WFTW Body: 

అద్భుతమైన సువార్త మరియు దేవుని అపారమైన కనికరం దృష్ట్యా, మన ప్రతిస్పందన ఏవిధంగా ఉండాలి?

అన్నింటిలో మొదటిది, మన శరీరాలను సజీవయాగంగా ప్రతిరోజూ దేవునికి సమర్పించాలి (రోమా 12:1). దేవునికి మన డబ్బు అక్కర్లేదు; ఆయనకు మన శరీరం కావాలి. పాతనిబంధనలోని దహనబలిలాగా, "ప్రభువా, ఇదిగో నా కన్నులు, నా నాలుక, నా చేతులు, నా పాదాలు, నా చెవులు, నా శారీరక కోరికలు - నేను సమస్తమును బలిపీఠం మీద ఉంచుతున్నాను" అని మన శరీరాలను అర్పించాలి. తరువాత, రెండవది, మన మనస్సులను నూతనపరచబడుటకు మనము ఆయనకు అప్పగించాలి (రోమా 12:2). మన మనస్సులను దేవుని వాక్యముతో సంతృప్తిపరచుటకు అనుమతించుట వలన ఇది జరుగుతుంది. మనలో చాలా మందికి మురికి ఆలోచనలతో విపరీతమైన సమస్యలు ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే గతంలో మనం మన మనస్సును ప్రాపంచిక కోణంలో ఆలోచించడానికి ఉపయోగించాము. ఇప్పుడు దేవుడు మన ఆలోచనా విధానాన్ని మార్చాలనుకుంటున్నాడు, తద్వారా మనం ఆయన ఆలోచించే విధంగా ఆలోచించడం ప్రారంభిస్తాము. అలా మన మనస్సు క్రమంగా రూపాంతరం చెందుతుంది.

మనం తిరిగి జన్మించిన వెంటనే దేవుడు ప్రతిదాని గురించి ఆలోచించినట్లు ఆలోచించడం ప్రారంభించము. కానీ ఆ క్షణం నుండి దేవుడు మన ఆలోచనా విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు, తద్వారా మనం క్రమంగా ప్రతిదాన్ని ఆయన ఎలా చూస్తున్నాడో చూడటం ప్రారంభిస్తాము. మనం డబ్బుని దేవుడు చూసే విధంగా చూడటం మొదలుపెట్టామా? స్త్రీలను, లోకంలోని పురుషులు వారి వైపు చూస్తున్నట్లుగా కాక దేవుడు చూసే విధంగా చూడటం మనం ప్రారంభించామా? లోకం స్త్రీలను తృణీకరిస్తుంది లేదా వారిని మోహిస్తుంది. దేవుడు ఆ రెండిండిలో దేనిని చేయడు. మన శత్రువులను యేసు ఏవిధంగా చూస్తున్నాడో ఆవిధంగా చూడడం ప్రారంభించామా? ఈ లోకంలోని ప్రజలు తమ శత్రువులను ద్వేషిస్తారు, కానీ యేసు వారిని ప్రేమించాడు. ప్రతి విషయంలోనూ మన మనస్సులు నవీకరించబడాలి. మనం దేవుని వాక్యాన్ని చదివి విధేయత చూపుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మనస్సులను పునరుద్ధరించడం ద్వారా క్రీస్తు పోలికగా మారుస్తాడు.

పరివర్తన మొదట అంతరంగంలో జరుగుతుంది. "ఈ లోక మర్యాదను అనుసరించక" (రోమా 12:2) అనే మాట ప్రాపంచికత మన మనస్సులలో ఉద్భవించునని మనకు బోధిస్తుంది. ఒక వ్యక్తి వస్త్రధారణలో లోకత్వం కనిపిస్తుందని చాలామంది ఊహించుకుంటారు. అది కాదు. ఇది మొదట మనస్సులో ఉంటుంది. మనం చాలా సాధారణమైన దుస్తులు ధరించవచ్చు అయినప్పటికీ డబ్బును ఎక్కువగా ప్రేమించవచ్చు. మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నిజమైన యేసు శిష్యుడు దేవుని ఆమోదం కోసం ప్రయత్నిస్తాడు. మనం మన శరీరాన్ని మరియు మన మనస్సును ఇలా దేవునికి సమర్పించినప్పుడే మన జీవితాల పట్ల ఆయన సంపూర్ణ చిత్తాన్ని మనం అర్థం చేసుకోగలం (రోమా 12:2).

రోమా 12లో, పౌలు ఆ తరువాత క్రీస్తు శరీరాన్ని నిర్మించడం గురించి మాట్లాడాడు. సువార్త యొక్క లక్ష్యం వ్యక్తిగత రక్షణ కాదు కానీ క్రీస్తు శరీరంలో ఒక భాగమవ్వడం - ఇక్కడ మనం దేవుడు మనకు ఇచ్చే ప్రవచనం, సేవ మొదలైన వరాలను అభ్యాసం చేస్తాము. 1కొరింథీ 12లో మాత్రమే కాక, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ వరముల జాబితా ప్రస్తావించబడింది (రోమా 12:6-8). ఏ క్రైస్తవుడు ఎప్పుడూ కోరని బహుమతి ఇక్కడ ప్రస్తావించబడింది -సంఘంలోని పేదలకు, దేవుని పని కోసం డబ్బు ఇచ్చే దాతృత్వ వరం (రోమా 12:8).

రోమా 12వ అధ్యాయంలో మిగిలిన భాగం, క్రీస్తు శరీరంలోని ఇతర వ్యక్తులతో మనం ఎలా సంబంధం కలిగి ఉండాలో మాట్లాడుతుంది. "మీ మనస్సులో అహంకారంతో ఉండకండి, కానీ తక్కువ వ్యక్తులతో సహవాసం చేయండి" (రోమా 12:16 NASB). మనము క్రీస్తు శరీరంలోని ప్రతి ఒక్కరితోను, ప్రత్యేకించి పేదవారితో కలిసిపోవాలి - దేవుడు ఈ ప్రపంచంలోని పేదలను విశ్వాసంలో ధనవంతులుగా ఎన్నుకున్నాడు (యాకోబు 2:5). "ప్రతీకారం దేవునికి చెందినది కాబట్టి ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవద్దు(19వ వచనం). ఆరాధన మరియు మహిమ దేవునికి మాత్రమే చెందినట్లుగా, ప్రతీకారం కూడా దేవునికి మాత్రమే చెందుతుంది. ఇతరుల నుండి ఆరాధన లేదా మహిమను పొందుటకు మనకు హక్కు లేనట్లే, ఇతరులపై ప్రతీకారం తీర్చుకునే హక్కు కూడా మనకు లేదు.

రోమా 13వ అధ్యాయం, పౌర అధికారులకు లోబడటం గురించి మాట్లాడుతుంది. అన్నింటికంటే ముందుగా దేవునికి లోబడాలని సువార్త మనకు బోధిస్తుంది (రోమా 12:1, 2); తరువాత క్రీస్తు శరీరంలో ఒకరికొకరు లోబడాలి (రోమా 12:3-21); చివరకు లౌకిక అధికారులకు లోబడాలి - ఎందుకంటే వారు "దేవుని సేవకులు" (రోమా 13:4, 6). అందుకే మనం పన్నులు చెల్లిస్తాం, మన దేశ చట్టాలను పాటిస్తాం.