క్రీస్తు తిరిగి రాకముందు, ప్రపంచం మొత్తానికి రాజ్య సువార్త ప్రకటన ఉంటుంది (మత్తయి 24:14).
ఈ రాజ్య సువార్త ఏమిటి? ఇది పరిశుద్ధాత్మలో నీతి, పరిశుద్ధాత్మలో సమాధానం మరియు పరిశుద్ధాత్మలో ఆనందం యొక్క సువార్త అని రోమా 14:17 స్పష్టంగా బోధిస్తుంది. దీనిని ప్రకటించేవారు చాలా తక్కువ. చాలామంది పాప క్షమాపణను మాత్రమే ప్రకటిస్తున్నారు, ఇది ఒక మంచి మొదటి అడుగు.
ఇది ఒక కప్పును శుభ్రం చేయడం లాంటిదని నేను అనుకుంటాను. నా చిన్న అబ్బాయి నా దగ్గరకు వచ్చి, "నాన్న, మీరు నాకు ఒక కప్పు పాలు ఇవ్వగలరా?" అని అడిగి, అతను నాకు మురికి కప్పును ఇస్తే(మన హృదయాలకు సాదృశ్యం), నేను మొదట కప్పును శుభ్రం చేస్తాను. నేను ఆ మురికి కప్పులో పాలు పోయను. నేను ఆ కప్పు తీసుకొని పూర్తిగా శుభ్రం చేస్తాను. శుభ్రపరచుటయొక్క ఉద్దేశ్యం ఏమిటి? నేను అతనికి ఖాళీ కప్పును ఇవ్వను! నేను దానిని పాలతో నింపి అతనికి ఇస్తాను.
అదేవిధంగా, మనం క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మొదటిగా కప్పు లోపలి భాగాన్ని శుభ్రం చేసినట్లుగా మన హృదయాలను శుభ్రం చేస్తాడు. ఆయన దానిని అలాగే వదిలేస్తాడా? లేదు! ఆయన దానిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నీతితో, దేవుని సమాధానంతో మరియు దేవుని ఆనందంతో నింపుతాడు. ఇదే సువార్త. క్రీస్తు హృదయాన్ని శుభ్రపరుస్తాడని మరియు కప్పును శుభ్రం చేస్తాడనే సత్యాన్ని మాత్రమే మనం అందిస్తే, మనం ప్రజలకు ఖాళీ కప్పును అందిస్తున్నాము, అందుకే చాలా మంది క్రైస్తవులు దప్పిగొని ఉన్నారు. వారు ఖాళీ కప్పుతో తిరుగుతున్నందున వారు సంతృప్తి చెందరు, అది నిజంగా శుభ్రంగా ఉండవచ్చు, కానీ అది ఖాళీగా ఉంది. నా పిల్లవానికి శుభ్రమైన ఖాళీ కప్పు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి, "కుమారుడా, నువ్వు నాకు మురికి కప్పు ఇచ్చావు, ఇదిగో, శుభ్రపరచబడింది" అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? దేవుడు మనకు ఇచ్చేది అంతే అయితే, అది నిరాశ కలిగిస్తుంది. నా కుమారుడు, "నాన్న, నాకు కొన్ని పాలు కావాలి" అని అంటాడు.
మీరు నీతి కోసం ఆకలి దప్పులతో ఉన్నారా? సమస్య ఏమిటంటే చాలా మంది క్రైస్తవులు నీతి కోసం ఆకలి దప్పులతో ఉండరు, అందుకే వారు శుభ్రమైన ఖాళీ కప్పుతో తిరుగుతుంటారు.
పాత నిబంధన మరియు కొత్త నిబంధనల మధ్య వ్యత్యాసాన్ని ఇలా చిత్రీకరించవచ్చు: పాత నిబంధన విశ్వాసికి ఇవ్వబడిన దేవుని రాజ్యాన్ని భూమిపైకి తీసుకువచ్చే పరిశుద్ధాత్మ వరం, ఒక బల్ల మీద తలక్రిందులుగా ఉంచబడిన కప్పు లాంటిది. మీరు కప్పుపై ఒక జగ్గు నుండి నీటిని పోస్తారు, ఇది పరిశుద్ధాత్మ కుమ్మరించబడటానికి చిత్రం. పాత నిబంధన కాలంలో ఇలాగే ఉండేది. నీరు ప్రవహించింది; పరిశుద్ధాత్మ ప్రజలపై ఉంది, వారి చుట్టూ ప్రవహించి బహుశా వేల మరియు లక్షలాది మందిని ఆశీర్వదించింది. అభిషేకించబడిన దేవుని సేవకుడైన మోషే అరణ్యంలో ఇరవైలక్షల మందిని నడిపించాడు. కానీ మోషే హృదయాంతరంగం మురికిగా ఉంది. అతను కోపాన్ని అధిగమించలేకపోయాడు. అతనికి కోపం ఉన్నప్పటికీ, అతని నుండి ఆశీర్వాదం ప్రవహించి జనసమూహాలను ఆశీర్వదించింది.
దావీదు, సమ్సోను, గిద్యోను మరియు పాత నిబంధనలో చాలా మంది ఇతర వ్యక్తుల విషయంలో కూడా అలాగే ఉంది. దేవుని ఆత్మ వారిపై ఉంది. తన తల్లి గర్భం నుండి దేవుని ఆత్మను తనపై కలిగి ఉన్న గొప్పవాడైన బాప్తిస్మమిచ్చు యోహాను కూడా జైలులో ఉన్నప్పుడు క్రీస్తు గురించి సందేహించాడు. పరలోకం నుండి ఒక స్వరం విన్నప్పటికీ, యేసు నిజంగా మెస్సీయనా అని అతను ప్రశ్నించాడు. అతని కప్పు లోపలి భాగం విశ్వాసంతో నిండి లేనందున అతనికి అవిశ్వాసం కలిగింది.
కానీ పెంతెకొస్తు రోజున, ప్రభువు ఈ కప్పును సరియైన వైపుకు తిప్పి, కప్పులో అంటే హృదయంలోకి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అప్పుడు అది పాత నిబంధనలో వలె పొంగి ప్రజలను ఆశీర్వదించడమే కాకుండా, కొత్త నిబంధనలో దానికంటే ఎక్కువగా జరుగుతుంది. అది అంతరంగంలోనుండి ప్రవహిస్తుంది. అది మనలో నుండి ప్రవహించే దేవుని రాజ్యం. యేసు ప్రవచించిన పెంతెకొస్తు రోజున వచ్చిన రాజ్యం ఇదే. అందుకే యెరూషలేములో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి... లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని అన్నాడు (యోహాను 7:38). పెంతెకొస్తు దినానికి ముందు అది జరగలేదు మరియు జరగదు. అందుకే యోహాను 7:39 లో ఇలా చెప్పబడింది, "తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు". పరిశుద్ధాత్మ ఇంకా ఇవ్వబడలేదు అంటే పై విధంగా ఇవ్వబడలేదు.
క్రీస్తు చనిపోయి తిరిగి లేచి తన రక్తాన్ని తండ్రి ముందు సమర్పించవలసి ఉంది. అప్పుడే, మనుష్యుల హృదయాలు శుద్ధి చేయబడతాయి. ఎద్దుల మరియు మేకల రక్తం ప్రజల హృదయాలను ఎన్నటికీ శుద్ధి చేయలేదు, అందుకే దేవుడు ప్రజలలో పరిశుద్ధాత్మను ఉంచలేకపోయాడు. పాత నిబంధన కాలంలో దేవుని రాజ్యం ప్రజలలోకి రాలేదు. కానీ ఇప్పుడు క్రీస్తు తన రక్తాన్ని చిందించి తండ్రి వద్దకు ఆరోహణమయ్యాడు కాబట్టి, మన ప్రతి పాపం దానిని ప్రభువువద్ద ఒప్పుకుంటే శుద్ధి చేయబడుతుంది.
కాబట్టి దేవుడు కప్పును సరియైనవైపుకు తిప్పి క్రీస్తు రక్తంలో మనలను శుద్ధి చేసి, మొదట మనలో పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు, తద్వారా ఆయన దేవుని చిత్తాన్ని చేయడానికి మనల్ని బలపరుస్తాడు. అప్పుడు, ఆయన జీవం మన నుండి మాటలు ద్వారా, క్రియల ద్వారా ప్రవహిస్తుంది, తద్వారా మనం చేసినట్లుగానే ఇతరులను కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి నడిపించగలము.
పరిశుద్ధాత్మ మన అంతరంగము నుండి ప్రవహిస్తుంది. ఆత్మ మన అంతరంగము నుండి ప్రవహించకపోతే, అది పాత నిబంధన పరిచర్య లాంటిది.