వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు శిష్యులు
WFTW Body: 

సంఘాన్ని నడిపిస్తున్న మనము సిలువ మార్గంలో నడుస్తూ సంఘంలోని ఇతరులకు మాదిరిగా ఉండాలి. వారి నాయకులుగా గాక యేసు వలె వారికి సేవకులుగా ఉండుటకు గొప్ప కోరికను కలిగి ఉండాలి. యేసు ఇలా చెప్పారు, "అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను" (మార్కు 10:42-45).

మనం, మన స్థానాన్ని గాని లేక ‘నాయకుడు’ వంటి బిరుదును కానీ ఎప్పటికీ ప్రేమించకూడదు (మత్తయి 23:10). సంఘంలోని ఏ ఇతర సహోదరులు మరియు సహోదరీల కంటే ఏ విధంగానైనా గొప్పవారముగా ఊహించుకోకూడదు. నిజానికి, సంఘంలోని ఇతరులందరినీ మనకంటే ముఖ్యమైన వారిగా (యోగ్యులుగా) పరిగణించమని మనం ఆజ్ఞాపింపబడ్డాము -మనకంటే ఆత్మీయమైన వారిగా కాదు (అది అసాధ్యం) కానీ మనకంటే ముఖ్యమైన వారిగా పరిగణించాలి (ఫిలిప్పీ 2:3).

మనం ఇతరులకు నాయకుడిగా ఉండుట కంటే ముందుగా సాటి సహోదరునిగా ఉండాలి. అపోస్తలైన యోహాను తన 95 సంవత్సరాల వయసులో సంఘములకు రాస్తూ ‘మీ తోటి సహోదరుడైన యోహానను నేను’ అని తనను తాను పిలుచుకుంటున్నాడు (ప్రకటన 1:9). దురదృష్టవశాత్తు అనేకమంది నాయకులు వారిని నాయకులుగా మాత్రమే ఎంచుకుంటారు. మనం సంఘంలో అన్నివేళలా సాధారణమైన సహోదరులుగా ఉండునట్లు దేవుణ్ణి కృప కొరకు వెతకాలి. మనం ఈ విధంగా జీవించాలనుకుంటే, దేవునితో సన్నిహితమైన ముఖాముఖి సంబంధమును అన్నివేళలా కలిగి జీవించాలి.

ఆత్మీయ అధికారము దేవుడు అనుగ్రహించేది, ఇది మనం ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించేది లేక వారు మనకు లోబడునట్లుగా బలవంతం చేసేది కాదు. ఇతరులు మనకు లోబడాలని మనం ఎప్పుడూ బలవంతం చేయకూడదు మరియు ఎప్పుడూ ఎవ్వరితోను పోట్లాడకూడదు (2తిమోతి 2:24,25 ). దేవుడు మనకు అండగా ఉన్నట్లయితే, మన యొక్క స్థానాన్ని ఎప్పుడూ మనం రక్షించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడే మనల్ని బలపరుస్తాడు మరియు మన అధికారాన్ని స్థిరపరుస్తాడు. ఒకవేళ ఎవరైనా తన అధికారాన్ని ఇతరులపై తనంతట తానే చెలాయించాలని చూస్తే, అది దేవుడు అనుగ్రహించిన అధికారం కాదనుటకు అదే స్పష్టమైన రుజువు.

ఒక ఆత్మీయ నాయకుడు దాడి చేయబడినప్పుడు మరియు నిందించబడినప్పుడు తన్నుతాను సమర్ధించుకోవడానికి కానీ తన్నుతాను రక్షించుకోవడానికి కానీ చూడడు. బైబిలు ఈ విధంగా చెప్తుంది, "క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను... ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను (1పేతురు 21,23).

యేసు ఎప్పుడూ తన అధికారమును స్థాపించుటకు మనుష్యులతో పోరాడలేదు. తనను విడిపించుటకు మరియు సమర్థించుటకు దేవునికే ఆ విషయాన్ని వదిలేశాడు. సంఘంలో ఉన్న నాయకులందరూ ఈ మార్గంలోనే నడవాలి. మనము దేవుని అధికారము క్రింద జీవిస్తున్నట్లయితే మన విషయములను సురక్షితంగా దేవుని హస్తములలోకి అప్పగించుకోవచ్చు. మనపై చేయబడిన నిందలను, విమర్శలను, కొండెములను మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే తన సేవకులను అటువంటి దాడుల నుండి రక్షిస్తారని ఆయన వాగ్దానం చేశారు. ఆత్మీయ నాయకునికి వ్యతిరేకంగా ఇతరులు చేసిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు (యెషయా 54:17). దీనిని నేను నా జీవితంలో మరలా మరలా అనుభవించాను. అటువంటి అనుభవాలు కలిగి ఉండుట ఎంతో ఆశీర్వాదకరం.

అటువంటి ఆత్మీయ మనసు కలిగిన నాయకులు లేకపోవుట చేత ఈనాడు సంఘం ఎంతో బాధ అనుభవిస్తూ ఉంది. యేసు ఒకసారి తన యొద్దకు వచ్చిన గొప్ప సమూహామును చూసి వారిపైన ఎంతో జాలిపడ్డాడు. "ఆ ప్రజలు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారని వారి సమస్యలు ఎంతో గొప్పవి మరియు వారికి ఏం చేయాలో ఎక్కడినుంచి సహాయం పొందుకోవాలో తెలియదు" (మత్తయి 9:36 - ఆంగ్ల లివింగ్ తర్జుమా). ఈనాడు కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. ఈనాడు కాపరి హృదయాన్ని, సేవకుని ఆత్మను కలిగి, దేవునికి భయపడుతూ, ఆయన వాక్యం యెడల వణుకుతూ, అవసరంలో ఉన్న ప్రజలకు సహాయపడే నాయకుల అవసరం ఎంతో ఉంది.

మనం ఎప్పుడూ ప్రజలు మనల్ని ఆరాధించునట్లు అనుమతించకూడదు. ఆవిధంగా చేయనట్లయితే, వారు ఎన్నటికీ క్రీస్తు వారి శిరస్సుగా ఉండే వ్యక్తిగతమైన సంబంధంలో ఎదగరు. మనం ఎవరిని మనతో అంటుకట్టబడునట్లు చూడకూడదు. దానికి బదులుగా ప్రతి ఒక్కరిని దేవుని ముఖం ఎదుట మాత్రమే జీవించునట్లుగా ప్రోత్సహించాలి. వారు చేసే విషయాల్లో వారు మన అంగీకారాన్ని వెతకకూడదు. ఒకవేళ ఎవరైనా మనకు అంటుకట్టబడుతున్నట్లుగా మనం కనుగొన్నట్లయితే వెంటనే వారిని వదిలించుకోవాలి. మనం ఎవరికైనా సలహాలు ఇచ్చినట్లయితే మనతో విబేధించటానికి కూడా వారికి స్వాతంత్రం ఇవ్వాలి మరియు వారి పనులను వారి మార్గంలో చేయుటకు స్వేచ్ఛనివ్వాలి. ఒకవేళ దాని పర్యావసానంగా వారు సంగతులను చెరుపుకుంటే మనం వెంటనే వారికి సహాయపడుటకు సిద్ధంగా ఉండాలి. "నేను ముందే చెప్పాను కదా" అని ఎప్పుడూ వారితో అనకూడదు. ఒక నిజమైన ఆత్మీయ నాయకుడు ప్రతిస్పందించే విధానం ఇదే.

"ఆత్మ పూర్ణులైయుండుడి... క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి" (ఎఫెసీ 5:18,21).

భూ సంబంధమైన పరిస్థితులకు లోబడుటలో మరియు 30 సంవత్సరాలు తన భూసంబంధమైన తల్లిదండ్రుల అధికారమునకు లోబడుటలో యేసే మనకు మాదిరిగా ఉన్నారు. ఈ పరిస్థితులన్నిటిలో ఆయన నమ్మకంగా ఉన్న తర్వాత మాత్రమే ఆయన బాప్తిస్మం వద్ద తండ్రి ఆయనకు ఈ ఆమోదపత్రం ఇచ్చారు, "ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను". నాయకులమైన మనము ఇదే మార్గంలో వెళ్ళాలి.

"మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి" అని బైబిలు చెప్తుంది (హెబ్రీ 13:17). ఈ ఆజ్ఞ నాయకులకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచాడో ఆ పరిస్థితులకు మనం లోబడాలి, సంఘంలో మరియు లోకంలో దేవుడు మనపై ఉంచిన ఎటువంటి అధికారానికైనా లోబడాలి. అప్పుడు మనం కూడా దేవునికి ప్రీతికరమైనవారమని ఆయన నుండి అటువంటి సాక్ష్యాన్ని పొందగలము.

మనం ఎప్పుడూ కూడా మనకు లోబడాలని ఎవ్వరిని డిమాండ్ చేయకూడదు. మనం నాయకులము కాబట్టి వారు లోబడాలని మనం డిమాండ్ చేసినట్లయితే, అది మన అభధ్రతను మరియు మనం నిజంగా దేవుని ఎరగలేదని సూచిస్తుంది. దేవుడు ప్రజలకు, తనకు లోబడుటకు మరియు తనపై తిరుగుబాటు చేయుటకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. మనం దేవుని కంటే గొప్పవారము కాదు. కాబట్టి నాయకులుగా, ఎవరినైనా మనకు లోబడమని డిమాండ్ చేసే అధికారం మనకు లేదు. మనం సేవించుటకు పిలువబడ్డాం, లోబడమని డిమాండ్ చేయుటకు కాదు.

మన యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రభావం వలన ఏ ఒక్కరూ మనకు లోబడునట్లుగా చేసే విషయంలో మనమెంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో దృఢమైన మనసు కలిగిన నాయకుడు సంఘంలోని ఇతరులపై తన యొక్క వ్యక్తిత్వం ద్వారా పట్టును కలిగి ఉండడం అనేది ఎంతో సులభం. అది చెడ్డది. అటువంటి మానసిక శక్తిని మరణింపచేయాలి. సంఘంలో ఉన్న ఇతరులు మనతో విభేదించుటకు స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి. ఎవ్వరూ మనకు భయపడకూడదు. పేతురు తనను గద్దించునట్లు యేసు అనుమతించాడు (మత్తయి 16:22). నీ సహోదరుడు నిన్ను గద్దించే స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాడా లేదా? అని ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో, లేనట్లయితే నిన్ను నీవు హెచ్చించుకునే విషయంలో నీ రక్షణను నీవు అభ్యాసం చేయాలి మరియు యేసు భూమిపై నడచినప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండుటకు నిన్ను నీవు తగ్గించుకోవాలి.

మన సంఘంలో అనేక నియమాలను పెట్టడం ద్వారా ఇతరులలో మనం పరిశుద్ధతను కలుగ చేయలేము. మనం వాక్యాన్ని తప్పక బోధించాలి అయితే ఒక విధమైన పద్ధతిలో వారు జీవించాలని ప్రజలను బలవంతం చేయకూడదు. వారి సొంత ఒప్పుదలలు లేకుండా కేవలం మనల్ని సంతోషపెట్టుటకు మాత్రమే పనులు చేస్తున్నట్లయితే, అవి నీతిగా మరియు మనుషుల దృష్టిలో మంచిగా కనిపించినప్పటికీ వారి క్రియలన్నీ కేవలం మృతమైన క్రియలు మాత్రమే.

మనుష్యులను సంతోషపెట్టుటకు మరియు వారి మెప్పును పొందుటకు చేసే క్రియలు మృతక్రియలు. మృతక్రియలన్ని దేవునికి అంగీకార యోగ్యం కావు. ఆయనను మాత్రమే సంతోష పెట్టుటకు చేసే క్రియలను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. మనం సహోదర సహోదరీలను అటువంటి క్రియలు చేయుటకు నడిపించాలనుకుంటే, దేవుడు ఆదాము హవ్వలను ఏదేను వనంలో స్వేచ్ఛగా వదిలివేసినట్లే మనం వారిని కూడా వదిలివేయాలి. నిజమైన పరిశుద్ధత ఏ విధమైన సంఘ నాయకుల యొక్క భయంతో గాక కేవలం దేవుని భయంతోనే పరిపూర్ణమవుతుంది (2కొరంథీ 7:1).

దేవుడు ఒక యౌవ్వన సహోదరుడిని పరిచర్య చేయుటకు లేవనెత్తినట్లయితే మరియు ప్రజలు మీ కంటే ఆ యౌవ్వనస్తునిలో ఎక్కువగా నమ్మకం ఉంచినట్లయితే నీవు తప్పకుండా ఇది దేవుని కార్యమని ఒప్పుకొని కృపా సహితంగా అటువంటి అభిషిక్తుడైన యౌవ్వన సహోదరునికి సంఘంలో ప్రాముఖ్యతను ఇవ్వాలి. లేనట్లయితే నీవు దేవునికి వ్యతిరేకంగా పోరాడు వాడవగుదువు.

నీవు ప్రేమకలిగిన తండ్రివి అయినట్లయితే మీ పిల్లలు నీ కంటే ఎక్కువ చదువుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటావు. ఒక నిజమైన ఆత్మీయ తండ్రి కూడా అటువంటి కోరికనే కలిగి ఉంటాడు, తన ఆత్మీయ పిల్లలు తనకంటే ఆత్మీయంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటాడు. నీవు సేవించే వారి పట్ల అటువంటి కోరికను నీవు కలిగి ఉండనట్లయితే నీవు ఆత్మీయమైన తండ్రి కావు. అప్పుడు నీవు ఒక నాయకుడుగా ఉండుటకు అనర్హుడవు. నీ స్థానిక ప్రదేశంలో క్రీస్తు శరీరమును కట్టుటకు నీవు ఒక అడ్డుగా ఉండెదవు.

ఆధిపత్య వైఖరిని కలిగి ఉండి సంఘంలోని తమ స్నేహితులకు పక్షపాతం చూపే నాయకులు, వారి పాపపు ప్రవర్తనకు దేవుని తీర్పును తప్పించుకున్నామని ఊహించుకుంటారు. అయితే దేవుడు ప్రతిదానిని గమనించి, ప్రతిదానిని ఖచ్చితంగా నమోదు చేసుకుంటాడు. నియమింపబడిన సమయంలో అటువంటి అపనమ్మకస్తులైన నాయకులను ఎంతో కఠినంగా శిక్షిస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ, వేషధారిగా ఉండే, మందపై ఆధిపత్యం చేసే, కఠినంగా ఇతరులను పరిపాలించే మరియు ఆవిధమైనవి చేసే నాయకులను దేవుడు వదిలిపెట్టడని తెలుసుకుంటారు. దేవునికి పక్షపాతం లేదు. కాబట్టి "తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" (1కొరంథీ 10:12).

హెబ్రీ 12:26–28 మనకు ఇలా చెబుతోంది, "దేవుడు కదిలించగల వాటన్నిటినీ కదిలించి తీసివేస్తాడు, తద్వారా కదిలించలేనివి నిలిచి ఉంటాయి" (వివరణ).

మన చుట్టూ ఉన్న క్రైస్తవ్యంలో అనేకమైన గొప్ప బోధకులు పాపంలో పడుటను చూస్తున్నాం. కొత్త నిబంధన పద్ధతిని వెంబడిస్తున్నట్లుగా కనిపించే సంఘాలు వారి మూలాల వరకు కదిలింపబడి విభజింపబడుట చూస్తున్నాం. ఈరోజులలో జరుగుతున్న ఈ యొక్క కదిలింపులన్నిటిలో, ఒకపక్క లోకత్వం మరియు రాజీపడటం మరొకపక్క అక్షరానుసారత మరియు పరిసయతత్వం మధ్యలో కదిలింపబడని క్రీస్తు శరీరమును మనం నిర్మించాలనుకున్నట్లయితే, మనం "భయభక్తులతో దేవుని సేవించాలి - ఎందుకంటే మన దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు" (హెబ్రీ 12:29).

మనం అన్ని సమయాలలో మన జీవితాంతం వరకు దీనత్వపు మార్గంలో నడుచుదుము గాక. ఆమెన్.