మా సి.ఎఫ్.సి (CFC) సంఘాలలో, చనిపోయిన తర్వాత పరలోకానికి ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి మేము ప్రసంగించము. సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులను శిష్యులనుగా చేయమని మరియు తాను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనుటకు వారికి నేర్పించమని యేసుప్రభువు మనకు ఆజ్ఞాపించారు తప్ప, నరకం నుండి తప్పించుకుని పరలోకానికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కాదు!! కానీ విచారకరమైన విషయమేమిటంటే, ఈనాడు ప్రకటింపబడుతున్న అనేక సువార్త ప్రకటనలలో చనిపోయిన తర్వాత పరలోకానికి ఎలా వెళ్ళాలి అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజలను పరలోకానికి చేర్చడం నా పని కాదు గనుక నేను అటువంటి సువార్తను ప్రకటించను. అది దేవుని పని. ఈ భూమి మీద యేసుక్రీస్తు కొరకు శిష్యులను తయారుచేయుటకే కోరుచున్నాను, ఆ తర్వాత యేసుప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ లోబడటం వారికి నేర్పించడానికి నేను ప్రయత్నిస్తాను. మత్తయి 28:18-20 లో ప్రభువు మనకు ఎంతో స్పష్టంగా ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఇదే. గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉన్న మా సి.ఎఫ్.సి సంఘాలలో దీనిని నెరవేర్చుటకే మేము ప్రయత్నిస్తున్నాము.
ఈ భూమి మీద యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఎలా జీవించాలి మరియు ప్రతిరోజూ ఆయనను ఎలా వెంబడించాలి అనేదే నా సువార్త. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ మార్గము సంకుచితమునై యున్నదని యేసు సెలవిచ్చారు (మత్తయి 7:14). మన పాపముల విషయమై మారుమనస్సు పొంది, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములయందు విశ్వాసముంచుట ద్వారా మనము ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించగలము. ఆ తర్వాత ప్రతిరోజూ మన సిలువను ఎత్తుకొని, మన స్వయానికి చనిపోతూ, మన జీవితాలలో క్రీస్తుకే ప్రథమ స్థానమిచ్చి, ఆయనను వెంబడించుట ద్వారా ఆ సంకుచిత మార్గములో నడవడానికి మనము పిలువబడ్డాము. పైన పేర్కొన్న వచనంలో యేసుప్రభువు బోధించిన జీవ మార్గము మరియు శిష్యత్వము ఇదే -మా సంఘాలన్నిటిలో మేము బోధించే నిత్యజీవ మార్గము కూడా ఇదే.
శిష్యత్వానికి సంబంధించి లూకా 14:26లో యేసుప్రభువు ఇలా సెలవిచ్చారు: "ఎవడైనను నా యొద్దకు వచ్చి, తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు." యేసుప్రభువు ఆ వచనంలో చెప్పినట్లుగా, తమకు ప్రియమైన వారిని ద్వేషించడం గురించి ఎవరైనా ప్రసంగించడం మీరు ఎప్పుడైనా విన్నారా? యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉండటానికి ఇది మొట్టమొదటి షరతు. యేసుప్రభువు అన్నిచోట్లా శిష్యులను తయారు చేయమని మనకు ఆజ్ఞాపించారు తప్ప కేవలం మతం మార్చుకున్న వారిని కాదు. కాబట్టి మనము శిష్యులను చేయాలనుకుంటే, వారికి మరేదైనా నేర్పించడానికి ముందే, శిష్యత్వానికి సంబంధించిన ఈ మొట్టమొదటి నిబంధనను వారికి ఖచ్చితంగా నేర్పించాలి.
ఒక పిల్లవాడు బడిలో చేరినప్పుడు, అతనికి మొదటగా భౌతికశాస్త్రమో లేదా రసాయనశాస్త్రమో నేర్పించరు. మొదటగా అతనికి అక్షరమాల -అనగా అ, ఆ, ఇ, ఈ...లు నేర్పిస్తారు. అదే రీతిగా, మన సంఘములో చేరేవారికి మొట్టమొదటిగా శిష్యత్వము యొక్క ప్రాథమికమైన పాఠాన్ని నేర్పించాలి -అది ఏమిటంటే యేసుప్రభువును అత్యున్నతంగా ప్రేమించడం. ఆ షరతు నెరవేర్చడానికి ఇష్టపడని వారికి, వారు యేసుక్రీస్తుకు శిష్యులు కాలేరని ప్రారంభంలోనే స్పష్టంగా చెప్పాలి. శిష్యులలో రెండవ తరగతి అనేది ఏదీ లేదు. శిష్యులలో ఒకే ఒక్క తరగతి ఉంది -అదేంటంటే "తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించేవారు" (లూకా 14:26).
యేసుప్రభువు పెట్టిన ఈ కఠినమైన షరతును, లేఖనాలలో ఉన్న ఇతర ఆజ్ఞలైన "నీ తల్లిదండ్రులను సన్మానించుము", "క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా మీ భార్యలను ప్రేమించుడి" మరియు మన పిల్లలను, సహోదర సహోదరీలను ప్రేమించాలనే ఆజ్ఞలతో మనము ఎలా సమన్వయపరుస్తాము?
యేసుప్రభువు తన వర్తమానాలలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి తరచుగా ఉపమానాలను ఉపయోగించేవారు. కాబట్టి మన కుటుంబ సభ్యులను ప్రేమించడం మరియు ద్వేషించడం అనే ఈ పరస్పర విరుద్ధమైన ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి నేను ఒక చక్కని ఉపమానాన్ని వివరిస్తాను, ఈ ఉపమానం దీనిని స్పష్టపరుస్తుంది. నా తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్ర పట్ల నాకున్న ప్రేమను నక్షత్రాల వెలుగుతో పోల్చుతాను -ఆ వెలుగు ప్రకాశవంతమైనది, నిర్మలమైనది మరియు దానిలో ఎలాంటి చీకటి ఉండదు -ఇది మన కుటుంబ సభ్యుల పట్ల మనం కలిగి ఉండవలసిన ప్రేమకు సాదృశ్యం. అయితే ఉదయమున సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ నక్షత్రాలు అదృశ్యమవుతాయి. అవి అక్కడే ఉంటాయి, కానీ మనకు కనిపించవు. అదే రీతిగా, క్రీస్తు పట్ల నాకున్న ప్రేమ సూర్యుని వెలుగు వలె ఉండాలి; ఆ వెలుగులో నా కుటుంబ సభ్యుల పట్ల నాకున్న ప్రేమ మరుగైపోతుంది. నా కుటుంబ సభ్యుల పట్ల నా ప్రేమ ఇంకా ఉంటుంది (ఉదయమున ఆ నక్షత్రాలు అక్కడే ఉన్నట్లుగా). కానీ క్రీస్తు పట్ల నాకున్న ప్రేమ ఎంత గొప్పదంటే, ఇతరులందరినీ నేను కేవలం క్రీస్తు పట్ల నాకున్న ప్రేమ ద్వారానే ప్రేమిస్తాను. దాని అర్థం -క్రీస్తు పట్ల నాకున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే నా భార్య గానీ, నా తల్లిదండ్రులు గానీ, నాకు అత్యంత సన్నిహితులైన ఎవరైనా సరే నాకు మరియు క్రీస్తుకు మధ్యలోనికి రావడానికి నేను ఎన్నటికీ అనుమతించను. ఇకనుండి నేను ఇతరులందరినీ క్రీస్తు పట్ల నాకున్న అత్యున్నతమైన ప్రేమ ద్వారానే ప్రేమిస్తాను.
"నా సంఘమును నేను కట్టుదును" అని యేసుప్రభువు సెలవిచ్చారు. ఆయన మాత్రమే దానిని కట్టగలరు. మనము కేవలం ఆయన శరీరములోని అవయవాలము మాత్రమే -ఒకరు నాలుక లాంటివారు, మరొకరు చేయి లాంటివారు, ఇంకొకరు కాలు లాంటివారు. అంతగా ప్రాముఖ్యత లేని కొందరు విశ్వాసులు శరీరంలోని అంతరంగ అవయవాల వంటివారు. కానీ తన శరీరమైన సంఘాన్ని కట్టే శిరస్సు క్రీస్తే. ఆయన శరీరములోని అవయవాలుగా ఆయన చేత ఏలబడటానికి, నియంత్రించబడటానికి మరియు ఉపయోగించబడటానికి మనలను మనము ఆయనకు సమర్పించుకోగలము అంతే. చేతులు, కాళ్ళు తమంతట తాముగా ఏమీ చేయలేవు. చేయి ఏమి చేయాలో, కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో శిరస్సే చెబుతుంది. ఆ రీతిగానే మనము క్రీస్తుకు లోబడి ఉండాలి. ఆ విధంగానే క్రీస్తు శరీరము పనిచేస్తుంది మరియు కట్టబడుతుంది. ఈ సత్యాన్నే మేము నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము.
అయితే దేవుడు ఒక వ్యక్తిని కొద్దిగా వాడుకోవడం ప్రారంభించి, ఒక స్థలములో క్రీస్తు శరీరము కట్టబడే ఆ అద్భుతాన్ని అతడు చూడటం మొదలుపెట్టగానే... ఆత్మీయ గర్వము అనే ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉంటుంది. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు, గర్వము పక్కనే మాటువేసి ఉంటుంది. ఆ స్థానిక సంఘాన్ని మనమే కట్టామని లేదా ఆ ప్రజలను మనమే క్రీస్తు నొద్దకు నడిపించామని మనము ఊహించుకోవడం ప్రారంభిస్తాము. ఒక దైవజనుడు గానీ లేదా ఒక సంఘము గానీ గర్వించినప్పుడు, దేవుడు తక్షణమే ఆ వ్యక్తిని, ఆ సంఘాన్ని ఎదిరించడం ప్రారంభిస్తాడు.
మన జీవితాలలో దేవుని మహిమపరచుటకు మరియు ఈ అంత్యదినములలో ఆయన సంఘాన్ని కట్టుటకు మనమందరము దైవభీతి కలిగి, ప్రతిరోజూ ఆయన ఆత్మ శక్తి కొరకు కనిపెట్టుదుము గాక.
ఆమేన్.