WFTW Body: 

‘పరమగీతములు’ క్రైస్తవులందరికీ ఎంతో ప్రాముఖ్యమైన పుస్తకం. నేను నా క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు మొదటిగా ఈ పుస్తకం చదువుటకు ప్రభువు నన్ను నడిపించినందుకు నేను ప్రభువుకు ఎంతో కృతజ్ఞుడను. క్రీస్తుతో వ్యక్తిగతమైన, ప్రేమపూరితమైన, భక్తితోనిండిన సంబంధం ఒక ఊట వంటిది. దానిలో నుండే ప్రభువు కొరకు నిజమైన పరిచర్య -అది సువార్తికరణగాని, సంఘస్థాపనగాని, బైబిలు బోధగాని, సామాజిక సేవగాని లేక మరేదైనా ప్రవహిస్తుంది. మనం మొదటిగా "పెళ్లికుమారుని మరియు పెళ్లికుమార్తె యొక్క పాట"ను నేర్చుకోవాలి. అది ప్రభువు మన కొరకు, మనం ప్రభువు కొరకు పాడే పాట.

పరమగీతము 1:1లో మనము అది సొలోమోను గీతమనే విషయాన్ని మొదటిగా గమనిస్తాము. ప్రాముఖ్యంగా పెళ్లికుమారుని గీతం, పెళ్లికుమార్తెది కాదు. దాని అర్థం ఏమిటంటే ప్రాముఖ్యంగా మనకొరకైన ప్రభువు పాట, ఆయనకొరకైన మన పాట కాదు. "మొదట ఆయన మనలను ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాము" (1యోహాను 4:19). మొదట మనం ఆయనను ప్రేమించలేదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మొదట ఈ గీతమును ఆయన మనకు పాడారు కాబట్టి ఇప్పుడు మనం ఆయనకు ఒక పాటను పాడగలుగుతున్నాము.

పరమగీతము 4:8లో పెళ్లికుమారుడు పెళ్లికుమార్తెతో ఈ విధంగా చెప్తున్నాడు, "ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహ వ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు". ఇది పర సంబంధమైన వాటిలో నివసించుటకు ఆహ్వానమై ఉన్నది. ప్రభువు ఇలా చెప్తున్నారు, "క్రిందనుండి మరియు భూ సంబంధమైన దృక్కోణం నుంచి చూడకు. ఉన్నతమైన ప్రదేశములోనికి నాతో కూడా రా, అక్కడ నుండి ప్రతిదాన్ని చూడు. నీవు అక్కడ నుండి వాటిని చూసినప్పుడు, భూసంబంధమైనవి ఎంతో చిన్నగా మసకగా విలువలేనివిగా మారుతాయి". ఉన్నతమైన ప్రదేశానికి మనల్ని లేవనెత్తాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అవును, అక్కడ సింహాలు అనగా దయ్యములు, దుష్ట అధిపతులు, అధికారాలు ఉన్నాయి. కానీ అక్కడ మనం ప్రభువుతో కూడా ఉంటాము. ఆయనతో కలిసి ఆ చెడ్డ శక్తులన్నిటిని జయిస్తాము.

పరమగీతము 4:12లో పెళ్లికుమారుడు పెళ్లికుమార్తెను తనకు మాత్రమే ప్రత్యేకమైన "మూయబడిన ఉద్యానమని" పిలుస్తున్నాడు. ఆమె మరి ఎవరికీ చెందినది కాదు. ఆమె ప్రత్యేకంగా తన ప్రభువుకు మాత్రమే చెందినది. ప్రభువుతో నీ సంబంధం ఆ విధంగా ఉందా? ప్రభువు నీతో, "నువ్వు నా ప్రత్యేకమైన తోటవి, కేవలం నా సొంతానివి" అని చెప్పగలరా?. ఈ లోకంలో అనేక విషయాలు -మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించే అవకాశాలు, లోకసంబంధమైన అధికారం మరియు ఘనత, మనకోసం మనం పేరు సంపాదించుకోవడం మొదలైనవి మనల్ని ఆకర్షించవచ్చు. ఈ శోధనలన్నీ కూడా ఇతర పురుషులు పెళ్లికుమార్తెను తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించుటతో పోల్చవచ్చు. కానీ ఇక్కడ ఉన్న పెళ్లికుమార్తె ఆకర్షణకు లోనుకాలేదు. ఆమె తనయొక్క ప్రియునిలో మాత్రమే లీనమైంది. ఆమె తన పెళ్లికుమారునికి మాత్రమే ప్రత్యేకింపబడింది. చాలా కొద్దిమంది విశ్వాసులు మాత్రమే క్రీస్తుతో అటువంటి సంబంధం కలిగి జీవిస్తారు. అందుకే వారు అన్యోన్యంగా ఆయనను ఎరుగరు మరియు ఆయన వాక్యమును అర్థం చేసుకోరు. బైబిలును అర్థం చేసుకునే మొట్టమొదటి రహస్యం ప్రభువుతో అన్యోన్య సంబంధం కలిగి ఉండుట. ఆయన మాటలయొక్క అర్థం ఏమిటో స్పష్టంగా ఆయనకంటే శ్రేష్టంగా మరెవరు చెప్పగలరు. ఆది శిష్యులు ఆయనతో నడచినట్లుగా ఆయనతో నడవండి. ఆయన మీతో మాట్లాడాలని ఎంతగానో కోరుకోండి. అప్పుడు వారి కన్నులవలె మీ కన్నులు తెరవబడతాయి మరియు వారి హృదయాలవలె మీ హృదయాలు మండుతాయి.

పరమగీతము 5:2లో అర్థరాత్రివేళ పెళ్లికుమారుడు వచ్చి "ప్రియురాలా తలుపు తెరువుమని" పిలిచినప్పుడు, పెళ్లికుమార్తె తన వస్త్రములు ధరించి తలుపు తీయుటకు ఎంతో బద్ధకించింది. ఆమె తాను కడుక్కొనిన పాదాలు మరలా మట్టి అవుతాయని చింతించింది. అతడే బయటనుండి ఆ తలుపును తెరవడానికి ప్రయత్నించాడు (పరమగీతము 5:4). పెళ్లికుమార్తె తన మనసు మార్చుకొని తలుపు తెరిచింది కానీ అప్పటికే తన ప్రియుడు వెళ్లిపోయినట్లుగా కనుగొన్నది. అతను ఆమెను పిలచిన వెంటనే ప్రతిస్పందించనందున అతను వెళ్ళిపోయాడు. మనకు కూడా అలా జరగవచ్చు. ప్రభువు మనతో, "నీవు ఇప్పుడు చేస్తున్న దాన్ని విడిచిపెట్టు, చదువుతున్న పుస్తకాన్ని ఆపు, మాట్లాడుతున్న దాన్ని ముగించి నాతో ఏకాంతముగా వచ్చి మాట్లాడు. ఇద్దరం కలిసి అలా నడుద్దాం" అని చెప్పినప్పుడు, మనం, "ప్రభువా, కొద్దిసేపు ఆగు. నేను చేయవలసిన ముఖ్యమైన పని ఉంది. 15 నిమిషాల్లో దాన్ని ముగిస్తాను. తర్వాత వస్తాను" అని సమాధానం చెప్పవచ్చు. 15 నిమిషాల తర్వాత ఆ ముఖ్యమైన(?) పని ముగించి, "ప్రభువా ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను" అని మనం చెప్పినప్పుడు ఆయన వెళ్లిపోయినట్లుగా మనం కనుగొంటాం. ఆయనని మనం కనుగొనలేము. దేవుని యొక్క ప్రభావంతమైన సేవకునిగా నీవు ఉండాలని అనుకుంటున్నావా? అయితే ప్రభువు నిన్ను పిలిచినప్పుడు ఉన్నపాటున ప్రతిదాన్ని విడిచిపెట్టి ఆయననుండి వినుటను నేర్చుకో. దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు చింతించవు.

పరమగీతము 5:3లో పెళ్లికుమారుడు పెళ్లికుమార్తెతో, "నేను రాత్రి బయట ఉన్నాను, మంచుతో కప్పబడి ఉన్నాను" అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు, నశించిన దానిని వెదకి రక్షించుటకు భూమి పైకి వచ్చారు. ఆయన సిలువ మార్గంలో (స్వచిత్తమును ఉపేక్షించుకుంటూ) నడిచాడు మరియు ఈ లోకపు అంధకారంలో తప్పిపోయిన గొర్రెలను వెతకుటలో ఆయన బాధను అనుభవించాడు. ఇప్పుడు అదే మార్గంలో నడవమని తన పెళ్లికుమార్తెను ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆమె దానికి అయిష్టంగా ఉంది.

పరమగీతము 6:4-10లో పెళ్లికుమారుడు తన పెళ్లికుమార్తెకు తన ప్రశంసను తెలియజేస్తున్నాడు. అతను, స్త్రీలందరిలో పరిపూర్ణురాలైన నా పెళ్లికుమార్తె వంటి వారు ఎవరూ లేరని చెప్తున్నాడు. వేరేవరి కంటే నేను నిన్నే కోరుకుంటాను. ప్రతి భర్త కూడా తన భార్యను ఈవిధంగా చూడాలి: ఈ లోకంలో అనేకమంది ఆకర్షణీయమైన స్త్రీలు ఉన్నారు అయితే నా భార్య వంటి వారు ఎవరూ లేరు. నా దృష్టిలో ఆమే ఉన్నతమైనది. దీన్నే ప్రభువు మన గురించి చెప్తున్నాడు. ఈ లోకంలోని జ్ఞానవంతుల కంటే ధనవంతుల కంటే గొప్ప వారి కంటే కూడా ఆయన మనల్ని ప్రశంసిస్తున్నాడు.

పరమగీతము 7:1-9లో పెళ్లికుమారుడు పెళ్లికుమార్తెను మెచ్చుకుంటున్నాడు. మన బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ, ప్రభువు మనల్ని మెచ్చుకుంటాడని, ప్రశంసిస్తాడని మనం ఎంతో స్పష్టంగా చూడాలి. అనేకమంది విశ్వాసులు తమను తాము నిరంతరం నిందించుకుంటూ జీవిస్తారు ఎందుకంటే ప్రభువు వారిని మెచ్చుకుంటాడనే విషయాన్ని వారు గ్రహించరు. పెళ్లికుమారుడు పెళ్లికుమార్తె యొక్క పెదవులను మెచ్చుకున్నప్పుడు ఆమె వెంటనే, ఆ మాట పెళ్లికుమారుని యొక్క పెదవులకే ఎక్కువగా వర్తిస్తుందని బదులిస్తుంది (పరమగీతము 7:9). అది వారిద్దరి మధ్య ఉన్న ఉన్నత స్థాయి అన్యోన్యతను సూచిస్తుంది. అటువంటి అన్యోన్యతే మనం మన ప్రభువుతో కలిగి ఉండాలి.

పరమగీతము 7:10లో పెళ్లికుమార్తె ఈ విధంగా చెప్తుంది, "నేను నా ప్రియునికి చెందిన దాన్ని. అతడు నా కోసం తహతహలాడుతున్నాడు". ఇక్కడ పెళ్లికుమార్తె ప్రభువు తనకు చెందిన వాడని మాత్రమే చెప్పడం లేదు, తనపట్ల ప్రభువు సంతోషంగా ఉన్నాడని కూడా చెప్తుంది. ప్రభువు, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పడం ఒక విషయమైతే, "నిన్నుబట్టి నేను సంతోషంగా ఉన్నాను" అని చెప్పడం పూర్తిగా మరొక విషయం. ఒక భర్త తన భార్యను ప్రేమించవచ్చు అయితే ఆమె పనులు చేసే విధానాన్నిబట్టి సంతోషంగా ఉండకపోవచ్చు. ప్రభువు నిన్ను ప్రేమించవచ్చు అయితే నీ జీవితంలో అనేక విషయాలను బట్టి ఆయన సంతోషంగా ఉండకపోవచ్చు. పరిణితి చెందిన ప్రేమ ప్రభువును సంతోషపరచుటకు చూస్తుంది. ఇప్పుడు పెళ్లికుమార్తె పెళ్లికుమారునితో కూడా జతపనిరాలయ్యి, "నా ప్రియుడా రమ్ము. పొలములలోనికి వెళ్ళుదము" అని చెప్పుచున్నది (పరమగీతము 7:11). ఇప్పుడు పెళ్లికుమార్తె, ఎక్కడైతే పొలాలు తెల్లబారి కోతకు వచ్చాయో ఆ అవసరతలో ఉన్న లోకం కొరకైన పెళ్లికుమారుని యొక్క ఆందోళనను పంచుకుంటూ ఉంది. అయితే ఎప్పుడూ కూడా నీయంతట నీవు ఆ పొలములలోనికి వెళ్ళవద్దు. నీ ప్రియునితో కలిసి అక్కడికి వెళ్ళుము. ఆయనతో సంబంధమును ఏర్పరచుకొని తర్వాత ఆయనను సేవించుము. ఆ పొలములలో నీవు ఆయనకొరకు పనిచేయగల శ్రేష్టమైన ప్రదేశములు ఆయన మాత్రమే ఎరుగును.

60 సంవత్సరాలలో ఇదేవిధంగా నేను ప్రభువును సేవించుటకు చూశాను. నా అంతట నేను ఎక్కడికైనా వెళ్ళుటకు కోరుకొనలేదు. నేను, "ప్రభువా, నీవే మార్గము చూపుము. నేను నీతో కలిసి వస్తాను. ఇద్దరం కలిసి పొలములలోనికి వెళ్దాం. నువ్వు ఎక్కడికి వెళ్లుతున్నావో చెప్పు. నీవు ఎక్కడికైనా వెళ్లనట్లయితే నేను కూడా అక్కడికి వెళ్లాలనుకోవట్లేదు" అని చెప్పాను. ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయనకు లోబడుతూ ఆయనను సేవించినట్లయితే, మన జీవితాల్లో ఎటువంటి అతిశయం ఉండదు మరియు మన పరిచర్యను మరొకరి పరిచర్యతో పోల్చుకోము.