WFTW Body: 

ప్రజలు గొఱ్ఱెలతో సరిపోల్చబడినారు. మరి గొఱ్ఱెలకు ప్రశ్నించకుండా గుంపును అనుసరించి వెళ్లే నైజముంటుంది. యేసు వచ్చి మనము ప్రతి విషయాన్ని దేవుని వాక్యముతో పరీక్షించుకోవాలని బోధించారు. పరిసయ్యులు మానవ సంప్రదాయాలకు ఎక్కువ విలువ యిచ్చారు. యేసు దేవుని వాక్యాన్ని హెచ్చించారు. మనం దేవుని ప్రతి మాట వలన జీవించాలి - దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఉన్న ప్రతి మానవ సాంప్రదాయాన్ని తిరస్కరించాలి (మత్తయి 4:4).

యేసు పరిసయ్యులతో నిరంతరము చేసిన పోరాటము, కాలంతో పాటుగా దేవుని వాక్యానికిని మనుష్యులు పెట్టిన సంప్రదాయాలకు మధ్యన జరుగుతున్నదే. ఈనాడు దేవుని సంఘములో మనము కూడా అదే పోరాటములో నున్నాము. దేవుని వాక్యమొక్కటే ఈ భూమిపై మనకున్న వెలుగు. దేవుడు మొదటగా వెలుగును సృష్టించినప్పుడు ఆయన వెంటనే దానిని చీకటి నుండి వేరుపరచెను. పాపము మరియు మానవ సంప్రదాయాలే చీకటి అయి ఉన్నవి. మనము కూడా పాపం మరియు మానవ సాంప్రదాయాలను స్వచ్ఛమైన దేవుని వాక్యమునుండి వేరు చేయాలి, ఆ విధముగా దేవుని సంఘములో మిశ్రితమైనది ఏది ఉండదు.

క్రిస్మస్‌

యేసుక్రీస్తు జన్మదినముగా అనేకుల చేత జరుపుకోబడుతున్న క్రిస్మస్‌ గురించి మొదటగా ఆలోచిద్దాము. అన్ని మతాలకు సంబంధించిన వ్యాపారస్తులు క్రిస్మస్‌ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ లాభాలు పొందుటకు అది తగిన సమయము. ఇది ఒక వ్యాపారపు పండుగ తప్ప ఆత్మీయ పండుగ కాదు. లక్షల కొద్ది రూపాయలు క్రిస్మస్‌ కార్డులు, బహుమతుల కోసం ఖర్చవుతాయి. మత్తు పానీయాల అమ్మకం ఈ సమయంలో ఎంతో పెరిగిపోతుంది.

ఇది నిజంగా దేవుని కుమారుని జన్మదినమా? లేక ’ఇంకొక యేసు’దా?

మొదటిగా దేవుని వాక్యాన్ని చూద్దాము. యేసు బెత్లెహేములో జన్మించిన రాత్రి గొఱ్ఱెల కాపరులు వారి గొఱ్ఱెలతో కలసి యూదయ ప్రాంతమందలి పొలాల్లో నుండిరని బైబిలు మనకు చెబుతుంది (లూకా 2:7-14). ఆ కాలంలో వాతావరణం వర్షంతోను, చలితోను ఉండుట చేత ఇశ్రాయేలు గొఱ్ఱెల కాపరులు అక్టోబరు నుండి ఫిబ్రవరి నెల వరకు వారి గొఱ్ఱెలను ఆరు బయట పొలాల్లో నుంచరు. కనుక నిజమైన యేసు తప్పక మార్చి నుండి సెప్టెంబరు నెలల మధ్య పుట్టియుండాలి. అప్పుడు డిసెంబరు 25 తప్పక మార్పుచెందని వ్యక్తులచే, అనుమానించని క్రైస్తవ లోకంలోనికి తప్పుగా చేర్చబడిన ’మరియొక యేసు’ జన్మదినమై ఉండాలి!

ఇంకా ఆలోచించినట్లయితే, ఒకవేళ యేసు యొక్క ఖచ్చితమైన జన్మదినము మనకు తెలిసియుండినా, దేవుని సంఘము ఆ దినాన్ని జరుపుకొనుటకు దేవుడు ఉద్దేశించాడా అనేది ప్రశ్న. యేసు తల్లియైన మరియకు యేసు జన్మించిన ఖచ్చితమైన రోజు తెలియును. ఆమె పెంతెకొస్తు దినము తరువాత ఎంతోకాలం అపొస్తలులతో కలిసియుండెను. అయినను ఎక్కడ కూడా యేసు జన్మదినము గూర్చి వ్రాయబడలేదు. ఇది దేనిని సూచిస్తుంది? సంఘము దానిని ఆచరించుట ఆయన కోరుకొనుట లేదు కనుకనే దేవుడు ఉద్దేశపూర్వకముగా యేసు యొక్క జన్మదినమును మరుగుపరచెనని మాత్రమే చూపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు జరుపుకొనుటకు యేసు కేవలం మానవమాత్రుడు కాడు. మనవలె కాక ఆయన "రోజుల ప్రారంభంలేని" దేవుని కుమారుడు (హెబ్రీ 7:3). సంవత్సరానికి ఒకసారి కాక, ప్రతిరోజు మనం యేసు జననం, మరణం, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు.

పాత, క్రొత్త నిబంధనల మధ్య తేడాను అర్థం చేసుకొనుట ద్వారా, ఎందుకు దేవుడు ప్రస్తుతం ఆయన బిడ్డలు ఏ ప్రత్యేక "పరిశుద్ధ దినములను" ఆచరించుటకు యిష్టపడలేదో మనము తెలుసుకోవచ్చును. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు కొన్ని దినములను పవిత్ర దినములుగా ఆచరించాలని ఆదేశింపబడినారు. కాని అది కేవలం నీడ మాత్రమే. ఇప్పుడు మనకు క్రీస్తునందు వాస్తవం ఉన్నది. ప్రతిదినము మన జీవితాల్లో ఒకే విధమైన పవిత్రత కలిగి ఉండాలనేది దేవుని చిత్తము. చివరకు వారం వారం వచ్చే సబ్బాతు కూడా క్రొత్త నిబంధనలో తీసివేయబడెను. ఇందుచేతనే క్రొత్త నిబంధనలో ఏ పవిత్ర దినములు పేర్కొనబడలేదు (కొలొస్స 2:16, 17).

అయితే క్రిస్మస్‌ క్రైస్తవ లోకములోనికి ఎలా ప్రవేశించింది?. దానికి జవాబు: పసిపిల్లల బాప్తిస్మము, దశమబాగం, గురువులు, జీతాలు తీసుకునే పాస్టర్లు మరియు అనేక మానవ సంప్రదాయాలు, పాతనిబందన పద్దతులు ఎలా ప్రవేశించాయో అలాగునే - సాతాను యొక్క కపట తంత్రముల వలన మరియు మార్పు చెందని వ్యక్తుల వలన ప్రవేశించాయి.

నాల్గవ శతాబ్దంలో కాన్‌స్టంటైన్‌ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని రోమాదేశంలో అధికారిక మతంగా చేసినప్పుడు అనేకులు హృదయంలో మార్పులేకుండా ’పేరుకు’ మాత్రం క్రైస్తవులయ్యారు. అయితే వారు సంవత్సరంలో వచ్చేటటువంటి రెండు గొప్ప పండుగలను విడిచిపెట్టుటకు యిష్టపడలేదు. అవి సూర్యుని ఆరాధించుటతో సంబంధముండిన రెండు పండుగలు. ఒకటి డిసెంబరు 25, వారి సూర్యదేవుని జన్మదినము. అనగా సూర్యుడు భూమిదక్షిణార్థ గోళము వైపు దిగిపోయిన తరువాత తిరుగ ప్రయాణము మొదలు పెట్టినది (దక్షిణాయనం). రెండవది మార్చి లేక ఏప్రియల్‌లో వచ్చే వసంతకాలపు పండుగ. అది చలికాలము చనిపోయి వారి సూర్యదేవుడు తెచ్చినటువంటి ఎండాకాలపు పుట్టుకను వారు జరుపుకునేవారు. వారు వారి సూర్యదేవునికి ’యేసు’ అని పేరు పెట్టి వారి రెండు గొప్ప పండుగలను ఇప్పుడు క్రైస్తవ పండుగలుగా ’క్రిస్మస్‌’ మరియు ’ఈస్టర్‌’ పేర్లతో జరుపుకోనుట కొనసాగించిరి.

నేటి క్రిస్మస్‌ ఆచారములు క్రైస్తవ కాలానికి ఎంతో ముందునుండి క్రమానుగతంగా వచ్చినటువంటివి. ఇది కాలముతో పాటుగా విగ్రహారాధనతోను, మతతత్వముతోను మరియు దేశీయమైన వేడుకలతోను కలసిపోయి పురాణాలు మరియు సంప్రదాయాలతో పూర్తిగా ఆవరింపబడినవి. క్రీస్తు పుట్టిన ఖచ్చితమైన తేదీ, సంవత్సరము ఇప్పటివరకు సంతృప్తికరముగా లేదు. కాని క్రీస్తు తరువాత 440వ సంవత్సరములో క్రైస్తవ సంఘ పెద్దలు, ప్రజల మనసుల్లో బలంగా నాటుకొనియున్న, వారి ముఖ్యమైన పండుగ రోజైన చలికాలంలో సూర్యుడు భూమి అర్ధగోళం నుండి తిరుగు ప్రయాణం ప్రారంభించిన (దక్షిణాయనం) రోజును క్రీస్తు జన్మదినముగా ఆచరించుటకు ఒక తేదీగా నిర్ణయించారు. ఆ విధంగా క్రైస్తవత్వం క్రైస్తవేతర స్థలాలలోనికి వ్యాప్తి చెందగా చలికాలపు (దక్షిణాయనం) పండుగ యొక్క అనేక వాడుకలు క్రైస్తవ్యంలోనికి కలసిపోయాయి.

’ది ఎనసైక్లోపీడియా బ్రిటానికా’ (లౌకిక చరిత్ర గూర్చి అధికారికంగా చెప్పే గ్రంథము) ఈ విధముగా క్రిస్మస్‌ ఆరంభము గూర్చి తెలియపర్చింది:

పురాతన రోమన్ పండుగ సాటర్నాలియా బహుశా ఆధునిక క్రిస్మస్ వేడుకలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఈ పండుగ శీతాకాలపు సూర్యుని దక్షిణయానం సమయంలో జరుగుతుంది మరియు పంట నాటే కాలం ముగింపును సూచిస్తుంది. ఆటలు, విందులు మరియు అనేక రోజులు బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతాయి మరియు ఈ ఉల్లాసమైన పండుగను జ్ఞాపకం చేసుకోవడానికి పని మరియు వ్యాపారం నిలిపివేయబడతాయి. చివరి రోజులలో, కొవ్వొత్తులు, పండ్ల మైనపు నమూనాలు మరియు మైనపు విగ్రహాలను బహుమతులుగా చేయడం సర్వసాధారణం. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలపై సాటర్నాలియా ప్రభావం ప్రత్యక్షంగా ఉంది. మరొక రోమన్ పండుగ అయిన అజేయుడైన సూర్యుని పుట్టినరోజున క్రిస్మస్ జరుపుకుంటారనే వాస్తవం, ఈ కాలానికి సూర్యుని నేపథ్యాన్ని ఇచ్చింది మరియు దానిని రోమన్ నూతన సంవత్సరంతో అనుసంధానించింది, ఆ సమయంలో ఇళ్ళు పచ్చదనం మరియు దీపాలతో అలంకరించబడి పిల్లలకు మరియు పేదలకు బహుమతులు ఇవ్వబడ్డతాయి.
(https://www.britannica.com/topic/Winter-Holidays).

ఈ అన్యాచారములు నిజానికి నిమ్రోదుతో ప్రారంభమయిన బబులోను మతముతో ఆరంభమయ్యాయి (ఆదికాండము 10:8-10). అతడు చనిపోయిన తరువాత అతడి భార్య సెమిరమిస్‌కు ఒక అక్రమ సంతానము కలిగెను, వానిని నిమ్రోదు తిరిగి ప్రాణంతో వచ్చినట్లు ఆమె చెప్పెను. ఆ విధంగా తల్లి, బిడ్డను పూజించడం మొదలయ్యింది. దానినే 2000 సంవత్సరాల తరువాత పేరుకే క్రైస్తవులుగా ఉన్నవారు తీసుకొని ’మరియ, యేసు’గా మార్పు చేసారు.

ఈ బాల దేవుని జన్మ దినాన్ని పురాతన బబులోను వారు డిసెంబరు 25న ఆచరించేవారు. సెమిరమిస్‌ "పరలోకపు రాణి"గా యుండెను మరియు (యిర్మీయా 44:19) శతాబ్దాల అనంతరం ఎఫెసులో డయానా లేక అర్తెమి దేవిగా పూజింపబడెను (అపొ.కా.19:28).

ఒక చనిపోయిన చెట్టు మోడు నుండి ఒక రాత్రిలో ఒక పూర్తిగా ఎదిగిన పచ్చని చెట్టు మొలిచెనని ఆమె చెప్పెను. ఇది నిమ్రోదు తిరిగి జీవము పొందుతాడని, బహుమతులు తెస్తాడనుదానికి సాదృశ్యముగా నుండెను. ఆ విధముగా దేవదారు వృక్షాలను నరికి దానికి బహుమతులను వ్రేలాడదీసే అలవాటు మొదలయ్యింది. అదే ఈనాటి క్రిస్మస్‌ చెట్టు!

దేవుని వాక్యమా? లేక మానవ సాంప్రదాయములా?

క్రిస్మస్‌ ఆచరించడం వెనుక దేవుని వాక్యంలో ఏ పునాదిలేకపోయినా మానవ సంప్రదాయాలను ఆచరించడం అనే అతి ప్రమాదకరమైన నియమము దాగియుంది. ఈ సంప్రదాయాల శక్తి ఎటువంటిదనగా, అనేక విశ్వాసులు అనేక విషయాల్లో వాక్యాన్ని అనుసరించి నడుస్తూనే క్రిస్మస్‌ జరుపుకోవడం మానలేరు.

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం క్రిస్మస్‌ పండుగ క్రైస్తవేతర పండుగని లౌకిక రచయితలు (ఎన్‌ సైక్లోపీడియా బ్రిటానికా వంటివి వ్రాసిన వారు) అంగీకరించినా అనేకమంది విశ్వాసులు ఆ విషయాన్ని అంగీకరించరు. కనుక పేర్లు మార్చినంత మాత్రమున ఇవి క్రైస్తవ పండుగలుగా తయారవ్వవు!

మనం మొదట్లో చెప్పుకొన్న విధంగా యేసు పరిసయ్యులతో ఇదే విషయమై చివరివరకు పోరాడారు. అది మనుష్యుల కట్టుబాట్లు మరియు దేవుని వాక్యం మధ్య పోరాటము. ఆయన పాపానికి వ్యతిరేకంగా బోధించిన దానికంటే "తండ్రులు"గా పిలువబడిన వారి శూన్యమైన కట్టుబాట్లను బట్టబయలు చేయడం వలననే ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొనెను. మనం ఆయనవలె నమ్మకంగా ఉన్నచో ఆయన అనుభవాన్నే మనమూ పొందగలము.

దైవజనులైనా సరే వారు దేవుని వాక్యాన్ని ఎక్కడ తప్పుచున్నారో అక్కడ దేవుని వాక్యమే మనకు మార్గదర్శకం గాని దైవజనులు కారు. "ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు" (రోమా 3:4). బెరయలో నున్నవారు పౌలు చెప్పిన బోధలను కూడా వాక్యంతో సరిపోల్చుకునేవారు. ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు (అపొ.కా. 17:11). మనమంతా దీనిని అనుసరించుటకు యిదొక చక్కని ఉదాహరణ.

దావీదు దేవుని హృదయానుసారుడు అయినను అతడు నలుబది సంవత్సరముల వరకు ఇశ్రాయేలీయులు మోషే తయారుచేయించిన ఇత్తడి సర్పాన్ని పూజించుటకు అనుమతించాడు. ఆ విధముగా చేయుట దేవునికి హేయకరమైనదని అతడు గ్రహించలేకపోయాడు. అంతటి స్పష్టమైన విగ్రహారాధన గూర్చి కూడ అతనికి వెలుగు లేకపోయెను. అయితే ఎంతో తక్కువ రాజైన హిజ్కియా రాజుకు ఆ విగ్రహారాధన అలవాటును బట్టబయలు చేసి దాని నాశనము చేయుటకు వెలుగు యివ్వబడెను (2 రాజులు 18:4). మనం దావీదు మరియు ఇతర భక్తుల పరిశుద్ధ జీవితాన్ని అనుసరించవచ్చు గాని వారికి వెలుగులోపించిన మానవ కట్టుబాట్ల విషయములో కాదు. మన భద్రత ఎప్పుడు దేవుని వాక్యబోధకు ఏదీ కలుపకుండా, తీసివేయకుండా అనుసరించుటలో ఉంది.

ఇతరులను తీర్పు తీర్చవద్దు

చివరగా: క్రిస్మస్ జరుపుకునే నిజాయితీగల విశ్వాసుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి?

క్రిస్మస్ జరుపుకోకపోవడం వల్ల మనం ఆధ్యాత్మికంగా మారలేమని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ పండుగను జరుపుకునే వారు శరీర సంబంధమైన విశ్వాసులు అవ్వరు. ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే ప్రతిరోజు స్వచిత్తానికి చనిపోవడం ద్వారా మరియు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడటం ద్వారా యేసును అనుసరించేవారు - వారు క్రిస్మస్ జరుపుకున్నా లేదా జరుపుకోకపోయినా.

కాబట్టి ఈ పండుగలను జరుపుకునే విశ్వాసులను మనం కలిసినప్పుడు, ఈ పండుగ యొక్క అన్యమత మూలం గురించి వారికి తెలియకపోవచ్చు అని మనం దయతో పరిగణించాలి. కాబట్టి, వారు దానిని జరుపుకునేటప్పుడు వారు ఏ విధంగానూ పాపం చేయడం లేదు. మరోవైపు, మనం వారిని తీర్పు తీర్చినట్లయితే మనం పాపం చేస్తున్నాము - ఎందుకంటే మనకు నిజం తెలుసు.

డిసెంబర్ 25 సాధారణంగా అందరికీ సెలవుదినం మరియు దాని చుట్టూ ఉన్న రోజులు పాఠశాలలకు కూడా సెలవులు కాబట్టి, చాలామంది ఈ కాలాన్ని సంవత్సరాంతపు కుటుంబ కలయికలకు ఉపయోగిస్తారు - ఇది చాలా మంచి విషయం. మరియు కొంతమంది డిసెంబర్ 25న మాత్రమే జరిగే సంఘ కూటాలకు హాజరవుతారు కాబట్టి - ఈ తేదీన కూటలు నిర్వహించడం మంచిది, తద్వారా వారు అలాంటి వారికి సువార్తను ప్రకటించగలరు - యేసు ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి భూమికి వచ్చాడని మరియు ఆయన మన కోసం మరణాన్ని మరియు సాతానును జయించాడని వారికి వివరించగలరు.

క్రైస్తవత్వం యొక్క ప్రారంభ రోజుల్లో, కొంతమంది క్రైస్తవులు సబ్బాతును జరుపుకున్నారు - ఇది క్రిస్మస్ లాగానే క్రైస్తవేతర యూదు మతపరమైన పండుగ. కాబట్టి ఇతర క్రైస్తవులను తీర్పు తీర్చడం ద్వారా పాపం చేయవద్దని హెచ్చరించడానికి పరిశుద్ధాత్మ పౌలును రోమా 14 వ్రాయమని ప్రేరేపించాడు. క్రిస్మస్ జరుపుకునే ఇతరులను తీర్పు తీర్చే వారికి కూడా అదే హెచ్చరిక వర్తిస్తుంది.

"విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. దినమును లక్ష్యపెట్టనివాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. మనలో ప్రతివాడును తన్నుగురించి(తాను) దేవునికి లెక్క యొప్పగింపవలెను" (రోమా. 14:1-12 సంగ్రహించబడినది).

క్రిస్మస్ గురించి ఈ అధ్యయనాన్ని ముగించడానికి అదే ఉత్తమ మాట.