యేసు బోధను, ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించాలి ఎందుకంటే చాలామంది దానిని పలుచన చేశారు లేదా వేరొక అర్థం వచ్చే విధంగా చేశారు. చాలా మంది బోధకులు దేవుని ప్రమాణానికి అనుగుణంగా జీవించలేకపోతున్నందున, ఆయన ప్రమాణాన్ని వారి స్థాయికి తగ్గించారు. దేవుని వాక్యంలో మీరు సాధించని లేదా మీ జీవిత స్థాయి కంటే ఉన్నతమైన ప్రమాణం చూసినప్పుడల్లా, మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. ఒక ఎంపిక ఏమిటంటే, "దేవుని వాక్యానికి నిజమైన అర్థం అది కాదు. దాని అర్థం ఖచ్చితమైనది కాదు కాని అది సాధారణంగా చెప్పబడింది" అని చెప్పటం. ఉదాహరణకు, "ఫిలిప్పీ 4:4 ‘ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి’ అని చెబుతుందని నాకు తెలుసు, కానీ అది నిజంగా ‘ఎల్లప్పుడూ’ అని అర్థం కాదు. ‘సాధారణంగా’ లేదా ‘ఎక్కువ సమయం’ అని అర్థం". ఆ విధంగా మీరు దేవుని వాక్యాన్ని మీ శరీర స్థాయికి తగ్గించడంలో విజయం సాధించి, మీరు దానిని పాటిస్తున్నారని ఊహించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకుంటారు. కానీ ఆత్మీయ మనస్సు గల క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకొని, "నేను ప్రభువునందు 24/7 ఆనందించాలి" అని చెప్తాడు. మరియు అతను వినయంగా ఇలా చెప్తాడు, "ప్రభువా, నేను ఇంకా అక్కడికి చేరుకోలేదు. నేను కొంత సమయం ఆనందిస్తున్నాను, కొంత సమయం (లేదా ఎక్కువ సమయం) గొణుగుతున్నాను, మరియు తరచుగా కోపపడుతున్నాను. నేను అన్ని పరిస్థితులలోనూ ఆనందించడం లేదు. బైబిల్ చెప్పినట్లుగా నేను ప్రతిదానికీ కృతజ్ఞతలు చెప్పడం లేదు. నేను దీనిని అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను ఆ స్థాయికి తీసుకురండి".
దేవుని ప్రమాణాన్ని అటువంటి వ్యక్తే చేరుకుంటాడు. దేవుని ప్రమాణాన్ని తన స్థాయికి తగ్గించిన మరొక వ్యక్తి దానిని ఎప్పటికీ చేరుకోలేడు. ఒక రోజు అతను నిత్యత్వంలో మేల్కొని తన జీవితాంతం దేవునికి అవిధేయత చూపాడని కనుగొంటాడు. కాబట్టి, దేవుని వాక్యాన్ని ఉన్న చోటే ఉంచి, మనం దానిని అర్థం చేసుకోలేదని లేదా మనం అక్కడికి చేరుకోలేదని అంగీకరించడం మంచిది. అప్పుడు మనం అక్కడికి చేరుకుంటామని కొంత ఆశ ఉంటుంది.
మత్తయి 5:20 కి మనం వచ్చినప్పుడు దీనిని గుర్తుంచుకోవాలి: "మీ నీతి శాస్త్రుల నీతిని మరియు పరిసయ్యుల నీతిని మించిపోని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని నేను మీకు చెప్తున్నాను."
పరిసయ్యుల నీతి చాలా ఉన్నతమైన ప్రమాణం. వారు పది ఆజ్ఞలను పాటించారు. ధనవంతుడైన యౌవ్వన అధికారి యేసు దగ్గరకు వచ్చి, "నేను అన్ని ఆజ్ఞలను పాటించాను" అని అన్నాడు, యేసు దానిని ప్రశ్నించలేదు. (వాస్తవానికి, వారు పదవ ఆజ్ఞను పాటించలేకపోయారు, కానీ పదవ ఆజ్ఞ అంతరంగానికి చెందినందున ఎవరూ దానిని పాటించలేరు. కానీ వారు మిగిలిన తొమ్మిది ఆజ్ఞలను మరియు 600 కంటే ఎక్కువ ఆజ్ఞలను కలిగి ఉన్న పాత నిబంధన చట్టాలన్నింటినీ పాటిస్తున్నారు). పరిసయ్యులు తాము క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నామని, బహుశా రోజుకు మూడు సార్లు, వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటామని మరియు వారి ఆదాయమంతటిలో దశమభాగాలను ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. కాబట్టి మీ నీతి వారి నీతిని మించి ఉండాలని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి?
దాని అర్థం, మీరు రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువ ప్రార్థించాలి, వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ ఉపవాసం ఉండాలి మరియు మీ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ ఇవ్వాలనా? దాని అర్థం అది కాదు. మన మనస్సు లోక సంబంధమైనది కాబట్టి మనం ఎల్లప్పుడూ పరిమాణం పరంగా ఆలోచిస్తాము. మనం ఎంత ఎక్కువగా లోక సంబంధమైన మనస్సు కలిగి ఉంటామో, అంత ఎక్కువగా సంఖ్యలు, గణాంకాలు మరియు పరిమాణం పరంగా ఆలోచిస్తాము. మనం ఒక సంఘాన్ని అక్కడ ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి అంచనా వేస్తాము, ఆ వ్యక్తుల జీవిత నాణ్యతను బట్టి కాదు. "ఒక సంఘంలో 30,000 మంది సమావేశమైనప్పుడు మీరు నా శిష్యులని అందరు తెలుసుకుంటారు" అని యేసు చెప్పాడని మనం అనుకుంటాము. కానీ ఆయన చెప్పింది అది కాదు. ఆయన తన పదకొండు మంది శిష్యులతో, "మీరు పదకొండు మంది ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మీరు నా శిష్యులని అందరు తెలుసుకుంటారు" అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారనేది ప్రాముఖ్యం కాదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటమే నిజమైన స్థానిక సంఘ శిష్యుల ప్రాథమిక లక్షణం.
యేసు ఎల్లప్పుడూ నాణ్యతను నొక్కి చెప్పాడు. మిషన్ సంస్థలు మరియు మెగా చర్చిల వంటి నేటి క్రైస్తవత్వం సంఖ్యలను నొక్కి చెబుతుంది. మన చర్చిలో ఎంత మంది ఉన్నారు? మనం ఎన్ని ప్రదేశాలకు చేరుకున్నాం? మన వార్షిక కానుకలు ఎంత? వారు ఈ విషయాలను బట్టే అంతరంగంలో సంతోషిస్తారు. బోధకులు ఇలా అంటారు: నేను ఎన్ని దేశాలకు ప్రయాణించాను? నేను ఎన్ని ప్రసంగాలు బోధించాను? నేను ఎన్ని పుస్తకాలు రాశాను? నేను ఎన్ని టీవీ కార్యక్రమాలలో మాట్లాడుతున్నాను? శరీర సంబంధమైన వ్యక్తులు గొప్పగా చెప్పుకునే విషయాలు ఇవే.
యేసు ఎల్లప్పుడూ నాణ్యతను నొక్కి చెప్పాడు: నాణ్యమైన ఉప్పు మరియు నాణ్యమైన కాంతి. ఆయన జీవితం చివరలో ఆయనకు పదకొండు మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. అది పెద్ద సంఖ్య కాదు, కానీ వారి జీవితాల నాణ్యతను చూడండి. ఆ పదకొండు మంది శిష్యులు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. అందరినీ విడిచిపెట్టిన, డబ్బుపై ఆసక్తి లేని మరియు ఇలాంటివి లేని శిష్యులను మీరు ఎక్కడ కనుగొంటారు? నేటి ప్రపంచంలో అలాంటి ఒక్క బోధకుడిని కనుగొనడం కూడా చాలా అరుదు.
"మీ నీతి పరిసయ్యుల నీతిని మించి ఉండాలి" అని యేసు చెప్పినప్పుడు ఆయన నాణ్యతను నొక్కిచెప్పాడు. నాణ్యత, మీరు పాల్గొనే కార్యకలాపాల సంఖ్య కాదు. దీనికి డబ్బుతో సంబంధం లేదు. దీనికి ప్రార్థనతో సంబంధం లేదు. దీనికి ఉపవాసంతో సంబంధం లేదు. ఇది జీవితం యొక్క నాణ్యతకు సంబంధించింది.
యేసు మిగిలిన వచనాలలో (వాస్తవానికి, దాదాపు కొండమీది ప్రసంగం చివరి వరకు) ఈ ఒక్క వచనాన్ని వివరిస్తూ ముందుకు సాగిపోయాడు. కొండమీది ప్రసంగంలో ఎక్కువ భాగం మత్తయి 5:20ని వివరిస్తుందని మనం చెప్పవచ్చు. మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అప్పుడు మీ నీతి శాస్త్రులు మరియు పరిసయ్యుల నీతిని మించి ఉండాలి. మనం దేవుని ప్రమాణాలను తగ్గించకూడదు.