"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును" (సామెతలు 3:5,6)
ఈ వచనములో హృదయం ప్రాముఖ్యమైనదిగా ఎంచబడింది. సామెతల గ్రంథంలో హృదయం ప్రాముఖ్యమైనదిగా ఎంచబడుట తరచుగా మీరు కనుగొంటారు. విశ్వాసం అనేది మనసుకు సంబంధించిన కాదని ఇక్కడ మనం చూస్తాము. పాత నిబంధనలో సొలోమోను సహితం దాన్ని అర్థం చేసుకున్నాడని చూచుట ఆసక్తికరమైనది, అయితే కొన్నిసార్లు మనం ఆవిషయంలో తప్పు చేయవచ్చు. కొన్ని సత్యాలను మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు దేవుడు ప్రేమించు తండ్రి అని, దేవుడు యేసును ప్రేమించినట్లే యేసు శిష్యులను కూడా ప్రేమిస్తున్నాడని (ప్రతి ఒక్కరిని కాదు విశ్వాసులందరినీ కూడా కాదు కానీ యేసు శిష్యులను, అన్నిటినీ విడిచిపెట్టిన యేసు శిష్యులను మాత్రమే ప్రేమిస్తున్నాడని) మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే అవి కేవలం నా మనస్సులో అర్థం చేసుకునే విషయాలుగా ఉండవచ్చు. వాటిని నా పూర్ణ హృదయంతో నమ్మటం లేదు కాబట్టి పరీక్షించబడిన సమయంలో నేను ఇంకా ఆందోళనపడతునే ఉంటాను. అపవాదికున్న విశ్వాసం వలె నా తలలో ఒకదానిని నమ్ముటకు మరియు నా పూర్ణ హృదయంతో ప్రభువుయందు విశ్వాసముంచుటకు ఎంతో తేడా ఉంది. పూర్ణ హృదయంతో విశ్వసించుటకు నాకు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత కావాలి.
నీ తలలో ఒక దానిని నమ్ముటకు నీకు బైబిలును వివరించి చెప్పే ఒక మంచి బైబిలు బోధకుడు ఉంటే సరిపోతుంది, అప్పుడు నీవు దాన్ని అర్థం చేసుకుంటావు. అదే విశ్వాసం అని మనం అనుకుంటాం, అయితే పరీక్షకాలంలో అది విశ్వాసం కాదని మనం కనుగొంటాము. మనకు డబ్బు ఉందని మనం అనుకుంటాము అయితే మనం ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు మనం కలిగి ఉన్నది నకిలి డబ్బని మనం కనుగొంటాం, అది నిజమైన డబ్బు యొక్క నకలు మాత్రమే, నిజమైనది కాదు. మన విశ్వాసం మన యొక్క హృదయంలో నుంచి వస్తుందా లేక కేవలం తలలోనుండి వస్తుందా అనే విషయం పరీక్షకాలమే ప్రత్యక్షపరుస్తుంది. అందుకే దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించునట్లు మనం అధికంగా ప్రార్థించాలి. అప్పుడు మన విశ్వాసం కేవలం మన తలలో మాత్రమే కాకుండా మన హృదయం యొక్క లోతుల్లోనికి వెళ్తుంది. పరీక్ష కాలములో ఆ విశ్వాసం మనల్ని కదలకుండా పట్టుకుంటుంది. నీ పూర్ణ హృదయముతో ప్రభువునందు నమ్మకముంచుము.
తరువాత ‘నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని’ అతను చెప్తున్నాడు. మన స్వబుద్ధి అంటే మన మనసులో ఉన్న వివేచనతో ఆలోచించే జ్ఞానం. నీ మనస్సును నమ్మవద్దని దానికి బదులుగా నీ పూర్ణ హృదయముతో ప్రభువునందు నమ్మకముంచమని అతను చెప్తున్నాడు. అతడిక్కడ హృదయానికి మరియు మనస్సుకు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. నీ మనస్సు నమ్మదగినది కాదు దేవుడు ప్రేమించు తండ్రి అని నీ మనసు నీకు చెప్తుంది అయితే పరీక్ష కాలంలో నీవు ఎంతో ఆందోళనపడుతున్నావు. నీ హృదయంతో దేవుడు ప్రేమించు తండ్రియని నీవు నమ్మటం లేదని అది రుజువు పరుస్తుంది. మా సంఘంలో మేము తరచుగా చెప్పే ఒక విషయము: మన తెలివైన తర్క జ్ఞానమే మన విశ్వాసానికి మొదటి శత్రువు. అందుకే తెలివైన వారు విశ్వాసంలోనికి రావడం ఎంతో కష్టం. అది అసాధ్యం కాదు గాని కష్టం. ఎందుకంటే వారు తమ తెలివితేటల మీద ఆనుకుంటారు. తెలివైన వారు లేఖనాలను ఎంతగానో అర్థం చేసుకున్నప్పటికీ వారు ఎంతో ఆందోళన చెందుతుంటారని మీరు కనుగొంటారు. పాపంపై వారు విజయాన్ని పొందలేరు ఎందుకంటే వారికి విశ్వాసం లేదు. వారు తెలివైన వారు, వారి సొంత జ్ఞానం మీదే వారు ఆధారపడతారు.
బైబిలు కళాశాలలు చేసే అతి పెద్ద తప్పు ఇదే. దేవుని వాక్యము చేయవద్దని చెప్పిన దాన్నే వారు ప్రజలకు చేయమని నేర్పిస్తున్నారు: లేఖనములను పరిశోధించుటకు వారి యొక్క సొంత తెలివితేటల మీద ఆధారపడుట. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను వారు ప్రాముఖ్యమైనదిగా చెప్పరు. దాని ఫలితం ఏమిటంటే ఆ బైబిలు కళాశాల నుండి బయటకు వచ్చిన తరువాత వారు దేవుని పనికి పెద్ద ఆటంకంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. బైబిలు కళాశాలలో చదవడం వలన నీవు విశ్వాసాన్ని పొందలేవు. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత వలనే విశ్వాసం కలుగుతుంది. ఇదే విషయం మీ సంఘంలో కూడా అమలవుతుంది. సిద్ధాంతాలను మన తెలివితేటల ద్వారా అర్థం చేసుకొని ఇతర ప్రజలకు దాన్ని అదే విధంగా అందించడానికి ప్రయత్నిస్తే చాలదు. మనం మన హృదయాలలో వాటి చేత పట్టబడాలి. నీ హృదయమంతటితో ప్రభువు నందు విశ్వాసముంచు, నీ స్వబుద్ధి మీద ఆధారపడకు.
సామెతలు 3:6 ఈ విధంగా చెప్తుంది, "నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము". ఇంకొక మాటలో చెప్పాలంటే నీ జీవితంలోని ప్రతి ఒక్క విషయాన్ని ప్రభువుకు అప్పగించు. నీ డబ్బుకు సంబందించిన విషయాలు ఆయనే నియంత్రించనివ్వు, నీవు చదివే వాటిని ఆయనే నియంత్రించనివ్వు, నీ సమయాన్ని ఖర్చు చేయుటను ఆయనే నియంత్రించనివ్వు, నీ కుటుంబ జీవితంలో ప్రతి విషయమును ఆయనే నియంత్రించనివ్వు, నీ పిల్లలు యెడల నీవు కలిగి ఉన్న ఆశయాలను ఆయనే నియంత్రించనివ్వు, నీ ఉద్యోగాన్ని ఆయనే నియంత్రించనివ్వు, ప్రతి ఒక్క విషయం కూడా నిన్ను ఆయనే నియంత్రించనివ్వు. నీ అన్ని మార్గాలలో ఆవిధంగా చేయుము, అప్పుడు ఆయన నీ మార్గమును సరాళం చేస్తాడు మరియు సరియైన మార్గములలో నడిపిస్తాడు, నీకు ఆలోచన చెబుతాడు. అనేకమందికి కేవలం ఏదో ఒక్క విషయంలో మాత్రమే నడిపింపు కావాలి. వారు ప్రభువుతో ఈ విధంగా చెప్తారు, ‘ప్రభువా ఈ విషయంలో నీవు ఏది చెప్పినా చేయుటకు నిన్ను సిద్ధంగా ఉన్నాను నన్ను నడిపించు’. అప్పుడు ప్రభువు "నేను నిన్ను నడిపించలేను, ఎందుకంటే నీవు నీ మార్గాలన్నిటిలో నా అధికారమునకు లోబడలేదు! కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాలలో లోబడాలి. నీ జీవితమంతటిని కూడా నా నియంత్రణలోనికి తేవడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే అప్పుడు నేను నిన్ను నడిపిస్తాను" అని అంటారు.
నీవు కేవలం ఒక్క విషయంలో మాత్రమే దేవుని యొక్క నడిపింపు కోరుకున్నట్లైతే కేవలం ఆ విషయాన్ని మాత్రమే దేవుని యొక్క నియంత్రణలోనికి తీసుకొని వచ్చావు, నీవు నడిపింపు పొందుతావని ఎటువంటి వాగ్దానము నీకు లేదు. అయితే అన్ని మార్గములలో, నీ జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితుల్లో నీవు ఆయనను ఒప్పుకొని నీ మార్గములను నియంత్రించుటకు ఆయనకు అనుమతించినట్లయితే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన కేవలం నిన్ను నడిపించడం మాత్రమే కాదు నీ కోసం మార్గాన్ని సిద్ధపరుస్తాడు. అనేకమైన అడ్డంకులతో నింపబడి ఉన్న ఆ మార్గాన్ని నీ కొరకు ఆయన శుభ్రపరుస్తాడు. సహోదరి సహోదరుడా నీవు ముందుకు వెళ్ళకుండా మార్గంలో అనేకమైన అడ్డంకులు అనేకమైన విషయాలు నిన్ను ఆటంక పరుస్తున్నట్లయితే ఈ మాటను జ్ఞాపకం చేసుకో: నీ మార్గములన్నిటిలో నీవు ఆయనను ఒప్పుకున్నట్లయితే నీ హృదయమంతటితో ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొననట్లయితే, ఆయన నీ కొరకు మార్గమును సిద్ధపరుస్తాడు. నీ అంతట నీవు దానిని సిద్ధపరచుకోలేవు. ఎంతోకాలం నీవు ప్రయత్నించావు. నీవు ముందుకు సాగునట్లు ఆయన నీ కొరకు మార్గమును సిద్ధపరచినట్లయితే మనం ఎటువంటి జీవితాన్ని జీవించగలమో ఒకసారి ఆలోచించండి. తన పూర్ణ హృదయంతో దేవుని నమ్మి, తన తెలివితేటల మీద ఆనుకొనక, తన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో దేవుని అధికారమునకు లోబడిన వ్యక్తి యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది.