అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?

వ్రాసిన వారు :   డా. అనీ పూనెన్
    Download Formats:

అధ్యాయము 0
ఈ పుస్తకము మరియు మీరు

ఒక స్త్రీ సున్నితమైన స్వభావము కలిగియుండునట్లు ఆమె సృష్టికర్త చేత ఆశీర్వదింపబడెను. ఆమె లోతైన భావములు కలిగియుండి ప్రజల సమస్యలను గ్రహించగలిగే సామర్థ్యము కలిగియుండును. ఆవిధముగా ఆమె ఇతరుల బాధలను సానుభూతి మరియు వారి గూర్చిన ఆలోచనతో అర్థము చేసికొని వారికి ఉపశమనము ఇవ్వగలిగి యుండును.

అయితే ఈ సున్నితత్వము ఆమెకు చాలా సమస్యలు తెచ్చిపెట్టును. ఇతరులకు జరిగినట్లే ఆమెకు కూడా విషాద సంఘటనలు జరుగును. అటువంటి సమయములలో ఆమెకు కూడా సహాయము అవసరమై యుండును.

కొందరు స్త్రీలు వారి దు:ఖములు వారి యొక్క కన్నీటి సముద్రములో మునిగి పోవునన్నట్లుగా వారాల తరబడి ముగింపు లేకుండా ఏడుస్తూ యుందురు. మరి కొందరు లోలోపలే ఏడుస్తూ వారి బాధలు యొక్క బరువు క్రింద నలిగిపోవుదురు. చాలా మంది స్త్రీలు వారి సమస్యలు తీరిపోయిన చాలా కాలము తరువాత కూడా వారి మానసిక గాయములను అట్లే యుంచుకొందురు.

కాని దు:ఖములు మరియు పరీక్షలు ఒక మంచి ఉద్దేశ్యము నెరవేర్చుటకు మార్చబడవచ్చును. ఆ ఉద్దేశ్యముచేత మనలను అత్యధికముగా ప్రేమించే సర్వాధికారియైన దేవుడు వాటిని మన జీవితములలో అనుమతించును. పరీక్షలు మన స్వభావాన్ని మార్చివేయగలవు.

ఒక గంధపు చెట్టు తనను నరకు గొడ్డలికి తన సువాసనను యిచ్చినట్లు, ఒక స్త్రీ దేవుని గూర్చి ఆమె దు:ఖములో తెలుసుకొన్నవాటి ద్వారా అనేకులకు (ఆమెకు హాని చేసిన వారికి కూడా) ఒక ఆశీర్వాదముగా ఉండును.

ఒక దైవజనురాలిగా యగుటకు, ఒకరు అనేక పరీక్షలను ఎదుర్కొనుటకు సిద్ధపడవలెను. కాని ఆ పరీక్షలు మనలను ముంచి వేయుటకు మనము అనుమతించకూడదు.

నా స్నేహితులలో అనేకులు ఎంతో లోతైన దు:ఖముల ద్వారా వెళ్లిరి. కొన్నిసార్లు నేను వారి శ్రమల యొక్క లోతులను కనిపెట్టలేకపోతిని. కాని వారిని వింటూ, వారితో మాట్లాడుతూ వారికి వ్రాస్తూ, వారికి ఒక స్నేహితురాలిగా ఉండుట నన్ను ఐశ్వర్యవంతురాలిగా చేసెను. మనం శ్రమలను సరిగా వ్యవహరించడం నేర్చుకుంటే మనము మెరుగైన వ్యక్తులుగా మారగలమని నేను కనుగొంటిని. శ్రమలు అనే పాఠశాలలో మనమొక ప్రత్యేకమైన విద్యను అభ్యసిస్తాము. దాని చివరి ప్రతి ఫలము మన స్వభావములో క్రీస్తును పోలిన వారిగా మార్చబడటము.

ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలే కనబడుదును (యోబు 23:10). కాని సువర్ణమును నిర్మలము చేయు అగ్ని మంటిని కఠినపరచును (గట్టిదిగా చేయును). ఒక స్త్రీ కూడా తన శ్రమల ద్వారా కఠినపరచబడి, ఇతరుల యెడల అంతులేని ఫిర్యాదులు కలిగి, దేవుని యెడల కూడా ఫిర్యాదులు కలిగి తన జీవితమును జీవించవచ్చును.

దాదాపు మన శోధనలు శ్రమలన్నియు మన అదుపులో లేనివే. కాని ప్రభువు వాటి ద్వారా మనలో మంచి జరిగేటట్లు చేసి వాటిని మనకు లాభకరంగా చేయగలడు. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, సమస్తమును సమకూడి వారి మేలుకే జరుగును (రోమా 8:28).

ఆ పునరుత్థానపు ఉదయము ఆయన సమాధి యొద్ద ఏడ్చుచున్న మగ్దలేనె మరియను కలుసుకున్నట్లే, యేసు ఈ రోజున స్త్రీలమైన మనలను కలుసుకొనుచున్నాడు. ఆయన మనలను కూడా అదే ప్రశ్న అడుగుచున్నాడు: “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?”. “మనకు జరిగే ప్రతి వివరము(విషయము) ఆయన యెరుగును” (యోబు 23:10 - లివింగు బైబిలు). ఆయన యెరుగని వాడు కాదు.

ఆయన మనలను ఇలా అడుగుచున్నాడు: “అమ్మా, ఎవనిని వెదకుచున్నావు?”. మన జవాబు ఏమౌతుంది? “ప్రభువా, నా కష్టాల మధ్యలో నేను నిన్నే వెదకుచున్నాను. నా కన్నీళ్ల మధ్యలో నీ ముఖమును మాత్రమే చూచుటకు నేను ఆశ కలిగియున్నాను” అని మనము యధార్థముగా చెప్పగలమా?

ప్రజల యొద్దనుండి మనము పొందే ఆదరణ ఎంత చాలనిది. మనము యేసు వైపు చూచెదముగాక.

యేసు సిలువలో వ్రేలాడుచుండగా ఏడుస్తున్న ఆయన తల్లి కూడా ఆయన నుండి ఆదరణ పొందినది. ఆమె నివసించుటకు ఆమె కొరకు ఆయన ఒక ఇంటిని ఏర్పాటు చేసి ఆమెను చూచుకోమని యోహానుకు చెప్పెను.

ఈ రోజున కూడా స్త్రీలమైన మనలో ప్రతి ఒక్కరి యెడల ఆయన ఆలోచన ఆ విధంగానే ఉంది. మన గురించి ఆయన చింతించుచున్నాడన్న విషయంలో మనము విశ్రాంతి కనుగొనెదము.

ఆనీ జాక్ పూనెన్
బెంగళూరు
నవంబరు, 2001

అధ్యాయము 1
దేవుడు నీకు తండ్రియై ఉన్నాడు

“నా తండ్రియు, మీ తండ్రియునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నాను” (యోహాను 20:17).

నేను ఒక వైద్యురాలిగా పనిచేస్తున్నప్పుడు, చాలా మంది స్త్రీలు వారికి పుట్టిన బిడ్డలు ఆడపిల్లలైనందున వారిని ఆసుపత్రిలో వదిలి వేయుట చూచాను. ఆ తల్లులు చెల్లించవలసిన సొమ్ము చెల్లించకుండా మాయమయ్యి పోయేవారు. వారు బీదవారై యుండి ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆ బిడ్డ వారి జీవిత కాలమంతయు ఒక భారముగా ఉండునని భావించి నిరుత్సాహం చెందేవారు. మన భారతదేశములో ఉన్న దుర్భరమైన వరకట్న వ్యవస్థ దేశములో అన్ని చోట్లా, ముఖ్యముగా బీద ఆడపిల్లలకు ఎన్నో సమస్యలను కలుగజేయుచున్నది. పుట్టిన ఆడ పిల్లలను వారి పల్లెలకు తీసుకు వెళ్ళుట కంటె క్రైస్తవ ఆసుపత్రిలోనే లేక అనాధ శరణాలయములోనే విడిచి పెట్టినట్లయితే వారి జీవితము బాగుండే అవకాశము ఉండునని వారు అనుకొందురు. అనాధ శరణాలయములలో, బహుశా ఎవరైనా ధనికులు వారి ఆడశిశువును దత్తత తీసికొనవచ్చును. మరియు క్రైస్తవ అనాధ శరణాలయములోనయితే వారి బిడ్డ మగవారిచే బలాత్కరింపబడే అవకాశము తక్కువగా నుండును.

నేను పనిచేసిన ఆసుపత్రి వార్డులో, ఒక పేరులేని చక్కటి రెండేళ్ల అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వేది కాదు. ఎప్పుడూ మాట్లాడేది కాదు, ఎప్పుడూ ఏడ్చేది మరియు ఏదైనా తినుటకు కూడా నిరాకరించేది. ఆ బిడ్డ ఆసుపత్రి గేటు వద్ద ఒక సంఘ సేవకునికి దొరికినది. ఆ అమ్మాయి చాలా తెలివైనదిగా కనబడింది. కాని ఎన్నో విచారాలతో నిండియుండిన ఆమె కళ్లల్లోకి చూచినప్పుడు ఆమె జీవించిన కొంచెము కాలంలో జీవితములో ఆమె అనుభవించిన భయంకర అనుభవాలను ఒకరు ఊహించవచ్చును. ఆ వార్డులో పనిచేసిన మేమందరము ఆ అమ్మాయిని యిష్టపడేవారము మరియు ఆమెను సంతోషపరచుటకు మేము చేయగలిగినదంతా చేసేవారము. సాధారణముగా అటువంటి చిన్న ఆడపిల్లలను ఏదోఒక క్రైస్తవ అనాధ శరణాలయమునకు పంపించి వేయుదురు. ఈ అమ్మాయి నా దగ్గర రోగి, కనుక ఆమె బాగుపడిన తరువాత, నేనూ మరికొంతమంది క్రైస్తవ స్నేహితులు కలిసి ఒక మంచి క్రైస్తవ అనాధ శరణాలయమునకు ఆమెను పంపించుటకు ఏర్పాటు చేసాను.

నేను ఆమె కొరకు అప్పుడప్పుడు వాకబు చేస్తూ యుండే దానిని, మరియు ప్రార్థిస్తూ ఉండే దానిని. అలాగు ఒక రోజున, 30 సంవత్సరాలు తరువాత, ఆమెను నేను కలుసుకున్నాను. ఇప్ప్పుడు ఆమె పెండ్లి చేసుకొని బిడ్డలు కలిగియున్నది. కాని ఆమె నన్ను అడిగిన మొదటి ప్రశ్న: “నా తల్లిదండ్రులు ఎవరు?” అనేది. ఈ 30 సంవత్సరాలు ఈ ప్రశ్న ఆమెను వెంటాడ్తూ ఉన్నది. ఆమె అనాధ శరణాలయములో ఎప్పుడూ పొందనటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ కొరకు పరితపిస్తున్నందున ఆమె హృదయములో ఒక శూన్యత యుండెను.

ఆమెకు, ఒక స్త్రీ కోరుకొనే ప్రతీది - మంచి భర్త, బిడ్డలు, విద్య చివరకు ఒక మంచి ఉద్యోగము కూడా ఉన్నవి. కాని ఆమె హృదయములో ఈ బాధ ఉండిపోయి ఆమె నన్ను చూడగానే ఏడ్చేలా చేసింది. దురదృష్టవశాత్తు, నేను ఆమె తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోయాను, ఎందుకంటే అది నాకు తెలియదు. అయితే నేను ఆమెకు ఈ లోకములో ఉండే ఎటువంటి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే పరలోకములో ఉన్న తండ్రి గురించి చెప్పగలిగాను. ఆమె శిశువుగా ఉండినప్పుడు తనను వదిలి వెళ్లిపోయిన తన తల్లిదండ్రులను ఆమె క్షమించగలిగిన స్థితికి రాలేదు. ఆమెలో నుండిన “తిరస్కరించబడ్డాననే ఆలోచనలు” ఆమె మనసును నాశనం చేయుట నేను చూడగలిగాను.

తల్లిదండ్రులుండినా వారుకోరుకొనిన శ్రద్ధను మరియు ప్రేమను పొందనటువంటి మరికొందరు అమ్మాయిల గూర్చి నేను ఆలోచించాను. అటువంటి అమ్మాయిలు కూడా భద్రత లేకుండా, ఒంటరిగా, ఏ సంతోషం లేకుండా ఈ కౄరమైన మరియు కఠినమైన లోకములో పెరిగియున్నారు. విడిపోయిన కుటుంబాలకు చెందిన మరియు వివాహము కాని తల్లులకు పుట్టిన అమ్మాయిలున్నారు. ఎంతోమంది అమ్మాయిలు అటువంటి విషాదకరమైన పరిస్థితులలో ఉంటూ, వారి తల్లిదండ్రులు వారిని అర్థము చేసికోలేరని భావించుదురు.

ఎంతో మంది అమ్మాయిలు విషాదకరమైన పరిస్థితులలో నుండి వచ్చియుందురు, అయితే వారందరు కూడా, మన పరలోకపు తండ్రి ఒడిలోనికి వచ్చినట్లయితే, వారు ఆశపడే భధ్రత, ప్రేమ మరియు సంరక్షణ పొందగలరు.

నీవు గతంలో అనుభవించిన బలాత్కారమునకు సంబంధించిన జ్ఞాపకములను బట్టి గాయపడియున్నావా? బహుశా అవి నీవు ఎవరికీ చెప్పుకోలేని లోతైన, రహస్యమైన గాయములయ్యుండవచ్చు. చిన్నతనములో లైంగికముగా బలాత్కరింపబడిన ఒక అమ్మాయిని నేనొకసారి కలుసుకొన్నాను. ఆమె పాడైనట్టుగా ఊహించుకుంటూ తన కన్యత్వము దోచుకోబడినట్లుగా బాధపడ్తూ కోపముతో ఏమగవాడిని ఎప్పుడూ నమ్మలేనని భావించేది. ఆమెకు జరిగినదంతా ఒక దుర్ఘటన అని ఆ విషయంలో ఏ విధంగాను ఆమె బాధ్యురాలు కాదని నేను చెప్పాను, ఆ మాటను విని ఆమె ఉపశమనం పొందెను.

యేసుప్రభువు మాత్రమే ప్రతి గాయమును మాన్పి ప్రతి దోషమును మరియు అవమానమును కడిగివేయగలడు. నీకు హాని చేసిన వానిని క్షమించగలుగునట్లు ఆయన సహాయము చేయగలడు. నీవలె బాధపడిన వారికి కనికరము చూపుటకు వారికి సహాయము చేయుటకు నీ బాధాకరమైన అనుభవము నీకు ఉపయోగపడును. బహుశా నీవు ధరించు దుస్తులు మరియు నీ నడవడి మొదలైన వాటిపై నీ తల్లిదండ్రులు విధించిన కఠిన నియమములను బట్టి నీవు కోపగించుకొని ఉండవచ్చును. కొంతమంది అమ్మాయిలు కొన్ని సమయములలో వారి జీవితములను అంతము చేసికొనుటకు వారి ఇళ్లనుండి పారిపోవాలనుకొందురు. కాని భవిష్యత్తు అంతా ప్రతికూలముగా అనిపించే అమ్మాయిలు ఎవరూ ఉండరు. ప్రతి కారుమేఘములో మెరుపు తీగ ఒకటి ఉండును. కనుక నీకు జరగబోయే మంచి విషయముల గూర్చి ఆలోచించుట నేర్చుకో. నీ తల్లిదండ్రులు నీ కొరకు చేసిన మంచి పనుల గూర్చి కృతజ్ఞత కలిగియుండుట నేర్చుకో. వాటిని బట్టియే నీవు ఈ రోజు జీవించియున్నావు. నీవు ఎదుర్కొనే యిబ్బందులకు మరియు పరీక్షలకు నీవు సర్దుకొని పోవునట్లు దేవుడు సహాయము చేయగలడు. కనుక ఎప్పుడూ నిరీక్షణను విడిచిపెట్టకు. అన్నీ బాగా జరిగిపోవుచున్న వారి జీవితాలను చూచి నీవు అసూయపడకు.

దేవుడు నిన్ను చేయుటలో లేక నీ కొరకు ఏర్పాటు చేసిన పరిస్థితుల విషయములో ఏ పొరపాటు చేయలేదు. నీ పరిస్థితి కంటే విచారించవలసిన పరిస్థితులున్న వారు ఈ లోకములో లక్షల కొద్దీ ఉన్నారు. నీవు కృతజ్ఞత తెలుపుటకు చాలా విషయాలు ఉన్నాయి.

బహుశా నీవు పాపము చేసి వివాహమగుటకు ముందే గర్భము ధరించి యుండవచ్చును. అటువంటి పరిస్థితులలో, వారు బిడ్డలను కనుటకు సరియైన నిర్ణయము తీసుకొనిన చాలా మంది అమ్మాయిలను నేనెరుగుదును. కొందరు వారి బిడ్డలను వారితో ఉంచుకొన్నారు. మరికొందరు వారిని దత్తతకు ఇచ్చివేసారు. అంతేకాని వారు ఆ బిడ్డలను చంపలేదు. వారు తమను తాము తగ్గించుకొని దేవుని యెదుట పశ్చాత్తాప పడినప్పుడు, ఆయన వారిని అర్థము చేసుకొనగలిగే భర్తలను కూడా యిచ్చాడు. దేవుడే వారి దోషమును మరియు అవమానమును తీసివేసాడు. కనుక నీవు అటువంటి చీకటి సమయాల్లో కూడా ఇతరులు నిన్ను దూషించినప్పుడు కూడా నీవు దేవుని నమ్మవచ్చును. దేవుడు నిన్ను స్వీకరించి నీకు ఒక క్రొత్త జీవితమును ప్రసాదించుటకు వేచియున్నాడు.

కొంతకాలము క్రిందట మన దేశములో వార్తాపత్రికలలో, ఒక కుటుంబములో ముగ్గురు అక్కాచెల్లెల్లు (ముగ్గురూ వివాహ వయస్కులు) వారి పడక గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చదివాను. ఆ అమ్మాయిలలో ఎవరినైనా వివాహము చేసుకొనుటకు వచ్చిన ప్రతి కుర్రవాడి తల్లిదండ్రులు అడిగిన కట్నం వారి తండ్రి చెల్లించలేక పోయాడు మరియు ఆ తండ్రి ఏమీ చేయలేక నిరాశ చెందాడు. వారు తమ జీవితాన్ని అంతమొందించుకొనుట ద్వారా తమ తండ్రి కష్టములకు స్వస్థి పలకాలనుకొన్నారు! ఎంత విషాదకరం!!

బహుశా నీవు అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటూ ఉండవచ్చును. వచ్చిన ప్రతి సంబంధము కట్నము వలన తిరిగి వెళ్ళిపోతూ ఉండవచ్చును. అయినా నిరుత్సాహపడవద్దు. దేవుడు నీకు తండ్రి, నీ యొక్క ప్రతి అవసరము ఆయనకు తెలియును మరియు నీ గూర్చి ఆయన జాగ్రత్త తీసుకొనును. వివాహము లోకములో అతి గొప్ప విషయము కాదు. జీవితములో దేవుని చిత్తమును నెరవేర్చుట గొప్ప విషయము. కనుక నిన్ను నీవు దేవునికి సంపూర్తిగా అంకితం చేసికొని, నీ జీవితములో ఆయన చిత్తమును మాత్రము నెరవేర్చుటకు చూడు. అప్పుడు నీవు వివాహము చేసికొనినా చేసికొనక పోయినా, నీ జీవితము చివరకు వచ్చునప్పటికి నీవు సంతృప్తికలిగిన జీవితము కలిగియుందువు. లోకములో కొందరు గొప్ప మిషనెరీలు పెండ్లి కాని స్త్రీలే.

నీవు ఎంతో కష్టపడి చదివిన తరువాత కూడా ఏదైనా పరీక్షలో తప్పిపోయావా? ఇతరులెవ్వరూ నీకు సానుభూతి చూపుట లేదని అనుకుంటున్నావా? నీ జీవితమంతా వ్యర్థమేనని నీవు అనుకొనేలా సాతాను చేస్తున్నాడా? అటువంటి దుష్టుని యొక్క ఆలోచనలను నీలో కొనసాగనివ్వకు, ఎందుకంటే చివరకు అవి నీ జీవితాన్ని అంతం చేసుకొనేలా చేయును.

నా సహోదరీ, ఏడ్వడం మాను. నీవు ఒక పరీక్షలో తప్పినందుకు, ఆ మాటకొస్తే ఎన్నో పరీక్షల్లో తప్పినంత మాత్రాన నీ జీవిత చక్రం ఆగిపోనక్కర్లేదు. ఆ పరీక్షలు మరలా వ్రాయి. ఒక రోజున నీవు విజయం సాధిస్తావు. ఎప్పుడూ చేతులెత్తివేయకు. ఒకవేళ నీవు ఉత్తీర్ణత చెందకపోతే లేక పై చదువులు చదువుటకు కావలసిన తెలివి తేటలు కాని, లేక ఆర్థిక స్తోమత కాని నీకు లేకపోయినట్లయితే, లోకములో నున్న జ్ఞానవంతులును మరియు ధనికులను సిగ్గు పరుచుట కొరకు దేవుడు బలహీనులను మరియు బీదలను ఏర్పర్చుకొనెనను విషయము జ్ఞాపకముంచుకో.

నీవు ఎలా ఉన్నావో అలాగే నీవు పరీక్షల్లో ఉత్తీర్ణత చెందినా లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు! నిన్ను అంగీకరించుటకు ముందు ఆయన నీ మార్కుల జాబితాను చూడడు!!

మనకు దేవుడు ఎంతో ప్రియమైన వాడుగా ఉండుటకు ఎన్నో పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తాడు. ఇప్పటినుండి ఆయనే భూమిపై నీకు అత్యంత ఆకర్షనీయమైన వానిగా ఉండనిమ్ము.

బహుశా నీవు ప్రేమలో విఫలం చెందియుండవచ్చు. నీవు వివాహం చేసుకోవాలని అనుకొన్న వాడు ఇంకొకరిని వివాహం చేసికొని యుండవచ్చును. అటువంటి సమయములో అందరి యౌవనస్థులు వలె నీవు ఏడ్చియుందువు. కాని ఆ యౌవనస్థుడు ఇంకొకరిని వివాహము చేసికొన్నాడంటే, దేవుని చిత్తములో అతడు నీ కొరకు లేడనే విషయాన్ని అది ఋజువు చేస్తుంది. నీ కొరకు దేవుడు అంతకంటే శ్రేష్టమైన వానినో లేక శ్రేష్టమైన పరిస్థితినో ఏర్పాటు చేసి యుండవచ్చును- బహుశా ఆయనను సేవించునట్లు ఒంటరి జీవితాన్నే దేవుడు ఉద్దేశించి యుండవచ్చును. మనకు ఈ లోకములో ఉండే ఎవరి కంటే మరియు దేని కంటే కూడా దేవుడే విలువైన వాడిగా అగునట్లు ఆయన మన జీవితాల్లో ఎన్నో విషయాలు జరుగునట్లు అనుమతించును. అందువలన ఇక నుండి నీ జీవితంలో ఆయనే ఈ లోకమంతటిలో అతికాంక్షణీయుడుగా ఉండుటనట్లు చేసుకో.

కనుక తల్లిండ్రులచేత విడిచి పెట్టిన వారికి నేను చెప్పేదేమనగా మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మును విడిచిపెట్టారో తెలుసుకొన అవసరము లేదు. నీవు అనుకోకుండా పుట్టిన దానవు కాదు, నీ దినములన్నియు శాశ్వత కాలము నుండి దేవుని గ్రంథములో వ్రాయబడియున్నవి (కీర్తన 139:15,18). లోకములను సృష్టించకముందే ఆయన నిన్ను ఏర్పాటు చేసికొనెను (ఎఫెసీ 1:4,11). నీ తల్లిదండ్రుల పొరపాట్లకు నీవు భాద్యురాలివి కాదు. నీవు ఒక కుటుంబం గురించి ఎంతగానో వాంచించి యున్నావు. నిన్ను తన కుటుంబంలో చేర్చుకొనుటకు ఆశిస్తున్న ఒక పరలోకపు తండ్రి ఉన్నందుకు ఇప్పుడు సంతోషించు. ఒక విషయము జ్ఞాపకం ఉంచుకో. ఆయన తన బిడ్డలను ఎప్పుడు విడువడు ఎడబాయడు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు మరియు ఆ ప్రేమను నీపై కుమ్మరించియున్నాడు. నీవు ఒక బిడ్డగా, నీ తండ్రియైన దేవుని చేతులలో ఉన్నట్లు ఎప్పుడూ ఊహించుకో. నీవు ఆయన రూపములో సృష్టించబడితివి మరియు ఆయన నిన్ను దీవించుటకు మరియు ఎప్పుడూ నీకు అందుబాటులో నుండుటకు ఎంతో ఆశ పడుచున్నాడు.

ఆయన నీ కొరకు దాచియుంచిన దానినంతటిని నీకు చూపుటకు వేచియున్నాడు. ఒక రోజున ఆయన నీ కొరకు సిద్ధపరచిన నివాస స్థలములో నీవు ఉండుటకు ఆయన నిన్ను తీసుకు వెళ్ళును. అది ఈ లోకములో నున్న ఏ ఇంటికంటే లేక వారసత్వముగా వచ్చిన ఆస్తి కంటే ఎంతో శ్రేష్టమైనది. కాని నీవు ఆయన బిడ్డగా అగుటకు మరియు ఆయన కుటుంబములో భాగముగా అగుటకు నీవు అంగీకరించాలి. అప్పుడు ఎవరు కూడా ఆయన చేతి నుండి నిన్ను బలాత్కారముగా లాగలేరు. కనుక నీ జీవితమంతటిని ఆయనకు ఇమ్ము.

“తన్ను (యేసును) ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను 1:12).

నీవు ఒక పాపివని నీవంగీకరించి, యేసు నీ పాపముల కొరకు మరణించెనని అంగీకరించినట్లయితే నీవు పరలోకపు తండ్రికి ఒక బిడ్డగా మారగలవు. నీ పాపములన్నిటిని గూర్చి పశ్చాత్తాపపడి పాపినని ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ కొరకు కార్చిన ఆయన రక్తములో నిన్ను పూర్తిగా కడుగును. నీ పట్ల తప్పు చేసిన వారందరిని క్షమింపుము`నీ తల్లిదండ్రులను కూడా. నీ గత జ్ఞాపకాలు నిన్ను వెంటాడి నిన్ను దోషిగా చెయ్యనియ్యకుము. నీ గతము గూర్చి నీవెప్పుడూ దోష భావముతో ఉంటే, నీ జీవితములో దేవుని ఉద్దేశ్యమును నీవు నెరవేర్చలేవు. నీ గతము ఎప్పటికీ వెనక్కు ఉండిపోయేలా దాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టు. నీ గతాన్ని యేసుక్రీస్తు యొక్క రక్తము క్రింద ఉంచి భవిష్యత్తులోకి సాగిపో. యేసు ప్రభువు శ్రమపడి మరణించింది నిన్ను కడుగుటకే కాక, నీవు కడుగబడితివని నీవు తెలుసుకొనుట కొరకు కూడా మరణించెను. క్రీస్తు నీ జీవితములోనికి వచ్చినప్పుడు, నీవు దేవుని యెదుట నీతిమంతురాలుగా తీర్పుతీర్చబడితివి. దేవుడు ఇప్పుడు నిన్ను, నీ జీవితమంతటిలో ఎప్పుడూ నీవు పాపము చేయలేదన్నట్లుగా చూచుచున్నాడు. ఈ వాస్తవమును గూర్చిన గ్రహింపు నీ హృదయములోనికి ఎప్పుడూ సంతోషమును తీసుకొని రానివ్వు.

ఎంత మాత్రము ఏడ్వవద్దు
నీవు ఒక అనాధవు కాదు
నీవు ఒక రాజ కుమార్తెవు

ఆ విధముగా నీవు, ఇప్పుడు నేను వ్రాసినట్లు చేసిన మాలో అనేకమంది వలె, దేవుని యొక్క అద్భుతమైన కుటుంబమునకు చెందుదువు. నీవు బైబిలు చదువుచున్నప్పుడు, దేవుడు నీ హృదయముతో మాట్లాడుటను నీవు విందువు. మరియు నీవు ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుచున్నప్పుడు, ఆయన పరలోకము నుండి నీ ప్రార్థన వింటున్నాడనియు మరియు నీకు సమాధానమిస్తున్నాడనే నిశ్చయతను నీవు పొందుదువు. తండ్రి యేసు ప్రభువుతో ఒకసారి “నీవు నా ప్రియ కుమారుడవు. నీ యందు నేను ఆనందించుచున్నాను” అని చెప్పెను. ఒక రోజున ఆయన నిన్ను కూడా ఆయన ఆనందించుచున్న ఆయన యొక్క ప్రియ బిడ్డగా పిలుచును. ఇంక ఏడవకు. నీవు అనాధవు కావు. నీవు ఒక రాజు యొక్క కుమార్తెవు.

నేను కొంతకాలము క్రితము ఒక ఉత్తరాన్ని చదివాను, అది నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో దానిని అది బహు చక్కగా తెలియజెప్పింది. దాన్ని బేరీ ఆడమ్స్ అనే ఆయన వ్రాసారు. ఆయన ప్రేరేపణతో సమకూర్చిన దానిని పూర్తిగా ఇక్కడ వ్రాయుటకు దయతో అనుమతిని ఇచ్చారు.