WFTW Body: 

యేసు ఇలా చెప్పారు, "భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును" (మత్తయి 6: 19-21). అనేకులు ధనాన్ని ప్రేమించడం తప్పు అని భావించరు. ధనాన్ని కలిగి ఉండడం పాపం కాదు, కానీ ధనాన్ని ప్రేమించడం పాపం.

ఈ ఆజ్ఞకు మనం లోబడుతున్నామా లేదా అని తెలుసుకోవడం ఎంతో సులువు. నీ మనస్సు పరలోక సంబంధమైన విషయాల కంటే భూలోక సంబంధమైన విషయాలను అనగా పరలోక సంబంధమైన వాటికంటే భౌతిక ఆస్తులు మరియు సంపదల గూర్చి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లయితే, నీ హృదయం భూమిపైనే ఉన్నదని నీవు నిశ్చయించుకోవచ్చు, ఎందుకంటే నీ యొక్క సంపద కూడా ఇక్కడే ఉంది. ఈ ఆజ్ఞకు మనం విధేయత చూపిస్తున్నామా లేదా అని తెలుసుకొనుటకు మార్గం, రోజులో మన హృదయం దేనిపై ఉందని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే. మన పనిలో (లేక వేరొక దానిలో) మనం ఆర్థికంగా కొద్దిగా నష్టపోయినప్పుడు బాధపడినట్లయితే లేక ఆర్థికంగా కొద్దిగా లాభపడినప్పుడు సంతోషించినట్లయితే మన మనస్సు లోకంపైనే ఉన్నదని ఇది సూచిస్తుంది.

అనేక సంవత్సరాల క్రితం ఒకరు నాకు ఒక చిన్న ఆర్థిక బహుమతి ఇచ్చినప్పుడు ప్రభువు నన్ను ఒక ప్రశ్న అడిగారు -"నీ ఆనందం అధికమైందా?". నేను వెంటనే ఒప్పింపబడి నేను ఆ కొద్ది డబ్బును పొందినందుకు నా ఆనందం అధికమైందనే విషయాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకున్నాను. నేను కేవలం ప్రభువులో మాత్రమే ఆనందించాలి గాని డబ్బులో కాదని ఆ రోజు నేను నేర్చుకున్నాను. డబ్బు అధికమవ్వడం వల్ల నా ఆనందము అధికమవ్వకూడదనే విషయాన్ని కూడా ఆ రోజు నేను నేర్చుకున్నాను. అది నా ఆనందాన్ని అధికం చేసినట్లయితే నా ఆనందం డబ్బులోనే ఉందని అర్థం.

ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమని బైబిలు చెప్తుంది. ప్రభువు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటారు కాబట్టి డబ్బును పొందుకున్నా లేక కోల్పోయినా ప్రభువులోని నీ ఆనందం పెరగకూడదు మరియు తగ్గకూడదు. అది ఒకే విధంగా ఉండాలి. నీవు డబ్బును పోగొట్టుకున్నందువల్ల నీ ఆనందం తగ్గినట్లయితే నీ హృదయం అక్కడే ఉందన్న విషయాన్ని నీవు నిశ్చయించుకోవచ్చు. నీవు కొద్దిగా డబ్బును పొందినందువల్ల నీ ఆనందం పెరిగినట్లయితే నీ హృదయం అక్కడ ఉందని నీవు నిశ్చయించుకోవచ్చు. మనం తప్పక దేవుణ్ణి నమ్మాలి. జీవితానికి కావలసిన లోక సంబంధమైన అవసరాలన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు అయితే ఈ లోక సంబంధమైన వాటిలో మన సంతోషాన్ని కనుగొనకూడదు. ఈ లోక సంబంధమైన విషయాలు మనం వాడుకోవచ్చు అయితే వాటిలో మన ఆనందాన్ని పొందకూడదు.

డబ్బు ఒక అద్భుతమైన సేవకుడు కానీ నిప్పువలె ఒక భయంకరమైన యజమాని. మన ఇంటిలో (వంట వండుటకు) నిప్పు లేకుండా జీవించలేము. అయితే పొయ్యిలోని నిప్పు యజమానుడైనట్లయితే ఇల్లంతా తగలబడుతుంది. నిప్పు మీ ఇంటినంతా తగలబెట్టగల సామర్థ్యంగల ఒక భయంకరమైన యజమాని. కానీ నీవు దాన్ని నియంత్రణలో ఉంచినట్లయితే (నీవు మీట తిప్పి ‘నిన్ను ఎప్పుడు వెలిగించాలో, ఎప్పుడు ఆర్పాలో నేనే నిర్ణయిస్తాను, నీవు కాదు’. ఆ విధంగా నీవు ఇంటి యజమానిగా ఉంటావు) అప్పుడు అది ఒక అద్భుతమైన సేవకుడిగా ఉంటుంది. డబ్బు కూడా అదే విధంగా ఉండాలి. మనకు నిప్పు కావలసినట్లే ఈ లోకంలో జీవించుటకు మనకు డబ్బు కావాలి, కానీ అది ఒక సేవకుడిగా ఉండాలి. మనం ఈ విధంగా చెప్పాలి, "ధనమా, నీవు నన్ను నియంత్రించలేవని నేను నిర్ణయించుకోబోతున్నాను; నేనే నిన్ను నియంత్రిస్తాను. నువ్వు నా మనసును నియంత్రించి, నన్ను ఎల్లప్పుడూ నీ గురించే ఆలోచించేలా చేయలేవు. నేను ఎల్లప్పుడూ ప్రభువు గురించి పరలోక సంబంధమైన విషయాల గురించే ఆలోచిస్తాను. అయితే నేను నిన్ను వాడుకుంటాను". ఇదే ఒక ఆత్మీయ వ్యక్తి యొక్క వైఖరి.

ఒక సేవకునిగా ఉపయోగించినట్లయితే బంగారం మంచిది. పరలోకంలో కూడా బంగారం ఉందని బైబిలు చెప్తుంది. అయితే అక్కడ బంగారపు వీధుల గురించి మనం చదువుతాము. దాని అర్థం దానిపై నీవు నడుస్తావు అది నీ కాళ్ళ క్రింద ఉంటుంది. పరలోక సంబంధమైన క్రైస్తవునికి మరియు లోక మనస్సు కలిగిన క్రైస్తవునికి ఉన్న వ్యత్యాసం ఇదే. పరలోక మనస్సు కలిగిన క్రైస్తవుడు బంగారాన్ని కాళ్ళ క్రింద ఉంచుతాడు, అది అతణ్ణి పరిపాలించదు. అయితే ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు బంగారాన్ని తన తలపై ధరిస్తాడు మరియు ఎల్లప్పుడూ అది తన మనస్సులో ఉంటుంది.

కాబట్టి ఎల్లప్పుడూ నీ హృదయంలో డబ్బు ఉన్నట్లయితే నీకు ఇష్టమున్నా లేకపోయినా నీవు దాన్ని ప్రేమిస్తున్నావు. అది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి ఎల్లప్పుడూ ఆమె గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. డబ్బు గురించి ఎల్లప్పుడూ ఆలోచించే వ్యక్తి డబ్బును ప్రేమిస్తున్నాడు మరియు ధనాపేక్ష(డబ్బుపై ఆశ) సమస్త కీడులకు మూలము. డబ్బును ప్రేమించుటకు నీవు ధనవంతునివి కావాల్సిన అవసరం లేదు. డబ్బును ప్రేమించని బిచ్చగాడిని నేను భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు. ప్రతి బిచ్చగాడు డబ్బును ప్రేమిస్తాడు. నీవు వారికి 50 పైసలు ఇచ్చినట్లయితే వారు దానిని తృణీకరిస్తారు. వారు డబ్బును ప్రేమించి దానిని అధికంగా కోరుకుంటారు. కాబట్టి ఒక మనిషిని డబ్బును ప్రేమించేలా చేసేది సంపద కాదు. ధనవంతులు డబ్బును ప్రేమిస్తున్నట్లే పేదవారు కూడా డబ్బును ప్రేమిస్తారు.

అదేవిధంగా నీవు ఎంత సంపద కలిగి ఉన్నప్పటికీ దాని నుంచి స్వతంత్రుడిగా జీవించవచ్చు. దాని పట్ల నీ వైఖరి ఏ విధంగా ఉంది అనేదే ఇక్కడ ప్రశ్న. నీవు ఇంటిలో ఒక సేవకుడిని కలిగి ఉన్నప్పుడు అతను ఇంటినంతటినీ స్వాధీనపరచుకుంటే అది ఎంతో దారుణంగా ఉంటుంది. నీవు ఒక సేవకుడిని కలిగి ఉన్న విధంగానే కొద్ది డబ్బును కలిగి ఉండవచ్చు, అది నీ ఇంటిని స్వాధీనపరుచుకుని నీ ఆలోచనను పరిపాలిస్తుంది. మరొకపక్క అబ్రహాము వలె 318 మంది సేవకులను కలిగి ఉండవచ్చు, వారందరూ అతని సేవకులు మరియు అతనికి లోబడ్డారు. అబ్రహాము వలె నీవు కూడా అధికమైన ధనాన్ని కలిగి ఉండవచ్చు. అయితే నీవు దానిని పరిపాలించినట్లయితే దేవుని యొక్క మహిమ కొరకు నీవు దానిని ఉపయోగించగలవు.

ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము (అధికమైన ధనం కలిగి ఉండడం కాదు). దీని మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. అనేకమంది పేద ప్రజలు ధనాన్ని అధికంగా ప్రేమించడం నేను చూశాను మరియు అనేకమంది ధనవంతులు డబ్బును ప్రేమించకపోవడం కూడా నేను చూశాను. నువ్వు ఎంత కలిగి ఉన్నావనేది కాదు కానీ నువ్వు దేనిని ప్రేమిస్తున్నావనేదే ప్రశ్న. దీని గురించే యేసు మాట్లాడుతున్నారు. నీ మనసు తప్పక పైనున్న వాటిపైనే ఉంచుకోవాలి. పరలోకంలో ధనాన్ని కూర్చుకొనుము. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో తెలుసుకొనుటకు, నీవు దేనిని గురించి ఆలోచిస్తున్నావో, నీ హృదయం ఎక్కడ ఉందో పరీక్షించుకొనుము.

తర్వాత యేసు మత్తయి 6:22లో ధనమునకు సంబంధించి కన్ను గురించి ఆయన మాట్లాడారు, "దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును". నీవు డబ్బును ఏ విధంగా చూస్తున్నావు అనేదే దీని అర్థం. నీ కన్ను చెడ్డది అయితే అప్పుడు నీవు డబ్బును ప్రాముఖ్యమైనదిగా, ఈ లోకంలో నీ జీవితానికి ఎంతో ముఖ్యమైనదిగా చూస్తావు మరియు నీ దేహమంతయు అంధకారమై ఉంటుంది. "నీలోనున్న వెలుగు చీకటి అయినట్లయితే ఆ చీకటి ఎంత గొప్పది". అనేకమంది ప్రజలు సరైన సిద్ధాంతాలను కలిగి ఉండి, ఇతరుల దృష్టిలో మంచి క్రైస్తవులుగా ఉండి, క్రమం తప్పకుండా సంఘ కూటాలకు వెళుతున్నప్పటికీ ధనాన్ని ఎక్కువగా ప్రేమించుట చూచుట ఎంతో ఆశ్చర్యమైన విషయం. క్రొత్త నిబంధన నమూనా గల సంఘాలలో ఉన్నామని చెప్పుకునే తమకంటే, మృత తెగలలోని ప్రజలు ధనాపేక్షనుండి మరింత స్వేచ్ఛగా ఉన్నారనే విషయం తెలియకుండా, వారు ఇతర మృత తెగలను కూడా చిన్నచూపు చూడవచ్చు.

కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలను నీకు నీవే ప్రశ్నించుకో: నీవు కొద్దిగా అధికంగా డబ్బును పొందినప్పుడు ఆనందిస్తున్నావా? నీవు డబ్బు కోల్పోయినప్పుడు నిరుత్సాహపడుతున్నావా? అప్పుడు నీవు డబ్బును ప్రేమిస్తున్నావు. మన ఆనందం ప్రభువులోనే ఉన్నట్లయితే అది ఎప్పటికీ మార్పుచెందదు. మన ఆనందం లోక సంబంధమైన విషయాలపై ఉన్నట్లయితే, మన ఆదాయంలోని మార్పుల వల్ల అది మార్పుచెందుతుంది.

ఎవ్వరూ ఇద్దరు యజమానులను సేవించలేరు. ‘అతడు ఒకని ద్వేషించి మరొకని ప్రేమించును’. యేసు ఇక్కడ చెప్పింది ఎంతో తీవ్రమైన విషయం, తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను ద్వేషించమని లూకా 14:26లో చెప్పిన విధంగానే ఇక్కడ ఎంతో తీవ్రంగా దాని చెప్పారు. యేసు ఎంతో విప్లవాత్మకమైన వ్యక్తి. నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే ధనాన్ని తప్పక ద్వేషించాలని యేసు చెప్పారు (మత్తయి 6:24). సిరి, డబ్బును స్థిరాస్తులను స్టాక్స్ మరియు షేర్లను సూచిస్తుంది. నీవు దేవుణ్ణి ప్రేమించాలనుకున్నట్లయితే వాటన్నిటిని ఖచ్చితంగా ద్వేషించాలని యేసు చెప్పారు. వాటిని ఉపయోగించుకోవచ్చు అయితే దేవుని యెడల నీ ప్రేమ అత్యున్నతమైనదిగా ఉండాలి. సూర్యుని యొక్క వెలుతురులో నక్షత్రాలు మాయమైనట్లే డబ్బుపై నీ ఆసక్తి కనుమరుగవ్వాలి. ఆ విధంగా లేనట్లయితే నీవు దేవుని సేవించలేవు.

‘ఒకదానిని హత్తుకొనిన యెడల మరొక దానిని తృణీకరిస్తావని’ యేసు చెప్పారు. ‘దేవుని వాక్యము’ మరియు ‘సిరి’ని ఆ యొక్క మాటలో పెట్టి చదివినట్లయితే ఈ విధంగా ఉంటుంది: "ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి మరియు భౌతిక సంబంధమైన విషయాలను (భౌతిక సంపద, డబ్బును) ప్రేమించలేరు. అతను డబ్బును ద్వేషించి దేవుని ప్రేమిస్తాడు లేక దేవుని ద్వేషించి డబ్బును ప్రేమిస్తాడు". యేసు చెప్పిన దాని అంతరార్థం ఏమిటంటే, డబ్బును ప్రేమించే వ్యక్తి దేవుని ద్వేషిస్తున్నాడు. ఇంతకుముందు నీకు అది తెలియకపోవచ్చు అయితే ఇప్పుడు నీకు తెలుసు. నీవు డబ్బును ప్రేమిస్తున్నట్లయితే దేవుణ్ణి ద్వేషిస్తున్నావని యేసు చెప్తున్నారు. అనేకమైన పాటలు ఆయనకు పాడుతున్నావు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నీవు అనుకొనవచ్చు, అయితే యేసు చెప్పేది అది కాదు.

నీవు దేవుణ్ణి హత్తుకున్నట్లయితే డబ్బును తృణీకరిస్తావని, డబ్బును హత్తుకున్నట్లయితే దేవుణ్ణి తృణీకరిస్తావని యేసు చెప్తున్నారు. నీవు డబ్బును కలిగి ఉండవచ్చు డబ్బు సంపాదించవచ్చు అయితే నీవు దాన్ని ప్రేమించడం ప్రారంభించిన క్షణం నుండి నీవు దేవుని ద్వేషించడం ప్రారంభిస్తావు. దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం మరియు వారసత్వ సంపదను నీకు ఇచ్చి ఉండవచ్చు, అది మంచిదే. అయితే నీవు దాన్ని ప్రేమించి దాన్ని హత్తుకున్నట్లయితే, నీవు దేవుణ్ణి తృణీకరించి ద్వేషిస్తున్నావు. మనం ప్రభువును నమ్మకంగా సేవించాలని అనుకున్నట్లయితే దీన్ని అర్థం చేసుకోవడం మరియు దీని పట్ల సరియైన వైఖరి కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది.