వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
WFTW Body: 

పెర్గమ సంఘములో పెద్ద, మనుష్యులకు దాసుడై పోయెను కాబట్టి అక్కడ బిలాము యొక్క బోధలు ప్రాచుర్యము పొందినవి.

ఒక దేవుని సేవకుడు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండవలెను. "మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మనుష్యులకు దాసులు కాకుడి" (1కొరింథీ 7:23).

బిలాము బోధలో రెండు బాగాలున్నాయి. పేతురు ఆ రెంటిని 2పేతురు 2:14,15లో చెప్పెను- అవి దురాశ మరియు జారత్వము.

ధనమును ప్రేమించువాడు దేవుని ద్వేషించునని, మరియు ఎవడైతే ధనమును హత్తుకొని యుండునో వాడు దేవుని తృణీకరించునని యేసు చెప్పెను (లూకా 16:13 జాగ్రత్తగా చదవండి).

దీనిని మనము తేటగా బోధించనట్లయితే, సంఘములో బిలాము బోధ ప్రాచుర్యము పొందును మరియు సహోదర సహోదరీలు ధనమును ప్రేమించువారవుదురు.

అయితే యేసు ప్రభువు బోధించిన దానిని మనము బోధించవలెనంటే, మొదట మనము ధనము యొక్క పట్టు నుండి విడుదల కావల్సియున్నది. ధనము యొక్క పట్టునుండి విడుదల కాబడుట కంటె కోపము నుండి మరియు మోహపుచూపుల నుండి విడుదలగుట సుళువు. కేవలము ఎడతెగని పోరాటము వలన మాత్రమే ఈ దుష్టత్వమును జయించగలము.

"ధనాశ అన్ని కీడులకు మూలము" (1తిమోతి 6:10) -ఈ విషయాన్ని మనము చూచామా? కోపము, మోహపు చూపులు దుష్టమైనవిగా గుర్తింపు పొందినవి, కాని ధనాశ అట్లు గుర్తింపు పొందలేదు. ఆ విధముగానే చాలా మంది వారు దేవుని తృణీకరిస్తున్నారని మరియు ద్వేషిస్తున్నారను విషయం గ్రహించకుండానే ధనానికి దాసులై పోవుచున్నారు.

పూర్తికాలపు సేవకులుగా పిలవబడే అనేకమంది బిలామువలె ధనాశకు దాసులైపోయారు. మంచి బహుమతులు దొరకునని తెలియుట చేత వారు ధనికుల ఇండ్లను దర్శింతురు. ఆ విధముగా ఆ ధనికులను మరియు పలుకుబడి కలిగిన వారిని వారి పాపముల విషయము గద్దించవలసి వచ్చినప్పుడు వీరి నోళ్లు మూతబడి పోవును. వారు ప్రయాణములు చేసి ఏ సంఘములలో నైతే మంచి పుష్టియైన కానుకలు వచ్చునో అటువంటి చోట్ల బోధించుదురు. అటువంటి బోధకులు దేవుని ఎలా సేవించెదరు? అది అసాధ్యము. వారు సిరిని సేవించుచున్నారు. ఎవ్వరును ఇద్దరు యజమానులను సేవించలేరని యేసు ప్రభువు చెప్పెను.

నూతన నిబంధన క్రింద దేవుని సేవకుడు కావలెనంటె ఎవరికైనా మూడు ముఖ్యమైన అర్హతలు ఉండవలెను.

అతడు తన వ్యక్తిగత జీవితములో పాపము నుండి విడుదల పొందవలెను (రోమా 6:22).

అతడు మనుష్యులను సంతోషపెట్టు వాడుగా ఉండకూడదు (గలతీ 1:10).

అతడు ధనమును ద్వేషించవలెను మరియు తృణీకరించవలెను (లూకా 16:13).

మనము నూతన నిబంధన యొక్క సేవకులుగా ఉండుటకు అర్హులమో కాదో చూచుకొనుటకు ఈ మూడు విషయములను ఎల్లప్పుడూ మన జీవితములలో చూచుకొనవలెను.

మనము దేవుని కొరకు బలముగా వాడబడవలెనంటే, ధనము మరియు వస్తువులకు మన జీవితములపై ఎటువంటి పట్టు ఉండకూడదు.

మనము బహుమతులను తీసుకొనుటను కూడా ద్వేషింపవలెను. ఎందుకనగా "పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యత" (అపొ.కా. 20:35) అని యేసు ప్రభువు చెప్పెను.

మన జీవితాల్లో ధనము యొక్క పట్టునుండి మనము విడుదల కాకపోయినట్లయితే, మనము చేయవలసినంతగా దేవుని సేవించలేము మరియు ఆయనను ప్రేమించలేము. మరియు ఇతరులను దేవుని ప్రేమించునట్లు నడిపించలేము మరియు వారిని బిలాము బోధ నుండి విడుదల చేయలేము.

బిలాము యొక్క బోధలో రెండవ విషయము జారత్వము. ఈ బోధ సహోదర సహోదరీలను స్వేచ్ఛగా ఒకరినొకరు కలుసుకొని ఏ ఆటంకము లేకుండా తిరిగేలా ప్రోత్సహించును. ప్రకటన 2:14లో ఇశ్రాయేలీయుల యవ్వన పురుషులతో మోయాబు స్త్రీలు స్వేచ్ఛగా సంచరించునట్లు బిలాము పురికొల్పెనని చదువుదుము. ఇది ఒక్క రోజులోనే దేవుడు 24,000 మందిని సంహరించినటువంటి జారత్వములోనికి ఇశ్రాయేలీయులను నడిపించినది (సంఖ్యా 25:1-9).

ఫీనెహాసు ఒక బళ్లెమును ఎత్తి దానికి ముగింపు పలికే వరకు, ఇశ్రాయేలీయులపై దేవుని కోపము చల్లారలేదు. దేవుడు ఫీనెహాసు చేసిన క్రియను చూచినప్పుడు, ఆయన దానికి ఎంతో సంతోషించి అతడితో ఎల్లకాలముండు యాజకత్వపు నిబంధన చేసెను (సంఖ్యా 25:11-13). సంఘములో సహోదరులు మరియు సహోదరీలు స్వేచ్ఛగా తిరుగు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించు వారిని దేవుడు ఎప్పుడూ ఘనపరచును.

ఇక్కడ మరల పెద్దలుగా మనము, మన వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాదిరిగా ఉండవలెను. మనము సహోదరిలతో మన యొక్క నడవడి విషయంలో జాగ్రత్త కలిగియుండవలెను మరియు అనవసరమైన సరదా సంభాషణలకు తావివ్వకూడదు. ముఖ్యముగా మనతో మాటలాడవలెనని చూచే సహోదరీలకు ఎప్పుడూ దూరముగా ఉండవలెను. మనము సహోదరీలతో మాటలాడుటను ప్రేమిస్తూ ఉంటే, మనము దేవుని సంఘమును నడిపించుటకు అనర్హులము. మనమెప్పుడూ స్త్రీలతో ఒంటరిగా మూసి ఉండిన గదిలో మాటలాడకూడదు. ఒక సహోదరికి సలహా యిచ్చునప్పుడు ఎప్పుడూ భార్యతో కలసి ఆ పని చేయుట మేలు లేక వేరొక పెద్దగా ఉండిన సహోదరునితో కలిసి ఆ పని చెయ్యవలెను.

సమరయ ప్రాంతములో శిష్యులు యేసు బావి యొద్ద ఒక స్త్రీతో మాటలాడుట చూచినప్పుడు, "ఒక స్త్రీతో ఆయన మాటలాడుట చూచి వారు ఆశ్చర్యపడిరి" అని వ్రాయబడియున్నది (యోహాను 4:27). దానికి కారణం యేసు ఎప్పుడూ ఒక స్త్రీతో సాధారణంగా ఒంటరిగా మాటలాడకపోవుటయై యున్నది. ఆయన ఏదైనా ’చెడుగా కనబడేది’ కూడా చేయకుండుటకు జాగ్రత్త పడేవారు. ఇక్కడ మనమందరము అనుసరించుటకు ఒక మాదిరి యున్నది.