను పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే'' (పక్రటన 3:1).


ఇక్కడ ఆత్మీయముగా చనిపోయినను, అతడు జీవించుచున్నాడను పేరును బట్టి సంతృప్తి చెందు ఒక మనుష్యుడుండెను. అతడు దేవుని నుండి వచ్చు మెప్పుకంటె మనుష్యుని నుండి వచ్చు మెప్పును ఎక్కువగా వెదుకుచుండెను (యోహాను 5:44; 12:43). దానికి ఫలితముగా అతడి క్రియలన్నియు నిర్జీవ క్రియలైయుండెను. మనము చేసినదేమైనను, దాని గూర్చి ఇతరులకు తెలియవలెనని కోరుకొన్నట్లయితే, అది కూడా నిర్జీవక్రియ అయి ఉన్నది (మత్తయి 6:1-18). దేవుని ముఖముయెదుట మరియు మనుష్యుల దృష్టి నుండి దాచుటకు సాధ్యమైనంతగా ప్రయత్నించి రహస్యముగా చేసినవే జీవ క్రియలు. ఎప్పుడైతే దేవుని కొరకు మనము సాధించిన వాటిని బట్టి మనము అతిశయించుదుమో, అప్పటి నుండి ''మన చేతులతో చేసిన వాటిని పూజించు'' వారమగుదుము (అపొ.కా. 7:41). మరియు అప్పుడు మన క్రియలు వెంటనే నిర్జీవ క్రియలుగా మారిపోవును. బబులోను ఈ విధముగా కట్టబడినదని దానియేలు 4:30 మనకు తేటపర్చుచున్నది.


మన పనిని గూర్చికాని, మనను గూర్చికాని ఇతరుల యొక్క అభిప్రాయముల గూర్చి ఆలోచించునట్లు మనము శోధింపబడినట్లయితే, ఆ ఆలోచనలను (అవి మంచివైనా లేక చెడ్డవైనా) వాటి స్థానమైన చెత్తబుట్టలో పడవేయవలెను. మన గూర్చి దేవుని యొక్క గొప్ప భక్తులకుండిన అభిప్రాయములను కూడా చెత్తబుట్టలో పడవేయవలెను. ''మానవ దృష్టిలో మన యొక్క నీతి, దేవుని దృష్టిలో అసహ్యమై (చెత్త కుండీకి మాత్రమే తగును) యున్నది (లూకా 16:15).


కేవలము ఈ విధమైన తీవ్ర ధృక్పథము కలవారు మాత్రమే నిర్జీవ క్రియల నుండి తప్పించుకొనగలరు. అదే విధముగా దేవుని కొరకు జీతము తీసుకొని చేయునది నిర్జీవ క్రియ. జీతము కొరకు చేయునది క్రైస్తవ పని కాదు. అది 'క్రైస్తవ' పేరు కలిగియున్నను అది లౌకికమైన పని. దేవునిని, ధనమును సేవించుట అసాధ్యము.


6. ఒకరి మనస్సాక్షికి ఊరట కలిగించుటకు చేసిన క్రియలు


అన్యులు వారి మనసు యొక్క నేరారోపణను బట్టి ఉపవాసము, ప్రార్థన, దానధర్మాలు వంటి పనులు చేయుటకు ప్రేరేపింపబడుదురు (రోమా 2:15).


క్రైస్తవులు కూడా వారి మనస్సాక్షి ఊరట కలుగుట కోసం అటువంటి కార్యములు చేయుదురు. అనేకులు రోజూ బైబిలు చదువుట, ప్రార్థించుట వారి మనస్సాక్షి యొక్క నేరారోపణ నుండి విడుదల పొందుటకే చేయుదురు. అటువంటి పనులన్నియు నిర్జీవ క్రియలే. కొంతమంది బోధకులు విశ్వాసులలో నుండిన ఇటువంటి బలహీనతను బట్టి క్రీస్తు లేకుండా చనిపోవు లక్షలమంది కొరకు ఏదొకటి చేయమని ప్రేరేపించుదురు ''నీవు ఇవ్వుము లేక వెళ్లుము'' అందురు. దాని ఫలితముగా కొందరు కొంత ద్రవ్యము నిచ్చెదరు. మరికొందరు వారి ఉద్యోగములను విడిచి క్రైస్తవపనిలోకి వెళ్లుదురు. కాని ఈ రెండు గుంపులలో నున్నవారు కూడా దేవుని యొక్క నడిపింపు లేకుండా, ఆ సమయానికి కలిగిన ఉద్రేకమును బట్టి తమ మనస్సాక్షికి ఊరట కలిగించుట కొరకు అట్లు చేసి చివరకు అనేక నిర్జీవ క్రియలు చేయువారుగా మిగిలిపోవుదురు.


7. దేవుని యొక్క తీర్పును గూర్చి భయముతో చేసిన క్రియలు


కేవలము దేవుని యొక్క తీర్పునకు భయపడి పాపమును చేయక తప్పించుకొనుట మంచిదే కాని యేసు పాపము చేయకుండుటకు కారణమది కాదు. ఆయన తండ్రిని సంతోషపర్చుటకు పాపము చేయలేదు. ఇదే మన ఉద్దేశ్యముగా ఉండవలెను. ఒకవేళ స్త్రీ యెడల మోహము, అబద్దములు చెప్పుట లేక ఇతరులయెడల నిష్ఠూరతను ఉంచుకొనుట మొదలగు వాటికి శిక్ష లేకపోయినట్లయితే, మనము ఆ పాపములలో యథేచ్చగా జీవించుదుమా? లేక మన ప్రాథమిక కోర్కె దేవునిని సంతోషపర్చుట అయినందున ఆ పాపములకు దూరముగా ఉందుమా? ప్రతిఒక్క వ్యక్తి ఆ ప్రశ్నకు తనకు తానే జవాబిచ్చుకొనవలెను. మరియు నిర్జీవ క్రియలనుండి తన స్వంత రక్షణకు భయముతో మరియు వణుకుతో కొనసాగించుకొనవలెను. కేవలము దేవుని నుండి తీర్పుగా ఏదో రోగము రాకుండుటకుగాను, లేక దేవుడు మనలను క్షమించుటకు గాను మనము ఇతరులను క్షమించినట్లయితే అది ఒక నిర్జీవ క్రియయే - ఎందుకనగా అది తీర్పును గూర్చిన ఒక స్వార్థపూరితమైన భయము నుండి ఉద్భవించినది. ఆ రోజు ప్రమాదమేమి జరుగకుండునట్లు ఉదయాన్నే ప్రార్థించుట మరియ బైబిలు చదువుట చేయు వారిగూర్చి ఏమనాలి! అది కూడా అన్యులలో నుండిన మూఢ నమ్మకాల వరుసలోనే వస్తుంది!


8. ప్రతిఫలము ఆశించి చేసిన క్రియలు


యేసు ప్రభువు నమ్మకముగా నుండు వారికి ప్రతిఫలమిచ్చుననునది సత్యమే (పక్రటన 22:12). మరియు మన జీవితాలలో నుండిన ఆఖరి కోర్కె దేవుని సంతోషపర్చుట అనునది కూడా సత్యమే (2 కొరింథీ 5:9). అందును బట్టి, ఒక దినాన భళా! నమ్మకమైన మంచి దాసుడా! అను మాటలను ఆయన నుండి వినవచ్చును. అయినప్పటికిని మన త్యాగములలో మరియు ఆయన కొరకు మన సేవలో పరలోకపు ప్రతి ఫలము గూర్చిన స్వార్థపరమైన కోరిక మన ఉద్దేశ్యముండునేమోయని యేసు ప్రభువు హెచ్చరించెను.


పేతురు ధనవంతుడైన యౌవనస్థునితో (యేసు యొద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోయిన యౌవనస్థుడు) తనను తాను అనుకూలముగా పోల్చుకొని ''నీ కొరకు అన్నిటిని విడిచిపెట్టిన మేమేమి పొందుదుము? అని ప్రశ్నించెను (మత్తయి 19:27). దానికి యేసు పనివారిని గూర్చిన ఉపమానముతో సమాధానమిచ్చెను (మత్తయి 20:1-16). అక్కడ కూలి (ప్రతిఫలము) కొరకు పనిచేసిన పనివారు, చివరగా వచ్చుటను, ప్రతిఫలము గూర్చి ఏ మాత్రము ఆలోచన లేనివారు మొదటగా వచ్చుటను (వారు మొదటి గుంపుతో పోలిస్తే చాలా కొద్ది పని మాత్రము చేసియుండిరి) మనము కనుగొందుము.


అక్కడ పరిమాణమునకును, నాణ్యతకును అనగా నిర్జీవ క్రియలకును జీవముగల క్రియలకును మధ్య బేధమును మనము చూడగలము. ఇతర విశ్వాసుల కంటె ఉన్నత స్థితిలోనికి వెళ్ళుదమనియు మరియు క్రీస్తు పెండ్లికుమార్తె గుంపులో స్థానము సంపాదించుకొనుట కొరకైన నిరీక్షణతో చేయు క్రియలు నిర్జీవ క్రియలుగా ఆఖరి దినాన్న బయలుపర్చబడును.


మన ఆలోచనా జీవితములను స్వచ్ఛముగా చేసికొనడము, ఇతరులకు మంచి చేయుట మరియు భార్యలను ప్రేమించుట లేక భర్తలకు లోబడుట, ఇవన్నియు భవిష్యత్తులో ఒక రోజున హెచ్చింపబడుదుమనే ఆలోచనతో చేసినట్లయితే, అప్పుడు అహం అనునది మన జీవితాల మధ్య ఇంకను ఉండినట్లే, మరియు మన కొరకు మనము చేసిన మంచి పనులన్నియు నిర్జీవ క్రియలైయున్నవి!


పరలోకములో తలపై కిరీటములు పొందినవారు, ప్రభువు పాదాల యొద్ద వాటిని వెంటనే పడవేసి నీవే అర్హుడవు అని చెప్పుదురు (పక్రటన 4:10). దేవునిని మహిమ పర్చవలెనను ఉద్దేశ్యము తప్ప మిగిలిన ప్రతి ఉద్దేశ్యము నుండి మనలను మనము ప్రక్షాళన చేసికొన్నప్పుడు మాత్రమే మనము నిర్జీవ క్రియలనుండి విడుదల పొందగలము. మన యొక్క జ్ఞాపకములో మనము చేసిన మంచి క్రియలను గూర్చిన వివరాలు ఉంచుకొనినట్లయితే, అవన్నియు మృత క్రియలగును.


యేసు ప్రభువు మనకు ఆఖరి తీర్పు దినమును గూర్చి రెండు దృశ్యాలను ఇచ్చారు. ఒక దానిలో, ప్రజలు వారి భూమిపై జీవించిన జీవితాల్లో వారు చేసిన మంచిని ప్రభువునకు చెప్పుదురు. ''ప్రభువా! నీ పేరున ప్రవచింపలేదా, నీ పేరున రోగులను స్వస్థపరచలేదా మొదలైనవి (మత్తయి 7:22, 23). వారు ప్రభువుచేత తిరస్కరింపబడిరి. వేరొక దృశ్యములో నీతిమంతులు వారు భూమిపై జీవించిన జీవితాల్లో చేసిన మంచి క్రియలు ప్రభువుచేత జ్ఞప్తికి తేబడెను. ''ప్రభువా, మేమెప్పుడు అట్లు చేసాము? అని ఆశ్చర్యంతో మొఱపెట్టారు (మత్తయి 25:34-40). వారు చేసిన మంచిని వారు మరచిపోయిరి ఎందుకనగా వారు ఆ పనులు ప్రతిఫలము కొరకు చేయలేదు. అక్కడ నిర్జీవ క్రియలకును, జీవ క్రియలకును మధ్య నున్న తేడాను చాలా తేటగా చూడగలము. మనము ఏ వర్గానికి చెందినవారము?


9. యేసు యొక్క మరణానుభవమును వహించుచు చేయని క్రియలు


మనలో నున్నటువంటి యేసు యొక్క జీవము నుండి ప్రవహించు క్రియలే జీవముగల క్రియలు. ప్రతి దినము సిలువ నెత్తుకొనకుండా అనగా మొదట యేసు యొక్క మరణమును వహించుకొనకుండా యేసు జీవమును కలిగియుండుట అసాధ్యము (2 కొరింథీ 4:10), మనము కేవలము మన నాలుకను కోపముగా మాట్లాడకుండునట్లు అదుపులో ఉంచుకొనినట్లయితే లేక మన ముఖములను చిట్లించుకొనుట మాని, ఇంకను లోపల కోపముతోను మరియు చిరాకుతోను మరుగుతున్నట్లయితే అది జయము కాదు. అది అణచివేయుట మాత్రమే. అది యోగాభ్యాసమై యున్నది, కాని యేసు చెప్పినదికాదు. ప్రతిదినము సిలువ నెత్తుకొనుమని యేసు ప్రభువు చెప్పెను. దాని అర్థము అనుదినము శరీరేచ్ఛలను మరణమునకు అప్పగించుట (గలతీ 5:24). తుపాకీతో కాల్చుట లేక ఉరితీయుట వలె కాక సిలువ వేయబడుట ద్వారా మరణము చాలా సమయము తీసుకొంటుంది. మాంసము ఒక్క క్షణములో తుపాకీతో కాల్చబడదు లేక ఉరి వేయబడదు. అది కేవలము సిలువ వేయబడవలెను. అయితే ఈ నేరస్థుని సిలువపై నుంచుటలో మనము నమ్మకముగా ఉండినట్లయితే మరణము తగిన సమయములో వస్తుంది అప్పుడు మనము అంతరంగములో కూడా పాపముతో జోలియిక నేమియు లేకయుందుము (1 పేతురు 4:1). అప్పుడు ఆత్మ యొక్క జీవము గల క్రియలు మనలోపల నుండి జీవజలనదుల వలె ప్రవహించును (యోహాను 7:38). అప్పుడు మన అంతరంగపు వైఖరులు బయటకు కనబడే మన క్రియలకు అనుగుణంగా ఉండును. అప్పుడు తెచ్చి పెట్టుకొన్న చిరునవ్వులు లేక బయటకు కనిపించే భక్తి ప్రదర్శనలు అక్కర్లేదు.


10. మన స్వంత మానవ ఆలోచన నుండి ఉద్భవించిన క్రియలు


ప్రభువునకు మరియు ఆయన శిష్యులకును మార్త చేసిన నిస్వార్థపూరితమైన మరియు త్యాగ పూరితమైన పని, మంచి క్రియలయి ఉండియు నిర్జీవ క్రియలైన వాటికి ఒక మంచి ఉదాహరణ (లూకా 10:38-42). ఆమె అది ఒక మంచిపనిగా తలంచినందుననే ఆమె ఆ పని చేసినది. కాని ''సేవకుడు చెయ్యవలసిన ప్రాముఖ్యమైన పని. వాని యజమాని ఏమి చెయ్యమని చెప్పునో దానిని చేయుట'' - అంతేకాని తనకు తానుగా తనకు ఇష్టమొచ్చినది చేయుట కాదు (1 కొరింథీ 4:2 లివింగ్‌ బైబిలు). ఆ విధంగా మరియ జ్ఞానవంతురాలు ఎందుకనగా ఆమె మొదట యేసు ప్రభువు ఆమెకు ఏమి చేయమనునో వినుటకు ఆయన పాదముల యొద్ద కూర్చొనినది. దేవుని వాక్యము ప్రకృతి సంబంధమైన దానిని మరియు ఆత్మ సంబంధమైన దానిని విడదీయును, మనము ఏ విధముగా పాపము నుండి విరమించు కొందుమో అదే విధముగా మన స్వంత క్రియలను చేయుట నుండి కూడా విరమించుకొనవలెను (హెబీ 4:10-12). మానసిక ప్రేరేపణతో చేయు క్రియలు నిర్జీవ క్రియలు. యేసు ప్రభువు ఎప్పుడూ ఏ పని తన స్వంత ప్రేరణతో చేయలేదు (యోహాను 5:30). దేవుడు ఆయన యొక్క పనిచేయుటకై అది ఎలా చేయాలనే గొప్ప గొప్ప ఆలోచనలున్న వారి కొరకై చూచుటలేదు (అటువంటి వారు 'ఇశ్మాయేలు'లను మాత్రమే ఉత్పత్తి చేయగలరు). కాని ఎవరైతే వారి యొక్క జ్ఞానము మరియు బలము యొక్క కొదువను గూర్చి ఒప్పుకొనుటకు తమ్మును తాము తగ్గించుకొందురో, మరియు ఎవరైతే ఆయన కిష్టమైన విధముగా దేవుడు వారిని ఉపయోగించుకొనులాగున అందుబాటులో నుందురో అటువంటి వారి కొరకు చూచుచున్నాడు. దేవుడు సామర్థ్యము గూర్చి చూచుట లేదు కాని అందుబాటులో ఉన్న వారి కొరకు చూచుచున్నాడు.


ఇరుకు మార్గములో ఒక ప్రక్కన ఒక శిఖరము మరియొక ప్రక్కన ఇంకొక శిఖరము ఉంటుంది. 'నిర్జీవ క్రియలు ఒక శిఖరమైనట్లయితే, ఏ క్రియలు లేకపోవుట' దానికి ఎదురుగా ఉండిన ఇంకొక శిఖరము. నిర్జీవ క్రియలు చేయుటలో ఉపయోగము లేకపోవుటను గూర్చి విని, ఏ క్రియ చేయకుండేటటువంటి లేక ఏదైనా చేయుటకు ముందు, మనము చేసే ప్రతి పనిని బేరీజు వేసుకుంటూ ఉండే ప్రమాదములో మనలో అనేకులు పడిపోవుదురు. అప్పుడు మన జీవితము కొలిక్కి రాని నిష్ఫలమైన ఆత్మ పరిశీలనగా ఉండును. అది ఇంకా ఘోరమైన విషయము. మనము ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని జీవించుటలో ఆత్మతో సహకరించినప్పుడు మాత్రమే ఆత్మయొక్క జీవముగల క్రియలు మనద్వారా వచ్చును. కావలసినది నియమ నిబంధనలు కాదు గాని క్రమశిక్షణ.


కాబట్టి శరీరము యొక్క కల్మషము నుండియే కాక ఆత్మ యొక్క కల్మషము నుండి కూడా మనలను మనము పవిత్రపరచుకొనెదము (2 కొరింథీ 7:1). ఆ విధంగా గొఱ్ఱెపిల్ల యొక్క వివాహ దినమున మన నీతి క్రియలు మన వివాహ దుస్తులుగా మారును

అధ్యాయము 14
దేవుని యొక్క ఆశీర్వాదమా? లేక దేవుని యొక్క ఆమోదమా?

విశ్వాసులలో రెండు రకములైన వారుందురు - దేవుని యొక్క ఆశీర్వాదము కోరువారు మరియు దేవుని యొక్క ఆమోదము కోరువారు. వీరిరువురి మధ్య ఎంతో గొప్ప వ్యత్యాసము ఉన్నది. పక్రటన 7:9-14లో విశ్వాసుల సమూహముల గూర్చి చదువుతాము. వారు లెక్కించుటకు వీలుకానంత మందిగా ఉన్నారు. వారు వారి రక్షణ కొరకు దేవునికి కృతజ్ఞత కలిగినవారు (10వ వచనము) మరియు వారి యొక్క వస్త్రములు క్రీస్తు రక్తములో కడుగబడినవి అను సాక్ష్యము గలవారు (14వ వచనము). వేరొక విధంగా చెప్పవలెనంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. సందేహం లేకుండా ఇది చాలా మంచిదై ఉన్నది అయితే పక్రటన 14:1-5లో చెప్పబడిన విశ్వాసుల యొక్క సాక్ష్యము కంటె ఇది ఎంతో వేరైనది.


అక్కడ లెక్క పెట్టగలిగినంతటి చిన్న గుంపు గూర్చి చదువుతాము. నిజానికి వారు 1,44,000 మంది మాత్రమే, వారు ఈ భూమిపై నివసిస్తున్న కోటానుకోట్ల ప్రజల నుండి ఎన్నిక చేయబడిన వారని నీవు గమనించినట్లయితే అది చాలా చిన్న సంఖ్య. వారు భూమిపై క్రీస్తును పూర్తిగా వెంబడించిన వారని వారిగూర్చి సాక్ష్యము చెప్పబడినది. వారి నోట అబద్ధమేమియు లేదు మరియు వారు 'స్త్రీ' సాంగత్యమును అపవిత్రులు కాకుండునట్లు తమ్మును తాము కాపాడుకొన్నవారు. (ప్రకటన 17వ అధ్యాయములో చెప్పబడిన స్త్రీ - అది బబులోను మరియు ఆమె కుమార్తెలు) వేరే విధంగా చెప్పవలెనంటే, వారు దేవునిని ఆనందింప చేసినవారు.


ఇక్కడ తేడాను గమనించండి. మొదటి గుంపు దేవుని యొక్క ఆశీర్వదములను పొందినది. రెండవ గుంపు దేవుని ఆమోదాన్ని పొందినది. మనము దేవుని యొక్క ఆశీర్వాదములతోనే సంతృప్తి చెందితే, మనము పొందగలిగేవి అవి మాత్రమే. మరియు దేవుడిచ్చు వస్తు వాహనాల యొక్క ఆశీర్వదములతో మాత్రమే సంతృప్తి పడినట్లయితే, ఆయనయిచ్చే ఆత్మీయ ఆశీర్వాదములు పొందునట్లు ముందుకు వెళ్ళలేము.


అనేక విశ్వాసులు దేవునిచేత ఆశీర్వదింపబడుటతో సంతృప్తి చెందుదురు - అది కూడా ఎక్కువగా వస్తువాహన పరిధియందు మాత్రమే. ఆ కారణం చేతనే క్రైస్తవ పుస్తకశాలలు, ఏ విధంగా ఒకరు, తన రోగము నుండి స్వస్థపడవచ్చును మరియు దశమ భాగము అర్పించుట ద్వారా ఎలాగు ధనికుడుగా అవ్వవచ్చు మొదలైన విషయాలతో నిండిన పుస్తకాలతో నిండియుంటున్నది. అక్కడ ప్రాధాన్యత భౌతికంగా మరియు వస్తు సముదాయాలతో గొప్పగా నుండడం - అది ఆరోగ్యం మరియు అన్నిటిలో వర్ధిల్లడం. ఇది తననుతాను కేంద్రముగా కలిగియున్న జీవితానికి స్పష్టమైన లక్షణము. అయితే మనము వాక్యములో ''జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు యేసు మృతి పొందెనని'' చదువుదుము (2 కొరింథీ 5:15). వేరొక విధంగా చెప్పవలెనంటే, ''మనలను మనము సంతోష పెట్టుకొనుట కొరకుకాక ఆయనను సంతోషపర్చుటకు మాత్రమే'' అని చెప్పవచ్చును. ఇంకా వేరొక విధంగా చెప్పాలంటే ''మనలను మన కొఱకు మనము జీవించే జీవితమునుండి విడుదలచేసి, దేవుని కొరకు జీవించే జీవితములోనికి తేవటానికి యేసు చనిపోయెనని'' చెప్పవచ్చును.


ఈ దినాలలో మనకు అర్థంకాని విషయాలలో ఒకటి దానికి ఉండవలసిన ప్రత్యేక లక్షణముల విషయంలో ఎంతగానో రాజీపడిపోయే క్రైస్తవ పరిచర్యను దేవుడు ఆశీర్వదించే విషయం. దీని అర్థం వాక్యమును ఉల్లంఘించి రాజీపడిపోవడం విషయంలో దేవుడు ఏ మాత్రము కలతచెందడం లేదనియా? తప్పని సరిగా అలాకాదు. ఎన్నో పరిచర్యలను ఆయనకు పూర్తిగా అంగీకారము కాకపోయినా దేవుడు దీవించును.


మోషే బండను కొట్టుట ద్వారా దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు కూడా (దేవుడు బండతో మాట్లాడమని అతడితో చెప్పెను) అవిధేయతతో కూడినదయినప్పటికి దేవుడు ఆ పరిచర్యను దీవించెను. నిజానికి ఇరువది లక్షలమంది ప్రజలు దాని ద్వారా దీవింపబడిరి. అయినను అటు తరువాత తన అవిధేయుడైన సేవకునిని బహు కఠినముగా శిక్షించెను (సంఖ్యాకాండము 20:8-13). దేవుడు ఇరువది లక్షల మంది అవసరతలో నున్న ప్రజలను ప్రేమించుటచేత ఆ పరిచర్యను దీవించెను. కాని, ఆయన సేవకుడు చేసినది ఆమోదించుట వలన కాదు. ఈనాడు కూడా అంతే.


రక్షణ మరియు స్వస్థత మొదలైన అవసరతలు కలిగిన ప్రజలను ప్రేమించి దేవుడు అనేక పరిచర్యలను ఆశీర్వదిస్తున్నారు. కాని ఈనాడు యేసు క్రీస్తు నామము పేరిట జరుగుతున్న ఎన్నో విషయాలను ఆయన తప్పనిసరిగా ఆమోదించడు. తగిన కాలమందు ఈ రాజీపడే బోధకులను ఆయన తప్పక శిక్షించును.


దేవుని యొద్ద నుండి భౌతికపరమైన ఆశీర్వాదములు పొందుటకు నెరవేర్చాల్సిన ఒకే ఒక షరతు ఏమిటంటే ఒకరు మంచిగా కాని చెడుగా కాని ఉండుటయే!! ఎందుకంటే దేవుడు చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింపచేసి, వర్షమును కురిపింపజేయుచున్నాడు (మత్తయి 5:45). దీనినిబట్టి భౌతికపరమైన దీవెన ఒకరి జీవితంపై దేవుని యొక్క ఆమోదానికి గుర్తు కాదు. అరణ్యములో ఇరువది లక్షల మంది ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు దేవునికి అవిధేయులుగా నుండిరి - దేవుడు వారియెడల ఎంతగానో కోపించెను (హెబీ 3:17). అయినప్పటికి దేవుడు ఆ సంవత్సరాలన్నిటిలో వారికి ఆహారము, స్వస్థత ఇచ్చియున్నాడు అది కూడా అద్భుతంగా (ద్వితీయో. 8:2). అందుచేత భౌతిక మరియు వస్తు సముదాయ పరిధులలో ప్రార్థనకు మనము పొందే అద్భుత జవాబులు ఒక వ్యక్తి యొక్క జీవితము దేవునికి సంతోషం కలిగించేదిగా ఉందనటానికి నిదర్శనం కాదు.


యేసు ముప్పై సంవత్సరాల వయసున్నప్పుడు, ఒకే ఒక కారణాన ఆయనపై దేవుని యొక్క ఆమోదము ఉండినది. ఆ కారణము ఆ సంవత్సరాలన్నిటిలో యేసు నమ్మకముగా శోధనను జయించుట వలన. ఆయన తండ్రిలో తన జీవితాన్నుంచుకొని జీవించాడు తప్ప తనలో తన జీవితాన్ని ఉంచుకొని జీవించలేదు. తనను సంతోష పర్చుదానిని ఎప్పుడు ఆయన చేయలేదు (రోమా 15:3). ఆయన బాప్తిస్మము సమయములో తండ్రి ఈ విధంగా సాక్ష్యమిచ్చెను. ''ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను'' అంతేకాని ''నేను ఎంతగానో దీవించిన నా ప్రియకుమారుడు'' అని చెప్పలేదు. ఈ రెండవ విధమైన సాక్ష్యం అర్థం లేనిదిగా ఉండియుండును. ఆ మొదటిది, దేవుని యొక్క ఆమోదమును తెలిపేది, యేసు క్రీస్తునకు సమస్తమై ఉండెను. యేసు క్రీస్తును వెంబడించడం అంటె మన కొరకు అటువంటి సాక్ష్యం కోరుకొనడం అన్న మాట.


ఆదాము పిల్లలుగా మనమందరం మనకు మనమే ముఖ్యులుగా చూచుకొనే వారముగా పుట్టాము. ప్రతీది మన చుట్టూ తిరగాలని, ప్రతీది మనకు ఉపయోగపడాలని అనుకుంటూ మనము ఎదిగాము. మనము రక్షణ పొందినప్పుడు దేవుడు మనకు పరిచర్య చెయ్యాలిన మరియు అనేక విధాలుగా ఆశీర్వదించాలని అనుకొన్నాము. ప్రారంభములో ఆయన యొక్క క్షమాపణతో మనము దీవింపబడాలని అటు తరువాత స్వస్థత, ప్రార్థనకు జవాబు, వస్తురూపమైన అభివృద్ధి, ఉద్యోగము, ఇల్లు, వివాహ సహచరి మొదలైన వాటి కొరకు ఆయన దగ్గరకు వచ్చెదము. అయితే మనము మన దృష్టిలోనూ మరియు ఇతరుల దృష్టిలోనూ ఎంతో లోతైన 'మతాసక్తి' గలవారమై ఉండినప్పటికి, మనమింకా మనకు మనమే కేంద్రముగా ఉండే జీవితం జీవించడానికి అవకాశం ఉంది. మన చుట్టూ 'భ్రమణం' చేసే అనేక వాటిలో దేవుడు కూడా ఒక వ్యక్తి అవుతాడు, మరియు ఆయన దగ్గర్నుండి ఏమైతే పొందటానికి వీలుంటుందో అవి పొందటానికి మనము ప్రయత్నిస్తాము. తప్పిపోయిన కుమారుడు తిండి కొరకే తన తండ్రి యొద్దకు వచ్చెను; అయినప్పటికిని తండ్రి తనను చేర్చుకొనెను. మన ఉద్దేశ్యాలు పూర్తిగా స్వార్థపూరితంగా నుండినా కూడా దేవుడు మనలను చేర్చుకొనును. మనము స్వార్థపూర్తిమైన ఉద్దేశ్యాలతో ఆయన దగ్గరకు వచ్చినా మనలను చేర్చుకొనేంతగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. అయితే మనము వేగంగా పరిపక్వత చెంది పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యత, అనే ఆయన స్వభావములోనికి వచ్చుటయే నిజమైన ఆత్మానుసారతయని తెలుసకోవాలని ఆయన నిరీక్షిస్తున్నారు. అయితే అనేకులైన ఆయన బిడ్డలలో, ఈ ఉద్దేశ్యాన్ని ఆయన నెరవేర్చక పోవుచున్నారు. వారు వారి యొక్క స్వంతం గురించి ఆలోచనయైన 'నేను' 'నాకు' మరియు 'నాది' మరియు వస్తుసముదాయాలు మరియు భౌతిక ఆశీర్వాదాలతోనే జీవించి చనిపోతున్నారు.


పరిపక్వత చెందుటయనగా మనము దేవుని యొద్ద నుండి ఏమి పొందుతాము అనే ఆలోచన నుండి, మనకున్న ఈ ఒక్క జీవితం నుండి దేవుడు ఏమి పొందగలడు అనే ఆలోచనలోనికి మన మనస్సులు నూతన పర్చబడడం. ఈ నూతన పర్చబడిన మనస్సే రూపాంతరమును తెస్తుంది (రోమా 12:2). ఇదే 1,44,000 మందిని గొఱ్ఱెపిల్లతో సీయోను కొండపై నిలిచియుండుటకు అర్హత కలుగజేసెను.


నిజమైన ఆత్మానుసారతయనగా కోపం, చిరాకు, మోహపు తలంపులు మరియు ధనాశ మొదలగు వాటిపై విజయం మాత్రమే కాదు. అది ఒకరు తన కొరకే జీవించుట మానివేయడం. అది మన స్వప్రయోజనములను, మన స్వంత లాభము, మన స్వంత సౌఖ్యం, మన స్వంత సదుపాయం - చివరకు స్వంత హక్కులు, స్వంత గౌరవము మరియు స్వంత ఆత్మీయతను కూడా వెదుక్కొనకపోవడము.


శిష్యులు యేసును ప్రార్థించుట నేర్పించమని అడిగినప్పుడు, 'నేను', 'నాకు' లేక 'నాది' అనే పదములు ఒక్క మారుకూడా రాని ప్రార్థనను యేసు వారికి బోధించారు (లూకా 11:1-4). అక్కడ ఆయన మొదట తండ్రి యొక్క నామము, రాజ్యము గూర్చిన ఆలోచన కలిగి, అటు తరువాత మన గూర్చి మనమెట్లు ఆలోచన కలిగియుందుమో అట్లే మనతోటి విశ్వాసుల గూర్చి (వారి యొక్క భౌతికపరమైన మరియు ఆత్మీయ సంక్షేమము) మనము ఆలోచన కలిగియుండాలని బోధించెను ('మాకు', 'మాకు', 'మాకు' అంతేకాని 'నాకు', 'నాకు', 'నాకు' కాదు). ఆ ప్రార్థన కంఠస్థంగా నేర్చుకొని చిలకవలె తిరిగి చెప్పడం సుళువే. కాని ఆ పాఠాన్ని హృదయంలో నేర్చుకోవటానికి, మనమన్నిటిని విడచి దేవునిని మన హృదయ మధ్య భాగములో ఉంచుకొనవలెను. మన శరీర భాగములలో తరచు కనబడే నియమము (రోమా 7:22) మనము నిజాయితీగా తీర్పు తీర్చుకొనినట్లయితే స్వార్థపరత్వము అనే నియమముగా కనబడును. అది జీవితమంతా మన స్వంత సౌకర్యములను మరియు హక్కులను వెదకుకొనుటయే.


దేవుని రాజ్యమును మొదట వెదకమని యేసు క్రీస్తు బోధించారు. అది మన జీవితంలో 'నా' అనుదానిని సింహాసనము నుండి దించి దేవునిని ఆయనకు ఇష్టమైన వాటిని అక్కడ ఉంచుకొనుట. యేసు క్రీస్తు ఆయన తండ్రి చిత్తమును భూమిపై నెరవేర్చుటకు ఆయన పరలోకపు సౌఖ్యాలను విడచిపెట్టెను. పౌలు ప్రభువు కొరకు అపొస్తలుడుగా కష్టములను ఎదుర్కొనుటకు తార్సు పట్టణంలో ఒక క్రైస్తవ వ్యాపారిగా విలాసవంతముగా జీవించాల్సిన సౌఖ్యములను విడచిపెట్టెను. అపొస్తలులలో ప్రతి ఒక్కరు దేవుడు ప్రధానముగా నుండిన త్యాగపరితమైన జీవితాలను జీవించిరి. ఈనాటి అనేక యాత్రిక బోధకులు వలె కాక, దేవుని రాజ్యము ఈ లోకములో అభివృద్ధి చెందునట్లు వారికున్న దానినంతటిని ఇచ్చివేసిరి.


మన యొక్క స్వంత సౌఖ్యములను సౌకర్యములను ఇంకను వెతుక్కొనే పరిశుద్ధత, ఒకవేళ మనము కోపాన్నీ మరియు చెడు తలంపులను జయించినా, నిజమైన పరిశుద్ధతకాదు. దీనినే చాలా మంది అర్థము చేసికొనరు. అందువలననే సాతాను వారిని మోసము చేయగలుగుచున్నాడు. చాలా మంది క్రైస్తవులు వేరువేరు దేశములకు వారి స్వంత సౌఖ్యము కొరకు, సౌకర్యముల కొరకు మరియు సంపద కొరకు ప్రయాణములు చేయుట లేక వలసపోవుట చేయుచున్నారు. వారి జీవితాలపై అప్పటిని దేవుని ఆశీర్వాదముండవచ్చును. కాని దేవుని ఆమోదము ఉండదు, ఎందుకనగా ఎవడును సిరికిని (సంపద, భోగములు, సౌఖ్యము మొదలైనవి) దేవునికిని దాసుడుగా నుండలేడు. మనపై మన బిడ్డలపై ఉండిన దేవుని ఆశీర్వాదము, దేవుడు మన గూర్చి సంతోషిస్తున్నాడనుటకు గుర్తు అని మనమనుకొంటే సాతాను మనలను నిజముగా మోసగించాడన్నమాట. దేవుని ఆశీర్వాదము మరియు దేవుని ఆమోదము రెండూ రెండు వేరు వేరు విషయములు. ఈ లోకములో మన జీవితపు చివరన మనకుండాల్సిన సాక్ష్యము, అది ''అతడు దేవునికి ఇష్టుడై యుండెను'' (హెబీ 11:5). అవి కేవలము మూడు మాటలు, కాని ఎవరూ తన ఈలోక జీవితము గూర్చి అంతకంటె గొప్పబలమైన సాక్ష్యము కలిగియుండలేరు. యేసు ప్రభువు, పౌలు ఇటువంటి సాక్ష్యము కలిగియుండిరి. కేవలము అతడు దేవునిచేత దీవింపబడెను అను సాక్ష్యము ఏ విలువ లేనిది ఎందుకనగా ఎందరో అవిశ్వాసులు కూడా అటువంటి సాక్ష్యము కలిగియున్నారు.


దేవుడు కేవలము ఆయన ఆశీర్వాదము కొరకు కాక ఆయన ఆమోదము కొరకు వెదకు వారికొరకు చూచుచున్నాడు.


అధ్యాయము 15
మరియొక 'యేసు' - అతడి పరిచర్య

నీవు సుమారు 1960 సంవత్సరముల క్రితం ఇశ్రాయేలు దేశములో ఉన్నట్లును, అప్పుడు 'నజరేయుడైన యేసు' అనే వ్యక్తి రోగులను స్వస్థపరిచే పరిచర్య చేస్తున్నాడని విన్నావని ఊహించుకొనుము.. నీవు ఆయనను ఎప్పుడూ చూడలేదు. కాని అనుకోకుండా యెరూషలేమలో చాలా మంది ప్రజలు 'యేసు' అనే ఆయన బోధించే స్వస్థత కూటానికి గుంపులుగా వెళ్ళే ప్రదేశానికి నీవు దగ్గర్లో ఉండడం నీకు సంతోషం కలిగించింది.


నీవు ఆ కూటము దగ్గకు వచ్చినప్పుడు స్టేజి మీద 'యేసు' (ఆ బోధకుడు) తో పాటు, పిలాతు, హేరోదు ఇంకా అన్న, కయప కూడా కూర్చొనియుండుట నీవు కనుగొన్నావు. అప్పుడు 'యేసు' ముందుకు వచ్చి జనసమూహముల నుద్దేశించి ఇశ్రాయేలు దేశములో గొప్ప లౌకికరాజ్య పరిపాలకులైన ఘనత వహించిన హేరోదు మరియు పిలాతు ఆ రోజు కూటమునకు వచ్చుటచేత వారి వలన కూటమునకు గౌరవము వచ్చినదని చెప్పెను. అంతేకాక, 'ఇద్దరు గొప్ప దైవ జనులు రైట్‌ రెవరెండ్‌ అన్న మరియు కయప ఆ రోజు కూటమును దీవించుటకు అక్కడున్నారు' అని చెప్పెను.


పరిచయ పూర్వకముగా ఈ మాటలు చెప్పిన తరువాత హేరోదు, పిలాతు ఆ కూటమును ప్రారంభించి కొద్ది మాటలు మాట్లాడమని 'యేసు' ఆహ్వానించెను. అప్పుడు హేరోదు, పిలాతు 'యేసు'ను పొగుడుతూ ఆయన యొక్క పరిచర్య వలన సమాజమునకు ఎంతో మేలు జరుగుతున్నదనియు, ప్రజలందరి యొక్క మద్ధతు పొందుటకు ఆయన అర్హుడని వారు చెప్పిరి. తరువాత రైట్‌ రెండరెండ్‌ అన్న, కయపలు కొద్ది మాటలు చెప్పి ప్రారంభ ప్రార్థన ప్రార్థించుటకు 'యేసు'చే పిలువబడిరి. వారు కూడా 'యేసు'ను ఎంతగానో స్తుతించి, వారి సంఘాల్లో నుండిన వారందరూ 'యేసు' యొక్క పరిచర్యను వారి హృదయమంతటితో బలపర్చాలని చెప్పిరి.


అటు తరువాత సేవ యొక్క ఆర్థిక అవసరాలు తెలుపుటకై 'యేసు' ఇస్కరియోతు యూదాను ఆహ్వానించెను. యూదా, సేవకు అవసరమైన వేలకొలది దేనారముల గూర్చి చెప్పెను. వాలంటీర్ల దరఖాస్తులు ఉంటాయనియు ఎవరైతే 1000 కంటే ఎక్కువ దేనారీలు విరాళముగా ఇచ్చెదరో వారి కొరకు (వారు విశ్వాసులైనా, అవిశ్వాసులైనా పర్వాలేదు - ఇవ్వగలిగిన వారందరూ రావచ్చును. ఎంత ఎక్కువ ఇవ్వగలిగినట్లయితే అంత మంచిది) 'యేసు' ప్రత్యేక ప్రార్థనలు చేయునని ప్రకటించెను. అప్పుడు హేరోదు లేచి ఈ సేవ కొరకు ఇచ్చు సొమ్ముపై ఆదాయపు పన్ను లేకుండా చేయుదునని ప్రకటించెను. అప్పుడు కానుకలు పట్టిరి. అప్పుడు 'యేసు' ఒక క్లుప్తమైన ప్రసంగము చేసి, సామాన్యులు ఆశ్చర్యపోవునట్లు ఆయన యొక్క అద్భుత శక్తులను కొన్నిటిని చూపించి, కొందరు రోగులను స్వస్థపరచెను. అది అయిన తరువాత ఎవరైన ఆయనను కలుసుకొనుటకు అవకాశము లేకుండా ఆయన హేరోదు, పిలాతు, అన్నా , కయపలతో పాటు రోమా రాజ్యమునకు సంబంధించిన రాజరథముపై యెరూషలేము మధ్యలో నున్న ప్రధాన యాజకుని భవనానికి వారితో విందు చేయుటకు వెళ్ళిపోయెను.


ఇదంతా జరిగిన తరువాత, నీవు క్రొత్తగా క్రీస్తులోనికి మారిన వాడవైనప్పటికిని, నీకున్న కొద్ది వివేచనతో అనుభవముతో నీ మనసులో అసౌకర్యానికి గురి అయ్యావు. ఇంతవరకు నీవు చూసినదంతా నీవు అపొస్తలులైన మత్తయి, పేతురు, యోహానుల దగ్గర నుండి యేసును గూర్చి విన్న వివరణలతో సరిపోవుట లేదు.


అయినా సాతాను నీ చెవుల దగ్గరకు వచ్చి 'తీర్పు తీర్చకూడదు' (మత్తయి 7:1) 'అని వ్రాయబడియున్నది' అని చెప్పును. కాని 'అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేదో పరీక్షించుడి' (1 యోహాను 4:1) అని కూడా వ్రాయబడెను అని నీవు అతడితో చెప్పుదువు.


చివరకు నీవు ఒక నిర్ణయానికి వచ్చెదవు. ఇది నేను వినినది యేసు కాదు. ఇది తప్పక 'మరియొక యేసు' (2 కొరింథీ 11:4).


నీవు తప్పుకాదు.


ఇది నిశ్చయముగా ''మరియొక యేసే''.


చివరకు నీవు ఆ నిర్ణయానికి ఎలా వచ్చావు? నీలో నుండిన అభిషేకము ఈ క్రింది నిజాలను నీకు చెప్పినది (1 యోహాను 2:19, 20, 27).


1. నిజమైన యేసు ఈలోక అధిపతులు, పరిపాలకుల నుండి మద్దతు కాని తన పరిచర్యకు రక్షణలేని మత పెద్దల నుండి సిఫార్సులు కాని కోరడు. అలాగే ఆయన వారెవరినీ పొగడ్తలతో ఎత్తి వేయడు. ఆయన యొద్దకు ఆ కాలపు బిషప్పు వచ్చినప్పుడు అతడు తిరిగి జన్మించాలని అతనితో చెప్పెను (యోహాను 3:1-10). హేరోదు రాజును యేసు 'నక్క' అని పిలిచారు (లూకా 13:31, 32). అంతే కాకుండా అతడు ఆయనను కలుసుకొన్నప్పుడు అతడితో మాట్లాడటానికి కూడా తిరస్కరించెను (లూకా 23:8, 9).


2. నిజమైన యేసు ఎప్పుడు ఎవ్వరినీ డబ్బు అడగడు. చివరకు అది తన పరిచర్య కోసమైనా సరే, ఆయన తన అవసరతలను తండ్రికి మాత్రమే తెలియజేసెను. అప్పుడు తండ్రి యేసు అవసరములు తీరునట్లు ప్రజలను లేక చేపనైనను (ఒకమారు అట్లు జరిగినది) కదిలించెను (లూకా 8:1-3, మత్తయి 17:27).


3. నిజమైన యేసు ఆయన ప్రార్థనలనెప్పుడూ ఎంత ధరకైనా 'అమ్మడు'. సమరయలో గారడీవాడైన సీమోను పేతురు యొక్క ప్రార్థనలకు డబ్బు ఇవ్వబోయినప్పుడు, దైవికమైన వరమును డబ్బుతో కొనాలని అనుకొనిన దుష్టత్వమును గూర్చి పేతురు అతడిని గద్దించెను (అపొ.కా.8:18-23). సీమోను వెంటనే పశ్చాత్తాపపడెను. కాని అతడిని అనుసరించు వారు మారుమనస్సు పొందని వారు అనేకులు ఈ శతాబ్దాలన్నిటిలో యున్నారు. రోమన్‌ కేథలిక్‌ పోపులు (సీమోనును గద్దించిన పేతురు వారసులమని చెప్పుకొనేవారు) వారి ప్రార్థనలను డబ్బుకు అమ్ముకొనేవారు. మార్టిన్‌ లూథర్‌, ఆయన కాలంలో, పేతురువలె అటువంటి దుష్టత్వాన్ని ఎదురించెను. కాని లూథర్‌ తరువాత వచ్చిన వారిలో కొందరు (ఈనాటి ప్రొటెస్టెంటులు) తిరిగి ఆ పాత పద్ధతికి వెళ్ళిపోయి వారి 'ప్రార్థన' లను మరియు వారి 'ప్రవచనాల'ను డబ్బుకు అమ్ముకొనుచున్నారు. అయ్యో, గారడీ సీమోను వలె వారికి డబ్బు చెల్లించుటకు అనేకమంది జనులు సిద్ధముగా ఉన్నారు.


ఆఖరి దినాల్లో ఏర్పరచబడినవారు సహితము మోసగింపబడునట్లు మోసము చాలా నిగూడముగా నుండునని యేసు చెప్పెను. ముఖ్యముగా వారు సూచక క్రియలతోను అద్భుతాలతోను మోసపోవుదురు (మత్తయి 24:24). ఈ రోజుల్లో ఏర్పర్చుకొనబడినవారు జాగ్రత్తగా నుండి బహు జాగ్రత్తగా పరీక్షించాల్సినది సూచకక్రియలు మరియు అద్భుతాలతో కూడిన పరిచర్యను యేసుప్రభువు వారి గదిలోనికి వచ్చి మాట్లాడెనని ప్రజలు మనతో చెప్పినప్పుడు నమ్మవద్దని యేసు ప్రభువు మనతో చెప్పెను (మత్తయి 24:26 చూడండి). పునరుత్థానమైన యేసు యొక్క శరీరము ఆయన ఆరోహణుడైన తరువాత ఇంతకాలము (సుమారు 1900 సంవత్సరాలపైన) ఎప్పుడూ తండ్రి కుడి పార్శ్వమును విడిచిపెట్టలేదు. పౌలు, స్తెఫెనులు ఆయనను అక్కడనే చూచిరి (అపొ.కా. 7:56; 9:3). యోహాను కూడా పత్మాసు ద్వీపములో యేసు యొక్క భౌతిక శరీరమును చూడలేదు కాని యేసును సూచించిన సాదృశ్యములను మాత్రమే చూచెను (పక్రటన 1:13-16). యేసు ప్రభువు భూమిపైకి రెండవ రాకడలో వచ్చినప్పుడు మాత్రమే పరలోకమును విడిచిపెట్టును.


అందువలన ఈ రోజుల్లో ఆయన వారి గదుల్లోనికి వచ్చెనని చెప్పినప్పుడు నమ్మవద్దు.


ప్రతి చిన్న అనుభవానికి ఆకర్షితులైపోయే అమాయక విశ్వాసుల మధ్య జీవిస్తూ యున్నప్పుడు మనము వివేచన లేకుండా యుండకూడదు. ఈ ఆఖరి దినాల్లో కోరుకున్న వారికి తేటగా కనబడునట్లు దేవుని వాక్యము వెలుగునిచ్చును. మనము ఆ వెలుగును మాత్రమే అనుసరించి వెళ్ళినట్లయితే, మనమెప్పుడును మోసపోము.

అధ్యాయము 16
మత మౌఢ్యము యొక్క గుర్తులు

''అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్ఛ కలిగి, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును.....'' (కొలొస్స 2:18, 19).


''తమ ఆలోచనల ననుసరించి చెడు మార్గమున నడచుకొనుచు....మా దాపునకు రావద్దు ఎడముగా నుండము నీకంటె మేము పరిశుద్ధలమని చెప్పుదురు....'' (యెషయా 65:2, 5).


''మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున....మెళకువగా ఉండుడి'' (అపొ.కా 20:30, 31).


యేసు ప్రభువుతో పాటుగా ఒక వ్యక్తికిగాని లేక ఒక బోధకునికిగాని అంకితమై యుండుట మతమౌఢ్యము. అది ప్రభువుతో పాటు ఏలీయాకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాల వేయుట వంటిది. అది ఎప్పుడు దేవుని సన్నిధిని మరుగుచేసే మేఘమును తీసకువచ్చును. అయితే యేసు ప్రభువు మాత్రమే మన జీవితాల్లో కేంద్రముగా నుండవలెననునది దేవుని చిత్తము (మత్తయి 17:1-8).


చివరి దినాల్లో క్రైస్తవ్యములో మతమౌఢ్యము ఎక్కువగుట చూచుదుము. శిరస్సైయున్న క్రీస్తుతో వ్యక్తిగతమైన దగ్గర సహచర్యమునకు బదులు ప్రభువు యొక్క దూతలను వారు పూజించుట చేత అనేకులు వీటికి ఎరయై పోవుదురు.


ఈ ప్రమాదము నుండి రక్షింపబడుటకు మతమౌఢ్యము యొక్క గుర్తులను కొన్నిటిని మనము చూచుట మంచిది. దానివలన అన్నివేళలా దానికి వ్యతిరేకముగా మెళకువగా నుండవచ్చును.


మతమౌఢ్యునిగా నుండుటకును మతమౌఢ్యవాదులతో కలసి యుండుటకును వ్యత్యాసమున్నది.


వాక్యప్రకారముగా సరిగానుండిన బోధకలిగి, నాయకులు దైవభక్తి గలవారుగానుండిన సంఘములో నీవుండినను నీ వైఖరిలో నీ నాయకుని యెడల, నీ గుంపు యెడల మరియు ఇతర సంఘములలో నుండిన విశ్వాసుల యెడల నీవు మతమౌఢ్యతతో యుండవచ్చును. మతమౌఢ్యము, తప్పుడు బోధలోనే కాక తప్పుడు వైఖరులలోనూ చూడవచ్చును.


కొందరు వారి సిద్ధాంతపరమైన, బోధ విషయములో సరిగానుండి మరియు వారి జీవితములలో సత్యవంతులుగా నుండి కూడా వారి వైఖరులలో నుండిన మత మౌఢ్యత గూర్చి తెలియనివారుగా యుందురు.


1. క్రీస్తు మరియు వేరొక వ్యక్తి


మత మౌఢ్యము యొక్క ప్రధానమైన గుర్తు ఏమిటంటే దానికి ఒక నాయకుడు ఉండును (సాధారణముగా ఆ గుంపును స్థాపించినవాడు). అతడు ఎంతగా గౌరవింపబడునంటే అతడి యొక్క జీవితము పరిపూర్ణముగా నుండినట్లును మరియు అతడి బోధలు దేవుని యొక్క వాక్యమునకు సమానమైనట్లుగా ఎంచబడును.


బెరెయలో నుండిన యూదులు పౌలు బోధలు లేఖనానుసారముగా నున్నవో లేదో సరిచూచుటకు ప్రతిదినము లేఖనములను పరిశోధించుట చేత పరిశుద్ధాత్ముడు వారిని ''ఘనులైనవారు'' అనెను. పౌలు గొప్ప అపొస్తలుడు, అయినను అతడి బోధలు కూడా లేఖనములతో సరిపడియున్నవో లేదో పరీక్షింప బడవలసి వచ్చినది (అపొ.కా. 17:11).


ఒక కూటములో ప్రవక్తలు మాటలాడునప్పుడు కూడా ''ఇతరులు వివేచింపవలెనని'' బైబిలు చెప్పుచున్నది (1 కొరింథీ 14:29). ఇతరులు వివేచింపవలసినది ఏమిటి? అది ప్రవక్తలు చెప్పినది దేవుని వాక్యములో ఉండినదో లేదో చూచిన విధముగా వివేచింపవలెను. ఇది మత మౌఢ్యమునుండి బాగుగా కాపాడును.


మత మౌఢ్యులైన విశ్వాసులు, తమ నాయకుడు చెప్పినది ఏదైనా దానికి వాక్యానుసారమైన పునాది ఉన్నదోలేదో పరీక్షించకుండా అంగీకరించేంత గౌరవాన్ని వారి నాయకునిపై కలిగియుందురు. అటువంటి వారు బెరయనులు వంటి ఘనమైన మనసు కలిగిన వారుకారు.


మతమౌఢ్యపు గుంపులో, దానిని స్థాపించిన నాయకుడు మరణించిన తరువాత, ఆ నాయకత్వము తీసుకొనిని వ్యక్తి ఆ గుంపునకు నాయకునిగా గుర్తింపబడును. ఆ గుంపులోనుండిన వారందరు వారి ప్రస్తుత నాయకుడు జీవించుచున్న దైవజనులందరిలో గొప్పవానిగా ఎంచబడవలెను. అటువంటి వైఖరి ఒక నాయకుని బోధలకు, అధికారమునకు ప్రశ్నించకుండా ఉండే విధేయతను కలిగించును. ఆ గుంపులో సభ్యులపై అతడి యొక్క అధికారము పోపు యొక్క అధికారము వలె నుండును మరియు అతడి మాట చట్టముగా నుండును.


అనేక మతమౌఢ్య గుంపులలో, నాయకునికిక ఒక కుమారుడు ఉన్నయెడల, ఆ గుంపు యొక్క నాయకత్వపు బాధ్యలతను వహించుటకు అతనికి నెమ్మదిగా తర్ఫీదు ఇవ్వబడును. ఆ గుంపు సభ్యులందరు తండ్రిని గౌరవించినట్టే నెమ్మదిగా కుమారుని గౌరవించుట మొదలుపెట్టుదురు.


2. బైబిలు మరియు మరియొక పుస్తకము


మత మౌఢ్యత యొక్క రెండవ గుర్తు ఏమిటంటే దానికి బైబిలుతో పాటుగా వేరొక పుస్తకము ఉండును (అది సాధారణముగా ఆ గుంపు నాయకుడు వ్రాసినదిగా యుండును). అది అభ్యాసాత్మక విషయములలో, బైబిలువంటి అధికారమున్నదిగా ఎంచబడును.


అనేకమైన గుంపులు వారి స్థాపకుని యొక్క వ్రాతకు అటువంటి ఉన్నత స్థానము ఇచ్చిన విషయాన్ని ఒప్పుకొనరు. కాని ఆ ఒక్క పుస్తకము యెడల వారి వైఖరి వారుదానిని బైబిలుతోసమానముగా నుంచుచున్నారను విషయాన్ని రూఢిపర్చును. వారి క్రియలు వారి మాటలకంటె బిగ్గరగా మాటలాడును.


ఈ గుంపు ప్రారంభదశలో ఎంతో యథార్థత మరియు ప్రభువు యెడల నిజమైన భక్తియుండియుండవచ్చును. కొన్నిసార్లు స్థాపించిన వారు నిజమైన దైవజనుడైయుండవచ్చును. కాని సాధారణముగా తరువాతకాలములో, అతడిని అనుసరించినవారు అతడి యొక్క వ్రాతలను మరియు బోధలను ఒక సిద్ధాంతముగా క్రోడీకరించి దానికి బైబిలుక్నునటువంటి అధికారమును ఇచ్చుదురు.


ఆ విధముగా స్థాపకుని వ్యక్తిగత అభిప్రాయములు అతనిని వెంబడించిన వారికి దేవుని యొక్క మాటగాయుండును. స్థాపకుడు నిజమైన దైవజనుడైనట్లయితే, అతడి జీవితకాలములో అట్లు జరుగకుండా చూచును. అయితే అతడు దైవజనుడు కాకపోయినట్లయితే, అతడి జీవిత కాలములోనే అతడు చెప్పువాటికి దైవికమైన అధికారమున్నట్లు చెప్పును.


మతమౌఢ్య గుంపులో నున్నవారు దాని స్థాపకుడు వ్రాసిన పుస్తకమునే మరల మరల చదువుదురు. చాలామంది దానిని వారి ప్రయాణములలో ఎక్కుడకు వెళ్లినా వారి వెంట తీసుకువెళ్లుదురు మరియు దానినుండి విషయములను ఎత్తిచూపుచుందురు. బైబిలు కుండిన అధికారము దానికిని ఇచ్చుచుందురు. ఆ పుస్తకము ఏదైనా ఒక వచనము యొక్క భావమును, లేక సిద్ధాంత వివరణను ఒక విధముగా ఇచ్చినట్లయితే, అదే విధమైన గ్రహింపును ఆ గుంపులో సభ్యులందరు ఆ వచనము గూర్చి మరియు సిద్ధాంతము గూర్చి కలిగియుండవలెనని అనుకొందురు.


ఆ పుస్తకమును అదేపనిగా చదువుట వలన అది మతమౌఢ్య విశ్వాసి యొక్క మెదడు జ్ఞానవత్తిడికి గురిఅగును. కనుక అతడు క్రమేణ లేఖనములను ఆ పుస్తకములో వివరింపబడినట్లుగా మాత్రమే వివరించును. ఆ విధముగా అతడి మెదడు మారిపోయినందున దేవుని వాక్యములో అనేక భాగముల గూర్చి నూతనమైన వెలుగును ఆత్మ ద్వారా పొందుటకు అశక్తుడగును. దానికి కారణము అతడు తన మనస్సులో వాటి భావమును ముందుగానే నిర్ణయించుకొని యుండుట.


ఇది రోమను క్యాథలికు పాదిరులు తమ అనుచరులకు రోమను క్యాథలికు వేదాంతులు బైబిలును వివరించినట్లే అది వివరించబడవలెనని చెప్పినట్లుండును.


మత మౌడ్యపు గుంపు యొక్క సిద్ధాంతములు గూర్చిన లేక వారి నాయకుల బోధల గూర్చిన ప్రశ్నలు పూర్తిగా నొక్కివేయబడును.


3. సహవాస విషయములో విడిగానుండుట (వ్యతిరిక్తముగా నుండుట)


మతమౌఢ్యత యొక్క మూడవ గుర్తు సహవాసములో వ్యతిరిక్తత.


మత మౌఢ్యపు భావన ఉండిన విశ్వాసులు వారి స్వంత గుంపు వారితో తప్ప ఇతర తిరిగి జన్మించిన విశ్వాసులతో సహవాసము ఆత్మీయముగా విలువ లేనిదిగా చూచుదురు. వీరు సాధారణముగా వారి సభ్యులను ఇతర విశ్వాసులను వారిగుంపులో కలుపుకొనుటకు తప్ప ఇతర విశ్వాసులతో మరి ఏ విధమైన సంబంధమునైనా కొనసాగనివ్వరు. అటువంటి గుంపు సాధారణముగా తమదే యథార్థమైన సంఘమని మరియు క్రీస్తు యొక్క పెండ్లికుమార్తెకు సంబంధించిన వారందరు చివరకు వారి యొద్దకే చేరుదురని నమ్ముదురు. వారి అహంభావము నిజంగా ఊహించరానిది!


సహవాస విషయములో అట్లు వేరుగా నుండుట, అనేకమంది మతమౌఢ్యవాదులను మతవిషయములో అహంభావము కలవారుగాను మరియు అక్షరానుసారముగా ఆచరించే పరిసయ్యులుగాను చేయును. దేవుని వాక్యములో వారు పొందామని చెప్పు ''గొప్ప పరిజ్ఞానము'' వారిలో ఇతర విశ్వాసుల యెడల ''మేము'' ''మీరు'' అని వైఖరిని అభివృద్ధి చేయును. అటువంటి మత మౌడ్యపు విశ్వాసులు సాధారణముగా వారిలోనుండే పరిసయతత్వము గూర్చి ఎరుగక యుండి, వారే యేసు ప్రభువు యొక్క నిజమైన భక్తులని మరియు దీనులైన శిష్యులని అనుకొందురు. మానవ మనస్సు తననుతాను అంతగా మోసగించుకొను శక్తి కలిగినది. అయితే ఆ గుంపును బయట నుండి చూచువారు వారిలో న్నున పరిసయతత్వమును చాలా తేటగా చూడగలరు.


నిజమైన పరిశుద్ధత అనేది దేవుని కృప వలన మాత్రమే కలుగుతుంది (ఇది రోమా 6:14లో ఎంతో స్పష్టంగా తెలియజేయబడింది) మరియు దేవుడు కేవలం దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు (1 పేతురు 5:5). కాబట్టి నిజమైన పరిశుద్ధత యొక్క ప్రాథమిక లక్షణం దీనత్వం మాత్రమే. ఎక్కడైతే దీనత్వం లోపిస్తుందో, మతమౌఢ్య గుంపుల దగ్గర మనకు కనబడే 'పరిశుద్ధత' అంతా కూడా ధర్మశాస్త్రము వలన కలుగు నీతిమాత్రమే (మానవ ప్రయత్నం వలన జరిగినది). అందుకే అనేకమంది మతమౌఢ్యులు వారి 'పరిశుద్ధ జీవితములను' బట్టి 'పరిశుద్ధ గృహములను' బట్టి గర్విస్తుంటారు. ఒకవేళ వారి పరిశుద్ధత దేవుని కృప వలన కలిగియుండుంటే దాని గురించి వారు గర్వించే అవకాశం ఉండదు.


అటువంటి గుంపులలో నుండు వారు సాధారణముగా వారి గుంపులో నాయకులు వ్రాసిన పుస్తకములు మాత్రమే చదువుదురు. వారి నెల పత్రికలలో మరియు వాజ్మయములో వారి గుంపువారు వ్రాసిన ప్రసంగములు మాత్రమే యుండును. కొన్ని గుంపులు ఇతర విశ్వాసులు వ్రాసిన వాటిని చదువవద్దని గట్టిగా హెచ్చరించుచు అపొస్తలుల తరువాత క్రైస్తవత్వములో వారి గుంపు తాలుకా నాయకులు తప్ప మరి ఏ దైవజనులు లేరని చెప్పుదురు. జనులను మోసపుచ్చుటకు మతమౌఢ్యము యొక్క శక్తి అట్లుండును.


ఈ గుంపులలో వారు కేవలము వారి గుంపులో వారు వ్రాసిన పాటలు మాత్రమే పాడుదురు. వారి పాటల పుస్తకములలో అటువంటి పాటలు మాత్రమే యుండును. ఇతర కీర్తనలు తప్పుడు ఆత్మతోనుండునని అందువలన వాటిని ప్రమాదకరమైనవిగా చూచుదురు!!


ఆ విధముగా ఈ మతమౌఢ్య గుంపులు వారి సభ్యులను బయట ప్రపంచముతో సంబంధము లేని మానవ నిర్మిత గూళ్ళలో, శతాబ్దాల తరబడి దేవుడు ఇతర దేశములలోని దైవజనుల ద్వారాను మరియు వారి కాలములో ఇతర సంఘములలోని దైవజనుల ద్వారా ఏమిచేసెనో తెలియకుండా ఉంచుదురు.


ఎప్పుడైతే ఒకడు దైవభయముగల ఇతర విశ్వాసులతో సంబంధము లేకుండా జీవించునో, అప్పుడు వాస్తవముతో సంబంధము కోల్పోయి తన్నుతాను మోసము చేసికొనుచు స్వాతిశయముతో జీవించుట ప్రారంభమగును.


దేవుడు అంగీకరించిన బిడ్డలలో ఒక్కరినైనను మనము మన సహవాసపు పరిధిలో నుండి ఏ కారణము చేతనైననూ వేరుచేసినట్లయితే, నష్టపోయేది మనమే. ఎందుకనగా ''పరిశుద్ధులందరితో కూడి మనము క్రీస్తు యొక్క ప్రేమయందు వేరుపారవలెనని మరియు సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా దేవుడు ఏర్పర్చెను'' (ఎఫెసీ 3:18, 19).


ఇది క్రైస్త సంఘములు అన్ని ఒక్కటే అని గాని లేక రాజీ విధానాన్ని గాని ప్రోత్సహించుట కాదు. అనేక మంది విశ్వాసులు బబులోను వ్యవస్థలలో ఉండుట మనకు సంబంధము లేదు, మరియు అటువంటి వాటినుండి బయటకు రమ్మనమని విశ్వాసులను ఎప్పుడూ ప్రోత్సహించవలెను. కాని మన హృదయములు ఎప్పుడూ దేవునికి భయపడు యేసు క్రీస్తు శిష్యులకు తెరవబడి యుండవలెను. మన ప్రభువే ఒకరిని అంగీకరించినప్పుడు, అతడు మనతో ఏకీభవించనప్పటికీ అతనిని తృణీకరించుటకు మనకు ఏ హక్కు ఉన్నది? (లూకా 9:49, 50).


ఒకే బృందములో కలసి పనిచేయునప్పటికీ, వ్యక్తులుగా ఎలా కలసి సహవాసము చేయుట సాధ్యమో అనుదానికి పౌలు, బర్నబా మంచి ఉదాహరణలు (అపొ. కా. 15:36-41). వారు ఒక అంశము గురించి గట్టిగా విభేదించి కలసి పనిచేయుటకు ఏ విధమైన మార్గమును కనుగొనలేకపోయిరి. కాని వారు ఒకరితోనొకరు సహవాసమును తెంచుకొని, ఒకరినొకరు ద్వేషించి, ఒకరినొకరు తిట్టుకోలేదు. వారు వీటిలోదైనినైనా చేస్తే వారు మతమౌఢ్యులుగా మారేవారు. కాని వారు ఒకరినొకరు ప్రేమించి విడిగా పరిచర్యచేసిరి. వారు ఒకరికొరకు ప్రార్థించిరి. మతమైడ్యులకు ఇలా చేట అసాధ్యముగా అనిపించును. వారికి పూర్తిగా లోబడువారితోనే వారు సహవాసము చేయగలరు.


4. సువార్త ప్రకటన విషయములో భారము లేకపోవుట


మతమౌఢ్యపు గుంపుల యొక్క నాల్గవ గుర్తు ఏమిటంటే లోకములో దేవుని ఎఱుగని వారికి సువార్త తీసుకు వెళ్లవలెననే భారము వారికి ఉండదు.


ఇటువంటి కొన్ని గుంపులు కొద్ది పరిమితులతో క్రైస్తవేతరుల మధ్య సువార్త ప్రకటించినా, సాధారణముగా, చాలా మత మౌఢ్యపు విశ్వాసులు క్రైస్తవుల మధ్య మాత్రమే పనిచేయుదురు. వారికి యేసు ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించాలనే (మార్కు 16:15) ఆశ యుండదు. దానికి బదులుగా, ఇతర విశ్వాసులనుండి వారి స్వంత గుంపులోనికి శిష్యులుగా చేసికొనుటకు మాత్రమే చూచుదురు.


ఈ గుంపులు సాధారణముగా ఒకరికొరకు దగ్గరగా ఉండే సహవాసము కలిగియుండి, ఒకరి గురించి ఒకరు పట్టించుకొనుచు, ఒకరి యెడల ఒకరు అనేక విధములుగా మంచిగా యుందురు. అందుచేత అనేక విశ్వాసులు వారి మధ్య భధ్రత కలిగి ఉన్నట్లు అనుకొందురు. ప్రేమలేని క్రైస్తవత్వాన్ని ఎదుర్కొనిన భధ్రతలేని క్రైస్తవులు మరియు దేవునిలో కాక విశ్వాసుల సమాజములో భద్రతను మరియు అంగీకరింపబడుట కొరకు చూచేవారు, ఎక్కువగా ఈ గుంపుల వైపు ప్రేమ పొందుట కొరకు ఆకర్షింపబడుదురు. కాని ఆ విధముగా వ్యతిరిక్తముగా ఉండుట వలన తమ క్రైస్తవ జీవితములో తాము తరువాత ఎదుర్కొనే ప్రమాదాల యొక్క అవగాహన వారికి సాధారణముగా ఉండదు.


ఈ గుంపులో విశ్వాసులు 'క్రొత్తగా వచ్చినవారు' వారి గుంపులో పూర్తిగా కలిసిపోవుటకు వారిపై ఎక్కువ అభిమానమును ప్రత్యేకతను చూపుదురు. ఒక క్రొత్తగా వచ్చినవాడు ఒకసారి వారితో కలసినట్లయితే క్రమేణ అతడు వారి బోధలన్నిటిని మరియు వారి నాయకుని యొక్క ''దైవిక అధికారమును'' అంగీకరించునని వారికి తెలియును.


అటువంటి గుంపులో కొన్ని సంవత్సరములుండిన తరువాత, చాలామంది విశ్వాసులు వారు తిరిగి ఒంటరి వారైపోయి ఎవరూ పట్టించుకొనరనే భయముతో ఆ గుంపును విడిచి పెట్టు ఆలోచనలు రానివ్వరు. ఆ భయము ''యథార్థమైన సంఘమనుండి పడిపోవుదుమేమో'' అను ఆలోచనతో కలిసియుండుట చేత ఆ గుంపులలో విశ్వాసులు వారి జీవితాంతము ఆ ఉచ్చులోచిక్కుకొని యుందురు.


శతాబ్దముల నుండి దేవుని భయము గల మిషనరీలు క్రీస్తు నెరుగని వారిని క్రీస్తునొద్దకు తీసుకువచ్చుటకు, అనాగరిక పరిస్థితులలో వారి మధ్య నివసించినటువంటి త్యాగములు ఈ గుంపులో విశ్వాసులు సాధారణముగా చేయరు. వారు అటువంటి మిషనరీ పని గూర్చి చాలా తేలికగా మాటలాడుదురు. అటువంటి పనిచేయుట కష్టమైనది కాబట్టి వారు సహజముగా అట్లు మాటలాడుదురు!


ఈ గుంపుల బోధకులు, అన్య దేశాలకు వెళ్లినా కేవలము దర్శించు బోధకులుగా వెళ్లుదురు. అన్య దేశాలలో స్థానిక ప్రతినిధులను నియమించే సుళువైన పద్ధతిని వారు ఎంచుకొందురు. ఆ విధంగా ఆ ప్రాంతములో వారి గుంపు యొక్క పనిని వారు పెంపొందించుదురు మరియు వారి వార్షిక దర్శనాలలో వారికొరకు కూటములు ఏర్పాటు చేసుకొందురు. దానికి ప్రతిఫలంగా ఆ స్థానిక ప్రతినిధులు బహుమానములు పొందుదురు లేక ఆ గుంపు యొక్క ప్రధాన కార్యాలయములకు అన్ని ఖర్చులతో కూడిన ప్రయాణమును లంచముగా అప్పుడప్పుడు పొందుదురు.


క్రీస్తు అపొస్తలులు పేదవారు గనుక వారు ఎవరికీ అటువంటి లంచాలను ఇవ్వలేకపోయిరి. కాబట్టి అన్యదేశాలలో వారు దేవుని కొరకు ఒక యథార్థమైన పరిచర్యను చేసిరి.


5. విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడుటను విలువలేనిదిగా చేయుట


మత మౌఢ్యపు గుంపుల యొక్క అయిదవ గుర్తు ఏమిటంటే వారు క్రియలు ద్వారా నీతిమంతునిగా తీర్పు తీర్చబడుటను బోధించి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటను విలువలేనట్లు చేయుదురు.


క్రియలు మన విశ్వాసమునకు ఋజువు అని లేఖనములు చెప్పుచున్నవి (యాకోబు 2:24). అయితే ''పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది'' (రోమా 4:5) అని కూడా చెప్పుచున్నది.


ఇక్కడ ఉన్న ప్రమాదము ఏదో ఒక దానిని తక్కువ చేసి చెప్పుట కాదు, కాని తప్పుడు బోధయైయున్నది. ఎప్పుడైతే బైబిలులో ఉన్న ఒక సత్యమునకు, ఇతర సత్యముల కంటే ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చినప్పుడు అది తప్పుడు బోధయగును. ఇంకా, మనము ఒక బైబిలు సిద్ధాంతమును పట్టుకొనియుండి దానిని మన సంఘములలో ఎప్పుడూ బోధించక యుండినట్లయితే, అది మనము దానిని నమ్మని దానితో సమానముగా నుండును. బయటకు మాటలాడని సత్యము, ఉపయోగించని కండరమువలె, క్రమేణ దాని కదలికను కోల్పోవును మరియు అటువంటి సత్యము సంఘములో లేకుండా పోవును.


''సత్యమనేది విపరీత ధోరణులలో దాగిలేదు. కాని అది వాటి మధ్యలో ఉంటుంది. విపరీత ధోరణులలో ఉన్న సత్యాన్ని ఇది కలిపి పట్టుకుంటుంది''.


మన బోధలు ఇతరులు అనుసరించుచున్న విపరీత ధోరణలకు ప్రతిస్పందనగా నుండకుండా జాగ్రత్త పడవలెను. అనేక బోధకులు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట గూర్చిన బోధను పాపము చేయుటకు అనుమతిగా మార్చివేసిరి. అందువలన ఆ లేఖనానుసారమైన సత్యమును మనము పారవేసి మరొక విపరీతమైన క్రియల ద్వారా మాత్రమే నీతిమంతునిగా తీర్చబడుట అనుబోధ యొద్దకు వెళ్లకూడదు.


సాధారణంగా చెప్పాలంటే మతమౌఢ్య గుంపులకు చెందినవారు క్రియలద్వారా నీతిమంతులముగా తీర్చబడుతామని బోధిస్తుంటారు. క్రైస్తవేతన మతములన్నీ కూడా ఇవే బోధిస్తాయి. ఒకవేళ మతమౌఢ్య గుంపులవారు రోమా 4వ అధ్యాయమును బోధించినట్లయితే ఈ అధ్యాయం కూడా క్రియల ద్వారానే నీతిమంతులముగా తీర్చబడతామని బోధిస్తుంది అని చెబుతారు. ఈ మత మౌడ్య విశ్వాసులు ''క్రీస్తే మన పరిశుద్ధతాయెను'' (1కొరింథీ 1:30) అనే సత్యమును కూడా తక్కువ చేసి చూపెడతారు. ''ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి మనలో నెరవేర్చబడెను'' (రోమా 8:4) అనే మాటను ఎక్కువచేసి చూపిస్తారు. కాని మొదటి వాక్యమే రెండవ వాక్యమునకు పునాది అని వారు గుర్తించరు.


వారు క్రీస్తు రక్తమును కూడా అంత ముఖ్యమైనదిగా చూడరు మరియు దాని గూర్చి మాటలాడరు. ఒకవేళ మాటలాడినా మర్మగర్భముగా మరియు అర్థము చేసికొనుటకు క్లిష్టమైనదన్నట్లుగా మాటలాడుదురు.


ఏ సంఘము లోనైనా పాడే పాటలు ఆ సంఘము యొక్క ముఖ్యమైన నమ్మకములకు సూచనగా యుండును. నీవు మత మౌఢ్యపు గుంపువారి పాటల పుస్తకములను చూచినట్లయితే, అందులో పాపక్షమాపణ గూర్చి, విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడుట గూర్చి లేక యేసు రక్తము ద్వారా పాపములు కడుగబడుట గూర్చిన పాటలు చాలా తక్కువగా యుండును.


మనము పరలోకములో శాశ్వత కాలము పాడు (పక్రటన 5:9) యేసు ప్రభువు ఆయన అపొస్తలులు మాట్లాడిన సిలువలో కార్చబడిన రక్తము గూర్చి (లూకా 22:20, ఎఫెసీ 2:13) పాటలు ఈ గుంపుల పాటల పుస్తకములలో చాలా తక్కువగా యుండును.


ఈ గుంపులో విశ్వాసులు బాహ్యముగా ఎంతో చక్కటి జీవితములు జీవించినా, వారి మధ్యలో ఎందరో వారి నాయకుల బోధల ఫలితముగా భారములతో కృంగి పోవుచుందురు. వారి మధ్యన ఎందరో దేవుడు వారిని బట్టి సంతోషించుచుండెనా లేదా అనే ఎడతెగని అనిశ్చిత స్థితిలో యుండుటచేత, వారు ఎప్పుడూ దోష భావముతో యుండి సహోదరులపై నేరమారోపించు సాతాను యొక్క దోషారోపణ ఎదుర్కొనుచుందురు. కాని వీరిలో ఎక్కువమంది, విశ్వాసములేని వారిగా, నమ్మకము లేనివారిగా ఎంచబడకుండునట్లు ఈ సమస్యలను ఒప్పుకొనుటకు ఇష్టపడరు.


ఇటువంటి అపరాధ భావనలను కొనసాగునట్లు చేయుట ద్వారా ఈ గుంపుల యొక్క నాయకులు ఆ గుంపులో ఉన్న ఎక్కువ మంది విశ్వాసులమీద నియంత్రణ కలిగియుందురు. ఆ కారణము చేత ఈ గుంపులలో ప్రసంగాలు ప్రజలను అపరాధభావములతో నింపును. అనేక సందర్భాలలో ఈ అపరాధభాము అస్పష్టముగా నుండును. ఎందుకనగా ఎటువంటి పాపము ప్రత్యేకముగా ఎత్తిచూపబడదు.


అటువంటి తలంపులను జయించగలుగు బలమైన మనస్సు కలిగిన వారు అటువంటి గుంపులలో ఉన్నప్పటికీ జయించలేక ఓడిపోయి సాతాను యొక్క బంధిఖాణాలోనికి వెళ్లువారు కూడా గలరు. ఇది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట గూర్చిన బోధను నిర్లక్ష్యము చేయుట వలన వచ్చిన సూటియైన ఫలితము.


6. నమ్మకములను గూర్చిన గోప్యత


మతమౌఢ్య గుంపుల యొక్క ఆరవ గుర్తు వారి నమ్మకములను గూర్చిన గోప్యత.


వీరు వాక్యపు పునాది తేటగాలేని వారి నమ్మకముల గూర్చి ఇతర విశ్వాసుల చేత ప్రశ్నించబడినప్పుడు జవాబులు దాటవేయుదురు.


వారి సిద్ధాంతములను వాక్యప్రకారము ఋజువు చేయలేనప్పుడు వారి ప్రామాణికమైన జవాబు ''నీకు పరిశుద్ధాత్మ యొక్క బయల్పాటు అవసరమైయున్నది'' అనునది. ఆవిధముగా వారు దేవుని నుండి వాక్యములో లేని ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత పొందినట్లును, అది ఇతర విశ్వాసులు పొందలేనట్లును చెప్పుకొందురు.


వారు ఆత్మ చేత బయల్పర్చబడిన మర్మముల గూర్చి చెప్పుటలో ఆనందించుదురు. అవి కేవలము ''పూర్ణహృదయముతో అనుసరించువారికి'' మాత్రమే అని చెప్పుదురు, దాని భావము వారి గుంపులోచేరి వారి నాయకుని అనుసరించు వారికి మాత్రమే అని అర్థము.


వారి గుంపులోతప్ప బయట ఎవరూ దేవుని యెడల పూర్ణహృదయము గలవారుందురని వారు నమ్మరు. ఆవిధముగా ఆసక్తి కలిగిన విశ్వాసులను ''సత్యము గూర్చి వెలుగు'' పొందిన ప్రత్యేక పర్చబడిన ''అంతరంగ గుంపు''లోనికి వచ్చునట్లు ఆకర్షింతురు.


దేవుడు కొందరిని ప్రత్యేకముగా చూచుననియు ఆయన యొక్క అంతరింగులకు ఇతర విశ్వాసులకు తెలియని ''మర్మములను'' ఆయ వివరించునను అభిప్రాయము మానవ శరీరములో ఒక గొప్పదురాశగా యుండును.


ప్రతి వారిలో ఉండిన ఈ శరీరాశను మతమౌఢ్యులు తీర్చుటకు చూచెదరు.


అయితే సత్యమేమిటి?


దేవుని యొక్క ప్రతి మర్మము దేవుని వాక్యములో తేటగా బయల్పర్చబడినదియే సత్యము.


ఎఫెసీ 3:4-6, క్రీస్తును గూర్చిన మర్మము పాతనిబంధన కాలములో మాత్రమే మర్మమని చెప్పుచున్నది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అందరకు అది బయల్పర్చబడినది. ఇప్పటివరకు మరుగు చేయబడిన మర్మము పరిశుద్ధులందరకు ప్రత్యక్ష పరచబడెను అని కొలొస్స 1:26, 27 చెప్పుచున్నది. ఇప్పుడు ఏ మర్మము రహస్యముగా లేదు. ఎందుకనగా క్రొత్తనిబంధన ప్రతి దానిని తేటపరచినది. అయితే మతమౌఢ్యులు ఇంకను కొన్ని దాచబడిన రహస్యములున్నవని నమ్మునట్లు చేయుదురు.


క్రొత్తనిబంధనలో చెప్పబడిన రెండు గొప్ప మర్మములలో, ఒకటి దైవభక్తిని గూర్చినది, రెండవది సంఘమును గూర్చినది (1 తిమోతి 3:16, ఎఫెసీ 5:32).


ఈ రెండు మర్మములు గూర్చి లేఖనములలో తేటగా వ్రాయబడి బోధించబడినది. ఎవరైనా వాటిని తెలుసుకొనలేదంటే వారు వాక్యమును జాగ్రత్తగా చదువకపోయి ఉండాలి. లేక వారు ముందుగానే కొన్ని అభిప్రాయములను ఏర్పర్చుకొని వాటిని మార్చుకొనుటకు యిష్టపడనంతటి గర్విష్టులై యుండాలి. కాని దేవుడు వాక్యములో తేటగా బయలుపర్చకుండా ఏ ఒక్కరికో రహస్యముగా బయల్పర్చిన మర్మము అంటూ ఏదీ లేదనేది మాత్రము తథ్యము.


కనుక ''మర్మము''లని మతమౌడ్యులు ఎప్పుడూ మాట్లాడే వాటి గూర్చి జాగ్రత్త పడండి.


7. ఒకే విధముగా కనబడుటకు (ఖఅఱటశీతీఎఱ్‌వ) ప్రాముఖ్యతనిచ్చుట


మతమౌఢ్యపు గుంపుల యొక్క ఏడవ గుర్తు ఏమిటంటే అది దాని అనుచరులందరిని ఒకే విధముగా ఉండాలని ఆశించును.


ఒకే విధముగా కనబడినప్పుడు మాత్రమే ఐకమత్యముండునని వీరు విశ్వసింతురు. వారు ''1 కొరింథీ 1:10లో నుండిన'' ''ఏకమనస్సుతోను, ఏక తాత్పర్యముతోను'' అను మాటను వారి వాదనకు ఆధారముగా చూపింతురు. అందువలన ఏ చిన్న విషయములో వారు చేసేదానికి వేరుగా నున్నా భరించలేరు. ఆ వచనము ఆత్మలో ఐక్యత గూర్చి చెప్పుచున్నది కాని ప్రతిచిన్న విషయములో ఐక్యతను గూర్చి చెప్పుటలేదని వారు గ్రహించరు.


వీరు దేని గూర్చియైనా వారికి అంగీకారమైన లేక అంగీకారము కాని విషయములలో వేరు అభిప్రాయములుండిన సహోదరుని (రోమా 14:1) ఎట్లు చేర్చుకొనవలెనో తెలియకయుందురు. వారు ఆనందముగా స్వాగతించగలిగినది వారితో 100% ఏకీభవించిన వారిని మాత్రమే. రోమా 14వ అధ్యాయము గూర్చి వారు భోధించరు. వారి మధ్య భిన్నత్వానికి స్థానము లేదు. వారితో వేరు వేరు అభిప్రాయములుండిన వారిని కొనసాగనివ్వరు.


మతమౌఢ్యపు గుంపులలో ఎలా ఉంటుందంటే వారి సంఘముల యొక్క కార్యక్రమములు కూడా ఆ గుంపుయొక్క ప్రధాన సంఘములోని క్రమము వలె ఉండాలని ఆదేశించబడుతుంది. ఆ గుంపులోని అనేకమంది విశ్వాసులు ఆ సంఘనాయకుని యొక్క సంస్కృతిని, శైలిని కూడా అనుకరిస్తుంటారు!


వారి ప్రధాన సంఘములో కార్యక్రమములు ఏ పద్ధతిలో జరుగుతాయో వారియొక్క ఇతర సంఘములలో కూడా అదేవిధంగా జరగాలని సభ్యులందరికీ అంతర్గతంగా ఒత్తిడి ఉంటుంది. రోబోలవలె, జోంబీల (బుద్ధిని ఉపయోగించనివారు) వారందరు దీనులు, పూర్ణహృదయులైన విశ్వాసులుగాను మరియు 'ఏర్పరచబడిన వారి'గాను పరిగణించబడతారు.


మిగిలినవారందరు కూడా గర్విష్టులుగాను మరియు 'వెలుగులేని వారుగాను' పరిగణించబడతారు.


వారి ప్రధాన కార్యాలయము లేక సంఘము ఉద్దేశించిన పద్ధతిని అన్నివిషయములలో అనుసరించవలెనని లేనట్లయితే నాయకుల నుండి తిరుగుబాటు చేస్తున్నట్లుగా పర్యవసానమును ఎదుర్కొనవలసి వస్తుందనే భయము సభ్యులలో కల్పింపబడుతుంది. ఆ గుంపులో నాయకులతో ఏకీభవించని వారికి ''ఎటువంటి చెడు జరిగిందనే'' భయంకరమైన కథలు సభ్యులకు చెప్పబడును. ఆ విధముగా బలహీన మనస్సు కలిగిన విశ్వాసులు వారి పద్ధతులను అనుసరించి నడచుకొందురు. ఆ విధముగా వారు క్రమేణ వారి యొక్క వివేచనను కోల్పోయి ఆ గుంపునకు బానిసలగుదురు.


యేసు ప్రజలను స్వతంత్రులుగా చేయుటకు వచ్చెను. మతమౌఢ్యత ప్రజలను ఖైదీలుగా చేయును. ఈ మతమౌఢ్యపు బోధకులు వారిని నిర్భంధించిన చెరసాలలో నుండి అనేకమంది విశ్వాసులు విడిపింపబడవలసియున్నది.


యేసు ప్రభువు కాలమందలి యూదులు పాపమునకు మాత్రమేకాక, ఆచారములకు మరియు వారి మత నాయకుల అభిప్రాయములకు కూడా బానిసలుగా ఉండిరి. యేసు ప్రభువు వారి ఆ రెండు బానిసత్వములనుండి కూడా విడుదల చేయవలసివచ్చినది. పాపమునుండి విడుదల చేసే యేసుప్రభువు సందేశమును అంగీకరించిన అనేకులు, వాక్యానుసారము కాదని తెలిసినా వారి మత నాయకులు వారిని వెలివేయుదురేమో అని భయపడి ''పెద్దల ఆచారముల'' విడిచిపెట్టరు (యోహాను 12:42, 43).


ఈ బానిసత్వపు అభిప్రాయములు ఎంతబలమైనవంటే, 20 సంవత్సరములు ఆత్మచేత నింపబడిన జీవితమును జీవించిన పేతురు ఇశ్రాయేలీయులలోని క్రైస్తవ నాయకులకు కోపము కలుగకుండాయుండుటకు యూదుల ఆచారములను బహిరంగముగా మీరుటకు భయపడెను. ఆ సమయములో అపొస్తలత్వములో వెనుకవచ్చిన పౌలు, ''పెద్దల ఆచారములను'' అనుసరించుచుండినందున పేతురును ఎదురించెను. అప్పటికి ముందు నుండి సేవలో నుండిన బర్నబాకు కూడా అట్లు ఎదిరించుటకు ధైర్యము లేకపోయెను (గలతీ 2:11-21).


ఎవరైనా వ్యక్తిగత ఒప్పుదల లేకుండా, పైనుండి ఒత్తిడితో బాహ్యమైన పద్ధతులకు లేక అనుకరణతో నుండుట దేవుడు కోరుకొనుటలేదు. దేవుడు ఎప్పుడూ అడిగే విధేయత సంతోషముగా మరియు ఉచితముగా ఇచ్చిన విధేయత మాత్రమే, ఎందుకనగా ''దేవుడు సంతోషముగా ఇచ్చువారిని ప్రేమించును'' (2 కొరింథీ 9:7).


దేవుడు ఎప్పుడూ మన స్వంత మానసిక స్వేచ్ఛ విషయములో కలగుజేసికొనడు. మనము ఆయనకు విధేయత చూపుటకు లేక అవిధేయులుగా నుండుటకు ఆదాము, హవ్వలకు ఇచ్చినట్లు మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చెను అటువంటి పూర్తి స్వేచ్ఛా వాతావరణములోనే నిజమైన పరిశుద్ధత అభివృద్ధి చెంది ఫలించునని దేవునికి తెలియును.


నిజమైన పరిశుద్ధత దేవుని భయముతో సంపూర్తి చేసుకొనునదియే కాని మనుష్యుల భయముతో సంపూర్తి చేసుకొనునది కాదు (2 కొరింథీ 7:1).


దేవునికి మనం చూపించే విధేయత ఆయన తీర్పు తీరుస్తాడనే భయము వలనో లేక ప్రతిఫలం ఇస్తాడనే నిరీక్షణ వలన కాకుండా ఆయన మీద ఉన్న ప్రేమ మరియు కృతజ్ఞతతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.


ఒక గుంపులో అందరివలె ఉండాలనో లేక ఆ గుంపు యొక్క అంగీకారమును పొందుటకో చూపించే విధేయత అంతా కూడా కేవలం మృతక్రియ మాత్రమే అవుతుంది. దేవునియెదుట దానికి ఎటువంటి విలువ ఉండదు. ఆ గుంపులో ఇతరుల యొక్క గౌరవం మాత్రమే నీకు దక్కుతుంది.


మనము ఆయన ఆమోదమును కోరుకుంటున్నామా లేక తోటివిశ్వాసుల ఆమోదమును కోరుకుంటున్నామా అని ఇక్కడే దేవుడు మనందరికీ పరీక్షిస్తాడు.


స్వేచ్ఛగా నుండుట


ఈ స్వాతంత్య్రము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి (గలతీ 5:1).


క్రైస్తవ జీవితములో అతి గొప్ప పోరాటము కోపము లేక చెడుతలంపులకు వ్యతిరేకముగా చేసేదికాదు. అది మనుష్యుల యొక్క ఆమోదమును పొందుటకు వ్యతిరేకముగా చేయునది. మనము స్వేచ్ఛగా నుండవలెనంటే ఈ విషయములో దేవుని యెదుట మాత్రమే జీవించుటకు నిశ్చయించుకొనవలెను.


నీకు మతమౌఢ్యపు వైఖరి యుండినా నీవు మంచి జీవితమును జీవించవచ్చును. కాని నీవు నీ జీవితములో అటువంటి వైఖరి కలిగియుండి ఈ లోకములో దేవుడు ఉద్దేశించిన దానిని నెరవేర్చలేవు. తమ చుట్టూ మతమౌఢ్యపు బోధకులచేత నిలువబడిన గోడలను బలాత్కారముగా విరుగగొట్టువాడు మాత్రమే దేవుని రాజ్యములో స్థానము పొందగలడు.


దేవుని కుమారులుగా మహిమకరమైన స్వేచ్ఛలోనికి ప్రవేశింపవలెనంటే, ఎలాంటి ధర చెల్లించియైనా మనుష్యుల అభిప్రాయములు అనే భానిసత్వము నుండి తప్పించుకొనవలసియున్నది.


అధ్యాయము 17
క్రీస్తు రాకడను సూచించు గుర్తులు

1939 సంవత్సరము నుండి ప్రపంచము ఒకేలా లేదు. ఆ కాలమందు జరిగినది అనేక స్థలములలో ప్రతిచర్యలకు దారితీసెను. ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడతో మాత్రమే అంతమగును.


ఆయన తిరిగి వచ్చు ఖచ్చితమైన రోజు మరియు ఘడియను తండ్రికి తప్ప మరెవరికి తెలియదని యేసు చెప్పెను. కాని ఆయన చెప్పిన గుర్తులను గమనించినట్లయితే, ఆయన రాకడ సమీపమైన విషయమును తెలుసుకొనుట మనకు సాధ్యమగునని కూడా ఆయన చెప్పెను (మత్తయి 24:33, 36).


కనుక ఈ విషయాలను మనము గమనించుట మనకు అవసరమై యున్నది.


1. యుద్ధములు


(మత్తయి 24:7) - కడవరి దినములు నోవహు దినముల వలె నుండునని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 24:37). నోవహు దినములలో హింస ఒక ముఖ్యమైన లక్షణము. ''భూమి బలత్కారముతో నిండియుండెను'' (ఆదికాండము 6:11, 13). ఆ మాటలు మనము నివసిస్తున్న ఈ దినాలను గూర్చి చెప్పబడినట్లుగానున్నవి. తీవ్రవాదము, విమానాలను దారి మళ్లించుట, దోపిడీలు, హత్యలు, మానభంగములు, దహనకాండలు, దేశానికి దేశానికి మధ్య యుద్దములు ఇప్పుడు ప్రతి రోజూ జరుగుతున్న విషయములు. వీటికి అనేక కారణాలున్నవి. హత్యచేసిన వానికి మరణ శిక్ష (ఆదికాండము 9లో దేవుని చేత ఏర్పాటు చేయబడింది) తొలగించుట, అనేక దేశాలలో హత్యల సంఖ్యలను ఎక్కువ చేసినది. హింసను సినిమా తెరపై, టి.వి. పై సిగ్గులేకుండా వర్ణించి ఆకర్షణీయముగా చూపుట ప్రజలను వారి చిన్నతనము నుండి హింసాత్మకముగా తయారగునట్లు చేస్తుంది. 1950లో టెలివిజన్‌ వచ్చుట, 1970లో వీడియో వచ్చుట హింసా సాంప్రదాయాన్ని అన్ని చోట్లకు విస్తరించునట్లు చేసినది. కరాటే విద్య మరియు ఇతర శారీరక యుద్ధ విద్యలకుండిన ఖ్యాతి కూడా హింస యొక్క సందేశమును ప్రాచుర్యమునకు తెచ్చెను. (ఇవన్నీ కూడా ప్రజలు అపవిత్రాత్మలచే పట్టుబడుటకు అవకాశమిచ్చును). ఇవన్ని కూడా సాతాను భూమిపై రెండవ ప్రపంచ యుద్ధమును ప్రారంభించిన తరువాత 1939 నుండి ఒక వరదవలె వచ్చాయి. ప్రజలలో పెరిగిపోయిన ద్వేషము, పగ అపవిత్రాత్మలు మానవులపైకి ప్రవాహమువలె వచ్చుటకు తలుపులు తెరిచాయి. 1939 నుండి యుద్ధములు ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ సాగే ఒక వ్యవహారముగా అయిపోయాయి. 1945లో బ్రద్ధలైన అణుబాంబు, తరువాత వచ్చు పరిణామములన్నిటితో కలిపి అణు యుగమునకు స్వాగతం పలికింది.


రెండవ ప్రపంచ యుద్ధము నుండి మానవ చరిత్రలో మనము చూస్తున్నటువంటి హింస లేక వరుసగా వచ్చు యుద్ధములు లేక కుప్పలుగా నుండిన మారణాయుధాలు ప్రపంచము ఎప్పుడూ చూడలేదు.


2. కరవులు


(మత్తయి 24:7) - మానవుని చరిత్రలో కరవులు ఎప్పుడూ ఉన్నవి. కాని రెండవ ప్రపంచయుద్ధము నుండి, ప్రపంచ జనాభా ఎక్కువవుటవలన కరవుల వలన ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కోట్ల కొలది చనిపోయిరి. 1950 నుండి అనావృష్టి, పంటలు పండక పోవడము చాలా ప్రదేశములలో సాధారణమై పోయినది. ఇది మన దేశము వంటి బీద దేశములలో ఆహారము, నూనెలు మొదలైన వాటి కల్తీలాంటి ఇతర చెడుపరిణామాలకు త్రోవతీసినది. మనము అంతమును సమీపిస్తూ ఉండగా ఇది ఇంకా సామాన్యముగా తయారవుతుంది.


3. ప్రకృతి వైపరీత్యములు


(మత్తయి 24:7) - భూకంపములు, వరదలు, తుఫానులు, అగ్నిపర్వతములు బ్రద్ధలగుట మొదలైనవి అంతమును సమీపిస్తూ ఉండగా మనము ఇంకా ఎక్కువ ఎదుర్కొనాల్సిన ప్రకృతి వైపరీత్యములో కొన్ని. ఇవి కూడా రెండవ ప్రపంచ యుద్ధము నుండి అధికమైనవి. ఇవి రాబోవు దినాల్లో ఇంకా ఎక్కువగును.


4. జ్ఞానాభివృద్ధి


(దానియేలు 12:4) - ఆఖరి దినములలో జ్ఞానము అభివృద్ధి చెందునని దానియేలు తేటగా ప్రవచించెను. మానవుడు ఆదాము కాలము నుండి 1939 (5900 సంవత్సరములు) వరకు సమకూర్చుకొనిన శాస్త్రీయ విజ్ఞానము గత 70 సంవత్సరములలో 20 రెట్లు పెరిగినదని లెక్కవేసారు. ఈ విషయం గ్రాఫులో చూచినట్లయితే మానవుని జ్ఞానాభివృద్ధి గీత సుమారుగా సమాంతరముగా వచ్చి ఒక్కమారుగా మానవుని చరిత్ర ఆఖరు భాగములో ఇరువది రెట్లు పైకి వెళ్లినట్లుండెను. క్రీస్తు రాకడకు ఇది మరియొక తేటతెల్లమైన సూచన.


5. ప్రపంచమంతట ప్రయాణము


(దానియేలు 12:4) - మానవుడు సుమారు 5,800 సంవత్సరములుగా, ఒకే వేగముతో ప్రయాణించెను. అది ఎక్కువగా జంతువుల మీద, చివరకు 1900 సంవత్సరములో మానవుడు ప్రయాణించిన అత్యధిక వేగము గంటకు 50 మైళ్ళు. కాని ఈరోజు మానవుడు అంతరిక్షంలో గంటకు 24,000మైళ్ళ వేగముతో ప్రయాణించెను. ప్రపంచమంతటా ప్రయాణించుట, పర్యటనలు రెండవ ప్రపంచ యుద్ధము తరువాత మాత్రమే ప్రజాదరణ వచ్చెను. ''అనేకులు నలుదిశలు ప్రయాణించెదరు'' అని దానియేలు ఆఖరిదినముల యొక్క ఒక గుర్తుగా ప్రవచించెను.


6. సుఖానుభవము యెడల ప్రేమ


(2 తిమోతి 3:4) - ఇక్కడ పౌలు కడవరి దినములలో ప్రజలు దేవుని కంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించుదురని చెప్పెను. నోవాహు దినములలో హింసతో పాటు లైంగిక పాపములో ప్రజలు నిమగ్నమైపోయిరి (ఆదికాండము 6:2). ఇప్పుడు లోకములో తిరిగి దానినే చూస్తున్నాము. ఆది నుండి మనుష్యులలో లైంగిక పాపముండెను. కాని ఇప్పటివలె సిగ్గు లేకుండా, బహిర్గతంగా పాల్గొనుట మానవ చరిత్రలో ఎప్పుడును లేదు. ఈ విషయంలో కూడా ప్రపంచమంతా నీతి నియమాల విషయంలో రెండవ ప్రపంచ యుద్ధమునుండి క్రిందికి దిగజారి యున్నది. అపవిత్రాత్మలు వరదవలె భూమిపై దాడిచేసాయి. టెలివిజన్‌, సినిమా, వీడియో టేపులు సుఖానుభవమును వెదకు అవకాశమును ఎక్కువ చేసి సాతాను యొక్క ఉద్దేశ్యామును నెరవేర్చుటకు ఉపయోగపడుచున్నవి.


దెయ్యముల యొక్క బోధలలో ఒకటి కడవరి దినములలో వివాహమను నిషేధించుట అని పౌలు చెప్పెను (1 తిమోతి 4:1-3). దీనిని మనము రెండు విపరీతార్థములుగా చూస్తున్నాము. ఒకటి క్రీస్తు పెండ్లికుమార్తె యొక్క గుంపులో భాగముగా నుండవలెనంటె ఒకడు వివాహము చేసికొనకుండా ఉండాలని బోధించే కొన్ని గుంపులు. వేరొకిటి వివాహములో నమ్మకము లేకుండా కలసి జీవించుటలో నమ్మికయుంచువారు. ఆఖరి దినములలో మానవుడు ''అనురాగరహితుడుగా నుండుటను బట్టి'' గర్భస్రావము సరియైన పనే అని అనుటలో ఆశ్చర్యమేమీ లేదు (2 తిమోతి 3:3). బేత్లెహేములో హేరోదు చేతుల కంటె ఎక్కువగా ఈనాడు అనేకమంది వైద్యుల చేతులు గర్భస్రావము చేయుట ద్వారా చిన్నపిల్లలను చంపిన రక్తముతో యున్నవి (మత్తయి 2:16). ఆఖరి దినములు లోతు (సొదొమలో) దినముల వలె నుండును అని యేసు చెప్పెను. పురుష సంయోగ సంబంధములను ఇప్పుడు సాధారణంగా తీసుకొంటున్నారు. ''తమ పాపములను మరుగు చేయక సొదొమ వారి వలె బయలపరుచుదురు'' (యెషయా 3:9). అందువలన దేవుడు వారిని విడిచిపెట్టెను. భయంకర రోగమైన 'ఎయిడ్స్‌' ఈ పాపముపై దేవుడుంచిన తీర్పునకు మచ్చుతునక అయి ఉన్నది (రోమా 1:26-28).


మాదక ద్రవ్యముల ద్వారా కోట్ల కొలది యౌవనస్థులు నాశనమగుచుండుట, ఈ సుఖానుభవము కోరుకొనే తరమువారు నాశనకరమైన గుంటలోనికి జారి పోవుచున్నారనుటకు ఇంకొక సాక్ష్యము.


7. తిరుగుబాటు ఆత్మ


(2 తిమోతి 3:2) - తల్లిదండ్రులపై పిల్లలు, ఉపాధ్యాయులపై విద్యార్థులు, యజమానులపై సేవకులు (కార్యాలయాలు, కార్ఖానాలు మొదలగు చోట్ల) చేయుతిరుగుబాట్లు రెండవ ప్రపంచ యుద్ధము మొదలుకొని ప్రపంచం ఎప్పుడూ చూడనటువంటిది. ఉన్నత విద్యను బట్టి ఈనాడు యౌవనస్థులు వారి తల్లిదండ్రుల యెడలను, పెద్దవారి యెడలను తలబిరుసుతో అమర్యాదతో ప్రవర్తిస్తున్నారు. ఈ తిరుగుబాటు ఆత్మ క్రైస్తవ లోకములోనికి కూడా చొచ్చుకుపోయింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నట్లుగా, పాస్టర్లు వారి సంఘాలలోనుండే యౌవనస్థులను ప్రతి విషయములో సంతోషపర్చు విధంగా, వారి దయపై ఆధారపడి యుంటున్నారు.


చరిత్రలో ఎప్పుడూ చూడనంతగా రెండవ ప్రపంచ యుద్ధము నుండి స్త్రీలు ఇల్లు విడిచి బయటకు పనికి వెళ్తున్నారు. వారు స్వంత సంపాదనను కలిగియుండుట, ఈనాడు ఒక సగటు స్త్రీని తలబిరుసుగా, మెడవంచని విధముగా దేవుడు ఏర్పాటు చేసిన పురుషుని అధికారమునకు లోబడుటకు ఇష్టపడని దానిగా చేసినది. ఇదంతా క్రైస్తవ లోకంలో కూడా అధికారముపై తిరుగుబాటు ఏవిధంగా ప్రాచుర్యము పొంది లోతుగా పాతుకుపోతుందో తెలియజేస్తుంది.


ఈనాటి స్త్రీలు ప్రాథమికంగా తల్లులగా ఉండాలని కోరుకొనుట లేదు. లోకంలో రెండవ ప్రపంచ యుద్ధము నుండి ఎలాగైతే స్త్రీలు ప్రధానమంత్రులు అవుతున్నారో (దానికి ముందు ఇటువంటి విషయం ఎక్కడా వినబడలేదుకూడా) అదే విధముగా క్రైస్తవలోకంలో స్త్రీలు పెద్దలుగా, యాజకులుగా మరియు బోధకులుగా అవుతున్నారు. ఇది యెజెబెలు యొక్క ఆత్మ (పక్రటన 2:20). సంఘములో దీనిని పాతనిబంధన కాలములో వలె ఏలీయా యొక్క ఆత్మ మరియ శక్తితో వ్యతిరేకించవలెను (1 రాజులు 20:21-23).


8. విశ్వాసము నుండి తొలగిపోవుట


1 తిమోతి 4:1, ఈ వచనమును సందర్భ సహితముగా చదివినట్లయితే, ఎంతో ప్రాముఖ్యమైనది. ''కడవరి దినములలో కొందరు విశ్వాసము నుండి పడిపోదురని ఆత్మ నొక్కి చెప్పుచున్నాడు'' అని ఈ వచనము చెప్తుంది. దాని ముందు వచనము దైవ భక్తి గూర్చిన మర్మము గూర్చి చెప్తుంది. అందులో క్రీస్తు శరీరధారుడుగా ప్రత్యక్షమగుట గూర్చి చెప్తుంది (1 తిమోతి 3:16). మొట్టమొదటిగా క్రైస్తవలోకము దైవభక్తినుండి పడిపోయెను. ఇది క్రైస్తవ లోకమును యేసు ప్రభువు యొక్క ఆజ్ఞలను (ముఖ్యముగా మత్తయి 5నుండి 7 అధ్యాయములలో ఉన్నవి) పాటించకుండునట్లు త్రిప్పివేసెను. అలాగే కృప గురించి తప్పుగా బోధించుట మొదలగువాటివైపు నడిపించును. ఇవన్ని కూడా మొదటి శతాబ్దములో కూడా ఉన్నవి. అయితే ఇవన్ని రెండవ ప్రపంచ యుద్ధము నుండి చాలా ఎక్కువైనవి.


ఒకే ప్రపంచ క్రైస్తవ సంఘము గూర్చిన ఏర్పాట్లు, మత మౌఢ్యపు గుంపులు, పరిశుద్ధాత్మ యొక్క నకిలీ వరములు మొదలైనవి గత 40 సంవత్సరాలుగా ఎంతగానో ఎక్కువైనవి.


యేసు ప్రభువు ముమ్మారు ఆఖరి దిములకు సంబంధించిన మోసము గూర్చి చెప్పారు (మత్తయి 24:5 ,11 ,24). అబద్ధ ప్రవక్తలు ఎలా అద్భుతములు, సూచక క్రియల ద్వారా ఎన్నుకొనబడిన వారిని కూడా మోసపుచ్చుదురో ప్రత్యేకముగా చెప్పారు. 1945 నుండి క్రైస్తవ లోకములో ''అద్భుతములు'' అని చెప్పే పరిచర్యలు ఎక్కువైనాయి. వాటిలో అనేకమైనవి యేసు ప్రభువు హెచ్చరించిన మోసపు పనివై యున్నవి. కేవలము యేసు క్రీస్తు నామమున ఈ సూచక క్రియలు, అద్భుతములు చేయబడుటచేత అనేక మంది విశ్వాసులుగా పిలువబడువారు మోసపోవుచున్నారు. వాటిని చేయువారు దైవభయము గలవారా మరియు అపొస్తలుల వలె ఇతరులను యేసు యొక్క ఆజ్ఞలకు లోబడునట్లు నడిపిస్తున్నారా లేదా అనునది ధృవీకరించుకొనుటకు ప్రయత్నించరు. అందువలననే వారు మోస పోవుచున్నారు (ద్వితీయో. 13:1-4).


9. ఇశ్రాయేలు దేశము


(లూకా 21:29-32) - వృక్షములన్నియు చిగురించుట (దేశములు స్వతంత్రములగుట) గూర్చి యేసు చెప్పెను. ప్రపంచ చరిత్రలో 1945 నుండి జరిగినంతగా ఈ విషయం ఎప్పుడూ జరుగలేదు. భారత దేశము 1947లో స్వాతంత్య్రము పొందెను. అనేక ఇతర దేశములు కూడా 1945 నుండి స్వాతంత్య్రము పొందెను. అయితే వాటన్నిటి కంటె అంజూర వృక్షము (ఇశ్రాయేలు) ను చూడమని యేసు చెప్పెను (లూకా 21:29). యేసు ఇశ్రాయేలు యొద్దకు వచ్చి, ఆ అంజూరపుచెట్టున పండ్ల కొరకు చూచెను. ఆయన అందులో ఆకులనే మతపరమైన ఆచారములనే చూచెను; అప్పుడు ఆ చెట్టును శపించెను మరియు అది ఎండిపోయెను (మత్తయి 21:19). యేసు ప్రభువు సిలువ వేయబడిన 40 సంవత్సరముల తరువాత బైబస్‌ అను సైన్యాధికారి చేత నడిపింపబడిన రోమా సైన్యమును యెరూషలేములోకి ప్రవేశించి వారి దేవాలయమును పడగొట్టుటకు దేవుడు అనుమతించెను. అప్పుడు యూదులు ప్రపంచమంతటా మారుమూలలకు చెదిరిపోయిరి. సుమారు 1900 సంవత్సరములు అంజూరపు చెట్టు ఎండిపోయి యుండెను.


కాని ఎండిపోయిన ఆ అంజూరపు చెట్టు తిరిగి ఆకు తొడుగుటను చూడమని యేసు ప్రభువు చెప్పెను. రెండవ ప్రపంచ యుద్ధములో లక్షల మంది యూదులు హిట్లరుచే చంపబడుట, యూదులపై ప్రపంచమంతట సానుభూతి రగిలించుటకును, అది చివరకు వారు తమ మాతృభూమికి 1948మే నెలలో వచ్చుటకును దారి తీసింది. 1967 జూన్‌ నెలలో వారు యెరూషలేమును కూడా వశపర్చుకొనిరి. అంజూరపు చెట్టు తన ఆకులను చిగురించ మొదలుపెట్టెను. యెరూషలేము అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు అన్యజనులు (యూదులు కాని వారు) యెరూషలేమును త్రొక్కుదురు (ఏలుదురు) అని యేసు ప్రభువు చెప్పెను. యేసు చెప్పిన ఆ కాలములో మనమిప్పుడు జీవించు చున్నాము.


దేవుని యొక్క కాలపట్టిక


దేవుడు మానవునికి ఆరు రోజులు పని చేయుటకు ఇచ్చి ఏడవ రోజు విశ్రాంతి దినముగా ఉండునట్లు నియమించెను. దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరాలుగానున్నది (2 పేతురు 3:8). మానవునికి 6000 సంవత్సరములు ఈ భూమిపై పని చేయుటకు ఇవ్వబడినవి. ఏడవ వేయి సంవత్సరాల కాలము యేసు క్రీస్తు ఈ భూమిని రాజుగా పరిపాలించునప్పుడు వెయ్యి సంవత్సరాల విశ్రాంతి కాలముగా నుండును. ఆదాము నుండి క్రీస్తు వరకు 4000 సంవత్సరములు. ఇప్పుడు క్రీస్తు వచ్చినప్పటి నుండి దాదాపు 2000 సంవత్సరములు పూర్తయినవి. దీనితో మానవుని 'ఆరు రోజులు' పూర్తియగును.


ఇశ్రాయేలీయులకు రెండు దినములు పరిశుద్ధ పర్చుకొనుటకు ఇవ్వబడెను. అప్పుడు ప్రభువు వారి మధ్యకు మూడవదినమున దిగి వచ్చెను (నిర్గమ 19:10, 11, 16). ''మూడవ దినమున (రెండు దినములైన తరువాత) ఆయన మనలను బ్రతికించును'' (హోషేయా 6:2). సంఘమునకు కూడా తనను తాను పరిశుద్ధ పర్చుకొనుటకును, ప్రభువు రాకడకు సిద్ధపర్చుకొనుటకును రెండువేల సంవత్సరములు (2రోజులు) ఇవ్వబడెను.


మన బాధ్యత


క్రీస్తు రాకడకు సిద్ధపడుటకు మొదటగా నీకు తెలిసిన ప్రతిపాపము నుండి నీవు మారుమనస్సు చెంది, నీవు ఒక పాపివని దేవుని యొద్ద ఒప్పుకొనుము. అప్పుడు నీ పాపములన్నిటి యొక్క శిక్షను భరించుటకై యేసు క్రీస్తు చనిపోయెననియు, ఆయన తిరిగి మరణము నుండి లేచి పరలోకములో ఇప్పుడు జీవిస్తున్నాడనియు నమ్ముము. నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా చేయుటకు యేసు క్రీస్తు నీ హృదయములోనికి రక్షకునిగా మరియు ప్రభువుగా రమ్మనమని అడుగుము.


''ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసికొనును'' (1 యోహాను 3:3).


ఈ వచనము ప్రకారము క్రీస్తు రాకడ గూర్చి మనకు నిరీక్షణ ఉన్నదనుటకు ఒకే ఒక ఋజువు మనలను మనము పవిత్ర పర్చుకొనుటయై యున్నది. మరియు మన యజమానుని యొక్క పవిత్రత వంటి పవిత్రత మనము పొందువరకు మనలను మనము పవిత్ర పర్చుకొనుటను మనము ఆపము. దేవుని వాక్యమనే అద్దములో క్రీస్తు మహిమను చూపించుటకు మరియు ప్రభువు యొక్క మహిమను ప్రతిఫలింపజేయుట (2 కొరింథీ 3:18) కొరకే పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ ఇవ్వబడెను.


పరిశుద్ధాత్మ యొక్క రెండు పిలుపులు


ఆత్మ యొక్క రెండు పిలుపులతో బైబిలు (దానిలో ఆఖరి పుస్తకము) ముగుస్తుంది:


1. నమ్మని ప్రపంచమునకు: ''రమ్ము'' (పక్రటన 22:17), మారుమనసు పొంది క్రీస్తునందు విశ్వసించుము.


2. నమ్మిన వారికి: ''జయించుము'' (పక్రటన 2:7 నుండి 3:21), మరియు పెండ్లి కుమార్తె సంఘములో పాలివాడవు కమ్ము.


అధ్యాయము 18
క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు

క్రీస్తు తిరిగి భూమిపైకి వచ్చుట గూర్చి మనము ఆలోచించునప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఆ సమయమెప్పుడనేది తెలుసుకొనుట కాదు కాని ఆయన రాకడకు ఆత్మీయముగా సిద్ధపడుటయై యున్నది. ఆయన రాకడ గూర్చిన ప్రవచనాలు ఎంతో మంది వారి దైనందిక జీవితములో ఆయన ప్రమాణమునకు సమానమైన పవిత్రతతో సమానముగా వారిని వారు పవిత్రపర్చుకొనుట లేదు. అందువలన క్రీస్తు రాకడ గూర్చిన నిరీక్షణ వారికి మృతమైన నిరీక్షణగానే యున్నది, కాని జీవముగల నిరీక్షణ లేదు (1 యోహాను 3:3). దానికి వేరుగా, యేసు ప్రభువు మనలను దేనిపై కేంద్రీకరించమన్నారో దానిపై మనసు పెట్టినట్లయితే మనము బైబిలులో నున్న ప్రవచనములన్ని అర్థము చేసికొనకపోయినను లేక ప్రకటన గ్రంధములో నుండిన సాదృశ్యముల గూర్చిన భావము తెలసుకోలేపోయినను, మనము ఆయన రాకడ కొరకు నూరు శాతము సిద్ధపాటు కలిగియుండుట సాధ్యమే.


యేసు ఆయన రాకడ గూర్చి శిష్యులకు మత్తయి 24వ అధ్యాయులో చెప్పినప్పుడు వారు మెళకువగలిగి సిద్ధపాటుతో ఉండవలెనని ఒకటి కంటే ఎక్కువసార్లు నొక్కి చెప్పెను (మత్తయి 24:42, 44; 25:13). అందువలన ఎల్లవేళలా ఆత్మీయముగా మెళకువ కలిగి సిద్ధపాటుతో నుండుట ప్రవచన సత్యముల గూర్చిన జ్ఞానము కంటే అన్ని విషయములలో ప్రాముఖ్యమైనది.


మత్తయి 25వ అధ్యాయములో (మత్తయి 24వ అధ్యాయములో ప్రవచనములకు కొనసాగింపుగా చెప్పబడినది), మనము ఆయన రాకడ గూర్చి ఏ మూడు విషయములలో నమ్మకముగా నుండి సిద్ధపాటు కలిగియుండవలెనో యేసు చెప్పెను.


రహస్య జీవితములో నమ్మకత్వము


(మత్తయి 25:1-13), ఈ ఉపమానములో యేసు ప్రభువు పదిమంది కన్యకల గూర్చి చెప్పెను. అందులో గమనించినట్లయితే వారిలో ఎవ్వరు కూడా వ్యభిచారిణులు కాదు (ఆత్మీయ వ్యభిచారిణులు ఎవరో తెలిసికొనుటకు యాకోబు 4:4 చూడండి). వారందరు కన్యకలు. వేరే మాటలలో చెప్పాలంటే వారికి మనుష్యుల ఎదుట మంచి సాక్ష్యముండెను. వారి దీపములు అన్నీ వెలుగుచుండెను (మత్తయి 5:16). వారి మంచి క్రియలు ఇతరులకు కనబడుచుండెను. అయినా, ఈ కన్యకలందరిలో అయిదుగురు మాత్రమే తెలివైనవారు. అయితే ఈ విషయం ప్రారంభంలో అందరికీ తెలియదు. అయిదుగురు మాత్రమే సిద్దెలలో నూనె తీసుకువెళ్లిరి (4వ).


సిద్దెలలో నున్న నూనె వెలుగు కనబడినట్లు రాత్రులందు కనబడదు. అది దేవుని యెదుట మన రహస్య జీవితముగా యున్నది. మరియు లోకపు చీకటిలో దానిని మనుష్యులు చూడలేరు. మనందరకు ఒక సిద్దె యున్నది. అయితే ఇక్కడి ప్రశ్న అందులో నూనె యున్నదా, లేదా అనునది.


లేఖనాలన్నిటిలో నూనె పరిశుద్ధాత్మకకు సాదృశ్యంగా చెప్పబడినది. ఇక్కడ మన ఆత్మలకు పరిశుద్ధాత్ముడు దేవుని జీవాన్ని తెలియజేయుట గూర్చి చెప్పబడినది. ఆ జీవము యొక్క ప్రత్యక్ష గుర్తు వెలుగైయున్నది (యోహాను 1:4). అంతరంగములో ఉండాల్సింది నూనె. అనేకులు వారి బాహ్య సాక్ష్యముతోనే సంతోషపడిపోవుదురు. ఇది వారి తెలివితక్కువ తనము. మనకు వచ్చే పరీక్షలలో మరియు శ్రమలలో మనకున్న బాహ్యపు వెలుగు ఒక్కటే సరిపోదని మనము తెలుసుకొందుము. ఒకడు విజయోత్సాహముతో ముందుకు వెళ్లుటకు అంతరంగములో దైవిక జీవము అవసరము.


''శ్రమదినమున నీవు కృంగినయెడల నీవు చేతగాని వాడవగుదువు'' (సామెతలు 24:16). జీవితములో వచ్చు సంక్షోభములే వచ్చినప్పుడే మనము బలవంతులమో బలహీనులమో మనకు తెలియజేయును. ఈ ఉపమానములో ఉన్న సంక్షోభము ఏమంటే పెండ్లికుమారుని రాక యొక్క ఆలస్యం. కాలము మన ఆత్మానుసారత యొక్క యథార్థతను ఋజువు చేస్తుంది.


ఎవరికైతే విశ్వాసముంటుందో అతడు అంతము వరకు సహించి రక్షింపబడును. అలాగే ఎవరి అంతరంగ జీవితములో దైవికమైన జీవమున్నదో, ఎవరిలో లేదో కూడా కాలమే ఋజువు చేయును. అనేకులు విత్తబడిన వెంటనే చిగురించు వారిగా నుండి, వారిలో అంతరంగ జీవితము లేనివారుగా నుందురు. వారి హృదయములలో మన్ను లోతుగా లేకుండెను (మార్కు 4:5).


ఆ కారణముచేతనే యౌవన విశ్వాసుల ఆత్మానుసారత గూర్చి గాని వారి సంపూర్ణ ఆసక్తి గూర్చిగాని అంచనా వేయుట కష్టము. కనిపెట్టుటకు మనము ఓపిక ఉండినట్లయితే కాలము ప్రతి దానిని బయల్పుర్చును. కనుక క్రీస్తు రాకడకు సిద్ధపడు మార్గము మన చుట్టూ ఉన్న ప్రజలు చూడలేని మన ఆలోచనలలో, వైఖరులలో మరియు ఉద్దేశ్యములలో దేవుని ముఖము ఎదుట అంతరంగములో పవిత్రత కలిగి విశ్వాసముతో కూడిన జీవితము కలిగియుండుటైయున్నది. ఇది మనలో లేకుండా క్రీస్తు రాకడకు మనము సిద్ధపడియున్నాము అనుకొన్నట్లయితే మనలను మనమే మోసగించుకొందుము.


మన పరిచర్యలో నమ్మకత్వము


(మత్తయి 25:14 - 30), రెండవ ఉపమానము, దేవుడు మనకిచ్చిన తలాంతులను నమ్మకముగా ఉపయోగించుట గూర్చినది. ఈ తలాంతులు మనకుండిన వస్తు సామాగ్రి, ధనము, సహజముగా నుండే సామర్థ్యములు, జీవితంలో వచ్చిన అవకాశములు, సమయము, ఆత్మీయ వరములు మొదలైన వాటిని సూచిస్తున్నాయి.


ఈ విషయంలో అందరూ సమానము కాదు. ఒకరు ఐదు, వేరొకరు రెండు మరియొకరు ఒకటి పొందినట్లు చూడగలము. అయితే వారు పొందిన వాటితో అందరికీ నమ్మకముగా నుండుటకు సమానమైన అవకాశము, సమయముండెను. ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడినదో వారి నుండి ఎక్కువ రావలసియున్నది. అందువలన రెండును నాలుగుగా చేసిన వారికిని, ఐదును పదిగా చేసిన వారితో సమానముగా ప్రతిఫల మియ్యబడినది.


అయితే తలాంతును భూమిలో పాతిపెట్టిన వానిపైకి తీర్పువచ్చినది (18వ వచనము). అతడు దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు కాక ఈ లోకము కొరకు వాడెను.


ఎవ్వరు కూడా నేనేమీ పొందలేదని చెప్పలేరు. ఎందుకంటే అందరూ దేవుని నుండి ఏదొక తలాంతును పొందియున్నారు. అయితే వాటిని దేని కొరకు వాడామన్నదే ప్రశ్న. మన కొరకు వాడుకొన్నది భూమిలో పాతిపెట్టిన దానితో సమానము. మనము దేవుని మహిమ కొరకు వాడినదే నిత్యత్వములో లాభము తెచ్చినట్లుగా లెక్కింపబడును. ఈ ప్రమాణము చొప్పున విశ్వాసులలో అనేకులు ఎటువంటి పేదరికములో ఉన్నారో చూడవచ్చును.


మన ముఖ్య సిద్ధాంతము ''అంతయూ దేవునికే, మనకేమీ వద్దు'' అన్నట్లుగా నుండవలెను. అప్పుడు మనము క్రీస్తు రాకడకు సిద్ధముగా నుండగలము. మనకున్నదంతా మనము విడిచిపెట్టనట్లయితే మనము యేసుకు శిష్యులుగా నుండలేము.


దేవుడు ఇచ్చిన ఆస్తిపాస్తులను మరియు వరములను కేవలము దేవుని కొరకు ఉపయోగించనివాడు క్రీస్తు రాకడకు సిద్ధపడియున్నాను అనుకొన్నట్లయితే తనను తాను మోసగించుకొనుచున్నాడు.


మన తోటి విశ్వాసులకు పరిచర్య చేయుటలో నమ్మకత్వము


(మత్తయి 25:31-46), ఈ ఆఖరి భాగములో యేసు ప్రభువు మనతోటి విశ్వాసుల అవసరము విషయంలో మన వైఖరి గూర్చి తెలిపారు, (ఆ అవసరము భౌతికమైనది కావచ్చు లేక ఆత్మీయమైనది కావచ్చును).


ఇక్కడ కొందరు తమ తోటి విశ్వాసులకు ప్రభువుకు చేసినట్లుగానే భావించి చేసినందున వారు పరలోక రాజ్యములో ప్రవేశించిరి. వారు ఎడమచేతితో చేసినది కుడిచేతికి తెలియనంతటి రహస్యముగా చేసిరి (మత్తయి 6:3). అది ఎంతగా ఉండెనంటే వారు చేసిన మంచిన ప్రభువు వారికి గుర్తు చేసినప్పటికీ అది వారికి జ్ఞాపకము లేకపోయెను (మత్తయి 25:38).


ఇక్కడ యేసు ప్రభువు ఆయన సహోదరులలో అల్పులైన వారికి చేసిన ఏ పరిచర్యయైనా ఆయనకే చేసినట్లు పరిగణింపబడునని కూడా బోధించెను (మత్తయి 25:40). ఇక్కడ ఆయన అల్పులైన వారికి అని చెప్పుటలో ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ప్రాముఖ్యమైన విశ్వాసులకు సేవ చేసి అంత ప్రాముఖ్యత లేని అల్పులైన వారిని విడిచిపెట్టుట మన యొక్క నైజము. ఎవరైతే వారి కొరకు మాత్రమే తినుట, త్రాగుట, అమ్ముట, కట్టుట, నాటుటలో మునిగిపోయి యుందురో వారు యేసు తిరిగి వచ్చినప్పుడు విడిచిపెట్టబడుదురు (లూకా 17:28-34).


ప్రభువు కొరకైన సేవలో, ఎవరైతే వారితోటి విశ్వాసుల యెడల ప్రేమతో కూడిన ఆలోచన కలిగియుందురో వారు పైకెత్తబడుదురు. వేరొక వాక్య భాగములో, యేసు ప్రభువు వేరొక గుంపు గూర్చి మాట్లాడారు. ఆ గుంపు ఈ గుంపునకు వేరుగా నున్నది. వారు ప్రభువు పేరిట చేసిన ప్రతి మంచి పనిని జ్ఞాపకముంచుకొన్నవారు. వారు కూడా తీర్పు సింహాసనము యొద్ద ఉండి వారు యేసు పేరిట దయ్యములను వెళ్ళగొట్టిన విషయమును, రోగులను స్వస్థపరచిన విషయమును ప్రభువుకు జ్ఞాపకము చేసారు. కాని, వారు ఈ విషయాలన్నిటినీ చేసినా మొట్టమొదట ఉండవలసిన మరుగైన పరిశుద్ధతతో కూడిన జీవితము లోపించినందున వారు త్రోసివేయబడిరి. వారు వారియొక్క గొప్ప వరములను బట్టి కొనిపోబడినారు.


అయితే వారిరువురి మధ్య నున్న వ్యత్యాసము చూచుటకు ఆసక్తిగా నుండును.


రోగులను స్వస్థపరచిన వారు బయటకు త్రోయబడిరి (మత్తయి 7:22, 23). కాని కేవలము రోగులను దర్శించినవారు పరలోక రాజ్యమును పొందుకొనిరి (మత్తయి 25:34-36). మనకు స్వస్థపరచు వరమనే తలాంతు ఇవ్వబడనప్పుడు మనలను స్వస్థపర్చమని దేవుడు అడుగుట లేదు. కాని మనము రోగులను దర్శింపవచ్చును మరియు వారిని ప్రభువు నామములో ప్రోత్సహించి దీవింపవచ్చును. అప్పుడు రోగులను స్వస్థపరచిన అనేకులు వెనుక విడిచిపెట్టబడగా మనము క్రీస్తు రాకడకు సిద్ధపడి యుండుటను చూడవచ్చును. ఈ విధముగా ఇతరులకు సేవ చేయుటకు మనము అసౌకర్యము పొందుటకు ఇష్టపడవలెను.


ఎవరైతే వారి దైనందిక ప్రణాళికలకు అవసరతలో నున్నవారి వలన ఎన్నడూ అంతరాయము కలుగుటకు ఇష్టపడరో వారు క్రీస్తు వచ్చినప్పుడు తప్పక విడిచి పెట్టబడుదురు. మనము ప్రభువు నామములో ఇతరులకు సేవ చేయవలెనంటే మన సమయాన్ని, ధనాన్ని మరియు అన్నిటికంటే ఎక్కువగా మన స్వంత ప్రణాళికలను మరియు యిష్టములను త్యాగము చేసికొనవలసియున్నది.


స్వార్థము మనలో ఎంతగా వేరుపారియున్నదంటే, మన కన్నులతో చేయు పాపము, కోపము మరియు దురాశ మొదలగు వాటన్నిటినుండి మనలను మనము కడుగుకొనినా, మన కొరకు మనము జీవించుచూ ఉండే పాపములో కొనసాగుతూ యుండవచ్చును. అందులో పరిశుద్ధత యుండవచ్చును. అది పరిసయ్యులకుండిన పరిశుద్ధతయై, కేవలము మన గూర్చి మాత్రమే ఆలోచించుకొంటూ ఉండి మనపై కేంద్రీకరింపబడిన వైఖరి నుండి విడిపింపలేనిదై యుండును. ఇది యథార్థమైన పరిశుద్ధతకు నకిలీయై యున్నది. దానిచేత మోసగింపబడుట సుళువే.


యేసు ప్రభువు ప్రార్థించుట నేర్పించినప్పుడు, ''మాకు ఇమ్ము....మమ్ములను క్షమింపుము...మమ్ములను విడిపింపుము'' (మత్తయి 6:11-13) అని చెప్పారు. ఇంకనూ పాపములో నుండిన వారిగూర్చి మరియు వారి అవసరతల గూర్చి ఆలోచననివ్వని పరిశుద్ధత, విలువలేనిది. మరియు నకిలీదై యుండి చెత్తబట్టలో పారవేయుటకు మాత్రమే పనికివచ్చును.


ఇతరులు ఎట్లున్నారో తెలుసుకొనుటకు మనము వారి ''చెప్పుల్లో కాళ్లు పెట్టి'' చూచి వారి పరిస్థితులను అర్థము చేసికొనగలుగునట్లు మన ఆలోచనా విధానమును తిరిగి మార్చుకోవాల్సి యున్నది (మనసు రూపాంతరము చెందుట రోమా 12:2). ఇది రాబోయే దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనగలుగునట్లు సిద్ధపరచే క్రీస్తుకు కలిగినటువంటి ఆలోచనా విధానమైయున్నది. తన గురించి, తన కుటుంబం అవసరత గూర్చి మాత్రమే ఆలోచించేవాడు, అతడు ఎంత పరిశుద్ధుడైనా క్రీస్తు రాకడకు సిద్ధపడియున్నానుకొంటే తనను తాను మోసగించుకొను వాడైయుండును.


అధ్యాయము 19
సౌవార్తీకరణ మరియు శిష్యులనుగా చేయుట

ఒక అంశము గూర్చి ఒక వాక్యమును తీసుకొని వేరొక వాక్యమును వదలివేయుట క్రైస్తవులలో చాలా సాధారణమైన పొరపాటుగా యున్నది.


సాతాను యొక్క మొదటి ప్రయత్నము (యేసు ప్రభువుకు అరణ్యములో వచ్చిన మొదటి శోధన విషయములో చూచినట్లు) మన అవసరము తీర్చుకొనుటకు మనకు మనముగా దేవుని చిత్తమునకు వేరుగా ఏమైనా చేయునట్లు చేయుట (నీవు ఆకలి గొనియున్నావు కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము). యేసు ప్రభువు దేవుడు ఏమి చెబితే అదే చేస్తానని చెప్పి ఆ శోధనను తిరస్కరించారు (మత్తయి 4:4). మనము కూడా అదే చేయవలెను.


అయితే యేసు ప్రభువు వలె దేవుని వాక్యానుసారముగా మనమును నిలువబడుట సాతాను చూచినట్లయితే అతడి తరువాత ప్రయత్నము దేవుని వాక్యమునే (''అట్లు వ్రాయబడియున్నది'') మనకు ఎత్తి చూపుటగాయున్నది. వాడు యేసు ప్రభువు నొద్దకు రెండవ శోధన ''ఇట్లు వ్రాయబడియున్నది...'' (మత్తయి 4:6) అని వచ్చెను. యేసు ప్రభువునకు దేవుని యొక్క పూర్తి సంకల్పము తెలియకపోయినట్లయితే ఈనాటి అనేక విశ్వాసుల వలే యేసు ప్రభువు కూడా సాతాను చూపిన వాక్యములను బట్టి మోసపోయి యుండేవాడు. కాని యేసు ప్రభువు ఆ శోధనను కూడా ''అని మరియొకచోట వ్రాయబడియున్నది'' (మత్తయి 4:7) అని చెప్పి బహు సమర్థవంతముగా తిరస్కరించారు.


కనుక దేవుని యొక్క సంపూర్ణ సంకల్పమును తెలుసుకొనుట మనకు ఆవశ్యకమై యున్నది. పూర్తి సత్యము ''అని వ్రాయబడియున్నది...'' మరియు ''అని కూడా యొకచోట వ్రాయబడియున్నది...'' అనువాటిలో మనము కనుగొనగలము. ''మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి'' (మార్కు 16:15) అని వ్రాయబడియున్నది. ''కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి'' (మత్తయి 28:19) అని కూడా వ్రాయబడియున్నది. పైన చెప్పబడిన రెండు వచనములను జాగ్రత్తగా ఆలోచించి వాటికి విధేయత చూపుట ద్వారా, మనము ఈ కాలములో మనకొరకు దేవుని చిత్తమును నెరవేర్చు మార్గమును కనుగొనగలము.


సౌవార్తీకరణ


మార్కు 16:15లో యేసు ప్రభువు ఆజ్ఞాపించినట్లు, లోకమంతటికీ వెళ్లి సువార్త ప్రకటించుట మొదటి మెట్టుగా యున్నది. ఈ ఆజ్ఞ వ్యక్తిగతముగా ఒక విశ్వాసికి సంబంధించినది కాదు, గాని క్రీస్తు శరీరమైన మొత్తము సంఘమునకు సంబంధించినదైయున్నది. ఒక వ్యక్తికి గాని లేక ఏదైనా స్థానికి సంఘమునకు గాని వారికి వారే లోకమందున్న ప్రతి మానవునికి సువార్త ప్రకటించుట మానవరీతిగా అసాధ్యమైనది. మనలో ప్రతి ఒక్కరు మన శాయశక్తులా ప్రయత్నించి ఆ మొత్తము కార్యములో చిన్న భాగమును నెరవేర్చగలము.


కాని ఆ భాగము, అది ఎంత చిన్నదైనా మనము పూర్తి చేయవలసియున్నది. ఇక్కడనే అపొ.కా. 1:8 అన్వయింపబడును. ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుకు ఒక బలమైన సాక్షిగా నుండవలెనంటే, పరిశుద్ధాత్ముడు అతడి పైకి దిగి వచ్చి శక్తితో నింపబడుట అవసరము. అందరు సువార్తికులుగా పిలువబడలేదను విషయం గమనించండి. (క్రీస్తు శరీరము క్షేమాభివృద్ది చెందుటకు ఆయన కొందరిని సువార్తికులుగా నియమించెను (ఎఫెసీ 4:13). కాని అందరు సాక్షులుగా నుండుటకు పిలువబడిరి.


ఒక సువార్తికునికి ఒక సాక్షికంటె ఎక్కువైన పరిధి ఉండును. ఒక సాక్షి అతడు పనిచేయు మరియు వెళ్లు ప్రతిచోట క్రీస్తును ప్రకటించవలెను. అది బంధువులకు, పొరుగువారికి, తను పనిచేసే స్థలములో తోటివారికి మరియు అతడు కలుసుకొనినవారికి లేక ప్రయాణము చేయుచున్నప్పుడు అవకాశమున్న వారికి. ఇక్కడ మనము ఎటువంటి భూసంబంధమైన వ్యాపకములలో నుండినా మనమందరము సాక్షులుగా ఉండవచ్చును.


కాని క్రీస్తు సంఘమునకు సువార్తికులను, మనము సాధారణముగా వినుచుండినట్లు, ''ఆత్మల సంపాదనకు'' లేక ''క్రీస్తు నొద్దకు జనులను తెచ్చుటకు'' కాక ''క్రీస్తు శరీరము క్షేమాభివృద్ది చెందుటకొరకు'' ఇచ్చెను (ఎఫెసీ 4:13). ఇక్కడనే సౌవార్తీకరణ, సామాన్యముగా చెప్పుకొనవలెనంటే క్రీస్తు శరీరము కట్టబడుటకు కాక, కేవలము వ్యక్తిగత ఆత్మల రక్షణ కొరకు మాత్రమే జరుగుచున్నది. ఈ రక్షణ పొందిన ఆత్మలను సాధారణముగా వారు తిరిగి తప్పిపోయే లేక ప్రభువు చేత ఉమ్మి వేయబడే నులివెచ్చని స్థితి (పక్రటన 3:16) లోనికి మారే అవకాశమున్న మతశాఖలకు సంబంధించిన మృతమైన సంఘములలోనికి పంపించుచున్నారు. రెంటిలో ఏ విధముగానైనా, వారు క్రీస్తు శరీరములో కట్టబడుట లేదు; ఆ విధముగా సాతాను ఉద్దేశ్యము నెరవేరుచున్నది. ఎందుకనగా ఆ వ్యక్తి రెండింతల నరక పాత్రుడగుచున్నాడు (మత్తయి 23:15). మొదటిగా అతడు నశించిన స్థితిలో నున్నవాడు, రెండవదిగా ఇప్పుడు ఎవరో ఒక సువార్తికుని ద్వారా అతడు రక్షింపబడిన వాడుగా తన్నుతాను ఎంచుకొనునట్లు చేయబడెను. అటువంటి సువార్తికుని ద్వారా నిర్మింపబడేది కేవలము అతడి యొక్క స్వంత సామ్రాజ్యముగా యుండును. అటువంటి సౌవార్తీకరణ సాధారణముగా మనుష్యుల ఘనతను కోరుకునేదిగాయుండును.


యేసు ప్రభువు సువార్తికులను ''మనుష్యులు పట్టు జాలరులు'' అని పిలిచెను. కాని మార్పుచెందని బిషప్పులు మరియు పాస్టర్ల సహకారముతో చేసే సౌవార్తీకరణ రంధ్రాలు పడిన వలలో చేపలు పట్టినట్లుగా యుండును. యేసు ప్రభువు లేక పేతురు వారి సువార్త సభల ప్రారంభోత్సవానికి అన్న లేక కయిపలను వారి ప్రక్కన సభాస్థలముపై కూర్చుండబెట్టి వారితో ఆ కూటములను ప్రారంభించుట ఎవరూ ఊహించుకొనలేరు! అయినప్పటికి ఈనాడు సువార్తికులు అదే చేయుచున్నారు. అంతేకాక, వారు ఈ మార్పులేని బిషప్పులను పొగుడుచున్నారు. అటువంటి సువార్తికులు మొదటి తరగతి రాజీ పడువారు.


ఇంకా, వలలో పడి దొరికిన చేపలు, తిరిగి తరువాత జరిగే సువార్త సభలలో పట్టబడునట్లు తిరిగి సముద్రములోనికి (మృత సంఘములలోనికి) వదిలి వేయబడును. ఈ ప్రక్రియ ఈనాడు అనేకమంది సువార్తీకులు అన్ని సంఘములతో కలిసి జరిగించే కూటములలో ప్రతి సువార్తీకుడు ఎత్తబడే చేతులను, ఇవ్వబడే నిర్ణయపు కార్డులు మొదలైనవి లెక్కించుట మరల మరల పునరావృతమౌవుతున్నది. ఇటువంటి సౌవార్తీకరణ దేవదూతలకు కాక, సాతాను యొక్క దురాత్మలకు సంతోషమును తెచ్చును. ఎందుకనగా దేవదూతలు రెండింతల నరక పాత్రులుగా అయ్యేవారికొరకు ఎట్లు సంతోషించగలరు?


యేసు ప్రభువు పాపములు క్షమించునని మరియు రోగములను స్వస్థపరచుననీ సువార్తను ప్రకటించినప్పుడు సూచక క్రియలు మరియు అద్భుతములు జరుగవచ్చును. కాని ఇక్కడ ప్రశ్న ఏమంటే అటువంటి సౌవార్తీకరణ ఫలితముగా ఎంతమంది క్రీస్తు శరీరములోనికి కట్టబడిరి అనేది.


మొదటి శతాబ్దములోని అపొస్తలులు ఇటువంటి సువార్తీకరణలో నిమగ్నులై యుండలేదు. వారు క్రీస్తును విశ్వసించిన వారిని శిష్యులై అభివృద్ధి చెందునట్లుగా స్థానిక సంఘములకు అప్పగించిరి. దురదృష్టవశాత్తూ 20వ శతాబ్దములో స్వస్థత వరముండిన సువార్తికుని యొక్క పరిచర్య క్రైస్తవత్వములో అన్నిటికంటె గొప్పదిగా చూడబడుచున్నది. ఇది క్రైస్తవ్యము దేవుని వాక్యపు బోధకు ఎంత దూరముగా తొలగిపోయినది అనుదానికి మరియొక సూచనగా యున్నది.


ఎఫెసీ 4:11లో చెప్పబడిన ఐదు పరిచర్యలు (అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు బోధకులు), 1 కొరింథీ 12:28లో వాటి ప్రాముఖ్యత ప్రకారము తెలుపబడినవి.


''మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగల వారినిగాను (అనగా సువార్తికులు, ఎందుకనగా క్రొత్త నిబంధనలో సువార్తికులందరు స్వస్థపరచు కృపావరము కలిగియుండిరి). అదే వర్గములో ఉపకారము చేయువారు (బలహీనులకు సహాయపడువారు) ప్రభుత్వము చేయువారు (మూలభాషలో ఓడ నడుపువారు) అనగా కాపరులు లేక పాస్టర్లు''.


ఇది దేవుని దృష్టిలో అపొస్తలులు, ప్రవక్తలు మరియు బోధకుల పరిచర్య క్రీస్తు శరీరములను కట్టుటలో సువార్తికని పరిచర్య కంటే ప్రాముఖ్యత కలదని తెలియజేయుచున్నది. సువార్తికుడు అపొస్తలులు, ప్రవక్తలు మరియు బోధకుల పరిచర్యల క్రింద అతడి పరిచర్యను ఉంచినపుడు మాత్రమే అది సరియైన స్థానములో ఉండినట్లగును. అటువంటప్పుడు మాత్రమే అతడి పరిచర్య క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు దోహదపడును. ఇక్కడనే 20వ శతాబ్దపు సౌవార్తీకరణ దేవుని వాక్యము నుండి ప్రక్కకు తొలగిపోవుచున్నది.


శిష్యులనుగా చేయుట


సౌవార్తీకరణ యొక్క ఉద్దేశ్యమును (మార్కు 16:15లో ఆజ్ఞాపించబడినది) సమస్త జనులను శిష్యులనుగా చేయుట (మత్తయి 29:18) అను ఆజ్ఞ యొక్క వెలుగులో చూచినప్పుడు మాత్రమే అర్థము చేసికొనగలము. ఇది క్రీస్తును విశ్వసింపని వారి కొరకు దేవుని పూర్తి సంకల్పమై యున్నది.


క్రీస్తును విశ్వసించిన వానిని శిష్యునిగా మార్చవలసియున్నది. దురదృష్టవశాత్తూ ఈనాడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు కూడా తరచూ నిజమైన రక్షణ పొందిన వారిగా యుండుటలేదు. ఎందుకనగా అనేక సమయములలో సువార్త కూటములలో మారుమనస్సు గూర్చి ఒక్కమాట కూడా చెప్పకుండానే కేవలము విశ్వసించమని అతడికి చెప్పబడియుండును. ఈనాడు క్రైస్తవత్వములోనికి మారిన అనేకులు, ఓపిక పట్టలేని మంత్రసానులు (సువార్తికులు), వారి లెక్కల గూర్చి ఆసక్తి కలిగి ప్రసవ కాలమునకు ముందే బలవంతముగా ప్రసవింపజేసిన బిడ్డల వలె యున్నారు. ఇటువంటి నెలలు నిండని శిశువులు తరువాత చనిపోవుదురు, లేక వారి జీవిత కాలమంతా సమస్యలతో యుందురు. దేవదూతలు మారుమనస్సు పొందిన పాపుల గూర్చి (లూకా 15:7, 10) సంతోషింతురు కాని, కేవలము నమ్మిన పాపుల విషయములో కాదు.


అయితే నిజమైన మారుమనస్సు కలిగియుండి, ఒక వ్యక్తి నిజముగా క్రైస్తవుడైనను, అతడి విషయములో దేవుని చిత్తము నెరవేరబడునట్లు అతడు శిష్యత్వములోనికి నడిపింపబడవలెను.


శిష్యత్వములోనికి నడిపింపబడని సౌవార్తీకరణ పూర్తికాని పనియైయున్నది. తరచుగా, తన స్వంత సామ్రాజ్యమును నిర్మించుకొనవలెననే సువార్తికుని ఆశ, అతడి ద్వారా 'మారిన' వారిని శిష్యులుగా చేయువారితో అతనిని కలిసి పనిచేయనివ్వదు.


అటువంటి వారిని మనము తీర్పు తీర్చకూడదు. ఎందువలనంటే తీర్పు తీర్చవద్దని మనకు ఆజ్ఞయున్నది. కాని వారి యొక్క క్రైస్తవులను శిష్యులగుటకు ఆటంకపడినందుకు వారు తప్పక ప్రభువుకు సమాధానమిచ్చుకోవలసి యుండును.


మార్కు 16:15లో ఉండిన ఆజ్ఞను మత్తయి 28:19, 20తో కలిపి చూచి దేవుని పూర్తి సంకల్పమును అర్థము చేసికొనుటకు ప్రయత్నించుదుము.


జనులను మొదటి మెట్టు అయిన మారుమనస్సు మరియు విశ్వాసములోనికి నడిపించిన తరువాత, అది నీటి బాప్తిస్మము యొద్దకు నడిపించవలెను (మార్కు 16:16). పూర్తిగా మార్పు చెందని కొందరు పెద్దలు మొదలైన వారికి అభ్యంతరము కలుగునేమో అని నీటి బాప్తిస్మమును ప్రకటింపని వారు పెంతెకొస్తు దినమున పేతురు బోధించినట్లు సువార్తను బోధించుట లేదు (అపొ.కా. 2:38).


ఇంకా, మత్తయి 28:19 శిష్యులనుగా చేయుడి అని చెప్పుచున్నది. ఇది రక్షణ పొందినవారిని వారు ప్రభువును వెంబడించుటకు ఆటంకపరిచే వారి బంధువుల యెడల నుండిన మితిమీరిన ప్రేమ నుండి వేరుపడునట్లు (లూకా 14:26), ఈ లోక వస్తు వాహనాలపై నున్న అనుబంధముల నుండి వేరుపడునట్లు (లూకా 14:33) మరియు వారి మిగిలిన జీవిత కాలమంతా ప్రతి రోజు సిలువ నెత్తుకొనునట్లుగా నడిపించవలెను (లూకా 14:27), ఈ మూడును శిష్యులగుటకు కనీస అవసరతలుగా ఉన్నవి.


మత్తయి 28:19 మరల నీటి బాప్తిస్మము యొక్క ఆవశ్యకతను గూర్చి చెప్పుచున్నది. రెండు వాక్య భాగములలో చెప్పబడిన రెండు ఆజ్ఞల విషయములలో బాప్తిస్మము గూర్చి చెప్పబడినా, ఈ దినాల్లో ధైర్యముగా బాప్తిస్మము గురించి ప్రకటించు సువార్తికులు చాలా తక్కువగా ఉన్నారు. వారు అన్ని సంఘములను సంతోషపెట్టువారుగా ఉండుట కొరకు దేవునికి భయడపడుట కంటే మనుష్యులకు ఎక్కువ భయపడి దేవుని సంపూర్ణ సంకల్పమును బోధించకుండా యుండి, దేవుని దృష్టికి బదులు మనుష్యుల దృష్టిలో ఘనులుగా నుందురు.


శిష్యునికి యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క ఆజ్ఞను బోధించవలసియున్నదని మత్తయి 28:20 చెప్పుచున్నది. అంతమాత్రమే గాక, యేసు ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞకు విధేయత చూపి, ఆచరించుట అతనికి నేర్పింపవలెను. మత్తయి 5,6 మరియు 7 అధ్యాయములలో యేసు ఆజ్ఞాపించిన కొన్నిటిని చూడవచ్చును. అనేకమంది విశ్వాసులు వాటికి విధేయత చూపుట గూర్చి పట్టించుకొనుట లేదు.


కనుక రెండు ఆజ్ఞలను కలిపి నెరవేర్చుట ఎటువంటి గొప్ప కార్యమో మనము చూచాము. ప్రతిచోట మనుష్యులు సగము పనిమాత్రమే చేయు సులువైన మార్గమును ఎంచుకొనుట సాధారణము.


ఇప్పుడు మన దేశములో దేవుని సంపూర్ణ సంకల్పమును ప్రకటించవలసిన అవసరత చేత పట్టబడి, యేసు ప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నిటికి హృదయ పూర్వకముగా విధేయత చూపి (వారికి కలిగిన వెలుగుకు తగినట్లుగా) క్రీస్తు శరీరమును కట్టవలెనని కోరిక కలిగినవారి అవసరత ఉన్నది.


తన శిష్యులు ఒక గుర్తు వలన గుర్తింపబడుదురని యేసు చెప్పెను. అది వారిలో ఒకరిపై ఒకరికి యుండిన ప్రేమ.


దీనిని గుర్తుంచుకొనుడి! అది ఎక్కువ సభ్యులు సంఖ్య ద్వారా లేక వారి యొక్క సంపద ద్వారా కాదు, కాని వారికి ఒకరిపై ఒకరి కున్న ప్రేమను బట్టి వారు, యేసు ప్రభువు శిష్యులుగా గుర్తింపబడుదురు. సువార్త, స్వస్థత కూటములలో సందేశములను వినుటకు వేలకొద్ది మందిని ఆకర్షించు ప్రదేశములో ఒకరిని ఒకరు ప్రేమించుకొను ఒక స్థానిక సంఘమును స్థాపింపబడవలెను.


అయినప్పటికీ, విచారించవలసిన విషయమేమంటే, ఎక్కడైతే సంవత్సరము తరువాత సంవత్సరము ఈ సువార్త, స్వస్థత కూటములు ఏర్పాటు చేయబడుచున్నవో, అక్కడ ఒకరితో ఒకరు తగవులు లేకుండా లేక ఒకరిపై ఒకరు కొండెములాడుట మొదలైనవి లేకుండా, (ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట అనేది ప్రక్కన పెట్టండి) ఉండే ఒక సంఘమునైనా చూచుట కష్టమైనదిగా యున్నది. క్రొత్తగా మారినవారు జయ జీవితమును జీవించలేకపోవుట అర్థము చేసికొనవచ్చును. కాని మన చుట్టూ ఉన్న సంఘములలో పోరాటములు, అపరిపక్వత లక్షణములు పెద్దలలో కూడా కనబడుచున్నట్లయితే మనము ఏమని చెప్పుకొనవలెను.


మత్తయి 28:19, 20లో చెప్పబడిన శిష్యత్వము మరియు యేసు ప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నిటికి విధేయత చూపు విషయము పూర్తిగా నిర్లక్ష్యము చేయబడుచున్న దనుటకు ఇదే స్పష్టమైన సూచన. మార్కు 16:15, 16 లో నున్న ఆజ్ఞకే (విశ్వాసము మరియు నీటి బాప్తిస్మము) విధేయత చూపబడుచున్నది మరియు అది కూడా కొన్ని చోట్ల సగము మట్టుకే (నీటి బాప్తిస్మము విడిచిపెట్టబడుచున్నది) ఆచరించబడుచున్నది.


మార్కు 16:15-20లో సౌవార్తీకరణ గూర్చి నొక్కి చెప్పబడినది. ఆ సందేశము ప్రభువుచేయు సూచకక్రియలు, అద్భుతముల ద్వారా స్థిరపరచబడుచున్నది. మత్తయి 28:19, 20 శిష్యత్వము గూర్చి నొక్కి చెప్పబడినది. శిష్యత్వము యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికి విధేయత చూపుటలో కనబడును. క్రైస్తవులలో ఎక్కువ మంది మొదటిదానినే ఎక్కువగా ఇష్టపడుదురు. చాలా కొద్దిమంది తరువాత దానిని కోరుకొనెదరు. అయినప్పటికి తరువాతది లేకుండా మొదటిది ఒక్కటే ఉండుట అసంపూర్ణమైనది మరియు సగము మానవ శరీరము వలె విలువలేనిదిగా యుండును. కాని ఇది చూచుటకు ఎంత మందికి కళ్లు ఉన్నవి?


యేసు క్రీస్తు యొక్క పరిచర్యలో, ఆయన సువార్త స్వస్థత పరిచర్య వలన జనసమూహములు ఆయనను వెంబడించుట గూర్చి మనము చదువుదుము. అయితే ఆయన వెంటనే వెనుకకు తిరిగి శిష్యత్వము గూర్చి చెప్పెను (లూకా 14:25, 26). ఈనాటి సువార్తికులు ఆవిధముగా వారికి వారుగా గాని లేక వారు ప్రారంభించిన పనిని పూర్తిచేయు అపొస్తలులు, ప్రవక్తలు, బోధకులు మరియు కాపరులతో కలిసిగాని చేయుదురా?


యేసు ప్రభువు జన సమూహములకు శిష్యత్వము గూర్చి బోధించినప్పుడు త్వరగా ఆ సమూహములు 11 మందికి తగ్గిపోయిరి. (యోహాను 6:2ను 70వ వచనముతో పోల్చి చదవండి). మిగిలిన వారికి ఆ సందేశము చాలా కఠినముగా నుండుటచేత వారు విడిచి వెళ్లిపోయిరి (యోహాను 6:60, 66). కాని నిలిచిన ఆ పదునొకండు శిష్యులతో దేవుడు ఈ లోకములో ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చెను మరియు యేసు క్రీస్తు ప్రారంభించిన పనిని కొనసాగించెను.


ఈనాడు యేసు ప్రభువు యొక్క పరిచర్యను ఆయన శరీరముగా మనము పూర్తి చేయవలసి యున్నది. సువార్తికుడు సమూహములను సమకూర్చినపుడు మనము క్రీస్తును అంగీకరించిన వారిని శిష్యత్వములోనికి మరియు విధేయతలోనికి నడిపించవలెను. కేవలము ఆ విధముగా మాత్రమే క్రీస్తు శరీరము కట్టబడును.


అధ్యాయము 20
సంఘముగా మనకున్న విశిష్టమైన పిలుపు

మనదేశములో దేవుడు మనలను వేరు వేరు ప్రదేశములలో సంఘముగా ఉంచగా అక్కడ మనకున్న విశిష్టమైన పిలుపు ఏమైయున్నది?


మనము రాజీపడకుండా దేవుని వాక్యమునకు నమ్మకముగా ఉండాలంటే, మనము కనీసము ఏడు విషయాలలో ప్రస్తుతమున్న క్రైస్తవ సంఘములకు వ్యత్యాసముగా ఉండవలెను.


1. గొప్పతనము కాదు, గాని పరిశుద్ధత


బబులోను (అసత్యమైన సంఘము) ''మహాబబులోను'' అని ప్రకటన గ్రంథములో పదకొండుసార్లు పిలువబడినది. మరోప్రక్క యెరూషలేము (క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె) 'పరిశుద్ధ పట్టణమని' పిలువబడినది (ప్రకటన 12 నుండి 21 అధ్యాయములు చూడండి).


మనము లోకము దృష్టిలో 'సంఘముగా' గొప్పగా ఉండాలని చూచినట్లయితే మనము బబులోను వైపు కొట్టుకొనుపోవు వారమగుదుము. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టిలో అసహ్యము అని యేసు చెప్పారు (లూకా 16:15). అందువలన మన సంఘములో ఏ విషయములోనైనా, (అది సంగీతము లేక బోధించుట) మనుష్యులను ఆకట్టుకొనుటకు చెప్పేది లేక చేసేది ఏదైనా చేస్తున్నామేమోనని ఎప్పుడూ గమనించుకోవాల్సి యున్నది. సంఖ్యలు ఎప్పుడూ మనుష్యులకు ఆకర్షణీయముగా యుండును. మనము సంఘము యొక్క ఎదుగుదలను లెక్కల ద్వారా ఇతరులకు చూపుటకు ఆసక్తి చూపినట్లయితే, అది బబులోను యొక్క ఒక ఖచ్చితమైన గుర్తుగా యున్నది. దీని అర్థము దేవుడు మనకు ఇతరులను కలుపుటలో ఆసక్తిగా లేడని కాదు. ఆయన యొక్క ఇతర గొఱ్ఱెలకు (ఆత్మీయ జీవితము యెడల ఆసక్తిగాయున్నవారు) సిఫారసు చేయగలిగిన మందగా మనలను ఆయన తలంచినట్లయితే ఆయన తప్పక ఇతరులను చేర్చును. కాని సంఖ్యలో పెరుగుట ఎదుగుదలకు సూచనగా ఉండాల్సిన అవసరములేదు. ఎందుకంటే మత మౌఢ్యవాదులు, ఇతర అన్యమతములు కూడా సంఖ్యలో పెరుగుచున్నవి. అంతేకాకుండా చాలాసార్లు వారి యొక్క లెక్కలు అనేక క్రైస్తవ గుంపుల కంటే చాలా ఆకర్షణీయముగా ఉంటున్నాయి.


పరిశుద్ధత నిజమైన సంఘము (యెరూషలేము) యొక్క లక్షణముగా ఉన్నది. కనుక యెరూషలేము యొక్క ఎదుగుదల పరిశుద్ధతను బట్టి కొలవబడుతుంది. అందులో ఒకరి యెడల ఒకరికుండిన ప్రేమ కూడా కొలువబడుతుంది. జీవమునకు వెళ్ళుమార్గము ఇరుకైనదనియు మరియు కొద్ది మందిమాత్రమే దానిని కనుగొందురని యేసు ప్రభువు చెప్పారు. అందును బట్టి ఎవరైతే ఇరుకు ద్వారమును యేసు ప్రభువు ఇరుకు చేసినంత ఇరుకు చేయుదురో వారి సంఘములో సహవాసమునకు తప్పనిసరిగా తక్కువమంది వచ్చెదరు (మత్తయి 7:13, 14). అయితే యేసు ప్రభువు చెప్పిన దానికంటే ద్వారమును మనము విశాలము చేసినట్లయితే, అప్పుడు చాలా సులువుగా మనము మన సంఖ్యను పెంచుకొనవచ్చును. ఇక్కడనే చాలా వరకు ఈనాటి క్రైస్తవత్వము తప్పుమార్గములో పోవుచున్నది. యేసు ప్రభువు ఇరుకు ద్వారము మరియు ఇరుకు మార్గము గూర్చి ''కొండమీది ప్రసంగము'' (మత్తయి 5-7 అధ్యాయములు) సందర్భముగా చెప్పారు. ఆ అధ్యాయములలో ఇరుకు ద్వారము మరియు ఇరుకు మార్గములంటే ఏమిటో చెప్పబడియున్నది.


1 కొరింథీ 3:13లో ఆఖరి దినమున మన పనిని ప్రభువు పరిమాణాన్ని బట్టి కాక నాణ్యతను బట్టి పరీక్షిస్తారని తేటగా చెప్పబడినది. నాణ్యతతో కూడిన పరిచర్య కేవలము ఎవరైతే ఎల్లప్పుడు తమను తాము తీర్పు తీర్చుకొందురో వారి యొద్ద నుండి మాత్రమే వచ్చును. ''మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?'' (యెషయా 33:14)


ఇక్కడ నిజమైన సంఘము మన చుట్టూ ఉండిన ఇతర పేరొందిన క్రైస్తవ శాఖలకు వ్యత్యాసముగా ఉండును. ఈ విశిష్టతను మనము కోల్పోయిన యెడల మనము చివరకు మరొక మృతమైన సంఘశాఖగా మారుదుము.


2. మొదట బాహ్య జీవితము కాదు, గాని అంతరంగ జీవితము


పాత నిబంధనలో ఎప్పుడూ ప్రాధాన్యత బాహ్య విషయములకు ఇవ్వబడినది. అది ''వారి హృదయ కాఠిన్యమును బట్టి'' (మత్తయి 19:8) అని చెప్పబడినది. ధర్మశాస్త్రము బాహ్యమైన స్వచ్ఛత గూర్చి నొక్కిచెప్పేది. దానికి వేరుగా క్రొత్తనిబంధన మొదట ''గిన్నె లోపల'' శుభ్రపర్చుట గూర్చి నొక్కిచెప్పింది (మత్తయి 23:25, 26). ఆ వచనములో యేసు ప్రభువు ఒకసారి లోపల శుభ్రపరిచినట్లయితే, బయట దానికదే శుభ్రపర్చబడునని (26వ వచనము), కనుక బయట శుభ్రపర్చవలసిన అవసరము లేదని చెప్పారు. దీనిని మనము మత్తయి 5:21-30లో చూడవచ్చును. ఒకడు తన హృదయమును కోపము నుండి శుభ్రపరచుకొనినట్లయితే అతడు బహిరంగముగా నరహత్యచేసే ప్రమాదములో ఉండదు. అదేవిధముగా అతడు తన హృదయమును చెడు తలంపుల నుండి శుభ్రపరచుకొనినట్లయితే, అతడికి బాహ్యముగా వ్యభిచారము చేసే ప్రమాదముండదు. పాత్రను లోపల శుభ్రపరిచినట్లయితే బయట దానికదే శుభ్రపరచబడుతుంది.


సంఘములో ప్రాథమికంగా సినిమాలకు వెళ్లుట, పొగత్రాగుట, మత్తు పదార్థములు సేవించుట, జూదము మరియు అటువంటి బాహ్య జీవితమునకు సంబంధించిన వాటిపైనే ప్రాధాన్యత ఉండినట్లయితే, అటువంటి సంఘము పాత నిబంధనకు సంబంధించిన సంఘముగా మాత్రమే ఉండును! ఈ బాహ్యమైన విషయాలన్నీ తప్పనిసరిగా చెడ్డవే కాని వాటిని పోగొట్టుటకు మార్గము మొదట వాటిపై కేంద్రీకరించుట కాదు, కాని అటువంటి బాహ్యముగా కనబడే దుష్టత్వాన్ని కలుగజేసే అంతరంగపు లోకతత్వపు వైఖరి గల మనస్సుపై కేంద్రీకరించవలెను.


ఎవరికి వారు తీర్పుతీర్చుకొనకుండా అంతరంగములో శుద్ధి పొందడము జరుగదు. ఇటువంటి అంతరంగ శుద్ధి గూర్చి ఎప్పుడూ సంఘులో బోధించకపోయినట్లయితే సంఘమును కట్టుట అసాధ్యము. పాపము యొక్క భ్రమతో కఠిన పర్చబడకుండునట్లు సంఘములో ఒకరినొకరు హెచ్చరించుకొనుచుండవలెనని బైబిలు చెప్పుచున్నది (హెబీ 3:13; 10:25). చాలా 'క్రైస్తవ సంఘములలో' ఇటువంటి బోధ యెడల ఆసక్తి లేదు. దానివలన అవి గిన్నె బయట మాత్రమే శుభ్రపరిచే పరిసయ్యులను తయారు చేయుచున్నవి. ఇక్కడ క్రీస్తు వధువు వేరుగా ఉండవలెను.


3. విరామ మెరుగని కార్యక్రమములు కాదు, గాని విధేయత


పేరొందిన మత శాఖలలో ఎప్పుడూ ''కార్యక్రమము''లపై ప్రాధాన్యత ఉండును, అది వీధులలో బోధించుట, ఇంటింటిని దర్శించుట, సువార్తికులను పంపుట మొదలైన వాటి మీద ఉండును. ఇవన్నీ మంచివే, కాని దురదృష్టవశాత్తూ ఇవి అనేక విశ్వాసుల మనస్సులలో దేవుని వాక్యమునకు సంపూర్ణమైన విధేయత చూపుట యొక్క స్థానమును ఆక్రమించినవి.


క్రైస్తవులకు యేసు చెప్పిన వాటన్నిటిని గైకొనవలెనని బోధించమని ఆయన చెప్పారు (మత్తయి 28:20). బలులనర్పించుట కంటే దేవుడు విధేయతను ఎక్కువగా కోరుకొనుచున్నాడు (1 సమూయేలు 15:22). దేవుని యెడల మనకున్న ప్రేమను ఋజువు చేయుటకు మనము కొన్ని శారీరక బాధలు అనుభవించాలనుకొనేది అన్యజనుల ఆలోచన. ఇటువంటి ఆలోచన భారతదేశపు సంస్కృతిలో బహుగా వ్యాపించి యున్నది. అదే ఆలోచన మనదేశములో నున్న క్రైస్తవ్యములో కూడా బలముగా యున్నది. అందువలన ఉద్యోగము విడిచిపెట్టుట మరియు క్లిష్టమైన ప్రదేశములకు వెళ్ళుట, వేరు వేరు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొనుట మొదలైనవి ఆత్మానుసారమైనవిగా చూచుట జరుగుచున్నది. వీటన్నిటిలో ఎంతో త్యాగమున్నది. కాని ఇది దేవుని వాక్యమునకు లోబడుటకు ప్రత్యామ్నాయము కావు.


యేసు ప్రభువు యెడల మనకున్న ప్రేమ త్యాగము ద్వారా ఋజువు కాదు. కాని, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారానే ఋజువవునని యేసు ప్రభువే యోహాను 14:15లో చెప్పారు. యేసు ప్రభువు మత్తయి 5,6 మరియు 7 అధ్యాయములలో బోధించిన వాటికి విధేయత చూపుట మన జీతములో 50 శాతం ఇచ్చుట లేక మన ఉద్యోగమును విడిచిపెట్టి సువార్తికునిగా దూరప్రదేశమునకు వెళ్ళుట కంటే ఆయన యెడల మనకుండిన ప్రేమకు గొప్ప ఋజువుగా ఉండును.


పేరొందిన శాఖాపరమైన క్రైస్తవత్వముకు విశ్రాంతి లేకుండా పనులలో మునిగిపోయిన వారికి మార్త సూచనగా ఉన్నది (లూకా 10:39-42). ఆమె నిష్కపటమైనది, త్యాగపూరితమైనది, స్వార్థము లేనిది మరియు ప్రభువుకు పరిచర్య చేయుటకు ఆమె వంటగదిలో బహు ఆసక్తి కలిగియుండెను. అయినప్పటికి ప్రభువు ఆమెను గద్దించెను. ఆమె ఆత్మ ఏమీ చేయకుండా కూర్చొని ప్రభువు కొరకు ఏ త్యాగము చేయని మరియ యెడల విమర్శతో నిష్టూరతతో నిండిపోయి ఉండెను మరియ యేసు ప్రభువు యొక్క పాదముల యొద్ద ఆయన కొరకు ఏదైనా చేసే ముందు ఆయన మాటలు వినుటకు ఎదురుచూస్తూ కూర్చొనినది.


ఇది మన వైఖరిగా ఉండవలెను. అది విశ్రాంతి లేకుండా పనిచేయుట కాక ప్రభువు ఏమి చెప్తారో అని ఎదురుచూచి దానికి విధేయత చూపుటైయున్నది. మన స్వంత ఆలోచన ప్రకారము కాక దేవుని చిత్తము చేయుటై యున్నది.


4. శిష్యులను తయారు చెయ్యని సౌవార్తీకరణ కాదు


కొందరు విశ్వాసులు దేవుని వాక్యములో - మీరు వెళ్ళి సర్వ లోకమునకు సువార్త ప్రకటించుడి (మార్కు 16:15) అనే ఒకే ఒక ఆజ్ఞ ఉండినట్లు పరిగణిస్తారు. ఈ ఆజ్ఞ ప్రపంచమంతా వ్యాపించియుండిన క్రీస్తు శరీరము తప్పక పాటించవలసిన ఆజ్ఞ - మరి ముఖ్యముగా ఇది శరీరమునకు (సంఘము) క్రీస్తు ఇచ్చిన సువార్తికులు (ఎఫెసీ 4:11) విధేయత చూపవలసినది. కాని క్రీస్తు ఇచ్చిన ఈ ఆజ్ఞ ఆయన ఇచ్చిన వేరొక ఆజ్ఞ అయిన మీరు వెళ్లి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి (మత్తయి 28:19) అనుదానితో సరియైన తూకంలో లేకపోయినట్లయితే ఆ పని నెరవేరనట్లే.


వ్యక్తిగతంగా ఎంతో వెలచెల్లించి, లోకమంతటిలోకి వెళ్లి యేసుని పేరు ఎరుగని వారికి సువార్తను ప్రకటించిన వారినందరిని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాము. కాని 20వ శతాబ్దపు సువార్తీకరణ గూర్చిన విషాదకరమైన విషయమేమిటంటే మత్తయి 28:19, 20లో ఉన్న ఆజ్ఞ యొక్క మూడు భాగములు - శిష్యులను చేయుట, వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటిలో బాప్తిస్మమిచ్చుట (ముంచి లేపుట) మరియు యేసు ఆజ్ఞలన్నిటికి విధేయతను వారికి బోధించుట - దాదాపు పూర్తిగా నిర్లక్ష్యము చేయబడెను.


కోకొల్లల మంది విశ్వాసులు శిష్యులను చేయుటకు కాక కేవలము సువార్తీకరణకు ప్రాధాన్యతను ఇస్తున్నప్పుడు, శిష్యులను చేయుట అను ఆ నిర్లక్ష్యము చేయబడిన పనిని మనము చేసి ఆ పూర్తికాని దానిని పూర్తి చేయుట మన పనియైయున్నది.


ప్రపంచములో సువార్త చేరని వేరు వేరు ప్రదేశములకు సువార్త అందించుటయే ఇప్పటికి పూర్తి కాని పని అని అనేకులనుకొందురు, సువార్త కొరకు పిలువబడినవారికి దేవుడు ఆ భారమిచ్చును. కాని దేవుడు మనకు అంతే ప్రాముఖ్యమైన పని (అలా కానట్లయితే, అంతకంటే కష్టమైన పని)యైన సువార్త విని మార్పు చెందిన వారిని శిష్యులుగా మార్చే పనిని మనకిచ్చారు.


దీనిని ఒక వడ్రంగి దుఖాణములో చాలామంది వడ్రంగి వారు బల్లలు చేయుట కొరకు నాలుగు కాళ్ళను తయారుచేసే పనిలో మునిగిపోయి యుండుటను మరియు కొద్దిమంది మాత్రమే బల్లలను పూర్తి చేయుటకై బల్ల పై భాగమును తయారు చేయుట అను దృష్టాంతముతో పోల్చవచ్చును. దాని యొక్క ఫలితము ఆ దుఖాణములో పూర్తికాని బల్లలు కుప్పగా నిండిపోయి యుండినా, అక్కడ వండ్రంగి వారు ఇంకా బల్లల యొక్క కాళ్లను చేయుటలోనే తీరిక లేకుండా ఉండుట. యేసు ప్రభువు నజరేతులో వడ్రంగి పని చేసినప్పుడు ఆయన ఒక బల్ల పూర్తి చేసిన తరువాతనే ఇంకొక బల్ల తయారు చేయుటకు మొదలు పెట్టేవారని మనము అనుకొనవచ్చును. ఆయనెప్పుడూ మొదలుపెట్టిన పనిని పూర్తి చేయుటలో నమ్మినవారు (ఆయన సిలువపై ''సమాప్తమాయెను'' అని కేక వేసెను) మరియు ఆయన ఈనాడు కూడా అదేవిధముగా ఉన్నాడు. మనము ఆయన తోటి పనివారము కనుక మనము కూడా పూర్తి చేయవలసిన పనిలోనే నమ్మకముంచవలెను. సువార్త ద్వారా మార్పు చెందిన వారిని శిష్యులుగా చేయవలెను.


5. పాత నిబంధన ప్రకారము ఇచ్చుట కాదు, గాని క్రొత్త నిబంధన ప్రకారము ఇచ్చుట


చాలామంది విశ్వాసులకు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యనున్న వ్యత్యాసము అసలు తెలియదు. దీనిని బోధకులు అవకాశముగా తీసుకొని విశ్వాసులపై పాత నిబంధన 'దశమ' భాగ అర్పణను ఒక ఆజ్ఞగా మోపుచున్నారు.


యేసుప్రభువు పాత నిబంధన క్రింద నున్న పరిసయ్యులతో మాట్లాడినప్పుడు వారితో దశమ భాగము గూర్చి చెప్పారు. అది మోషే చేత ఆజ్ఞాపించబడినది (మత్తయి 23:23). కాని ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ వారికి క్రొత్త నిబంధనను పరిచయం చేస్తున్నప్పుడు, ఆయనెప్పుడూ వారు ఎంత ఇవ్వవలెననునది చెప్పలేదు. కాని వారి ఉద్దేశ్యముల గూర్చి మాట్లాడారు (మత్తయి 6:1-4). క్రొత్త నిబంధనలో మనము ఇచ్చేదాని నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వబడినది కాని దాని పరిమాణమునకు కాదు (2 కొరింథీ 9:7 చూడండి). దీనిని బట్టి మనకు ఇప్పుడున్న ప్రశ్న, మనము పరిసయ్యుల వలె లేక యేసు ప్రభువు శిష్యులుగా నుండగోరుచున్నామా అనేదియే!


ఈ రోజులలో క్రైస్తవ పత్రికలు విశ్వాసులు దశమ భాగాలతో నానారకములైన పరిచర్యలకు బోధకులకు సహాయపడమని చెప్పు ప్రకటనలతో నిండియున్నవి. దాదాపు అన్ని క్రైస్తవ పత్రికలు బబులోను యొక్క వ్యాపారసంబంధమైన ఆత్మతో కలుషితమైపోయాయి. క్రీస్తు పేరిట నానాకరములైన ప్రాజెక్టులకు డబ్బును అడుక్కొనెదరు.


అపొస్తలులు ఒక్కసారి కూడా తమ స్వంత పరిచర్యల కొరకు ఈ విధంగా అడుక్కొలేదు. యేసుకూడా ఆ విధంగా చేయలేదు. ఈ రోజు మనము చూచునవి యేసు మరియు అపొస్తలుల ఉదాహరణలకు పూర్తిగా వ్యత్యాసముగా ఉన్నవి. అయినప్పటికీ ఎక్కువమంది విశ్వాసులు ఈ విషయమును గూర్చి ఎటువంటి అవగాహన లేకుండా ఈ విధంగా అడుక్కొనటానికి మద్ధతు ఇచ్చుట కొనసాగించి తమ్మును తాము కూడా కలుషితపరచుకుందురు.


మన ధనము కంటే మన శరీరములను దేవునికి ఇచ్చుకొనవలెనని క్రొత్త నిబంధన ఎక్కువగా చెప్తుంది (రోమా 12:1). మనము దీనినే సంఘములో ఎప్పుడూ నొక్కి చెప్పుచుండవలెను. మనము దేవుని రాజ్యమును మొదట వెదకినట్లయితే మన ఆర్థిక అవసరములను దేవుడే చూచుకొనును (మత్తయి 6:33).


6. మానవుని శక్తి కాదు, కాని దేవుని యొక్క శక్తి


మానవుని మానసిక శక్తి ఈ రోజుల్లో క్రైస్తవత్వములో పరిశుద్ధాత్ముని యొక్క శక్తికి మోసపూరితమైన నకిలీగా మారినది. కరిస్మాటిక్‌ సంఘాలలో మానసిక శక్తి ఆత్మశక్తి వేషములో ఉన్నది. మనము ఈ మోసము నుండి తప్పించుకొనవలెనంటే మానసిక విషయములను మరియు ఆత్మ విషయములను వివేచించుట ఇప్పటి అవసరమైయున్నది. మరియు ఈ దినములలో మనము దేవుని సంఘములో దేవుని వాక్య వెలుగును బలముగా ప్రసరింప చేయవలసియున్నది.


దేవుడు మానవుని బలహీనత ద్వారా పనిచేయును. ఆయన లోకములో నున్న జ్ఞానులను సిగ్గుపరుచుటకు వెఱ్ఱివారిని ఏర్పర్చుకొనెను (1 కొరింథీ 1:27). దేవుని సత్యములు జ్ఞానులకు వివేకులకు మరుగుపర్చబడి పసిపిల్లలకు బయల్పర్చబడినవి (మత్తయి 11:25). ఎక్కడైతే వేదాంత విద్యాధికులు వారి తెలివి తేటలతో బోధిస్తారో అక్కడ తప్పనిసరిగా బబులోను ఉంటుంది. ఆ వేదాంత విద్యాధికులు వారి సిద్ధాంతాలలో తప్పులు లేనివారైనా సరే అంతే. బబులోను క్రైస్తవత్వము దేవుని పనికి వెఱ్ఱివారిని ఉపయోగించుకొనే దేవుని పద్ధతిని పనికిరాదని త్రోసివేస్తుంది.


మానవుని తెలివితేటలను హెచ్చించుట బబులోనును కట్టుటకు ఒక ఖచ్చితమైన మార్గము. ఎవరైతే దేవుని పనికి వారి తెలివిన ఉపయోగించుకొనుటకు చూచెదరో, ఎవరైతే మానసిక శక్తిని మరణింప చేయు అవసరమును అర్థము చేసికొనరో, అటుంటి తెలివితేటలు గల జనులున్న చోట సంఘములో కూడా ఈ ప్రమాదమున్నది. సంఘములో తెలివైన వ్యక్తి నిజానికి ఒక ఆటంకముగా నుండును. దేవుడు ఆయన పనిని విద్యాధికులైన ప్రొఫెసర్లు స్కాలర్ల ద్వారా చేయడు కాని దీనులైన దేవునికి భయపడే వారి ద్వారానే చేయును.


కాబట్టి సంఘములో నాయకత్వము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని బట్టే కాని మరి దేనిని బట్టి ఉండకూడదు. దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారాను మరియు సిలువను గూర్చిన వార్త ద్వారాను మాత్రమే ప్రత్యక్షపర్చబడుతుంది (1 కొరింథీ 1:18, 2:4) అంతేకాని అధికారము చలాయించగలిగే మానవ వ్యక్తిత్వాల ద్వారా కాదు.


ఎక్కడైతే ఒక సంఘము దేవుని ఆత్మ యొక్క శక్తిని మరియు సిలువ మార్గమును నొక్కి చెప్పదో అక్కడ మానవ మానసిక శక్తి తనను తాను ప్రత్యక్షపర్చుకొనునట్లు తలుపులు తెరచి ఉంచినట్లవుతుంది. దేవుని ప్రత్యక్షతకు మరియు ఆత్మ యొక్క శక్తికి బదులుగా మానవ తెలివితేటలు మరియు సామర్థ్యము ముందుకు వచ్చి అక్కడ పరిశుద్ధత బోధింపబడినా బబులోను కట్టబడుతుంది!


7. సమాజముగా కూడుకొనుట కాదు, గాని క్రీస్తు శరీరమును కట్టుట


పాత నిబంధనలో దేవుని ప్రజలైన యూదులు ఒక శరీరముగా ఉండుట అసాధ్యము. అది యేసు ప్రభువు పరమునకు ఆరోహణమయ్యి మనిషిలో నివసించుటకు పరిశుద్ధాత్మను కుమ్మరించిన తరువాత మాత్రమే అది సాధ్యమైనది. ఇప్పుడు ఇద్దరు ఒకటికాగలరు. పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులు ఒక సమాజముగా నుండిరి. అది అంతకంతకు పెరుగుచుండినదునుటలో అనుమానమేమీ లేదు. అయినా అది ఒక సమాజమే. క్రొత్త నిబంధనలో సంఘము ఒక శరీరము కాని ఒక సమాజము కాదు.


ఇద్దరు ఒకటిగా కాకపోయినట్లయితే, అక్కడ ఉన్నదంతా ఒక సమాజమే. క్రీస్తు శరీరములో ముఖ్యమైన విషయం పరిమాణము కాదు గాని ఐకమత్యము. అందువలన ఈ ప్రమాణము ద్వారా సమాజముకాని 'సంఘమును' కనుగొనుట చాలా కష్టము. ప్రతిచోట ఐకమత్యములో కాక పరిమాణములో పెరుగుతున్న సమాజములను చూడవచ్చు. అసూయ, కలహములు మరియు పోటీ నాయకత్వపు స్థాయిలోనే చూచుదుము.


లోకమంతటా వేరు వేరు స్థలములలో క్రీస్తు శరీరము యొక్క ప్రత్యక్షతలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. బబులోను క్రైస్తవత్వము దీనిని సాధించలేదు. కాని యేసు క్రీస్తు శిష్యులకుండాల్సిన గుర్తు ఒకరి యెడల ఒకరికి కల మిక్కుటమైన ప్రేమయే అనియు సంఖ్యలో ఎక్కువగా ఉండుట కాదనియు అర్థము చేసికొనిన కొద్ది మందితో దేవుని పని కొనసాగుతుంది.


క్రీస్తు శరీరములో ఆత్మీయ వరములు లేకపోయినా ప్రతి వ్యక్తి విలువైనవాడు. అతడు శరీరములో భాగము కాబట్టి అతడు విలువైనవాడు. ఇంకా చెప్పాలంటే శరీరములో ఐక్యత కొరకు ప్రత్యేకతలు లేనివానికి దేవుడు ఎక్కువైన ఘనత నిచ్చును అని చెప్పబడినది (1 కొరింథీ 12:24, 25). సంఘములో, దేవునికి భయపడి, దీనులుగా ఉన్నవారైతే వారికి ఏ ప్రత్యేకతలు లేకపోయినా, మనము దేవుని మాదిరిని అనుసరించి వారికి ఘనతను ఇవ్వవలెను. బబులోనులో, బోధించు వరము కలవాడు, పాటలు పాడు వరము కలవాడు మరియు క్రైస్తవుడుగా మారిన గొప్పవాడు ఘనపర్చబడును కాని దేవుని గుడారమైన సంఘములో దేవుని భయము గలవారిని మనము ఘనపరచెదము (కీర్తన 15:1, 4).


బబులోనుకు యెరూషలేముకు ఎంతో తేడా ఉన్నది.


దేవుడు ఈనాడు మనలను బబులోను నుండి బయటకు వచ్చి యెరూషలేమును కట్టమని పిలుచుచున్నాడు (పక్రటన 18:4).


అధ్యాయము 21
రొట్టె విరచుట - ఒక నిబంధన

యేసు ప్రభువు ''రొట్టె విరచు''టను ఏర్పాటు చేసినప్పుడు, ఆయన అంతకుముందు ఎప్పుడూ వాడని ఒక మాటను ఉపయోగించిరి. అది 'నిబంధన', మనము ప్రభువు బల్లలో అర్థవంతముగా పాలుపంచుకొనుటకు దీని గూర్చి సరియైన గ్రహింపు ఉండుట అవసరము.


దేవునితో నిబంధనతో కూడిన సంబంధము


'నిబంధన' అను మాట దేవుడు నోవహుతో ఒక నిబంధన చేయుదునని (ఆదికాండము 6:18) వాగ్ధానము చేసిన సందర్భములో (ఆదికాండము 9:9, 11) మొదట పేర్కొనబడినది. మానవుని పాపమును బట్టి దేవుడు లోకమంతటిని శిక్షించి, తిరిగి మరెప్పుడు లోకమును జలప్రళయముతో శిక్షించనని ఆయన నోవహుతో నిబంధనను చేసెను. ఆయన అప్పుడు చేసిన నిబంధనకు గుర్తుగా ఒక సూచనను ఆయన ఇచ్చెను. దానిని మనము ఇప్పుడు 'ఇంధ్రధనస్సు'గా పిలుచుచున్నాము. అయితే దేవుడు దానిని ''మేఘములో నా ధనస్సు'' (ఆదికాండము 9:13) అనెను. అక్కడ ధనస్సు అని వాడిని మాట బైబిలులో మరికొన్నిచోట్ల ఆయుధముగా వాడు 'ధనస్సు'గా యున్నది. ఆ ధనస్సు ఎప్పుడూ బాణము (అమ్ము)తో కొట్టబడువాని వైపు గురి చూపునదిగా యుండును. మేఘములో నుంచబడిన ధనస్సు మీదికి (క్రిందికి కాకుండా) గురిచూపబడి యుండుటలో అర్థము, ఆకాశమండలములో నివసించు దేవుడు ఆ ధనస్సు నుండి విడివబడిన అమ్ము చేత కొట్టబడుటకు సంసిద్ధుడైయుండెను. అనగా మానవుని యొక్క పాపపు శిక్షను తీసుకొనుటకు సిద్ధముగా యుండెను. ఆ ధనస్సు మానవుని వైపునకు కాక దేవునికే గురిపెట్టబడి యుండెను. లోకము అప్పటి నుండి జలప్రళయము చేత శిక్షింపబడలేదు. దేవుని తీర్పు ప్రవాహములు సిలువపై యేసుప్రభువుపై ప్రవహించెనని కీర్తన 69:1, 2 చెప్పుచున్నది. ఇది మేఘములో ధనస్సు యొక్క గుర్తు నెరవేర్పుగా ఉన్నది.


లేఖనములలో దేవుడు నిబంధన చేసిన మరియొక వ్యక్తి అబ్రాము. ఇది మొదట ఆదికాండము 15:17లో చెప్పబడినది. అక్కడ దేవుడు అబ్రాముతో ఎట్లు నిబంధనలో ప్రవేశించెనో గమనించండి. అక్కడ దేవుడు అబ్రామును మూడు జంతువులను మరియు రెండు పక్షులను తీసుకువచ్చి వాటిని చంపి విభాగించి నేలపై పరువమని చెప్పెను (ఆదికాండము 15:9, 10). జంతువులు రెండు భాగములుగా చేయబడి ఒక్కొక్క భాగమును రెండవ భాగమును ఎదురుగా నుంచబడెను. రాత్రి సమయములో దేవుడు అగ్ని రాజుకున్న పొయ్యివలెను అగ్నివలెను దిగివచ్చి ఖండింపబడిన జంతువుల ఖండముల మధ్య నడచిపోయెను. ఆ విధముగా దేవుడు అబ్రాముతో ఒక నిబంధన చేసెను. ఇక్కడ కూడా సూచన తేటగాయున్నది. అబ్రాము కొరకు దేవుడు ప్రాణమును (మరణించిన జంతువులవలె) పెట్టెను. నోవాహు చేసిన నిబంధన యొక్క గుర్తువలె, నిబంధన స్థిరపరచుటకు మరణము మార్గమైయున్నది. ఆ మరణమును దేవుడు తనకు తానుగా మరణించుట ద్వారా ప్రారంభించెను.


ఈ విధముగా నిబంధనను స్థిరపరచు పద్ధతి, తరువాత ఇశ్రాయేలీయులలో ఒక ఆచరణగా మారెను (యిర్మీయా 34:18, 19లో చెప్పబడినట్లు) ఎప్పుడైతే యిరువురు వ్యక్తులు ఒక నిబంధనలోనికి ప్రవేశించెదరో వారు ఒక దూడను చంపి, రెండుగా ఖండించి, ఆ రెండు భాగముల నడుమ నుండి నడచుదురు. దాని అర్థము వారిరువురు కూడా వారి మధ్య నుండిన నిబంధన కొరకు ఒకరి కొరకు ఒకరు వారి ప్రాణమును యిచ్చుటకు సిద్ధముగా ఉన్నామని సాదృశ్యరూపముగా చెప్పుటయైయున్నది. అటువంటి సూచనార్థకమైన వాగ్దానము చేసి దానిని నిలువబెట్టు కొనకపోవుట చాలా తీవ్రమైన నేరము. అందువలన దేవుడు యూదా ప్రజలను అటువంటి నిబంధన చేసి దానిని మీరినందుకు తీవ్రముగా శిక్షింతునని యిర్మీయా ద్వారా హెచ్చరించెను.


ఆదికాండము 17లో దేవుడు తన నిబంధనను అబ్రాహాముతో తిరిగి స్థిరపరచుటను చూచుదుము. మరల నిబంధనకు గుర్తుగా సున్నతిని దేవుడు నియమించెను. సున్నతి అనగా శరీరములో ఒక భాగమును తెగగొట్టుట ద్వారా శరీరేచ్ఛలను మరణింపజేయుట (ఫిలిప్పీ 3:3 మరియు కొలొస్స 2:11). ఇక్కడ మరల నిబంధన యొక్క గుర్తు మరణమునకు సంబంధించినది. ఈసారి అబ్రాహాము మరియు అతడి సంతానము మరణపర్యంతము నిబంధనకు నమ్మకముగా ఉందురని వారి యిష్టమును కనబరచుచుండెను. ఇశ్రాయేలీయులు పూర్ణహృదయముతో ఆయనను ప్రేమించునట్లు వారి హృదయములకు సున్నతి చేయవలెననే దేవుని ఆశకు ఈ బాహ్యమైన సున్నతి గుర్తుయైయున్నది (ద్యితీయోపదేశ కాండము 30:6; రోమా 2:28, 29). ఇది శరీరము యొక్క మరణము లేకుండా దేవుని పూర్ణహృదయముతో ప్రేమించలేమని బోధించుచున్నది.


తరువాత నిబంధన దేవుడు ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా చేసిన, 'పాత నిబంధన' అను దానిని గూర్చి మనము చదువుదుము. దీని గర్చి నిర్గమకాండము 24:4-7లో చదువుదుము. మోషే దేవుని యొక్క మాటలను నిబంధన పుస్తకముగా పిలువబడు ఒక పుస్తకములో వ్రాసి, లేతదూడలను దేవునికి బలియిచ్చి, ఆ దూడలయొక్క రక్తమును జనులపై జల్లి ''ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే'' అని చెప్పెను (నిర్గమకాండము 24:8). అక్కడ నిబంధన చంపబడిన జంతువుల రక్తముతో ముద్ర వేయబడినది.


'నిబంధన రక్తము' అనుమాట బైబిలులో మొదటిసారి అక్కడనే వాడబడినది. ఇదేమాటను యేసు ప్రభువు, తన శిష్యులతో చివరి రాత్రి భోజనము చేసినప్పుడు ద్రాక్షారసపు గిన్నెను అందిస్తూ ఉపయోగించిరి (మత్తయి 26:28). పాత నిబంధన క్రింద జనులపై రక్తము కేవలము ప్రోక్షింపబడినది. క్రొత్త నిబంధన క్రింద గిన్నెలోనిది త్రాగుటకు యేసుప్రభువు మనలను ఆహ్వానించుచున్నాడు. ఇది పాత నిబంధన క్రింద ధర్మశాస్త్రము ఒక వ్యక్తి యొక్క బాహ్యజీవితమును మాత్రము కడుగునని అయితే క్రొత్త నిబంధన క్రింద మనము అంతరంగములో పవిత్రపర్చబడుదుము అను దానికి సాదృశ్యముగాయున్నది.


మరల, ఈ నిబంధన మరణము ద్వారా ప్రవేశించినది. హెబీ 9:13-22లో దూడల యొక్క రక్తము మరియు క్రీస్తు యొక్క రక్తమును గూర్చి తేడా ఈ విధముగా చెప్పబడినది. అక్కడ 'మరణ శాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము...అది వ్రాసినవాడు జీవించియుండగా అది ఎప్పుడైనను చెల్లునా?'' (16, 17వ). అందుచేతనే దేవుడు మానవునితో చేసిన ప్రతి నిబంధన యొక్క గుర్తు మరణమునకు సాదృశ్యముగా యుండెను.


యేసుప్రభువు మనతో క్రొత్త నిబంధన స్థిరపర్చుటకుండిన ఒకే ఒక్క మర్గము ఆయన మరణము ద్వారా మాత్రమే. మరియు మనము ఆ నిబంధనలోను మరియు దాని యొక్క ఆధిక్యతలలోను ప్రవేశించుటకు ఉండిన ఒకే ఒక మార్గము మనకు మనము మరణించుట. ఇది 'రొట్టెవిరచుట' సమయములో రొట్టె తినుట మరియు ద్రాక్షారసము త్రాగుటలో నున్న అర్థము.


హెబీ 13:20లో దేవుడు యేసును నిత్యమైన నిబంధన ద్వారా మరణము నుండి లేపెనని మనకు చెప్పబడినది. దాని అర్థమేమిటి? కల్వరి సిలువపై యేసుకార్చిన రక్తము, పాపమును మరణించునంతగా ఎదురించిన దాని ఫలితము (హెబీ 12:4). యేసు ప్రభువు తండ్రికి విధేయత చూపుటకును మరియు ఎప్పుడును పాపము చేయకుండుటకును నిర్ణయించుకొనెను. తండ్రి యెడల ఆయన వైఖరి ''తండ్రీ, ఏ చిన్న విషయములోనైనా నీకు అవిధేయత చూపుటకంటే నేను మరణించుట కోరుకొందును'' (ఫిలిప్పీ 2:8 మరణము పొందునంతగా విధేయత). ఇది తండ్రితో యేసుప్రభువు యొక్క నిబంధన.


ఇప్పుడు యేసు ఈ క్రొత్త నిబంధన యొక్క రక్తమును గిన్నెలో త్రాగుటకు ఆయన బల్లయొద్దకు మనలను ఆహ్వానించుచున్నాడు. మనము దానికి యిష్టపడుచున్నామా? ఆయన త్రాగిన గిన్నెలోనిది మనము త్రాగగలమా? అపొస్తలుడైన పౌలువలె ''ఏ విధముచేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగుటకు'' (ఫిలిప్పీ 3:10, 11) మనము ఆశ కలిగియుందుమా?


చాలామంది విశ్వాసులు ప్రభువు బల్ల యొద్దకు చాలా తేలికగా నిబంధన అనగా ఏమిటో తెలియకుండా దానిలో ఉండిన భావమేమిటో తెలియకుండా వచ్చెదరు. కేవలము పాపమునకు వ్యతిరేకముగా రక్తము కారునంతగా పోరాడుటకు నిర్ణయము చేసుకొనిన వారు మాత్రమే ప్రభువు బల్లలో పాలుపంచుకొనుటకు అర్హులుగా యుందురు.


'నిబంధన' అనుమాట న్యాయస్థానములో ఒక ఒప్పందముపై సంతకము పెట్టినటువంటిది. ఎవరు కూడా ఒక ఒప్పందములో వ్రాయబడినది ఏమిటో జాగ్రత్తగా చదవకుండా, అందులో విషయములను అర్థము చేసికొనకుండా దానిపై సంతకముచేయరు. కాని విశ్వాసులు ప్రభువు బల్లయొద్ద రొట్టె మరియు ద్రాక్షారసములో ఎంత తేలికగా పాలుపుచుచ్చుకొనుచున్నారు? అటువంటప్పుడు కొరింథు సంఘములోవలె, ఈనాడు కూడా అనేకమంది విశ్వాసులు బలహీనులగా (శారీరకముగా మరియు ఆత్మీయముగా), రోగగ్రస్తులుగా యుండుటలో మరియు కొందరు దేవుడు ఏర్పాటు చేసిన సమయము రాకముందే మరణించుటలో (1 కొరింథీ 11:30) ఆశ్చర్యములేదు. ఇదంతా వారు ప్రభువు యొక్క బల్ల యొద్దకు తేలికగా వచ్చుట చేతనే.


లేవీయకాండము 26:14-20లో దేవుడు ఇశ్రాయేలీయులు ఆయనతో నిబంధన చేసి దానినితప్పిపోయినట్లయితే, వారు రోగులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ఓటమిపొందువారైయుండి, వారు చేయు ప్రయాస మరియు వ్యాపారము నుండి ఎటువంటి లాభము పొందరని దేవుడు చెప్పెను.


నిబంధనను మీరుట చాలా తీవ్రమైన విషయం. ''నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొనుము...నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనిన యెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము...నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు'' (పస్రంగి 5:2-5).


ఎవరైనా వ్యాధిచేతగాని బలహీనత చేతగాని మాటి మాటికి పీడింపబడుచున్నట్లయితే వారు దేవునికి ఏమైనా మ్రొక్కుకొని తరువాత లక్ష్యములేకుండా దానిని చెల్లించకుండా యున్నారేమో జాగ్రత్తగా పరీక్షించుకొనవలెను. అందుచేతనే మనము స్వస్థత పొందునట్లు మన పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనమని యాకోబు చెప్పెను (యాకోబు 5:16).


మనము విరచు రొట్టె క్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా యున్నది. మొదటగా అది యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చి ఎప్పుడును తన స్వంత యిష్టముకాక తన తండ్రి యిష్టమును నెరవేర్చిన భౌతిక శరీరమునకు సాదృశ్యముగా యున్నది (హెబీ 10:5-7). ఆ విధముగా ఆయన యొక్క శరీరము ఒక విరిగిన మరియు లోబడిన శరీరముగా ఆయన ఇహలోక జీవితములో యుండెను. ఆయన శరీరము చిన్నగా తాకినా విరిగిపోయే రెట్టెవలె యుండెను. అట్లు అన్ని విషయములలో తండ్రి చిత్తమునకు ఆయన లోబడుచుండెడివాడు. మనము రొట్టె విరచి దానిలో పాలుపొందినప్పుడు, మనము కూడా ఆవిధముగా లోబడుటకు మరియు విరుగగొట్టబడుటకు ఆశ కలిగియున్నామని సాక్ష్యమిచ్చుచున్నాము. అందువలన ప్రభువు బల్ల యొద్ద అట్లు చెప్పి అటు తరువాత మనము ఎటువంటి ప్రమాణము చేయనట్లు ప్రవర్తించుట చాలా తీవ్రమైన విషయము. మనము సంపూర్ణులము కాకపోవచ్చును, కాని ఒక క్రొత్త విశ్వాసి నుండి కూడా ప్రభువు తన కొరకు తాను జీవించుటమాని, ఆయన కొరకు మాత్రమే జీవించు (2 కొరింథీ 5:15) మరణ మార్గమును యిష్టపడుటను కోరుచున్నాడు. అలాకాక పోయినట్లయితే ప్రభువు యొక్క శరీరమని వివేచింపక అయోగ్యముగా రొట్టెలో పాలు పొందువారిగా ఉందుము.


సహోదరత్వములో నిబంధన సంబంధము


మనము విరచు రొట్టె యేసుయొక్క భౌతిక శరీరమునకు మాత్రమే కాక క్రీస్తు శరీరమైన సంఘమునకు కూడా సాదృశ్యముగా యున్నది (1 కొరింథీ 10:16, 17). ఎందుకనగా మనము అనేకులమైనను ఒక్క శరీరముగా ఎలా ఉన్నామో అట్లే ఒక్క రొట్టె ఉన్నది. ''అర్పణము తినువాడు బలిపీఠములో పాలివాడైయుండెను'' (1 కొరింథీ 10:18). మనము ప్రభువు బల్ల యొద్ద తినినట్లయితే, మనము ఆయన సిలువపై (బలిపీఠము) పొందిన మరణములోను అనగా మనకు మనము మరణించి, దేవునితో మనకున్న సంబంధములో మాత్రమే కాక, క్రీస్తు శరీరములో ఇతరులతో మనకున్న సంబంధముల విషయములో కూడా బాగస్థులమైయున్నాము.


మనము మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టవలసియున్నాము (1 యోహాను 3:16). ప్రభువు బల్లయొద్ద మన సాక్ష్యమునకు ఇది మరియొక భావముగా యున్నది. మనము ప్రభువుతో మాత్రమే కాక, మనతోటి విశ్వాసులతోకూడా నిబంధనలోనికి వచ్చియున్నాము. ఇక్కడ కూడా ఈ నిబంధన 'స్వయం' అనేది మరణించుట ద్వారా చేయబడినది.


ఇశ్రాయేలులో రెండు వర్గముల వారు నిబంధనలో ప్రవేశించునప్పుడు ఖండింపబడిన దూడ భాగముల మధ్య గుండా వెళ్ళినట్లే, ఈనాడు కూడా విరవబడిన రొట్టెగుండా, ఒకరితోఒకరము నింధనలోనికి వెళ్లుచున్నాము. ఇది కూడా మనము మొదట చూచిన దేవునితో నిబంధన చేసికొనుట అంత తీవ్రమైనది.


1 సమూయేలు 18:1-8లో యోనాతాను దావీదుతో నిబంధన చేసుకొనెను. క్రీస్తు శరీరములో నిబంధన సంబంధము ఎలా ఉండవలెనో తెలుపు చక్కని దృశ్యము అది. అక్కడ యోనాతాను ప్రాణము దావీదు ప్రాణముతో కలిసిపోయినని చెప్పబడినది. ఇక్కడ వాడిన 'కలసిపోయెను' అనుమాటయే నెహెమ్యా 4:6లో జనులు గోడకట్టు సందర్భములో, గోడకట్టునప్పుడు మధ్యలో ఎక్కడ ఖాళీలేకుండునట్లు కట్టుట గూర్చి చెప్పబడెను. అదేవిధముగా యోనాతాను యొక్క హృదయము, దావీదు హృదయముతో మధ్యలోనికి ఏ శత్రువు వచ్చుటకు ఖాళీలేనంతగా కలసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించి తన వలె అతన్ని ప్రేమించెనని చెప్పబడెను. క్రీస్తు శరీరములో మన పిలుపు కూడా ఇదియే అయియున్నది - ఒకరివలె ఐక్యమవడం. క్రీస్తు శరీరములో మన మధ్యన ఏ ఖాళీలేనంతగా (అపార్థము లేక అసూయ లేక అనుమానము మొదలైన ఖాళీలు లేకుండా) శత్రువు వచ్చి ఎటువంటి విభజన తీసుకురాలేనంతగా కలసిపోవలెను.


తన తండ్రియైన సౌలు తరువాత ఇశ్రాయేలు దేశమునకు రాజయ్యే అవకాశమున్నది కాబట్టి దావీదుపై ఎక్కువగా అసూయపడుటకు యోనాతానుకే అవసరమున్నది. అయినప్పటికీ తనలో నుండిన శరీరాశయైన అసూయను జయించి తనను తాను ప్రేమించినట్టే దావీదును ప్రేమించెను. యోనాతాను క్రొత్త నిబంధన విశ్వాసులను ఎట్లు సిగ్గు పరచునో చూడండి!


యోనాతాను దావీదుతో నిబంధన చేసుకొనెను. మరియు దానికి గుర్తుగా అతడి యొక్క రాజవస్త్రమును తీసి దావీదుకు వేసెను. ఇది యోనాతాను ఇశ్రాయేలుకు రాజు అవ్వాలన్న తనకున్న ఆశకు మరణించి దావీదును రాజుగా చేయుటకు అతడికి ఉండిన కోర్కెకు సూచనార్థముగా యుండెను. మనము క్రీస్తు శరీరములో ''ఒకరినొకరము ఘనపరచు కొనవలెను'' అని (రోమా 12:10) ఆజ్ఞాపించబడితిమి. మన సహోదరులు గొప్పవారుగా, ఉన్నతమైనవారుగా మరియు మనకంటె గుర్తింపు పొందిన వారుగా నుండునట్లు మనము నిష్కపటముగా మరియు నిజమైన ఆశ కలిగి దాని కొరకు మనకు మనము మరణించవలసియున్నది. మరియు అవసరమైనట్లయితే, మన సహోదరుని యొక్క దిగంబరత్వము ఎక్కడ కనబడునో అక్కడ దానిని కప్పుటకు మన వస్త్రమును తీయవలెను. ఆవిధముగా మనము మన సహోదరుని ఇతరుల దృష్టిలో గొప్పగా చేయగలము. క్రీస్తు శరీరములో సహోదరులతో నిబంధన సంబంధములో ప్రవేశించుట అనగా అర్థము ఇది.


మనకు మనము నిరంతరము చనిపోకుండా అటువంటి నిబంధనలోనికి ప్రవేశించుట అసాధ్యము. సుమారుగా ప్రతి సంఘములో విశ్వాసుల మధ్య వచ్చు సమస్యలకు కారణము అక్కడ విశ్వాసులు ఒకరితో ఒకరు అటువంటి నిబంధన సంబంధములోనికి రాకపోవుటయే. ప్రతివారు వారి స్వంత విషయములనే చూచుకొందురు. దాని ఫలితముగా సాతాను జయము పొందును. అటువంటి సంఘములు యేసు క్రీస్తు కట్టునవి కావు. ఎందుకనగా ఆయన ట్టు సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 16:18).


యేసు ప్రభువు ఈనాడు ఆయన సంఘమును కట్టుచున్నాడు. మనము ఆ సంఘములో భాగముగా నుండవలెనంటే మరియు ఆ సంఘము కట్టబడుటలో భాగముగా ఉండవలెనంటే, మనము నిబంధన సంబంధములను తీవ్రముగా తీసుకోవలెను. మరియు మన సహోదరులను గొప్పచేయుట అనగా ఏమిటో మన హృదయమంతటితో నేర్చుకొనవలెను.


తరువాత యోనాతాను తన కవచమును, తన ఖడ్గమును, తన బాణమును మరియు తన నడికట్టును తీసి దావీదునకు ఇచ్చినట్లు చదువుదుము. మన సహోదరులతో నిబంధనలోనికి ప్రవేశించునప్పుడు, మనము వారిని ఏ విధముగానైనను హానిపరచుటకు అవకాశముండిన ప్రతి ఆయుధమును వారికి అప్పగించుదుము. ఇది యోనాతాను చేసిన దానియొక్క అర్థము.


క్రైస్తవత్వములో అత్యంత నష్టము కలుగజేసిన ఆయుధము నాలుక, మనము ఇంకొకరికి విరోధముగా, ఒక్కసారి కూడా ఎప్పుడును చెడుమాటలాడుట కాని, లేక వారి వెనుక వారి గూర్చి చెడ్డగా మాటలాడుట లేక ముచ్చట్లు చెప్పుకొనుట చేయకుండునట్లు మన యొక్క ఈ ఆయుధమును నింబంధన సంబంధములో క్రిందపెట్టుటకు మనము ఇష్టపడుచున్నామా?


మన ఆయుధములను అప్పగించుటలో అతడు మనకు ఎప్పుడును హాని చేయడు అని మనము మన సహోదరుని నమ్మి అతడి యెదుట మనము నిరాయుధుల మగుటకు నమ్మకమును చూపుచున్నాము అనునది మరొక భావము. అటువంటి నమ్మకము, ధైర్యము ద్వారా సహోదరత్వము కట్టబడును.


1 సమూయేలు 19, 20 అధ్యాయములలో, దావీదు యెడల యోనాతాను యొక్క స్థిరమైన నమ్మకత్వము తన తండ్రికి వ్యతిరేకముగా నిలువబడుటలో మనము చూడగలము. యోనాతాను తన సహోదరుడైన దావీదు కొరకు తన శరీర సంబంధులైన బంధువుల ముందు నిలువబడెను. ఇది నిజముగా మనమందరము అనుసరించుటకు చక్కని మాదిరి. మనము మన సహోదరు(రీ)లను మన స్వంత రక్తసంబంధికుల కంటే ఎక్కువగా ప్రేమించవలసియున్నది.


ఆమోసు 1:9, 10లో సహోదరుల యెడల నిబంధన మీరుటను దేవుడు ఎంత తీవ్రముగా పరిగణించునో చూచుదుము. హీరాము రాజు రోజుల్లో తూరు దేశస్థులు ఇశ్రాయేలీయులతో ఒక నింధన చేసికొనిరి. అయితే ఇశ్రాయేలు అవసరములో నుండినప్పుడు, వారు ఇశ్రాయేలులను శత్రువులకు అప్పగించుట ద్వారా వారు చేసిన నిబంధనను మీరిరి. దీనిని బట్టి తూరు వారిని కఠినముగా శిక్షించుదునని దేవుడు ఆమోసుకు చెప్పెను.


2 సమూయేలు 21:1, 2లో, దీనికి సంబంధించిన మరియొక ఉదాహరణను చదువుదుము. మూడు సంవత్సరములు ఇశ్రాయేలు దేశములో కరువువచ్చినది. దాని విషయమై దావీదు దేవుని వేడుకొనినప్పుడు, యోహోషువ కాలములో ఇశ్రాయేలు వారు గిబియోను వారితో చేసికొనిన నిబంధన మీరుటవలన అట్లు జరిగెనని దేవుడు చెప్పెను. సౌలు రాజు నిబంధనను మీరి గిబియోనీయులను చంపెను. అనేక సంవత్సరములు తరువాత, సౌలు మరణించిన చాలా కాలము తరువాత దానికి సంబంధించిన తీర్పు ఇశ్రాయేలీయులను చుట్టుకొనెను. దేవుడు ఆయన తీర్పులను ఆలస్యము చేయవచ్చును. కాని ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపమును చూడకపోవునో అప్పుడు తీర్పు తప్పనిసరిగా వచ్చును. దేవుడు ఆ రువును పంపుటకు ఎందుకు అంత ఆలస్యము చేసెనని ఒకరు అడుగవచ్చును. ఇశ్రాయేలు వారు దాని విషయములో పశ్చాత్తాపపడుటకు అను విషయములో ఏ అనుమానము లేదు. వారు ఎప్పుడైతే పశ్చాత్తాపపడలేదో అప్పుడు తీర్పు వారిపై పడెను.


పౌలు కొరింథీయులతో వారిని వారు తీర్పు తీర్చుకొనినట్లయితే, దేవుడు వారిని తీర్పు తీర్చడు అని చెప్పెను. కాని వారిని వారు తీర్పు తీర్చుకొనకపోవుటచేత, వారిలో అనేకులు రోగులు మరియు బలహీనులు మరియు అనేకులు వారి సమయమునకు ముందు మరణించియుండిరి (1 కొరింథీ 11:30, 31). ఎప్పుడూ బలహీనముగా మరియు రోగగ్రస్తులుగా నుండు విశ్వాసులందరు దేవున్ని దాని కారణము గూర్చి వేడుకొనవలెను. బహుశా అది సహోదరత్వపు నిబంధన మీరుట అనగా ప్రభువు బల్లలో పాలు పొంది తరువాత సహోదరులను, సహోదరీలను వారి వెనుక వారిపై నిందలు వేయుచు, వారి గూర్చి ఉన్నవి లేనివి మాటలాడుట మొదలైనవి చేయుటద్వారా వారికి నమ్మకద్రోహము చేయుటవలనై యుండవచ్చును. ఇది ఇస్కరియోతు యూదా యొక్క ప్రధానమైన పాపము. అతడు యేసు ప్రభువుతో నిబంధన భోజనము చేసి వెళ్లి ఆయనను అప్పగించాడు. ''నేను నమ్ముకొనిన నా విహితుడు నాయింట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమె నెత్తిన వాడాయెను'' (కీర్తన 41:9) అని కీర్తనాకారుడు ప్రవచించెను.


భవిష్యత్తులో మనలను మనము పరీక్షించుకొని ప్రభువు బల్లలో అర్థవంతముగా పాలు పొందునట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయము చేయునుగాక. ప్రభువుతోను మరియు మన సహోదర సహోదరీలతోను నిబంధన మీరిన పాపము గూర్చి మనము పూర్ణ హృదయముతో పశ్చాత్తాపపడుదము. మరియు మన యొద్దకు వచ్చిన ఆత్మ యొక్క స్వరమును లక్ష్యపెట్టుదము.

అధ్యాయము 22
సంఘము మరియు మహా శ్రమల కాలము

పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క జ్ఞానమును తెలియజేయవలెనని క్రొత్త నిబంధనలో దేవుడు కోరుచున్నాడని ఎఫెసీ పత్రిక 3:10లో మనకు చెప్పబడినది. ఎఫెసీ 6:12నుండి ఆకాశమండలమందున్న ప్రధానులు, అధికారులు అనగా రెండవ ఆకాశమందున్న సాతాను మరియు అతడి యొక్క దురాత్మల సమూహముగా మనకు తెలియును. (వారు దేవుని సన్నిధియైన మూడవ ఆకాశము నుండి త్రోసివేయబడినప్పటి నుండి అక్కడే యుండిరి - 2 కొరింథీ 12:2).


మనము మనుష్యులందరికి క్రీస్తు యొక్క సాక్ష్యులుగా ఉండాలి. అయితే ఇక్కడ మనము దురాత్మలకు కూడా సాక్ష్యముగా ఉండవలెనని మనకు చెప్పబడినది. ఏమిటా సాక్ష్యము? అది దేవుని యొక్క జ్ఞానమునకు సాక్ష్యము (ఎఫెసీ 3:10). అది మన జీవితములో ప్రతి దానిని కూడా దేవుడు ఆయన యొక్క సంపూర్ణ జ్ఞానము చొప్పున ఏర్పాటు చేసెనని మన ఆత్మలు సంతోషముతో ఒప్పుకొను ఒప్పుదల. అది పై నుండి దిగివచ్చిన జ్ఞానము యందు పాలుపొందిన జీవితముల యొక్క సాక్ష్యము.


యోబు గ్రంథములో యోబు, తన జీవితము ద్వారా సాతానుకు సాక్ష్యముగా యుండుట గూర్చి మనము చదువుదుము. సాతాను భూమియంతట సంచరించి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యోబు జీవితములో న్యాయశీలతను గమనించితివా అని దేవుడు అడిగెను (యోబు 1:8). యోబు చుట్టూ ఒక కంచె, మరియొక కంచె అతడి కుటుంబము చుట్టూ మరియు మూడవది అతడి సంపదల చుట్టూ (10వ) దేవుడు పెట్టినందువలన యోబు దేవుని యందు భయభక్తులు కలిగియుండెనని సాతాను జవాబిచ్చెను. యేసుప్రభువు శిష్యుల చుట్టూ దేవుడు మూడు విధములైన కంచెలు ఏర్పాటుచేయునని అనేక విశ్వాసులకు తెలియదు. లూకా సువార్త 14:26-33లో చెప్పబడిన శిష్యత్వపు షరతును నెరవేర్చిన వారి చుట్టూ, ప్రభువుకు అప్పగించిన ప్రతి ఒక్క విషయములో అనగా సంపదలు, కుటుంబ సభ్యులు మరియు ఒకరి స్వంత జీవితము చుట్టూ దేవుడు ఒక్కొక్క కంచెను ఏర్పాటు చేయును.


అయితే సాతాను వెళ్ళి యోబు యొక్క సంపదలను, అతడి కుటుంబీకులను మరియు అతడి శరీరమును బాధించుటకు దాడి చేయునట్లు యోబు చుట్టూ నుండిన ఒక్కొక్క కంచెను దేవుడు తెరచెను. యోబు యొక్క సత్యప్రవర్తనను సాతానుకు కనపరచుట కొరకు ఆ విధముగా చేసెను.


దీని ద్వారా సాతాను యేసుక్రీస్తు యొక్క శిష్యుని లేక అతడికి సంబంధించిన దేనిని దేవుని అనుమతి లేకుండా తాకలేడని మనము నేర్చుకోవచ్చును. ఇది మనలో లోతుగా నాటబడవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యము మరియు దీని అవసరతను రాబోవు దినములలో ఇంకా ఎక్కువగా చూచుదుము. యేసు క్రీస్తు యొక్క యథార్థమైన సంఘము రాబోవు కాలములో మొదటి శతాబ్దములో వలె శ్రమపడుటకు పిలువబడును. ఆ దినములు రాకమునుపే మనము ఈ సత్యములో లోతుగా నాటబడవలసి యున్నది. అన్నిటికంటె మొదటగా యేసుప్రభువు యొక్క నిజమైన శిష్యుని చుట్టూ మూడు కంచెలుండునని, దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరును అందులో ప్రవేశింపలేరని, దేవుడు అనుమతించినప్పుడే సాతాను అందులో ప్రవేశింపగలడని తెలుసుకొనవలెను.


యోబు యొక్క కథ ద్వారా మనము నేర్చుకొను మరియొక పాఠము మన బంధువులు, మతాసక్తి కలిగిన క్రైస్తవులు మనలను విమర్శించి మనపై నేరారోపణ చేయదురనునది. యోబు విషయములో, అతడి భార్య మరియు ముగ్గురు మత నాయకులు (ఎలీఫజు, బిల్దదు మరియు జోఫరు) అతడిని అపార్థము చేసికొని విమర్శించిరి. అది కూడా దేవునిచే అనుమతించబడినది. దేవుడు మనచుట్టూ ఉండిన కంచెలను తెరచి అట్లు చేయుటకు అనుమతించినందున మనలను ప్రేమించువారు మనకు విరోధులుగా మారుదురు మరియు మతాసక్తి కలవారు మనను అపార్థము చేసికొని విమర్శించుదురు.


యోబు తనను తాను తగ్గించుకొని ''నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా యిచ్చెను యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక'' అనెను (యోబు 1:21). అతడు తనకు కలిగినది ఏదీ తనదిగా అనుకొనలేదు. కావున అతడు నిజమైన శిష్యుడు. అతడికి సంబంధించినదంతటికి హక్కుదారుడు దేవుడనియు, వాటిని యిచ్చుటకు దేవునికి ఎంత హక్కు ఉన్నదో వాటిని తీసుకొనుటకు అంతే హక్కు ఉన్నదని అతడు గుర్తించెను. శిష్యులు కానివారు ఆశీర్వాదము అనగా దేవుడు వారికిచ్చుటయే అనుకొందురు. అయితే శిష్యులు దేవుడు వాటిని తీసుకొనిపోవుట కూడా అంతే ఆశీర్వాదమనియు, బహుశా ఇంకా ఎక్కువ ఆశీర్వాదమని అనుకొందురు. ఆ విధముగా మనము శిష్యులమో కాదో తెలిసికొనవచ్చును.


విచారించవలసిన విషయమేమనగా యోబు ఈ ఒప్పుదలలో చివర వరకు నిలువలేకపోయెను. కొద్ది సమయము తరువాత ఎడతెగని బాధల ఒత్తిడికి వాడిపోయి మరియు బలహీనపడి దేవునికి వ్యతిరేకముగా ఫిర్యాదులు చేయుట ప్రారంభించెను. 3వ అధ్యాయము నుండి 31వ అధ్యాయము వరకు యోబు విశ్వాసముతో ఒప్పుకొనుచు గొప్ప ఎత్తులకు వెళ్లెను. మరికొన్నిసార్లు నిస్పృహలోనికి, సణుగుకొనుచు తనను తాను సమర్థించుకొనుచు మునిగిపోవుటను మనము చూచుదుము. ఇది పాత నిబంధన ప్రజల అనుభవము.


అయితే దేవుడు మనకు అంతకంటే శ్రేష్టమైన దానిని ఏర్పాటు చేసెనని మనము హెబీ 11:40లో చదివెదము. అది హెబీ 12:1-13 వరకు వివరింపబడినది - దాని ప్రకారము చివరి వరకు ఓపిక వహించి విజయము పొందిన యేసును మనము వెంబడించ వచ్చును.


ఈనాడు మనము యోబును వెంబడించు వారము కాదు, కాని యేసును వెంబడించు వారము - మరియు ఎటువంటి శ్రమ వచ్చినా మనము దేవుని కృప యొక్క శక్తి వలన మనము చివరి వరకు జయశీలులుగా యుండవచ్చును మరియు సాతానుకు సాక్ష్యముగా యుండవచ్చును. యోబు కృప రానప్పుడు, పరిశుద్ధాత్మ ఇవ్వబడక ముందు, క్రొత్త నిబంధన స్థిరపరచబడుట మొదలైనవి లేనప్పుడు జీవించెను కాబట్టి మనము యోబును విమర్శించలేము. అతడి కాలములో నుండిన పరిమితులను పరిగణలోనికి తీసుకొనినట్లయితే, అతడు ఎంతో గొప్పగా జీవించెను - ఎంతగానంటే దేవుడు మూడుసార్లు అతడిని మెచ్చుకొనెను (యోబు 1:8; 2:3; 42:7).


మనమైతే యేసు ప్రభువును వెంబడించు వారము, ఆయన మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునై యున్నాడు.


యేసు ప్రభువు శ్రమల విశ్వవిద్యాలయములో ఉత్తీర్ణుడై, అందులో సంపూర్ణ విధేయత చూపినవానిగా సర్టిఫికేటు పొందెను. మరియు ఆయన ఇప్పుడు అదే యూనివర్సిటీలో అందులో చేరిన వారందరకూ విధేయతను బోధించుటకు ఒక ప్రొఫెసరుగా నున్నాడు (హెబీ 5:8, 9). ఇందులో పాత నిబంధనవలె ''నీవు చేయకూడదు'' అను బలవంతము లేదు. కాని ఆత్మ మరియు పెండ్లి కుమారుడు, ''వచ్చి ఈ యూనివర్సిటీలో చేరుము'' అని చెప్పుదురు. ఇందులో చేరని వారెవరూ శిష్యులు కాలేరు. ఎందుకనగా శిష్యులు శిక్షణ పొందేది ఇక్కడ మాత్రమే.


లోకములో శ్రమ పొందుదురని యేసు ప్రభువు శిష్యులకు తేటగా చెప్పెను. అయితే వారు దీనికి భయపడనక్కరలేదు. ఎందుకనగా ఆయన లోకమును మరియు దాని అధిపతిని జయించి యుండెను. అందువలన వారు కూడా జయించువారుగా యుందురు (యెహాను 16:33).


ఈనాడు యేసు ప్రభువును అభిమానించేవారు ఎందరో ఉన్నారు, కాని ఆయనను వెంబడించేవారు చాలా కొద్ది మంది మాత్రమే. ఆయనను అభిమానించుమని ఆయన ఎవ్వరినీ పిలువలేదు కాని వెంబడించుటకే పిలిచెను. మనము ఆయనను వెంబడించినట్లయితే, అప్పుడు మనము ఇక ఈ లోకానికి సంబంధించిన వారము కాము. అప్పుడు ఈ లోకము మనలను తప్పక ద్వేషించును.


ఈ లోకము దానికి సంబంధించిన వారినే ప్రేమిస్తుందని యేసు ప్రభువు చెప్పారు (యెహాను 15:19).


యేసు క్రీస్తు శిష్యులుగా మనకు ఉన్న ఒక పొరబడరాని మరియు తేటయైన గుర్తు ఈ లోకము మనను ద్వేషించుటయే. ''వారు నన్ను హింసించినయెడల, మిమ్మును కూడా హింసితురు'' అని యేసు ప్రభువు చెప్పెను (యోహాను 15:20).


యేసు క్రీస్తు శిష్యులుగా రెండవ తేటయైన గుర్తు ఏమనగా, వారిని హింసించి ద్వేషించువారిని వారు ప్రేమించుదురు (మత్తయి 5:44-48). ఈ రెండు గుర్తులను బట్టి దేవుని యొక్క సత్యమును వినుటకు చెవులు కలవారందరు వారి యొక్క స్థితి ఏమిటో పరీక్షించుకొని మరియు వారి గూర్చిన సత్యమును తెలుసుకొనవచ్చును.


నీవు లోకానుసారమైన వారిలో లేక మత సంబంధమైన క్రైస్తవులలో (నిజమైన శిష్యులు కాని వారిలో) పేరు గలవాడివైతే, నీవు పూర్తిగా రాజీపడువాడవనుటలో సందేహము లేదు. అంతేకాక నీవు మార్పు చెందిన వాడవు కూడా కాకపోవచ్చును.


లోకము యేసును ఎందుకు ద్వేషించినది? ఆయన పన్నులు చెల్లించినందుకు మరియు ప్రజల కాళ్ళు కడిగినందుకు కాదు. లేక ఆయన పరిశుద్దమైన జీవితమును జీవించినందుకు కూడా కాదు. లోకములోని వేషధారణను ఆయన బయట పెట్టినందుకు లోకము ఆయనను ద్వేషించెను. ఆయన దేవుని ప్రజలలో నుండిన వాక్యానుసారముకాని ఆచారములను కూడా బహిరంగ పరచెను. కనుక ''పెద్దల ఆచారములను'' విడువక పాటించదలచుకొనిన వారందరు కూడా ఆయనను ద్వేషించిరి. ఆయనవలె మనము మాట్లాడినట్లయితే మన పరిస్థితి కూడా అలాగే యుండును. మనము మనుష్యుల నుండి మరియు మత పెద్దల నుండి ఘనత పొందవలెనంటే మనము మౌనముగా యుండి పేరు సంపాదించుకొనవచ్చును. మనలో ప్రతి ఒక్కరు మనము కోరుకొనిన మార్గమును ఎంచుకొనవచ్చును.


ప్రకటన 12వ అధ్యాయములో సాతాను కొందరిపై బహు కోపపడినట్లు చదువుదుము. అక్కడ సాతాను, స్త్రీ (ఇశ్రాయేలు) ఈ లోకములోనికి తీసుకువచ్చిన మగబిడ్డను మ్రింగుటకు చూచుట గూర్చి మనము చదువుదుము. సాతాను ఆ విషయములో జయము పొందలేక పోయెను. ఆ మగబిడ్డ ఎదిగెను. ఆయన పరిచర్యను ముగించి దేవుని సింహాసనము యొద్దకు ఆరోహణుడయ్యెను (పక్రటన 12:4, 5). ఇప్పుడు సాతాను యొక్క ఉగ్రత ఆ మగబిడ్డ యొక్క తమ్ముళ్ళపైకి తిరిగెను. వారు ''దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారు'' అని చెప్పబడెను (పక్రటన 12:17). వీరు దేవుని ఆజ్ఞలకు వారి జీవితములలో సంపూర్ణమైన విధేయత చూపుట లక్షణముగా కలిగి మరియు యేసు క్రీస్తు గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చు వారైయుండిన శిష్యులు, వారు నోళ్ళు తెరచి యేసు క్రీస్తు సాక్ష్యమిచ్చిన ప్రతి దాని గూర్చి చెప్పువారు, అదే యేసు యొక్క సాక్ష్యము. అటువంటి వారు ఈనాడు లోకములో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞలకు సంపూర్ణమైన విధేయత కలిగియుండుట గూర్చి కొన్ని సంఘములే ఈనాడు లోకములో బోధించుచున్నవి.


ఈ యుగపు చివరి రోజులలో యేసు ప్రభువు తిరిగి ఈ లోకమునకు వచ్చుటకు ముందు (9వ) మూడున్నర సంవత్సరములు సాతాను రెండవ ఆకాశము నుండి భూమిపైకి పడద్రోయబడుట గూర్చి ప్రకటన 12వ అధ్యాయము చెప్పుచున్నది. ఆ కాలములో దేవుని ఆజ్ఞలను పాటించువారు మరియు యేసు క్రీస్తు యొక్క సాక్ష్యమును ధైర్యముతో కలిగియున్నవారు మరియు సాతానును జయించినవారు (11వ) ఈ భూమిపై యుందురు. వీరు దేవుని ''కమాండో''లు భూమిపై ఆయన సైన్యములో ఉన్న శ్రేష్టమైన దళములు.


వారిలో ఒకరిగా నుండుట గొప్ప ఆధిక్యత మరియు ఘనతగా యుండును. వారిలో అనేకులు వారియొక్క జీవితములను యేసు ప్రభువు కొరకు పెట్టుదురు. యేసు ప్రభువు యొక్క శిష్యులను చంపుటకు క్రీస్తు విరోధి దేవుని చేత అనుమతి పొందియుండెనని పక్రటన 13:7 తేట పర్చుచున్నది. అయితే ఈ కంచెలను తెరచినవాడు దేవుడను విషయము జ్ఞాపకముంచుకొనవలెను. అలా కానట్లయితే ఎవరును మనను తాకలేరు. అందువలన మనము భయపడము.


''నాకు జరుగునది ఆయనకు తెలియును'' (యోబు 23:10) అని యోబు చెప్పగలిగి యుండెను. నూతన నిబంధనలో మనమంత కంటె ఎక్కువగా ''దేవుడు నా గూర్చిన ప్రతి విషయమును ప్రణాళిక వేయును'' అని చెప్పగలము. రోమా 8:28 యొక్క భావము అదియే. ఆ సమయములో కూడా, దేవుడు నమ్మకమైన వాడగుట చేత ఆయన మన సామర్థ్యము కంటె ఎక్కువగా పరీక్షింపబడనియ్యడు అనేది యథార్థము. ప్రతి పరీక్షల్లో కూడా మనము పాపము చేయకుండునట్లు మరియు ఆయనను విడిచిపెట్టకుండునట్లు ఒక మార్గమును ఏర్పాటు చేయును (1 కొరింథీ 10:13). అయినప్పటికి ఆయన కృప చాలినంతటిగా ఋజువు చేయబడుతుంది (2 కొరింథీ 12:9). ఆ రోజున నిలిచేది స్వతహాగా ధైర్యవంతులు కాదు. గాని సహజంగా భయపడు వారైయుండి వారిని బలపర్చుట కొరకు దేవునిపై నమ్మిక యుంచువారు ఆ రోజు నిలిచెదరు.


ఆ దినములలో క్రీస్తు విరోధి పాలించునప్పుడు ఆ దినములు గొప్ప శ్రమల కాలముగా యుండును. అయితే ఆ కాలమును ''ఏర్పరచబడిన వారి కొరకు'' (మత్తయి 24:21) తక్కువ చేయబడెను అని యేసు ప్రభువు చెప్పెను. దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు (సంఘము) ప్రభువు కొరకు సాక్ష్యమిచ్చుచూ, ఆ కాలములో భూమిపై యుందురని ఇది తెలియజేయుచున్నది. ''ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ... మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చిరక వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేయుదురు'' (మత్తయి 24:29-31). యేసు ప్రభువు ఇక్కడ చెప్పిన బూర 1 థెస్సలోనీకయులకు వాయ్రబడిన 4:16,17లో చెప్పబడినది. అక్కడ క్రీస్తు నందు మృతులైన వారు తిరిగి లేచెదరని, వారు అప్పటికి జీవించుచుండిన శిష్యులతో కలిసి మధ్యాకాశమునకు ప్రభువును కలుసుకొనుటకు ఎత్తబడుదురని చెప్పబడిన విషయము.


సంఘము (ఏర్పరచబడినవారు) శ్రమదినములు తరువాత ఎత్తబడునని యేసు ప్రభువు తేటగా చెప్పారు. అప్పుడు మనము ప్రభువునకు ఆయన రెండవ రాకడయందు ఆకాశములో స్వాగతము చెప్పి మరల ఆయనతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించుటకు భూమిపైకి వచ్చెదము. వెయ్యేళ్ళలో ప్రభువుతో కలిసి పరిపాలించేది ఎవరనేది దేవుని వాక్యము తేటగా చెప్పుచున్నది. వారు ''కౄరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళుపై గాని, చేతులపై గాని దాని ముద్ర వేయించుకొనని వారు'' (పక్రటన 20:4). క్రీస్తు విరోధి పరిపాలనలో, జయించువారు (క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె) భూమిపై ఉండి ప్రభువు కొరకు యథార్థముగా నిలువబడుదురని ఇది తేటగా చూపించుచున్నది.


శ్రమలు సంఘమునకు విరోధముగా సాతాను చేత పురికొల్పబడిన మనుష్యుల నుండి వచ్చునటువంటివి. దీనిని భక్తిహీనుల కొరకు ప్రత్యేక పరచబడిన దేవుని ఉగ్రతకు వేరుగా చూడవలసి యున్నది. మనము దేవుని ఉగ్రతను ఎదుర్కొనము కాని తప్పక మనుష్యుల నుండి వచ్చు మహాశ్రమలను ఎదుర్కొందుము. పాత నిబంధన క్రింద దేవుని ప్రజలకు వర్ధిల్లుట మరియు సుఖము ఆశీర్వాదముగా నుండెను కాని క్రొత్త నిబంధన క్రింద నుండు వారికి ప్రతికూల పరిస్థితులు, శ్రమలు మరియు బాధలు ఆశీర్వాదముగా నున్నవి.


యేసు ప్రభువు మరణమును ఎదుర్కొనినప్పుడు ఆయన ''తండ్రీ ఈ గడియ తటస్థింపకుండా తప్పింపుము, అని కాక నీ నామము మహిమ పరచుము'' (యోహాను 12:27, 28) అని ప్రార్థించెను. వేశ్య యొక్క పాట, ''తండ్రీ, శ్రమ నుండి తప్పించుము'' అనునది. పెండ్లి కుమార్తె యొక్క పాట ''తండ్రీ, నీ నామము మహిమ పరచుము'' అనునది. మనము ''శ్రమయందు అతిశయపడుదుము''. ''అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను'' (రోమా 5:4; అపొ.కా. 14:22).


మనలను ఈ లోకము నుండి తీసుకొని పొమ్మని కాక మనలను పాపము నుండి కాపాడమని యేసు ప్రభువు తండ్రికి ప్రత్యేకముగా ప్రార్థించెను (యోహాను 17:15). యేసు ప్రభువు తన పెండ్లి కుమార్తె శ్రమలను తప్పించుకొనుట కొరకు ఎత్తబడవలెనని ఎప్పుడూ కోరుకొనలేదు.


క్రీస్తు రహస్యముగా వచ్చి విశ్వాసులు శ్రమలను ఎదుర్కొనకుండునట్లు వారందరిని తీసుకుపోవునను ఒక క్రొత్త సిద్ధాంతము సుమారు 150 సంవత్సరముల క్రితము క్రైస్తవ లోకములో ఉద్భవించినది. (ఇటువంటిది అపొస్తలుల కాలములో వినబడలేదు). మనుష్యుల నుండి వచ్చు శ్రమలు దేవుని నుండి వచ్చు శిక్ష వలె కనబడునట్లు ఈ సిద్ధాంతము చేసినది! ఏ విధమైన ఆశ్చర్యానికి తావులేకుండా, ఈ సిద్ధాంతము క్రైస్తవులు హింసలు పొందుచున్న దేశము నుండి రాలేదు, కాని శతాబ్దాలుగా క్రైస్తవులు హింసను పొందని ఒక పాశ్చాత్య దేశమునుండి వచ్చినది. ఈ సిద్ధాంతమునకు సరిపోయేటట్లు లేఖనములు అనేకుల చేత వక్రీకరింపబడినవి. ఆ విధముగా సాతాను క్రైస్తవులను అసత్యపు ఆదరణలోనికి జోలపాడుటలో విజయము పొందెను. కనుక శ్రమల వారిపైకి వచ్చినప్పుడు వారు సిద్ధపాటు లేకుండా యుందురు.


ఎక్కువమంది క్రైస్తవుల ప్రార్థనలు, ''ప్రభువా, ఈ లోకములో నా జీవితము ఇంకా సుఖవంతముగా ఉండునట్లు చేయుము'' అను ఉద్దేశ్యములో ఉండుటచేత, లోకములో నుండిన క్రైస్తవులలో అనేకులు శ్రమలను తప్పించుకొనే ఈ సిద్ధాంతమును సంతోషముతో అంగీకరించారు. అయితే యేసు ప్రభువు యొక్క బోధలను బాగుగా వంట పట్టించుకొనినవారు, హింసలను లేక శ్రమలను తప్పించుకొనుటలో సుగుణమేమీ లేదని తేటగా అర్థము చేసికొనెదరు. యేసు ప్రభువు తన శిష్యులతో ఎల్లప్పుడు వారు ఈ లోకములో శ్రమలను మరియు హింసలను ఎదుర్కొనెదరని చెప్పుచుండెడివారు.


క్రీస్తు పూర్ణ హృదయముతో ఆయనను వెండించువారిని తీసుకొనిపోయి సగము హృదయముతో ఆయనను వెండించువారిని క్రీస్తు విరోధి పరిపాలనలో విడిచిపెట్టునని కొందరు బోధించుదురు. ఇది దేవుడు నమ్మకముగా ఉండువారికి హింసలను తప్పించుకొనుట ఒక బహుమానంగా ఇచ్చునని దానిని సూచిస్తుంది!! ఏ విచక్షణ కలిగిన సైన్యాధిపతి కూడా యుద్ధములో తన యొద్దనున్న రెండవ తరగతికి చెందిన సైనికులను యద్ధము బాగుగా జరుగుచోటికి పంపి తన యొద్దనున్న మొదటి తరగతికి చెందిన సైనికులను ఇంటివద్ద ఉంచుకొనడు! భూమిపై దేవుని కొరకు సాక్ష్యము ఎక్కువగా అవసరమున్న సమయములో దేవుడు ఆయన యొక్క శ్రేష్టమైన సైనికులను భూమినుండి తీసుకు వెళ్ళిపోవుననునది ఊహించుకొనలేము.


క్రీస్తువిరోధిని ఎదిరించువారు ''దేవుని ఆజ్ఞలను పాటించి, యేసును గూర్చి, సాక్ష్యమిచ్చు వారు'' (పక్రటన 12:17) అని లేఖనములు తేటగా చెప్పుచున్నవి. వీరు సగము హృదయముతో దేవుని వెంబడించువారు కాదు. దానికి బదులు వారు జయించినవారు. వారి పేర్లు జీవగ్రంథములో లిఖించబడినవి (పక్రటన 13:8, 2:5). సాతాను సగము హృదయముతో దేవుని వెంబడించువారిపై ఆగ్రహము తెచ్చుకొనడు, కాని పూర్ణ హృదయముతో నుండు వారిపై ఆగ్రహించును. ఈనాడు దేవుని ఆజ్ఞలకన్నిటికి సంపూర్ణమైన విధేయత చూపించవలసి యున్నదని బోధించువారే సాతాను యొక్క ముఖ్యమైన లక్ష్యము. అందువలననే తన గురించి ఆసక్తితో ప్రార్థించమని పౌలు విశ్వాసులందరిని వేడుకొనెను. సాతాను యొక్క ముఖ్యమైన లక్ష్యములలో తనొకడని అతనికి తెలియును. మనము కూడా ఈనాడు దేవునికి పూర్తి విధేయత కలిగి యుండవలెనని బోధించువారు కాపాడబడవలెనని ప్రార్థించవలసి యున్నది.


మొదటి మూడు శతాబ్దములలో, క్రైస్తవులకు వ్యతిరేకముగా తీవ్రమైన హింస చెలరేగియున్నప్పుడు, దేవుడు వారిని శ్రమలలో నుండి తీసుకు వెళ్లిపోలేదు. వారు సింహములచే తినివేయబడిరి మరియు స్తంభములకు కట్టబడి కాల్చివేయబడిరి. యేసు ప్రభువు యొక్క శిష్యులు రోమా దేశపు క్రీడా స్థలములలో వేధింపబడుచుండినప్పుడు రహస్యముగా ఎత్తబడుట సంభవించలేదు. దానియేలు యొక్క దినములలో సింహముల నోళ్ళు మూయించి మరియు తీవ్రమైన వేడితో మండుచుండిన అగ్నిగుండము యొక్క వేడిని చల్లార్చిన దేవుడు మొదటి మూడు శతాబ్దాములలో యేసుక్రీస్తును పూర్ణ హృదయముతో వెంబడించు శిష్యుల విషయములో అటువంటి అద్భుతములు చేయలేదు. ఎందుకనగా వారు అగ్నిలో దేవుని మహిమపరచు క్రొత్త నిబంధన క్రైస్తవులు. యేసు ప్రభువు తిరిగి వచ్చుటకు ముందు ఆఖరి శతాబ్దములో కూడా యేసు శిష్యులకు అట్లే యుండును. మొదటి శతాబ్దములో దేవుని యొక్క శ్రేష్టమైన సైనిక దళములు చివరి వరకు ఆయన కొరకు యథార్థముగా నిలువబడినవి. వారు దేవదూతలు వచ్చి వారిని తప్పించునట్లు వారి గురించి అడుగలేదు, లేక ఎదురు చూడలేదు. దేవుడు తన కుమారుని యొక్క పెండ్లి కుమార్తె సింహములచే ముక్కలు ముక్కలుగా చేయబడుటను మరియు కొయ్యకు కట్టబడి కాల్చివేయబడుటను చూచెను మరియు ఆయన వారి సాక్ష్యములను బట్టి మహిమపర్చబడెను - గొఱ్ఱెపిల్ల ఎక్కడకు పోవునో అక్కడికెల్ల ఆయననను వారు వెంబడించిరి, చివరకు హింసాత్మకమైన శారీరక మరణము వరకు వారు వెంబడించిరి. వారితో యేసు ప్రభువు అను ఒకే ఒక మాట ''మరణ పర్యంతము నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను'' అనునది.


మనతో కూడా ఆయన యిప్పుడు అదే చెప్పుచున్నారు. అయితే భవిష్యత్తులో వచ్చు క్రీస్తువిరోధి యొక్క రోజులలో మనము నమ్మకముగా నుండుటకు, ఈనాడు మనకు వచ్చు చిన్న చిన్న శోధనలు మరియు పరీక్షలలో నమ్మకముగా నుండుట నేర్చుకొనవలెను. అందుచేతనే మనము మన రహస్య జీవితములో నమ్మకముగా నుండుట నేర్చుకొనుట చాలా అవసరమై యున్నది. మన జీవిత రహస్య విషయములలో అనగా మన ఆలోచనలలో, వైఖరిలలో, ఉద్దేశ్యములలో, ధనమునకు సంబంధించిన విషయములలో శోధింపబడినప్పుడు నమ్మకముగా నుండవలెను. ఇవన్నీ చాలా చిన్న విషయములు; కాని మనము చిన్న విషయములలో నమ్మకముగా ఉండినప్పుడే, ఒక రోజున మనము గొప్ప విషయములలో నమ్మకముగా యుందుము. మనము చిన్న విషయములలో నమ్మకముగా లేకపోయినట్లయితే, మనము శ్రమల కాలములో కూడా ప్రభువుకు నమ్మకముగా యుండలేము. మనమిప్పుడు మనుష్యులతో పరుగెత్తలేక పోయినట్లయితే, గుఱ్ఱములతో ఎట్లు పరుగెత్తుదుము? సుళువైన సమయములలో మనము నమ్మకముగా ఉండలేక పోయినట్లయితే, యిబ్బందుల కాలములో మనము నమ్మకముగా ఎట్లుండగలము? (యిర్మీయా 12:5). త్వరలో రాబోయే ఆ భవిష్యద్ధినమున ఆయన యొక్క 'కమాండో'లుగా నుండుటకు మనలను తర్ఫీదు చేయుటకు ఈ రోజు దేవుడు చూచుచున్నాడు.


అధ్యాయము 23
మేము విశ్వసించు సత్యము

మన గూర్చియు మన బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండవలెనని, ఆ విధముగా మాత్రమే మనలను మరియు మన బోధవినువారిని రక్షించుకొనగలమని మనము ఆజ్ఞాపింపబడితిమి (1 తిమోతి 4:16).


మన జీవితము మరియు మన సిద్ధాంతములు మన క్రైస్తవ జీవితానికి నిలకడనిచ్చు రెండు కాళ్లవంటివి. సామాన్య మానవులకున్నట్లే రెండు కాళ్లు సమానముగా నుండవలెను. క్రైస్తవలోకములో సాధారణముగా చెప్పాలంటే ఎక్కువ మంది విశ్వాసులు ఈ రెండు కాళ్లలో ఏదో ఒక దానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుదురు.


సిద్ధాంతముల విషయములో ''సత్యవాక్యమును సరిగా ఉపదేశించు'' వారిగా ఉండవలెనని మనము ఆజ్ఞాపింపబడితిమి (2 తిమోతి 2:15). లేఖనములను ధ్యానించుట విషయములో అనేకమంది అజాగ్రత్తగా ఉన్నందున సిద్ధాంతములను గ్రహించే విషయములో సమతుల్యత లేనివారిగా ఉందురు.


దేవుని సత్యము మానవ శరీరము వంటిది. ప్రతి అవయవము దాని సరియైన పరిమాణములో ఉన్నప్పుడే అది పరిపూర్ణముగా ఉండును. కేవలము ఒక ఉదాహరణను చూడండి: భాషలలో మాట్లాడుట ఇతర విశ్వాసులను ప్రేమించుట అంతటి ముఖ్యమైన విషయం కాదు. ఏ ఒక్క సిద్ధాంతమునైనా ఇతర సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి నొక్కి చెప్పిన యెడల మనము ప్రకటించు సత్యము ఒక భారీ పరిమాణము గల కంటినో లేక చెవినో కలిగియున్న శరీరమువలే యుండును! అంతేకాక ఆ విధమైన అతి ప్రాధాన్యత మన నమ్మకాలలో మనము మత మౌడ్యము గలవారిగా యగునట్లు చేయును. కాబట్టి దేవుని సత్యమును మనము సరిగా ఉపదేశించుట ప్రాముఖ్యమైనది.


దేవుని వాక్యము (బైబిలు నందలి 66 పుస్తకాలలోనున్నది) లో నున్న సత్యము మేము నమ్ముతున్నామని చెప్పినట్లయితే సుళువుగా ఉంటుంది. అది సత్యము. కాని దేవుని వాక్యములో సత్యము, సాతాను మరియు మనుష్యుల కపటోపాయముల చేత వక్రీకరింపబడి కల్తీ చేయబడింది. అందుచేత బైబిలు ఖచ్చితంగా ఏమి బోధిస్తుందో అర్థమయ్యేటట్లు విస్తరించి చెప్పవలసిన అవసరం ఉన్నది.


పరిశుద్ధాత్ముడు బయలుపరచకుండా దేవుని వాక్యము గణితము మరియు వైజ్ఞానిక శాస్త్రము వలే కేవలం బుద్ధి వివేకములతో పఠించుట వలన అర్థము కాదు. గర్విష్టులైన వివేకులకు కాక పసి పిల్లలకు (వినయ మనస్కులకు) మాత్రమే ఇది బయలు పరచబడుతుందని యేసు చెప్పెను (మత్తయి 11:25). ఇందువలననే యేసు క్రీస్తు కాలమందలి బైబిలు పండితులు కూడా ఆయన బోధలను అర్థము చేసికొనలేక పోయిరి. అదే కారణమున ఈనాటి అనేక బైబిలు పండితులు కూడా అదే పడవలో నున్నారు!


అదే సమయములో, మనము మన మనస్సులను కూడా ఉపయోగించవలెను. ఎందుకనగా, ''బుద్ధి విషయములో పెద్దవారై యుండవలెనని'' మనము ఆజ్ఞాపించబడినాము (1 కొరింథీ 14:20).


కాబట్టి పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడియున్న మనస్సు మాత్రమే దేవుని వాక్యమును సరిగా గ్రహించగలదు.


దేవుడు తన బిడ్డలందరు అన్ని విధాలుగా పూర్తిగా స్వతంత్రులై యుండవలెనని కోరుచున్నాడు. కాని అనేకమంది విశ్వాసులు అనేక పాపపు అలవాట్లకు మానవ ఆచారాలకు బానిసలుగా ఉన్నారు. వారు దేవుని వాక్యమును అజాగ్రత్తగా చదువుట దీనికి ఒక కారణము.


మనము దేవుని వాక్యమును గ్రహించుటకు ఎంత జాగ్రత్త వహిస్తామో అంతగా, సత్యము మనలను మన జీవితము యొక్క అన్ని పరిధులలో స్వతంత్రులుగా చేయును (యోహాను 8:32).


తమ డబ్బును, పెట్టుబడి పెట్టే విషయములో ఎక్కువ మంది విశ్వాసులు చాలా జాగ్రత్త వహించుదురు. కాని లేఖనములను ధ్యానించే విషయములో వారు చాలా అజాగ్రత్తగా యుందురు. వారు దేవునికంటే ఎక్కువగా డబ్బుకు విలువ ఇస్తున్నారని ఇది చూపిస్తున్నది. అటువంటి విశ్వాసులు దేవుని వాక్యమును గ్రహించే విషయములో నిశ్చయముగా దారితప్పిపోవుదురు.


లేఖనములు మనను ''పరిపూర్ణులు''గా చేయుటకు ఇవ్వబడినవి (2 తిమోతి 3:16, 17) అని కూడా చెప్పబడింది. క్రైస్తవ పరిపూర్ణతకు ఇష్టపడని వారు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొనలేరు (యోహాను 7:17).


యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది (కీర్తన 25:14).


దేవుని గూర్చిన సత్యము


దేవుడొక్కడే అనియు ఆయనలో ముగ్గురు వ్యక్తులున్నారనియు బైబిలు బోధిస్తున్నది.


అయితే అంకెలు భౌతిక ప్రపంచానికి సంబంధించినవి, కాని దేవుడు ఆత్మ కనుక ఒక చిన్న గిన్నె సముద్రము యొక్క నీటినంతటిని కలిగియుండలేదో మన పరిమితమైన మానవ మనస్సు ఈ సత్యమును గ్రహించలేదు.


ఒక కుక్క గుణకారమును గ్రహించలేదు- మూడు ఒక్కట్లను గుణించినప్పటికీ ఎలా ఒకటిగా నుండెను 1I1I1=1 అలాగా దేవుడు మూడు వ్యక్తులైయుండి కూడా ఒకే దేవుడు. ఒక కుక్క మరొక కుక్కను మాత్రమే అర్థము చేసుకోగలదు. అది ఒక మనిషిని పూర్తిగా అర్థము చేసుకోలేదు. అదే విధంగా, మన మానవ వివేచన గ్రహించబడగలిగిన వివరింపబడగలిగిన దేవుడు మనవంటి మరొక మానవుడు మాత్రమే అయ్యుండును. బైబిలులో ఉన్న దేవుడు మన మానవ జ్ఞానమునకు అందనివాడన్న వాస్తవమే ఇదే సత్యమనుటకు స్పష్టమైన ఆధారము.


అయిననూ ఈ సత్యము బైబిలు నందలి మొదటి వచనము నుండియే తేటపర్చబడినది. బైబిలులో ''దేవుడు'' అనే పదానికి ''ఎలోహిమ్‌'' అనే హెబ్రీపదము బహువచనములో వాడబడిని. 'మనము' మరియు 'మన యొక్క' అను పదములు వాడబడడం ఆదికాండము 1:26లో చూడగలము. క్రొత్త నిబంధనలో ఈ విషయము మరి విశేషముగా వెలుగులోనికి తేబడినది. యేసు ప్రభువు బాప్తిస్మము సమయములో తండ్రి (పరలోకము నుండి వచ్చిన స్వరము) కుమారుడు (యేసుక్రీస్తు) పరిశుద్ధాత్మ (పావురరూపంలో) ఉండిరి (మత్తయి 3:16, 17).


యేసే స్వయంగా తండ్రీ, కుమారుడు మరియు పరిశుద్ధాత్మయైయున్నాడు అని చెప్పువారు ఆయన తన స్వంత చిత్తము కాక భూమిపై తన తండ్రి చిత్తమును ఎలా చేసెనో వివరించలేరు (యోహాను 6:38). యూనిటారియన్‌ తెగవారు దేవుడు ఒకే వ్యక్తి అని నమ్ముట చేత, యేసు నామములో మాత్రమే బాప్తిస్మము ఇచ్చుదురు. వారు నిజానికి యేసు మానవునిగా వచ్చెనని నిరాకరించుదురు.


సరియైన బోధను కలిగియుండువారు తండ్రిని కుమారుని అంగీకరించుననియు, తండ్రిని కాని కుమారుని కాని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి ఆత్మను కలిగియున్నాడని బైబిలు చెప్పుచున్నది (2 యోహాను 9; 1 యోహాను 2:22).


క్రైస్తవ బాప్తిస్మములో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను ముగ్గురి పేర బాప్తిస్మము యివ్వాలని యేసు ప్రత్యేకముగా ఆజ్ఞాపించారు (మత్తయి 28:19) కుమారుడు యేసుక్రీస్తుగా గుర్తింపబడ్డారు (అపొ.కా.2:38).


క్రీస్తుని గూర్చిన సత్యము


యేసు క్రీస్తు దేవుడనియు ఆది నుండి ఆయన దేవునితో సమానుడిగా నుండెననియు మరియు ఆయన ఈ లోకమునకు వచ్చినపుడు దేవునిగా ఆయనకున్న కొన్ని శక్తులను వాడుటకు స్వచ్ఛందంగా నిరాకరించెననియు (రిక్తునిగా అయ్యాడని) లేఖనములు బోధిస్తున్నవి. ''ఆయన తన్నుతాను రిక్తునిగా చేసుకొనెను'' అనుదానికి అర్థమిదియే. (యోహాను 1:1; ఫిలిప్పీ 2:6, 7).


దీనిని నిరూపించే కొన్ని ఉదాహరణలు చూడండి. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు (యాకోబు 1:13). అయితే యేసు శోధింపబడెనని మనమెరుగుదుము (మత్తయి 4:1-10). దేవుడు అన్నిటిని ఎరుగును. కాని యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు తన రెండవ రాకడ యొక్క తేదీ తెలియదని చెప్పెను (మత్తయి 24:36). ఒక అంజూరపు చెట్టుకు పండ్లు ఉన్నాయేమో చూచుటకు ఆయన దాని దగ్గరకు వెళ్లవలసి వచ్చెను (మత్తయి 21:19). దేవునిగా ఆయనకున్న శక్తిని ఆయన ఉపయోగించిన యెడల ఆ చెట్టుకు పండ్లు లేవని దూరమునుండియే తెలుసుకొని యుండును! దేవుని జ్ఞానము మారనిది, నిత్యమైనది. కాని ''ఆయన జ్ఞానమందు వర్ధిల్లెను'' అని మన ప్రభువైన యేసు గురించి రెండు మార్లు నమోదు చేయబడినది (లూకా 2:40, 52).


యేసు భూమి మీదకు వచ్చినప్పుడు దేవునిగా ఆయనకుండిన అనేక శక్తుల నుండి ''తన్నుతాను రిక్తునిగా చేసుకొనెను'' అని ఈ వచనాలన్నియు సూచిస్తున్నవి.


ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఈ శక్తులనుండి తన్నతాను రిక్తునిగా చేసుకొన్నప్పటికీ ఆయన వ్యక్తిత్వములో ఆయన దేవునిగానే ఉండెను. దేవుడు దేవునిగా ఉండకపోవుట నిశ్చయముగా అసాధ్యము. ఆయన అలా చేయాలనుకున్నా కూడా అలా చేయలేడు. ఒక రాజు వెళ్లి ఒక మురికి వాడలో జీవించి రాజుగా తనకున్న హక్కులను విడిచిపెట్టవచ్చును. కాని అతడు ఇంకను రాజుగానే ఉండును. యేసు విషయములో కూడా ఇది నిజమే.


యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవత్వము యొక్క స్పష్టమైన ఋజువు ఆయన ఇతరులనుండి ఆరాధనను అంగీకరించిన ఏడు పర్యాయాలలో మనము చూడగలము (మత్తయి 8:2; 9:18; 14:33; 15:25; 20:20; మార్కు 5:6; యోహాను 9:38). దేవదూతలు మరియు దైవభయముగల మనుష్యులు ఆరాధనను అంగీకరించరు (అపొ.కా. 10:25, 26; పక్రటన 22:8, 9). కాని యేసు దేవుని కుమారుడైనందున ఆరాధనను అంగీకరించెను. యేసు భూమి మీద ఉన్నప్పుడే దేవుని కుమారుడని తండ్రి పేతురుకు బయలుపరచెను (మత్తయి 16:16, 17).


యేసు యొక్క మానవత్వమును గూర్చి, ''ఆయన అన్నివిషయములలో, తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను'' అని హెబీయ్రులు 2:17 చెప్పినప్పుడు అది చాలా ఖచ్చితముగా ఉన్నది. ఆయన ఆదాము సంతానము వలే చేయబడలేదు, ఎందుకనగా అప్పుడు ఆయన తక్కిన మానవాళి వలే ప్రాచీన పురుషుని కలిగియుండెడివాడు. ('ప్రాచీన పురుషుడు' అనేది అనేకులు దురదృష్టవశాత్తు వాడే లేఖనానుసారము కాని 'పాప స్వభావము' అన్న మాటకు లేఖనానుసారమైన పదము).


యేసు ఒక మానవ తండ్రిని కలిగియుండలేదు కాబట్టి ఆయన పాపస్వభావమును కలిగియుండలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించెను మరియు గర్భము నుండియే పరిశుద్ధునిగా ఉండెను (లూకా 1:35).


యేసు యొక్క ఆత్మీయ సహోదరులు దేవుని చిత్తము చేయువారు (మత్తయి 12:49, 50). వీరు ఆత్మ వలన జన్మించిన వారు (యోహాను 3:5) మరియు వారు ప్రాచీన స్వభావమును వదులుకొని చేయువారు నవీన స్వభావమును ధరించినవారై యున్నారు (ఎఫెసీ 4:22, 24). కాని యేసుని సహోదరులమైన మనము మన స్వంత చిత్తమును కలిగియున్నాము మరియు యేసు ''అన్ని విషయములలో మన వలే చేయబడెను''. ఆయన కూడా స్వంత చిత్తమును కలిగియుండెను కాని ఆయన దానిని ఉపేక్షించెను (యోహాను 6:38).


మనము ఆదాము సంతతిగా జన్మించినప్పుడు మనమందరము ప్రాచీన పురుషునితో జన్మించితిమి. ఈ ప్రాచీన పురుషుడుని శరీరేచ్ఛలకు (వాటిని ఒక దొంగల ముఠాతో పోల్చవచ్చును) మన హృదయపు తలుపును తెరచే ఒక అపనమ్మకస్తుడైన పనివానితో పోల్చవచ్చును. మనము తిరిగి జన్మించినప్పుడు ఈ ప్రాచీన పురుషుడు దేవునిచేత చంపబడ్డాడు (రోమా 6:6). కాని మనము శోధింపబడగలిగే శరీరమును మనము ఇంకను కలిగియున్నాము (యాకోబ 1:14, 15). ఆ ప్రాచీన పురుషుడు ఇప్పుడు నవీన పురుషునిచేత భర్తీ చేయబడెను. ఇతడు శరీరేచ్ఛలను ఎదిరించి హృదయపు తలుపును ఈ 'దొంగల ముఠా' రాకుండా మూసివేయును.


యేసు అన్ని విషయాలలో మనవలే శోధింపబడెను కాని జయించెను (హెబీ 4:15). ఆయన పాపపు శరీరముతో రాలేదు కాని ''పాపశరీరాకారముతో వచ్చెను (రోమా 8:3). మనము అనేక సంవత్సరములు పాపములో జీవించితిమి. అనేక సంవత్సరములు పాపము చేయట ద్వారా మనము పొందుకొన్న పాపపు అలవాట్లు మనము తిరిగి జన్మించిన తరువాతకూడా మనము తెలియకుండా పాపము చేయునట్లు చేయును.


ఉదాహరణకు గతంలో బూతులు మాట్లాడిన వారు, ఒత్తిడిలో ఉన్నప్పుడు తమ నోటి ద్వారా తెలియకుండానే అటువంటి పదాలు వచ్చుటను కనుగొందురు అయితే తమ రక్షణపొందని దినములలో, బూతులు అస్సలు మాట్లాడని వారు తమకు తెలియకుండా కూడా అటువంటి పదాలు వాడరు. అదే విధంగా ఎంతో అశ్లీల సాహిత్యము చదివిన వారు, అంతగా వాటిని చదవని వారి కంటే ఎక్కువగా చెడు తలంపులతో మరియు చెడు కలలు సమస్యను కలిగియుండుటను కనుగొందురు.


యేసు ఎప్పుడూ పాపము చేయలేదు కాబట్టి ఆయన తన జీవితములో తెలియని పాపమును కూడా కలిగియుండలేదు. ఆయన ఒక్కసారి కూడా తెలియకుండా పాపము చేసిన యెడల (మనము లేవీయకాండము 4:27, 28లో చదువునట్లుగా) ఆయన ఒక బలిని అర్పింపవలసి యుండెడిది. అప్పుడు ఆయన మన పాపముల నిమిత్తము ఒక పరిపూర్ణ బలిగా యెండెడివాడు కాదు.


సంఘ చరిత్ర అంతటిలో కూడా యేసు యొక్క వ్యక్తిత్వమును గూర్చిన సిద్ధాంతము అనేక వివాదాలకు దారితీసినది మరియు దాని గూర్చి అనేక మత విరోధమైన సిద్ధాంతములు ప్రకటింపబడినవి. కొందరు ఆయన దేవత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిచ్చిరంటే ఆయన మనవలెనే శోధింపబడెనని చూడలేకపోయిరి. ఇతరులు ఆయన మానవత్వమునకు ఎంత ప్రామ్యుత నిచ్చిరంటే వారు ఆయన దేవత్వమును కొట్టివేసిరి.


ఈ రెండు మతవిరోధమైన సిద్ధాంతములకు దూరముగా ఉండుటకు మన ఏకైక భధ్రత లేఖనములలో ఉన్న దేవుని పూర్ణ ప్రత్యక్షతతో నిలబడి, దాని ముందుకు వెళ్లకుండునట్లు అది ఎక్కడ ఆగితే మనమక్కడ ఆగవలెను (2 యోహాను 7, 9).


యేసు భూమి మీదకు ఒక మనిషిగా రావడము ఒక మర్మము. బైబిలులో మనకు చెప్పబడిన దానికంటే ఎక్కువగా ఈ సత్యమును విశ్లేషించుట అవివేకము. అలా చేయుట క్రీస్తుకు సాదృశ్యమైన దేవుని మందసములోకి ఇశ్రాయేలీయులు తొంగి చూచినప్పుడు చేసిన అవివేకమైన అగౌరవమైన కార్యము వలే నుండును - ఆ కార్యమును బట్టి దేవుడు వారిని మొత్తెను (1 సమూయేలు 6:19).


తన స్వంత యిష్ట ప్రకారముకాక తన తండ్రి చిత్తమును చేయుటకే ఆయన వచ్చెనని యేసు చెప్పెను (యోహాను 6:38). తన తండ్రికి వేరైన మానవ చిత్తమును యేసు కలిగియుండెనని ఇది చూపిస్తున్నది (మత్తయి 26:39). లేనియెడల ఆయన తన చిత్తమును ఉపేక్షించుకొనవలసిన అవసరము లేదు.


యేసు కూడా మనవలెనే అన్ని విషయములలో శోధింపబడెను (హెబీయ్రులు 4:15). కాని ఆయన తన మనసులో ఆ శోధనలకు ఎప్పుడూ తావివ్వలేదు. కనుక ఆయన ఎప్పుడూ పాపము చేయలేదు (యాకోబు 1:15). మనము ఎదుర్కొనబోయే శోధనలన్నిటిని ఆయన తన భూసంబంధమైన జీవితములో ఎదుర్కొని జయించెను.


ఒక్క రోజు పాపము చేయకుండా ఉండుట ఎంత కష్టమో మనందరికీ తెలుసు! కాబట్టి ఆయన అనుదినము మనవలెనే ప్రతి విషయములో శోధింపబడినప్పటికీ 33 సంవత్సరాలపాటు పాపము చేయకుండా జీవించుట యేసు చేసిన అతి గొప్ప అద్భుతమని మనము చెప్పవచ్చును. ఆయన మరణము పొందునంతగా పాపమును ఎదిరించెను. మరియు ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోను తండ్రినుండి కృపను వేడుకొనెను కాబట్టి ఆయన దానిని పొందెను (హెబీ 5:7; 12:3, 4).


మన అగ్రగామిగా సిలువనెత్తికొనుటలో ఆయన మాదిరిని అనుసరించమని ఆయన మనలను పిలచుచున్నాడు - అనగా మన స్వంత చిత్తమును మరణింపజేయుట (లూకా 9:23).


మనము పాపమును తగినంత తీవ్రతతో ఎదిరించము గనుక, జయించుటకు తండ్రిని కృపకొరకు వేడుకొనము గనుక మనము పాపములో పడిపోవుదము. ఈ రోజున మనము యేసును ఆయన జీవితము యొక్క బాహ్య విషయాలలో, వడ్రంగిగా ఉండుటలో లేక బ్రహ్మచారి ఉండుటలో ఆయనను వెంబడించుటకు లేక ఆయన పరిచర్యలో నీళ్లపై నడచుటలో లేక చనిపోయిన వారిని తిరిగి లేపుటలో ఆయనను వెంబడించుటకు పిలువబడలేదు కాని పాపమును జయించే విషయములో ఆయన వలే నమ్మకముగా ఉండుటకు పిలువబడితిమి.


యేసుక్రీస్తును గూర్చి రెండు విషయాలు ఒప్పుకొనేలా పరిశుద్ధాత్ముడు మనలను ప్రేరేపిస్తున్నాడు. ఒకటి ఆయన ప్రభువనియు మరొకటి ఆయన శరీరధారియై వచ్చెననియు (1 కొరింథీ 12:3; 1 యోహాను 4:2, 3). ఈ రెండు విధములైన ఒప్పుదలలు, సమానమైన ప్రాముఖ్యము కలవి. కాని రెండవది మరికొంచెము ఎక్కువ ప్రాముఖ్యత కలది. ఎందుచేతనంటే క్రీస్తువిరోధి (అంత్య క్రీస్తు) యొక్క ఆత్మను గుర్తు పట్టడానికి ఆనవాలు యేసు శరీరధారియై వచ్చెనని ఒప్పుకొనక పోవటమే (2 యోహాను 7, 8).


ఈనాడు క్రీస్తు యేసను నరుడు (1 తిమోతి 2:5) అనేకులైన సహోదరులలో జ్యేష్టసోదరుడు మరియు ఆయన యొక్క తండ్రి మనకు కూడా తండ్రియే (రోమా 8:29; యోహాను 20:17; ఎఫెసీ 1:3; హెబీ 2:11).


యేసు భూమి మీదకు వచ్చినప్పుడు దేవునిగా ఉండుట మానలేదు (యోహాను 10:33) ఆయన తిరిగి పరలోకము వెళ్లినప్పుడు మనుష్యునిగా ఉండుట మానలేదు (1 తిమోతి 2:5).


రక్షణ గూర్చిన సత్యము


దేవుని వాక్యము రక్షణ గూర్చి మూడు కాలములలో - భూతకాలము (ఎఫెసీ 2:8), వర్తమానకాలము (ఫిలిప్పీ 2:12) మరియు భవిష్యత్కాలము (రోమా 13:11) లలో చెబుతుంది. వేరే మాటలో చెప్పాలంటే నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపర్చబడుట మరియు మహిమ పరచబడుట.


రక్షణకు పునాది మరియు పై నిర్మాణం ఉన్నవి. పునాది పాపక్షమాపణ మరియు నీతి మంతులుగా తీర్చబడుటయైయున్నది.


నీతిమంతులుగా తీర్చబడటము అనేది క్రీస్తు యొక్క మరణం, పునరుత్థానం మరియు ఆరోహణము ఆధారముగా మన పాపములు క్షమింపబడడం మరియు దేవుని దృష్టిలో నీతిమంతులుగా అగుట అయి ఉంది. ఇది మన క్రియల మూలముగా కాదు (ఎఫెసీ 2:8, 9). ఎందుచేతనంటే మన నీతిక్రియలు కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలవలె ఉన్నవి (యెషయా 64:6). మనము క్రీస్తు యొక్క నీతితో కప్పబడియున్నాము(గలతీ 3:27). మారుమనస్సు, విశ్వాసము క్షమించబడుటకు మరియు నీతిమంతులుగా తీర్చబడటానికి షరతులుగా ఉన్నవి (అపొ.కా. 20:21).


నిజమైన పశ్చాత్తాపము తిరిగి చెల్లించటము అనే ఫలాన్ని ఫలించాలి. ఇతరులకు సంబంధించిన డబ్బు, వస్తువులు (తప్పుగా మన దగ్గర ఉన్నవి) కట్టవలసిన పన్నులు, ఇతరుల విషయములో మనము గతములో చేసిన తప్పులకు క్షమాపణ అడగడం, ఇవన్నీ అవకాశం ఉన్నంతవరకు మనము చెయ్యాలి (లూకా 19:8, 9). దేవుడు మనలను క్షమించినప్పుడు మనము కూడా ఇతరులను అదే విధంగా క్షమించాలని ఆయన కోరుచున్నాడు. అలా క్షమించటంలో తప్పి పోయినట్లయితే ఆయన ఇచ్చే క్షమాపణను ఆయన రద్దు చేస్తారు (మత్తయి 18:23-35).


పశ్చాత్తాపము మరియు విశ్వాసము అనునవి నీటిలో ముంచబడే బాప్తిస్మమునకు దారితీయాలి. దీని ద్వారా మనలో ఉండిన ప్రాచీన పురుషుడు పాతిపెట్టబడినట్లు మనము దేవునికి మనుష్యులకు మరియు దయ్యములకు బహిరంగముగా మనము సాక్ష్యమిస్తాము (రోమా 6:4-6).


అప్పుడు మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందగలము. దాని ద్వారా మనము శక్తితో నింపబడి, క్రీస్తుకు మన జీవితాల ద్వారా, పెదవుల ద్వారా సాక్షులముగా ఉంటాము (అపొ.కా. 1:8). నీటిలో బాప్తిస్మము పొందడం దేవుని ఆజ్ఞను పాటించుట. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము దేవుని బిడ్డలందరు విశ్వాసము ద్వారా పొందవలసిన వాగ్దానము (మార్కు 3:11, లూకా 11:13).


ప్రతి విశ్వాసికి ఉన్న ఆధిక్యత ఏమిటంటే ఖచ్చితంగా అతడు దేవుని బిడ్డయే అని ఆత్మ ద్వారా సాక్ష్యము కలిగియుండడము (రోమా 8:16) మరియు ఇంకా అతడు పరిశుద్ధాత్మును పొందియున్నానని తెలుసుకొనడము (అపొ.కా. 19:2).


పరిశుద్ధపరచబడుట ఈ కట్టడము యొక్క పై నిర్మాణము. పరిశుద్ధ పరచబడుట అనగా పాపము నుండి ప్రపంచము నుండి వేరుపరచబడటం. ఇది ఒక వ్యక్తి యొక్క నూతన జన్మ (1 కొరింథీ 1:2).తో ప్రారంభమై, అతడు భూమిపై నివసించు కాలమంతా కొనసాగే ప్రక్రియయై ఉన్నది (1 థెస్సలో. 5:23, 24). ఈ యొక్క పనిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన కట్టడలను మన హృదయాలపై మరియు మన మనస్సు నందు వ్రాయుట ద్వారా ప్రారంభిస్తాడు. అయితే మన బాధ్యతగా మన రక్షణను మనము భయముతోను వణుకుతోను కొనసాగించాలి (ఫిలిప్పీ 2:12, 13). అదేమిటంటే మన శరీర క్రియలను పరిశుద్ధాత్ముడు అందిస్తున్న శక్తి ద్వారా మనము వాటిని మరణింపజేయవలెను (రోమా 8:13). మనము శరీరము యొక్క ఆత్మ యొక్క మాలిన్యమును శుభ్రపరచుకొని దేవుని భయముతో, పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనవలెను (2 కొరింథీ 7:1).


ఎప్పుడైతే ఒక శిష్యుడు నిజముగా పరిపూర్ణమయిన మార్పుకోరి పూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మునికి ఈ పనిలో సహకరిస్తాడో అప్పుడు అతని జీవితంలో పరిశుద్ధపరచబడే ప్రక్రియ త్వరితముగా జరుగుతుంది. అదే పని పరిశుద్ధాత్మునితో సహకరింపని వాని యందు నెమ్మదిగా జరగటం జరుగుతుంది.


మనము శోధింపబడినప్పుడు మనము పూర్ణహృదయముతో పరిశుద్ధపరచబడుటకు కోరుచున్నామో లేదో పరీక్షింపబడును.


పరిశుద్ధ పరచబడటం అంటే ధర్మశాస్త్రము నందలి నీతి మన హృదయాలలో నెరవేర్చబడుట అంతేకాని, పాత నిబంధనలో వలె బాహ్యముగా కాదు (రోమా 8:4). దీనినే యేసు మత్తయి 5:17-48 వచనాలలో విపులీకరించి చెప్పారు.


ధర్మశాస్త్ర మంతయు ''నీ దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించడం మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం'' అనే వాటిలో యిమిడి ఉందని యేసు చెప్పారు (మత్తయి 22:36-40).


ఇప్పుడు దేవుడు ప్రేమ సూత్రమును మన హృదయాలపై వ్రాయటానికి చూస్తున్నారు. ఎందుచేతనంటే అది ఆయన యొక్క స్వభావము (హెబీ 8:10; 2 పేతురు 1:4). ఈ విషయం మన ఆత్మ వివేకములకు తెలిసిన అన్ని పాపముపై విజయము సాధించటము మరియు యేసు చెప్పిన అన్ని ఆజ్ఞలకు లోబడటంలో గోచరమవుతుంది (యోహాను 14:15).


యేసు చెప్పిన శిష్యత్వపు షరతులను మొదటిగా నెరవేర్చకుండా ఈ జీవితములోకి ప్రవేశించుట అసాధ్యము (లూకా 14:26-33). ఇవి ప్రాథమికంగా ప్రభువుకు మనకంటే మన బంధువలందరి కంటే ఉన్నతమైన స్థలము నిచ్చుట మరియు ఒకరికున్న భౌతికపరమైన సంపదను కలిగినవాటినన్ని విడిచిపెట్టుటకు సిద్ధపడియుండుట.


ఇది మనము ముందుగా వెళ్లవలసిన ఇరుకు ద్వారము. ఆ తరువాత పరిశుద్ధ పరచబడుట అనే ఇరుకు మార్గము వచ్చును. పరిశుద్ధ పరచబడుటను వెంబడించనివారు ప్రభువును చూడలేరు (హెబీ 12:14).


యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనము మహిమ శరీరము పొందెదము (1 యోహాను 3:2). మన మనస్సాక్షి విషయంలో సంపూర్ణులముగా అవడము ఇప్పుడు, ఇక్కడ సాధ్యమయినప్పటికి (హెబీ 7:19; 9:9, 14) పాపరహితముగా సంపూర్ణులగుట స్థానిక సంఘములను స్థాపించుటకు మహిమ శరీరము పొందే వరకు సాధ్యము కాదు (1 యోహాను 3:2). కాని ఇప్పుడు ఆయన నడచినట్లు నడచుటకు మనము కోరుకోవలెను (1 యోహాను 2:6).


మనము ఈ క్షయమయిన శరీరము ఉన్నంతవరకు మనమెంత పరిశుద్ధ పరచబడినా దానిలో మన మనస్సుకు తెలియని రీతిలో దాగుకొని యున్న పాపము ఉంటుంది (1 యోహాను 1:8). కాని మనము మన మనస్సాక్షి విషయములో పరిపూర్ణులమై (అపొ.కా.24:16) మనకు తెలిసిన పాపము నుండి ఇప్పుడు కూడా విడుదల పొందగలము (1 యోహాను 2:1). మనము పూర్ణహృదయముతో వెదకినట్లయితే దీనిని సాధించగలము (1 కొరింథీ 4:4).


ఆ విధముగా మనము యేసు రెండవ రాకడ కొరకు మరియు మనము మహిమ పొందుట కొరకు ఎదురు చూస్తున్నాము. ఇది మన యొక్క రక్షణ కార్యములో చివరి భాగము (రోమా 8:23; ఫిలిప్పీ 3:21).


సంఘము గూర్చిన సత్యము


సంఘము క్రీస్తు యొక్క శరీరము. దీనికి ఉండే ఒకే ఒక శిరస్సు క్రీస్తు. మరియు దీనికి ఉండే ఒకే ఒక ప్రధాన కార్యాలయము - మూడవ ఆకాశము. క్రీస్తు శరీరములో ప్రతి సభ్యునికి ఒక పరిచర్య కలిగియున్నాడు (ఎఫెసీ 4:16)కొందరు సభ్యులు ఇతరుల కంటే ప్రాముఖ్యమైన పరిచర్యను కలిగియున్నప్పటికీ, ప్రతి సభ్యుడు పంచుకొనుటకు విలువైనదానిని కలిగియుండును.


క్రీస్తు ఆయన సంఘానికి అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను మరియు బోధకులను ఆయన శరీరాన్ని కట్టడానికి నియమించారు (ఎఫెసీ 4:11). ఇవన్నీ పరిచర్యలు కాని బిరుదులు కాదు. అపొస్తలులు స్థానిక సంఘములను స్థాపించుటకు దేవుని చేత పిలువబడి పంపబడినవారు (2 కొరింథీ 10:13). వారిది సంఘములో మొదటి స్థానము (1 కొరింథీ 12:28). మరియు వారుండిన స్థలములలో ఇతర పెద్దలకు వారు పెద్దలుగా ఉంటారు. ప్రవక్తలు దేవుని బిడ్డల మరుగైన ఆధ్యాత్మిక అవసరతలను వెలుగులోనికి తెస్తూ వారికి పరిచర్య చేసేవారు. సువార్తికులు దేవుని ఎరుగని ప్రజలను క్రీస్తు నొద్దకు తీసుకొని రాగల వరము కలవారు. అయితే వీరు దేవుని తెలుసుకొన్న వారిని క్రీస్తు శరీరమయిన స్థానికి సంఘానికి తీసుకురావలెను. ఈ విషయంలో ఈ కాలపు సువార్తికులు అనేకులు తప్పిపోతున్నారు. కాపరులు గొఱ్ఱెపిల్లల గురించి గొఱ్ఱెల గురించి (అనగా క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రొత్తగా ప్రవేశించిన వారిని, స్థిరపడిన వారిని) జాగ్రత్త తీసుకొని దారి చూపించేవారు. బోధకులు లేఖనాలను, సిద్ధాంతాలను విపులీకరించి చెప్పగలిగేవారు. ఈ అయిదు వరములు ప్రపంచమంతా వ్యాపించి యున్న సంఘములకు ఇవ్వబడ్డాయి. వీటన్నిటిలో కాపరులు మొదటి నుండి ప్రతి స్థానిక సంఘమునకు అవసరమైయున్నారు. మిగిలిన వరముల అవసరత సంచారము చేయు వారి ద్వారా నెరవేరవచ్చును.


స్థానిక సంఘముల యొక్క నాయకత్వము పెద్దల చేతులలో నుండవలెను, దీనిని క్రొత్త నిబంధన తేటగా బోధిస్తుంది (తీతుకు 1:5, అపొ.కా.14:23). ''పెద్దలు'' బహువచనము కాబట్టి కనీసము ఇద్దరు అయినా పెద్దలు ప్రతి స్థానిక సంఘములో ఉండాలనే భావము స్పష్టముగా తెలుస్తుంది. స్థానికి సంఘములో నాయకత్వములో సమతల్యత కొరకు మరియు మనము మత్తయి 18:18-20లో చదువునట్లు సాతాను యొక్క కార్యములను బంధించుటకును పెద్దల యొక్క బహుళత్వము అవసరము.


సంఘములో ఒకే వ్యక్తి నాయకత్వము క్రొత్త నిబంధన యొక్క బోధకు వ్యతిరేకము. ఆ పెద్దలలో ఒకరు సంఘపు దూత కావచ్చు (పక్రటన 2:1). అతడు దేవుని వాక్యమును పంచుకొనే వరము కలవాడై యుండవలెను.


యేసు తన శిష్యులకు బిరుదులు కలిగి ఉండకూడదని ఖచ్చితంగా చెప్పారు (మత్తయి 23:7-12). అందుచేత బోధకుడని లేక తండ్రి (ఫాదర్‌ అని లేక కాపరి (పాస్టర్‌) అని లేక పూజ్యుడని (రెవరెండు) లేక నాయకుడని (లీడర్‌) పిలవబడడం వాక్య విరుద్దము. నిజానికి ''పూజ్యుడు'' (రెవరెండు) అనే బిరుదు బైబిలులో ఒక దేవునికే ఉపయోగించబడింది (కీర్తనలు 111:9). ఎవరైన ఆ బిరుదు ఉపయోగించినట్లయితే దేవునితో సమానముగా నుండాలని కోరుకొన్న లూసిఫరు అంతటి నేరస్థుడే (యెషయా 14:14). సంఘములో ఉండిన ప్రతి ఒక్కరు కేవలం ఒక సహోదరుడుగా, సేవకనిగా ఉండవలెను.


స్థానికి సంఘములో కూటములు - కేవలం వాక్యోపదేశమునకో (అపొ.కా. 20:9,11) లేక ప్రార్థనకో (అపొ.కా. 12:5,12) లేక సువార్తీకరణకో కేటాయింపబడితే తప్ప ప్రతి కూటములో దేవుని వాక్యాన్ని ప్రవచించటానికి శిష్యులకు అవకాశం ఉండాలి(1 కొరింథీ 14:26-40). ప్రవచించే వరమును కూటములలో వాడే ప్రతి ఒక్కరు కోరుకోవాలి (1 కొరింథీ 14:1, 39). భాషలలో మాట్లాడే కృపావరము వలన ప్రధానముగా వ్యక్తిగత ఆత్మీయాభివృద్ది కలుగుతుంది (1 కొరింథీ 14:4, 18, 19). కాని, భాషలకు అర్థము చెప్పినప్పుడు కొంతవరకు కూటముల యందు ఉపయోగకరముగా ఉంటుంది (1 కొరింథీ 14:27). భాష యొక్క భావము ఒక బయల్పాటు కావచ్చు, జ్ఞానముతో కూడిన వాక్య వివరణ కావచ్చు, ప్రవచనము , బోధ లేక దేవునికి చేయు ప్రార్థనై యుండవచ్చును (1 కొరింథీ 14:26). 1 కొరింథీ 12:8, 10లో మరియు రోమా 12:6, 8లో చెప్పబడిన వరములన్నీ క్రీస్తు శరీరాన్ని కట్టడానికి అవసరమై ఉన్నవి. ఈ ఆత్మీయ వరములను తృణీకరించు లేక అలక్ష్యము చేయు సంఘము వీటిని ఎప్పటికినీ పొందలేదు.


స్త్రీలు తలపై ముసుకు వేసుకొని కూటములలో ప్రార్థింపవచ్చును, ప్రవచింపవచ్చును కాని వారు ఉపదేశించుటకైనను పురుషులపై అధికారము చేయుటకైనను అనుమతింపబడకూడదు (1 కొరింథీ 11:5; 1 తిమోతి 2:12).


అన్ని దేశముల యందు కూడా యేసు ప్రభువు శిష్యులను తయారు చేసేందుకు గాను వీలైనంత మందికి వీలైనన్ని రీతులలో యేసు క్రీస్తును గూర్చిన సువార్త బోధించే బాధ్యత సంఘము కలిగియుంది (మార్కు 16:15; మత్తయి 28:19). శిష్యులను తయారు చేయలేనటువంటి సువార్త సేవ చేయడం భూమిపై క్రీస్తు యొక్క సాక్ష్యానికి ఆటంకముగా ఉంటుంది.


ప్రతీ స్థానిక సంఘము 'రొట్టె విరచుట' ద్వారా క్రీస్తు యొక్క మరణాన్ని ప్రకటించాలి (1 కొరింథీ 11:22-34). అయితే ఎన్ని మారులు 'రొట్టె విరచుట' ఉండాలనే విషయంలో దేవుడు సంఘానికి స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే దీనిని ఎప్పుడూ ఒక విలువలేని ఆచారముగా మాత్రము మారనివ్వకూడదు.


3వ యోహాను 7వ వచనము ప్రకారము అవిశ్వాసుల నుండి దేవుని పనికొరకు ద్రవ్యము తీసుకొనుట తప్పని దేవుని వాక్యము తేట పరచుచున్నది. కనుక అవిశ్వాసులు హాజరయ్యే కూటములలో కానులు పట్టకూడదు. విశ్వాసులు ఇచ్చేదంతా రహస్యముగాను, స్వచ్ఛందంగా ఇచ్చేదిగా ఉండిలి (2 కొరింథీ 9:7). కానుకలు పొందాలన్న ఉద్దేశ్యంతో ''ప్రార్థనా ఉత్తరాలు'' లేక సువార్త సేవ యొక్క నివేదికలు ఉండే ఉత్తరాలు కూడా పంపుట తప్పని మేము నమ్ముతున్నాము.


యేసు యొక్క ఆజ్ఞలనన్నిటిని ప్రత్యేకంగా మత్తయి 5,6,7 అధ్యాయాలలో వ్రాయబడిన వాటన్నిటిని విశ్వాసముతో లోబడటానికి శిష్యులను నడిపించగలిగినప్పుడే సంఘము కదలకుండా ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఉన్న అతి చిన్న ఆజ్ఞను కూడా తప్పక అనుసరించాలి మరియు ఉత్సాహముతో ప్రకటించాలి. ఇదే ఒక వ్యక్తిని దేవుని దృష్టిలో గొప్పవానిగా చేయును (మత్తయి 5:19).


అనేక విషయాలను గూర్చి క్రొత్త నిబంధన మౌనముగా ఉన్నది. ఇటువంటి విషయాలలో మనము పిడివాదముగా ఉండకుండా ఇతర శిష్యులు వారి ఒప్పుదలలను బట్టి వారుండటానికి స్వేచ్ఛనిస్తూ మన ఒప్పుదలలను మనము స్థిరముగా కలిగియుండాలి (రోమా 14:5).


మనతో ప్రతి విషయాన్ని ఏకీభవించే వారిని ప్రేమించుట సుళువు. మనతో ఏకీభవించని వారి యెడల గల మన వైఖరిని బట్టి మన ప్రేమ పరీక్షింపబడుతుంది. దేవుడు తన పిల్లలు అందరు ప్రతీ చిన్న అంశములలో కూడా ఒకే విధమైన అభిప్రాయము కలిగి ఉండాలని తలంచలేదు. అలాగే ప్రతి స్థానిక సంఘము వాక్యానుసారము కాని విషయాల యందు ఒకేవిధమైన బాహ్యరూపము కలిగియుండాలని దేవుడు ఉద్దేశింపలేదు. భిన్నత్వంలో ఏకత్వము నందు దేవుని యొక్క మహిమ కనబడుతుంది. మనభావము అనేది మానవ కల్పితము. ఇది ఆత్మీయ మారణాన్ని తెస్తుంది. దేవుడు ఐక్యతను కోరుతున్నాడు కాని ఒకే విధమైన బాహ్యరూపాన్ని కోరుట లేదు.


చివరిగా మనము జ్ఞాపకము ఉంచుకోవలసినది ఒకరి యెడల ఒకరికి గల ప్రేమయే యేసు శిష్యుల కుండవలసిన స్పష్టమైన గుర్తు (యోహాను 13:35). తండ్రి కుమారుడు ఒకరుగా ఏకమై ఉన్నలాగున సంఘము కూడా ఏకమై ఉండుటకు అపేక్షించాలి (యోహాను 17:21).


ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదంతా మనము స్థిరమైన పునాదిగా కలిగియుండవలసిన సత్యము.


ఇది సత్యమని మాకు తెలుసు, ఎందుచేతనంటే దీనిని పూర్ణహృదయంతో అంగీకరించిన వారిని ఈ సత్యము స్వతంత్రులుగా చేయుచున్నది (యోహాను 8:32).


అధ్యాయము 24
క్రిస్‌మస్‌ మరియు ఈస్టర్‌ - క్రైస్తవ్యమా లేక అన్యాచారమా?

ప్రజలు గొఱ్ఱెలతో సరిపోల్చబడినారు. మరి గొఱ్ఱెలకు ప్రశ్నించకుండా గుంపును అనుసరించి వెళ్లే నైజముంటుంది. యేసు వచ్చి మనము ప్రతి విషయాన్ని దేవుని వాక్యముతో పరీక్షించుకోవాలని బోధించారు. పరిసయ్యులు మానవ సంప్రదాయాలకు ఎక్కువ విలువ యిచ్చారు. యేసు దేవుని వాక్యాన్ని హెచ్చించారు. మనుష్యుడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును (మత్తయి 4:4) అని యేసు చెప్పెను.


యేసు పరిసయ్యులతో నిరంతరము చేసిన పోరాటము, కాలంతో పాటుగా దేవుని వాక్యానికిని మనుష్యులు పెట్టిన సంప్రదాయాలకు మధ్యన జరుగుతున్నదే. ఈనాడు దేవుని సంఘములో మనము కూడా అదే పోరాటములో నున్నాము. దేవుని వాక్యమొక్కటే ఈ భూమిపై మనకున్న వెలుగు. దేవుడు మొదటగా వెలుగును సృష్టించినప్పుడు ఆయన వెంటనే దానిని చీకటి నుండి వేరుపరచెను. పాపము మరియు మానవ సంప్రదాయాలే చీకటి అయి ఉన్నవి. మనము కూడా ఈరెంటిని స్వచ్ఛమైన దేవుని వాక్యమునుండి వేరు చేయటానికి పిలువబడినాము, ఆ విధముగా దేవుని సంఘములో మిశ్రితమైనది ఏది ఉండదు.


క్రిస్‌మస్‌


యేసు క్రీస్తు జన్మదినముగా అనేకుల చేత జరుపుకోబడుతున్న క్రిస్‌మస్‌ గురించి మొదటగా ఆలోచిద్దాము. అన్ని మతాలకు సంబంధించిన అంగడ్లవారు క్రిస్‌మస్‌ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ లాభాలు పొందుటకు అది తగిన సమయము. ఇది ఒక వ్యాపారపు పండుగ తప్ప ఆత్మీయపు పండుగ కాదు. లక్షల కొద్ది రూపాయలు క్రిస్‌మస్‌ కార్డులు, బహుమతుల కోసం ఖర్చవుతాయి. మత్తు పానీయాల అమ్మకం ఈ సమయంలో ఎంతో పెరిగిపోతుంది. మరియు ట్రాఫిక్‌ పోలీసులు వారి మునివేళ్లపై నిల్చోని ఉంటారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు క్రిస్‌మస్‌ కాలంలో అయినంతగా మరి ఎప్పుడూ జరుగవు. రోడ్డు ప్రమాదాల ద్వారా ఈ కాలంలో నరకానికి వెళ్లినంత మంది సంవత్సరంలో ఇంకే సమయంలో వెళ్లరు.


ఇది నిజంగా దేవుని కుమారుని జన్మదినమా? లేక ఇంకొక 'యేసు'దా?


మొదటిగా దేవుని వాక్యాన్ని చూద్దాము. యేసు బెత్లెహేములో జన్మించిన రాత్రి గొఱ్ఱెల కాపరులు వారి గొఱ్ఱెలతో కలసి యూదయ ప్రాంతమందలి పొలాల్లో నుండిరని బైబిలు మనకు చెబుతుంది. ఆ కాలంలో వాతావరణం వర్షంతోను, చలితోను ఉండుట చేత పాలస్తీనాలో ఉండే గొఱ్ఱెల కాపర్లు అక్టోబరు నెల నుండి, ఫిబ్రవరి నెల వరకు వారి గొఱ్ఱెలను ఆరు బయట పొలాల్లో నుంచరు. కనుక నిజమైన యేసు తప్పక మార్చి సెప్టెంబరు నెలల మధ్య పుట్టియుండాలి. అప్పుడు డిసెంబరు 25 తప్పక సాతానుచే శంకింపని క్రైస్తవ లోకంలోనికి తప్పుగా చేర్చబడిన ఇంకొక 'యేసు' జన్మదినమై ఉన్నది!


ఇంకా ఆలోచించినట్లయితే, ఒక వేళ యేసు యొక్క ఖచ్చితమైన జన్మదినము మనకు తెలిసియుండినా, దేవుని సంఘము ఆ దినాన్ని జరుపుకొనుటకు దేవుడు ఉద్దేశించాడా అనేది ప్రశ్న. యేసు తల్లియైన మరియకు యేసు జన్మించిన ఖచ్చితమైన రోజు తెలియును. ఆమె పెంతెకొస్తు దినము తరువాత ఎంతోకాలం అపొస్తలులతో కలిసియుండెను. అయినను ఏ సువార్తలో కూడా యేసు జన్మదినము గూర్చి వ్రాయబడలేదు. ఇది దేనిని సూచిస్తుంది? సంఘము దానిని ఆచరించుట ఆయన కోరుకొనుట లేదు కనుకనే దేవుడు ఉద్దేశపూర్వకముగా యేసు యొక్క జన్మదినమును మరుగుపరచెనని మాత్రమే చూపిస్తుంది.


మనము బైబిలులో భూలోక రాజులు మాత్రమే వారి జన్మదినమును జరుపుకొనుటను చదువుదుము - ఫరో (ఆదికాండము 40:20) మరియు హేరోదు (మార్కు 6:21). దేవుడు యేసును ఆ వర్గంలో నుంచుటకు ఎప్పుడు తలంచలేదు.


పాత, క్రొత్త నిబంధనల మధ్య తేడాను అర్థం చేసుకొనుట ద్వారా, ఎందుకు దేవుడు ప్రస్తుతం ఆయన బిడ్డలు ఏ ప్రత్యేక దినములను ఆచరించుటకు యిష్టపడలేదో మనము తెలుసుకోవచ్చును. పాత నింధనలో ఇశ్రాయేలీయులు కొన్ని దినములను పవిత్ర దినములుగా ఆచరించాలని ఆదేశింపబడినారు. కాని అది కేవలం ఛాయ మాత్రమే. ఇప్పుడు మనకు క్రీస్తునందు వాస్తవం ఉన్నది. ప్రతిదినము మన జీవితాల్లో ఒకే విధమైన పవిత్రత కలిగి ఉండాలనేది దేవుని చిత్తము. చివరకు వారం వారం వచ్చే సబ్బాతు కూడా క్రొత్త నిబంధనలో తీసివేయబడెను. ఇందుచేతనే క్రొత్త నిబంధనలో ఏ పవిత్ర దినములు పేర్కొనబడలేదు (కొలొస్స 2:16, 17).


అయితే క్రిస్‌మస్‌, ఈస్టరు పండుగలు క్రైస్తవ లోకములోనికి ఎలా ప్రవేశింపగలిగాయి. దానికి జవాబు: పసిపిల్లల బాప్తిస్మము మరియు అనేక మానవ సంప్రదాయాలు ఎలా ప్రవేశించాయో అలాగునే - సాతాను యొక్క కపట తంత్రముల వలన ప్రవేశించాయి.


నాల్గవ శతాబ్దంలో కాన్‌స్టంటైన్‌ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని రోమాదేశంలో అధికారిక మతంగా చేసినప్పుడు అనేకులు హృదయంలో మార్పులేకుండా 'పేరుకు' మాత్రం క్రైస్తవులయ్యారు. అయితే వారు సంవత్సరంలో వచ్చేటటువంటి రెండు గొప్ప పండుగలను విడిచిపెట్టుటకు యిష్టపడలేదు. అవి సూర్యుని ఆరాధించుటతో సంబంధముండిన రెండు పండుగలు. ఒకటి డిసెంబరు 25, వారి సూర్యదేవుని జన్మదినము. అనగా సూర్యుడు భూమిదక్షిణార్థ గోళము వైపు దిగిపోయిన తరువాత తిరుగ ప్రయాణము మొదలు పెట్టినది (దక్షిణాయనం). రెండవది మార్చి లేక ఏప్రియల్‌లో వచ్చే వసంతకాలపు పండుగ. అది చలికాలము చనిపోయి వారి సూర్యదేవుడు తెచ్చినటువంటి ఎండాకాలపు పుట్టుకను వారు జరుపుకునేవారు. వారు వారి సూర్యదేవునికి 'యేసు' అని పేరు పెట్టి వారి రెండు గొప్ప పండుగలను ఇప్పుడు క్రైస్తవ పండుగలుగా 'క్రిస్‌మస్‌' మరియు 'ఈస్టర్‌' పేర్లతో జరుపుకోనుట కొనసాగించిరి.


'ది ఎనసైక్లోపీడియా బ్రిటానికా' (లౌకి చరిత్ర గూర్చి అధికారికంగా చెప్పే గ్రంథము) ఈ విధముగా క్రిస్‌మస్‌ ఆరంభము గూర్చి తెలియపర్చింది:


''డిసెంబరు 25 ఓటమి ఎరుగని పిలోకలిస్‌ సూర్యుని యొక్క సూర్యోత్సవము. క్రిస్‌మస్‌ ఆచారములు క్రైస్తవ కాలానికి ఎంతో ముందునుండి క్రమానుగతంగా వచ్చినటువంటివి. ఇది కాలముతో పాటుగా విగ్రహారాధనతోను, మతతత్వముతోను మరియు దేశీయమైన వేడుకలతోను కలసిపోయి పురాణాలు మరియు సంప్రదాయాలతో పూర్తిగా ఆవరింపబడినవి.క్రీస్తు పుట్టిన ఖచ్చితమైన తేదీ, సంవత్సరము ఇప్పటివరకు సంతృప్తికరముగా లేదు. కాని క్రీస్తు తరువాత 440వ సంవత్సరములో క్రైస్తవ సంఘ పెద్దలు తెలివిగా (?) ప్రజల మనసుల్లో బలంగా నాటుకొనియున్న, వారి ముఖ్యమైన పండుగ రోజైన చలికాలంలో సూర్యుడు భూమి అర్ధగొళం నుండి తిరుగు ప్రయాణం ప్రారంభించిన (దక్షిణాయనం) రోజును క్రీస్తు జన్మదినముగా ఆచరించుటకు ఒక తేదీగా నిర్ణయించారు. ఆ విధంగా క్రైస్తవత్వం క్రైస్తవేతర స్థలాలలోనికి వ్యాప్తి చెందగా చలికాలపు (దక్షిణాయనం) పండుగ యొక్క అనేక వాడుకలు క్రైస్తవ్యంలోనికి కలసిపోయాయి' (1953 ముద్రణ, 5వ సంపుటి, 642ఎ, 643 పేజీలు).


ఈ అన్యాచారములు నిజానికి నిమ్రోదుతో ప్రారంభమయిన బబులోను మతముతో ఆరంభమయ్యాయి (ఆదికాండము 10:8-10). అతడు చనిపోయిన తరువాత అతడి భార్య సెమిరమిస్‌కు ఒక అక్రమ సంతానము కలిగెను, వానిని నిమ్రోదు తిరిగి ప్రాణంతో వచ్చినట్లు ఆమె చెప్పెను. ఆ విధంగా తల్లి, బిడ్డను పూజించడం మొదలయ్యింది. దానినే 2000 సంవత్సరాల తరువాత రోమన్‌ కేథలిక్కులు తీసుకొని 'మరియ, యేసు'గా మార్పు చేసారు.


ఈ బాల దేవుని జన్మ దినాన్ని పురాతన బబులోను వారు డిసెంబరు 25న ఆచరించేవారు. సెమిర్‌మిస్‌ ''పరలోకపు రాణి''గా యుండెను మరియు (యిర్మీయా 44:19) శతాబ్దాల అనంతరం ఎఫెసులో డయానా లేక అర్తెమి దేవిగా పూజింపబడెను (అపొ.కా.19:28).


ఇక చనిపోయిన చెట్టు మోడు నుండి ఒక రాత్రిలో ఒక పూర్తిగా ఎదిగిన పచ్చని చెట్టు మొలుస్తుందని ఆమె చెప్తూ ఉండేదని మత చరిత్ర చెబుతుంది. ఇది నిమ్రోదు తిరిగి జీవము పొందుతాడని, బహుమతులు తెస్తాడనుదానికి సాదృశ్యముగా నుండెను. ఆ విధముగా దేవదారు వృక్షాలను నరికి దానికి బహుమతులను వ్రేలాడదీసే అలవాటు మొదలయ్యింది. అదే ఈనాటి క్రిస్‌మస్‌ చెట్టు!


యెహోవా సెలవిచ్చునదేమనగా జనుల ఆచారములను అభ్యసించకుడి....జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరకునట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకయండునట్లు మేకులు కొట్టి సుత్తులతో బిగగొట్టి దానిని నిలుపుదురు (యిర్మీయా 10:2-4).


ఈస్టరు


ఈస్టరు అనే మాట పరలోకపు రాణి అయిన ''ఇష్తారు'' లేక ''అష్తారోతు'' అనే బిరుదులు నుండి వచ్చినది (1 రాజులు 11:5 చూడండి). ఇది సొలొమోను పూజించిన ఒక అన్యదేవత. వేరు వేరు దేశాల్లో ఈ పేర్లు కొద్ది తేడాతో నున్నవి.


''ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా'' ఇలా చెబుతుంది,


''ఈస్టరు'' అనే ఇంగ్లీషు పదమునకు 'ఓష్టరు'' అనే జర్మను పదమునకు ఉండిన సంబంధమును బట్టి మధ్య ఐరోపాలో ఉన్న ట్యూటోనిక్‌ తెగలకు క్రైస్తవ్యం ఋణపడి యున్నట్లు బయల్పడుతుంది. క్రైస్తవ్యం ట్యూటోనిక తెగలకు చేరినప్పుడు ఈ గొప్ప క్రైస్తవ ఉత్సవ దినము ఇతర విగ్రహారాధికుల క్రియలు ఆచారాలతో కలసిపోయి వారి ''వసంత'' ఋతువు పండుగలతో కలసి ఆచరించడమైనది. వసంత ఋతువులో వచ్చే మరణంపై జీవము జయము పొందిన పునరుత్థాన దినము 6 ట్యూటోనిక తెగల వారు గొప్ప సంతోషముతో చలికాలం చనిపోయి క్రొత్త సంవత్సరం పుట్టినందుకు, సూర్యుడు తిరిగి వస్తున్నందుకు గౌరవ పూర్వకంగా చేసికొనే పండుగ. క్రైస్తవ సంఘము మరణంపై జీవము జయము పొందినందుకు వసంత ఋతువులో ఆచరించే పునరుత్థాన సందర్భంగా గుర్తించుటకు సుళువుగా నుండినది. ఓష్త లేక ఓష్తరా అనే వసంత ఋతు దేవత తన పేరును క్రైస్తవ పవిత్ర దినానాకి ఇచ్చింది. పురాతన కాలంలో నాటి ఐగుప్తీయులు పారసీకులు గుడ్డును నూతనత్వం పొందిన జీవితానికి మరియు సారవంతమైన జీవితానికి సూచనార్థంగా భావించేవారు. దానికి తోడు వసంత ఋతు పండుగలో గుడ్లకు రంగు వేసి తినే ఆచారము కూడా ఉండెడిది. గుడ్డును జీవానికి గుర్తుగా చూపే పురాతన ఆలోచన పునరుత్థాన జీవితమునకు ఆలోచనగా అయ్యింది. ఈస్టరు ఉదయాన్న సూర్యుడు ఉదయించి నాట్యమాడుతాడని ఒక పాతకాలపు మూఢ నమ్మకము. దీని గూర్చి తరచి చూచినట్లయితే పురాతన విగ్రహారాధికుల పండుగయిన వసంత ఋతు పండుగ రోజు సూర్యునికి గౌరవార్థంగా ప్రేక్షకులు నాట్యమాడే విషయం బయల్పడుతుంది. ప్రొటెస్టంటు సంఘములు కూడా ఈస్టరు రోజు ఉదయం సూర్యోదయ ఆరాధనలు జరుపుట ఒక ఆచారముగా కొనసాగించారు. (1959 ప్రచురణ, సంపుటి 7,859, 860 పేజీలు).


బబులోను వారు ఒక గొప్ప గుడ్డు పరలోకము నుండి యూఫ్రటీసు నదిలోన పడిందని అందులో నుండి అష్తారోతు దేవత బయటకు వచ్చిందని నమ్ముతారు. ఆ విధంగా వసంత ఋతు పండుగలో సూర్యుని ఆరాధనకు సంబంధించి గుడ్డును పంచడం మొదలయ్యింది. నాల్గవ శతాబ్దంలో క్రైస్తవులు ఈ ఆచారాన్ని కూడా గ్రహించి, క్రీస్తు సమాధిలో నుండి బయటకు రావటాన్ని కోడిపిల్ల కోడి గుడ్డు నుండి బయటకు రావడంతో సూచనార్థంగా భావించి, ఈనాటి వరకు ఈస్టరును ఈస్టరు గుడ్లతో ఆచరించడం కొనసాగిస్తున్నారు!!


'బౌన్లు' అని పిలువబడే పవిత్రమైన తీపి రొట్టెలు క్రీస్తుకు ముందు ఎన్నో శతాబ్దాల క్రితమే విగ్రహారాధికులు ఆకాశరాణికి సమర్పించేవారు (యిర్మీయా 7:18 చూడండి). ఈ అన్యాచారాలను క్రైస్తవులు పాటించడం మొదలుపెట్టినప్పుడు తీపి రొట్టెలు మంచి శుక్రవారం నాడు తయారు చేసే 'హాట్‌ క్రాస్‌ బన్నులు' అయ్యాయి!!


క్రీస్తు చనిపోవడం, తిరిగి పునరుత్థానుడవడము సువార్తకు ముఖ్యమైన సందేశం. ఈ విషయాన్ని జ్ఞాపకము చేసికొనుటకు యేసు ఉద్దేశించిన పద్ధతి ''రొట్టె విరచుట'' ద్వారా, దానిని తన శిష్యులు సంఘముగా కూడికొనునప్పుడు అందులో పాలు పంచుకొనవలెనని ఆయన ఉద్దేశించారు. ఇది ఆచరించడం సంవత్సరములో మంచి శుక్రవారము, ఈస్టరు రోజులలో ఏదో ఒక్కమారు మాత్రం కాదు మరియు గ్రుడ్డు, రొట్టెలతో అసలే కాదు!!


రొట్టె విరచుటలో క్రీస్తు యొక్క మరణం గురించి మాత్రమే కాక, ఆయనతో పాటు మనము కూడ సిలువ వేయబడుట వలన మరణించితిమని సాక్ష్యమిస్తున్నాము. ఈ మంచి శుక్రవారం నాటి మతపరమైన ఉద్రేకాలు, ఈస్టరు నాటి మానసిక భావాలు యేసుని వెంబడించాల్సిన ముఖ్య అవసరత నుండి మానవులను ప్రయోజనం లేని ఆచారకాండవైపు త్రిప్పుతున్నాయి.


దేవుని వాక్యమా? లేక మానవ సాంప్రదాయములా?


క్రిస్‌మస్‌ ఈస్టరు ఆచరించడం వెనుక దేవుని వాక్యంలో ఏ పునాదిలేకపోయినా మానవ సంప్రదాయాలను ఆచరించడం అనే అతి ప్రమాదకరమైన నియమము దాగియుంది. ఈ సంప్రదాయాల శక్తి ఎటువంటిదనగా, అనేక విశ్వాసులు అనేక విషయాల్లో వాక్యాన్ని అనుసరించి నడుస్తూనే క్రిస్‌మస్‌ మరియు ఈస్టరులను జరుపుకోవడం మానలేరు.


ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం క్రిస్‌మస్‌ ఈస్టరు పండుగలు క్రైస్తవేతర పండుగలని లౌకిక రచయితలు (ఎన్‌ సైక్లోపీడియా బ్రిటానికా వంటివి వ్రాసిన వారు) అంగీకరించినా అనేకమంది విశ్వాసులు ఆ విషయాన్ని అంగీకరించరు. నీవు ఒక గాడిదను సింహమని పిలవవచ్చును కాని అది గాడిద మాత్రమే. కనుక పేర్లు మార్చినంత మాత్రమున ఇవి క్రైస్తవ పండుగలుగా తయారవ్వవు! క్రిస్‌మస్‌కు మరియు ఈస్టరుకు మరియు వినాయక చవితి, లేక దసరాకు ఏమి తేడా లేదు.


ఇప్పటి వరకు చూచిన దానిని బట్టి మనకు తేటగా తెలిసినదేమిటంటే క్రైస్తవులు క్రిస్‌మస్‌గా ఆచరించేది ఇంకొక 'యేసు' పుట్టిన రోజు - అది బబులోను యొక్క నిమ్రోదుకు సంబంధించినది. అలాగే ఈస్టరు సమయంలో ఆచరించే పునరుత్థానం కూడా నిజానికి ఇంకొక 'యేసు'దే. అది సూర్యదేవుడు ఉత్తరార్ధ గోళానికి ఎండాకాలాన్ని తెస్తున్న పునరుత్థానాన్ని ఆచరిస్తున్నారు. నిమ్రోదు మరియు సూర్యదేవుని వెనుక నిలువబడి ఆరాధన అందుకొంటున్నది నిజానికి సాతాను. ఇశ్రాయేలీయులు బంగారు దూడను 'యెహోవా' అని పిలచారు, కాని సాతాను ఆ ఆరాధనను స్వీకరించాడు (నిర్గమకాండము 32:4, 5). క్రిస్‌మస్‌ మరియు ఈస్టరును ఆచరించేవారు ఆ విషయాన్ని జ్ఞాపకముంచుకొని జాగ్రత్తగా ఉండవలెను!


మనం మొదట్లో చెప్పుకొన్న విధంగా యేసు పరిసయ్యులతో ఇదే విషయమై చివరివరకు పోరాడారు. అది మనుష్యుల కట్టుబాట్లు మరియు దేవుని వాక్యం మధ్య పోరాటము. ఆయన పాపానికి వ్యతిరేకంగా బోధించిన దానికంటే ''తండ్రులు'' గా పిలువబడిన వారి శూన్యమైన కట్టుబాట్లను బట్టబయలు చేయడం వలననే ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొనెను. మనం ఆయనవలె నమ్మకంగా ఉన్నచో ఆయన అనుభవాన్నే మనమూ పొందగలము.


ఈనాటి సంఘానికి పిలుపు ఏమంటే దేవుని వాక్యంలో ఏ పునాది లేనటువంటి సాతాను అభివృద్ది చేసిన శూన్యమైన బబులోను ఆచరణలను క్రైస్తవ్యంలో బహిర్గతం చేయుట మరియు దేవుని వాక్యములో ఆధారము లేని వాటిని (ఎంత అమాయకంగా కనబడినా) నిరాకరించుట.


రోమా 14:5, 6 వ్రాయబడినట్లు కొందరు దేవుని కొరకు ఒక దినాన్ని లక్ష్యపెట్టుచున్నామని చెబుతారు. ఇది స్పష్టముగా పాత నిబందనలో చెప్పబడిన సబ్బాతు గూర్చినది. ఆ దినాల్లో క్రైస్తవులుగా మారిన కొందరు యూదులు సబ్బాతును విడిచి పెట్టుటను గూర్చిన సరైన వెలుగు లేకపోవటను బట్టి యిది చెప్పబడినది. పౌలు ఇటువంటి బలహీన యూద సహోదరులను సహించవలెనని క్రొత్త నిబంధన వెలుగు కలిగిన వారిని హెచ్చరించాడు. కాని యిది నేటి క్రైస్తవులు వినాయక చవితి లేక క్రిస్‌మస్‌, దీపావళి లేక ఈస్టరు ఆచరించుట గూర్చినది కాదు!


అయితే భక్తులైన కొందరు క్రిస్‌మస్‌ ఈస్టరు ఏలాగ ఆచరించుచున్నారని యితరులు అడుగవచ్చు. భక్తులైనా సరే వారు దేవుని వాక్యాన్ని ఎక్కడ తప్పుచున్నారో అక్కడ దేవుని వాక్యమే మనకు మార్గదరశకం గాని భక్తులు కారు. ''ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు'' (రోమా 3:4). వారి మాటలు దేవుని వాక్యంలో సరిచూడుడి అని ప్రభువు చెప్పెను. ఒకవేళ వారి వర్తమానములు (బోధలు) దేవుని సందేశానికి వేరుగా ఉంటే, అది వారికి వెలుగు లేనందు వలననే (యెషయా 8:20 లివింగు బైబిలు) బెరయలో నున్నవారు పౌలు చెప్పిన బోధలను కూడా వాక్యంతో సరిపోల్చుకునేవారు. ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు (అపొ.కా. 17:11). మనమంతా దీనిని అనుసరించుటకు యిదొక చక్కని ఉదాహరణ.


దావీదు దేవుని హృదయానుసారుడు అయినను అతడు నలుబది సంవత్సరముల వరకు ఇశ్రాయేలీయులు మోషే తయారుచేయించిన ఇత్తడి సర్పాన్ని పూజించుటకు అనుమతించాడు. ఆ విధముగా చేయుట దేవునికి హేయకరమైనదని అతడు గ్రహించలేకపోయాడు. అంతటి స్పష్టమైన విగ్రహారాధన గూర్చి కూడ అతనికి వెలుగు లేకపోయెను. అయితే ఎంతో తక్కువ రాజైన హిజ్కియా రాజుకు ఆ విగ్రహారాధన అలవాటును బట్టబయలు చేసి దాని నాశనము చేయుటకు వెలుగు యివ్వబడెను (2 రాజులు 18:4). మనం దావీదు మరియు ఇతర భక్తుల పరిశుద్ధ జీవితాన్ని అనుసరించవచ్చు గాని వారికి వెలుగులోపించిన మానవ కట్టుబాట్ల విషయములో కాదు. మన భద్రత ఎప్పుడు దేవుని వాక్యబోధకు ఏదీ కలుపకుండా, తీసివేయకుండా అనుసరించుటలో యుంది.


నిజమైన ఆత్మానుసారత అనేది అన్ని విషయాలలో యేసుని అనుసరించుటయే. ఇది ప్రధానముగా సిలువను ఎత్తుకోవడం, అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లోబడంతో కూడి యున్నది. ఇదియుగాక, క్రొత్త నిబంధనలో కన్పించని మానవ కట్టుబాట్లన్నింటిని విడిచిపెట్టడం కూడా ఉన్నది. దేవుడు ప్రతి స్థలములోను స్వచ్ఛమైన సాక్ష్యాన్ని కోరుచున్నాడు. పాపం నుండి మాత్రమే గాక బబులోను ఆచారాలనుండి కూడా విడుదల పొందిన సంఘాన్ని ఆయన కోరుచున్నాడు.


అధ్యాయము 25
విఫలమైన వారియెడల దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక

చాలా మంది సహోదర, సహోదరీలు వారి గత జీవితములో ఎప్పుడో ఒకప్పుడు పాపము చేయుట వలన మరియు వారి యెడల దేవుని ఉద్దేశ్యాన్ని తప్పుట వలన ఇప్పుడు వారి జీవితాల్లో దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చలేమని అనుకొందురు.


మన యొక్క స్వంత జ్ఞానము మీద లేక మన తర్క జ్ఞానము మీద ఆధారపడకుండా, ఈ విషయములో లేఖనములు ఏమి చెప్పుచున్నవో చూచెదము.


బైబిలు ఎలా మొదలవుతుందో గమనించండి.


ఆదియుందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (ఆదికాండము 1:1). దేవుడు వాటిని సృష్టించినప్పుడు భూమ్యాకాశములు తప్పనిసరిగా పరిపూర్ణముగా ఉండియుండెడివి, ఎందుకనగా ఆయన చేతి నుండి ఎప్పుడును అసంపూర్ణమైనదియు లేక కొఱతగా నున్నదియు రాదు.


అయితే ఆయన సృష్టించిన దేవదూతలలో కొందరు పడిపోయిరి. ఆ విషయం యెషయా 14:11-15 మరియు యెహెజ్కేలు 28:13-18లో చెప్పబడినది. అలాగు జరిగినప్పుడు భూమి ఆదికాండము 1:2లో వ్రాయబడినట్లు ''నిరాకారముగాను, శూన్యముగాను మరియు చీకటిగాను'' మారెను.


ఆదికాండము 1వ అధ్యాయము మిగిలిన భాగములో అటువంటి నిరాకారమైన, శూన్యమైన, చీకటి పదార్థము నుండి ఆయనే 'చాలామంచిది' అని చెప్పిన (ఆదికాండము 1:31) సుందరమైనది తయారగునట్లు ఆయనే చేసెను. ఆదికాండము 1:2, 3లో భూమిపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను మరియు దేవుడు ఆయన మాట పలికెను అని చదివెదము. అది మార్పును తీసుకు వచ్చినది.


దానినుండి ఈ రోజున మనకున్న సందేశమేమిటి?


అది ఏమిటనగా మనమెంత విఫలమైనా లేక మన మెంతగా పరిస్థితులను గజిబిజి చేసినా, దేవుడు మన జీవితాల నుండి ఒక మహిమగల కార్యాన్ని చేయగలడు.


సృష్టించినప్పుడు వాటి గూర్చి దేవునికొక నిర్ధిష్టమైన ప్రణాళిక యుండెను .కాని లూసిఫరు తప్పిపోవుటను బట్టి ఆ ప్రణాళికను పక్కను పెట్టవలసి వచ్చెను. అయితే దేవుడు భూమ్యాకాశములను తిరిగి తయారు చేసి వాటినుండి ఎంతో మంచిగా నుండిన దానిని తయారుచేసెను.


తరువాత ఏమైనదో ఇప్పుడు చూచెదము.


దేవుడు ఆదాము, హవ్వలను చేసి మరల అంతా మొదలు పెట్టెను. వారి విషయంలో కూడా దేవునికి ఒక సంపూర్ణమైన ప్రణాళిక ఉండెను. అందులో వారు మంచి, చెడుల వివేచననిచ్చు ఫలమును తినుట కలిగి లేదనునది స్పష్టము. కాని వారు నిషేధింపబడిన చెట్టు యొక్క ఫలమును తినుట ద్వారా దేవుని యొక్క అసలైన ఉద్దేశ్యాన్ని పాడు చేసారు. ఆ ప్రణాళిక ఏదైనా కావచ్చును.


వారు దేవునియొక్క పరిపూర్ణమైన ప్రణాళికను నెరవేర్చరని మన తర్క జ్ఞానము చెప్పవచ్చును. అయితే ఏదేను తోటలో దేవుడు వారిని కలుసుకొనుటకు వచ్చినప్పుడు వారి జీవితమంతా దేవునియొక్క ద్వితీయ శ్రేణి ప్రణాళిక ప్రకారం జీవించాలని వారితో అనలేదు. ఆయన వారితో ఆదికాండము 3:15లో స్త్రీ సంతానము సర్పము యొక్క తలను నలగ గొట్టును అని ఆయన వాగ్దానము చేసెను. అది లోకపాపము కొరకు క్రీస్తు చనిపోవుట మరియు కల్వరి సిలువపై సాతానును జయించుట అనే వాగ్దానమై యున్నది.


ఇప్పుడు ఈ వాస్తవాన్ని నీవు ఆలోచనతో గ్రహించి తర్కించుటకు ప్రయత్నించు.


క్రీస్తు యొక్క మరణము శాశ్వత కాలపు ముందునుండి దేవుని సంపూర్ణ ప్రణాళికలో భాగమని మనకు తెలియును. ''జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల'' (పక్రటన 13:8). అయితే ఆదాము, హవ్వలు పాపము చేయుట వలన దేవుని ఉద్దేశ్యమునుండి తప్పిపోయినందున మాత్రమే క్రీస్తు చనిపోయెనని మనకు తెలియును. కనుక తర్కబద్దంగా, లోకపాపములకై చనిపోవుటకు క్రీస్తును ఈలోకమునకు పంపించుట అనే దేవుని పరిపూర్ణ ప్రణాళిక ఆదాము తప్పిపోయినప్పటికీ నెరవేరలేదు. కాని ఆదాము తప్పిపోవుట ద్వారా నెరవేరెనని అని మనము చెప్పవచ్చును. ఆదాము యొక్క పాపమును బట్టి తప్ప కల్వరి సిలువపై చూపబడిన దేవుని ప్రేమను మనము తెలిసికొని ఉండేవారముకాము.


ఇది మన తర్కాన్ని భంగపరుస్తుంది. అందుచేతనే ''మీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక'' (సామెతలు 3:5)అని లేఖనములలో చెప్పబడి యున్నది.


దేవుడు గణిత శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం పనిచేసి యుండినట్లయితే, క్రీస్తు ఈ భూమిపైకి వచ్చుట దేవునియొక్క ద్వితీయ శ్రేణి ప్రణాళికగా చెప్పుకొనవచ్చును. కాని అలాగు చెప్పుట దైవ దూషణయి ఉన్నది. అది మానవుని కొరకు దేవుని పరిపూర్ణ ప్రణాళికలో ఒక భాగమై యున్నది. దేవుడు పొరపాట్లు చేయడు. దేవుడు మహోన్నతుడు మాత్రమే కాక సర్వాధికారి, ఆయనకు అంతయు ఆదినుండే తెలియును మరియు ఆయన మన కొరకు నిశ్శబ్దంగా ప్రేమతో ప్రణాళికలు వేయును కనుక, ఆయన మన యెడల చేయు కార్యములను వివరించుటలో మానవ జ్ఞానము విఫలమగుచూ ఉంటుంది.


దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. వాటి మధ్యనున్న తేడా ఆకాశమునకు భూమికిని ఉన్నంతటిది (యెషయా 55:8, 9). కనుక దేవుని మార్గాలను అర్థం చేసికొనుటలో మన తెలివైన ఆలోచనలను మరియు తర్కాన్ని ప్రక్కన పెట్టుట మంచిది.


బైబిలు మొదటి పేజీ నుండి దేవుడు మనకు ఇచ్చుటకు ప్రయత్నించే సందేశమేమిటి? ఆయన ఒక తప్పిపోయిన మానవుని తీసుకొని అతడి నుండి మహిమకరమైనది ఏదో చేసి అతడి జీవితంలో దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చునట్లు చేయగలుగుట అనునదియే.


అది మానవునికి బైబిలులో దేవుని యొక్క సందేశము, దానిని మనమెన్నడూ మరచిపోకూడదు.


పదేపదే విఫలమైన మానవుని తీసుకొని అతనియెడల దేవుని యొక్క ద్వితీయ శ్రేణి ప్రణాళిక కాక, ప్రథమ శ్రేణి ప్రణాళికను నెరవేరునట్లు దేవుడు చేయగలడు.


ఓటమి కూడా కొన్ని మరచిపోలేని పాఠములు నేర్పుటకొరకు దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికలో భాగముగా యుండియుండవచ్చును. దేవుని గూర్చి మనకు చాలా కొద్దిగా తెలియుటచేత, మానవ తర్క జ్ఞానముతో దీనిని అర్థము చేసికొనుట అసాధ్యము.


విరిగి నలిగిన స్త్రీ, పురుషులను మాత్రమే దేవుడు ఉపయోగించుకొనగలడు. మనము పదేపదే పొందే ఓటమి మనలను విరుగగొట్టుటకు ఆయనకు ఒక మార్గము.


అపొస్తలుడైన పేతురు యొక్క నాయకత్వపు శిక్షణలో ఒక భాగము ఓటమి అయి యుండెను. పేతురు యొక్క ఓటమిని ప్రభువు అతడిని విరుగగొట్టుటకు ఉపయోగించు కొనెను.


మనతో దేవునికున్న పెద్ద సమస్యలలో ఒకటి ఆయన మనను దీవించునప్పుడు ఆ దీవెన మనలను గర్వముతో ఉప్పొంగ చేయకుండునట్లు దీవించుట. కోపముపై జయము పొంది దాని గూర్చి గర్వించుట, మనము ఉండిన గోతి కంటె ఎక్కువ లోతైన గోతిలోనికి పడిపోవుట వంటిది! దేవుడు మనలను విజయములో కూడా దీనులనుగా ఉంచవలసి యున్నది.


పాపముపై నిజమైన విజయము ఎప్పుడును లోతైన దీనత్వముతో కలసి యుండును. ఇక్కడనే అనేక ఓటములు మనపై మనకున్న ఆత్మవిశ్వాసాన్ని నాశనము చేయుటలో ముఖ్యమైన పాత్రను పోషించును ఆ విధముగా మనము పాపముపై పొందిన విజయము దేవుని యొక్క కృపతో తప్ప సాధ్యము కాదని మనము ఒప్పింపబడుదము. అప్పుడు మనము విజయము పొందినప్పుడు దాని గూర్చి ఎప్పుడును అతిశయించము.


ఇంకను మనమే పదేపదే ఓటమి చెందినప్పుడు ఓటమి చెందిన మరొకరిని కించపర్చము. మనము లెక్కలేనన్ని మార్లు ఓడిపోవుట చేత మన శరీరములో నుండిన బలహీనతలను తెలిసికొనుట ద్వారా ఓడిపోయిన వారి యెడల సానుభూతి చూపగలము. బలహీనతల చేత ఆవరింపబడియున్నందున మనము ఏమియు తెలియని వారి యెడలను త్రోవ తప్పిన వారి యెడలను తాలిమి చూపగలము (హెబీ 5:2).


ఇటువంటి సందేశము విని, తర్క జ్ఞానపు మనసు కలిగిన మనుష్యుడు ''మంచి జరుగును కనుక మనమింక ఎక్కువ పాపము చేయుదము'' అని చెప్పవచ్చును!


రోమా 3:7, 8లో అటువంటి మనుష్యునికి సమాధానముగా ఈ మాటలున్నవి. ''దేవునికి మహిమ కల్గునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రభలిన యెడల నేనికను పాపినైనట్లు తీర్పు పొందనేల? మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్ము దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే''.


లేదు, మంచి కలుగునట్లుగా మనము పాపము చేయవలెనని మేము బోధించుట లేదు. లేక దేవుని యొక్క కృపను అవకాశముగా తీసుకొనవచ్చుననియు మరియు దేవునికి అవిధేయత చూపవచ్చుననియు, మరియు అలాగు చేసినను మనము విత్తిన దానిని కోయకుండా తప్పించుకొనవచ్చునని మేము చెప్పుట లేదు. అలా ఎప్పుడును కాదు.


కాని మేము చెప్పునది పడిపోయిన మానవుని యెడల దేవుని కృప గూర్చి మానవ తర్కజ్ఞానము అర్థము చేసికొన లేదనునదియే. దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు. చివరకు మనము దౌర్భాగ్యకరంగా మరల, మరల తప్పిపోయిన తరువాత కూడా ఆయన పరిపూర్ణ చిత్తములోనికి మనలను తెచ్చుట కూడా ఆయనకు సాధ్యమైయున్నది. కేవలము మన అపనమ్మకమే ఆయనను ఆటంక పరచగలదు.


''కాని నేను అనేక పర్యాయములు పరిస్థితులను గజిబిజి చేసుకొంటిని, ఇప్పుడు ఆయన పరిపూర్ణ చిత్తములోనికి నన్ను తెచ్చుట అసాధ్యము'', అని నీవనవచ్చును. అప్పుడు అది దేవునికి అసాధ్యమే. ఎందుకనగా ఆయన నీకు చేయగల దాని గూర్చి నీవు నమ్మలేక పోవుచున్నావు. కాని, దేవుడు నీకు చేయుదాని గూర్చి నీవు కేవలము నమ్మిక మాత్రముంచినట్లయితే దేవునికి ఏదియును అసాధ్యము కాదు అని యేసు చెప్పెను.


''మీ నమ్మిక చొప్పున మీకు జరుగును'' (మత్తయి 9:29) అనునది అన్ని విషయములలో దేవుని నియమమైయున్నది. మనకున్న విశ్వాసమునకు తగినట్లుగా మనము పొందుదుము. దేనినైనా మన ఎడల జరిగించుట దేవునికి అసాధ్యమని మనము నమ్మినట్లయితే అది మన జీవితాల్లో ఎప్పటికి నెరవేరదు.


అయితే నీకంటె జీవితాన్ని ఇంకా ఎక్కువ గజిబిజి చేసికొన్న వేరొక విశ్వాసి జీవితములో దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక నెరవేరుటను క్రీస్తు న్యాయ సింహాసనము ఎదుట నీవు చూడగలవు - అది విరిగి ముక్కలైన తన జీవితాన్ని దేవుడు పైకి తీసి వాటి నుండి ఎంతో మంచి దానిని చేయగలడని అతడు నమ్ముటను బట్టియే జరుగును.


ఆ దినమున నీ జీవితములో దేవుని ప్రణాళికను నిష్ఫలపరిచినది నీ ఓటములు కాక (అవి ఎన్నైనా కావచ్చును) నీ అపనమ్మకమే! అని ఆదినమున నీవు తెలుసుకొన్నప్పుడు ఎంత విచారించెదవు.


ఓడిపోయిన వారికి కూడా శ్రేష్టమైనవి దేవుడు ఇవ్వగలడు అని ఎన్నో సంవత్సరాలు వ్యర్థంచేసుకున్న తప్పిపోయిన కుమారుని కథ మనకు తెలియజేస్తుంది. తన ప్రతిష్ఠను ఎంతో దిగజార్చిన తన కుమారుని కోసం ''త్వరగా ప్రశస్థ వస్త్రమును తీసికొని రమ్ము'' అని తండ్రి చెప్తున్నాడు. విమోచన మరియు నూతన ప్రారంభము కేవలం ఒక్కసారి కాదు, మరలా మరలా ఎందుకంటే దేవుడు ఎవ్వరినీ విడువడు. ఇదే సువార్త యొక్క సందేశము.


ద్రాక్షతోట యజమాని వెళ్లి పనివారిని పనికి కుదుర్చుకొనిన ఉపమానము కూడా ఇదే విషయాన్ని బోధించును (మత్తయి 20:1-16). ఆఖరి గంటలో పనికి పెట్టుకొనబడిన వారు మొదట ప్రతిఫలము పొందిరి. వేరొక మాటలో చెప్పవలెననిన ఎవరైతే వారి జీవితాలలో 90 శాతం (12 గంటలలో 11 గంటలు) నిత్యత్వపు విలువలకు సంబంధించిన వాటిని ఏమియు చేయరో వారు కూడా మిగిలిన 10 శాతం వారి జీవితాలలో దేవుని కొరకు కొంత మహిమ గల పనిని చేయగలరు. ఇది ఓడిపోయిన మనకందరకు ఒక గొప్ప ప్రోత్సాహకరమైన విషయం.


''అపవాది క్రియలను లయపర్చుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యెను'' (1 యోహాను 3:8).


దాని అర్థము మన జీవితాలలో నున్న చిక్కుముడులను విప్పుటకే యేసు వచ్చెను. మనమందరము మన బాల్య జీవితాన్ని ఒక చక్కని దారపు ఉండతో మొదలు పెట్టితిమి. కాని ఇప్పుడు ఆ దారములో పదివేల ముడులు పడిపోయినవి మరియు ఆ ముడులను విప్పగలమన్న నిరీక్షణ మనకు లేకుండా పోయినది. మన జీవితాల వైపు చూచుకొన్న కొలది మనకు నిరుత్సాహము మరియు నిస్పృహ కలుగును. అయితే యేసు ఆ ముడులలో ప్రతి ఒక్క దానిని విప్పుటకు వచ్చెననునదియే సువార్తలో ఉండిన మంచివార్త.


''అది అసాధ్యము'' అని నీవనవచ్చును. మంచిదే, అప్పుడు నీ విశ్వాసమునకు తగినట్లు నీకు జరుగును. నీ విషయములో అది అసాధ్యముగా ఉండును.


నీ కంటే ఘోరమైన జీవితము కలిగిన వేరొకరు ''అవును, దేవుడు నాలో అది చేయునని నేను నమ్ముదును'' అని చెప్పుచుండుట నేను వినగలను. అతనికి కూడా అతడి విశ్వాసమునకు తగినట్లుగా జరుగును అతడి జీవితములో దేవుని పరిపర్ణ ప్రణాళిక నెరవేరును.


యిర్మీయా గంథము 18:1-6లో దేవుడు యిర్మీయాతో ఒక ప్రయోగాత్మకమైన ఉదాహరణతో మాట్లాడెను. అక్కడ యిర్మీయాను ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని చెప్పెను. అక్కడ అతడు ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేయుటను చూచెను. కాని ఆపాత్ర అతడి చేతిలో పాడైపోయెను. అప్పుడు ఆ కుమ్మరి ఏమి చేసెను? ఆ కుమ్మరి వానికి ఇష్టమైన విధముగా అతడు వేరొక పాత్రగా దానిని చేసెను.


అప్పుడు దానికి సంబంధించిన అన్వయింపు: ఓ ......., ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అనేది ప్రభువు యొక్క ప్రశ్న (6వ) (ఆ చుక్కలున్న ఖాళీలో నీ పేరు నింపుకో మరియు అది నీకు దేవుని యొక్క ప్రశ్న).


నీవు ఓటముల గురించి నీ జీవితములో దైవికమైన విచారము నీకుండినట్లయితే, అప్పుడు నీ పాపములు కెంపువలె ఎఱ్ఱనివైనను (పాత నిబంధనలో వాగ్దానము చేసినట్లు - యెషయా 1:18) గొఱ్ఱె బొచ్చు వలె తెల్లగా అగుట మాత్రము కాక, దేవుడు క్రొత్త నిబంధనలో ''మీ పాపముల నెన్నటికి జ్ఞాపకము చేసికొనను'' (హెబీ 8:12) అని వాగ్దానము చేయుచున్నాడు.


నీ యొక్క పొరపాట్లు లేక ఓటములు ఏమైనా, నీవు దేవునితో ఒక క్రొత్త ప్రారంభాన్ని మొదలు పెట్టగలవు. మరియు నీవొక వేళ వెయ్యి క్రొత్త ప్రారంభాలను గతంలో మొదలు పెట్టి తిరిగి ఓడిపోయిన స్థితికి వచ్చినా, నీవు తిరిగి వెయ్యినొక్క క్రొత్త ప్రారంభాన్ని ఈ దినము మొదలు పెట్టవచ్చును. దేవుడు ఇంకను నీ జీవితమును ఒక మహిమ కలదానిని చేయును.


జీవితముండగా నిరీక్షణ ఉన్నది.


కనుక దేవుని నమ్ముటలో ఎప్పుడున తప్పిపోవద్దు. ఆయన ఎన్నో గొప్ప కార్యములను ఆయన పిల్లలైన ఎందరికో చేయలేకపోవుట, గతములో వారు విఫలమైనందుకు కాదు గాని ఇప్పుడు వారు ఆయనను నమ్మకపోవుట చేత.


ఇప్పటి వరకు ఏ విషయములైతే అసాధ్యమని అనుకొంటిమో వాటి గూర్చి రాబోవు దినములలో సాధ్యమని నమ్మి మనము, ''విశ్వాసము వలన బలము పొంది దేవునికి మహిమను చెల్లించుదము'' (రోమా 4:20).


ప్రజలందరు, యౌవనులు మరియు పెద్దవయసు గలవారు, వారు ఎంతగా గతములో విఫలమైనా కేవలము వారి ఓటములను వారు ఒప్పుకొనినట్లయితే, వారిని వారు తగ్గించుకొని నట్లయితే మరియు దేవుని నమ్మినట్లయితే వారికి నిరీక్షణ కలదు.


ఆ విధముగా మన మందరము మనము ఓటముల నుండి నేర్చుకొని మన జీవితకాలంలో దేవుని సంపూర్ణ ప్రణాళికను నెరవేర్చుటకు సాగిపోదుము.


మరియు రాబోవు యుగములలో పూర్తిగా విఫలమైన వారి జీవితాలతో ఆయన ఏమి చేయగలిగెనో అని ఇతరులకు మాదిరిలుగా మనలను చూపును.


''క్రీస్తు యేసునందు మనకు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి'' (ఎఫెసీ 2:7) మనలో ఆయన ఏమి చేసెనో ఆ దినమున ఆయన చూపును.


ఈ పుస్తకము యొక్క సందేశమును వినుటకు చెవులు గలవారు వినును గాక ఆమేన్‌.