WFTW Body: 

మన మార్గదర్శకుడైన యేసు (మనకు ముందు అదే పరుగును పరుగెత్తినవాడు) మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుటకును అక్కడ ఎల్లప్పుడు నివసించుటకును మనకొరకు మార్గమును తెరచెను. ఈ మార్గము "నూతనమైన జీవముగలిగిన" మార్గమని పిలువబడెను (హెబ్రీ 10:19). యేసును వెంబడించుట అనగా "ఆయన మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడును వహించుకొనిపోవుట" యని పౌలు చెప్పెను (2 కొరింథీ 4:10). అతడు క్రీస్తుతో కూడా సిలువవేయబడి, ఇక జీవించియుండలేదన్న వ్యక్తిగత సాక్ష్యమును కలిగియుండెను. అతడు కల్వరిలో మరణించినందున అతనిలో జీవించుచున్నవాడు క్రీస్తే. తన అద్భుతమైన జీవితమునకును, దేవునికిని ఉపయోగపడుటకును ఇదే రహస్యము.

యేసు ఎల్లప్పుడు సిలువ మార్గములో నడిచెను. ఇది స్వంత చిత్తమునకు మరణముతో కూడిన మార్గము. ఆయన తన్నుతాను ఒక్కసారి కూడా సంతోషపెట్టుకొనలేదు (రోమా 15:3). ఒకడు తన్నుతాను ఉపేక్షించుకొనుట పరిశుద్ధతకు మూలమైయున్నది. ఒకడు తన్నుతాను అనుదినము ఉపేక్షించుకొని అనుదినము తన స్వంత చిత్తమునకు మరణించని యెడల, అతడు తనను వెంబడించలేడని ఒకసారి యేసు చెప్పెను (లూకా 9:23). మనలను మనము అనుదినము ఉపేక్షించుకొనని యెడల యేసును వెంబడించుట అసాధ్యము. మనము క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడి, పరిశుద్ధాత్మను పొంది, దేవుని వాక్యమును బాగుగా అర్థము చేసుకొని యుండవచ్చును గాని అనుదినము మన స్వంత చిత్తమునకు మనము చనిపోని యెడల మనము యేసును వెంబడించలేము.

పాతబట్టకు క్రొత్తబట్ట మాసిక వేయుటకు చూచేవారిని గూర్చి యేసు ఒకసారి మాట్లాడెను. ఇది ఆ వస్త్రమును చింపివేయునని ఆయన చెప్పెను. పాత వస్త్రమును విడిచిపెట్టి(స్వంత జీవమును మరణింపజేసి) క్రొత్త వస్త్రమును పొందవలసిన అవసరమున్నది. మరియొక ఉపమానములో, మనము మంచి ఫలములను కోరుకొనిన యెడల చెట్టును మంచిదిగా చేయవలెనని ఆయన చెప్పెను. కేవలము చెడ్డ ఫలములను నరికివేయుటలో ప్రయోజనము లేదు.

ఈ ఉపమానములన్నిటిలో ప్రధానముగా ఒక పాఠమున్నది: ప్రాచీన పురుషుడు మెరుగుపరచబడలేడు. అతడు దేవుని చేత సిలువవేయబడెను (రోమా 6:6). అతనిపై దేవుని తీర్పును మనము అంగీకరించి, అతనిని విడిచిపెట్టి నూతన పురుషుని ధరించవలెను.

సిలువ మార్గమే ఆత్మీయ పురోగతికి మార్గము. కోపము, చికాకు, అసహనము, మోహపు తలంపులు, మోసము, అసూయ, ద్వేషము, పగ, డబ్బును ప్రేమించుట మొదలగు పాపములను మీరు జయించలేకుంటే దానికి సమాధానము ఇక్కడే ఉన్నది: మీరు సిలువ మార్గమును తప్పించుకొనిరి.

ఒక మరణించిన వ్యక్తి తన హక్కుల కొరకు నిలబడడు. అతడు తిరిగి పోరాడడు. అతడు తన పేరు ప్రతిష్ఠలను లెక్కచేయడు. అతడు ప్రతీకారము తీర్చుకొనడు. అతడు ఎవరిని ద్వేషించడు లేక పగ కలిగియుండడు. మన స్వంత జీవితమునకు (చిత్తమునకు) చనిపోవుట అంటే ఇదే. దేవుడు మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఏర్పాటుచేసిన వాటివలే సిలువ మార్గమనేది కూడా మన ఆత్మీయ అభివృద్ధికి మనకు అనుదినము అవసరమైనది.