"నేను క్రిస్టియన్‌గా మారుతున్నానా", "ప్రజలు చాలా తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడుకునే నా ఇంటికి సమీపంలో ఉన్న చర్చిలో చేరడం లేదా?" అని కొత్తగా మారిన వ్యక్తిని అడిగాడు. అటువంటి ప్రశ్నకు మనం ఏ సమాధానం చెప్పాలి? ప్రపంచానికి దైవిక ప్రేమ యొక్క అందాన్ని వ్యక్తపరచడానికి పిలుపునిచ్చింది, అనేక చర్చిలు బదులుగా అంతర్గత రాజకీయాలు మరియు శత్రుత్వం యొక్క హాట్-బెడ్‌లు - క్రీస్తు వాటిని ఉద్దేశించిన వ్యంగ్య చిత్రాలు. (ప్రేమ సిద్ధాంతం తప్ప - అన్ని సిద్ధాంతాలను సరిగ్గా కలిగి ఉన్న అనేక ఎవాంజెలికల్ చర్చిలు చేర్చబడ్డాయి!) సువార్త ప్రభావవంతమైన ప్రచారానికి క్రైస్తవ సంఘం యొక్క స్పష్టమైన సాక్ష్యం ఒక ప్రాథమిక అవసరం. సువార్తికులు బండిని గుర్రం ముందు ఉంచే ప్రమాదం ఉంది, సువార్త ప్రచారం ఒత్తిడికి గురైనప్పుడు మరియు సహవాసాన్ని విస్మరించినప్పుడు. రక్తహీనత గల చర్చి దేవుని ఉద్దేశాలను ఎన్నటికీ నెరవేర్చదు. మన ఫెలోషిప్‌లో చేరమని ఇతరులను ఆహ్వానించడానికి ముందుగా మనం ముందుగా మన స్వంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి. నేడు క్రైస్తవ సంఘంలో వ్యక్తుల మధ్య సంబంధాల యొక్క దుర్భర స్థితిని సరిదిద్దడానికి మనం ఏమి చేయవచ్చు? మనం వినడానికి శ్రద్ధ వహిస్తే, దేవుని వాక్యానికి సమాధానం ఉంది…
మానవుడు అనేక విషయములలో అభివృద్ధి చెందుచుండినా, ప్రపంచమంతా మానవుల మధ్య సంబంధములలో సమస్యలు కొనసాగుచున్నవి. వ్యాపార సంస్థలు మరియు ఇతర కేంద్రములు వారి పనివారి మధ్య ఐక్యతను పెంపొందించుటకు ఎంతో సొమ్మును ఖర్చు చేయుచున్నవి.
సరే, ఎవరి గురించి వారు చూచుకొనే, క్రీస్తులోనికి (క్రైస్తవులుగా) మార్పుచెందని జనులలో ఒకరితో ఒకరు కలసి కొనసాగుట కష్టముగా నుండుననునది అర్థము చేసికొనవచ్చును, కాని తిరిగి జన్మించిన అనుభవము కలిగియుండి క్రీస్తులో నూతన సృష్టిగా అయిన వారి మధ్య అటువంటి సమస్యలుండవని అనుకొనవచ్చును. ఎందుకనగా, ఒకని జీవితమునకు మరియు పరిచర్యకు కేంద్రముగా దేవుడు నుండినప్పుడు ఇతరులలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు స్థానమెక్కడుంటుంది?
అయినప్పటికి, విచారించ వలసిన విషయమేమంటే, ప్రపంచమంతా క్రైస్తవులు ఒకరితో ఒకరు పోట్లాటలు మరియు కలహములు కలిగియుందురు. చాలామంది వారి తోటి క్రైస్తవులతో మాటలు కూడా లేకుండా యుందురు; మరి కొంతమంది ఇతర క్రైస్తవులను చూచుటకు కూడా యిష్టపడరు. విశ్వాసులమని చెప్పుకొను వారి ప్రవర్తన వలన లోకములో దేవుని యొక్క నామము అవమానపర్చబడుట కొనసాగుచున్నది.
తన శిష్యులలో ఒకరిపై ఒకరి కుండినటువంటి మిక్కుటమైన ప్రేమ వలన తన శిష్యులు గుర్తింపబడుదురని యేసు ప్రభువు చెప్పారు. ఇది మామూలుగా చెప్పుకోవాలంటే క్రీస్తు శకములో మొదటి రెండు శతాబ్దాలలోను నెరవేరినది. అప్పటి కాలములో లోకము క్రైస్తవుల వైపు ఆశ్చర్యముగా చూచి, ''ఈ క్రైస్తవులు ఒకరిని ఒకరు ఎలా ప్రేమించు కొనుచున్నారో చూడండి!'' అని చెప్పుకొనేవారు. ఇప్పుడు కథ వేరుగా ఉన్నది, ''ఈ క్రైస్తవులు ఒకరినొకరు ఎట్లు ద్వేషించుకొనుచున్నారో చూడండి'' అని లోకము చెప్పుకొనుచున్నది.
బాంధవ్యాలు నిజముగా ఎంతో ప్రాముఖ్యమైనవి. వరములు, తలాంతులు, పద్ధతులు, ఉపాయములు, కార్యక్రమములు మరియు ఆర్థిక వనరులు అన్నీ కూడా మనుష్యులు మరియు వారిమధ్య ఒకరితో ఒకరికుండిన సంబంధముల తర్వాత వచ్చేవే. సంఘములో సభ్యుల మధ్య నిజమైన క్రైస్తవ బాంధవ్యము ఉన్నప్పుడే సంఘము తనకున్న దేవుని పనిని నెరవేర్చగలదు. అదే విధముగా, ఒక విశ్వాసి తనతోటి క్రైస్తవులతో ప్రేమ నియమమును బట్టి జీవించుట నేర్చుకొనినప్పుడే అతడు ఇతరులకు జీవము నిచ్చు పరిచారకుడుగా నుండగలడు.
రెండు పరిమాణముల సహవాసము
ఇతర విశ్వాసులతో సహవాసము లేకుండా ఏ క్రైస్తవుడు దేవునితో సహవాసము కలిగియుండడని బైబిలు తేటగా పదేపదే చెప్పుచున్నది. నీవు తోటి విశ్వాసితో ప్రేమతో నడవకపోయినట్లయితే దేవునితో నడువలేవు.
యేసు ప్రభువు చనిపోయిన సిలువకు రెండు దుంగలున్నవి-ఒకటి నిలువుగా ఉన్నది మరియొకటి అడ్డంగా ఉన్నది. దేవునికి మానవుడికి మధ్య (నిలువుగా) మాత్రమే కాక మనుష్యునికి మనుష్యునికి మధ్య (అడ్డంగా) సమాధానము తెచ్చుటకు యేసు ప్రభువు వచ్చెను. నిలువుగా మరియు అడ్డంగా నున్న సంబంధములు కలిసి వెళ్లవలసి యున్నది. ఒక దానిని నిర్లక్ష్యము చేసినయెడల రెండవది కూడా ఉండదు.
ప్రేమ యొక్క అపొస్తలుడైన యోహానుకు, ఈ విషయములో మనకు చెప్పుటకు చాలా బలమైన మాటలున్నవి. క్రైస్తత్వములోనికి నిజమైన మార్పునకు ఒక సాక్ష్యము ఒకడు తన తోటి క్రైస్తవులను ప్రేమించుటతో ప్రారంభమగుటయని ఆయన చెప్పెను. ఒకనికి ఇటువంటి ప్రేమ లేకపోయినట్లయితే అతడి మార్పు బూటకమైనది మరియు అతడు నిత్యమరణమునకు నడుచుచున్నాడు (1యోహాను 3:14). సిద్ధాంతపరమైన ఖచ్చితత్వము ఒక్కటే ఒకనికి దేవునితో నున్న సంబంధమును రూఢిపరచుటకు అపొస్తలులు పెట్టిన పరీక్ష కాదు.
అపొస్తలుడైన యోహాను అదే పత్రికలో తరువాత, ఒక మనుష్యుడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినట్లయితే అతడు ఒక అబద్దికుడని చెప్పే దానిని గమనించండి! అటువంటి మనుష్యుని యొక్క సరియైన పేరు ''విశ్వాసి'' కాదు, కాని ''అబద్ధికుడు''! ఇక్కడ యోహాను యొక్క తర్కము అడ్డుచెప్పలేనిదిగా యున్నది. ఆయన చెప్పుచున్నది, దేవుడు కనబడడు అయితే ఒక సహోదరుడు కనబడును అనునది. నీవు కనబడుదానిని ప్రేమించ లేకపోయినట్లయితే, కనబడని దానిని ప్రేమించుట అసాధ్యము (1యోహాను 4:20).
ఇప్పుడు దీనిని అనేక మంది ''విశ్వాసులు'' అనుభవముతో పోల్చిచూడండి. దేవుని యెడల ప్రేమను సాధారణముగా క్రైస్తవ పనిలో ఖాళీలేకుండా యుండుటతోనో లేక దేవుని సన్నిధిలో ఉద్రేకపూరితమైన అనుభూతులు అనుభవించుటతోనో లెక్కవేయుదురు. ఇవి చాలా మోసపూరితమైనవి. ఇతర క్రైస్తవులతో సహవాసములేని విశ్వాసులు ''అద్భుతమైన ప్రార్థనా సమయములు'' గూర్చి మరియు ''పరిచర్యలో అద్భుతమైన ఫలితములు'' గూర్చి సాక్ష్యములు నిచ్చుటను నేను చూచాను.
దేవుని యొక్క కుటుంబములో కక్ష యుండిన ఇతర సభ్యులతో పరిస్థితులు చక్కబెట్టుకొనుటకు కూడా ప్రయత్నించని వారు, ఏవిధముగా దేవునితో నడచుదురు? తప్పనిసరిగా సాతాను వారి మనస్సులను లేఖనములలోని సత్యములకు గ్రుడ్డి వారినిగా చేసెను.
విరిగిన సహవాసము యొక్క మూల్యము
ఇతర విశ్వాసులతో సహవాసము విరిగి పోయినప్పుడు మనము దేనిని పోగొట్టుకొనుచున్నామో సాధారణముగా గ్రహించము. మనము క్రీస్తు ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు మరియు ఎత్తులను తెలుసుకొని, దేవుని యొక్క సంపూర్ణతను ''పరిశుద్ధులందరితో కలసి'' మాత్రమే పొందగలమని బైబిలు మనకు చెప్పుచున్నది (ఎఫెసీ 3:17-19). దేవుడు మనతో నుంచిన విశ్వాసులతో సహవాసము యొక్క యదార్థత మనకు తెలిసినప్పుడే మనము క్రీస్తు యొక్క ప్రేమ మరియు దేవుని యొక్క సంపూర్ణత గురించిన ప్రయోగాత్మక గ్రహింపులోనికి ప్రవేశించుదుము.
తనతోటి క్రైస్తవుని నుండి దూరముగా నుండువాడు దానిని బట్టి తాను పొందవలసిన క్రీస్తుయొక్కప్రేమ మరియు కృప యొక్క అనుభవాన్ని పోగొట్టుకొనుచున్నాడు. మనము ఎప్పుడైతే ప్రేమ నియమము చేత జీవించుట తప్పిపోవుదుమో, అప్పుడు మనము కొంత క్రీస్తు యొక్క ఐశ్వర్యమును మరియు కొంత దేవుని యొక్క సంపూర్ణతను పొందకుండా మనలను మనమే అడ్డుకుంటున్నాము.
క్రీస్తు యొక్క శరీరము
ఎఫెసీ క్రైస్తవులకు పౌలు వ్రాసిన పత్రిక, విశ్వాసులు క్రీస్తులో ఒక శరీరముగా నుండవలసిన గొప్ప సత్యము చుట్టూ కేంద్రీకృతమైయున్నది. క్రీస్తు సంఘమునకు శిరస్సు, మరియు సంఘము ఆయన శరీరము (ఎఫెసీ 1:22,23) ప్రతి విశ్వాసి ఈ శరీరములో ఒక అవయవముగా నున్నాడు.
ఇది మన వివేకముతో అర్థము చేసికొని ఒప్పుకొనిన ఒక వాస్తవ విషయము కాదు గాని ఇది మన అనుదిన జీవితమును ప్రభావితము చేయు వాస్తవమై యుండవలెను.
ఎఫెసీ పత్రిక మొదటి భాగమంతా క్రీస్తుశరీరము గూర్చిన సిద్ధాంతము చెప్పబడును. రెండవభాగము ఈ సత్యము అభ్యాసాత్మకముగా పనిచేయుట గూర్చి చెప్పును. అందుచేతనే రెండవభాగము ఈ విధముగా ప్రారంభమగును.
''కాబట్టి మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి'' (ఎఫెసీ 4:1-4).
వేరొక విధముగా చెప్పవలెనంటే, ఒకడు సంఘము క్రీస్తు శరీరముగా నుండవలెనను సత్యమును అర్థము చేసుకొని చూచినట్లయితే, అతడు తనతోటి విశ్వాసులతో తప్పక దీనత్వముతో, మృదువుగా, ఓర్పుతో, దీర్ఘశాంతముతో, ప్రేమతో, ఐక్యతతో మరియు సమాధానముతో నడచుటకు ఆశపడవలెను. ఒక క్రైస్తవుడు అట్లు నడువక పోయినట్లయితే అతడు క్రీస్తు శరీరమును చూడలేదని అది సూచిస్తున్నది.
అటువంటి వ్యక్తి ఎఫెసీ పత్రిక మొదటి మూడు అధ్యాములకు వెళ్లి ''ప్రభువా, ఇక్కడ దేనినో నేను చూడలేకపోవుచున్నాను దయచేసి నాకు బోధించుము, దయచేసి నా కన్నులు తెఱువుము'' అని చెప్పవలసి యున్నది. ఎందుకనగా 'శరీరము' గూర్చిన సత్యమును మన వివేకము వలన అర్థము చేసికొనలేము, మనము తెలుసుకొనవలెనంటె, పౌలు చెప్పినట్లు, మన హృదయము యొక్క కన్నులు పరిశుద్ధాత్మ ద్వారా వెలిగింపబడవలసి యున్నవి (ఎఫెసీ 1:18,22,23).
పౌలు కొరింథీ సంఘమునకు ''మీరు క్రీస్తు యొక్క శరీరమై యుండి, వేరు వేరు అవయవములుగా ఉన్నారు'' అని వ్రాసెను (1కొరింథీ 12:27). మొదటి శతాబ్దములో కొరింథీ పట్టణములో నుండిన క్రైస్తవులు గత కాలములో, ఇప్పుడు మరియు భవిష్యత్తులో క్రీస్తు శరీరముగా నుండు లోకమందలి క్రైస్తవులందరిలో చిన్నభాగముగా నుండుట నిజమే; కాని వారు కొరింథిలో క్రీస్తు శరీరము యొక్క స్థానికమైన వ్యక్తీకరణగా నుండవలసి యుండెను. ఇది ప్రతి కాలములో మరియు ప్రతి స్థలములో ప్రతి విశ్వాసుల గుంపు యొక్క పిలుపుగా యున్నది. ప్రతి క్రైస్తవ సహవాసము, అది సంఘము లేక పరిచారకుల గుంపు లేక సంస్థ కావచ్చు, అది క్రీస్తు శరీరముగా లోకమునకు కనబడునదిగా యుండవలెననునది దేవుని ఉద్దేశ్యము.
యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు, ఆయన ఈ భూసంబంధపు శరీరముతో వచ్చెను. దేవుడు మానవునికి క్రీస్తు యొక్క భౌతిక శరీరముతో తన్నుతాను చూపించుకొనెను. భౌతిక శరీరము లేకుండా, క్రీస్తు నెరవేర్చవలసినది ఆయన నెరవేర్చలేకపోయియుండును మరియు లోకము దేవుడు ఎలా ఉండునో తెలిసికొనలేకపోయి యుండును. ఒక భౌతిక శరీరము అవసరమైయుండెను.
ఇప్పుడు, ఆయన శరీరము పక్షవాతముతో లేక సరిగా పనిచేయని అవయవములతో నుండినట్లయితే ఈ లోకములో క్రీస్తుయొక్క పరిచర్యకు ఎంత ఆటంకముగా యుండునో ఆలోచించండి. ఉదాహరణకు, ఆయన కాళ్లు, చేతులు లేక నాలుక పక్షవాతముతో కదలకుండా యుండినట్లయితే, ఆయన పాపుల యింటికి నడిచివెళ్లి యుండేవాడు కాదు. తన చేతులను కుష్టురోగులపై నుంచగలిగేవాడు కాదు, జీవపు మాటలు పలికేవాడు కాదు. ఆయన ఇవన్నీ-మరియు ఇంకా చాలా చేయగలిగినది ఆయనకు బలమైన, ఆరోగ్యవంతమైన శరీరము ఉండుట వలననే.
క్రీస్తు పరలోకమునకు వెళ్లిన తరువాత, దేవుడు ఈ లోకములో ఆయన పని నెరవేర్చుటకు క్రీస్తుకు వేరొక శరీరమును ఇచ్చెను. అది ప్రతి తెగనుండి, ప్రతిభాష నుండి మరియు ప్రతి దేశమునుండి ఆయన రక్తము చేత విడిపింపబడిన విశ్వాసులతో కూడిన ఆత్మీయ అంతరార్థముగల ఆత్మీయ శరీరమునిచ్చెను. ఈ విశ్వాసుల యొక్క శరీరములో, క్రీస్తు ఈ లోకములో శరీరముతో నుండినప్పుడు ఆయనలో నుండిన పరిశుద్ధాత్ముడే ఉండి, క్రీస్తు తన భౌతిక శరీరమును ఉపయోగించి చేయుటకు ప్రారంభించిన పరిచర్యను ఇప్పుడు కొనసాగించవలసి యున్నది. ఇది సంఘము యొక్క పిలుపుగాయున్నది.
క్రీస్తు ఈ లోకములో ఎందుకు ఆయన పని కొనసాగించలేకపోవుచుండెనో ఇప్పుడు గ్రహించావా? ఆయన యొక్క మర్మగర్భమైన శరీరము (సంఘము)నకు పాపము వలన పక్షవాతముతో పనిచేయని లేక అనైక్యత వలన ఒకదానితో ఒకటి కలువని అవయవములు మరియు భాగములు యున్నవి.
ఈనాడు సాతాను క్రీస్తు యొక్క భౌతిక శరీరముపై దాడి చేయలేడు కాని అతడు క్రీస్తు యొక్క నూతన శరీరముపై దాడి చేయగలడు మరియు చేయుచుండెను. సంఘములో పనిచేయని మరియు ఒకరితో ఒకరు కలవని సభ్యుల ద్వారా క్రీస్తు యొక్క పని ఎక్కువ ఆటంకపడునని సాతానుకు (చాలామంది విశ్వాసుల వలె కాకుండా) తెలియును.
క్రీస్తుయొక్క శరీరము గూర్చిన ఆత్మీయ దర్శనము గూర్చి మనమెంత అవసరముతో ప్రార్థించవలసియున్నది. నిజానికి ఇది ఈనాటి గొప్ప అవసరాలలో ఒకటి. క్రీస్తు ఆయన శరీరమునకు శిరస్సుగా మరియు మనలో ప్రతిఒక్కరు అందులో అవయవములుగా చూచుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. అటువంటి దర్శనము మాత్రమే సంఘమును విజయోత్సాహములో నడిపించును.
క్రీస్తు శరీరము ఆత్మీయ వరములను వినియోగించుట చేత మరియు ప్రేమ వలన నిర్మింపబడి, ఎదుగును (ఎఫెసీ 4:11,12 మరియు 16). వరములు మరియు ప్రేమ రెండూ అవసరమైయున్నవి. అందువలన క్రొత్త నిబంధనలో ఎక్కడెక్కడ వరముల గూర్చి చెప్పబడెనో అక్కడ వాటితో పాటుగా ప్రేమను గూర్చి కూడా చెప్పబడెను. 1కొరింథీ 12వ అధ్యాయములో వరముల గూర్చి మరియు 13వ అధ్యాయములో ప్రేమను గూర్చి, రోమా 12:4-8లో వరముల గూర్చి మరియు 9,10 వచనములలో ప్రేమను గూర్చి, 1పేతురు 4:10,11 వచనములలో వరముల గూర్చి మరియు 8వ వచనములో ప్రేమను గూర్చి చెప్పబడెను.
క్రీస్తు ప్రేమ వంటి ప్రేమ
యేసుప్రభువు సిలువకు వెళ్ళుటకు ముందు ఆయన శిష్యులకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చెను. అది వారు ఒకరినొకరు ఆయన వారిని ప్రేమించినట్లుగా ప్రేమించుకొనవలసినదనే ఆజ్ఞ (యోహాను 13:34). యేసు ప్రభువు యిచ్చిన ఆ ఆజ్ఞలోని రెండవమాట దేవుని యొక్క కృప లేనిదే నెరవేర్చుట అసాధ్యముగా చేయుచున్నది.
క్రీస్తు యొక్క ప్రేమలో నుండిన ప్రత్యేకమైన విశేషమేమిటి? అది తప్పకుండా మన కొరకు ఆయన మరణించిన సిలువయైయున్నది. కనుక నా సహోదరుని ప్రేమించుమని ఆయన నాకు చెప్పినప్పుడు అది నా యొక్క సహోదరునితో నుండి సంబంధముల విషయములో నా స్వంత యిష్టమునకు నేను ఆయన మాదిరిని అనుసరించి మరణించవలెనను పిలుపుగా యున్నది. మరియు నా సహోదరునితో నాకుండిన సంబంధము విషయములో నా స్వంత చిత్తమును గూర్చి మరణించవలసి యున్నది. క్రీస్తు శరీరములో ఇతర సభ్యులతో నా యొక్క సంబంధములకు నన్ను నేను ఉపేక్షించుకొనుట లక్షణముగా యుండవలెను. ఇది, మరియు ఇంతకు తక్కువకానిదే నిజమైన ''క్రైస్తవ ప్రేమ''.
''మన సహోదరుల కొరకు మనము ప్రాణము పెట్టవలసి యున్నది'' (1యోహాను 3:16) అని మనకు చెప్పబడినప్పుడు, అది భౌతికమైన మరణము గూర్చి కాదు గాని, అంతకు మించిన చాలా కష్టమైన దానిని గూర్చి చెప్పబడినది. ఒక్కసారిగా హతసాక్షిగా మరణించుట మనతోటి విశ్వాసులతో నున్న సంబంధముల విషయములో రోజులో అనేక సార్లు మన స్వజీవమును మరణింప జేయుటకంటె సులువైన విషయము. కాని యేసు ప్రభువు మనలను దాని కొరకే పిలిచెను.
అటువంటి త్యాగపూరితమైన, నిస్వార్థమైన ప్రేమ, క్రీస్తుశరీరము యొక్క మూలాధారమైన నియమమైయున్నది. తన సిలువనెత్తికొని తన్నుతాను ఉపేక్షించుకొనని వాడెవడూ క్రీస్తు యొక్క శరీరములో తన విధిని నెరవేర్చలేడు.
మనము యితర క్రైస్తవులను బట్టి ఎందుకు కోపము తెచ్చుకొందుము మరియు చిరాకు పడుదుము? అది తప్పక మన అహము అనేది మన జీవితపు సింహాసనము మీద ఉండుట వలననే. మనలను మనముఎంతో ప్రాముఖ్యమైన వారుగా చూచుకొని, ఇతరులు అన్ని విషయములలో మనలను సంప్రదించాలని మనము గౌరవింప బడవలెనని అనుకొందుము. ఇతరుల ప్రవర్తన మరియు వారి వ్యవహారములను చక్కబెట్టుకొను తీరు మనము ఉద్దేశించిన విధముగా ఉండవలెనని మనము అనుకొందము. యితరులు మన యెడల మంచిగాను మన గూర్చి పట్టించుకొనేవారిగా ఉండి, మనలను ఎక్కువ చేసి చూచి మనలను స్తుతింపవలెనని మనము ఎదురు చూచుదుము. అటువంటి భావనలు మరియు ఆశలు వాస్తవానికి మనకు సిలువను గూర్చి ప్రయోగాత్మకముగా ఏమీ తెలియదు అనుదానికి రుజువుగా ఉన్నది. మన జీవితములు యిప్పటికిని స్వార్థము చేత నడిపింపబడుచు, సంపూర్తిగా అహము మరియు స్వంత ఆసక్తుల చుట్టూ తిరుగులాడుచున్నవి.
విశ్వాసుల మధ్య సంబంధములో సిలువను గూర్చిన ప్రేమను ముఖ్యమైన నియమముగా చేయక పోయినట్లయితే వారి మధ్యను క్రైస్తవ సహవాసమును ఎప్పటికిని అనుభవించలేరు. అటువంటి ప్రేమకు వేరుగా, 'సహవాసము' అను పేరుతో ఉన్నది కేవలము సాంఘీకమైన స్నేహము తప్ప నిజమైన క్రీస్తు శరీరము యొక్క అన్యోన్య సంబంధము కాదు. అటువంటి సాంఘీకమైన స్నేహము లోకములో నున్న క్లబ్బులలో కూడా ఉండును. అనేక క్రైస్తవసంఘములు మరియు గుంపులు అటువంటి క్లబ్బుల కంటె ఏ మాత్రము వేరుగా లేకపోవుట విచారించవలసిన విషయము!
ఒక క్రైస్తవ సహవాసములో సభ్యులు ఒకరితో ఒకరు దగ్గరగా పెనవేసుకొనినట్లు ఉండవలెను. దేవుడు మనలను శరీర భాగములను కోసి వివరించే అనాటమీ లేబరేటరీలో నుండు వేరు చేయబడిన అవయవముల వలె నుండుటకు పిలువలేదు, కాని మానవ శరీరములో జీవముతో నుండి ఒకదానితో నొకటి సంబంధము కలిగిన భాగములవలే ఏకముగా నుండుటకు పిలిచెను. అయితే ఇది మన అనుభవమగుటకు ఒక ధర చెల్లించవలసి యున్నది. అది ప్రతీ సభ్యుడు ఇతరుల కొరకు తన్నుతాను ఉపేక్షించుకొనవలసి యున్నది. ఈ నియమము చొప్పున జీవించుటకు యిష్టపడిన సభ్యులందరు గల క్రైస్తవగుంపులు నిజముగా ధన్యమైనవి.
ప్రేమ యొక్క నియమము చొప్పున జీవించునప్పుడు కలుగు అభ్యాసాత్మక అంతర్భావములేమిటి?
క్షమించు ప్రేమ
మొదటగా, ఒకరినొకరు క్షమించుట గూర్చి చూచుదుము. తన్నుతాను ఉపేక్షించుకొనిన వాడెవడూ ఎప్పుడూ ఎవరిమీద నిష్టూరమును లేక కక్షను ఉంచుకొనడు లేక క్షమించలేకుండా ఉండడు. 'అహం' అనేది ఎక్కడైతే ఇంకా హృదయములో సింహాసనముపై నుండునో అక్కడ కోపించుట యుండును.
ఒక దాసుడు అతడు బాకీ యుండిన గొప్ప మొత్తము గూర్చి క్షమింపబడినా ఆ దాసునికి కొద్ది సొమ్ము బాకీయుండిన వేరొక దాసుని అతడు క్షమించలేని ఉపమానమును ఒకసారి యేసుక్రీస్తు చెప్పారు. అందులో ఆ యజమానుడు జరిగినది విని కనికరము లేని ఆ దాసుని శిక్షింపబడుటకు బాధించు వారికి అప్పగించెను. ''అందుచేత తన సహోదరుని హృదయ పూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయును'' అని యేసు చెప్పెను (మత్తయి 18:35). దీని తాత్పర్యము ఏమైనప్పటికీ, బాధించువారికి శిక్షింపబడుటకు అప్పగించుట అనేది, తమ తోటి విశ్వాసుల యెడల క్షమింపలేని వైఖరి కలిగియుండుట లేక క్షమింపలేని ఆత్మ కలిగియుంచు కొనువారి విషయములో తప్పక జరుగునని యేసు ప్రభువు చెప్పారు. క్షమించుట అనేది హృదయపూర్వకముగా ఉండవలెనన్న విషయమును యేసు నొక్కి చెప్పెనని గమనించండి. వేరే విధముగా చెప్పవలెనంటే అది తప్పక హృదయ పూర్వకముగా ఉండవలెను. అంతే తప్ప బాహ్యమైనటువంటి మ్రొక్కుబడిగా ఉండకూడదు. నీ హృదయములో నిష్టూరమును ఉంచుకొని ఒకడిని క్షమించానని చెప్పుట అర్థము లేనిది.
మనము దేవుని ప్రేమ యొక్క ధర్మమును మీరినట్లయితే, మనము క్రీస్తు శరీరము యొక్క పనికి ఆటంకముగా యుందుము. అయితే అంత మాత్రమే కాదు. మనకు మనము కూడా హాని చేసుకొందుము. డా. యస్.ఐ. మెక్ మిలన్, ''నన్ ఆఫ్ దీజ్ డిసీజస్'' అను పుస్తకములో ''నేను ఒకనిని ద్వేషించుట ప్రారంభించగానే, నేను అతడికి బానిసనవుదును. అతడు నా ఆలోచనలను కూడా అదుపు చేస్తూ ఉండినందున నేను నా పనియందు ఆనందించలేను. నా యొక్క కోపము ఒత్తిడికి సంబంధించిన ఎన్నో హార్మోన్లను నా శరీరములో ఉత్పత్తి చేయును. అందువలన కొద్ది గంటల పని చేసిన వెంటనే నేను అలసిపోవుదును. నేను ఇంతకు మునుపు సంతోషముతో చేయు పని ఇప్పుడు చాకిరీగా మారినది. చివరకు పనికి సెలవు తీసుకొనుట కూడా సంతోషాన్నిచ్చుట మానివేసినది. నేను ద్వేషించే వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళినను నన్ను వెంటాడు చుండెను. నా మనసు అతడి యొక్క క్రూరమైన పట్టునుండి తప్పించు కొనలేక పోవుచుండెను'' అని చెప్పెను.
దాచబడిన కక్షలు మరియు నిష్టూరము ఈనాడు లోకమంతా అనేకమైన క్రైస్తవుల మరియు క్రైస్తవ పనివారి యొక్క సమర్థతను మరియు శారీరక ఆరోగ్యమును కూడా పాడుచేయును.
సహవాసమును పునర్నిర్మించే పనిలో చివరకు ఒక సహోదరుడు మనము అతడిని బాధపరిచామని (నిజమవ్వచ్చు-తప్పవ్వచ్చు) అనుకొనిన సందర్భములో మనమే మొదట అడుగు వేయవలెనని యేసు ప్రభువు బోధించారు. ''నీవు బలిపీఠము నొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచి పెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము'' (మత్తయి 5:23,24). అదే విధముగా ''మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగియున్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును'' (మార్కు 11:25).
అన్ని పరిస్థితులలో మనలను మనము ఉపేక్షించు కొనుటకు, మన గర్వమును మనము అణగద్రొక్కుకొనుటకు, ఎక్కడైతే సహవాసము విరిగిపోయెనో అక్కడ తిరిగి సహవాసమును కట్టుటకు ''రెండవ మైలు'' వెళ్లుటకు యేసు ప్రభువు మనలను పిలుచుచున్నాడు. కొన్ని సమయములలో, తిరిగి సంబంధము ఏర్పర్చుకొను విషయములో మనమెంత ప్రయత్నించినను, ఒక సహోదరుడు కఠినమైన మరియు క్షమించలేనటువంటి వైఖరిని కలిగియుండవచ్చును. కాని మన ప్రయత్నము మనము చేసినప్పుడు దేవుని యెదుట మన బాధ్యతను నెరవేర్చినట్లే.
మనకును మరియు ఆయన శరీరములో ఏ ఒక్క సభ్యునికి మధ్య పరిష్కరింపబడని సమస్యలుంటే లేక తిరిగి సంబంధము నెలకొల్పబడుటకు ప్రయత్నము చేయకుండా యుండినట్లయితే, దేవుడు మన యొక్క ఆరాధన లేక సేవను లేక అర్పించే దేనిని అంగీకరించడు అని యేసు ప్రభువు మాటలు స్పష్టపరచుచున్నవి. ఎంతమంది క్రైస్తవులు యేసు ప్రభువు యొక్క మాటలను తీవ్రముగా తీసుకొనుచున్నారు అని నేను అప్పుడప్పుడు ఆశ్చర్య పోవుదును. అనేకులు దేవుని ఆజ్ఞలను తేలికగా తీసుకొందురు, తద్వారా క్రీస్తు శరీరములోనికి మరణమును తీసుకువచ్చుదురు.
ఇంకను క్షమించుటకు ఉండిన కారణము గూర్చి పౌలు ''నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు క్షమించితిని'' అని చెప్పెను (2కొరింథీ 2:11).
ఆయన అనిన దాని అర్థమేమిటి?
మన యెడల ఇంకొకరు చెడుగా ప్రవర్తించునట్లు సాతాను చేత ప్రేరేపించబడినయెడల, మనము కూడా అదే విధముగా ప్రవర్తించినయెడల మనము కూడా సాతానును సేవించినట్లే. ఇలా మారుట ఎంత బుద్ధిహీనత? సిలువపై నుండినప్పుడు జనులు యేసు ప్రభువును దూషించుట ద్వారా సాతానుకు సేవ చేసారు. కాని ''తండ్రీ, వీరిని క్షమించుము'' అని ప్రార్థించి యేసు ప్రభువు తండ్రిని సేవించారు. కనుక ఇక్కడ ప్రశ్న మనము సరిగానే ఉన్నామా మరియు మనము నిష్టూరము కలిగి యుండుట సమర్థనీయమేనా అనేది కాదు, కాని మనము సేవించేది సాతానునా లేక దేవునినా అనేది.
మనలో తప్పు లేదని మనకు తెలిసియుండి ఎదుటివారు తప్పుగా ఉన్నారని తెలిసినప్పుడు మనము తరచుగా ఎక్కువ ప్రమాదములో యుందుము. ఎందుకనగా అటువంటి పరిస్థితులలోనే మనము స్వనీతిపరులైన పరిసయ్యులుగా మారిపోవుదుము. మనము ఆ విషయమునకు సంబంధించి సరియైన వారుగా ఉండవచ్చును కాని మనము మన వైఖరిలో తప్పుగా ఉండవచ్చును-క్రీస్తువలె కాక సాతానువలె యుండవచ్చును, దీనులుగా కాక గర్వముతో నిండు కొనిన వారముగా యుండవచ్చును.
దేవుడు కనికరముతో నుండుటలో సంతోషించును మరియు ఆయన బిడ్డలందరు అదే లక్షణము కలిగి యుండవలెను. విశ్వములో కనికరము ఏ మాత్రము కనబడని ఒకే ఒక్క ప్రదేశము నరకము. కనుక కనికరము లేని వైఖరి మరియు క్షమించలేని ఆత్మ మన హృదయములలో కొంత వరకు నరకము యొక్క చిన్ని భాగము ఉన్నదనుదానికి సూచనగాయున్నది.
దానితోపాటుగా మనము ఇతరుల యొక్క ఓటములలో వారికి కనికరము చూపనట్లయితే మనకు మనమే దేవుని యొక్క కనికరమును పొందకుండా చేయువారుగా యుందుము. ''కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును'' (యాకోబు 2:13) అని బైబిలు చెప్పుచున్నది. మనము యితరులను ఎట్లు చూచెదమో అట్లే దేవుడు మనలను చూచును.
సిలువను తన జీవితములో సంతోషముతో అంగీకరించిన వానికి, తన్నుతాను తగ్గించుకొనుట మరియు ఇతరులను క్షమించుట సులువైన మెట్టు. కేవలము తన అహాన్ని సింహాసనముపై నుంచుటకు ప్రయాసపడువానికి క్షమించుట కష్టముగా నుండును.
ఇతరుల యెడల కనికరము చూపుట మరియు క్షమించుట కేవలము మొదటి అడుగు మాత్రమే. మన సహోదరుల యొక్క తప్పులను కప్పిపుచ్చేటంతవరకు మనము వెళ్లవలెనని బైబిలు చెప్పుచున్నది (1పేతురు 4:8). ''ప్రేమ దోషములను కప్పును'' (సామెతలు 17:9). కనుక మనము ఒక సహోదరుని మన హృదయము నుండి క్షమించిన తరువాత, మనము ఆ విషయమును సంపూర్తిగా పాతి పెట్టవలెను. అతడు తప్పిపోయిన విషయము మరియు మనము అతడిని క్షమించిన విషయము ఎవరికి చెప్పకూడదు. లేనట్లయితే అతడిని దోషిగా ఇతరులకు కనపరచుదుము. మన ప్రయత్నము మన తోటి విశ్వాసులను సాధ్యమైనంత మంచి వారుగా చూపించునట్లుండ వలెను. అటువంటి ప్రేమతో క్రీస్తు శరీరము కట్టబడును.
విశ్వాస పాత్రమైన ప్రేమ
నీవు ఒకరిని ప్రేమించినట్లయితే, అది ఎంతటి త్యాగమైనా నీవు అతడికి విశ్వాస పాత్రుడవుగా నుండవలెను (1కొరింథీ 13:7). విశ్వాస పాత్రునిగా ఉండుట అంటే ఒక వ్యక్తి ముఖము మీద చెప్పలేనిదేదైనను ఆ వ్యక్తి యొక్క వెనుక చెప్పకుండుట. కొండెము లాడుట పిరికివారి కాలక్షేపమై యున్నది.
దీని అర్థము మన తోటి విశ్వాసి ఉద్యోగ విషయములో లేక వివాహ విషయములో మన అభిప్రాయము అడిగినప్పుడు అతడి గూర్చి వ్యతిరేకముగా చెప్పకూడదని కాదు. అటువంటి పరిస్థితులలో దేవుని పట్ల మన నమ్మకత్వము మన తోటి విశ్వాసుల పట్ల మన నమ్మకత్వమును మించినదని, అది మనలను సత్యమునకు కట్టుబడియుండునట్టు చేయునని మనము గుర్తుంచుకొనవలెను. కాని సత్యము మనకు అవకాశము ఇచ్చినంత వరకు మనము మన సహోదరుని యొక్క దోషములను సాధ్యమైనంత వరకు కప్పి పెట్టవలెను.
సహనముతో కూడిన ప్రేమ
''ప్రేమ దీర్ఘకాలము సహించును, అది చిరాకుపడదు'' (1కొరింథీ 13:4,5).
మనలను మనము ఉపేక్షించుకొనుటకు యిష్టపడినప్పుడు ఇతరుల యొక్క దోషములను భరించుట మరియు వాటిని సహించుట సుళువుగా నుండును. మన అహమునకు మనము మరణించినట్లయితే, మనము ఇతరుల యొక్క ప్రవర్తనను బట్టి చిరాకుపడము లేక కోపము తెచ్చుకొనము. మనము కూడా ఊరకనే కోపము తెచ్చుకొనుట నుండి మరియు అసహనము నుండి విడుదల పొందుదుము. ఇతరుల తప్పిదములను శాంతముతో భరించలేని ప్రేమ కేవలము భావోద్రేకములతో కూడినది మరియు మానవ ప్రేమయైయున్నది. క్రీస్తు యొక్క ప్రేమ సంపూర్తిగా వ్యత్యాసమైన నాణ్యత కలిగినది.
''మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనితో ఒకడు సహించుచుండవలెను'' (ఎఫెసీ 4:2) అని బైబిలు ఆజ్ఞాపించుచున్నది.
ఇది ప్రతి సంఘము మరియు ప్రతి క్రైస్తవ సహవాసము ముందు పెద్ద అక్షరాలతో వ్రాయవలసిన వచనము. సహనము సిలువ యొక్క ప్రేమకు ఒక స్పష్టమైన ఋజువు.
మనమందరము పడిపోయిన మానవులము. మన యొక్క స్వంత తప్పిదములను నిజాయితీతో చూచిన యెడల, ఇతరుల యొక్క తప్పిదములను సహించుట సుళువుగా నుండును. మన యొక్క అసహనము మరియు చిరాకు సాధారణముగా మన స్వనీతి యొక్క పరిమాణములో నుండును.
పక్షపాతము లేని ప్రేమ
''నీవు ఎవరినైనా ప్రేమించిన యెడల, నీవు అతనికి ఎల్లప్పుడు మంచియే జరగాలని ఎదురుచూచెదవు'' (1కొరింథీ 13:7 లివింగు బైబిలు).
మన స్వభావము మనకు మనము కేంద్రముగా కలిగినది కాబట్టి ఇతరుల గూర్చి మనము అనుకొనేది సాధారణముగా మనము ఊహించుకొనుదానికి అనుగుణముగా ఉంటుంది-అది ఇతరులలో మనము చూడాలనుకొనేదే చూచుదుము. మనము ఒకనిని అసహ్యించుకొనినట్లయితే, మనము అతడితో నుండిన బలహీనతలను మాత్రమే చూచుదము మరియు అతడి గూర్చిన వినిన చెడునంతటిని నమ్ముదుము. అదే విధముగా, మనము ఒకరిని గొప్పగా చూచినప్పుడు అతడిలో మంచిని మాత్రమే చూచి అతడి గూర్చి వినిన ప్రతి మంచి విషయమును నమ్ముదుము. మనము జనులను ''రంగుటద్దాల''లో నుండి చూచుదము. అందువలననే ''ప్రేమ గ్రుడ్డిది'' అందురు.
మన ఇష్టానుసారముగా ఊహించుకొనుటకు ఒక ఉదాహరణ: మనలో చాలా మందికి కొన్ని కులముల మరియు జాతులవారు ఎలా ప్రవర్తిస్తారను విషయములో మనసులలో కొన్ని ఉద్దేశ్యములుండును. వారిలో ఒకరి గూర్చి మనము ఏదైనా పుకారు కాని, లేక ఒక అపనింద గాని వినినప్పుడు (అది పూర్తిగా అబద్ధము కావచ్చు), మన యొక్క ముందు ఏర్పర్చుకొనిన ఉద్దేశ్యములు వెంటనే బలము పుంజుకొని మనము ఏ ప్రశ్న లేకుండా ఆ గాలి కబుర్లను నమ్ముదుము మరియు సహవాసము చెడిపోవును.
అటువంటి గోతులను తప్పించుకొనుటకు మనము కులాలకు లేక జాతులకు లేక వేరే ఎటువంటి తరగతికి చెందిన జనులపైనా ముందుగా ఉద్దేశ్యాలు కలిగియుండుటను తీసివేసికొనుటకు ప్రయత్నించవలెను. మనము సాధారణముగా యిష్టపడని వారి గూర్చిన మంచి విషయములను జ్ఞాపకము ఉంచుకొనుట మరియు మనము ఆరాధించే వారి విషయములో బలహీనతలను గుర్తించుట కూడా ఎంతో సహాయకరమైన క్రమశిక్షణగా యుండును. మనము యిష్టపడని వారిని కనికరముతో తీర్పు చేయవలెను. మరియు మనము మెచ్చుకొనువారిని నిజాయితీతో తీర్పు తీర్చవలెను.
మనము వినిన దానిని బట్టి ఎప్పుడూ తీర్పు తీర్చకూడదు లేక మనము చూచిన దానిని బట్టి నిర్ణయానికి రాకూడదు. ఒక వ్యక్తి ప్రవర్తన 'అనుమానాస్పదము'గా ఉండవచ్చును. కాని దానికి ఒక మంచి వివరణ యుండవచ్చును. ఇతరుల యొక్క వ్యవహారముల గూర్చి అన్నివేళలా సాధ్యమైనంత శ్రేష్టమైన వివరణ ఇచ్చుటకు మనము చూడవలెను.
యేసు ప్రభువు గూర్చి (ప్రవచనాత్మకముగా యెషయా గ్రంథములో), ''కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి.....తీర్పు తీర్చును'' (యెషయా 11:3,4) అని చెప్పబడినది.
క్రీస్తు శరీరములో అట్లే ఉండవలెను.
గౌరవప్రదమైన ప్రేమ
ప్రేమ యితరులపై ఎంతో విలువ ఉంచును.
'అహము' మన జీవితము యొక్క సింహాసనముపై యుండినప్పుడు, మనము యితరులను తృణీకరించుట లేక పట్టించుకొనకుండునట్లు యుందుము. కాని, మనము సిలువ నెత్తికొని 'అహము' విషయములో మరణించినప్పుడు, మనము మన తోటి విశ్వాసులను గౌరవించుటకు, విలువ యిచ్చుటకు మరియు చివరకు వారిని బట్టి సంతోషించుటకు ప్రారంభించుదుము.
సాంఘీకముగా, విద్యార్హతలలోను మరియు ఆత్మీయముగా మనకంటె తక్కువగా ఉన్న వారి విషయములో మన వైఖరి ఏమై యున్నది? దాని జవాబు మన జీవితములలో కల్వరి ప్రేమ గూర్చి నిజముగా మనకు తెలిసిన దానిపై ఆధారపడియుండును. క్రీస్తు ఆయన స్థితికి మరియు దేవునిగా ఆయనకుండిన ఔన్నత్యానికి మరణించుటలో మరియు క్రిందికి వచ్చి పడిపోయిన మానవునితో సంపూర్తిగా సమానుడుగా గుర్తింపు చేసికొనుటలో దేవుని ప్రేమ కనబడును. ఆయన ప్రేమ చిన్న చూపు చూచునది కాదు, మన ప్రేమ కూడా అట్లుండవలెను.
కాని శరీరములో ఒక సభ్యుడు వేరొకరిని జాతి, సాంఘీక స్థితి, సంస్కృతి లేక ఇతర వ్యత్యాసములను బట్టి ఎంత తఱచుగా తక్కువగా చూడడము జరుగుచున్నది. అటువంటి ''క్రైస్తవులు'' (అటువంటి వారు సిద్ధాంత పరముగా ఎంత ఖచ్చితముగా ఉండిన వారైనా సరే) క్రీస్తు శరీరమును కట్టుటకు ఎప్పటికి పనిముట్లుగా ఉండరు- ఎందుకనగా వారు క్రైస్తవ సేవలో మొదటి నియమమైన ''మానవ రూపము ధరించుట'' అను సూత్రమును అర్థము చేసికొనలేదు. వాక్యము శరీరరూపము దాల్చి జనుల మధ్య వారిలో ఒకరిగా నివసించెను. దేవుని కొరకు ఉపయోగపడు వారిగా ఉండవలెనంటే, శిరస్సు విషయములో ఎలాగునో అలాగే ఆయన శరీరములో సభ్యుల విషయములోనూ ఉండవలెను.
నీవు నీ తోటి విశ్వాసులకు విలువ ఇచ్చుచున్నావా? నీవు వారి అవసరత ఉన్నదని గుర్తించి నిజముగా వారి యొక్క సహవాసమును వెదకుచున్నావా? లేక జాతి, కులము లేక తెలివి తేటలు లేక సాంఘీక స్థాయిలను బట్టి నీకు అనుకూలమైన వారితో కూడిన చిన్న ముఠాలను నీవు ఏర్పర్చుకొని వారితో నీవు కలిసియుండి దానిని 'సహవాసము' అని పిలుచుచుంటివా? అలా అయినట్లయితే మనుష్యులను మోసగించే గొప్పమోసగాడు, నీవు దీనుడుగా ''పరిశుద్ధులందరితో'' సమానముగా సహవాసమును వెదకినట్లయితే, నీకు చెందవలసిన ధనమును నీ నుండి దొంగిలించాడు.
మర్యాద పూర్వకరమైన ప్రేమ
''ప్రేమ దయగలది.....అమర్యాదగా ప్రవర్తించదు'' (1కొరింథీ 13:4,5).
''కృప చూపుట నరుని ఇతరులకు ప్రియునిగా చేయును'' (సామెతలు 19:22). మనము అపరిచితుల యెడల మర్యాదగా నుందుము, కాని ప్రతిరోజు కలిసి భుజాలు భుజాలు వ్రాసికొని తిరిగే వారితో మొరటుగా వ్యవహరించుదుము. మనము మర్యాదగా ఉండి కొన్ని దయగలమాటలు మాటలాడుటద్వారా, మనము వెళ్ళిన ప్రతిచోట కొంచెము తేనెను పూయుటకు మనకు ఖర్చు ఏమీ కాదు, అయినప్పటికీ మనలో అనేకులము అట్లు చేయుటకు నిర్లక్ష్యము చేయుదుము. దయగల మాటలు మరియు పనులు లోతులేని స్థితిలో ఉండిన ఎన్నో సహవాసములను లోతుగా చేయును. యంత్రములలో తైలము వలె, మర్యాద మనమధ్య నుండిన అనేక సంబంధములలో రాపిడిని తగ్గించును. కాని మనము నేర్చుకొనుటలో చాలా నిదానించువారుగా ఉందుము.
మనము ప్రాథమికముగా మనకు మనమే కేంద్రముగా నుండు వారము కాబట్టి మనకు మనము క్రమశిక్షణ కలిగియుండవలెను మరియు దయగా నుండుట అను కళను గూర్చి మనకు మనము నేర్చుకొనవలెను. సహవాసము దానికదే సహజముగా అభివృద్ధి చెందదు. దానిని ఒక తోట వలె జాగ్రత్తగా సాగుచేయవలెను.
ఒక విశ్వాసి తనయొక్క అజాగ్రత్తయైన సంభాషణలతో ఇతరులకు ఎన్నోసార్లు గాయము చేయును. ఎంతమంది క్రైస్తవులు ''చమత్కారముగా మాటలాడును'' అని పేరు తెచ్చుకొనుట కొరకు, ఇతరులను బాధపెడ్తూ నవ్వులాట మాటలు మాట్లాడుదురు. తమకు వ్యతిరేకముగా తాము హాస్యపు మాటలు మాట్లాడుటకు అంత తొందర చూపరు.
హాస్యములో నిశ్చయముగా విలువ ఉన్నది. కాని దాని ఫలితముగా యితరులను తక్కువ చేయుటకాని లేక వారికి యిబ్బంది కలిగించుటకు కాని చెయ్యకూడదు. ''బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటె ఒకనిచేత అన్యాయము పొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము'' (సామెతలు 18:19) అని జ్ఞాపకముంచుకొనండి.
ఇతరుల గూర్చి పట్టించుకొనే ప్రేమ
ప్రేమ యితరుల అవసరములను పట్టించుకొనును. మనము చూచుచున్నట్లుగా క్రీస్తు ప్రేమ తన గురించి తాను చూచుకొనేది కాదు. అది నిస్వార్థమైనది. ఇది మన సహోదరుల యొక్క అవసరమునకు సంబంధించిన విషయములో కూడా వర్తించును.
మానవశరీరము విషయము చూడుడి, మానవశరీరములో ఏదైనా భాగము దెబ్బ తగిలి పుండుగా అయినప్పుడు, వెంటనే ఆ పుండుకు కారణమైన క్రిములతో పోరాడుటకు ఎన్నో తెల్లరక్తకణములు రక్తములో ఉత్పత్తియగును. ఈ తెల్లరక్తకణములు దెబ్బ తగిలిన స్థలమునకు వెళ్లి అక్కడ సమస్య కలిగించిన బాక్టీరియాతో పోరాడును మరియు ఆ ప్రక్రియలో మరణించి, 'చీము'ను కలిగించును. లక్షల కొద్ది తెల్ల రక్త కణములు దెబ్బ తగిలిన భాగమునకు జీవము కలిగించుటకు వాటి జీవమును అర్పించును.
క్రీస్తు యొక్క శరీరము ఎలా పనిచేయాలి అని చూపించుటకు ఇదిఎంత చక్కని ఉదాహరణ.
''(క్రీస్తు) శరీరములో వివాదము లేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున...దేవుడు శరీరమును అమర్చియున్నాడు. ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడా శ్రపబడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడా సంతోషించును'' (1కొరింథీ 12:25,26) అని బైబిలు చెప్పుచున్నది.
ఈ ఆఖరు వచనము ఇతర 'భాగములు' బాధపడునప్పుడు లేక సంతోషించుచున్నప్పుడు ప్రతి 'భాగము' బాధపడవలెను లేక సంతోషించవలెను అను దానిని ఆజ్ఞగా చెప్పుట లేదు కాని, ఒక భాగము బాధపడునప్పుడు లేక సంతోషించినప్పుడు ఇతర భాగములు ఎట్లుండుననే వివరణ యిచ్చుచున్నది. అదే విధముగా, క్రీస్తు శరీరములో శిరస్సుతో సమీప సంబంధము కలిగిన ప్రతిసభ్యుడు తన తోటి సభ్యుని యొక్క బాధలో లేక సంతోషములో ఏ ప్రయత్నము లేకుండగానే పంచుకొనును.
మనకును దేవునికిని మధ్య జీవము గల సంబంధము నుండినట్లయితే మరియు క్రీస్తు శరీరమును గూర్చిన సత్యమును చూడగలుగునట్లు మన కన్నులు తెరవబడినట్లయితే, అప్పుడు వేరొక సభ్యుడు శ్రమ పడునప్పుడు మనము కూడా అతడితో శ్రమ పడుదుము. అతడి యొక్క సమస్య మనలను కూడా ఆలోచింపజేయును. అలా జరగని యెడల మనము ప్రభువుతో సంబంధము కోల్పోయామని అది సూచించును.
ఔదార్యము గల ప్రేమ
''నీవు యితరులకు సహాయము చేయుట ద్వారా నీవు ఋజువు చేసుకొనకపోయినట్లయితే నీవు క్రైస్తవుడవని మరియు నీకు విశ్వాసముందని చెప్పుకొనుటలో ఉపయోగమేమిటి? అటువంటి విశ్వాసము ఎవరినైనా రక్షించునా? నీకొక స్నేహితుడుండి అతడు తిండి బట్ట అవసరములో నుండినట్లయితే అతడికి దుస్తులు లేక భోజనము ఇవ్వకుండా 'మంచిది, దేవుడు నిన్ను దీవించును, చలికాచుకొని మంచిగా తిను, సెలవు' అని చెప్పినట్లయితే అది ఎటువంటి మంచిని చేస్తుంది?'' (యాకోబు 2:14-16) అని వాక్యములో చెప్పబడియున్నది.
''ఒకడు క్రైస్తవుడై యుండి అతడు బాగా జీవించుటకు తగినంత కలిగియుండి, అవసరతలో నుండిన సహోదరుని చూచి అతడికి సహాయము చేయక పోయినట్లయితే దేవుని ప్రేమ అతడిలో ఎట్లుండును? మేము ఇతరులను ప్రేమించుచున్నాము అను మాటలు మాని నిజముగా వారిని ప్రేమించి అది మన క్రియల ద్వారా చూపుదము'' (1యోహాను 3:17,18).
దీని అర్థము అవసరములో ఉన్నామని చెప్పిన క్రైస్తవులందరికి సొమ్మును ఏ తేడా లేకుండా పంచి పెట్టుట కాదు. అట్లు కాదు. యెహోషువ మరియు ఇశ్రాయేలీయుల పెద్దలు, గొప్ప అవసరములో ఉన్నట్లు కనపరచుకొని వారిని మోసగించిన గిబియోనీయులకు సహాయము చేయుట ద్వారా పెద్ద తప్పును చేసారు (యెహోషువ 9:6). అనేక మంచి మరియు దయా హృదయము కల క్రైస్తవులు, అట్లే మోసగించుట వృత్తిగా కలవారి చేత మోసగింపబడుదురు.
సుళువుగా మోసపోవుటలో ఏ సుగుణము లేదు.
కాని మనము దేవునితో సంబంధము కలిగియుండుటకు వెదకినట్లయితే, ప్రతి పరిస్థితికి కావలసిన జ్ఞానము దొరుకును. మనము కేవలము మానవపరమైన జాలితో నడిపింప బడకూడదు. మనము శిరస్సుతో సంబంధము కలిగియుండి ఆయన చేత నడిపింపబడవలెను.
క్రీస్తు నడిపించు ప్రేమ
మానవశరీరములో ప్రతిఒక్క భాగము శిరస్సు (మెదడు)చేత అదుపు చేయబడుట వలన లేక ప్రతి భాగము 'విధేయత' చూపుటవలన వివిధములైన భాగముల మధ్య సమన్వయము ఉండును. అదేవిధముగా సంఘములో కూడా సభ్యుల మధ్య ఒకరితో ఒకరికి యుండిన సంబంధములను క్రీస్తు (శిరస్సు) అదుపు చేయగలిగి యుండినప్పుడు మాత్రమే నిజమైన సహవాసము యుండును. ఇద్దరు క్రైస్తవుల మధ్య వారి సంబంధములో క్రీస్తు ప్రధానమైన పాత్రగా ఉండక పోయినట్లయితే, వారు లోతైన సంబంధము కలిగియుండుట ప్రమాదకరము.
స్నేహము నిమిత్తము క్రైస్తవులు సత్యము విషయములో రాజీ పడిన సంఘటనలను నేను చూచియున్నాను. మానవుల యెడల విశ్వాస్యత దేవుని సత్యము యెడల నుండిన విశ్వాస్యతను అధిగమించుట చేత, ఈనాడు అనేక స్థలములలో దేవుని యొక్క పని కుంటుపడుచున్నది.
అటువంటి సందర్భములన్నిటిలో వారి మధ్య నుండిన సహవాసము క్రీస్తుద్వారాగాని లేక క్రీస్తులోగాని కాక కేవలము మానవపరమైనది అని స్పష్టమగును. దీనిని చాలామార్లు లోతైన క్రైస్తవ సహవాసముగా పొరపాటు పడుదుము. కాని నిజానికి యదార్థమైన దానికి ఇది నఖిళీ మాత్రమే.
మనము శిరస్సుతో లోతైన మరియు దగ్గర సంబంధము కలిగియుండి, ఆయన ఆజ్ఞలకు లోబడినట్లయితే, మనము సహజముగా శరీరములో ఇతర సభ్యుల యెడల సరియైన వైఖరి కలిగియుందుము. అప్పుడు ఒకరితో మరియొకరికి ఉన్న మన యొక్క సహవాసము, మానవోద్రేకము మరియు నీటి నురగవంటిది కాక లోతైనది మరియు నిజమైనదిగా యుండును.
లోకములో ఎక్కడైనా ఏ రెండు మంచు బిందువులు ఒకేలాగున ఉండవని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. అదే విధముగా, లోకములో ఏ ఇద్దరు మానవులు పూర్తిగా ఒకే విధముగా ఉండరు.
దేవుడు విశ్వమును అంతులేని వైవిధ్యముతో సృష్టించారు. సృష్టిని ఎంతో అద్భుతముగా మరియు సౌందర్యముగా చేసినది అదియే. విశ్వములో అట్లు వైవిధ్యము లేనట్లయితే అది ఎంత ఊహకందని విసుగుగా ఉండి యుండును. అదే విధముగా మానవులందరూ ఖచ్చితముగా ఒకే ఉద్రేకములతో మరియు వ్యక్తిత్వములతో నుండినట్లయితే జీవితము ఎంత అనాసక్తిగా మరియు చప్పగా ఉండి యుండును.
మానవ శరీరములో వైవిధ్యము ఉండినట్లే క్రీస్తుయొక్క శరీరమైన సంఘములో కూడా వైవిధ్యముండును. అదే సమయములో వివిధ అవయవముల మధ్య ఒక సజీవమైన ఐక్యత ఉండును. శరీరములో వాటియొక్క పనులు సంపూర్తిగా వ్యత్యాసముగా నుండినా, అవయవములన్ని సమానమైన ప్రాముఖ్యత మరియు అవసరత కలిగియున్నవి. ఏ ఒక్క అవయవము వేరొక అవయవముకంటె ఎక్కువ ప్రాముఖ్యమైనది కాదు. ఏ ఒక్కరి పరిచర్య వేరొకరి పరిచర్యను కాదనటానికి లేదు. శరీరములో ప్రతి అవయవము తనయొక్క ప్రత్యేకమైన ధర్మమును నెరవేర్చుచుండినప్పుడు మాత్రమే, లోకమునకు క్రీస్తుయొక్క శక్తివంతమైన, సమిష్టియైన ప్రదర్శనను చూపించగలము.
పాత నిబంధన కాలములో, దేవుడు తరచుగా ఆయన ప్రతినిధులుగా మరియు ఆయన స్వరమును వినుపించువారిగా ఒక్కొక్కరుగా నుండిన ప్రవక్తలను ఉపయోగించుకొనెను. కాని ఇప్పుడు అలా కాదు. ఈనాడు దేవుడు క్రీస్తుశరీరము ద్వారా పని చేయుచున్నాడు. ఒకే శరీరములో సమిష్టిగా, ఐక్యతతో పనిచేయుచు నుండిన విశ్వాసుల ద్వారా ఈ లోకమునకు దేవుడు మరియు క్రీస్తు ప్రదర్శింపబడవలెను. అందువలన ఈ ఉద్దేశ్యము నెరవేరుట కొరకు ఏ ఒక్క విశ్వాసి వేరొక విశ్వాసి కంటె ఎక్కువ ప్రాధాన్యత కలవాడు కాడు. శరీరము కట్టబడుటకు మరియు ఈ లోకములో దాని పరిచర్య కొరకు ప్రతి అవయవము (సభ్యుని) యొక్క వరములు అవసరమై యున్నవి.
దీనిని దేవుని విధానముగా గుర్తింపు లేకపోవుట వలన సంఘములో కొందరు ఉన్నతమైన వారుగాను మరికొందరు తక్కువస్థాయి కలిగినవారుగాను భావించుకొనుటకు కారణమగుచున్నది. పౌలు అటువంటి వారితో 1కొరింథీ 12లో ఇట్లు చెప్పుచున్నాడు.
తక్కువ వారిగా భావించుకొనుట
తమకుండిన వరము శరీరము కట్టబడుటకు ఇంకొకరి వరము వలె అవసరమైనది కాదు అని భావించుకొనిన వారితో మొదట పౌలు ఇట్లు చెప్పుచున్నాడు.
''నేను చేయి కాదు కాబట్టి నేను శరీరములో ఒక భాగము కాదని కాలు చెప్పినట్లయితే, అది దానిని శరీరములో ఒక తక్కువ భాగముగా చేయదు. నేను కేవలము చెవిని మాత్రమే కాని కంటిని కాదు కాబట్టి నేను శరీరములో ఒక భాగమును కాదు అని చెవి చెప్పుచుండుట నీకు వినబడినట్లయితే నీవు ఏమి అనుకొందువు. అట్లు అనుకొనుట ఆ అవయవమును ఏమైనా తక్కువ చేయునా? ఒకవేళ శరీరమంతా కన్నే అయినట్లయితే- నీవు ఎట్లు విందువు? లేక నీ శరీరమంతా ఒక పెద్ద చెవిగా ఉండినట్లయితే, నీవు దేనినైనా ఎట్లు వాసనచూచెదవు? కాని దేవుడు మనలను అట్లు సృష్టింపలేదు. ఆయన మన శరీరముల కొరకు అనేక భాగములు తయారు చేసి, ఒక్కొక్క భాగమును ఆయన ఎక్కడ కోరుకొనెనో అక్కడ ఉంచియున్నాడు. ఒక శరీరమునకు ఒకే అవయవముండినట్లయితే అది ఎటువంటి విచిత్రముగా నుండును! కనుక ఆయన అనేక భాగములను చేసెను, కాని అవన్ని ఒక్క శరీరముగా నుండెను'' (1కొరింథీ 12:15-20).
క్రీస్తుశరీరములో మనము ఇంకొకరితో మంచికి కాని చెడుకుకాని పోల్చుకొనుట ఎప్పుడూ హానిచేయును. అటువంటి పోల్చుకొనుట గర్వము లేక నిరుత్సాహము మరియు అసూయకు త్రోవ తీయును. పాదము తనను తాను చేతితో పోల్చుకొనుట ప్రారంభించి, ''నాకు శరీరములో చేతికుండినంత గుర్తింపు లేదు, నేను శరీరమునకు అడుగు భాగములో మరియు బూట్లతో మేజోళ్లుతో కప్పబడి యుందును మరియు నేను ఉన్నానా లేదా అని ఎవరూ గుర్తించరు. చేయి అయితే, ఇతరులచే ప్రతి దినము గుర్తించబడుచుండును. అది ఎప్పుడూ ఏదొకటి చేస్తూ తీరిక లేకుండా ఉండును, నేనైతే చాలా సమయము ఏ పని చేయకుండా ఉందును''. అట్లు పోల్చుకొనినట్లయితే, అది నిరుత్సాహమువైపు మరియు చేతికి బదులుగా పాదముగా చేసెనని దేవునికి విరోధముగా పిర్యాదు చేసే ఆత్మను అభివృద్ధి చేసికొనుటకు ఒక చిన్న అడుగు దూరమంతలో యుండును. అటువంటి ఆత్మ అనేకమంది విశ్వాసులు వారి యొక్క తలాంతులను పాతిపెట్టి క్రీస్తు శరీరము బలపడుటకు మరియు దాని మేలుకొరకు ఏమీ చేయనివారుగా నుండునట్లు నడిపించును. అనేకమంది విశ్వాసులు, అందరికి గొప్పగా కనిపించే వరము కావలెనని కోరుకొని, అటువంటిది లేక పోవుటను బట్టి ఏమి చేయకూడదని నిర్ణయించు కొనుటవలన ఈనాడు క్రీస్తుశరీరము యిబ్బంది పడుచున్నది.
ఇంకొకరిలో నీవు చూచే వరము నీకు యివ్వలేదని దేవునిపై నీవు కక్షను కలిగియుండుట అసూయకు చిన్న అడుగువేసి చేరుకొనేంత దూరములో ఉన్నది; మరియు అసూయ సహవాసమును చంపివేయును. బైబిలు చెప్పినట్లుగా, ''ఎక్కడైతే అసూయ మరియు తాను గుర్తింపు పొందాలనే కోరిక ఉండునో అక్కడ అల్లరి మరియు ప్రతి విధమైన నీచకార్యము ఉండును'' (యాకోబు 3:16).
మనము క్రీస్తు శరీరమును చూడగలిగి నట్లయితే, అక్కడ అసూయకు ఏ మాత్రమును తావుండదు. మానవ శరీరములో పాదమునకు పాదముగా నుండుటకు ఏ సమస్యాలేదు. అది పాదముకాక వేరొక దానిగా ఉండుటకు ఎప్పుడూ కోరుకొనదు మరియు ఎప్పుడూ ఒక చేయిగా మారాలని కలకనదు. పాదముగా నుండుటతో అది ఎంతగానో సంతృప్తి చెంది యుండును. దానిని దేవుడు ఒక పాదముగా చేయుటలో ఏ పొరపాటు చేయలేదని దానికి తెలియును. అది ఒక పాదముగా నుండినందుకు ఆనందించును; అది చేయివలె ఎప్పటికి దేనిని చేయలేనని తెలిసి యుండినా, చేయి నెరవేర్చుచుండిన దానిని చూచి అదే విధముగా ఆనందించును.
క్రీస్తుయొక్క శరీరమును గూర్చిన భావమును అర్థము చేసికొనిన వారందరి విషయములో అట్లే ఉండును. నీవు ఇంకొకరి విషయములో అసూయపరుడుగా నుండినట్లయితే, వేరొక సభ్యుడు దేవుని చేత గొప్పగా ఉపయోగింపబడుటను పూర్ణ హృదయముతో ఆనందించలేక పోయినట్లయితే అది నీవు ఈ సత్యమును ఏ మాత్రమును అర్థము చేసికొనలేదని స్పష్టము చేయుచున్నది. శిరస్సుతో సమీపమైన సంబంధముతో జీవించుచున్న ఏ అవయవమైనా శరీరములో వేరొక అవయవము ఘనతను పొందినప్పుడు ఆనందించి సంతోషించును (1కొరింథీ 12:26).
క్రీస్తు శరీరములో ఒక అవయవమునకు మరియు వేరొక అవయవమునకు మధ్య ఎటువంటి పోటీకి చోటు లేదు. కాని కలసిపని చేయుట, శరీరము యొక్క ధర్మముగా యున్నది.
వేరొకరు ఒక పరిచర్యను సమర్థవంతముగా నెరవేర్చుచుండుట నీవు చూచినప్పుడు, నీవు ఆ పనిని అంత బాగా (లేక అంతకంటెబాగా) చేయగలవని చూపించుకొనుటకు ప్రణాళిక వేసినట్లయితే, అప్పుడు 'అహము' అనేది నీ జీవితములో ఇంకను కేంద్రముగా నున్నదని స్పష్టమగుచున్నది. నీవు శిరస్సుకు లోబడుచు జీవించుచుండినట్లయితే, నీవు శరీరములో ఏ ఒక్కరితో పోటీలో ఉండవు. దానికి బదులు నీవు నీ యొక్క విలక్షణమైన పనిని సమర్థవంతముగా చేయుటకు నీ దృష్టిని కేంద్రీకరించుదువు.
మనము దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానములో నమ్మిక యుంచినట్లయితే, మనలో ఒక్కొక్కరికి ఏ వరము ఇవ్వవలెననేది దేవునికి బాగుగా తెలియునని మనము గుర్తించగలిగి యుందుము. అప్పుడు మనకు ఇంకొకరి వరము విషయములో ఎటువంటి ఫిర్యాదులు, నిరుత్సాహము మరియు ఆ వరము పొందుటకు అసూయ ఉండదు.
క్రీస్తు శరీరములో ఏ ఒక్కరు కూడా తక్కువగా అనుకొనే అవసరము లేదు. శరీరములో సభ్యులందరు సామర్థ్యము లేక ప్రతిభ విషయములో సమానముగా నుండకపోవచ్చు. కాని అందరు వారికి ఏర్పాటు చేయబడిన స్థానములలో దేవుని యొక్క పని విషయములో సమానమైన ఉపయోగము కలిగియుందురు.
దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన ప్రవృత్తి, వరము మరియు ప్రతిభలతో దేవునియొక్క మహిమను ప్రతిఫలించుటకు మనము పిలువబడ్డాము. విశ్వాసులు వారు ఇవ్వవలసిన ప్రత్యేకమైన భాగమును తీసుకొని రాకపోవుట చేత ఈనాడు సంఘములో ఎంతో పరిమితి యున్నది. వేరొకరిని వ్యర్థముగా అనుకరించుటకు ప్రయత్నించుట వలన, వారి యొక్క స్వంత ప్రత్యేకమైన వరములను ఆర్పివేయుచున్నారు మరియు దాని ఫలితముగా శరీరము యొక్క పరిచర్యకు ఏమీ ఇచ్చుటలేదు.
ఉన్నతమైన వారుగా అనుకొనుట
ఉన్నతమైన వారుగా అనుకొనువారికి పౌలు ఇట్లు వ్రాసాడు.
''కన్ను చేతితో 'నీవు నాకక్కరలేదని' చెప్పజాలదు. తల, పాదముతో మీరు 'నాకక్కరలేదని' చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే....దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు....అటువలె, మీరు క్రీస్తు యొక్క శరీరమైయుండి వేరువేరుగా అవయవములై యున్నారు'' (1కొరింథీ 12:21-27).
సంఘములో తోటి విశ్వాసులకంటె ఎక్కువ ప్రాముఖ్యము గల వారమని అనుకొనే స్వాతిశయము కలిగిన అధములు కొందరు ఉందురు. వారి యొక్క పరిచర్య ఇతరుల యొక్క పరిచర్యకంటె శరీరములో ఎక్కువ అవసరమైనదని వారు అనుకొందురు. అయితే వారు గర్విష్టులుగా పరిగణింపబడుదురని వారియొక్క భావములను బయటకు చూపించరు, కాని వారి పనులు మరియు వైఖరులు వారి ఉద్దేశ్యములను బయలు పర్చును. అటువంటి ఆత్మీయగర్వము వారిని ఆత్మీయముగా నాశనము చేయుట మాత్రమే కాక నిజమైన సహవాసము యొక్క మరణమునకు సూచనగా గంట మ్రోగించును.
కన్ను మానవశరీరములో చాలా ముఖ్యమైన భాగము మరియు దానికి ఎంతో ప్రాముఖ్యమైన విధి యున్నది. కాని అది చేతిని తృణీకరించి ''నీవు నాకక్కరలేదని'' అనినట్లయితే, అది శరీరములో తన విధిని గూర్చి తప్పుగా అర్థము చేసికొనినది.
తనయొక్క పరిచర్య ఇతరులయొక్క పరిచర్య కంటె ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా అనుకొనిన వారి ఎవరి విషయములోనైనా అంతే. మన హృదయతలంపులు ఎంతో మోసకరమైనవి, కనుక మనము దేవుని జనుల మధ్య ప్రవక్తలుగా మరియు నాయకులుగా పిలువబడితిమని ఊహించుకుంటూ మనలనుమనము సులువుగా మోసగించుకొందుము. ఇటువంటి ఉచ్చులో పడిన తరువాత వారు సంఘములలో పెద్దలుగా నుండుటకు మరియు క్రైస్తవ సంస్థలలో నాయకులుగా నుండుటకు దురాశకలిగి యుందురు. వారు ఇతరులకంటె ఉన్నతమైన వారుగా భావించుకొందురు. మరియు క్రీస్తు శరీరములో ఒక కేన్సరు వలె యుందురు.
దేవుని పనిలో ఏ ఒక్కరు కూడా అనివార్యమైనవారు కారు. దేవుని కొరకు ఇశ్రాయేలు దేశములో యదార్థముగా నిలువబడిన ప్రవక్త తననొక్కడినే అని ఏలియా దేవునికి ఫిర్యాదుచేసినప్పుడు అతడు వెళ్లి అతనికి బదులుగా ప్రవక్తగా నుండుటకు ఎలీషాను అభిషేకించుమని దేవుడు అతనికి చెప్పారు (1రాజులు 19:14-16). బహుశా ఇది దేవుడు ఉపయోగించుకొనుటకు ఎప్పుడైనను ఆయనకు మనుష్యులు లేకుండా ఉండరని ఏలియాకు చెప్పుటకు అయ్యుండవచ్చును. కనుక గొప్పవాడైన ఏలియా కూడా భర్తీ చేయలేని వాడు కాడు.
క్రీస్తు శరీరములో ఎవరు కూడా అనివార్యమైన వారు కాదు.
అదే సమయములో వేరొక ప్రక్క ఏ ఒక్కరు కూడా ఉపేక్షణీయమైన వారు కూడా కాదు. సభ్యులందరు అవసరమే అని బైబిలు చెప్పుచున్నది.
అయితే మనము మొదట నిజముగా అనివార్యమైన వారగుటకు ముందు మనము ఉపేక్షణీయమైన వారమని మొదట గుర్తించవలెను. మన యొక్క విలువలేని విషయమును మనము గ్రహించినప్పుడే మనము క్రీస్తు శరీరమునకు ఎంతో అవసరమగుదుము. ఒకరు తాను లేకుండా పలానా ప్రదేశములో దేవుని యొక్క పని జరగదని అనుకొనినప్పుడు, సాధారణముగా ఆ ప్రదేశములో అతడు లేకుండానే అక్కడ పని ఎంతో బాగుగా జరుగును అనేది సత్యము.
దేవునియొక్క పని క్రీస్తు శరీరములో సమిష్టి పరిచర్యపై ఆధారపడి యుండును, అంతే కాని ఏ ఒక్క వ్యక్తిపై కాదు. వాస్తవానికి, ప్రతిపని తానే చేయుటకు ప్రయత్నించే వాడు దేవునియొక్క పనికి స్పష్టమైన ఆటంకముగా యుండును- ఎందుకనగా అతడు ఇతరులు పని చేయుటకు ఏ మాత్రము అవకాశమివ్వడు.
కన్ను ఒక ప్రాముఖ్యమైన అవయవము, కాని శరీరమంతా కేవలము ఒక పెద్ద కన్నే అయినట్లయితే అటువంటి శరీరము ఏ మాత్రము ప్రయోజనము లేనిదై యుడును. ఆ విధముగా, ఒక సంఘము లేక క్రైస్తవసంస్థ ఒక మనుష్యుని యొక్క పరిచర్య చుట్టూ ఉండినట్లయితే (అతడు ఎటువంటి వరము గలవాడైనా) అది క్రీస్తు శరీరమును చూపింపలేకయుండును. అటువంటి గుంపు నిజానికి దేవుని యొక్క పనికి ఆటంకముగా యుండును. గణాంకములు ఎంత ఆకర్షణీయముగా ఉండినా, ఒక దైవిక వరముగల నాయకుడు లేక పాస్టరు కేంద్రముగా కలిగిన సంఘములు దేవుడు ఉద్దేశించిన పనిని నెరవేర్చలేవు. అటువంటి పరిస్థితిలో నిజమైన క్రైస్తవ సహవాసమును కట్టుట అసాధ్యముగా యుండును.
శరీరములో ఒక కణము దేవుడు ఉద్దేశించిన దానికంటె పరిమాణములో ఎంతో పెద్దదిగా ఎదిగినప్పుడు, ఆ విధముగా ఎదుగు ప్రక్రియలో ఇతర కణములను నలిపివేయుట ద్వారా వాటిలో ప్రాణమును పోవునట్లు చేయును. ఇది ఒక కేన్సరు మరియు దానికి వైద్యము చేయనట్లయితే అది శరీరమును చంపివేయును.
అయ్యో! ఇది అనేక క్రైస్తవ సంస్థలు మరియు సంఘముల పరిస్థితియైయున్నది. వాటిలో నుండిన విశ్వాసులు వారి మధ్య నున్న అమితమైన శక్తి కలిగిన ఒకని వ్యక్తిత్వమును బట్టి ఆత్మీయముగా ఎదుగలేకుండా యుందురు. వారు మర్రిచెట్టు క్రింద పుట్టకొక్కులవలె నుండి, వారికి వారుగా సూర్యరశ్మి ఎప్పుడోగాని చూడలేక యుందురు.
ఒక అసాధారణమైన ఆత్మీయవరము కలవారికి గమనిక: మీరు సామాన్యమైన వరములు కలిగిన వారికంటే, ఇతర విశ్వాసుల ఎదుగుదలకు ఆటంకముగా నుండే అవకాశము ఎక్కువగా ఉన్నది. తక్కువ ప్రతిభ కలిగిన సహోదరుల కంటె నిజమైన సహవాసమును చంపే అవకాశము మీకు ఎక్కువ ఉన్నది. అంత మాత్రమే కాక, మీరు క్రీస్తు శరీరము యొక్క సభ్యులను శిరస్సైన క్రీస్తు కంటె మీపై ఎక్కువ ఆధారపడునట్లు చేయు ప్రమాదములో మీరున్నారు.
మనము ఇతరులు తమ పరిచర్యను నెరవేర్చుటకు అవకాశమివ్వక పోయినట్లయితే, మనము శరీరము యొక్క ఒక ముఖ్యమైన ధర్మమును మీరుదుము. ఇతరులను మన కంటె ప్రాముఖ్యమైన వారుగా చూడవలెనని బైబిలు మనలను-మనలో ప్రతివారిని-హెచ్చరించుచున్నది (ఫిలిప్పీ 2:3). మనము ప్రతివారిని మన కంటె ఎక్కువ ఆత్మీయమైన వారినిగా చూచుట, నిజాయితీగా ఒప్పుకొనినట్లయితే, సాధ్యము కాదు మరియు బైబిలు నిజాయితీ లేని తప్పుడు దీనత్వమును మననుండి కోరుటలేదు. మనము ఇతరులను ఎక్కువ ప్రాముఖ్యమైన వారుగా యోచించమని చెప్పబడినది. మనము ఒకే శరీరములో మన స్థానమును మరియు ఇతరుల స్థానమును చూచినట్లయితే, మనము దీనిని తప్పక చేయగలము.
దీని అర్థము ఆత్మవరములన్ని శరీరము కట్టబడుటకు సమానమైన విలువ కలవని కాదు. కొన్ని వరములు ఇతర వరముల కంటె ఎక్కువ విలువ కలవని బైబిలే చెప్పుచున్నది (1కొరింథీ 14) మరియు ''శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించవలెనని'' మనకు చెప్పబడినది (1కొరింథీ 12:31). విశ్వాసులందరు శరీరము యొక్క పరిచర్యకు తప్పనిసరిగా యివ్వవలసిన వారి భాగమున్నది. కాని ఎవరికైతే దేవుడు (తన సర్వాధికారమును బట్టి) ఎక్కువ ఉపయోగకరమైన వరమును యిచ్చెనో వారు సహజముగా మరి ఎక్కువ గుర్తింపు పొందిన విధముగా వారి భాగమును యివ్వవలసి యుండును. కొందరికి ప్రత్యేకముగా కనబడు వరము ఉన్నదను వాస్తవము విశ్వాసులందరు సమానమను విషయమునకు అసంబద్ధమైనది కాదు. ఎందుకనగా సమానత్వము అనగా సమరూపత కాదు.
మనము ఒకరికొకరు అవసరమై యున్నాము
మన ప్రభువును గూర్చిన విషయములలో అద్భుత విషయము ఒకటి, ఆయన భూమి మీద జీవించినప్పుడు, ఆయన అందరికంటె ఉన్నతమైనవాడు మరియు పరిపూర్ణుడైనను, ఆయన మనుష్యులతో సమానమైన వాడన్నట్లుగా వారితో మెలిగెను. మనము కూడా అట్లు జీవించుట కొరకు పిలువబడితిమి. ఇతర మనుష్యుల సహవాసము అవసరమనునట్లుగా యేసుప్రభువు జీవించారు. గెత్సెమనే వనములో ఆయన పేతురు, యోహాను, యాకోబుల వైపు తిరిగి ''నా ప్రాణము మరణమగునంతగా బహుదు:ఖములో మునిగివున్నది. మీరు ఇక్కడ నాతో కూడా మెళకువగా నుండుడి'', అని వారితో చెప్పెను (మత్తయి 26:38) ఆయన దేవుని కుమారుడై యుండి, పరిపూర్ణులుకాని ఆయన శిష్యుల ప్రార్థనా సహవాసము యొక్క అవసరత కలిగియుండెను.
అయినప్పటికి మనలో ఎంత మంది సర్వసమృద్ధి గలవారము! శరీరములో బలహీనమైన అవయవములను మాకు అవసరము లేదనుకొనుచు వాటిని లక్ష్యపెట్టము. అటువంటి వైఖరితో మనము ఆత్మీయ పేదరికమునకు మరియు గ్రుడ్డితనమునకు కేవలము మనలను అప్పగించుకొనుచున్నాము. ''శరీరము యొక్క అవయవములలో ఏవి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే'' (1కొరింథీ 12:22) అని బైబిలు చెప్పుచుండిన విషయమును జ్ఞాపకముంచు కొనండి.
మన శరీరములో నుండిన లోపలి భాగములైన, గుండె మరియు కాలేయము వంటివి ఎవరికీ కనబడవు; అయినప్పటికీ చేయుటకు అవి ఎంతో ముఖ్యమైన పని కలిగియున్నవి. క్రీస్తు శరీరములో కూడా అంతే. బహిరంగ పరిచర్య లేకుండా ఎవరికీ తెలియని వారు, నిజానికి ఎంతో అవసరమైన వారుగా యుందురు.
శిరస్సు (క్రీస్తు) పాదములతో (శరీరములో అన్నింటికంటె క్రింది స్థానములో నుండిన అవయవములు) ''నీవు నాకక్కరలేదు'' అని చెప్పదునని బైబిలు చెప్పుచున్నది (1కొరింథీ 12:21). అటువంటప్పుడు ఎంతో బలహీనుడైన మరియు తక్కువ వరము కలిగిన మన యొక్క తోటి విశ్వాసి లేకుండా మనము ఏమి చెయ్యగలము. వారికి క్రీస్తుకు సంబంధించినది ఏదో ఒకటి మనకు పరిచర్య చేయుటకు ఉండును. కనుక మనము వారి నుండి వినవలసి యున్నది. మనము వారిని నిర్లక్ష్యము చేసినా లేక తృణీకరించినా, అంతే పరిమాణములో క్రీస్తు యొక్క సంపూర్ణత మనము పొందకుండా యుందుము.
సహవాసము అనేది ఎప్పుడూ రెండు వైపుల నుండు విషయము. అందులో ఇచ్చుట మరియు పుచ్చుకొనుట యుండును. వాక్యపరిచర్య చేయగలిగిన మనము ఎప్పుడూ యితరులు మన నుండి వినవలెనని అనుకొందుము. దానికి కారణము వారికి యిచ్చుటకు మనయొద్ద ఏదో కొంత ఉన్నదని మనము అనుకొందుము. చివరకు సంభాషణలో కూడా, మనము అక్కడ జరుగుచున్న సంభాషణలో ఆధిపత్యం ప్రదర్శించుటకు ప్రయత్నించు వారుగా యుందుము, కనుక అక్కడ ఉండిన సహోదరుడు ఒక మాట చెప్పుటకు కూడా అవకాశముండదు. చివరకు అతడికి ఏదైనా చెప్పుటకు అవకాశము వచ్చినప్పుడు తిరిగి అతడికి బోధించుట ప్రారంభించుట కొరకు అతడు ఎప్పుడు ముగిస్తాడా అని అసహనముతో ఎదురు చూచుదుము. మనకు మనము ప్రాముఖ్యులమని ఎంతగా అనుకొందుము?
''ప్రతి మనుష్యుడు (బోధకులు కూడా) వినుటకు వేగిర పడుటకును మాటలాడుటకు నిదానించువాడుగా యుండవలెను'' (యాకోబు 1:19) అని బైబిలు చెప్పుచున్నది. ఇతరులు చెప్పేది వినే కళను నేర్చుకోవలసిన అవసరత మనకున్నది. మనము చూచుకొనినట్లయితే, దేవుడు మనకు రెండు చెవులను ఒకే ఒక్క నోటిని ఇచ్చెను! అంతే కాకుండా, ''దేవుడు మనకు ఎల్లప్పుడు తెరచి ఉండే చెవులను మరియు మూసికొని ఉండే ఒక నోటిని ఇచ్చెను''.
కనుక మన ప్రార్థన
''ప్రభువా, నా నోటిని (జీవముతో నిండిన మాటలు) పనికి వచ్చే విషయములతో నింపుము,
మరియు నేను తగినంత మాటలాడిన తరువాత ఆగునట్లు నన్ను తాకుము'' అని యుండవలెను.
మనము ఒకరి నుండి ఒకరము వినవలసియున్నది. మనకు ఒకరి నుండి ఒకరికి సహాయము పొందుకొనుము. శరీరములో ఏ అవయవము నాకు నేను చాలు అనుకొనుటకు లేదు.
గర్వమునకు తావులేదు
మనము క్రీస్తు శరీరమును చూచినప్పుడు, జాతి, విద్య, తెలివితేటలు లేక సాంఘీక స్థాయిలతో సంబంధము లేకుండా విశ్వాసులందరిని సమానముగా గుర్తించవలసియున్నది. అందరూ సమానము మరియు అందరూ సమానముగా అవసరమై యున్నారు. ఎవరు కూడా ఇంకొకరి కంటె తక్కువ అవసరము కాదు మరియు అందరూ వారి తరపున యిచ్చుటకు ఏదొకటి యుండును, ఎవరు కూడా తక్కువైన వారన్నట్లుగా అనుకొననవసరము లేదు, ఏ ఒక్కరు కూడా ఉన్నతమైన వారుగా అనుకొననవసరములేదు మరియు గర్వము, వేరొకరితో పోల్చుకొనుట మరియు అసూయ అనునవి సంపూర్తిగా లేకుండా పోవలసియున్నది.
కొందరు క్రైస్తవ పనివారు, వారు ఎంతో ఆత్మీయత మరియు విద్యార్హతలు గలవారై యుండి కూడా, వారికంటె తక్కువ ఆత్మీయత మరియు విద్యార్హతలు గల సహోదరుల క్రింద పని చేయుటకు యిష్టపడుదుము అని చెప్పు పైకి కనపడని గర్వము (అది దీనత్వము అనే ముసుగులో ఉండునది) నకు కూడా చివరకు చోటు లేదు. అటువంటి వారు శరీరము గూర్చి ఎంతటి గ్రుడ్డితనము కలిగియున్నారు.
క్రీస్తుయొక్కశరీరము గూర్చి ఆత్మీయప్రత్యక్షత మనకు కలిగినట్లయితే ఎన్ని సమస్యలు పరిష్కరింపబడియుండేవి.
భిన్నత్వములో ఏకత్వము
క్రీస్తుయొక్క శరీరములో దేవుడు ఏర్పర్చిన భిన్నత్వము ఉన్నది. మనలో నున్న వ్యత్యాసమైన స్వభావాలను మరియు వరములను లోకమునకు సరితూకము కలిగిన క్రీస్తు యొక్క ప్రతిరూపమును చూపుటకు దేవుడు ఉపయోగించును. మనలో ఒక్కొక్కరము వికృతమైన మరియు సరితూకము లేని క్రీస్తు యొక్క రూపమును మాత్రమే చూపగలము. ఒంటరియైన ఏ వ్యక్తి యొక్క పరిచర్యయైనను సరితూకము లేని క్రైస్తవులను ఉత్పత్తి చేయును. శరీరములో వ్యత్యాసమైన ప్రాధాన్యతలను మరియు స్వభావములను కలిగిన యితరులు ఉండుటను బట్టి మనమెంత కృతజ్ఞులమై యుండవలెను. ఉదాహరణకు, ఇద్దరు సహోదరులు ఒకే గుంపులో నుండిన విశ్వాసులకు దేవుని యొక్క వాక్యమును పరిచర్య చేయుచున్నట్లయితే మరియు అందులో ఒకరు ''మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిరని ఖచ్చితముగా అనుకొనవద్దు, ఎందుకనగా మిమ్ములను మీరు మోసగించుకొనవచ్చు'' అని వక్కాణించి చెప్పవచ్చును. ఇంకొక సహోదరుడు ''మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడియున్నారని నిశ్చయత కలిగియుండుడి'' అని నొక్కి చెప్పవచ్చును. పైకి కనబడుటకు వారు ఒకరినొకరు విభేదించుకొనుచున్నట్లు కనబడవచ్చును. కాని రెండు విధముల నొక్కి చెప్పబడిన బోధ అవసరమైయున్నది. దాని వలననే వారి పరిచర్యలు ఒకదాని నొకటి సంపూర్ణము చేసుకొనునవిగా వున్నవి.
క్రీస్తుయొక్క శరీరములో, మనకు కాల్వనిస్టులు మరియు ఆర్మేనియన్లు కలసి పనిచేయుచు ఒక్కొక్కరు వారి యొక్క ప్రత్యేకమైన వివరణలను తీసుకువచ్చుదురు- అవి రెండూ కూడా బైబిలులో ఉన్నవే. చార్లెస్ సిమెయోను అనే ఆయన ''ఏ ఒక్క వివరణలోను సత్యమంతయు లేదు కాని ఈ రెండు వివరణలలోను సత్యము ఉన్నది'' అని చెప్పినట్లుగా యున్నది. కనుక, మనకు రెండు వివరణలలో నుండిన సత్యమును చెప్పు వారు కావలసియున్నారు.
అలాగే, కలుపు గోలుగా ఉండువారు మరియు సిగ్గు పడువారికి కూడా చోటు ఉన్నది. వ్యత్యాసమైన స్వభావములు ఒక దానికొకటి సంపూర్ణము చేసుకొనేటట్లుగా ఉండును. కొందరు అతి జాగ్రత్తగా ఉండి, ముందు వెనుక ఎంతో ఆలోచించి లాభనష్టాలు బేరీజు వేసుకొనకుండా, ముందుకు వెళ్ళాలా వద్దా అనేది ఎంతో సమయము ఆలోచించకుండా ఎప్పుడూ అడుగు ముందుకు వెయ్యరు. మరికొందరు అన్నింటిని ఎంతో తేలికగా తీసుకొను వారైయుండి, పర్యవసానములు గూర్చి లోతుగా ఆలోచించకుండా ఆసక్తితో ముందుకు అడుగువేయువారుగా యుందురు. ఇటువంటి రెండు (మరియు ఇతరమైన) విధములైన వ్యక్తిత్వములు క్రీస్తు శరీరములో ఉండుటచేత, అందులో ఒక సమతుల్యత ఉన్నది. శరీరములో కేవలము సంకోచించువారు, లోతుగా ఆలోచించు వారు ఉండినట్లయితే ప్రగతి చాలా నెమ్మదిగా ఉండును. దానికి వ్యతిరేకముగా, శరీరములో కేవలము అనాలోచితముగా ముందుకు ఉరికే వారుండినట్లయితే, అక్కడ ఎన్నో పూర్తికాని పథకములు ఉండును.
ప్రతి స్వభావముకు బలములు మరియు బలహీనతలు ఉండును. వివిధ రకములైన జనులు వివిధ రకములైన స్వభావములో ఉండిన ఉద్రేకములతో కలిసి క్రైస్తవులుగా పనిచేసినప్పుడు వారు లోకమునకు మరి ఎక్కువ సంపూర్ణమైన మరియు ఎక్కువ ఖచ్చితమైన క్రీస్తు యొక్క ప్రతిరూపమును చూపగలరు.
కనుక శరీరములో ఉన్నవారందరిని మనవలె ఉండవలెనని మార్చుటకు ప్రయత్నిస్తూ మనము సమయము వృథా చేసి కొనకూడదు. ప్రతివారు వారు ఎట్లుండునో అట్లుండునట్లు మనము అనుమతించవలెను. ఏ విధముగా మనబలము ఇతరులయొక్క బలహీనతలో సహాయముగా ఉండునో అనుదానిపై మనము దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరము ఉన్నది. అదేవిధంగా అతడి బలము మన యొక్క బలహీనతలో మనకు ఆధారమగును.
పేతురు, యోహానులు (వ్యత్యాసమైన వ్యక్తిత్వములు కలిగినవారు) కలిసి పనిచేయుట ద్వారా వారు ఎవరికి వారుగా నుండి పనిచేసిన దానికంటె ఎంతో ఎక్కువైన మహిమను దేవునికి తెచ్చిరి. పౌలు మరియు తిమోతి వారి స్వభావములలో కొట్టవచ్చినట్లుండే వ్యత్యాసములుండినా వారు శక్తివంతమైన జట్టుగా యుండి సువార్త కొరకు కలసి ప్రయాసపడిరి.
సంఘములో మేధావులు మరియు సామాన్యమైన తెలివితేటలు కలవారు కూడా యుందురు. సహజముగానే, దేవుని గూర్చిన సత్యమును బోధించు తీరులో తేడా యుండును. కాని వారిలో ఎవరు కూడా వేరొకరిని తక్కువచేయుట కాని లేక విమర్శించుట కాని చేయలేరు, ఎందుకనగా వారిరువురు లోకములో ఉన్న తెలివిగల వారికి మరియు తెలివిలేని వారికి, తత్వవేత్తలకు మరియు గృహిణులకు, విద్యార్థులకు మరియు రైతులకు మొదలైన వారికి సువార్త ప్రకటించుటకు శరీరమునకు అవసరమైయున్నారు. దేవునికి ప్రజ్ఞావంతుడు మరియు మేధావియైన పౌలు మరియు విద్యలేని పామరులైన చేపలు పట్టు పేతురు కూడా ఆయన పని కొరకు కావలసియుండెను. వారు ఒకే సువార్తను వ్యత్యాసమైన రీతిలో ప్రకటించువారుగా ఉండిరి, కాని వారు ఒక్కొక్కరు ప్రత్యేకమైన పాత్రను పోషించవలసి యుండెను మరియు వారిలో ఏ ఒక్కరు దేవుడు ఇంకొకరి ద్వారా నెరవేర్చిన పనిని, అదే విధముగా నెరవేర్చలేక పోయియుందురు.
క్రైస్తవుడుగా మారుట ఒక మానవుని యొక్క తెలివితేటలను మార్పు చేయదు. అదే విధముగా అతడి యొక్క సాంఘీక స్థాయిని మారునట్లు బలవంతము చేయలేదు. క్రీస్తులో సాంఘీక అసమానత్వములు పట్టింపు లేనివైనా సువార్త సమాజములో నుండిన వైవిధ్యమైన స్వభావమును ఈ భూమిపై తొలగించదు. దేవునికి సంపన్నుడైన ఫిలోమోను కావలసియుండెను. అదే విధముగా ఫిలోమోను యింటిలో దాసుడైన ఒనేసిమసు కూడా కావలసియుండెను. వారి సామాజిక స్థాయిలు జీవన ప్రమాణములు మార్పు చెందలేదు కాని వారిలో ఒక్కొక్కరు క్రీస్తు శరీరము కొరకు, వేరొకరు ఎప్పుడూ చేయలేని ప్రత్యేకమైన పనిని చేయవలసి యుండెను. కనుక వారు సువార్తలో కలసి ప్రయాసపడవలసియుండెను.
క్రీస్తు శరీరములో ఒక ఫ్యాక్టరీలో నుండి బయటకు వచ్చే మోటారు కార్లవలె ప్రతి విషయములో ఒకే విధముగా ఉండే జనులు ఉండవలెనని దేవుడు ఎప్పుడూ ఉద్దేశించలేదు. అట్లు కాదు. శరీరముయొక్క పరిచర్య తన యొక్క వైవిధ్యమైన అవయవములపై ఆధారపడి యుండును. అన్ని ఒకే విధముగా నుండినట్లయితే అక్కడ స్తబ్ధత మరియు ఆత్మీయమరణము యుండును.
చివరకు మనము ఒకరితో ఒకరు అంగీకరింపని విషయములు కూడా మన యొక్క సహవాసము లోతుగా వెళ్ళుటకు ఉపయోగపడి మనలను ఆత్మీయ పరిపక్వత లోనికి నడిపించును. సామెతలు 27:17 ''ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును'' అని చెప్పుచున్నది. ఇనుము ఒక దానితో ఒకటి రాపిడి యైనప్పుడు, అక్కడ నిప్పు రవ్వలు వచ్చును, కాని అట్లు రెండు ఇనుప ముక్కలు పదునగును. ఆ విధముగానే ఇద్దరు ''ఉక్కు మనుష్యులు'' ఘర్షణ పడుటకు బదులు ఒకరినొకరు పదును చేసుకొనవచ్చును.
కొన్నిసార్లు వ్యత్యాసమైన స్వభావములు కల యిద్దరిని దేవుడు ఆయన పనిలో కలిపి యుంచును. వారు కలిసి పనిచేయుదురు, వారి మధ్యలో నిప్పు రవ్వలు ఎగురవచ్చును, కాని అది వారిని పదును చేయుటకు దేవుడు ఉద్దేశించిన పద్ధతి కావచ్చును. ఒకడు ఇనుము వలె ఉండినట్లయితే, ఇంకొకరు మట్టి వలె ఉండినట్లయితే, అక్కడ నిప్పు రవ్వలు ఉండవు మరియు పదునగుట కూడా ఉండదు. దానికి బదులు ఆ మట్టి ముద్దపై ఇనుము యొక్క ముద్రపడును- అది ఒక బలమైన వ్యక్తిత్వముండిన వారి అభిప్రాయము బలహీన వ్యక్తిత్వముండిన వానిపై బలవంతముగా ముద్రింపబడును. ఒకరి యొక్క అభిప్రాయములు ఇంకొకరిపై ముద్రించవలెననేది దేవుని ఉద్దేశ్యము కాదు, కాని వారిరువురు ఒకరి నుండి మరియొకరు నేర్చుకొనవలెననేది ఆయన ఉద్దేశ్యమై యున్నది. మనము అంగీకారమునకు రాలేక పోవచ్చును. కాని మనమింకను ఐక్యత కలిగియుండవచ్చును. అయినప్పటికీ ఒకరినొకరు ప్రేమించు కొనవచ్చును. ఇంకా చెప్పవలెనంటె, ఒకరి నొకరు ఇంతకు ముందు కంటె ఇంకా లోతుగా ప్రేమించుకొనవచ్చును.
సంఘములో వేరువేరు సభ్యుల మధ్య వేరు వేరు అభిప్రాయములు (ప్రాధాన్యత లేని విషయములపై) ఉండునట్లు దేవుడు అనుమతించునని, నేను నమ్ముచున్నాను, దాని వలన క్రైస్తవ ప్రేమను అభ్యాసము చేయుటకు గొప్ప అవకాశముండును. మన మందరము ప్రతి విషయమును ఒకే దృష్టితో చూచినట్లయితే ఒకరినొకరు ప్రేమించుకొనుట సుళువైన విషయముగా నుండును. కాని మనము అంగీకరించలేక పోయినప్పుడు మన ప్రేమ పరీక్షింపబడును. కనుక మనలను వేరు చేయలేని లేక అనైఖ్యత కలుగజేయని బేధాభిప్రాయాలు ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలెను.
అభిప్రాయబేధములులేవని అతిశయించే క్రైస్తవ సహవాసమును అనుమానించవలసిన యున్నది. అటువంటి సహవాసములో నుండే సభ్యులు వారికి వారు ఆలోచించుటైనా మానివేసి యుందురు లేక ఒక బలమైన అభిప్రాయములుండిన వాని ఆధీనములోనికి వెళ్ళిపోయి యుందురు.
అభిప్రాయ బేధములు ఉన్నప్పటికీ, కమ్మరి వాని యొద్ద కాల్చబడి పోతపోసినట్లు ప్రేమతో కలసి పోయే ఆరోగ్యకరమైన సహవాసమే నిజమైన క్రైస్తవ సహవాసము.
''ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సయి యున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తమకు క్షేమాభివృద్ది కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది'' (ఎఫెసీ 4:15,16).
ఇవి మరియు క్రొత్త నిబంధనలో మరికొన్ని వచనములు క్రీస్తుయొక్క శరీరమునకు జీవమిచ్చు పరిచర్య చేయుటకు, ప్రతి విశ్వాసికి తన స్వంత విధముగా బాధ్యత ఉన్నదని స్పష్టము చేయుచున్నది. ఇది బోధకులకు మాత్రమే ఉండిన ప్రత్యేకమైన ఆధిక్యతకాదు, కాని క్రీస్తుయొక్క శరీరములో నుండిన అందరి సభ్యుల భాధ్యతయై యున్నది.
సిలువ నెత్తికొనుట మరియు మన అహము విషయములో మరణించుట గూర్చిన ప్రాముఖ్యతను మనము ఇప్పటికే చూచియున్నాము. ఇది క్రీస్తు శరీరములో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధముల విషయములో ప్రాథమిక ధర్మమై యున్నది. శరీరమునకు ప్రతి ఒక్క సభ్యుడు పరిచర్య చేయుటకు ఇది ప్రధానమైన మార్గమైయున్నది. ''మరణము మాలో పని చేయుచున్నది. కాని (దాని ఫలితముగా) జీవము మీలో కలుగుచున్నది'' అని పౌలు కొరింథులో నుండిన కొరింథీయులకు వ్రాసెను (2కొరింథీ 4:12). మన జీవితములలో మనమెంతగా సిలువను మోయుదుమో, బోధించు వరము మనకు లేకపోయినా అంతగా మనము శరీరమునకు జీవమును సరఫరా చేయుదుము.
సహవాసము ఇప్పటికే మనము చూచినట్లు, రెండువైపులా నుండు విషయము. అందులో ఇచ్చుట మరియు పుచ్చుకొనుట యున్నది. శరీరములో మనమందరము ఇతరులకు ఇవ్వవలసియున్నది. మరియు మనలో అందరూ ఇతరుల యొద్దనుండి పుచ్చుకొనవలసియున్నది. గత అధ్యాయములలో మనము కొందరు తక్కువైన వారమని అనుకొనుట చేత ఇచ్చుటకు మరియు ఇతరులు, ఉన్నతమైన వారమని అనుకొనుట చేత పుచ్చుకొనుటకు ఏమి లేదని అనుకొనుటను చూచియున్నాము. శరీరములో సభ్యులందరూ వారు పని చెయ్యవలసిన విధముగా పనిచేసినట్లయితే, శరీరము కట్టబడుటకు నడిపించే ప్రేమతో ఇచ్చుకొనుట మరియు పుచ్చుకొనుట యుండును.
ఇచ్చుట మరియు పుచ్చుకొను విషయములో మనలో ప్రతి ఒక్కరికి రెండు బాధ్యతలు ఉన్నవని బైబిలు మనకు చెప్పుచున్నది. మనము ఒకరి నొకరు ప్రోత్సహించుకొనవలెనని మరియు సరిదిద్దుకొనవలెనని మనకు చెప్పబడినది.
బైబిలులో నున్న క్రింద ఆజ్ఞలను ఆలోచించండి
''.......పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి (హెచ్చరించుచు, ప్రేరేపించుచు మరియు ప్రోత్సహించుచు) చెప్పుకొనుడి''.
''కొందరు మానుకొను చున్నట్లుగా (విశ్వాసులుగా) సమాజముగా కూడుకొనుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు, ప్రేరేపించుచు మరియు ప్రోత్సహించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకరి కొకరు పురికొల్పవలెనని ఆలోచింతుము'' (హెబ్రీ 3:13; 10:25).
ఈ ఆజ్ఞలు విశ్వాసులలో అనేకమంది చేత నిర్లక్ష్యము చేయబడుచున్నవి. అయినప్పటికి అవి క్రీస్తు యొక్క శరీరములో సభ్యుల యొక్క ప్రధానమైన బాధ్యతలను ఎత్తిచూపుచున్నవి.
పైన చెప్పబడిన వాక్య భాగములోని ''హెచ్చరించు లేక ప్రోత్సహించు'' అను మాట గ్రీకు మాట ''పరాకలియో'' అను మాట నుండి తర్జుమా చేయబడినది. ఈ మాట యొక్క నామవాచకము ''పరాక్లెటోస్'' అనునది, ఇది 'ఆదరణకర్త' అని అనువదించబడినది. ''ఆదరణ కర్త'' అనుమాట, యేసు ప్రభువు యోహాను సువార్త 14నుండి 16లో పరిశుద్ధాత్మ గూర్చి చెప్పినప్పుడు వాడారు.
ఈ మాట ప్రోత్సహించుట మరియు హెచ్చరించుట పరిశుద్ధాత్మ యొక్క రెండు ముఖ్యమైన పరిచర్యలుగా సూచించుచున్నది. మరియు క్రీస్తు శరీరము యొక్క అవయవములుగా మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నివసించుచుండగా, ఒకరికొకరు ప్రోత్సహించుకొను మరియు హెచ్చరించుకొను పరస్పర పరిచర్యను మనద్వారా చూపించవలెనని ఆయన చూచుచుండెను. మనము అటువంటి పరిచర్య చేయక పోయినట్లయితే మనము ఆత్మను ఆర్పివేయువారిగా యుందుము. అందువలన దేవుని వాక్యము మనలను ఈ విధముగా హెచ్చరించుచున్నది.
''సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత మియ్యుడి, అందరి యెడల దీర్ఘ శాంతము కలవారై యుండుడి. ఆత్మను ఆర్పకుడి'' (1థెస్స 5:14,19).
దీని అర్థము మన సమయమంతా ఇతరులను ప్రోత్సహించుచు మరియు హెచ్చరించుచు గడపవలెనని కాదు. అట్లు కాదు. ఏ పరిచర్య చేయుటకైనా ఒక సమయము, సందర్భము ఉన్నవి. అయితే ఈ విషయములలో మన బాధ్యతను మనము గుర్తించవలసియున్నది.
యేసుప్రభువు ఆయన శిష్యులకు ఈ పరిచర్య గూర్చియే బహుశా ప్రభురాత్రి భోజన సమయమందు ''మీరును ఒకరి పాదములను ఒకరు కడుగ వలసినదే'' (యోహాను 13:14) అని చెప్పియుందురు. వారు పాదములు చాలా వరకు బయటకు కనిపించు జోళ్ళు మాత్రమే ధరించి, ధూళితో నిండిన దారిపై నడచిన తరువాత, వారి కాళ్ళు కడుగబడుట వారికి తాజాతనమును మరియు శుభ్రతను ఇచ్చియుండును.
అదే విధముగా, ప్రోత్సాహపరచుట ఒక బలహీనుడును నిరుత్సాహముతో నుండిన సహోదరునికి నూతన ఉత్తేజమును మరియు దిద్దుబాటు త్రోవనుండి తప్పి పోయిన సహోదరునికి శుభ్రతను తెచ్చును. మనము ఇతరుల కాళ్ళు కడుగుటకు మరియు వారు మన కాళ్ళు కడుగుటకు యిష్టపడవలెను.
ఇతరులను ప్రోత్సహించుట
పౌలు మరియు బర్నబాలు వారు స్థాపించిన సంఘములలో శిష్యుల యొక్క ఆత్మలను ప్రోత్సహించుట ద్వారా బలపర్చిరి, అని వ్రాయబడినది (అపొ.కా. 14:22).
మనము కూడా ఇతరులను ప్రోత్సహించు పరిచర్య ద్వారా బలపరచవచ్చును.. కేవలము వాక్యమును బోధించుట ద్వారా మాత్రమేకాక, ఎక్కడ సమంజసమో అక్కడ వారిని ప్రశంసించుట ద్వారా కూడా బలపరచవచ్చును.
ఎక్కడ సమంజసమో అక్కడ మెప్పుకోలు మాటను యేసు ప్రభువు ఎప్పుడూ వెంటనే చెప్పేవాడు. ఆయన ఒక శతాధిపతిని అతడి విశ్వాసమును గూర్చి (మత్తయి 8:10), పశ్చాత్తాపపడిన ఒక స్త్రీని ఆమె ప్రేమను గూర్చి మెచ్చుకున్నారు (లూకా 7:47). మరియు బేతనియకుచెందిన మరియను ఆమె అంకితభావమును గూర్చి మెచ్చుకున్నారు (లూకా 10:42; మార్కు 14:8,9). ఓడిపోతున్న తన శిష్యులతో ఆయన ఈ విధంగా చెప్పారు: ''నా శోధనలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే'' (లూకా 22:28).
పౌలు సంఘములకు చివరకు ఎంతో లోక సంబంధమైన వాటికి పత్రికలు వ్రాయుచుండినప్పుడు సాధారణముగా ఆయన వారిలో మెచ్చుకొనదగిన దానిని చూచేవారు. ముఠాలలో చిక్కులు, వ్యభిచార సంబంధమైన గొడవలతో నుండిన కొరింథులో నుండిన సంఘమునకు పౌలు ఈ విధముగా పత్రిక ప్రారంభించారు.
''క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరము నందును లోపము లేక మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు'' (1కొరింథీ 1:4-9).
దాని తరువాత మాత్రమే ఆయన ''కాని సహోదరులారా, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను, ఏక తాత్పర్యముతోను, మీరు సన్నద్ధులైయుండ వలెననియు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను'' (10 వ).
పౌలు కొంత అనుకూల విషయములతో ప్రారంభించుటకు ప్రయత్నించుచుండెను. మనము కూడా అట్లే ఉండవలెను.
ఇది మనందరకు సహజముగా రాదు. మనలో ఎక్కువ మంది ఇతరులలో ప్రతికూలాంశములు మొదట చూచు అలవాటు కలిగి యుందుము. కాని మనము పరిశుద్ధాత్ముని క్రమశిక్షణ క్రింద లోబడినట్లయితే, ప్రతివారిలో ఏదొకటి మెచ్చుకొనదగినది మనము చూడగలుగునట్లు ఆయన చూపించును.
ఒక ఉపాధ్యాయుడు ఒకసారి ఒక చిన్న సిరా మరక మూలన ఉండిన ఒక పెద్ద తెల్లని కాగితమును, తన తరగతి వారి ముందు పరచి, పిల్లలను వారు ఏమి చూచుచున్నారో వ్రాయమని అడిగెను, వారందరు కూడా మలినము కాని ఆ పెద్దకాగితము కంటె దానిపై నుండిన చిన్న సిరా మరకను గూర్చి వ్రాసిరి. ఆ విధముగానే మానవ సంబంధములలో, మనము ఎక్కువగా ఇతరుల యొక్క చిన్న లోపములపై దృష్టిని కేంద్రీకరించి వారిలోనున్న మంచిని చూడము.
ఒకని యొక్క దృష్టిని మార్చుకొనుటకు ఎంతో స్థిరమైన పట్టుదల ఉండవలెను. కాని అదితగిన ప్రయోజనము నిచ్చును. క్రమేణ ఇతరులలో మంచి లక్షణములను గుర్తించుట అలవాటు వచ్చును. దాని తరువాత మెట్టు ఆ మంచి లక్షణములు ఎంత మెచ్చుకొనుచున్నామో అని వారికి చెప్పుటయైయున్నది.
నిజాయితీ
మన యొక్క మానవ బలహీనతలను మరియు పోరాటములను మన తోటి విశ్వాసులతో నిజాయితీతో ఒప్పుకొనుట చేత వారిని ప్రోత్సహించవచ్చును.
మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండుటకు పిలువబడితిమి. మన సాక్ష్యము విషయములో, మన జీవితముల గూర్చి తప్పుడు అభిప్రాయమును యిచ్చినట్లయితే, అప్పుడు మనము నిజానికి అబద్ధ సాక్షులుగా యున్నాము. విశ్వాసులలో ఎక్కువ మంది ఈ వర్గమునకు చెందిన వారుగా యుందురు. వారు ఇతరులకు వారి యొక్క గొప్ప విజయములు గూర్చి చెప్పుదురు, కాని వారి ఓటములను గూర్చి పోరాటములను గూర్చి ఒక్కమాటకూడా చెప్పరు. వారెప్పుడూ వారి ప్రార్థనలకు పొందిన జవాబులు గూర్చి సాక్ష్యమిచ్చుదురు. కాని వారి ప్రార్థనలకు జవాబు పొందని వాటి విషయము చెప్పరు. వారి అంతరంగములో నుండిన భయములు మరియు ఆందోళనలు లేక నిరాశ మరియు నిరుత్సాహము పొందిన సమయముల గూర్చి ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పరు. వారి యొక్క పర్వతమంత ఎత్తుకు ఎక్కిన అనుభవములను వివరించుదురు. కాని ఆ పర్వత శిఖరముల మధ్యనుండిన పొడవైన లోయలు గూర్చి ఎప్పుడూ అంతగా చెప్పరు. వారు అబద్ధ సాక్షులై యున్నారు. ఎందుకనగా వారు క్రైస్తవ జీవితము గూర్చి యదార్థముకాని దృశ్యమును చూపించుచున్నారు.
ఒక యౌవనక్రైస్తవుడుగా ఉన్నప్పుడు ఇతర క్రైస్తవుల నుండి ఎన్నో అటువంటి సాక్ష్యములను విని, దేవుని సంతోషపరచు జీవితమును జీవించుటకు పెనుగులాడుట గూర్చి నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. వారిలో ఏ ఒక్కరు కూడా ప్రసంగవేదిక పైనుండి కాని లేక వారు వ్యక్తిగతముగా మాటలాడినప్పుడు కాని, వారికి కూడా భయములు మరియు పరిష్కరింపబడని సమస్యలు మరియు జవాబు పొందని ప్రార్థనలు, లేక వారికి కూడా బైబిలులో అర్థముకాని విషయములున్నవని నాకు చెప్పలేదు. అందువలన అటువంటి సమస్యలు మరియు ప్రశ్నలు నాకు ప్రత్యేకముగా నుండినట్లు అనుకొనేవాడిని. దాని ఫలితముగా వారి సాక్ష్యములన్ని నన్ను కేవలము నిరుత్సాహ పరిచేవి మరియు ఆ నిరుత్సాహము నన్ను దేవుని యొద్దనుండి ఇంకా దూరముగా తీసుకుపోయేది.
అప్పుడు నేను అపొస్తలుడైన పౌలు ఎట్లు తరచు సందిగ్ధములో ఉండెనో, నిరాశలో ఉండెనో, ఆయన ప్రార్థనలలో కొన్నిటికి ఎట్లు అడిగినది పొందలేదో కొందరు రోగుల కొరకు ఆయన ప్రార్థించినను వారు ఎట్లు స్వస్థత పొందలేదో, ఆయనకు కూడా చివరకు ఎట్లు భయములుండెనో మరియు ఆయన క్రుంగి యుండినప్పుడు తోటి విశ్వాసులు ద్వారా ఎట్లు ఆదరింపబడెనో బైబిలులో చదివితిని (2కొరింథీ 4:8; 1:8; 12:8,9; 2తిమోతి 4:20; 2కొరింథీ 7:5,6). పౌలు యొక్క నిజాయితీ నా ఆత్మను లేవనెత్తినది మరియు నేను ముందుకు సాగిపోవుటకు ప్రోత్సహించినది.
ఇతరులు తన గూర్చి తప్పుడు అభిప్రాయము కలిగియుండవలెనని పౌలు ఎప్పుడూ కోరుకొనలేదు (2కొరింథీ 12:6). అందుచేత, తాను ఒక మానవుడే కాని దేవదూతను కానని చాలా మామూలు మాటలతో ఆయన వారికి చెప్పాడు. ఆయన తనకు తెలిసి యుండిన పాపమంతటిపై విజయముతో జీవించెను, కాని ఆయన అప్పటికీ పొరపాట్లు చేయుటకు అవకాశముండిన మరియు మాంస శరీర స్వభావము నిర్మూలముకాని మానవ మాత్రుడుగా యుండెను. పౌలు యొక్క గురి ఎప్పుడు, ఇతరుల మెప్పును పొందవలెనని కాక, ఎల్లప్పుడు వారికి సహాయము చెయ్యవలెనని యుండెను. ఆయనయొక్క మానవ నైజము గూర్చిన నిజాయితీ ద్వారా, అనేకులకు ప్రోత్సాహమిచ్చు పనిముట్టుగా ఆయన మారెను.
ఇతరులకు మంచి అభిప్రాయము కలుగజేయవలెనను కోరిక మనలో అనేకులను మన యొక్క పోరాటములు మరియు చింతలు గూర్చి నిజాయితీతోఉండుటకు ఇష్టపడకుండా జేయును. దేవునితో దగ్గరగా నడచు విషయములో మనము వారికి సహాయపడుటకు నిజముగా ఆసక్తి కలిగిలేమని ఇది చూపించుచున్నది. మనము వారి యెదుట ఉంచిన అందుబాటులో లేని ప్రమాణముల వలన వారు నిరుత్సామము పొందుదురని మనకు ఆలోచన లేదు. మనలను గొప్పగా వారు చూచినంత వరకు మనము చాలా సంతృప్తి కలిగి యుందుము.
పరిశుద్ధాత్మ, ఇతరులను ప్రోత్సహించుటకు మనలను కాలువలుగా చేయుట కొరకు మనము ధర చెల్లించవలసి ఉన్నది- అది నిజాయితీ అనే ధర.
నిజమైన క్రైస్తవ సహవాసము వెలుగుపై ఆధారపడి యుండవలెను. మనము వెలుగులో నడుచుటకు యిష్టపడునప్పుడు మాత్రమే మనము ఒకరితో ఒకరు నిజమైన మరియు లోతైన సహవాసములో నడువగలము. దీనిలో అన్నివిధములైన నటన మరియు వేషధారణను విడిచిపెట్టి మనము నిజానికి ఎట్లున్నామో ఒకరియెడల ఒకరు అట్లుండుటకు యిష్టము కలిగి యుండుటైయున్నది. క్రైస్తవులు ఒకరి యెడల ఒకరు ఈ విధముగా నడువవలెనని దేవుడు ఉద్దేశించెను. ఆది సంఘములో దేవునిచేత బహిరంగముగా శిక్షింపబడిన పాపము వేషధారణ అని జ్ఞాపకముంచు కొనుడి (అపొ.కా. 5:1-14. అననీయ సప్పీరాల గూర్చి వ్రాయబడిన భాగమును చూడండి).
పాపము మనమందరము మనయొక్క పరస్పర సంబంధములలో ముసుగులు ధరించు కొనునట్లు చేయును. మనము ఎలా ఉన్నామో అట్లు తెలియబడుటకు మనము భయపడుదుము మరియు సిగ్గుపడుదుము. మనము ముసుగులు ధరించిన జనులతో నిండియుండిన లోకములో జీవించుచున్నాము మరియు జనులు క్రైస్తవులుగా మారినప్పుడు, వారు వారి యొక్క ముసుగులు తీసివేయరు. వారు వారి యొక్క ముసుగులు ధరించి కూటములకు వెళ్ళుదురు మరియు ఇతరులను కలుసుకొందురు మరియు దానిని వారు సహవాసమని పిలుచుదురు. కాని అటువంటి సహవాసము ఒక సహవాసము కాదు. అయినప్పటికీ అనేకమంది క్రైస్తవులు కేవలము దానితో సంతృప్తి పొందేటట్లు సాతాను చేయును.
మనలో ఎవరైనా మన ముసుగులను సంపూర్తిగా తీసివేయుట అసాధ్యమైనదన్న విషయము యదార్థము. పాపముతో నిండిన లోకములో జీవించుట మరియు పరిపూర్ణము కాని ఒక సంఘములో సహవాసములో ఉండుట మరియు మనకుండిన మాంసశరీరముతో కట్టుబడియుండుట వలన ఇతరులతో సంపూర్తిగా నిజాయితీ కలిగియుండుట సాధ్యము కాదు మరియు కోరుకునేది కూడా కాదు. మనలను మనము సంపూర్తిగా చూచుకొనలేము కాబట్టి, సంపూర్ణమైన నిజాయితీ సాధ్యము కాదు. అది యితరులకు ఆటంకముగా ఉండవచ్చు కాబట్టి అది అట్లుండమని చెప్పుట కూడా మంచిది కాదు.
నిజాయితీగా ఉండుటలో తప్పనిసరిగా మనకు జ్ఞానము అవసరమైయున్నది. కాని మనము మనలో లేని దానిని ఉన్నట్లు ఎల్లప్పుడు చూపకూడదు. అది వేషధారణ మరియు వేషధారణను యేసుప్రభువు ఎప్పుడూ ఖండించారు.
స్వనీతి, పరిసయ్యతత్వపు వైఖరి అనేక క్రైస్తవులను ఇతరులకు సహాయ పడువారుగా మరియు ప్రోత్సహించేవారిగా ఉండుటకు ఆటంకపరిచేదిగా యుండును. మన తోటి విశ్వాసులు మరియు ఇతరులు మన యొద్దకు వచ్చుటకు స్వేచ్ఛగా యుండునట్లును మరియు వారి ''తల బరువు దించుకొనుగలుగునట్లును'' మరియు వారి యొక్క భారము దించుకొనగలుగునట్లును భావించగలిగి ఉండవలెను, ఇతరులను సానుభూతితో అర్థము చేసుకొందుమని, అంతేకాని వారి యొక్క అజ్ఞానము బట్టి లేక వారి యొక్క ఓటములను బట్టి వారు తృణీకరింపబడరని వారు అనుకొనేటట్లు ఉండవలెను.
లోకము ఒంటరియైన, ఏమి జరుగునో అనే ఉద్వేగముతో నుండిన, భయకంపితులైన మరియు నరముల బలహీనతతో నుండిన వారితో నిండియున్నది. వారి సమస్యలకు జవాబు క్రీస్తు యొద్ద ఉన్నది. కాని ఆ జవాబు తన శరీరమైన సంఘము ద్వారా రావలెను. కాని, అయ్యో, ఎందరో క్రైస్తవులు ఎంతో స్వనీతిపరులు మరియు యదార్థతలేని వారుగా యుండి అవసరములో నుండిన జనులను తరిమివేయు వారుగా నున్నారు.
కీత్‌మిల్లర్ 'ది టేస్ట్ ఆఫ్ న్యూ వైన్' అను పుస్తకములో, ''మన నవీన సంఘము పవిత్రముగా కనుబడుచు, పవిత్రముగా వినబడుచు, అంతరంగములో వారి బలహీనతలతో వారి యొక్క భంగపాటులతో మరియు వారి చుట్టూ ఉన్న యదార్థత లేని వారితో విసిగివేసారిన వారితో నిండియున్నది. మన క్రైస్తవేతరులైన స్నేహితులు, 'అక్కడ యుండిన యిబ్బందులు లేని జనులు నా సమస్యలను ఎప్పటికీ అర్థము చేసికొనలేరు' అనైనా అనుకొందురు లేక క్రైస్తవులమైన మనము ఏ యిబ్బందులు లేనివారమనియు మరియు మానవ సమస్యలు గూర్చి తెలియని వారమనియు లేక సంపూర్తిగా వేషధారణ కలవారమనియు, మన గురించి లేక మన పరిస్థితులు గురించి బాగుగా తెలిసిన అన్యజనులు అనుకొందురు''.
ఇతరులతో వ్యక్తిగతమైన స్థాయిలో నిజాయితీతో సహవాసము చేయుట అనగా ఏమిటనేది మనము తెలుసుకొనవలసి యున్నది మరియు మనమందరము ఒక్క వ్యక్తితో ప్రారంభించవలసియున్నది.
ఈ నిజాయితీతో కూడిన సహవాస విషయములో ప్రమాదములు ఉన్నవి. వాటిని మనము తెలుసుకొనినట్లయితే మనము వాటినుండి దూరముగా తొలిగిపోవచ్చును. మన సహాయము కొరకు కొన్ని మార్గదర్శకములు.
అన్నిటికంటె మొదటగా, అటువంటి సన్నిహితముగా నుండే సహవాసము ఒకే లింగము (పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో) వారి మధ్య మాత్రముండవలెను. మనము పతనమయిన లోకములో ఉన్నామనియు మరియు ఈ శరీర స్వభావము (పాపము చేయుటకు ప్రేరేపించు) మనందరిలో ఇప్పటికిని ఉన్నదనియు మనము మరచి పోకూడదు. అందువలన, ఎవరైనా వివాహ సంబంధములో తప్ప, వ్యతిరేకలింగముతో (పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషునితో) సన్నిహితమైన సహవాసమును ప్రయత్నించి, అభివృద్ధి చేసికొనుట చాలా ప్రమాదకరమైన విషయము, అటువంటిది చేయుటకు ప్రయత్నించువారు, తప్పక ఏదొక పాపములో పడుదురు.
రెండవదిగా, మనము మనయొక్క సహవాసము గూర్చి, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన విషయములను పాటించవలెను, అంతేకాక మానసిక ఆలోచననుబట్టి నడిపింపబడుటకు తిరస్కరించవలెను. పరిశుద్ధాత్మ మన సహవాసమును అదుపు చేయువారుగా ఉండవలెను మరియు ఆయన మనలను ఒకరికొకరు ఏ ప్రయత్నము లేకుండానే దగ్గరగా నడిపించుటకు అనుమతించవలెను. మనమెప్పుడు ఎవరిని కూడా కృత్రిమమైన నిజాయితీ కలిగియుండునట్లు బలవంతపెట్టకూడదు.
మూడవదిగా, మన సహవాసము యొక్క గురి ఒకరి పాపములు ఒకరి కొకరము ఒప్పుకొని వాక్యానుసారము కాని ఒక విపరీతమైన ఊరట పొందుట కొరకు కాదని జ్ఞాపకముంచు కొనవలెను. మన పాపములను ఎవరో ఒకరికి లేక ప్రతి ఒక్కరకు ఒప్పుకొనవలెనని బైబిలు ఎక్కడా ప్రోత్సహించలేదు. మనము ఎవరి మధ్యను పాపము చేసామో వారి మధ్యనే మనము పాపమును ఒప్పుకొనవలెను. మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినట్లయితే, మనము దేవునికి మాత్రమే మన పాపమును ఒప్పుకొనవలెను. మనయొక్క పాపము ఒక వ్యక్తికి వ్యతిరేకముగా లేక ఒక గుంపుకు వ్యతిరేకముగా అయినట్లయితే, అప్పుడు వారి యొద్ద కూడా ఒప్పుకొనవలెను. కాని మన పాపములను మన తోటి విశ్వాసులందరియెదుట ఒప్పుకొనకూడదు. అలా ఒప్పుకొనుట అవసరము లేదు. అలా ఒప్పుకొన్నట్లయితే మనము ఇతరుల యొక్క మనసులను కల్మషపరచి మరియు అటువంటి పాపము చేయుటకు వారిని ప్రోత్సాహపరచుట ద్వారా ఇతరులకు ఆటంకముగా కూడా యుండవచ్చును. మనము క్రీస్తు శరీరమును కట్టవలసియున్నది. నీవు దానిని పడగొట్టకుండా చూచుకొనుము. మనము ఒకరికొకరు ప్రోత్సహించుకొనుచు మరియు హెచ్చరించుకొనుచు నుండవలెను, కాని ఒకరికొకరు పాపములు ఒప్పుకొనకూడదు.
క్రొత్త నిబంధనలో ఒకరికొకరు మన దోషములను ఒప్పుకొనవలెనని చెప్పబడిన విషయము (యాకోబు 5:16) శారీరక స్వస్థత గూర్చియని ఆ సందర్భము స్పష్టముగా తెలియజేయుచున్నది. రోగము కొన్నిసార్లు ఒప్పుకొనని పాపము వలన కూడా కలుగును. కనుక పెద్దలముందు పాపము పూర్తిగా ఒప్పుకొనినట్లయితే స్వస్థత ఆలస్యము కాదని యాకోబు చెప్పాడు. ఆ ఆజ్ఞను ఆ సందర్భము నుండి వేరుగా తీసి, అందులో లేని విషయమును అన్నిటికి వర్తింపచేయకూడదు. ''ఒక విషయమును దాని సందర్భమునుండి బయటకు తీసి చెప్పినది కేవలము ఒక సాకు మాత్రమే'' అయ్యుండును అని జ్ఞాపకముంచుకొనండి.
ఒక బుద్దిహీనమైన నిజాయితీ క్రీస్తుయొక్క సాక్ష్యమునకు హాని చేయును మరియు అది అనవసరమైన గాలికబుర్లకు అవకాశమిచ్చును. ఒక సంఘములో ముగ్గురు పరిచారకులు ఒకరితో ఒకరు నిజాయితీగల సహవాసము కలిగి యుండవలెనని నిర్ణయించు కొనుట గూర్చి వినిన ఒక కథ నాకు జ్ఞాపకముండినది. ఒకడు తన బలహీనత ధనము అని మరియు అతడు సంఘపు ధనమునుండి దొంగిలించు చుండెనని చెప్పెను. ఇంకొకరు తన బలహీనత లైంగిక వాంఛయని మరియు అతడు సంఘములో పలాన స్త్రీతో పాపములో జీవించుచుండెనని ఒప్పుకొనెను. మూడవవాడు ''నా బలహీనత ముచ్చట్లు మాట్లాడుట: మరియు మనము మాట్లాడుకొనుట ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు బయటకు వెళ్ళుదునా అని చూచుచున్నాను'' అని చెప్పెను!
''కొండెగాడై తిరుగులాడు వాడు పరులు గుట్టు బయటపెట్టును'' (సామెతలు 20:19) అని బైబిలు చెప్పుచున్నది. సంఘములో కూడా నియమనిబంధనలు లేని వారుందురు అందువలన నీకుకాని లేక ఇతరులకుకాని ''జ్ఞానములేని నిజాయితీతో'' యిబ్బందికరమైన పరిస్థితి లేకుండా జాగ్రత్తపడుము. సహవాసములో వేరొకరితో నీవు ఎంత నిజాయితీతో ఉండవలెననే విషయములో నీకు సందేహము నుండినట్లయితే, ఎక్కువ చెప్పుట కంటె తక్కువ చెప్పియున్నావన్న తప్పిదములో నుండుట మేలు.
మనము దేవుని వాక్యము యొక్క బోధను హత్తుకొని యుండినట్లయితే మనము సురక్షితముగా యుందుము.
నాల్గవదిగా, మనము మన ఉద్దేశ్యములను గమనించవలెను. మనము ఇతరులతో ''నిజాయితీ'' గా యుండుటమనునది మనలను దీనులైన పరిశుద్ధులుగా మనయొక్క పేరును పెంచుటకు ఉద్దేశించినట్లయితే అది హేయమైనది. విశ్వాసులు వారి యొక్క కొన్ని ''గౌరవప్రదమైన పాపములను'' (''నేను తగినంతగా ప్రార్థించుటలేదు'', ''ఇవ్వవలసినంతగా సాక్ష్యమిచ్చుట లేదు''. ''నేను ఇంకా కనికరము కలిగియుండవలసి యున్నది'' అట్లు విసుగు పుట్టేటంతగా ఎన్నో) బహిరంగముగా ఒప్పుకొనుట నేను వినియున్నాను. అవి వారిని పాపులుగా కాక మరియు ఎక్కువ పరిశుద్ధులుగా కనబడునట్లు చేయును. అయితే, అది వారి యొక్క ఉద్దేశమైయున్నది (అది తెలిసీ లేక తెలియక). తమ తోటి విశ్వాసుల నుండి వారి యొక్క 'నిజాయితీ' గూర్చి ఆమోదమును పొందుట కొరకై యున్నది. అటువంటి 'దీనత్వముతో కూడిన గర్వము'ను బట్టి జాగ్రత్తపడుడి.
ఐదవదిగా, మనతో యితరులు పంచుకొనిన వారి రహస్యములు పవిత్రమైన నిధియై యున్నది. వాటిని ఎప్పుడూ బయట పెట్టి మోసగించువారుగా యుండకూడదు. యితరులు వారి గూర్చి లేక యితరుల గూర్చి మనతో పంచుకొనిన అటువంటి విషయములను ''ప్రార్థనా విన్నపములు''గా కూడా ఎప్పుడూ పంచుకొనకూడదు. ''నేను ఇది కేవలము ప్రార్థన కొరకు పంచుకొనుచున్నాను'' అని చెప్పే భక్తి రూపమైన గొడుగు క్రింద చుట్టూ ప్రచారమయ్యే ముచ్చట్లు వినుట దిగ్భ్రాంతిని కలిగిస్తుంది.
ఆరవదిగా, ఒకరు మనతో వారి హృదయములో నుండిన దానిని పంచుకొనినప్పుడు మనము అనారోగ్యకరమైన మరియు శరీరసంబంధమైన ఉత్సుకతను తప్పించుకోవలెను. మనము పరులజోలికి పోవువారుగా నుండకూడదని (1పేతురు 4:15) దేవుని వాక్యములో హెచ్చరింపబడి యున్నాము. మనము జనుల వ్యవహారము లోనికి తొంగి చూచువారుగా నుండకూడదు. సహవాసము విషయములో మన గురి ఇతరులకు సహాయము చేయునట్లుగా యుండవలెను అంతేకాని అతడి దోషములను మరియు పాపములను తెలిసికొనుటకుకాదు.
చివరగా, మన విషయములను మన మధ్య పంచుకొనునప్పుడు మరియు మన సహవాసములోను దేవుడు మన మధ్య నుండునట్లు మనము దేవుని అడగాలి. మనము పంచుకొనునప్పుడు ఆయన సన్నిధి మాత్రమే మనలను కాపాడగలదు. శిరస్సైన క్రీస్తు మన మధ్య లేకపోయినట్లయితే మన సహవాసము దేవునియొక్క ఉద్దేశ్యమును నెరవేర్చని ఐహికసంబంధమైన అభ్యాసముగా దిగజారిపోవును.
నిజమైన క్రైస్తవసహవాసములో ప్రతి సభ్యుడు వేరొకరిని ప్రోత్సహించవలసి యున్నది. ఎక్కడైతే దీనిని అభ్యాసము చేయుదుమో అక్కడ, సహవాసము యొక్క బంధములు తీపిగా మారును మరియు బలపడును.
ఇతరులను హెచ్చరించుట
శరీరములో తోటి సభ్యుల యెడల నమ్మకత్వము, వారు ప్రక్క త్రోవపట్టుట చూచినప్పుడు మనము వారిని ప్రేమతో హెచ్చరించుటను మరియు సరిదిద్దుటను కోరుచున్నది. నిజమైన ప్రేమ ఒక సహోదరుడు పర్వతశిఖరము పైనుండి పడిపోవుచుండినప్పుడు, సంతుష్టిగా మౌనముగా వెనుక కూర్చొనలేదు.
''నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దించవలెను'' (లేవీ 19:17) అని బైబిలు చెప్పుచున్నది.
అంతటా తిరిగి ప్రతివారి తప్పిదములను వారికి ఎత్తి చూపవలెనని బైబిలు చెప్పుట లేదు. మనతో సహవాసముయొక్కబంధము స్థిరపడిన వారిని మాత్రమే మనము దిద్దుబాటు చేయవలెను. లేనట్లయితే మనయొక్క మందలింపు తప్పుగా అర్థము చేసికొనబడి మేలు కంటే ఎక్కువ కీడు చేయును.
ఒక వ్యక్తిని అతడి సుగుణముల విషయములో మనము ఎప్పుడూ మెచ్చుకొననప్పుడు, అతడి తప్పిదములు విషయములో సరిదిద్దుట ఎప్పుడూ చేయకూడదు. ఒకని తప్పిదములను చూపించుటకు మెప్పుకోలుగా చెప్పిన మాటలు మంచి అవకాశమునిచ్చును. పౌలు కొరింథులో క్రైస్తవులకు పత్రిక వ్రాసినప్పుడు ఈ పద్ధతిని అనుసరించుటను మనము ఇప్పటికే చూచి యున్నాము.
అదే విధముగా దిద్దుబాటును ఖచ్చితముగా తిరస్కరించుదురని తెలిసిన వారికి దిద్దుబాటు ఇవ్వకుండా నిగ్రహించుకొనవలెను. ''అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానము కలుగును. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును'' (సామెతలు 9:7,8) అని బైబిలు చెప్పుచున్నది.
మనము ఇతరుల నుండి దిద్దుబాటును తీసుకొనుటకు యిష్టపడనప్పుడు, మనమెవరికి ఎప్పుడును దిద్దుబాటును యివ్వకూడదనే విషయము చెప్పనవసరము లేదు.
అయినప్పటికిని, నీ సహోదరులను దిద్దుబాటు చేయవలసిన పరిస్థితులుండును. ''నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము'' అని యేసుప్రభువు చెప్పాడు (లూకా 17:3). ఒక సహోదరుని దిద్దుబాటు చేయుట, అతడిని క్షమించుట వంటివి పవిత్రమైన బాధ్యతయైయున్నది. మనము దేనిని నిర్లక్ష్యము చేయకూడదు.
మత్తయి సువార్త 18:15-34లో యేసు ఈ రెండు అంశములైన దిద్దుబాటు చేయుట మరియు క్షమించుట గూర్చి ఎంతో మాట్లాడారు. దిద్దుబాటును గూర్చి, ''నీ సహోదరుడు నీ యెడల తప్పిదము చేసిన యెడల, నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతని గద్దించుము; అతడు నీ మాట వినిన యెడల, నీ సహోదరుని సంపాదించు కొంటివి. అతడు వినని యెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంట బెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని యెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు వినని యెడల అతడు నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము'' (మత్తయి 18:15-17) అని యేసు చెప్పెను.
''లోలోపల ప్రేమించుట కంటె బహిరంగముగా గద్దించుట మేలు''. మరియు ''నాలుకతో ఇచ్చకములాడు వాని కంటె నరులను గద్దించు వాడు తుదకు ఎక్కువ దయ పొందును'' ఎందుకనగా ''ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును'' అనియు నీవు కనుగొందువు (సామెతలు 27:5; 28:23; 26:28).
ఏమైనప్పటికి మనము మన తోటివిశ్వాసులకు ఎటువంటి ఆత్మతో గద్దింపును యిచ్చుచున్నామను విషయములో జాగ్రత్త కలిగియుండవలెను. మనము ''ఇతరులను పరీక్షించు ధర్మకర్తలు (న్యాయవిచారణ చేసేవారు)''గా నుండుటకు పిలువబడలేదు. లేనట్లయితే, మనము దేవునిచే తీవ్రముగా తీర్పుపొందుదుము (యాకోబు 3:1). ఇతరులు వారి గృహములను ఎట్లు నడిపించుకొనవలెను లేక వారు ఎటువంటి జీవన ప్రమాణములతో జీవించవలెనో చెప్పుటకు మనమిక్కడ లేము. మనకున్న శరీరానుసారమైన స్వభావములను బట్టి మనలో అనేకమంది ఇతరుల విషయములలో జోక్యము చేసుకొను వారుగా యుంటిమి. కొందరు ఇతరులను తిన్నగా చేయుటకు పిలువబడినట్లు తమనుతాము నియమించుకొనిన ''ప్రవక్తలు'' అనుకొనుట చేత కొందరు దేవుని నుండి తొలగిపోయిరి.
మన పిలుపు క్రీస్తు శరీరమును కట్టుటై యున్నది. మనము ఎవరికైనా యిచ్చినా దిద్దుబాటు ఈ గురితో నుండవలెను. అట్లు లేనట్లయితే, మనము మౌనముగా నుండుట ద్వారా ఎంతో మేలు చేయుదుము.
ఇతరులకు సాధ్యమైనంత వరకు అనుకూలమైన తీర్పును ఇచ్చుటకు చూచి వాస్తవములన్నింటిని సరిగా ఉండునట్లు మనము చూచుకొనవలెను. దానిని చేసిన తరువాత ''సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములను నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై యుండి తాను ఎన్నికైన వాడినని యెంచుకొనిన యెడల తన్ను తానే మోసపరచు కొనును'' (గలతీ 6:1-3) అని యివ్వబడిన హెచ్చరికకు బాధ్యతగా లోబడవలసి యున్నది.
ఈ ఆజ్ఞ విశ్వాసులందరకు ఉద్దేశించి యివ్వబడలేదు కాని ''భక్తి'' గలవారికి లేక ''ఆత్మీయముగా'' ఉన్న వారికే యివ్వబడినది. తన సహోదరుని కంటిలో ఉండిన నలుసును తీయుటకు అడుగు ముందుకు వేయుటకు ముందు, తన కళ్లలో నుండిన దూలములను మొదట తీసుకొను వాడే ఆత్మీయమైన వాడు (మత్తయి 7:1-5). ఒక ఆత్మీయమైన మనుష్యుడు తన సహోదరుడు పడినటువంటి పాపములో తాను కూడ పడు అవకాశముందని కూడా గుర్తించగల దీనుడు (గలతీ 6:1; 1కొరింథీ 10:12).
అంతేకాక, ''నలుసు తీయువాడు''గా ఆసక్తి కలవాడు ఆత్మీయముగా మాత్రమే కాకుండా మృదువుగా కూడా ఉండవలెను. ఎందుకనగా, ఒకరికంటి నుండి నలుసును తీయుట అనేది సున్నితమైన పనియై యున్నది. దురుసుగా, మొరటుగా ప్రయత్నించినట్లయితే, ఆ నలుసు ఇంకా కంటి లోపలికి వెళ్లిపోయే ప్రమాదమున్నది. అట్లు మంచి కంటె ఎక్కువ నష్టము జరుగును.
ఆత్మానుసారుడైవాడు ప్రార్థించి సరియైన వైఖరిని పొందిన తరువాత వేరొకరితో నమ్మకముతో మాట్లాడును, దాని వలన తన గద్దింపును బట్టి తన సహోదరుడు బాధపడిన దానికంటె తన సహోదరుడు పడిపోయిన స్థితిని బట్టి అతడు ఎక్కువ బాధనొందును. ''ఒకని భారములను ఒకరు భరించుట'' (గలతీ 6:2) అను దానికి అర్థము ఇది.
ఆత్మానుసారుడైన మనుష్యుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడును. ''ఆత్మానుసారుడు'' అను మాటకు అది అర్థము. అతడు గద్దింపును యిమ్మనమని, అంతరంగములో ఆత్మచేత సాక్ష్యమును పొందినప్పుడు మాత్రమే అట్లు చేయునని తెలియజేయుచున్నది. ఎందుకనగా ''ప్రతి దానికి సమయమున్నది;'' ''మౌనముగా నుండుటకు మాటలాడుటకు'' (ప్రసంగి 3:1,7) అని బైబిలు చెప్పుచున్నది. శరీరములో వేరొక సభ్యుని యొద్దకు ఒక గద్దింపు మాటతో వెళ్ళుటకు సరియైన సమయమును తెలిసికొనుటకు మనము శిరస్సుతో సన్నిహితమైన సంబంధము కలిగియుండవలెను. శిరస్సుతో అటువంటి సన్నిహిత సంబంధము కలిగిన వారే అటువంటి పరిచర్యను చేయగలరు.
క్రీస్తు యొక్క శరీరములో సభ్యులుగా, ఒకరి కొకరు గద్దించుకొనుట పవిత్రమైన బాధ్యతయై యున్నది. మన కంటిలో నుండిన దూలమును తీసివేసిన తరువాత మన సహోదరుని కంటిలో నలుసును తీయుటకు వెళ్లవలసిన బాధ్యత మన కుండినదని యేసు చెప్పారు (మత్తయి 7:5). మన కన్నులు శుభ్రపడిన తరువాత మనము వెనుకకు జారబడి కూర్చొనకూడదు. లేక కేవలము కంటిలో నలుసును ఎత్తి చూపుటకు మాత్రము మనము మన సహోదరుని యొద్దకు వెళ్ళకూడదు. దానిని తీసివేయుటకు సహాయపడుట మన యొక్క బాధ్యతయైయున్నది. దీని అర్థము మనము అతడి ప్రక్కన నిలువబడి ఆ నలుసును తీసివేయుటకు మనము సహకరించవలసి యున్నది.
ప్రోత్సాహమును పొందుకొనుట
సహవాసము, మనము మరల మరల చూచినట్లు, అది రెండు వైపుల విషయమై యున్నది. మానవ శరీరములో ప్రతి అవయవము శరీరములో ఇతర భాగముల నుండి సహాయమును తీసుకొనవలసి యున్నది. మరియు సహాయమును యివ్వవలసి యున్నది. క్రీస్తుయొక్క శరీరములో కూడా అంతే.
ఇతరుల యొద్దనుండి ప్రోత్సాహమును పొందు అవసరతను ఒప్పుకొనుటకు మనలను మనము తగ్గించుకొనవలసి యున్నది. ఇతరుల నుండి ఎటువంటి ప్రోత్సాహము అక్కరలేకుండా కొనసాగగలనని చెప్పేది ఒక గర్వముగల ఆత్మ. మనము నిజాయితీగా యుండినట్లయితే, మనము ప్రోత్సాహము పొందినప్పుడు మనము ఎంతో మంచిగా జీవించగలిగామని మరియు పని చేయగలిగామని ఒప్పుకొనవలసి యున్నది. మనలో ప్రతి ఒక్కరికి ప్రోత్సాహము కావలసి యున్నది.
రోమాలో నుండిన యౌవన క్రైస్తవులకు వ్రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు వైఖరిని గమనించండి. ''మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను'' (రోమా 1:11,12) అని వ్రాసెను.
శరీరములోని సభ్యులు ఒకరి యెడల ఒకరు ఎట్లు పని చేయవలసి యున్నదో అక్కడ స్పష్టమైన మాదిరి యున్నది. పౌలు గొప్ప అపొస్తలుడైయుండి కూడా ఆయనకు అనుభవము మరియు పరిపక్వత ఎంతో యుండినా, రోమాలో నుండిన యౌవన క్రైస్తవులనుండి సహాయము మరియు ప్రోత్సాహము పొందు అవసరతను గుర్తించి యుండెను.
మనకు కూడా వేరొకరినుండి సహాయము మరియు ప్రోత్సాహము అవసరమై యున్నది.
మందలింపును పొందుకొనుట
మనము యితరుల నుండి హెచ్చరిక లేక మందలింపును పొందుకొనుటకు తగిన దీనత్వమును కలిగియుండవలెను. మనందరిలో తప్పులుండును. అంతకంటె భయంకరమైన విషయము, మనందరిలో దృష్టి లోపములుండును. కనుక మనము మనలో నుండిన తప్పులను యితరులు చూచినంత స్పష్టముగా చూడలేము.
ఇక్కడనే, మనము సహాయము పొందుటకు యిష్టపడినట్లయితే, శరీరములోని యితర సభ్యులు మనకు సహాయపడగలరు. అయితే, వారు గర్వముతో నుండిన, వినుటకు యిష్టపడని ఆత్మను మనలో గమనించినట్లయితే మనలో వారు చూచేది, వారు ఎప్పుడూ వచ్చి మనకు చెప్పరు, అందువలన మనము మాత్రమే నష్టపోవుదుము.
పేతురు రాజీ పడుటను చూచినప్పుడు, ఆయనను గద్దించు విషయములో పౌలు నమ్మకముగానుండెను. పౌలు చేసినది సరియైనదని యెంచి పౌలు యొక్క గద్దింపును అంగీకరించునట్లు పేతురు తన్ను తాను తగ్గించుకొనెను. దాని ఫలితముగా యితరులు దీవింపబడిరి మరియు క్రీస్తు యొక్క శరీరము కట్టబడినది (గలతీ 2:11-16). అక్కడ పౌలు మౌనముగా నుండినట్లయితే లేక గద్దింపు మాట వినుటకు పేతురు గర్వముతో (ఒక మొదటనుండి ఉండిన అపొస్తలునిగా) తిరస్కరించినట్లయితే ఎటువంటి ఆత్మీయమైన నష్టము జరిగి యుండును!
మనలను గద్దించుటకు మాటలుండిన వాని నుండి మనము వినుటకు సిద్ధముగా యుంటిమా? లేక మన వైఖరిద్వారా మాకు ఎటువంటి విమర్శ వద్దని యితరులకు సూచించుచున్నామా? శరీరములో నుండిన యితర సభ్యుల సలహాతో మన యొద్దకు వచ్చుటకు కష్టముగా భావించినట్లయితే శిరస్సైన క్రీస్తు కూడా మనకు చెప్పుటకు కష్టముగా భావించుట సాధ్యమే.
మన ఆత్మీయ స్థితికి ఒక స్పష్టమైన పరీక్ష విమర్శకు మన వైఖరి ఎట్లుండును అనేదిగా యున్నది.
దీని విషయము బైబిలు చెప్పునది ఇక్కడ యివ్వబడినది.
''బుద్ధి హీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు!...ఉపదేశమును అంగీకరించు వాడు జీవమార్గములో ఉన్నాడు...నీవు నేర్చుకొనుటకు నీకు నేర్పబడవలసి యున్నది. గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు....శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్య్రతలు ప్రాప్తించును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును...జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును....ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. బంగారు కర్ణ భూషణమెట్టిదో....విను వాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు.....మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును'' (ప్రసంగి 7:5; సామెతలు 10:17; 12:1; 13:18; 15:32; 21:11; 23:12; 25:12; 27:6).
ప్రతి సభ్యుడు ఇచ్చుట మరియు పుచ్చుకొనుటలో తన బాధ్యతను నెరవేర్చినప్పుడు క్రీస్తుయొక్క శరీరము నిర్మింపబడును.
దేవునిరాజ్యము యొక్క ధర్మములు భూలోకరాజ్యముల యొక్క ధర్మములకు భూమి నుండి పరలోకము ఎంత వ్యత్యాసముగా ఉండునో అంత వ్యతిరేకముగా ఉండును (యెషయా 55:8,9).
భూమిపై, ఇతరులపై అధికారము చెలాయించే నాయకులను ఉన్నతమైన వారుగా పరిగణింతురు మరియు లోబడువారిని తక్కువైన వారుగా చూచెదరు. కాని, అది క్రీస్తు శరీరములో సరిగ్గా వ్యతిరేకముగా నుండును.
క్రీస్తు శరీరము యొక్క ధర్మములు,
''క్రీస్తు నందలి భయముచేత ఒకనికొకడు లోబడి యుండుడి'' (ఎఫెసీ 5:21).
''ఎదుటి వాని యెడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి'' (1పేతురు 5:5).
మరియు ''ప్రేమ కలిగిన వారై యొకని కొకడు దాసులై యుండుడి'' (గలతీ 5:14) అని మనలను పిలుచుచున్నవి.
ప్రతి సభ్యుడు వేరొకరికి లోబడుటకు మరియు సేవ చేయుటకు పిలువబడెను. ''ఇది ఎలా సాధ్యము'' చిన్న వారు వారి పెద్దలకు లోబడి యుండుటకు పిలువబడలేదా? అని ఒకరు అడుగవచ్చును.
లోబడుట అంటే కేవలము విధేయత అని తరచు తప్పుగా అర్థము చేసికొనుట చేత అటువంటి ప్రశ్న ఉదయించును. కాని మనము యితరులకు మనలను మనము ఉపేక్షించుకొనుట ద్వారా కూడా లోబడవచ్చును. యేసు ప్రభువు ఆ విధముగా జీవించారు. ఆయనకు యితరులతో ఉండిన సంబంధములలో ఆయన యొక్క హక్కులను నిరంతరము వదులుకొన్నారు. లోబడుట అను దానికి ప్రాథమిక అర్థము అదియే. మరియు శరీరములో ప్రతి ఒక్క సభ్యుడు పిలువబడినది ఇది చేయుటకే.
యేసు ప్రభువు లోబడుటలో నుండిన మహిమను మనకు చూపారు, కనుక మనము మన జీవితమంతా ఈ మార్గములో నడచుటకు ఆనందించవలెను.
దైవికముగా నియమింపబడిన అధికారమునకు లోబడుట
విశ్వములో దేవుడే అన్నింటికి పైనున్న అధికారము. దాని గూర్చి ఎటువంటి సందేహము లేదు. అయితే దేవుడు కూడా అధికారమును ఇతరులకు బదలాయించును. ప్రభుత్వ పరిపాలకులు, తల్లిదండ్రులు మరియు సంఘ నాయకులకు సమాజములో, గృహములో మరియు సంఘములో అధికారముండును.
సంఘము, కొందరనుకొనునట్లు, ప్రతి ఒక్కరూ దేవునికి మాత్రమే బాధ్యులుగా ఉండే ఒకప్రజాస్వామ్యము కాదు. అలా కాదు. అక్కడ శరీరములో మనము లోబడి విధేయత చూపుటకు దేవుని చేత నియమింపబడిన నాయకులుందురు. ఇది లేఖనములలో స్పష్టముగా చెప్పబడిన దేవుని చిత్తమై యున్నది.
దేవుని వాక్యము ప్రజలను వారి పరిపాలకులకు, భార్యలు భర్తలకు, బిడ్డలు తల్లిదండ్రులకు మరియు సేవకులు వారి యాజమానులకు లోబడమని ఆజ్ఞాపించెను. అదే విధముగా సంఘములో పెద్దలకు కూడా లోబడునని ఆజ్ఞ యివ్వబడినది.
ఉదాహరణకు పురుషుడు స్త్రీ పై దేవుని చేత నియమింపబడిన అధికారమని బైబిలు బోధించుచున్నది. క్రీస్తు శరీరములో విమోచింపబడిన స్త్రీ పురుషులు సమానమైన సభ్యులైనా, సంఘములో స్త్రీ పురుషునికి లోబడి యుండవలెనని దేవుడు ఆజ్ఞాపించియుండెను (1కొరింథీ 11:3; 14:33-35; 1తిమోతి 2:11-13).
అదే విధముగా, స్థానిక సంఘములలో నాయకత్వము కొరకు దేవుడు పెద్దల నుంచెను. దేవుడు నిజముగా ఒక సంఘములో పెద్దలను నియమించినప్పుడు, వారు దేవుని ప్రతినిధులుగా ఉండి, ఆయన అధికారమునుకొంత ప్రయోగించుదురు. ప్రభువు, ఆయన పంపిన శిష్యులతో, ''మీమాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును'' (లూకా 10:16) అని చెప్పెను.
దేవుని యొక్క వాక్యములో ఇటువంటి ఆజ్ఞలున్నవి.
''మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దు:ఖములో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దు:ఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడి యుండుడి'' (హెబ్రీ 13:7).
''మరియు సహోదరులారా, మీలో ప్రయాస పడుచు ప్రభువునందు మీకు పై వారై యుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము'' (1థెస్స 5:12,13).
''స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని, పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను'' (1కొరింథీ 16:15,16).
''బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులునుగా ఎంచవలెను'' (1తిమోతి 5:17).
''చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి యుండుడి'' (1పేతురు 5:5).
దేవుడు మనలను క్రీస్తు యొక్క శరీరములో అవయవములుగా సహవాసపు గుంపులలో (సంఘములు లేక క్రైస్తవ పనివారి గుంపులు) ఉంచెను. అక్కడ దేవుడు మనపై నియమించిన ఆత్మీయ నాయకులకు లోబడుటకు మరియు వారితో ఒక జట్టుగా కలసి నడుచుటకు పిలువబడితిమి. వ్యక్తిగతమైన విషయములో, దేవుని యొక్క నడిపింపు సూటిగా మనకు వచ్చును, కాని జట్టు విషయములలో నడిపింపు మనకు మన ఆత్మీయ నాయకుల ద్వారా వచ్చును.
అపొస్తలుల కార్యములు16:9,10లో పౌలు ఆయన జట్టులోనుండిన పనివారు తదుపరి ఎక్కడకు వెళ్లవలెనను విషయము గూర్చిన దేవుని యొద్దనుండి వచ్చు నడిపింపు పౌలు మాత్రమే పొందెనని మనము చదువుదము. ఆయన జట్టు అయిన పౌలు తిమోతి మరియు లూకాలను దేవుడు నడిపిస్తున్నాడు అని పూర్తిగా నమ్మి ఆయనను వెంబడించారు. ఎందుకనగా వారు పౌలు యొక్క నాయకత్వము క్రింద పనిచేయుచుండిరి. వారు ముందుకు వెళ్లుటకు వారికి ప్రత్యేకమైన నడిపింపు అవసరము లేకపోయినది. ఎందుకనగా అది జట్టుకు సంబంధించిన విషయము మరియు వారి నాయకునితో అప్పటికే దేవుడు మాట్లాడియుండెను.
మానవ శరీరములోకూడా కొన్ని అవయవములు మరికొన్ని ఇతర అవయవములు కదలినప్పుడు కదలునట్లు ఏర్పరచబడెను. ఉదాహరణకు నా కుడి చేతికి చిటికినవ్రేలు శిరస్సునుండి వచ్చే సూచనలకు విధేయత చూపి దానికదే కదిలే ఒక అవయవము, అదే సమయములో, అది నా కుడి చేతి యొక్క ఒక అవయవమై యుండుటచేత, ఆ చేయి ఎప్పుడు కదిలితే అప్పుడు అది కూడా కదలవలసి యున్నది. అది కొన్ని సమయములలో నా చేతినుండి విడిపోయి కదలనని అనలేదు, ఎందుకనగా దేవుడు దానిని కుడిచేతి అవయవముల జట్టులో ఉంచాడు. నా ఎడమ చెయ్యి కదలినప్పుడు అది కదలనక్కర్లేదు. ఎందుకనగా అది ఆ జట్టులో అవయవము కాదు, కాని అది తన స్వంత జట్టుతో కలసి కదలవలసియున్నది.
దేవుడు మనలను ఒక సంఘ సహవాసములో, లేక ఒక క్రైస్తవ పని వారి జట్టులో ఉంచినట్లయితే, మనము అక్కడ మనపై దేవుడు ఉంచిన నాయకత్వమునకు లోబడుటకు మరియు జట్టుకు సంబంధించిన అన్ని విషయములలో వారిని అనుసరించుటకు యిష్టపడవలెను. మనము ఖచ్చితముగా తెలుసుకొనవలసిన ఒకే ఒక విషయము, దేవుడు మనలను ఆ జట్టులో ఉంచెనను విషయము. ఒకసారి ఆ విషయము స్థిరముగా తెలిసిన తరువాత, మన యొక్క నాయకులకు లోబడి విధేయత చూపుటను దేవుడు ఎదురు చూచుచుండెనని విషయము గూర్చి ఏ ప్రశ్న లేదు. ఈ ఆత్మీయ నియమము ఒకమారు అర్థము చేసికొనినట్లయితే క్రైస్తవ పనిలో ఎన్నో సమస్యలు పరిష్కారమగును.
దేవుని కుమారుని యొక్క మాదిరిని గూర్చి ఆలోచించండి. చిన్న పిల్లవాడుగా ఆయన యోసేపు మరియలకు లోబడి జీవించిన మనము చదువుదుము (లూకా 2:51). యేసు ప్రభువు పరిపూర్ణుడు, కాని యోసేపు మరియలు కాదు. అయినప్పటికి ఆయన విషయములో దేవుని చిత్తము అట్లుండుట చేత పరిపూర్ణుడైన వాడు పరిపూర్ణతలేని మానవులకు ఎన్నో సంవత్సరములు లోబడియుండెను. తండ్రి చిత్తము కొరకు అన్ని విషయములను పరిష్కరించెను. యోసేపు మరియలకు లోబడి జీవించవలెనని తండ్రి కోరినట్లయితే, ఆయన అది చేసారు. అంతే కాకుండా, అది తన తండ్రి కోరినంత వరకు అట్లుండెను.
యేసు ప్రభువు జీవితములో ఒక సమయము వచ్చింది. అప్పుడు (ఆయన బాప్తిస్మము పొందిన తరువాత) ఆయన వారికి లోబడుట మానెను. అది ఆయనతండ్రి ఆయన యింటిని విడిచిపెట్టి దేవుని కుమారునిగా ఆయన పరిచర్యకు బయటకు వెళ్ళుమని తండ్రి పిలిచినప్పుడు జరిగెను. దాని తరువాత, ఆయన తల్లియైన మరియకు ఆయన జవాబు ''అమ్మా, నాతో నీకేమి పని?'' అని అడిగెను (యోహాను 2:4). కాని తన తండ్రి ఆయనను వారికి లోబడియుండుటకు ఉంచినంత కాలము ఆయన సంతోషముతో లోబడి యుండెను.
కనుక పరిపూర్ణుడైన దేవుని కుమారుని మాదిరి విషయములో కూడామనముచూచినది, ఒకే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. నేను ఈ సహవాసములో ఉండుట దేవుని చిత్తమా అనునది. దానికి జవాబు ''అవును'' అయినట్లయితే అప్పుడు దేవుడు నియమించిన నాయకత్వమునకు లోబడియుండుట మన విధి.
అధికారమునకు తిరుగుబాటు చేయుట విశ్వములో మొదటి పాపము. అది దేవదూతలకు ప్రధానుడైన లూసిఫరు, అతడిపై ఉండిన దేవుని యొక్క అధికారమునకు తిరుగుబాటు చేసినప్పుడు జరిగినది.
లోకములో యిప్పుడు, రెండు ఆత్మలు పని చేయుచున్నవి-ఒకటి దైవికముగా ఏర్పాటు కావింపబడిన అధికారమునకు జనులను లోబడునట్లు చేయు క్రీస్తు ఆత్మ మరియు అటువంటి ఆధికారముపై తిరుగుబాటు చేయుటకు నడిపించు సాతాను యొక్క ఆత్మ.
తిరుగుబాటు ఆత్మ ఈనాడు సమాజములో గృహములో మరియు సంఘములో కూడా సర్వసాధారణమై పోయింది. లోకము దేవుని నుండి త్వరితగతిని తొలగిపోయి, సాతానుచే క్రమేపి అదుపు చేయబడుచుండెను అను దానికి ఇది స్పష్టమైన సూచనగా యున్నది. ఈ సాతాను యొక్క నియమమునకు వ్యతిరేకముగా నిలువబడి, లోబడు విషయములో క్రీస్తు యొక్క మాదిరిని చూపుటకు క్రీస్తుశరీరము యొక్క అవయవములుగా మనము పిలువబడితిమి.
మనము దేవుడు నియమించిన నాయకత్వమునకు లోబడుట వలన ఏది పోగొట్టుకొనము. దానికి వేరుగా, మనము తిరుగుబాటు ద్వారా ఎంతో పోగొట్టుకొందుము.
దైవికముగా ఏర్పాటు చేయబడిన నాయకత్వమునకు లోబడుట మనలను ఆత్మీయ పరిపక్వతలోనికి నడిపించుటకు దేవుని పద్ధతి. దేవుడు మనలను పిలిచిన చోట మనము లోబడకపోయినట్లయితే మనము ఆత్మీయముగా ఎదుగుదలలేని మరుగుజ్జులవలె మిగిలి పోవుదుము.
అనేక మంది విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ నాయకులకు దీనులుగా లోబడిన ఫలితముగా, వారి ప్రణాళికలు నిరోధించబడుట మరియు అడ్డగింపబడుట అనే అనుభవము లేకపోవుటచేత, వారు దేవునియొక్క సర్వాధికారమును నిజముగా వారి అనుభవములో తెలుసుకొనరు. ఒకరి జీవితములో ఏదొక సమయములో ఇతరులకు లోబడుట ఎప్పుడు తెలియని ఎవ్వరు కూడా దేవునిని ప్రయోజనకరముగా సేవించలేరు లేక వారు ఎప్పటికీ ఆత్మానుసారుడైన నాయకుడు కాలేరు.
లోబడుట అనేది, అపవాది మన చెవులలో గుసగుసలాడునట్లు ఏదో అవమానకరమైనది మరియు అణచివేయునది కాదు. దానికి వ్యతిరేకముగా, అది దేవుడు మనలను ఆత్మీయముగా కాపాడు విధానమై యున్నది. మనము మన యొక్క ఆత్మానుసారులైన నాయకులకు లోబడినట్లయితే మన క్రైస్తవ జీవిత ప్రారంభ సంవత్సరములలో మనకు దేవుని మార్గములు గూర్చి సరిగా తెలియనప్పుడు, మనము అనేక ప్రమాదకరమైన గోతుల నుండి కాపాడబడుట మాత్రమే కాకుండా, మన యవ్వన ఆసక్తితో యితరులను ప్రక్కత్రోవ పట్టించు ప్రమాదము నుండి కాపాడబడుదుము. లోబడుచు గడిపిన సంవత్సరములలో దేవుడు మనకు ఆయన రాజ్యము యొక్క నియమములను నేర్పించి దాని ద్వారా మనలను ఆత్మీయముగా సంపన్నులనుగా చేయును. అందువలన మనము యితరుల కొరకు ఒక పరిచర్య కలిగియుండవచ్చును.
లోబడుట అను మార్గమును తప్పించుకొనినప్పుడు మన మెంత కోల్పోవుదుము!
నాయకత్వము
క్రీస్తు శరీరములో కొందరు సభ్యులను ఇతరులపై ఆత్మీయ అధికారము కలిగియుండునట్లు దేవుడే పిలుచును.
అటువంటి నాయకులందరు శరీరమునకు శిరస్సు క్రీస్తు మాత్రమే అనే విషయమును అన్నిటికంటె మొదటిగా గుర్తించవలెను. శిరస్సు యొక్క స్థానము క్రీస్తు ఎవ్వరికి బదలాయించడు. అందుచేత స్థానిక సంఘములో (లేక కొన్ని సంఘముల సముదాయములలో) లేక క్రైస్తవ పనివారుండే సహవాసములో ఒక వ్యక్తి ఇతరులకంటె పై స్థానాన్ని తీసుకొనుటకు ప్రయత్నించుట క్రీస్తు యొక్క సర్వాధికారము కలిగిన శిరస్సు స్థానమునకు వ్యతిరేకముగా హద్దుమీరుటయై యున్నది.
ఈ కారణము చేతనే క్రొత్త నిబంధన సంఘమునకు నాయకత్వము పెద్దల యొక్క సముదాయము (ఏకవచనము కాక బహువచనము)గా సూచించబడినది. పెద్దలు కలిసి ఆత్మీయఅధికారమును ప్రయోగించవలసి యున్నది (అపొ.కా. 14:23; 20:17; 1తిమోతి 5:17; తీతు 1:5; యాకోబు 5:14; 1పేతురు 5:1).
మత్తయి సువార్త 18:18-20లో ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామములో కూడుకొందురో, వారి మధ్యన ఆయన ఉండి వారికి బంధించుటకు మరియు విడుదల చేయుటకు అధికారమిచ్చెదనని యేసుప్రభువు చెప్పారు. అక్కడ ఆ భాగము యొక్క సందర్భము (17వ) ప్రధానముగా (ప్రత్యేకముగా కాకపోయినా) సంఘము యొక్క పెద్దలు (కనీసం ఇద్దరు లేక ముగ్గురు అని చెప్పుటలో) అధికారము ప్రయోగించుట గూర్చి చెప్పినట్లుగా అన్పిస్తుంది. ఒక వ్యక్తి తనకు తానుగా అటువంటి అధికారమును చూపలేడనేది స్పష్టమైయున్నది (అలా కాకపోయినట్లయితే ''ఇద్దరు లేక ముగ్గురు'' అని క్రీస్తు ప్రత్యేకముగా చెప్పుటలో అర్థము లేదు).
ఈనాడు మనము పాత నిబంధన పరిస్థితులలో నివసించుట లేదు. ఆ దినాలలో దేవుడు సాధారణముగా ఆయన యొక్క జనులను నడిపించుటకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసేవారు. ఉదాహరణకు మోషే, యెహోషువ, దావీదు మొదలైనవారు. ఆ నాయకులందరు క్రీస్తు యొక్క వివిధ లక్షణములు కలవారు. ఇప్పుడు క్రీస్తు వచ్చి యున్నారు. ఆయనే దేవుని జనులకు శిరస్సయి యున్నారు. మరియు ఆయన శరీరములో సమిష్టియైన నాయకత్వము ద్వారా పని చేయుచున్నాడు.
క్రైస్తవశకము ప్రారంభదినాలలో ప్రభువు పదకొండు మంది అపొస్తలులకు మరియు అపోస్తలుడైన పౌలుకు సంఘములపై ప్రత్యేకమైన అధికారమును యిచ్చెను. అయితే ఆది అపొస్తలులు సంఘమునకు పునాదిరాళ్లయి ఉండుటచేత (ఎఫెసీ 2:20; ప్రకటన 21:14) మరియు దేవుడు సంఘమునకు వ్రాత పూర్వకమైన వాక్యమును యిచ్చుటకు వారు మార్గములుగా ఉండుట చేత అట్లు జరిగెను. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కనుక ఎవరైనా తనయొక్క అధికార ప్రదర్శనను పౌలు అపొస్తలుడుగా చేసిన కార్యములను చూసి సమర్థించుకొని నట్లయితే అది బుద్ధిహీనత మాత్రమే కాక సాహసమవుతుంది. అటువంటి వ్యక్తి పౌలువలె కాక దియోత్రిఫసు వలే ఉండుటకు అవకాశమున్నది (3యోహాను 9).
దియోత్రిఫసు తనను తాను నియమించుకొనిన 'అపొస్తలుడు' మరియు అతడు సంఘములో అధికారమును ఒక్కడే నిర్వహించుకొనవలెనని కోరుకొనెను. అతడు యోహాను చేత ఖచ్చితమైన మాటలతో ఆక్షేపించబడెను.
ఈనాడు ఎక్కడైనను ఏ మనుష్యుడైనా దేవుని యొక్క జనులకు ఒంటరి నాయకత్వమును ఇచ్చుటకు చూచినట్లయితే అతడు వారిని ఆత్మీయముగా తిరిగి పాత నిబంధన పరిస్థితులలోనికి తీసుకు వెళ్లు ప్రమాదములో ఉన్నాడు. ఇది ముఖ్యముగా నాయకత్వపు లక్షణములు బలముగా ఉండిన వారు తమ మనసులలో ఎల్లప్పుడు ఉంచుకొనవలెను.
దేవుడు ఈనాడు కూడా, తిమోతి మరియు తీతును పౌలు క్రింద నుండినట్లు, క్రైస్తవ పనివారి జట్లును ఏర్పర్చును. అందులో అనుమానము లేదు. కాని అటువంటిది ఆ జట్టు ప్రారంభ దశలలో మాత్రమే ఉండవలెను. సమయము గడిచిన కొద్దీ, తిమోతి మరియు తీతు పౌలు చేత సహపనివారుగా ఆయనతో సమానులుగా చూడబడిరి, కాని వారు ఆయన తరువాత వచ్చిన సహాయకులుగా చూడబడలేదు.
క్రీస్తు శరీరములో నాయకత్వము కొరకు దైవికముగా నియమింపబడిన ప్రణాళిక ఒక పెద్దల గుంపు ద్వారా ఉండును (అది సంఘము లేక పనివారి జట్టుకైనా). ఇది సంఘము యొక్క క్షేమానికి దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన, ఆ విధముగా ఏ ఒక్కవ్యక్తి యొక్క ఆలోచన విధానము అందరి ఉద్దేశముల కంటే మరీ ఎక్కువైనదిగా కాకుండా ఉండును.
క్రైస్తవ పనిలో గొప్ప ఆశయము మరియు సామర్థ్యము కలవారు తమతో నాయకత్వమును పంచుకొనే వారి యొక్క విధానమును బట్టి అసహనమునకు గురియవుట సుళువుగా జరుగుచుండెను. వారు తమను తాము సమర్థించుకొనుటకు మరియు ఇతరులు మాట కాదనునట్లు ప్రవర్తించుట చేసి, అది దేవుని పని ముందుకు వెళ్లుట కొరకు అట్లు చేయుచున్నామని చెప్పునట్లు శోధింపబడుదురు. కాని అది దేవునియొక్క క్రమమును మీరుట, అది చివరకు క్రీస్తు శరీరములో ఇతరుల యొక్క ఎదుగుదలకు ఆటంకముగా నుండును.
చుట్టూ ఉండిన సంఘములు మరియు సంస్థలలో ఒక బలమైన అధికారము కలిగిన నాయకుడు ఉండిన పరిస్థితిని చూచినట్లయితే అక్కడ ఉండిన క్రైస్తవులు తప్పనిసరిగా మరుగుజ్జులుగా నుండుటను నీవు కనుగొందువు. అటువంటి ఒక వ్యక్తి నాయకత్వము చూచుటకు అనేక కార్యక్రమములతో దూసుకు పోవుచున్నట్లుగా కనబడును, కాని అతడిచే నడిపింపబడే క్రైస్తవులు మాత్రమే ఎదగరు. ఇది క్రీస్తు యొక్క శరీరము గూర్చి దేవుని యొక్క ఉద్దేశ్యము కాదు. ఆయన కార్యక్రమములు మరియు పథకములను తక్కువగాను సభ్యులలో ఎక్కువ ఆత్మీయ ఎదుగుదలను కోరుకొనుచున్నాడు.
నాయకత్వ అర్హతలు
దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని ఆత్మీయ నాయకునిగా నియమించగలడు. మనము నియమింపబడుట కేవలము మనుష్యుని వలనైతే, మనము క్రీస్తు యొక్క అధికారమును ఎప్పుడూ ప్రయోగించలేము. ఇక్కడనే క్రైస్తవ నాయకత్వపు పదవుల కొరకు ఎన్నికవుటకు ప్రయత్నించు బుద్ధిహీనత కనబడుచున్నది. వారు దేవునిచేత నియమింపబడుటకు ప్రయత్నించరు.
ఒక ఆత్మీయనాయకుడు తన మందను సిలువ మార్గములో నడిపించవలెను. దాని కొరకు అతడు తనను తాను ఉపేక్షించుకొనే మార్గమందు నడచుటలో నమ్మకముగా ఉండవలెనని ఇది సూచిస్తుంది.
క్రీస్తువలె ఇతరులకు సేవకుడుగా ఉండవలెననే ఆశలేనివాడెవడూ క్రీస్తు శరీరమునకు నాయకుడుగా ఉండలేడు. ''అన్యజనులలో అధికారులని ఎంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియును. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడైయుండ గోరినయెడల, వాడు అందరికి దాసుడైయుండవలెను'' (మార్కు 10:42-45). పౌలు, గొప్ప అపొస్తలుడు, ఇతరులెవ్వరికంటె కూడా ఎక్కువ అధికారము కలిగియుండినవాడు. అయినను ఇతరులకు సేవకుడుగా ఉండెను (2కొరింథీ 4:5; 1కొరింథీ 9:19). ఇది ఆత్మీయ నాయకత్వమునకు ఉండవలసిన మరియొక ప్రాథమిక అర్హతయై యున్నది.
ఒక ఆత్మీయనాయకుడు అతడి క్రింద దేవుడు ఉంచిన వారిపై అధికారము చూపుటకు మరియు అదే సమయములో వారికి ఒక సహోదరుడుగా మరియు ఒకే శరీరములో తోటి అవయవముగా నుండుటకు పిలువబడెను. నాయకుడు సహోదరుడుగా నుండుట చాలా సున్నితమైన తూకమైయుండి చాలా కష్టమైన సంబంధమైయున్నది. ఈ విషయములో ఏదో ఒక విధముగా మనము తూకము తప్పుటకు అవకాశమున్నది. మనము ఈ తూకమును సరిగా కొనసాగించవలెనంటే, మనకు ప్రభువు నుండి ఎడతెగక ఎంతో కృప అవసరమైయున్నది. అందువలన ఆ నాయకుడు దేవునితో ముఖాముఖిగా ఉండే దగ్గర సంబంధముతో జీవించవలసిన అవసరత ఎంతగానో ఉన్నది. 40 సంవత్సరములు ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులలో 30 లక్షల మంది దేవుని ప్రజలను సమర్థవంతముగా నాయకత్వము వహించుటలో ఇదియే మోషేయొక్క రహస్యమైయున్నది (ద్వితీ 34:10; సంఖ్యా 12:8).
ఆత్మీయఅధికారము, దేవుడు ఇచ్చేది, అంతేకాని మనము ఇతరులపై రుద్దేది లేక ఇతరులను మనకు లోబడమని బలవంతపెట్టేది కాదు. ఇతరులు మనము చెప్పేది వినాలని లేక మనకు విధేయత చూపవలెనని మనమెప్పుడూ బలవంతపెట్టకూడదు. తన ప్రతినిధులను ఎదురించే వారి విషయము దేవుడే చూచుకొనును. ప్రభువు యొక్క సేవకుడు ఎప్పుడూ మనుష్యులతో గొడవ పడకూడదు (2తిమోతి 2:24,25) ఎందుకనగా మన అధికారము వెనుక దేవుడు ఉన్నయెడల మన స్థానాన్ని మనమెందుకు కాపాడుకొనుటకు ప్రయత్నించవలెను. దేవుడే మనకు బదులు పోరాడును మరియు మన అధికారమును ఆయనే స్థిరపరచును. మన అధికారమును మనకొరకే స్థిరపరచుకొనవలెనని మనము చూచినట్లయితే, దానికి కారణము అది తప్పకుండా దేవుడు మనకు ఇచ్చిన అధికారము అయ్యుండకపోవుటయే.
ఒక ఆత్మీయ నాయకుడు దాడిచేయబడినప్పుడు లేక నిందించబడినప్పుడు తనను తాను నిరూపించుకొనుటకు మరియు సమర్థించుకొనుటకు లేక రక్షించుకొనుటకు చూడకూడదు. ''మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను....ఆయన దూషింపబడియు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను'' క్రీస్తు మీకు మాదిరి అని బైబిలు చెప్పుచున్నది (1పేతురు 2:21,23). సర్వాధికారియైన దేవుని కుమారుడు మనుష్యులతో పోరాడుటకు, వారిని పరిపాలించుటకు నిరాకరించెను. ఆయనను సమర్థించుటకు మరియు న్యాయముగా తీర్పు తీర్చుటకు ఆయన దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. ఇది సంఘములో ఆయన క్రింద నుండిన కాపరులందరు వెళ్ళవలసిన త్రోవ. ఒక ఆత్మీయ నాయకునిగా, నీకునీవు దేవుని యొక్క అధికారము క్రింద జీవించినట్లయితే, ప్రతి విషయమును నీవు సురక్షితముగా ఆయనకు అప్పగించవచ్చును. నీ మీద వచ్చే అపనిందలు మరియు విమర్శలు మరియు నీ వెనుక నీపై చెప్పుకొనే మాటలు నీవు పట్టించుకొనకుండా ఉండగలవు. ఎందుకనగా ఆయన సేవకులను అటువంటి దాడుల నుండి ఆయనే కాపాడును అని దేవుని యొక్క వాగ్దానమున్నది (యెషయా 54:17).
''ఒకరు మనపై బురద చల్లినప్పుడు, దానిని తుడిచి వేయుటకు ప్రయత్నించినట్లయితే, మన దుస్తులను పాడు చేసుకొందుము. కాని దానిని అట్లే విడిచి పెట్టినట్లయితే సమయము అవుతున్న కొద్ది అది ఎండిపోయి దానికదే పడిపోవును మరియు అప్పుడు మరక ఏదీ ఉండదు'', అని ఓస్వాల్డ్ చాంబర్స్ అనే దైవజనుడు చెప్పెను. అపనిందల విషయము చెయ్యవలసిన జ్ఞానము గల పని ఇది.
వాచ్‌మన్‌నీ, చైనాలో దేవుడు ఇచ్చిన ఆత్మీయ నాయకత్వమును చూపిన అనేక సంవత్సరముల అనుభవముతో, ''ఆత్మీయ అధికారము'' అనే ఆయన పుస్తకములో మనకు కొంత జ్ఞానయుక్తమైన విషయములను తెలియజేసెను. ఆయన ఇట్లనెను:
బలాత్కారులు కాని లేక బలవంతులు కాని కాదు కాని శారీరకముగా బలహీనుడు మరియు ప్రసంగములు గొప్పగా ఉండనివాడైన (2కొరింథీ 10:10) పౌలు వంటి వానిని దేవుడు అధికారముగా స్థిరపర్చును...జనులు సాధారణముగా అధికారములో నున్న వారికి అవసరమైన లక్షణములుగా: వైభవము మరియు శోభ, బలమైన వ్యక్తిత్వము, ప్రవర్తన లేక అతడు కనుపించు విధానము మరియు శక్తి అని అనుకొందురు. అధికారములో ఉండుటకు ఒకనికి నిర్ణయములు తీసుకొనుటలో బలమైన అభిప్రాయము, తెలివైన ఆలోచనలు మరియు వాగ్దాటి కలిగి యుండవలెనని అనుకొందురు. కాని ఇవేమీ అధికారమునకు లక్షణములు కావు, కాని ఇది శరీరానుసారమైన లక్షణములకు సూచనగా యుండును. పాత నిబంధనలో ఎవరు కూడా దేవుడు ఏర్పాటు చేసిన అధికారము విషయములో మోషేను మించిలేరు, అయినప్పటికిని ఆయన మనుస్యులందరిలో సాత్వికుడుగా ఉండెను. ఆయన ఐగుప్తులో ఉండిన కాలములో, ఆయన ఐగుప్తీయుని చంపుటలో మరియు హెబ్రీయునకు బుద్ధి చెప్పుటలో ఎంతో తీవ్రముగా ఉండేవాడు. ఆయన ఇవన్నీ తన యొక్క శారీరకమైన శక్తితో చేసెను. కనుక ఆ సమయములో దేవుడు ఆయనను ఒక అధికారిగా నియమించలేదు. లోకములో మనుష్యులందరి కంటె ఎంతో సాత్వికుడుగా (సంఖ్యా 12:3) మారిన తరువాతనే దేవుడు ఆయనకు అధికారమిచ్చి వాడుకొనెను. ఒక వ్యక్తికి అటువంటి అధికారమిచ్చుటకు అసలు అవకాశము లేదని అనికొనిన వాడే తరచు ఆ స్థానమునకు వచ్చును. అదే విధముగా ఒక వ్యక్తి అధికారము పొందుటకు తగిన వాడనని అనుకొనినవానికి, అటువంటి అవకాశము తక్కువగా యుండును.
అధికారము దేవుని నియమములను నెరవేర్చుట కొరకు కాని, ఒకరిని పై స్థాయికి వెళ్లునట్లు చేయుటకు కాదు. అది దేవుని బిడ్డలకు దేవుని గూర్చి తెలియజేయుటకు గాని, ఒకని గూర్చి తెలియజేయుటకు కాదు. ఇక్కడ ముఖ్య విషయమేమంటే దేవునియొక్క అధికారమునకు జనులు లోబడునట్లు సహాయపడుట కొరకు....ఒక అధికారము తరుపున ఆ అధికారమును చూపించుట అంత సుళువైన విషయమేమీ కాదు, దానికి కారణము ఒకడు తనను తాను రిక్తునిగా చేసుకోవలసియున్నది.
''అధికారము అనగా ఒక స్థానము మాత్రమే కాదు. ఆత్మీయ పరిచర్య ఎక్కడ లోటుగా నుండునో, అక్కడ అధికారముతో నియమింపబడిన వారుండరు. దేవుని యెదుట ఎవరికైతే ఆత్మీయ సేవ ఉండునో వారికి మనుష్యుల మీద అధికారముండును. అటువంటప్పుడు, ఎవరైనను ఇటువంటి అధికారము కొరకు పోరాడుదురా? పరిచర్య ఎలాగు ప్రభువు చేత పంచి పెట్టబడినదో కేవలము అదే విధముగా అధికారము కూడా ఆయన చేత నిర్ణయింపబడును....మన పరిచర్యకు ఉండిన అధికారమును మీరుటకు మనముప్రయత్నించకూడదు....చాలా మంది సహోదరులు వారి అధికారమును ఎక్కడైనా చూపవచ్చని అనుకొని పొరపాటు పడుదురు. వారికి మనుష్యుల యెదుట ఒకని యొక్క అధికారము, దేవుని యెదుట అతని పరిచర్యతో సమానము అని తెలియక యుందురు. అధికారము పరిచర్యను మించినట్లయితే, అది స్థానమును చూచుకొనునదిగా యుండును, మరియు అందును బట్టి అది ఆత్మీయమైనదిగా యుండదు.....
అధికారము చలాయించుట కొరకు చూచువారికి అధికారమును ఎప్పుడూ ఇవ్వకూడదు. ఎందుకనగా, దేవుడు అటువంటి వారికి ఎప్పుడూ అధికారమును ఇవ్వడు. కాని చెప్పుటకు విచిత్రముగా నుండు విషయమేమనగా, తన అనర్హతను తెలుసుకొనిన వానికి దేవుడు అధికారమిచ్చును....ఒక మనుష్యుడు దేవుని చేత వాడబడుటకు ముందు దేవుని యెదుట సాగిలపడవలెను. అతడు ఎప్పుడైతే తనను తాను హెచ్చించుకొనునో అప్పుడు అతడు దేవుని చేత తిరస్కరింపబడును.
శరీరానుసారమైన హస్తములతో దేవుని యొక్క అధికారమును లాక్కొను వారిపై తీర్పు ఎంత తీవ్రముగా నుండును.
మనము నరకములోని అగ్నికి భయపడునట్లు అధికారమునకు భయపడుదుము గాక!
దేవునికి ప్రాతినిద్యము వహించుట అంత సుళువైన విషయము కాదు. దానిని మనము తాకుట ఎంతో గొప్ప మరియు ఆశ్చర్యకరమైన విషయము. మనము విధేయత బాటలో ఖచ్చితమైన విధముగా నడువవలెను. మన త్రోవ విధేయతే గాని అధికారము కాదు. సేవకులుగా నుండుటకే కాని, ప్రధానులుగా నుండుటకు కాదు; దాసులుగా నుండుటకే కాని, ప్రభువులుగా నుండుటకు కాదు. మోషే మరియు దావీదు ఇరువురు కూడా అధికారులలో అతి గొప్పవారు, అయినప్పటికిని వారు వారి యొక్క స్వంత అధికారమును స్థిరపరచుకొనుటకు ప్రయత్నించలేదు. ఈనాడు అధికారములో ఉండవలెనని అనుకొనువారు వారి అడుగు జాడలలో నడువవలసియున్నది. ఈ అధికారము కలిగియుండుట అనే విషయములో ఎల్లప్పుడు భయముతోను వణుకుతోను ఉండవలెను''.
ఈనాడు సంఘము ఆత్మీయ నాయకుల గూర్చిన గొప్ప లోటుతో బాధపడుచున్నది. ఎంతో మంది బిరుదులు తగిలించుకొని ఉద్యోగ సంబంధమైన అధికారమును చెలాయించుచున్నారు. కాని ఆత్మీయ నాయకత్వము చాలా అరుదుగా కనబడుచున్నది. ఒకసారి యేసు ప్రభువు తన యొద్దకు వచ్చుచున్న జన సమూహములను చూచి వారిపై కనికరపడి ''వారికి ఎన్నో గొప్ప సమస్యలున్నవి కాని వారికి సహాయము కొరకు ఎక్కడికి వెళ్ళవలెనో లేక ఏమి చేయవలెనో తెలియక యున్నారు. వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నారు'' (మత్తయి 9:36) అనెను. ఈనాడు కూడా పరిస్థితి అట్లే యున్నది.
కాపరి హృదయము మరియు సేవకుని ఆత్మ కలిగియుండి దేవుని వాక్యమునకు భయపడి వణకుచుండిన మనుష్యులుగా నున్న నాయకులు సంఘములో మనకు కావలసియున్నారు.
''ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడి వానిని లేవనెత్తును; అయితే ఒంటిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన యెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగు నొకని మీద మరియొకడు పడిన యెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?'' (ప్రసంగి 4:9-12).
ఒక ముసలి రైతు ఐకమత్యము గూర్చి ఎప్పుడూ తమలో తాము దెబ్బలాడుకొనే తన ముగ్గురు కుమారులకు చెప్పిన కథ మీకు జ్ఞాపకముండి యుంటుంది. అతడు సన్నగా నుండిన కొన్ని పుల్లలను తీసుకొని అవి ఒక్కొక్కటిగా ఎంత సుళువుగా విరిగిపోవునో, కాని వాటిని ఒక కట్టగా కట్టినప్పుడు వాటిని అట్లు విరుచుట దాదాపు అసాధ్యముగా నుండుటను చూపించెను.
ఈ లోక సంబంధులు కూడా ఐకమత్యములోనూ మరియు సహవాసములో బలమున్నదని గ్రహించియుండిరి.
''మిడుతలకు రాజు లేకపోయినా అవి కలిసియుండి పంక్తులు తీరి సాగిపోవును'' అని బైబిలు చెప్పుచున్నది (సామెతలు 30:27). ఆ విధముగా వాటికి భద్రత మరియు శక్తి కలుగుచున్నది.
యేసుక్రీస్తు యొక్క సంఘములో, ఈ పాఠమును మనము మరల నేర్చుకొనవలసియున్నది.
ప్రారంభములోనే నేను ఒకటి మీకు తేటపర్చవలెనని అనుకొనుచున్నాను. దేవుని యొక్క సత్యము విషయములో రాజీపడి మరియు త్యాగము చేయు ఒక మానవునిచే ప్రారంభించబడిన నీవన కాలపు విశ్వవ్యాప్త క్రైస్తవ ఐకమత్య ఉద్యమము వంటి ఒక సంస్థగా క్రైస్తవుల ఐకమత్యము గూర్చి నేను మాట్లాడుట లేదు. అటువంటి ఐకమత్యము క్రీస్తు ప్రార్థించిన ప్రధాన యాజక ప్రార్థనలో (యోహాను 17వ అధ్యాయములో నుండిన) ఐకమత్యమునకు నఖిళీది మరియు నిరర్థకమైనదిగా యున్నది.
క్రొత్త నిబంధన చెప్పే ఐక్యత క్రీస్తు శిరస్సుగా ఉండి, క్రీస్తు యొక్క శరీరములో సభ్యులు ఒకరితో ఒకరు ఐకమత్యముగా ఉండే సేంద్రీయ (దేవుని యొక్క జీవమును కలిగియుండుట ద్వారా కలిగే) ఐకమత్యము తప్ప సంస్థాగతమైన ఐకమత్యము కాదు. అది చివరకు 'క్రైస్తవుడు' అనిపించుకొనినా క్రీస్తు శరీరమునకు బయట ఉన్నవారిని మినహాయించును. సజీవమైన వాటికిని మృతమైన వాటికిని మధ్య సంఘీభావము ఉండదు. క్రీస్తు ద్వారా నూతన జన్మను బట్టి బ్రతికింపబడిన వారు, వారివలే దేవుని యొక్క నూతన జీవమును పొందిన వారితో ఐకమత్యము కలిగియుందురు. క్రైస్తవ ఐక్యత క్రీస్తు శరీరములో మనలను సభ్యులుగా చేయు పరిశుద్ధాత్మ చేత కలిగింపబడును. ''ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనుటయందు శ్రద్ధ కలిగినవారు''గా యుండవలెనని బైబిలు మనలను హెచ్చరించుచున్నది (ఎఫెసీ 4:2,3). మానవునిచే ఏర్పర్చబడిన ఎటువంటి ఐక్యతయైనా విలువలేనిదే.
సాతాను యొక్క వ్యూహము
సాతాను కపటమైన శత్రువు. క్రీస్తుకు మరియు ఆయన వాక్యము యొక్క అధికారము క్రింద ఐక్యతతో జీవించుచుండిన క్రైస్తవ సహవాసమును జయించలేడని అతడికి తెలియును. అందువలన ఈ యుద్ధములో అతడి వ్యూహముగా ఒక సహవాసములో సభ్యుల మధ్య అసమ్మతి, అనుమానము మరియు అపార్థములను విత్తుట ద్వారా అందులోని వ్యక్తులను ఒక్కొక్కరిగా పనికి రాకుండా చేయును.
పాతాళలోకపుశక్తి ఆయన సంఘమును జయించలేదని యేసు ప్రభువు చెప్పారు (మత్తయి 16:18). సాతానుకు వ్యతిరేకముగా పోరాటమందు విజయము క్రీస్తు శరీరమైన సంఘమునకు వాగ్దానము చేయబడినది. ఇతర విశ్వాసులకు వేరుగా ఒంటరిగా ఉండే విశ్వాసి ఓడిపోవచ్చును.
క్రీస్తు యొక్క జీవిత కాలమంతటిలో సాతాను నిరంతరము క్రీస్తుపై దాడి చేశాడు. కాని గెలవలేకపోయెను. చివరిగా సిలువ నొద్ద మానవునిపై సాతాను యొక్క అధికారము క్రీస్తు చేత పడద్రోయబడెను (నశింపజేయబడింది) (హెబ్రీ 2:14; కొలస్సీ 2:15).
ఈనాడు మరణము గెలిచి లేచిన క్రీస్తుపై సాతాను దాడి చేయలేడు. అందువలన ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరమైన ఆయన సంఘము పైకి అతడి దాడులను కేంద్రీకరించును. మన యొక్క ప్రభువు శిరస్సుగా ఆయనలో మనము ఒక శరీరముగా సాతానుకు వ్యతిరేకముగా ఒక్కటిగా నిలిచినప్పుడు మాత్రమే మనము సాతానుపై విజయము పొందగలము.
క్రైస్తవుల యొక్క సహవాసములో, ఏ ఒక సభ్యుడు తన యొక్క బాధ్యతను ఎంతమట్టుకు నిర్వర్తించలేకపోవునో, శరీరము యొక్క శక్తి అంతమట్టుకు బలహీనపడును. సాతానుకు ఇది తెలియుట చేత, ఒక గుంపులో నుండిన వారిని ఎవరికి వారుగా ఉండునట్లు విడదీసి లేక ఆ గుంపును (లేక సంఘమును) చిన్న చిన్న ప్రత్యేక గుంపులుగా చేయుటకు నిరంతరము చూచును.
ఈ కారణము చేతనే మనము సాతాను యొక్క యుక్తికరమైన ఉచ్చులకు వ్యతిరేకముగా నిరంతరము జాగ్రత్త కలిగియుండవలెను. లేనట్లయితే మనకును క్రీస్తు శరీరములో నుండిన ఏ ఇతర సభ్యునికి మధ్య ఉండిన సంబంధములను అతడు బలహీనపరుచును.
శరీరము యొక్క అధికారము
ఎఫెసీ క్రైస్తవులకు పౌలు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయములు క్రీస్తు శరీరముయొక్క 'మర్మము'ను బహిర్గతము చేసెను. ఆ పత్రిక చివరకు వచ్చునప్పటికి సంఘము పోరాడవలసిన ఆత్మీయ పోరాటము మరియు ఆ పోరాటములో గెలుచుటకు అవసరమైన దేవుని సర్వాంగ కవచము గూర్చి వివరింపబడెను.
ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క ముఖ్యాంశము సంఘము క్రీస్తు శరీరమని చెప్పుట కాబట్టి, ఆ పత్రిక యొక్క చివరన వర్ణింపబడిన పోరాటము శరీరమంతయు పోరాడునది-అంతేకాని వ్యక్తిగత సభ్యులు స్వంతంగా పోరాడునది కాదు. ఈ పోరాటములో మనము ఒకరికొకరు అవసరము.
క్రీస్తుసంఘమునకు శిరస్సుగా అన్నింటికంటె పైగా హెచ్చింపబడెనని అదే పత్రిక ప్రారంభములో మనకు చెప్పబడినది (ఎఫెసీ 1:20-23). క్రీస్తు హెచ్చింపబడెనని తెలియుట ఒక విషయమైతే ఆయన శరీరమైన సంఘము యొక్క శిరస్సుగా ఆయన హెచ్చింపబడెనని తెలియుట వేరొక విషయము. ఈ భూమిపై నున్న సంఘము క్రీస్తుకు సమస్తము పైన అధికారము కలదను సత్యమును ఎఱుగునట్లు వారి కన్నులు తెరువబడవలెనని ఎఫెసీ క్రైస్తవుల గూర్చి పౌలు ప్రార్థించెను. భూమి మీద నున్న సంఘము విషయములో ఈ సత్యమునకు సుదూరమైన భావములున్నవి.
క్రీస్తుసంఘము యొక్క శిరస్సుగా అన్నిటికంటె పైగా హెచ్చింపబడినట్లయితే, క్రీస్తుయొక్క అధికార ప్రయోగములో సంఘమునకు కూడా భాగమున్నదని సూచిస్తున్నది. మానవ శరీరము నుండి ఒక ఉదాహరణ చూచుదుము. నా శరీరము లేకుండా నా శిరస్సు మాత్రము ఒక సింహాసనముపై కూర్చుండుట సాధ్యము కాదు. శిరస్సు సింహాసనముపై కూర్చొనినట్లయితే శరీరము ఆ సింహాసనముపై కూర్చొనును. క్రీస్తు మరియు ఆయన శరీర విషయము కూడా అంతే.
క్రీస్తుకు కలిగియుండిన అధికారమును ఆయన తన సంఘమునకు కూడా యిచ్చుటకు కోరుకొనుచున్నాడు. అటువంటప్పుడు ఈనాడు సంఘమెందుకు అంత శక్తిహీనమయ్యెను? తప్పనిసరిగా క్రీస్తు యొక్క అధికారము క్రింద శరీరముగా దాని స్థానమును గుర్తించి దానిని తీసుకొనకపోవుటను బట్టి మాత్రమే.
క్రీస్తుయొక్క అధికారము ఆయన శరీరముద్వారా ప్రయోగించబడును తప్ప, ఒంటరిగా నుండిన వ్యక్తులద్వారా కాదు. మానవశరీరము శిరస్సునకు విధేయత చూపుచూ పని చేయును, ఎందుకనగా అది ఒక సమన్వయము కలిగిన జీవిగా యున్నది అంతేకాని వివిధ రకములైన అవయవములు భాగములు సంబంధం లేకుండా యున్నది కాదు. క్రీస్తు శరీరములో కూడా అంతే, ఎక్కడైతే ఒకనితో ఒకరు కలసి పనిచేసే క్రైస్తవ జట్టు ఉండునో, అక్కడ క్రీస్తు యొక్క అధికారము ప్రయోగించబడును.
సాతాను ఎందుకు ''శరీరము'' గూర్చిన సత్యమును ద్వేషిస్తాడో మరియు మనము దాని విషయములో గ్రుడ్డివారగునట్లు అతడు తన శక్తి కొలది చేయగలిగినదంతా ఎట్లు చేయునో ఇప్పుడు చూచారా? మనము ఈ విషయమునకు సంబంధించి సత్యమును వివేకముతో గ్రహించినట్లయితే, దానికి సంబంధించిన ఆచరణ విషయములో గ్రుడ్డివారగునట్లు సాతను ప్రయత్నము చేయును.
శరీరములో సమైఖ్యత
వ్యక్తిగతముగా విశ్వాసులు దేవునికి ప్రార్థించుట గూర్చి యేసు ప్రభువు ఎన్నో వాగ్దానాలు చేసారు. కాని మత్తయి 18:18,19లో క్రీస్తు యొక్క శరీరములో ఒక విభాగము ఏకత్వముతో ప్రార్థించుట గూర్చిన వాగ్దానము యివ్వబడియున్నది.
''భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడును....మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చియైనను భూమిమీద ఏకీభవించిన యెడల అది పరలోక మందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను''.
ఇక్కడ 19వ వచనములో నుండిన ''ఏకీభవించిన'' అనుమాట వాయిద్యములు వాయించునప్పుడు వాటి మధ్యనుండిన మేళవింపుకు సంబంధించిన గ్రీకు పదము నుండి వచ్చింది. యేసు ప్రభువు ఇక్కడ తన బిడ్డలలో ఏ యిద్దరు మధ్యన నుండిన వాయిద్యముల మధ్యనుండు మేళవింపు వంటి ఐక్యతను గూర్చి చెప్పుచున్నారు. ఇది ఒకరు చేసిన ప్రార్థనకు చివరన వేరొకరు 'ఆమేన్' చెప్పుట కంటె ఎక్కువైనది. ఈ మేళవింపు అనునది కలసి ప్రార్థించే యిద్దరి మధ్య ఆత్మలో లోతైన సమైఖ్య భావముండుట గూర్చి తెలియజేయును. చిన్న గుంపుగా నుండిన క్రైస్తవుల మధ్యనైనను, ఒక మంచి వాద్యబృందము మధ్యనుండిన మేళవింపువంటిది ఉండినట్లయితే అప్పుడు, వారి ప్రార్థనలకు ఏది అడిగినా పొందుకొన గలిగే అధికారముండును (అని యేసు చెప్పారు). అటువంటి క్రైస్తవులుండిన గుంపునకు సాతాను యొక్క శక్తిని బంధించుటకు మరియు సాతాను యొక్క బంధీలను విడిపించుటకు అధికారముండును.
అటువంటి అధికారమును ఒక సహవాసము ప్రయోగించుటకు గల కారణమును యేసుప్రభువు వివరించారు. ''ఎందుకనగా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్యను నేను ఉందును'' (20వ వచనము) అని చెప్పారు. క్రీస్తు అటువంటి సహవాసములో శిరస్సుగా ఆయన అధికారమంతటితో ఉండును. అందువలన పాతాళపు శక్తులు అటువంటి సహవాసమునకు వ్యతిరేకముగా నిలువనేరవు.
అపొస్తలుల కార్యములలో చెప్పబడిన సంఘము ఇటువంటి అధికారములో యదార్థముగా ఎదుగుటకు ఒక కారణము వారి మధ్య నుండిన సహవాసములో ఇటువంటి సమైక్యత యుండుటైయున్నది.
''వారందరు (11మంది అపొస్తలులు) ఏక మనస్సుతో దేవుని కిట్లు మొఱ పెట్టిరి'' (అపొ.కా. 1:14;2:44,46; 4:24).
వారు క్రీస్తు యొక్క అధికారము క్రింద ఒక ఆత్మీయశరీరముగా సమైఖ్యముగా ఉండుటచేత వారు ప్రార్థనలో ప్రభువు యొక్క అధికారమును ప్రయోగించగలిగిరి. వారు ఎక్కువగా చదువుకొన్నవారు కాదు, వారు సాంఘీకముగా పలుకుబడి కాని ఆర్థిక సామర్థ్యము గాని ఉన్నవారు కాదు, అయినప్పటికీ వారికి తెలిసియున్న లోకమును తలక్రిందులు చేసిరి.
పేతురు ఖైదులో బంధించబడినప్పుడు, హేరోదు యొక్క బలగాలు అన్నియు ఆ ఆది సంఘము దేవునియెదుటమోకాళ్ళూనినప్పుడు వచ్చిన శక్తి ముందు నిలువ లేకపోయినవి (అపొ.కా. 12:5-11). ఆ సంఘము ఒక శరీరముగా బయలు వెళ్లినప్పుడు అది రోమా సామ్రాజ్యమంతట నుండిన మానవ జీవితాలపై క్రీస్తు యొక్క విజయమును మరియు అధికారమును స్థిరపరుస్తూ సాతాను యొక్క రాజ్యమును పునాదుల మట్టుకు కదిలించి వేసెను (అపొ.కా. 19:11-20లో ఒక ఉదాహరణ).
ఈనాడు అనైక్యత కలిగిన సంఘము బయటకు కనబడే విన్యాసాలతో, క్రొత్త పరికరాలతో, సమావేశములతో, వేదాంత పరిజ్ఞానముతో, వాగ్దాటితో మరియు తర్ఫీదు పొందిన గాయక బృందముతో సాతానును తన బలమైన దుర్గములో నుండి బయటకు త్రోసి వేయాలని చూచుచున్నప్పుడు ఆ ప్రయత్నములను సాతాను ఎగతాళి చేయుచున్నాడు.
ఇవేవీ కూడా సాతానుకు వ్యతిరేకముగా పని చేయలేవు. క్రీస్తు యొక్క నాయకత్వములో ఒక శరీరముగా ఐక్యమగుట యొక్క యదార్థతను సంఘము తిరిగి తెలుసుకొను అవసరము వచ్చియున్నది.
ఒకరితో ఒకరు సరియైన విధముగా సంబంధము కలిగి, ఒకరి యెడల ఒకరిపై ప్రేమలో ఎదుగుచు మరియు క్రీస్తుకును మరియు ఆయన వాక్యమునకును విధేయతతో జీవించు క్రైస్తవుల సహవాసము ఈ భూమిపై అపవాది యొక్క రాజ్యమునకు గొప్ప బెదరింపుగా ఉండును. దానికి భయపడినట్లుగా సాతాను మరి దేనికి భయపడడు.
శరీరమును గూర్చిన మహిమగల సత్యము యొక్క వెలుగులో ప్రతి దినము జీవించగలుగుటకు ప్రభువు సహాయము చేయునట్లు మనము ప్రార్థన చేయుదుము. ప్రపంచమంతా క్రైస్తవులు ఇంకా ఇంకా ఈ సత్యమును అర్థము చేసికొనుటకు దానిని బట్టి జీవించుట మొదలుపెట్టుచుండగా మనము తప్పక సంఘము, సంఖ్యలో చిన్నదిగా నుండినను, తన యొక్క పాతకాలపు వైభవమును పొంది, చీకటి శక్తులను తరిమి వేయుటకు మరియు అవసరతలో నుండిన లోకమునకు ఆశీర్వాదములు తెచ్చే ఒక కాలువగా దేవుని చేతిలో ఒక పనిముట్టు వలె వాడబడుటను మనము తప్పక చూచెదము.
చివరి మాట
కల్వరి ప్రేమ
క్రీస్తుశరీరము కల్వరిప్రేమ చేత తన్నుతాను కట్టుకొనును. ఈ అంశముపై ధ్యానించుట కొరకు సహాయముగా ఏమీకార్‌మైకేల్ గారి పుస్తకము నుండి కొన్ని భాగములను మీకు ఇచ్చుచున్నాను. క్రింది వాక్యములను తొందర లేకుండా కల్వరిప్రేమ యున్న ఒక్కొక్క వివరణను ధ్యానించమని సలహా ఇచ్చుచున్నాను.
నా ప్రభువునకు నాపై యుండిన కనికరము వలె, నాకు నా తోటి విశ్వాసిపై కనికరము లేక పోయినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నేను ఎవరికి సేవ చేయుటకు పిలువబడితినో వారిని చిన్న చూపు చూచినట్లయితే, నాలో ఉండిన నా బలమైన లక్షణములు అనుకొన్న వాటితో వారి బలహీనమైన లక్షణములను పోల్చి నేను మాట్లాడినట్లయితే, ''నీకు ఆధిక్యము కలుగజేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుల వలన నీవు పొందనిది ఏది?'' (1కొరింథీ 4:7) అని చెప్పబడిన మాటలను మరచిపోయి, నేను ఇతరులకంటె ఎక్కువైన వాడిననే తలంపును కలిగియున్నట్లయితే-అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఏ ఒక్కరి పొరపాట్లు మరియు పాపములను గూర్చి నేను సులువుగా చర్చించగలిగి నట్లయితే, ఒక చిన్న పిల్లవాని తప్పిదము గూర్చియైనను నేను మామూలుగా మాట్లాడగలిగినట్లయితే అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఇతరుల యొక్క పొరపాట్లు గూర్చి ముందుగానే ఊహించుకొని, ''ఓ వారెప్పుడూ అలాగే చేయుదురు'', లేక ''ఓ, ఆమెప్పుడూ అలాగే మాట్లాడుతుంది'', లేక ''అతడెప్పుడు అలాగే ప్రవర్తిస్తాడు'' అని చెప్పువాడనైతే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నేను బాధపడకుండా లేక సిగ్గుపడకుండా ఒక కష్టము కలిగించే ఉత్తరము వ్రాసినట్లయితే లేక కష్టము కలిగించే మాట మాట్లాడినట్లయితే లేక అటువంటి ఆలోచన కలిగియుండినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ప్రతిస్పందించని ఒకరి విషయములో నేను చేయు ప్రయత్నమును బట్టి అలసిపోయి మరియు ఆ భారము క్రిందనుండి తప్పించు కొన్నట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నేను లెక్క అప్పగించవలసిన ఆత్మల మేలు కొరకు చర్య తీసుకొనినప్పుడు వచ్చిన తిరస్కారము మరియు అపార్థములను బట్టి నేను కలత చెందినట్లయితే, ఆ విషయములు దేవునికి అప్పగించి, మౌనముగాను మరియు సమాధానముతోను వెళ్ళలేక పోయినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఎవరిలో అయితే ఏ చిన్న ఆశ యున్నదో వారిని ప్రభువు వలె నిరీక్షణ కల కన్నులతో చూడక పోయినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఒక నిరాశ చెందిన ఆత్మ విషయం నేను మౌనముగా ఉండలేకపోయినట్లయితే (ఆ ఆత్మ మేలు కొరకై లేక ఇతరుల మేలు కొరకై, మాట్లాడే అవసరం ఉంటే తప్ప) అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఒక ఒప్పుకొనబడిన, పశ్చాత్తాపపడిన మరియు విడిచిపెట్టబడిన పాపమును ఇతరులపై నుంచి, ఆ పాపము గూర్చిన జ్ఞాపకము నా ఆలోచనలను ప్రభావితము చేయునట్లుగా మరియు నా అనుమానములకు బలమిచ్చునట్లు నేను చేసినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఒకరితో స్నేహము చెడిపోతుందని, లేక ఆ వ్యక్తి, ''నువ్వు నన్ను అర్థము చేసికొనలేదు'' అని చెప్పునని లేక నేను దయగలవాడననే పేరుపోతుందని నేను భయపడి, నేను సత్యము మాట్లాడుటకు భయపడినట్లయితే, ఇతరులకు లుగు గొప్ప మేలు కంటె నా యొక్క మంచి పేరును ముందు పెట్టినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నిజాయితీతో కూడిన సంతోషముతో రెండవ స్థానము (లేక ఇరవైవ స్థానము) నేను తీసికొనలేకపోయినట్లయితే, నా యొక్క అయోగ్యత గూర్చి పెద్ద రాద్ధాంతము చెయ్యకుండా మొదటి స్థానమును తీసుకొనలేకపోయినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నేను తేలికగా అభ్యంతరపడినట్లయితే, స్నేహము కొనసాగించుటకు అవకాశముండినా, స్నేహము లేకుండా చల్లగా కొనసాగుటకే సంతృప్తి చెందినట్లయితే, నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
స్నేహమునకు అవకాశముండినప్పుడు, నేను అభ్యంతరపడి, ముభావముగా ఉండుటతోనే సంతృప్తి పడినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
పాపము లేని నా రక్షకుడు ఈ మార్గములో చివరి వరకు నడిచెనని మరచి, నాపై ఒకరు నిజము లేని అభాండములను రుద్దినప్పుడు నేను బాధ పడినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నా గూర్చి నాకు తెలిసినట్లు ఇతరులకు నా గూర్చి తెలిసినట్లయితే, వారు నన్నింకను ఖండిస్తారని మరచి, నన్ను అన్యాయముగా (అలా నాకన్పించవచ్చు) దోషిగా నిర్ణయించిన వారిపై నిష్టూరము పెట్టుకొన్నట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ప్రపంచమందలి సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువులను రోజుకు రెండుసార్లు కడిగే దేవుడే నా జ్ఞాపకములను కడిగివేయునట్లుగా, ''నేను క్షమిస్తాను, కాని నేను మరచిపోలేను, అటువంటి జ్ఞాపకములను నా మనసునుండి కడిగి వేయలేను'' అని నేను అన్నట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఇతరులు నన్ను తప్పుగా అర్థము చేసికొందురను ఉద్దేశంతో ఒకని అవసరత ఎంతగానో నాకుండిననూ, కర్ర, మట్టి మరియు గడ్డితోనే కట్టుటకు అతడు సంతృప్తి పడినప్పుడు నాకు ఉండిన వెలుగుకు విధేయత చూపకుండా, ఆ సహాయము లేకుండ నేను చేయునట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
మార్పులేని జీవిత పరిస్థితులు నాకు అలుపు తెచ్చినట్లయితే, నిర్వర్తించవలసిన క్లిష్టమైన విధులు నిర్వర్తించలేకుండా ఉండినట్లయితే, అజ్ఞానులు నన్ను చిరాకు పెడుతూ ఉండగా మరియు చిన్న చిన్న కలవరపాటులు నాకు కోపము తెప్పిస్తుండగా, జీవితములో వచ్చే చిన్న చిన్న పరీక్షలకు బాధపడుతూ ఉండినట్లయితే నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నేను ఇతరుల యొక్క సౌఖ్యముల గూర్చి లేక వారి భావాల గూర్చి లేక ఇంకా వారి చిన్న చిన్న బలహీనతల గూర్చి ఆలోచించని వాడనైతే, వారి మార్గము సుళువుగా చేయుటకు నాకున్న అవకాశములను పోగొట్టుకొనినట్లయితే వారి యొక్క చిన్ని చిన్ని బాధలను నేను పట్టించుకొననట్లయితే, సంతోషముతో సాగిపోయే కుటుంబములో పనులు పూర్తి చేయుటకు కష్టమగునట్లు నేను చేసినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నేను పనిచేస్తుండగా వచ్చే ఆటంకములు నాకు కోపం తెప్పించినట్లయితే మరియు నా వ్యక్తిగతమైన అవసరములు నాకు అసహనము కల్పించినట్లయితే అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నా ప్రక్కనే ఆత్మలు శ్రమ పడుతూ ఉండగా నాలో ఆత్మీయ వివేచన లేనందున, ఆ విషయం నాకు తెలియకుంటె, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నన్ను వేరొకరు వారికొరకు ఏదైనా చెయ్యమని అడిగినట్లయితే, దాని గూర్చి నేను భారముగా భావించనట్లయితే మరియు లోపల అయిష్టతకు చోటిచ్చి, నేను దానిని చేయకుండినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
మనుష్యుల యొక్క పొగడ్త నన్ను ఉప్పొంగజేసి మరియు వారి నింద నన్ను కృంగదీసినట్లయితే, నేను అపార్థము చేసికొనబడినప్పుడు నన్ను నేను సమర్థించుకొనకుండా విశ్రాంతిలో నుండక పోయినట్లయితే, నేను ఇతరులను ప్రేమించిన దానికంటే, నేను ప్రేమింపబడుటనే ఎక్కువగా ప్రేమించినట్లయితే, సేవ చేయుట కంటె సేవింపబడుటనే నేను ప్రేమించినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఒక ఆత్మ పాపదాసత్వము నుండి స్వాతంత్య్రము పొందవలెననే ఆశకు బదులుగా, స్వాతంత్య్రపు మార్గమును ఆ ఆత్మకు చూపుటకు దేవుడు నన్ను వాడుకొనవలెననే కోర్కె నాలో అధికముగా నుండినట్లయితే, ఆ ఆత్మ విడుదల పరిచర్యను ఇంకొకరికి ఇవ్వమని అడుగుటకు బదులుగా, ఆ పరిచర్య నేను చెయ్యలేక పోయాననే దిగులును నా మనసులో పెట్టుకొన్నట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
సహవాసములో ఇతరులు నాకు అక్కర్లేదు అన్పించినట్లుగా నేను ఒక స్నేహితునితో అతుకుకొనినట్లయితే, నా స్నేహములు అందరితో దారాళముగా నుండకుండా మరియు ఇతరులను లోతైన నిజ సహవాసములోనికి నడిపించనట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నాకు ప్రియమైన ఒకరిని క్రీస్తు కొరకు శ్రమ పడుటకు నేను ఒప్పుకొనక పోయినట్లయితే, అటువంటి శ్రమ యేసు శిష్యులలో ఎవ్వరికైనా ఇవ్వబడిన గొప్ప ఘనతయని నేను చూడక పోయినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
వేరొకరి జీవితములో క్రీస్తు మాత్రమే ఉండవలసిన స్థానములోనికి, నెమ్మదిగా నేను వెళ్లినట్లయితే, ఆ ఆత్మను ఆయనతో దగ్గరగా కలుపుటకు బదులుగా నన్ను ఆ ఆత్మకు మొదటి అవసరముగా చేసినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఇతరుల పరిచర్యలో నాకు ఆసక్తి లేనియెడల, నా ప్రత్యేకమైన పరిచర్యను గూర్చియే నేను ఆలోచించినయెడల, ఇతరుల భారములు నావి కానియెడల, వారి సంతోషము నాది కానియెడల, నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
నాతోటి విశ్వాసులు కష్టమైన, ఇబ్బందికరమైనది నానుండి అడుగులేక పోయినట్లయితే, నన్ను అడుగుటకు వెనుకాడి, ఇంకొకరి దగ్గరకు వెళ్ళినట్లయితే, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
సిలువ పాదాల దగ్గర ఉన్న ధూళిగా ఉండుట తప్ప ఈ భూమిపై ఏ స్థానాన్ని ఆశ పడినా, అప్పుడు నాకు కల్వరి ప్రేమ గూర్చి ఏమియు తెలియదు.
ఓ ప్రభువా! నా దేవా నాకు తెలియని దానిని, నాకు బోధించుము.