WFTW Body: 

"అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమైయుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచ్చున్నాడు. అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు" (మలాకీ 3:16-18).

నీతిమంతులు మరియు దుర్మార్గులు అను రెండు రకముల ప్రజల గురించి పై వచనము చెప్పుచున్నవి. దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించే క్రైస్తవుల పేర్లతో మాత్రమే "జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము" దేవుడు కలిగియుండెను. మరియు నీతిమంతులెవరో దుర్మార్గులెవరో స్పష్టముగా కనుగొందురని దేవుడు చెప్పుచున్నాడు.

మత్తయి 23:25,26లో ప్రభువైన యేసు చెప్పిన మాటలతో ఈ మాటలను పోల్చవచ్చును. ఆయన ఇట్లన్నారు, "దుర్మార్గులైన పరిసయ్యులు గిన్నెను వెలుపల శుద్ధి చేయుదురు కాని నిజమైన నీతిమంతులు గిన్నెను లోపల మరియు వెలుపల శుద్ధి చేయుదురు". దుర్మార్గులనుండి నీతిమంతులను ఈవిధముగా వేరు చేయవచ్చును.

నిజముగా దేవునియెడల భయభక్తులు కలిగిన విశ్వాసులు ఎల్లప్పుడు దేవుని యెదుట శుద్ధహృదయము కలిగియుండి మరియు ప్రజలయెదుట తమ వెలుగును (వారి బహిరంగ సాక్ష్యము) ప్రకాశింపనిచ్చెదరు. అంతరంగ జీవితాన్ని ముఖ్యమైనదిగా భావించేవారు మాత్రమే పాపముమీద జయము పొందవచ్చును.

మంచి మనస్సాక్షికి మరియు శుద్ధహృదయానికి కూడా చాలా భేదమున్నది. తెలిసిన పాపమును ఒప్పుకొని విడుదల పొందుట ద్వారా మంచి మనస్సాక్షి కలిగియుంటాము. శుద్ధ హృదయమనగా తెలిసిన పాపమంతటి నుండి విడుదల పొందుటయే గాక దేవుడు కాని దానంతటి నుండి విడుదల పొందుట. శుద్ధ హృదయముగలవారు దేవుని మాత్రమే చూస్తారు గాని మరిదైనను లేక ఎవరినైనను చూడారు. "శుద్ధ హృదయము గలవారు దేవుని చూచెదరని" (మత్తయి 5:8) ప్రభువైన యేసు చెప్పారు. ప్రతి పరిస్థితిలో వారు దేవుని మాత్రమే చూస్తారు. వారి మనస్సులు ప్రజలతోగాని (మంచివారైనను లేక చెడ్డవారైనను) లేక పరిస్థితులతోనైనను (సులభముగా ఉన్నను లేక కష్టముగా ఉన్నను) నింపబడవు. వారు కేవలము దేవునితోనే నింపబడుదురు.

ఇతరుల మీద ఫిర్యాదు చేసే వ్యక్తి, తనకు శుద్ధ హృదయములేదని రుజువుపరచుచున్నాడు ఎందుకనగా అతడు దేవునితోగాక తను ఇతరులలో చూసే చెడుతో నింపబడియున్నాడు. అతడు శుద్ధ హృదయము కలిగియున్నట్లయితే, ఇతరులు తనను ఇబ్బంది పెట్టినప్పటికీ, అతడు దేవునినే చూచును. అటువంటి కష్ట పరిస్థితులలో, అతడు తన మేలుకొరకే కాక దేవుని మహిమార్థం ఆ పరిస్థితిని దేవుడు అనుమతించాడని చూచును (రోమా 8:28).

ప్రతి పరిస్థితిలో దేవుడే నీకొరకు పనిచేయుచున్నాడు కాబట్టి నీవు శుద్ధ హృదయము కలిగియున్నయెడల, లోకములోని ప్రజలందరు మరియు విశ్వములోని దయ్యములన్నియు కలిసి కూడా నీ జీవితములో దేవుని యొక్క ప్రణాళిక (చిత్తము) జరుగకుండా ఆపలేవు. అప్పుడు నీవు ప్రతి పరిస్థితిలో జయించువాడవుగా ఉండి మరియు నీ జీవితములోని దేవుని సంకల్పమును నెరవేర్చగలవు.

"నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును" (సామెతలు 27:19) అని బైబిలు చెప్పుచున్నది. ఇతరులు చేసిన దానిని బట్టి నీవు ఆరోపణలను చేయుచున్నట్లయితే, అది నీ హృదయము యొక్క స్థితిని బయలుపరచును ఎందుకనగా నీకున్న చెడు ఉద్దేశ్యమే వారు కూడా కలిగియున్నారని నీవు ఊహించెదవు. కాని మీరు వారి ఫలముల వలన వారి గురించి తెలుసుకొందురని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 7:16). కాని వారి వేరు ద్వారా (మనము చూడలేని వారి ఉద్దేశ్యములు) కాదు. ఇతరుల ఉద్దేశ్యములను గాక మనలను మనము తీర్పు తీర్చుకొనుచు మరియు ఎల్లప్పుడు మనలను మనము పవిత్రపరచుకొనవలెను. అప్పుడు మనము శుద్ధ హృదయములు కలిగియుండెదము. అప్పుడు మనము మోసపోకుండునట్లు, ఇతరుల విషయములో దేవుడు మనకు వివేచన నిచ్చును. ప్రభువైన యేసు ఎవరిని తీర్పు తీర్చలేదు (యోహాను 8:15) కాబట్టి ఎల్లప్పుడు శుద్ధ హృదయము కలిగియుండి మరియు అందరి విషయములో వివేచన కలిగియుండెను (యోహాను 2:24,25).

శుద్ధ హృదయము కలిగియుండుటను గూర్చి ఒక ఉదాహరణను చూచెదము. జూనిఫర్ అనే దైవజనుడు 13వ శతాబ్దములో ఇటలీలో జీవించాడు. అతడు ఎల్లప్పుడు సామాన్య వస్త్రధారణ కలిగియుండెడివాడు. ఒకరోజు తన తోటి సహోదరులలో ఒకరు చాలా ఖరీదైన వస్త్రములు ధరించుట చూచాడు. కాని దాని విషయము జూనిఫర్ అతనిని తీర్పు తీర్చలేదు. కాని ఇట్లనుకున్నాడు, "నేను ఈ సామాన్య వస్త్రములతో ఉన్న దాని కంటే బహుశా నా సహోదరుడు ఖరీదైన వస్త్రములతో ఎక్కువ దీనుడైయుండవచ్చును". అటువంటి శుద్ధ హృదయమును మరియు దీన వైఖరిని కలిగియుండుటవలన, తన సహోదరుని తీర్పు తీర్చుట నుండి కాపాడబడియున్నాడు. ఇదియే అతని దైవభక్తికి మర్మము మరియు మనము కూడా ఆ మాదిరిని వెంబడించవచ్చును. ఎల్లప్పుడు మనము ఆ విధముగా ఉండెదము గాక ఆమేన్.