WFTW Body: 

అపోస్తలుడైన పౌలు, అపో.కా. 23:1లో ప్రధాన యాజకుని ముందు సాక్షమిచ్చేటప్పుడు ఈ విధంగా చెప్పాడు, "ధర్మశాస్త్రమునకు సంబంధించిన నీతి విషయమైతే నేను అనింద్యుడను. ఈరోజు వరకు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నడుచుకున్నాను". దాని అర్థం ఏమిటి? అతను అన్ని ఆజ్ఞలను వెంబడిస్తున్నాడని దాని అర్థం. ఏ ఆజ్ఞలు అతడు వెంబడిస్తున్నాడు? కేవలం మొదటి తొమ్మిది ఆజ్ఞలు. ఎందుకంటే రోమా 7:7-8లో పదో ఆజ్ఞ విషయం వచ్చేసరికి, "నువ్వు ఆశించవద్దు, దురాశ కలిగి ఉండవద్దు" వంటి వాటికి విషయంలో "ప్రతి విధమైన దురాశ" తనలో ఉన్నట్లు నిజాయితీగా చెప్పాడు. ప్రతి విధమైన దురాశ -డబ్బు పట్ల వ్యామోహం, ఇతరుల భార్యలపై మరియు కూతుర్లపై మోహం, ఘనత కొరకు ఆశ, మరియు ప్రతి విధమైన దురాశ తనలో కనుగొని, ఆ పదవ ఆజ్ఞను అతడు నెరవేర్చలేడనే విషయాన్ని గ్రహించాడు.

పెంతుకోస్తు రోజున పరిశుద్ధాత్ముడు దిగివచ్చి ప్రజలను నింపిన విధంగా, అతని హృదయం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అపోస్తులైన పౌలు రోమా 8:2లో ఈ విధంగా చెబుతున్నాడు (వివరణ) "ఆత్మ నియమము (పది ఆజ్ఞలు కాక క్రీస్తు నందున్న జీవ నియమము) నేను కోపపడునట్లుగా, దురాశ కలిగి ఉండునట్లుగా మరి ఇతరమైనవి చేయునట్లు చేసే పాప నియమము నుండి నన్ను విడుదల చేసింది". మరియు నాలుగవ వచనంలో, "మనం కేవలం ఆత్మానుసారంగానే నడుచుకుంటున్నాము కానీ శరీరానుసారంగా నడుచుకొనుటలేదు కాబట్టి ’నీవు దురాశ కలిగి ఉండకూడదు’ అను ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఇప్పుడు మనలో నెరవేరింది". ఇది పాత నిబంధన క్రింద అసాధ్యం.

మత్తయి సువార్త ఐదవ అధ్యాయంలో ఈ పాపాలను జయించుటను గూర్చి యేసు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మానవునికి అసాధ్యమయ్యే విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5 6 7 అధ్యాయాలను చదివినట్లయితే చివర్లో అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు లేనేలేదు. ఆ ప్రశ్న ఏమిటి? "ప్రభువా ఇటువంటి జీవితాన్ని నేను ఎలా జీవించాలి?". మత్తయి సువార్త 5 6 7లో దీనిని కనీసం ప్రస్తావించ లేదు. కొండమీది ప్రసంగం, తిరిగి జన్మించిన కొత్త నిబంధన క్రైస్తవుని నుండి దేవుడు కోరుకునే జీవితం యొక్క ప్రమాణాన్ని చూపిస్తుంది. అయితే ఆ ప్రసంగం అంతటిలో కూడా అక్కడికి ఏ విధంగా చేరుకోగలమో చెప్పబడలేదు.

అప్పుడు ఏం చేయాలో మనకు ఎలా తెలుస్తుంది? మనలో ఆ విధంగా జీవించగలిగే కోరికను కలిగించడానికి యేసు కొండమీది ప్రసంగాన్ని చెప్పాడని నేను అనుకుంటాను. ఒకవ్యక్తి అటువంటి జీవితం కొరకు ఆశకలిగి దేవుని దగ్గరికి వెళ్లి "ప్రభువా దీని జవాబు ఏమిటి?" అని అడిగినప్పుడు, ప్రభువు "నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీవు అంతరంగ పురుషునిలో బలపరచబడాలి" అని చెప్తాడు.

గొప్ప అపోస్తలుడైన పౌలు, ధర్మశాస్త్రానుసారముగా నీతిమంతుడు, అయితే అతను కూడా పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఈ కోరికను జయించలేదు. దేవుని ఆత్మ అతనిని స్వతంత్రునిగా చేసింది. ఇది యేసు గుడ్డివాని కన్నులను తెరచినట్లుగా ఉంది. ఒక గుడ్డివాడు తన కళ్ళను తాను తెరచుకోలేడు.

కేవలం పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే ఇది సాధ్యం. మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే కొండమీది ప్రసంగంలో యేసు బోధించిన వాటికి అనుగుణంగా జీవించగలము.

"ఆత్మ సంపూర్ణత" పేరుతో ఈరోజు మన చుట్టూ జరుగుతున్న చవకైన నకిలీ వాటి గురించి నేను మాట్లాడుట లేదు. నీవు అనుభవించినట్లుగా చెప్పుకొనే ఆత్మ నింపుదల నిన్ను వణుకునట్లుగా, నేల మీద పడి దొర్లునట్లుగా, నవ్వునట్లుగా, భాషలతో మాట్లాడునట్లుగా చేసి కోపం మరియు లైంగిక కోరికలవంటి పాపలలో నీవు ఓడిపోతూ, ఇప్పటికీ నీ భార్యపై లేక భర్తపై అరుస్తున్నట్లయితే అప్పుడు నీవు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఎవ్వరు కూడా నిన్ను మోసం చేయుటకు అనుమతించవద్దు. అనేకమంది ప్రజలు మోసపోయారు. పరిశుద్ధాత్ముడు మనకు కొత్త నాలుకను ఇస్తాడు, కేవలం తెలియని భాషలలో మాట్లాడే సామర్థ్యం మాత్రమే కాదు కాని మీయొక్క మాతృభాషను కూడా అదుపు చేసుకునే సామర్థ్యం ఇస్తాడు. ఆదివారం ఉదయం నీకు తెలియని భాషలో నీవు మాట్లాడి ఆదివారం మధ్యాహ్నం నీ మాతృభాషలో నీ భార్యపై అరుస్తున్నట్లయితే దానివలన ఎటువంటి ఉపయోగం లేదు. అది పరిశుద్ధాత్మ సంపూర్ణత కాదు.

పరిశుద్ధాత్మ సంపూర్ణత మన నాలుకలపై మనకు నియంత్రణ ఇస్తుంది. ఆత్మ ఫలము ఆశానిగ్రహము మరియు ఆయన, రోజుకు <24 గంటలకు వారానికి ఏడు రోజులు కూడా మన నాలుకలపై మనకు నియంత్రణ ఇస్తాడు. ఒకవేళ ఇలా కానట్లయితే నిజమైన ఆత్మ సంపూర్ణతను నీకు ఇవ్వమని నీవు దేవుణ్ణి అడగాలి. ఆత్మ వరాలను బట్టి దేవునికి వందనాలు అయితే ఆత్మ వరాలను మించిన నిజమైన ఆత్మ నింపుదల కొరకు దేవుణ్ణి అడుగుము. కేవలం అది మాత్రమే జయించుటకు మార్గం. వేరొక మార్గం లేదు.

ప్రతి జంతువు మనిషిచే సాధుపరచబడింది కానీ ఏ మనిషి కూడా తన యొక్క నాలుకను నియంత్రించుకోలేడు అని యాకోబు చెప్పాడు (యాకోబు 3:7-8). కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ విధంగా చేయగలడు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే నీ నాలుకపై మరియు నీ కళ్ళపై ఆయన నీకు నియంత్రణ కలుగ చేస్తాడు. మత్తయి 5:21-32 వచనాలలో పాపమునకు సంబంధించిన విషయంలో యేసు చెప్పిన రెండు శరీర అవయవాలు ఇవి. నాలుకతో పాపం చేయడం, కళ్ళతో పాపం చేయడం. ఈ రెండు కూడా ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవి.

నీ నాలుకను మరియు నీ కళ్ళను నియంత్రించలేని ఎటువంటి చౌకబారు నకిలీ ఆత్మ నింపుదలతో నీవు సంతృప్తి పడవద్దు. దేవుని దగ్గరకు వెళ్లి "ప్రభువా, నేను నకిలీ దాన్ని పొందాను. నేను నీతో నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానని ప్రజలను ఒప్పిస్తున్నాను. అది ఎందుకూ పనికిరానిది. నేను నిజమైన ఆత్మ సంపూర్ణతను పొందకుండా తప్పిపోవద్దని అనుకుంటున్నాను" అని చెప్పండి.

నేను యవ్వన క్రైస్తవునిగా ఉన్నప్పుడు ఈ రెండు విషయాల్లో ఓడిపోయాను. ఆత్మ సంపూర్ణతను నేను వెతికినప్పుడు ప్రజలు నన్ను వేరు వేరు కూటములకు పంపారు అయితే నేను అక్కడ చూసిన విషయాలను బట్టి ఎంతో నిరుత్సాహపడ్డాను. నేను పెద్ద శబ్దాలు విన్నాను మరియు ప్రభువుకు ఈ విధంగా చెప్పాను "ప్రభువా, నేను వెదకునది ఇది కాదు. పాపమును జయించుటకు శక్తి కొరకు వెదకుతున్నాను. 10 సంవత్సరాలు పట్టిన సరే నాకు నిజమైనది కావాలి. పెంతెకోస్తు రోజున పేతురు యాకోబు మరియు యోహాను దేనిని పొందుకున్నారో నాకు అది కావాలి. ఈరోజు ప్రబలి ఉన్న చౌకబారు నకిలీది నాకు అవసరం లేదు".

నకిలీతో ప్రజలు సంతృప్తి కలిగి ఉండాలని అపవాది కోరుకుంటున్నాడు. నీవు బంగారం కానీ వజ్రాలు కానీ కొంటునప్పుడు లేక డబ్బు నోట్లు తీసుకుంటునప్పుడు, నకిలీ వాటిని పొందుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటావు. దొంగ నోట్లు చలామనీలో ఉన్నాయని తెలిసినప్పుడు, 500 రూపాయల నోటును నీవు తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా పరీక్షిస్తావు. నిత్యత్వపు గమ్యానికి చెందిన నిజమైన ఆత్మ సంపూర్ణత విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా!.

నకిలీ దాంతో సంతృప్తి పడవద్దు. నకిలీ బంగారం వజ్రాలు డబ్బు నోట్లతో నువ్వు సంతృప్తి కలిగి లేనట్లయితే, పరిశుద్దాత్మ నింపుదల విషయంలో ఎంతగా సంతృప్తి లేకుండా ఉండాలి. ఇదే పరీక్ష: దేవుని ఆత్మ, పాప మరియు మరణ నియమం నుండి నిన్ను స్వతంత్రునిగా చేసిందా? (రోమా 8:2). అదే పరీక్ష.