దేవుడు ఒక సంఘములో ఇంకను పనిచేయుచున్నాడు అనుదానికి రెండు ఋజువులు ఏమిటంటే ఆయన పూర్ణ హృదయము గల శిష్యులను దానికి కలుపును మరియు ప్రభువును వెంబడించుటకు ఆసక్తిలేని వారిని దాని నుండి తీసివేయును. లేఖనములలో మనము ఈ విధముగా చదువుదము
"రక్షణ పొందుచున్నవారిని ప్రభువు వారితో చేర్చుచుండెను" (ఆ రోజుల్లో శిష్యత్వము యొక్క సందేశమును అంగీకరించిన వారినే "రక్షింపబడిన వారిగా" పరిగణించేవారు) (అపొ.కా. 2:47).
"గర్వించు అతిశయించు వారిని నేను నీ మధ్యనుండి వెళ్ళగొట్టుదును మరియు దు:ఖితులగు దీనులను నీ మధ్య ఉండనిత్తును. దేవుడైన యోహోవా (అప్పుడు) నీ మధ్యనుండును, బహుఆనందముతో నీ యందు సంతోషించును" (జెఫన్యా 3:8-17).
మొట్టమొదట నుండి మన పరలోకపు తండ్రి ఈ రెండు విధాలుగా మా సంఘములో పనిచేయుట మేము చూచితిమి.
వందకోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న భారతదేశములాంటి దేశములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండగోరిన వారిని వెదకుట లక్ష గడ్డివాములలో కొన్ని సూదుల కొరకు వెదకినట్లుండును!! మనము ఈ గడ్డివాములలో వెదకుతూ ఒక జీవిత కాలము గడిపినా అప్పుడు కూడా కేవలం ఒకటి రెండు సూదులను మాత్రం కనుగొనగలము. కాని ఈ గడ్డివాముల బయట చాలా శక్తి వంతమైన అయస్కాంతములను పెట్టుట ఎంతో సమర్థవంతమైన పద్ధతి. అప్పుడు ఆ సూదులు ఆ గడ్డివాము నుండి బయటకు ఆకర్షించబడును - అది కూడా తక్కువ శ్రమతో! పూర్ణ హృదయయులను కనుగొనుటకు ఇదే అతి శ్రేష్టమైన మరియు సమర్థవంతమైన విధానము. దేవుడు కూడా ఈ విధముగానే మనము చేయాలని కోరుకొంటున్నాడు. ఇతరులు మనము యేసు శిష్యులమని మనకు ఒకరి యెడల ఒకరికున్న ప్రేమను బట్టి తెలుసుకొందురని యేసు చెప్పెను (యోహాను 13:33-35). ఒక సంఘముగా మనకున్న సాక్ష్యమే ఇతరులను మన యొద్దకు ఆకర్షించును.
కాబట్టి మేము మా సంఘమును (మరియు మా ద్వారా ప్రభువు స్థాపించిన సంఘములు) భారతదేశములో మరియు ఇతర ప్రదేశాలలో ఉన్న వేలకొద్ది గడ్డివాముల నుండి శిష్యులను ఆకర్షించే అయస్కాంతములుగా ఉండాలని కోరుకొన్నాము.
ప్రభువు మనలను శిష్యులను (మతం మారిన వారిని కాదు) చేయమని ఆజ్ఞాపించెను గనుక (మత్తయి 28:18-20) మేము శిష్యత్వము యొక్క మూడు షరతులను (లూకా 14:26-33 లో వ్రాయబడిన విధముగా) మొదటి నుండి ప్రకటించాము- ప్రభువైన యేసును అన్నిటి కంటే ఎక్కువగా ప్రేమించుట, ప్రతి దినము స్వంత చిత్తమునకు చనిపోవుట మరియు మనకు కలిగిన వస్తుసామాగ్రి యొక్క అనుబంధం నుండి విడిపించబడుట. ఈ శిష్యత్వము యొక్క షరతులను నెరవేర్చుటకు ఆసక్తి చూపిన వారినే మేము మా సంఘములలో చేర్చుకొనుటకు కోరుకొన్నాము.
కాబట్టి అటువంటి శిష్యులగుటకు ఇష్టపడినవారినే ప్రభువు మా సంఖ్యతో చేర్చాలని ప్రార్థించాము. మా సంఘములలో చేరమని మేము ఎప్పుడూ ఎవరినీ ఆహ్వానించలేదు. ప్రజలు వారి స్వంతాన మాతో చేరాలని కోరుకొన్నాము. 1975 నుండి, గడచిన సంవత్సరములన్నిటిలో, నేను ఒక్క వ్యక్తిని కూడా మా సంఘములలో దేనిలోనైనా ఒక సభ్యునిగా చేరమని ఆహ్వానించలేదు. మా వద్దకి వారంతటికి వారే వచ్చిన వారిని మేము స్వీకరించాము. మేము ఎవరికైతే కాపరులుగా, పరిచారకులుగా ఉండుటకు పిలువబడ్డామో, వారిని ప్రభువు మా యొద్దకు పంపించునని మేము నమ్మాము. ప్రభువే తన సంఘమునకు ప్రజలను చేర్చును.
"తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు; నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రము బయటికి త్రోసివేయను" అని యేసు చెప్పెను (యోహాను 6:37).
భూమి పైన క్రీస్తు శరీరముగా ఉన్న మా నిమిత్తము కూడా ఈ విషయము నిజమగునని మేము నమ్మాము.
ప్రభువు అద్భుతమైన మార్గములు ఉపయోగించి మాతో శిష్యులను చేర్చెను. ఇవి కొన్ని ఉదాహరణలు:
మా పొరుగున ఉన్న ఒక దేశములో, ఒక యుద్ధము అనేక ప్రజలు అంతా వదిలిపెట్టి తమ కుటుంబాలలో చిన్న పడవలలో పారిపోవునట్లు చేసెను. ఆ పడవలలో కొన్ని సముద్రములో మునిగిపోయెను. కాబట్టి అనేకులు మునిగిపోయి చనిపోయిరి. కాని కొంత మంది బ్రతికి భారత దేశపు తీరాలకు చేరిరి. ఈ శరణార్థులను భారతదేశ ప్రభుత్వము ఒక శిబిరములో ఉంచెను. మా సంఘములలో రెండు ఈ శిబిరానికి దగ్గరలో ఉండెను. కాబట్టి ఆ సంఘములలో మా సహోదరులు కొందరు ఆ శరణార్థులను (వారు మార్పులేని నామకార్థ క్రైస్తవులు) దర్శించి వారితో సువార్తను పంచుకొనిరి. దీని కారణముగా వారిలో కొందరు తిరిగి జన్మించిరి. మా సహోదరులు అప్పుడు వారిని ఆ శిబిరములో క్రమము తప్పకుండా దర్శించి వారిని ఒక సంఘముగా స్థిరపరచిరి. వారు బెంగళూరులోను ఇతర ప్రదేశాలలోను రెండు సంవత్సరములపాటు మా సదస్సులకు హాజరైరి. తమ సాక్ష్యమును పంచుకొనుటకు వారి ఆసక్తి ఎంత గొప్పగా నుండెనంటే మా సదస్సులలో వారు వేదిక యొద్దకు పరుగెత్తికొని వచ్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చిరి. వారక్కడున్నప్పుడు ఇతర సంఘ సభ్యులకు సాక్ష్యమిచ్చే అవకాశం దొరుకుట కష్టమే!! వారి ఆసక్తిని బట్టి మేమందరమూ సవాలు చేయబడ్డాము. ఒక సదస్సులో, నేను ఏ విధముగా భార్యలు భర్తలకు లోబడవలెనని (సంఘము క్రీస్తుకు లోబడినట్లు) బైబిలు బోధించెనో అని మాట్లాడిన తరువాత, వారిలో ఒక క్రొత్తగా పెళ్ళైన భార్య, తన వివాహ జీవితము మొదటినుండి ఒక విధేయత గల భార్యగా ఉండుటకు కృపనిమ్మని ఏడుస్తూ ప్రభువునకు ప్రార్థించెను. ఒక భార్య ఇటువంటి అభ్యర్థనతో ఇంత ఉద్రేకముగా ఏడ్చి ప్రార్థించుట నా జీవితములో ఎన్నడూ వినలేదు!!
దాదాపు రెండు సంవత్సరముల తరువాత, భారతదేశ ప్రభుత్వము వారిని తిరిగి వారి స్వంత దేశమునకు పంపించుటకు నిర్ణయించెను. కాని అప్పటికి, ఈ విశ్వాసులు విశ్వాసములో బాగా స్థిరపడిరి గనుక వారు వెళ్ళిపోయే లోగా మేము వారిలో ముగ్గురిని పెద్దలుగా నియమించగలిగితిమి. కాబట్టి దేవుడు వారు భారత దేశములో నుండు సమయమును (ఖచ్చితముగా) పరిపూర్ణముగా ఏర్పాటు చేసెను. వారు తమ దేశమునకు తిరిగి వెళ్ళిన కొంత కాలము తరువాత మరల ఆ ప్రాంతములో యుద్ధము జరిగెను మరియు వారు మూడు వేర్వేరు ప్రదేశములకు చెదరగొట్టబడిరి. కాని అద్భుతరీత్య, ఈ మూడు గుంపులలో మేము వారి మధ్య నియమించిన పెద్దలలో ఒకరుండెను! కాబట్టి వారు ఆ పెద్దల నాయకత్వము క్రింద మూడు సంఘాలుగా వ్యవహరించగలిగిరి. వారి సాక్ష్యము ద్వారా అనేకులు ఈ సంఘములలో చేర్చబడిరి. మా సహోదరులలో ఒకరు వారిని కొన్నిమారులు దర్శించి, వారి మధ్య కూటములు జరిపి వారిని ప్రోత్సహించెను.
మా సహోదరులలో మరియొకరు, ఒక చిన్న వ్యాపారము ప్రారంభించుటకు ఒక క్రొత్త ప్రదేశములో స్థిరపడుటకు నిర్ణయించుకొనెను. ఇక్కడ క్రీస్తు కాలము నుండి ఒక సంఘము కూడా లేదు. అక్కడ ఈ సహోదరుని సాక్ష్యము ద్వారా కొందరు శిష్యులైరి మరియు 2000 సంవత్సరములలో మొట్టమొదటిగా అక్కడ ఒక మంచి సంఘమున్నది.
దేవుడు గత 25 ఏళ్ళలో మామధ్య చేసిన అతిగొప్ప అద్భుతము 2000 ఏళ్ళపాటు సంఘములులేని చోట సంఘములు నాటుటకాదు గాని ఈ సంఘములన్నిటినీ నడిపించుటకు భక్తిపరులైన పెద్దలను లేవనెత్తుటయే. భారతదేశములాంటి దేశములో ఎటువంటి జీతము తీసుకొనకుండా దేవుని గొఱ్ఱెలను, గొఱ్ఱెపిల్లలను కాచి, పరిచర్యచేసే ఆత్మీయులైన నాయకులను కనుగొనుట ఆశ్చర్యకరమైన అద్భుతము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువమంది క్రైస్తవ పరిచారకులు జీతముతీసుకొనే పనివారు మరియు డబ్బు ప్రధానముగా విదేశములనుండి వస్తుంది. దేవుడు మా వద్దకు దశాబ్దాలపాటుగా ఉచితముగా మా సంఘాలలో కాపరులుగా పెద్దలుగా పరిచర్య చేసినవారిని పంపెను. మేము మా పెద్దలకు జీతము చెల్లించము. కాబట్టి, మాతో చేరియుండే చాలామంది "క్రైస్తవ మోసగాళ్ళ" నుండి రక్షింపబడితిమి. ఈ రోజున చాలా క్రైస్తవసంఘములు, సంస్థలు ఎదుర్కొంటున్న సమస్య ఇదే.
దేశమంతట చెదరియున్న మా అయస్కాంతములు గడ్డివాములోనుండి కొన్ని శ్రేష్టమైన యదార్ధమైన సూదులను ఆకర్షించాయి. రాబోయే రోజుల్లో మేము మరెన్నో సూదులను ఆకర్షించాలని ఆశిస్తున్నాము.
ప్రభువునకు స్తోత్రము!