ప్రభువు మరియు ఆయన సంఘము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 1
యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత

యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత


ఈ పుస్తకములో, ప్రకటన గ్రంథము యొక్క మొదటి మూడు అధ్యాయముల ద్వారా ప్రభువు మనతో ఏమి మాట్లాడుచున్నాడో తెలిసికొనుటకు వాటిని పరిశీలించెదము.


సాతాను ప్రకటన గ్రంథమును ద్వేషించును ఎందుకనగా అది అతని చివరి ఓటమిని మరియు అతని అంతిమ గమ్యాన్ని వర్ణిస్తున్నది. సాతాను ఒక పుస్తకమును ద్వేషించిన యెడల, దానిలో మనకొరకు విలువైనది ఏదో యుండియుండవచ్చని మనము నిర్ధారించుకోగలము.


అంత్య దినములలో జయించువారిగా ఉండగోరు వారి కొరకు ప్రకటన గ్రంథము ప్రత్యేకముగా వ్రాయబడినది. ఈ గ్రంథము యొక్క మొదటి అధ్యాయములో తిరిగిలేచిన ప్రభువు యొక్క దర్శనమును మనము చూడగలము. తదుపరి రెండు అధ్యాయములలో, ఆసియా మైనర్‌ అను ప్రాంతములో నున్న ఏడు సంఘముల యొక్క ఆయన మూల్యాంకనమును(అంచనాలను) మనము చూడగలము. మనకిష్టమైతే, ఈ అంచనాల ద్వారా మన సంఘములను మరియు మనలను మనము విశ్లేషించుకోవచ్చు.


ఇతరులు మన జీవితమునకిచ్చే అంచనాలకు, మనము మనకిచ్చుకొనే అంచనాలకు ప్రభువు యొక్క అంచనాలు ఎంతో వ్యత్యాసముగా ఉండవచ్చు. మనలో ఎక్కువ మంది మన ఆత్మీయత గురించి ఉండవలసిన దానికంటే గొప్ప అభిప్రాయమును కలిగియున్నారు. మనము ఇప్పుడిక్కడ ప్రభువు చేత విశ్లేషించబడుటకు సిద్ధపడి ఆయన మనగురించి, మన సంఘముల గురించి చూపించినది యధార్ధముగా అంగీకరించినట్లయితే, మనము ఒక రోజు ఆయన న్యాయ పీఠము ముందు నిలబడినప్పుడు ఎంతో దు:ఖము నుండియు, విచారము నుండియు రక్షింపబడగలము.


ఏడు పరిచయ వ్యాఖ్యలు


''యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూతద్వారా వర్తమానము పంపి తనదాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు, యేసు క్రీస్తు సాక్ష్యము గూర్చియు, తాను చూచినదంతటిని గూర్చియు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు'' (ప్రకటన 1:1-3).


ఈ మొదటి మూడు వచనములలో ప్రకటన గ్రంథమంతటికి పరిచయముగా నున్న ఏడు సూత్రీకరణలను మనము కనుగొనెదము. మొట్టమొదటిగా, ఈ గ్రంథము ఒక ప్రత్యక్షత (లేదా ప్రకటన) అని పిలువబడినది. ''ప్రత్యక్షత'' అను పదము గ్రీకు బాషలో ''ఆవిష్కరణ'' అని అర్థమిచ్చు పదమునకు అనువాదము. దేవుడు మాత్రమే తన సత్యములను మనకు ప్రత్యక్షపరచగలడు. మనము గుర్తుంచుకొనవలసిన మొదటి విషయమిదే. దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఏమి చెప్పాలని అనుకొనుచున్నాడో అర్థము చేసికొనుటకు మనకు జ్ఞానమును, ప్రత్యక్షతయుగల ఆత్మ అవసరము. మానవ తెలివితేటలు దానిని ఎప్పటికీ గ్రహించలేవు.


రెండవదిగా, ఈ ప్రత్యక్షత ''ఆయన (క్రీస్తు యొక్క) దాసులకు'' కనుబరచుటకు ఇవ్వబడెనని మనము చదివెదము. ఇది అందరికీ కాదు. ఇది ప్రభువు యొక్క దాసులుగా ఉండుటకు ఇష్టపడిన వారికి మాత్రమే. ఒక జీతము తీసుకొనే పనివానికి , ఒక దాసునికి వ్యత్యాసమున్నది. ఒక పనివాడు జీతము కొరకు పనిచేయును. కాని ఒక దాసుడు తన యాజమానికి చెందిన ఒక బానిస మరియు అతనికి ఎటువంటి హక్కులు ఉండవు.


అయితే ప్రభువునకు దాసులైన వారెవరు? తమ ప్రణాళికలను, ఆశయాలను మరియు తమ హక్కులన్నిటినీ సంతోషముగా విడచిపెట్టి, ఇప్పుడు తమ జీవితాలలో ప్రతియొక్క విషయములో దేవుని చిత్తమును చేయుటకు కోరుకొనువారే ఆయన దాసులు. అటువంటి విశ్వాసులు మాత్రమే నిజమైన దాసులు.


ప్రభువుకు అనేకమంది పనివారు ఉన్నారు కాని, దాసులుగా ఉండుటకు ఇష్టపడువారు చాలా కొద్దిమందే ఉన్నారు. దేవుని వాక్యము ఆయన దాసులకు మాత్రమే నిర్థిష్టంగా (సరిగా) అర్థమగును. ఇతరులు దానిని ఒక పాఠ్యపుస్తకమును చదివినట్లు తమ మేథాశక్తితో దానిని అధ్యయనం చేయగలరు గాని దానిలో ఉన్న ఆత్మీయమైన వాస్తవాలను ఎప్పటికీ గ్రహించలేరు. దేవుని చిత్తమునకు విధేయత చూపుట ద్వారా మాత్రమే ఒకడు సత్యమును తెలిసికోగలడని యేసు యోహాను 7:17లో స్పష్టముగా చెప్పెను.


మూడవదిగా, ఈ గ్రంథము యోహానుకు సూచనగా ఇవ్వబడినదని మనకు తెలియజేయబడినది (1వ వచనము). దీని అర్థమేమిటంటే ఈ సందేశము మనకు సాదృశ్యముల ద్వారా తెలియజేయబడినది. మొదటి మూడు అధ్యాయాలలోనే మనము దీపస్థంబాలు, నక్షత్రములు, అపరంజి వంటి పాదములు, రెండంచులు గల ఖడ్గము, మరుగైయున్న మన్నా, తెల్లరాయి మొదలగువాటి గురించి చదివెదము. ఇది అక్షరానుసారమైనవి లేదా భౌతికమైనవి కావు. ఇవి కేవలము ఆత్మీయ వాస్తవాలకు సాదృశ్యములు (చిహ్నాలు) మాత్రమే. ఈ సాదృశ్యములకు అర్థము తెలుసుకొనుటకు మనము ఒక లేఖనమును మరియొక లేఖనముతో పోల్చిచూడవలెను.


నాల్గవదిగా, యోహాను దీనిని ''దేవుని వాక్యము'' యొక్క ప్రత్యక్షత అని పిలిచెను (2వ వచనము). ఈ ''గ్రంధమందున్న ప్రవచన వాక్యములకు'' ఎవడైననూ ఏదైననూ కలుపుటకు లేక తీసివేయుటకు ప్రయత్నించిన యెడల వానిపైన ఒక కఠినమైన తీర్పు ప్రకటన 22:18,19 లో ఉచ్ఛరించబడినది. ఇంత తీవ్రమైన హెచ్చరిక బైబిలు అంతటిలోను మరే గ్రంథమందైనను లేదు. దేవుని యొక్క ప్రతి లేఖనము ''ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును'' మన కివ్వబడినది. దీనిద్వారా మనము ''పరిపూర్ణులమై, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండగలము'' ( 2 తిమోతి 3:16,17). ప్రకటన గ్రంథములో మనము చూడబోయే మూడు అధ్యాయములు మనలను పరిపూర్ణులుగా చేయుటకు కూడా ఇవ్వబడెను. వారి జీవితములో పరిపూర్ణత కొరకు ఆసక్తి గలవారు మాత్రమే దేవుని యొక్క ఏ లేఖన భాగమునైనా అధ్యయనం చేయుట ద్వారా అత్యంత ప్రయోజనము పొందగలరు.


అయిదవదిగా, ఈ ప్రత్యక్షత ''యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము''(2వ వచనము). ప్రకటన 19:10 లో ''యేసును గూర్చి సాక్ష్యము ప్రవచనసారమని'' మనకు చెప్పబడినది. నిజమైన ప్రవచనము సంఘటనలతట్టు మాత్రమే కాక ఎల్లప్పుడు ప్రభువును మాత్రమే చూపును. ప్రవచనములను నిజముగా అర్థముచేసుకొనుట ద్వారా మనలను ప్రభువు ఎదుట దీనులుగా చేయును కాని మనకున్నదని ఊహించుకొనే సంఘటనల యొక్క జ్ఞానమును బట్టి అతిశయించేటట్లు చేయదు. రాబోయే రోజులలో జరగబోయే వేర్వేరు సంఘటనల యొక్క సరియైన క్రమమును బట్టి మనము తప్పిపోయినప్పటికి మనకున్న ప్రభువుని గూర్చిన జ్ఞానము విషయములో మనము తప్పిపోని యెడల మనము బాగా చేసినట్లే.


ఈ ప్రత్యక్షత ''త్వరలో సంభవించబోవు సంగతులను'' ఆవిష్కరించినప్పటికీ (1వ వచనము), దాని ప్రధాన ఉద్ధేశ్యము అది కాదు. అది ''యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము'' అని పిలువబడినది.భవిష్యత్తులో జరుగబోవు సంఘటనల యొక్క జ్ఞానమును మనకిచ్చుటకు అది ఇవ్వబడలేదుకాని, ఆ సంఘటనలు ప్రభువైన యేసు యొక్క నియంత్రణలో ఉన్నవని మనకు చూపించుటకు ఇవ్వబడినది. ప్రకటన గ్రంధమంతటిలోనూ మనము ప్రధానముగా చూచేది ప్రభువు యొక్క విజయమును. దీనిని మనము అధ్యయనం చేయునప్పుడు మన దృష్టిని యేసు పైనే ఉంచుదాము.


ఆరవదిగా, ''ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారికి'' ఒక ఆశీర్వాదము వాగ్దానము చేయబడినది (3వ వచనము). లేఖనములలో చివరి గ్రంధము మనము గైకొనుటకు ఇవ్వబడినది. ఏ లేఖన భాగమునకు మనము లోబడినా అది ఆశీర్వాదకరమే. కాని దానిలో వ్రాయబడిన దానిని గైకొనువారికి ఒక ప్రత్యేకమైన దీవెన (ఆశీర్వాదము) వాగ్ధానము చేయబడిన ఏకైక గ్రంథము ప్రకటన గ్రంథము.


దానిలోఉన్న సాదృశ్యములను మనము చాలావరకు అర్థంచేసుకోలేనప్పటికీ, మనము చదివిన దానిని మనము గైకొనినట్లైయితే అది సరిపోవును. దీనిలో ఉన్న సాదృశ్యములను అర్థముచేసుకొన్నవారికి లేక జరుగబోవు సంఘటనలను క్రమము చొప్పున నిర్దుష్టముగా చెప్పగలిగిన వారికి ఎటువంటి ఆశీర్వాదము వాగ్దానము చేయబడలేదు. ఆయన వాక్యమును కేవలము మేధాశక్తితో అర్థము చేసుకొనుటకంటే విధేయత దేవునికి చాలా ముఖ్యము. దురదృష్టవశాత్తు, విశ్వాసులలో ఎక్కువ మంది వాక్యమునకు విధేయతచూపుటకంటే వాక్య జ్ఞానమునకు ఎక్కువ విలువనిచ్చెదరు.


అది ఏ విధముగా జరుగునో మనకు అర్థముకానప్పటికీ, మనము తిను ఆహారము మాంసముగా, రక్తముగా మరియు ఎముకగా మారును. మన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తే అది చాలును. ఆత్మీయ విషయాలలో కూడా అంతే. విధేయతలేని జ్ఞానము దేవుని దృష్టిలో జీర్ణముకాని ఆహారము వంటిది. అది జీవమునకు బదులు మరణమును తెచ్చును. విధేయతతో కూడిన జ్ఞానము జీవమును తెచ్చును.


ఏడవదిగా, ''ఈ ప్రవచన వాక్యములను చదువువానికి'' ఒక ఆశీర్వాదము వాగ్దానము చేయబడినది (3వ వచనము). ఇది బహిరంగముగా బిగ్గరగా చదివి ఇతర విశ్వాసులకు బోధించువారిని సూచించుచున్నది.


మొదటి శతాబ్దములో ప్రకటన గ్రంధము యొక్క వ్యక్తిగత ప్రతులు విశ్వాసుల అందుబాటులో లేవని మనము గుర్తుంచుకొనవలెను. ఈ గ్రంథము యొక్క సందేశము వినుటకు ఏకైక మార్గము సంఘ కూటములలో దానిని చదివినప్పుడు వినుటయే. ఈ కారణము చేతనే పౌలు ''చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము'' అని తిమోతిని ప్రోత్సహించెను (1 తిమోతి 4:13).


దేవుని వాక్యము ద్వారా మనము ఆయనలోనుండి పొందినది మనము ఇతరులతో పంచుకొనుట ద్వారా ఈ రోజున మనము దీనిని అన్వయించుకోవచ్చును. దీనిని చేసిన వారందరికీ ఇక్కడ ఒక ఆశీర్వాదము వాగ్దానము చేయబడినది.


దేవుని కృపా సమాధానములు


''యోహాను ఆసియలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మలనుండియు, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగును గాక! మనలను ప్రేమించుచూ, తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులను గాను జేసెను. ఇదిగో ఆయన మేఘారూడుడై వచ్చుచున్నాడు, ప్రతినేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమెన్‌. ''అల్ఫయు ఓమెగయు నేనే'' వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు'' ( ప్రకటన 1:4-8).


కృపా సమాధానములు దేవునిలో నుండి వారికి వచ్చునట్లు యోహాను ఒక ప్రార్థనతో మొదలుపెట్టెను. ''కృప'' అనగా ''మన ప్రస్తుత అవసరతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించే సహాయము''. మనకు పాపక్షమాపణ అవసరమైతే, కృప మనలను క్షమించగలదు. పాపమును జయించుటకు మనకు శక్తి అవసరమైతే, కృప మనలను శక్తితో నింపగలదు. పరీక్షింపబడు సమయములో నమ్మకస్తులుగా ఉండుటకు మనకు సహాయము కావలసినయెడల, కృప మనకు కావలసిన సహాయమునివ్వగలదు. దేవుని కృప మన ప్రతి అవసరతకు చాలును.


''సమాధానము'' దేవుని యొక్క మరో గొప్ప వరము - ఏ శిక్షావిధియు లేక ఖండించబడుచున్నామనే భావన లేకుండా మన హృదయాలలో సమాధానము; మరియు సంఘములో సహవాసమును కలుగజేయుటకు మన సంఘములో ఉన్న జనులతో సమాధానము కలిగియుండుట.


ఈ శుభవచనము త్రియేక దేవుని నామములో పంపబడినది. భూత వర్తమాన భవిష్యత్కాలములో ఎప్పటికీ ఉండువాడు అనగా తండ్రియైన దేవుడు. ''ఏడు ఆత్మలు'' అనగా పరిశుద్ధాత్మ. లేఖనములలో ఏడు అనేది పరిపూర్ణతను సూచించుచున్నది. మరియు ''ఏడు ఆత్మలు'' అంటే పరిశుద్ధాత్మ పరిపూర్ణతగల ఆత్మ అని సూచించుచున్నది. యెషయా 11:2,3 తో పరిశుద్ధాత్మ ఈ విధముగా సంబోధించబడెను:


1. యెహోవా ఆత్మ.


2. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ.


3. వివేకమునకు ఆధారమగు ఆత్మ.


4. ఆలోచనకు ఆధారమగు ఆత్మ.


5. బలమునకు ఆధారమగు ఆత్మ.


6. తెలివిని పుట్టించు ఆత్మ.


7. యోహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ.


త్రిత్వములో రెండవ వ్యక్తియైన యేసు క్రీస్తు అనేక నామములతో సంబోధించబడెను. వీటిని మనము ఒకదాని తరువాత ఒకటిగా మనము చూచెదము (5వ వచనము).


క్రీస్తు యొక్క నామములు


''నమ్మకమైన సాక్షి'' అనే నామము మన ప్రభువు చేసిన వాగ్ధానాలకు సంబంధించి ఆయన సంపూర్ణ విశ్వసనీయతను సూచించుచున్నది. ''మృతులలో నుండి ఆది సంభూతుడు'' అనే నామము మరణమును జయించి సమాధిలోనుండి శాశ్వతముగా బయటకు వచ్చిన మొదటి నరునిగా ఆయనను సూచించుచున్నది. ఆయన కంటే ముందు మృతులలోనుండి లేపబడినవారు తిరిగి మరణించిరి. ఇప్పుడు యేసు శాశ్వతముగా మరణమును జయించెను కాబట్టి, మనము ఇంకెప్పుడు వ్యాధికిగాని మరణమునకు గాని భయపడనక్కరలేదు.


యేసు ''భూపతులకు అధిపతి'' అని సంబోధించబడెను. మన ప్రభువునకు పరలోకమందును భూమిమీదను సర్వాధికారము ఇవ్వబడినది. ఆయన భూపతులయొక్క హృదయాలను కూడా నియంత్రించగలడు. ''ప్రభువైన యోహోవాచేతిలో రాజు హృదయము నీటి కాలువలవలే నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును'' (సామెతలు 21:1).


మన ప్రభువు ''మనలను ఎప్పటికీ ప్రేమించి, తన స్వంత రక్తము ద్వారా మన పాపముల నుండి మనకు విడుదలనిచ్చి స్వేచ్ఛనిచ్చిన వానిగా కూడా సంబోధించబడెను (5వ వచనము ఏంప్లిఫయిడ్‌ తర్జుమా). మన యెడల ఆయనకున్న ప్రేమ నిత్యమైనది. ఆయన మన పాపక్షమాపణ నిమిత్తమే కాక మన పాపములనుండి మనలను ఎప్పటికీ విడిపించుటకు (నిత్య విమోచన) తన రక్తమును కార్చెను. ''యేసు తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును'' అనేది క్రొత్త నిబంధన గ్రంధములోని మొదటి వాగ్దానము (మత్తయి 1:21). పాపము యొక్క శక్తినుండి విడుదల పొందుట క్రొత్త నిబంధనంతటి యొక్క గొప్ప సందేశము. మనము కృపకు లోనైనవారమైతే ఏ పాపమును మనపై ప్రభుత్వము చేయలేదు (రోమా 6:14).


మన తండ్రియైన దేవునికి ఒక రాజ్యము మరియు యాజక సమూహము.


ప్రభువైన యేసు మనలను ''తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను'' చేసెనని ఇంకా మనకు చెప్పబడినది (6వ వచనము). ''దేవుని యొక్క రాజ్యము'' అనగా దేవుడు పరిపూర్ణ అధికారమును నిర్వహించే పరిధి. భూమిపైన సంఘము దేవుని రాజ్యమునకు ఒక ప్రాతినిధ్యము - అనగా తమ జీవితములలోని ప్రతి విషయములోనూ దేవుని అధికారమునకు లోబడి ''ఒక రాజ్యము'' గా మారిన ప్రజల గుంపు. ప్రభువు ఒక అదుపు తప్పిన మందను ఒక సక్రమమైన రాజ్యముగా మార్చివేసెను - వీరు దేవుని చేత పరిపాలించబడే ఒక జనము.


మనము యాజకులుగా కూడా చేయబడినాము. ప్రతి ఒక్క విశ్వాసి పురుషుడు లేక స్త్రీ ప్రభువునకు ఒక యాజకునిగా చేయబడెను. దేవుని దృష్టిలో ''యాజకులు'' అనబడే ఒక ప్రత్యేకమైన గుంపు సంఘములో లేదు. అది పాతనిబంధనకు సంబంధించిన భావము. ఈ రోజున అటువంటిది ఏ సంఘములోనైనా ఉన్నయెడల, ఆ సంఘము ప్రజలను క్రీస్తుకు పూర్వము ఉన్న పరిస్థితులకు నడిపించుచున్నది!! మనమందరమూ యాజకులమే. యాజకులుగా మనము దేవునికి బలులర్పించుటకు పిలువబడినాము. పాత నిబంధనలో వారు జంతువుల యొక్క శరీరములను అర్పించిన విధముగా ఈ రోజున మనము మన స్వంత శరీరములను దేవునికి సజీవయాగముగా అర్పించుచున్నాము (రోమా 12:1).


''తన తండ్రియగు దేవుడు'' అన్న మాట యేసు తన పునరుత్థానము తరువాత వాడిన ''నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు'' (యోహాను 20:17) అన్న మాట వలేనున్నది. ఆయన తండ్రియిప్పుడు మన తండ్రిగా కూడా మారెను. యేసు తన భద్రతను కనుగొనిన విధముగానే దేవుడు మన తండ్రి అన్న దానిలో మనము ఇప్పుడు మన భద్రతను కనుగొనవచ్చు. యోహాను ''ఆమేన్‌'' అనెను (6వ వచనము). అయితే మనము కూడా ''అలా జరుగును గాక'' అనెదము.


ఆయనకే ''మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక'' (6వ వచనము). ఏడవ వచనములో, భూమికి క్రీస్తు తిరిగివచ్చుట ప్రవచింపబడినది. ఈ లోకము మన ప్రభువును చివరిసారిగా చూచినప్పుడు ఆయన కల్వరి సిలువపై అవమానముతో వ్రేలాడెను. కాని రాబోయే దినాలలో ఒక రోజు ఈ లోకము ఆయన మేఘారూఢుడై వచ్చుట చూచును. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడచిన వారు (ఇశ్రాయేలు దేశము) కూడా ఆయనను చూచెదరు. భూజనులందరు ఆయనను చూచి విలపించెదరు. కాని మనము ఆనందించెదము. మరల యోహాను ''ఆమేన్‌'' అనెను. అయితే మనము కూడా ''అలా జరుగును గాక!'' అనెదము.


ఎనిమిదవ వచనములో దేవుడు తనను తాను అల్ఫాయు ఓమెగయూగాను సర్వాధికారిగాను, ఎప్పటికీ ఉండువానిగాను సంబోధించుకొనెను. ఏమియు లేనప్పుడు ఆయన మొదటి నుండి ఉండెను. అంత్యకాలమందు కూడా ఆయన ఉండును. ఎక్కడ ఏమి జరిగిననూ అది దేవుని ఆశ్చర్యపరచలేదు. మన తండ్రికి అంతము ఆది నుండియే తెలియును. అదేగాక సర్వాధికారియైన దేవునిగా ఆయన అన్నిటిని నియంత్రించును. కాబట్టి భవిష్యత్తును బట్టి మనము ఎటువంటి భయము కలిగియుండవలసిన అవసరము లేదు.


ప్రకటన గ్రంధము చివరిలో, దేవుడు మరియొకసారి సర్వాధికారిగాను, అల్ఫాయు ఓమెగయు గాను సంభోధించబడెను ( 19:6; 22:13). ప్రకటన గ్రంధమంతయు మన తండ్రియగు దేవుని సంపూర్ణ జ్ఞానమును సర్వాధికారమును సూచించే ఈ రెండు వ్యాఖ్యల మధ్య ఇమిడియున్నదని మనము చెప్పవచ్చును. మనము ఈ గ్రంధములో దేవుని ప్రజలకు సంభవించబోవు శ్రమలు మరియు శోధనలను గూర్చియు, మన చుట్టూ ఉన్న లోకములో సంభవించబోవు ఉపద్రవముల గూర్చియు మనము చదువునప్పుడు ఇదే మనకు పరిపూర్ణ భధ్రతనిచ్చును.


ఏడు మహిమకరమైన సత్యములు


ఈ చివరి దినాలలో మనము నిరూపించవలసిన కొన్ని గొప్ప సత్యములు మన ప్రభువునకు మరియు ఆయనతో మనకున్న సంభంధమునకు చెందినవి. వీటిని మనము ఇప్పుడే పరిశీలించియున్నాము:


1. ప్రభువు యొక్క వాగ్ధానముల సంపూర్ణ విశ్వసనీయత.


2. నరుని యొక్క అతిగొప్ప శత్రువుపై ఆయన విజయము.


3. పరలోకములోను భూమిమీదను ఆయనకున్న పూర్తి అధికారము.


4. మన యెడల ఆయనకున్న మారని మరియు నిత్యమైన ప్రేమ.


5. పాపము యొక్క శక్తినుండి ఆయన మనలను విడిపించుట.


6. ఆయన తండ్రి ఇప్పుడు మనకును తండ్రియై యున్నాడు.


7. భూమిపైన తన రాజ్యమును స్థాపించుటకు ఆయన తిరిగివచ్చును.


రాబోయే దినాలలో మనము స్థిరులుగాను, కదలని వారుగాను ఉండగోరిన యెడల మనము ఈ సత్యాలలో వేరుపారి స్థిరపడవలసిన అవసరమున్నది.

అధ్యాయము 2
శ్రమలలో ప్రోత్సాహము

''మీ సహోదరుడును, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనైయుండగా బూరధ్వనివంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని'' ( ప్రకటన 1:9,10).


మీ సహోదరుడైన యోహాను


ఇక్కడ యోహాను తనను తాను ''మీ సహోదరుడు'' అని పిలచుకొనుట మనము చదువుచున్నాము. ఆ సమయములో యేసు ఎన్నుకొన్న 12 మందిలో యోహాను మాత్రమే జీవించుచున్న అపొస్తులుడు. పత్మాసు ద్వీపమున ప్రభువు ఈ ప్రత్యక్షతను అతనికిచ్చినప్పుడు అతనికి సుమారు 95 సంవత్సరములు. అప్పటికే అతడు దేవునితో 65 సంవత్సరములు నడిచెను. కాని అతడు అప్పటికీ ఒక సహోదరుడే.


అతడు పోప్‌ యోహాను లేక రెవరెండ్‌ యోహాను కాదు. అతడు పాష్టరు యోహాను కూడా కాదు! అతడు ఒక సాధారణమైన సహోదరుడు. యేసు తన శిష్యులకు బిరుదులన్నిటినీ నిరాకరించి తమను తాము కేవలము సహోదరులుగా సంభోధించుకొనవలెనని బోధించారు (మత్తయి 23:8-11). ఈ రోజున అనేకుల వలేకాక అపొస్తలులు ఆయనకు అక్షరానుసారమైన విధేయత చూపించిరి. మనకున్నది ఒకే ఒక శిరస్సు మరియు ఒకే ఒక్క నాయకుడు - అది క్రీస్తే. మిగిలిన వారమైన మనమందరము ఎటువంటి పరిచర్య కలిగియున్నప్పుటికీ, సంఘములో ఎంత అనుభవమున్నప్పటికీ, సహోదరులమే.


యేసును బట్టి కలుగు శ్రమ


యోహాను తనను తాను ''యేసును బట్టికలుగు శ్రమలో పాలివానిగా'' సంభోధించుకొనెను. యేసు ప్రభువు యొక్క ప్రతియొక్క పూర్ణ హృదయముగల శిష్యుడు, ఈ లోకములోఉన్నంత వరకు ''యేసును బట్టి కలుగు శ్రమలో'' పాలుపొందుటకు సిద్ధముగా నుండవలెను. యోహాను సుఖముగా జీవించుచున్నప్పుడు ఈ ప్రత్యక్షతను పొందలేదు. అతడు ''దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును'' పత్మాసు ద్వీపములో శ్రమను అనుభవించుచున్నప్పుడు దానిని పొందెను (9వ వచనము). చివరి దినములలో పరిశుద్ధులు క్రీస్తువిరోధినుండి ఎదుర్కొనబోవు శ్రమలను గూర్చి వ్రాయగలుగుటకు అతడు కూడా శ్రమలను అనుభవించవలసి యుండెను. శ్రమలను ఎదుర్కొనే వారికి ఒక పరిచర్యను ఇచ్చేముందు దేవుడు మనలను మొదట శోధనలద్వారా, శ్రమల ద్వారా తీసుకువెళ్ళును. ''దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో,


ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైననూ ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు'' అని పౌలు చెప్పెను (2 కొరింథీ 1:4).


కాబట్టి యేసు రహస్యముగా వచ్చి, మహాశ్రమలముందు తన సంఘమును ఈ లోకమునుండి కొనిపోవుననే సిద్ధాంతము మొదటిసారిగా క్రైస్తవులు సౌఖర్యవంతముగా జీవించే దేశములో (ఇంగ్లాండులో), తమ విశ్వాసము నిమిత్తము ఎటువంటి హింసను ఎదుర్కొనని సమయములో (19వ శతాబ్దపు మధ్య భాగములో) ఉద్భవించెనన్న విషయము ఆశ్చర్యకరముగా లేదు. ఈ రోజున ఈ సిద్ధాంతము సుఖసౌఖర్యాలలో జీవించు క్రైస్తవులచే, క్రైస్తవులకు వ్యతిరేకముగా ఎటువంటి హింస లేని దేశాలలో ప్రకటింపబడుచున్నది మరియు నమ్మబడుచున్నది.


ఎక్కువ మంది క్రైస్తవుల ప్రార్థనలు సాధారణముగా ఈ విధముగానుండును ''ప్రభువా, భూమిపైన నా జీవితమును ఎక్కువ సౌఖర్యవంతముగా చేయుము''.కాబట్టి సంఘము మహాశ్రమల ముందు కొనిపోబడును అనే బోధను వీరు ఆనందముగా అంగీకరించారన్న విషయము ఆశ్చర్యకరముగా లేదు. కాబట్టి మహాశ్రమలు వారికి సంభవించినప్పుడు వారు సిద్ధముగా నుండకుండునట్లు ఈ విధముగా సాతాను క్రైస్తవ జనసమూహములకు ఒక అబద్ధపు ఆదరణను కలుగజేయును.


యేసుని మాటలు స్పష్టముగా నున్నవి: ''ఈ లోకములో మీకు శ్రమకలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను'' (యోహాను 16:33). మనము శ్రమలను తప్పించుకొనగలమని ఆయన ఎప్పుడూ వాగ్దానము చేయలేదు - అవి చిన్న శ్రమలైననూ లేక మహాశ్రమలైననూ. కాని ఆయన జయించినట్లు మనముకూడా జయించగలమని ఆయన చెప్పెను. మనలను శ్రమలనుండి తప్పించుట కంటే మనలను జయించువారిగా చేయుటకు ఆయన ఎక్కువ ఆసక్తి కలిగియున్నాడు, ఎందుకనగా ఆయన మన సుఖము కన్నా మన స్వభావము గూర్చి ఎక్కువ ఆసక్తి కలిగియున్నాడు.


కొందరు బోధించునట్లు, మహాశ్రమలను తప్పించుకొనుట నమ్మకత్వమునకు ప్రతిఫలమని కూడా యేసు చెప్పలేదు. అయితే ఆయనను వెంబడించుటకు సమస్తమును విడచిపెట్టిన వారికి ఆయనను వెంబడించని వారికంటే మరిఎక్కువ శ్రమలు కలుగునని ఆయన చెప్పెను (మార్కు 10:30).


ఆయన తన శిష్యులకొరకు తన తండ్రికి ప్రార్థించినప్పుడు, ''నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడుము'' అని ప్రార్థించెను (యోహాను 17:15). తన శిష్యులు శ్రమలను ఎదుర్కొనవలెను కాబట్టి వారు ఆ సమయములో ఈ లోకములోనుండి కొనిపోబడవలెనని ఆయన కోరుకొనలేదు.


మూడవ శతాబ్ధములో క్రైస్తవులు రోమీయుల యొక్క చక్రాకార ప్రదర్శన శాలలో సింహాలకు ఆహారముగా వేయబడినప్పుడు మరియు రోమా సామ్రాజ్యములోని వేర్వేరు ప్రదేశాలలో అగ్నికి ఆహుతి చేయబడినప్పుడు ప్రభువు వారిని అట్టి శ్రమలనుండి కాపాడలేదు. దానియేలు దినములలో సింహపు నోళ్ళు మూయించి, అగ్నిబలమును చల్లార్చిన దేవుడు, ఈ యేసుని శిష్యుల కొరకు అటువంటి అద్భుతాలను చేయలేదు - ఎందుకనగా వీరు తమ మరణము ద్వారా దేవుని మహిమపరచే నూతన నిబంధన క్రైస్తవులు. తమ ప్రభువైన యేసువలే వారు తమ శత్రువులనుండి వారిని రక్షించుటకు పండ్రెండు సేనా వ్యూహముల సంఖ్యగల దూతలు వచ్చునట్లు వారు అడుగలేదు లేక ఆశించలేదు.


పరలోకమునుండి దేవుడు తన కుమారుని యొక్క వధువు సింహాల చేత చీల్చివేయబడుట, బూడిదగునట్లు కాల్చివేయబడుట చూచెను; మరియు వారి సాక్ష్యము ద్వారా ఆయన మహిమపరచబడెను - ఎందుకనగా వారు ''గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు'' అది ఒక హింసాత్మకమైన భౌతిక మరణమైనా సరే ( ప్రకటన 14:4). ప్రభువు వారితో మాట్లాడిన ఒకే ఒక్క మాట ఏదనగా, ''మరణము వరకు నమ్మకముగా ఉండుము; నేను నీకు జీవకిరీటమిచ్చెదను'' (ప్రకటన 2:10).


ఈ రోజున కూడా యేసుని శిష్యులు అనేక దేశాలలో ఆయన నామము నిమిత్తము హింసింపబడుచున్నారు. కాని ప్రభువు వారిని ఈ భూమినుండి తీసుకొనిపోడు. మరియు మహాశ్రమలకు ముందు ఆయన మనలను పరలోకమునకు కొనిపోడు కూడా. ఆయన మరి శ్రేష్టమైనది చేయును. మహాశ్రమల మధ్యలో ఆయన మనలను జయించువారిగా చేయును.


మనలను శ్రమలనుండి రక్షించుటకంటే కీడు (పాపము) నుండి రక్షించుటకు యేసు ఎక్కువ ఆసక్తి కలిగియున్నాడు. మనము శ్రమల ద్వారా వెళ్ళుటకు ఆయన అనుమతించును ఎందుకనగా మనము ఆత్మీయముగా బలపడుటకు అది ఒకే ఒక్క మార్గమని ఆయన యెరుగును.


ఇటువంటి సందేశము సంవత్సరాల తరబడి ప్రతి ఆదివారము తమను దురద చెవులను నిమిరే బోధకులచేత సంతోషపెట్టబడి సుఖమును ప్రేమించే క్రైస్తవత్వమునకు వింత బోధగా అనిపించును. కాని ఇదే సందేశమును అపొస్తులులు ఆది సంఘములకు ప్రకటించిరి. ''వారు (అపొస్తులులైన పౌలు మరియు బర్నబా) శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి'' (అపొ.కా. 14:22).


మనము ఇంటి యొద్ద మరియు పనిచేయు ప్రదేశములో ఇప్పుడు ఎదుర్కొనే చిన్న శోధనలు రాబోవుదినములలో వచ్చు పెద్ద శోధనలకు ఒక సిద్ధపాటు మాత్రమే. అందువలన మనము ఇప్పుడు నమ్మకముగా ఉండుట అత్యవసరము. ఎందుకనగా ''నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు'' అని దేవుడు చెప్పెను (యిర్మీయా 12:5).


యోహాను ఇక్కడ ''యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడగుటను'' గురించి మాట్లాడుచున్నాడు (9 వ వచనము). మనము యేసుతో ఆయన రాజ్యములో ఆయన సింహాసనములో పాలివారమయ్యే ముందు మనము ఆయన శ్రమలలో పాలివారమవ్వవలెను.


క్రొత్త నిబంధనంతటిలోను ప్రాధాన్యమివ్వబడిన ఒక గొప్ప గుణము సహనము. ''జనులు మిమ్మును శ్రమలపాలు చేయుదురు....అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును'' అని యేసు చెప్పెను (మత్తయి 24:13).


''ఆత్మవశుడై'' యుండుట


యోహాను ఈ ప్రత్యక్షతను ప్రభువు దినమందు పొందెను (10వ వచనము). వారములో మొదటి దినము ప్రభువు దినముగా పిలవబడెను ఎందుకనగా ఆ దినమున యేసు పాపమును, సాతానును, మరణమును, సమాధిని జయించి మృతులలోనుండి తిరిగిలేచెను.


ఆది శిష్యులు ప్రతివారములో మొదటి దినమున రొట్టె విరచుటకును మరియు ఒకరినొకరు కట్టుకొనుటకును (ప్రోత్సహించుకొనుటకును) కలుసుకొనేవారు (అపొ.కా. 20:7; 1 కొరింథీ 16:2). సంవత్సరములో వారికి ప్రత్యేక దినములు లేవు. వారికి ''మంచి శుక్రవారము'' గాని ''ఈస్టరు'' గాని ''క్రిస్‌మస్‌'' గాని లేవు. వారు నూతన నిబంధనలోనికి వచ్చిరి గనుక వారు దినములు మాసములు ఆచరించుట నుండి విడిపించబడిరి (కొలస్సీ 2:16,17).


యోహాను ఆత్మవశుడై యుండెను గనుక అతడు ప్రభువుయొక్క స్వరమును వినగలిగెను. మనము కూడా ఆత్మవశులమైతే ఆ స్వరమును మనముకూడా వినగలము. అదంతా మన మనస్సు దేనిపైనున్నదో ఆధారపడియున్నది. మన మనస్సు భూసంబంధమైన వాటియందున్న యెడల మనము విను స్వరములు కూడా భూసంబంధమైన వాటి గురించేయగును.


ఉదాహరణకు, మన చుట్టూ ఉన్న గాలిలో ఉన్న రేడియో తరంగాలలో అనేక స్వరములున్నవని మనకు తెలుసు. మనము వినే స్వరము మనకున్న రేడియో ఏ పౌన:పున్యమునకు శృతి చేయబడియున్నదో దానిపై ఆధారపడును. మీరు రేడియో ద్వారా దేవుని వాక్యమును వినవచ్చును లేక సాతాను యొక్క రాక్‌-సంగీతమును వినవచ్చును. ఆ ఎంపిక మీదే.


మన మనస్సు కూడా ఆ విధముగానే ఉండును. మనము ఆత్మ వశులమైతే - అనగా మనము ఆత్మతో నింపబడి మన మనస్సు పైనున్న వాటియందుంచిన యెడల (కొలస్సీ 3:2)- మనము ప్రభువు యొక్క స్వరము వినగలము. కాని మన సావధానత కొరకు చూచే ఇతర స్వరములు కూడా గాలిలో ఉన్నవి. ఏ విధముగా ఎక్కువ డబ్బు సంపాదించవలెనో, కుటుంబ ఆస్తిలో నీ భాగము ఎలా పొందవలెనో, నిన్ను మోసగించిన వ్యక్తికి ఎలా బుద్ధి చెప్పవలెనో, నీ గురించి అబద్దపు కథలను చెప్పేవారి యెదుట ఎలా సమర్థించుకొనవలెనో మొదలగు వాటిని చెప్పుటకు ఇష్టపడే స్వరములున్నవి.


సాతాను యొక్క రేడియో కేంద్రాలు ప్రతి దినములో 24 గంటలు అబద్ధములను, దుష్టత్వములను, కలవరము మొదలగు వాటిని ప్రసారం చేయుచున్నవి. మనము చేయవలసినది కేవలము ఆ కేంద్రములకు మన రేడియోను శృతి చేయుటమే, అప్పుడు మనకిష్టమొచ్చినది మనము వినవచ్చు!!


దేవుడు వారితో మాట్లాడడని విశ్వాసులు ఫిర్యాదు చేసినప్పుడు, అది దేవుడు మాట్లాడక పోవుటను బట్టి కాదు. ఆయన ఎల్లప్పుడూ మాట్లాడుచుండును. కాని వారి మనస్సులు ఈ లోకమునకు మరియు ఈ లోక సంబంధమైనవాటికి శృతిచేయబడియున్నవి. మనము ఆత్మ వశులము కాని కారణముచేత, గతములో మనతో ఆత్మ ఎంతో మాట్లాడినను మనము దానిని వినలేక పోతిమని నేను నమ్ముచున్నాను.


మీరు ఒక కూటములో కూర్చొని ఆ బోధకుడు చెప్పినదంతయూ అర్థము చేసుకొన్నప్పటికీ ఆత్మ చెప్తున్నది ఏ మాత్రము వినకుండా ఉండవచ్చును. మీ ప్రక్కన కూర్చున్న మరియొక వ్యక్తి ''ఆత్మవశుడై'' యుండుటచేత యోహాను వినినట్లు ప్రభువు స్వరమును వినగలుగును. యోహాను ప్రభువు స్వరమును ఎంత స్పష్టముగా వినగలిగెనంటే అది బూరధ్వని వంటి గొప్ప స్వరముగా ఉండెనని చెప్పెను! దేవుడు అంత బిగ్గరగా మాట్లాడును! కాని చెవిటి వారు బూరధ్వనిని కూడా వినరు.


మీలో ప్రతిఒక్కరు ప్రతిదినము ఆత్మ వశులై ఉండవలెనని మిమ్ములను హెచ్చరించుచూ సవాలుచేయుచున్నాను - ప్రత్యేకముగా ఈ యుగము యొక్క చివరి దినాలలో, ప్రభువు మీతో మాట్లాడుచున్నది మీరు వినుటకు మీ చెవులు తెరచియుండునట్లు మీరు పాపమునకు సున్నితముగా ఉండి దేవుని యెదుట దీనత్వముతో నడుచుకొనుడి.


అధ్యాయము 3
పునరుత్థానుడైన ప్రభువు

''నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గెము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియా, లవోదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములును, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనియుండెను. ఆయన తలయు తల వెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను; ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములును పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులు గల వాడియైన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను; ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలే ఉండెను. నేనాయనను చూడగానే చచ్చినవాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి ఇట్లనెను: భయపడకుము; నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు యేడు సంఘములు''.


(ప్రకటన 1:11-20)


యేడు స్థానిక సంఘములు


దేవుడు మనకు సందేశములను మన కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా ఇచ్చును. దేవుడు మనతో మాట్లాడునప్పుడు, యోహానుకు ఇక్కడ ఆజ్ఞాపింపబడిన రీతిగా (11వ వచనము) మనము వినిన దానిని వ్రాసుకొనుట మంచి అలవాటు. లేనియెడల దేవుడు అతనితో మాట్లాడిన విషయములను అతడు మరచిపోయి యుండెడివాడు.


ఈ సందర్భములో సందేశము ఆసియలోని యేడు సంఘములకు ఇవ్వబడినవి. ఆ సమయములో ఆసియాగా పేర్కొనబడిన ప్రాంతము ఈ రోజున టర్కీ దేశములో ఒక చిన్న భాగము. ఈ యేడు సంఘములు ఒక దానికి మరియొకటి 75 మైళ్ళ వ్యాసార్థములో నున్నవి. కాని గమనించినట్లయితే, అవి ఒకదానికొకటి అంత దగ్గరగా ఉన్నప్పటికీ అవి సమిష్టిగా ''ఆసియలోని సంఘము'' అని పిలువబడలేదు. అవి ''ఆసియలోని సంఘములు'' అని పిలువబడినవి.


ఇది చిన్న విషయమైనప్పటికీ ఎంతో ముఖ్యమైన విషయము. ''ఆసియలోని సంఘము'' అనివుంటే దాని అర్థము ఈ సంఘములు ఒక ప్రధాన కార్యాలయము కలిగియున్న ఒక శాఖగా మారినవని అర్థము. కాని ''ఆసియలోని సంఘములు'' అంటే ప్రతి సంఘము నేరుగా ప్రభువు యొక్క నాయకత్వము క్రింద ఉన్నదని అర్థము.


సంఘము క్రీస్తు చేత కట్టబడే దేవుని యొక్క కార్యము. కాని శాఖలు మనుష్యులు యొక్క క్రియలు. ప్రతి సంఘము నేరుగా క్రీస్తు యొక్క నాయకత్వము క్రింద ఉండాలని, ఒక శాఖలో భాగముగా ఉండుట దేవుని చిత్తము కాదని అపోస్తులుల యొక్క బోధలు మరియు రచనలన్నియూ స్పష్టము చేయుచున్నవి.


యోహాను ఈ పత్రికలను ఆ యేడు సంఘములకు పంపిణీ చేయుటకు, ఆ సంఘములకు బాధ్యత కలిగియున్న బిషప్పుగాని పర్యవేక్షకుడు గానీ లేడు. ప్రతియొక్క పత్రిక ఆ సంఘము యొక్క దూతకు వ్యక్తిగతముగా పంపబడవలసి యుండెను - ఎందుకనగా ప్రతి సంఘము ఒక స్వతంత్రపరమైన అంకము. ప్రభువు సంఘమునకు అపోస్తులులనిచ్చెను. యోహాను వారిలో ఒకడు కాని ప్రభువు బిషప్పులను గాని పర్యవేక్షకులను గాని నియమించలేదు.


ఉదాహరణకు ''భారతదేశములోని సంఘము'' అన్నది లేదు. భారత దేశములో సంఘములున్నవి. ఇవి వివిధ ప్రదేశాలలో ప్రభువు చేత కట్టబడుచున్నవి. వీటిలో ప్రతి ఒక్కటి నేరుగా ఆయన నాయకత్వము క్రిందనున్నది.


సాతాను యొక్క అంతిమ గురి బబులోను అనే తన నకిలీ లోకానుసారమైన ''సంఘము''ను కట్టుట. ఆ గురివైపు అతని మొదటిమెట్టు అనేక శతాబ్దాలముందే సంఘములను శాఖలుగా వర్గీకరణ చేయుట. అలాచేయని యెడల బబులోనును కట్టుట అసాధ్యమని అతనికి తెలియును. సాతాను యొక్క తంత్రములను మనము తెలుసుకోకుండా ఉండకూడదు.


ఆ యేడు బంగారు దీపస్థంభములు యేడు సంఘములకు సాదృశ్యముగా ఉన్నవి (20వ వచనమును చూడండి). పాత నిబంధన క్రింద, ఆలయము ఏడు కొమ్మలు కలిగిన ఒక దీపస్థంభమును కలిగియుండెను. ఎందుకనగా ఇశ్రాయేలు గోత్రములన్నియూ ఒక్క ''శాఖ'' యొక్క కొమ్మలుగా ఉండేవి. దాని నాయకులు మరియు ప్రధాన కార్యాలయము యెరూషలేములో ఉండేది.


కాని క్రొత్త నిబంధన క్రింద ఇది వేరుగా ఉన్నది. ఇక్కడ యేడు వేర్వేరు దీపస్థంభములు ఉన్నవి. ఇవి ఒకదానికొకటి పూర్తిగా వేరుగా ఉన్నవి. మనము పైన చూచిన విధముగా, దీనికి కారణము ప్రతియొక్క సంఘము స్వతంత్రముగా క్రీస్తు నాయకత్వము క్రింద ఉన్నది. అయితే ఆ శిరస్సు ద్వారా ఇతర సంఘములతో సహవాసములో నున్నవి.


సంఘము దీపస్తంభమని పిలవబడుటను బట్టి, దేవుని దృష్టిలో దాని ప్రధాన విధి వెలుగు నిచ్చుట అని సూచించుచున్నది. దీపస్తంభములు బంగారముతో చేయబడుట నిజమైన సంఘము యొక్క దైవ మూలాన్ని సూచించుచున్నది. అది మనుష్యులచేత కాక దేవుని చేత కట్టబడును.


ఒక దీపస్తంభము యొక్క ఉద్దేశ్యము కేవలము ఒక అలంకరణగా ఉండుట కాదు, అటువలెనే సంఘము కూడా! ప్రతి ఒక్క సంఘము చూపించవలసిన వెలుగు దేవుని వాక్యము, అది మాత్రమే ఈ చీకటి లోకములో మన త్రోవకు వెలుగైయున్నది (కీర్తనలు 119:105). ఆ వెలుగును చూపించుటకు బదులు, ''సంఘములు'' అనబడేవి పాఠశాలలను, వైద్యశాలలను నడుపుటకు, సాంఘీక సేవ చేయుటకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు, అవి దేవుని యొక్క ప్రధాన ఉద్దేశము నుండి తొలగిపోయినవని మనము ఖచ్చితముగా చెప్పవచ్చును.


పునరుత్థానుడైన ప్రభువు


ఎవరు మాట్లాడుచున్నారో చూచుటకు యోహాను తిరిగినప్పుడు అతడు యేసును చూచెను (12, 13 వచనములు). కాని అతడు ఆయనను సంఘముల మధ్య చూచెను. స్థానిక సంఘము ద్వారా ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకొనుటకు మరియు ఇతరులతో మాట్లాడుటకు ఆశించుచున్నాడు. బైబిలులో పేర్కొనబడిన దేవుని యొక్క మొదటి నివాస స్థలము మోషే అరణ్యములో చూచిన మండుచున్న పొద (ద్వితీయోపదేశ కాండము 33:1-6). పత్మాసులో యోహాను వలే, మోషే కూడా ఆ సమయములో ఆ గొప్ప వింతనుచూచుటకు ఆ తట్టు వెళ్ళెను. అప్పుడు దేవుడతనితో మాట్లాడెను (నిర్గమ కాండము 3:3).


ఈ రోజున సంఘము దేవుని యొక్క నివాస స్థలము. ఆ మండుచున్న పొదవలే దేవుడు ప్రతి సంఘము తన ఆత్మతో మండుచుండవలెనని కోరుకొనుచున్నాడు. ప్రజలు ఒక స్థానిక సంఘమును చూచినప్పుడు వారు ఆ సంఘస్థుల ద్వారా క్రీస్తు యొక్క జీవము వ్యక్తపరచబడుట చూడవలెను. అప్పుడు దేవుడు ఆ సంఘము ద్వారా ప్రజలతో మాట్లాడగలడు.


అప్పుడు యోహాను ప్రభువును, అతడు చూచిన రీతిగా వర్ణించసాగెను. ప్రభువు తిరిగి లేచినప్పటికీ, ఆయన ఇంకను ''మనుష్యకుమారుడు'' అని పిలువబడెను. ఇది ఆయన మానవాళితో శాశ్వతముగా అనుబంధం కలిగియున్నాడనే వాస్తవానికి ప్రాధాన్యతనిస్తున్నది.


ఆయన పొడువాటి వస్త్రము (నిస్సందేహముగా తెల్లనిరంగు కలది) ఆయన పాదముల వరకు చేరుచు, మన కొరకు విజ్ఞాపన చేయు ప్రధానయాజకుని పరిచర్యను సూచించుచున్నది - ఎందుకనగా యూదుల ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము ప్రాయశ్చిత్తార్థ దినమందు, ప్రత్యక్షపు గుడారము యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు ఈ విధముగా వస్త్రములు ధరించెను (13 వ వచనము).


ప్రభువు తన రొమ్మునకు బంగారు దట్టిని కట్టుకొనెను (13వ వచనము). బంగారము దైవికమైన వాటికి సాదృశ్యముగా ఉన్నది. ఆ దట్టి నీతికి మరియు విశ్వాస్యతకు సాదృశ్యముగానున్నది (యెషయా 11:5 ప్రకారము). ఇది యేసుని భూలోక జీవితములో కనబడిన దేవుని యొక్క పరిపూర్ణ నీతిని మరియు ఆయన మనకిచ్చిన వాగ్దానములను పరిపూర్ణమైన విశ్వాస్యతతో నెరవేర్చుటను ఉద్ఘాటించుచున్నది.


ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా నుండెను (14వ వచనము). దేవుని నిత్యత్వమును (ఆయన ఆదియు అంతము లేనివాడు) సూచించుటకు దానియేలు 7:9 ఇదే సాదృశ్యమును వాడుచున్నది. తెల్లని తలవెంట్రుకలు జ్ఞానమునకు కూడా సూచనగానున్నవి. కాబట్టి, ఇది యేసు మనుష్యకుమారుడైనప్పటికీ, నిత్యమైన దేవుడని, పరిపూర్ణ జ్ఞానము కలవాడన్న సత్యమును ఉద్ఘాటించుచున్నది.


ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవలేనుండెను (14 వ వచనము). దాని అర్థము ''సమస్తమును ఆయన కన్నులకు మరుగులేక తేటగానున్నది'' (హెబ్రీ 4:13). ఆయన నేత్రములు మతపరమైన పొరలను చొచ్చుకొనిపోగలవు, మరియు మతపరమైన వేషధారి యొక్క ''పైపై భక్తిని'' మరియు భక్తిగల బాషను తెలుసుకోగలుగును. అవి నత్తిగా పలికే మాటల వెనుక ఒక దైవ భక్తి కలిగిన, విరిగినలిగిన యదార్థ హృదయమును కూడా చూడగలవు. దీని ఫలితముగా ఆయన మూల్యాంకనములు (అంచనాలు) మనుష్యుని మూల్యాంకనములు (అంచనాలు) పూర్తిగా వ్యత్యాసముగా నున్నవి.


ఆయన పాదములు కొలిమితో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైయుండెను (15 వ వచనము). బలిపీఠము అపరంజితో చేయబడెను (ప్రత్యక్షపు గుడారము యొక్క వెలుపటి ఆవరణములో), అక్కడ పాపపరిహారార్థ బలిగా అర్పించబడెను కాబట్టి అపరంజి కలువరిలో దేవుడు మనుష్యుని పాపమును తీర్పుతీర్చుటకు సాదృశ్యముగా నున్నది. సర్పము యొక్క తలను చితుక త్రొక్కక ముందు, యేసుని పాదమును సిలువపై పొడవబడవలసి యుండెను (ఆదికాండము 3:15).


ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలే యుండెను (15వ వచనము). జీవజలనదులు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా నున్నవి (యోహాను 7:37-39). యేసు యొక్క సంభాషణ ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సాత్వీకముతోనూ జ్ఞానముతోనూ నిండియండేది.


ఆయన తన కుడి చేత యేడు నక్షత్రములు పట్టుకొనియుండెను (16వ వచనము). ఆ యేడు నక్షత్రములు సంఘముల యొక్క యేడు దూతలు (20వ వచనము). క్రొత్త నిబంధన సంఘము పెద్దల అనేకత్వముతో(ఒకరి కంటే ఎక్కువ మంది పెద్దలతో) నడిపించబడవలెనని దేవుడు నిర్దేశించెను (అపొ.కా. 14:23; తీతు 1:5; అపొ.కా. 20:17). కాని సాధారణముగా ఆ పెద్దలలో ఒకరిని తన దూతగా ఉండుటకు సంఘములో వాక్యమును ప్రకటించు వరముతో సిద్ధపరచును. ఇక్కడ అతడు ''సంఘము యొక్క దూత'' గా సంబోధించబడెను. (''దూత'' అని అనువాదము చేయబడిన పదము ఒక గ్రీకు భాష పదము, దాని అసలైన అర్థము, ''వార్తలను తెచ్చువాడు'' లేక ''వార్తాహరుడు'').


ఈ దూతలను క్రీస్తు తన చేతితో పట్టుకొని యుండెను. ఈ కారణము చేతనే మనము ''వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని'' రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెనని ఆజ్ఞాపించబడినాము (1 తిమోతి 5:17).


అయితే ఈ రోజున సంఘములలో అనేక మంది పెద్దలను మరియు దేవుని వాక్యమును ప్రకటించు అనేకులను క్రీస్తు తన చేతితో పట్టుకొనుట లేదని తెలియపరచుట అవసరము, ఎందుకనగా వారు క్రీస్తు చేత నియమింపబడక తమను తాము నియమించుకొనిరి.


ప్రభువు చేత నియమింపబడిన దూత ఒక దైవజనుడైయుండును, అతడు మీకు స్పూర్తి నిచ్చును, మరియు అతని జీవితము మరియు పరిచర్య ద్వారా మీకు (ఆత్మీయ) ఆహారము లభించును, మీరు నడిపించబడుదురు, దీవించబడుదురు. అటువంటి వ్యక్తి సన్మానించబడవలెను - ఎందుకనగా అతనిని ప్రభువు తన చేతితో పట్టుకొనియున్నాడు. ఈ రోజున లోకములో అట్టి వారు కొద్ది మందేవున్నారు- అయినప్పటికిని కొద్దిమంది ఉన్నందుకు దేవునికి స్తోత్రము.


దేవుని సేవకులు సాతాను యొక్క ప్రత్యేకమైన లక్ష్యములు. కాబట్టి వారిని ప్రభువు ప్రత్యేకముగా తన చేతితో పట్టుకొనును. వారక్కడ దీనులుగా ఉన్నంత కాలము, సాతాను వారిని ముట్టలేడు. కాని వారు గర్వించినయెడల లేక పాపము చేసి పశ్చాత్తాపపడని యెడల, వారు మారు మనస్సు పొందునట్లు సాతాను వారిని అనేక విధములుగా బాధించుటకు దేవుడు అనుమతించును. ప్రభువు చేతితో ఆయన దూతగా పట్టుకొనబడుట ఒక బ్రహ్మాండమైన ఆధిక్యత. కాని దానికి గొప్ప బాధ్యతలుకూడా కలవు.


ఆయన నోటినుండి రెండంచులుగల ఒక వాడియైన ఖడ్గము బయలువెళ్ళుచుండెను (16వ వచనము). ఇది ఆయన మాట్లాడు దేవుని వాక్యమునకు సూచనగానున్నది (హెబ్రీ 4:12). 15వ వచనములో ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెనని మనము గమనించితిమి. ఈ రెండు వచనములు కలిపి యేసు ఎల్లప్పుడు దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడునని సూచించుచున్నవి. ఆయన ఎంతో సాత్వీకముతో మాట్లాడును, కాని అవసరమైనప్పుడు గట్టిగా గద్దించును.


ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె నుండెను (16వ వచనము). ఈ విధముగానే పేతురు, యాకోబు, యోహాను కూడా ఆయనను రూపాంతరపు కొండపైన చూచిరి (మత్తయి 17:2). ఇది దేవుడు నివసించు ''సమీపించరాని తేజస్సు''కు సాదృశ్యముగా నున్నది (1 తిమోతి 6:16). దేవుని పరిశుద్ధత ఇక్కడ, మనము సూటిగా చూడలేని మధ్యాహ్నపు సూర్యునితో పోల్చబడినది. సూర్యుడు ఎటువంటి క్రిములు లేక సూక్ష్మ జీవులు నివసించలేని ఒక అగ్ని గోళము. ఆ విధముగానే ఏ పాపము దేవుని సన్నిధిలో వసించలేదు (యెషయా 33:14).


ప్రభువుయొక్క పాదముల చెంత


ప్రభురాత్రి విందులో యేసు రొమ్ముపై ఆనుకొన్న యోహానే ఇప్పుడు చచ్చినవాని వలే ఆయన పాదముల యొద్ద పడెను (17వ వచనము). యోహాను దేవునితో 65 ఏళ్ళు నడిచెను. నిస్సందేహముగా అతడు ఆ సమయములో భూమిపై నున్న అతి పరిశుద్ధుడు. అయినప్పటికీ అతడు ప్రభువు సన్నిధిలో నిలకడగా నిలువలేకపోయెను. ప్రభువును అత్యధికముగా ఎరిగినవారే ఆయనను ఎక్కువగా సన్మానించెదరు. ఆయనను అతితక్కువగా ఎరిగినవారు ఆయనతో అతి చనువున్నట్లు నటించుదురు.


పరలోకములో సెరాపులు ప్రభువు యెదుట తమ ముఖములను కప్పుకొందురు (యెషయా 6:2,3). యోబు, యెషయా తమ పాపస్వభావమును మరియు దేవుని మహిమను చూచినప్పుడు దు:ఖించిరి (యోబు 42:5,6; యెషయా 6:5). కాని ''దేవదూతలు వెళ్ళుటకు భయపడే స్థలమునకు మూర్ఖులు పరుగిడుదురు''!! ఒక శరీరానుసారియైన విశ్వాసి యొక్క మూర్ఖత్వము ఇటువంటిదే.


మనము ప్రభువును ఎరిగిన కొలదీ, మనమాయన పాదముల యొద్ద ఆశ్చర్యముతో ఆరాధించుటకు పడి దూళిలో మూతి పెట్టుకొనెదము. మనము ప్రభువు యొక్క మహిమను నిత్యము చూచినప్పుడు మన స్వంత క్రీస్తు విరుద్ధ స్వభావమును చూడగలము. అప్పుడు మాత్రమే మనము ఇతరులను తీర్పు తీర్చుట మాని మనలను మనము తీర్పు తీర్చుకొనుట మొదలు పెట్టెదము. అప్పుడు మాత్రమే యోహాను పత్మాసులో అనుభవించినట్లు మనము ఆయన స్పర్శ యొక్క శక్తిని అనుభవించగలము.


యేసు తన కుడిచేతిని యోహానుపై నుంచెను (17వ వచనము). ఇది శక్తిని అధికారమును అతనికిచ్చుటకు సాదృశ్యముగా నున్నది. ఆయన యోహానుకు భయపడవద్దని చెప్పెను. ''భయపడకుడి'' మరియు ''నన్ను వెంబడించుడి'' అనునవి సువార్తలలో యేసు ఎక్కువ సార్లు చెప్పిన వ్యాఖ్యలు. ఈ రోజున ఈ మాటలనే ఆయన మనతోకూడా మాట్లాడుచున్నాడు.


యేసు యోహానుతో ఆయనే మొదటివాడును కడపటివాడునూనై యున్నాడని కూడా చెప్పెను - ఇదే బిరుదును తండ్రి ఇంతకుముందు ఉపయోగించెను (8వ వచనము). ఆయనకు ఆదినుండియే అంతము తెలియును మరియు ఆయనే ఆదికి ముందు మరియు అంతము తరువాత ఉన్నాడు. ఈ కారణముచేత మనమెన్నడూ భయపడనక్కరలేదు.


యేసు అప్పుడు యోహానుతో ఆయన ఏ విధముగా మరణమును సమాదిని జయించెనో మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు కలిగియున్నానని చెప్పెను. (పాతాళము మృతులైనవారి ఆత్మలుండే స్థలము) (18వ వచనము). తాళపు చెవులు ద్వారములను తెరచుటకు మూయుటకు ఉన్న శక్తికి సాదృశ్యముగా నున్నవి. ఒకప్పుడు సాతాను మరణము యొక్క బలమును కలిగియుండెను (హెబ్రీ 2:14,15). కాని యేసు చనిపోయి తిరిగిలేచినప్పుడు, ఆయన ఆ తాళపుచెవులను సాతాను యొద్దనుండి తీసుకొనెను.


ఈ రోజున యేసు మరణముయొక్కయు పాతాళముయొక్కయు తాళపు చెవులను కలిగియున్నాడు. దాని అర్థము నీవు నీ జీవితములో దేవుని యొక్క చిత్తమునే చేయుటకు ఆశించే యేసుని పూర్ణ హృదయము కలిగిన శిష్యుడవైతే, నీవు దేవుడు నియమించిన సమయమొచ్చు వరకు చనిపోలేవు. నీవు ఆయన సన్నిధికి వెళ్ళుటకు మరణపు ద్వారమును తెరచుటకు సమయమొచ్చెనని యేసు నిర్ణయించేవరకు ఏ ప్రమాదము కాని వ్యాధి కాని నీ జీవితమును హరించలేదు (తీసుకొనలేదు). ఇది యేసుని నిజమైన శిష్యులందరికి అత్యంత ప్రోత్సాహకరము.


యోహాను మనుష్యులచేత పత్మాసులో హింసించబడవచ్చును, కాని అతని కొరకు దేవుని సమయమొచ్చు వరకు వారతనిని చంపలేరు. మరియు యోహాను నెరవేర్చుటకు, ప్రభువు అతనికొరకు ఒక పరిచర్యను ఇంకనూ కలిగియండెను.


యోహాను ఇప్పుడు అధికారముగలవాడై ఒక క్రొత్త కార్యము కొరకు ప్రభువుచేత నియమింపబడెను - అది ఈ అద్భుతమైన ప్రకటన గ్రంధమును వ్రాయుట (19వ వచనము). మనము మన పరిచర్యను విజయవంతముగా పూర్తిచేయుటకు మనము మరల మరల ప్రభువునుండి అధికాము పొందుట అవసరము.


''ప్రత్యక్షతను'' మూడు భాగములుగా విభజించుట


19వ వచనములో ప్రభువు యోహానుకు ఈ గ్రంధము యొక్క మూడు భాగముల విభజననిచ్చెను:


1. యోహాను అప్పటికే చూచినది (1వ అధ్యాయము) - విజయవంతుడైన ప్రభువైన యేసు ''భయపడకుము'' అని చెప్పిన దర్శనము. ప్రభువు యొక్క మహిమను చూచిన శిష్యుని హృదయములో భయమునకు ఎటువంటి స్థానము లేదు.


2. యోహాను సమయములో ఉన్న పరిస్థితి (2,3 అధ్యాయములు) - ఇది ఆసియ మైనర్‌ ప్రాంతములోనున్న యేడు సంఘముల స్థితిని సూచిస్తున్నది. ఈ ఏడు సంఘములకు ప్రభువు ఇచ్చిన వర్తమానములు అన్ని కాలములలోనూ ఉన్న అన్ని సంఘములకు మరియు వాటి ''దూతలకు'' ఒక హెచ్చరికగాను, ఒక సవాలుగాను ఉన్నవి.


3. యోహాను కాలము తరువాత జరుగబోవు సంఘటనలు (4 నుండి 22 అధ్యాయములు) - ఇక్కడ ఉపయోగింపబడిన ''వీటి తరువాత కలుగబోవు వాటిని'' అనే పదబంధము, 4వ అధ్యాయపు మొదటి వచనములో కూడా ఉపయోగించబడెను. ఇది ఈ గ్రంధము యొక్క మూడవ భాగము ఇక్కడ ప్రారంభమవుతుందని సూచిస్తున్నది.


ప్రభువు అప్పుడు యోహానుకు దీపస్తంభముల మరియు నక్షత్రముల యొక్క మర్మమును వివరించెను (20వ వచనము) మనము 12,16 వచనములను పరిశీలించినప్పుడు వీటిని ధ్యానించితిమి. ప్రభువు మాత్రమే తన వాక్యములోనున్న మర్మములపైన మనకు ప్రత్యక్షతనివ్వగలడు. అటువంటి ప్రత్యక్షతను పొందుటకు, మనకు రెండు లక్షణాలు అత్యవసరమైనవి - దేవుని భయము మరియు దీనత్వము. ''యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది...ఆయన తన మార్గములను దీనులకు నేర్పును'' (కీర్తనలు 25:14,9). కాబట్టి అటువంటి ఆత్మతో మనము సంఘములకు వ్రాసిన ఈ పత్రికలను చదివెదము.


అధ్యాయము 4
ప్రేమలేని సంఘము

''ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఏడు నక్షత్రములు తనకుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్దికులని కనుగొంటివనియు; నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటునుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో నున్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను వినునుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింపనిత్తును'' ( ప్రకటన 2:1-7).


ప్రభువు యొక్క మూల్యాంకనము(అంచనా)


ఈ ఏడు పత్రికలు ప్రధానముగా సంఘముల యొక్క ఏడు దూతలకు సంబోధించబడినప్పటికీ, ప్రతి వర్తమానము చివరిలో, చెవిగలవారందరికీ పరిశుద్ధాత్మ సంఘములన్నిటికీ చెప్పుచున్న మాటలకు శ్రద్ధవహించుటకు ఆహ్వానమును మనము కనుగొనెదము. కాబట్టి అవి ప్రతి తరములోనున్న ప్రతి సంఘములో నున్న ప్రతి శిష్యునికి ఒక సందేశమును కలిగియుండును.


మన ప్రభువు నమ్మకమైన సాక్షిగా వర్ణించబడుట మనము మొదటి అధ్యాయములో చూచితిమి. ఈ పత్రికలలో మనము ఆయన ఈ పరిచర్య నెరవేర్చుటను మనము చూడగలము. ఒక ఆధునిక భావమును ఉపయోగిస్తే, యేసు ''ఉన్నది ఉన్నట్లు చెప్పును''. క్రీస్తు సంఘము మధ్యలో ఒక న్యాయాధిపతిగా ఉండి, సంఘమును దాని దూతను కూడా తీర్పు తీర్చుచున్నాడు. ఆయన వారి గురించి ఏమనుకొనుచున్నాడో సంఘములకు మరియు వాటి దూతలకు ఖచ్చితముగా చెప్పును.


ఆయన మూల్యాంకనములలో(అంచనాలలో), ఆధునిక ఛాయాచిత్రకారులు రేఖాచిత్రాలను సరిదిద్దునట్లు, ప్రభువు చేయడు. అలా చేయుటకు ఆయన తన ప్రజలను చాలా ఎక్కువగా ప్రేమించును!! మనము న్యాయపీఠము ముందు వీటిని తరువాత ఎదుర్కొనుటకంటే పాపమును, లోకానుసార స్వభావమును, నులివెచ్చని స్థితిని, స్వీయ-కేంద్రీకృతమును(దేవుడు కేంద్రముగా కాకుండా మనుష్యుడు కేంద్రముగానుండుట) ఇప్పుడే సరిదిద్దుకొనుట మంచిదని ఆయన ఎరుగును. మనము వీటిని బట్టి అక్కడ తీర్పుతీర్చబడుట మనకు మంచిదికాదు; మరియు మనకు నిత్యముగా శ్రేష్టమైనదానియందు ఆయన దృష్టియుంచుచున్నాడు. కాబట్టి ప్రభువు ఈ పత్రికలో చెప్పినవాటన్నిటకి మనము జాగ్రత్తగా శ్రద్ధ వహించుట మంచిది.


ప్రశంసించుటకు అవకాశమున్నప్పుడు ప్రభువు యదార్థముగా ప్రశంసించును. గద్దింపుకు అవసరతున్నప్పుడు ఆయన గట్టిగా గద్దించుటకు వెనుకాడడు. కేన్సరును సబ్బుతోను నీటితోను శుద్ధిచేయలేము. దానిని సున్నితముగా తొలగించలేము కూడా. దానిని తీవ్రమైన శస్త్ర చికిత్సతో తీసివేయగలము. పాపము విషయములో కూడా అంతే.


గద్దింపుకు ముందు ప్రశంస


ఎఫెసీలో ఉన్న దూతకు వ్రాసిన పత్రికలో, ప్రభువు తనను తాను ఏడు నక్షత్రములను తన కుడిచేత పట్టుకొని, ఏడు సంఘముల మధ్య నడచువానిగా వర్ణించుకొనెను (1వ వచనము). ప్రభువు ఎల్లప్పుడు సంఘముల మధ్య నడచుచూ వాటిలో ఉన్న ప్రతిఒక్కరు చేసేవాటిని, చెప్పేవాటిని, ప్రత్యేకముగా ఆయన చేతితో పట్టుకొన్న దూతలు చెప్పేవాటిని, చేసేవాటిని పరీక్షించును. మరియు ఆయన ప్రతిదానిని, శరీరానుసారులైన క్రైస్తవులు కలిగియున్న తక్కువ ప్రమాణాల బట్టికాక, లేక పది ఆజ్ఞల యొక్క ప్రమాణాల బట్టికాక, దైవనీతియను మట్టపు గుండుతో కొలుచును.


ఆయన వైఫల్యాలను ఎత్తిచూపించే ముందు ఆయన ఆమోదాన్ని ప్రశంసను తెలియపరచెను (2వ వచనము). దైవ స్వభావము అటువంటిదే. ప్రభువు ఎల్లప్పుడు సరిదిద్దుకోవలసిన వాటిని ఎత్తిచూపేముందు మంచివాటి కొరకు చూచి వాటిని ప్రశంసించును. అయితే మానవ స్వభావము దీనికి పూర్తిగా విరుద్ధముగా నున్నది. అతడు ఇతరులలో మంచివాటికొరకు ముందు చూడక, చెడ్డవాటికొరకు చూచును. మానవుడు సహజముగా ప్రశంసించుటకు నిదానించును మరియు విమర్శించుటకు బహు వేెగిరపడును, ఇది మన వ్యవస్థలోనున్న ''సహోదరులపై నేరముమోపువాని'' విషము యొక్క ఒక గుర్తు మాత్రమే ( ప్రకటన 12:10). అయితే మనము దేవ స్వభావములో పాలుపొందిన కొలదీ, మనము ఇంకా ఎక్కువగా మన ప్రభువు వలె నుందుము - ప్రశంసించుటకు వేగిరపడెదము మరియు విమర్శించుటకు నిదానించెదము.


జీవితమంతా ఈ సూత్రమును పాటించుట మంచిది: ''నేను ఒకరిలో ప్రశంసించుటకు ఇప్పటి వరకూ ఏమియూ కనుగొనని యెడల, అతని తప్పును ఎప్పటికీ ఎత్తిచూపను''. ఈ సాధారణమైన నియమమును పాటించుట మనమూహించిన దానికంటే గొప్ప దైవభక్తికి మనలను నడిపించును. అది మనలను ఇప్పటి వరకు ఉన్నదానికంటే సంఘములో ఎంతో గొప్ప దీవెనగా చేసి, ఇతరులకు తక్కువ ఇబ్బందికరముగా చేయును.


మనము ఇతరులను ప్రశంసించినప్పుడు మాత్రమే వారిని నిర్మాణాత్మకంగా విమర్శించుటకు పునాది వేయగలము. లేనియెడల మనము కేవలము వారిపై రాళ్ళు విసురుదము. మీరు ఒక సుద్ద ముక్కతో గాలిలో వ్రాయలేరు. మీరు వ్రాయునది ప్రజలు చూడాలంటే మీకు ఒక రాతబల్ల అవసరము. అలాగే, వ్యక్తపరచబడిన ప్రశంస మనము వ్రాయుటకు మరియు ఇతరులతో ''ప్రేమకలిగి సత్యము చెప్పుటకు'' ఒక రాతబల్లగా మారును. అప్పుడు, మనము చెప్పునది వారు అంగీకరించుటకు ఎక్కువ అవకాశమున్నది.


ప్రశంస, గద్దింపు రెండూ ప్రేమ యొక్క గుర్తులే. కాని మనము ప్రశంసతో ప్రారంభించవలెను. పౌలు శరీరానుసారులైన కొరింథీ క్రైస్తవులకు వ్రాయునప్పుడు ఈ సూత్రమును ఎలా పాటించెనో గమనించండి (1 కొరింథీ 1:4-10).


ప్రభువు ఎఫెసులోనున్న దూతను తన కష్టమును బట్టి, సహనమును బట్టి సంఘమును దుష్టులనుండి పవిత్రముగానుంచుటకు అతడు చేసిన కృషిని బట్టి మెచ్చుకొనెను. నిస్సందేహముగా అతడు అపవిత్రత సంఘములోనికి ప్రవేశించకుండునట్లు దానికి వ్యతిరేకముగా పోరాడెను. అదేకాక, అతడు సంఘము యొక్క సిద్ధాంతము పవిత్రముగా ఉండునట్లు శ్రమించెను. తాము అపొస్తలులమని చెప్పుకొనేవారిని అతడు పరీక్షించి వారి వాదనలను అబద్ధమని నిరూపించెను.


ప్రభువు రెండవ వచనములో ''అపొస్తలుల'' గురించి చేసిన ప్రస్తావన ప్రభువు ఈ భూమిపైనున్నప్పుడు నియమించిన పదకొండు మందికాక, మొదటి శతాబ్దములో నున్న సంఘములో ఇతర అపొస్తలులు ఉన్నారని సూచించుచున్నది. క్రీస్తు ఆరోహణమైన తరువాత కూడా సంఘమునకు అపొస్తలులను ఇచ్చెను (ఎఫెసీ 4:13). మరియు ఈనాడు కూడా అపొస్తలులు ఉన్నారు. కాని తాము అపొస్తలులమని చెప్పుకొని అలా కానివారు అనేకమంది ఉన్నారు. కాబట్టి మనము అబద్ధపు అపోస్తలుల చేత మోసగింపబడకూడు (2వ వచనము).


ఎఫెసీ సంఘములో నున్న దూత ప్రభువు నామమును విడచిపెట్టకుండా ''సహించెను'' ( 3వ వచనము). అనేకమంది విశ్వాసుల ప్రమాణాల ప్రకారము ఈ దూత ఎంత అద్భుతమైన వ్యక్తి. ఎఫెసీ సంఘము ఎంత అద్భుతమైన సంఘముగా కనబడెను- అది కష్టపడెను, సహించెను, దుష్టులను దూరముగా నుంచెను, తప్పుడు సిద్ధాంతమును దూరముగా నుంచెను మరియు మోసగాళ్ళను బయటపెట్టెను - ఈ విధముగా అది జీవితము మరియు సిద్ధాంతము యొక్క పవిత్రతకు ప్రాముఖ్యతనిచ్చెను.


నీవు నీ మొదటి ప్రేమను వదిలితివి


ప్రభువు ఒక సంఘములో కనుగొనుటకు ఆశించిన ప్రతి ఒక్క విషయము ఈ సంఘము కలిగియుండెనని ఒకరు అనుకోవచ్చును. అయ్యో, కాని అలా కాలేదు. ప్రభువు చూడగోరిన ప్రధానమైన విషయము అది కలిగియుండలేదు. అది దాని మొదటి ప్రేమను విడచిపెట్టెను - ప్రభువు కొరకు ప్రేమ మరియు ఒకరి యెడల ఒకరు కలిగిన ప్రేమ (4వ వచనము).


ప్రభువు వారితో చెప్పిన దాని సారాంశము ఇది: ''మీ ఆసక్తి మరియు మీ కార్యచరణ మధ్యలో, మీరు నా గురించి మరచిపోయిరి. నా యెడల మీకు ఒకప్పుడు ఉండిన భక్తిని మీరు పోగొట్టుకొనిరి. మీరు చెడును విసర్జించి, తప్పుడు సిద్ధాంతమునకు దూరముగా ఉండిరి. కాని మీరు మొదట రక్షింపబడినప్పుడు మీరు నన్నెంత తీవ్రముగా (మిక్కటముగా) ప్రేమించిరో మరియు మీరు ఏవిధముగా అన్నిటినీ నా యెడల కలిగియున్న ప్రేమను బట్టి అప్పుడు చేసిరో గుర్తుచేసుకొనుడి. ఇప్పుడు అంతయూ ఒకరోజువారి ఆచారముగా దిగజారిపోయినది. మీరు ఇంకను కూటములకు వెళ్ళుచున్నారు, మీ బైబిలు చదువుచున్నారు, ప్రార్థన చేయుచున్నారు. కాని అదంతయు ఒక ఆచారముగా మారిపోయినది''.


ఇక్కడ సంఘము, ఒకప్పుడు తన భర్త యెడల ఉన్న ప్రేమను బట్టి సంతోషముగా సేవించి, కాని ఇప్పుడు అదే పనిని వెట్టి చాకిరిగా పరిగణించే భార్యవలే మారిపోయినది - ఎందుకనగా ఆమె వివాహజీవితము నుండి ప్రేమాగ్ని వెళ్ళిపోయినది. ఇదివరకటి రోజుల్లో ఆమె తన భర్త కార్యాలయమునుండి తిరిగి వచ్చుటకు ఆసక్తితో ప్రతి సాయంకాలము ఎదురుచూచేది. కాని ఇప్పుడు అలా లేదు. ఆమె ఇంకను అతని పట్ల నమ్మకముగా నున్నది, కాని ఆమె మొదటి ప్రేమను కోల్పోయినది.


ఒక నిజమైన భర్త మొట్టమొదటిగా తన భార్య యొద్దనుండి కోరుకొనేది ఏమిటి? అది ఆమె యొక్క ప్రేమనా లేక ఆమె చేసే పనులనా? నిశ్చయముగా ఆమె ప్రేమనే. ప్రభువు కూడా అంతే. అన్నింటికంటే మొదటిగా ఆయన మన హృదయాల యొక్క ప్రేమను ఆశించుచున్నాడు. అది లేనప్పుడు మనము చేసేదంతా నిర్జీవక్రియలే. దేవుని యెడల ప్రేమ ప్రేరేపించే శక్తి కానప్పుడు మంచి క్రియలు నిర్జీవక్రియలుగా మారును.


ఇక్కడి విశ్వాసులు ఒకరి యెడల ఒకరు కలిగియున్న మిక్కుటమైన ప్రేమను కూడా కోల్పోయిరి. వారు ఒకరి బలహీనతలను ఒకరు ఇక భరించలేక పోయిరి లేక ఒకరి పాపములను ఒకరు కప్పివేయలేక పోయిరి. వారు ఒకరి యెడల ఒకరు కలిగియున్న మొదటి ప్రేమను కూడా కోల్పోయిరి. ఆ దూత కూడా తన మొదటి ప్రేమను కోల్పోయెను- మరియు క్రమేణ సంఘము కూడా దాని యొక్క దూత వలె మారిపోయెను.


ఇది ఒక చిన్న తప్పిదము కాదు. ఇది ఒక గొప్ప పతనము- ఎందుకనగా ప్రభువు ''నీవు ఏ స్థితిలోనుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొనుము'' అని చెప్పెను. మనము సాధారణముగా ఒక విశ్వాసి వ్యభిచారములోనో, దొంగతనములోనో, పొగత్రాగుటలోనో పడినప్పుడు పడిపోయెనని తలంచెదము. అయితే మనము ఆత్మ యొక్క స్వరమునకు సున్నితముగా ఉన్నప్పుడు, ప్రభువు యెడల కొద్దిగా ప్రేమను కోల్పోయినా మరియు ఇతరుల యెడల ప్రేమలో కొద్దిగా చల్లారినా కూడా అది దిగజారిన స్థితికి ఒక ఆధారమని మనము గుర్తించెదము.


ఎఫెసులో ఉన్న సంఘము ఎక్కడనుండి పడిపోయెను? ఎఫెసు 40 సంవత్సరముల ముందు అపొస్తలుడైన పౌలు వచ్చి ఒక సంఘమును స్థాపించిన ప్రదేశము. ఆ సమయములో అక్కడ ఎంత ఉజ్జీవముండెనంటే ఆ నగరమంతా దాని గురించి తెలుసుకొనెను (అపొ.కా. 19). ఈ సంఘములో పౌలు మూడు సంవత్సరాలు ప్రయాసపడి, ప్రతిదినము కన్నీటితో బోధించెను (అపొ.కా. 20:3). అతడు చివరిగా ఎఫెసును వదలి వెళ్ళినప్పుడు, అతడు ఆ సంఘ పెద్దలను పిలచి, అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ సంఘము ఎదుర్కొనబోయే ప్రమాదాలలో కొన్నిటి గురించి వారిని హెచ్చరించెను (అపొ.కా. 20:17-35).


నాలుగు సంవత్సరాల తరువాత పౌలు వారికొక పత్రిక వ్రాసెను- ఈ పత్రిక బైబిలంతటిలో కనబడే నూతన నిబందన యొక్క కొన్ని లోతైన సత్యములు కలిగియున్నది. అతడు ఎఫెసులోని సంఘమును తాను స్థాపించిన సంఘములన్నిటిలోనూ అత్యంత పరిణితి కలిగినదిగాను, అత్యంత ఆత్మీయమైన మనస్సు కలిగినది గాను ఎంచెను గనుక వారికి ఇటువంటి విషయముల గూర్చి వ్రాయగలిగెను. వారిని గద్దించుటకుగాని సరిదిద్దుటకుగాని పౌలు ఏమియు కనుగొనలేదని కూడా ఈ పత్రికనుండి మనము గమనించగలము. ఇటువంటి ఉన్నతమైన స్థితిని వారు ఒకప్పుడు కలిగియుండిరి.


పౌలు వ్రాసిన పత్రికను ఎఫె˜సీయులకు వ్రాసిన మొదటి పత్రిక అని పిలువవచ్చును. ఇక్కడ ప్రకటన 2వ అధ్యాయములో, మనము ఎఫె˜సీయులకు వ్రాసిన రెండవ పత్రికను చూడగలము. ఇప్పుడు కథ పూర్తిగా వ్యత్యాసముగా ఉన్నది. సంఘములో ఒక క్రొత్త తరము లేచెను మరియు వారికి వారి పితరులకుండిన భక్తిగాని ఆత్మీయత గాని లేకుండెను.


ఇది ఈ ఇరవై శతాబ్దాలుగా దాదాపు ప్రతి ఒక్క సంఘము మరియు ఉద్యమము యొక్క విషాదకరమైన చరిత్ర. రెండవ తరము అదే సిద్ధాంతము కలిగియుండును, కాని వారి పితరులకుండిన జీవము కలిగియుండదు. కాబట్టి ప్రభువు ఎఫెసులో ఉన్న సంఘమునకు ''నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొనుము'' అని చెప్పెను.


మారుమనస్సు పొందే అవసరత


ఈ సమస్యకు ఏకైక పరిష్కారముండెను. ''మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము'' అని ప్రభువు చెప్పెను( 5వ వచనము).


మనము సాధారణముగా అవిశ్వాసులకు ప్రకటించుటకు తలచేమాట - ''మారుమనస్సు'' - ఈ మాటనే ప్రభువు సంఘమునకు ప్రకటించెను. ''నీవు ఇతరులకు వారి పాపములనుండి తిరుగమని చెప్పేముందు, నీ మొదటి ప్రేమను విడచిన నీ స్వంత పాపమునుండి తిరుగుము'' అని ప్రభువు వారితో చెప్పెను. వారు వారి మొదటి ప్రేమను విడిచిపెట్టినందుకు దు:ఖపడవలెను.


''మీరు మొదట చేసిన క్రియలను చేయుడి'' అని ప్రభువు చెప్పెను (5వ వచనము). వారి క్రియలు ప్రేమనుండి రానియెడల, వారి క్రియలకు ఆయన ఎదుట ఎటువంటి విలువ లేదు. వారి క్రియలు కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు వలే కాల్చివేయబడుటకే తగును. ప్రతి చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యమే ఆ చర్యకు విలువనిచ్చును. మీ సహనము, మీ కష్టము, మీ పవిత్రత వెనుకవున్న ఉద్దేశ్యము వాటిని ప్రభువుకు అంగీకారయోగ్యముగానో అంగీకరింపదగనివిగానో చేయును. మనము ప్రభువుముందు నిలబడు దినమున, ''ఏమిటి?'' అనే ప్రశ్న కంటే ''ఎందుకు?'' అనే ప్రశ్న ఎంతో ప్రాముఖ్యమైనదని మనము కనుగొనెదము. మనము చేసినది మనము ఎందుకు చేసామో అను పరీక్ష ద్వారా ప్రభువు మన క్రియలన్నింటిని విశ్లేషించును. మనము దీనిని ఎప్పుడూ మరువకూడదు. ప్రభువు కొరకు ప్రేమను బట్టి రాని ఏదైననూ నిర్జీవ క్రియే.


మనము నిర్జీవ క్రియలనుండి మారుమనస్సు పొందవలెనని ఆజ్ఞాపించబడినామని గుర్తుంచుకొనుడి. మన జీవితాలలో సంపూర్ణులగుటకు సాగిపోవుటకు కావలసిన పునాదిలో ఇది భాగమని హెబ్రీ 6:1 మనకు చెప్పుచున్నది.


ఆ సంఘము దాని దూత మారుమనస్సు పొందనియెడల వారి దీపస్తంభమును దానిచోటునుండి తీసువేతునని ప్రభువు చెప్పెను. దాని అర్థమేదనగా ఆయన వారిని భూమిపైన ఆయనకున్న సంఘములలో ఒక దానిగా ఇక పరిగణించడు. వారు వారి కూటములను సదస్సులను ఇంకనూ కలిగియుండవచ్చును మరియు వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండవచ్చును. గాని ప్రభువుకు సంబంధించినంత వరకు ఆయన ఆత్మాభిషేకము లేకుండా ఆయన కృప లేకుండా వారు చచ్చిన వారిగాను, ఉనికి లేనివారిగాను ఉందురు. మొదటి ప్రేమను పోగొట్టుకొనుట అంత తీవ్రమైనదిగా ఉండవచ్చును.


నికోలాయితుల అధికార క్రమము


ప్రభువు అప్పుడు ఆయన ద్వేషించిన నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నందుకు ఆ దూతను మెచ్చుకొనెను (6వ వచనము). నికోలాయితులు ఎవరో లేక వారు ఏమిచేసిరో మనకు తెలియజేయుటకు లేఖనములలో ఏ ప్రస్థావన లేదు. కాబట్టి ప్రభువు ఏ క్రియలను గూర్చి మాట్లాడుచుండెనో మనము ఖచ్చితముగా చెప్పలేము. అయితే, ''నికోలాయితులు'' అన్న పదమునకు (గ్రీకు బాషలో) ''ప్రజలను జయించువారు'' అని అర్థము.


ప్రభువు ఉద్ధేశ్యము అది అయినయెడల అప్పుడది ''మందకు ప్రభువులుగా ఉండుటకు'' కోరుకొనువారిని సూచించుచున్నది (1 పేతురు 5:3) - సేవకులుగా కాక రాజులుగా ప్రవర్తించు వారిని సూచించుచున్నది. అటువంటి పెద్దలు వారిని వారు ఒక ప్రత్యేకమైన యాజకుల కులముగా (పాత నిబంధనలో లేవీయులుండినట్లు) ఎంచుకొని ఇతర విశ్వాసులను ఏలుదురు. నికోలాయితుల క్రియలను ఆయన ద్వేషించెనని ప్రభువు చెప్పెను.


ఈ రోజున ''రెవరెండ్‌'' (లేఖనములో దేవునికి మాత్రమే వాడిన బిరుదు - కీర్తనలు 111:9) మరియు ''పాస్టరు'' (ఇది ఒక వరము అంతేకాని ఒక బిరుదో ఒక పదవో కాదు) వంటి బిరుదులను క్రైస్తవ బోధకులు సంఘములో ఇతరులపైన తమ్మును తాము హెచ్చించుకొనుటకు వాడుచున్నారు. అయితే, కేవలము బిరుదులతోనే బోధకులు ఇతరులను ఏలుటకు చూచుటలేదు. తమ్మును తాము కేవలము ''సహోదరులు'' అని పిలుచుకొని వారితోటి విశ్వాసులపై తమ బలమైన వ్యక్తిత్వము చేత ఆర్థిక బలముచేత, మరియు ఆత్మీయ వరములచేత ఆధిపత్యము ప్రదర్శించేవారు అనేకులున్నారు. ఇందంతయు నికోలాయితుల సిద్ధాంతము మరియు ఇది దేవునికి అసహ్యకరముగా నున్నది.


భారతదేశములో అనేక క్రైస్తవ సంఘములు మరియు సంస్థలు వారి పాశ్చాత్య యజమానులచేత డబ్బు బలము ద్వారా పాలనచేయబడుట అనే విషాదకరమైన దృశ్యమును మనము చూడగలము. పాశ్చాత్య దేశాలకు ఆహ్వానించబడుట ద్వారా వచ్చిన ఆర్థిక పరమైన ఋణభారము, మరియు నిర్భంధములవలన, అనేక మంది భారతీయ విశ్వాసులు చివరికి ''తెల్లవారికి'' బానిసలుగా మారిపోయిరి. ఇలా ఒక విశ్వాసి మరియొకనికి బానిసలుగా దాసోహం వహించుట నికోలాయితుల సిద్ధాంతము మరియు ఇది దేవుని దృష్టికి హేయమైనది.


నికోలాయితుల సిద్ధాంతములో మరియొక రూపమును పరిశీలించండి. రోమను క్యాథలిక్కు సంఘము మానవునికి క్రీస్తుకు మధ్యవర్తి మరియ అని బోధించును. వారి యాజకులు మరియకు రోమను క్యాథలిక్కులకు మధ్య మద్యవర్తులుగా ప్రవర్తించుదురు!! కాని ఈ లేఖనానుసారముకాని మద్యవర్తిత్వ వైఖరి ఒక రోమను క్యాథలిక్కు యాజకుడు పాటించినట్లే ఒక ప్రొటెస్టెంట్‌ పాస్టరు (కాపరి) కూడాపాటించగలడు!


ఒక పాస్టరు తన మందలో ఒకరికి ఉద్యోగ విషయములోగాని, వివాహ విషయములోగాని, ఇంకేవిషయములో గాని ''దేవుని చిత్తమును కనుగొని'' నప్పుడు, అతడు ఒక నికోలాయితుల మద్యవర్తిగా ప్రవర్తించుచున్నాడు. ఇటువంటి పద్దతుల ద్వారా యాజకులు మరియు పాస్టరులు దేవుడు అసహ్యించుకొనే రీతిగా వారి మందపై ఆధిపత్యము పొందుచున్నారు.


ఆత్మీయ నడిపింపు మరియు సలహా ఇచ్చుట దైవికమైనది. కాని క్రీస్తు శరీరములో మరియొక అవయవమునకు ''దేవుని చిత్తమును కనుగొనుట'' అతనికి తన శిరస్సైన క్రీస్తుతో ఉన్న సంబంధమును దొంగిలించుట.


పాత నిబంధన క్రింద, ప్రజలకొరకు దేవుని చిత్తమును కనుగొనే ప్రవక్తలుండిరి, ఎందుకనగా అప్పుడు పరిశుద్దాత్మ ప్రతి ఒక్కరికి ఇవ్వబడలేదు. కాని ఇప్పుడు క్రొత్త నిబంధన క్రింద సంగతులు వేరుగా ఉన్నవి. అందరు దేవున్ని వ్యక్తిగతముగా తెలుసుకొనగలరు (హెబ్రీ 8:8-12). వాస్తవానికి ప్రభువు తన సంఘములోని (తన శరీరములోని) ప్రతి సభ్యుడు శిరస్సైన తనతో నేరుగా సంబంధము కలిగియుండవలెనని ఆసక్తితో కోరుకొనుచున్నాడు (కొలస్సి2:18,19) అయితే నికోలాయితులు దీనికి అడ్డుపడుదురు.


ఎఫెసులో ఉన్న సంఘము నికోలాయితుల చర్యలను విజయవంతముగా నిరోధించింది. వారు దానిని ద్వేషించారు. ప్రభువు కూడా దానిని ద్వేషించినందున వారిని దానిని బట్టి మెచ్చుకొనెను. ఆయన మొదటి శతాబ్దములో దానిని ద్వేషించెను మరియు ఇప్పుడు కూడా దానిని ద్వేషించుచున్నాడు. నీ సంగతి ఏమిటి? ఈ చెడును నీవు ప్రభువు ద్వేషించినంతగా ద్వేషించుచున్నావా? అలా కానియెడల నీవు క్రీస్తు వలె లేవు, మరియు నీవు ఆయన నిజమైన దూతవు కాలేవు. ఒక నికోలాయితీయుడు క్రీస్తు శరీరమును ఎప్పుడూ కట్టలేడు.


జయించువారికి పిలుపు


చివరిగా ఈ వర్తమానము సంఘములన్నిటికి గనుక వినుటకు చెవిగల ప్రతివానిని, ఆయన చెప్పునది వినుటకు పరిశుద్ధాత్మ హెచ్చరించుచున్నాడు (7వ వచనము). ప్రభువు చెప్పిన దానికి లోబడుటకు ప్రతి విశ్వాసి సిద్ధముగా లేడు - ఎందుకనగా వారిలో ఎక్కువమంది వారి స్వంత చిత్తమును కోరుకొనుచున్నారు లేక వారి తోటి మనుష్యులను సంతోషపెట్టవలెనని చూచుచున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించి, పరిశుద్ధాత్మ సంఘములోని వ్యక్తులను జయ జీవితము జీవించుటకు సవాలు చేయుచున్నాడు.


పరిశుద్ధాత్మ సంఘము మధ్యలో పూర్ణహృదయులు మరియు నమ్మకస్థులైన విశ్వాసుల గుంపును గర్తించి వారిని ''జయించువారని'' పిలచుచున్నాడు. వీరు పాపమును లోకానుసారతను జయించి వారి చుట్టూ ఉన్న ఆత్మీయ క్షీణత మధ్యలో ప్రభువు కొరకు నమ్మకముగా నిలబడుదురు. ప్రతి ప్రాంతములో, దేవుడు ఆయన ప్రమాణాలకు కట్టుబడి వాటికొరకు ఎంత వెల చెల్లించవలసివచ్చినా పోరాడే వారికొరకు చూచుచున్నాడు. ఏడు సంఘములకు వ్రాసిన పత్రికలలో, ప్రభువు ప్రధానముగా జయించువారి పట్ల ఆసక్తి చూపుచున్నాడని మనము చూడగలము. ఈ రోజున కూడా, ఆయన ప్రతి ప్రాంతములో జయించువారి కొరకు చూచుచున్నాడు. ఆయన ప్రతి సంఘములో వారిని కనుగొనలేకపోవచ్చును గాని ఆయన వారి కొరకు ప్రతి ప్రాంతములో చూచును.


జయించువారికి ప్రభువు ఒక ప్రతిఫలమును వాగ్ధానము చేశాడు. ఈ సందర్భములో, అది జీవవృక్షఫలమును భుజించే ఆధిక్యత - ఈ ఆధిక్యతను ఆదాము పోగొట్టుకొన్నాడు. జీవవృక్షము దేవుని జీవమునకు దేవ స్వభావమునకు ప్రతిరూపముగా ఉన్నది. దేవుడు ఒక మానవుడికి ఇవ్వగలిగిన అతిగొప్ప ప్రతిఫలము ఆయన స్వభావములో పాలుపొందుట. ఇక్కడ భూమిపైన, ఎక్కువ మంది విశ్వాసులు కూడా దీని గురించి గొప్పగా తలంచరు. కాని నిత్యత్వపు స్పష్టమైన వెలుగులో, ఇది నిజముగా దేవుడు మానవునికివ్వగలిగిన ప్రతిఫలాల్లో అతి గొప్పదని మనము కనుగొనెదము.


అధ్యాయము 5
శ్రమలనుభవించే సంఘము

''స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. మొదటివాడును కడపటి వాడునైయుండి, మృతుడై మరల బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, 'నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమకలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు' '' (ప్రకటన 2:8-11).


శ్రమ


ప్రభువు ఇక్కడ తనను తాను మొదటివానిగాను కడపటివానిగాను, మృతుడై మరల బ్రతికిన వానిగాను వర్ణించుకొనెను. వ్యతిరేకతను హింసను ఎదుర్కొనుచున్న ఒక సంఘము ప్రభువును మొదటినుండి చివరకు అన్ని సంఘటనలను నియంత్రించువానిగాను మరియు మానవుని యొక్క అతిగొప్ప శత్రువు మరణమును జయించువానిగాను చూడవలసిన అవసరమున్నది. ప్రభువుకు ఈ సంఘముకు వ్యతిరేకముగా ఏ ఆరోపణలు లేవు. ఇది శ్రమను, దరిద్రతను, అపవాదులను ఎదుర్కొనుచున్న సంఘము.


ప్రకటన గ్రంథములో శ్రమ అనేది పునరావృతమయ్యే నేపథ్యము - మరియు గమనిస్తే దానిని, దేవుని బిడ్డలలో అతి నమ్మకమైన వారు శ్రమను ఎదుర్కొంటారు గాని రాజీపడరు. ప్రకటన గ్రంధము మొదటి అధ్యాయములో మనము యోహాను శ్రమలనుభవించుట చూచియున్నాము. ఇక్కడ ఒక నమ్మకమైన సంఘము దానిని అనుభవించుట చూచుచున్నాము. ఏ సంఘమునకు వ్యతిరేకముగా ప్రభువు ఒక్క ఆరోపణ కూడా కలిగిలేడో, ఆ సంఘము హింసింపబడుచుండెను. లోకానుసారమైన రాజీపడే సంఘములు మంచి సమయమును కలిగియుండును.


ఇదంతయూ పూర్ణహృదయులైన తన బిడ్డల కొరకు శ్రమలు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములో ఒక భాగమని మనకు గుర్తుచేయుటకు ఉద్దేశించబడినది. కాబట్టి మనము ఒక రోజు మహాశ్రమలను ఎదుర్కొన్నప్పుడు, మనకు ఏదో విచిత్రమైనది మనకు సంభవించెనని మనము తలంచనవసరములేదు. శతాబ్దాలుగా దేవునియొక్క నమ్మకమైన బిడ్డలు వెళ్ళిన మార్గమునే మనము కూడా వెళ్లెదము.


దేవుడు ఆయన బిడ్డలలో అతి శ్రేష్టులను శ్రమలు ఎదుర్కొనుటకు అనుమతించును. మొదటి శతాబ్దములో ఆ విధముగానే యుండెను. ఈ 20 శతాబ్దాల యొక్క సంఘ చరిత్రలో కూడా ఈ విధముగానే యుండెను. అంత్యకాలమందు కూడా ఈ విధముగానే యుండును.


క్రీస్తువిరోధి యొక్క దినములలో భూమిపై ప్రభువు యొక్క సాక్షులుగా ఉండువారు దేవుని బిడ్డలలో శ్రేష్టులైన వారు, వారిలో అత్యంత నమ్మకస్తులు మరియు ప్రభువు యొక్క సైన్యములోని ప్రత్యేకమైన ఏకాంగవీరుల దళములు. ప్రతి ఒక్క సైన్యాధిపతి తన శ్రేష్టమైన దళములను పోరాటము ఎక్కువగా రగులుచున్న చోటకు పంపించును. ప్రభువు కూడా అలాగునే చేయును. ప్రభువు యొక్క ఆ దళములలో నుండుట ఒక గొప్ప ఘనత మరియు ఆధిక్యత.


భూమిపైన జయించువారి సాక్ష్యము దేవునికి బాగా అవసరమైన సమయములో ఆయన వారిని పరలోకమునకు కొనిపోడు. ఆయన గతంలో ఎన్నడూ అలా చేయలేదు మరియు భవిష్యత్తులో కూడా అలా చేయడు. మహాశ్రమల దినములలో క్రీస్తువిరోధికి వ్యతిరేకముగా నిలబడే ప్రభువు యొక్క శ్రేష్టమైన దళాలు ప్రకటన గ్రంధములో ''దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చు వారిగా'' సంభోధించబడినారు (ప్రకటన 12:17). వారు క్రీస్తువిరోధికి మ్రొక్కుటకుగాని అతడి ముద్రను తన శరీరములపైన వేయించుకొనుటకుగాని నిరాకరించుదురు. గనుక వారిలో అనేకులు తమ విశ్వాసము నిమిత్తము తమ ప్రాణములను పెట్టుదురు (ప్రకటన 13:7,8,15-17). ఈ విధముగా వారు సదాకాలమున్న ''మరణము వరకు తమ ప్రాణములను ప్రేమింపని'' ఆ ప్రత్యేక హతసాక్షుల గుంపులో చేరుదురు (ప్రకటన 12:11).


మనలో సహజముగా ఎవరికీ ప్రభువు కొరకు మరణమును ఎదుర్కొనుటకు కావలసిన ధైర్యము లేదు. కాని దేవుడు మన సాక్ష్యమును మన రక్తముతో ముద్రించుటకు పిలచిన యెడల, అటువంటి సమయమొచ్చినప్పుడు దాని కొరకు మనకు ప్రత్యేకమైన కృపను దయచేయునని మనము నిశ్చయత కలిగియుండవచ్చు. ఇటువంటి ప్రత్యేక కృపను పొందుట ద్వారానే గతములో ప్రతిఒక్క క్రైస్తవ హతసాక్షి మరణమును నిర్భయముగా ఎదుర్కొనెను. మరియు దేవుడు వారి కొరకు చేసినది మనకొరకు కూడా చేయును - మనలో ఉన్న అతి బలహీనమైన మరియు అతి పిరికి వానికి కూడా చేయును. మనము చేయవలసినదంతా ఆయనకు నమ్మకస్తులుగా ఉండుటకు ఎటువంటి వెలనైనా చెల్లించుటకు సిద్ధమేనని ఆయనతో చెప్పుట. మనము సంసిద్ధులమైతే దేవుడు మనకు ధైర్యమునిచ్చును.


దరిద్రత(పేదరికము)


స్ముర్నలో నున్న సంఘములో నున్న పరిశుద్ధులు పేదవారు. సంఘ చరిత్రంతటిలో దేవుని నమ్మకస్తులైన బిడ్డలు ఎదుర్కొన్న మరియొక విషయము పేదరికము. అనేక పాత నిబంధన పరిశుద్ధులు ధనికులుగా ఉండిరి. పాతనిబంధనలో దేవుడు భూలోక సంబంధమైన సంపదను విధేయతకు ప్రతిఫలముగా వాగ్ధానముచేసెను, ఎందుకనగా ఇశ్రాయేలు ఒక భూసంబంధమైన రాజ్యమును స్వతంత్రించు కొనుటకు పిలువబడెను.


కాని యేసు ఒక నూతన నిబంధనను ఆవిష్కరించి పరలోకరాజ్యమును భూమిపైకి తెచ్చెను. ఇప్పుడు మనకు వాగ్దానము చేయబడిన ధనము భూలోకసంబంధమైనది కాక, పరలోక సంబంధమైనది. ఈ కారణము చేత యేసు మరియు ఆయన అపొస్తలులంతా పేదవారిగా ఉండిరి.


ఈనాడు, దేవుని యొక్క పిల్లలు ధనవంతులగుట వారిపైన ఆయన ఆశీర్వాదమునకు గుర్తని అనేకులు బోధించుచున్నారు. ఈ సిద్ధాంతము పాశ్చాత్య దేశాలలో ఉన్న బోధకులు దేవుని ప్రజలయొక్క దశమ భాగముల ద్వారా తాము ధనికులగుటను సమర్థించుకొనుటకు మొదట కనిపెట్టబడింది! అప్పుడు క్రైస్తవ వ్యాపారవేత్తలు తాము ధనమును కూడబెట్టుకొనుటను సమర్థించుకొనుటకు దీనిని ఒక అనుకూలమైన సిద్ధాంతముగా పట్టుకొనిరి. అన్ని ప్రదేశాలలోనున్న లోభులైన బోధకులు దీనిని వారికొరకు కూడా ఒక అనుకూలమైన సిద్ధాంతముగా కనుగొనిరి!!


యేసు మరియు ఆయన అపొస్తలుల యొక్క పేదరికము ఇటువంటి బోధకులంతా తమ స్వంత లోభత్వముచేత పూర్తిగా మోసగింపబడిరని చూపించుటకు సరిపోవును. గొప్ప శోధనల మధ్య స్ముర్నలోనున్న విశ్వాసులు తమ ప్రభువు యెడల నమ్మకస్తులుగా ఉండిరి, మరియు వారు పేదవారు. అయితే లవొదికయలోని విశ్వాసులు, భౌతికపరముగా ధనికులైనప్పటికి వారు పూర్తిగా చచ్చిన స్థితిలోనుండిరి. ఇది దేనిని నిరూపిస్తుంది? జవాబు ఎవరి దృష్టికైనా తేటగా నున్నది.


''ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడేర్పరచుకొనెను...లోకములో వెఱ్ఱివారిని దేవుడేర్పరచుకొనెను...లోకములో బలహీనులైన వారిని దేవుడేర్పరచుకొనెను....ఎన్నికలేని వారిని దేవుడేర్పరచుకొనెను...ఇది ఏ శరీరియు దేవునియెదుట అతిశయింపకుండునట్లు ఆయన చేసెను'' (యాకోబు 2:5; 1 కొరింథీ 1:27-29). తన బిడ్డలను ఎన్నుకొనుటలో దేవుడు ఏ తప్పిదమును చేయలేదు. మనము దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకినప్పుడు, ఆయన మన భౌతిక అవసరతలన్నిటిని తీర్చుతానని వాగ్దానము చేసెను (మత్తయి 6:33; ఫిలిప్పీ 4:19).


భారతదేశములో ఉన్న సంఘములలో, విశ్వాసులు నిరుపేద స్థితిలో జీవిస్తూ,ఎంతో అప్పులో ఉండినప్పటికీ, వారు వారి పరలోకపు తండ్రిని తమ జీవితాల ద్వారా ఘనపరచినప్పుడు, ఆయన వారిని ఆర్థికముగా దీవించెను. ఈ విధముగా జరుగుటను మేము మరల మరల చూచితిమి. భారతదేశము లాంటి దేశములో ఇది ఒక అద్భుతం, ఎందుకనగా ఇక్కడ ప్రభుత్వ నిధులతో కూడిన సామాజిక భద్రతా వ్యవస్థ లేదు మరియు నిరుద్యోగము ఎంతో ఎక్కువ మరియు అధికారిక అవినీతి ప్రబలియున్నది. కాని అటువంటి విశ్వాసులు ధనికులవ్వలేదని కూడా మేము చూచితిమి. దేవుడు వారి అవసరాలను తీర్చెను. కాని వారిని ధనికులుగా చేయలేదు. ఎక్కడైతే విశ్వాసులు ధనమును అపేక్షించిరో, వారు తమ్మును తాము ఆత్మీయముగా నాశనము చేసుకొనుటను కూడా చూచితిమి (1 తిమోతి 6:9,10).


ఒక విశ్వాసి తన కుటుంబ ఆస్తిని వారసత్వముగా పొందుట ద్వారానో లేక ఇంకా వేరే కారణము చేత అప్పటికే ధనికుడైయుంటే ఏమి చేయవలెను? అతడు దేవుని వాక్యమునకు లోబడవలెను: 1. మొట్టమొదటిగా అతనికి ఉన్నదంతయు ప్రభువుకు చెందినదని గుర్తించవలెను (ఈ లేఖనములను ధ్యానించండి: 1 కొరింథీ 10:26; 4:7; లూకా 14:33; యోహాను 17:10). 2. తన ధనమును సువార్త వ్యాప్తి కొరకు వాడమని ప్రభువు ఇచ్చిన ఆజ్ఞకు లోబడవలెను, ఈ విధముగా తన డబ్బుతో మొదట దేవుని రాజ్యమును వెదకవలెను (''మీ డబ్బును శాశ్వతమైన స్నేహితులను పొందుటకు వాడుడి'' లూకా 16:9 - వివరణ). 3. తన ధనమును అవసరతలో ఉన్న విశ్వాసులతో పంచమని దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడవలెను (1 తిమోతి 6:17-19).


అతడు ఈ మూడు మెట్లను అనుసరించిన యెడల, అతడు ఎక్కువ కాలము ధనికుడగా ఉండలేడు. కాని అతడు ఒక ఆత్మీయమైన వ్యక్తిగా మారును, ఎందుకనగా మనము భౌతిక పరమైన వాటితో నమ్మకముగా ఉన్న ప్రకారమే దేవుడు మనకు ఆత్మీయముగా ప్రతిఫలమునిచ్చును (లూకా 16:11). అనేకులు దేవుడు వారికి అప్పగించిన మరియు వారిని పరీక్షించిన ''అన్యాయపు సిరి''తో అపనమ్మకముగా ఉన్నందున, వారు ఆత్మీయముగా పేదరికములో ఉన్నారు.


క్రొత్త నిబంధనలో దేవుడు మనకు భౌతికపరమైన సంపదను వాగ్ధానము చేయలేదు. కాని స్ముర్నలో ఉన్న సంఘముతో ఆయన ఇట్లనెను, ''.....అయినను నీవు ధనవంతుడవే'' (9వ వచనము). వారు దేవుని దృష్టిలో ధనికులు, ఎందుకనగా వారు వారి శోధనలలో నమ్మకస్తులుగా ఉండి, ఆవిధముగా దేవుని స్వభావములో పాలుపొందిరి. ఇది మనకు దేవుడు క్రొత్త నిబంధనలో ఇచ్చే నిజమైన శాశ్వతమైన ధనము.


అపవాదులు(దూషణ)


స్ముర్నలో ఉన్న సంఘము ''యూదులమని చెప్పుకొనే వారి యొక్క దూషణను'' ఎదుర్కొన్నారు (9వ వచనము). దేవుని నమ్మకస్తులైన బిడ్డలు ఎదుర్కొనవలసిన మరియొక విషయము దూషణ. ఈ సంఘము ఎదుర్కొనే దూషణ మరియు వ్యతిరేకత తమ్మును తాము దేవుని ప్రజలని పిలచుకొనేవారి యొద్దనుండి వచ్చెనని గమనించండి - ''తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, సాతాను సమాజమునకు చెందినవారు'' (9వ వచనము).


ఆ యూదులు వారి బైబిళ్ళను (ఆదికాండము నుండి మలాకీ వరకు) ధ్యానించే మతపరమైన ప్రజలు. అయినప్పటికీ వారు వేషధారులైనందున ప్రభువు వారిని ''సాతాను సమాజము'' అని పిలిచెను. ఈ కారణముచేతనే వారు యేసు యొక్క నిజమైన శిష్యులను హింసించిరి. భక్తిపరులైన యూదులు ప్రారంభించిన అనేక సమాజమందిరములు, కాలం గడచిన కొలది సాతాను యొక్క సమాజముగా దిగజారిపోయెను. అదే విధముగా, భక్తిపరులైన విశ్వాసులు ప్రారంభించిన అనేక సంఘములు కూడా ఈనాడు దేవుని దృష్టిలో ''సాతాను సంఘములు''గా దిగజారిపోయెను.


ఈనాడు యేసు యొక్క నిజమైన శిష్యులకు వ్యతిరేకత అన్య మతముల నుండియే కాక (దీనిని మనము అర్థముచేసుకోవచ్చు) ''తాము క్రైస్తవులమని చెప్పుకొనుచు, క్రైస్తవులు కాక సాతాను సంఘముగా ఉన్నవారి'' యొద్దనుండి కూడా వచ్చుచున్నది.


ఈనాడు మనము ఒక నామకార్థ క్రైస్తవ సంఘము ''సాతాను సంఘము'' అని చెప్పినయెడల, అనేకులు మనము క్రీస్తును పోలినవారముకామని నిందించుదురు. కాని యేసే పేతురుని ''సాతానా, నా వెనుకకు పొమ్ము'' (మత్తయి 16:23) అని గద్దించెనని వారు మరచిపోవుదురు; మరియు యేసే ఈ మతపరమైన ప్రజల గుంపును ''సాతాను యొక్క సమాజము'' అని పిలచెనని మరచిపోవుదురు. ఆయన ఈ రోజున వాటి పిలుపునుండి తొలగిపోయిన ''సంఘము''లను గద్దించుటకు ఖచ్చితముగా అటువంటి బలమైన మాటలనే వాడును.


''వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు'' (యోహాను 16:2,3) అని యేసు తన శిష్యులను హెచ్చరించెను.


సమాజమందిరములోని జనులు తన శిష్యులకేమి చేతురని ఆయన చెప్పెనో, తరువాత శతాబ్దాలలో ''సంఘములు'' కూడా అలాగే చేసెను. 5 నుండి 15వ శతాబ్దము వరకున్న కాలములో, భక్తిపరులైన యేసుని శిష్యులు రోమన్‌ క్యాథలిక్‌ సంఘము యొక్క మత భ్రష్టత విరుద్ధ విభాగము చేత చంపబడిరి.


యేసుని శిష్యుల పట్ల ద్వేషము క్రీస్తువిరోధి కాలములో మరియు బబులోనుకు సంబంధించిన ప్రపంచ వ్యాప్తి సంఘము యొక్క కాలములో గరిష్టస్థాయికి చేరుకొనినవి. అది వచ్చునప్పుడు దానిని ఎదుర్కొనుటకు మనము సిద్ధపడియుండవలెను. అందుచేత మనము ఈ రోజుల్లో నామకార్థ క్రైస్తవులనుండి ఎదుర్కొనే కొద్ది దూషణకు వ్యతిరేకతకు భయపడకూడదు.


మనము దూషింపబడుటకు ఎన్నడూ భయపడకూడదు - ఎందుకనగా యేసు కూడా దూషింపబడెను. ఆయన తిండిపోతని, అబద్ధ బోధకుడని, దేవదూషణ చేయువాడని, మతి చెలించినవాడని, దయ్యములు పట్టిన వాడని, సాతాను శక్తి కలవాడని పిలువబడెను (లూకా 7:34; యోహాను 7:12; మత్తయి 26:65; మార్కు 3:21,22; యోహాను 8:48).


ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ''శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు; దాసుడు యజమాని కంటే అధికుడు కాడు, శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని (దెయ్యములకు అధిపతియైన సాతానుకు-యూదులిచ్చిన బిరుదు) వారు పేరుపెట్టియుండిన యెడల ఆయన ఇంటివారికి మరినిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా'' (మత్తయి 10:24,25).


పేతురు ఈ విధముగా మనలను హెచ్చరించుచున్నాడు ''అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌ క్రియలను చూచి, వాటిని బట్టి దర్శనదినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్య మీ ప్రవర్తన మంచిగా ఉండనీయుడి'' (1 పేతురు 2:12).


దేవుడు మనకిచ్చిన వాగ్దానమేదనగా, ''మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవాయొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము'' (యెషయా 54:17). కాబట్టి మనము దూషణకు భయపడనక్కరలేదు. ప్రభువే సరియైన సమయములో మన పక్షమున తీర్పు తీర్చును. అప్పటివరకు మనము మౌనముగా నుండి భక్తిహీనులు మన గురించి చెప్పు మాటలను విస్మరించవచ్చును.


భయమునుండి విడుదల


ప్రభువు అప్పుడు స్ముర్నలోనున్న సంఘముకు భయపడవద్దని చెప్పెను (10వ వచనము). యేసు భూమిపైనున్నప్పుడు ''భయపడకుడి'' అన్న మాట ఆయన పెదాలనుండి తరచుగా వచ్చెను. అయితే ఆయన నామము నిమిత్తము శ్రమలను ఎదుర్కొనుచున్న సంఘముతో కూడా ఇప్పుడు అదే మాటను పలికెను. బహుశా ఈ దినాలలో మనమందరమును ప్రభువు నోటనుండి ఎక్కువగా వినవలసిన మాట ఇదేనేమో.


ఈనాడు లోకమంతట పిరికితనముగల ఆత్మ కలదు మరియు అది ప్రజలను ఇంకా ఇంకా బలముగా పట్టుకొనుచున్నది. చివరి దినాలలో ఈ విధముగా నుండునని ప్రభువు మనలను హెచ్చరించెను (లూకా 21:26). కాని ఆయన శిష్యులు ఈ పిరికితనము గల ఆత్మ చేత ప్రభావితము చేయబడకూడదనికూడా ఆయన వారితో చెప్పెను. విషాదకరమైన విషయమేమిటంటే ఎక్కువమంది విశ్వాసులు ఈ ఆత్మనుండి విడుదల పొందలేదు. అనేక మంది విశ్వాసులు వారి భవిష్యత్తు గూర్చిన భయముచేత, మనుష్యుల భయముచేత, వ్యాధి భయముచేత, మరణ భయముచేత మరి ఇంకెన్నో భయాలచేత బానిసలుగా మార్చబడిరి.


భయము సాతాను యొక్క ప్రధాన ఆయుధాలలో ఒకటి. దీనితో అతడు అనేకమంది విశ్వాసులను బానిసలుగా చేయును. ఈ పిరికితనం గల ఆత్మయే అనేకమంది విశ్వాసులను సంఘము యొక్క కూటములలో ప్రభువు కొరకు ధైర్యముగా సాక్ష్యమివ్వకుండా, వారు పనిచేయు స్థలములలో ప్రభువు కొరకు ధైర్యముకలిగిన సాక్ష్యులుగా ఉండకుండా చేయును. అనేక మంది విశ్వాసులు పిరికితనమే దీనత్వమని భ్రమపడుదురు, కాబట్టి సాతాను వారిని మోసగించును.


ప్రధాన యాజకుని భవనములో పేతురును ప్రశ్నించిన పనికత్తెకు ప్రభువు గురించి ధైర్యముగా సాక్ష్యమివ్వకుండా పేతురును నిరోధించినది పిరికితనమే. కాని పేతురు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందినప్పుడు ఆ పిరికితనము పారద్రోలబడెను. అప్పుడతడు ధైర్యముగా ప్రభువు గురించి ఎవరికైనా సాక్ష్యమివ్వగలిగెను.


తరువాత, అతడు ఇతర అపొస్త్తలులు భయపడుటకు మరల శోధింపబడినప్పుడు, వారు ప్రార్థించి మరల పరిశుద్ధాత్మ చేత నింపబడిరి. అప్పుడు పిరికితనంగల ఆత్మవారినుండి మరల పారద్రోలబడెను (అపొ.కా. 4:31). అయితే దానికి ఇదే సమాధానము: మనము పరిశుద్ధాత్మ చేత మరల మరల నింపబడవలెను.


మిమ్ములను నోరు తెరవకుండా చేసి, మీ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, మీరు పనిచేయు స్థలములోను క్రీస్తు కొరకు సాక్షిగా ఉండకుండా నిరోధించే పిరికితనముగల ఆత్మకు మీరు బానిసలుగా ఉండుటను దేవుడు కోరుకొనుటలేదు. ఆయన మిమ్మును ఆయన పరిశుద్ధాత్మతో నింపి ధైర్యము గలవారిగా చేయాలని కోరుకొనుచున్నాడు. మీరు చేయవలసినదంతా మీరు పిరికివారని ఒప్పుకొని, ఆయన యొక్క ధైర్యముగల సాక్షిగా ఉండుటకు ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మును నింపమని అడగవలెను. ఆకలి దప్పిక గలవారు పరిశుద్ధాత్మతో నింపబడుదురు.


రాబోవు రోజుల్లో మనము ఇంకా ఎక్కువ భయపడుటకు శోధించబడుదుము. కాబట్టి ఎటువంటి భయమున్నను జయించుటకు మనకిప్పుడున్న అవకాశమును వాడుకొనవలెను.


దేవుని ప్రణాళిక చొప్పున శ్రమను అనుభవించుట


దేవుడు తన నమ్మకస్తులైన బిడ్డలను శ్రమలనుండి కాపాడడు. మన ఆత్మీయ ఎదుగుదలకు శ్రమను అనుభవించుట అవసరమని ఆయనకు తెలుసు. కాబట్టి స్ముర్నలో నున్న సంఘము శ్రమలనుండి తప్పించబడలేదు. కాని ప్రభువు వారిని ఇట్లు ప్రోత్సహించెను, ''మీరు అనుభవింపబోవు శ్రమల గూర్చి భయపడకుడి'' (10వ వచనము).


సాతాను వారిలో కొందరిని చెరలో వేయబోవునని ప్రభువు వారిని హెచ్చరించెను. విశ్వాసులను అన్యాయముగా చెరలో వేయుటకు దేవుడు సాతానుకు అధికారమునిచ్చెను. కాని మొదట దేవుని అనుమతి పొందకుండా సాతాను మనకేమీ చేయలేడని మనము గుర్తుంచుకొనవలెను. మరియు మనము చెరలో వేయబడినయెడల అది మనలను శోధించుటకు మాత్రమే (10వ వచనము).దేవుడు చెరను కూడా తన ఉద్దేశ్యములను నెరవేర్చుటకు వాడుకొనును.


''నాకు సంభవించినవి (చెరలో) సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెను'' అని పౌలు చెప్పెను (ఫిలిప్పీ 1:12-14). దేవుడు పౌలు యొక్క చెరను కొన్ని ఉద్దేశ్యములు నెరవేర్చుటకు ఉపయోగించుకొనెను. 1. పౌలును పరిశుద్ధ్దపరచుటకు 2. పౌలు యొక్క చెరసాల అధిపతులలో కొందరిని రక్షించుటకు (మార్చుటకు) 3. పౌలు తన పత్రికలు వ్రాయుటకు అవకాశమిచ్చుటకు 4. ఇంకా అనేకమంది విశ్వాసులు భయములేకుండా సువార్తను ప్రకటించుటకు ప్రోత్సహించుటకు.


నిజముగా మన దేవుడు సాతాను యొక్క ఎత్తులను ఏ విధముగా చిత్తు చేయునంటే ఖైదుతో సహా ప్రతి ఒక్క విషయము దైవ ఉద్దేశ్యములు నెరవేరుటకు మాత్రమే పనిచేయును (రోమా 8:28; కీర్తనలు 76:10). మనము చెరలో ఎంతకాలము గడుపుతామన్న విషయముకూడా ప్రభువే నిర్ణయించును. ''మీకు పది దినములు శ్రమ కలుగును'' అని ప్రభువు వారితో చెప్పెను (10వ వచనము). మన పరలోకపు తండ్రే ఆయన పిల్లలు ఎంతకాలము శ్రమలను అనుభవించవలెనో నిర్ణయించును.


మహా శ్రమల దినములో కూడా, ''ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును'' అని యేసు చెప్పెను (మత్తయి 24:22). జలప్రళయము భూమిపై నున్నప్పుడు ''దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను'' (ఆదికాండము 8:1) మరియు ఆయన ఏర్పరచుకొన్న వారు భూమిపై నున్న మహా శ్రమలచేత చుట్టబడినప్పుడు వారిని మరచిపోడు. ''నేను నిన్ను మరువను....నా అర చేతుల మీద నిన్ను చెక్కియున్నాను'' అన్నది ఆయన మనకిచ్చిన మాట (యెషయా 49:15,16).


మనము దీనిని తెలిసికొనుట గొప్ప ఆదరణను ఇచ్చును. మరియు రాబోవు దినములలో మనము ప్రభువు నిమిత్తము శ్రమపడునప్పుడు దీనిని జ్ఞాపకముంచుకొనవలెను. మన శక్తికి మించి ఆయన మనలను శోధింపబడనియ్యడు. ఆయన తన చేతిని నియంత్రించు గుబకపై ఉంచెను మరియు సరియైన సమయమొచ్చినప్పుడు (మనమెదుర్కొనుచున్న) ఒత్తిడిని ఆయన తగ్గించును.


''మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను'' అని ప్రభువు హెచ్చరించెను (10వ వచనము). ప్రభువు యెడల నమ్మకముగా ఉండుటకు, అవసరమైతే మనము చనిపోవుటకు కూడా సిద్ధముగా నుండవలెను. కొంచెము భూసంబంధమైన లాభముకొరకు వారి సాక్ష్యము విషయములలో రాజీపడే విశ్వాసుల యొక్క మాదిరిని అనుసరింపకుడి అది కొంచెము ఘనతో, డబ్బో లేక పదోన్నతో కావచ్చు. క్రీస్తువిరోధి ముద్ర లేకుండా మనకు కావలసిన ఆహారమును కూడా కొనుక్కొనుటకు అనుమతించబడని రోజున అటువంటి విశ్వాసులు ప్రభువుకు నమ్మకస్థులుగా ఎలా ఉందురు? (ప్రకటన 13:16,17). అటువంటి ''విశ్వాసులు'' ఖచ్చితముగా ''మృగము యొక్క ముద్రను'' తమ మనుగడకొరకు అంగీకరించుదురు.


జీవపు కిరీటము ఎటువంటి భూసంబంధమైన ఘనత కన్నా మరియు భౌతిక జీవముకన్నా ఎంతో గొప్ప ప్రతిఫలమని గుర్తుంచుకొనుడి. ఇటువంటి వర్తమానమును వినుటకు అందరికీ చెవులుండవని ప్రభువు గుర్తించెను. కాబట్టి ఆయన వినుటకు చెవులు గలవారిని వినుటకు పిలచుచున్నాడు. జయించువారు రెండవ మరణము వలన ఏ హాని చెందరు (11వ వచనము).


రెండవ మరణమనేది నిత్యమరణము - ఇది దేవుని సన్నిధినుండి నిత్యత్వమంతా కూడా, అగ్నిగుండములో పడవేయబడుట. రెండవ మరణమును తప్పించుకొనే వాగ్ధానము జయించువారికి మాత్రమే చేయబడెనన్న విషయము ప్రాముఖ్యమైనది. అందుచేతనే పాపమును జయించుట ముఖ్యమైనది - ఎందుకనగా పాపము యొక్క తుది ఫలితము మరణము (యాకోబు 1:15లో ఇది స్పష్టముగా చెప్పబడినది).


క్రొత్త నిబంధనంతటిలోను ఆత్మ యొక్క ప్రధానమైన సందేశము మనము పాపమును ప్రతి రూపములో జయించవలెననునదియే.


అధ్యాయము 6
లోకానుసారమైన సంఘము


''పెర్గెములోనున్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. వాడియైన రెండంచులు గల ఖడ్గముగలవాడు చెప్పుసంగతులేవనగా, 'సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసియైయుండి, నన్ను గూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలెనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతి మీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు'' (ప్రకటన 2:12-17).


కఠిక చీకటిలో వెలుగు


ఇక్కడ ప్రభువు తనను తాను వాడియైన రెండంచులుగల ఆత్మయొక్క ఖడ్గము (అనగా దేవుని యొక్క సజీవమైన శక్తివంతమైన వాక్యము) గలవానిగా వర్ణించుకొనెను (12వ వచనము, ఎఫెసీ 6:17). ఆయన భూమిపైనున్నప్పుడు ఈ ఖడ్గముతోనే సాతానును అరణ్యములో జయించెను. ఈ ఖడ్గము ఈనాడు కూడా ఆయన నోటనుండి వచ్చుచున్నది. మరియు సాతానుకు విరోధముగా మన పోరాటములలో కూడా మనకు కావలసిన ఆయుధము ఇదే.


పెర్గెము ఎంత చెడ్డ పట్టణమంటే సాతాను తన భూలోక ప్రధాన కార్యాలయమును అక్కడ కలిగియుండెనని ప్రభువు చెప్పెను. ఇది 13వ వచనములో రెండు మారులు సూచించబడినది. అయితే సరిగ్గా ఈ పట్టణము యొక్క మధ్యనే ప్రభువు తన సంఘము నుంచెను.


''మీరెక్కడ కాపురమున్నారో నేనెరుగుదును'' అని ప్రభువు వారితో చెప్పెను. మనము ఎక్కడ నివసించుచున్నామో, ఎటువంటి పరిస్థితులలో నివసించుచున్నామో ఆయనకు ఖచ్చితముగా తెలియును. మరియు మనము నివసించు ప్రదేశములో సాతాను తన భూలోక సింహాసనమును కలిగియున్నప్పటికీ ఆయన మనలను పవిత్రులనుగాను, జయించువారినిగాను ఉంచగలడు. ఆత్మ యొక్క ఖడ్గముతో మనముకూడా జయించగలము.


ఏ దీపస్థంభము కూడా ప్రకాశించుటకు పరిసరాలు చాలా చీకటిగా ఉన్నవని ఎన్నడూ ఫిర్యాదు చేయదు. ఒక దీపస్థంభము యొక్క ప్రకాశముకు దాని పరిసరాలతో ఎటువంటి సంబంధము లేదు. దాని కాంతి కేవలము దానిలోనున్న నూనెపైన ఆధారపడియుండును.


ఏ స్థానిక సంఘముతోనైనా ఆవిధముగానే ఉండును. పరిసరాలు చెడుగా ఉండవచ్చు. సాతానుకు ఆ పట్టణములో సింహాసనముండవచ్చు. కాని ఒక సంఘము పరిశుద్ధాత్మ అనెడి నూనెతో నింపబడినయెడల, దాని కాంతి బాగా ప్రకాశించును. నిజానికి, పరిసరాలు చీకటిగా ఉన్న కొలదీ, అటువంటి పరిసరాలలో ఏ కాంతియైన ఎక్కువ ప్రకాశవంతముగా కనబడును! నక్షత్రములు పగటి పూటకాక, రాత్రిపూటయే కనబడును.


ఆయన యందలి విశ్వాసమును హింసించబడిన సమయాలలో కూడ విసర్జించనందుకు, తన నామమును గట్టిగా చేపట్టినందుకు ప్రభువు ఈ సంఘమును మెచ్చుకొనెను. తన విశ్వాసము నిమిత్తము తన ప్రాణమునర్పించిన అంతిపయను నమ్మకమైన సాక్షిగా ఆయన ప్రత్యేకముగా పేర్కొనెను.


దేవుని సత్యముకొరకు ఒంటరిగా నిలబడవలసివచ్చినప్పటికీ అంతిప నిలబడెను. అతడు మనుష్యులను సంతోషపెట్టుటకు చూడని ఒక ధృడ నమ్మకము కలిగిన వ్యక్తి. దేవుని ఎరిగినవారు తాము నమ్మినవాటిని ఎంత మంది నమ్ముచున్నారో తెలుసుకొనుటకు తమ చుట్టూ చూడవలసిన అవసరము లేదు. అవసరమైతే, లోకమంతటిలో ఉన్నవారందరికీ వ్యతిరేకముగా ప్రభువుకొరకు నిలబడుటకు వారు సిద్ధముగానుందురు. అంతిప అటువంటి వ్యక్తి దాని ఫలితముగా అతడు చంపబడెను.


అతడు మనుష్యులను సంతోషపెట్టువాడైయుండినయెడల, అతడు మరణమును తప్పించుకొని యుండవచ్చును. దేవుడు బయలుపరచిన సత్యము కొరకు రాజీపడకుండా నిలబడుటచేత అతడు చంపబడెను. ప్రజలు బహుశా అతనిని సంకుచితమైన మనస్సు గలవాడని, మొండివాడని, ఇతరులతో కలవనివాడని, మతి చెలించిన వాడని అనియుండవచ్చును. కాని దానిని అతడు పట్టించుకొనలేదు. అతడు మాత్రము తన ప్రభువు నమ్మకముగా, పాపమునకు లోకానుసారతకు, సర్దుబాటుకు, దేవుని వాక్యము పట్ల అవిధేయతకు, అపవాదికి వ్యతిరేకముగా నిలబడెను. సాతాను రాజ్యమునకు ముప్పుగా ఉన్న మనుష్యుడు ఇక్కడొకడుండెను.


బహుశా అంతిప పెర్గెములో ఉన్నందుకే సాతాను తన సింహాసనము అక్కడుంచుటకు నిర్ణయించెనేమో. సాతాను కూడా అతడంటే భయపడినాడంటే అంతిప ఎటువంటి వ్యక్తి అయ్యుండెనో!


దేవునికి అంతిప వంటి వ్యక్తులు ప్రపంచములోని ప్రతి ప్రదేశములో కావలెను. మనము నమ్మినదాని కొరకు వెలచెల్లించవలసిన సమయమొచ్చుచున్నది. మన చుట్టూఉన్న బబులోను క్రైస్తత్వమంతాకూడా రాజీపడి క్రీస్తువిరోధికి మ్రొక్కును. ఆ రోజున మనము అంతిపవలె నిలకడగా నిలబడి యుందుమా? లేక మన జీవితమును కాపాడుకొనుటకు సాతానుకు మోకాలు వంచెదమా? దేవుని సత్యమునిమిత్తము మన జీవితాలు పొగొట్టుకొనుట తగినదే అని మనము ఒప్పించబడ్డామా?


ఈ రోజున దేవుడు మనలను చిన్న శోధనల ద్వారా పరీక్షించుచున్నాడు. మనము ఈ చిన్న శోధనలలో నమ్మకస్తులుగా ఉండినప్పుడే భవిష్యత్తులో రానున్న పెద్ద శోధనలలో నమ్మకస్థులుగా ఉండగలము. సాతాను తన రాజ్యమునకు నిన్నెంత ముప్పుగా ఎంచవలెనంటే అతడు తన సింహాసనమును నీవు నివసించు ప్రదేశమునకు మార్చును.


అంతిప యొక్క మరణము తరువాత క్షీణత


విషాదకరమైన విషయమేమిటంటే అంతిప చనిపోయిన తరువాత పెర్గెములో ఉన్న సంఘము ఆత్మీయముగా దిగజారిపోయెను. అంతిప బ్రతికియున్నప్పుడు అతడు బహుశా ఆ సంఘము యొక్క దూత అయియుండవచ్చును. అతడు చనిపోయిన తరువాత, వేరొకరు అతని స్థానమును తీసుకొనిరి మరియు ఆ సంఘము దిగజారిపోయెను. ఇది అనేక సంఘముల యొక్క విషాదకరమైన చరిత్ర. పౌలు ఎఫెసును విడచి వెళ్ళినప్పుడు, తను వెళ్ళిపోయిన తరువాత అక్కడి సంఘము రాజీపడి దిగజారిపోవునని తనకు తెలుసని అక్కడి పెద్దలతో చెప్పెను (అపొ.కా. 20:28-31). పౌలు అక్కడ ఉన్నంతవరకు పాపమునకు లోకానుసారతకు వ్యతిరేకముగా పోరాడి క్రీస్తువిరోధి యొక్క ఆత్మను దూరముగా నుంచెను. కాని పౌలు వెళ్ళిపోయిన తరువాత అది చేయుటకు ఎఫెసులో తగినంత (ఆత్మీయముగా) బలమైన వారు లేకపోయెను. కాబట్టి, తోడేళ్ళు గొర్రెల మంద మధ్యకు వచ్చి గొర్రెలను స్వేచ్ఛగా మ్రింగివేయగా పెద్దలు ప్రక్కన నిలబడి చూస్తుండిరి!


అంతిప చనిపోయిన తరువాత సాతాను తన వ్యూహాలను మార్చుకొనెను. సాతాను సింహాసనము ఒక ప్రదేశములో ఉంటే దాని అర్థము అతడు అక్కడి సంఘముపై ఎల్లప్పుడు హింసతో దాడిచేయును అని కాదు. అతడు లేఖనములలో గర్జించు సింహము అనేకాక (1 పేతురు 5:8) ఒక వెలుగు దూత వేషము వేసుకొనే తెలివైన సర్పముగా కూడా వర్ణింపబడెను (ప్రకటన 12:9, 2 కొరింథీ 11:4). గడచిన శతాబ్దాలలో అతడు సంఘమును బయటనుండి హింసిచుట కంటే లోపలనుండి అపవిత్రతతో (లోకానుసారతతో) పాడుచేయుట ద్వారా తన ఉద్దేశాలను మెరుగైన రీతిగా నెరవేర్చవచ్చని కనుగొనెను. పెర్గెములో అతడు చివరిగా ''బిలాము సిద్ధాంతము'' ద్వారా దీనిని చేసెను - ఎక్కడైతే హింసతో సఫలమవ్వలేదో అక్కడ ఈ విధముగా సఫలమయ్యెను!


బిలాము యొక్క బోధ (సిద్ధాంతము)


''బిలాము బోధను అనుసరించువారు మీలో కొందరున్నారు'' అని ప్రభువు ఇక్కడి సంఘముతో చెప్పెను.(14వ వచనము) ఇశ్రాయేలీయులను శపించుటకు బిలాము రాజైన బాలాకు యొద్ద జీతము తీసుకొనెను. మనము బైబిలులో చదివే ''జీతము కొరకు బోధించువారిలో'' ఇతడు మొదటివాడు.


ఈ రోజున క్రైస్తవ లోకము బ్రతుకు తెరువు కొరకు బోధించే ఇటువంటి జీతగాళ్ళతో నింపబడియున్నది. దేవుని మందకు కాపరులుగా ఉన్నట్లు నటించి, కేవలము గొర్రెల బోచ్చుకత్తిరించుటకు ఆసక్తి చూపించు ఇటువంటి జీతగాళ్ళకు దేవుడు వ్యతిరేముగానున్నాడు.


బాలాకు బిలామును మొదట పిలచినప్పుడు, అతడు వెళ్ళలేదు, ఎందుకనగా దేవుడతనికి ప్రత్యేకముగా వెళ్ళవద్దని చెప్పెను. కాని బాలాకు ఎక్కువ జీతము మరియు ఎక్కువ ఘనతను ఇచ్చెదనని చెప్పినప్పుడు బిలాము ''దేవుని చిత్తమును మరల వెదికెను'' - ఈనాడు అటువంటి పరిస్థితులలో అనేకులు చేయునట్లే అతడు కూడా చేసెను. బిలాము డబ్బు వెనుక వెళ్ళుట ద్వారా తననుతాను నాశనము చేసుకొనుటకు దేవుడు అనుమతించెను. మరియు దేవుడు ఈనాడు అనేక మంది క్రైస్తవ బోధకులను బిలాము యొక్క అడుగుజాడలలో నడచి చివరకు బిలాము యొక్క గతి పట్టునట్లు అనుమతించును.


బిలాము తాను ఇశ్రాయేలును శపించలేనని చూచినప్పుడు, ఇశ్రాయేలీయులను జారత్వము మరియు విగ్రహారాధన చేయుటకు శోధించి వారిని పాడుచేయుమని అతడు బాలాకుకు సలహానిచ్చెను (సంఖ్యాకాండము 24 మరియు 25). ఈ విధముగా బిలాము దేవుడు వారిని శిక్షించునట్లు చేయుటలో సఫలమాయెను.


ఆ విధముగానే సాతాను పెర్గెములో కూడా సఫలమాయెను. సంఘము ఒక విధముగా అపవిత్ర పరచబడ (లోకానుసారముగా మారనంతవరకు) నంతవరకు దానిని జయించలేనని అతడు ఎరిగెను. కాబట్టి అతడు సంఘమును లోపలినుండి పాడుచేసెను. ఈ విధముగా ఆ సంఘము ప్రభువుకొరకు సాక్ష్యమిచ్చుటలో మరియు సాతానుకు వ్యతిరేకముగా పోరాడుటలోకూడా అసమర్థముగా మారిపోయెను.


''వారిని ఓడించలేకపోతే, వారితో కలసిపొండి'' అనేది సంఘమునకు సంబంధించి సాతాను యొక్క నినాదమై యున్నది. మరియు ఈ విధముగా ఈ ఇరవై శతాబ్దములలోను అనేక సంఘముల యొక్క సాక్ష్యమును నాశనము చేయుటలో అతడు సఫలమాయెను.


పాతనిబంధన అంతటిలోనూ దేవుడు ఎక్కువగా ఖండించిన రెండు పాపములు విగ్రహారాధన మరియు జారత్వము. ఈ రోజున కూడా ఆయన ఈ రెండింటినీ ఖండించుచున్నాడు. క్రొత్త నిబంధన ప్రమాణాల ప్రకారము, ధనాపేక్ష కలిగియుండుట లేక డబ్బును గాని, ఒకరి వృత్తిని గాని, లేక భూసంబంధమైన దేనినైనా ఆరాధించుట విగ్రహారాధన. మరియు ఒకరి కళ్ళతో ఒక స్త్రీని మోహపు చూపులు చూచుట జారత్వము. నీ భార్యను వేరొకరి భార్యతో ఏ విషయములోనైనా ప్రతికూలముగా పోల్చుట ''నీ పొరుగువాని భార్యను ఆశించుట''. ఇది కూడా జారత్వమే.


ఏ సంఘములోనైతే ఈ క్రొత్త నిబంధన ప్రమాణములు క్రమము తప్పకుండా బోధింపబడవో, ఆ సంఘ సభ్యులలో రహస్య విగ్రహారాధన మరియు జారత్వము వ్యాపించును మరియు ఆ సంఘము త్వరలోనే పెర్గెములో ఉన్న సంఘము వలెయగును.


పెర్గెములో ఉన్న సంఘమును లోకానుసారత (లోకము) అధిగమించినప్పుడు, విషాదకరమైన విషయమేమిటంటే, ఆ సంఘపు దూత అది జరుగుట చూచెను కాని దాని గురించి ఏమి చేయలేదు. ఒక ప్రవాహము వలే వారి సంఘములలోనికి వచ్చియున్న లోకానుసారతకు వ్యతిరేకముగా అనేక పెద్దలు అదే విధముగా శక్తి విహీనముగా ఉన్నారు.


పెర్గెములోని దూత స్వయంగా బిలాము యొక్క సిద్ధాంతముకు లోనై పోలేదు. పెర్గెములో ''కొందరు'' మాత్రమే దానికి ఎరగా పడిపోయిరి. కాని ఆ దూత సంఘములోనికి వచ్చిన లోకానుసారతను గద్దింపలేదు గనుక అతడు అపరాధి. అతడు విఫలమైనది ఇక్కడే.


అతడి వైఫల్యమునకు కారణము అతడు తన తలంపులలో అటువంటి లోకానుసారతను తీవ్రముగా తీర్పు తీర్చుకొనకపోవుట కావచ్చును. మన శరీరములో సిలువవేసిన వాటిపైనే మనము సంఘములో అధికారము కలిగియుండగలము. మనము మన జీవితాలలో పాపమును లోకానుసారతను తేలికగా తీసుకొన్నప్పుడే మనము సంఘములోని ఇతరుల జీవితాలలో కూడా వాటిని సహించెదము.


ఒక పెద్దకు తన సంఘములోనున్న ఒక లోకానుసార వ్యక్తి పట్ల ఉన్న ''కనికరము''తో కూడిన వైఖరి ఆ పెద్ద హృదయములో ఉన్న తీర్పు తీర్చబడని లోకానుసారత వలన సాధారణముగా నిర్దేశించబడును. పెర్గెమలోని దూత లోకానుసారమైన బోధల పట్ల ఎంత నిర్లక్ష్యముగా నుండెనంటే అతడు నికోలాయితుల బోధను తన సంఘములో వర్ధిల్లుటకు అనుమతించెను (15వ వచనము). యాజక క్రమము ఒక సిద్ధాంతముగా పెర్గెములోని సంఘములో కొందరి చేత బోధింపబడుచుండెను! అయితే ఆ దూత దాని గురించి ఏమియూ చేయలేదు. ప్రభువు అతనికి వ్యతిరేకముగా కలిగియున్న మరొక విషయమిదే.


ప్రభువు అతనిని మరియు ఆ సంఘమును మారుమనస్సు పొందమని హెచ్చరించెను. అలా వారు చేయని యెడల, తన నోటినుండి వచ్చు ఖడ్గముతో వారిని తీర్పు తీర్చెదనని వారితో చెప్పెను (16వ వచనము). దేవుడు ఆయన వాక్యము చేత మనకు తీర్పు తీర్చును. ఆయన మనతో చెప్పిన మాట చేత అంత్య దినమందు మనమందరము తీర్పుతీర్చబడెదమని యేసు చెప్పెను (యోహాను 12:48). మన జీవితములు మనము విన్న దేవుని మాటలతో పోల్చబడును, మరియు వాటినిబట్టి మనము తీర్పుతీర్చబడెదము.


జయించువానికి ఇచ్చిన పిలుపు


జయించువానికి మరుగైయున్న మన్నా మరియు క్రొత్త పేరు చెక్కబడిన ఒక తెల్లరాయి ప్రతిఫలముగా వాగ్దానము చేయబడెను (17వ వచనము). పాత నిబంధనలో, ప్రత్యక్షపు గుడారము యొక్క అతి పరిశుద్ధ స్థలములో పరలోకమునుండి పడిన కొంచెము మన్నాను దాచిపెట్టమని మోషేకు చెప్పబడెను (నిర్గమ16:33,34). ఇశ్రాయేలీయులు తమ గుడారములలో ఉంచుకొన్న మన్నా 24 గంటలలో కంపు కొట్టినప్పటికీ (నిర్గమ 16:19,20) మందసములోనున్న ''దాచబడిన మన్నా'' ఇశ్రాయేలీయులు అరణ్యములో తిరిగిన 40 సంవత్సరాలంతా తాజాగా ఉండెను. ఆయన ముఖము యెదుట (ఆయన సన్నిధిలో) మనము అన్నిసమయములలో నివసించినయెడల, అతి పరిశుద్ధ స్థలములోనున్న దేవుని సన్నిధి యొక్క శక్తి మనలను అదే విధముగా తాజాగా ఉంచగలదు.


శరీరమను తెరచినుగుట ద్వారానే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము కలదు (హెబ్రీ 10:20). యేసు మన కొరకు తన శరీరము ద్వారా ఆవిష్కరించిన మార్గము ఇదే. మనము ఈ నూతనమైన జీవముకలిగిన మార్గములో నడచిన యెడల, మనము దేవుడిచ్చు మరుగైన మన్నాను పొందగలము - అది ఆయన వాక్యము నుండి ప్రత్యక్షత మరియు ఆయనతో సహవాసము. మరియు మన జీవితాలు ప్రభువు యొక్క తాజాదనము యొక్క పరిమళాన్ని ఎల్లప్పుడు కలిగియుండును.


జయించువాని పేరు వ్రాయబడియున్న మరుగైన అమూల్యరాయి (17వ వచనము) ఒక వధువుకు తన వరునితో కలిగియున్న సన్నిహితమైన సంబంధమును ప్రభువుతో కలిగియుండుటను సూచించుచున్నది. ఇది లోకస్థులైన పురుషులు తమ కాబోయే భార్యలకు ఇచ్చే నిశ్చితార్థపు ఉంగరముకు (ఈ ఉంగరము ఒక ఖరీదైన వెలగల రాయి కలిగియుండును మరియు దానిపై పేరు చెక్కబడియుండును) ఆత్మీయముగా సమానమైనది.


వరుడు వధువును ఇంకెవరికీ తెలియని ఒక సన్నిహితమైన పేరుతో పిలచును (17వ వచనము). ప్రభువుతో వివాహ సాన్నిహిత్యము జయించువారందరికీ ప్రతిఫలముగా వాగ్ధానము చేయబడినది.


ఒక సగటు విశ్వాసి పాపమును లోకానుసారతను తీవ్రముగా ద్వేషించడు గనుక, అతడు క్రీస్తుతో ఒక ఎండిపోయిన మరియు విసుగుపుట్టించే సంబంధమును కలిగియుండును. కాని నిజముగా జయించువాడు ఒక వధువు గాఢంగా ప్రేమించే తన వరుడితో కలిగియున్నటువంటి పారవశ్యం కలిగించే ఆత్మీయ సంబంధమును కలిగియుండును. ఇటువంటి సంబంధము ''పరమగీతము''లో వర్ణించబడినది- అయితే ఒక జయించువాడు మాత్రమే దానిని పూర్తిగా అర్థము చేసుకొనగలడు మరియు అనుభవించగలడు.


అధ్యాయము 7
వ్యభిచరించు(జారత్వముచేయు) సంఘము

''తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము - అగ్ని జ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములును గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా - నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరిఎక్కువైనవని యెరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడా వ్యభిచరించువారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫల మిచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక, సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా - మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చువరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక!'' (ప్రకటన 2:18-29).


ఒక అబద్ధ ప్రవక్త్రి


ఆయనకు అగ్ని జ్వాల వంటి కన్నులున్నవని ఇక్కడ ప్రభువు చెప్పెను (18వ వచనము). ఆయన మన హృదయముల యొక్క మరుగైన తలంపులను ఉద్ధేశ్యములను వెదకును - కాబట్టి కేవలము పైరూపమును లక్ష్యపెట్టే మనుష్యుల వలే ఆయన తీర్పు తీర్చడు. ఆయన పాదములు అపరంజిని పోలినవి - దీని అర్థము ఆయన పాపమును కఠినముగా తీర్పు తీర్చుటను నమ్మును. కల్వరి సిలువ నుండి ఒక్క స్పష్టమైన సందేశము మనకు వస్తే, అది ఇదే: దేవుడు పాపమును ద్వేషించును మరియు అది ఎక్కడ కనబడినా దానిని కఠినముగా తీర్పు తీర్చును.


తుయతైరలో ఉన్న సంఘము మరియు దాని దూత యొక్క క్రియలను, ప్రేమను, విశ్వాసమును, సహనమును ప్రభువు ఎరిగియుండెను. మరియు ఆ క్రియలయొక్క పరిమాణము గణనీయముగా పెరిగినప్పటికీ (19వ వచనము) వాటి నాణ్యత తగ్గిపోయెనని ఆయన గమనించెను. సర్థుబాటు చేసికొనుట మరియు లోకానుసారత సంఘములోనికి వచ్చెను.


ఈ సర్థుబాటుకు ముఖ్యకారణము ఆ దూత ఒక స్త్రీ (ప్రతీకాత్మకంగా యెజిబెల్‌ అని పిలువబడినది) ఆ సంఘమును ఒక చెడు, లోకానుసారవిధముగా ప్రభావితము చేయుటకు అనుమతించెను (20వ వచనము). ఆమె ఒక ప్రవక్త్రిగా నటించెను కాబట్టి ఆ సంఘపు దూత మోసపోయెను.


క్రీస్తు సంఘమునకు ప్రవక్తలను ఇచ్చినప్పటికీ, ఆయన ప్రవక్త్రిలను ఇవ్వలేదు (ఎఫెసీ 4:11,12 చూడండి). స్త్రీలు సంఘ కూడికలలో ప్రవచించుటకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడవచ్చును (అపొ.కా. 2:17, 1కొరింథీ 11:5). ఫిలిప్పు కుమార్తెలు అలా చేసిన వారికి ఉదాహరణలు (అపొ.కా. 21:9). పురుషులు మరియు స్త్రీలు ప్రవచింపవచ్చును - అంటే సంఘమును ప్రోత్సహించుటకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు దేవుని వాక్యమును పంచుకొనుట (1కొరింథీ 14:3). ఈ వరమును అపేక్షించుటకు విశ్వాసులందరు ప్రోత్సహించబడుచున్నారు (1కొరింథీ 14:1, అపొ.కా. 2:18). కాని ఒక ప్రవక్తకు మరియు ఒక ప్రవచించు వానికి వ్యత్యాసమున్నది. క్రొత్త నిబంధన క్రింద ప్రభువు ఎన్నడూ ఒక స్త్రీని ప్రవక్త్రిగా నియమింపలేదు - దీనికి కారణము దేవుడు ఒక స్త్రీ, పురుషుని పైన అధికారము చేయుట ఉద్ధేశించలేదు.


పాత నిబంధన క్రింద ప్రవక్త్రిలు ఉండిరి. వారిలో అయిదుగురి గురించి మనము బైబిలులో చదువవచ్చును, వారిలో అన్న చివరిది (లూకా 2:36). వారందరూ దేవుని వాక్యమును అధికారముతో మాట్లాడిరి. అటువంటి ప్రవక్త్రి యొక్క ఒక ఉదాహరణ దెబోరా (న్యాయాధిపతులు 4). కాని క్రొత్త నిబంధన క్రింద, సంఘములో అధికారమును ప్రభువు ఎల్లప్పుడు పురుషులకే ఇచ్చెను.


సంఘములో పురుషునిపై స్త్రీ అధికారము చేయుటకు దేవుడు అనుమతించకుండుటకు పౌలు మనకు రెండు కారణములనిచ్చెను: 1. ఆమె పురుషుని తరువాత సృష్టింపబడినది- అతనికి సాటియైన సహాయముగా ఉండుటకు 2. ఆమె సాతానుచేత మొదట మోసగింపబడెను (1తిమోతి 2:12-14). ఒక పురుషని కంటే ఒక స్త్రీ సాతాను చేత మోసగింపబడుటకు ఎక్కువ అవకాశమున్నది. క్రీస్తు సంఘములో బోధకురాళ్ళను నియమింపకుండుటకు ఇది ఒక కారణము. అయితే యెజెబెలు తనను ప్రవక్త్రి అని పిలచుకొనినది. తుయతైరలో ఉన్న సంఘపు దూత ఎంత బలహీనముగా ఆత్మన్యూనతగా ఉండెనంటే అతడు ఆమెను మాట్లాడకుండా (మౌనముగా) ఉంచలేకపోయెను.


ఒక ఇంటిలో, గృహమునకు శిరస్సైయుండవలసిన పురుషుడు బలహీనముగా, ఆడంగితనముగలవానిగా ఉన్నయెడల, అతని భార్య ఆ గృహమునకు నాయకత్వమును వహించును. ఒక సంఘములో కూడా ఇది నిజమగును. సమర్థవంతమైన స్త్రీలు ఒక సంఘములోని పెద్దలు బలహీనులైయుండుట చూచినప్పుడు, వారు తమ్మును తాము ఆ సంఘములో ఘనపరచుకొందురు (పైకెత్తుకొందురు).


దేవుని వాక్యము మనలను ''పౌరుషముగలవారిగా'' ఉండమని హెచ్చరించుచున్నది (1కొరింథీ 16:13). సమర్థవంతమైన స్త్రీలను మౌనముగా ఉంచుటకు ఈ రోజున అనేక పెద్దలకు ఒక జెల్లీచేపకున్నంత వెన్నెముక ఉంది గనుక, ఈ హెచ్చరికకు గొప్ప అవసరమున్నది! వారు, తన భార్యయైన యెజబెలుకు భయపడిన రాజైన ఆహాబు వలే ఉన్నారు. ఆహాబు ఎంత భయపడెనంటే తన రాజ్యములో ఆమెకిష్టమొచ్చినది చేయుటకు అతడు అనుమతించెను- ఏ పాపము చేయని దైవభయము కలిగిన ప్రజలను హత్య చేయుటకు కూడా అనుమతించెను (1రాజులు 21). ఆహాబు పేరుకు మాత్రమే ఇశ్రాయేలు యొక్క శిరస్సుగా (అధిపతిగా) నుండెను. యెజెబెలు ఆ రాజ్యమును నిర్వహించెను. అనేక మంది సంఘ-పెద్దలు సరిగ్గా అహాబువలెనే వ్యవహరించుదురు!


అయితే ఏలియా యెజెబేలు యొక్క అబద్ధ ప్రవక్తలందరికీ వ్యతిరేకముగా నిలబడి, వారినందరినీ హతమార్చిన ఒక భయపడని దైవజనుడు (1రాజులు 18:40). అందుకనే యెజెబేలు ఏలియాను ద్వేషించెను. మరియు ఆమె అతనికి భయపడెను కూడా. ఆ సమయములో ఇశ్రాయేలులో యెజెబేలు యొక్క విగ్రహాలకు మ్రొక్కని 7000 మంది జనులుండిరి. దేవుడే ఇది చెప్పెను (1రాజులు 19:18). కాని యెజెబేలు వారిలో ఎవ్వరికీ భయపడలేదు. ఆమె ఏలీయాకు మాత్రమే భయపడెను. ఆ 7000 మంది తన విగ్రహములకు మ్రొక్కకపోయినను తనకు భయపడిరని ఆమెకు తెలియును.


ఈనాడు ఒక యెజెబేలు 99.9% మంది విశ్వాసులకు భయపడదు, ఎందుకనగా ఆ విశ్వాసులు ఆమెతో ఏకభవించనప్పటికీ ఆమెను ఆపలేరని ఆమెకు తెలుసు. యెజెబేలులు ఏలియాలకు మాత్రమే భయపడుదురు. అయితే ఏలియాలు ఈ రోజున క్రైస్తత్వములో అరుదుగా ఉన్నారు. ఈ రోజు ఉన్న యెజెబేలులు ఏలియా వంటి పెద్దలను ద్వేషించి ఆహాబు వంటి పెద్దలను ప్రేమించుదురు. ప్రతి సంఘము యొక్క పెద్ద ఈ విషయములో ఏలియాను గాని ఆహాబును గాని అనుసరిస్తున్నాడు.


పెద్ద యొక్క భార్య


ఇక్కడ ''స్త్రీ'' అని అనువదించబడిన గ్రీకు పదము ''భార్య'' అని కూడా అనువధింపబడవచ్చును. దీని అర్థము యెజెబేలు ఆ సంఘపు దూత యొక్క భార్య అని. ఇది నిశ్చయముగా ఆ దూతకు పరిస్థితిని ఎక్కువ క్లిష్టమైనదిగా చేసియుండును.


ఆ దూత ప్రభువు యొక్క నిజమైన శిష్యునిగా ఉండి (యేసు తన శిష్యులకు చేయమని చెప్పినట్లు - లూకా 14:26) తన భార్యను ద్వేషించుట నేర్చుకొనియుండిన యెడల, ఎటువంటి సమస్య ఉండెడిది కాదు. కాని అతడు ఖచ్చితముగా తన భార్యను ప్రభువు కంటే సంఘము కంటే ఎక్కువ ప్రేమించెను. కాబట్టి అతడామెను అభ్యంతరపరచలేదు. కాబట్టి సంఘములో ఆమె తన కిష్టమొచ్చినట్లు చేయుటకు అనుమతించెను. ఆ విధముగా తుయతైరలో ఉన్న సంఘము పాడైపోయెను. మరియు అదే విధముగా ఈనాడు అనేక సంఘములు పాడైపోవుచున్నవి.


అనేక సంఘములు ఒక యెజెబేలు చేత నాశనము చేయబడినవి, ఈమె తరచు ఒక బలహీనమైన ఆడంగితనము కలిగిన ఒక పెద్ద యొక్క భార్య యైయుండును. అటువంటి స్త్రీ సంఘ కూడికలలో తరచుగా భాషలలో మాట్లాడుచూ, లేక తన ''భాషలకు'' అర్థం చెప్పుచూ, లేక దీర్ఘ ప్రార్థనల ద్వారా, లేక ఇతర మోటైన బైబిలు వ్యతిరేక పద్ధతులలో తనకుతాను ప్రాముఖ్యత కల్పించుకొనుటకు చూచును. ఇంటియొద్ద తన భర్తను ప్రభావితం చేయుట ద్వారా ఆమె పెద్దల యొక్క నిర్ణయాలను కూడా మార్చుటకు చూచును.


సంఘమునకు చెందిన విషయాలను పెద్దల కూడికలో చర్చించిన తరువాత, ఇంటికి వెళ్ళి ఈ విషయాలను తమ భార్యలతో చర్చించే కొందరు అవివేకులైన పెద్దలున్నారు. అప్పుడు ఇంటి యొద్ద తమ భార్యలచేత ప్రభావితము చేయబడి, ఈ ఆడంగితనము గల పురుషులు వారి మారిపోయిన అభిప్రాయాలను పెద్దల యొక్క తరువాతి కూడికలో వ్యక్తపరచుదురు!! మరియు మునుపటి కూడికలో తీసుకొన్న నిర్ణయాలు అప్పుడు మార్చబడును!! ఒక మరుగైయున్న యెజెబేలు ఒక సంఘమును ప్రభావితము చేయుటకు అటువంటి శక్తి కలిగియున్నది!!


వేరే సందర్భాలలో, ఆ యెజెబేలు సంఘపు పెద్దలో ఒకరిపైన ఎదోఒక మానసికమైన రీతిగా ప్రభావము సాధించిన స్త్రీయై యుండవచ్చును. కొందరి పెద్దల భార్యలు ఎంత శక్తివంతమైన వ్యక్తిత్వములను, మానసికమైన శక్తిని కలిగియుందురంటే, సంఘములో వేరే పురుషులు (పెద్దలతో సహా) వారిని ఏ విధముగానైనా భాదపెట్టుటకు భయపడుదురు. కొన్ని సంధర్భాలలో ఆమె భర్త కూడ ఆమెకు భయపడతాడు.


ఏ ప్రదేశములోనైనా, అక్కడున్న సంఘములోని పెద్దలు, ఒక స్త్రీ వారిపై ఏ విధముగానైన అధికారము కలిగియుండుటకు అనుమతించినయెడల అక్కడ క్రీస్తు శరీరమును కట్టుట అసాధ్యము. ఒక పెద్ద యొక్క భార్య ''సాధువైన మృదువైన గుణము'' కలిగియుండి, అన్ని సమయములలో తనను తాను దాచుకొనుటకు అదనపు జాగ్రత్త వహించి, ఇతరులకు మాదిరిగా ఉండవలెను. ఆమె సహాయక పాష్టరుగా, లేక పాటలు నడిపించేవ్యక్తిగా లేక సహాయక నిర్వాహకునిగా (అనేకమంది స్త్రీలు ఉన్నట్లు) ఉండక, తన భర్తకు మరుగైయున్న సహాయముగా ఉండి, వెనుక నుండి సంఘమును నడిపించుటకు ఆశింపకూడదు. స్త్రీలగా వారి హద్దులను గుర్తించుటవలన, తమ భర్తలైన పెద్దలకు నిజమైన సహాయకులుగా ఉన్న భార్యలు కూడా ఉన్నందుకు దేవునికి స్తోత్రములు. అటువంటి భార్యను కలిగిన పెద్ద ధన్యుడు.


సంఘములో ఏ విధముగానైనా ప్రాముఖ్యత కోసం చూసే ఏ స్త్రీ పైనైనా పెద్దలందరు ప్రత్యేకముగా దృష్టియుంచవలెను. ఆమె నిశ్చయముగా ఒక యెజెబేలు ఆత్మను కలిగియుండును. ఆమెకు స్వేచ్ఛ నిచ్చినయెడల, ఆమె సంఘమును నెమ్మదిగా అయినప్పటికి నిశ్చయముగా నాశనము చేయుటకు సాతాను యొక్క ప్రతినిధిగా మారును.


ఇక్కడ చెప్పబడిన ''జారత్వము'' (20వ వచనము) నిశ్చయముగా ఆత్మీయ పరమైనది - ఎందుకనగా నీతిమంతుడైన దేవుడు జారత్వము వలన పుట్టిన అమాయకపు పిల్లలను శిక్షింపలేడు. ఆత్మీయ జారత్వము శరీర జారత్వము కన్నా ఎక్కువ ప్రమాదకరమైనది, ఎందుకనగా అది తక్కువగా గుర్తించబడును. మతపరమైన జారత్వము విశ్వాసులను పాపమును తేలికగా తీసుకొనుటకు నడిపించే అబద్ధ కృప యొక్క బోధకు ఫలితము. చిన్న విషయాలలో దేవునికి అవిధేయత మరియు చిన్న అవిశ్వాస్యతలను పట్టించుకొనరు. ఇటువంటి బోధయే వేశ్యా సంఘమైన బబులోనును కట్టును. మరియు దీనినే ప్రభువు ఇక్కడ ఆక్షేపించుచున్నాడు (నిందించుచున్నాడు).


మారుమనస్సు పొందుటకు సమయము


యెజెబేలు మారుమనస్సు పొందుటకు ప్రభువు సమయమునిచ్చెను (21వ వచనము). మారుమనస్సు పొందుటకు యెజెబేలులకు కూడా సమయమివ్వబడును. దేవుని కనికరము అటువంటిది. కాని దేవుడు ఆమె మారుమనస్సు పొందుటకు ఒక కాలపరిమితినిచ్చెను. ఆమె ఆ సమయములోపల మారుమనస్సు పొందనియెడల, ఆమెకు తీర్పు తీర్చబడును. యెజెబేలు మాత్రమే కాక, ఆమెతో వ్యభిచరించు వారందరూ, ఆమె పిల్లలనూ చంపబడుదురు (22,23 వచనములు). పాపుల యెడల వేషదారుల యెడల దేవుని సహనము నిత్యము ఉండదు.


ఆత్మీయ జారత్వములో యెజెబేలు యొక్క భాగస్వాములు ఆమెతో కూడా ఈ తప్పుడు బోధను ప్రచారము చేసినవారు. ఆమె ''పిల్లలు'' అబద్ధ కృపను బోధించుట వలన ఉత్పత్తి అయిన అర్ధ మారుమనస్సు పొందిన మిశ్రమ జాతి. వీరు మొదట పాపమునుండి పశ్చాత్తాపపడకుండానే మారిపోయామని ఊహించుకొందురు లేదా ''మారిపోయాము'' గనుక శరీరేచ్ఛల నిగ్రహము లేకుండుటను తేలికగా తీసుకోవచ్చని ఊహించుకొందురు.


లోకములో పాపములో నివసించు ప్రజలు దేవుని చేత అంత త్వరగా తీర్పుతీర్చబడరు. కాని సంఘములోనికి వచ్చి పాపమును తేలికగా తీసుకొనువారు అధిక తీవ్రముగా మరియు చాలా త్వరగా నిర్వహించబడుదురు. అననీయ సప్పీరా మరియు కొరింథులో పాపము చేసిన వారిపై దేవుని తీర్పు (1కొరింథీ 11:29,30) క్రీస్తు నామమును తేలికగా తీసుకొన్న వారిపై దేవుని తీవ్రతకు ఉదాహరణలుగా ఉన్నవి.


మీలో ప్రతివానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదనని ప్రభువు దాని తర్వాత చెప్పెను. ఇది ''మనము నమ్మితే చాలు మన క్రియలు వర్తించవు'' అని తుయతైర లోనున్న అబద్ధ కృప యొక్క బోధను ఎదుర్కొనుటకు ప్రభువు చెప్పెను. మన క్రియలు కూడా వర్తించును.


''ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైననూ సరే చెడ్డవైననూ సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును'' అని దేవుని వాక్యము చెప్పుచున్నది (2కొరింథీ 5:10). ''మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారైయుందురు'' (రోమా 8:13). తుయతైరలోనున్న సంఘములోని పాపులను ''బహు శ్రమల'' పాలు చేతునని ప్రభువు చెప్పెను (23వ వచనము).


క్రొత్త నిబంధనలో రెండు రకములైన శ్రమలగురించి చెప్పబడియున్నది. ప్రకటన గ్రంధములో ఈ రెండు రకముల గూర్చి మనము చదువుతాము: 1. యేసు శిష్యులకు వ్యతిరేకముగా హింసరూపములో మనుష్యుల యొద్దనుండి వచ్చేది - (క్రొత్త నిబంధనలో ఎక్కువ ప్రస్తావనలు ఇటువంటి శ్రమల గూర్చి ఉన్నవి). 2. తీర్పు రూపములో దేవుని యొద్దనుండి ''దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మపై'' వచ్చేది - (రోమీయులు 2:9 మరియు ప్రకటన 2:32లో మాత్రమే ఇటువంటి శ్రమల గూర్చి ప్రస్తావన చేయబడింది).


తుయతైరా సంఘములోని మారుమనస్సు పొందని పాపులను బహు శ్రమలపాలు చేతునని దేవుడు బెదరించెను. కాని ఇది క్రీస్తువిరోధి రోజులలో రానున్న మహాశ్రమలను సూచించుటలేదు - ఎందుకనగా అది ఇంకా భవిష్యత్తులో జరుగనున్నది, అయితే తుయతైర సంఘములోని పాపులు ఇప్పటికే మరణించిరి. కాబట్టి ప్రభువు పాపులైన వేషధారులపైన దేవుడు తెచ్చు తీర్పును గూర్చి చెప్పుచున్నాడని దీని అర్థము.


సాతాను యొక్క గూఢమైన సంగతులు


అయితే తుయతైరలో యెజెబేలుతో అంగీకరింపనివారు, ఆమె బోధలను పాఠింపని వారు కొందరుండిరి. వారితో ప్రభువు వారిపై ఇంకే భారము పెట్టనని చెప్పారు (24వ వచనము). వారు ''సాతాను యొక్క గూఢమైన సంగతులకు'' దూరముగా నుండిరి, ఎందుకనగా వారిలో ఉన్న అభిషేకము యెజెబేలు బోధించిన ఈ అబద్ధ కృపలో ఏదో తప్పుందని చెప్పెను; మరియు వారు ఈ అభిషేకమును వినిరి (1యోహాను 2:27). ఈ అబద్ధ కృప అను బోధను ప్రభువు ''సాతాను యొక్క గూఢమైన సంగతులు'' అని పిలచెనని గమనించండి.


క్రైస్తత్వములో ఎక్కువమందిని మోసపరచుటకు సాతాను ఉపయోగించిన సాతాను యొక్క కళాఖండాలలో అబద్ధ కృప ఒకటి. కాబట్టి దీనిని ''సాతాను యొక్క గూఢమైన సత్యములలో'' ఒకటని పిలచుట సముచితమే!


సిద్ధాంతము ఒక విత్తనము వంటిది. ఒక విత్తనము మంచిదా చెడ్డదా అన్న దానికి ఋజువు అది పండించిన ఫలములో కనబడును. అనేక మంది క్రైస్తవులు రకరకాల విత్తనాలను (సిద్ధాంతాలను) వారి వేదాంత సూక్ష్మదర్శిని క్రింద పెట్టి విశ్లేషించి కొన్ని మంచివని కొన్ని చెడ్డవని ప్రకటించెదరు. కాని ఒక విత్తనము యొక్క నాణ్యతను కనుగొనుటకు అది మార్గము కాదు. ఆ విత్తనము విత్తి అది ఏ రకమైన పలమును పండించునో చూచుట మెరుగైన మార్గము.


పాపము చేయుటకు భయమును తీసివేసే ''కృప'' యొక్క ఎటువంటి సిద్ధాంతమైనా నిశ్చయముగా ఒక అబద్ధపు బోధ. ఒక సిద్ధాంతము మిమ్ములను పాపమును తేలికగా తీసుకొనుటకు మరియు నిజమైన మారుమనస్సు కలిగించు లోతైన దు:ఖమును మరియు పాపము కొరకు తీవ్రమైన ద్వేషము లేకుండా చౌకగా క్షమాపణ అడుగుటకు అనుమతించిన యెడల, ఆ సిద్ధాంతము ''సాతాను యొక్క గూఢమైన సత్యములలో'' ఒకటని మీరు నిర్ధారించుకోవచ్చును!


ఈ రోజులలో ''అంత్యకాల సత్యములు'' మరియు ''సామ్రాజ్యపు సత్యములు'' అని మొదలగు ఆకట్టుకొనే మాటలను చెప్పే అనేకమైన విశ్వాసులున్నారు. ''సత్యము'' అన్న ప్రతిదానిని మనము విశ్లేషించుటకు ఉపయోగించే పరీక్ష యేసు స్వయంగా ఇచ్చిన పరీక్ష: ''సత్యము మిమ్ములను....పాపమునుండి...స్వతంత్రులుగా చేయును'' (యోహాను 8:32-36). నీ దైనందిన (రోజువారీ) జీవితములో పాపమునుండి నిన్ను విడిపించని ''సత్యము'' దేవుని సత్యము కాదు. అది నీకెంత లేఖనానుసారముగా కనబడినప్పటికీ అది ఒక తప్పుడు సిద్ధాంతమే.


నీవు దేవుని సత్యమును సరిగా అర్థముచేసుకొన్నావు అనుటకు ఒక సూచన ఏమిటంటే నీ జీవితములోనున్న ప్రతివిధమైన బంధకమునుండి మరి ఎక్కువ విడుదలను అనుభవించెదవు. పరిశుద్ధాత్మ సత్యస్వరూపియగు ఆత్మ మరియు ''ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్య్రము నుండును'' (2కొరింథీ 3:17).


ప్రభువు అప్పుడు తుయతైరలోనున్న శేషమును వారు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనమని హెచ్చరించెను- ఇది దేవుని సత్యమైన కృప (1పేతురు 5:12). మనము దీనిని గట్టిగా పట్టుకొనవలెను, ఎందుకనగా సాతాను దానిని మన యొద్దనుండి లాక్కొనుటకు ఇష్టపడును. యేసు వచ్చువరకు మనము దానిని పట్టుకొనవలెనని ఆజ్ఞాపింపబడియున్నాము (25వ వచనము).


జయించువానికి ఇచ్చిన పిలుపు


జయించువాడు అంతమువరకు ప్రభువు క్రియలను జాగ్రత్తగా చేయువాడని ఆయన చేత వర్ణింపబడెను (26వ వచనము). యేసు యొక్క క్రియలు ఆయన శరీరధారియైయున్న దినములలో శోధనపై జయములైయున్నవి. యేసు జయించినట్లే శోధనను జయించి, ఈ మార్గములో అంతము వరకు కొనసాగువాడే జయించువాడు.


జయించువానికి ప్రభువు భవిష్యత్తులో జనులమీద అధికారమును ప్రతిఫలముగా వాగ్దానము చేసెను (26వ వచనము). మనము ఈ రోజున ప్రపంచములో అధికారమును అర్థము చేసుకొన్నట్లు ఇది ఇతరులపైన పెత్తనం చెలాయించుట కాదు. ''అతడు వారిని ఏలును'' అన్న వాక్యము (27వ వచనము)నకు నిజమైన అర్థము. ''అతడు వారిని కాయును'' (ఇక్కడ ''ఏలును'' అన్న పదము ''కాయును'' అన్న గ్రీకు భాష పదము నుండి వచ్చింది).


ఇది జయించువాడు తన గృహములో సంఘములో ఇప్పుడు అమలుపరచే అధికారము, మరియు దానిని ఒక దినమున లోకములోని జనులపై అతడు అమలుపరచును. ఇతరులపై ఈ రోజున పెత్తనం చేయువారు, అది కుటుంబములోనైనా లేక సంఘములోనైనా, నిజానికి పైశాచిక పరమైన అధికారమును అమలుపరచుచున్నారు కాబట్టి జనములను కాయుటకు వారు తగరు. అధికారమున్న మనమందరము - తండ్రులు, తల్లులు మరియు పెద్దలు - ఇప్పుడు ప్రభువుచేత పరీక్షింపబడు చున్నాము.


ప్రభువు అప్పుడు ఈ వాక్యమును వాడెను, ''నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు'' (27వ వచనము). ఆయన ఎన్నుకొన్న వారందరికీ నిత్యజీవమిచ్చటకు తండ్రి యేసుకు ప్రధానముగా అధికారమునిచ్చెను (యోహాను 17:2). ఈ ఉద్దేశ్యముతోనే ప్రభువు కూడా తన దూతలకు సంఘములో అధికారమునిచ్చును - ఇతరులు నిత్యజీవము చేపట్టుటకు నడిపించుటకు (1తిమోతి 6:12). తన అధికారమును ఇంకా ఏ విధముగానైనా అమలుపరచే ఏ పెద్ద అయినా నిజముగా తన అధికారమును దుర్వినియోగపరచుచున్నాడు.


తమ జీవితాలపై ప్రభువు యొక్క ఈ అధికారమును తిరస్కరించిన వారు ఒక దినమున యేసు పట్టుకొనియున్న ఇనుపదండముతో నిర్వహించబడుదురు (కీర్తనలు 2:7-9; ప్రకటన 12:5, 19:15). ప్రభువు ఆ ఇనుపదండమును జయించువానితో పంచుకొనును. అతడు భూమిపై నివసించిన సమయములో, అధికారమను దండమును సున్నితముగాను మరియు దృఢముగాను వాడుట నేర్చుకొని యుండును (ప్రకటన 2:26,27).


''పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్టుడు'' (సామెతలు 16:32). వారి శరీరేచ్ఛలను, లోకపు ఆకర్షణలను మరియు సాతాను తంత్రములను జయించువారు మాత్రమే ఆయన రాజ్యములో జనములను ఏలుటకు దేవుని దృష్టిలో నిజముగా అర్హత పొందినవారు.


జయించువానికి ''వేకువ చుక్క'' కూడా వాగ్ధానము చేయబడినది (28వ వచనము). వేకువ చుక్క స్వయంగా యేసే (ప్రకటన 22:16 చూడండి). యేసు దుర్మార్గులను కాల్చివేసి జనములకు స్వస్థతను తీసుకొనివచ్చె నీతి సూర్యుడని కూడా పిలువబడెను (మలాకీ 4:1,2). లోకము ఆయనను నీతి సూర్యునిగా మాత్రమే చూడగలదు, కాని జయించువారు ఆయనను వేకువచుక్కగా చూచెదరు.


వేకువ చుక్క సూర్యోదయము ముందు మాత్రమే కనబడును. ఈ యుగపు చివరి క్షణాలలో, మహా శ్రమల చివరిలో లోకమంతా చీకటిలో పడియుండగా, కడబూర మ్రోగును, అప్పుడు ప్రభువు స్వయంగా ఒక శబ్దముతో పరలోకమునుండి దిగివచ్చును. అప్పుడు అన్ని తరముల యొక్క జయించువారు ఆయనను ఆకాశములో ఎదుర్కొనుటకు కొనిపోబడి ఆయనను తిరిగి భూమికి ఆహ్వానించుదురు. అప్పుడు వారు ఆయనను వేకువ చుక్కగా చూచెదరు.


ప్రభువు అప్పుడు పాపరోగము పట్టిన ఈ లోకమును తీర్పు తీర్చుటకు మరియు స్వస్థపరచుటకు నీతి సూర్యునిగా భూమిపైకి దిగివచ్చును. మరియు ప్రతి నేత్రము ఆయనను చూచును. జయించువారు కూడా ఆయనతో భూమిపై ఏలుటకు ఆ సమయములో ఆయనతో కూడా దిగివచ్చెదరు. ఆత్మ చెప్పుచున్నది చెవిగలవాడు వినునుగాక! (29వ వచనము).


అధ్యాయము 8
వేషదారియైన సంఘము

''సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడు ఆత్మలు గలవాడు చెప్పుసంగతులేవనగా - 'నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నదిగాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవైయుండని యెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడా సంచరించెదరు. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవగ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక!'' (ప్రకటన 3:1-6).


ప్రభువు యొక్క అభిప్రాయము మరియు నరుని యొక్క అభిప్రాయము


ప్రభువు ఇక్కడ తనను తాను దేవుని యేడు ఆత్మలు, లేక ఏడంతల పరిశుద్ధాత్మను గలవానిగా సంబోధించుకొనెను. దీని అర్థమును మనము మొదటి అధ్యాయములో చూచాము. ఆయన యేడు నక్షత్రములను కూడా చేతపట్టుకొనియుండెను.ఆయన తన చేతిలోనున్న ప్రతి నక్షత్రము (దూత) సంఘములో తనయొక్క ఆత్మ నింపుదల గలిగిన ప్రతినిధిగా ఉండవలెనని ఆశించుచున్నాడు.


సార్దీస్‌లోనున్న దూత ఇతరుల ముందు ఒక ఆత్మీయమైన వ్యక్తిగా బ్రహ్మాండమైన పేరును (పరపతిని) సంపాదించుకొనెను. కాని అతని గూర్చి ప్రభువుకున్న అభిప్రాయము సార్దీస్‌లోనున్న తన తోటి విశ్వాసుల అభిప్రాయమునకు సరిగ్గా వ్యతిరేకముగానుండెను. సార్దీస్‌లోనున్న ఎక్కువమంది విశ్వాసులు ఎంత శరీరానుసారమైనవారో ఎంత త్వరగా మోసపరచబడగలరో చూపించుచున్నది.


90 శాతం మంది కంటే ఎక్కువ మంది విశ్వాసులు శరీరానుసారియైన దూతకు ఆత్మీయమైన దూతకు ఉన్న వ్యత్యాసమును గుర్తించలేరు. మరియు 99 శాతం మందికంటే


ఎక్కువ విశ్వాసులు మానసికమైన శక్తికి ఆత్మీయ శక్తికి మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు.


ఎక్కువ మంది విశ్వాసులు ఆత్మీయ వరముల యొక్క ప్రదర్శన మరియు వాటి వాడుకను బట్టి ఆకర్షింపబడుచున్నారు. మరియు దానిని బట్టి వారు ఒక బోధకునిని లేక ఒక పెద్దను అంచనా వేయుదురు. మరియు ఆ విధముగానే వారు మోసపోవుదురు. అయితే దేవుడు హృదయాన్ని చూచును. సార్దీస్‌లోనున్న దూత ఆత్మీయ వరములను కలిగి యుండవచ్చును. కాని అతడు ఆత్మీయముగా చనిపోయిన స్థితిలో ఉండెను.


ఇది మనమందరము జాగ్రత్తగా తీసుకోవలసిన హెచ్చరిక: మన తోటి విశ్వాసులలో 99 శాతం మంది మన గురించి కలిగియున్న అభిప్రాయము 100 శాతం తప్పుకావచ్చు! మన గురించి దేవునికున్న అభిప్రాయము వారి అభిప్రాయమునకు సరిగ్గా వ్యతిరేకముగా ఉండవచ్చు.


ఇది సంఘమునకు కూడా వర్తించును. ఇతరులు ఒక సంఘము ''ఆత్మీయముగా సజీవము'' అని పరిగణించవచ్చును. కాని అది ఆత్మీయముగా చచ్చియున్నదని దేవునికి తెలిసియుండవచ్చును. అదే విధంగా, దేవుడు ఆత్మీయముగా సజీవముగా ఉన్నవని పరిగణించిన సంఘములు వివేచన లేని వ్యక్తులచేత చచ్చినవిగా పరిగణింపబడవచ్చును.


ఎక్కువ మంది విశ్వాసులు కూటములకు వచ్చినప్పుడు వారు పొందిన ఆత్మీయతతోకూడిన ఆహ్వానమును బట్టి, జనసమూహము యొక్క పరిమాణమును బట్టి, కూటములలో ఉన్న ధ్వని యొక్క మోతాదు మరియు భావోద్వేగాలను బట్టి పాటల యొక్క సంగీత నాణ్యతను బట్టి, ప్రసంగము యొక్క బుద్ధికుశలతను బట్టి (ఎంత తెలివితేటలతో కూడిన), కానుక యొక్క మొత్తాన్ని బట్టి ఒక సంఘమును అంచనావేయుదురు!! కాని దేవుడు వీటిలో దేనితోనూ ఆకట్టుకొనబడడు (ముగ్దుడు కాడు).


దేవుడు ఒక సంఘమును దాని సభ్యుల యొక్క హృదయాలలో ఆయన కనుగొనిన క్రీస్తును పోలిన దీనత్వమును బట్టి, పవిత్రత మరియు ప్రేమను బట్టి, స్వీయ-కేంద్రీకృతము (ఒక వ్యక్తి అన్ని విషయాలలో తనను కేంద్రముగా కలిగియుండుట) నుండి విడుదలను బట్టి అంచనా వేయును. కాబట్టి ఒక సంఘము గురించి దేవుని యొక్క అంచనా మానవుని యొక్క అంచనా పూర్తిగా వ్యత్యాసముగా ఉండవచ్చును. నిజానికి, ఆ విధముగానే సహజముగా నుండును.


సార్దీసులో యెజెబేలులు గాని, బిలాము యొక్క బోధలుగాని నికొలాయితుల బోధలుగాని లేవు. కాని వారు ఇంకా ఘోరమైన దానిని కలిగియుండిరి - అది వేషదారణ.


సార్దీసులోని దూత తాను సంపాదించుకొనిన పరపతిని బట్టి రహస్యముగా సంతృప్తి చెందియుండును.లేనియెడల అతడు ఒక వేషదారిగా మారియుండడు. ఒకడు ఆత్మీయముగా సజీవముగా ఉన్నాడని ఇతరులు తెలుసుకొనుటలో ఎటువంటి తప్పు లేదు. అయితే వారి అభిప్రాయము నుండి మనము ఎటువంటి సంతృప్తి పొందకూడదు.


కాని మనము ప్రభువుకొరకు చేసిన దానినిబట్టి మనకొరకు మనము పేరు సంపాదించుకొనుటకు చూచిన యెడల, మనము నిశ్చయముగా దేవుని ముందు కాక మనుష్యులముందు జీవించువారిగా మారిపోవుదము. అప్పుడు నరుని అభిప్రాయము విలువలేనిదని మనము గ్రహించలేదని మనము ఒప్పుకోవలసియున్నది.


క్రైస్తవ లోకము తమ కొరకు తాము ఒక పేరు సంపాదించుకొనుటకు నిరంతరము పనులు చేయుచూ నివేదికలు వ్రాయుచున్న బోధకులతో నిండియున్నది. వీరందరూ సార్దీస్‌లో ఉన్న దూత వలే తయారగుదురు. మరియు దేవుని యెదుట వారిక్రియలు సంపూర్ణమైనవి కావు గనుక వారు అంత్యదినమందు ప్రభువు చేత తీర్పుతీర్చబడుదురు. మనుష్యులను ఆకట్టుకొనుట మన ఉద్దేశ్యమైతే మన క్రియలు దేవుని యెదుట సంపూర్ణముగా ఉండుట అసాధ్యము. సార్దీస్‌లోని దూత ఆత్మీయముగా కూడా గాఢమైన నిద్రలో నుండెను.


ఆయన రాకడకొరకు సిద్ధముగా నుండుటకు, మెళకువగా ఉండి ప్రార్థన చేయుటకున్న గొప్ప అవసరత గూర్చి యేసు తన శిష్యులను హెచ్చరించెను - ఎందుకనగా ఐహిక విచారములు మరియు ధన వ్యామోహము విశ్వాసులలో శ్రేష్టమైన వారిని కూడా నిద్రించునట్లు చేయగలవు (లూకా 21:34-36 చూడండి).


ఒక వ్యక్తి నిద్రించుచున్నప్పుడు, అతని చుట్టూ ఉన్న నిజమైన ప్రపంచములో జరుగుచున్నవాటి గూర్చి అతనికి అవగాహన ఉండదు. అతనికి నిజముకాని తన కలల లోకము గూర్చి ఎక్కువ అవగాహన ఉండును. ఆత్మీయముగా నిద్రించువారి సంగతి కూడా అంతే. వారికి దేవుని రాజ్యమను నిజమైన లోకము గూర్చి, వారి చుట్టూ ఉన్న నశించుచున్న ఆత్మలను గూర్చి మరియు నిత్యత్వపు వాస్తవాలను గూర్చి అవగాహన ఉండదు. వారు భౌతికమైన ధన సంపద, సుఖము, సౌఖ్యము, భూసంబంధమైన ఘనత మరియు పేరు ప్రతిష్టలు అను నిజముకాని లోకము కొరకు జీవించుదురు. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూత స్థితికూడా ఆ విధముగానే ఉండెను.


ప్రభువు అతడిని జాగరూకునిగా ఉండమని హెచ్చరించెను- వేరే మాటలలో చెప్పాలంటే తన కలల యొక్క నిజముగాని లోకమును విడచిపెట్టి (భౌతికపరమైన వాటియందు లక్ష్యముంచే లోకము) అనగా తన జీవితములో ఆత్మీయ మరణమునకు మునుగుచున్న వాటిని, కాని అప్పటికీ మరణించని వాటిని బలపరచమని ప్రభువు హెచ్చరించెను (2వ వచనము). కట్టెనిప్పులు ఇంకా పూర్తిగా చల్లారిపోలేదు. కాని అతడు వాటిని వెంటనే ప్రజ్వలింపజేయవలెను, లేని యెడల అవి పూర్తిగా చనిపోవును(ఆరిపోవును) (2తిమోతి 1:6).


దేవుని దృష్టిలో సంపూర్ణమైన క్రియలు


దేవుని దృష్టిలో అతని క్రియలు సంపూర్ణమైనవి కావని ప్రభువు అతనితో చెప్పెను (2వ వచనము). అనేకమంది విశ్వాసులు ''సంపూర్ణత'' అనే మాటకు భయపడుదురు. కాని ఈ దూత యొక్క క్రియలు దేవుని యెదుట సంపూర్ణముగా ఉండాలని ప్రభువు ఆశించినట్లు మనము ఇక్కడ చూచుచున్నాము.


ఆత్మీయ పరిపూర్ణత అనేది ఒక పెద్ద అంశము. కాని ఇక్కడ దాని అర్థమేమిటంటే ఈ దూత క్రియలు దేవుని ఆమోదము పొందుటకు పూర్ణహృదయముతో చేసినవి కావు. అతని పనులు మంచిపనులే - అందుచేతనే అతడు ఆత్మీయముగా మెళకువగా ఉన్నట్లు పేరుపొందెను. కాని అవి దేవుని మహిమార్ధమై చేయబడినవి కావు. అవి మనుష్యులను ఆకట్టుకొనుటకు చేయబడినవి. కాబట్టి అవన్నియు నిర్జీవక్రియలు. అతడి ''కార్యకలాపాలలో దోషముండెను'' (నిర్గమ 28:38). దేవుడు అతనిని ఆమోదించేముందు అతడు తన ఆత్మకు కలిగిన కల్మషమునుండి పవిత్రునిగా చేసుకొనవలసియుండెను (2కొరింథీ 7:1). మనుష్యుల ఘనతకొరకు చేయబడే మరచిక్రియలు నిర్జీవ క్రియలైయున్నవి.


పరిపూర్ణతకు మొదటి మెట్టు అన్నిటిని దేవుని యెదుట చేయటం. మనము ఇక్కడ ప్రారంభించని యెడల ఎక్కడకు వెళ్ళలేము. అది ప్రార్థించుటైనా, ఉపవాసం చేయుటైనా ఇతరులకు సహాయపడుటైనా లేక ఇంకేదైనప్పటికీ, మనలను మనము అడుగవలసిన ముఖ్యమైన ప్రశ్న ఇదే: ''నేను చేస్తున్నది ఒక వ్యక్తి చూచి నన్ను మెచ్చుకొంటాడని ఇప్పుడు ఆలోచిస్తున్నానా లేక దీనిని నేను దేవుని యెదుట ఆయన మహిమకొరకే చేస్తున్నానా?'' అనేక మంచి క్రియలను ఒక్క చెడ్డ ఉద్దేశ్యము పాడుచేసి వాటిని దేవుని దృష్టిలో సంపూర్ణము కానివిగా చేయును.


ఆ దూత గడచిన సంవత్సరాలలో ఏ విధముగా ఉపదేశము పొందెనో జ్ఞాపకము చేసుకొని ఆ హెచ్చరికలను గైకొనవలెనని ప్రభువు అతనికి గుర్తుచేసెను (3వ వచనము). ఎక్కువ ఇవ్వబడిన వారినుండి ప్రభువు ఎక్కువ ఆశించును. ఈ దూత పరిపూర్ణత గూర్చి మరియు అంతయు దేవుని మహిమకొరకు చేసే అవసరత గూర్చి చాలా వినెను. కాని అతడు ఆ హెచ్చరికలను తీవ్రముగా తీసుకొనలేదు. సత్యమును ఎరిగి దానికి లోబడకపోవుట ఒకరి ఇంటిని ఇసుకపై కట్టుటవంటిది. ఒక రోజున అది కూలిపోవును. మరియు సార్దీస్‌లో ఉన్న సంఘమునకు దాని దూతకు అదే జరిగెను.


మారుమనస్సు పొందుటకు పిలుపు


ఇప్పుడు ఆ దూత మారుమనస్సు పొందుటకు హెచ్చరించబడెను (3వ వచనము). ఈ చివరి దినములలో అన్ని సంఘములకు ప్రభువు యొక్క వర్తమానము ఇదే: మారుమనస్సు పొందుడి.


ఈ దూతకు ఇంకా నిరీక్షణ యుండెను ఎందుకనగా అతడింకను ప్రభువు చేతిలో ఒక నక్షత్రముగా నుండెను (1వ వచనము). ప్రభువు అతడిని విడిచిపెట్టలేదు. కాని అతడు మొదట నిద్రలేచి మారుమనస్సు పొందవలసియుండెను. బాప్తీస్మమిచ్చు యోహాను మారుమనస్సును ప్రకటించుటద్వారా ఇశ్రాయేలు దేశమును ప్రభువు యొక్క మొదటి రాకడకొరకు సిద్ధపరచిన క్రీస్తు యొక్క అగ్రగామి. ఇప్పుడు సంఘములోనున్న ప్రవక్తలు మారుమనస్సును ప్రకటించుట ద్వారా దేవుని ప్రజలను ఆయన రెండవ రాకడకొరకు సిధ్దపరచవలెను. మారుమనస్సు యొక్క సందేశము ఈ రోజున సంఘములో ఉన్న అతి గొప్ప అవసరత.


ఆ దూత నిద్రలేచి మారుమనస్సు పొందని యెడల, అతనికి తీర్పుతీర్చుటకు ఊహించని విధముగా రాత్రివేళ దొంగవలె వచ్చెదనని ప్రభువు అతనితో చెప్పెను. ప్రభువు రాత్రివేళ దొంగవలె వచ్చేది ప్రధానముగా అవిశ్వాసులకొరకు - కాని చీకటిలో నడిచే విశ్వాసుల కొరకు కూడా అలా వచ్చును. వెలుగులో నడిచే పగటి సంబంధులను ప్రభువు రాకడ ఆశ్చర్యపరచదు, కాని రాత్రి సంబంధులు ఆశ్చర్యపడుదురు (1 థెస్సలోని 5:4,5).


జయించువారు ఎల్లప్పుడు వెలుగులో నడుచుచుందురు గనుక వారు ప్రభువు రాకడ కొరకు ఎల్లప్పుడు సిద్ధముగా నుందురు. అయితే చీకటిలో నడుచుచూ, వారి జీవితాలలో ఒప్పుకొనని పాపమును కలిగియున్నవారు, తమను తాము ''విశ్వాసులు'' అని పిలుచుకొనినప్పటికీ సిద్దముగా నుండరు.


ఆత్మీయముగా నిద్రించుచూ మారుమనస్సు పొందని విశ్వాసులు (వారు సంఘములో దూతలైనప్పటికీ) ప్రభువు వచ్చునప్పుడు ఆశ్చర్యపడుదురని ప్రకటన 3:3 స్పష్టముగా సూచిస్తున్నది. వారు చీకటి సంబంధులున్న వర్గములోనే ఉందురు. వీరు ప్రభువు వచ్చునప్పుడు మూసివేయబడిన తలుపు వెలుపట విడిచిపెట్టబడిన బుద్ధిలేని కన్యకలు (మత్తయి 25:10-13). ''ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండితన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు'' అని ప్రభువు చెప్పుచున్నాడు (ప్రకటన 16:16).


నమ్మకముగా ఉన్న శేషము


అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో ఉండిరి (4వ వచనము) ఇది ఈ సంఘమునకున్న ఒకే ఒక్క మంచి లక్షణము. వారి హృదయాలను పవిత్రముగా ఉంచుకొన్నవారి పేరుల జాబితా దేవుడు కలిగియున్నాడు. ఈ పవిత్రత శరీర సంబంధమైన పాపములనుండి విడుదలను మాత్రమే కాక, మనుష్యుల ఘనతను ఆశించే పాపమునుండి మరియు ఆత్మకు సంబంధించిన ఇతర పాపములనుండి విడుదలను సూచిస్తున్నది.


ఇది సార్దీస్‌లో దేవుని యెదుట జీవించిన జయించువారి యొక్క శేషము. ప్రభువే స్వయంగా ఎత్తి చూపినట్లు ఈ జయించువారు కొద్ది మందే. ఈ శేషము ప్రతి ఒక్క తరములోను ఎప్పుడూ చిన్నదిగా ఉండెను, ఎందుకనగా ఇరుకు ద్వారమును జీవమునకు నడిపించు ఇరుకు మార్గమును కొందరే కనుగొందురు (మత్తయి 7:14).


ఈ కొద్ది మంది అర్హులు కాబట్టి వారాయనతో తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరించెదరని ప్రభువు చెప్పెను (4వ వచనము). వీరు లూకా 21:36లో ప్రభువు ఇచ్చిన హెచ్చరికను గైకొనిన వారు:''కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి'' (లూకా 21:36). వారు అర్హులుగా ఎంచబడిరి. కాబట్టి గొర్రెపిల్ల యొక్క వివాహదినమున వారు వధువు యొక్క తెల్లని వస్త్రములతో సంచరించెదరు.


జయించువారందరికీ తెల్లవస్త్రములు ధరించుకొనే ప్రతిఫలము వాగ్ధానము చేయబడినది (5వ వచనము). జయించువారు మాత్రమే క్రీస్తు వధువుగా ఉందురని ఇది స్పష్టముగా సూచిస్తున్నది.


జయించువారి పేరులు గొర్రెపిల్లయొక్క జీవగ్రంధమునుండి తుడిచివేయబడవని వారికి వాగ్ధానము చేయబడినది (5వ వచనము). ఒక వ్యక్తి పేరు జీవగ్రంధమందుండి తరువాత తుడిచివేయబడగలదని ఇది స్పష్టము చేయుచున్నది. అటువంటి ప్రమాదము లేని యెడల ఇక్కడ జయించువానికివ్వబడిన వాగ్ధానము అర్ధరహితముగా నుండును.


శరీరానుసారముగా ప్రవర్తించే విశ్వాసులు ఆత్మీయముగా మరణించెదరని లేఖనములు స్పష్టముగా బోధించుచున్నవి (రోమా 8:13). వారికి ఒకప్పుడున్న రక్షణను వారు పోగొట్టుకొందురు. ''యెవడు నాయెదుట పాపముచేసెనో వానిని నా గ్రంథములోనుండి తుడచి వేయుదును'' అని ప్రభువు మోషేతో చెప్పెను (నిర్గమ 32:33).


కీర్తన 69:25లో ఇస్కరియోతు యూదా గురించిన ప్రవచనమును పేతురు అపొ.కా. 1:20లో ఉల్లేఖించుట (పేర్కొనబడుట) మనము చదవగలము. 69వ కీర్తనను ఇంకా చదివితే, జీవగ్రంథమునుండి ఇస్కరియోతు యూదా పేరు తుడిచిపెట్టబడుట గురించి ప్రవచనాత్మక ప్రస్తావనను మనము చూడగలము (28వ వచనము). అతని పేరు ఒకప్పుడు ఆ గ్రంధములోనుండెను. కాని తరువాత తుడిచిపెట్టబడెను. ఒకని పేరు ఒకడు దానిలో నిలుపుకొనుటకు అతడు జయించువానిగా ఉండవలెను.


జయించువాని పేరును తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను ఒప్పుకొందునని ప్రభువు వాగ్ధానము చేసెను. ఇది ఆయన నామమును సిగ్గుపడకుండా మనుష్యుల యెదుట ఒప్పుకొనువారికి వాగ్ధానము చేయబడిన ప్రతిఫలము (మత్తయి 10:32; లూకా 12:8). మనమాయన నామమును బహిరంగముగా మన బంధువుల ముందు, స్నేహితులముందు, పొరుగువారిముందు మరియు తోటిపనివారిముందు ఒప్పుకొన్నప్పుడు ప్రభువు గొప్ప విలువనిచ్చును. అనేకమంది విశ్వాసులు ఈ విషయములో అపనమ్మకముగా ఉన్నారు. తద్వారా వారు జయించువారు కారని ఋజువు చేయుచున్నారు.


ఆ అంత్యదినమందు మన నామమును ప్రభువు బహిరంగముగా ఒప్పుకొనుట ఎంతటి ఘనత. భూమిపైన వందేళ్ళపాటు ప్రతిదినము ప్రభువు కొరకు అవమానమును హింసను భరించవలసివచ్చినప్పటికీ, దాని చివరి ప్రతిఫలము ప్రభువు మనలను తండ్రి యెదుట మరియు ఆయన పరిశుద్ధ దూతల యెదుట ఒక రోజున గర్వముగా గుర్తించుట (ఒప్పుకొనుట) అయినట్లయితే అది తగినదే (విలువైనదే). ఆయన ప్రశస్తమైన పెదవుల నుండి వచ్చు ఆమోదము జీవితకాలపు శ్రమలను మరియు ఎగతాళికి సంబంధించిన జ్ఞాపకాలను తుడిచిపెట్టును. వినుటకు చెవులుగలవారు ఆత్మ చెప్పుచున్న వాటిని జాగ్రత్తగా వినును (6వ వచనము).


అధ్యాయము 9
నమ్మకమైన సంఘము

''ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవికలిగి, యెవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా- ''నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ యెదట తీసియుంచియున్నాను; దానిని యెవడును వేయనేరడు; యూదులు కాకయే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపువారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుటపడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరుషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక'' (ప్రకటన 3:7-13).


దావీదు తాళపు చెవి


ప్రభువు ఇక్కడ తనను తాను సత్యస్వరూపియగు పరిశుద్ధునిగా పిలచుకొనెను. ''ఆయన పాపము చేయలేదు; ఆయన నోట ఏ కపటమును (వేషదారణ) కనబడలేదు'' (1పేతురు 2:22). ఆయన తన దూతలలో కూడా పరిశుద్ధత కొరకు వాస్తవికత కొరకు చూచుచున్నాడు.


ఆయన దావీదు తాళపు చెవిని కలిగియున్నానని కూడా చెప్పుచున్నాడు. క్రొత్త నిబంధన యొక్క సువార్త, శరీరమును బట్టి దావీదు సంతానముగా జన్మించిన దేవుని కుమారుని గూర్చియైయున్నది (రోమా 1:2-5).


పౌలు తిమోతికిచ్చిన చివరి హెచ్చరికలలో ఒకటి దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకోమని చెప్పుట (2 తిమోతి 2:8). అక్కడ దాని అర్థమేమిటనగా ఆయన దావీదుయొక్క శరీరముతో (దావీదు సంతానముగా) వచ్చినప్పటికి ఆయన ఎన్నడూ పాపము చేయలేదు. కాబట్టి మృతులలో నుండి తిరిగి లేపబడుటకు ఆయన దేవుని చేత అర్హునిగా ఎంచబడెను. క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యి, ఆత్మ చేత నీతిమంతుడని తీర్చబడుట దైవభక్తిని గూర్చిన మర్మమై యున్నది (1తిమోతి 3:16).


తాళపుచెవి తలుపు తెరచుటకున్న సామర్థ్యమును సూచిస్తున్నది. యేసు దావీదు శరీరముతో (అది మనశరీరము వంటిదే) వచ్చి పాపమును సాతానును జయించినందుకు ఆయన మనము నడచుటకు ఒక మార్గమును తెరువగలిగెను. జయించువారిగా ఉండాలనుకొనుచున్న వారందరికీ యేసు అగ్రగామిగా మరియు మాదిరిగా ఉన్నాడు.


ప్రతి ద్వారమునకు తాళపు చెవి


ప్రభువు తనను తాను ఏ తలుపునైనా తెరువగలవానిగా లేక మూయగలవానిగా కూడా వర్ణించుకొనెను. మనము జయించువారమైతే, మనము ఒక తలుపు ద్వారా వెళ్ళుట దేవుని చిత్తమైనప్పుడు, మనము ఏ సమయములోనైనా ఒక మూయబడిన తులుపు యెదుట నిలబడవలసిన అవసరము లేదు.


కాని ప్రభువు మనకొరకు నిర్దేశించని త్రోవలలో మనము వెళ్ళకుండునట్లు ఆయన మన ముందు కొన్ని తలుపులను మూసివేయును కూడా - ఈ త్రోవలు మనకు క్షేమాభివృద్ధి కలుగజేయవని ఆయనకు తెలియును. జయించువానిగా ఉండుట ఒక ఉత్సాహభరితమైన జీవితము. మనము ఏ తలుపుల ద్వారా వెళ్ళవలెనో, ఏ తలుపులను తట్టుట ఆపవలెనో ప్రభువే స్వయంగా నిర్ణయించును.


యోనా గ్రంధములో, ప్రభువు ఏ విధంగా ఒక తలుపును మూసి (యోనాను సముద్రములో పడవేయుట ద్వారా ఆ ఓడ యొక్క తలుపును మూసెను) మరియొక తలుపును తెరచుట (యోనాను మ్రింగునట్లు ఒక చేప యొక్క నోటిని తెరచెను) మనము చూడగలము. ఆ చేప ఇశ్రాయేలు తీరమునకు వచ్చినప్పుడు, తన సేవకుడిని ఒడ్డుకు చేర్చుటకు ప్రభువు ఆ చేప నోటిని మరియొక మారు తెరిచెను. ఈ విధంగా దేవుడు యోనాను ''ముందున్న చోటికే'' తీసుకొనివచ్చెను. అప్పుడాయన అతడిని నినెవే వెళ్ళమని మరలా చెప్పెను. అక్కడ అతడు ప్రకటించవలెనని ఆయన కోరెను. అప్పుడు యోనా వెళ్ళెను.


దేవుడు మనలను ఏ ప్రదేశములోనైనా ఏ ఉద్దేశ్యము కొరకైనా ఉండగోరిన యెడల, ఆయన మనముందున్న సరికాని తలుపులను మూయించుటకు (బహుశా ఎ్కడనుండైనా వెళ్ళగొట్టబడునట్లుచేసి) మరియు మన ముందర సరియైన తులుపులు తెరచుటకు సాధనోపాయములు కలిగియున్నాడు. మనము ఆయన శ్రేష్టమైనది పోగొట్టుకొనకుండునట్లు మన జీవితాలలో ''ముందున్న స్థితికి'' మనలను తెచ్చుటకు సాధనములు కలిగియున్నాడు! ఆయన యోనా కొరకు చేసినది, మన కొరకు కూడా చేయగలడు. ఆయన ఇంక ఎక్కువగా చేయును.


ప్రతి తలుపు యొక్క తాళపు చెవి ఆయన చేతిలోఉన్నది. నీవు దేవుని మహిమపరచుట తప్ప జీవితములో ఇంకే ఆశయములేని ప్రభువు యొక్క పూర్ణ హృదయ శిష్యునివైయుండిన యెడల, నీవు ఒక విషయమును ఖచ్చితముగా నమ్మగలవు - నీ మార్గములో ఏదియూ అడ్డునిలువలేదు. ఒక వ్యక్తి వాటి యొద్దకు వచ్చిన వెంటనే తెరువబడే స్వయంచాలికమైన (ఆటోమేటిక్‌) తలుపులవలే, నీవు దేవుని చిత్తమును నెరవేర్చుటకు ముందుకు వెళ్ళకుండా ఆటంకపరచే ప్రతి మూయబడిన తలుపు, నీవు దాని దగ్గరకు వచ్చిన వెంటనే నీ ముందు తెరువబడును. ఆయన ప్రతి తలుపును, చాలా త్వరగా లేక చాలా ఆలస్యముగా కాకుండా, సరియైన సమయములో తెరచును. ఆయన నీ జీవితముకొరకు కలిగియున్న పరిపూర్ణమైన చిత్తమును తప్పిపోయేటట్లు చేసే ఆ తలుపులను మూసివేయును కూడా.


ఒక ఆదర్శప్రాయమైన దూత మరియు సంఘము


ఇక్కడ ఫిలదెల్ఫియాలో, ప్రభువునుండి ఎటువంటి గద్దింపును పొందని ఇద్దరు దూతలలో మరియు సంఘాలలో రెండవ దానిని మనము చూడగలము. మనము చూచిన మొదటిది స్ముర్నలో యుండెను.


ప్రభువు మనలను పరిశీలించినప్పుడు ఆయన యొద్దనుండి ఎటువంటి గద్దింపును పొందని ఒక దూతగాను ఒక సంఘముగాను ఉండుట సాధ్యమని ఈ రెండు ఉదాహరణలు మనకు చూపించుచున్నవి. ఇది మనకందరికీ ఒక సవాలుగా ఉండవలెను.


ఇక్కడున్న దూత మరియు పరిశుద్ధులు కొంచెము శక్తిగల ప్రజలు (8వ వచనము). వారు చాలా తక్కువ మానవ పలుకుబడి మరియు శక్తిని కలిగియుండిరి. కాని వారు దేవుని వాక్యమును గైకొని ప్రభువు నామమును ఒప్పుకొనిరి.


మనము నివసిస్తున్న దినములలో ఉండవలసిన రెండు ప్రధానమైన అవసరతలు ఇవే- మరియు ఆ కారణము చేతనే అవి ప్రకటన గ్రంథములో మరల మరల చెప్పబడుట మనము కనుగొనగలము: అవి దేవుని వాక్యమునకు విధేయత మరియు యేసుని సాక్ష్యమును ప్రకటించుట.


వారి నమ్మకత్వం వలన, ఆయన కొరకు సాక్ష్యమిచ్చుటకు వారిముందు ఒక తెరచియున్న తలుపునుంచియున్నానని ప్రభువు చెప్పెను. ఆ తలుపును ఎవడును మూయలేడు (8వ వచనము). వారి సాక్ష్యము సహజముగా సాతానుచేత వ్యతిరేకించబడును. కాని పాతాళలోక ద్వారములు ఈ సంఘము యెదుట నిలువనేరవు - ఎందుకనగా ఇది సాతాను భయపడే విజయవంతమైన సంఘము.


మతపరమైన ప్రజల యొద్ద నుండి వ్యతిరేకత


స్ముర్నలో ఉన్న సంఘము వలెనే ఇక్కడున్న సంఘము సాతాను సమాజముచేత వ్యతిరేకింపబడుచుండెను (9వ వచనము). ఆసియలో ఉన్న ఏడు సంఘములలో సాతాను సమాజము రెండిటిని మాత్రమే వ్యతిరేకించెనని గమనించండి. ఈ రెండింటిని ప్రభువు విస్తారముగా మెచ్చుకొనెను. దేవుని కొరకు అత్యంత పూర్ణహృదయముతో ఉన్న సంఘములనే సాతాను అత్యధికముగా వ్యతిరేకించును. మరియు సాతాను యొక్క వ్యతిరేకత ప్రధానముగా మతపరమైన ప్రజలనుండి వచ్చును.


యేసు శరీరధారియైయున్న దినములలో గ్రీకు దేశస్తులచేత లేక రోమీయుల చేతకాక, తమ బైబిళ్ళను రోజూ ధ్యానించే మతపరమైన యూదుల చేత వ్యతిరేకింపబడెను! క్రీస్తు శరీరమైన సంఘము విషయములో కూడా అలాగుననే జరుగును. మన ప్రధాన వ్యతిరేకత క్రైస్తవులమని చెప్పుకొనుచూ, పాపముయొక్క శక్తినుండి విడుదలను ప్రకటింపని వారి యొద్దనుండి వచ్చును.


ఆయన ఫిలదెల్పియాలో ఉన్న సంఘముతో ఉన్నానని సాతాను సమాజము స్పష్టముగా గుర్తించునట్లు చేతునని ప్రభువు చెప్పుచున్నాడు. సాతాను యొక్క ప్రతినిధులు సంఘము యెదుటపడి నమస్కారము చేయుటకు ఒత్తిడి చేయబడుదురు (9వ వచనము). సాతాను సంఘము యొక్క పాదములు క్రింద చితుకత్రొక్కబడవలెనని దేవుడు నిర్దేశించెను (రోమా 16:20). సాతానుకు వ్యతిరేకముగా దేవుడు ఎల్లప్పుడు మన పక్షముననే ఉన్నాడని మనము ఎన్నడూ మరువకూడదు. కాబట్టి మనము సాతానుకుగాని అతడి ప్రతినిధులకు గాని ఎప్పుడూ భయపడవలసిన అవసరము లేదు.


ఆయన శిష్యులు తండ్రిచేత ప్రేమింపబడ్డారని లోకము తెలుసుకొనునట్లు యేసు ప్రార్థించెను (యోహాను 17:23). ఈ ప్రార్థన ఫిలదెల్ఫియాలో జవాబు పొందనున్నది. ప్రభువు సంఘమును ప్రేమించెనని మరియు ఆయన వారితో కూడా నుండునన్న వాస్తవమును యూదుల సమాజము తెలుసుకొనును (9వ వచనము). మన శత్రువులను కలవరపరచి మనము ఆయన ప్రేమను శ్రద్ధను పొందియున్నామని వారికి తెలియపరచుటకు దేవునికి అద్భుతమైన మార్గములున్నవి!


ఫిలదెల్ఫియాలోని సంఘము యేసు యొక్క ఓర్పు విషయమైన వాక్యమును గైకొనెను (10వ వచనము). వారు ప్రభువు యొక్క వాక్యమును గైకొని అంతమువరకు విధేయతతో సహనముతో కొనసాగిరి. శోధనల సమయములలో నమ్మకముగా సహించుట ద్వారా మాత్రమే మనము సంపూర్ణులముగాను, ఏ విషయములోను కొదువలేని వారుగాను ఉండెదము (యాకోబు 1:4).


ప్రభువు చేసిన వాగ్ధానములు


ప్రభువు ఈ సంఘమునకు చేసిన వాగ్ధానమేదనగా, ''లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను'' (10వ వచనము). ఇక్కడ లోకమంతటి మీదికి ఆ కాలములో (మొదటి శతాబ్దము యొక్క చివరిలో లేక రెండవ శతాబ్దము యొక్క మొదటిలో) రాబోవు శోధన కాలము గురించి ప్రభువు వారిని ముందుగానే హెచ్చరించెను. ఆ శోధన కాలములో ఫిలదెల్ఫియాలోనున్న సంఘమునకు దైవభద్రత వాగ్ధానముచేయబడెను.


ప్రభువు ''వారిని ఆ శోధన కాలములో ఏవిధముగా కాపాడెను?'' అది ఖచ్చితముగా వారిని లోకమునుండి ఎత్తబడేటట్లు చేయుటద్వారా కాదు. అలా కాదు. వారు శోధన మధ్యలో భద్రముగా ఉంచబడినారు. వారి శ్రమల మధ్యలో వారు ప్రభువుయొక్క రక్షణ హస్తమును అనుభవించిరి.


ఇది మనకు కూడా ఒక ప్రోత్సాహకరమైన మాట - ఎందుకనగా క్రీస్తువిరోధి కాలములో వచ్చు మహాశ్రమల మధ్యలో ప్రభువు మనలను కూడా అదేవిధముగా కాపాడును. రెండవ శతాబ్దములో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము కాపాడిన విధముగానే ఆయన మనలను కూడా కాపాడును- భూమిపైన మనమాయన నామము నిమిత్తము శ్రమపడవలసినప్పటికీ కీడు నుండి కాపాడును.


''మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు - కాని దేహమునే చంపువారికి భయపడకుడి- మీ తల వెంట్రువలన్నియు లెక్కింపబడినవి....మీ తలవెండ్రుకలలో ఒకటైనను నశింపదు'' అని యేసు చెప్పెను (మత్తయి 10:22,28,30; లూకా 21:18).


మహాశ్రమల సమయములోకూడా ప్రభువు అనుమతి లేకుండా, మన తలవెంట్రుకలలో ఒక దానినైననూ ఎవ్వరూ తాకలేరు. కాబట్టి మనము విశ్రాంతిలో


ఉండవచ్చు.


''శోధన కాలములో'' శోధించబడువారు ''భూనివాసులని'' ప్రభువు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో చెప్పెను - వీరు ఈ భూమిని తమ నివాసముగా చేసుకొని, భూసంబంధమైన వాటియందే మనస్సుంచి, ధనము కొరకు ప్రయాసపడి, మనుష్యుల ఘనతను కోరుకొందురు (10వ వచనము).


జయించువాడెవడును అటువంటి భూనివాసి కాదు, ఎందుకనగా అతడు పైనున్న వాటియందు మనస్సుంచును. వారు తమ కిరీటమును పోగొట్టుకొనకుండునట్లు, ఆయన భూమిపైకి తిరిగివచ్చువరకు వారు కలిగినదానిని గట్టిగా పట్టుకొనవలెనని ప్రభువు ఆ సంఘముతో చెప్పెను (10వ వచనము). కాబట్టి దేవుడు నీకివ్వదలచిన కిరీటమును వేరొకరు పొందుట సాధ్యమే.


దేవుడు నీకొరకు ఒక విధిని (పనిని) ఒక కిరీటమును ఏర్పాటు చేసెను. కాని ఆ విధిని (పనిని) నిర్వహించుటలో నీవు అపనమ్మకముగా ఉండినయెడల, నీవు ఆ కిరీటము పొందలేవు. ఆ పనిని నెరవేర్చుటకు దేవుడు మరొకరిని లేవనెత్తును మరియు నీకివ్వబడవలసిన కిరీటమును అతడు పొందును. ఇది నిజముగా సంభవమే. కాబట్టి మనము జాగ్రత్త కలిగియుండవలెను.


క్రీస్తు యొక్క ఇతర అపొస్తలులకు విధులను (పనులను) ఏర్పాటు చేసినట్లే దేవుడు ఇస్కరియోతు యూదాకు కూడా ఒక ప్రత్యేకమైన పనిని ఏర్పాటు చేసెను. కాని యూదా అపనమ్మకముగా ఉండెను. కాబట్టి అతడు తన కిరీటమును పోగొట్టుకొనెను. వేరొకరు (బహుశా పౌలు) యూదా నెరవేర్చవలసిన పనిని నెరవేర్చెను. ఆ వ్యక్తి తన కిరీటముతోపాటు యూదా పొందవలసిన కిరీటమును పొందును.


దేవుడు మనకిచ్చిన వాటిని మనము గట్టిగా పట్టుకొనవలెను. మనము ఏ సమయములోనూ విషయాలను సుళువుగా (తేలికగా) తీసుకొనకూడదు. జయించువాడు సంఘములో ఒక శాశ్వతమైన స్తంభముగా చేయబడును (12వ వచనము). దాని అర్థమేమిటంటే, అతడు సంఘములో ఇతరుల యొక్క భారములు మోయుచూ వారికి సహకరించును. అతడు ఇతరులకు ఆత్మీయ ''తండ్రి''గా నుండును. ప్రతి సంఘములోను అటువంటి స్తంభముల యొక్క గొప్ప అవసరతున్నది.


జయించువాని నుదిటిపైన దేవుని పేరు, నూతన యెరూషలేము పేరు మరియు ప్రభువు యొక్క క్రొత్త పేరు వ్రాయబడి యుండును. వేరే మాటలలో చెప్పాలంటే, అతడు ఎక్కడకు వెళ్ళినా, అతడు యేసు యొక్క పూర్ణహృదయముగల శిష్యుడని బహిరంగంగా గుర్తించబడును. దీని వలన అతడు భూమిపై ఇప్పుడు తృణీకరింపబడును, కాని ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయనచేత ఘనపరచబడును.


క్రీస్తు యొక్క పెండ్లికుమార్తెయే నూతన యెరూషలేము (ప్రకటన 21:9,10). ఆ పట్టణము యొక్క పేరు జయించువారి నుదిటిపై వ్రాయబడును. కాబట్టి జయించువారు మాత్రమే క్రీస్తు యొక్క పెండ్లికుమార్తెయని మనము మరియొకసారి చూడవచ్చును. వినుటకు చెవులు గలవారు ఈ ప్రోత్సాహకరమైన మాటలను చాలా తీవ్రముగా తీసుకొనవలెను (13వ వచనము).


అధ్యాయము 10
గర్వించె సంఘము

''లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము- ఆమెన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా - నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయనుద్ధేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక - నేను ధనవంతుడను ధనవృద్ధి చేసియున్నాను, నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవుధనవృద్ది చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైననూ నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చిండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక'' (ప్రకటన 3:14-22).


గౌరవ ప్రదమైనది మరియు మృతిచెందినది


ప్రభువు ఇక్కడ తనను తాను ఆమేన్‌ అనువాడిగా పిలచుకొనెను- అనగా ఆయన మాట నిశ్చయముగా నెరవేరును. ఆయన సత్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పే నమ్మకమైన సత్యసాక్షికూడా. ఆయన దేవుని సృష్టికి ఆదియైయున్నవాడు (కర్త) కూడా. ఆయన మొదటి సృష్టిని సృష్టించినవాడు మరియు తన మరణ పునరుత్థానము ద్వారా నూతన సృష్టిని ప్రారంభించిన వాడు. ''ఆయన అన్నిటికన్నా ముందున్నవాడు' (కొలస్సీ 1:17)- ఆయన దృశ్యమైనవాటికి అదృశ్యమైనవాటికి కారణభూతుడు, ఆయన మొదటివాడు మరియు కడపటివాడు.


ఇక్కడ ఏ యెజెబేలు కాని తప్పుడు బోధలుకాని లేని మరియొక సంఘమున్నది. వీరు జారులు లేక దుష్టులు కాదు. కాని వారు దేవుని కొరకు మండుచుండలేదు కూడా. వారు కేవలము ''నులివెచ్చని'' స్థితిలో నుండిరి (16వ వచనము). వారి సిద్ధాంతములలో వారు చచ్చినంత సరిగ్గా ఉండిరి- కాని వారు సరిగ్గా చచ్చిన వారుగా ఉండిరి! వారు నైతికముగా గౌరవప్రదముగా మరియు ఆత్మీయముగా మృతులుగా ఉండిరి!


ప్రభువు మన హృదయాలు అన్ని వేళలా మండుచుండవలెనని కోరుచున్నాడు- ఆయన కొరకు మరియు ఇతర విశ్వాసులకొరకు మిక్కటమైన ప్రేమతో మండుచుండవలెను. ''బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు'' అనేది పాత నిబంధన నియమము (లేవీకాండము 6:13).


యేసు యొక్క నిజమైన శిష్యుని యొక్క సాధారణ స్థితి ఎలా ఉండాలని దేవుడు ఆశించుచున్నాడో ఇక్కడ మనము ప్రతీకాత్మకముగా చూడగలము. దీనికంటే తక్కువైన దేదైననూ అప్రమాణికమైనది. మండుచున్న పొద ప్రభువు అగ్నితో మండినప్పుడు, దానిలో ఎటువంటి పురుగులు క్రిములుగాని జీవించలేకుండెను. మన హృదయములు ఆత్మ యొక్క అగ్నితో మండునప్పుడు, ఎటువంటి ప్రేమ రహితమైన వైఖరులు ఉండలేవు కూడా.


మనము వెచ్చగానో, చల్లగానో లేక నులివెచ్చగానో ఉన్నామని పరీక్షించుకొనుటకు ఒక మార్గమున్నది: ''వెచ్చ''గా ఉండుట అంటే ఇతరులను మిక్కుటముగా ప్రేమించుట. ''చల్ల''గా ఉండుట అంటె ఇతరుల యెడల ద్వేషమును మరియు క్షమింపలేని గుణము కలిగియుండుట. ''నులివెచ్చ''గా ఉండుట అంటే ఇతరుల యెడల ద్వేమును లేక ప్రేమను కలిగియుండక పోవుట.


ఒక విశ్వాసి ''నా హృదయములో ఎవరికి వ్యతిరేకముగా ఏమియూలేదు'' అని చెప్పినప్పుడు, అతడు నులివెచ్చగా ఉన్నాడు. ''మీ హృదయమాలలో ఒకనికొరకు ఒకడు ఎటువంటి వ్యతిరేకత కలిగియుండనియెడల దీనినిబట్టి మీరు నాశిష్యులని అందరును తెలిసికొందురు'' అని యేసు చెప్పెనా? లేదు. ఒకరి యెడల ఒకరు చెడ్డ వైఖరులు కలిగియుండకపోవుట యేసు యొక్క శిష్యుల గర్తుకాదు (యోహాను 13:35 చూడండి).


మన హృదయాలలో మనము ఏదోఒకటి కలిగియుండవలెను. మన తోటి విశ్వాసులందరి కొరకు మనము మిక్కుటమైన ప్రేమను కలిగియుండవలెను. ప్రేమ అంటే చెడును కలిగియుండకపోవుట కాదు, అది ఒక మంచి గుణము.


మన హృదయము నుండి ద్వేషభరితమైన ఆత్మను వెళ్ళగొట్టి దానిని కడిగి ఖాళీగా ఉంచుట నులివెచ్చగా ఉండుటకు ఖచ్చితమైన మార్గము మరియు అట్లు చేయుటవలన చివరకు మన కడపటి స్థితి మొదటి స్థితికన్నా దారుణముగా నుండును (లూకా 11:24-26).


''ఏమి లేకుండుట కంటే ఏదోఒకటి కలిగియుండుట మేలు'' అని లోకము చెప్పును. అలా అయితే చల్లగా ఉండుట కంటే నులివెచ్చగా ఉండుట మెరుగైనదని ఒకరు అనుకోవచ్చు. కాని ప్రభువు చెప్పేది అదికాదు. ''నీవు చల్లగానైనను ఉండినమేలు'' అని ప్రభువు చెప్పుచున్నాడు (15వ వచనము). మనము నులివెచ్చగా కాకుండా పూర్తిగా లోకానుసారులుగా ఉండుట ఆయన చూడగోరును. ఒక రాజీపడే నులివెచ్చని క్రైస్తవుడు ఒక లోకానుసారమైన అవిశ్వాసి కంటే క్రీస్తు పనికి ఎక్కువ హాని చేయును. ఒక అవిశ్వాసి క్రీస్తు నామమును ఉచ్చరింపడు గనుక అతని లోకానుసారమైన స్వభావము సువార్తకు ఆటంకము కాదు. కాని ఒక రాజీపడే నులివెచ్చని క్రైస్తవుడు క్రీస్తునామమును ఉచ్చరించి తన లోకానుసారమైన స్వభావము ద్వారా అన్యుల మధ్య ఆ నామమును అవమానపరచును.


ఒక లోకానుసారమైన చల్లని స్థితిలో ఉన్న అవిశ్వాసి, నులివెచ్చని స్థితిలో ఉన్న స్వనీతిపరుడైన పరిసయ్యుడు కంటే ఎక్కువగా తన ఆత్మీయ అవసరతను గుర్తించగలుగుటకు అవకాశమున్నది (మత్తయి 21:31 చూడండి). ఈ కారణాల వలన మనలను నులివెచ్చని స్థితిలో చూచుట కంటే చల్లని స్థితిలో చూచుట మంచిదని ప్రభువు చెప్పెను.


క్రియా రీత్యా దీని అర్థమేమిటంటే నీవు ధనాపేక్ష నుండి లేక కోపమునుండి లేక అపవిత్రపు తలంపులనుండి (కేవలము ఈ మూడు పాపాలను తీసుకొంటే) విడుదలపొందగోరని యెడల, యేసుని శిష్యుడవని చెప్పుకొనేకంటే నీవు ఒక అవిశ్వాసిగా ఉండిపోయిన యెడల మెరుగుగా నుండును. నీవు నులివెచ్చగా కాకుండా చల్లగా నుండినయెడల నీకు ఎక్కువ నిరీక్షణ ఉన్నది. ఇది ఆశ్చర్యకరమైనది కాని సత్యమే.


ఒకని స్థితి తెలియకుండుట


లవొదికయలో నున్న సంఘము దానికి కలిగినదానినిబట్టి అతిశయపడెను. అ్కడున్న ''విశ్వాసులు'' తమను తాము ఏమియు కొదువలేని ధనవంతులని ఎంచుకొనిరి - బహుశా వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును మనుష్యుల యెదుట మంచి పేరును ఎంతో డబ్బు కలిగియున్నందుకు అలా ఎంచుకొని యుండవచ్చును. లవొదికయ సమాజములోని గౌరవప్రదమైన నాయకులు వారి సంఘపు సభ్యులైయుండి యుండవచ్చును.


దేవాలయములో ప్రార్థించిన పరిసయ్యుని వలే, ఈ క్రైస్తవులు వారి మతపరమైన కార్యకలాపాల యొక్క సంపదవలన తమ్మును తాము ఆత్మీయులుగా ఎంచుకొనియుందురు (లూకా 18:9-14). కారణమేదైనప్పటికీ, ఆ దూతలోకాని ఆ సంఘములోనున్న వారిలోకాని ఆత్మవిషయమైన దీనత్వము ఖచ్చితముగా లేకుండెను.


ఈ రోజున అనేకులవలే- ఆ దూత మరియు ఆ సంఘము కూడా వారి దిగజారిన స్థితి గురించి పూర్తిగా అవగాహన లేకుండిరి. వారి గురించి వారికుండిన మూల్యాంకనము(అంచనా) ప్రభువు వారి గురించి కలిగియుండిన అభిప్రాయమునకు ఖచ్చితముగా వ్యతిరేకముగా నుండెను. ఆయన వారిని, ''దౌర్భాగ్యులు, దిక్కుమాలినవారు, దరిద్రులు, గ్రుడ్డివారు, దిగంబరులు'' అని పిలచెను (17వ వచనము). వారి స్థితి నిశ్చయముగా విషాదకరమైనదని చూపుటకు ప్రభువు ఎటువంటి బలమైన విశేషణాలను (పదాలను) వాడెనో చూడగలము! సార్దీస్‌లోనున్న సంఘము దాని దూత ఆత్మీయులైన వారిగా ఇతరులముందు పేరు పొందిరి. లవొదికయలో వీరికి అటువంటి పేరుకూడా లేకుండెను. వారి దృష్టిలో మాత్రమే వారు ''ఆత్మీయులు''గా ఉండిరి.


విశ్వాసులలో ఎక్కువ మంది వారి ఆత్మీయత గురించి ప్రభువు కలిగియున్న అభిప్రాయముకన్నా ఎంతో గొప్ప అభిప్రాయమును కలిగియున్నారు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవ గుంపులో ఉన్న విశ్వాసులగూర్చిన సత్యము. చాలాకొద్ది మంది విశ్వాసులు తమ గురించి తాము ఒక నిజమైన వాస్తవమైన అంచనాను కలిగియుందురు- ఎందుకనగా చాలా కొద్ది మంది మాత్రమే వారితోవారు నిర్దాక్షణ్యంగా యదార్థముగా నుందురు.


ప్రభువు నీ ఆత్మీయత గురించి కలిగియున్న అభిప్రాయము కంటే నీవు నీ ఆత్మీయత గురించి గొప్ప అభిప్రాయమును కలిగియుండుటకు ఎక్కువ అవకాశమున్నది. నిన్ను నీవు తగ్గించుకొని నీ జీవితము గూర్చి ప్రభువు కలిగియున్న మూల్యాంకనమును (అంచనాను) నీకిమ్మనమని ఆయనను వేడుకొనుము. ఈ పుస్తకమును కొన్ని క్షణాలు క్రింద పెట్టి ఆ ప్రార్థనను ఇప్పుడే ఎందుకు చేయకూడదు.....


లవొదికయలోని విశ్వాసులు ఫిదెల్పియాలోనున్న విశ్వాసులవలె ఒకప్పుడు మండుచుండెడి వారేమో. కాని వారు దిగజారిపోయి వారి ఆత్మీయ జీవితమును నిర్లక్ష్యము చేసిరి. వారు ఆత్మ-నింపుదలగల జీవితము యొక్క సిద్ధాంతములను ఇంకను కలిగియుండిరి. కాని అటువంటి జీవితము యొక్క వాస్తవికతను వారు కోల్పోయిరి. అటువంటి ప్రజల గూర్చి పేతురు ఇట్లనెను:''వారు నీతిమార్గమును అనుభవ పూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు'' (2 పేతురు 2:21).


ప్రభువు చేత ఉమ్మివేయబడుట(వాంతిచేయబడుట)


ఇటువంటి జనులతో ప్రభువు ఏమిచేయును? ఆ సంఘమును దానిదూతకు తన నోటినుండి ఉమ్మివేతునని ఆయన చెప్పెను (16వ వచనము). మనము మన నోటినుండి దేనిని ఉమ్మివేతుము? మనము భుజించిన ఆహారము జీర్ణముకాకుండా, మన భౌతిక శరీరములో ఒక భాగము కానప్పుడు దానిని వాంతి చేసుకొందుము.


మనలను మనము ప్రభువుకు అర్పించుకొన్నప్పుడు, దాని ఉద్దేశ్యము మనము ''ఆయన చేత జీర్ణించుకోబడుట'' (''ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే''), ఈ విధముగా ఆయన శరీరములో ఒక భాగమగుదుము. అయితే, మనము మన స్వంత చిత్తమును వెదకుట కొనసాగించిన యెడల, మనము ఆ జీర్ణంపబడని ఆహారముగా మారుదుము. మరియు ప్రభువు చేత ఉమ్మివేయబడుట మన చివరిగతియగును.


నీవు కొద్ది కాలము ప్రభువు యొక్క దూతగా యుండి యుండవచ్చును, అయినప్పటికీ నీవు ఆయన దూతగా నుండకుండునట్లు నీవు ఉమ్మివేయబడవచ్చును. మనము ఒక సమయములో ''క్రీస్తులో'' ఉండి తరువాత ఆయన చేత ఉమ్మివేయబడి ఆయన బయట


ఉండవచ్చును.


అయితే ప్రభువు ఈ సంఘము మరియు దాని దూత కొరకు ఇంకను నిరీక్షణ కలిగియుండెను. ఇది నిజముగా ఆశ్చర్యకరము. దౌర్భాగ్యులుగా, దిక్కుమాలినవారుగా, దరిద్రులుగా, గ్రుడ్డివారుగా, దిగంబరులుగా ఉన్నవారిని కూడా ఆయన ఎల్లప్పుడు విమోచించుటకు చూచుచున్నాడు. మనుష్యులు ఎప్పుడో విస్మరించు వాటినికూడా, ప్రభువు ఇంకను రక్షించుటకు చూచును. ఈ కారణము చేత మనలో నీచమైన వారు కూడా నిరీక్షణ కలిగి యుండవచ్చును. మనము మారుమనస్సు పొందిన యెడల మనమందరము రక్షింపబడవచ్చు.


ఒక వెల చెల్లించవలసియున్నది


ప్రభువు ఆ సంఘమును దాని దూతను ఆయన యొద్దనుండి బంగారమును తెల్లని వస్త్రములను, కాటుకను కొనమని సలహాఇచ్చెను (18వ వచనము). క్రైస్తవ జీవితములో ఉచితమైనవి కొన్నియున్నవి. పాపక్షమాపణ మరియు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము దేవుని ఉచిత వరములు.


కాని పొలములో దాచబడిన ధనము యొక్క ఉపమానము మరియు మంచి ముత్యములకొరకు వెదకుచున్న వర్తకుని ఉపమానము సమస్తమును ఇచ్చివేయుటకు సిద్ధపడినవారు మాత్రమే పరలోకరాజ్యమును పొందగలరని సందేహములేకుండా బోధించుచున్నవి (మత్తయి 13:44-46).


లవొదికయలో ఉన్న క్రైస్తవులకు కూడా ప్రభువు అదే చెప్పెను - ఆత్మీయధనము పొందుటకు వారు ఒక వెల చెల్లించవలసియుండెను. వారు దానిని కొనుగోలు చేయవలసియుండెను.


పుటమువేయబడిన బంగారము, ఎటువంటి మిశ్రమములేని స్వచ్ఛమైన దేవ స్వభావమునకు ప్రతిరూపముగా ఉన్నది. మన అంతరంగములో మనము దీనియందు పాలివారగవలెను. తెల్లని వస్త్రములు బాహ్యమైన నీతికి సాదృశ్యముగా ఉన్నవి- మన బాహ్యజీవితములో, మాటలో, ప్రవర్తనలో మొదలగువాటిలో పరిశుద్ధత. కాటుక మనలను ప్రతిఒక్క విషయమును దేవుని ఆలోచనా విధానముతో చూచుటకు సహాయపడే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను సూచిస్తున్నది. ఈ విధముగా మనము దేవుని వాక్యమును ఆయన ఉద్దేశ్యములను అర్థము చేసుకొని, మనలను దేవుడు చూచినట్లు మనలను మనము చూచుకోగలము. అది భూసంబంధమైన ధనము, ఘనత యొక్క నిర్భయతను(విలువలేని తనమును) చూచుటకు కూడా మనకు సహాయపడును.


ఇవన్నియు పొందుటకు మనము ఒక వెల చెల్లించవలెను. మనము అన్నిటిని విడచిపెట్టి దేవునికి అమ్ముడుపోవలెను. మనము అలా చేసినయెడల, ప్రభువు అనుగ్రహించు ఈ ధనమును పొందగలము - శాశ్వతమైన విలువ కలిగిన నిజమైన ధనము.


ఆయన ప్రేమించువారినందరిని మాత్రమే ఆయన గద్దించి శిక్షించునని ప్రభువు చెప్పుచున్నాడు (19వ వచనము). ఇది తెలుసుకొనుట గొప్ప ఆదరణ. మనము ప్రభువు చేత సరిదిద్దబడి శిక్షింపబడినప్పుడు, ఇవి ఆయన గొప్ప ప్రేమ యొక్క సూచనలని మనము గుర్తుంచుకొనవలెను. మనకొరకు ఆయన ఇంకా నిరీక్షణ కలిగియున్నాడని అవి ఋజువు చేయుచున్నవి.


అయితే నీవు పాపము చేయునప్పుడు, నీ మనస్సాక్షిలో నీవు గద్దించబడకుంటే, నీవు ప్రభువు చేత శిక్షింపబడకుంటే, అప్పుడు నీవు నిజముగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. బహుశా ప్రభువు నిన్ను మార్చుటకు ప్రయత్నించుట ఆపివేసెనేమో. బహుశా దీనికి కారణము గతములో నిన్ను సరిదిద్దుకొనమని చెప్పిన ఆయన మెల్లని స్వరమును నీవు మొండిగా వినుటకు నిరాకరించుట కావచ్చు.


పూర్తిగా ఆలస్యము కాకముందే మారుమనస్సు పొంది, ఆయన వైపుకు తిరుగుము. ''(నిజమైన) కుమారులైన వారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందని యెడల దుర్బీజులే కాని కుమారులు కారు'' (హెబ్రీయులు 12:8).


మారుమనస్సు పొందుటకు పిలుపు


ప్రభువు లవొదొకియలోని సంఘమును దాని దూతను ''ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము'' అని చెప్పెను (19వ వచనము). మన మారుమనస్సు కూడా నిదానముగా ఉండవచ్చును. మన మారుమనస్సు విషయములో కూడా మనము ఆసక్తితో పూర్ణహృదయముతో నుండవలెను. ప్రభువు ఇప్పుడు సంఘము వెలుపల నిలబడి, లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచు, తలుపు తట్టుచుండెను (20వ వచనము). అయితే సంఘ కూడికలో ''యధావిధిగా'' స్తుతి, ప్రార్థన మరియు బోధ మార్పులేని క్రమముతో కొనసాగుచుండెను. కాని కూడియున్న సమాజమునకు ప్రభువే బయట ఉన్నాడన్న వాస్తవము తెలియకుండెను. ప్రభువే తలుపు వెలుపల ఉన్న సంఘమునకు ఎన్నడూ చెందవద్దు. ఎందుకంటే ఆయన వెలుపల ఉన్నప్పుడు నీవు లోపల ఉండుటకు నీకు ఎటువంటి పని లేదు!! నీవు కూడా వెలుపలుండవలెను. వరుడు బయట నిలబడినప్పుడు, వధువు వరుడితో ఉండవలెను.


ప్రభువు ఇప్పుడు సంఘములోని వ్యక్తులను వారి హృదయాలను ఆయన కొరకు తెరువమని పిలచుచుండెను. అది వారు ఏ విధముగా చేయగలరు? వారు ఆసక్తితో మండుచూ మారుమనస్సు పొందుట ద్వారా వారు తలుపును తెరువగలరని సందర్భము స్పష్టము చేయుచున్నది. ఆ తలుపు మన మేథస్సు యొక్క తలుపు కాదు లేక మన భావోద్వేగాల యొక్క తలుపు కాదు. అది మన చిత్తము యొక్క తలుపు. మన చిత్తమును మనము విడచిపెట్టినప్పుడు ప్రభువు లోపలికి వచ్చి మనతో మన ఆత్మలో సహవాసము (భోజనము) చేయును. మరల జయించుటకు పిలుపు ఇవ్వబడెను. ఈ సారి ఆయన భూమిపైనున్న దినములలో జయించినట్లుగానే మనము కూడా జయించవచ్చని ఆయన తెలియజేయుచున్నారు (21వ వచనము).


యేసు మొదటి జయించువాడైయున్నాడు. ఆయన లోకమును, శరీరమును, అపవాదిని ఇప్పటికే జయించిన మన అగ్రగామి. ఈ విధముగా తండ్రితో ఆయన సింహాసనముపై కూర్చుండుటకు ఆయన హెచ్చించబడెను. ఇప్పుడు మనము వీటన్నిటికి ఆయన జయించినట్లే జయించగలము. అలా చేసినయెడల, మనము కూడా ఒకనాడు ఆయనతో పాటు ఆయన వధువుగా ఆయన సింహాసనముపై కూర్చుండవచ్చును.


''సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము'' (2తిమోతి 2:12). చివరిగా, మనము అదే మాటను చివరకు విందుము; ''సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక'' (22వ వచనము).


అధ్యాయము 11
దిగజారిపోవు ధోరణిని అరికట్టుట

మనము చూచిన ఏడు దూతలు మరియు సంఘములు ఈ 20 శతాబ్దాలలో


ఉన్న ఏడు రకముల దూతలకు సంఘములకు సాదృశ్యముగా ఉన్నవి. ఈ ఏడు రకముల దూతలు మరియు సంఘములు లోకములో ఈనాడు కూడా ఉన్నవి. మనలో ప్రతి ఒక్కరు మనలను మనము విశ్లేషించుకొని మనము ఎక్కడ ఉన్నామో చూసుకొనవచ్చు.


దిగజారిపోయిన దూతలు మరియు సంఘములు


ప్రభువుచేత గద్దింపబడిన అయిదు దూతలను మరియు సంఘములను మనము చూచినప్పుడు మనము వారిలో ఒక నిర్ధిష్టమైన దిగజారిపోవు ధోరణిని చూడవచ్చు:


1. ఎఫెసులో ప్రభువు కొరకు కలిగియున్న మొదటి ప్రేమను కోల్పోవుట మనము చూడగలము. క్రీస్తు కొరకు మనము కలిగియున్న మొదటి అంకితభావము మనము కోల్పోయినప్పుడు, మనము క్రిందకు మొదటి మెట్టు తీసుకొన్నాము. కొద్ది సమయములోనే ఇది మన తోటి విశ్వాసుల యెడల మనకున్న ప్రేమను కూడా కోల్పోవుటకు నడిపించును.


2. పెర్గమలో, బిలాము యొక్క బోధ ద్వారా లోకానుసారత మోసపూరితముగా జొరబడుటను మనము చూడగలము. ఎఫెసులో ఉన్న సంఘము బయట ఉంచబడిన నికొలయితులు ఇక్కడ ఇప్పుడు అధికారములో ఉండిరి. క్రీస్తు యెడల అంకితభావమును (భక్తిని) కోల్పోయినప్పుడు, లోకానుసారత జొరబడును మరియు మతపరమైన అధికార క్రమము సంఘమును స్వాధీనపరచుకొనును. ఒకసారి ఒక మతపరమైన అధికారక్రమము సంఘనాయకత్వమును స్వాధీనపరచుకొంటే, బబులోను సులువుగా కట్టబడును.


3. తుయతైరలో నున్న సంఘము పూర్తిగా లోకానుసారముగా మారిపోయెను, దీని కారణముగా మతపరమైన జారత్వము ప్రబలెను. ఇప్పుడు ఒక స్త్రీ సంఘమును ప్రభావితము చేయుటకు అధికారము కలిగియుండెను, మరియు అబద్ధపు కృపను ప్రకటించుచు కృపావరాలను (ముఖ్యముగా ప్రవచించు వరమును) నకలు చేసెను.


4. సార్దీస్‌లో మనము వేషదారణను చూడగలము. పాపము కప్పివేయబడెను మరియు దేవుని అభిప్రాయము కన్నా మానవ అభిప్రాయమునకు ఎక్కువ విలువ ఇవ్వబడెను. ఆ సంఘపు దూత ఆత్మీయముగా నిద్రించుచుండెను (ఆత్మీయ వాస్తవాలయొక్క అవగాహన లేకుండా). అయితే పైకి భక్తిగా కనిపించుట వలన, ప్రభువు అతనిలో చూచిన ఆత్మీయ మరణమును మనుష్యుల దృష్టినుండి దాచిపెట్టెను.


5. లవొదికయలో పరిస్థితులు ఎంతవరకు దిగజారిపోయెనంటే శరీరము మరణించుటే కాక, క్రుళ్ళిపోయి కంపుకొట్టుట ప్రారంభించెను. నులివెచ్చని స్థితి మరియు ఆత్మీయ గర్వము ఈ మరణమునకు కారణము. పైనున్న నాలుగు సంఘాలలో ప్రతి ఒక్క దానిలో ప్రభువు ఇంకను ఏదోఒకటి మంచి చూడగలిగెను. కాని ఇక్కడ లవొదికయలో ఆయన ఏమియు చూడలేకపోయెను.


పైనున్న సంఘములు యొక్క దూతలలో ఎవరును వారి జీవితాలయొక్క లేక వారి సంఘముల యొక్క నిజమైన ఆత్మీయ స్థితి గురించి అవగాహన లేకుండిరి. వారి గురించి వారు కలిగియున్న గొప్ప అభిప్రాయము వలన వారందరు ఆత్మ సంతృప్తి కలిగియుండిరి. వారు ఇతరులకు బోధించుటకు ప్రసంగాలను తయారు చేయుటలో ఖాళీలేకుండా ఉండిరి గనుక ప్రభువు వారికి చెప్పుచున్నది వారువినలేకపోయిరి. వారు వారి స్వంత అవసరతను చూచుకొనుట కంటే బోధించుటకు ఎక్కువ ఆసక్తి కలిగి యుండిరి.


ఒకసారి ఒక వ్యక్తి ఒక సంఘమునకు దూతయైన తరువాత, తను సరిదిద్దుకొనవలసిన అవసరతలేదని ఊహించుకొనుట చాలా సులభము. ''మూడత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు''ను గూర్చి బైబిలు చెప్పుచున్నది (ప్రసంగి 4:13).


ఈ ఐదు సంఘాల యొక్క దూతలు ఆ మూఢుడైన రాజువలే యుండిరి. వారి మాటే చట్టముగా ఎంత కాలముండెనంటే ఇప్పుడు ఏ విషయములోనైన వారు తప్పిపోయే అవకాశమును కూడా ఊహించలేకుండిరి!! వారి మోసపోయిన స్థితి ఆ విధముగా నుండెను. వారు వారి జీవితములనుండి దేవుని అభిషేకమును ఎన్నడూ పోగొట్టుకొనలేరని వారు ఊహించుకొనిరి. వారి గర్వముతోకూడిన వైఖరి వారిని ఆత్మీయముగా చెవిటివారిగా చేసెను.


రాజైన సౌలు బాగా ప్రారంభించినప్పటికీ వెంటనే దారిప్రక్కన పడిపోయిన మరియొక అవివేకమైనరాజు. అతడు ప్రభువు చేత రాజుగా మొదట అభిషేకింపబడినప్పుడు ''తన దృష్టికి తను అల్పుడిగా ఉండెను'' (1 సమూయేలు 15:17). కాని అతడు తన ఆలోచనలలో తనను తాను అల్పునిగా ఉంచుకోలేదు. కాబట్టి అతడు దేవుని అభిషేకమును కోల్పోయెను. అభిషేకము అప్పుడు యౌవ్వనుడైన దావీదుపైకి వెళ్ళెను. సౌలు దీనిని గ్రహించెనుగాని దానిని అంగీకరించుటకు నిరాకరించెను. అతడు మొండిగా సింహాసనముపై కూర్చుండి దావీదును చంపుటకు చూచెను. చివరకు, దేవుడు సౌలు జీవితమును తీసికొని దావీదును సింహాసనముపై కూర్చుండబెట్టెను.


ఇటువంటి పరిస్థితులను మనము ఈ రోజున అనేక సంఘములలో చూడవచ్చు. ఒకప్పుడు ప్రభువు యొక్క దూతలుగా ఉన్న వారిలో అనేకులపైనుండి ఆత్మ యొక్క అభిషేకము తొలగిపోయి ఇప్పుడు వారి సంఘాలలో ఉన్న కొందరు యౌవ్వన సహోదరులపై శక్తివంతముగా ఉన్నది. కాని ''అవివేకులైన ముసలి రాజులు'' దీనిని చూచుట భరించలేరు. కనుక వారేమి చేయుదురు? వారి ఈర్ష మరియు వారి రాజ్యాలను సంరక్షించుకొనుటకు వారికున్న స్వార్థము ఈ యౌవన సహోదరులను ఏదోఒక విధముగా అణచివేయుటకు ప్రేరేపించును.


ఆసియలో నున్న అయిదు దిగజారిపోయిన సంఘాలలోకూడా బహుశా అటువంటిది ఏదైనా జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి ప్రభువు ఆ దూతలకు ఒక చివరి హెచ్చరికనిచ్చెను. దేవునికి పక్షపాతము లేదు మరియు ఆయనకు ప్రత్యేకమైన ఇష్టులెవరూలేరు. అపోస్తులుడైన పౌలుకూడా తాను ఒక క్రమశిక్షణ కలిగిన జీవితమును జీవించుటకు జాగ్రత్తపడకుంటే తాను పడిపోయి భ్రష్టుడైపోవచ్చని గ్రహించెను (1 కొరింథీ 9:27).


''నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి యుండుము; వీటిలో నిలకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు'' అని పౌలు తిమోతికి చెప్పెను. మొట్టమొదటిగా తిమోతి తన స్వంత జీవితమును గమనించుకోవలసియుండెను. అప్పుడు అతడు తన స్వంత జీవితములో క్రీస్తును పోలని స్వభావమునుండి రక్షణను అనుభవించి, ఆవిధముగా ఇతరులను అటువంటి రక్షణకు నడిపించుటకు శక్తి పొందగలడు. ప్రతి ఒక్క సంఘములో నున్న తన దూతలకు ప్రభువు నియమించిన మార్గము ఇదే. పౌలు ఎఫెసులో నున్న సంఘపెద్దలకు కూడా మొట్టమొదటిగా వారి జీవితాలను గూర్చి జాగ్రత్తగా ఉండి అటు తరువాత వారి మంద యొక్క జీవితాలను గూర్చి జాగ్రత్తగా ఉండమని చెప్పెను (అపొ.కా. 20:28).


ప్రభువు యొక్క ప్రతి దూత యొక్క బాధ్యత ఇదే - మొట్టమొదటిగా తన జీవితమును పవిత్రతలోను మరియు ఎల్లప్పుడు ఆత్మ యొక్క అభిషేకము క్రింద ఉండునట్లు సంరక్షించుకొనుట. ''ఎల్లప్పుడు తెల్లని వస్త్రములను ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము'' (ప్రసంగి 9:8). ప్రభువు ఈ దూతలతో నేరుగా మాట్లాడవలెనని ఆశించెను కాని వారు వినగలిగే చెవులు కలిగియుండలేదు. చివరకు ఆయన ఒక అపొస్తలుని ద్వారా వారితో మాట్లాడవలసివచ్చెను. ప్రభువు స్వరమును స్పష్టముగా వినగలిగిన యోహాను వంటి ఒక్క వ్యక్తియైనా ఉన్నందుకు దేవునికి వందనములు.


అయితే వారి వైఫల్యాలున్నప్పటికీ, ప్రభువు ఈ అయిదుగురు దూతల కొరకు నిరీక్షణ కలిగియుండెను - ఎందుకనగా ఆయన వారినింకను తన కుడిచేతితో పట్టుకొనియుండెను (ప్రకటన 2:1). వారు మారుమనస్సు పొందినయెడల, వారు మరియొకసారి మహిమకరమైన సహోదరులుగా మారుదురు. మరియు వారి సంఘములు మరియొకసారి ప్రభువు యొక్క మహిమతో ప్రతిఫలించును. అయితే వారు ఈ చివరి హెచ్చరికను జాగ్రత్తగా తీసుకొననియెడల, ప్రభువు వారిని విసర్జించును.


నమ్మకస్తులైన దూతలు మరియు సంఘములు


ఇటువంటి క్షీణత మధ్యలో (స్ముర్నలోను మరియు ఫిలదెల్ఫియలోను) రెండు అద్భుతమైన సంఘములు మరియు దూతలుండిరి. వీరికి వ్యతిరేకముగా ప్రభువు ఎటువంటి నేరారోపణ చేయలేదు. వీరిలో ఈ మంచి గుణాలను మనము చూడగలము: 1. పేదరికము మరియు వ్యతిరేకత మధ్యలో నమ్మకత్వము 2. దేవుని వాక్యమును గైకొనుటలో సహనము మరియు 3. సిగ్గుపడకుండా క్రీస్తును గూర్చిన సాక్ష్యమును ప్రకటించుట.


ఆ అయిదు దిగజారిపోయిన దూతలు మరియు వారి సంఘములు వారిని వారు తీర్పు తీర్చుకోనందున ప్రభువు వారిని గద్దించి సరిదిద్దవలసి వచ్చెను.


ఆ ఇద్దరు నమ్మకమైన దూతలు మరియు వారి సంఘములకు ఎటువంటి గద్దింపు అవసరములేకుండెను, ఎందుకనగా వారు ఎల్లప్పుడు వారిని వారు తీర్పుతీర్చుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి పవిత్రపరచుకొనిరి (2 కొరింథీ 7:1). ''మనలను మనము విమర్శించుకొనిన యెడల తీర్పుపొందకపోదుము'' అని దేవుని వాక్యము చెప్పుచున్నది (1 కొరింథీ 11:31).


''తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది....అది మన యొద్దనే ఆరంభమగును'' (1 పేతురు 4:17). నిజమైన దేవుని ఇంటికి గుర్తు ఏమిటంటే మనము మనలను మొట్టమొదటిగా మరియు ఎల్లప్పుడు తీర్పుతీర్చుకొనెదము.


మనము ఆయన న్యాయపీఠము ముందు ఒక రోజు నిలబడినప్పుడు, మన జీవితాలలో విమర్శింపబడుటకు ఏమియు లేకుండునట్లు మనలను మనము విమర్శించుకొనే ఆధిక్యతను ప్రభువు ఇప్పుడు ఇచ్చెను. ఆ కారణము చేత మనము దేవుని వాక్యమును మనలను మనము తీర్పు తీర్చుకొనే వైఖరితో చదువుట ధ్యానించుట ఎంతో ప్రాముఖ్యము. ఆ విధముగా మనముకూడా ప్రభువు గద్దించుటకు లేక సరిదిద్దుటకు ఏమిలేని గుంపులో ఉండగలము.


జయించువారు


ప్రతి ఒక్క సంఘమునకివ్వబడిన సందేశములలో వ్యక్తిగత విశ్వాసులు జయించువారిగా ఉండుటకు పిలుపు ఇవ్వబడినది. జయించువారు వారి స్వంత జీవితాలలో (మనము పైన చూసిన) దిగజారిపోవు ధోరణిని అరికట్టి, ఆ విధముగా ప్రభువు యొక్క మహిమను ప్రతిఫలింప జేయుదురు. వారి చుట్టూ ఉన్న వారు దిగజారిపోవుటకు దారితీసిన చెడ్డ ప్రవృత్తులు కలిగిన శరీరమును వారును కలిగియున్నారని వారు గుర్తించుదురు. కాని వారు అటువంటి ప్రవృత్తులకు వ్యతిరేకముగా నిలబడి ఆత్మ ఇచ్చు శక్తితో వాటిని సిలువవేసెదరు.


ఈ రోజున జయించువారు ఏమిచేయవలెను? వారున్న మరణించిన సంఘములలో వారు కొనసాగవలెనా లేక బయటకు రావలెనా? ప్రకటన గ్రంథములో ఏడుసంఘములకు వ్రాయబడిన పత్రికలలో, జయించువారు తమ స్థానిక సంఘములను విడిచిపెట్టమని చెప్పిన ఎటువంటి ఆజ్ఞను మనము కనుగొనలేము. కాని దానికి కారణము అక్కడ ప్రతిఒక్క స్థానములో ఒకే ఒక్క సంఘముండెను. మరియు వాటిలో దేనినుండి కూడా ప్రభువు ఇంకను దీపస్తంభమును తీసివేయలేదు.


ఈనాడు పరిస్థితి చాలా వేరుగా నున్నది. ఈ రోజులలో మన పట్టణాలలోను నగరాలలోను అనేక ''సంఘములు'' ఉన్నవి. కాని వీటన్నిటిని మనము ప్రభువు యొక్క దీపస్తంభములని పిలువలేము ఎందుకనగా ఎక్కువ సందర్భాలలో ప్రభువు వాటిని ఎన్నడూ స్థాపించలేదు. వాటి దూతలు ఏ సమయములోనూ ప్రభువు చేతిలో నక్షత్రాలుగా లేరు, ఎందుకనగా ఆయన వారిని ఎన్నడూ పిలువలేదు, లేక పెద్దలుగా నియమింపలేదు.


ఇంకా అనేక సందర్భాలలో, వారు మారుమనస్సు పొందుటకు నిరాకరించినందున ప్రభువు దూతలను మరియు సంఘములను విడచిపెట్టెను. కాబట్టి, ఒక సంఘములో భాగముగా ఉండుటకు నిర్ణయించుకొనే ముందు ప్రభువు యొక్క ''అభిషేకము'' దాని దూతపైన మరియు ఆ సంఘముపై ఉన్నదా అని చూచుటకు వివేచన కావలెను. జయించువారు ''దేవుని సంకల్పమంతటిని'' ప్రకటింపని ఏ స్థానిక ''సంఘము''లో ఖచ్చితముగా భాగము కాకూడదు (అపొ.కా. 20:27).


ఎఫెసులో నున్న దూత మారుమనస్సు పొందని యెడల, ప్రభువు దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతునని హెచ్చరించెను (ప్రకటన 2:5). ఆ దూత మారుమనస్సు పొందియుండని యెడల ఏమి జరిగియుండును? ప్రభువు అతడిని తన దూతగా


ఉండకుండునట్లు ప్రక్కన పెట్టి వేరొకరిని నియమించి యుండును. ఒకవేళ ఎఫెసులో ఉన్న సంఘము కూడా మారుమనస్సు పొందనియెడల ఏమి జరిగియుండును? ఆ సంఘము ప్రక్కన పెట్టబడి ప్రభువు చేత గుర్తింపబడని సంఘముగా మారియుండెడిది.సందేహము లేకుండా వారు ఒక సమాజముగా కొనసాగియుండెడివారు - కాని ప్రభువు దృష్టిలో అది కేవలము ఒక బబులోను సంఘముగా యుండి ఉండును.


అప్పుడు ఎఫెసులోని జయించువారు ఏమి చేసియుండేవారు? ప్రభువు ఆ పాతసంఘమునుండి బయటకు వెళ్ళిపోయినవెంటనే వారు దానిని విడిచిపెట్టియుండేవారు మరియు వారువేరుగా కూడుకొనుట మొదలుపెట్టియండేవారు. ప్రభువు ఆ పాత వ్యవస్థనుండి ఈ క్రొత్త సంఘమునకు వెళ్ళుట చూచుటకు కన్నుల కలిగియుండిన వారు ఈ జయించు వారితో కూడుకొనెడివారు. ఆ క్రొత్త గుంపు (సమాజము) ఎఫెసులో సంఘముగా మారియుండును-ఎందుకనగా ప్రభువు వారి మధ్యలో తన దీపస్తంభమును పెట్టియుం డేవాడు.


ఏ సమయములోనైనా ఈ క్రొత్త సంఘము ఇప్పుడు దేవుని మార్గములలో నడచుటకు లేక వారిని వారు విమర్శించుకొనుటకు నిరాకరించిన యెడల, అప్పుడు దేవుడు వారి మధ్యనుండి దీపస్తంభమును తీసివేసి మరల అంతా మొదటినుండి ప్రారంభింపవలసియుండును. దేవునికి పక్షపాతము లేదు.


ఈ గత ఇరవై శతాబ్దాలుగా, లోకములోని ప్రతి దేశములో ఈ ప్రక్రియ మరల మరల పునరావృతమైనదని క్రైస్తవ సంఘ చరిత్ర చూపిస్తున్నది. ఈ కారణము చేతే మనము ప్రతి ప్రదేశములో ఎన్నో బబులోను ''సంఘముల''ను కనుగొనగలము. ఒక దశలో పరిస్థితి ఎంత చెడ్డగా ఉండవచ్చంటే ఒక నగరములో ఒక్క దీపస్థంభము కూడా లేకుండవచ్చును. సంఘమని పిలువబడిన ప్రతి ఒక్కటి బబులోను సంఘమైయుండవచ్చును.


మనము ఏ సందర్భములోనైనా ప్రభువు విడచిపెట్టిన సంఘములో ఉండకూడదు. మన విశ్వసనీయత (నమ్మకత్వము) ప్రభువుకును ఆయన సంఘమునకు ఉండవలెను - అంతేకాని ''మనము పెరిగిన సంఘమునకు'' కాదు. మానవ అనుబంధాలు మనలను ప్రభువుతో ముందుకు వెళ్ళకుండా ఆటంకపరచగలవు.


ఈ ఏడు సంఘముల గూర్చి మనము చేసిన ధ్యానములో, ప్రభువు ఒక సంఘములో దేనికొరకు చూచునో మనము స్పష్టముగా చూచితిమి. కాబట్టి, జయించువారు వారున్న ప్రదేశములో ఇటువంటి సంఘముతో సహవాసము కొరకు ఆశించవలెను:


1. క్రీస్తు కొరకు అంకిత భావముతోను ఒకరి యెడల ఒకరు ప్రేమతోను మండే సంఘము.


2. దేవునిలో సజీవమైన విశ్వాసమును ప్రకటించు సంఘము.


3. దేవుని ఆజ్ఞలన్నిటికి సంపూర్ణ విధేయతను ఉద్ఘాటించు సంఘము.


4. యేసుని గూర్చిన సాక్ష్యమును సిగ్గుపడకుండా ప్రకటించు సంఘము.


5. ఆత్మీయ గర్వమునకు, వేషదారణకు మరియు లోకానుసారతకు విరుద్ధముగా నిలబడే సంఘము.


6. అబద్దపు అపొస్తులులను, బోధకులను వరములను బయటపెట్టే సంఘము.


7. శరీరమును సిలువ వేయుటను ఎల్లప్పుడు ప్రకటించు సంఘము.


8. విశ్వాసులందరు తమను తాము తీర్పుతీర్చుకొనుటను ఎల్లప్పుడు ప్రోత్సహించు సంఘము మరియు


9. యేసు ఉండినట్లే విశ్వాసులను జయించువారిగా ఉండుటకు సవాలు చేసే సంఘము.


ప్రభువు తన నామము కొరకు అటువంటి సాక్ష్యమును ప్రతి ప్రదేశములో ఆశించుచున్నాడు.


అటువంటి సంఘములను కట్టుటకు, మనము ఈ పుస్తకములో పరిశీలించిన సత్యముల చేత పట్టుబడిన దూతలు ప్రభువుకు కావలెను. ఈ చివరి దినములలో అటువంటి అనేకమంది మనుష్యులను మరియు అనేక సంఘములను లోకములోని ప్రతి ప్రదేశములో ప్రభువు కనుగొనును గాక! ఆమేన్‌.