అనేకమంది కోపాన్ని, ధనాపేక్షను, మనుష్యుల నుండి ఘనతను కోరుకొనుటను, తమ శత్రువులను ద్వేషించుటను, చిన్న చిన్న అబద్ధాలు చెప్పుటను పాపాలని పరిగణించనట్టే చింతించుటను కూడా పాపంగా భావించరు.
అనేకమంది వాటిని కేవలం బలహీనతలని పిలుస్తారు. నీవు దాన్ని బలహీనత అని పిలిచినంత కాలం నీవు దాని నుండి ఎప్పటికీ విడుదల పొందలేవు. యేసు మన బలహీనతల నుంచి రక్షించుటకు రాలేదు ఆయన మన పాపం నుండి రక్షించుటకు వచ్చాడు. నీవు ఒక దానిని పాపమని ఒప్పుకున్నట్లయితే దాని నుండి యేసు నిన్ను రక్షిస్తాడు. అలా కాకుండా దానికి నువ్వు ఒక అందమైన పేరును పెట్టినట్లయితే దాని నుండి నీవు ఎప్పటికీ స్వతంత్రుడు కాలేవు. నీవు ఊహించగల అత్యంత హీనమైన పేరుతో దాన్ని పిలువు - మోహపు చూపులను ‘వ్యభిచారం’ అని పిలువు, కోపాన్ని ‘నరహత్య’ అని పిలువు, ధనాపేక్షను ‘దేవుని ద్వేషించుట’ అని పిలువు, అప్పుడు అది ఎంత చెడ్డదో నీవు చూస్తావు కాబట్టి దాని నుండి విడుదల పొందుతావు.
నీవు ఎయిడ్స్ లేక క్యాన్సర్‍ను కేవలం ఒక జలుబు లేక దగ్గుగా చూసినట్లయితే వాటిని నీవు తీవ్రంగా తీసుకోవు. యేసు వాటికి వ్యతిరేకంగా ఎంతో బలంగా చెప్పినప్పటికీ అనేకమంది ప్రజలు ఈ పాపాలను ఎంతో తేలికగా తీసుకుంటారు. నేను వారిని నిందించను ఎందుకంటే వారి నాయకులు మరియు వారి బోధకులు వారికి ఈ సంగతులను బోధించలేదని భావిస్తాను. దేవుని సత్యమంతటినీ బోధించుచు మరియు మనుష్యుల ఘనతను కోరుకోని క్రైస్తవ బోధకుల మరియు నాయకుల కొరత ఎంతో ఉంది. చాలా కొద్దిమంది బోధకులు మాత్రమే ఎవ్వరి డబ్బును ఆశించకుండా, దేవుని ప్రజలను ఆత్మీయ సహాయం కొరకు నడిపించుటకు సత్యమును బోధించాలనుకొందురు. ఇది ఒక వైద్యుడు నీ డబ్బుపై ఆసక్తి లేకుండా నిన్ను ఆరోగ్యం వైపుకు నడిపించుటలో ఆసక్తి కలిగినట్లుగా ఉంది. అటువంటి బోధకులు చాలా కొద్దిమందే ఉన్నారు.
ప్రజలు చింతించుటను కూడా ఒక బలహీనత అని పిలుస్తారు. అది కేవలం బలహీనత కాదు.
మత్తయి 6:25-34లో ఈ విశ్వానికి ప్రభువైన యేసుక్రీస్తు మూడుసార్లు ‘చింతించకుడి’ అని చెప్పారు. కేవలం ఈ పది వచనాల పరిధిలోనే ప్రభువు ‘చిందించవద్దు’ అని మూడు సార్లు చెప్పారు. ఈ ప్రభువే మనలను నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు అని ఆజ్ఞాపించాడు. వీటన్నిటిని కలిపి చూడండి: "నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, చింతించవద్దు". వీటిలో పాపం కానిదేది? నీవు, "నేను కేవలం వారానికి కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే చింతిస్తున్నాను" అని చెప్పగలవా? అది ఎలా ఉంటుందంటే, "నేను కేవలం వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే నరహత్య చేస్తున్నాను" లేక "వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే వ్యభిచరిస్తున్నాను, తరచుగా చేయుట లేదు" అని చెప్పినట్టుగా ఉంటుంది.
ఎందుకు మనం కొన్ని పాపాలను తీవ్రంగా తీసుకొని మరికొన్ని పాపాలను తీవ్రంగా తీసుకోము? ఎందుకంటే మీ బోధకులు మీకు వాటిని బోధించలేదు. భయపడడం ఒక బలహీనత కాదు, నరహత్య ఒక పాపమైనట్టుగా అది పాపం. పాపమనగా ఏమిటో మనకు ఏవిధంగా తెలుస్తుంది? నీవు చేయవద్దు అని దేవుడు ఏం చెప్పాడో అదే పాపం. దేవుడు, నీ భార్య చెడ్డ స్త్రీ అయినప్పటికీ నీ భార్యను నీవు తప్పకుండా ప్రేమించాలి అని చెప్పినప్పుడు, నీవు నీ భార్యను ప్రేమించాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు ఏదైనా ఒక దానిని చేయవద్దు అని చెప్పినప్పుడు అది నీకు చెడ్డగా కనిపించపోయినప్పటికీ దానిని చేయవద్దు - అది చెడ్డది. వ్యభిచారం చెడ్డదని నేను చూసినందు వల్ల కాదు కానీ దేవుడు దాన్ని చేయవద్దు అని చెప్పినందువల్ల అది చెడ్డది. ‘చింతించవద్దు మరియు భయపడవద్దు’ అని ఆయన చెప్పారు. దేవుడు దేన్నయితే చేయవద్దు అని చెప్పారో ఆ విషయాన్ని నేను చెడ్డగా చూడాలనుకుంటున్నాను.
చింతించుట దేవునితో ఉన్న నా సహవాసమును నాశనం చేస్తుంది. చింతించుట దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదని చెప్తుంది. అది దేవునికి అవమానకరం. చెత్తకుప్పలలోనుండి తింటున్న నాలుగు సంవత్సరాల పిల్లవాని గురించి మీరు ఏమనుకుంటారు. మన దేశంలో అటువంటివారు చాలామంది ఉన్నారు. దురదృష్టవశాత్తు వారి గురించి పట్టించుకునే తల్లిదండ్రులు వారికి లేరు. మన పరలోకపు తండ్రి ఆ విధంగానే ఉన్నాడా? మన పరలోకపు తండ్రి మన గురించి పట్టించుకోవటం లేదా? చెత్తకుప్పల నుండి తింటున్న పిల్లల యొక్క తండ్రులను మన పరలోకపు తండ్రిని ఒకే కోవలోనికి చేర్చటం ఎంతో అవమానకరం. ఆ పిల్లలు వారి తరువాత ఆహారం ఎక్కడ నుంచి వస్తుందో వారికి తెలియదు కాబట్టి వారు చింతించుట సమంజసమే. ఎందుకంటే వారి భౌతిక తండ్రులు వారిని పట్టించుకోవడం లేదు. అయితే నీవు పరలోకపు తండ్రిని కలిగి ఉండి మరియు చింతిస్తున్నట్లయితే నీవు పరలోకమందున్న తండ్రి కూడా అదే కోవకు చెందిన వాడని చెప్తున్నావు.
అందువలన నేను మీతో చెప్పునదేమనగా.. మీ ప్రాణమునుగూర్చి చింతింపకుడి (25వ వచనం). మీ ప్రాణం గురించి మీరు చింతించకుడి -ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని లేక మీ శరీరంగూర్చి చింతింపకుడి. మీ జీవితం ఆహారం, శరీరం, వస్త్రాల కంటే శ్రేష్టమైనది కాదా? లూకా ఆకాశ పక్షులను ఒక ఉదాహరణగా తీసుకున్నాడు -అవి విత్తవు కోయవు గిడ్డంగులలో దాచుకొనవు, ఆయనను మీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. చనిపోయిన పక్షిని మీరు రోడ్డుపై ఎన్నిసార్లు చూశారు? చనిపోయిన పక్షి రోడ్డు మీద కనపడడం ఎంతో అరుదు. రోడ్డుపై చనిపోయిన పక్షిని నా జీవితంలో చూసిన సందర్భాలను నా వేళ్ళపై లెక్కిస్తాను. పక్షులు ఆకలితో అలమటించడం మీరు ఎక్కడైనా చూశారా? అది ఎంతో అరుదు. ఎన్నో కోట్లకొలది పక్షులు ఈ భూమిపై ఉన్నాయి, అవి విత్తనప్పటికీ కోయనప్పటికీ ఆహారాన్ని ఇటు అటు వెళ్ళి వెతుకుతున్నప్పటికీ, అవి ఆహారాన్ని పొందుతున్నాయి. ఎవరు వాటిని పోషిస్తున్నారు? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడని యేసు చెప్పారు. ఆయన వాటి పరలోకపు తండ్రి కాదు. ఆయన నీ పరలోకపు తండ్రి. ఆయన వాటి సృష్టికర్త మరియు వాటిని పోషిస్తున్నాడు. అయితే మీవిషయంలో ఆయన మీకు సృష్టికర్త మాత్రమే కాదు కానీ ఆయన మీ తండ్రి. ఈ పక్షులన్నిటికంటే మీరు ఎంతో విలువైన వారు కాదా?
ఆసక్తికరమైన ఒక పద్యాన్ని నేను చదివాను. అది రెండు పక్షులు ఒకదానితో ఒకటో మాట్లాడుకోవడం గూర్చినది. పిచ్చుకతో రాబిన్ పక్షి ఇలా చెప్పింది, "ఈ మనుష్యులు ఎందుకు ఎప్పుడు కూడా హడావిడిగా ఉంటూ చింతిస్తూ ఉంటారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను?". అప్పుడు ఆ పిచ్చుక రాబిన్ పక్షితో ఈ విధంగా చెప్పింది, "స్నేహితుడా, బహుశా నిన్ను గూర్చి నన్ను గూర్చి జాగ్రత్త వహించే పరలోకపు తండ్రి వారికి లేడని అనుకుంటాను".
ఇది కేవలం ఒక చక్కని కథ మాత్రమే కాదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం చింతించే ప్రతిదాని గురించి ఆయన జాగ్రత్త వహించడని మనం ఆలోచించడం దేవుని అవమానపరచడమే.
దీనికి పరిష్కారం ఏమిటి? ఫిలిప్పీ 4:6లో దేనిని గూర్చి చింతపడకూడని బైబిలు చెప్తుంది. అది ఎంతో కచ్చితమైన మాట, "దేనిని గూర్చి చింతపడకుడి". ఆ చింతను గూర్చిన కారణం విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి. బహుశా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటావు మరియు దాని పరిష్కారం ఏమిటో మీకు తెలియదు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుడు ఏమీ చేయవద్దని చెప్పటం లేదు; దాని గురించి ప్రార్థించమని చెప్తున్నాడు. విజ్ఞాపన అంటే ఒక ప్రత్యేకమైన విన్నపము గురించి దేవునికి చెప్పడం మరియు నీ సమస్య ఏమిటో ఖచ్చితంగా దేవునికి చెప్పడం. విజ్ఞాపన తర్వాత నీ ప్రార్థనను కృతజ్ఞతలతో ముగించడం మర్చిపోవద్దు. కృతజ్ఞత అంటే, "తండ్రి, నా ప్రార్థన విన్నందుకు వందనాలు, నా గురించి జాగ్రత్త వహిస్తున్నందుకు వందనాలు" అని చెప్పడం. కృతజ్ఞత చెప్పడం ఒక రసీదు లాంటిది -దేవుని యొక్క సన్నిధికి నా ఉత్తరము చేరిందని, ఆయన నా ఉత్తరాన్ని అందుకున్నాడనుటకు ఒక రసీదు. నా ప్రార్థన విన్నందుకు వందనాలన్నప్పుడు నేను దీనినే చెప్తున్నాడు.
ఈ రెండు విషయాలను నీవు చేసినప్పుడు, "సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును (కావలి అనేది ఒక సైనిక పదం - ఒక కోటవలె ఉండును)" అని ఫిలిప్పీ 4:7 చెప్తుంది.
చింతించకూడదు అనేది ఒక ఆజ్ఞ దానికి మనం విదేయత చూపించాలి. నేను చింతించుట నుండి స్వతంత్రుడను అయినప్పుడు నిరుత్సాహం నుండి కూడా స్వతంత్రుడనవుతాను. ఇది మనం తప్పక తీసుకోవాల్సిన ఒక అద్భుతమైన ముందడుగు.