ప్రకటన 12:10లో దేవుని ఎదుట విశ్వాసులందరి గురించి సాతాను దివారాత్రులు నిందారోపణ చేస్తున్నాడని మనం చదువుతాము. ఇది సాతాను చేసే పూర్తికాల పరిచర్య. ఈ పరిచర్యలో అతనికి అనేకమంది జతపనివారున్నారు, విశ్వాసుల మధ్యలో కూడా అనేకమంది ఉండుట బాధకరమైనది. ఈ నిందారోపణ పరిచర్యలో సాతానుతో చేతులు కలిపి పనిచేస్తున్న విశ్వాసులు అనేకులు ఉన్నారు.
ఏదేను తోటలో ఆదాము పాపం చేసిన వెంటనే సాతాను తన నిందించు స్వభావాన్ని ఆదాముకు సంక్రమింప చేశాడు. అందుకే దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి నిషేధించబడిన పండును తిన్నావా అని అడిగినప్పుడు, ఆదాము చేసిన మొట్టమొదటి పని - తన పాపాన్ని ఒప్పుకొనుటకు బదులుగా, "నాకు తినుటకు పండు ఇచ్చింది ఈమే" అని తన భార్యను నిందించాడు (ఆదికాండము 3:12).
చిన్నప్పటినుండి కూడా మనమందరము ఇతరులలో లోపాలు కనుగొనుటకు మరియు వారిని నిందించుటకు నేర్చుకున్నాం. మనం ఎదిగిన తర్వాత కూడా ఈ స్వభావము ఎంతో గోప్యంగా మరియు దురుద్దేశపూర్వకంగా వ్యక్తమవుతుంది. వారు తిరిగి జన్మించిన అనేక సంవత్సరాల తర్వాత కూడా అనేకమంది విశ్వాసులలో నిందించు ఆత్మను కనుగొనడం ఎంతో విచారకరమైన విషయం.
2కొరంథీ 5:17 ఈ విధంగా చెప్తుంది, "ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను".
మనము తిరిగి జన్మించిన తర్వాత ఇతరుల ఎడల మన వైఖరి నూతనమవ్వాలి. మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని నిందించకుండా వారికోసం విజ్ఞాపన చేయు యేసు వంటి వైఖరిని మనం కలిగి ఉండాలి. అయితే మనం దేవునితో సహకరించినప్పుడు మాత్రమే మన వైఖరిలో అటువంటి రూపాంతరం సాధ్యమవుతుంది. ఆదాము నుండి మనం వారసత్వంగా పొందుకున్న అనేక తప్పుడు వైఖరులనుండి "రక్షింపబడుటను మనం అభ్యాసం చేయాలి(రక్షణలో కొనసాగాలి)" అని ఫిలిప్పీ 2:12 మనకు బోధిస్తుంది. విశ్వాసులు, "మీ రక్షణను అభ్యాసం చేయండి(కొనసాగించుడి)" అనే ఆజ్ఞను తీవ్రంగా తీసుకోకపోవడం చేత వారు ఇతరులను నిందిస్తూ ఆదాము పిల్లల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని పిల్లల యొక్క ఈ చెడ్డ స్వభావము వలన ప్రభువుకు మరియు ఆయన సంఘానికి ప్రజల ఎదుట ఎంతో చెడ్డ పేరు వస్తుంది.
యోహాను 8:4లో వ్యభిచారమందు పట్టబడిన ఒక పేద స్త్రీని పరిసయ్యులు నిందించుటను మనం చదువుతాము. ఆమెను ఆ పాపము నుండి రక్షించుటకు వారికి ఎటువంటి ఆసక్తి లేదు. వారు కేవలము వారి యొక్క స్వనీతిని మరియు ఆ స్త్రీ ఎంత పాపాత్మురాలో చూపించుటకు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు. అక్కడ నిలబడి, తమ పూర్వీకుడైన ఆదాము హవ్వ పట్ల చేసినట్లే, వారు ఆ పేద స్త్రీ వైపు నిందారోపణ చేస్తూ వేళ్లు చూపించారు. ఆ విధంగా వారు వారి అంతరంగంలో నిందించు వాడైనా సాతానుతో సహవాసం చేస్తున్నారని ప్రత్యక్ష పరుస్తున్నారు. అందుకే యేసు పరిసయ్యులతో, సాతాను వారి తండ్రి అని ప్రత్యేకంగా చెప్పారు (యోహాను 8:44).
యేసు, అటువంటి స్త్రీలను నిందించుటకు గాక వారి పాపము నుండి రక్షించుటకే వచ్చాడు. యోహాను 3:17లో మనం ఈ విధంగా చదువుతాము, లోకమును తీర్పుతీర్చుటకు దేవుడు తన కుమారుడిని పంపలేదు గాని లోకమును రక్షించుటకే తన కుమారుడిని పంపెను.
నిందారోపణ చేయుటకు మరియు దైవికమైన దిద్దుబాటుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రకటన గ్రంథం 2 మరియు 3 అధ్యాయాలలో, ఐదు సంఘాలలోని విఫలమవుతున్న సంఘ పెద్దలకు దైవిక దిద్దుబాటు ఇవ్వమని ప్రభువు యోహానును ఆదేశించాడు. అదేవిధంగా కొరంథీ, గలతీయ, థెస్సలోనీకయ సంఘములకు దైవికమైన దిద్దుబాటును ఇవ్వమని పరిశుద్ధాత్ముడు పౌలుకు ఆదేశించాడు. అటువంటి దిద్దుబాటు ఆత్మీయమైనది. తన ప్రజలకు సహాయపడుటకు అటువంటి దిద్దుబాటును ఇవ్వమని దేవుడు అభిషేకము కలిగిన తన సేవకులను అప్పుడప్పుడు పిలుస్తాడు. అయితే అటువంటి దిద్దుబాటులు ఎల్లప్పుడూ ప్రేమలో ఇవ్వబడతాయి.
నిందారోపణచేసే ఆత్మను గుర్తించడం చాలా సులువు. అది ఎల్లప్పుడూ వారికి నచ్చని వారిపట్ల ప్రతికూలమైన వైఖరితో వ్యక్తం అవుతుంది. నీవు ప్రేమించే వారిని ఎప్పుడూ ఆ విధంగా నిందించవు. ఉదాహరణగా చూసినట్లయితే, నీ సొంత పిల్లలను ఇతరుల ఎదుట నీవు నిందించవు. ప్రజలపట్ల నీ ప్రేమరాహిత్యం నిందించు ఆత్మను నీలో నుండి తీసుకొని వస్తుందని విషయాన్ని నీవు చూడవచ్చు.
అపోస్తలుడైన పౌలు మరియు యోహానుల వలె, దైవికమైన దిద్దుబాటు చేసే పరిచర్యను ప్రభువు తన నమ్మకమైన సేవకులకు మాత్రమే ఇస్తాడు. ప్రభువు ప్రతి ఒక్కరిని అటువంటి పరిచర్యకు పిలవడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నీవు నిందించు పరిచర్యను చేస్తూ దైవికమైన దిద్దుబాటు పరిచర్యను జరిగిస్తున్నానని తప్పుగా ఊహించుకొని నిన్ను నీవు మోసగించుకోవచ్చు.
నీవు నిందించు ఆత్మను కలిగి ఉన్నట్లయితే పరిసయ్యులను ఎదిరించినట్లే ప్రభువు నిన్ను కూడా ఎదిరిస్తారు. నిందించు పరిచర్య సాతాను పని, విశ్వాసులుగా మనం దానిలో ఏవిధంగా పాలుపొందకూడదు.
సాతాను మరియు అతని దయ్యములు ఎప్పుడూ కూడా మన తోటి విశ్వాసులను ఏదో ఒక విషయంలో నిందించమని మనల్ని తొందరపెడుతూ ఉంటాయనే విషయాన్ని మనం మొట్టమొదటిగా గుర్తించాలి. వారిని నిందించునట్లు ఆ దయ్యాలు నీ తోటి విశ్వాసులలో అనేక తప్పులను చూపుతూ ప్రేరేపిస్తుంటాయి. నీవు ఆ శోధనకు లొంగినట్లయితే సాతాను శక్తుల ప్రభావానికి లోనవుతావు. అనేకమంది విశ్వాసులు అనారోగ్యంతో బాధపడుటకు ఇది ఒక కారణం.
ఒక రోగిలో క్యాన్సరును ఒక డాక్టర్ ఏ విధంగా అయితే శస్త్రచికిత్స చేసి తీసివేస్తాడో మన జీవితాలలో నుండి నిందించు ఆత్మను తీసివేయుటకు మనం అత్యంత కఠినంగా ఉండాలి. నిందించు ఆత్మ ఏ విధమైన క్యాన్సర్ కంటే చెడ్డదనే విషయాన్ని మనం స్పష్టంగా చూడాలి.
పుట్టినప్పటినుండి ఇతరులలో తప్పులు కనిపెట్టే చెడ్డ అలవాటును మనమందరం పొందాము. ప్రజలగూర్చి వారి వెనక విమర్శనాత్మకంగా మాట్లాడడం మరియు వారిని నిందించుటకు వారిలో తప్పులు లేక మరేదైనా కనిపెట్టడం చేస్తూ అనేక సంవత్సరాలు మనం గడిపాం.
చివరిగా: ప్రభువు పరిసయ్యులతో, పాపములేనివాడు మాత్రమే ఇతరులపై రాయిని విసరుటకు అర్హుడని చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరము ఇతరులను నిందించుటకు అనర్హులము.
ఈ సాతాను ఆత్మ నుండి ప్రభువు మనల్ని సంపూర్ణముగా విడుదల చేయను గాక. ఆమెన్.