బైబిలులో లోబడుట అనేది ఒక శ్రేష్ఠమైన గుణము. కానీ మన కాలంలో ఇది అంతగా అభినందించబడటం లేదు, అసలు ఒక మంచి గుణంగా కూడా పరిగణించబడడం లేదు. తమ కంపెనీ యొక్క ముఖ్యమైన విలువలలో ‘లోబడుట’ ఒకటని ఏ కంపెనీ డైరెక్టర్లు చెప్పడం మీరు విని ఉండరు. వినే అవకాశమే లేదు! ఆ మాట వినడానికే విడ్డూరంగా ఉందంటే, లోబడుట యొక్క అసలైన ప్రాముఖ్యతకు మనము ఎంత దూరంగా వచ్చామో అర్థమవుతోంది.
అయినప్పటికీ, ఈ పదం పట్ల మన సమాజానికి ఉన్న అభిప్రాయంతో సంబంధం లేకుండా, లేఖనాలలో మనము చూసే అత్యంత అమూల్యమైన గుణాలలో లోబడుట ఒకటని చూస్తాం. పరిపూర్ణమైన ఐక్యత ఎక్కడైతే ఉంటుందో, అక్కడ లోబడుట ఉంటుంది: కుటుంబంలో, సంఘంలో మరియు చివరకు త్రిత్వంలో కూడా!
లోబడుట ద్వారా పరిపూర్ణం చేయబడిన సంపూర్ణ ఐక్యతకు దైవత్వాన్ని ఒక నిర్దిష్ట ఉదాహరణగా తీసుకోండి. యుగయుగాలుగా తన పరలోక తండ్రితో, పరిశుద్ధాత్మతో సమానమైన ఉనికిని, నిత్యత్వాన్ని కలిగియున్న యేసుక్రీస్తు, 33.5 సంవత్సరాల పాటు పరలోకమందున్న తన తండ్రికి మాత్రమే గాక (యోహాను 5:19, 30, 6:38, 8:28, 14:31), పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వానికి కూడా (మత్తయి 4:1, లూకా 4:1, మార్కు 1:12) తనను తాను సంపూర్ణంగా లోబరుచుకున్నారు.
యేసుక్రీస్తు జీవితంలో బయలుపరచబడిన ఈ లోబడుట యొక్క అమూల్యమైన విలువను మనము చూశామా? దాన్ని మనము కూడా పొందుకోవలసిన శ్రేష్ఠమైన గుణంగా గుర్తించి, అటువంటి లోబడే హృదయాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నామా?
ఈ కాలంలో లోకపు విలువలు మనపై ఒత్తిడి తెస్తుండగా, ఈ అమూల్యమైన గుణం యొక్క అసలైన విలువను మనము అంగీకరించడానికి నిరాకరిస్తున్నామని, లేదా సులువుగా నిర్లక్ష్యం చేస్తున్నామని నేను భయపడుతున్నాను.
లోబడుట వల్ల మన జీవితంలో సంతోషం తగ్గుతుందేమోనని మనము భయపడుతునట్లయితే, అది నిజమో కాదో తెలుసుకొనుటకు యేసుక్రీస్తు జీవితాన్ని చూస్తే సరిపోతుంది. ప్రపంచ చరిత్రలోనే ఆయన జీవితం కంటే ధన్యకరమైన జీవితం మరొకటి ఉందా? అంతటి సంపూర్ణమైన జీవితం, శక్తివంతమైన జీవితం, ఆనందదాయకమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మరొకటి ఉందా?
ప్రపంచ చరిత్రలోనే యేసుక్రీస్తు జీవించిన జీవితం కంటే అత్యంత ఆనందదాయకమైన జీవితాన్ని నేను ఊహించలేను. మన జీవితానికి కావలసిన రక్షణ, విశ్రాంతి, ఆనందం, సమాధానం, బలం మరియు మనకు కావలసిన సమస్తం కొరకు మన పరలోక తండ్రి వైపు చూడటం కంటే అత్యంత సంతోషకరమైనది మరొకటి లేదు. లోబడుట అనే మార్గమే ఆశీర్వాదాల మార్గమని, మనము నిజంగా కోరుకునే మరియు మనకు అవసరమైన సమస్తాన్ని పొందుకోవడానికి లోబడుటయే తాళపు చెవి అని మనము కనుగొంటాము.
లోబడుట యొక్క విలువను మనము తెలుసుకున్న తర్వాత ఒక కపటమైన మోసం మనలోనికి ప్రవేశించే ప్రమాదం ఉంది: అదేంటంటే—"నేను దేవునికి మాత్రమే లోబడితే సరిపోతుంది" అనే ఆలోచన. "విశ్వాసులందరూ యాజకులే" అనే సత్యాన్ని నేను నమ్ముతాను, మరియు యేసుక్రీస్తు తప్ప మరొక మధ్యవర్తి మనకు అవసరం లేదనే మాట నిజమే అయినప్పటికీ (హెబ్రీయులకు 7:25), ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా "కోరహు చేసిన తిరుగుబాటు" నుండి మన హృదయాలను కాపాడుకోవాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయనే విషయాన్ని మనము గమనించాలి (యూదా 1:11).
కోరహు చేసిన తిరుగుబాటు ఏంటంటే—దేవుడు తనపై ఉంచిన అధికారానికి లోబడకపోవడమే. అతని ఆలోచన ప్రకారం తాను లేవీయుడు, దేవుని చేత ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నవాడు గనుక, తాను వేరొక మనుష్యుడికి లోబడాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. మన హృదయాలలో కూడా సరిగ్గా అలాంటి ఆలోచనే ప్రవేశించవచ్చు: "నాకు యేసుక్రీస్తు ఉన్నాడు, కాబట్టి నా సంఘంలో ఉన్న నాయకుడికి గానీ, మరి ఎవరికి గానీ నేను లోబడాల్సిన అవసరం లేదు, అలాంటి ఆజ్ఞ కూడా లేదు". అయితే అటువంటి గర్వపు ప్రవర్తనను బట్టి కోరహు సజీవంగా పాతాళంలోకి కూలిపోయాడు, మనము కూడా అటువంటి ఫలితాన్ని పొందకుండా జాగ్రత్తపడాలని యూదా మనలను హెచ్చరిస్తున్నాడు. గొర్రెల సంరక్షణ కొరకు దేవుడే సంఘంలో నాయకత్వాన్ని ఉంచాడు; కాబట్టి యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవరికీ లోబడను అని అనుకోవడం, దేవుడు తన శరీరం (సంఘం) కొరకు ఇచ్చిన క్రమాన్ని తృణీకరించడమే అవుతుంది.
అందుకే పేతురు, 2పేతురు 2:10లో ఇలా హెచ్చరిస్తున్నాడు: "దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు". ఆయన ప్రభుత్వమును (అధికారాన్ని) తిరస్కరించడాన్ని, మలినమైన దురాశ కలిగి నడుచుకోవడంతో సమానంగా చూశాడు. దురాశతో కూడిన కామవికారాలకు లొంగిపోవడం ఎంత నాశనకరమో, అధికారానికి లోబడకుండా తిరుగుబాటు చేయడం కూడా మన ఆత్మలకు అంతటి నాశనకరమైనదని మనము గ్రహించామా?
అంత్యదినములలో సంఘం లోపల కూడా మోసం రాజ్యమేలుతుందని బైబిలు సెలవిచ్చుచున్నది (మత్తయి 24:24, లూకా 21:7-9). కాబట్టి "నేను ఏ అధికారానికి లోబడాల్సిన అవసరం లేదు" అనే ఆలోచన అత్యంత ప్రమాదకరమైన మోసం, దాని విషయంలో మనం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. లోబడుట అనే గుణం మన జీవితాలలో, మన దృష్టిలో ఎల్లప్పుడూ ఎదుగుతుండేలా మనము పోరాడాలి.
కాబట్టి, లోబడుట అనే అంశం వచ్చినప్పుడు, ఆ పదాన్ని వినగానే వెంటనే కోపం తెచ్చుకోవడం లేదా విసుక్కోవడం వంటి భావాల విషయంలో మనము తీర్పు తీర్చుకోవాలి. లోబడుట అనే గుణాన్ని హెచ్చించే (లేదా స్పష్టంగా లోబడుటకు ఆజ్ఞాపించే) లేఖన భాగాలను మనము ధ్యానిస్తున్నప్పుడు, వాటిని మనకు విశ్రాంతిని, సంతోషాన్ని ఇచ్చే ఆశీర్వాదకరమైన వాగ్దానాలుగా చూడాలి. ఈ ఆజ్ఞను చూసి మనము వెనకడుగు వేయకుండా, సంపూర్ణంగా లోబడే మనస్సు ద్వారా మనకు లభించే సమస్త ఆశీర్వాదాలను పొందుకునే అవకాశం మనకు దక్కినందుకు మనలను మనము ధన్యులుగా ఎంచుకుందాము.