ప్రభువు నా కొరకు చేసిన కార్యములు

వ్రాసిన వారు :   డా. అనీ పూనెన్
    Download Formats:

అధ్యాయము 0
కాల పట్టిక

- జన్మదినము డిసెంబరు 25,1942


- తన 14వ ఏట, ఆమె ఇంటి యొద్ద ఒక పనిమనిషి ఆమెకు విషము పెట్టెను. కాని దేవుడు ఆమె ప్రాణమును కాపాడెను మరియు ఆమె ఆ ఏట క్రీస్తుకు తన జీవితమును సమర్పించుకొనెను.


- తన 16వ ఏట, ఆమె పేదలకు సేవ చేయుటకు తన జీవితమును అంకితము చేసుకొని, కుష్టురోగుల ఆసుపత్రిలో కుష్టురోగులకు ఎలా సహాయపడవలెనో నేర్చుకొనుటకు మధ్యభారతదేశములో ఒక మారుమూల గ్రామమునకు రైలు బండిలో 1500 కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణము చేసి వెళ్లెను.


- తన 23వ ఏట, ఆమె భారతదేశపు అగ్ర వైద్య కళాశాలయైన క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (వెల్లూరు, తమిళనాడు) నుండి డాక్టరు (వైద్యురాలు)గా పట్టభద్రురాలాయెను.


- తన 25వ ఏట, ఎటువంటి ఆదాయము కాని జీతము కాని లేని జాక్‌ పూనెన్‌ అనే దేవుని సేవకుని ఆమె వివాహము చేసుకొనెను. అతడు తన అవసరాల కొరకు దేవుని నమ్మెను మరియు అతడు కూడా పేదలకు సేవ చేయాలనుకొనెను.


- ఆమె తన 26వ ఏటనుండి 54వ ఏట వరకు (28 ఏళ్లపాటు) ఇంటి యొద్ద ఒక భార్యగా ఒక తల్లిగా ఉండి, ఆమె భర్త దక్షిణ భారతదేశములోని మారుమూల గ్రామాలలో సువార్తను ప్రకటించుచు క్రొత్త సంఘాలను స్థాపించుచుండగా, ఆమె నలుగురు కుమారులను యేసుని శిష్యులుగా ఉండుటకు వారిని పెంచి పెద్దచేసారు.


- తన 54వ ఏట (ఆమె కుమారులు కాలేజీ చదువుల నిమిత్తము ఇంటిని వదిలి వెళ్లిన తరువాత) తన భర్త భారతదేశములోను ఇతర దేశాలలోను సువార్త ప్రకటించుటకు ప్రయాణించగా, ఆమె అతనితో పాటు ప్రయాణించెను.


- ఆమె తన 54వ ఏట నుండి 70వ ఏట వరకు (16 ఏళ్లపాటు) తన భర్తతో పాటు తరచుగా దక్షిణ భారతదేశములోని గ్రామాలకు పట్టణాలకు ప్రయాణించి వందల కొలది స్త్రీలకు పిల్లలకు ఉచిత వైద్య చికిత్సను అందజేసారు.


- తన 70వ ఏట, ఆమె తన జీవితమంతటిని తిరిగి చూచి, తన జీవితములో దేవుని ఆశ్చర్యకరమైన నడిపింపును బట్టి ఆశ్చర్యపడుచున్నది.


''మహిమ నివసించు ఇమ్మానుయేలు దేశములో నేను సింహాసనాసీనురాలనైనప్పుడు నన్ను నడిపించిన చేతిని నేను స్తుతించెదను, నా కొరకు ప్రణాళికను వేసిన హృదయమును నేను సన్నుతించెదను''.


''వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొనివచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు (యెషయా 42:16).


అధ్యాయము 1
పరిచయం

వారు గర్భమందు పడక మునుపే దేవుడు తన బిడ్డలను యెరుగును మరియు వారు జన్మింపక ముందే వారి జీవితాల యొక్క ప్రతి విషయమును యోచించును.


రెండవ ప్రపంచ యుద్ధ సమయములో (1939 నుండి 1945 వరకు), తుపాకులు బాంబులు ప్రపంచంలోని అనేక భాగాలలో పేలుతుండెను. కాని భారతదేశములో, దేవుడు తన సంఘము యొక్క ప్రణాళికలో ఒక భాగముగా ఉండుటకు రెండు శిశువులు జన్మించునట్లు చేసెను. ఒక శిశువు నవంబరు 5, 1939లో జన్మించిన జాక్‌ పూనెన్‌. అతడు తన పరిచర్య కొరకు ఒక సహాయకురాలి అవసరతను కలిగియుండెను గనుక దేవుడు మూడు సంవత్సరాల తరువాత మరియొక శిశువు జన్మించునట్లు చేసెను. ఆమె అతని కొరకు పరిపూర్ణముగా రూపింపబడిన ఆనీ. ఆమె డిసెంబరు 25, 1942లో జన్మించెను.


ఆయన సంఘములో తలెత్తనున్న అవసరతల కొరకు దేవుడు ఏళ్ల ముందుగానే పనిచేయును. ఆ అవసరత తలెత్తినప్పుడు దానిని తీర్చుటకు ఆయన తన దాసులను రహస్యముగా సిద్ధపరచును. ఆయన అలా పేతురు విషయములోను పౌలు విషయములోను మరియు సంఘ చరిత్రలో ఇంకా అనేకుల విషయములోను చేసెను. ప్రాచీనకాలములో ''ఇట్టి సమయము కొరకే'' జన్మించినావని చెప్పబడిన ఎస్తేరును ఆయన లేవనెత్తెను (ఎస్తేరు 4:14). ఆ కాలములో ఆమె పరిచర్య దేవుని ప్రజలకు అవసరమైనందున ఆమె ఆ కాలములో పుట్టెను. దేవుని సంఘమునకు ఆమె పరిచర్య అవసరమైనందున ఆనీ కూడా చరిత్రలో ఒక నిర్దిష్టమైన సమయములో జన్మించెను.


జాక్‌ పూనెన్‌ మరియు ఆనీ ఊమెన్‌ అను ఈ ఇద్దరు పిల్లలు వారు పెరుగుతూ ఉండగా దేవుడు వారిని ఒకరికొరకు ఒకరికి సిద్ధపరచుచుండెనని ప్రపంచమంతటా ఉన్న ఆయన సంఘమునకు ముఖ్యమైన పరిచర్య కొరకు వారికి తర్ఫీదు ఇచ్చుచుండెనని వారు ఎరుగకుండిరి. వారు ఒకరినొకరు తెలుసుకోకుండానే పెరిగి పెద్దవారైరి.


1966లో, బొంబాయిలో భారతదేశ నావికాదళములో ఒక అధికారిగా ఉన్న జాక్‌ పూనెన్‌ ప్రభువును పూర్తి కాలము సేవించుటకు తన ఉద్యోగమునకు రాజీనామా చేసెను. అదే సంవత్సరములో, బొంబాయి నుండి వెయ్యి కిలోమీటర్ల దూరములోనున్న వెల్లూరు అను ఒక చిన్న పట్టణములో ఆనీ, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ నుండి వెద్యురాలిగా పట్టబధ్రురాలై మధ్యభారతదేశములో ఉన్న ఒక కుష్టురోగుల ఆసుపత్రిలో ఉన్న కుష్టురోగులకు పరిచర్య చేయుట ద్వారా ప్రభువును సేవించుటకు నిర్ణయించుకొనెను.


రెండేళ్ల తరువాత వారి మార్గములు కలిసెను ఎందుకనగా భారతదేశ అపొస్తలుడైన భక్త్‌సింగ్‌ గారి ద్వారా దేవుడు వారిని కలిపెను. జూన్‌ 19, 1968 తేదీన ఆయన వారి వివాహమును జరిపింపగా, వారిని గూర్చి ఆయన ఈ విధముగా ప్రవచించెను:


''వీరు అనేక దేశములలో ఉన్న అనేక జనులకు ఆశీర్వాదకరముగా ఉండుట కొరకు కలుపబడుచున్నారు. వీరి కలయిక ద్వారా ప్రపంచములోని అనేక ప్రాంతాలలో దేవుడు వెలుగు బాగా ప్రకాశించును''.


ఆ విధముగా ఆనీ జాక్‌ పూనెన్‌ యొక్క సహాయకురాలిగా తన జీవితకాలపు పరిచర్యను ఆరంభించెను. ప్రపంచములో అనేక ప్రాంతాలలో వారు కలసి జీవించి పరిచర్య చేసిన 44 సంవత్సరాలను ఆమె తిరిగి చూచినప్పుడు, వారి వివాహములో చేయబడిన ప్రవచనము యొక్క నెరవేర్పును ఆమె చూచుచున్నది.


తమ తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా ప్రకటించిన సత్యాలకు ఈ రోజున ధైర్యముగల సాక్షులుగా ఉన్న నలుగురు కుమారులను పెంచిపెద్దచేయుటకు దేవుడు వారికి సహాయపడెను. ఈ విధముగా దేవుని సాక్ష్యము పవిత్రతలోను శక్తిలోను మరియొక తరమునకు వెళ్లుచున్నది. జాక్‌ పూనెన్‌ తరచు ఈ విధముగా చెప్పెను: ''నా కుమారులు ఈ రోజున ప్రభువును వెంబడించుచున్నారంటే అది మొట్టమొదటిగా దేవుని కృపాకనికరముల బట్టియే, రెండవది అది ఆనీ వారిలో ఆత్మానుసారమైన విలువలను కలుగజేసి వారికొరకు నిరంతరము ప్రార్థించుచు, వారితో ఎంతో సమయము గడుపుటను బట్టియే''.


ఆనీ జాక్‌ పూనెన్‌ను పెళ్లిచేసుకొనుటకు నిర్ణయించుకొన్నప్పుడు, ''అతడు నా దాసుడు. నీవతనిని చూచుకోవాలని నేను కోరుచున్నాను'' అని దేవుడు ఆమెతో ప్రత్యేకముగా చెప్పారు. ఆమె ఈ పనిని ఇప్పటికి 44 ఏళ్లుగా నమ్మకముగా జేసెను. ఆమె అతనిని శారీరకముగానే కాక, అతని పరిచర్యలో ప్రార్థనా భాగస్వామిగా ఉండి తమిళనాడు గ్రామములలో అతనితోపాటు పరిచర్య చేసెను. ఆమె ఆ గ్రామములలో ఉన్న స్త్రీలకు పిల్లలకు ఉచితముగా వైద్యసహాయమును ఇప్పటికి అనేక సంవత్సరాలుగా ఇచ్చెను.


40 ఎళ్లుగా భారతదేశములో నేరుగా కాని లేక ఏదైనా సంస్థద్వారా కాని ఇతరులకు తాను చేసిన వైద్య పరిచర్యనుండి ఒక్కరూపాయిని కూడా సంపాదించని వైద్యురాలు ఆనీ పూనెన్‌. ఆమె వైద్య పరిచర్య అనేకులను అకాల మరణమునుండి కాపాడి వందల మందికి అనారోగ్యము నుండి స్వస్థతను చేకూర్చెను.


(ఇది ఆనీ 70వ జన్మదినము సందర్భముగా ఆమె కుటుంబము మరియు స్నేహితులు ముద్రించిన స్మృతుల పుస్తకమునుండి తీయబడినది).


అధ్యాయము 2
నా మార్పు (రక్షణ)

ప్రభువు నా జీవితములో చేసిన అద్భుత కార్యములన్నిటిని బట్టి నేను దేవుని మహిమ పరచాలనుకొనుచున్నాను. ఒక మంచి క్రైస్తవ గృహములో ఎదుగుటకు దేవుడు నాకు కృపనిచ్చెను. తొమ్మిది మంది పిల్లలలో నేను పెద్దదానిని. నా జీవితము యొక్క తొలి దశలోనే నా తల్లిదండ్రులు యేసును నా రక్షకునిగా అంగీకరించమని నేర్పించిరి. ప్రభువును నా హృదయములోనికి రమ్మని నేను అనేకమార్లు అడిగితిని. కాని ఆయన వచ్చాడా లేదా అనే విషయములో నాకు ఎప్పుడు నిశ్చయత లేకుండెను. నేను ప్రార్థించి ఆయనను అడిగేదానను - ఆ తరువాత దాని గూర్చి మరచిపోయేదానను. కాని యేసు నా హృదయములోనికి వచ్చెననియు చీకటిరాజ్యము నుండి నన్ను తీసి ఆయన వెలుగు రాజ్యములోనికి నన్ను తెచ్చెననియు నాకు నిశ్చయత కలిగిన ఒక దినము చివరకు వచ్చెను. అది ఇలా జరిగెను.


నాకు 14 ఏళ్ల వయస్సున్నప్పుడు నా తల్లి నా చిన్న తమ్మునితో గర్భవతిగా యుండెను. నా తల్లి ఇంటి పనినంతటిని తనకు తానే చేయలేకపోయెను గనుక మా కొరకు ఒక వంటవానిని పనిలో పెట్టుకొంటిమి. ఈ వ్యక్తి మాకు తెలియకుండా ఒక రోజు ఆహారములో విషమును కలిపి పెట్టెను. మా ఇంటి నుండి వస్తువులను దొంగిలించుటకు మమ్ములనందరిని స్పృహ తప్పిపోయేటట్లు చేయాలనుకొన్నాడని నేననుకొనుచున్నాను. నేను పెద్దకుమార్తెను గనుక నేను అందరికి ఆహారమును వడ్డించాను. కాని అది రుచికరముగా లేదని అందరూ ఆ రోజు ఆహారము తినుటకు నిరాకరించిరి. అయితే నేను కొంచెము తింటిని. ఆ రాత్రి నాకు ఎంతో దప్పిక కలిగియుండుట నాకు గుర్తున్నది. దాని తరువాత ఏమి జరిగిందో నాకు జ్ఞాపకము లేదు. ఆ తరువాత రోజు నేను బడికి వెళ్లి అక్కడ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించితినని నా కుటుంబస్తులు నాతో చెప్పిరి. నేనెప్పుడు నెమ్మదిగల విద్యార్థినిగా ఉండేదానను కాని ఆ రోజు నేనెంతో గొడవచేసాను. బడి అయిపోయిన తరువాత, నా తమ్ముళ్లు, చెల్లి నేను కలసి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వచ్చితిమి. ఇంటికి వచ్చే దారంతటిలో నేను వారిని కొట్టుచూ చెడ్డగా ప్రవర్తించితినని వారు తరువాత నాతో చెప్పిరి. నేను ఇంటికి చేరుకొన్న తరువాత కూడా గొడవచేయుట కొనసాగించితిని. నా తల్లిదండ్రులు నాకు మతి చెలించినదనుకొనిరి. కాబట్టి వారొక వైద్యుని పిలచిరి. నేను తిన్నదతురా అనబడిన విషపు విత్తనాల వల్ల ఇది కలిగెనని అతడు చెప్పెను. అప్పుడు నా తల్లిదండ్రులు ఇంటిలోనున్న ఆహారమంతటిని పరీక్షించి చూచి ఒక పచ్చడిలో ఆ విత్తనాలను కనుగొనిరి. ఈ సమయానికి మా వంటవాడు ఏమి చెప్పకుండా మాయమయ్యాడు.


దీని తరువాత నేను చాలా గంటలపాటు నిద్రించితిని - ఎంత సమయమో నాకు గుర్తులేదు. ఆ వైద్యుడు నా కడుపును మందుల ద్వారా కడిగి నాకొరకు చేయగలిగినదంతా చేసారు. కాని నేనింకా కోమాలో (స్పృహలేని స్థితిలో) ఉంటిని. దేవుని కృపాకనికరముల వలన నేను వారం రోజుల తరువాత కోలుకొంటిని. అప్పుడు నాకుటుంబము జరిగినదానినంతటిని నాకు తెలియజేసిరి. అప్పటినుండి నేను మరణము గూర్చి తీవ్రముగా ఆలోచించితిని.


నేను ఆ విషాన్ని మరికొంచెము తీసుకున్నట్లయితే నేను చనిపోయుండేదానినని ఆ వైద్యుడు చెప్పెను. నేనప్పుడు చనిపోయినట్లయితే నేరుగా నరకానికి వెళ్లియుండేదానినని నేను యెరిగియుంటిని. నేను నా తల్లిదండ్రులకు అనేకమార్లు అవిధేయత చూపుట వలన నేను పరలోకమునకు వెళ్లుటకు అర్హురాలిని కాదు. కాబట్టి ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపడియుండాలని నేను నిర్ణయించుకొంటిని. ప్రభువైన యేసు నా పాపములను క్షమించి నా హృదయములోనికి రావాలని మరల ప్రార్థించితిని. నేను అలా కొంతసేపు ప్రార్థన చేసిన తరువాత కూడా ఏమి జరుగలేదు. దేవుని బిడ్డనన్న నిశ్చయత నాకు ఎప్పుడు కలుగదని నేననుకొంటిని.


కాని ఆ రాత్రి ప్రభువు, నా ఆత్మలో నన్ను ప్రార్థన ఆపవద్దని పురిగొల్పినట్లు నేను భావించితిని. నేను తీవ్రమైన ఆశ కలిగియుంటిని. నేను ఇక సందేహములో జీవించక దేవుని బిడ్డనేనన్న నిశ్చయతను కలిగియుండాలనుకొంటిని. గనుక నేను ప్రార్థించుట కొనసాగించితిని. మా ఇంటిలో నున్న పెద్ద గడియారము మధ్యరాత్రి గంట కొట్టెను. మరల ఒంటిగంటకు మ్రోగినది. ఇంటిలో మిగతావారందరు నిద్రపోయిరి, కాని నేను మేల్కొనియుండి ప్రార్థించితిని. నేను నా హృదయములో నెమ్మదిగా పాటలు పాడుకొంటు, కొన్ని వచనాలను నాకునేను వల్లించుకొంటిని. ఉదయము సుమారు మూడు గంటలకు, నాలో ఆనందము ఉప్పొంగుట కనుగొంటిని, నా హృదయము సమాధానముతో నిండిపోయెను. ఆయన నా పాపములను కడిగివేసెనని ఇప్పుడు నేనాయన బిడ్డనని, ఆయన నన్ను తీవ్రముగా ప్రేమించుచున్నాడని, నా జీవితము కొరకు ఒక ప్రణాళికను కలిగియున్నాడని దేవుడు నాకు నిశ్చయతనిచ్చెను. ఆ రోజు నుండి ఈ నిశ్చయత నన్ను వదిలి వెళ్లలేదు.


ఆ రాత్రి నేను రెండు విషయాలు స్పష్టముగా నేర్చుకొంటిని: మొదటిగా నేను దేనికొరకైనా ప్రార్థించినప్పుడు దేవుని నుండి సమాధానము పొందేవరకు నేను ప్రార్థించుట ఆపకూడదు. ఆ తరువాత నేనెప్పుడు సమస్యలను ఎదుర్కొన్ననూ - ''నీకు సమాధానము దొరికే వరకు ప్రార్థించుట మానవద్దు'' అని దేవుడు నాకు ఎప్పుడు గుర్తు చేసేవాడు. రెండవదిగా, ఆయన నన్ను నిజముగా చీకటి రాజ్యమునుండి విడిపించి ఆయన వెలుగు రాజ్యములోనికి తీసుకొని వచ్చెనని నాకు నిశ్చయతనిచ్చెను. అప్పటినుండి నేనాయన బిడ్డనని నేనెప్పుడు సందేహించలేదు.


నేను చిన్న వయస్సులో మరణించకుండునట్లు దేవుడు నా జీవితమును కాపాడినందుకు నేను దేవునికి కృతజ్ఞత కలిగియున్నాను. దేవుడు నాకు మంచి చేసి ఆయన కొరకు జీవించుటకు నాకు అనేక సంవత్సరములనిచ్చెను. ప్రభువు నాకు చూపించిన తరువాతి మెట్టు నీటి బాప్తిస్మము. అప్పటినుండి నా ఆత్మీయ జీవితము ఎదుగుటకు సహాయపడుటకు ప్రభువు నా మార్గములోకి అనేక భక్తిపరులను పంపెను. దానిలో ఒకరు భక్తిపరురాలైన సండేస్కూలు బోధకురాలు. ఈ సంఘటన వెంటనే నేను పాఠశాల విద్యను ముగించితిని. జీవితములో నేనేమి చేయవలెనని ఆయన కోరుచున్నాడని నేనప్పుడు ప్రభువును అడిగితిని. మనకొరకు మనము ఇంకెప్పుడు జీవించకుండా ఆయన కొరకు మాత్రమే జీవించుటకు క్రీస్తు మరణించెనని నేను 2కొరింథీ 5:15లో చదివితిని. నేను మరణమునుండి నరకము నుండి రక్షింపబడితిని. అప్పటినుండి నేను కేవలము క్రీస్తు కొరకే జీవించెదనని నిర్ణయించుకొంటిని.


అధ్యాయము 3
కుష్టురోగులతో పనిచేయుట

నేను పాఠశాల విద్యను ముగించగానే, మహారాష్ట్రలో ఉన్న ఒక కుగ్రామమైన కొతారాలోనున్న కుష్టురోగుల ఆసుపత్రిలో పనిచేయుచున్న అమెరికా మిషనరీలను కొందరిని నేను కలుసుకొంటిని. వారిలో ఒకరు సుమారు నలభై ఏళ్లున్న ఒక అందమైన స్త్రీ. ఆమె భారతదేశమునకు ఒక 27 ఏళ్ల నర్సుగా వచ్చి ఆ ఆసుపత్రిలో కుష్టురోగులను చూచుకొంటూ 15 ఏళ్లుగా పనిచేయుచుండెను. భారతదేశములో ఉన్న మన ప్రజలకు సహాయపడి వారిని క్రీస్తు యొద్దకు నడిపించుటకు ఈ యౌవన స్త్రీ అమెరికా వంటి దూర దేశమునుండి వచ్చుట నన్ను ఆశ్చర్యపరచెను. ఆమె సమర్పణ నన్ను సవాలు చేసెను మరియు నేను ఆమెకు సహాయపడాలని భావించితిని. (మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఫాదర్‌ దామియన్‌ అను ఒక బెల్జియన్‌ పాదిరిని గూర్చిన పుస్తకమును మాకు చదివి వినిపించెను. అతడు 19వ శతాబ్దములో, హవాయి అను ప్రాంతములో ఉన్న కుష్టురోగులకు సహాయపడుటకు క్రీస్తు కొరకు, అతనికున్న ప్రేమను బట్టి హవాయి అనుప్రదేశమునకు వెళ్లెను. చివరకు అతనికి కూడా కుష్టురోగము సంక్రమించినందున అతడు హవాయిలో చనిపోయెను. ఇది చదివినప్పుడు మా నాన్న స్వరము గద్గదికమాయెను).


గనుక నాకు 16 ఏళ్ల వయస్సున్నప్పుడు, నేను ఇంటినుండి 1500 కిలోమీటర్లదూరములోన్ను ఈ కుష్టురోగుల ఆసుపత్రికి ప్రయాణించుటకు నిర్ణయించుకొంటిని. నేనక్కడ రెండు వారాలు గడిపితిని. నేనక్కడ నర్సులకు సహాయపడుచుండగా, ఈ వ్యాధిగ్రస్తులకు సహాయపడాలనే గొప్ప ఆశను నాలో నేను కనుగొంటిని. ఆ కాలములో భారతదేశములో అనేకులు కుష్టువ్యాధితో బాధపడుచుండెడివారు మరియు వారికి సహాయపడుటకు ఎవరు ఇష్టపడేవారు కారు. ఈ రోగులు వారి వైకల్యాలతో వికర్షణీయముగా ఉండేవారు కాబట్టి ప్రజలు వారి దగ్గరకు కూడా వెళ్లేవారు కాదు. వారి బంధువులు వారిని ఆసుపత్రికి తీసుకొనివచ్చి వారిని అక్కడ విడిచిపెట్టి వారిని తిరిగి తీసుకువెళ్లేవారు కాదు. ఈ గ్రామము జననివాసము లేని, పాములతో నిండియున్న గ్రామము. కాబట్టి ప్రజలు కుష్టురోగము ఉన్న వారిని ఈ గ్రామమునకు తీసుకువచ్చి అక్కడ వదిలిపెట్టేవారు. ఆ గ్రామములో బస్సులు కూడా ఆగేవికావు.


మొదటి ఉదయాన్న నేను ఆసుపత్రిలో ఒక ప్రార్థనా కూటమునకు వెళ్లితిని. యేసును తమ రక్షకునిగా అంగీకరించిన కొందరు కుష్టురోగులు ప్రార్థన కొరకు కలసివచ్చిరి. నేను వారి ముఖాలను చూచినప్పుడు నాకు ఒక విధమైన అసహ్యము కలిగెను మరియు ఆ కుష్టువ్యాధి నాకు సంక్రమించునేమోనన్న భయము కలిగెను. అప్పుడు వారు నాకు అర్థముకాని మరాఠీ భాషలో పాడుట వింటిని. వారు రోగము చేత ప్రభావితము చేయబడిన స్వరములతో వారు పాడుచుండగా ప్రభువు నాతో మాట్లాడుట ప్రారంభించెను. నా వంటి పాపి కొరకు యేసు ఈ లోకములోకి ఎలా వచ్చెనో నేను తలంచితిని; నా పాపములు కుష్టురోగము కంటే ఘోరమైనవి. నా నిమిత్తము ఆయన తన ముఖమును అందవిహీనముగా మారునంతగా ఇతరులను కొట్టనిచ్చెను. దేవుడు అప్పుడు నన్ను విరుగగొట్టి ఈ దయనీయమైన స్త్రీల కొరకు నా హృదయమును ఎంతగా ప్రేమతో నింపెనంటే వారిలో ప్రతి ఒక్కరిని కౌగలించుకోవాలని నాకనిపించెను. వారు ఇక అందవిహీనముగా వికర్షణీయముగా నాకు అనిపించలేదు. ''ప్రభువా నేనిక్కడ ఉన్నాను. వీరికి సహాయపడుటకు నన్ను వాడుకొనుము'' అని నేను ప్రభువుతో చెప్పితిని. కేవలము దేవుడు మాత్రమే నాలో ఇట్టి పరివర్తనను కలుగజేసి యుండగలడు. అప్పుడు నేను ఒక వైద్యురాలిని అవ్వాలని నిర్ణయించుకొంటిని.


వెల్లూరులో ఉన్న క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో ప్రవేశము పొందుటకు ప్రభువు నాకు సహాయపడెను. ప్రతి సంవత్సరము క్రిస్‌మస్‌ సెలవులలో నేను ఈ కుష్టురోగుల ఆసుపత్రిని దర్శించి అక్కడి రోగులకు సహాయపడుటకు అలవాటు పడితిని. నా సెలవులకు ఇంటికి వెళ్లకుండా అక్కడికి వెళ్లుటను బట్టి నా తల్లిదండ్రులు సంతోషించలేదు. నేను ఒక డాక్టరును (వైద్యురాలిని) కాబోచున్నందుకు వారు ఆనందించిరి గాని నా జీవితాంతము కుష్టురోగులతో పనిచేయుట వారు ఇష్టపడలేదు. ఆ రోజులలో కుష్టువ్యాధిని నయం చేయటము కుదరదని అటువంటి వారితో పనిచేసిన అనేకులకు కుష్టురోగము సంక్రమించెనని వారు యెరిగియుండిరి. కుష్టురోగము ఉన్నవారితో నేను పనిచేసిన యెడల నన్ను ఎవరు పెళ్లిచేసుకోరని కూడా నా తల్లిదండ్రులు నాతో చెప్పారు.


అయితే ప్రభువు నన్ను కనీసము కొద్దికాలము అక్కడ పనిచేయవలెనని కోరుచున్నాడని నేను ఒప్పింపబడితిని. కాబట్టి నేను డాక్టరుగా పట్టభధ్రురాలనైన తరువాత, ఆ ఆసుపత్రిలో పనిచేయుటకు వెళ్లితిని. ఆ కుష్టురోగుల ఆసుపత్రిలో పనిచేసిన మొదటి భారతీయ మహిళా డాక్టరును నేనే మరియు ఆ ప్రాంతమంతటికీ ఉన్న ఏకైక మహిళా డాక్టరును నేనే. కుష్టువ్యాధి (చర్మం మీద ఒక చిన్న మచ్చగా మొదలగును) వచ్చిన స్త్రీలు సాధ్యమైనంత కాలము దానిని దాచిపెట్టుదురు మరియు వారు మగ డాక్టర్ల యొద్దకు వెళ్లరు. గనుక వారి కుష్టురోగము గూర్చి ఇతరులకు తెలిసే సమయానికి, అది ఎంత ముదిరిపోయి యుండునంటే దానిని నయం చేయటం అసాధ్యము. అప్పటికి వారు వారి గృహములో ఉన్న పిల్లలకు ఇతరులకు ఆ వ్యాధిని సంక్రమింపజేసి యుందురు. నేను స్త్రీని గనుక, ఈ స్త్రీలు నన్ను తమ శరీరాలను పరీక్షించుటకు అనుమతించేవారు. ఆ విధముగా మేము ఆ వ్యాధి సోకిన వారికి తొలి దశలో చికిత్స చేయుట వారిని నయం చేయుటకు సహాయపడెను. నేనక్కడ ఒక సంవత్సరమంతయు పని చేసితిని మరియు వారికి సేవచేయుటకు దేవుడు నాకు అనేక అవకాశాలనిచ్చెను. నేను వారిని అర్థం చేసుకొని వారితో మాట్లాడగలుగునట్లు ప్రభువు నేను మరాఠీ నేర్చుకొనుటకు సహాయము చేసెను. వారికి ఎలా చికిత్స చేయాలన్న విషయములో కూడా ఆయన నాకు జ్ఞానము నిచ్చెను. ఇతర వ్యాధులతో ఉన్న కొందరు స్త్రీలు కూడా ఉండిరి. కాని వారందరి విషయంలో నేను ప్రభువును ఒక గొప్ప వైద్యునిగా అనుభవించితిని.


అధ్యాయము 4
నా వివాహము

నేను వెల్లూరులో వైద్య కళాశాలలో ఉన్నప్పుడు నేను ఎంతో ఎక్కువగా గౌరవించిన భక్త్‌ సింగ్‌ అనే దైవజనుడుని, ముఖ్య నాయకునిగా కలిగియున్న ఒక సంఘమునకు వెళ్లేదానను. ఆయన నాకు ఒక తండ్రి వలే నుండెను. 1967లో, నేను కుష్టురోగుల ఆసుపత్రిలో పని చేయుటకు వెళ్లేముందు, తన తోటి దాసుడైన జాక్‌ పూనెన్‌ అనే వ్యక్తిని వివాహము చేసుకొనుటకు నన్ను ఆలోచించమని అడిగెను. దాని గురించి నన్ను ప్రార్థన చేయమని అడిగెను.


జాక్‌ పూనెన్‌ ఒక నావికా దళ అధికారిగా ఉండి ప్రభువును సేవించుటకై ఒక ఏడాది ముందు భారతీయ నావికా దళమునుండి రాజీనామా చేసారు. కొన్ని సందర్భాలలో జాక్‌ పూనెన్‌ మాట్లాడుట విని నేను అతనిని ప్రశంసించితిని. ఆయనకు సేవచేయుటకు దేవుడు జాక్‌ పూనెన్‌ను పిలచెనని, అతని పరిచర్య ద్వారా అనేక స్థలాలలో ఉజ్జీవము కలిగెనని నేను తెలుసుకొంటిని. గనుక నా భర్తగా కలిగియుండుటకు అతనే శ్రేష్టమైన వ్యక్తియని నేను భావించితిని - ఎందుకంటే నేను అతనిని నాకు మాదిరిగా చూచుట చాలా తేలిక. ఈ ప్రకారముగా నేను నా తండ్రికి వ్రాసితిని. కాని నా తండ్రి దానిని అంగీకరించలేదు.


నావికా దళంలో తన ఆదాయాన్నంతా జాక్‌ పూనెన్‌ దేవుని పనికి ఇచ్చివేసారు మరియు ఇప్పుడు ఎటువంటి ఆదాయము లేకుండెను. కాబట్టి జాక్‌ ఏ విధంగా ఒక కుటుంబానికి కావలసిన అవసరతలను తీర్చగలడు అని నా తండ్రి ఆలోచించి ఈ సంబంధమును ఇంకా పట్టించుకోలేదు. నేను ఆ కుష్టురోగుల ఆసుపత్రిని విడిచిపెట్టాలని ఆయన నిర్ణయించి నన్ను తిరిగి ఇంటికి తీసుకువచ్చుటకు అక్కడకి వస్తున్నానని నాతో చెప్పారు. నా తండ్రి ఒక వ్యాపారవేత్త మరియు ఒక బోధకుడైయుండెను. ఇంటి నుండి నేను పని చేయు స్థలమునకు దూర ప్రయాణము చేయుచుండగా, ఆయన కొన్ని స్థలాలలో ఆగి సంఘాలలో బోధించెను. కొన్ని సంఘాలలో ఆయన తన స్నేహితులనుండి జాక్‌ పూనెన్‌ గురించి విచారణ చేసారు. జాక్‌ గురించి అందరూ మంచిగా చెప్పిరి మరియు అటువంటి వ్యక్తిని అల్లుడిగా పొందుట ఆయన అదృష్టమని చెప్పిరి. నా తండ్రికి దగ్గర స్నేహితుడైన ఒక అమెరికా మిషనరీ కూడా అదే విషయాన్ని చెప్పి ''అనేక మంది డాక్టర్లు కేవలము డబ్బు సంపాదించుటలో ఆసక్తి కలిగియున్నారు. కాని నీ కుమార్తెకు డబ్బును సంపాదించే విషయములో ఆసక్తి లేదు కాని ప్రభువును సేవించాలను కొనుచున్నది. కాబట్టి ఆమె ప్రభువును సేవించే వానినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నది'' అని కూడా చెప్పెను. ఇదంతా విన్న తరువాత నా తండ్రి వైఖరి పూర్తిగా మారిపోయి జాక్‌ పూనెన్‌తో నా వివాహము జరిపించుటకు అంగీకరించెను. నేను చాలా ఆనందించితిని.


కాని ఆసుపత్రిలో ఉన్న ప్రజలు నేను వారిని వదిలి వెళ్లిపోవుచున్నానని బాధపడిరి. నేను కూడా వారిని ప్రేమించితిని. నేను మహిళా రోగులతో మాట్లాడుచున్న ఒక కూడికలో ఉజ్జీవము వంటిది వచ్చుట నాకు గుర్తున్నది. గదిలో ఒక మూలనున్న ఒక స్త్రీ అకస్మాత్తుగా ఏడవడం మొదలుపెట్టి మరియొక స్త్రీ యొద్దకు వెళ్లి, ''నేను నీతో చాలా కాలం పాటు మాట్లాడనందుకు నన్ను క్షమించు'' అని క్షమాపణ చెప్పెను. ఆ తరువాత మరియొకరు ఇంకొకరి యొద్దకు వెళ్లి ఆమెతో సమాధానపడిరి. త్వరలోనే ఆ గదియంతయు ఏడుస్తూ దేవునికి ప్రార్థించే స్త్రీలతో నిండిపోయెను. మా మధ్య పరిశుద్ధాత్మ కదులుచుండెను. అటువంటి దేవుని కదలికలను చూచిన తరువాత, వారిని వదిలి వెళ్లుట నాకు బాధగా ఉండెను. ''ప్రభువా, ఇక్కడ నీవు ఒక అద్భుతమైన పనిని చేయుచున్నావు. ఈ ప్రదేశాన్ని వదిలి నన్ను వెళ్లిపొమ్మని నీవు నిజముగా కోరుచున్నావా?'' అని ప్రభువు నడిగితిని. కాని నా మార్గములు ప్రభువు మార్గములు కావని యెరిగి నా జీవితములో ఒక క్రొత్త అధ్యాయములోనికి (దశలోనికి) ఆయన నన్ను నడిపించుచున్నాడని భావించితిని. ఆయన నన్ను మెట్టు తరువాత మెట్టు నడిపించుట కొనసాగించును. ఆ విధముగా నేను ఆ ఆసుపత్రిని విడిచితిని. జూన్‌ 1968లో వెల్లూరు నందు సహోదరుడు భక్త్‌ సింగ్‌ జాక్‌ పూనెన్‌తో నా వివాహమును జరిపించిరి.


(నేను ఈ ఆసుపత్రిని విడిచివెళ్లిన తరువాత ప్రభువు వీరి కొరకు ఒక అద్భుతమైన కార్యము చేసెను. వారికి సేవ చేయుటకు ఆయన వేరే వైద్యులను పంపించెను. ఇప్పుడు భారతదేశములో కుష్టువ్యాధి నిర్మూలింపబడినందున ఈ ఆసుపత్రి నానావిధములైన రోగులకు చికిత్స చేస్తున్నది. అనేక ఏళ్ల తరువాత నేను దానిని దర్శించినప్పుడు, నేనక్కడ ఉండగా జన్మించిన ఒక శిశువు (ఈమె ప్రసవం నా చేతులమీదుగా జరిగినది), అదే ఆసుపత్రిలో ఒక టెక్నీషియన్‌ (సాంకేతిక నిపుణురాలు)గా పనిచేయుట నన్ను పులకరింపజేసినది).


వివాహము తరువాత, స్థిరమైన ఆదాయము లేకుండా జీవించుట ఎంత కష్టమో వెంటనే కనుగొంటిని. అప్పుడు నేను తిరిగి ఆ కుష్టురోగుల ఆసుపత్రికి వెళ్లి పనిచేయాలని మరియు జాక్‌ పూనెన్‌ తాను ప్రయాణించే పరిచర్య కొరకు దానిని ఒక స్థావరముగా వాడుకోవచ్చని నాకు మొదట తలంపు వచ్చెను. గనుక మేము ఆ ఆసుపత్రిని దర్శించితిమి. కాని అక్కడ ఉండుటకు జాక్‌కు దేవుని నుండి నడిపింపు లేకుండెను. కాబట్టి మేము వెల్లూరు తిరిగి వచ్చితిమి. ఒక ఇల్లు అద్దెకు తీసుకొనుటకు మా యొద్ద సరిపడా డబ్బు లేనందున అక్కడ ఉన్న ఆయన తల్లిదండ్రుల ఇంటిలో ఒక గదిలో ఉండవలసి వచ్చెను. దాదాపు ఒక ఏడాది తరువాత మా మొదటి కుమారుడు జన్మించెను. అప్పుడు మా ఆర్థిక అవసరతలు బాగా పెరిగిపోయెను. మేము పొందిన కొద్ది దానితో జీవించుటకు మేము ఇబ్బందిపడితిమి.


అధ్యాయము 5
పరిశుద్ధాత్మలో బాప్తిస్మము

నాకు వివాహమయ్యే వరకు నేను కళాశాలలోను ఆసుపత్రిలోను దేవుని పనిలో చురుకుగా ఉండేదానను. కాని ఇప్పుడు నేను ఇంటి యొద్ద కూర్చొని (అది నా ఇల్లు కూడా కాదు) చూచుకోవడానికి చాలినంత డబ్బు కూడా లేకుండా ఒక చిన్న బిడ్డను కలిగియుంటిని. నేను ఎంతో నిరాశపడి నా మనస్సులో ప్రభువుకు దూరమగుట మొదలు పెట్టితిని. నేను బయటకు ఏ తప్పు చేయలేదు. నేను సంఘ కూటాలకు వెళ్తూవుండే దానను. కాని లోపల దౌర్భాగ్య స్థితిలో ఉంటిని. జాక్‌ పూనెన్‌ను వివాహము చేసుకొనుటకు ప్రభువు నన్ను నడిపించెనని నేను యెరిగితిని. కాని ఈ విధముగా మేము ఎందుకు శ్రమపడుచున్నామో ఆలోచించితిని. నాకు ప్రార్థన చేయాలనిపించలేదు, బైబిలు చదవాలని కూడా అనిపించలేదు. దానితో పాటు మా బిడ్డ రాత్రి నన్ను మెళకువగా ఉంచేవాడు మరియు నేను ఎప్పుడు అలసిపోతూ ఉండేదానను.


ఈ తీవ్రమైన నిరాశ సమయములో, నేనప్పటి వరకు కలుసుకోని ఒక సహోదరి మా ఇంటికి వచ్చినది. మనము కలసి ప్రార్థన చేద్దామా అని ఆమె నన్ను అడిగింది. నేను దానికి అంగీకరించి ఆమెను నా పడకగదికి తీసుకొని వెళ్లి అక్కడ మేమిద్దరము కలసి ప్రార్థించితిమి. ఆమె ప్రార్థనలోని నవీనత్వము నన్ను సవాలు చేసింది. అటువంటి నవీనత్వమును నా జీవితములో కూడా కలిగియుండుటకు ఆశ పడేలాగా అది నన్ను చేసింది. అప్పుడు ఆ సహోదరి ఆ తరువాతసారి ఆమె ఇంటిలో ప్రార్థించుటకు రమ్మనమని చెప్పెను. గనుక ఆ తరువాతసారి నేను నా బిడ్డను తీసుకొని ఆమె ఇంటికి వెళ్లితిని. నా బిడ్డ మా మధ్య నిద్రించుచుండగా మేమిద్దరము నేలమీద మోకరించి ప్రార్థించితిమి. నేను ''ప్రభువా, నా జీవితములో ఏదో జరిగినది. ఒకప్పుడు నేను నీకు చాలా సమీపముగా ఉంటిని, కాని ఇప్పుడు నేను నీకు చాలా దూరమైతిని. నన్ను కనికరించి నన్ను నీ యొద్దకు తిరిగి చేర్చుకో'' అని ప్రార్థించితిని.


అప్పుడు కొందరికి వ్యతిరేకంగా నా హృదయములో నేను తప్పుడు వైఖరులను కలిగియుండుటను ప్రభువు నాకు చూపించుట మొదలపెట్టెను. నా తండ్రి మరియు నేను మాకున్న సంబంధములో దూరమైతిమి. నా భర్త యొక్క తల్లిదండ్రులు నాతో మంచిగానే ఉన్నారు కాని నేను వారి ఇంటిలో సంతోషముగా లేకుంటిని. సమస్య ఇతరులతో కాదుగాని నాతోనేనని ప్రభువు నా కళ్లు తెరచి నాకు చూపించెను. కాబట్టి నేను ఏడ్చుచూ, ''ప్రభువా నన్న క్షమించు. నేను ఘోరమైన పాపిని. బయటకు నేను మంచిదానినే అని ప్రజలనుకొనుచున్నారు. కాని లోపల నేను నిష్ఠూరముతో నిండియున్నాను'' అని చెప్పితిని.


అకస్మాత్తుగా దేవుడు నా హృదయమును ముట్టినట్లు నాకనిపించెను. ఆయన కౌగిలిలో ఒక చిన్న బిడ్డవలే నాకనిపించెను. ఆయన నన్ను ఎత్తికొనెను మరియు నా కన్నీళ్లు ఆగిపోయెను. ఆయన నా హృదయమును మరల సంతోషముతోను సమాధానముతోను నింపెను. నేనాయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మొదలుపెట్టగా నేనొక క్రొత్త భాషలో మాట్లాడుట కనుగొంటిని. నేనాశ్చర్యపోతిని. మేము ''బ్రదరన్‌'' సంఘ నేపధ్యము గలవారము. నేను భాషల వరమును నమ్మలేదు. నాకేమగుచున్నదోనని నేను ఆశ్చర్యపడితిని. ఆ అన్య భాషలో ప్రార్థించాలని నేను కోరుకోలేదు. కాబట్టి నేను ఇంగ్లీషులో మరల ప్రార్థించుట మొదలుపెట్టితిని. కాని ఇప్పుడు ఇంగ్లీషు (ఆంగ్లము)లో ప్రార్థించుట ప్రయాసగా నుండెను. దేవుడు నాకిచ్చిన ఈ క్రొత్త భాషలో ప్రార్థించుట నాకు సుళువుగా అనిపించెను. నేను నా హృదయమును ప్రభువు ముందు కుమ్మరించి ఈ క్రొత్త భాషలో దేవుని స్తుతించితిని. నేను ఇక భూమిపై లేనట్లుగా నా ఆత్మలో నాకనిపించెను. నా హృదయములో ఎంతో గొప్ప సంతోషము సమాధానము ఉండెను. నేను ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని నా భర్తతో చెప్పితిని. తరువాత రోజుల్లో ఆయన నా జీవితములో ఒక నిజమైన మార్పును చూచెను. ఒక క్రొత్త తాజాదనము నా జీవితములోనికి వచ్చెను. నా హృదయములో ఒక ఎండిపోయి మోడుబారిన ఎడారి అకస్మాత్తుగా తాజాగా పచ్చగా మారినట్లు నాకనిపించెను. ఆ దినమునుండి నన్ను ఆ సంతోషము సమాధానము విడిచివెళ్లలేదు.


ఒక కుటుంబముగా మమ్మును వ్యతిరేకించిన ప్రజలనుండి మేము అనేక శోధనలను ఎదుర్కొంటిమి. కాని వాటిలో ఏది కూడా నన్ను ప్రభువుతో నాకున్న సంబంధమునుండి వేరుచేయలేదు. మా నాల్గవ బిడ్డ పుట్టిన తరువాత నేను అకస్మాత్తుగా కీళ్ల నొప్పులతో మంచాన పడి దాదాపు సమయమంతయు మంచములోనే గడుపవలసియుండెను. అప్పుడు కూడా ప్రభువు నా హృదయమును సంతోష సమాధానములతో నింపియుంచెను-ఒక నెల తరువాత నన్ను అద్భుతకరముగా స్వస్థపరచెను.


1975 ఆగష్టు నెలలో ప్రభువు మా గృహములో ఒక సంఘమును ఆరంభించెను. ఆ తరువాత మేము భారతదేశములోనున్న ఇతర క్రైస్తవులనుండి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటిమి. మా కుటుంబ అవసరతలను తీర్చుటకు కూడా మేము ఇబ్బండి పడితిమి. కాని ఆ పరిస్థితులన్నింటిలోను దేవుడు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచి నా ప్రార్థనకు జవాబిచ్చెను. ఆయనను నా తండ్రిగా ఇంకా ఇంకా సన్నిహితముగా నేను తెలుసుకొంటిని.


ఆ తరువాత దేవుడు క్రీస్తులో నెలకొల్పిన నూతన నిబంధన యొక్క గొప్ప సత్యాలను చూచునట్లు నా కళ్లు తెరచెను. నేను నా కొరకు ఇక జీవించకుండా ఆయన కొరకే జీవించుటకు తన పరిశుద్ధాత్మ శక్తిని నాకిచ్చెనని ఆయన నాకు చూపించెను. యేసు స్వారూప్యములోనికి నన్న మార్చాలని దేవుడు కోరుచున్నాడని నేను చూచితిని. ఆయన నన్ను నెమ్మదిగా మార్చుట ఆరంభించెను. ఆయన నాకు ఓర్పును నేర్పించి, నా కోపమును జయించుటకు సహాయపడి ప్రజలకొరకు నా హృదయాన్ని ప్రేమతో నింపెను.


అధ్యాయము 6
నా కుటుంబ జీవితము

జాక్‌ పూనెన్‌ యొక్క భార్యగా నేను దేవుని చేత గొప్పగా దీవించబడితిని. నేను జాక్‌ పూనెన్‌ను వివాహము చేసుకొన్నప్పుడు ఆయన సహాయకురాలిగా నా బాధ్యత ఆయనకు సహకరించుట మరియు ఆయనను చూచుకొనుటయని ప్రభువు నాతో చెప్పెను. దేవుని సహాయముతో 44 ఏళ్లుగా ఇది చేయుటకు నేను ప్రయత్నించితిని.


జాక్‌ పూనెన్‌ నా యెడల ఎంతో ప్రేమగల భర్తగా ఉండెను. ప్రభువు తరువాత భూమిపైన ఆయన నా అత్యంత సన్నిహిత స్నేహితుడు. మేము ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకొనుచున్నాము మరియు ఒకరు లేకుండా మరియొకరు జీవించుట కూడా తలంచలేము. ''నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని మాటలు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు. ఇతడే నా ప్రియుడు నా స్నేహితుడు'' (పరమగీతము 5:10,16).


జాక్‌ వివాహములలోను లేక పెళ్లైన జంటలతోను మాట్లాడినప్పుడు, మా వైవాహిక సంబంధమే ఆయన వర్తమానాలకు దన్ను నిచ్చును. ఇది ఆయన జీవితములో పనిచేసిన దానినే ఆయన మాట్లాడుచున్నాడని నిరూపిస్తుంది.


మేము పరిపూర్ణులము కాము మరియు పెళ్లైన జంటలందరి వలే మేము కూడా పొరపాట్లు చేసితిమి. కాని మా వివాహ జీవితము భూమి మీద పరలోకమునకు ఒక ముందు రుచిగా నున్నదని నేను యధార్థముగా చెప్పగలను.


దేవుడు మమ్మును నలుగురు చక్కని అబ్బాయిలతో దీవించి వారిలో ప్రతి ఒక్కరికి ఒక భక్తిపరురాలైన భార్యనిచ్చెను. వారందరు ప్రభువును వెంబడించుట మాకు ఆనందముగా ఉన్నది. మేము బోధించు వాటికి మా గృహ జీవితము మరియు మా కుటుంబ జీవితము రుజువుగా ఉన్నవనుటకు వారు సజీవ సాక్ష్యముగా ఉన్నారు. ఈ విషయమై నేను దేవునికి మహిమచెల్లిస్తున్నాను.


ఇప్పుడు మాకు కొంతమంది మనవళ్లు మనుమరాళ్లు ఉన్నారు. నేను వారితో ఉండుటకు అవకాశము వచ్చినప్పుడు వారితో ఆడుకొనుట నాకు ఆనందాన్ని తెస్తుంది. మేము వారి కొరకు క్రమంగా ప్రార్థిస్తాము మరియు వారు కూడా వారి తరములో ప్రభువును వెంబడించి భూమిపై ఆయన సాక్షులుగా ఉండుటకు ఎదుగుదురని నమ్ముచున్నాము. వారి కొరకు ఇదే మా అతిగొప్ప కోరికైయున్నది. ప్రభువు నా కొరకు నా కుటుంబము కొరకు ఇంకా ఎన్నో అద్భుతకరమైన కార్యములను చేసెను. అవి లెక్కపెట్టుటకు అనేకము. వాటన్నిటిని బట్టి ఇంకా ఎన్నో విషయములను బట్టి నేను నిత్యత్వమంతటిలో ప్రభువుకు కృతజ్ఞత కలిగియుంటాను. నేను దానికి అర్హురాలనైనందుకు కాదుగాని దేవుడు మంచివాడైనందున నేను దేవుని మంచితనమును అనేక విధములుగా అనుభవించాను. దేవుడు ప్రజలందరికి మంచి చేయును - వారు దానికి అర్హులైనా కాకపోయినా సరే. కాబట్టి నేను దేవుని మంచితనమును అనుభవించినప్పుడు నేను మంచిదానను కాబట్టి లేక గొప్పదానను కాబట్టి ఆ దీవెనలను పొందితినని నేను ఊహించుకొనను. దేవుడు నా యెడల మంచిగా ఉండుటకు కారణము ఆయన దేవుడైయున్నాడు మరియు మంచితనము ఆయన స్వభావమైయున్నది. కాబట్టి నా మీద మరియు నా కుటుంబము మీద ఆయన దీవెనలు నా పరలోకపు తండ్రియైన ఈ ఆశ్చర్యకరమైన దేవుని యొక్క అద్భుతకరమైన మంచితనాన్ని నిరూపిస్తున్నది.


ఆయన చేసినదానికి ఆయన అయ్యున్నదానికి దేవునికి మాత్రమే స్తుతియు మహిమయు కలుగును గాక. ఆమేన్‌.


అధ్యాయము 7
దేవునికే మహిమంతయు కలుగును గాక

నాకు కాదు, ఓ ప్రభువా నాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక (కీర్తనలు 115:1).


మంటిలోనుండియు పెంటకుప్ప మీదనుండియు నన్ను లేవనెత్తి మహిమగల సింహాసనము మీద నన్ను కూర్చుండ బెట్టిన వాడవు నీవే (1సమూయేలు 2:8).


నేను బయటి నేలను పడవేయబడియుండుట కనుగొని నన్ను ఎత్తుకొని, సౌందర్యముగలదానిగా జేసి, మహిమకర వస్త్రములను నాకు ధరింపజేసి, నా కీర్తి ప్రపంచమంతా వెళ్లునట్లు చేసినవాడవు నీవే (యెహెజ్కేలు 16:5,14).


ఈ రోజు నేనేమైయున్నానో, నాకు కలిగినదంతయు నీ నుండే పొందుకొనియున్నాను. కాబట్టి, ప్రభువా నేను దేనియందు అతిశయింపలేను (1కొరింథీ 4:7).


నీ యెదుట ఎవరును అతిశయింపకుండునట్లు నీవు అవివేకులను, బలహీనులను తృణీకరింపబడినవారిని ఎన్నుకొనియున్నావు (1కొరింథీ 1:27,29).


నా శరీరమందు మంచిదేదియు లేదు, అది యెండిన గడ్డి వంటిది (రోమా 7:18, యెషయా 40:6).


ఈ రోజున నా కున్న మంచితనమంతయు నీ నుండే వచ్చినది (కీర్తనలు 16:2).


ప్రభువైన యేసు, నీ రక్తముతో నన్నుకొని నీతో పాటు భూమిమీద ఏలుటకు నన్ను రాజుగాను యాజకునిగానుచేసితివి. కాబట్టి నీవు మాత్రమే ఎప్పటికీ ఘనత మహిలంతటికి అర్హుడవైయున్నావు (ప్రకటన 5:9,10).


ఓ దేవా నీ మహిమార్థమై నన్ను సృజించితివి (యెషయా 43:7).


ఓ దేవా, నా తండ్రీ, ఇప్పుడును మరి ఎప్పటికి ఘనతా మహిమలు పొందుటకు నీవు మాత్రమే అర్హుడవు (ప్రకటన 4:11).


అధ్యాయము 8
ఆనీ యౌవన దినాలలోకి తిరిగిచూచుట - అలెగ్జాండర్‌ ఊమెన్‌ (ఆనీ యొక్క తమ్ముడు)

నా హృదయమంతటితో నేను ప్రేమించి ఇష్టపడే నా అక్కయైన ఆనీ నాకు క్రైస్తవ జీవితము యొక్క పరిపూర్ణ మాదిరియై యున్నది. ఆమె మా కుటుంబములో జ్యేష్టురాలు. ఆనీ ఆమె అతి చక్కటి శిశువని మా అమ్మ మాకు చెప్పేది. ఆమె మల్లెపూల వంటి చర్మము, నక్షత్రాల వలే మెరిసే నల్లటి కళ్లు, పొడువాటి నల్ల వెంట్రుకలు కలిగియుండెను. మా తండ్రికి ఆమె ఇంటి యొక్క వల్లీ పద్మము వలెను ప్రకాశమైన వేకువ చుక్కవలెను ఉండెను.


ఆనీ యొక్క ఏడుగురు తమ్ముళ్లు చెల్లెలు వెంటవెంటనే పుట్టినందున ఆమెకు బాల్యము అంతగా లేకపోయెను. ఆమె ఎప్పుడు అమ్మకు సహాయము చేయుచు, ఒక బిడ్డ తరువాత మరొక బిడ్డకు స్నానం చేయించుటకు, ఆహారము తినిపించుటకు, చివరిగా పడుకోపెట్టుటకు వారిని చూచుకొనేది. రాత్రి వేళయందు ఆమెతో ఎల్లప్పుడు ఎవరో ఒక తమ్ముడు గాని చెల్లెలు గాని పడుకొనేవారు. ఆమె జీవితపు తొలిదశలోనే రాత్రివేళ లేచి శిశువుల యొక్క నేప్కిన్లు మార్చే దినచర్యకు అలవాటు పడిపోయెను.


మేము తన స్వంత బిడ్డలమైనట్లే ఆమె తన తమ్ముళ్లను చెల్లెలను చూచుకొనేది. మాకు దెబ్బ తగిలితే, మా దెబ్బలకు కట్లు కట్టే డాక్టరు ఆమెనే. మేము ఆమెను మా పొరబడని నాయకురాలిగా చూచేవారిమి. ఆమె క్రమశిక్షణ మరియు నిశ్చయత గల నాయకురాలు. బడికి వెళ్లే రోజులలో తన బరువైన స్కూలు బ్యాగును మోయుచు, కూనూరు యొక్క కొండ ప్రాంతముననున్న రహదారులపై మమ్మును ఆ రెండు మైళ్ల దూరమున నడిపించే సన్నివేశమును నేనింకా చిత్రీకరించుకోగలను. కొన్నిసార్లు మేము ''నువ్వు చాలా త్వరగా నడుస్తున్నావు'' లేక ''నా బ్యాగు నాకు చాలా బరువుగా ఉన్నది, దయచేసి దానిని మోయుటకు నాకు సహాయము చేయుము'' అని నిరసించేవారము. అప్పుడు ఆమె మా బ్యాగులను ఎప్పుడు హృదయపూర్వకముగా మోసేది.


ఆనీ ఆమెకున్న వాటినన్నిటిని మాతో పంచుకొనేది. ఆమె తన కొరకు ఎప్పుడు ఏదియు ఉంచుకొనేది కాదు. ఒకసారి స్కూలులో ఆమె స్నేహితురాలు ఆమెకు బబుల్‌ గమ్‌ను ఇచ్చెను. ఆమె ఇంటికి వెళ్లే దారిలో దానిని మాతో పంచుకొనుటకు దానిని జాగ్రత్తగా తన జేబులో పెట్టుకొనెను. మేము దాని ముందు బబుల్‌ గమ్‌ను ఎప్పుడూ చూడలేదు. ఆమె మాలో తలొక్కరికి దానిలో ఒక చిన్న ముక్క నిచ్చెను. మేము ఇంటికి వచ్చే వరకు దానిని నములుకుంటూ ఉంటిమి.


ఆమె మాకు పరిపూర్ణమైన మాదిరిగా యుండెను. ఆమె తన చదువుల్లో చాలా తెలివైనదిగా యుండెను. మా హోమ్‌వర్క్‌తో మాకు సహాయపడుటకు పరిపూర్ణమైన ఉపాధ్యాయురాలిగా యుండెను. స్కూలుకు సమయానికి వెళ్లుటకు మేము తయారగుటకు మాకు సహాయపడేది. సాయంకాలవేళలలో ఆడుకొన్న తరువాత మేము స్నానము చేసి చదువుకొనుటకు సిద్ధపడేటట్లు చేసేది. ఆ తరువాత ఆమె మా సాయంకాల కుటుంబ ప్రార్థన సమయాన్ని నడిపించేది. వర్ణమాల ప్రకారము, 'అ' తో మొదలు పెట్టి పల్లవులు పాడుటలో మమ్ములను ఆమె నడిపించేది. ఆమె మాటలను ఆమె ప్రార్థన చేయు శైలిని అనుకరించుట ద్వారా మేము బాల్యదశలోనే ప్రార్థన చేయుట నేర్చుకొంటిమి. ఆ తరువాత అమ్మకు వంటగదిలో సహాయపడుటకు ఆమె త్వరపడి వెళ్లిపోయేది.


భోజన వేళలలో తొమ్మిది పళ్లాలలో సరియైన భాగాలలో ఆహారమును వడ్డించుట ఆనీకున్న ఒక ప్రత్యేకమైన కళ. ఖచ్చితంగా ఆ భాగములు సమానంగా ఉండేవి కావు. ప్రతి ఒక్కరి కళ్లు ఎవరి భాగము పెద్దదిగా ఉన్నదో చూచుటకు వేరే పళ్లాలపై ఉండేవి. అప్పుడు నిరసనలు ఫిర్యాదులు ఉండేవి. కాని ఆమె, ''పర్వాలేదు, నా దగ్గర నుండి నీవు కొంత తీసుకో'' అని వాటన్నిటిని ఆపివేసేది. చలికాలములో ఆమె మాకు కథలను పద్యాలను చదివి వినిపించేది. వాటిలో కొన్ని మాకు కన్నీళ్లు తెప్పించేవి.


వైద్య కళాశాలలో (సి.ఎమ్‌.సి వెల్లూరులో) ఆమె విద్యాసక్తి కలిగి కష్టపడి చదివేది. ఆమెకున్న ఏకైక కాలక్షేపము క్రైస్తవ విద్యార్ధి కూటములు. ఆమె తన సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు, అది మాకు ఒక విశ్రాంతినిచ్చే చల్లటి గాలి వలే నుండెను. ఆమె మాకు సి.ఎమ్‌.సి ఆసుపత్రి యొక్క ఆకర్షణీయమైన కథలను చెప్పేది. కొన్ని కథలు ఆమె చనిపోయే రోగులతో ప్రార్థిస్తూ, వారు యేసుతో నిత్యత్వమును ఎలా గడపగలరో వారికి చెప్పే విషాదకరమైన కథలుగా ఉండేవి. 1962లో ఒక సాయంకాలము నేను ఆమెను వినుచుండగా, ప్రభువు ఆమె ద్వారా నాతో మాట్లాడెను. అప్పుడు నేను ఆమె కలసి ప్రార్థించితిమి మరియు నేను యేసును నా స్వంత రక్షకునిగా నా జీవితానికి ప్రభువుగా అంగీకరించితిని.


కొద్ది సంవత్సరాలలో ఆనీ ఆమె వైద్య పట్టాతో పట్టబధ్రురాలై తన శిక్షణలో మలిదశను ప్రారంభించింది. అప్పుడు పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి. ఇంటి యొద్ద సూచనలు, వాదనలు, చర్చలు ఉండేవి. ఒకరోజు, ''జాక్‌ పూనెన్‌'' అను పేరుగల ఒకతని చుట్టూ ప్రశ్నలు చెలరేగెను. ''అతడు ఎవరు?'' ''అతడు డాక్టరా?'' ''అతడి ఉద్యోగమేమిటి?'' ''అతడు ఎంత సంపాదిస్తున్నాడు?'' మొదలగునవి. ఆ ప్రశ్నలకు జవాబులు తెలియగానే మా గృహము విభజింపబడెను. అది మాకుటుంబమును కదిలించి వేసెను మరియు మాకున్న కుటుంబ ఐక్యతను గూర్చిన ప్రతి భావాన్ని సవాలుచేసెను.


కాని ఆనీ స్థిరముగా నుండెను. ఆమె ఎంపిక స్పష్టముగా ఉండెను: ఆమె యేసును వెంబడించి, ఆయన వాక్యమునకు విధేయతతో కూడిన జీవితమును జీవించును. ఇతర పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఆమె వాటిని నిరాకరించెను. ఆమె వెండి బంగారముల కన్నా జాక్‌ పూనెన్‌ నే కలిగియుండుటకు ఇష్టపడెను. గొప్ప విద్యార్హతగల ఒక ధనికుడైన డాక్టరు కంటే జాక్‌ పూనెన్‌నే కలిగియుండుటకు ఇష్టపడెను. ఇళ్లు స్థలాలు కలిగియున్న ధనికుడైన ఇంజినీరు లేక వ్యాపారవేత్త కంటే జాక్‌ పూనెన్‌ ను కలిగియుండుటకు ఇష్టపడెను. తనకు కలిగియున్న వాటన్నిటిని విడచిపెట్టి ప్రభువును విధేయతతో సేవించుటకు, క్రీస్తు యొక్క గాయపడిన హస్తాలతో నడిపింపబడుటకు ఎంచుకొన్న ఒక వ్యక్తి యొక్క భార్యగా, సహచరిగా, సహాయకురాలిగా ఉండుటకు ఒక సామాన్యమైన జీవితమును ఎంచుకొనెను.


ఆమె జీవితములో ఉన్న ఆ నిరాడంబరత మరియు విధేయత ఈ రోజుకు కూడా కొనసాగుచున్నవి. ఆమె తన భర్తతో కలసి, క్రీస్తు నిజముగా ఘనపరచబడే గృహాన్ని ఆమె కట్టెను. ఆమె నలుగురు కుమారులు వారి కుటుంబాలు ప్రభువును తీవ్రముగా ప్రేమిస్తున్నారు. ఆమె ఇప్పుడు లోకమంతయు ప్రయాణించుచు, లోకమంతటిలోను క్రైస్తవ స్నేహితుల చేత సంఘాల చేత స్వాగతించబడుచున్నప్పటికీ ఆమె జీవనశైలి మారలేదు. ఆమె గృహము ఇంకను అందరికి తెరువబడియున్నది. ఆమె ఇంటిలోకి వెళ్లిన వారందరికి భోజనము సిద్ధముగా నుండును. దేవుడు ఆమెకు ఇచ్చిన ప్రతి చిన్న దానికి ఆమె విలువనిచ్చును. ఆమె దేనిని వృథాచేయదు. ఆమె ఫ్రిడ్జ్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని నిలువ ఉంచుటకు చిన్న గిన్నెలుండును. వాటిని తరువాత భోజనము కొరకు ఆమె ఉపయోగించును. ఆమె దేవుని యెదుట కృతజ్ఞత, సంతోషము, తృప్తి కలిగియున్న హృదయముతో జీవితాన్ని జీవించుచున్నది.


ఆనీ పేదవారికి అవసరతలో నున్నవారికి డాక్టరుగా ఉన్నది. వారికి స్వస్థత దేవుని నుండి వచ్చును కాని ఆమె దయాళుత్వము, ప్రేమ, ప్రార్థనలు మరియు ఆమె మృధువైన చేతుల ద్వారా అది వచ్చును.


ఆమె అనేక ఆశీర్వాదములను అనుభవించెను - ఒక భక్తిపరుడైన భర్త మరియు గృహము, దైవభయము గల పిల్లలు మరియు మనుమలు, సీ.పఫ్‌.సీ లో ఒక ఆత్మ నింపుదల గల శక్తివంతమైన పరిచర్య, లోకమంతటానున్న క్రైస్తవ సహోదరులు సహోదరీలను ఆమె కలిగియున్నది. కాని ఆమె అపహాస్యమును, ఎగతాళిని, శారీరక మానసిక వేధింపును తాను ప్రేమించి సేవించిన కొందరినుండి అనుభవించెను. అది గుండె పగిలిపోయేలా ఉండెను. కాని ఆమె గొఱ్ఱెపిల్ల అడుగులను వెంబడించుటకు ఎంచుకొనెను మరియు ఆ శోధనలలో యేసు ఆమెకు నేర్పించిన దీనత్వము, విధేయత మరియు శిష్యత్వముతో కూడిన క్రొత్త పాటను ఆమె నేర్చుకొనెను. ఒకనాడు ఆమె ఆయన సింహాసనము యెదుట నిలబడును.


''ఇంతవరకు ప్రభువు ఆమెకు సహాయము చేసెను'' (1సమూయేలు 7:12). ''ఇంతవరకు'' అనేది ఆనీ జీవిత ప్రయాణములో ఈ ప్రత్యేకమైన సందర్భమును సూచిస్తున్నది. అది ఇప్పటి వరకు గడచిపోయిన 70 చక్కటి సంవత్సరములు. ''ఇంతవరకు'' అనే మాట ఆమె ప్రయాణము అంతమునకు ఆమె ఇంకా రాలేదని కూడా సూచిస్తున్నది. అది భవిష్యత్తును - ముందున్న శ్రమలకు శోధనలకు, కష్టాలకు, పోరాటాలకు సూచనగా ఉన్నది. అయితే ఒకనాడు ఆమె తన రక్షకుని ముఖాముఖిగా చూచువరకు రానున్న విజయాలకు సంతోషాలకు కూడా సూచనగా ఉన్నది.


ఇంతవరకు ఆమెకు సహాయపడిన ప్రభువు ఆమె ప్రయాణము పూర్తయ్యే వరకు ఆమెకు సహాయపడును!


నా సహోదరి ఆనీ జీవితాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించెదను

అధ్యాయము 9
ఆనీ - దేవుని నుండి ఒక పరిపూర్ణమైన వరము - జాక్‌ పూనెన్

దేవుడు నన్ను ఎంతగా ప్రేమించెనంటే ఆయన తన కుమారుని నా ప్రభువుగా మరియు నా వరునిగా ఉండుటకు, నన్ను నా పాపములనుడి విడిపించుటకు మరియు ఎప్పటికీ తన వధువుగా చేసికొనుటకు నాకు ఇచ్చెను.


దేవుడు నన్ను ఎంతగా ప్రేమించెనంటే ఆయన తన పరిశుద్ధాత్మను నా దైవిక సహాయకునిగా ఉండుటకు, నన్ను ఎల్లప్పుడు ప్రోత్సాహించుటకు, ఆయన కొరకు నేను జీవించి ఆయనను సేవించగలుగుటకు ఇచ్చెను.


దేవుడు నన్ను ఎంతగా ప్రేమించెనంటే ఆయన తనను తాను నా పరలోకపు తండ్రిగా ఉండుటకు, ఈ లోకములో నేను ఎల్లప్పుడు అబధ్రతతో ఒంటరిగా, తృణీకరింపబడిన వానిగా భావింపకుండా ఉండుటకు ఇచ్చుకొనెను.


దేవుడు నన్ను ఎంతగా ప్రేమించెనంటే ఆయన నాకు ఆనీని నా భూలోక సహాయకురాలిగా ఉండుటకు, మానవునిగా నన్ను పూర్తిచేయుటకు, ఆయన కొరకు జీవించి ఆయనను సేవించుటలో నా భాగస్వామిగా ఉండుటకు ఇచ్చెను.


శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ప్రేమగల తండ్రినుండి వచ్చును. ఇవన్నియు నాకు దేవుని సంపూర్ణమైన వరములుగా ఉన్నవి. వీటిలో దేనికి నేను అర్హుడను కాను.


ఆనీని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను. ఎందుకనగా


- నేను జీతం సంపాదించుటలేదని, నా బ్యాంకు ఖాతాలో ఏమిలేదని, నా అవసరతలన్నిటి కొరకు ప్రభువును మాత్రమే నమ్ముచున్నానని బాగా తెలిసికూడా, నన్ను కేవలము ఆత్మసంబంధమైన పరిగణలను బట్టియే, పెళ్లి చేసుకొనుటకు ఆమె నిశ్చయించుకొనెను.


- 44 ఏళ్లుగా నేను కలసి ప్రార్థించి, నవ్వుకొనే అద్భుతమైన స్నేహితురాలిగా, సహచారిగా ఆమె నాతోనుండెను.


- ఆమె నా కంటే ఎక్కువగా యేసు ప్రభువునే ఎల్లప్పుడు ప్రేమించెను - నా భార్య ఖచ్చితంగా ఇలాగే ఉండాలని నేను కోరుకొన్నాను.


- మేము పెళ్లి చేసుకోకముందు నుంచే ఆమె ప్రభువును మరియు భారతదేశపు పేదవారిని సేవించుటకు ఆసక్తి కలిగియుండెను.


- నా పరిచర్య యొక్క ప్రతి కోణములోను ఆమె నన్ను ఎల్లప్పుడు ప్రోత్సహించెను.


- బబులోను సంబంధమైన క్రైస్తవత్వమునకు వ్యతిరేకముగా నేను నిలబడినప్పుడు, నాకున్న అన్ని ఒప్పుదలలోను ఆమె నాకు సహకరించి మద్దతునిచ్చెను. తన స్వంత కుటుంబ సభ్యులనుండి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆమె అలా చేసెను.


- నా పరిచర్యలో సమతుల్యత లేనప్పుడు లేక నేను ఎక్కువ కఠినముగా ఉన్నప్పుడు ఆమె అది గ్రహించి నన్ను సున్నితముగా సరిదిద్దెను.


- ఆమె తెర వెనుక నా కొరకు నమ్మకముగా ప్రార్థించెను.


- ఆమె దేవుని యొద్ద నుండి పొందుకొన్న ప్రత్యక్షతలను నాతో పంచుకొనును.


- ఆమె విలాసవంతమైన వస్తువులను ఎప్పుడు కోరుకోలేదు కాని ఎల్లప్పుడు నిరాడంబరముగా జీవించుటకు ఇష్టపడెను.


- ఒక భార్యగా మరియు తల్లిగా ఆమె మా కుటుంబ అవసరతలన్నిటిని చూచుకొనుచు ఎంతో కష్టపడి పనిచేసెను. ఆమె దీనిని ఎంత సంపూర్ణముగా చేసెనంటే నేను ఎప్పుడు ''బల్లల యొద్ద పరిచర్య చేయకుండా దేవుని వాక్య పరిచర్య చేయుచు ఉండగలిగాను'' (అపొ.కా.6:2,4).


- ఆమె మా నలుగురు కుమారులతో ప్రతి ఏట వందల కొలది గంటలు గడిపి వారికి వారి స్కూలు సబ్జెక్టులను కే.జీ నుండి హైస్కూలు వరకు నేర్పించెను.


- మా వివామము యొక్క ప్రథమ సంవత్సరములలో మేము ఆర్థికంగా ఎక్కువ కలిగిలేనప్పటికీ ఆమె తన వృత్తి ద్వారా డబ్బును సంపాదించే అవకాశము కంటే తన పిల్లలకు ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చెను. ఇప్పుడు ఆమె మా నలుగురు కుమారులు ప్రభువును వెంబడించుచు, దైవభయముగల కుటుంబాలను పెంచుచుండుట చూచినప్పుడు, ఆమె మరుగైయున్న ప్రయాస మరియు త్యాగముతో కూడిన సంవత్సరముల యొక్క ధన్యమైన ఫలమును కోయుచున్నది.


- ఇంటియొద్ద పిల్లల అవసరతలతో, వారు వ్యాధిగ్రస్తులైనా ఇంకేమైనా, నేను ఇంటియొద్ద లేకపోవుట వలన ఆమె ఎంత అసౌకర్యానికి గురౌవ్వవలసి వచ్చినా, నేను ప్రభువును సేవించుటకు ఎక్కడికైన వెళ్లకుండా నన్ను ఆపలేదు.


- నేను అనేక దేశాలలో ఉన్న ప్రజలకు పరిచర్య చేయుటకును, ఎక్కువ ప్రయాణించగలుగుటకును నేను శారీరకముగా బలముగా ఆరోగ్యముగా నుండునట్లు ఆమె 44 ఏళ్లుగా నాకు సరియైన వైద్య సలహాలనిచ్చెను.


- ఆమె అనేక విశ్వాసులకు మా ఇంటిలో ఇష్టపూర్వకముగా ఆతిథ్యమునిచ్చెను. వారు పేదవారైన ధనికులైనా వారికి సంతోషముతోను ధారాళముగాను ఎల్లప్పుడు శ్రేష్టమైన వాటినే ఇచ్చెను.


- సహోదరీలకు మరియు కుటుంబాలకు జరిగే కూడికలలో, వ్యక్తిగత సంభాషణలలో, ఈమెయిల్‌ ద్వారా ఆమె అనేక సహోదరీలకు దైవికమైన సలహాలతో సహాయమునిచ్చి, కొందరిని ఆత్మహత్యలనుండి మరికొందరిని విడాకులనుండి కాపాడెను.


- ఆమె అనేక మంది స్త్రీల, పిల్లల వైద్య అవసరతలకు పరిచర్య చేసి కొందరిని అకాల మరణమునుండి కాపాడి మరి అనేకమందికి స్వస్థతను తీసుకువచ్చెను.


- ఆమె అనేక యౌవన స్త్రీలను, తల్లులను, బాధపడుచున్న స్త్రీలను ప్రోత్సాహించే పుస్తకాలను రచించెను.


- ఆమె నా వ్యక్తిత్వము యొక్క ప్రత్యేక అలవాట్లను భరించెను.


- నేను పేర్కోలేని అనేక విధాలుగా ఆమె నా జీవితమును సరాళము చేసెను.


బైబిలు చెప్పినట్లు ఆనీ ఆ రోజు కూడా, ''నా కన్నులకు ఇంపైనది''. నాకు ఇంకెవరినీ చూడాలనిపించదు. బైబిలు చెప్పినట్లు ఆమె ఇప్పటికీ ''యౌవనమున పెండ్లిచేసికొనిన నా భార్య'' యైయున్నది. ఆమె 25 ఏళ్లప్పుడు ఆమెను నేను చూసినట్లే ఆమెను ఈరోజున కూడా చూచెదను. నేను వేసే హాస్యోక్తులను మరల మరల విన్నప్పటికీ ఆమె ఇంకా నవ్వుచుండును. అనేకమంది విశ్వాసుల వలే మేము మా వివాహ జీవితమును ఓడిపోయిన స్థితిలో మొదలుపెట్టినప్పటికీ, దేవుని కృపవలన మేము కలసి సమాధానముతోను, సంతోషముతోను జీవించుచున్నాము. ఇది సమయము గడిచే కొలది ఎక్కువగుచున్నది. మేము మా వివాహ జీవితములో ఇంకా పరిపూర్ణతను చేరుకోలేదు. కాని మేము సాగిపోవుచున్నాము.


ఆనీ జన్మించినప్పుడు దేవుడు ఆమెకు నాకు తగినవిగా ఉండే వ్యక్తిత్వమును మానవ లక్షణాలను ఇచ్చెను. దేవుడామెను పరిశుద్ధాత్మాతో నింపినప్పుడు నాకు తగినవిగా ఉండే కృపావరములను ఆమెకిచ్చెను. ఆ విధముగా మేము ప్రభువును కలిసి సేవించాము. నేను ప్రపంచములో అనేక మంది స్త్రీలను కలుసుకొన్నాను. కాని ఆనీని కాకుండా పెళ్లిచేసుకోదగిన ఒక్క స్త్రీని కూడా నేను ఎప్పుడు కనుగొనలేదు. నేను నా జీవితమును మరల జీవించవలసివస్తే, నేను ఆనీని మాత్రమే పెళ్లిచేసుకొనెదను. లేకపోతే ఒంటరిగా ఉండిపోదును. ఆనీలో నా అవసరతలకు తగినట్లుగా దేవుడు సిద్ధపరచిన సహాయకురాలి కొరకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను.


మా వివాహ జీవితములో ''ఒంటిగా ఉండుట కంటే ఇద్దరు కలిసియుండుట మేలు'' అని మేము కనుగొంటిమి. ఎందుకనగా:


1. ఇద్దరు విడివిడిగా సాధించగలిగిన దానికంటే, ఇద్దరు కలిసి ఇంకా ఎక్కువ సాధించగలరు మరియు మా పని ఎక్కువ ప్రభావవంతముగా నుండెను.


2. ఒకరు పడబోవుచుండగా, వేరొకరు అతనిని ఎత్తిపట్టుకొనుట వలన ఇద్దరు నిలబడగలరు.


3. ఇద్దరు దేవుని కొరకు ఎల్లప్పుడు మండుచుండునట్లు మేము ఒకరినొకరు పురికొల్పుకోవచ్చును.


4. కలసి నిలబడుట ద్వారా మేము సాతానును ఓడించితిమి - ఎందుకనగా మా మధ్య క్రీస్తు ఉండుట వలన మేము ముగ్గురిమి (మత్తయి 18:20). అది ఓడింపలేని కూటమి.


(ప్రసంగి 4:9-12 నుండి కూర్చుబడినది)


మహిమంతయు దేవునికే కలుగును గాక!


అధ్యాయము 10
ఒక తల్లి కథ - (ఒక ఉపమానము)

ఆ యౌవన తల్లి జీవిత మార్గము పైన తన పాదమును మోపెను. ''ఇది చాలా దూరముండునా'' అని ఆమె ప్రభువును అడిగెను. ''అవును, నా కుమారీ, ఈ మార్గము దూరముగాను కష్టముగాను ఉండును. దాని అంతము చేరుకొనే సరికి నీవు చాలా వృధ్దురాలివగుదువు. కాని అంతము ఆరంభము కంటే శ్రేష్టమైనదని నీవు కనుగొనెదవు'' అని ప్రభువు చెప్పెను.


దేవుడు ఆమెకు నలుగురు చిన్న కుమారులనిచ్చెను - ఆ యౌవన తల్లి ఎంతో ఆనందించెను. ఈ సంవత్సరముల కంటే శ్రేష్టమైనది ఇంకేదైన యుండునని ఆమె నమ్మలేకపోయెను. గనుక ఆమె తన అబ్బాయిలతో ఆటలాడెను, వారికి బైబిలు కథలు నేర్పించెను, వారు నిద్రపోకముందు వారితో ప్రతిరాత్రి ప్రార్థించెను, వారికి ప్రతిరోజు పోషణకరమైన ఆహారమును వండిపెట్టెను, వారితో మాట్లాడెను, వారిలో కలసి నవ్వెను. సూర్యుడు వారందరి మీద బాగా ప్రకాశించెను. ''దీని కంటే శ్రేష్టమైనది ఇంకేదియు లేదు'' అని ఆ యౌవన తల్లి చెప్పెను.














అప్పుడు రాత్రి వచ్చెను, ఒక తుఫాను వచ్చెను, వ్యాధులతోను ఇంకా ఇతర శోధనలతోను మార్గము చీకటిమయమాయెను - ఆమె కుమారులు భయముతో వణకిపోయిరి. ఆ తల్లి వారిని తన దగ్గరకు తీసుకొని, వారిని తన చీరతో కప్పెను. అప్పుడు ఆమె కుమారులు ''అమ్మా, నీవు మా దగ్గర ఉంటే మాకు భయములేదు, మాకు ఏ హానియు సంభవించదు'' అని చెప్పిరి.


ఆ తరువాత ఉదయము వచ్చెను మరియు దాటుటకు ఒక సరస్సు ఉండెను. వ్యక్తిత్వ అభివృద్ధి అనెడి ఏటవాలు కొండను కూడా ఎక్కవలసి యుండెను. వారు సరస్సును దాటిరి గాని వారు కొండను ఎక్కుచుండగా ఆ అబ్బాయిలు అలసిపోయిరి. ఆ తల్లి కూడా అలసిపోయెను గాని ఆమె దానిని కనుపరచలేదు. ''ఇంకొంచెము ఓపికపడితే మనము శిఖరము చేరుకొనెదము'' అని ఆమె తన కుమారులకు చెప్తూ ఉండెను. వారు శిఖరమును చేరుకొన్నాక, ''అమ్మా, నీవు లేకుండా మేము చేరుకొనేవారిమి కాము'' అని ఆ అబ్బాయిలు తల్లితో చెప్పిరి.


ఆ రాత్రి ఆ తల్లి పడుకొన్నప్పుడు, ఆమె నక్షత్రాలను చూచి ''ఈ దినము నిన్నటి కంటే మెరుగైనది. నిన్న దేవుడు వారికి ధైర్యమునిచ్చెను. ఈ రోజు, ప్రభువు వారికి స్థిరమైన మంచి వ్యక్తిత్వమునిచ్చెను'' అని చెప్పెను.


మరుసటి రోజు భూమిని చీకటిమయము చేసిన వింతైన మేఘములుండెను. అవి ఇతరులనుండి ద్వేషము మరియు అసూయతో కూడిన మేఘములు. ఆ నులుగురు కుమారులు చీకటిలో తొట్రుపడి కలవరపడిరి. అప్పుడు ఆ తల్లి ''పైకి చూడండి. వెలుగువైపు మీ కన్నులనెత్తుడి'' అని చెప్పెను. అప్పుడు ఆ అబ్బాయిలు పైకి చూచి దేవుని ప్రేమ అనెడి ప్రకాశమైన వెలుగును చూచిరి, ఆ వెలుగు వారిని చీకటిలోనుండి నడిపించెను. ఆ రాత్రి ఆ తల్లి, ''ఇది అన్నిటిలోకి శ్రేష్టమైన దినము, ఎందుకంటే ఇప్పుడు నా కుమారులు తమ్మును ద్వేషించిన వారిని ప్రేమించుట నేర్చుకొనిరి'' అని చెప్పెను.


రోజులు నెలలాయెను, నెలలు సంవత్సరములాయెను మరియు ఆ తల్లి వృద్ధురాలయ్యెను మరియు బలహీనపడెను. కాని ఆమె నలుగురు కుమారులు పొడవుగా బలముగా మారి ఎంతో సాధించిరి. అన్నిటికంటె ముఖ్యముగా వారు ప్రభువుతో నడచిరి. ఇప్పుడు మార్గము కష్టముగా ఉన్నప్పుడు వారు తమ తల్లిని ఎత్తుకొని వెళ్లిరి.


ఆమె కుమారులు నలుగురు చక్కటి అమ్మాయిలను వివాహము చేసుకొనిరి. వారు కూడా ప్రభువును ప్రేమించిరి. వారికి పిల్లలు పుట్టిరి - అబ్బాయిలు అమ్మాయిలు కూడా పుట్టిరి. ఆమె మనుమలు నాయనమ్మ రాక కొరకు ఎదురుచూచుచుందురు. ఆమె చిరునవ్వు మరియు ఆమె ప్రేమ వారి అనుదిన వాంఛగా నున్నది. అప్పుడు తండ్రి కుమారులు భార్యలు మరియు మనుమలందరు నాయనమ్మను కూర్చోబెట్టి ఆమె తలపై ఒక కిరీటము పెట్టి ''నీ కొరకు మేము దేవునికి కృతజ్ఞత తెలుపుచున్నాము'' అని చెప్పిరి.






















ఆమె కుమారులు, ''అమ్మా, మేము నిన్ను ఎప్పుడు మరువలేము, ఎందుకనగా నీ మాదిరి నీ ప్రార్థనలు ఈ రోజు మమ్ములను ఇంతటి మనుష్యులుగా చేసినవి. మేము నిన్ను ఎప్పుడూ జ్ఞాపకముంచుకొనెదము.


- నీవు మా కొరకు వండిన రుచిగల ఆహారమును


- మేము వేసుకొనుటకు నీవు ఎడతెగక ఉతికిన బట్టలు


- మేము అనారోగ్యముతో ఉన్నప్పుడు మా నుదుళ్లపైన నీ చల్లటి హస్తము


- నీవు మాతో కలిసి నవ్విన విధానము మరియు మేము నవ్వుట చూచి ఆనందించడము


- మా బాధలలో మాతో కలసి ఏడ్చిన విధానము


- అన్నిటికంటే ముఖ్యముగా మా కొరకు నీవు సమస్తమును త్యాగము చేసిన విధానము ద్వారా ప్రభువైన యేసు మమ్మును ఎలా ప్రేంమిచెనో మాకు చూపించావు.


- మేము వచ్చిన స్థలము నీవే


- మా మొదటి గృహము నీవే


- మాకు నడచుట నేర్పినది నీవే


- మేము మొదటిగా ప్రేమించినది నిన్నే


- ప్రభువును ప్రేమించుట మాకు నేర్పినది నీవే


నిన్ను బట్టి మేము దేవునికి కృతజ్ఞత కలిగియున్నాము. మేము నిన్ను ప్రేమించుచున్నాము'' అని చెప్పిరి.


ఆ తరువాత, పైనున్న మేఘాలలో వారు ఒక ప్రకాశవంతమైన నీలిరంగు రహదారిని ఒక సువర్ణపు ద్వారమును చూచిరి. తన సుదీర్ఘమైన ప్రయాణము యొక్క అంతమును ఆమె ఒకనాడు చేరుకొనెదనని ఆ తల్లి యెరిగెను.


అప్పుడు ఆమె ''అంతము ఆరంభము కంటే నిజముగా శ్రేష్టమైనదని నేనిప్పుడు చూడగలను. ఇప్పుడు నా కుమారులు కూడా నా సహాయము లేకుండా ప్రభువుతో నడవగలరు. వారు వారి పిల్లలను కూడా అలా చేయగలుగునట్లు వారికి సహాయపడుదురు'' అని చెప్పెను. అప్పుడామె మోకరించి ఈ విధంగా ప్రార్థించెను, ''ప్రభువా, భూమి మీద నాకు నీవిచ్చిన పనిని పూర్తి చేయుటకు నాకు సహాయపడినందుకు నీకు కృతజ్ఞతలు''.


ఒకనాడు ఈ తల్లి ఆమె ప్రభువును ఆకాశములో కలసినప్పుడు ఆయన ఆమెతో ఇట్లనును, ''భళా, నమ్మకమైన మంచి దాసురాలా, నీవు భూమి మీద ఒక శ్రేష్టమైన తల్లిగా ఉంటివి. నీ ప్రభువు సంతోషములో పాలుపొందుము''.


(మాతృత్వము గూర్చిన ఉపమానము అనెడి పుస్తకమునుండి ఇది సేకరించబడినది).