భార్యభర్తల మధ్యకు వచ్చుటకు అపవాదిని అనుమతించినట్లయితే, వారి వివాహం అరణ్యంవలె మారుతుంది. సామెతలు 24:30-32లో ఇలా చెప్పబడింది, "సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని". ఒక తోట నిర్లక్ష్యం చేయబడినప్పుడు, వెంటనే అది పెరిగిపోతుంది. మీరు దానిలో కలుపుమొక్కలు, ముళ్లపొదలు నాటవలసిన అవసరం లేదు, వాటంతట అవే మొలుస్తాయి. మీరు రెండు ఇళ్ళ పక్కనుండి వెళ్ళుతున్నప్పుడు, ఒక దానిలో అందమైన తోట మరియొక దానిలో బాగా పెరిగి అరణ్యంలా ఉన్న తోటను చూశారు, ఆ అందమైన తోట దానంతట అదే అక్కడకి వచ్చిందని మీరు ఖచ్చితంగా అనుకోరు. అందమైన తోటను కలిగి ఉన్న వ్యక్తి ఎంతో కష్టపడి, శ్రమపడి దానిని అందమైన దానిగా చేశాడు. దానికి వేరుగా, బాగా పెరిగిన తోటను కలిగిన వ్యక్తి ఎంతో శ్రమతో దానిని ఆవిధంగా చేశాడని అనుకోరు - నిర్లక్ష్యం వలన అది ఆవిధంగా తయారయ్యింది.
వివాహంలో కూడా అదే నియమం అమలవుతుంది. ఒక అందమైన వివాహాన్ని మీరు చూచినప్పుడు, దానంతట అదే అలా అవ్వలేదని మీరు నిశ్చయించుకోవచ్చు. భార్యాభర్తలిద్దరు పనిచేసి దానిని అందమైనదిగా చేశారు. భార్యాభర్తలిద్దరు కలుపుమొక్కలను పెరికివేయకుండా దానికి క్రమంగా నీరుపోయకుండా ఉన్నట్లయితే వివాహం ఒక అందమైన తోటగా అవ్వటం అసాధ్యం. దానికి వేరుగా, మీరు మీ వివాహాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది దానంతటదే ఒక అరణ్యంలా మారుతుంది.
మీరు జాగ్రత్తగా ఉండనట్లయితే అపవాది మీ ఇంటిలోనికి, మీ వివాహ సంబంధమును నాశనం చేయుటకు నెమ్మదిగా వచ్చినా కచ్చితంగా వస్తాడు. అది ఒక్క రాత్రిలో జరగదు. ఒక అరణ్యం రెండు మూడు రోజులలో ఎదగదు. నీవు అన్ని సవ్యంగా ఉన్నాయని అనుకొనవచ్చు. అయితే నీ వివాహమును వృద్ధిచేయుటను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే దీర్ఘకాలంలో అది ఒక అరణ్యంలా మారుతుంది.
నీ తోట ఇప్పటికే ఒక అరణ్యంలా మారితే పరిస్థితి ఏంటి? ఒక అరణ్యమును మరలా తోటగా ఏ విధంగా పునరుద్ధరించగలమో చూద్దాం.
దేవుడు మనకు రెండు వాగ్దానాలను ఇచ్చాడు. మొదటిది యెషయా 51:3- "దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు". ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం. నీ జీవితంలో దాన్ని నెరవేర్చమని ప్రభువును అడుగుము. నీవు అడగనట్లయితే నీవు దానిని పొందవు. యాకోబు 4:1 ఈ విధంగా చెప్తుంది "మీరు అడగనందున మీరు పొందుట లేదు". ఆయన వాగ్దానం చేసిన రీతిగా నీ యొక్క అరణ్యమును ఒక ఏదేను తోటగా పునరుద్ధరించమని ప్రభువును అడుగుము.
రెండవ వాగ్దానము యెహెజ్కేలు 36:34-36లో ఉంది, "మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములుగలవాయెననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసి కొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును". ఇది ఇప్పటికే బాగా చెడిపోయిన వివాహమును గూర్చి చెప్తుంది. చూచువారు కూడా దాని యొక్క పరిస్థితిని గ్రహించగలరు. అయితే అటువంటి చెడిపోయిన వివాహమును కూడా పునరుద్ధరించుదునని దేవుడు చెప్తున్నాడు. దానిని నిర్జనముగా చూసిన వారందరూ కూడా ఇప్పుడు ఏదేను వనముగా అది మార్చబడినదని చెప్తారు.
ఈ అద్భుతమైన వాగ్దానాలు చదివిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అరణ్యంవలె ఉన్న నీ వివాహమును ఒక తోట వలె పునరుద్ధరించలేవనే విషయాన్ని గుర్తు పెట్టుకొనుట ఎంతో ప్రాముఖ్యము. వివాహ కౌన్సిలింగ్ పద్ధతుల ద్వారా లేక అనేకమైన పుస్తకాలు చదువుట ద్వారా గాక కేవలము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే నీవు పునరుద్ధరించగలవు. యెహెజ్కేలు 36:26లో దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు - "నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను". ఆదికాండం 2:10లో ఏదేను వనంలో ప్రవహిస్తున్న నది గురించి మనం చదువుతాము. ఆ నది, మన వివాహం అనే తోట మధ్యలో నుండి ప్రవహిస్తూ, వివాహంలోని ప్రతిదానిని తాజాగా ఉంచు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది.
మన అరణ్యమును ఒక తోటగా మార్చలేని నిస్సహాయతను మనం ఒప్పుకొని సహాయం కొరకు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. కీర్తనలు 127:1 ఈ విధంగా చెప్తుంది, "యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే". ప్రభువు సహాయం చేయనిదే ఒక తోటగా మన వివాహమును మార్చుటకు వినియోగించు మన శ్రమ అంతయు కూడా వ్యర్థం. ఒకవేళ ఇప్పటికే నీకు తోట ఉన్నా, ప్రభువు దానిని కావలికాయకపోతే అది ఒక అరణ్యంలా మారకుండుటను నీవు ఆపలేవు.
ఈరోజు నీ వివాహ సంబంధం ఏ విధంగా ఉంది? అది ఒక అరణ్యంలా ఉందా? నీ వివాహము ఒక తోట వలె పునరుద్ధరించబడుతుందనే ఆశలు నీవు విడిచి పెట్టావా? "నా భాగస్వామితో ఒక తోటను కలిగి ఉండటం అనేది అసాధ్యమైన విషయం" అని చెప్తున్నావా? నీవు అదే చెప్పాలని అపవాది కోరుకుంటున్నాడు. అయితే మనం ఎప్పుడూ నిరీక్షణను విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనం దేవుని పునరుద్ధరించు వాగ్దానాలని చూశాము. నీ వివాహం కొరకు విశ్వాసంతో వాటిని స్వతంత్రించుకొనుము. యెహెజ్కేలు 36:37 ఈ విధంగా చెప్తుంది, "యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను వారికి చేయునట్లు వారు దీనిని అడుగు వరకు నేను వేచి చూసెదను(విచారణ చేయనిత్తును)". మనం ప్రభువును అడిగినప్పుడే ఆయన మనకు దానిని చేస్తాడు. కాబట్టి నీవు తప్పక ప్రభువు దగ్గరకు వచ్చి "ప్రభువా నా వివాహంలో నీవు దీన్ని చేస్తావని నమ్ముతున్నాను. నేను నిరీక్షణను విడిచిపెట్టను" అని చెప్పండి.