అరణ్యంలోని రెండవ శోధనలో సాతాను యేసుతో, "నీవు దేవుని కుమారుడివైతే, దేవాలయం పైనుండి క్రిందికి దూకి దేవుని వాగ్దానాన్ని ఎందుకు స్వతంత్రించుకోకుడదు?" అని అన్నాడు (మత్తయి 4:6). అతను కీర్తన 91ని కూడా ఉటంకించాడు, "ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు".
మత్తయి 4:7లో, యేసు, "నీ దేవుడైన ప్రభువును నీవు పరీక్షించకూడదు" అని జవాబిచ్చాడు. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఇది ఆచరణాత్మక పరంగా ఎలా వర్తిస్తుంది? ఇక్కడ యేసుకు శోధన ఏమిటంటే, దేవాలయం పైనుండి దూకి, కీర్తన 91లోని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని గాయపడకుండా ఆలయ ప్రాంగణానికి దిగినప్పుడు, ప్రజలు చూసి, "ఓ, ఎంత గొప్ప దేవుని సేవకుడు! ఆయన విశ్వాసాన్ని చూడండి, ఆయన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని గాయపడలేదు" అని ఆశ్చర్యపడేలా చేయటం. యేసు, "నేను దేవుణ్ణి అలా శోధించను" అని అన్నాడు. దేవాలయం పైనుండి క్రిందికి దిగడానికి మెట్లు ఏర్పాటు చేయబడినప్పుడు, దూకవలసిన అవసరం లేదు. యేసు నిరాకరణ యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు అందించిన మార్గాలను మనం ఉపయోగించవచ్చు మరియు మన కోసం అద్భుతమైన రీతిలో ఏదైనా చేయమని దేవుడిని అడగడం ద్వారా దేవుణ్ణి శోధించకూడదు.
ఉదాహరణకు, అపొస్తలుల కార్యములు 8:39లో, ఫిలిప్పు నపుంసకుడికి బోధించిన తర్వాత, పరిశుద్ధాత్మ ఫిలిప్పును పైకెత్తి అజోతు అని పిలువబడే మరొక ప్రదేశానికి తీసుకెళ్లిన ఒక సందర్భాన్ని మనం చదువుతాము. పరిశుద్ధాత్ముడు అతనిని ఈ రోజు హెలికాప్టర్ చేసినట్లుగా గాలిలో పైకికెత్తి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు, మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలనుకుంటే, "నా కోసం అలా చేయి ప్రభువా" అని దేవుడిని అడిగితే, అది దేవుడిని శోధించడం అవుతుంది. దేవుడు బస్సులు, రైళ్లు, స్కూటర్లు మరియు విమానాలను ఏర్పరచినప్పుడు, మనల్ని ఆవిధంగా తీసుకెళ్లమని మనం పరిశుద్ధాత్ముడిని ఎందుకు అడగాలి?
దేవుణ్ణి శోధించే మరొక మార్గం ఏమిటంటే, దేవుడు నా కోసం చేసిన అద్భుతమైన పని గురించి తరువాత సాక్ష్యమివ్వగలిగేలా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. ఉదాహరణకు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు, "ప్రక్కనే ఉన్న వీధిలో మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, నాకు సలహా ఇవ్వడానికి వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను. నేను ఆ వైద్యులను, ఆ మందులను ఉపయోగించను" అని అంటారు. "ప్రభువే నన్ను స్వస్థపరచువాడు, కాబట్టి నాకు మందులు అవసరం లేదు" అనే వాగ్దానాన్ని పొందేందుకు ప్రయత్నించి వారు లేదా వారి పిల్లలు లేదా వారి భార్యలు చనిపోవడానికి అనుమతించిన చాలా మంది మూర్ఖపు క్రైస్తవులు ఉన్నారు. దేవుడు ఆలయంలో మెట్లు ఏర్పాటు చేసినప్పుడు, పైనుండి దూకి కీర్తన 91ని స్వతంత్రించుకోవడానికి బదులుగా మీరు వాటిని ఉపయోగించాలని ఆయన ఆశిస్తున్నాడు. అదేవిధంగా, దేవుడు మందులను ఏర్పాటు చేసినప్పుడు, మీరు వాటిని ఉపయోగించాలని ఆయన ఆశిస్తున్నాడు అంతేకాని ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడనే ఏదైనా వాగ్దానాన్ని మూర్ఖంగా స్వతంత్రించుకోమని ఆశించటం లేదు. ఫిలిప్పుకు చేసినట్లుగా మిమ్మల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లమని ప్రభువును అడగడానికి ప్రయత్నించినంత మూర్ఖంగా ఇది ఉంటుంది.
దేవుడు కొంతమంది కోసం కొన్ని పనులు చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి విశ్వాసి కోసం ఆయన ప్రతి అద్భుతాన్ని చేయడు. మనకోసం కొంత గౌరవం పొందడానికి మనం అద్భుతమైనది చేయడానికి ప్రయత్నించడం లేదని లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల నుండి గౌరవం పొందాలనే కోరిక మన శరీరంలో చాలా లోతుగా పాతుకుపోయింది, కానీ కొన్నిసార్లు మనం దాన్ని గ్రహించము. యేసు తన శిష్యులకు పోరాడటానికి నేర్పించిన గొప్ప విషయాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రాథమికంగా శోధన ఏమిటంటే, గౌరవం పొందడం, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆలయ ప్రాంగణంలోనికి ఎటువంటి హాని కలగకుండా దిగడం, ప్రజలు మిమ్మల్ని ప్రశంసించడం.
శోధన సాధారణమైన మార్గాల్లో కూడా రావచ్చు. యేసు మత్తయి 6లో ఇలా అన్నాడు, "మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు ప్రార్థన వింటున్న వ్యక్తుల నుండి గౌరవం పొందే విధంగా ప్రార్థన చేయవద్దు, మరియు మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో అందరికీ తెలియజేయవద్దు." మీరు అలా చేస్తే, అది గౌరవం పొందడానికే. "మీరు దానం చేసినప్పుడు, మీరు ఏమి ఇచ్చారో ఎవరికీ తెలియజేయవద్దు" అని కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ చాలా మంది క్రైస్తవులు గౌరవం కోరుతూ మరియు దేవుణ్ణి శోధిస్తూ ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారు.