వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము తెలిసికొనుట
WFTW Body: 

ఒక జంట ఒక ఇంటిని నిర్మించాలని అనుకున్నప్పుడు వారు ఒక్కో ఇటుక పేరుస్తూ దాన్ని నిర్మిస్తారు. భౌతిక మరియు ఆత్మీయ విషయాలలో కూడా ఇది సత్యం. మనం ఉపయోగించే ఆత్మీయమైన ఇటుకలు ఏమిటి?

వారు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న ఆలోచనలు, ఒకరితో ఒకరు మాట్లాడే మాటలను ఇంటిని కట్టుటకు ఉపయోగించే ఇటుకలతో పోల్చవచ్చు. నీ సొంత ఇంటిని నిర్మించుటకు ఏ రకమైన ఇటుకలను ఉపయోగిస్తున్నావనేది కేవలం నీవు మాత్రమే నిర్ణయించగలవు. అనేకమైన జంటలు ఉపయోగించే ఇటుకల యొక్క నాణ్యతను చూస్తే వారి ఇళ్ళు కూలిపోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

భౌతిక ఇంటిని మనం నిర్మించేటప్పుడు పరీక్షింపబడిన నాణ్యమైన ఇటుకలను ఉపయోగించుటకు జాగ్రత్తగా ఉంటాము, ఎందుకంటే మనం ఎక్కువ కాలం నిలచిఉండే నిర్మాణాన్ని కోరుకుంటాం. అయితే మన భౌతిక ఇళ్ళు శాశ్వతం కాదు. ఒక రోజున అవి నశించిపోతాయి. మనం దృష్టి పెట్టవలసిన నిజమైన ఇళ్ళు నిత్యత్వానికి మనం నిర్మిస్తున్న మన భాగస్వామితో మనం కలిగి ఉండే సంబంధం. కాబట్టి మీ సాంగత్యంలో, ఆలోచనలలో మరియు మాటలలో జాగ్రత్తగా ఉండండి. ఒకరి పట్ల ఒక్కరు పవిత్రమైన మరియు మంచితనంతో కూడిన ఆలోచనలుగా మరియు మాటలుగా వాటిని ఉండనివ్వండి.

హెబ్రీ 12:15, చేదైన వేరు గురించి మనల్ని హెచ్చరిస్తుంది. మన భాగస్వామి పట్ల మన హృదయంలో ఇది ఏర్పడుతుంది. కొలస్సీ 3:19లో భర్తలు వారి భార్యల పట్ల చేదు స్వభావం కలిగి ఉండకూడదని (నిష్ఠూరపెట్టకుడని) బైబిలు ఆజ్ఞాపిస్తుంది. చేదు స్వభావం వంటి ఆలోచనలు మరియు హృదయ వైఖరులను ఖచ్చితంగా చంపివేయాలి. మన ఆలోచన జీవితంలో మనం చనిపోయే ఒక సిలువ మరియు రక్తపు గుర్తులు మనకు ఉండాలి. ప్రేమ లేని తలంపులు, స్వార్థపూరితమైన తలంపులు, విభజన తీసుకుని వచ్చే తలంపులను చంపివేయాలి. అపవాది ఎంతో దగ్గరగా ఉండి తన రాళ్లను మరియు తన ఇటుకలను నీ చేతిలో పెట్టి వాటితో నీ గృహాన్ని కట్టుకొనుటకు వాటిని ఇస్తున్నాడనే విషయాన్ని నీవు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. మనలో వివాహమైన అందరం కూడా కఠినంగా ఉండుటకు, స్వార్థంగా ఉండుటకు, చేదు స్వభావాన్ని కలిగి ఉండుటకు, మన భాగస్వామిపట్ల అనుమానపు ఆలోచనలు కలిగి ఉండుటకు శోధింపబడటం మనకు తెలుసు. అపవాది స్వార్ధపు ఇటుకలను తీసుకొని వచ్చి మన స్వంత ప్రయోజనాలను మాత్రమే ఆలోచిస్తూ మన ఇంటిని నిర్మించుకునేలా చేస్తాడు. మీ భాగస్వామి పట్ల అనుమానపు ఇటుకలను తీసుకొని వస్తాడు. అనుమానానికి చనిపోయి నమ్ముటను నేర్చుకోండి. అపవాది తీసుకొనివచ్చే వాటన్నిటిలో అనుమానపు ఇటుకలు ఎంతో చెడ్డవి.

అదేవిధంగా మనం మాట్లాడే మాటలు కూడా మనం నిర్మించే ఇంటి ఇటుకలుగా ఉన్నాయి. వివాహమైన వారందరి యొక్క మాటలన్నీ రికార్డుచేయబడి మరలా వినిపిస్తే (తీర్పుదినాన ఆ విధంగా ఖచ్చితంగా జరుగుతుంది), మనలో ఎంతమంది వాటిని వినుటకు ఆనందిస్తారని నేను ఆలోచిస్తాను. లేక మనం పారిపోయి దాక్కుంటామా? ఒకరితో ఒకరు దయతో మరియు కనికరంతో కూడిన మాటలను మాట్లాడిన కొన్ని జంటలకు ఆరోజు ఎంత అద్భుతంగా ఉంటుంది. తీర్పుదినాన వారి సంభాషణలన్ని ప్రపంచమంతా విన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంతో ఉంటారు.

మనం పరిపూర్ణులము కాదు. అయితే మనల్ని మనం తగ్గించుకొని, మంచి మాటలు మాట్లాడుటను, అపవాది మన నాలుకలపై పెట్టిన చెడ్డ మాటలను చంపుటను నేర్చుకోవచ్చు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడే చెడిపోయిన మాటలను ఒకసారి ఆలోచించండి - మీ నాన్న అలాంటివాడు, మీ చెల్లి అలాంటిది.. మొదలైనవి. అటువంటి ఇటుకలతోనే అనేకులు ఇంటిని కట్టుకొనుట ఎంతో విచారకరం. అటువంటి దుఃఖకరమైన ప్రమాణాల మధ్య, దేవుడు తన వాక్యంలో మనకు ఇచ్చిన నమూనా ఆధారంగా దేవుని మహిమ పరిచే గృహాలను మనం కట్టాలి.

ఎఫెసీ 4:29 ఈ విధంగా చెప్తుంది “నీ నోటి నుండి చెడిపోయిన ఏ మాటకూడా(దుర్భాష) రాకూడదు”. చెడిపోయిన మాటలు చెడిపోయిన ఇటుకలవలె ఉన్నాయి. భార్యాభర్తలుగా మనము ఈ సామాన్యమైన నియమాన్ని వెంబడించినట్లయితే, ‘నేను నా భాగస్వామితో కేవలం కృపాసహితమైన మాటలను మాత్రమే మాట్లాడతాను’ అని నిర్ణయించుకుంటే, ఒక సంవత్సరం తిరిగే సరికి, ప్రజలు అనేక సంవత్సరాలుగా కట్టిన చెడిపోయిన గృహముల కంటే శ్రేష్టమైన గృహమును మనం కలిగి ఉంటాము. అది మనలో ప్రతి ఒక్కరికి సాధ్యమే. మీ ఇంటిలో ఎవరినైనా నిందించు శోధనలు వస్తాయి, కానీ అవి కేవలం శోధనలు మాత్రమే. ఎవరైనా మీ ఇంటికి దర్శించినప్పుడు నీవు పుకార్లు చెప్పుటను ప్రారంభిస్తే నీవు నీ ఇంటిని చెడిపోయిన ఇటుకలతో కట్టుకుంటున్నావు. అపవాది నీకు చెడిపోయిన ఇటుకలను అందిస్తున్నాడు, నీవు వాటిని వెంటనే తీసుకున్నావు. ఆ విధంగా అతడు నీ ఇంటికి చేయనివ్వకండి. దేవుని యొక్క నమూనాను తీవ్రంగా తీసుకుని దానిని వెంబడించుటకు నీవు నిర్ణయించుకున్నట్లయితే నీవు పరలోకంవంటి గృహమును కలిగి ఉంటావనుటలో ఎటువంటి సందేహం లేదు.

ద్వితీయోపదేశకాండము 33:16లో, ‘పొదయందు నివసించు వాడని’ దేవుని గూర్చి చెప్పబడింది. అది నిర్గమకాండంలో మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడును సూచిస్తుంది. బైబిలులో నమోదు చేయబడిన దేవుడు నివసించిన మొట్టమొదటి ప్రదేశం ఇది. అగ్నితో మండుతున్నప్పుడు ఆ పొదలో ఎటువంటి క్రిములు లేక బ్యాక్టీరియా బ్రతికి ఉండుటను మీరు ఊహించగలరా? అగ్ని ఎటువంటి క్రిములనైనా బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది. మనకు ఆ అగ్ని కావాలి - మన గృహములలో క్రిములను మరియు బ్యాక్టీరియాలను చంపుటకు మనకు పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. నేను ఏ క్రిములు మరియు బ్యాక్టీరియా గురించి చెప్తున్నాను? ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న దైవవిరుద్ధమైన ఆలోచనలు, దయలేని మరియు చెడిపోయిన మాటలు, అనవసరమైన ముచ్చట్లు(పుకార్లు) మొదలగునవి. మనం పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు, మన గృహాలు పరిశుద్ధాత్మ అగ్నితో మండుచున్నప్పుడు, మనం అత్యంత శుద్ధమైన(క్రిమిరహిత) గృహాన్ని కలిగి ఉంటాము. మన గృహం భౌతికంగా అపరిశుభ్రంగా ఉన్నా పర్వాలేదు కానీ మన మాటలు మరియు మన ఆలోచనలు ఖచ్చితంగా శుభ్రంగా(నిర్మళంగా) ఉండాలి.

దేవుడు దేని గురించి శ్రద్ధ వహిస్తాడనే దానికి, మనిషి దేని గురించి శ్రద్ధ వహిస్తాడనే దానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. పరిసయ్యులు బాహ్యంగా శుద్ధులుగా ఉన్నారు అయితే యేసు శిష్యులు అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకున్నారు. వారి గృహాల్లో దేవుడు నివసించునట్లు వారి తలంపులు మరియు ఆలోచనలు నీతిమంతమైనవి. మనం దీనిని కోరుకున్నట్లయితే మన గృహాలు పాత నిబంధనలో దేవుని మహిమ దిగివచ్చే ప్రత్యక్షగుడారంవలె ఉండును. అటువంటి అనేక గృహాలను కలిగి ఉండుట ఎంతో అద్భుతమైన విషయం. పొదయందు నివసించు దేవుడు, తాను మహిమ పరచబడే గృహాలలో కూడా నివసిస్తాడు.