WFTW Body: 

దేవుని చిత్తమును నెరవేర్చుటే మానవునికి అత్యధిక గౌరవము మరియు ఆధిక్యత. యేసు ప్రభువు తన శిష్యులకు బోధించినది ఇదే. తన తండ్రి చిత్తమును నెరవేర్చువారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని ఒకసారి ఆయన చెప్పారు (మత్తయి 7:21) . దేవుని చిత్తమును నెరవేర్చువారు మాత్రమే తన నిజమైన సహోదరులు, సహోదరీలు అని కూడా ఆయన చెప్పారు (మత్తయి 12:50) . అపొస్తలులు కూడా తమ తరములో ఈ విషయమును నొక్కి చెప్పారు. మానవులను దేవుడు పాపము నుండి విముక్తులనుగా చేశాడు తద్వారా వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చగలరని పేతురు ప్రకటించాడు (1పేతురు 4:1,2). తాను అనాదిగా సంకల్పించిన దివ్యపథాన (మార్గమున) నడవాలనే ఉద్దేశ్యముతో క్రీస్తు యేసునందు దేవుడు విశ్వాసులను నూతనముగా సృష్టించాడని పౌలు చెప్పాడు. అందువలనే, అవివేకులుగా ఉండక, వారి జీవితాలలో దేవుని చిత్తమేమిటో తెలిసికోవాలని ఎఫెసీ క్రైస్తవులను పౌలు హెచ్చరించాడు (ఎఫెసీ 2:10,5:17) . దేవుని చిత్తమును సంపూర్ణముగా గ్రహించ గలిగిన వారై ఉండాలని కొలస్సీ క్రైస్తవుల కొరకు పౌలు ప్రార్ధన చేశాడు. వారు ప్రతి విషయములో దేవుని చిత్తమును నెరవేర్చాలని తన తోటి జతపనివాడైన ఎపఫ్రా కూడా ప్రార్ధన చేస్తున్నాడని పౌలు వారితో చెప్పాడు (కొలస్సీ 1:9; 4:12). దేవుని చిత్తమును జరిగించు వారు మాత్రమే నిత్యము నిలుచుదురని అపోస్తలుడైన యోహాను చెప్పాడు (1యోహాను 2:17).

దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చ కోరిక గలవాడు గనుక "దేవుని హృదయానుసారుడు" అని దావీదు పిలువబడ్డాడని అపోస్తలుల కార్యములు 13:22 లో ప్రస్తావించడం జరిగింది. దేవుని చిత్తమును చేయుట నాకు సంతోషమని దావీదే మనకు మరొక చోట చెప్తున్నాడు (కీర్తన 40:8). అతడు సంపూర్ణుడు కాదు. అతడు చాలా పాపాలు చేశాడు. కొన్ని తీవ్రమైన పాపాలు చేసినందుకు దేవుడు ఎంతో కఠినముగా శిక్షించవలసి వచ్చినది. అయినప్పటికీ, దేవుడు అతనిని క్షమించి, దావీదును బట్టి ఆనందించాడు. ఎందుకనగా దావీదు దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును చేయాలని కోరుకున్నాడు. ఇది, మనలో ఎన్ని బలహీనతలు కలిగియున్నప్పటికినీ, ఒకవేళ మన హృదయములు దేవుని చిత్తమును చేయుట మీదనే దృష్టించినట్లయితే మనము కూడా దేవుని హృదయానుసారులము కాగలమని మనలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది.

యేసు నడచుకొన్నట్లుగా వారు కూడా నడచుకోవాలని, ఆయన మాదిరిని అనుసరించవలెనని విశ్వాసులను క్రొత్త నిబంధన గ్రంథము కోరుచున్నది (1యోహాను 2:6). యేసు తన యొక్క జీవితములోను, పరిచర్యలోను తండ్రియొక్క చిత్తమును నెరవేర్చుటయే తనను నడిపించే నియమముగా పెట్టుకొన్నాడు. తన తండ్రి చెప్పేంత వరకూ ఎక్కడకూ వెళ్ళలేదు. తన తండ్రి చిత్త ప్రకారము ఆయన ఎక్కడకైనా వెళ్ళుటకు, తన శత్రువుల యొక్క బెదిరింపులు గాని, తన స్నేహితుల యొక్క విజ్ఞప్తులు గాని, తండ్రి తన నుండి ఏమి కోరుకుంటున్నాడో అది చేయలేకుండా ఆయనను ఆపలేకపోయాయి. తన తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయన అనుదిన ఆహారమైయున్నది (యోహాను 4:34). శరీరమును పోషించుకొనుటకు మనుష్యులు ఏవిధముగానైతే ఆరాటపడతారో, అదేవిధముగా తన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట కొరకు ఆయన తృష్ణగొనియున్నాడు. దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును నెరవేర్చుటకు ప్రతి విశ్వాసి ఇదేవిధమైన ఆకలి కలిగి ఉండాలి. కేవలము మనలను మనము సంతోషపరచుకొంటూ, మన అనుదిన జీవితములో దేవుని యొక్క నడిపింపును వెదకకుండా "నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక" అని ప్రార్థన చేయడం ఎంత సుళువు!!

మన జీవితములో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగియున్నాడని బైబిలు మనకు బోధిస్తుంది (ఎఫెసీ 2:10). మన వృత్తి విషయంలోను, జీవిత భాగస్వామి విషయంలోను మరియు మనము ఎక్కడ నివసించాలి, ప్రతిరోజు మనము ఏమి చేయాలనే విషయములోను ఆయన ప్రణాళిక కలిగియున్నాడు. ప్రతి విషయంలోను ఆయన ఎంపికే శ్రేష్టమైనది. ఎందుకనగా, ఆయన మనలను బాగా ఎరుగును మరియు ప్రతి అంశమును ఆయన పరిగణనలోనికి తీసుకుంటాడు. కాబట్టి ప్రతి చిన్న విషయములోను, పెద్ద విషయములోను ఆయన చిత్తమును వెదకుట తెలివైన పని.

అనేకులు వారి యౌవనదశ నుండే దేవుని చిత్తమును వెదుకుటలో తప్పిపోయి వారి జీవితములను పాడుచేసుకొన్నారు. "యౌవన కాలమున కాడి మోయుట నరునికి మేలు" (విలాప 3:27). మత్తయి 11:28-30 లో తన కాడిని మనము మోయవలెనని ఆహ్వానిస్తున్నాడు. కాడిని మోయుట అనగా అర్ధమేమిటి? ఒక ఎద్దుల జత పొలమును దున్నుతున్నప్పుడు, ఆ రెండు ఎద్దుల మెడల మీద ఒక కాడిని ఉంచుతారు. ఒక క్రొత్త ఎద్దుకు దున్నుటలో తర్ఫీదు ఇచ్చేటప్పుడు అనుభవం కలిగిన ఎద్దుతో కలిసి కాడిని పెడతారు. ఆ విధముగా ఆ క్రొత్త ఎద్దు, అనుభవం కలిగిన ఎద్దు ఎటు నడిస్తే అటు మరియు అదే వేగముగా నడువవలసి వస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు కాడిని మనము మోయుట అంటే ఇదే అర్ధము. ఆయనను సంతోషపరచే విధముగా ఆయనతో మనము నడువవలసియున్నది. ఆయన నడిపింపు లేకుండా ఎప్పుడు ఆయనకంటే ముందు పరుగెత్తకూడదు మరియు ఆయనకు విధేయత చూపించుటలో క్రొత్త అడుగు వేయుటకు వెనుదీయకూడదు. కొద్దిమంది మాత్రమే ఈ కాడిని గురించి అర్ధం చేసుకుంటారు. అతి కొద్దిమంది మాత్రమే దీనిని అంగీకరిస్తారు. ఎద్దుపై తన యజమాని చేత బలవంతముగా మెడమీద కాడి పెట్టబడినది. కాని యేసు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ ఎటువంటి బలవంతమూ లేదు. ఇటువంటి ఆహ్వానమును తిరస్కరించుటకు మనము ఎంత బుద్ధిహీనులమో కదా! నిజమైన విడుదల మరియు విశ్రాంతి నిచ్చు యేసు యొక్క తేలికైన కాడిని మోయుటకు బదులు ఓటములు, చింతలు మరియు ఒత్తిడులతో కూడిన మన స్వంత చిత్తమనే భారమైన కాడిని మోయుదుము.

"దేవునితో నడిచెను" (ఆది 5:22) అని హనోకు గురించి మనము చదువుతాము. అంటే దీని అర్ధము అతడు దేవునికంటే ముందు పరుగెత్తలేదు మరియు వెనుక నడువలేదు, ఒకే కాడిక్రింద ఉన్నట్లుగా దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో 300 సంవత్సరములు నడిచాడు. దానికి ఫలితముగా దేవుడు హనోకు జీవితమును బట్టి సంతోషించినట్లు దేవుడే సాక్ష్యమిచ్చాడు (హెబ్రీ 11:5) . ఆయన సంపూర్ణ చిత్తములో ఆయన కాడిక్రింద జీవించి, నడచుట ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి సంతోషపరచగలము. కేవలము ఈ విధముగా ఆయన ఎదుట నిలువబడి, ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా (చింతించకుండా) ఉండగలము.

తన జీవితములో దేవుని యొక్క సంపూర్ణ చిత్తమునుండి తప్పిపోవుట విశ్వాసి జీవితములో సాధ్యమే. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సౌలు ఎన్నుకొనబడ్డాడు, అయితే క్రమేపీ అతని అసహనమును బట్టి మరియు అవిధేయతను బట్టి దేవుడు సౌలును నిరాకరించ వలసి వచ్చినది. అయినా కూడా కొన్ని సంవత్సరాలు అతడు సింహాసనం మీద ఉండుట నిజమే, కాని తన జీవితములో దేవుని చిత్తమునుండి అతడు తప్పిపోయాడు. సొలొమోను దీనికి మరొక ఉదాహరణ. తన జీవిత ప్రారంభ దశలో దేవుణ్ణి అతడు సంతోషపరచాడు, కాని తరువాత అన్యులైన స్త్రీలను వివాహం చేసుకొనుటను బట్టి పడిపోయాడు. అరణ్యములో నశించిన ఇశ్రాయేలీయుల దృష్టాంతమును గురించి జాగ్రత్త పడవలసినదిగా క్రొత్త నిబంధనలో రెండుసార్లు మనము హెచ్చరించబడ్డాము. వారు కనానులోనికి ప్రవేశించాలనేది వారికోసమైన దేవుని పరిపూర్ణ ప్రణాళిక. ఇద్దరు తప్ప మిగిలిన వారందరు వారి అవిశ్వాసము, అవిధేయతను బట్టి దేవుడిచ్చు శ్రేష్టమైన దానిని వారు కోల్పోయారు (1కొరింథీ 10:1-12; హెబ్రీ 3:7-14 ), అనేక మంది విశ్వాసులు ఇదేవిధముగా వారి జీవితములలో అవిధేయత ద్వారా మరియు వివాహములో, వృత్తిని ఎంచుకొనే విషయములో రాజీపడుట ద్వారా దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును కోల్పోయారు.

మనందరికీ ఉన్నది ఒకే ఒక్క జీవితము. దేవుడు నాకిచ్చిన పనిని కడముట్టించితిని అని తన జీవితం చివరిలో చెప్పిన పౌలు వలె చెప్పగలిగిన మనుష్యుడు ధన్యుడు (2 తిమోతి 4:7).

లోకము మరియు దానిలోని తీవ్రమైన కోరికలన్ని ఒకరోజు అదృశ్యమవుతాయి. కానీ దేవుని చిత్తాన్ని అనుసరించే మనిషి శాశ్వతమైన దానిలో భాగమవుతాడు మరియు చనిపోడు" (1యోహాను 2:17-JPB)

"జీవితపు అర్థం మరియు ఉద్దేశ్యం తెలియని వ్యక్తులలా కాకుండా, తెలిసిన వారిలాగా సరైన బాధ్యతతో జీవితాన్ని గడపండి. ఈ రోజుల్లోని అన్ని కష్టాలు ఉన్నప్పటికీ, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అస్పష్టంగా ఉండకుండా, దేవుని చిత్తమని మీకు తెలిసిన దానిని గట్టిగా పట్టుకోండి" (ఎఫె. 5:15-17-JPB).