వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట పురుషులు
WFTW Body: 

మనము సంఖ్యాకాండము 22-24 అధ్యాయములలో బిలాము గురించి చదువుతాము. ఇది అనేక విషయాలు కలిగియున్న ముఖ్యమైన వాక్యభాగము. రాజైన బాలాకు ప్రవక్తయైన బిలాము యొద్దకు వచ్చి ఇశ్రాయేలును శపించమని ఆహ్వానించినప్పుడు బిలాము దేవుని చిత్తాన్ని వెదెకెను. వెళ్ళవద్దని దేవుడు బిలాముతో స్పష్టముగా చెప్పాడు. అతడు వస్తే ఇంకా ఎక్కవ డబ్బును ఇంకా ఎక్కవ ఘనతను ఇస్తానని రాజు బిలాముతో చెప్పాడు. మరలా దేవుని చిత్తాన్ని వెదుకుతానని బిలాము చెప్పాడు. ఆదినుండే కలుగబోవు వాటిని యెరిగియున్న దేవుడు అప్పటికే అతణ్ణి వెళ్ళవద్దని చెప్పినప్పుడు దేవుని చిత్తాన్ని రెండవసారి వెదుకవలసిన అవసరమేమిటి? కాని డబ్బును ఘనతను పొందాలని అతడు బహుగా ఆశించెను. దుర్నీతి వలన కలుగు బహుమానమును బిలాము ప్రేమించెనని బైబిలు చెప్పుచున్నది (2 పేతురు 2:16).

నీవు అటువంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చును. నీవు దేవుని చిత్తాన్ని వెదికినప్పుడు దేవుడు నిన్నొక ప్రదేశానికి వెళ్ళవద్దని నీ ఆత్మలో చెప్పడాన్ని నీవు గ్రహిస్తావు. కాని అక్కడ నీకు వచ్చే జీతము చాలా ఆకర్షణీయముగా కనిపించి మరలా దేవుని చిత్తాన్ని వెదకడానికి శోధింపబడతావు. నీవు భవిష్యత్తులో ఇటువంటి శోధనను ఎదుర్కొన్నప్పుడు బిలామును గుర్తుంచుకో. జీతము ఆకర్షణీయముగా ఉన్నది కాబట్టి, ఎక్కువ ఘనత వస్తుంది కాబట్టి, దేవుడు మనసును మార్చుకోడు. ఒక వ్యక్తి ఒక దారిలో వెళ్ళాలనుకోవడం దేవుడు చూచినప్పుడు దేవుడతనిని ఆపడు. అతణ్ణి వెళ్ళనిస్తాడు. అందుకనే బిలాము దేవునిని రెండవసారి అడిగినప్పుడు వెళ్ళమని అతనితో చెప్పాడు. అది దేవుని పరిపూర్ణ చిత్తము కాదు. ఆయన బిలాము చిత్తాన్ని కాదని అతణ్ణి ఒక మరమనిషిగా చేయలేదు. బిలాము నిజంగా వెళ్ళాలనుకున్నాడని ఆయన చూచాడు. గనుక వెళ్ళమని చెప్పాడు. ఇది తప్పిపోయిన కుమారుని తండ్రి అతనిని దూరదేశమునకు వెళ్ళుటకు అనుమతించినట్లుంది. దేవుడు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మన సొంత చిత్తాన్ని త్రొక్కివేయడు.

అయినప్పటికీ బిలామును ఆపడానికి దేవుడు తన దూతను పంపించాడు. బిలాము దూతను చూడలేకపోయెను కాని అతని గాడిద చూడగలిగెను. దీన్నుండి మనమేమి పాఠం నేర్చుకోగలము? ఒక మనిషి ధనాశ చేత గ్రుడ్డివాడైనప్పుడు ఒక గాడిద కూడా ఆత్మీయ వాస్తవాలను అతనికంటే స్పష్టంగా చూడగలిగింది. బిలాము డబ్బును ప్రేమించెను గనుక చూడలేకపోయెను. బిలాము ఒకప్పుడు దేవుని యెరిగిన ప్రవక్తగా ఉండెను కాని డబ్బును ప్రేమించడం వలన అతడు తన ప్రవచనాత్మక అభిషేకమును పొగొట్టుకొనెను.

గాడిద దాని యజమానితో మాట్లాడటం మొదలు పెట్టెను. బైబిలు గ్రంథములో "భాషలతో మాట్లాడుట" ఇదే మొదటిసారి. ఒక గాడిద దానికి తెలియని భాషను, నేర్చుకోని భాషను ధారాళముగా మాట్లాడటం. ఇది మనవాతీతమైనది ఇది నిస్సందేహంగా దేవుని యొద్దనుండి వచ్చినది. లేఖనాలలో మొదటి సారిగా భాషలతో మాట్లాడిన ఈ పర్యాయము నుండి భాషలతో మాట్లాడటం ఎవరినీ ఆత్మానుసారులుగా చేయదని నేర్చుకుందాము. ఎందుకంటే ఆ గాడిద భాషలతో మాట్లాడిన తరువాత కూడా, దాని నాలుక ద్వారా దేవుని మానవాతీతమైన శక్తిని అనుభవించినాక కూడా అది బుద్ధిహీనమైన గాడిదగానే ఉండిపోయింది. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకొనుడి.

తర్వాత బిలాము మోయాబీయులకు ఒక తెలివైన తంత్రాన్ని చెప్పాడు. ఇశ్రాయేలీయులను నాశనము చేయడానికి ఉత్తమమైన మార్గం వారి దేవునినే వారికి వ్యతిరేకంగా చేయడమని మోయాబీయులతో చెప్పాడు. దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా చేయడానికి ఉత్తమమైన మార్గం వారిని జారత్వములో పడవేయడమని చెప్పాడు. గనుక ఇశ్రాయేలు యొక్క పురుషులను మోహింపచేయడానికి మోయాబీయుల యొక్క అందమైన కుమార్తెలను ఇశ్రాయేలు పాళెములోనికి పంపించమని చెప్పాడు. ఆ విధంగా ఇశ్రాయేలు జారత్వములోనికే కాకుండా ఈ మోయాబీయుల ఆడపిల్లలు ఇశ్రాయేలు పాళెములోనికి తీసుకువచ్చిన విగ్రహాల యొక్క ఆరాధనలోకి కూడా పడిపోయారు (సంఖ్యాకాండము 25:1 మరియు ప్రకటన 2:14 చూడండి). అనుకున్నట్లే దేవుడు ఇశ్రాయేలీయులను కఠినంగా శిక్షించాడు. 24,000 మంది తెగులుతో మరణించారు (సంఖ్యాకాండము 25:9). ఈ విధంగానే సాతాను ఈ రోజున కూడా విశ్వాసులను అపవిత్రపరిచాడు. బిలాము యొద్దనుండి మనము సాతాను తంత్రములను నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలి.