మీరు యేసు జీవితంలో పాలుపంచుకోవడంలో నిజంగా చనిపోయినట్లయితే, భౌతిక వస్తువుల ప్రేమ నుండి, మనుష్యుల గౌరవాన్ని కోరడం నుండి మిమ్మల్ని విడిపించడానికి దేవుడు మీకు వెయ్యి మరియు ఒకటి జరిగేలా చేస్తాడు. స్వీయ-జాలి మరియు అనేక ఇతర అన్-క్రీస్తు వైఖరులు. నీకు ఇష్టం లేకుంటే ఆ దారిలో వెళ్ళమని బలవంతం చేయడు. మీ చుట్టూ ఉన్న చాలా మంది విశ్వాసులు జీవించే నాసిరకం, ఓడిపోయిన జీవితాన్ని గడపడానికి మీరు సంతృప్తి చెందితే, అతను మిమ్మల్ని ఒంటరిగా వదిలివేస్తాడు. కానీ మీరు దేవుని ఉత్తమమైన వాటి కోసం దాహంతో ఉంటే, అతను మీతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు, మిమ్మల్ని నాశనం చేస్తున్న క్యాన్సర్లను నరికివేస్తాడు మరియు మిమ్మల్ని భ్రష్టు పట్టించే విగ్రహాలను నాశనం చేస్తాడు. అతను మిమ్మల్ని ఆ స్థిరమైన ప్రదేశానికి తీసుకురావడానికి - మీరు ఇకపై కదలలేని స్థితికి తీసుకురావడానికి, బాధ, నిరాశ, నష్టం, చెదిరిన ఆశలు, అవమానాలు, అన్యాయమైన విమర్శలు మొదలైన వాటిని అనుభవించడానికి మిమ్మల్ని అనుమతిస్తాడు. అప్పుడు మీరు ధనవంతులైనా లేదా పేదవారైనా, విమర్శించినా లేదా ప్రశంసించినా, గౌరవించబడినా లేదా అగౌరవపరచబడినా, ఆ తర్వాత మీకు ఎలాంటి తేడా ఉండదు. ఈ ప్రపంచంలోని ప్రతిదానికీ క్రీస్తు మరణంలోకి దిగి, మీరు ఈ భూమిపై రాజులా నడవడానికి కారణమయ్యే యేసు జీవితంలో పాలుపంచుకుంటారు. మీకు అలాంటి జీవితం కావాలా? చదవండి....
మనము ఎల్లప్పుడూ విజయములో జీవించాలన్నది మనయెడల దేవుని ఉద్దేశ్యమైయున్నది. అనేక లేఖనములలో ఇది ఎంతో స్పష్టముగా బోధించబడినది.
కొన్ని విషయములను చూద్దాం:
''క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము'' (2 కొరింథీ 2:14).
''మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము'' (రోమా 8:37).
''మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను'' (1యోహాను 2:1).
ఈ లేఖనములు మరియు అనేకమైన ఇతర లేఖనములు ఉన్నప్పటికీ దేవుడు వారిని జయజీవితములు జీవించవలెనని కోరుతున్నాడని అనేకమంది విశ్వాసులను ఒప్పించుట కష్టతరమైనది.
లేఖనములలో వ్రాయబడినదానిని సామాన్యముగా, చిన్న బిడ్డవలె విశ్వసించినట్లయితే అప్పుడు ఈ సందేశం మనకు ఎంతో సులువుగా, స్పష్టముగా అర్థమవుతుంది. కాని మన స్వబుద్ధిపైన మనము ఆధారపడినట్లయితే, ఈ దుష్టప్రపంచములో ఎందుకు ఇలాంటి జీవితము సాధ్యము కాదో అని చెప్పుటకు ఒప్పించదగ్గ వాదములను మనము కలిగియుంటాము. మరియు అనేకమంది విశ్వాసములేని ''విశ్వాసులు'' మన స్వబుద్ధి ఏదైతే చెబుతుందో దానికి అనువుగా వారి సాక్ష్యములను కూడా కలిపి చెబుతుంటారు. అప్పుడు మనము కూడా ఈ లోకములో జయజీవితము అసాధ్యమని ఒప్పించబడతాము.
మనము నిరంతరము జయజీవితములో జీవించాలని దేవుడు కోరుతున్నాడు అని మనము ఒప్పించబడే వరకు కూడా అటువంటి జీవితము కొరకు మనము విశ్వాసము కలిగియుండలేము. మరియు విశ్వాసము లేకుండా అటువంటి జయజీవితములోనికి ప్రవేశించుట అసాధ్యము. క్రైస్తవ జీవితములోని ప్రతి విషయము కూడా కేవలం విశ్వాసం మీదే ఆధారపడియుంటుంది. దేవుడు తన వాక్యములో మనకిచ్చిన ప్రత్యక్షతపై విశ్వాసం ఆధారపడియుంటుంది.
అనేక సంవత్సరములనుండి నీవు ఓడిపోయిన జీవితం జీవిస్తున్నప్పటికీ, దేవుని వాక్యములో నిరంతర జయజీవితము అను సత్యమును నీవు స్పష్టముగా చూడగలిగినట్లయితే, ఇది జయజీవితము వైపుగా తొలి అడుగు అవుతుంది.
1 యోహాను 2:6 ''క్రీస్తు యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై యున్నాడు'' అని చెబుతుంది. యేసు ఏ విధంగా నడిచాడు? కొంత సమయమందు జయమును కలిగి యుండటమా, ఎక్కువ సమయమునందా లేక అన్ని సమయాల్లో జయ జీవితం కలిగియుండటమా? మనకు సమాధానం తెలుసు. ''సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా నుండెను'' (హెబ్రీ 4:15).
ఆయన నడచినట్టుగా మనము ఇప్పుడు నడువవలెనని మనకు చెప్పబడినది. అది ఈ భూమిపై సాధ్యమవుతుందా? మనము చేయలేమని దేవునికి బాగుగా తెలిసి కూడా వాటిని చేయమని దేవుడు చెబుతాడా? లేదు. అది ఊహకు అందనిది. ఈ లోకపు తండ్రులు కూడా తమ పిల్లలను చేయలేని వాటిని చెయ్యమని అడగరు. మరి ఇక దేవుడు ఎలా అడుగుతాడు?
అత్యంత విచారకరమైన కొన్ని మాటలు క్రొత్త నిబంధన మత్తయి 13:58లో వ్రాయబడి ఉన్నవి. ''వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు''. మార్కు 6:5లో ఉన్నట్టి అదే భాగములో ''ఆయన ఏ అద్భుతమును చేయజాలక పోయెను'' అని చెప్పబడినది.
ఆయన తన స్వంత ఊరిలోని ప్రజల కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేయాలని ఆశించాడు. కాని వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి ఆయన చేయలేకపోయాడు. అవిశ్వాసము మహోన్నతుడైన దేవుని చేతులను కట్టివేస్తుంది. గనుక ఆయన మన కొరకు చేయాలనుకున్న కార్యాలను చేయలేడు.
నీ జీవితంలో దేవుడు నీకొరకు అద్భుతాలను చేయాలని ఆశించినా కూడా, నీ అవిశ్వాసమును బట్టి వాటిని ఆయన చేయలేక పోతున్నాడేమోనని ఆశ్చర్యపడుతున్నాను. మనలో ఎవరమైన క్రీస్తు తీర్పు సింహాసనము దగ్గర ''నీ యొక్క అపనమ్మకం వలన నీ కొరకు నేను ఉద్దేశించినది, నీ ద్వారా చేయాలని ఆశించినది ఏదీ నేను చేయలేకపోయాను'' అనే మాటలు మనం భూమిపై జీవించిన జీవితం చివరన కనుగొంటే మన హృదయాల్లో ఎంతగా చింతించాల్సి ఉంటుందో! దానిని గూర్చి ఇప్పుడే ఆలోచించడం మంచిది.
నేను మారుమనస్సు పొందిన తరువాత తొలి సంవత్సరాలలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించే కొన్ని సంఘాలలో సమయాన్ని గడిపాను. ఒక విధంగా దేవునికి దీని గూర్చి కృతజ్ఞుడిని. ఎందుచేతనంటే దేవుని వాక్యమును గూర్చిన ప్రాథమిక విషయాలను బాగా తెలుసుకోగలిగాను. కాని అది చాలా వరకు తలకెక్కిన బాహ్య జ్ఞానమే తప్ప దానంతటిలో పరిశుద్ధాత్మ యొక్క బయల్పాటు ఉండేది కాదు, ఎందుచేతనంటే వారు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య గూర్చి ఎక్కువగా నమ్మేవారు కాదు. మేము బైబిలును, పాఠశాలలో విద్యార్థులు రసాయనిక శాస్త్ర పాఠాలను ఏ విధంగా అధ్యయనం చేస్తారో ఆ విధంగా అధ్యయనం చేసాము. మేము పాత నిబంధనలోని వివిధ రకములైన అర్థములను కనుగొన్నాము. కాని మేము అప్పటికిని మా జీవితాల్లో పాపముచేత ఓడింపబడుచుంటిమి. దేవుడు నా పాపములను క్షమించాడని నాకు తెలుసు, కాని అంతకు మించి మరి ఏ ఇతర విషయాలకు సంబంధించి నాకు విశ్వాసముండేది కాదు.
ఎప్పుడైతే ఆత్మలో బాప్తిస్మమును గూర్చిన సత్యమును వాక్యములో తెలుసుకొని మరియు దాని గూర్చి దేవుని అడగడం మొదలు పెట్టానో, అప్పుడు నాకొక భయంకరమైన సమస్య కలిగింది. అది నేను దాన్ని గూర్చి నమ్మలేకపోయాను. నేను ఉపవాసముండి ప్రార్థించాను మరియు ఎట్టి మూల్యమైనా చెల్లించటానికి సిద్ధపడ్డాను. దేవుడు నా విన్నపాలు విన్నాడనియు మరియు వాటిని అనుగ్రహించాడని నమ్ముట నాకు ఎంతో కష్టమైనది. మనము ప్రార్థించినప్పుడెల్లా మనము అడుగువాటిని పొందామని నమ్మమని యేసు చెప్పారు. ''అందుచేత మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి'' (మార్కు 11:24).
పైన చెప్పబడినటువంటి చిన్న బిడ్డలలో ఉండేటటువంటి సామాన్యమైన విశ్వాసములోనికి రావటానికి నాకు ఎంతో కాలము, ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆఖరుగా దేవుని కృపచేత దేవుడు నా ప్రార్థనలు విన్నాడనియు మరియు అడిగింది అనుగ్రహించాడని నమ్మే స్థితికి వచ్చాను. విశ్వాసము ద్వారా ఆత్మలో బాప్తిస్మము పొందాను. దానిననుసరించిన భాషలతో మాట్లాడే వరము, నేను అప్పటికే విశ్వాసముతో పొందినదానిని స్థిరపరచింది.
ఇప్పుడు నేను గత సంవత్సరాలలో నా పోరాటాన్ని చూసుకొన్నప్పుడు నన్ను ఆటంకపరచింది అపనమ్మకమేనని తేటగా చూడగల్గుతున్నాను.
ఇదే నియమము పాపముపై జయ జీవితములో ప్రవేశించడానికి కూడా వర్తిస్తుంది. మనలను దేవుడు అటువంటి జీవితంలోనికి నడిపించగలడని, నడిపిస్తాడని మనము నమ్మేవరకు మనము ప్రార్థించవచ్చు, ఉపవాసముండవచ్చు మరియు తృష్ణ కలిగియుండవచ్చు. అయినప్పటికిని మనము ఏమియు పొందలేకపోవచ్చు.
నీవు దేవుని నుండి విశ్వాసముతో తప్ప ఏదీ కూడా పొందలేవని సాతానుకు తెలుసు. గనుక అతడు ఎలాగు నీ హృదయాన్ని అపనమ్మకముతో నింపుతాడో నీవు ఊహించుకోవచ్చు. అపనమ్మకం అనేది -అబద్ధం, వ్యభిచారం కంటే గొప్ప ప్రమాదకరమైనది ఎందుకంటే, ఇప్పుడు చెప్పబడినవి, సుళువుగా పాపములుగా గుర్తింపు పొందుతాయి. అపనమ్మకం అలాకాదు.
''సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి'' అని హెబ్రీ 3:12 చెబుతుంది. విశ్వాసము లేని దుష్టహృదయము దేవుని యొద్ద నుండి పడిపోయేటట్లు చేస్తుంది. ''అవిశ్వాసమనేది మిగిలిన అన్ని పాపములకు మూల కారణము''. రాబోయే అధ్యాయాలలో అది చూస్తాము.
మనము కృపలో నుండిన యెడల పాపము మన మీద ప్రభుత్వము చేయదని రోమా 6:14 స్పష్టముగా చెబుతుంది. ఇది ఒక చిన్న బిడ్డ కూడా స్పష్టముగా అర్థము చేసికొనే లాగున వ్రాయబడింది. ఇలాగు ఉన్నప్పటికీ అనేకమంది విశ్వాసులు పాపముపై విజయము కలిగిన జీవితాన్ని జీవించడం సాధ్యమనే విషయాన్ని నమ్మరు.
నీవు విజయమందు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క ఆలోచనా జీవితము ఎంత మురికిగా నుండినా లేక ఎంతో కాలం నుండి నీవు కోపముచే ఓడింపబడుచున్నా పర్వాలేదు. ప్రభువు నిన్ను సంపూర్తిగా విడుదల చెయ్యగలడు మరియు స్వచ్ఛమైన హృదయాన్ని ఇవ్వగలడు. కాని నీవు విశ్వసించేవరకు ఆయన ఏ కార్యం చేయలేడు.
మనము హృదయములో విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకోవాలని బైబిలు చెబుతుంది రోమా 10:10 ఈ విధముగా చెబుతుంది.''ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును''. ఇది ఒక ముఖ్యమైన సిద్ధాంతము. మనము నోటితో ఒప్పుకొనుట ద్వారా మన విశ్వాసాన్ని తెలియబరుస్తాము. ఇలాగు చేయడం మనలను ప్రతిపాపము నుండి రక్షణలోనికి నడిపించును. ''పాపముపై విజయములోనికి దేవుడు నన్ను నడిపించునని నమ్ముచున్నానని'' మనము సాతానుకు సాక్ష్యం చెప్పాలి. ఆ విధముగా సాతానును జయించగలము. ''వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు'' (ప్రకటన 12:11). నీ జీవితంలో విజయమన్నది నిజమయ్యే వరకు, నీవు పడిపోయిన ప్రతిసారి నోటితో ఆ ఒప్పుకోలును చేస్తూ ఉండు. ఒక్కరాత్రికే అది (పాపముపై విజయము) జరగక పోయినట్లయితే నిరుత్సాహపడకు. నీ నోటితో ఒప్పుకొన్న దానిని దేవుడు తప్పక ఘనపరుస్తాడు. నీవు కూడా సాతానును జయించగలవు.
అనేకమంది విశ్వాసులలో గల ఒక చెడు అలవాటు దేవుని వాక్యమును తేలికగా తీసుకొనడము. ఉదాహరణకు మత్తయి 12:36,37 వచనాలలో, యేసు యొక్క మాటలను చూద్దాము. ''మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునొందుదువు''.
నేను అనుకొనేదేమంటే అనేకమంది విశ్వాసులు వారు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పగించవలసియున్నదని నమ్మరు. దానిని వారు నమ్మినట్లయితే, క్రైస్తవులలో అంతగా చాడీలు చెప్పుకోవడం, గాలి కబుర్లు చెప్పుకోవడం, చెడు మాట్లాడుకోవడం మరియు కోపము ఉండదు. మనము దేవుని మాటను తీవ్రంగా తీసుకున్నట్టయితే, మన మాటలలో వ్యర్థమైన వాటిని ఇంకా సమూలముగా తీసివేసికొని యుందుము.
మన మాటలను బట్టి తీర్పు తీర్చబడతాము, అని కూడా ప్రభువైన యేసు చెప్పారు. మనకందరకు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్పు తీర్చబడుటను గూర్చి తెలియును. కాని క్రియలు లేని విశ్వాసము మృతము, అలాగుననే మన సంభాషణను మార్చలేని విశ్వాసము మృత విశ్వాసం. గత మూడు నెలలుగా నీవు ఇంటిలో, నీ ఆఫీసులో, నీ భర్తతో, పిల్లలతో, పనివారితో మొదలగు వారితో మాట్లాడిన (లేక వ్రాసినట్టి) మాటల గూర్చి ఆలోచించు. ఒకవేళ టేపురికార్డర్‌లో రికార్డు చెయ్యబడిన నీ సంభాషణ నీ చుట్టు ఉండిన ప్రపంచానికి భిన్నంగా, నిన్ను ఒక దేవుని బిడ్డగా నిరూపిస్తుందా? తీర్పు తీర్చగలుగుతుందా? లేక నీ మాటలు కూడా అవిశ్వాసులయొక్క మాటలులాగే ఉన్నవా?
అనేకమంది విశ్వాసుల సంభాషణ పరిశుభ్రపరచబడుటలేదు. ఎందుచేతననగా వారు యేసు యొక్క మాటలను అంత తీవ్రముగా తీసుకొనలేదు. ఇది ఎందుచేతనంటే వారు దేవునికి భయపడకపోవుట చేత. వారు దేవుని కంటే మనుష్యులకు ఎక్కువ భయపడతారు. మనము దేవుని యొక్క మాటలను తీవ్రంగా తీసుకొనే అలవాటు పెంపొందించుకొనకపోయినట్లయితే మన ఆత్మీయ జీవితములో వృద్ధిని పొందగలమనే నిరీక్షణను కలిగియుండలేము.
''ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే'' అని యాకోబు 1:26 చెబుతుంది. ఒక వ్యక్తి తన నాలుకను అదుపులో పెట్టుకోలేనట్లయితే, తన క్రైస్తవత్వము వ్యర్థము.మనము మాటలాడే మాటలు మన హృదయస్థితిని సూచిస్తాయి అని యేసు ప్రభువు చెప్పారు. ''హృదయము నిండియున్న దానిని బట్టి నోరు మాట్లాడును'' (మత్తయి 12:34). మన నాలుకను మనము ఉపయోగించే విధానమే మన ఆత్మీయ స్థితికి స్పష్టమైన సూచన.
ఇక్కడ మరొక ఉదాహరణ ఉన్నది: భర్తలు తమ భార్యల యెడల నిష్ఠూరము పెట్టుకొనకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ''భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి; వారిని నిష్ఠూర పెట్టకుడి'' (కొలొస్స 3:19).
దీని అర్థమేమిటి? తన భార్యపైన ఒక్కసారైనా నిష్ఠూరపడుటకు భర్త అనుమతించబడ్డాడా? దేవుని వాక్యము వ్యభిచారము లేక నరహత్యను నిషేధిస్తున్నప్పుడు అటువంటి పాపములను ఒక్కసారి కూడా మనము చేయకూడదని మనకు తెలుసు. అయినప్పటికీ భర్త తన భార్యను నిష్ఠురపెట్టకూడదని మనము చదివినప్పుడు అది మనలను అంతబలముగా తాకదు. ఎందుకని? ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలలో ఏవి తీవ్రమైనవో, ఏవి తీవ్రమైనవి కావో అని మనము ఎన్నుకొని ఏరుకుంటాము. దేవుని వాక్యమంతటిని కూడా మనము తీవ్రముగా తీసుకోవలసియున్నదని మనము తెలుసుకోము.
ఎవరైతే దేవుని యొక్క ప్రతి మాటను కూడా తీవ్రముగా తీసుకుంటారో, వారు ఓడిపోయిన ప్రతిసారి కూడా వారి పాపమును బట్టి దు:ఖిస్తారు. ఆ విధముగా వారు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ(బలము)ను కనుగొని, జయజీవితములోనికి, నడిపించబడతారు. ''దు:ఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు (బలపరచబడుదురు)'' (మత్తయి 5:4).
విజయమునకు మరొక రహస్యమొకటి ఇక్కడున్నది: దేవుని యొక్క ప్రతిమాటను కూడా తీవ్రముగా తీసుకో మరియు ఎప్పుడైతే దేవుని ప్రమాణాల కంటే తక్కువ స్థాయి జీవితము జీవించి పాపము చేస్తావో ఆ పాపమును బట్టి దు:ఖించు. ఆ విధముగా నీవు దేవునికి భయడుతున్నావని ఋజువు పరచుకొంటావు
మరియు జయజీవితమునకు నడిపించే జ్ఞానమునకు దేవుని యందలి భయభక్తులే మూలము.
ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై దేవుని మాట విని వణుకుచుండునో వానినే దేవుడు కృపతోను, దయతోను చూచును.
''ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నామాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను'' (యెషయా 66:2).
మన ఆత్మీయ సమస్యలన్నిటికి మూల కారణము, దేవుణ్ణి ప్రేమ కలిగిన తండ్రిగా మరియు సర్వాధికారియైన దేవునిగా తెలుసుకొనక పోవడంలోనే యున్నది.
యేసును ప్రేమించినట్టుగానే, తండ్రి మనలను ప్రేమించునని యేసు మనకిచ్చిన సత్యము ఒక మహిమాయుక్తమైన ప్రత్యక్షత. అది నా క్రైస్తవ జీవితాన్ని విప్లవాత్మక పరిచింది. ''వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని''(యోహాను 17:23).ఈ సత్యము మన చుట్టూ ఉన్న లోకము తెలుసుకోవాలని యేసు అక్కడ ప్రార్థించెను. కాని లోకము ఈ విషయాన్ని గ్రహించుటకు ముందు మన హృదయాలను ఆ సత్యం పట్టుకోవాలి.
క్రైస్తవులందరు పరలోకమందున్న ఒక ప్రేమ గలిగిన తండ్రిని సిద్ధాంతపరంగా నమ్ముదురు. అయితే తరచు ఆందోళన చెందడము, పూర్తి అభద్రతలోనుండుట మరియు భయము, ఋజువు చేసేదేమంటే వాస్తవానికి వారు వారి హృదయాంతరంగములలో అది నమ్ముట లేదనే విషయము.
అతికొద్దిమంది మాత్రమే దేవుడు యేసును ప్రేమించినంతగా వారిని ప్రేమిస్తున్నారని నమ్ముటకు ధైర్యం చేస్తున్నారు. యేసు ఆ విషయాన్ని తేటగా చెప్పనట్లయితే మనలో ఎవ్వరము కూడా అటువంటి సత్యమును నమ్ముటకు ధైర్యము చేసియుండేవారము కాము.
ఒకమారు ఈ మహిమగల సత్యమునకు నీ కన్నులు తెరవబడినట్లయితే, జీవితంపై నీకుండిన అభిప్రాయాన్ని అది మార్చి వేయును. నీ జీవితంలో నుండిన సణుగుడు మరియు వ్యాకులత మరియు విచారము పూర్తిగా అదృశ్యమయిపోవును. ఇలా జరుగగలదని నాకు తెలుసును, ఎందుచేతననగా నా జీవితములో అలా జరిగెను.
నేను అనేక సంవత్సరములు ఈ వ్యాకులత యొక్క దాస్యంతో యుండి ఓడింపబడుతూ ఉండేవాడిని. అది నా పట్ల దేవుని యొక్క చిత్తము కాదు కాని దాని నుండి విడుదల పొందలేకుండా ఉంటిని. దేవుడు యేసును ప్రేమించినంతగా నన్నును ప్రేమిస్తున్నాడనే సత్యమునకు నా కన్నులు తెరవబడినప్పటినుండి నా పరిస్థితులన్ని వేరుగా నుంటున్నవి. నా మార్గములో వచ్చు ప్రతిది కూడ ప్రేమ కలిగిన తండ్రి యొద్ద నుండి వస్తుందని ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఆయన నుపాపవలె నన్ను గూర్చి జాగ్రత్త తీసుకొనుచున్నాడని నేను చూచి యుంటిని. అందుచేత ఇప్పుడు జీవితములో ఏ పరిస్థితి కూడా నేను సణుగు కొనులాగున లేక వ్యాకులపడేలాగున ఎప్పటికి చేయలేవు. పౌలు చెప్పినట్లు అన్ని పరిస్థితులలో సంతృప్తి కలిగియుండడము మరియు దేవుని స్తుతించడము అనే రహస్యాన్ని నేను నేర్చుకొనియున్నాను. ''ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తికలిగియుండ నేర్చుకొని యున్నాను''. ''ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము'' (ఫిలిప్పీ 4:4,11; 1థెస్స 5:16-18). దేవుడు యేసును ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఇప్పుడు నా జీవితము యొక్క కదలింపబడని పునాది.
నీవు ఈ జయ జీవితములోనికి ప్రవేశింపలేకపోవుటకు నీవు తగినంతగా ఉపవాసము మరియు ప్రార్థింపకపోవుట వలన కాదు. విజయము స్వంత ప్రయత్నము ద్వారా కాదు కాని విశ్వాసము ద్వారా వచ్చును. ''దేని యందు విశ్వాసము?'' అని మనము అడుగవచ్చు. అది నీ యెడల దేవుని యొక్క సంపూర్ణ ప్రేమయందలి విశ్వాసము.
'నీవు తగినంతగా ఉపవాసముండుట లేదు', నీవు తగినంతగా ప్రార్థించుట లేదు, నీవు తగినంతగా సాక్ష్యమిచ్చుట లేదు, నీవు తగినంతగా బైబిలు చదువుటలేదు మొదలైనవి చెప్పే సాతాను యొక్క దోషారోపణ క్రింద అనేకులు జీవిస్తున్నారు. వారు ఎడతెగక ఇటువంటి ఆలోచనలనే కొరడాలచే కొట్టబడుతూ నిరంతరం కొనసాగేటి కార్యకలాపాల భ్రమణంలోనికిని మరియు అనేకమైన నిర్జీవ క్రియలలోనికిని త్రోలి వేయబడుదురు.
నీయొక్క స్వంత క్రమశిక్షణ, ఉపవాసము, ప్రార్థన, దశమ భాగార్పణ మరియు సాక్ష్యమిచ్చుట అనునవి దేవుని మీద నీకున్న ప్రేమనుండి ప్రారంభమవక పోయినట్లయితే అవి నిర్జీవ క్రియలని నీవు ఆలోచించితివా? మొదటగా నీవు దేవుని ప్రేమలో భద్రత కలిగి లేనట్లయితే అవి ప్రేమనుండి ఆరంభము కావు.
మనము దేవుని ప్రేమయందు వేరుపారి, స్థిరపరచబడవలెనన్నది ఎఫెసీ క్రైస్తవుల గురించి పౌలు ప్రార్థించాడు.
''మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మవలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి.....'' (ఎఫెసీ 3:15-18).
ఎఫెసీ క్రైస్తవులు అప్పటికే మారుమనస్సు పొంది, ఆత్మయందు బాప్తిస్మము పొందియున్నారు. అయినప్పటికీ వారియెడల దేవుడు కలిగియున్న ప్రేమయందు వేరుపారి, స్థిరపడి మరియు ఆ ప్రేమయొక్క పొడుగు, లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఆత్మ వలన బలపరచబడవలసియున్నది. ఆ తరువాత మాత్రమే క్రీస్తు యొక్క సంఘము కట్టబడుటకు కావలసిన కృపావరములను గురించి పౌలు చెబుతున్నాడు. ''అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను....పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులను గాను నియమించెను'' (ఎఫెసీ 4:7,13).
దేవుని ప్రేమయందలి ఆ పరిపూర్ణ భధ్రతను మనము ఎల్లప్పుడు కలిగియుండాలి. మన పరిచర్య ఫలవంతముగా నుండాలటే మనము ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడాలి.
క్రొత్త నిబంధనలో వేరొకచోట దీనిని గురించి ''విశ్రాంతిలోనికి ప్రవేశించుట'' అని చెప్పబడింది. ''విశ్వాసము కలిగియున్న (మనయెడల దేవుని పరిపూర్ణ ప్రేమయందు) మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము'' (హెబ్రీ 4:3) అని అపొస్తలుడు చెబుతున్నాడు. ఆ తరువాత మన పూర్ణ హృదయముతో ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు ప్రయాసపడవలెనని ఆయన మనలను హెచ్చరిస్తున్నాడు. ''కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము'' (హెబ్రీ 4:11). దేవుని ప్రేమలో మనము పరిపూర్ణ భధ్రత యందు ''విశ్రాంతి''ని కనుగొననట్లయితే మనము పడిపోవుట ఎంతో సులువు.
ప్రపంచమంతా తమను ప్రేమించే వారు ఒక్కరైనా ఉందురాయని ఎదురు చూచే మనుష్యులతో నిండిపోయి ఉంది. అనేకమంది క్రైస్తవులు ప్రేమింపబడుటకై ఒక సంఘమునుండి వేరొక సంఘమునకు వెళ్లుచుందురు. కొందరు స్నేహంలో మరియు వివాహంలో ప్రేమ గురించి వెదకుతూవుంటారు. కాని ఈ అన్వేషణ అంతా నిరాశతో ముగుస్తుంది. అనాధలవలె, ఈ ఆదాము యొక్క పిల్లలు భద్రతలేకుండా యుండి దాని ఫలితముగా మరల మరల వారి యందు వారు జాలిపడే భావాలతో ఓడింపబడుతుంటారు. ఒక విచారకరమయిన విషయమేమిటంటే అనేకులు వారు క్రీస్తులోనికి మారిన తరువాత కూడా భధ్రత లేని స్థితిలో ఉండవలసిన అవసరము ఇక లేనప్పటికీ అదే స్థితిలో నుండెదరు.
ఈ సమస్యకు సువార్తలో గల సమాధానమేమిటి? దీనికి సమాధానము దేవుని ప్రేమలో భద్రతను పొందడమే.
యేసు ఆయన శిష్యులకు వారి తలపై నుండిన వెంట్రుకలన్నియు లెక్కింపబడినవనియు మరియు కోట్ల సంఖ్యలో నుండెడి పక్షులకు ఆహారమును మరియు కోట్ల కొద్ది పువ్వులకు వస్త్రములను ధరింప చేసే దేవుడు తప్పనిసరిగా వారి గూర్చిన జాగ్రత్త తీసుకొనునని మరల మరల చెప్పారు. దీనియంతటి కంటె గొప్పదైన వాదన ''తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?'' (రోమా 8:32). యేసును గూర్చి జాగ్రత్త తీసుకొన్న దేవుడు, నీ గూర్చియు జాగ్రత్త తీసుకొంటాడు.
దేవుడు కొన్నిమార్లు మనము మన తోటి మానవ మాత్రులతో భంగపడే పరిస్థితిని అనుమతించడానికి ఒక కారణము, మనలను మానవునిపై ఆధారపడుటను మాన్పుట కొరకు. ఆయన అటువంటి విగ్రహారాధన నుండి మనలను విడుదల చేయాలని ఆశిస్తున్నారు (మానవునిపై ఆధారపడుట ఒక విధమైన విగ్రహారాధన), దాని వలన మనము దేవునిపైన పూర్తిగా ఆధారపడుటను నేర్చుకొనెదము. దీనిని బట్టి నీకు అన్ని వైపులనుండి పరిస్థితులు ఆశాజనకంగా లేనివిధంగా ఉండునట్లు దేవుడు ఆదేశించినప్పుడు అదినిన్ను నిరుత్సాహపరచకూడదు. ఈ పరిస్థితి కేవలము దేవుడు, నీవు మాంసపు శరీరులపై ఆధారపడుటను తప్పించుట కొరకు మాత్రమే, అందువలన నీవు ఆయన యందు విశ్వాసముతో జీవించుటను నేర్చుకొనెదవు. దేవుడు యేసును ప్రేమించినట్టుగానే నిన్నును ప్రేమిస్తున్నాడనే వాస్తవంలో నీవు భద్రత కలిగి యుండడము నేర్చుకో.
క్రైస్తవులలో పోటీలు మరియు అసూయలు అన్ని ఈ భద్రతా లేమి నుండి కలుగునవే. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమ యొక్క భద్రతలో ఉండునో మరియు ఎవరైతే దేవుడు అతడిని చేసిన విషయములోను మరియు అతడికిచ్చిన వరములు మరియు తలాంతులు విషయములో పొరపాటు చేయలేదని నమ్మునో అతడు ఎప్పుడును ఇంకొకరిపై అసూయపడుటకాని, పోటీపడుటకాని చేయడు. విశ్వాసుల మధ్య సంబంధములలో వచ్చు సమస్యలకు ప్రధాన కారణము ఈ భద్రతాలేమి వలననే.
దేవుడు యేసును ప్రేమించినట్టే నిన్నుకూడా ప్రేమిస్తున్నాడు అను ఈ ఒక్క సత్యము విషయములో నీ కన్నులు తెరువబడినట్లయితే నీకు ఉన్న వాటిలో ఎన్ని సమస్యలు పరిష్కారమవుతాయో ఒక్కసారి ఆలోచించండి.
దేవుడు మన జీవితాలలోనికి అనుమతించే ప్రతి విషయానికి, దేవునికి ఒక సంకల్పము, ఒక మహిమకరమైన ఉద్దేశ్యము ఉన్నదని ఎప్పుడైతే మనము చూచెదమో అప్పుడు మన జీవితము అద్భుతముగా నుండును. మన ప్రార్థనలకు ఎప్పుడు ఆయన 'కాదు' అని చెప్పుదురో, అదికూడా పరిపూర్ణమైన ప్రేమనిండిన హృదయములో నుండి వచ్చిన జవాబే.
దేవుడు ఇశ్రాయేలీయులను కరచుటకు అరణ్యములో తాపకరములైన సర్పములను పంపినప్పటిది, అది ప్రేమ వలననా? ''అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి'' (సంఖ్యా 21:6). అది తప్పకుండా అందుచేతనే, ఎందుకనగా ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపము చెంది ఆయన తట్టుతిరుగుదురనియు అట్లు వారిని ఆశీర్వదించుటకు దేవుడు ఆ పద్ధతిని వాడెను. ఆయన వారిని ఆశీర్వదించాలని అనుకొనెను కాని వారు పశ్చాత్తాపము నొందు వరకు అట్లు చెయ్యలేకపోయెను.
''నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు - ఇదే యెహోవా వాక్కు'' (యిర్మీయా 29:11).
దేవుడు ఈ లోకమును రోగములు, వ్యాధులు మరియు విష సర్పములు మొదలైన వాటితో అసౌకర్యముగా నుండుటకు అంగీకరించుటకు ఒక కారణము ప్రజలు వారి కష్టపరిస్థితిలో ఆయనవైపు తిరుగుదురని అట్లు ఆయన వారిని దీవించుటకు, ఆ విధముగా దేవుడు కీడులను (సాతాను కల్పించిన వాటిని) కూడా ఆయన యొక్క సంకల్పములను కొనసాగించుటకు పనికి వచ్చులాగున ఉపయోగించుట కొఱకు.
మనము నిత్యత్వమందు క్రీస్తురక్తముతో విమోచింపబడిన వారిని కలుసుకొనినప్పుడు, పాము కాట్లు, ఆర్థిక యిబ్బందులు, కేన్సరు రోగములు మొదలైన వాటిని, ప్రజలు వారి పాపముల నుండి తిరిగి ఆయన యొక్క బిడ్డలగుటకు దేవుడు ఎలా వాడుకొన్నారనే కథలను వారి నుండి మనము తెలుసుకొనెదము. దేవుడు ఏ విధముగా శ్రమల ద్వారా ఆయన బిడ్డలను పవిత్రులను చేసి ఆ విధముగా ఆయన యొక్క స్వభావములో పాలివారగుటకు ఉపయోగించెనో కూడా వినెదము.
ఆ రోజున భూమిపై మనము అర్థము చేసికొనని అనేక విషయముల గూర్చి దేవునికి కృతజ్ఞత తెలిపెదము. అయితే విశ్వాసముతో నుండినవ్యక్తి ఆ దినము వరకు ఎదురు చూడనక్కరలేదు, అతడు దేవుని యొక్క జ్ఞానము మరియు ప్రేమయందు ఇప్పుడే నమ్మిక యుంచెను కాబట్టి అతడు ప్రతిదానికి ఇప్పుడే కృతజ్ఞత తెలపడము మొదలు పెట్టును.
మన యెడల దేవుని ఉద్దేశ్యముల యొక్క అంతిమ ఫలితము మనము ఆయన యొక్క స్వభావములో పాలుపంచు కొనవలెననునది. దేవుడు అన్ని విషయములను మనకు మేలు కలుగుటకు సమకూర్చి జరిగించుచుండెను- ఆ మేలు మనము ఆయన కుమారుని సారూప్యము గలవారమవుటకు. ''దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను'' (రోమా 8:28,29).
మనలో అనేకులకు జనసమ్మర్ధమున్న బస్సులలో, రైలులో మన జేబులు కత్తిరింపబడినట్టి అనుభవము కలిగియుందుము. నేను అటువంటి సమయములో ఆ దొంగ లేక మోసగాడి గూర్చి ప్రార్థించుట ఒక అంశముగా చేసికొంటిని. అది మాత్రమే కాక మనకు డబ్బుతోను మరియు వస్తువులతోను మనకుండిన మితిమీరిన బంధము నుండి విడవడానికి కూడా దేవుడు కోరుచుండెను. మనము పోగొట్టుకొనిన ప్రతి రూపాయి గూర్చి చింతించుట లేక మనము సంపాదించిన ప్రతి రూపాయి గూర్చి ఆనందించునట్లు బహుగా లెక్కలు చూచుకొను వారముగా ఉండకుండునట్లు ఆయన కోరుకొనుచుండెను. ఏమైనా వస్తువులు పొందుట చేత పెరిగేటి మరియు వస్తువులు పోగొట్టుకొనుట చేత తరిగేటి సంతోషము కాక మన యొక్క సంతోషము ఆయన యందే ఉండాలని ఆయన కోరుకొనుచున్నాడు.
యేసు భూమిపై అట్లు నడిచెను మనము కూడా అట్లు నడవవవెనని పిలువబడ్డాము. ''క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి'' (ఫిలిప్పీ 2:5). యేసునకు కృతజ్ఞతతో ఎవరైనా ఆయన పరిచర్య కొరకు ఒక పదివేల దేనారములు బహుమతిగా ఇచ్చినట్లయితే, అది యేసు యొక్క సంతోషాన్ని ఏమాత్రము ఎక్కువచేసి యుండేదికాదు. ఎందుకనగా ఆయన సంతోషము ఆయన తండ్రియందు అప్పటికే నిండి పొంగి ప్రవహిస్తున్నది. కాబట్టి అదే సమయములో ఏదైనా వస్తువులు నష్టపోవుటచేత ఆయన సంతోషము తగ్గియుండేది కాదు. ఇస్కరియోతు యూదా తరచుగా యేసునకు వచ్చిన బహుమానముల నుండి చాలా సొమ్మును దొంగిలించుచుండెడివాడు. యేసుకు అది తెలియును. యూదా గూర్చి ఆయన తప్పనిసరిగా విచారించియుండవచ్చును, కాని సొమ్ము నష్టపోయిన దాని విషయమును గూర్చి ఆయనెప్పుడునూ కలత చెందియుండలేదు.
దేవుని ప్రజల యొక్క కానుకల యెడల ఈనాటి బోధకులకున్నట్టి వైఖరి ఎటువంటి వేరైన కథ! అయితే ఆ బోధకులను వారిమట్టుకు వారిని విడచిపెట్టుదాము! మన గూర్చి ఏమిటి? మన సంతోషము భౌతిక వస్తువుల వలన ఎక్కువగుట లేక తక్కువగుట జరుగునా? అట్లయిన నిన్ను నీవు తీర్పు తీర్చుకొనుచు నీ రక్షణను భయముతో, వణకుతోను కొనసాగించుకొనవలెను.
నీవు యేసు యొక్క జీవములో పాలుపంచుకొనవలెనని నిజమైన ఆసక్తితో నుండినట్లయితే నిన్ను భౌతిక వస్తువుల ప్రేమ నుండి, మనుష్యుల నుండి గౌరవము పొందాలనుకొనుట, నీ గూర్చి నీవు జాలి పడుట నుండి మరియు అనేకమైన క్రీస్తు వైఖరి కానటువంటి విషయాల నుండి నిన్ను విడుదల చేయుటకు దేవుడు ఎన్నెన్నో విషయాలు నీకు జరుగునట్లు అనుమతించును.
నీకు యిష్టము లేనట్లయితే ఆ మార్గములో వెళ్ళమని ఆయన నిన్ను బలవంతము చేయరు. నీవు నీ చుట్టూ నివసిస్తున్న అనేకమంది విశ్వాసులవలె తక్కువ ప్రమాణాలు కలిగి, ఓడింపబడుతున్న జీవితముతోనే సంతృప్తి పడుతున్నట్లయితే, ఆయన నీ మట్లుకు నిన్ను విడచిపెట్టుదురు.
కాని నీవు దేవుని యొక్క శ్రేష్టమైన వాటి కొరకు దాహము కలిగి యుండినట్లయితే, నిన్ను పాడు చేస్తున్న రాచపుండులను (కేన్సర్) కత్తిరించి తీసివేయునట్లును మరియు నిన్ను కల్మషపరుస్తున్న విగ్రహాలను నాశనపరచునట్లును ఆయన నిర్దాక్షిణ్యముగా నీతో వ్యవహరించెదరు. నీవు మరల కదలింపబడకుండునట్లు నిశ్చలమైన స్థలమునకు నిన్ను తెచ్చుటకుగాను నీవు బాధ, నిరాశ, నష్టము, చెదరిపోయిన నిరీక్షణను, అవమానము, అన్యాయమైన విమర్శ మొదలైనవి అనుభవించునట్లు ఆయన అనుమతించెదరు.
అప్పుడు నీవు ధనికుడవైనను లేక బీదవైనను, విమర్శింపబడినను లేక పొగడబడినను, గౌరవింపబడినను లేక అగౌరవపర్చబడినను అది ఇక నీలో ఏ మార్పును తీసుకురాదు.
తనకుతాను పూర్తిగా మరణించుట అనే మూల్యమును కొద్ది మంది మాత్రమే చెల్లించుటకు ఇష్టపడుదురు. అందుచేత కొద్దిమంది మాత్రమే క్రీస్తునందలి అతి సమృద్ధియైన జీవమిచ్చు ఈ మార్గమును కనుగొందురు. మనకు మనము చనిపోకపోయినట్లయితే మనము విశ్వాసముతో జీవించలేము. మనము క్రీస్తుతో కూడ సిలువ వేయబడుటకు యిష్టపడక పోయినట్లయితే, దేవుని యొక్క పరిపూర్ణ ప్రేమనుగూర్చిన జ్ఞానము సిద్ధాంతముగా మాత్రమే ఉండిపోతుంది. ఈ లోకమునకు సంబంధించిన ప్రతి దానిని విడచి పెట్టనట్లయితే, మనము యేసు శిష్యులముగా నుండలేము. ''ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు'' (లూకా 14:33).
ఇంతకు మునుపు యోహాను 17:23 చూశాము. ''వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని'' (యోహాను 17:23). యేసు ఈ లోకము గురించి గాని లేక నామకార్థపు క్రైస్తవుల గురించి కాని ప్రార్థించలేదు. ఆయనను వెంబడించుటకు ఎవరైతే అన్నిటిని విడచి పెట్టిరో ఆ పదకొండు శిష్యుల గురించి ఆయన ప్రార్థించారు. నామకార్థపు క్రైస్తవులు మరియు లోకస్తులు ఎప్పటికి తెలుసుకొనలేనట్టి తండ్రి ప్రేమలో వారు భద్రతను కనుగొన్నారు.
ఎందుకు ఏ క్రైస్తవుడయినా శరీరానుసారుడైన క్రైస్తవుడవుతాడు? దేవునికి సంపూర్తిగా లోబడకుండా, రెండు ప్రపంచాల్లో శ్రేష్టమైన వాటిని పొందుతూ (కొందరు చెప్పునట్లు) సంతోషంగా ఉండవచ్చునని ఆలోచించేలాగు సాతాను వారిని చేయుట వలన కాదా? అయితే ఇది ఒక వంచన; మనము దేవుని పరిపూర్ణ ప్రేమ యందు నమ్మిక యుంచినట్లయితే, మనము సంతోషముగా ఏమీ దాచిపెట్టకుండా మనకు మనము ఆయనకు లోబర్చుకొందుము. అప్పుడు దేనిని గూర్చి చింతపడకుండా పూర్తిగా విడుదల పొందగలము. ''దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును'' (ఫిలిప్పీ 4:6,7). శరీరానుసారులైన క్రైస్తవులు ఎప్పుడూ, తుఫాను మధ్యలో వారి పడవ మునిగిపోతుందేమోనన్న తలంపుతోనే యుందురు. యేసు తుఫాను మధ్యలో కూడా నిద్రించగలిగాడు, ఎందుకంటే ఆయన తన తండ్రి ప్రేమలో భద్రత కలిగియుండెను. సాతాను తనను అంత తేలికగా ముంచివేయలేడని ఆయనెరుగును. ఆయన తండ్రి ఆయనను అన్ని సమయములలో కనిపెట్టియుండెను. తండ్రి యేసును ప్రేమించి మరియు జాగ్రత్త తీసుకొన్నంతగా మనలను కూడా ప్రేమించి మరియు జాగ్రత్త వహిస్తారని గ్రహించినట్లయితే మన జీవితము ఎంత అద్భుతముగా నుంటుంది.
మనము చివరకు దేవునిని చూచినప్పుడు, ఆయనయొక్క ప్రేమ మన యెడల ఎంతగా ఉండెనో కనుగొని, మనము ఎప్పుడును ఊహించనంతగా ఉండుటను బట్టి మనము ఆశ్చర్యపోవుదుము. అప్పుడు మన చింతలన్ని ఎంత బుద్ధిహీనమైనవో గ్రహించెదము. కాని అప్పుడు గ్రహించి లాభమేముంటుంది? దేవుని ప్రేమ అనే సత్యానికి మరియు విశ్వాసముతో జీవించుటకు మన కన్నులు తెరువబడుటకు ఇదియే సరైన సమయం.
1కొరింథీయులు 10:13వ వచనము, ఒక దివ్యమైన వచనము. దానియందు మన అందరకు ఒక గొప్ప ఆదరణ ఉంది. అది ''దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు, అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును'' అని చెబుతుంది.
మేము భరించలేనంతటి పరీక్షలు మరియు ఇబ్బందులు గుండా వెళ్తున్నామని జనులు తరచు చెబుతుంటారు. ఆదాము పిల్లలకు అది నిజమే కావచ్చును కాని, యేసు ప్రభువు యొక్క శిష్యుల యెడల అది నిజము కాలేదు. ఎందుచేతనంటే వారి మార్గములో వచ్చే ప్రతి పరీక్షను మరియు శోధనను దేవుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు.
సాతాను మరియు మనలను ద్వేషించేవారు మనలను అనేకవిధాల కష్టపెట్టాలని కోరుకుంటూవుండవచ్చు. అయితే వారు దేవుని అనుమతి లేకుండా మన యొద్దకు రాలేరు. పాత నిబంధన సమయములోనే, యోబు చుట్టూ దేవుడు కంచె ఏర్పాటు చేసాడని అందువలన చెడు ఏమియు అతడిని ముట్టదని సాతాను గ్రహించాడు. ''నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది'' (యోబు 1:10) అని సాతాను దేవునితో చెప్పాడు. కాని యోబు పవిత్ర పరచబడులాగున దేవుడు ఆ కంచె కొద్దిగా తెరువబడునట్లు అంగీకరించాడు మరియు సాతాను అతడిని శోధించులాగున అనుమతి ఇవ్వబడింది. అయితే ఎంత వరకు కంచె తెరువబడాలనేది దేవుని చేత నిర్ణయింపబడింది. అది మొదట్లో కొద్దిగా మాత్రం తెరువబడింది (యోబు 1)అటు తరువాత ఇంకొంచెం (యోబు 2), యోబు ఆస్తులను ఎత్తుకుపోయిన నెబూసీయులు, కల్దీయులు, దేవుడు తెరిచిన కంచె యొక్క సందులో నుండియే వచ్చారు. ''ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి, ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి-దేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి-కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను'' (యోబు 1:14-17). యోబు పిల్లలపై ఇల్లు కూలునట్లు చేసిన తుఫాను కూడా కంచెలో అదే సందుగుండా వచ్చింది. ఆ సందులోనుండి వ్యాధి వచ్చి యోబు శరీరాన్ని బాధించటానికి సరిపడినంత వెడల్పులేదు. కాని తరువాత ఎప్పుడైతే దేవుడు ఆ కంచెను మరికొంచెం తెరిచారో అప్పుడు వ్యాధి కూడా లోనికి వచ్చి యోబును బాధించింది.
దేవుడే జరుగుతున్న ప్రతిదానిని అదుపులో ఉంచేవాడని యోబు మొదట గ్రహించలేదు. అతడు ఆ విషయాన్ని చాలాకాలం తరువాత తెలుసుకున్నాడు - ఆ కథ ఆఖరి భాగంలో. కాని మనము ఆయనను తప్పుపట్టలేము. ఎందుచేతనంటే మనకుండినట్లుగా ఆయనకు వ్రాయబడిన లేఖనాలు లేవు. అయితే దేవుని బిడ్డల చుట్టూ ఉండిన కంచెలో దారిని ఎవరు అదుపు చేస్తారో చూపెట్టే దేవుని వాక్యం మనకు ఉంది. ఆ కంచె నిజానికి అగ్ని ప్రాకారముగా మన చుట్టూ ఉన్న దేవుడేనని జెకర్యా 2:5 మనకు చెబుతుంది. ''నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు'' (జెకర్యా 2:5).
మనము పాత నిబంధనలో చదువునట్లుగా, ఎలీషా యొక్క సేవకునివలె, మన కన్నులు మూయబడి యుండును. మనము మనలను చుట్టుకొని ఉండిన అగ్నిప్రాకారాన్ని చూడలేము. ఎలీషా దానిని చూసాడు కాబట్టి ఆయనకు భయమేమి లేకపోయెను. ''దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు- అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు-భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులైయున్నారని చెప్పి- యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుడుట చూచెను'' (2 రాజులు 6:15-17). ఎలీషా చూసినదానిని ఆ సేవకుడు చూడలేకపోయాడు. కాబట్టి అతడు భయపడ్డాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించాడో ఆ సేవకుని కన్నులు తెరువబడ్డాయి. అప్పుడు అతడు విశ్రాంతిలోనికి వచ్చాడు. మన న్నులు కూడా ఆ విధముగానే తెరువబడవలసియున్నది.
ఎప్పుడు ఆ కంచెను మూయాలనేది కూడ దేవునికి తెలియును. మనయొక్క ఆత్మీయ సామర్థ్యాన్ని బట్టి మరియు దేవుని యందలి అత్యున్నతమైన స్థితికి సాగిపోవాలనే మన ఆసక్తిని బట్టి ఆయన చాలా జాగ్రత్తగా మరియు ఖచ్చితమైన విధంగా ఆయన మన పరిస్థితులను అదుపు చేస్తూ ఉంటారు. మనము ఆత్మీయంగా అపరిపక్వంగా ఉన్నపుడు మరియు బలహీనంగా ఉన్నప్పుడు, ఆయన మనలను ఏదైనా గొప్ప శోధనతో శోధింపబడనియ్యడు. అంతేకాక మనపై హింసాత్మకంగా దాడి చేయుటకు సాతానును అనుమతించడు. అదే విధంగా మన జీవితం కొరకు ఆయన ఉద్దేశ్యం గూర్చిన ఆసక్తి మనకు లేకపోవుటను దేవుడు చూచినట్లయితే మన జీవితమంతా సుఖమార్గము గుండా సాగిపోవడానికి ఆయన సమ్మతిస్తాడు. అప్పుడు నిత్యత్వంలో మనమే నష్టపోయిన వారమవుతాము.
యోబు, దేవుడు ఎంచుకున్న సేవకులలో ఒకడు. కనుక అటుంటి తీవ్రమైన శ్రమను ఎదుర్కొనటానికి దేవుడు అంగీకరించెను. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అలాగు జరగటానికి సమ్మతించడు, ఎందుచేతనంటే కొద్దిమంది మాత్రమే అటువంటిది భరించేటంతటి పరిపక్వత చెందియుందురు మరియు అతి కొద్దిమంది మాత్రమే అటువంటి ఆత్మీయ పరిపక్వత యెడల ఆసక్తి కలిగియుందురు.
యేసు ఆయన తండ్రిచే మనము ఎప్పుడైనను ఎదుర్కొనే అవకాశముండిన ప్రతిశోధన గుండా తీసుకువెళ్లబడెను. ఆ విధంగా ఆయన పరిపూర్ణుడయ్యెను. ''మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపములేనివాడుగా ఉండెను. శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను'' (హెబ్రీ 4:15 మరియు 5:7-9). ఆ విధముగా యేసుప్రభువు మానవునిగా తన విద్యను పూర్తి చేసికొని పరిపూర్ణుడయ్యాడు. మనము కూడా పరిపూర్ణమగుటకు వేరొక మార్గమేమియు లేదు.
దేవుడు మనలను ఎప్పుడును మనము సహింపజాలనంతగా శోధింపబడనివ్వడు లేక పరీక్షింపబడనియ్యడు అనే వాస్తవమే మనము అన్ని సమయములందు జయ జీవితము జీవించగలమనే నమ్మకాన్ని కలుగజేస్తుంది. మనకు 1కొరింథీ 10:13లో అటువంటి హామీ దేవుడు ఇవ్వనట్లయితే, మనకు అటువంటి నమ్మకం కలిగియుండేది కాదు.
మన మార్గములో వచ్చేటటువంటి ప్రతి ఒక్క పరీక్ష మరియు శోధన గెలవగలిగినదని దేవుడు నమ్మకంగా చెబుతున్నాడు. అటువంటప్పుడు ఎందుకు మనము పడిపోతున్నాము? ఎందుచేతనంటే ప్రతి పరీక్షలో మరియు శోధనలో దేవుడు మనకనుగ్రహించు తప్పించుకునే మార్గమును మనము తీసుకొనుట లేదు.
ఆ తప్పించుకునే మార్గమేమిటి?
అది మనలను మనము తగ్గించుకోవడము - యేసువలె చివరకు సిలువ మరణము పొందునంతగా. ''మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను'' (ఫిలిప్పీ 2:8). ఇది సమృద్ధియైన జీవమునకు పోవు ఇరుకు మార్గము. దీనిని కొద్దిమంది మాత్రమే కనుగొనెదరు. గర్వం శరీర స్వభావంలో చాలా లోతుగా వేళ్ళూనింది. అందువలన కొద్దిమంది మాత్రమే దీనత్వం అనే మహిమగల మార్గాన్ని కనుగొనగలరు లేక కనీసం తమను తాము తగ్గించుకోవడం అనే దాని భావాన్ని అర్థం చేసికోగలరు. ఇది నిజంగా ఒక మర్మము, కాని నీవు పూర్ణహృదయముతో వెదికినట్లయితే దేవుడు ఇది నీకు బయల్పరుస్తాడు.
జీవితంలో ఉండిన ఒత్తిడులు మన జీవితాలను భరింపలేనివిగా చేస్తున్నాయని మనమనుకుంటాము. మన గురించి మనకుండిన గొప్ప ఆలోచనలు, నిజానికి మనలో ఉండిన గర్వమే మన జీవితములను ఆ విధముగా చేస్తుంది. రిజర్వేషను లేకుండా కిక్కిరిసిన రైలుపెట్టెలలో ప్రయాణించినప్పుడు ఆ సమయాల్లో ఈ విషయమును గురించి ధ్యానించాను. కూర్చోవటానికి బల్లమీద స్థలం లేకుండా పెట్టెలో ఒక మూలన, నేల మీద కూర్చోవలసి వచ్చేది, లేనట్లయితే కొన్ని సమయాల్లో నిల్చోవలసి వచ్చేది. ఆ పెట్టె మనుష్యులతోను, సామానులతోను, రైలు బయలుదేరిన స్టేషన్లలోనే నిండిపోయి ఉండేది. అది త్రోవలో ఒక్కొక్క స్టేషను దగ్గర ఇంకా ఎక్కువ మనుష్యులు, సామానులు లోనికి రావడం వలన ఇంకా ఘోరంగా తయారయ్యేది. ఉండేకొద్ది ఒత్తిడి పెరుగుతుండేది. అప్పుడు నేనిలాఆలోచించేవాడిని, ''నేను ఇక్కడ చీమ పరిమాణమంత అయినట్లయితే, అప్పుడు నా మీద ఈ ఒత్తిడి ఇంక ఏమీ ఉండదు'' నేను మానవుడి నయినందున, నా పరిమాణాన్ని బట్టి నాకు ఒత్తిడి ఎంతో ఎక్కువగా ఉంది, నా కంటె ఎక్కువ లావుగా ఉండిన మనుష్యునికి ఇంకా ఘోరంగా ఉంటుంది. అది అంతా మన యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంది. అదే చీమైతే ఆ కిక్కిరిసిన పెట్టెలో ఎంతో ఖాళీ కనుగొనును మరియు ఆ ఒత్తిడి గురించి ఏ విధమైన ఫిర్యాదు చేయదు.
ఆత్మీయముగా కూడా సమాధానమదే. ఎప్పుడైతే బయట నుండి ఒత్తిడి అధికమవుతూ ఉంటుందో, అప్పుడు నా దృష్టిలో నేను ఇంకా ఇంకా చిన్నగా అయినట్లయితే, ఒత్తిడి సుళువుగా అయి నెమ్మదిగా కనబడకుండా పోతుంది. దేవుడు మనలను తగ్గించాలని ఆశిస్తున్నాడు. ఆయన ఉద్దేశ్యము మన ద్వారా నెరవేర్చబడటానికి ముందు ఆయన మనలను విలువలేని సున్నావంటి స్థితికి తగ్గించాల్సి ఉంది (మన యొక్క ఆలోచనలలో).
ఉదాహరణకు మనము వేరే వారిని బట్టి ఎందుకు అభ్యంతరపడతాము? మన గురించి మనకున్న ఉన్నతమైన తలంపులను బట్టి మరియు మనకుండిన హక్కులను బట్టి కాదా? మనకు రావలసిన మర్యాద మనకు జనులు ఇవ్వడం లేదని మనము భావిస్తాము. లేక వారు మన హక్కులను తీసివేస్తున్నారని అనుకుంటాము.
జనులు మన వెనుక మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు మనము బాధపడతాము. మనలో కొలువుండిన గర్వము అటువంటి బాధపడేలా చేస్తుంది. గర్వమనే బెలూను (బుడగ)ను గ్రుచ్చినట్లయితే మనము పూర్తిగా చప్పబడిపోతాము. అప్పుడు ఒత్తిడి అనేది ఏమియు లేకుండా ఉండడాన్ని తెలుసుకుంటాము.
ఇది ఒక రహస్యము. అది చూడటానికి దేవుడు మన కన్నులను తెరచునుగాక.
మన చుట్టూ ఉండిన జనులు వెయ్యిన్నొక్క విషయాలు గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండగా మనకు ఏమైనప్పటికి ఏ ఫిర్యాదులు ఉండవు. ఎందుచేతనంటే మనము తప్పించుకునే మార్గాన్ని గైకొన్నాము. అది మనలను మనము తగ్గించుకోవడము.
దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుట కొరకే మనలను మనము తగ్గించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆయన యొక్క నియమములను అతిక్రమించలేడు మరియు ఆయన బద్దుడై ఉన్న ఒక నియమము, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించుననునది (1పేతురు 5:5). ఆయన మనలను ఎంతగా ప్రేమించినా, మనము గర్విష్టులమైతే ఆయన కృపను మనకు ఇవ్వలేడు మరియు మనము ఆయన యొద్ద నుండి కృపను పొందలేకపోయినట్లయితే మనము విజయమందు జీవించలేము. శోధనకు ఉన్నటువంటి శక్తిని దేవుని యొక్క కృపా శక్తి చేతనే జయింపబడుతుంది.
''ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృప యేసు క్రీస్తు ద్వారా కలిగెను'' (యోహాను 1:17). ధర్మశాస్త్రము క్రింద (పాత నిబంధన) జనులు శోధనకు వ్యతిరేకముగా హృదయమందు పోరాడుతూ నుండెడివారు, కాని ఎప్పుడును ఓడిపోయేవారు.
దేవుని ఆజ్ఞల యొక్క బాహ్య ప్రమాణాలను బట్టి సంపూర్ణమైన జీవితము జీవించిన తార్సుకు చెందిన సౌలు సహితము, ''ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని'' (ఫిలిప్పీ 3:6) తన హృదయంలో నుండిన ఇచ్చలకు మరియు దురాశకు వ్యతిరేకంగా అతడు శక్తిహీనుడని తెలుసుకున్నాడు. ''అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము'' (రోమా 7:8). ధర్మశాస్త్రము ప్రజలను హృదయమందుండినటువంటి వ్యామోహాల నుండి విడుదల చేయలేదు. అది అందుకు ఉద్దేశింపబడలేదు. శరీరంలో ఉండిన శరీర వ్యామోహాలకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రము మానవుని యొక్క పాపస్వభావాన్ని మరియు నిస్సహాయతను మరియు దేవుని అవసరమును చూపించుటకు మరియు శిక్ష విధింపబడుతుందనే భయముతో బాహ్యసంబంధమైన పాపము చేయకుండుటకు మాత్రమే ఉద్దేశించబడినది.
ధర్మశాస్త్రమును బట్టి మనుష్యుల దృష్టిలో ఒక వ్యక్తి బాహ్యముగా పరిపూర్ణమైన జీవితమును కలిగియుండవచ్చును. కాని అతని హృదయమంతయు కూడా పాపముతో నిండియుండవచ్చును! ధర్మశాస్త్రము మహా అయితే దీనినే సాధించగలదు. అయితే యేసు క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన యొక్క మంచి వార్త ఏమిటంటే ధర్మశాస్త్రము ఏమైతే చేయలేకపోయెనో దానిని కృప చేయగలుగుట. దేవుని యొక్క కృప కేవలం అపాత్రులపై పాప క్షమాపణ కొఱకు చూపే అనుగ్రహము మాత్రమే కాదు. అది అంతకంటె ఎక్కువైనది. మనము పాపమును జయించుటకు సహాయపడే దేవుని శక్తియే కృప. 2 కొరింథీ 12:9 చూడండి అక్కడ కృప - శక్తితో సమానంగా చూపబడింది. ''అందుకు-నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును'' (2 కొరింథీ 12:9). అది శోధన సమయమందు మనకు సహాయంగా వచ్చే దేవుని శక్తి అయి ఉన్నది. ''గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము'' (హెబ్రీ 4:16 చూడండి). మన హృదయము వ్యామోహము చేతగాని మరియు దురాశ చేతగాని మరెన్నడు అపవిత్ర పర్చబడకుండునట్లు కృప మన యొక్క హృదయాలను ఎంతో బలపర్చుతుంది. ''నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపనుబట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు'' (హెబ్రీ 13:9). ఇది క్రొత్త నిబంధన యొక్క శుభవర్తమానము. వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అని హెబ్రీ 8:10లో దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధన (ధర్మశాస్త్రము) క్రింద దేవుడు మానవునితో ''నీవు ఇది చేయవలెను....'' మరియు ''ఇది చేయకూడదు...'' అని చెప్పాడు. కాని క్రొత్త నిబంధన క్రింద గమనించినట్లయితే (ఈ వచనములో) దేవుడు తానే బాధ్యత తీసుకొని ఈ విధంగా చెప్తున్నాడు. ''నేను ఉంచెదను...'', ''నేను వ్రాయుదును....''. దేవుడు కృపగలిగిన ఆత్మతో తన పనిని మన మనస్సులలోను, హృదయములలోను చేయును.
''మనము ఇచ్ఛయించుటకును, కార్యసిది ్ధకలుగజేసికొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై కృప ద్వారా ఆయన మనలో కార్యసిద్ధికలుగజేయును'' (ఫిలిప్పీ 2:13). ఆ విధముగా మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడినది (రోమా 8:3).
పెంతెకొస్తు రోజున దేవుడు ఆయన యొక్క ఆత్మను కుమ్మరించుటలో ముఖ్య ఉద్దేశ్యం ఇది. ఆ దినాన యెరూషలేము నివాసుల మీద ''కరుణనొందించు ఆత్మ'' కుమ్మరించబడినది (జెకర్యా 12:10).
దేవుని సింహాసనము నుండి భూమిపైకి ఈనాటికిని ఆ నది జలపాతమువలె ప్రవహిస్తున్నది. దేవుని యొక్క పరలోకపు యెరూషలేము (దేవుని సంఘము) నివాసులు ఇప్పటికిని ఆ జలపాతము క్రిందకు వచ్చి దేవుని రుణలో సంపూర్తిగా ముంచబడవచ్చు.
అటుపిమ్మట రోమా 6:14లో ఉన్నటువంటి ''మీరు కృపకేగాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీమీద ప్రభుత్వము చేయదు'' అనే వాగ్దానము నెరవేర్చబడుతుంది.
ఆ జలపాతము క్రిందికి రావటానికి ఒకే ఒక్క షరతు ఉన్నది - అది మనలను మనము తగ్గించుకొనుట (దేవుని అవసరమును ఎరుగుట).
కృప మనలను పాపము, మన పరిస్థితులు, కృంగిన స్థితి, చికాకు పర్చే స్థితి, సాతాను, ఆయాసము, ద్వేషము, అసూయ, శరీరేచ్ఛ మరియు ప్రతివిధమైన ఇతర దుష్టత్వము పైన హెచ్చించును. ''దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి'' (1పేతురు 5:6).
మనము దీనమనస్కులమై తగ్గించుకొని ఉండవలసినట్టి దేవుని బలిష్టమైన చెయ్యి ఏది? ఏ చెయ్యి అయితే మన దైనందిన జీవితపు త్రోవలో ఎదురయ్యే పరిస్థితులను మరియు మనుష్యులను ఏర్పాటు చేయునో అదే. మనము దీనమనస్కులమై ఉండుట యనగా దేవుడు మన యెడల ఏర్పాటు చేసిన వ్యవహారాలన్నిటిలో అన్ని పరిస్థితులలోను మరియు ఆయన మన తలలపై స్వారీ చేయుటకన్నట్లు పంపించిన మనుష్యులందరికిని సంతోషముగా లోబడుటయే. మనమెప్పుడు ఇది భరించలేనంతగా అవుతుందని భయపడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన చుట్టూ ఉంచిన కంచెలో సన్నటి సందును గమనిస్తుండుట వలన ఎంత తెరువవలెనో మరియు ఎప్పుడు అది మూసివేయాలో కూడా ఆయనకు తెలియును.
మనము ఏదైనా పాపము చేత జయించబడినట్లయితే దానికి ఒకే ఒక్క కారణం - మన యొక్క గర్వము. దేవుడు మనకు కృపను ఇవ్వనట్లయితే మనము పాపమును జయించలేము. దేవుడు ఆ గర్వాన్ని బట్టి కృపను ఇవ్వలేడు. మనము ఓడింపబడిన ప్రతిసారి దేవుని దగ్గరకు వెళ్లి ''ప్రభువా! నేను జయించుటకు కావలసిన కృపను నాకు ఇవ్వకుండునట్లు ఆటంకపరచిన నాలోని గర్వము ఎక్కడ ఉందో చూపించు'' అని అడుగవలెను. ఆ విధంగా ప్రతి ఓటమిలో త్వరితంగా మనలను మనము తీర్పు తీర్చుకొన్నట్లయితే, విజయము చాలా తక్కువ సమయములో మనది యగును.
క్రొత్త నిబంధనలో పాపముపై విజయమనేది మన జన్మహక్కు. గర్వము లేక అజ్ఞానము వలన దీనిని సాతాను నీకు దక్కకుండా చేయనివ్వొద్దు. విజయం పొందటానికి సమయం తీసుకుంటుందంటే కారణం దేవుడు మనలను దీనులనుగా చెయ్యటానికి సమయమును తీసుకుంటున్నట్లే. ఆదాము యొక్క పిల్లలముగా మనలో నిండియున్నట్టి మనమీద మనకుండిన నమ్మకాన్ని చెదరకొట్టడానికి దేవునికి సమయం పడుతుంది.
పాపాన్ని జయించటానికి మాకు శక్తి ఉన్నదనుకొనుట ఒక విధమైన గర్వము. మనము అనుకునే దేమిటంటే మనకు కావలసినది ఇంకొంచెం పట్టుదల, ఇంకొంచెం క్రమశిక్షణ, ఇంకొంచెం బైబిలు పరిజ్ఞానము అని. విజయం గురించి ఇటువంటి పుస్తకములో చదివినప్పుడు ఈ సిద్ధాంతాన్ని తేటగా ఇపుడు గ్రహించాను. కనుక విజయము సుళువు అని అనుకొనవచ్చును.
మనము గొప్ప విశ్వాసముతో ముందుకు సాగవచ్చు కాని అప్పటికీ మన విశ్వాసము మనయందే తప్ప దేవుని కృప యందు కాదని తెలుసుకోలేము. మరియు గమనించినట్లయితే మనము బహు ఘోరముగా పడిపోవుదుము.
అయితే ఒక్కసారి పడిపోవటాన్ని బట్టి మనము పాఠము నేర్చుకుంటామా? అలా నేర్చుకోము. కనుక దేవుడు మనము మరల, మరల తిరిగి పడిపోవుటకు సమ్మతిస్తాడు. మన యొక్క మంచి తీర్మానాలన్నిటిని ఉల్లంఘిస్తూ తరచూ పడిపోవుటను బట్టి విజయ మెప్పటికైనా పొందగలమనే ఆశను వదిలి వేసి శూన్యస్థితకి వచ్చే వరకు మనము మరల మరల తిరిగి పడిపోవుటకు దేవుడు సమ్మతిస్తాడు. విజయమనే వాగ్దాన దేశములోనికి దేవుడు మలను నడిపించగలుగుటకు అదియే ప్రారంభబిందువు.
''యుద్ధము చేయువారు (సైనికులు) అందరు (స్వశక్తికి దృష్టాంతము) నశించు వరకు'' (ద్వితీయో 2:14,16) తమపై తమకు నమ్మకం కలిగిన గర్విష్టులైన ఇశ్రాయేలీయులు నలుబది సంవత్సరములు అరణ్యమందు సంచరించుటకు దేవుడు సమ్మతించెను. ఆయన వారిని ఐగుప్తు విడిచి పెట్టిన రెండు సంవత్సరములకే వాగ్దాన దేశము యొక్క పొలిమేరలకు తీసుకువచ్చారు కాని వారు అందులో ప్రవేశింపలేదు. ఎందుచేతనంటే వారి అవిశ్వాసము చేత (సంఖ్యాకాండము 13,14 అధ్యాయములు), కనుక దేవుడు వారిని మరియొక ముప్పది ఎనిమిది సంవత్సరములు వారిలో ఆత్మవిశ్వాసము ఇక ఏ మాత్రమునులేని శూన్యస్థానానికి వచ్చువరకు తిరుగనిచ్చారు. అప్పుడు వారు లోనికి ప్రవేశించారు; మరియు మానవ ప్రయత్నము ఏ కొంచెమయినను లేకుండా యెరికో వారి ముందు పడిపోయింది.
దేవుడు మనలోను, మన ద్వారాను ఆయన యొక్క పనిని చేయుటకు ముందు ఆయన మనలను శూన్యస్థితికి తగ్గించి వెయ్యాలి. దానికి నలువది సంవత్సరములు తీసుకోనక్కర్లేదు. ఎలాగైనా నిన్ను నీవు తగ్గించుకోవాలని స్థిర నిర్ణయం తీసుకొన్నట్లయితే మరియు నీవు ఆ విషయంలో తీవ్రంగా ఉండి ధృఢనిశ్చయత కలిగియుండినట్లయితే నీవు ఒకటి రెండు సంవత్సరాలలోనే నీవు ప్రవేశించవచ్చు.
మనము మనయొక్క పరిస్థితులను లేక ఇతరులను నిందిస్తున్నంత కాలము మనము ఎప్పటికిని విజయము గురించి నిరీక్షించలేము. కాని మనయొక్క పరిస్థితులన్నిటిని దేవుడు తన సర్వాధికారము క్రింద అదుపు చేస్తున్నారని మరియు ఏ శోధన కూడా ఎప్పుడును మనకు అధికమైనది కాదని నమ్మి, మనలను మనము తగ్గించుకొన్నట్లయితే అప్పుడు విజయము రూఢి అవుతుంది.
మన యొక్క విశ్వాసము కదలింపబడనిదిగా ఉండవలెనంటే అది దేవునికి సంబంధించిన మూడు యదార్థమైన విషయాలపై స్థిరంగా నిలిచి యుండాలి. అవి ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమ, ఆయన యొక్క సంపూర్ణమైన శక్తి మరియు ఆయన యొక్క పరిపూర్ణమైన జ్ఞానము గూర్చి.
మనము ఆయన యొక్క ప్రేమను గురించి ఒప్పింపబడినట్లయితే, దానికి సమానంగా ఆయన యొక్క సార్వభౌమత్వ అధికారమును గూర్చి కూడ అదే విధంగా ఒప్పింపబడతాము.
ఇందుచేతనే మన ప్రార్థనలలో దేవున్ని ''పరలోకమందున్న మా తండ్రీ'' అని పిలుస్తూ ప్రారంభించమని యేసు మనకు బోధించెను.
'మా తండ్రీ' అని పిలుస్తూ ప్రారంభించమని యేసు మనకు బోధించెను. 'మా తండ్రి' అనేది ఆయన యొక్క పరిపూర్ణ ప్రేమను గుర్తు చేస్తుంది మరియు ''పరలోకమందున్న'' అనేది ఈ విశ్వంలో ఉండిన ప్రతిదానిపై ఆయన యొక్క సంపూర్ణ సార్వభౌమత్వాన్ని మనకు గుర్తుచేస్తుంది. ఆయన జ్ఞానము కలిగిన వాడు గనుక ఆయన యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత మన మార్గాలన్నిటిని శాసించును.
''దేవుడు యదార్థవంతుడు (ఆయన జ్ఞానమందు పరిపూర్ణుడు) నన్ను యదార్థ మార్గమున నడిపించువాడు ఆయనే (నా పరిస్థితులను సరైన విధంగా ఆయన క్రమపర్చును)'' (కీర్తన 18:30,32).
దేవుడు ప్రేమ, శక్తి మరియు జ్ఞానమందు పరిపూర్ణుడు కాకపోయినట్లయితే, మన విశ్వాసము నిలిచియుండుటకు తగినంత పునాది లేక యుండెడిది. కాని ఆయన ఆ మూడు గుణములు కలిగియుండుటచేత మనము ఎన్నటికిని కదిలింపబడాల్సిన అవసరం లేదు.
విశ్వాసమనేది (దేవునిపై) ఆయన యొక్క కొలతలేని ప్రేమపై, ఆయన యొక్క సంపూర్ణమైన శక్తిపై మరియు ఆయన యొక్క పరిపూర్ణమైన జ్ఞానముపై మానవ వ్యక్తిత్వం సంపూర్తిగా ఆధారపడడము.
దేవుని యొక్క జ్ఞానము మనయొక్క జ్ఞానము కంటె ఎంతో ఉన్నతమైనదని, భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతమైనదో అటువంటిదని ఒప్పుకోవటానికి మనలో ఎవరికిని సమస్య ఉండదని అనుకుంటున్నాను.
''నా తలంపులు మీ తలంపులవంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి'' (యెషయా 55:8,9). అందుకే ఆయన పనిచేసే విధానాన్ని లేక ఆయన అనుమతించే పరిస్థితులను మనము తరచుగా అర్థము చేసుకోలేము. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి యొక్క మార్గములన్నింటిని అర్థంచేసుకోలేక పోతున్నట్లయితే మనము కూడా దేవుని మార్గములను అర్థము చేసుకోలేకపోవుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు.
మనము ఆత్మీయముగా ఎదుగుచూ దేవుని స్వభావములో పాలివారమవుతుండిన కొద్ది, మనము దేవుని యొక్క మార్గములను అర్థము చేసికొనుటకు ప్రారంభిచెదము.
ఏమైనప్పటికి మనుష్యులందరిపైన మరియు పరిస్థితులన్నిటిపైన దేవుని యొక్క సంపూర్ణ సార్వభౌమత్వమును అనేకమంది విశ్వాసులు అనుమానిస్తుంటారు. వారు దాని గురించి పెదవులతో ఒప్పుకోవచ్చును కాని వారు అది తమ దైనందిక జీవితంలోని ఆయా పరిస్థితులలో పని చేస్తుందని నమ్మరు. అయినప్పటికిని దేవుడు ఏ విధంగా ఆయన యొక్క పిల్లల తరపున సర్వాధికారంతో ఎలా పనిచేసాడో మరియు తరచు అసాధారణమైన విధంగా వాటిని చేయుటను గూర్చిన ఉదాహరణలతో లేఖనాలు నిండియున్నాయి. మనలో చాలా మందికి దేవుడు తన ప్రజల తరపున స్పష్టమైన అద్భుతాలతో పని చేయటం తెలుసు.
ఉదాహరణకు ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఐగుప్తు నుండి విడుదల చేసారో మొదలైనవి. కాని సాతాను దేవుని ప్రజలనెదుర్కొన్నప్పుడు, దేవుడు ఏ విధంగా సాతానును త్రిప్పికొడతాడో, అట్టి గొప్ప అద్భుతాలను తరచు మనము చూచుటలేదు.
యోసేపును గూర్చిన విషయం ఒక మహత్తరమైనట్టిది. యాకోబు యొక్క పదకొండవ కుమారునికి ముప్పయి ఏళ్ళు వచ్చేసరికి ఐగుప్తు పరిపాలనలో రెండవ స్థానముండిన వానిగా చెయ్యడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉండినది. యోసేపు దేవునికి భయపడే కుర్రవాడు కాబట్టి అతడు సాతాను చేత ద్వేషింపబడ్డాడు.
యోసేపును తొలగించివెయ్యాలని అతని అన్నలను సాతాను పురిగొల్పాడు. కాని యోసేపు ప్రాణాన్ని వారు తీయకుండా దేవుడు భద్రపరచెను. అయితే వారు కొందరు ఇశ్మాయేలీయ వర్తకులకు అతడిని అమ్మి వేయగలిగారు. కాని ఆ వర్తకులు యోసేపును ఎక్కడకు తీసుకువెళ్ళారని అనుకుంటున్నారు? ఐగుప్తుకు మాత్రమే. అట్లు దేవుని యొక్క ప్రణాళికలో మొదటి మెట్టు నెరవేర్చబడింది.
ఐగుప్తులో యోసేపు పోతీఫరు అనువాని చేత కొనబడ్డాడు. ఇది కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. పోతీఫరు యొక్క భార్య బహుచెడు స్త్రీ; యోసేపును మోహించి, ఆమె అతడిని అనేకమార్లు ఆకర్షించటానికి ప్రయత్నించింది. ఆఖరుగా ఎప్పుడైతే ఆమె అనుకున్నది చేయలేకపోయిందో, యోసేపుపై తప్పుడు అభియోగము మోపి అతడిని కారాగారములో వేయించినది. కాని కారాగారములో యోసేపు ఎవరిని కలుసుకొన్నాడనుకుంటున్నారు? ఫరోకు ద్రాక్షారసము అందించువానిని! ఫరో యొక్క ద్రాక్షారసము అందించువానిని యోసేపు కలుసుకొనేలాగు అతడు కూడా అదే సమయంలో ఖైదు చేయబడునట్లు దేవుడు ఏర్పాటు చేసెను. అది దేవుని యొక్క ప్రణాళికలో రెండవ మెట్టు.
దేవుని యొక్క మూడవ మెట్టు, ఫరో పానదాయకుడు యోసేపును గూర్చి రెండు సంవత్సరములు మరచిపోవడము. ''అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను. రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను'' (ఆదికాండము 40:23 మరియు 41:1). దేవుని యొక్క సమయము ప్రకారము యోసేపు చెఱసాలలో నుండి విడిపించబడవలసిన సమయము ఇదే. ''అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను'' (కీర్తనలు 105:19,20). యోసేపుకు ముప్పయి సంవత్సరములు వచ్చినప్పుడు దేవుని సమయము వచ్చినది - ఫరోకు ఒక కల వచ్చినది మరియు అతడి పానదాయకుడు అకస్మాత్తుగా యోసేపు కలల భావము చెప్పగలడని గుర్తు తెచ్చుకొన్నాడు. ఆ విధంగా యోసేపు ఫరో ముందుకు వచ్చి అతడి తరువాత ఐగుప్తునకు పరిపాలనలో రెండవ స్థానముండిన వాడయ్యాడు. యోసేపు జీవితములోని సంఘటనల యొక్క దేవుని సమయము ఆ విధముగా పరిపూర్ణము చేయబడినది.
ఆయా విషయములను దేవుడు ఏర్పాటు చేసిన విధానమును గురించి మన మెప్పుడును ఆలోచించలేము.మనకు, దేవునికి ఉండినట్టి శక్తి ఉన్నట్లయితే యోసేపునకు మనుష్యులు చెడు చేయకుండా ఆపిఉండేవారము. కాని దేవుడు శ్రేష్టమైన విధానములో దీనిని చేశాడు. మనుష్యులు ఉద్దేశించిన చెడు దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం చాలా గొప్ప అద్భుతం. సాతాను యొక్క ఉద్దేశ్యాలను తలక్రిందులు చేయుటలో దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఆ విధముగా సమస్తమును ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి జరుగును.
ఈ విషయాలను మన పరిస్థితులకు అన్వయించుకుందాం. దుష్టులయెడల, మన మీద అసూయపడే సహోదరుల యెడల, మనపై తప్పుడు అభియోగము మోపే చెడు స్త్రీల యెడల, అన్యాయంగా ఖైదులోనికి త్రోయబడడం విషయంలో మరియు సహాయం చేస్తామని వాగ్దానం చేసి మరచిపోయిన స్నేహితుల యెడల మన వైఖరి ఎలా ఉండాలి? వారు చేసిన పనులు వారు ఉద్దేశ పూర్వకంగా చేసినా లేక అనుకోని విధంగా చేసినా వాటినన్నిటిని మన జీవితాలలో ఆయన యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడునట్లు సమకూడి జరిగించటానికి దేవుడు సర్వాధికారము కలవాడని మనము నమ్ముతామా? ఆయన యోసేపు విషయంలో అది చేసినప్పుడు మన కొరకు ఎందుకు చేయలేడు? ఆయన తప్పనిసరిగా చెయ్యగలడు మరియు చేస్తాడు.
అయితే యోసేపు జీవితంలో దేవుని ప్రణాళికను ఎవరు గజిబిజి చేయగలిగి ఉండేవారో నేను చెబుతాను. ఒకే ఒక వ్యక్తి అది యోసేపు. తనకు తాను మాత్రమే. పోతీఫరు భార్య యొక్క ఆకర్షణకు అతడు లొంగిపోయి ఉండినట్లయితే అతడు దేవునిచేత ప్రక్కకు నెట్టివేయబడి ఉండేవాడు.
ప్రపంచమంతటిలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే నీ జీవితములో దేవుని ప్రణాళికను పాడుచేసి, విచ్ఛిన్నం చేయగలడు. అది నీకు నీవు మాత్రమే. ఇంకెవ్వరు అది చేయలేరు. నీ స్నేహితులుగాని, నీ శత్రువులుగాని కాదు. దేవదూతలు గాని, అపవాదిగాని కాదు. కేవలం నీవు మాత్రమే. ఒక్కమారు మనము ఇది చూసినట్లయితే అది మనకుండిన ఎన్నో గొప్ప భయాల నుండి మరియు మనకు ఎవరైతే హాని చెయ్యటానికి తలపడతారో వారి యెడల మనకుండిన తప్పుడు వైఖరి నుండి మనలను స్వేచ్ఛాపరులుగా చేయును.
పాత నిబంధన నుండి ఇంకొక ఉదాహరణను చూసి ఆ విధముగా మన మనస్సులలో ఈ సత్యాన్ని స్థిరపరచుకొందాము. ఎస్తేరు గ్రంథంలో జాతి అంతా సంహరింపబడకుండా దేవుడు యూదులను ఏ విధంగా కాపాడెనో మనము చదువుతాము. కాని ఒక్కరాత్రి రాజు నిద్రలేక పోవడం అనే చిన్న సంఘటన ద్వారా దేవుడు అది చేయుట చూడటం ఒక వింతైన విషయం. హామాను అతని భార్య, మొర్దకైను మరుసటి ఉదయం ఉరికొయ్యపై వ్రేలాడ దీయటానికి రాజు దగ్గర అనుమతి తీసుకోవడం గురించి ఒకరాత్రి కుట్ర పన్నుతున్నారు. ఇది యూదులందరిని నాశనం చేయటానికి ప్రారంభవిషయం. అయితే హామాను, అతడి భార్య వారి యొక్క దుష్ట ప్రణాళికలు తయారు చేస్తూ ఉండగా, దేవుడు కూడా మొర్దకై తరుపున పని చేస్తున్నాడు. ''ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు'' (కీర్తన 121:4).
రాజు ఆ రాత్రి నిద్రపోకుండా దేవుడు చేసెను. ''ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను'' (ఎస్తేరు 6:1) కనుకనే రాజు రాజ్యపు సమాచార గ్రంధము చదువుతూ తెల్లవారే వరకు సమయాన్ని గడిపాడు. అప్పటికి రాజు చదివేది రాజు సంహరింపబడకుండ మొర్దకై రక్షించిన విషయం వ్రాయబడిన సంఘటన దగ్గరకు వచ్చింది. అప్పుడు ఇందు నిమిత్తము మొర్దకైకు ఏదైనా ఘనత చేయబడినదా? అని సేవకులను అడుగగా యేమియు చేయబడలేదని ఉత్తరమిచ్చిరి.
సరైన సమయానికి పరిస్థితులను కల్పించటంలో దేవుని సమయాలు ఖచ్చితమైనవి. అదే సమయంలో హామాను లోనికి ప్రవేశించి మొర్దకైను వ్రేలాడతీయడానికి రాజు యొక్క అనుమతి కోరటానికి వచ్చియున్నాడు. హామాను నోరు విప్పటానికి ముందే రాజు ఘనపరచదలచు కొన్నవారికి ఏమిచేయాలని రాజు హామానును అడిగాడు. హామాను రాజుయొక్క మర్యాదలను ఆపేక్షించి, అందును బట్టి తానే ఘనత పొందేవాడనని అనుకొని, అటువంటి వానికి ఘనతతో కూడిన గొప్ప కవాతు జరిపించాలని ఆలోచన చెప్పాడు. ''శీఘ్రముగా వెళ్లి, మొర్దకైకు ఆ విధంగా చేయమని'' రాజు చెప్పాడు.
ఎంత అద్భుతంగా మన దేవుడు సాతాను యొక్క ఉద్దేశ్యాలను తలక్రిందులు చేసాడు. చివరకు హామాను మొర్దకై కొరకు తయారు చేయించిన ఉరి కొయ్యమీదనే వ్రేలాడ దీయబడ్డాడు. బైబిలులో చెప్పబడినట్లు ''గుంటను త్రవ్వువాడే(వేరే వారికొరకు) దానిలో పడును(తానే). రాతిని పొర్లించువాని(వేరే వారికొరకు) మీదకు అది తిరిగివచ్చును(తననే నలుగగొట్టుటకు)'' (సామెతలు 26:27).
ఈ కథలో హామాను మనకు వ్యతిరేకంగా ఎప్పుడూ కీడును ఉద్దేశించే సాతాను వంటివాడు.
దేవుడు అతడిని అడ్డుకొనడు, ఎందుచేతనంటే దేవునికి సాతాను యొక్క ఉద్దేశ్యాలను తలక్రిందులు చేసే మరొక మంచి ప్రణాళిక ఉంటుంది. సాతాను మనకొరకు త్రవ్వే గొయ్యిలో చివరకు వాడే పడతాడు.
జెఫన్యా 3:17లో (ఒక అనువాదంలో) దేవుడు మన కొరకు అన్ని సమయములందు ప్రేమతో మౌనంగా ప్రణాళిక వేస్తున్నారని చెప్పబడింది.
మొర్దకైకు వ్యతిరేకంగా, హామాను అతడి భార్య ప్రణాళిక చేస్తున్నప్పుడు అదేమీ తెలియకుండగనే అతడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నపుడు దేవుడు కూడా మొర్దకైను రక్షించటానికి ప్రణాళికను రూపొందించుచుండెను. హామాను చెడ్డ ప్రణాళిక తెలిసి యుండినా మొర్దకై ప్రశాంతంగా నిద్రపోయి ఉండేవాడు. ఎందుచేతనంటే దేవుడు అతని పక్షాన ఉండగా అతనికి విరోధి యెవడు?
ప్రేమతో, దేవుడు తనకొరకు మౌనంగా ప్రణాళిక చేస్తున్నారని తెలిసినవాడై హేరోదు చేత సంహరింపబడటానికి ముందు రాత్రి పేతురు ఖైదులో ప్రశాంతంగా నిద్రించగలిగాడు. సరైన సమయంలో దేవుని దూత వచ్చి పేతురును నిద్రలేపి విడుదల చేసెను (అపొ.కా. 12:6,7).
ప్రతి విషయములో ప్రతివానిపై, మన దేవునికి గల సర్వాధికారమందు మనము నమ్మకముంచినట్లయితే మనము కూడా మనుష్యులు గాని, దెయ్యములు గాని మనకు ఏమైనా చేయాలని తలంచుచుండిననూ ప్రతి రాత్రి మనము ప్రశాంతంగా నిద్రించవచ్చు.
ఒక్కసారి మనము దేవుని యొక్క సర్వాధికారాన్ని చూసినట్లయితే దేని గూర్చి కూడా మనుష్యులను నిందించడం మానివేస్తాము. సాతాను మనకు ఏదో ఒక విధంగా హాని చేస్తాడనే భయంతో అతడికి భయపడుతూ ఉండము. ఈ ప్రపంచములో ఉండిన అనారోగ్యము, రోగము, మరియు దేనికి కూడా మనము భయపడము.
మనము అన్నింటికొరకు, అన్ని పరిస్థితులలో మరియు ప్రజలందరి కొరకు కృతజ్ఞతలు చెల్లించవలెనని బైబిలు మనకు చెప్తున్నది.
''మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి'' (ఎఫెసీ 5:20). ''ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము'' (1 థెస్స 5:16-18).
''అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను'' (1 తిమోతి 2:1). దేవుని యొక్క సంపూర్ణమైన సార్వభౌమాధికారమును మనము చూసినపుడు మాత్రమే దీనిని మనము అర్థవంతముగా చేయగలము.
దేవుడు యేసును ఎలాగు కాపాడెనో అలాగే మనలను కూడా కాపాడెను. యేసుకు సహాయము చేసిన కృపయే, ఆయన జయించటానికి తోడ్పడిన పరిశుద్ధాత్మ శక్తియే ఇప్పుడు మనకు కూడా అందుబాటులో ఉంది.
యూదా ఆయనను అప్పగించాడు, పేతురు ఆయనను తెలియదని చెప్పాడు. ఆయన శిష్యులు ఆయనను విడిచి పెట్టారు, ఆయనను వెంబడించిన జనసమూహము ఆయనకు వ్యతిరేకంగా తిరిగారు, ఆయన అన్యాయంగా తీర్పు తీర్చబడెను. తప్పుగా నింద మోపబడి సిలువ వేయబడటానికి నడిపించబడ్డాడు. అటువంటి స్థితిలో కూడా ఆయన జన సమూహముల వైపు తిరిగి, ''నా గురించి ఏడవవద్దు. మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి'' అని చెప్పగలిగారు (లూకా 23:28). అక్కడ ఆయన గురించి ఆయన జాలిపడడం మచ్చుకైనా లేదు.
తాను త్రాగుతున్న గిన్నె తన తండ్రి యొద్దనుండి పంపబడినదని ఆయనకు తెలుసు. ఇస్కరియోతు యూదా కేవలము ఆ గిన్నె తెచ్చిన సేవకుడు మాత్రమే. అందుచేతనే ఆయన యూదాను ప్రేమతో చూసి ''స్నేహితుడా'' అని పిలువగలిగాడు. నీవు దేవుని యొక్క సర్వాధికారమందు విశ్వాసము ఉంటే తప్ప ఆలాగు చేయలేవు.
''నా తండ్రి ఇస్తేనే తప్ప నా పైన నీకు ఏ అధికారము లేదు'' అని యేసు పిలాతుతో చెప్పెను (యోహాను 19:11).
ఆ నిశ్చయతయే యేసును ఈ లోకంలో ఒక రాజుకున్న హోదాతో నడవ గలిగేటట్లు చేసింది. ఆయన ఆ ఆత్మీయమైన హోదాతో నడిచాడు. అదే ఆత్మీయమైన హోదాతో మరణించాడు.
ఇప్పుడు మనము 'యేసు నడిచినట్లు నడవటానికి' పిలువబడ్డాము. పిలాతు యెదుట ఆయన ''ఒప్పుకొనిన మంచి ఒప్పుకోలు'' వలె మనము కూడా అవిశ్వాసులైన ఈ తరము వారి యెదుట మన యొక్క ఒప్పుకోలు ఒప్పుకోవాల్సి ఉంది. ''సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను'' (1తిమోతి 6:13,14).
మనము చూచినట్లుగా, మనము ఆయన యొక్క స్వభావములోనికిని, ఆయన యొక్క పరిశుద్ధతలోనికిని, పాలు పంచుకొనేటట్లు దేవుడు మన మేలుకొరకై సమకూర్చి జరిగిస్తారు. ఆయన యొక్క అద్భుతమైన సర్వాధికారంతో మన మార్గాన ఎవరైతే ఎదురుపడతారో వారిని ఆయన యొక్క ఉద్దేశం నెరవేరునట్లు ఉపయోగిస్తారు. ఆ కారణం చేత మనము మనుష్యులందరికొరకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించవచ్చును.
ఎందుచేత దేవుడు ఇబ్బంది పెట్టే పొరుగువారిని, చికాకు పరిచే బంధువులను, మరియు నిరంకుశంగా అధికారం చెలాయించే అధికారిని నిన్ను బాధించడానికి అనుమతిస్తున్నారు? ఆయన వేరే దగ్గరకు వారిని తీసుకొని వెళ్ళవచ్చు లేక వారి ప్రాణాలు ఒక్క క్షణంలో తీసివేసి నిన్ను, నీ జీవితాన్ని మరియెక్కువ సౌఖ్యంగా చేయగలరు. కాని ఆయన అలా చెయ్యరు. ఎందుచేతనంటే ఆయన వాటిని నిన్ను మరింత పరిశుద్ధపరచుటకు ఉపయోగిస్తారు. మరియు వారిని నీ ద్వారా రక్షించాలని కూడా ఆయన కోరతాడు.
దేవునికి స్తోత్రము. మన విజయము మన చుట్టూ ఉండిన మనుష్యులపైగాని, మన ఇంటిలోపటి విషయాలపై గాని, ఆఫీసు లేక మరియు ఏ ఇతర స్థలాలపైగాని ఆధారపడి లేదు. మన విజయము సంపూర్తిగా దేవుని కృపపై ఆధారపడి ఉంది. మరియు మనలను మనము తగ్గించుకొన్నట్లయితే ప్రతి పరిస్థితిలో ఆ కృప మనదగును.
ఈ ప్రపంచములో ధనమునకు గొప్ప శక్తి ఉన్నది. అందుచేతనే కేవలం ఇద్దరు యజమానులు మననుండి సేవను కోరుతున్నారని యేసు చెప్పారు - వారు దేవుడు మరియు సిరి. ''ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను'' (లూకా 16:13).
ప్రపంచము ధనము యొక్క శక్తి యందు నమ్మకముంచి డబ్బు ఏమైనా చేయగలదు అని చెప్పును. విశ్వాసులమైన మనము దేవుడు ఏమైన చేయగలడని అనెదము. అయితే అనేకమార్లు విశ్వాసులకు యదార్థమైన జీవముగల దేవుని మీద ఉండిన నమ్మకం కంటే అవిశ్వాసులకు వారి దేవుని (ధనము) మీదనే ఎక్కువ విశ్వాసముంటుంది.
మనము ప్రతి దినము డబ్బుకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగి ఉంటాము కాబట్టి ఈ విషయంలో కూడా మనము జయము పొందాల్సియుంది.
లంచం అద్భుతాలను చేస్తుందని లోకం నమ్ముతుంది మరి మన సంగతేమిటి? మన దేవుడు ధనము చేసే అద్భుతాలకంటే గొప్పవి చేయలేడా? కాని మనకు విశ్వాసము లేనట్లయితే దేవుడు మన పక్షాన పని చేయలేరు. ఇద్దరు వ్యక్తులకు ఈ ప్రపంచంలో ఏది కూడా అసాధ్యము కాదని యేసు చెప్పారు. ఒకరు దేవుడు, రెండవ వారు విశ్వాసము కలిగియున్న విశ్వాసి (మార్కు 10:27; 9:23).
దేవునికి మరియు విశ్వాసముతో నుండిన ఒక వ్యక్తికిని అసాధ్యమేమీలేదు. ఇది అద్భుతమైనది. దేవుని యొక్క మహోన్నతమైన శక్తి మనలను కలుపుతుంది. విశ్వాసమునకు అంతటి శక్తి ఉంటుంది. అటువంటి విశ్వాసముతో మనము మన చుట్టూ నున్న వారికి మన దేవుడు ధనము కంటె గొప్పవాడని చూపించాలి. బెంగుళూరులో నున్న మీటింగు హాలు నిర్మించు సమయములో మేము సిమెంటు కొరకు పర్మిటు తీసుకోవలసిన సమయం గుర్తుకొస్తుంది. నేను వెళ్లి దానికి సంబంధించిన గుమాస్తాను కలిశాను. అతడు మరుసటి వారము రమ్మని చెప్పాడు. నేను ఆ మరుసటి వారంలో వెళ్ళాను. అతడు తరువాత రమ్మన్నాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ గుమాస్తా పరోక్షంగా లంచం అడుగుతున్నాడని ఈ గవర్నమెంటు కార్యాలయాలలో పద్ధతులు తెలిసిన ఒకరు చెప్పారు.
లంచం ఇచ్చే ప్రశ్నేలేదు. అయితే దానికి బదులు మేము ప్రార్థించాము. నేను మరల మరల ఆ ఆఫీసుకు వెళ్ళాను మరియు అక్కడ ఎంతో ఓర్పును నేర్చుకున్నాను. ఆఖరుగా కొన్ని నెలల తరువాత మేము సిమెంటుకు పర్మిటు పొందాము. నేను సిమెంటు గురించి మాత్రమే దరఖాస్తు చేసాను. కాని ఓర్పును కూడా పొందాను. దేవుడు ఎప్పుడు కూడా మనము అడిగిన దానికంటె అధికముగా మనకు ఇస్తాడు!! హల్లెలూయా!
నేను ఓర్పు అనే దేవుని స్వభావమును పొందేలాగు దేవుడు ఒక అవినీతి పరుడైన అధికారిని ఉపయోగించడం ఎంత ఆశ్చర్యము. నేను ఆ మనుష్యునికి లంచం ఇచ్చి ఉండినట్లయితే నేను సిమెంటును ముందుగా పొందగలిగేవాడిని. కాని ఓర్పును కాదు. దేవుని యొక్క పద్ధతి అదికాదు.
మనమాయనను ఘనపరచినట్లయితే, ఆయన మనలను ఘనపరుస్తాడు (1సమూయేలు 2:30).
మన జీవితాలలో దేవుని చిత్తానికి బయట మనకు ఆశలు ఏమీ లేనట్లయితే మనకు ఎప్పుడును ఏ విధమైన సమస్యలు ఉండవు.
ఆ సమయములో బెంగుళూరులో సంఘానికి సంబంధించి మాకు సిమెంటు కావాలి. అయితే అది మేము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడినట్లయితేనే. మాకు మీటింగు హాలు వద్దని, దేవుడు అనుకొన్నట్లయితే మేము దానిని కోరము లేక దేవుడు ఉద్దేశించిన సమయానికి ముందుగా కూడా మాకు వద్దు. కనుక సిమెంటు పర్మిట్టుకు నాలుగు సంవత్సరాల కాలము పట్టినా మేము అంతవరకు ఎదురు చూడటానికి సిద్ధంగా ఉన్నాము. దేవుని యొక్క కాలక్రమ పట్టిక సంపూర్ణమైనది. ఆయన ఎల్లప్పుడూ సమయాన్ని పాటించేవాడు మరియు ఎప్పుడు ఆలస్యం కాడు.
సిమెంటు పొందటానికి దేవుడు నిర్దేషించిన తేదీయే, మేము దానిని పొందే తేది. ఈ భూమి మీద నున్న ఏ శక్తి కూడా దేవుని కాలక్రమ పట్టిక ప్రకారము మేము పొందకుండా ఆపలేదు. కనుక దేవుని సమయం కొరకు నిరీక్షించటానికి మనము సిద్ధపడినట్లయితే, ఆ విషయంతో సంబంధం కలిగియున్న అధికారులతో ఆయన పద్ధతిలో, ఆయన సమయాన్ని బట్టి ఆయన చూసుకుంటాడు.
సౌలు ఓర్పుతో ఉండక పోవడం చేత తన రాజ్యాన్ని కోల్పోయాడు. ''సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటము చూచి- దహన బలులను సమాధానబలులను నా యొద్దకు తీసికొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో- నీవు చేసిన పనియేమని యడిగెను. అందుకు సౌలు- జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయకు నేను చూచి - ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నాఅంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను- నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును'' (1సమూయేలు 13:8-14).
మరియు అనేకులు ఓర్పు లేకపోవడం చేతనే దేవుడు ఉద్దేశించిన శ్రేష్టమైన దానిని పోగొట్టుకుంటున్నారు. నీవు దేవుడు ఉద్దేశించిన సమయం వచ్చేవరకు ఎదురు చూడటానికి ఇష్టపడి సత్యం కోసం, నీతి కోసం నిలబడినట్లయితే ఎవరు కూడా దేవునికి నీ జీవితంలో ఉండిన ఉద్దేశ్యాన్ని అడ్డుకొనలేరు. విశ్వాసముతోను మరియు ఓర్పుతోను మనము వాగ్దానాలను స్వతంత్రించుకొనెదము (హెబ్రీ 6:12).
ఇదే సిద్ధాంతము మన గృహ అవసరాల ఆర్థిక విషయాలకు కూడా వర్తిస్తుంది. మన విశ్వాసము దేవునిపైనే గాని ధనముపైన కాదు. నీవు నీ ఇంటిని దేవుని యొక్క సిద్దాంతాలపై నడిపించినట్లయితే నీ అవసరాలకు చాలినంత ద్రవ్యము ఎప్పుడు నీ దగ్గర ఉంటుంది. నీవు ఎప్పటికిని ధనవంతుడవు కాకపోవచ్చు కాని నీవు భిక్షమెత్తడం అంటూ జరగదు. ''నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనైయున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు'' (కీర్తన 37:25) అని దావీదు చెప్పాడు. ''కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును'' (మత్తయి 6:33) అని యేసుప్రభువు చెప్పారు.
అనేకమంది క్రైస్తవులు ''ఫుల్ టైమ్ క్రిస్టియన్ వర్క్'' లోనికి అడుగు పెట్టి విశ్వాసముతో మొదలు పెట్టి, నెల నెలా 'ప్రార్థనా అంశాలు' (ముష్టి ఉత్తరాలకు మరోపేరు)తరచూ పంపుతూ తెలివిగా వారి ఆర్థిక అవసరాలు తెలియజేస్తూ కొద్ది సంవత్సరములలోనే గౌరవం కలిగిన ముష్టి వారిగా తయారవుతారు. నీవు నిజముగా ప్రేమ గలిగిన మరియు సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రిని కలిగియున్నట్లయితే మనుష్యులకు మన అవసరతలను గురించి ఎందుకు తెలియజేయాలి? మన నెలవారి అవసరాలవంటి చిన్న విషయాలకు ఆయన ఆధారపడతగినవాడు కాకపోయినట్లయితే మనము ఆయనను సేవించడం మానివేయడం మంచిది. ఇటువంటి పరిస్థితులలోనే దేవుడు మరియు సిరి ఈ రెండును మనము వారితట్టు చూచేలా చేస్తాయి. ఎవరి యందు మనము నమ్మకం ఉంచుతాము?
మనకున్న ఆశలు దేవునికుండిన వంటివే అయితే ఎటువంటి సమస్య ఉండదు. దేవుడు వద్దు అని చెప్పినవి కొనాలని కాని, పొందాలని కాని మనకు కోరిక లేకపోయినట్లయితే మనము ఎప్పుడును విశ్రాంతిలో ఉండగలము. ఎందుచేతనంటే అవసరమైతే ఆశ్చర్యకరంగా కూడా దేవుడు మన ప్రతి అవసరాలను తీరుస్తాడు. కాని వస్తువులకు సంబంధించిన దురాశ తీర్చుకోవడం కోసం అవసరం లేని అనేక వస్తువులను కొనాలని కోరుకొన్నట్లయితే అప్పుడు మనము అన్ని సమయములలో సమస్యలలోనికి వెళ్తాము.
ఇదే విశ్వాస సూత్రము జీవిత భాగస్వామిని వెదకడం విషయంలో కూడా వర్తిస్తుంది. ఒక తండ్రి తన కుమారులకు గృహమును, ఆస్థిని ఇచ్చును కాని దేవుడు మాత్రమే జ్ఞానము కలిగిన భార్యలను ఇవ్వగలడు (సామెతలు 19:14).
దేవుడు ఒక వ్యక్తిని నీకు భాగస్వామిగా ఉండాలని ఉద్దేశించినట్లయితే అప్పుడు వేరొకరు ఆ వ్యక్తిని వివాహంచేసుకునే ప్రమాదం ఉందా? నీకు దేవుని సర్వాధికారమందు నమ్మిక ఉండినట్లయితే అలా ఎప్పటికీ కాదు.
నీవు ఆతురత పడాల్సిన అవసరం లేదు. నీవు బలవంతంగా దొరక పుచ్చుకో నక్కర్లేదు. దేవుడు ఆ వ్యక్తిని నీ కొరకు ఉంచుటకు తగిన సామర్థ్యం కలవాడని నీవు సంపూర్ణ విశ్రాంతిని పొందవచ్చును. ఆదాము వివాహము చేసుకొనుటకు ఒక భాగస్వామి కోసం వెదుకుతూ ఏదేను వనమంతా తిరగలేదు. ఒకవేళ అలా తిరిగినా కూడా ఎవరినీ కనుగొని ఉండేవాడు కాదు. దేవుడు ఏమి చేశాడు? ఆయన ఆదామును నిద్రింపచేశాడు. ఆదాము విశ్రాంతిలో నున్నప్పుడు దేవుడు ఆదాముకు భార్యను సిద్ధపరచాడు. ఆ తరువాత దేవుడు ఆదామును నిద్రలేపి హవ్వను ఇచ్చాడు.
దేవుడు ఆదామును ఏ విధముగా ప్రేమించాడో నిన్ను కూడా అదేవిధముగా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నీ కొరకు వివాహమును ఆయన ఉద్దేశించినట్లయితే తప్పకుండా నిన్ను సరైన వ్యక్తి దగ్గరకే నడిపిస్తాడు. కాని నీవు ఆయనను తప్పక విశ్వసించాలి. విశ్వాసము లేకుండా వేచియుండుట కేవలం నిరాశకు మాత్రమే దారితీస్తుంది.
నీకు దేవుని చిత్తానికి బయట ఏ ఆశయాలు లేనట్లయితే, నీవు దేవుని చిత్తాన్ని బట్టి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినట్లయితే అప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. తన యెడల యదార్థ హృదయముగల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు (2దిన 16:9).
''లోకమును జయించిన విజయము మన విశ్వాసమే'' (1యోహాను 5:4). నీకు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానమందు, ప్రేమయందు, శక్తియందు విశ్వాసముండినట్లయితే నీవు ఈ ప్రపంచాన్ని మరియు దాని అధికారిని, దాని అధికారాన్ని (ధనము, ఆహ్లాదము, ఘనత మొదలైనవి) జయింపగలవు.
అయితే నీవు దేవుని సర్వాధికారమందు లేక ఆయన ప్రేమయందు నమ్మిక యుంచనట్లయితే నీవు ప్రపంచముతోను, ఆదాము పిల్లలతోను కలిసి దౌర్భాగ్యమైన, దైవభక్తి లేని మరియు రాజీపడే జీవితంలోనికి లాగివేయబడతావు.
తమకు తాము సహాయం చేసుకునే వారికి దేవుడు సహాయం చేయునని లోకం చెబుతుంది. కాని ఎవరైతే వారికి వారు సహాయం చేసుకోలేరో వారికి దేవుడు సహాయం చేస్తాడని బైబిలు చెప్తుంది. ఆయన బలహీనులకు, నిస్సహాయులకు దేవుడై యున్నాడు. ఆయన తల్లితండ్రులు లేని వారికిని, విధవరాండ్రకును, పరదేశులకును దేవుడనని పిలచుకొనెను.
''ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు'' (ద్వితీ 10:17,18). ఆయన ధనవంతులకు, గొప్పవారికిని, దేవుడనని పిలచుకొనలేదు, ఎందుచేతనంటే వారికి మానవ లేక ఆర్థికమైన సహాయము అందుబాటులో ఉంటుంది. ఎవరికైతే మానవ లేక ఆర్థిక సహాయము అందుబాటులో ఉండదో అటువంటి బలహీనులకు మరియు సహాయం లేనివారికిని ఆయన దేవుడు. దేవుడు బలహీనుల వైపున ఉంటాడు. అందుచేతనే ఆయన మనకు సహాయం చేసే ముందు మనలను బలహీనులగా చేయాల్సిఉంది.
పౌలు జీవితంలో ఎప్పుడును దేవుని శక్తి నిలిచియుందని ఆయన తెలుసుకొనేలాగున దేవుడు ఆయన శరీరంలో ఆయనను బలహీనుని చేయటానికి ఒక ముల్లు ఉంచారు. ''నాకు కలిగిన ప్రతక్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు-నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను'' (2కొరింథీ 12:7-10).
నీవు నీ ఆస్తిపైన మరియు నీ యొక్క పలుకుబడి కలిగిన స్నేహితులపైన నీ జీవితము సౌఖ్యంగా గడచులాగున ఆధారపడినంత కాలము దేవుడు నీ స్వంత సాధనాలపై విడిచిపెట్టును. ఆయన సహాయం కోసం నీవు చేసిన ప్రార్థనలకు సమాధానం కూడా ఇవ్వడు. ఎందుచేతనంటే నీ యొక్క నమ్మకం శరీరుల మీద ఉంది అనగా నీవు కూడబెట్టిన సొమ్ముపైన మరియు నీకు తెలిసిన పలుకుబడి కలిగిన వ్యక్తులమీద ఉందని ఆయన చూచును.
కాని నీవు కేవలం బలహీనమైన స్థానానికి అనగా ఎక్కడైతే నీవు మానవ వనరుల మీద లేక మనుష్యులపై ఆధారపడవో అప్పుడు నీవు ఈ భూమిపై అత్యంత ఆశీర్వాదకరమైన వాడవుగా నగుదువు. ఎందుకంటే అప్పుడు దేవుడే నీకు ఆధారంగా ఉంటాడు. బలహీనంగా మరియు సహాయత లేకుండా ఉండుట అనేది ఆశీర్వాదకరము, ఎందుచేతనంటే అప్పుడు మనము ప్రతిదానికి దేవుని యందే నమ్మిక యుంచవచ్చును.
యూదారాజు ఆసా దేవుని చేత ఒకటి కంటె ఎక్కువసార్లు సహాయం పొందెను. అయినప్పటికీ అతడి కాళ్ళకు తీవ్రమైన రోగము కలిగినపుడు అతడు ప్రభువు వైపుకు కాకుండా సహాయం కోసం వైద్యుల తట్టుకు తిరిగాడని చెప్పబడింది. అతని గురించి ఈ విధమైన విచారకరమైన మాటలు మనము చదువుతాము. ''ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా'' (2దిన 16:12,13).
అతడు రాజు అయినందుచేత రాజ్యంలో ఉండిన శ్రేష్టమైన వైద్యులకు చెల్లించటానికి కావలసినంత ధనము అతడి దగ్గర ఉంది. కాని రాజుగా తనకు ఉండిన ఐశ్వర్యము మరియు అతని పలుకుబడి అతడి రోగాన్ని స్వస్థపరచలేదు. అతడు సామాన్యమైన విశ్వాసముతో ప్రభువును నమ్మియుండినట్లయితే అతడికి ఎంతో మేలు జరిగి ఉండేది.
అతడు వైద్యుల చేత చికిత్స పొందడంలో తప్పేమీ లేదు గాని అతడు పూర్తిగా వైద్యుల మీదే ఆధారపడడం తప్పు.
ప్రభువు ఒక్కడే నీకు సహాయకుడుగా ఉండునట్టి స్థానము చాలా ఉత్తమమైనది. దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలని కోరుకొనే వాళ్లలో నీవూ ఒకడవైతే శరీరులపై ఆధారపడకుండా దేవుడు మరల మరల నిన్ను ఆ పరిస్థితి నుండి దూరం చేయడం నీవు గమనిస్తావు. నీవు ఆయన మీద మాత్రమే ఆధారపడేలాగున ఆయన నిన్ను బలహీనునిగా చేయును.
ఏలీయా విషయంలో దేవుడు ఏమి చేసెనో గమనించండి. ఇశ్రాయేలు దేశంలో కరవు వచ్చినపుడు దేవుడు కాకులతోను, నీటివాగు ద్వారాను ఏలియాను పోషించెను. ''ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను'' (1రాజులు 17:4-6). రోజుకు రెండుమార్లు కాకులు రొట్టెను, మాంసాన్ని తెస్తూ ఉండేవి. నీటి వాగులో త్రాగటానికి కావలసినంత నీరు ఎప్పుడును ఉండేది. ఏలియా దేవుని మీద కంటె కాకుల మీద ఆధారపడే ప్రమాదములో పడునట్లుగా ఇది క్రమముగా జరిగింది. కనుక దేవుడు ఆ సరఫరా చేయు మార్గాన్ని మార్పు చేయుటకు నిర్ణయించెను. ''కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను'' (1 రాజులు 17:7).
ఒక ఉదయాన ఏలియా నీటి వాగు దగ్గరకు వెళ్లి అది ఎండిపోయిందని తెలుసుకున్నాడు. తన సేవకుడు కాకుల పైనను మరియు నీటి వాగులపైనను ఆధారపడడం మాని వేయడం దేవుడు నేర్పించుచుండెను. మాంసం తినే కాకి తన స్వాభావానికి విరుద్ధంగా నడుచుకొని దేవుని సేవకునికి ఇచ్చులాగున చేసిన దేవుడు మరియొక విధమైనట్టి సరఫరా ఏర్పాటును చేయగలడని నమ్మాలి.
ఆ విధంగా ఆయన ఏలియాను సారెఫతు వెళ్లమని చెప్పాడు. అక్కడ దేవుడు తన సేవకుని విషయంలో జాగ్రత్త తీసుకోదల్చాడు. ఒక ధనికుడైన వ్యాపారి ద్వారాకాదు గాని, ఒక వృద్ధురాలైన, ఏ సహాయం లేని బీదతనంతో కృంగిన యూదురాలికాని ఒక విధవరాలి ద్వారా. అటువంటి పనికి మనము ఎంపిక చేసియుండినట్లయితే సారెఫతులో ఆమె ఆఖరుది అవుతుంది.
అయితే దేవుని మార్గములు మన మార్గముల కంటే వేరైనవి. ఆయన సరఫరాకు ఏ మాత్రము తగని పద్ధతిని ఉపయోగించుటయందు ఆనందిస్తాడు. ఆ విధంగా మన విశ్వాసము ఆ పద్ధతి మీద ఆధారపడడం కాకుండా దేవుని మీద ఆధారపడుతుంది. ''ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు'' (1కొరింథీ 1:27-29).
మన జీవితాల్లో మనలను ఎప్పటినుండో పోషిస్తున్న కాకులు ఆగిపోయిన రోజు ఎంతో అద్భుతమైన రోజు. అప్పుడు మనము దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచడం మొదలు పెడతాము.
నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి నిన్ను నిరాశపరచినప్పుడు అతనికి వ్యతిరేకముగా ఫిర్యాదు చేయకు. దేవుడు ఏ విధంగా కాకులను ఏలియా వద్దకు రావడం ఆపాడో అలాగే మనుష్యుడు నీకు సహాయం చేయడం ఆయన ఆపి ఉంటాడు. ఆ విధంగా నీవు జీవముగల దేవునిపైన మాత్రమే ఆధారపడడం నేర్చుకొంటావు.
దేవుడు రోషముగల దేవుడు మరియు ఆయనకు చెందవలసిన మహిమను మరి ఎవరితోను పంచుకోడు. ''యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను'' (యెషయా 42:8).
''నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు'' అనే మాట మనము తిరిగి తిరిగి వినాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే మన రక్తమాంసములు కల శరీరములో విగ్రహారాధన వైపు తిరిగే స్వభావం ఉంది. అది ఏమిటంటే ఆర్థికమైన లేక మానవ సంబంధమైన విషయాలపై ఆధారపడడం. మన అవసరాల కన్నిటికి మనము ఆయనపైన మాత్రమే ఆధారపడాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అప్పుడు మనము ప్రతి సమయములో జయమందు జీవించగలము.
ఇప్పటి వరకు మనము చెప్పు కొనిన దాని సారాంశమంతా మన రక్షణ కృప చేతను మరియు విశ్వాసము ద్వారాను అనునది.
కృపచేత విశ్వాసము ద్వారా పాపక్షమాపణ పొంది ఆత్మలో బాప్తిస్మము తీసుకొనుట ద్వారా మన క్రైస్తవ జీవితమును ప్రారంభించాము. ''మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే'' (ఎఫెసీ 2:8). ఒక దినాన మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమతో వచ్చునపుడు మనము మధ్యాకాశములో ఆయనను కలుసుకొనుటకు ఎత్తబడడం కూడా విశ్వాసము ద్వారా కృప చేతనే జరుగుతుంది.
కనుక భూమిపై మన యొక్క క్రైస్తవ జీవితానికి తుది, మొదలు కూడా విశ్వాసం ద్వారా కృపచేతనే. ఈ మధ్యలో ప్రతిది కూడా విశ్వాసము ద్వారా కృపచేతనే అనే సూత్రముపై మనము ప్రతి దుష్టత్వాన్ని జయించి భూమిపై దేవుడు మనకు నియమించిన కార్యాన్ని పూర్తి చేయగలమని మనము నేర్చుకోవాల్సియుంది.
దేవునికి భవిష్యత్తు అంతయు తెలియును. రేపు లేక వచ్చేవారం లేక వచ్చే సంవత్సరంలో మనకు జరగబోయేది ఏది కూడా దేవునికి ఆశ్చర్యం కలిగించదు. ఆయనకు చివరగా జరుగబోయేది ముందే తెలుసు. ఇది మనకు గొప్ప ఆదరణ కలుగజేస్తుంది. ఎందుచేతనంటే రేపు లేక వచ్చే వారంలో నీవు ఒక గొప్ప శోధనను ఎదుర్కొంటావని దేవునికి తెలిసినట్లయితే ఆయన తప్పనిసరిగా దానికి అవసరమైన కృపను దానితో పాటుగా ఇస్తాడు.
పౌలుతో ప్రభువు ఈ విధంగా చెప్పాడు. ''అందుకు-నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును'' (2కొరింథీ 12:9). ఆయన కృప ప్రతి అవసరమునకు సరిపోవును. అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు (2కొరింథీ 9:8).
మనకు సమయోచితమైన సహాయము కొరకు కావలసినంతగా కృప మనకు దొరకుతుంది. ''గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము'' (హెబ్రీ 4:16). అది ఎటువంటి అవసరమైనా దానిని ఎదుర్కొనటానికి నీకు కావలసిన దేవుని కృప దొరకుతుంది. గనుకనే మనము ''ధైర్యముతో కృపాసనము వద్దకు కృపను పొందుటకు రమ్మనమని ఆహ్వానింపబడుతున్నాము''.
మనము గతములో ఆ కృపను పొందకపోవుటచేత ఓడిపోయాము. భవిష్యత్తులోకథ ఇంకొక లాగున ఉండగలదు. మనలను మనము తగ్గించుకొని(మన నిస్సహాయతను ఒప్పుకొని), మన అవసరత కాలమందు కృపకొరకు మొఱ్ఱపెట్టినట్లయితే దేవుడు మనలను నిరాశ పర్చడు.
కృపా బాహుళ్యము (అధికమైన కృప) ను పొందిన వారు యేసు క్రీస్తు ద్వారా జీవముగలవారై ఏలుతారు. ''మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసు క్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు'' (రోమా 5:17).
ఇది ఆదాము విషయంలో దేవుని చిత్తమై ఉండినది. అది అతడు ప్రతిదానిపైన అధికారము కలిగి ఏలుబడి చేయడం. ''దేవుడు- మన స్వరూపమందు మన పోలికెచొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను'' (ఆదికాండము 1:26). తన జీవితములో ఇది నెరవేర్చబడకుండా తనయొక్క అవిధేయత అడ్డుపడింది.
అయితే ఇప్పుడు దేవుడు ఒక క్రొత్త జాతిని ఈ భూమిపై లేవనెత్తాడు - వారు దేవుని కుమారులు, ఎవరైతే యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా జీవిస్తారో, ఎవరైతే రాజులవలె గౌరవం కలిగి జీవిస్తూ మరియు ఈ భూమిపై రాజ్యం చేస్తారో వారు. నిన్ను నీవు తగ్గించుకొని దేవుని కృపను పొందినట్లయితే ఏ పాపము కూడా నీ మీద ఇక ప్రభుత్వము చేయనవసరం లేదు.
ఏ భయము లేక ఆందోళన మరల ఎప్పుడును నీ హృదయంలో ప్రవేశించదు.
ఈ భూమిపై నుండిన ఎవ్వరు కూడ, నీ అధికారి, నీ పొరుగువారు, నీ బంధువులు, నీ విరోధులు ఎవరూ కూడా జీవితాన్ని నీకు దౌర్భాగ్యంగా చేయలేరు. ఎందుకంటే నీవు విజయ రహస్యాలను నేర్చుకున్నావు.
ఎల్లప్పుడు క్రీస్తునందు మమ్ములను విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి కృతజ్ఞతలు.
దేవుని యొక్క క్రొత్త నిబంధన కృపను పొందుకొనుచు జీవించడం ఎంత అద్భుతం.
ఇదిగో, వాగ్దానదేశము నీ యెదుట తెరువబడి ఉంది.
లోనికి వెళ్లి దానిని స్వతంత్రించుకో.
(సారాంశము)
1. అన్ని వేళలలోను నీవు విజయమునందు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నీ హృదయమంతటితో దీనిని నమ్ము.
2. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీకు ఆజ్ఞలనిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఆజ్ఞను కూడా తీవ్రముగా తీసుకో.
3. దేవుడు యేసును ప్రేమించినట్టే యేసు యొక్క శిష్యులను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమలో నీవు భద్రపరచబడు.
4. ప్రతి శ్రమలోను దేవుని ఉద్దేశ్యం ఉంటుంది. నీ సామర్థ్యమునకు మించి నీవు శోధింపబడునట్లు లేక పరీక్షింపబడునట్లు దేవుడు ఎన్నడూ అనుమతించడు. నీ హృదయమంతటితో దీనిని నమ్ము.
5. యేసు అన్ని విషయాలలో మనవలెనె శోధించబడ్డాడు. అయినా కూడా ఆయన ఎన్నడూ పాపము చేయలేదు. నీవు శోధించబడినప్పుడు, నీకు మాదిరిగా ఉన్న ఆయన వైపు చూడుము.
6. కేవలము దీనులకు మాత్రమే దేవుడు కృపను అనుగ్రహించును. కాబట్టి అన్ని సమయాలలో కూడా సిలువను ఎత్తుకొని నిన్ను నీవు తగ్గించుకో.
7. అన్నీ నీ మేలు కొరకే జరుగునట్లు దేవుడు నీ పరిస్థితులన్నింటిని నియంత్రించును. నీ హృదయమంతటితో దీనిని నమ్ము.
8. అన్ని పరిస్థితులలో కూడా తప్పిపోని సహాయకునిగా ఉండే దేవుని మీదే ఆధారపడు. మరిదేనిమీదనైనను, ఎవరి మీదనైనను ఆధారపడకుండా నిన్ను తప్పించుమని దేవుణ్ణి అడుగు.
9. కేవలం బలహీనులకు మాత్రమే దేవుడు తన శక్తినివ్వగలడు. కాబట్టి దేవుడు నిన్ను విరుగగొట్టునట్లుగా మరియు శూన్యస్థితికి తీసుకువచ్చునట్లుగా అనుమతించు.
1) మనము అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని పాటించి దానిలోని ఆత్మను ఉపేక్షించినట్లయితే, మనకు శక్తిలేనటువంటి దైవభక్తి కలిగిన రూపము ఉంటుంది.
2) దీనత్వం కలిగిన మానవుడు చిన్న విషయానికి కూడా దేవునికిని, మానవునికి కూడా కృతజ్ఞత కలిగిఉంటాడు.
3) నీవు ఏదైనా పాపం చేత ఓడింపబడినట్లయితే, దానికి మూల కారణం ఏదొక విధంగా గర్వమే అయి ఉంటుంది.
4) నీవు నిజంగా దీనుడవైతేే, దేవుని యొద్దనుండి కృపను పొందకపోవడం అసాధ్యం.
5) ఒక దీనుడైన వ్యక్తి ప్రజల చేతగాని, సాతానుచేత లేక శరీరంచేత గాని ఎప్పటికిని ఓడింపబడడు.
6) మనలను మనము తగ్గించుకొన్నట్లయితే, దేవుని యొక్క బలిష్టమైన హస్తము చేత మనము కాపాడబడతాము.
7) ఇద్దరు ఆత్మలో దీనులైనవారైతే తప్ప, ఇరువురు ఒక్కరుగా ఉండడం అసాధ్యం.
8) ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నవారంటే ఎవరైతే వారి అవసరతను తెలుసుకొని ఉండి, ఆ విధంగా ఎడతెగక తమను తాము తీర్పు తీర్చుకుంటారో వారు.
9) ప్రత్యక్షతను కలిగియుండటం అంటే విషయాలను, ప్రజలను మరియు పరిస్థితులను మొదలైన వాటిని దేవుని దృక్పధంలో చూడడం.
10) ఒకని కంటిలో దూలమంటే, కంటిలో నలుసు వుండిన మరో సహోదరుని యెడల ప్రేమలేకుండా, తీర్చు తీర్చే స్వభావం కలిగి ఉండడం.
11) ధర్మశాస్త్రము మనకు ఆజ్ఞలనిస్తుంది కాని వాటిని పాటించుటకు సామర్థ్యము నివ్వదు. కృప ఇంకా ఉన్నతమైన స్థాయికి పిలుస్తుంది, కాని దానిని చేరుకొనుటకు శక్తిని కూడా ఇస్తుంది.
12) ప్రతి దినము నీవు దేవుని చిత్తాన్ని చేయటానికి లేక ఆ దినాన్ని పోగొట్టుకోవటానికి నీకు అవకాశముంది.
13) మన మార్గంలో ఆటంకాలు సాధారణంగా వెనక్కు తగ్గిపోవటానికి సంకేతాలు కావుగాని మన విశ్వాసానికి సవాలు చేసేవి.
14) శరీరానుసారంగా నడిచేవాడు ఇతరులు అతడికి చేయవలసినది ఖచ్చితంగా చెయ్యాలని ఎదురు చూస్తాడు. అయితే ఆత్మానుసారంగా నడిచేవాడు ఇతరుల బలహీనతలను భరించి వారికి సేవచేయటానికి చూస్తాడు.
15) ఎవరైతే దేవుని ప్రేమలో భద్రపర్చబడి ఉంటారో వారు ఇతరులను తీర్చుతీర్చరు, మత్సరపడరు లేక పోటీపడరు.
16) దేవునికి చెందని మహిమ ఎలాంటి మహిమ అయినా వ్యర్థమైన మహిమయే.
17) నీవు ఇప్పుడు స్వార్థపూరితంగా జీవించినట్లయితే, ఆ జీవితం తాలుకు జ్ఞాపకం నిత్యత్వమంతా కూడా నీవు చింతించునట్లు చేస్తుంది.
18) దేవుడు మనము అవసరతలు కలిగి ఉండడం, ఇతరుల యొద్దనుండి సహాయం పొందడం అనుమతిస్తాడు. ఎందుకంటే క్రీస్తు శరీరంలో మనం ఒకరి మీద ఒకరు ఆధారపడడం నేర్పించటానికి.
19) నీవు ఇంకొకరికి ఏవైనా బహుమానముగా ఇచ్చినపుడు మానవునిగా అతనికి ఉండిన గౌరవాన్ని దొంగలించకుండా ఇవ్వాలి.
20) మన జీవితం యొక్క నిజమైన విలువ మనము ఏమి ఇచ్చాము, అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది గాని ఏమి పొందాము అన్న దాని మీద కాదు.
21) దైవికమైన ప్రత్యక్షత చేత మనము ఏమైతే పొందామో అది మన యొక్క నిజమైన సంపద. మిగిలిన దంతా కేవలం తెలివి మాత్రమే మరియు అది దొంగనోట్ల వలె విలువ లేనటువంటిది.
22) విశ్వాసము దేవుని యొద్దనుండి మనము వినిన మాట మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుచేత మనుష్యుడు దేవుని నోటనుండి వచ్చుప్రతి మాటవలన జీవించవలెను.
23) దేవుడు మనలను హెచ్చించి ఆయన యొక్క ఉద్దేశ్యమును మన ద్వారా నెరవేర్చుకొనక మునుపు ఆయన మనలను శూన్యపు స్థితికి తీసుకురావలసి ఉంది.
24) మనము క్రీస్తును అనుకరించటానికి కాదుగాని ఆయన స్వభావంలో పాలివారమగుటకు మరియు ఆయనను వెంబడించుటకు మనము పిలువబడ్డాము.
25) దేవునికి భయపడడం అంటే ఒకరి రహస్య జీవితంలో నమ్మకంగా ఉండడం.
26) మన యెడల దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళికను మనము తప్ప ఇంకెవ్వరును పాడుచేయలేరు.
27) ధనము వాడుట విషయంలో నమ్మకంగా ఉండటమంటే కేవలం ధనసంబంధమైన విషయాలలో నీతిగా ఉండటం కంటె ఎంతో గొప్పదైన విషయం.
28) నిజమైన ఆత్మీయత మనయొక్క స్వంత చిత్తమును ఉపేక్షించుకొని దేవుని చిత్తమును చేయుటలో ఉంటుంది.
29) ఇసుకపై కట్టడం అంటే సిద్ధాంత పరమైన బోధను అర్థం చేసుకోవడం మరియు దాని గురించి ఉరకలెత్తడం. రాతి మీద కట్టడం అంటే దేవుని వాక్యానికి లోబడడం.
30) ఆత్మీయంగా ఉండడం అంటే ఒకడు తప్పులను విడిచి పెట్టడం మాత్రమే కాదు కాని లాభకరము కాని విషయాలను కూడా త్యజించడం.
31) దైవికమైన ప్రేమ లేకుండా ఆత్మీయ వరాలు కలిగిఉండడం అనేది తొడుగు లేనటువంటి విద్యుత్తు తీగ వంటిది. అది వెలుగుకు బదులు మరణాన్ని తెస్తుంది.
32) యేసు సిలువ వేయబడింది, ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించినందుకు కాదు గాని మతపరమైన వ్యభిచారాన్ని బహిర్గతం చేసినందున, ఆయన మాదిరిని మనం అనుసరిద్దాం.
33) బైబిలు నందు నిజమైన ప్రవక్త ఎప్పుడును బైబిలు పాఠశాల నుండి రాలేదు. కేవలం అబద్ద ప్రవక్తలు మాత్రమే వచ్చారు.
34) మన మానవ సంబంధమైన సామర్థ్యములకు మరియు భూసంబంధమైన అర్హతలకు దేవుని దృష్టిలో ఎటువంటి విలువ కూడా ఉండదు.
35) అత్యున్నతుడైన ప్రధానదూత తనకుండిన సౌందర్యం, అతని యొక్క జ్ఞానము, అతనికుండిన స్థానమును బట్టి గర్వించుట ద్వారా సాతానుగా మారాడు. అటువంటి గర్వం విషయంలో మనము జాగ్రత్తగాఉండాలి.
36) ధర్మశాస్త్రము మనకుండిన కురుపులను అదుపు చేసే లేహ్యంవంటిది. కృప కురుపులను కలుగజేసే క్రిములను సంహరించే రోగనిరోధకం వంటిది.
37) పొరపడటానికి వీల్లేనటువంటి విశ్వాసము యొక్క గురుతు ఏమిటంటే దేవునిని స్తుతించడం మరియు కృతజ్ఞతలు అర్పించడం.
38) వస్తువులు ఉపయోగించుకోవటానికి దేవునిచేత మనకు ఇవ్వబడ్డాయి. అంతేకాని వాటిని ప్రేమించటానికి స్వాస్థ్యపరచుకోవడానికి కాదు.
39) నిజమైన క్రైస్తత్వము వైరాగ్యమునకును, భౌతిక వాదమునకును మధ్యస్తంగా ఉంటుంది.
40) యేసు మహిమతో తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మనము ఆయన వలే ఉండగలము. కాని ఇప్పుడు ఆయన నడచినట్లు మనము నడుచుకోగలము.
41) యేసు ఆయన ఇంటిలోను మరియు ఆయన పనిచేసే స్థలములోనూ (వడ్రంగి కొట్టు) జ్ఞానమందు ఎదిగారు. మనము కూడా ఈ రెండు స్థలములలో జ్ఞానములో ఎదుగవచ్చు.
42) మనము సహోదరులపై నేరారోపణ చేసినప్పుడు మనము సాతానుతో తోటిపనివారము అవుతున్నాము. మనము వారి కొరకు విజ్ఞాపణ చేసినపుడు మనము యేసు తోటి పనివారమగుదుము.
43) వేరే వారికి మనలను మనము అవసరముగా చేసుకున్నట్లయితే, దేవునితో వారి యొక్క నడకకు మనము ఆటంకముగా ఉంటాము.
44) ప్రేమలో ఆరంభం కాని ప్రతిది ఒక రోజున నశించిపోతుంది.
45) మనయొక్క ఆత్మీయ పరిపక్వత మనము నమ్మిన సిద్ధాంత పరమైన బోధతో ఏకీభవించని, కలియని వారి యెడల మన వైఖరిని బట్టి పరీక్షింపబడుతుంది.
46) హృదయ శుద్ధి కలిగి యుండడం అంటే దేవునిని తప్ప దేనినీ, మరెవరినీ కోరుకొనకపోవుట.
47) యేసు ఆత్మ అభిషేకము లేకుండా ఆయన తండ్రిని సేవించలేక పోయినట్లయితే మనము కూడా సేవించలేము.
48) ఆత్మ వరములు లేని సంఘము పక్షవాతము కలిగియున్న వ్యక్తి వలె ఉంటుంది- అతడు జీవమును కలిగియుండవచ్చుగాని ఇతరులకు ఫలవంతముగా సేవచేయలేడు.
49) ఇద్దరు వ్యక్తులకు అసాధ్యమైనది ఏది లేదు వారు - దేవుడు మరియు విశ్వాసము గల వ్యక్తి.
50) మనకు మనము చనిపోయినట్లయితే, నీవు అన్ని సమయములలో, మరియు అన్ని పరిస్థితులలో ''సమాధానమందు విశ్రాంతి''ని పొందగలము.